<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
క్యాటలాగ్‌కు తిరిగి వెళ్ళుBBTబైబిల్ థియాలజీని నిర్మించడం
బైబిల్ థియాలజీని నిర్మించడం ·Videoఆంగ్లం నుండి అనువాదం చేయబడింది

BBT-01 బైబిల్ థియాలజీ అంటే ఏమిటి?

పూర్తి వచనం చదవండి

అదే శ్రేణి 1వ పాఠానికి తోడుగా ఉండే వీడియో, ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: వ్యవస్థాగత థియాలజీకి, బైబిల్ థియాలజీకి ఉన్న తేడా ఏమిటి? వ్యవస్థాగత థియాలజీకి, బైబిల్ థియాలజీకి ఏది ముఖ్యం? వ్యవస్థాగత థియాలజీ, బైబిల్ థియాలజీ ఒకదానికొకటి తెలియజేస్తాయా? బైబిల్ థియాలజీ బైబిల్ యొక్క కంటెంట్, ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తుందా? బైబిల్ థియాలజీకారులు దేవుని అసాధారణ కార్యాలపై ఎందుకు దృష్టి పెడతారు? బైబిల్ థియాలజీ దేవుని సాధారణ కార్యాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? కల్చర్‌కు ప్రతిస్పందనగా క్రైస్తవులు ఎల్లప్పుడూ థియాలజీని రూపొందించాలా? కల్చర్‌కు ప్రతిస్పందనగా థియాలజీని రూపొందించడం ప్రమాదకరమా? క్రిటికల్ బైబిల్ థియాలజీకి, ఇవాంజెలికల్ బైబిల్ థియాలజీకి ఉన్న తేడా ఏమిటి? క్రిటికల్ బైబిల్ థియాలజీకారులు హీల్స్‌గెషిచ్టే (రెడెంప్టివ్ హిస్టరీ)ని ఎందుకు విలువైనదిగా భావిస్తారు? బైబిల్ వాస్తవ చరిత్రను రికార్డు చేస్తుందని గ్రహించడం ఎందుకు ముఖ్యం? బైబిల్ నిజమైన చరిత్రను రికార్డు చేస్తుందని మనం ఎలా నిరూపించగలం? హోడ్జ్ యొక్క ఇవాంజెలికల్ బైబిల్ థియాలజీ దృక్పథం వార్‌ఫీల్డ్ దృక్పథం నుండి ఎలా భిన్నంగా ఉంది? వోస్ యొక్క ఇవాంజెలికల్ బైబిల్ థియాలజీ దృక్పథం ఏమిటి? మనం పూర్తిగా యేసుపై, రెడెంప్టివ్ హిస్టరీపై దృష్టి పెడితే, మనం ఏమి మిస్ చేయవచ్చు? చర్య, వాక్య ప్రకటనలు రెండూ ఎందుకు ముఖ్యం? చర్య ప్రకటన "రేడియల్", "అస్పష్టమైనది" ఎలా? ఎపోకల్ షిఫ్ట్‌లు పెరిగిన ప్రకటన కాలాలకు ఎలా అనుగుణంగా ఉంటాయి? దేవుడు నిరంతరం ప్రకటనను అందించడు కదా? ప్రకటనలో మార్పులు ఆధునిక అనువర్తనను ఎలా ప్రభావితం చేయాలి? ప్రకటన చరిత్ర "ఆర్గానిక్" ఎలా?


From the transcript

1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.

బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.

ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.

అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.

మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.

మనము ప్రజలను మొదటి సారి కలసినప్పుడు, “తొలి అభిప్రాయములు” లేక వారిని ఎరిగిన మొదటి తరుణంలో వారిని గూర్చి మనకు కలిగిన అభిప్రాయములను కలిగియుంటాము. కాని అనుబంధములు పెరిగిన కొలది, వారి జీవితములు మరియు వ్యక్తిగత చరిత్రలను గూర్చి అడిగి తెలుసుకొనుట ద్వారా మన స్నేహితులను గూర్చి మరిన్ని విషయములు మనము నేర్చుకుంటాము. వారి జీవితములను రూపుదిద్దిన ముఖ్యమైన సన్నివేశములను గూర్చి మనము నేర్చుకొనుచుండగా, మన తొలి అభిప్రాయములకు ఎంతగానో మించిపోయిన మెళకువలను మనము నేర్చుకుంటాము.

అనేక విధాలుగా, క్రైస్తవ వేదాంతశాస్త్ర విషయములో కూడా ఇదే నిజమైయున్నది. క్రీస్తు అనుచరులుగా, మన నమ్మకములను ప్రాథమికముగా క్రొత్త నిబంధనను గూర్చిన తొలి అభిప్రాయముల ఆధారంగా రూపించుట ఆరంభిస్తాము. అయితే మన విశ్వాసము యొక్క చరిత్రను నేర్చుకొనుట ద్వారా, అది ఆదికాండములోని మొదటి పేజీలు మొదలుకొని ప్రకటన గ్రంథములోని ఆఖరి అధ్యాయముల వరకు అభివృద్ధి చెందిన విధానమును పరిగణించుట ద్వారా క్రైస్తవులుగా మనము నమ్మువాటిని గూర్చిన అవగాహనను మరింతగా బలపరచుకొనవచ్చు.

బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును కట్టుట అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము. ఈ పాఠ్య క్రమములో బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అనే అంశమును మనము నేర్చుకుందాము, మరియు ఇది బైబిలు చరిత్ర అంతటిలో మన విశ్వాసము ఎదిగిన విధానమును వివరించు వేదాంతశాస్త్ర శాఖయైయున్నది. ఈ పాఠమునకు “బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అంటే ఏమిటి?” అనే శీర్షికనిచ్చాము. మరియు ఈ పరిచయ పాఠంలో, ఈ పాఠ్యక్రమమంతటిలో మనకు మార్గదర్శకమునిచ్చు అనేక ప్రాథమిక సమస్యలను మనము చూద్దాము.

మన పాఠం మూడు ముఖ్య విషయముల మీద దృష్టి పెడుతుంది: మొదటిగా, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము పట్ల ఒక సామాన్య ధోరణిని పొందుకుందాము. ఈ పదజాలము యొక్క అర్థము ఏమిటి? రెండవదిగా, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క అభివృద్ధిని మనము చూద్దాము. శతాబ్దములుగా ఈ శాఖ ఏ దిశలలో ప్రయాణించింది? మరియు మూడవదిగా, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క కేంద్ర అంశమైయున్న చరిత్ర మరియు ప్రత్యక్షత మధ్య ఉన్న పరస్పర అనుబంధములను చూద్దాము. మన అంశము పట్ల గల సామాన్య ధోరణితో మొదలుపెట్టుదాము రండి.

“బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము” అను పదమును వేదాంతవేత్తలు అనేక విధములుగా ఉపయోగించారు. ఈ ఉపయోగములను గూర్చి విశాలమైన మరియు సంకుచితమైన భావాలను కలిగిన ఒక వర్ణమాల దృష్ట్యా ఆలోచన చేయుట ఉపయోగకరముగా ఉంటుంది. విశాలమైన భావాలలో, బైబిలులోని సత్యములను అంటిపెట్టుకొనియుండు వేదాంతశాస్త్రము అని ఈ పదము యొక్క అర్థము. ఈ అభిప్రాయములో, లేఖన బోధలను ఉన్నవి ఉన్నట్లుగా ప్రతిబింబించు ఏ వేదాంతశాస్త్రమైనా బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అవుతుంది.

ఇవాంజెలికల్ విశ్వాసులకు ఈ విశాలమైన ధోరణిలో వేదాంతశాస్త్రము అంత బైబిలానుసారమైనదిగా ఉండుట ఎంతో అవసరము. మనము సొల స్క్రిప్చుర, అనగా ప్రతి వేదాంతశాస్త్ర ప్రశ్నకు లేఖనములు సార్వభౌమమైన, అంతిమ న్యాయాధిపతిగా ఉన్నాయను నమ్మకము, అనే సిద్ధాంతమునకు కట్టుబడియున్నాము కాబట్టి బైబిలులోని అంశములన్నిటిని ప్రతిబింబించాలని మేము ఆశపడుచున్నాము.

అయితే సమకాలీన వేదాంతవేత్తలు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును గూర్చి సంకుచితమైన, మరింత సాంకేతికమైన విధానములో కూడా మాట్లాడతారు. వర్ణమాలలోని ఈ వైపున, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము బైబిలులోని అంశములకు మాత్రమే గాక లేఖనము యొక్క ప్రాథాన్యతలకు కూడా కట్టుబడియుండు వేదాంతశాస్త్రమైయున్నది. ఈ దృక్పథములో, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము బైబిలు బోధించువాటికి మాత్రమే గాక బైబిలు దాని యొక్క వేదాంతశాస్త్రమును అమర్చు లేక క్రమపరచు విధానమునకు కూడా కట్టుబడియుంటుంది. ఈ సంకుచిత భావనలోనే బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ఒక అధికారిక శాఖగా రూపుదిద్దుకుంది. మరియు ఈ పాఠంలో ఇది మనము దృష్టి పెట్టు ఒక విషయమైయున్నది.

మీరు ఊహించగలుగునట్లే, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు లేఖనములను విశదపరచుచుండగా, బైబిలు దాని యొక్క వేదాంతశాస్త్రమును అమర్చు విధానమును గూర్చి వారు అనేక భిన్నమైన అభిప్రాయములను తీసుకున్నారు. కాబట్టి, సమకాలీన వేదాంతవేత్తలు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము పట్ల భిన్నమైన కందకాలు తీసుకున్నారను విషయము మనకు ఆశ్చర్యం కలిగించనవసరము లేదు. ఈ భిన్నమైన దృక్పథములన్నిటిని అన్వేషించుటకు సమయము మనకు అనుకూలించదు. కాబట్టి, మనము ఒక ప్రఖ్యాతిగాంచిన మరియు ప్రసిద్ధి చెందిన ఒక బైబిలానుసారమైన వేదాంతశాస్త్ర విధమును చూద్దాము.

మన పాఠ్య ఉద్దేశముల కొరకు, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ఈ ప్రాముఖ్యమైన విధమును ఈ క్రింది విధముగా నిర్వచించవచ్చు: “బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అనగా లేఖనములో తెలియజేయుబడిన దేవుని కార్యముల యొక్క చారిత్రిక విశ్లేషణ నుండి వెలువడిన వేదాంతశాస్త్ర ఆలోచనలైయున్నది.” ఈ నిర్వచనములో కనీసం మూడు మూలకాలు ఉన్నాయి: మొదటిగా, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము లేఖనము పట్ల వ్యాఖ్యాన ప్రణాళికను కలిగియుండుట మీద ఆధారపడియున్నది మరియు దానిని మనము “చారిత్రిక విశ్లేషణ” అని పిలుస్తాము. రెండవదిగా, ఈ చారిత్రిక విశ్లేషణ బైబిలులో మనకు కనిపించు “దేవుని కార్యముల”ను గూర్చి యోచించునదిగా ఉన్నది. మరియు మూడవదిగా, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో లేఖనములోని దైవిక కార్యముల మీద “వేదాంతశాస్త్ర విశ్లేషణ” కూడా ఇమిడియున్నది.

లేఖనము పట్ల ఈ ధోరణిని గూర్చి మరింత అవగాహన పొందుట కొరకు, మన నిర్వచనములోని ఈ మూడు మూలకాలను మనము పరిశీలించుదాము. మొదటిగా, “చారిత్రిక విశ్లేషణ” అంటే ఏమిటో చూద్దాము. రెండవదిగా, “దేవుని కార్యములు” అంటే ఏమిటో చూద్దాము. మరియు మూడవదిగా, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో కనిపించు “వేదాంతశాస్త్ర విశ్లేషణలను” చూద్దాము. బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము లేఖనము యొక్క చారిత్రిక విశ్లేషణలో నుండి వెలువడుతుంది అను సత్యమును మొదటిగా పరిగణించుదాము.

చారిత్రిక విశ్లేషణ యొక్క అర్థమును అవగాహన చేసికొనుటకు, ఇతర పాఠ్యక్రమములలో మనము పరిచయం చేసిన కొన్ని విశాలమైన దృక్పథములను మనము సమీక్షించవలసియున్నది. క్రమబద్ధమైన వేదాంతశాస్త్రమును నిర్మించుట అను మన పాఠ్య క్రమములో, లేఖనము యొక్క వ్యాఖ్యానమును చేయుటకు పరిశుద్ధాత్మ సంఘమును మూడు ముఖ్యమైన మార్గములలో నడిపించాడని మనము చూశాము: సాహిత్య విశ్లేషణ, చారిత్రిక విశ్లేషణ మరియు అంశ విశ్లేషణ. మనము అనేక సార్లు చెప్పినట్లు, క్రైస్తవులు ఎల్లప్పుడూ ఈ మూడు కందకాలను ఒకదానితో ఒకటి కలిపి ఉపయోగిస్తారు, కాని మన చర్చ నిమిత్తం వీటిని వేర్వేరుగా పరిశీలించుట సహాయకరముగా ఉంటుంది.

సాహిత్య విశ్లేషణ లేఖనములను ఒక చిత్రముగా చూస్తుంది, అనగా పాఠకులను కొన్ని మార్గములలో ప్రభావితము చేయుటకు మానవ రచయితలు రూపొందించిన ఒక సాహిత్యకరమైన చిత్రము. చారిత్రిక విశ్లేషణ లేఖనములను చరిత్రలోనికి ఒక కిటికీగా పరిగణిస్తుంది, మరియు బైబిలు వెనుక ఉన్న చారిత్రిక సన్నివేశములను పరిశీలిస్తుంది. మరియు సాహిత్య విశ్లేషణ బైబిలును మన ఆసక్తులను మరియు ప్రశ్నలను ప్రతిబింబించు ఒక అద్దముగా చూస్తుంది.

క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము ప్రాథమికముగా అంశ విశ్లేషణ మీద కట్టబడు ఒక అధికారిక శాఖయైయున్నది. క్రమబద్ధీకులు సంఘ చరిత్ర అంతటిలో అభివృద్ధి చెందిన సాంప్రదాయిక క్రైస్తవ అంశములు మరియు ప్రాధాన్యతలను ఉద్ఘాటిస్తారు. అత్యంత సాంప్రదాయికమైన ప్రశ్నలు లేక అంశముల సుదీర్ఘమైన పట్టిక యొక్క జవాబులను వెదకుటకు వారు రూపకముగా లేఖనములను ఆశ్రయిస్తారు.

భిన్నముగా, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ప్రాథమికముగా లేఖనములను చారిత్రిక విశ్లేషణతో ఆశ్రయిస్తుంది. అది బైబిలును చరిత్రలోనికి చూచుటకు అవకాశమిచ్చు ఒక కిటికీగా పరిగణిస్తుంది. ఈ పాఠ్యక్రమములో మనము చూడబోవుచున్నట్టుగా, వ్యాఖ్యానము యొక్క గురి సాంప్రదాయిక వేదాంతశాస్త్ర అంశముల నుండి బైబిలులో వర్ణించబడిన చారిత్రిక సన్నివేశముల వైపుకు మళ్ళినప్పుడు, ఎంతో భిన్నమైన ప్రాధాన్యతలు మరియు ఆందోళనల యొక్క పట్టిక వెలువడుతుంది. హితమైన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము హితమైన క్రమబద్ధ వేదాంతశాస్త్రమును ఖండించనప్పటికీ, అది ఎంతో భిన్నమైన వేదాంతశాస్త్ర దృక్కోణములకు దారి తీస్తుంది.

బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము లేఖనముల యొక్క చారిత్రిక విశ్లేషణ మీద ఆధారపడియున్నది అని చూశాము కాబట్టి, ఇప్పుడు అది ప్రాథమికంగా దేవుని కార్యములకు సంబంధించినదిగా ఉన్నదను సత్యము వైపు తిరగవలసియున్నది. బైబిలు అనేక రకముల చారిత్రిక సన్నివేశములను గూర్చి నివేదిస్తుంది గాని, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ప్రాథమికంగా, “దేవుడు ఏమి చేసెనని లేఖనములు తెలియజేయుచున్నవి?” అని అడుగుతుంది. క్రైస్తవులు ఈ ప్రశ్నకు అనేక విధాలుగా జవాబిస్తారు గనుక, చరిత్రలో దేవుని కార్యములను గూర్చి బైబిలు బోధనలను సమీక్షించుట కొరకు మనము కొంత సమయము కేటాయించాలి.

చరిత్రలో దేవుని కార్యము యొక్క ఒక సాంప్రదాయికమైన మరియు సహాయకరమైన మార్గమును గూర్చి వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఐదవ అధ్యాయం, మూడవ పేరా ఈ విధముగా చెబుతుంది. లోకములో దేవుని కార్యమును గూర్చి అది ఇచ్చు వివరణ మనకు కొన్ని ప్రాముఖ్యమైన దృక్కోణముల యొక్క ఉపయోగకరమైన సారాంశమును ఇస్తుంది. ఇక్కడ దేవుని దైవకృతము వివరించబడిన విధానమును వినండి.

దేవుడు ఆయన యొక్క సాధారణ దైవకృతములో, కొన్ని మాధ్యమములను ఉపయోగించుకుంటాడు, కాని ఆయన చిత్తానుసారంగా అవి లేకుండా, వాటిని మించి, లేక వాటికి విరోధముగా కూడా కార్యము చేయుటకు స్వతంత్రుడైయున్నాడు.

