అదే శ్రేణి 10వ పాఠానికి సమాధానమునిచ్చే ఒక అనుబంధ వీడియో ఇది. ఈ వీడియో క్రింది ప్రశ్నలకు సమాధానమిస్తుంది: దేవుడు మానవాళికి సాంస్కృతిక ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడు? మానవాళి పాపంలో పడటం మన సరైన ఆలోచించే సామర్థ్యాన్ని ఎలా ప్రభావితం చేసింది? దేవుని చట్టాలు పురాతన ఇజ్రాయెల్ సంస్కృతిని ఎలా నిర్దేశించాయి? క్రీస్తు రాక ఇజ్రాయెల్ మరియు అన్యజాతుల మధ్య సంబంధాన్ని ఎలా ప్రభావితం చేసింది? బైబిల్లో కేవలం వివరించబడిన సాంస్కృతిక పద్ధతులు మరియు మనం ఈరోజు అనుసరించవలసిన పద్ధతుల మధ్య తేడాను మనం ఎలా తెలుసుకోగలం? 1 కొరింథీయుల 11వ అధ్యాయంలో తల కవరింగుల గురించి పౌలు చెప్పిన ప్రకటనలకు క్రైస్తవులు ఎలా స్పందించాలి? క్రైస్తవులు భూమి యొక్క ఉప్పు మరియు ప్రపంచం యొక్క వెలుగుగా ఉండటం అంటే ఏమిటి? క్రైస్తవులు నేడు సంస్కృతుల మధ్య తేడాలను ఆమోదించడం ఎలా, అయితే, స్క్రిప్చర్ యొక్క సంపూర్ణ అధికారంలో విశ్వాసాన్ని ఎలా నిలబెట్టుకోవాలి?
From the transcript
ఏదో ఒక సమయములో, బైబిలును బోధించు ప్రతిఒక్కరు ఈ ప్రశ్నను ఎదుర్కొనే ఉంటారు, “బైబిలులోని ఈ భాగము కేవలం సాంస్కృతికమైనది కాదా?” వారి అర్థము ఏమిటంటే, లేఖనములోని కొన్ని భాగములు బైబిలు కాలముల యొక్క ప్రాచీన సంస్కృతులలో ఎంతగా నాటుకొనిపోబడినవి అంటే, అవి మనకు నేడు అనువర్తించబడుట సాధ్యము కాదు. కాబట్టి, క్రైస్తవులు “సాంస్కృతిక” బైబిలు భాగములు మరియు ఆధునిక జీవితమునకు అనువర్తించబడు బైబిలు భాగముల మధ్య వ్యత్యాసమును కనుగొనుటకు చాలా సమయమును గడుపుతుంటారు.
ఈ పాఠములో, మనము ఒక విభిన్నమైన దృక్కోణమును ప్రతిపాదించబోవుచున్నాము. లేఖనములోని భాగములను సాంస్కృతిక లేక అనువర్తిక భాగములుగా పరిగణించుటతో పాటుగా, బైబిలులోని ప్రతి భాగము సాంస్కృతికమైనది మరియు అనువర్తికమైనది అని మనము చూద్దాము. బైబిలు అంతా ప్రాచీన సాంస్కృతిక నేపథ్యమున ప్రతిబింబిస్తుంది, అయితే మనము ఎవరిమైయున్నను, లేక మనము ఎక్కడ లేక ఎప్పుడు నివసించుచున్నను ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధముగా అనువర్తించబడు దేవుని వాక్యమైయున్నది.
ఆయన మనకు లేఖనమును అనుగ్రహించాడు: వ్యాఖ్యానమునకు పునాదులు అను మన పాఠ్యక్రమములో ఇది పదియవ పాఠము, మరియు దీనికి “బైబిలు సంస్కృతి మరియు ఆధునిక అనువర్తనము” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో, లేఖనము యొక్క సాంస్కృతిక కోణములు ఆధునిక లోకములో మన బైబిలు అనువర్తనమును ఏ విధంగా ప్రభావితము చేయాలో మనము చూద్దాము.
