<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
క్యాటలాగ్‌కు తిరిగి వెళ్ళుHEBహెబ్రీయుల పుస్తకం
హెబ్రీయుల పుస్తకం ·Videoఆంగ్లం నుండి అనువాదం చేయబడింది

HEB-01 హెబ్రీయులకు వ్రాసిన లేఖ నేపథ్యం మరియు ఉద్దేశ్యం

పూర్తి వచనం చదవండి

అదే శ్రేణి 1వ పాఠానికి తోడుగా ఉండే వీడియో. ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: హెబ్రీయులకు వ్రాసిన లేఖను ఎవరు రాశారు? హెబ్రీయులకు వ్రాసిన లేఖ రచయిత గురించి మీ వ్యక్తిగత అభిప్రాయాలు ఏమిటి? హెబ్రీయులకు వ్రాసిన లేఖలోని కంటెంట్ నుండి రచయిత గురించి మనం ఏమి నేర్చుకోగలం? హెబ్రీయులకు వ్రాసిన లేఖ ప్రేక్షకులు తమ సమాజాన్ని ప్రభావితం చేసే హింసలకు ఎలా స్పందించారు? హెబ్రీయులకు వ్రాసిన లేఖ రచయిత తన పాఠకులను ఎదుర్కొంటున్న ఆందోళనలను ఎలా పరిష్కరించాడు? హెబ్రీయులకు వ్రాసిన లేఖను ఇతర న్యూ టెస్టమెంట్ ఉత్తరాలతో పోల్చినప్పుడు, మనం ఇప్పటికీ హెబ్రీయులకు వ్రాసిన లేఖను ఉత్తరం అని పిలవాలా? హెబ్రీయులకు వ్రాసిన లేఖ యొక్క నిర్మాణం మరియు కంటెంట్ ఇతర న్యూ టెస్టమెంట్ ఉత్తరాలతో ఎలా పోల్చబడతాయి? హెబ్రీయులకు వ్రాసిన లేఖ యొక్క అత్యంత వాక్చముఖ స్వభావం రచయిత యొక్క ఉద్దేశ్యాన్ని ఎలా సమర్థిస్తుంది? డెడ్ సీ స్క్రోల్స్ మరియు ఫిలో యొక్క రచనల వంటి మొదటి శతాబ్దపు యూదు రచనలు హెబ్రీయులకు వ్రాసిన లేఖ రచయితను ఎంతవరకు ప్రభావితం చేశాయి? హెబ్రీయులకు వ్రాసిన లేఖలోని అనేక హెచ్చరికలతో రచయిత ఏ లక్ష్యాలను సాధించాలనుకున్నారు? పాత ఒడంబడిక యొక్క అంశాలతో యేసును హెబ్రీయులకు వ్రాసిన లేఖ ఎలా విరుద్ధంగా చూపుతుంది? మెల్కీసెదెకు హెబ్రీయులకు వ్రాసిన లేఖలో ఎవరు మరియు అతని ప్రాముఖ్యత ఏమిటి? హెబ్రీయులకు వ్రాసిన లేఖ యొక్క ఉద్దేశ్యం ఏమిటి?


From the transcript

1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.

బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.

ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.

అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.

మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.

చరిత్రయందంతట క్రీస్తు అనుచరులు హింసను అనుభవించారు. ఆస్తులు దొంగిలించబడుట, కొట్టబడుట, చెరసాలలో శిక్షను అనుభవించుట మరియు హతసాక్షులగుట అనేకమంది క్రైస్తవుల విధి అయ్యింది. కొన్ని నివేదికల ప్రకారంగా, క్రీస్తు అనుచరులు నేటి దినములలో మరిఎక్కువగా హింసించబడుతున్నారు.

మనలో ఇట్టి హింసను ఎదుర్కొననివారికి, హింస ద్వారా కలుగు శోధనలను గూర్చి ఊహించడం చాలా కష్టమవుతుంది. సమాధానముతోను, సురక్షితముగాను జీవించే క్రైస్తవులు శోధనలు లేకపోయినప్పటికీ కూడా ఎల్లప్పుడు తమ విశ్వాసము విషయములో రాజీపడుతుంటారు. అయితే మిమ్మును, మీ భాగస్వామిని, మీ పిల్లలను మరియు స్నేహితులను ప్రమాదకరమైన హాని నుండి తప్పించడానికి మీ విశ్వాసము విషయములో రాజీ పడడం ఎంత సులభమైయున్నదో మీరు ఊహించగలరా? ఇటువంటి పరిస్థితులలో తోటి విశ్వాసులను మనం ఎలా ప్రోత్సహించగలము?

హెబ్రీ పత్రిక రచయిత ఎదుర్కొన్న సవాలు ఇదే. గతములో హింసించబడిన క్రైస్తవులకు మరియు ఇప్పడు మరింత ఎక్కువగా హింసించబడుతున్న క్రైస్తవులకు అతడు ఈ పత్రిక వ్రాశాడు. వారు అనేక సంవత్సరముల క్రితం స్థిరముగా నిలబడ్డారు, కాని రాబోవు హింసను తప్పించుకోడానికి వారు ఇప్పుడు క్రీస్తును విడిచిపెడతారని హెబ్రీ పత్రిక రచయిత భయపడ్డాడు.

హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము మరియు దీనికి, “హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యము మరియు ఉద్దేశ్యము” అను శీర్షిక ఇచ్చాము. ఈ పాఠములో, ఈ సంక్లిష్టమైన పత్రికను గూర్చి మనమిచ్చు వ్యాఖ్యానమును మార్గనిర్దేశం చేసే అనేక దృక్పథములను మనం పరిచయం చేస్తాము.

మన శీర్షిక చెప్పుచున్నట్లుగా, హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యమును మరియు ఉద్దేశ్యమును రెండు మార్గములలో చూద్దాము. మొదటిగా, పత్రిక యొక్క నేపథ్యమును చూద్దాము. మరియు రెండవదిగా, హెబ్రీ పత్రిక వ్రాయబడిన విస్తృతమైన ఉద్దేశ్యమును సంగ్రహిద్దాము. హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యముకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలను చూస్తూ ఆరంభిద్దాము.

పరస్పర ఆధారితమైన మూడు విషయాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా మనము హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యమును చూద్దాము. పత్రిక యొక్క గ్రంథకర్తృత్వమును మొదటిగా చూద్దాము. తరువాత వాస్తవిక శ్రోతలను గూర్చి చూద్దాము. చివరిగా, హెబ్రీ పత్రిక వ్రాయబడిన తేదీని చూద్దాము. హెబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్తృత్వమును మొదటిగా చూద్దాము.

ఆరంభ దినముల నుండే, హెబ్రీ గ్రంథకర్తృత్వమును గూర్చి వివిధ అభిప్రాయములు ఉన్నాయి. మన ఉద్దేశముల కొరకు, రెండు విషయాలను మనం చూద్దాము. మొదటిగా, రచయిత యొక్క గుర్తింపును మనం చర్చించుదాము. మరియు రెండవదిగా, అతని పత్రికలోని కొన్ని లక్షణాల మీద దృష్టిపెట్టుట ద్వారా రచయిత కొరకు ఒక ప్రొఫైల్ ను నిర్మిద్దాము. రచయిత యొక్క గుర్తింపును పరిశీలిస్తూ ఆరంభిద్దాము.

రచయిత తనను గూర్చి ఎలాంటి సమాచారమును ఇవ్వలేదు గనుక ఇతర క్రొత్త నిబంధన పుస్తకములవలె హెబ్రీ పత్రిక రచయితను గుర్తించడం అంత సులభం కాదు. సంఘ పితరుల కాలం నాటికి, సుమారు క్రీ.శ. 150 నుండి 250 వరకు నివసించిన అలెగ్జాండ్రియాకు చెందిన క్లెమెంతు మరియు క్రీ.శ. 185 నుండి 254 వరకు నివసించిన అలెగ్జాండ్రియాకు చెందిన ఓరిగన్, తమ దినములలో హెబ్రీ పత్రిక గ్రంథకర్తృత్వము మీద రకరకాల అభిప్రాయములు ఉన్నాయని అంగీకరించారు. ఆరంభం నుండి, అపొస్తలుడైన పౌలునకు ఈ పుస్తకమును ఎక్కువగా ఆపాదించారు, అయితే పండితులు, బర్నబా, లూకా, అపొల్లో మరియు రోమాకు చెందినవాడైన క్లెమెంతు యొక్క పేర్లను కూడా సూచించారు.

సుమారు క్రీ.శ. 325లో, సంఘ చరిత్రకారుడైన యుసేబియస్ తన పుస్తకమైన హిస్టరీ ఆఫ్ ది చర్చ్ యొక్క 6వ పుస్తకము, 25వ అధ్యాయము, 14వ భాగములో హెబ్రీ పత్రిక రచయితను గూర్చి ఓరిగన్ కలిగియున్న దృక్పథమును ప్రస్తావించాడు. అక్కడ మనము ఇలా చదువుతాము:

[హెబ్రీ] పత్రికను ఎవరు వ్రాశారో, దేవునికి తెలుసు.

అతని కాలములో అతడు మరియు అనేకులు హెబ్రీ పత్రిక రచయిత విషయంలో ఎంత అనిశ్చితముగా ఉన్నారో ఓరిగన్ మాటలు చూపుతాయి. మరియు నేడు చాలామంది బైబిలు పండితులు కూడా దీనిని అంగీకరిస్తున్నారు. ఈ పత్రికను ఎవరు వ్రాశారో కేవలం దేవునికి మాత్రమే తెలుసు.

దురదృష్టవశాత్తు, గ్రంథకర్తృత్వమును గూర్చిన ప్రశ్నల వలన మరియు హెబ్రీ పత్రికను కొన్ని క్రైస్తవేతర సమూహములు అపార్థం చేసుకోవడం వలన, క్రొత్త నిబంధన ప్రామాణిక గ్రంథములో హెబ్రీ పత్రికను చేర్చాలా వద్దా అని కొందరు సందేహించారు. వాస్తవానికి, సుమారు క్రీ.శ. 99లో మరణించిన రోమావాడైన క్లెమెంతు వంటి ప్రముఖ పండితులు హెబ్రీ పత్రికను ఇతర క్రొత్త నిబంధన పుస్తకాలతో సమానంగా భావించారు. మరియు క్రీ.శ. 100 నుండి 165 మధ్యకాలపు వాడైన జస్టిన్ మార్టిర్ కూడా అదే చేశాడు. అయితే సుమారు క్రీ.శ. 144లో వ్రాయబడిన మార్సియోనైట్ కెనన్ మరియు సుమారు క్రీ.శ. 170లో వ్రాయబడిన మురాటోరియన్ కెనన్ రెండింటి నుండి హెబ్రీ పత్రికను తొలగించారు. అయితే, సంఘ పితరుల కాలం ముగిసేనాటికి, తూర్పు మరియు పశ్చిమ సంఘములలోని అనేకమంది యొక్క ప్రభావవంతమైన వ్యాఖ్యానకర్తల వలన హెబ్రీ పత్రికను ప్రామాణిక గ్రంథములో భాగంగా గుర్తించారు. మరియు అపొస్తలుడైన పౌలును రచయితగా వారు అంగీకరించారు.

మధ్యయుగ కాలమంతా, పౌలు హెబ్రీ పత్రికను వ్రాశాడని చాలామంది ప్రముఖ పండితులు నమ్ముతూనే ఉన్నారు. అయితే సంస్కరణ కాలములో, ప్రొటెస్టెంట్ సంస్కర్తలు పౌలు గ్రంథకర్తృత్వము యొక్క సాంప్రదాయ దృక్పథముతో సహా అనేక సంఘపరమైన సాంప్రదాయములను ప్రశ్నించారు. మార్టిన్ లూథర్ అపొల్లోను రచయితగా సూచించాడు. జాన్ కెల్విన్ ఎలాటి పేరును సూచించలేదుగాని, ఈ పత్రికను పౌలు మాత్రం వ్రాయలేదు అని నొక్కి చెప్పాడు.