ఇక్కడ విశ్వాసపుటొప్పుకోలు దేవుని దైవకృతము, చరిత్రలో దేవుని పాలుపంపులు, లేక దేవుని కార్యములు అని మనము పిలువదగిన దాని యొక్క నాలుగు ముఖ్యమైన విభాగములను తెలియజేస్తుంది అని గమనించండి. “మాధ్యమముల”తో దేవుడు స్వయంగా పాలుపంచుకొను నాలుగు విభాగములను ఇది గుర్తిస్తుంది, మరియు ఇవి సృష్టించబడిన కారకములుగాను లేక పరికరములుగాను ఉన్నవి.

వర్ణమాలలో ఒక వైపున, దేవుడు మాధ్యమములను సామాన్యముగా ఉపయోగిస్తాడని కన్ఫెషన్ తెలియజేస్తుంది, అనగా ఆయన మాధ్యమాల ద్వారా పని చేస్తాడు. మరొక మాటలో, సృష్టిలోని పలు భాగముల ద్వారా కార్యము చేయుచు దేవుడు తన ఉద్దేశములను నెరవేర్చుతాడు. ఈ విభాగములో ప్రాకృతిక సంభవాలు మరియు సృష్టముల యొక్క అనుదిన కార్యకలాపాలు ఇమిడియున్నాయి.

రెండవదిగా, మాధ్యమాలు లేకుండా, అనగా ఏ విధమైన సామన్య మాధ్యమాలను ఉపయోగించుకొనకుండా దేవుడు సూటిగా కార్యమును చేయుటను గూర్చి కన్ఫెషన్ మాట్లాడుతుంది, ఉదాహరణకు, కొన్ని సార్లు ఎలాంటి సామన్య మాధ్యమాలను ఉపయోగించుకొనకుండా దేవుడు ఆయన ప్రజల మీదకు రోగములను తెచ్చుట మరియు వారిని స్వస్థపరచుటను గూర్చి లేఖనములు మాట్లాడతాయి.

మూడవదిగా, మాధ్యమాలకు పైగా చరిత్రలో దేవుడు కార్యమును చేయుటను గూర్చి కన్ఫెషన్ మాట్లాడుతుంది, అనగా ఒక సాధారణమైన దానిని తీసుకొని దానిని గొప్పదిగా చేయుట. ఉదాహరణకు, శారాకు ఇస్సాకు అసాధారణమైన రీతిలో జన్మించుట అబ్రాహామును ఆమె కూడుట ద్వారా జరిగింది, కాని అది ఆమె వృద్ధ వయస్సులో, అనగా పిల్లలను కనుటకు సామన్య వయస్సును ఆమె మించిపోయిన తరువాత జరిగింది.

మరియు నాల్గవదిగా, దేవుడు మధ్యామాలకు విరోధముగా కార్యమును చేయుటను గూర్చి కన్ఫెషన్ మాట్లాడుతుంది, మరియు సృష్టి యొక్క విధికి విరోధముగా కార్యములు జరుగునట్లు చేస్తుంది. ఉదాహరణకు, యెహోషువ కాలములో సూర్యుని నిలిపివేసిన సమయములో దేవుడు ప్రకృతి యొక్క స్వాభావిక విధులకు విరుద్ధంగా కార్యము చేశాడు.

దేవుని కార్యమును గూర్చిన మన అవగాహనను స్పష్టము చేయుటకు దేవుని దైవకృతము యొక్క ఈ నాలుగు విభాగములు మనకు సహాయం చేస్తాయి. కొన్ని సార్లు దేవుడు మాధ్యమాల ద్వారా పని చేస్తాడు. అట్టి సన్నివేశములలో దేవుని యొక్క పాలుపంపులు చాలా తక్కువగా ఉన్నాయన్నట్లు అనిపిస్తుంది, కాని వెనుక నుండి ఆయన సమస్తమును నియంత్రిస్తూనే ఉన్నాడు. కాని దేవుని యొక్క ఇతర కార్యములు మరింత నాటకీయముగా ఉన్నాయి. దేవుడు సృష్టములు లేకుండా, వాటిని మించి మరియు వాటికి విరుద్ధముగా కార్యములు చేసినప్పుడు, ఈ సన్నివేశములను మనము సామాన్యముగా “దైవిక జోక్యములు” లేక “ఆశ్చర్య కార్యములు” అని పిలుస్తాము.

బైబిలానుసారమైన వేదాంతవేత్తలు లేఖనములో దేవుని కార్యముల మీద దృష్టి పెట్టినప్పుడు, వారు దైవిక కార్యములన్నిటి మీద ఆసక్తిని చూపుతారుగాని, ఒకే రకముగా చూపరు. అవి కొన్ని సార్లు దేవుడు మాధ్యమాల ద్వారా కార్యమును చేయు సాధారణ సన్నివేశములను ప్రతిబింబించినప్పటికీ, అవి ముఖ్యముగా సాధారణ మాధ్యమాల కంటే ఎక్కువగా అసాధారణమైన కార్యముల మీద దృష్టిని పెడతాయి. మరియు దేవుని కార్యము ఎంత అమోఘముగా ఉంటె, అంత ఎక్కువగా బైబిలానుసారమైన వేదాంతవేత్తలు దానిని ఉద్ఘాటిస్తారు.

సృష్టి; ఐగుప్తు నుండి నిర్గమము; కనాను దేశమును స్వాధీనపరచుకొనుట; క్రీస్తు జననం, జీవితము, మరణం, పునరుత్థానము మరియు ఆరోహణము వంటి సన్నివేశములు చరిత్రలో దేవుడు నాటకీయముగా పాలుపంచుకున్న సందర్భములుగా లేఖనము యొక్క పేజీలలో నిలిచిపోతాయి. కాబట్టి, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము దేవుని కార్యముల వైపు మన ఆసక్తిని మళ్ళిస్తుంది అని మనము చెప్పినప్పుడు, ఇట్టి దేవుని యొక్క అసామాన్యమైన కార్యములు ప్రాథమిక లక్ష్యముగా ఉన్నాయి.

బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము బైబిలును చారిత్రిక విశ్లేషణ ద్వారా చూసి లేఖనములలో నివేదించబడిన దేవుని అసామాన్యమైన కార్యముల మీద దృష్టి పెడుతుంది అని మనము చూశాము కాబట్టి, ఇప్పుడు మన నిర్వచనము యొక్క మూడవ కోణమును మనము చూడవలసియున్నది: ఈ అంశముల విషయములో బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో వేదాంతశాస్త్ర విశ్లేషణ ఇమిడియున్నదను సత్యము.

బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో వేదాంతశాస్త్ర విశ్లేషణ లేఖనములోని దేవుని కార్యము యొక్క చారిత్రిక విశ్లేషణ మీద ఆధార పడియుంటుంది కాని చారిత్రిక విశ్లేషణ అనేక రూపాలను సంతరించుకుంటుంది. అయితే కనీసం రెండు ముఖ్యమైన ధోరణులను గూర్చి ఆలోచన చేయుట సహాయకరముగా ఉంటుంది: వాస్తవిక చారిత్రిక విశ్లేషణ మరియు వేదాంతశాస్త్ర చారిత్రిక విశ్లేషణ. ఈ రెండు ధోరణులు ఒకే విధముగా ఉంటాయిగాని, వాటి ముఖ్య విషయములు భిన్నముగా ఉంటాయి. వాస్తవిక చారిత్రిక విశ్లేషణ అంటే ఏమిటో మొదట చూద్దాము.

చాలా సార్లు, బైబిలు యొక్క ఆధునిక పాఠకులు బైబిలు చరిత్ర పట్ల “వాస్తవిక” ధోరణిని ఉపయోగిస్తారు. దీని అర్థము, లేఖనములో నివేదించబడిన సన్నివేశములు పురాతన పశ్చిమ ఆసియా యొక్క సందర్భములోనికి ఎలా అమర్చబడతాయి అను విషయమును గూర్చి వారు ఎక్కువగా చింతిస్తారు. చారిత్రిక విశ్లేషణ పట్ల వాస్తవిక ధోరణి మోషే నాయకత్వములో నిర్గమము యొక్క తారీఖు, ఇశ్రాయేలు రాజరికమునకు దారి తీసిన చారిత్రిక పరిస్థితులు, కొన్ని యుద్ధములు మరియు ఇతర ముఖ్య సన్నివేశముల యొక్క రుజువులు వంటి ప్రశ్నల మీద ఎక్కువ దృష్టిని పెడుతుంది. వాస్తవిక చారిత్రిక విశ్లేషణ యొక్క గురి మాత్రం చాలా సూటిగా ఉంది. అది లేఖనములో మనము నేర్చుకొను విషయములను బైబిలేతర నిధుల నుండి మనము సేకరించు సమాచారముతో కలుపుట ద్వారా చరిత్రలోని సత్యముల యొక్క ఆధారయోగ్యమైన కథనమును నిర్మించుటయైయున్నది.

ఇలాంటి వాస్తవిక విషయములు ఎంత ప్రాముఖ్యమైనవైనప్పటికీ, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము వేదాంతశాస్త్ర చారిత్రిక విశ్లేషణను గూర్చి మరి ఎక్కువగా చింతిస్తుంది. బైబిలానుసారమైన వేదాంతవేత్తలు లేఖనములో నివేదించబడిన దేవుని కార్యముల యొక్క వేదాంతశాస్త్ర ప్రాముఖ్యత మీద ఎక్కువ ఆసక్తి కలిగియున్నారు. మన అర్థమును గ్రహించుట కొరకు, వేదాంతశాస్త్ర విశ్లేషణను గూర్చి మాట్లాడునప్పుడు ఎక్కువ మంది క్రైస్తవుల యొక్క అర్థమును సూచించు థామస్ అక్వినస్ యొక్క రచనలలో కనిపించు వేదాంతశాస్త్రము యొక్క సామాన్య నిర్వచనము వైపు మనము తిరగాలి.

ఆయన సుపరిచిత పుస్తకమైన సుమ్మ థియోలజికలోని మొదటి పుస్తకము, మొదటి అధ్యాయం, ఏడవ భాగంలో అక్వినస్ వేదాంతశాస్త్రమును “పవిత్రమైన సిద్ధాంతము” అని పిలచి ఈ విధంగా నిర్వచించాడు:

అవి స్వయంగా దేవుడైయుండుట వలన లేక అవి దేవుని సంభోదించుచున్నందు వలన, అన్ని విషయములు దేవుని దృష్టిలో నుండి విచారించబడు ఒక ఏకీకృత విజ్ఞానము.

సాధారణంగా, వేదాంతశాస్త్రమునకు రెండు ముఖ్యమైన ఆందోళనలు ఉన్నట్లు క్రైస్తవులు అక్వినస్ తో సమ్మతించినట్లు కనిపిస్తారు. ఒక వైపున, దేవునిని సూటిగా సంబోధించు ఏ విషయమైనా వేదాంతశాస్త్ర విషయమే. మరియు మరొక వైపు, ఇతర అంశములను దేవునితో అనుబంధములో వివరించు ప్రతిది వేదాంతశాస్త్ర విషయమే. ముందు విభాగమును సాంప్రదాయిక వేదాంతశాస్త్రము దేవుని గూర్చిన వేదాంతశాస్త్రము అని పిలుస్తుంది. మరియు తరువాత విభాగము మానవ పాపము, రక్షణ, నైతిక, సంఘ సిద్ధాంతములు మరియు ఇలాంటి ఇతర సిద్ధాంతముల వంటి వాటిని కలిగియుంటుంది.

ఈ రెండింతల నిర్వచనము బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో వేదాంతశాస్త్ర విశ్లేషణ ఇమిడియున్న మార్గములను గూర్చి మనకు మెళకువలను ఇస్తుంది. ఒక వైపున, స్వయంగా దేవుని గూర్చి అవి ఏమి బోధించుచున్నవో చూచుటకు బైబిలానుసారమైన వేదాంతవేత్తలు దేవుని కార్యములు అని బైబిలు చెప్పువాటిని సమీక్షిస్తారు. దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు దేవుని స్వభావమును గూర్చి మరియు దేవుని చిత్తమును గూర్చి ఏమి బయలుపరుస్తాయి? మరియు మరొక వైపు, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము దేవునికి సంబంధించిన ఇతర అంశములను గూర్చి కూడా ఆలోచన చేస్తుంది: మానవ జాతి, పాపము, రక్షణ మరియు అనేక ఇతర అంశములు. ఈ వేదాంతశాస్త్ర అంశములన్నిటిని గూర్చి మనము కలిగియున్న అవగాహనను ప్రోత్సహించు మరియు బలపరచు మార్గములను బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము విప్పుతుంది.

ఈ సామాన్య ధోరణిని దృష్టిలో ఉంచుకొని, మన రెండవ ముఖ్య అంశము వైపుకు తిరుగుదాము: బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అను అధికారిక శాఖకు దారి తీసిన పరిణామములు. అవి ఎలా ఉనికిలోనికి వచ్చాయి? క్రైస్తవులు లేఖనములను ఈ విధముగా ఎందుకు సమీపించారు?

ఈ ప్రశ్నల యొక్క రెండు కోణములను మనము చూద్దాము: మొదటిగా, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము కొరకు రంగమును సిద్ధము చేసిన కొన్ని ముఖ్యమైన సాంస్కృతిక మార్పులను మనము చూద్దాము. మరియు రెండవదిగా, ఈ సాంస్కృతిక మార్పుల పట్ల సంఘము యొక్క వేదాంతశాస్త్ర ప్రతిస్పందనలను చూద్దాము. మొదటిగా బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ఎదుగుదలకు తోడ్పడిన సాంస్కృతిక మార్పులను చూద్దాము రండి.

తమ సమకాలీన సంస్కృతులకు సరిగా జవాబిచ్చు విధానాలలో క్రైస్తవ వేదాంతశాస్త్రమును పునఃనిర్మించుట ద్వారా క్రైస్తవ వేదాంతవేత్తలు గొప్ప ఆజ్ఞను నెరవేర్చుటకు ప్రయత్నించారు అను విషయం మనం ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి. ఇతర పాఠములలో, మధ్యధరా ప్రపంచము నియో ప్లాటోవాదము మరియు అరిస్టాటిల్ వాదముచే శాసించబడుచున్న కాలములో క్రీస్తు యొక్క సత్యమును ఆ ప్రపంచములోనికి తీసుకొనివచ్చుటకు పురాతన మరియు మధ్యకాలీన సంఘము చేసిన ప్రయత్నములలో నుండి క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము పుట్టుకొచ్చింది అని మనము చూశాము. క్రైస్తవులు ఈ తత్వవాదముల నుండి సవాళ్లను ఎదుర్కొనగా, వారు లేఖనములకు నమ్మకముగా ఉండుటకు ప్రయత్నించారు గాని, అదే సమయములో ఆ తత్వవాద దృక్పథముల నుండి వెలువడిన సమస్యలను పరిష్కరించుటకు కూడా ప్రయత్నించారు.

ఇంచుమించు ఇదే విధముగా, పదిహేడవ శతాబ్దము యొక్క జ్ఞానోదయము సమయములో కలిగిన సాంస్కృతిక మార్పులకు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ప్రతిస్పందనగా ఉన్నది. అంటే దీని అర్థము బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క సమస్యలు నూతనమైనవి, లేక కేవలం ఆధునిక కాలమునకు చెందినవి మాత్రమే అని కాదు. క్రైస్తవులు ఎల్లప్పుడు లేఖనములో నివేదించబడిన దేవుని కార్యములను విశదపరచారు. కాని ఆధునిక యుగములో, మునుపెన్నడు లేని విధముగా ఈ చారిత్రిక ఆసక్తులను ఉద్ఘాటించునట్లు విశేషమైన సాంస్కృతిక మార్పులు వేదాంతవేత్తలను పురికొల్పాయి.

సులువుగా చెబితే, ఆధునిక యుగములో అతి ప్రాముఖ్యమైన జ్ఞానతత్వ ఉద్యమమైన ఆధునిక చరిత్రాధ్యయనమునకు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము క్రైస్తవ ప్రతిస్పందనగా ఉన్నది. సామాన్య పరిభాషలో, ఆధునిక చరిత్రాధ్యయనం అనగా మనలను మనము మరియు మన చుట్టు ఉన్న లోకమును అర్థము చేసికొనుటలో చరిత్ర కీలకపాత్ర పోషిస్తుంది అనే నమ్మకమైయున్నది. ఈ అభిప్రాయములో, ఏ విషయము యొక్క సరియైన అవగాహన అయినా చరిత్రలో అది కలిగియున్న స్థానము ఆధారంగా మాత్రమే రాబట్టబడుతుంది.

ఈ సాంస్కృతిక మార్పును వ్యక్తపరచిన అత్యంత సుపరిచితమైన జ్ఞానోదయ మూర్తులలో ఒకరు జర్మన్ తత్వ వాదియైన జార్జ్ విల్హెల్మ్ ఫ్రెడ్రిక్ హెగెల్, మరియు ఈయన 1770 నుండి 1831 మధ్య కాలములో నివసించాడు. వాస్తవికతలోని ప్రతిది మాండలికము అని పిలువబడు చారిత్రిక ప్రక్రియ యొక్క తార్కిక పద్ధతులలో పట్టబడియున్నది అను ప్రతిపాదన ద్వారా హెగెల్ సుపరిచితుడైయ్యాడు. విశ్వమంతా దేవునిచే ఆదేశించబడి దైవికమైన చారిత్రిక తర్కమును అనుసరించింది అని అతడు అనుకున్నాడు. ఈ దృష్టికోణము ప్రకారం, చరిత్ర యొక్క ఈ తార్కిక పద్ధతి వెలుగులో లోకములోని ప్రతిదానిని మనము ఉత్తమమైన రీతిలో అర్థము చేసుకోగలుగుతాము.

