ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశం వైపు మోసెస్ను అనుసరించినప్పుడు ఈ కథలు కలిగి ఉండాలని ఉద్దేశించిన అసలు ప్రభావాన్ని అన్వేషిస్తుంది.
From the transcript
1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.
బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.
ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.
అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.
మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.
క్రీస్తును భక్తితో అనుసరించువారు లేఖనములను ప్రేమిస్తారు. అవి మనతో చాలా భిన్నముగాను వ్యక్తిగతమైన మార్గములలోను మాట్లాడతాయని మనము కనుగొంటాము. ఇది క్రైస్తవులు ఎన్నడు మరచిపోకూడని లేఖనమును గూర్చిన సత్యము. అయితే అనేకసార్లు లేఖనము యొక్క ఈ అద్భుతమైన వ్యక్తిగత కోణము మనము ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకోవలసిన ఒక విషయమును మరచిపోవుటకు కారణమవుతుంది. బైబిలు మీకు లేక నాకు సూటిగా వ్రాయబడలేదు. మొదటిగా, లేఖనము కొన్ని వేల సంవత్సరముల క్రితం నివసించిన ప్రజల కొరకు వ్రాయబడింది. కాబట్టి లేఖనములు నేడు మన జీవితములకు ఏ విధంగా అనువర్తించబడతాయో అర్థము చేసుకొనుటకు ప్రయత్నించుచుండగా, మన ఆధునిక అనువర్తనలను ఎల్లప్పుడూ లేఖనము యొక్క వాస్తవిక అర్థము మీద ఆధారితము చేయునట్లు మనము జాగ్రత్తపడాలి.
ఇవి మనము తండ్రియైన అబ్రాహాము అను శీర్షికనిచ్చిన పాఠ్యక్రమములు. మరియు ఈ పాఠములలో ఆదికాండము 11:10-25:18లో కనిపించు అబ్రాహాము జీవితమును గూర్చిన కథనమును మనము విశదీకరించుచున్నాము.
మూడు పరిచయ పాఠములలో ఇది రెండవ పాఠము, మరియు దీనికి “అబ్రాహాము జీవితము: వాస్తవిక అర్థము” అను శీర్షికనిచ్చాము. అవి ఎప్పుడు వ్రాయబడినవి మరియు ఎవరికి వ్రాయబడినవి అను విషయముల వెలుగులో అబ్రాహాము జీవిత వృత్తాంతములను చదవవలసిన ప్రాముఖ్యతను ఈ పాఠములో మనము చూస్తాము. వారు వాగ్దాన దేశము వైపుకు మోషేను వెంబడించుచుండగా ఈ వృత్తాంతములు ఇశ్రాయేలు దేశముపైన చూపవలసియుండిన వాస్తవిక ప్రభావమును మనము విశదపరుద్దాము.
రెండు ముఖ్యమైన విషయములను చూచుట ద్వారా మనము ఆది. 11:10-25:18 యొక్క వాస్తవిక అర్థమును చూద్దాము. మొదటిగా, అబ్రాహాము జీవితము యొక్క చరిత్ర మరియు అతని వాస్తవిక శ్రోతల అనుభవముల మధ్య మోషే చూపిన పోలికలను మనము చూద్దాము. రెండవదిగా, ఈ పోలికలు వాస్తవిక శ్రోతలపై చూపిన కొన్ని అంతర్భావాలను క్రోడీకరిద్దాము.
అబ్రాహాము జీవితము యొక్క వాస్తవిక అర్థమును చూచుటకు ముందు, మునుపటి పాఠములో మనము చూసిన విషయములను సమీక్షించుటకు కొంత సమయమును కేటాయించాలి. ఇప్పటి వరకు మనము రెండు కీలకమైన విషయముల మీద దృష్టిపెట్టాము. మొదటిగా, ఆది. 12:1-3 అబ్రాహాము వృత్తాంతములోని నాలుగు ప్రధానమైన అంశములను బయలుపరుస్తుంది అని మనము సూచించాము. అబ్రాహాము పట్ల దేవుడు చూపిన దయ (పితరునికి దేవుడు కనికరమును చూపిన అనేక విధానములు), అబ్రాహాము దేవునికి స్వామిభక్తి చూపవలసిన బాధ్యత (అబ్రాహాము దేవునికి విధేయుడు కావాలని ఆయన కోరిన అనేక విధానములు), అబ్రాహాము దేవుని నుండి పొందిన ఆశీర్వాదములు (గొప్ప జనము, అనేకమంది వారసులు, భూమి, మరియు గొప్ప పేరును గూర్చిన వాగ్దానములు) మరియు అబ్రాహాము ద్వారా ఇతరులకు దేవుని ఆశీర్వాదములు (భూమి మీద కుటుంబములన్నిటికి అబ్రాహాము ఆశీర్వాదముగా ఉంటాడను వాగ్దానము).
అంతేగాక, ఈ ప్రధానమైన అంశములు ఆదికాండములో అబ్రాహాము వృత్తాంతము వర్ణించబడిన విధానము మీద ప్రభావము చూపాయని కూడా మనము చూశాము. అబ్రాహాము యొక్క వృత్తాంతము ఐదు సౌష్టవ దశలుగా విభజించబడుతుంది అని మనము నేర్చుకున్నాము. మొదటిగా, 11:10-12:9లో అబ్రాహాము యొక్క నేపధ్యము మరియు ఆరంభ అనుభవాలతో ఆరంభించాము. తరువాత, 12:10-14:24లోని అనేక ఉపాఖ్యానాలు ఇతర ప్రజల ప్రతినిధులతో అబ్రాహాము చేసిన ఆరంభ సంకర్షణల మీద దృష్టిపెడతాయి. 15:1-17:27లోని మూడవ మరియు అబ్రాహాము జీవితము యొక్క కేంద్రీయ భాగము అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన మీద దృష్టిపెడుతుంది. అబ్రాహాము జీవితము యొక్క నాల్గవ భాగము 18:1-21:34లో అబ్రాహాము ఇతర ప్రజల ప్రతినిధులతో చేసిన తరువాతి సంకర్షణల మీద దృష్టిపెడుతుంది. మరియు 22:1-25:18లోని ఐదవ భాగము అబ్రాహాము వారసులు మరియు అతని మరణమును గూర్చి మాట్లాడుతుంది.
ఈ ఐదు దశలు పితరుని జీవితమును సౌష్టవ పద్ధతిలో కనుపరుస్తాయి. అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధనను గూర్చి ప్రస్తావించు 15:1-17:27లో ఉన్న మూడవ భాగము అబ్రాహాము జీవితమునకు కేంద్ర భాగముగా వ్యవహరిస్తుంది. రెండవ మరియు నాల్గవ భాగములు ఇతర ప్రజలతో అబ్రాహాము చేసిన సంకర్షణల మీద దృష్టిపెడతాయి కాబట్టి అవి ఒకదానికొకటి అనుసంధానముగా ఉన్నాయి. మొదటి మరియు చివరి భాగములు అబ్రాహాము జీవితము యొక్క ఆరంభము మరియు అంతమును ప్రస్తావిస్తూ, అతని మునుపటి వంశావళిని మరియు భవిష్యత్తులో వచ్చు వంశావళిని తెలియజేస్తాయి కాబట్టి అవి కూడా ఒకదానికొకటి అనుసంధానముగా ఉన్నాయి.
అనేక విధాలుగా, అబ్రాహాము జీవితము యొక్క నిర్మాణము మరియు విషయములలో మనము నేర్చుకున్న మెళకువలను ఈ పాఠం వివరిస్తుంది. ఈ సమీక్షను మనస్సులో ఉంచుకొని, ఈ పాఠము యొక్క ముఖ్య అంశమైన, ఆదికాండములో అబ్రాహాము జీవితము యొక్క వాస్తవిక అర్థమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. అబ్రాహామును గూర్చిన వృత్తాంతములు మరియు ఈ వృత్తాంతములను మొదటిగా పొందిన ఇశ్రాయేలు యొక్క అనుభవాల మధ్య పోలికలను చూస్తూ ఆరంభిద్దాము.
ఈ పాఠ్య క్రమములో అబ్రాహాము జీవితముపై మన వ్యాఖ్యను ఈ వృత్తాంతములు వాస్తవానికి మోషే దినములలో వ్రాయబడినవి, మరియు ఇంచుమించు అప్పటి కాలములో వ్రాయబడిన విధముగానే నేడు కూడా అవి ఉన్నాయి అను ఊహ మీద నిర్మిస్తున్నాము. ఈ వృత్తాంతములు మోషే దినములలో వ్రాయబడలేదని అత్యంత విమర్శనాత్మకమైన పండితులు నమ్ముతారు, కాని మోషే వీటిని వ్రాశాడని పాత నిబంధనలోని ఇతర భాగములు మరియు స్వయంగా యేసు కూడా తెలియపరిచారు, మరియు ఈ కారణము చేత ఈ పుస్తకమును మోషే వ్రాశాడను నిశ్చయతను ఆధునిక క్రైస్తవులు కలిగియుండవచ్చు. అయితే ఈ పాఠ్యక్రమములో మనము మరొక అడుగు ముందుకు వేస్తాము. మోషే ఈ వృత్తాంతములను వ్రాశాడు అను సత్యమును అర్థముచేసుకోవాలని మాత్రమే మనము కోరుటలేదు; వీటిని అతడు ఎందుకు వ్రాశాడో కూడా మనము తెలుసుకోవాలని ఆశించుచున్నాము. అబ్రాహాము జీవితమును గూర్చి అతడు కలిగియుండిన దృక్కోణము ఏమిటి? వీటిని రచించుట వెనుక అతడు కలిగియుండిన ఉద్దేశ్యము ఏమిటి? అబ్రాహాము జీవితము యొక్క వాస్తవిక అర్థమును విశదపరచుటను ఆరంభించుటకు ఉత్తమమైన మార్గములలో ఒకటి, అబ్రాహాము గూర్చి అతడు వ్రాసిన వృత్తాంతములను వాస్తవిక శ్రోతలతో, అనగా ఐగుప్తు నుండి వాగ్దాన దేశము వైపుకు తనను వెంబడించిన ఇశ్రాయేలీయులతో, పోల్చిన విధానములను కనుగొనుట అయ్యున్నది.
అబ్రాహామును గూర్చిన తన వృత్తాంతములను వాస్తవిక శ్రోతలతో మోషే ఎలా పోల్చాడో చూచుటకు, మనము మూడు విషయములను చూద్దాము: మొదటిగా, ఈ పోలికలను గూర్చి మాట్లాడునప్పుడు మన అర్థము ఏమిటో చూద్దాము. రెండవదిగా, అబ్రాహాము జీవిత వృత్తాంతములలో కనిపించు కొన్ని రకముల పోలికలను చూద్దాము; మరియు మూడవదిగా, అబ్రాహాము జీవిత వృత్తాంతము యొక్క నిర్మాణములోని ఐదు ప్రధానమైన దశలలోని ప్రతి దశను పరిశీలించుట ద్వారా ఈ వృత్తాంతములలో ఉన్న పోలికలను మనము క్రోడీకరిద్దాము. మొదటిగా ఈ పోలికల యొక్క నిర్వచనముతో ఆరంభిద్దాము.
అనేక విధాలుగా, అబ్రాహాము జీవితమును గూర్చి చరిత్రను వ్రాసినప్పుడు, బైబిలు కథనములు వ్రాసిన రచయితలందరు ఎదుర్కొన్న పరిస్థితినే అతడు కూడా ఎదుర్కొన్నాడు. అతడు రెండు లోకముల మధ్య నిలబడ్డాడు. ఒక వైపున, “ఆ లోకము” అని మనము పిలచు దాని నుండి మోషే కథనములను పొందుకున్నాడు: ఆ లోకము అబ్రాహాము లోకము. సుమారుగా ఐదు ఆరు వందల సంవత్సరాల క్రితం అబ్రాహాము జీవితములో జరిగిన విషయములను మోషే పరంపర ద్వారా మరియు దేవుని యొద్ద నుండి కలిగిన అసాధారణమైన ప్రత్యక్షత ద్వారా తెలుసుకున్నాడు. ఈ విధంగా, మోషే మొదటిగా అబ్రాహాము జీవించిన ప్రాచీన లోకముతో వ్యవహరించాడు.
కాని మరొక వైపు, మోషే తాను నివసించిన లోకముతో కూడా వ్యవహరించాడు, దానిని మనము “వారి లోకము” అని పిలువవచ్చు: మోషే మరియు అతనిని అనుసరించిన ఇశ్రాయేలీయుల లోకము. ఆ సమయములో దేవుని ప్రజల నాయకునిగా, వారి లోకములోని అవసరతలను తీర్చుటకు అబ్రాహాము యొక్క ప్రాచీన లోకమును గూర్చిన వృత్తాంతములను మోషే వ్రాశాడు.
