<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
Back to CatalogHGBఅతడు మాకు గ్రంథమును అను మనకు వ్యాఖ్యానమునకు పునాదులు
అతడు మాకు గ్రంథమును అను మనకు వ్యాఖ్యానమునకు పునాదులు ·VideoTranslated from English

HGB-08 ఆధునిక అనువర్తన మరియు పాత నిబంధన యుగాలు

Read the full text

అదే శ్రేణి 8వ పాఠానికి సమాధానమిచ్చే ఒక అనుబంధ వీడియో, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిస్తుంది: స్క్రిప్టure అధికారికమైనది ఎందుకు? బైబిల్ రచయిత్వాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? స్క్రిప్టure రచయితలు వారి అసలు ప్రేక్షకుల పరిస్థితుల ద్వారా ఎంత ప్రభావితం చేయబడ్డారు? బైబిల్లోని పాత్రలు మనకు అనుసరించడానికి సానుకూల ఉదాహరణలుగా మరియు తిరస్కరించవలసిన ప్రతికూల ఉదాహరణలుగా మనం ఎలా చెప్పగలం? రక్షణ చరిత్ర యొక్క ప్రధాన యుగాలు లేదా యుగాలను మనం స్క్రిప్టure నుండి ఎలా నిర్ణయించవచ్చు? ఓల్డ్ టెస్టమెంట్ చరిత్రను యుగాలు లేదా యుగాలుగా విభజించడానికి వేదాంతవేత్తలు ఏ ప్రమాణాలను ఉపయోగిస్తారు? పాత నిబంధన చరిత్ర కథనంలో దేవుడు ప్రధాన పాత్రగా మరియు సాతాను ప్రతినాయకుడిగా ఎలా పనిచేస్తాడు? నేటి మన జీవితాలకు దైవిక మరియు జాతీయ యుద్ధాన్ని బైబిల్ ఎలా వర్తింపజేయాలి? యేసు రాజుగా ఉన్న కార్యాలయం ఆధునిక జీవితానికి బైబిల్‌ను వర్తింపజేసే మార్గాన్ని ఎలా ప్రభావితం చేయాలి?


From the transcript

పాత నిబంధనను ఆధునిక జీవితమునకు అనువర్తించు విషయములో క్రైస్తవులు తీవ్రతలలోనికి వెళ్లిపోవుటను మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక వైపున, పాత నిబంధన కాలములో దేవుని ప్రజలు చేసిన పనులను ఉన్నవి ఉన్నట్లుగా మనము కూడా చేయాలని కొందరు విశ్వాసులు ఆలోచిస్తారు. మరొక వైపున, పాత నిబంధన దినములలో దేవుడు తన ప్రజలకు ఆజ్ఞాపించిన విషయములను మనము మరచిపోవాలని కొందరు విశ్వాసులు అనుకుంటారు. అయితే వాస్తవానికి, వాస్తవము అనునది ఈ రెండు తీవ్రతల మధ్య ఉంటుంది.

మన దినములకు పాత నిబంధనను అనువర్తించు విషయములో, మనము రెండు విషయములను జ్ఞాపకముంచుకోవాలి: మనము ఎన్నడును మునుపటి లోనికి తిరిగివెళ్లకూడదు, కాని మనము మునుపును ఏనాడు మరిచిపోకూడదు.

ఆయన మనకు లేఖనమును అనుగ్రహించాడు: వ్యాఖ్యానమునకు పునాదులు అను మన పాఠ్యక్రమములో ఇది ఎనిమిదవ పాఠము, మరియు దీనికి “ఆధునిక అనువర్తనము మరియు పాత నిబంధన యుగములు” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో, చరిత్రలోని గొప్ప యుగములలో పాత నిబంధన విశ్వాసము అభివృద్ధి చెందిన విధానములను విశదీకరించి, ఈ పురోగమనములు మన వ్యక్తిగత లేఖన అనువర్తనము మీద ప్రభావమును చూపగల విధానములను వివరిద్దాము.

మునుపటి పాఠములో, కనీసం మూడు మార్గములలో లేఖనము యొక్క వాస్తవిక శ్రోతలు మన సమకాలీన శ్రోతల కంటే భిన్నముగా ఉన్నారని మనము చూశాము. వాస్తవిక శ్రోతలు మన కంటే విభిన్నమైన చారిత్రిక యుగములలో జీవించారు. వారి సంస్కృతులు మన కంటే భిన్నమైనవిగా ఉన్నాయి. మరియు వారు మన కంటే విభిన్నమైన ప్రజలైయున్నారు. ఈ మూడు భిన్నత్వములు లెక్కలేనన్ని విధానములలో పరస్పర అనుబంధము కలిగినవిగా ఉన్నప్పటికీ, ఈ పాఠములో పాత నిబంధన యుగముల మీద మరియు అవి ఆధునిక అనువర్తనమును ప్రభావితము చేయు విధానముల మీద దృష్టిపెడదాము.

ఆధునిక అనువర్తనము మరియు పాత నిబంధన యుగముల మధ్య ఉన్న అనుబంధమును మనము రెండు మార్గములలో విశదీకరిద్దాము. మొదటిగా, పాత నిబంధన చరిత్ర యొక్క యుగముల సంబంధమైన విభజనలను మనము చూద్దాము. మరియు రెండవదిగా, ఈ విభజనలు ప్రాతినిధ్యం వహించు యుగముల సంబంధమైన పురోగమనములను మనము పరిగణిద్దాము. పాత నిబంధన చరిత్ర యొక్క యుగముల సంబంధమైన విభజనలతో ఆరంభిద్దాము.

చరిత్రలో జరిగిన అనేక వేదాంతశాస్త్ర మార్పులను పాత నిబంధన నివేదిస్తుంది. తన ప్రజల యొక్క భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములను గూర్చి తాను కలిగియున్న ఆకాంక్షలలో దేవుడు మార్పుచేర్పులు చేసిన ప్రతిసారి వేదాంతశాస్త్ర మార్పులు జరిగాయి. మరియు ఆ మార్పులు పెద్దవి అయినప్పుడు, అవి యుగముల విభజనను గుర్తించుటకు ఆధారమైయ్యాయి.

క్రైస్తవులు ఈ మార్పులను అనేక విధములుగా వర్ణించారు, అయితే పాత నిబంధన వేదాంతశాస్త్రమును ఎదుగుచున్న ఒక చెట్టుతో పోల్చుట ఒక సాధారణమైన మరియు సహాయకరమైన ఉదాహరణయైయున్నది. ఒక ఆరోగ్యకరమైన చెట్టు చిన్న విత్తనము నుండి పెద్ద వృక్షముగా ఎదుగుచున్నప్పుడు అనేక మార్పులను అనుభవిస్తుంది. అయితే లోకములోని అనేక ప్రాంతములలో ఒక చెట్టు యొక్క ఎదుగుదల వార్షిక వాతావరణ మార్పుల మీద ఆధారపడియుంటుంది. చెట్లు చలికాలములలో తక్కువగా ఎదుగుతాయి, మరియు అధిక ఉష్ణోగ్రత ఉన్న కాలములలో త్వరగా ఎదుగుతాయి.

పాత నిబంధన వేదాంతశాస్త్రము యొక్క ఎదుగుదల కూడా కాలములకు అనుగుణంగా జరిగింది. కొన్నిసార్లు అది చాలా తక్కువగా ఎదిగింది. అయితే మరికొన్నిసార్లు అది నాటకీయముగా మార్పు చెంది, నూతన పరిపక్వత దశలకు చేరింది. ఈ పరిపక్వత దశలు పాత నిబంధనలోని యుగముల సంబంధమైన విభజనలతో అనుసంధానం కలిగియున్నాయి. ప్రతి యుగము పాత నిబంధన వేదాంతశాస్త్రములో విశేషమైన మరియు స్థిరమైన మార్పులు జరిగిన కాలమైయున్నది.

పాత నిబంధన యొక్క యుగముల సంబంధమైన విభజనలను మనము మూడు దశలలో చూద్దాము. మొదటిగా, బైబిలులో నమోదు చేయబడిన చరిత్రను పండితులు విభజించిన విభిన్నమైన విధానములను మనము గుర్తిద్దాము. రెండవదిగా, అనేక క్రైస్తవ పరంపరలు ఉపయోగించు సహాయకరమైన యుగముల సంబంధమైన ఆకారమును మనము వర్ణించుదాము. మరియు మూడవదిగా, లేఖనము యొక్క ఆధునిక అనువర్తనము కొరకు ఈ ఆకారము కలిగియున్న కొన్ని అంతర్భావములను మనము ఎత్తిచూపుదాము. పాత నిబంధన చరిత్ర విభజించబడిన విభిన్నమైన విధానములను చూస్తూ ఆరంభిద్దాము.

పాత నిబంధనలో నమోదు చేయబడిన చరిత్రను విభాగించుటకు వేదాంతవేత్తలు అనేక మార్గములను కనుగొన్నారు అను విషయము మనలను ఆశ్చర్యపరచకూడదు. ఒక విషయము ఏమిటంటే, సమయము ఖచ్చితముగా విభాగించబడిన కాల వ్యవధులలో కదలదు. కాబట్టి, యుగముల మధ్య మార్పులు నిదానంగా జరిగాయి, మరియు చాలాసార్లు యుగములు ఒకదాని మీదికి ఒకటి అతివ్యాప్తి చెందాయి. మరొక వైపు, వేదాంతవేత్తలు నిర్థారించిన విభజనలు వారు ఉపయోగించిన అర్హతల మీద ఆధారపడియుంటాయి. విజ్ఞానములో ఇది జరుగు విధానమును గూర్చి ఆలోచన చెయ్యండి. పురావస్తుశాస్త్రజ్ఞులు లోహశాస్త్రములో కలిగిన పురోగమనముల ఆధారముగా చరిత్రను విభజిస్తారు. కాబట్టి, వారు ఆరంభ, మధ్య మరియు చివరి కాంస్య యుగమును గూర్చి; ఆరంభ, మధ్య మరియు చివరి లోహయుగమును గూర్చి మాట్లాడతారు. సామాజికశాస్త్రవేత్తలు రాజకీయ పురోగమనములను ఉద్ఘాటిస్తారు. కాబట్టి, వారు గోత్రముల కాలములను గూర్చి, ఆరంభ జాతీయ యుగమును గూర్చి, రాజుల పరిపాలనను గూర్చి, చెర కాలమును గూర్చి, మరియు చెర తరువాత కాలమును గూర్చి మాట్లాడతారు.

ఇదే విధముగా, యుగములను విభాగించుటకు వేదాంతవేత్తలు స్పష్టముగా వేదాంతశాస్త్ర అర్హతలను ఉపయోగిస్తారు. అయితే వారు విభజనల విషయములో ఎల్లప్పుడూ సమ్మతించరు, ఎందుకంటే పాత నిబంధనలోని వేదాంతశాస్త్రము పలు కాలములలో పలు విధములుగా వృద్ధి చెందింది. ఒక చెట్టు ఎదుగుదల జరుగునప్పుడు, దానిలోని పలు భాగములు ఒకే సమయములో లేక ఒకే వేగముతో ఎదగవు. కొన్నిసార్లు మిగిలిన కొమ్మలు ఎదుగుచుండగా, ఒక కొమ్మకు రోగము వచ్చుట వలన దాని ఎదుగుదలకు ఆటంకం కలుగవచ్చు. ఒక చెట్టు మొద్దు మీద తోలు నిదానముగాను కనిపించకుండా ఎదుగుతుంది, మరియు దీనితో పోల్చితే చెట్టు యొక్క చిన్న కొమ్మలు మరియు ఆకులు త్వరగా పెరుగుతాయి. ఇదే విధముగా, పాత నిబంధన వేదాంతశాస్త్రము నిదానముగా ముందుకు కదలగా, కొన్ని తగు వేగముతో ముందుకు కదిలాయి, ఇంకొన్ని సరవేగముగా ముందుకు కదిలాయి. మరియు ఈ భాగములు విభిన్నమైన కాలములలో ఎదిగాయి. ఇశ్రాయేలు విశ్వాసములోని ప్రతి కోణము ఒకే వేగముతో ఒకే సమయములో ముందుకు కదిలియుంటే, దాని యొక్క విభజనల విషయములో సమ్మతించుట వ్యాఖ్యాతలకు సులభమైయ్యేది. అయితే మన యొద్ద అందుబాటులో ఉన్న విధముగా పాత నిబంధన చరిత్ర పలు విధములుగా విభాగించబడింది.

