అదే శ్రేణిలోని 2వ పాఠానికి సంబంధించిన ఒక అనుబంధ వీడియో, ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: హెబ్రీయుల రచయిత యేసు క్రీస్తు రాకతో చరిత్ర చివరి రోజులకు చేరుకుందని ఎలా విశ్వసించాడు? హెబ్రీయుల రచయిత తన పాఠకులకు పాత నిబంధన చట్టబద్ధతను ఎలా ధృవీకరించాడు? హెబ్రీయుల రచయిత తన పాఠకులను విశ్వాసంలో పట్టుదలగా ఉండమని ఎలా ప్రేరేపించాడు? హెబ్రీయులలోని హెచ్చరికలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? హెబ్రీయుల రచయిత యేసును అహరోను మరియు మెల్కీసెదెకు యాజకత్వంతో ఎలా పోల్చాడు మరియు విరుద్ధంగా చూపాడు? పాత నిబంధనలో అందించిన బలుల కంటే యేసు పాపం కోసం చేసిన త్యాగం ఎలా ఉన్నతమైనది? యేసు పూజారిగా మరియు బలుగానూ ఉండటం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? 12వ అధ్యాయంలో హెబ్రీయుల రచయిత మనం ఇప్పటికే సియోను, పరలోకపు యెరూసలేము వద్దకు వచ్చామని చెప్పినప్పుడు అతడు దేనిని సూచించాడు? హెబ్రీయుల రచయిత క్రీస్తు రాకతో పాత నిబంధన వాడుకలో లేకుండా పోయిందని చెప్పినప్పుడు అతడు దేనిని సూచించాడు? హెబ్రీయుల పుస్తకం కొత్త నిబంధనను ఒక నిబంధన పునరుద్ధరణగా లేదా పూర్తిగా కొత్తదిగా ప్రదర్శిస్తుందా? 13వ అధ్యాయంలో హెబ్రీయుల రచయిత దేవుని ప్రజల చివరి గమ్యస్థానాన్ని ఎలా వర్ణించాడు?
From the transcript
1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.
బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.
ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.
అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.
మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.
మనతో ఏకీభవించుటకు ప్రజలను ఒప్పించాలనుకునే పరిస్థితులను మనం తరచుగా ఎదుర్కుంటాము. దీనిని చేయుటకు అనేక మార్గములు ఉన్నాయి, అయితే మన మధ్య పోలిక కలిగియున్న నమ్మకముల మీద సాధ్యమైనంత వరకు నిర్మించుట అనేది ఒక అత్యంత ప్రభావవంతమైన మార్గముగా ఉంది. అటుతరువాత, ఆ పోలికగల నమ్మకమును ఆధారము చేసుకొని, ఇతర విషయములలో మనము వారిని ఒప్పించవచ్చును. అనేక సందర్భములలో, హెబ్రీ పత్రిక యొక్క రచయిత కూడా ఇలానే చేశాడు. స్థానిక యూదుల సమాజము బోధించు విషయములలోనికి తిరిగివెళ్లుట ద్వారా హింసను తప్పించుకోవాలని శోధించబడిన సంఘముకు అతడు వ్రాశాడు. కాబట్టి, క్రీస్తుకు నమ్మకముగా జీవించమని వారిని పురికొల్పుటకు, అతడు మరియు అతని శ్రోతలు సాధారణముగా కలిగియున్న నమ్మకముల మీద అతడు తన ఆలోచనలను నిర్మించాడు.
హెబ్రీయులకు వ్రాసిన పత్రిక అను మన పాఠ్యక్రమములో ఇది రెండవ పాఠము మరియు దీనికి మనము “విషయములు మరియు ఆకృతి” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో, హెబ్రీ పత్రిక రచయిత క్రీస్తుపట్ల వారు కలిగియున్న నిబద్ధతను పునరుద్ధరించుకొనమని తన శ్రోతలను ప్రోత్సహించుచుండగా, ఈ పురికొల్పు ప్రణాళికను ఎలా అనుసరించాడో చూద్దాము.
హెబ్రీ పత్రిక యొక్క విషయములు మరియు ఆకృతి అను మన పాఠము రెండు భాగములుగా విభజించబడుతుంది. మొదటిగా, ప్రతి పుస్తకము యొక్క ప్రధాన భాగములో కనిపించే విషయములను మనము చూద్దాము. రెండవదిగా, హెబ్రీ పత్రిక యొక్క అలంకారిక ఆకృతిని, రచయిత పునరావృతమయ్యే ఈ అంశాలను పురికొల్పు విధముగా ఎలా వివరించాడో పరిశీలిద్దాము. హెబ్రీ పత్రిక యొక్క విషయములను మొదటిగా చూద్దాము.
మన మునుపటి పాఠములో, పత్రిక యొక్క విస్తృతమైన ఉద్దేశ్యమును ఈ విధముగా మనము సంగ్రహించాము:
స్థానిక యూదుల బోధనలను తిరస్కరించి యేసుకు నమ్మకముగా జీవించమని తన పాఠకులను ప్రోత్సహించుటకు హెబ్రీ పత్రిక రచయిత వ్రాశాడు.
ఇప్పుడు మన పాఠములో, ఇలాటి అంశాలను పదే పదే ఉపయోగించడము ద్వారా రచయిత తన ఉద్దేశ్యమును ఎలా నేరవేర్చాడో చూద్దాము.
హెబ్రీ పత్రికలోని విషయములను నిశితంగా పరిశీలించినట్లయితే, రచయిత మూడు ప్రధానమైన అంశాలను పునరావృతం చేయడం ద్వారా తన విస్తృతమైన ఉద్దేశ్యమును నెరవేర్చాడు అని తెలుస్తుంది. మొదటిగా, చరిత్ర యేసులో అంత్యదినములకు చేరుకుంది అనే విషయము మీదకి అతడు మన దృష్టిని ఆకర్షించాడు. రెండవదిగా, అతడు ఈ నమ్మకముకు పాత నిబంధన మద్దతును తెలియపరిచాడు. మరియు మూడవదిగా, వారు క్రైస్తవ విశ్వాసములో కొనసాగునట్లు అనేక ఉపదేశములను అతడు తన శోత్రలకు ఇచ్చాడు. అంత్యదినములు యేసులో వచ్చాయి అను రచయిత యొక్క నమ్మకముతో ఆరంభిద్దాము.
ఎక్కువగా, “అంత్యదినములు” అను వ్యక్తీకరణమును క్రీస్తు అనుచరులు వినినప్పుడు, క్రీస్తు మహిమలో తిరిగివచ్చు సంఘటనల వైపుకు వారి దృష్టి మళ్లుతుంది. మనలో చాలామంది గొప్ప శ్రమదినాలు, యెత్తబడుట, మరియు వెయ్యేండ్ల పాలన వంటి సంఘటనలను అర్థం చేసుకోడానికి చాలా సమయం గడుపుతున్నాము మరియు చాలా కృషి చేస్తున్నాము. అయితే మనము హెబ్రీ పత్రికలోని “అంత్యదినములు” గూర్చి మాట్లాడునప్పుడు, క్రీస్తు యొక్క రెండవ రాకడకు దగ్గర సంబంధం ఉన్న సంఘటనల కంటే మరింత విస్తృతమైన ఒక విషయము మన మనసులో ఉంటుంది.
క్రైస్తవ వేదాంతపండితులు “అంత్యదినములు”ను గూర్చిన బైబిలు బోధనను “ఎస్కటాలజి” అని పిలుస్తారు. ఈ సాంకేతిక పదము గ్రీకు పదమైన ఎస్కాటోస్ (ἔσχατος) నుండి వెలువడుతుంది, అనగా “అంతిమ” లేదా “చివరి” అని అర్థం. ఆసక్తికరముగా, ఈ క్రొత్త నిబంధన పదము పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండము 4:30లో “అంత్యదినము” గూర్చి ప్రస్తావించబడినప్పుడు కనిపిస్తుంది. అక్కడ, ఇశ్రాయేలీయులు దేవుని మీద తిరుగుబాటు చేసినట్లయితే చెరలోనికి వెళతారని మోషే హెచ్చరించాడు. అయితే, “అంత్యదినములలో” వారు పశ్చాత్తాపపడినట్లయితే, చెర నుండి తిరిగి వచ్చి దేవుడు అనుగ్రహించు సాటిలేని ఆశీర్వాదములను పొందుకొంటారని కూడా అతడు వారికి హామీ ఇచ్చాడు. మరియు చెర నుండి ఇశ్రాయేలు యొక్క రాకను గూర్చిన సంఘటనలు “అంత్యదినములలో” జరుగుతాయని పాత నిబంధన ప్రవక్తలు మాట్లాడారు.
హెబ్రీ పత్రిక రచయిత తన పత్రికను వ్రాయుచుండగా అతని మనసులో ఎస్కటాలజి ఉందని హెబ్రీ. 1:1-2 నుండి చూడడం అంత కష్టమేమీ కాదు. అతడు వ్రాసిన మొదటి విషయమును వినండి:
పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను (హెబ్రీ. 1:1-2).
దేవుడు క్రీస్తు ద్వారా చేసిన కార్యములు “ఈ అంతిమ” — లేదా ఎస్కటాలజి — “దినములలో” జరుగుతున్నట్లు ఈ ఆరంభ వచనములు ఎలా సూచించుచున్నవో గమనించండి. ఈ విషయములో, హెబ్రీ పత్రిక రచయిత యొక్క అర్థము ఏమిటి? ఎస్కటాలజి అతనికి ఎందుకు ప్రాముఖ్యమైనదిగా ఉంది?
ప్రప్రధమంగా, హెబ్రీ పత్రిక యొక్క మొదటి వచనములో, యేసుకు ముందు ఇవ్వబడిన ప్రతి ప్రవచనమునకు ఆయనే నెరవేర్పు అను విషయమును వారు అర్థం చేసుకోవాలని అతడు ఆశించాడు. “పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను” అని అతడు చెప్పాడు, అనగా ఆయనకు ముందు ఇవ్వబడిన ప్రతిదానికి కూడా యేసే నెరవేర్పు అని అర్థం. ఆయన ప్రభువు రాకడయైయున్నాడు, ప్రభువు దినము యొక్క రాకడయైయున్నాడు, రాజ్యము యొక్క ప్రవేశమైయున్నాడు, మానవ చరిత్రలో దేవుడు మాట్లాడాలని ఆశించిన చివరి మాటయైయున్నాడు; యేసులో ఇవే కనిపిస్తాయి.
— డా. కే. ఎరిక్ ధోయెన్స్
హెబ్రీ పత్రికలోని ఎస్కటాలజిని అర్థం చేసుకోవాలంటే, పాత నిబంధన యొక్క ముగింపులో, మరియు పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యకాలములోని ఇశ్రాయేలు చరిత్రలోని కొన్ని మెలికెలు మరియు మలుపులను మనం చూడాలి. రాజుల కాలములో, ఇశ్రాయేలు దేవుని మీద బహుగా తిరుగుబాటు చేసింది. చివరికి దేవుడు ఉత్తర ఇశ్రాయేలీయులను చెరగొనిపోవుటకు అష్షూరీయులను పంపించాడు. తరువాత, యూదా వారికి కూడా అట్లు చేయుటకు దేవుడు బబులోనీయులను పంపించాడు. ఇప్పుడు, సుమారు క్రీ.పూ. 538లో ఇశ్రాయేలు మరియు యూదా రాజ్యపు శేషము దేవుడు అంత్యదినములలో తీర్పులు మరియు ఆశీర్వాదములను అనుగ్రహిస్తాడు అను నిరీక్షణతో వాగ్దాన దేశముకు తిరిగివచ్చింది. అయితే పశ్చాత్తాపము మాత్రం పెద్దగా జరుగలేదు. తత్ఫలితంగా, ఇశ్రాయేలు ఐదు శతాబ్దములుగా మాదీయులు, పారసీకులు, గ్రేకులు మరియు చివరిగా రోమా సామ్రాజ్యము యొక్క దౌర్జన్యము క్రింద శ్రమనుభవించింది.
పాత మరియు క్రొత్త నిబంధన యొక్క మధ్యకాలములో, అనేక యూదుల సమాజములు దేవుని యొక్క అంతిమ తీర్పులు మరియు ఆశీర్వాదములు అంత్యదినములలో కలుగుతాయనే నిరీక్షణను కలిగియుండినవి. ఈ నిరీక్షణ వారికి చాలా ముఖ్యమైనది గనుక వారు చరిత్రయంతటిని రెండు గొప్ప యుగాలుగా విభాగించారు. వారు నివసించిన కాలమును “ఈ యుగము,” అనగా ఇశ్రాయేలు యొక్క విఫలమును మరియు చెరను కొనితెచ్చిన పాపపు యుగము అని వారు పిలచారు. మరియు “రాబోవు యుగము”ను దేవుడు తన శత్రువులమీద కురిపించు తుది తీర్పు మరియు నమ్మకస్తుల మీద కురిపించు మహిమకరమైన తుది ఆశీర్వాదములు అని పిలిచారు. మరియు, పాత నిబంధన ప్రవచనముల ఆధారముగా, ఈ యుగము నుండి రాబోవు యుగములోకి నడిపించుటకు దేవుడు దావీదు కుమారుని, మెస్సీయను పంపుతాడని వారికి తెలుసు.
ఎస్కటాలజి మీద దృష్టిపెట్టుట ద్వారా, హెబ్రీ పత్రిక రచయిత తన శ్రోతలతో మరియు విస్తృత యూదుల సమాజముతో సాధారణముగా కలిగియున్న నమ్మకము మీద నిర్మించాడు. అయితే అదే సమయములో, యేసును విశ్వసించినవారు మరియు తమ మార్గములను విడచిపోనివారు ఉన్న స్థానమును కూడా అతడు పదే పదే చెప్పాడు. ఈ యుగము మరియు రాబోవు యుగముకు మధ్య మెస్సీయ ఒక నాటకీయమైన మరియు విపత్కరమైన మార్పు తీసుకువస్తాడని అవిశ్వాసులైన యూదులు ఆశించారు. అయితే యేసు అనుచరులు మాత్రం యేసు అంత్యదినములను మూడు దశలలో తీసుకువస్తాడు అని నమ్మారు: మొదటి రాకడలో ఆయన మెస్సీయ రాజ్యము యొక్క ఆరంభము, సంఘచరిత్రలో మెస్సీయ రాజ్యము యొక్క కొనసాగింపు, మరియు ఆయన మహిమలో తిరిగివచ్చునప్పుడు మెస్సీయ రాజ్యము యొక్క నెరవేర్పు. క్రొత్త నిబంధన రచయితలు ఈ మూడు దశలను “అంత్యదినములు" అని అపొస్తలుల కార్యములు 2:17 మరియు 2 పేతురు 3:3 వంటి వాక్యభాగములలో ప్రస్తావించారు.
