అదే శ్రేణి 4వ పాఠానికి అనుబంధ వీడియో, ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: బైబిల్ వేదాంతశాస్త్రజ్ఞులు పాత మరియు కొత్త నిబంధనలను విడిగా ఎందుకు అధ్యయనం చేస్తారు? నిబంధన వేదాంతశాస్త్రజ్ఞులు కొత్త నిబంధనతో ఏమి చేస్తారు? బైబిల్ రచయితలు ఒకరినొకరు వ్యతిరేకించారా? బైబిల్ రచయితల వేదాంతాలు ఎంత వైవిధ్యంగా ఉన్నాయి? కొత్త నిబంధన రచయితల వివిధ వేదాంతాలను మనం ఎలా కనుగొంటాము? ఎస్కటాలజీ అంటే ఏమిటి? ఎస్కటాలజీ సిద్ధాంతం ఎలా అభివృద్ధి చెందింది? ప్రవక్తలు ఎప్పుడైనా నెరవేరని విషయాలను అంచనా వేశారా? యేసు పరిచర్యతో యోహాను బాప్టిస్ట్ ఎందుకు ఆశ్చర్యపోయాడు? క్రీస్తు రాక యొక్క వివరాలతో మనం ఆశ్చర్యపోతాంరా? పాత నిబంధన ప్రవక్తలు అంచనా వేసినట్లుగా ఎండ్ టైమ్స్ ఎందుకు జరగలేదు? చారిత్రక అంశాలు నేటికీ వర్తిస్తాయా? కొత్త ఒడంబడిక వచ్చిందా? కొత్త నిబంధనలో వేర్వేరు ఎస్కటాలజీలు ఉన్నాయా? బైబిల్ వేదాంతశాస్త్రం యొక్క ఎస్కటాలజీపై దృష్టి కేంద్రీకరించడం వల్ల కొన్ని ఆచరణాత్మక చిక్కులు ఏమిటి?
From the transcript
1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.
బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.
ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.
అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.
మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.
ఒక సుదీర్ఘమైన ప్రయాణంలో చదువుకొనుట కొరకు ఒక పాత పుస్తకాల కొట్టులో ఒక పాత పుస్తకమును కొనిన స్నేహితుడు నాకొకడున్నాడు. ఒక వారం పాటు తన చేతిలో ఉన్న ఆ చిరిగిపోయిన నవల తన యాత్రా సహచరిగా ఉన్నదని అతడు నాకు చెప్పాడు; అతడు దానిని క్రింద పెట్టలేకపోయేవాడు. ఆ పుస్తకమును చాలా ఇష్టపడియుంటావు కదా, అని నా స్నేహితుని అడిగాను. “అవును, నాకు చాలా నచ్చింది, కాని చివరి పేజీకి వచ్చే సరికి ఆ పేజీని ఎవరో చింపివేశారని నాకు అర్థమయ్యింది. నాకు చాలా నిరుత్సాహం కలిగింది, ఎందుకంటే నేను ఇంటికి వచ్చి క్రొత్త పుస్తకము కొంటె గాని దాని ముగింపు ఏమిటో నాకు తెలియలేదు,” అని అతడు జవాబిచ్చాడు. ఒక మంచి నవలను చదివి చివరికి ఆఖరి పేజీ లేదని తెలుసుకుంటే ఎంత నిరుత్సాహం కలుగుతుందో నాకు తెలుసు.
మరియు అనేక విధాలుగా, బైబిలు విషయములో కూడా ఇదే వాస్తవమైయున్నది. ముగింపు తెలుసుకోకుండా కూడా బైబిలు యొక్క ఆరంభ భాగములను చదివి మనము దీవించబడవచ్చు. అయితే బైబిలు యొక్క ముగింపు భాగమైన క్రొత్త నిబంధనను మనము చదవకపోతే, అది ఒక నవల యొక్క ఆఖరి పేజీని చదవకపోవడంతో సమానమైయున్నది. పాత నిబంధన ప్రశ్నలను, సమస్యలను, మరియు నిరీక్షణలను లేవనెత్తుతుంది, కాని వాటికి జవాబులు, పరిష్కారములు మరియు నెరవేర్పులు లేఖనముల చివరిలో ఉన్న క్రొత్త నిబంధనలో కనిపిస్తాయి.
బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును కట్టుట అను మన పాఠ్యక్రమములో ఇది నాల్గవ పాఠము. ఈ పాఠమునకు “క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ఆకృతులు” అని పేరు పెట్టాము. మరియు ఈ పాఠంలో, లేఖన కథనము యొక్క ముగింపు, అనగా దేవుని ప్రత్యక్ష్యత యొక్క సమాప్తియైన క్రొత్త నిబంధనలోని బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ముఖ్యమైన లక్షణములను మనము చూద్దాము.
ఈ పాఠ్యక్రమములో మనము చూసిన వాటిని సమీక్షించుటకు ఒక నిమిషం తీసుకుందాము. లేఖనములను వ్యాఖ్యానించుటకు క్రైస్తవులు మూడు ముఖ్యమైన ప్రణాళికలను అనుసరించారని మనము గమనించాము. సాహిత్య విశ్లేషణ అనగా కొన్ని వేదాంతశాస్త్ర దృక్పథములను ఉద్ఘాటించుట కొరకు రూపొందించబడిన ఒక సాహిత్య చిత్రముగా బైబిలును చూచుట; అంశ విశ్లేషణ అనగా మన సాంప్రదాయిక మరియు సమకాలీన ఆసక్తులను మరియు ప్రశ్నలను ప్రతిబింబించు అద్దముగా బైబిలును చూచుట; మరియు చారిత్రిక విశ్లేషణ అనగా అది వర్ణించు చారిత్రిక సన్నివేశాలకు ఒక కిటికీగా బైబిలును చూచుట. లేఖనములను చదువునప్పుడు మనము ఈ మూడు పద్ధతులలో ఏదో ఒక దానిని కొంత వరకు ఉపయోగిస్తాము, కాని బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అను శాఖ బైబిలును ప్రాథమికముగా ఒక కిటికీగా భావిస్తుంది, మరియు లేఖనముల యొక్క చారిత్రిక విశ్లేషణ మీద దృష్టి సారిస్తూ, బైబిలులో నివేదించబడిన చారిత్రిక సన్నివేశాలలో దేవుడు పాలుపంచుకొను మార్గములను చూస్తుంది. ఈ కారణము చేత, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అను శాఖను మనము ఈ విధముగా నిర్వచిస్తాము:
బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అనగా లేఖనములో తెలియజేయబడిన దేవుని కార్యముల యొక్క చారిత్రిక విశ్లేషణ నుండి వెలువడిన వేదాంతశాస్త్ర ఆలోచనయైయున్నది.
బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము దేవుని కార్యముల యొక్క లేఖన కథనముల మీద దృష్టి పెడుతుంది మరియు ఆ సన్నివేశములలో నుండి క్రైస్తవ వేదాంతశాస్త్రము కొరకు అనుమితులను వెలికి తీస్తుంది.
ఈ పాఠ్యక్రమము యొక్క గత రెండు పాఠములలో, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు పాత నిబంధనను సమీపించు మార్గములను మనము చూశాము. ఈ పాఠంలో, క్రొత్త నిబంధనలో బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ఆకృతులను మనము చూద్దాము. మనము చూడబోవుతున్నట్టు, బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము రెండు నిబంధనలను సమీపించు విధానములలో చాలా పోలికలు ఉన్నాయి, కాని అనేక భేదములు కూడా ఉన్నాయి.
మన పాఠం మూడు ముఖ్యమైన విషయముల మీద దృష్టిపెడుతుంది. మొదటిగా, మన అంశము పట్ల ఒక ధోరణిని పొందుకుంటాము. రెండవదిగా, క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములోని ఒక ప్రాముఖ్యమైన అంశమైన ఎస్కటాలోజి, లేక అంత్య దినములను గూర్చి బైబిలు బోధ యొక్క అభివృద్ధిని చూద్దాము. మరియు మూడవదిగా, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు క్రొత్త నిబంధన ఎస్కటాలోజిని సమీపించిన విధానమును చూద్దాము. మన అంశము పట్ల గల సామాన్య ధోరణితో మొదలుపెట్టుదాము రండి.
పాత నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును గూర్చి ఈ పాఠ్యక్రమములో మనము నేర్చుకున్న విషయమును క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రముతో పోల్చుట మరియు వ్యత్యాసపరచుట క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క మూలమును కనుగొనుటకు ఒక మార్గమైయున్నది. మొదటిగా, పాత నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము మరియు క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము దేవుని రెండింతల ప్రత్యక్ష్యత పట్ల పరస్పర ఆసక్తి కలిగియున్నాయను సత్యమును మనము చూద్దాము. రెండవదిగా, మనము వేదాంతశాస్త్ర నిర్మాణములు అని పిలచువాటిని రెండు శాఖలు ఎలా అర్థం చేసుకున్నాయో మనము చూద్దాము. మరియు మూడవదిగా, ఈ రెండు భిన్నాకాలిక పురోగమనముల మీద ఏ విధంగా దృష్టి పెట్టాయో చూద్దాము. మొదటిగా రెండింతల ప్రత్యక్ష్యత మీద దృష్టిపెడదాము.
పాత నిబంధన కాలములో దేవుడు తనను తాను రెండు విధాలుగా ప్రత్యక్షపరచుకున్నాడని మీరు గుర్తుచేసుకోవచ్చు: కార్య ప్రత్యక్ష్యతలు మరియు వాక్య ప్రత్యక్ష్యతల ద్వారా. ప్రత్యక్ష్యత యొక్క రెండింతల భావన క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము మీద కూడా ప్రభావము చూపింది. ఒక వైపున, క్రొత్త నిబంధన క్రీస్తు యొక్క భూలోక పరిచర్య, మరియు మొదటి శతాబ్దపు సంఘములో పరిశుద్ధాత్మ పరిచర్య వంటి దేవుని ప్రత్యక్షతా కార్యములను నివేదిస్తుంది. అలాగే అది భవిష్యత్తులో జరగబోవు దేవుని కార్యములు అనగా క్రీస్తు యొక్క మహిమగల రాకడ వంటి వాటిని గూర్చి ప్రవచిస్తుంది. అయితే మరొక ప్రక్క, దేవుని కార్యములకు సంబంధించిన వాక్య ప్రత్యక్ష్యతలను గూర్చి కూడా క్రొత్త నిబంధన మాట్లాడుతుంది: తండ్రియైన దేవుడు మాట్లాడాడు; క్రీస్తు మాట్లాడాడు, కొన్ని సార్లు దేవదూతలు మరియు మనుష్యులు దేవుని ఆత్మ ద్వారా దేవుని వాక్యమును బయలుపరచారు.
ఇందు వలనే క్రొత్త నిబంధన కథనములు యేసు, అపొస్తలులు, మరియు క్రొత్త నిబంధనలోని ఇతర క్రైస్తవుల యొక్క క్రియలను మరియు మాటలను నివేదించారు; ఎందుకంటే దేవుడు వారి క్రియల ద్వారా మరియు వారి మాటల ద్వారా తనను తాను బయలుపరచుకున్నాడు. ఇది కేవలం క్రొత్త నిబంధన యొక్క కథన భాగములలో మాత్రమేగాక, పత్రికలలో కూడా సంభవించింది. అవి కొన్ని సార్లు తన ప్రజల కొరకు దేవుడు చేసిన కార్యములను గూర్చి మాట్లాడుతూ తన ప్రజల కొరకు దేవుని వాక్యమును నివేదిస్తాయి.
కార్య మరియు వాక్య ప్రత్యక్ష్యతల మధ్య గల తాత్కాలిక అనుబంధములను గూర్చి పాత నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలు మాట్లాడిన విషయము మీకు జ్ఞాపకముండియుంటుంది. దేవుడు చేసిన కొన్ని కార్యముల వెనుక వాక్య ప్రత్యక్ష్యతలు సంభవిస్తాయి, కొన్ని ఏకకాలములో సంభవించు వాక్య ప్రత్యక్ష్యతలతో అనుబంధం కలిగియుంటాయి, మరికొన్ని వాక్య ప్రత్యక్ష్యతలకు ముందు సంభవిస్తాయి.
క్రొత్త నిబంధనలో మూడు రకముల వాక్య ప్రత్యక్ష్యతలన్ని ఉన్నాయని బైబిలానుసారమైన వేదాంతవేత్తలు సూచించారు. యేసు యొక్క మునుపటి కార్యములను ప్రతిబింబించునట్లు యేసు మాటల ద్వారా దేవుడు మాట్లాడిన విధానమును సువార్తలు నివేదిస్తాయి. యేసు బోధలు తను ఆ సమయములో చేస్తున్న కార్యములను వివరించిన సమయములను, మరియు యేసు భవిష్యత్తు కార్యములను ప్రవచించిన సమయాలను కూడా అవి నివేదించాయి. అపొస్తలుల కార్యములు, ప్రకటన గ్రంథము మరియు క్రొత్త నిబంధన పత్రికలలోని రచయితలు మరియు పాత్రలను గూర్చి కూడా ఇదే మాటను చెప్పవచ్చు. క్రొత్త నిబంధన అంతటిలో దేవుడు తన కార్యములు మరియు మాటల మధ్య ఉన్న కలయికల ద్వారా తననుతాను బయలుపరచుకున్నాడు.
పాత నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తల వలెనె, క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలు కూడా దేవుడు తనను తాను బయలుపరచుకున్న రెండింతల విధానము మీద దృష్టిపెట్టారు. పాత మరియు క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఇరువురు దేవుని కార్య మరియు వాక్య ప్రత్యక్ష్యతల మీద దృష్టిపెట్టారు.
దేవుని కార్య మరియు వాక్య ప్రత్యక్ష్యతల మీద దృష్టిపెట్టుటతో పాటుగా, పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రములు వేదాంతశాస్త్ర నిర్మాణముల విషయములలో ఒకే రకమైన ఆలోచనలు కలిగియుంటాయి. దేవుని కార్య మరియు వాక్య ప్రత్యక్ష్యతలు ఒకదానితో ఒకటి కలిసిన అనేక మార్గములను ముడివేస్తు పాత నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలు వేదాంతశాస్త్ర దృక్పథాలను గుర్తించారని మీరు జ్ఞాపకము చేసుకొనవచ్చు. దేవుడు చెప్పినవాటికి మరియు చేసినవాటికి మధ్య ఉన్న తార్కికమైన అనుసంధానముల మీద వారు ప్రత్యేకమైన దృష్టిని పెట్టారు. ఈ నిర్మాణములు అత్యంత మౌలికమైనవాటి నుండి సంక్లిష్టమైన అమరికలలో అమర్చబడ్డాయి మరియు క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఇవే రకమైన వేదాంతశాస్త్ర నిర్మాణములను క్రొత్త నిబంధనలో కూడా గుర్తించారు.
పాత నిబంధన వేదాంతశాస్త్రమును గూర్చి మనము ఇంతకు ముందు చేసిన సంభాషణల పద్ధతిని అనుసరిస్తూ, క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రములోని వేదాంతశాస్త్ర నిర్మాణముల యొక్క మూడు స్థాయిలను మనము చర్చించుదాము: మొదటిగా, మౌలిక-స్థాయి నిర్మాణముల యొక్క ఉదాహరణ; రెండవదిగా, మధ్యమిక-స్థాయి నిర్మాణముల యొక్క ఉదాహరణ; మరియు మూడవదిగా, క్లిష్ట-స్థాయి నిర్మాణముల యొక్క ఉదాహరణ. మొదటిగా క్రొత్త నిబంధనలోని మౌలిక-స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములను గూర్చి ఆలోచన చేద్దాము.
దైవిక ప్రత్యక్ష్యతల యొక్క సులువైన తార్కిక కలయికల ద్వారా క్రొత్త నిబంధనలో మౌలిక వేదాంతశాస్త్ర నిర్మాణములు అగుపడతాయి. దైవికమైన మాటలు దేవుని కార్యములను వివరిస్తాయి; దేవుని కార్యములు విశేషముగా ఆయన మాటల యొక్క అర్థములను స్పష్టము చేస్తాయి. పలు కార్య ప్రత్యక్ష్యతలు ఒకదానితో ఒకటి తార్కికమైన అనుబంధం కలిగియుంటాయి; మరియు పలు వాక్య ప్రత్యక్ష్యతలు కూడా ఒకదానితో మరొకటి కలుస్తాయి. ఈ విధమైన తార్కిక నిర్మాణములు తక్కువ పరిమాణములో కనిపించినప్పుడు, మనము మౌలిక-స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములు లేక దృక్కోణములు అని పిలిచునవి రూపొందించబడతాయి.
