అదే శ్రేణిలోని 3వ పాఠానికి తోడుగా ఉండే వీడియో. ఈ వీడియో క్రింది ప్రశ్నలను అడుగుతుంది: వ్యక్తిగతమైన, సాధారణమైన ఎస్కటాలజీల మధ్య దేవుని శాస్త్రజ్ఞులు ఎలా తేడాను గుర్తిస్తారు? యేసు తిరిగి వస్తాడా? యేసు తిరిగి రావడం ఎందుకు అవసరం? యేసు శారీరకంగా తిరిగి వస్తాడా లేక ఆధ్యాత్మికంగా మాత్రమేనా? రెండవ రాక ఎంత గుర్తించదగినది? యేసు రాక గురించి గ్రంథం మనకు ఏమి చెబుతుంది? క్రీస్తు రాకకు ముందు ఏ సంఘటనలు జరగాలి? క్రీస్తు రాకకు ముందు జరగాల్సిన సంఘటనలను అంచనా వేసే భాగాలను మనం ఎలా వ్యాఖ్యానించాలి? చివరి రోజుల్లో దెయ్యం, మానవుల వ్యతిరేకత దేవుని ప్రణాళికలకు ఆటంకం కలిగిస్తుందా? రప్చర్ గురించి మీ అభిప్రాయం ఏమిటి? క్రీస్తు రాకకు ముందు ఈ ప్రపంచం నుండి చర్చి తీసుకోబడుతుందా? క్రీస్తు రాకకు ముందు ఇజ్రాయెల్ కోసం భవిష్యత్ పునరుద్ధరణ గ్రంథం అంచనా వేస్తుందని మీరు ఎందుకు నమ్ముతారు? క్రీస్తు రాకకు ముందు ఇజ్రాయెల్ కోసం భవిష్యత్ పునరుద్ధరణ గ్రంథం అంచనా వేయదని మీరు ఎందుకు నమ్ముతారు? క్రైస్తవులు చరిత్ర అంతటా మిలెనియం గురించి ఏ అభిప్రాయాలను కలిగి ఉన్నారు? మీరు మిలెనియం యొక్క ప్రీమిలెనియల్ అభిప్రాయాన్ని ఎందుకు కలిగి ఉన్నారు? మీరు మిలెనియం యొక్క పోస్ట్‌మిలెనియల్ లేదా అమిలెనియల్ అభిప్రాయాన్ని ఎందుకు కలిగి ఉన్నారు? క్రీస్తు రాక, మిలెనియం గురించి క్రైస్తవులందరూ ఏకీభవించే ప్రధాన అంశాలు ఏమిటి?
From the transcript
1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.
బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.
ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.
అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.
మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.
ఒక దంపతులు తమ మొదటి బిడ్డకు జన్మనివ్వబోవుచున్నప్పుడు, వారు ఒక ఊహించిన ప్రక్రియను ఎదుర్కొంటారు. వారు బహుగా ఉత్సాహపడతారు. పుట్టబోవు బిడ్డ కొరకు అన్ని సిద్ధపరచుటను గూర్చి వారు చింతిస్తారు. పిల్లలుగల తమ స్నేహితులను వారు లెక్కలేనన్ని ప్రశ్నలు అడుగుతారు. వారు పుస్తకములను మరియు వ్యాసములను కూడా చదువుతారు. గర్భధారణను గూర్చి, ప్రసవ ప్రకియను గూర్చి, నూతన శిశువును సంరక్షించుటను గూర్చి వారు నేర్చుకోవాలనుకుంటారు. మరియు పిల్లలను కలిగియున్న మనకు వారు అలా ఎందుకు చేస్తారో తెలుసు. మొదటి బిడ్డను కలిగియుండుట మీ జీవితమును నాటకీయముగా, ఉత్సాహకరముగా, మరియు కొన్నిసార్లు కొంత భయమును కలిగించు విధముగా మార్చివేస్తుంది. మరియు మన ప్రభువైన యేసు యొక్క రాకను గూర్చి మనము ఎదురుచూచుచుండగా ఇలాంటిదే జరుగుతుంది. ఆయన రాక సమస్తమును మార్చివేయబోతుంది. కాబట్టి, ఏమి జరుగబోతుందో అర్థము చేసుకొని, ఆయన భూలోక రాజ్యము కొరకు మనలను సిద్ధపరచు విధానములలో జీవించుట లాభదాయకముగా ఉంటుంది. ఇందువలనే మనము యుగాంతశాస్త్రమును అధ్యయనం చేస్తాము.
నీ రాజ్యము వచ్చునుగాక: యుగాంతశాస్త్ర సిద్ధాంతము అను మన పాఠ్య క్రమములో ఇది మూడవ పాఠము. దీనికి “రాజు యొక్క రాకడ” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠంలో, క్రీస్తు రాకడను గూర్చి లేక “రెండవ రాకడ”ను గూర్చి మరియు యుగాంతములోనికి నడిపించు సన్నివేశములతో దాని యొక్క అనుబంధమును గూర్చి బైబిలు ఏమి చెబుతుందో మనము చూద్దాము.
ఇంతకు ముందు పాఠంలో, యుగాంతశాస్త్రమును “అంత్య దిన విషయములను గూర్చిన అధ్యయనము” లేక “అంత్య దిన విషయములను గూర్చిన సిద్ధాంతము” అని మనము నిర్వచించాము. వ్యక్తిగత యుగాంతశాస్త్రము అనగా “అంత్యదినములలోని సన్నివేశములను ఒక వ్యక్తి ఏ విధంగా అనుభవిస్తాడు అను విషయమును గూర్చిన అధ్యయనం అయ్యున్నది” అని కూడా మనము చెప్పాము. అయితే, ఈ పాఠంలో మన అంశములు “సాధారణ యుగాంతశాస్త్రము” అను మరొక ఉపభాగమునకు చెందినవిగా ఉన్నాయి. సాధారణ యుగాంతశాస్త్రము అనగా:
అంత్య దినములలో దేవుని యొక్క సార్వత్రిక కార్యములైన తీర్పు మరియు రక్షణను అధ్యయనం చేయుట.
ఇది కూడా వ్యక్తిగత యుగాంతశాస్తములో ఉన్న కొన్ని అవే సమస్యలను గూర్చి మాట్లాడుతుంది. అయితే ఇది వ్యక్తులు సన్నివేశములను ఎలా అనుభవిస్తారు అను దాని కంటే స్వయంగా సన్నివేశములను ఎక్కువగా ఉద్ఘాటిస్తుంది.
“రాజు యొక్క రాకడ” మీద మన చర్చ మూడు భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా, క్రీస్తు రాకడను గూర్చి లేఖనము ఏమి చెబుతుందో మనము పరీక్షిద్దాము. రెండవదిగా, ఆయన రాకడను సూచించు కాలముల యొక్క చిహ్నములను మనము పరిగణిద్దాము. మరియు మూడవదిగా, వెయ్యేండ్ల పాలనను గూర్చి ఇవాంజెలికల్ క్రైస్తవులు కలిగియున్న ప్రధానమైన అభిప్రాయములను పరిశీలన చేద్దాము. క్రీస్తు రాకడతో ఆరంభిద్దాము.
తన భూలోక పరిచర్య ముగింపునకు వచ్చుచుండగా, ఆయన పరలోకమునకు ఆరోహణమగుటకు ముందు, ఆయన మరలా తిరిగివస్తానని యేసు తన అనుచరులకు నిశ్చయతనిచ్చాడు. ఉదాహరణకు, మత్తయి 24, 25లోని ఒలీవల కొండ మీద ఉపదేశములోను, మరియు యోహాను 14-17లో ముగింపు ఉపదేశములోను దీనిని మనము చూస్తాము. తరువాత, యేసు పరలోకమునకు ఆరోహణమైనప్పుడు, ఆయన తిరిగి వస్తాడని అపొస్తలులకు గుర్తు చేయుటకు యేసు ఇద్దరు దేవదూతలను పంపాడు. అపొ. 1:10-11లో లూకా వ్రాసినట్లు:
ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశమువైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలిచి – గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి (అపొ. 1:10-11)
యేసు యొక్క రెండవ రాకడను గూర్చి అనేక ఇతర క్రొత్త నిబంధన పుస్తకములు కూడా ప్రస్తావిస్తాయి. థెస్సలొనీక సంఘమువారు దీని కొరకు సిద్ధపడియుండునట్లు 1 థెస్స. 3:13లో పౌలు ప్రార్థించాడు. మరియు వారు దీనిని తప్పిపోలేదు అని 2 థెస్స. 2:1, 2లో అతడు వారికి పునఃనిశ్చయతనిచ్చాడు. హెబ్రీ. 9:28లో హెబ్రీ పత్రిక రచయిత దీనిని యేసు కొరకు ఎదురుచూచినవారి రక్షణతో అనుసంధానం చేశాడు. 2 పేతురు 3:4-10లో పేతురు దీనిని లోకము యొక్క ముగింపు మరియు పునరుద్ధరణ అని వర్ణించాడు. మరియు ప్రకటన 22:12లో యోహాను యొక్క అంత్యదినముల దర్శనములో, ఆయన తిరిగివచ్చునంత వరకు నమ్మకముగా ఉండమని యేసు యోహానుకు చెప్పాడు. భూమి మీదికి యేసు తిరిగివచ్చుటను గూర్చి క్రొత్త నిబంధన అంతటా తెలియపరచబడింది, మరియు ఇది క్రైస్తవ వేదాంతశాస్త్రములో ఎల్లప్పుడూ ఒక ముఖ్యమైన విషయముగా పరిగణించబడింది.
యేసు తిరిగివచ్చుచున్నాడు; ఆయన తిరిగివచ్చుచున్నాడని ఆయన బైబిలులో మనకు చెప్పాడు. మేడగదిలో ఆయన పలికిన మాటలను మనము చూడవచ్చు; అపొస్తలులు, పౌలు, పేతురు, మరియు యోహాను పత్రికలలో, మరియు విశేషముగా ప్రకటన గ్రంథములో మనము చూడవచ్చు. కాబట్టి, యుగాంతములో యేసు క్రీస్తు తిరిగివస్తాడు అనునది లేఖన సత్యమైయున్నది. మరియు అది మనకు గొప్ప నిరీక్షణ అయ్యున్నది, ఎందుకంటే విశ్వాసులముగా, మనము మన రక్షకుని చూచుటకు ఎదురుచూచుచున్నాము, మరియు ఆయన తిరిగివచ్చినప్పుడు, మన అనుభవములో నుండి మరణము పూర్తిగా తొలగించబడుతుంది, ప్రాణములో మరియు శరీరములో మనము పూర్ణ శుద్ధులముగా చేయబడతాము, మరియు మనము యేసు సన్నిధిలో పరిశుద్ధులందరితోను పరిశుద్ధమైన దేవదూతలతోను నిరంతరము జీవిస్తాము. కాబట్టి, యేసు తిరిగి వచ్చుచున్నాడు అని మాత్రమే మనము ఒప్పుకోముగాని, మనము అభిరుచితోను, ఆశతోను దాని కొరకు ఎదురుచూస్తాము.
— డా. గై వాటర్స్
ఈ పాఠంలో, క్రీస్తు రాకడలోని రెండు విషయముల మీద మనము దృష్టిపెడదాము: మొదటిగా, ఆయన రాకడ యొక్క అవసరత; మరియు రెండవదిగా, ఆయన వచ్చు విధానము. ముందుగా యేసు రెండవ రాకడ యొక్క అవసరతను చూద్దాము.
లోకములో ధనిక ప్రాంతములలో నివసించుచున్న చాలామంది క్రైస్తవులు క్రీస్తు యొక్క రాకడను గూర్చి పెద్దగా చింతించరు. వారు ఈ జీవితములో ఉన్న ఆశీర్వాదములను ఆస్వాదించుటలో సంతృప్తిపొందుతారు, మరియు మధ్య స్థితిలో పరలోకమందు జీవించుట కొరకు ఎదురుచూస్తారు. మార్కు 10:21-25లోని ధనికుడైన నాయకుని వలె, యేసు తిరిగివచ్చినప్పుడు ఆయన ఆరంభించు రాజ్యముకు ఎక్కువ విలువ ఇవ్వకుండా వారి ఐశ్వర్యము వారికి ఆటంకము కలిగిస్తుంది. అయితే లోకములోని ఇతర భాగములలో, క్రైస్తవులు తమ విశ్వాసము నిమిత్తం శ్రమను అనుభవిస్తారు. కాబట్టి, యేసు తీసుకొని రాబోవుచున్న పూర్ణమైన లోకమును గూర్చి ఎదురుచూచుట వారికి సులభమవుతుంది. క్రీస్తు యొక్క రెండవ రాకడ యొక్క అవసరతను గుర్తించుటలో వారికి ఎలాంటి సమస్య ఉండదు.
దేవుని పని ఇంకా పూర్తి కాలేదు కాబట్టి యేసు తిరిగిరావలసియున్నది. దేవుని ప్రణాళిక ఇంకా పూర్తి కాలేదు. సృష్టి ఉన్నది, పతనము జరిగింది, క్రీస్తులో విమోచన ఉన్నది, మరియు నెరవేర్పు కూడా జరుగుతుంది. చరిత్ర ముగింపులోనికి వస్తుంది. దేవుడు సమస్త విషయములను ముగించబోతున్నాడు. తప్పులుగా ఉన్న విషయములన్నీ సరిచేయబడతాయి. మరియు తిరిగివస్తానని క్రీస్తు వాగ్దానము చేశాడు. ఆయన మన కొరకు స్థలమును సిద్ధము చేయుటకు వెళ్లుచున్నాడని, మరియు ఆయన వెళ్లి మన కొరకు స్థలమును సిద్ధము చేసిన యెడల, ఆయన తిరిగివచ్చి మనలను ఆయన యొద్దకు చేర్చుకుంటాడని యోహాను 14వ అధ్యాయములో ఆయన సెలవిచ్చాడు. సజీవులకు మరియు మృతులకు తీర్పు తీర్చుటకు కూడా యేసు తిరిగిరాబోవుచున్నాడు... క్రీస్తు రాకడ ప్రాముఖ్యమైనది అనుటకు అనేక కారణములు ఉన్నాయి, మరియు వీటిలో ప్రాముఖ్యమైనది, క్రీస్తు రాకడ ఒక విధముగా క్రీస్తు పునరుత్థానము యొక్క నెరవేర్పుగా ఉన్నది. ఆయన లేచియున్నాడు. ఆయన నిజముగా లేచియున్నాడు. అయితే ఆయన మరలా తిరిగివచ్చునట్లు ఆయన లేచియున్నాడు. మరియు మనము ప్రభురాత్రి భోజనములో ఇదే చెబుతాము. కదా? “మీరు ఈ రొట్టెను తిని, ఈ పాత్రలోనిది త్రాగు నప్పుడెల్ల ప్రభువు వచ్చువరకు ఆయన మరణమును ప్రచురించుదురు.” సువార్త సందేశమునకు ఇది కేంద్రమైయున్నది.