హెబ్రీ పత్రిక రచయిత ఆరు సందర్భములలో “అంత్యదినము”లను గూర్చిన సుపరిచితమైన భాషను ఉపయోగించాడని మనం గమనించినప్పుడు ఈ అంశము యొక్క ప్రాముఖ్యతను మనం చూడగలుగుతాము. హెబ్రీ 2:5లో, అతడు “రాబోవు కాలము”ను గూర్చి క్రీస్తు మహిమలో తిరిగివచ్చుకాలము అని వ్రాశాడు. 6:5లో, “రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము”ను అతని శ్రోతలలో చాలా మంది అనుభవించారని అతడు సూచించాడు. 9:11లో, క్రీస్తును గూర్చి “రాబోవుచున్న మేలులవిషయమై” ప్రధానయాజకుడు అని వ్రాశాడు. 9:26లో, యేసు యొక్క భూలోక పరిచర్య కాలమును “యుగముల సమాప్తి” అని సూచించాడు. 10:1లో, క్రీస్తు బల్యర్పణ ద్వారా కలిగిన ఆశీర్వాదములను “రాబోవుచున్న మేలులు” అని ప్రస్తావించాడు. మరియు 13:14లో, క్రీస్తు అనుచరుల యొక్క తుది నిరీక్షణను “ఉండబోవుచున్న పట్టణము” అని వివరించాడు. అంత్యదినములను సూచించే ఈ సుప్రసిద్ధ మార్గములను తరచుగా ఉపయోగించుట రచయిత యొక్క ఉద్దేశ్యముకు ఈ అంశము ఎంత ప్రాముఖ్యమైనదో తెలుపు ఒక సంగ్రహావలోకనమును ఇస్తుంది.
హెబ్రీ పత్రికలోని పునరావృతమయ్యే విషయములలో యేసులో అంత్యదినములు అను విషయము మీద ఉద్ఘాటన ఉంది అని ఇప్పటివరకు మనం చూశాము గనుక, పత్రికలో పునరావృతమయ్యే రెండవ విషయమును ఇప్పుడు చూద్దాము: రచయిత యొక్క వేదాంతపరమైన దృక్పథములకు అతడిచ్చిన పాత నిబంధన మద్దతు.
అనేక లెక్కల ప్రకారం, హెబ్రీ పత్రికలోని ఉల్లేఖనాలు, దాదాపు 100 సార్లు పాత నిబంధనను సూచిస్తాయి లేదా ఉపయోగిస్తాయి. పాత నిబంధన లేఖనములతో ఈ సంభాషణలు రచయిత యొక్క ఉద్దేశ్యముకు చాలా కీలకమైనవి గనుక అతని పత్రికలోని ప్రతి ప్రధాన భాగములో కనిపిస్తాయి. మరియు వాస్తవంగా చెప్పాలంటే, ఇవి ఎందుకు కీలకమైనవో అర్థం చేసుకోవడం అంత కష్టమేమి కాదు. హెబ్రీ పత్రిక యొక్క రచయిత స్థానిక యూదుల సమాజము యొక్క బోధనలను సవాలు చేయుటకు, వారందరు పరిశుద్ధమైనదిగా పరిగణించిన ఒక సాధారణ ప్రతుని నివేదించాడు: అది పాత నిబంధన.
ఈ పాఠము యొక్క ఉద్దేశ్యముల కొరకు, పాత నిబంధనలోని ఉల్లేఖనములను హెబ్రీ పత్రిక రచయిత పదే పదే ప్రస్తావించిన ఐదు మార్గములను చూచుట సహాయకరముగా ఉంటుంది. మొదటిగా, అతడు పాత నిబంధన గ్రంథములోని వాస్తవిక నేపథ్యముల మీద దృష్టిపెట్టాడు.
సులభంగా చెప్పాలంటే, హెబ్రీ లేఖనములలోని కొన్ని చారిత్రిక వివరణలను జ్ఞాపకం చేసుకొని, రచయిత కొన్ని మాటలను ఉల్లేఖించాడు. తరువాత అతడు క్రైస్తవ విశ్వాసమును గూర్చి మాట్లాడేడప్పుడు ఆ వాస్తవములను చేర్చాడు. ఉదాహరణకు, ఆదికాండము 14:18లోని “మెల్కీసెదెకు, షాలేమురాజు” యొక్క అర్థము హెబ్రీ. 7:2లో “నీతి రాజనియు” మరియు “సమాధానపు రాజనియు” అతడు వివరించాడు. తరువాత ఈ వాస్తవిక నేపథ్యము యేసు మరియు మెల్కీసెదెకుకు మధ్య అతడు చేసిన పోలికను మెరుగుపరచింది.
మరొక ఉదాహరణగా, హెబ్రీ. 12:20 మరియు 21లో, నిర్గమ. 19:12-13 మరియు ద్వితీయోపదేశకాండము 9:19లో నివేదించబడిన సీనాయి కొండమీద ఇశ్రాయేలుకు కలిగిన భయమును రచయిత నమోదుచేశాడు. తరువాత అతడు ఇశ్రాయేలు యొక్క భయమును క్రీస్తు అనుచరులు పొందుకొను పరలోక యెరూషలేము యొక్క ఆనందముతో భిన్నముగా చూపాడు.
రెండవదిగా, పాత నిబంధనలో స్థాపించబడి అతని దినములలో కూడా కొనసాగుచున్న వేదాంతపరమైన దృక్పథములను రచయిత నమోదు చేశాడు.
ఈ సందర్భములలో, కేవలం చారిత్రిక సత్యములను మాత్రమే గమనించకుండా, హెబ్రీ లేఖనములు ధృవీకరించిన వేదాంతపరమైన నమ్మకముల మీద రచయిత తన దృష్టిని కేంద్రీకరించాడు — దేవునిని గూర్చిన నమ్మకము మరియు దేవునితో సన్నిహిత సంబంధం కలిగియున్న ఇతర విషయములను గూర్చిన నమ్మకము.
ఉదాహరణకు, హెబ్రీ. 1:5లో, రచయిత 2 సమూయేలు 7:14ను — లేదా దాని యొక్క సమాంతర వాక్యభాగమైన 1 దినవృత్తాంతములు 17:13ను — సూచించాడు. అక్కడ, దావీదు రాజవంశములోని ప్రతి రాజు కూడా దావీదు కాలము మొదలుకొని దేవుని “కుమారుని”గా పిలువబడతాడు అని దేవుడు ప్రకటించాడు.
హెబ్రీ. 1:7లో, రచయిత కీర్తనలు 104:4ను ఉల్లేఖించాడు, అక్కడ దేవదూతలు వాయువులుగా వర్ణించబడినవి.
హెబ్రీ. 2:6-8లో, అతడు కీర్తనలు 8:4-6ను ఉల్లేఖించాడు. సృష్టియంతటి మీద క్రీస్తుతో పాటు దేవాదూతలుగాక మానవులు పాలించువరకు మాత్రమే అని దేవుడు మానవులను దూతలకంటే కొంచెము తక్కువగా చేశాడని అతడు వాదించాడు.
హెబ్రీ 2:13, యెషయా 8:17, 18ను ఉల్లేఖిస్తుంది. దేవుని ఆశీర్వాదములు అబ్రాహాము యొక్క కుటుంబీకుల మధ్యనే పంచబడతాయి గాని దేవాదూతల మధ్య కాదు అని ఈ వచనములు చెబుతాయి.
హెబ్రీ. 6:13, 14లో, ఆదికాండము 22:17లో దేవుడు అబ్రాహాముతో చేసిన నిబంధనను అతడు ఉల్లేఖించాడు. తాను అతనితో చేసిన వాగ్దానము శాశ్వతమైనది, మరియు క్రొత్త నిబంధన కాలముకు కూడా వ్యాపించబడింది అని దేవుడు అక్కడ చెప్పాడు.
హెబ్రీ. 12:29లో, రచయిత ద్వితీయోపదేశకాండము 4:24ను ఉల్లేఖించాడు, మరియు దేవునిని దహించు అగ్నిగా వివరించాడు. దేవుడు క్రీస్తులో ఇంకనూ దహించు అగ్నిగానే ఉన్నాడు అను తన బోధనను బలపరచడానికి అతడు ఈ విధంగా ఉల్లేఖించాడు.
ఇటువంటి ఉదాహరణలు హెబ్రీ. 4:4-7, 8:5, 9:20, 10:30-31, 10:38, మరియు 13:5లో కూడా కనిపిస్తాయి. ఈ వాక్యభాగములన్నిటిలో, పాత నిబంధనలో స్థాపించబడిన కొన్ని వేదాంతపరమైన దృక్పథములు క్రొత్త నిబంధన కాలములో కూడా కొనసాగాయని హెబ్రీ పత్రిక యొక్క రచయిత ఉద్ఘాటించాడు.
హెబ్రీ పత్రిక రచయిత, యేసు పాత నిబంధన కంటే గొప్పవాడు అని ఉద్ఘాటించినప్పటికీ, ఏ సమయంలో కూడా పాత నిబంధనను తక్కువ చేసి చూపించలేదు, అది గతించిపోయినది లేదా దానిని సులభంగా వదిలివేయవచ్చు అని ఉద్ఘాటించలేదు; దానిని మనం చదువనవసరం లేదు; మనకు యేసు ఉన్నాడు కదా అని చెప్పలేదు. అటువంటి సూచన ఎక్కడ కూడా లేదు. హెబ్రీ పత్రిక రచయిత ప్రతిచోట కూడా పాత నిబంధనను అపారమైన గౌరవముతో చూస్తాడు; అది దేవుని వాక్యము అని అతడు అర్థం చేసుకున్నాడు. మరిముఖ్యముగా, యేసు ఎవరు అను విషయమును స్పష్టము చేసే ప్రతిదానిని స్థిరపరచేది పాత నిబంధన గ్రంథమే. యేసు ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ఏమిటి? అది పాత నిబంధనలో స్థాపించబడింది? అతడు ఒక నిర్దిష్ట బలిని అర్పిస్తాడు. రక్తము అంటే ఏమిటి? ప్రత్యక్ష గుడారములోని అతి పరిశుద్ధ స్థలము అంటే ఏమిటి? అవును, ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఇది పరలోక గుడారము, అయితే ఇది ఇప్పటికే భూసంబంధమైన గుడారముగాను, తరువాత సొలొమోను దేవాలయముగాను స్థాపించబడింది. అనేకమైన స్థాపనలు, వ్యక్తిగత ప్రవర్తన స్థాయితో సహా, విశ్వాసము అను పాత నిబంధన గుర్తుతో స్థాపించబడ్డాయి, ఉదాహరణకు, హెబ్రీ. 11లో లేదా హెబ్రీ 3 చివర్లో అరణ్యములో రాలిపోయిన వారి యొక్క చెడు ఉదాహరణ. ఇవన్నీ కూడా పాత నిబంధనలో నుండే తీసుకొనబడినవి.
— డా. డి. ఎ. కార్సన్
మూడవదిగా, హెబ్రీ పత్రిక రచయిత నైతిక బాధ్యతలను పాటించుటను గూర్చి కూడా మాట్లాడాడు. ఈ సందర్భములలో, పాత నిబంధన కాలములో దేవుడు తన ప్రజల మీద కొన్ని నైతిక బాధ్యతలను ఉంచాడు అని రచయిత చెప్పాడు. మరియు ఈ బాధ్యతలు, క్రొత్త నిబంధన కాలములోని దేవుని ప్రజలకు ప్రామాణికతలుగా ఉండాలి.
ఉదాహరణకు, హెబ్రీ. 3:7-15లో, కీర్తనలు 95:7-11 దేవునిపై తిరుగుబాటు చేయవద్దని ఇశ్రాయేలుకు బోధించినట్లుగా అతడు సూచించాడు.
దేవుడు ఇశ్రాయేలును క్రమశిక్షణలో పెట్టినప్పుడు నిరుత్సాహపడవద్దని సామెతలు 3:11, 12 హెచ్చరించినట్లుగా హెబ్రీ 12:5, 6 చూపిస్తుంది.
సామెతలు 4:26ను అనుసరించి, ధర్మమార్గముకు కట్టుబడి ఉండాలని హెబ్రీ 12:13లో తన ప్రేక్షకులను సూచించాడు.
మరియు హెబ్రీ 13:6లో, కీర్తనలు 118:6-7ను ఉల్లేఖిస్తూ, తన శ్రోతలు దేవునిలో తమ విశ్వాసమును ఒప్పుకోవాలని రచయిత కోరాడు.
ఈ వాక్యభాగములన్నియు పాత నిబంధనలోని నైతిక బాధ్యతలు క్రీస్తు అనుచరుల విషయములో కూడా కొనసాగుతున్నవి అని సూచిస్తున్నాయి.
నాలుగవదిగా, రచయిత పాత నిబంధన గ్రంథములో నుండి అనేకమైన రాకడశాస్త్రమును గూర్చిన ప్రవచనములను ఉల్లేఖించాడు.
అనేక వాక్యభాగములలో, పాత నిబంధన రచయితలు “అంత్యదినములను” గూర్చి ప్రవచనములను చెప్పారు. ఇశ్రాయేలు చెర ముగిసినప్పుడు దేవుడు ఏమి చేస్తాడో మరియు దేవుని విజయవంతమైన రాజ్యము ప్రపంచమంతటా ఎలా వ్యాపిస్తుందో వారు వ్రాశారు. దేవుని యొక్క తుది తీర్పులు మరియు ఆశీర్వాదములు క్రీస్తులో నెరవేర్చబడినవి అని చూపించుటకు రచయిత పాత నిబంధనలోని రాకడశాస్త్ర ప్రవచనములను ఉపయోగించాడు.