ఉదాహరణకు, మత్తయి 2:1-12లో, యేసు జననములో దేవుడు చేసిన కార్యము అన్యులైన జ్ఞానుల యొక్క క్రియలు మరియు మాటలతో ఎలా కలిసిందో మత్తయి నివేదించాడు. ఆకాశములోని ఒక నక్షత్రము ద్వారా యేసు జననము లోకమునకు ప్రకటించబడింది. ఈ నక్షత్రము ఒక క్రొత్త రాజు యొక్క జననమును ప్రకటించింది అని జ్ఞానులు అర్థము చేసుకొని, ఆ క్రొత్త రాజును అన్వేషిస్తూ నక్షత్రమును అనుసరిస్తూ అనేక నెలలు లేక ఇంచుమించు రెండు సంవత్సరాలు గడిపారు. తుదకు ఆ బిడ్డ ఉన్న చోటుకు చేరుకున్నప్పుడు, వారు ఆయనను ఆరాధించారు. మత్తయి ఇచ్చిన నివేదిక యేసు జననము యొక్క నిజమైన వేదాంతశాస్త్ర ప్రాముఖ్యతను గూర్చి ఒక స్పష్టమైన ధృక్పథమును సూచించింది: యేసు అనేక సంవత్సరములుగా ఎదురు చూసిన ఇశ్రాయేలు రాజైయున్నాడు మరియు ఈ అన్యులు ఆయనను ఆరాధించిన.
అదే సమయములో, మత్తయి 2:16-18లో, యేసు జననము యొక్క తార్కిక కలయికలను రాజైన హేరోదు యొక్క క్రియలు మరియు మాటలతో ముడిపెడుతూ సువార్త రచయిత మరొక వేదాంతశాస్త్ర నిర్మాణమును సృష్టించాడు. మెస్సీయ ఎప్పుడు జన్మించాడో జ్ఞానులు హేరోదుకు తెలియజేశారు, మరియు మెస్సీయ బేత్లెహేములో జన్మిస్తాడని పాత నిబంధన ప్రవచించిన విషయమును అతని సలహాదారులు హేరోదుకు చెప్పారు. యేసును చంపుటకు చేసిన ప్రయత్నములో, బేత్లెహేములో రెండు సంవత్సరముల వయస్సులోపు ఉన్న పిల్లలను వధించమని హేరోదు ఆజ్ఞ ఇచ్చాడు. తరువాత దేవుని తీర్పులో హేరోదు ఎదుర్కొన్న ఘోరమైన మరణమును గూర్చి మత్తయి నివేదించాడు.
ఈ కార్యములు మరియు మాటల మధ్య మత్తయి చూపిన కలయిక యేసు జననము మీద మరొక దృక్కోణమును చూపిన వేదాంతశాస్త్ర నిర్మాణమును సృష్టించింది. యేసు అనేక సంవత్సరములుగా ఎదురు చూసిన ఇశ్రాయేలు రాజైయున్నాడు మరియు హేరోదు ఆయనను చంపగోరాడు. మత్తయి ఇచ్చిన నివేదికలో, ఈ రెండు గుంపుల వేదాంతశాస్త్ర నిర్మాణములు ఒకదానితో ఒకటి గొప్ప వ్యత్యాసమును కనుపరచాయి, మరియు ఈ పుస్తకములో అనేకమార్లు అగుపడిన ఒక అంశమును బలపరచాయి. యేసు జననము పట్ల హేరోదు చూపిన స్పందన, ఇశ్రాయేలులోని అనేక మంది మెస్సీయగా యేసును తిరస్కరించి ఆయన మరణమును సహితము కోరతారు అను సత్యమునకు సూచనగా ఉన్నది. అయితే దీనికి భిన్నంగా, యేసు జననమునకు జ్ఞానులు చూపిన స్పందన, అనేకమంది అన్యులు యూదులకు వాగ్దానము చేయబడిన రాజును ఆహ్వానించి భక్తితోను ఆనందముతోను ఆయనను కొనియాడతారు అను సత్యమునకు సూచనగా ఉన్నది.
క్రొత్త నిబంధనలోని అనేక మౌలిక స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములను చూశాము కాబట్టి, ఇప్పుడు మధ్యమిక-స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములకు కొన్ని ఉదాహరణలను చూద్దాము.
అనేక మౌలిక-స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములకు అవకాశమిచ్చు విధముగా మన ఆలోచనను మనము విశాలపరచుకున్నప్పుడు, అవి చాలా సార్లు పెద్దవైన మరియు మరింత క్లిష్టమైన వేదాంతశాస్త్ర ఆలోచనలను రూపొందిస్తాయని మనము చూడవచ్చు. ఈ ఒకింత కష్టమైన వేదాంతశాస్త్ర నిర్మాణములలో అతి ప్రాముఖ్యమైనది క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రము యొక్క నిబంధనా అమరిక.
ఉదాహరణకు, మత్తయి సువార్త నుండి ప్రకటన గ్రంథము వరకు ఉన్న పుస్తకముల సంగ్రహమును “క్రొత్త నిబంధన” అని పిలుస్తాము. ఇక్కడ “నిబంధన” అను పదము “ఒడంబడిక”కు పర్యాయపదముగా ఉపయోగించబడినది. బైబిలులోని ఈ భాగము పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన నూతన ఒడంబడికను గూర్చినది కాబట్టి దీనిని క్రొత్త నిబంధన అని పిలుస్తాము. ఇశ్రాయేలు యొక్క చెర ముగిసిన తరువాత, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు ఒక అంతిమ ఒడంబడికను స్థాపిస్తాడని అనేకమంది పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారు. యెషయా 54:10, యెహే. 34:25 మరియు 37:26 ఈ ఒడంబడికను “సమాధానవిషయమైన నిబంధన” అని సంబోధించాయి. యిర్మీయా 31:31 ఇదే ఒడంబడికను “క్రొత్త నిబంధన” అని సంబోధిస్తుంది.
నూతన నిబంధనతో ముడిపడియున్న మధ్యమిక-స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములు క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రములో ఒక అతి ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. దేవుని ఉపకారము, మానవ రాజభక్తి, ఆశీర్వాదములు మరియు శాపములకు కలుగు పరిణామములను క్రియాశీలకముల దృష్ట్యా పాత నిబంధనలోని నిబంధనలు పాత నిబంధన వేదాంతశాస్త్రమును ఏ విధముగా క్రమపరచాయో మీకు గుర్తుండే ఉంటుంది. ఇంచుమించు అదే విధముగా, ఈ నాలుగు క్రియాశీలకములు క్రొత్త నిబంధనలోని జీవితమును శాసించి క్రొత్త నిబంధనలోని అనేక వేదాంతశాస్త్ర దృక్కోణముల విశాలమైన గుంపుల యొక్క తార్కిక కలయికలను క్రమపరచాయి.
మౌలిక మరియు మధ్యమిక-స్థాయి వేదాంతశాస్త్ర నిర్మాణములతో పాటు, క్రొత్త నిబంధన పలు రకముల క్లిష్ట-స్థాయి నిర్మాణములను కూడా అందిస్తుంది. ఈ పాఠ్యక్రమములో పాత నిబంధనను గూర్చిన పాఠముల నుండి మనము ఊహించగలిగినట్లే, క్రొత్త నిబంధన యొక్క అత్యంత క్లిష్టమైన మరియు విశాలమైన వేదాంతశాస్త్ర నిర్మాణము దేవుని రాజ్యమైయున్నది, ఇది భూమిని పాపమను భ్రష్టత్వము నుండి దేవుని మహిమకరమైన సన్నిధి మరియు పరిపాలన కలిగిన స్థానముగా మార్చుటకు చరిత్ర కలిగియున్న లక్ష్యముపై బైబిలు దృక్పథమైయున్నది. క్రొత్త నిబంధనలోనే అత్యంత క్లిష్టమైన ఈ వేదాంతశాస్త్ర నిర్మాణమునకు కొన్ని ఆకృతులను నిర్మించుదాము.
క్రొత్త నిబంధన యొక్క ఆరంభములో, దేవుని రాజ్యము సమీపించియున్నదని బాప్తిస్మమిచ్చు యోహాను మరియు యేసు ప్రకటించారు. యేసు ప్రసంగములు మరియు బోధలు తరచుగా దేవుని రాజ్యమును సంబోధించాయి. వాస్తవానికి, యేసు సువార్త సందేశమును అనేక మార్లు “రాజ్య సువార్త” అని పిలచేవారు. మత్తయి 4:23, 9:35 మరియు 24:14, లూకా 4:43, 8:1, 16:16 మరియు అపొ. 8:12 వంటి వచనములలో మనము దీనిని చదువుతాము.
పాత నిబంధన రచయితలతో పాటు, దేవుని పరిశుద్ధమైన స్వరూపముల యొక్క పరిచర్య ద్వారా ఆయన రాజ్యమును భూమియందంతట స్థాపించి ఆయనను మహిమపరచుట ఆది నుండి చరిత్ర యొక్క లక్ష్యమైయుండెనని యేసు మరియు క్రొత్త నిబంధన రచయితలు కూడా నమ్మారు. క్రీస్తు యొక్క మొదటి రాకడలో దేవుడు చేసిన కార్యము దేవుని సార్వత్రిక రాజ్యము యొక్క అంతిమ ఘట్టమును ఆరంభించినదని వారు నిర్థారణకొచ్చారు, అనగా తుదకు, దేవుని అత్యంత పరిశుద్ధమైన స్వరూపమైన క్రీస్తు యొక్క రెండవ రాకడలో భూమియంతా దేవుని రాజ్యముగా పరివర్తన చెందుతుంది. ఈ నిరీక్షణ గూర్చి మనము ప్రకటన 11:15లో చదువుతాము.
ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను (ప్రకటన 11:15).
ఈ పాఠంలో మనము తరువాత చూడబోతున్నట్టు, దేవుని రాజ్య వేదాంతశాస్త్రము క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రములోని ప్రతి విషయమును పరిగణలోనికి తీసుకుంటుంది. క్రొత్త నిబంధన అంతటి యొక్క స్పష్టమైన వ్యవస్థను క్రీస్తు ద్వారా దేవుని రాజ్యము భూమి మీదికి దిగివచ్చుట అనే నిర్దేశనము క్రింద క్రోడీకరించవచ్చు.
కాబట్టి కార్య మరియు వాక్య ప్రత్యక్ష్యతల మీద దృష్టిపెట్టు విషయములోను, మరియు వేదాంతశాస్త్ర నిర్మాణములను గుర్తించు విషయములోను క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము పాత నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రమును పోలియున్నదని మనము చూడవచ్చు. ఈ పోలికలన్నిటి మధ్యలో కూడా ఒక ముఖ్యమైన భిన్నత్వమును గూర్చి మనము అవగాహన కలిగియుండాలి: క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలు భిన్నకాలిక పురోగమనములను ఉపయోగించిన విధానము.
మూడు విషయముల మీద దృష్టి నిలుపుట ద్వారా బైబిలానుసారమైన వేదాంతశాస్త్రములోని ఈ అంశమును మనము పరిగణిద్దాము. మొదటిగా, క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రము యొక్క భిన్నకాలిక స్వభావము; రెండవదిగా, క్రొత్త నిబంధనను భిన్నకాలికముగా అధ్యయనము చేయుటకు ఆటంకాలు; మరియు మూడవదిగా, భిన్నకాలిక విశ్లేషణకు బదులుగా క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఉద్ఘాటించిన నూతన దిశ. మొదటిగా క్రొత్త నిబంధనలోని వేదాంతశాస్త్ర పురోగమనముల యొక్క భిన్నకాలిక స్వభావమును చూద్దాము.
మునుపటి పాఠంలో, కాల క్రమములో పాత నిబంధన వేదాంతశాస్త్రము అభివృద్ధి చెందిన మార్గముల పట్ల ఎక్కువ ఆసక్తి చూపబడినది. చరిత్రలో ఏదో ఒక స్థాయిలో మాట్లాడు ద్వారా లేక కార్యము చేయుట ద్వారా దేవుడు తనను తాను బయలుపరచుకొనిన ప్రతిసారి, ఆయన నూతన ప్రత్యక్ష్యతలు అప్పటికే ఉనికిలో ఉండిన వేదాంతశాస్త్ర నిర్మాణములు పునరాకృతిపరచబడ్డాయి.
క్రొత్త నిబంధన చరిత్రలో కూడా ఇదే జరిగింది. క్రొత్త నిబంధన చరిత్ర ముందుకు కొనసాగగా, వేదాంతశాస్త్ర నిర్మాణములు భిన్నకాలిక మార్పులు చెందాయి. ఉదాహరణకు, పాత నిబంధన కాలము యొక్క అంతమునకు, ఇశ్రాయేలు చెరలో నుండి తిరిగివచ్చిన తరువాత ప్రవక్తల ద్వారా దేవుని వాక్యము దేవుని ఆశీర్వాదముల కొరకు ఎదురుచూసింది. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, చెరలో నుండి తిరిగివచ్చుటను గూర్చిన ఈ వేదాంతశాస్త్ర అంశములు క్రీస్తులో దేవుడు కుమ్మరించుట ఆరంభించిన ఆశీర్వాదములను అర్థము చేసుకొనుట వైపుకు మళ్లాయి. క్రీస్తు యొక్క భూలోక పరిచర్య ఆయన సిలువవేయబడుట ద్వారా నిత్య పాప క్షమాపణను గూర్చిన నిరీక్షణను మనకు అనుగ్రహించింది; ఆయన పునరుత్థానము పాత నిబంధన పునరుత్థాన నిరీక్షణకు జీవము పోసింది; మరియు ఆయన పరలోక ఆరోహణము పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన పరిశుద్ధాత్మ కుమ్మరింపును అనుగ్రహించింది. అంతేగాక, అపొస్తలులు క్రీస్తు కార్యమును కొనసాగించుచుండగా, చెర తరువాత అన్యజనులకు దేవుని కృపను చూపు పాత నిబంధన నిరీక్షణ సువార్త ప్రకటన ద్వారా వాస్తవమైయ్యింది. అవును, క్రీస్తు యొక్క మహిమకరమైన రాకడను గూర్చి క్రొత్త నిబంధన ప్రవచనాలు ఒక నూతన సృష్టిని గూర్చిన పాత నిబంధన నిరీక్షణలు క్రీస్తులో నెరవేరు దినము వైపుకు చూపాయి.
ఇలాంటి భిన్నకాలిక వేదాంతశాస్త్ర పురోగమనములు క్రొత్త నిబంధన కాలములో కనిపిస్తాయి, అయితే భిన్నకాలిక విశ్లేషణకు కలుగు మూడు ముఖ్యమైన ఆటంకములను క్రొత్త నిబంధన చరిత్ర తెలియజేస్తుంది. మొదటి స్థానములో, పాత నిబంధనతో పోలిస్తే, క్రొత్త నిబంధన చరిత్ర యొక్క కాల వ్యవధి చాలా తక్కువగా ఉంటుంది. పాత మరియు క్రొత్త నిబంధన చరిత్రల యొక్క కాల వ్యవధిని ఒక సారి పోల్చండి. ఆదికాండములోని మొదటి పదకొండు అధ్యాయముల యొక్క చరిత్రకు మునుపుటి కాలమును ప్రక్కనబెడితే, పాత నిబంధన చరిత్ర 1600 సంవత్సరాల కంటే ఎక్కువ కాల వ్యవధిలో అబ్రాహాము నివసించిన క్రీ.పూ. 2000 నుండి చివరి ప్రవక్త పరిచర్య చేసిన క్రీ.పూ. 400 వరకు వ్యాపించియున్నది. బదులుగా, క్రొత్త నిబంధన చరిత్ర చాలా చిన్నదిగా ఉన్నది. క్రొత్త నిబంధన చరిత్ర కేవలం 100 సంవత్సరాల కాలమునకు ప్రాతినిధ్యము వహిస్తుంది. చరిత్ర అంతటిలో అత్యంత ప్రాముఖ్యమైన భిన్నకాలిక పురోగమనమును — క్రీస్తు భూలోక పరిచర్య — క్రొత్త నిబంధన పరిచయం చేస్తున్నప్పటికీ, ఆ కాలవ్యవధిలోనే ముఖ్యమైన భిన్నకాలిక పురోగమనములను కలిగియుండునంత చరిత్రను అది కలిగిలేదు.
