<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
Back to CatalogHGBఅతడు మాకు గ్రంథమును అను మనకు వ్యాఖ్యానమునకు పునాదులు
అతడు మాకు గ్రంథమును అను మనకు వ్యాఖ్యానమునకు పునాదులు ·VideoTranslated from English

HGB-09 ఆధునిక అనువర్తన మరియు కొత్త నిబంధన

Read the full text

అదే శ్రేణి 9వ పాఠానికి సమాధానమునిచ్చే ఒక అనుబంధ వీడియో. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది: క్రీస్తు యొక్క మొదటి మరియు రెండవ రాకడల దృష్ట్యా పాత నిబంధన ఇతివృత్తాలను నూతన నిబంధన రచయితలు ఎలా వ్యాఖ్యానించారు? క్రీస్తు తన మొదటి రాకడలో దుష్టత్వానికి వ్యతిరేకంగా యుద్ధం అనే థీమ్‌ను ఎలా నెరవేర్చాడు? క్రీస్తు చర్చి ద్వారా నేడు దుష్టత్వానికి వ్యతిరేకంగా యుద్ధం అనే థీమ్‌ను ఎలా నెరవేరుస్తున్నాడు? మహిమలో తిరిగి వచ్చినప్పుడు, క్రీస్తు బైబిల్ యుద్ధం అనే థీమ్‌ను దుష్టత్వానికి వ్యతిరేకంగా ఎలా నెరవేర్చాడు? ఎఫెసీయులకు 3వ అధ్యాయంలో పౌలు "నాకు వెల్లడి చేయబడిన రహస్యం" గురించి మాట్లాడినప్పుడు అతను అర్థం ఏమిటి? క్రీస్తు మరియు అతని అపొస్తలుల రోజుల్లో జీవించడం కంటే చర్చిలో నేడు జీవించడం ఎలా భిన్నంగా ఉంది? మనం నేడు మన జీవితాలకు స్క్రిప్చర్‌ను వర్తింపజేసినప్పుడు దేవుని రాజ్యంలో అభివృద్ధిని విశ్వాసులు ఎలా లెక్కించాలి?


From the transcript

మనము చాలా త్వరగా మరిచిపోయే అనుభవాలను మనమంతా కలిగియుంటాము, కాని కొన్ని అనుభవాలు ఎంతగా మనలను ప్రభావితము చేస్తాయి అంటే మన జీవితాంతం అవి మనతో నిలిచియుండిపోతాయి. అది, మీరు క్రీస్తును మొదటిగా స్వీకరించిన సమయము కావచ్చు, మీ వివాహ దినము కావచ్చు, లేక మీ ఆప్తులను కోల్పోయిన సమయము కావచ్చు. ఏది ఏమైనా, ఇట్టి అనుభవాలను మనము ఎదుర్కున్నప్పుడు, అవి మనము విషయములను చూసే విధానమును శాశ్వతంగా మార్చివేస్తాయి. మరియు మన ఆధునిక లోకమునకు లేఖనములను అనువర్తించుటకు మనము ప్రయత్నించుచుండగా, క్రీస్తు అనుచరులమైన మన విషయములో కూడా ఇదే వాస్తవమైయున్నది. దేవుడు చేసిన అనేక కార్యములను గూర్చి బైబిలు మనకు చెప్పుచున్నప్పటికీ, క్రీస్తులో క్రొత్త నిబంధన యొక్క రాక మన ఆధునిక జీవితములకు లేఖనమును అనువర్తించుటతో సహా మనము సమస్తమును అర్థము చేసుకొను విధానమును పూర్తిగా మార్చివేసిన ఒక కీలకమైన సన్నివేశమైయున్నది.

ఆయన మనకు లేఖనమును అనుగ్రహించాడు: వ్యాఖ్యానమునకు పునాదులు అను మన పాఠ్యక్రమములో ఇది తొమ్మిదవ పాఠము మరియు దీనికి “ఆధునిక అనువర్తనము మరియు క్రొత్త నిబంధన” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో, క్రీస్తులో క్రొత్త నిబంధన నేటి దినములలో మన లేఖన అనువర్తనమును నిర్దేశించవలసిన విధానములను మనము చూద్దాము.

మన మునుపటి పాఠములో, బైబిలును మన జీవితములకు అనువర్తించుకొనుచుండగా పాత నిబంధనలోని యుగముల సంబంధమైన పురోగమనములను మనము గుర్తించవలసిన విధానమును మనము నేర్చుకున్నాము. మరియు బైబిలు చరిత్ర అంతా ఒక వృత్తాంత క్రమమును కలిగియున్నది అని మనము గమనించాము. దేవుడు తన వైభవమైన మహిమతో పరలోక సింహాసనము నుండి పాలించుచున్నాడని, మరియు ఎంతమంది ఆయనను వ్యతిరేకించినను ఆయన దృశ్య మహిమను పరలోకము నుండి భూమియందంతటా వ్యాపింపజేయుట ఆరంభము నుండి ఆయన లక్ష్యమైయున్నది అని బైబిలు బోధిస్తుంది. ఆయన స్వరూపమందు చేయబడిన జీవులుగా, ఆయన మహిమ యొక్క ఉన్నతమైన ప్రదర్శనకు సిద్ధపాటుగా భూమిని నింపి దానిని పాలించమని దేవుడు మానవులకు ఆజ్ఞాపించాడు. మరియు దేవుని యొక్క వైభవము ప్రతి స్థలమందు ప్రకాశించుచుండగా, ప్రతి జీవి అంతములేని విధముగా ఆయనను ఆరాధిస్తుంది మరియు స్తుతిస్తుంది.

బైబిలులోని ఈ వృత్తాంత క్రమము ఆరు ప్రధానమైన అధ్యాయములు, లేక యుగములు ఒకదాని మీద ఒకటి నిర్మించబడుట ద్వారా అభివృద్ధి చెందినది అని కూడా మనము చూశాము: ఆదాము, నోవహు, అబ్రాహాము, మోషే, దావీదుతో చేయబడిన నిబంధన యుగములు మరియు క్రీస్తునందు క్రొత్త నిబంధన. ఈ యుగముల సంబంధమైన పురోగమనములు ఒకదాని మీద ఒకటి నిర్మించబడు విధానము మునుపటి విధానములలో దేవుని ప్రజలు దేవుని సేవించుటలోనికి తిరిగి వెళ్లకుండానే, మునుపటి కాలములోని పాఠములను నేటి దినములకు అనువర్తించుట కూడా మరచిపోకూడదు అని మనకు జ్ఞాపకము చేస్తుంది.

ఈ పాఠములో, ఆధునిక అనువర్తనము మరియు క్రొత్త నిబంధనను మనము రెండు దశలలో చూద్దాము. మొదటిగా, క్రీస్తునందు క్రొత్త నిబంధన యొక్క నెరవేర్పును మనము చూద్దాము. మరియు రెండవదిగా, క్రొత్త నిబంధన నేటి మన లేఖన అనువర్తనమును ఏ విధంగా నిర్దేశించాలో మనము చూద్దాము. క్రీస్తునందు క్రొత్త నిబంధన యొక్క నెరవేర్పుతో ఆరంభిద్దాము.

మనము చాలాసార్లు ఒక సన్నివేశము జరుగుటకు మునుపు అది ఏ విధంగా ఉంటుంది అని ఊహించుకుంటాము — ఒక పోటీని గెలచుట లేక జీవితములో ఒక క్రొత్త అడుగు వేయుట వంటివి. అయితే చాలాసార్లు, మనము ఊహించిన దాని కంటే అనుభవాలు భిన్నముగా ఉండునట్లు మనము కనుగొంటాము. అవును, బైబిలు కాలములలో దేవుని ప్రజల విషయములో కూడా ఇలానే జరిగింది. క్రీస్తు రాకకు ముందు, క్రీస్తులో ఆయన నెరవేర్చబోవుచుండిన విషయములను గూర్చి దేవుడు తన ప్రజలకు అనేక మెళకువలను ప్రత్యక్షపరిచాడు. అయితే క్రీస్తునందు క్రొత్త నిబంధన చివరికి నెరవేర్పులోనికి వచ్చినప్పుడు, ఆయన ప్రజలు ఊహించిన విధముగా అది రాలేదు.

ఇది ఎలా జరిగినదో తెలుసుకొనుటకు, లేఖనములో క్రొత్త నిబంధన నెరవేర్చబడిన మూడు కోణములను మనము చూద్దాము. మొదటిగా, పాత నిబంధనలో ప్రత్యక్షమయ్యే దృక్పథములను మనము చూద్దాము. రెండవదిగా, నిబంధనల మధ్య కాలములో అభివృద్ధి చెందిన దృక్కోణములను మనము వర్ణించుదాము. మరియు మూడవదిగా, క్రొత్త నిబంధన యొక్క నెరవేర్పును క్రొత్త నిబంధన ఎలా తెలియజేస్తుందో మనము వివరిద్దాము. క్రొత్త నిబంధనను గూర్చి పాత నిబంధన దృక్పథములను చూస్తూ ఆరంభిద్దాము.

క్రొత్త నిబంధన కొరకు పాత నిబంధన నిరీక్షణలు క్రీ.పూ. 586లో యెరూషలేము యొక్క పతనము జరిగిన కాలములో పరిచర్య చేసిన యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటలలో నుండి వెలువడినవి.

యిర్మీయా 31:31-34లో బబులోను చెర ద్వారా యూదాకు విరోధముగా వచ్చిన తీవ్రమైన తీర్పుల తరువాత కూడా, భవిష్యత్తు కొరకు దేవుడు ఒక వైభవమానమైన నిరీక్షణను ప్రకటించాడు. అక్కడ వ్రాయబడిన మాటలను వినండి:

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. . . వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; … నేను (యిర్మీయా 31:31-34).

ఈ వాక్యభాగము దేవుని ప్రజల కొరకు ఒక ఆశ్చర్యకరమైన నిరీక్షణలను కలిగించింది. యిర్మీయా 31:31లో మనము చదువునట్లు, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు, మరియు దక్షిణ రాజ్యమైన యూదాతో ఒక క్రొత్త నిబంధనను చేస్తాడు. క్రొత్త నిబంధన విఫలము కాదు ఎందుకంటే, 33వ వచనము వివరించుచునట్లు, “వారి మనస్సులలో” మరియు “వారి హృదయము మీద” తన ధర్మశాస్త్రమును స్థిరపరచు కార్యమును దేవుడు నెరవేర్చాడు. మరియు 34వ వచనము సూచించుచున్నట్లు, దేవుడు “వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము” చేసికొనడు కాబట్టి ఈ ఆశీర్వాదములు ఎన్నడును అంతరించవు. క్రొత్త నిబంధన యుగము కొరకు ఈ నిరీక్షణలను మనము పరిగణించినప్పుడు, దీని కంటే గొప్ప విషయములను గూర్చి ఊహించుట కష్టమవుతుంది.

మన పాఠములో ఈ సమయమందు, ఈ క్రొత్త నిబంధన నిరీక్షణల యొక్క నెరవేర్పుతో పాత నిబంధన వ్యవహరించిన విధానమును మనము చూడగోరుచున్నాము. ఆరంభించుటకు, దేవుడు ఇశ్రాయేలును చెరలో నుండి వెనుకకు తీసుకొనివచ్చినప్పుడు ఈ ఆశీర్వాదములను ఇచ్చుటకు ప్రతిపాదించాడు అని స్పష్టమవుతుంది.