మునుపటి పాఠములలో మనము తెలియజేసినట్లు, మన దినమున మనము బైబిలు భాగములను అనువర్తించిన ప్రతిసారి, లేఖనము యొక్క వాస్తవిక శ్రోతలకు మరియు ఆధునిక శ్రోతలకు మధ్య ఉన్న యుగముల సంబంధమైన, సాంస్కృతిక మరియు వ్యక్తిగత దూరమును మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఈ మూడు పరిగణలు ఒకదాని నుండి ఒకటి పూర్తిగా వేరుచేయబడలేకపోయినప్పటికీ, మనము లేఖనము యొక్క వాస్తవిక అర్థము నుండి ఆధునిక అనువర్తనము వైపుకు కదులుచుండగా పరిగణలోనికి వచ్చు సాంస్కృతిక విషయముల మీద మనము ప్రత్యేకముగా దృష్టి పెడదాము.
సంస్కృతిని నిర్వచించుటకు అనేక మార్గములు ఉన్నాయి. అయితే ఆధునిక సమాజశాస్త్రము మరియు మానవశాస్త్రములో కనిపించు కొన్ని దృక్పథములను అనుసరిస్తూ, సంస్కృతిని మనము ఈ విధంగా నిర్వచిద్దాము:
ఒక సమాజములో కనిపించు భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములు ఒకదానితో ఒకటి కలుసుకునే విధానములు
ఈ నిర్వచనము సూచించుచున్నట్లు, సంస్కృతులలో భాష, కళ, ఆరాధన, టెక్నాలజీ, పరస్పర సంబంధములు మరియు సామాజిక అధికారము వంటి కలుసుకునే పద్ధతుల యొక్క వర్ణమాల భాగమైయుంటుంది. మరియు ఈ కలుసుకును పద్ధతులలో పంచుకొనబడు భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములు భాగమైయుంటాయి — మనము ఏమి నమ్ముతాము, చేస్తాము మరియు భావిస్తాము. కాబట్టి, మనము సంస్కృతులను గూర్చి మాట్లాడునప్పుడు, ఈ విషయములు సమాజములో ఏ విధముగా కనబడతాయి అను విషయము మన మనస్సులో ఉంటుంది — అది ఒక కుటుంబము కావచ్చు, ఒక జాతి కావచ్చు, సామాజిక సంస్థ కావచ్చు, మతపరమైన సంస్థ కావచ్చు, లేక మానవ జాతి అంతా కూడా కావచ్చు.
ఈ పాఠము బైబిలు సంస్కృతి మరియు ఆధునిక అనువర్తనములోని మూడు కోణముల మీద దృష్టిపెడుతుంది: మొదటిగా, బైబిలులోని మొదటి అధ్యాయములలో కనిపించు సంస్కృతి యొక్క బైబిలు పునాదులను మనము పరీక్షించుదాము. రెండవదిగా, పాత మరియు క్రొత్త నిబంధనలలో జరిగిన పలు సంస్కృతి యొక్క బైబిలు పురొగమనములను మనము కనుగొందాము. మరియు మూడవదిగా, బైబిలులోని ఈ సాంస్కృతిక విషయములు మన ఆధునిక లేఖన అనువర్తనమును ప్రభావితము చేయగల విధానములను మనము చూద్దాము. సంస్కృతి యొక్క బైబిలు పునాదులను ముందుగా చూద్దాము.
సంస్కృతి యొక్క బైబిలు పునాదులను మనము పరిగణించుచుండగా, ఆదికాండము 1-11 అధ్యాయములను విశదీకరిస్తూ మనము ఆరంభిద్దాము. మొదటిగా, ఈ అధ్యాయములు సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను స్థాపించు విధానములను మనము చూద్దాము. రెండవదిగా, ఇవి రెండు వ్యతిరేకమైన సాంస్కృతిక ఆదర్శములను పరిచయము చేయు విధానము మీద దృష్టిపెడదాము. మరియు మూడవదిగా, లేఖనములోని ఆరంభ అధ్యాయములు దేవుని నమ్మకమైన సేవకుల మధ్య సాంస్కృతిక భిన్నత్వము కొరకు రంగమును సిద్ధపరచు విధానమును మనము పరిగణిద్దాము. సంస్కృతి యొక్క ప్రాముఖ్యతతో ఆరంభిద్దాము.