— డా. వొడ్డి బౌచమ్, జూ.
యేసు రాకడ యొక్క అవసరతకు అనేక కారణములు ఉన్నాయి. అయితే మన ఉద్దేశముల కొరకు, అబ్రాహాము వారసునిగా ఆయన పాత్రను మరియు దావీదు వారసునిగా ఆయన పాత్రను మనము చూద్దాము. ముందుగా అబ్రాహాము వారసునిగా క్రీస్తు యొక్క పాత్రను మనము చూద్దాము.
ఆదికాండము 15, 17 అధ్యాయములలో అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధనలో అబ్రాహాము మరియు అతని వారసుల కొరకు ఒక దేశము వాగ్దానము చేయబడింది. మరియు ఈ రెండు అధ్యాయములలో, ఈ దేశము కనానుగా గుర్తించబడింది. వాస్తవానికి, ఇందుమూలముగానే బైబిలు మరియు వేదాంతవేత్తలు కనానును “వాగ్దాన దేశము” అని పిలుస్తారు. అయితే ఆదికాండము 17:5లో, అబ్రాహాము జనములకు తండ్రిగా కూడా ఉంటాడని దేవుడు వాగ్దానం చేశాడు. మరొక మాటలో, అతని స్వాస్థ్యములో కేంద్ర బిందువుగా కనాను ఉంటుందిగాని, ఆ స్వాస్థ్యము కేవలం కనానుకు మాత్రమే పరిమితము కాదు. రోమా. 4:13లో, అబ్రాహాము మరియు అతని వారసులు భూమియంతటిని స్వాధీనం చేసుకుంటారు అను విధంగా పౌలు ఈ వాగ్దానమును వ్యాఖ్యానించాడు.
అంతేగాక, ఆదికాండము 17వ అధ్యాయములోని సన్నివేశములు జరిగిన అనేక సంవత్సరముల తరువాత, మోరియా పర్వతము యొద్ద దేవుడు అబ్రాహాముతో తన నిబంధనను మరొకసారి నిర్థారించాడు. ఆ సమయమందు, దేవునికి దహనబలిగా తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వమని ఆజ్ఞాపించి దేవుడు అబ్రాహామును పరీక్షించాడు. రెండు కారణముల చేత ఇది ఒక అఘోరమైన ఆజ్ఞగా ఉన్నది. మొదటిగా, దేవుడు ఇంతకు ముందు ఏనాడు నర బలిని కోరలేదు. మరియు రెండవదిగా, ఆదికాండము 17లో, అబ్రాహాము యొక్క నిబంధన వాగ్దానములకు వారసునిగా ఇస్సాకు గుర్తించబడ్డాడు. కాబట్టి, ఇస్సాకు మరణించవలసియుంటే, దేవుని వాగ్దానములు విఫలమైనట్లు కనిపించేవి. అయితే చివరి క్షణములో, దేవుడు ఇస్సాకును మరణము నుండి తప్పించాడు. తరువాత దేవుని నిబంధనా ఆశీర్వాదములన్నీ ఇస్సాకు ద్వారా నెరవేర్చబడబోతున్నాయి అను విధముగా దేవుడు అబ్రాహాముతో తన నిబంధనను నిర్థారించాడు. మరియు నిబంధనలో స్పష్టముగా లోకమంతా చేర్చబడు విధముగా నిబంధనా పదములలో దేవుడు మరింత వివరణను జోడించాడు. ఆది. 22:17-18లో, దేవుడు అబ్రాహాముతో ఇలా సెలవిచ్చాడు:
నీ సంతతివారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు... భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును (ఆది. 22:17-18)
వాస్తవిక హెబ్రీ భాషలో, ఈ వాగ్దానములు క్రీస్తుకు ముందు సూచికముగా లేక మాదిరిగా ఉన్న ఇస్సాకును సూచించుచున్నవి. మొదటిగా, ఇక్కడ సంతతివారు మరియు సంతానము అని అనువదించబడిన “జెరహ్” అను పదము యొక్క అర్థము “విత్తనము” అయ్యున్నది. ఇప్పుడు, ఏక వచనములో, జెరహ్ అను పదము అనేక విత్తనములను సూచించవచ్చు. అయితే ఈ సందర్భములో, అది “యరాష్” అను క్రియాపదము యొక్క ఏకవచన రూపమును తీసుకొని, “స్వాధీనపరచుకొనుట” అని అనువదించబడింది, మరియు సంబంధబోధక సర్వనామము యొక్క ఏకవచన రూపమును తీసుకొని, ఇక్కడ “వారు” అని అనువదించబడింది. కాబట్టి, ఈ వాక్య భాగము యొక్క అక్షరార్థ అర్థము ఈ విధంగా ఉన్నది:
నీ సంతతి తన శత్రువుల గవిని స్వాధీనపరచుకొనును. మరియు... భూలోకములోని జనములన్నియు నీ వారసునివలన ఆశీర్వదించబడును (ఆది. 22:17-18)
మరొక మాటలో, అబ్రాహాము యొక్క నిబంధన వాగ్దానములు అతని ప్రత్యేకించబడిన వారసుడైన ఇస్సాకు ద్వారా నెరవేరతాయి. మరియు ఈ వాగ్దానములలో వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొనుట మరియు ఆ స్వాధీనమును దేశములన్నిటికి వ్యాపింపజేయుట కూడా ఉన్నాయి.
అయితే ఇస్సాకు దినములలోని విశేషత ఏమిటంటే అతడు తాను స్వాధీనము చేసుకొనిన దేశములో నివాసముంటాడు. అవును, చరిత్ర పురోగతి చెంది దేవుడు తన ప్రణాళికలను బయలుపరచుచుండగా, ఇస్సాకుకు చేయబడిన వాగ్దానములు అతని వారసుడైన యేసు ద్వారా తుదకు నెరవేర్చబడతాయని స్పష్టమైయ్యింది. యేసు దేవునికి మానవ బలిగా కూడా అర్పించబడతాడు. అయితే ఈసారి చివరి నిమిషములో ఉపశమనము ఉండదు. అబ్రాహాము విధేయత ఇస్సాకు దేవుని నిబంధనా ప్రజలకు నాయకునిగా ఉండుటకు స్థానమును సంపాదించిపెట్టిన విధముగానే, యేసు చూపిన విధేయత ఆయనకు అదే హక్కును ఇచ్చింది. మరియు తాను స్వాధీనము చేసుకొనిన భూమిలో జీవించుట ద్వారా యేసు కొంత వరకు ప్రతి దేశమును వ్యక్తిగతముగా దీవిస్తాడు.
అబ్రాహాము మరియు ఇస్సాకుకు చేయబడిన వాగ్దానములు యేసు రాకడ యొక్క అవసరతకు ఒక కారణముగా ఉన్నాయి. అబ్రాహాము వారసులలో ఒకరు అతని విరోధులను జయించి, అతనికి నివాస స్థానముగా ఉండునట్లు లోకమంతటిని ఆక్రమిస్తాడు అని దేవుడు ప్రమాణము చేశాడు. ఆ వాగ్దానములు యేసు ద్వారా నెరవేర్చబడతాయని కొత్త నిబంధన స్పష్టము చేస్తుంది. అయితే ఆయన విరోధుల ప్రాంతములను స్వాధీనము చేసుకొనుటకు, మరియు ఆయన స్వాధీనము చేసుకున్న లోకములో జీవించుటకు, యేసు ఇక్కడ భూమి మీద నివాసముండాలి. అబ్రాహాము మరియు ఇస్సాకుతో చేయబడిన వాగ్దానములు నెరవేర్చబడుటకు ఆయన వ్యక్తిగతముగా రావలసియున్నది.
అబ్రాహాము వారసునిగా యేసు రాక యొక్క అవసరతతో పాటుగా, ఆయన దావీదు వారసుడైయున్నాడు కాబట్టి కూడా ఆయన తిరిగి రావలసియున్నది.
మునుపటి పాఠంలో మనము చూసినట్లు, దావీదు వారసులలో ఒకరు ఇశ్రాయేలును నిత్యము పాలిస్తారు అని దేవుడు చేసిన వాగ్దానమును యెషయా 9:7 తెలియజేస్తుంది. 2 సమూయేలు 7:16, మరియు యెహెజ్కేలు 37:24-28లో మనము ఇలాంటి ఆలోచనలనే చూస్తాము. వాస్తవానికి దావీదు వారసుడు పరిపాలన చేసి “సకల జనులును రాష్ట్రములున ఆయా భాషలు మాటలాడువారును” ఆయనను ఆరాధిస్తారు అని దానియేలు 7:1 తెలియజేస్తుంది. అయితే తన భూలోక పరిచర్య కాలములో యేసు స్థిరమైన, సార్వత్రిక భూలోక రాజ్యమును స్థాపించుట సరికదా దావీదు సింహాసనమును కూడా పునరుద్ధరించలేదు. మరియు ఆయన భూమి మీద జీవించినప్పుడు ఆయన నిశ్చయముగా ఆరాధించబడలేదు కూడా.
ఇప్పుడు, యేసు అప్పటికే ఆకాశమునకు భూమికి రాజుగా పాలించుచుండెను అని గుర్తించుట ప్రాముఖ్యమైయున్నది. ఆయన పరలోకమునకు ఆరోహణమగుటకు ముందు, ఆయనకు ఆకాశమందును, భూమియందును సర్వాధికారము ఇయ్యబడినది అని ఆయన తన శిష్యులకు చెప్పాడు. మత్తయి 28:18లో, ఆయన ఇలా సెలవిచ్చాడు:
ఆకాశమందును భూమిమీదను సర్వాధికారము నాకియ్యబడినది (మత్తయి 28:18).
యేసు ఆకాశమునకు మరియు భూమికి రాజైయున్నాడు; ఆయనకు సర్వాధికారము ఇవ్వబడియున్నది. ఈ విషయమును గూర్చి పౌలు ఎఫెసీ. 1:20-22లో మాట్లాడాడు. క్రీస్తు పరలోకము నుండి పాలించుచున్నాడని, మరియు ఆయనకు ఇవ్వబడిన రాజరిక స్థాయి ఈ యుగములో మరియు రాబోవు యుగములో ఎవ్వరికి ఇవ్వబడని ఉన్నతమైన స్థాయి అయ్యున్నదని అతడు వివరించాడు. మరియు 1 కొరింథీ. 15:25, మరియు కొలస్సీ. 2:10 వంటి అనేక ఇతర చోట్ల పౌలు ఈ ఆలోచనను పునరావృతం చేశాడు.
అయితే ప్రస్తుతము, యేసు సింహాసనము పరలోకమందు ఉన్నదిగాని, భూమి మీద లేదు. కాబట్టి, దావీదుతో దేవుడు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకుగాను, యేసు భూమి మీదికి తిరిగిరావలసియున్నది, ఇశ్రాయేలులో దావీదు సింహాసనమును స్థాపించవలసియున్నది, మరియు అక్కడ నుండి, సర్వభూమిని పాలించవలసియున్నది. లూకా 1:32-33లో యేసు తల్లియైన మరియతో దేవదూత చెప్పినట్లు:
ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను (లూకా 1:32-33).
అదే విధంగా, మత్తయి 25:31-46లో, యేసు తన సింహాసనము మీద కూర్చొని దుష్టులకు మరియు నీతిమంతులకు రాజరిక తీర్పులను ఇచ్చినప్పుడు, ఆ సింహాసనము భూమి మీద ఉంటుంది అని ఆయన స్వయంగా తెలియపరచాడు. మత్తయి 25:31-32లో యేసు సెలవిచ్చిన ఈ మాటలను వినండి:
తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతోకూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపర[చును] (మత్తయి 25:31-32).
ఇక్కడ చిత్రము యేసు పరలోకము నుండి ప్రజ్వలించుచున్న వైభవముతో — లేక “పరలోక మహిమ”తో — ఆకాశము నుండి తిరిగివచ్చుట, మరియు జయించుచున్న దేవదూతల సైన్యములు ఆయనతో కూడా వచ్చుటను గూర్చినదైయున్నది. మరియు ఆయన ఎక్కడికి వచ్చుచున్నాడు? తాను తీర్పు తీర్చాలని కోరుచున్న దేశములు ఉన్న భూమి మీదికి వస్తున్నాడు.
క్రీస్తు తిరిగివచ్చినప్పుడు ఆరంభమైయ్యే ఆయన భవిష్యత్ భూలోక పరిపాలన కొరకు క్రైస్తవులంతా ఎదురుచూడాలి. ప్రకటన 21, 22 అధ్యాయములలో అపొస్తలుడైన యోహాను చూసిన నూతన యెరూషలేము దర్శనములో ఈ నిరీక్షణ ప్రతిబింబించబడుట మనము చూస్తాము. మరియు యిర్మీయా 3:17లో యెరూషలేమును గూర్చి యిర్మీయా చేసిన ప్రవచనములలో, మరియు యిర్మీయా 17:35 మరియు 33:17-22లో దావీదు వంశపు రాజులను గూర్చి అతడు పలికిన మాటలలో ఇది కనుపరచబడింది. ఇది యేసు మరియు క్రొత్త నిబంధనలో ఆయనను అనుసరించినవారి యొక్క నమ్మకము మరియు నిరీక్షణ అయ్యున్నది, మరియు ఇది మన నమ్మకము మరియు నిరీక్షణ కూడా అయ్యుండాలి.
క్రీస్తు రాకడ యొక్క అవసరతను ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి, ఇప్పుడు ఆయన రాకడ యొక్క విధానమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.
దేవుని యొక్క భూలోక రాజ్యమును నెరవేర్పుకు తెచ్చుటకు యేసు చేయవలసిన ప్రాముఖ్యమైన కార్యములు చాలా ఉన్నాయి — మరియు ఆ కార్యములను ఆయన స్వయంగా చేస్తాడు. కాబట్టి, ఆయన తిరిగివస్తున్నాడు అని మనకు తెలుసు. అయితే ఆయన ఎలా తిరిగివస్తాడు? అది ఎలా ఉంటుంది? మరియు మనము ఆయనను ఎలా గుర్తిస్తాము? సరళమైన పదములలో, యేసు విజయుడైన, సర్వసృష్టిని జయించు రాజుగా పరలోకము నుండి దిగివస్తాడు.
క్రీస్తు రాకడ విధానములోని నాలుగు విశేషతలను మనము ప్రస్తావిద్దాము. అది వ్యక్తిగతముగాను, భౌతికముగాను, దృశ్యమైనదిగాను, విజయవంతముగాను ఉంటుంది. అది వ్యక్తిగతమైనది అను సత్యమును మొదట చూద్దాము.
