అదే శ్రేణిలోని 4వ పాఠానికి అనుబంధ వీడియో, ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: చనిపోయిన వారి సాధారణ పునరుత్థానం అంటే ఏమిటి? మన భవిష్యత్ పునరుత్థానం శారీరక పునరుత్థానం కావడం ఎందుకు ముఖ్యం? మొదటి శతాబ్దంలో క్రైస్తవ పునరుత్థానం సిద్ధాంతం గ్రీకు, పాగాన్ నమ్మకాలను ఎలా ఎదుర్కొంది? పౌలు చనిపోయిన వారి భవిష్యత్ పునరుత్థానాన్ని ఎలా చూశాడు? యేసు పునరుత్థానం, విశ్వాసుల పునరుత్థానం మధ్య సంబంధం ఏమిటి? మన బాధలు చనిపోయినప్పుడు, మన ఆత్మలు స్వర్గానికి వెళ్ళినప్పుడు ముగుస్తాయని మనకు తెలిస్తే, సాధారణ పునరుత్థానం కోసం మనం ఎందుకు ఎదురుచూస్తాం? మన పునరుత్థాన శరీరాలు మన ప్రస్తుత శరీరాలను ఎంతవరకు పోలి ఉంటాయి? మన శరీరాలు ఇప్పటికే నేలలో కుళ్ళిపోయినట్లయితే, మనకు పునరుత్థాన శరీరాలు ఉంటాయని మనం ఎలా చెప్పగలం? సువార్తను ఎన్నడూ వినని వ్యక్తులు చివరి తీర్పులో ఎలా ఖండించబడతారు? క్రీస్తు శత్రువులందరూ చివరి తీర్పులో ఖండించబడతారని ఇచ్చినట్లయితే, అవిశ్వాసుల పట్ల మనకు ఎలాంటి వైఖరి ఉండాలి? పాత నిబంధన కొత్త ఆకాశాలను, కొత్త భూమిని ఎలా చిత్రీకరించింది? ప్రస్తుత ఆకాశాలు, భూమి కొత్త ఆకాశాలను, భూమిని సృష్టించడానికి నాశనం చేయబడతాయా? కొత్త ఆకాశాలు, కొత్త భూమి ఎలా ఉంటాయి? కొత్త ఆకాశాలలో, కొత్త భూమిలో దేవుని తక్షణ ఉనికిలో ఉండటం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి?
From the transcript
1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.
బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.
ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.
అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.
మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.
దేవుడు లోకమును సృజించినప్పుడు, సర్వలోకమును తన భూలోక రాజ్యముగా మార్చుట ఆయన లక్ష్యమైయుండెను. ఏదేను తోటను తన పరిశుద్ధ నివాసముగా స్థిరపరచుటను ఆయన ఆరంభించాడు. మరియు సంఖ్యలో వృద్ధిపొంది, తోట యొక్క సరిహద్దులను భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు ఆయన మానవాళిని నియమించాడు. అయితే, అవును, మానవాళి పాపము చేసింది, మరియు మానవ జాతిని, స్వయంగా సృష్టిని కూడా భ్రష్టత్వము మరియు మరణములోనికి నెట్టివేసింది. ఫలితంగా, భూమి దేవుని కొరకు సిద్ధపడలేదు, మరియు ఆయన తన రాజ్యమును సంపూర్ణతలో ఇంకా భూమి మీదికి తీసుకొని రాలేదు. అయితే దేవుడు తన ప్రణాళికను విడిచిపెట్టలేదు. మరియు యుగసమాప్తిలో ఆయన దానిని నెరవేర్చుతాడు — పరిపూర్ణముగా. ఆయన తనకు నమ్మకమైన ప్రజలను జీవములోనికి నడిపిస్తాడు, లోకమును ఆయన విరోధుల నుండి శుద్ధి చేస్తాడు, తన శాశ్వత రాజ్యముగా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని స్థాపిస్తాడు, మరియు నూతన యెరూషలేములోని అయన సింహాసనము మీద నుండి ఆయన నిత్యము పాలిస్తాడు.
నీ రాజ్యము వచ్చునుగాక: యుగాంతశాస్త్ర సిద్ధాంతము అను మన పాఠ్య క్రమములో ఇది నాల్గవ పాఠము. దీనికి “యుగసమాప్తి” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠంలో, ఈ యుగమును ముగింపుకు తెచ్చి రానున్న యుగమును పూర్తిగా నెరవేర్పులోనికి తెచ్చు చరిత్రలోని చివరి సన్నివేశములను గూర్చిన మన అధ్యయనమును కొనసాగిద్దాము.
ఈ పాఠ్యక్రమములోని మొదటి భాగములో మనము చూసినట్లు, దేవుని రాజ్యము మూడు దశలలో వస్తుందని పాత నిబంధన ఆకాంక్షించింది: విశ్వము యొక్క ఆరంభ సృష్టి మరియు దానిలోని సృష్టములు; మానవులు పాపములో పడుట వలన కలిగిన సుదీర్ఘమైన విమోచన చరిత్ర; చివరిగా, నిత్యముండు అంత్య కాలము, లేక “రాబోవు యుగము.” అంత్య కాలము విమోచన పూర్తి అయిన తరువాత దేవుని పరలోక రాజ్యమును భూమిని నింపునప్పుడు కలుగు విశ్వము యొక్క అంతిమ స్థితి అయ్యున్నది.
అంత్య కాలమును మూడు దశలుగా విభాగించుట ద్వారా క్రొత్త నిబంధన ఈ ఆకాంక్షలను మార్చింది అని కూడా మనము చూశాము. రాబోవు యుగము ఆరంభ కాలముతో ప్రారంభమవుతుంది, మరియు ఇది మొదటి శతాబ్దములో అపొస్తలులు మరియు ప్రవక్తలు చేసిన ప్రాధమిక కార్యములతో పాటుగా యేసు జీవితము మరియు భూలోక పరిచర్య కాలము అయ్యున్నది. ఆరంభ కాలములో, ఈ యుగము రాబోవు యుగముతో మిళితమగుట ప్రారంభమైయ్యింది. ఈ యుగము పాపము, శ్రమ మరియు మరణముతో నిండియుండగా, రాబోవు యుగము తనకు నమ్మకమైన ప్రజలకు దేవుడిచ్చు ఆశీర్వాదములతో నిండియున్నది.
అంత్య కాలములోని రెండవ దశను కొనసాగింపు అంటారు, ఇది ఆరంభము తరువాత వెంటనే ప్రారంభమై యేసు తిరిగివచ్చు వరకు కొనసాగుతుంది. కొనసాగింపులో, మనము ఈ యుగము యొక్క కష్టములను అనుభవించుచున్నాము మరియు రాబోవు యుగము యొక్క ఆరంభ ఆశీర్వాదములను ఆస్వాదించుచున్నాము.
మరియు మూడవ దశ నెరవేర్పు అయ్యున్నది, మరియు ఇది యేసు రాకతో ఆరంభమవుతుంది. నెరవేర్పులో, దేవుడు ఈ యుగమును పూర్తిగా ముగించి, దీనిని రాబోవు యుగముతో శాశ్వతముగా భర్తీ చేస్తాడు. కాబట్టి, ఈ పాఠంలో, మనము “యుగసమాప్తి”ని గూర్చి మాట్లాడునప్పుడు, మనము ఈ యుగము యొక్క ముగింపును మరియు రాబోవు యుగము యొక్క సంపూర్ణమైన నెరవేర్పును దృష్టిలో ఉంచుకొనుచున్నాము. మన మునుపటి పాఠం వలె, ఈ పాఠం కూడా సాధారణ యుగాంతశాస్త్రము మీద దృష్టిపెడుతుంది. మీకు జ్ఞాపకముందా, సాధారణ యుగంతశాస్త్రము అనగా:
అంత్య దినములలో దేవుని యొక్క సార్వత్రిక కార్యములైన తీర్పు మరియు రక్షణను అధ్యయనం చేయుట.
మరియు, వ్యక్తిగత యుగాంతశాస్త్రమునకు భిన్నముగా, సాధారణ యుగాంతశాస్త్రము అంత్య కాలములో జరుగు సన్నివేశముల కంటే ఎక్కువగా ఆ సన్నివేశములను ప్రజలు వ్యక్తిగతముగా ఎలా అనుభవిస్తారు అను విషయమును ఉద్ఘాటిస్తుంది.
“యుగసమాప్తి”ని గూర్చిన మన సంభాషణ వరుసగా జరుగు మూడు సన్నివేశములను గూర్చి మాట్లాడుతుంది. మొదటిగా, మృతుల సాధారణ పునరుత్థానమును పరిశీలన చేద్దాము. రెండవదిగా, అంత్య తీర్పును మనము చూద్దాము. మరియు మూడవదిగా, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో జీవితమును వర్ణిద్దాము. ముందుగా సాధారణ పునరుత్థానమును చూద్దాము.
సాధారణ పునరుత్థానమును “సాధారణ” అని ఎందుకు పిలుస్తారంటే, దీనిలో ఇప్పటి వరకు నివసించిన ప్రతి వ్యక్తి, అనగా పునరుజ్జీవనము పొందినవారు లేక పునరుజ్జీవనము పొందనివారు — అనగా ఇప్పటి వరకు నివసించిన లక్షల కోట్ల మానవులు — అందరు ఉంటారు. మరియు మృతుల ప్రాణములు పునఃనిర్మించబడిన తమ శరీరములతో మరలా ఐక్యపరచబడతాయి కాబట్టి దీనిని “పునరుత్థానము” అని పిలుస్తారు.
ఇప్పటివరకు మరణించినవారి శరీరములన్నీ పునరుత్థానము చెందుతాయి, కేవలం విశ్వాసులు మాత్రమే గాక ప్రతి ఒక్కరు ఒక విశేషమైన ఉద్దేశ్యము కొరకు పునరుత్థానము చెందుతారు, దేవుడు నియుక్తి చెసిన తీర్పులో నిలబడుట మరియు దేవుడు నియమించిన న్యాయాధిపతి, అనగా అయన కుమారుడైన యేసు క్రీస్తు ఎదుట నిలువబడుటయే ఈ ఉద్దేశ్యము. మరియు తీర్పులో, జీవగ్రంథములో ఎవరి పేరు ఉన్నదో మరియు వారి జీవితములకు సంబంధించిన పుస్తకముల ద్వారా ఎవరికి తీర్పుతీర్చబడుతుందో స్పష్టమవుతుంది. వారి జీవిత పుస్తకముల ద్వారా తీర్పు తీర్చబడినవారు, “నాయొద్దనుండి పొండి” అను తీర్పును పొందుతారు. జీవగ్రంథములో పేరు నమోదు చేయబడియున్నవారు “ప్రియుడా, లోనికి రమ్ము,” అను మహిమకరమైన సత్యమును వింటారు, మనము ఇతరుల కంటే మంచివారము కాబట్టి కాదుగాని మనము క్రీస్తుకు మన జీవితములను సమర్పించియున్నాము, మరియు ఆయన మనము చేసిన ఉపేక్షించు పాపములు మరియు క్రియల ద్వారా చేయు పాపముల కొరకు, మన పాపములన్నిటి కొరకు, ప్రజలందరి పాపముల కొరకు వెల చెల్లించి, తన రక్తము ద్వారా మనలను జీవగ్రంథములో లిఖించాడు.
— డా. హ్యారి ఎల్. రీడర్ III
మృతుల యొక్క సాధారణ పునరుత్థానమును మధ్య స్థితిలోని చివరి సన్నివేశములలో ఒకటిగా, లేక అంతిమ స్థితిలోని మొదటి సన్నివేశములలో ఒకటిగా మనము పరిగణించవచ్చు. సాధారణ పునరుత్థానములో, పునరుజ్జీవనము పొందనివారు మరియు పునరుజ్జీవనము పొందినవారు ఇరువురు తమ అంతిమ పరిస్థితిలోనికి చేరలేదు కాబట్టి దీనిని మధ్య స్థితిలోని భాగముగా పరిగణించవచ్చు. అయితే మన ప్రాణములు ఇక మన శరీరముల నుండి వేరుపరచబడవు కాబట్టి దీనిని అంతిమ స్థితిలో భాగముగా కూడా మనము పరిగణించవచ్చు. దీనిని మనము ఏ విధంగా విభాగించినా, సాధారణ పునరుత్థానము పునరుజ్జీవనము పొందని ప్రాణముల యొక్క తాత్కాలిక శిక్షలను మరియు పునరుజ్జీవనము పొందినవారి యొక్క తాత్కాలిక ఆశీర్వాదములను ముగింపునకు తెచ్చి, వారిని తమ శాశ్వత శిక్షలు మరియు ఆశీర్వాదముల కొరకు సిద్ధపరుస్తుంది.
సాధారణ పునరుత్థానమును మనము నాలుగు భాగములలో విశదీకరిద్దాము. మొదటిగా, ఈ సిద్ధాంతమునకు సంబంధించిన ఆదిమ వివాదములను చూద్దాము. రెండవదిగా, ఈ యుగాంత సన్నివేశమును అమలుపరచుటకు దేవుడు కలిగియున్న దైవిక అధికారమును మనము చూపుదాము. మూడవదిగా, సృష్టి మీద దీని యొక్క ప్రభావమును చూద్దాము. మరియు నాల్గవదిగా, మానవుల మీద దీని యొక్క ప్రభావమును చూద్దాము. సాధారణ పునరుత్థాన సిద్ధాంతముకు సంబంధించిన ఆదిమ వివాదములను ముందుగా చూద్దాము.
యేసు దినములలో, మృతుల పునరుత్థానమును గూర్చి కనీసం రెండు వేర్వేరు అభిప్రాయములు ఉండేవి. నీతిమంతులు మరియు దుష్టుల యొక్క సాధారణ పునరుత్థానము జరుగుతుంది అని పరిసయ్యులు నమ్మారు. అయితే మృతులు భౌతికముగా తిరిగిలేస్తారు అను విషయమును సద్దూకయ్యులు తిరస్కరించారు. వాస్తవానికి, పౌలు పట్టబడి మహా సభ అను యూదుల న్యాయస్థానము ఎదుట నిలబెట్టబడినప్పుడు, తనను తాను సమర్థించుకొనుటకు అతడు ఈ వివాదమును ఉపయోగించాడు. అపొ. 23:6-8లో ఈ సన్నివేశమును గూర్చి లూకా ఇచ్చిన నివేదిక వినండి:
వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి–సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణనుగూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను. సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు (అపొ. 23:6-8).
