<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
క్యాటలాగ్‌కు తిరిగి వెళ్ళుBBTబైబిల్ థియాలజీని నిర్మించడం
బైబిల్ థియాలజీని నిర్మించడం ·Videoఆంగ్లం నుండి అనువాదం చేయబడింది

BBT-02 పాత నిబంధన యొక్క సింక్రోనిక్ సింథసిస్

పూర్తి వచనం చదవండి

అదే శ్రేణి 2వ పాఠానికి సంబంధించిన వీడియో స伴ుగా, ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: బైబిల్‌కు వర్తించినప్పుడు "సింక్రోనిక్" అనే పదానికి అర్థం ఏమిటి? బైబిల్‌కు వర్తించినప్పుడు "సింథసిస్" అనే పదానికి అర్థం ఏమిటి? హెబ్రీయులు, గ్రీకు మనస్తత్వాలు సింక్రోనిక్ సింథసిస్‌కు ఎలా సంబంధం కలిగి ఉన్నాయి? బైబిల్ సింక్రోనిక్ సింథసిస్‌ను ఉపయోగిస్తుందా? ఒక నిర్దిష్ట కాల వ్యవధి గురించి సమాచారాన్ని పొందడానికి మనం బైబిల్‌ను ఎలా ఉపయోగించవచ్చు? బైబిల్ రచయితలు చరిత్రను తారుమారు చేశారా? బైబిల్ చరిత్ర ఆధునిక జర్నలిజానికి ఎంతవరకు సమానం? చారిత్రక డేటాను గుర్తించడం అస్పష్టంగా ఉండేలా బొమ్మల ప్రసంగం చేస్తుందా? బైబిల్ కథనాలకు కూడా బాహ్య డేటాను తీసుకురావలసి ఉంటుందా? బైబిల్‌ను అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడే ఆధునిక పురావస్తు ఆవిష్కరణలు ఏమిటి? జనరేసి అధ్యాయం 1 కవిత్వం లేదా కథనమా? బైబిల్ ఎంత శాస్త్రీయంగా ఖచ్చితంగా ఉంది? సింక్రోనిక్ సింథసిస్ చేసేటప్పుడు ఇతర కాలాల నుండి సమాచారాన్ని చేర్చడానికి మనం ఎందుకు ఉండాలి? ఒక భాగాన్ని వ్యాఖ్యానించడానికి మనకు ఎప్పుడు సరిపోదు? ఒడంబడికలు మధ్య-స్థాయి వేదాంతపరమైన నిర్మాణాలుగా ఎలా పనిచేస్తాయి? ఒడంబడికలు మాత్రమే దయతో రక్షణ సిద్ధాంతానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయి? రాజ్యం బైబిల్ యొక్క సంక్లిష్ట-స్థాయి వేదాంతపరమైన నిర్మాణంగా ఎలా పనిచేస్తుంది? పాత నిబంధనలో దేవుని రాజ్యం ఉద్యమం ఎప్పుడు కనిపిస్తుంది?


From the transcript

1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.

బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.

ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.

అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.

మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.

ఈ మధ్య నేను ఒక బల్లను కొన్నాను మరియు అది ఒక బాక్సులో వేర్వేరు ముక్కలుగా ప్యాక్ చేయబడి నాకు ఇవ్వబడింది, ఆ బాక్సును నేను తెరచిన వెంటనే ముక్కలు ప్రవాహము వలె నేల మీద ఒక్కసారిగా పడిపోయాయి. దానిలో చాలా ముక్కలున్నాయి కాబట్టి ఏది ఎక్కడ ముక్కో కనుగొనుటకు చాలా ఎక్కువ సమయం పట్టబోతుందని నాకు అర్థమయ్యింది. కాని ఆ ముక్కల మధ్యలో ఒక చిన్న సూచనల పుస్తకం నాకు కనిపించింది. కాబట్టి, నేను కూర్చొని దానిని చదువుట ఆరంభించాను.

దానిలోని మొదటి రెండు పేజీలు మొదటి మెట్టును గూర్చినవి. తరువాత రెండు పేజీలు రెండవ మెట్టును గూర్చినవి. తరువాత మూడవ మెట్టు. నేను ఆ చిన్న పుస్తకమును చదువుతుండగా, ఆ బల్లను అమర్చు సుదీర్ఘమైన ప్రక్రియ చిన్న చిన్న మెట్లుగా విభజించబడియుండుట నాకు ఎంతో ఉపశమనం కలిగించింది.

సరే, పాత నిబంధన లేఖనముల యొక్క సుదీర్ఘమైన చరిత్రను అర్థము చేసుకొనుటకు మనము ప్రయత్నించినప్పుడు కూడా అనేక విధాలుగా ఇలాంటిదే జరుగుతుంది. దేవుని కార్యములు మరియు వాక్యములు, ప్రజలు మరియు స్థలములను గూర్చి ఎంత ఎక్కువ సమాచారం ఉంది అంటే, అది మనలను కొన్ని సార్లు తికమక పెట్టవచ్చు. కాని మనము ఏకకాలిక పద్ధతిని తీసుకున్నట్లయితే, అనగా దాని చరిత్రను పలు దశలుగా విభజించి సమస్తమును ఏకీకృతము చేయునప్పుడు ఒకొక్క దశ మీద దృష్టిపెట్టగలిగితే, ఆ పని మరింత నియంత్రణగాను మరియు మరింత ప్రయోజనకరముగాను ఉంటుంది.

బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును కట్టుట అను మన పాఠ్యక్రమములో ఇది రెండవ పాఠము. ఈ పాఠమునకు మేము “పాత నిబంధన యొక్క ఏకకాలిక సంయోగము” అని పేరు పెట్టాము. పాత నిబంధన చరిత్రలోని పలు సమయాలలో దేవుడు తన ప్రజలకు దశల వారిగా బయలుపరచిన విషయములను బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పరిశోధించిన విధానమును ఈ పాఠములో మనము చూస్తాము.

మన మునుపటి పాఠంలో, చారిత్రికముగా లేఖనములను అర్థము చేసుకొనుట కొరకు క్రైస్తవులు మూడు ముఖ్యమైన ప్రణాళికలను ఉపయోగించారని మనము చూశాము: సాహిత్య విశ్లేషణ, అనగా కొన్ని దృక్కోణములను తెలియజేయుటకు రూపించబడిన ఒక సాహిత్య పటముగా బైబిలును చూచుట; అంశ విశ్లేషణ, అనగా మన సమకాలీన లేక సాంప్రదాయిక అంశములను మరియు ప్రశ్నలను ప్రతిబింబించు ఒక అద్దముగా బైబిలును చూచుట; మరియు చారిత్రిక విశ్లేషణ, అనగా అది నివేదించు చారిత్రిక సన్నివేశములకు కిటికీగా బైబిలును చూచుట. బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ప్రాథమికముగా లేఖనముల యొక్క చారిత్రిక విశ్లేషణ మీద దృష్టి పెడుతుంది అని, ప్రత్యేకముగా బైబిలులో నివేదించబడిన చారిత్రిక సన్నివేశములలో దేవుడు పాలుపంచుకున్న మార్గములను పరిశీలిస్తుంది అని కూడా మనము చూశాము.

ఈ కారణము చేత, మనము ఇలా చెప్పాము: “బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అనగా లేఖనములో తెలియజేయబడిన దేవుని కార్యముల యొక్క చారిత్రిక విశ్లేషణ నుండి వెలువడిన వేదాంతశాస్త్ర ఆలోచనయైయున్నది.” బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము దేవుని కార్యముల యొక్క లేఖన కథనముల మీద దృష్టి పెడుతుంది మరియు ఆ సన్నివేశములలో నుండి క్రైస్తవ వేదాంతశాస్త్రము కొరకు అనుమితులను వెలికి తీస్తుంది. ఈ సమీక్షను దృష్టిలో ఉంచుకొని, ఈ పాఠమును పరిశీలన చేద్దాము.

పాత నిబంధన యొక్క ఏకకాలిక సంయోగము అనే ఈ పాఠములో, మనము మూడు ముఖ్యమైన విషయములను చూద్దాము. మొదటిగా, “ఏకకాలిక సంయోగము” అంటే ఏమిటో ఒక సాధారణ ధోరణిని పొందుకుందాము. రెండవదిగా, ఏకకాలిక సంయోగములో ఉపయోగించిన చారిత్రిక సమాచారమును పాత నిబంధన వాక్యభాగములు తెలియజేయు మార్గములను చూద్దాము. మరియు మూడవదిగా, పాత నిబంధనలోని చారిత్రిక సమాచారమును ఏకకాలిక సంయోగము చేయుట ద్వారా కనుగొనబడిన సంయోగముగల వేదాంతశాస్త్ర నిర్మాణముల మీద దృష్టిపెడదాము. మన అంశము పట్ల గల సామాన్య ధోరణితో మొదలుపెట్టుదాము రండి.

“ఏకకాలిక సంయోగము” అను మాట యొక్క అర్థమును గ్రహించుటకు, మనము మూడు విషయములను చూద్దాము. మొదటిగా, “ఏకకాలిక” అను పదమును నిర్వచించుదాము. రెండవదిగా, “సంయోగము” అనే పదమును చూద్దాము; మరియు మూడవదిగా, మన మనస్సులో ఉన్నదానిని లేఖనముల ఉదాహరణ ద్వారా ఉదాహరిద్దాము మరియు క్రమపరుద్దాము. “ఏకకాలిక” అను పదము యొక్క అర్థముతో ఆరంభిద్దాము.

ఏకకాలిక లేక “సిన్క్రోనిక్” అను పదము రెండు గ్రీకు పదముల నుండి వెలువడుతుంది: సన్ అను విభక్తి యొక్క అర్థము “కూడా” లేక “కలిసి,” మరియు క్రోనోస్ అను నామవాచకము యొక్క అర్థము “కాలం.” ఏకకాలిక లేక సిన్క్రోనిక్ అను పదమును చారిత్రిక సన్నివేశముల కొరకు ఉపయోగించినప్పుడు, అది “ఒక కాలములో కలిసి,” లేక “ఒకే సమయమందు” జరిగిన సన్నివేశములను వివరిస్తుంది. పాత నిబంధన చరిత్రలో ఒకే కాలములో సంభవించిన సన్నివేశముల గుంపును బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పరిశోధించు విధానమును సూచించుటకు మనము ఏకకాలిక అను పదమును ఉపయోగిస్తాము.

ఈ ఆలోచనను ఉదాహరించుటకు, చలనచిత్ర దర్శకులు తమ కథలను చెప్పు విధానమును గూర్చి ఆలోచన చెయ్యండి. అత్యంత ఖ్యాతిగాంచిన చలన చిత్రాలు ఆరంభము నుండి అంతము వరకు కథను క్రమముగా చెబుతాయి. ఒక సన్నివేశము మరొక సన్నివేశములోనికి, మరియు ఆ సన్నివేశము ఇంకొక సన్నివేశములోనికి ఎలా నడిపిస్తుందో అవి తెలియజేస్తాయి. అయినను, చలనచిత్రమంతా ఒకటే అయినా, అది అనేక చిన్న చిన్న భాగములైన సీనులుగా విభాగించబడుతుంది. ప్రతి సీను పెద్ద కథలోని ఒక భాగమును తెలియజేస్తుంది. ఈ భావనలో, ప్రతి సీను చలనచిత్రములోని ఒక ఏకకాలిక సందర్భమును, అనగా చలనచిత్రములో ఒక సమయమును తెలియజేస్తుంది.

పాత నిబంధన యొక్క ఏకకాలిక అధ్యయనము కూడా ఇలాంటి పద్ధతినే అనుసరిస్తుంది. ఏకకాలిక సంయోగములో, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధనలోని పలు కాలములను చరిత్రయంతటిలో ఒక శ్రావ్యముగా గాక ఒక చలనచిత్రములోని సీనుల వలె పరిగణిస్తారు.

అయినను, చలనచిత్రములోని సీనుల వలె, ఏకకాలిక పద్ధతులు కూడా పలు పరిమాణములు గల కాలముల మీద దృష్టిపెట్టగలవని గ్రహించుట చాలా అవసరము. కొన్నిసార్లు బైబిలానుసారమైన వేదాంతవేత్తలు క్లుప్తమైన చారిత్రిక సందర్భముల మీద దృష్టిపెడితే, మరికొన్నిసార్లు వారు సుదీర్ఘ కాల సందర్భముల మీద దృష్టిపెడతారు.

మనము కూడా సాధారణ జీవితములో ఇదే పని చేస్తాము. కొన్నిసార్లు మనము కొన్ని విషయములను గూర్చి అవి సుదీర్ఘ కాల క్రమములో చోటు చేసుకున్నాగాని అవి ఏకకాలములో జరుగుతున్నట్టు మాట్లాడతాము. ఉదాహరణకు, ఒక సుదీర్ఘమైన సంభాషణను ఒకే సన్నివేశముగా సంబోధిస్తూ, “కొంచెం సేపు క్రితమే నా స్నేహితునితో నేను సుదీర్ఘముగా మాట్లాడాను,” అని నేను చెప్పవచ్చు. మరికొన్ని సార్లు, మనము పెద్ద అనిత్యమైన విషయములను గూర్చి అవి ఒకే సమయములో సంభవించినట్లు మాట్లాడతాము. ఉదాహరణకు, ఒక వారమంతా జరిగిన కార్య కలాపాలను “గతవారమంతా నేను కొండలలో గడిపాను” అని మనం క్రోడీకరించవచ్చు, లేక “గత సంవత్సరము నేను స్కూల్ కి వెళ్లాను” అని చెబుతూ సంవత్సరమంతటిని కూడా క్రోడీకరించవచ్చు. పాత నిబంధన చరిత్రను ఏకకాలిక భాగములుగా విభజించునప్పుడు బైబిలానుసారమైన వేదాంతవేత్తలు కూడా ఇదే విధమైన అనిత్య వశ్యతను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు వారు చరిత్రలోని తక్కువ కాల వ్యవధులను ఉపయోగిస్తే మరికొన్నిసార్లు వారు సుదీర్ఘ కాల వ్యవధుల మీద దృష్టిపెడతారు.

ఇప్పుడు, మన దృష్టిలో ఒక క్షణం ఉంటె తప్ప చరిత్రలోని ప్రతి ఏకకాలిక కాలములో సమయము గడుస్తుంది, మరియు ఈ కాల మార్పులు చారిత్రిక మార్పులను కూడా తీసుకొని వస్తాయి. కొన్నిసార్లు ఈ మార్పులు చిన్నగా ఉంటాయి, మరికొన్నిసార్లు ఎంతో ముఖ్యమైనవిగా ఉంటాయి. కాని ఎలాంటి మార్పులు జరిగినను, పాత నిబంధన పట్ల ఏకకాలిక పద్ధతులు ఇవ్వబడిన కాలమును ఏకముగా చూస్తాయి. మరియు ఇవ్వబడిన కాలము యొక్క చివరిలో స్థాపించబడిన వేదాంతశాస్త్ర దృక్కోణముల మీద వారు ప్రాథమికముగా దృష్టిపెడతారు.

ఉదాహరణకు, ఆదికాండము 22లో అబ్రాహాము ఇస్సాకును బలి ఇచ్చుటను గూర్చిన చిన్న కథనములో, అనేక విషయములు చోటు చేసుకున్నాయి. కాని “అబ్రాహాము జీవితములోని ఈ భాగములో ఏ వేదాంతశాస్త్ర దృక్పథములు కనిపిస్తాయి?” అని బైబిలానుసారమైన వేదాంతవేత్తలు అడుగుతారు.

ఆదికాండము 11-25 అధ్యాయములలో అబ్రాహము జీవితము — సుమారుగా 175 సంవత్సరముల కాల వ్యవధి — వంటి సుదీర్ఘ కాల వ్యవధులను కూడా బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పరిగణలోనికి తీసుకుంటారు. అట్టి సుదీర్ఘ కాల వ్యవధి పరిగణలో ఉన్నప్పుడు కూడా, వారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు: అబ్రాహాము జీవితమంతటిలో ఏ వేదాంతశాస్త్ర దృక్కోణములు కనిపించాయి?”

వాస్తవానికి, కొన్నిసార్లు బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధన అంతటిని ఒక ఏకకాలిక భాగముగా పరిగణించి ఇలా అడుగుతారు: “పాత నిబంధన దినాలలో దేవుడు ఏమి చేశాడు మరియు ఏమి చెప్పాడు?”

“ఏకకాలిక” అను మాట యొక్క నిర్వచనమును చూశాము కాబట్టి, మన రెండవ పదమైన “సంయోగము”ను ఇప్పుడు పరిశీలన చేద్దాము.

సంయోగము అనే అంశమును అర్థము చేసుకొనుట కష్టమేమి కాదు. దానిని మనము మన అనుదిన జీవితములలో ఉపయోగిస్తాము. సుళువుగా చెబితే, ఒక విషయములోని పలు భాగములను ఒకటిగా కలుపుటయే దాని అర్థము.