లేఖనము ప్రక్రియాత్మక ప్రత్యక్షత అయ్యున్నది కాబట్టి, కాలక్రమములో అది మనకు ఇవ్వబడినది కాబట్టి, వివృతమగుచున్న దేవుని ప్రణాళికలో మనము ఖచ్చితముగా ఎక్కడ ఉన్నామో కనుగొనుట చాలా ప్రాముఖ్యమైయున్నది. దేవుని ప్రణాళికను పలు కాలములు మరియు యుగములుగా విభజించాలని వేదాంతవేత్తలు చాలాసార్లు మాట్లాడుతుంటారు... క్రొత్త నిబంధన పాత నిబంధనను విభాగించు విధానమును గూర్చి క్రొత్త నిబంధనలో మనకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. మత్తయి వంశావళిని గూర్చి ఆలోచన చెయ్యండి. అది అబ్రాహాముతో ఆరంభమై, దావీదు గుండా ప్రయాణిస్తుంది. అది పాత నిబంధన చరిత్రను అబ్రాహాము నుండి దావీదు, దావీదు నుండి చెర, చెర నుండి క్రీస్తు దృష్ట్యా చూస్తుంది. ఈ విధంగా బైబిలు పాత నిబంధన చరిత్రను విభాగిస్తుంది, దాని యొక్క విశేషమైన ప్రాముఖ్యతను చూస్తుంది మరియు అది మన యొద్దకు వచ్చిన విధానమును తెలియపరుస్తుంది. క్రొత్త నిబంధన దానిని విభాగించు ఇతర విధానములు కూడా ఉన్నాయి. రోమా. 5 మరియు 1 కొరింథీ. 15లో పౌలును గూర్చి ఆలోచన చెయ్యండి. ఆదాము మరియు క్రీస్తును గూర్చి ధర్మశాస్త్రము ముందు, ధర్మశాస్త్రము తరువాత దృష్ట్యా మాట్లాడవచ్చు. కాబట్టి, దీనిని విభాగించు అనేక విధములను క్రొత్త నిబంధన చూపుతుంది. దేవుని యొక్క పూర్ణ ఆలోచన దృష్ట్యా, బైబిలు నిబంధనల ఆధారముగా మనము ఒక కీలకమైన రీతిలో దీనిని చేయవచ్చు అని నా ఆలోచన. మీరు ఆదాము — సృష్టి నిబంధన — నోవహు, అబ్రాహాము — అబ్రాహాము నిబంధన, ఇశ్రాయేలుతో పాత నిబంధన — మరియు మోషే, దావీదు నిబంధన, మరియు క్రొత్త నిబంధన యొక్క ఆకాంక్ష గుండా ప్రయాణించుచుండగా, నిబంధన తరువాత నిబంధనలోనికి ప్రయాణిస్తూ తుదకు యేసు క్రీస్తులో ముగించబడుట విమోచన చరిత్ర వివృతమగుటకు దేవుడిచ్చిన విధానము అని నా ఆలోచన. ఆదికాండము నుండి క్రీస్తు వరకు మనము కదులు విధానమును గూర్చి, దేవుని పూర్ణ ఆలోచన చక్కగా అమర్చబడు విధానమును గూర్చి ఆలోచించుటకు ఇది చాలా చాలా ఉపయోగకరమైన మార్గమైయున్నది. మరియు పాత నిబంధన చరిత్ర, విమోచన చరిత్రను గూర్చి క్రొత్త నిబంధన మాట్లాడు అనేక మార్గములు ఈ నిబంధనా పద్ధతిని అనుసరిస్తాయి.

— డా. స్టీఫెన్ జే. వెల్లుమ్

పాత నిబంధన చరిత్రలోని యుగముల సంబంధమైన విభాగముల విభిన్నతల యొక్క అర్హతను గుర్తించాము కాబట్టి, అనేకమంది వ్యాఖ్యాతలు అలవరచుకున్న ఒక సహాయకరమైన ఆకారమును పరిగణిద్దాము.

పాత నిబంధన చరిత్ర విభాగించబడిన అనేక ప్రఖ్యాతిగాంచిన మార్గములలో ఒకటి, ప్రతి యుగమును దేవుని నిబంధనలలో ఒకదానితో అనుసంధానము చేయుట అయ్యున్నది. ఆయన ప్రజలతో దేవుని నిబంధనలు ఎల్లప్పుడూ ప్రాముఖ్యమైన వేదాంతశాస్త్ర మార్పులను ఎదుర్కొన్నాయి, తద్వారా యుగముల సంబంధమైన విభజనల కొరకు ఉపయోగకరమైన పరిమితులను అందిస్తాయి.

అనేక క్రైస్తవ పరంపరలు పాత నిబంధనలో ఆరు ప్రధానమైన దైవిక నిబంధనలను గుర్తిస్తాయి: ఆదాము, నోవహు, అబ్రాహాము, మోషే మరియు దావీదుతో చేయబడిన నిబంధనలు, మరియు వాగ్దాన దేశము నుండి ఇశ్రాయేలు ఎదుర్కొనిన చెర యొక్క ముగింపు తరువాత కలుగుతుంది అని పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించిన క్రొత్త నిబంధన.

ఆదాము విషయములో, ఆదికాండము 1-3లో ఉన్న నివేదిక మనము సాధారణంగా “నిబంధన” అని అనువదించు హెబ్రీ పదమైన బెరిత్ ను ఉపయోగించదు. అయినను, ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు అని ఆదికాండము గట్టిగా తెలియజేస్తుంది. ఒక ఉదాహరణగా, ఆదికాండము 6:18లో, నోవహుతో తన నిబంధనను “స్థిరపరచుదును” అని దేవుడు సెలవిచ్చాడు. “స్థిరపరచుదును” అని అనువదించబడిన హెబ్రీ పదము కుమ్, ఇది క్రొత్తగా ఆరంభమైయ్యే ఒకదానిని తెలుపుటకు బదులుగా, ముందుగా ఉనికిలో ఉన్న ఒక విషయమును నిర్థారించుట కొరకు ఉపయోగించబడుతుంది. కాబట్టి, ఆదాముతో దేవుని యొక్క అనుబంధమును ఆదికాండము నిబంధనా అనుబంధముగా ప్రస్తుతిస్తుంది అను నిశ్చయతను మనము కలిగియుండవచ్చు. అంతేగాక, హోషేయా 6:7 వలె, దేవుడు మరియు ఆదాము మధ్య నిబంధనను, లేక దేవునికి మరియు సర్వ మానవ జాతికి ప్రతినిధిగా ఆదాముకు మధ్య జరిగిన నిబంధనను సూచించాడు.

నోవహుతో దేవుని నిబంధన ఆదికాండము 6:18లో జలప్రళయమునకు ముందు, మరియు 9:9-17లో జలప్రళయం తరువాత ప్రత్యక్షమవుతుంది. అబ్రాహాముతో దేవుని నిబంధన ఆదికాండము 15:18లో అబ్రాహాము తన భార్య దాసీయైన హాగరు ద్వారా వారసుని పొందుటకు ప్రయత్నించుటకు ముందు, మరియు 17:2లో హాగరు ద్వారా వారసుని పొందుటకు ప్రయత్నించిన తరువాత ప్రస్తావించబడింది. మోషే ద్వారా ఇశ్రాయేలుతో దేవుడు చేసిన నిబంధన ఆదికాండము 19-24లో సీనాయి పర్వతము యొద్ద నమోదు చేయబడింది, మరియు సాహసవంతుడైన ఫీనెహాసుతో ఆయన యొక్క దగ్గర సంబంధము కలిగిన నిబంధన సంఖ్యా 25:13లో ప్రస్తావించబడింది. దావీదుతో దేవుని నిబంధన 2 సమూయేలు 7లో మరియు కీర్తనలు 89 మరియు 132లో నమోదు చేయబడింది. మరియు చివరిగా, యిర్మీయా 31:31లో మనము క్రొత్త నిబంధన యొక్క ప్రవచనమును కనుగొంటాము. ఇదే నిబంధన యెషయా 54:10 మరియు యెహెజ్కేలు 34:25లో “సమాధాన నిబంధన” అని పిలువబడింది. ఈ నిబంధన క్రీస్తులో కలిగింది అని లూకా 22:20 మరియు హెబ్రీ 8:6-12 వంటి వాక్యభాగములు తెలియజేస్తాయి.

ఈ నిబంధనలు చరిత్రలో దేవుడు అద్భుతమైన రీతులలో కదిలిన కాలములను సూచిస్తాయి, మరియు అవి నిత్యము నిలిచియుండు వేదాంతశాస్త్ర ఉద్ఘాటనలను పరిచయం చేశాయి. దేవునితో ఆదాము యొక్క నిబంధనా అనుబంధము సృష్టి మరియు మానవాళి పాపములోనికి పడిపోయినప్పుడు దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ప్రతిస్పందన యొక్క నేపథ్యములో జరిగింది. ఇది దేవుని పట్ల మానవాళి చేసిన సేవ యొక్క పునాదులను ఉద్ఘాటించి, పాపము ఈ సేవను సంక్లిష్టతరము చేసిన విధానమును వర్ణించింది. మానవాళి తుదకు ఈ పరిచర్యలో సఫలతను సాధిస్తుంది అని దేవుడిచ్చిన వాగ్దానము కూడా దీనిలో ఉన్నది.

నోవహు దినములలో, మానవాళి లోకమును బహుగా కలుషితము చేయుట వలన దేవుడు బహు ఘోరమైన ఒక జలప్రళయమును పంపాడు. నిరాశ్చర్యముగా, నోవహుతో దేవుని నిబంధన పాపాత్ములైన ప్రజలు తమ పాపమును అదుపు చేయుటకు సమయమును మరియు అవకాశమును ఇచ్చుటకు మరియు దేవుని కొరకు వారు వాస్తవముగా చేయవలసిన పరిచర్యను జరిగించుటకు సృష్టి యొక్క నిలిచియుండు స్థిరత్వమును స్థాపించింది.

అబ్రాహాము దినములలో, మానవాళిని దేవుని పరిచర్యలోనికి నడిపించు ప్రజలుగా దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. కాబట్టి, అబ్రాహాముతో చేయబడిన నిబంధన ఇశ్రాయేలు యొక్క ఎంపిక మీద దృష్టిపెడుతుంది. ఈ నిబంధనా యుగము ఇశ్రాయేలు దేవుని వాగ్దానముల మీద విశ్వాసముంచి, ఆయనకు నమ్మకముగా నిలిచియుండవలసిన అవసరతను ఉద్ఘాటించింది.

తాను ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వము నుండి విమోచించిన తరువాత మరియు వారిని వాగ్దాన దేశము వైపుకు నడిపించుట ఆరంభించిన తరువాత దేవుడు మోషే ద్వారా ఒక నిబంధనను చేశాడు. నిరాశ్చర్యముగా, ఈ నిబంధన ఇశ్రాయేలీయులు దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగుచుండగా వారికి మార్గదర్శకమును చూపిన మోషే యొక్క వ్రాయబడిన జాతీయ ధర్మశాస్త్రము మీద దృష్టిపెట్టింది.

దావీదు దినములలో, దేవుడు దావీదును ఇశ్రాయేలునకు రాజుగా లేవనెత్తాడు. దావీదుతో ఆయన చేసిన నిబంధన ఇశ్రాయేలు యొక్క రాజరిక వ్యాప్తికి నాయకత్వము వహించు శాశ్వతమైన రాజ వంశముగా దావీదు కుటుంబమును స్థిరపరచింది. ఈ వ్యాప్తి దేవునికి ఇశ్రాయేలు చేసిన పరిచర్యలో ఒక ప్రాముఖ్యమైన కోణమైయున్నది.

చివరిగా, ఇశ్రాయేలు యొక్క చెర ముగింపులో దేవుడు చరిత్ర యావత్తును నెరవేర్చినప్పుడు ఒక క్రొత్త నిబంధన కలుగుతుంది అని పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారు. మెస్సీయ దేవుని ప్రజలను విమోచించి, దేవుని రాజ్యమును లోకమంతటా వ్యాపింపజేస్తాడు.

దేవుని నిబంధనలలో ప్రతిది ఆయన మానవులతో అనుబంధము కలిగియుండిన పలు మార్గములను స్థిరపరచింది, మరియు ఆయన పరిచర్యలో కొనసాగుటకు ఆయన నమ్మకమైన ప్రజలకు నూతన నియమములను అనుగ్రహించింది.

యుగముల సంబంధమైన విభజనలను గూర్చిన మన సంభాషణలో ఇప్పటి వరకు, బైబిలు చరిత్ర పలు విధములుగా విభాగించబడి, యుగముల కొరకు సహాయకరమైన ఆకారమును అందించిన విధానమును చూశాము. ఇప్పుడు, లేఖనము యొక్క ఆధునిక అనువర్తనము కొరకు ఈ ఆకారము కలిగియున్న కొన్ని అంతర్భావములను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.

తన ప్రజలు వేదాంతశాస్త్ర అంశములను అర్థము చేసుకొని పలు కాలములలో పలు విధములుగా అనువర్తించాలని దేవుడు కోరాడని పాత నిబంధనను యుగములుగా విభజించుట స్పష్టము చేస్తుంది. చరిత్రలోని మునుపటి కాలములలో నివసించినట్లుగా పాత నిబంధన విశ్వాసులు ఏ విధంగా దేవుని సేవించవలసియుండలేదో, ఆలాగే చరిత్రలోని మునుపటి కాలములలో నివసించుచున్నట్లు క్రొత్త నిబంధన విశ్వాసులు ఏనాడు లేఖనములను అనువర్తించకూడదు.