ఇది మరియు ఇతర రకముల చరిత్రాధ్యయనం ఆధునిక చరిత్రలో అనేక కారణముల ద్వారా ప్రాముఖ్యతను సంతరించుకున్నది. ఉదాహరణకు, పురావస్తుశాస్త్ర ఆవిష్కరణముల యొక్క గుండశైలములు లోకములోని పురాతన సంస్కృతులను గూర్చి ఎంతో సమాచారమును ఇస్తాయి. భూవిజ్ఞాన శాస్త్రము కేవలం భూమి యొక్క ప్రస్తుత కాల స్థితిని అవగాహన చేసుకొనుట మాత్రమే గాక, భూమి యొక్క వయస్సు మరియు అభివృద్ధిని వివేచించు ఒక కృషి అయ్యింది. జీవశాస్త్రము కూడా దాని గురి విషయములో చారిత్రికమైనదైనది, మరియు అనేక మంది జీవశాస్త్రజ్ఞులు తమ శాఖను డార్విన్ వాదము యొక్క దృష్టితో చూచుట ఆరంభించి, మన గోళము మీద జీవము ఈ విధముగానే ఆరంభమైనది అని నమ్మారు. ఆధునిక చరిత్రాధ్యయనం వైపుకు ఈ మార్పు ఇంచుమించు అన్ని అధ్యయన శాఖలలో, వేదాంతశాస్త్రములో కూడా, జరిగాయి. చరిత్ర యొక్క ప్రవాహము వెలుగులో సమీక్షించబడినప్పుడు జీవితములో ప్రతి విషయము సంపూర్ణంగా గ్రహించబడుతుంది.

ఆధునిక చరిత్రాధ్యయనమును దృష్టిలో ఉంచుకొని, క్రైస్తవ వేదాంతవేత్తలు ఈ సాంస్కృతిక మార్పునకు స్పందించిన విధానములను మనము చూడవలసియున్నది. వేదాంతశాస్త్రమును క్రైస్తవులు సమీపించు విధానముల మీద, ముఖ్యముగా వారు బైబిలును అనువదించిన విధానముల మీద చరిత్రాధ్యయనం ఎలాంటి ప్రభావములను చూపింది?

చరిత్రాధ్యయనము ఆధునిక క్రైస్తవ వేదాంతశాస్త్రము మీద లెక్కలేనన్ని ప్రభావములను చూపింది, కాని ఈ పాఠంలో అది బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమునకు ఎలా జన్మనిచ్చిందో అను విషయము మీద మనము ప్రత్యేకమైన ఆసక్తిని చూపుదాము. నిశ్చయముగా, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము చరిత్రలో ఆధునిక పాశ్చాత్య సంస్కృతి యొక్క ఆసక్తులను ప్రతిబింబిస్తుంది. కాని మనము ముందు చూడబోవుచున్నట్లు, ప్రాముఖ్యమైన క్రైస్తవ నమ్మకములను పణంగా పెట్టు విధముగా కొందరు వేదాంతవేత్తలు చరిత్రాధ్యయనమును హత్తుకున్నారు, మరికొందరు క్రైస్తవ విశ్వాసమును ఎత్తిపట్టుకొను విధముగాను మరికొన్ని సార్లు దానిని గూర్చిన మన అవగాహనను బలపరచు విధముగా కూడా చరిత్రాధ్యాయనమునకు విలువైన మెళకువలను జోడించారు.

ఈ కారణము చేత, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అను శాఖలో అనుసరించబడిన రెండు ముఖ్యమైన దిశలను మనము చూద్దాము. మొదటిగా, “విమర్శనాత్మక బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము,” అనగా బైబిలు అధికారమును నిరాకరించునంతగా ఆధునీకతా దృక్పథమును హత్తుకున్న అధ్యయన శాఖలను మనము పరిశీలించుదాము. మరియు రెండవదిగా, మనము “ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము,” అనగా బైబిలు అధికారమునకు కట్టుబడియున్న వేదాంతవేత్తలు అనుసరించిన అధ్యయన శాఖలను చూద్దాము. విమర్శనాత్మక పరిసరాలలో బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క పరిణామములను మొదట చూద్దాము.

క్రొత్త ప్రశ్నలు మరియు ప్రాధాన్యతలతో లేఖనములను చూచుటకు అనేకమంది విమర్శనాత్మక వేదాంతవేత్తలను ఆధునిక చరిత్రాధ్యయనము పురికొల్పింది. పరిణామాల యొక్క రెండు చారిత్రిక దశలను క్లుప్తంగా చూచుట ద్వారా మనము ఈ అంశము యొక్క మూలమును తెలుసుకొనవచ్చు. మొదటిగా, పద్దెనిమిదవ శతాబ్దములోని ఆరంభ దశలను చూద్దాము. మరియు రెండవదిగా, ఈ మధ్యకాల చరిత్రలోని మరికొన్ని పరిణామాలను మనము వర్ణించుదాము. మొదటిగా ఆదిమ విమర్శనాత్మక బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును చూద్దాము.

ఆధునిక బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క మూలములను 1787లో ఆల్ట్ డార్ఫ్ విశ్వవిద్యాలయములో జోహాన్న్ గెబ్లర్ ఇచ్చిన పరిచయ ప్రసంగమునకు సాధారణముగా ఆపాదిస్తారు. గెబ్లర్ కంటే ముందు కొంత మంది ప్రాముఖ్యమైన పూర్వగాములు ఉన్నప్పటికీ, శతాబ్దముల వరకు క్రైస్తవ సిద్ధాంతమును నిర్దేశించిన విశేషతలను గూర్చి ఆయన మాట్లాడాడు.

గెబ్లర్ రెండు సామన్య వేదాంతశాస్త్ర ప్రయత్నాల మధ్య వ్యత్యాసము చూపాడు. ఒక వైపున, అతడు “బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము”ను గూర్చి మాట్లాడుతూ, దానిని బైబిలు బోధనలను దాని సొంత పురాతన చారిత్రిక సందర్భములో వివరించు చారిత్రిక శాఖగా నిర్వచించాడు. ఆయన అభిప్రాయములో, పురాతన బైబిలు రచయితలు మరియు పాత్రలు దేవుని గూర్చి మరియు వారు నివసించిన లోకమును గూర్చి ఏమి నమ్మారో కనుగొనుట బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క లక్ష్యమైయున్నది.

మరొక వైపు, గెబ్లర్ పిడివాదము లేక క్రమబద్ధమైన వేదాంతశాస్త్రమును గూర్చి కూడా మాట్లాడాడు. క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము యొక్క లక్ష్యము బైబిలును పరీక్షించుట లేక వివరించుట కాదుగాని, విజ్ఞానము మరియు మతములను తార్కికముగా సమీక్షించుచు ఆధునిక లోకములో క్రైస్తవులు ఏమి నమ్మాలో నిర్థారించుటయైయున్నది.

ఒక విమర్శనాత్మక వేదాంతవేత్తగా, గెబ్లర్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ఆవిష్కరణలు కాలక్రమములో కొన్నిసార్లు ఆసక్తిని కలిగించవచ్చు, కాని ఆధునిక క్రైస్తవులు బైబిలులో ఆధునిక తార్కిక మరియు వైజ్ఞానిక విశ్లేషణ యొక్క ప్రమాణములను అనుసరించు భాగములను మాత్రమే విశ్వసించవలెనని నమ్మాడని గ్రహించుట చాలా అవసరము. ఈ అభిప్రాయం ప్రకారం, ఆధునిక తార్కిక యుగమునకు మునుపు నివసించిన ప్రజల యొక్క అమాయక నమ్మకములను మరియు ఆచారములను లేఖనములు ప్రతిబింబించుచున్నాయి. మరియు ఈ కారణము చేత, క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము ఒక స్వతంత్రమైన శాఖగా ఉండాలి, మరియు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము బైబిలులో కనుగొను విషయములను గూర్చి అది పట్టించుకోకూడదు.

బైబిలానుసారమైన మరియు క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము మధ్య గెబ్లర్ చూపిన వ్యత్యాసము మన రోజులలో కూడా కొనసాగుచున్న విమర్శనాత్మక వేదాంతవేత్తలకు నిర్దేశనములను ఇచ్చింది. అయితే ఈ మధ్య శతాబ్దములలో విమర్శనాత్మక బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అభివృద్ధి చెందిన విధానమును చూచుట కూడా చాలా అవసరమైయున్నది. ఈ మధ్య శతాబ్దాలలో విమర్శనాత్మక బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో కనిపించిన మరొక లక్షణము ఏమనగా, బైబిలులో ఇవ్వబడిన చారిత్రిక విషయములు పూర్తిగా ఆధారయోగ్యమైనవి కావు అనే ఎదుగుచున్న నిర్థారణ. చాలా వరకు, లేఖనములలోని అనేక భాగములను తప్పిదములు కలిగినవని, కల్పితములని లేక ఖచ్చితమైన మోసములని అనేక మంది విమర్శనాత్మక పండితులు వాటిని తిరస్కరించారు. ఈ దృష్టికోణములో, యెర్ర సముద్రమును దాటి వెళ్లుట సముద్రములోని బురద మీద వీచిన బలమైన గాలి, లేక తెప్పల మీద ఐగుప్తు నుండి తప్పించుకున్న చిన్న బానిసల గుంపు మాత్రమే. కనానును స్వాధీనపరచుకొనుట సంచార జాతులు మరియు కనానులోని పట్టణ వాసుల మధ్య జరుగిన కొన్ని స్థానిక పోరాటములు మాత్రమే అయ్యున్నది. విమర్శనాత్మక వేదాంతశాస్త్రము ముందుకు కొనసాగగా, అనేక మంది ప్రఖ్యాతిగాంచిన విమర్శనాత్మక వేదాంతవేత్తలు అబ్రాహాము చారిత్రిక వ్యక్తి, లేక మోషే అనేవాడు ఒకప్పుడు నివసించాడు అనే విషయములను గూర్చి కూడా సందేహించుట ఆరంభించారు. యేసు నివసించియుంటే, ఆయన ఒక గొప్ప నైతిక బోధకుడుమాత్రమేగాని, ఆయన ఎన్నడు అద్భుతాలు చేయలేదు లేక మరణము నుండి లేవలేదు అని వారు వాపోయారు.

ఇప్పుడు, తమ క్రమబద్ధమైన వేదాంతశాస్త్రమును రూపొందించుచున్నప్పుడు లేఖనములను ఆధారము చేసికొనుట విమర్శనాత్మక వేదాంతవేత్తలకు రానురాను కష్టమైనదని మీరు ఊహించవచ్చు. బైబిలు అంతటిలో తప్పుదోవపట్టించు చారిత్రిక విషయములు ఉన్నాయని వారు ఊహించారు కాబట్టి వారు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును ప్రక్కన పెట్టారని మనము ఆలోచించవచ్చు. మరియు ఆధునిక కాలములో అనేక మంది ఈ విధముగానే చేశారు. అయితే విమర్శనాత్మక వేదాంతవేత్తలు బైబిలు అధికారమును తిరస్కరించినప్పుడు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అంతరించిపోలేదు. బదులుగా, సమకాలీన వేదాంతశాస్త్రములో లేఖనములను ఉపయోగించుకొనుటకు వారు ఇతర మార్గములను కనుగొన్నారు. బైబిలును నిజమైన చరిత్రగా పరిగణించుటకు బదులుగా, చారిత్రిక ప్రదిపాదనలుగా ప్రస్తుతించబడిన ప్రాచీన మతపరమైన భావన యొక్క వ్యక్తీకరణలుగా వారు లేఖనములను పరిగణించుట ఆరంభించారు, మరియు ఈ పురాతన మతపరమైన భావనలు మరియు అనుభవాలు ఆధునిక క్రైస్తవులకు ఏ విధంగా ఉపయోగపడతాయో వారు కనుగొన్నారు.

జి. ఎర్నెస్ట్ రైట్, 20వ శతాబ్దపు ప్రసిద్ధిగాంచిన బైబిలానుసారమైన వేదాంతవేత్త, తాను వ్రాసిన గాడ్ హూ ఆక్ట్స్ అను పుస్తకములో బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును వివరిస్తూ ఈ అభిప్రాయమును వెళ్ళబుచ్చాడు:

కాబట్టి బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును ఒక చరిత్రలో దేవుని కార్యములను వాటిలో నుండి వెలువడిన ఉద్ఘాటనలతో సహా అంగీకరించుచు వల్లించుట అని నిర్వచించాలి.

ఇక్కడ రైట్ చెప్పిన మాటలను గుర్తించండి. ఆయన అభిప్రాయం ప్రకారం, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము “దేవుని కార్యముల” మీద దృష్టి పెడుతుంది. కాని రైట్ “దేవుని కార్యముల”ను గూర్చి ఒక విశేషమైన భావనలో మాట్లాడాడు. సన్నివేశములను జరిగినవి జరిగిన్నట్లుగా దృష్టించుటకు బదులుగా, బైబిలు వంటి పుస్తకములలో కనిపించు దేవుని కార్యములను గూర్చిన “అంగీకార వల్లిక” మీద బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము దృష్టిపెట్టాలని రైట్ సూచించాడు.

రెండవ స్థానములో, లేఖనములోని దేవుని కార్యముల యొక్క అంగీకార వల్లికలో నుండి “వెలువడిన ఉద్ఘాటన” మీద బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము దృష్టిపెట్టాలని రైట్ నమ్మాడు. రైట్ అభిప్రాయం ప్రకారం, లేఖనములో వ్రాయబడిన చరిత్ర చాలా వరకు కల్పితమైయున్నది. కాని దానిని సరిగా పరిగణించినప్పుడు, దానిలోని కథలు వేదాంత సత్యములను తెలియజేస్తాయి. కాబట్టి, లేఖనము యొక్క కల్పిత కథనముల వెనుక ఉన్న వేదాంత సత్యములను కనుగొనుట బైబిలానుసారమైన వేదాంతవేత్త యొక్క బాధ్యతయైయున్నది.

విమర్శనాత్మక బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములోని ఈ ధోరణి ఆధునిక వేదంతశాస్త్రములో ఒక సామాన్య విషయమైన ఒక విశేషతలో చక్కగా ఇముడుతుంది. అనేక మంది జర్మన్ వేదాంతవేత్తలు రెండు వేర్వేరు పదములను ఉపయోగించుట ద్వారా బైబిలులో కనిపించు అంగీకార చరిత్రను వాస్తవిక చారిత్రిక సన్నివేశములతో వ్యత్యాసపరచారు. వాస్తవిక సన్నివేశములను హిస్టరీయ అనే పదము ద్వారా సూచించారు. లేఖనములలోని కొన్ని సన్నివేశములను ఆధునిక వైజ్ఞానిక పరిశోధన ద్వారా ఆమోదించవచ్చు. కాని వారి అభిప్రాయములో మనకు బైబిలులో కనిపించు “పవిత్రమైన చరిత్ర-కథనము”లో చాలా వరకు నిజమైన చరిత్ర కానేకాదు; అది హెయిల్స్గెస్చిచ్టే — “విమోచన చరిత్ర” లేక “రక్షణ చరిత్ర.” రక్షణ చరిత్ర అనేది చరిత్రను తెలియజేయు రూపములో ఉన్న మతపరమైన భావనల యొక్క వ్యక్తీకరణ. విమోచన చరిత్ర అనగా మనకు బైబిలులో కనిపించు సన్నివేశముల యొక్క అంగీకార వల్లికయైయున్నది.

నేడు సహితం, లేఖనమంతటిని తిరస్కరించని విమర్శనాత్మక వేదాంతవేత్తలలో ఎక్కువ మంది బైబిలు యొక్క చరిత్రను హెయిల్స్గెస్చిచ్టే గానే అనగా “విమోచన చరిత్ర,” “అంగీకరించు, చరిత్ర వంటి” వేదాంత ప్రతిబింబములుగా పరిగణిస్తారు. లేఖనము యొక్క చారిత్రిక ఆధారయోగ్యతను తిరస్కరిస్తూనే, లేఖనములు మానవ మత భావనలను ఎలా ప్రతిబింబిస్తాయో అన్వేషిస్తూ తమ సొంత వేదాంతశాస్త్రము కొరకు లేఖనమును ఉపయోగించుకుంటారు. హెయిల్స్గెస్చిచ్టే, ఇశ్రాయేలు మరియు ఆదిమ సంఘము యొక్క సంప్రదాయములు, సమకాలీన విమర్శనాత్మక బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క గురియైయున్నది, మరియు దాని యొక్క తీర్పులు కొంత వరకు ఆధునిక క్రమబద్ధ లేక సమకాలీన వేదాంతశాస్త్రమునకు సమాచారమును సమకూర్చుతాయి.

విమర్శనాత్మక వేదాంతవేత్తల మధ్య బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ఒక శాఖగా ఎదిగిన విధానమును మనము గమనించాము కాబట్టి, ఇప్పుడు రెండవ ఆలోచన వైపుకు మన దృష్టిని మళ్ళించాలి: ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము. ఇక్కడ “ఇవాంజెలికల్” అను పదమును మనము ఎలా ఉపయోగిస్తామంటే, ఈ క్రైస్తవులు లేఖనము యొక్క నిస్సందేహమైన అధికారమును ఉద్ఘాటించుట కొనసాగిస్తారు.