ఉదాహరణకు, మీరు మీ స్నేహితుని ఇంటికి భోజనానికి వెళ్లారని ఊహించుకోండి. అక్కడ మీరు అది ఇది తింటారు. ఒకరు మాట్లాడడం మరొకరు స్పందించడం మీరు వింటారు. ఒకరు జోక్ వేస్తే ఉన్నవారంతా నవ్వుతారు. ఒకరు ఆలస్యంగా వస్తే, మరొకరు త్వరగా వెళ్లిపోతారు. ఇలా అన్ని రకముల విషయములు అక్కడ జరుగుతాయి. ఇప్పుడు తరువాత రోజు భోజనము దగ్గర ఏమి జరిగినదో మీరు మీ స్నేహితునికి చెప్పారని ఊహించుకోండి. అక్కడ జరిగినది జరిగినట్టుగా మీరు అతనికి చెప్పుట సాధ్యము కాదు. బదులుగా, అక్కడ కూడిక అంతటిని మీరు ఐక్యపరచి, దానిలోని భావమును వెల్లడిస్తారు.

అనేక విధాలుగా, ఏకకాలిక సంయోగమును దృష్టిలో ఉంచుకొని లేఖనములను పరిగణించినప్పుడు మనము కూడా ఇదే చేస్తాము. చరిత్రలోని ఒక కాలములో బయలుపరచబడిన వేదాంతశాస్త్ర భాగములు ఒక తార్కికమైన పొందికగల నిర్మాణములో అమర్చబడు పలు మార్గములను మనము వివరిస్తాము. ఏకకాలిక సంయోగములో ఒక కాలములోని పాత నిబంధన వేదాంతశాస్త్రము యొక్క తార్కిక నిర్మాణమును సమీక్షించుట ఏ విధముగా భాగమైయున్నదో తెలుసుకొనుటకు, మనము రెండు విషయములను చూద్దాము. మొదటిగా, పాత నిబంధన తార్కిక స్వభావము యొక్క సాధారణ తిరస్కరణను చూద్దాము; మరియు రెండవదిగా, దాని తార్కిక పొందికకు ఒక ఉద్ఘాటనను మనము అందించుదాము. పాత నిబంధన తార్కిక స్వభావము యొక్క సాధారణ తిరస్కరణతో ఆరంభించుదాము.

ఇరవైయవ శతాబ్దపు మధ్య భాగంలో, ప్రతి శాఖలోను తర్కము యొక్క పాత్రను ఎత్తి చూపుతూ అనేకమంది విమర్శనాత్మక పండితులు బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము మరియు క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము మధ్య వ్యత్యాసము చూపారు. సాంప్రదాయిక క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములో తర్కము ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తుంది అని గుర్తించుట చాలా సులభము. కాని తర్కము బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో అంత పెద్ద పాత్రను పోషించకూడదని విమర్శనాత్మక వేదాంతవేత్తలు వాదించారు.

ఈ చర్చలలోని చిక్కులు ఈ పాఠమునకు బయట కూడా ఉన్నప్పటికీ, వారి అభిప్రాయమును ఉపయోగకరమైన విధములో మనము క్రోడీకరించవచ్చు. క్లుప్తంగా, “గ్రీకు ఆలోచనా విధానము” అని వారు పిలచినదానికి తర్కము ప్రాథమికమైన స్వభావముగా ఉన్నదిగాని, “హెబ్రీ ఆలోచనా విధానము”నకు అది వేరుగా ఉన్నదని విమర్శనాత్మక వేదాంతవేత్తలు నమ్మారు. అనేక భాషాపరమైన మరియు సాంస్కృతిక సమీక్షల ఆధారంగా, ఇంచుమించు క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము వలెనె గ్రీకులు కూడా వైరాగ్యము మరియు తార్కిక క్రమము మీద దృష్టి పెట్టారని వారు వాదించారు. మరియు దీనికి భిన్నంగా, హెబ్రీ ఆలోచనా విధానము ప్రతి దానిని చారిత్రిక క్రియాశీలకముల వెలుగులో చూసింది అని సూచించారు. ఈ దృష్టి కోణం ప్రకారం, నమ్మకముల మధ్య ఉన్న తార్కిక పద్ధతులు లేక వేదాంతశాస్త్ర అనుబంధముల మీద పాత నిబంధన దృష్టి పెట్టలేదు. మరియు ఈ కారణము చేత, పాత నిబంధన వేదాంతశాస్త్రమును సంయోగపరచుట హెబ్రీ బైబిలును అపార్థము చేసుకొనుట మరియు దానిని గ్రీకు ఆలోచనా విధానములోనికి నెట్టి వేస్తుంది.

ఈ తిరస్కరణకు భిన్నంగా, పాత నిబంధనలోని తార్కిక గుణము యొక్క ఉద్ఘాటన కనీసం రెండు ఆధారముల మీద నిలబడుతుంది. మొదటి స్థానంలో, ఒకానొకప్పుడు అనేకమంది బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ప్రతిపాదించిన గ్రీకు మరియు హెబ్రీ ఆలోచనా విధానములకు మధ్య ఉన్న వ్యత్యాసముల రకములను ఆధునిక అధ్యయనములు ప్రక్కనబెట్టాయి. ఈ ఆలోచనా విధానముల మధ్య అనేక వ్యత్యాసములు ఉన్నాయిగాని వాటి మధ్య పోలికలు కూడా ఉన్నాయి.

రెండవ స్థానంలో, పాత నిబంధన వేదాంతశాస్త్రము తర్కము మరియు తార్కిక ఆలోచన పట్ల గొప్ప ఆసక్తిని కనుపరుస్తుంది. శ్రద్ధగల తార్కిక విశ్లేషణ లేకుండా జీవితమును సరైన విధానములో సమీక్షించలేము. ఇప్పుడు, నిస్సందేహముగా, దేవుని ఆలోచనలు మన ఆలోచనల కంటే ఉన్నతమైనవిగా ఉన్నాయి కాబట్టి పాత నిబంధనలో బయలుపరచబడిన అనేక విషయములు మానవులకు మర్మములుగానే మిగిలిపోతాయి. అయినను, ఆయన మనకు బయలుపరచిన విషయములను గూర్చి తార్కికముగా ఆలోచన చేయుటలో గల విలువను ఈ సత్యము తిరస్కరించదు. పాత నిబంధన వేదాంతశాస్త్రములో తర్కము ఇమిడియున్నదా లేదా అనునది ప్రశ్న కాదు; కాని దానిలో తర్కము ఎలా ఇమిడియుండినది అనేదే ప్రశ్న.

సాంప్రదాయిక క్రమబద్ధమైన వేదాంతశాస్త్రమును లోతుగా ప్రభావితము చేసిన అధికారిక పాశ్చాత్య తత్వవాద సాంప్రదాయముల ప్రమాణాలను పాత నిబంధన వేదాంతశాస్త్రము ఉపయోగించదు అనేది నిజమే. ఉదాహరణకు, పాత నిబంధన చాలా తక్కువ స్థిరమైన సాంకేతిక పదములను ఉపయోగిస్తుంది; దాని వేదాంతశాస్త్రము పలు రకముల రచనా శైలులలో వ్యక్తీకరించబడుతుంది; పలువురు పాత నిబంధన రచయితలు వారి విశ్వాసము యొక్క పలు కోణములను ఉద్ఘాటించారు; మరియు పాత నిబంధన ఎక్కడా కూడా ఒక సార్వత్రికమైన తార్కిక వేదాంతశాస్త్ర వ్యవస్థను అందించదు.

అదే విధముగా, లేఖనములో దేవుని ప్రత్యక్షతలు కూడా అక్కడక్కడ, పొంతనలేకుండా లేక వ్యతిరేకముగా ఉన్నవి కావు. మనము ఈ పాఠంలో తరువాత చూడబోవుచున్నట్టుగా, దేవుని ప్రత్యక్షతలు ఆయన ప్రజలకు కొన్ని సన్నివేశములలోనికి మెళకువను ఇచ్చుట మాత్రమే గాక, ఆయనను గూర్చి, తమను గూర్చి మరియు మిగిలిన సృష్టిని గూర్చి ఒక తార్కికమైన, సంయోగ మార్గములలో అవగాహన, ప్రవర్తన మరియు భావనలను కలిగియుండుటకు నడిపించింది.

ఏకకాలిక సంయోగమును గూర్చిన ఈ సామాన్య అవగాహనను దృష్టిలో పెట్టుకొనుట, ఈ పద్ధతి యొక్క ఒక ఉదాహరణను బైబిలులోనే కనుగొనుటకు మనకు సహాయపడుతుంది.

మనము లేఖనములను చూచుచుండగా, పాత్రలు మరియు రచయితలు పాత నిబంధనను పలు చారిత్రిక కాలములలోనికి విభజన చేసి అక్కడ వారు కనుగొనిన వేదాంతశాస్త్రమును సంయోగపరచారని మనము కనుగొంటాము. వారు ఈ విధముగా లెక్కలేనన్ని సార్లు చేసిరిగాని, మన ఉద్దేశముల కొరకు మనము కేవలము ఒక ప్రాతిపదిక లేఖన భాగమును మాత్రమే చూద్దాము. రోమా 5:12, 13లో పౌలు ఏమని వ్రాస్తున్నాడో ఒకసారి చూడండి:

ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చిన దనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారిమీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతై యుండెను (రోమా 5:12-14),

ఈ వచనములలో, ఆదాము పాపములో పడుట మొదలుకొని సీనాయి పర్వతము యొద్ద ధర్మశాస్త్రము ఇవ్వబడుటను పౌలు ఒక ఏకకాలిక భాగముగా అనగా చరిత్రలో ఒక ఏక భాగముగా పరిగణించాడు. ఆదాము చేసిన పాపము యొక్క శాశ్వత పరిణామములు క్రీస్తు చూపిన విధేయత యొక్క శాశ్వత పరిణామములకు పూర్వగామిగా ఎలా ఉన్నాయో నిర్థారించుట ఈ వాక్యభాగములో పౌలు యొక్క ముఖ్య అంశముగా ఉన్నది. మరియు ఈ బిందువును తెలియజేయుటకు, ఆదాము మరియు మోషే మధ్య కాలములో ఉన్న అనేక వేదాంతశాస్త్ర విషయములను పౌలు సంయోగపరచాడు.

12వ వచనములో పౌలు అంటాడు, “ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో . . .” ఇక్కడ అతడు ఆది. 3:14-19ని ప్రస్తావిస్తూ, మానవ మరణము మానవ పాపమునకు ఏ విధముగా ఫలితముగా ఉన్నదో తెలియపరచాడు. తరువాత, ఆదాము పతనము మరియు సీనాయి పర్వతము మధ్య ఉన్న కాలమును “ధర్మశాస్త్రము లేనప్పుడు,” అని పౌలు వర్ణించాడు, అనగా పది ఆజ్ఞలు మరియు నిబంధన గ్రంథము వంటి వ్రాయబడిన ధర్మశాస్త్రము ప్రజల యొద్ద లేని కాలమది. ఆ కాలములో ప్రజలు “ఆదాము చేసిన అతిక్రమమును బోలి పాపము చేయలేదని” అతడు చెప్పాడు. అనగా, ఏదెను వనములో ఆదాము వలె వారు ప్రత్యేకముగా నిర్మించబడిన ఆజ్ఞలను ఉల్లంఘించలేదు.

ఇప్పుడు, సీనాయి పర్వతమునకు ముందు “ధర్మశాస్త్రము” ఉనికిలో లేదు అని పౌలు చెప్పిన తరువాత, అతడు ఒక ఊహాజనకమైన సాధ్యతతో వ్యవహరించవలసియుండినది. ఆదాము మరియు మోషే మధ్య కాలములో నివసించిన ప్రజలు పాపము విషయములో నిర్దోషులై యుండియుండవచ్చు. వారు ఉల్లంఘించుట కొరకు కొన్ని నిర్దిష్టమైన నియమములు లేనియెడల, వారు పాపులని మనము ఎలా చెప్పగలము? ఈ ప్రశ్నకు జవాబిచ్చుటకు, ఆ కాలములోని మరొక విషయము వైపుకు పౌలు ధ్యాసను మళ్లించాడు: “ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను.” స్త్రీ పురుషులు మరణ శాపము క్రింద ఉన్నారు కాబట్టి, తార్కిక అనుమతుల ఆధారంగా వారు పాపులు అయ్యుండాలి అని అతడు వాదించాడు.

ఈ వాక్య భాగము యొక్క విస్తృత నేపథ్యములో ఆదాము పాపము సృష్టించిన సమస్యను యేసు దేవునికి చూపిన విధేయత పరిష్కరించింది అని పౌలు చెప్పాడు. ఆదాము చేసిన ఒక అవిధేయత కార్యము ఆదాముతో జతకలసిన ప్రతి ఒక్కరికి మరణమును కొని తెచ్చినట్లే, క్రీస్తు చేసిన ఒక విధేయత కార్యము క్రీస్తుతో జత కలసిన ప్రతి ఒక్కరికి జీవమును తెచ్చింది. మరియు ఈ కారణము చేత, ఆదాము యేసు యొక్క “మాదిరి”గాను లేక రూపముగాను ఉన్నాడు.

పౌలు యొక్క తర్కము ఏ విధముగా పని చేసినదో గమనించండి. మొదటిగా, పతనము నుండి ధర్మశాస్త్రము ఇవ్వబడినంత వరకు ఉన్న కాలమును అతడు ఏకకాలికము చేసి, క్రీస్తు నుండి నేటి కాలము మధ్య ఉన్న సమయమును మరొక కాలముగా ఏకకాలికము చేశాడు. రెండవదిగా, దానిలోని కొన్ని గుణములను తార్కికముగా కలిపి అతడు ప్రతి యుగమును సంయోగపరచాడు. క్లుప్తంగా, బాధ్యతగల బైబిలానుసారమైన వేదాంతవేత్తలు చేయు పనినే అతడు చేశాడు. మరియు ఆధునిక క్రైస్తవులకు ఏకకాలిక సంయోగం కూడా తార్కికమైన అభ్యాసమేనని అతని మాదిరి తెలియజేస్తుంది.

ఏకకాలిక సంయోగము ఏమిటో మనము చూశాము కాబట్టి, మరియు క్రొత్త నిబంధన ఈ పద్ధతిని సమర్థిస్తుంది అని చూపితిమి కాబట్టి, ఏకకాలిక సంయోగమును, అనగా పాత నిబంధనలో చారిత్రిక సమాచారమును వివేచించు ప్రక్రియను సృష్టించు ప్రాముఖ్యమైన మెట్టును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.

మునుపటి పాఠంలో మనము చూసినట్లుగా, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు రెండు రకముల చారిత్రిక సన్నివేశముల మీద విశేషమైన దృష్టిని పెడతారు: దైవిక కార్య ప్రత్యక్షతలు, అనగా, దేవుడు చేసిన కార్యములు; మరియు దైవిక వాక్య ప్రత్యక్షతలు, దేవుడు మరియు ఆయన సందేశకులు చెప్పిన వాక్కులు.

పాత నిబంధనలోని ఒక కాలములోని వేదాంతశాస్త్రమును బైబిలానుసారమైన వేదాంతవేత్తలు సంయోగపరచక ముందు, వారు చారిత్రిక సన్నివేశములను గూర్చి — వారు చూచుచున్న కాలములో సంభవించిన దేవుని కార్యములు మరియు వాక్కులు — సమాచారమును సేకరించవలసియున్నది. వారి ఏకకాలిక సంయోగమునకు ఈ చారిత్రిక సత్యములు ఒక సామాన్య నిర్మాణ రాళ్లుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మొదటి చూపులో, ఇది చాలా సులభమైన పనిగా అనిపించవచ్చు. కొన్ని కాలములలో జరిగిన సన్నివేశములను గూర్చి బైబిలు చెప్పువాటిని మనము కేవలం తిరిగి చెబితే చాలు అని మనము ఆలోచన చేయవచ్చు. కాని మనము చూడబోవుచున్నట్టుగా, బైబిలులో నుండి చారిత్రిక సమాచారమును సేకరించుటకు చాలా శ్రద్ధ చూపవలసియున్నది.

పాత నిబంధన చారిత్రిక సమాచారము యొక్క జాబితాగా మనకు ఇవ్వబడలేదు. బదులుగా, దానిలో కథనములు, పద్యభాగం, ధర్మశాస్త్రము, జ్ఞాన రచనలు, వంశావళులు, పలు రకముల కీర్తనలు, ప్రవచన పలుకులు, మరియు అనేక ఇతర రచనా శైలులు కలవు. ఈ రచనా శైలులన్ని దేవుని కార్యములు మరియు వాక్కులను గూర్చిన సమాచారమును బయలుపరుస్తాయి, కాని ఈ చారిత్రిక సమాచారము ప్రతి రచనా శైలి యొక్క సాహిత్య లక్షణములలో పొదగబడియుంటుంది. మరియు ఈ కారణము చేత, ప్రతి సాహిత్య శైలి నుండి చారిత్రిక సమాచారమును సేకరించుటకు బైబిలానుసారమైన వేదాంతవేత్తలు మార్గములను కనుగొనాలి.

ఈ ప్రక్రియను గూర్చి రెండు ప్రథానమైన సాహిత్య రకముల ద్వారా చర్చించుటకు మాత్రమే సమయము మనకు అనుమతిస్తుంది: పద్యభాగం మరియు కథనములు. ఈ రచనా శైలులను గూర్చి మనము నేర్చుకొను విషయములు ఇతర రచనా శైలులకు సంబంధించిన ఆందోళనల రకములను గూర్చి మనకు అవగాహనను కలుగజేస్తుంది. పద్యభాగము చారిత్రిక సమాచారమును ఇచ్చు మార్గములతో ఆరంభించుదాము.