నేడు, చాలామంది వ్యాఖ్యాతలు పౌలు గ్రంథకర్తృత్వమును తిరస్కరించారు. ఈ విషయంలో మూడు కారణములను మనం చూద్దాము. మొదటిగా, ఇప్పటికే మనం చెప్పినట్లుగా, ఈ పత్రిక అనామధేయమైనది, మరియు తన పత్రికలలో తననుతాను పేరుపెట్టి గుర్తించుకోవడం పౌలు యొక్క అలవాటుగా ఉండేది. వాస్తవంగా చెప్పాలంటే, 2 థెస్సలొనీకయులకు 2:2 స్పష్టం చేస్తున్నట్లుగా, తన పేరు మీద నకిలీ పత్రికలు వ్యాపించాయని పౌలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాడు. కాబట్టి, అతడు హెబ్రీ పత్రికను వ్రాసినట్లయితే తనను తాను గుర్తించుకొనుటలో విఫలమయ్యే అవకాశం లేదు.

రెండవదిగా, పౌలు పత్రికలలో ఉద్ఘాటించబడని విషయాలు హెబ్రీ పత్రికలో ఉద్ఘాటించబడ్డాయి. ఉదాహరణకు, హెబ్రీ పత్రిక రచయిత మెల్కీసెదెకును గూర్చి ముమ్మారు ప్రస్తావించాడు. అతడు పాత నిబంధన ప్రత్యక్ష గుడారము మీద దృష్టి పెట్టాడు. మరియు ప్రధాన యాజకునిగా క్రీస్తు అను అంశము మీద విస్తృతముగా వ్రాశాడు. వీటిని కలిపి తీసుకొంటే, ఈ అంశాలు పౌలు వ్రాసిన పత్రికలకు మరియు హెబ్రీ పత్రికకు మధ్య వ్యత్యాసమును చూపుతాయి.

మూడవదిగా, యేసు యొక్క మొదటి తరము అనుచరుల నుండి హెబ్రీ పత్రిక రచయిత తననుతాను దూరము చేసుకున్న విధానము పౌలు గ్రంథకర్తృత్వమును సందేహించడానికి ఒక బలమైన కారణమైయున్నది. హెబ్రీ 2:3-4లోని ఈ మాటలను వినండి:

అట్టి రక్షణ ప్రభువు భోధించుటచేత ఆరంభమై, ... వినినవారిచేత మనకు దృఢపరచబడెను (హెబ్రీ. 2:3-4).

రక్షణ “ప్రభువు బోధించుటచేత ఆరంభమై”నది – మరోమాటలలో, యేసు చేత – మరియు “వినినవారిచేత మనకు దృఢపరచబడెను” అని హెబ్రీ పత్రిక రచయిత చెప్పిన విధానమును ఇక్కడ గమనించండి. అంటే, రచయిత మరియు అతని శ్రోతలు యేసు నుండి ప్రత్యక్షంగా వినిన వ్యక్తుల ద్వారా సువార్తను ధృవీకరించారు. నా క్రైస్తవ విశ్వాసమును పరోక్షంగా పొందుకున్నాను అని రచయిత ఒప్పుకొనుట, గలతీ. 1:1, 11 మరియు 12, 1 కొరింథీ 11:23 వంటి వాక్యభాగములతో విభేదిస్తుంది, అక్కడ యేసు నుండి ప్రత్యక్షంగా సువార్తను స్వీకరించాను అని పౌలు నొక్కి చెప్పాడు.

“హెబ్రీ పత్రికను ఎవరు వ్రాశారు” అను చిన్న ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మనకు తెలియదు. అతను ఎవరో అను విషయము మీద మనకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. చరిత్రయందంతటిలో ఈ ప్రశ్నకు అనేకమైన సమాధానములు ఉన్నాయి. కాబట్టి, పౌలు ఈ పత్రికను వ్రాశాడు అని అనేక సంవత్సరములు సంఘము భావించింది. పౌలు దీనిని వ్రాయలేదని నా ఆలోచన ఎందుకంటే హెబ్రీ పత్రికకు మరియు పౌలు పత్రికలకు మధ్య వ్యత్యాసములు ఉన్నాయి. ఉదాహరణకు, పౌలు ఎల్లప్పుడు ..... తననుతాను గుర్తించుకొంటూ పత్రిక యొక్క శ్రోతలతో మాట్లాడాడు. హెబ్రీ పత్రికలో ఆ విధంగా లేదు. ప్రధాన యాజనునిగా క్రీస్తు వంటి అంశాలు హెబ్రీ పత్రికలో ఉన్నాయి, అవి పౌలు పత్రికలలో ఎక్కువగా కనిపించవు. కాబట్టి, పౌలు రచయిత కాదు. ఇతర సూచనలు బర్నబా లేదా అపొల్లో — బహుశా అపొల్లో అని మార్టిన్ లూథర్ భావించాడు — ప్రిస్కిల్లా. అయినను, మనకు తెలియదు. మనము చెప్పగలిగినది ఏమిటంటే హెబ్రీ పత్రిక యొక్క రచయిత రెండవ-తరము క్రైస్తవుడు. 2వ అధ్యాయములో క్రీస్తు మాటలను ప్రత్యక్షముగా విని, వారు వినినవాటిని తనకు అందించినవారిని గూర్చి మాట్లాడాడు, కాబట్టి అతడు తననుతాను రెండవ తరము క్రైస్తవులతో లెక్కించుకున్నాడు.

— డా. స్టీఫెన్ ఈ. విట్మర్

హెబ్రీ పత్రిక యొక్క గ్రంథకర్తృత్వమును మరియు రచయిత యొక్క గుర్తింపు అనామధేయముగా ఉండుటను మనము చూశాము. అయినప్పటికీ, మనము రచయిత కొరకు ప్రొఫైల్ ను నిర్మించవచ్చును.

సమయమును బట్టి, రచయిత జీవితము యొక్క స్పష్టమైన లక్షణములలో కేవలము రెంటిని మాత్రమే చూద్దాము.

హెల్లెనీయుడైన యూదుడు. మొదటిగా, హెబ్రీ పత్రిక రచయిత ఒక హెల్లెనీయుడైన (గ్రీకు సంస్కృతిని అనుసరించువాడు) యూదుడు. హెబ్రీ పత్రికను పౌలు వ్రాయలేదని నేడు అనేకమంది పండితులు అంగీకరిస్తారు. చివరికి, కేవలము దేవునికి మాత్రమే తెలుసు అను ఓరిగన్ దృక్పథముతో ముగించడం మంచిది. హెబ్రీ గ్రంథకర్తృత్వమును గూర్చిన పశ్న సంవత్సరాలుగా చర్చనీయాంశమైనది, అయితే పత్రికలో కనిపించే ఆధారముల నుండి రచయితను గూర్చి, అదే విధంగా అతని వ్యక్తిత్వమును గూర్చి నేర్చుకొనుట నుండి ఇది మనలను నిరోధించకూడదు.

యూదా మరియు గ్రీకు ప్రభావము రచయితను మరియు అతని పత్రికను రెంటిని ప్రభావితం చేసిందని వాక్యభాగములో నుండి మనం చూడవచ్చును. రచయిత యొక్క బలమైన యూదా వారసత్వము పాత నిబంధన మీద అతడు కలిగియున్న అవగాహనలో స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి, అతడు 13 అధ్యాయములలో దాదాపు 31 సార్లు పాత నిబంధనను ఉల్లేఖించాడు.

రచయిత బలమైన హెల్లెనీయ పెంపకం గలవాడని కూడా మనకు కనిపిస్తుంది. గతములో, పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదమైన, సెప్టుజెంట్ ను రచయిత ఉపయోగించాడని, అతడు హెల్లెనీయుడైన యూదుడుగా ఉన్నాడనుటకు అది రుజువుగా ఉందని అనువాదకులు సూచించారు. అయితే, గత శతాబ్దము యొక్క రెండవ భాగములో, ముందుగా సెప్టుజెంట్ కు ఆపాదించబడిన ఉల్లేఖనాలు వాస్తవానికి హెబ్రీ గ్రంథములు కాని ఇతర సాహిత్యముల నుండి వచ్చాయి అని డెడ్ సి స్క్రోల్స్ మీద చేసిన పరిశోధనలు బయలుపరచాయి. ఈ కారణమును బట్టి, హెబ్రీ పత్రిక యొక్క రచయిత సెప్టుజెంట్ ను ఉపయోగించాడని మనము ఖచ్చితంగా చెప్పలేము.

ఈ ఆవిష్కరణ తరువాత కూడా, హెబ్రీ పత్రిక యొక్క రచయిత గ్రీకు నేపథ్యం కలిగినవాడు అని మనం నిశ్చయత కలిగి ఉండవచ్చును. అతని యొక్క అధునాతన గ్రీకు ఉపయోగము హెల్లెనీయ పెంపకమునకు బలమైన సాక్ష్యాలను అందిస్తుంది. మరియు అతని పదజాలము మరియు శైలి, లూకా రచనలను కూడా అధిగమించే భాషా పాండిత్యమునకు రుజువుగా ఉన్నాయి.

ఉద్వేగభరితమైన జ్ఞాని. హెబ్రీ పత్రిక యొక్క రచయిత హెల్లెనీయుడైన యూదుడు మాత్రమే కాదుగాని, అతడు ఉద్వేగభరితమైన జ్ఞానము గలవాడు అని కూడా ప్రొఫైల్లో మనం చేర్చవచ్చును. హెబ్రీ పత్రిక యొక్క రచయిత మేధావి అని వ్యాఖ్యాతలు విస్తృతంగా అంగీకరిస్తారు. హెబ్రీ పత్రికలో ఉన్న వేదాంతపరమైన వాదనలు క్రొత్త నిబంధనలో కనిపించే మిగిలిన వాటన్నిటికన్నా సంక్లిష్టమైనవి. వాస్తవంగా చెప్పాలంటే, హెబ్రీ. 5:13-14 వంటి వాక్యభాగములలో అధునాతన వేదాంత విశ్లేషణ యొక్క ప్రాధాన్యతను రచయిత స్వయంగా గుర్తించాడు, చెడు నుండి మంచిని వ్యత్యాసపరచాలంటే, క్రీస్తు అనుచరులు సిద్ధాంతపరముగా పరిపక్వత చెందాలి అని అక్కడ అతడు సూచించాడు.

హెబ్రీ పత్రికలోని విషయములలో నుండి, రచయితను గూర్చి మనము అనేక విషయాలను చెప్పవచ్చును. వాటిలో ఒకటి అతడు మేధావి. అతనికి పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదమైన సెప్టుజెంట్, బాగా తెలుసు. సాంప్రదాయ యూదు ప్రేక్షకులను బాగా ఒప్పించే విధంగా పాఠములను ఏ విధముగా చెప్పాలో అతనికి తెలుసు. బహుశా అతడు హెల్లెనీయుడైన యూదుడు కావచ్చు, బహుశా హెల్లెనీయ యూదులైన శ్రోతలకు వ్రాసియుండవచ్చు. నేను “హెల్లెనీయుడైన యూదుడు” అని చెప్పినప్పుడు, దాని యొక్క అర్థం గ్రీకు-మాట్లాడువాడు మరియు బహుశా డయాస్పొరాకు చెందినవాడు కాని, యూదా సాంప్రదాయములకు కట్టుబడి ఉంటూ లేఖనములో గొప్ప జ్ఞానము కలిగినవాడు.