సంతోషకరముగా, బైబిలు అధికారమును విమర్శనాత్మకముగా తిరస్కరించని క్రైస్తవులు లోకమంతట అనేక సంఘ శాఖలలో చాలా మంది ఉన్నారు. వైజ్ఞానిక పరిశోధన యొక్క విలువను మరియు ప్రాముఖ్యతను తృణీకరించకుండా, లేఖనములు చేయు ప్రతిపాదనలన్నిటిలో, చరిత్రను గూర్చి చేయు ప్రతిపాదనలలో కూడా, నమ్మదగినవని ఈ ఇవాంజెలికల్ క్రైస్తవులు ఒత్తి చెబుతారు. బైబిలు అధికారము పట్ల ఈ ఎడతెగని సమర్పణ కలిగియుండిన తరువాత కూడా, ఇవాంజెలికల్ క్రైస్తవులు లేఖనములను ఆశ్రయించు విధానము మీద ఆధునిక చరిత్రాధ్యయనము గొప్ప ప్రభావమును చూపింది.

ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును అన్వేషించుటకు, విమర్శనాత్మక పద్ధతులకు సమాంతరముగ ఉన్న రెండు దిశల్లో మన దృష్టిని సారించుదాము: మొదటిగా, ఆధునిక ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ఆరంభ దశలు, మరియు రెండవదిగా, మరికొన్ని ఇటీవల పరిణామాలు. ప్రిన్స్స్టన్ థియోలాజికల్ సేమినరికి చెందిన 19వ శతాబ్దపు ఇద్దరు అమెరికన్ వేదాంతవేత్తల యొక్క ఉన్నత ప్రభావముగల అభిప్రాయములను చూచుట ద్వారా ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ఆరంభ దశలను మనము చూద్దాము. మొదటిగా, చార్లెస్ హడ్జ్ యొక్క అభిప్రాయమును చూద్దాము. మరియు రెండవదిగా, బెంజమిన్ బి. వార్ఫీల్డ్ యొక్క అభిప్రాయమును మనము చూద్దాము. చార్లెస్ హడ్జ్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును అర్థము చేసుకున్న విధానమును చూచుటతో ఆరంభించుదాము.

చార్లెస్ హడ్జ్ 1797 నుండి 1878 మధ్య కాలంలో నివసించాడు మరియు తనను తాను ముఖ్యముగా క్రమబద్ధమైన వేదాంతశాస్త్రమునకు అంకితం చేసుకున్నాడు. తాను వ్రాసిన మూడు వాల్యూంల సిస్టమాటిక్ థియోలాజి యొక్క పరిచయంలో హడ్జ్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును క్రమబద్ధతల నుండి వ్యత్యాసపరచిన విధానమును వినండి.

ఇది బైబిలానుసారమైన మరియు క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము మధ్య వ్యత్యాసమును తెలియజేస్తుంది. [బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము] యొక్క బాధ్యత లేఖనము యొక్క సత్యములను తెలియజేయుట మరియు ఉద్ఘాటించుటయైయున్నది. [క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము] యొక్క బాధ్యత ఆ సత్యములను తీసుకొని, ఒకదానితో మరొక దాని యొక్క అనుబంధమును మరియు ఇతర సత్యములతో వాటి అనుబంధమును నిర్థారించి, వాటిని సమర్థించి వాటి యొక్క ఐక్యతను మరియు స్థిరత్వమును తెలియజేయుటయైయున్నది.

మనము ఇక్కడ చూచుచున్నట్లు, హడ్జ్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును వ్యాఖ్యాన శాఖగా, అనగా లేఖన సత్యములను అధ్యయనము చేయుదానిగా నిర్వచించాడు. మరియు క్రమబద్ధమైన వేదాంతశాస్త్రమును బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో కనుగొనబడిన సత్యములను తీసుకొని వాటిని ఒకదానితో మరొకటి కలిగిన అనుబంధ క్రమములో అమర్చి, వాటి యొక్క తార్కిక అనుబంధములను కనుగొనునదిగా నిర్వచించాడు.

విమర్శనాత్మక వేదాంతవేత్తలకు భిన్నముగా, హడ్జ్ లేఖనము యొక్క అధికారమును నమ్మాడు. బైబిలు అధికారము పట్ల తాను కలిగియుండిన సమర్పణ, క్రమబద్ధమైన వేదాంతశాస్త్రమును బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ఆవిష్కరణల మీద ఆధారితము చేయుటకు క్రైస్తవులు బద్ధులైయున్నారని బోధించునట్లు ఆయనను పురికొల్పింది. లేఖనము యొక్క ఒక భాగమును తిరస్కరించి మరొక దానిని అంగీకరించుటకు బదులుగా, లేఖనములో బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము కనుగొనిన ప్రతి విషయమును తార్కికమైన క్రమములో అమర్చుచు క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము వాటికి కట్టుబడియుండాలని హడ్జ్ కోరాడు.

హడ్జ్ యొక్క అభిప్రాయములలో చాలా వరకు అతని మరణము తరువాత కూడా ఇవాంజెలికల్ క్రైస్తవులను ప్రభావితము చేసినప్పటికీ, తన అనుచరులలో ఒకడైన 1851 నుండి 1921 మధ్య కాలంలో నివసించిన బెంజమిన్ వార్ఫీల్డ్ యొక్క ప్రభావము ద్వారా ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో ఒక ముఖ్యమైన మార్పు చోటు చేసుకున్నది. బైబిలు అధ్యయనముల పై తాను కలిగియున్న నైపుణ్యత బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములోని ఇవాంజెలికల్ అంశమును బలోపేతము చేయుటకు అతనిని సిద్ధపరచింది. తాను వ్రాసిన ప్రఖ్యాతిగాంచిన వ్యాసమైన ది ఐడియా అఫ్ సిస్టమాటిక్ థియోలజిలో వేదాంతశాస్త్రము యొక్క అమరికను గూర్చి వార్ఫీల్డ్ మాట్లాడిన విధానమును చూడండి. ఈ వ్యాసము యొక్క ఐదవ భాగములో ఆయన ఇలా వ్రాసాడు:

క్రమబద్ధమైన వేదాంతశాస్త్ర్రము వ్యాఖ్యాన ప్రక్రియ ద్వారా అందించబడిన చెదిరిపోయిన వేదాంతశాస్త్ర విషయముల యొక్క తార్కికమైన అమరిక కాదు; అది ముందుగానే తార్కికముగా అమర్చబడి బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ద్వారా ఇవ్వబడిన సమాచారము యొక్క కలయికయైయున్నది... లేఖనములోని వేర్వేరు పిడివాద కథనములను ఒకే సారి అధ్యయనం చేయుట ద్వారా నిజమైన క్రమబద్ధతలను మనము పొందుకోలేము గాని, లేఖనముల యొక్క పలు వేదాంతశాస్త్రములలో అవి నిలచియుండు క్రమము మరియు పరిమాణము ఆధారముగా వాటిని కలుపుట ద్వారా పొందుకుంటాము.

ఈ భాగములో, వార్ఫీల్డ్ కనీసం మూడు ముఖ్యమైన బిందువులను తెలియజేశాడు. మొదటిగా, క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము బైబిలులో కనిపించు విడిపోయిన వేదాంతకథనముల యొక్క తార్కికమైన అమరిక అయ్యుండకూడదు. వార్ఫీల్డ్ కంటే ముందు, ఇవాంజెలికల్ క్రైస్తవులు బైబిలును క్రమబద్ధ వేదాంత ప్రతిపాదనలకు నిధిగా పరిగణించేవారు, మరియు వారు ఈ ప్రతిపాదనలను క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము యొక్క సాంప్రదాయిక పద్ధతులలో అమర్చారు. అవి అపక్వ దత్తాంశాలైయున్నవి అను విధంగా బైబిలు బోధనలను క్రోడీకరించారు. కాని లేఖనము యొక్క బోధనలు ముందుగానే బైబిలులో తార్కికమైన రీతిలో అమర్చబడియున్నాయని వార్ఫీల్డ్ తెలియజేసాడు. బైబిలు క్రమములేని ప్రతిపాదనల యొక్క సంగ్రహము కాదు; దానికి దాని సొంత తార్కికమైన అమరిక ఉన్నది, మరియు దాని సొంత వేదాంతశాస్త్ర దృక్కోణములు ఉన్నవి.

రెండవదిగా, వార్ఫీల్డ్ ఆలోచన ప్రకారం, లేఖనములలో వేదాంతశాస్త్ర్రము కేవలం ఒక విధముగా మాత్రమే అమర్చబడలేదు. ఖచ్చితముగా, బైబిలు దానిని అదే ఎన్నడు ఖండించదు; దానిలోని బోధనలన్నియు పొందిక కలిగియుంటాయి. కాని అతడు చెప్పినట్లు, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము “లేఖనములలోని పలు వేదాంతశాస్త్రముల”తో వ్యవహరిస్తుంది. బైబిలు పుస్తకముల యొక్క మానవ రచయితలు తమ వేదాంతశాస్త్ర అభిప్రాయములను భిన్నమైన, కాని పరిపూరకమైన రీతులలో వ్యక్తపరచారు. వారి రచనలు భిన్నమైన పదజాలములను, నిర్మాణములను మరియు ప్రాథాన్యతలను ప్రతిబింబించాయి. అపొస్తలుడైన పౌలు వేదాంతశాస్త్రమును వ్యక్తపరచిన విధానము యెషయాకు భిన్నముగా ఉన్నది; మత్తయి వేదాంతశాస్త్రమును మోషే కంటే భిన్నమైన పదములతో, ఉద్ఘాటనలతో మరియు దృక్కోణములతో వ్యక్తపరచాడు.

మూడవ స్థానంలో, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము లేఖనములోని “పలు వేదాంతశాస్త్రములను” వివేచిస్తుంది కాబట్టి, లేఖనములో అనేక వేదాంతశాస్త్ర వ్యవస్థలను ఒక ఐక్యమైన పూర్ణతగా కలుపుట “నిజమైన క్రమబద్ధీకుల” యొక్క బాధ్యతయైయున్నది. క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము బైబిలులోని వేదాంతశాస్త్రములను “వాటి యొక్క సరియైన క్రమములోను పరిమాణములోను” అమర్చవలసియున్నది. సులువుగా చెబితే, లేఖనములో ఇవ్వబడిన పలు వేదాంతశాస్త్ర వ్యవస్థలను బైబిలానుసారమైన వేదాంతశాస్త్ర్రము వివేచించాలని వార్ఫీల్డ్ నమ్మాడు. మరియు క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము లేఖనములోని పలు వేదాంతశాస్త్రములను సంగ్రహ ఐక్యమైన పూర్ణతగా కలపవలసియున్నది. వార్ఫీల్డ్ దినములు మొదలుకొని నేటి వరకు, ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఈ సామాన్య పద్ధతిని అనుసరించారు. బైబిలులోని పలు భాగముల యొక్క భిన్నమైన వేదాంతశాస్త్ర దృక్పథములను కనుగొనుటకు వారు ప్రయత్నించారు, మరియు బైబిలులోని వేదాంతశాస్త్రములన్నిటిని ఒక సమగ్రమైన ఐక్య వ్యవస్థగా చేయుటకు ఒక కృషిగా క్రమబద్ధమైన వేదాంతశాస్త్రమును చూశారు.

హడ్జ్ మరియు వార్ఫీల్డ్ యొక్క అభిప్రాయములను మనస్సులో ఉంచుకొని, ఈ మధ్య కాలములో ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో చోటుచేసుకున్న ఇతర పరిణామాలను మనము చూద్దాము. నిస్సందేహంగా సమకాలీన ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము మీద ఇతరులందరి కంటే ఎక్కువగా ఒక బైబిలానుసారమైన వేదాంతవేత్త ప్రభావము చూపాడు, అతడు 1862 మరియు 1949 మధ్య నివసించిన గీర్హర్డస్ వోస్. 1894లో, ప్రిన్స్టన్ థియోలాజికల్ సెమినరిలోని బైబిలానుసారమైన వేదాంతశాస్త్ర విభాగములోని మొదటి అధ్యక్షత గీర్హర్డస్ వోస్ కు ఇవ్వబడింది. అతడు హడ్జ్ మరియు వార్ఫీల్డ్ యొక్క రచనలను బలపరచాడు, కాని అతడు ఈ విభాగమును ఒక నూతనమైన మార్గములలో కూడా నడిపించాడు.

విశాల దృక్పథములో మాట్లాడితే, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము లేఖనము యొక్క బోధను కనుగొని క్రమబద్ధమైన వేదాంతశాస్త్రమునకు అధికారిక మార్గదర్శకమునిస్తుందని హడ్జ్ మరియు వార్ఫీల్డ్ చెప్పిన విషయమును వోస్ అంగీకరించాడు. మరియు దీనిని మించి, సుస్థిరమైన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములో ఐక్యమైన పూర్ణతగా అమర్చవలసిన బైబిలులోని పలు వేదాంతశాస్త్రములను వివేచిస్తుంది అనే వార్ఫీల్డ్ ప్రతిపాదనను వోస్ సమ్మతించాడు.

బైబిలులోని పలు వేదాంతశాస్త్రములన్నిటిలో సామాన్యముగా కనిపించు ఒక విషయము వైపు దృష్టిని మళ్ళించుట ద్వారా వోస్ తన పూర్వగాముల కంటే భిన్నమైయ్యాడు. లేఖనములోని పలు వేదాంతశాస్త్రములు విమోచన చరిత్ర మీద ఒక సామాన్య దృష్టి కలిగియుండినవని అతడు వాదించాడు. చరిత్రలో దేవుని యొక్క ఆశ్చర్యకార్యములు బైబిలులోని ప్రతి భాగములోని బోధన యొక్క మూలమైయున్నవని అతడు నమ్మాడు. ఈ కారణం చేత, ప్రతి బైబిలు రచయిత స్వయంగా దేవుని ఆశ్చర్య కార్యముల మీద చూపిన ధ్యాస మీద బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము దృష్టిపెట్టాలని వోస్ బోధించాడు. 1894లో తాను చేసిన మొదటి ప్రసంగములో వోస్ చెప్పినట్లు:

క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము ఒక వృత్తమును గీయుటకు ప్రయత్నిస్తుంది, మరియు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ఒక తిన్నని గీతను గీస్తుంది... బైబిలానుసారమైన మరియు క్రమబద్ధమైన వేదాంతశాస్త్రముల మధ్య ఉన్న నిజమైన అనుబంధము ఇదే. బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము సాధించు కార్యములన్నిటిలో నుండి ఎదుగు కిరీటమే పిడివాదము.

వోస్ అభిప్రాయము ప్రకారం, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము బైబిలు రచయితలు చరిత్రను ప్రతిబింబించు మార్గముల మీద దృష్టిపెడుతుంది. అది చరిత్రలో దేవుని గొప్ప కార్యముల మీద మరియు ఆ దైవికమైన కార్యముల యొక్క వేదాంతశాస్త్ర ప్రాముఖ్యత మీద బైబిలు కలిగియున్న పలు దృక్కోణములను వివేచిస్తుంది. తరువాత క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము విమోచన చరిత్రను గూర్చి బైబిలు బోధించు వాటన్నిటిని ఒక ఐక్య వేదాంత వ్యవస్థలోనికి తీసుకొని వస్తుంది. ఇంచుమించు ప్రతి ఇవాంజెలికల్ విభాగములో, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ఈ సామన్య దృష్టిని కలిగియుంటుంది.

సమకాలీన ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము లేఖనము యొక్క కేంద్రముగా విమోచన చరిత్ర మీద ఎలా దృష్టి పెడుతుందో మనము చూశాము కాబట్టి, ఈ పాఠములోని మూడవ ముఖ్య బిందువు వైపుకు తిరుగుటకు మనము సిద్ధముగా ఉన్నాము: చరిత్ర మరియు ప్రత్యక్షతకు మధ్య ఉన్న అనుబంధమును ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఎలా అర్థము చేసుకున్నారు.

చరిత్ర మరియు ప్రత్యక్షత కంటే బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో ఎక్కువ కేంద్రమైన అంశములు లేవు. మనము ముందు చూసినట్లు, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము లేఖనము అంతటిని ఐక్యపరచు దారముగా చరిత్ర మీద దృష్టిపెడుతుంది. చరిత్ర మీద ఇలాంటి దృష్టిపెట్టుటకు ఒక కారణము, లేఖనములో దేవుని యొక్క స్వయం ప్రత్యక్షత చారిత్రిక సన్నివేశములతో లోతుగా ముడిపడియున్నది అనే అవగాహన.

బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో చరిత్ర మరియు ప్రత్యక్షత మధ్య ఉన్న అనుబంధమును అర్థము చేసుకొనుటకు మనము రెండు విషయములను పరీక్షించుదాము: మొదటిగా, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ప్రత్యక్షతను “కార్యము మరియు వాక్యము” అని ఎలా నిర్వచిస్తారో మనము చూద్దాము; మరియు రెండవదిగా, బైబిలులో చరిత్ర మరియు ప్రత్యక్షత యొక్క ఆకృతులను పరీక్షించుద్దాము. మొదటిగా దైవిక ప్రత్యక్షత కార్యము మరియు వాక్యమైయున్నదను ఆలోచనను చూద్దాము.

ఈ ముఖ్యమైన అంశములను చూచుటకు, మనము మూడు విషయములను పరిగణించుదాము: మొదటిగా, “కార్య ప్రత్యక్షత” అని మనము పిలచుదానిని గూర్చి లేఖనము ఎలా మాట్లాడుతుంది; రెండవదిగా, “వాక్య ప్రత్యక్షత” లేక మౌఖిక ప్రత్యక్షత అని మనము పిలచుదాని యొక్క అవసరతను మనము చూద్దాము; మరియు మూడవదిగా, కార్య మరియు వాక్య ప్రత్యక్షత మధ్య ఉన్న అనుబంధములను పరిశీలన చేద్దాము. మొదటిగా “కార్య ప్రత్యక్షత” అను అంశమును చూద్దాము.