ఉదాహరణకు, ద్వితీయోపదేశకాండము 32:43 సెప్టుజంట్ లో, అనగా పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదములో అనువదించబడిన విధముగా హెబ్రీ. 1:6 దానిని నివేదిస్తుంది. దేవుడు తన శత్రువులందరిమీద తుది విజయము పొందిన తరువాత దేవదూతలు వంగి వినమ్రముగా నమస్కరిస్తాయి అని ఈ వచనము చెబుతుంది.
అదే విధముగా, హెబ్రీ 1:10-12లో, రచయిత కీర్తనలు 102:25-27ను ఉల్లేఖించాడు. సృష్టి యొక్క ప్రస్తుత ఏర్పాటులో, దేవదూతలు గొప్పగా గౌరవించబడినవి, ఇవి చరిత్ర ముగింపులో నాశనము చేయబడతాయి అని ఈ వాక్యభాగము తెలియజేస్తుంది.
తన గొప్ప కుమారుడైన మెస్సీయ యొక్క విశ్వవ్యాప్త సార్వభౌమాధికారమును గూర్చిన దావీదు చేసిన ప్రవచనము ఆయనను దేవదూతల కంటే ఉన్నతముగా హెచ్చిస్తుంది అని చూపించుటకు హెబ్రీ 1:13 కీర్తనలు 110:1ను ఉల్లేఖిస్తుంది.
హెబ్రీ 5:6 మరియు 7:17లో, రచయిత కీర్తనలు 110:4ను సూచించాడు. దావీదు యొక్క గొప్ప కుమారుడు తన రాజ్య యాజకత్వమును తనకొరకు స్వాధీనం చేసుకొనడు, కాని అతడు దానిని దేవుని నుండి స్వీకరిస్తాడు అనే ప్రవచనమును అతడు ఉద్ఘాటించాడు.
హెబ్రీ 8:8-12లో, రచయిత యిర్మీయా 31:31-34ను సూచించాడు. ఇశ్రాయేలు యొక్క చెర తరువాత, దేవుడు మోషేతో చేసిన నిబంధన విషయంలో మానవాళి యొక్క వైఫల్యమును క్రొత్త నిబంధన అధిగమిస్తుంది అని ఈ వచనములు ప్రవచిస్తున్నవి.
క్రీస్తునందు చేయబడిన క్రొత్త నిబంధన, బలుల యొక్క తదుపరి అవసరతను తొలగిస్తుంది అని చూపించుటకు హెబ్రీ 10:16, 17 మరలా యిర్మీయా 31ని సూచిస్తున్నాయి.
హెబ్రీ. 7:21, 10:37, మరియు 12:26లో హెబ్రీ పత్రిక రచయిత అంత్యదినములు, లేదా ఎస్కటాలాజికల్ యుగమును గూర్చి ఇలాటి ప్రవచనములనే నివేదించాడు.
ఐదవదిగా, కీర్తనల గ్రంథములో దావీదు వంశము కొరకు స్థాపించబడిన అనేకమైన రాజవంశీకుల ఆదర్శములను రచయిత సూచించాడు.
ఈ వాక్యభాగములు దావీదు రాజవంశములో ఉన్న ప్రతి ఒక్కరికీ, విశ్వాసము మరియు దేవుని పరిచర్య యొక్క ప్రామాణికతలను వ్యక్తపరుస్తాయి. అయితే, దావీదు యొక్క పాత నిబంధన వారసులు ఈ ప్రామాణికతలను అసంపూర్ణముగా మాత్రమే చేరుకోగలిగారు. యేసు, దావీదు యొక్క రాజ గృహమునకు సంబంధించిన ఆదర్శముల యొక్క అత్యున్నతమైన, పరిపూర్ణమైన నెరవేర్పుగా ఉన్నాడు అని హెబ్రీ పత్రిక రచయిత ఉద్ఘాటించాడు.
ఉదాహరణకు, హెబ్రీ 1:5లో, రచయిత కీర్తనలు 2:7 మరియు 2 సమూయేలు 7:14ను ఉల్లేఖించాడు. దేవుడు, సామంత రాజ్యములను పాలించుటకు దావీదు యొక్క వారసుని తన రాజరిక కుమారునిగా అంగీకరించాడు అని ఈ వచనములు సూచిస్తాయి.
హెబ్రీ 1:8, 9 కీర్తనలు 45:6, 7ను ఉల్లేఖిస్తుంది. ఈ రాజ వివాహ కీర్తన నీతిని ప్రేమించి, దుష్టత్వమును ద్వేషించే రాజవంశములోని ఒక రాజును గౌరవించడం ద్వారా అందరి మీద దేవుని పాలనను ప్రశంసిస్తుంది.
హెబ్రీ 2:11-12లో, రచయిత కీర్తనలు 22:22ను సూచించాడు. ఈ వచనములో, ఇతర ఇశ్రాయేలీయుల సమాజములో తన విమోచనము యొక్క ఆనందమును పంచుకొంటాను అని దావీదు ప్రమాణం చేశాడు. యేసు తన యొక్క విమోచనమును అబ్రాహాము కుమారులతో పంచుకొనుట ద్వారా ఈ రాజవంశీకుల ఆదర్శములను పరిపూర్ణముగా నెరవేర్చాడు అని చూపించుటకు రచయిత ఈ వచనమును ఉపయోగించాడు.
హెబ్రీ 10:5-7లో, రచయిత కీర్తనలు 40:6-8ను సూచించాడు. ఈ వచనములలో, దావీదు జంతుబలి స్థానములో తన సర్వశరీరమును దేవునికి అంకితం చేస్తానని ప్రమాణము చేశాడు. ఈ ఆదర్శమునకు ఎస్కటాలాజికల్ నెరవేర్పుయైన, సిలువ మీద ఉన్నతమైన బలిగా అర్పించబడిన యేసుకు రచయిత దీనిని ఆపాదించాడు.
ఇప్పటివరకు మనము యేసులో అంత్యదినములు మరియు రచయిత యొక్క వేదాంతపరమైన దృక్పథముకు పాత నిబంధన మద్దతు దృష్ట్యా హెబ్రీ పత్రికలోని పునరావృతమయ్యే విషయములను చూశాము. ఇప్పుడు మనము మూడవ పునరావృత విషయమును క్లుప్తంగా చూడగలిగే స్థితిలో ఉన్నాము: పట్టుదలను గూర్చిన రచయిత యొక్క ఉపదేశములు.
హెబ్రీ పత్రిక యొక్క రచయిత అనేక విధాలుగా విశ్వాసములో పట్టుదలతో ఉండమని తన శ్రోతలను ఉపదేశించాడు. పాత నిబంధన గ్రంథము నుండి అనేకమైన ఉల్లేఖనములు ఉన్నాయి, ఇవన్నీ దేవుడు తన ఉద్దేశ్యములను కొనసాగించుచున్నాడు అని మరియు ప్రత్యేకముగా ఈ అంత్యదినములలో, తన కుమారుని పంపుట ద్వారా కొనసాగించుచున్నాడు అని ఊహించుచున్నవి. హింసను నమ్మకముగా సహించిన వారి యొక్క ఉదాహరణలు, ప్రత్యేకముగా హెబ్రీ. 11లో, పట్టుదలకు ఒక గొప్ప మాదిరిగా ఇవ్వబడినవి. మరియు ముఖ్యముగా, వాస్తవంగా చెప్పాలంటే, క్రీస్తు తానే, “ఆయన ఎదుట ఉంచబడిన [మహిమ] కొరకు సిలువను భరించాడు,” పరలోకమును నిరీక్షిస్తూ దాని యొక్క అవమానమును అలక్ష్యము చేశాడు – ఇది క్రైస్తవులు నేడు అనుసరించుటకు ఒక మాదిరిగా ఇవ్వబడింది.
— డా. సైమన్ వైబర్ట్
హెబ్రీ. 13:22లో, హెబ్రీ పత్రిక రచయిత తన యొక్క పత్రిక అంతటినీ “హెచ్చరికమాట” అను పదముతో సంగ్రహించాడు అని మునుపటి పాఠములో మనం చెప్పాము. మీరు లెక్కించు విధానము ఆధారముగా, హెబ్రీ పత్రికలో సుమారు 30 స్పష్టమైన హెచ్చరికమాటలు ఉన్నాయి. మనము చూడబోవుచున్నట్లుగా, ప్రతి హెచ్చరికమాట ఒక నిర్దిష్టమైన విషయమును స్పృశిస్తుంది, అయితే అవన్నియు వాస్తవిక శ్రోతలు క్రీస్తుకు నమ్మకముగా ఉండు విషయములో పట్టుదల కలిగి ఉండాలని పిలచుటకు రూపొందించబడినవి.
మన పాఠములోని ఈ సమయములో, పట్టుదలతో ఉండమని చెప్పు రచయిత యొక్క హెచ్చరికమాటలలోని రెండు క్లిష్టమైన లక్షణములను మనం చూద్దాము. మొదటిగా, రచయిత తన శ్రోతల నుండి ఆశించిన ప్రతిస్పందనల మీద కొన్ని వ్యాఖ్యలను చేద్దాము. మరియు రెండవదిగా, పట్టుదలతో ఉండాలని అతడు తన శ్రోతలను ఎలా ప్రోత్సహించాడో చూద్దాము. రచయిత తమ శ్రోతల నుండి ఆశించిన ప్రతిస్పందనలను మొదటిగా చూద్దాము.
హెబ్రీ పత్రిక యొక్క విశేషమైన లక్షణములలో ఒకటి రచయిత తన శ్రోతలను ప్రోత్సహించి వారి నుండి పొందిన ప్రతిస్పందనల యొక్క విస్తారత. ఇప్పుడు, క్రొత్త నిబంధన గ్రీకు భాష వంటి ప్రాచీన భాషను గూర్చి మనం మాట్లాడినప్పుడు, నిర్దిష్ట వ్యక్తీకరణల కొరకు అర్థములను గుర్తించడం ఎల్లప్పుడు అసాధ్యముగానే ఉంటుంది. కాబట్టి, మనము సాపేక్షంగా స్పష్టమైన కొన్ని ఉదాహరణలకు మాత్రమే మన సంభాషణను పరిమితం చేద్దాము. సాధారణంగా చెప్పాలంటే, రచయిత యొక్క హెచ్చరికమాటలు తన పత్రికను భావోద్వేగపరముగా, అంశపరముగా మరియు ప్రవర్తనపరముగా అనువర్తించుకొనునట్లు తన శ్రోతలను ప్రోత్సహించాయి. వాస్తవిక శ్రోతలు పట్టుదలతో ఉండాలంటే, ఈ పరిపూర్ణ ప్రతిస్పందల శ్రేణి మీద శ్రద్ధ చూపడం చాలా అవసరం.
మొదటిగా, హెబ్రీ పత్రిక రచయిత తన శ్రోతలను విశ్వాసము యొక్క భావోద్వేగ కోణములలో ఎల్లప్పుడు ప్రోత్సహించాడు. హెబ్రీ 3:8, 15లో అతడు ఇలా చెప్పాడు, “మీ హృదయములను కఠినపరచుకొనకుడి.” అదే అధ్యాయములోని 13వ వచనములో మనము ఇలా చదువుతాము, “మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు... ప్రతిదినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి.” ఈ వచనములతో పాటుగా, 4:1లో అతడు ఇలా చెప్పాడు, “భయము కలిగియుందము” లేదా మరింత అక్షరార్థంగా — మరియు ఈ సందర్భములో ఉత్తమముగా — “దేవుని యొక్క విశ్రాంతిలో ప్రవేశించమేమో అను భయము కలిగియుందము.” తన శ్రోతలు సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు కృపాసనమునొద్దకు వచ్చినప్పుడు “ధైర్యముతో” లేదా నిర్భయముతో ఉండాలని 4:16లో వారిని హెచ్చరించాడు. “సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధానమునకు చేరాలి” అని 10:22లో అతడు వారికి పిలుపునిచ్చాడు. మరియు 10:35లో అతడు వారిని ఇలా హెచ్చరించాడు, “మీ ధైర్యమును” లేదా నమ్మకమును “విడిచిపెట్టకుడి”.
ఈ భావోద్వేగ ఉద్ఘాటనలు హెబ్రీ పత్రిక రచయితకు చాలా ముఖ్యమైనవిగా ఉన్నప్పటికీ, అతడు తన వాక్యభాగమును అంశపరముగా కూడా అనువర్తించుకోవాలని తన శ్రోతలను హెచ్చరించాడు. తన యొక్క ప్రేరేపిత మాటలు వారి వేదాంతపరమైన సిద్ధాంతములను మరియు నమ్మకములను ప్రభావితం చేయాలని అతడు ఆశించాడు. ఉదాహరణకు, హెబ్రీ. 2:1లో వారు వినిన సంగతుల విషయములో “మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను” అని శ్రోతలకు పిలుపునిచ్చాడు. 3:1లో, వారు “[తాము] ఒప్పుకొనిన దానికి యేసుమీద లక్ష్యముంచాలి” అని అతడు హెచ్చరించాడు. 6:1లో “క్రీస్తునుగూర్చిన మూలోపదేశము మాని,” జ్ఞానములో మరియు బుద్ధిలో సంపూర్ణులగుటకు సాగిపోవాలని అతడు వారిని ప్రోత్సహించాడు.