పాత నిబంధన పద్య భాగమును గూర్చి మనము మాట్లాడునప్పుడు, మనము కీర్తనలు, కొంత జ్ఞాన సాహిత్యము, పాత నిబంధన ప్రవచనములో ఎక్కువ భాగము మరియు ఇతర పుస్తకములలో కొన్ని భాగములను గూర్చి మాట్లాడుతున్నాము. లేఖనములలోని దేవుని కార్యములు మరియు మాటలను గూర్చిన సత్యములను వివేచించుటకు, పద్య భాగము యొక్క సాహిత్య లక్షణములు చారిత్రిక సమాచారమును ఏ విధముగా బయలుపరుస్తున్నాయో మనము చూడాలి.

దీనిని పరిశీలించుటకు, మనము రెండు విషయములను చూద్దాము. మొదటిగా, పాత నిబంధన ఎల్లప్పుడూ పరిగణించిన రెండు ప్రపంచములను మనము చూద్దాము. మరియు రెండవదిగా, రెండు ప్రపంచముల పట్ల ఆసక్తిని కలిగియుండుట పద్యభాగములో చారిత్రిక సమాచారమును వివేచించు ప్రక్రియ మీద ఎలా ప్రభావము చూపుతుందో చూద్దాము. మొదటిగా పాత నిబంధన పద్యభాగము యొక్క రెండు ప్రపంచములను చూద్దాము.

చరిత్రను గూర్చి మనకు సమాచారమునిచ్చు రెండు వేర్వేరు ప్రపంచములను గూర్చి పాత నిబంధన కవులు ఆసక్తి కలిగియుండిరి. ఒక వైపున, వారు వ్రాసిన ప్రపంచము పట్ల వారు ఆసక్తిని కనుపరచారు — మనము దానిని “ఆ ప్రపంచము” అని పిలుస్తాము. ఆ ప్రపంచమును గూర్చి వ్రాయునప్పుడు, దేవుని కార్యములు మరియు వాక్కులను గూర్చి వారు ఖచ్చితమైన సత్యములను ఇచ్చారు. మొదటి స్థానంలో, పద్యభాగము చాలా సార్లు భూతకాలము యొక్క కిటికీలను తెరచేది.

ఉదాహరణకు, నిర్గమ. 15:1-21లో మోషే మరియు మిర్యాము యెర్ర సముద్రము యొద్ద పాడిన పాట ఒక సుపరిచితమైన పద్య భాగముగా ఉన్నది. యెర్ర సముద్రము యొద్ద దేవుడు చేసిన కార్యమును గూర్చి తన పాఠకులకు చారిత్రిక సమాచారమును అందించుట కొరకు మోషే ఈ భాగమును నిర్గమకాండములో జోడించాడు.

రెండవ స్థానంలో, పాత నిబంధన పద్యభాగము చాలా సార్లు రచయిత కాలములోని సమకాలీన చారిత్రిక సమాచారమునకు కిటికీలను అందించింది. ఉదాహరణకు, దేవుని ధర్మాశాస్త్రమును ధ్యానించవలసినదని మొదటి కీర్తన తెలియజేస్తుంది. దేవుని ధర్మశాస్త్రము యొక్క ప్రాముఖ్యతను వ్యక్తపరచుటకు, నమ్మకమైన సేవకుల కొరకు దేవుడిచ్చు నిరంతర ఆశీర్వాదములు మరియు పాపులకు ఆయన ఇచ్చు తీర్పులను గూర్చిన నమూనాల వైపుకు కీర్తనకారుడు ధ్యాసను మళ్లించాడు. ఈ విధముగా, మొదటి కీర్తన ఆ కాలములో జరిగిన సన్నివేశములను గూర్చి పాఠకులకు మెళకువను అనుగ్రహించింది.

మూడవ స్థానంలో, కొన్ని సార్లు పాత నిబంధన కవులు తమ పాఠకుల దృష్టిని భవిష్యత్తు వైపుకు మళ్లించారు. ఉదాహరణకు, యెషయా 40:1-11లో, చెరలో ఉన్న యూదులు తమ సొంత దేశమునకు తిరిగి వెళ్లు సమయమును యెషయా తెలియజేశాడు.

ఏదో ఒక విధముగా, పాత నిబంధన పద్యభాగము వర్తమాన, భూత భవిష్యత్త్ కాలములలో దేవుని ప్రత్యక్షతా కార్యములు మరియు వాక్కులను గూర్చిన సమాచారమును తెలియపరచింది. పాత నిబంధన కవులు తమ పాఠకుల ప్రపంచము మీద కూడా దృష్టిపెట్టారు, దానిని మనము “వారి ప్రపంచము” అని పిలుస్తాము. తమ వాస్తవిక పాఠకుల యొక్క జీవితములను కొన్ని విధాలుగా ప్రభావితము చేయుటకు తమ రచనలను రూపొందించుట ద్వారా వారు తమ లోకము మీద దృష్టిపెట్టారు.

ఉదాహరణకు, నిర్గమ. 15లో ఇవ్వబడిన మిర్యాము మరియు మోషే యొక్క పాట వాగ్దాన దేశము వైపుకు నిశ్చయతతో వెళ్లునట్లు మోషే యొక్క ఆదిమ పాఠకులను ప్రేరేపించింది. దేవుని ధర్మశాస్త్రమును నిరంతరము ధ్యానించునట్లు పురికొల్పుట కొరకు మొదటి కీర్తన వ్రాయబడినది. మరియు చెరలో ఉన్నవారు మహిమకరమైన వాగ్దాన దేశ ప్రవేశమును గూర్చి నిరీక్షణ కలిగియుండునట్లు ప్రోత్సహించుటకు యెషయా 40లోని ప్రవచనములు రూపొందించబడినవి. “వారి ప్రపంచము”తో, అనగా తమ ఆదిమ పాఠకులు నివసించిన కాలముతో మాట్లాడుటకు పాత నిబంధన కవులు వారి దృష్టిని దేవుని కార్యము మరియు వాక్య ప్రత్యక్షత యొక్క “ఆ ప్రపంచము” వైపుకు మళ్లించారు.

పాత నిబంధన పద్యభాగము యొక్క రెండు ప్రపంచములు బైబిలులోని ఈ భాగములలో ఉన్న చారిత్రిక సమాచారమును వివేచించు మార్గములను ఏ విధముగా ప్రభావితము చేస్తాయో మనము చూడాలి.

పాత నిబంధన కవులు వర్తమాన భూత భవిష్యత్త్ కాలములను గూర్చి తమ పాఠకులకు చెప్పిన విషయములు సత్యములు అనే నిశ్చయతను మనము కలిగియుండవచ్చు. కేవలం సత్యమును మాత్రమే మాట్లాడు దేవుని ద్వారా వారు ప్రేరేపించబడిరి. కాని వారు చరిత్రను గూర్చి కొన్ని సార్లు సూటిగా వివరించలేదు. మరియు ఈ కారణము చేత, ఖచ్చితమైన చారిత్రిక సత్యములను గూర్చి కవులు చెప్పదలచిన విషయములను తెలుసుకొనుటకు, పాత నిబంధన పద్యభాగము యొక్క సాహిత్య పద్ధతులను మనము అర్థము చేసుకోవాలి.

పాత నిబంధన పద్యభాగము యొక్క సాహిత్య పద్ధతులను వివరించుటకు అనేక మార్గములు కలవు, కాని మన ఉద్దేశముల కొరకు మనము కేవలం నాలుగు ముఖ్యమైన లక్షణములను మాత్రమే పరిశీలన చేద్దాము. మొదటిగా, వ్రాయబడిన వాటిని గూర్చి పాఠకులను ఆలోచింపజేయుటకు పద్యభాగ లేఖనములు అసాధారణమైన పదములను మరియు శబ్దప్రయోగ లక్షణమును ఉపయోగిస్తాయి. రెండవదిగా, చారిత్రిక సత్యములను పరోక్షంగా వివరించుటకు పాత నిబంధన కవులు ఉపమాలంకారములు, ఉపమానములు, ఉదాహరణలు, మరియు అతిశయోక్తులు వంటి అనేక భాషాభాగములను ఉపయోగించారు. మూడవదిగా, తమ పాఠకులలో ప్రేరేపణాత్మకమైన ఊహాజనికమైన భావనాత్మకమైన అనుభవాలను పురికొల్పుటకు కవులు తమ సొంత ఊహాత్మకమైన ఆలోచనలను వ్యక్తపరచారు. నాల్గవదిగా, తమ పాఠకులలో భావనాత్మకమైన ప్రతిస్పందనలను పురికొల్పుటకు వారు తమ సొంత భావనలను వ్యక్తపరచారు. ఈ గుణములు ఇతర బైబిలు రచనా శైలులలో కూడా కొంత వరకు కనిపిస్తాయిగాని, పాత నిబంధన పద్యభాగములో మాత్రం అవి కేంద్రీకరించబడియున్నవి.

ఈ గుణములు చారిత్రిక సమాచారమును తెలియపరచుట మీద ఎలాంటి ప్రభావమును చూపినవో తెలుసుకొనుటకు, మనము ఇంతకు ముందే ప్రస్తావించిన ఒక పద్య భాగ లేఖనమును చూద్దాము: నిర్గమ. 15లో యెర్ర సముద్రము యొద్ద మోషే మరియు మిర్యాము పాడిన పాట. నిర్గమ 15:6-7లో మోషే గ్రంథస్థం చేసిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నవి:

యెహోవా, నీ దక్షిణహస్తము బలమొంది అతిశయించును. యెహోవా, నీ దక్షిణహస్తము శత్రువుని చితక గొట్టును. నీ మీదికి లేచువారిని నీ మహిమాతిశయమువలన అణచివేయుదువు. నీ కోపాగ్నిని రగులజేయుదువు అది వారిని చెత్తవలె దహించును (నిర్గమ. 15:6-7)

మనము చూసినట్లుగా, ఈ వాక్య భాగములో మోషే ఇశ్రాయేలు యెర్ర సముద్రమును దాటిన చారిత్రిక సన్నివేశమును గూర్చి మాట్లాడుతున్నాడు. అయినను, ఈ వచనములు దేవుడు చేసిన కార్యములను గూర్చి ఒక అక్షరార్థ వివరణను ఇవ్వవు. ఉదాహరణకు, దేవుని “దక్షిణ హస్తము శత్రువును చితక గొట్టును” అని మోషే చెప్పినను యెర్ర సముద్రము యొద్ద దేవుని దక్షిణ హస్తము స్పష్టముగా కనిపించలేదు. దేవుని “కోపాగ్ని...వారిని చెత్త వలె దహించినను” ఐగుప్తీయులు అగ్ని ద్వారా కాల్చబడలేదు. బదులుగా, దేవుడు బలమైన తూర్పు గాలిని పంపగా అది సముద్రమును పాయలు చేసెను మరియు ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచెను అని నిర్గమకాండములోని కథనము తెలియజేస్తుంది. తరువాత ఐగుప్తీయులు దాటుచుండగా నీటిని మరలా యదా స్థాయికి తెచ్చి ఐగుప్తు సైన్యమును దేవుడు ముంచివేశాడు.

కాబట్టి, దేవుని దక్షిణ హస్తము మరియు ఆయన కోపాగ్ని ఐగుప్తీయులను చెత్త వలె దహించుటను గూర్చి మోషే ఎందుకు మాట్లాడాడు? ఈ సన్నివేశము దేవుడు తన శత్రువుల మీద చేసిన బలమైన దాడి అని తెలియజేయుటకు సాధారణ పాత నిబంధన రూపకమైన దక్షిణ హస్తము మీద మోషే ఆధారపడ్డాడు. ఐగుప్తీయుల పరిస్థితిని దహించబడిన చెత్త వలె వర్ణిస్తూ అతడు ఒక అతిశయ ఉపమానమును ఉపయోగించాడు; వారి నాశనము యొక్క మార్గమును వివరించుటకు కాదు, కాని వారు ఎంత సంపూర్ణంగా మరియు ఎంత ఘోరముగా నాశనమైయ్యారో బయలుపరచుటకు. ఈ సన్నివేశము యొక్క ఊహాత్మకమైన అనుభవాలను తన పాఠకుల యొక్క మనస్సులలో మరియు హృదయాలలో మోషే పురికొల్పాలని ఆశించాడు. అతడు తన సొంత ఉత్సాహముతో దేవుని స్తుతించుట మాత్రమే గాక ఇతరులు కూడా ఆ విధంగానే చేయాలని ప్రోత్సహించాడు. మోషే తన పద్య భాగమును సన్నివేశము యొక్క నిజమైన కథనముగా ఉపయోగించాలని ఆశించాడు గాని, అది ఒక అక్షరార్థమైన వివరణగా చదవబడాలని ఎన్నడు కోరలేదు.

నిర్గమ 15:6-7లోని పద్యభాగ లక్షణములను మనము గుర్తించినప్పుడు, దానిలోని చారిత్రిక సమాచారమును మనము చాలా సులువుగా వివేచించవచ్చు. మనము దృష్టించు లేఖన భాగము యొక్క లక్షణము ఆధారంగా ఈ వచనములను మనము అనేక విధాలుగా క్రోడీకరించవచ్చు. ఉదాహరణకు, చారిత్రిక సమాచారమును అనుబంధపరచుటకు అది భాషాభాగములను ఉపయోగించు విధానము మీద మనము దృష్టిపెట్టవలసియుంటే, దానిని మనము ఈ విధముగా క్రోడీకరించవచ్చు: “యెర్ర సముద్రములో ఐగుప్తు సైన్యమును అద్భుతముగా నాశనము చేసి దేవుడు ఇశ్రాయేలును విడిపించాడు.”

మనము పాత నిబంధన పద్యభాగమును ఎంతో జాగ్రత్తగా పరిగణించాలి అని ఈ ఉదాహరణ మనకు స్పష్టము చేస్తుంది. మనము గద్యభాగమును చదువు విధముగా దీనిని మనము చదవకూడదు. బదులుగా, పద్యభాగము యొక్క అసాధారణమైన పదములు మరియు శబ్ద లక్షణములను, దాని భాషా భాగములను, దాని ఊహాత్మక విషయములను మరియు దాని భావనాత్మక ప్రభావములను గుర్తిస్తూ మనము చారిత్రిక సమాచారమును బట్టీపట్టాలి. అప్పుడు మాత్రమే మన పాత నిబంధన వేదాంతశాస్త్రము యొక్క ఏకకాలిక సంయోగమునకు ఉపయోగపడు దేవుని కార్యములు మరియు వాక్కులను గూర్చి మరింత వాస్తవమైన అవగాహనలను మనము వెలికితీయవచ్చు.

పద్యభాగములో చారిత్రిక సమాచారమును వివేచించు కొన్ని మార్గములను ఇప్పుడు మనము తెలుసుకున్నాము కాబట్టి, ఇప్పుడు మనము పాత నిబంధన కథనమును చూడవలసియున్నది.

పాత నిబంధన కథనములు మనందరికీ సుపరిచితమైనవే. ఆదికాండము, నిర్గమకాండము మరియు అనేక ఇతర పుస్తకములలో కథనములు ఎక్కువగా ఉంటాయి; చారిత్రిక ప్రజలు, స్థలములు మరియు సన్నివేశములను గూర్చి నిజమైన గాధలు. తమ కథలు చరిత్రను గూర్చి అనేక విషయములను తెలియజేస్తాయి కాబట్టి, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు కథనములను ఎక్కువగా ఉపయోగిస్తారు. వారు మాటలు మరియు ప్రసంగములు, పాత్రల యొక్క పేర్లు, సన్నివేశములు జరిగిన స్థలములు, మరియు అనేక చారిత్రిక అనుబంధములను గూర్చి నివేదిస్తారు. ఇవి మరియు ఇతర లక్షణములు ఏకకాలిక సంయోగమునకు కథనములను ఘనమైన నిధులుగా చేస్తాయి. అయితే చారిత్రిక సమాచారమును వివేచించుటకు కథనములను కూడా చాలా జాగ్రత్తగా వ్యాఖ్యానించాలి.

మనము పద్యభాగమును చర్చించిన విధముగానే కథనములను కూడా చర్చించుదాము. మొదటిగా, కథనములు కూడా రెండు ప్రపంచములను గూర్చి సమాచారమును ఇచ్చుట కొరకు రూపించబడినవని మనము చూద్దాము. మరియు రెండవదిగా, ఈ రచనా శైలిలో చారిత్రిక సమాచారమును ఎలా వివేచించాలో మనము పరిశీలన చేద్దాము. రెండు ప్రపంచములను గూర్చి బైబిలులోని ఈ భాగములు చారిత్రిక సమాచారమును ఎలా నమోదు చేస్తాయో మొదటిగా చూద్దాము.