రెండవ స్థానములో, క్రొత్త నిబంధనలోని పలు పరిస్థితులు ఒకదానికొకటి పోలిక కలిగియున్నాయి. భిన్నముగా పాత నిబంధన దాని చరిత్రలో గొప్ప భిన్నత్వము కలిగిన పరిస్థితులను కలిగియున్నది. పితరుల కాలములో, దేవుని ప్రజలు కనానులో సంచార జాతులుగా ఉండేవారు. తరువాత వారు ఐగుప్తులో బానిసలుగా ఉండేవారు. తరువాత వారు మోషే నాయకత్వములో నూతన దేశమైయ్యారు. తరువాత, న్యాయాధిపతుల కాలములో వారు కనానును జయించారు. ఇశ్రాయేలు యొక్క ఆరంభ రాజరికము దేశమును సామ్రాజ్యవాద వైభవములోనికి నడిపినప్పుడు, మరియు తరువాత రాజులు, నాయకులు విధేయత మరియు తిరుగుబాటు మధ్య తేలియాడినప్పుడు వారి పరిస్థితులు మరలా మారాయి. దేవుడు వారిని చెరలోనికి పంపినప్పుడు వారి పరిస్థితి మరింత దిగజారింది. తరువాత చెరలో నుండి వాగ్దాన దేశములోనికి తిరిగివచ్చిన వారి ద్వారా దేవుడు రాజ్యమును పునరుద్ధరించినప్పుడు అది మరలా మెరుగుపడింది.
దేవుని ప్రజలు ఈ పరిస్థితులన్నిటిని ఎదుర్కొనగా, వారి పరిస్థితులకు అనుగుణంగా ఆయన వారి కొరకు కార్యములు చేశాడు మరియు మాట్లాడాడు, మరియు వారి అవసరతలను తీర్చాడు. ఇశ్రాయేలు యొక్క పరిస్థితులను భిన్నకాలికముగా తీర్చు ఈ విధానము పాత నిబంధన వేదాంతశాస్త్ర పురోగమనములలో గొప్ప విశేషతలను కలిగించింది.
అయితే పోల్చి చూస్తే, క్రొత్త నిబంధన చరిత్రలో దేవుని ప్రజల యొక్క పరిస్థితులు స్థిరముగానే ఉన్నాయి. స్పష్టముగా, పరిస్థితులు అదే విధముగా ఉండలేదు. యేసు, అపొస్తలులు, మరియు సంఘము వేర్వేరు పరిస్థితులలో వేర్వేరు రకముల ప్రజలతో వ్యవహరించారు, మరియు దేవుని ప్రత్యక్ష్యత ఆ భేదములకు స్థానం కల్పించింది. అయినను, ఈ చరిత్ర కాలమంతటిలో, పాత నిబంధన కాలములోని దేవుని ప్రజలు ఎదుర్కొనిన తీవ్రమైన మార్పులను ఆదిమ క్రైస్తవులు అనుభవించలేదు. క్రొత్త నిబంధనలో, క్రైస్తవులు తరచుగా వెలివేయబడ్డారు మరియు హింసించబడ్డారు. వారు గొప్ప ఐశ్వర్యము మరియు ఘోరమైన పేదరికము గల కాలములను అనుభవించలేదు. వారు ఒక స్థలము నుండి మరొక స్థలమునకు కలిసికట్టుగా ప్రయాణించలేదు. అలాగే వారు విస్తారమైన-పరిమాణములో విధేయత మరియు తిరుగుబాటును అనుభవించలేదు. ఫలితంగా, క్రొత్త నిబంధనలో నమోదు చేయబడిన దేవుని ప్రత్యక్ష్యతలు పాత నిబంధన ప్రత్యక్ష్యతలలో ఉన్న విభిన్నమైన పరిస్థితులకు స్థానం కల్పించలేకపోయాయి. మరియు ఈ స్థిరత్వము క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రములోని భిన్నకాలిక పురోగమనములకు తక్కువ ప్రాముఖ్యతను కల్పించింది.
మూడవ స్థానములో, పాత నిబంధనకు భిన్నముగా, క్రొత్త నిబంధన కేవలం ఒకే దైవిక నిబంధనను గూర్చి మాట్లాడుతుంది. మనము ఇంతకు ముందు చూసినట్లు, పాత నిబంధనలోని నిబంధనలు వేదాంతశాస్త్రములో ఒక ఉన్నతమైన యుగ మార్పిడులకు దారి తీసాయి. ఆదాము, నోవహు, అబ్రాహాము, మోషే మరియు దావీదులతో చేయబడిన నిబంధనలు ఒకదానితో ఒకటి భిన్నముగా ఉన్నాయి. ఫలితంగా, ఈ నిబంధనా యుగముల గుండా చరిత్ర ప్రయాణించినప్పుడు ప్రాముఖ్యమైన వేదాంతశాస్త్ర మార్పులు కలిగాయి.
భిన్నముగా, క్రొత్త నిబంధన ఒకే నిబంధనకు ప్రాతినిధ్యము వహిస్తుంది, అది క్రీస్తులో నూతన నిబంధన. క్రొత్త నిబంధన చరిత్ర క్రీస్తు యొక్క మొదటి రాకడ నుండి సంఘ చరిత్రలోనికి కొనసాగినప్పుడు ఈ నిబంధన విపులమగుట ఆరంభమైయ్యింది. మరియు ఈ చరిత్ర యొక్క సంపూర్ణ పరిమితి దేవుని ఉపకారము, మానవ రాజభక్తి, ఆశీర్వాదములు మరియు శాపములకు కలుగు పరిణామములను క్రియాశీలకముల ద్వారా గుర్తించబడింది. క్రొత్త నిబంధనలో విభిన్నమైన నిబంధనలు లేకపోవుట క్రొత్త నిబంధనలో భిన్నకాలిక పురోగమనముల యొక్క ప్రాముఖ్యతను కుదించింది.
క్రొత్త నిబంధన చరిత్రలోని భిన్నకాలిక మార్పులు పాత నిబంధనలోని మార్పులు అంత నాటకీయమైనవి కాదు కాబట్టి, క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలు తమ ఆసక్తిని ఒక నూతన దిశలోనికి మళ్లించారు. పలు చారిత్రిక కాలముల మీద దృష్టి ఉంచుటకు బదులుగా, క్రొత్త నిబంధన చరిత్ర అంతటిని ఒక సంపూర్ణతగా పరిగణించుట మొదలుపెట్టారు.
ఇప్పుడు, మనము ఇంతకు ముందు చెప్పినట్లే క్రొత్త నిబంధనలో భిన్నకాలిక పురోగమనములు ఉన్నాయి. యేసు యొక్క భూలోక పరిచర్య, సంఘ చరిత్ర మరియు క్రీస్తు యొక్క మహిమ రాకడల మధ్య ప్రాముఖ్యమైన మార్పులు జరిగాయి. అయినను, క్రొత్త నిబంధన ఈ పురోగమనములను ఒక సమగ్ర సంపూర్ణతగా, అనగా క్రీస్తు మరియు ఆయన కార్యము యొక్క ఏక చిత్రములోని భాగముగా పరిగణించినదని చెప్పుట సమంజసమే. ఉదాహరణకు, సువార్తలు యేసు యొక్క జీవితమును గూర్చి మాత్రమే మనకు తెలియపరచవుగాని, చాలా సార్లు సంఘము యొక్క కొనసాగుచున్న పరిచర్యను గురించి మరియు మహిమలో ఆయన రాకడను గూర్చి కూడా ప్రస్తావిస్తాయి. అపొస్తలుల కార్యములు మరియు పత్రికలు యేసు పరిచర్య తరువాత జరిగిన సన్నివేశములను గూర్చి మాత్రమే మాట్లాడవుగాని, యేసు జీవిత కాలము వైపుకు తిరిగి చూస్తూ ఆయన రాకడ కొరకు ఎదురుచూస్తాయి. ప్రకటన గ్రంథము యేసు యొక్క భవిష్యత్త్ రాకడను గూర్చి మాత్రమే మాట్లాడదు గాని, ఆయన ఆరోహణమైన తరువాత సంఘ చరిత్రను మరియు ఆయన జీవితమును తిరిగి చూస్తుంది.
క్రొత్త నిబంధన యొక్క క్లుప్త చరిత్ర, ఒకే రకమైన పరిస్థితులు, మరియు ఏక నిబంధన ద్వారా సృష్టించబడిన వేదాంతశాస్త్ర ఐక్యత ఒక స్పష్టమైన భిన్నకాలిక అధ్యయనము చేయుటను కష్టతరము చేస్తుంది. కాబట్టి, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు తమ ఆసక్తిని చాలా వరకు ఒక నూతన దిశ మీద పెట్టారు. దేవుని క్రొత్త నిబంధన కార్య మరియు వాక్య ప్రత్యక్షతల చరిత్రను చిన్న భాగములుగా విభజించుటకు బదులుగా, ఈ కాల వ్యావధికి పలువురు క్రొత్త నిబంధన రచయితలు ఇచ్చిన పలు దృక్కోణముల మీద వారు దృష్టి పెట్టారు.
వాస్తవానికి, ఈ కాలములోని చరిత్ర అంతటి మీద ఒక విభిన్నమైన వేదాంతశాస్త్ర విశ్లేషణను క్రొత్త నిబంధన మనకు అందిస్తుంది. ఉదాహరణకు, యేసు జీవితము యొక్క ఒక చరిత్ర నలుగురు సువార్త రచయితల ద్వారా నాలుగు వేర్వేరు మార్గములలో వర్ణించబడింది: మత్తయి, మార్కు, లూకా, మరియు యోహాను. సువార్త రచయితలు ఒకరినొకరు ఖండించనప్పటికీ, క్రీస్తు జీవితము యొక్క చారిత్రిక సన్నివేశముల మీద వారి పుస్తకములు విభిన్నమైన దృక్పథములను అందిస్తాయి. అవి నాలుగు వేర్వేరు వేదాంతశాస్త్ర దృక్కోణములకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇదే విషయమును అపొస్తలుల కార్యములను గూర్చి; పౌలు, పేతురు, యాకోబు, యోహాను మరియు యూదా వ్రాసిన పత్రికలను గూర్చి; హెబ్రీ పత్రిక మరియు ప్రకటన గ్రంథములను గూర్చి కూడా చెప్పవచ్చు. అవి క్రొత్త నిబంధన ప్రత్యక్ష్యత అంతటి మీద విభిన్నమైన వేదాంతశాస్త్ర దృక్కోణములను అందిస్తాయి. క్రొత్త నిబంధనలోని ఈ భాగములు ఒకదానినొకటి ఖండించవుగాని, అవి విభిన్నమైన వేదాంతశాస్త్ర పదములను, రకములను, మరియు ఉద్ఘాటనలను ప్రదర్శిస్తాయి.
ఈ కారణము చేత, క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలు తమ శాఖను ఎంతో ఫలబరితముగా కనిపించిన ఒక దిశలోనికి నడిపించారు. క్రీస్తు జీవితము మొదలుకొని ఆయన రాకడకు మధ్య ఉన్న చారిత్రిక కాలమునకు మధ్య ఉన్న భిన్నమైన వేదాందశాస్త్ర అవగాహనలను పలువురు క్రొత్త నిబంధన రచయితలు పోల్చారు. వారు ఇలాంటి ప్రశ్నలను అడుగుతారు: క్రొత్త నిబంధన చరిత్రలోని అద్భుత కార్యములను పౌలు ఎలా అనువదించాడు? లూకా మరియు యోహాను వాటిని ఎలా అనువదించారు? వారి మధ్య ఉన్న వ్యత్యాసములు ఏమిటి? వారు కలిగియుండిన ఏకాభిప్రాయములు ఏవి? ఈ దిశ క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలను అనేక ముఖ్యమైన మెళకువలలోనికి నడిపించింది.
క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ఆకృతులను గూర్చి ఇప్పుడు మనకు ఒక సామన్య అవగాహన వచ్చినది కాబట్టి, ఈ పాఠంలోని రెండవ ముఖ్య బిందువును మనము చూడవలసియున్నది, రాకడ శాస్త్రము అనగా కడవరి దినములను గూర్చిన బైబిలు బోధ యొక్క పురోగమనములు. మనము ముందు చూడబోవుతున్నట్టు, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రమును సమీపించిన మార్గములలో దీనియంత కేంద్రమైన అంశము మరొకటి లేదు. బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ఈ ఉద్ఘాటనను ఎందుకు కలిగియుండినదో అర్థము చేసుకొనుటకు, కడవరి దినములను గూర్చిన క్రొత్త నిబంధన దృక్పథములు మునుపటి ఆలోచనలలో నుండి ఎలా అభివృద్ధి చెందాయో మనము అర్థము చేసుకోవాలి.
మనము మూడు దిశలలో చూద్దాము. మొదటిగా, సాంప్రదాయిక రాకడ శాస్త్రము, అనగా క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము ఈ అంశమును సమీపించిన విధానములను పరిగణిస్తూ ఆరంభిద్దాము. రెండవదిగా, కడవరి దినములను గూర్చి పాత నిబంధన అభిప్రాయములు అభివృద్ధి చెందిన మార్గములను చూచుటకు పాత నిబంధన రాకడశాస్త్రమును పరిగణిద్దాము. మరియు మూడవదిగా, ఆదిమ క్రొత్త నిబంధన కాలములోని రాకడ శాస్త్ర దృక్పథములను పరిశీలిద్దాము. సాంప్రదాయిక క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములోని రాకడ శాస్త్రమును చూస్తూ ప్రారంభిద్దాము.
“ఎస్కటాలోజి” లేక రాకడ శాస్త్రము అనే పదము గ్రీకు విశేషణమైన ఎస్కటోస్ నుండి వెలువడుతుంది, దాని అర్థము “అంతిమ,” “చివరి” లేక “తుది.” ఈ పదము క్రొత్త నిబంధనలో సుమారుగా యాభై రెండు సార్లు మరియు పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదమైన సెప్టుజెంట్ లో అనేక సార్లు కనిపిస్తుంది. క్రొత్త నిబంధనలో, ఎస్కటోస్ అనే పదము “కడవరి దినములు,” “అంతిమ విషయములు” లేక “ఆఖరు ఘడియలు” అను మాటలను సంబోధించుటకు కనీసం పదిహేను సార్లు ఉపయోగించబడింది. కాబట్టి, రాకడశాస్త్రము అనేది వేదాంతశాస్త్ర సాంకేతిక పదమైయున్నది మరియు దీని అర్థము “కడవరి దినములు, అంతిమ విషయములు లేక ఆఖరు ఘడియలను గూర్చిన సిద్ధాంతము.”
శతాబ్దములుగా, రాకడ శాస్త్రము సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంతశాస్త్రములో ఒక ముఖ్యమైన విభాగముగా ఉండినది. క్రమబద్ధీకులు లేఖనము యొక్క బోధనలను ఐదు ముఖ్యమైన విభాగములలో చర్చించారు: దేవుని గూర్చిన వేదాంతశాస్త్రము, మానవ శాస్త్రము, రక్షణ శాస్త్రము, సంఘ శాస్త్రము మరియు చివరిగా రాకడ శాస్త్రము. రాకడ శాస్త్రము క్రీస్తు యొక్క రాకడకు సంబంధించిన విషయములను తెలియజేస్తూ ప్రాథమికముగా భవిష్యత్తు మీద దృష్టి పెట్టింది కాబట్టి, క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములో, అనేక ఒప్పుకోలులు మరియు విశ్వాస ప్రమాణములలో ఇది చివరి ముఖ్యమైన అంశముగా పరిగణించబడింది.
ఇప్పుడు, సంవత్సరములు తరబడి, అంత్య దినములను గూర్చిన కొన్ని అంశముల విషయములో బైబిలు స్పష్టత కలిగియున్నదని ఎక్కువ మంది క్రైస్తవులు గుర్తించారు. కొన్ని మౌలిక అంశములైన క్రీస్తు యొక్క మహిమకరమైన రాకడ, శరీర పునరుత్థానము, మరియు నశించినవారిని నిత్య శిక్షకు మరియు క్రీస్తులో ఉన్నవారికి నిత్యజీవమును అనుగ్రహించు అంతిమ తీర్పు వంటి వాటిని వారు హృదయపూర్వకముగా అంగీకరించారు. కాని ఈ మౌలిక బోధనలకు వెలుపల, రాకడ శాస్త్రమును గూర్చి వారి చేసిన సాంప్రదాయిక చర్చలు విశ్వాసుల మధ్య విభజనలను కలిగించాయి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో యోహాను ప్రవచించిన భూమి మీద క్రీస్తు యొక్క వెయ్యేళ్ళ పాలన మీద ఆధారపడియున్న మిలీనియం సమస్యను ఒక ఉదాహరణగా తీసుకోండి. శతాబ్దములుగా నిజాయితీగల విశ్వాసులు పలు రకములుగా దీనిని అనువదించారు: ఈ అధ్యాయము అక్షరాల వెయ్యేళ్ళ పాలనను గూర్చి మాట్లాడుతుందా? దీనికి ముందు కొన్ని గుర్తించదగిన చిహ్నములు కలుగుతాయా? అది ఇప్పటికే ఆరంభమైయ్యిందా? జ్ఞానము గల క్రీస్తు అనుచరులు ఈ ప్రశ్నకు అనేక విధాలుగా జవాబులు ఇచ్చారు. క్రీస్తు రాకడకి గల పలు ధోరణులను వారు అనుసరించారు ఎందుకంటే ఇట్టి అంశముల మీద బైబిలు బోధన సంపూర్ణ స్పష్టత కలిగినదిగా లేదు.