ప్రజలు తమను గూర్చిన విషయములను కనీసం రెండు విధాలుగా బయలుపరుస్తారని సామాన్య అనుభవము ద్వారా మనందరికీ తెలుసు. ఒక వైపున, వారు ఏమి ఆలోచిస్తున్నారో వారు మనకు చెప్పగలరు. వారు తమను గూర్చి మరియు తాము కోరు దానిని గూర్చి మాట్లాడగలరు. కాని మరొక వైపు, వారు చేయు క్రియల ద్వారా కూడా ఇతరులను గూర్చి మనము అనేక విషయములను నేర్చుకోవచ్చు. వారు కార్యములు చేయు విధానము వారు ఎలాంటి ప్రజలో బయలుపరుస్తుంది. మనము లేఖనములను పరిశీలన చేసినప్పుడు, దేవుడు తన కార్యముల ద్వారా తనను తాను బయలుపరచుకొనుటను గూర్చి బైబిలు తరచుగా మాట్లాడుతుంది అని మనకు వెంటనే స్పష్టమవుతుంది. ఉదాహరణకు, కీర్తనలు 98:2-3లో దేవుని ప్రత్యక్షత యొక్క వేడుకను వినండి.

యెహోవా తన రక్షణను వెల్లడిచేసియున్నాడు; అన్యజనులయెదుట తన నీతిని బయలుపరచియున్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసికొనియున్నాడు భూదిగంత నివాసులందరు మన దేవుడు కలుగజేసిన రక్షణను చూచిరి (కీర్తనలు 98:2-3).

గమనించండి రెండవ వచనములో కీర్తనకారుడు హెబ్రీ పదమైన గ ల ను ఉపయోగిస్తూ దేవుడు తన నీతిని “బయలుపరచాడని” చెప్పాడు, గ ల అను మాటకు అర్థము విప్పుట, తెరచుట, లేక బయలుపరచుట. అన్యజనుల యెదుట దేవుడు తన నీతిని బయలుపరచాడు లేక విప్పాడని కీర్తనకారుడు చెప్పాడు. కాని దేవుడు దీనిని చేశాడని ఈ వాక్య భాగము ఎలా తెలియజేస్తుంది? “నేను నీతిమంతుడను” అని అన్యజనులతో చెప్పుట ద్వారానా? ఈ సందర్భములో మాత్రం కాదు. మూడవ వచనము ప్రకారము దేవుడు ఒక కార్యమును చేసినప్పుడు, దేవుని యొక్క నీతి బయలుపరచబడింది. భూదిగంత నివాసులందరు “దేవుడు కలుగజేసిన రక్షణను చూచునట్లు” ఇశ్రాయేలు సంతతిని జ్ఞాపకము చేసికొని దేవుడు కార్యములను చేసెనని కీర్తన తెలియజేస్తుంది. దేవుడు తన ప్రజలను విమోచించినప్పుడు దేవుని నీతి యొక్క బయల్పాటు లేక ప్రత్యక్షత కీర్తనకారుని యొక్క మనస్సులో ఉండెను. కీర్తనకారుడు మాట్లాడిన ప్రత్యక్షత దేవుని కార్యమైయున్నది.

ఇలాంటి ఆశ్చర్యకర రకమైన “కార్య ప్రత్యక్షత” బైబిలు అంతటిలో కనిపిస్తుంది. ఉదాహరణకు, సృష్టి కార్యము దేవుని యొక్క శక్తిని మరియు స్వభావమును ప్రత్యక్షపరచింది. ఐగుప్తు నుండి ఇశ్రాయేలు యొక్క నిర్గమము శత్రువుల మీద ఆయన కలిగియున్న శక్తిని మరియు ఆయన ప్రజల కొరకు కలిగియున్న ప్రేమను బయలుపరచింది. అదే విధముగా, దావీదు సింహాసనము యొక్క స్థాపన, ఇశ్రాయేలు మరియు యూదా దేశముల చెర, చెరలో నుండి తిరిగివచ్చుట, క్రీస్తు యొక్క నరావతారము, క్రీస్తు మరణ పునరుత్థానము — ఇవన్ని, మరియు లేఖనములో లిఖించబడిన అనేక ఇతర సన్నివేశములు దేవుని స్వభావమును మరియు చిత్తమును బయలుపరుస్తాయి. “కార్య ప్రత్యక్షత” అనే అంశము బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో ఎంతో ప్రాముఖ్యమైనది.

మొదటి చూపులో, “కార్య ప్రత్యక్షత” వైపుకు ఈ కదలిక క్రైస్తవ వేదాంతశాస్త్రము మీద ఎంతో గొప్ప ప్రభావమును చూపుతుంది అనే విషయము స్పష్టము కాకపోవచ్చు. కాబట్టి, ఈ దృష్టి ఎలాంటి మార్పును కలిగించినదో చూచుటకు మనము ఒక నిమిషం వెచ్చించాలి. ఈ ఆధునిక చారిత్రిక దృష్టి యొక్క ప్రాముఖ్యతను చూడగల ఒక మార్గము దేవుని గూర్చిన వేదాంతశాస్త్రము అను సిద్ధాంతమును, అనగా స్వయంగా దేవుడు అనే అంశమును పరిగణించి, ఈ అంశమును క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము మరియు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ఏ విధముగా సమీపిస్తాయో చూచుటయే.

సాంప్రదాయిక క్రమబద్ధమైన వేదాంతశాస్త్ర దృక్పథమునకు ప్రాతినిధ్యము వహిస్తూ దేవుని ఎలా చూడాలి అను విషయమును గూర్చి వెస్ట్మినిస్టర్ షార్టర్ కేటకిజం బోధించు విధానమును ఒక నిమిషం చూడండి. షార్టర్ కేటకిజం లోని నాల్గవ ప్రశ్న ఇలా అడుగుతుంది: “దేవుడు ఎవరు?” మరియు ఈ విధముగా జవాబిస్తుంది:

దేవుడు ఆత్మయైయున్నాడు మరియు ఆయన ఉనికిలో, జ్ఞానములో, శక్తిలో, పరిశుద్ధతలో, న్యాయములో, మంచితనములో, మరియు సత్యములో అమితమైనవాడు, నిత్యుడు, మరియు మార్పులేనివాడు.

ఈ జవాబు లేఖనములకు అనుగుణంగా ఉన్నప్పటికీ, దేవుడు నిత్యమైన, నిరంతర గుణముల ఆధారంగా పూర్తిగా క్రమబద్ధమైన వేదాంతశాస్త్ర పదజాలములో నిర్వచించబడినాడని చూచుట అంత కష్టమైన పని కాదు. కాని వ్యత్యాసముగా, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు చరిత్రలో దేవుని స్థిరమైన కార్యముల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగియున్నారు. మరియు “కార్య ప్రత్యక్షత” మీద ఈ దృష్టి దేవుని గూర్చిన వేదాంతశాస్త్రములో ఒక భిన్నమైన ఉద్ఘాటన వైపుకు నడిపించింది.

“దేవుడు ఎవరు?’ అని ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతవేత్తలను ప్రశ్నించినప్పుడు, వారు వెస్ట్మినిస్టర్ షార్టర్ కేటకిజం వలె స్పందించుటకు ప్రయత్నించరు. ఇప్పుడు, ఈ అభిప్రాయమునకు వారు అసమ్మతి తెలుపరుగాని వారి ఉద్ఘాటన మరింత చారిత్రికమైనదిగా ఉంటుంది. బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఈ విధముగా చెప్పుటకు ఎక్కువ మొగ్గుచూపుతారు, “ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వమును నుండి విడిపించినవాడు దేవుడే;” “చెరలో ఇశ్రాయేలుకు తీర్పు తీర్చినవాడు దేవుడే.” లేక వారు, “తన కుమారుని ఈ లోకములోనికి పంపినవాడు దేవుడే,” అని చెప్పవచ్చు. ఏది ఏమైనా, దేవుని గూర్చి ప్రాథమికముగా ఆయన నిత్యమైన గుణముల ఆధారముగా ఆలోచించుట కంటే, చరిత్రలో ఆయన చేసిన కార్యముల ఆధారముగా బైబిలానుసారమైన వేదాంతవేత్తలు దేవుని గూర్చి ఆలోచిస్తారు. మరియు దేవుని గూర్చిన వేదాంతశాస్త్రములో ఏది సత్యమైనదో అది బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములోని ప్రతి విషయములోను సత్యమైయుంటుంది.

అదే సమయములో, ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతవేత్తలు “కార్య ప్రత్యక్షత” యొక్క ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తూనే, “వాక్య ప్రత్యక్షత,” అనగా దేవుని యొక్క మౌఖిక ప్రత్యక్షత యొక్క ప్రాముఖ్యతను కూడా ఉద్ఘాటించారు. లేఖనములలో, దేవుడు కేవలం కార్యములు మాత్రమే చేయడు; ఆయన తన కార్యములను గూర్చి మాట్లాడతాడు కూడా. ఆయన తన కార్యములను మాటలతో వివరిస్తాడు.

మౌఖిక లేక “వాక్య ప్రత్యక్షత” అనేక కారణముల వలన ప్రాముఖ్యమైనది, కాని “వాక్య ప్రత్యక్షత”ను ఎంతో ప్రాముఖ్యమైనదిగా చేయు దేవుని కార్యములను గూర్చిన రెండు విషయములను మేము ప్రస్తావిస్తాము: ఒక వైపున, సన్నివేశముల యొక్క అస్పష్ట ప్రాముఖ్యత; మరొక వైపు, సన్నివేశముల యొక్క కిరణ సదృశ ప్రాముఖ్యత. మొదటిగా లేఖనములోని సన్నివేశముల యొక్క అస్పష్టత “వాక్య ప్రత్యక్షత”ను అవసరమైనదిగా ఎలా చేస్తుందో చూద్దాము.

దేవుని కార్యములు అస్పష్టమైనవి అని మనము చెప్పినప్పుడు, ఆయన కార్యముల యొక్క ప్రాముఖ్యత ఎల్లప్పుడు మానవులకు స్పష్టముగా కనిపించదు అని అర్థము. తాను చేయుచున్నదానిని దేవుడు ఎల్లప్పుడు సంపూర్ణంగా అర్థము చేసుకొనునప్పటికీ, ఆయన కార్యముల యొక్క ప్రాముఖ్యతను మనము అర్థము చేసుకొనుటకు వాటిని మాటల ద్వారా అనువదించవలసియున్నది లేదా స్పష్టపరచవలసియున్నది.

అనుదిన జీవితములోని ఒక ఉదాహరణను పరిగణించండి. ఇతర విద్యార్థులతో కలసి మీరు ఒక తరగతి గదిలో కూర్చున్నారని ఊహించుకోండి, మరియు అకస్మాత్తుగా ఒక విద్యార్థి నిలబడతాడు. అతడు ఏమి మాట్లాడడు; కేవలం నిలబడతాడంతే. అవును, దానిని మీరు ఎలా అర్థము చేసుకోవాలో మీకు తెలియదు; అది చాలా అస్పష్టమైనది. “అతడు ఎందుకు నిలబడ్డాడు? ఏమి జరుగుతుంది?” అని మీరు ఆశ్చర్యపోవచ్చు. వాస్తవానికి, అధ్యాపకుడు పాఠము చెప్పుట ఆపివేసి ఆ విద్యార్థి ఎందుకు నిలబడ్డాడో అడుగుతాడు. ఫలితంగా, తాను చేసిన కార్యము యొక్క ప్రాముఖ్యతను ఆ విద్యార్థి మాటలలో వినుటకు ప్రతి ఒక్కరు ఎదురుచూస్తారు.

ఇంచు మించు అదే విధంగా, లేఖనములో నివేదించబడిన దేవుని కార్యములు మితమైన పాపులైన మానవమాత్రులకు తరచుగా అస్పష్టమైనవిగా ఉంటాయి. వారికి కూడా మౌఖిక అనువాదము అనగా మాటలలో వివరణ యొక్క అవసరత ఉన్నది. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు బబులోను చెరలో నుండి తిరిగి వచ్చి దేవాలయమును పునఃనిర్మించిన సమయమును జ్ఞాపకము చేసుకోండి. ఎజ్రా 3:10-12లో, మనము ఈ మాటలను చదువుతాము:

శిల్పకారులు యెహోవా మందిరముయొక్క పునాదిని వేయుచుండగా... జనులందరును గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకులలోను లేవీయులలోను కుటుంబ ప్రధానులలోను వృద్ధులైన అనేకులు, ఇప్పుడు వేయబడిన యీ మందిరముయొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషముచేత బహుగా అరచిరి (ఎజ్రా 3:10-12).

ఇక్కడ బైబిలు చరిత్రలో ఒక సన్నివేశమును మనము చూస్తాము — ఇశ్రాయేలు చెరలో నుండి తిరిగివచ్చిన తరువాత దేవాలయము కొరకు పునాదిని వేయుటలో దేవుడు చేసిన అద్భుత కార్యము. కాని ఈ సన్నివేశమును ప్రత్యక్షంగా చూసిన వారికి ఇది అస్పష్టమైనదిగా ఉన్నది.

కొందరు దేవాలయము యొక్క పునాదిని చూసి సంతోషించారు ఎందుకంటే అది ఒక గొప్ప ఆశీర్వాదమని వారు నమ్మారు. అయితే, ఇతరులు క్రొత్త దేవాలయము సొలొమోను దేవాలయమునకుండిన శోభను ఎన్నడు పొందుకోలేదని గ్రహించారు కాబట్టి ఏడ్చారు. దేవుని నుండి మౌఖిక సంభాషణ లేకుండా, ఈ సన్నివేశమును ఏదో ఒక విధముగా చూసియుండవచ్చు. ఇందును బట్టియే చెర తరువాత దేవాలయ నిర్మాణము యొక్క నిజమైన ప్రాముఖ్యతను వివరించుటకు ఎజ్రా గ్రంథము ఎంతో సమయమును కేటాయిస్తుంది.

ఇదే విధముగా, మార్కు 3:22-33లో, యేసు దయ్యములను వెళ్లగొట్టిన సన్నివేశమును కొందరు ఎలా అపార్థము చేసుకున్నారో మరియు ఆయన కార్యములకు సరియైన అనువాదమును యేసు ఎలా ఇచ్చాడో మనము చదువుతాము.

యెరూషలేమునుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టినవాడై దయ్యముల యధిపతిచేత దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పిరి. అప్పుడాయన వారిని తన యొద్దకు పిలిచి, ఉపమానరీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నేలాగు వెళ్లగొట్టును? (మార్కు 3:22-33).

దేవుడు చేసిన ఈ అద్భుత కార్యములను చూసిన కొందరు దయ్యములు సాతాను యొక్క శక్తితో వెళ్లగొట్టబడుచున్నాయని తప్పుగా అర్థము చేసుకున్నారు, కాని ఆయన దేవుని శక్తితో కార్యములు చేసెనని తెలియజేయుటకు యేసు తన కార్యములతో పాటు మాటల ద్వారా స్పష్టము చేశాడు.

బైబిలులో నమోదు చేయబడిన దేవుని కార్యముల యొక్క అస్పష్టత “వాక్య ప్రత్యక్షత” “కార్య ప్రత్యక్షత”ను ఎల్లప్పుడు ఎందుకు అనుసరించినదో వివరించుటకు సహాయపడుతుంది. దేవుని మౌఖిక ప్రత్యక్షత సన్నివేశముల యొక్క నిజమైన ప్రాముఖ్యతను స్పష్టము చేయుటకు వాటిని వివరించింది.

కొంత వరకు అస్పష్టమైనదిగా ఉండుటతో పాటు, సన్నివేశములు వాటి యొక్క ప్రాముఖ్యతలో కిరణ సదృశముగా కూడా ఉంటాయి కాబట్టి “కార్య ప్రత్యక్షత” “వాక్య ప్రత్యక్షత”తో కలిసియుంటుంది. అనేక విధాలుగా, బైబిలులోని ఒక సన్నివేశము చెరువులో విసిరిన ఒక రాయిని పోలియున్నది. ఏమి జరుగుతుందో మీకు తెలుసు. అన్ని దిశలలోను నీటి తరంగములు వ్యాపించి చెరువులో తేలియాడు ప్రతి వస్తువును తాకుతాయి. విసిరిన రాయి యొక్క ప్రభావము కిరణ సదృశముగా ఉన్నది; అది చెరువు అంతటా వ్యాపిస్తుంది. ఇంచుమించు ఇదే విధముగా, లేఖనములోని సన్నివేశములు కూడా వాటి ప్రాముఖ్యతలో కిరణ సదృశము కలిగియున్నాయి.

ఉదాహరణకు ఇశ్రాయేలు యెర్ర సముద్రమును దాటిన సన్నివేశమును తీసుకోండి. ఇది ఐగుప్తీయుల చేతిలో నుండి దేవుడు తన ప్రజలను విమోచించిన కార్యము అని లేఖనములు వివరించుచున్నవని మనందరికీ తెలుసు. కాని యెర్ర సముద్రములోని నీటి యొక్క కదలిక అనేక ఇతర ప్రాముఖ్యతలను కూడా కలిగియున్నదని మనకు తెలుసు. ఉదాహరణకు, అది ఆ ప్రాంతములో ఉన్న మత్స్య జీవుల మీద ప్రభావము చూపి తద్వారా స్థానిక జాలర వృత్తికి అంతరాయం కలిగించియుంటుంది. ఈ పరిణామము నేడు మనకు అంత ప్రాముఖ్యమైనదిగా అనిపించకపోవచ్చుగాని, ఆ సమయములో ఆ ప్రాంతములో నివసించిన ప్రజలకు ఇది ప్రాముఖ్యమైన విషయమైయుండినది. దీని కంటే ఎక్కువగా, ఐగుప్తు సైన్యము మునిగిపోవుట ఐగుప్తీయుల జీవితముల మీద ఎన్నో రకములుగా ప్రభావం చూపింది. భార్యలు భర్తలను కోల్పోయారు; పిల్లలు తండ్రులను కోల్పోయారు. ఈ సన్నివేశము యొక్క లెక్కలేనన్ని ప్రభావములను గూర్చి ఊహించుట చాలా కష్టము.