కవుల వలెనె, కథనముల రచయితలు కూడా రెండు ప్రపంచముల మధ్య నిలబడ్డారు. ఒక వైపున, వారి వాక్యభాగము యొక్క అంశమైన ప్రపంచములో, లేక “ఆ ప్రపంచము”ను గూర్చి వారు వ్రాశారు. అయితే, పద్యభాగమునకు భిన్నముగా కథనములు మునుపటి కాలము మీద ఎక్కువ దృష్టిపెడతాయి, మరియు వర్తమానము లేక భవిష్యత్తును గూర్చి చాలా అరుదుగా ప్రస్తావిస్తాయి. ఉదాహరణకు, మోషే చరిత్రలో చాలా కాలం తరువాత నివసించినను ఆదికాండములో అతడు పురాతన మరియు పితరుల చరిత్రను గూర్చి వ్రాశాడు. పాత నిబందన రచయితలు చాలా సార్లు తమ కంటే వంద సంవత్సరముల ముందు కాలమును గూర్చి వ్రాశారు.

మరొక వైపు, కథనముల యొక్క రచయితలు “వారి ప్రపంచము”ను గూర్చి, అనగా పాఠకులు నివసించిన కాలమును గూర్చి కూడా మాట్లాడారు. మునుపటి కాల సన్నివేశముల వెలుగులో తమ సొంత ప్రపంచములలో వారి పాఠకులు ఆలోచన చెయ్యాలని, కార్యములు చెయ్యాలని మరియు భావనలు కలిగియుండాలని వారు కోరారు. కాబట్టి మోషే పురాతన మరియు పితరుల కాలములను గూర్చి వ్రాసినట్లే, తన ఇశ్రాయేలీ పాఠకులకు తమ సొంత ధన్యతలు మరియు బాధ్యతలను గూర్చి నేర్పిన మార్గములలో అతడు పురాతన దినములను వివరించాడు. పాత నిబంధన కథనముల యొక్క రచయితలందరు తరువాత కాలములో నివసించిన తమ పాఠకుల కొరకు మునుపటి కాలమును గూర్చి వ్రాశారు.

పాత నిబంధన కథనములు అనేక వేర్వేరు ప్రభావములు కలిగియుండుటకు రూపించబడినవి. అవి మహిమాన్వితమైనవి, మరియు పాఠకులను దేవుని స్తుతించుటకు మరియు ఆరాధించుటకు ప్రేరేపించాయి. అవి దేవుని గూర్చిన సత్యములను వివరించు వేదాంతశాస్త్ర అనుసారమైనవి. కొన్ని రాజకీయ సంబంధమైనవి, వర్తమాన జాతీయ సన్నివేశముల మీద మరియు వివాదాత్మక, వ్యతిరేక అబద్ధ బోధనల మీద దృష్టిపెట్టాయి. అవి నైతికమైనవి, మరియు దేవుని ప్రజలు జీవించు విధానమును వివరించాయి. అవి ప్రోత్సాహకరమైనవి, మరియు ప్రతి విధమైన నమ్మకమైన ప్రతిస్పందనను ప్రోత్సహించాయి.

క్లుప్తంగా, పాత నిబంధన కథనములు ఉపదేశకమైనవి. తమ జీవితములను గూర్చి ఆదిమ పాఠకులకు ఉపదేశించుట కొరకు అవి రూపొందించబడినవి. ఇప్పుడు, కథన రచనా శైలిలో చాలా వరకు ఈ ఉపదేశ ఉద్దేశము ఇమిడియుంటుంది; తమ కథనములకు పాఠకులు వేదాంతశాస్త్ర నియమాలను ఊహించాలని రచయితలు కోరారు. అయినను, ఈ ఉపదేశ కోణము ఎంతో ఉద్దేశపూర్వకముగా ఉన్నది. పాఠకులకు తమ సొంత జీవితములను గూర్చి తెలియజేయుటకు రచయితలు ఎల్లప్పుడూ వ్రాశారు.

ఈ రెండు ప్రపంచములను మనస్సులో ఉంచుకొని పాత నిబంధన కథనములలో నుండి చారిత్రిక సమాచారమును వివేచించు మార్గములను మనము ఇప్పుడు పరిశీలన చేయాలి.

దురదృష్టవశాత్తు, పాత నిబంధన కథనములు ఆధునిక విలేకరుల చారిత్రిక రచనలను పోలియుండాలని ఆశిస్తూ ఆధునిక ఇవాంజెలికల్ క్రైస్తవులు పొరపాటు పడుతుంటారు. పదిహేడవ శతాబ్దములో ఐరోపాలో జరిగిన జ్ఞానోదయము మొదలుకొని, వ్రాయబడిన చారిత్రిక కథనములకు వైజ్ఞానిక స్థాయిలను అన్వయింపజేయుటకు అనేక మంది చరిత్రకారులు ప్రయత్నించారు. ఈ అభిప్రాయం ప్రకారం, తమ తోటివారు రసాయనశాస్త్రము మరియు జీవశాస్త్రము వంటి వైజ్ఞానిక అంశములలో ఉపయోగించు ఖచ్చితత్వమును చరిత్రకారులు కూడా ఉపయోగించుటకు ప్రయత్నించాలి.

ఈ కఠినమైన స్థాయిలను క్రోడీకరించుటకు అనేక మార్గములు ఉన్నాయి, కాని ఈ ధోరణిలో నమ్మకమైన చారిత్రిక కథనములు విశాలముగాను, ఖచ్చితముగాను, నిష్పాక్షికంగాను ఉండవలెను. దీని అర్థము, ఒక సమతుల్యమైన కథనమును ఇచ్చుటకు నిజమైన చారిత్రిక నివేదికలలో ఒక పరిస్థితిని గూర్చి ప్రతి ముఖ్యమైన సత్యము ఇమిడియుంటుంది. వారు వివరములను ఎంతో ఖచ్చితత్వముతో నివేదిస్తారు, లేక కనీసం అలా చేయలేదని తెలియపరుస్తారు. మరియు పాఠకుల మనస్సులలో పక్షపాతము కలిగించు పక్షపాత విశ్లేషణలను వారు నివారిస్తారు.

ఈ ఆధునిక ఆదర్శాలు ఎందుకు అభివృద్ధి చెందాయో ఇప్పుడు మనము అర్థము చేసుకోవచ్చు. ఎందుకంటే, చరిత్రకారులు ఈ స్థాయిని కొంత వరకైనా అందుకోనప్పుడు సత్యమును కల్పితమని పొరపాటు పడుట చాలా సులభమవుతుంది. అయినను, పాత నిబంధన కథనముల యొక్క రచయితలు ఈ ఆధునిక ఆదర్శకములను పూర్తిగా అనుసరించలేదు. ఇప్పుడు, వారు మతపరమైన భ్రమలను ప్రచారం చేయలేదు. మరియు చారిత్రిక తప్పిదములను లేక కల్పనలను సత్యముగా కూడా తెలియపరచలేదు. అయితే మన ఆధునిక స్పందనల ఆధారంగా గాక, తమ ఉపదేశ ఉద్దేశముల ఆధారంగా వారు రచించారు.

ఇది ఎలా సత్యమో తెలుసుకొనుటకు, పాత నిబంధన కథనములకు పొరపాటుగా ఆపాదించబడిన మూడు ఆధునిక స్థాయిలను మనము క్లుప్తంగా చూద్దాము, మరియు మొదటిగా చారిత్రిక కథనములు విశాలముగా ఉండాలి అనే ఆలోచనతో ఆరంభిద్దాము. సులువుగా చెబితే, పాత నిబంధన కథనములు వారి రచయితల యొక్క ఉపదేశ ఉద్దేశములకు అనువుగా ఉన్నంతగా మాత్రమే విశాలముగా ఉన్నాయి. దానిలో ప్రతి ముఖ్యమైన సత్యము ఇమిడి లేదు.

దినవృత్తాంతముల గ్రంథములోని ఒక ఉదాహరణను చూద్దాము. 2 దిన. 1-9లో దినవృత్తాంతముల రచయిత సొలొమోను జీవితమును గూర్చిన చరిత్రను వ్రాసినప్పుడు, అతడు 1 రాజులు 1-11లో ఇవ్వబడిన నివేదికను దగ్గరగా అనుసరించాడు. అయితే సొలొమోను జీవితములోని ప్రతి చెడు కోణమును తొలగించాడు. సొలొమోను ఫరో కుమార్తెను మరియు ఇతర అన్య స్త్రీలను వివాహము చేసుకొనుటను, దేవాలయములో ఇతర దేవతలను ఆరాధించుటకు ఆరాధనా స్థలములను సృష్టించుటను, మరియు సొలొమోను పొందుకొనిన బలమైన ప్రవచన ఖండింపులను అతడు తొలగించాడు.

అభ్యాసికముగా చాలా వరకు, ఈ అభావార్థక సన్నివేశములు ఎంతో ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే, 1 రాజులు 11:11-13 ప్రకారం, సొలొమోను యొక్క వైఫల్యములు దేశ విభజనకు దారితీసాయి. అయితే తన ఉపదేశ ఉద్దేశముల కొరకు దినవృత్తాంతముల రచయిత వాటిని చేర్చకూడదని నిర్థారించాడు. ఖచ్చితముగా, ఈ సమాచారము తన పాఠకులలో అనేక మందికి ఇంతకు ముందే తెలుసు, కాని వారు సొలొమోను చేసిన మంచి కార్యముల మీద దృష్టిపెట్టాలని దినవృత్తాంతముల రచయిత కోరాడు. తత్ఫలితంగా, అతడు తన నివేదికలో సొలొమోను యొక్క సఫలతల మీద దృష్టిపెట్టాడు. ప్రతి ప్రాముఖ్యమైన సత్యమును చేర్చాలనే కాంక్ష పాత నిబంధన రచయితలకు కలుగలేదు. మంచి చరిత్రను వ్రాయుటలో ఉండవలసిన విశాలతను గూర్చిన ఆధునిక అర్హతలను వారు అనుసరించలేదు. అయినప్పటికీ, వారి కథనములు మునుపటిని గూర్చిన నిజమైన అధికారికమైన నివేదికలే.

రెండవ స్థానంలో, పాత నిబంధన రచయితలు తమ ఉపదేశ ఉద్దేశములకు అవసరమైన వాటిని మాత్రమే ఖచ్చితముగా వ్రాశారు. ఖచ్చితత్వము మరియు సత్యము మధ్య ఎంతో ప్రాముఖ్యమైన తేడా ఉన్నది. మన జీవితములలో ప్రతి రోజు సత్యమును తప్పుగా తెలియజేయకుండానే మనము విషయములను గూర్చి ఖచ్చితత్వము లేకుండా మాట్లాడతాము. ఒకరు “టైం ఎంత అయ్యింది?” అని అడిగితే, “రెండు అయ్యింది” అని చెప్పుటకు మనము వెనకాడము, కాని ఖచ్చితముగా సమయము రెండు గంటల రెండు నిమిషాల ఇరవై సెకండ్లు అయ్యుంటుంది. జీవితములోని ప్రతి కోణములో, ఖచ్చితత్వము అనేది స్థాయికి సంబంధించినదైయున్నది. మరియు మనము అవసరమైనంత ఖచ్చితత్వముతో స్పందించినంత వరకు, మనము సత్యములను తారుమారు చేస్తున్నామని ఎవరు అనరు. సరే, అనేక విధాలుగా, పాత నిబంధన రచయితల విషయంలో కూడా ఇదే నిజమైయున్నది. తమ ఉపదేశ ఉద్దేశములను అందుకొనుట కొరకు ఎంత ఖచ్చితత్వము అవసరమైయుండినదో అంత మాత్రమే వారు ఉపయోగించారు. ఉదాహరణకు, ఆది. 1:7లో, భూమి యొక్క వాతావరణమును గూర్చి మోషే ఈ విధముగా వ్రాసిన రీతిని చూడండి:

దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను (ఆది. 1:7).

ఇక్కడ రఖియ అనే హెబ్రీ పదమును ఉపయోగిస్తూ దేవుడు ఆకాశములో “విశాలము”ను ఉంచాడని మోషే వ్రాశాడు. రఖియ అనే పదమునకు అర్థము ఒక రకమైన చదునైన బలమైన వస్తువు. లేఖన భాగము మనకు తెలియజేయుచున్నట్లుగా, ఈ బలమైన వస్తువు “విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచెను.”

భూమి యొక్క వాతావరణమును గూర్చి మోషే యొక్క వివరణ వైజ్ఞానికముగా ఖచ్చితమైనది కాదని ఆధునిక ప్రజలుగా మనకు తెలుసు. మోషే ఈ విధముగా ఎందుకు మాట్లాడాడంటే అతనికి మరియు అనేక మంది ఇతరులకు ఆకాశము ఒక సీలింగ్ వలె లేక ఒక నీలి రంగు పందిరి వలె లేక వైడూర్యము వలె కనిపించినది. పైన ఉన్న నీలి రంగు నీరు బలమైన సీలింగ్ లో ఉన్న రంద్రముల గుండా పడుట ద్వారా వర్షము కలిగినది అని వారు సాధారణంగా నమ్మేవారు. అవును, ఆయన తలచుకుంటే లేఖనములోని సర్వజ్ఞానియైన దేవుడు భూమి యొక్క వాతావరణమును గూర్చి మోషేకు మరింత వైజ్ఞానిక ఖచ్చితత్వముతో తెలియజేసియుండేవాడే. కాని తన ప్రజలు ఆ సమయములో ఇది నేర్చుకోవాలని పరిశుద్ధాత్మ ఆశించలేదు. మోషే ప్రకృతి యొక్క నిజమైన స్థితిని గూర్చి తప్పుగా చెప్పలేదు. కాని తనకు కనిపించిన విధముగా ఖచ్చితత్వము లేకుండా మాత్రం మాట్లాడాడు.

దీనిని తెలుసుకొని, ఆది. 1:7లో మోషే చేరుకోవాలని ఆశించిన ఖచ్చితత్వ స్థాయిని అతిగా యోచించకుండా మనము జాగ్రత్తపడాలి. “దేవుడు ఆకాశములో ఒక బలమైన వస్తువును ఉంచాడని” లేక “ఆ బలమైన వస్తువు క్రింద మరియు పైన దేవుడు నీటిని ఉంచాడని” చెప్పుట ఒక చారిత్రిక సత్యమని నిర్థారించుట ఒక పొరపాటు అవుతుంది. బదులుగా, ఈ చారిత్రిక నివేదికను గూర్చి మనము చేయు సమీక్ష మోషే యొక్క ఖచ్చితత్వ లేమిని మరియు ఉపదేశ ఉద్దేశము మీద దృష్టిని గుర్తించాలి. ఉదాహరణకు, ఆది. 1:7 ప్రకారం “దేవుడు ఆకాశమును ఆజ్ఞాపించాడు” అని; “భూమిని నివాస యోగ్యముగా చేయుటకు దేవుడు ఆకాశమును స్థాపించాడు” అని; “మంచిగా ఉండు విధముగా దేవుడు ఆకాశమును నియమించాడు” అని మనము సరిగానే చెప్పవచ్చు. మోషే మరియు ఇతర బైబిలు రచయితలు చారిత్రిక సత్యములను గూర్చి కేవలం తమ ఉపదేశ ఉద్దేశములను పొందుకొనునంత ఖచ్చితత్వముతోనే మాట్లాడిరి అను సత్యమును మనము అంగీకరించాలి.

పాత నిబంధన కథనములలో మాటలు మరియు ఆలోచనల యొక్క నివేదికలను మనము పరిగణించినప్పుడు కూడా ఖచ్చితత్వమును గూర్చిన ప్రశ్న ముందుకు వస్తుంది. కేవలం ఒక ఉదాహరణను పరిగణించండి. 1 రాజులు 9:5 మరియు 2 దిన. 7:18లో, దేవాలయము యొక్క ప్రతిష్ఠలో సొలొమోను చేసిన ప్రార్థనకు స్పందనగా దేవుని మాటల యొక్క వర్ణనను మనము చూస్తాము. ఈ లేఖన భాగములను ఒక సారి పోల్చిచూద్దాము. 1 రాజులు 9:5లో దేవుడు చెప్పిన ఈ మాటలను మనము చదువుతాము:

నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై యుండక మానడని నీ తండ్రియైన దావీదునకు నేను సెల విచ్చియున్నట్లు “ఇశ్రాయేలీయుల మీద నీ సింహాసనమును చిరకాలము వరకు స్థిరపరచుదును” (1 రాజులు 9:5).

2 దిన. 7:18లో దేవుడు చెప్పిన ఈ మాటలను చదువుతాము:

ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని నేను నీ తండ్రియైన దావీదుతో చేసియున్న నిబంధననుబట్టి “నేను నీ రాజ్యసింహాసనమును స్థిరపరచుదును” (2 దిన. 7:18).