— డా. క్రెయిగ్ ఎస్. కీనర్

హెబ్రీ పత్రిక యొక్క రచయితను ఒక మేధావిగా పరిగణించవలసి ఉన్నప్పటికీ, అతడు దూరముగా ఉన్న, పరిస్థితులను గూర్చి తెలియని పండితుడు మాత్రం కాదు. అతడు క్రైస్తవ విశ్వాసము యెడల ఎంతో మక్కువ కలిగియున్నాడు. తోటి విశ్వాసుల కొరకు అతడు కలిగియున్న భక్తి మరియు మక్కువ అతని రచనలో కనిపిస్తుంది.

హెబ్రీ. 10:33-34లో, అతడు తన శ్రోతలతో సానుభూతి చూపిన విధానమును గూర్చి వినండి:

ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభవించినవారితో పాలివారలైతిరి. ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి (హెబ్రీ.10:33-34).

అదే విధముగా, 12:1-2లో అతడు ఇలా చెప్పినప్పుడు క్రీస్తు యెడల తాను కలిగియున్న మక్కువను చూపించాడు:

మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసువైపు చూచుచు, మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. ఆయన తనయెదుట ఉంచబడిన ఆనందముకొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్నాడు (హెబ్రీ. 12:1-2).

ఈ రచయిత అనామకమైన పండితుడు అని గ్రహించకుండ ఇవి మరియు ఇలాటి ఇతర వాక్యభాగములను చదువుట కష్టముగా ఉంటుంది. అతడు తన శ్రోతల పట్ల మరియు క్రీస్తు పట్ల చాలా మక్కువతో ఉన్నాడు. మనము ఈ మక్కువను కోల్పోయినట్లైతే, పత్రికలోని ఒక అత్యంత ముఖ్యమైన లక్షణమును కోల్పోతాము.

రచయితను గూర్చి మనము నేర్చుకొను మరొక విషయము ఏమిటంటే అతడు ప్రకటిస్తున్న ప్రజల విషయములో మరియు ఎవరికి వ్రాస్తున్నాడో వారి విషయములో అతడు చాలా శ్రద్ధ కలిగియున్నాడు. అతడు వారి యొక్క ఆత్మీయ స్థితి విషయంలో శ్రద్ధ కలిగియున్నాడు కాబట్టి, బలహీనులైయ్యే లేదా అలసిపోయే, మతభ్రష్టులైపోయే ప్రమాదమును గూర్చి పదే పదే మాట్లాడాడు. కాబట్టి, అతడు ఖచ్చితముగా అద్భుతమైన వేదాంతపండితుడు మరియు లేఖనమును అనువదించువాడు, అయితే అదే సమయములో తన శ్రోతలను బాగుగా, వ్యక్తిగతముగా యెరిగినవాడుగా కూడా ఉన్నాడు. వారి యెడల అతడు శ్రద్ధ చూపించాడు మరియు వారి యొక్క ఆత్మీయ యాత్రలో వేదాంతపరముగాను, లేఖనముల అనువాదములోనూ మరియు వాటి యొక్క అనువర్తనములోనూ అతడు చేయగలిగిన సహాయమంతయు చేశాడు.

— డా. ఎక్హార్డ్ స్కాన్బెల్

హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యము మీద మన చర్చలో ఇప్పటివరకు మనము పత్రిక యొక్క గ్రంథకర్తృత్వమును చూశాము. ఇప్పుడు మనము మన యొక్క రెండవ అంశమును చూడాలి: హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు.

హెబ్రీ పత్రిక దాని యొక్క శ్రోతలను పేరుతోగాని, పట్టణముతోగాని లేదా ప్రాంతముతోగాని గుర్తించదు. అయినను, సాధారణ మాటలలో, రచయిత వ్యక్తిగతముగా యెరిగిన ఒక నిర్దిష్ట శ్రోతలకు వ్రాశాడని మనము నిశ్చయత కలిగియుండవచ్చు. 13:19-24లో, రచయిత తన శ్రోతలను మరలా సందర్శించాలనే ఉద్దేశమును ధృవీకరించాడు. అతడు తిమోతిని గూర్చి “మన సహోదరుడు” అని మాట్లాడాడు మరియు తన శ్రోతలకు తెలిసిన ఇటలీలోని ఒక సమూహమును గూర్చి కూడా అతడు ప్రస్తావించాడు.

హెబ్రీ పత్రికను అధ్యయనము చేయుచుండగా మనము పరిగణించవలసిన ఈ వాస్తవిక శ్రోతలను గూర్చి ఐదు ముఖ్యమైన అంశాలను చూడాలి.

మొదటిగా, వాస్తవిక శ్రోతలలో ఎక్కువమంది యూదులే అని అనుకొనుటకు ఒక మంచి కారణం ఉంది. హెబ్రీ 1:1 దీనిని స్పష్టం చేస్తుంది:

పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు (హెబ్రీ. 1:1).

ఇక్కడ, పాత నిబంధనలో దేవుడు తననుతాను ఇశ్రాయేలుకు ఏ విధముగా కనుపరచుకున్నాడో రచయిత సూచించాడు. అయితే పాత నిబంధన ఇశ్రాయేలీయులను “మన పితరులు” — రచయిత మరియు అతని శ్రోతల యొక్క పితరులు — అని అతడు పిలచిన విధానమును గమనించండి.

క్రీ.శ. 155 నుండి 230 వరకు నివసించిన తెర్తుల్లు కాలము నుండి, ఈ పత్రికకు సాంప్రదాయముగా “ప్రోస్ హెబ్రాయ్యోస్,” “హెబ్రీయుల కొరకు” అను శీర్షిక ఇవ్వబడుట ఆశ్చర్యము కలిగించదు.

రెండవదిగా, శ్రోతలలో ఎక్కువశాతం హెల్లెనీయులు అని చెప్పడం కూడా సమంజసమే అవుతుంది. పాలస్తీనాలో ఉండే సాంప్రదాయ యూదుల వర్గముల కంటే పాలస్తీనా వెలుపల నివాసము చేస్తున్న యూదులలో సర్వసాధారణంగా ఉన్న వేదాంత బోధనలతో శ్రోతలు సుపరిచితముగా ఉన్నారు అని హెబ్రీ పత్రికలోని విషయాలు సూచిస్తాయి.

పాలస్తీనా వెలుపల శ్రోతలు ఎక్కడ నివసించారో తెలుసుకోవడానికి అనేకమంది వ్యాఖ్యాతలు ప్రయత్నించారు. రోమాకు చెందిన క్లెమెంతు యొక్క మొదటి పత్రిక క్రీ.శ. 95లోనే ఈ పత్రికను ప్రస్తావించిన వాస్తవమును పరిగణిస్తూ శ్రోతలు రోమాకు చెందిన వారు అని కొందరు భావించారు. ఈ దృక్పథముకు మద్దతునివ్వడానికి హెబ్రీ 13:24ను ఉపయోగించారు ఎందుకంటే ఇది “ఇటలీవారు” అని ప్రస్తావిస్తుంది. ఈ సూచనలు ఆసక్తికరముగా ఉన్నాయి, కాని విశ్వాసము యొక్క ఏ పరిమాణములోనైనా, మనం చెప్పగలిగేది ఏమిటంటే, శ్రోతలలో పాలస్తీనా వెలుపల ఉన్న హెల్లెనీయులైన యూదులే ఎక్కువమంది ఉన్నారు.

మూడవదిగా, హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు అపరిపక్వతగలవారైయున్నారు. హెబ్రీ. 5:12లో రచయిత వారిని గూర్చి ఎలా వర్ణించాడో వినండి:

కాలమునుబట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై యుండగా, దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరల బోధింపవలసి వచ్చెను (హెబ్రీ. 5:12).

శ్రోతలు చాలాకాలం నుండి విశ్వాసులుగా ఉన్నారు కాబట్టి, “కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసినవారై ఉండాలి” అని రచయిత చెప్పాడు అను విషయమును గమించండి. వారు గొప్ప సిద్ధాంతీయ పురోగతిని సాధించి ఉండాలి. అయితే రచయిత చెప్పినట్లుగా, వారికి “దేవోక్తులలో మొదటి మూలపాఠములను మరల బోధింపవలసి వచ్చెను.”

ఆసక్తికరంగా, శ్రోతలు వేదాంతపరముగా అపరిపక్వముగా ఉన్నప్పటికీ, క్రొత్త నిబంధన అంతటిలోకెల్లా హెబ్రీ పత్రికలో మాత్రమే కొన్ని అత్యంత అధునాతనమైన, జ్ఞానయుక్తమైన వేదాంత బోధనలు ఉన్నాయి. పత్రిక యొక్క ఈ లక్షణములు శ్రోతల యొక్క అపరిపక్వతకు ఎలా సరిపోతాయి? ఈ పరిస్థితిని అర్థం చేసుకోగల ఉత్తమమైన మార్గము ఏమిటంటే ఆదిమ క్రైస్తవులు మొదటి శతాబ్దపు సమాజ మందిరములలో ఉపయోగించే సాధారణ పద్ధతిని అనుసరించారు అను విషయమును మనసులో పెట్టుకోవడం.

సమాజ మందిరములలోని నాయకులు మరియు క్రైస్తవ సంఘ నాయకులు తమ సంఘాలకు లేఖనాల పఠనమును మరియు వివరణను అందించారని లూకా 4:16, అపొస్తలుల కార్యములు 13:15, మరియు 1 తిమోతి 4:13 వంటి వాక్యభాగములలో నుండి మనము నేర్చుకుంటాము. కాబట్టి, హెబ్రీ పత్రిక రచయిత కొన్ని అత్యంత వేదాంతపరమైన అధునాతనమైన క్రొత్త నిబంధన రచనలను వ్రాశాడు ఎందుకంటే సంఘ నాయకులు తన పత్రికను తమ సంఘాలకు బోధించాలని అతడు ఆశించాడు. ఇప్పుడు, హెబ్రీ 5:11లో, “వినుటకు మందులైనందున” అని పిలిస్తూ హెబ్రీ పత్రిక రచయిత తన శ్రోతలను గద్దించాడు. కాబట్టి, వారు తమ నాయకులను సరిగా గౌరవించనందున శ్రోతలలో ఎక్కువశాతం అపరిపక్వతగలవారు ఉన్నారు అని మనం చెప్పగలము.

ఈ అభిప్రాయము హెబ్రీ. 13:17 ద్వారా ధృవీకరించబడింది, అక్కడ రచయిత తన శ్రోతలకు ఈ విధముగా చెప్పాడు:

మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్‌ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి (హెబ్రీ. 13:17).

నాల్గవదిగా, హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు హింసించబడినవారైయున్నారు. క్రీ.శ. మొదటి శతాబ్దములో క్రైస్తవులను హింసించిన రెండు ప్రసిద్ధ సంఘటనలు ఉన్నాయి, ఇవి హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలను పరోక్షంగా ప్రభావితం చేసి ఉండవచ్చును. క్రీ.శ. 49లో, క్లౌదియ అను రోమా చక్రవర్తి రోమా పట్టణము నుండి యూదులను బహిష్కరించాడు. మరియు సుమారు క్రీ.శ. 64లో, నీరో చక్రవర్తి రోమా పట్టణములో క్రైస్తవులను హింసించాడు.

హెబ్రీ పత్రికను మనము చదువుచుండగా, హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు అప్పటికే గతములో హింసించబడ్డారు అని, కొందరు ప్రస్తుతము కూడా బాధననుభవించుచున్నారు అని స్పష్టమౌతుంది, మరియు వారిలో అనేకులు భవిష్యత్తులో మరింత తీవ్రంగా హింసించబడతారు అని రచయత భావించాడు.

10:32-35లో, గతములో కనీసము కొంతమంది అనుభవించిన బాధ మీద రచయిత దృష్టిపెట్టాడు.

అయితే మీరు వెలిగింపబడినమీదట, శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి... కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును (హెబ్రీ. 10:32-35).