యెర్ర సముద్రమును దాటుట వంటి సన్నివేశములకు కిరణ సదృశ ప్రాముఖ్యత ఉన్నదని మనము గుర్తించినప్పుడు, ఈ ప్రశ్న మనకు ఎదురుతుంది: ఈ అర్థములన్నిటిలో మనము దేని మీద దృష్టి పెట్టాలి? లేఖనములోని ఒక సన్నివేశమును మనము అర్థము చేసుకొనుటకు ప్రయత్నించినప్పుడు ఏ ప్రాముఖ్యత ఎంతో ముఖ్యమైనదిగా ఉన్నది? దీనికి జవాబు చాలా సులువైనది: ఆయన ప్రజలు అర్థము చేసుకోవాలని దేవుడు ఆశించిన అత్యంత ముఖ్యమైన ప్రాముఖ్యతలను ఆయన “వాక్య ప్రత్యక్షత” ద్వారా బయలుపరచాడు. దేవుడు ఆయన చేయు కార్యములకు మౌఖిక అనువాదములను ఇవ్వకపోతే, దేవుని యొక్క ఆశ్చర్యకార్యముల నుండి సరియైన వేదాంతశాస్త్ర భావములను మనము తెలుసుకొనలేము.

లేఖనములో కార్య మరియు వాక్య ప్రత్యక్షత ఒకదానితో ఒకటి కలిసియుండుటను చూసిన పిమ్మట, ఇప్పుడు ఈ రెండు రకముల ప్రత్యక్షతలు ఒకదానితో ఒకటి పరస్పర అనుబంధము కలిగియుండు విధానముల వైపుకు మన దృష్టిని మళ్ళించాలి. బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో కార్య మరియు వాక్య ప్రత్యక్షతలు ఏ ఏ విధాలుగా అనుబంధం కలిగియుంటాయి?

మన ఉద్దేశముల కొరకు ఈ అనుబంధములను గూర్చి మూడు రకముల వాక్య-ప్రత్యక్షతల ఆధారంగా మాట్లాడదాము; మొదటిగా, భావిసూచిక “వాక్య ప్రత్యక్షత,” అనగా అవి వివరించు సన్నివేశములకు ముందు ఇవ్వబడిన మాటలు; రెండవదిగా, ఏకకాల “వాక్య ప్రత్యక్షత,” లేక అవి వివరించు సన్నివేశములు జరిగిన సమయములోనే ఇవ్వబడిన మాటలు; మరియు మూడవదిగా, పునర్విమర్శ “వాక్య ప్రత్యక్షత,” అనగా అవి వివరించు సన్నివేశములు జరిగిన తరువాత వచ్చు మాటలు.

మొదటి స్థానంలో, దేవుని మాటలు దేవుని కార్యములకు ముందుగా వచ్చిన అనేక ఉదాహరణలను లేఖనములు వివరిస్తాయి. ఈ సందర్భాలలో, దేవుని కార్యము జరుగక ముందే దేవుని వాక్యము దానిని వివరిస్తుంది లేక అనువదిస్తుంది. ఈ రకమైన “వాక్య ప్రత్యక్షత”ను చాలా సార్లు మనము జరగబోవువాటిని చెప్పుట అని పిలుస్తాము.

కొన్ని సార్లు, దేవుని భావిసూచిక “వాక్య ప్రత్యక్షత” జరుగబోవు సన్నివేశములను గూర్చి మాట్లాడింది మరియు చాలా సార్లు ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఆ సన్నివేశమును చూడబోతున్న ప్రజలతో మాట్లాడింది. ఉదాహరణకు, నిర్గమ. 3:7-8లో, ఇశ్రాయేలు ప్రజలను విడిపించుటకు మోషే ఐగుప్తుకు వెళ్లుటకు ముందే దేవుడు ఏమి జరుగబోతుందో మోషేకు చెప్పాడు.

మరియు యెహోవా యిట్లనెను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టువారినిబట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలోనుండి వారిని విడిపించుటకును, ఆ దేశములోనుండి విశాలమైన మంచి దేశమునకు...పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి యున్నాను (నిర్గమ. 3:7-8).

దేవుడు మోషేతో చెప్పిన మాటలు ఐగుప్తులో దేవుడు చేయబోవు కార్యములను గూర్చి తెలియజేశాయి. అవి భావిసూచికమైనవి, మరియు దేవుడు భవిష్యత్తులో చేయబోవు కార్యము యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాయి. ఈ మాటలు వినిన వెంటనే, ఐగుప్తులో తాను చేయవలసిన పనిని ఒక దృష్టికోణములో చూచుటకు మోషే తనను తాను సిద్ధపరచుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క విమోచన కొరకు అతడు దేవుని ఆయుధముగా ఉండవలసియుండినది. ఐగుప్తులో అతడు చేసిన ప్రయత్నములు కేవలం మానవ కార్యములు మాత్రమే కాదు; అతడు తన పరిచర్యను దాని యొక్క ప్రాముఖ్యత నుండి తక్కువ చేయకూడదు — అది ఇశ్రాయేలును వాగ్దాన దేశములోని ఆశీర్వాదములకు నడిపించుటకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యము.

ఇతర సమయాలలో, దేవుని భావిసూచిక “వాక్య ప్రత్యక్షత” దీర్ఘకాల భవిష్యత్తులో జరుగబోవు సన్నివేశములను గూర్చి మాట్లాడింది, ఎంత దీర్ఘకాలమంటే ఆ మాటను మొదటిగా విన్నవాడు ఆ సన్నివేశమును అనుభవించియుండేవాడు కాదు. ఈ సందర్భములలో, “వాక్య ప్రత్యక్షత” “కార్య ప్రత్యక్షత” కంటే ఎంతో కాలము ముందు వచ్చింది. ఉదాహరణకు, యెషయా 9:6-7లో రానున్న గొప్ప మెస్సీయను గూర్చి ప్రవక్తయైన యెషయా ఈ విధంగా మాట్లాడాడు:

ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితిలేకుండ దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు...రాజ్యపరిపాలన చేయును (యెషయా 9:6-7).

ఇక్కడ యెషయా ఒక రాజకుమారుని గూర్చి మాట్లాడుతున్నాడు మరియు అతడు దేవుని ప్రజలను పరిపాలిస్తాడు మరియు అతని రాజ్యమునకు అంతముండదు. ఆయన మెస్సీయయైన యేసును గూర్చి మాట్లాడాడు. కాని ఈ మాటలు యేసు కాలమునకు కనీసం యేడు వందల సంవత్సరాల ముందు మాట్లాడబడ్డాయి. ఈ మాటలు యెషయా కాలములో నివసించిన దేవుని ప్రజలకు నిరీక్షణను కలిగించాయి గాని, ఈ “వాక్య ప్రత్యక్షత”ను మొదటిగా విన్నవారిలో ఒకరు కూడా ఈ దైవికమైన కార్యమును చూడలేదు.

కాబట్టి, దేవుని భావిసూచిక “వాక్య ప్రత్యక్షత” సన్నివేశములు జరుగుటకు ముందు వాటి యొక్క ప్రాముఖ్యతను గూర్చి దేవుని ప్రజలకు కొంత అవగాహనను కలిగించుటకు ఇవ్వబడినవని అనేక విధాలుగా మనము చూస్తాము. ఈ విధమైన ప్రత్యక్షతను మనము లేఖనమందంతట చూస్తాము.

రెండవ స్థానంలో, లేఖనములో కొన్నిసార్లు దేవుడు సన్నివేశము జరిగిన సమయములోనే ఏకకాలములో మాట్లాడతాడని కూడా మనము గ్రహించుట ఎంతో అవసరము. ఇప్పుడు, లేఖనములో దేవుని మాటలు మరియు కార్యములు ఒకే తరుణంలో చాలా అరుదుగా జరుగుతాయి. కాని వాటిని ఏకకాలముగా పరిగణించుటకు దేవుడు ఒక సన్నివేశమునకు దగ్గర సమయములో చాలా సార్లు మాట్లాడతాడు. ఆయన కార్యము చేస్తూనే చాలా సార్లు తన “వాక్య ప్రత్యక్షత”ను ఇచ్చాడు. ఉదాహరణకు, నిర్గమ. 19:18-21లో దేవుని కార్యములు మరియు మాటలను వినండి.

యెహోవా అగ్నితో సీనాయి పర్వతముమీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై యుండెను. దాని ధూమము కొలిమి ధూమమువలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాటలాడుచుండగా దేవుడు కంఠస్వరముచేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. అప్పుడు యెహోవా “ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దుమీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము” (నిర్గమ. 19:18-21).

ఈ వాక్య భాగములో దేవుని ఆశ్చర్య కార్యము, సీనాయి పర్వతము మీద అగ్నిలో, ధూమములో, మరియు మిక్కిలి కంపనలో దేవుడు చూపిన శక్తియైయున్నది. ఈ గొప్ప కార్యమును దేవుడు చేయుచుండగా, ప్రజలను పర్వతము యొద్దకు సమీపించవద్దని హెచ్చరిస్తూ ఆయన చేయుచున్నదాని యొక్క ప్రాముఖ్యతను వివరించిన “వాక్య ప్రత్యక్షత”ను ప్రకటించాడు. ఈ విధముగా, ఆయన కార్యములు చూసిన వారు వాటిని అర్థము చేసికొనునట్లుగా చాలా సార్లు లేఖనములో ఆయన కార్యము చేసిన సమయములోనే దేవుడు “వాక్య ప్రత్యక్షత”ను ఇచ్చాడని మనము చూస్తాము.

మూడవ స్థానంలో, దేవుని “వాక్య ప్రత్యక్షత” పునర్విమర్శనాత్మకముగా ఉన్నదని, అనగా సన్నివేశముల యొక్క ప్రాముఖ్యతను అవి జరిగిన తరువాత వివరించినదని కూడా గ్రహించుట ఎంతో అవసరమైయున్నది. ఈ సందర్భాలలో, దేవుడు ఒక కార్యమును చూసి దానిని గూర్చి ఆ కార్యములు జరిగిన తరువాత నివసించిన ప్రజలతో మాట్లాడాడు. వాస్తవానికి, సంపూర్ణంగా చూసినట్లయితే, లేఖనములో దేవుని “వాక్య ప్రత్యక్షత” మనకు ఈ విధముగానే ఎక్కువ సార్లు బయలుపరచబడింది.

కొన్ని సార్లు, దేవుడు సన్నివేశము సంభవించిన తరువాత వెంటనే మాట్లాడాడు. ఈ సందర్భాలలో, ఆయన తన కార్యములను ప్రత్యక్షంగా లేక పరోక్షంగా వీక్షించిన ప్రజలకు తనను తాను బయలుపరచుకున్నాడు. ఉదాహరణకు, నిర్గమ. 20:2-3 వినండి, అది జరిగిన వెంటనే ఐగుప్తు నుండి ఇశ్రాయేలు విమోచన యొక్క ప్రాముఖ్యతను అక్కడ దేవుడు వివరిస్తున్నాడు. అక్కడ ఇలా వ్రాయబడియున్నది:

నీ దేవుడైన యెహోవాను నేనే, నేను దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు (నిర్గమ. 20:2-3).

ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన అనుభవము ఒక సామాన్యమైన సన్నివేశము కాదని దేవుడు ఇశ్రాయేలుకు వివరించాడు. ఆది ఆయన వ్యక్తిగత మరియు ప్రత్యక్ష విమోచనయైయున్నది. దీనిని మించి, ఈ “వాక్య ప్రత్యక్షత” దేవుని విమోచన కార్యము యొక్క ఒక భావమును కూడా వివరించింది. దేవుడు వారిని విమోచించాడు కాబట్టి, ఇశ్రాయేలు ఇతర దేవతలను ఆరాధించకూడదు. దేవుని పట్ల రాజభక్తి యొక్క అవసరత ఒక పునర్విమర్శ పదమైయున్నది, మరియు ఇశ్రాయేలు యొక్క గొప్ప విమోచనను చూచిన ప్రజలకు దాని యొక్క ప్రాముఖ్యతను వివరించింది.

అయినను, ఇతర సమయాలలో, దీర్ఘకాల పునర్విమర్శ వాక్య ప్రత్యక్షత దేవుని ప్రజలకు “కార్య ప్రత్యక్షత” జరిగిన చాలా సమయము తరువాత కలిగింది. సన్నివేశములు జరిగిన సమయములో జీవించని ప్రజలకు అది ఇవ్వబడింది. ఉదాహరణకు, ఆది. 1:27లో, మానవ జాతి యొక్క సృష్టిని గూర్చి మనము ఈ వివరణ చదువుతాము.

దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను (ఆది. 1:27).

ఈ పునర్విమర్శ వాక్యము యొక్క వాస్తవిక శ్రోతలు నిర్గమము తరువాత మోషేను అనుసరించిన ఇశ్రాయేలీయులు, మరియు వారు ఆదాము హవ్వలు సృష్టించబడిన కొన్ని వేల సంవత్సరముల తరువాత జీవించారు. అయినను, సృష్టిలో మానవుల యొక్క నిజమైన పాత్రను వారికి తెలియజేయుటకు దేవుడు “వాక్య ప్రత్యక్షత”ను ఇచ్చాడు. కాబట్టి అనేక విధాలుగా, దేవుని వాక్యము చాలా సార్లు ఆయన కార్యములను అనుసరించి సన్నివేశములు జరిగిన తరువాత ఆయన ప్రజలకు అవగాహనను కలిగిస్తుంది. ఈ విధమైన వాక్య ప్రత్యక్షత లేఖనమంతటిలో కనిపిస్తుంది.

లేఖనములలో చరిత్ర మరియు ప్రత్యక్షత మధ్య గల పరస్పర అనుబంధమును బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ఉద్ఘాటించిన విధమును చూసిన పిమ్మట, మనము మన రెండవ అంశము వైపుకు తిరగవలసియున్నది: బైబిలులో చరిత్ర మరియు ప్రత్యక్షత యొక్క ఆకృతులు. కొన్ని వేల సంవత్సరాలలో జరిగిన కొన్ని వందల వేల సన్నివేశములను బైబిలు ప్రస్తావిస్తుంది. మరియు ఈ లెక్కలేనన్ని సన్నివేశముల యొక్క పద్ధతులను మరియు ఆకృతులను వివేచించుట బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము చేయవలసిన ఒక పనియైయున్నది.

లేఖనములో చరిత్ర మరియు ప్రత్యక్షత యొక్క ఆకృతులను బైబిలానుసారమైన వేదాంతవేత్తలు అర్థము చేసుకున్న విధానములను పరీక్షించుటకు, మనము మూడు విషయములను చూద్దాము: మొదటిగా, లేఖన చరిత్రలో దేవుని ప్రత్యక్షత యొక్క లక్ష్యము; రెండవదిగా, లేఖనములో ప్రత్యక్షత యొక్క ఎగయుట మరియు పడిపోవుట; మరియు మూడవదిగా, లేఖనములో ప్రత్యక్షత యొక్క కర్బన సంబంధమైన అభివృద్ధి. మొదటిగా బైబిలులో చరిత్ర యొక్క లక్ష్యమును చూద్దాము.

దేవుడు చరిత్రను అనేక అవ్యవధాన లక్ష్యముల వైపుకు నడిపించాడు అను విషయమును లేఖన భాగములను చదువుతున్నప్పుడు మనము నిస్సందేహముగా తెలుసుకోవచ్చు. నోవహు దినములలో, లోకమునకు ఒక నూతన ఆరంభమును కలిగించుటకు ఆయన పని చేశాడు. అబ్రాహాముకు తనను తాను బయలుపరచుకొనుటలో ఆయన కలిగియుండిన లక్ష్యము తన కొరకు ప్రత్యేకించబడిన ప్రజలను పిలచుట. పాత నిబంధన ఇశ్రాయేలును ఐగుప్తు నుండి విమోచించుటలోని లక్ష్యము, పాత నిబంధనలో ఆయన ప్రత్యేకించబడిన ప్రజలను వాగ్దాన భూమిలో స్థాపించుట. ఇశ్రాయేలు యొక్క నిత్యమైన రాజులుగా దావీదును మరియు అతని కుమారులను ఎన్నుకొనుట యొక్క ఉద్దేశము, ఆయన ప్రజలను రాజరిక మహిమలోనికి నడిపించుట. యేసు జీవితము, మరణము మరియు పునరుత్థానము యొక్క లక్ష్యము, దేవుని ప్రజల కొరకు నిత్య రక్షణను చేకూర్చుట.

బైబిలు చరిత్రలోని ప్రతి స్థాయిలోను, ఆయన కార్య మరియు వాక్య ప్రత్యక్షతను శాసించిన విశేషమైన ఉద్దేశములను లేక లక్ష్యములను దేవుడు కలిగియుండినాడు. ఈ భిన్నమైన లక్ష్యములను వర్ణించుటలో బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఎక్కువ సమయం గడుపుతారు. కాని అదే సమయములో, రోమా 11:36లో అపొస్తలుడైన పౌలు చరిత్ర యొక్క ఉన్నత లక్ష్యము ఏమిటో తెలియజేశాడు.

ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగియున్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్‌ (రోమా 11:36).

ఇక్కడ పౌలు చెబుతున్నట్లు, ఆరంభములో సమస్తము దేవుని మూలమున కలిగినవి. దేవుని యొక్క కొనసాగించు శక్తి ద్వారా నేడు సమస్తమును తమ ఉనికిని కొనసాగించుచున్నవి. మరియు సమస్తమును “ఆయన నిమిత్తమైయున్నవి,” అనగా అవి దేవుని మహిమ మరియు ఘనత కొరకైయున్నవి. ఒక్క మాటలో, తుదకు ఆయనకు ఎనలేని మహిమను తెచ్చు విధముగా దేవుడు తన సృష్టి యొక్క చరిత్రను శాసిస్తాడు.

ఈ బలమైన దైవిక ఉద్దేశమును పలువురు బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పలు విధాలుగా వర్ణించారు. ఉదాహరణకు, కొందరు రాకడ శాస్త్రము లేక ఆఖరి దినములు లేఖనముల యొక్క గురియైయున్నవని చాలా సామాన్యముగా మాట్లాడతారు. బైబిలు క్రీస్తు కేంద్రితమైనదని, అనగా క్రీస్తు మీద దృష్టి కలిగియున్నదని ఇతరులు అనేక విధాలుగా వాదించారు. ఇవి మరియు ఇతర దృక్పథాలు మనకు ఎంతో నేర్పిస్తాయి గాని, ఈ పాఠములలో భూమి మీద దేవుని రాజ్యమును స్థాపించుట చరిత్ర అంతటి యొక్క లక్ష్యమైయున్నది అనే విషయమును గూర్చి మనము మాట్లాడదాము. సులువైన మాటలలో, ఆయన రాజ్యమును భూదిగంతముల వరకు వ్యాపింపజేస్తూ ప్రతి జీవి ఎదుట తుదకు దేవుడు మహిమపరచబడు ప్రక్రియగా బైబిలు చరిత్రను గూర్చి మనము మాట్లాడదాము.

ఇలా జరుగునట్లు ప్రార్థించమని మత్తయి 6:10లో యేసు మనకు నేర్పించాడని మనందరికీ తెలుసు, అక్కడ ఇలా చదువుతాము:

నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక (మత్తయి 6:10).

దేవుని పూర్ణమైన పరలోక పరిపాలనను భూదిగంతముల వరకు వ్యాపింపజేయుట సమస్త లోక చరిత్ర యొక్క దైవికమైన లక్ష్యమైయున్నది. దేవుని చిత్తము పరలోకములో జరుగునట్లు భూమి మీద కూడా పరిపూర్ణముగా జరిగినప్పుడు, ప్రతి జీవి దేవుని ఎదుట మోకరిల్లి ఆయనను దైవికమైన రాజుగాను సమస్తమును సృష్టించిన ఉన్నతమైన సృష్టికర్తగాను గౌరవిస్తుంది. ఆ సమయములో, చరిత్ర యొక్క ఉన్నత లక్ష్యము నెరవేరుతుంది.

ఇప్పుడు, విశ్వములోని ప్రతి సన్నివేశము ఈ ఘనమైన ముగుంపు వైపుకు ప్రయాణిస్తున్నప్పటికీ, లేఖనములు స్వయంగా దేవుని ఉన్నతమైన ఉద్దేశములకు మధ్యలో ఉన్న సన్నివేశముల మీద ముఖ్యముగా దృష్టిపెడతాయి. దేవుని రాజ్యమును లోకమంతట వ్యాపింపజేయు లక్ష్యమును సాధించుటలో కొన్ని చారిత్రిక సన్నివేశములు ఎలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయో అవి తెలియజేస్తాయి. బైబిలు కథనము యొక్క సామాన్య ఆకృతులు మనందరికీ తెలుసు. సృష్టిని చేయుట ద్వారా, ఏదేను వనములో ఆయన స్వరూపమును ఉంచుట ద్వారా, మరియు ఏదేను వనమును భూదిగంతముల వరకు వ్యాపింపజేయమని మానవాళిని ఆజ్ఞాపించుట ద్వారా దేవుడు ఒక శూన్యమైన లోకమును తన సొంత రాజ్యముగా మార్చుట ఆరంభించిన విధానమును బైబిలులోని ఆరంభ అధ్యాయములు తెలియజేస్తాయి. కాని మానవజాతి దైవికమైన ఆజ్ఞకు విరోధముగా తిరుగుబాటు చేసి లోకములోనికి నాశానమును మరియు మరణమును ఏ విధముగా తీసుకొనివచ్చినదో కూడా లేఖనము యొక్క ఆరంభ అధ్యాయములు తెలియజేస్తాయి.

ఆయన సొంత జనులుగా దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకొని భూదిగంతముల వరకు దేవుని రాజ్యమును వ్యాపింపజేయుటలో మిగిలిన మానవాళికి నాయకత్వము వహించుటకు వారిని ఆజ్ఞాపించిన విధానమును పాత నిబంధనలోని ఇతర భాగములు నివేదిస్తాయి. పాత నిబంధన మనకు తెలియజేయుచున్నట్లు, దేవుడు ఇశ్రాయేలు ద్వారా అనేక కార్యములను సాధించాడుగాని ఇశ్రాయేలు కూడా ఘోరముగా విఫలమైయ్యింది.

ఈ ఘోర వైఫల్యములు కలిగిన తరువాత కూడా, దేవుడు తన గొప్ప ఉద్దేశమును విడిచిపెట్టలేదు. క్రొత్త నిబంధన బయలుపరచుచున్నట్లు, దేవుడు ఈ లోకములోనికి తన నిత్య కుమారుని పంపాడు. ఆయన మరణము ద్వారా, దేవుడు మునుపు జరిగిన వైఫల్యాలను సవరించి భూమి మీద ఉన్న దేశములన్నిటిలో నుండి తన కొరకు ప్రజలను విమోచించుకున్నాడు. మరియు క్రీస్తు పునరుత్థాన ఆరోహణముల ద్వారా, ఆయన శరీరమైన సంఘములో పరిశుద్ధాత్మ పరిచర్య మరియు ఆయన మహిమకరమైన రాకడ ద్వారా, మానవాళికి ఇవ్వబడిన పనిని క్రీస్తు ముగిస్తున్నాడు. ప్రకటన 11:15లో మనము చదువునట్లు, పరలోకములో ఉన్నట్లు దేవుని రాజ్యమును క్రీస్తు భూలోకమునకు తీసుకొనివస్తాడు.

ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను (ప్రకటన 11:15).

బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును ఈ విధముగా సమీపించినప్పుడు, బైబిలు చరిత్రలోని ప్రతి సన్నివేశము ఒక గొప్ప ప్రణాళికలో భాగమవుతుంది. బైబిలులో కనిపించు వివిధ రకములైన దైవికమైన కార్యములు, పెద్దవి మరియు చిన్నవి, సాధారణమైనవి మరియు అసాధారణమైనవి, క్రీస్తు కార్యములో ముగింపును పొందుకుంటాయి మరియు ఆయన క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో ఆయన రాజ్యమును స్థాపించుట ద్వారా దేవునికి ఉన్నతమైన మహిమను తెస్తాడు.

క్రీస్తులో ఆయన విశ్వవ్యాప్త రాజ్యమును స్థాపించుట ద్వారా దేవునికి మహిమను తెచ్చుట బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క లక్ష్యమైయుండగా, బైబిలు చరిత్ర యొక్క ఆకృతులలో రెండవ కోణమును మనము చూడవలసియున్నది: దేవుని కార్య మరియు వాక్య ప్రత్యక్షత యొక్క ఎగయుట మరియు పడిపోవుట.

మీరు సముద్ర తీరమునకు వెళ్లి ఒడ్డుకు వస్తున్న అలను చూసియుంటారు. సముద్రపు అల ముందుకు సాగుచుండగా అది సజావుగా తిన్నగా ముందుకు రాదని గమనించుట అంత కష్టమేమి కాదు. ముందుకు కదలిక జరుగుతుంది, కాని ఆ ప్రక్రియలో అలలు పడి లేస్తూ ఉంటాయి.

అదే విధంగా, కార్య మరియు వాక్య ప్రత్యక్షత అను అలల రూపములో దేవుడు తన మహిమకరమైన రాజ్య లక్ష్యము వైపుకు చరిత్రను నడిపించాడని ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ఒత్తి చెబుతుంది. దేవుడు దైవకృతముగా లోకమును అన్ని వేళల నియంత్రించుచున్నప్పటికీ, ఇతర సమయముల కంటే ఎక్కువగాను మరియు నాటకీయముగాను ఆయన కార్యములు చేసిన మరియు మాట్లాడిన సందర్భములు చరిత్రలో ఉన్నాయి. తత్ఫలితంగా, బైబిలు చరిత్రలోని ప్రత్యక్షత కూడా దాని యొక్క అంతిమ గమ్యమునకు ముందుకు సాగిపోతూనే పడి లేస్తుంటుంది.

ఈ కారణం చేత, దేవుని కార్య మరియు వాక్య ప్రత్యక్షతను గూర్చి రెండు విధాలుగా ఆలోచన చేయుట సహాయకరముగా ఉంటుంది: దైవిక ప్రత్యక్షత యొక్క అడుగు స్థితులు అని పిలవగల సమయములు; మరియు ప్రత్యక్షత యొక్క ఉన్నత స్థితులు అని పిలవగల సమయములు. ఒక వైపున, బైబిలు అంతటిలో, దైవిక కార్య మరియు వాక్య ప్రత్యక్షత అంతరించిపోయిన సమయములు కలువు, లేక వీటిని మనము చరిత్రలో దిగజారిన స్థితులు అని పిలవవచ్చు. ఉదాహరణకు, 1 సమూ. 3:1లో సమూయేలు యొక్క ఆరంభ జీవితమును గూర్చి సమూయేలు యొక్క రచయిత వివరించిన విధానమును వినండి:

బాలుడైన సమూయేలు ఏలీ యెదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరుచుగా తటస్థించుటలేదు (1 సమూ. 3:1).

సమూయేలు యొక్క బాల్య దినములలో ప్రత్యక్షత చాలా అరుదుగా కలిగేది. ఆయన ప్రజల యొక్క పాపముల కారణంగా, దేవుడు కొంత కాలము పాటు తన ప్రజల యొద్ద నుండి వెళ్లిపోయాడు, మరియు వారి కొరకు ఏ కార్యములు చేయలేదు మరియు వారితో మాట్లాడలేదు.

బైబిలు చరిత్రలో అత్యంత దిగజారిన స్థితికి ఉదాహరణ పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన మధ్య ఉన్న కాలము, అనగా మలాకీ మరియు బాప్తిస్మమిచ్చు యోహాను మధ్య కాలము కావచ్చు, ఆ సమయములో ఇశ్రాయేలు దేశము అన్యుల అధికారములో ఉండినది. ఈ నిబంధనల మధ్య కాలములో, ఇశ్రాయేలు దేవుని యొక్క ఘోరమైన శాపమును అనుభవించినది మరియు దేవుడు తన ప్రజల నిమిత్తము కార్యములు చేయలేదు; మరియు వారితో మాట్లాడలేదు.

మరొక వైపు, ఎగయుచున్న పోటులోని బలమైన అలల వలె, దేవుని కార్య మరియు వాక్య ప్రత్యక్షత దూసుకొనివచ్చిన ఉన్నత స్థితులు కూడా బైబిలు చరిత్రలో ఉన్నాయి. ఈ సమయములలో, దేవుడు ఆయన ప్రజల మధ్య ఎన్ని అద్భుత కార్యములు చేశాడంటే మరియు ఎంతగా వారికి ప్రత్యక్షతనిచ్చాడంటే, ఆయన వాస్తవముగా తన రాజ్యమును నూతన అభివృద్ధి దశలలోనికి తీసుకొనివెళ్లాడు. ఉదాహరణకు, సమూయేలు యొక్క బాల్యములో ప్రత్యక్షత చాలా అరుదైనప్పటికిని, సమూయేలు ఎదిగిన కొలది, దేవుడు నాటకీయముగా కార్యములు చేయుట ప్రారంభించాడు మరియు తన ప్రజలకు ఆయన చిత్తమును మరొక సారి బయలుపరచుట ఆరంభించాడు. సమూయేలు యొక్క పరిచర్య ద్వారా, చరిత్ర ఇశ్రాయేలు యొక్క రాజరికములోనికి, దావీదు సింహాసనములోనికి కదులునట్లు దేవుడు తన కార్య మరియు వాక్య ప్రత్యక్షతను పెంచాడు.

ఇంచుమించు ఇదే విధంగా, పాత మరియు క్రొత్త నిబంధనల మధ్య ఉన్న దిగజారిన స్థితి లోక చరిత్రలోనే దేవుని యొక్క అతి గొప్ప ప్రత్యక్షతకు దారి తీసింది: బాప్తిస్మమిచ్చు యోహాను మరియు క్రీస్తు యొక్క మొదటి రాకడ, క్రీస్తు మరియు ఆయన అపొస్తలులు మనకు ఇచ్చిన ఘనమైన వాక్య ప్రత్యక్షత. దేవుని యొక్క ఈ ఘనమైన కార్యములు బైబిలు చరిత్రను ఏ స్థాయికి తీసుకొనివచ్చాయంటే దానిని మనము నేడు క్రొత్త నిబంధన కాలము అని పిలుస్తాము.

చరిత్రలో దైవిక కార్యములు మరియు మాటలు అధికమైన సమయములు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో విశేషముగా ప్రాముఖ్యమైనవి, ఎందుకనగా ఈ సమయములలో దేవుడు తన రాజ్యమును నూతన దశలు లేక కాలములలోనికి తీసుకొని వెళ్లాడు. జల ప్రళయము, అబ్రాహాము యొక్క పిలుపు, ఐగుప్తు నుండి ఇశ్రాయేలు యొక్క విమోచన, రాజుల పాలనను స్థాపించుట, ఇశ్రాయేలు మరియు యూదా దేశములు చెరకొనిపోబడుట, చెర నుండి తిరిగి వచ్చుట, క్రీస్తు యొక్క భూలోక పరిచర్య, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడుట వంటి ముఖ్య సన్నివేశములు — ఈ సన్నివేశములు భూమి మీద దేవుని రాజ్యము నూతన అభివృద్ధి దశలకు తేబడిన సమయములను జ్ఞాపకము చేస్తాయి. కాబట్టి, ఈ కారణము చేత, ఇవాంజెలికల్ బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో, బైబిలు చరిత్రను పలు యుగములు లేక కాలములుగా విభజించుట చాలా సాధారణమైన విషయము.

దేవుని ప్రత్యక్షత యొక్క ఎగయుట మరియు పడిపోవుట బైబిలు చరిత్రను కాలములుగా లేక యుగములుగా విభజిస్తుంది అని గుర్తించుట ఒక గంభీరమైన ప్రశ్నకు దారితీస్తుంది: చరిత్రలోని ఈ వేర్వేరు దశలు ఒకదానితో మరొకటి ఏ విధంగా ముడిపడియున్నాయి? ఒక్క మాటలో, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము లేఖనములో చరిత్ర యొక్క కర్బన స్వభావమును ఉద్ఘాటించింది.

బైబిలు చరిత్రలోని యుగములు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఉన్నాయని నేడు అనేక మంది క్రైస్తవులు నమ్ముతారని సమకాలీన ఇవాంజెలికల్ క్రైస్తవ్యమును గూర్చి అవగాహన కలిగిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ అభిప్రాయం ప్రకారం, లేఖనములోని కాలములు, ముఖ్యముగా పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన కాలములు ఒకదానితో ఒకటి సంబంధము లేకుండా ఉన్నాయి. ఇప్పుడు, నేడు ఈ ఆలోచన ఎంత ఖ్యాతిని పొందినా గాని, బైబిలు చరిత్రలోని అభివృద్ధులు కర్బన సంబంధమైన ఐక్యతను కలిగియున్నాయని బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము రుజువు చేసింది.

ఇక్కడ “కర్బన” అను పదము బైబిలు చరిత్ర ఒక ఎదుగుచున్న జీవి వలె ఉన్నదని మరియు దాని యొక్క ఎదుగుదలను చిన్న చిన్న ముక్కలుగా వేరు చేయలేము అని సూచించుటకు ఒక రూపకాలంకారముగా ఉపయోగించబడినది. ఈ అభిప్రాయములో, బైబిలులోని విశ్వాసము చాలా సార్లు బైబిలు చరిత్ర యొక్క ఆరంభ దశలలో నాటబడి, పాత నిబంధన ద్వారా ఎదిగి, చివరికి క్రొత్త నిబంధనలో పరిపక్వత పొందిన విత్తనముతో పోల్చబడినది. ఒక కాలము నుండి మరొక కాలము మధ్య చోటు చేసుకున్న మార్పులను ఎదుగుదలగా లేక పరిపక్వతగా పరిగణించారు. కార్య మరియు మాట ప్రత్యక్షతల పోటు చరిత్రను నూతన యుగములలోనికి నడిపించుచుండగా, చెట్లు మరియు జంతువులు ఇతర సమయమల కంటే కొన్ని సమయములలో ఎక్కువ ఎదుగునట్లే ఈ ఎదుగుదల అసమానంగా జరుగుతుంది. కాని బైబిలు చరిత్రలోని కాలములు ఒకదానితో ఒకటి పొంతన లేకుండా వేర్వేరు భాగములుగా లేవు. బదులుగా, ప్రత్యక్షతలోని తదుపరి దశలు ప్రత్యక్షతలోని ఆరంభ దశల యొక్క ఫలములుగా ఉన్నాయి.