మోషే అబ్రాహాము జీవితమునకు సంబంధించిన “ఆ లోకము” మరియు “వారి లోకమునకు” (వారి సమకాలీన లోకము) మధ్య మధ్యవర్తిత్వం చేయుచుండగా, అతడు పితరుని జీవితమునకు మరియు అతని పాఠకుల జీవితములకు మధ్య పోలికలను వెలికి తీశాడు, తద్వారా అతడు వ్రాసిన వృత్తాంతముల యొక్క ఔచిత్యమును వారు చూడాలని ఆశించాడు. అనగా, అతనిని అనుసరించిన ఇశ్రాయేలీయులు అబ్రాహాము జీవితములతో తమ జీవితములకు పోలికలు ఉన్నట్లు చూచు విధముగా మోషే తన వృత్తాంతములను నిర్థారించుకున్నాడు మరియు వాటిని రూపొందించాడు. చాలా వరకు, అబ్రాహాము మరియు తమ సొంత సమకాలీన అనుభవాల మధ్య ఉన్న పోలికలను మరియు భేదములను అతని పాఠకులు చదువునట్లు మోషే తన రచనల ద్వారా దీనిని చేశాడు. కొన్నిసార్లు ఈ పోలికలు మరియు భేదములు చిన్నవిగా ఉండేవి, మరికొన్నిసార్లు మరింత విస్తృతముగా ఉండేవి, కాని ప్రతి ఉపాఖ్యానములో మోషే అబ్రాహాము జీవితము మరియు అతని వాస్తవిక శ్రోతల జీవితముల మధ్య ఉన్న ఈ పోలికల వైపుకు ఏదో ఒక విధముగా దృష్టిని ఆకర్షించాడు.
పోలికలు మరియు వాస్తవిక అర్థమును గూర్చి ఒక సామాన్య అవగాహనను మనము పొందుకున్నాము కాబట్టి, ఇప్పుడు మన రెండవ అంశమును చూద్దాము, అబ్రాహాము జీవితము మరియు అతని వాస్తవిక ఇశ్రాయేలీయ శ్రోతల అనుభవముల మధ్య మోషే స్థాపించిన పోలికల రకములు.
ఏ వృత్తాంతమైనా దాని పాఠకుల కొరకు ఔచిత్యము కలిగినదిగా ఉండుటకు, ఆ పాఠకులు అర్థము చేసుకోగల లోకమును అది వారికి అందించాలి. వృత్తాంతము యొక్క లోకము వాస్తవిక లోకము కంటే వేరుగా ఉంటె, వృత్తాంతములోని పాత్రలు మరియు అంశములతో పాఠకులు అనుబంధపరచుకోలేకపోతే, ఆ వృత్తాంతము సందేశమును అందించలేదు. లేక ఈ పాఠం యొక్క పదజాలములో చెబితే, అబ్రాహాము యొక్క “ఆ లోకము” మోషే మరియు ఇశ్రాయేలీయుల యొక్క “వారి లోకము”తో పూర్తిగా భిన్నమైనదిగా ఉంటె, అబ్రాహామును గూర్చిన వృత్తాంతములు ఇశ్రాయేలీయులకు అర్థరహితముగాను లేక పొందికలేనివిగాను ఉండేవి. కాబట్టి, అబ్రాహాము లోకమునకు మరియు వాగ్దాన దేశము వైపుకు పయనించుచున్న ఇశ్రాయేలీయుల లోకమునకు మధ్య పోలికలను స్థాపించుటకు మోషే చాలా కష్టపడ్డాడు.
మోషే ఈ పోలికలను ఎలా స్పష్టము చేశాడు అనునది ఈ పాఠములో మనముందున్న ప్రశ్న. అబ్రాహామును గూర్చిన వృత్తాంతములు అతని పాఠకుల లోకమునకు పోలినవిగా ఉండునట్లు వాటిని అతడు ఏ విధంగా రూపొందించాడు? ఈ పాఠ్యక్రమములో మనము మందుకు కొనసాగుచుండగా, మోషే తన వృత్తాంతములను ఇశ్రాయేలీయుల అనుభవాలతో మూడు ప్రాముఖ్యమైన మార్గములలో పోల్చాడని మనము చూడబోతున్నాము. మొదటిగా, ఇశ్రాయేలీయులు అనుభవిస్తున్న పరిస్థితులకు చారిత్రిక నేపధ్యములను సమకూర్చుటకు మోషే ఈ వృత్తాంతములను వ్రాశాడు. రెండవదిగా, ఇశ్రాయేలీయులు అనుసరించుటకు లేక నిరాకరించుటకు కొన్ని మాదిరులను లేక ఉదాహరణలను అందించుటకు అతడు తన కథనములను వ్రాశాడు. మరియు మూడవదిగా, పితరుడు అనుభవించిన అనేక అనుభవాలు ఇశ్రాయేలీయుల అనుభవాలకు ముందస్తు సూచనగా లేక సూచనగా ఉన్నాయని చూపుటకు అతడు వ్రాశాడు. ఇలాంటి రకముల పోలికలను రానున్న పాఠములలో మనము అనేకసార్లు ప్రస్తావిస్తాము కాబట్టి, తన వాస్తవిక శ్రోతలకు అబ్రాహాము జీవితము యొక్క ఔచిత్యమును చూపుటకు మోషే ఉపయోగించిన ఈ మూడు విధానములన్నిటిని ఇక్కడ మనము పరిచయం చేయాలి. మొదటిగా అబ్రాహాము యొక్క జీవితము మోషే దినమున నివసించిన ఇశ్రాయేలు యొక్క అనుభవమునకు నేపధ్యములను ఏ విధంగా సమకూర్చినదో చూద్దాము.
అనేక విధాలుగా, పోలికలన్నిటిలో ఇది కనుగొనుటకు సులభతరమైన పోలిక. తాము అనుభవించు విషయముల యొక్క చారిత్రిక నేపధ్యములను వివరించుటకు వృత్తాంతములను చెప్పుట ప్రజలందరు ఉపయోగించు ఒక సామాన్యమైన పద్ధతి. తల్లిదండ్రులు తరచుగా పిల్లలతో ఈ విధంగా వ్యవహరిస్తారు, అధ్యాపకులు తమ బోధలను ఈ విధంగా ఉదహరిస్తారు, కాపరులు, మరియు రాజకీయ నాయకులు కూడా ఇలానే చేస్తారు. అవి చారిత్రిక నేపధ్యములను అందించు విధానము మీదికి దృష్టిని ఆకర్షించుట ద్వారా మనము వృత్తాంతములను మన శ్రోతలకు అనుసంధానం చేస్తాము.
ఇప్పుడు అబ్రాహాము జీవితము విషయములో, ఈ అనుబంధమును మనము ఈ విధంగా వర్ణించవచ్చు: ఇశ్రాయేలు యొక్క అనుభవాలు అబ్రాహాము జీవిత సన్నివేశాలపై చారిత్రికముగా నాటబడియున్న విధానములను మోషే ఎత్తి చూపినప్పుడు మనము చారిత్రిక నేపధ్యముల మధ్య ఉన్న అనుబంధమును కనుగొంటాము. ఉదాహరణకు, కనాను దేశమును ఇశ్రాయేలు యొక్క మాతృభూమిగా పరిగణించమనుటకు మోషే వివరించిన చారిత్రిక నేపధ్యమును చూడండి. నిర్గమన కాలములో అనేక పర్యాయాలు తాము కనాను దేశమునకు ఎందుకు వెళ్లాలని ఇశ్రాయేలీయులు ప్రశ్నించిన సందర్భాలను మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. మోషే వారిని ఆ దేశములోకి వెళ్లుటకు కొంచెము ముందే ఎందుకు ఆపగోరలేదు?
అనేక సందర్భాలలో, అబ్రాహాము జీవితము యొక్క చారిత్రిక నేపధ్యమును ఇస్తూ మోషే ఈ సమస్యకు జవాబును ఇచ్చాడు. ఒక్క మాటలో, వారికి కూడా కనానులో తమ సొంత దేశము ఉన్నదని తాను ఇశ్రాయేలీయులను ఎందుకు బలవంతము చేయుచున్నాడో ఇశ్రాయేలీయులు చూచునట్లు దేవుడు అబ్రాహాముకు విశేషముగా కనానులో సొంత దేశమును ఇచ్చాడని అతడు చూపాడు. ఉదాహరణకు, ఆది 15:18లో దేవుడు అబ్రాహాముతో మాట్లాడిన ఈ మాటలను మనము చదువుతాము:
ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నదియైన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును...నీ సంతానమున కిచ్చియున్నా[ను] (ఆది. 15:18).
ఇశ్రాయేలు కనానును కలిగియున్నదని మోషే చెప్పిన మాట యొక్క చారిత్రిక నేపధ్యమును లేక మూలమును ఈ లేఖనభాగము స్థాపిస్తుంది. దేవుడు ఆ భూమిని ఇశ్రాయేలు యొక్క మహా పితరునికి ఇచ్చాడు మరియు అతడు తన వారసులుగా వారికి ఆ భూమిని ఇచ్చాడు, కాబట్టి వేరే దేశములో స్థిరపడుట కుదరదు.
అబ్రాహాము జీవితమును గూర్చి మరిన్ని వివరములను మనము పరిశీలించుచుండగా, మోషే తరచుగా ఇట్టి చారిత్రిక నేపధ్యముల మీద దృష్టిపెట్టాడని మనము చూస్తాము. మోషే అబ్రాహాము జీవితమును తన కాలములోని ఇశ్రాయేలుతో అనుబంధపరచిన రెండవ ప్రధానమైన మార్గము వారికి మాదిరులను చూపుట. ఈ వృత్తాంతములలో మాదిరిని చూపుట ఏ విధంగా పని చేసిందో చూద్దాము.
అబ్రాహామును గూర్చిన వృత్తాంతములను తన వాస్తవిక శ్రోతలు కేవలం నేపధ్యమును గూర్చి సమాచారమునిచ్చునవిగా పరిగణించకూడదని మోషే కోరాడు; అబ్రాహాము జీవితములోని పరిస్థితులకు మరియు తమ జీవిత పరిస్థితులకు మధ్య అనేక పోలికలను వారు చూచు విధముగా అతడు పితరుని జీవితములోని అనేక సందర్భాలను వర్ణించాడు. ఈ పోలికలు మోషే శ్రోతలలో నైతికతకు సంబంధించిన సమస్యలను లేవనెత్తాయి. ఈ పోలికలు ఇశ్రాయేలుకు ఆచరించవలసిన మరియు తిరస్కరించవలసిన ఉదాహరణలను చూచుటకు అవకాశం ఇచ్చాయని మోషే సూచించాడు.
మాదిరులను లేక ఉదాహరణలను ఇచ్చుటకు వృత్తాంతములను చెప్పుట వృత్తాంతములను మన శ్రోతలకు అనుసంధానపరచుటకు ఒక సామాన్యమైన మార్గమైయున్నది. అది ఎల్లప్పుడు జరుగుతుంది. పని చేయునప్పుడు ఒక పని చేయమని లేక చేయవద్దని మనము ఒకరిని హెచ్చరించినప్పుడు, మునుపు ఒక వ్యక్తి ఆ పని చేసినప్పుడు జరిగిన అపాయమును గూర్చిన వృత్తాంతమును మనము తరచుగా చెబుతుంటాము. పాఠశాలలో వారు ఎందుకు కష్టపడి చదవాలో పిల్లలకు మనము బోధించునప్పుడు, మన ఉపదేశమును బలపరచుటకు పాఠశాలలో కష్టపడి చదివి జీవితములో జయమును పొందిన ప్రజలను గూర్చి ఉదాహరణలను ఇస్తూ వృత్తాంతములను చెబుతాము.
అబ్రాహామును గూర్చి తాను వ్రాసిన వృత్తాంతములను వాస్తవిక ఇశ్రాయేలీయ శ్రోతలకు అనుబంధపరచుటకు మోషే తరచుగా ఇదే పనిని చేసేవాడు. ఇశ్రాయేలు అనుసరించుటకు లేక తిరస్కరించుటకు అతడు మాదిరిగా ఉండునట్లు అబ్రాహాము యొక్క వృత్తాంతమును మోషే చెప్పేవాడు. ఉదాహరణకు, కనాను దేశమును ఆక్రమించుకున్న కనానీయులు బెదిరించినప్పుడు ధైర్యముగా ఉండమని మోషే ఇశ్రాయేలీయులను ప్రోత్సహించిన విధానమును పరిగణించండి. బలమైన కనానీయులు కనాను దేశమును ఆక్రమించారు కాబట్టి మోషేను అనుసరించిన ఇశ్రాయేలీయులు కనాను దేశములోనికి వెళ్లుటకు నిరాకరించారని సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండములో మనము చూస్తాము. కనానీయులు అజేయమైన శత్రువులుగా కనిపించారు కాబట్టి వారి గుండెలు భయముతో నిండిపోయాయి. ద్వితీ. 1:26-28లో మోషే ఇశ్రాయేలు గోత్రముతో పలికిన మాటలు ఈ విధంగా ఉన్నాయి:
అయితే మీరు వెళ్లనొల్లక మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటకు తిరుగబడి మీ గుడారములలో సణుగుచు యెహోవా మనయందు పగపట్టినందున మనలను సంహరించునట్లు అమోరీయుల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తుదేశములో నుండి మనలను రప్పించియున్నాడు. మనమెక్కడికి వెళ్లగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటె బలిష్ఠులును ఎత్తరులునై యున్నారు; ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటు ప్రాకారములతోనున్నవి. అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి (ద్వితీ. 1:26-28).