ఇట్టి పరిస్థితిలో క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము అంతగానో సహకరిస్తుంది. సాంప్రదాయిక వాదనలన్నిటిని పరిగణలోనికి తీసుకొని బైబిలానుసారమైన వేదాంతవేత్తలు రాకడ శాస్త్రమును సమీపించారు. రాకడ శాస్త్రము యొక్క సాంప్రదాయిక అవగాహనలకు వారు నూతన ప్రణాళికలను పరిచయం చేసి తాజా ఆలోచనలను వెలుగులోనికి తెచ్చారు. మరియు దీని ద్వారా పలు రాకడశాస్త్ర ధోరణులు కలిగియున్నవారంతా ఒక లోతైన ఐక్యతలోనికి వచ్చుటకు అవకాశం లభించింది.
సాంప్రదాయిక పద్ధతులను అధిగమించి అంత్య దినములను క్రొత్త నిబంధన వేదాంతవేత్తలు అర్థము చేసుకున్న విధానమును గ్రహించుటకు, పాత నిబంధన రాకడశాస్త్రము యొక్క నేపధ్యమును గూర్చిన అవగాహన మనకు కావాలి.
ఈ పాఠ్యక్రమమంతటిలో మనము చూచినట్లుగా, కార్య మరియు వాక్య ప్రత్యక్ష్యతల ద్వారా దేవుడు తన్నుతాను ప్రత్యక్షపరచుకొనినప్పుడు, వేదాంతశాస్త్రములో ఆయన అభివృద్ధులను కలుగజేశాడు. అంత్య దినములను గూర్చి బైబిలు బోధయైన రాకడ శాస్త్రము ఇట్టి భిన్నకాలిక పురోగమనములకు దూరముగా లేదు. ఇతర అంశముల వలెనె, అంత్య దినములను గూర్చి పాత నిబంధన బోధలు కూడా కాల క్రమములో అభివృద్ధి చెందాయి. పాత నిబంధనలోని ఈ భిన్నకాలిక పురోగమనములు క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలు క్రొత్త నిబంధనలో కనుగొన్న రాకడ శాస్త్ర విషయములకు మార్గమును సిద్ధపరచాయి.
ఈ భాగములో, ఈ పాఠ్య క్రమములో మనము అధ్యయనం చేసిన పాత నిబంధన ప్రధాన నిబంధనలతో పాటుగా రాకడ శాస్త్రము ఏ విధముగా అభివృద్ధి చెందుతుందో చూద్దాము. ఆదాముతో చేసిన నిబంధనతో ఆరంభించి, క్రమముగా నోవహు, అబ్రాహాము, మోషే మరియు దావీదుతో నిబంధనను చూద్దాము. ఈ దశలన్ని పాత నిబంధన రాకడ శాస్త్రము యొక్క ముఖ్య మూలకములకు తోడ్పాటునిచ్చాయి.
బైబిలు చరిత్ర ఆరంభములో, దేవుడు పాత నిబంధన రాకడ శాస్త్రము యొక్క రెండు క్లిష్టమైన మూలకములను ప్రత్యక్షపరచాడు. దీనిలో మొదటిది సృష్టిలో స్పష్టముగా కనిపిస్తుంది. మానవాళి దేవుని పోలికెలో సృజించబడ్డారు. మరియు ఆయన రాజులైన యాజక సమూహముగా, భూమిని నింపి దానిని లోపరచుకొనుటకు మనము పిలువబడితిమి. సృష్టి యొక్క ఈ కోణముల ద్వారా, చరిత్ర యెడల ఆయన లక్ష్యము భూమియంత ఆయన మహిమ తన ప్రజలతో ఉండు స్థలముగా ఉండాలని దేవుడు బయలుపరచాడు.
ఆదాము మరియు హవ్వల పాపము, మరియు వారిపైకి వచ్చిన శాపముతో, పాత నిబంధన రాకడ శాస్త్రము యొక్క రెండవ క్లిష్టమైన మూలకమును దేవుడు బయలుపరచాడు: ఇది మొదలుకొని ప్రపంచమును నియంత్రించుటకు రెండు సమూహాలు పోరాడుచున్నాయి. స్త్రీ సంతానము మరియు సర్ప సంతానము లోకమును నియంత్రించుటకు పోరాడుతాయి అని ఆదికాండము 3:15 చెబుతుంది. దేవునికి నమ్మకముగా ఉండువారు స్త్రీ సంతానములలో, మరియు సాతాను అడుగుజాడల్లో నడచువారు సర్ప సంతానము. కాలము పూర్తియ్యే వరకు, ఈ రెండు సమూహములు లోకమును నియంత్రించుటకు పోరాడతాయి. అయితే తుదకు జయము తనది మరియు నమ్మకమైన స్త్రీ సంతానముది అని దేవుడు వాగ్దానం చేశాడు.
ఆదాము కాలమందు పరిచయము చేయబడిన రెండు మూలకములను చూశాము గనుక, ఇప్పుడు నోవహు నిబంధనను చూద్దాము.
ఆదికాండము 7లో ప్రపంచవ్యాప్త జలప్రళయము తరువాత, దేవుడు నోవహుతో నిబంధన చేశాడు. ఈ నిబంధన ప్రకృతి యొక్క స్థిరత్వమును భద్రపరచెను గనుక ప్రపంచము యెడల దేవుని ప్రణాళికను మానవాళి అనుసరించుచుండగా నాశనమును గూర్చి కలతచెందవలసిన అవసరము లేదు. ఆదికాండము 8:22లో, “భూమి నిలిచియున్నంతవరకు” కాలములు, రాత్రింబగళ్లు ఉండక మానవు అని దేవుడు చెప్పాడు. ఈ వాగ్దానము ద్వారా, తమ కొరకు దేవుని లక్ష్యమును సాధించడానికి సహజ వాతావరణం అవసరము అని నమ్మకమైన ‘స్త్రీ సంతానముకు’ ఆయన ధృవీకరించాడు. పతనము ద్వారా నాశనము చేయబడిన నేల వారికి విరోధముగా ఉండదు. మరియు వాస్తవముగా, నోవహు నిబంధన ద్వారా ఇవ్వబడిన స్థిరత్వం చరిత్ర యొక్క లక్ష్యము చేరుకొనే వరకు కొనసాగుతుంది. ఈ సమయములో, ప్రకృతితో ఒక నూతన నిబంధన ఏర్పాటు చేయబడుతుంది.
ఆదాము మరియు నోవహుతో చేయబడిన సార్వత్రిక నిబంధన కాలములో ఇవ్వబడిన చరిత్ర ముగింపు యొక్క ప్రాథమిక దర్శనమును చూచాము గనుక అబ్రాహాము, దేవుడు జాతీయ నిబంధన చేసిన మొదటి వ్యక్తి, కాలములో జరిగిన పాత నిబంధన రాకడ శాస్త్రము యొక్క ప్రధాన భిన్నకాలిక పురోగమనముల అభివృద్ధిని ఇప్పుడు చూద్దాము.
దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన ఆదికాండము 15 మరియు 17లో నమోదు చేయబడింది. అయితే ఆ నిబంధన యొక్క అంశము మాత్రం ఆదికాండము 12:1-3లోనే పరిచయం చేయబడింది. ఆ వచనాలలో, ఆదాము మరియు నోవహుకు ఇవ్వబడిన వాగ్దానములను కొనసాగించుటకు భూలోక కుటుంబములన్నిటిలో నుండి దేవుడు అబ్రాహామును ప్రత్యేకపరచాడు. అబ్రాహాము మరియు ఆయన కుటుంబముకు ఇవ్వబడిన ఆశీర్వాదములు వారి ద్వారా ప్రజలందరికి అందించబడాలి. వాస్తవానికి, ఏదెను తోటలో ఆదాము హవ్వలకు ఇవ్వబడిన పిలుపును నెరవేర్చుటలో, చిన్న శ్రేణిలో, దేవుడు ఇశ్రాయేలుకు విజయము వాగ్దానం చేశాడు. అందువలన, పాత నిబంధన యొక్క రాకడ శాస్త్రము అబ్రాహాము మరియు ఆయన కుటుంబము పైనే దృష్టి పెడుతుంది. చరిత్ర యొక్క తుది లక్ష్యము వారి ద్వారా ప్రపంచమంతటికీ తీసుకురాబడుతుంది.
ఇప్పుడు మనము దేవుడు ఇశ్రాయేలుతో చేసిన రెండవ నిబంధన, మోషేతో చేసిన నిబంధనను చూచుటకు సిద్ధముగా ఉన్నాము. మోషే కాలములో, పాత నిబంధన రాకడ శాస్త్రము మరింత అభివృద్ధి చెందినది. మోషే నిబంధన ఆధీనములోని రాకడ శాస్త్రము యొక్క భిన్నకాలిక పురోగమన అభివృద్ధులు సంక్లిష్టమైనవి. కాబట్టి, వాటిని రెండు మెట్లలో పరిశీలిద్దాము: మొదట, చెర శాపము; మరియు రెండవది, చెర నుండి విమోచన ఆశీర్వాదము.
మనము చూచినట్లుగా, మోషే నిబంధన ఆయన రాజ్యమును ప్రపంచమంతటా వ్యాప్తిచేయుటలోగల ఇశ్రాయేలు పరిచర్యకు దిక్సూచియైన దేవుని ధర్మశాస్త్రముపై దృషి పెట్టింది. ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రముకు విధేయులైతే ఆశీర్వాదములు పొందుతారని, వారు మోషే ధర్మశాస్త్రముకు లోబడకపోతే అనేక శాపములు పొందుతారనే బెదిరింపులకు లోనైయ్యారు. వాస్తవానికి, రాబోవు ఇశ్రాయేలు తరమువారు దేవుని మార్గముల నుండి తప్పిపోతారని మోషే అనేక వాక్యభాగములలో భావించాడు. అవిధేయతవలన కలుగు అనేక పర్యవసానములను గూర్చి ఆయన వారిని హెచ్చరించాడు, కాని దేవుని ధర్మశాస్త్రమును ఘోరముగా ఉల్లంఘించుట కొనసాగిస్తే, వాగ్దాన దేశము నుండి చెరలోకి పంపిస్తానని హెచ్చరించాడు. ద్వితీయోపదేశకాండము 4:27-28లో మోషే దీనిని గూర్చి ఎలా వ్రాశాడో వినండి:
మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును; యెహోవా ఎక్కడికి మిమ్మును తొలివేయునో అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలియుందురు. అక్కడ మీరు మనుష్యుల చేతి పనియైన కర్ర రాతి దేవతలను పూజించెదరు; అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు (ద్వితీ 4:27-28).
ఇశ్రాయేలు యొక్క చెర కేవలము ఇశ్రాయేలీయులకు మాత్రమే కాదుగాని సమస్త మానవాళికి కూడా భయంకరమైన దృశ్యమే. అబ్రాహాము కాలమునుండి కూడా చరిత్ర పట్ల దేవుని లక్ష్యము ఇశ్రాయేలు ద్వారానే నెరవేరుతుందనే విషయమును గమనించండి. చెర అనేది ఇశ్రాయేలీయుల సంఖ్యను గొప్పగా తగ్గిస్తుంది మరియు వారిని దేశము నుండి తీసివేస్తుంది, గనుక అబ్రాహముతో చేయబడిన వాగ్దానమును మరియు ఆదాము హవ్వల పిలుపును నెరవేర్చుటకు మరింత కష్టతరం చేస్తుంది.
చెరను గూర్చి అభావార్థకమైన భావనలు మనస్సులో ఉంచుకొని, దేవుడు మోషే ద్వారా వాగ్దానం చేసిన విమోచన అంశమును చూద్దాము. సంతోషంగా, ఇశ్రాయేలు రాబోయే చెర ఉన్నప్పటికీ కూడా, ఇశ్రాయేలును ఆయన ప్రత్యేక జనాంగముగా దేవుడు కలిగియుంటాడని మోషే స్పష్టం చేశాడు. ద్వితీయోపదేశకాండము 4:30-31లో, ఇశ్రాయేలు దాని పాపములను బట్టి పశ్చాత్తాపపడి విధేయతతో దేవుని వైపు తిరిగిన యెడల, ఆయన వారి మొర ఆలకించి దేశముకు తిరిగి తెస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దీని కంటే కూడా, ద్వితీయోపదేశకాండము 30:5లో ఈ విమోచనలో మునపటి కంటే మరింత ఎక్కువగా మరియు అధికముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.
ఈ ఇశ్రాయేలు మారుమనస్సు మరియు వాగ్దాన భూమిలో చేరుట మోషే రాకడ శాస్త్రము యొక్క మూల లక్షణమైయున్నది. రోమా. 4:15లో ఆయన చెప్పిన మాటలను వినండి:
ఈ సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినిన యెడల (ద్వితీ 4:30).
మోషే “అంత్యదినములలో” అని అనువదించబడిన అంత్యప్రత్యయమును ఉపయోగించాడు గనుక ఇక్కడ మోషే ప్రకటన పాత నిబంధన రాకడ శాస్త్రము యొక్క భిన్నకాలిక పురోగమన అభివృద్ధికి సంక్లిష్టమైనది. ఈ పదసముహము సెప్టుజెంట్ లో, అనగా పాత నిబంధన గ్రీకు అనువాదములో, ఎస్కటోస్ అను పదము ద్వారా అనువదించబడింది మరియు ఇది చెర నుండి ఇశ్రాయేలు యొక్క మహిమకరమైన విమోచన కాలమును సూచిస్తుంది. మోషే ఇక్కడ ఉపయోగించిన పదములు పాత నిబంధన ప్రవక్తలు మరియు క్రొత్త నిబంధన రచయితలు లోక చరిత్ర యొక్క అంతిమ ఘడియలను వర్ణించుటకు ఉపయోగించిన “అంత్య దినములు,” “తుది దినములు,” లేక “ఎస్కటోన్” అనే పదములకు ఆధారమయ్యాయి. ఇది మొదలుకొని, చెర నుండి ఇశ్రాయేలు యొక్క విమోచన రాకడ శాస్త్రముని గూర్చిన బైబిలు బోధనలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
ఇప్పుడు మనము దావీదు నిబంధన కాలములో చోటు చేసుకున్న రాకడ శాస్త్రము అభివృద్ధులను పరిశీలన చేయుటకు సిద్ధముగా ఉన్నాము. ఈ కాలములోని అభివృద్ధులు కూడా సాపేక్షంగా క్లిష్టమైనవే. కాబట్టి మనము వాటిని మూడు దశలో విశదీకరించుదము: మొదట, సమైక్య రాజ్య కాలము; రెండవది, ఇశ్రాయేలు యొక్క ఆరంభ ప్రవక్తల కాలము; మరియు మూడవది, ఇశ్రాయేలు యొక్క చివరి ప్రవక్తల కాలము. ఇశ్రాయేలు యొక్క సమైక్య రాజ్య కాలములో దేవుని ప్రత్యక్షతలు రాకడ శాస్త్రముని ఏ విధముగా రూపాంతరపరచాయో చూద్దాము.
ఈ పాఠ్యక్రమములో మనము చూచినట్లుగా, దావీదుతో దేవుడు చేసిన నిబంధన ప్రత్యేకముగా ఇశ్రాయేలు శాశ్వత సామ్రాజ్యముగా దావీదు కుటుంబ నియామకముపై దృష్టిపెడుతుంది. ఈ నిబంధనలో, దావీదు వారసులు మరియు దేవాలయముతో పాటుగా యెరూషలేము ఇశ్రాయేలు వేదాంతశాస్త్రమంతటిలో, అంత్యదినములను గూర్చిన ఆలోచనతో సహా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మొదలుకొని, చరిత్ర యొక్క ముగింపు అనేది యెరూషలేములో దావీదు రాజ గృహము యొక్క విజయవంతమైన పరిపాలనతో ముడిపెట్టబడింది. వాస్తవానికి కీర్తనలు 72:8-11లో దావీదు వారసుడు భూమియంతటినీ రాజ్యము చేస్తాడని మనము కనుగొంటాము.
సముద్రము నుండి సముద్రము వరకు నది మొదలుకొని భూదిగంతములవరకు అతడు రాజ్యము చేస్తాడు. అరణ్య వాసులు అతనికి లోబడుదురు అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు; షేబ రాజులును సెబా రాజులును కానుకలు తీసుకొని వచ్చెదరు. రాజులందరు అతనికి నమస్కారము చేసెదరు అన్య జనులందరు అతని సేవించెదరు (కీర్తనలు 72:8-11).
మరియు భవిష్యత్తును గూర్చిన ఈ దర్శనము కీర్తనలు 72:17-19లో విస్తరించబడింది.