ఆసక్తికరముగా, హెబ్రీ పత్రిక రచయిత ఆరంభములో నిర్దిష్ట ప్రవర్తనాపరమైన అంశములను ఉద్ఘాటించలేదు. ఖచ్చితంగా చెప్పాలంటే, అతని హెచ్చరికమాటలు సాధారణంగా ప్రవర్తనాపరమైన ప్రభావములను కలిగియున్నవి, అయితే అతని యొక్క స్పష్టమైన ప్రవర్తనాపరమైన బోధనలు చాలావరకు పత్రిక యొక్క చివర్లో కనిపిస్తాయి. హెబ్రీ 12:16లో, “వ్యభిచారియైనను ఉండునేమో అనియు, జాగ్రత్తగా చూచుకొనుడి” అని అతడు తన శ్రోతలను హెచ్చరించాడు. మరియు 13:1-19లో, ఆతిధ్యం, వివాహము, క్రీస్తు నామమును ప్రకటించుట మరియు మంచి చేయుట వంటి అంశములను చర్చించాడు.
హెబ్రీ పత్రిక రచయిత తన పత్రికకు తన శ్రోతలు స్పందించాలని కోరుకొనే వివిధ మార్గములను ఈ హెచ్చరికమాటలు ఉదహరిస్తాయి. స్పష్టంగా, వారు క్రీస్తుకు నమ్మకమైన సేవ చేయాలనే పట్టుదలతో ఉండాలంటే, వారు తమ భావోద్వేగములను, భావనలను మరియు ప్రవర్తనలను జాగ్రత్తగా చూచుకోవాలి.
హెబ్రీ పత్రిక్రలోని హెచ్చరికమాటల యొక్క రచయిత అనేక విధములైన ప్రతిస్పందనలను ప్రేరేపించాడని మనం చూశాము. ఇప్పుడు పట్టుదలతో ఉండమని ప్రోత్సహించుటకు రచయిత సానుకూల మరియు ప్రతికూల ప్రేరేపణలను ఎలా ప్రస్తుతించాడో చూడండి.
ఒక వైపున, రచయిత తన అనేకమైన హెచ్చరికమాటలను సానుకూల ప్రేరేపణలతో అనుసంధానపరచాడు. ఉదాహరణకు, హెబ్రీ 4:13-16లో క్రీస్తు నుండి కృపను మరియు సహాయమును పొందుకొనుటను గూర్చి అతడు సూచించాడు. మరియు 13:16లో, కొన్ని కార్యములు దేవునిని సంతోషపెడతాయనే జ్ఞానముతో తన శ్రోతలను ప్రేరేపించుట కొరకు అతడు ప్రయత్నించాడు. నమ్మకముగా జీవిస్తే శాశ్వతమైన బహుమానం కలుగుతుంది అని హెబ్రీ పత్రిక రచయిత పదే పదే చెప్పాడు. హెబ్రీ 10:35లో, ఉదాహరణకు, అతడు ఇలా చెప్పాడు:
కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును (హెబ్రీ 10:35).
అయితే, మరోవైపు, హెబ్రీ రచయిత తన శ్రోతలను హెచ్చరించడానికి ప్రతికూల ప్రేరేపణలను కూడా ఉపయోగించాడు. ఈ హెచ్చరికమాటలు ప్రధమంగా దైవ తీర్పు యొక్క హెచ్చరికమాటలుగా ఉన్నాయి. ఉదాహరణకు, హెబ్రీ 2:2-3లో, దేవదూతలను తిరస్కరించిన వారు శిక్షించబడ్డారు అని అతడు చెప్పాడు. కాబట్టి, క్రీస్తులో రక్షణను విస్మరించిన ఎవరైనా దేవుని తీర్పు నుండి తప్పించుకొంటాము అని ఎలా అనుకుంటారు? 6:4-8లో తప్పిపోయిన ప్రతిఒక్కరు “విజర్జింపబడి శాపము పొందతగినవారు” అని అతడు వారిని హెచ్చరించాడు. 10:26-31లో “న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్ని”ని గూర్చి అతడు వారిని హెచ్చరించాడు.
హెబ్రీ పత్రిక యొక్క అంశములలో ఒక గొప్ప అంశము ఏమనగా పట్టుదలతో ఉండవలసిన ఆవశ్యకత. మనము హెబ్రీ పత్రికను కేవలము దాని యొక్క హెచ్చరికలు మరియు ఉపదేశములతో మాత్రమే చదివి, పట్టుదలతో ఉండుమని; కొనసాగుతూ ఉండాలని; వెనుదిరిగే అవసరత లేదని, అయితే క్రైస్తవ జీవితములో ముందుకు సాగిపోవాలని హెబ్రీ పత్రిక రచయిత వారికి ఉపదేశిస్తున్నాడని మనం చెప్పలేము. ఇప్పుడు అతడు దీనిని ఎలా చేశాడు? సరే, అతడు హెచ్చరికమాటలను మరియు ప్రోత్సాహకరమైన మాటలను చక్కగా సమతుల్యపరచాడని నేను అనుకుంటాను, మరియు ఇవి ఒకే నాణెము యొక్క రెండు వైపులు అయ్యున్నవి. పదే పదే, ప్రోత్సాహకరమైన మాటలకు సంబంధించి, క్రీస్తుకు మరియు పాత నిబంధన వ్యక్తులు, ప్రజలు మరియు నిబంధనలకు మధ్య ఉన్న భిన్నత్వము హెబ్రీ పత్రికలో సుప్రసిద్ధమైనదిగా ఉంది. అతడు మోషే కంటే గొప్పవాడుగా ఉన్నాడు; గొప్ప విశ్రాంతిని తెస్తాడు; అతడు గొప్ప యాజకుడుగా ఉన్నాడు; గొప్ప బలిగా ఉన్నాడు...మరోవైపు, హెచ్చరికలు కూడా ఉన్నాయి. హెబ్రీ పత్రికలోని హెచ్చరికలు క్రైస్తవ శ్రోతలను మరియు పాఠకులను అప్రమత్తం చేయడానికి పనిచేస్తాయి, “నేను పట్టుదలతో ఉండకపోతే, నా దృష్టిని క్రీస్తుమీద ఉంచకపోతే, నేను ఆయనతో నడచుట కొనసాగించకపోతే, ఆయన వైభవములో మరియు మహిమలో — ఆయన మహిమగల ప్రభువు, మన మధ్యకు వచ్చిన గొప్ప ప్రధాన యాజకునిగా — ఆయన ఏమైయున్నాడో అందునుబట్టి, ఆయనకు వేరుగా రక్షణ లేదు ... కాబట్టి, ఈ రెండు కలసి సానుకూల ప్రోత్సాహమును మరియు మనలను పందెములో పరిగిడునట్లు చేయు, మన విశ్వాసమునకు కర్త మరియు కొనసాగించువాడైన యేసు మీద మన కన్నులు నిలుపునట్లు చేయు ప్రతికూల సహాయమును కూడా మనకు ఇస్తాయి.
— డా. స్టీఫెన్ జె. వెల్లం
హెబ్రీ పత్రిక యొక్క శ్రోతల యెడల తీర్పును గూర్చిన హెచ్చరికలు ఎల్లప్పుడు వ్యాఖ్యాతలను సమస్యలో పెట్టాయి ఎందుకంటే నిజమైన విశ్వాసులు తమ రక్షణను పోగొట్టుకుంటారు అన్నట్లుగా అవి మాట్లాడుతాయి. ఈ కారణమును బట్టి, హెబ్రీ పత్రికలోని ఈ భాగములు, ఈ సమస్య మీద ఒక అభిప్రాయమును లేదా మరొక అభిప్రాయమును కలిగి ఉన్న క్రైస్తవుల మధ్య ఎల్లప్పుడు సంఘర్షణలకు కారణంగా ఉన్నాయి. ఈ వేదాంతపరమైన విషయములను లోతుగా చర్చించడానికి సమయము అనుకూలించకపోయినప్పటికీ, ఈ విషయము యొక్క రెండు ముఖ్యమైన అంశముల మీద వ్యాఖ్యానించుట సహాయకరముగా ఉంటుంది.
మొదటిగా, హెబ్రీ పత్రిక ఒక సాంకేతికమైన క్రమబద్ధ వేదాంతశాస్త్రము కాదు అని మనం గమనించాలి. అనగా, లేఖనములు ఎల్లప్పుడు, పదములను, రక్షణను గూర్చిన పదములను క్రైస్తవ వేదాంతవేత్తలు మరియు వేదాంత సాంప్రదాయముల కంటే చాలా భిన్నముగా ఉపయోగిస్తాయి. వాస్తవంగా చెప్పాలంటే, సంఘములోని ప్రతి శాఖ కొన్ని వేదాంత పదములను లేఖనములో ఉపయోగించిన వివిధ మార్గముల కంటే భిన్నముగా ఉపయోగిస్తుంది. నిస్సందేహమైన వేదాంత వ్యవస్థలు ఉండాలని మనం ఆశించినట్లయితే ఈ ఆచరణను పాటించవలసినదే. అయినను, పదములు మరియు వ్యక్తీకరణముల యొక్క మన సొంత సంకుచితమైన అర్థములను హెబ్రీ పత్రికలోకి చదవడం చాలా సులభం గనుక ఈ దృక్పథము కూడా ప్రమాదకరమైనదే. హెబ్రీ పత్రిక రచయిత మత భ్రష్టులుగా మారినవారిని లేదా క్రీస్తులో తప్పిపోయినవారిని గూర్చి వివరించిన విధానమును అర్థం చేసుకొన్నప్పుడు ఈ ప్రమాదం మరిముఖ్యముగా స్పష్టం అవుతుంది.
ఒకవైపున, హెబ్రీ పత్రిక రచయిత మతభ్రష్టులు “నీతిమంతులుగా తీర్చబడ్డారు” అని ఎన్నడు వివరించలేదని గమనించడం సహాయకరముగా ఉంటుంది. క్రొత్త నిబంధన గ్రంథములో, ఈ పదము ఎల్లప్పుడు నిజమైన విశ్వాసుల కొరకు కేటాయించబడింది. అయితే మరోవైపు, క్రొత్త నిబంధన కేటాయించకపోయినప్పటికీ కూడా, ఇవాంజెలికల్ క్రైస్తవులు ఎల్లప్పుడు నిజమైన విశ్వాసుల కొరకు మాత్రమే కేటాయించబడే కొన్ని పదాలను ఉపయోగించారు. ఉదాహరణకు, హెబ్రీ 6:4-6లో, రచయిత ఇలా హెచ్చరించాడు:
ఒకసారి వెలిగింపబడి, పరలోకసంబంధమైన వరమును రుచిచూచి, పరిశుద్ధాత్మలో పాలివారై, దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగసంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపో[గలరు] (హెబ్రీ. 6:4-6).
ఇక్కడ ఉన్న సంక్లిష్టత ఏమిటంటే, మనలో చాలామందిమి మన సాంకేతిక వేదాంత పదజాలములో ఇవి మరియు ఇటువంటి ఇతర వ్యక్తీకరణములను కేవలము నిజమైన విశ్వాసులను గూర్చి వివరించడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాము. ఇతర ఉదాహరణలలో హెబ్రీ 10:29 వంటి వాక్యభాగములు ఉన్నాయి, అక్కడ మతభ్రష్టులు నిబంధన రక్తము ద్వారా “పరిశుద్ధపరచబడిన”వారిగా వర్ణించబడ్డారు. లేదా 10:32లో “వెలిగింపబడిన”వారిగా వర్ణించబడ్డారు.
వాస్తవానికి, వేదాంతవేత్తలు ఎల్లప్పుడు “దృశ్యమైన సంఘము” అని పిలచుదానిలో పాల్గొనే వారికి ఇలాటి వ్యక్తీకరణములు క్రొత్త నిబంధనలో ఉపయోగించబడతాయి. ఇది “అదృశ్యమైన సంఘము”నకు లేదా నిజమైన విశ్వాసుల శరీరముకు చాలా భిన్నముగా ఉంది. దృశ్యమైన సంఘములోని ప్రజలు బాహ్యపరమైన సంఘములో సభ్యులేగాని అంతరంగ సంఘములో సభ్యులు కారు. సంఘములోని ఈ వ్యత్యాసము రోమా 2:28, 29లో “బాహ్యమునకు — గ్రీకులో ఫనేరోస్ (φανερός) — యూదుడైనవాడు బాహ్యమునకు, శరీరపరమైన సున్నతి పొందినవానికి, మరియు “అంతరంగమందు” — గ్రీకులో క్రుప్టోస్ (κρυπτός) — హృదయమందు సున్నతిపొందినవారికి మధ్య భిన్నత్వమును పోలి ఉంటుంది.
రెండవదిగా, మతభ్రష్టత్వము వలన కలుగు దైవిక తీర్పు అను ముప్పు కేవలము హెబ్రీ పత్రికకు మాత్రమే పరిమితమైనది కాదని మనం ఎల్లప్పుడు జ్ఞాపకముంచుకోవాలి. ఉదాహరణకు, 1 కొరింథీయులకు 10:1-13 మరియు 2 పేతురు 2:21, 22 వంటి లేఖనములలో ఇలాటి హెచ్చరికలనే మనం చూస్తాము. మొత్తానికి, క్రీస్తులో రక్షించు విశ్వాసమును కలిగినవారు అంతము వరకు సహిస్తారు అని క్రొత్త నిబంధన బోధిస్తుంది. అయితే క్రీస్తును తృణీకరించువారు, తమ విశ్వాసము రక్షించు విశ్వాసము కాదని నిరూపిస్తారు. బదులుగా, వారి విశ్వాసము కేవలము వేదాంతవేత్తలు ఎల్లప్పుడు పిలచే “తాత్కాలికమైన” లేదా “వేషధారణ విశ్వాసము”గా ఉంది. 1 యోహాను 2:19 ఈ మతభ్రష్టులను ఇలా వివరిస్తుంది:
వారు మనలోనుండి బయలువెళ్లిరి గాని వారు మన సంబంధులు కారు; వారు మన సంబంధులైతే మనతో కూడ నిలిచియుందురు; అయితే వారందరు మన సంబంధులు కారని ప్రత్యక్ష పరచబడునట్లు వారు బయలువెళ్లిరి (1 యోహాను 2:19).
ఏ సమయములోనైనా, ఎవరైనా, క్రైస్తవ విశ్వాసము నుండి తొలగిపోతారు, వారు వాస్తవానికి అదృశ్యమైన సంఘముకు సంబంధించిన వారు కాదు అని నిరూపించుకుంటారు.