మనము ఇంతకు ముందే చదివినట్లు, యిర్మీయా 31:31 “దినములు వచ్చుచున్నవి” అను వ్యక్తీకరణతో ఆరంభమవుతుంది, కాని వాస్తవిక నేపథ్యములో ఈ తాత్కాలిక సూచన ఖచ్చితముగా ఉన్నది. యిర్మీయా 31:31-34 యిర్మీయా గ్రంథము యొక్క పెద్ద విభాగములో భాగమైయున్నది, మరియు ఇది యిర్మీయా 30:1-31:40 వరకు విస్తరించబడిన పునరుద్ధరణ గ్రంథము అని పిలువబడుతుంది. చెరను గూర్చి మరియు చెర తరువాత కలుగు ఆశీర్వాదములను గూర్చి అనేక వర్ణనలు ఉన్నాయి కాబట్టి ఈ విభాగమునకు ఈ పేరు ఇవ్వబడినది. పునరుద్ధరణ గ్రంథము యొక్క ఆరంభములో యిర్మీయా 30:3లో వ్రాయబడిన విషయమును వినండి:

రాబోవు దినములలో నేను ఇశ్రాయేలువారును యూదావారునగు నా ప్రజలను చెరలోనుండి విడిపించి, వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు (యిర్మీయా 30:3).

“రాబోవు దినములు” అను వ్యక్తీకరణము యిర్మీయా 31:31లో క్రొత్త నిబంధనను గూర్చిన ప్రవచనము యొక్క ఆరంభములో కనిపించు విధముగా ఈ వచనములో ప్రత్యక్షమవుతుంది. మరియు ఈ వచనములో, “రాబోవు దినములు” అను మాట విశేషముగా దేవుడు తన ప్రజలను “చెరలోనుండి విడిపించి దేశమును వారు స్వాధీనపరచుకొనునట్లు వారిని తిరిగి రప్పించు” సమయమును సూచిస్తుంది.

దీని వెలుగులో, యిర్మీయా 31:31 ఆరంభములో క్రొత్త నిబంధనను వాగ్దాన దేశములోనికి ఇశ్రాయేలు యొక్క పునరుద్ధరణతో అనుసంధానపరిచింది అని స్పష్టమవుతుంది. పాత నిబంధన దృక్కోణము నుండి, చరిత్ర యొక్క ముగింపులో “తదుపరి దినములలో,” లేక “అంత్య దినములలో” ఇశ్రాయేలు యొక్క పునరుద్ధరణ జరుగుతుంది. ఇశ్రాయేలు చెర నుండి తిరిగివచ్చుట, యెరూషలేము మరియు దాని దేవాలయము యొక్క పునఃనిర్మాణము, అభిషిక్తుడైన దావీదు కుమారుని సార్వత్రిక పరిపాలన, మరియు సృష్టి యొక్క నూతనీకరణతో పాటుగా క్రొత్త నిబంధన యొక్క స్థాపనకు కూడా ఆరంభమవుతుంది.

యిర్మీయా 29:10-14లో, క్రొత్త నిబంధన యుగమును ఎప్పుడు ఆశించవచ్చో కూడా దేవుడు యిర్మీయాకు బయలుపరచాడు. ప్రవక్త చెప్పిన మాటలను వినండి:

యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు- బబులోను రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మునుగూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి యీ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును ... మీరు నాకు మొఱ్ఱపెట్టుదురేని మీరు నాకు ప్రార్థనచేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును ... నేను మిమ్మును చెరపెట్టి యే జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసితినో ఆ జనులందరి నుండియు ఆ స్థలములన్నిటిలో నుండియు మిమ్మును సమకూర్చి రప్పించెదను (యిర్మీయా 29:10-14).

ఇశ్రాయేలు “ఆయనకు మొర్రపెట్టి, ఆయనకు ప్రార్థన చేయుచు వచ్చిన యెడల” డెబ్బై సంవత్సరముల తరువాత దేవుడు వారిని వాగ్దాన దేశములోనికి “తిరిగి రప్పించుదును” అను నిరీక్షణను దేవుడు ఇక్కడ ఇచ్చుచున్నాడు. ఇదే కాలక్రమము యిర్మీయా 25:12లో బయలుపరచబడింది.

వాస్తవానికి, క్రీ. పూ. 538లో ఇశ్రాయేలును వాగ్దాన దేశములోనికి తిరిగి రప్పించుటకు పారశీక చక్రవర్తియైన కోరేషును దేవుడు నడిపించాడు. కాబట్టి, 2 దిన. 36:20-22లో, యిర్మీయా యొక్క డెబ్బది సంవత్సరముల చెర కాలము ఈ కాలమందు నెరవేర్చబడుతుంది అని చెబుతూ దినవృత్తాంతముల గ్రంథ రచయిత తన గ్రంథమును ముగించాడు.

చివరి దినములలో, క్రొత్త నిబంధన దినములలో రాబోవు అనేక ఇతర ఆశీర్వాదముల విషయము ఏమిటి? విచారకరముగా, వాగ్దాన దేశమునకు తిరిగి వచ్చినవారు కూడా దేవుని సేవించుటలో మరలా మరలా విఫలమైయ్యారు. ఫలితంగా, యిర్మీయా 31లో ప్రవచించబడిన క్రొత్త నిబంధనలోని అద్భుతమైన ఆశీర్వాదములు వాయిదా వేయబడినాయి.

డెబ్బై సంవత్సరములను గూర్చి యిర్మీయా చేసిన ప్రవచనము యొక్క నెరవేర్పును గూర్చి దానియేలు 9:24లో దేవుడు ఒక మాటను పంపినప్పుడు దానియేలు ఖచ్చితముగా దీనినే నేర్చుకున్నాడు.

తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతమువరకుండునట్టి నీతిని బయలు పరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బదివారములు విధింపబడెను (దానియేలు 9:24).

ఈ వాక్యభాగము సూచించుచున్నట్లు, అంత్య దినములలోని గొప్ప ఆశీర్వాదములు, అనగా క్రొత్త నిబంధన దినములు, “డెబ్బదివారముల” పాటు అనగా, యిర్మీయా యొక్క వాస్తవిక డెబ్బది సంవత్సరముల కంటే ఏడుమాటలు పొడిగింపబడునట్లు దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ సమయమందు, క్రొత్త నిబంధన నిరీక్షణలు నెరవేర్చబడతాయి. అపరాధము అంతమవుతుంది, పాపము ముగించబడుతుంది, ప్రాయశ్చిత్తము జరుగుతుంది, నీతి కలుగుతుంది, దర్శనము మరియు ప్రవచనము నిర్ణయించబడుతుంది, మరియు అతి పరిశుద్ధ స్థలము అభిషేకించబడుతుంది.

యిర్మీయా ప్రవచించిన డెబ్బది సంవత్సరముల చెరను గూర్చి దానియేలు ప్రార్థించుచుండగా, “సమయము అయ్యిపోయింది. ప్రభువా, ఏమి జరుగుతుంది?” అని అతడు ప్రార్థించాడు. మరియు డెబ్బై సంవత్సరములు కాదు, డెబ్బది వారముల సంవత్సరముల పాటు చెరలో ఉండవలసియున్నదని జవాబు వచ్చింది, దేశము నిర్లక్ష్యము చేసిన విశ్రాంతి దినములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. లేఖనమును వ్యాఖ్యానించు విషయములో మనకు సూచించబడు ఒక విషయము ఏమిటంటే, కొన్నిసార్లు దేవుడు అక్షరాలా తాను వాగ్దానము చేసినదానిని చేస్తాడు, కాని దానిలోని కొన్ని అంతర్భావములు ప్రవచనాత్మకముగా తరువాత నెరవేర్చబడు కోణము కూడా ఉన్నది. కాబట్టి, ఉదాహరణకు, ప్రకటన గ్రంథములో, పాత నిబంధన కంటే భిన్నమైన విధానములలో ఉపయోగించబడిన పాత నిబంధన రూపకములు తరచుగా కనబడతాయి. అవును ప్రకటన గ్రంథము స్పష్టముగా ఐగుప్తులో సంభవించిన తెగుళ్లను గూర్చి మాట్లాడుటలేదు, కాని దేవుడు తీర్పును తీసుకొనివచ్చుచున్న విధానమును పోల్చుటకు ప్రకటన గ్రంథములో తెగుళ్ల రూపకమును మరలా మరలా ఉపయోగించబడుట మనము చూస్తాము. కాబట్టి, లేఖనములో రచయితలు మునుపటి రచయితలతో వ్యవహరించుచున్న విధానమును గూర్చి మనము చదువునప్పుడు, మనము ఉదార మనస్సు కలిగియుండాలి. అనగా, డెబ్బై సంవత్సరముల చెరకు సంబంధించిన ఒక భావన ఉన్నది, కాని దేవదూత ద్వారా చూపబడకపోతే దానియేలు ఏనాడు చూసియుండేవాడు కాడు అను ఆలోచనను దేవుడు తన మనస్సులో కలిగియుండినాడు అను భావన కూడా కనిపిస్తుంది.

— డా. క్రైగ్ ఎస్. కీనర్

ప్రజల అవిధేయత వలన క్రొత్త నిబంధన యొక్క పూర్ణత వాయిదా వేయబడుటను పాత నిబంధనలో మనము చూస్తాము. ఇప్పుడు నిబంధనల మధ్య కాలమును — క్రొత్త మరియు పాత నిబంధన మధ్య కాలములను — చూద్దాము మరియు యేసు యొక్క భూలోక పరిచర్యకు ముందు యిర్మీయా ప్రవచనము యొక్క నెరవేర్పును గూర్చి ఇశ్రాయేలులో అనేకమంది అభివృద్ధి చేసిన కొన్ని దృక్కోణములను మనము చూద్దాము.

క్రొత్త నిబంధనను గూర్చి యిర్మీయా యొక్క ప్రవచనము ఇంకా పూర్తిగా నెరవేర్చబడలేదు అని మొదటి శతాబ్దములో ప్రతి ఒక్కరికి స్పష్టముగా కనిపించింది. ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న పలు మత సమూహములు విభిన్నమైన దృక్కోణములను కలిగియుండిరి అని క్రొత్త నిబంధన నివేదికలు మరియు పురావస్తుశాస్త్ర ఆవిష్కరణలు సూచిస్తాయి, కాని అనేక సామాన్య విషయములను గూర్చి సార్వత్రిక సమ్మతి కూడా కనిపించేది.

నిబంధనల మధ్య కాలము చివరి నాటికి, అంత్య దినముల నిరీక్షణ, లేక క్రొత్త నిబంధన యుగమును గూర్చి, చరిత్రలో రెండు గొప్ప యుగముల దృష్ట్యా అనేకమంది రబ్బాయిలు మాట్లడారు.