మనము ఇంతకు ముందు చూసినట్లు, అబ్రాహాము మరియు దావీదులకు చేయబడిన వాగ్దానములను నెరవేర్చుటకుగాను యేసు భూమి మీదికి వ్యక్తిగతముగా తిరిగివచ్చుట అవసరమైయున్నది. పరిశుద్ధాత్మ దీనిలో పాలుపంచుకొనునప్పటికీ, రాజ్యము యొక్క తరువాత స్థాయిని ప్రభావితము చేయుటకు ఆయన పరిశుద్ధాత్మను పంపడు. మరియు ఆయన కేవలం తన సంఘము ద్వారా మాత్రమే కార్యము చేయడు, కాని ఆయన రాజ్యమును నెరవేర్చునప్పుడు జరుగు సన్నివేశములలో మనము ఖచ్చితముగా పాలుపంచుకుంటాము. ఆయన రాకడ నశించినవారు ఎక్కువ మొత్తములో మారుమనస్సు పొందుటను గూర్చి, లేక ప్రపంచ దేశములన్నిట సమాధానము వ్యాపించుటను గూర్చి, లేక లోకమంతటా సంఘము జయమును పొందుటను గూర్చి వివరించుటకు క్రొత్త నిబంధన ఉపయోగించు ఉపమాలంకారము కాదు. వాస్తవానికి, అది అసలు అలంకారమే కాదు. యేసు తను ఆరంభించిన పనిని ముగించుటకు నిజముగా — వ్యక్తిగతముగా — తిరిగివచ్చుచున్నాడు.
యేసు మరణము నుండి తిరిగిలేచిన తరువాత, మరియు పరలోకమునకు ఆరోహణమగుటకు ముందు, తనకు నమ్మకమైన అపొస్తలులకు దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తు ఆయన నలుబది దినములు గడిపాడు. తరువాత, అపొ. 1:4, 5లో, సంఘమును పరిచర్య కొరకు బలపరచుటకు పరిశుద్ధాత్మను పంపుతానని ఆయన వివరించాడు. దీనికి స్పందిస్తూ, అపొ. 1:6లో, అపొస్తలులు ఆయనను ఇలా అడిగారు:
ప్రభువా, యీ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించెదవా? (అపొ 1:6).
ఈ ప్రశ్న ఒక ప్రాముఖ్యమైన ఆలోచనను, ముఖ్యముగా యేసు స్వయంగా ఇశ్రాయేలు కొరకు రాజ్యమును మరల అనుగ్రహిస్తాడు అను ఆలోచనను బయలుపరుస్తుంది.
వారు పరిశుద్ధాత్మను పొందిన వెంటనే యేసు యొక్క ఇతర యుగాంత కార్యములు జరుగుతాయా లేదా అని అపొస్తలులు స్వాభావికముగానే ఆశ్చర్యపోయారు. అయితే కాలములను గూర్చి ఊహించుకోవద్దని యేసు వారికి తెలిపి, పరిశుద్ధాత్మ వారి పరిచర్యలను బలపరుస్తుంది అని మాత్రం పునఃనిశ్చయపరచాడు. తరువాత వెంటనే, ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు.
కాబట్టి, దీనిని గూర్చి అపొస్తలులు ఏమి ఆలోచన చేసిరి? రాజ్యమును పునరుద్ధరించవలసినవాడు పరలోకమునకు ఆరోహణమై వెళ్లిపోతే, అసలు రాజ్యమును ఎవరు పునరుద్ధరిస్తారు అని వారు ఆలోచన చేసియుంటారు అని మనము చెప్పవచ్చు. వాస్తవానికి, ఇలానే జరిగింది అని తరువాత వచనములు సూచిస్తాయి. ఈ వృత్తాంతము కొనసాగుచుండగా, ఇద్దరు దేవదూతలు ప్రత్యక్షమై, భవిష్యత్తులో యేసు వ్యక్తిగతముగా తిరిగివస్తాడని, బహుశా భూమి మీద దేవుని రాజ్యమును నెరవేర్పులోనికి తెచ్చుటకు తిరిగివస్తాడని తెలిపారు. అపొ. 1:11లో ఇంతకు ముందు మనము చదివినట్లు, దేవదూతలు అపొస్తలులతో ఇలా అనిరి:
గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచుచున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చు[ను] (అపొ. 1:11)
యేసు విడచి వెళ్లాడు అంటే ఆయన రాజ్యమును పునరుద్ధరించుటను మరచిపోయాడు అని అర్థము కాదు. భిన్నముగా, తన భూలోక రాజ్యమును సంపూర్ణము చేయుటకు ఆయన వ్యక్తిగతముగా తిరిగివచ్చుచున్నాడు. అపొస్తలుడైన పేతురు ఈ వాస్తవము చేత ఎంతగా ప్రభావితము అయ్యాడు అంటే, ఇది తన సువార్త ప్రకటనలో ఒక భాగమైపోయింది. అపొ. 3:21లో పేతురు జనసమూహములకు చెప్పిన మాటలను వినండి:
అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చు...వరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము (అపొ. 3:21).
భూమి మీద దేవుని మెస్సీయ రాజ్యమును నెరవేర్పులోనికి తెచ్చుటకు యేసు వ్యక్తిగతముగా తిరిగివస్తాడని అనేకమంది క్రొత్త నిబంధన రచయితలు మరియు పాత్రలు వాదించారు. అయితే ఈ ఆలోచన పౌలు యొక్క రచనలలో మరింత సామాన్యముగా కనిపిస్తుంది. ఉదాహరణకు, 1 కొరింథీ. 15:23, మరియు ఫిలిప్పీ. 3:20, 21 వంటి చోట్ల, పౌలు క్రీస్తు యొక్క వ్యక్తిగత రాకడను విశ్వాసుల యొక్క పునరుత్థానముతో అనుసంధానం చేశాడు. 2 తిమోతి 4:8లో, క్రీస్తు రాకడ కొరకు ఆసక్తితో ఎదురుచూచు వారికి దేవుడు ప్రతిఫలమిస్తాడని అతడు చెప్పాడు. మరియు తీతు 2:12-14లో, యేసు యొక్క వ్యక్తిగత రాకడను దైవికమైన జీవితములను జీవించవలసిన అవసరతతో అనుసంధానం చేశాడు.
క్రీస్తు తిరిగి వచ్చు విధానము వ్యక్తిగతముగా ఉంటుంది అని చూశాము కాబట్టి, ఇప్పుడు ఆయన రాకడ భౌతికమైనదిగా ఉంటుంది అను ఆలోచనను మనము విశదీకరిద్దాము.
యేసు పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఆయన తన మానవత్వమును విడిచిపెట్టలేదు అను విషయమును జ్ఞాపకము చేసుకొనుట చాలా ప్రాముఖ్యమైయున్నది. ఆయన ఒకే పురుషమూర్తి అయ్యున్నాడు — త్రిత్వములోని రెండవ పురుషమూర్తి. అయితే ఆయనకు రెండు స్వభావములు ఉన్నాయి: దైవిక స్వభావము మరియు మానవ స్వభావము. తన దైవిక స్వభావములో, యేసు ఇప్పటికే భూమి మీద ఉనికిలో ఉండి ప్రతి చోట కార్యములు చేయుచున్నాడు. అయితే మానవునిగా ఆయన చేయవలసిన పని కొంత మిగిలియున్నది. మరియు దానిని చేయుట కొరకు, ఆయన తన సంపూర్ణ మానవత్వములో, శరీరముతో సహా తిరిగిరావలసియున్నది. ఉదాహరణకు, ఆయన కేవలం మానవ స్వభావము ప్రకారం అబ్రాహాము మరియు దావీదు యొక్క నిబంధన వారసుడైయున్నాడు. ఫలితంగా, అబ్రాహాము మరియు దావీదుతో చేయబడిన వాగ్దానములు ఆయన మానవత్వము ద్వారా మాత్రమే నెరవేర్చబడతాయి.
అదే విధంగా, అపొ. 3:20-22లో, మోషే వంటి ప్రవక్తగా తనకు ఇవ్వబడిన బాధ్యతను పూర్తి చేయుటకు యేసు మానవ స్వభావములో తిరిగి రావలసియున్నదని లూకా వాదించాడు. మరియు అవును, ఆయన భౌతికముగా తిరిగివస్తాడని ఆయన ఆరోహణమైనప్పుడు దేవదూతలు తెలియపరచారు. అపొ. 1:11లో దేవదూతలు అపొస్తలులతో ఇలా అనిన విషయమును జ్ఞాపకము చేసుకోండి:
యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చు[ను] (అపొ. 1:11)
యేసు మానవునిగా పరలోకమునకు ఆరోహణమై వెళ్లుటను అపొస్తలులు చూశారు, మరియు అదే విధంగా ఆయన తిరిగివచ్చుటను వారు చూస్తారని వారికి తెలియజేయబడింది. అనగా ఆయన మానవ శరీరముతో తిరిగివస్తాడు అని దీని అర్థమైయున్నది. అంతేగాక, మహిమపరచబడిన మన మానవ శరీరములను యేసు తిరిగివచ్చినప్పుడు కలిగియుండు మహిమపరచబడిన మానవ శరీరముతో అనేక లేఖనభాగములు పోల్చుతాయి. అనగా మన వలె ఆయన కూడా భౌతికముగా ఉంటాడు. ఈ విషయాన్ని మనము 1 కొరింథీ. 15:20-23 మరియు ఎఫెసీ. 3:20, 21 వంటి చోట్ల చూడవచ్చు. యేసు తిరిగివచ్చినప్పుడు, ఆయన తన మహిమపరచబడిన భౌతిక శరీరములో — అనగా ఆయన మరణము నుండి తిరిగిలేచి పరలోకమునకు ఆరోహణమైన అదే శరీరముతో ప్రత్యక్షమవుతాడు — అని క్రొత్త నిబంధన తరచుగా బోధిస్తుంది.
యేసు తిరిగివచ్చు విధానము వ్యక్తిగతముగాను, భౌతికముగాను ఉంటుంది అని మనము చూశాము కాబట్టి, ఇప్పుడు అది దృశ్యమైనదిగా కూడా ఉంటుంది అని చూద్దాము.
యేసు మహిమపరచబడిన మానవ శరీరముతో తిరిగివచ్చినప్పుడు, ఆయనను మనము చూస్తాము అని మనము స్పష్టముగా చెప్పవచ్చు. అయితే కొన్ని అబద్ధ బోధలు యేసు యొక్క దృశ్యమైన రాకడను తిరస్కరిస్తాయి. చాలాసార్లు, ఇట్టి తిరస్కరణ యేసు ఇప్పటికే తిరిగివచ్చాడు అను పొరపాటు నమ్మికకు దారి తీస్తుంది. మరియు ఆయన తిరిగివచ్చుటను ఎవ్వరు చూడలేదు కాబట్టి, అది అదృశ్యమైన రీతిలో జరిగినది అని వారు వాదిస్తారు. యేసు తిరిగివచ్చినప్పుడు ఆయన కనిపిస్తాడు అని క్రొత్త నిబంధన స్పష్టముగా తెలియపరచుట ఈ పొరపాటు ఆలోచనలోని అత్యంత స్పష్టమైన సమస్యలలో ఒకటైయున్నది. ఉదాహరణకు, 1 యోహాను 3:2లో, యోహాను ఇలా వ్రాశాడు:
ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము (1 యోహాను 3:2).
మరియు ప్రకటన 1:7లో, యోహాను ఇలా ప్రవచించాడు:
ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును (ప్రకటన 1:7).
మరియు మత్తయి 24:27-30లో, యేసు స్వయంగా తన రెండవ రాకడను ఈ విధంగా వర్ణించాడు:
మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును... అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు (మత్తయి 24:27-30).
యేసు కేవలం కొంతమందికి మాత్రమే కనిపించడు అని సూచించుచున్నాయి కాబట్టి చివరి రెండు వాక్యభాగములు మరింత సహాయకరముగా ఉన్నాయి. భూమి మీద ఉన్న సకల జనులు ఆయనను చూస్తారు. మరియు దీనికి కారణమును అర్థము చేసుకొనుట అంత కష్టమైన పనేమీ కాదు: యేసు రాకడ భూమిని-కదిలించువేయు సన్నివేశమైయున్నది. ఆయన మహిమ యొక్క ప్రకాశము సూర్యుని వలె ఉంటుంది, మరియు ఆయన పరలోక సైన్యములు ఆకాశమును నింపివేస్తాయి. మరియు ఆయన న్యాయ సింహాసనము ఎదుట ప్రతి ఒక్క మానవుడు ఆయనను ఎదుర్కొనవలసియున్నది. మత్తయి 16:27లో యేసు బోధించినట్టుగా:
మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతోకూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును (మత్తయి 16:27).
మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడ ఉంటుంది అని క్రొత్త నిబంధన బోధిస్తుంది; అనగా అది చాలా స్పష్టముగా కనబడుతుంది మరియు దానిని చూడకపోవుట ఇంచుమించు అసాధ్యమే అవుతుంది. మరియు పౌలు రచనల భాషలో, క్రీస్తు యొక్క రెండవ రాకడ బూర ధ్వనితోను, గొప్ప శబ్దముతోను కలుగుతుంది అని అతడు చెబుతాడు. మరొకసారి, రెండవ రాకడను మనము చూడకుండా ఉండాలన్నా తప్పించుకోలేము అని, మరియు ఈ విప్లవాత్మకమైన మరియు చారిత్రికమైన సన్నివేశమును మనము నిశ్చయముగా చూచునట్లు దేవుడు చేస్తాడని ఈ విషయములు నాకు సూచించుచున్నవి. కాబట్టి, అది పూర్తిగా దృశ్యమైనదిగాను, గమనించునదిగాను ఉంటుంది అని, మరియు క్రీస్తు తిరిగివచ్చిన సమయములో భూమి మీద ఉన్న ఏ ఒక్కరు కూడా దానిని చూడకుండా ఉండలేరని నేనంటాను.
— రెవ. డెన్ హెండ్లే
ఇప్పటి వరకు క్రీస్తు తిరిగివచ్చు విధానము వ్యక్తిగతముగాను, భౌతికముగాను, దృశ్యమైనదిగాను ఉంటుంది అని మనము వర్ణించాము. ఇప్పుడు అది విజయవంతముగా కూడా ఎలా ఉంటుందో చూద్దాము.
