ఈ పాఠం 2 యొక్క అనుబంధ వీడియో, ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: అదాము యొక్క తొలి పాపం కోసం అందరు మానవులను శిక్షించడం దేవునికి న్యాయమా? పునరుత్పత్తి చెందనివారు దేవునికి సంతోషం కలిగించే నైతిక సామర్థ్యం కలిగి ఉన్నారా? శాశ్వత జీవితం అంటే ఏమిటి? శాశ్వత జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది? స్వర్గంలో మన శాశ్వత ప్రతిఫలాలు క్రీస్తు యొక్క ఘనత మీదనే ఆధారపడి ఉన్నాయా, లేదా మన పనులు కూడా లెక్కించబడతాయా? మరణం వద్ద విశ్వాసులకు ఏమి జరుగుతుంది? మనం చనిపోయినప్పుడు, మన శరీరాలు మనలో భాగమా? ఇంటర్మీడియట్ స్టేట్ అంటే ఏమిటి? క్రైస్తవులు నేడు నరకాన్ని నమ్మడం కొనసాగించాల్సిన అవసరం ఎందుకు ఉంది? విశ్వాసులు ఎలా నమ్మకం లేని వారి నమ్మకాన్ని తిరస్కరించాలి - మరణం తరువాత కొంత సమయం తరువాత, నమ్మకం లేని ఆత్మలు ఉనికిని కోల్పోతాయి అనే నమ్మకం? ప్రేమగల దేవుడు తన శత్రువులను కూడా శాశ్వత ఖండనలోకి ఎలా పంపగలడు? యేసు యొక్క శరీర పునరుత్థానం సువార్త సందేశంలో ఒక అనివార్యమైన భాగం ఎందుకు ఉంది?
From the transcript
1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.
బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.
ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.
అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.
మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.
నమోదు చేయబడిన చరిత్రలో ఆది నుండే, మరణము తరువాత జీవితమును గూర్చి మానవులు ఆలోచిస్తూ ఉన్నారు. మన ఆత్మలు శాశ్వతము జీవిస్తాయా? మనము ఏదో ఒక రకమైన శరీరములను కలిగియుంటామా? మన వ్యక్తిగత మనస్సులను మనము పొందుకుంటామా? ఈ ప్రశ్నలకు నమ్మదగిన జవాబులు లేఖనములో దేవుడిచ్చిన ప్రత్యక్షతలో మాత్రమే ఉన్నాయి. అవును, మనము తెలుసుకోవాలని కోరు ప్రతి విషయమును బైబిలు మనకు తెలియజేయదు. మరియు కొన్నిసార్లు క్రైస్తవులు దీనిలోని మాటలను పలు విధాలుగా వ్యాఖ్యానిస్తారు. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాజ్యములో మహిమామయమైన భవిష్యత్తును గూర్చి లేఖనము మనకు గొప్ప నిరీక్షణను ఇస్తుంది అని మనమంతా సమ్మతిస్తాము.
నీ రాజ్యము వచ్చునుగాక: యుగాంతశాస్త్ర సిద్ధాంతము అను మన పాఠ్య క్రమములో ఇది రెండవ పాఠము. దీనికి “సజీవులు మరియు మృతులు” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠంలో, వేదాంతవేత్తలు సాధారణంగా “వ్యక్తిగత యుగాంతశాస్త్రము” అని పిలచుదానిని మనము పరిగణిద్దాము.
ఇంతకు ముందు పాఠంలో, మనము యుగాంతశాస్త్రమును “అంత్య దిన విషయములను గూర్చిన అధ్యయనము” లేక “అంత్య దిన విషయములను గూర్చిన సిద్ధాంతము” అని నిర్వచించాము. యుగాంతశాస్త్రము యేసు జీవితము మరియు పరిచర్యతో ఆరంభమై, ఆయన తిరిగివచ్చినప్పుడు పూర్తి అయ్యే అంత్య దినముల కాలమంతటని గూర్చి మాట్లాడుతుంది అని కూడా మనము చెప్పాము. ఈ పాఠంలో, యుగాంతశాస్త్రములో ఒక ఉపభాగమైన వ్యక్తిగత యుగాంతశాస్త్రము మీద మనము దృష్టిపెడదాము. వ్యక్తిగత యుగాంతశాస్త్రము అనగా:
అంత్య దినములలోని సన్నివేశములను — ముఖ్యముగా మన శరీరములు మరియు ఆత్మల యొక్క జీవితము, మరణము, మధ్య స్థితి, మరియు అంతిమ స్థితికి సంబంధించిన సన్నివేశములను — ఒక వ్యక్తి ఏ విధంగా అనుభవిస్తాడు అను విషయమును గూర్చిన అధ్యయనం అయ్యున్నది.
“సజీవులు మరియు మృతులు” అను మన పాఠం మూడు భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా, మానవ జీవితము యొక్క వర్తమాన స్థితిని గూర్చి బైబిలు ఏమి బోధిస్తుందో మనము చూద్దాము. రెండవదిగా, మనము మరణించినప్పుడు ఆరంభమయ్యే మధ్య స్థితిని మనము చూద్దాము. మరియు మూడవదిగా, అంత్య కాలము యొక్క నెరవేర్పు జరిగినప్పుడు మన అంతిమ స్థితిని మనము పరిగణిద్దాము. ముందుగా మన వర్తమాన స్థితిని చూద్దాము.
మనము ఇంతకు ముందు పాఠంలో చూసినట్లు, మానవాళి ప్రస్తుతానికి చివరి దినములలో నివసిస్తుంది, దీనినే “అంత్య కాలము” అని కూడా అంటారు. ఫలితంగా, పాపము మరియు మరణము వంటి ఈ యుగము యొక్క కష్టములను మనమంతా అనుభవిస్తాము. అయితే రాబోవు యుగములో కలుగు ఆశీర్వాదములైన క్షమాపణ మరియు రక్షణ ద్వారా ఈ సమస్యలకు కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. మానవాళి యొక్క ప్రస్తుత స్థితిలో, విశ్వాసులు, లేక “పునరుజ్జీవనము పొందినవారు,” రెండు యుగములలోని ప్రభావములను ఏకకాలమందు అనుభవిస్తారు, అయితే అవిశ్వాసులు లేక “పునరుజ్జీవనము పొందనివారు” ఈ యుగములోని కష్టములను భారముగా అనుభవిస్తారు.
వేదాంతశాస్త్రములో, “పునరుజ్జీవనము” అను పదమునకు అర్థము “పునఃసృష్టి” లేక “తిరిగి జన్మించుట” అయ్యున్నది. కాబట్టి, పునరుజ్జీవనము పొందినవారిని మనము ఆత్మీయముగా “సజీవులు” అని పిలువవచ్చు. అలాగే, “పునరుజ్జీవనము పొందనివారు” అను వేదాంత పదమును “పునఃసృష్టింపబడనివారు” లేక “తిరిగి జన్మించనివారు” అని పిలువవచ్చు. మరొక మాటలో, పునరుజ్జీవనము పొందనివారు ఆత్మీయముగా “మృతులై”యున్నారు.
ఈ వ్యత్యాసమును దృష్టిలో ఉంచుకొని, మానవాళి యొక్క వర్తమాన స్థితిని రెండు భాగములుగా మనము చూడవచ్చు. మొదటిగా, పునరుజ్జీవనము పొందనివారిని మనము చూద్దాము. రెండవదిగా, పునరుజ్జీవనమును పొందినవారిని మనము చూద్దాము. పునరుజ్జీవనము పొందనివారి యొక్క వర్తమాన స్థితిని చూస్తూ ఆరంభిద్దాము.
పతనమైన మానవులు ఆత్మీయముగా మరణించినవారిగా జన్మిస్తారని లేఖనము సెలవిస్తుంది. పునరుజ్జీవనము పొందనివారు ఈ ఆత్మీయ మరణ స్థితిలో మిగిలిపోతారు, ఎందుకంటే వారు పరిశుద్ధాత్మ ద్వారా నూతనపరచబడలేదు లేక “పునరుజ్జీవనము” పొందలేదు.
పునరుజ్జీవనము పొందనివారి యొక్క మూడు లక్షణముల మీద మనము దృష్టిపెడదాము: మొదటిగా, వారి ఆత్మీయ మరణము; రెండవదిగా, వారి నైతిక అసమర్థత; మరియు మూడవదిగా, దేవునితో వారి వైరము. వారి ఆత్మీయ మరణమును వివరముగా చూచుట ద్వారా మనము ఆరంభించవచ్చు.
భౌతిక మరణమును పోలిన విధములుగా ఆత్మీయ మరణమును గూర్చి ఆలోచించునట్లు మనము శోధింపబడతాము. అయితే ఇది కొంత వరకు తప్పుదారి పట్టించునదిగా ఉన్నది. మనము భౌతికముగా మరణించినప్పుడు, మన ప్రాణములు మన శరీరముల నుండి వేరుచేయబడతాయి. స్వతంత్ర నిర్ణయములను తీసుకొనుటకు మన శరీరములు అసమర్థమైయున్నవి, మరియు తుదకు మట్టిలో కలసిపోవునంత విధముగా అవి కుళ్లిపోతాయి. అయితే మనము ఆత్మీయముగా మరణించినప్పుడు కూడా, మన ప్రాణములు మన శరీరములలో క్రియాత్మకముగానే ఉంటాయి. పునరుజ్జీవనము పొందనివారు ఆలోచిస్తారు, అనుభవిస్తారు, కలలు కంటారు, నిర్ణయాలు తీసుకుంటారు, మరియు పునరుజ్జీవనము పొందినవారి విధముగానే లోకములో అన్ని విధాలుగా పాలుపంచుకుంటారు. వారు రోబోలు కాదు, లేక వారు మతిలేని శరీరులు కూడా కాదు. కాబట్టి, అసలు ఆత్మీయ మరణము అంటే ఏమిటి?
ఆత్మీయ మరణమును గూర్చి మనము ఆలోచన చేయునప్పుడు, నేను తోటను గూర్చి జ్ఞాపకము చేసుకుంటాను. మనము పాత నిబంధనను, ముఖ్యముగా ఆదికాండమును చూసినట్లయితే, అక్కడ దేవుడు ఆదాముతో “ఏ చెట్టు ఫలమునైనా తినవచ్చు” అని చెప్పిన విషయము నిజముగా ఆసక్తికరముగా ఉంది. ఆంగ్లములోను మరియు ఇతర భాషలోను కొన్ని అనువాదములు “నీవు స్వతంత్రముగా తినవచ్చు” అని చెబుతాయి... స్పష్టముగా దేవుడు ఏమని చెబుతాడంటే, “నీవు ఆశ కొలది తృప్తిగా తినవచ్చు. నీకు నచ్చినంత తినవచ్చు. అయితే ఈ ఒక్క చెట్టు ఉంది కదా, ఈ చెట్టు ఫలమును నీవు తింటే...” — నేను చెబుతున్నట్లు — “నీవు ఒక మేకు వలె చచ్చినవాడవవుతావు.” కాబట్టి స్పష్టముగా, ఆదాము ఆ ఫలమును తినిన వెంటనే అతడు మరణిస్తాడు, భౌతికముగా మాత్రమే కాదు, ఆత్మీయముగా కూడా. పాత నిబంధన అంతటా ఘోరమైన పాపపు జీతములను మనము చూస్తాము. క్రొత్త నిబంధనలో కూడా, పౌలు కూడా ఆత్మీయ మరణమును గూర్చి మాట్లాడుతున్నాడు. “పాపము వలన వచ్చు జీతము మరణము” వంటి వచనములను మనము చూస్తాము... “అందరును పాపము చేసి దేవుడనుగ్రహించు మహిమను పొందలేకయున్నారు” అనునది నాకు నచ్చిన మరొక వచనము... పాపము నన్ను దేవుని నుండి దూరము చేసింది అని, మరియు పాపము అన్ని రకముల సమస్యలకు కారణమైయున్నది అని అర్థము చేసుకొనుట చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. నేను పాపము చేశానని, నేను తప్పిపోయానని అర్థము చేసుకున్నప్పుడు, “నేను ఏమి చేయగలను? నేను ఎక్కడికి వెళ్లగలను?” అని ఆలోచన చేస్తాను. అప్పుడే సువార్త అరంగేట్రం చేస్తుంది.
— రెవ. జార్జ్ శంబ్లిన్
ఆదియందు, దేవుడు ఆదాము హవ్వలను ఆత్మీయ జీవితముతో దీవించాడు. కాబట్టి ఆత్మీయ మరణము ఎక్కడ నుండి వస్తుంది? దీనికి క్లుప్త జవాబు: ఆదాము హవ్వలు ఏదెను తోటలో దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు, దేవుడు మానవాళిని ఆత్మీయ మరణముతో శపించాడు. ఆది. 2:17లో దేవుడు ఇలా సెలవిచ్చాడు:
అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను (ఆది. 2:17).
అయితే ఆదికాండము 3వ అధ్యాయములో మనము నేర్చుకొనుచున్నట్లు, సాతానుడు సర్పము ద్వారా మాట్లాడి పండును తినునట్లుగా హవ్వను మోసము చేశాడు. హవ్వ దానిని తినిన తరువాత కూడా జీవించియుండిన విషయమును ఆదాము చూసిన తరువాత, అతడు కూడా దానిని తిన్నాడు. తరువాత, ఆదాముతో దేవుడు చేసిన నిబంధన షరతుల ప్రకారం, దేవుడు వారిని శపించాడు. ఆ రోజున వారు మరణించలేదు, కనీసం భౌతికముగా మరణించలేదుగాని వారు ఆత్మీయముగా భ్రష్టమైపోయారు. మరియు ఈ ఆత్మీయ భ్రష్టత్వము ఆత్మీయ మరణమునకు మూలమైయున్నది. రోమా. 7:14-25లో, పౌలు దీనిని మన “పాపపు స్వభావము” అని సంబోధిస్తున్నాడు. పాపము మన శరీరములలో నివసిస్తుంది అని మరియు మన మనస్సులను స్వాధీనములో ఉంచుకుంటుంది అని అతడు వర్ణించుచున్నాడు.
ఇంకా ఘోరముగా, ఆత్మీయ మరణము స్వభావికముగా గర్భము దాల్చబడిన ఆదాము హవ్వల వారసులందరి మీద ప్రభావము చూపుతుంది. యేసు మినహా ప్రతి మానవుడు ఈ లోకములోనికి ఆత్మీయముగా మరణించిన స్థితిలో ప్రవేశిస్తాడు అని యోహాను 3:5-7, రోమా. 8:10 మరియు కొలస్సీ. 2:13 వంటి వాక్యభాగములు సూచిస్తాయి. రోమా. 5:12-19లో పౌలు సూచించుచున్నట్లు, ఆదాము మన ప్రతినిధి అయ్యున్నాడు, కాబట్టి, మనమంతా అతని శిక్షలో పాలివారమైయున్నాము.
బైబిలు బోధించు అత్యంత కఠినమైన సిద్ధాంతములలో ఒకటి ఆదాములో అందరు పాపము చేశారు — రోమా. 5వ అధ్యాయములో పౌలు మాట్లాడుచున్నట్లు — అనునదియే అని ప్రజలు అంటారు, కాబట్టి పాపము శిక్ష మరియు మరణములోనికి నడిపిస్తుంది, మరియు మనము ఆదాముయందు ఉన్నాము. ఇది ఆదాము చేసిన పాపము కదా, మరి నేను ఎందుకు నిందించబడుతున్నాను? ఆదాము అపరాధములో మన అపరాధము విషయములో దేవుడు న్యాయముగానే వ్యవహరించుచున్నాడా, అను ప్రశ్నకు మనము ఏ విధంగా జవాబు ఇస్తాము?... మేము దీనిని ఖండించుచున్నాము అని ప్రజలు చాలాసార్లు అంటారు, కాని పౌలు వాదనలోని మరొక భాగమైన ఆదాములో అందరు పాపము చేశారు, కాబట్టి క్రీస్తులో అందరు సజీవులైయ్యారు అను విషయమును ఖండించరు. మనము ఒకదానిని ఖండిస్తే, మరొక దానిని ఎందుకు ఖండించము? దేవుడు మానవులతో రెండు విభాగములలో మరియు రెండు విభాగములలో మాత్రమే వ్యవహరిస్తాను అని అనుచున్నాడు. ప్రతి విధమైన జాతి వివాదములు లేక శ్రేణి వివాదములలో ఇది చాలా వరకు సహాయకరముగా ఉంటుంది. దేవుని దృష్టికోణములో కేవలం రెండు విభాగములు మాత్రమే ఉన్నాయి: అయితే మనము ఆదాములో ఉన్నాము లేక క్రీస్తులో ఉన్నాము... ఇది వాక్యములో బోధించబడింది కాబట్టి దీనిని మనము అంగీకరించాలి, మరియు ఆచరణాత్మక కారణమును బట్టి మనము క్రీస్తులో ఉండి ఆయనలో సజీవులమవగలిగితే, పౌలు బోధించు మరొక కోణమును కూడా మనము అంగీకరించాలి.