ఆదికాండములోని మొదటి పదకొండు అధ్యాయములు సృష్టి మొదలుకొని అబ్రాహాము దినముల వరకు గల ప్రపంచ చరిత్ర అంతటిని గూర్చి మాట్లాడతాయి. ఇవి మన అధ్యయనమునకు విశేషముగా ప్రాముఖ్యమైయున్నవి, ఎందుకంటే ఇవి లోకము కొరకు మరియు మానవ సంస్కృతి కొరకు దేవుని యొక్క ఆదర్శవంతమైన పద్ధతులను స్థిరపరుస్తాయి. ఈ విధముగా, ఆదికాండములోని మిగిలిన భాగము విషయములో మాత్రమేగాక, లేఖనములోని మిగిలిన భాగమంతటి విషయములో ఇవి మన అధ్యయనమునకు మార్గదర్శకమును ఇస్తాయి.
సంస్కృతికి పునాదులు మొదటిగా ఆదికాండము 1:28లో ప్రత్యక్షమవుతాయి, మరియు ఈ వాక్యభాగమును చాలాసార్లు “సాంస్కృతిక ఆజ్ఞ” అని పిలుస్తారు. ఇక్కడ, దేవుడు మానవాళికి ఇలా సెలవిచ్చాడు:
మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను (ఆది. 1:28).
సాంస్కృతిక ఆజ్ఞ యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకొనుటకు మరియు అనువర్తించుటకు, మనము మునుపటి పాఠములలో చూసిన ఒకదానిని జ్ఞాపకముంచుకోవాలి. ప్రతి జీవి ఆయనను నిత్యము వరకు ఆరాధించునట్లు లోకమును తన దృశ్య మహిమతో నింపుట చరిత్ర కొరకు దేవుడు ఎల్లప్పుడూ కలిగియున్న అంతిమ లక్ష్యమైయున్నది. దేవుడు సృష్టి యొక్క ఆదిమ క్రమమును స్థిరపరచిన తరువాత, దేవుని మహిమ యొక్క అంతిమ ప్రదర్శన కొరకు సృష్టిని మరింతగా సిద్ధపరచుట మానవునికి ఇవ్వబడిన బాధ్యత అయ్యున్నది అని సాంస్కృతిక ఆజ్ఞ సూచిస్తుంది.
లోకము, సృష్టి ఆయన మహిమతో నింపబడులాగున దేవుడు మానవాళికి సాంస్కృతిక ఆజ్ఞను అత్యంత సులువైన మాటలలో అనుగ్రహించాడు. సృష్టి యొక్క చిత్రమును మనము ఒక ఇంటిని ఒక ప్రాచీన దేవాలయము వలె నిర్మించు విధముగా చూస్తాము. మరియు ఒక దేవాలయము నిర్మించబడునప్పుడు, ఆ భవనమును కట్టమని ఆజ్ఞాపించిన దేవుడు దానిలో నివసిస్తాడు. కాబట్టి, సర్వభూమి దేవుని నివాసస్థానముగాను, ఆయన పరిశుద్ధ స్థలముగాను మార్చబడుట సృష్టి పట్ల బైబిలు అభిప్రాయమైయున్నది. అయితే దేవునిని సూచించు ఒక ప్రతిమకు బదులుగా — దేవాలయములో ఒక పక్షి లేక సింహము లేక ఇతర జీవి యొక్క ప్రతిమను ఉంచుటకు బదులుగా — ఆయన స్వరూపములుగా దేవుడు స్త్రీ పురుషులను దానిలో ఉంచాడు. మరియు సాంస్కృతిక ఆజ్ఞను ఇచ్చుట ద్వారా, దేవుడు ఇలా అనుచున్నాడు, “వెళ్లి నా స్వరూపమును వృద్ధి చేయండి, భూమిని నింపండి, తరువాత దానిని నా ఆధీనములోనికి తీసుకొని రండి, ఒక యాజకుని వలె దాని మీద అధికారమును కలిగియుండండి.” ఈ విధంగా, దేవుని స్వరూపములు వెళ్లి సృజించబడిన లోకము మీద దేవుని యొక్క ప్రభుత్వమును చేలాయించుట సాంస్కృతిక ఆజ్ఞ అయ్యున్నది, తద్వారా దానిని సృజించిన దేవుని కొరకు భూమి నివాస స్థానమవుతుంది, మరియు యెషయా 6 వంటి చోట్ల మనము చూచునట్లు ఆయన పరలోక సింహాసనము వలెనే భూమి కూడా ఆయన నివాస స్థానమవుతుంది. కాబట్టి నీరు సముద్రములను కమ్ము విధముగా యెహోవా మహిమ భూమిని కప్పుతుంది అని పాత నిబంధన మనకు చెబుతున్నప్పుడు, అది క్రొత్త విషయమేమీ కాదు, ఎందుకంటే ఇది దాని కొరకు దేవుడు కలిగియున్న వాస్తవిక ఆలోచన అయ్యున్నది.