ఆయన మొదటి రాకడ సమయములో, యేసు విజయవంతముగా ప్రత్యక్షముకాలేదు. ఆయన పేదవానిగా, ఒక దీన కుటుంబములో జన్మించాడు. ఆయన ఏనాడూ రాజకీయ లేక సైనిక అధికారమును పొందలేదు. మరియు మరణములో, ఆయన ఖండించబడి, ఒక నేరస్తునివలె హతమార్చబడుటకు అనుమతి ఇచ్చాడు. ఫిలిప్పీ. 2:7-8లో పౌలు వ్రాసినట్లు:
[యేసు] మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. (ఫిలిప్పీ. 2:7-8)
“తన్ను తానే తగ్గించుకొనెను” అను మాటలో ఉపయోగించిన గ్రీకు క్రియాపదము “కెనో” అయ్యున్నది. ఇక్కడ ఉపయోగింపబడిన ఈ పదము “కెనోసిస్” అను వేదాంతశాస్త్ర పదమునకు ఆధారమైయున్నది, మరియు ఇది యేసు యొక్క మొదటి రాకడలో ఆయన తన దైవిక మహిమను కప్పుకొనిన కార్యమైయున్నది.
యేసు యొక్క కెనోసిస్ ఆయన కొన్ని దైవిక గుణములను కోల్పోయాడు అని సూచిస్తుంది అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు తప్పుగా అర్థము చేసుకున్నారు. అయితే దేవుడు దేవునిగా ఉండుట మానలేడు. ఆయన స్వతహాగా కూడా తనలో ఉన్న ఏ దైవిక గుణములను ప్రక్కన పెట్టలేడు. బదులుగా, యేసు యొక్క కెనోసిస్ ఆయన తన మహిమను, ముఖ్యముగా తాను నరావతారిగా వచ్చుట ద్వారా మరియు అనుభవించిన శ్రమల ద్వారా దాచుకున్నాడు అని సూచిస్తుంది. అయితే ఆయన మరణము నుండి తిరిగిలేచి, పరలోకమునకు ఆరోహణమై వెళ్లినప్పుడు, ఆయన కెనోసిస్ ముగించబడింది. ఆ సమయమందు, దేవునిగా యేసు ఎల్లప్పుడూ కలిగియుండిన మహిమను ప్రత్యక్షపరచుటకు దేవుడు తెరను తొలగించాడు. యోహాను 17:5లో యేసు ప్రార్థించినట్లు:
తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము (యోహాను 17:5).
యేసు మహిమ ఇకనెన్నడు మరుగుచేయబడలేదు. మరియు ఆయన తిరిగివచ్చునప్పుడు, అది సంపూర్ణముగా కనుపరచబడుతుంది. ఆయన మేఘముల మీద వేవేల దూతలతో కలసి వైభవముతోను, ప్రకాశమానముగాను తిరిగివస్తాడు. ఆయన “ప్రభావముతోను మహా మహిమతోను” వస్తాడు అని మత్తయి 24:30 చెబుతుంది. “ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను” ఆయన ప్రకటించబడతాడు అని 1 థెస్స. 4:16 చెబుతుంది. ఆయన దూతల సైన్యములతోను అగ్ని జ్వాలలతోను తిరిగివస్తాడని 2 థెస్స. 1:7 చెబుతుంది. ఆయన అనేక కిరీటములను కలిగియుండి, పరలోకమందున్న సేనలతో, ఇనుపదండముతో దేశములను ఏలుటకు వస్తాడని ప్రకటన 19:11-16 తెలియజేస్తుంది. క్లుప్తంగా, తన సైన్యములను విజయములోనికి నడిపించు విజయుడైన రాజు వలె ఆయన ప్రత్యక్షమవుతాడు. మరియు ఆయన ప్రభావము మరియు అధికారము ఎదుట అందరి మోకాళ్లు వంగుతాయి. యేసు యొక్క కెనోసిస్ యొక్క ఫలితములను ఫిలిప్పీ. 2:9-11లో పౌలు వర్ణించిన విధానమును వినండి:
అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను (ఫిలిప్పీ. 2:9-11).
ఇది అంతిమ విజయమైయున్నది. యేసు తిరిగివచ్చి తన శత్రువులను ఓడించినప్పుడు, ఆయనను వ్యతిరేకించువారు ఎవరు మిగిలియుండరు. ఏ భేదము లేకుండా, ప్రతి ఒక్కరు వంగి ఆయన గొప్పతనమును ఒప్పుకొని, ఆయన పరిపాలనకు సమర్పించుకుంటారు. ఆయన సింహాసనము నూతన యెరూషలేములో ఉంటుంది అని, అక్కడ ఆయన మహిమ ఎంతో ప్రకాశమానముగా ఉంటుంది కాబట్టి ఆ పట్టణమునకు దీపములు లేక సూర్యుడు కూడా అవసరము లేదని ప్రకటన 22:3-5 బోధిస్తుంది. మరియు ఆయన పరలోక రాజ్యము లోకమంతటిని చుట్టునట్లు వ్యాపిస్తుంది అని ప్రకటన 11:15 సూచిస్తుంది.
విశ్వాసులముగా, క్రీస్తు యొక్క భవిష్యత్ భౌతిక రాకడ మనము కలిగియున్న గొప్ప నిరీక్షణలలో ఒకటైయున్నది. యేసు తిరిగివచ్చినప్పుడు, సృష్టి పరిపూర్ణము చేయబడుతుంది మరియు లోకమంతటా దేవుని మహిమ కనబడుతుంది. అప్పటివరకు, ఆ అంతిమ విజయమును ఎదురుచూచుట మరియు ప్రకటించు విధములలో జీవించుట మన బాధ్యతలలో భాగమైయున్నది. మనము పరిశుద్ధులమైయుండి, మన రాజును గౌరవించి, ఆయన రాకడ కొరకు ఆయన రాజ్యమును సిద్ధపరచాలి. ఒక విధంగా, ఆయన చేస్తున్న ఈ ఆలస్యమును బట్టి మనము కృతజ్ఞులమైయుండాలి. ఎందుకని? ఎందుకంటే యేసు ఆలస్యము చేయు ప్రతి రోజు ఆయన శత్రువులు మారుమనస్సు పొందుటకు ఒక అవకాశమైయున్నది, తద్వారా వారు ఇప్పుడు ఆయన ఇచ్చు క్షమాపణను పొందుకొని, ఆయన తిరిగివచ్చునప్పుడు ఆయన యొక్క నిత్య ఆశీర్వాదములను పొందవచ్చు.
క్రీస్తు రాకడ దృష్ట్యా రాజు యొక్క రాకడను ఇప్పటివరకు మనము పరిగణించాము కాబట్టి, ఇప్పుడు మన రెండవ ప్రధానాంశమును చూద్దాము: కాలముల యొక్క చిహ్నములు.
“కాలముల యొక్క చిహ్నములను” గూర్చి మనము మాట్లాడునప్పుడు, దేవుని యుగాంత కాలక్రమము యొక్క పురోగతిని సూచించు సన్నివేశములు మన మనస్సులలో ఉన్నాయి. ఇంతకు ముందు పాఠములలో మనము చూసినట్లు, “అంత్య దినములు” లేక “ఎస్కటన్” మూడు స్థాయిలలో ప్రత్యక్షమవుతుంది: యేసు యొక్క మొదటి రాకడలో జరిగిన దేవుని భూలోక మెస్సీయ రాజ్యము యొక్క ఆరంభము; ఇప్పుడు మనము నివసించుచున్న, రాజ్యము యొక్క కొనసాగింపు; మరియు యేసు తిరిగివచ్చునప్పుడు జరుగు రాజ్యము యొక్క భవిష్యత్ నెరవేర్పు. మన పాఠంలోని ఈ భాగములో, క్రీస్తు మహిమగల రాకడకు ముందు సంభవించు చిహ్నముల మీద మనము ప్రధానముగా దృష్టిపెడదాము.
కాలముల యొక్క చిహ్నములను మనము మూడు భాగములలో చూద్దాము. మొదటిగా, క్రీస్తు రాకడ యొక్క సమయము దైవిక మర్మముగా ఉన్నదని మనము చూద్దాము. రెండవదిగా, క్రీస్తు రాకకు ముందు సంభవించు కొన్ని ప్రాముఖ్యమైన సూచకములను మనము ఎత్తి చూపుదాము. మరియు మూడవదిగా, ఈ సూచకములను వివరించుటకు వేదాంతవేత్తలు ఉపయోగించిన కొన్ని వ్యాఖ్యాన వ్యూహములను మనము గుర్తిద్దాము. క్రీస్తు రాకడ సమయము దైవిక మర్మమైయున్నది అను సత్యమును పరిశీలిస్తూ ఆరంభిద్దాము.
మత్తయి 24:3లో, యేసు శిష్యులు ఆయనను ఇలా అడిగారు:
ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేవి? (మత్తయి 24:3).
వారు ఆయనను ఈ ప్రశ్న అడుగుటకు ముందు, యేసు కొంత కాలము పాటు వారిని విడచివెళ్లి మరలా తిరిగివస్తాడని శిష్యులు గ్రహించారు. మరియు ఆయన తిరిగివచ్చునంత వరకు దేవుని మెస్సీయ రాజ్యము యొక్క పూర్ణతను ఆయన తీసుకొనిరాడు అని వారికి తెలుసు. అయినను ఇవి ఎప్పుడు జరుగును? అని వారు ఆశ్చర్యపోయారు.
ఈ ప్రశ్నకు జవాబుగా, ఆయన తిరిగివచ్చుటకు ముందు కలుగు సూచనలను యేసు వారికి చెప్పాడు. మత్తయి 24:27-30లో, సూర్యుడు మరియు చంద్రుడు నలుపైపోతారని, అప్పుడు ఆయన ఆకాశమందు ప్రత్యక్షమై, మేఘముల మీద గొప్ప మహిమతో ప్రకాశించుచు వస్తాడని ఆయన వారికి చెప్పాడు. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందో ఆయన వారికి చెప్పలేదు. వాస్తవానికి, అది ఆయనకు కూడా తెలియని దైవిక మర్మమైయున్నది కాబట్టి దానిని ఆయన వారికి చెప్పలేకపోయాడు. మత్తయి 24:36లో ఆయన చెప్పినట్లు:
అయితే ఆ దినమునుగూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు (మత్తయి 24:36).
ఆయన మానవ స్వాభావము యొక్క దృష్టికోణములో, ఆయన ఎప్పుడు తిరిగివస్తాడో యేసుకు కూడా తెలియదు! విచారకరముగా, చరిత్రలోని అనేకమంది వేదాంతవేత్తలు తమను తాము యేసు కంటే జ్ఞానులుగాను ఎక్కువ తెలిసినవారిగాను పరిగణించుకొని, ఆయన రాకడ కొరకు తేదీలను నిర్ణయించుటకు ప్రయత్నించారు. అయితే వారి అంచనాలన్నీ తప్పులైయ్యాయి. మత్తయి 24:42-44లో యేసు ఇలా సెలవిచ్చాడు:
కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి... మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి (మత్తయి 24:42-44).
మత్తయి 25:13, మార్కు 13:32, 33, లూకా 12:40, 1 థెస్స. 5:2, మరియు 2 పేతురు 3:10తో సహా అనేక ఇతర వాక్యభాగములు యేసు తిరిగివచ్చు సమయమును తెలుసుకొనుట సాధ్యపడదు అని నిర్థారిస్తాయి. ఆ సమయము ఎప్పుడు వస్తుందో దేవునికి మాత్రమే తెలుసు అని మాత్రం క్రీస్తు రాకడ సమయమును గూర్చి లేఖనము స్పష్టముగా చెబుతుంది. ఇంకా ఎవరూ దానిని ఊహించలేరు.
క్రీస్తు రాకడను గూర్చిన దైవిక మర్మమును కాలముల యొక్క చిహ్నములు బయలుపరచవని చూశాము కాబట్టి, ఇప్పుడు ఆయన రెండవ రాకడకు ముందు కలుగు కొన్ని ప్రాముఖ్యమైన సూచకములను చూద్దాము.
యేసు ఎప్పుడు వస్తాడో మనకు తెలియకపోయినప్పటికీ, ఆయన రాకడకు సూచకములుగా ఉన్న అనేక పరిస్థితులను లేఖనము ప్రస్తావిస్తుంది. సామాన్యముగా మాట్లాడితే, ఈ సూచకములు నిరంకుశమైనవి కావు. మనము ఇంతకు ముందు పాఠంలో చూసినట్లు, దేవుని ప్రవచనములు ప్రాధమికముగా షరతులతో కూడినవైయున్నవి. ఒక కుమ్మరి మట్టిని మరొక కుండను చేయుటకు ఉపయోగించు విధముగానే, భవిష్యత్తును గూర్చిన ప్రవచనములను నెరవేర్చు విషయములో దేవుడు స్వాతంత్ర్యమును కలిగియున్నాడు. అయినప్పటికీ, క్రీస్తు రాకడకు ముందు కలుగుతాయని లేఖనము చెప్పు పరిస్థితులు మనకు మార్గదర్శకమును ఇవ్వగలవు. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అను విషయమును గూర్చి అవి సక్రమమైన ఆకాంక్షలను కలిగిస్తాయి. మరియు క్రీస్తు రాకడ కొరకు మనము సిద్ధపడుచుండగా అవి మనలను హెచ్చరిస్తాయి మరియు ప్రోత్సహిస్తాయి.
క్రీస్తు రాకడకు ముందు కలుగు అత్యంత ప్రాముఖ్యమైన మూడు సూచకములను మాత్రమే మనము ప్రస్తావిద్దాము, మరియు దేవుని రాజ్యమునకు దయ్యముల నుండి ఎదురైయ్యే వ్యతిరేకతతో ఆరంభిద్దాము.
చరిత్రయంతటిలో దేవుని రాజ్యము యొక్క వ్యాప్తిని సాతాను మరియు వాని దయ్యపు శక్తులు వ్యతిరేకించాయి అని లేఖనము బోధిస్తుంది. కాబట్టి, దయ్యముల నుండి ఎదురైయ్యే వ్యతిరేకత క్రొత్త ఏమి కాదు. అయితే యేసు రాకడకు ముందు మరింత కఠినమైన దయ్యపు శక్తుల వ్యతిరేకత ఎదురవుతుంది అని కూడా లేఖనము బోధిస్తుంది. ప్రకటన 7:14 దీనిని “మహాశ్రమ” అని పిలుస్తుంది — అది భ్రమపరచు సూచనలను మరియు అద్భుతములను చేయునట్లు దయ్యములు అబద్ధ ప్రవక్తలను బలపరచు కాలము. మరియు ప్రకటన గ్రంథములో యోహాను చూసిన దర్శనములలో ఇలాంటి ఇతర ఆలోచనలు కూడా కనిపిస్తాయి. ఉదాహరణకు, ప్రకటన 16:13-14లో, యోహాను ఇలా వ్రాశాడు:
మరియు... కప్పలవంటి మూడు అపవిత్రాత్మలు బయలువెడలగా చూచితిని. అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే (ప్రకటన 16:13-14).