మొదటిగా, మునుపటి చరిత్ర మరియు తమ వర్తమాన పరిస్థితులను వారు “ఈ యుగము” అని పిలిచారు. చెరలో దేవుని ప్రజల మీద దుష్టత్వము యొక్క స్పష్టమైన విజయము ఈ యుగమును వైఫల్యము, బాధ మరియు మరణముతో నిండియున్న యుగముగా గుర్తించునట్లు రాబ్బాయిలను పురికొల్పింది.

రెండవదిగా, రబ్బాయిలు చరిత్రలో రెండవ గొప్ప యుగమును గూర్చి, భవిష్యత్ మహిమను గూర్చి “రాబోవు యుగము”గా మాట్లాడారని రబ్బాయిలు మాట్లాడారు. రాబోవు యుగమును వారు “అంత్య దినములు,” “దేవుని రాజ్యము,” మరియు క్రొత్త నిబంధన యుగము అని గుర్తించారు. రాబోవు యుగము ఆసన్నమైనప్పుడు, చరిత్ర కొరకు దేవుడు కలిగియున్న ఉద్దేశ్యములు నెరవేర్చబడతాయని రబ్బాయిలు ఆకాంక్షించారు. పశ్చాత్తాపపడిన, చెరగొనిపోబడిన ప్రజలను పెద్ద సంఖ్యలో ఆయన తిరిగి తీసుకొనివచ్చి, దావీదు సింహాసనమును పునరుద్ధరించి, తన పరిపాలనను భూమియందంతటా వ్యాపింపజేసి, దేవునికి మరియు దావీదు కుమారునికి సమర్పించుకొనుటకు నిరాకరించిన వారి మీదికి తీర్పును తీసుకొని వచ్చి, అబ్రాహాము ఆశీర్వాదములను భూదిగంతముల వరకు వ్యాపింపజేస్తాడు.

దీనికి తోడు, ఈ యుగము నుండి రాబోవు యుగములోనికి మార్పు దావీదు గొప్ప కుమారుడైన మెస్సీయ యొక్క రాకతో నిర్ణయాత్మకముగా జరుగుతుంది అని అనేకమంది రబ్బాయిలు బోధించారు. మెస్సీయ ప్రపంచ చరిత్రలో గొప్ప మలుపురాయిని తెస్తాడు, మరియు ఓటమి నుండి జయములోనికి, దుష్టత్వము నుండి నీతిలోనికి, మరణము నుండి నిత్య జీవములోనికి, చీకటి నుండి దేవుని మహిమతో నింపబడిన లోకములోనికి గొప్ప మార్పును కలిగిస్తాడు.

పాత నిబంధనలోని నిబంధనల మధ్య కాలముల యొక్క నేపథ్యమును గూర్చిన ఈ దృక్పథములను మనస్సులో ఉంచుకొని, క్రొత్త నిబంధన కొరకు యిర్మీయా కలిగియున్న నిరీక్షణ యొక్క నెరవేర్పును క్రొత్త నిబంధన వివరించు విధానమును చూద్దాము.

యేసు తన శిష్యులతో కలసి చేసిన చివరి భోజనములో ఒక గిన్నెను తీసుకొని, “ఈ గిన్నె నా రక్తము వలనైన క్రొత్త నిబంధన” అని సెలవిచ్చాడు. అంతేగాక, పౌలు తనను తాను మరియు తన సహచరులను “క్రొత్త నిబంధనకు పరిచారకులు” అని పిలచుకున్నాడు. మరియు హెబ్రీ పత్రిక యిర్మీయా 31ను సూచిస్తూ, క్రైస్తవులు క్రొత్త నిబంధన యుగములో నివసిస్తున్నారు అని ఉద్ఘాటిస్తుంది. మన దినములలో జరుగు విషయములను యిర్మీయా 31లోని క్రొత్త నిబంధనను గూర్చిన వర్ణనతో మనము పోల్చినప్పుడు, క్రొత్త నిబంధన వాగ్దానములను మనము ఇంకా పూర్ణతలో చూడవలసియున్నది అని మనము గ్రహిస్తాము. దేవుని ధర్మశాస్త్రము మన మనస్సుల మీద మరియు హృదయముల మీద ఇంకా పరిపూర్ణముగా వ్రాయబడలేదు. ప్రభువును తెలుసుకోమని సంఘములోని ప్రజలకు ఇప్పటికి చెప్పవలసివస్తుంది. మన పాపముల కొరకు క్షమాపణ కోరమని మనకు ఇప్పటికీ ఆజ్ఞాపించబడుతుంది. కాబట్టి, యిర్మీయా ఆకాంక్షలలో ఇంకా చాలా నెరవేర్చబడకుండానే మనము క్రొత్త నిబంధన యుగములో ఉన్నామని ఎలా చెప్పగలము? క్రీస్తునందు దేవుడు బయలుపరచిన మర్మములో, క్రొత్త నిబంధన నెరవేర్పును ఆయన వివృతము చేయు విధానములోనే దీనికి జవాబు కనిపిస్తుంది.

పలువురు పాత నిబంధన పాత్రలు ఈ విషయములను గూర్చి పలు విధములుగా మాట్లాడారు. ఉదాహరణకు, యేసు, తాను చెప్పిన అనేక ఉపమానములలో, తన భూలోక పరిచర్య ద్వారా దేవుని రాజ్యము ఆరంభమై, కాలక్రమములో ఎదుగుతుంది అని, మరియు ఆయన మహిమలో తిరిగివచ్చినప్పుడు నెరవేర్పులోనికి చేరుతుంది అని ప్రకటించాడు.

ఎఫెసీ. 3:3-5 వంటి చోట్ల అపొస్తలుడైన పౌలు ఈ విషయములను గూర్చి మాట్లాడుతూ, అంత్యదినములను గూర్చిన మర్మము మునుపటి కాలములలోనికి ప్రజలకు మరుగుచేయబడినది, కాని క్రీస్తునందు ఇప్పుడు బయలుపరచబడినది అను వాస్తవమును అతడు తెలియజేశాడు.

రోమా. 11:25 మరియు 16:25-26 మరియు కొలస్సీ. 1:26-27 వంటి చోట్ల అనేక విధానములలో పౌలు ఈ మర్మమును ప్రస్తావించాడు. ఇవి మరియు ఇతర వాక్యభాగములలో, క్రీస్తునందు అంత్య దినములను గూర్చి క్రైస్తవ దృక్కోణములలోని పలు కోణములను అతడు మర్మములు అని పిలిచాడు, ఎందుకంటే అవి మునుపటి తరములవారి నుండి మరుగు చేయబడినవి.

పౌలు పత్రికలలో అనేక చోట్ల, సువార్తను గూర్చి లేక సువార్తలోని పలు కోణములను గూర్చి అతడు మర్మము, లేక గ్రీకులో ముష్టిరియాన్ అని మాట్లాడతాడు. మరియు మర్మము అనగా ఒక్కసారిగా తెరమీదికి వచ్చు ఏదో ఒక వింతైన, మసకబారిన విషయము అని లేక పరిష్కరించజాలని ఒక చిక్కు అని అతని అర్థము కాదు. ఒక క్రొత్త నిబంధన పండితుడు దానిని వర్ణించినట్లు, పౌలు ఆలోచన ప్రకారం ఒక మర్మము అనగా స్పష్టమైన దృష్టిలో దేవుడు మరుగుచేసిన విషయము, అనగా పాత నిబంధనలో స్పష్టమైన దృష్టిలో దేవుడు మరుగుచేసిన ఒక విషయమైయున్నది. మరియు అది ఇప్పుడు క్రీస్తు బయలుపరచబడుట అను స్పష్టపరచు ప్రత్యక్షత ద్వారా, ప్రజలు వెనుకకు చూసి, “అయ్యో చూడండి! ఇక్కడ ఏమి ఉన్నదో చూడండి” అని చెప్పవచ్చు. కాబట్టి పౌలు ఏదో క్రొత్త విషయమును తెలియజేయుటలేదు, కాని “మనము చూచుటలో విఫలమైన విషయమును, ఇక్కడ వ్రాయబడియున్నదానిని చూడండి” అని అతడు అనుచున్నాడు ... మరియు అనేక విధములుగా, రానున్న మెస్సీయను గూర్చి మరియు యూదులు మరియు అన్యుల యొక్క ఐక్యతను గూర్చిన సత్యము పాత నిబంధనలో, కీర్తనలలో మరియు యెషయాలో స్పష్టముగా ఉన్నది, కాని అది కలిసి ప్రత్యక్షమగుట ... “ఇక్కడ ఏమి ఉన్నదో చూడండి; ఈ ముక్కలు అన్ని ఏ విధంగా అమర్చబడియున్నవో చూడండి” అను విధముగా పౌలు మాట్లాడుచున్న విధముగా దేవుడు తన ఆత్మను మరియు క్రొత్త నిబంధన వాగ్దానములను అనుగ్రహించుటను గూర్చి ఎదురుచూచుచున్నది.

— డా. రాబర్ట్ ఎల్. ప్లమ్మర్

ఎఫెసీ. 3లో మర్మము తనకు బయలుపరచబడుటను గూర్చి పౌలుమాట్లాడుచున్నప్పుడు, అతడు సువార్తను గూర్చి మాట్లాడుచున్నాడు. సువార్తయే ఆ మర్మము. దేవుడు దానిని మనకు బయలుపరచుటకు నిర్ణయించనిదే అది మనకు మరుగైయుంటుంది, కాని సువార్త విషయములో, అది బహిరంగ మర్మమైయున్నది. దీనిని బహిరంగ రహస్యము అని మనము పిలువవచ్చు. అయితే పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా ఇది సువార్త ప్రకటన ద్వారా మాత్రమే వివృతము కాగలదు. ఇప్పుడు, ఎఫెసీ. 3 వంటి చోట్ల వలె పౌలు మర్మమును గూర్చి మాట్లాడునప్పుడు, అతడు కొన్నిసార్లు సువార్త ప్రకటన ద్వారా వాస్తవికతలోనికి వచ్చిన క్రీస్తు శరీరము అను మర్మమును గూర్చి మాట్లాడుతున్నాడు. మరియు ఎఫెసీ. 3లో అతడు ఇలా అనుచున్నాడు, యూదుడు మరియు అన్యుడు ఒకనినొకడు ప్రేమించుచున్నాడు మరియు రాజ్యములో కర్బన సంబంధమైన ఐక్యతలోనికి తీసుకొని రాబడినాడు అనునది మర్మమైయున్నది. ఇది అద్భుతమైన విషయము. కాబట్టి, క్రీస్తులోని శోధింపశక్యముకాని ఐశ్వర్యమును గూర్చి ఈ అన్యులకు ప్రకటించబడినది. అవును, ఒక అన్యునిగా, అది అన్యుల యొద్దకు వచ్చినందుకు నేను సంతోషించుచున్నాను. అయితే అది ఒక మర్మమైయున్నది... సిలువ రక్తము ద్వారా మరియు ఆయన ఆత్మ శక్తి ద్వారా యూదుని మరియు అన్యుని ఐక్యపరచువాడు ఆయనే.

