<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
Back to CatalogHGBఅతడు మాకు గ్రంథమును అను మనకు వ్యాఖ్యానమునకు పునాదులు
అతడు మాకు గ్రంథమును అను మనకు వ్యాఖ్యానమునకు పునాదులు ·VideoTranslated from English

HGB-01 బైబిల్ హెర్మెనిటిక్స్‌కు పరిచయం

Read the full text

అదే శ్రేణి 1వ పాఠానికి సమాధానమిచ్చే ఒక అనుబంధ వీడియో, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిస్తుంది: స్క్రిప్చర్ అధికారానికి లోబడటం ఎందుకు చాలా ముఖ్యం? మనం అనుసరించాల్సిన అతి ముఖ్యమైన హెర్మెనిటికల్ సూత్రాలు ఏమిటి? స్క్రిప్చర్ యొక్క మన వివరణలు స్క్రిప్చర్ యొక్క అధికారానికి సమానం కాదు ఎందుకు? బైబిల్ భాగాల యొక్క అసలు అర్థాన్ని వెతకడం ఎందుకు చాలా ముఖ్యం? క్రీస్తుపై మన విశ్వాసం బైబిల్ యొక్క మన వివరణలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఒక వ్యాఖ్యాత యొక్క ఆధ్యాత్మిక పరిస్థితులు అతని లేదా ఆమె బైబిల్‌ను వ్యాఖ్యానించే సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? మేము స్క్రిప్చర్ యొక్క వచనాన్ని విద్యాపరమైన అధ్యయనంలో ఒక వస్తువుగా చేసినప్పుడు మనం దానితో భావోద్వేగంగా నిమగ్నమై ఉండటం ఎలా? స్క్రిప్చర్‌ను ప్రేమించడం మరియు 소중히 ఉంచుకోవడం మనకు ఎంత ముఖ్యం? బైబిల్ వ్యాఖ్యానంలో ప్రార్థన ఏ పాత్ర పోషిస్తుంది? బైబిల్ యొక్క మన జ్ఞానాన్ని ఆచరణలో ఉంచడం మనకు ఎంత ముఖ్యం?


From the transcript

పిల్లలు చాలాసార్లు తమకు తెలిసినదాని కంటే ఎక్కువ వారికి తెలుసు అని అనుకుంటారు అని మనందరికీ తెలుసు. వారు తమ తల్లి వంట చేయునప్పుడు, కొంచెం సహాయం చేస్తారు, మరియు తాము సొంతగా కూడా ఆ వంటను చేయగలమని ఊహిస్తారు. వారు తమ తండ్రులు పని చేయుటను చూస్తారు, దానితో ఒకటి రెండు సార్లు ఆడతారు, మరియు తమ తండ్రికి తెలిసినదంతా వారికి కూడా తెలుసు అని ఆలోచిస్తారు. అయితే ఒక సమయము వచ్చేసరికి, వారు ఊహించినదాని కంటే వారు ఇంకా ఎన్నో విషయములను నేర్చుకొనవలసియున్నదని పిల్లలు కనుగొంటారు.

విచారకరముగా, బైబిలును వ్యాఖ్యానించు ప్రాముఖ్యమైన విషయములో పెద్దలు కూడా చాలాసార్లు ఇదే పొరపాటును చేస్తారు. మనలో చాలామందిమి తరచుగా బైబిలు చదువుతాము; మనలో చాలామంది అనేక సంవత్సరములుగా చదువుతున్నారు. కాబట్టి, లేఖనముల వ్యాఖ్యానమును గూర్చి మనకు అనేక విషయములు తెలుసు అని మనము ఊహించుకుంటాము. అయితే బైబిలు వ్యాఖ్యానము సులువైనదిగా అనిపిస్తుందిగాని, వాస్తవానికి సులువైనది కాదు. మరియు బైబిలు వ్యాఖ్యానములో ఉన్న విషయములను జాగ్రత్తగా విశ్లేషించుటకు మనము సమయమును కేటాయించినప్పుడు, మనము ఊహించినదాని కంటే నేర్చుకొనవలసిన విషయములు ఇంకా చాలా ఉన్నాయి అని మనము కనుగొంటాము.

ఆయన మనకు లేఖనమును అనుగ్రహించాడు: వ్యాఖ్యానమునకు పునాదులు అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము. ఈ పాఠ్యక్రమములో, బైబిలు వ్యాఖ్యానమునకు సంబంధించిన అనేక కీలకమైన దృక్పధములను విశదీకరించి, బైబిలును అర్థము చేసుకొనుటలో మనము కలిగియున్న సామర్థ్యమును మెరుగుపరచుకొను అనేక మార్గములను పరిశీలిద్దాము. ఈ పాఠమునకు “బైబిలు వ్యాఖ్యానశాస్త్రమునకు పరిచయం” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠం హితమైన మరియు పాండిత్యపరమైన బైబిలు వ్యాఖ్యానమునకు ఒక మౌళిక ఆకారమును పరిచయం చేస్తుంది.

బైబిలు వ్యాఖ్యానశాస్త్రమునకు మనమిచ్చు పరిచయం మూడు ప్రధానమైన భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా, కొన్ని ప్రాముఖ్యమైన పదములను పరిచయం చేయుట ద్వారా మన అంశమును గూర్చి కొంత అవగాహనను పొందుదాము. రెండవదిగా, బైబిలు యొక్క పాండిత్య వ్యాఖ్యానమును నిర్ధారించు వ్యాఖ్యానశాస్త్రము యొక్క “వైజ్ఞానిక” విధానములను మనము విశదీకరిద్దాము. మరియు మూడవదిగా, సాంప్రదాయిక అధ్యయన విధానములకు అనుబంధములో భక్తిసంబంధమైన వ్యాఖ్యనశాస్త్రమును ఉపయోగించు విలువను చూద్దాము. కొన్ని ప్రాముఖ్యమైన పదములతో ఆరంభిద్దాము.

కీలకమైన పదములను అపార్థము చేసుకొనుట ఏ సంభాషణలోనైనా సందిగ్ధతకు కారణమవుతుంది. కాబట్టి మన అధ్యయనము కొరకు మనము కొన్ని కీలకమైన పదములను పరిచయం చేద్దాము. మొదటిగా, బైబిలు వ్యాఖ్యానశాస్త్రము అంటే అర్థము ఏమిటో మనము చూద్దాము. రెండవదిగా, మూడు వ్యాఖ్యానశాస్త్ర ప్రక్రియలను మనము చూద్దాము. ముందుగా బైబిలు వ్యాఖ్యానశాస్త్రము అను అంశమును చూద్దాము.

“వ్యాఖ్యానశాస్త్రము” వేదాంత మరియు బైబిలు అధ్యయనములలో ఒక సామాన్యమైన పదమైయున్నది, కాని దీనిని మనము మన అనుదిన జీవితములలో తరచుగా ఉపయోగించము. “వ్యాఖ్యానశాస్త్రము” లేక హెర్మెన్యుటిక్స్ అను పదము గ్రీకు పదముల సమూహము నుండి వెలువడుతుంది అని, దానిలో దేవతల నుండి సందేశమును తెచ్చు పౌరాణిక పాత్ర అయిన “హెర్మిస్” అను పదము కూడా ఉన్నదని మనలో అనేకమంది గుర్తిస్తారు. ఈ పదము హెర్మెనెయియో అను క్రియాపదముగల గ్రీకు పదముల సమూహము నుండి వెలువడుతుంది, “వ్యాఖ్యానించుట” లేక “వివరించుట” దీని అర్థమైయున్నది. కాబట్టి, విశాలమైన భాషలో మనము వ్యాఖ్యానశాస్త్రమును గూర్చి మాట్లాడునప్పుడు, మనము ఒక సందేశము లేక సమాచారము యొక్క వ్యాఖ్య లేక వివరణను గూర్చి మాట్లాడతాము.

1768 నుండి 1834 మధ్య కాలములో నివసించిన ఫ్రెడరిక్ స్క్లెయిర్మాకర్ ఆధునిక వ్యాఖ్యానశాస్త్రము యొక్క పితామహుడు అని పిలువబడతాడు. 1819లో అతడు “సాధారణ వ్యాఖ్యనశాస్త్రము,” అనగా అన్ని సాహిత్యములను అర్థము చేసుకొనుటకు ఉపయోగపడు ఒక సమగ్ర సిద్ధాంతమును గూర్చి మాట్లాడాడు. మనము వివిధ అంశములను విశేషమైన వాటి సొంత వ్యాఖ్యానశాస్త్రముల దృష్ట్యా చూడాలని అతడు తెలియజేశాడు, కాని అన్ని వ్యాఖ్యానశాస్త్రములలో ఒక సాధారణ వ్యాఖ్యాన విధానము ఉండాలని అతడు వాదించాడు.

ఇరవైయ్యవ శతాబ్దము ముగిసేనాటికి, ప్రసిద్ధిగాంచిన పండితులు సాధారణ వ్యాఖ్యానశాస్త్రము యొక్క అవసరతను గుర్తించారు, ఎందుకంటే వ్యాఖ్యాన విధానము అనేక అధ్యయన విభాగములలో ఒక కీలకమైన కోణముగా మారిపోయింది. నేడు, వ్యాఖ్యానశాస్త్ర సంభాషణలు తత్వశాస్త్రములో, సాహిత్యములో మరియు సాహిత్యకళలలో కనిపిస్తాయి. మనోవిజ్ఞానశాస్త్రము, సమాజశాస్త్రము మాత్రమేగాక భౌతికశాస్త్రము మరియు జీవశాస్త్రములో కూడా వ్యాఖ్యానశాస్త్రము ఉపయోగపడుతుంది. వారు అధ్యయనము చేయుచున్న విషయముల యొక్క అర్థమును వారి విభాగములలో కూడా వ్యాఖ్యానించవలసిన అవసరతను ఈ అధ్యయన విభాగములలోని అనేకమంది ప్రముఖులు గ్రహించారు కాబట్టి ఈ వ్యాప్తి జరిగింది.

ఈ పాఠం యొక్క శీర్షిక సూచించుచున్నట్లు, మనము బైబిలు వ్యాఖ్యానశాస్త్రము మీద, అనగా లేఖనము యొక్క అర్థమును మరియు ప్రాముఖ్యతను వ్యాఖ్యానించు అధ్యయనము మీద ప్రధానముగా దృష్టిపెడతాము. మీరు లేఖనములు చదివియుంటే, కనీసం అనధికారికముగానైనా మీరు బైబిలు వ్యాఖ్యానశాస్త్రములో పాలుపంచుకున్నట్లే. బైబిలును అధ్యయనము చేయుటకు అనధికార విధానములు చాలా విలువైనవి, మరియు మనలో చాలామందికి ఇప్పటికే తెలిసిన విషయముల మీద ఈ పాఠములు నిర్మించబడతాయి. అయితే మనము అనధికార వ్యాఖ్యానశాస్త్రము మాత్రమేగాక, బైబిలు యొక్క అధ్యయన, పాండిత్య అనువాదములో ఎదురయ్యే కొన్ని రకముల సమస్యలను కూడా చూద్దాము.

సాధారణ వ్యాఖ్యానశాస్త్రము మరియు బైబిలు వ్యాఖ్యానశాస్త్రము మధ్య వ్యత్యాసమును మరియు పోలికను చూపుట సహాయకరముగా ఉంటుంది. బైబిలులో ఉన్న సాధారణ వ్యాఖ్యానశాస్త్రములో ఈ క్రింది ఆలోచనలు ఉంటాయి, క్రియ ఏమి చేస్తుంది? భాషా భాగాలు ఏవి? వ్యాకరణం, శబ్దప్రయోగ లక్షణము, మొదలగువాటి యొక్క అర్థము ఏమిటి? ఒక రచయిత తన మాటలను వ్రాసినప్పుడు అతని లేక ఆమె యొక్క అర్థమును మనము ఎలా నిర్థారించగలము? అయితే నియమానుసారముగా బైబిలు వ్యాఖ్యానశాస్త్రములో కొన్ని విశేషమైన నియమములు ఉంటాయి, ఎందుకంటే బైబిలు దేవుని వాక్యము అని, అనగా అధికారికమైనది అని, మరియు దేవుని వాక్యమును మనకు బయలుపరుస్తుంది అని బైబిలులో తెలియజేయబడింది. దేవుడు ఒక్కడే మరియు దేవుడు సత్యుడు గనుక, బైబిలు దానికి అది వ్యతిరేకముగా నిలబడదు. కాబట్టి, బైబిలు వ్యాఖ్యానశాస్త్రములో ఒక విశేషమైన లక్షణము ఏమిటంటే, లేఖనములో ఉన్న సమాచారమంతా ఒకదానిని ఒకటి వ్యతిరేకించుకొనక, — దేవుని ప్రత్యక్షతలోని భిన్నత్వము మధ్య కూడా — ఒకదానిని మరొకటి సమర్థించుకుంటాయనే ఆలోచనతో లేఖనములోని విషయములన్నిటిని అనుబంధపరచుటకు ప్రయత్నిస్తాము.