మీరు యెరూషలేములో సొలొమోను దేవుని దేవాలయమును నిర్మించిన తరువాత కొంత కాలానికి అక్కడ నివసించు ఇశ్రాయేలీయుడు అనుకోండి. దావీదు నిబంధనా యుగములో నివసించుచున్నారని మీకు తెలుసు. మునుపటి మోషే యుగములో, ఇశ్రాయేలు ప్రజలు మోషే మందిరము యొద్ద బలులను అర్పించారని మీకు తెలుసు. అలాగే మీ సొంత యుగములో, దేవాలయములో మాత్రమే బలులను అర్పించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. మీ చారిత్రిక నేపథ్యములో, మోషే మందిరము యొద్ద బలులను అర్పించుట దేవుని ఉల్లంఘించుట అవుతుంది. అలాగే మీరు మోషే నిబంధన కాలములో నివసించువారైతే, అబ్రాహాము మరియు ఇతర పితరులు చేసినట్లు సంచారము చేయుచు పలు స్థలములలో బలిపీఠములను కట్టి బలులను అర్పించుట తప్పు అయ్యేది. ఆరాధనలో బలి అర్పించుట కొరకు దేవుడు ఒక నూతన విధానమును ఆజ్ఞాపించిన తరువాత, తన ప్రజలు ఇక ఎన్నడు పాత మార్గములకు తిరిగివెళ్లకూడదు అని ఆయన కోరాడు.

ఇదే విధముగా, ఆరాధనలో బలులు అను పాత నిబంధన అంశము యొక్క ఆధునిక అనువర్తనమును గూర్చి మనము ఆలోచన చేయునప్పుడు, మనము క్రొత్త నిబంధన యుగములో నివసించుచున్నాము అను సత్యమును గూర్చిన అవగాహన మనము కలిగియుండాలి. క్రొత్త నిబంధన మరలా మరలా వివరించుచునట్లు, క్రీస్తు అందరి కొరకు ఒకేసారి అర్పించిన పరిపూర్ణమైన బలి మునుపటి బలి విధానములన్నిటిని అధిగమించింది. సిలువపై ఆయన మరణము దేవుని ఆరాధనలో దేవునికి నమ్మకమైన ప్రజలు బలిని అర్పించు విధానమును పూర్తిగా మార్చివేసింది. ఇందుమూలముగానే పాత నిబంధనలోని బలుల వ్యవస్థలోనికి తిరిగివెళ్లాలని కోరిన క్రైస్తవులను క్రొత్త నిబంధనలోని హెబ్రీ పత్రిక రచయిత బలముగా ఖండించాడు. మొదటిగా, యిర్మీయా 31లో యిర్మీయా ప్రవచించిన క్రొత్త నిబంధనను క్రీస్తు ఆరంభించాడు అని అతడు వాదించాడు. తరువాత క్రొత్త నిబంధన పాత బలుల వ్యవస్థను పాతదిగా చేసింది అని అతడు చెప్పాడు. హెబ్రీ. 8:13లో అతడు ఏమని వ్రాస్తున్నాడో ఒకసారి వినండి:

ఆయన క్రొత్తనిబంధన అని చెప్పుటచేత మొదటిది పాతదిగా చేసియున్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది (హెబ్రీ. 8:13).

ఇక్కడ, “పాతవిగా చేయబడు” లేక “పాతగిలిన” అని అనువదించబడు పలయూ అను గ్రీకు పదమును ఉపయోగించుట ద్వారా క్రొత్త నిబంధన యొక్క రాక పాత మార్గములను “పాతవి”గా చేసింది అని హెబ్రీ పత్రిక రచయిత తెలిపాడు.

ఇప్పుడు, ఇక్కడ మనము కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే క్రీస్తు అనుచరులు పాత నిబంధనను పూర్తిగా తొలగించివేసి, దాని బోధనలకు ఎలాంటి ప్రాముఖ్యతను ఇవ్వకూడదు అని దీని అర్థము అని అనేకమంది సద్భావన కలిగిన క్రైస్తవులు అనుకుంటారు. అయితే ఇది వాస్తవము కాదు. హెబ్రీ పత్రిక స్వయంగా పాత నిబంధనను క్రైస్తవులకు అనువర్తిస్తుంది. పాత నిబంధన ఇక ఔచిత్యము లేనిది అని దీని రచయిత క్రైస్తవులకు తెలుపుటలేదు. బదులుగా, మనము విభిన్నమైన యుగములో నివసించుచున్నామని, మరియు బలి అర్పించు ఆచారములో మనము మార్పులను చేయాలని క్రొత్త నిబంధన కోరుతుంది అని అతడు చెప్పుచున్నాడు. మనము పాత మార్గములను నిర్లక్ష్యము చేయము, కాని పాత దినములలో నివసించుచున్నట్లు మనము ఏనాడు దేవుని సేవించకూడదు.

యుద్ధములో నాయకత్వము అను అంశము మరొక విశేషమైన ఉదాహరణను అందిస్తుంది. మీరు దావీదు యొక్క రాజవంశపు నిబంధన కాలములో నివసించుచున్నారని ఊహించుకోండి. దుష్టత్వము మీద యుద్ధములో నాయకత్వము వహించుటకు దేవుడు ఇశ్రాయేలు రాజులను అభిషేకించాడు అని మీకు తెలుసు. రాజులు దేవుని నుండి నిర్దేశనములను పొంది, మీరు యుద్ధములో పాలుపంచుకొను మార్గములను నియంత్రిస్తారు. అయితే మీకు వ్యక్తిగతముగా దావీదు రాజు అంటే ఇష్టములేక, మోషే మునుపు ఇచ్చిన జాతీయ ధర్మశాస్త్ర యుగము యొక్క నిబంధనలోనికి మీరు తిరిగి వెళ్లాలని ఆశించారు అనుకోండి. స్థానిక న్యాయాధిపతియైన గిద్యోనును, లేక ఎఫ్రాయీమీయుడైన యెహోషువను, లేక లేవీయుడైన మోషేను, లేక ఇతర పితరులను మీరు అనుసరించాలని ఆశించారు అనుకోండి. మరియు దావీదు కుటుంబమునకు బదులుగా, వీరిలో ఒకరిని మీరు అనుసరించియుంటే, మీరు పాపము చేసినవారైయుండేవారు. మీ యుగము కొరకు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరు ఉల్లంఘించియుండేవారు. అలాగే మీరు మోషే దినములలో నివసించుచు అబ్రాహాముతో నిబంధన యుగములో దేవుని ప్రజలు అనుసరించినట్లు గోత్ర పితరుని మీరు అనుసరించియుంటే ఇదే తప్పిదమును చేసియుండేవారు. ప్రతి యుగములోను, ఆ యుగము కొరకు దేవుడు స్థాపించిన సైన్య నాయకత్వమును మనము అనుసరించవలసియున్నది.

ఆధునిక క్రైస్తవులకు కూడా ఇదే వర్తిస్తుంది. క్రొత్త నిబంధనలో నివసించుచున్న ప్రజలముగా, దావీదునకు గొప్ప కుమారుడైన యేసును మనము అనుసరించుచున్నాము. ఆయన మన కొరకు దేవుడు నియమించిన రాజైయున్నాడు. మరియు దుష్ట శక్తుల మీద యుద్ధము చేయుటలో తన ప్రజలకు నాయకత్వము వహించు విశేషమైన హక్కును దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అయితే మనము దీనిని ఎలా చేస్తాము? యుద్ధము కొరకు మన ప్రస్తుత ప్రణాళిక ఏమిటి? ఎఫెసీ. 6:12లో అపొస్తలుడైన పౌలు క్రొత్త నిబంధనలోని యుధ్ధమును వివరించిన విధానమును వినండి:

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము (ఎఫెసీ. 6:12).

ఇది మునుపటి యుగములలోని ప్రణాళికకు చాలా భిన్నమైనదిగా ఉన్నది, ఆ రోజులలో మోషే మరియు దావీదు వంటి నాయకులు దేవుని ప్రజలను భౌతిక, రక్త మాంసములతో యుద్ధములోనికి నడిపించారు. ఆ రోజులలో ఆత్మీయ యుద్ధములు కూడా ఉండేవి, కాని ఈ నాయకులు దేవుని యొక్క ఆత్మీయ సైన్యముల మీద దాడి చేయలేదు. భిన్నముగా, యేసు సంఘమును భౌతికమైన యుద్ధములలోనికి నడిపించడు. అయితే ఆయన మనలను ఆత్మీయ యుద్ధములోనికి నడిపిస్తాడు, మరియు ఈ ప్రణాళికబద్ధమైన మార్పును మనము నిర్లక్ష్యము చేస్తే మనము దేవుని చిత్తమును ఉల్లంఘించినవారమవుతాము.

క్రొత్త నిబంధన పాత నిబంధనలోని యుద్ధములను మరియు పోరాటములను దేవుడు మరియు సాతానుకు మధ్య మరియు దేవుని ప్రజలు మరియు దేవుని ప్రణాళికను నిర్మూలము చేయుటకు ప్రయత్నించు సాతానుకు మధ్య కలుగు గొప్ప యుద్ధములో భాగముగా పరిగణిస్తుంది. కాబట్టి మీరు ఎఫెసీ 6ను గూర్చి ఆలోచన చేసినట్లయితే, అదే యుద్ధములో భాగమైయున్న నేటి క్రైస్తవులకు కూడా ఇది అనువర్తించబడుతుంది, మరియు మీ పోరాటము సాతాను యొక్క దుష్ట శక్తులతో అని మరియు క్రైస్తవులు ఈ యుద్ధములో స్థిరముగా నిలబడుటకు దేవుని యొక్క సర్వాంగ కవచనమును ధరించుకోవాలని ఎఫెసీ 6 తెలియజేస్తుంది.

— డా. పి. జే. బయ్స్

క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధనలోని ఆత్మీయ మరియు జాతీయ యుద్ధములను తీసుకొని, వాటిని నిజముగా కొన్ని మార్గములలో విప్లవాత్మకముగా చేసి, నేడు ప్రజలు అర్థము చేసుకొను విధానమునకు భిన్నమైన రీతులలో దానిని అనువర్తిస్తారు. మొదటిగా, క్రీస్తు ఆత్మీయ యుద్ధమును చేయుటకు వచ్చాడు. ఆయన చీకటిని అధిగమించుటకు వచ్చాడు అని యోహాను 1 తెలియజేస్తుంది. చీకటి ఆయనను అర్థము చేసుకొనకపోవుట సమస్య కాదుగాని, ఆయనను అధిగమించుటకు ప్రయత్నించుట సమస్య అయ్యున్నది, మరియు ఆయన చీకటికి విరోధముగా యుద్ధము చేస్తాడు — దీనిని మనము విశేషముగా యోహాను సువార్తలో చూస్తాము. కాబట్టి, క్రీస్తు దైవికమైన యోధునిగా వచ్చి లోకాధికారియైన సాతానుతో పోరాడాడు. వాస్తవానికి, యోహాను 12లో ఆయన మహిమపరచబడు ఘడియ వచ్చియున్నది అని యేసు సెలవిచ్చాడు, అది ఆయన సిలువ వేయబడిన ఘడియ, మరియు ఆ సమయమందు ఈ లోకాధికారి పడద్రోయబడతాడు అని ఆయన తెలిపాడు... కాబట్టి ఎఫెసీ. 6లో వలె మన యుద్ధోపకరణములు దేవుని వాక్యము మరియు ప్రార్థన మరియు విశ్వాసము మొదలగునవైయున్నవి అని పౌలు చెప్పునప్పుడు, అది ఇక మీదట రాజకీయ, జాతీయ యుద్ధము కాదు అని, క్రైస్తవులు యుద్ధమును గ్రహించు విషయములో జాతీయవాదులుగా ఉండకూడదు అని చెబుతున్నాడు... ఖడ్గము ఉన్నది మరియు సిలువ కూడా ఉన్నది, మరియు మానవులుగా మనము సిలువను క్రిందపెట్టి ఖడ్గము పట్టుకొనే శోధన కూడా ఉన్నది. అయితే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించని వాడెవ్వడు నా శిష్యుడు కానేరడు అని యేసు సెలవిచ్చాడు. కాబట్టి నేడు యేసు తన సిలువలో, తన భూలోక పరిచర్య మరియు జీవితము అంతటిలో కనుపరచిన విధముగా స్వయమును-సమర్పించుకొనుట ద్వారా, స్వయమును అర్పించు ప్రేమ ద్వారా నేడు మనము ఆత్మీయ యుద్ధములను చేయగలుగుతాము.