అబ్రాహాము తన దినములలో కనానీయులను ఎదుర్కొనిన విషయమును గూర్చిన ఉదాహరణను తన పాఠకులకు ఇచ్చుట ద్వారా ఒక విధంగా మోషే కనానీయుల యొక్క భయమును తొలగించాలని ప్రయత్నించాడు. ఉదాహరణకు, అబ్రాహాము జీవితములో కనానీయుల ప్రస్తావనను మొదటిసారిగా ఆది. 12:6లో చూస్తాము:
అప్పుడు అబ్రాము...ఆ దేశ సంచారముచే[సెను]. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి (ఆది. 12:6).
అదే విధంగా, ఆది. 13:7లో మనము ఈ మాటలను చదువుతాము:
ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి (ఆది. 13:7).
వాగ్దాన దేశములో కనానీయులు జీవించుటను గూర్చి రెండు దగ్గర దగ్గర ఉపాఖ్యానాలలో మోషే ఎందుకు ప్రస్తావించాడు? అబ్రాహాము పరిస్థితి కూడా వారి పరిస్థితిని పోలినదిగానే ఉండెను అని ఇశ్రాయేలుకు చూపుట మోషే ఉద్దేశ్యములలో ఒకటైయున్నది. మోషే దినములలోని ఇశ్రాయేలులో వారు నివసించినట్లుగానే, అబ్రాహాము కాలములో కనానీయులు వాగ్దాన దేశములో నివసించారు. అయినను, అబ్రాహాము దేవుని వాగ్దానములను నమ్మి కనానీయులు స్వాధీనము చేసుకున్న దేశములోనికి ధైర్యముగా వెళ్లాడు. ఈ విధంగా, దేవుని వాగ్దానములను నమ్ముట ద్వారా మరియు కనానీయులు దేశములో నివసించుచున్నప్పటికీ దేశమును స్వాధీనపరచుకొనుట ద్వారా అబ్రాహాము యొక్క ధైర్యమును అనుకరించమని మోషే తన పాఠకులను ప్రోత్సహించాడు. ఈ విధంగా అబ్రాహాము అనుకరించుటకు ఒక మాదిరి అయ్యాడు.
అబ్రాహాము జీవితమును మనము పరిశీలన చేసినప్పుడు, అనుకూల మరియు ప్రతికూల ఉదాహరణలను ఇచ్చు అనేక వాక్యభాగములను మనము కనుగొంటాము. అయితే మూడవదిగా, పితరుని జీవితములోని సన్నివేశములు తమ దినములలో జరిగిన సన్నివేశములకు ముందస్తు సూచనలుగా లేక సూచనలుగా ఏ విధంగా ఉన్నాయో చూపుట ద్వారా మోషే అబ్రాహాము జీవితమును తన పాఠకుల జీవితములతో పోల్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అనేక విధాలుగా, దాని ఉద్దేశ్యములను సాధించుటకు చారిత్రిక నేపధ్యముల మధ్య అనుబంధముకు చాలా తక్కువ పోలికల యొక్క అవసరత ఉంటుంది; ఒక ఉదాహరణ ఔచిత్యముగా ఉండుటకు ఉదాహరణలు లేక మాదిరులు వృత్తాంతమునకు మరియు శ్రోతలకు మధ్య ఎక్కువ పోలికలను కోరతాయి. ఎక్కువ పోలికలు ఉన్నప్పుడు మాత్రమే, అనగా అబ్రాహాము యొక్క “ఆ లోకము” ఇశ్రాయేలు యొక్క “వారి లోకము” వలె ఖచ్చితముగా కనిపించినప్పుడు మాత్రమే, ముందస్తు సూచనలు జరుగుతాయి, అబ్రాహాము జీవిత వృత్తాంతములలో ఈ విధమైన స్పష్టమైన అనుబంధము చాలా తక్కువగా కనిపిస్తుంది, కాని ఆయా సమయాలలో, మోషే అబ్రాహాము దినములను తన దినములలోని సన్నివేశములను పోలిన విధముగా వర్ణించాడు.
“చరిత్ర పునరావృతమవుతుంది” అనే నానుడిని మనలో చాలామందిమి వినే ఉంటాము. అవును, ఏ రెండు చారిత్రిక సంఘటనలు కూడా ఖచ్చితముగా ఒకే విధంగా ఉండవు. కాని కొన్నిసార్లు సన్నివేశములు ఎంత పోలిక కలిగియుంటాయంటే రెండవ సన్నివేశము మొదటి సన్నివేశము యొక్క పునరుక్తిగా ఉంటుంది. మునుపటి సన్నివేశములు తమ శ్రోతల యొక్క జీవితములలో పునరావృతమైనట్లు బైబిలు రచయితలు చూసినప్పుడు, వారు ఈ అనుబంధమును స్పష్టము చేశారు. మరియు ఈ సాహిత్య పద్ధతిని ముందస్తు సూచన అని పిలుస్తారు.
ముందస్తు సూచనకు ఒక ఉదాహరణ ఆది. 15:1-21లో దేవునితో అబ్రాహాము చేసిన నిబంధనను వర్ణించు సుపరిచితమైన ఉపాఖ్యానములో కనిపిస్తుంది. నిబంధనా సంస్కారము కొరకు సిద్ధపడమని పిలచుట ద్వారా ఒక దినాన అతని వారసులు కనాను దేశమును స్వాధీనపరచుకుంటారని దేవుడు అబ్రాహాముకు నిశ్చయతను ఇచ్చాడు. అబ్రాహాము కొన్ని జంతువులను రెండు ఖండములుగా కోసి ఆ మాంసపు ఖండములను మార్గమునకు ఇరు వైపులా పెట్టుట ద్వారా దీనికి సిద్ధపడ్డాడు. పితరుడు నిద్రించిన తరువాత, వాస్తవిక శ్రోతలు తమ దినములలో అనుభవించుచున్న అనుభవమునకు దగ్గర పోలికలున్న ఒక దర్శనమును అతడు చూశాడు. ఆది. 15:17లో మనము ఈ మాటలను చదువుతాము:
మరియు ప్రొద్దు గ్రుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్నపొయ్యియు అగ్నిజ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను (ఆది. 15:17).
ఈ వాక్య భాగము యొక్క విస్తృత నేపధ్యములో, దేవుడు అబ్రాహాము యొక్క వారసులకు ఖచ్చితముగా వాగ్దాన దేశమును ఇస్తాడనుటకు ఒక నిశ్చయతగా ఈ రాజుచున్న పొయ్యి మరియు
అగ్నిజ్వాల దేవుడు స్వయంగా జంతువుల యొక్క ఖండముల మధ్య నడిచిపోయిన విషయమును తెలియజేస్తాయని మనము నేర్చుకుంటాము.
ఇప్పుడు ఇక్కడ విషయమును గ్రహించండి. ఆది. 15:17లో, దేవుడు తన వారసులకు వాగ్దాన దేశమును ఇవ్వబోవుచున్నాడు అని అబ్రాహాముకు నిశ్చయత కలుగజేయుటకు దేవుడు అబ్రాహాము ఎదుట అగ్నిజ్వాలగా నడిచివెళ్లాడు. ఇప్పుడు, దేవుడు అబ్రాహాముకు నిశ్చయత కలుగజేయుటకు పొగగాను మరియు అగ్నిగాను ప్రత్యక్షమైన విషయము ఆధునిక పాఠకులమైన మనకు వింతగా అనిపించవచ్చు. కాని, వాగ్దాన దేశము వైపుకు తనను వెంబడించుచున్న ఇశ్రాయేలీయుల కొరకు మోషే అబ్రాహాము జీవితమును వ్రాశాడని మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు, అతడు ఈ వివరణను వ్రాసిన విషయము ఆశ్చర్యం కలిగించదు. ఇశ్రాయేలీయుల ప్రయాణములన్నిటిలో, దేవుడు రాజుచున్న పొయ్యి మరియు అగ్నిజ్వాలను పోలిన విధముగానే దేవుడు ఇశ్రాయేలుకు ప్రత్యక్షమయ్యాడు. వారిని వాగ్దాన దేశము వైపుకు నడిపించిన మహిమ మేఘములో కూడా దేవుడు వారికి పొగగాను, అగ్నిగాను ప్రత్యక్షమయ్యాడు.
కాబట్టి, ఈ విధంగా దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమైన విధానము మోషే దినములలో ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమైన విధానమునకు ముందస్తు సూచనగా ఉన్నది. దేవుడు ఈ విధముగా అతని ఎదుట వెళ్లుట వలన అబ్రాహాము దేశమును స్వాధీనపరచుకొనుటను గూర్చి నిశ్చయతను పొందినట్లే, ఈ వృత్తాంతమును వినిన ఇశ్రాయేలీయులు కూడా తమ దినములలో దేశమును స్వాధీనపరచుకొనుటకు నిశ్చయతను పొందుకొనియుంటారు.
మరొక మరింత విశేషమైన ముందస్తు సూచన ఆది. 12:10-20లో కనిపించు ఐగుప్తు నుండి అబ్రాహాము యొక్క విమోచనను గూర్చిన ఉపాఖ్యానములో జరుగుతుంది. ఐగుప్తును గూర్చిన తమ అభిప్రాయములలో ఇశ్రాయేలుకు మాదిరి చూపుటకు ఈ వాక్య భాగము వ్రాయబడింది. ఈ సందర్భములో, తన నాయకత్వములోని ఇశ్రాయేలీయుల అనుభవమునకు పోలిన విధముగా మోషే ఉపాఖ్యానమంతటిని నిర్మించాడు. ఆది. 12:10-20లో కనాను దేశములో కరువు సంభవించుట వలన అబ్రాహాము ఐగుప్తునకు వెళ్లాడు, ఫరో శారాను తన అంతఃపురంలోనికి తీసుకున్నప్పుడు అతడు ఐగుప్తులో నిలిపివేయబడ్డాడు, కాని ఫరో కుటుంబము మీదికి రోగములను పంపి దేవుడు అబ్రాహామును విమోచించాడు. తరువాత ఫరో అబ్రాహామును ఐగుప్తు నుండి పంపివేశాడు మరియు అబ్రాహాము గొప్ప ధన సంపదతో ఐగుప్తును విడిచిపెట్టాడు.
అనేక తరముల తరువాత ఇశ్రాయేలు దేశము యొక్క అనుభవమునకు ముందస్తు సూచనగా అబ్రాహామును గూర్చిన వృత్తాంతము స్పష్టముగా రూపొందించబడింది. అబ్రాహాము వలెనె, కనాను దేశములో కరువు వచ్చుట వలన వారు ఐగుప్తుకు వెళ్లారు, ఫరో వారిని అక్కడ బంధించాడు, దేవుడు రోగమును పంపి ఫరో ఇంటి నుండి వారిని విడిపించాడు, ఇశ్రాయేలును విడిచిపెట్టమని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు, ఇశ్రాయేలు ఐగుప్తీయుల యొక్క సొమ్మును కొల్లగొట్టి ఐగుప్తును విడిచిపెట్టారు. తన శ్రోతల యొక్క అనుభవాలకు ముందస్తు సూచనగా ఉండునట్లు మోషే ఉద్దేశ్యపూర్వకముగా ఈ కథనమును వ్రాశాడు. అబ్రాహాము వృత్తాంతములలో ఇట్టి విశాలమైన ముందస్తు సూచనలు చాలా అరుదేగాని, అట్టి పోలికలు అబ్రాహాము వృత్తాంతములలో అక్కడక్కడ కనబడతాయి.
అబ్రాహాము జీవితమును మనము అధ్యయనం చేసినప్పుడు, మూడు పోలికలను మనము అనేక సందర్భాలలో అనేక విధాలుగా చూస్తాము. వారి అనుభవాలను గూర్చి చారిత్రిక నేపధ్యములను ఇచ్చుట ద్వారా, అనుసరించవలసిన మరియు వ్యతిరేకించవలసిన మాదిరులను వారికి ఇచ్చుట ద్వారా, అబ్రాహాము జీవితము వారి అనుభవాలకు అనేక విధాలుగా ముందస్తు సూచనగా ఉందని చూపుట ద్వారా మోషే అబ్రాహాము జీవితము యొక్క “ఆ లోకమును” మరియు అతని వాస్తవిక శ్రోతల లోకమైన “వారి లోకమును” పోల్చాడు.
అబ్రాహాము మరియు అతని ఇశ్రాయేలీయ శ్రోతల మధ్య మోషే స్థాపించిన అనుబంధముల పోలికలను మనము చూశాము కాబట్టి, అబ్రాహాము జీవితములోని ప్రతి ముఖ్యమైన అడుగు వాస్తవిక శ్రోతల యొక్క జీవితాలతో ఎలా ముడిపడియున్నదో క్రోడీకరించుట సహాయకరముగా ఉంటుంది.
అబ్రాహాము జీవితము ఐదు సౌష్టవ దశలుగా విభజించబడింది అని మీకు జ్ఞాపకముండియుంటుంది. ప్రతి భాగములోను అబ్రాహాము వృత్తాంతములను తన వాస్తవిక శ్రోతల యొక్క పరిస్థితులతో పోల్చుటకు మోషే మార్గములను కనుగొన్నాడు.