— రెవ. మైక్ గ్లోడో

బైబిలు వ్యాఖ్యానశాస్త్రము యొక్క అర్థమును దృష్టిలో ఉంచుకొని, ఇప్పుడు రెండవ ప్రాముఖ్యమైన పదమును మనము చూడవలసియున్నది, అది వ్యాఖ్యానశాస్త్ర ప్రక్రియలు — బైబిలును వ్యాఖ్యానించుచుండగా మనం అనుసరించు విధానములు.

ఈ పాఠ్యక్రమము అంతటిలో, మనము మూడు ప్రధానమైన వ్యాఖ్యానశాస్త్ర ప్రక్రియలను గూర్చి మాట్లాడతాము: సిద్ధపాటు, పరిశోధన, మరియు అనువర్తనము. బైబిలు వ్యాఖ్యానమునకు ఈ ప్రక్రియలు ఎంత ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయంటే, ఈ పాఠ్యక్రమములోని ప్రతి పాఠం ఈ మూడు విభాగములలో ఒకదానికి చెందినదైయుంటుంది. ముందుగా సిద్ధపాటును చూద్దాము.

సిద్ధపాటు అను వ్యాఖ్యానశాస్త్ర ప్రక్రియ మనము లేఖనములో ఒక భాగమును వ్యాఖ్యానించుట ఆరంభించుటకు ముందు జరుగుతుంది. అవును, మనము బైబిలును మరలా మరలా చదువుతాము మరియు అధ్యయనం చేస్తాము కాబట్టి, మనము తరచుగా సిద్ధపడతాము అని దీని అర్థము. ప్రాముఖ్యమైన భావనలో, సిద్ధపాటు అనుదానిని ఎవ్వరు తప్పించుకోలేరు, ఎందుకంటే ఏనాడు ఎవ్వరు కూడా టబుల రస — ఖాళీ పలక — వలె బైబిలును ఆశ్రయించలేరు. మనమంతా లెక్కలేనన్ని భావనలు, ప్రవర్తనలు మరియు ఆలోచనలతో ప్రభావితమై లేఖనములను ఆశ్రయిస్తాము. మనము దీనిని గ్రహించినా గ్రహించకపోయినా, మనము బైబిలును చదువుట ఆరంభించిన ప్రతిసారి, లేఖనములను సరిగా ఉపయోగించుట కొరకు అనేక విషయములు అప్పటికే మనలను సిద్ధపరచియుంటాయి, కాని ఇతర విషయములు హితమైన బైబిలు వ్యాఖ్యానమునకు ఆటంకములను కలిగించాయి. ఈ కారణం చేత, బైబిలును వ్యాఖ్యానించు విషయములో మనలను సిద్ధపరచుట మీద ఈ పాఠములు విశేషమైన శ్రద్ధను పెడతాయి.

లేఖన అధ్యయనము కొరకు మనలను మనము సిద్ధపరచుకొనుటకు లేక సిద్ధపరచుకొను ప్రక్రియలో అనేక పనులను మనము చేస్తామని నేననుకుంటాను... లేఖనములను అధ్యయనం చేయుట కష్టతరమైన పని అయ్యున్నది. మనము పరీక్షించవలసిన అనేక వివరములు ఉంటాయి, మరియు లేఖనమును అధ్యయనం చేయుచుండగా దేవుని ఆత్మ యొక్క స్వరమును వినుటతో పాటుగా అనేక వివరములను మనము గుర్తుంచుకోవలసియున్నది. కాబట్టి మంచి పరికరములను ఉపయోగించి మనము సిద్ధపడాలి. ఇతరులు వ్రాసిన మంచి సాహిత్యములను అందుబాటులో ఉంచుకొని మనము సిద్ధపడాలి. ప్రార్థించుట ద్వారా మరియు పరిశుద్ధాత్మునికి అవకాశమిచ్చుట ద్వారా, మన జీవితములలో కార్యము చేయుటకు ఆయనకు స్వాతంత్ర్యమునిచ్చుట ద్వారా మనము సిద్ధపడాలి... మీరు దేవుని స్వరమును వినవలసియున్నది, మరియు మీ జీవితముల కొరకు దేవుని స్వరమును విని, ఆ స్వరమును ఇతరులకు కూడా పంచవలసియున్నది.

— డా. స్టీఫెన్ జే. బ్రామర్

సిద్ధపాటు అను వ్యాఖ్యానశాస్త్ర ప్రక్రియతో పాటుగా, మనము పరిశోధన అను ప్రక్రియను కూడా విశదీకరిద్దాము. పరిశోధనను గూర్చి మాట్లాడునప్పుడు, మనము బైబిలు భాగము యొక్క వాస్తవిక అర్థము మీద దృష్టిపెట్టుటకు ప్రయత్నించుచున్నాము.

ప్రాముఖ్యముగా, మనము లేఖనములను పరిశోధించినప్పుడు, మన ఆధునిక ప్రపంచమును విడచి, బైబిలులోని భాగములు మొదటిగా వ్రాయబడిన సమయములో వాటి యొక్క అర్థమును గ్రహించుటకు మనము ఉత్తమమైన ప్రయత్నమును చేస్తాము. పరిశోధన ప్రక్రియలో, స్వయంగా బైబిలు ప్రతుల కొరకు, మరియు లేఖనముల యొక్క మొదటి శ్రోతల కొరకు దేవుడు మరియు బైబిలు యొక్క మానవ రచయితలు ఉద్దేశించిన వాస్తవిక అర్థము మీద దృష్టిపెడతాము. అనేక విధాలుగా, మనము లేఖనమును అధ్యయనం చేసిన ప్రతిసారి, కనీసం కొంత వరకైనా వాస్తవిక అర్థముతో వ్యవహరించుటను మనము నివారించలేము.

ఉదాహరణకు, బైబిలును మనము దాని యొక్క వాస్తవిక భాషలలో విశదీకరించినప్పుడు, పురాతన హెబ్రీ, అరమాయిక్ మరియు గ్రీకు ప్రతుల యొక్క భాషాపరమైన పద్ధతులను మనము పరిగణలోనికి తీసుకోవాలి. బైబిలు యొక్క ఆధునిక అనువాదము మీద మనము ఆధారపడినప్పటికీ, ఆ అనువాదము కూడా పదములు మరియు వ్యాకరణ వ్యక్తీకరణముల యొక్క పురాతన అర్థముల యొక్క సమీక్షల మీద ఆధారపడియుంటుంది. ఇవి మరియు అనేక ఇతర మార్గములలో, బైబిలు భాగము యొక్క వాస్తవిక అర్థము దాని యొక్క వ్యాఖ్యానము కొరకు ఎల్లప్పుడూ కీలకమైనదిగా ఉన్నది. కాబట్టి, పరిశోధన యొక్క ప్రక్రియ మీద కూడా మనము విశేషమైన ఆసక్తిని పెట్టాలి.

వ్యాఖ్యానశాస్త్ర ప్రక్రియలలో కేవలం సిద్ధపాటు మరియు పరిశోధన మాత్రమేగాక, అనువర్తనము ప్రక్రియ కూడా ఉన్నది.

సులువైన పదజాలములో, అనువర్తనము అనగా వాస్తవిక అర్థమును సరియైన మార్గములో ఆధునిక శ్రోతలతో అనుసంధానము చేయుట అయ్యున్నది. మనము వాస్తవిక అర్థమును అర్థము చేసుకున్న తరువాత, సహస్రాబ్దిల గుండా మనము మన ఆధునిక పరిస్థితిలోనికి ప్రవేశిస్తాము. అనువర్తనములో, దేవుని ప్రజలుగా లేఖనములు మనకు అనువర్తించబడవలసిన విధానముల మీద మనము దృష్టిపెడతాము.

ఇతర వ్యాఖ్యానశాస్త్ర ప్రక్రియల వలెనే, అనువర్తనమును కూడా పూర్తిగా నివారించుట అసాధ్యమవుతుంది. ఒక బైబిలు భాగము యొక్క పైపై అవగాహనను మాత్రమే మనము పొందినప్పటికి కూడా, కొంత వరకు దానిని మనము మన ఆలోచనకు అనువర్తిస్తాము. అవును, బైబిలును అర్థము చేసుకొని, దానిని అనుసరించకపోవు వేషధారణకు విరోధముగా లేఖనములు హెచ్చరిస్తాయి. కాబట్టి, ఈ పాఠ్యక్రమములో లేఖనములను అనువర్తించుట మీద మనము ఉద్దేశపూర్వకముగా మరియు స్పష్టముగా ఎక్కువ దృష్టినిపెడతాము.

ఈ పాఠములను మనము చూచుచుండగా, సిద్ధపాటు, పరిశోధన మరియు అనువర్తనము ఎక్కువగా పరస్పరాధారితమైన ప్రక్రియలైయున్నాయని మనము కనుగొంటాము. మనము ఇతర ప్రక్రియలను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు మాత్రమే ఒక ప్రక్రియను సరిగా చేయగలుగుతాము. అవును, ప్రతి ఒక్కరికి వేర్వేరు అవగాహనలు మరియు సామర్థ్యములు ఉన్నాయి, కాబట్టి మనము ఈ ప్రక్రియలలో ఒకటి లేక రెండింటి మీద మాత్రమే ఉద్ఘాటన పలుకుతుంటాము. అయితే సిద్ధపాటు, పరిశోధన మరియు అనువర్తనము యొక్క పరస్పరాధారము, ఈ మూడు విభాగములలో మన నైపుణ్యతలను అభివృద్ధి చేసుకోవాలని మనకు జ్ఞాపకము చేస్తుంది.

బైబిలు వ్యాఖ్యానశాస్త్రము యొక్క పరిచయము అను మన పాఠంలో ఇప్పటి వరకు మనము కొన్ని ప్రాముఖ్యమైన పదములను వివరించాము కాబట్టి, ఇప్పుడు మన రెండవ ప్రాముఖ్యమైన అంశమును చూడవలసియున్నది: వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రము — శతాబ్దములుగా బైబిలు పండితులు లేఖన వ్యాఖ్యానమును ఒక వైజ్ఞానిక అభ్యాసముగా చూసిన విధానము.

బైబిలు వ్యాఖ్యానశాస్త్రములో ఎల్లప్పుడూ ఎంతో కొంత వైజ్ఞానిక చవి ఉండినది, మరియు ఇతర విభాగముల వలెనే దీనిలో కూడా ఈ ధోరణి శతాబ్దములుగా ఎదుగుతూ వచ్చింది. ఇట్టి పురోగమనములకు కారణం చాలా స్పష్టముగా ఉన్నది. బైబిలును కొన్ని వేల సంవత్సరముల క్రితం నివసించిన ప్రజలు వ్రాశారు. కాబట్టి, అనేక విధాలుగా, పురాతన ప్రపంచములోని ఇతర రచనల వలెనే మనము లేఖనములతో సరిగానే వ్యవహరిస్తాము. దాని యొక్క చారిత్రిక నేపథ్యమును దృష్టిలో ఉంచుకొని పండితులు బైబిలుతో వ్యవహరించుచుండగా, వారు అనేకసార్లు వైజ్ఞానిక విభాగములైన పురావస్తుశాస్త్రము, చరిత్ర, మానవశాస్త్రము, సమాజశాస్త్రము మరియు భాషాశాస్త్రములను ఉపయోగించారు. వీటిలో మరియు ఇతర వైజ్ఞానిక పరిశోధనలలో వలెనే, లేఖనముల యొక్క అధ్యయన వ్యాఖ్యానములు వాస్తవముల ఆధారముగా లేక తార్కికముగా వైజ్ఞానిక విధానములను బైబిలుకు అనువర్తించారు.

దీని అర్థము ఏమిటో కనుగొనుటకు, వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రమునకు సంబంధించిన మూడు విషయములను మనము చూద్దాము. మొదటిగా, దీని యొక్క బైబిలు మూలములను గుర్తించుట ద్వారా ఈ పద్ధతి యొక్క మాన్యతను మనము చూద్దాము. రెండవదిగా, ఇట్టి వ్యాఖ్యానశాస్త్రములోని పురోగమనములను ఉదహరించు కొన్ని చారిత్రిక ఉదాహరణలను మనము ప్రస్తావిద్దాము. మూడవదిగా, లేఖనముల పట్ల ఈ ధోరణి వ్యాఖ్యాన ప్రక్రియ కొరకు కొన్ని ప్రాధాన్యతలను స్థాపించు విధానమును మనము చూద్దాము. ముందుగా వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రము యొక్క బైబిలు మూలములను చూస్తూ ఆరంభిద్దాము.

బైబిలు కాలములలో నివసించిన ప్రజలు ఆధునిక వైజ్ఞానికులు కారు. అంటే వారు జ్ఞానములేనివారు లేక తర్కములేనివారు అని అర్థము కాదు. భిన్నముగా, బైబిలు కాలములో నివసించిన ప్రజలు వాస్తవములతో వ్యవహరించారు అని, ఆధునిక వైజ్ఞానికుల వలె లోకమును గూర్చి తార్కికమైన రీతిలో ఆలోచించారు అని వారి సంక్లిష్టమైన నిర్మాణ విధానములు, విరివిగా చేసిన సముద్ర ప్రయాణములు, నవప్రవర్తక వ్యవసాయ విధానములు, మరియు లెక్కలేనన్ని ఇతర సాంస్కృతిక సాధ్యతలు తెలియజేస్తాయి.