ఇప్పుడు, ఇవి ఒకే చారిత్రిక సన్నివేశమును గూర్చి మాట్లాడుతున్నాయని ఈ రెండు వచనముల యొక్క విస్తృత సందర్భాలు స్పష్టము చేస్తున్నాయిగాని, ఉపయోగించిన మాటలు మాత్రం ఖచ్చితముగా ఒకే విధముగా లేవు. 1 రాజులు గ్రంథములో, దేవుడు “దావీదుకు సెలవిచ్చాడు,” కానీ 2 దినవృత్తాంతముల గ్రంథములో ఆయన “దావీదుతో నిబంధన చేశాడు.” 1 రాజులు గ్రంథములో “నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలీయుల మీద సింహాసనాసీనుడై యుండక మానడని” దేవుడు చెప్పాడు, మరియు 2 దినవృత్తాంతముల గ్రంథములో “ఇశ్రాయేలీయులను ఏలుటకు స్వసంతతివాడు ఒకడు నీకుండకపోడని” ఆయన సెలవిచ్చాడు. ఈ వ్యత్యాసములలో కొన్ని లేఖన భాగములను ఎదుటి తరమువారికి అందించుటలో జరిగిన తప్పిదములుగాని అన్ని కాదు. బదులుగా, పాత నిబంధన కథనములు దేవుని యొక్క లేక ఇతరుల యొక్క మాటలు మరియు ఆలోచనలను అత్యంత ఖచ్చితముగా పునరావృత్తం చేయుటకు రూపొందించబడలేదను సత్యమును వారు ప్రతిబింబించారు.

వాస్తవానికి, రాజుల గ్రంథ లేఖకుడు లేక దినవృత్తాంతముల రచయిత ఎవ్వరు కూడా అత్యంత ఖచ్చితముగా ఉండుటకు ప్రయత్నించలేదు. వారు వ్రాసినది చారిత్రికముగా సత్యమైయున్నది. దేవుడు చెప్పినదానిని వారు తప్పుగా తెలియపరచలేదు. అయితే వారి ఖచ్చితత్వ స్థాయిలు వారు కలిగియుండిన ఉపదేశ లక్ష్యముల ద్వారా నిర్థారించబడినవిగాని, ఖచ్చితమైన నివేదికల నమోదును గూర్చిన ఆధునిక ఆలోచనల ద్వారా కాదు.

బాధ్యతాయుతమైన వ్యాఖ్యానము బైబిలు నివేదికలకు సరిపోలు విధముగా దేవుడు చెప్పిన ఖచ్చితత్వ స్థాయిలను తెలియపరుస్తుంది. “దావీదు వంశమును స్థాపిస్తానని దేవుడు చెప్పాడని” మరియు దావీదుతో చేసిన నిబంధనను నిలబెట్టుటకు దేవుడు వాగ్దానము చేశాడని” మనము నిశ్చయత కలిగియుండవచ్చు. మరియు “దావీదు సంతతివాడు ఇశ్రాయేలును నిత్యము యేలును.” అయితే దీని కంటే ఎక్కువ ఖచ్చితత్వమును ఆశించుట మనలను తప్పు దోవ పట్టించవచ్చు.

ఏకకాలిక సంయోగములో కథనము యొక్క రచనాశైలిని మనము విశదపరచుచుండగా, మనము అనేక రకముల ఖచ్చితత్వ లేమిని ఎదుర్కొంటాము. ప్రజల సంఖ్య, కొలత, భౌగోళిక సూచనలు మరియు అనేక ఇతర విషయములు ఆధునిక వైజ్ఞానిక స్థాయిలను చేరుకోలేవు. అయితే ఈ ఆధునిక ఖచ్చితత్వము లేమి యొక్క అర్థము కథనములు సత్యములు కావని కాదు. భిన్నముగా, పాత నిబంధన కథనములు చరిత్రను గూర్చి మనకు సత్యమును తెలియజేయుచున్నవి అనే నిశ్చయతను మనము కలిగియుండవచ్చు. అయినను, వారి ఖచ్చితత్వమును అతిగా అంచనా వేయకుండా మనము జాగ్రత్తపడాలి.

చివరిగా, పాత నిబంధన కథనములు ఆధునిక స్థాయిల ఆధారంగా ఖచ్చితమైనవి కావను సత్యమును మనము పరిగణించాలి. మన కాలములోని నమ్మదగిన చరిత్ర రచయతలు తమ నివేదికలలో ఖచ్చితముగా ఉంటారని, మరియు చరిత్రను గూర్చిన తమ రచనల మీద తమ వ్యక్తిగత అభిప్రాయములు లేక సన్నివేశముల యొక్క విశ్లేషణలు ప్రభావము చూపుటకు ఎన్నడు అవకాశము ఇవ్వరని ఆలోచించుట చాలా సాధారణమైన విషయము. అయితే ఖచ్చితత్వము అనేది స్థాయికి సంబంధించినది అని మనము ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకోవాలి. చారిత్రిక నివేదికలను భద్రముగా దాచినంత వరకు, తమ వ్యక్తిగత పక్షపాత అభిప్రాయములను చరిత్రను అపార్థము చేయునంతగా వ్రాసిన చరిత్రకారులు ఎల్లప్పుడు ఉనికిలో ఉండిరి. అయితే అంత్యంత ఖచ్చితమైన చరిత్రకారులు కూడా కొన్ని పక్షపాతముల నుండి తప్పించుకోలేకపోయారు. కనీసం, ఈ పక్షపాతములు వారు ఏ సన్నివేశములను తెలియపరచారు మరియు వాటిని ఎలా వివరించారు అను విషయముల మీద ప్రభావము చూపాయి. ఈ విధముగా, చారిత్రిక రచనలు ఎన్నడు ఖచ్చితమైనవిగా ఉండలేదని మనము తెలుసుకుంటాము.

పాత నిబంధన విషయములో కూడా ఇదే నిజమైయున్నది. తమ పాఠకుల యొక్క అభిప్రాయములను రూపుదిద్దుటకు పాత నిబంధన రచయితలను దేవుడు ప్రేరేపించాడు. ఈ లక్ష్యము వారు వేటిని తొలగించారు, వేటిని జోడించారు, మరియు వారు జోడించినవాటిని ఎలా వివరించారు అను విషయముల మీద ప్రభావం చూపినది. కొన్నిసార్లు, తమ పక్షపాతములను మరియు సమీక్షలను ధైర్యముగా వ్యక్తపరచుటకు కూడా ఇవి వారిని పురికొల్పాయి. ఉదాహరణకు, ఆది. 13:13లోని ఈ మాటలను వినండి, అక్కడ లోతు సొదొమ దగ్గర తన గుడారములను వేశాడని మోషే నివేదించాడు:

సొదొమ మనుష్యులు దుష్టులును, యెహోవా దృష్టికి బహు పాపులునై యుండిరి (ఆది. 13:13).

సొదొమను గూర్చి మోషే యొక్క విశ్లేషణ నుండి మనము ప్రక్కకు తొలగకూడదు. పట్టణమును గూర్చి తన అభిప్రాయమును ఆయన ఇచ్చాడు, కాని అతని నైతిక అభిప్రాయము దేవుని ద్వారా ప్రేరేపించబడినది కాబట్టి సరైనదైయున్నది. “దుష్టులతో సహవాసము చేయుటకు లోతు దేవునికి దూరమయ్యాడు,” లేక “సొదొమ పట్టణము దుష్ట ప్రజలతో నిండియుండినది” అని మనము చెప్పవచ్చు. ఈ కథనములు నాటి చారిత్రిక పరిస్థితులను గూర్చిన ఖచ్చితమైన సత్యములను తెలియజేస్తాయి.

క్లుప్తంగా, పాత నిబంధన కథనములు ఆధునిక చరిత్ర రచనా స్థాయిలను అందుకొనుటకు రూపొందించబడలేదని మనము నిశ్చయతతో చెప్పవచ్చు. అవి కేవలం పాత నిబంధన వేదాంతశాస్త్రము యొక్క ఏకకాలిక సంయోగమును నిర్మించుటకు ఉపయోగపడు ఆధారయోగ్యమైన చారిత్రిక సమాచారమును మాత్రమే మనకు అందిస్తాయి.

పాత నిబంధనలో మనము చారిత్రిక సమాచారమును వివేచించగల కొన్ని మార్గములను చూశాము కాబట్టి, ఇప్పుడు మన చివరి అంశము మీద దృష్టిపెట్టవచ్చు: సంయోగ వేదాంతశాస్త్ర నిర్మాణములు. మన పాఠంలోని ఈ భాగంలో, పాత నిబంధన చరిత్రలోని పలు కాలములలోని దేవుని ప్రత్యక్షతలు సంయోగకమైన, తార్కికముగా పొందికగల వేదాంతశాస్త్ర నిర్మాణములను రూపొందించిన మార్గముల మీద దృష్టిపెట్టుదాము.

సంయోగ వేదాంతశాస్త్ర నిర్మాణములను గూర్చి మనము మాట్లాడునప్పుడు, వేదాంతశాస్త్ర విషయములను గూర్చి పొందికయైన లేక తార్కికమైన దృక్కోణములను రూపొందించుట కొరకు దైవిక ప్రత్యక్షతలు ఒకటిగా కలుస్తాయి అని మన అర్థము. ఇప్పుడు, దేవుడు బయలుపరచిన సమస్త విషయములకు తార్కిక అనుబంధములను మానవులు పూర్తిగా అర్థము చేసుకుంటారని ఇక్కడ అర్థము కాదు. కాని దేవుని ప్రత్యక్షతలు ఒకదానికొకటి వేరుగా లేవని, మరియు అవి ఒకదానితో ఒకటి తార్కికముగా పొందికలేనివిగా లేవని దీని అర్థము. సరిగా పరిశీలన చేస్తే, అవి నమ్మకము యొక్క తార్కిక పద్ధతులను లేక సంయోగ, వేదాంతశాస్త్ర నిర్మాణములు అని పిలచువాటిని నిర్మిస్తాయి.

ఈ అంశమును గూర్చి మనము రెండు ముఖ్యమైన మార్గములలో పరిశీలన చేద్దాము. మొదటిగా, పాత నిబంధనలోని ఈ సంయోగ వేదాంతశాస్త్ర నిర్మాణములను వివేచించుట కొరకు మనము ఆధారపడవలసిన వివిధ మూలములను మనము చూద్దాము. మరియు రెండవదిగా, ఈ వేదాంతశాస్త్ర నిర్మాణములు అనేక స్థాయిలలో కనిపిస్తాయని మనము చూస్తాము. మనము మనస్సులో ఉంచుకొనవలసిన వివిధ మూలములను మొదట చూద్దాము.

మనము వేదాంతశాస్త్ర నిర్మాణములను వివేచించు వివిధ మూలములను అన్వేషించుచుండగా, మనము మొదటిగా బైబిలు ప్రత్యక్షతలను చూద్దాము, మరియు రెండవదిగా బైబిలేతర ప్రత్యక్షతలను చూద్దాము. మనము లేఖనమును అనువదించు ప్రతిసారి, మనకు అందుబాటులో ఉండు ప్రతి వనరును ఉపయోగించుకొనుటకు మనము సిద్ధముగా ఉండాలి. కాని ఈ రెండు సామాన్య వనరుల శ్రేణులను గూర్చి ఆలోచించుట ఉపయోగకరముగా ఉంటుంది. మొదటిగా మనకు వేదాంతశాస్త్ర నిర్మాణములను చూపించు బైబిలు ప్రత్యక్షతలను చూద్దాము.

పాత నిబంధన చరిత్రలోని ఏ కాలములోనైనా వేదాంతశాస్త్ర నిర్మాణములను మనము వివేచించినప్పుడు లేఖనములు కేంద్ర అంశముగా ఉన్నవి. కాని ఎల్లప్పుడు ఎదురయ్యే ప్రశ్న ఒకటి ఉన్నది: “మనము లేఖనములో ఏ భాగములను చూడవలసియున్నది?”

మన సంభాషణ కొరకు, మనము చూస్తున్న కాలమునకు అనుబంధంగా ఈ ప్రశ్నను మూడు రకముల బైబిలు వాక్యభాగములుగా విభజించుదాము: మొదటిగా, ఏకకాలిక వాక్యభాగములు — పరిగణలో ఉన్న చారిత్రిక కాలముతో వ్యవహరించు లేఖన భాగములు; రెండవదిగా, పూర్వభావ వాక్యభాగములు — పరిగణలో ఉన్న చారిత్రిక కాలమునకు ముందు ఉన్న చరిత్రతో వ్యవహరించు బైబిలు భాగములు; మరియు మూడవదిగా, ఉపక్రమ వాక్యభాగములు — తదుపరి కాలములోని ప్రత్యక్షతతో వ్యవహరించు లేఖన భాగములు. ఏకకాలిక బైబిలు వాక్యభాగములు వేదాంతశాస్త్ర నిర్మాణములను వివేచించుటలో మనకు ఎలా సహాయపడతాయో మొదట చూద్దాము.

ఈ సందర్భములో ఏకకాలిక లేఖనభాగములను గూర్చి మనము మాటలాడునప్పుడు, మనము ఒకే కాలములో వ్రాయబడిన వాక్యభాగములను గూర్చి మాట్లాడుట లేదుగాని, ఒకే కాలమును వివరించు వాక్యభాగములను గూర్చి మాట్లాడుతున్నాము. కొన్ని సందర్భాలలో, ఒక కాలము యొక్క వేదాంతశాస్త్రమును గూర్చిన సమాచారము లేఖనములోని ఒక వాక్యభాగాములో మాత్రమే కనిపిస్తుంది. కానీ చాలా సార్లు, పాత నిబంధన చరిత్ర యొక్క కాలములు ఒక స్థలము కంటే ఎక్కువ చోట్ల వివరించబడినవి. ఇలాంటి సందర్భాలలో, లేఖనము ఇచ్చు సమాచారమంతటిని మనము కలపవలెను.

లేఖనములు దేవుని ద్వారా ప్రేరేపించబడినవని మనము నమ్ముతాము కాబట్టి, దానిలోని భాగములన్నిటి యొక్క శ్రావ్యతను మనము ఉద్ఘాటిస్తాము. ఒక కాలము యొక్క చరిత్ర మరియు వేదాంతశాస్త్రమును గూర్చిన ప్రతి బైబిలు వ్యాఖ్య వాస్తవమేనని మరియు ఆ కాలమును గూర్చి మనము ఎరిగిన సమస్తములోనికి అది పొందికగా ఇముడుతుంది అని మనము నమ్ముతాము. బైబిలు రచయితలు ఒకరినొకరు ఖండించరు; బదులగా, వారు శ్రావ్యతతో ఒకరినొకరు ప్రోత్సహించుకుంటారు. కాబట్టి, మనలను మనము కేవలం ఒక వాక్యభాగమునకు మాత్రమే పరిమితము చేసుకోకూడదు; కాని కొన్ని చారిత్రిక కాలములలో దేవుడు చేసిన మరియు చెప్పిన వాటిని నిర్థారించుటకు అనేక ఏకకాలిక భాగములలో నుండి సహాయమును పొందుకొనుటకు మనము సిద్ధముగా ఉండాలి.

ఏకకాలిక వాక్యభాగములతో పాటుగా, అనేకసార్లు మనము బైబిలులోని పూర్వభావ భాగముల నుండి మద్దతును పొందుకోవాలి. ఇక్కడ మనము ఇతర భాగముల కంటే ముందుగా వ్రాయబడిన బైబిలు భాగములను గూర్చి ఆలోచన చేయుటలేదుగాని, పాత నిబంధన చరిత్రలోని ఆదిమ కాలముల మీద దృష్టిపెట్టు లేఖనభాగములను గూర్చి ఆలోచించుచున్నాము. మునుపటి కాలములలో దేవుడు చేసిన మరియు చెప్పిన మాటలు తరువాత కాలములోని వేదాంతశాస్త్ర నిర్మాణములను విశదపరుస్తున్నాయి.

ఉదాహరణకు, ఆది. 12:1-3లో దేవుడు అబ్రాహాముకు లేక్కలేన్నంతమంది వారసులను మరియు వాగ్దాన దేశ స్వాస్థ్యమును ఇచ్చాడు. అబ్రాహాము జీవితము కొరకు కేటాయించబడిన ఆదికాండములోని అధ్యాయములలో దేవుడు పలికిన ఈ మాటలు పదే పదే పునరావృతమవుతాయి, మరియు ఆయన జీవితకాలము యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణములను అర్థము చేసుకొనుటకు అవి ఎంతో కీలకమైనవిగా ఉన్నాయి. అయినను, అబ్రాహాము జీవితములో వాటి ప్రాముఖ్యతను గూర్చి ఎలాంటి స్పష్టమైన వివరణ లేదు. ఈ సమస్యకు మునుపటి కాలములతో వ్యవహరించు బైబిలు భాగములు ఉత్తమమైన రీతిలో జవాబు ఇవ్వగలవు.

ఉదాహరణకు, ఆది. 1:28లో ఫలించి అభివృద్ధి చెంది భూమిని ఏలమని ఆయన స్వరూపములైన ఆదాము హవ్వలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. భూమియందంతట దేవుని స్వరూపము యొక్క ఈ సంఖ్యాపరమైన మరియు భౌగోళికమైన విస్తరణ మానవ జాతి కొరకు దేవుడు కలిగియుండిన ఉద్దేశములకు ఎల్లప్పుడు ప్రాముఖ్యమైన విషయముగా ఉండినది. తరువాత, అబ్రాహామును గూర్చి మోషే వ్రాసినప్పుడు, అతడు ఈ మునుపటి వేదాంతశాస్త్ర నిర్మాణము మీద కట్టాడు. సులువుగా చెబితే, ఆదామునకు ఇవ్వబడిన వాస్తవిక ఆజ్ఞను ముందుకు కొనసాగించుట కొరకు దేవుడు అబ్రాహాము మరియు అతని వంశమును ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన అబ్రాహాము వంశము మరియు భూమి మీద దృష్టిపెట్టాడు. అబ్రాహాము సంతతి యొక్క ఫలింపు మరియు వారు వాగ్దాన భూమిని స్వాధీనపరచుకొనుట సర్వలోకము మీద మానవజాతి యొక్క ఏలుబడికి ఆరంభ బిందువుగా ఉన్నది.