— డా. సాండర్స్ ఎల్. విల్సన్

అపొస్తలులకు మరియు ప్రవక్తలకు దేవుడు బయలుపరచిన మర్మము క్రొత్త నిబంధన పండితులు చాలాసార్లు వర్ణించిన “ఆరంభమైన యుగాంతశాస్త్రము” లేక “ఇక్కడ ఉన్నది, కాని ఇంకా లేదు” అను క్రొత్త నిబంధన యుగమును గూర్చిన దృక్పథములోనికి నడిపించింది. మనము ఏ పదజాలమును ఎన్నుకునప్పటికీ, అంత్య దినముల కొరకు దేవుడు కలిగియున్న ప్రణాళికలో, క్రొత్త నిబంధన యుగము యొక్క నెరవేర్పు మూడు ప్రధానమైన దశలలో నెరవేర్చబడుతుంది అని యేసు మరియు క్రొత్త నిబంధన రచయితలు బోధించినట్లు మనము చూడవచ్చు.

మొదటిగా, క్రొత్త నిబంధన యుగము యొక్క ఆరంభము యేసు యొక్క మొదటి రాకడలో మరియు అపొస్తలులు మరియు ప్రవక్తల యొక్క పరిచర్యలలో ప్రారంభమైయ్యింది. ఇందుమూలముగానే యేసు మరియు ఆయన అపొస్తలుల యొక్క దినములను క్రొత్త నిబంధన “అంత్య దినములు” అని పిలుస్తుంది. హెబ్రీ. 1:1-2లో మనము ఈ మాటలను చదువుతాము:

పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను (హెబ్రీ. 1:1-2) .

ఇక్కడ, హెబ్రీ పత్రిక రచయిత యేసు యొక్క భూలోక పరిచర్య మరియు తన శ్రోతల కాలమును “ఈ దినముల అంతమందు” అని పిలచుచున్నాడు. ఈ వాక్యభాగము సూచించుచున్నట్లు, యేసు రాజ్యమును ఆరంభించుట ద్వారా, పాత నిబంధనలో వాగ్దానము చేయబడిన అంత్యదినములు లోకములోనికి వచ్చాయి.

ఈ క్రొత్త నిబంధన యుగము యొక్క ఆరంభ దశలో యేసు తన నరావతారము, మరణము, పునరుత్థానము, పరలోక ఆరోహణము, మరియు పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపులో చేసిన కార్యములన్నీ భాగమైయున్నాయి అని క్రొత్త నిబంధన ఉద్ఘాటిస్తుంది. విశేషమైన కాలములో సంఘమునకు పునాది వేయుటకు అపొస్తలులు మరియు ప్రవక్తలు చేసిన పరిచర్యలు కూడా భాగమైయున్నాయి. ఎఫెసీ. 2:19-20లో, పౌలు దీనిని గూర్చి ఇలా మాట్లాడుతున్నాడు:

క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు (ఎఫెసీ. 2:19-20).

రెండవదిగా, క్రొత్త నిబంధన యుగము యొక్క కొనసాగింపు సంఘ చరిత్ర కాలమంతా వ్యాపించబడుతుంది. ఈ కాలములో, సువార్త ప్రకటన ద్వారా మరియు మార్పుకలిగించు శక్తి ద్వారా క్రీస్తు సంఘమును దేశములన్నిటిలో వ్యాపింపజేస్తాడు.

2 తిమోతి 3:1-5 వంటి చోట్ల సంఘ చరిత్ర కాలమంతటిని క్రొత్త నిబంధన రచయితలు అంత్యదినములు అని పిలచారు. అక్కడ వ్రాయబడిన మాటలను వినండి:

అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము. ఏలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు ధనాపేక్షులు బింకములాడువారు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతిద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జనద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవునికంటె సుఖాను భవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగలవారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు (2 తిమోతి 3:1-5).

“అంత్యదినములలో” జరుగు పాపములను గూర్చి ఇక్కడ ఇవ్వబడిన పట్టికలోని పాపములు పౌలు దినములలోజరిగినవి, మరియు చరిత్ర అంతటా నేటి వరకు కూడా జరుగుతూ వస్తున్నాయి.

ఎఫెసీ. 3:9-10లో పౌలు ఈ కాలము యొక్క లక్షణమును క్రీస్తునందు బయలుపరచబడిన మర్మము అని పిలిచాడు:

దేవుడు ... సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి, ... పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును ... అనుగ్రహించెను (ఎఫెసీ. 3:9-10).

ఈ వెలుగులో, సంఘ చరిత్ర కాలమంతటిని మనము క్రొత్త నిబంధన యుగము అని సరిగానే పిలువవచ్చు.

మూడవదిగా, క్రొత్త నిబంధన యుగము యొక్క అంత్య దినములు క్రీస్తు తిరిగివచ్చి చరిత్ర అంతటి కొరకు దేవుడు కలిగియున్న ఉన్నతమైన ఉద్దేశ్యములను సంపూర్ణతలోనికి తెచ్చినప్పుడు నెరవేర్పులోనికి వస్తాయి. ఇందుమూలముగానే, క్రీస్తు రాకడలో రాజ్యము యొక్క నెరవేర్పును క్రొత్త నిబంధన రచయితలు “అంత్య దినములు” అని పిలచారు. యోహాను 6:39లో యేసు శిష్యులతో ఇలా సెలవిచ్చాడు:

ఆయన నాకు అనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పొగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమైయున్నది (యోహాను 6:39).

ఇక్కడ యేసు తండ్రితో తనకున్న అనుబంధమును గూర్చి శిష్యులకు బోధించాడు. ఆయన ఉపయోగించిన “అంత్య దినము” అను మాట ఆయన మహిమలో తిరిగివచ్చినప్పుడు, మృతులు లేపబడి లోకమునకు దేవుడు తీర్పు తీర్చు అంత్య దినమును సూచిస్తుంది.

ఎఫెసీ. 1:9-10లో, పౌలు ఈ సమయమును క్రీస్తునందు దేవుడు బయలుపరచిన మర్మము అని వర్ణించాడు. ఈ వచనములలో, పౌలు నెరవేర్పును ఈ విధంగా వర్ణించాడు:

కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన యేర్పాటునుబట్టి, ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, ... పరలోకములో ఉన్నవే గాని, భూమిమీద ఉన్నవే గాని, సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని తనలోతాను నిర్ణయించుకొనెను (ఎఫెసీ. 1:9-10).

క్రొత్త నిబంధన సూచించుచున్నట్లు, యేసు తన మొదటి రాకడలో క్రొత్త నిబంధనను ఆరంభించాడు, నేడు సార్వత్రిక సంఘము ద్వారా క్రొత్త నిబంధనను బయలుపరచుటను ఆయన కొనసాగించుచున్నాడు, మరియు క్రీస్తు అందరికీ రాజుగా మహిమలో తిరిగివచ్చినప్పుడు క్రొత్త నిబంధన యుగము యొక్క సంపూర్ణమైన తీర్పులు మరియు ఆశీర్వాదములు కలుగుతాయి.

క్రీస్తునందు క్రొత్త నిబంధన యొక్క నెరవేర్పును విశదీకరించాము కాబట్టి, మన పాఠములోని రెండవ ప్రధానమైన అంశమును చూచుటకు ఇప్పుడు మనము సిద్ధముగా ఉన్నాము: క్రొత్త నిబంధన యుగము యొక్క వివృతమగు స్వభావము మీద ఆధారపడియున్న లేఖనము యొక్క ఆధునిక అనువర్తనము.

మనము తరువాత పాఠములలో చూడబోవుచున్నట్లు, క్రొత్త నిబంధన యుగములో నివసించుచున్న ప్రజలకు లేఖనమును అనువర్తించవలసిన విషయములో అనేక విషయములు తెలియజేయవలసియున్నది. వీటిలో లెక్కలేనన్ని సాంస్కృతిక మరియు వ్యక్తిగత పరిగణలు కూడా భాగమైయున్నాయి. అయితే ఈ సమయమందు, క్రొత్త నిబంధన యొక్క మూడు దశలను గూర్చిన క్రొత్త నిబంధన బోధన నేడు మన జీవితములకు బైబిలును అనువర్తించుటలో మనకు మార్గనిర్దేశనం ఎలా చేయగలదో మనము చూద్దాము. ఈ అనువర్తన అంశములు సామన్యమైనవిగా ఉన్నాయి, కాని నేడు మన జీవితములలో లేఖనములను ఎలా ఉపయోగించాలి అను విషయమును గూర్చి అవి మనకు గొప్ప దృక్కోణములను అనుగ్రహిస్తాయి.

మీరు కూర్చొనియున్న స్థానము ప్రదర్శనను గూర్చి మీరు కలిగియున్న దృక్కోణమును ప్రభావితము చేస్తుంది అని ఒక ధియేటర్ లో ఒక నాటికను చూసిన ప్రతి వారికి తెలిసే ఉంటుంది. ఒకే పాత్ర మరియు క్రియలు పలు కోణముల నుండి పలు విధములుగా కనిపించవచ్చు. మరియు పలు కుర్చీలలో నుండి ఒకసారి కంటే ఎక్కువగా ప్రదర్శనను చూచుట ప్రదర్శననంతటినీ గ్రహించుటకు ఉత్తమమైన మార్గమైయున్నది. అనేక విధాలుగా, యేసు మరియు క్రొత్త నిబంధన రచయితలు క్రైస్తవ సంఘమునకు క్రొత్త నిబంధన యుగములో లేఖనములను అనువర్తించుటను గూర్చి ఇదే విధముగా బోధించారు. విభిన్నమైన స్థలములలో నుండి లేఖనమును పరిశీలించుట ద్వారా, బైబిలును మన జీవితములకు అనువర్తించుకొనుట కొరకు మనము మరింత సిద్ధపడగలము.

ఒక నమ్మకమైన క్రీస్తు అనుచరుడు లేఖనములను మూడు పెద్ద పలకలుగా విభజించబడిన వెనుకతెర ఉన్న స్టేజి నుండి అధ్యయనము చేయుచున్న చిత్రమును ఊహించుకోండి. శ్రోతలలో ఒక వైపు నుండి, క్రైస్తవుడు బైబిలును క్రీస్తు క్రొత్త నిబంధనను ఆరంభించుట అను తెర ముందు నిలువబడి చదువుచున్నట్లు మనము చూస్తాము. శ్రోతలు కూర్చున్న స్థలములోని మధ్య భాగములో నుండి, క్రైస్తవుడు బైబిలును క్రీస్తు క్రొత్త నిబంధనను కొనసాగించుట అను తెర ముందు నిలువబడి చదువుచున్నట్లు మనము చూస్తాము. శ్రోతలో మరొక వైపు నుండి, క్రైస్తవుడు బైబిలును క్రీస్తు క్రొత్త నిబంధనను నెరవేర్చుట అను తెర ముందు నిలువబడి చదువుచున్నట్లు మనము చూస్తాము. ఏదో ఒక విధముగా, ఈ మూడు దృక్కోణములను మనస్సులో ఉంచుకొని బైబిలును అధ్యయనం చేయుట ద్వారా క్రీస్తు అనుచరులు లేఖనములను ఆధునిక లోకమునకు అనువర్తించాలి.