మత్తయి 24:21లో మహా శ్రమను గూర్చి యేసు కూడా మాట్లాడుతు, లోకము సమాప్తమగు కాలములో జరుగు సన్నివేశములతో దానిని అనుసంధానం చేశాడు. ఆ కాలములో అబద్ధపు చిహ్నములు మరియు అబద్ధపు ఆశ్చర్య కార్యములు జరుగుతాయని యోహాను వలె ఆయన కూడా చెప్పాడు. మత్తయి 24:24లో యేసు సెలవిచ్చినట్లు:
అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు (మత్తయి 24:24).
స్పష్టముగా, తన రాజ్యము కొరకు దేవుడు కలిగియున్న ప్రణాళికలకు ఆటంకము కలిగించుటకు ఆయన యొక్క దయ్యపు విరోధులు ప్రతి విధమైన కుతంత్రమును మరియు శక్తిని ఉపయోగిస్తాయి.
దేవుని రాజ్యమునకు మానవ వ్యతిరేకత క్రీస్తు రాకడకు రెండవ సూచకము అయ్యున్నది.
దేవునికి విరోధముగా దయ్యపు శక్తుల నుండి ఎదురైయ్యే వ్యతిరేకతలో అనేకమంది మానవులు కూడా సహకరిస్తారు అని లేఖనము వర్ణిస్తుంది. ఉదాహరణకు, సాతాను రెండు మృగములను ఉపయోగిస్తాడు అని ప్రకటన 13 సూచిస్తుంది: ఒకటి భూమి మీద నుండి, మరొకటి సముద్రములో నుండి. అయితే ఈ మృగములు వ్యక్తుల రూపములో, జనముల గుంపులు, లేక సంస్థల రూపములో ఉన్నాయో ఇది తెలియపరచదు. అయితే అవి మానవులైయున్నట్లు అగుపడతాయి. ఒక విధంగా, సమాజములను మరియు ప్రభుత్వములను నియంత్రించు విధముగా అవి మానవాళి మీద ప్రభావము చూపుతాయి. మరొక వైపు, భూమి మీద నుండి వచ్చు మృగము “మానవ సంఖ్య,” లేక “మానవాళి సంఖ్య,” లేక “ఒక వ్యక్తి యొక్క సంఖ్య” అయ్యుండవచ్చని ప్రకటన 13:18 గుర్తిస్తుంది. ఈ మృగములు మాత్రమేగాక, ప్రకటన 16:13, 19:20 మరియు 20:10లో ఒక బలమైన “అబద్ధ ప్రవక్త” కూడా ప్రస్తావించబడ్డాడు.
దేవుని రాజ్యమునకు మానవ వ్యతిరేకత 2 థెస్స. 2:1-10లో కూడా కనిపిస్తుంది, అక్కడ “ధర్మవిరుద్ధ పురుషుని” గూర్చి మరియు అతని తిరుగుబాటును గూర్చి ప్రస్తావించబడింది. ధర్మవిరుద్ధ పురుషుడు అబద్ధ ఆశ్చర్య కార్యములు చేయుటకు సాతాను ద్వారా బలపరచబడతాడు, మరియు తుదకు తానే దేవుడను అని ప్రకటించుకుంటాడు. అలాగే తక్కువ సామర్థ్యముగల వ్యతిరేకత కూడా ఎదురవుతుంది. ఉదాహరణకు మత్తయి 24:24లో ప్రస్తావించబడిన అబద్ధపు ప్రవక్తలు మరియు అబద్ధపు క్రీస్తులు, మరియు 1 యోహాను 2:18లో ప్రస్తావించబడిన అనేకమంది అంత్యక్రీస్తులు.
క్రొత్త నిబంధనలో దయ్యపు కార్యములను గూర్చి లేక 1 యోహానులో అంత్య క్రీస్తును గూర్చి, లేక ప్రకటన గ్రంథములో మృగమును గూర్చి మనము చదివినప్పుడు, ఆ దుష్ట పాత్రలు అన్ని, ఆ దుష్ట దేవతలు అన్ని, దేవుడు అనుమతించిన కార్యములను మాత్రమే చేస్తాయి అని మీరు గ్రహించవచ్చు. ఫలితంగా, అది యోబు గ్రంథమును పోలినదిగా ఉంటుంది; సాతానుడు వచ్చి తాను చేయు కార్యములను గూర్చి యెహోవా యొద్ద అనుమతి తీసుకుంటాడు, కాబట్టి, దేవుడు మరియు సాతాను ఇక్కడ ద్వంద్వ యుద్ధములో ఉన్నారు అని, మరియు ఎవరు గెలుస్తారో మనకు తెలియదు అని అర్థము కాదు. ఇది దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుచున్నాడు, మరియు ఆయన ప్రణాళికలో భాగముగా ఆయన దుష్టుని కూడా ఒక పాత్రగా ఉపయోగించుకొనుచున్నాడు అను అర్థమునిస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా — అది మృగము కావచ్చు లేక అంత్య క్రీస్తు కావచ్చు లేక స్వయంగా దుష్టుడు కావచ్చు — ఎవ్వరు కూడా దేవుని ప్రణాళికను ఆపలేరు. మరియు వాస్తవానికి, దేవుని ప్రణాళిక ఉద్దేశించబడిన విధముగా నెరవేరుటకు ఈ పాత్రలన్నీ ఉపయోగించబడుచున్నవి.
— డా. శామ్యూల్ లేమర్సన్
రెండవ రాకడకు ముందు జరుగు మూడవ సూచకము సఫలీకృతమైన ప్రపంచవ్యాప్త సువార్త ప్రకటన.
మత్తయి 24:14లో, యేసు ఈ ప్రవచనమును ఇచ్చాడు:
మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును (మత్తయి 24:14).
దేవుని రాజ్యము అనేక విధములైన కఠినమైన వ్యతిరేకతను ఎదుర్కొనినప్పటికీ, రాజ్యము దాని యొక్క సువార్త సందేశమును సర్వజనుల మధ్య సఫలీకృతముగా ప్రకటిస్తుంది.
ఈ ప్రవచనము తరువాత యేసు కనీసం రెండు సార్లు ఈ ఆలోచనను పునరావృతము చేశాడు. ఆయన పునరుత్థానుడైన తరువాత యేసు ఇచ్చిన గొప్ప ఆజ్ఞలో, సర్వజనులకు సువార్తను ప్రకటించి, దానిని స్వీకరించినవారిని తర్ఫీదు చేయమని ఆయన తన పదకొండు మంది నమ్మకమైన శిష్యులకు సెలవిచ్చాడు. మరియు ఆయన ఈ సువార్తీకరణ కార్యమును మరియు తర్ఫీదును యుగసమాప్తి వరకు రాజ్యము యొక్క కొనసాగింపు అంతటితో అనుసంధానపరచాడు. మత్తయి 28:19-20లో ఆయన మాటలను వినండి:
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి... ఇదిగో నేను యుగసమాప్తివరకు సదాకాలము మీతోకూడ ఉన్నానని వారితో చెప్పెను (మత్తయి 28:19-20).
యుగసమాప్తిని గూర్చి ఇక్కడ యేసు ప్రస్తావించుట పదకొండు మంది ఈ పనిని పూర్తి చేయలేరని, సంఘము ఈ కార్యమును కొనసాగిస్తుంది అని యేసుకు తెలుసునని సూచిస్తుంది.
తాను ఆరోహణమగుటకు ముందు చివరి ఘడియలలో కూడా యేసు ఇదే విధంగా మాట్లాడాడు. అపొ. 1:8లో, భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించుటకు వారు పరిశుద్ధాత్మ శక్తిని ఉపయోగిస్తారు అని ఆయన తనకు నమ్మకమైన అపొస్తలులకు ప్రకటించాడు. మరియు ఈ ప్రపంచవ్యాప్త సువార్త ప్రకటన ద్వారా అనేకమంది మారుమనస్సు పొందుతారని లేఖనము సూచిస్తుంది. ఫలితంగా, యేసు తిరిగివచ్చు సమయానికి, సంఘములో ప్రతి జాతి, భాష, ప్రజలు మరియు దేశము సభ్యులైయుంటారు. ప్రకటన గ్రంథములో యోహాను చూసిన పరలోక దర్శనములతో సహా దీనిని మనము అనేక చోట్ల చూడవచ్చు. ఒక ఉదాహరణగా, ప్రకటన 7:9లో యోహాను యొక్క నివేదికను వినండి
అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలోనుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొనెను (ప్రకటన 7:9).
అనేకమంది తెల్లని వస్త్రములు ధరించుకొనుట మరియు ఖర్జూరపుమట్టలు చేతపట్టుకొనుట వారు దేవునికి నమ్మకస్తులని సూచిస్తుంది. కాబట్టి, ఈ దర్శనములో, యోహాను ప్రపంచములోని ప్రతి భాగములో నుండి విమోచించబడిన ప్రజలను చూస్తున్నాడు. మెస్సీయ రాజ్యము వ్యతిరేకతను ఎదురించి, సువార్తను ప్రకటించుటలో మరియు క్రొత్త ఆత్మలను రక్షించుటలో సఫలమవుతుంది అని ఇది తెలియజేస్తుంది.
కాలముల యొక్క చిహ్నములను గూర్చిన మన సంభాషణలో ఇప్పటి వరకు క్రీస్తు రాకడ సమయము దైవిక మర్మము అయ్యున్నదని చూశాము, మరియు క్రీస్తు రాకడకు ముందు సంభవించు అనేక సూచకములను చూశాము. ఇప్పుడు ఈ సూచకములను వివరించుటకు కొన్ని వ్యాఖ్యాన వ్యూహములను చూచుటకు సిద్ధముగా ఉన్నాము.
సంఘము ఎల్లప్పుడూ వ్యతిరేకతను ఎదుర్కొంది అని, మరియు భవిష్యత్తులో కూడా వ్యతిరేకతను ఎదుర్కొనబోతుంది అని ఇవాంజెలికల్ క్రైస్తవులందరు ఒప్పుకుంటారు. మునుపు సువార్త ప్రకటన సఫలీకృతమైనది అని అందరు ఒప్పుకుంటారు, మరియు యేసు తిరిగివచ్చు వరకు మనము సువార్త ప్రకటించు ధ్యేయమును కలిగియున్నాము. అంతేగాక, సార్వత్రిక సువార్త పరిచర్య యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తిస్తాము, మరియు లోకమంతటా సంఘము ఉనికిలో ఉంటుంది కాబట్టి, భద్రపరచబడుతుంది కాబట్టి మరియు వ్యాపిస్తుంది కాబట్టి మనము ఆనందించాలి. అయితే ఇన్ని విషయములలో సమ్మతించిన తరువాత కూడా, క్రీస్తు రాకడకు ముందు జరుగు సూచకములను మనము భిన్నమైన విధములుగా వ్యాఖ్యానిస్తాము.
సాధారణంగా, ఇవాంజెలికల్ వ్యాఖ్యాన వ్యూహములు నాలుగు ప్రధానమైన ధోరణులను కనుపరచుతాయి. ఈ ధోరణులను గుర్తించుట ద్వారా వాటి నుండి మనము నేర్చుకొని, లేఖనమును గూర్చిన మన అవగాహనను వృద్ధిపరచుకోవచ్చు.
క్రీస్తు రాకడకు సూచకములు చరిత్రలో ఎప్పుడు ప్రత్యక్షమవుతాయి అను విషయము మీద కొన్ని వ్యాఖ్యాన వ్యూహములు దృష్టిపెడతాయి. ఈ వ్యూహములు భూతకాలవాదము మరియు భవిష్యత్ వాదము మధ్య ఉంటాయి. ఒక వైపున, ఈ సూచకములు భూతకాలములో జరిగాయని భవిష్యత్తులో మరలా సంభవించవని భూతకాల వాదము చెపుతుంది. ఉదాహరణకు, అంత్యక్రీస్తు మొదటి శతాబ్దములో నివసించిన మానవుడైయున్నాడని, మరియు భవిష్యత్తులో అతని కొరకు మనము ఎదురుచూడకూడదు అని భూతకాలవాదులు చెబుతారు.
మరొక వైపు, క్రీస్తు రాకడకు సూచకములు ఇంకా ప్రత్యక్షము కాలేదుగాని, భవిష్యత్తులో ప్రత్యక్షమవుతాయి అని భవిష్యత్ వాదులు చెబుతారు. ఉదాహరణకు, రెండవ రాకడకు ముందు చివరి తరములో అంత్య క్రీస్తు నివసిస్తాడు అని భవిష్యత్ వాదులు అనవచ్చు. మరియు ఈ రెండు తీవ్రతల మధ్య ప్రజలు మరియు సన్నివేశముల యొక్క కాలమునకు సంబంధించిన అనేక అభిప్రాయములు ఉన్నాయి. ఉదాహరణకు, అంత్యక్రీస్తు చరిత్రయందంతటా పునరావృతమైయ్యే ఒక రకమైన వ్యక్తి లేక మానవ వ్యవస్థ అని కొందరు చెప్పవచ్చు.
క్రీస్తు రాకడకు ముందు సూచకములు చరిత్రలో ఎలా ప్రత్యక్షపరచబడతాయి అను విషయము మీద ఇతర వ్యాఖ్యాన వ్యూహములు దృష్టిపెట్టవచ్చు. ఈ వ్యూహములు చరిత్రాధ్యయనం మరియు ఆదర్శవాదములకు మధ్యన ఉంటాయి. చరిత్రాధ్యయనం ఈ సూచకములను చరిత్రయందంతటా ఉన్న నిజమైన ప్రజలు మరియు సన్నివేశములకు అనుసంధానం చేస్తుంది. ఉదాహరణకు, పదహారవ శతాబ్దపు సంస్కరణ కాలములో, రోమన్ కాథలిక్ పొప్, లేక స్వయంగా పొప్ యొక్క ఆధిపత్యము అంత్యక్రీస్తు అని అనేకమంది చరిత్రాధ్యయనవాదులు నమ్మారు.
దీనికి భిన్నముగా, క్రీస్తు రాకడకు సూచకములను సంక్షేపమైన భావనలు మరియు సాధారణ నియమములతో అనుసంధానం చేస్తుంది. ఉదాహరణకు, అబద్ధ బోధ చేస్తూ యేసును వ్యతిరేకించు ప్రతిఒక్కడు అంత్యక్రీస్తే అని ఒక ఆదర్శవాది వాదించవచ్చు. మరియు ఈ రెండు తీవ్రతలకు మధ్య క్రీస్తు రాకడకు సూచకములను చరిత్రాధ్యయనము మరియు ఆదర్శవాదముల యొక్క పలు శ్రేణులలో వ్యాఖ్యానించు అనేక రకముల అభిప్రాయములు ఉన్నాయి. ఉదాహరణకు, చరిత్ర అంతటిలో అనేకమంది అంత్యక్రీస్తులు నివసించిరి అని కొందరు చెప్పవచ్చు, కాని వారు పొప్ యొక్క ఆధిపత్యము వంటి దృశ్యమైన సంస్థలకు సంబంధించినవారైయున్నారు అని మాత్రం ఉద్ఘాటించరు.