— రెవ. మైక్ గ్లోడో
బైబిలు యొక్క ఆరంభములోనే ఆదికాండము 1లో, పతనమునకు ముందు, దేవుడు ఆదాము హవ్వలకు ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞను లేక కొన్ని హెచ్చరికలను — వాస్తవానికి, దీనిని ఒక దృష్టికోణము అనవచ్చు — ఇచ్చుచున్నాడు, మరియు అది తోటలోని అందమును, క్రమమును మరియు అద్భుతమును తీసుకొని లోకమంతటా వ్యాపింపజేయుట అయ్యున్నది. మరియు బైబిలులోని వృత్తాంతము చాలా వరకు పతనము మరియు అలా చేయుటలో విఫలమగుట, మరియు అదే ఆజ్ఞను రెండవ ఆదాము అయిన యేసు క్రీస్తు మరియు ఆయన వధువుయైన సంఘము ద్వారా మరలా ప్రారంభించుట అయ్యున్నది. కాబట్టి ఆ సాంస్కృతిక ఆజ్ఞ, ఆ సృష్టి ఆజ్ఞ, ఆదికాండము 1లోని ఆ వాస్తవిక ఆజ్ఞ, బైబిలు సందేశమునకు మూలమైయున్నది, మరియు అదే విమోచన కూడా అయ్యున్నది అని నేను సూచిస్తాను. ఒక పండితుడు విమోచనను “సృష్టిని పునరుద్ధరించుట” అని పిలిచాడు. మరియు అది అందమైన చిత్రము అని నేననుకుంటాను. బైబిలు యొక్క సారాంశముమను గూర్చి ఇది ఒక అందమైన సంగ్రహమైన అవగాహన అయ్యున్నది. నేను చాలాసార్లు బైబిలు సందేశమును దేవుడు తన పరిపాలనను, లేక తన రాజ్యమును, పరలోకము నుండి భూమికి, సృష్టి నుండి నూతన సృష్టికి పునరుద్ధరించుట అని వర్ణిస్తాను. మరియు అది దేవుడు పరలోక వాస్తవములను, పూర్తిగా-జన్మించిన భూలోక వాస్తవములను సంపూర్ణముగా తెచ్చుట అను రెండు వైపులను, రెండు కోణములను కలుపుతుంది, మరియు దేవుడు సృష్టిలో నుండి అంతిమ లక్ష్యమైన నూతన సృష్టి కొరకు కార్యము చేయుచున్నాడు అను తాత్కాలిక భావనను కూడా ఇస్తుంది. మరియు దేవుడు తన అందమును, తన వైభవమును, లేక బైబిలు భాషలో, “తన మహిమ”ను భూమియందంతటా వ్యాపింపజేయుచున్నాడు అను ఆలోచన దీనిలో కేంద్ర భాగమైయున్నది. మరియు వ్యక్తులుగా మరియు దేవుని సంఘములో విమోచించబడిన మానవాళిగా ఇది మానవులందరికీ ఇవ్వబడిన పిలుపైయున్నది.
— డా. జోనాథన్ టి. పెన్నింగ్టన్
దీనిని మనము ఆదికాండము 1:26లో చూస్తాము, అక్కడ దేవుడు ఇలా సెలవిచ్చాడు, “మన స్వరూపమందు నరులను చేయుదము.” ప్రాచీన లోకములో, దేశముల రాజులను దేవుని స్వరూపములు అని పిలిచేవారు, కొంత వరకు ఎందుకంటే వారి దేవతల యొక్క చిత్తమును కనుగొని దానికి అనుగుణంగా సంస్కృతులను నిర్మించుట వారికి ఇవ్వబడిన రాజరిక పనియైయుండేది. దీని వెలుగులో, భూమి మీద దేవుని చిత్తమును మరింత వ్యాపింపజేయుటకు ఇట్టి రాజరిక సాంస్కృతిక పరిచర్యను చేయునట్లు మానవులు సృజించబడిరి అని ఆదికాండము యొక్క ఆరంభ అధ్యాయములు స్పష్టముచేస్తాయి.