మొదటిగా, ఐగుప్తులో నుండి తనను వెంబడించి బయటకు వచ్చిన ప్రజల యొక్క ఆరంభ అనుభవాలు మరియు నేపధ్యముతో పోల్చు విధముగా మోషే అబ్రాహాము నేపధ్యము మరియు ఆరంభ అనుభవాలను గూర్చి చెప్పాడు. అబ్రాహాము మరియు ఇశ్రాయేలు ఇరువురు ఒకే కుటుంబమునకు చెందినవారు. అబ్రాహాము మరియు ఇశ్రాయేలు ఇరువురు కనాను దేశమును స్వాధీనపరచుకొనుటకు దేవుని ద్వారా పిలువబడ్డారు. కాబట్టి, మోషే చారిత్రిక నేపధ్యములను ఇచ్చాడు, అబ్రాహామును మాదిరిగా చూపాడు, మరియు అబ్రాహాము జీవితము వాస్తవిక శ్రోతల యొక్క అనుభవాలకు ముందస్తు సూచనగా ఉన్న విధానములను కూడా తెలియజేశాడు.
రెండవదిగా, అబ్రాహాము ఇతరులతో చేసిన ఆరంభ సంకర్షణలను గూర్చి కూడా తన శ్రోతలకు అనుబంధపరచు విధముగా మోషే వర్ణించాడు. ఇశ్రాయేలు తమ దినమున ఐగుప్తీయులతో వ్యవహరచింది కాబట్టి అబ్రాహాము ఐగుప్తీయులతో వ్యవహరించిన విధానమును గూర్చి అతడు మాట్లాడాడు. ఇశ్రాయేలు లోతు సంతతివారైన మోయాబీయులు మరియు అమ్మోనీయులతో వ్యవహరించింది కాబట్టి అతడు అబ్రాహాము మరియు లోతును గూర్చి మాట్లాడాడు. ఇశ్రాయేలు విదేశీ రాజులు మరియు కనానీయ పట్టణముల నుండి అలాంటి అనుభవములనే ఎదుర్కొన్నది కాబట్టి, అతడు తూర్పు రాజులను గూర్చి సొదొమను పాలించిన కనానీయ రాజును గూర్చి అతడు వ్రాశాడు.
మూడవదిగా, ఇశ్రాయేలు కూడా దేవునితో నిబంధనలోనికి ప్రవేశించింది కాబట్టి అబ్రాహాముతో దేవుని నిబంధనను గూర్చి మోషే వ్రాశాడు. దేవునితో అబ్రాహాము నిబంధన ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధనకు అనేక విధాలుగా ముందస్తు సూచనగా ఉంది.
నాల్గవదిగా, అబ్రాహాము ఇతర ప్రజలతో చేసిన తరువాతి సంకర్షణలను గూర్చి మోషే వ్రాశాడు. ఇశ్రాయేలు తమ దినములలో ఇలాంటి ప్రజలనే ఎదుర్కొన్నారు కాబట్టి అతడు సొదొమ గొమొర్రా ప్రజలను గూర్చి, లోతును గూర్చి, ఫిలిష్తీయుడైన అబీమెలెకును గూర్చి వ్రాశాడు: కనానీయ పట్టణములు, మోయాబీయులు మరియు అమ్మోనీయులు, మరియు ఫిలిష్తీయులు.
మరియు ఐదవదిగా, మోషే అబ్రాహాము వారసులను గూర్చి మరియు అతని మరణమును గూర్చి తన ఇశ్రాయేలీయ పాఠకులకు అనుసంధానముగా ఉండు విధముగా వ్రాశాడు. అబ్రాహాము యొక్క ప్రత్యేకమైన కుమారునిగా మరియు వారసునిగా అతడు ఇస్సాకు మీద దృష్టిపెట్టాడు ఎందుకంటే అతని ఇశ్రాయేలీయ శ్రోతలు ఇస్సాకు వారసులైయున్నారు. అతడు శారా సమాధిచేయబడిన స్థలమును గూర్చి ప్రస్తావించాడు ఎందుకంటే అది దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానము చేసిన దేశములో ఉంది. అబ్రాహాము వారసులుకాని ఇతర కుమారులను గూర్చి, ముఖ్యముగా ఇష్మాయేలును గూర్చి అతడు పస్తావించాడు, ఎందుకంటే తన దినములలోని ఇశ్రాయేలుకు ఇష్మాయేలీయులతో వ్యవహరించవలసి వచ్చింది.
కాబట్టి మోషే అబ్రాహామును గూర్చి వ్రాయుచున్నప్పుడు అతని వృత్తాంతములు మరియు తన ఇశ్రాయేలీయ శ్రోతల అనుభవాలకు మధ్య అనేక రకముల పోలికలను చూపాడు. మరియు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశము వైపుకు అతనిని వెంబడించుచుండగా వారికి ప్రాముఖ్యమైన రీతులలో మార్గదర్శకమును అందించుటకు అతడు ఇలా వ్రాశాడు.
మోషే అబ్రాహాము జీవితమును తన వాస్తవిక ఇశ్రాయేలీయ శ్రోతలతో పోల్చిన ప్రధానమైన మార్గములను మనము చూశాము గనుక, వాస్తవిక అర్థమును గూర్చి మనము మరొక ప్రాముఖ్యమైన ప్రశ్నను అడగవలసియున్నది. వాస్తవిక శ్రోతలతో చేయబడిన ఈ పోలికల యొక్క అంతర్భావములు ఏమిటి? అబ్రాహాము జీవిత వృత్తాంతముల నుండి వారు ఏమి నేర్చుకోవలసియుండెను?
ఆదికాండములో అబ్రాహాము జీవితమంత క్లిష్టమైన చరిత్రను వ్రాయుటకు ఒకరు ప్రయత్నించినప్పుడు, దాని వెనుక అనేక విధముల ప్రేరేపణలు మరియు లక్ష్యములు ఉంటాయనుటలో ఏ సందేహము లేదు. వారి వృత్తాంతములు వారి శ్రోతల మీద పలు రకములుగా ప్రభావములను చూపాలని వారు కోరతారు. వాస్తవానికి, మోషే అబ్రాహాము జీవితమును గూర్చి వ్రాసినప్పుడు, అతని ఉద్దేశములు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తిగా విభాగించుట అసాధ్యము, మరియు వాటిని కొన్ని కథనములలో వివరించుట కూడా కష్టమే అవుతుంది. అదే సమయములో, అబ్రాహామును గూర్చి తాను వ్రాసిన వృత్తాంతముల నుండి తన వాస్తవిక శ్రోతలు కనుగొంటారని మోషే ఆశించిన ముఖ్య అంతర్భావములను క్రోడీకరించుట సాధ్యమవుతుంది.
అబ్రాహాము జీవితము యొక్క వాస్తవిక అంతర్భావములను మనము మూడు దశలలో చూద్దాము. మొదటిగా, ఈ వృత్తాంతములు వాస్తవిక శ్రోతల మీద చూపవలసియుండిన సామాన్య ప్రభావమును మనము వర్ణించుదాము. రెండవదిగా, అబ్రాహాము యొక్క జీవితములోని నాలుగు ముఖ్య అంశములలో ఈ వృత్తాంతముల యొక్క ప్రభావము ఎలా కనిపించినదో మనము చూద్దాము. మరియు మూడవదిగా, అబ్రాహామును గూర్చి మోషే వ్రాసిన వృత్తాంతములలోని ఐదు దశల యొక్క వాస్తవిక అంతర్భావములను మనము క్రోడీకరిద్దాము. ఈ వృత్తాంతములు చూపవలసియుండిన సామాన్య ప్రభావమును మొదట చూద్దాము.
సామన్య పరిభాషలో, అబ్రాహాము వృత్తాంతము యొక్క ఉద్దేశ్యమును ఈ విధంగా క్రోడీకరించుట సహాయకరముగా ఉంటుంది: వారు ఐగుప్తును విడచి వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొనుటకు ఎలా కొనసాగాలో ఇశ్రాయేలుకు బోధించుటకు మోషే అబ్రాహామును గూర్చి వ్రాశాడు. మరొక మాటలో, అబ్రాహాములో తమ జీవితముల యొక్క చారిత్రిక నేపధ్యములను చూచుట ద్వారా, అబ్రాహాము వృత్తాంతములో అనుసరించవలసిన మరియు తిరస్కరించవలసిన మాదిరులను లేక ఉదాహరణలను కనుగొనుట ద్వారా, మరియు అతని జీవితము వారి జీవితములకు ముందస్తు సూచనగా ఎలా ఉన్నదో వివేచించుట ద్వారా, మోషేను అనుసరించిన ఇశ్రాయేలీయులు దేవుడు తమ పట్ల కలిగియున్న ఉద్దేశమును ఏ విధంగా వెదకాలో చూడగలిగారు.
లేఖనము యొక్క సాక్ష్యముపై మనము నిశ్చయత కలిగియుండగలిగినప్పటికీ, ఆదికాండము గ్రంథము మోషే దినముల నుండి వెలువడిందని యేసు స్వయంగా చెప్పినప్పటికీ, నేడు మన వద్ద ఉన్న విధముగా ఈ వృత్తాంతములను ఖచ్చితముగా మోషే ఎప్పుడు వ్రాసి ముగించాడో మనకు నిర్థారణ లేదు. ఏది ఏమైనా, అబ్రాహాము చరిత్రను గూర్చి వ్రాసినప్పుడు మోషే కలిగియుండిన ముఖ్య ఆలోచన ఏ తరమువారికైనా ఒకే విధముగా ఉంటుంది అని మాత్రం మనము చెప్పవచ్చు. వారి హృదయములను ఐగుప్తు మీద నుండి వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొనుట వైపుకు మరల్చుటకు అతడు అబ్రాహామును గూర్చి వ్రాశాడు.
వాస్తవిక శ్రోతల కొరకు ఈ సామాన్య అంతర్భావమును గూర్చి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఐగుప్తుకు మరిఎన్నడు తిరిగివెళ్లకూడదని మరియు కనానును స్వాధీనపరచుకొనుటలో జయమును పొందాలని తనను అనుసరించుచున్న ఇశ్రాయేలు దేశమును ప్రోత్సహించుటకు మోషే వ్రాశాడు మరియు ఈ విస్తృత అంతర్భావము అబ్రాహాము జీవితము యొక్క ఆధునిక అనువర్తనలో మనకు సహాయపడుతుంది. క్రైస్తవులముగా మనము ప్రయాణములో ఉన్నాము, ఇది మోషే దినములలో ఇశ్రాయేలు ఆరంభించిన ప్రయాణమును ముగించే ప్రయాణమైయున్నది. మనము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి వైపుకు ప్రయాణం చేయుచున్నాము. కాబట్టి, మనము అబ్రాహాము వృత్తాంతములను మన జీవితములకు సరిగా అనువర్తించుకొనుటకు, కనాను వైపుకు సాగిపొమ్మని అవి వాస్తవిక శ్రోతలను హెచ్చరించిన విధానముల మీద మనము దృష్టిని నిలపాలి.
ఈ విశేషమైన దృష్టిని వివరించుటకు, ఆదికాండములోని ఈ భాగములో మనము ఇప్పటికే గుర్తించిన నాలుగు ముఖ్య అంశములను మరలా జ్ఞాపకము చేసుకొనుట ద్వారా మనము మోషే ఉద్దేశమును చూడాలి.
పితరుల చరిత్రలోని ఈ భాగమునకు పొందికను ఇచ్చు కనీసం నాలుగు అంశాలను ఆది. 12:1-3 తెలియజేస్తుంది అని ఈ పాఠములో ఇంతకు ముందు సూచించిన విషయము మీకు జ్ఞాపకముండే ఉంటుంది. ఈ నాలుగు అంశములు మోషే తన వృత్తాంతముల నుండి ఆశించిన కేంద్ర ప్రభావమును వ్యక్తపరుస్తాయి. మొదటిగా, అబ్రాహాముకు ఇవ్వబడిన దేవుని కృప మీద అతడు దృష్టి పెట్టాడు; రెండవదిగా, అబ్రాహాము చూపిన స్వామిభక్తి మీద అతడు దృష్టిపెట్టాడు; మూడవదిగా, అబ్రాహాముకు ఇవ్వబడిన ఆశీర్వాదముల మీద అతడు దృష్టిపెట్టాడు; మరియు నాల్గవదిగా, అబ్రాహాము ద్వారా కలుగు ఆశీర్వాదము మీద అతడు దృష్టిపెట్టాడు. అబ్రాహామును గూర్చి వ్రాయుట వెనుక మోషే యొక్క వాస్తవిక ఉద్దేశమును గూర్చి ఈ నాలుగు ఉద్దేశముల దృష్ట్యా ఆలోచన చేయుట సహాయకరముగా ఉంటుంది.
మొదటిగా, అబ్రాహాము పట్ల దేవుడు కనికరము చూపిన విధానములను గూర్చి మోషే వ్రాశాడు.
విస్తృతమైన పదజాలములో, దేవునితో తన అనుబంధము యొక్క ఆరంభ దినములలో మరియు తన జీవితకాలమంతా దినదినము అబ్రాహాముకు దేవుడు గొప్ప కృపను చూపాడని మనము ఇప్పటికే చూశాము. దేవుడు వారికి కూడా గొప్ప కృపను చూపాడని మోషే దినములలోని ఇశ్రాయేలీయులకు తెలియపరచుటకు దైవిక కృప అను ఉద్దేశము రూపొందించబడింది. వారిని ఐగుప్తు నుండి సీనాయి యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆయన వారికి ఆరంభ కృపను చూపాడు. తరువాత దినదినము, వారిని భవిష్యత్తులో కనానును స్వాధీనపరచుకొనుటకు సిద్ధపరచుచుండగా కూడా ఆయన కనికరమును చూపుట కొనసాగించాడు.