— రెవ. మైక్ గ్లోడో

తాము నివసించుచున్న నిబంధన యుగమునకు తగిన విధముగా తన ప్రజలు ఆయనను సేవించాలని దేవుడు కోరాడు. కాబట్టి, పాత నిబంధన చరిత్ర అనేక ప్రధానమైన నిబంధనా యుగములుగా విభజించబడిన విధానమును అర్థము చేసుకొనుట నేడు లేఖనములను అనువర్తించుటకు ప్రాముఖ్యమైయున్నది. దేవుడు చరిత్రను ముందుకు సాగించలేదు అన్నట్లు గడియారమును వెనుకకు త్రిప్పుటకు బదులుగా, క్రీస్తునందు క్రొత్త నిబంధన కాలము వరకు ప్రతి నిబంధనా యుగములో అభివృద్ధి చెందిన విధముగా మనము ప్రతి వేదాంతశాస్త్ర అంశమును కనుగొనాలి.

పాత నిబంధన యొక్క యుగముల సంబంధమైన విభజనల దృష్ట్యా ఆధునిక అనువర్తనమును మరియ పాత నిబంధన యుగములను ఇప్పటి వరకు మనము పరిగణించాము కాబట్టి, యుగముల సంబంధమైన పురోగమనములు ఆధునిక అనువర్తనమునకు సహాయపడవలసిన విధానములను ఇప్పుడు విశదీకరిద్దాము.

యుగముల సంబంధమైన పురోగమనములు అను ఆలోచనను ఉదహరించుటకు, మరొకసారి మనము ఎదుగుచున్న చెట్టును గూర్చి ఆలోచన చేద్దాము. ఈ సారి, ఒక విత్తనము, మరియు ఆ విత్తనములో నుండి ఎదుగుచున్న చెట్టు యొక్క చిత్రము మీ యొద్ద ఉన్నది అని ఊహించుకోండి. విత్తనము మరియు చెట్టు ఎంత భిన్నముగా కనిపిస్తాయి అంటే, అవి వేర్వేరు కాలములలో ఒకే వస్తవు అయ్యున్నవి అని నమ్ముట కష్టమవుతుంది. కాని అవి ఒకటే అయ్యున్నవి. అవి పురోగమనములోని పలు స్థాయిలలో ఉన్న ఒకే జీవము అయ్యున్నవి. వాటి డి ఎన్ ఏలో ఒకే జెనెటిక్ నిర్మాణములు ఉన్నాయి.

ఇదే విధముగా, మునుపటి మరియు తదుపరి పాత నిబంధన యుగముల మధ్య లెక్కలేనన్ని వేదాంతశాస్త్ర భిన్నత్వములు ఉన్నాయి. అయితే వాటి యొక్క వేదాంతశాస్త్ర నిర్మాణములను, లేక డి ఎన్ ఏను మనము నేర్చుకున్నట్లయితే, ఈ వేదాంతశాస్త్ర మార్పులు వాస్తవానికి ఒకే ఎదుగుచున్న విశ్వాసము యొక్క కర్బన సంబంధమైన పురోగమనమును ప్రతిబింబిస్తుంది అని మనము కనుగొంటాము.

పాత నిబంధన యుగముల సంబంధమైన పురోగమనములను మనము నాలుగు భాగములలో విశదీకరిద్దాము. మొదటిగా, ఈ పురోగమనములకు వెనుక ఉన్న రెండు ప్రధానమైన పాత్రలు బైబిలు చరిత్ర అంతటిలో స్థిరముగా ఉంటారు అని చూద్దాము. రెండవదిగా, ఇతరులతో అనుబంధము కలిగియున్న ప్రతి యుగము ఐక్య వృత్తాంత క్రమమును కలిగియుంటుంది అని చూద్దాము. మూడవదిగా, పాత నిబంధన రచయితలు స్వయంగా మునుపటి యుగములను తరువాత శ్రోతలకు అనువర్తించారు అని మనము చూద్దాము. మరియు నాల్గవదిగా, ఈ అనువర్తనములను చేయుటకు పాత నిబంధన రచయితలు ఆధారపడిన యుగముల మధ్య ఉన్న అనుబంధములను మనము ఉద్ఘాటిద్దాము. బైబిలు చరిత్రలోని ప్రధానమైన పాత్రలతో ఆరంభిద్దాము.

లేఖనములో నమోదు చేయబడిన చరిత్ర అంతటిలో, మంచి శక్తులు మరియు దుష్ట శక్తుల మధ్య జరిగిన గొప్ప యుద్ధములో అవే పాత్రలు పాలుపంచుకున్నారు.

అక్షరార్థముగా, ఈ వృత్తాంతములోని మంచి శక్తులకు కథానాయకుడు, అనగా స్వయంగా దేవుడు నాయకత్వము వహించాడు. మరియు దుష్ట శక్తులకు వైరి లేక విలన్ అయిన ఉన్నతమైన దుష్ట సృష్టముయైన సాతానుడు నాయకత్వము వహించాడు, వీడు దేవుడు తన లక్ష్యమును సాధించకుండా ఆటంకము కలిగించుటకు ప్రయత్నిస్తాడు. సాతనుడు బహు బలవంతుడు మరియు యుక్తిగలవాడు. అయినను వాడు ఒక సృష్టము అయ్యున్నాడు, మరియు ఎల్లప్పుడు సృష్టికర్త యొక్క సార్వభౌమ ఆధీనములో ఉంటాడు. అయినను, దైవికమైన వృత్తాంతము ఆరంభమైనప్పుడు సాతానుడు ఆయనకు విరోధముగా నిలబడుటకు దేవుడు వానికి అనుమతినిచ్చాడు.

దేవుడు తన పరలోక సింహాసనము నుండి పాలించుచు, తన పరలోక భవనమును అద్భుతమైన మహిమతో నింపిన సర్వోన్నతమైన సృష్టికర్త-రాజు అయ్యున్నాడు. పరలోకములో ఆయనను సేవించుచున్న సృష్టములు ఇప్పటికే ఆయనను గౌరవించుచున్నవి. అయితే తన మహిమను భూమియందంతటా వ్యాపింపజేయుట ద్వారా తన ఘనతను పెంచుకోవాలని దేవుడు ఎల్లప్పుడూ ఆశించాడు. ఈ లక్ష్యమును సాధించుటకు, దేవుడు తన రాజ్యమును భూమి మీద కూడా వ్యాపించుటకు ప్రణాళికను సిద్ధపరచాడు, తద్వారా భూమి కూడా పరలోకము వలె మారిపోతుంది. అలా జరిగినప్పుడు, భూమికి పైన, మీద మరియు క్రింద ఉన్న ప్రతి జీవి ఆయనకు ముగింపులేని ఆరాధనను మరియు స్తుతిని చెల్లిస్తుంది. ఈ లక్ష్యమును నెరవేర్చుట కొరకు దేవుడు ఆత్మల సమూహమును పురమాయించాడు. అయితే తన భూలోక స్వరూపమైన మానవాళికి దేవుడు భూమిని నింపి, దానిని లోపరచుకొను ఘనతను అనుగ్రహించాడు. భైబిలు అంతటిలో, మనము దేవుని ప్రతినిధులమైయున్నాము, మరియు ఆయన యొక్క ఉన్నతమైన మహిమను కనుపరచుటకు లోకమును సిద్ధపరచుచున్నాము.

సంఘర్షణలో మరొక వైపున, దేవుని కొరకు భూమిని నింపి లోపరచుకొనకుండా మానవాళిని నివారిస్తూ సాతాను దేవుని మహిమ యొక్క వ్యాప్తికి ఆటంకము కలిగిస్తాడు. భూమియందంతటా దేవుని రాజ్య వ్యాప్తిని ఎదురించుట కొరకు, దేవునికి తిరుగుబాటు చేయనట్లు సాతానుడు అనేకమంది ఆత్మలను మరియు మానవులను నడిపిస్తాడు, మరియు దేవుని ఆత్మీయ మరియు మానవ సేవకులతో పోరాటము చేయునట్లు పురికొల్పుతాడు. అబద్ధము, మోసము, అబద్ధ మతము, మరియు పతనమైన మానవుల యొక్క పాపపు వాంఛల వంటి వాటి ద్వారా అనేక విధములుగా వాడు మానవ మద్దతుదారులను పొందుకుంటాడు.

ప్రతి గొప్ప కథలోను ఒక కథానాయకుడు ఉంటాడు, మరియు ఆ కథానాయకునికి విరోధముగా నిలుచువాడు ఉంటాడు. కథలోని ముఖ్య పాత్రయైన కథానాయకుడు ఉంటాడు మరియు అతనికి విరోధముగా నిలిచియుండు వైరి కూడా ఉంటాడు. మరియు బైబిలు వృత్తాంతములన్నిటిలో ఉన్నతమైనదిగా ఉన్నది, మరియు దీనిలో కూడా, మనము పాత నిబంధనలో చదువునట్లు, దేవుడు మరియు ఆయన వాగ్దానము చేసిన మెస్సీయ మరియు మెస్సీయ యొక్క రాకను నివారించుటకు తనకు తోచినదంతయు చేయు అపవాదికి మధ్య జరుగు ఒక యుద్ధమును చూచుట మనకు ఆశ్చర్యము కలిగించకూడదు. కాబట్టి, అపవాది యొక్క తలను చితకద్రొక్కు ఒక వారసుడు స్త్రీకి జన్మిస్తాడు అని ఏదెను తోటలో దేవుడు వాగ్దానము చేసినప్పుడు, అది మొదలుకొని అపవాది ప్రతి మలుపులోనూ దేవునికి వ్యతిరేకముగా నిలబడుట మీరు చూస్తారు. మరి విశేషమైన విషయము ఏమిటంటే, ఒక యౌవ్వన బాలుని విషయములో కూడా, అనేకసార్లు అపవాది ఆ బాలుని యొక్క ప్రాణమును తీయజూశాడు, లేక దేవుని ప్రజలు గొప్పగా దీవించబడుచున్న కాలములో వాడు వారిని చెరలోనికి తెచ్చి నాశనము చేయగోరాడు. పాత నిబంధన అంతటా ఇదే కథ మరలా మరలా పునరావృతమగుట మీరు చూడవచ్చు.

— డా. ఫిలిప్ రైకెన్

పాత నిబంధన చరిత్ర యొక్క వృత్తాంత క్రమములో, ఆరంభము నుండే, దేవుడు కథానాయకుడైయున్నాడు మరియు సాతాను వైరియైయున్నాడు. తోటలో ఆరంభము నుండే దీనిని మీరు చూస్తారు ఎందుకంటే సాతానుడు వచ్చి ఆదాము హవ్వలను శోధిస్తాడు, అయితే దేవునికి విరోధముగా అతడు వారిని శోధిస్తాడు... తరువాత అవును పతనము తరువాత, పాత నిబంధనలో మిగిలిన కాలమంతా కొనసాగు ఒక సంఘర్షణను మనము చూస్తాము, మరియు అది క్రొత్త నిబంధనలోనికి కూడా సర్ప సంతానము మరియు స్త్రీ అనగా హవ్వ సంతతికి మధ్య కూడా కొనసాగుటను మనము చూస్తాము. మరియు అవును ఇది అపవాదికి అవమానము కలిగించి, వానిని సమూలముగా ఓడించిన క్రీస్తులో ముగింపునకు, నెరవేర్పునకు చేరింది... మరియు ఇది పాత నిబంధనలో మరలా మరలా కనబడుతున్న విషయమును మీరు చూడవచ్చు, మరియు సర్ప సంతతి, అనగా దేవుని విరోధులు, దేవుని ఎదురించుటను, ఆయన ప్రజలను ఎదురించుటను, ఆయన ప్రజలతో యుద్ధము చేయుటను, ఆయన ప్రజలను అణగద్రొక్కుటను పాత నిబంధన అంతటా మనము చూస్తాము. కాబట్టి, ఉదాహరణకు, ఇశ్రాయేలు ఫిలిష్తీయులచే అణగద్రొక్కబడి వారితో యుద్ధము చేస్తుంది అని మీరు వినినప్పుడు ఆ యుద్ధము కేవలం ఇశ్రాయేలు మరియు ఫిలిష్తీయులకు మధ్య మాత్రమే జరుగుట లేదు అని మీరు తెలుసుకుంటారు. దాని వెనుక దేవుడు మరియు సాతానుకు మధ్య జరుగు కొనసాగు పోరాటము కలదు అని నేననుకుంటాను.