— డా. జోష్ మూడి
పునరుజ్జీవనము పొందనివారు వర్తమాన స్థితిలో ఆత్మీయ మరణమును కలిగియున్నారు అని మనము చూశాము కాబట్టి, ఇప్పుడు వారి నైతిక అసమర్థతను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.
“నైతిక అసమర్థత” అను పదము పునరుజ్జీవనము పొందనివారి జీవితములోని ఈ సత్యమును సూచిస్తుంది:
దేవుని సంతోషపరచుటకు లేక ఆయన ఆశీర్వాదములకు యోగ్యులగుటకు సామర్థ్యము లేకపోవుట.
అన్నిటికంటే ప్రాముఖ్యముగా, వారు క్షమాపణ కొరకు ఆయనను అడగలేరు, లేక రక్షణ కొరకు కృషి చేయలేరు.
క్రీ.శ. 354 నుండి 430 కాలములో జీవించిన హిప్పో పట్టణ బిషప్ అయిన అగస్టిన్ సుపరిచితమైన ఈ మాటలను బోధించాడు, మానవాళి యొక్క మొదటి పాపమునకు ముందు, ఆదాము హవ్వలు పొస్సే నాన్ పెక్కరె అను స్థితిలో జీవించారు. ఈ ల్యాటిన్ మాటను “పాపమును తప్పించుకొను సామర్థ్యమును కలిగియుండుట” అని అనువదించవచ్చు. అయితే, వేదాంతశాస్త్ర ఉపయోగములో ఈ పదమును “పాపమును తప్పించుకొను సామర్థ్యము” అని అనువదిస్తారు. అగస్టిన్ మాటల ప్రకారం, ఆదాము హవ్వలు పాపమును పూర్తిగా తప్పించుకోగల శక్తితో సృజించబడ్డారు. అయితే పాపము చేయు సామర్థ్యము కూడా వారిలో ఉండెను. మరియు వారు పాపము చేసినప్పుడు, వారు పొస్సే నాన్ పెక్కరె స్థితిలో నుండి నాన్ పొస్సే నాన్ పెక్కరె — పాపమును తప్పించుకొనుటలో అసమర్థత — స్థితిలోనికి చేరుకుంటారు. పాపమును తప్పించుకొను నైతిక సమర్థతను వారు మరియు వారి యొక్క స్వాభావిక వారసులు అందరు కోల్పోయారు.
యోహాను 8:31-44 మరియు రోమా 6:6-20 వంటి చోట్ల, యేసు మరియు పౌలు ఇరువురు నైతిక అసమర్థతను పాపమునకు బానిసలగుటతో పోల్చారు. పునరుజ్జీవనము పొందనివారు పాపము యొక్క అధికారములో జీవిస్తారని, లోకము మరియు దాని దయ్యపు అధికారముల యొక్క పాపాత్మక మార్గములను అనుసరిస్తారని ఎఫెసీ. 2:1-5లో పౌలు బోధిస్తున్నాడు. మరియు వారు ఆత్మీయ మరణపు స్థితిలో నిలిచియుంటారు, మరియు దేవుడు వారిని కరుణతో రక్షించునంత వరకు తమను తాము విమోచించుకొనుటకు అసమర్థులైయుంటారు. అవును, పునరుజ్జీవనము పొందనివారు బయటకు మంచిగా కనిపించు క్రియలను చేయగలరు. వారు తమ పిల్లలను ప్రేమిస్తారు మరియు వారి కొరకు సమకూర్చుతారు. వారు న్యాయమును జరిగిస్తారు. వారు ఇతరుల కొరకు తమ జీవితములను దారపోస్తారు కూడా. అయితే దురదృష్టవశాత్తు, పునరుజ్జీవనము పొందనివారు దేవుని ప్రేమ ద్వారా పురికొల్పబడరు కాబట్టి ఈ కార్యములన్ని మలినమైపోయాయి. లూకా 6:43-45లో యేసు ఈ సమస్యకు సమాధానం ఇచ్చాడు. పునరుజ్జీవనము పొందనివారి క్రియలను యేసు చెడ్డ చెట్లు ఫలించు చెడ్డ ఫలములతో పోల్చాడు. మానవులు తమ మనస్సుకు తోచిన విధముగా వ్యవహరిస్తారు అని ఆయన ఉద్దేశ్యమైయున్నది. కాబట్టి, చెడ్డ హృదయములుగలవారు — అనగా, పునరుజ్జీవనము పొందనివారు — దేవుడు మంచివిగా ఎంచు కార్యములను చేయుటకు నైతికముగా అసమర్థులైయున్నారు. రోమా. 8:6-8లో పౌలు ఇలా చెబుతూ ఈ సమస్యను వర్ణించాడు:
ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు (రోమా. 8:7-8).
పునరుజ్జీవనము పొందనివారు దేవుని సంతోషపరచు నైతిక సామర్థ్యమును కలిగియున్నారా? “లేరు” అనునది క్లుప్త జవాబు, ఎందుకంటే దేవుని సంతోషపరచుట అను ఆలోచనను అనుబంధము దృష్ట్యా చూడాలి... కాబట్టి, దేవుని సంతోషపరచు కార్యములు దేవునికి మానవునికి మధ్య ఉన్న అనుబంధమునకు ఫలములైయున్నవి. మనము జీవించు విధానములో దేవుని సంతోషపరచుటకు, ఆయన ఉన్నాడని మరియు ఆయనను వెదకువారికి ప్రతి ఫలమును ఇస్తాడని మనము ముందు నమ్మాలి — హెబ్రీ పత్రికలో ఇదే భాష ఉన్నది. కాబట్టి, పునరుజ్జీవనము పొందనివారి క్రియలలో పాపపు స్వభావము ఉంటుంది అని ఆంగ్లికన్ ఆర్టికల్స్ ఆఫ్ రిలీజియన్ చెబుతుంది, ఎందుకంటే అవి క్రియలు, అవి దేవునితో అనుబంధము వెలుపల ఉన్న ప్రజలు చేయు క్రియలు అయ్యున్నవి, మరియు మానవాళి దేవునితో అనుబంధము ద్వారా చేయబడినది కాబట్టి, ఏ పనినైనా ఆయనను సంతోషపరచు నేపథ్యములో చేయవలసియుంటుంది.
— డా. కేరీ విన్జంట్
ఇప్పటివరకు, ఆత్మీయ మరణము మరియు నైతిక అసమర్థత దృష్ట్యా పునరుజ్జీవనము పొందనివారిని గూర్చి చర్చించాము. ఇప్పుడు మూడవ లక్షణమును మనము చూడబోతున్నాము: దేవునితో వైరము.
ఆత్మీయ మరణములోని అత్యంత హానికరమైన విషయములలో పునరుజ్జీవనము పొందనివారు దేవుని విరోధులు అనునది ఒకటైయున్నది. సాతాను మరియు అతని అనుచరులు దేవునితోను, ఆయనకు నమ్మకముగా ఉన్న దేవదూతలతోను నిత్యము యుద్ధము చేయుచున్నారని లేఖనము బోధిస్తుంది. మరియు పునరుజ్జీవనము పొందనివారు సాతాను పక్షమున ఉన్నారు. వారు తమ పాపమును ప్రేమిస్తారు మరియు దేవుని ద్వేషిస్తారు. పునరుజ్జీవనము పొందనివారిని గూర్చి ఎఫెసీ. 2:1-3లో పౌలు చెప్పిన మాటలను వినండి:
[వారు తమ] అపరాధములచేతను పాపములచేతను... చచ్చినవారై యుం[డి]... వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి... [తమ] శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు... స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రు[లైయుంటిరి] (ఎఫెసీ. 2:1-3).
దేవునికి మరియు పునరుజ్జీవనము పొందనివారికి మధ్య ఉన్న వైరమును గూర్చి దీనికంటే కఠినమైన కథనమును మనము ఊహించలేము. పునరుజ్జీవనము పొందనివారు ఆత్మీయ సంఘర్షణలో కేవలం ప్రక్కన నిలువబడి చూసేవారు కాదు లేక నిర్దోషులైన పౌరులు కాదు. బదులుగా, రోమా. 5:10 మరియు కొలస్సీ. 1:21లో మనము చదువునట్లు, పునరుజ్జీవనము పొందనివారు స్వయంగా దేవునికి విరోధులైయున్నారు. మరియు ఈ కారణము చేత, వారు ఖండించబడతారు, మరియు దేవుని నిత్య శిక్షను అనుభవించునట్లు నాశనమునకు నెట్టబడతారు. యోహాను 8:42-44లో అవిశ్వాసులైన యూదులకు యేసు సెలవిచ్చినట్లు:
దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు... మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు; మీ తండ్రి దురాశలు నెరవేర్చ గోరుచున్నారు (యోహాను 8:42-44).
యాకోబు 4:4లో, యాకోబు ఇలా వ్రాశాడు:
వ్యభిచారిణులారా, యీ లోకస్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి యెవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును (యాకోబు 4:4).
పునరుజ్జీవనము పొందనివారు తెలిసికూడా, ఉద్దేశ్యపూర్వకముగా దేవుని వ్యతిరేకిస్తారు అని దీని అర్థము కాదు, కాని కొంతమంది అలా చేస్తారు కూడా. పునరుజ్జీవనము పొందనివారిలో చాలా మంది కేవలం మోసము చేయబడుతున్నారు. ఎందుకంటే, అబద్ధ మతములు, మరియు నాస్తిక వాదులు కూడా నిజమైన లోకదృష్టికోణములను ప్రతిపాదిస్తున్నామని దావా చేస్తారు. పునరుజ్జీవనము పొందనివారు బైబిలు దేవుని పట్ల సూటిగా మరియు స్పష్టమైన వైరమును కనుపరచకపోయినప్పటికీ, వారు ఆయనకు విరోధులైయున్నారు. వారు ఇప్పటికీ ఈ లోక రాజ్యములో సభ్యులై, సాతానును అనుసరిస్తున్నారు. ఇప్పటికీ వారు దేవుని మంచితనమును తిరస్కరించి, ఆయన అధికారమును వ్యతిరేకిస్తారు. మరియు ఇప్పటికీ దేవుడు వారిని ఖండిస్తాడు.
పునరుజ్జీవనము పొందనివారు దృష్ట్యా ఇప్పటి వరకు మానవాళి యొక్క వర్తమాన స్థితిని మనము చూశాము కాబట్టి, ఇప్పుడు పునరుజ్జీవనము పొందినవారి వైపుకు మన దృష్టిని మళ్లిద్దాము.
“పునరుజ్జీవనము పొందినవారు” అను పారిభాషిక పదమునకు అర్థము, పునఃసృజించబడుట లేక తిరిగిజన్మించుట అయ్యున్నది అని మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. మరొక మాటలో, పునరుజ్జీవనము పొందినవారు పరిశుద్ధాత్మ కార్యము ద్వారా తిరిగి జన్మించినవారైయున్నారు. అలా జరిగినప్పుడు, మన ఆత్మలు పునరుజ్జీవనము లేక నూతన జీవమును పొందినవిగా ఉంటాయి.
పునరుజ్జీవనము పొందినవారి యొక్క లక్షణములను పునరుజ్జీవనము పొందనివారిని గూర్చి మనము చేసిన చర్చకు అనుగుణంగా మూడు మార్గములలో చూద్దాము. ముందుగా, వారికి ఆత్మీయ జీవితము ఉన్నదని మనము చూద్దాము. రెండవదిగా, వారి నైతిక సామర్థ్యమును మనము వివరిద్దాము. మరియు మూడవదిగా, దేవునితో వారు సమాధానపడుట మీద మనము దృష్టిపెడదాము. ముందుగా వారి ఆత్మీయ జీవితమును చూద్దాము.
మానవులు ఒక విధంగా, ఆత్మ సంబంధమైన మరణపు దశలో జన్మిస్తారని లేఖనము బోధిస్తుంది. కాబట్టి, మనము పునరుజ్జీవనమును పొందుటకు — ఆత్మీయ జీవితమును కలిగియుండుటకు — మన ప్రాణములు మరణములో నుండి జీవములోనికి దాటిపోవాలి. దీనిని గూర్చి ఆత్మీయ పునరుత్థానముగా మనము ఆలోచించవచ్చు. యోహాను 5:24, ఎఫెసీ. 2:4, 5 మరియు కొలస్సీ. 2:13 వంటి చోట్ల ఈ నియమము స్పష్టముగా బోధించబడింది.
లేఖనము ఈ ప్రక్రియను తిరిగిజన్మించుట అని వర్ణిస్తుంది. మానవులు భౌతిక జీవితమును పొందినప్పుడు మొదటిగా జన్మిస్తారు. అయితే మనము రక్షణ వంటి దేవుని ఆశీర్వాదములను పొందుకొనుటకు, రెండవ జన్మను పొందాలి — ఆత్మీయ జననము.
దేవుని ఆశీర్వాదములను పొందుకొనుటకు మనకు ఆత్మీయ జీవితము కావాలి అను ఆలోచన సంక్లిష్టమైనది కాదు. ఇశ్రాయేలులో ఒక పరిసయ్యుడు మరియు బోధకుడైన నీకొదేము కూడా దీనిని అర్థము చేసుకొనుటకు కష్టపడ్డాడు. కాబట్టి, యోహాను 3:3-6లో, యేసు నీకొదేముకు దీనిని గూర్చి ఈ విధంగా వివరించాడు:
ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలే[డు]...ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలే[డు]. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది (యోహాను 3:3-6).
ఇక్కడ, మన ఆత్మలకు పరిశుద్ధాత్మ జన్మనిస్తేనే మనము ఆత్మీయ జీవితమును కలిగియుండగలము అని యేసు బోధించాడు. మరియు తీతుకు 3:5లో పౌలు కూడా ఇలాంటి ఒక విషయమునే చెబుతున్నాడు:
పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను [దేవుడు] మనలను రక్షించెను (తీతు 3:5).
కొన్ని అనువాదములలో, ఇక్కడ ఉపయోగించబడిన “పునర్జన్మ” అను పదము “పునరుజ్జీవనము” అని అనువదించబడింది.
మన ఆత్మీయ జీవితమును గూర్చి మనము చూడవలసిన మరొక ప్రాముఖ్యమైన బిందువు ఏమనగా, అది నిత్యము ఉంటుంది, లేక కొన్ని అనువాదములు తెలుపునట్లు “నిత్యమైనది.” పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరచినప్పుడు, మన ప్రాణములు మరణములో నుండి జీవములోనికి దాటిపోతాయి. మరియు ఆ జీవితము ఎన్నడు ముగింపబడదు. మన భూలోక శరీరములు మరణించినప్పుడు, మన ప్రాణములు నిత్యము జీవిస్తాయి.