మరొక మాటలో, బైబిలును అధ్యయనం చేయుచున్నప్పుడు, విశ్వాసులు ప్రతి లేఖన భాగమును క్రొత్త నిబంధన యొక్క ఆరంభములో క్రీస్తు నెరవేర్చిన విషయములన్నిటికి అనుబంధపరచాలి మరియు క్రీస్తు తన భూలోక పరిచర్యలో మన కొరకు సాధించిన ప్రతిదానిని పరిగణించాలి. అయితే మనము లేఖనము యొక్క బోధనలను క్రొత్త నిబంధన యుగము యొక్క కొనసాగింపు వెలుగులో కూడా పరిగణించి, నేడు మన జీవితములలో లేఖనము యొక్క ప్రాముఖ్యత కొరకు కూడా వెదకాలి. అంతేగాక, మన యుగము యొక్క నెరవేర్పులో క్రీస్తు సాధించబోవువాటి దృష్ట్యా లేఖనములను చూచి, మహిమలో క్రీస్తు యొక్క అద్భుతమైన రాకడ కొరకు సిద్ధపడుట కూడా చాలా ప్రాముఖ్యమైయున్నది.

క్రొత్త నిబంధన అనువర్తనములను గూర్చి ఈ మూడు దృక్కోణములను మనము అనేక విధాలుగా విశదీకరించవచ్చు, కాని మనము రెండు ప్రాముఖ్యమైన బిందువులను మాత్రమే పరిగణిద్దాము. మొదటిగా, క్రొత్త నిబంధన యుగములో అనువర్తనమునకు కొన్ని సాధారణ మార్గదర్శకములను మనము క్రోడీకరిద్దాము. రెండవదిగా, ఈ ప్రణాళికలను ఉదాహరించు ఒక అనువర్తనము యొక్క ఉదాహరణను మనము ఇద్దాము. కొన్ని సాధారణ మార్గదర్శకములతో ఆరంభిద్దాము.

మునుపటి పాఠములలో అనువర్తన ప్రక్రియను మనము ఈ విధంగా నిర్వచించాము:

సమకాలీన శ్రోతల యొక్క భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగముల మీద ప్రభావము చూపు విధముగా బైబిలు పత్రము యొక్క వాస్తవిక అర్థమును తగిన విధముగా వారికి అనుసంధానము చేయుట.

ఈ నిర్వచనము సూచించుచున్నట్లు, లేఖనము యొక్క ప్రతి అనువర్తనములో వాస్తవిక అర్థమును సమకాలీన శ్రోతలకు తగిన రీతిలో అనుసంధానము చేయుట భాగమైయున్నది.

మొదటిగా, బైబిలు రచయితలు తమ వాస్తవిక శ్రోతల యొక్క భావనలను, ప్రవర్తనలను మరియు భావోద్వేగములను ప్రభావితము చేయుటకు ప్రయత్నించిన మార్గములను కనుగొనుట ద్వారా మనము ఒక బైబిలు భాగము యొక్క వాస్తవిక అర్థమును నిర్థారించాలి. తరువాత, ఒక బైబిలు భాగము నేటి ప్రజల యొక్క భావనలను, ప్రవర్తనలను మరియు భావోద్వేగములను ప్రభావితము చేయవలసిన విధానమును నిర్థారించుట ద్వారా ఈ వాస్తవిక అర్థమును మనము సమకాలీన శ్రోతలకు అనువర్తించవచ్చు. ఇతర పాఠములలో మనము చూసినట్లు, మనము లేఖనములను అనువర్తించునప్పుడు యుగముల సంబంధమైన పురోగమనములను మనస్సులో ఉంచుకొనుట చాలా ప్రాముఖ్యమైయున్నది, ఎందుకంటే వాస్తవముగా లేఖనములోని ప్రతి వాక్యభాగము మన కంటే విభిన్నమైన బైబిలు విశ్వాస దశలో జీవించుచున్న ప్రజల కొరకు వ్రాయబడినది. కాబట్టి, మన పాఠములో ఈ సమయమందు, యుగముల సంబంధమైన పురోగమనములు లేఖనము యొక్క వాస్తవిక శ్రోతలను క్రొత్త నిబంధన యుగములో నివసించుచున్న సమకాలీన శ్రోతలతో అనుబంధపరచిన విధానముల మీద దృష్టిపెడదాము.

మన మనస్సులో ఉన్న విషయము ఏమిటో చూచుటకు, మనము రెండు దశలలో క్లుప్తంగా చూద్దాము. మొదటిగా, పాత నిబంధన వాక్యభాగముల యొక్క క్రొత్త నిబంధన అనువర్తనములను గూర్చి కొన్ని సామాన్య వ్యాఖ్యలను చేద్దాము. తరువాత రెండవదిగా, క్రొత్త నిబంధన వాక్యభాగములను కూడా పరిగణిద్దాము. పాత నిబంధనతో మొదలుపెడదాము, రండి.

మునుపటి పాఠములో మనము చూసినట్లు, బైబిలు చరిత్రలోని ఆరు ప్రధానమైన నిబంధనలను గూర్చి పాత నిబంధన మాట్లాడుతుంది, కాని పాత నిబంధన గ్రంథముల యొక్క రచన ఈ నిబంధన యుగములలో రెండింటిలో మాత్రమే జరిగింది: మోషే మరియు దావీదు యొక్క నిబంధనా యుగములు. ప్రతి పాత నిబంధన వాక్యభాగము మోషే నిబంధనా యుగములో లేక దావీదు నిబంధనా యుగములో నివసించిన దేవుని ప్రజల యొక్క అవసరతల కొరకు రూపొందించబడినది. ఒక విధంగా, పాత నిబంధన వాక్యభాగములు వాస్తవానికి దేవుని ప్రజలకు ఈ రెండు నిబంధనా యుగములలోని వేదాంతశాస్త్ర పురోగమనములకు అనుగుణంగా ఉన్న భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములను తెలియజేస్తాయి.

ఈ కారణము చేత, పాత నిబంధన వాక్యభాగములలో నుండి క్రొత్త నిబంధన యుగమునకు అర్థము యొక్క వంతెనలను నిర్మించుట అవసరమైయున్నది. క్రీస్తు అనుచరులముగా, ఈ ప్రక్రియలో మన ముందు ఉన్న ఒకే ఒక్క తప్పిదములేని మార్గదర్శకము క్రొత్త నిబంధన అయ్యున్నది. కాబట్టి, క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధనను క్రొత్త నిబంధన యొక్క మూడు దశలన్నిటిలో అనువర్తించిన విధానములను చూచుట చాలా ప్రాముఖ్యమైయున్నది. ఉదాహరణకు, క్రీస్తు తన మొదటి రాకడలో పాత నిబంధన బోధనలను నెరవేర్చిన అనేక ఉదాహరణలను క్రొత్త నిబంధన మనకు ఇస్తుంది. కొనసాగింపు కాలములో క్రీస్తు పాత నిబంధన బోధనలను నెరవేర్చుచున్న విధానముల వైపుకు కూడా అది దృష్టిని ఆకర్షిస్తుంది. దీనికి తోడు, క్రొత్త నిబంధన యొక్క నెరవేర్పులో క్రీస్తు పాత నిబంధన బోధనలను నెరవేర్చు విధానములను క్రొత్త నిబంధన ఎత్తిచూపింది.

బైబిలు అంశములలో ప్రాముఖ్యమైన వాటిలో ఒకటి దేవుని రాజ్యమైయున్నది, అయినను ఈ మాట కేవలం క్రొత్త నిబంధనలో మాత్రమే కనిపిస్తుంది. అవును, దానిని మనము పాత నిబంధన అంతటిలో, ముఖ్యముగా కీర్తనలలో “యెహోవా ఏలుచున్నాడు” అను మాటలో చూస్తాము. క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధన అంశములను క్రీస్తు రాకడ వెలుగులో చూస్తారు, కాబట్టి సువార్త ప్రకటించు వారు యేసు బోధనలను క్రోడీకరించుచుండగా, వారు దేవుని రాజ్యమును గూర్చి మరియు స్వయంగా యేసును గూర్చి, పరలోక రాజ్యము సమీపించి యున్నది, దేవుని రాజ్యము సమీపించి యున్నది అని ఆయన మాట్లాడినట్లు వ్రాయబడియున్న విధమును అనుసరిస్తూ మాట్లాడతారు. కాబట్టి, తన ప్రజల మీద మరియు దేశముల మీద యెహోవా యొక్క పరిపాలనను గూర్చి మాట్లాడు ఒక విషయము ఇప్పుడు ఇశ్రాయేలులోనికి ప్రవేశించిన దావీదు కుమారుడును, మెస్సీయయైన క్రీస్తు దృష్ట్యా చిత్రీకరించబడింది... దీనిని మనము ఆయన ఆరోహణమై, పునరుత్థానము ప్రకటించబడి, తిరిగిలేచిన మరియు ఆరోహణమైన క్రీస్తు వైపుకు ప్రజలు ఆకర్షించబడుచుండగా అపొస్తలుల కార్యములు 1లో క్రీస్తు ఆరోహణమగుట మరియు సింహాసనము మీద నుండి పాలించుట దృష్ట్యా చూస్తాము, కాని దీనికి భవిష్యత్తులో ప్రభువు దినమందు క్రీస్తు తిరిగివస్తాడు అను భావన కూడా ఉన్నది. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము మనకు బోధించుచున్నట్లు, ఆయన తిరిగివెళ్లిన విధముగానే మరలా తిరిగివస్తాడు, మరియు సాతాను విడిచిపెట్టబడినప్పుడు దేవుని ప్రజలు అంతిమ మోసమును మరియు తిరుగుబాటును అనుభవించుచుండగా చివరి విమోచన కలుగుతుంది, అంతేగాక క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు తుదుకు సాతాను తంత్రములన్నిటి మీద విజయము సాధిస్తాడు.

— డా. గ్రెగ్ పెర్రీ

సువార్త యేసును పాత నిబంధనలోని అంశముల వెలుగులో చూచుటకు అత్యంత అద్భుతమైన విషయములలో ఒకటైయున్నది. దీనిని మనము అనేక చోట్ల చూస్తాము. యేసు మోషే స్థానములో చూపబడిన స్థలములో దీనిని మనము ప్రధానముగా చూస్తాము. ఒక విధముగా ఆయన క్రొత్త రెండవ మరియు గొప్ప నిర్గమనలో నడిపించుటకు వచ్చిన రెండవ మోషే అయ్యున్నాడు. యేసును గూర్చి రెండవ మోషేగా ఆలోచన చేయునప్పుడు అనేక ఉదాహరణలు మనకు జ్ఞాపకము వస్తాయి. అవును, బాప్తిస్మము తరువాత ఆయన అరణ్యములోనికి వెళ్లుట అనునది ఒక ఆలోచన అయ్యున్నది. కాబట్టి, ఆయన యొర్దాను నది యొద్ద బాప్తిస్మము పొందినప్పుడు, ఒక విధముగా, ఈ నీటి నుండి నడచుట ఇశ్రాయేలీయులు యెర్రసముద్రమును దాటివెళ్లి, వెంటనే అరణ్యములోనికి వెళ్లుటను పోలియున్నది. అరణ్యములో ఆయన ఇశ్రాయేలీయుల వలె శోధనలను అనుభవించాడు, కాని ఇశ్రాయేలు అవిధేయుడైన కుమారునిగా ఉండగా, ఆయన విధేయత చూపిన కుమారుడై యున్నాడు. అరణ్య అనుభవములో, నూతన నిర్గమనలో యేసు విజయుడైన నాయకుడైయ్యాడు మరియు ఆయన వచ్చి మత్తయి 5లోని కొండ మీద ప్రసంగములో ఒక క్రొత్త ధర్మశాస్త్రమును ఇచ్చాడు మరియు ఆయన ఒక క్రొత్త ధర్మశాస్త్రమునిచ్చినవానిగా కనుపరచబడ్డాడు... కాబట్టి సువార్తలు మరియు పాత నిబంధన మధ్య ఈ సామరస్యమును మరియు ఐక్యతను మీరు మరలా మరలా చూస్తారు మరియు అనేక సంవత్సరముల క్రితం ఆరంభమైన కథను యేసు పూర్తి చేశాడు.