— డా. బ్రియన్ జే. విక్కర్స్

ఇప్పుడు, దేవునికి సాతానుకు మధ్య జరుగు ఈ సంఘర్షణ యొక్క ప్రాముఖ్యతను ఆధునిక క్రైస్తవులు చాలాసార్లు కనుగొనలేకపోతారు అని మనము ఒప్పుకోవాలి. మన అనుభావిక లోకము దేవుని ద్వారా మరియు ఆయనను సేవించు ఆత్మల ద్వారా, అలాగే సాతాను ద్వారా మరియు వానిని సేవించు ఆత్మల ద్వారా ప్రభావితము చేయబడుతుంది అనే అవగాహన లేకుండానే మనలో చాలామందిమి బైబిలును ఆశ్రయిస్తాము. అయితే లేఖనము యొక్క వాస్తవిక శ్రోతలు ఈ సమస్యను ఎదుర్కోలేదు. ఆత్మీయ మరియు అనుభావిక వాస్తవికతల మధ్య ఉన్న క్రియాశీల పరస్పరాధరములను వారు అర్థము చేసుకున్నారు. వాస్తవానికి, ప్రాచీన లోకములో ఈ నమ్మకము ఎంత సాధారణమైనదిగా ఉండేది అంటే, దీనిని గూర్చిన పూర్తి వివరణను ఇవ్వాలని లేఖన రచయితలు కోరలేదు. కాబట్టి, ఆధునిక ప్రజలముగా, ఈ ఆత్మీయ పోరాటము దృష్ట్యా లేఖనము యొక్క నాటికను మనము చూచుట ఆరంభిస్తే, బైబిలు యొక్క వాస్తవిక శ్రోతలు అప్పటికే ఎరిగియుండిన విషయములను మనము కనుగొనవచ్చు: ఈ సంఘర్షణ బైబిలు బోధించు ప్రతి మాటలో కనిపిస్తుంది.

లేఖనము యొక్క ప్రధానమైన పాత్రలను మనస్సులో ఉంచుకొని, పాత నిబంధనలోని యుగముల సంబంధమైన పురోగమనములలోని రెండవ విషయమును ఇప్పుడు మనము చూద్దాము: బైబిలులోని వృత్తాంత క్రమము.

నిబంధనా యుగముల మధ్య లెక్కలేనన్ని భిన్నత్వములు ఉన్నప్పటికీ, ఈ భిన్నత్వములన్నీ దేవునికి సాతానుకు మధ్య ఉన్న సంఘర్షణను గూర్చిన ఐక్య, సమస్తమును కలిగియున్న కథనములో చక్కగా అమర్చబడతాయి. సౌకర్యముగా ఉండుటకు, లేఖనము యొక్క నిబంధనా యుగములను అమితమైన స్తుతులను పొందుటకు దేవుడు తన మహిమను వ్యాపింపజేయు బైబిలు వృత్తాంతములోని ప్రధానమైన అధ్యాయములుగా పరిగణిద్దాము.

నాటిక మొదటి అధ్యాయము, అనగా ఆదాము యుగముతో ఆరంభమవుతుంది. ఈ అధ్యాయము యొక్క ఆరంభములో, దేవుడు మొదటి మానవులను భూమి మీద తన దృశ్య మహిమ నిలిచియున్న ఒక స్థలమందు ఉంచాడు: ఆయనకు పవిత్రమైన స్థలముగా పని చేసిన ఏదెను తోట. తాను సృష్టిని చేసిన ఉద్దేశ్యమునకు అనుగుణంగా, భూమిని లోపరచుకొని నింపుట ద్వారా తన పరిశుద్ధమైన తోట యొక్క సరిహద్దులను వ్యాపింపజేయమని దేవుడు ఆదాము హవ్వలకు ఆజ్ఞాపించాడు. తన దృశ్యమైన మహిమగల సన్నిధిని వ్యక్తపరచుటకు భూమిని దేవుని కొరకు తగిన స్థలముగా చేయుట లక్ష్యమైయుండెను.

అవును, మొదటి మానవులను దేవుని మీద తిరుగుబాటు చేయునట్లు పురికొల్పుట ద్వారా సాతానుడు ఈ ప్రణాళికను వ్యతిరేకించాడు. మరియు దీనికి స్పందనగా, దేవుడు తన సృష్టిని శపించాడు మరియు మానవాళి యొక్క పనిని కష్టతరము చేశాడు. ఆ సమయము మొదలుకొని మానవాళి వ్యతిరేక గుంపులుగా విభజించబడుతుంది అని ఆయన ప్రకటించాడు: స్త్రీ సంతతిలో దేవుని ఉద్దేశ్యములను చేయు ప్రజలు భాగమైయుంటారు మరియు సర్పము యొక్క సంతానములో సాతాను యొక్క తిరుగుబాటులో పాలివారైనవారు ఉంటారు. అదే సమయములో, స్త్రీ సంతతి తుదకు సాతాను మరియు వాని సంతతి మీద జయమును పొందుతుంది అని కూడా దేవుడు వాగ్దానము చేశాడు.

పాత నిబంధనలోని మిగిలిన నిబంధన యుగములు బైబిలు వృత్తాంత క్రమములో ముఖ్య భాగముగా పని చేస్తాయి.

రెండవ అధ్యాయమైన, నోవహు నిబంధన యుగములో, సాతానును అనుసరించి మానవాళి చేసిన ఘోరమైన హింస నుండి దేవుడు భూమిని శుద్ధి చేశాడు. స్త్రీ సంతతిలో శేషమును, అనగా నోవహును అతని కుటుంబమును ఆయన విమోచించాడు, మరియు మానవులు భూమిని నింపి లోపరచుకొనుచుండగా తదుపరి భ్రష్టత్వమును వ్యతిరేకించమని చెబుతూ ఒక స్థిరమైన లోకమును స్థాపించాడు.

మూడవ అధ్యాయమైన, అబ్రాహాముతో నిబంధన యుగములో, సాతాను మరియు వాని అనుచరులతో పోరాడుటలో మానవాళికి నాయకత్వము వహించుటకు స్త్రీ సంతతిలో భాగముగా దేవుడు అబ్రాహాము కుటుంబమును ఎన్నుకున్నాడు. అబ్రాహామును వారసులను వృద్ధి చేసి కనాను దేశమును వారికిఇచ్చుదునని దేవుడు వాగ్దానము చేశాడు. ఆ భౌగోళిక ఆరంభ బిందువు నుండి, వారు తుదకు దేవునికి మరియు ఆయన ప్రణాళికకు ఎదురయ్యే ప్రతి వ్యతిరేకతను అధిగమిస్తారు. వారు సర్వభూమిని స్వాధీనము చేసుకొని, మానవ జాతిలోని ప్రతి కుటుంబమునకు దేవుని ఆశీర్వాదములను వ్యాపింపజేస్తారు.

నాల్గవ అధ్యాయమైన మోషేతో నిబంధన యుగములో, ఐగుప్తీయులు మరియు వారి దయ్యపు దేవతల మీద దేవుడు ఇశ్రాయేలుకు గొప్ప విజయమును అనుగ్రహించాడు. ఆయన ఇశ్రాయేలును దేశముగా స్థాపించి, అది నడిపించబడుటకు తన ధర్మశాస్త్రమును అనుగ్రహించి, కనానీయులను తరిమికొట్టమని వారిని ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయులు కనానులోనికి ప్రవేశించుచుండగా, దేవుడు వారికి కనానీయుల మీద మరియు వారు సేవించు దయ్యపు శక్తుల మీద జయమును అనుగ్రహించాడు. ఆయన ఇశ్రాయేలీయులను దేశములో స్థిరపరచి, వృద్ధి చేసి, భూమియందంతటా దేవుని రాజ్యమును వ్యాపింపజేయు అంతిమ లక్ష్యము వైపుకు వారిని నడిపించాడు.

ఐదవ అధ్యాయమైన, దావీదుతో చేయబడిన నిబంధన యుగములో, దేవుని ప్రజలను పాలించుటకు, మరియు వారిని సాతానును సేవించిన దేశముల మీద యుద్ధములో మరింత ముందుకు నడిపించుట కొరకు దావీదు కుటుంబము అభిషేకించబడింది. దావీదు రాజవంశము కనానులో భద్రతను తెచ్చింది మరియు లోకము కొరకు దేవుని ప్రణాళికకు స్పందనగా ఇశ్రాయేలు యొక్క సరిహద్దులను వ్యాప్తిపరచుట కొనసాగించింది. విచారకరముగా, కాలక్రమములో ఇశ్రాయేలు రాజులు దేవునిపై విచ్చలవిడిగా తిరుగుబాటు చేసి, దేవుడు వారి రాజ్యమును నాశనము చేసి వారిని చెరలోనికి పంపునట్లు పురికొల్పబడుటకు కారణమయ్యారు. చెర కాలములో, వారు అన్య రాజ్యములు మరియు వారి దేవతల యొక్క బానిసత్వములో శ్రమను అనుభవించారు. తుదకు, దేవుడు చెరను ముగించుటకు నిర్ణయించుకొని కనానులో రాజ్యమును పునరుద్ధరించుటకు ప్రయత్నించునట్లు ఆయన ఒక చిన్న శేషమును వాగ్దాన దేశములోనికి తిరిగి తీసుకొని వచ్చాడు. అయితే ఆ శేషము కూడా దేవునికి నమ్మకముగా ఉండుటలో విఫలమైయ్యింది, కాబట్టి దుష్టత్వము యొక్క బానిసత్వములో చెర కొనసాగింది.

పాత నిబంధనలో ప్రస్తావించబడిన చివరి అధ్యాయము, ఇశ్రాయేలు యొక్క శేషము పశ్చాత్తాపపడి దావీదు యొక్క గొప్ప కుమారుడైన మెస్సీయ లేక క్రీస్తు, వారి పాపముల కొరకు ప్రాయశ్చిత్తము చేసిన తరువాత స్థాపిస్తానని దేవుడు వాగ్దానము చేసిన ఆ తుది క్రొత్త నిబంధన అయ్యున్నది. మెస్సీయ ఇశ్రాయేలును సాతాను మీద, దుష్టశక్తులు మరియు వాటిని సేవించు దేశముల మీద అంతిమ విజయములోనికి నడిపిస్తాడు. ఆయన సాతానును చితకద్రొక్కి వానిని అనుసరించినవారందరికీ తీర్పుతీర్చుతాడు. చివరికి, మెస్సీయ సమస్తమును నూతనముగా చేసి, దేవుని ప్రజలతో కలసి భూమిని పాలిస్తాడు. దేవుని మహిమ సృష్టిని నింపుతుంది, మరియు ప్రతి జీవి ఆయనను అంతములేకుండా స్తుతిస్తుంది.

పాత నిబంధనలోని నిబంధన యుగముల మధ్య భేదములు ఉన్నప్పటికీ, ఒక సుదీర్ఘమైన కథనములోని అధ్యాయముల వలె ఈ యుగములు ఒకదాని మీద మరొకటి నిర్మించబడతాయి అని ఈ బైబిలు వృత్తాంత సారాంశము మనకు చూపుతుంది. ఒకదానినొకటి వ్యతిరేకపరచుటకు, తొలగించుటకు, లేక చిన్నచూపుచూచుటకు బదులుగా, చరిత్రలోని ఈ దశలలో ప్రతిది లేఖనము యొక్క వృద్ధి చెందుచున్న ఏక వృత్తాంతమునకు తోడ్పాటునిస్తాయి.

ఇప్పటి వరకు, పాత నిబంధనలోని యుగముల సంబంధమైన పురోగమనముల వెనుక ఉన్న ముఖ్య పాత్రలను మనము పరిగణించాము, మరియు ఐక్య వృత్తాంత క్రమములో ప్రతి యుగము ఇతరులతో అనుబంధము కలిగియున్నది అని మనము చూపాము. ఇప్పుడు పాత నిబంధన రచయితలు చాలాసార్లు మునుపటి యుగములను తదుపరి శ్రోతలకు అనువర్తించారు అని చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.

ఈ పాఠము యొక్క ఆరంభములో, ఈ విధంగా చెబుతూ మనము పాత నిబంధన యొక్క అనువర్తనమును క్రోడీకరించిన విధానము మీకు గుర్తుండే ఉంటుంది: “ఎన్నడును మునుపటి లోనికి తిరిగివెళ్లవద్దు, కాని మునుపును ఏనాడు మరిచిపోవద్దు.” మనము మునుపటిలో జీవించుట లేదు, మరియు ఈ కారణము చేత మనము మునుపటి కాలములలో జీవించుచున్నాము అన్నట్లు ఆలోచించకూడదు, ప్రవర్తించకూడదు లేక భావించకూడదు. అయితే మునుపటిని భాగముగా కలిగియున్న వృత్తాంతములో మనము భాగమైయున్నాము. మరియు పాత నిబంధన రచయితలకు ఇది బాగా తెలుసు. కాలక్రమములో ఏక సత్య దేవుడు ఏక సత్య మతము ద్వారా తనను తాను బయలుపరచుకొనుచున్నాడు అని వారు గుర్తించారు. అనగా మునుపు దేవుడు చేసిన మరియు చెప్పిన విషయములు కాలమంతటిలో దేవుని ప్రజలకు మార్గదర్శకమును అందిస్తాయి. దీని వెలుగులో, పాత నిబంధన రచయితలు మునుపు నేర్చుకున్న విషయములను తీసుకొని, తరచుగా వాటిని తమ దినములకు అనువర్తించారు. దీనిని గూర్చి ఈ విధంగా ఆలోచించండి: పాత నిబంధనలో ఆరు ప్రధానమైన నిబంధనా యుగములు ప్రస్తావించబడినవి. అయితే మూడు ఆరంభ యుగములను గూర్చి — ఆదాము, నోవహు, మరియు అబ్రాహాము కాలములు — మనము కలిగియున్న సమాచారమంతా మోషే, దావీదు మరియు క్రొత్త నిబంధన యొక్క తదుపరి యుగములలో వ్రాయబడిన బైబిలు గ్రంథములలో నుండి వెలువడుతుంది.