నిత్యజీవము అనునది ఒక అద్భుతమైన, అద్భుతమైన ఆలోచన అయ్యున్నది, కాబట్టి ప్రతి క్రైస్తవుడు దీనిని గూర్చి వింటాడు, ఎరిగియుంటాడు, మరియు నమ్ముతాడు. అది ఎప్పుడు ఆరంభమవుతుంది అనునది ఆసక్తికరమైన ప్రశ్న, ఎందుకంటే నిత్యజీవము అనునది మనము మరణించిన తరువాత ఆరంభమై, ఆ తరువాత నిత్యము ఉంటుంది అని అనేక మంది నిత్యజీవమును గూర్చి ఆలోచన చేస్తారు. మరియు, అవును, ఇది నిజమే, కాని మనము క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు మనకు నిత్యజీవము కలుగుతుంది, అనగా మనము తిరిగి జన్మించినప్పుడు, దేవుడు మనలను పునరుజ్జీవపరచినప్పుడు అది ఆరంభమవుతుంది అని లేఖనములు బోధిస్తున్నాయి. మరియు ఆ సమయము మొదలుకొని, మనము దేవునికి చెందినవారము, మనము దేవుని కొరకు జీవిస్తాము, మనము దేవుని మహిమపరుస్తాము, మరియు ఆయన మన సంరక్షకుడు మరియు కాపరి అయ్యున్నాడు. ఆ సమయము మొదలుకొని, మన తండ్రి చేతిలో నుండి మనలను ఎవరు లాగుకొనలేరు. కాబట్టి, నిత్యజీవము అనునది ఎంత కాలము ఉంటుంది మరియు ఎంత పరిపూర్ణమైనది అనునది ముఖ్య విషయము కాదుగాని, అది జీవితము యొక్క నాణ్యతకు సంబంధించినది, ప్రభువుతో జీవితం, ప్రభువుతో మరియు ప్రభువు కొరకు జీవించు జీవితము, ఇప్పుడు మరియు తుదకు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి జీవించు జీవితమైయున్నది.
— డా. పాల్ గార్డ్నర్
మనము చాలాసార్లు నిత్యజీవమును మరణము తరువాత పొందుకుంటాము అనుకుంటాము. మన నిత్యజీవితము మన శరీరములు పునరుత్థానము పొందునంత వరకు పరిపూర్ణముగా కలుగదు అను ప్రాముఖ్యమైన భావన ఉన్నది. అయినను నిత్య జీవము వర్తమాన స్థితిలో పునరుజ్జీవనము పొందినవారు అనుభవించు ఒక ఆశీర్వాదమైయున్నదని లేఖనములు బోధిస్తాయి. పునరుజ్జీవనము పొందినవారు ఇప్పటికే నిత్య ఆత్మీయ జీవమును కలిగియున్నారు అని యోహాను 10:28, 1 తిమోతి 6:12, మరియు 1 యోహాను 5:11-13 వంటి వాక్యభాగములు బోధిస్తాయి.
పునరుజ్జీవనము పొందినవారి యొక్క ఆత్మీయ జీవితములను మనస్సులో ఉంచుకొని, ఇప్పుడు వారి పునరుద్ధరించబడిన నైతిక సామర్థ్యమును చూద్దాము.
నిరాశ్చర్యముగా, “నైతిక సామర్థ్యము” అనగా:
దేవుని సంతోషపరచి, ఆయన ఆశీర్వాదములకు యోగ్యులగు సామర్థ్యమైయున్నది.
దీనిని గూర్చి, విశేషముగా యోగ్యతను గూర్చి మరికాసేపట్లో వివరిద్దాము. ప్రస్తుతానికి, మన నైతిక సామర్థ్యము మనము రక్షణను సంపాదించుటలో మనకు సహాయము చేయదు అని చెబుదాము — క్షమాపణ, నీతి మరియు నిత్య జీవము వంటివి క్రీస్తు యోగ్యత ఆధారంగా దేవుడిచ్చు ఉచిత బహుమానములైయున్నవి. అయితే పునరుద్ధరణ చెందిన మన నైతిక సామర్థ్యము దేవుని చిత్తముకు విధేయులగుటకు మరియు రాజ్యములోని ఆశీర్వాదములను అన్వేషించుటకు మనకు బలమునిస్తాయి.
అగస్టిన్ ఆలోచన ప్రకారం, మానవాళి పాపములో పడిపోయినప్పుడు, మనము పొస్సే నాన్ పెక్కరె, లేక పాపము తప్పించుకొను సామర్థ్యమును కలిగియుండుట నుండి నాన్ పొస్సే నాన్ పెక్కరె లేక పాపమును తప్పించుకొనుటలో అసమర్థతలోనికి నడిపించబడ్డాము. పరిశుద్ధాత్మ మనకు ఆత్మీయ జీవితమునిచ్చి మన ప్రాణములను పునరుజ్జీవపరచినప్పుడు, ఆయన మన నైతిక సామర్థ్యమును ఉజ్జీవపరుస్తాడు అని కూడా అగస్టిన్ బోధిస్తాడు. ఆయన మనలను మరలా పొస్సే నాన్ పెక్కరె స్థితిలోనికి వెనుకకు నడిపిస్తాడు. మరొక మాటలో, పునరుజ్జీవనము పొందినవారు పాపమును తప్పించుకొని, దేవుని సంతోషపరచు సామర్థ్యమును తిరిగిపొందుకుంటారు. ఎఫెసీ. 2:4-5లో ఆయన చెప్పిన మాటలను వినండి:
అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను. కృప చేత మీరు రక్షింపబడియున్నారు (ఎఫెసీ. 2:4-5).
తరువాత 10వ వచనములో అతడు ఇలా సెలవిచ్చాడు:
మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము (ఎఫెసీ. 2:10).
దేవుడు సత్క్రియలను పునరుజ్జీవనము పొందినవారి కొరకు సిద్ధపరుస్తాడు అను సత్యము మనము మన నైతిక సామర్థ్యమును తిరిగిపొందుకున్నామని రుజువు చేస్తుంది. అయినప్పటికీ, పునరుజ్జీవనము మరియు రక్షణ కృపా ఫలితములైయున్నాయి. మన సత్క్రియలు మనలను రక్షించలేవు.
ఇప్పుడు, పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరచినప్పుడు, ఆయన మన జీవితములలో నుండి పాపము యొక్క భ్రష్టత్వమును మరియు ప్రభావమును పూర్తిగా తొలగించడు అని అర్థము చేసుకోవాలి. రోమా. 7:14-25లో పౌలు వివరించినట్లు, మనలో నివసించు పాపము మనలో నివసించు పరిశుద్ధాత్మతో పోరాడుతూ ఉంటుంది. రోమా. 7:23, గలతీ. 5:17, మరియు 1 పేతురు 2:11 వంటి చోట్ల లేఖనము ఈ సంఘర్షణను యుద్ధము అని పిలుస్తుంది. అయితే ఆత్మ మనలో నివసిస్తాడు మరియు మనలో కార్యములను చేస్తాడు అనునది శుభవార్త అయ్యున్నది. కాబట్టి, పాపము యొక్క ప్రభావము వలన మనము పడిపోతు ఉన్నప్పటికీ, ఆత్మ ప్రభావము వలన మనము సత్క్రియలను కూడా చేస్తాము. ఫిలిప్పీ. 2:13లో పౌలు చెప్పినట్లు:
మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే (ఫిలిప్పీ. 2:13).
కాబట్టి, మనము చేయు సత్క్రియలకు ఘనతను దేవుడు తీసుకుంటే, యోగ్యత ఎక్కడ నుండి వస్తుంది? ఈ విషయమును గూర్చి వేదాంతవేత్తలు భిన్నమైన అభిప్రాయములను కలిగియున్నారు. ఒక వైపున, మనము చేయు సత్క్రియల కొరకు ఘనతను దేవుడు తీసుకోవచ్చు అని ఇవాంజెలికల్ వేదాంతవేత్తలు అందరు సమ్మతిస్తారు. మనము చదివిన లేఖన భాగములలో ఇంత మట్టుకు స్పష్టమవుతుంది.
అయితే మరొక వైపు, పునరుజ్జీవనమును పొందినవారు కొంత వరకు తమ యోగ్యతను కూడా దావా చేయవచ్చని కొందరు ఇవాంజెలికల్ వేదాంతవేత్తలు చెబుతారు. దేవుడు మన సత్క్రియలకు పరలోక నిధులు మరియు కిరీటముతో ప్రతిఫలమిస్తాడు అను సత్యమును వారు చూపుతారు. కొన్ని ఉదాహరణలుగా, మత్తయి 5:12లో, శ్రమను సహించువాడు ప్రతిఫలమును పొందుతాడని యేసు సెలవిచ్చాడు. మత్తయి 16:27లో, అంత్య తీర్పునందు ప్రతి వ్యక్తి “వానివాని క్రియల చొప్పున” ప్రతిఫలము పొందుతాడని ఆయన సెలవిచ్చాడు. మరియు 1 కొరింథీ. 3:8లో, “[మన] కష్టము కొలది” మనకు నిత్య ప్రతిఫలములు ఇవ్వబడతాయని పౌలు సెలవిచ్చాడు.
రెండు రకముల నీతిమంతులుగా తీర్చబడుట ఉన్నదని నేడు కొంతమంది చెబుతుంటారు. మ్రాను మీద తన శరీరములో మన అపరాధమును భరించుట ద్వారా క్రీస్తు మన పక్షమున చేసిన కార్యమును బట్టి, పాపులముగా ఇప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడియున్నాము, అయితే చివరికి దేవుడు “నేను నిన్ను ఎందుకు లోనికి రానివ్వాలి?” అని అడిగినప్పుడు, ఆ సమయమందు కొంత వరకు క్రీస్తు కార్యమును బట్టి మరికొంత నీవు జీవించిన విధానమును బట్టి నీవు నీతిమంతువునిగా తీర్చబడతావు... అయితే ఇది చాలా బాధాకరమైనది, ఎందుకంటే మనము ముందుగా పొందుకున్న నీతి సురక్షితమైనది కాదు, నిశ్చయమైనది కాదు అని దీని అర్థము... కాబట్టి, ఇది కొంత ఇబ్బందిని కలిగిస్తుంది. మరొక వైపున, ప్రతిఫలమును గూర్చిన ఈ అవగాహనను కొంత వరకు మీరు తెలుసుకోవాలి ఎందుకంటే, బైబిలులో ప్రతిఫలము భాష చాలా తరచుగా ఉపయోగించబడింది. అయితే ఈ విషయమును స్పష్టము చేయుటకు అనేక విషయములు సహాయకరంగా ఉంటాయని నా ఆలోచన. నెరవేర్పునందు మహిమ మరియు ప్రతిఫలమును కలిగించు సత్క్రియలను మనము చేసినట్లయితే, అవి మనలను అంగీకరించుటకు ఆధారములుగా ఉన్నాయా లేవా? అనునది ప్రశ్న అవుతుంది... కాబట్టి, క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో క్రైస్తవ ప్రతిఫలములు కృపా ఫలమైన ఈ అనుబంధము యొక్క నెరవేర్పుతో ముడిపడియున్నాయి, ఇందుమూలముగానే ప్రతిఫలములు కృప ద్వారా ఆపాదించబడతాయి అని, తద్వారా మన క్రియలు ఆధారము కాకుండా, అనగా అవి స్వతంత్రముగా సహాయము చేస్తాయి అని కాకుండా ఉంటాయని రోమా పత్రిక సెలవిస్తుంది, అయితే మనము చేయుచున్న విషయములు మరియు మనలను కొన్ని పనులు చేయునట్లు పురికొల్పు దేవుని కృప యొక్క పూర్ణత ద్వారా మన జీవితములో కలుగు ప్రతిఫలము మధ్య అనుబంధము ఉన్నది. అయితే దేవుని ఎదుట మన ఆమోదమునకు మనకు ఆపాదించబడిన క్రీస్తు నీతి మరియు ఆయన మీద మోపబడిన మన పాపమైయున్నది, మరియు ఆయన సమస్తమును భరించి సమస్తమును అనుగ్రహించాడు, మరియు అంత్య దినమందు దీని ఆధారముగానే మనము సజీవుడైన దేవుని ఎదుట ఆమోదించబడతాము.
— డా. డి. ఏ. కార్సన్
యోగ్యత మరియు ప్రతిఫలములను గూర్చిన ప్రశ్నకు మనము ఏ విధముగా జవాబు ఇచ్చినను, దేవుడు మన నైతిక సామర్థ్యతను పునరుద్ధరించాడు అని, మరియు సత్క్రియల నిమిత్తం మనలను బాధ్యులుగా ఎంచుతాడని ఇవాంజెలికల్ క్రైస్తవులు అందరు ఒప్పుకుంటారు. ఆయనను అనుకరించమని, ఆయనను ప్రేమించమని, ఒకరినొకరు ప్రేమించమని, ధర్మశాస్త్రమును పాటించమని ఆయన మనకు పిలుపునిస్తాడు. అలా చేసినప్పుడు మనకు ప్రతిఫలమును అనుగ్రహిస్తానని ఆయన వాగ్దానము చేస్తున్నాడు.
ఇప్పటివరకు, వారి ఆత్మీయ జీవితము మరియు నైతిక సామర్థ్యత దృష్ట్యా పునరుజ్జీవనము పొందినవారిని మనము పరీక్షించాము. ఇప్పుడు దేవునితో వారు సమాధానపడుటను గూర్చి చూద్దాము.
దేవుడు మనలను పునరుజ్జీవపరచినప్పుడు, ఆయన మనలను తన కుటుంబములోనికి దత్తతు కూడా తీసుకుంటాడు. ఒకప్పుడు మనము సాతాను పక్షమున దేవునికి విరోధముగా పోరాడిన ఆయన విరోధులమైయుంటిమి. అయితే ఇప్పుడు యేసు ద్వారా దేవుడు మనతో సమాధానపడ్డాడు. క్రీస్తు మరణము ద్వారా మన పాపములు క్షమించబడినవి, మరియు ఆయన నిబంధన వాగ్దానములకు వారసులముగా మనము ఆయన కుటుంబములోనికి చేర్చబడితిమి.
రోమా. 5:10లో పౌలు వ్రాసినట్లు:
ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధాన పరచబడి[తిమి] (రోమా. 5:10).
కొలస్సీ. 1:21, 22లో కూడా అతడు ప్రధానముగా ఇదే విషయమును చెబుతున్నాడు.
వాస్తవానికి, మనము దేవుని కుటుంబములో కేవలం పిల్లలము మరియు వారసులము మాత్రమే కాదు. మనము ఆయన కుమారుడైన యేసుతో ఐక్యపరచబడ్డాము కాబట్టి, దేవుని ప్రియమైన కుమారునిగా యేసు యొక్క స్థాయిని మనము పంచుకుంటాము. అనేక చోట్ల, బాప్తిస్మము ద్వారా వ్యక్తపరచబడిన రక్షింపబడు విశ్వాసము ద్వారా మనము క్రీస్తుతో ఐక్యపరచబడితిమి అని పౌలు బోధించాడు. కాబట్టి, దేవుడు మనలను చూసినప్పుడు, ఆయన మనలను క్రీస్తు ఛాయలో చూస్తాడు, మరియు ఆయన క్రీస్తు పూర్ణతలను మరియు నీతిని మన ఖాతాలో జమ చేస్తాడు. మరొక మాటలో, మనమే యేసు అన్నట్లు ఆయన మనతో వ్యవహరిస్తాడు: అబ్రాహాము మరియు దావీదుకు వారసునిగా, మరియు దేవుని నిబంధనను పరిపూర్ణముగా నెరవేర్చువానిగా. మరియు మనము క్రీస్తు మరణములో కూడా ఐక్యపరచబడితిమి కాబట్టి, మనము ఇప్పటికే పాపముల కొరకు చచ్చినవారమైయున్నట్లు దేవుడు మనలను పరిగణిస్తాడు, తద్వారా ఏ విధమైన శిక్ష మనకు ఇవ్వబడదు — కేవలం ఆశీర్వాదములే. రోమా. 6:3, 4 మరియు 1 కొరింథీ 12:12-27 వంటి చోట్ల దీనిని మనము చూడవచ్చు. మరియు గలతీ. 3:26-27లో పౌలు వ్రాసిన మాటలను వినండి:
యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసమువలన దేవుని కుమారులై యున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు (గలతీ. 3:26-27).
అంతేగాక, క్రీస్తుతో ఐక్యత మరియు — అది తీసుకొనివచ్చు సమాధానము — దేవుని యుగాంత ఆశీర్వాదముల యొక్క నెరవేర్పుగా ఉన్నదని పౌలు బోధించాడు. ఈ విధంగా, అంత్య దినములలోని నూతన సృష్టి ఆరంభమైనది అనుటకు ఇది రుజువుగా ఉన్నది. దీని ఆధారంగా, దేవునితో సమాధానపడుట క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి వాటి యొక్క సంపూర్ణతలో వచ్చినప్పుడు మనము పొందు నిత్య ప్రతిఫలములకు ముందు రుచిగా ఉన్నదని కూడా మనము చెప్పవచ్చు. 2 కొరింథీ. 5:17లో, పౌలు వ్రాసినట్లు:
కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను; (2 కొరింథీ. 5:17).