ఈ కారణం చేత, బైబిలు రచయితలు స్వయంగా ఇతర లేఖనములను వాస్తవిక మరియు తార్కిక విశ్లేషణల ఆధారంగా అనువదించారు అను విషయము మనలను ఆశ్చర్యపరచకూడదు. సమయమును దృష్టిలో ఉంచుకొని, ఒక వాక్య భాగమును ఉపయోగించి దీనిని వివరిద్దాము. రోమా 4:3-5లో అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు:

లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచబడదు. పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది (రోమా. 4:3-5).

ఈ వచనములలో, పౌలు ఆదికాండము 15:6ను ఉపయోగించాడు, అక్కడ దేవుడు అబ్రాహాము ఆయన వాగ్దానమును నమ్మినప్పుడు దానిని అతనికి నీతిగా “ఎంచాడు.” అయితే ఈ పాత నిబంధన వాక్యభాగమును ఒక క్రమపద్ధతిని ఉపయోగించి పౌలు వర్ణించిన విధానమును గమనించండి. 4 మరియు 5 వచనములలో, పౌలు “ఎంచుట,” లేక గ్రీకు పదమైన లోగిజోమయి అనువదించబడునట్లు “పరిగణించుట” అను పదము యొక్క అర్థమును జాగ్రత్తగా విశ్లేషించాడు. తాను కలిగియున్న గ్రీకు జ్ఞానమును ఉపయోగించి, “జీతములు ఒక బహుమానముగా ఎంచబడవుగాని, ఒక బాధ్యతగా ఎంచబడతాయి” అని అతడు వాదించాడు. అయితే దేవుని నమ్మువారికి వారి “విశ్వాసము” — క్రియలు కాదు — “నీతిగా ఎంచబడుతుంది” అని అతడు గుర్తించాడు. కాబట్టి, ఈ తర్కము ఆధారంగా అబ్రాహామునకు నీతి విశ్వాసము ద్వారా ఉచిత బహుమానముగా ఎంచబడినది అని ఆది. 15:16 సూచిస్తుంది అని అతడు నిర్థారించాడు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఆదికాండము 15 యొక్క ఖచ్చితమైన వాస్తవిక, తార్కిక విశ్లేషణను చేశాడు అని చూచుట అంత కష్టమైన పని కాదు.

ఈ ఒక్క ఉదాహరణ తెలియజేయుచున్నట్లు, మరలా మరలా బైబిలు రచయితలు లేఖనములను ఈ విధముగా జాగ్రత్తగా వ్యాఖ్యానించారు. మరియు వైజ్ఞానిక బైబిలు వ్యాఖ్యానశాస్త్రము లేఖనములలో స్థిరముగా నాటబడియున్నది అని లేఖనము పట్ల వారి ధోరణి సూచిస్తుంది.

వైజ్ఞానిక వ్యాఖ్యనశాస్త్రము యొక్క బైబిలు మూలములను దృష్టిలో ఉంచుకొని, ఇట్టి బైబిలు వ్యాఖ్యానమునకు కొన్ని చారిత్రిక ఉదాహరణలను మనము క్లుప్తంగా చూద్దాము.

సంఘ పితరుల కాలములో, క్రీ.శ. 185 నుండి 254 వరకు నివసించిన అలగ్జేంద్రియకు చెందిన ఓరిగన్ బైబిలు వ్యాఖ్యానములో అత్యంత ప్రాముఖ్యమైన వారిలో ఒకరిగా ఉన్నాడు. ఈ పాఠంలో మనము తరువాత చూడబోవుచున్నట్లు, ఓరిగన్ వైజ్ఞానిక వ్యాఖ్యానమును దాటి వెళ్లాడుగాని, బైబిలు యొక్క వాస్తవిక మరియు తార్కిక విశ్లేషణ కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. ఉదాహరణకు, హెక్సప్ల ను సృష్టించుట ఓరిగన్ యొక్క గొప్ప సాధ్యతలలో ఒకటైయున్నది, ఇది పాత నిబంధన యొక్క పలు హెబ్రీ మరియు గ్రీకు వెర్షన్లలోని ఒకొక్క పదమును పోల్చి అతడు వ్రాసిన ఆరు వేల పేజీలు మరియు యాబై వాల్యూంలు కలిగిన సాహిత్యమైయున్నది. కొన్ని శతాబ్దముల తరువాత ఇది కనుమరుగైపోయినప్పటికీ, ఆదిమ సంఘ చరిత్రలో వైజ్ఞానిక బైబిలు వ్యాఖ్యానమునకు ఇది ఒక విశేషమైన ఉదాహరణగా ఉన్నది.

లేఖనము కొరకు వైజ్ఞానిక విధానములను అభివృద్ధి చేయుటను గూర్చిన ఇతర ప్రాముఖ్యమైన ఉదాహరణలు ఓరిగన్ దినముల తరువాత జరిగాయి. ఉదాహరణకు, క్రీ.శ. 354 నుండి 430 మధ్య కాలములో జీవించిన హిప్పోకు చెందిన అగస్టిన్, జాగ్రత్తతో కూడిన, కొన్నిసార్లు కఠిన పరిశ్రమతో కూడిన, వాస్తవిక మరియు తార్కిక బైబిలు అనువాదము మీద దృష్టిపెట్టుటను కొనసాగించాడు. 1225 నుండి 1274 మధ్య కాలములో నివసించిన థామస్ అక్వినాస్ కాలము నాటికి, పశ్చిమ క్రైస్తవ్యములోని బైబిలు వ్యాఖ్యానము ఆరిస్టొటిల్ యొక్క తార్కిక, వైజ్ఞానిక తర్కవాదము యొక్క ప్రభావమును ప్రతిబింబించింది. అక్వినాస్ మరియు అతని అనుచరులు కఠినమైన అనుభావిక మరియు తార్కిక విశ్లేషణను బైబిలు కొరకు ఉపయోగించారు.

విచారకరముగా, సంఘ చరిత్రలో అప్పటి వరకు అక్షరాస్యత చాలా తక్కువగా ఉండేది, అలాగే బైబిలు మరియు ఇతర గ్రంథములు విరిగిగా అందుబాటులో ఉండేవి కాదు. కాబట్టి, ఆధిక్యతగల కొందరు మాత్రమే లేఖనములను అధ్యయనం చేసేవారు. ఫలితంగా, సామాన్య ప్రజలు బైబిలును అర్థము చేసుకొను విధానమును సంఘములోని అధికారులు నియంత్రించేవారు. అయితే ఈ సందర్భములో, సంఘము యొక్క ఆధిపత్యముతో పాటుగా అనేకమంది పండితులు లేఖనమును మరింత క్లిష్టమైన వైజ్ఞానిక విశ్లేషణ ద్వారా వ్యాఖ్యానించుట ఆరంభించారు.

ఈ దిశలో మొదటి అడుగులు పునరుజ్జీవనోద్యమ కాలములో ఆరంభమయ్యాయి. 1204లో జరిగిన నాల్గవ క్రూసేడ్ లో కాన్స్టంట్నోపెల్ పతనమైన తరువాత, అక్కడ భద్రపరచబడిన అనేక సాంప్రదాయిక మరియు బైబిలు ప్రతులను పాశ్చాత్యమునకు తీసుకొని వచ్చారు. అయితే సంఘ బోధనల దృష్ట్యా ఈ పురాతన ప్రతుల యొక్క ప్రాముఖ్యతను వ్యాఖ్యానించుటకు బదులుగా, పునరుజ్జీవనోద్యమ పండితులు జాగ్రత్తగా వాటి వ్యాకరణమును మరియు పురాతన చారిత్రిక నేపథ్యములను విశ్లేషించుట ద్వారా ఈ ప్రతులను అర్థము చేసుకొనుటకు ప్రయత్నించారు. సుమారుగా 1450లో ఉపయోగములోనికి వచ్చిన గుటేన్బెర్గ్ యొక్క ముద్రణ యంత్రము యొక్క సహాయముతో, పునరుజ్జీవనోద్యములో జరిగిన పరిశోధనలు విరివిగా అందుబాటులోనికి వచ్చాయి. ఫలితంగా, 1466 నుండి 1536 మధ్య కాలములో నివసించిన ఎరాస్మస్ వంటి ప్రాముఖ్యమైన వ్యక్తులు, తమ దినములలో నివసించిన ప్రజలను బైబిలు వ్యాఖ్యానము యొక్క వైజ్ఞానిక విధానముల వైపుకు ఎక్కువగా నడిపించారు.

పదహారవ శతాబ్దములో జరిగిన ప్రొటెస్టెంట్ సంస్కరణ వైజ్ఞానిక బైబిలు వ్యాఖ్యానశాస్త్రమును మరింత బలపరచింది. పునరుజ్జీవనోద్యమము యొక్క బాటను అనుసరించి, ఆరంభ ప్రొటెస్టెంట్ నాయకులైన మార్టిన్ లూథర్, అల్రిచ్ జ్విన్గ్లి మరియు జాన్ కెల్విన్ బైబిలు వ్యాఖ్యానము పైన సంఘ సిద్ధాంతముల యొక్క ఆధిపత్యమును బలముగా తిరస్కరించారు. బదులుగా, బైబిలు వ్యాకరణము మరియు చారిత్రిక నేపథ్యముల యొక్క విశ్లేషణ ద్వారా లేఖనము యొక్క అర్థము నిర్థారించబడాలని వారు ఉద్ఘాటించారు.

ఆరంభ ప్రొటెస్టెంట్ లు ఈ ఉద్ఘాటనతో పాటు సుపరిచిత సిద్ధాంతమైన సొల స్క్రిప్చుర, “లేఖనము మాత్రమే,” మీద కూడా దృష్టిపెట్టారు అని గుర్తుంచుకొనుట చాలా ప్రాముఖ్యమైయున్నది. బైబిలు మాత్రమే నిస్సందేహమైన అధికారమైయున్నది అని, అనగా మిగిలినవన్ని నిర్ణయించుటకు ఉపయోగించవలసిన సర్వోన్నతమైన అధికారమైయున్నదని ప్రొటెస్టెంట్ లు గ్రహించారు. బైబిలు అధికారము యొక్క ఆధిక్యత పట్ల ఈ సమర్పణ, లేఖనముల యొక్క పొరపాటుపడని వ్యాఖ్యానకర్త లేఖనము మాత్రమే అని తెలియజేస్తుంది. కాబట్టి, దాని యొక్క పురాతన చారిత్రిక నేపథ్యములో దాని వ్యాకరణము యొక్క తార్కికమైన, ఖచ్చితమైన విశ్లేషణ ద్వారా బైబిలును అర్థము చేసుకొనుట కంటే మరొక ప్రాముఖ్యమైన విషయము ఏమి ఆరంభ ప్రొటెస్టెంట్లకు ఉండలేదు.

పదిహేడవ మరియు పద్దెనిమిదవ శతాబ్దములలో పశ్చిమ ఐరోపాలో జరిగిన జ్ఞానోదయము లేఖనములో ఉన్నవాటితో సహా అన్ని సత్యములను విశ్లేషించుటకు ఆధునిక, వాస్తవిక మరియు తార్కిక వైజ్ఞానిక ప్రామాణికతలను ఉద్ఘాటించుట ద్వారా వైజ్ఞానిక బైబిలు వ్యాఖ్యానశాస్త్రమును మరింత బలపరచింది. భూవిజ్ఞానశాస్త్రజ్ఞులు, పురావస్తుశాస్త్రజ్ఞులు, మరియు ఇతర ఆధునిక శాస్త్రజ్ఞులను పోలిన విధముగానే బైబిలు పండితులు కూడా వైజ్ఞానిక ప్రామాణికతలను లేఖన అధ్యయనమునకు చాలా జాగ్రత్తగా అనువర్తించారు.

బైబిలు పట్ల ఈ ధోరణి శతాబ్దములుగా అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. అయితే ఎంతో కొంత వరకు, ఆధునిక బైబిలు పండితులు రెండు ప్రధానమైన మార్గములను అనుసరించారు. ఒక వైపున, ప్రఖ్యాతిగాంచిన విద్యాసంస్థలలోని వ్యాఖ్యానకర్తలలో ఎక్కువమంది విమర్శనాత్మక బైబిలు అధ్యయనములు అని పిలువబడుదానిని అనుసరించారు. విస్తృతముగా మాట్లాడితే, విమర్శనాత్మక బైబిలు పండితులు సాంప్రదాయిక ప్రొటెస్టెంట్ సిద్ధాంతమైన సొల స్క్రిప్చురను తిరస్కరించి, సత్యమును వివేచించుటకు కేవలం తర్కము మరియు వైజ్ఞానిక విశ్లేషణను మాత్రమే అత్యున్నతమైన పరిమాణముగా పరిగణించారు. చాలావరకు, లేఖనములు దేవుని గూర్చి, మానవాళిని గూర్చి మరియు లోకమును గూర్చి పురాతన, ప్రాచీన మరియు ఆధారయోగ్యము కాని అభిప్రాయములకు ప్రాతినిధ్యం వహిస్తాయి అని విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు నిర్థారించారు. ఈ అభిప్రాయములో, ఆధునిక ప్రజలు లేఖనముల నుండి కొన్ని విధాలుగా లాభమును పొందగలరుగాని, లేఖనములను గూర్చిన ఎలాంటి అభిప్రాయమైనా బైబిలు బోధనల మీదగాక వైజ్ఞానిక పరిశోధన మీద ఆధారపడియుండాలి.