నిర్గమ. 19:4లో సీనాయి యొద్ద దేవుడు పలికిన సుపరిచితమైన మాటలు దేవుని కృపను గూర్చి ఈ విధంగా మాట్లాడతాయి:
నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి (నిర్గమ 19:4).
విచారకరముగా, మోషే నాయకత్వం వహించిన ఇశ్రాయేలీయులు దేవుని యొద్ద నుండి ఎంత కృపను పొందుకున్నారో మరచిపోయారు. వారిని ఐగుప్తులోని వసతుల నుండి దూరముగా తీసుకొని వచ్చుట ద్వారా దేవుడు మరియు మోషే వారిని మోసం చేశారు అని వారు ఆరంభములో ఫిర్యాదులు చేశారు. అరణ్యములో ఆహారము మరియు నీటి కొరకు వాదించారు. వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొనుటకు వెళ్లమని వారిని పిలచుట ద్వారా దేవుడు వారిని శక్తిని మించిన పని చేయుట కొరకు పిలిచాడని వారనుకున్నారు. కాబట్టి, దేవుడు వారిని దీవించిన విధానములను, తరచుగా దేవుడు వారిపట్ల చూపిన కనికరమును తన వాస్తవిక శ్రోతలకు జ్ఞాపకము చేయుటకు దేవుడు అబ్రాహాముకు కనికరమును చూపిన విధానములను మోషే మరలా మరలా నొక్కి చెప్పాడు.
రెండవదిగా, తన ఆజ్ఞలకు విధేయుడగునట్లు దేవుడు అబ్రాహామును బాధ్యునిగా ఎంచిన అనేక మార్గముల వైపుకు దృష్టిని ఆకర్షించుట ద్వారా అబ్రాహాము చూపిన స్వామిభక్తిని కూడా మోషే ఉద్ఘాటించాడు అని మనము చూశాము. తనను అనుసరించిన ఇశ్రాయేలీయుల కొరకు కూడా ఈ విషయము ఔచిత్యముగా ఉన్నది గనుక, ఆయన ఆజ్ఞలకు పితరుడు నమ్మకత్వము చూపాలని దేవుడు ఆశించిన విషయమును మోషే మరలా మరలా ఉద్ఘాటించాడు. స్వామిభక్తిని చూపవలసిన అవసరత మీద దృష్టి మోషే దినమున నివసించిన ఇశ్రాయేలుతో కూడా మాట్లాడింది. నిర్గమ. 19:4-5లో సీనాయి పర్వతము యొద్ద దేవుడు మోషేతో మాట్లాడుట కొనసాగించిన విధానమును వినండి:
నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్మునెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు (నిర్గమ 19:4-5).
స్వకీయ సంపాద్యముగా ఉండు ఆశీర్వాదము ఇశ్రాయేలు చూపు నమ్మకత్వము మీద ఆధారపడి ఉన్నదను విషయమును ఇక్కడ గమనించండి. దేవుడు దేశమునకు ఎంతో కనికరమును చూపినప్పటికీ, ప్రతి తరములోని ప్రతి వ్యక్తి యొక్క హోదా దేవుని ఆజ్ఞలకు వారు ఎలా స్పందిస్తారు అనుదాని మీద ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు, మనము ఇంతకు ముందు చూసినట్లుగా, కనాను దేశమునకు వెళ్లుట అబ్రాహామునకు ఇవ్వబడిన ముఖ్యమైన బాధ్యత. ఇశ్రాయేలు కూడా తనను వెంబడించి కనాను దేశము వైపుకు ప్రయాణించాలనే ఆశతో మోషే ఈ బాధ్యతను నొక్కి చెప్పాడు. అవును, అబ్రాహాము యొక్క ఇతర బాధ్యతలను గూర్చి మోషే వ్రాయుచుండగా, తన దినములలోని ఇశ్రాయేలీయులకు వారు కలిగియుండిన అనేక ఇతర బాధ్యతలను గూర్చి బోధించుటకు వాటిని వ్రాశాడు. అబ్రాహాము అనేక విధములుగా చూపవలసియుండిన స్వామిభక్తి వాస్తవిక శ్రోతలు కూడా దేవుని ఆజ్ఞలకు విధేయులుగా, నమ్మకముగా ఉండాలను సత్యమును గూర్చి సూటిగా మాట్లాడింది.
మూడవదిగా, అబ్రాహాముకు దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదములు అను అంశము యొక్క ప్రాముఖ్యతను కూడా మనము చూశాము. అబ్రాహామును గూర్చి తాను వ్రాసిన వృత్తాంతములలో, గొప్ప దేశమును గూర్చి వాగ్దానము చేయబడిన ఆశీర్వాదముల మీద, ఐశ్వర్యము మీద మరియు అబ్రాహాము, అతని వారసులు పొందు గొప్ప పేరు మీద మోషే దృష్టిపెట్టాడు. మరియు ఈ ఆశీర్వాదముల యొక్క ముందురుచిని అబ్రాహాము స్వయంగా తన జీవిత కాలములో అనుభవించినట్లు అనేక సందర్భాలలో మనము చూస్తాము. అనేక ఇతర సందర్భాలలో, రానున్న తరములలో ఈ ఆశీర్వాదముల యొక్క భవిష్యత్ నెరవేర్పు మీద అబ్రాహాము వృత్తాంతములు దృష్టిపెట్టాయి. అబ్రాహాము ఆశీర్వాదముల మీద మోషే ఈ విధముగా దృష్టి ఎందుకు పెట్టాడంటే, ఈ వాగ్దానములు అబ్రాహాము వారసులకు, అనగా మోషే నడిపించిన ఇశ్రాయేలు ప్రజలకు కూడా చెందియుండినవి. ఇశ్రాయేలు ప్రజలకు కూడా గొప్ప ఆశీర్వాదములు వాగ్దానం చేయబడినవి. వాగ్దాన దేశములోనికి ప్రవేశించినప్పుడు వారు గొప్ప దేశమైయుండాలి, మునుపెన్నడూ చూడని ఐశ్వర్యమును అనుభవించాలి, మరియు గొప్ప పేరును పొందుకోవాలి.
వాస్తవానికి, అబ్రాహాము వలెనె, ఆదికాండము గ్రంథము వ్రాయబడిన సమయానికే ఇశ్రాయేలు ఈ ఆశీర్వాదముల యొక్క అనేక ముందు రుచులను అనుభవించింది. ఈ వాగ్దానములలో కొన్ని వారి జీవితములలో నెరవేర్చబడుటను వారు చూచుట ఆరంభించారు. అయినను, వారు వాగ్దాన భూమిలోనికి ప్రవేశించిన తరువాత భవిష్యత్తులో నెరవేరబోవు ఆశీర్వాదములు కూడా చాలా ఉండినవి. నిర్గమ. 19:6లో సీనాయి యొద్ద దేవుడు ఇశ్రాయేలు కొరకు దాచియుంచబడిన ఈ భవిష్యత్ ఆశీర్వాదములను గూర్చి మాట్లాడాడు:
...మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను ఉందురు (నిర్గమ 19:6).
తన దినములలోని ఇశ్రాయేలు యొక్క నిరీక్షణను బలపరచుటకు మోషే దేవుడు అబ్రాహాముకు వాగ్దానము చేసిన ఆశీర్వాదములను గూర్చి వ్రాశాడు. పితరునికి ఇవ్వబడిన దేవుని వాగ్దానములను గూర్చి వారు చదివినప్పుడు, వారి కొరకు కూడా దేవుడు గొప్ప ఆశీర్వాదములను ఏ విధంగా దాచిపెట్టాడో వారు స్పష్టముగా చూశారు.
నాల్గవదిగా, పితరుని ద్వారా సర్వలోకమునకు దేవుని ఆశీర్వాదములు ఇవ్వబడతాయని అబ్రాహామును గూర్చిన వృత్తాంతములు బయలుపరచినట్లు కూడా మనము చూశాము. మీకు జ్ఞాపకమున్నట్లయితే, అబ్రాహాము ద్వారా కలుగు ఆశీర్వాదములు సులువైన విధానములో కలుగవు. అబ్రాహాము స్నేహితులను ఆశీర్వదించుట ద్వారా మరియు అతని విరోధులను శపించుట ద్వారా దేవుడు అబ్రాహాముకు జయమును అనుగ్రహిస్తాడని ఆది. 12:3లో మనము చదువుతాము. విభిన్నమైన ఉపాఖ్యానములలో, వేర్వేరు దేశములకు ప్రాతినిధ్యం వహించిన ఇతర ప్రజలతో సంకర్షించుట ద్వారా అబ్రాహాముకు తన జీవిత కాలములోనే ఈ ప్రక్రియ యొక్క ముందు రుచిని దేవుడు ఏ విధంగా ఇచ్చాడో మోషే తెలియజేశాడు. అబ్రాహాము జీవితమును గూర్చి తాను వ్రాసిన వృత్తాంతములలోని అనేక సందర్భములలో, అనేక నెరవేర్పులు భవిష్యత్తులో జరుగుతాయని మోషే సూచించాడు.
తన దినములలో తనను అనుసరించిన ఇశ్రాయేలు ప్రజలకు ఇది ఎంతో ఔచిత్యమైనదిగా ఉండెను గనుక మోషే ఈ ఉద్దేశమును ఉద్ఘాటించాడు. ఇతరులకు ఆశీర్వాదముగా ఉండుటలో దేవుడు వారికి జయమును నిశ్చయించాడు ఎందుకంటే ఆయన వారి స్నేహితులను దీవిస్తాడు మరియు విరోధులను శపిస్తాడు. తమ దినములలో అనేకమంది ప్రజలతో సంకర్షించుచుండగా వారు కూడా ఈ వాగ్దానముల యొక్క ముందు రుచులను అనుభవించారు. వారి స్నేహితులను దేవుడు దీవించుటను మరియు వారి విరోధులను పలు సందర్భాలలో శపించుటను వారు అప్పటికే చూశారు. అంతేగాక, వారు వాగ్దాన దేశములోనికి ప్రవేశించుచుండగా మరియు దేవుని రాజ్యమును భూదిగంతముల వరకు వ్యాపింపజేయుచుండగా భవిష్యత్ నెరవేర్పుల వైపుకు కూడా ఇశ్రాయేలీయుల కన్నులను త్రిప్పుటకు మోషే ఈ విషయముల మీద దృష్టిపెట్టాడు. మనము ఇంతకు ముందే చూసినట్లు, నిర్గమ. 19:6లో దేవుడు ఇశ్రాయేలుతో ఈ మాటలు చెప్పాడు:
...మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను, పరిశుద్ధమైన జనముగాను ఉందురు (నిర్గమ 19:6).
యాజక రూపకమైన రాజ్యముగా ఒక దేశమును గూర్చిన దర్శనము కేవలం దేశము మాత్రమే దేవుని సేవించు పరిశుద్ధ జనాంగముగా ఉండు ధన్యతతో దీవించబడుతుంది అని మాత్రమే సూచించదుగాని, ఇశ్రాయేలు పిల్లలు కూడా లోకమంతా దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చుతారు అని కూడా సూచిస్తుంది. వాగ్దాన దేశము వైపుకు ప్రయాణమును కొనసాగించమని మోషే ఇశ్రాయేలును ప్రేరేపించినప్పుడు, తన రాజ్యమును, తద్వారా తన దీవెనలను లోకమంతటా వ్యాప్తిపరచుకొనుటకు దేవుడు ఇశ్రాయేలును వాడుకొను దర్శనమును వారిలో కలిగించు విధముగా అబ్రాహామును గూర్చి తాను వ్రాసిన వృత్తాంతములు రూపొందించబడినవి.
వాస్తవిక శ్రోతల కొరకు అబ్రాహాము జీవితములోని నాలుగు ముఖ్యమైన అంశముల యొక్క అంతర్భావములను మనము చూశాము కాబట్టి, ఆదికాండములో నమోదుచేయబడిన విధముగా పితరుని యొక్క జీవిత నిర్మాణములోని ప్రతి ప్రాముఖ్యమైన దశను చూచుట ద్వారా వాస్తవిక శ్రోతల మీద అబ్రాహాము వృత్తాంతముల యొక్క ప్రభావమును క్రోడీకరిద్దాము.
అబ్రాహాము జీవితమును గూర్చిన వృత్తాంతములు ఐదు ముఖ్యమైన దశలుగా విభాగించబడిన విషయము మీకు జ్ఞాపకముండియుంటుంది. మొదటిగా, 11:10-12:9లో అబ్రాహాము యొక్క నేపధ్యము మరియు ఆరంభ అనుభవాలు; రెండవదిగా, 12:10-14:24లోని ఇతర ప్రజల ప్రతినిధులతో అబ్రాహాము చేసిన ఆరంభ సంకర్షణలు; మూడవదిగా, 15:1-17:27లో అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన; నాల్గవదిగా, 18:1-21:34లో అబ్రాహాము ఇతర ప్రజల ప్రతినిధులతో చేసిన తరువాతి సంకర్షణలు; మరియు ఐదవదిగా, 22:1-25:18లో అబ్రాహాము వారసులు మరియు అతని మరణము.