కొన్ని అనువాదములు “వాడు నూతన సృష్టి” అను మాటను “అది నూతన సృష్టి” లేక “అతడు ఒక నూతన సృష్టి” అని అనువదిస్తాయి. అయితే గ్రీకు పదమైన కైనె క్టిసిస్ అను పదము స్వభావికముగా “అది నూతన సృష్టి” అని అనువదించబడుతుంది. ఈ అనువాదము పౌలు వివరించిన పునరుజ్జీవనమును గూర్చి మరింత స్పష్టతనిస్తుంది. కాబట్టి, క్రీస్తుతో మన ఐక్యత రానున్న యుగము వచ్చియున్నది అని రుజువు చేస్తుంది. 19-21 వచనములలో పౌలు కొనసాగించిన విధానమును వినండి:
దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు[న్నాడు]... దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనమాయనయందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగా చేసెను (2 కొరింథీ. 5:19-21).
క్రీస్తు సిలువపై మన స్థానమును తీసుకున్నాడు, మరియు మనలను రక్షించుటకుగాను ఆయన పాపిగా ఎంచబడ్డాడు. మరియు ఆయన ఈ విధంగా చేశాడు కాబట్టి, ఇప్పుడు ఆయన నీతి మనకు ఆపాదించబడింది. మన సమాధానమును ఇదే సాధిస్తుంది. మనము క్రీస్తులో క్షమాపణను పొందితిమి కాబట్టి దేవుడు మనలను కేవలం నిర్దోషులుగానే ఎంచడుగాని, సంపూర్ణముగా విధేయులైనవారిగా — స్వయంగా క్రీస్తు వలె విధేయులైనవారిగా — ఎంచుతాడు.
కాబట్టి, “సజీవులు మరియు మృతులు” అను మన పాఠంలో ఇప్పటి వరకు, మానవాళి యొక్క వర్తమాన స్థితిని గూర్చి బైబిలు ఏమి బోధిస్తుందో చూస్తాము. ఇప్పుడు మన రెండవ ప్రధానమైన అంశమును చూద్దాము: మధ్య స్థితి.
“మధ్య స్థితి” అను పదమును వేదాంతవేత్తలు ప్రజల మరణములు మరియు పునరుత్థానముకు మధ్య ఉన్న కాలముగా వర్ణిస్తారు. కాబట్టి, విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు కూడా మధ్య స్థితి ఉన్నది, అవి ప్రస్తుత స్థితిలో పరలోకము, మరియు ప్రస్తుత స్థితిలో నరకమైయున్నది — వీటిని కొన్నిసార్లు “ప్రస్తుత పరలోకము” మరియు “ప్రస్తుత నరకము” అని పిలుస్తారు — అంతిమ నిత్య నరకము అగ్నిగుండమైయుంటుంది, మరియు అంతిమ నిత్య పరలోకము నూతన భూమి మీద ఉంటుంది. కాబట్టి, మధ్య స్థితి పరలోకము మరియు నరకమునకు మధ్యన ఉన్న సమయము కాదు; అవి పునరుత్థానమునకు ముందు పరలోకము లేక నరకము అయ్యున్నది. కాబట్టి, మరణించిన తరువాత ప్రతి ఒక్కరు మధ్య స్థితిలోనికి ప్రవేశిస్తారు. నీతిమంతులు మరియు అవినీతిపరుల పునరుత్థానము జరిగినప్పుడు మధ్య స్థితి ప్రతి ఒక్కరి కొరకు ముగించబడుతుంది.
— డా. ర్యాండి అల్కర్న్
మధ్య స్థితి మనము మరణించినప్పుడు ఆరంభమవుతుంది మరియు క్రీస్తు తిరిగివచ్చినప్పుడు ముగుస్తుంది. దీనిని “మధ్య” అంటారు ఎందుకంటే, అది ప్రస్తుత భూమి మీద మన శారీరిక జీవముకు సంబంధించిన వర్తమాన స్థితి, మరియు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో మన శరీర జీవితముల యొక్క భవిష్యత్ స్థితికి మధ్య ఉన్నది. ఇది ఒక అసాధారణమైన స్థితి ఎందుకంటే, ఇతర స్థితులకు భిన్నముగా, మధ్యస్థితిలో మన ప్రాణములు మన శరీరముల నుండి వేరుపరచబడతాయి.
మధ్య స్థితిని గూర్చిన మన చర్చ మూడు భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా, మనము భౌతిక మరణమును చూద్దాము. రెండవదిగా, పునరుజ్జీవనము పొందనివారి ప్రాణముల గతిని మనము పరిగణిద్దాము. మూడవదిగా, పునరుజ్జీవనము పొందినవారి ప్రాణముల యొక్క గమ్యమును చూద్దాము. భౌతిక మరణమును చర్చిస్తూ ఆరంభిద్దాము.
భౌతిక మరణము సర్వలోకంలోని సమస్త ప్రజల అనుభవమైయున్నది, కాని అది భయంకరంగా అసాధారణమైనదై యున్నది. ఎందుకని? మన శరీరములు మరణము కొరకు చేయబడలేదు కాబట్టి, అవి నిత్యము ఉండవలసియున్నవి. ఇందుమూలముగానే మరణము చాలా భయానకమైనది మరియు చాలా నిరాశాజనకమైనది. అది మన ఉనికిని తుత్తునియలు చేస్తుంది. మనము స్వాధీనపరచుకొనుటకు చేయబడిన భూలోక సృష్టి నుండి అది మనలను తొలగించివేస్తుంది. అది మన అనుబంధములను తారుమారు చేసి, మనలను మన కుటుంబములు మరియు ప్రియుల యొద్ద నుండి వేరుచేస్తుంది. మరియు విడిచిపెట్టబడినవారికి, అది చాలా బాధాకరముగా ఉంటుంది. భౌతిక మరణమును లేఖనములు “విరోధి” అని పిలుస్తాయి అను విషయము ఆశ్చర్యము కలిగించదు.
కణముల క్రియ ఆగిపోవుట ద్వారా భౌతిక మరణము సంభవిస్తుంది అని అనేకమంది వైజ్ఞానికులు బోధిస్తారు. మన శరీరములోని కణములు పనిచేయుట ఆగిపోయినప్పుడు, మనము మరణిస్తాము. మరియు ఈ అభిప్రాయము చాలా వరకు నిజమైయున్నది. అయితే భౌతిక మరణము యొక్క వేదాంతశాస్త్ర విషయములు మరి ఎక్కువ ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయి. ఆత్మీయ మరణము వలెనే, భౌతిక మరణము కూడా ఏదెను తోటలో ఆదాము చేసిన పాపము ద్వారా దేవుడు మానవాళికి ఇచ్చిన శాపములో భాగమైయున్నది. ఆది. 2:17లో, ఆదాముతో దేవుడు పలికిన మాటలను మీరు గుర్తు చేసుకోవచ్చు:
అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను (ఆది. 2:17).
ఆదాము నిషేధించబడిన ఫలమును భుజించినప్పుడు, అతడు దేవుని శాపమునకు పాత్రుడైయ్యాడు. దేవుడు కృపతో ఆదాము యొక్క భౌతిక మరణమును ఆలస్యం చేశాడు, కాబట్టి ఆదాము వెంటనే మరణించలేదు. అయితే ఆయన శాపమును పూర్తిగా తొలగించలేదు, మరియు తుదకు ఆదాము శరీరము మరణించింది. ఆదాము పాపము ఆత్మీయ మరణమును మానవాళి అంతటికి వ్యాపింపజేసినట్లే, అది మనకు భౌతిక మరణమును కూడా కలిగించింది. ఈ సమస్యను గూర్చి రోమా. 5వ అధ్యాయములో పౌలు సుదీర్ఘముగా మాట్లాడాడు. రోమా. 5:12-17లోని ఈ ఉదాహరణలను వినండి:
ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను... ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను...మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యే[లెను] (రోమా. 5:12-17).
మనము మరణించినప్పుడు, మన ప్రాణములు మన శరీరముల నుండి వేరుచేయబడతాయి, మరియు మన శరీరములు నాశనము కొరకు విడువబడి మంటికి చేరతాయి. ఆది. 2:7లో మనము నేర్చుకొనుచున్నట్లు, దేవుడు ఆదామును నేల మంటి నుండి చేశాడు. మరియు ఆది. 3:19లో దేవుడు ఆదామును శపించినప్పుడు, ఆదాము నేల మంటి నుండి చేయబడ్డాడు, కాబట్టి మంటికి చేరతాడని ఆయన స్పష్టముగా చెప్పాడు. అతడు మంటి నుండి చేయబడ్డాడు కాబట్టి మరలా మంటికి చేర్చబడతాడు.
ఇప్పుడు, మనము మరణించినప్పుడు మన శరీరములు పరలోకమునకు చేరవు కాబట్టి, అవి అంత ప్రాముఖ్యమైనవి కాదు అని ఆలోచించునట్లు క్రైస్తవులు శోధింపబడతారు. మనము మరణించిన తరువాత కూడా మన శరీరములు మనలో భాగమైయుంటాయని లేఖనము తెలియజేస్తుంది. పునరుత్థానములు దీనికి అత్యంత స్పష్టమైన ఉదాహరణలుగా ఉన్నాయి. 1 రాజులు 17:20-22లో ఏలీయా మరణము నుండి లేపిన విధవరాలి కుమారుని చూడండి, లేక యోహాను 11:43, 44లో ప్రభువు మరణము నుండి లేపిన యేసు స్నేహితుడైన లాజరును చూడండి. వారు తిరిగి లేపబడుటకు ముందు, వారి శరీరములతో సజీవులుగా ఉన్న ప్రజలతో వ్యవహరించు విధముగానే వ్యవహరించబడింది. వారి శరీరములు తమ ఆత్మల ద్వారా విడనాడబడిన పెంకులు అనుటకు ఎలాంటి సూచనలేదు. మరియు వారి ఆశీర్వాదములను ప్రతి ఒక్కరు పునరుత్థానములుగా చూశారు, ఎందుకంటే వీరిలోని ప్రాముఖ్యమైన భాగములు — వారి శరీరములు — మరలా జీవములోనికి తిరిగివచ్చాయి.
కాబట్టి, మనము మరణించినప్పుడు ఏమి జరుగుతుంది? మనము మరణించినప్పుడు మన శరీరములు లేకుండా దేవునితో మనము ఉనికిలో ఉండు మధ్య స్థితిని మీరు నమ్మునట్లయితే, మన శరీరములు మనలో ఇక భాగముగా లేవు అని ఆలోచించుట సులభముగా ఉంటుంది, ఎందుకంటే మనము దేవునితో ఒక చోట ఉంటే మనలో భాగము కాని మన శరీరము సమాధిలో ఉన్నది అని దీని అర్థము కాదా? అయితే ఈ విధముగా మనము చేయు ఆలోచనలో ఒక పొరపాటు ఏమిటంటే, దేవుడు మనలను సంపూర్ణమైన వ్యక్తిత్వములుగా చేశాడు. కాబట్టి, జాన్ కూపర్ చెబుతున్నట్లు ఈ ఎడబాటు పతనము తరువాత జరిగిన ఒక విషాదకరమైన పరిణామమైయున్నది. అయితే వాస్తవము ఏమిటంటే, ఇప్పుడు జరుగుతున్న ఎడబాటులో... ఒక మంచి భాగము మననుండి దూరమైనప్పటికీ, మరణము తరువాత కూడా, ప్రజలు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారు, అయితే, మనము సశరీరులముగా ఉండుటకు చేయబడితిమి, మరియు మనము సశరీరులముగా చేయబడితిమి కాబట్టి, మరియు క్రీస్తు శరీర పునరుత్థానమును పొందాడు కాబట్టి, ఇప్పుడు ఈ విషాదకరమైన ఎడబాటు జరుగుతునప్పటికీ, మన శరీరము సమాధిలో ఉన్నప్పటికీ కూడా అది మనలో భాగమైయున్నది, మరియు అంత్య దినమున, ఆ శరీరము తిరిగి లేస్తుంది.
— విన్సెంట్ బకొటే, Ph.D.
మన శరీరములు మరణించినప్పుడు, మనమిక సంపూర్ణులముగా ఉండము. రక్షింపబడినవారి విషయములో, మనము చేయుటకు దేవుడు మనలను సృజించిన కార్యములను, అనగా భూమిని నిండించి లోపరచుకొను కార్యమును చేయలేమని అర్థము. అవును, మన ప్రాణముల కొరకు పరలోకము అద్భుతమైనదిగా ఉంటుంది. అయితే భౌతిక మరణము అప్పటికీ ఘోరమైన నష్టమైయున్నది మరియు భవిష్యత్తులో పునరుత్థానమును గూర్చిన నిరీక్షణ కొరకు ఎదురుచూచునట్లు అది మనలను చేయాలి. మరియు రక్షింపబడనివారి విషయములో, ఇది తిరిగిరాని విపత్తైయున్నది. ఇది వారి పరిస్థితిని మరింత ఘోరమైనదిగా చేస్తుంది, మరియు భవిష్యత్తులో మరి ఎక్కువ శ్రమ యొక్క ముందు రుచిని అది వారికి ఇస్తుంది.
భౌతిక మరణము మధ్య స్థితికి ఆరంభముగా ఉన్నది అని ఇప్పటి వరకు మనము వర్ణించాము కాబట్టి, ఇప్పుడు పునరుజ్జీవనము పొందని ప్రాణముల యొక్క అనుభవములను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.
ఆత్మీయ మరణమును గూర్చిన మన సంభాషణలో మనము చూసినట్లు, మన ప్రాణములు మరణించినప్పుడు అవి అంతమైపోవు. అవి జ్ఞానమును కూడా కలిగియుంటాయి. మరియు భౌతిక మరణము ద్వారా మన శరీరములు మన ప్రాణముల నుండి వేరుచేయబడినప్పుడు కూడా ఇదే జరుగుతుంది. మన శరీరములు మరణించిన తరువాత కూడా మన ప్రాణములు ఉనికిలో ఉంటాయి, ఆలోచిస్తాయి మరియు భావనలు కలిగియుంటాయి.
ప్రసంగి 12:7లో మనము ఇలా చదువుతాము:
మన్నయి నది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును (ప్రసంగి. 12:7).
పునరుజ్జీవనము పొందనివారికి, వారి ప్రాణములు ఉనికిలో కొనసాగుతాయి అను సత్యము వారికి గొప్ప భయమును కలిగించాలి, ఎందుకంటే వారి ఆత్మ దానిని ఇచ్చిన దేవుని యొద్దకు తిరిగివెళ్లినప్పుడు, అది ఆయన ఆశీర్వాదములను ఆస్వాదించదు. అది నరకములో వారి యొక్క న్యాయమైన శిక్షను అనుభవించుటకు ఆరంభముగా ఉన్నది. యేసు లూకా 12:4-5లో బోధించినట్టుగా:
నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరని వారికి భయపడకుడి... చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను (లూకా 12:4-5).
రెండు కారణముల వలన ప్రజలు నరకమును గూర్చి నమ్మాలని నా ఆలోచన. యేసు క్రీస్తు నరకమును గూర్చి అనేకసార్లు మాట్లాడాడు అనునది మొదటి కారణం. ఉదాహరణకు... శరీరమును చంపువారిని గూర్చి ప్రజలు భయపడకూడదని [ఆయన చెప్పాడు]. అయితే శరీరములను చంపి ఆత్మను నరకములో పడవేయువానిని గూర్చి మనము భయపడాలి. అంతేగాక, సంఘము నరకమును గూర్చి నమ్మి, దానిని గూర్చి ప్రకటించాలి — ధైర్యముగాను, ప్రేమతోను — తద్వారా ప్రజలు దేవుని ఎదుట తమ పరిస్థితులను గూర్చి అర్థము చేసుకొని నిత్య శిక్షను తప్పించుకోగలుగుతారు.