— డా. మైఖేల్ జే. కృగర్

పాత నిబంధన వాక్యభాగములను అనువర్తించుటను గూర్చిన ఈ సామాన్య ధోరణిని మనస్సులో ఉంచుకొని, క్రొత్త నిబంధన వాక్యభాగములను క్రొత్త నిబంధన యుగమునకు అనువర్తించుటను మనము చూద్దాము.

మొదటిసారి చూసినప్పుడు, క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన యుగములో వ్రాయబడినది కాబట్టి క్రైస్తవులు క్రొత్త నిబంధనను అనువర్తించుకొనునప్పుడు యుగముల సంబంధమైన పురోగమనములను పరిగణించవలసిన అవసరము లేదు అన్నట్లు అనిపిస్తుంది. అయితే క్రొత్త నిబంధన యొక్క ఆరంభ దశలో క్రొత్త నిబంధన అంతా వ్రాయబడినది అని మనము మనస్సులో ఉంచుకొనుట చాలా అవసరమైయున్నది. నేడు, మనము ఆ దశలో జీవించుటలేదు. బదులుగా, మనము క్రొత్త నిబంధన యుగము యొక్క కొనసాగింపులో జీవించుచున్నాము. కాబట్టి, క్రొత్త నిబంధనను మన జీవితములకు అనువర్తించుకొనునప్పుడు ఈ యుగముల సంబంధమైన వ్యత్యాసమును మనము మనస్సులో ఉంచుకోవాలి.

క్రొత్త నిబంధన గ్రంథములు సంఘమును స్థాపించిన నాయకుల చేతులలో నుండి వచ్చాయి మరియు క్రొత్త నిబంధన యుగము యొక్క ఆరంభ కాలములో నివసించిన ప్రజల కొరకు ముందుగా ఇవ్వబడినవి. క్రొత్త నిబంధన యుగము యొక్క కొనసాగింపులో మనము జీవించుచుండగా ఈ రచయితలు వ్రాసిన విషయములు మన కొరకు అనేక అంతర్భావములను కలిగియున్నవి. కాబట్టి, ఈ రచనలు వ్రాయబడిన కొన్ని వేల సంవత్సరముల తరువాత మనము జీవించుచున్నప్పటికీ, మన మీద అవి నిస్సందేహమైన అధికారమును కలిగియున్నవి.

నేటి మన జీవితములకు మరియు క్రొత్త నిబంధన వ్రాయబడిన కాలములకు మధ్య ఉన్న కొన్ని వ్యత్యాసములను పరిగణించండి. ఉదాహరణకు, నేటికి భిన్నముగా, మార్గదర్శకము కొరకు సహాయమును ఆ దినములలో నివసించుచున్న వ్యక్తిగత అపొస్తలులు మరియు ప్రవక్తలతో సూటిగా అడిగియుండవచ్చు. ఫిలేమోను పత్రికలో దీనిని మనము చూడవచ్చు. అంతేగాక, సంఘమునకు పునాది వేసిన నాయకుల మధ్య జరిగిన సంభాషణల ద్వారా అనేక ప్రసిద్ధిగాంచిన సమస్యలు పరిష్కరించబడినవి, ఉదాహరణకు అపొస్తలుల కార్యములు 15వ అధ్యాయములో యెరూషలేము సభ వంటివి. అయితే మన దినమున, ఈ సంఘమును స్థాపించిన అధికారులు మన మధ్య నివసించుటలేదు. కాబట్టి, మనకు మార్గదర్శకముగా ఉండుటకు క్రొత్త నిబంధనలో వారి బోధనల యొక్క సంగ్రహముల మీద మనము ఆధారపడాలి.

దీనికి తోడు, క్రొత్త నిబంధనలో అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన సన్నివేశములను గూర్చిన ఉదాహరణలు ఉన్నాయి. యేసు, ఆయన అపొస్తలులు మరియు ప్రవక్తలు ప్రాముఖ్యముగా వారి అధికారమును స్థాపించుకొనుటకు వరములను పొందుకున్నారు. అప్పుడు ఇది వాస్తవమైయుండినప్పటికీ, నేడు అధికారము కేవలం క్రొత్త నిబంధన ద్వారా మాత్రమే స్థాపించబడుతుంది. ఈ వ్యత్యాసమును మనము మరచిపోయినట్లయితే, మన దినము కొరకు మనము అబద్ధ ఆకాంక్షలను కలిగియుంటాము. ఖచ్చితముగా ఉండుటకు, క్రొత్త నిబంధన యొక్క కొనసాగింపులో దేవుడు సంఘములో ఆశ్చర్యములను చేయుట కొనసాగిస్తాడు, అయితే ఈ యుగములో అట్టి సన్నివేశములు క్రీస్తు మరియు ఆయన అపొస్తలులు భూమి మీద జీవించిన కాలములో జరిగినంత తరచుగా జరగవు అని కనుగొనినప్పుడు మనము నిరుత్సాహపడకూడదు.

అంతేగాక, క్రొత్త నిబంధన రచయితలు క్రొత్త నిబంధన యొక్క ఆరంభములో విశేషముగా ప్రాముఖ్యమైయుండిన సైద్ధాంతిక మరియు అభ్యాసిక విషయములకు తమను తాము అంకితము చేసుకున్నారు. ఉదాహరణకు, దేవుని రాజ్యమును దాని యొక్క యూదా మూలముల నుండి అన్యజనుల లోకమునకు వ్యాపింపజేయుట కంటే ఎక్కువ దృష్టిని క్రొత్త నిబంధనలో ఏ ఇతర విషయము ఆకర్షించలేదు. క్రొత్త నిబంధనలో పరిష్కరించబడిన అనేక వివాదములు, క్రీస్తు అనుచరులు పాత నిబంధన ఆచారములను మరియు ఇతర యూదుల పరంపరలను ఆచరించాలా లేక ఆచరించకూడదా అను విషయముతో వ్యవహరించాయి. ఈ బోధనలు నేటి సంఘము కొరకు అంతర్భావములను కలిగియున్న మాట వాస్తవమైనప్పటికీ, క్రైస్తవ సంఘము ఈ ఆరంభ వివాదములలో చాలా వాటిని విడచి ముందుకు వెళ్లింది. సువార్త ప్రపంచ వ్యాప్తముగా వ్యాపించుచుండగా, మనము ఇతర రకమైన సమస్యలను ఎదుర్కుంటాము.

నేను అపొస్తలుల కాలమునకు తిరిగివెళ్లి, అపొస్తలుల యొక్క ప్రసంగ పరిచర్యను మరియు వారు చేసిన ఆశ్చర్యకార్యములను మరియు సంఘ జీవితములో వారు పరిచయము చేసిన ప్రతి విషయమును వీక్షించాలని నాకు కొన్నిసార్లు ఆశ కలుగుతుంది. మరియు అవును, ఆదిమ సంఘము యొక్క అనుభవాలలో చాలా వరకు నేడు మనము లోకములో కలిగియున్న అనుభవాలను పోలియున్నవి. అనగా, లోకములో అనేక చోట్ల సంఘము హింసించబడుతుంది, మరియు మొదటి విశ్వాసులు పట్టుకొనియుండిన సువార్తను వారు కూడా పట్టుకొనియున్నారు. అయితే అపొస్తలుల యొక్క పరిచర్య సంఘ చరిత్రలోని విశేషమైన కాలములలో విశేషమైన రీతిలో ఉన్నదను భావన కూడా ఉన్నది, మరియు ఆ అపొస్తలులు ఇచ్చిన లేఖనములను చదువుట ద్వారా మనము వారు వేసిన పునాదుల మీద నిర్మిస్తాము. అయితే అపొస్తలుని యొక్క స్థానము సంఘ జీవితములో ఒక కొనసాగు స్థానమైయున్నది. అది వారికి ఇవ్వబడిన విశేషమైన పునాదివేయు పరిచర్య అయ్యున్నది మరియు ఇప్పుడు మనము నేడు సంఘములో ఆ పునాది మీద నిర్మించుచున్నాము.

— డా. ఫిలిప్ రైకెన్

ఈ కారణము చేత, క్రొత్త నిబంధనను మనము ఆధునిక లోకమునకు అనువర్తించునప్పుడు, వాస్తవిక అర్థము క్రొత్త నిబంధన యుగము యొక్క ఆరంభ దశ మీద స్థిరముగా నాటబడియున్నది అని గ్రహించుట చాలా కీలకమైయున్నది. ఈ వాస్తవిక అర్థమును మనస్సులో ఉంచుకొని, క్రొత్త నిబంధన యుగములో జరిగిన తదుపరి పురోగమనములను పరిగణలోనికి తీసుకొనుట ద్వారా దీనిని మన కాలమునకు అనువర్తించుకోవచ్చు.

పాత మరియు క్రొత్త నిబంధనలలో క్రొత్త నిబంధన అనువర్తనమునకు సాధారణ మార్గదర్శకములను చూశాము. కాబట్టి, ఈ నియమములను ఉదహరించు లేఖనములోని ఒక ఉదాహరణను ఇప్పుడు మనము చూద్దాము. యుద్ధము మీద బైబిలు పెట్టిన ఉద్ఘాటనను ఒక ఉదాహరణగా మనము చూద్దాము.

బైబిలు దుష్టశక్తులు మరియు వాటిని అనుసరించు దేశముతో జరుగు యుద్ధము అను అంశము మీద ఎక్కువ దృష్టిని పెడుతుంది అని బైబిలు ఎరిగిన ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇంచుమించు పాత నిబంధనలోని ప్రతి పుస్తకము ఏదో ఒక విధంగా ఈ అంశమును ప్రస్తావిస్తుంది. మరియు పాత నిబంధనలో కనిపించు దుష్టత్వమునకు విరోధముగా యుద్ధము క్రొత్త నిబంధన యుగములో కూడా కొనసాగుతుంది అని క్రొత్త నిబంధన పదే పదే సూచిస్తుంది.