అతని పేరు నిత్యము నిలుచును అతని నామము సూర్యుడున్నంతకాలము చిగుర్చుచుండును అతనినిబట్టి మనుష్యులు దీవింపబడుదురు అన్యజనులందరును అతడు ధన్యుడని చెప్పుకొందురు. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడును గాక సర్వభూమియు ఆయన మహిమతో నిండియుండును గాక. ఆమేన్, ఆమేన్ (కీర్తనలు 72:17-19).
ఇది మొదలుకొని, చరిత్ర యొక్క ముగింపు అనేది యెరూషలేము నుండి లోకమంతటిపైన దావీదు రాజ గృహము యొక్క విజయవంతమైన పరిపాలనతో ముడిపెట్టబడింది.
ఇప్పుడు మనము ఇశ్రాయేలు ప్రవక్తల ఆరంభ మాటలను చూద్దాము ఇశ్రాయేలు యొక్క ఆరంభ ప్రవక్తలు మోషే నిబంధన యొక్క క్రియాశీలకములను దావీదు రాజ నిబంధనకు అనువర్తించారు. దావీదు గృహ షరతులు అంత్యదినములకు ఏ విధముగా వర్తిస్తాయో వారు వివరించారు. ఆయన ధర్మశాస్త్రమును ఘోరముగా ఉల్లంఘిస్తే దేవుడు భరించడని, మరియు దేవుడు రాజ్యమంతటిని చెరలో వేస్తాడని ఆరంభ ప్రవక్తలు దావీదు యొక్క అపనమ్మకమైన కుమారులకు హెచ్చరించారు. క్రీ.పూ. 587 లేదా 586లో బబులోనీయుల చేతిలో యెరూషలేము పతనమైనప్పుడు ఇవి నెరవేర్చబడ్డాయి.
ఆయనను, నిరీక్షణ అంతా నశించిపోలేదని ఇశ్రాయేలుకు ధృవీకరించుటకు, అంత్య దినముల అద్భుతాలు మరియు ఇశ్రాయేలు యొక్క చెర విమోచనకు మధ్య మోషే సంబంధమును ఆరంభ ప్రవక్తలు జ్ఞాపకము చేసుకున్నారు. చెర విమోచనలో, దావీదు యొక్క గొప్ప కుమారుడురు, తన రాజధాని నగరమైన యెరూషలేములో, నూతన క్రమముకు కేంద్ర బిందువుగా ఉంటాడని ప్రవక్తలు ప్రకటించారు. ప్రవక్తయైన ఆమోసు, ఆమోసు 9:11-12లో దీనిని ఎలా వ్రాశాడో వినండి:
పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును న నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపు రీతిగా దానిని మరల కట్టుదును (ఆమోసు 9:11-12).
ఇవే వరుసలతో పాటుగా యెషయా ఈ మాటలను యెషయా 2:2లో వ్రాశాడు:
అంత్యదినములలో పర్వతములపైన యెహోవా మందిరము పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండలకంటే ఎత్తుగా ఎత్తబడును (యెష. 2:2).
ప్రపంచ దేశములన్నియు యెహోవా నామమును ఎరుగునట్లు దావీదు గుడారము “ఎత్తబడుతుంది” అని ఆమోసు ప్రకటించాడు, మరియు యెషయా “అంత్య దినములలో,” లేక చెర తరువాత, యెరూషలేము భూమియందంతట గొప్ప నగరమవుతుంది అని సర్వలోక నివాసులు రక్షణ నిమిత్తము దానిలోనికి వస్తారని తెలియజేశాడు. చెర తరువాత దావీదు కుటుంబము యొక్క మహిమ మరియు యెరూషలేము మీద అంత ఉన్నతమైన నిరీక్షణను ఉండినది కాబట్టి, ఇశ్రాయేలు యొక్క చెర కాలము కేవలం డెబ్బై సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అని యిర్మీయా ప్రవచించుట ఆశ్చర్యం కలిగించుట లేదు. యిర్మీయా 25:11 మరియు 29:10లో, డెబ్బై యేండ్ల చెరను గూర్చి ప్రవక్త మాట్లాడాడు — ఇది పురాతన లోకములో దేవుని తీర్పును గూర్చి మాట్లాడు ఒక సాధారణ విధానము. అంత్య దినములలో, దేవుని ప్రజలు చెర నుండి తిరిగివచ్చినప్పుడు, దావీదు గృహమునకు మరియు యెరూషలేముకు ప్రపంచవ్యాప్తముగా మహిమ కలుగుతుంది అని యిర్మీయా మరియు ఇతర మునుపటి ప్రవక్తలు తరచుగా ప్రకటించారు.
ఇశ్రాయేలు మునుపటి ప్రవక్తల యొక్క పరిచర్యల మీద నిర్మిస్తు, దేవుడు తన తదుపరి ప్రవక్తల ద్వారా రాకడ శాస్త్రములో మరి ఎక్కువ భిన్నకాలిక పురోగమనములను బయలుపరచాడు. చరిత్రలో దేవుని యొక్క పాలుపంపులు అంత్య దినములను గూర్చిన పాత నిబంధన ఆలోచనలో కనీసం రెండు ముఖ్యమైన మార్పులను కలిగించింది. ఒక వైపున, చెరలో ఉన్న ఇశ్రాయేలీయులు తమ పాపములను ఒప్పుకోలేదు కాబట్టి చెర కాలము పొడిగించబడింది. దానియేలు 9లో, చెర కాలములో డెబ్బై సంవత్సరముల చెరను గూర్చి యిర్మీయా ప్రవచనములను తాను చదివాడని, కాని చెరలో ఉన్న ఇశ్రాయేలీయులు తమ పాపములను ఇంకా ఒప్పుకోలేదని దానియేలు నివేదించాడు. అయినను, ఇశ్రాయేలును తమ దేశమునకు తిరిగి పంపి యెరూషలేమును కట్టమని అతడు దేవుని అడిగాడు. దానియేలు 9లో మనము తరువాత చదువుచున్నట్లు, గబ్రియేలు దూత దేవుని జవాబును దానియేలుకు అందించాడు. యిర్మీయా ప్రవచించిన కాలములో ఇశ్రాయేలు యొక్క చెర ముగియలేదు. దేవుని ప్రజలు పశ్చాత్తాపపడుటకు విఫలమైనందున, ఈ చెర ఏడు మార్లు పెరిగి డెబ్బై వారముల వత్సరములకు పొడిగింపబడింది. లేవీయకాండము 26లోనే దేవుడు స్థాపించినట్లు, కొనసాగు పాపములను ఆయన ఏడు రెట్లు ఎక్కువగా శిక్షిస్తాడు. సులువుగా చెబుతే, ఇశ్రాయేలు యొక్క మహిమకరమైన పునరుద్ధరణను దేవుడు సుమారుగా 490 సంవత్సరాలకు పొడిగించాడని దానియేలు నేర్చుకున్నాడు.
మరొక వైపు, తమ చెర కాలమును కుదించుకునే అవకాశము ఇచ్చి ఆయన ప్రజలకు దేవుడు గొప్ప కరుణను చూపాడని తరువాత ప్రవక్తలు బయలుపరచారు. క్రీ.శ. 539లో, యిర్మీయా ద్వారా దేవుడు తన మాటను అద్భుతముగా నెరవేర్చాడు. యెరూషలేములో దేవాలయమును పునఃనిర్మించుటకు ఇశ్రాయేలును విడిపించునట్లు పారశీక రాజుయైన కోరేషును దేవుడు పురికొల్పాడు. ఈ సమయములో కొంత మంది ఇశ్రాయేలీయులు దావీదు సంతతివాడైన జెరుబ్బాబెలు నాయకత్వములో వాగ్దాన దేశమునకు తిరిగివచ్చారు.
ప్రవక్తలైన హగ్గయి, జెకర్యా మరియు దినవృత్తాంతముల రచయిత దేవుని ఆశీర్వాదములతో ముందుకు కొనసాగి యెరూషలేమును పునర్నిర్మించమని తిరిగివచ్చిన శేషమును పురికొల్పారు. కాని దుఖకరముగా, ఎజ్రా మరియు నెహెమ్యా కాలానికి పునరుద్ధరించబడిన సమాజము మరొకసారి దేవుని ధర్మశాస్త్రమును తృణీకరించింది. కాబట్టి, ఇంతకు ముందు దానియేలు నేర్చుకున్న విధముగానే ఇశ్రాయేలు యొక్క మహిమకరమైన రాకడశాస్త్ర నిరీక్షణల యొక్క ఆరంభము రానున్న భవిష్యత్తులోని వాయిదా వేయబడినదని మలాకీ ప్రవక్త ప్రకటించాడు. పాత నిబంధన ఈ రానున్న కాలము యొక్క దుఖకరమైన వాయిదాతో ముగుస్తుంది.
కాబట్టి పాత నిబంధన రాకడ శాస్త్రము భిన్నకాలికముగా అభివృద్ధి చెందినదని మనము చూస్తాము. ఆదాము కాలములో ఇది సూక్ష్మముగా ఆరంభమైయ్యి నోవహు దినములకు వృద్ధి చేయబడినది. అబ్రాహాము కాలములో, లోకమునకు ఇశ్రాయేలు ఇవ్వబోవు ఆశీర్వాదము ద్వారా దేవుడు చరిత్రను ఒక ముగింపులోనికి తీసుకొనువచ్చు విధముగా ఇది రూపొందించబడింది. మోషే ఈ నిరీక్షణను చెరలో నుండి ఇశ్రాయేలు యొక్క మహిమకరమైన రాకతో ముడిపెట్టాడు. దావీదుతో చేయబడిన నిబంధన చెర తరువాత వచ్చు మహిమకరమైన అంత్య దినములకు అతని సింహాసనమును మరియు యెరూషలేమును కేంద్రముగా ఉంచింది. బబులోను నుండి కొంత మంది ఇశ్రాయేలీయులు వాగ్దాన భూమికి తిరిగివచ్చినప్పుడు కొంత నిరీక్షణ కనిపించినప్పటికీ, ఇశ్రాయేలు తరచుగా తిరిగుబాటు చేయుట ద్వారా ఎస్కటోన్ యొక్క నిరీక్షణ రానున్న భవిష్యత్తుకు వాయిదా వేయబడింది.
పాత నిబంధనలో రాకడ శాస్త్రము యొక్క భిన్నకాలిక పురోగమనములను మనస్సులో ఉంచుకొని, అంత్య దినముల సిద్ధాంతము క్రొత్త నిబంధన కాలములో మరింతగా ఎలా అభివృద్ధి చెందినదో చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.
మనము రెండు విషయములను చూద్దాము: మొదటిగా, ఎక్కువ మంది మొదటి శతాబ్దపు యూదులు కలిగియుండిన అంత్య దినముల దృక్పథములు; మరియు రెండవదిగా, బాప్తిస్మమిచ్చు యోహాను మరియు యేసు యొక్క పరిచర్యలలో రాకడ శాస్త్రము నాటకీయముగా సవరించబడుట.
మొదటి శతాబ్దములో పాలస్తీనాలో నివసించిన యూదులలో ఎక్కువ శాతము పాత నిబంధనను ప్రతిబింబించు అంత్య దినముల అభిప్రాయములను కలిగియుండేవారు. దానియేలు ప్రవక్త ప్రవచించినట్లు, కొన్ని శతాబ్దముల పాటు ఇశ్రాయేలు అన్యజనుల క్రింద బానిసత్వమును అనుభవించింది. బబులోనీయులు, మాదీయులు మరియు పారశీకులు, గ్రేకులు మరియు చివరికి రోమీయులు ఇశ్రాయేలు యొక్క చెరను కొన్ని వందల సంవత్సరాల పాటు పొడిగించారు.
ఈ శతాబ్దములు అంతటిలో, అంత్య దినములలో పునరుద్ధరణ మరియు ఇశ్రాయేలు మహిమపరచబడు పాత నిబంధన నిరీక్షణల యొక్క నెరవేర్పు కొరకు నమ్మకమైన యూదులు ఎదురుచూశారు. అనేకమంది రబ్బీలు ఈ నిరీక్షణను చరిత్ర యొక్క రెండింతల అభిప్రాయములో వ్యక్తపరచారు. ఒక వైపున, ప్రస్తుత పరిస్థితులను వారు “ఈ యుగము” అని సంబోధించారు. ఈ యుగము ఇశ్రాయేలు చరిత్రలోని ఒడుదిడుకులలో కొనసాగి, యెరూషలేము పతనము మరియు ఇశ్రాయేలు యొక్క సుదీర్ఘ చెరలో అట్టడుగుస్థాయికి చేరింది. మంచిని చెడు జయించిన కారణముగా ఈ యుగమును వారు ఎక్కువగా విషాదకరమైన మాటలతో సంబోధించారు. అది వైఫల్యము, దుఖము మరియు మరణ కాలము.
మరొక వైపు, అనేకమంది రబ్బీలు చరిత్రలోని రెండవ కాలమును గూర్చి, అనగా ఇశ్రాయేలు యొక్క రానున్న మహిమ కాలమును గూర్చి మాట్లాడారు. వారు ఈ భవిష్యత్తు కాలమును “రానున్న యుగము” అని పిలచారు. చరిత్రలో ఈ కాలము ఇశ్రాయేలు ఆశీర్వాదములకు అంతము లేని యుగముగాను దుష్టత్వము మీద విజయము కలుగు కాలముగాను ఉంటుంది. ఆ కాలములో, దేవుడు చెదరిపోయిన తన ప్రజలను సమకూర్చి, ఇశ్రాయేలులోని అవిశ్వాసులకు తీర్పు తీర్చి, దేశములలోని దుష్టులకు తీర్పుతీర్చి, యెరూషలేమును దాని రాజును మహిమపరచి, అబ్రాహాము ఆశీర్వాదములను భూదిగంతముల వరకు వ్యాపింపజేస్తాడు.
యేసు జీవితము కాలమునకు ముందు దశాబ్దములలో మరియు ఆయన జీవిత కాలములో, పాలస్తీనాలోని యూదుల మధ్య అనేక మత శాఖలు ఉండేవి. ఈ యుగము నుండి రానున్న యుగముకు మార్పు ఎలా కలుగుతుంది అనే విషయము మీద ఈ శాఖలు పలు అభిప్రాయములను కలిగియుండేవారు. ఒక ఆకస్మిక, భయానకమైన దేవుని కార్యము ద్వారా ఎస్కటోన్ కలుగుతుంది అని అంత్య దినముల గుంపులు నమ్మాయి. రోమా నాయకులకు విరోధముగా యూదులు ఒక సైన్యమును తయారు చేసినప్పుడు దేవుని మద్దతు వారికి తోడవ్వగా రానున్న యుగము వస్తుందని జిలేతులు అని పిలువబడు ఇతర గుంపులు నమ్మారు. పరిసయ్యులు మరియు సద్దూకయ్యుల వంటి నామిస్ట్ అభిప్రాయము కలిగినవారు, ఇశ్రాయేలు మోషే ధర్మశాస్త్రమునకు నమ్మకముగా ఉంటేనే అంత్య దినములు వస్తాయని బోధించారు.
ఈ యుగము రానున్న యుగములోనికి మారుటను గూర్చి అనేక అసమ్మతులు ఉన్నప్పటికీ, ఏదో ఒక విధముగా పథ నిబంధనలో వాగ్దానము చేయబడిన దావీదు గొప్ప కుమారుడైన మెస్సీయ యొక్క రాకతో అది జరుగుతుంది అని ఎక్కువ మంది యూదులు నమ్మారు. మెస్సీయ ప్రపంచ చరిత్రలో ఒక నిర్ణయాత్మకమైన మలుపును తీసుకువస్తాడు, అది చీకటిలో ఉన్న లోకమును వెలుగులోనికి, అపజయములో ఉన్న లోకమును జయములోనికి, దుష్టత్వముతో ఉన్న లోకమును నీతిలోనికి, మరణములో ఉన్న లోకమును జీవములోనికి నడిపించు అంతిమ మలుపుగా ఉంటుంది.
మొదటి శతాబ్దపు యూదులు కలిగియుండిన ఆలోచనలు పాత నిబంధన బోధలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, రాకడ శాస్త్రములోని ముఖ్యమైన భిన్నకాలిక పురోగమనములు బాప్తిస్మమిచ్చు యోహాను మరియు యేసు పరిచర్యలలో కలిగిన దైవిక ప్రత్యక్షత ద్వారా కలిగాయి.
అంత్య దినములలో దేవుని రాజ్యము సమీపించియున్నదని బాప్తిస్మమిచ్చు యోహాను మరియు యేసు ఇరువురు ప్రకటించారు. మార్కు 1:15లో ఈ ప్రకటన వివరించబడిన విధానమును వినండి:
కాలము సంపూర్ణమైయున్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి (మార్కు 1:15).