ఈ నాలుగు ధోరణులు అనేకవిధాలుగా అతివ్యాప్తి కలిగియుంటాయి. మరియు వారు వ్యాఖ్యానించుచున్న లేఖనభాగము ఆధారంగా వ్యక్తిగత వ్యాఖ్యానకర్తలు పలు వ్యూహములను ఉపయోగిస్తారు. ఒక వ్యక్తి ఒక వాక్యభాగము కొరకు భూతకాల వాదమును ఆశ్రయిస్తే, మరొక వాక్యభాగము కొరకు భవిష్యత్ వాదము మీద, లేక కొన్ని లేఖనభాగములలో చరిత్రాధ్యయనము మీద మరియు ఇంకొన్ని వాటి కొరకు ఆదర్శవాదము మీద ఆధారపడవచ్చు. కొన్నిసార్లు వ్యాఖ్యానకర్తలు ఒకే వాక్యభాగము కొరకు విభిన్నమైన వ్యూహములను ఉపయోగించవచ్చు.
ఈ వ్యాఖ్యాన వ్యూహములలో ప్రతి దానికి బలములు మరియు బలహీనతలు ఉన్నాయి, మరియు ఇవాంజెలికల్ క్రైస్తవులు కొంత వరకు ఈ వ్యూహములన్నిటిని ఉపయోగిస్తారు. కాబట్టి, మన నమ్మకత్వమును కోరు వ్యవస్థలుగా వాటిని గూర్చి ఆలోచించుటకు బదులుగా, లేఖనములోని పలు విషయములను అర్థము చేసుకొనుటకు ఉపయోగపడు పరికరములుగా వాని అర్థము చేసుకొనుట సహాయకరముగా ఉంటుంది. మరియు ఒక వాక్యభాగమును వ్యాఖ్యానించు విషయానికొస్తే, మనము ఏ పరికరమును లేక పరికరములను ఉపయోగించాలో ఆ వాక్యభాగము యొక్క నేపధ్యము నిర్థారించునట్లు చూసుకోవాలి.
క్రీస్తు రాకడను గూర్చి బైబిలు బోధను ఇప్పటి వరకు మనము క్రోడీకరించాము, మరియు కాలముల యొక్క చిహ్నములను చూశాము కాబట్టి, ఇప్పుడు మూడవ ప్రధానమైన అంశము వైపుకు మన దృష్టిని మళ్లించుదాము: వెయ్యేండ్ల పాలన లేక మిలీనియం.
“మిలీనియం” అను పదము అక్షరార్థంగా వెయ్యేండ్ల కాలమును సూచిస్తుంది. అయితే వెయ్యేండ్ల కాలమును గూర్చి మనము మాట్లడునప్పుడు, ప్రకటన 20:2-7లో ప్రస్తావించబడిన యుగాంత కాలములో జరుగు క్రీస్తు పరిపాలనను ఉద్దేశించుచున్నాము. లేఖనములో ఇక్కడ మాత్రమే ఈ కాలము వెయ్యేండ్లపాటు ఉంటుంది అని తెలియజేయబడింది. అయితే వెయ్యేండ్ల పాలన ఇతర వాక్యభాగములలో — ముఖ్యముగా ఇశ్రాయేలు కొరకు సుదీర్ఘమైన ఐశ్వర్యము కలుగు కాలమును ప్రవచించు పాత నిబంధన వాక్యభాగములలో — కూడా ప్రస్తావించబడింది అని అనేకమంది వ్యాఖ్యానకర్తలు నమ్ముతారు.
యుగాంతశాస్త్ర కాలక్రమము విషయములో, క్రీస్తు ఇప్పుడు పరలోకము నుండి పాలించుచున్నాడు అని ఇవాంజెలికల్ క్రైస్తవులు అందరు నమ్ముతారు. భూమి మీద దేవుని పరిపాలన నెరవేర్పుకు వచ్చుటకు ముందు యేసు తిరిగిరావలసియున్నదని మనమంతా నమ్ముతాము. ఈ భావనలో, మనమంతా యుగాంతశాస్త్రము యొక్క ఆరంభమును కొంత వరకు హత్తుకుంటాము.
ఇంతకు ముందు పాఠంలో మనము ప్రస్తావించినట్లు, యుగాంతశాస్త్ర ఆరంభము దేవుని యొక్క యుగాంతకాల రాజ్యము క్రీస్తులో ఆరంభమైనది లేక “ఆరంభించబడినది” కాని పూర్ణతలో ఇంకా రాలేదు అను ఆలోచనను తెలియజేస్తుంది. దేవుని రాజ్యము యొక్క ఆరంభమును గూర్చి మనము సహజంగా సమ్మతించుచున్నప్పటికీ, యుగాంతశాస్త్ర కాలక్రమములో వెయ్యేండ్ల పాలనను ఎక్కడ అమర్చాలి అను విషయమును గూర్చి మనము చాలాసార్లు అసమ్మతి వ్యక్తపరుస్తాము. వాస్తవానికి, ఆరంభ శతాబ్దముల నుండే ఇట్టి అసమ్మత్తి సంఘములో ఉండినది.
ఉదాహరణకు, సుమారుగా క్రీ. శ. 100 నుండి 165 మధ్య కాలములో జీవించిన జస్టిన్ మార్టియర్, తాను వ్రాసిన డైలాగ్ విత్ ట్రైఫో లోని 80వ అధ్యాయములో ఈ క్రింది విధముగా వ్రాశాడు:
ముందుగా మృతుల పునరుత్థానము జరుగుతుంది అని, తరువాత యెరూషలేములో వెయ్యేండ్ల పాలన జరుగుతుంది అని, అది నిర్మించబడుతుంది, అలంకరించబడుతుంది మరియు వ్యాపింపబడుతుంది అని నేను మరియు ఇతరులు నిశ్చయత కలిగియున్నాము.
ఇక్కడ, యేసు వెయ్యేండ్ల పాలనకు ముందు తిరిగివస్తాడను అభిప్రాయమును జస్టిన్ సమర్థించాడు. అయితే ఈ అధ్యాయములోనే మరొక చోట అతడు ఇలా వ్రాశాడు:
నేను మరియు అనేక ఇతరులు ఈ అభిప్రాయమును కలిగియున్నాముగాని ... పవిత్రమైన మరియు శుద్ధమైన విశ్వాసము కలిగిన ఇతర నిజమైన క్రైస్తవులు వేరొక విధముగా అర్థము చేసుకుంటారు.
వెయ్యేండ్ల పాలన యొక్క సమయము మరియు వివరములను గూర్చి భిన్నాభిప్రాయములు ఎల్లప్పుడూ ఉన్నాయని అనిపిస్తుంది.
వెయ్యేండ్ల పాలనను గూర్చి అనేక భిన్నమైన ఆలోచనా విధానములు ఉన్నాయి, మరియు ఆ ఆలోచనా విధానములలో అనేక వ్యత్యాసములు ఉన్నాయి, కాబట్టి ఈ పాఠంలో వాటన్నిటిని చూచుట సాధ్యపడదు. కాబట్టి, నాలుగు ప్రధానమైన పద్ధతులను పరిచయం చేయుట, మరియు ప్రతిదానికి క్లుప్త వివరణ ఇచ్చుట మన లక్ష్యమైయున్నది. అయితే ఈ పద్ధతులలో ప్రతి దానిని బైబిలును నమ్ము, ఇవాంజెలికల్ క్రైస్తవులు పట్టుకొనియున్నారు అని కూడా మేము ఉద్ఘాటించాలనుకొనుచున్నాము. కాబట్టి, మనకు ఏ పద్ధతి సరియైనది అనిపించినా, ఇతర పద్ధతులను నమ్మువారిని కూడా మనము గౌరవించాలి, మరియు వారితో మనము అసమ్మతి తెలుపునప్పుడు మనము ప్రేమ మరియు వినయముతో వ్యవహరించాలి.
ఈ పాఠంలో, నేడు మనుగడలో ఉన్న వెయ్యేండ్ల పాలనను గూర్చిన నాలుగు అభిప్రాయములను మనము క్లుప్తంగా వివరిద్దాము: చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలన, దైవ విదితమైన పూర్వ-వెయ్యేండ్ల పాలన, ఉత్తర వెయ్యేండ్ల పాలన మరియు అసాధ్య వెయ్యేండ్ల పాలన. ముందుగా చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలనను చూద్దాము.
చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలన మనము పరిశీలించబోవుచున్న రెండు పూర్వ-వెయ్యేండ్ల పాలన పద్ధతులలో ఒకటైయున్నది. పూర్వ రచనలలో, దీనిని చాలాసార్లు “ఖిలియసం” అని పిలిచేవారు, ఇది గ్రీకు పదమైన “ఖిలియోయి” నుండి వెలువడుతుంది, అనగా “వెయ్యి” అని అర్థము.
“పూర్వ-వెయ్యేండ్ల వాదము” అను పదము వెయ్యేండ్ల పాలన ఆరంభమగుటకు ముందే యేసు తిరిగివస్తాడు అని సూచిస్తుంది. మరియు ఆధునిక దైవ విదితమైన పూర్వ-వెయ్యేండ్ల పాలనకు భిన్నముగా సంఘ చరిత్రయంతటా క్రైస్తవులు ఈ అభిప్రాయమును కలిగియుండిరి అని “చారిత్రిక” అను పదము సూచిస్తుంది.
యేసు రాకడకు ముందు సంఘము గొప్ప శ్రమను అనుభవిస్తుంది అని చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలన బోధిస్తుంది. యేసు వచ్చినప్పుడు, అప్పటికి సజీవులుగా ఉన్న విశ్వాసులను సమకూర్చి, లోకమును ప్రభావితము చేయకుండా సాతానును బంధించి, తన భౌతికమైన, భూలోక వెయ్యేండ్ల పాలనను ఆరంభిస్తాడు. మరియు పూర్వ-వెయ్యేండ్ల పాలనలోని ఒక కీలకమైన — మరియు సంక్లిష్టమైన — విశేషత ఏమనగా, వెయ్యేండ్ల పాలనలో క్రీస్తు భూమి మీద భౌతికముగా పరిపాలిస్తాడని అది ఎదురుచూస్తుంది.
వెయ్యేండ్ల పాలన ఖచ్చితముగా వెయ్యేళ్లపాటు కొనసాగుతుంది అని కొందరు పూర్వ-వెయ్యేండ్ల పాలన వ్యాఖ్యానకర్తలు నమ్ముతారు, కాని “వెయ్యేండ్లు” అను పదము అలంకార రూపముగా ఒక నిర్థారించబడని కాలవ్యవధిని సూచిస్తుంది అని అంటారు. ఇదే విధంగా, చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలన విశ్వాసులు “సమకూర్చబడుట” లేక “ఎత్తబడుట”ను గూర్చిన విషయములో పూర్తిగా ఐక్యతను కనుపరచదు. కాబట్టి, దీనిని మరింత జాగ్రత్తగా వివరించుటకు కొంత సమయం వెచ్చించాలి. 1 థెస్స. 4:16-17లో, రాకడను పౌలు ఈ విధంగా వర్ణించాడు:
ఆర్భాటముతోను, ప్రధానదూతశబ్దముతోను, దేవుని బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి యుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతోకూడ ఉందుము (1 థెస్స. 4:16-17).
“ర్యాప్చర్” లేక ఎత్తబడుట అను పదము ఈ వచనముల యొక్క ల్యాటిన్ వెర్షన్ నుండి వెలువడుతుంది, అది “రాపియో” అను క్రియా పదమును ఉపయోగిస్తుంది, మరియు దీనికి “ఎత్తబడుట” అని అర్థము. కాబట్టి, “ఎత్తబడుట” విశ్వాసులు క్రీస్తుతో కూడా మేఘముల మీదికి సమకూర్చబడు లేక ఎత్తబడు సన్నివేశమైయున్నది.
యేసు తిరిగివచ్చినప్పుడు సజీవులుగా ఉన్న విశ్వాసులు మధ్యాకాశములో ఆయనను కలుసుకుంటారు అని చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలన బోధిస్తుంది. తరువాత ఆయన విజయవంతమైన సైనిక కవాతు కొరకు, మరియు ఆయన వెయ్యేండ్ల పాలనలో ఆయనతో కలసి భూమి మీద జీవించుటకు వారు భూమి మీదికి వెంటనే తిరిగివస్తారు. అయితే, ఎత్తబడుటలో పునరుత్థానులైన విశ్వాసులు కూడా ఉంటారని కొందరు చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలనవాదులు ఆలోచిస్తారు. అయితే వెయ్యేండ్ల పాలన ముగింపులో అంతిమ తీర్పు జరుగునంత వరకు విశ్వాసుల పునరుత్థానము జరుగదు అని ఇంకొందరు వాదిస్తారు.
ఏది ఏమైనా, వెయ్యేండ్ల పాలనలో, విశ్వాసులు మరియు అవిశ్వాసులు భూలోక ఆశీర్వాదములను, సమాధానమును మరియు ఐశ్వర్యమును ఒకే విధంగా ఆస్వాదిస్తారు. వెయ్యేండ్ల పాలన కాలము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని అనుభవించు అంతిమ స్థితి అయ్యుండదు; అయినప్పటికీ, వెయ్యేండ్ల పాలన కాలములో అంతిమ స్థితి ఆరంభమవుతుంది అని కొందరు చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలనవాదులు నమ్ముతారు. అయితే మన ప్రస్తుత యుగము కంటే వెయ్యేండ్ల పాలన మరింత మహిమకరముగా ఉంటుంది అని వారంతా ఒప్పుకుంటారు. ఆశీర్వాదకరమైన మర్త్య జీవితమును గూర్చి వర్ణించు కీర్తనలు 72:8-14, యెషయా 11:2-9, మరియు జెకర్యా 14:5-21 వంటి పాత నిబంధన వాక్యభాగములు వెయ్యేండ్ల పాలనను గూర్చి ప్రవచించుచున్నవని చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలన వేదాంతవేత్తలు తరచుగా భావిస్తారు.