పరిసయ్యులు మరియు సద్దూకయ్యుల మధ్య ఈ వివాదము ప్రతి గుంపు యొక్క లేఖన అవగాహన మీద ఆధారపడియున్నది. పరిసయ్యులు పాత నిబంధన అంతటిని ప్రేరిత వాక్యముగా అంగీకరించారు. అయితే సద్దూకయ్యులు మోషే వ్రాసిన ఐదు పుస్తకములను — అనగా మనం పంచగ్రంథము అని పిలచు ఆదికాండము నుండి ద్వితీయోపదేశకాండము వరకు — మాత్రమే అంగీకరించేవారు. యెషయా 26:19, మరియు దానియేలు 12:2 వంటి లేఖనభాగములలో సాధారణ పునరుత్థానమును గూర్చి స్పష్టముగా బోధించబడింది. కాబట్టి, పరిసయ్యులు దీనిని ఉద్ఘాటించారు. అయితే మోషే వ్రాసిన గ్రంథములలో ఈ సిద్ధాంతమును వారు కనుగొనలేదు కాబట్టి సద్దూకయ్యులు దీనిని తిరస్కరించారు.
ఈ వివాదము విషయములో, యేసు, పౌలు మరియు మిగిలిన ఆదిమ సంఘము అంతా పరిసయ్యుల యొక్క పక్షము తీసుకున్నారు. మరియు సద్దూకయ్యులను మరింత బలముగా ఖండించుటకు, వారు మోషే వ్రాసిన రచనలను అపార్థము చేసుకున్నారని యేసు రుజువు చేశాడు. మార్కు 12:18-27లో, పునరుత్థాన సిద్ధాంతము విషయములో ఒక సద్దూకయ్యుల గుంపు యేసును సవాల్ చేసింది. మార్కు 12:26-27లో, యేసు ఈ విధంగా స్పందించాడు:
వారు లేచెదరని మృతులనుగూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదువలేదా? ఆ భాగములో దేవుడు–నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడు గాని మృతుల దేవుడు కాడు. కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను (మార్కు 12:26-27)
యేసు యొక్క వాదనను మనము ఈ విధంగా క్రోడీకరించవచ్చు: దేవుడు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులతో ఇప్పటికీ నిబంధనా అనుబంధములో ఉన్నాడు. మరియు ఇది వాస్తవమగుటకు, అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల ఆత్మలు బ్రదికియుండవలసియున్నది. మరియు వారు ఆత్మలుగా బ్రతికియుంటే, వారు తుదకు పునరుత్థానము చెందుతారు — మత్తయి 8:11లో యేసు సూచించినట్లు తమ నిబంధనా ఆశీర్వాదములను స్వాధీనము చేసుకొనుటకు కావచ్చు. మరియు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు వంటి విశ్వాసులు పునరుత్థానము చెందితే, సాధారణ పునరుత్థానము కూడా నిజమైయుండాలి కదా.
విచారకరముగా, ఆదిమ శతాబ్దపు సంఘములోని కొంతమంది కూడా శరీర పునరుత్థానమును తిరస్కరించారు. ఉదాహరణకు, 2 తిమోతి 2:18లో, పౌలు అప్పటికే పునరుత్థానము జరిగిపోయింది అని నమ్ముతున్నారని హుమెనైయు మరియు ఫిలేతుల మీద అభియోగం మోపాడు. పునరుత్థానము కేవలం ఆత్మీయమైనది అని వారు ఆలోచించియుండవచ్చు. లేక మత్తయి 27:52, 53లో నమోదు చేయబడినట్లు, యేసు సిలువవేయబడినప్పుడు జరిగిన పునరుత్థానములలో ఇది నెరవేర్చబడినది అని వారు ఆలోచించియుండవచ్చు. ఏది ఏమైనా, వారు సత్యమును తిరస్కరించి, విశ్వాసమును నాశనము చేశారని పౌలు సెలవిచ్చాడు.
కొరింథులో కూడా పౌలు శరీర పునరుత్థానమును గూర్చి ప్రతిఘటనను ఎదుర్కొనినట్లు 1 కొరింథీ. 15:12-34లో అతడు ఈ ఆలోచనను సమర్థించిన విధానములో స్పష్టమవుతుంది. స్పష్టముగా, కొరింథులో ఉన్న అతని విరోధులు పునరుత్థానమును అసహ్యమైనదిగా భావించారు. కాబట్టి, ఒకవేళ వారు పునరుత్థానములన్నిటిని తిరస్కరించినట్లయితే, వారు యేసు యొక్క పునరుత్థానమును కూడా తిరస్కరించాలని పౌలు సూచించాడు. మరియు వారు యేసు యొక్క పునరుత్థానమును తిరస్కరిస్తే, వారు పాప క్షమాపణను కూడా తిరస్కరించవలసియున్నది. 1 కొరింథీ. 15:17లో పౌలు సెలవిచ్చినట్లు:
క్రీస్తు లేప బడనియెడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకను మీ పాపములలోనే యున్నారు (1 కొరింథీ. 15:17).
మరొక వైపున, వారు యేసు యొక్క పునరుత్థానమును అంగీకరిస్తే, వారు ఇతరుల పునరుత్థానమును తిరస్కరించుటకు ఏ కారణము లేదు. పౌలు పునరుజ్జీవనము పొందినవారి యొక్క పునరుత్థానమునకు ప్రథమ ఫలముగా యేసును గుర్తించాడు, అనగా యేసు పునరుత్థానుడైయ్యాడు కాబట్టి, మన భవిష్యత్ పునరుత్థానములు నిశ్చయపరచబడినవి. మరియు పునరుజ్జీవనము పొందినవారి యొక్క పునరుత్థానమును సమర్థించు ప్రక్రియలో, పౌలు సాధారణ పునరుత్థానమునకు కలుగు అభ్యంతరములను కూడా తొలగించివేశాడు.
క్రీస్తు పునరుత్థానము విశ్వాసులందరి పునరుత్థానమునకు ఆధారముగా ఉన్నది. బెర్కాఫ్ సెలవిచ్చినట్లు, ఆయన పునరుత్థానమునకు ప్రభువు అని, మరియు ఆయన పునరుత్థానము విశ్వాసుల పునరుత్థానమును కూడా కలిగిస్తుంది అని యేసు పునరుత్థానము రుజువు చేస్తుంది. యేసు సజీవులకు ప్రభువు అను మాట చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. కొలస్సీ. 1:18 సెలవిచ్చుచున్నట్లు, యేసు క్రీస్తు పునరుత్థానులలో మొదటివాడు, మరియు పునరుత్థానములో ప్రథమ ఫలమైయున్నాడు. ఆయన మృతులలో నుండి తిరిగిలేచినవారిలో ప్రథముడు కాబట్టి, ఆయనను అనుసరించువారు కూడా ఆయనతో కూడా తిరిగిలేపబడతారు. యేసు క్రీస్తు పునరుత్థానము యొక్క ప్రాముఖ్యతను సూచించుటకు కోతకు వచ్చిన పొలము యొక్క చిత్రము ఉపయోగించబడుతుంది. కోత కాలములో చెట్లు ఫలములనిచ్చుట మనము చూసినప్పుడు, మరిన్ని ఫలములు రాబోవుచున్నాయని మనము గుర్తిస్తాము, అలాగే యేసు క్రీస్తుతో కూడా కొందరు ప్రజలు తిరిగిలేపబడతారని యేసు క్రీస్తు యొక్క ఆరంభ పునరుత్థానము చూపుతుంది.
— ప్రొఫెసర్. హెజ్హువాంగ్ టియన్, అనువాదము
సాధారణ పునరుత్థానమును గూర్చిన ఆదిమ వివాదములను మనము చూశాము కాబట్టి, మృతులను లేపుటకు దేవుని యొక్క దైవిక అధికారమును ఇప్పుడు మనము చూద్దాము.
దేవుని దైవిక అధికారమును అనేక విధాలుగా మనము నిర్వచించవచ్చు. అయితే ఆ పాఠంలో మన ఉద్దేశ్యముల కొరకు, దీనిని మనము ఈ విధంగా వర్ణిద్దాము:
ఆయన చిత్తమును జరిగించుటకు దేవుడు కలిగియున్న న్యాయమైన మరియు నైతికమైన హక్కు.
ఒక కార్యమును చేయుటకు దేవునికి అధికారము ఉన్నదని మనము చెప్పునప్పుడు, ఆ కార్యమును చేయుటకు ఆయన సంపూర్ణముగా హక్కు కలిగియున్నాడని, మరియు ఆ కార్యమును చేయుట ద్వారా ఆయన ఏ తప్పిదమును చేయుటలేదని మనము ఒప్పుకొనుచున్నాము.
దేవుని దైవిక అధికారమును గూర్చిన మన సంభాషణ సాధారణంగా రెండు భాగములుగా విభాగించబడుతుంది: నరకముపై ఆయన కలిగియున్న అధికారము, మరియు పరలోకముపై ఆయన కలిగియున్న అధికారము. ముందుగా నరకము మీద ఆయన కలిగియున్న అధికారమును మనము చూద్దాము.
దేవునికి నరకము మీద సంపూర్ణ అధికారము ఉన్నదని గుర్తించుట చాలా ప్రాముఖ్యమైయున్నది. మధ్య స్థితిలో పునరుజ్జీవనము పొందని ప్రాణములు నరకములో శ్రమను అనుభవించునప్పుడు, దేవుడు వారిని శిక్షించుచున్నాడు కాబట్టి వారు శ్రమపొందుతున్నారు. మరియు తీర్పును ఎదుర్కొనుటకు వారు నరకములో నుండి బయటకు లాగబడినప్పుడు, దేవుడు వారిని తన సముఖములోనికి రమ్మని చెప్పాడు కాబట్టి వారు రాగలిగారు.
ఇప్పుడు, సాతాను నరకమునకు నాయకుడైయున్నాడని క్రైస్తవులు కొన్నిసార్లు ఊహించుకుంటారు. ఉదాహరణకు, జాన్ మిల్టన్ వ్రాసిన ప్యారడైస్ లాస్ట్ అను ఒక ప్రఖ్యాతిగాంచిన పద్యములో, సాతాను అను పేరుగల పాత్ర “పరలోకములో సేవించుట కంటే, నరకములో పాలించుట మేలు” అని వాపోతాడు. అయితే సత్యము ఏమిటంటే దేవుడు నరకమును పాలించుచున్నాడు, మరియు ఆయన సాతాను మీద, దయ్యముల మీద, మరియు ఆయన అక్కడ బంధీలుగా ఉంచిన పునరుజ్జీవనము పొందవారి మీద సంపూర్ణ నియంత్రణ కలిగియున్నాడు. 2 పేతురు 2:4, 9-10లో పేతురు వ్రాసినట్లు:
దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను... దుర్నీతిపరులను..., శిక్షలో ఉంచబడినవారిని తీర్పుదినమువరకు కావలిలో ఉంచుటకును, ప్రభువు సమర్థుడు (2 పేతురు 2:4, 9-10).
అపవాదికి వాని దయ్యముల మీద అధికారము ఉన్నది అను మాటలో కొంత అర్థము ఉన్నది అనిపిస్తుంది, మరియు వాడు కొన్ని కార్యములను చేయుటకు మరియు కీడు చేయుటకు ఆ దయ్యములను పంపగలడు, కాని తుదకు, అపవాది, వాని దయ్యములన్నీ, నరకములో ఉన్న పునరుజ్జీవనము పొందని జీవులందరు యెహోవా అధికారము యొక్క ఆధీనములో ఉన్నారు. వారు దేవుని అధికారము క్రింద, విశ్వమంతటికీ దేవుడైన సృష్టింపబడని దేవుని అధికారము క్రింద ఉన్నారు. కాబట్టి, సాతానుకు కొంత బలము ఉన్నది అను విషయములో అర్థము ఉంది, అయితే వాడు కలిగియున్న బలమంతా యెహోవా యొక్క రాకతో ముగించబడుతుంది, మరియు ఏ సమయములోనైనా యెహోవా వాని బలమును తొలగించి, వానిని వెనుకకు తీసుకొనివచ్చి వాని శక్తిని నిర్మూలము చేసి దానితో ఆయనకు తోచిన విధముగా చేయగలడు.
— డా. శామ్యూల్ లేమర్సన్
నరకముపై అధికారిగా మరియు చెరసాల నాయకునిగా, పునరుజ్జీవనము పొందనివారిని చెరసాలలో నుండి పిలచి, తన సింహాసనము ఎదుట తీర్పు కొరకు నిలువబెట్టు అధికారము దేవునికి ఉన్నది. మరియు సాధారణ పునరుత్థానములో, ఆయన దీనినే చేయబోవుచున్నాడు.
నరకము మీద దేవుని యొక్క దైవిక అధికారమును గూర్చిన ఈ అవగాహనతో, పరలోకములో ఆయన అధికారమును ఇప్పుడు మనము చూద్దాము.
నరకము మీద దేవుని యొక్క అధికారమును గూర్చి కొందరు క్రైస్తవులు సందేహపడినప్పటికీ, పరలోకము మీద ఆయన అధికారమును గూర్చి ఎవ్వరు సందేహపడనవసరము లేదు. పరలోకము దేవుని సింహాసనమైయున్నది — ఇతర చోట్లన్నిటి కంటే ఎక్కువగా ఆయన అధికారము మరియు మహిమ వ్యక్తపరచబడు స్థలము. యెషయా 66:1లో యేసు దీనిని గూర్చి చెబుతున్నట్లు:
ఆకాశము నా సింహాసనము (యెషయా 66:1).
సృష్టియంతటిలో, పరలోకములోనే దేవుడు తన అధికారమును సూటిగా వ్యక్తపరుస్తాడు. మత్తయి 5:34 మరియు 23:22, మరియు హెబ్రీ 8:1లో మనము ఇదే విషయమును చూస్తాము.
దేవుని యొక్క అనేక వ్యక్తీకరణములు ఆత్మీయ వాస్తవికతల యొక్క చిత్రాత్మక ప్రాతినిధ్యములైయున్నాయి. అయితే దేవుడు పరలోకమందున్న తన నిజమైన సింహాసనము మీద నుండి పాలించుచున్నాడు అను వ్యక్తీకరణ అక్షరార్థమైనదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. దేవుడు పరలోకమందున్న నిజమైన సింహాసనము మీద కూర్చొనియున్నట్లు అనేకమంది ప్రవక్తలు దర్శనములను చూశారు కాబట్టి దేవునికి పరలోకములో నిజమైన సింహాసనము ఉన్నదని ఆలోచన చేయుటకు ఒక కారణమైయున్నది. ఉదాహరణకు, 1 రాజులు 22:19లో మరియు 2 దిన. 18:18లో పాత నిబంధన ప్రవక్తయైన మీకాయా ఆయనను చూశాడు. మొదటి క్రైస్తవ హతసాక్షి అయిన స్తెఫను కూడా అపొ. 7:55, 56లో ఇదే విషమైన దర్శనమును పొందుకున్నాడు. ఈ సందర్భములలో, వారి దర్శనములు చిత్రాత్మక కలలుగా లేక అలంకారిక సాదృశ్యములుగా కనిపించవుగాని, పరలోక సత్యముల యొక్క అంత్యదిన ప్రకటనలుగా ఉన్నాయి. మరొక మాటలో, వారు దేవుడు తన సింహాసనము మీద కూర్చొని ఎలాంటి ప్రతివాదము లేకుండా పాలించు పరలోక న్యాయస్థానములోని వాస్తవిక సన్నివేశములను చూశారు.