— రెవ. జోసె అరిస్టైడ్స్, అనువాదము
వేదాంతవేత్తలు మరియు అనువాదకులు “నరకం” అను జన్యు పదమును ఉపయోగించు సందర్భములో లేఖనము అనేక రకముల పదములను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, హెబ్రీ పదమైన షియోల్, లేక ఆంగ్ల పదమైన “షి-యెల్” పాత నిబంధన అంతటా అనేక విధములుగా ఉపయోగించబడింది, మరియు కీర్తనలు 9:17లో, పునరుజ్జీవనము పొందనివారి ప్రాణములు ఉండు గృహముగా సంబోధించబడింది. పాత నిబంధన అబద్దోన్ అను పదమును, లేక ఆంగ్లములో “ఉహ్-బాడ్-న్” కూడా ఉపయోగిస్తుంది, యోబు 26:6 మరియు సామెతలు 15:11 వంటి చోట్ల “నాశనము” అని ఈ పదము యొక్క అర్థమైయున్నది. మరియు యెషయా 14:15-19లో, బౌర్, లేక ఆంగ్లములో “పిట్” అను పదము శిక్షను అనుభవించు స్థలమును సూచిస్తుంది.
మధ్య స్థితిలో ప్రాణములు ఉండు స్థలమును వర్ణించుటకు క్రొత్త నిబంధన కూడా అనేక పదములను ఉపయోగిస్తుంది. ఉదాహరణకు, గ్రీకు పదమైన హేడ్స్, లేక ఆంగ్లములో “హెయ్-డీజ్” లూకా 10:15తో సహా అనేక చోట్ల శిక్షను అనుభవించు స్థలము కొరకు ఉపయోగించబడింది. లూకా 8:31 మరియు ప్రకటన 9:1-11లో వలె అబుస్సోస్ లేక అబిస్స్ అను పదము దయ్యముల కొరకు యేర్పరచబడిన చెరసాలను సూచిస్తుంది. అయితే రోమా. 10:7లో, యేసు యొక్క నీతిగల ప్రాణముతో మానవ ప్రాణములు ఉండు స్థలమును సూచించుటకు కూడా పౌలు ఈ పదమును ఉపయోగించాడు.
అయితే “గీన్న” లేక గెహెన్న అను పదము సార్వత్రికముగా శిక్ష, హింస మరియు నాశనము ఉన్న అగ్ని ఉన్న స్థలముగా గుర్తించబడుతుంది. మత్తయి 5:22, మరియు మార్కు 9:43 వంటి అనేక వాక్యభాగములలో ఇది ప్రస్తావించబడింది. గెహెన్నను చాలాసార్లు శారీరిక శ్రమ ఉన్న స్థలముగా వర్ణిస్తారు, మరియు ఇది మధ్య స్థితిగాక అంతిమ స్థితికి సంబంధించినదిగా ఉన్నది. అయితే గెహెన్న ఇప్పటికే ఉపయోగములో ఉన్నది అని యాకోబు 3:6 సూచిస్తుంది, మరియు మధ్య స్థితిలో పునరుజ్జీవనము పొందని ప్రాణములు ఇక్కడే ఉంటాయని ఇది తెలియజేస్తుంది.
పునరుజ్జీవనము పొందని ప్రాణములు మధ్య స్థితిలో అనుభవించు స్పష్టమైన చిత్రమును కొంత వరకు మనము లూకా 16:19-31లో చూస్తాము. ఈ వాక్యభాగములో, మరణించిన వెంటనే పాతాళములో శ్రమను అనుభవించిన ధనవంతుని యేసు వర్ణించాడు. లూకా 16:23-25లో పాతాళమును గూర్చిన వర్ణనను వినండి:
అప్పుడు [ధనవంతుడు] పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రాహామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి తండ్రివైన అబ్రాహామా, నాయందు కనికరపడి, తన వ్రేలికొనను–నీళ్లలోముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము; నేను ఈ అగ్నిజ్వాలలో యాతనపడుచున్నానని కేకలువేసి చెప్పెను. అందుకు అబ్రాహాము – కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, ఆలాగుననే లాజరు కష్టము అనుభవించెనని జ్ఞాపకము చేసికొనుము; ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు (లూకా 16:23-25).
పాతాళమును గూర్చి యేసు ఇచ్చిన కథనము చారిత్రిక కథనమో లేక ఉపమానమో బైబిలు స్పష్టము చేయదు. అయితే మధ్య స్థితిని గూర్చి మనము చేయుచున్న పరిశోధనకు ఈ వివరణ అంత అవసరము లేదు. ఎందుకంటే, ఈ కథనములోని శ్రమలు నిజమైనవి కాకపోతే ఇది ఇచ్చు హెచ్చరిక అర్థరహితమవుతుంది.
ప్రజలు ఈ ప్రశ్నను అడుగుతారు, మరణించినప్పుడు క్రీస్తును నమ్మనివారి పరిస్థితి ఏమవుతుంది? దీనికి జవాబు క్రొత్త నిబంధనలో అనేక చోట్ల ఇవ్వబడినది, అయితే అత్యంత వివరణాత్మకమైన వర్ణన లూకా 16లో ఇవ్వబడింది, అక్కడ యేసు ఒక ఉపమానమును ఇస్తున్నాడు, మరియు అది మరణము తరువాత విశ్వాసుల మరియు అవిశ్వాసుల జీవితమును గూర్చి వాస్తవిక రూపములో వర్ణించు ఉపమానమైయున్నది. అవిశ్వాసియైన ధనవంతుడు శ్రమను అనుభవించాడు. ఇది అతడు మరణించిన వెంటనే జరిగింది. అతడు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేశాడు కాబట్టి మరియు క్రీస్తుకు వేరుగా అతని పాపములకు వెల చెల్లించబడలేదు కాబట్టి, అతడు శిక్షను అనుభవిస్తున్నాడు. కాబట్టి, అతడు శ్రమపడుతున్నట్టు చిత్రీకరించబడ్డాడు, అయితే ఇది క్రీస్తు తిరిగివచ్చిన తరువాత జరుగు అంతిమ తీర్పుకు ముందు ఉన్న స్థితియైయున్నది.
— డా. వెర్న్ ఎస్. పోయ్త్రెస్స్
భౌతిక మరణము మరియు పునరుజ్జీవనము పొందని ప్రాణముల దృష్ట్యా మధ్య స్థితిని ఇప్పటివరకు మనము చూశాము కాబట్టి, ఇప్పుడు మన దృష్టిని పునరుజ్జీవనము పొందిన ప్రాణముల వైపుకు త్రిప్పుదాము.
స్పష్టముగా, పునరుజ్జీవనము పొందని ప్రాణముల వలెనే పునరుజ్జీవనము పొందిన ప్రాణములు కూడా ఉనికిలో కొనసాగుతాయి. అయితే వారి అనుభవము చాలా భిన్నముగా ఉంటుంది. పునరుజ్జీవనము పొందని ప్రాణములు తమ అంతిమ శిక్షకు ముందు రుచిని అనుభవించుచుండగా, పునరుజ్జీవనమును పొందిన ప్రాణములు తమ అంతిమ ఆశీర్వాదముల యొక్క ముందు రుచిని ఆస్వాదిస్తాయి.
మధ్య స్థితిలో పునరుజ్జీవనము పొందిన ప్రాణములు కలిగియుండు మూడు అనుభవములను మాత్రమే మనము ప్రస్తావిద్దాము, మరియు వారు పరలోకములో ప్రభువు సన్నిధిలో ఉన్నారు అను వాస్తవముతో ఆరంభిద్దాము.
అనేక చోట్ల, పునరుజ్జీవనము పొందినవారు మరణించినప్పుడు, వారి ప్రాణములు వెంటనే పరలోకములో దేవుని సన్నిధిలోనికి కొనిపోబడతాయి అను నమ్మకమును బైబిలు రచయితలు మరియు పాత్రలు వ్యక్తపరచారు. ఉదాహరణకు, లూకా 23:43లో, సిలువ మీద పశ్చాత్తాపపడిన దొంగతో యేసు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని చెప్పాడు. హతసాక్షుల ప్రాణములు దేవుని పరలోక మందిరములో బలిపీఠమునకు దగ్గరగా ఉంటాయని ప్రకటన 6:9 తెలియజేస్తుంది. భౌతిక మరణము తన ప్రాణము యేసుతో కూడా నివసించు సమయముగా ఉన్నది కాబట్టి దాని కొరకు ఎదురుచూచుచున్నానని పౌలు సెలవిచ్చాడు. 2 కొరింథీ. 5:8-23లో పౌలు ఏమి వ్రాసాడో ఒకసారి చూద్దాము:
... యీ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము (2 కొరింథీ. 5:8).
మరియు ఫిలిప్పీ. 1:23లో, అతడు ఇలా వ్రాస్తున్నాడు:
ఈ రెంటిమధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అది నాకు మరి మేలు (ఫిలిప్పీ. 1:23).
మరణమందు విశ్వాసులకు ఏమవుతుంది? సరే, యేసు మరణించుటకు ముందు రాత్రి ఇక్కడ ఉన్నాడు... ఆయన చుట్టూ శిష్యుల యొక్క చిన్న గుంపు చేరింది; వారు విలపించుచుండిరి. ఆయన మాట్లాడిన చివరి మాటలలో ఇవి కొన్ని, మరియు వారికి ఆయన భవిష్యత్తును గూర్చి తెలియజేశాడు. ఆయన చెప్పిన మొదటి విషయం ఏమిటంటే ... కాబట్టి, “నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును.”కాబట్టి ఒక విశ్వాసి మరణించిన తరువాత, యేసు అంటాడు గదా, “నేను ఆ విశ్వాసి యొద్దకు వచ్చి ఇలా అంటాను, ‘రమ్ము, వెళ్దాము పద. వెళ్లు సమయమాసన్నమైయ్యింది.’ నేను మిమ్మును తండ్రి ఇంటి యొద్దకు వెంటబెట్టుకొని తీసుకొనివెళ్తాను” ... ఇది అద్భుతమైన విషయము. ఆయన వెంటబెట్టుకొని వెళ్లువాడు. అయితే ఆయన కేవలం వెంటబెట్టుకొని వెళ్లువాడు మాత్రమేకాదు. ఆయన స్వయంగా గమ్యమైయున్నాడు. “నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొనిపోవుదును.” కాబట్టి ఆయన నన్ను అక్కడి వరకు వెంటబెట్టుకొని మాత్రమే వెళ్లడు. ఆయన స్వయంగా గమ్యమైయున్నాడు. “ఆ మార్గమేలాగు తెలియును?” అని తోమా అడిగాడు. “నేనే మార్గమును, సత్యమును, జీవమును” అని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఆయన వెంటబెట్టుకొని వెళ్లువాడైయున్నాడు; ఆయన గమ్యమైయున్నాడు; ఆయన మార్గమైయున్నాడు. కాబట్టి, మరణించిన తరువాత మనకు ఏమి జరుగుతుంది? యేసు మీద పూర్తిగా దృష్టిపెట్టుము. ఆయన మిమ్మును అక్కడికి వెంటబెట్టుకొని తీసుకొనివెళ్తాడు. అక్కడ ఆయన మార్గమైయుంటాడు. ఆయనే గమ్యమైయుంటాడు. మరియు అవును మన కొరకు మరణించుట ద్వారా మన కొరకు స్థలమును సిద్ధపరచుచున్నాడు. సిలువ మీద మరణించుట ద్వారా అక్కడికి వెళ్లునట్లు ఆయన మనలను పురికొల్పుచున్నాడు, తద్వారా మన పాపమునకు పరిష్కారము కలుగుతుంది, మరియు సిలువ ద్వారా మనము పరలోకమునకు మార్గమును కనుగొనగలము.
— రెవ. రికో టైస్
పునరుజ్జీవనము పొందినవారు మరణించినప్పుడు, వారి శరీరములు సమాధిలో విశ్రాంతి తీసుకుంటాయి, కాని వారి ప్రాణములు వెంటనే పరలోకమందున్న ప్రభువు సన్నిధికి కొనిపోబడతాయి, అక్కడ వారు అంతిమ పునరుత్థానము జరుగు వరకు ఉంటారు. ఇక్కడ “సమాధిలో” అను వ్యక్తీకరణము, వారి శరీరములు భౌతిక సమాధులలో పెట్టబడినప్పటికీ లేక పెట్టబడకపోయినప్పటికీ మరణించినవారందరిని సూచిస్తుంది అను స్పష్టతను మనము కలిగియుండాలి.
అంతేగాక, చరిత్రయందంతటా కొందరు క్రైస్తవులు “ప్రాణము యొక్క నిద్ర” అను అభిప్రాయమును బోధించారు అను విషయమును మనము ఇక్కడ ప్రస్తావించాలి. మనము మరణించిన వెంటనే దేవుడు మన ప్రాణములను నేరుగా పరలోకమునకు తీసుకువెళ్లడు అని ఈ అభిప్రాయము తెలియజేస్తుంది. బదులుగా, మన ప్రాణములు యేసు తిరిగివచ్చునంత వరకు మన శరీరములతో కలసి అజ్ఞాతములో ఉంటాయి. ఈ అభిప్రాయమునకు మద్దతు పలుకువారు మృతులను నిద్రించినవారిగా సంబోధించు దానియేలు 12:2, మరియు 1 కొరింథీ. 15:51 వంటి వాక్యభాగములను ఎత్తి చూపుతారు.
అయితే ఈ అభిప్రాయము లేఖనముతో పొంతన లేకుండా ఉన్నది. మనము ఇంతకు ముందు చూసినట్లు, వారు మరణించిన వెంటనే పరలోకములో ఒకరికొకరు కలిసి ఉంటారని యేసు, పౌలు మరియు ఇతరులు నమ్మారు. హతసాక్షులు ఇప్పటికే అక్కడ ఉన్నారు అని మరియు సంపూర్ణ జ్ఞానమును కలిగియున్నారని బైబిలు బోధిస్తుంది. మృతులు “నిద్రించుచున్నారు” అని బైబిలు మాట్లాడునప్పుడు, దీనిని సభ్యోక్తి — మరణమును గూర్చి మృదువుగా, రూపకాత్మకముగా మాట్లాడు విధానము — రూపములో సులువుగా అర్థము చేసుకోవచ్చు. యోహాను 11:11-14లో లాజరు “నిద్రించెను” అని చెప్పినప్పుడు లాజరు మరణమును గూర్చి యేసు స్వయంగా ఈ విధంగా మాట్లాడాడు. మృతులు “వెళ్లిపోయారు,” “కాలం చెల్లించారు,” లేక “ప్రభువు యొద్ద ఉండుటకు వెళ్లారు” అని చెప్పునప్పుడు ఆధునిక క్రైస్తవులు ఇదే విధమైన సభ్యోక్తులను ఉపయోగిస్తారు.
పునరుజ్జీవనము పొందిన ప్రాణములు మధ్య స్థితిలో కలిగియుండు రెండవ అనుభవము ఏమనగా, పరలోకములో ఇతర పునరుజ్జీవనము పొందిన ప్రాణములతో సహవాసము కలిగియుండుట.
పరలోకమందున్న హతసాక్షులు ఒకరినొకరు ఎరిగియుంటారు మరియు ఒకరితో ఒకరు సహవాసము చేస్తారు అని ప్రకటన 6:9, 10 సూచిస్తుంది. అంతిమ తీర్పును త్వరపెట్టమని దేవుని అడుగునప్పుడు వారు ఏక కంఠముతో కలసి మాట్లాడతారు.
మరియు సువార్తలలో, పేతురు, యాకోబు, మరియు యోహానుల ఎదుట యేసు రూపాంతరము పొందినప్పుడు, ఆయన మోషే ఏలీయాలతో ప్రత్యక్షమైయ్యాడు, మరియు వారు ఒకరితో ఒకరు సంభాషించారు. దీనిని గూర్చి మనము మత్తయి 17:3, మార్కు 9:4, మరియు ముఖ్యముగా లూకా 9:30, 31లలో చదువుతాము.
అబ్రాహాము మరియు ధనవంతుని గూర్చి యేసు ఇచ్చిన కథనములో, లాజరు అను పేరుగల పేదవాని యొక్క ప్రాణమును అబ్రాహాము ఓదార్చాడు. అంతేగాక, లూకా 16:26లో, పునరుజ్జీవనము పొందినవారి ప్రాణములు మరియు పునరుజ్జీవనము పొందనివారి ప్రాణముల మధ్య మహా అగాధముంచబడినది అని అబ్రాహాము సెలవిచ్చాడు. అనగా అబ్రాహాము మరియు లాజరు ఉన్న వైపున వారు మాత్రమే లేరుగాని, వారు ఇతర పునరుజ్జీవనము పొందిన ప్రాణములతో సహవాసములో ఉన్నారు అని ఇది సూచిస్తుంది.