యుగముల సంబంధమైన పురోగమనములను గూర్చి వారు కలిగియుండిన అవగాహనను బయలుపరచుటకు పాత నిబంధన రచయితలు తమ రచనలలో చేర్చిన రెండు సామాన్య విషయములను మనము పరిగణిద్దాము. మొదటిగా, పాత నిబంధన రచయితలు మునుపటిని గూర్చి వ్రాశారని మనము చూద్దాము. మరియు రెండవదిగా, వారు ప్రస్తుతము కొరకు వ్రాశారని మనము చూద్దాము. అనగా, వారి ప్రస్తుతములో, వారి దినములలో నివసించిన శ్రోతల కొరకు వారు వ్రాశారు. ముందుగా పాత నిబంధన రచయితలు మునుపటిని గూర్చి వ్రాశారు అను వాస్తవమును చూద్దాము.

పాత నిబంధన గ్రంథములన్నీ విశేషముగా మునుపటిని గూర్చి మాట్లాడతాయి. పంచగ్రంథమును పరిగణించండి — ఆదికాండము, నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండము గ్రంథములు. తన నిబంధన యుగములో మోషే ఈ గ్రంథములన్నిటిని వ్రాశాడు. అయితే ఆదికాండములో అతడు చాలా కాలము క్రితము, ఆదాము, నోవహు మరియు అబ్రాహాము నిబంధనల యుగములలో జరిగిన సన్నివేశములను నివేదించాడు. నిర్గమకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయపదేశకాండములలో, అతడు చరిత్రలో వెనుకకు అంత దూరము వెళ్లలేదు. అయితే అక్కడ కూడా గ్రంథములు వ్రాయబడుటకు ముందు జరిగిన సన్నివేశముల మీద అతడు దృష్టిపెట్టాడు.

మిగిలిన పాత నిబంధన గ్రంథములన్నీ దావీదు నిబంధన యుగములో వ్రాయబడినవి. మరియు అవి కూడా తమ శ్రోతలను గతంలోనికి తీసుకొనివెళ్ళాయి. ఉదాహరణకు, యోబు గ్రంథము దావీదు యుగమునకు చెందిన రాజుల పరిపాలన కాలములో వ్రాయబడియుండవచ్చు. అయితే అది రాజుల పరిపాలనకు చాలా కాలము క్రితం అబ్రాహాము యుగములో జరిగిన సన్నివేశములను నివేదిస్తుంది. యెహోషువ, న్యాయాధిపతులు, మరియు రూతు గ్రంథములు దావీదు నిబంధనా యుగములో వ్రాయబడినవి, కాని దావీదు రాజు అగుటకు ముందు మోషే యుగము యొక్క ముగింపు కాలములో జరిగిన సన్నివేశములను నివేదిస్తాయి. సమూయేలు, రాజులు, దినవృత్తాంతములు, ఎజ్రా, నెహెమ్యా గ్రంథములు మునుపు ఆ మధ్య కాలములో జరిగిన సన్నివేశములను శ్రోతలకు జ్ఞాపకము చేశాయి. యెషయా నుండి మలాకీ వరకు ఉన్న పాత నిబంధన ప్రవక్తల గ్రంథముల విషయములో కూడా ఇది వాస్తవమైయున్నది. ప్రవక్తలు ముందుగా ప్రవచన పలుకులు మరియు కార్యముల ద్వారా పరిచర్య చేశారు, మరియు తరువాత మాత్రమే వారి సమకాలీన శ్రోతలను వ్యాప్తిపరచుట కొరకు వారి పరిచర్యలు నమోదు చేయబడినవి. కాబట్టి, వారి గ్రంథములు చాలా వరకు అప్పటికే ఇవ్వబడిన ప్రవచన కార్యములు మరియు ఉపన్యాసముల యొక్క వ్రాయబడిన నివేదికలుగా ఉన్నాయి. ఇంచుమించు ఇదే విధముగా, సామెతలు, పరమగీతము మరియు ప్రసంగి గ్రంథములు కూడా మునుపు కొంత కాలము క్రితము జరిగిన సన్నివేశముల యొక్క వేదాంతశాస్త్ర విశ్లేషణలైయున్నవి.

పాత నిబంధన రచయితలు మునుపటిని గూర్చి వ్రాశారు అని ఇప్పుడు మనము అర్థము చేసుకున్నాము గనుక, వారు వర్తమానము కొరకు, అనగా తమ సమకాలీన శ్రోతల కొరకు కూడా వ్రాశారు అను వాస్తవమును ఇప్పుడు మనము చూద్దాము.

బైబిలు రచయితలు లేఖనములను వ్రాయుట ఆరంభించినప్పుడు ... వారు పాఠకులు, అనగా తమ ప్రజల యొక్క అవసరతలను తీర్చుట కొరకు వ్రాశారు. మరియు వారు ఊరకనే కూర్చొని వ్రాయుట అంటే ఇష్టము కాబట్టి మాత్రమే వ్రాయలేదు. బదులుగా, నేర్చుకొనుటకు, నడిపింపు కొరకు మరియు నిర్మాణము కొరకు ప్రజలు కలిగియుండిన అవసరతలను తీర్చుటకు వారు వ్రాశారు. ఈ కారణం చేత, ప్రతి గ్రంథము వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశ్యము ఉన్నది. ప్రేరణ అనునది “కేవలం కూర్చొని వ్రాయుటకు” సంబంధించినది మాత్రమే కాదు. కాదు, అక్కడ ఒక అవసరత ఉన్నది కాబట్టే వ్రాయుట జరిగినది — “లేచి వ్రాయుము.” ఇందు మూలముగానే ప్రతి రచయిత తన ప్రజల యొక్క అవసరతను పరిగణలోనికి తీసుకొని ప్రజలకు అర్థమైన రీతిలో సమాచారమును అందించారు.

— డా. ఘస్సన్ ఖలాఫ్, అనువాదము

లేఖన రచయితలు వారు వ్రాయుచుండిన శ్రోతల యొక్క పరిస్థితులను దగ్గరగా పరిశీలించారు. దీనిని మనము అతిగా ఉద్ఘాటించవలసిన పనిలేదు. అవి వాస్తవిక పరిస్థితుల కొరకు ఎంతగా ఉద్దేశించబడినవి అంటే, తదుపరి శ్రోతలకు అవి ఎలాంటి ప్రయోజనమును కలిగించవు అని మనము అనకూడదు. ఇతర స్థలములతో పాటు రోమా 15:4లో పౌలు మాటల ప్రకారం వ్రాయబడిన సమస్తము మన ప్రోత్సాహము కొరకు వ్రాయబడినవి అని మనకు తెలుసు. అయినను, తాము వ్రాయుచున్న శ్రోతల యొక్క జీవితములలో జరుగుచున్న విషయముల మీద లేఖన రచయితలు విశేషమైన దృష్టిని పెట్టారు... ఉదాహరణకు, ఆదికాండము ఐగుప్తు నుండి బయటకు వచ్చిన ప్రజల సమూహమునకు వ్రాయబడింది. వారు ఇంతకు ముందే భూమి మీద ఉన్న అత్యంత బలవంతుడైన చక్రవర్తికి కోపము పుట్టించారు. వారు తమ ఇతర విరోధులతో యుద్ధము చేయవలసియుండిన ఒక భూమిలోనికి ప్రవేశించుటకు సిద్ధముగా ఉన్నారు. వారు దేనిని గూర్చి కూడా భయపడవలసిన పనిలేదు అని వారు తెలుసుకొనవలసియుండెను, కాబట్టి సమస్తమును సృజించిన, సర్వదేశములను నియంత్రణలో ఉంచుకొనిన, పితరులకు వాగ్దానములను చేసి, ఆ వాగ్దానములను నెరవేర్చిన దేవుని గూర్చి తెలియజేస్తూ ఆదికాండము ఆరంభమవుతుంది. ఇశ్రాయేలు భయపడవలసిన పనిలేదు... కాబట్టి, ఒకసారి మనము వాస్తవిక శ్రోతల యొక్క పరిస్థితులను తెలుసుకుంటే, లేఖనము చెప్పు విషయములను మరియు అది ఎందుకు చెబుతుందో తెలుసుకొనుటలో అది సహాయపడుతుంది. తరువాత మనము ఇలాంటి ప్రశ్నలను అడగవచ్చు, ఐగుప్తును విడచిన తరువాత అరణ్యములో ఇశ్రాయేలు ఎదుర్కొనిన పరిస్థితులను పోలిన పరిస్థితులను మనము ఏ సందర్భములలో అనుభవించుచున్నాము? ... మరియు దేవుడు ఒక కాపరి వలె తన ప్రజల మీద శ్రద్ధ వహించు విధానమును మరియు మన అవసరతల కొరకు దయ చూపు విధానమును మనము చూచుట ఆరంభిస్తాము.

— డా. జిమ్మీ అగన్

మునుపు బైబిలు విశ్వాసము యొక్క కర్బన సంబంధమైన పురోగమనములో ఆరంభ దశలకు ప్రాతినిధ్యము వహిస్తుంది అని లేఖన రచయితలు అర్థము చేసుకున్నారు. అయితే వారి దినములలో నివసించిన శ్రోతలకు పరిచర్య చేయుట కొరకు వారు అన్నిటి కంటే ఎక్కువగా పిలువబడ్డారు. కాబట్టి, వారి వాస్తవిక శ్రోతల జీవితముల కొరకు వంతెనలు నిర్మించిన విధముగా వారు మునుపటిని గూర్చి వ్రాశారు. వారు చారిత్రిక ప్రజలను, క్రియలను, మాటలను, వ్యవస్థలను మొదలగువాటిని గూర్చి చారిత్రిక అంశములు వారి శ్రోతల యొక్క జీవితములకు అనుబంధపరచబడు విధానములలో ఉద్ఘాటించారు. చాలా వరకు, ఈ వంతెనలను నిర్మించుట కొరకు బైబిలు రచయితలు ఉపయోగించిన సాహిత్య పద్ధతులను గూర్చి పాత నిబంధన గ్రంథముల యొక్క వాస్తవిక శ్రోతలు సుపరిచితులైయున్నారు. కాబట్టి, రచయితలు ఈ అనుబంధములను వివరించవలసిన అవసరతను చూడలేదు. మరికొన్ని సార్లు, మునుపటికి మరియు ప్రస్తుతానికి మధ్య ఉన్న అనుబంధములను ఎత్తిచూపు కొన్ని చిన్న ఆధారములను రచయితలు అందించారు. మరికొన్ని వాక్యభాగములలో, మునుపు వారికి ఏ విధంగా అనువర్తించబడుతుందో చూచునట్లు తమ శ్రోతలకు సహాయము చేయుట కొరకు బైబిలు రచయితలు సూటైన వివరణలను అందించారు.

తమ సొంత ప్రస్తుత శ్రోతలతో మునుపటిని అనుసంధానము చేయుటకు పాత నిబంధన రచయితలు మార్గములను కనుగొనిన విధముగానే, ఆధునిక క్రైస్తవులు కూడా మునుపటి కాలములోని రచనలను తమకు అనుసంధానము చేసుకోవాలి. అవును, ఆధునిక అనువర్తనము మన దినములలో జరుగుతున్న విషయముల మీద దృష్టిపెడుతుంది. అయితే అది ఎల్లప్పుడూ మునుపటి మార్గముల మీద ఆధారపడియుంటుంది.

ఆధునిక లోకములో నివసించు దేవుని ప్రజలముగా, మన విశ్వాసము దేవుడు చాలా కాలము క్రితం బయలుపరచిన దానితో లోతైన అనుబంధమును కలిగియున్నది. మునుపటితో వ్యవహరించు పాత నిబంధన గ్రంథముల యొక్క ఆధునిక అనువర్తనమునకు మనము అంకితభావమును కలిగియున్నాము. మరియు మనము క్రొత్త నిబంధన గ్రంథములను అనువర్తించునప్పుడు కూడా, మనము మునుపటి వైపునకే చూచుచున్నాము. ఇప్పుడు, ప్రకటన గ్రంథము వంటి కొన్ని పుస్తకములు భవిష్యత్తు మీద ఎక్కువ దృష్టిని పెడతాయి. అయితే ప్రకటన గ్రంథము కూడా దాని రచయిత అయిన యోహాను మునుపటికి చెందిన తన వాస్తవిక శ్రోతలకు అనువర్తించిన దర్శనముల యొక్క నివేదిక అయ్యున్నది. ఏదో ఒక విధముగా, లేఖనములోని ప్రతి గ్రంథము దేవుడు మునుపు చేసిన కార్యముల మీద దృష్టిపెడుతుంది. కాబట్టి, ఈ గ్రంథములను ఆధునిక లోకమునకు అనువర్తించుటకు, మనము మునుపటి మీద కూడా దృష్టిపెట్టవలసియున్నది.