హెబ్రీ పత్రికలో ఐదు హెచ్చరిక వాక్యభాగములు ఉన్నాయి...ఈ ఐదింటికీ ఒకే బిందువు ఉందని మనలో చాలామంది వాదిస్తాము, కాబట్టి హెచ్చరికలకు, బహువచనము, ఒక ముఖ్య ఉద్దేశ్యము ఉన్నదని మనము చెప్పవచ్చు. మరియు ఒక సేవకుని కొరకు, వాటి ఉద్దేశ్యము సరళంగా ఉంది. తన సమాజములో ఉన్న ప్రతి ఒక్కరు పట్టుదల కలిగి క్రీస్తును వెంబడించాలి అని అతడు ఆశిస్తాడు. ఇప్పుడు, వాస్తవానికి, ప్రకటించవలసిన కొన్ని బిందువులు అక్కడ ఉన్నాయి. ఇవి నిజమైన హెచ్చరికమాటలు. ఇవి సందేహమైనవి కాదు. ఇవి భయము కలిగించే విధంగా రూపొందించబడలేదు.... చెప్పవలసిన ఒక విషయం ఏమిటంటే, ఆదివారము ఉదయమున ఒక సేవకుడు తన సంఘముతో మాట్లాడు విధముగా అతడు వారితో మాట్లాడుతున్నాడు. అయితే అతడు సర్వజ్ఞుడు కాదు. తన సంఘములోని ప్రతి ఒక్కరి యొక్క శాశ్వత స్థితి ఏమిటో అతనికి తెలియదు. వారు క్రీస్తును ఒప్పుకొంటున్నారు అని అతనికి తెలుసు, అయితే వాస్తవానికి, క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రములో, కాలమే తెలియపరుస్తుంది. అంటే, 1 యోహాను 2:19లో మనము ఒక ఉదాహరణను చూస్తాము, వాస్తవానికి, విశ్వాసమును విడిచిపెట్టిన వారు, విశ్వాస సమాజమును విడిచిపెట్టి, బయటకు వెళ్లుట ద్వార, వారు నిజముగా మనలో ఒకరు కాదని నిరూపిస్తారు; యోహాను చిన్న ఆసియాలో ఉన్న —సంఘముకు వ్రాశాడు. కాబట్టి, క్రీస్తును బాహాటముగా ఒప్పుకొనే వారిని గూర్చి అతడు మాట్లాడుటను ఇక్కడ మనం చూస్తాము, కాని వాస్తవానికి, వారికి ఆయన తెలుసో లేదో కేవలము సమయము మాత్రమే చెబుతుంది.
డా. బ్యారి జోస్లిన్
హెబ్రీ పత్రిక యొక్క విషయములు మరియు ఆకృతి అను మన పాఠములో, పత్రికలోని పునరావృతమయ్యే విషయములు యొక్క మూడు అంశాలను మనం చూశాము. ఇప్పుడు, మన పాఠములోని రెండవ ప్రధాన అంశమును చూద్దాము: హెబ్రీ పత్రిక యొక్క అలంకారరూపక ఆకృతి.
మునుపటి పాఠములో మనము చూచినట్లుగా, హెబ్రీ పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలు హింసను ఎదుర్కొనుచున్నారు. స్థానిక యూదుల సమాజము యొక్క అబద్ధ బోధనలను హత్తుకొనే శోధన విస్తృతంగా ఉంది. మరియు తన శ్రోతలు ఈ అబద్ధ బోధనల వలన క్రీస్తు నుండి తొలగిపోకుండా కొనసాగాలని హెబ్రీ పత్రిక రచయిత వారిని హెచ్చరించాడు. కాబట్టి, హెబ్రీ పత్రిక రచయిత తన ఉద్దేశ్యమును నెరవేర్చడానికి తన పత్రిక యొక్క విషయములను ఎలా అల్లాడు? ఈ అలంకాలరూపక ఆకృతి ఎలా కనిపిస్తుంది?
హెబ్రీ పత్రిక యొక్క అలంకారరూపక ఆకృతిని అనేక స్థాయిలలో మనం చూడవచ్చు, కాని మన ఉద్దేశ్యముల కొరకు, పత్రిక యొక్క ఐదు ప్రధాన భాగములను మనము చూద్దాము. క్రీస్తుకు నమ్మకముగా ఉండాలని రచయిత తన శ్రోతలను ఎలా ప్రోత్సహించాడో అర్థం చేసుకోడానికి ఈ భాగములు మనకు సహాయపడతాయి:
1:1-2:18లోని మొదటి ప్రధాన భాగము, దేవాదూతల ప్రత్యక్షతలను గూర్చిన నమ్మకములను ఉద్ఘాటిస్తుంది.
3:1-4:13లోని రెండవ ప్రధాన భాగము, మోషే అధికారమును చర్చిస్తుంది.
4:14-7:28లోని మూడవ ప్రధాన భాగము, రాజత్వ మెల్కీసెదెకును గూర్చి మాట్లాడుతుంది.
8:1-11:40లోని నాలుగవ ప్రధాన భాగము, క్రొత్త నిబంధన మీద దృష్టిపెడుతుంది.
12:1-13:25లోని ఐదవ ప్రధాన భాగము, ఆచరణాత్మకమైన పట్టుదలను గూర్చి మాట్లాడుతుంది.
తన శ్రోతలు శ్రమల మధ్యలో కూడా క్రీస్తుకు నమ్మకముగా ఉండాలని వారిని ప్రోత్సహించుటకు హెబ్రీ పత్రిక రచయిత ఈ ప్రధాన భాగములను ఉపయోగించాడు. 1:1-2:18లో దేవదూతల ప్రత్యక్షతలను గూర్చి హెబ్రీ పత్రిక రచయిత ఎలా మాట్లాడాడో మొదటిగా చూద్దాము.
మన మునుపటి పాఠములో మనం చెప్పినట్లుగా, కుమ్రాన్ నుండి వెలువడిన అనేక యూదుల రచనలు, అదే విధముగా ఎఫెసీ మరియు కొలస్సీ వంటి పత్రికలు, మొదటి శతాబ్దపు యూదుల సమాజములు దేవదూతలను, శక్తివంతమైనవిగాను, తమ కంటే తక్కువవారిగా ఉన్న మానవులకు దైవ దర్శనములు తెచ్చే గొప్ప సృష్టములు అని నమ్మారని సూచించాయి.
స్థానిక యూదుల సమాజము యొక్క దృక్పథములు బైబిలులో నాటబడియున్నవి, అయితే అవి దేవదూతలకు ఇవ్వతగినదానికంటే ఎక్కువ గౌరవమును ఇచ్చాయి. దేవాదూతలను గూర్చిన ఈ అతీతమైన ప్రశంస క్రీస్తు అనుచరులలో ఒక తీవ్రమైన సవాలును లేవనెత్తింది. యేసు కేవలము మాంసము మరియు శరీరము కలిగిన సహజ మానవుడు అని అందరికీ తెలుసు. అలాంటప్పుడు, దేవదూతల ప్రత్యక్షతలకు గాక ఆయన (యేసు) చెప్పినదానిని ఎవరైనా ఎలా అనుసరించగలరు?
హెబ్రీ పత్రిక రచయిత ఈ సవాలుకు ఐదు మెట్లలో సమాధానం ఇచ్చాడు. మొదటిగా, యేసు దైవ ప్రత్యక్షత కలిగించు దేవుని యొక్క ఉన్నతమైన మూలము గనుక తన శ్రోతలు యేసును అనుసరించాలని హెబ్రీ 1:1-4లో అతడు వ్రాశాడు. దేవుడు దేవదూతల ద్వారా మాట్లాడాడు మరియు పాత నిబంధన చరిత్ర ద్వారా కూడా మాట్లాడాడు అని రచయిత గుర్తించాడు. అయితే, యేసు, అంత్యదినములలో రాజత్వ ప్రధాన యాజకునిగాను దేవుడు నియమించిన వానిగాను, ప్రత్యక్షతను తెచ్చాడని, అది దేవదూతల ద్వారా ఇవ్వబడిన ప్రత్యక్షత కంటే ఉన్నతమైనదని అతడు ఉద్ఘాటించాడు.
1:5-14లో, యేసు దేవుని యొక్క అద్వితీయ మెస్సీయత్వ కుమారుడు గనుక ఆయన దేవదూతల కంటే గొప్పవాడు అని హెబ్రీ పత్రిక రచయిత వివరించాడు. దావీదు కుటుంబము కొరకైన ఆదర్శములను యేసు నెరవేర్చాడు అని అతడు చెప్పాడు. దేవుని శత్రువులందరి మీద దేవుని మెస్సీయత్వ కుమారుని యొక్క జయమును గూర్చిన దావీదు ప్రవచనమును యేసు నెరవేర్చాడు. విరుద్ధంగా చెప్పాలంటే, దేవదూతలు, క్రీస్తులో రక్షించబడినవారికి పరిచర్య చేయుటకు పంపబడినవారే తప్ప ఎక్కువ కాదు అని అతడు నివేదించాడు.
2:1-4లో, యేసు ఆరంభించిన గొప్ప రక్షణను జాగ్రత్తగా పట్టుకోవాలని రచయిత శ్రోతలను హెచ్చరించాడు. పూర్వము దేవదూతల ద్వారా పలుకబడిన సందేశములను తిరస్కరించుట వలన దేవుని శిక్షకు పాత్రులైయ్యారు అని అతడు వారికి జ్ఞాపకం చేశాడు. కాబట్టి, మన రక్షణయైన క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడిన గొప్ప రక్షణను వారు నిర్లక్ష్యము చేసినయెడల, దేవుని తీర్పు నుండి తప్పించుకొనే అవకాశము ఉందని అతని శ్రోతలు అనుకొనకూడదు.
యేసు ఇప్పుడు దేవదూతల మీద పాలకునిగా ఉన్నాడు అని వివరించుట ద్వారా హెబ్రీ 2:5-9 క్రీస్తు ఆధిపత్యము మీద ఉన్న నమ్మకముకు మద్దతు ఇస్తుంది. మరియు భవిష్యత్తులో విశ్వాసులందరూ ఆయనతో కూడా కలిసి వారిని పాలిస్తారు. దేవుడు మనుష్యులను తాత్కాలికముగా దేవదూతలకంటే కొంచెము తక్కువవానిగా చేశాడు, అయితే రాబోవు ప్రపంచములో సృష్టియంతటినీ యేలుటకు వారు నిర్ణయించబడ్డారు అని రచయిత నివేదించాడు. మానవులకు ఇవ్వబడిన ఈ తుది మహిమ దేవుని యొక్క రాజత్వ ప్రధాన యాజకునిగా పరలోకములో క్రీస్తు యొక్క ప్రస్తుత పాలనలో ఊహించబడింది.
మరియు చివరిగా, హెబ్రీ 2:10-18లో, యేసు అబ్రాహాము వారసుడు అని రచయిత తెలియజేశాడు. మరియు యేసు తన మహిమను అబ్రాహాము సంతానముతో పంచుకుంటాడు గాని, దేవదూతలతో కాదు. రచయిత ఈ భాగములో దావీదు మరియు యెషయాలను ఉల్లేఖించాడు, తద్వారా అబ్రాహాము యొక్క వంశవృక్షముకు యేసు అనుబంధమును చూపించాడు. యేసు, తన మానవత్వములో, పడిపోయిన గొప్ప దూతయైన సాతాను యొక్క శక్తిని నాశనము చేశాడు అని కూడా అతడు వివరించాడు. దేవదూతలను విడిపించుటకు ఇలా చేయలేదుగాని, అబ్రాహాము సంతానమును మరణ భయము నుండి విడిపించడానికి చేశాడు. క్రీస్తు యొక్క మానవత్వమే ఆయనను కృపగల మరియు నమ్మకమైన ప్రధాన యజకునిగా, ప్రజల పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేయునట్లు చేసింది.
హెబ్రీ పత్రిక రచయిత దేవదూతల ప్రత్యక్షతలను గూర్చిన యూదుల బోధనలతో వ్యవహరించుటను మనము చూశాము గనుక, పత్రికలో రెండవ ప్రధాన భాగమును చూద్దాము. హెబ్రీ 3:1-4:13లో, మోషే అధికారమును గూర్చిన సవాళ్లకు అతడు ప్రతిస్పందించాడు. మోషే వలే ఏ మనుష్యుడు కూడా ఇశ్రాయేలులో గౌరవించబడలేదు.
మోషేకు ఇవ్వబడిన గౌరవమును బట్టి, ఈ స్థానిక యూదుల బోధనల విషయమై మనం ఆశ్చర్యపడకూడదు. క్రీస్తుతో సంబంధం లేకుండా దేవుడు మోషే ద్వారా ప్రత్యక్షపరచిన వాటన్నిటిని గైకొనాలి అని హెబ్రీ పత్రిక యొక్క శ్రోతలను వారు సవాలు చేశారు. ఈ భాగములో మనము చూడబోవుచున్నట్లుగా, హెబ్రీ పత్రిక రచయిత మోషేను కూడా గౌరవించాడు. మోషే దేవుని యొక్క నమ్మకమైన దాసుడైనప్పటికీ, యేసు మరెక్కువ గొప్పవాడు, ఎందుకంటే ఆయన అంత్యదినములలో దేవుని యొక్క రాజత్వ ప్రధాన యాజకునిగా ఉన్నాడు.
పత్రికలోని ఈ భాగము మూడు ప్రధాన భాగములుగా విభాగించబడుతుంది, వీటిలో ప్రతిదీ యేసు అధికారమును మోషే అధికారం కంటే గొప్పగా చూడాలని ఉపదేశించే ఉపదేశమును కలిగి ఉంది. మొదటి భాగమైన హెబ్రీ 3:1-6, మోషే కంటే యేసును ఎక్కువ మహిమకు అర్హునునిగా భావించాలని హెబ్రీ శ్రోతలకు స్పష్టంగా పిలుపునిస్తుంది. మోషే దేవుని ఇంటిని, ప్రత్యక్షగుడారమును నిర్మించాడు అని ఈ భాగము చూపిస్తుంది. అయితే దేవుని యొక్క రాజత్వ కుమారునిగా, యేసు, దేవుని గృహమైన సంఘమును పాలించుచున్నాడు.