మరియు “సంపూర్ణసిద్ధిపొందిన నీతిమంతుల ఆత్మల” యొక్క పరలోక సహవాసమును గూర్చి హెబ్రీ 12:22, 23 మాట్లాడుతుంది. హెబ్రీ. 11:40 సందర్భములో, భౌతిక మరణము పొందిన ప్రతి పునరుజ్జీవనము పొందిన వ్యక్తి ఈ సహవాసములో భాగమైయుంటాడు.
మధ్య స్థితిలో పునరుజ్జీవనము పొందిన ఆత్మలు అనుభవించు మూడవ అనుభవము సంపూర్ణ పరిశుద్ధత.
ఈ సందర్భములో మానవ పరిశుద్ధతను గూర్చి మనము మాట్లాడినప్పుడు, నైతిక శుద్ధత మరియు దేవుని సన్నిధిలో ఆమోదించబడుట రెండూ మన మనస్సులో ఉంటాయి. భౌతిక మరణము ద్వారా మన ప్రాణములు మన శరీరముల నుండి వేరుచేయబడినప్పుడు, పాపము మన మీద దాని పట్టును కోల్పోతుంది, మరియు ఆ సమయము మొదలుకొని ప్రతి విధమైన పాపమును ఆశతో నిరోధిస్తాము.
మానవాళి పాపములో పడినప్పుడు, మనము పొస్సే నాన్ పెక్కరె స్థితి లేక పాపమును తప్పించుకొను సామర్థ్యము నుండి నాన్ పొస్సే నాన్ పెక్కరె స్థితి లేక పాపమును తప్పించుకొనుటలో అసమర్థతలోనికి నడిపించబడ్డాము అను అగస్టిన్ బోధ మీకు జ్ఞాపకముండియుంటుంది. అగస్టిన్ ఆలోచన ప్రకారం పరిశుద్ధాత్మ మనలను పునరుజ్జీవపరచినప్పుడు ఆయన మనలను తిరిగి పొస్సే నాన్ పెక్కరె స్థితికి చేర్చి, మన నైతిక సామర్థ్యమును పునరుద్ధరిస్తాడు అని కూడా మీకు గుర్తుండే ఉంటుంది. అంతిమ స్థితిలో మనము నాన్ పొస్సే పెక్కరె స్థితికి అనగా పాపము చేయుటకు అసమర్థత స్థితిలోని చేరుకుంటాము అని కూడా అగస్టిన్ బోధించాడు. అయితే మధ్య స్థితి పరిస్థితి ఏమిటి? పాపము చేయు సామర్థ్యమును మనము ఎప్పుడు కోల్పోతాము? మనము మధ్య స్థితిలోనికి ప్రవేశించిన వెంటనే పాపము చేయు సామర్థ్యమును మనము కోల్పోతాము అని లేఖనము సూచిస్తుంది. హెబ్రీ 12:23 దీనిని గూర్చి ఈ విధంగా మాట్లాడుతుంది:
సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ[లు] (హెబ్రీ. 12:23).
మధ్య స్థితిలో పునరుజ్జీవనము పొందిన ప్రాణములు పూర్ణసిద్ధిని పొందుతాయి ఎందుకంటే వారు ఇక పాపపు భ్రష్టతను కలిగియుండరు, మరియు వారు వెంటనే దేవుని సన్నిధిలోనికి చేర్చబడతారు. వెస్ట్‌మినిస్టర్ షార్టర్ కేటకిజం 37వ ప్రశ్నకు జవాబు తెలియజేయుచున్నట్లు:
విశ్వాసుల జీవాత్మలు వాటి మరణంలో పరిశుద్ధతతో పరిపూర్ణము చేయబడును, మరియు వెంటనే మహిమలోనికి ప్రవేశించును.
ఈ అభిప్రాయమును సమర్థించుటకు, ఈ కేటకిజం 2 కొరింథీ. 5:1, 6 మరియు 8; ఫిలిప్పీ. 1:23; మరియు లూకా 23:43లను ఎత్తి చూపుతుంది. పునరుజ్జీవనము పొందినవారు మరణించిన వెంటనే, వారు పరలోకమునకు కొనిపోబడతారు అని ఈ వాక్యభాగములలో ప్రతి ఒక్కటి సూచిస్తుంది.
అయితే భౌతిక మరణము మనలను పాపము యొక్క భ్రష్టత్వము మరియు ప్రభావము నుండి స్వతంత్రులను చేయునదిగా ఎందుకు ఉంది? 1616 నుండి 1683 మధ్య కాలములో నివసించిన ఆంగ్ల వేదాంతవేత్తయైన జాన్ ఓవెన్, ఈ ప్రశ్నకు జవాబునిచ్చాడు. పాపము మన హృదయములలో నివసిస్తూ, మన ప్రాణములతో పోరాడుటకుగాను మన శరీరములను ఉపయోగించుకుంటుంది అని అతడు వాదించాడు. నేచర్, పవర్, డిసిట్ అండ్ ప్రివెలెన్స్ ఆఫ్ ఇన్డ్వెలింగ్ సిన్ ఇన్ బిలివర్స్ అను రచనలోని 6వ అధ్యాయములోఓవెన్ వ్రాసినట్లు:
[పాపపు వాంఛలు] ఆత్మకు విరోధముగా, తద్వారా కృపా నియమమునకు విరోధముగా పోరాడతాయి అని పేతురు చూపుచున్నాడు; అవి మన “అంగములు,” లేక మన మర్త్యమైన శరీరములలోని భ్రష్టత్వమును ఉపయోగించి పోరాడతాయని యాకోబు అంటాడు.
ఇక్కడ ఓవెన్ 1 పేతురు 2:11 మరియు యాకోబు 4:1ని సూచిస్తూ, మనలను పాపములోనికి నెట్టుటకు మన భౌతిక శరీరములను పాపము ఆయుధములుగా ఉపయోగించుకుంటుంది అని నిర్థారించాడు.
రోమా. 6:12లో ఇలా వ్రాస్తూ అపొస్తలుడైన పౌలు కూడా ఇదే విధంగా వాదించాడు:
కాబట్టి శరీర దురాశలకు లోబడునట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియ్యకుడి (రోమా. 6:12).
రోమా. 7:22-23లో అతడు ఇలా సెలవిచ్చాడు:
అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సు నందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలోనున్న పాపనియమమునకు నన్ను చెరపెట్టి లోబరచుకొనుచున్నది (రోమా. 7:22-23).
పునరుజ్జీవనము పొందినవారు మరణించినప్పుడు, అంతరంగమున నివసించు పాపము మనలను పాపములోనికి నెట్టుటకు మన శరీరములను ఉపయోగించుకోలేదు. ఆఫ్ ది మోర్టిఫికేషన్ ఆఫ్ సిన్ ఇన్ బిలివర్స్, 2వ అధ్యాయములో ఓవెన్ వ్రాసినట్లు:
ఈ లోకములో మనము జీవించినంత కాలము మనలో నివసించు పాపము ఉనికిలోనే ఉంటుంది... మనము “మృత శరీరమును” కలిగియున్నాము ... మరియు మన శరీరముల యొక్క మరణము ద్వారానే మనము దాని నుండి విమోచన పొందుతాము.
భూమి మీద నిత్యము నివసించుటకు దేవుడు మనలను సృజించాడు. అనగా క్రీస్తును నమ్మువారికి మరణము ఒక తాత్కాలిక నష్టము మాత్రమే. అవును, అది చాలా విషాదకరమైనది, మరియు మనకు బహు దుఃఖమును కలిగిస్తుంది. అయితే నిరీక్షణలేని వారివలె మనము దుఃఖించము. క్లుప్తముగా, మధ్య స్థితి మనలను ప్రస్తుత శ్రమ మరియు పాపము నుండి విడిపిస్తుంది, మరియు పునరుత్థానము వరకు పరలోకమందు క్రీస్తుతో నివసించుటకు మనకు అనుమతి ఇస్తుంది అనునది మన నిరీక్షణ అయ్యున్నది. కాబట్టి, దేవుడు మన శ్రమను ముగించి పరలోకమందు వర్ణింప శక్యము కాని ఆశీర్వాదములను కురిపిస్తాడు అని నమ్మి భయము లేకుండా మనము మరణమును ఎదుర్కొనవచ్చు.
“సజీవులు మరియు మృతులు” అను మన పాఠంలో ఇప్పటి వరకు మానవాళి యొక్క వర్తమాన స్థితిని, మరియు మన మరణముతో ఆరంభమైయ్యే మధ్య స్థితిని మనము చూశాము. కాబట్టి, ఇప్పుడు మన మూడవ ప్రధానమైన స్థితిని చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము: అంత్య కాలము యొక్క నెరవేర్పు జరిగినప్పుడు మానవాళి యొక్క అంతిమ స్థితి.
మునుపటి పాఠంలో, మనము అంత్య కాలము లేక చివరి దినములను మూడు దశలుగా విభాగించాము. ఆరంభ కాలము మొదటి శతాబ్దములో అపొస్తలులు మరియు ప్రవక్తలు చేసిన ప్రాధమిక కార్యములతో పాటుగా యేసు జీవితము మరియు భూలోక పరిచర్య కాలము అయ్యున్నది. ఆరంభ కాలములో, దేవుని నమ్మదగిన ప్రజల కొరకు ఆయన ఆశీర్వాదములను కొనితెచ్చు రాబోవు యుగము పాపము, శ్రమ మరియ మరణముతో నిండిన ఈ యుగముతో కలిసింది.
రెండవ దశ ఆరంభ దశ తరువాత వెంటనే ప్రారంభమైన కొనసాగింపు అయ్యున్నది. మనము ఇప్పుడు ఈ కాలములో జీవిస్తున్నాము, కాబట్టి ఇది వ్యక్తిగత యుగాంతశాస్త్రములో వర్తమాన స్థితి మరియు మధ్య స్థితి కాలములను కలిగియున్నది. ఈ దశలో, ఈ యుగము మరియు రాబోవు యుగముతో కలిసి జీవించుట వలన కలుగు ఉద్రిక్తతను మనము అనుభవిస్తాము.
మరియు మూడవ దశ నెరవేర్పు, ఇది ఈ యుగమును పూర్తిగా ముగించి, దానిని రాబోవు యుగముతో భర్తీ చేస్తుంది. వ్యక్తిగత యుగాంతశాస్త్రము విషయములో, నెరవేర్పు మానవులందరు ఏకకాలములో అంతిమ స్థితికి చేరుకొను దశ అయ్యున్నది.
అంతిమ స్థితిని గూర్చిన మన సంభాషణను మూడు భాగములుగా విభాగించుదాము. మొదటిగా, మృతుల భౌతిక పునరుత్థానమును మనము చూద్దాము. రెండవదిగా, పునరుజ్జీవనము పొందనివారి గతిని మనము చూద్దాము. మరియు మూడవదిగా, పునరుజ్జీవనము పొందినవారి గమ్యమును మనము చూద్దాము. మృతుల భౌతిక పునరుత్థానమును ముందుగా చూద్దాము.
దేవుడు మానవాళిని సృజించినప్పుడు ఆయన మనకు శరీరములను మరియు ప్రాణములను ఇచ్చాడు. మధ్య స్థితిలో, మన శరీరములు మన ప్రాణముల నుండి తాత్కాలికముగా విడిపోయాయి. అయితే అంతిమ స్థితి ఆరంభమైనప్పుడు, ఇప్పటి మరణించిన ప్రతివారి శరీరములు తిరిగిలేస్తాయి, తద్వారా మనము పూర్ణమైన వ్యక్తులుగా దేవుని అంతిమ తీర్పును ఎదుర్కోవచ్చు. దీనిని “సాధారణ పునరుత్థానము” అని పిలుస్తారు, ఎందుకంటే దీనిలో పునరుజ్జీవనము పొందినవారు లేక పునరుజ్జీవనము పొందనివారు అందరు కూడా తిరిగిలేస్తారు.
సాధారణ పునరుత్థానమును గూర్చి పాత మరియు క్రొత్త నిబంధన రెంటిలో స్పష్టముగా బోధించబడింది. మరియు ఇది ప్రతి క్రైస్తవుడు ఒప్పుకొనవలసిన ఒక మౌలిక సిద్ధాంతమైయున్నదని హెబ్రీ. 6:1, 2 తెలియజేస్తుంది.
మృతుల యొక్క సాధారణ పునరుత్థానము ప్రాముఖ్యమైనదిగా ఉన్నది, ఎందుకంటే అపొ. 17లో పౌలు సెలవిచ్చుచున్నట్లు, లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఒక దినమును నిర్థారించాడు, మరియు క్రీస్తును మృతులలో నుండి లేపుట ద్వారా ఆయన మనకు ఒక రుజువును ఇచ్చాడు. ఆ తీర్పు సంపూర్ణమైన ప్రజలకు ఇవ్వబడుతుంది, మరియు సాధారణ పునరుత్థానము మనము సంపూర్ణ ప్రజలము అను సత్యమును ఉద్ఘాటించుట కొరకైయున్నది, మరియు దేవుని ఎదుట మనము సంపూర్ణ ప్రజలుగా నిలబడతాము. మరియు మనము జీవించిన, పాపము చేసిన, నమ్మిన శరీరములలో మనకు తీర్పు తీర్చబడుతుంది అను సత్యము మాత్రమే ఇది ఉద్ఘాటించదుగాని, మనము సంపూర్ణ ప్రజలుగా నిత్యత్వమును గడుపుతాము అని కూడా ఉద్ఘాటిస్తుంది. మనము యుగాంతశాస్త్రము వీక్షించు దృష్టిలో మాత్రమే ఇది ప్రాముఖ్యమైనది కాదుగాని, మనము ఒకరినొకరము చూచు విధానములో మరియు ప్రతి మానవుని యొక్క అంతరంగ మర్యాద మరియు విలువ దృష్టిలో కూడా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది, ఎందుకంటే మనము దేవుని స్వరూపమందు చేయబడితిమి.
— డా. వొడ్డి బౌచమ్, జూ.
ఒకసారి మరణించి మట్టిలో కలసిన భౌతిక శరీరములు మట్టిలో నుండి మరలా తిరిగిలేస్తాయని పాత నిబంధనలో ప్రవక్తలు బోధించారు. మరియు దైవిక తీర్పును పొందుకొనుటకు వారు మరలా లేస్తారు. దానియేలు 12:2లో ఇలా వ్రాయబడియున్నది:
మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు: కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు (దాని. 12:2).
మరియు యెషయా 26:19-20 ఇలా ప్రవచిస్తుంది:
మృతులైన నీవారు బ్రదుకుదురు నావారి శవములు సజీవములగును. మంటిలో పడియున్నవారలారా, మేల్కొని ఉత్సహించుడి... భూమి తనలోని ప్రేతలను సజీవులనుగా చేయును.... ఇదిగో వారి దోషమునుబట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములోనుండి వెడలి వచ్చుచున్నాడు (యెషయా 26:19-20).
కీర్తనలు 49:7-15, కీర్తనలు 73:24-28, మరియు యోబు 19:25-27 వంటి పాత నిబంధన వాక్యభాగములు కూడా తీర్పు పునరుత్థానమును సూచిస్తాయి.
క్రొత్త నిబంధనలో, యేసు సాధారణ పునరుత్థానమును గూర్చి పలుమార్లు ప్రస్తావించాడు. ఉదాహరణకు, మత్తయి 22:31, 32 మరియు లూకా 20:35-38లో, ఆయన దేవుని “అబ్రాహాము ... ఇస్సాకు మరియు ... యాకోబు దేవుడు” అని పిలుస్తూ, “ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు” అని సెలవిచ్చాడు. యోహాను 5:28-29లో యేసు యేమని సెలవిస్తున్నాడో వినండి:
ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు [మనుష్య కుమారుని] శబ్దము విని మేలు చేసినవారు జీవపునరుత్థానమునకును, కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటకి వచ్చెదరు (యోహాను 5:28-29).
పాత నిబంధన వలెనే, దేవుని తీర్పును ఎదుర్కొనుటకుగాను మృతులందరు సాధారణ పునరుత్థానములో తిరిగిలేస్తారని యేసు సెలవిచ్చాడు. యోహాను 11:24లో మార్త, మరియు అపొ. 4:2లో అపొస్తలులతో సహా ఇతర నమ్మకమైన క్రొత్త నిబంధన పాత్రలు కూడా ఇదే విషయమును నమ్మారు. అపొ. 17:32, 23:6, మరియు 24:21, మరియు తన సొంత రచన అయిన 1 కొరింథీ. 15:12-42లో సాధారణ పునరుత్థానమును గూర్చి అపొస్తలుడైన పౌలు కూడా వాదించాడు.