ఇప్పటి వరకు, యుగముల సంబంధమైన పురోగమనములను గూర్చిన మన చర్చ పాత నిబంధనలోని యుగముల సంబంధమైన పురోగమనముల వెనుక ఉన్న ముఖ్య పాత్రల మీద, లేఖనము యొక్క ఐక్య వృత్తాంత క్రమము మీద, మరియు పాత నిబంధన రచయితలు మునుపటి యుగములను తమ సమకాలీన శ్రోతలకు అనువర్తించారు అను వాస్తవము మీద దృష్టి పెట్టింది. కాబట్టి, మునుపటికి మరియు ప్రస్తుతానికి మధ్య బైబిలు రచయితలు వెలికితీసిన అనుబంధముల రకముల మీద దృష్టిపెట్టుటకు మనము ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము.

మునుపటికి మరియు ప్రస్తుతానికి మధ్య పాత నిబంధన రచయితలు వెలికితీసిన మూడు రకముల అనుబంధములను గూర్చి మనము మాట్లాడదాము. మొదటిగా, వారి విశ్వాసములోని పలు కోణములకు చారిత్రిక నేపథ్యములను వారు తమ శ్రోతలకు అందించారు. రెండవదిగా, వారి శ్రోతలు అనుకరించవలసిన మరియు తిరస్కరించవలసిన కొన్ని మాదిరులను వారు ఇచ్చారు. మరియు మూడవదిగా, వారి శ్రోతల అనుభవముల యొక్క ఆకాంక్షలను వారు అందించారు. బైబిలు రచయితలు తమ శ్రోతలకు చారిత్రిక నేపథ్యములను ఇచ్చిన విధానమును చూస్తూ ఆరంభిద్దాము.

వారి శ్రోతల యొక్క ప్రస్తుత అనుభవముల యొక్క నేపథ్యమును లేక మూలమును వివరించుట ద్వారా పాత నిబంధన ప్రవక్తలు చాలాసార్లు మునుపటి యొక్క ఔచిత్యమును చూపారు. ఉదాహరణకు, మోషే ఆదాము హవ్వల వివాహమును గూర్చి వర్ణించిన తరువాత, ఈ సన్నివేశమును తన శ్రోతలతో సూటిగా అనుసంధానము చేయుటకు అతడు ఒక క్షణం ఆగాడు. ఆది. 2:24లో మోషే వ్రాసిన మాటలను వినండి:

ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురు (ఆది. 2:24).

ఈ వచనములో, ఆదాము నిబంధనా యుగమునకు చెందిన ఒక విషయము మోషే యుగమునకు చెందిన శ్రోతలకు ఏ విధంగా ఔచిత్యముగా ఉన్నదో మోషే వివరించాడు. విశేషముగా, ఆదాము హవ్వల వివాహము మోషే దినములలో కూడా కొనసాగిన నిలిచియుండు వివాహ ఆజ్ఞను స్థిరపరచింది.

తన వాస్తవిక శ్రోతల కొరకు మోషే ఈ సన్నివేశమును ఒక నేపథ్యముగా ఉపయోగించుకున్నాడు అని ఒకసారి మనము చూడగలిగితే, దానిని మనము అదే విధముగా మనకు కూడా అనుసంధానము చేసుకోవచ్చు. ఆదాము హవ్వల వివాహము ప్రాచీన ఇశ్రాయేలులో వివాహము కొరకు నేపథ్యమైయున్నది, మరియు మన దినములలో కూడా వివాహమునకు నేపథ్యమైయున్నది.

ఇతర సందర్భాలలో, చారిత్రిక వ్యక్తులను దేవుడు ఆమోదించుటను లేక తిరస్కరించుటను బయలుపరచుటకు బైబిలు రచయితలు నేపథ్యములను ఉపయోగించారు. ఉదాహరణకు, రూతు గ్రంథము రూతులోగాని, నయోమిలోగాని లేక బోయజులో గాని ఎలాంటి తప్పిదము లేదు అని తెలియజేస్తూ, దేవుని సంపూర్ణ ఆమోదమును వారు కలిగియుండిరి అని చూపుతుంది. దీనికి కారణమును మనము గ్రంథము యొక్క ముగింపులో చూస్తాము. రూతు 4:20-21లో రూతు గ్రంథమును ముగించు వంశావళిని వినండి:

శల్మాను బోయజును కనెను, బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను (రూతు 4:20-21).

బోయజు రాజైన దావీదు యొక్క పితరుడు అని ఈ వంశావళి తెలియజేస్తుంది. ఈ ముగింపు మోషే యుగములో జరిగిన సన్నివేశములను దావీదు నిబంధనా కాలములో నివసించిన వాస్తవిక శ్రోతల కాలమునకు అనుసంధానము చేస్తుంది.

మొత్తము మీద, దావీదు మొయాబీయురాలైన రూతు వారసత్వములో జన్మించాడు కాబట్టి దావీదు రాజరికము యొక్క మాన్యతను గూర్చి తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఇశ్రాయేలులో ఆమె యొక్క చేరిక అన్ని విధములుగా మాదిరికరమైనది అని, దేవుడు ఆమెను పూర్తిగా ఆమోదించాడు అని రూతు గ్రంథములోని వృత్తాంతము కనుపరుస్తుంది. ఈ విధంగా, ఇశ్రాయేలు రాజుగా దావీదు యొక్క ఎంపికను పునరుద్ఘాటించిన నేపథ్యమును రూతు గ్రంథము అందిస్తుంది.

మరొకసారి, తన వాస్తవిక శ్రోతల కొరకు రూతు గ్రంథము యొక్క రచయిత నిర్మించిన వంతెనను ఆధునిక అనువర్తనములో విస్తరింపజేయుటకు మనకు అవకాశము ఉన్నది. దేవుడు రూతును ఆమోదించుట దావీదు కాలములో దావీదు యొక్క రాజవంశము యొక్క మాన్యతను చూపిన విధముగానే, మన దినమున దావీదు గొప్ప వారసుడైన యేసు యొక్క రాజరికమును ఆమోదించుటకు మనకు నేపథ్యమును అందిస్తుంది.

మునుపటికి మరియు ప్రస్తుతానికి మధ్య రచయితలు వెలికితీసిన అనుబంధములు నేపథ్యములను అందించుటతో పాటుగా, తమ వాస్తవిక శ్రోతలు అనుకరించుటకు లేక తిరస్కరించుటకు మాదిరులను కూడా అందించాయి.

కొన్నిసార్లు మనము బైబిలు వృత్తాంతమును చదువునప్పుడు మనలను మనము ఇలా అడుగుతుంటాము, “ఇప్పుడు, ఇది మంచి మాదిరా లేక చెడ్డ మాదిరా? బైబిలులో ఉన్న ఈ వ్యక్తి చేసినట్లు నేను చేయాలా, లేక దీనికి భిన్నమైన పనిని చేయాలా?” మరియు ఈ ప్రశ్నకు పలు వాక్యభాగములలో పలు విధములుగా జవాబు ఇవ్వవచ్చు, కాని అనేక బైబిలు వృత్తాంతములకు అనువర్తించబడు ఒక చాలా ప్రాముఖ్యమైన నియమము ఇక్కడ ఉన్నది, మరియు దానిని నేను ప్రతిఫలముల నియమము అని పిలుస్తాను, మరియు అది వృత్తాంతము యొక్క ముగింపు వైపుకు చూసి ఆ వ్యక్తికి ఏమి జరుగుతుందో చూచుట అయ్యున్నది. వారు దేవుని ఆశీర్వాదమును పొందుకుంటారా లేక దేవుని తీర్పును పొందుకుంటారా? మరియు చాలాసార్లు ఒక వ్యక్తి మంచి మాదిరిని ఇచ్చుచున్నాడా లేక చెడ్డ మాదిరిని ఇచ్చుచున్నాడా అని కనుగొనుటకు ఆధారమునిచ్చుటకు ఇది మనకు సరిపోతుంది.

— డా. ఫిలిప్ రైకెన్

మోషే యుగములోని సన్నివేశములను దావీదు యుగములో నివసించుచున్న వాస్తవిక శ్రోతల కొరకు నమోదు చేయు యెహోషువ గ్రంథములోని రెండు మాదిరులను ఉదాహరణలుగా చూద్దాము. యెహోషువ 2-6లో యెరికో పట్టణము కొరకు చేయబడిన యుద్ధములో ఇశ్రాయేలు యొక్క పని తీరుని గూర్చి యెహోషువ గ్రంథ రచయిత ఒక అనుకూలమైన మాదిరిని, మరియు యెహోషువ 7లో హాయి పట్టణము కొరకు చేయబడిన యుద్ధములో వారి పని తీరును గూర్చి ప్రతికూలమైన మాదిరిని ఇచ్చాడు.

యెరికో పట్టణము కొరకు చేయబడిన యుద్ధమును గూర్చిన సుదీర్ఘమైన కథనములో, యెహోషువగాని, వేగులవారుగాని, ఇశ్రాయేలు సైన్యముగాని దేవుని చిత్తమునకు విరోధముగా ఏదైనా పని చేసినట్లు ఎలాంటి సూచనా లేదు. యెరికోకు కొన్ని మైళ్ల దూరములో గిల్గాలు వద్ద సున్నతికి సమర్పించుకొని వారు దేవునికి తమ సంపూర్ణ భక్తిని కనుపరచారు, మరియు దేవుడు ఆజ్ఞాపించిన విధముగా లేవీయులు పాడుచు, కేకలు వేయుచు, బూరలు ఊదుచు యెరికో చుట్టూ తిరుగుచుండగా వారిని వెంబడించారు. కాబట్టి, యెహోషువ 6:27లో ఈ అనుకూలమైన మాటలతో యెహోషువ గ్రంథ రచయిత వృత్తాంతమును ముగించాడు:

యెహోవా యెహోషువకు తోడై యుండెను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించెను (యెహోషువ 6:27).

అయితే యెహోషువ 7:1లో హాయి పట్టణము కొరకు జరిగిన యుద్ధమును గూర్చిన కథనము ఏ విధంగా ఆరంభమైయ్యిందో వినండి:

శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటుచేసిరి (యెహోషువ 7:1).

ఈ వచనము యెరికో కొరకు జరిగిన యుద్ధములో ఇశ్రాయేలు యొక్క అనుకూలమైన మాదిరిని హాయి పట్టణము కొరకు జరిగిన యుద్ధములో ఇశ్రాయేలు యొక్క ప్రతికూలమైన మాదిరితో వ్యత్యాసముగా చూపుతుంది.

ఇశ్రాయేలు హాయి పట్టణము మీద ముందు దాడి చేసినప్పుడు, యుద్ధములో వచ్చిన కొల్లసొమ్ము అంతా దేవుని కొరకు ప్రత్యేకించబడాలని దేవుడిచ్చిన ఆజ్ఞకు తిరుగుబాటుగా యెరికో నుండి ఆకాను కొంత సొత్తును దొంగిలించుట వలన ఇశ్రాయేలు యొక్క మహా సైన్యము ఓటమి చవిచూసింది. వారు ముందు దేవుని ఎదుర్కొని, తమ పాపమును ఒప్పుకొని, ఆకాను మరియు అతని కుటుంబమును తీవ్రముగా శిక్షించినంత వరకు యెహోషువా మరియు ఇశ్రాయేలు యుద్ధములో హాయి పట్టణమును ఓడించలేదు.

యెరికో మరియు హాయి పట్టణముల కొరకు జరిగిన యుద్ధములలోని భిన్నత్వములు యెహోషువ యొక్క పాఠకులకు అనుకరించుటకు అనుకూలమైన మాదిరిని మరియు తిరస్కరించుటకు ప్రతికూలమైన మాదిరిని అందించాయి. ఈ మాదిరులను గమనించుట ద్వారా, దావీదు యుగములోని వాస్తవిక శ్రోతలు యుద్ధములో తమ సొంత రాజులను ఏ విధంగా అనుసరించాలో నేర్చుకొనవలసియున్నది.