దీనికి తోడు, దేవుని చిత్తానుసారముగా కలుగు ప్రతి సాంస్కృతిక పురోగమనము దేవుని కొరకు చేయబడు పవిత్రమైన యాజక పరిచర్య అయ్యున్నది అని ఆదికాండము 2వ అధ్యాయము వివరిస్తుంది. తోటను “సేద్యపరచుటకును దాని కాచుటకును” దేవుడు ఆదాము హవ్వలను పవిత్రమైన తోటలో ఉంచాడు అని 15వ వచనములో మనము నేర్చుకుంటాము. ఈ వ్యక్తీకరణము రెండు హెబ్రీ క్రియా పదముల యొక్క కలయిక అయ్యున్నది: అవద్, దీనిని సాధారణంగా “పని చేయుట” లేక “శ్రమించుట” అని అనువదిస్తారు, మరియు షమర్, దీనిని సాధారణంగా “శ్రద్ధ వహించుట” లేక “కాయుట” అని అనువదిస్తారు. మోషే ఈ పదములను కలిపి మరొకసారి మాత్రమే ఉపయోగించాడు — సంఖ్యా 3:8లో మందిరములో దేవుని మహిమగల సన్నిధి ఎదుట లేవీయ యాజకుల యొక్క పరిచర్యను వర్ణించినప్పుడు.
కాబట్టి, ప్రభావవంతముగా, ఆదికాండములోని ఆరంభ అధ్యాయములు సంస్కృతి మన ఉనికిలో ఒక చిన్న కోణము మాత్రమే కాదు అను ఒక మౌలిక బైబిలు దృష్టికోణమును స్థాపిస్తాయి. బదులుగా, అది దేవుని కొరకు మన రాజరిక మరియు యాజక పరిచర్య అయ్యున్నది. ఆయన దృశ్యమైన మహిమ యొక్క అంతిమ ప్రదర్శనకు సిద్ధపాటుగా భూమిని నింపు, అభివృద్ధి చేయు, క్రమపరచు, అందముగా తీర్చు, మరియు పరిశుద్ధపరచు బాధ్యత కొరకు దేవుడు మనలను నియమించాడు.
దేవుడు మానవునికి సాంస్కృతిక ఆజ్ఞను ఎందుకు ఇచ్చాడో అర్థము చేసుకొనుటకు, నరుడు ఆయన స్వరూపమందు విశేషమైన రీతిలో సృజించబడినాడు అని గుర్తుంచుకొనుట చాలా ప్రాముఖ్యమైన విషయమైయున్నది అని నా ఆలోచన. కాబట్టి దైవిక స్వరూపమునకు నిర్మాణాత్మక కోణము కూడా ఉన్నది — మనము దేవుని స్వరూపమందు ఉన్నాము. అయితే కార్యరూప కోణము కూడా ఉన్నది, అది మానవులుగా మనకు తగిన విధముగా ఒక విశేషమైన రీతిలో దేవుని మహిమను చూపుట మరియు కనుపరచుట అయ్యున్నది మరియు మనము చేయు పని ద్వారా మనము ఆయన మహిమను ప్రతిబింబిస్తాము. కాబట్టి సాంస్కృతిక ఆజ్ఞను గూర్చి మనము ఆలోచన చేయునప్పుడు, భూమిని నింపు మరియు దానిని లోపరచుకొను, లోకమును ఏదెను వలె, తోట వలె చేయు పని, దానిని నింపి, దానిని జనాభాతో నింపు పని మనకు ఇవ్వబడినది. కాబట్టి ఇక్కడ ఆలోచన ఏమిటంటే, మానవ రూపములో కనుపరచబడిన ఆయన విశేషమైన దైవిక స్వరూపమును ఆయన మహిమ నిమిత్తము భూదిగంతముల వరకు వ్యాపింపజేయుట సాంస్కృతిక ఆజ్ఞ అయ్యున్నది.
— డా. బ్రూస్ బౌగస్
సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను గూర్చి బైబిలు పునాదులను మనము ఇప్పటి వరకు చూశాము గనుక, ఇప్పుడు రెండవ విషయమును మనము చూడాలి: చరిత్ర అంతటిలో మానవులు వెంబడించిన రెండు వ్యతిరేక సాంస్కృతిక ఆదర్శములకు బైబిలు పునాదులు.