దేవుని తీర్పు సింహాసనము ఎదుట సాధారణ పునరుత్థానము జరుగుతుంది అని, లేక కనీసం తిరిగిలేచిన తరువాత మానవులందరు అక్కడికే తోడ్కొని రాబడతారని క్రొత్త నిబంధన బోధిస్తుంది. ప్రకటన 20:11-13లో వ్రాయబడిన యోహాను యొక్క దర్శనమును వినండి:
మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని... సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను (ప్రకటన 20:11-13).
తీర్పు దినము వచ్చినప్పుడు సజీవులుగా ఉన్నవారికి ఏమి జరుగుతుంది అను విషయమును సాధారణ పునరుత్థానములో చివరిగా మనము చర్చించాలి. పునరుత్థానమును పొందినవారి వలెనే, సజీవులుగా ఉన్నవారికి కూడా తీర్పు తీర్చబడుతుంది. పునరుజ్జీవనము పొందినవారిని ప్రస్తావిస్తూ 1 కొరింథీ. 15:51, 52 ఈ సత్యమును ప్రస్తావిస్తుంది. అయితే ఇది అన్నిచోట్ల ఉన్న ప్రజలందరికీ ఒకే విధంగా అనువర్తించబడుతుంది. 2 కొరింథీ. 5:9-10లో పౌలు వ్రాసినట్లు:
కావున దేహమందున్నను దేహమును విడిచినను, [ప్రభువున] కిష్టులమై యుండవలెనని మిగుల అపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డైవెనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును (2 కొరింథీ. 5:9-10).
నెరవేర్పు సమయమందు, మృతులు తిరిగిలేస్తారు, మరియు దేవుని తీర్పు సింహాసనము ఎదుట సజీవులుగా ఉన్నవారితో కలుసుకుంటారు. మరియు మన క్రియలను బట్టి ఆయన మనందరికీ తీర్పు తీర్చుతాడు. ఆయనకు అపనమ్మకస్తులుగా ఉన్నవారు తాము చేసిన పాపములను బట్టి ఖండించబడి నిత్య శిక్షను పొందుకుంటారు. అయితే నమ్మకముగా ఉన్నవారు — అనగా పరిశుద్ధాత్మ ద్వారా పునరుజ్జీవపరచబడి క్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడినవారు — నిత్య ప్రతిఫలమును అనుభవిస్తారు.
మృతుల భౌతిక పునరుత్థానముతో అంతిమ స్థాయి ఆరంభమవుతుంది అని ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి, ఇప్పుడు పునరుజ్జీవనము పొందనివారి గతిని గూర్చి చూద్దాము.
మనము ఇంతకు ముందు చూసినట్లు, పతనమైన మానవులందరు ఆదాము పాపమును బట్టి శిక్షకు పాత్రులైయున్నారు. అంతేగాక, మనమంతా మన సొంత పాపములకు అపరాధులముగా కూడా ఉన్నాము. ఫలితంగా, మనందరినీ శిక్షించుటకు దేవుడు అర్హుడైయున్నాడు. అయితే ఆయన గొప్ప కనికరము వలన, ఆయన కొందరిని రక్షిస్తాడు. విచారకరముగా, కాని న్యాయముగా, రక్షింపబడనివారు తమ పాపములకు తగిన శిక్షను అనుభవిస్తారు. మత్తయి 16:27లో యేసు స్వయంగా చెప్పినట్టుగా:
మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతోకూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును (మత్తయి 16:27).
ఇక్కడ “ఫలమిచ్చును” అని అనువదించబడిన గ్రీకు పదము, “అపొడిడొమి” ((ἀποδίδωμι). కొన్ని అనువాదములు ఈ పదమును “తిరిగి చెల్లించును” అని అనువదిస్తాయి. అయితే ఇక్కడ “పతిఫలము” అను పదము “[ప్రతి మనుష్యుని] క్రియలచొప్పున” కలుగు శిక్షలు మరియు ఆశీర్వాదములు రెంటిని సూచిస్తుంది అని యేసు స్పష్టముగా తెలిపాడు. మార్కు 9:43-47, యోహాను 5:29, 2 కొరింథీ. 5:10, మరియు 2 పేతురు 2:4-9తో సహా అనేక ఇతర లేఖన భాగములు ఇదే ఆలోచనను స్పష్టముగా తెలియజేస్తాయి.
ఇంతకుముందు, నరకము కొరకు లేఖనములు ఉపయోగించు అనేక పదములను మనము ప్రస్తావించాము. నరకమును గూర్చి క్రొత్త నిబంధన వర్ణన రెండు విభాగములలో ఒక విభాగమునకు చెందినదిగా ఉన్నది, మరియు నరకమును చీకటి ఉండు స్థలముగా, లేక అగ్ని ఉండు స్థలముగా సంబోధిస్తుంది.
చీకటిని సూచించునప్పుడు, లేఖనము నరకమును “టో స్కోటోస్ టో ఎక్సోటెరోన్” అని పిలుస్తుంది, అనగా “బయట చీకటి” లేక “చీకటి” అని అర్థము. మత్తయి. 8:12, 22:13 మరియు 25:30 వంటి చోట్ల మనము దీనిని చూస్తాము. ఇది “హో జోఫోస్ టు స్కోటుస్” అని కూడా సంబోధించబడుతుంది, అనగా యూదా 13వ వచనం ప్రకారం “కటిక చీకటి” అని అర్థము.
ఈ చీకటి ప్రాముఖ్యమైనది, ఎందుకంటే దేవుడు తన మహిమకరమైన కృపగల సన్నిధిని నరకములో వ్యక్తపరచడు అని ఇది సూచిస్తుంది. నూతన యెరూషలేములో, దేవుని మహిమ వెలుగు పట్టణమంతటిని నింపుతుంది అని ప్రకటన 21:23, 24 బోధిస్తాయి. అయితే నరకములో ఉన్న దుష్టులు ఈ వెలుగు నుండి త్రోసివేయబడతారు. వారు దేవుని దయ, అనుగ్రహము, మరియు కనికరము యొక్క మహిమల నుండి నిత్యత్వము వరకు వేరుచేయబడతారు. 2 థెస్స. 1:9లో పౌలు వ్రాసినట్లు:
అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు (2 థెస్స. 1:9).
దేవుడు నరకములో లేడు అని దీని అర్థము కాదు. ఎందుకంటే, ఆయన సర్వవ్యాపి అయ్యున్నాడు, అనగా ఆయన అన్ని వేళల అన్ని చోట్ల ఉన్నాడు. అయితే నరకములో, ఆయన ఒక చెరసాల నాయకునిగాను, శిక్షించువానిగాను ఉన్నాడుగాని, కృపగల మహిమామయుడైన రక్షకునిగా లేడు.
అపొస్తలుడైన పౌలు 2 థెస్స. 1వ అధ్యాయములో నరకములో ఉండుటను ప్రభువు సన్నిధి నుండి దూరముగా ఉండుటతో పోల్చుతాడు కాబట్టి దేవుడు నరకములో లేడని చాలామంది చెప్పుట మీరు వింటారు. అయినను, దేవుడు అన్ని స్థలములయందు ఉన్నాడు కాబట్టి నరకములో కూడా ఉన్నాడు. ఆయన అక్కడ తన ఉగ్రతను చూపుతాడు. వారు నరకమునకు వెళితే, ఓహ్, అక్కడ ఎంత బాగుంటుందో, అది కేవలం బజారులో ఉన్న ఒక బారు వలె ఉంటుంది, మరియు వారు అక్కడ నచ్చింది చేయవచ్చు అని ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవానికి, అది దేవుని యొక్క క్రియాశీల ఉగ్రత అయ్యున్నది. ఆయన అక్కడ కృపతోను, అనుగ్రహముతోను ఉండడు. గొప్ప అహరోను ఆశీర్వాదమును గూర్చి ఆలోచన చెయ్యండి: “యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక.” నరకములో ఇది ఏమి ఉండదు. అక్కడ దేవుడు తన ముఖమును త్రిప్పుకుంటాడు; దేవుని శాపము, దేవుని నుండి వారు పొందిన ఎడబాటు, మరియు దేవుని ఉగ్రతను గూర్చి వారు అవగాహన కలిగియుంటారు. సిలువ మీద మన ప్రభువైన యేసును గూర్చి ఆలోచించండి. దీనిని గూర్చి మనము చూడగలిగిన మంచి సందర్భము ఇది. “నన్నేల చేయి విడచితివి?” సిలువ మీద దేవుడు తన ఉగ్రతను తన కుమారుని మీద చూపాడు. కాబట్టి, నరకములో దేవుడు ఉండడు అని ప్రజలు చెప్పునప్పుడు ఈ గుణనిర్దేశములు అవరసమైయున్నవి. దేవుని అనుగ్రహము, దేవుని మంచితనము, దేవుని ప్రేమ, ఇవన్నీ అక్కడ అసలు ఉండవు. పౌలు దీనిని గురించే మాట్లాడుతున్నాడు... అయితే దేవుని ఉగ్రత, దేవుని భీకర రూపము, వారు తృణీకరించిన దేవుని సౌందర్యము మరియు పరిశుద్ధతను గూర్చిన అవగాహన, మరియు వాటి యొద్దకు వారికి ప్రవేశము లేకపోవుట, ఇవన్నీ నరకములో ఉంటాయి. అది నిత్యము వరకు దేవుని యొక్క శాపము మరియు ఉగ్రత అయ్యున్నది.
— డా. రిచర్డ్ ఫిలిప్స్
నరకమును చీకటిగల స్థలమని వర్ణించుటతో పాటుగా, నరకము అగ్ని ఉండు స్థలమని కూడా లేఖనము చెబుతుంది. యూదా 7లో “నిత్యాగ్ని”; ప్రకటన 20:14, 15లో “అగ్నిగుండము”; మరియు మత్తయి 13:50లో “అగ్నిగుండము” అని అది పిలువబడింది. మరియు మనము ఇంతకు ముందు చూసినట్లు, అది గీన్న లేక గెహన్నా — అగ్నితో కూడిన శిక్ష, హింస మరియు నాశనము ఉన్న స్థలము — అని కూడా సంబోధించబడింది. గెహెన్నా అను పేరు మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులు అబద్ధ దేవతలకు బలిగా తమ పిల్లలను కాల్చిన హిన్నోము లోయను సూచిస్తుంది. ఆహాజు రాజు తన పిల్లలను అక్కడ బలి ఇచ్చాడు అని 2 దిన. 28:3 నివేదిస్తుంది. మనష్షే రాజు కూడా ఇలానే చేశాడు అని 2 దిన. 33:6 నివేదిస్తుంది. స్పష్టముగా ఈ భూలోకపు లోయ నిజమైన నరకమునకు రూపకముగా ఉన్నది. అయినను, దుష్టులు అక్కడ అనుభవించు శ్రమలను గూర్చి అది తెలియజేస్తుంది.
అయితే నరకమును గూర్చి మనము చెప్పగల అత్యంత భయంకరమైన విషయము ఏమనగా, దానికి అంతము లేదు. 2 థెస్స. 1:9లో పౌలు వ్రాస్తున్నట్లు, దుష్టులు “నిత్యనాశనమను దండన పొందుదురు.” మత్తయి 25:41లో నరకమును “నిత్యాగ్ని” అని సంబోధిస్తూ, మత్తయి 25:46లో “నిత్య శిక్ష”ను గూర్చి మాట్లాడుతూ యేసు ఇదే విషయమును తెలియజేశాడు. అదే విధముగా, హెబ్రీ 6:2 నరకమును “నిత్య తీర్పు” అని పిలుస్తుంది.
అగ్నిగుండములో నిత్య శిక్షను గూర్చిన ఆలోచన ప్రతి ఒక్కరిని భయపెట్టాలి. క్రీస్తులో కరుణను అనుగ్రహించమని వేడుకొనుటకు దేవుని యొద్దకు పరుగిడునట్లు ఇది మనలను పురికొల్పాలి. రక్షింపబడని మన కుటుంబము మరియు స్నేహితులు అట్టి ఘోర శిక్షను అనుభవిస్తూ నిత్యత్వమును గడుపుతారు అని మనము ఆలోచన చేసినప్పుడు, ప్రేమించు దేవుడు అట్టి ఘోరమైన శిక్షను తాను సృజించిన ప్రజలకు ఎలా ఇవ్వగలడు అని మనము ఆశ్చర్యపోతాము. వారు చేసిన పాపములకు నిజముగా అంత ఘోరమైన శిక్ష అవసరమా?
కాపరిగా మనము జవాబు ఇవ్వవలసిన అత్యంత కఠినమైన ప్రశ్నలలో ఒకటి ఏమనగా, ప్రేమించు దేవుడు ఎవరినైనా, ఆయన శత్రువులను కూడా, నిత్య శిక్షను పొందుటకు నరకమునకు ఎలా పంపగలడు? మరియు దేవుని పరిశుద్ధతను అర్థము చేసుకొనుటలోనే దీనికి జవాబు దాగియున్నది. దేవుడు ఎంత పరిశుద్ధుడో చాలామంది అర్థము చేసుకోలేరు అని, అలాగే మనము ఎంత పాపాత్ములమో కూడా అర్థము చేసుకోలేరని నా ఆలోచన. దేవుని పరిశుద్ధతను గూర్చి మనకు చాలా పరిమితమైన అవగాహన ఉంది, కాబట్టి అపరిమితముగా పరిశుద్ధుడైన దేవునికి విరోధముగా మనము పాపము చేసినప్పుడు లేక ఆయన హృదయమును గాయపరచినప్పుడు మనము అపరిమితమైన శిక్షకు పాత్రులమవుతాము అని మనము అర్థము చేసుకోలేము. దీనిని గూర్చి ఒకసారి సరిగా ఆలోచన చేస్తే చాలా వరకు అవగాహన వస్తుంది, కాని దేవుడు అంత అమోఘముగా పరిశుద్ధుడైయున్నాడు, మరియు మనము అదే విధముగా పాపులమైయున్నాము కాబట్టి ఆయన పరిశుద్ధత కారణంగా మానవాళి మీద ఆయన ఉగ్రతను పోయుట సమంజసమే అని నా ఆలోచన... ఆయన పరిశుద్ధత మరియు మన పాపమునకు మధ్య ఖాళీ అంత పెద్దది కాకపోతే, దూరము అంత విశాలముగా లేకపోతే, దేవుడు కేవలం “హేయ్, నీ పాపములను నేను క్షమిస్తున్నాను. ఇప్పుడు నీ పని నీవు చేసుకో” అని చెప్పియుండేవాడు మరియు ఎవ్వరు నరకమునకు వెళ్లేవారు కాదు. అయితే, యేసు సిలువ ఉన్నది. సిలువలో ఆయన తన ఉగ్రతను యేసు మీద దారపోశాడు. ఒకవేళ నరకము లేనట్లయితే, దేవుని పరిశుద్ధత మరియు మన అవినీతికి మధ్య అంత దూరము లేకపోతే ఇది చాలా కఠినమైన శిక్ష అవుతుంది కదా. కాబట్టి, సువార్త ఏమనగా, సిలువ మీద యేసు అర్పించిన బలి ద్వారా ఎవరైనా దేవుని ఉగ్రతను తప్పించుకోవచ్చు. కాబట్టి, ప్రేమించు దేవుడు ప్రజలను నరకమునకు ఎందుకు పంపుతాడు అనునది ప్రశ్న కాదుగాని, ప్రేమించు దేవుడు మనలో ఎవరినైనా పరలోకములోనికి ఎందుకు అనుమతిస్తాడు? అనునది సరియైన ప్రశ్న. మరియు ఆయన యేసు ద్వారా దీనిని చేశాడు. మరియు ఆయన ఎంత పరిశుద్ధుడో మరియు మనము ఎంత పాపులమో అర్థము చేసుకున్నప్పుడే మనము ఈ విషయమును పూర్తిగా అర్థము చేసుకోగలుగుతాము.