రెండు పూర్వ-వెయ్యేండ్ల పాలన పద్ధతులలో ఉన్న విశేషమైన భాగములలో ఒకటి, వెయ్యేండ్ల పాలన పూర్తి అయ్యే వరకు అవిశ్వాసులు పునరుత్థానమును పొందరు అను ఆలోచన. అయితే, వెయ్యేండ్ల పాలన సమయమునకు భూమి మీద అవిశ్వాసులు నివసిస్తూనే ఉంటారు, మరియు అప్పటికీ పాపము, భ్రష్టత్వము మరియు మరణము భూమి మీద ఉంటాయి. యెషయా 65:20 ఇలా చెబుతూ ఈ కాలమును సూచించుచున్నట్లు అనిపిస్తుంది.
అక్కడ ఇకను కొద్దిదినములే బ్రదుకు శిశువులుండరు, కాలమునిండని ముసలివారుండరు, బాలురు నూరు సంవత్సరముల వయస్సుగలవారై చనిపోవుదురు, పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సహితము నూరుసంవత్సరములు బ్రదుకును (యెషయా 65:20).
ప్రజలు ఇప్పుడు నివసించుచున్న దినముల కంటే ఎక్కువ దినములు నివసిస్తారు అని యెషయా ఇక్కడ ప్రవచించినట్లు పూర్వ-వెయ్యేండ్ల పాలనవాదులు నమ్ముతారు. మరియు ఈ కాలములో కూడా పాపులు రక్షణను వెదుకుదురు అని యెషయా 11:10, 11 వంటి పాత నిబంధన వాక్యభాగములు సూచిస్తాయి అని వారు వాదిస్తారు. అయితే ఈ వర్ణనలు ప్రస్తుత స్థితికి లేక అంతిమ స్థితికి సరిపోలవు కాబట్టి, అవి వెయ్యేండ్ల పాలనకు సూచనలుగా అనువదించబడినవి.
వెయ్యేండ్ల పాలన యొక్క ముగింపులో, సాతాను యొక్క తిరుగుబాటు జరుగుతుంది అని చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలనవాదులు చెబుతారు. దీని తరువాత ఇంతకు ముందు పునరుత్థానులు కాని వారందరు తిరిగిలేస్తారు. తరువాత అంతిమ తీర్పు జరుగుతుంది. ఆ సమయమందు, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి మీద దేవుని యొక్క నిత్య పరిపాలన పూర్తిగా నెరవేర్పులోనికి వస్తుంది.
నేను ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము యొక్క పూర్వ-వెయ్యేండ్ల పాలన వ్యాఖ్యానమును హత్తుకుంటాను, ఎందుకంటే ఇది లేఖన భాగమును చాలా సూటిగా అధ్యయనం చేస్తుంది... ప్రకటన 19వ అధ్యాయము యొక్క చివరిలో, మృగము మరియు అబద్ధ ప్రవక్త అగ్నిగుండములో పడవేయబడిరిగాని, సాతాను అనగా ఆ ఘటసర్పము అగ్ని గుండములో పడవేయబడక వెయ్యేండ్ల పాటు బంధించబడెను అని మనము స్వాభావికముగా చూడవచ్చని నా ఆలోచన. తరువాత వెయ్యేండ్ల కాలమునకు ముందు విశ్వాసుల యొక్క పునరుత్థానము జరుగుతుంది మరియు వారు క్రీస్తుతో కూడా వెయ్యేండ్ల పాటు పరిపాలిస్తారు. తరువాత, వెయ్యేండ్ల కాలము యొక్క ముగింపులో, సాతానుడు విడవబడతాడు, తరువాత మరలా చెరపట్టబడి, మృగము మరియు అబద్ధ ప్రవక్త అప్పటికే ఉన్న అగ్నిగుండములో పడద్రోయబడతాడు.
— డా. జేమ్స్ ఎమ్. హమిల్టన్
వెయ్యేండ్ల పాలనను గూర్చి చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలన యొక్క అభిప్రాయములను మనము చూశాము కాబట్టి, ఇప్పుడు దైవ విదితమైన పూర్వ-వెయ్యేండ్ల పాలనలోని భిన్నమైన అభిప్రాయములను చూద్దాము.
పూర్వ-వెయ్యేండ్ల పాలన పద్ధతిగా, వెయ్యేండ్ల పాలనకు ముందు యేసు తిరిగివస్తాడని మరియు విశ్వాసులు తిరిగిలేస్తారని దైవ విదితమైన పూర్వ-వెయ్యేండ్ల పాలన నమ్ముతుంది. వెయ్యేండ్ల పాలన కాలములో యేసు భూమి మీద భౌతికముగా పరిపాలిస్తాడు. మరియు వెయ్యేండ్ల పాలన తరువాత అవిశ్వాసులు పునరుత్థానము పొంది తీర్పును పొందుతారు. అయితే చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలనకు భిన్నముగా, సజీవులుగా ఉన్న విశ్వాసులు మహాశ్రమకు ముందు పరలోకమునకు ఎత్తబడతారని మరియు వెయ్యేండ్ల పాలన ముగిసే వరకు వారు అక్కడ నివసిస్తారని దైవ విదితమైన పూర్వ-వెయ్యేండ్ల పాలన సాధారణముగా బోధిస్తుంది.
చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలనకు మరియు దైవ విదితమైన పూర్వ-వెయ్యేండ్ల పాలనకు మధ్య ఉన్న భిన్నత్వమునకు ఒక కారణము దైవ విదితము అను కోణము అయ్యున్నది. దైవవిదిత వాదము పలు కాలములు లేక “యుగముల”లో దేవుడు చేసిన కార్యములను గూర్చి బోధిస్తుంది. దేవుడు యూదా ప్రజల కొరకు సంఘము కంటే భిన్నమైన ప్రణాళికను కలిగియున్నాడు అనునది ఈ యుగములకు ఒక పరిణామమైయున్నది.
దైవవిదితవాదము ప్రకారం, పాత నిబంధనలో ఇశ్రాయేలుతో ఆయన చేసిన వాగ్దానములను నెరవేర్చుటకుగాను ఇశ్రాయేలు దేశమునకు మెస్సీయగా ఉండుటకు దేవుడు యేసును పంపాడు. అయితే యేసును మెస్సీయగా ఇశ్రాయేలు తిరస్కరించినప్పుడు, వారి కొరకు దేవుడు కలిగియుండిన ప్రణాళికలను తాత్కాలికముగా నిలిపివేశాడు. వారి స్థానములో, దేవుడు సంఘములో అన్యజనులను లేవనెత్తాడు. అవును, సంఘములో యూదా విశ్వాసులు కూడా ఉండేవారే. అయితే దేవుడు ఇశ్రాయేలు కొరకు జాతీయముగా కలిగియుండిన ఉద్దేశ్యములను ఇప్పటికీ నెరవేర్చగోరుచున్నాడు. దీనిని సాధించుట కొరకు, శ్రమకు ముందు దేవుడు సంఘమును పైకెత్తి, వెయ్యేండ్ల కాలములో ముఖ్యముగా ఇశ్రాయేలుతో వ్యవహరిస్తాడు.
ఎత్తబడుట తరువాత భూమి మీద నిలిచియుండువారు ఏడు సంవత్సరముల పాటు మహాశ్రమను అనుభవిస్తారు అని అనేకమంది దైవ విదితమైన పూర్వ-వెయ్యేండ్ల పాలనవాదులు నమ్ముతారు. శ్రమ దినముల ముగింపులో, యేసు తిరిగివస్తాడు, మరియు వెయ్యేండ్ల పాలన ఆరంభమవుతుంది. యేసు ఇశ్రాయేలు దేశమును పునరుద్ధరించి యెరూషలేములో తన సింహాసనము మీద నుండి దృశ్యమైన రీతిలో దేశములన్నిటిని పాలిస్తాడు. ఈ కాలమందు, ఇశ్రాయేలు దేశమునకు దేవుడు పాత నిబంధనలో చేసిన వాగ్దానములను నెరవేర్చుతాడు. ఉదాహరణకు, ఆమోసు 9:11-15లో దేవుడు పలికిన మాటలను వినండి:
పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు... శ్రమనొందుచున్న నా జనులగు ఇశ్రాయేలీయులను నేను చెరలోనుండి రప్పింతును, పాడైన పట్టణములను మరల కట్టుకొని వారు కాపురముందురు... వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములోనుండి వారు ఇక పెరికివేయ బడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు (ఆమోసు 9:11-15).
ఇలాంటి ప్రవచనములు ఇశ్రాయేలు దేశములో వెయ్యేండ్ల కాలములో నెరవేర్చబడతాయి అని దైవ విదితవాదులు నమ్ముతారు.
వెయ్యేండ్ల పాలన ముగింపులో, సాతానుడు తిరుగుబాటు చేస్తాడు, అయితే దేవుడు సాతానును మరియు వాని సైన్యమును సమూలముగా ఓడిస్తాడు. తరువాత, దేవుడు అవిశ్వాసులను మరియు ఎత్తబడుట జరిగిన తరువాత విశ్వసించి మరణించిన విశ్వాసులను తిరిగిలేపుతాడు. తరువాత అంతిమ తీర్పు జరుగుతుంది, మరియు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో అంతిమ స్థాయి ఆరంభమవుతుంది.
అది నిబంధనా వేదాంతశాస్త్రములోని ఉత్తమమైన విషయములను కలిగియున్నది కాబట్టి నేను ప్రక్రియాత్మక దైవ విదితవాదినైయున్నాను, మరియు ఇది ఒకే దేవుని ప్రజల మీద మరియు పాత నిబంధనలోని నిబంధనా వాగ్దానము మీద మాత్రమే దృష్టిపెట్టదుగాని, ఇశ్రాయేలు కొరకు భవిష్యత్ కార్యక్రమము మరియు ప్రణాళికను చూచు సాంప్రదాయిక దైవ విదితవాద అభిప్రాయములోని ఉత్తమమైన విషయములను కూడా పరిగణలోనికి తీసుకుంటుంది. కాబట్టి, దీని ద్వారా నేను రెండు లోకముల యొక్క ఉత్తమమైన విషయములను పొందుతాను.
— డా. డేని అకిన్
ఇప్పటి వరకు మనము చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలన మరియు దైవ విదిత పూర్వ-వెయ్యేండ్ల పాలన దృష్ట్యా వెయ్యండ్ల పాలనను చూశాము కాబట్టి, ఇప్పుడు ఉత్తర వెయ్యేండ్ల పాలనను చూద్దాము.
ఉత్తర వెయ్యేండ్ల పాలన అను పదము యేసు వెయ్యేండ్ల పాలన ముగిసిన తరువాత తిరిగివస్తాడు అను నమ్మకమును సూచిస్తుంది. ఆయన వెయ్యేండ్ల పాలన ఆరంభమగుటకు ముందు తిరిగివస్తాడు అని చెప్పు రెండు పూర్వ-వెయ్యేండ్ల పాలన పద్ధతులకు ఇది పూర్తిగా భిన్నముగా ఉన్నది. తన వెయ్యేండ్ల పాలన కాలములో క్రీస్తు నివసించు స్థలము పూర్వ-వెయ్యేండ్ల పాలన పద్ధతులు మరియు ఉత్తర వెయ్యేండ్ల పాలనకు మధ్య ఉన్న మరొక ప్రాముఖ్యమైన వ్యత్యాసమైయున్నది. క్రీస్తు భౌతికముగా భూమి మీద నివసిస్తాడు అని పూర్వ-వెయ్యేండ్ల పాలనవాదులు అంటారు. అయితే ఆయన భౌతికముగా పరలోకమందుండి ఆత్మీయముగా భూమి మీద పాలిస్తాడు అని ఉత్తర వెయ్యేండ్ల పాలనవాదులు నమ్ముతారు.
ఉత్తర వెయ్యేండ్ల పాలన పద్ధతిలో, వెయ్యేండ్ల కాలము క్రీస్తు రాకడ కొరకు భూమిని సిద్ధపరచునట్లు సువార్త సఫలీకృతమయ్యే యుగమైయున్నది. వెయ్యేండ్ల పాలన యేసు ఆరోహణము నుండి ఆయన తిరిగివచ్చు వరకు ఉన్న మధ్యకాలములో వ్యాపించియున్నదని కొందరు నమ్ముతారు; అది ఆయన తిరిగివచ్చుటకు ముందు చివరి వెయ్యేండ్ల కాలమును సూచిస్తుంది అని మరికొందరు ఆలోచిస్తారు. అయితే వెయ్యేండ్ల కాలము అంతటిలోని చరిత్ర యొక్క సామాన్య ఉరవడి సువార్తకు మరియు లోకమంతటా ఉన్న సంఘమునకు గొప్ప ఫలమును మరియు ఘనమైన జయమును కలిగిస్తుంది అని ఎక్కువమంది ఉత్తర వెయ్యేండ్ల పాలనవాదులు నమ్ముతారు. క్రీస్తు యొక్క పరిపాలన దేశము విశ్వసించునట్లు చేస్తుంది. క్రైస్తవ నైతికతతో మానవ సమాజము నిండియుంటుంది. మరియు తుదకు దేవుని రాజ్యము సర్వలోకములో వ్యాపిస్తుంది. ఈ ఆలోచనకు మద్దతునిచ్చుటకు, ఉత్తర వెయ్యేండ్ల పాలనవాదులు క్రీస్తు తుదకు తన విరోధుల మీద పొందు జయమును గూర్చి తెలుపు లేఖనములను ఎత్తి చూపుతూ, వెయ్యేండ్ల పాలనలో ఆయన పరిపాలనకు సూచనలుగా వీటిని అనువదిస్తారు. ఉదాహరణకు, 1 కొరింథీ. 15:25లో పౌలు యొక్క మాటలను వినండి:
ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను (1 కొరింథీ. 15:25).
క్రీస్తు తిరిగివచ్చుటకు ముందు తన శత్రువులను విజయవంతముగా జయిస్తాడు అని ఈ వచనములు సెలవిచ్చుచున్నవని ఉత్తర వెయ్యేండ్ల పాలనవాదులు సాధారణంగా నమ్ముతారు.
ఉత్తర వెయ్యేండ్ల పాలన వెయ్యేండ్ల పాలనను దేవుని రాజ్యము కొరకు అత్యధిక జయము కలిగించు కాలముగా పరిగణిస్తుంది. కాబట్టి, మహాశ్రమ క్రీ.శ. మొదటి శతాబ్దములోనే కలిగింది అని నమ్ముతూ ఇది కొన్నిసార్లు భూతకాలవాద ఆలోచనను హత్తుకుంటుంది. అయినను, వెయ్యండ్ల పాలన యొక్క ముగింపులో సాతాను యొక్క తిరిగుబాటును గూర్చి, మరియు క్రీస్తు తిరిగివచ్చినప్పుడు వాని పరాజయమును గూర్చి ఇంచుమించు ఉత్తర వెయ్యేండ్ల పాలనవాదులు అందరు గుర్తిస్తారు.