అవును, క్రీస్తు అనుచరులముగా, యెహోషువ చేసినట్లు మనము శారీరిక యుద్ధమును చేయము, ఎందుకంటే క్రొత్త నిబంధన మనలను కేవలం ఆత్మీయ పోరాటము కొరకు మాత్రమే పిలుస్తుంది. అయినను, ఆధునిక అనువర్తనములో ఆత్మీయ పోరాటములో పాలుపొందుటకు సరియైన మార్గములను నేర్చుకొనునట్లు ఇవే అనుకూల మరియు ప్రతికూల మాదిరుల వంతెనను మనము పొడిగిస్తాము. సులువైన మాటలలో, యెరికోలో యెహోషువ చేసినట్లు మనము దేవునికి అంకితము చేయబడియుండాలి, మరియు హాయి పట్టణము యొద్ద ఆకాను చేసినట్లు ఆయన ఆజ్ఞలను నిర్లక్ష్యము చేయకుండా మనము జాగ్రత్తపడాలి. అవును, ఈ విస్తృతమైన ఆధునిక అనువర్తనములకు సంబంధించి లెక్కలేనన్ని వివరములు ఉన్నాయి. అయితే తన వాస్తవిక శ్రోతలకు యెహోషువ గ్రంథ రచయిత ఇచ్చిన అనుబంధములు ఆ వివరములను మన సొంత పరిస్థితుల కొరకు నిర్ధారించుకొనుటలో మనకు సహాయము చేయు మార్గములలో మనము వ్యాపింపజేయవచ్చు.

దైవికమైన జీవితము అంటే పాపము అంటే ఏమిటో గమనించుట అని బైబిలు మనకు అనేక విధములుగా బోధిస్తుంది, కొన్నిసార్లు అది దీనిని సూటిగా చెబుతుంది — మీరు ఇలా చెయ్యాలి, లేక మీరు ఇలా చేయకూడదు అన్నట్లు — కాని కొన్నిసార్లు చరిత్రలో నిజమైన ప్రజలు అనుదినము తమ జీవితములను జీవించిన విధానమును తెలియజేస్తూ చెబుతుంది. మరియు వాటిని మనము చదువుచుండగా, వారి మాదిరి నుండి మనము అనుకూలముగా లేక ప్రతికూలముగా నేర్చుకోవలసియున్నది అని మనకు తెలుస్తుంది. “ఏలయనగా ఓర్పువలనను, లేఖనములవలని ఆదరణవలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడిన వన్నియు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడియున్నవి” అని రోమా పత్రికలో వ్రాయబడియున్నది. కాబట్టి మనము అనుకరించవలసిన అనుకూల మాదిరులు మనకు ఉన్నాయి, మరియు మనము విసర్జించవలసిన ప్రతికూల మాదిరులు కూడా ఉన్నాయి... బత్షెబతో దావీదు వ్యభిచారము చేసినప్పుడు, అది తప్పు అని పది ఆజ్ఞల ద్వారా మనకు తెలుసు; నాతాను అతనిని పాపమును బట్టి గదించుట ద్వారా కథనములో నుండి అది మనకు తెలుస్తుంది. మరియు ఇతర సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది సాధారణంగా మంచి మాదిరిని ఇచ్చు ఒక వ్యక్తి, దేవునికి ఇష్టుడైన వ్యక్తి ఇచ్చిన ఒక చెడ్డ మాదిరి అని మనకు తెలుసు... అయితే ఈ తేడాను మనము ఎలా తెలుసుకోగలము? దేవుని ధర్మశాస్త్రము, స్పష్టమైన బోధనలు, ఆజ్ఞలు, మరియు తరువాత అది కార్యరూపం దాల్చుతుంది, మరియు ఈ రెంటిని మనము కలిపి చెప్పవచ్చు.

— డా. ఆండ్రూ డేవిస్

కొన్నిసార్లు లేఖనములను మనము పరిశీలించుచున్నప్పుడు ఒక వ్యక్తిగత పాత్ర లేక అతని జీవితమును మనము అనుకరించాలా లేదా అని కనుగొనుట చాలా కష్టమవుతుంది. మరియు మనము అనుకరించాలని మనకు తెలిసిన ఏకైక వ్యక్తి యేసు మాత్రమే అని మనము జ్ఞాపకముంచుకోవాలి. మన విమర్శలో సంపూర్ణముగా ఉత్తీర్ణత పొందేది ఆయన ఒక్కడు మాత్రమే. మిగిలిన వారందరినీ మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. వారు బైబిలులో ఉండుటకు కారణం ప్రధానముగా మనము అనుకరించునట్లు మాదిరిగా ఉండుట కాదు... అయితే మనము దానిని అర్థము చేసుకొనుటకు ప్రయత్నించినప్పుడు, మనము అనుకరించుటకు మరియు అనుకరించకపోవుటకు ఒక జీవిత పాఠమును పొందుకొనునప్పుడు, మనము నేపథ్యమును, ఆ క్రియలను గూర్చి ఏమి చెప్పబడియున్నదో, ఆ క్రియల యొక్క పరిణామాలు ఏమిటో, అవి రాజ్య వ్యాప్తికి తోడ్పడతాయా లేదా అను విషయములను మనము చూడాలి, అయితే ప్రధానముగా లేఖనములలో ఉన్న నైతిక విలువలను చూసి మనము తీర్పు తీర్చినప్పుడు యేసు మినహా ఎవరు కూడా ఆ స్థాయికి చేరలేరు. ఆయన చేసిన మరియు చెప్పిన ప్రతిది మంచిది, సత్యము మరియు అందమైనది అని మనకు తెలుసు. మిగిలిన వారంతా బైబిలు నైతికత అను భూతద్దము క్రిందికి వస్తారు.

— డా. సాండర్స్ ఎల్. విల్సన్

చివరిగా, నేపథ్యములను మరియు మాదిరులను ఇచ్చుటతో పాటుగా, పాత నిబంధన రచయితలు తమ వాస్తవిక శ్రోతల యొక్క సొంత అనుభవముల యొక్క ఆకాంక్షలను చేర్చుట ద్వారా మునుపటికి మరియు ప్రస్తుతానికి మధ్య అనుబంధములను వెలికితీశారు.

మునుపటి కాలములో జరిగిన సన్నివేశములు తమ శ్రోతలు ఎదుర్కొనుచున్న పరిస్థితులను పోలియున్న విధానములను తెలుపుటకు బైబిలు రచయితలు చాలాసార్లు మునుపటిని గూర్చి వ్రాశారు. ఇట్టి వంతెన “ముందస్తు సూచన” అను ఒక సాహిత్య రకమును పోలియున్నది. ముందస్తు సూచనలో, తదుపరి వివరములను ఆకాంక్షించు విధముగా రచయిత వృత్తాంతములోని ఆరంభ వివరములను అందిస్తాడు. మరియు బైబిలు రచయితలు కొన్నిసార్లు మునుపటిని గూర్చిన ఇవే ఉద్దేశములతో వ్రాయుట జరిగింది. వారి పాఠకుల యొక్క అనుభవములను ఆకాంక్షించు విధానములలో వారు మునుపటి సన్నివేశములను గూర్చి వ్రాశారు.

ఒక సుపరిచితమైన ఆకాంక్ష ఆదికాండము 12:10-20లో నమోదు చేయబడిన అబ్రాహాము ఐగుప్తుకు వెళ్లుటను గూర్చి మోషే ఇచ్చిన వృత్తాంతములో జరుగుతుంది. అవును, అబ్రాహాము యుగములో జరిగిన ఒక వాస్తవమును గూర్చి మోషే తెలిపాడు, కాని అబ్రాహాముకు మరియు తమకు మధ్య ఉన్న అనేక పోలికలను గుర్తించుటలో తన వాస్తవిక శ్రోతలకు సహాయము చేయు విధానములలో అతడు వృత్తాంతమును వివరించాడు. ఉదాహరణకు, మోషే యొక్క వాస్తవిక శ్రోతలు కరవు వలన ఐగుప్తునకు వెళ్లిన విధముగానే అబ్రాహాము కూడా కరవు కారణంగా ఐగుప్తునకు వెళ్లాడు. శారాను తన భవనములోనికి తీసుకొనుట ద్వారా ఫరో అన్యాయముగా అబ్రాహామును ఐగుప్తులో బంధించిన విధముగానే, మోషే దినములలో ఐగుప్తీయులు అన్యాయముగా ఇశ్రాయేలీయులను బానిసలను చేశారు. ఫరో కుటుంబము మీదికి తెగులును రప్పించుట ద్వారా దేవుడు అబ్రాహామును విమోచించాడు, మరియు మోషే దినములలో ఐగుప్తు మరియు ఫరో కుటుంబము మీద పలు తెగుళ్లను పంపుట ద్వారా ఆయన ఇశ్రాయేలును విడిపించాడు. ఫరో అబ్రాహామును గొప్ప ఐశ్వర్యముతో తిరిగి పంపాడు, మరియు మోషే దినములలోని నిర్గమములో, ఫరో మరియు ఐగుప్తీయులు ఐగుప్తు యొక్క ఐశ్వర్యమును ఇచ్చి ఇశ్రాయేలీయులను పంపివేశారు.

అబ్రాహాము యొక్క అనుభవము, వారి సొంత అనుభవమునకు ముందస్తు సూచనగా ఉన్నదని చూపుతూ మోషే ఈ పోలికలను వెలికితీసాడు. తన వాస్తవిక శ్రోతలు ఐగుప్తులోని సమయమును తమ గతిగా ఎంచుకొనుట ఆపమని, మరియు వారి విమోచనను దేవుడు వారి పక్షమున చేయబోవు గొప్ప కార్యముగా చూచునట్లు వారిని ప్రోత్సహించాలని మోషే కోరాడు.

మరొకసారి, ఆధునిక అనువర్తనములో అబ్రాహాము జీవితము నుండి తన వాస్తవిక శ్రోతలకు మధ్య మోషే నిర్మించిన వంతెనను చూసి, ఆ వంతెనను మన ఆధునిక జీవితముల కొరకు పొడిగించుట మన పని అయ్యున్నది. ఉదాహరణకు, దేవుడు ముందు అబ్రాహామును తరువాత ఇశ్రాయేలును విమోచించిన విధముగానే క్రీస్తు మనలను దుష్టుని యొక్క బానిసత్వము నుండి విమోచించాడు అని క్రొత్త నిబంధన బోధిస్తుంది. ఇట్టి పోలికల ద్వారా, ఐగుప్తునకు అబ్రాహాము చేసిన ప్రయాణము ఆధునిక క్రైస్తవులు మన విశ్వాసమును మరియు దేవుని సేవను అర్థము చేసుకొనవలసిన విధానమును ఆకాంక్షించింది.

మనము లేఖనమును అనువర్తించిన ప్రతిసారి, బైబిలు కాలములకు మరియు మన దినములకు మధ్య జరిగిన యుగముల సంబంధమైన పురోగమనములను మనము పరిగణించాలి. నేపథ్యములు, మాదిరులు మరియు ఆకాంక్షల ద్వారా పాత నిబంధన రచయితలు వెలికితీసిన అనుబంధములు చారిత్రిక యుగముల మధ్య ఉన్న ఖాళీని పూరించు వంతెనను నిర్మించు పద్ధలను మనకు అందిస్తాయి.

ఆధునిక అనువర్తనము మరియు పాత నిబంధన యుగములను గూర్చిన ఈ పాఠములో, వాటి భిన్నత్వము, యుగముల యొక్క సామాన్య ఆకారము, మరియు ఈ విభాగముల యొక్క పర్యావసానముల దృష్ట్యా పాత నిబంధన చరిత్ర యొక్క యుగముల సంబంధమైన విభజనలను మనము చూశాము. మరియు వాటి స్థిరమైన పాత్రలు, ఐక్య వృత్తాంత క్రమము, బైబిలు రచయితలు మునుపటి యుగములను ఉపయోగించుట, మరియు మన అనువర్తనములో సహాయపడు యుగముల మధ్య అనుబంధముల దృష్ట్యా ఈ విభజనల మధ్య ఉన్న యుగముల సంబంధమైన పురోగమనములను మనము పరిగణించాము.

మనము చూసినట్లుగా, దేవుని నిబంధనలు బైబిలు చరిత్రను విభిన్నమైన వేదాంతశాస్త్ర ధోరణులు గల ప్రధానమైన యుగములుగా విభాగించాయి. కాబట్టి, మునుపటి మార్గములలోనికి తిరిగివెళ్లుట ద్వారా మన దినములలో దేవుని సేవించుటకు మనము ఏనాడు ప్రయత్నించకూడదు. అయితే మునుపటి కాలములో దేవుడు బయలుపరచిన విషయములను మనము ఏనాడు మరచిపోకూడదు. వేదాంతశాస్త్ర అంశములు ఒక యుగము నుండి మరొక యుగములోనికి కర్బన సంబంధమైన రీతిలో వృద్ధి చెందిన విధానములను మనము పరిగణించినప్పుడు, మునుపటి నిబంధనా యుగములలో దేవుడు బయలుపరచిన విషయములన్నీ మన యుగములో, మరియు క్రీస్తునందు నూతన నిబంధనా యుగములో కూడా ఆయనను సేవించుటను గూర్చి మనకు అనేక విషయములను నేర్పిస్తాయి.

Continue reading the full transcript