హెబ్రీ 3:1-3ను వినండి, అక్కడ రచయిత తన శ్రోతలను ఈవిధముగా హెచ్చరించుచున్నాడు:
యేసుమీద లక్ష్యముంచుము...ఈయన మోషేకంటె ఎక్కువ మహిమకు అర్హుడుగా యెంచబడెను (హెబ్రీ 3:1-3).
యేసు, మోషే వలెనే దేవునికి నమ్మకముగా ఉన్నాడుగాని, యేసు “ఎక్కువ మహిమకు అర్హుడుగా” యెంచబడ్డాడు అని రచయిత ఉద్ఘాటించాడు.
ఈ వచనముల తరువాత, 3:7-19లో, ఇశ్రాయేలీయులు మోషే మీద తిరుగుబాటు చేసినట్లుగా తన శ్రోతలు తమ హృదయములను కఠినపరచుకొనకుండ, తిరుగుబాటు చేయకుండా ఉండాలని రచయిత వారిని హెచ్చరించాడు. మోషేను అనుసరించిన వారిలో చాలామంది దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణమున వాగ్దాన దేశములోనికి ప్రవేశింపలేదు అని చెప్పుట ద్వారా రచయిత ఈ వ్యక్తీకరణముకు మద్దతిచ్చాడు. అదే విధముగా, క్రీస్తును అనుసరించువారు తమ ఆరంభ ఒప్పుకోలును అంతము వరకు పట్టుకొనినట్లయితే క్రీస్తుతో పాలుపంచుకొంటారు. అవిశ్వాసమువలన ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశములోనికి ప్రవేశింపలేదు; క్రీస్తులో అవిశ్వాసము కూడా ఆ పర్యవసానమునే కలిగియుంటుంది.
హెబ్రీ 4:1-13లో, క్రీస్తును అనుసరించుటకు మరియు మోషేను అనుసరించుటకు మధ్య పోలికను గూర్చి రచయిత వివరించాడు. దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి ప్రతి విధమైన ప్రయత్నమును చేయాలి అని అతడు తన శ్రోతలను హెచ్చరించాడు. పాత నిబంధన గ్రంథమును ఉపయోగించి, దేవుని విశ్రాంతిలోకి ప్రవేశించుట ఇంకా భవిష్యత్తులోనే ఉంది అని అతడు వివరించాడు. కాబట్టి దేవుని వాక్యము ప్రతిదానిని ఆయన యెదుట ఎలా బట్టబయలు చేస్తుందో గమనించి వారు జాగ్రత్తపడాలి. వారు లెక్క యొప్పచెప్పవలసినది దేవునికే. మరియు అరణ్యములో ఇశ్రాయేలీయులను అనుసరించక ఆయన విశ్రాంతిలో ప్రవేశించుటకు వారు జాగ్రత్తపడాలి.
దేవదూతల ప్రత్యక్షత మరియు మోషే అధికారమును గూర్చి చర్చించిన తరువాత, హెబ్రీ 4:14-7:28లో హెబ్రీ పత్రిక రచయిత మెల్కీసెదెకు యొక్క రాజత్వ ప్రధాన యాజకత్వమును గూర్చిన స్థానిక యూదుల బోధలను సవాలు చేశాడు.
మన మునుపటి పాఠములో, కుమ్రాన్ వద్ద కనుగొనబడిన 11Q మెల్కీజెదెక్ లేదా ది మిద్రాష్ ఆన్ మెల్కీజెదెక్ లోని వాక్యభాగమును నమోదు చేశాము. ఈ వాక్యభాగము మెల్కీసెదెకును ఒక పరలోక వ్యక్తిగా వర్ణించింది, ప్రాయశ్చిత్త బలులు అర్పించడానికి మరియు దేవుని రాజ్యములో ప్రవేశపెట్టుటకు అతడు అంత్యదినములలో అగుపడతాడు అని సెలవిస్తుంది. స్పష్టంగా చెప్పాలంటే, వాస్తవిక శ్రోతలలో కొందరు ఈ విధమైన బోధనను బట్టి సందేహించారు. అంత్యదినములలో మెల్కీసెదెకు కొరకు నిరీక్షించక, దేవుని యొక్క రాజత్వ ప్రధాన యాజకునిగా యేసును వారు ఎందుకు అనుసరించాలి? కాబట్టి, యేసు మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన నిజమైన రాజత్వ యాజకుడు అని హెబ్రీ పత్రిక రచయిత తెలియజేశాడు.
ఈ భాగము నాలుగు భాగములలో తేటపరచబడుతుంది. మొదటి మరియు మూడవ భాగములు మెల్కీసెదెకు కంటే క్రీస్తును మరియెక్కువగా హత్తుకోవాలని శ్రోతలను హెచ్చరిస్తున్నాయి, మరియు రెండు మరియు నాలుగు భాగములు ఎందుకు హత్తుకోవాలో చూపిస్తాయి.
హెబ్రీ 4:14-16లో, వారు ఒప్పుకొనిన విశ్వాసమును గట్టిగా పట్టుకోవాలని తన శ్రోతలకు హెచ్చరికనిచ్చుటతో మెల్కీసెదెకు అను అంశమును రచయిత పరిచయం చేశాడు. యేసు పరిపూర్ణమైన మానవుడు, పాపరహితుడు, పరలోకమునకు ఆరోహణమైన గొప్ప ప్రధాన యాజకుడు మరియు విశ్వాసులకు దయను, కృపను అనుగ్రహింపజేశాడు మరియు వారి అక్కర సమయాలలో సహాయం చేశాడు అని చెప్పుట ద్వారా అతడు వారిని ప్రోత్సహించాడు.
5:1-10లో, మెల్కీసెదెకు యొక్క క్రమములో యేసు దేవుని యొక్క రాజత్వ ప్రధాన యాజకునిగా ఎలా అర్హత పొందాడో హెబ్రీ పత్రిక రచయిత వివరించాడు. యేసు తన విధేయత మరియు శ్రమ ద్వారా యాజకత్వముకు అవసరమైన అర్హతలన్నిటిని పొందాడు. అయితే ఈ స్థానము కొరకు తన్నుతాను ప్రోత్సహించుకోలేదు. కీర్తనలు 2:7 మరియు కీర్తనలు 110:4ను ఉల్లేఖిస్తూ, మెల్కీసెదెకులో ఇశ్రాయేలు ఉంచిన నిరీక్షణలు వాస్తవానికి దావీదు వంశము ద్వారా నెరవేర్చబడతాయని రచయిత తెలియజేశాడు. కాబట్టి, దేవుడే స్వయంగా యేసును మెల్కీసెదెకు క్రమములో రాజత్వ ప్రధాన యాజకునిగా నియమించాడు. అందుకని, యేసు తనకు విధేయులైన వారందరి శాశ్వతమైన రక్షణకు మూలము అయ్యాడు.
హెబ్రీ 5:11-6:12 అనునది ప్రాథమిక బోధలను మించి పరిపక్వతలోకి నడవాలని హెబ్రీ శ్రోతలను హెచ్చరించే సుదీర్ఘమైన ఉపదేశముగా ఉంది. క్రీస్తు మరియు మెల్కీసెదెకును గూర్చిన తన చర్చను తన శ్రోతలు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారని రచయిత ఒప్పుకున్నాడు. అయితే అర్థం చేసుకొనే విషయంలో పరిపక్వులు అవ్వాలని తద్వారా వారు మతభ్రష్టత్వములోనికి పడిపోరని అతడు వారిని పురికొల్పాడు. ఒకే నిజమైన రాజత్వ ప్రధాన యాజకుని యందు విశ్వాసముంచు విషయములో వారు విఫలమైతే, పాపమునకు ఏ బలి కూడా ఉండదు అని హెచ్చరించాడు. రచయిత తన శ్రోతలపట్ల ఎక్కువ ఆశలు కలిగియున్నాడు, అయితే వారు తమ సోమరితనమును మాని విశ్వాసమున్న వారిని అనుసరించాలి మరియు దేవుడు వాగ్దానము చేసినవాటిని పొందుకొనుటకు సహనము కలిగి ఉండాలి.
హెబ్రీ 6:13-7:28లో, యేసు మెల్కీసెదెకు యొక్క రాజరిక యాజకత్వముకు నెరవేర్పు అను చర్చను రచయిత కొనసాగించాడు. ప్రత్యేకముగా, యేసు యొక్క రాజరిక యాజకత్వము లేవీయుల యాజకత్వమును మించిపోయినది, లేదా అధిగమించినది అని అతడు వివరించాడు. హెబ్రీ పత్రిక వ్రాయబడినప్పుడు, యెరూషలేము దేవాలయములో ఆరాధనలు కొనసాగుచున్నవి. యేసు యొక్క మరణము దేవాలయములో అర్పించు లేవీయుల బలులను ముగించింది అను క్రైస్తవ ప్రకటనకు ఈ వాస్తవము తీవ్రమైన సవాలును విసిరింది. ఈ సవాలుకు జవాబుగా, అంత్యదినములలో మెల్కీసెదెకు బలులనన్నిటిని ముగిస్తాడు అను స్థానిక యూదుల నమ్మకముల మీద రచయిత నిర్మించాడు. అయితే, కీర్తనలు 110:4లో దేవుని వాగ్దానము ఆధారముగా ముగించాడు, అక్కడ, దావీదు యొక్క గొప్ప కుమారుడు, మెల్కీసెదెకు క్రమము చొప్పున నిరతరం యాజకుడై ఉన్నాడు అని చెప్పబడింది. కాబట్టి, యేసు లేవీయుల బలుల వ్యవస్థను ముగించాడు.
లేవీయుల యాజకత్వము మీద యేసు ఆధిపత్యమును చూపించడానికి, రచయిత ఆదికాండము 14:20లో, మెల్కీసెదెకు ఉన్నతమైన వాడు అని చూపించుటకు అబ్రాహాము పదియవవంతు చెల్లించిన సంఘటనను నమోదుచేశాడు. కాబట్టి, అబ్రాహాము యొక్క సంతానమైన లేవీ, అబ్రాహాము ద్వారా ప్రతీకగా అదే చేశాడు. కాబట్టి, మెల్కీసెదెకు క్రమము చొప్పున రాజత్వ ప్రధాన యాజకునిగా, లేవీయుల యాజకత్వమును అధిగమించడం క్రీస్తుకు సరియైనదే. లేవీయుల బలులు ఎన్నడును పరిపూర్ణ ప్రాయశ్చిత్తమును ఇవ్వలేవు, అయితే మెల్కీసెదెకు రాజరిక యాజకత్వపు నెరవేర్పుగా క్రీస్తు అందరికొరకు ఒకేసారి ప్రాయశ్చిత్తము చేశాడు.
ప్రసంగికులకు మరియు బోధకులకు, హెబ్రీ పత్రికలో ఒక ఇష్టమైన భాగము ఏమిటంటే పాత నిబంధనలోని దాదాపు తెలియని యాజకుడైన మెల్కీసెదెకుతో యేసు యొక్క పోలిక. ఈ పోలికకు ముందు, రచయిత లేవీయుల యొక్క అహరోను యాజకత్వముతో పోల్చాడు. అహరోను యాజకత్వము వంశపారంపర్యమైనదిగా ఉంది; ఇది తండ్రి నుండి కుమారునికి మరియు లేవీ గోత్రము నుండి ఇవ్వబడుతుంది. యేసు యాజకత్వము అలా లేదు. ఆయన లేవీయుల వారసుడు కాదు ఎందుకంటే ఆయన దావీదు గోత్రము, అనగా యూదా నుండి వచ్చాడు. అహరోను యాజకత్వము నాశనమవుతుంది గనుక, అహరోను యాజకత్వము తండ్రి నుండి కుమారునికి వెళ్ళింది. దీనికి విరుద్ధంగా, యేసు యొక్క యాజకత్వము శాశ్వతమైనది. ఆయన యాజకత్వము నిరంతరం ఉండునది; ఆయన అదే యాజకునిగా ఉన్నాడు ... మెల్కీసెదెకుకు యాజకుడయ్యే మానవ హక్కు లేదు, కాని అతడు చరత్రలోకి యాజకునిగా, దేవుడు నియమించినవానిగా ప్రవేశించాడు, మరియు మాయమైపోయాడు. యేసు కూడా ఆవిధంగానే చేశాడు, మరియు ఆయన భూలోక పరిచర్య ముగిసిన తరువాత పునరుత్థానుడైన తరువాత పరలోకముకు ఆరోహణమయ్యాడు.
—డా. అల్విన్ పడిల్ల, అనువాదము
హెబ్రీ పత్రికలో రెండు యాజకత్వములను గూర్చి నమోదు చేయబడింది. ఒకటి సాంప్రదాయిక యాజకత్వము, ఇది అహరోను నుండి ఆరంభించబడి, లేవీ గోత్రము ద్వారా కొనసాగించబడినది, లేవీయుల యాజకత్వము. తరువాత పితరుల చరిత్ర యొక్క ఆరంభములో కనిపించే మెల్కీసెదెకు యొక్క అసాధారణమైన యాజకత్వము ఉంది, ఆయన అబ్రాహాము కాలములో, ప్రభువు యాజకుడు, ప్రభువు యొక్క ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. యేసును ఈ రెంటితో పోల్చారు, ఒక కోణంలో లేవీయుల యాజకత్వము కంటే గొప్పది అని చూపించుటకు, మరో కోణంలో, ప్రధాన యాజకునిగా మెల్కీసెదెకు ప్రత్యేకత యొక్క సారుప్యతను చూపించడానికి... ఆయన యాజకత్వము శాశ్వతకాలముకు నియమించబడింది. మరియు మెల్కీసెదెకు గూర్చి మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఆయనకు తల్లిదండ్రులు లేరు; ఎటువంటి జనన వృత్తాంతము లేకుండానే ఆయన తెరమీద కనపడతాడు; ఆయన అబ్రాహాము కంటే గొప్పవాడు అబ్రాహాము ఆయనకు అర్పణ ఇచ్చాడు, పదియవవంతు ఇచ్చాడు, మరియు తక్కువవాడు ఎక్కువవానికి పదియవవంతు ఇస్తాడు...అయితే ప్రతి విషయములోను గొప్పగా ఉన్న మరియు యూదా మతమును, ఇశ్రాయేలు చరిత్రను రూపొందించి, లేవీయుల యాజకత్వమును తమ స్వాధీనములో కలిగిన పితరుల యొక్క అర్పణ తీసుకొను ఆ ప్రధాన యాజకత్వపు పద్ధతి, మెల్కీసెదెకు యొక్క చిత్రంలో కొనసాగుతుంది. మరియు క్రీస్తు యొక్క యాజకత్వము, ఆ నూతన యాజకత్వము, మెల్కీసెదెకు నమూనా మీద అమలు చేయబడుతుంది.