“[వారు] [మొదట] వెలిగింపబడినమీదట పూర్వపుదినముల”లో హింసించబడినప్పుడు వారి బలమును బట్టి రచయిత తన శ్రోతలను ప్రశంసించినట్లు ఇక్కడ మనం చూస్తాము. అయితే “మీ ధైర్యమును విడిచిపెట్టకుడి” అని కూడా అతడు వారిని పురికొల్పాడు. ఇక్కడ “ధైర్యము” అని అనువదించబడిన గ్రీకు పదము పర్రెసియ అయ్యున్నది, అనేక సందర్భములలో దీని యొక్క అర్థము ఏమిటంటే ప్రముఖుల సమక్షములో “నిబ్బరం,” “ధైర్యము,” లేదా “నిర్భయము”గా ఉండడం. ఈ పదము యొక్క ఎంపిక శ్రోతలు బహిరంగముగా లేదా అధికారికంగా హింసను ఎదుర్కొనుచున్నారని మరియు వారు తమ ధైర్యమును కోల్పోయే శోధనలో ఉన్నారని సూచిస్తుంది.

13:3లో, రచయిత ఇలా చెప్పినప్పుడు ప్రస్తుత హింసలను కూడా సూచిస్తున్నాడు:

మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి (హెబ్రీ. 13:3).

“[మీరును] వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి” అని “కష్టముల ననుభవించుచున్న వారిని (మీరును అనుభవించుచున్నట్లు] జ్ఞాపకము చేసికొనుడి” అని రచయిత తన శ్రోతలను ప్రోత్సహించాడని ఈ వచనము ద్వారా మనం చూస్తాము. అతని శ్రోతల యొక్క హింస అంతా గతములో జరుగలేదని ఇక్కడ స్పష్టమౌతుంది.

గతములో మరియు ప్రస్తుత హింసతో పాటుగా, తన శ్రోతలు భవిష్యత్తులో మరింత హింసను ఎదుర్కొంటారు అని 12:3-4లో హెబ్రీ పత్రిక రచయిత గుర్తించాడు. ఈ ఉపదేశమును వినండి:

మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు, పాపాత్ములు తనకు వ్యతిరేకముగ చేసిన తిరస్కార మంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంక దానిని ఎదిరింపలేదు (హెబ్రీ. 12: 3-4).

ఈ వాక్యభాగము సూచిస్తున్నట్లుగా, తన శ్రోతలు మరింత హింసను ఎదుర్కొంటారని రచయిత భావించాడు, మరియు తమ అనుభవములోని ఈ లక్షణమును బట్టి అతడు బహుగా చింతించాడు.

హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు అనేక సమస్యలను ఎదుర్కొన్నారు... 10వ అధ్యాయములో రచయిత చెప్పినట్లుగా, వారు అనేక రకముల బాధలను అనుభవించారు; వారు తమ ఆస్తిని కోల్పోయారు, కొందరు చెరసాలలో వేయబడ్డారు, వారు ఒక విధమైన బహిరంగ అవహేళనకు గురైయ్యారు. అతడు ఈ పత్రికను వ్రాయచుండగా సమాజము నుండి వెలివేయబడు విధముగా కూడా క్రీస్తు కొరకు నిందను అనుభవించుటకు సిద్ధముగా ఉండమని ఇక్కడ అతడు పాఠకులను ప్రాధేయపడుతున్నాడు, మరియు అతడు ఈ విషయమును పాత నిబంధన పదజాలములలో వివరించుచున్నాడు, అనగా సమాజమందిరము నుండి వెలివేయబడుటను గూర్చి, మరియు వారు యెరూషలేములో ఉంటే దేవాలయము నుండి వెలివేయబడుటను గూర్చి మాట్లాడుతున్నాడు. మరియు అతడు ఈ పత్రికను వ్రాసిన సమయమునకు దేవాలయము ఇంకా పతనము కాలదు అని నేను నమ్ముతాను. కాబట్టి ఇవి వారు ఎదుర్కొంటున్న హింస యొక్క రూపములు. కాబట్టి 12వ అధ్యాయములో వారి బాధలు రక్తమును ధారపోయు స్థాయికి పెరగలేదని అతడు చెప్పాడు, మరియు 2వ అధ్యాయములో అతడు చెప్పినట్లుగా, యేసు క్రీస్తు పొందిన జయము వలన వారు మరణ భయము నుండి తప్పించబడ్డారని ధృవీకరించవలసిన అవసరతను గూర్చి అతనికి తెలుసు. కాబట్టి, మరింత తీవ్రమైన హింస భవిష్యత్తులో రాబోవుచుండవచ్చు.

— డా. డెన్నిస్ ఈ. జాన్సన్

ఐదవదిగా, హెబ్రీ పత్రిక యొక్క శ్రోతలు హింసను ఎదుర్కొనుచుండగా, వారిలో కనీసము కొందరు మతభ్రష్టత్వములోకి జారిపోయేవారిగా ఉన్నారు. నిరుత్సాహము పొందడము లేదా బాధల వలన బలహీనమైపోవడమే కాకుండా, పూర్తిగా క్రీస్తు నుండి వెనుదిరిగే ప్రమాదంలో వారు ఉన్నారు. ఉదాహరణకు, హెబ్రీ. 10:26-27లో మనము ఈ హెచ్చరికను చదువుతాము:

మనము సత్యమునుగూర్చి అనుభవజ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినయెడల పాపములకు బలి యికను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును (హెబ్రీ. 10:26-27).

హెబ్రీ పత్రిక రచయిత అల్ప దోషము లేదా చిన్న పాపములను గూర్చి శ్రద్ధ చూపుట లేదు అని మనం ఇక్కడ స్పష్టత కలిగి ఉండాలి. క్రీస్తు నుండి వెనుదిరిగి వెళ్లేవారికి, “పాపములకు బలి ఇకను ఉండదు” గనుక అతడు తన శ్రోతలను తీవ్రంగా హెచ్చరించాడు. హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలలో కొందరు క్రీస్తును తిరస్కరించుటకు శోధించబడినట్లుగా, ప్రజలు క్రైస్తవ విశ్వాసమును తిరస్కరించినప్పుడు, తమకు ఎన్నడు రక్షించు విశ్వాసము లేదని వారు నిరూపిస్తారు. మరియు ఈ కారణమును బట్టి, “న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును.”

మనము మన తదుపరి పాఠములో వివరించబోవుచున్నట్లుగా, నిజమైన విశ్వాసులు తమ రక్షించు విశ్వాసమును కోల్పోతారు అని ఇది మరియు ఇతర వాక్యభాగములు సూచించవు. బదులుగా, పునరుద్ధరణ లేకుండా మరియు నీతిమంతులుగా తీర్చబడకుండా తమ విశ్వాసమును ఒప్పుకొని దాని యొక్క ఆశీర్వాదములను అనుభవించువారిని గూర్చి ఈ వచనము మాట్లాడుతుంది. ప్రతి సంఘటనలోను, హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలలో కొందరు తమ విశ్వాసమును విడిచిపెట్టుటకు శోధించబడ్డారు.

పత్రిక యొక్క గ్రంథకర్తృత్వమును మరియు వాస్తవిక శ్రోతల దృష్ట్యా హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యమును మనము చూశాము కాబట్టి, ఇప్పుడు మనము మన యొక్క మూడవ అంశమును పరిశీలిద్దాము: హెబ్రీ పత్రిక వ్రాయబడిన తేది.

హెబ్రీ పత్రిక వ్రాయబడిన ఖచ్చితమైన తేది అనిశ్చితముగా ఉన్నప్పటికీ, ఈ పత్రిక యొక్క ఆరంభ మరియు చివరి తేదీలను ఉద్ఘాటించి చెప్పవచ్చును. మొదటిగా, పత్రిక యొక్క ఆరంభ తేదీని లేదా టర్మినస్ ఎ క్వో, మరియు చివరి తేదీని లేదా టర్మినస్ ఎక్వం ను చూద్దాము. ఈ రెండు తేదీలను లేఖనాత్మక మరియు చారిత్రిక ఆధారాలను ఉపయోగించి కొంత నిశ్చయతతో నిర్ణయించవచ్చును.

మరోప్రక్క, హెబ్రీ 13:23 ఈ పత్రిక యొక్క సాధ్యమైనంత ఆరంభ తేదీని నిర్థారించడానికి సహాయపడుతుంది. ఈ వచనములో రచయిత ఇలా వ్రాశాడు:

మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితోకూడ వచ్చి మిమ్మును చూచెదను (హెబ్రీ. 13:23).

ఇటీవలే చెరసాల నుండి “తిమోతికి విడుదల కలిగినది” అని ఇక్కడ మనం చూస్తాము. క్రొత్త నిబంధనలో ఎక్కడా కూడా తిమోతిని చెరసాలలో వేయుటను గూర్చి మనం వినము. వాస్తవానికి, పౌలు తన మరణమునకు ముందు తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో, తిమోతి ప్రయాణించి పౌలుకు అవసరమైన వస్తువులను స్వతంత్రంగా అందించేవాడు. అయినను, హెబ్రీ పత్రిక వ్రాయబడిన సమయానికి తిమోతి చెరసాలలో వేయబడి విడుదల కూడా పొందాడు అని ఈ వచనము మనకు తెలియజేస్తుంది. ఈ కారణమును బట్టి, హెబ్రీ పత్రిక వ్రాయబడిన కాలము సుమారు క్రీ.శ. 65లో పౌలు మరణము తరువాత అయి ఉండవచ్చు.

మరోవైపు, హెబ్రీ పత్రిక యొక్క చివరి తేదిగా, రోమా వాడైన క్లెమెంతు తన పత్రికయైన 1 క్లెమెంట్ లో హెబ్రీ పత్రికను ప్రస్తావించడానికి కొంతకాలం ముందు సుమారు క్రీ.శ. 95లో ఈ పత్రిక వ్రాయబడింది అని చెప్పవచ్చు.

అంతేకాకుండా, హెబ్రీ 5:1-3 వంటి వాక్యభాగములలో, ప్రధాన యాజకుని యొక్క బల్యర్పణ విధులను గూర్చి వివరించడానికి రచయిత వర్తమాన కాలమును ఉపయోగించాడని చాలామంది వ్యాఖ్యాతలు గమనించారు. ఇది చాలా ముఖ్యమైన విషయము ఎందుకంటే రచయిత తన పత్రిక యొక్క మిగిలిన భాగములో గత సంఘటనలను గూర్చి సూచించినప్పుడు గ్రీకు భూతకాలమును ఉపయోగించాడు. కాబట్టి, హెబ్రీ పత్రిక వ్రాయబడినప్పుడు ఈ ప్రధాన యాజకుల విధులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి.

8:13లో కూడా దేవుడు మోషేతో చేసిన నిబంధన ద్వారా స్థాపించబడిన “పాతగిలిన” బల్యర్పణ పద్ధతుల వైపు తిరిగి వెళ్లవద్దు అని రచయిత తన శ్రోతలను పురికొల్పాడు. క్రొత్త నిబంధన వెలుగులో, ఈ ఆచారాలు “అదృశ్యమగుటకు సిద్ధముగా” ఉన్నాయని అతడు వివరించాడు. ప్రధాన యాజకుని కార్యకలాపాలు, మరియు లేవీయుల యొక్క బల్యర్పణ వ్యవస్థ అంతయు, క్రీ.శ. 70లో రోమీయులు యెరూషలేమును, మరియు దేవాలయమును నాశనము చేసినప్పుడు ముగిసిపోయాయి అని మనకు తెలుసు. కాబట్టి, హెబ్రీ పత్రిక వ్రాయబడిన తేది సుమారు క్రీ.శ. 65లో పౌలు యొక్క మరణము తరువాత, మరియు క్రీ.శ. 70లో దేవాలయము నాశనము చేయబడుటకు ముందు కావచ్చని ఈ ఆధారలు సూచిస్తున్నాయి.

హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యము మరియు ఉద్దేశ్యము అను మన పాఠములో, హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యములోని అనేక లక్షణములను మనం చూశాము. ఇప్పుడు, పత్రిక యొక్క విస్తృతమైన ఉద్దేశ్యమును చర్చించడానికి మనం సిద్ధంగా ఉన్నాము. హెబ్రీ పత్రిక ఎందుకు వ్రాయబడింది?

హెబ్రీ పత్రిక వలె విస్తృతమైన లేదా సంక్లిష్టమైన ఏ పుస్తకమైన అనేక ఉద్దేశ్యములతో వ్రాయబడుతుంది అని చెప్పుట సమంజసముగానే ఉంటుంది. అయితే ఈ పాఠంలో, పత్రిక యొక్క విస్తృతమైన ఉద్దేశ్యమును సంగ్రహించుట మీద మనం ప్రధమంగా దృష్టిపెడదాము. ఈ పత్రికలోని ప్రతి భాగమునకు ఉద్ఘాటన ఉంది, మరియు ఈ ఉద్ఘాటనలను మనము తరువాత పాఠములలో చూద్దాము. ఈ సమయంలో, వాస్తవిక శ్రోతల యొక్క భావోద్వేగములను, ప్రవర్తనలను మరియు భావనలను ప్రభావితం చేయడానికి ఈ పత్రిక ఎలా రూపొందించబడినదో మనం చూద్దాము.

హెబ్రీ పత్రిక యొక్క విస్తృతమైన ఉద్దేశ్యమును వ్యాఖ్యాతలు వివిధ రకాలుగా సంగ్రహించారు. అయితే ఈ అధ్యయనము కొరకు, హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక ఉద్దేశ్యమును మనం ఈ విధముగా వివరిద్దాము:

స్థానిక యూదుల బోధనలను తిరస్కరించి యేసుకు నమ్మకముగా జీవించుమని తన శ్రోతలను ప్రోత్సహించుటకు హెబ్రీ పత్రిక రచయిత వ్రాశాడు.

రచయిత ఉద్దేశ్యము యొక్క ఈ వివరణ హెబ్రీ పత్రికలో కనిపించే ప్రధానమైన ఆలోచనలను చూచుటలో మనకు సహాయపడుతుంది.

మనము ఇంతకు ముందే చెప్పినట్లుగా, హెబ్రీ పత్రిక రచయిత తన శ్రోతలను ప్రోత్సహించడానికి దీనిని వ్రాశాడు. 13:22లో రచయిత తన పత్రికను స్వయంగా వర్ణించిన విధానమును వినండి:

సహోదరులారా, ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను (హెబ్రీ. 13:22).

ఇక్కడ రచయిత తన పత్రికను “హెచ్చరిక మాట”గా అంగీకరించుమని తన శ్రోతలను వేడుకొనుచున్నాడని గమనించండి. “వేడుకొనుచున్నాను” అను మాట గ్రీకు క్రియా పదమైన పారాకలియో నుండి వస్తుంది, మరియు ఇది ఇదే వచనములో “హెచ్చరిక” అని అనువదించబడిన గ్రీకు నామవాచకము యొక్క క్రియా రూపమైయున్నది.

హెచ్చరిక అను మాట యొక్క పరిభాష “మాట్లాడువాని యొద్దకు పిలచుట”ను లేదా “మాట్లాడువాని యొక్క దృక్పథమును అంగీకరించుట”ను సూచిస్తుంది. లూకా 3:18లో మారుమనస్సు కొరకు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క అత్యవసర, త్వరపెట్టు పిలుపును వివరించడానికి ఇదే వ్యక్తీకరణము ఉపయోగించబడింది.

ఆసక్తికరముగా, “హెచ్చరికమాట” అను పదసమూహము అపొస్తలుల కార్యములు 13:15లో కూడా కనిపిస్తుంది, అక్కడ పిసిదియలోనున్న అంతియొకయలో సమాజ మందిరపు అధికారులు లేఖనమును చదివిన తరువాత “ప్రోత్సాహకరమైన బోధను” బోధించమని పౌలును మరియు అతని సహచరులను పిలచారు. “హెచ్చరిక మాట” — లేక సందేశము — అను వ్యక్తీకరణము మొదటి శతాబ్దపు సాంకేతిక పేరుగా ఉంది, దీనిని నేడు మనం సందేశము అని పిలుస్తాము.

సరే, రచయిత తన పనిని హెచ్చరికమాట అని గుర్తించాడు — ఇది 13:22లో ఉంది — మరియు దీని యొక్క అర్థము ఏమిటంటే హెబ్రీ పత్రిక ఒక హెచ్చరికగా ఉంది; అది ఒక సందేశము అయ్యున్నది. కాబట్టి యేసును దేవుని కుమారునిగాను మరియు తమ యొక్క ప్రభువు మరియు రక్షకునిగాను అంగీకరించి, నిబద్ధతగా ఉండునట్లు శ్రోతలను పురికొల్పడానికి అలంకార శైలి యొక్క ఉపయోగము ప్రాధమికంగా ఒక సాధనముగా ఉంది. కాబట్టి, హెబ్రీ పత్రికలోని అలంకార శైలి, లేదా హెబ్రీ పత్రికలోని ధర్మోపదేశము, అంశములను వివరించడానికి, యూదుల లేఖనాలను లోతుగా వివరించడానికి — అనగా, అర్థవంతముగా యూదుల లేఖనాలను వివరించడానికి — రచయిత అతడు ఏమి ఆశించుచున్నాడో, వారేమిచేయాలని ఆశించుచున్నాడో శ్రోతలు స్పష్టంగా అర్థం చేసుకొనునట్లు దానిని శక్తివంతంగా ప్రదర్శించడానికి అనుమతిస్తుంది. క్రీస్తు వారికి అనుగ్రహించిన రక్షణకు, దేవుడు క్రీస్తులో అనుగ్రహించిన రక్షణకు కట్టుబడి ఉండాలని అతడు కోరాడు.

— డా. ఫ్రెడ్రిక్ లాంగ్

క్రొత్త నిబంధనలోని ప్రతి పత్రిక లేదా లేఖనము దాని యొక్క శ్రోతలకు ఉపదేశములను కలిగియుంటుంది. అయితే హెబ్రీ పత్రికలో ఉపదేశములు ఎక్కువ ఉండుటను బట్టి ఇతర క్రొత్త నిబంధన పత్రికలన్నిటికీ ఇది భిన్నముగా ఉంది.

రచయిత యొక్క ఉద్దేశ్యమును వివరించడానికి, పత్రికలోని ప్రాముఖ్యమైన హెచ్చరికల యొక్క తీవ్రతను మరింత దగ్గరగా చూద్దాము. తరువాత, ఈ హెచ్చరికల యొక్క లక్ష్యమును, తన శ్రోతలు ఎలా స్పందించాలని రచయిత ఉద్దేశించాడో చూద్దాము. రచయిత తన శ్రోతలకు ఇచ్చిన హెచ్చరికల యొక్క తీవ్రతను మొదటిగా చూద్దాము.

హెచ్చరిక యొక్క తీవ్రత అనగా ఏమిటో చూచుటకు, రెండు విషయాలను మనం చూద్దాము: మొదటిగా, పత్రికలోని హెచ్చరికల యొక్క తరచుదనం, మరియు రెండవదిగా, హెచ్చరికతో అనుసంధానంగా ఉన్న రచయిత యొక్క అలంకార శైలి. హెచ్చరికల యొక్క తరచుదనమును చూస్తూ ఆరంభిద్దాము.

రచయిత యొక్క తరచుదనం అతని సందేశము యొక్క ఆవశ్యకతను అర్థం చేసుకోడానికి మనకు సహాయపడుతుంది. ఈ హెచ్చరికలు కొన్నిసార్లు అవ్యక్తంగా ఉంటాయి, అయితే కనీసం 30సార్లు అవి స్పష్టంగా కనిపిస్తాయి. అనేక సందర్భములలో, గ్రీకు వ్యాకరణవేత్తలు “హోర్టేటరి సబ్జెన్టివ్” అని పిలచే వాటిని రచయిత ఉపయోగించాడు. వేడుకొనుట లేదా హెచ్చరించుట అను ఈ శబ్ద రూపాలు తరచు ఈ పని లేదా ఆ పని “చేద్దాము” అని అనువదించబడతాయి. ఉదాహరణకు, 4:14, 16లో ఇటువంటి రెండు హెచ్చరికలను మనం చదువుతాము:

మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము... ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము (హెబ్రీ. 4:14, 16).

రచయిత ఆజ్ఞావాక్యములను కూడా ఉపయోగించి తన శ్రోతలను హెచ్చరించాడు, వీటిని మనము తరచు ప్రత్యక్ష ఆదేశాలు అని అనువదిస్తాము. ఉదాహరణకు, 12:12-16లో హెచ్చరికలను గూర్చిన ఈ శీర్షికలను మనము చదువుతాము:

కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్లను బలపరచుడి. మీ పాదములకు మార్గములను సరళము చేసికొనుడి... అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి... మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండ తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి... ఏశావువంటి భ్రష్టుడైనను వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి (హెబ్రీ. 12:12-16).

రచయిత తన శ్రోతలను ఎంత తరచుగా ప్రత్యక్షంగా హెచ్చరించాడో జ్ఞాపకముంచుకోవడానికి ఒక అతి ముఖ్యమైన కారణం ఏమిటంటే, పత్రికలోని సంక్లిష్టమైన వేదాంత విశ్లేషణలు రచయిత యొక్క ఉద్దేశ్యమును తరచుగా మరుగుచేస్తాయి. అతడు తన శ్రోతలకు వేదాంతపరమైన సిద్ధాంతములను కేవలము తెలియపరచుటకు ఇష్టపడలేదు. విభిన్న వైఖరులను మరియు కార్యములను అవలంబించడానికి వారిని ఒప్పించుటకు అతడు వారికి సిద్ధాంత సమాచారమును ఇచ్చాడు. అతడు తన పత్రికను “హెచ్చరికమాట” అని పిలచినప్పుడు దాని అర్థము ఇదే. ఈ ఆవశ్యకతను మనము మనసులో ఉంచుకోకపోతే, హెబ్రీ పత్రిక యొక్క కీలకమైన కోణమును మనం కోల్పోతాము.

రచయిత యొక్క హెచ్చరికల తీవ్రత అతడు తన శ్రోతలను పురికొల్పిన తరచుదనములో ఎలా ప్రతిబింబించినదో మనం చూశాము. రచయిత యొక్క అలంకార శైలి అతని శ్రోతల పట్ల అతడు కలిగియున్న ఆసక్తిని ఎలా ప్రత్యక్షపరుస్తుందో ఇప్పుడు చూద్దాము.

హెబ్రీ పత్రిక ఎల్లప్పుడు అలంకారయుక్తమైనదిగా వర్ణించబడింది. అంటే మొదటి శతాబ్దములో ఒప్పించే వక్తృత్వం లేదా అత్యవసర చర్చతో సంబంధం ఉన్న అనేక సాహిత్య పరికరాలను ఇది ఉపయోగిస్తుంది అని అర్థం. అనేకమైన ఈ అలంకార పరికరాలు ఇక్కడ మరియు ఇతర క్రొత్త నిబంధన పుస్తకములలో కనిపిస్తాయి, కాని వాటిని మనము ఎక్కువగా హెబ్రీ పత్రికలో కనుగొంటాము.