ప్రభువు ప్రార్థనలో యేసు బోధించినట్లు, పరలోకము దేవుని చిత్తము పరిపూర్ణముగా నెరవేరు స్థలమైయున్నది. ఇందువలననే అది అంత్య కాలము యొక్క ముగింపులో దేవుడు సృజించి క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమికి నమూనాగా ఉన్నది. మత్తయి 6:10లో, ఇలా ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పాడు:
[దేవుని] చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు, భూమియందును నెరవేరునుగాక (మత్తయి 6:10).
మన లోకము పరిపూర్ణము చేయబడు దినము కొరకు — అనగా ఆయన విరోధులందరు తొలగించబడి, ఆయన ప్రజలందరు పాపములేకుండా సమాధానముతో నివసించు దినము కొరకు — యేసు ఎదురుచూచుచున్నాడు. మరియు ఆయన పరలోకము యొక్క వర్తమాన స్థితితో పోల్చుతూ భవిష్యత్ లోకమును వర్ణించాడు.
ఇప్పుడు ఆదిమ వివాదములు మరియు దేవుని దైవిక అధికారము దృష్ట్యా సాధారణ పునరుత్థానమును మనము విశదీకరించాము కాబట్టి, సృష్టి మీద దాని యొక్క ప్రభావమును గూర్చి మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాము.
సృష్టి మీద సాధారణ పునరుత్థానము ప్రభావము కనీసం మూడు స్థలములలో ప్రభావము చూపుతుంది. మొదటిగా, అది ప్రాకృతిక ప్రపంచము మీద బహుగా ప్రభావము చూపుతుంది.
మీకు జ్ఞాపకమున్నట్లయితే, అంత్య కాలములోని సన్నివేశములు, ముఖ్యముగా నెరవేర్పు, లోకమును దేవుని యొక్క భూలోక రాజ్యముగా మార్చుటకు రూపొందించబడ్డాయి. అయితే ప్రస్తుత లోకము పాపముతో భ్రష్టమై కుళ్లుపట్టిపోయింది. కాబట్టి, ప్రాకృతిక లోకమును తన సానిధ్యము కొరకు సిద్ధపరచునట్లు దానిని మార్చుటకు దేవుడు అంత్యకాల సన్నివేశములను ఉపయోగిస్తాడు. వెస్ట్‌మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, 5వ అధ్యాయము, 3వ భాగము ఇలా చెబుతూ సృష్టిని మార్చగల దేవుని సామర్థ్యమును గూర్చి విప్లవాత్మకముగా మాట్లాడుతుంది:
దేవుడు ఆయన యొక్క సాధారణ దైవకృతములో, కొన్ని మాధ్యమములను ఉపయోగించుకుంటాడు, కాని ఆయన చిత్తానుసారంగా అవి లేకుండా, వాటిని మించి, లేక వాటికి విరోధముగా కూడా కార్యము చేయుటకు స్వతంత్రుడైయున్నాడు.
కన్ఫెషన్ “మాధ్యమము”లను గూర్చి మాట్లాడునప్పుడు, అది కారణము మరియు పరిణామము, మానవ సంకల్పశక్తి, మరియు విశ్వము యొక్క భౌతిక నియమములను దృష్టిలో ఉంచుకుంటుంది. కాని దేవుడు మాధ్యమములు “లేకుండా, వాటికి పైన, వాటికి విరోధము”గా కూడా కార్యములు చేయగలడు. మరొక మాటలో, ఆయనకు నచ్చినట్లు ఆయన ఆశ్చర్యకార్యములను చేయగలడు.
మానవాళి పాపములోనికి పతనమైనప్పుడు, దేవుడు మనకు ఇచ్చిన శాపములో భూమిని శపించుట కూడా భాగమైయుండెను. అది అపాయము మరియు మరణము ఉన్న స్థలమైయ్యింది, మరియు సాగు చేయుటకు మానవులు చేసిన కృషిని స్వయంగా నేల ప్రతిఘటించింది. ఆది. 3:17-18లో ఆదాముతో దేవుడు చెప్పినట్లు:
నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును (ఆది. 3:17-18)
అయితే రోమా 8వ అధ్యాయములో, ఈ సమస్యకు పరిష్కారముగా పునరుజ్జీవనము పొందినవారికి దేవుడు అనుగ్రహించు అద్భుతమైన పునరుత్థానము కొరకు పౌలు ఎదురుచూశాడు. పునరుత్థానములో, విమోచించబడిన మానవాళి యొక్క పునరుత్థానము ద్వారా స్వయంగా భూమి కూడా విమోచించబడుతుంది. రోమా 8:19-23లో పౌలు ఏమని వ్రాస్తున్నాడో ఒకసారి వినండి:
దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి, నాశనమునకులోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్యము పొందుదునను నిరీక్షణకలదై[యున్నది]... సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదనపడుచునున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడ, దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు, మనలో మనము మూలుగుచున్నాము (రోమా 8:19-23).
ఈ వాక్యభాగములో, మన శరీరముల యొక్క విమోచన, అనగా, మన పునరుత్థానము కుమారులుగా మన దత్తతును పూర్తి చేస్తుంది అని పౌలు బోధించాడు. అప్పుడే దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడతారు, మరియు సృష్టి స్వయంగా విముక్తిని పొందుతుంది.
సులువైన మాటలలో, ఆదికాండము 3వ అధ్యాయములో మానవాళికి దేవుడిచ్చిన శాపము ద్వారా సృష్టి భ్రష్టమైపోయినట్లే, దేవుడు శక్తితో మానవాళిని విమోచించినప్పుడు సృష్టి కూడా భ్రష్టత్వము నుండి శుద్ధిచేయబడుతుంది. మరియు సాధారణ పునరుత్థానములో భాగముగా పునరుజ్జీవనము పొందినవారు తిరిగిలేపబడినప్పుడు ఈ విమోచన పూర్తిచేయబడుతుంది.
భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము మరియు జీవశాస్త్రములోని నియమముల ప్రకారం, సాధారణ పునరుత్థానము అసాధ్యమైయున్నది. అయితే ప్రాకృతిక లోకము యొక్క భౌతిక నియమములు ఆయన ఆజ్ఞలను పాటించునట్లు దేవుడు ఏమైనా చేయుటకు సమర్థుడైయున్నాడు. కొన్ని వందల కోట్ల మంది తిరిగి లేపబడతారు — కొన్ని వేల సంవత్సరాలుగా మరణించినవారు కూడా. అది దేవుని శక్తి యొక్క మహామహిమతో కూడిన ప్రదర్శన అయ్యుంటుంది. మరియు మనము కలిగియున్న అత్యంత ప్రాముఖ్యమైన వైజ్ఞానిక నమ్మకముల కంటే ఎక్కువగా లోకము యొక్క కార్యనిర్వహణకు ఆయన అధికారము ప్రధానమైనదిగా ఉన్నదని అది నిరాటంకమైన రుజువును ఇస్తుంది.
సృష్టి మీద సాధారణ పునరుత్థానము యొక్క ప్రభావము పునరుజ్జీవనముపొందని మరియు పతనమైన దేవదూతలు ఇంతకుముందు బంధించబడిన నరకము మీద కూడా ప్రభావము చూపుతుంది.
పునరుజ్జీవనము పొందనివారు పునరుత్థానము పొందినప్పుడు, వారి ప్రాణములు నరకము నుండి వెలికితీయబడి, దేవుని తీర్పును ఎదుర్కొనుటకుగాను భూమి మీద తమ శరీరములతో ఐక్యపరచబడతారు. అయితే కేవలం పునరుజ్జీవనము పొందనివారు మాత్రమే నరకము నుండి కాళీ చేయబడరు. సాతాను మరియు ఇతర దయ్యములు కూడా అంత్య కాలములో ఈ సమయమునాటికి వెలికితీయబడతారు.
ప్రకటన 20వ అధ్యాయము సాతాను, మరియు దయ్యములు సహితము, దేవునికి విరోధముగా చివరి తిరుగుబాటులో పాలుపంచుకొనుటకుగాను నరకములోని చెరలో నుండి విడిపించబడతారని బోధిస్తునట్లు కొందరు వేదాంతవేత్తలు అర్థము చేసుకుంటారు. ప్రకటన 20:7-8లో యోహాను నివేదించినట్లు:
వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును. భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకు సముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును (ప్రకటన 20:7-8).
మరికొందరు వేదాంతవేత్తలు మనము ఇంతకు ముందు చదివిన 2 పేతురు 2:4 వంటి వాక్యభాగములను ఎత్తి చూపుతారు, అక్కడ పతనమైన దేవదూతలు చీకటి చెరసాలలో తీర్పు కాలము వరకు బంధించబడియుంటారని వ్రాయబడియున్నది. అయితే ఏది ఏమైనా, నరకము మాత్రము కాళీ చేయబడుతుంది; పునరుత్థానమునకు ముందు తిరుగుబాటులో పాలుపంచుకొనుటకు దయ్యములు విడుదల చేయబడతాయి; లేక పునరుత్థానము చెందిన పునరుజ్జీవనము పొందనివారితో పాటుగా అవి తీర్పులో నిలువబడతాయి.
పరలోకము ఇక పునరుజ్జీవనము పొందిన ప్రాణములకు నివాసముగా ఉండదు అనునది సృష్టి మీద సాధారణ పునరుత్థానము యొక్క మూడవ ప్రభావము అయ్యున్నది.
పునరుత్థానము పొందిన పునరుజ్జీవనము పొందనివారి వలె, పునరుత్థానము పొందిన పునరుజ్జీవనము పొందినవారు దేవుని తీర్పు సింహాసనము ఎదుట ప్రత్యక్షమగుటకుగాను భూమి మీదికి తిరిగివస్తారు. పరలోకము అద్భుతమైన స్థలమైయున్నది, కాబట్టి మనము ఆ స్థలమును ఎందుకు విడిచిపెట్టాలని అని ఆశ్చర్యపోవుట చాలా సులభము. అయితే మనము అక్కడ నిరంతరము నివసించాలని దేవుడు ఉద్దేశించలేదు. పరలోకములో మనకు శరీరములు ఉండవు అనునది ఒక విషయము. కాబట్టి, మనము అక్కడ సంపూర్ణమైన మానవులుగా ఉండము అనునది ఒక ప్రాముఖ్యమైన ఆలోచన అయ్యున్నది. అంతేగాక, పునరుత్థానము తరువాత, యేసు యొక్క సింహాసనము పరలోకమందుగాక భూమి మీద ఉంటుంది. మరియు మనము ఆయన సన్నిధిలో నిలిచియుండుట మంచిది. మరియు అవును, పరలోకము ఎంత అద్భుతమైనది అయినప్పటికీ, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో దేవుడు మన కొరకు మరి ఉత్తమైన ఆలోచనను కలిగియున్నాడు.
అవును, మరణము తరువాత దేవునికి చెందినవారు దేవుని సన్నిధిలో ఒక ఆనంద స్థితిని ఆస్వాదిస్తారు అను మాట నిజమే, దీనిని “మధ్య స్థితి” అని పిలుస్తారు. ఇది వాస్తవమైయున్నది: తన సృష్టి ఫలబరితము కావాలని దేవుడు కోరుచున్నాడు. అనగా దీనిలో ఆయనకు చెందినవారు, చివరికి రక్షించబడినవారైన మానవులు ఫలబరిత స్థితిని చేరతారు... కాబట్టి ప్రజలు దేవుని సన్నిధిని అనుభవించుట గొప్ప విషయమైనప్పటికీ, వాస్తవమేమిటంటే, నెరవేర్పు, సృష్టి యొక్క ఫలబరిత స్థితి, మనము శరీరముములలో ఉండుట అయ్యున్నది, మరియు ఈ శారీరములు దేవుని ఆలోచన అయ్యున్నవి. మన శరీరములకు వెలుపల దేవుని సన్నిధిలో ఉండుట ఉత్తమమైన విషయమని మనము ఆలోచిస్తే, దేవుడు తన సృష్టి అంతటికి సంబంధించిన రక్షణను గూర్చి ఆలోచన చేస్తున్నాడని, మరియు దానిలో మన శరీరముల యొక్క రక్షణ, మన శరీరముల యొక్క పరివర్తన కూడా ఉన్నదన్న విషయమును మనము తప్పిపోతాము అని నా ఆలోచన. మరియు అవును, తుదకు క్రీస్తు శరీరములో పునరుత్థానుడైయ్యాడు. మరియు ఆయన శరీరములో లేపబడితే మరియు ఆయన ప్రథమ ఫలములైతే, దాని తరువాత ఏమి జరుగుతుంది? మన శరీరముల యొక్క పునరుత్థానము.
— విన్సెంట్ బకొటే, Ph.D.
పునరుత్థానము జరిగినప్పుడు పునరుజ్జీవనము పొందిన ప్రాణములు పరలోకమును ఖాళీ చేయుటతో పాటుగా, దేవదూతలు కూడా పరలోకమును ఖాళీ చేస్తారు. యేసు తిరిగివచ్చినప్పుడు, ఆయన దేవదూతలన్నిటిని తనతో కూడా తీసుకొనివస్తాడని మత్తయి 25:31 సెలవిస్తుంది. పరలోకము మరియు భూమి నలుమూలలలో ఉన్న పునరుత్థానము పొందిన పునరుజ్జీవన పొందినవారిని సేకరించుట, వారిని క్రీస్తు యొద్దకు సేకరించుట వారికి ఇవ్వబడిన పని అయ్యున్నదని మత్తయి 24:31 సెలవిస్తుంది.
క్లుప్తంగా, సాధారణ పునరుత్థానము భూమి మీద ఉన్న ప్రతి మానవుని మరియు ప్రతి దేవదూతను భూమి మీదకు తెచ్చి, అంత్య తీర్పు కొరకు సమకూర్చుతుంది. ఫలితంగా, పరలోకము మరియు నరకము రెండు ఖాళీగా విడిచిపెట్టబడతాయి.
ఆదిమ వివాదములు, దైవిక అధికారము, మరియు సృష్టి మీద ప్రభావము దృష్ట్యా సాధారణ పునరుత్థానమును వర్ణించాము కాబట్టి, మానవుల మీద పునరుత్థానము యొక్క ప్రభావమును చూద్దాము.
సాధారణ పునరుత్థానములో ఇప్పటి వరకు నివసించిన మానవులందరు, అనగా పునరుజ్జీవనము పొందినవారు లేక పునరుజ్జీవనము పొందనివారు ఉంటారు. యోహాను 5:28-29లో యేసు సెలవిచ్చినట్లు:
ఒక కాలము వచ్చున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవపునరుత్థానమునకును, కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటకి వచ్చెదరు (యోహాను 5:28-29).