మరొకవైపున, ఇతర నిపుణులు మనము ఆధునిక ఇవాంజెలికల్ బైబిలు అధ్యయనములు అని పిలచు మార్గమును అనుసరించారు. బైబిలు మాత్రమే నిస్సందేహమైన విశ్వాస మరియు జీవిత నియమమైయున్నదని ఇవాంజెలికల్ పండితులు ఉద్ఘాటించారు. వారు లేఖనము మీద వాస్తవిక మరియు తార్కిక వైజ్ఞానిక విశ్లేషణను తిరస్కరించరు; బైబిలునకు వైజ్ఞానిక విశ్లేషణను తీవ్రముగా అనువర్తించుటను వారు పూర్తిగా ఆమోదిస్తారు. అయినను, అట్టి విశ్లేషణ బైబిలు బోధలను స్పష్టముగా వ్యతిరేకించినప్పుడు, ఇవాంజెలికల్ పండితులు తమ అధికారముగా లేఖనములకు హృదయపూర్వకముగా సమర్పించుకుంటారు. ఈ పాఠములన్నిటిలో మనము చూడబోవుచున్నట్లు, ఈ పాఠ్యక్రమము ఇవాంజెలికల్ మార్గమును అనుసరిస్తుంది.

ఒక క్రైస్తవునికి, ముఖ్యముగా ప్రొటెస్టెంట్ క్రైస్తవునికి లేఖన అధికారమునకు సమర్పించుకొనియుండుట చాలా ప్రాముఖ్యమైన విషయమైయున్నది... నిజమైన అధికారము సమ్మతి కలిగించు హక్కును శక్తిని కలిగియుంటుంది, మరియు క్రైస్తవుని జీవితములో అధికారముగా పని చేయుటకు లేఖనము విశేషమైన అర్హతను కలిగియున్నది. దీనికి ఒక కారణము ఏమిటంటే, మనము ఇతర మార్గముల ద్వారా పొందలేని జ్ఞానమును మరియు మెళకువను లేఖనములు కలిగియున్నాయి. ఇందువలనే దీనిని ప్రత్యక్షత అని పిలుస్తారు... మరొక కారణం ఏమిటంటే అనేక చోట్ల సత్యము ఉన్నప్పటికీ, లేఖనములో ఇమిడియున్న సత్యము దాని యొక్క కూర్పులో మరియు చివరి రూపములో ఆశ్చర్యకరమైన రీతిలో అమర్చబడింది, కాబట్టి ఈ లోకములో మనకు అందుబాటులో ఉన్న సత్యమునకు మూలములన్నిటిలో విశేషమైన నమ్మకత్వము మరియు పొరపాటులేమితనము దానిలో ఉన్నది. ఇప్పుడు దీనిలో విశేషమైన ఆధారయోగ్యత, పొరపాటులేమితనము, విఫలమగుటకు అయోగ్యత ఉండుటకు కారణము ఇది దేవుని ద్వారా ప్రేరేపించబడుట అయ్యున్నది. ఇది దేవుని వాక్యమైయున్నది, కాబట్టి మనము లేఖనముల యొక్క అధికారమును గూర్చి మాట్లాడినప్పుడు వాస్తవానికి మనము దేవుని అధికారమును గూర్చి మాట్లాడుతున్నాము. మరియు దీని పట్ల మనము సమర్పణ కలిగియుండుట సృష్టములముగా మనము సృజించబడినవారమని, ఇతరుల మీద ఆధారపడు జీవులమని గుర్తిస్తుంది. ఇక్కడ ఒక వైరుధ్యము ఉన్నది: ఈ సమర్పణ కార్యము మనలను చిన్నబుచ్చుటకు లేక మనలను బలహీనులను చేయుటకు బదులుగా, వాస్తవానికి ఇది మనము చేయదగిన అత్యంత బలపరచు కార్యమైయున్నది, ఎందుకంటే ఇది మనలను సత్య మార్గములో నడిపిస్తుంది, జీవన మరియు అభివృద్ధి మార్గములో ఇది మనలను సరియైన మార్గములో బలముగా నిలుపుతుంది.

— డా. గ్లెన్ స్కోర్గి

వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రము యొక్క బైబిలు మూలములను ప్రస్తావించి, కొన్ని చారిత్రిక ఉదాహరణలను చూశాము కాబట్టి, ఇప్పుడు మనము మూడవ విషయమును చూడవలసియున్నది: లేఖనముల పట్ల ఈ ధోరణి యొక్క ప్రాధాన్యతలు.

చాలా వరకు, ప్రపంచవ్యాప్తముగా ఉన్న ఆధునిక ఇవాంజెలికల్ బైబిలు పండితులు వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రమునకు బలమైన సమర్పణ కలిగియున్నారు. ఈ సమర్పణ సిద్ధపాటు, పరిశోధన మరియు అనువర్తన ప్రక్రియల కొరకు కొన్ని ప్రాధాన్యతలను స్థాపించింది. సిద్ధపాటు కొరకు వారి యొక్క ప్రాధాన్యతలతో ఆరంభిస్తూ, ఇది ఎలా వాస్తవమైయున్నదో చూద్దాము.

మనము ఇంతకు ముందు తెలియజేసినట్లు, మనము లేఖనమును వ్యాఖ్యానించుట ఆరంభించిన ప్రతిసారి సిద్ధపాటు అనునది అనివార్యమవుతుంది. అయితే ఇతర అధ్యయన విభాగములలో కనిపించు వివేకముతో కూడిన ప్రాధాన్యతలకు అనుగుణంగానే అధ్యయన బైబిలు వ్యాఖ్యానకర్తలు కొంతవరకు సిద్ధపాటు కొరకు ప్రాధాన్యతలను అభివృద్ధి చేశారు.

ఒక విశ్వవిద్యాలయములో మీరు జీవశాస్త్రమును అధ్యయనము చేయాలనుకుంటే, వీలైనంత మంచిగా మీరు సిద్ధపడాలని ఆశపడతారు. కాబట్టి, “నా చదువుల కొరకు నేను ఎలా సిద్ధపడాలి?” అని మీరు అనేకమంది జీవశాస్త్ర అధ్యాపకులను అడుగుతారు. వారు మీకు ఈ విధంగా జవాబివ్వవచ్చు: “వీలైనన్ని జీవశాస్త్ర వాస్తవములను బట్టీపట్టండి.” “జీవశాస్త్రములో ఉపయోగించబడు వైజ్ఞానిక విధానములన్నిటి గూర్చి వీలైనంత నేర్చుకోండి.”

ఇంచుమించు ఇదే విధముగా, నేడు అనేక ఇవాంజెలికల్ వేదాంత కళాశాలలలోని అధ్యాపకులను వారి కళాశాలలలో బైబిలును అధ్యయనం చేయుటకు ఎలా సిద్ధపడాలి అని మీరు అడిగితే, వారు కూడా ఇలాంటి సలహానే ఇస్తారు. “హెబ్రీ మరియు గ్రీకు భాషలను నేర్చుకోండి” అని వారు చెప్పవచ్చు. “బైబిలును గూర్చి వీలైనన్ని పాఠములను నేర్చుకోండి.” “మంచి వ్యాఖ్యాన విధానములను నేర్చుకోండి” అని వారు చెప్పవచ్చు. ఎందుకంటే, నేడు అనేకమంది బైబిలు పండితులు తమ సొంత జీవితములలో కూడా బైబిలును అధ్యయనము చేయుటకు తార్కిక మరియు వైజ్ఞానిక విధానములను ఉద్ఘాటిస్తారు. మరియు వారి విద్యార్థులు కూడా అలా చేయుట ద్వారా సఫలీకృతులు అవుతారని వారు నమ్ముతారు.

అవును, వాస్తవిక మరియు సిద్ధాంతపరమైన అవగాహన ద్వారా మనలను మనము సిద్ధపరచుకొనుట చాలా ప్రాముఖ్యమైయున్నది. బైబిలును గూర్చిన సత్యములను నేర్చుకొనుటకు ప్రత్యామ్నాయమేది లేదు. మరియు బైబిలు వ్యాఖ్యానమునకు అవసరమైన నియమములను నేర్చుకొనుటకు మనము తగినంత కృషిని చెయ్యాలి. అయితే మనము కాసేపట్లో చూడబోవుచున్నట్లు, జ్ఞానపూర్వక సిద్ధపాటు మీద మాత్రమే దృష్టిపెట్టుట, బైబిలు వ్యాఖ్యానము కొరకు మనలను మనము సిద్ధపరచుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విధానములను నిర్లక్ష్యం చేయుటకు కారణమవుతుంది.

సిద్ధపాటు కొరకు కొన్ని ప్రాధాన్యతలను మనము చూశాము కాబట్టి, వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రములో పరిశోధన కొరకు ఇవ్వబడిన కొన్ని ప్రాధాన్యతలను చూద్దాము.

సాధారణంగా, బైబిలు వ్యాఖ్యానకర్తలు లేఖన వ్యాఖ్యానము కొరకు రెండు విధానములకు మధ్య వ్యత్యాసమును చూపుతారు: భష్యము లేక ఎక్సిజీసిస్ మరియు స్వభాష్యము లేక ఐసిజీసిస్. ఎక్సిజీసిస్ లేక భాష్యము అను పదము “వెలికితీయుట” లేక “బయటకు తీయుట” అను అర్థమునిచ్చు గ్రీకు పదము నుండి వెలువడుతుంది మరియు వాక్యభాగము నుండి వెలికితీయుట లేక బయటకు తీయుట దీని అర్థమైయున్నది. భిన్నముగా, ఐసిజీసిస్ లేక స్వభాష్యములో “లోనికి వెళ్లుట” లేక “రుద్దుట” అను భావనలు ఉన్నాయి. అనగా వాక్యభాగమునకు సొంత అర్థమును ఇచ్చుటకు ప్రయత్నించుట అయ్యున్నది. వైజ్ఞానిక బైబిలు వ్యాఖ్యానకర్తలు స్వభాష్యమును నివారించుటకు చాలా కష్టపడతారు. బదులుగా, స్వభాష్యముగాక లేఖనము యొక్క భాష్య అవగాహనలు కలుగునట్లు చూచు విధముగా వారు వ్యాఖ్యాన నియమములను ఉపయోగిస్తారు.

ఈ అభిప్రాయము ప్రకారం, పరిశోధనలో చాలావరకు లేఖనము యొక్క సత్యములను కనుగొనుటలో మన జ్ఞానపూర్వక సిద్ధపాట్లను ఉపయోగించుట భాగమైయున్నది. అసలు వాస్తవిక అర్థమును వివేచించుట కొరకు జాగ్రత్తగా సిద్ధపరచిన వ్యాఖ్యాన పద్ధతులను లేక నియమములను నైపుణ్యముతో ఉపయోగించుట ద్వారా, మనము బైబిలు భాగముల యొక్క వాస్తవిక అర్థమును పరిశోధన చేద్దాము.

ఈ పాఠ్యక్రమము అంతటిలో మనము చూడబోవుచున్నట్లు, వైజ్ఞానిక పద్ధతులను ఈ విధంగా ఉపయోగించుట బైబిలు వ్యాఖ్యానములో ఒక కీలకమైన కోణమైయున్నది. అయితే లేఖనము యొక్క వాస్తవిక అర్థము యొక్క హితమైన పరిశోధనకు సంబంధించిన ప్రతి విషయమును ఇది తెలియజేయదు.

సిద్ధపాటు మరియు పరిశోధన ప్రక్రియలో పాండిత్య మరియు వైజ్ఞానిక వ్యాఖ్యనశాస్త్రము కొరకు కొన్ని ప్రాధాన్యతలను మనము చూశాము. ఇప్పుడు అనువర్తన ప్రక్రియను గూర్చి ప్రశ్నించుటకు మనము సిద్ధముగా ఉన్నాము. ఇవాంజెలికల్ పండితులలో ఎక్కువమంది నేడు బైబిలును ఎలా అనువర్తిస్తారు?

నేను ఒక వేదాంత విద్యార్థిగా ఉండినప్పుడు, ఒక విద్యార్ధి బోధించుచున్న అధ్యాపకులను మాటిమాటికి అభ్యంతరపరచి ప్రశ్నలను అడిగేవాడు. అతడు అడుగు ప్రశ్నలు ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండేవి. “సర్, మీరు చేస్తున్న భాష్యము నేడు మనకు ఏ విధంగా అనువర్తించబడగలదు?” “ఈ బైబిలు భాగమును గూర్చి మీరు చెబుతున్న విషయములను నేను నా జీవితమునకు ఏ విధంగా అనువర్తించగలను?” చాలా అరుదుగా మినహా, జవాబు ప్రతిసారి ఒకే విధంగా ఉండేది. అధ్యాపకుడు నవ్వి, “ఇది చాలా మంచి ప్రశ్న. కాని దీనికి జవాబు నేను ఇవ్వలేను. అభ్యాసిక వేదాంత బోధకులను అడుగు” అనేవారు.