“దేవుని రాజ్యము” అనే పదము పాతనిబంధనలో కనిపించదు, కాని ఈ రాజ్యమును గూర్చిన ప్రకటన దేవుని పరిపాలన మరియు మోషేయు ఇతర ప్రవక్తలును “అంత్య దినములు,” లేక ఇశ్రాయేలు చెర యొక్క ముగింపు అని పిలచినదాని మధ్య జరిగిన సంధిలో నుండి బయలువచ్చింది. చెర తరువాత దేవుని పరిపాలనను యెషయా 52:7-10లో యెషయా సంబోధించిన విధానమును వినండి:
“నీ దేవుడు ఏలుచున్నాడు!” ఆలకించుము! నీ కావలివారు పలుకుచున్నారు కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సీయోనును మరల రప్పించగా వారు కన్నులార చూచుచున్నారు. . . . సమస్తజనముల కన్నులయెదుట యెహోవా తన పరిశుద్ధబాహువును బయలుపరచియున్నాడు. భూదిగంత నివాసులందరు మన దేవుని రక్షణ చూచెదరు (యెషయా 52:7-10).
చెరలో నుండి తిరిగి వచ్చుటను దేవుడు ప్రజలను యెరూషలేమునకు తిరిగి రప్పించునట్లుగా యెషయా వివరించాడు. “నీ దేవుడు ఏలుచున్నాడు!” అను సువార్త శిధిలావస్థలో ఉన్న యెరూషలేముకు ప్రకటించబడింది. ఫలితంగా, అంత్య దినములలో దేవుడు ఆయన ప్రజలను తిరిగి తీసుకువచ్చినప్పుడు, సమస్త దేశముల మీదను వారి విగ్రహముల మీదను దేవుడు రాజ్యము చేయుచున్నాడని ఆయన చూపుతాడని యెషయా ప్రకటించాడు.
ఒక విధముగా, అంత్య దినములను గూర్చి బాప్తిస్మమిచ్చు యోహాను తన కాలములో నివసించిన యూదులు కలిగియుండిన ఆలోచనలనే కలిగియున్నాడు. చరిత్ర యొక్క అంతిమ భాగము అనగా భూమి మీద దేవుని రాజ్యము, పాపులకు తీర్పు తీర్చి పశ్చాత్తాపపడిన దేవుని ప్రజల మీద దీవెనల వర్షము కుమ్మరించి మెస్సీయ చురుకుగా మరియు నిర్ణయాత్మకముగా కార్యము చేయుట ద్వారా వస్తుంది అని అతడు నమ్మాడు. లూకా 3:9 అతడు ప్రకటించిన మాటలను వినండి:
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను (లూకా 3:9).
దేవుని రాజ్యము యొక్క రాకడను దేవుని ప్రజల కొరకు ఆశీర్వాదములను తెచ్చు విధముగా మాత్రమే గాక దేవుని శత్రువుల మీద తీర్పును తెచ్చు విధముగా కూడా బాప్తిస్మమిచ్చు యోహాను అనుబంధపరచాడు.
ఆ విధముగా, అంత్య దినములను గూర్చి బాప్తిస్మమిచ్చు యోహాను కలిగియుండిన అభిప్రాయములు ఒక ప్రాముఖ్యమైన పురోగమనమునకు ప్రాతినిథ్యం వహిస్తున్నాయి. యేసును మెస్సీయగాను, అంత్య దినములలో దేవుని రాజ్యమును తెచ్చు దావీదు యొక్క గొప్ప కుమారునిగాను గుర్తించుట ద్వారా తన యూదా సమకాలీనులను అతడు అధిగమించాడు. అయితే బాప్తిస్మమిచ్చు యోహానుకు ఒక సమస్య ఎదురైయ్యింది. యేసు యొక్క పరిచర్యలో తీర్పు మరియు ఆశీర్వాదములు సంపూర్ణంగా కనిపించకపోయేసరికి, యేసు నిజముగా మెస్సీయయేనా అని యోహాను ఆశ్చర్యపోయాడు. బాప్తిస్మమిచ్చు యోహాను తన ఇద్దరు శిష్యులను యేసు యొద్దకు పంపి ఒక ప్రశ్నను అడగమని చెప్పిన సందర్భమును లూకా 7:20లో మనము చదువుతాము.
రాబోవువాడవు నీవేనా? లేక మరియొకనికొరకు మేము కనిపెట్టవలెనా? అని అడుగుటకు బాప్తిస్మమిచ్చు యోహాను మమ్మును నీయొద్దకు పంపెనని చెప్పిరి (లూకా 7:20).
యోహాను ఈ ప్రశ్నను అడుగుట ఆశ్చర్యము కలిగించదు. పాత నిబంధన, మొదటి శతాబ్దపు యూదులు మరియు యోహాను స్వయంగా మెస్సీయను గూర్చి ప్రకటించినవన్నియు యేసు చేయలేదు.
ఇప్పుడు లూకా 7:22-23లో యేసు బాప్తిస్మమిచ్చు యోహానుకు స్పందించిన విధానమును వినండి.
అప్పుడాయనమీరు వెళ్లి, కన్నవాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠ రోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయినవారు లేపబడుచున్నారు, బీదాలకు సువార్తప్రకటింపబడుచున్నది. నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడనివారికి ఉత్తరమిచ్చెను (లూకా 7:22-23).
ఈ వాక్య భాగములో, చెర తరువాత అంత్య దినములలో ఇశ్రాయేలు తిరిగి వచ్చుటను గూర్చి యెషయా చేసిన అనేక ప్రవచనాలను యేసు తెలియజేస్తున్నాడు. వీటిని సంబోధించుట ద్వారా, ఆయన అంత్య దినములను గూర్చిన పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్చు పనిలో ఉన్నాడని ఆయన పరిచర్య యొక్క కార్య మరియు వాక్య ప్రత్యక్షత తెలియజేస్తున్నాయని ఉద్ఘాటించాడు.
అయితే ఆయన విషయములో “అభ్యంతరపడవద్దని” యేసు బాప్తిస్మమిచ్చు యోహానుకు మరియు ఇతరులందరికీ హెచ్చరికను ఇచ్చాడు. అంత్య దినములలోని దేవుని రాజ్యము తాను నెరవేర్చుచున్న విధానమును చూసి నిరీక్షణ కోల్పోవద్దని యేసు యోహానును ప్రోత్సహించాడు. ఒక్క మాటలో, “అంత దిన దేవుని రాజ్య ఆకాంక్షలలో నేను మిగిలిన వాటినన్నిటిని నెరవేర్చుతానని నీవు నమ్ముటకు కావలసినన్ని నేను ఇప్పటికే నెరవేర్చాను” అని యేసు బాప్తిస్మమిచ్చు యోహానుకు చెప్పాడు. ఈ పాఠము యొక్క పదజాలములో దీనిని చెప్పాలంటే, యేసు మాటలు అప్పటికే సంభవించుచున్న ఒక పెద్ద భిన్నకాలిక పురోగమనమును తెలియజేసాయి. అంత్య దినములను గూర్చి పాత నిబంధన దృక్కోణములు ఆదాము దినములు మొదలుకొని మలాకీ కాలము నాటికి నాటకీయముగా మార్పు చెందాయి. అదే సమయములో, యేసు ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతలు రాకడ శాస్త్రమును మరొకసారి మార్చి వేసింది.
ఊహించిన విధముగా అనుకోకుండా రానున్న యుగము ప్రత్యక్షము కాదని యేసు ప్రకటించాడు. బదులుగా, ఎస్కటోన్ అనునది ఒక సుదీర్ఘ కాలములో నెరవేరుతుంది. మత్తయి 13-22లో యేసు చెప్పిన అనేక రాజ్య ఉపమానములలో, దేవుని రాజ్యము నాలుగు దశలలో వస్తుంది అని యేసు వివరించాడు. ఆయన మొదటి రాకడలో అది చిన్నగా ఆరంభమవుతుంది, మరియు నిర్ణితముకాని కాలము వరకు ఎదుగుతుంది, మరియు ఆయన మహిమలో తిరిగివచ్చినప్పుడు అది సంపూర్ణత చెందుతుంది. యేసు యొక్క భూలోక పరిచర్య కొన్ని అంత్య దిన ఆశీర్వాదములు మరియు తీర్పులతో రానున్న యుగమును ఆరంభిస్తుంది. యేసు పరలోకము నుండి పాలించుచుండగా మరియు సంఘము ఎదుగుచుండగా, రానున్న యుగము ఈ యుగముతో పాటు కొంత కాలము కొనసాగుతుంది. మరియు క్రీస్తు యొక్క రెండవ రాకడలో, రానున్న యుగము సంపూర్ణమవుతుంది మరియు పాపముతోను మరణముతోను నిండియున్న ఈ యుగము ముగించబడుతుంది.
బైబిలానుసారమైన వేదాంతవేత్తలు రాకడశాస్త్రము యొక్క అభివృద్ధిని అనేక విధాలుగా సంబోధిస్తారు. దీనిని వారు “ఇంతకు ముందే వచ్చిందిగాని, ఇంకా రానట్లే,” “ఇప్పుడే వచ్చింది, కాని రాలేదు,” మరియు “యుగముల కలయిక” అని వర్ణిస్తుంటారు. కొన్నిసార్లు దీనిని గూర్చి వారు కేవలం “ఆరంభమైన రాకడ శాస్త్రము” అని మాత్రమే అంటారు. పదజాలము ఏమైనప్పటికీ, ఆలోచన మాత్రమే ఒకే విధముగా ఉన్నది.
పాత నిబంధన ప్రవక్తలు, మొదటి శతాబ్దపు యూదులు, మరియు బాప్తిస్మమిచ్చు యోహాను సహితం అంత్య దినముల యొక్క ఆగమనమును చరిత్రలో కలుగు ఒక మెట్టుగా మాత్రమే పరిగణించారు. అంత్య దినములలోని మార్పును యేసు కూడా చరిత్రలోని చివరి మెట్టుగానే పరిగణించాడు, కాని ఈ ఉదాహరణను చూడండి: ఒక సామన్య మానవుని యొక్క అడుగును ఒక కదలిక, లేక ఒక అడుగువలె చూడాలని మనకందరికీ తెలుసు. అయితే మనము దానిని దగ్గరగా పరిశీలన చేస్తే, దానిని కనీసం మూడు భాగములుగా విభజించవచ్చు అని చూడడం అంత కష్టమైన పని కాదు: నేలల మీద నుండి పాదమును లేపుట, గాలిలో దానిని చాపుట, మరియు నేల మీద పాదమును తిరిగి పెట్టుట. ఇంచుమించు ఇదే విధముగా, అంత్య దినములు లేక ఎస్కటోన్ అంచెలంచెలుగా వస్తుందని యేసు చెప్పాడు. అది ఆయన మొదటి రాకడలో ఆరంభించబడి, కొంత కాలము వరకు ఎదిగి, ఆయన మహిమ గల రాకడలో ముగుస్తుంది అని ఆయన ప్రకటించాడు.
ఆదాము కాలము నుండి యేసు కాలము వరకు బైబిలు రాకడ శాస్త్రము అభివృద్ధి చెందిన విధానములను దృష్టిలో ఉంచుకొని, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు క్రొత్త నిబంధనలోని రాకడశాస్త్రమును ఏ విధముగా పరిగణించారో చూసే పరిస్థితిలో మనము ఇప్పుడు ఉన్నాము.
క్రీస్తు యొక్క ఆధునిక అనుచరులుగా, మనము క్రైస్తవ విశ్వాసములోనికి ఆధునిక సాంస్కృతిక నేపధ్యములోనికి ప్రవేశిస్తాము. క్రొత్త నిబంధన రచయితల నేపధ్యముల కంటే భిన్నముగా ఉన్న జీవన అభిప్రాయములతో మనము క్రీస్తును ఆశ్రయించాము. మరియు ఈ వ్యత్యాసముల కారణంగా, క్రొత్త నిబంధన రచయితలు తమ విశ్వాసమును గూర్చి ఆలోచన చేసిన విధానములను నియంత్రించిన దృష్టికోణమును అర్థము చేసుకొనుటకు మనము చాలా సార్లు కష్టపడవలసివస్తుంది. ఇది బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క అత్యుత్తమ లాభములలో ఒకటైయున్నది. క్రొత్త నిబంధన రచయితలు తమ క్రైస్తవ విశ్వాసమును వ్యక్తపరచుచుండగా ప్రస్తావించిన మౌలిక దృక్పథములకు కొంత వెలుగును ఇచ్చింది.
ఈ విషయములను బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఆశ్రయించిన విధమును తెలుసుకొనుటకు, మూడు అంశములను చూద్దాము. మొదటిగా, క్రొత్త నిబంధనలో రాకడ శాస్త్రము యొక్క ప్రాముఖ్యతను మనము చూద్దాము. రెండవదిగా, క్రొత్త నిబంధన అంశమైన క్రీస్తు, లేక క్రీస్తుశాస్త్రము ఎస్కటోన్ యొక్క నెరవేర్పుగా ఉన్న విధానమును అన్వేషిద్దాము. మరియు మూడవదిగా, క్రొత్త నిబంధన రక్షణశాస్త్రము, లేక రక్షణ సిద్ధాంతము రాకడశాస్త్రము ద్వారా ఎలా ప్రాభావితము చేయబడినదో చూద్దాము. ముందుగా రాకడ శాస్త్రము యొక్క ప్రాముఖ్యతను చూద్దాము.
ఆరంభములో ఇది అతిశయోక్తి అనిపించినప్పటికీ, యేసు యొక్క మూడు దశల-రాకడశాస్త్రము ఆదిమ క్రైస్తవుల హృదయాలలో ఎంత ఖ్యాతిగడించినదంటే క్రొత్త నిబంధనలోని ప్రతి పేజీలో దానిని మనము ప్రత్యక్షంగా లేక పరోక్షముగా కనుగొనవచ్చు. అవును, క్రొత్త నిబంధన అనేక ఇతర సిద్ధాంతిక మరియు అభ్యాసిక అంశములను గూర్చి కూడా మాట్లాడుతుందని మనకు తెలుసు. ప్రతి క్రొత్త నిబంధన బోధన ఏదో ఒక విధముగా అంత్య దినములను గూర్చి యేసు యొక్క మూడు దిశల అభిప్రాయము ద్వారా ప్రభావితము చేయబడినదని బైబిలానుసారమైన వేదాంతవేత్తలు నిరూపించారు.
మెస్సీయ వారిని అంత్య దినములలోనికి — అనగా జయము, రక్షణ, నిత్య జీవముగల యుగములోనికి — నడిపించాలని పాలస్తీనాలో నివసించిన ఎక్కువ మంది యూదులు తరతరాలుగా ఎదురుచూశారు. లూకా మినహా, క్రొత్త నిబంధన రచయితలు అంతా యూదులే. మరియు లూకాతో సహా వారంతా యూదుల వేదాంతశాస్త్రములో లోతుగా నిమగ్నమయ్యారు. ఫలితంగా, మెస్సీయ తెచ్చు అంత్య దినముల మీద యూదా వేదాంతశాస్త్రము కలిగియుండిన ధ్యాస క్రొత్త నిబంధన రచయితల యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణముకు ప్రాముఖ్యమైన విధములుగా తోడ్పాటునిచ్చింది.
రాకడశాస్త్రము క్రొత్త నిబంధనకు మరిముఖ్యముగా ప్రాముఖ్యమైనది ఎందుకంటే, అంత్య దినములను గూర్చి యేసు చేసిన బోధలు క్రైస్తవులు మొదటి శతాబ్దపు యూదులతో విడిపోయిన అత్యంత నిర్ణయాత్మకమైన మార్గములను తెలియజేస్తుంది. కేవలం మెస్సీయ తెచ్చు అంత్య దినములను గూర్చి క్రైస్తవులు కలిగియుండిన ధోరణి కారణముగానే యూదా మత నాయకులు మరియు యూదులు క్రైస్తవుల మీద తిరిగిబాటు చేశారు. ఊహించని విధముగా మెస్సీయ రానేవచ్చాడని క్రైస్తవులు నమ్మారు. ఆయన యూదులు మరియు అన్యుల చేతిలో శ్రమనొంది మరణించాడు; ఆయన పునరుత్థానము చెంది పరలోకమునకు ఆరోహణమై అక్కడి నుండి పరిపాలించుచున్నాడు; ఇశ్రాయేలులో ఉన్న అవిశ్వాసులతో సహా సమస్త మానవాళికి తీర్పు తీర్చుటకు ఆయన ఒక దినమున తిరిగి వస్తాడు. అట్టి మెస్సీయ ఆలోచన ఆ దినములలో యూదుల నమ్మకమునకు పూర్తిగా భిన్నముగా ఉన్నది. ఈ కారణముల చేత, క్రొత్త నిబంధన రచయితలు యేసు బోధించిన మూడు-దశల రాకడశాస్త్రములో నిమగ్నమైపోయారు. మరియు ఈ నిమగ్నము వారు వ్రాసిన ప్రతిదానిలో ప్రతిబింబించబడేది.