మనము మునుపటి పాఠంలో ప్రస్తావించినట్లు, పునరుత్థానములో ప్రజలు సమాధులలో నుండి లేచుటను గూర్చి బైబిలు మాట్లాడుచున్నప్పుడు, కేవలం పాతిపెట్టబడుట ద్వారా భద్రపరచబడిన శరీరముల గల ప్రజలు మాత్రమే తిరిగిలేవరు. బదులుగా, మరణించిన ప్రతి ఒక్కరు తిరిగిలేస్తారు. ఉదాహరణకు, ప్రకటన 20:13లో, సముద్రములో మరణించినవారిని సముద్రము తిరిగి ఇస్తుంది అని, మరియు మరణించిన, పాతాళములో ఉన్న ప్రాణములన్నీ తిరిగిలేస్తాయని యోహాను చెబుతున్నాడు. యెషయా 26:19, దానియేలు 12:2, మరియు యోహాను 11:24 వంటి చోట్ల కూడా ఇదే ఆలోచన ప్రతిబింబించబడింది.
మన శరీరములు ఎక్కడ ఉన్నాసరే — మరియు అవి అసలు లేకపోయినా సరే — సాధారణ పునరుత్థానములో మనమంతా తిరిగిలేస్తాము. అయితే పునరుత్థానము చెందిన మన శరీరములు ఎలా ఉంటాయి? మనము ఇప్పుడు కలిగియున్న శరీరములకు అవి ఎలాంటి పోలికలు కలిగియుంటాయి?
సాధారణ పునరుత్థానము తరువాత మన పునరుత్థాన శరీరములు ఏ విధంగా ఉంటాయి అను విషయమును గూర్చి చాలామంది తెలుసుకోవాలని కోరతారు. యేసు మరణములో నుండి తిరిగిలేచిన తరువాత కలిగియుండిన పునరుత్థాన శరీరమును అధ్యయనము చేయుట ఈ ప్రశ్నకు ఉత్తమమైన జవాబు అయ్యున్నది. ఆయన శరీరము తాను కలిగియుండిన పాత శరీరమునే పోలియుండినది — యేసు నడచాడు, భుజించాడు, మరియు మాట్లాడాడు. అయినను మరికొన్ని విధాలుగా ఆయన శరీరము తన మునుపటి శరీరము కంటే భిన్నముగా ఉన్నది — యేసు మూయబడిన తలుపలలో నుండి లోనికి నడిచాడు మరియు మాయమైపోయాడు. మరియు యేసు కలిగియుండిన విధముగానే మన పునరుత్థాన శరీరములు “మహిమకరమైన శరీరములు”గా ఉంటాయని బైబిలు తెలియజేస్తుంది.
— డా. రియాద్ ఖాస్సిస్, అనువాదము
మన పునరుత్థాన శరీరములు పూర్తిగా నూతనమైనవిగా ఉండవు. బదులుగా, మనము ఇప్పుడు కలిగియున్న శరీరములకు అవి పునఃనిర్మిత రూపములో ఉంటాయి. మరణమందు, మన శరీరములు దహనము, కుళ్లిపోవుట లేక ఇతర విధానముల ద్వారా పూర్తిగా నాశనమైపోతాయి. అయితే దేవుడు సమస్తమును చేయుటకు సమర్థుడు. ఏదో ఒక రూపములో శరీరములను కలిగియుండువారి విషయములో, అట్టి శరీరములు లేపబడతాయని మరియు పునరుద్ధరించబడతాయని లేఖనము సూచిస్తుంది. పూర్తిగా తప్పిపోయిన లేక నాశనమైపోయిన శరీరముల విషయములో, లేఖనము విశేషముగా ఏమి మాట్లాడదు. అయితే వాస్తవిక శరీరములను పోలిన విధముగా నూతన శరీరములను సృజించుటకు దేవుడు సమర్థుడైయున్నాడు అని మనము నమ్మవచ్చు.
మరియు గుర్తింపును గూర్చిన ఈ బిందువు ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. అనగా, మన పునరుత్థాన స్థితిలో, మనము ఇప్పుడు ఉన్నట్లుగానే ఉంటాము — శరీరము మరియు ప్రాణము. పునరుజ్జీవనము పొందినవారిని దేవుడు సంపూర్ణమైన ప్రజలుగా విమోచిస్తాడు, మరియు పునరుజ్జీవనము పొందనివారిని ఆయన సంపూర్ణమైన ప్రజలుగా ఖండిస్తాడు. ఒకే భౌతిక శరీరములతో మనము మన గుర్తింపును కలిగియున్నప్పటికీ, మన ప్రస్తుత శరీరములు మరియు పునరుత్థాన శరీరముల మధ్య గుణముల విషయములో కొన్ని మార్పులు ఉంటాయి. పునరుజ్జీవనము పొందినవారిని గూర్చి, 1 కొరింథీ. 15:42-44 ఇలా సెలవిస్తుంది:
శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును; ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును; ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది (1 కొరింథీ 15:42-44).
పునరుజ్జీవనము పొందినవారి యొక్క పునరుత్థాన శరీరములు మన ప్రస్తుత ప్రాకృతిక శరీరముల కంటే మరింత మహిమకరముగాను, అమర్త్యమైనవిగాను, బలమైనవిగాను ఉంటాయి. వాస్తవానికి, మన పునరుత్థాన శరీరములు యేసు మరణము నుండి తిరిగిలేచినప్పుడు పొందుకున్న శరీరమును పోలినవిగా ఉంటాయి. 1 కొరింథీ. 15:49లో పౌలు వాదించినట్లు:
మరియు మనము మంటినుండి పుట్టినవాని [ఆదాము] పోలికను ధరించిన ప్రకారము పరలోకసంబంధి పోలికయు ధరింతుము (1 కొరింథీ. 15:49).
మరియు 1 యోహాను 3:2లో, మనము చదువునట్లు:
మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము.
పునరుజ్జీవనము పొందనివారి యొక్క శరీరములను లేఖనము వర్ణించదు. నిశ్చయముగా వారి శరీరములు పునరుజ్జీవనము పొందినవారి శరీరముల వలె మహిమకరమైనవిగా ఉండవు. అయితే అంతిమ స్థితిలో నిలిచియుండుటకు వారు ఏదో ఒక విధముగా భిన్నత్వమును కలిగినవారిగా ఉండాలి. విచారకరముగా, పునరుత్థానము కొంత మందికి భయమునకు మూలముగా ఉంటుంది. వారు భయముతోను అవమానముతోను నిండిపోతారు. వారి నూతన శరీరములు అదనపు శ్రమలు పొందునట్లు వారిని బలహీనులను చేస్తుంది. మరియు వారి అంతిమ చెర వారు అప్పటివరకు అనుభవించిన నరకము కంటే ఎంతో ఘోరమైనదిగా ఉంటుంది.
పునరుజ్జీవనము పొందినవారి యొక్క మహిమకరమైన పునరుత్థానము మరియు పునరుజ్జీవనము పొందనివారి యొక్క భయంకరమైన పునరుత్థానమును గూర్చిన మన చర్చ ఒక స్పష్టమైన ప్రశ్నను లేవనెత్తుతుంది: యేసు తిరిగివచ్చినప్పుడు సజీవులుగా ఉన్న ప్రజలకు ఏమి జరుగుతుంది? వారు అసలు మరణించకపోతే ఎలా పునరుత్థానులవుతారు? పునరుజ్జీవనము పొందినవారి విషయములో, మన శరీరములు పునరుజ్జీవనము పొందిన పునరుత్థాన శరీరముల వలె ఉండునట్లు మనము రెప్పపాటులో మార్పుపొందుతాము. 1 కొరింథీ. 15:51-52లో, పౌలు ఈ వివరణను ఇచ్చుచున్నాడు:
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్ప పాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము (1 కొరింథీ. 15:51-52).
ఇక్కడ పౌలు “నిద్రించు” అను పదమును మరణమునకు సభ్యోక్తిగా ఉపయోగించాడు. కాబట్టి, మరణించనివారు పునరుత్థానముపొందినవారిని పోలియుంటారు.
అయితే పునరుజ్జీవనము పొందనివారిని గూర్చి లేఖనము స్పష్టముగా మాట్లాడుటలేదు. సాధారణ పునరుత్థానమునకు ముందు సాతాను చేయు తిరుగుబాటు కాలములో జరుగు అంతిమ యుద్ధములో వారు వధించబడవచ్చు. సాతాను సమూహములు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులను పోలియున్నవి అని చెప్పు వాక్యభాగమైన ప్రకటన 20:7-10 నుండి మనము దీనిని ఊహించవచ్చు. ఇది నిజమైన యెడల, పునరుత్థానము జరిగినప్పుడు భూమి మీద పునరుజ్జీవనము పొందనివారు ఎవరు సజీవులుగా ఉండరు. అయితే పునరుజ్జీవనము పొందనివారిలో కొందరు కూడా ఈ యుద్ధములో బ్రతికి బయటపడే అవకాశం ఉంది. ఇలా జరిగిన యెడల, వారు కూడా పునరుజ్జీవనము పొందినవారి వలె మార్పు చెందవచ్చు. అయితే తేడా ఏమిటంటే, వారి శరీరములు కూడా పునరుత్థానము పొందిన ఇతర పునరుజ్జీవనము పొందనివారి శరీరములను పోలియుంటాయి, మరియు నిత్య శిక్షను అనుభవించుటకు సిద్ధపడతాయి.
ఏది ఏమైనా, సాధారణ పునరుత్థానముకు ఫలితముగా మానవ జాతి అంతా పూర్తిగా పునఃనిర్మించబడుతుంది — ప్రతి మానవుడు ఒక నిత్యమైన శరీరములో నిత్యమైన ఆత్మగా నివాసముంటాడు. మనము సంపూర్ణమైన మానవులముగా ఉంటాము, మరియు మనము కలసి సంపూర్ణ మానవ జాతిగా ఉంటాము. మరియు ఈ విధముగా, మానవాళి మన అంత్య తీర్పును ఎదుర్కొనుటకు సిద్ధపడుతుంది.
“యుగసమాప్తి” అను మన పాఠంలో ఇప్పటి వరకు, మృతుల యొక్క సాధారణ పునరుత్థానమును మనము చూశాము. ఇప్పుడు అంత్య తీర్పు మీద దృష్టిపెడదాము.
అంత్య తీర్పు దేవుడు అధికారికముగా తన విరోధులందరి యొక్క అపరాధములన్నిటి యొక్క దోషములన్నిటిని ప్రకటించి, వారికి నిత్య శిక్షను తెలియపరచు యుగాంత సన్నివేశమైయున్నది. మరియు క్రీస్తునందు ఉన్నవారి యొక్క నిర్దోషత్వమును అధికారికముగా ప్రకటించి, వారికి నిత్య బహుమానములను మరియు ప్రతిఫలములను తెలియపరుస్తాడు. అది ఒక గొప్ప బహిరంగ సభ అయ్యుంటుంది, మరియు పునరుత్థానము పొందిన మానవ జాతి అంతా మరియు పడిపోయిన మరియు ఎన్నుకొనబడిన దేవదూతలందరు దానిలో పాలుపంచుకుంటారు.
అంత్య తీర్పును గూర్చిన మన చర్చ నాలుగు భాగాలలో విభాగించబడుతుంది. మొదటిగా, మనము ఈ కార్యక్రమము అంతటికి న్యాయాధిపతిని గుర్తిద్దాము. రెండవదిగా, తీర్పును పొందు సమూహములను పరిగణిద్దాము. మూడవదిగా, న్యాయాధిపతి సమీక్షించు రుజువును ప్రస్తావిద్దాము. మరియు నాల్గవదిగా, ఆయన ఇచ్చు నిర్ణయములను మనము చర్చిద్దాము. ముందు స్వయంగా న్యాయాధిపతిని చూద్దాము.
అంత్య తీర్పులో యేసు న్యాయాధిపతియైయుంటాడు అని క్రొత్త నిబంధన అనేకచోట్ల బోధిస్తుంది. ఉదాహరణకు, మత్తయి 25:31-46, యోహాను 5:26-30, అపొ. 10:42 మరియు 17:30, 31 మరియు అనేక ఇతర చోట్ల మనము చూస్తాము. ఒక క్లుప్త ఉదాహరణను చూద్దాము, 2 తిమోతి 4:1 ఇలా సెలవిస్తుంది:
... సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు... (2 తిమోతి 4:1)
సంఘము యొక్క ఆదిమ శతాబ్దముల నుండి క్రైస్తవ విశ్వాస సూత్రములలో కూడా ఇదే నమ్మకము ఉద్ఘాటించబడినది. ఉదాహరణకు, క్రీ.శ. 700లో స్థిరపరచబడిన అపొస్తలుల విశ్వాస సూత్రము ఇలా సెలవిస్తుంది:
సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి యేసు క్రీస్తు వచ్చును.
క్రీ.శ. 325లో రూపొందించబడి క్రీ.శ. 381లో సవరించబడిన నైసియా విశ్వాస సూత్రము ఇలా చెబుతుంది:
యేసు క్రీస్తు... సజీవులకు మరియు మృతులకు తీర్పుతీర్చుటకు మహిమతో మరలా వస్తాడు.
సర్వమానవాళికి మరియు దేవదూతలందరికీ అంత్య తీర్పు తీర్చు హక్కు తండ్రియైన దేవునికి సంపూర్ణముగా చెందియున్నది. అయితే తండ్రి ఆ హక్కును కుమారునికి అనుగ్రహించాడు. తండ్రి యేసును నియమించుటను గూర్చి అపొ. 10:42లో పేతురు మాట్లాడాడు; అపొ. 17:31లో పౌలు దీనిని ప్రస్తావించాడు; మరియు మెస్సీయగా తాను పోషించిన పాత్ర వలన తాను ఈ ఘనతను పొందుకున్నానని యేసు స్వయంగా ప్రకటించాడు. యోహాను 5:26-27లో యేసు పలికిన మాటలను వినండి:
మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు తండ్రి [కుమారునికి] అధికారము అనుగ్రహించెను (యోహాను 5:26-27).
ఈ వాక్యభాగములో, “మనుష్య కుమారుడు” అనునది ఒక మెస్సీయ బిరుదైయున్నది; ఇది యేసును క్రీస్తుగా, అనగా దావీదు నిబంధనకు మరియు సింహాసనమునకు వారసునిగా గుర్తిస్తుంది.
తీర్పును ఇచ్చువానిగా, అనగా మన శిక్షను ప్రకటించువానిగా తండ్రి కుమారుని నియమించాడు. తండ్రి కుమారుని నియమించుటకు ఒక కారణము — ప్రాముఖ్యమైన కారణము కాదు — కాని ఒక కారణము ఏమిటంటే దానియేలు 7వ అధ్యాయమును నెరవేర్చుట. దానియేలు 7లో, నాలుగు మృగములతో వ్యవహరించిన వ్యక్తి మనుష్య కుమారుడే, మరియు ఆయన జయమును పొంది, మహావృద్ధుని సన్నిధికి వెళ్తాడు, మరియు అక్కడ ఆయన బాధ్యతను నెరవేర్చుతాడు, వాస్తవానికి, దానియేలు 7లో మనుష్యకుమారుని గూర్చి ప్రస్తావించబడుటకు ముఖ్య కారణము ఏమనగా, ఈయనే తిరుగుబాటు చేయు రాజ్యములకు తీర్పు తీర్చుతాడు... మరొక మాటలో, మనుష్యకుమారుడు మహావృద్ధుని యొక్క చిత్తమును నెరవేర్చుతాడు.