ఈ అనుభవము ఉదహరించుచున్నట్లు, చాలాసార్లు, బైబిలు యొక్క వైజ్ఞానిక, పాండిత్య అనువాదములో లేఖనము యొక్క అభ్యాసిక అనువర్తనమునకు ఎక్కువ అవకాశము ఉండదు. అది కేవలం వాస్తవము మీద ఆధారితమైన ఆధునిక అనువర్తనములోనికి మాత్రమే నడిపించగలదు. మరొక మాటలో, అనువర్తనము ప్రధానముగా క్రీస్తు యొక్క ఆధునిక అనుచరులు నమ్మాలని బైబిలు బోధించు వాస్తవముల రకములను స్థాపిస్తుంది. బైబిలులోని వేదాంత మరియు నైతికమైన వాస్తవిక విషయములు నిజమని నమ్ముటకు మనము నమ్మకమైనవారికి పిలుపునిస్తాము. నిజం చెప్పాలంటే, ఈ విధమైన అనువర్తనము గొప్ప విలువను కలిగియున్నది. అయితే నేడు మన జీవితములకు లేఖనము అనువర్తించబడవలసిన అనేక కీలకమైన విధానములను ఇది నిర్లక్ష్యం చేస్తుంది.

బైబిలు అధ్యయన పద్ధతులు చాలా కీలకమైనవి, కాని అవి స్వయంచలితమైనవి అన్నట్లు వాటిని యాంత్రికమైనవిగా చేస్తాము కాబట్టి కొన్నిసార్లు వాటిని మనము అధికముగా ఉద్ఘాటించవచ్చు, కాబట్టి “సరే, నేను ఈ పద్ధతులను ఉపయోగించాను; నా తార్కిక పరిష్కారము ఇది,” అని చెప్పినట్లు మాత్రమే అవుతుంది, మరియు మన వ్యక్తిత్వమంతా హత్తుకొను విషయముగాక కేవలం శుద్ధమైన తార్కిక అభ్యాసము మాత్రమే అవుతుంది. నేను ఈ విషయమును సంవత్సరముల నా అనుభవములో నుండి నేర్చుకున్నాను... ఉదాహరణకు, సాంస్కృతిక నేపథ్యము, లోకము, ప్రాచీన లోకము మీద నేను నా పరిశోధనలలో విశేషమైన ఉద్ఘాటనను పెట్టాను, ఎందుకంటే ఇది చాలా అవసరమైయున్నది. చాలామందికి అది అందుబాటులో లేదు, కాబట్టి ఒక పండితునిగా నేను దానిని చేయగలిగాను. మరియు నేను అలా చేయుచుండగా, బైబిలు భాగములను నేను అధ్యయనము చేయుచున్నప్పుడు అవి నాకు క్రొత్త ప్రపంచములను గూర్చి అవగాహన కలిగిస్తాయని నేను కనుగొన్నాను. అదే సమయములో, నేపథ్యములో ఆత్మీయ జీవితము దానంతట అదే ఉండదు. నేను దానిలో జ్ఞానపూర్వకమైన ఆనందమును సాధించాను, కాని నిజమైన ఆత్మీయ జీవితము బైబిలు భాగములోను, దానిని చదువుతూ దేవుడు చెప్పు మాటలను వినుటలోను, మన జీవితములను దానికి సమర్పించుకొనుటలోను ఉన్నది, మరియు అది ఒక యాంత్రిక విధానము మాత్రమే కానేరదు. అది మనలను ప్రేమించి, మన కొరకు తననుతాను అర్పించుకొనినవానికి సమర్పించుకొనుట ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

— డా. క్రైగ్ ఎస్. కీనర్

ఇప్పటి వరకు మనము బైబిలు వ్యాఖ్యానశాస్త్రములో ఉపయోగించు కొన్ని ప్రాముఖ్యమైన పదములను, మరియు వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రము యొక్క సుదీర్ఘమైన పరంపరను చూశాము కాబట్టి, ఇప్పుడు మన పాఠములోని మూడవ ప్రధానమైన అంశమును మనము చూద్దాము, అది వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రము, లేఖనములను వ్యాఖ్యానించుచుండగా దేవునికి దగ్గరవ్వవలసిన అవసరతను ఉద్ఘాటించు క్రైస్తవ సంప్రదాయమైన భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రముతో ముడిపడవలసియుండిన విధానమును చూద్దాము.

మానవులు లేఖనములను వ్రాశారు కాబట్టి క్రీస్తు అనుచరులు సాధారణ వ్యాఖ్యనశాస్త్రములోని అనేక కోణములను ప్రతిబింబించు వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రమును ఉపయోగించారు. అయితే భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము ప్రధానముగా లేఖనము యొక్క దైవిక అధికారము మీద దృష్టిపెడుతుంది.

లేఖనములో మానవులు వ్రాసిన మాటలు కూడా దేవుని వాక్యమైయున్నాయని క్రైస్తవులు ఎల్లప్పుడూ గుర్తించారు. లేఖనములు దేవుని ద్వారా ప్రేరేపించబడినవి అని, లేక అక్షరాల “దైవావేశము” గలవైయున్నాయని 2 తిమోతి 3:16 మనకు తెలియజేస్తుంది. ఈ సత్యము బైబిలు వ్యాఖ్యానశాస్త్రమును సాధారణ వ్యాఖ్యానశాస్త్రములోని ఇతర కోణముల నుండి భిన్నమైనదిగా చేస్తుంది ఎందుకంటే మనము లేఖనములను, స్వయంగా దేవుని యొక్క సజీవమైన వాక్యము అన్నట్లు భక్తిపూర్వకముగా వ్యాఖ్యానించాలి.

మనము లేఖనమును వ్యాఖ్యానించుచుండగ మనము కేవలం మానవ రచయితల మాటలను మాత్రమే చదువుటలేదని, త్రిత్వములో మూడవ పురుషమూర్తి అయిన పరిశుద్ధాత్మ దేవుడు మానవ రచయితల యొక్క విభిన్నమైన వ్యక్తిత్వముల ద్వారా, శైలుల ద్వారా, అనుభవముల ద్వారా వీటిని ప్రేరేపించాడు అని గుర్తుంచుకొనుట చాలా ప్రాముఖ్యమైయున్నది. మనము లేఖనమును ఆశ్రయించినప్పుడు, ఈ మాటలను ప్రేరేపించిన ఆత్మ విశ్వాసులలో నివసిస్తూ కార్యము చేయుచున్నాడు కాబట్టి, ఒక విధంగా మనకు లేఖనము యొక్క రచయిత యొద్దకు వెళ్లు అనుమతి ఉన్నది. మరియు ఇది మనకు ఎంతో అవసరమైయున్నది; మనము లేఖనమును ఆశ్రయించుచుండగా మన మనస్సులను తెరచునట్లు మరియు మన మనస్సులు లేఖనముల కొరకు తెరవబడునట్లు ప్రార్థనాపూర్వకముగా ఆత్మ మీద ఆధారపడవలసిన అవసరము ఉన్నది.

— డా. డెన్నిస్ ఈ. జాన్సన్

దీని అర్థము ఏమిటో చూచుటకు, మన మునుపటి సంభాషణను పోలిన విధానములలో మనము భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రమును చూద్దాము. మొదటిగా, ఇట్టి బైబిలు వ్యాఖ్యానమునకు బైబిలు మూలములు ఉన్నాయని మనము చూద్దాము. రెండవదిగా, భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రమును అభ్యసించిన బైబిలు పండితులను గూర్చి కొన్ని చారిత్రిక ఉదాహరణలను చూద్దాము. మూడవదిగా, లేఖనము పట్ల ఈ ధోరణిని అనుసరించుట వ్యాఖ్యాన ప్రక్రియలను గూర్చి మనము కలిగియున్న ప్రాధాన్యతలను రూపుదిద్దు విధానమును మనము చూద్దాము. ముందుగా భక్తిసంబంధమైన వ్యాఖ్యనశాస్త్రము యొక్క బైబిలు మూలములను చూద్దాము.

బైబిలు రచయితలు చాలావరకు లేఖనములను వైజ్ఞానిక విధానములలో పరీక్షించినప్పటికీ, వారు లేఖనములను భక్తితో కూడా ఆశ్రయించారు అను విషయమును చూచుట చాలా ప్రాముఖ్యమైయున్నది. క్రీస్తు అనుచరులు లేఖనములను దేవుని వాక్యముగా, దేవుని సన్నిధిలో, దేవునితో అసాధారణమైన, మరియు ఆశ్చర్యకరమైన అనుభవములు కలుగు విధంగా చదవాలని వారు పదే పదే సూచించారు.

వ్యాఖ్యానము యొక్క ఈ కోణమును బైబిలు రచయితలు అనేకసార్లు ఎత్తిచూపారుగాని, ప్రస్తుతానికి మనము ఒక ఉదాహరణను మాత్రమే ప్రస్తావిద్దాము. హెబ్రీ. 4:12లో మనము ఇలా చదువుతాము:

ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది (హెబ్రీ. 4:12).

ఈ వాక్యభాగములో, హెబ్రీ పత్రిక రచయిత ఇంతకు ముందు వచనములలో ఉపయోగించిన 95వ కీర్తనలోని ఒక భాగమును సంబోధిస్తూ, దానిని “దేవుని వాక్యము” అని పిలచాడు. ఇంతకు ముందు హెబ్రీ. 4:7లో ఇదే కీర్తనను ఉద్ధరణముగా ఉపయోగిస్తూ దేవుడు స్వయంగా “దావీదు ద్వారా మాట్లాడాడు” అని అతడు తెలిపాడు. మరియు దీనికి ముందు, హెబ్రీ. 3:7లో, అతడు 95వ కీర్తనను “పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు” అను మాటలతో పరిచయం చేశాడు.

ఇప్పుడు, ఈ కీర్తన యొక్క దైవిక కర్తృత్వమును పరిచయం చేసిన తరువాత, హెబ్రీ పత్రిక రచయిత లేఖనమును అధ్యయనము చేయు అనుభవమును వర్ణించిన విధానమును గమనించండి. స్వయంగా లేఖనము “సజీవమై బలముగలదై”యున్నదని అతడు సెలవిచ్చాడు. అది “రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.” వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రములో మనము బైబిలును విభజించి, విశ్లేషించు ఒక వస్తువుగా చూస్తాము. అయితే ఈ వాక్యభాగములో, వాస్తవానికి లేఖనము మనలను విభజించి శోధించుచున్నది అని హెబ్రీ పత్రిక రచయిత సూచించుచున్నాడు.

హెబ్రీ పత్రిక రచయిత ఒక సంక్లిష్టమైన బైబిలు పండితుడు గనుక ఈ వాక్యభాగము మన సంభాషణ కొరకు మరింత ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. అతడు చాలాసార్లు, పాత నిబంధన లేఖనములను క్రొత్త నిబంధన యొక్క ఇతర రచయితల కంటే లోతైన మెళకువతో ఉపయోగించాడు. అయినను, అతడు లేఖనములను గొప్ప జ్ఞానముతో విశ్లేషించిన విధానము అతనిని భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము నుండి దూరము చేయలేదు. భిన్నముగా, అతని జ్ఞానపూర్వకమైన వ్యాఖ్యానములు భావనాత్మకమైన, ప్రోత్సాహకరమైన మరియు లోతైన పరివర్తన కలిగించు విధానములలో దేవునిని ఎదుర్కొనునట్లు లేఖనములను ఆశ్రయించుటకు అతని సామర్థ్యమును బలపరచాయి. ఈ విధంగా, వైజ్ఞానిక మరియు భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము కలిసి పని చేయాలని అతడు మనకు చూపాడు.

భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము యొక్క బైబిలు మూలములను చూశాము కాబట్టి, క్రీస్తు అనుచరులు వ్యాఖ్యానము కొరకు వైజ్ఞానిక మరియు భక్తిసంబంధమైన ధోరణులను కలిపి ఉపయోగించారు అని తెలుపు కొన్ని చారిత్రిక ఉదాహరణలను మనము ప్రస్తావించాలి.

బైబిలు యొక్క భక్తిసంబంధమైన వ్యాఖ్యానము సంఘ పితరులు నివసించిన సంఘ చరిత్ర కాలములో ప్రాముఖ్యమైనదిగా ఉండేది. అలేగ్జేంద్రియకు చెందిన ఓరిగన్ వివేకముగల, వైజ్ఞానిక బైబిలు పండితుడు అని మనము ఇంతకు ముందు ప్రస్తావించాము. అయినను, లెటర్ ఆఫ్ ఓరిగన్ టు గ్రెగరీలో అతడు నియోకైసరియాకు చెందిన గ్రెగరీని ప్రోత్సహించిన విధానమును వినండి:

నిన్ను నీవు దైవికమైన అధ్యయనమునకు సమర్పించుకొని, యథార్థతతో దేవుని మీద కన్నులుంచి ఆయనను వెదకుతూ, అనేకమందికి మరుగుచేయబడిన దైవిక మాటల యొక్క అర్థమును వెదకుము. కేవలం తట్టుట మరియు వెదకుటతో ఆగిపోవద్దు, ఎందుకంటే దైవికమైన మాటలను అర్థముచేసుకొనుటకు ప్రార్థించుట ఎంతో అవసరమైన విషయమైయున్నది.