పాత నిబంధనలో, దేవుడు ఒక యుద్ధవీరునిగాను, యుద్ధవీరుడైన రాజుగాను, ఒక సైన్యముకు అధిపతిగాను కనుపరచబడుట తరచుగా మనము చూస్తాము. అవును, మన నేపథ్యములో ఇది సరియైన భావనను కలిగించకపోవచ్చు, మరియు దీనిని మనము సరిగా అర్థము చేసుకొనలేకపోవచ్చు. అయితే ప్రాచీన ఇశ్రాయేలు జీవితములో యుద్ధములు ఒక సామాన్య విషయమైయుండేవి... ఫరో దేవుని ప్రజలు వెళ్లుటకు ఇష్టపడలేదు, కాబట్టి దేవుడు ఏమి చేశాడంటే... ముందుగా తెగుళ్లను పంపాడు, కాని తరువాత దేవుడు యెర్ర సముద్రములో ఐగుప్తు సైన్యమును ముంచుట ద్వారా ఆయన వారితో యుద్ధము చేశాడు. కాబట్టి మరొక ఉదాహరణను మనము చూస్తాము. తరువాత మోషే మరియు మిర్యాము దేవుని స్తుతించుట కొరకు ఈ పాటను పాడారు: గుఱ్ఱమును దాని రౌతును ... గుఱ్ఱమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. కాబట్టి ఇక్కడ దేవుడు యుద్ధవీరునిగా కొనియాడబడినాడు. మరియు ఇశ్రాయేలు దేశము కనానీయుల భూమిలోనికి వెళ్లుచుండగా, దేవుడు వారి పక్షమున పోరాడుచుండినప్పుడు మనము దానిని నిశ్చయముగా చూస్తాము.

— డా. డేవిడ్. టి. లాంబ్

ఈ అంశము యొక్క ప్రాముఖ్యత ఒక కీలకమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. దీనిని మనము నేటి మన జీవితములకు ఏవిధంగా అనువర్తించుకోవాలి? మనము పాత నిబంధనను లేక క్రొత్త నిబంధనను చదివినప్పుడు, మన జీవితములకు ఈ అంశము అనువర్తించబడు విధానమును గూర్చి సంపూర్ణమైన చిత్రమును మనము పొందుకోవాలని కోరినట్లయితే, క్రీస్తునందు నూతన నిబంధన యుగములోని మూడు దశల దృష్ట్యా దానిని మనము చూడాలి.

మొదటిగా, మన యుగము యొక్క ఆరంభమునకు మనము విశేషమైన ధ్యాసను ఇవ్వాలి. లోకములో దుష్టత్వము మీద యుద్ధము అను అంశములోని కొన్ని కోణములు యేసు యొక్క భూలోక పరిచర్యలో విశేషముగా నెరవేర్చబడినవి అని క్రొత్త నిబంధన స్పష్టము చేస్తుంది. తన పరిచర్యలో జరుగుచున్నది దుష్టత్వము మీద విజయమైయున్నది అని యేసు స్వయంగా తన శిశ్యులకు తెలియజేశాడు.

ఉదాహరణకు, లూకా 10:18-19లో, ఆయన శిష్యులు దయ్యములను వెళ్లగొట్టి తిరిగివచ్చిన తరువాత యేసు ఇచ్చిన జవాబును మనము చదువుతాము.

సాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను (లూకా 10:18-19).

అంతేగాక, కొలస్సీ. 2:15 ప్రకారం, యేసు సిలువ మీద తాను పొందిన మరణము ద్వారా దుష్ట ఆత్మీయ శక్తులను ఓడించాడు:

ఆయనతోకూడ మిమ్మును జీవింపచేసెను; [యేసు] ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను (కొలస్సీ. 2:15).

ఇదే విధముగా, ఎఫెసీ. 4:8లో, క్రీస్తు పునరుత్థానము మరియు ఆరోహణమును పౌలు యుద్ధములో విజయముగా సూచించాడు.

అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెను [ను] (ఎఫెసీ. 4:8).

ఇవి మరియు ఇలాంటి ఇతర వాక్య భాగముల వెలుగులో, పాత లేక క్రొత్త నిబంధనలలో దేవుని విరోధుల మీద యుద్ధమును గూర్చిన అంశమును మనము చూసిన ప్రతిసారి, క్రొత్త నిబంధన యుగము యొక్క ఆరంభములో జరిగిన యుద్ధములో క్రీస్తు తన పాత్రను నెరవేర్చిన విధానమును ఎల్లప్పుడూ మనము మనస్సులో ఉంచుకోవాలి. క్రీస్తు ఇంతకు ముందే సాధించిన దానికి వేరుగా, పాపము మరియు మరణము అను శక్తుల మీద అంతిమ విజయము అను నిరీక్షణ లేనేలేదు.

తన మొదటి రాకడలో క్రీస్తు యుద్ధమును, లేక సాతానుతో యుద్ధ మును కనుపరచాడు, లేక యుద్ధ మును నెరవేర్చాడు. మరియు అది పతనము జరిగినప్పుడు ఒక విమోచకుని పంపుతానని దేవుడు ఆదాము హవ్వలకు వాగ్దానము చేసినప్పుడు ఆదికాండము 3:15లో ఆరంభమైయ్యింది. తరువాత అది సిలువ మీద జరుగుటను మనము చూస్తాము. సాతాను తల చితక ద్రొక్కబడింది, యేసు మడిమెమీద కాటువేయబడింది, కొట్టబడింది — మీరు ఏ పదమైన ఉపయోగించవచ్చు — తరువాత ఆయన మరణములో నుండి తిరిగిలేచి సాతాను మీద సంపూర్ణమైన విజయమును సాధించాడు.

— డా. హోవార్డ్ ఐరిచ్

అంత్య కాలమందు క్రీస్తు తిరిగివచ్చునంత వరకు ఆయన దుష్టుని పూర్తిగా నాశనము చేయడు అని అనేకమంది క్రైస్తవులు అనుకుంటారు. అయితే క్రీస్తు తన మొదటి రాకడలోనే దుష్టుని సమూలముగా నాశనము చేశాడు అనునది వాస్తవమైయున్నది. ఆయన నియమ రూపములో దుష్టత్వమును నాశనం చేశాడు అని మనము చెప్పవచ్చు, అనగా ఆయన సిలువ మీద అపవాదిని ఓడించాడు మరియు అంతిమ రెండవ రాకడ కొరకు పునాదిని వేశాడు. లోకములో నేటికి దుష్టత్వము ఉన్నది, మరియు ఇప్పటికీ మనము దానిలో నివసిస్తాము, కాని ఆ దుష్టత్వము నిర్మూలమగు మార్గములో ప్రయాణిస్తుంది. మన ప్రభువైన యేసు క్రీస్తు చేసిన యుద్ధములో, “ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను” మరియు ఆయన మరణ పునరుత్థానముల ద్వారా అపవాది క్రియల మీద గొప్ప విజయమును సాధించాడు.

— డా. ఘస్సన్ ఖలాఫ్, అనువాదము

మన యుగము యొక్క ఆరంభముతో పాటుగా, లేఖనములో మనము యుద్ధము అను అంశమును చూసే ప్రతిసారి, దానిని క్రొత్త నిబంధన యుగము యొక్క కొనసాగింపునకు కూడా అనువర్తించుటకు సిద్ధముగా ఉండాలి.

తన మొదటి రాకడలో దుష్టత్వము యొక్క అంతిమ ఓటమిని క్రీస్తు స్వయంగా ఆరంభించినప్పటికీ, ఈ యుద్ధము సంఘ చరిత్ర అంతటిలో ప్రతి విశ్వాసి యొక్క అనుభవములో భాగమైయున్నది అని క్రొత్త నిబంధన బోధిస్తుంది.

ఉదాహరణకు, 2 కొరింథీ. 10:4లో, సువార్త యొక్క వ్యాప్తి దురాత్మ శక్తుల మీద యుద్ధము అయ్యున్నది అని పౌలు ఉద్ఘాటించాడు. అక్కడ అతడు ఇలా అంటాడు:

మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై యున్నవి (2 కొరింథీ. 10:4).

ఎఫెసీ. 6:12లో సంఘములో యుద్ధమును గూర్చి పౌలు ఈ విధంగానే సంబోధించాడు:

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము (ఎఫెసీ. 6:12).

ఈ రెండు వాక్యభాగములలో క్రైస్తవులముగా మనము చేయు యుద్ధము స్వాభావికముగా ఆత్మీయమైయున్నది అను విషయమును గమనించండి. మన యుగము యొక్క ఆరంభములో యేసు చేసిన విధముగానే, మనము “రక్త మాంసము”లతో పోరాడుటలేదు. మనము “ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను” పోరాడుచున్నాము. క్రీస్తు రాజ్యము యొక్క కొనసాగింపులో, మనము లోకములో పని చేయుచున్న సాతానుతోను మరియు ఇతర దురాత్మ శక్తులతోను యుద్ధము చేయుచున్నాముగాని ప్రజలతో కాదు. 2 కొరింథీ. 5:19-20లో, పౌలు ఈ మాటలను వ్రాశాడు:

[దేవుడు] ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము (2 కొరింథీ. 5:19-20).

క్రొత్త నిబంధన యొక్క కొనసాగింపు కాలములో నివసించుచున్న దేవుని ప్రజలముగా, మనము మన తోటి మనుష్యులతో పోరాడుటలేదు. బదులుగా, మనము “క్రీస్తు రాయబారులమై”యుండి క్రీస్తు సువార్త యొక్క వ్యాప్తి ద్వారా పాపము యొక్క అధికారములో నుండిమానవులను విడిపించుట కొరకు ప్రయత్నించుచున్నాము. “దేవునితో సమాధానపడుడి” అని ప్రజలను బతిమాలుకొనుట ద్వారా మనము సాతాను రాజ్యము యొక్క ఓటమిని మరి ముందుకు తీసుకొనివెళ్తాము.

కాబట్టి, 2 కొరింథీ. 2:14లో పౌలు సువార్త పరిచర్యను క్రీస్తు యొక్క విజయోత్సవము అని వర్ణించుట మనకు ఆశ్చర్యము కలిగించకూడదు:

మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తునుగూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము (2 కొరింథీ. 2:14).

యుద్ధ మును గూర్చిన ఉదాహరణలను మనము పాత నిబంధన నుండి లేక క్రొత్త నిబంధన నుండి వెలికితీసినా, క్రీస్తు అనుచరులు క్రొత్త నిబంధన యొక్క కొనసాగింపులో తమ అనుదిన పరిచర్యకు ఈ అంశమును అనువర్తించుటకు సిద్ధముగా ఉండాలి.