క్రొత్త నిబంధన గ్రంథములో బలమైన సాహిత్య మరియు అలంకారిక నైపుణ్యములు కలిగిన రచయితలలో హెబ్రీ పత్రిక రచయిత బహుశా ఉత్తమ ఉదాహరణ అయ్యున్నాడు, మరియు ఈ అలంకారిక నైపుణ్యతలు రచయిత యొక్క ఉద్దేశ్యమును నెరవేర్చుటకు సహాయపడతాయి. అతడు క్రీస్తు యొక్క ఆధిపత్యమును చూపించడానికి మరియు పాత నిబంధన కంటే క్రొత్త నిబంధనను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు, అతడు దీనిని ఒప్పించగలిగే ఒక బలమైన సాహిత్య వాదనతో చేశాడు. మరియు అతడు దానిని సాధించడానికి అనేక విభిన్న నిర్మాణ లక్షణాలను ఉపయోగించాడు... కాబట్టి, అతని శ్రోతలను ఆకర్షించడానికి అలంకారమును ఉపయోగించి, ఆపై అతడు చేస్తున్న వాదనను బట్టి వారిని ఒప్పించడానికి దానిని అందముగా నిర్మించాడు.

— డా. మార్క్ ఎల్. స్ట్రాస్

గ్రీకులో ఇది సిన్క్రిసిస్ అని పిలువబడే ఒక అలంకారిక పరికరము అయ్యున్నది, అనగా మాట్లాడువాని యొక్క దృక్పథమును ధృవీకరించడానికి శ్రోతలను ఒప్పింపజేయడానికి రూపొందించబడిన రెండు లేదా ఎక్కువ విషయాల మధ్య వివరణాత్మకమైన పోలికమైయున్నది. ఉదాహరణకు, సిన్క్రిసిస్ అను పదము హెబ్రీ పత్రిక 7:11-28లో కనిపిస్తుంది. అక్కడ, యేసు, ఆదికాండము పుస్తకములో పేర్కొనబడిన యాజకుడు మరియు రాజు అయిన మెల్కీసెదెకు వంటి రాజరిక రాజు అయ్యున్నాడని రచయిత వాదించాడు. అయితే అతని నమ్మకమును కేవలము ధృవీకరించుట మాత్రమే కాకుండ, హెబ్రీ పత్రిక యొక్క రచయిత తన శ్రోతలకు క్రీస్తు మరియు మెల్కీసెదెకుకు మధ్య ఎనిమిది పోలికలను ఇచ్చాడు: వారి తల్లిదండ్రులు, జనన వృత్తాంతము, జననము, మరణము, పని, క్రియలు, స్థితి, మరియు విజయాలు. ఈ వివరణాత్మక పోలికలు యేసు గొప్ప, రాజరిక ప్రధాన యాజకుడు అనే వాదన మీద ఉన్న సందేహాలను పరిష్కరించడానికి రూపొందించబడ్డాయి.

హెబ్రీ పత్రికలో ఉన్న మరొక అలంకారిక పరికరమును ఎక్సెంప్ల అని పిలుస్తారు. ఎక్సెంప్ల అనగా ఒక నిర్దిష్ట దృక్పథము కొరకు ఒప్పించదగిన వాదనను రూపొందించడానికి ఒకదాని తరువాత మరొకటిగా అనుసరించే ఉదాహరణల లేదా దృష్టాంతముల జాబితాలు అయ్యున్నది. ఈ వక్తృత్వ సాంకేతికత హెబ్రీ 11లోని సుపరిచిత విశ్వాసుల జాబితాలో కనిపిస్తుంది. అక్కడ రచయిత పేరుల జాబితాను ఇచ్చాడు: హేబెలు, హనోకు, నోవహు, అబ్రాహాము, శారా, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఇశ్రాయేలీయులు, రాహాబు, గిద్యోను, బారాకు, సమ్సోను, యెఫ్తా, దావీదు, సమూయేలు మరియు ప్రవక్తలు. దేవుని సేవకులు తమ హింసయందంతటా నమ్మకముగా ఉండాలని శ్రోతలకు తెలియజేయడానికి ఈ సుదీర్ఘమైన జాబితా రూపొందించబడింది.

హెబ్రీ పత్రిక రచయిత ఉపయోగించే మూడవ అలంకారిక పరికరమును హెబ్రీ వ్యక్తీకరణలో కోల్ వహోమెర్ అని అంటారు. ఈ వ్యక్తీకరణము గ్రీకు-రోమా మరియు రబ్బీల సంప్రదాయములు రెంటి ద్వారా సుపరిచితమైనది మరియు దీనిని “తక్కువ నుండి ఎక్కువ,” “చిన్నది నుండి పెద్దది,” లేదా “సరళము నుండి సంక్లిష్టము” అని అనువదించవచ్చును. ఈ రకమైన వాదన శ్రోతల ద్వారా వివాదించబడని సాధారణ అలోచనతో ఆరంభమౌతుంది. తరువాత ఇది సంక్లిష్టమైన నిర్ధారణకు చేరుకుంటుంది, దీనిని శ్రోతలు అనుమానిస్తారు, కాని మరింత సుళువుగా అంగీకరిస్తారు. సరళంగా చెప్పాలంటే, సులభమైన ఆలోచన నిజమైనది కాబట్టి, సంక్లిష్టమైన నిర్ధారణ కూడా ఖచ్చితంగా నిజమైనదిగానే ఉండాలని ఈ వాదన చెబుతుంది. హెబ్రీ 10:28-29లో ఈ అలంకారిక పరికరం ఏ విధంగా కనిపిస్తుందో చూడండి:

ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించినయెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును? (హెబ్రీయులకు 10:28-29).

ఇక్కడ రచయిత శ్రోతలు అర్థం చేసుకున్న ఒక ఆలోచనతో ఆరంభించాడు: మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన వారికి శిక్ష మరణము. మోషే కంటే గొప్పవాడైన “దేవుని కుమారుని” “పాదములతో త్రొక్కి”న వాడు “ఎంత ఎక్కువ” దండనకు పాత్రుడు అని అతడు తన శ్రోతలకు మరింత నొక్కిచెప్పాడు.

రచయిత ఉద్దేశ్యములలోని త్వరిత గుణమును చూచుటకు ఈ ఉదాహరణలు మనకు సహాయపడతాయి. తన శ్రోతలు చాలా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొనుచున్నారు అని మరియు కొన్ని క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోడానికి ఇదే సమయము అని అతడు నమ్మాడు. కాబట్టి, సరైన నిర్ణయాలు తీసుకోవాలని వారిని పురికొల్పుటకుగాను మరియు హెచ్చరించుటకుగాను అతడు చేయగలిగినదంతయూ చేశాడు.

రచయిత యొక్క ఉద్దేశ్యములు అతని హెచ్చరిక మాటల ద్వారా ఎలా బలపరచబడినవో మనము చూశాము కాబట్టి, ఇప్పుడు పత్రికలోని రెండవ లక్షణమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము: ఈ హెచ్చరికల యొక్క లక్ష్యాలు.

హెబ్రీ పత్రిక యొక్క విస్తృతమైన ఉద్దేశ్యమును ఈ విధముగా నిర్వచించవచ్చు అని ఇంతకు ముందే మనము చూశాము:

స్థానిక యూదుల బోధనలను తిరస్కరించి యేసుకు నమ్మకముగా జీవించుమని తన పాఠకులను ప్రోత్సహించుటకు హెబ్రీ పత్రిక రచయిత వ్రాశాడు.

ఈ నిర్వచనము ధృవీకరించుచున్నట్లుగా, రచయిత హెచ్చరికల యొక్క లక్ష్యము రెండు విధములుగా ఉంది. అతని శ్రోతలు స్థానిక యూదుల బోధనలను తిరస్కరించాలని అతడు ఆశించాడు మరియు మెస్సీయగా యేసుకు నమ్మకముగా ఉండాలని కూడా అతడు ఆశించాడు. స్థానిక యూదుల బోధనలను తిరస్కరించుమని రచయిత తన శ్రోతలను ఎలా కోరాడో చూద్దాము.

హెబ్రీ పత్రిక యొక్క శ్రోతలు హింసను అనుభవించారని మరియు ఈ హింస మతభ్రష్టత్వములోనికి నడిపించడానికి వారిని శోధిస్తుందని మనం చూశాము. అయితే ఈ శోధన మనము మొదట ఊహించినది కాదు. హెబ్రీ పత్రిక వ్రాసే సమయంలో, క్రైస్తవులు తమ విలక్షణమైన క్రైస్తవ విశ్వాసములను తిరస్కరించి, తమ స్థానిక యూదుల సమాజముతో మరింత సన్నిహితముగా గుర్తించుకున్నట్లయితే హింస నుండి భద్రపరచబడియుండేవారు.

మొదటి శతాబ్దములో, యూదులు ఎల్లప్పుడు ప్రత్యేకమైన పన్నులు చెల్లించవలసి ఉండేదిది మరియు వారు ఎక్కువగా హింసించబడుతూ ఉండేవారు. అయితే చాలాసార్లు రోమా సామ్రాజ్యములోని యూదుల సమాజాలు తమ విశ్వాసమును అభ్యసించడానికి స్వతంత్రులుగా ఉండేవారు. ఆరంభములో, క్రైస్తవుల విషయములో కూడా ఈ విధముగా ఉండేది ఎందుకంటే వారు యూదా మతముతో దగ్గరగా గుర్తించబడేవారు. కాని కాలము గడిచేకొద్దీ, యూదా మతములో క్రైస్తవ్యం భాగముగా ఉన్నదను గుర్తింపు అంతరించిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే, పౌలు దినములలో కూడా, యూదుల సమాజమందిరాలు క్రీస్తు అనుచరులను తిరస్కరించినవి మరియు వారిని అవమానించుమని స్థానిక అధికారులను పురికొల్పినవి అని అపొస్తలుల కార్యములు నివేదిస్తుంది. అన్నిటికంటే ఎక్కువగా, హెబ్రీ పత్రిక యొక్క శ్రోతలు అనుభవించుచున్న పరిస్థితి ఇది. మరియు వారు అనుభవించుచున్న సుదీర్ఘమైన బాధలవలన క్రైస్తవ విశ్వాసముకు విరుద్ధంగా ఉన్న స్థానిక యూదుల సమాజపు బోధలను అంగీకరించడానికి శోధించబడ్డారు.

ఆసక్తికరముగా, హెబ్రీ పత్రిక యొక్క రచయత సాధారణంగా యూదుల వంచన మరియు చట్టపరమైన విషయాలతో ముడిపడి ఉన్న సమస్యలను పరిష్కరించలేదు. ఈ విషయాలు ఎంత ముఖ్యమైనవైనప్పటికీ, హెబ్రీ పత్రికలో అవి ప్రధానమైన విషయాలు మాత్రం కాదు. బదులుగా, రచయిత ప్రధమంగా అబద్ధ నమ్మకములు మరియు ఆచారాలను గూర్చి, ప్రత్యేకముగా పాలస్తీనా యూదా మతము యొక్క ప్రధానమైన తెగల వెలుపల ఉన్న యూదుల సమాజములలో అభివృద్ధి చెందిన విషయాలను గూర్చి చర్చించాడు. హెబ్రీ 13:9లో హెబ్రీ పత్రిక రచయిత ఏమి వ్రాశాడో వినండి:

నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనము లనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగ లేదు (హెబ్రీ. 13:9).

ఈ వచనములో, భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయమును స్థిరపరచుకొనుట మంచిది అని రచయిత వ్యత్యాసము చూపించాడు. ఈ నిర్దిష్ట ఉద్ఘాటన సుపరిచితమైనదిగా అనిపిస్తుంది. “నానా విధములైన అన్య బోధలు” అని అతడు పిలచేదానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని గమనించండి. మరోమాటలలో, అసాధారణమైన లేదా అన్య బోధనలను స్థానిక యూదుల సమాజములు బోధించేవి. కాబట్టి, శ్రోతలు అనుసరించడానికి శోధించబడిన “ఈ అన్య బోధలు” ఏమిటి?