ఇక్కడ, “దైవికమైన అధ్యయనమునకు తననుతాను సమర్పించుకోమని” ఓరిగన్ గ్రెగరీకి తెలిపాడు. “దైవికమైన అధ్యయనము” అను మాట తరువాత ల్యాటిన్ పదమైన లెక్టియో డివినలో వ్యక్తపరచబడింది, ఇది నేడు కూడా అనేక విధములుగా కొనసాగు భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్ర పరంపర అయ్యున్నది.

ఇప్పుడు, లేఖనము పట్ల ఓరిగన్ యొక్క ధోరణి నియో-ప్లాటోవాదము ద్వారా, ముఖ్యముగా అది ఇంతకు ముందు యూదుల పాత నిబంధన వ్యాఖ్యానకర్తయైన అలేగ్జేంద్రియకు చెందిన ఫిలో యొక్క రచనలలో వ్యక్తపరచబడిన విధానము ద్వారా ప్రభావితమైయ్యింది. ఈ దృష్టికోణములో, బైబిలు మాటలలో “అనేకమందికి మరుగుచేయబడిన” పరలోక, ఆత్మీయ సత్యములు ఉన్నాయి. విశ్వాసులు బైబిలులో మరుగుచేయబడిన సత్యములను కనుగొనగోరితే, వారికి “దేవుని మీద స్థిరముగా నాటబడిన విశ్వాసము” అవసరమైయున్నది. అనగా, వారు “[బైబిలు] యొక్క అర్థమును దైవికమైన మాటల వలె వెదకాలి.” కాబట్టి, బైబిలు వ్యాఖ్యానకర్తలు దేవుని యొద్ద నుండి వ్యక్తిగత జ్ఞానమును పొందుకొనుటకు “తట్టుట మరియు వెదకుట వద్ద మాత్రమే ఆగిపోకూడదు.” వాస్తవానికి, ఓరిగన్ మాటల ప్రకారం, “లేఖనమును అర్థము చేసుకొనుటకు “దేవుని మాటలను అర్థము చేసుకోవాలని ప్రార్థన చేయుట ఎంతో అవసరమైయున్నది.” ఈ విషయముల పట్ల ఓరిగన్ కలిగియున్న నియోప్లాటోవాద ధోరణిని మనము తిరస్కరించాలిగాని, అతడు లేఖనములకు సంబంధించిన ఒక వాస్తవమును మాత్రము గుర్తించాడు. నమ్మకమైనవారు లేఖనమును అధ్యయనము చేయుచుండగా ప్రార్థనాపూర్వకముగా విచారణ చేసినప్పుడు, దేవుడు వారికి మరుగుచేయబడియున్న మెళకువలను అనుగ్రహిస్తాడు.

మీరు బైబిలును చదివినప్పుడు, మీరు ఆత్మీయ అర్థమును తెలుసుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయమైయున్నదని ఓరిగన్ వంటివారు ఉద్ఘాటించారు. ఇప్పుడు ఇది చాలా ఆరోగ్యకరమైన విషయమని నేను చెప్పగోరుచున్నాను, ఎందుకంటే బైబిలు కేవలం ఒక చారిత్రిక పుస్తకము మాత్రమే కాదు, అది మన వేదాంతశాస్త్ర ఊహలను రేపు ఒక అధ్యయన పాఠ్యపుస్తకము మాత్రమే కాదు. దానిలో ఒక ఆత్మీయ ప్రాధాన్యత ఉన్నది ... వాస్తవానికి, ఈ రెండు కలిసి ఉంటాయని మనము నమ్ముతాము, అనగా బైబిలు పదముల యొక్క అర్థమును గ్రహించు మన సామర్థ్యమును బలపరచుకొనుటకు, అనగా ఆ వాక్యభాగము యొక్క నేపథ్యమును, చారిత్రిక వివరములను మొదలగువాటిని తెలుసుకొనుటకు మనము ప్రయత్నించుచుండగా, ఆ వాక్యభాగము యొక్క మొదటి పాఠకుల కొరకు, మరియు తరువాత మన కొరకు కూడా దాని యొక్క అర్థమును గ్రహించు ఆత్మీయ మెళకువను మనము పొందుకుంటాము.

— డా. సైమన్ విబర్ట్

మధ్యయుగము అంతటా, ప్రాముఖ్యమైన వైజ్ఞానిక వ్యాఖ్యానకర్తలైన అగస్టిన్ మరియు అక్వినాస్ తో సహా లేఖనము యొక్క ప్రతి ప్రాముఖ్యమైన వ్యాఖ్యానకర్త కొంత వరకు దైవిక అధ్యయనము లేక లెక్టియో డివినను అభ్యసించారు.

చాలా వరకు, లెక్టియో డివినను నాలుగు సుపరిచితమైన అడుగులు లేక మార్గములలో అభ్యసించవచ్చు: లెక్టియో, అనగా లేఖన అధ్యయనము; మెడిటషియో, అనగా అధ్యయనము చేసినదానిలోని విషయములను మౌనముగా ధ్యానించుట; ఒరేషియో, జ్ఞానోదయమును కలిగించమని దేవునికి నిజాయితీగా ప్రార్థన చేయుట; మరియు కాన్టెంప్ప్లేషియో, లేఖన భాగము యొక్క ప్రాముఖ్యతను గూర్చి ఉన్నతమైన జ్ఞానముగల, లోతైన భావనాత్మక మరియు పరివర్తనచెందు నిశ్చయతలను దేవుని ఆత్మ అనుగ్రహించునట్లు మౌనముగా వేచిచూచుట.

సంస్కరణ సమయము నాటికి, సమస్త విధములైన అబద్ధ బోధలను సమర్థించుటకు రోమా సంఘము లెక్టియో డివిన పద్ధతిని ఉపయోగించింది. వారి బోధనలు దేవుని యొద్ద నుండి కలిగిన ఆశ్చర్యకరమైన మెళకువలలో నుండి పుట్టాయని సంఘ అధికారులు దావా చేశారు, కాని ఈ “మెళకువలు” లేఖనముల యొక్క బోధనలకు కొన్ని ప్రాముఖ్యమైన రీతులలో వైరుధ్యమును చూపాయి. దీనికి స్పందనగా, అనేకమంది ప్రొటెస్టెంట్ పండితులు వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రమునకు ఎక్కువ విలువనిచ్చారు. అయితే బైబిలును భక్తిపరముగా చదువుటను వారు విడచిపెట్టలేదు. భిన్నముగా, భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము లేఖనము యొక్క హితమైన భాష్య విశ్లేషణతో ముడిపడియుండాలని వారు ఉద్ఘాటించారు.

ప్రొటెస్టెంట్ బైబిలు పాండిత్యములోని ఈ లక్షణమును ఎక్కువమంది గుర్తించలేదు, కాబట్టి రెండు సుపరిచితమైన ఉదాహరణలను ప్రస్తావించుట సహాయకరముగా ఉంటుంది: జాన్ కెల్విన్ మరియు జోనాథన్ ఎడ్వర్డ్స్.

జాన్ కెల్విన్ ను ఆరంభ సంస్కరణలో అత్యంత తార్కికమైన మరియు జ్ఞానపూర్వకమైన బైబిలు వ్యాఖ్యానకర్త అని సరిగానే పిలచారు. ఒక న్యాయవాధిగా మరియు పునరుజ్జీవనోద్యములోని మానవతావాధిగా అతడు పొందిన తర్ఫీదు అతనిని ఈ భూమిక కొరకు సిద్ధపరచింది. అయితే తాను వ్రాసిన వ్యాఖ్యానములన్నిటిలో, అతడు కేవలం వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రమును మాత్రమేగాక, భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రమును కూడా ఎంతో రోషముతో అనుసరించాడు అని మనము కనుగొంటాము.

ఒక ఉదాహరణగా, తాను వ్రాసిన కామెంటరీ ఆన్ హగ్గై, 2వ భాగములో అతడు ఇలా వ్రాశాడు:

దేవుని మహిమ తన వాక్యములో ఎంతగా ప్రకాశిస్తుంది అంటే, దాని ద్వారా ఆయన మనకు చేరువగా, ముఖాముఖిగా ఉన్నట్లు భావించాలి.

లేఖన అనువాదమును మనతో సంబంధము లేని, అవ్యక్తిగతమైన వైజ్ఞానిక కార్యముగా పరిగణించక, “తన వాక్యములో దేవుని మహిమ ఎంతగా ప్రకాశిస్తుంది అంటే” మనము లేఖనములను చదివినప్పుడు మనము దేవునితో స్వయంగా “ముఖాముఖి”గా ఉన్నట్లుగా “ప్రభావితము చేయబడతాము” అని కెల్విన్ నొక్కి చెప్పాడు. ఈ వాక్యభాగము సూచించుచునట్లు, లేఖనమును దేవుని సన్నిధి యొక్క ఆవరించు, బహు భావనాత్మకమైన మరియు నమ్రపరచు అనుభవముగా చదవాలని కెల్విన్ తన అనుచరులను కోరాడు.

ఇంచుమించు ఇదే విధముగా, 1703 నుండి 1758 మధ్య కాలములో నివసించిన ఆదిమ అమెరికా వేదాంతవేత్తయైన జోనాథన్ ఎడ్వర్డ్స్, తరచుగా తన లేఖనముల యొక్క తార్కికమైన మరియు జ్ఞానపూరితమైన విశ్లేషణను కనుపరచాడు. అయితే పర్సనల్ నెరేటివ్ అను తన వ్యాసములో అతడు వ్రాసిన ఈ మాటలను వినండి:

[1 తిమోతిలోని] మాటలను నేను చదువుచుండగా, ఒక దైవికమైన జీవి యొక్క మహిమ నా ప్రాణములో కలిగింది; నేను ఇంతకు ముందు ఎన్నడు అనుభవించని ఒక క్రొత్త భావన నాలో కలిగింది. ఈ మాటల వలె లేఖనములో ఏ మాటలు ఎన్నడు నాకు అనిపించలేదు. నేను నిత్యము ఆ దేవుని ఆస్వాదించగలిగితే అది ఎంత బాగుంటుందో, మరియు నేను ఎంత ఆనందముగా ఉంటానో అని నాలో నేను అనుకున్నాను.

ఇక్కడ ఎడ్వర్డ్స్ లేఖనమును అధ్యయనం చేయుచుండగా “దైవికమైన జీవి యొక్క మహిమను గూర్చిన భావన” అతనిని ఆనందపరచింది అని అన్నాడు. ఈ దేవుని ఆత్మ అనుభవము ఎంత బలమైనది అంటే, ఎడ్వర్డ్స్ “నిత్యము ఆ దేవుని ఆస్వాదించగోరాడు!” ఎడ్వర్డ్స్ జ్ఞానోదయ తర్కవాదముతో బహుగా ప్రభావితమైయ్యాడు, మరియు బైబిలు వ్యాఖ్యానము లోతైన వైజ్ఞానిక విధానమును అనుసరించాలని అతడు సరిగానే నమ్మాడు. అయితే బైబిలు యొక్క తార్కిక విశ్లేషణతో మాత్రమే ఎడ్వర్డ్స్ కూడా సంతృప్తిపొందలేదు. అద్భుతమైన దేవుని సన్నిధిని గూర్చి లోతైన భావన కలిగియుండి లేఖనమును అధ్యయనము చేయాలని అతనికి తెలుసు.

మన దినమందు, వ్యాఖ్యానశాస్త్రము పట్ల భక్తిసంబంధమైన ధోరణులు పాండిత్య బైబిలు వ్యాఖ్యానము నుండి కనుమరుగైపోయాయి. రోమన్ కాథలిక్ వ్యాఖ్యానకర్తల యొక్క తంత్రములకు స్పందనగా ఆదిమ ప్రొటెస్టెంట్లు వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రము వైపుకు మొగ్గుచూపినప్పటికీ, నేడు అనేకమంది బైబిలు పండితులు భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రమును తమ జ్ఞాన శక్తికి తగినది కానిదిగా పరిగణిస్తారు. వారు తమ పాండిత్య ధ్యాసనంతటిని జాగ్రత్తతో కూడిన తార్కిక భాష్యము మీద పెడతారు, మరియు బైబిలులో మనకు కావలసినదంతటని ఈ ధోరణి అందిస్తుంది అనట్లు భావిస్తారు. తీవ్రమైన ప్రార్థనలు, ఉపవాసము మరియు ఆలోచనల ద్వారా దేవుని జ్ఞానమును వెదకుట ఇవాంజెలికల్ పాండిత్యము నుండి అంతరించిపోయింది. అయితే అధికారిక, అధ్యయన వ్యాఖ్యానశాస్త్రమును మనము ఆశ్రయించునప్పుడు మనము వైజ్ఞానిక మరియు భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రములను ఉపయోగించుట చాలా కీలకమైయున్నది. మనము తీవ్రతలను ఉపయోగించకుండా జాగ్రత్తపడాలి, కాని మునుపు ప్రొటెస్టెంట్ వ్యాఖ్యానకర్తలు అనేకమంది దీనిని సరియైన రీతిలో ఉపయోగించారు, మరియు వారి మాదిరిని అనుసరించుట మనకు సహాయకరముగా ఉంటుంది.

భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము యొక్క బైబిలు మూలములు మరియు బైబిలు వ్యాఖ్యానమునకు వైజ్ఞానిక మరియు భక్తిసంబంధమైన ధోరణులను కలిపి ఉపయోగించిన కొందరు వేదాంతవేత్తల యొక్క చారిత్రిక ఉదాహరణలను చూశాము కాబట్టి, ఇప్పుడు ఇట్టి వ్యాఖ్యానశాస్త్రము యొక్క ప్రాధాన్యతలను క్లుప్తంగా చూద్దాము.

క్రీస్తు అనుచరులలో అనేకమంది లేఖనములను భక్తిగల ఆత్మతో చదువుట ఆరంభిస్తారు. అయితే వారు పాండిత్య బైబిలు వ్యాఖ్యానమును నేర్చుకున్న తరువాత, చాలసార్లు భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము యొక్క ప్రాముఖ్యతను కనుగొనుటలో విఫలమవుతారు. కాని బైబిలు యొక్క వైజ్ఞానిక వ్యాఖ్యానము చాలాసార్లు ఎంతో జ్ఞానసంబంధమైనదిగాను, విశ్లేషణపూర్వకమైనదిగాను ఉంటుంది కాబట్టి, ఒకప్పుడు క్రీస్తుతో మన జీవితమునకు కీలకమైన ఒక విషయమును మనము మరచిపోతాము — అది ఆయన వాక్యము ద్వారా దేవుని యొక్క వ్యక్తిగత మరియు బలమైన పరివర్తన కలిగించు అనుభవము. ఈ కారణము చేత, ఈ మూడు వ్యాఖ్యానశాస్ర్త ప్రక్రియలను మనము అనుసరించుచుండగా లేఖనముల పట్ల భక్తిసంబంధమైన ధోరణి మనముందున్న ప్రాధాన్యతలను ఎలా సరిదిద్దాలో మనము చూడవలసియున్నది.

వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్ర ప్రాధాన్యతలను చూసిన విధముగానే మనము భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్ర ప్రాధాన్యతలను పరీక్షిద్దాము. మొదటిగా, సిద్ధపాటు కొరకు ప్రాధాన్యతలను మనము నిర్థారిద్దాము. తరువాత, భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రములో పరిశోధన ప్రక్రియ మీద దృష్టిపెడదాము. మరియు చివరిగా, ఇట్టి వ్యాఖ్యానశాస్త్రము యొక్క ఆధునిక అనువర్తనమును గూర్చి ఆలోచన చేద్దాము. సిద్ధపాటు కొరకు ప్రాధ్యానతలతో ఆరంభిద్దాము.

విచారకరముగా, మనము లేఖనమును అధ్యయనము చేయునప్పుడు దేవుని విశేషమైన సన్నిధి యొక్క అనుభవము మీద మనకు ఎలాంటి నియంత్రణ ఉండదు అని నిజాయితీగల క్రీస్తు అనుచరులలో అనేకమంది నమ్ముతారు. అది కలుగవచ్చు లేక కలుగకపోవచ్చు. మరియు దాని కొరకు మనలను మనము సిద్ధపరచుకొనుట అసాధ్యము. అయితే యాకోబు 4:8లో యాకోబు ఈ పొరపాటు ఆలోచనను గూర్చి మాట్లాడిన విధానమును వినండి:

దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును (యాకోబు 4:8).

“దేవునియొద్దకు రండి” అను వ్యక్తీకరణము పాత నిబంధనలో నుండి వెలువడుతుంది. నమ్మకమైన ఆరాధికులు మందిరములో మరియు దేవాలయములో దేవుని యొక్క విశేషమైన సన్నిధిలోనికి ప్రవేశిస్తారు. అవును, దేవుడు ప్రతి చోట ఉన్నాడు మరియు ఆయన కోరినప్పుడెల్లా విశేషమైన రీతులలో తనను తాను బయలుపరచకొనగలడు. అయితే యాకోబు యొక్క మాటలు మానవ బాధ్యత మీద బైబిలు పెట్టు ఉద్ఘాటనను ప్రతిబింబిస్తాయి. మనము దేవుని యొక్క విశేషమైన సన్నిధిని అనుభవించాలని కోరితే, మనము ఆయన యొద్దకు వెళ్లవలసియున్నది. మరియు మన యొద్దకు వచ్చుట ద్వారా దేవుడు బదులిస్తాడు.

సాధారణమైన మాటలలో, భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము కొరకు సిద్ధపడుటలో పవిత్రపరచబడుట లేక దేవునికి పరిశుద్ధముగా సమర్పించుకొనుట ఇమిడియున్నవి. లేఖనములు బోధించుచున్నట్లు, దేవునితో సంభాషణలో ఆటంకము కలిగించు ప్రతిదానిని విడచి, దానిని బలపరచు ప్రతిదానిని మనము హత్తుకోవాలి. ఇట్టి సిద్ధపాటులో అనేక విషయములు ఉన్నాయని, వాటన్నిటిని ఇక్కడ చెప్పుట సాధ్యపడదని మనము చెప్పనవసరం లేదు, కాని మూడు సాధారణ విభాగములను గూర్చి మాట్లాడుతూ వాటి యొక్క వైశాల్యమును గూర్చి తెలుసుకొనుట సహాయకరముగా ఉంటుంది: ఊహాత్మక, ప్రవర్తనాత్మక మరియు భావనాత్మక సిద్ధపాట్లు.

మొదటిగా, ఊహాత్మక సిద్ధపాటు ద్వారా మనము లేఖనములో దేవుని సన్నిధి కొరకు సిద్ధపడతాము. అనగా మన నమ్మకములను దేవుని సత్య వాక్యమునకు అనుగుణంగా మలచుకొనుటకు ఉత్తమమైన కృషిని చేస్తాము. దేవునిని గూర్చిన అబద్ధపు ఊహలను నమ్ముట వలన, మానవ జాతి మరియు లోకము దేవునితో సహవాసమునకు ఆటంకములను కలిగిస్తుంది. మనము ఇంతకుముందు చూసినట్లు, బైబిలు పండితులు తమ అధ్యయన ఉద్ఘాటనలకు సరిపడు కొన్ని సంకుచితమైన ఊహల మీద దృష్టిపెడుతుంటారు. అయితే దేవుని ఆత్మ ద్వారా పవిత్రపరచబడుట మన ఆలోచనలను దేవుని మనస్సునకు అనుగుణంగా మలచుకొను వాంఛను కలిగిస్తాయి, మరియు మనము లేఖనములను వ్యాఖ్యానించుచుండగా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించునట్లు ఈ ఆశ మనలను సిద్ధపరుస్తుంది.

రెండవదిగా, ప్రవర్తనాత్మక సిద్ధపాటు ద్వారా లేఖనములను చదివినప్పుడు కూడా మనము దేవుని యొద్దకు ఆకర్షించబడతాము. లేఖనములలో, దేవుని చిత్తమునకు విరోధముగా ఉన్న కార్యములను చేయుట దేవుని యొక్క అనుగ్రహముతో కూడిన సన్నిధిని అనుభవించుటకు బలమైన ఆటంకములను కలిగిస్తుంది. భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము కొరకు సిద్ధపాటులో మన వైఫల్యములను బట్టి పశ్చాత్తాపము మరియు దేవునికి ఇష్టమైన మార్గములలో ప్రవర్తించుటకు నిజాయితీగల వాంఛ అవసరమైయున్నవి.

మూడవదిగా, భావనాత్మక సిద్ధపాటు ద్వారా మనము దేవుని యొద్దకు వెళ్లుటకు సిద్ధపడాలి. భావనాత్మక సిద్ధపాటులో మన వైఖరులు అన్ని భాగమైయున్నాయి — గతించుపోవు ఆశలు మొదలు దేవునిని గూర్చి, మానవులను గూర్చి మరియు మిగిలిన సృష్టిని గూర్చి మనము కలిగియున్న నిలిచియుండు భావనలు. లేఖనములు తరచుగా గర్వము, ద్వేషము మరియు హృదయ కాఠిన్యమునకు విరోధముగా హెచ్చరిస్తాయి. ఇవి మరియు ఇతర భావనలు దేవుని విశేషమైన సన్నిధిలోనికి ప్రవేశించుటకు ఆటంకములుగా ఉన్నాయి. అయితే నమ్రత, ప్రేమ, హృదయ మృదుత్వము వంటివి దేవునితో సహవాసము చేయుటకు మార్గమును తెరుస్తాయి. ఈ కారణం చేత, భక్తిసంబంధమైన వ్యాఖ్యనశాస్త్రము కొరకు సిద్ధపాటు మన ఊహలు మరియు ప్రవర్తనలను మాత్రమే ఉద్దేశించకూడదుగాని, మన భావనలన్నిటిని కూడా ఉద్దేశించాలి.

బైబిలును జ్ఞానముతోను, నమ్మకముగాను అనువదించుట కేవలం మనస్సునకు సంబంధించిన విషయము మాత్రమే కాదు. అది హృదయమునకు మరియు వ్యక్తిత్వమంతటికి సంబంధించినదైయున్నది. దీని అర్థము ఏమిటంటే — నా ఆలోచన ప్రకారం ఇది దేవుని వాక్యమును వ్యాఖ్యానించి తరువాత బోధించు బాధ్యత గల ప్రతిఒక్కరికి ఒక సవాలుగా ఉన్నది — అనగా మన హృదయ స్థితి, మరియు క్రీస్తుతో మన అనుబంధము, బైబిలును గూర్చిన మన అవగాహన యొక్క కార్యసాధకము మీద ప్రభావము చూపుతాయి. అందువలనే మన పాపములను ఒప్పుకొను విషయములో నమ్మకముగా ఉండుట, అనుదినము సువార్తను హత్తుకొనియుండుట చాలా ప్రాముఖ్యమైన విషయమైయున్నది. మరియు ఆత్మీయముగా మనము దారితప్పుట ఆరంభించినప్పుడు, విశేషముగా మన జీవితములోని పలు విభాగములలో పాపములో దారితప్పిపోయినప్పుడు, అది చాలా ప్రతికూలమైన ప్రభావమును చూపుతుంది. దేవుని వాక్యమును నిజముగా అర్థము చేసుకొనుటకు మనము కలిగియున్న సామర్థ్యము మీద కూడా ఇది ప్రతికూల ప్రభావమును చూపుతుంది అని నా ఆలోచన. మరియు అది చేయగల మరియొక పని ఏమిటంటే, లేఖనములో మన కొరకు ఇవ్వబడిన బలమైన ఆజ్ఞలను విడచునట్లు అది మనలను పురికొల్పుతుంది మరియు ఆ ఆజ్ఞల నుండి తప్పించుకొనుటకు మనము ప్రయత్నించుచున్నాము కాబట్టి, వాటిని మనము నిజాయితీగా హత్తుకొనియుండలేము. ఇది చాలా ప్రాముఖ్యమైయున్నది — నమ్మకమైన బైబిలు వ్యాఖ్యానము కొరకు మన హృదయము యొక్క పరిస్థితి చాలా ప్రాముఖ్యమైయున్నది.

— డా. ఫిలిప్ రైకెన్

సిద్ధపాటు కొరకు ఈ ప్రాధాన్యతలను మనస్సులో ఉంచుకొని, ఇప్పుడు రెండవ వ్యాఖ్యానశాస్త్ర ప్రక్రియ వైపుకు మనము తిరగవలసియున్నది, అది భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రములో వాస్తవిక అర్థము యొక్క పరిశోధన.

భక్తి సంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము మనలను దేవునికి దగ్గరగా నడిపించు విధముగా లేఖనము యొక్క వాస్తవిక అర్థమును పరిశోధించునట్లు మనకు సహాయము చేస్తుంది. భక్తిసంబంధమైన పరిశోధనలో, దేవుని సమీపత్వమును బైబిలు రచయితలు అనుభవించిన విధానములకు మరియు వారు తమ వాస్తవిక శ్రోతలను దేవునికి దగ్గరగా నడిపించవలసియుండిన విధానములకు అనుగుణంగా వాస్తవిక అర్థమును మనము చూస్తాము. ఇలా చేయుటకు అనేక మార్గములు ఉన్నాయి, అయితే సులువుగా ఉండుట కొరకు, మరొకసారి మనము పరిశోధన యొక్క ఊహాత్మక, ప్రవర్తనాత్మక మరియు భావనాత్మక కోణముల దృష్ట్యా ఆలోచన చేద్దాము.