పాత నిబంధన నివేదికలు అనేక వేదాంతశాస్త్ర దృష్టికోణములను వివరించలేవని మరలా మరలా మనము కనుగొంటాము ఎందుకంటే దేవుడు ఇంతకు ముందు కాలములలో బయలుపరచిన దాని మీద వారు ఆధారపడ్డారు. ఈ కారణము చేత, చరిత్రలోని ఒక భాగములోని వేదాంతశాస్త్ర నిర్మాణములను గూర్చి మనము అధ్యయనం చేయునప్పుడు మనము ఎల్లప్పుడు పూర్వభావ ప్రత్యక్షతలను గూర్చిన అవగాహన కలిగియుండాలి.

ఏకకాలిక మరియు పూర్వభావ లేఖనములతో పాటుగా, వేదాంతశాస్త్ర నిర్మాణములను వివేచించుటలో ఉపక్రమ లేక తదుపరి లేఖనభాగములు కూడా సహాయం చేస్తాయి. ఇతర వాక్య భాగముల వలెనె, ఉపక్రమ లేఖన భాగములు అనగా తరువాత వ్రాయబడిన లేఖనములైయుండవలసిన పని లేదు. బదులుగా, అవి చరిత్రలో తరువాత కాలములను గూర్చి మాట్లాడు లేఖనములైయున్నవి. ఉదాహరణకు, ఆది. 12:3లో దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాటలను వినండి:

నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువాని శపించెదను; భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడును (ఆది. 12:3).

ఈ వచనము యొక్క రెండవ భాగములో, దేవుడు సర్వలోకమును ఆశీర్వదించుటకు మార్గముగా ఉండుటకు అబ్రాహాము స్పష్టముగా పిలువబడ్డాడు. కాని చాలా మంది ఈ వచనము యొక్క మొదటి భాగమును గూర్చి తికమకపడ్డారు. ఈ సార్వత్రిక ఆశీర్వాదము అబ్రాహామును దీవించువారిని దేవుడు ఆశీర్వాదిస్తాడు మరియు దూషించువారిని శపిస్తాడు అనే దేవుని ఆశీర్వాదముల యొక్క రెండింతల ప్రక్రియ ద్వారా నెరవేరుతుంది అని చెప్పినప్పుడు దేవుని ఉద్దేశమేమిటి? దీనిని అర్థము చేసుకొనుటకు ఒక మార్గము తరువాత ఇవ్వబడిన బైబిలు ప్రత్యక్షతను చూచుట. ఉదాహరణకు, కీర్తనలు 72:17లో ఇవ్వబడిన మాటలను వినండి:

అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు (కీర్తనలు 72:17).

72వ కీర్తన సొలొమోను కాలములో అనగా అబ్రాహాము కాలమునకు సుమారుగా వెయ్యి సంవత్సరముల తరువాత వ్రాయబడినది. “నిరంతరము నిలచు” నామమును గూర్చి అది మాట్లాడునప్పుడు, అది దావీదు యొక్క గొప్ప కుమారుని గూర్చి, జయించు, రాజ్యము చేయు మరియు సమస్త దేశముల నిధులను పొందుకొను మెస్సీయను సంబోధిస్తుంది. ఈ వచనము ఆదికాండము 12కు ఉపక్రమ ప్రత్యక్షతగా ఉన్నది ఎందుకంటే ఇది సొలొమోను యొక్క తదుపరి చారిత్రిక కాలములో నిజమైన రాజరిక అంశములను గూర్చి మాట్లాడుతుంది. కాని అబ్రాహాము దినములలోని వేదాంతశాస్త్ర నిర్మాణములను గూర్చి కూడా అది మనకు కొన్ని విషయములను తెలియజేస్తుంది. ప్రత్యేకముగా, “అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు” అని చెప్పినప్పుడు అది దేవుడు అబ్రాహాముకు ఇంతకు ముందు ఇచ్చిన హామీని పునరావృతం చేస్తుంది. అయితే దేవుడు అబ్రాహాముతో చేసిన వాగ్దానం నెరవేర్చబడుటను గూర్చి అది మనకు ఏమి చెబుతుంది?

అబ్రాహాము యొక్క ఆశీర్వాదములు యుద్ధముల ద్వారా లోకమంతా వ్యాపిస్తాయని 72వ కీర్తన చుట్టూ ఉన్న వచనములు తెలియజేస్తాయి. మెస్సీయ దుష్ట దేశములను జయించి దేశములోని నీతిమంతులను రక్షించగా, అబ్రాహాము రాజరిక వారసులతో నిలిచియుండువారు దీవించబడతారు, మరియు ఆయనను వ్యతిరేకించువారు శపించబడతారు. మరియు తుదకు, ఈ ప్రక్రియ ద్వారా భూమి మీద ఉన్న కుటుంబములన్ని దీవించబడతాయి.

ఇతర ప్రజల గుంపులతో పితరుడు కలిగియుండిన భావార్థక మరియు అభావార్థక సంభాషణలను గురించి అబ్రాహామును గూర్చిన అనేక కథలు నివేదించుచున్న సత్యము ద్వారా ఈ మెళకువ నిర్థారించబడుతుంది. దేవుడు కొందరిని ఆశీర్వదించి మరికొందరిని శపించు సంఘర్షణ ప్రక్రియ ద్వారా సమస్త జనులపై ఆయన ఆశీర్వాదములు కుమ్మరించబడతాయని దేవుడు అబ్రాహాముకు బయలుపరచాడు.

ఈ ఉదాహరణ తెలియజేయుచున్నట్లు, తదుపరి ప్రత్యక్షత వాటిని స్పష్టము చేసినంత వరకు మునుపటి వేదాంతశాస్త్ర నిర్మాణములు ప్రస్తావించబడలేదు లేక సందిగ్ధంగా విడిచిపెట్టబడ్డాయి. ఈ సందర్భాలలో, ఆదిమ కాలముల వేదాంతశాస్త్ర నిర్మాణములను అర్థము చేసుకొనుటకు ఉపక్రమ బైబిలు ప్రత్యక్షతలు మనకు సహాయం చేయగలవు. కాబట్టి పాత నిబంధన చరిత్రలోని ఒక భాగము యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణములను సంపూర్ణంగా అర్థము చేసుకొనుటకు బైబిలు ప్రత్యక్షతలోని అన్ని కాలక్రమానుగత విధానములలో నుండి నేర్చుకొనుట కొరకు మనము సిద్ధముగా ఉండాలని మనము చూడవచ్చు.

పాత నిబంధన కాలములను శాసించిన వేదాంతశాస్త్ర నిర్మాణములను చూచుటలో మనకు సహాయపడు రెండవ ముఖ్యమైన మూలము వైపుకు మనము తిరగవలసియున్నది: బైబిలేతర ప్రత్యక్షత, లేఖనము వెలుపల ఉన్న దేవుని ప్రత్యక్షత.

పాత నిబంధనలోని ఒక కాలము యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణములను అర్థము చేసుకొనుటకు మనము ప్రయత్నించుచుండగా, ఏ బైబిలు వాక్యభాగము కూడా వేదాంతశాస్త్ర శూన్యతలో వ్రాయబడలేదని గుర్తుచేసుకొనుట చాలా అవసరము. పాత నిబంధన రచయితలు తమ పాత్రలతోను మరియు తమ పాఠకులతోను పంచుకున్న నమ్మకముల మరియు వేదాంతశాస్త్ర నిర్మాణముల సందర్భములో తమ లేఖనములను వ్రాశారు. రెండు రకముల బైబిలేతర ప్రత్యక్షతల ద్వారా దేవుడు ఈ వేదాంతశాస్త్ర చట్రములను బయలుపరచాడు. మొదటిగా, ఆయన వాటిని సాధారణ ప్రత్యక్షత ద్వారా అనగా సమస్త విషయములలో దేవుని ప్రత్యక్షత ద్వారా బయలుపరచాడు; మరియు రెండవదిగా, లేఖనములో కనిపించని విశేష ప్రత్యక్షత ద్వారా ఆయన వాటిని ఇచ్చాడు.

సాధారణ ప్రత్యక్షత ద్వారా ఆరంభము నుండే ప్రతి ఒక్కరు నిజమైన వేదాంతశాస్త్రమును గూర్చి కనీసం కొంతైనా నేర్చుకున్నారని పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన రెండు తెలియజేయుచున్నవి. దేవుడు ఆయన స్వభావమును, ఆయన నైతిక అర్హతలను, మరియు సృష్టి యావత్తులో ప్రజలందరి మీద పాపము యొక్క పరిణామములను స్పష్టముగా బయలుపరచాడని కీర్తనలు 19 మరియు రోమా 1:18-21 వంటి లేఖన భాగములు సూచించుచున్నవి. మనము విషయమును ఈ విధముగా క్రోడీకరించవచ్చు: సాధారణ ప్రత్యక్షత నుండి తాము నేర్చుకున్నవాటిని పాపులైన ప్రజలు అణగద్రొక్కినప్పటికీ, ఏదో ఒక స్థాయిలో దేవుని విశేష ప్రత్యక్షతలను అర్థము చేసుకొనుటకు బాధ్యులుగా ఉండుటకు కావలసినంత నిజమైన వేదాంతశాస్త్రమును వారు అర్థము చేసుకుంటారు.

సాధారణ ప్రత్యక్షత యొక్క వాస్తవికత కారణంగా, తమ కథలలోని చారిత్రిక పాత్రలు మరియు తరువాత వారి కథలను చదివిన పాఠకులు వారిని రచయితలుగా ఉంచి అనేక నిజమైన వేదాంతశాస్త్ర దృక్కోణములను నేర్చుకున్నారని పాత నిబంధన రచయితలు ఎల్లప్పుడు ఊహించారు. అనేక సామాన్య వేదాంతశాస్త్ర నిర్మాణములు అప్పటికే ఉనికిలో ఉన్నందున కొన్ని విషయములను బాహాటముగా వివరించవలసిన అవసరతను వారు చూడలేదు. సాధారణ ప్రత్యక్షతను మరచిపోవుట వలన ఆధునిక వేదాంతవేత్తలు తరచుగా అపార్థము చేసుకున్న ఒక వాక్యభాగమును పరిగణించండి.

ఉదాహరణకు, ఈ మాటలు చెబుతూ తన కుమారుని బలి ఇచ్చుట నుండి దేవుడు అబ్రాహామును అడ్డుకున్నాడని ఆది. 22:12 తెలియజేస్తుంది:

అప్పుడు ఆయన ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను (ఆది. 22:12).

దురద్రుష్టవశాత్తు, ఈ లేఖన భాగమును సమకాలీన వేదాంతవేత్తలు తరచుగా అపార్థం చేసుకుంటారు. “నీవు దేవునికి భయపడువాడవని యిందువలన నాకు కనబడుచున్నదనెను” అని దేవదూత చెప్పెను గనుక, కథలోని ఈ సమయములో అబ్రాహాము ఏమి చేయబోతున్నాడో దేవుడు ఎరిగియుండలేదని అబ్రాహాము నమ్మాడని అనేకమంది అనువాదకులు సూచించారు. మరొక మాటలో, ఈ కాలములోని వేదాంతశాస్త్రములో దేవుడు సర్వజ్ఞాని అనే నమ్మకము ఇమిడియుండలేదని వారు నమ్మారు.

అయితే సాధారణ ప్రత్యక్షతను గూర్చి బైబిలు ఇచ్చు సాక్ష్యము దీనికి భిన్నమైన విషయమును సూచిస్తుంది. సర్వజ్ఞానము వంటి దేవుని “అదృశ్య లక్షణములు” సమస్త జనులకు తెలుసు అని రోమా. 1:20లో పౌలు తెలియజేశాడు. అవును, పాపులైన ప్రజలు ఈ జ్ఞానమును అణచివేసి అబ్రాహాముతో దేవుడు పలికిన మాటలను అపార్థము చేసుకోవచ్చు. కాని అబ్రాహాము జీవితములోని ఈ సమయమును గూర్చి మోషే వ్రాసిన మాటలు దేవుడు జ్ఞానములో పరిమితులు కలిగియున్నాడు అని తెలియజేయవని సాధారణ ప్రత్యక్షత స్పష్టము చేస్తుంది.

మరలా మరలా, బైబిలు రచయితలు సాధారణ ప్రత్యక్షతను ఊహించుకున్నారు. ఇశ్రాయేలు ప్రవక్తలైన యోనా మరియు దానియేలుల ద్వారా అన్యజనులు సందేశములను అందుకున్నప్పుడు, ఈ ప్రవక్తలు ఖచ్చితముగా చెప్పిన మాటల ఆధారంగానే వారి వేదాంతశాస్త్ర దృక్పథములు రూపొందించబడలేదు. అన్యజనులు పరలోక భూలోక దేవుని గూర్చిన సత్యములను చాలా వరకు సాధారణ ప్రత్యక్షత ద్వారా అర్థము చేసుకున్నారు అనే నిశ్చయతతోనే దేవుని సందేశకులు మాట్లాడారు. పాత నిబంధన చరిత్రను తెలియపరచు వేదాంతశాస్త్ర నిర్మాణములను అర్థము చేసుకొనుటకు మనము ప్రయత్నించుచుండగా, బైబిలు రచయితలు సాధారణ ప్రత్యక్షతను ఊహించుకున్నారు కాబట్టి అనేక విషయములు వ్రాయబడలేదు.

సాధారణ ప్రత్యక్షతతో పాటుగా, పాత నిబంధన చరిత్ర కాలములోని వేదాంతశాస్త్ర నిర్మాణములను అర్థము చేసుకొనుటలో రెండవ బైబిలేతర మూలము కూడా మనకు సహాయం చేస్తుంది: బైబిలేతర విశేష ప్రత్యక్షత.

స్వప్నములు, దర్శనములు, కలలు మొదలగువాటి ద్వారా దేవుడు కొంత మంది ప్రజలకు విశేష ప్రత్యక్షతలను ఇచ్చాడని పాత నిబంధన సూచిస్తుంది. లేఖనములో అనేక మంది పరిశుద్ధులు ఎంతో విశేష ప్రత్యక్షతను పొందుకున్నారుగాని దానికి ప్రత్యేకమైన బైబిలు ఆధారములు లేవని మనము చెప్పకుండా ఉండలేము. విశేష ప్రత్యక్షతలు ఇశ్రాయేలు వెలుపల ఉన్న మెల్కీసెదకు మరియు యోసేపు దినములలో ఫరో వంటి ప్రజలకు కూడా ఇవ్వబడినవి. కొన్నిసార్లు, ఈ బైబిలేతర ప్రత్యక్షతలు కలిగాయని, మరియు పురాతన ప్రజలకు వీటిని గూర్చి తెలుసు అని పాత నిబంధన సూచిస్తుంది. ఉదాహరణకు, ఆది. 7:2లో దేవుడు నోవహుతో చెప్పిన మాటలను వినండి:

పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులు ఏడును, పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతి పోతును పెంటియు రెండును . . . నీయొద్ద ఉంచుకొనుము (ఆది. 7:2).

ఈ వాక్యభాగంలో, అవి ఓడలోనికి ప్రవేశించుచుండగా పవిత్రమైన మరియు పవిత్రము కాని జంతువులను వేరు చేయమని దేవుడు నోవహుకు ఆజ్ఞాపించాడు. ఏ జంతువులు పవిత్రమైనవో మరియు పవిత్రముకానివో దేవుడు బయలుపరచిన దాఖలు లేఖనములో ఎక్కడా లేవు. దేవుడు పవిత్రమైన మరియు పవిత్రము కాని జంతువులను గూర్చి నోవహుకు లేక మరొక వ్యక్తికి ప్రత్యేకముగా బయలుపరచాడు అనేది దీనికి ఉత్తమమైన జవాబు.

పాత నిబంధన చరిత్రలో ఒక కాలమును తెలియజేయు వేదాంతశాస్త్ర్ర నిర్మాణములను మనము అన్వేషించుచుండగా, మన యొద్ద నివేదికలు లేని విశేష ప్రత్యక్షతలను దేవుడు ఇచ్చియుంటాడు అనే సూచనలను గూర్చి కూడా మనము ఎరిగియుండాలి. ఇలాంటి బైబిలేతర ప్రత్యక్షతల పట్ల మనము శ్రద్ధ వహించినప్పుడు, మనము పరిగణించుచున్న చారిత్రిక కాలము యొక్క పొందికగల సంయోగ నిర్మాణములను మనము సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాము.

పాత నిబంధనలోని ఒక కాలము యొక్క పాత నిబంధన వేదాంతశాస్త్రమును అర్థము చేసుకొనుటలో మనకు సహాయం చేయుటకు అనేక మూలములను చూసిన పిమ్మట, మనము ఎదుర్కొను వివిధ స్థాయిల వేదాంతశాస్త్ర నిర్మాణములను మనము చూడవలసియున్నది.