క్రొత్త నిబంధన రచయితలను రాకడశాస్త్రము ఎంతగా ప్రేరేపించినదో చూచుటకు ఒక సులువైన మార్గము, వారు క్రొత్త నిబంధన అంతటిని “అంత్య దినముల” కాలముగా మాట్లాడుటను గూర్చి గమనించుటయే. మొదటిగా, హెబ్రీ. 1:1-2లో మనము చదువునట్లుక్రొత్త నిబంధన రచయితలు యేసు మరియు ఆయన అపొస్తలుల దినములన్నిటిని “అంత్య దినములు” లేక ఎస్కటోన్ అని పిలచారు.
పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
ఇక్కడ హెబ్రీ పత్రిక రచయిత తన శ్రోతల కాలమును “అంత్య దినములు” అని సంబోధించాడు. ఇలా చేయుట ద్వారా అతడు యేసు వచ్చుటకు ముందు కలుగు ఒక భవిష్యత్తు కాలమును గూర్చి మాట్లాడుట లేదు, కాని యేసులో దేవుడు చివరిగాను నిశ్చయతతోను మాట్లాడాడను సత్యమును సూచించాడు. యేసు రాజ్యమును ఆరంభము చేయుటతో, వాగ్దానము చేయబడిన పాత నిబంధన యొక్క అంత్య దినములు భూమి మీదకి వచ్చాయి.
రెండవదిగా, 2 తిమోతి 3:1-5 వంటి చోట్ల విస్తరించా=బడిన సంఘ చరిత్రను క్రొత్త నిబంధన రచయితలు అంత్యదినములు అని పిలచారు.
అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము (2 తిమోతి 3:1-5).
“అంత్య దినముల”లో జరుగుతాయని పౌలు సూచించిన ఈ పాపములు పౌలు కాలములో జరుగుతున్నాయి, కాబట్టి అతడు ఈ పాపములను గూర్చి పౌలును హెచ్చరించాడు. అయితే ఈ పాపములు చరిత్ర అంతటిలో జరుగుతూ వచ్చాయి మరియు నేడు కూడా జరుతున్నాయి. “ఇట్టివారికి విముఖుడవై యుండుము” అని పౌలు చెప్పిన మాటలలో పౌలు ఒక భవిష్యత్తు కాలమును సంబోధించుట లేదు అని చూడవచ్చు. “అంత్య దినముల”లోని దుష్ట ప్రజలు తిమోతికి ఒక ఆటంకముగా ఉన్నారు ఎందుకంటే “అంత్య దినములు” యేసు ద్వారా లోకములో అప్పటికే ఆరంభమయ్యాయి.
మూడవదిగా, క్రీస్తు రాకడలో రాజ్యము యొక్క నెరవేర్పును క్రొత్త నిబంధన రచయితలు “అంత్య దినములు” అని పిలచారు. దీనిని మనము యోహాను 6:39లో చూడవచ్చు.
ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పొగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది (యోహాను 6:39).
ఇక్కడ యేసు తండ్రితో తనకున్న అనుబంధమును గూర్చి శిష్యులకు బోధించాడు. ఆయన ఉపయోగించిన “అంత్య దినము” అను మాట ఆయన మహిమలో తిరిగివచ్చినప్పుడు, మృతులు లేపబడి లోకమునకు దేవుడు తీర్పు తీర్చు అంత్య దినమును సూచిస్తుంది.
ఇది మరియు అనేక ఇతర లేఖన భాగములు సూచించుచున్నట్లు, యేసు యొక్క భూలోక పరిచర్య మొదలుకొని ఆయన మహిమలో తిరిగివచ్చు కాలము మధ్య కలిగిన ప్రత్యక్షతలన్నియు అంత్య దినములని క్రొత్త నిబంధన రచయితలు నమ్మినట్లు సూచించుచున్నాయి. యేసు యొక్క మూడు-దశల రాకడశాస్త్ర వెలుగులో మాత్రమే, వారి బోధనులను అర్థము చేసుకోగలము మరియు సరిగా అనుసరించగలము.
ఇప్పుడు మనము క్రొత్త నిబంధన క్రీస్తు శాస్త్రము లేక క్రీస్తు సిద్ధాంతము ఇశ్రాయేలు యొక్క రాకడ నిరీక్షణల యొక్క నెరవేర్పుగా యేసును ఎలా చూపిస్తుందో చూచుటకు సిద్ధముగా ఉన్నాము. ఈ అంశమును మనము రెండు దశలలో చూద్దాము. మొదటిగా, క్రమబద్ధమైన వేదాంతశాస్త్రము క్రీస్తుశాస్త్రము అను అంశమును వివరించిన విధానమును చూద్దాము. మరియు రెండవదిగా బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఈ అంశమును ఏ విధంగా అర్థము చేసుకున్నారో కూడా చూద్దాము. మొదటిగా క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములో క్రీస్తుశాస్త్రమును గూర్చి చూద్దాము.
సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంతశాస్త్రములో, సంఘ చరిత్రలోని కొన్ని కాలములలో ఎక్కువగా ఆసక్తిని రేపిన కొన్ని అంశముల మీద క్రీస్తుశాస్త్రము దృష్టిపెట్టింది. ఉదాహరణకు, క్రమబద్ధీకులు త్రిత్వములోని ఇతర పురుషమూర్తులతో క్రీస్తు యొక్క అనుబంధము, క్రీస్తు యొక్క ఏక మూర్తిమత్వములో రెండు వ్యక్తిత్వముల యొక్క భిన్నమైన ఏకత్వము, క్రీస్తు యొక్క అవమానము మరియు ఘనత అను స్థితులు, ఆయన ప్రాయశ్చిత్తము యొక్క స్వభావము, మరియు ప్రవక్త, యాజకుడు, మరియు రాజుగా క్రీస్తు యొక్క మూడు బాధ్యతలు వంటి విషయముల మీద దృష్టిపెట్టారు. నిస్సందేహముగా, క్రొత్త నిబంధన వీటిని మరియు వీటిని పోలిన అంశములను గూర్చి మాట్లాడుతుంది, మరియు అవి నేటి సంఘమునకు కూడా ముఖ్యమైన అంశములుగా ఉన్నాయి.
అయితే బైబిలానుసారమైన వేదాంతవేత్తలు క్రీస్తుశాస్త్రమును ఒక నూతన దిశలోనికి నడిపించారు. పాత నిబంధన నిరీక్షణలోని ప్రతి చిన్న విషయము నెరవేర్చిన వానిగా క్రీస్తును క్రొత్త నిబంధన రచయితలు ప్రాథమికముగా పరిచయం చేశారు అని వారు ఉద్ఘాటించారు.
పాత నిబంధనను అనువదించుటలో క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను ఉదాహరించుటకు బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఎమ్మాయి మార్గమున యేసు కలసిన తన ఇద్దరు శిష్యులను సూచిస్తారు. లూకా 24:26-27లో, మనము ఈ మాటలను చదువుతాము:
క్రీ”స్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా?” అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలును మొదలు కొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను (లూకా 24:26-27).
ఆయనను గూర్చి పాత నిబంధన మాట్లాడిన విషయములను యేసు వివరించుచున్న విషయమును గమనించండి. ఆయన తన శిష్యులకు “మోషేయు సమస్త ప్రవక్తలును” మరియు పాత నిబంధన అంతటిని సంబోధించి, “లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి” తెలియజేశాడు. పాత నిబంధన రాకడశాస్త్రము యొక్క నెరవేర్పుగా యేసు తనను గూర్చి తాను సంబోధించిన ఉదాహరణను క్రొత్త నిబంధన రచయితలు మరలా మరలా అనుసరించారని బైబిలానుసారమైన వేదాంతవేత్తలు తెలియజేస్తారు.
అంత్య దినముల వాగ్దానములను యేసు నెరవేర్చిన అనేక మార్గములను క్రొత్త నిబంధన తెలియజేస్తుంది కాని ప్రవచనము యొక్క నెరవేర్పు క్రీస్తును గూర్చి క్రొత్త నిబంధన కలిగియున్న ధోరణిని సరిగా తెలియజేయదు. బదులుగా, క్రొత్త నిబంధన రాకడ నిరీక్షణ యేసు యొక్క వ్యక్తిత్వము మీద ఆధారపడియున్నదని మనము అర్థము చేసుకోవాలి. క్రొత్త నిబంధన రాకడశాస్త్రమునకు యేసు కేంద్రముగా ఉన్నాడు.
మునుపటి పాఠములో పాత నిబంధన ప్రతీకవాదమును చర్చించిన విషయమును ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. పాత నిబంధన చరిత్రలోని ప్రతి దశలోను, ముఖ్యమైన వ్యక్తులు, వ్యవస్థలు మరియు సన్నివేశాలు దేవుడు చరిత్రను నడిపించుచున్న లక్ష్యములను సూచించాయి. అవి చరిత్ర అంతములో పూర్తిగా ప్రత్యక్షమయ్యే వాటికి ప్రదర్శనలుగాను, ముందస్తు సూచనలుగాను, లేక రకములుగాను ఉన్నాయి. ఈ కారణము చేత, యేసే క్రీస్తు, అనగా దేవుడు ఎస్కటోన్ ను తీసుకొనివచ్చిన మెస్సీయ కాబట్టి, క్రొత్త నిబంధన రచయితలు క్రీస్తును గూర్చి పాత నిబంధన రకముల యొక్క నెరవేర్పు అని మాట్లాడారు.
కొన్ని ఉదాహరణలుగా, చరిత్ర యొక్క ఆరంభ కాలములలో దేవుని రాజ్యము యొక్క రాజత్వ యాజకునిగా లోకమును అంతిమ లక్ష్యమునకు నడిపించుటకు దేవుడు ఆదామును పిలచాడు; గొప్ప రాజు మరియు ప్రథాన యాజకునిగా యేసు అంత్య దినములలో లోకములో మానవ నాయకత్వమును ముగిస్తాడు. దేవుని రాజ్య ఉద్దేశములను మరింతగా కొనసాగించుటకు దేవుని తీర్పు నుండి మానవాళిని విమోచించమని దేవుడు నోవహును అభిషేకించాడు; యేసు అందరి కొరకు ఒకే సారి ఆయన మరణ పునరుత్థానముల ద్వారా ఎస్కటోన్ లో చేశాడు. అతని సంతానము భూమి మీద ఉన్న కుటుంబములన్నిటికీ దేవుని ఆశీర్వాదములను తెస్తుంది అని దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేశాడు; యేసు సువార్త ప్రకటన ద్వారా అంత్య దినములలో దీనిని నెరవేర్చాడు. ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్ర ప్రత్యక్షతను ఇచ్చుటకు దేవుడు మోషేను లేపాడు; ఎస్కటోన్ లో యేసు దేవుని యొక్క అంతిమ వాక్యమును బయలుపరచాడు. తన సామ్రాజ్యము దేవుని విరోధులను జయించి దేవుని కొరకు లోకమును ఏలుతుంది అని దేవుడు దావీదుకు చెప్పాడు; యేసు అంత్య దినములలో దీనిని నెరవేర్చాడు. క్రొత్త నిబంధన రచయితలు యేసును పాత నిబంధన యొక్క నెరవేర్పుగా చూశారనుటకు ఇవి కొన్ని ఉదాహరణలు.
యేసు పాత నిబంధన ఆకాంక్షలను నెరవేర్చుట మూడు దశలలో జరుగుతుంది అని యేసు మరియు క్రొత్త నిబంధన వివరించిన విషయమును మనము జ్ఞాపకముంచుకోవాలి: రాజ్యము యొక్క ఆరంభము, కొనసాగింపు మరియు ముగింపు. దీని వలన, యేసు పాత నిబంధన నిరీక్షణలను నెరవేర్చిన వేర్వేరు విధానముల వైపుకు క్రొత్త నిబంధన రచయితలు దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఉదాహరణకు, పరిపాలించుట కొరకు ఆదాముకు ఇవ్వబడిన పిలుపును యేసు తన భూలోక పరిచర్యలో నెరవేర్చాడు. ఆయన తన పరిపాలనను లోకమందంతట వ్యాపింపజేయుట కొనసాగిస్తున్నాడు. మరియు ఆయన మహిమలో తిరిగివచ్చినప్పుడు సృష్టిలోని ప్రతి అంగుళమును పరిపాలిస్తాడు.
స్త్రీ పురుషులను మారుమనస్సు పొందమని పిలచుట ద్వారా మరియు ప్రజలకు బాప్తిస్మమియ్యుడని శిష్యులకు ఆజ్ఞ ఇచ్చుట ద్వారా యేసు తన భూలోక పరిచర్యలో దేవుడు నోవహుకు ఇచ్చిన మానవాళిని విమోచించు బాధ్యతను యేసు నెరవేర్చాడు. లోకమంతట వ్యాపించియున్న సంఘము ప్రజలను రక్షణ మరియు బాప్తిస్మము కొరకు పిలచుచుండగా ఆయన ఈ పనిని చేయుట కొనసాగించుచున్నాడు. ఆయనను నమ్మకముగా వెంబడించిన మానవాళిని దైవిక తీర్పు నుండి రక్షించుటకు వచ్చినప్పుడు యేసు తుదకు వారిని విమోచిస్తాడు.
లోకమంతటికీ ఆశీర్వాదముగా ఉండమని అబ్రాహాముకు ఇవ్వబడిన పిలుపును కూడా యేసు నెరవేర్చాడు. మొదటిగా, ఆయన మరియు ఆయన శిష్యులు అన్యులకు సువార్త ప్రకటించారు. రెండవదిగా, లోకమందంతట ఉన్న ప్రజలందరికీ రక్షణ ఆశీర్వాదములను తెచ్చుట ద్వారా ఆయన దీనిని చేయుట కొనసాగించుచున్నాడు. మరియు మూడవదిగా, నూతన సృష్టిని ప్రతి జాతి మరియు దేశములో నుండి విమోచించబడిన ప్రజలతో నింపుట ద్వారా దేవుని రాజ్యము యొక్క ఈ కోణమును ఆయన నెరవేర్చుతాడు.
ఆయన మరియు ఆయన శిష్యులు దేవుని ధర్మశాస్త్రమును ఉద్ఘాటించి నూతన ప్రత్యక్షతను తెచ్చినప్పుడు యేసు మోషే ధర్మశాస్త్రము యొక్క మార్గదర్శకమును కూడా నెరవేర్చాడు. బైబిలు బోధలను భూదిగంతముల వరకు వ్యాప్తి చేయుటకు ఆయన ఆత్మ సంఘమును బలపరచుచుండగా యేసు తన శిష్యులకు ఇచ్చు మార్గదర్శకము కూడా కొనసాగుతుంది. మరియు క్రీస్తు తిరిగివచ్చినప్పుడు, నూతన సృష్టిలోని ప్రతి ఒక్కని హృదయము మీద దేవుని ధర్మశాస్త్రము పరిపూర్ణముగా వ్రాయబడియుంటుంది.
చివరిగా, యేసు విజయమును గూర్చిన మరియు దావీదు కుటుంబము లోకమును పాలించుటను గూర్చిన వాగ్దానమును కూడా నెరవేర్చాడు. ఆయన దీనిని మొదటిగా తన మరణము, పునరుత్థానము మరియు ఆరోహణముల ద్వారా సాతాను జయించి చేశాడు. సువార్త ద్వారా లోకము మీద క్రీస్తు యొక్క ఆత్మీయ విజయమును సంఘము ప్రకటిస్తుంది. మరియు క్రీస్తు తిరిగివచ్చినప్పుడు, దావీదు యొక్క గొప్ప కుమారునిగా ఆయన దేవుని విరోధులకు న్యాయము తీర్చి సృష్టి అంతటిని పాలిస్తాడు.
పాత నిబంధన నిరీక్షణల యొక్క నెరవేర్పుగా క్రీస్తు మీద క్రొత్త నిబంధన రచయితలు దృష్టిపెట్టిన పలు మార్గములను అర్థము చేసుకొనుటకు ఈ ఉదాహరణలు మనకు ఒక అవకాశమును ఇస్తాయి. పాత నిబంధన రాకడశాస్త్రము యొక్క ప్రతి నిరీక్షణను వ్యక్తిగతముగా క్రీస్తు అంత్య దినముల యొక్క మూడు దశలలో సంపూర్ణముగా నెరవేర్చుతాడు.
బైబిలానుసారమైన వేదాంతవేత్తలు రక్షణ సిద్ధాంతమును లేక రక్షణ శాస్త్రమును చాలాసార్లు నూతనమైన మార్గములలో అర్థము చేసుకున్నారు. దీని అర్థమును గ్రహించుటకు, సాంప్రదాయిక వేదాంతశాస్త్రములో రక్షణశాస్త్రమును అన్వేషించుట ద్వారా ఈ అంశమును మొదట చూద్దాము. తరువాత బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము ఈ సిద్ధాంతమును గూర్చి ఏ విధముగా మాట్లాడిందో చూద్దాము. మొదటిగా క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములో రక్షణశాస్త్రమును చూద్దాము.