—డా. ఎడ్వర్డ్ యం. క్యాజిరియన్
నాల్గవ ప్రధాన భాగమైన హెబ్రీ 8:1-11:40, క్రొత్త నిబంధన మీద దృష్టిపెడుతుంది. ఇక్కడ, హెబ్రీ పత్రిక యొక్క రచయిత క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే గొప్పది అని చర్చించుట ద్వారా క్రీస్తు యొక్క ఆధిపత్యమును దేవుడు నియమించిన రాజరిక ప్రధాన యాజకునిగా వివరించాడు.
“క్రొత్త నిబంధన” అను పదము యిర్మీయా 31:31 నుండి వెలువడుతుంది. ఈ వచనములో, ఇశ్రాయేలు యొక్క చెర ముగిసిన తరువాత అంత్యదినములలో దేవుడు ఇశ్రాయేలు మరియు యూదాకు తుది పునరుద్ధరణ నిబంధనను ఇస్తాడని ప్రవక్త ప్రవచించాడు. ఈ ఎస్కటాలాజికల్ నిబంధన యెషయా 54:10లో మరియు యెహెజ్కేలు 34 మరియు 35 అధ్యాయములలో “సమాధాన నిబంధన”గా కూడా పిలువబడింది. కాబట్టి, ఈ సమయములో, హెబ్రీ పత్రిక రచయిత అంత్యదినములలో మెల్కీసెదెకును గూర్చిన తన చర్చ నుండి క్రొత్త నిబంధనను గూర్చిన చర్చకు మారాడు.
హెబ్రీ పత్రిక యొక్క ఈ విభజన ఎనిమిది ప్రధాన భాగములుగా విభాగించబడింది. మొదటిగా, హెబ్రీ 8:1-13 యేసు క్రొత్త నిబంధనను పరలోకపు రాజత్వ ప్రధాన యాజకునిగా మధ్యవర్తిత్వం చేస్తాడు అను ఆలోచనను పరిచయం చేస్తుంది.
1 మరియు 2 వచనములలో, “[అతడు] చెప్పుచున్న విషయము”ను రచయిత స్పష్టముగా తెలియజేశాడు. క్రీస్తు, రాజత్వ ప్రధాన యాజకుడు, “మనుష్యుడుకాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు” పరలోకములో పరిచారకుడై ఉన్నాడు అని అతడు వివరించాడు.
మరోమాటలలో, భూమిమీద ఆ పాత్రను నెరవేర్చినది లేవీయులైన యాజకులు. అయితే వారి యాజకత్వం ధర్మశాస్త్రము మీద ఆధారపడినదిగా ఉంది. పాత నిబంధనలో, మోషేతో చేయబడిన నిబంధన భూమిమీద లేవీయుల యాజకత్వమును స్థాపించింది, అయితే ఇశ్రాయేలు పాపము వలన అది విఫలమైపోయింది.
భిన్నముగా, యిర్మీయా 31లోని క్రొత్త నిబంధన విఫలమవ్వదు ఎందుకంటే, హెబ్రీ 8:6 ఈ విధముగా చెబుతుంది:
అది మరిఎక్కువైన వాగ్దానముల మీద స్థాపించబడింది (హెబ్రీ 8:6).
ఈ “మరిఎక్కువ వాగ్దానములు” దేవుని ప్రజలకు పరిపూర్ణ మారుమనస్సును కలిగిస్తాయి మరియు తమ పాపములకు అంతిమ శాశ్వత క్షమాపణను అనుగ్రహిస్తాయి.
హెబ్రీ 9:1-28లో, యేసు యొక్క రాజత్వ యాజకత్వము లేవీయుల యాజకత్వము కంటే గొప్పది అని రచయిత వివరించాడు. దేవుని పరలోకపు దేవాలయమును పోలి ఉండే లక్షణములను వెల్లడిచేయు మోషే యొక్క భూసంబంధమైన ప్రత్యక్షగుడారపు అమరికను ప్రస్తావించుట ద్వారా అతడు ఈ భాగమును ఆరంభించాడు. అంతేకాకుండా, ప్రాయశ్చిత్తపు దినమును గూర్చి లేవీయకాండము 16:34లో ఆజ్ఞాపించబడిన యాజక కార్యములను అతడు వివరించాడు. భూసంబంధమైన దేవాలయము యొక్క బలులు పాప సమస్యను సంపూర్ణంగా పరిష్కరించలేవు గనుక ప్రతి సంవత్సరం అవి పునరావృతం చేయబడాలి అని ఇది తెలియజేస్తుంది. ఈ బలులు చరిత్ర అంత్యదినములలో ముగింపుకు చేరేవరకు ఏర్పాటు చేయబడినవి — హెబ్రీ 9:10లో అతడు దీనిని “దిద్దుబాటు జరుగు కాలము” అని పిలచాడు. తరువాత, హెబ్రీ 9:11లో అతడు ఇలా చెప్పాడు:
అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చాడు (హెబ్రీ. 9:11)
క్రీస్తుయందు విశ్వాసము కలిగినవారు ఆయన యొక్క పరిపూర్ణమైన యాజకత్వ అర్పణ ద్వారా పాపము నుండి విమోచించబడ్డారు గనుక పరలోకములోని కృపాసనము యొద్దకు ప్రవేశము కలిగియున్నారని ఈ వచనము ఉద్ఘాటిస్తుంది.
పాత నిబంధనలోని బలుల వ్యవస్థ మరియు పాపమునకు యేసు యొక్క ప్రాయశ్చిత్తమును గూర్చి హెబ్రీ పత్రిక రచయిత ఇచ్చిన ఒక విరుద్ధత ఏమిటంటే, పాత నిబంధనలోని బలుల వ్యవస్థలో యాజకుని పని పూర్తి కాలేదు. యాజకుడు పాపమునకు పదే పదే బలులు అర్పించవలసి వచ్చింది. మరియు రచయిత చెప్పే విషయం ఏమిటంటే, ఆ పని పాపము పరిహరించబడడానికి అవసరమైన వాటిని సంపూర్ణంగా పూర్తి చేయదు, అయితే యేసు పని సంపూర్ణంగా పూర్తి చేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే, యేసు గొప్ప ప్రధాన యాజకునిగా ఉన్నాడు, ఆయన పాప విమోచన కొరకు తన్నుతాను అర్పించుకున్నాడు, దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు, అయితే ఇంకా చేయవలసిన పని మిగిలియున్నందున పాత నిబంధన యాజకులు తమ కాళ్ళమీద నిలబడ్డారు. అయితే యేసు కూర్చున్నాడు, మరియు హెబ్రీ పత్రిక రచయిత దీనిని ఇలా వివరించాడు, ఆయన పని పూర్తయిపోయింది, పాపము విమోచించబడింది, అది ముగిసింది.
—డా. కాన్ష్టెంట్టైన్ కాంప్బెల్
యేసు యొక్క బలి ఎందుకు అవసరమైనదో రచయిత వివరించాడు. ఆయన సంకల్పము అను ఉదాహరణను ఉపయోగించాడు. ఒక మరణము ద్వారా సాధారణమైన సంకల్పములు ఆరంభించబడతాయి. మోషే నిబంధన మరణము మరియు రక్తముతో ఆరంభించబడింది. కాబట్టి, క్రొత్త నిబంధన కూడా మరణము మరియు రక్తముతోనే-దేవుని పరలోక స్థానములోని అంతరంగ దేవాలయములోని క్రీస్తు రక్తము ద్వారా ఆరంభించబడాలి అని రచయిత ఆలోచించాడు — అయితే ఈ సందర్భములో, “సంకల్పము” యొక్క స్వాస్థ్యము క్షమాపణయై ఉంది. కాబట్టి, యేసు బలి యొక్క రక్తము ద్వారా కడుగబడేవరకు క్షమాపణ అనేది ఇవ్వబడదు. హెబ్రీ 9:26లో రచయిత దీనిని గూర్చి ఇలా చెప్పాడు:
అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను (హెబ్రీ 9:26).
యేసు అనేకుల పాపముల కొరకు ఒక్కసారే అర్పించబడ్డాడు ఎందుకంటే ఆయన రక్తము మనుష్యులు నిర్మించిన దేవాలయము మీద ప్రోక్షించబడదు. తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన ఆయన పరలోకములో ప్రవేశించాడు. యిర్మీయా 31:34లో దేవుడు ఇలా వాగ్దానం చేశాడు:
నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను (యిర్మీయా 31:34).
యేసు ఆయన ప్రజలను తీర్పులోకి తీసుకురాకుండునట్లు విమోచన క్రయధనముగా అర్పించబడెను. క్రీస్తు రెండవసారి ప్రత్యక్షమవుతాడు, అయితే పాపములను భరించుటకు కాదు అను వాక్యముతో రచయిత ఈ భాగమును ముగించాడు. ఆయన వచ్చినప్పుడు, ఆయన కొరకు కనిపెట్టుకొనియుండువారిని సంపూర్ణ రక్షణలోనికి యేసు నడిపిస్తాడు.
హెబ్రీ 10:1-18 మోషే నిబంధనను క్రొత్త నిబంధనతో పోల్చుతుంది. క్రొత్త నిబంధనలో, యేసు యొక్క ప్రధాన యాజకత్వము పాపమునకు తుది క్షమాపణను తెచ్చిందని ఇక్కడ రచయిత నొక్కి చెప్పాడు. ప్రాయశ్చిత్త దినము యొక్క బలులు వార్షిక పాపములను జ్ఞాపకం చేస్తాయి గాని, పాపములను పరిహరించలేవు అని అతడు పునరావృతం చేశాడు. జంతుబలులు దేవునిని సంతోషపెట్టవు అని అతడు గుర్తించాడు. కీర్తనలు 40లో అతడు దావీదును ఉల్లేఖించాడు, అక్కడ దావీదు ఒక ఆదర్శముగా తన్నుతాను దేవునికి అర్పించుకున్నాడు. యేసు సిలువమీద బలియగుట ద్వారా ఈ ఆదర్శమును నెరవేర్చాడు అని అతడు వివరించాడు. లేవీయుల బలులు పాపము యొక్క తుది క్షమాపణను తీసుకురాలేదు, దేవుడు తన ప్రజల యొక్క పాపములను క్షమిస్తాడు అని క్రొత్త నిబంధనను గూర్చిన యిర్మియీ ప్రవచనం వాగ్దానం చేస్తుంది. యేసు దానిని నెరవేర్చాడు. కాబట్టి జంతుబలుల యొక్క అవసరత ఇక లేదు.
హెచ్చరికమాటలలోని నాలుగు భాగములలో హెబ్రీ 10:19-23 మొదటి భాగముగా ఉంది. మొదటిగా, తన శ్రోతలు దేవుని దగ్గరకు వచ్చి తమ నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలని రచయిత వారిని పిలచాడు. క్రీస్తు, ఆయన రక్తము ద్వారా, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము కల్పించాడని అతడు వివరించాడు. ఇప్పుడు, 23వ వచనము మనకు సెలవిస్తున్నట్లుగా, దేవుడు నమ్మదగినవాడు గనుక వారు “నిరీక్షణ విషయమై [వారు] ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకోవాలి.”
10:24-31లో, “ప్రేమ చూపుటకును మరియు సత్కార్యములు చేయుటకును” ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని రచయిత తన శ్రోతలను హెచ్చరించాడు. వారు సమాజముగా కూడుకోవాలని, తీర్పు దినము సమీపించుటను చూచినకొలది మరియెక్కువగా ఆలాగు చేయాలని అతడు చెప్పాడు. “దేవుని కుమారుని పాదములతో త్రొక్కి,” నిబంధనా రక్తమును అపవిత్రమైనదిగా యెంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వారి కొరకు వేచియున్న దండన యొక్క తీవ్రతను గూర్చి అతడు వివరించాడు. అతడు చెప్పినట్లుగా, దేవుడు తన ప్రజలకు తీర్పుతీర్చుతాడు.
హెబ్రీ 10:32-35లో, పూర్వపుదినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి మరియు ధైర్యము విడిచిపెట్టకుడి అని రచయిత తన శ్రోతలకు పిలుపునిచ్చాడు. రాబోవు కాలములో నిత్య స్వాస్థ్యములు ఉన్నవని వారికి తెలుసు గనుక పూర్వదినములో వారు స్వచ్ఛందంగా మరియు ఆనందముగా బాధలను అనుభవించారని అతడు వారికి జ్ఞాపకం చేశాడు. వారు ఇలానే కొనసాగితే, గొప్ప బహుమానం పొందుకుంటారు.
మరియు హెబ్రీ 10:36-39 దేవుని చిత్తము జరిగించుటలో పట్టుదలతో ఉండమని శ్రోతలను ప్రోత్సహిస్తుంది. తుది తీర్పులను మరియు ఆశీర్వాదములను తెచ్చుటకు దేవుడు వస్తున్నాడని వారికి జ్ఞాపకం చేయుట ద్వారా అతడు ఈ వ్యక్తీకరణముకు మద్దతిచ్చాడు. విశ్వాసము ద్వారా జీవించుట నుండి తొలగిపోయిన వారినిబట్టి దేవుడు సంతోషించడు అని అతడు వారిని హెచ్చరించాడు. అయితే హెబ్రీ 10:39లో అతడు ఇలా చెప్పాడు:
అయితే మనము నశించుటకు వెనుకతీయువారము కాము గాని ఆత్మను రక్షించుకొనుటకు విశ్వాసము కలిగినవారమై యున్నాము (హెబ్రీ 10:39).