చరిత్రలోని పలు కాలములలోని పాత నిబంధన వేదాంతశాస్త్రము యొక్క సంయోగమైన మరియు తార్కికమైన అమరికల కొరకు మనము అన్వేషించుచుండగా, పలు స్థాయిల వేదాంతశాస్త్ర నిర్మాణములు వెలుగులోనికి వస్తాయని వెంటనే స్పష్టమవుతుంది. దానిలో విస్తృత వర్ణమాల ఉంటుంది మరియు అది అనేక సులువైన నిర్మాణముల నుండి ఎంతో విశాలమైన నిర్మాణముల వరకు వ్యాపిస్తుంది.

దీనిని పరిశీలించుట కొరకు, మనము వేదాంతశాస్త్ర నిర్మాణముల యొక్క మూడు సాధారణ స్థాయిలను చూద్దాము. మొదటిగా, మనము “మౌలిక-స్థాయి” సంయోగ వేదాంతశాస్త్ర నిర్మాణములను చూద్దాము; రెండవదిగా, మనము “మధ్యమిక-స్థాయి” సంయోగ వేదాంతశాస్త్ర నిర్మాణముల ఉదాహరణను చూద్దాము. మరియు మూడవదిగా, మనము “క్లిష్టమైన” సంయోగ వేదాంతశాస్త్ర నిర్మాణములను చూద్దాము. మొదటిగా పాత నిబంధన చరిత్రలోని పలు కాలములలో బయలుపరచబడిన వేదాంతశాస్త్రమును తెలియపరచిన కొన్ని మౌలికమైన తార్కిక అమరికలను చూద్దాము.

అత్యంత మౌలికమైన వేదాంతశాస్త్ర నిర్మాణములు దేవుని యొక్క ప్రత్యేకమైన కార్యములు మరియు మాటలలో గల తార్కికమైన అనుబంధములు మరియు పరిణామములలో కనిపిస్తుంది. ఇక్కడ మన ఆలోచనను గమనించుటకు, మనము రెండు విషయములను చూద్దాము. మొదటిగా, దైవిక కార్య మరియు వాక్య ప్రత్యక్షతలు తార్కికముగా కలుసుకొను కొన్ని మార్గములను మనము చూద్దాము. మరియు రెండవదిగా, మన మనస్సులో ఉన్నదానిని ఒక ప్రత్యేకమైన వాక్యభాగము ద్వారా ఉదాహరించుదాము. మొదటిగా దైవిక కార్యములు మరియు మాటల మధ్య ఉన్న తార్కికమైన కలయికల యొక్క రకములను చూద్దాము.

దేవుని విశేష ప్రత్యక్షతలు ఒకదానితో ఒకటి అనుబంధపరచుకొనుటకు అనేక మార్గములు ఉన్నాయి. మొదటి స్థానంలో, దేవుని కార్యములు చాలా సార్లు దేవుని మాటలతో కలుస్తాయి. మనము ఇంతకు ముందు పాఠంలో చూసినట్లుగా, దేవుని వాక్యములు ప్రవచనముల రూపములో దేవుని కార్యముల కంటే ముందు వచ్చాయి. మరికొన్ని సార్లు, దేవుని వాక్యములు ఆయన కార్యములతో పాటుగా సంభవించాయి మరియు ఆయన చేయు కార్యములను వివరించాయి. మరికొన్ని సమయాలలో, ఆయన మాటలు ఆయన కార్యముల తరువాత వచ్చాయి మరియు మునుపటి కాలములో దేవుడు చేసిన కార్యముల యొక్క ప్రాముఖ్యతను గూర్చి తెలియపరచాయి.

అదే సమయములో, దేవుని కార్యములు ఆయన మాటలను కొంత విపులపరచాయి. ఉదాహరణకు, ఆయన మాట్లాడుటకు ముందు దేవుడు కార్యములు చేసినప్పుడు, ఆయన కార్యములు ఆయన చెప్పబోవు మాటల కొరకు మార్గమును సిద్ధపరచాయి. దేవుడు ఇంచుమించు ఆయన మాటలతో పాటుగా కార్యములను చేసినప్పుడు, ఆయన కార్యములు ఆయన చెప్పిన మాటల యొక్క అర్థమును స్పష్టపరచాయి. మరియు అవును, దేవుడు మాట్లాడిన తరువాత కార్యములు చేసినప్పుడు, ఆయన మునుపటి మాటలను నెరవేర్చుట కొరకు ఆయన అలా చేశాడు.

కాని దీనితో పాటుగా, దేవుని కార్యములు ఆయన ఇతర కార్యములతో తార్కికముగా కలుసుకొనునప్పుడు మౌలిక వేదాంతశాస్త్ర నిర్మాణములు యేర్పడతాయి. ఈ సందర్భములలో, తార్కికమైన పొందికను అనేక విధాలుగా చూడవచ్చు. కొన్ని సాధ్యతలు ఏమనగా: కొన్నిసార్లు దేవుడు చేసిన ఒక కార్యము ఆయన చేసిన మరొక కార్యమునకు సులువుగా జోడించబడుతుంది; మరికొన్ని సమయాలలో, దేవుడు చేసిన ఒక కార్యము ఆయన చేసిన మరొక కార్యమునకు ముందు వస్తుంది; దేవుని కార్యములు ఆయన చేయు ఇతర కార్యములకు మార్గమును సిద్ధపరచాయి; మరియు కొన్ని సార్లు దైవిక కార్యములు మరికొన్ని కార్యములకు కారణమయ్యాయి.

మరియు దీనిని మించి, దేవుని వాక్య ప్రత్యక్షతలు ఇతర వాక్య ప్రత్యక్షతలతో తార్కికముగా కలిసిన విధానమును మనము చూసినప్పుడు మౌలిక వేదాంతశాస్త్ర నిర్మాణములు కూడా వెలుగులోనికి వస్తాయి. మరొకసారి, సాధ్యమైన అనుబంధములు లెక్కలేనన్నిగా ఉన్నవి. కొన్నిటిని మాత్రమే తెలియజేయదలచితే, ఒక మాట మరొక మాటకు సులువుగా జోడించబడవచ్చు, ఒక మాట మరొక దానికి తార్కికమైన ఆధారము కావచ్చు, లేక ఒక మాట మరొక మాటను వివరించవచ్చు.

దేవుని కార్యములు మరియు మాటలు ఒకదానితో ఒకటి అనుబంధము కలిగియుండు అనేక మార్గములు పలు తార్కికమైన అమరికలను స్థాపించగలవు. దేవుని విశేష కార్యములు మరియు మాటల మధ్య కలయికలు లెక్కలేనన్ని, తార్కికమైన పరిణామముల చిక్కులతో కూడిన వలయములను కలుగజేస్తుంది. ఈ పరిణామములు పాత నిబంధన చరిత్రలోని కొన్ని కాలములలో దేవుడు స్థాపించిన సంయోగ వేదాంతశాస్త్ర నిర్మాణములను లేక పొందికగల వేదాంతశాస్త్ర దృక్పథములను రూపొందించాయి.

ఈ సాధారణ ఆలోచనను మనస్సులో ఉంచుకొనుట, దేవుని కార్యములు మరియు మాటల యొక్క కలయిక ఒక వాక్య భాగములో పొందికగల వేదాంతశాస్త్ర నిర్మాణములను ఎలా కలుగజేస్తుందో ఉదాహరించుటకు సహాయపడుతుంది. ఉదాహరణకు, ఆది. 2:15-22లో హవ్వను సృష్టించిన సన్నివేశములోని ఒక భాగమును పరిశీలన చెయ్యండి. అక్కడ మనము ఈ సుపరిచితమైన మాటలను చదువుతాము.

మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. . . మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను (ఆది. 2:18). దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశపక్షిని నేలనుండి నిర్మించి, ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవముగల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. . . అయినను ఆదామునకు సాటియైన సహాయము అతనికి లేక పోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్క టెముముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను (ఆది. 2:15-22).

మొదటిగా దేవుని కార్యములు మరియు మాటల మధ్య ఉన్న కొన్ని తార్కిక కలయికలను పరిగణించండి. ఈ వాక్యభాగము 15వ వచనములో తోటను సేద్యపరచుటకు తోటలో దేవుడు మానవుని ఉంచుటతో ప్రారంభమవుతుంది. ఈ కార్యము 18వ వచనము మొదటి భాగములో ఉన్న దేవుని మాటతో కలిసింది, అక్కడ దేవుడు “నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు” అని సెలవిచ్చాడు. మొదటి చూపులో, ఏదెను వనములో ఆదాము యొక్క జీవితము ఎంతో ఘనముగా ఉండేదని మనకు అనిపించవచ్చు, కాని దేవుని వాక్యము ఆయన ఇంతకు ముందు చేసిన కార్యమును జ్ఞాపకము చేసుకొని ఆదాము ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని జ్ఞాపకము చేసింది.

అదే విధముగా, 18వ వచనము యొక్క రెండవ భాగములోని “వానికి సాటియైన సహాయమును వాని కొరకు చేయుదును” అను మాటలు 22వ వచనములో స్త్రీని చేయుట ద్వారా దేవుని కార్య నెరవేర్పును ప్రవచించాయి. దేవుని కార్యములు మరియు మాటల మధ్య ఉన్న ఈ తార్కిక అనుబంధములు సులువైన వేదాంతశాస్త్ర నిర్మాణమును, అనగా చరిత్రలోని ఈ భాగములో వెలువడిన పొందికగల నమ్మకముల గుంపును బయలుపరుస్తాయి. ఆయన తోటను సేద్యపరచుటకు దేవుడు మానవులను సృష్టించాడు, కాని అందు కొరకు స్త్రీ పురుషుల యొక్క అవసరత ఉండినది.

ఈ కథనములో దేవుడు చేసిన వివిధ కార్యములు ఒకదానితో ఒకటి సంయోగ వేదాంతశాస్త్ర నిర్మాణములను బయలుపరచు విధముగా కలుసుకున్నాయి. 19వ వచనములో వాటికి పేర్లు పెట్టుట ద్వారా ఆదాము వాటి మీద అధికారము కలిగియుండునట్లు సిద్ధపరచుటకు దేవుడు ముందుగానే జంతువులను సృజించాడు. ఆదాము తన కొరకు సాటియైన సహాయమును జంతువులలో పొందలేదని 20వ వచనము తెలియజేస్తుంది మరియు జంతువులతో ఆదాము చేసిన పాలుపంపుల యొక్క ఉద్దేశమును గూర్చి ఇది కొంత వరకు మాత్రమే వివరిస్తుంది. ఈ దేవుని కార్యములు ఒక సులువైన వేదాంతశాస్త్ర దృక్పథమును , అనగా తార్కికమైన మార్గములో వీటిని చూచు విధానమును బయలుపరచాయి. దేవుడు జంతువులను యేలుటకు మానవులను తయారు చేశాడుగాని, వాటిలో తమ సాటియైన సహాయమును వెదకుకొనుటకు కాదు.

చివరిగా, 18వ వచనములోని రెండు బయలుపరచు మాటల మధ్య ఉన్న తార్కిక కలయికను కూడా మనము చూడవచ్చు. ఒక వైపున, “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు” అని దేవుడు సెలవిచ్చాడు. “వానికి సాటియైన సహాయమును వాని కొరకు చేయుదును” అని దేవుడు సెలవిచ్చుటకు ఈ కథనమే కారణము. నరుని యొక్క ఒంటరితనమునకు దేవుడిచ్చిన పరిష్కారము సాటియైన సహాయమును సృజించుట అను పొందికగల వేదాంతశాస్త్ర దృష్టికోణమును ఈ తార్కిక అనుబంధము బయలుపరుస్తుంది. ఈ సులువైన ఉదాహరణ పాత నిబంధనలో మనము మరలా మరలా ఎదుర్కొను విషయమును ఉదాహరిస్తుంది. సంయోగ వేదాంతశాస్త్ర నిర్మాణములు, పొందికగల వేదాంతశాస్త్ర దృష్టికోణములు దేవుని కార్యములు మరియు మాటల మధ్య ఉన్న కలయికల ద్వారా బయలుపరచబడతాయి.

పాత నిబంధన చరిత్రలోని కాలములను వర్ణించిన మధ్యమిక-స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములను ఇప్పుడు మనము చూడాలి.

మధ్యమిక లేక కొంత వరకు క్లిష్టత కలిగియున్న సంయోగ వేదాంతశాస్త్ర నిర్మాణముల పట్ల మనము శ్రద్ధ వహించినప్పుడు దేవుడు చేసిన కొన్ని కార్యములు మరియు మాటల యొక్క ప్రాముఖ్యత స్పష్టమవుతుంది. మనము ఇంతకు ముందు చూసినట్లు, దేవుని యొక్క ఏ కార్యములు మరియు మాటలు ఒకదానికి వేరుగా మరొకటి జరగలేదు. ఆయన కార్యములు మరియు మాటల గుంపుల విషయములో కూడా ఇదే నిజమైయున్నది. అవి మనము చూచుచున్న చరిత్ర కాలమును వర్ణించు ఇతర మరింత క్లిష్టమైన వేదాంతశాస్త్ర నిర్మాణములలో చక్కగా అమర్చబడతాయి.

అనేక రకముల మధ్యమిక-స్థాయి సంయోగ నిర్మాణములు ఉన్నాయి గాని, మన ఉద్దేశముల కొరకు మనము ఒక దాని మీద దృష్టిపెడదాము: దైవిక నిబంధనలు. మొదటిగా, నిబంధనల యొక్క తార్కిక క్రియాశీలకాలను మనము చిత్రీకరిద్దాము, మరియు తరవాత చరిత్రలోని ఒక కాలము యొక్క వేదాంతశాస్త్రమును అర్థము చేసుకొనుటకు ఈ తార్కిక నిర్మాణము ఎలా సహాయపడుతుందో చూద్దాము. మొదటిగా నిబంధనల యొక్క తార్కిక క్రియాశీలకములను చూద్దాము.

పాత నిబంధన ఇశ్రాయేలు యొక్క విశ్వాసము నిబంధనా సంబంధమైనది అని చాలా కాలముగా గుర్తించబడింది. నిబంధన అను అంశము లేఖనము అంతటా నిండియున్నది. నిబంధనలను గూర్చి మనము అనేక విషయములను తెలియజేయవలసియున్నను, పాత నిబంధనలో దైవిక నిబంధనలను గూర్చిన ఒక అంశమును మాత్రమే మనము చూద్దాము: కొన్ని దైవిక ప్రత్యక్షతల యొక్క పొందికను అర్థము చేసుకొనుటలో అవి మనకు ఎలా సహాయం చేయగలవు.

పాత నిబంధనలో ప్రతి నిబంధనకు కొన్ని విశేష లక్షణములు ఉన్నప్పటికీ, మూడు ముఖ్యమైన విషయములను అర్థము చేసుకొనుటకు అవి ఒక తార్కికమైన విధానమును కనుపరచాయి: దైవిక ఉపకారము, మానవ రాజభక్తి మరియు విధేయతకు ఆశీర్వాదములు మరియు అవిధేయతకు శాపముల ఫలితములు. దేవుడు మరియు మానవుల మధ్య ఉన్న అనుబంధము ఈ మూడు విషయముల మధ్య ఉన్న అనుబంధము ద్వారా ఎల్లప్పుడు శాసించబడింది. ప్రజలను ఆయనతో అనుబంధములోనికి తీసుకొనివచ్చు విధముగా మరియు వారిని ఆ అనుబంధములో నిలిచియుండునట్లు చేయు విధముగా దేవుడు ఉపకారమును చూపాడు. కాని దీనికి ప్రతి స్పందనగా, ఆయన ఆజ్ఞలను పాటించుట ద్వారా మానవులు దేవునికి రాజభక్తి చూపవలసియున్నది. దీనితో పాటుగా, పాత నిబంధనలోని ప్రతి నిబంధనలోను స్థాపించబడిన పరిణామాలు ఉన్నాయి: దేవుని ఆజ్ఞలకు విధేయులైనవారికి కలుగు ఆశీర్వాదములు మరియు అవిధేయులైనవారికి కలుగు శాపములు.

పాత నిబంధన చరిత్రలోని ప్రతి క్షణము ఈ తార్కిక నిబంధన నిర్మాణముల ద్వారా నియంత్రించబడింది అని గుర్తించుట ఎంతో అవసరము. దేవుని కార్య మరియు వాక్య ప్రత్యక్షతలన్నిటిలో గల దాగియున్న వ్యవస్థను చూచుటకు మనకు సహయము చేయు ఒక మార్గమును అవి సృష్టించాయి. కొన్ని సార్లు, దేవుని ప్రత్యక్షతలు తన ప్రజల పట్ల ఆయన కలిగియున్న నిబంధనా ఉపకారములను, మరియు దయను కనుపరచాయి. ఇతర దైవిక కార్యములు మరియు మాటలు దేవుడు ఆశించిన మానవ రాజభక్తిని, అనగా ఆయన చేసిన ఉపకారములకు మానవులు స్పందించవలసిన విధానములను వ్యక్తపరచాయి. మరియు దైవిక ప్రత్యక్షతలు ఆశీర్వాదములు మరియు శాపముల యొక్క పరిణామముల వైపుకు కూడా ఆసక్తిని మళ్ళించాయి. పాత నిబంధనలోని ఏ సమయములోని వేదాంతశాస్త్ర నిర్మాణమును గూర్చియైన మనము కలిగియున్న అవగాహన చాలా వరకు ఈ నిబంధనా నిర్మాణములలో దైవిక ప్రత్యక్షత యొక్క ప్రతి లక్షణము ఇమిడియుండు దాని మీద ఆధారపడుతుంది.