అనేక విధములుగా క్రీస్తు నేడు సంఘము ద్వారా దుష్టత్వము మీద యుద్ధమును నెరవేర్చుచున్నాడు, కాని మనము పరిగణించవలసిన ఒక ప్రధానమైన విషయము ఏమిటంటే, క్రీస్తు రాజ్యము నేడు మనము ఊహించుకొను ఇతర రాజ్యముల కంటే భిన్నమైన క్రమమును కలిగియున్నది. యేసు దినములలో ఆయన రాజకీయ క్రమమును స్థాపిస్తాడు అని అపార్థము చేసుకొనినవారి విషయములో ఇది ఎంత వాస్తవమైయున్నదో, నేడు కూడా ఇది అంతే వాస్తవమైయున్నది, నేడు మన జాతీయ లేక సామజిక-ఆర్థిక ఆసక్తుల కారణంగా, క్రీస్తు యొక్క యుద్ధ మును మనము సిలువ యుద్ధముగా గాక సింహాసనము లేక ఖడ్గ యుద్ధముగా పరిగణిస్తాము. ఇట్టి ఆత్మీయ పోరాటమును గూర్చి ఎఫెసీ. 6లో పౌలు మనకు మార్గదర్శకములను ఇస్తాడు. మనము ప్రార్థించవలసియున్నది. మనము సువార్తను ప్రకటించవలసియున్నది. మనము విశ్వాసమును పంచవలసియున్నది. మనము నీతిని మరియు దేవుని వాక్యములో నియమములను పాటించవలసియున్నది... వాస్తవానికి, మార్టిన్ లూథర్, తాను వ్రాసిన “ఏ మైటీ ఫోర్ట్రెస్”లో ఈ వాక్యము భూలోక అధికారములన్నిటి కంటే ఉన్నతమైనది అని తెలియపరిచాడు. కాబట్టి, దేవుని సేవకుని కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా క్రీస్తు యొక్క ఆత్మీయ పోరాటమునకు నెరవేర్పుగా దేవుని వాక్యము ప్రబలుతుంది. కాబట్టి, మన కొరకు దీని అర్థము ఏమిటంటే, మనము క్రీస్తు పద్ధతిని, సిలువ-ఆకారములో జీవితమును పాటించవలసియున్నది. ఫిలిప్పీ 2 చెబుతున్నట్లు అదే వైఖరిని కలిగియుండి మనము క్రీస్తును అనుకరించుచున్నాము, తద్వారా సువార్త విశేషముగా కనబడుతుంది, మతమును ప్రధానముగా బలవంతపెట్టునదిగా చూచు మిగిలిన మతముల కంటే క్రైస్తవ్యము విశేషముగా కనబడుతుంది. క్రైస్తవ్యము మరియు ఇస్లాంలో ఉన్న ప్రధానమైన వ్యత్యాసము ఇదే. ఇస్లాం బలవంతపెట్టని విధముగా దేవునిని నమ్ముటను ఊహించుకోలేదు, మరియు క్రైస్తవ్యము ప్రధానముగా సిలువ మతమైయున్నది, స్వయం-సమర్పణ, క్రీస్తు మన కొరకు తన జీవితమును అనుగ్రహించాడు కాబట్టి ఇతరుల కొరకు మన ప్రాణములను పెట్టు మతమైయున్నది, కాబట్టి ఇది ఇతరులు మనస్పూర్తిగా వచ్చి ఆయనను ప్రభువుగా చేసుకొనునట్లు క్రీస్తు మాదిరిని అనుసరించుటకు మరియు సమర్పణ కలిగియుండుటకు పిలుపైయున్నది.

— రెవ. మైక్ గ్లోడో

క్రొత్త నిబంధన యుద్ధము అను అంశమును మన యుగము యొక్క ఆరంభము మరియు కొనసాగింపుకు మాత్రమే అనుబంధపరచదుగాని, క్రొత్త నిబంధన యుగము యొక్క నెరవేర్పుకు కూడా అనుసంధానము చేస్తుంది.

క్రీస్తు స్వయంగా తన మొదటి రాకడలో యుద్ధమునుచేసిన విధముగానే, ఆయన మహిమలో తిరిగివచ్చినప్పుడు దుష్టత్వము మీద యుద్ధమును ఆయన ముగిస్తాడు. ఆయన ఉగ్రతకు పాత్రులుగా ఆత్మీయ శక్తులను మరియు ఆయన కనికరమునకు పాత్రులుగా మానవులను పరిగణించుట ద్వారా ఆయన చేసిన వ్యత్యాసము రెండవ రాకడలో అంతరించిపోతుంది. ప్రకటన 19:11-15లో, రాబోవు యుద్ధమును యోహాను ఈ విధంగా వర్ణించాడు:

మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండి యున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామముగలవాడు. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆయన యినుప దండముతో వారిని ఏలును (ప్రకటన 19:11-15).

అనేక విధాలుగా, దుష్టుని మీద క్రీస్తు అంతిమ యుద్ధము చేయు ఈ సన్నివేశము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి మీద మన విజయము మరియు నిత్య జీవమునకు నిరీక్షణ అయ్యున్నది. పాపము మరియు మరణము యొక్క అంతిమ ఓటమి జరిగినప్పుడు, క్రీస్తు పరిపాలించుచు విజయములో ఆయనతో కూడా పాలించుటకు ఆయన తన అనుచరులందరినీ ఆహ్వానిస్తాడు.

బైబిలులో, విశేషముగా పాత నిబంధనలో యుద్ధము అను అంశము, మరియు దేవుని తీర్పు మరియు ఆయన ఉగ్రత, అది వివృతమగు విధానము మరియు అంత్య దినములలో అది ఎలా ఉంటుంది అను విషయము ఒక పెద్ద అంశమైయున్నది ... అయితే క్రొత్త నిబంధనలో ఈ అంశము రెండు విభిన్నమైన మార్గములలో అభివృద్ధి చెందినది. మొదటిది యేసు పాపము మీద యుద్ధము చేయుటకు ఆయన దైవిక యోధునిగా వచ్చాడు, కాని ఈసారి పాపి మీద కాదు పాపము మీద యుద్ధము చేయుటకు వచ్చాడు. ఒక విధముగా ఆయన ఇక్కడ క్షతగాత్రునిగా ఉన్నాడు. ఆయన ఉగ్రతను తెచ్చువానిగా గాక దేవుని యొక్క సంపూర్ణ ఉగ్రతను పొందుకొను వాడైయ్యాడు. ఇప్పుడు, తమను తాము దాచుకొనుట ద్వారా లేక క్రీస్తులో ఆ తీర్పును అనుభవించినవారిగా క్రీస్తుతో ఐక్యపరచబడుట ద్వారా పాపులు తుదకు దేవుని ఉగ్రతను తప్పించుకుంటారు. కాబట్టి క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన తన ప్రజలతో కలిసి రావాలనుకొనుచున్నాడు, మరియు ఆయన రాబోవుచున్నాడు మరియు పశ్చాత్తాప పడనివారి మీద మరియు విశ్వాసములో ఆయనతో ఐక్యపరచబడనివారి మీద యుద్ధము చేయబోతున్నాడు. కాబట్టి మనము ఒక విధముగా జలప్రళయములో, ఇశ్రాయేలు మరియు వాగ్దాన దేశము విషయములో, అష్షూరు మరియు బబులోను ఇశ్రాయేలు మీద యుద్ధము చేసినప్పుడు కూడా అంత్యదినముల తీర్పునకు చిత్రములుగా మనము యుద్ధమును గూర్చిన అవగాహనలను పొందుకుంటాము. అయితే మన కొరకు క్రీస్తు అనుభవించినవాటికి అవి నిజముగా చిత్రములైయున్నవి. కాబట్టి రెండు చిత్రములు ఉన్నాయి: ఒకటి, దేవుని కృప — ఆయన యుద్ధ మును ఉగ్రతను ఎదుర్కొని మన కొరకు వాటి శాపమును అనుభవించాడు, కాని దేవుని న్యాయము కూడా దానిలో ఉన్నది. ఆయన తిరిగిరాబోవుచున్నాడు మరియు ఆయనతో ఐక్యముకాని వారు అదే విధమైన తీర్పును ఎదుర్కుంటారు.

— డా. మైల్స్ వాన్ పెల్ట్

లేఖనమంతటా కనిపించు యుద్ధము అను అంశమును మనము జయించిన యోధునిగా క్రీస్తు గొప్ప రాకడ యొక్క నెరవేర్పు వెలుగులో వ్యాఖ్యానించుటను ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి.

నేడు మనము లేఖనములను అనువర్తించుకొనుచుండగా యుద్ధము అను అంశమును క్రొత్త నిబంధన ఉపయోగించు విధానము మనకు సూచనగా ఉన్నది. స్పష్టముగా చెప్పాలంటే, క్రొత్త నిబంధన వాటిని విభిన్నమైన రీతులలో అభివృద్ధి చేస్తుంది కాబట్టి మనము ప్రతి అంశమును వ్యక్తిగతముగా అధ్యయనం చేయాలి. అయినను, ఏ బైబిలు అంశమునైనా మరిఎక్కువగా అనువర్తించుటకు, క్రీస్తునందు క్రొత్త నిబంధన యుగము యొక్క ఆరంభము, కొనసాగింపు మరియు నెరవేర్పు దృష్ట్యా అది పరిగణించబడిన విధానమును మనము చూడాలి. ఏ అంశమునైనా అన్వేషించుటకు మనము ఏ విధంగా ఆరంభించినా, మనము పాత లేక క్రొత్త నిబంధనలో ఆరంభించినా, క్రీస్తు అనుచరులముగా క్రొత్త నిబంధన యుగములోని మూడు దశలలో అవి నెరవేర్చబడిన విధానమును కనుగొనుట ద్వారా ఈ అంశములను మన జీవితములకు మనము అనువర్తించుకోవచ్చు.

ఆధునిక అనువర్తనము మరియు క్రొత్త నిబంధనను గూర్చిన ఈ పాఠములో, క్రీస్తునందు క్రొత్త నిబంధన బైబిలును మనము ఆధునిక లోకమునకు అనువర్తించు విధానమును ప్రభావితము చేయవలసిన మార్గములను మనము చూశాము. క్రొత్త నిబంధన కొరకు పాత నిబంధన నిరీక్షణల యొక్క నెరవేర్పు క్రీస్తునందు మన యుగము యొక్క ఆరంభము, కొనసాగింపు మరియు నెరవేర్పులో ఎలా కనబడుతుందో మనము గమనించాము. పాత మరియు క్రొత్త నిబంధనలోని ప్రతి అంశమును మన ఆధునిక జీవితమునకు అనువర్తించుట క్రొత్త నిబంధనలోని అవే మూడు దశలతో ఎలా అనుసంధానము కలిగియుండాలో మనము ఉదాహరించాము.

క్రీస్తునందు క్రొత్త నిబంధన ఒక చిన్న విషయము కాదు. బదులుగా, అది చరిత్ర అంతటి కొరకు దేవుని ఉద్దేశ్యముల యొక్క నెరవేర్పు అయ్యున్నది. ఈ విధంగా, మన ఆధునిక లోకములో బైబిలులోని ప్రతి భాగమును మనము అనువర్తించవలసిన విధానమును క్రీస్తునందు క్రొత్త నిబంధన ప్రభావితము చేస్తుంది. క్రీస్తు అనుచరులముగా, క్రీస్తునందు దేవుడు తన ఉద్దేశ్యములను నెరవేర్చు విధానము వెలుగులో మనము లేఖనములను చదవాలి. క్రీస్తు ఇప్పటికే చేసిన కార్యముల తట్టు మనము వెనుదిరిగి చూస్తాము, ఆయన ఇప్పుడు చేయుచున్న వాటిని మనము చూస్తాము, మరియు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన చేయబోవు కార్యముల కొరకు ఎదురుచూస్తాము. అప్పుడు మాత్రమే క్రొత్త నిబంధన ప్రజలముగా మనము లేఖనములను మన ఆధునిక లోకమునకు సరియైన రీతిలో అనువర్తించుకోగలము.

Continue reading the full transcript