సరే, ఈ యూదులైన విశ్వాసులు అలసిపోయారు, వారు సొమ్మసిల్లిపోయారు, వారు హింసించబడ్డారు అని స్పష్టమౌతుంది — ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరికీ మరియు చరిత్రయంతటా సంఘముకు చాలా సరిపడినది — అయితే వారు అలసిపోయి విశ్వాసములో కదలించబడుతున్నారు. కాబట్టి, వారు తమ ఇండ్లను దోచుకున్నారు. అప్పటివరకు హతమార్చే విధంగా అయితే ఎటువంటి హింస కూడా లేదు, కానీ అది ఆ అంచులో ఉన్నట్లు కనిపిస్తుంది, కాబట్టి వారి విశ్వాసముకు చాలా సవాళ్లు ఉన్నాయి, వారు వెనుదిరిగి తమ పాత జీవితముకు తిరివి వెళ్లిపోడానికి అనేక కారణములు ఉన్నాయి. మరియు వారు యేసును విశ్వసించుటకు సమీపించిన క్రొత్త నిబంధనకు కట్టుబడి ఉండాలని వారిని ప్రోత్సహిస్తూ రచయిత వారికి వ్రాశాడు.
—డా. ఎరిక్ థోయెన్స్
ఈ హెచ్చరికల యొక్క శీర్షిక తరువాత, 11:1-40లో, రచయిత తన పత్రికలో రక్షించు విశ్వాసమును గూర్చి మాట్లాడాడు. హెబ్రీ పత్రిక శ్రోతలు పూర్వదినములలో హింస అనుభవించారని మరియు మరింత ఆవశ్యకతను ఎదుర్కొన్నారని ముందే మనం చెప్పాము. కాబట్టి, కష్ట సమయములో వెనక్కి తగ్గిపోని విశ్వాసము వారు కలిగి ఉండాలని రచయిత వారిని ప్రొత్సహించాడు.
పాత నిబంధన గ్రంథములో కష్టసమయములలో కూడా సహనముతో నమ్మకముగా ఉన్న వ్యక్తుల యొక్క సుదీర్ఘ జాబితాను ఇచ్చుట ద్వారా అతడు తన అర్థమును ఉదాహరించాడు. వారి జీవితకాలములలో, ఈ నమ్మకస్తులు వాగ్దానము చేయబడిన దానిని పొందుకోలేదు ఎందుకంటే దేవుని వాగ్దానము భవిష్యత్తుకు సంబంధించినది. అయితే, హెబ్రీ పత్రిక రచయిత వివరించినట్లుగా, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు రచయిత మరియు అతని శ్రోతలు పరిపూర్ణులు అవుతారు.
చివరి ప్రధాన భాగమైన హెబ్రీ 12:1-13:25, ఆచరణాత్మకమైన పట్టుదలను గూర్చి వివరిస్తూ హెబ్రీ పత్రికను ముగింపుకు తెస్తుంది. ఈ భాగములో సుదీర్ఘమైన హెచ్చరికమాటలు మరియు వివరణలు ఉన్నాయి. మన ఉద్దేశ్యముల కొరకు, ఈ హెచ్చరికలను మనం సంగ్రహించుదాము.
హెబ్రీ పత్రిక రచయిత తన పత్రికను ముగించడానికి కొనసాగుచుండగా, అతడు జీవితములోని కొన్ని ప్రత్యేకమైన కోణములను గూర్చి వివిధ హెచ్చరికలను జారీచేశాడు. అనేక సందర్భములలో, ఇది పత్రికలో అత్యంత ఆచరణాత్మకమైన భాగముగా ఉంది ఎందుకంటే, తన శ్రోతలు అనుసరించాలని అతడు ఆశించిన ప్రవర్తనల మీద ఇది ప్రత్యేకముగా దృష్టిపెడుతుంది. క్రీస్తు అనుచరులుగా వారు అనుభవించిన గొప్ప ఆశీర్వాదముల దర్శనముతో శ్రోతలను ప్రోత్సహించుటకు మరియు ప్రేరేపించుటకు రచయిత ఒక అవకాశమును కూడా తీసుకున్నాడు.
ఈ హెచ్చరికమాటలు ఐదు సాధారణ భాగములుగా వర్గీకరించబడతాయి చివరిగా ముగింపు ఉంటుంది. హెబ్రీ 12:1-3లో, ఒక పందెములో వలే, తన శ్రోతలను పట్టుదలతో ఉండుమని రచయిత హెచ్చరించాడు. వారు పాపమును విడిచిపెట్టుట ద్వారా మరియు క్రీస్తు వైపు చూచుట ద్వారా వారు దీనిని చేయగలరు.
హెబ్రీ 12:4-13, శ్రోతలు తమ కష్టములను దేవుని నుండి వచ్చు ఒక తండ్రి క్రమశిక్షణగా సహించాలి అని హెచ్చరిస్తుంది. రచయిత ఈ దృక్పథముకు సామెతలు 3:11, 12ను ఉల్లేఖించుట ద్వారా మద్దతిచ్చాడు. దేవుని శిక్షణ “నీతియు సమాధానకరమైన ఫలమిచ్చును” అని అతడు వివరించాడు. కాబట్టి, వారు తమనుతాము బలపరచుకోవాలని మరియు బాధ వలన బలహీనపడవద్దని అతడు వారిని ప్రోత్సహించాడు.
హెబ్రీ 12:14-17లో, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని అతడు మరలా తన శ్రోతలను ప్రోత్సహించాడు. సమాధానముతోను మరియు పరిశుద్ధతతోను జీవించాలని అతడు వారిని హెచ్చరించాడు. ఎవ్వరు కూడా పడిపోకుండా లేదా లైంగిక అనైతికత కలిగి ఉండకుండా ఉండునట్లు వారు జాగ్రత్తపడాలి. తన వారసత్వపు హక్కులు వదులుకున్న ఏశావు ఉదాహరణను ప్రస్తావించుట ద్వారా ఇది ఎంత ప్రాముఖ్యమో అతడు వివరించాడు.
హెబ్రీ 12:18-29లో, క్రీస్తులో వారు పొందిన ఆశీర్వాదములను బట్టి కృతజ్ఞులై ఉండుమని రచయిత తన శ్రోతలను హెచ్చరించాడు. అతని శ్రోతల యొక్క ఆత్మలను ఎత్తిపట్టడానికి మరియు పట్టుదలతో ఉండుమని వారిని పురికొల్పడానికి, వారు పొందిన అపరిమితమైన అధికారములను మరియు ఆశీర్వాదములను గూర్చి అతడు వివరించాడు. హెబ్రీయులకు 12:22-24 వినండి:
ఇప్పుడైతే సీయోనను కొండకును, జీవముగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును, వేవేలకొలది దేవదూతలయొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును,వారి మహోత్సవమునకును, అందరి న్యాయాధిపతియైన దేవుని యొద్దకును, సంపూర్ణసిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, క్రొత్తనిబంధనకు మధ్యవర్తియైన యేసునొద్దకును హేబెలుకంటె మరి శ్రేష్ఠముగ పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చియున్నారు (హెబ్రీ 12:22-24).
హెబ్రీ 12:22లో మరియు తరువాత వచనములలో, “సీయోనను కొండకు వచ్చియున్నాము” అని హెబ్రీ రచయిత చెబుతున్నాడు. ఇప్పుడు, మునుపటి అధ్యాయముతో పాటుగా మీరు దానిని తీసుకోవాలి ఎందుకంటే 11వ అధ్యాయములో విశ్వాసమును “హాల్ ఆఫ్ ఫేమ్” అని పిలుస్తాము, పాత నిబంధన పరిశుద్ధులంతా వాగ్దానం పొందుకోకుండా విశ్వాసముతో మరణించినవారిగా చెప్పబడ్డారు. అయితే, 12వ అధ్యాయము యొక్క ఆరంభములో, క్రీస్తు వచ్చాడు, క్రీస్తు పందెమును ముగించాడు; ఆయన అధిగమించాడు. కాబట్టి, 22వ వచనము మరియు తరువాత వచనములు, పాత నిబంధన పరిశుద్ధులు తమ జీవితకాలములో ఆనందించలేని స్థానములో మనం ఉన్నాము అని చెబుతున్నాయి. మరియు హెబ్రీ పత్రిక రచయిత ఇలా చెప్పుట కొనసాగించాడు, “సీయోనను కొండకు, వేవేలకొలది దేవదూతలయొద్దకును, పరలోకమందు వ్రాయబడియున్న జ్యేష్టుల సంఘమునకును, వారి మహోత్సవమునకును,” మరియు అక్కడ దేవుని సింహాసనము ఉందని, పరలోకములో దేవుని ప్రసన్నత ఉందని అతడు వివరించాడు. మరియు దీని యొక్క అద్భుతమైన భావములలో ఒకటి ఏమనగా పాత నిబంధన గ్రంథములో సీయోనను కొండ మరియు యెరూషలేము సూచించిన ప్రతిదీ క్రీస్తులో ఉన్నవారికి నెరవేర్పుగా ఉంది తద్వారా మనము కీర్తనలు 48 వంటి వాటిని సరిగానే చూడవచ్చు, “మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై యున్నాడు,” భూమిమీద క్రీస్తు సమాజముగా మనము కూడుకొనియుండగా దీని అర్థం ఏమిటో ఆలోచిద్దాము — మనము పరలోకములో సీయోనను కొండ వద్ద ఉన్నాము, భూసంబంధమైన ప్రతిరూపం కాదు, కాని నిజమైన పరలోక సీయోను, నూతన యెరూషలేము దిగి వచ్చినప్పుడు క్రొత్త ఆకాశములు మరియు భూమిలో ప్రత్యక్షపరచబడుతుంది, జయం పొందిన క్రీస్తు ద్వారా మనము దేవుని సన్నిధిలో నిలబడతాము. మరియు ప్రపంచములోని దృశ్యమైన సంఘమును మనం చూచు విధానము మీద ఇది విశేషమైన ప్రభావమును చూపుతుంది.
— రెవ. మైఖేల్ గ్లోడో
హెబ్రీ 13:1-19లో, అనుదిన జీవితములో నమ్మకముగా ఉండుమని రచయిత తన శ్రోతలను ప్రోత్సహించాడు. ఒకరినొకరు ప్రేమించుకోవాలి, పరదేశులను మరియు ఖైదీలను జ్ఞాపకం చేసుకోవాలి, వివాహమును ఘనంగా యెంచాలి, సంతృప్తితో ఉండాలి, మరియు నాయకులను జ్ఞాపకము చేసుకోవాలి అని అతడు నివేదించాడు. స్థానిక యూదుల సమాజముల యొక్క క్రొత్త బోధలను తిరస్కరించాలని మరియు తమ జీవితములలో క్రీస్తు శ్రమను హత్తుకోవాలని అతడు వారికి జ్ఞాపకం చేశాడు. స్తుతియాగము చెల్లించాలని, సత్క్రియలు చేయాలని మరియు ఒకరితోనొకరు పంచుకోవాలని హెచ్చరించాడు. అతని కొరకు మరియు అతని సహచరుల కొరకు ప్రార్థించుమని చెప్పుచు అతడు ఈ భాగమును ముగించాడు.
చివరిగా, హెబ్రీ 13:20-25లో, రచయిత తన పత్రికను ముగించాడు. 20 మరియు 21 వచనములలో, ఆశీర్వచనమును ఇచ్చాడు, అంటే, యేసును మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు, వారిలో కార్యము చేస్తాడు మరియు మహిమ పొందుతాడు అని ప్రార్థన. తరువాత 22వ వచనములో, “ఈ హెచ్చరికమాటను సహించుడని” లేదా అతడు వారికిచ్చిన ఉపదేశమును సహించమని తన శ్రోతలకు పిలుపునిచ్చాడు. మరియు అనేక వందనములతో తన పత్రికను ముగించాడు.
ఈ పాఠములో, హెబ్రీ పత్రిక యొక్క విషయములు మరియు ఆకృతిని మనము చూశాము. పునరావృతమయ్యే విషయము, క్రీస్తు అంత్యదినముల మీద, రచయిత యొక్క దృక్పథముకు పాత నిబంధన యొక్క మద్దతు మీద, మరియు పట్టుదలతో ఉండుమని అతడు ఇచ్చిన అనేకమైన హెచ్చరికమాటల మీద దృష్టిని కేంద్రీకరించడం మనం చూశాము. క్రైస్తవ విశ్వాసముకు వ్యతిరేకముగా వచ్చిన స్థానిక యూదుల బోధనల యొక్క సవాళ్లను చర్చించడానికి రచయిత పునరావృతమయ్యే అంశాలను ఎలా అల్లాడో గమనించుట ద్వారా పత్రిక యొక్క అలంకారరూపక ఆకృతిని మనం పరిశీలించాము.
హెబ్రీ పత్రిక క్రీస్తు అనుచరులకు గొప్ప సంపదను ఇస్తుంది. క్రీస్తు మన కొరకు చేసిన ప్రతి కార్యములోను అతని యొక్క వేదాంతపరమైన దృక్పథములు లోతుగా చొచ్చుకుపోతాయి. క్రీస్తును అనుసరించుట అంటే ఏమిటో అను విషయము యొక్క కేంద్ర భాగములోకి ఇది చొచ్చుకుపోతుంది. లేఖనమును మన అధికారముగా కలిగి దాని వైపు చూడాలని మరియు దేవుడు వాగ్దానము చేసిన ప్రతిదాని యొక్క నెరవేర్పుగా క్రీస్తును అంగీకరించుమని హెబ్రీ పత్రిక మనకు పిలుపునిస్తుంది. మరియు ఆయన మన కొరకు సిద్ధపరచుచున్న రాజ్యమును, స్థిరమైన ఆ ఒకే రాజ్యమును పొందుకొను దినమువరకు క్రీస్తును ప్రేమతో మరియు కృతజ్ఞతతో సేవించాలని అది మనలను హెచ్చరిస్తుంది.
Continue reading the full transcript