ఈ మధ్యమిక-స్థాయి సంయోగ నిర్మాణము ఎలా పని చేస్తుందో వివరించుటకు, ఆదికాండము 2లో హవ్వను సృష్టించిన ఉదాహరణను మరింత విపులముగా చూద్దాము. ఇప్పుడు, మనకు తెలిసినట్లుగానే ఆదికాండము 2వ అధ్యాయము దేవుడు ఆదాముతో చేసిన మొదట నిబంధన కాలములో జరిగింది. ఈ నిబంధన యొక్క ప్రత్యేకతను మనము మన తరువాత పాఠంలో చర్చించుదాము. అయితే, ఈ సమయములో, ఈ లేఖన భాగములో దేవుని ఉపకారము, మానవ రాజభక్తి, ఆశీర్వాదములు మరియు శాపములకు కలుగు పరిణామముల యొక్క తార్కిక నిర్మాణములు స్పష్టముగా కనిపించు కొన్ని మార్గములను మాత్రమే మనము గుర్తించుదాము.

మొదటి స్థానములో, ఆది 2:8లో ఆదామును ఆయన తోటలో ఉంచినప్పుడు దేవుడు ఆదాము పట్ల గొప్ప ఉపకారమును కనుపరచాడు. అయితే దేవుడు రాజభక్తి కలిగియుండు బాధ్యత కూడా ఆదాముకు ఇచ్చాడు. ఆదాము తోటను “సేద్యపరచి ... దానిని కాయవలసియుండెను.” ఈ వచనము వెనుక దాగియున్న నిబంధనా నిర్మాణములు స్పష్టముగా ఉన్నాయి. దేవుడు ఆదామునకు దయను చూపాడు, మరియు దానికి స్పందనగా ఆదాము తోటను సేద్యపరచి కాచి దేవునికి నమ్మకమైన పరిచర్య చేయవలసియుండినది.

రెండవ స్థానములో, 18వ వచనములో దేవుడు ఆదాము యొక్క పరిస్థితిని గమనించి ఆదాముకు సాటియైన సహాయమును ఇస్తానని చెప్పినప్పుడు ఆయన మరింత ఉపకార గుణమును చూపాడు. తరువాత 19 మరియు 20 వచనములలో, ఆదాము జంతువులకు పేర్లు పెట్టుట ద్వారా తన రాజభక్తి బాధ్యతను నెరవేర్చుట ఆరంభించాడు, మరియు ఏ జంతువు కూడా తనకు సాటియైన సహాయము కానేరదని గమనించాడు.

మూడవ స్థానములో, 21 మరియు 22 వచనములలో, జంతువులకు పేరు పెట్టుటలో ఆదాము చూపిన నమ్మకత్వము యొక్క ఫలితమును మరియు జంతువులలో ఆయన సాటియైన సహాయమును కనుగొనలేకపోవుటను మనము చూస్తాము. దేవుడు ఆదాముకు అతని సాటియైన సహాయమైన హవ్వను కానుకగా ఇచ్చాడు. ఈ వాక్యభాగములో, దేవుని శాపముల యొక్క ఫలితములను గూర్చి ఎలాంటి హానికరమైన మాట తెలుపబడలేదుగాని, తన బాధ్యతను నెరవేర్చుటలో ఒకవేళ ఆదాము విఫలమైయుంటే, దేవుడు ఈ విధముగా ఆదామును దీవించియుండేవాడు కాదని మనము నమ్ముటకు కారణము ఉంది. నిబంధనల వంటి మధ్యమిక-స్థాయి సంయోగ నిర్మాణములు దేవుని యొక్క విశేష కార్య మరియు వాక్య ప్రత్యక్షతలను అర్థము చేసుకొనుటలో మనకు ఎలా సహాయము చేస్తాయో ఉదాహరించుటకు ఈ సులువైన ఉదాహరణ సరిపోతుంది.

సంయోగ నిర్మాణముల యొక్క ఈ స్థాయిలను మనస్సులో ఉంచుకొని, మన ధ్యాసను ఇప్పుడు క్లిష్ట-స్థాయి సంయోగ నిర్మాణముల వైపుకు త్రిప్పవలసియున్నది.

క్లిష్టమైన వేదాంతశాస్త్ర నిర్మాణములను గూర్చి మనము మాటలాడునప్పుడు, ఎంత విశాలమైన వేదాంతశాస్త్ర వ్యవస్థలు లేక చట్రములు మనస్సులో ఉన్నాయంటే అవి ఎన్నో మౌలిక మరియు మధ్యమిక-స్థాయి నిర్మాణములను కలిపి, వాటిని ఇతర ఆలోచనలతో జతపరుస్తాయి. పాత నిబంధన వేదాంతశాస్త్రములో ఎన్నో క్లిష్టమైన వేదాంతశాస్త్ర వ్యవస్థలు ఉన్నాయి, కాని మన దృష్టిని ఒక అతి ప్రాముఖ్యమైనదాని మీద కేంద్రీకరించుదాము: దానిని మనము దేవుని రాజ్యమును గూర్చిన వేదాంతశాస్త్రము అని పిలుస్తాము.

ఈ అంశమును గూర్చి మనము అనేక విషయములు చెప్పవచ్చు, కాని ఈ పాఠంలో, దేవుని రాజ్య సిద్ధాంతమును క్రోడీకరించి, పాత నిబంధన చరిత్రలోని ఒక భాగము యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణములను చూచుటలో అది మనకు ఉపయోగపడు ఉదాహరణను గమనించుట సరిపోతుంది.

దేవుని రాజ్య సిద్ధాంతము ఆయన సృష్టి కొరకు దేవుడు కలిగియున్న సమగ్ర ప్రణాళికను ప్రస్తావిస్తుంది. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు, నేడు పరలోకములో ఉన్నట్లు భూమి మీద కూడా దేవుని మహిమకరమైన పరిపాలనను స్థాపించుట ద్వారా దేవుడు మహిమ మరియు ఘనతను పొందు గమ్యము వైపుకు చరిత్ర ఆపులేకుండా ముందుకు సాగుతున్నట్టు మనము చూస్తాము. భూమిని ఆయన మహిమకరమైన రాజ్యము కొరకు సిద్ధపరుస్తూ ఈ పనిని చేయుట కొరకు దేవుడు తన స్వరూపములైన మానవులను నియమించాడని లేఖనమంతా స్పష్టము చేస్తుంది.

దేవుడు వాస్తవముగా తన స్వరూపమును పరిశుద్ధమైన ఏదెను తోటలో మాత్రమే ఉంచినా, ఫలించుట ద్వారా మరియు దేవుని సేవలో ఆధిపత్యము కలిగియుండుట ద్వారా దేవుని తోట యొక్క పరిమితులను భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు మానవులు ఎల్లప్పుడూ పిలువబడితిరి. ఆది. 1:28లో ఇలా వ్రాయబడియున్నది:

దేవుడు వారిని ఆశీర్వదించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను (ఆది. 1:28).

పాపములోనికి పడిపోయిన తరువాత, ఈ కార్యమును చేయుటకు మానవులు దేవుని ద్వారా విమోచించబడి బలపరచబడవలసియుండినది. అయినను, దేవుడు పాపము నుండి విడిపించినవారు ఆయన విమోచనను ప్రచురపరచుచు ప్రతి చోట ఏలుట ద్వారా దేవుని రాజ్యమును వ్యాపింపజేయుటకు పిలువబడిరి.

దుఃఖకరముగా, దేవుని ప్రజలు ఈ కార్యము చేయుటలో విఫలమయ్యారని, కాని దేవుడు తన రాజ్య ప్రణాళికను విరమించుకోలేదని లేఖనములు బయలుపరచుచున్నాయి. త్రిత్వములోని రెండవ పురుషమూర్తి మానవ అవతారము ధరించి, పరిపూర్ణమైన పరిశుద్ధ జీవితమును జీవించినప్పుడు, సిలువ మీద మరణించుట ద్వారా దేవుని ప్రజల యొక్క పాపములకు వెల చెల్లించినప్పుడు, మరణము నుండి తిరిగి లేచినప్పుడు, మరియు పరలోకమునకు ఆరోహణమై తగిన ఫలమును పొందుకున్నప్పుడు, ఆయన ప్రణాళిక తుదకు నెరవేరింది. అక్కడ నుండి, యేసు సమస్తమును పాలించుచున్నాడు, మరియు సమస్తమును నూతనపరచుటకు ఆయన మహిమలో తిరిగివస్తాడు. క్రీస్తు తిరిగివచ్చినప్పుడు ఈ భూమి మీద నుండి చెడును పూర్తిగా నిర్మూలం చేస్తాడు మరియు క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి ఏర్పడతాయి. మరియు ఆ సమయమందు, భూమి విమోచించబడిన పరిశుద్ధమైన దేవుని స్వరూపములతో నిండియుంటుంది మరియు తండ్రియైన దేవుడు దిగివచ్చి భూమియంతటిని తన మహిమతో నింపివేస్తాడు. ప్రకటన 21:9-23లో మనము ఈ క్రింది మాటలు చదువుతాము:

అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను, అనగా గొఱ్ఱపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పెను. ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతముమీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోక మందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను. దానియందలి వెలుగు ధగధగ మెరయు సూర్యకాంతమువంటి అమూల్య రత్నమును పోలియున్నది ... దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱపిల్లయే దానికి దీపము (ప్రకటన 21:9-11, 22-23).

క్రీస్తు యొక్క మహిమగల రాకలో ఈ కార్యములన్ని జరుగక ముందు, ఆయన రాజ్యమును వ్యాప్తి చెందించు పని చేయుట కొరకు దేవుడు తన విమోచించబడిన ప్రజలను పిలచాడు. ఈ కార్యము కొరకు పాత నిబంధన విశ్వాసులు చేసిన ప్రతి కృషి దేవుని గొప్ప రాజ్య ప్రణాళికలో భాగమైయుండినది.

దేవుని రాజ్యము భూమి మీదకు వచ్చు బైబిలు దర్శనము చరిత్రలో దేవుని రాజ్య ప్రణాళికను అర్థము చేసుకొనుటలో మనకు సహాయపడు సమగ్ర సంయోగ వేదాంత నిర్మాణమును రూపొందిస్తుంది. ఆయన రాజ్య ప్రణాళిక పాత నిబంధనలో ఆయన చెప్పిన మరియు చేసిన సమస్తము యొక్క నేపథ్యములో దాగియున్నది. దేవుడు తన స్వరూపము ద్వారా మహిమను పొందుతాడు మరియు తన రాజ్యమును భూమి మీద అంతట వ్యాపింపజేస్తాడు. ఈ సంయోగ వేదాంతశాస్త్ర నిర్మాణము పాత నిబంధనలోని సమస్త దైవిక ప్రత్యక్షత యొక్క తార్కిక అమరికను అర్థము చేసుకొనుటలో మనకు సహాయపడుతుంది.

ఈ క్లిష్టమైన వేదాంతశాస్త్ర నిర్మాణము పాత నిబంధన చరిత్రలోని కొన్ని భాగములను మరింత విపులంగా అర్థము చేసుకొనుటకు మనకు ఏ విధముగా సహాయము చేయగలదో చూచుటకు, ఆదికాండము 2లో హవ్వను సృష్టించిన ఉదాహరణను మరొకసారి పరిగణించండి. తార్కికముగా వివిధ విధాలుగా కలుసుకొను అనేక కార్యములను దేవుడు చేశాడు మరియు మాటలను సెలవిచ్చాడని మనము చూశాము. నిబంధనా క్రియాశీలకముల యొక్క తార్కిక అమరిక దేవుడు ఆదాముకు ఎంతో ఉపకారము చేశాడు, ఆదాము రాజభక్తి కలిగియుండాలని పిలచాడు, ఆదాము తనకు ఇవ్వబడిన బాధ్యతలను నెరవేర్చాలని కోరాడు, మరియు దేవుడు హవ్వను సాటియైన సహాయముగా తయారు చేసినప్పుడు ఆదాము దీవించబడ్డాడు అను సత్యముల వైపుకు మన దృష్టిని ఆకర్షిస్తుంది అని కూడా మనము చూశాము.

అయితే ఈ వేదాంతశాస్త్ర నిర్మాణములను చూచుట ఎంత ప్రాముఖ్యమైన విషయమైనప్పటికీ, ఒక ముఖ్యమైన ప్రశ్న మాత్రం మన ముందు నిలుస్తుంది. దేవుడు ఈ కార్యములను ఎందుకు చేశాడు? ఆయన అసలు ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నలకు జవాబు దేవుని రాజ్యమును గూర్చిన వేదాంతశాస్త్రములో మనము కనుగొనవచ్చు.

మనము ఇంతకు ముందు చెప్పినట్లు, ఆరంభములోనే ఆదికాండము 1లో, దేవుడు మానవులకు ఈ లోకములో ఒక ప్రత్యేకమైన బాధ్యతను అప్పగించాడు. ఆయన స్వరూపములుగా, దేవుని పరదైశు లేక రాజ్యమును లోకమంతటా వ్యాపింపజేయుటకు నీతిగల సాధనములుగా ఉండుటకు మనము పిలువబడితిమి. కాని ఆదాము స్వయంగా ఈ రాజ్య కార్యమును నెరవేర్చలేకపోయాడు. ఒక పురుషుడు మాత్రమే ఫలించి భూమిని నింపి దానిని ఏలలేడు. కాబట్టి, దేవుడు ఆదాముకు ఒక సాటియైన సహాయమునిచ్చాడు, మరియు ఆమె దేవుని రాజ్యములో అతని పాత్రను నెరవేర్చుటలో సహాయపడుతుంది. హవ్వ ఆదాము ప్రక్కన ఉండుట ద్వారా, దేవుని స్వరూపము ఫలిస్తుంది, మరియు దేవుని మహిమగల పరిపాలన కొరకు గొప్ప సంఖ్యలో ఎదిగి భూమిని సిద్ధపరుస్తుంది. ఈ క్లిష్టమైన వేదాంతశాస్త్ర నిర్మాణము వెలుగులో హవ్వ యొక్క సృష్టిని మనము చూసినప్పుడు, సమస్త లోకమును దేవుని రాజ్యముగా మార్చుట కొరకు ఆమెను సృష్టించుట ఎంతో ప్రాముఖ్యమైన మెట్టు అని మనము చూడవచ్చు.

కాబట్టి పాత నిబంధన చరిత్రలోని కాలములు వివిధ స్థాయిలలో సంయోగ వేదాంతశాస్త్ర నిర్మాణములను ప్రతిబింబించునట్లు మనము చూస్తాము, మౌలిక స్థాయిలో, దేవుని కార్యములు మరియు మాటలు ఏ విధముగా కలుస్తాయో మనము చూస్తాము. మన ఆలోచనను మధ్య స్థాయి నిర్మాణములైన దైవిక నిబంధనలకు మనము పొడిగించుచుండగా, దేవుని ప్రత్యక్షతల యొక్క గుంపులు విస్తృత వేదాంతశాస్త్ర అమరికల యొక్క తర్కములో ఎలా అమర్చబడతాయో మనము చూడవచ్చు. మరియు మనము దేవుని రాజ్యము వంటి మరింత పెద్దవైన సంయోగ నిర్మాణములను అన్వయించుచుండగా, దైవిక ప్రత్యక్షత యొక్క పొందిక మరింత స్పష్టమవుతుంది.

ఈ పాఠంలో బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధన వేదాంతశాస్త్రము యొక్క ఏకకాలిక సంయోగమును ఎలా రూపొందిస్తారో మనము చూశాము. ఏకకాలిక సంయోగము అనేది పాత నిబంధన చరిత్రలోని పలు కాలములలో దేవుని కార్యములు మరియు మాటల యొక్క వర్ణన అని మనము గమనించాము. పాత నిబంధనలోని వివిధ రచనా శైలులలో నుండి చారిత్రిక సమాచారమును సేకరించు మార్గములను కూడా మనము చూశాము. మరియు చరిత్రలోని ఒక కాలములో పలు స్థాయిలలో దేవుని ప్రత్యక్షత యొక్క సంయోగవేదాంతశాస్త్ర నిర్మాణములను ఎలా వివేచించాలో మనము చూశాము.

పాత నిబంధన వేదాంతశాస్త్రము యొక్క ఏకకాలిక సంయోగమును రూపొందించుట బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములో ఒక ముఖ్యమైన కోణమైయున్నది. పాత నిబంధన చరిత్రలోని పలు కాలములలో ఆయన కార్యములు మరియు మాటల ద్వారా దేవుడు బయలుపరచిన వాటిని మనము అర్థము చేసుకొనుచుండగా, బైబిలు అంతటిలో వేదాంతశాస్త్రము ఎలా అభివృద్ధి చెందినదో అన్వేషించుటకు మనము మరి ఎక్కువగా సిద్ధపడతాము.

Continue reading the full transcript