ఈ కారణము చేత, బైబిలు యొక్క ఆరంభ దశలలో క్రొత్త నిబంధన ప్రత్యక్షత యొక్క విత్తనములను చూచుటకు మరియు తదుపరి కార్య మరియు వాక్య ప్రత్యక్షతగా ఎదిగిన ఈ విత్తనములు దేవుని రాజ్యము యొక్క ఎదుగుదలలోని తదుపరి దశలకు దారితీసి క్రొత్త నిబంధనలోనికి ఎలా నడిపించాయో చూచుటకు బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఎంతో కృషి చేస్తారు.

మన అర్థమును ఉదాహరించుట కొరకు, క్రీస్తును గూర్చి క్రొత్త నిబంధనలోని ముఖ్య బోధనలలో నుండి పలు సులువైన ఉదాహరణలను తీసుకుందాము. క్రీస్తు పరిచర్యలోని మూడు గుంపుల సన్నివేశములతో దేవుని “వాక్య ప్రత్యక్షత” కలిగియున్న అనుబంధము మీద దృష్టి పెడదాము. అనేక విషయములతో పాటుగా, త్రిత్వములోని రెండవ పురుషమూర్తి శరీరధారియై ఒకే పరిపూర్ణమైన నీతిగల మానవునిగా నివసించాడని క్రొత్త నిబంధనలో మనము నేర్చుకుంటాము. యేసు మరణము, పునరుత్థానము మరియు ఆరోహణము ఆయన ప్రజల కొరకు విమోచనను తెచ్చి వారి పాపములకు ప్రాయశ్చిత్తము కలిగించి, నూతన జీవమునిచ్చి, వారికి పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించాయని క్రొత్త నిబంధన బోధిస్తుంది. మరియు యేసు తిరిగివచ్చునప్పుడు, తన శత్రువులను సమూలముగా ఓడించి క్రొత్త సృష్టిలో తన ప్రజలకు మహిమగల జయమును ఇచ్చి సృష్టి అంతటిని జయముతో పాలిస్తాడని కూడా మనము నేర్చుకుంటాము. దేవుని యొక్క ఈ కార్యములు మరియు మాటలు క్రైస్తవ సువార్తకు కేంద్ర లక్షణములుగా ఉన్నాయి.

యేసును గూర్చిన ఈ సంగతులను తెలుసుకొనుట మరియు నమ్ముట ఎంత అద్భుతముగా ఉన్నప్పటికీ, ఈ క్రొత్త నిబంధన అంశములు వాస్తవముగా లేఖనమంతటిలో కర్బన సంబంధముగా కలిసి ఎదిగాయని గ్రహించుట క్రీస్తులో దేవుడు చేసిన కార్యములను గూర్చి మనము కలిగియున్న అవగాహనను బహుగా బలపరుస్తుంది. ఇది ఎలా నిజమైయున్నదో తెలుసుకొనుట కొరకు, క్రీస్తులో దేవుడు సంపాదించినదిగా పాత నిబంధన ప్రత్యక్షత ఏ విధముగా పరిపక్వత చెందినదో కొన్ని మార్గములను ఇక్కడ మేము క్లుప్తముగా తెలియజేస్తాము.

క్రీస్తులో దేవుడు సాధించినది ఆదికాండములోని ఆరంభ అధ్యాయములలో ఒక చిన్న విత్తనముగా ఆరంభమైనది. మొదటి స్థానంలో, ఆదికాండము 1వ అధ్యాయములో ఆదియందు, దేవుని స్వరూపములుగా దేవుడు మానవులకు ఈ లోకములో ఒక ప్రత్యేకమైన పాత్రను ఇచ్చాడు. ఆయన స్వరూపములుగా, దేవుని పరదైశు లేక రాజ్యమును లోకమంతటా వ్యాపింపజేయుటకు నీతిగల సాధనములుగా ఉండుటకు మనము పిలువబడితిమి. క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క నరవతారమును మరియు నీతిగల జీవితమును వక్కాణించుటకు ఇది ఒక కారణము. ఆయన ఆఖరు ఆదామైయున్నాడు, మరియు వాస్తవముగా మానవులకు ఇవ్వబడిన పాత్రను సంపూర్ణంగా నెరవేర్చాడు.

రెండవ స్థానములో, ఆదికాండము 2లో మానవులు పాపములోనికి పడిపోవుట, మానవులు మరియు సృష్టి యావత్తు దేవుని తీర్పు నుండి విమోచన యొక్క అవసరతలో ఉండిరి అని బోధిస్తుంది. ఈ అవసరత క్రొత్త నిబంధన బోధయైన క్రీస్తు మరణము, పునరుత్థానము మరియు ఆరోహణమునకు విత్తనమైయ్యింది. ఆయనను నమ్మినవారిని పాప శాపము నుండి విడిపించుటకు ఆయన మరణించి తిరిగిలేచాడు. క్రీస్తు యొక్క పూర్ణమైన ప్రాయశ్చిత్తము, బలమైన పునరుత్థానము మరియు ప్రబలమైన ఆరోహణము ద్వారా, మనము దేవుని స్వరూపములము మరియు సృష్టి యావత్తు యొక్క విమోచనను చూస్తాము.

మూడవ స్థానంలో, పాపములోనికి పడిపోయిన వెంటనే, మానవ జాతి యొక్క నీతిగల శేషము దుష్టత్వము మీద జయమును పొందుతుంది అని దేవుడు సూచించాడు. ఆది. 3:15లో, దేవుడు సర్పముతో మాట్లాడిన ఈ మాటలను మనము చదువుతాము:

మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను (ఆది. 3:15).

మానవ జాతి సర్పము, లేక సాతాను సంతతిగాను మరియు హవ్వ సంతతిగాను విభజించబడుతుంది అని దేవుడు ఇక్కడ ప్రకటించాడు — సర్పము యొక్క మోసమును అనుసరించుట కొనసాగించినవారు మరియు మానవులకు వాస్తవముగా ఇవ్వబడిన మార్గమును ఎన్నుకున్నవారు. ఈ వచనము సూచించుచున్నట్లుగా, మానవ జాతి యొక్క ఈ రెండు విభజనలు వైరము కలిగియుంటాయి, కాని తుదకు స్త్రీ సంతతి సర్పము యొక్క తలను చితక త్రొక్కి వాని మీద మరియు వాని సంతతి మీద జయము సాధిస్తుంది అని దేవుడు వాగ్దానము చేశాడు. మరియు ఈ కారణము చేత, రోమా 16:20లో, మహిమలో యేసు రాకను గూర్చి అపొస్తలుడైన పౌలు ఈ విధముగా చెప్పాడు:

సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ల క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును (రోమా. 16:20).

క్రీస్తు యొక్క జయోత్సవ రాకడను గూర్చి ఆదికాండము యొక్క ఆరంభ అధ్యాయములలోనే ప్రస్తావించబడినది. కాబట్టి క్రొత్త నిబంధన బోధయైన నరావతారము మరియు జీవితము; మరణము, పునరుత్థానము మరియు ఆరోహణము; మరియు క్రీస్తు యొక్క రాకడలు క్రొత్త ఆలోచనలుగా పరిగణించబడలేదని మనము చూస్తాము. అవి బైబిలు చరిత్ర యొక్క ఆరంభములోనే విత్తనములుగా నాటబడినవి.

క్రొత్త నిబంధన బోధన ఆదికాండము యొక్క ఆరంభ అధ్యాయములలో కనిపిస్తుంది అని చూచుటతో పాటుగా, ఆదికాండము యొక్క ఆరంభ అధ్యాయములు మరియు క్రొత్త నిబంధన మధ్య అనేక ఎదుగుదల దశలు ఉన్నాయని కూడా మనము తెలుసుకోవాలి. కాని ఈ పాఠంలో మన ఉద్దేశముల కొరకు, పాత నిబంధన చరిత్రలోని ఒక దశను మాత్రమే మనము చూద్దాము, అది ఇశ్రాయేలు దేశముతో దేవుడు రూఢిగా వ్యవహరించిన సందర్భాలు.

ప్రప్రథమముగా, ఆదికాండములో వాస్తవముగా మానవాళికి ఇవ్వబడిన పాత్రను క్రీస్తు యొక్క నరావతారము మరియు నీతిగల జీవితము నెరవేర్చింది అని మనము ముందుగానే చూశాము. అయితే అబ్రాహాము సమయము మొదలుకొని పాత నిబంధన ముగింపు వరకు, ఈ ఉద్దేశము ఒక విశేషమైన దిశలో ఎదిగింది. సామాన్య భావనలో, స్త్రీ యొక్క నమ్మకమైన సంతతిగా ఉండుటకు, దేవుని రాజ్యమును భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు దేవుడు పాత నిబంధన ఇశ్రాయేలును పిలచాడు. మరియు ఒక విశేషమైన విధముగా, ఇశ్రాయేలులో రాజుల పాలన ఎదగగా, తమ రాజ్య గమ్యములోనికి నీతిగల దావీదు కుమారుడు నమ్మకమైన ఇశ్రాయేలీయులను నడిపిస్తాడని దేవుడు నియమించాడు.

ఇందు వలననే క్రొత్త నిబంధన యేసును కేవలం నీతిగలవాడు అని మాత్రమే పిలువదని మనము చూస్తాము. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుతో వ్యవహరించిన సమయములో మానవాళి యొక్క పాత్ర ఎదిగిన మార్గముల వెలుగులో, యేసు ఒక నీతిగల ఇశ్రాయేలీయునిగా జన్మించాడు. మరియు దీని కంటే ఎక్కువగా, యేసు ఇశ్రాయేలు యొక్క నీతిగల రాజు, మరియు దావీదు సింహాసనమునకు నిజమైన వారసునిగా ఉన్నాడు. క్రొత్త నిబంధన బోధనయైన నరావతాము మరియు క్రీస్తు జీవితము ఆదామునకు ఇవ్వబడిన వాస్తవిక ఆజ్ఞను మాత్రమే నెరవేర్చదుగాని, ఇశ్రాయేలు ప్రజలు మరియు వారి రాజు యొక్క అనుబంధములో పాత నిబంధనలో ఆ ఆజ్ఞ యొక్క తదుపరి దశను కూడా నెరవేర్చుతుంది.

రెండవ స్థానములో, ఆదాము హవ్వలు పాపములో పడిపోవుట ద్వారా ఏర్పడిన విమోచన అవసరతను యేసు నెరవేర్చాడు అని మనము చూశాము. అయితే ఈ విమోచన అంశము పాత నిబంధనలో ఏ విధముగా అభివృద్ధి చెందినదో మనము పరిగణించుచుండగా, క్రీస్తు యొక్క కార్యమును మనము మరింత సంపూర్ణంగా అర్థము చేసుకోగలము. మనకు తెలిసియున్నట్లే, లోకములో పాపము అనే సత్యముతో వ్యవహరించుటకు దేవుడు జంతు బలులు మరియు ఆరాధనా వ్యవస్థను మొదట ప్రత్యక్ష గుడారములో మరియు తరువాత యెరూషలేములోని దేవాలయములో స్థాపించాడు. ఈ ఆచారములు ఖచ్చితమైన యాజక నియమములతో నియంత్రించబడేవి. కాని ఈ ఉపాయములు ఎంత అద్భుతమైనవిగా ఉన్నను, అవి పాప ప్రభావముల నుండి తాత్కాలిక ఉపశమనమును మాత్రమే కలిగించగలిగేవి. అవి ఏ ఒక్కరిని కూడా దేవుని తీర్పు అను శాపము నుండి శాశ్వతముగా విడిపించలేదు.

పాత నిబంధన చరిత్రలో ఈ అభివృద్ధి, క్రీస్తు మరణము, పునరుత్థానము మరియు ఆరోహణము ద్వారా కలిగిన విమోచనలోని కొన్ని విషయముల మీద క్రొత్త నిబంధన ఎందుకు ఉద్ఘాటిస్తుందో వివరిస్తుంది. యేసు సిలువ మీద మరణించినప్పుడు, సమస్త పాత నిబంధన జంతు బలుల యొక్క నెరవేర్పుగా యేసు తన ప్రజల కొరకు ఒక పరుపూర్ణమైన బలి అయ్యాడు. పునరుత్థానము ద్వారా ఆయన సంపూర్ణమైన ఆఖరు బలిగా రుజువుచేయబడ్డాడు. మరియు నేడు సహితం, ఆరోహణమైన ప్రభువుగా, మన గొప్ప ప్రథాన యాజకునిగా ఆయన ప్రజల కొరకు ఆయన విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు దేవుని పరలోక దేవాలయములో పరిచర్య చేయుచుండగా ఈ పాత్రలో తన బలిలోని లాభములను గూర్చి ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి, క్రీస్తు యొక్క విమోచన కార్యము ఆదికాండములోని మొదటి అధ్యాయములలో పాపములో పడిపోయిన సమయము నుండి మొదలవగా, అది మధ్యలో ఉన్న దశలైన ఇశ్రాయేలు యొక్క ప్రత్యక్ష గుడారము మరియు దేవాలయ ఆరాధనలో కూడా ఎదిగినది.

మూడవ స్థానంలో, క్రీస్తు రాకడ సమయములో చివరి మహిమకరమైన విజయమును గూర్చిన క్రొత్త నిబంధన బోధ కూడా ఇశ్రాయేలుతో దేవుడు వ్యవహరించిన సందర్భములలో నుండి ఎదిగినది. తన విశేషమైన నీతిగల ప్రజలుగా ఉండుటకు దేవుడు ఇశ్రాయేలును పిలచినప్పుడు, స్త్రీ సంతతిగా జయములో జీవించుటకు ఆయన వారిని పిలచాడు. సాతాను మార్గములను అనుసరించిన అన్య దేశములు పాత నిబంధన అంతటిలో పలు వైపుల నుండి ఇశ్రాయేలును వ్యతిరేకించాయి మరియు ఇబ్బంది పెట్టాయి, కాని ఇశ్రాయేలు నమ్మకముగా దేవుని రాజ్యమును వ్యాపింపజేయుచుండగా పాత నిబంధన ఇశ్రాయేలుకు దేవుడు అంతిమ విజయమును వాగ్దానం చేశాడు. ఈ కారణము చేత, నూతన ఆకాశము మరియు నూతన భూమిలో క్రీస్తు యొక్క అంతిమ విజయమును నూతన యెరూషలేము యొక్క రాకగా క్రొత్త నిబంధన వివరించుట మనలను ఆశ్చర్యపరచకూడదు. సువార్త ప్రకటింపబడినప్పుడు యూదులు మరియు అన్యజాతీయులు యేసు క్రీస్తుకు తమను తాము సమర్పించుకొనగా, ఆయన తన సంఘమును ఒక శరీరముగా కట్టి వారిని వాగ్దానము చేయబడిన, అంతిమ, నిత్యమైన మహిమగల విజయములోనికి నడిపిస్తాడు.

ఈ ఉదాహరణలో నుండి, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము లేఖనము యొక్క చరిత్రను ఎదుగుచున్న ఐక్య కర్బన చరిత్రగా ఎలా వీక్షిస్తుందో మనము చూడవచ్చు. చరిత్రలోని ప్రతి దశ మునుపటి దశలలోని ప్రత్యక్షత మీద నిర్మించబడుతుంది మరియు క్రీస్తులో దేవుని రాజ్యము యొక్క అంతిమ నెరవేర్పు కొరకు ఎదురుచూస్తుంది. ఈ పాఠ్యక్రమమును మనము కొనసాగించుచుండగా, దేవుని కార్య మరియు వాక్య ప్రత్యక్షత యొక్క కర్బన సంబంధమైన అవలోకనము బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో మరలా మరలా ఉద్ఘాటించబడినదని మనము చూస్తాము.

ఈ పాఠంలో మనము బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును మొదటి సారిగా చూశాము. ఈ అధ్యయన విభాగమును గూర్చి సామన్య అవగాహనను పొందుకున్నాము, మరియు అది లేఖనములను దేవుని కార్యముల యొక్క చారిత్రిక విశ్లేషణ ద్వారా ఎలా సమీపిస్తుందో చూశాము. బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అను అధికారిక శాఖ శతాబ్దములుగా ఏ విధముగా అభివృద్ధి చెందినదో మనము చూశాము. మరియు చివరిగా, చరిత్ర మరియు ప్రత్యక్షత మీద దాని యొక్క కేంద్ర దృష్టిని మనము చూశాము.

బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ఈ మధ్య శతాబ్దములలో ఇవాంజెలికల్ క్రైస్తవులు వేదాంతశాస్త్రమును నిర్మించిన అత్యంత ప్రఖ్యాత మార్గములలో ఒకదానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. లేఖనము పట్ల ఈ ధోరణిని గూర్చి మన అధ్యయనమును కొనసాగించుచుండగా, అది వేదాంతశాస్త్రము పట్ల సాంప్రదాయిక ధోరణులను బలపరుస్తుంది మరియు మునుపు తరచుగా నిర్లక్ష్యం చేయబడిన అనేక మెళకువల వైపుకు దృష్టిని ఆకర్షిస్తుంది అని మనము కనుగొంటాము. సరిగా అధ్యయనము చేయబడిన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము దేవుని వాక్యమును మరింత సంపూర్ణముగా గ్రహించుటకు మరియు లేఖనముల మీద ఆధారపడిన మరియు సంఘమును బలపరచు వేదాంతశాస్త్రమును నిర్మించుటలో మనకు సహాయపడుతుంది.

Continue reading the full transcript