— డా. బెంజమిన్ గ్లాడ్డ్
ఎంపికచేయబడిన లేక నీతిగల దేవదూతలు కూడా క్రీస్తు న్యాయాధిపతిగా పోషించు పాత్రలో సహాయము చేస్తారని క్రొత్త నిబంధన బోధిస్తుంది. ఉదాహరణకు, మత్తయి 13:41, 42లో ఉన్న గురుగులు మరియు గోధుముల ఉపమానములో, యేసు దేవదూతలను కోత సమయములో పని చేయు పనివారితో పోల్చాడు. విశేషముగా, కీడు చేయువారిని, లేక పునరుజ్జీవనము పొందనివారిని ఆయన గురుగులుగా గుర్తించాడు, మరియు ఆయన దేవదూతలు వారిని పోగుచేసి అగ్నిగుండములో పడవేస్తారు అని ఆయన సెలవిచ్చాడు. అనగా దేవదూతలు పునరుత్థానము పొందిన బంధీలను నరకము నుండి అంత్య తీర్పులోనికి తోడుకొని పోతాయి, మరియు వారికి అంతిమ తీర్పులను ఇచ్చుటలో సహాయపడతాయి. మరియు మత్తయి 24:31 ప్రకారం, తీర్పు దినము కొరకు ఎన్నుకొనబడినవారిని, లేక పునరుజ్జీవనము పొందినవారిని పోగుచేయుటకు దేవదూతలకు యేసు అదనపు బాధ్యతను ఇచ్చాడు.
అంతేగాక, పునరుజ్జీవనము పొందనివారికి మరియు పతనమైన దేవదూతలకు తీర్పుతీర్చుటలో పునరుజ్జీవనము పొందినవారు ప్రభువుకు సహాయము చేస్తారని 1 కొరింథీ. 6:2, 3 సూచిస్తుంది. మరియు క్రీస్తు ప్రజలలో కొందరు ఆ తీర్పులో మరింత ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తారు అని ప్రకటన 20:4 తెలియజేస్తుంది. దీనికి తోడు, యేసు ఖండించిన వారికి తీర్పు తీర్చుటలో పునరుజ్జీవనము పొందినవారు వాస్తవానికి ఆయనకు సహాయము చేస్తారని కీర్తనలు 149:5-9 ప్రవచిస్తుంది.
అంత్య తీర్పును జరిగించు న్యాయాధిపతిని గుర్తించాము కాబట్టి, ఆయన తీర్పు తీర్చబోవు సమూహములను ఇప్పుడు చూద్దాము.
అంత్య తీర్పును ఎదుర్కొను మూడు విభిన్నమైన సమూహములు లేక గుంపులను లేఖనము ప్రస్తావిస్తుంది. ముందుగా మనము పతనమైన దేవదూతలను, లేక దయ్యములను గూర్చి మాట్లాడదాము.
దయ్యములు దేవుని యొద్ద నుండి అధికారమును పొందిన దేవదూతలైయుండేవారని 2 పేతురు 2:4 మరియు యూదా 6 నివేదిస్తాయి. అయితే వారు ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేశారు, మరియు తమ పరలోక గృహములను మరియు తమ అధికారమును విడిచిపెట్టారు. ఫలితంగా, వారు నేడు చీకటిగల చెరసాలలలో బంధించబడి క్రీస్తు ఇచ్చు తీర్పు కొరకు ఎదురుచూచుచున్నారు.
ఎన్నుకొనబడిన దేవదూతలు — అనగా పతనముకానివారు — తీర్పులో పాలివారు కారు, ఎందుకంటే వారు దేవునికి విరోధముగా ఎన్నడును పాపము చేయలేదు. కాబట్టి, వారిని నిందించుటకు ఎలాంటి కారణము లేదు.
తీర్పును పొందు రెండవ సమూహము పునరుజ్జీవనము పొందనివారు.
పునరుత్థానము చెందిన మానవజాతి క్రీస్తు న్యాయ సింహాసనము ఎదుట ప్రత్యక్షమైనప్పుడు, దేవుడు పునరుజ్జీవనము పొందనివారిని పునరుజ్జీవనము పొందినవారి నుండి వేరు చేస్తాడు అని అనేక లేఖన భాగములు బోధించుచున్నాయి. ఈ నీతిమంతులు దుష్టుల నుండి వేరుచేయబడుటను గూర్చి రోమా. 2:5-8లో పౌలు మాట్లాడాడు. ప్రకటన 11:18 మరియు 20:11-15లో యోహాను దీనిని గూర్చి దర్శనములను చూశాడు. మరియు మత్తయి 25లో యేసు ఒలీవల కొండ మీద ఇచ్చిన ఉపదేశములో దీనిని గూర్చి స్వయంగా మాట్లాడాడు. మరియు అంత్య తీర్పులో క్రీస్తు పునరుజ్జీవనము పొందనివారిని శిక్షిస్తాడు అని ఈ వాక్యభాగములలో ప్రతి ఒక్కటి బోధిస్తుంది. మత్తయి 25:31-46లో యేసు పలికిన మాటలను వినండి:
తన మహిమతో మనుష్యకుమారుడును... మహిమగల సింహాసనముమీద ఆసీనుడైయుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; ... ఆయన వారిని వేరుపరచి... అప్పుడాయన యెడమవైపున ఉండువారిని చూచి శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి... వీరు నిత్యశిక్షకు... పోవుదురు (మత్తయి 25:31-46).
క్రీస్తు తీర్పు తీర్చు మూడవ సమూహము పునరుజ్జీవనము పొందినవారు.
యేసు పునరుజ్జీవనము పొందనివారిని పునరుజ్జీవనము పొందినవారి నుండి వేరుపరచిన తరువాత, ఆయన పునరుజ్జీవనము పొందినవారికి కూడా తీర్పు తీర్చుతాడు. దీనిని మనము రోమా. 2:7, ప్రకటన 11:18, మరియు యేసు పునరుజ్జీవనము పొందనివారిని మేకలతోను, పునరుజ్జీవనము పొందినవారిని గొర్రెలతోను పోల్చిన మత్తయి 25 వంటి అనేకచోట్ల చూస్తాము. మత్తయి 25:33-34లో పునరుజ్జీవనము పొందినవారికి యేసు చెప్పిన మాటలను వినండి:
తన కుడివైపున గొఱ్ఱెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి (మత్తయి 25:33-34)
ఇప్పుడు, పునరుజ్జీవనము పొందినవారికి తీర్పు తీర్చబడదు అని కొందరు క్రైస్తవులు అపార్థము చేసుకుంటారు అని మనము చెప్పాలి. ఎందుకంటే యోహాను 5:24ను విశ్వాసులకు తీర్పు తీర్చబడదు అను భావనలో కూడా అనువదించవచ్చు. అయితే అనేకమంది అనువాదకులు, మరియు ఎక్కువమంది వ్యాఖ్యానకర్తలు, అంత్య తీర్పులో విశ్వాసులు ఖండింపబడరు అను భావనలో ఈ వచనమును సరిగానే అర్థము చేసుకుంటారు. వాస్తవానికి, మనము ఈ పాఠంలో తరువాత చూడబోతున్నట్లు, పునరుజ్జీవనము పొందినవారు తీర్పును తప్పించుకుంటే, వారు తమ నిత్య ప్రతిఫలములను పొందలేరు.
ఇప్పుడు న్యాయాధిపతి మరియు ఆయన ఎదుట నిలువబడు సమూహముల దృష్ట్యా అంత్య తీర్పును మనము చూశాము కాబట్టి, ఇప్పుడు ఆయన పరిగణించు రుజువును మనము చూద్దాము.
పరిపూర్ణమైన న్యాయమును జరిగించుటకుగాను దేవుడు అందుబాటులో ఉన్న ప్రతి విధమైన రుజువును పరిగణిస్తాడు. మనము చేసిన, ఆలోచించిన, మరియు చెప్పిన ప్రతిదానిని ఆయన విశ్లేషిస్తాడు. ఆయన మన రహస్య ఉద్దేశములను చూస్తాడు. ఆయనతో మన అనుబంధమును నియంత్రించు అనుబంధమును, జీవితములో మనము పొందుకున్న ప్రత్యక్షతను ఆయన పరిగణిస్తాడు. ఆయన సాక్ష్యుల యొక్క సాక్ష్యములను వింటాడు, మరియు పరిహార పరిస్థితులను పరిగణిస్తాడు. ఏది విడిచిపెట్టబడదు, మరియు ఏది కూడా పరిగణలోనికి రాకుండా ఉండదు. మరియు సంపూర్ణ న్యాయమును జరిగించు ప్రక్రియలో ఇది అంతా జరుగుతుంది, తద్వారా తీర్పు తీర్చబడిన ప్రతి ఒక్కనికి ప్రతిఫలము మరియు ప్రతి శిక్ష పరిపూర్ణముగా సరిపోతుంది. రుజువు యొక్క విస్తృతమైన పరిమితిని ప్రసంగి. 12:14 ఈ విధంగా క్రోడీకరిస్తుంది:
గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును (ప్రసంగి 12:14).
మత్తయి 12:36 ఇలా సెలవిస్తుంది:
మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును (మత్తయి 12:36).
1 కొరింథీ. 4:5 ఇలా సెలవిస్తుంది:
ఆయన అంధ కారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచును (1 కొరింథీ. 4:5).
కీర్తనలు 62:12, సామెతలు 24:12, మత్తయి 16:27, మరియు రోమా. 2:5-11లో ఇలాంటి ఆలోచనలనే మనము చూడవచ్చు.
అయితే, మనము ఇంతకు ముందు ప్రస్తావించినట్లు, ప్రతి ఒక్కరు కూడా ఒకే స్థాయిలో జవాబుదారులుగా ఎంచబడరు. బదులుగా, మనందరికీ మన పరిస్థితుల ఆధారంగా తీర్పుతీర్చబడుతుంది. ఉదాహరణకు, ఎక్కువ బహిరంగముగా, మరియు దేవుని అర్హతలను గూర్చిన జ్ఞానమును ఎక్కువగా కలిగి పాపము చేసినవారికి ఎక్కువ కఠినముగా తీర్పుతీర్చబడుతుంది. ఆయనను తిరస్కరించినవారిని యేసు గద్దించిన విధానమును లూకా 10:13-14లో చూడండి:
అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర్చుండి మారుమనస్సు పొందియుందురు. అయినను విమర్శకాలమునందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును (లూకా 10:13-14).
మన నిబంధనా షరతులకు కూడా క్రీస్తు తీర్పులో మనలను బాధ్యులుగా ఎంచుతాడని కీర్తనలు 50:4-6 సూచిస్తుంది. అనగా నిబంధనలో దేవునితో ముడిపడియున్న మనము ఆయనకు విధేయులగుటకు ఎక్కువగా బాధ్యులమైయున్నామని దీని అర్థమైయున్నది. సంఘములోని బోధకులకు మరింత కఠినముగా తీర్పు తీర్చబడుతుంది అని యాకోబు 3:1 సెలవిస్తుంది.
అయితే, ఎన్నడును సువార్తను విననివారు కూడా తీర్పును పొంది శిక్షించబడతారు అను విషయమును గూర్చి కూడా మనము స్పష్టత కలిగియుండాలి. అయితే వారి దోషము క్రీస్తును ఎరిగి ఆయనను తిరస్కరించి, దేవుని మీద మరియు ఆయన ధర్మశాస్త్రము మీద ఉద్దేశ్యపూర్వకముగా తిరుగుబాటు చేసినవారి కంటే తక్కువగా ఉంటుంది. అయితే వారి గమ్యములు మాత్రం ఒకే విధంగా ఉంటాయి.
ఇందుమూలముగానే తాను “సంపూర్ణమైన దేవుని చిత్తమును” ప్రకటించాడు కాబట్టి “ప్రజలందరి రక్తము విషయములో నిర్దోషిగా” ఎంచబడతాడని అపొ. 20:26, 27లో పౌలు వాదించాడు. ఒకవేళ ప్రజలు సువార్త వినకపోతే, వారు తమ పాపములలో చచ్చినవారై నిత్యము వరకు నశిస్తారని అతని ఉద్దేశమైయున్నది. మరియు, ఒక సువార్తికునిగా అతడు తన పనిని చేయకుంటే, వారి యొద్ద నుండి జీవ వాక్కులను మరుగుచేసినందున అతడు కొంత వరకు దోషిగా ఎంచబడు అవకాశం ఉంది.
సువార్తను ఎన్నడును వినని ప్రజలు చాలా సందర్భములలో అంత్య తీర్పునందు శిక్షించబడతారు, ఎందుకంటే దేవుని గూర్చి మరియు ఆయన నీతిగల అర్హతలను గూర్చి వారికి కొంత వరకు తెలిసేయున్నది. రోమా. 1లో దేవుడు తనను గూర్చిన అనేక విషయములను ప్రతి మానవునికి సృష్టి ద్వారా బయలుపరచాడని, కాబట్టి యేసును గూర్చిన జ్ఞానమును పొందలేనివారు కూడా ఎలాంటి సాకు లేకుండా ఉన్నారని అపొస్తలుడైన పౌలు స్పష్టముగా చెప్పాడు, ఎందుకంటే దేవునిని గూర్చి మరియు దేవుడు వారి యొద్ద నుండి ఆశించు విషయములను గూర్చి వారికి తెలుసు, మరియు రోమా పత్రిక బోధించుచున్నట్లు, వారు దేవుని నియమమును ఉల్లంఘించారు. కాబట్టి, వారు పొందుకొనిన జ్ఞానము ఆధారంగా, దేవుని స్వభావము వెలుగులో మరియు స్వాభావికముగా పొందుకున్న చిత్తము వెలుగులో వారికి తీర్పు తీర్చబడుతుంది. మనలో చాలామందిమి లేఖనముల ద్వారా మరియు యేసు యొక్క సువార్త సందేశము ద్వారా ఎక్కువ పొందుకున్నాము. దానికి మనము బాధ్యులమైయున్నాము. అయితే సృష్టి నుండి దేవుని గూర్చి తాము పొందుకొనిన జ్ఞానమునకు ప్రజలందరు బాధ్యులైయున్నారు, మరియు ఇందునుబట్టి వారు బాధ్యులుగా ఎంచబడతారు. మనము పొందుకున్న వెలుగు విషయములో మరియు దానికి మనము స్పందించు విధానము విషయములో మనము బాధ్యులమైయున్నామని సువార్తలలో యేసు స్పష్టము చేశాడు.