గత శతాబ్దములోని రెండవ భాగములో, కుమ్రాన్ వద్ద డెడ్ సి స్క్రోల్స్ కనుగొనబడడంతో ఈ ప్రశ్నకు అనేక ఉపయోగకరమైన అంతర్దృష్టులు వెలుగులోకి వచ్చాయి. దీర్ఘకాలంగా సేకరించబడిన ఈ ప్రతుల సేకరణలో పాత నిబంధన వాక్యభాగములు ఉన్నాయి, డెడ్ సి దగ్గర నిససిస్తున్న నిరాకరించబడిన యూదుల సమూహము యొక్క విలక్షణమైన బోధనలను సూచించే బైబిలేతర రచనలు కూడా ఉన్నాయి. రూల్ ఆఫ్ ది కమ్యూనిటి, ది డెమాస్కస్ కవనెంట్, ది వార్ స్క్రోల్, ది మిద్రాష్ ఆన్ మెల్కీసెదెక్, అదే విధంగా “ది బుక్ ఆఫ్ ది వాచర్స్” మరియు “ది బుక్ ఆఫ్ డ్రీమ్స్” గా పిలువబడే 1 ఎనోక్ లోని భాగాలు వీటిలో ఉన్నాయి. ఈ పుస్తకములలో ఉన్న బోధనలు హెబ్రీ పత్రికలో చర్చించబడిన వేదాంత అంశాలకు సమాంతరముగా ఉన్నాయి.

ఇప్పుడు, ఈ బోధలు ఈ సమాజముకు ప్రత్యేకమైనవి కావు అని గమనించుట ముఖ్యమైన విషయము. మధ్యదరా ప్రపంచంలోని ఇతర యూదుల సమూహాలు కూడా ఇలాటి అభిప్రాయములను కలిగి ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే, ఎఫెసీయులకు మరియు కొలస్సయులకు వ్రాయబడిన పత్రికలు తమ ప్రాంతములలో పోల్చదగిన విషయాలను చర్చించాయి. అయినను, హెబ్రీ పత్రిక మరియు కుమ్రాన్ వద్ద కనుగొనబడిన పుస్తకాలు రెంటిలోను కనుగొనబడే ఇలాటి కొన్ని విషయాలను గమనించినట్లయితే స్థానిక యూదుల సమాజము యొక్క నమ్మకములు హెబ్రీ పత్రికలోని హెచ్చరికలకు విరుద్ధంగా ఉన్నాయని అర్థం చేసుకొనుటకు ఇవి మనకు సహాయపడతాయి.

డెడ్ సి స్క్రోల్స్ కుమ్రాన్ ఎడారిలో కనుగొనబడిన మనోహరమైన ప్రతులు, మరియు అవి యూదుల ప్రధాన స్రవంతికి, ప్రత్యేకముగా దేవాలయ సముదాయమునకు వ్యతిరేకంగా తమనుతాము గుర్తించుకొనిన ఒక తీవ్రమైన యూదుల తెగ యొక్క రచనలుగా ఉన్నాయి. కాబట్టి హెబ్రీ పత్రికకు కొంత సారూప్యముగా, కుమ్రాన్ వద్ద ఉన్న తెగలవారు నూతన నిబంధన ప్రకారం నూతన దేవాలయము అని తమ్మునుతాము భావించుకున్నారు. ఇప్పుడు, పాత నిబంధన యొక్క కొన్ని ఆచారపరమైన అంశాల వలన ముఖ్యముగా చాలా అసమానతలు ఉన్నాయి, కుమ్రాన్ సమూహము హెబ్రీ పత్రిక రచయిత సూచించిన రీతిగా వాటిని పునరుజ్జీవింపజేయాలని కోరుకుంది.

— డా. సీన్ మెక్ డోనో

ఈ పాఠము కొరకు, హెబ్రీ పత్రిక మరియు కుమ్రాన్ ప్రతులలో కనిపించు నాలుగు అంశాలను మాత్రం మనం చూద్దాము.

ఆచారబద్ధమైన ఆహారము. మొదటిగా, హెబ్రీ 13:9లో మనము ఇప్పటికే చెప్పిన విధముగా, ఆచారపరమైన ఆహారమును తినుటకు వ్యతిరేకముగా రచయిత మాట్లాడాడు.

కుమ్రాన్ వద్ద ఆచరించబడిన అనేక ఆచారములు ది రూల్ ఆఫ్ కమ్యూనిటి లో వివరించబడినవి. అనేక ఇతర విషయములతో పాటుగా, కుమ్రాన్ సమాజము ఎల్లప్పుడు పవిత్రమైన మతపరమైన భోజనమునలు ఏర్పాటు చేసేవారు, అందులో వారు ప్రత్యేకముగా పవిత్రపరచబడిన ఆహారమును మాత్రమే తినేవారు.

ప్రాధమిక బోధనలు. రెండవదిగా, హెబ్రీ పత్రికలో ఉన్న ప్రాధమిక బోధనల యొక్క రకములు కుమ్రాన్ ప్రతులలో కూడా కనిపిస్తాయి.

ఉదాహరణకు, హెబ్రీ. 6:1-2లో రచయిత మారుమనస్సు, విశ్వాసము, శుద్ధీకరణ ఆచారాలు (బాప్తిస్మము), చేతులుంచుట, మృతుల పునరుత్థానము మరియు నిత్య తీర్పును గూర్చి ప్రస్తావించాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కుమ్రాన్ లోని ది రూల్ ఆఫ్ ది కమ్యూనిటి మరియు వార్ స్క్రోల్ పాలస్తీనా యూదా మతము యొక్క ప్రధాన స్రవంతికి భిన్నమైన మార్గములలో ఇవి మరియు ఇలాటి విషయముల మీద శ్రద్ధ చూపుతాయి.

దేవదూతలు. మూడవదిగా, కుమ్రాన్ లోని సాహిత్యము హెబ్రీ పత్రికలో దేవదూతల మీద ఉన్న ఉద్ఘాటనను అర్థం చేసుకోడానికి సహాయం చేస్తుంది. హెబ్రీ పత్రిక దేవాదూతలను గూర్చిన నమ్మకాలను అనేక వాక్యభాగములలో ప్రస్తావిస్తుంది. రూల్ ఆఫ్ ది కమ్యూనిటి, ది డెమాస్కస్ కవనెంట్, ది వార్ స్క్రోల్, అదే విధంగా “ది బుక్ ఆఫ్ ది వాచర్స్” మరియు “ది బుక్ ఆఫ్ డ్రీమ్స్”గా పిలువబడే 1 ఎనోక్ లోని కొన్ని భాగములలోని బోధనలను పోలిన నమ్మకాలకు ప్రతిస్పందనగా ఈ ఉద్ఘాటన ఉంది. ఈ పుస్తకములు మంచి మరియు చెడు దేవాదూతల యొక్క శక్తులను, దైవిక ప్రత్యక్షతను అందించేవారిగా వారి పాత్రను, మరియు తమకంటే తక్కువస్థాయిలో ఉన్న మానవుల మీద వారు చూపు ప్రభావమును ప్రశంసించాయి. స్పష్టంగా, హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు ఈ విధమైన బోధనకు ఆకర్షించబడ్డారు.

మెల్కీసెదెకు. నాలుగవదిగా, కుమ్రాన్ ప్రతులు పాత నిబంధన పాత్రయైన మెల్కీసెదెకు విషయంలో హెబ్రీ పత్రిక యొక్క రచయితకు ఉన్న అసాధారణ ఆసక్తిని అర్థం చేసుకోడానికి సహాయపడతాయి.

సుదీర్ఘకాలంగా, మెల్కీసెదెకుకు మరియు యేసుకు మధ్య పోలికలు హెబ్రీ పత్రిక యొక్క రచయితకు ఎందుకు అంత ముఖ్యమైనవో వివరించడానికి వ్యాఖ్యాతలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తరచు ది మిద్రాష్ ఆన్ మెల్కీసెదెక్ లేదా మెల్కీసెదెక్ అని పిలువబడే కుమ్రాన్ లో కనుగొనబడిన ఒక ప్రతు, మెల్కీసెదెకు దినమును ప్రకటించి, దేవుని ప్రజల కొరకు ప్రాయశ్చిత్తము జరిగించుటకు అంతిమ దినములలో ప్రత్యక్షమవ్వబోవుచున్న ఒక పరలోకపు వ్యక్తి అని తప్పుగా బోధించింది. కనిపించే వీటన్నిటి నుండి, హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు ఇవి మరియు ఇటువంటి తప్పుడు నమ్మకములను కలిగి ఉండుటకు శోధించబడ్డారు.

యూదుల సమాజములో వ్యాపించిన తప్పుడు బోధలను గుర్తించినట్లయితే, ఈ బోధలను ప్రతిఘటించి యేసుకు నమ్మకముగా ఉండాలని హెబ్రీ పత్రిక రచయిత తన శ్రోతలను ఎందుకు హెచ్చరించాడో అర్థం చేసుకొనుటకు అవి మనకు సహాయపడతాయి.

డెడ్ సి స్క్రోల్స్ కు మరియు హెబ్రీ పత్రికకు మధ్య ఆసక్తికరమైన అనేక పోలికలు ఉన్నాయి. బహుశా వాటిలో అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే, వారు అంత్యదినములలో జీవించుచున్నట్లు మరియు దేవుని యొక్క తుది రక్షణ జరుగబోతున్నట్లు రెండు సమాజములవారు నమ్మారు లేదా గుర్తించారు. వాస్తవంగా చెప్పాలంటే, హెబ్రీ పత్రికలో మనము చూచే వ్యత్యాసం ఏమిటంటే దేవుని రక్షణ వచ్చింది అని అది సెలవిస్తుంది, అయితే కుమ్రాన్ సమాజము — లేదా డెడ్ సి స్క్రోల్స్ — ఏ సమయములోనైన అది జరుగుతుంది అని ఆశించింది. అయితే బహుశా ఈ రెంటి మధ్య మెల్కీసెదెకు పాత్ర చాలా ఆసక్తికరమైన పోలికగా ఉన్నది. హెబ్రీ పత్రికలోని మెల్కీసెదెకు విషయములో, యేసు యొక్క ప్రధాన యాజకత్వము అహారోను క్రమములో లేదు, అనగా సాంప్రదాయ పాత నిబంధన పాత్ర క్రమములో లేదుగాని మెల్కీసెదెకు క్రమములోనే ఉంది అని రచయిత మెల్కీసెదెకును గూర్చిన తన వేదాంతశాస్త్రమును అభివృద్ధి చేశాడు, ఎందుకంటే మెల్కీసెదెకు ఆదికాండములో అబ్రాహామును కలసిన చట్టపరమైన ప్రధాన యాజకుడు అని మనం చూస్తాము — కాబట్టి, ఈ మెల్కీసెదెకు పోలిక జరిగింది. సరే, డెడ్ సి స్క్రోల్స్ లోని ఒకదానిలో — డెడ్ సి స్క్రోల్స్ యొక్క 11వ గుహలో కనుగొనబడినది కాబట్టి ఇది 11Q అని పిలువబడుతుంది — మెల్కీసెదెకు రక్షణను అనుగ్రహించు ఒక శక్తివంతమైన, పరలోకపు, మహిమగల, మెస్సీయ చిత్రముతో చిత్రీకరించబడ్డాడు. కాబట్టి, వాస్తవంగా చెప్పాలంటే, హెబ్రీ పత్రికలో మెల్కీసెదెకు క్రీస్తుకు పోలికెగా ఉన్నాడు, మరియు డెడ్ సి స్క్రోల్స్ లో మెస్సీయ చిత్రముగా ఉన్నాడు గనుక ఇది ఒక ఆసక్తికరమైన పోలికగా ఉంది. హెబ్రీ పత్రికలోని మెల్కీసెదెకు చిత్రముకు మరియు డెడ్ సి స్క్రోల్స్ లోని మెల్కీసెదెకుకు మధ్యగల ఈ సంబంధమును గూర్చి పండితులు కలవరపడుతున్నారు. ఇది ఆసక్తికరమైన పోలిక.