విశాలమైన ధోరణిలో, సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంతవేత్తలు రక్షణ సిద్ధాంతమును రెండు మౌలిక భాగములుగా విభజించారు: హిస్టోరియ సాలుటిస్, లేక రక్షణ చరిత్ర, మరియు ఆర్డో సాలుటిస్, లేక రక్షణ క్రమము. రక్షణ చరిత్ర నిష్పాక్షిక చరిత్రలో దేవుడు రక్షణను సాధించిన మార్గములను గూర్చి మాట్లాడుతుంది. రక్షణ క్రమము ప్రజలకు వ్యక్తిగతముగా సందర్భానుసారముగా రక్షణను అనువర్తించుటను గూర్చి మాట్లాడుతుంది.
క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములో, రక్షణను లేక హిస్టోరియ సాలుటిస్ ను సాధించుటను, క్రీస్తు యొక్క భూలోక పరిచర్యలో దేవుడు సాధించిన విషయములు అని జాగ్రత్తగా నిర్వచించారు. క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తముపై ఎక్కువ ఆసక్తి చూపబడింది. క్రీస్తు ఎవరి కొరకు మరణించాడు? ఆయన మన కొరకు ఎందుకు మరణించాడు? ఆయన మరణము ఏమి సాధించింది? ఈ మధ్య దశాబ్దములలో క్రీస్తు యొక్క పునరుత్థానము మీద ఎక్కువ ఆసక్తి ఉంచబడింది. యేసు మరణము నుండి ఎందుకు తిరిగిలేచాడు? ఆయన నూతన జీవమునకు మరియు మన రక్షణకు సంబంధం ఏమిటి? క్రీస్తు యొక్క ఆరోహణము మరియు పరలోక సింహాసము మీద కూర్చొనుటను గూర్చి, మరియు ఆయన ప్రస్తుత పరిపాలన ఆయనను నమ్మి వారి మీద చూపు ప్రభావమును గూర్చి కూడా క్రమబద్ధ వేదాంతవేత్తలు మాట్లాడతారు. క్రీస్తు యొక్క మహిమ రాకడను గూర్చి కూడా వారు రాకడశాస్త్ర సందర్భములో మాట్లాడతారు. అయితే ఈ ముఖ్యమైన విషయములకు మించి, స్వచ్చమైన రక్షణను పొందుకొనుటను గూర్చి చర్చించుటకు క్రమబద్ధ వేదాంతవేత్తలు ఎక్కువ సమయమును కేటాయించలేదు.
బదులుగా, క్రమబద్ధీకులు రక్షణ యొక్క అన్వయింపు లేక ఆర్డో సాలుటిస్ మీద ఎక్కువ ఆసక్తిని పెట్టారు. ఈ ఉద్ఘాటన వ్యక్తిగతముగా ప్రజల జీవితాలలో రక్షణను ఎలా అన్వయించాలి అను విషయము మీద ఎక్కువమంది క్రైస్తవులు దృష్టిపెట్టునట్లు పురికొల్పింది. నేడు కూడా క్రొత్తగా జన్మించుట, పశ్చాత్తాపము, విశ్వాసము, నీతిమంతునిగా తీర్చబడుట, పరిశుద్ధపరచబడుట మరియు మహిమపరచబడుట వంటి పదములను ఉపయోగించినప్పుడు, రక్షణను వ్యక్తిగతముగా ప్రజలకు అన్వయించు పలు విషయములు మన మనస్సులో ఉంటాయి. ఇంచుమించు సంఘములోని ప్రతి శాఖ యొక్క వేదాంతశాస్త్ర భాషలో, క్రొత్తగా జన్మించుట అను పదము రక్షణ పొందిన వెంటనే ప్రజలకు కలుగు నూతన జన్మను సంబోధిస్తుంది. పశ్చాత్తాపము అనగా ఒక వ్యక్తి పాపమును విడచి క్రీస్తు వైపు తిరుగుట. విశ్వాసము అనగా రక్షణ కొరకు క్రీస్తులో దేవుని కృపను నమ్ముట మరియు దాని మీద ఆధారపడుట. నీతిమంతునిగా తీర్చబడుట అనగా విశ్వాసము అను పరికరము ద్వారా దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడు అని శాస్త్రీయముగా ప్రకటించుట. పరిశుద్ధపరచబడుట అను పదము ఒక వ్యక్తి పరిశుద్ధతలో ఎదుగుటను సూచిస్తుంది. మరియు మహిమపరచబడుట అనగా ఒక వ్యక్తికి రక్షణను పూర్తిగా అన్వయించుట, మరియు దీనిని నిత్యజీవ ప్రతిఫలము అంటారు.
క్రమబద్ధమైన వేదాంతశాస్త్రములో రక్షణశాస్త్రముకు సంబంధించిన ఈ విషయములను చర్చించు విధానములు మనందరికీ తెలిసినవే. అయితే క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతవేత్తలు రక్షణశాస్త్రమును వేరొక దృష్టికోణములో నుండి చూశారు:
క్రమబద్ధమైన వేదాంతవేత్తలకు భిన్నముగా, బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఆర్డో సాలుటిస్ లేక రక్షణను పొంచుకొనుట అను విషయము మీద ఎక్కువ దృష్టిని పెట్టారు. క్రొత్త నిబంధనలో వ్యక్తిగత రక్షణ అన్వయింపు ఎల్లప్పుడూ యేసు రాకడశాస్త్రము యొక్క మూడు దశల దృష్టిలో, అనగా ఆయనలో చారిత్రికముగా రక్షణను పొందు దృష్టిలో అర్థము చేసుకోబడినదని వారు చూపించారు.
క్రొత్త నిబంధన రక్షణ శాస్త్రమును ఒక రంగస్థల సందర్భములో ఊహించండి. బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము దృష్ట్యా, క్రీస్తులో రక్షణను పొందుకొనుట రంగస్థలము యొక్క వెనుకతెరను పోలియున్నది. ఈ వెనుక తెరలో మూడు ఫలకాలు ఉన్నాయి మరియు అవి అంత్య దినముల ఆరంభమును, కొనసాగింపును మరియు ముగింపును సూచిస్తున్నాయి. ఒక వ్యక్తి జీవితమునకు రక్షణను అన్వయించుట రంగస్థలము యొక్క ముందుభాగములో నిలువబడియున్న పాత్ర యొక్క నటనను పోలియున్నది. శ్రోతల స్థానములో మూడు వేర్వేరు కుర్చీలలో కూర్చొని రంగస్థలమును చూస్తున్నవారివలె క్రొత్త నిబంధన రచయితలు ఒక వ్యక్తి యొద్దకు రక్షణ వచ్చినప్పుడు ఏమి జరుగుతుందో వివరించారు. అంత్య దినముల యొక్క ఆరంభము, కొనసాగింపు మరియు ముగింపులను సూచించు వెనుకతెర మీద ఉన్న మూడు ఫలకముల సందర్భములో వారు ఒక వ్యక్తి యొక్క రక్షణ అనుభవమును వీక్షిస్తారు.
మొదటి స్పష్టమైన బిందువు నుండే, ఒక క్రీస్తు అనుచరుడు అతని లేక ఆమె రక్షణను అంత్య దినముల ఆరంభములో క్రీస్తు సంపాదించినదానిలో పాలుపంచుకున్నదాని మీద ఆధారితము చేస్తారు. రెండవ స్పష్టమైన బిందువు నుండి, ఒక క్రీస్తు అనుచరుడు అతని/ఆమె రక్షణను అంత్య దినముల కొనసాగింపులో క్రీస్తు సంపాదించుచున్నదానిలో పాలుపంచుకున్నదాని మీద ఆధారితము చేస్తారు. మూడవ స్పష్టమైన బిందువు నుండి, క్రీస్తు అనుచరులు వారి రక్షణను అంత్య దినముల ముగింపులో క్రీస్తు సంపాదించబోవుదానిలో పాలుపంచుకున్నదాని మీద ఆధారితము చేస్తారు.
చాలా వరకు, క్రొత్త నిబంధన రచయితలు రక్షణను సంపాదించుటను రక్షణ యొక్క అన్వయింపుకు ఈ విధముగానే అనుసంధానపరిచారని కనుగొనుట చాలా సులభము. ఉదాహరణకు, అపొస్తలుడైన పౌలు రక్షణ అను పదమును మూడు సాధారణ మార్గములలో ఉపయోగించాడు. కొన్నిసార్లు అతడు దానిని గూర్చి మొదటి స్పష్టమైన బిందువు నుండి మాట్లాడుతూ, అప్పటికే సంభవించినదని చెప్పాడు. ఉదాహరణకు రోమా. 8:24లో మనము ఈ మాటలను చదువుతాము:
ఏలయనగా మనము నిరీక్షణ కలిగినవారమై రక్షింపబడితిమి (రోమా. 8:24).
ఇక్కడ పౌలు పరిశుద్ధాత్మలో మనము మునుపు పొందుకొనిన నూతనపరచబడి నూతన జీవన శైలిని ఆరంభించిన అనుభవమును గూర్చి మాట్లాడుతూ ఎందుకంటే క్రీస్తు 2000 సంవత్సరముల క్రితము సాధించిన దానిలో మనము పాలుపంచుకొనుచున్నాము.
మరికొన్ని సందర్భాలలో, పౌలు రక్షణను గూర్చి రెండవ స్పష్టమైన బిందువులో నుండి మాట్లాడుతూ దానిని విశ్వాసుల అనుభవములో కొనసాగుచున్న ప్రస్తుత వాస్తవముగా తెలియపరచాడు. 1 కొరింథీ. 1:18లో ఆయన చెప్పినట్లు,
సిలువనుగూర్చిన వార్త, నశించుచున్న వారికి వెఱ్ఱి తనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి (1 కొరింథీ. 1:18).
ఇక్కడ పౌలు కిస్తులో మనము అనుదినము అనుభవించు రక్షణను గూర్చి మాట్లాడుతున్నాడు, మరియు ఇది నిశ్చయముగా క్రీస్తు రాజ్య ఆరంభములో చేసిన దాని మీద ఆధారపడియున్నదిగాని, ఇది పరలోకములో ఆయన ఇప్పుడు చేయుచున్న పరిచర్యతో మనము కలిగియున్న అనుబంధముతో కూడా దగ్గరగా ముడిపడియున్నది.
మరికొన్ని సందర్భాలలో, పౌలు రక్షణను గూర్చి మూడవ స్పష్టమైన బిందువు నుండి అనగా భవిష్యత్తులో క్రీస్తు తిరిగివచ్చిన తరువాత సంభవించు విషయముల దృష్టిలో కూడా మాట్లాడుతున్నాడు. రోమా. 5:9లో ఆయన చెప్పినట్లు:
కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. (రోమా. 5:9).
ఒక ఉదాహరణను పరిగణించండి. ఆర్డో సాలుటిస్ లోని చివరి ఘట్టమును “మహిమపరచబడుట” అంటారు. దీనిని మనము సాధారణంగా క్రీస్తు తిరిగివచ్చినప్పుడు వ్యక్తులకు జరుగువాటిని సంబోధించుట కొరకు ఉపయోగిస్తాము. మహిమపరచబడుటను క్రీస్తు రాకడ ముగింపులో జరుగు కార్యముగా మాత్రమే పరిమితము చేస్తే, మనము క్రొత్త నిబంధనలోని మహిమపరచబడుట అను అంశమును ఖండించినట్లు అవుతుందని బైబిలానుసారమైన వేదాంతవేత్తలు గుర్తించారు. ఉదాహరణకు, మహిమపరచబడుటను గూర్చి పౌలు అంత్య దినముల యొక్క మూడు దశలను దృష్టిలో ఉంచుకొని వ్రాశాడు. మొదటి స్థానములో, దీనిని గూర్చి పౌలు విశ్వాసుల జీవితములో ఇంతకు ముందే జరిగినదిగా వ్రాశాడు. రోమా 8:29-30లో పౌలు ఏమని వ్రాస్తున్నాడో ఒకసారి వినండి:
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను; ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను; ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరచెను (రోమా 8:29-30).
“మహిమపరచబడుట” అని అనువదించబడిన క్రియా పదము యిడొక్సాసెన్ మరియు ఈ క్రియా పదము ఇంతకు ముందే జరిగిన ఒక సన్నివేశమును సూచిస్తుంది. క్రీస్తు యొక్క పునరుత్థానము మరియు ఆరోహణములో ప్రజలు క్రీస్తు యొక్క యొక్క మహిమలో పాలివారు అవుతారు కాబట్టి, ఆయనతో కూడా వారు మహిమలో కొంత భాగమును పొందుకున్నారు. విశ్వాసులు ఇప్పటికే క్రీస్తులో మహిమపరచబడ్డారు.
దీనితో పాటుగా, మహిమపరచబడుట అనేది నమ్మకమైన విశ్వాసుల జీవితములో కొనసాగు ప్రక్రియ అని కూడా పౌలు సూచించాడు. క్రీస్తుతో అనుబంధములో అనుదినము జీవించు అనుభవమును కూడా మహిమపరచబడుట అని పిలువవచ్చు. 2 కొరింథీ. 3:18లో పౌలు తన గురించి మరియు తన అనుచరులను గూర్చి చెప్పినట్లుగా:
మన మందరమును ముసుకు లేని ముఖముతో ప్రభువుయొక్క మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయుచు, మహిమనుండి అధిక మహిమను పొందుచు, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము (2 కొరింథీ. 3:18).
ఇక్కడ “మహిమ నుండి అధిక మహిమను పొందుచు” అని అనువదించబడిన గ్రీకు పదము అపొ డొక్సేస్ యెయిస్ డొక్షొన్ మరియు దీనిని అక్షరార్థముగా “మహిమ నుండి మహిమలోనికి” అని అనువదించవచ్చు. క్రీస్తుకు సేవ చేయు క్రైస్తవ జీవితము విశ్వాసి యొక్క ఎదుగుచున్న మహిమకు సూచనగా ఉంది అని పౌలు చెబుతున్నాడు.
అవును, పౌలు మహిమను గూర్చి భవిష్యత్తులో జరుగబోవు విషముగా కూడా మాట్లాడాడు. క్రమబద్ధమైన వేదాంతవేత్తల వలెనె, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు క్రీస్తు అనుచరులు అత్యధిక మహిమను పొందుకుంటారు అని పౌలు అర్థము చేసుకున్నాడు. 2 తిమోతి 2:10లో మనము చదువునట్లు:
అందుచేత ఏర్పరచబడినవారు నిత్యమైన మహిమతోకూడ క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలెనని నేను వారికొరకు సమస్తము ఓర్చుకొనుచున్నాను (2 తిమోతి 2:10).
ఇంచుమించు ఇదే విధముగా, క్రొత్త నిబంధన రచయితలు యేసు రాకడ శాస్త్రమును గూర్చి మూడు దశలలో ఆలోచన చేసి, రక్షణశాస్త్రములోని ప్రతి అంశమును కూడా మూడింతలుగా పరిగణించారు అని బైబిలానుసారమైన వేదాంతవేత్తలు సూచిస్తారు.
ఈ పాఠములో, క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము యొక్క ఆకృతులను పరిచయం చేశాము. దీనిని పాత నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రముతో పోల్చుట ద్వారా ఈ శాఖను గూర్చి కొంత అవగాహనను మనము పొందుకున్నాము. అంత్య దినములను గూర్చి యేసు చేసిన బోధలకు దారితీసిన పురోగమనములలో క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రము యొక్క ముందస్తు సూచనలను మనము చూశాము. క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రమంతటిని నియంత్రించు ఆకారముగా యేసు యొక్క మూడు-దశల రాకడశాస్త్రమును బైబిలానుసారమైన వేదాంతవేత్తలు ఎలా అన్వేషించారో చూశాము.
యేసు మరియు అపొస్తలుల యొక్క బోధనలను గూర్చి మనము కలిగియున్న అవగాహనను పెంపొందించుకొనుటకు క్రొత్త నిబంధన బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము మనకు సహాయం చేసింది. అయితే అన్నిటి కంటే ఎక్కువగా, యేసు మొదటి రాకడలో సంపాదించినదాని వెలుగులో మనము ఎలా జీవించాలో, మనలో నేడు నివాసమున్న ఆత్మ శక్తితో క్రీస్తు కొరకు ఏ విధముగా జీవించాలో, మరియు ఆయన మహిమగల రాకను నిరీక్షిస్తూ క్రీస్తు కొరకు మనము ఎలా జీవించాలో బైబిలానుసారమైన వేదాంతశాస్త్రము మనము చూపించింది.
Continue reading the full transcript