— రెవ. డెన్ హెండ్లే
న్యాయాధిపతి, సమూహములు మరియు రుజువు దృష్ట్యా అంత్య తీర్పును గూర్చి మనము మాట్లాడాము కాబట్టి, ఇప్పుడు యేసు తీసుకొనబోవు నిర్ణయాలను మనము చర్చిద్దాము.
మన లోకములో ఎన్నో రకములైన ఘోరమైన అన్యాయములు జరుగుచున్నాయి. అబద్ధికులు మరియు దోచుకొనువారు, చాలాసార్లు తాము పలుకు మాటలు మరియు చేయు కార్యములకు ఎలాంటి పర్యవసానములను అనుభవించరు. నేరగాళ్లు చాలాసార్లు స్వతంత్రులై తిరుగుతుంటారు. ఇతరులకు హాని కలిగించు లేక దోచుకొనువారు పరిహారములను చెల్లించరు. ప్రజలు అణగద్రొక్కబడతారు. సమర్పణ కలిగిన క్రైస్తవులు విశ్వాసము విషయములో భయంకరముగా హింసించబడతారు. నియమములు సహాయము చేయవలసిన ప్రజలకే గొప్ప హాని కలిగించు విధముగా మరల్చబడతాయి. ఈ విధంగా ఎన్నో చెప్పవచ్చు. అయితే ఈ విషయములన్నిటిని సరిచేయుటకుగాను అనగా — దుష్టులను శిక్షించి, నీతిమంతులకు ప్రతిఫలమిచ్చుటకుగాను — అంత్య తీర్పు వైపుకు చూడమని లేఖనము బోధిస్తుంది. అంత్య తీర్పులో దేవుడు సమీకరణాలను సమతుల్యం చేస్తాడు, అక్కడ మంచి ఆశీర్వాదమును కలిగిస్తుంది, మరియు కీడు లాభమునుగాక, శాపమును కలిగిస్తుంది.
సాధారణంగా, క్రీస్తు రెండు రకముల నిర్ణయాలు తీసుకుంటాడు అని మనము చెప్పవచ్చు: కీడు చేసినవారికి శాపములు, మరియు మేలు చేసినవారికి ఆశీర్వాదములు. ఈ రెండు నిర్ణయాలను మనము క్లుప్తంగా వర్ణిద్దాము, దుష్టులకు కలుగు శాపములతో ఆరంభిద్దాము.
లేఖనము పతనమైన దేవదూతల యొక్క శిక్షను మరియు పునరుజ్జీవనము పొందనివారు పొందు శిక్షను పలు చోట్ల వర్ణిస్తుంది. అయితే వారి అంతము మాత్రము ఒకే విధంగా ఉంటుంది. సరళమైన మాటలలో, దేవదూతలైనా లేక మానవులైనా, వారు క్రీస్తును వ్యతిరేకించిన విధానమును బట్టి, ప్రజలతో దుర్వ్యవహారం చేసిన విధానమును బట్టి, మరియు దేవుని స్వభావమునకును, ధర్మశాస్త్రమునకును విరోధముగా చేసిన తిరుగుబాటును బట్టి న్యాయమైన శిక్షను పొందుకుంటారు. 2 థెస్స. 1:6-10లో పౌలు తన పాఠకులకు చెప్పినట్లు:
... దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతి దండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే... అట్టివారు... నిత్యనాశనమను దండన పొందుదురు (2 థెస్స. 1:6-10).
దుష్టులు నిత్యనాశన దండనను పొందుకుంటారని పౌలు చెప్పినప్పుడు, వారు నిర్మూలము చేయబడతారని లేక అంతరించిపోతారు అని అతడు ఉద్దేశించలేదు. బదులుగా, దుష్టుల జీవితములను నాశనము చేయు అణగద్రొక్కు శిక్షను అనుభవిస్తారని, మరియు అది వారిని నిత్యము వరకు నాశన స్థితిలో పడవేస్తుంది అని అతడు తెలియజేయుచున్నాడు. దానియేలు 12:2, మత్తయి 25:46, యోహాను 5:29, రోమా. 2:7-12, మరియు యూదా 7లో మనము ఇదే ఆలోచనను చూస్తాము.
దుష్టుల యొక్క తీర్పు ప్రకటన 20:10-15లో చాలా క్లుప్తముగా వర్ణించబడింది. అక్కడ, మండుచున్న గంధకములలో, లేక అగ్ని గుండములో సాతానుడు నిత్యము శ్రమను అనుభవిస్తాడని అక్కడ వ్రాయబడియున్నది. మరియు వాని అనుచరులు — ప్రకటన 13-20లో ప్రస్తావించబడిన మృగము మరియు అబద్ధ ప్రవక్తతో సహా — ఇదే విధమైన శిక్షను అనుభవిస్తారు. మరియు పునరుజ్జీవనము పొందనివారు కూడా ఇదే పరిస్థితిని అనుభవిస్తారు. యేసు తన విరోధులను ఇదే నిత్యమైన, యోచితమైన శిక్షనిచ్చి ఖండిస్తాడు. దీనితో పాటుగా, వారి పాపములు ఎంత ఎక్కువగా ఉంటే వారు అంత ఎక్కువగా శ్రమను అనుభవిస్తారని మత్తయి 11:23, 24 మరియు హెబ్రీ. 10:29 వంటి వాక్యభాగములు కూడా బోధిస్తాయి.
క్రీస్తు తీసుకొను నిర్ణయాలలో దుష్టుల కొరకు శాపములు భాగమైయున్నాయని చూశాము కాబట్టి, నీతిమంతుల మీద ఆయన కురిపించు ఆశీర్వాదములను ఇప్పుడు చూద్దాము.
క్రీస్తులో దేవుడు చూపిన కృప కారణంగా, యేసు సంపాదించిన నిత్య నిబంధన వాగ్దానములను పునరుజ్జీవనము పొందినవారు పంచుకుంటారు. తన పరిపూర్ణమైన జీవితము, విధేయతగల మరణము మరియు బలమైన పునరుత్థానము ద్వారా, క్రీస్తునందు ఉన్నవారు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో పాప క్షమాపణ, నిత్య జీవము వంటి వాటిని పొందుకుంటారు. మరియు ఈ కృపగల వరములతో పాటుగా దేవుడు ముందుగా నిర్ణయించిన మరియు పునరుజ్జీవనము పొందినవారి జీవితములలో పరిశుద్ధాత్మ సాధించిన సత్క్రియల కొరకు ప్రతిఫలములు కూడా ఇవ్వబడతాయి. ఇందువలనే, మత్తయి 6:20, మార్కు 10:21, మరియు లూకా 12:33, 34 వంటి చోట్ల పరలోకములో నిధులను దాచిపెట్టుకొనుట మీద యేసు ఎక్కువ ఉద్ఘాటనను ఉంచాడు.
ప్రకటన 20లో యోహాను చూసిన అంత్య తీర్పును గూర్చిన దర్శనములో ఈ రెండు రకముల ఆశీర్వాదములు — వరములు మరియు ప్రతిఫలములు — ఉదాహరించబడినవి. ఇదే దర్శనములో దయ్యములు మరియు పునరుజ్జీవనము పొందనివారు అగ్నిగుండములో పడద్రోయబడ్డారు. ప్రకటన 20:12, 15లో, యోహాను ఈ నివేదికను అందించాడు:
మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమను వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.......ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను (ప్రకటన 20:12, 15).
యోహాను చూసిన దర్శనములో, మానవులు చేసిన కార్యములను కలిగియున్న — మంచి మరియు చెడు — అనేక పుస్తకములు ఉన్నాయి. విచారకరముగా, ఆ పుస్తకముల ఆధారముగా మాత్రమే తీర్పును పొందిన ప్రతిఒక్కరు శిక్షించబడ్డారు, ఎందుకంటే దేవుని ఆశీర్వాదములను సంపాదించుకొను విధంగా ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాడు. అయితే “జీవ గ్రంథము” అనే ఒక విశేషమైన పుస్తకము ఉన్నది. మరియు దానిలో పునరుజ్జీవనము పొందివారందరి పేర్లు ఉన్నాయి. ఆ పుస్తకము వారు చేసిన పాపముల కొరకు యేసు మరణ పరిహారమును చెల్లించాడు అని తెలుపు న్యాయసంబంధమైన నివేదికగా ఉన్నది. కాబట్టి, జీవగ్రంథములో పేరు నమోదు చేయబడియున్న ప్రతిఒక్కరు వారి జీవితములలో దేవుని ఆత్మ జరిగించిన సత్క్రియలకు కలుగు నిత్య ప్రతిఫలములతో పాటుగా వారు క్షమాపణ మరియు నిత్య జీవితము వంటి దేవుని యొక్క కృపగల వరములను కూడా పొందుకుంటారు.
అంత్య తీర్పులో, అతడు లేక ఆమె చేసిన కార్యముల ద్వారా మాత్రమే తీర్పు పొందిన ప్రతి ఒక్కడు అగ్ని గుండములో పడద్రోయబడునట్లు శిక్షను పొందుతాడు. అయితే మనము యేసు యొక్క సువార్తను నమ్మితే, మన పాపములను ఒప్పుకుంటే, మనము పూర్తిగా క్షమించబడతాము. వాస్తవానికి, మనము ఇలా చేస్తుంటే, మన పేర్లు ఇప్పటికే జీవగ్రంథములో నమోదు చేయబడియున్నాయి. మనము శిక్షను పొందుటకు ఎలాంటి అవకాశము లేదు ఎందుకంటే మనము యేసుకు చెందినవారము, మరియు ఆయన వ్యక్తిగత నిబంధన స్వాస్థ్యముగా మనలను కొనుగోలు చేయుటకు ఆయన మరణించాడు. కాబట్టి, శిక్షించబడుటకు బదులుగా, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో మనము నిత్యము ఆయన ఆశీర్వాదములను అనుభవిస్తాము.
సాధారణ పునరుత్థానము మరియు అంత్య తీర్పును గూర్చిన బైబిలు బోధను ఇప్పటి వరకు మనము పరిశీలించాము కాబట్టి, ఇప్పుడు మన చివరి ప్రధానమైన అంశము వైపుకు దృష్టిని మళ్లిద్దాము: క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి.
క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి విమోచన చరిత్రలో చివరి దశ — అంత్య కాలము యొక్క నెరవేర్పులో ఆఖరి సంఘటన — అయ్యున్నది. మానవాళి పాపములోనికి పతనమగుట వలన కలిగిన పరిణామాలు పూర్తిగా తీసివేయబడతాయి. భూమిని నిండించునట్లు దేవుని పరలోక రాజ్యము పరిపూర్ణత చెందినప్పుడు సృష్టి సంపూర్ణతలోనికి వస్తుంది. మరియు దేవుని ప్రజలు ఆయనతో నివసిస్తూ ఆయన సౌందర్యమును, సమాధానమును, ఆరోగ్యమును మరియు ఐశ్వర్యమును నిత్యము వరకు ఆస్వాదిస్తారు.
మొదటిగా శుద్ధత, రెండవదిగా వాటి క్రొత్తదనము, మరియు మూడవదిగా వాటి యొక్క భౌగోళము మీద దృష్టిపెడుతూ, మనము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని మూడు దశలలో వర్ణిద్దాము. శుద్ధతతో ఆరంభిద్దాము.
మునుపటి పాఠంలో, భూమిని తన స్వరూపములతో నింపుట ఎల్లప్పుడూ దేవుని ప్రణాళిక అయ్యుండినది అని, తద్వారా ఆయన పక్షమున సృష్టిని పాలించుచు తన స్వరూపములు ఆయనను సేవిస్తూ ఘనపరచవలసి యుండినది అని మనము చూశాము. కొంత వరకు మన పరిపాలన సాంస్కృతిక ఆజ్ఞ ద్వారా నియంత్రించబడింది అని, దీనిలో సమస్తము ఏదెను తోట వలె కనిపించునంత వరకు మనము విశ్వమును సాగుచేయవలసియుండెను అని మనము చూశాము. అయితే, ఇప్పటి వరకు మన పాపము మరియు దాని యొక్క పరిణామాలు ఆ లక్ష్యమును చేరలేకుండా మనకు ఆటంకమును కలిగించాయి. అయితే అంత్య తీర్పు తరువాత, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో ఆయన ప్రణాళికలు నెరవేర్చబడుటకుగాను దేవుడు సృష్టిని శుద్ధి చేస్తాడు.
మనము ఇంతకు ముందు చూసినట్లు, అంత్య తీర్పులో దయ్యములన్నీ మరియు పునరుజ్జీవనము పొందనివారందరు అగ్నిగుండములో పడద్రోయబడతారు. వారికి ఇవ్వబడు శిక్ష వారు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలోనికి ప్రవేశించకుండా చూస్తుంది. అయితే ఇది సృష్టి యొక్క శుద్ధీకరణలో మొదటి భాగము మాత్రమే, ఎందుకంటే ఆకాశములు మరియు భూమి కూడా శుద్ధి చేయబడవలసియున్నవి. పాపము యొక్క పరిణామాలు సృష్టిలోనికి చొచ్చుకొనిపోయి, దేవుడు ఉద్దేశించిన లోకముగా మారకుండా దానిని నివారించాయి. మరియు దీనికి కారణము దేవుడు ఆదాముకు ఇచ్చిన శాపములో కనిపిస్తుంది. అది. 3:17-19లో, దేవుడు ఈ శాపమును ఇచ్చాడు:
నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; ... నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ... (అది. 3:17-19).
అంతేగాక, దేవుని శాపము కేవలం వ్యవసాయము మీద మాత్రమే ప్రభావము చూపలేదు. అది నిశ్చయముగా ప్రాకృతిక వైపరిత్యాలు మరియు క్రూర మృగముల దాడులకు కూడా కారణమైయ్యింది. అయితే సమస్యలు మరింత లోతుకు చొచ్చుకుపోయాయి అని పౌలు సూచించుచున్నాడు. మరొక మాటలో, దేవుడు ఉద్దేశించిన మహిమకరమైన అంత్య స్థితిని సృష్టి యావత్తు చేరలేకపోయింది — కనీసం దేవుడు చరిత్ర యొక్క అంతిమ నెరవేర్పును తీసుకొనివచ్చువరకైనా సరే. రోమా. 8:20-21లో పౌలు వ్రాసిన మాటలను వినండి:
ఏలయనగా సృష్టి, నాశనమునకులోనయిన దాస్యములోనుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్యము పొందుదునను నిరీక్షణకలదై, స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను (రోమా. 8:20-21).