— డా. మార్క్ ఎల్. స్ట్రాస్

హెబ్రీ పత్రికలోని హెచ్చరికల యొక్క లక్ష్యము స్థానిక యూదుల బోధనలను తిరస్కరించుమని హెచ్చరించుట మాత్రమే కాదు. వాస్తవానికి, వారు మెస్సీయగా యేసుకు నమ్మకముగా ఉండాలని రచయిత ఆశించాడు.

యేసుకు నమ్మకముగా జీవించాలని తన శ్రోతలకు పిలుపునిచ్చిన లక్ష్యమును నెరవేర్చుటకు, హెబ్రీ పత్రిక యొక్క రచయిత తన హెచ్చరికలను ఐదు ప్రధాన భాగములుగా విభాగించాడు. తరువాత పాఠములో ప్రతి విభాగమును కొంత వివరముగా మనం చూద్దాము. అయితే ఈ సమయంలో ప్రతి విభాగములోని కేంద్ర అంశమును సంగ్రహించడానికి ఇది సహాయపడుతుంది.

హెబ్రీ 1:2-2:18లో, హెబ్రీ పత్రిక రచయిత దేవదూతల ప్రత్యక్షతల కంటే క్రీస్తు ఆధిపత్యమును ధృవీకరించమని తన శ్రోతలకు పిలుపునిచ్చాడు.

హెబ్రీ పత్రిక దేవదూతలను గూర్చిన తప్పుడు నమ్మకాలకు వ్యతిరేకముగా మాట్లాడుతుంది అని ఈ పాఠంలో మునుపు మనం చూశాము. దేవదూతలు శక్తివంతమైనవి, తమకంటే తక్కువస్థాయి కలిగిన మనుషులకు దైవ ప్రత్యక్షతను అనుగ్రహించే మహిమగల సృష్టి అని అనేకమైన యూదుల రచనలు వాటిని ప్రశంసించాయి. దేవాదూతలను గూర్చిన ఈ ప్రశంస క్రీస్తు అనుచరులకు ఒక తీవ్రమైన సవాలును లేవనెత్తింది. యేసు మాంసము మరియు రక్తము అయ్యున్నాడు. ఆయన సెలవిచ్చిన మాటలకు బదులుగా ఒకరు దేవాదూతల ప్రత్యక్షత=లను ఎలా అనుసరించగలరు? హెబ్రీ పత్రిక రచయిత ఈ స్థానిక యూదుల బోధలకు పాత నిబంధన ద్వారా, యేసు జీవితము, మరణము, పునరుత్థానము, ఆరోహణము, మరియు మహిమలో తిరిగివచ్చుట ద్వారా స్పందిస్తూ, ఆయన నిజముగా దేవదూతల కంటే గొప్పవాడు అని నిరూపించాడు.

హెబ్రీ 3:1-4:13లోని రెండవ ప్రధాన భాగము యేసు మోషే అధికారము కంటే గొప్పవాడు అని చూపిస్తుంది.

యేసు అనుచరులు దేవుడు మోషే ద్వారా ఇచ్చిన బల్యర్పణ సేవలను పాటించుటలేదని అందరికీ స్పష్టమైంది. మోషే మరియు అతని మార్గములకు తిరిగి రావాలని స్థానిక యూదుల సమాజము క్రైస్తవులకు పిలుపునిచ్చింది. మోషే దేవుని యొక్క నమ్మకమైన దాసుడు అని ధృవీకరిస్తూ హెబ్రీ పత్రిక రచయిత స్పందించాడు. అయితే యేసు దేవుని యొక్క రాజరిక కుమారుడు గనుక మరింత గొప్పవాడైయున్నాడు.

దేవదూతలు మరియు మోషేను గూర్చి చర్చించిన తరువాత, హెబ్రీ పత్రిక రచయిత 4:14-7:28లో మెల్కీసెదెకు యొక్క యాజకత్వమును గూర్చి చర్చించాడు.

ఈ విభాగములో, మెల్కీసెదెకు యొక్క క్రమములో యేసు ఉన్నతమైన రాజరిక యాజకుడు అని రచయిత వాదించాడు. స్పష్టంగా, వాస్తవిక శ్రోతలు యేసును మెస్సీయగా తిరస్కరించాలని స్థానిక యూదుల సమాజము కోరుకుంది, ఎందుకంటే అంతిమ దినములలో మెల్కీసెదెకు ఒక గొప్ప రాజరిక ప్రధాన యాజకునిగా కనిపిస్తాడు అని వారు నమ్మారు. ప్రతిస్పందనగా, హెబ్రీ పత్రిక రచయిత యేసు పాపమునకు శాశ్వతమైన ప్రాయశ్చిత్తమును అందించడానికి అంతిమ దినములలో కనిపించిన నిజమైన రాజరిక యాజకుడు అని నిరూపించాడు.

8:1-11:40లో, హెబ్రీ పత్రిక రచయిత యేసులో నూతన నిబంధన యొక్క ఆధిపత్యమును వివరించాడు.

యిర్మీయా వాగ్దానం చేసిన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిత్వం వహించడానికి యేసు వచ్చాడని ప్రకటించు క్రైస్తవుల యొక్క ప్రకటనను గూర్చి స్థానిక యూదుల సమాజము యొక్క బోధనలు అనుమానములను లేవనెత్తాయి. అయితే హెబ్రీ పత్రిక యొక్క రచయిత, యేసు వాస్తవానికి, నూతన నిబంధనకు మధ్యవర్తి అని సూచించాడు.

12:1-13:25లోని చివరి ప్రధాన విభాగములో, శ్రోతలకు ఆచరణాత్మమైన సహనమును అభ్యసించు అనేక మార్గములను హెబ్రీ పత్రిక వివరిస్తుంది.

ఈ విభాగములో సుదీర్ఘమైన హెచ్చరికలు ఉన్నాయి, అలాగే ఈ హెచ్చరికలకు వివరాలు కూడా ఉన్నాయి. స్థానిక యూదుల సమాజము నుండి మరియు ఇతర వాటి నుండి తమ విశ్వాసముకు కలిగే ఆటంకముల వెలుగులో, రచయిత తన శ్రోతలను ప్రోత్సహించడానికి మరియు బలపరచడానికి వ్రాశాడు. దేవుని వాగ్దానములను మరియు యేసులోని వాగ్దానములను వారికి జ్ఞాపకం చేస్తూ మెస్సీయగా యేసుకు నమ్మకముగా ఉండుమని అతడు వారిని హెచ్చరించాడు.

అనేకమైన హెచ్చరికల ద్వారా, హెబ్రీ పత్రిక యొక్క రచయిత, భావార్థకంగా చెప్పాలంటే, అతని శ్రోతలు సహనముగా ఉండాలని ప్రోత్సహించాడు. మరియు అతడు ఉపయోగించిన భాష కొంతవరకు మృదువుగా, విన్నపముగా, ప్రోత్సాహకరమైనదిగా ఉంది, అయితే మరికొంత నిర్మోహమాటంగా, కఠినంగా, భయంకరముగా ఉంది. అది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము నుండే ఆరంభమౌతుంది – “పాత నిబంధన పరిశుద్ధులే పడిపోయినట్లయితే, క్రొత్త నిబంధన వారసులైన, ప్రభువైన యేసును యెరిగిన మనము ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?” మరియు “ఇదే అయితే, అది ఇంకా ఎంత తీవ్రముగా ఉంటుంది,” అను ఈ విధమైన బలవంతపు వాదన ఈ పత్రికలో పదే పదే కనిపిస్తుంది. తరువాత హెబ్రీ పత్రికలోని 6 మరియు 10 అధ్యాయములో “మతభ్రష్టత్వపు వాక్యభాగములు”గా పిలువబడే రెండు వాక్యభాగములు ఉన్నాయి, అవి క్రీస్తునందు గొప్ప విశ్వాసమును కనుపరచి —కొంతకాలం అనుసరించి — తరువాత విడిచిపెట్టే వారి యొక్క ప్రమాదమును గూర్చి హెచ్చరిస్తాయి. కాబట్టి, పాత నిబంధన కథనమును చదివేడప్పుడు, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము యొక్క చివర్లో, రచయిత ఇలా అంటాడు, ఐగుప్తు నుండి విమోచించబడి మరియు బానిసత్వము నుండి విడిపించబడిన పాత నిబంధన పరిశుద్ధులవలె ఉండకుడి ఎందుకంటే వారు సహనము లేనందున వాగ్దాన దేశములో ప్రవేశింపలేదు. వారు అరణ్యములోనే రాలిపోయారు. ఇంచుమించు ఆ తరము అంతయు రాలిపోయింది. మరియు, ప్రోత్సహించాలనే అతని యొక్క ప్రేరణ కేవలం సున్నితమైనది లేదా మృదువైనది మాత్రమే కాదుగాని, ఆయన వైపు ఆకర్షించబడడానికి ఆప్యాయత, ప్రోత్సాహము క్రీస్తు యొక్క మహిమలను ఎత్తిపట్టుకొనుటను చూపించే కాపరుల సమాంతరాల రకాలు అవి. అయితే ఒక ప్రమాదము మరియు హెచ్చరిక కూడా ఉంది, ఏమిటంటే ఇది ఒక తీవ్రమైన విషయము మరియు మీరు దీనిని తీలికగా తీసుకోకూడదు.

— డా. డి. ఎ. కార్సన్

హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యము మరియు ఉద్దేశ్యము అను ఈ పాఠములో, రచయిత, శ్రోతలు మరియు కూర్పు చేయబడిన తేది దృష్ట్యా హెబ్రీ పత్రిక యొక్క నేపథ్యమును చూశాము. స్థానిక యూదుల బోధల నుండి వెనుదిరిగి, మెస్సీయగా యేసునందు తమ నమ్మకమును పునరుద్ఘాటించుమని రచయిత తన శ్రోతలను ప్రోత్సహించడానికి తన పత్రికను ఎలా వ్రాశాడో పరిశీలించుట ద్వారా హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక ఉద్దేశ్యమును మనం చూశాము.

హెబ్రీ పత్రిక క్రొత్త నిబంధన గ్రంథములో అత్యంత కఠినమైన పుస్తకాలలో ఒకటిగా ఉంది. అది మనకు చాలా విషయాలను తెలియజేస్తుంది గనుక అది బోధించే వాటిలో కొంత భాగమును మాత్రమే మనం అర్థం చేసుకోగలుగుతాము. అయినను, ఈ సంక్లిష్టమైన బోధనల ద్వారా అనేక విధములుగా మనము ప్రయోజనము పొందవచ్చు. ఆధునిక క్రీస్తు అనుచరులముగా, యేసు యెడల మనకున్నవిశ్వాసము విషయములో రాజీపడుట ద్వారా ఈ జీవితములో కలిగే ఇబ్బందులను నివారించుకోవాలనే శోధనలను మనం ఎదుర్కొంటాము. అయితే హెబ్రీ పత్రిక రచయిత తన వాస్తవిక శ్రోతలను ఆవశ్యకముగా హెచ్చరించిన విధానమును వినుటకు మనం హృదయములను సిద్ధపరచుకొంటే, మనం ఎటువంటి వ్యతిరేకతను ఎదుర్కొనినప్పటికీ, విశ్వాసములో స్థిరులమై ఉండుట ఎంత ముఖ్యమైయున్నదో మనం చూడగలుగుతాము.

Continue reading the full transcript