ఈ ప్రధానమైన దశలలో ప్రతి ఒక్కటి అనేక చిన్న భాగములుగా లేక ఉపాఖ్యానములుగా విభజించబడుతుంది. ఈ ఉపాఖ్యానముల యొక్క ముఖ్య విషయములను మరియు మోషే వ్రాసిన వాస్తవిక శ్రోతల కొరకు ఈ ఉపాఖ్యానములను కలిగియుండిన కొన్ని ప్రాముఖ్యమైన అంతర్భావములను మనము క్లుప్తంగా క్రోడీకరిద్దాము.
అబ్రాహాము జీవితములోని మొదటి దశ, అనగా అతని నేపధ్యము మరియు ఆరంభ అనుభవాలు, అబ్రాహాము కుటుంబమును గూర్చి మరియు అబ్రాహామును దేవుడు మొట్టమొదటిగా పరిచర్య కొరకు పిలచిన సమయమును గూర్చి అనేక విషయములను నివేదిస్తాయి. సామాన్యమైన మాటలలో, అబ్రాహాము జీవితములోని ఈ సన్నివేశముల ద్వారా వారి కుటుంబ నేపధ్యమును గూర్చి మరియు దేవుడు వారికి ఇచ్చిన పిలుపును గూర్చి అతని వాస్తవిక ఇశ్రాయేలీయ శ్రోతలు నేర్చుకోగల విషయములను తెలియజేయుటకు మోషే ఈ మొదటి దశను రూపొందించాడు.
మొదటి దశ మూడు ఉపాఖ్యానములుగా లేక భాగములుగా విభజించబడుతుంది. అబ్రాహాము జీవితము 11:10-26లో దేవుని-కనికరమును పొందిన అబ్రాహాము యొక్క వంశమును పరిచయం చేయు వంశావళితో ఆరంభమవుతుంది. అబ్రాహాము షేము కుటుంబములో, అనగా దేవునిచే విశేషముగా యేర్పరచబడిన ప్రజలుగా ఒక ప్రత్యేకమైన కుటుంబములో, పతాక పాత్రగా ఉన్నాడని ఈ వచనములు తెలియజేస్తాయి. అబ్రాహాము వంశావళి వలెనె తాము కూడా దేవుని కనికరము పొందిన వంశముగా ఉన్నామని ఈ వంశావళి మోషే యొక్క వాస్తవిక ఇశ్రాయేలీయ శ్రోతలకు జ్ఞాపకము చేసియుండాలి. వారు దేవుడు ఏర్పరచుకొనిన విశేషమైన ప్రజలైయుండిరి.
11:27-32లో, అబ్రాహాము నేపధ్యము మరియు ఆరంభ అనుభవాలను గూర్చిన రెండవ ఉపాఖ్యానము కూడా ఒక వంశావళి అయ్యున్నది. క్లుప్తంగా, తెరహు కనాను దేశమునకు వెళ్లుటకు ప్రయత్నించి విఫలమైన ఒక విగ్రహారాధికుడని ఈ వాక్య భాగము సూచిస్తుంది. మోషే యొక్క వాస్తవిక శ్రోతలు తమ పరిస్థితులు మరియు అబ్రాహాము పరిస్థితుల మధ్య పోలికలను సులువుగా గుర్తించియుంటారు. తమ తల్లిదండ్రులు కూడా విగ్రహారాధన చేసి కనాను దేశమునకు చేరుటలో విఫలమైయ్యారు. కాబట్టి, అబ్రాహాము తన తండ్రి చేసిన తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్తపడిన విధముగానే, మోషేను అనుసరించిన ఇశ్రాయేలీయులు కూడా తమ తల్లిదండ్రులు, అనగా కనానును చేరుటకు విఫలమైన విగ్రహారధికులైన నిర్గమము తరువాత మొదటి తరమువారు, చేసిన తప్పులను పునరావృతం చేయకుండా జాగ్రత్తపడాలి.
అబ్రాహాము నేపధ్యము మరియు ఆరంభ అనుభవాలు తరువాత 12:1-9లో అబ్రాహాము కనానుకు ప్రవాసముగా వెళ్లిన వృత్తాంతమును తెలియజేస్తాయి. దేవుడు అబ్రాహామును కనాను దేశమునకు పిలిచాడు, మరియు అనేక కష్టముల మధ్యలో కూడా అబ్రాహాము దేవుని పిలుపుకు విధేయుడయ్యాడు. ఇంచుమించు ఇదే విధముగా, దేవుడు మోషే యొక్క వాస్తవిక ఇశ్రాయేలీయ శ్రోతలను కనాను దేశమునకు పిలిచాడు, మరియు వారు కూడా అనేక కష్టముల మధ్యలో విధేయులవ్వవలసియుండెను. కాబట్టి అబ్రాహాము కనానుకు వలస వెళ్లిన వృత్తాంతము మోషే దినములలోని ఇశ్రాయేలీయులు అబ్రాహాము అడుగుజాడలలో నడిచి అతని వలె కనాను దేశమునకు ప్రవాసులై వెళ్లాలను వాస్తవిక అంతర్భావములను కలిగియుండెను.
ఈ మూడు భాగముల ద్వారా, మోషే అబ్రాహాము జీవితమును పరిచయం చేసి, తన వాస్తవిక శ్రోతలు దేవుని సేవలో అనేక సవాళ్లను ఎదుర్కొనుచుండగా వారికి ప్రాముఖ్యమైన మార్గదర్శకమును అనుగ్రహించాడు.
అబ్రాహాము జీవితమును గూర్చిన అబ్రాహాము వృత్తాంతములోని రెండవ ప్రాముఖ్యమైన దశ ఇతర ప్రజలతో పితరుడు చేసిన ఆరంభ సంకర్షణల మీద దృష్టిపెడుతుంది. వాస్తవిక ఇశ్రాయేలీయ శ్రోతలు ఇతరులతో వ్యవహరించుచుండగా వారికి మార్గదర్శకమును ఇచ్చుటకు పితరుడు ఇతర ప్రజల గుంపులతో అనేక విధాలుగా సంకర్షించిన విధానమును ఈ అధ్యాయములు తెలియజేస్తాయి.
మొదటి ఉపాఖ్యానములో, ఐగుప్తు నుండి అబ్రాహాము యొక్క విమోచనను గూర్చి ఆది. 12:10-20లో మోషే వర్ణించాడు. కరువు కారణంగా పితరుడు ఐగుప్తుకు వెళ్లిన విషయము మీకు జ్ఞాపకముండే ఉంటుంది, కాని దేవుడు ఫరో కుటుంబము మీదికి రోగములను పంపుట ద్వారా అతనిని ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించాడు. దేవుని గొప్ప విమోచన వలన అబ్రాహాము ఐగుప్తును గొప్ప ఐశ్వర్యముతో విడిచి, మరలా అక్కడికి తిరిగివెళ్లలేదు. ఐగుప్తు తన గృహము కాదని అబ్రాహాము స్పష్టముగా నేర్చుకున్నాడు.
తమ సొంత అనుభవాలు అనేక విధాలుగా అబ్రాహాము వృత్తాంతమును ప్రతిబింబించాయని మోషే యొక్క వాస్తవిక ఇశ్రాయేలీయ శ్రోతలు చూడగలిగారు. వారు కూడా కరువు కారణంగా ఐగుప్తుకు వెళ్లారు, ఐగుప్తీయుల మీద దేవుడు రోగములను పంపినప్పుడు వారు కూడా విడుదల పొందారు, మరియు వారు ఐగుప్తీయుల నుండి గొప్ప ఐశ్వర్యమును పొందుకొని ఐగుప్తును విడిచిపెట్టారు. విచారకరముగా, ఇశ్రాయేలీయులు తమ ప్రయాణాలలో కష్టములను ఎదుర్కున్నప్పుడు, అనేకమంది ఐగుప్తు జీవితమును సౌకర్యవంతమైనదిగా భావించి తిరిగివెళ్లాలని కోరారు. ఐగుప్తు తమ గృహము కాదని ఈ ఉపాఖ్యానము వాస్తవిక శ్రోతలకు స్పష్టము చేసియుండాలి. దేవుడు వారిని కృపతో విమోచించిన విధానమును వారు జ్ఞాపకము చేసుకొని, ఐగుప్తును మరియు ఐగుప్తీయులను విడచిపెట్టవలసియుండెను.
అబ్రాహాము యొక్క ఆరంభ సంకర్షణలలోని రెండవ భాగము 13:1-18లో లోతుతో సంఘర్షణను గూర్చిన వృత్తాంతమైయున్నది. ఇది అబ్రాహాము మనుష్యులు మరియు లోతు మనుష్యుల మధ్య జరిగిన సంఘర్షణను గూర్చిన సుపరిచితమైన వృత్తాంతమైయున్నది, ఇక్కడ రెండు గుంపుల వారు తమ గొర్రెల కొరకు ప్రాకృతిక నిధుల విషయములో గొడవపడ్డారు. ఈ సంఘర్షణలో, అబ్రాహాము లోతుతో దయతో వ్యవహరించి, అతనికి నచ్చిన స్థలములో సమాధానముతో నివసించుటకు లోతుకు అనుమతి ఇచ్చాడు. ఆదికాండము యొక్క వాస్తవిక శ్రోతలకు ఈ వృత్తాంతము యొక్క అర్థమును గ్రహించుట అంత కష్టమైయ్యుండదు. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము ప్రకారం, వారు వాగ్దాన దేశము వైపుకు ప్రయాణము చేయుచుండగా లోతు వారసులతో దయతో వ్యవహరించమని, వారు తమ పితరుల దేశములో సమాధానముతో జీవించుటకు అనుమతించమని మోషే ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఫలితంగా, అబ్రాహాము లోతు పట్ల చూపిన దయ ఇశ్రాయేలీయులు తమ దినములలో మోయాబీయులతో ఏ విధంగా వ్యవహరించాలో చూపింది.
ఇతరులతో అబ్రాహాము చేసిన ఆరంభ సంకర్షణల యొక్క మూడవ ఉపాఖ్యానము 14:1-24లో ఉన్న అబ్రాహాము లోతును రక్షించుటను గూర్చిన వృత్తాంతమైయున్నది. అబ్రాహాము దూరము నుండి వచ్చిన బలమైన, నియంత రాజులను ఏ విధముగా ఓడించాడో, మరియు ఈ నియంత రాజుల నుండి రక్షించుట ద్వారా అతడు లోతు పట్ల మరింత దయను ఏ విధంగా చూపాడో ఈ క్లిష్టమైన వృత్తాంతము వర్ణిస్తుంది. మోషేను అనుసరించుచున్న ఇశ్రాయేలీయులతో ఈ వృత్తాంతము చాలా స్పష్టముగా మాట్లాడింది. ఇశ్రాయేలు లోతు వంశము వారైన మోయాబీయుల మరియు అమ్మోనీయుల దేశముల గుండా సంచరించుచుండగా, ఇశ్రాయేలు సైన్యము నియంతలైన అమోరీయుల రాజైన సిహోనును, బాషాను రాజైన ఓగును ఓడించారు, వీరిరువురు మోయాబీయులను మరియు అమ్మోనీయులను అణగద్రొక్కినవారే. ఈ విధంగా మోయాబీయులను మరియు అమ్మోనీయులను విడిపించుట ద్వారా, అబ్రాహాము వారి కొరకు స్థాపించిన మాదిరిని ఇశ్రాయేలు అనుసరించింది.
ఈ విధంగా అబ్రాహాము జీవితము యొక్క ఈ దశలోని ప్రతి ఉపాఖ్యానములో, ఇశ్రాయేలు తమ కాలములో అనుసరించవలసిన మాదిరిగా అబ్రాహాము పరిచయం చేయబడ్డాడు.
ఇప్పుడు అబ్రాహాము జీవితము యొక్క మూడవ ప్రధానమైన దశలోనికి మనము వచ్చాము, 15:1-17:27లో దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధన. సామాన్య పరిభాషలో, దేవునితో ఇశ్రాయేలు యొక్క నిబంధన అనుబంధము యొక్క స్వభావమును బయలుపరచు విధానాలలో దేవుడు పితరునితో చేసిన నిబంధన మీద ఈ దశ దృష్టిపెడుతుంది. ఈ అధ్యాయములు మూడు ముఖ్య భాగములుగా విభజించబడతాయి.
15:1-21లో అబ్రాహాముకు ఇవ్వబడిన దేవుని నిబంధన వాగ్దానముల మీద మొదటి ఉపాఖ్యానము దృష్టిపెడుతుంది. ఈ అధ్యాయము అబ్రాహాము దేవునితో నిబంధనలోనికి ప్రవేశించిన సమయమును గూర్చి సుపరిచితమైన కథనమైయున్నది. అబ్రాహాముకు వారసులను మరియు దేశమును ఇస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. విశేషంగా, అబ్రాహాముకు లెక్కింపజాలని వారసులు ఉంటారని, మరియు కొంతకాలము పరాయి దేశములో హింసించబడిన తరువాత, అబ్రాహాము వారసులు వాగ్దాన దేశములోనికి తీసుకొనిరాబడతారని దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో అదే విధమైన నిబంధనను చేశాడని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకము చేయు విధముగా ఈ వాక్యభాగము రూపొందించబడింది. అంతేగాక, వారు స్వయంగా అబ్రాహాముతో దేవుడు చేసిన వాగ్దానముల యొక్క నెరవేర్పును అనుభవించుచున్నారని అది వారికి చూపింది. ఇశ్రాయేలీయులు అబ్రాహాముకు వాగ్దానము చేయబడిన వారసులైయున్నారు, మరియు దేవుడు పితరునికి వాగ్దానము చేసిన అదే దేశములోనికి వారు తిరిగి వెళ్లుచున్నారు. ఈ వాస్తవములను సందేహించుట దేవుడు కృపతో అబ్రాహాముతో చేసిన మరియు మోషేకు పునరుద్ఘాటించిన నిబంధన వాగ్దానములను సందేహించుట అవుతుంది.
అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన మీద దృష్టిపెట్టు రెండవ ఉపాఖ్యానము 16:1-6లో హాగరు విషయములో పితరుడు విఫలమైన విషయమును గూర్చినది. శారా యొక్క ఐగుప్తీయురాలైన దాసియైన హాగరు ద్వారా బిడ్డను కనుటకు ప్రయత్నించుట ద్వారా అబ్రాహాము మరియు శారా దేవుని నిబంధన వాగ్దానముల నుండి తొలగిపోయిన విధానమును ఈ విచారకరమైన వృత్తాంతము జ్ఞాపకము చేసుకుంటుంది. దేవుని నిబంధన వాగ్దానములను నమ్ముటలో అబ్రాహాము మరియు శారా విఫలమైయ్యారు, కాని అబ్రాహాము యొక్క నిజమైన సంతతిగా బాలుడైన ఇష్మాయేలును అంగీకరించుటకు నిరాకరించుట ద్వారా దేవుడు వారి యొక్క ప్రత్యామ్నాయ ప్రణాళికను తిరస్కరించాడు. మోషే యొక్క వాస్తవిక శ్రోతలు దేవుని నిబంధన వాగ్దానముల నుండి మరలా మరలా తొలగిపోయి, ఐగుప్తు సౌకర్యములను ఆశించారు. అబ్రాహాము ప్రణాళిక తిరస్కరించబడిన విధముగానే, దేవుని ప్రణాళికలకు వారు వెదకుచున్న ప్రత్యామ్నాయాలు కూడా తిరస్కరించబడతాయని అబ్రాహాము జీవితములోని ఈ వృత్తాంతము వారికి నేర్పించింది.
అబ్రాహాముతో దేవుడు చేసిన నిబంధన మీద దృష్టిపెట్టు మూడవ ఉపాఖ్యానము 17:1-27లోని అబ్రాహాము యొక్క నిబంధన అవసరతను గూర్చినది. ఈ వాక్యభాగములో, దేవుని ప్రణాళికను అనుసరించుటలో విఫలమైన పితరుని దేవుడు ప్రశ్నించాడు. అబ్రాహాము మరియు అతని కుమారులు అనుసరించవలసిన నిబంధన చిహ్నముగా సున్నతిని స్థాపించుట ద్వారా దేవుడు నిబంధనలో నమ్మకత్వము చూపవలసిన అవసరతను నొక్కి చెప్పాడు. ఈ చిహ్నము ద్వారా, తన నిబంధన అనుబంధము స్వామిభక్తి చూపవలసిన బాధ్యత మీద ఆధారపడి ఉంటుందని, మరియు స్వామిభక్తి గొప్ప ఆశీర్వాదములను కలిగిస్తుందని దేవుడు అబ్రాహాముకు జ్ఞాపకము చేశాడు. తన దినములలోని ఇశ్రాయేలీయులు నమ్మకముగా ఉండుటలో విఫలమైనందు వలన వారిని నిలదీయుటకు మరియు ఇశ్రాయేలీయులు నిబంధన నమ్మకత్వమును చూపవలసిన అవసరతను పునరుద్ఘాటించుట ద్వారా మోషే అబ్రాహాము నిబంధనలోని ఈ విషయమును జ్ఞాపకము చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులు తమ నిబంధన దేవునికి నమ్మకముగా ఉంటేనే, వారు ఆయన ఇచ్చు గొప్ప ఆశీర్వాదముల కొరకు నిరీక్షించగలరు.
కాబట్టి, అబ్రాహాము జీవితములోని కేంద్ర భాగము, అనగా దేవునితో అతని నిబంధన, దేవుడు ఇశ్రాయేలుకు ఇచ్చిన అమోఘమైన వాగ్దానముల కృప వైపుకు దృష్టిని ఆకర్షించింది. అంతేగాక తమ నిబంధన దేవుని నమ్మకముగా సేవించుటకు వారు బద్ధులైయున్నారు అని కూడా ఇది అతని శ్రోతలకు జ్ఞాపకము చేసింది.
ఇప్పుడు మనము అబ్రాహాము జీవితము యొక్క నాల్గవ దశలోనికి ప్రవేశించాము: 18:1-21:34లో అతడు ఇతరులతో చేసిన తరువాతి సంకర్షణలు. ఈ అధ్యాయములలో, మోషే దినములలో నివసించిన ప్రజలకు సంబంధించిన అనేకమంది ప్రజలను అబ్రాహాము ఎదుర్కొన్నాడు. అబ్రాహాము కనానులో నివసించిన సొదొమ గొమొర్రా ప్రజలను, లోతు, అబీమెలెకు, మరియు ఇష్మాయేలును ఎదుర్కొన్నాడు. సామన్య పరిభాషలో, అబ్రాహాము ఈ ప్రజలతో చేసిన సంకర్షణలు తమ దినములలో నివసించిన కనానీయులతో, మోయాబీయులతో మరియు అమ్మోనీయులతో, ఫిలిష్తీయులతో మరియు ఇష్మాయేలీయులతో ఎలా వ్యవహరించాలో ఇశ్రాయేలుకు నేర్పించాయి.
పితరుని జీవితమును గూర్చిన ఈ భాగము యొక్క మొదటి వృత్తాంతము 18:1-19:38లో సొదొమ గొమొర్రాలను గూర్చిన కథనమైయున్నది. దుష్టమైన కనానీయ పట్టణములకు విరోధముగా కలుగు దైవిక తీర్పు అను ముప్పును గూర్చి ఈ సుపరిచితమైన కథనము తెలియజేస్తుంది. ఈ పట్టణములలో ఉన్న నీతిమంతులను గూర్చి, పట్టణముల నాశనమును గూర్చి మరియు లోతును విడిపించుటను గూర్చి అబ్రాహాము కలిగియుండిన ఆందోళనను గూర్చి ఇది తెలియజేస్తుంది. మోషే యొక్క వాస్తవిక శ్రోతలు ఎదుర్కొన్న పరిస్థితిని గూర్చి ఈ సన్నివేశములు సూటిగా మాట్లాడాయి. తమ దినమున నివసించిన ప్రజలకు ఏమి జరుగుతుందో అర్థము చేసుకొనుటలో అవి వారికి సహాయం చేశాయి: కనానీయులకు విరోధముగా దేవుని ముప్పు, కనానీయులలో ఉన్న నీతిమంతుల పట్ల వారు చూపవలసిన కనికరము (యెరికో పట్టణములో తాము ఎదుర్కొనవలసియుండిన రాహాబు వంటివారు), కనానీయ పట్టణముల మీద నిశ్చయముగా వచ్చుచుండిన నాశనము, లోతు వారసులైన మోయాబీయులు మరియు అమ్మోనీయులతో వారి సంబంధములు.
అబ్రాహాము యొక్క తరువాతి సంకర్షణలోని రెండవ భాగము 20:1-8లో ఉన్నది. ఈ వృత్తాంతములో మరొకసారి ఆ దేశములో నివసించిన ఫిలిష్తీయుడైన అబీమెలెకు కొరకు అబ్రాహాము విజ్ఞాపన చేశాడు. శారా అబ్రాహాము భార్య అని తెలియకుండా ఆమెను తీసుకొనుట ద్వారా అబీమెలెకు అబ్రాహాము యొక్క భవిష్యత్తుకు ముప్పును కలిగించిన విషయము మీకు జ్ఞాపకముండియుంటుంది. తరువాత, దేవుడు అబీమెలెకు మీదికి తీర్పును తేగా, అబీమెలెకు తమ క్రియలను బట్టి పశ్చాత్తాపపడి నీతిమంతునిగా నిరూపించుకున్నాడు. అతడు పశ్చాత్తాపపడిన కారణంగా, అబ్రాహాము అబీమెలెకు కొరకు ప్రార్థించాడు, అబ్రాహాము మరియు అబీమెలెకు ఒకరితో ఒకరు కొనసాగు సమాధానమును మరియు స్నేహమును అనుభవించారు.
తమ కాలములోని ఫిలిష్తీయులతో మోషే దినములలోని ఇశ్రాయేలీయులు వ్యవహరించవలసియుండిన విధానములను గూర్చి ఈ వృత్తాంతము వారితో మాట్లాడింది. అనేక విధాలుగా, ఫిలిష్తీయులు ఇశ్రాయేలును బెదిరించారు. అయితే దేవుని తీర్పు అను ముప్పు ఫిలిష్తీయులకు పశ్చాత్తాపమును కలిగించినప్పుడు, ఇశ్రాయేలీయులు వారి కొరకు విజ్ఞాపన చేసి, వారితో నిలిచియుండు సమాధానమును అనుభవించవలసియుండెను.
ఈ భాగములోని మూడవ కథనము, 21:1-21లో ఉన్నది, మరియు అది ఇస్సాకు మరియు ఇష్మాయేలుకు మధ్య ఉన్న కఠినమైన అనుబంధము మీద దృష్టిపెడుతుంది. ఇస్సాకు మరియు ఇష్మాయేలు ఇరువురు అబ్రాహాము కుమారులైయున్నారు. అయితే వారి మధ్య ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు, ఇష్మాయేలును కుటుంబము నుండి వేరుచేయమని దేవుడు అబ్రాహామును హెచ్చరించాడు. అయినను దేవుడు ఇష్మాయేలును దీవించాడుగాని, అబ్రాహాము యొక్క నిజమైన వారసుడు ఇస్సాకు మాత్రమే అని స్పష్టం చేశాడు. ఈ సన్నివేశములను గూర్చి మోషే తన వాస్తవిక ఇశ్రాయేలీయ శ్రోతలకు తెలుపుచుండగా, తమ దినములలో నివసించిన ఇష్మాయేలీయులతో తమ సంబంధము యొక్క స్వభావమును అర్థము చేసుకొనుటలో వారికి సహాయం చేశాడు. ఇశ్రాయేలు మరియు ఇష్మాయేలీయుల మధ్య ఉద్రిక్తతలు చెలరేగినప్పుడు, దేవుడు వారి మధ్య విభజనను నిర్ణయించాడు అని ఇశ్రాయేలీయులు జ్ఞాపకము చేసుకొనవలసియుండెను. దేవుడు ఇష్మాయేలీయులను అనేక విధాలుగా దీవించినప్పటికీ, ఇశ్రాయేలీయులు అబ్రాహామునకు నిజమైన వారసులైయున్నారు.
ఇతరులతో అబ్రాహాము చేసిన తరువాతి సంకర్షణల యొక్క నాల్గవ ఉపాఖ్యానము 21:22-24లో అబ్రాహాము అబీమెలెకుతో చేసిన ఒప్పందమును గూర్చిన వృత్తాంతమైయున్నది. అబ్రాహాము మీద ఉన్న దేవుని దయను ఫిలిష్తీయుడైన అబీమెలెకు గుర్తించిన విధానమును, మరియు అబీమెలెకుతో మరియు అతని వారసులతో సమాధానముతో నివసించుటకు అబ్రాహాము ఒప్పుకొనిన విధానమును గూర్చి ఈ వృత్తాంతము నివేదిస్తుంది. అబ్రాహాము మంద కొరకు నీటి హక్కుల విషయములో వివాదము ఏ విధంగా తలెత్తిందో వివరిస్తు, పరస్పర గౌరవము మరియు మర్యాద విషయములో బెయేర్షెబాలో అబీమెలెకు మరియు అబ్రాహాము చేసిన ఒక అధికారిక ఒప్పందమును వివరిస్తు కొనసాగుతుంది.
తమ దినములలో ఫిలిష్తీయుల నుండి పొంచియున్న ముప్పును గూర్చి అబీమెలెకు మరియు అతని సైన్యాధిపతి మోషేకు మరియు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకము చేశారు. ఇక్కడ, ఇశ్రాయేలు మీద ఉన్న దేవుని ఆశీర్వాదమును ఫిలిష్తీయులు గుర్తిస్తే, ఇశ్రాయేలు అబ్రాహాము ఉదాహరణను అనుసరించి వారితో సమాధానముగా నివసించాలని మోషే అతని అనుచరులకు బోధించాడు. బెయేర్షెబా అను పేరుగల బావి మోషే దినములలో కూడా ఉండినది, మరియు అక్కడ చేయబడిన ఒప్పందమును గూర్చి, ఫిలిష్తీయులతో వారు కలిగియుండవలసిన సమాధానము మరియు పరస్పర గౌరవమును గూర్చి ఇశ్రాయేలుకు జ్ఞాపకము చేసినది.
కాబట్టి, అబ్రాహాము యొక్క తరువాతి సంకర్షణను గూర్చిన వృత్తాంతములలో అనేక పాత్రలు ఉన్నాయని మరియు వారు మోషే మరియు ఇశ్రాయేలు ఎదుర్కొన్న ప్రజలకు సంబంధించవారైయున్నారని మనము చూస్తాము. అబ్రాహాము కార్యములను చూచుట ద్వారా ఇశ్రాయేలీయులు తమ దినములలో అనేక పాఠములను నేర్చుకొనియుండవచ్చు.