కొన్ని చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలనవాదముల వలెనే, ఎత్తబడుటలో పునరుత్థానులైన మరియు సజీవులైన విశ్వాసులు అందరు ఉంటారు అని ఉత్తర వెయ్యేండ్ల పాలన బోధిస్తుంది. ఆయన తిరిగివచ్చినప్పుడు వీరు మేఘముల మీద ప్రభువును కలుసుకుంటారు, మరియు వెంటనే ఆయన విజయవంతమైన సైన్య కవాతులో భాగంగా భూమి మీదికి ఆయనతో కూడా తిరిగివస్తారు. ఈ సమయములో అవిశ్వాసులు కూడా పునరుత్థానులవుతారు, మరియు యేసు విశ్వాసులకు మరియు అవిశ్వాసులకు ఇరువురకు అంతిమ తీర్పులను ప్రకటిస్తాడు. చివరిగా, ఆయన క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలోనికి నడిపిస్తాడు, మరియు అంతిమ స్థాయి ఆరంభమవుతుంది.
ఉత్తర వెయ్యేండ్ల పాలన అభిప్రాయమును ఉద్ఘాటించుటకు అత్యంత ప్రోత్సాహకరమైన, బైబిలు కారణములలో ఒకటి విమోచన చరిత్ర అంతటిని పరిశీలించుట ద్వారా చూడవచ్చని నా ఆలోచన... పలు సందర్భములలో, ఉత్తర వెయ్యేండ్ల పాలన వాదులు వెయ్యేండ్ల స్వర్ణ యుగమును నమ్మారు... అయితే నేడు తమను తాము ఉత్తర వెయ్యేండ్ల పాలనవాదులము అని పిలచుకొనువారు ఏ విధమైన స్వర్ణ యుగమును నమ్మవలసిన అవసరము లేదు. సువార్త యొక్క వాస్తవికతల పట్ల మరింత భావార్థకమైన ధోరణిని కలిగియుండుట వారి ఉద్దేశ్యమైయున్నది, అనగా సువార్త వ్యాపిస్తుంది మరియు క్రీస్తు రాకడకు ముందు దేశములు ఆయనను ఆశ్రయిస్తాయి, మరియు విరివిగా ఈ పని జరుగుతుంది... మరియు మనము ప్రకటన గ్రంథమును చూసినప్పుడు, భూమియంతా, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి, ప్రతి జాతి, భాష మరియు జనములో నుండి దేవుని స్వరూపములతో నిండిపోతాయి. మరియు లేఖనము బోధించు విషయములన్నిటికి ప్రగతిశీల ఉరవడియున్నది అని, మరియు దేవుని ఆరంభ ప్రణాళిక, అనగా భూమియంతా దేవుని స్వరూపములతో నింపబడుతుంది అని ఆదాము హవ్వలకు ఆయన ఇచ్చిన ఆదిమ పిలుపు నెరవేర్చబడుతుంది అను వాస్తవము వైపునకు చూపుతుంది అని నా ఆలోచన. మరియు క్రీస్తు స్వరూపములోనికి విమోచించబడిన మరియు నూతనపరచబడిన నిజమైన దేవుని ప్రజలు భూమియందంతటా నింపబడతారు.
— ప్రొ. బ్రాండన్ పి. రోబ్బిన్స్
చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలన, దైవ విదిత పూర్వ-వెయ్యేండ్ల పాలన మరియు ఉత్తర వెయ్యేండ్ల పాలనను ఇప్పటి వరకు చూశాము కాబట్టి, ఇప్పుడు నాల్గవ ప్రధాన యుగాంతశాస్త్ర పద్ధతిని చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము: అసాధ్య వెయ్యేండ్ల పాలన.
“అసాధ్య వెయ్యేండ్ల పాలన” అను మాటకు అక్షరార్థము “అసలు వెయ్యేండ్ల పాలన లేకపోవుట.” వెయ్యేండ్ల పాలన అక్షరార్థముగా వెయ్యేండ్ల కాలమైయుండదు అను నమ్మకమును దీని పేరు సూచిస్తుంది. “వెయ్యేండ్ల పాలన” అను పదము ఉపమాన రీతిగా ఉన్నది అను విషయమును ఇతర పద్ధతులు కూడా ఆమోదిస్తాయి. అయితే అన్ని రకముల ఆధునిక అసాధ్య వెయ్యేండ్ల కాల అభిప్రాయములు ఉపమాన అధ్యయనమును ఉద్ఘాటిస్తాయి.
కొన్ని రకముల ఉత్తర వెయ్యేండ్ల పాలన పద్ధతుల వలె, అసాధ్య వెయ్యేండ్ల పాలన వెయ్యేండ్ల కాలము క్రీస్తు ఆరోహణము మరియు రాకడకు మధ్య ఉన్న కాలమైయున్నదను అభిప్రాయమును కలిగియున్నది. ఈ కాలములో, పరలోకమందున్న తన సింహాసనము మీద నుండి దేవుడు భూమిని పాలిస్తాడు. మరియు అన్ని రకముల ఉత్తర వెయ్యండ్ల పాలన వలె, అసాధ్య వెయ్యేండ్ల పాలన వెయ్యేండ్ల కాలము తరువాత తిరిగివస్తాడని నమ్ముతుంది.
అసాధ్య వెయ్యేండ్ల పాలన మరియు ఉత్తర వెయ్యేండ్ల పాలనకు మధ్య ఉన్న వ్యత్యాసము ఏమిటంటే, యేసు యొక్క వెయ్యేండ్ల పాలన రాజ్యమును స్థిరముగా వ్యాపింపజేయుచు లోకమును అభివృద్ధి చేస్తుంది అని అసాధ్య వెయ్యేండ్ల పాలన ఉద్ఘాటించదు. అసాధ్య వెయ్యేండ్ల పాలన దృష్టికోణము నుండి, సంఘ అనుభవము, సఫలత మరియు ఎదుగుదల స్వయంగా సంఘము యొక్క క్రియల ద్వారా, మరియు దేవుని యొక్క స్వతంత్ర దైవకృతముల ద్వారా నిర్థారించబడుతుంది. కాబట్టి, లోకము దేవునికి ఇంకా ఇంకా నమ్మకముగా ఉండుట సాధ్యమేగాని, నమ్మకముగా ఉండకపోవుట కూడా సాధ్యమైయున్నది. మహాశ్రమ విషయములో, అది సంఘ చరిత్ర యొక్క ఆరంభములో జరిగినది అని కొందరు అసాధ్య వెయ్యేండ్ల పాలనవాదులు నమ్ముతారు, మరియు ఇతరులు వెయ్యేండ్ల పాలన ముగింపులో సాతాను యొక్క తిరుగుబాటుతో దానిని జతకలుపుతారు.
ఈ బిందువు నుండి, అసాధ్య వెయ్యేండ్ల వాదము మరియు ఉత్తర వెయ్యేండ్ల వాదము మధ్య వ్యత్యాసము చూపలేము. యేసు తిరిగివచ్చినప్పుడు ఆయన సాతాను యొక్క తిరుగుబాటును అణగద్రొక్కుతాడు. ఆయన పునరుత్థానులైన మరియు సజీవులైన విశ్వాసులను పైకెత్తి, వారితో కలసి వెంటనే భూమి మీదికి తిరిగివస్తాడు. అవిశ్వాసులు పునరుత్థానమును పొందుతారు, మరియు ప్రతి ఒక్కరికి యేసు తన అంతిమ తీర్పులను ప్రకటిస్తాడు. మరియు చివరిగా, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి మీదికి యేసు నడిపిస్తాడు, మరియు అంతిమ స్థితి ఆరంభమవుతుంది.
యుగాంతశాస్త్రము యొక్క అర్హమైన ఇవాంజెలికల్ అనువాదములు ఎన్నో ఉన్నాయి, కాని నేను అసాధ్య వెయ్యేండ్ల పాలనను హత్తుకుంటాను... మీరు పౌలు యొక్క యుగాంతశాస్త్రమును పరిశీలన చేసినట్లయితే — అవును, పౌలు యొక్క యుగాంతశాస్త్రమును గూర్చి గీర్హార్డస్ వోస్ ఆ అద్భుతమైన ఉల్లేఖనమును వ్రాశాడు — యేసు క్రీస్తు తిరిగివస్తాడు మరియు తరువాత అంతము వస్తుంది, ఆ సమయములో సమస్తము నెరవేర్పునకు వస్తుంది, మరియు మనము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలోనికి నడిపించబడతాము అన్నట్లు పౌలు యుగాంతశాస్త్రములో ఒక సరళతను మనము చూస్తాము, మరియు అది చాలా అందముగాను సుళువుగాను ఉంటుంది. మరియు గొప్ప సౌందర్యము సరళముగా ఉంటుంది. మరియు బైబిలు యుగాంతశాస్త్రము నాకు చాలా సుళువుగా అనిపిస్తుంది.
— డా. సాండర్స్ ఎల్. విల్సన్
మనము ఏ అభిప్రాయమును హత్తుకొనినను — చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలన, దైవ విదితమైన పూర్వ-వెయ్యేండ్ల పాలన, ఉత్తర వెయ్యేండ్ల పాలన మరియు అసాధ్య వెయ్యేండ్ల పాలన — ఈ అభిప్రాయములలో ప్రతిదానిని ఇవాంజెలికల్ క్రైస్తవులు హత్తుకొనియున్నారు అని జ్ఞాపకముంచుకొనుట చాలా ప్రాముఖ్యమైయున్నది. మరియు మనము వెయ్యండ్ల పాలన కాలక్రమమును అధ్యయనం చేయుచుండగా ఇది మనలను వినయముగలవారిగాను, సహాయము చేయువారిగాను మరియు బోధింపదగినవారిగాను చేయాలి.
వెయ్యేండ్ల పాలన యొక్క అన్ని ఇవాంజెలికల్ రకములు — “ఉత్తర,” “అసాధ్య-,” లేక “పూర్వ” — క్రీస్తు యొక్క భవిష్యత్ రెండవ రాకడను గూర్చి, సాధారణ మృతుల పునరుత్థానమును, అంతిమ తీర్పును, పరలోకమును మరియు నరకమును గూర్చి నమ్ముతాయని గుర్తించుట అత్యంత ప్రాముఖ్యమైన విషయమైయున్నది. గత 20 నుండి 25 సంవత్సరాలలో కొన్ని మౌలిక విషయములను గూర్చి, విశేషముగా “ఇప్పటికే వచ్చింది మరియు ఇంకా రాలేదు” అని వర్ణించబడు ఆలోచనల మీద ఎక్కువ ఏకాభిప్రాయం వచ్చినట్లు అనిపిస్తుంది. చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలనవాదియైన జార్జ్ ఎల్డోన్ లాడ్డ్ “ఇప్పటికే వచ్చింది మరియు ఇంకా రాలేదు” అను ఆలోచనను అనగా యుగాంతము ఆరంభమైనది అను ఆలోచనను ప్రతిపాదించుటలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అయ్యున్నాడు. అయితే అంత్య దినముల యొక్క ఆరంభము క్రీస్తు యొక్క మొదటి రాకడతో ప్రారంభమైనది అను ఈ అవగాహనను మనము అసాధ్య వెయ్యేండ్ల పాలనవాదులు మరియు ఉత్తర వెయ్యేండ్ల పాలనవాదుల మధ్య కూడా చూస్తాము... “ఇప్పటికే వచ్చింది, ఇంకా రాలేదు” అను ఈ పెద్ద అభిప్రాయమును గూర్చి ఏకాభిప్రాయము పెరుగుతున్నట్లు ఉంది. లేఖనములను అధ్యయనం చేయుటను మనము కొనసాగించుచుండగా కొన్ని అసమ్మతులు ఉన్నప్పటికీ, ఈ అభిప్రాయములు మునుపు కలిగియుండిన సమస్యలలో కొన్నింటిని మనము విడిచిపెట్టి, ఎక్కువ విషయములలో సమ్మతించుచుండుట ప్రోత్సాహకరమైన విషయముగా భావిస్తున్నాను.
— డా. కీత్ మతిసన్
“రాజు యొక్క రాకడ”ను గూర్చిన ఈ పాఠంలో క్రీస్తు రాకడ యొక్క అవసరతను మరియు ఆయన వచ్చు విధానమును మనము పరిగణించాము; దైవిక మర్మము, క్రీస్తు రాకడకు సూచకములు మరియు వ్యాఖ్యాన వ్యూహముల దృష్ట్యా మనము కాలముల యొక్క చిహ్నములను విశదీకరించాము; మరియు చారిత్రిక పూర్వ-వెయ్యేండ్ల పాలన, దైవ విదిత పూర్వ-వెయ్యేండ్ల పాలన, ఉత్తర వెయ్యేండ్ల పాలన మరియు అసాధ్య వెయ్యేండ్ల పాలన దృష్ట్యా వెయ్యేండ్ల పాలనను మనము చర్చించాము.
సంఘ చరిత్రలో అనేక సందర్భాలలో, యుగాంతశాస్త్రమును గూర్చిన భిన్నాభిప్రాయాలు కలహము మరియు విభజనకు దారితీసాయి. మరియు ఎప్పటి వలె నేడు కూడా ఇది జరుగుతుంది. అయితే ఈ పాఠంలో మనము ప్రస్తావించిన ప్రధానమైన ఇవాంజెలికల్ యుగాంతశాస్త్ర పద్ధతుల విషయములో, మనము విభజనను అధిగమించాలి. ఎందుకంటే, యేసు మరణము నుండి తిరిగిలేచి, పరలోకమునకు ఆరోహణమై వెళ్లాడు అని ప్రతి ఇవాంజెలికల్ క్రైస్తవుడు ఒప్పుకుంటాడు. ఆయన ప్రస్తుతము పరలోకము నుండి పాలించుచున్నాడు అని మనమంతా సమ్మతిస్తాము. భూమి మీద దేవుని పరిపాలనను కొనసాగించుటకు ఆయన శారీరికముగాను, దృశ్యమైన విధముగాను తిరిగివస్తాడని, ఆయన ద్వారా దేవుని వాగ్దానములన్ని నెరవేర్చబడతాయని మనమంతా నమ్ముతాము. మరియు వెయ్యేండ్ల పాలన తరువాత, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క అంతిమ స్థితిని ఆయన తీసుకొని వస్తాడు అను వాస్తవము మీద మనమంతా నిరీక్షణ కలిగియున్నాము. మన మధ్య ఉన్న ఏకాభిప్రాయము దృష్ట్యా మన భిన్నాభిప్రాయాలు తేలిపోతాయి. మరియు మన సహవాసము దీనిని ప్రతిబింబించాలి.
Continue reading the full transcript