పేతురు లోకము యొక్క భవిష్యత్ శుద్ధీకరణను నోవాహు దినములలో సంభవించిన జలప్రళయముతో పోల్చాడు. ఆ సమయమందు, దేవుడు పాపాత్మకమైన మానవజాతిని చాలా వరకు భూమి మీద నుండి తొలగించివేశాడు. అయితే భూమి మీద ఆయన శాపము నిలిచియుండినది, మరియు సమస్యలు సృష్టించుటకు దయ్యములు స్వాతంత్య్రముతో తిరిగులాడుచుండినవి. అయితే పేతురు మాటల ప్రకారం, అంత్య తీర్పు తరువాత పాపము యొక్క మిగిలిన ప్రభావములను మరియు పర్యవసానములను తొలగించుటకు అగ్నితో శుద్ధీకరణ జరుగుతుంది. 2 పేతురు 3:7-12లో పేతురు ఇలా వ్రాస్తున్నాడు:
అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి... ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములును కాలిపోవును... ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు[ను] (2 పేతురు 3:7-12).
పేతురు ఇచ్చిన వర్ణన ప్రకారం, “పంచభూతములను” నాశనము చేయుటకు దేవుడు అగ్నిని పంపుతాడు. అనేకమంది ఆధునిక పాఠకులు ఈ పదమును భూమి, నీరు, మరియు గాలి వంటి లోకములోని భౌతిక భాగములతో అనుసంధానం చేస్తారు. అయితే “పంచభూతములు” అని అనువదించబడిన గ్రీకు పదము — స్టోయికెయ్ — వాస్తవానికి అగ్నిగుండములో నిత్యము వరకు శిక్షింపబడు సామాన్య శక్తులను లేక దయ్యపు శక్తులను సంభోదిస్తుంది. గలతీ. 4:3, 9, కొలస్సీ. 2:8, మరియు హెబ్రీ. 5:12తో సహా క్రొత్త నిబంధనలో ఇతర చోట్ల ఈ పదము ఈ విధముగానే ఉపయోగించబడింది.
ముఖ్యభావనలో, పేతురు భూమిని నివసించుటకు అయోగ్యముగా చేయు అగ్ని ద్వారా శుద్ధీకరణ ప్రక్రియను, లేక అతని మాటలలో “కాలిపోవు” కాని పాపములేని భూమిని వర్ణించాడు. సృష్టి వారములో దేవుడు విశ్వమును చేయుటకు మునుపు, ఆదికాండము 1వ అధ్యాయము యొక్క ఆరంభములో ఉన్న విధముగా అది కనిపిస్తుంది అని కూడా మనము చెప్పవచ్చు.
పేతురు నోవహు కాలములో సంభవించిన జలప్రళయమును గూర్చి మాట్లాడుతున్నాడు. నోవహు కాలములో లోకము నాశనమైన విధముగానే ఈ లోకము కూడా నాశనము చేయబడుతుంది. కాబట్టి, ఇక్కడ మనకు మూడు లోకముల యొక్క చిత్రము ఉన్నది: జలప్రళయమునకు ముందు నోవహు లోకము, జలప్రళయం తరువాత లోకము, మరియు ప్రభువు తిరిగివచ్చిన తరువాత వచ్చు లోకము. మరియు ఈ మూడు లోకములు రెండు ఉపద్రవములతో కూడిన సన్నివేశముల ద్వారా వ్యత్యాసపరచబడ్డాయి: జలప్రళయం మరియు అగ్నితో నాశనం. అయితే దేవుడు తన లోకమును ఒకేసారి సృజించాడు, మరియు అది నేడు ఇక్కడ ఉన్నది, కాబట్టి నోవహు కాలములోని జలప్రళయం లోకమును నాశనము చేయలేదుగాని, దానిని కడిగింది; అది దానిని శుద్ధిచేసింది. మరియు శుద్ధీకరణకు సంబంధించిన భాష లేఖనములో చాలా సాధారణంగా ఉపయోగించబడింది. రానున్న లోకమును గూర్చి మాట్లాడుతూ అది మలాకీలో ఇవ్వబడింది. ఈ విధంగా మాట్లాడుటకు 1 కొరింథీ పత్రికలో పౌలు దానిని ఉపయోగిస్తాడు. కాబట్టి నా ఆలోచన ప్రకారం, నోవహు జలప్రళయమును గూర్చిన ఉదాహరణ ద్వారా, దేవుడు తన లోకమును నాశనము చేసి మరొక లోకమును తయారు చేస్తాడు అని లేఖనభాగము తెలియజేయుటలేదుగాని, ఆయన దానిని శుద్ధిచేయబోతున్నాడు. ఇప్పుడు, అది ఒక విప్లవాత్మకమైన శుద్ధీకరణ అవుతుంది. ఆయన వచ్చి చెత్తను యేరడుగాని, అది సంపూర్ణమైన నాశనముగా కూడా ఉండదు.
— డా. మైఖేల్ డి. విలియమ్స్
క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క శుద్ధతను మనము ఇప్పటి వరకు వర్ణించాము కాబాట్టి, ఇప్పుడు వాటి యొక్క క్రొత్తదనమును చూద్దాము.
“క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి” అను మాట మొట్టమొదటిసారిగా యెషయా 65:17లో ప్రత్యక్షమవుతుంది. మరియు “క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి” అను మాట యెషయా 66:22లో కూడా కనిపిస్తుంది. ఈ రెండు వచనాలలో, “క్రొత్త” అను మాటకు హెబ్రీ పదము కదేష్, అనగా “సరిక్రొత్త” అని కావచ్చు, లేక సులభంగా “నూతనపరచబడిన” అని కూడా కావచ్చు. అయితే యెషయా యొక్క నేపథ్యములో, దీని అర్థము “నూతనపరచబడిన” అయ్యున్నది. యెషయా 65:17-19లోని మాటలను వినండి:
ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకు రావు... నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించు చున్నాను. నేను యెరూషలేమునుగూర్చి ఆనందించెదను నా జనులనుగూర్చి హర్షించెదను రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఇకను వినబడవు (యెషయా 65:17-19).
క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో నూతనముగా సృష్టించబడిన యెరూషలేము ఉంటుంది అను విషయమును గమనించండి. అయితే ఆ యెరూషలేము యెషయా పరిచర్య చేసిన కాలములోని ప్రజలకు అంగలార్చుచు ఉండిన మరియు విలపించుచుండిన అదే యెరూషలేము అయ్యుంటుంది. అంతేగాక, దేవుడు తన ప్రజలను సంతోషకారణంగా ఉండుటకు సృజించబోతున్నాడు, అనగా ఆయన వారి జీవితములను పూర్తిగా మార్చబోతున్నాడు, కాని ఆయన సరిక్రొత్త ప్రజలను సృజించబోవుట లేదు.
హెబ్రీ పదమైన కదేష్ యొక్క అర్థము “సరిక్రొత్త” లేక “నూతనపరచబడిన” అయ్యున్న విధముగానే, గ్రీకు పదమైన కయినోస్ విషయములో కూడా ఇదే వాస్తవమైయున్నది. క్రొత్త ఆకాశమును మరియు క్రొత్త భూమిని వర్ణిస్తూ 2 పేతురు 3:13 మరియు ప్రకటన 21:1 రెండు కయినోస్ అను పదమును ఉపయోగిస్తాయి. అంతేగాక, ప్రకటన 22లో నూతన సృష్టిని గూర్చిన వర్ణన కూడా భూమి బదిలీచేయబడక నూతనపరచబడింది అను సత్యమును ఎత్తిచూపుతుంది. ప్రకటన 22:3లో, యోహాను సెలవిచ్చినట్లు,
ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు (ప్రకటన 22:3).
“ఇకమీదట” అను మాట ఒకప్పుడు శాపము ఉండేది అని, అది తొలగించబడింది అని సూచిస్తుంది. మరొక మాటలో, శాపగ్రస్తమైన మన లోకము సరిచేయబడుతుంది, కాని ఎన్నడును శపించబడని లోకముతో బదిలీ చేయబడదు.
పునరుజ్జీవనము పొందినవారి యొక్క పునరుత్థానముతో పోల్చుట ద్వారా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క క్రొత్తదనమును గూర్చి మనము ఆలోచన చేయుట సహాయకరముగా ఉంటుంది. మన క్రొత్త శరీరములు లక్షణముల విషయములో పాత శరీరముల కంటే భిన్నముగా ఉంటాయి. అయితే వాటిలో గొప్ప కొనసాగింపు కూడా ఉంటుంది. సమాధులలో పెట్టబడిన అవే శరీరములు తిరిగిలేస్తాయి. ఇదే విధంగా, ఇప్పుడు పాపముతో భ్రష్టమైపోయిన అవే ఆకాశములు మరియు భూమి భవిష్యత్తులో మరలా చేయబడతాయి. అయితే అవి లక్షణముల విషయములో భిన్నముగా ఉంటాయి. క్రూర మృగములు ఇక ఇతర జంతువులకు లేక మానవులకు విరోధముగా ఉండవు. మరణము ఉండదు. మరొక ప్రకృతి వైపరీత్యము సంభవించదు. మరియు ప్రకటన 21:1 సూచించుచున్నట్లు, ఉప్పునీటితో నిండియున్న సముద్రములు కూడా జీవమునిచ్చు మంచినీటితో నిండిపోతాయి.
సృష్టి కొరకు దేవుని యొక్క ప్రణాళికను జ్ఞాపకము చేసుకొనుట ఆకాశములు మరియు భూమి యొక్క క్రొత్తదనమును గూర్చి ఆలోచన చేయుటకు మరొక మార్గమైయున్నది. ఇంతకు ముందు మనము సాంస్కృతిక ఆజ్ఞగా గుర్తించిన ఆది. 1:27, 28లో, భూమినంతటిని సాగుచేయు బాధ్యతను దేవుడు మానవాళికి అనుగ్రహించాడు. భూమియంతటిని నింపువరకు ఏదెను తోట యొక్క సరిహద్దులను విశాలపరచుట లక్ష్యమైయుండినది. అప్పటి నుండి, భూమియందంతటా మానవ సంస్కృతిని వ్యాప్తిపరచుటలో మానవాళి చాలావరకు సఫలీకృతమైయ్యింది. అయితే మన పాపపు స్వభావము కారణంగా, మనము నిర్మించిన సంస్కృతి ఏదెనులోని పరదైసును పోలిలేదు. కాబట్టి, దేవుడు భూమిని నూతనపరచినప్పుడు, ఆయన ముందుగా మానవాళి యొక్క పాపపు కార్యమును తుడిచివేస్తాడు. మరియు దాని స్థానములో, ఆయన ఎల్లప్పుడూ ఉద్దేశించిన విశ్వవ్యాప్త తోటను స్థాపిస్తాడు.
క్రైస్తవులు సృష్టిని గూర్చి ఆలోచన చేయునప్పుడు, వారు చాలాసార్లు కొన్ని విషాదకరమైన తప్పిదములను చేస్తారు. సృష్టిలోని ఈ లోకములో మన జీవితములను గూర్చి మనము ఆలోచన చేస్తాము మరియు మనము ఈ లోకము విడిచివెళ్లుటయే రక్షణ అయ్యున్నదని మనము ఆలోచిస్తాము. మనము ఈ లోకమును గూర్చి మరియు దానిలోని సమస్యలన్నిటిని గూర్చి ఆలోచన చేయునప్పుడు, యుగసమాప్తిలో దేవుడు ఈ సృష్టిని నాశనము చేసి మనకు పరలోకములో మరొక జీవితమును అనుగ్రహిస్తాడు అని ఆలోచన చేస్తాము. కాబట్టి, చారిత్రికముగా క్రైస్తవులు తమను తాము సృష్టి నుండి వేరుపరచుకున్నారు... దీనిని గూర్చి మనము మరింత బైబిలు ఆధారమైన విధముగా ఆలోచన చేయాలి. దేవుడు తన సృష్టిని ప్రేమించుచున్నాడు, ఆయన తన సృష్టికి కట్టుబడియున్నాడు; ఈ సృష్టి ఆయన కాలారంభములో ఊహించుకొనినది అయ్యున్నది, కాబట్టి, సృష్టిని పునర్నిర్మించుట ఈ లోకములో ఆయన పనియైయున్నది; అది సృష్టి యొక్క పునరుద్ధరణ అయ్యున్నది. కాబట్టి, యుగసమాప్తిలో క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి ఉంటాయి అనునది వాగ్దానము అయినట్లయితే, ఈ భూమి తీసి పారవేయబడుతుంది అని దీని అర్థము కాదు. ఈ భూమి నూతనపరచబడుతుంది. కాబట్టి, క్రీస్తు అనుచరునిగా, తన సృష్టి పట్ల దేవుడు కలిగియున్న ఆసక్తిలో నేను పాలుపంచుకోవాలని కోరుచున్నాను, మరియు ఆదియందు దేవుడు ఈ లోకము కొరకు ఉద్దేశించిన సౌందర్యము, మహిమ మరియు అద్భుతముతో మరలా నింపబడుట కొరకు నేను ఎదురుచూచుచున్నాను.
— డా. గ్యారీ ఎమ్. బర్గె
వాటి శుద్ధత మరియు క్రొత్తదనము దృష్ట్యా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని మనము చూశాము కాబట్టి, ఇప్పుడు వాటి యొక్క భౌగోళమును క్లుప్తంగా చూద్దాము.
క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క భౌగోళములో కనీసం రెండు విషయములు చూడదగినవి. మొదటిగా, అవి ఒకే ఐక్య రాజ్యముగా ఉన్నాయి.
వేదాంతవేత్తలు “ప్రాకృతిక రాజ్యము” అని పిలచు వస్తు ప్రపంచమును దేవుడు సృజించుటకు ముందు, ఆయన ఆశ్చర్యకరమైన రాజ్యమైన పరలోకమును సృజించి దానిని పాలించాడు. ఆశ్చర్యకరమైన రాజ్యము దేవదూతలు మరియు దయ్యములు నివసించిన ఆత్మీయ లోకమైయున్నది. ఇది ప్రాకృతిక లోకముతో పాటుగా ఉనికిలో ఉంటుంది, మరియు దేవుడు అనుమతించిన విధముగా జీవులు ఈ రెండు రాజ్యముల మధ్య వచ్చిపోతు ఉండవచ్చు. ఉదాహరణకు, మనము మరణించినప్పుడు మన ప్రాణములు ఆశ్చర్యకరమైన రాజ్యములోనికి ప్రవేశిస్తాయి, మరియు దేవదూతలు మరియు దయ్యములు ప్రాకృతిక లోకమును అనేక విధములుగా ప్రభావితము చేస్తాయి. అయితే ఈ పాఠములన్నిటిలో మనము ప్రస్తావించినట్లు, ప్రాకృతిక లోకము తన ఆశ్చర్యకరమైన, పరలోక రాజ్యము యొక్క విస్తరణగా ఉండాలనే లక్ష్యమును దేవుడు ఎల్లప్పుడూ కలిగియున్నాడు. మత్తయి 6:9-10లో ఉన్న పరలోక ప్రార్థనను వినండి:
పరలోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక (మత్తయి 6:9-10).