అబ్రాహాము జీవితమును గూర్చి మోషే ఇచ్చిన నివేదికలోని చివరి దశకు ఇప్పుడు మనము చేరుకున్నాము, ఆదికాండము 22:1-25:18లోని అతని వారసులు మరియు మరణము. దేవునితో అతని నిబంధన అనుబంధమును భవిష్యత్ తరములకు కొనసాగించిన అబ్రాహాము వారసత్వము మీద ఈ ఉపాఖ్యానములు దృష్టిపెడతాయి. సామాన్య పరిభాషలో, మోషే నుండి మొట్టమొదటిగా ఈ వృత్తాంతములను అందుకున్న ఇశ్రాయేలీయులు అబ్రాహాము వారసులుగా తమ సొంత స్థాయిని గూర్చి, మరియు తమ వారసులను గూర్చి వారు కలిగియుండవలసిన నిరీక్షణలను గూర్చి అనేక విషయములను నేర్చుకొనియుంటారు.
అబ్రాహాము జీవితము యొక్క ఈ భాగములోని మొదటి ఉపాఖ్యానము 22:1-24లో అబ్రాహాము పరీక్షను గూర్చిన సుపరిచితమైన వృత్తాంతమైయున్నది. అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకు కంటే ఎక్కువగా దేవుని ప్రేమించాడో లేదో నిర్థారించుటకు ఈ పరీక్ష పెట్టబడినది. తన కుమారుని బలి అర్పించమని అబ్రాహామును కోరుతూ దేవుడు ఒక కఠినమైన పరీక్షను ఆరంభించాడు. అబ్రాహాము విధేయుడైయ్యాడు, మరియు అతడు విధేయుడయ్యాడు కాబట్టి ఇస్సాకుకు మంచి భవిష్యత్తు కలుగుతుంది అని అబ్రాహాముకు దేవుడు నిశ్చయతను ఇచ్చాడు.
మోషేను వెంబడించుచున్న ఇశ్రాయేలీయుల కొరకు ఈ వృత్తాంతము లెక్కలేనన్ని అంతర్భావములను ఇచ్చినప్పటికీ, వారు దేవుని పట్ల కలిగియుండిన స్వామిభక్తిని చూచుటకు దేవుడు ఇశ్రాయేలు దేశమును పరీక్షించుచున్నాడని వారికి జ్ఞాపకము చేయుట ఈ వాక్యభాగము యొక్క ప్రాముఖ్యమైన లక్షణమైయున్నది. మోషే దినములలో దేవుడు ఇశ్రాయేలు దేశమును అనేక విధాలుగా పరీక్షించాడు. అబ్రాహాము పరీక్షకు విధేయుడగుట ఎంత కష్టమైనా వారు కూడా తాము ఎదుర్కొను పరీక్షల మధ్య విధేయులు కావాలని వారికి జ్ఞాపకము చేసింది. అబ్రాహాము వారసునిగా ఇస్సాకు యొక్క ఉజ్వల భవిష్యత్తును గూర్చి ఇవ్వబడిన నిశ్చయత, వారు పరీక్షలలో సఫలమైతే వారికి కూడా ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది అని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకము చేసింది.
అబ్రాహాము జీవితము యొక్క ఆఖరి దశలోని రెండవ ఉపాఖ్యానము 23:1-20లో సమాధి కొరకు పితరుడు కొనిన స్థలమును గూర్చిన వృత్తాంతమైయున్నది. తన భార్యయైన శారా మరణించినప్పుడు తన కుటుంబము కొరకు హెబ్రోనులో సమాధి స్థలమును అబ్రాహాము కొనుగోలు చేసిన విధానమును ఈ వృత్తాంతము వర్ణిస్తుంది. పితరుడు ఈ భూమిని బహుమతిగా అంగీకరించలేదుగాని, దానిని కొనుగోలు చేశాడని ఈ కథనము ఉద్ఘాటిస్తుంది. ఈ స్థలము యొక్క కొనుగోలు కనాను దేశమును తమ సొంత దేశముగా పరిగణించుటకు కుటుంబమునకు చట్టపరమైన హక్కును ఇచ్చింది.
తమ జీవితాల కొరకు కొనుగోలు చేయబడిన ఈ సమాధి స్థలము యొక్క ప్రాముఖ్యతను మరియు అంతర్భావములను మోషేను వెంబడించిన ఇశ్రాయేలీయులు అర్థము చేసుకున్నారు. అది వారి పితరుల సమాధి స్థలమైయున్నది. అబ్రాహాము, ఇస్సాకు, మరియు యాకోబులు అక్కడ సమాధి చేయబడ్డారు. స్వాధీనపరచుకొనుటకు ముందు కూడా ఆ భూమి వారి యొక్క చట్టపరమైన స్వాస్థ్యమని వారు గ్రహించారు. అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు తమ జీవితాలలోని ఎక్కువ కాలమును హెబ్రోను చుట్టూ గడిపారు. తమ పితరుల దేశముగా హెబ్రోను పట్ల ఇశ్రాయేలీయులు ఎంత సమర్పణ కలిగియుండిరి అంటే వారు తమ పితరుడైన యాకోబు యొక్క ఎముకలను సమాధి చేయుటకు హెబ్రోనుకు తీసుకొని వచ్చారు. అబ్రాహాము సమాధి స్థలమును కొనుగోలు చేయుటను గూర్చిన ఈ వృత్తాంతము అతని వారసులకు సరియైన స్థలము కనానీయుల దేశము తప్ప ఏది కాదని తెలియజేసింది.
అబ్రాహాము వారసులు మరియు మరణమును గూర్చిన మూడవ ఉపాఖ్యానము 24:1-67లో అబ్రాహాము యొక్క ప్రత్యేకించబడిన కుమారునికి భార్యయైన, అబ్రాహాము కోడలైన రిబ్కాను గూర్చిన వృత్తాంతమైయ్యున్నది. ఈ వృత్తాంతములో, కనాను దేశములోని భ్రష్టత్వమును ఇస్సాకు తప్పించుకొనుటకు గాను, ఇస్సాకు కనానీయ స్త్రీని వివాహము చేసుకొనకూడదని అబ్రాహాము కోరాడు. అయితే ఇస్సాకు వాగ్దాన దేశమైన కనానులో నిలిచియుండునట్లు, ఇస్సాకు కొరకు భార్యను తెచ్చుటకు అతని దాసుని పంపాడు. ఈ విధముగా ఇస్సాకు కొరకు భార్యను కనుగొనుట ద్వారా, ఇస్సాకు కొరకు మరియు అతని వారసుల కొరకు దేవుని ఆశీర్వాదములతో కూడిన ఉజ్వల భవిష్యత్తును అబ్రాహాము నిశ్చయించాడు.
అబ్రాహాముతో తమకు ఉన్న పితరుల అనుబంధమునకు మూలమైన ఇస్సాకు కనానును తన మాతృభూమిగా పరిగణించుచునే కనానీయుల భ్రష్టత్వము నుండి దూరముగా ఉన్నాడని మోషేను అనుసరించిన ఇశ్రాయేలీయులు ఈ వృత్తాంతము నుండి నేర్చుకొనియుంటారు. ఇస్సాకు పొందిన ఆశీర్వాదములతో కూడిన ఉజ్వల భవిష్యత్తు, వాగ్దాన దేశములో నివసించిన కనానీయుల భ్రష్టత్వమును వారు ఎదురించినంత వరకు వారి భవిష్యత్తు కూడా అయ్యుండినది.
అబ్రాహాము జీవితము యొక్క ఆఖరి ఉపాఖ్యానము 25:1-18లో ఉన్న పితరుని మరణము మరియు వారసుని గూర్చిన వృత్తాంతమైయున్నది. అనేక క్లుప్త కథనముల సంపుటి శారా గాక ఇతర భార్యలతో అబ్రాహాముకు కలిగిన కుమారులను గూర్చి తెలియజేస్తుంది. తరువాత ఇది పితరుని మరణమును గూర్చి మాట్లాడుతుంది, మరియు ఈ సమయములో చట్టపరమైన వారసునిగా ఇస్సాకు అబ్రాహాము యొక్క చివరి ఆశీర్వాదమును పొందుకున్నాడు. చివరిగా, ఇది ఇష్మాయేలు వారసులను గూర్చి క్లుప్తంగా తెలుపు ఒక వ్యత్యాసముతో కూడిన భాగముతో ముగుస్తుంది.
అబ్రాహాము జీవితము యొక్క ఈ ముగింపు వాస్తవిక శ్రోతల ఎదుట అనేక అంతర్భావములను ఉంచింది. అబ్రాహాము యొక్క ఇతర కుమారులను ఇశ్రాయేలీయులతో వేరుపరచుటకుగాను ఇది వారిని గూర్చి నివేదించింది. మోషేను అనుసరించుచున్న ఇశ్రాయేలీయులు అబ్రాహాము ఆశీర్వాదములకు నిజమైన వారసులు అని వారికి నిశ్చయతను కలిగించుటకు ఇస్సాకుకు అబ్రాహాము ఇచ్చిన అంతిమ ఆశీర్వాదమును ఇది ఉద్ఘాటించింది. అబ్రాహాము వారసత్వము కొరకు ఇష్మాయేలీయులు చేసిన ప్రతి విధమైన దావాను త్రోసిపుచ్చుటకు ఇది ఇష్మాయేలు వారసులను ప్రస్తావించింది. అబ్రాహాము జీవితమును గూర్చి తాను వ్రాసిన కథనమును ఈ విధంగా ముగించుట ద్వారా, అబ్రాహాము నిజమైన వారసులైన, తాను వాగ్దాన దేశము వైపుకు నడిపించుచున్న ఇశ్రాయేలీయుల యొక్క గుర్తింపును, హక్కులను మరియు బాధ్యతలను మోషే స్థిరపరచాడు.
తాను నాయకత్వము వహించుచున్న ఇశ్రాయేలీయులు ఐగుప్తును విడచి వాగ్దాన దేశమును స్వాధీనపరచుకొనుటకు ఎందుకు మరియు ఎలా వెళ్లాలో బోధించుటకు మోషే అబ్రాహాము జీవితమును గూర్చిన ఈ వృత్తాంతములను వ్రాశాడని మనము చూస్తాము. ఈ లక్ష్యమును సాధించుటకు, వారు పితరునికి ఇవ్వబడిన కృపకు వారసులుగా ఎలా ఉన్నారో, పితరుడు దేవుని ఎదుట బాధ్యత కలిగి ఉన్న విధముగా వారు కూడా దేవునికి స్వామిభక్తి చూపవలసిన బాధ్యతను ఎలా కలిగియున్నారో, అబ్రాహాము వలె వారు దేవుని ఆశీర్వాదములను ఎలా పొందుకుంటారో, మరియు ఒక దినమున వారు భూమి మీద ఉన్న జనములనందరికి ఏ విధంగా ఆశీర్వాదకరముగా ఉంటారో వివరించుటకు మోషే పితరుని జీవితములోని ప్రతి ఉపాఖ్యానము మీద అనేక విధములుగా ఉద్ఘాటన పెట్టాడు. అబ్రాహాము జీవితమును గూర్చి మోషే వ్రాసిన కథనము వాగ్దాన దేశము వైపుకు తనను వెంబడించిన ఇశ్రాయేలీయులకు లెక్కకు మించిన అంతర్భావములను ఇచ్చింది.
ఆదికాండములో అబ్రాహాము జీవిత వృత్తాంతము యొక్క వాస్తవిక అర్థమును ఈ పాఠంలో మనము చూశాము. ఈ వాస్తవిక అర్థమును తెలుసుకొనుటకు మనము రెండు ప్రధానమైన దిశలను పరిశీలించాము: ఒక వైపు, ఈ వృత్తాంతములు మరియు తాను వ్రాసిన ఇశ్రాయేలీయుల అనుభవములకు మధ్య మోషే స్థాపించిన పోలికలను మనము పరీక్షించాము. మరొక వైపు, తన వాస్తవిక శ్రోతలు ఐగుప్తును విడిచి కనానును స్వాధీనపరచుకొనుటకు ప్రయాణించుచుండగా వారి మీద ప్రభావము చూపు విధముగా మోషే ఈ వృత్తాంతములను ఏ విధముగా రూపొందించాడో మనము చూశాము.
అబ్రాహాము మరియు వాస్తవిక ఇశ్రాయేలీయ శ్రోతల మధ్య మోషే వెలికితీసిన పోలికలను గూర్చి, మరియు తాను వ్రాసిన వృత్తాంతము తన శ్రోతల మీద చూపాలని అతడు ఆశించిన ప్రభావమును గూర్చి మనము మరి ఎక్కువగా నేర్చుకొనుచుండగా, అబ్రాహాము జీవితములోని ప్రతి ఉపాఖ్యానము ఇశ్రాయేలీయులకు మార్గదర్శకమును ఇచ్చుటకు ఏ విధంగా వ్రాయబడినదో మనము కనుగొందాము. మరియు ఈ వృత్తాంతములను నేడు మన జీవితములకు ఎలా అనువర్తించుకోవాలో కూడా మనము మరి ఎక్కువగా వివేచించగలుగుతాము.
Continue reading the full transcript