మొదటిగా, భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రములో ఊహాత్మక పరిశోధన అవసరమైయున్నది — అనగా దేవుడు మరియు ఆయన ద్వారా ప్రేరేపించబడిన రచయితలు తమ వాస్తవిక శ్రోతలకు తెలియజేయాలని ఉద్దేశించిన ఆలోచనల మీద దృష్టి పెట్టుట. మనము ఇంతకు ముందు చూసినట్లు, భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము లేఖనములోని సత్యములతో దగ్గరగా ముడిపడియుండాలి, తద్వారా అది తప్పిదములలోనికి లేక అబద్ధపు ఊహలలోనికి ప్రవేశించదు. ఈ కార్యము కొరకు వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రము చక్కగా రూపుదిద్దబడినది అని మనము ఇంతకు ముందే గుర్తించాము. అయితే భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రములో వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రములో గుర్తించబడని కొన్ని సాధారణ ఊహాత్మక ప్రశ్నలను అడుగుతాము. ఈ వాక్యభాగము రచయిత దేవుని అనుభవించిన విధానమును ఏ విధంగా బయలుపరుస్తుంది? తన శ్రోతలు దేవునితో సమీపత్వమును ఎలా అనుభవించాలో రచయిత ఉద్దేశించిన విధానమును ఇది ఎలా సూచిస్తుంది?

రెండవదిగా, భక్తిసంబంధమైన పరిశోధన లేఖన వాస్తవిక అర్థము యొక్క ప్రవర్తనాత్మక కోణముల మీద కూడా దృష్టిపెట్టాలి. మానవ ప్రవర్తన దేవుని యొక్క విశేషమైన సన్నిధిలోనికి వచ్చు మన సామర్థ్యమును అయితే బలపరుస్తుంది లేకపోతే ఆటంకము కలిగిస్తుంది. ఈ కారణం చేత, బైబిలు రచయితలు వ్రాయుచుండగా వారి సొంత క్రియలు మరియు వారి శ్రోతల యొక్క క్రియలు దేవునితో వారి యొక్క సమీపత్వ అనుభవమును ప్రభావితము చేసిన విధానమును కూడా బయలుపరచారు.

మూడవదిగా, భక్తిసంబంధమైన పరిశోధన వారు దేవునితో సమీపత్వముతో అనుబంధపరచుకొనుచుండగా వాస్తవిక అర్థము యొక్క భావనాత్మక కోణములను కూడా వెలికితీయాలి. వైజ్ఞానిక వ్యాఖ్యానము చాలాసార్లు దీనిని నిర్లక్ష్యం చేసినప్పటికీ, బైబిలు రచయితలు తమ సొంత భావనలను వ్యక్తపరచి, వారి వాస్తవిక శ్రోతల యొక్క భావనలను కూడా ప్రభావితము చేశారు. బైబిలు రచయితలు మరియు వారి శ్రోతల యొక్క ఆనందములు, సందేహములు, దుఃఖములు, మరియు భయములు ప్రతి కోణములో కనిపిస్తాయి. మరియు మనము ఇంతకు ముందే సూచించినట్లు, దేవుని సమీపత్వము యొక్క లోతైన అనుభవములలో బలమైన భావనలు ఉంటాయి. కాబట్టి, రచయితలు మరియు వారి శ్రోతల యొక్క భావనలను గూర్చి బైబిలు భాగముల పట్ల మనము మరియు దేవుని సన్నిధిని వారు అనుభవించిన విధానములతో అవి అనుబంధపరచబడిన విధానము పట్ల ఎల్లప్పుడూ ఆసక్తిని చూపవలసియున్నది.

సిద్ధపాటు మరియు పరిశోధన యొక్క ప్రాధాన్యతలను మనము చూశాము కాబట్టి, ఇప్పుడు భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రములో అనువర్తనము యొక్క ప్రాధాన్యతలను మనము ప్రస్తావించవలసియున్నది.

దేవుని సన్నిధిలో మనము లేఖనములను చదువునప్పుడు, దేవుడు ఉద్దేశించిన విధముగా దేవుని వాక్యమును అనువర్తించుటకు మనము విశేషముగా సమర్పణ కలిగియుంటాము. మనము బైబిలును కొన్ని వేల సంవత్సరముల క్రితం నరమాత్రుల ద్వారా వ్రాయబడిన ఒక నిర్జీవమైన వస్తువుగా పరిగణించకూడదు. దీనికి భిన్నముగా, మనము లేఖనములను నేడు మనకు ఇవ్వబడిన సజీవమైన దేవుని వాక్యముగా పరిగణించాలి. దీనిని మనము ఎలా సాధించాలి అను విషయమును గూర్చి కొంత అవాగాహనను పొందుట కొరకు, మరొకసారి మనము అనువర్తనము యొక్క ఊహాత్మక, ప్రవర్తనాత్మక మరియు భావనాత్మక కోణములను గూర్చి మాట్లాడదాము.

ఊహాత్మక స్థాయిలో, భక్తిసంబంధమైన అనువర్తనము లేఖనముల ద్వారా దేవుని గూర్చి, మానవాళిని గూర్చి, మిగిలిన సృష్టిని గూర్చి మనము కలిగియున్న ఊహలను ఆయన ప్రభావితము చేయు విధానము మీద దృష్టి పెడుతుంది. తీవ్రమైన ప్రార్థన మరియు ఆయన వాక్య ధ్యానము ద్వారా మనము దేవుని ఆత్మ ప్రత్యక్షతను వెదకుచుండగా, దేవుని ఆత్మ దేవుని గూర్చి, మానవాళిని గూర్చి మరియు మిగిలిన సృష్టి యావత్తును గూర్చి మనము కలిగియున్న ఊహలను నిర్ధారించుచున్నట్లు, బలపరచుచున్నట్లు మరియు సరిచేయుచున్నట్లు మనము చూస్తాము. మరియు మన పూర్ణ హృదయములతో ఈ దిద్దుబాటులను మనము హత్తుకొనినప్పుడు, మనము దేవుని సన్నిధి యొక్క ఆశీర్వాదములోనికి మరి ఎక్కువగా ఆకర్షించబడుచున్నామని గమనిస్తాము.

ప్రవర్తనాత్మక స్థాయిలో, మనము లేఖనములను గూర్చి ఆలోచన చేయుచుండగా దేవుని సన్నిధి ద్వారా మన ప్రవర్తనలు ప్రభావితము చేయబడు విధానము మీద భక్తిసంబంధమైన అనువర్తనము దృష్టిపెడుతుంది.

మనము లేఖనమును ఆశ్రయించినప్పుడు, మనలను మనము వినయముతో పూర్తిగా ఆయన ఎదుట సమర్పించుకోవాలి. మరియు ప్రార్థనాపూర్వకముగా మనము దేవునిని సమీపించుచుండగా, భవిష్యత్తులో దేవుని సేవ కొరకు మన క్రియలను ఆయన ఆత్మ నిర్థారిస్తాడు మరియు బలపరుస్తాడు. అంతేగాక, ఆత్మ మీద ఆధారపడుతూ మనము లేఖనమును విశ్లేషించుచుండగా, దేవునికి ఇష్టమైన కార్యములను చేయునట్లు ఆయన మనలను సరిచేస్తాడు మరియు బలపరుస్తాడు అని మనము చూస్తాము.

చివరిగా, భావనాత్మక స్థాయిలో, దేవుని యొక్క విశేషమైన సన్నిధిలో లేఖనములను చదువుట ద్వారా మన వైఖరులు మరియు భావనలు ప్రభావితము చేయబడు విధానములను లేఖనము యొక్క భక్తిసంబంధమైన అనువర్తనము తెలియజేస్తుంది. ఆయన జ్ఞానమందు, దేవుని ఆత్మ మనలో తగిన విధముగా పశ్చాత్తాపమును, బాధను మరియు దుఃఖమును కలిగిస్తాడు. దేవుని ఆత్మ మన హృదయాలను ఆనందము, సమాధానము మరియు ప్రేమతో నింపుతాడు. దేవుని యొక్క సజీవమైన వాక్యముగా మనము లేఖనములను ఆశ్రయించినప్పుడు, ఆయన పట్ల, ఇతర ప్రజల పట్ల మరియు మిగిలిన సృష్టి పట్ల మనము కలిగియున్న భావనలు మనలను మౌనముగా ఆవరిస్తాయి. లేక, ఆత్మ కోరిన విధముగా, మనము దేవుని సన్నిధిలో మైమరచిపోవునట్లు అవి మన హృదయములను నింపగలవు. ఏది ఏమైనా, దేవుని సమీపత్వము యొక్క వెలుగులో లేఖనములను వ్యాఖ్యానించుటను మనము నేర్చుకొనుచుండగా, లేఖనములు జీవము కలిగి మనలను మార్చుతాయని, కేవలం మన ఊహలు మరియు ప్రవర్తనలను మాత్రమేగాక, మన భావనల యొక్క లోతులను కూడా మార్చుతాయని మనము కనుగొంటాము.

మనము బైబిలును అధ్యయనం చేయునప్పుడు, మన ఆలోచనను మాత్రమే మార్చుకొనమని బైబిలు మనలను అడుగుటలేదని మనము గుర్తించాలి. అది మన జీవితములను మార్చుకోమని అడుగుతుంది. కాబట్టి ప్రజలను బైబిలు అధ్యయనము చేయమని ప్రోత్సహించిన ప్రతిసారి లేఖనము యొక్క అనువర్తనమును గూర్చి మూడు భాగములలో ఆలోచించమని నేను వారికి చెబుతుంటాను: ఆలోచించండి, అనుభవించండి, చెయ్యండి. జ్ఞానవాదములో మనము బైబిలును ఒక భాగము కొరకు మాత్రమే అనువర్తిస్తాము — అది ఎలా ఆలోచన చెయ్యాలి. అయితే మనము మన పూర్ణ మనస్సులతో ఆయనను ప్రేమించాలని దేవుడు కోరుచున్నాడు, కాబట్టి దేవుడు ఆలోచనకు ప్రాధాన్యతనిస్తాడు. అయితే మన అనుభవమునకు కూడా దేవుడు ప్రాధాన్యతనిస్తాడు — అనగా మన భావనాత్మక జీవితము, అనుదినము మనము ఎదుర్కొను విషయములు. మన భావనలకు ఆయన ప్రాధాన్యతనిస్తాడు. మరియు భావనలు దేవునికి నమ్మకముగా ఉండవచ్చు, మరియు భావనలు దేవునికి నమ్మకముగా ఉండకపోవచ్చు. తటస్థ భావనలు అనేవి లేవు. అయితే “చేయు” కోణము కూడా ఉన్నది. మనము లేఖనమును అనువర్తించునప్పుడు, అది మన భావనలను ఎలా ప్రభావితము చేస్తుంది లేక మన మనస్సును ఎలా ప్రభావితము చేస్తుంది అని మాత్రమేగాక మన క్రియలను అది ప్రభావితము చేయు విధానమును గూర్చి కూడా మనము ఆలోచన చెయ్యాలని దేవుడు కోరతాడు. కాబట్టి మనము ఆ మూడింటిని — ఆలోచన, అనుభవము, కార్యము — ఉపయోగిస్తే మనము బైబిలును గూర్చి ఆలోచన చేయు విధానమునకు అది సమతుల్యతను కలిగిస్తుంది.

— డా. మైఖేల్ జే. కృగర్

బైబిలు వ్యాఖ్యానశాస్త్రము యొక్క పరిచయములో, మనము మూడు ప్రధానమైన అంశముల మీద దృష్టిపెట్టాము. మొదటిగా, ఈ అంశమును గూర్చి అవగాహన కలిగియుండుటకు కొన్ని సాధారణ పదములను మనము విశదీకరించాము. రెండవదిగా, వాటి కఠినత మరియు తార్కిక స్థిరత్వము కొరకు వైజ్ఞానిక వ్యాఖ్యానశాస్త్రము చాలా ప్రాముఖ్యమైనది అని మనము చూశాము. మరియు మూడవదిగా, భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రము — దేవుని సన్నిధిలో లేఖనమును చదువుట — వైజ్ఞానిక వ్యాఖ్యనశాస్త్రమునకు ఒక కీలకమైన సమతుల్యతను అందిస్తుంది అని మనము చూశాము.

లేఖనములను వ్యాఖ్యానించుటను గూర్చి మరిఎక్కువగా నేర్చుకొనుట దేవుని నుండి అన్ని విధములైన నూతన మెళకువలను మరియు ఆశీర్వాదములను పొందుకొనుటకు ద్వారమును తెరుస్తుంది. దేవుని నమ్మకమైన ప్రజలుగా మనము నమ్ము ప్రతిదానికి, మనము చేయు ప్రతిదానికి మరియు మనము భావించు ప్రతిదానికి పాత మరియు క్రొత్త నిబంధనలు ప్రామాణికతలను నిర్ణయిస్తాయి. రానున్న పాఠములలో మనము అనేక ఇతర వివరములను చూడబోవుచుండగా, వైజ్ఞానిక మరియు భక్తిసంబంధమైన వ్యాఖ్యానశాస్త్రములు మన కొరకు ఎంత ప్రాముఖ్యమైయున్నవో మనము చూడబోతున్నాము. మనము అలా చేయుచుండగా, మన జీవితములలోని ప్రతి కోణములో దేవునికి నమ్మకమైన పరిచర్య చేయుటకు నూతనమైన మార్గములను మనము కనుగొంటాము.

Continue reading the full transcript