— డా. మ్యాట్ కార్టర్
ఇది ఎంత కఠినముగా అనిపించినప్పటికీ, దుష్టులు నరకములో శిక్షకు అర్హులైయున్నారు. వారిని మనము ప్రేమిస్తాము కాబట్టి మనము విలపించినప్పటికీ, దానిని మనము అన్యాయముగా లేక అనర్హమైన తీర్పుగా పరిగణించకూడదు.
భౌతిక పునరుత్థానము మరియు పునరుజ్జీవనము పొందనివారి శిక్ష దృష్ట్యా అంతిమ స్థితిని చూశాము కాబట్టి, ఇప్పుడు పునరుజ్జీవనము పొందినవారు పొందు అంతిమ ఆశీర్వాదముల మీద దృష్టిపెడదాము.
పునరుజ్జీవనము పొందినవారి అంతిమ స్థితి అద్భుతముగా ఉంటుంది. మరణము మనలను బంధకములలో ఉంచలేదు. మన శరీరములు మరణము నుండి తిరిగిలేచినప్పుడు, మన ప్రభువు అంతిమ తీర్పులను ఇస్తాడు. మరియు మన విషయములో, ఆ తీర్పులు కేవలం ఆశీర్వాదములను మాత్రమే కలిగిస్తాయి. క్రీస్తుయందు, మనము పరిపూర్ణులమైయున్నాము. మరియు దేవుని తీర్పులు దీనిని ప్రతిబింబిస్తాయి. అది ఎలా ఉంటుందో మనకు ఖచ్చితముగా తెలియదు. అయితే మన అంతిమ స్థితి మనము కనిన అతి గొప్ప కలల కంటే అద్భుతముగా ఉంటుందని లేఖనము మనకిచ్చిన వివరములు మనకు నిర్థారణను కలుగజేస్తాయి.
పునరుజ్జీవనము పొందినవారు అనుభవించు అంతిమ స్థితిలోని మూడు కోణములను మనము చూద్దాము, మరియు మనము పూర్ణమైన శరీరములను కలిగియుంటాము అను వాస్తవముతో ఆరంభిద్దాము.
అంతిమ తీర్పు కొరకు మన శరీరములు పునరుత్థానము పొందుతాయని ఇంతకు ముందే మనము చూశాము. అయితే అప్పుడు మన శరీరములు ఏ విధంగా ఉంటాయో చూచుట మనకు ప్రోత్సాహమును కలిగిస్తుంది. మధ్య స్థితిలో, పునరుజ్జీవనము పొందిన మన ప్రాణములు పరిశుద్ధతలో పరిపూర్ణము చేయబడతాయి, కాని మన శరీరములు సమాధిలో కుళ్ళిపోతాయి. కాబట్టి, ఈ భావనలో, మధ్య స్థితిలో మన రక్షణ సంపూర్ణమైనదిగా లేదు. అయితే అంతిమ స్థితిలో అది సంపూర్ణమైయున్నది, ఎందుకంటే ఈ సమయములోనే మన శరీరములు విమోచించబడతాయని రోమా. 8:23లో పౌలు సెలవిచ్చాడు. మన ప్రాణములు వర్తమాన స్థితిలో పునరుజ్జీవనమును పొందాయి మరియు మధ్య స్థితిలో దుష్టత్వము లేకుండా ఉంటాయి. అయితే వాటి యొక్క పునరుద్ధరణ మరియు పూర్ణత కొరకు మన శరీరములు అంతిమ స్థితి వరకు వేచియుండాలి. వేదాంతవేత్తలు చాలాసార్లు దీనిని మనము “మహిమపరచబడుట” అని పిలుస్తారు, ఎందుకంటే ఆది నుండి దేవుడు ఉద్దేశించిన విధముగా ఆయన మహిమను మనము చివరికి ప్రతిబింబించగలుగుతాము.
అయితే మహిమపరచబడిన మన శరీరములు ఖచ్చితముగా ఎలా ఉంటాయి? 1 కొరింథీ 15:52-54లో, పౌలు వాటిని “అక్షమైన” మరియు “అమర్త్యమైన” అని వర్ణించాడు, అనగా మనకు ఇక రోగము లేక బలహీనత లేక మరణము ఉండవు. ఫిలిప్పీ. 3:21లో పౌలు ఏమి వ్రాశాడో వినండి:
యేసుక్రీస్తు ... మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును (ఫిలిప్పీ. 3:21).
ఇది ఎంత అమోఘముగా అనిపించినను, యేసు యొక్క పునరుత్థాన శరీరము భౌతికముగాను, ధృడముగాను ఉండినది అని క్రొత్త నిబంధన నివేదిస్తుంది. ఉదాహరణకు, లూకా 24:30-43లో ఆయన తినగలిగాడు. యోహాను 20:27లో మనము చూచునట్లు తోమా గాయపడిన యేసు ప్రక్కను తాకగలిగాడు.
అయితే యేసు యొక్క పునరుత్థాన శరీరము, ఆయన మరణించినప్పుడు ఉన్న శరీరము కంటే భిన్నముగా ఉన్నది. లూకా 24:36లో ఆయన తన అపొస్తలులకు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యాడు, మరియు లూకా 24:31లో వారి సముఖుము నుండి హఠాత్తుగా మాయమైపోయాడు. అలాగే, యోహాను 20:19, 26లో లోనికి ప్రవేశింపకుండానే ఆయన గదులలో కనిపించాడు. 1 కొరింథీ. 15:42-44లో ఇలా వ్రాస్తూ పౌలు ఈ భిన్నత్వములకు జవాబు ఇవ్వగలిగాడు:
శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును; ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది (1 కొరింథీ 15:42-44).
పౌలు మన శరీరములను మనము నాటిన తరువాత మొక్కలుగా ఎదుగు విత్తనములతో పోల్చాడు. మన ప్రాకృతిక శరీరము మరియు మన ఆత్మీయ శరీరమునకు మధ్య కొనసాగింపు ఉంది — ఒకటి మరొకటిగా మారుతుంది — అని అతడు చెప్పాడు. అయితే ఆత్మీయ శరీరము ప్రాకృతిక శరీరములోని భ్రష్టత్వమును కోల్పోయి, నిత్య జీవము కొరకు మహిమగల క్రొత్త లక్షణములను పొందుకుంది.
మన పునరుత్థాన మరియు మహిమపరచబడిన శరీరములను గూర్చి ఒక చాలా ప్రాముఖ్యమైన అపార్థమును నేను స్పష్టము చేయగోరుచున్నాను. ఇది 1 కొరింథీ. 15వ అధ్యాయము యొక్క గజిబిజి వ్యాఖ్యానము మీద ఆధారపడియున్నది. “ఆత్మీయ శరీరము” అను పౌలు మాటను చదివి, పునరుత్థానము పొందిన శరీరము ద్రవ్య రహితముగాను, అభౌతికముగాను ఉంటుంది అని ఊహించుకొను అనేకమంది విశ్వాసులను నేను చూశాను. అయితే పౌలు బోధించుచున్నది ఇది కాదు. క్రొత్త నిబంధన గ్రీకు భాషలో “ఆత్మీయ” అను మాటకు రెండు వేర్వేరు పదములు ఉన్నాయి; ఒకటి ఆత్మ ద్వారా “చేయబడుట” లేక “రూపొందించబడుట” అయ్యున్నది, మరొకటి ఆత్మకు “అనువర్తన” చేయబడుట అయ్యున్నది. మరియు ఇక్కడ పౌలు తరువాత పదమును ఉపయోగిస్తున్నాడు. మన పునరుత్థాన, మహిమపరచబడిన శరీరములు ఆత్మ ద్వారా చేయబడతాయని అతడు చెప్పుటలేదుగాని, అవి పరిపూర్ణముగా ఆత్మకు అనువర్తన చేయబడతాయని అతడు చెబుతున్నాడు. అంటే అర్థము ఏమిటి? సరే, ఇప్పుడు మన భౌతిక శరీరములు పతనము యొక్క పరిణామములను భ్రష్టత్వమును అనుభవిస్తున్నాయి, మరియు మనము ఆత్మీయముగా నూతనపరచబడినప్పటికీ మన శరీరములో పాపపు వాంఛలు ఇప్పటికీ ఉన్నాయి. నిషేధించబడిన ఆనందములను పొందుకొనుటకు అది ప్రయత్నిస్తుంది. మరియు మనము ఈ శరీరములో ఉన్నంత వరకు, పౌలు తరచుగా వర్ణించిన శరీరము మరియు ఆత్మ మధ్య ఆ సంఘర్షణను మనము ఎదుర్కొనుచూనే ఉంటాము... అయితే పునరుత్థానము మరియు మహిమపరచబడుటలో, మనము పొందుకొను శరీరములు పరిపూర్ణముగా ఆత్మ స్వాధీనములోనికి అనువర్తించబడతాయి. భౌతిక శరీరములో నుండి ప్రతి విధమైన భ్రష్టత్వము తొలగించబడుతుంది, కాబట్టి ఇప్పుడు మనము ఎదుర్కొనుచున్న ఈ యుద్ధము తుదకు ముగియబడుతుంది. నేను ఆ రోజు కొరకు ఎదురుచూచుచున్నాను.
— డా. ఛార్లెస్ ఎల్. క్వార్లెస్
పునరుజ్జీవనము పొందినవారి యొక్క అంతిమ స్థితిలో మనం ప్రస్తావించబోవు రెండవ విషయము ఏమనగా, మనము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో నివసిస్తాము.
మనము మరణించిన తరువాత మన ప్రాణములు పరలోకమునకు వెళ్తాయని నేర్చుకొని మనలో అనేకమంది సంతృప్తిని పొందుతారు. అయితే మనము చూసినట్లుగా, ఇది మన మధ్య స్థితి మాత్రమే. మన శరీరములు సమాధిలో ఉంచబడతాయి కాబట్టి పరలోకములో మనము పాక్షిక ఆశీర్వాదములను మాత్రమే పొందుకుంటాము. నూతన ఆకాశములు మరియు నూతన భూమిలో మనము శారీరికముగా నివసించినప్పుడు మనము సంపూర్ణమైన మరియు పరిపూర్ణమైన ఆశీర్వాదములను పొందుకుంటాము. ఆదాము హవ్వలు ప్రస్తుత సృష్టిని భ్రష్టము చేసిన నాటి నుండి ఇది ఎల్లప్పుడూ దేవుని ప్రజల యొక్క నిరీక్షణ అయ్యుండినది.
ఆది. 3:17-19లో, ఆదాము చేసిన పాపమును బట్టి దేవుడు భూమిని శపించాడు. అయితే అదే అధ్యాయములోని 15వ వచనములో, విమోచకుడు వచ్చినప్పుడు ఆయన పాపము యొక్క ప్రభావములను తిరిగిరాస్తాడని కూడా దేవుడు సూచించాడు. యెషయా 65:17 మరియు 66:22లో ప్రవక్తయైన యెషయా దేవుని భూలోక రాజ్యము యొక్క నెరవేర్పును “క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి” అని సంబోధిస్తూ స్పష్టముగా ఈ నిరీక్షణను చూపాడు. 2 పేతురు 3:13లో అపొస్తలుడైన పేతురు ఈ నిరీక్షణను నిర్థారించాడు. అలాగే ప్రకటన గ్రంథములో నమోదు చేయబడిన తన అంత్యకాల దర్శనములో దీనిని యోహాను ముందుగానే చూశాడు. ప్రకటన 21:1లో, యోహాను ఇలా నివేదించాడు:
అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. సముద్రమును ఇకను లేదు (ప్రకటన 21:1).
క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిని గూర్చి యోహాను యొక్క వర్ణన 22:5లో కూడా కొనసాగుతుంది.
క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో, భూమి మీద దేవుని శాపము పూర్తిగా తీసివేయబడుతుంది. నేల మనకు ఇక సమస్యలను కలిగించదు, మరియు మనము సులువుగా దేవుని పరిపూర్ణమైన రాజ్యమును ఆస్వాదిస్తాము మరియు కాస్తాము. దీనికంటే ముఖ్యముగా, దృశ్యమైన రీతిలో దేవుడు మనతో కూడా ఉంటాడు. ఆయన మహిమ నూతన యెరూషలేమును వెలిగిస్తుంది అని ప్రకటన 21:22, 23 బోధిస్తాయి. ఆ పరిశుద్ధ పట్టణములో దేవుడు స్వయంగా తన సింహాసనము నుండి పాలిస్తాడు అని ప్రకటన 21:3-24 నిశ్చయపరుస్తుంది.
అంతిమ స్థితిలో మన పునరుజ్జీవన పొందిన జీవనములను గూర్చి మనము ప్రస్తావించు మూడవ వివరము ఏమనగా, మనము నిత్య ప్రతిఫలములను పొందుతాము.
క్రీస్తు వారి పక్షమున చేసిన కార్యములను బట్టి, వారి నమ్మకత్వము, మరియు దేవునికి విధేయులై వారు చేసిన మేలులను బట్టి పునరుజ్జీవనము పొందినవారు ప్రతిఫలము పొందుతారు. ఉదాహరణకు, 2 తిమోతి 4:8లో పౌలు “జీవ కిరీటము”ను గూర్చి మాట్లాడతాడు. మరియు 1 పేతురు 5:4లో పేతురు “మహిమ కిరీటము”ను గూర్చి మాట్లాడతాడు. 2 తిమోతి 2:12లో, మనము క్రీస్తుతో పాలిస్తాము అని కూడా పౌలు చెప్పాడు. మనము దేవుని అంతిమ “విశ్రాంతి”లోనికి ప్రవేశిస్తాము అని హెబ్రీ. 4:1-11 చెబుతుంది. మత్తయి 6:20, మార్కు 10:21, మరియు లూకా 12:33తో సహా అనేక ఇతర చోట్ల యేసు పరలోకములో మన ధనమును కూడబెట్టుకొనుటను గూర్చి మాట్లాడాడు.
ఈ ప్రతిఫలములు మరియు నిధులు ఏమైయుంటాయో మనకు నిజముగా తెలియదు. అయితే మన ప్రేమించు దేవుని యొక్క కృపా స్వభావము మనకు తెలుసు కాబట్టి, ఆయన మన కొరకు ఏమి సిద్ధపరచినను అది నిత్యము ఆయనను మనము బహుగా ఆనందించుటకు నడిపిస్తుంది అను నమ్మకమును మనము కలిగియుండవచ్చు.
ఈ పాఠంలో, వ్యక్తిగత యుగాంతశాస్త్రములో “సజీవులు మరియు మృతులు” యొక్క అనేక స్థాయిలను మనము చూశాము. పునరుజ్జీవనము పొందనివారు మరియు పునరుజ్జీవనము పొందినవారి యొక్క వర్తమాన స్థితిని మనము పరిగణించాము. భౌతిక మరణము యొక్క సార్వత్రికత, మరియు దానిలో పునరుజ్జీవనము పొందనివారు మరియు పునరుజ్జీవనము పొందినవారి యొక్క అనుభవాల దృష్ట్యా మధ్య స్థితిని మనము వర్ణించాము. భౌతిక పునరుత్థానముతో ఆరంభించి, పునరుజ్జీవనము పొందనివారు మరియు పునరుజ్జీవనము పొందినవారి యొక్క అంతిమ గమ్యములను గూర్చి చూస్తూ కొనసాగించి మనము మానవాళి యొక్క అంతిమ స్థితిని చూశాము.
వ్యక్తిగత యుగాంతశాస్త్రమును అధ్యయనం చేయుట ప్రాముఖ్యమైయున్నది ఎందుకంటే, పతనమైన ఈ లోకములో మన జీవితములకు నిత్య పరిణామాలు ఉన్నాయని అది మనకు జ్ఞాపకము చేస్తుంది. మనలో రక్షణ పొందినవారికి, మధ్య స్థితిలో, మరియు తరువాత వచ్చే అంతిమ స్థితిలో కూడా పరిమాణమునకు మించిన విధముగా దీవించబడతాము అను నిశ్చయత ఇవ్వబడినది. అయితే క్రీస్తును తిరస్కరించినవారికి తరువాత లోకములో నిరీక్షణ లేదు. మనకు కలుగు మంచి భవిష్యత్తును గూర్చి అతిశయపడుటకు బదులుగా, ఈ సత్యములు మనలను సువార్త ప్రకటించుటకు పురికొల్పాలి, తద్వారా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో వీలైనంత మంది మన నిత్య ఆనందములో మరియు సహవాసములో పాలుపంచుకుంటారు.
Continue reading the full transcript