తన పరలోక రాజ్యమును భూమి మీదికి తీసుకొని వచ్చి, పరలోకము ఆయనకు విధేయత చూపునట్లు భూమిని కూడా సంపూర్ణముగా విధేయత కలిగినదిగా చేయమని దేవునికి ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించాడు. సులభమైన మాటలలో, తన ఆశ్చర్యకరమైన పరలోక రాజ్యమును భూమి మీద ఉన్న ప్రాకృతిక రాజ్యము అంతటా వ్యాపింపజేయునట్లు దేవునికి ప్రార్థించమని మనకు నేర్పబడింది. మునుపటి కాలములో, మోషే మందిరములోని అతిపరిశుద్ధ స్థలము, మరియు తరువాత దేవాలయము వంటి కొన్ని విశేషమైన స్థలములలో మాత్రమే ఆకాశము భూమితో కలిసేటట్లు దేవుడు అనుమతించేవాడు. హెబ్రీ. 8:5లో మనము చదువునట్లు:
మోషే గుడారము అమర్చబోయినప్పుడు – కొండమీద నీకు చూపబడిన మాదిరిచొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవునిచేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోకసంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవచేయుదురు (హెబ్రీ. 8:5).
మందిరములో మరియు దేవాలయములో అతిపరిశుద్ధ స్థలములు దేవునిపరలోక సింహాసనము ఉన్న గదికి నమూనాలుగా ఉన్నాయి, ఎందుకంటే ఆకాశము మరియు భూమి కలుసుకున్న స్థలము ఇదే. అతి పరిశుద్ధ స్థలములు ఒకే సమయములో ఆకాశములోను, భూమి మీదను ఉన్నాయి. మరియు లేవీ. 16:2 ప్రకారం, అవి దేవుని యొక్క సముఖపు సన్నిధిని ప్రజలకు అందుబాటులో ఉంచేవి. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన విధముగానే వాటిలో ప్రయాణించుట శ్రేయస్కరముగా ఉండేది. ఇది యెషయా 6:1లో యెషయా యొక్క దర్శనమును కూడా వివరిస్తుంది, అక్కడ అతడు పరలోక సింహాసనమునందు ఆసీనుడైన దేవుని చూశాడు, మరియు దేవుని అంగీ యొక్క అంచులు భూలోక దేవాలయమును నింపియుండినవి.
అయితే క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో, దేవుడు తన పరలోక సింహాసనమును భూమి మీద స్థాపిస్తాడు. ప్రకటన 21:1-5 మరియు 22:1-3లో ఇది స్పష్టముగా కనిపిస్తుంది. మరియు ప్రాముఖ్యముగా, దేవాలయము లేక అతిపరిశుద్ధ స్థలము ఇక ఉండవని ప్రకటన 21:22 తెలియజేస్తుంది, ఎందుకంటే దేవుడు తన సన్నిధిని అన్ని చోట్ల తన ప్రజలకు కనుపరచుతాడు. ఆకాశము మరియు భూమి కలిసే విశేషమైన స్థలము ఇక మనకు అవసరముండదు. మరియు సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకునికి మాత్రమే అది ఇక పరిమితము చేయబడదు. బదులుగా, దేవుని ప్రజలందరు అన్నివేళల ఆయన సన్నిధికి వెళ్లే అవకాశమును కలిగియుంటారు.
క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా మనము ఎలాంటి లాభములను పొందుకుంటాము? మనము దేవుని చూస్తామని ప్రకటన 22 మనకు తెలియజేస్తుంది. ఏ మానవుడు ఎన్నడును దేవుని చూడడని మరొక చోట — పాత నిబంధనలో — చెప్పబడినది కాబట్టి ఇది ఒక అద్భుతమైన కథనమైయున్నది. మరియు యేసు దేవుని దృశ్యమైనవానిగా చేశాడని కూడా మనకు తెలుపబడింది. యోహాను 1లో, ఆయన నరావతారియైన దేవుడై, మన మధ్యన నివసించాడు. దేవుని సన్నిధిలో ఉండుటనే పూర్వీకులు పరమానంద దర్శనము” అని పిలిచేవారు, అనగా “సంతోషము కలిగించు దృశ్యము” అని అర్థము. దేవుని చూచుట అనగా ఆనందకరముగా ఉండుట — ఇవి పర్యాయపదములైయున్నవి — అనగా క్రీస్తు నీతితో కప్పబడిన విమోచించబడిన ప్రజలుగా దేవుని చూచుట. క్రీస్తు యొక్క నీతితో కప్పబడియుండకుండా దేవుని చూచుట భయానకమైన పని అయ్యున్నది ఎందుకంటే ఆ నీతిలేని పక్షమున ఆయన పరిశుద్ధతలో మనము మునిగిపోతాము. అయితే ఆయనతో మనము అట్టి అనుబంధము కలిగియుంటాము, ఆయనతో ఐక్యత కలిగియుంటాము. ఆయన అబ్బా, తండ్రి, నాన్న అయ్యున్నాడు. మనము ఆయన సన్నిధిలో ఉండగలుగుతాము, ఆయన ముఖమును చూడగలుగుతాము, మరియు ఆయన సన్నిధిని ఆస్వాదించగలుగుతాము. అది ఒక ఆనందకరమైన స్థలమైయుంటుంది. మనము మునుపెన్నడూ లేని విధముగా ఆనందిస్తాము, మనము ఎన్నడును కలుగని ఆనందమును పొందుతాము, దేవుని సన్నిధిలో స్వయంగా నివసిస్తాము.
— డా. ర్యాండి అల్కర్న్
నూతన యెరూషలేము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క భౌగోళములో మనము ప్రస్తావించు రెండవ విషయమైయున్నది.
నూతన యెరూషలేము నూతన సృష్టికి రాజధానిగాను, ముఖ్య ఆకర్షణగాను ఉంటుంది అని ప్రకటన 21, 22 వర్ణిస్తాయి. అది దేవుని మహిమతో ప్రకాశిస్తుంది, మరియు ప్రతివిధమైన అమూల్యమైన రత్నములతో అలంకరించబడుతుంది. మరియు అది పరలోకము నుండి దిగివస్తుంది అను సత్యము, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి దేవుడు తన ప్రజలతో నివసించు ఐక్య రాజ్యముగా ఉంటుంది అని మనము చెప్పిన విషయమును నిర్థారిస్తుంది.
ఏదెను తోటలో ఇంతకు ముందు దేవుడు దీనిని చేశాడు. మోషే దినములలో ఆయన తన ప్రజలను అరణ్యములో నుండి వాగ్దాన దేశములోనికి నడిపించినప్పుడు ఆయన ఇలా చేశాడు. సొలొమోను దినములలో ఆయన కొరకు దేవాలయము నిర్మించబడినప్పుడు ఆయన ఇలా చేశాడు. మరియు ఆయన ఎల్లప్పుడూ తన పరిశుద్ధాత్మ ద్వారా నమ్మకమైన ప్రజలలో నివసించాడు. అయితే క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి వీటినన్నిటిని అధిగమిస్తాయి, ఎందుకంటే దేవుడు తన మహిమను మననందరి మధ్య కనుపరుస్తాడు, మరియు ఆయన మహిమగల సన్నిధిలో మనము నిత్యము నివసిస్తాము.
ఆసక్తికరముగా, నూతన యెరూషలేము ఒక పరిపూర్ణమైన ఘనమూల ఆకారములో ఉంటుంది: పన్నెండు వేల స్టేడియాల పొడవు, వెడల్పు, మరియు ఎత్తు దానికి ఉంటుంది. ఇది సుమారుగా పద్నాలుగు వందల మైళ్ల పొడవు, వెడల్పు మరియు ఎత్తు అయ్యున్నది! ఇప్పుడు, ప్రకటన గ్రంథములో యోహాను చూసిన దర్శనములు చాలా వరకు చిత్రాత్మకముగా ఉన్నాయి, కాబట్టి ఆయన వర్ణనలు ఖచ్చితముగా, అక్షరార్థముగా నెరవేర్చబడతాయని మనము నిశ్చయతతో చెప్పలేము. అయినప్పటికీ, నూతన యెరూషలేము ఎంతో పెద్దదిగా ఉంటుంది అని, విమోచించబడిన మానవాళి అంతా దేవుని సన్నిధిలో నివసించుటకు సరిపడినదిగా ఉంటుంది అని ఈ చిత్రములు సూచిస్తున్నాయి.
అంతేగాక, నూతన యెరూషలేము యొక్క ఘనాకారము దేవుని నిలిచియుండు సన్నిధిని నిర్థారిస్తుంది. పాత నిబంధనలో, మందిరము మరియు దేవాలయములోని అతిపరిశుద్ధ స్థలములు కూడా ఘనాకారములో ఉండేవి. కాబట్టి, అతిపరిశుద్ధ స్థలములలో దేవుడు తన మహిమగల పరిశుద్ధ సన్నిధిని వ్యక్తపరచినట్లే, నూతన యెరూషలేములోని ఆయన ప్రజలకు కూడా ఆయన తన మహిమను కనుపరుస్తాడు. వాస్తవానికి, దేవుని మహిమ ఎంత వెలుగుమయమైయుంటుంది అంటే నూతన యెరూషలేములో ప్రకాశించుటకు సూర్యుని అవసరత కూడా ఉండదని ప్రకటన 21:23 తెలియజేస్తుంది.
నూతన యెరూషలేము యొక్క పరిమాణములు మరియు వర్ణనలు చాలాసార్లు పన్నెండు అను సంఖ్యను చూపుతాయి అను విషయమును కూడా మనము గుర్తించాలి. పాత నిబంధనలో, ఈ సంఖ్య ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రములతో అనుబంధము కలిగియున్నది, మరియు ఆ కాలములో నివసించిన దేవుని ప్రజలను సూచిస్తుంది. మరియు క్రొత్త నిబంధనలో, పన్నెండు అను సంఖ్య పన్నెండుమంది అపొస్తలులను సూచిస్తుంది, మరియు ప్రస్తుత యుగములో దేవుని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. నూతన యెరూషలేములో దేవుని ప్రజలు సంపూర్ణ భిన్నత్వముతో నివసిస్తారని, మరియు బహుశా వారి విభిన్నమైన సంస్కృతులలో నివసిస్తారని ఇది సూచిస్తుంది. ప్రకటన 21:24-27లో మనము చదువునట్లు:
జనములు దాని వెలుగునందు సంచరింతురు; భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసికొనివత్తురు... జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసికొని వచ్చెదరు. గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయబడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనదేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు (ప్రకటన 21:24-27).
క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో, దేవుని సృష్టి సంపూర్ణముగా నవీకరించబడుతుంది మరియు నూతనపరచబడుతుంది. ఆయన పాపమును మరియు దాని యొక్క ప్రభావములన్నిటిని భూమి మీద నుండి తుడిచివేస్తాడు. మరియు ఆయన పరలోక రాజ్యము సర్వలోకమును నింపు విధముగా ఆయన దానిని వ్యాపింపజేస్తాడు. ఫలితంగా, మనమికనెన్నడును, మరణము, లేక రోగము, లేక రోదన, లేక అంగలార్పు లేక బాధను అనుభవించము. అయితే క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క మహిమ మాత్రమే పరిపూర్ణమైన లోకమైయుండదు. మనము దేవుని సన్నిధిలో పూర్ణ శాంతితోను, సహవాసముతోను నిత్యము నివసిస్తాము అనునది అతిగొప్ప ఆశీర్వాదమైయుంటుంది.
క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని గూర్చిన లేఖన బోధనలు నేటి క్రైస్తవులను కొన్నిసార్లు నిర్ఘాంతతకు గురిచేస్తాయి, ఎందుకంటే మనము మరణించి పరలోకమునకు వెళ్తామని వారు చాలాసార్లు ఆలోచిస్తారు, మరియు అక్కడ శరీరము లేకుండా మేఘముల మీద గాలిలో తేలుతూ జీవిస్తామని భావిస్తారు; అయితే వాస్తవానికి, క్రొత్త భూమి మరియు క్రొత్త ఆకాశము సృష్టించబడతాయని, మరియు నూతన సృష్టిలో మానవ శారీరిక ఉనికిని గుర్తిస్తామని బైబిలు స్పష్టముగా బోధిస్తుంది. పాపమిక ఉండదు; రోదన ఇక ఉండదు; ఈ నూతన సృష్టిలో ఇక మరణము ఉండదు. అయితే “నీ రాజ్యము వచ్చునుగాక... పరలోకమందు నెరవేరునట్లు భూమియందును నెరవేరునుగాక” అని ప్రార్థించమని యేసు మనకు బోధించినప్పుడు, క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి కొరకు మనము పని చేయుట ఇప్పటి నుండి ఆరంభించాలి అనే ఆకాంక్ష అయ్యున్నది, అయితే, యేసు తిరిగివచ్చినప్పుడు ఈ కార్యము నెరవేర్చబడుతుంది అని యేసు నిశ్చయతనిచ్చాడు.
— డా. సైమన్ వైబర్ట్
“యుగసమాప్తి”ని గూర్చిన ఈ పాఠంలో, యుగాంతశాస్త్రములోని మూడు ముఖ్యమైన అంశములను మనము పరీక్షించాము. ఆదిమ సిద్ధాంతిక వివాదములు, దేవుని అధికారము, మరియు సృష్టి మీద మరియు మానవుల మీద పునరుత్థానము యొక్క ప్రభావము దృష్ట్యా మృతుల పునరుత్థానమును మనము చూశాము. న్యాయాధిపతిగా యేసును, ఆయన తీర్పు తీర్చు సమూహములను, ఆయన సమీక్షించు రుజువును, మరియు ఆయన తీసుకొను నిర్ణయములను చూస్తూ మనము అంత్య తీర్పును అధ్యయనం చేశాము. మరియు శుద్ధత, క్రొత్తదనం మరియు భౌగోళము దృష్ట్యా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని మనము పరిగణించాము.
ఈ పాఠ్యక్రమములో, యుగాంతశాస్త్ర సిద్ధాంతములోని అనేక విషయములను మనము విశదీకరించాము. దేవుడు సర్వసృష్టికి రాజు మరియు ప్రభువైయున్నాడు అని మనము చూశాము. పునరుజ్జీవనము పొందిన మరియు పునరుజ్జీవనము పొందని మానవులుగా మన జీవితముల మీద ఆ సత్యము యొక్క పర్యవసానములను మనము చూశాము. మరియు ఆయన నిరాటంకంగా చరిత్రను దాని యొక్క అంతిమ లక్ష్యము వైపుకు నడిపించుచున్నాడు అని మనము నేర్చుకున్నాము: క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో క్రీస్తు మెస్సీయ రాజ్యము యొక్క నెరవేర్పు. క్రీస్తు అంత్య తీర్పునందు పరిపూర్ణమైన న్యాయమును జరిగిస్తాడు కాబట్టి అవును కొందరు బాధితులు ఉంటారు. అయితే దీని యొక్క ఫలితము దేవునికి మహిమను తెస్తుంది, మరియు మనము ఆయన సన్నిధిలో నిత్యము నివసించుచుండగా మనకు లెక్కింపజాలని దీవెనలను కలిగిస్తుంది.
Continue reading the full transcript