మనము లోకములోని పలు ప్రాంతములకు ప్రయాణము చేయునప్పుడు, ప్రజలు విషయములను విభిన్నమైన రీతులలో చేయుటకు ఎంతో అవకాశము ఉన్నదని మనము జ్ఞాపకము చేసుకొనుట మంచిదే. మనమంతా వీధిలో ఒకే వైపున వాహనాలు నడపవలసిన అవసరం లేదు, ఒకే భాష మాట్లాడవలసిన అవసరము లేదు, లేక ఒకే రకమైన వస్త్రములు ధరించవలసిన అవసరము లేదు. అయినను, సంస్కృతి ఏనాడు కూడా నైతికముగా తటస్థమైనది కాదు అని ఆదికాండములోని ఆరంభ అధ్యాయములు స్పష్టము చేస్తాయి. భిన్నముగా, ఏదో ఒక విధముగా ప్రతి సంస్కృతిలోని ప్రతి పురోగమనము వ్యతిరేకముగా ఉన్న రెండు సాంస్కృతిక ఆదర్శములలో ఒకదానిని ప్రతిబింబిస్తుంది కాబట్టి అయితే దేవుని సంతోషపరుస్తుంది లేక దుఃఖపరుస్తుంది.
మానవులు సంస్కృతిని అనేక విధాలుగా అభివృద్ధి చేశారు అని బైబిలు రచయితలకు బాగా తెలుసు. అయితే వారి అభిప్రాయము ప్రకారం, సంస్కృతులన్నీ రెండు మౌలిక విభాగములలో ఒకదానికి చెందినవైయున్నవి: దేవుని సేవించిన సంస్కృతిక పద్ధతులు మరియు ఆయనను వ్యతిరేకించిన సంస్కృతిక పద్ధతులు.
మనము తరువాత చూడబోవుచున్నట్లు, ఈ సాంస్కృతిక వ్యత్యాసములు బైబిలును నేటి మన జీవితములకు అనువర్తించునప్పుడు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉంటాయి. అయితే ప్రస్తుతానికి, బైబిలులోని ఆరంభ అధ్యాయములలో ఈ విభజన ఏ విధంగా అనువర్తించబడినదో మనము పరిగణిద్దాము.
ఆదికాండము 3లో, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినుట ద్వారా ఆదాము హవ్వలు దేవుడు వారికి పెట్టిన స్వామిభక్తి పరీక్షలో విఫలమైయ్యారు. దీని తరువాత, వారు పాపములో పడిపోవుట ద్వారా మానవులు రెండు విభిన్నమైన సాంస్కృతిక మార్గములలో ప్రయాణిస్తారు అని దేవుడు బయలుపరచాడు. ఆదికాండము 3:15లో సర్పముతో ఇలా చెప్పినప్పుడు దేవుడు ఈ రెండు సాంస్కృతిక అన్వేషణలను వర్ణించిన విధానమును వినండి:
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తలమీద కొట్టును; నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను (ఆది. 3:15).
క్లుప్తంగా, ఇక్కడ ప్రస్తావించబడిన “స్త్రీ” దేవుడు సృజించిన మొదటి స్త్రీ అయిన హవ్వ, మరియు సర్పము సాతాను.
ఈ వాక్యభాగము చరిత్ర అంతటా మానవ సంస్కృతిలో కనిపించిన విభజనను స్థాపిస్తుంది. స్త్రీ సంతతి దేవుని నమ్మకముగా సేవించుటకు వెదకింది. మరియు సర్ప సంతతి ఆయనను వ్యతిరేకించుటకు ప్రయత్నించింది. మరియు ఈ విభజన హవ్వ యొక్క గొప్ప వారసుడైన క్రీస్తు యొక్క రాక వరకు, సాతాను మీద తన అంతిమ విజయమును పూర్తి చేయుటకు ఆయన తిరిగివచ్చు వరకు కొనసాగుతుంది.
ఈ రెండు మార్గములు ఆదికాండము 4లో కయీను మరియు హేబెలు వృత్తాంతములో వెంటనే కనిపిస్తాయి. 4వ అధ్యాయము చివరిలో, కయీను మరియు అతని వారసులు సర్ప సంతానముగా జీవించిన విధానమును మనము చూస్తాము. వారు సంక్లిష్టమైన సంస్కృతులను స్థాపించారు, కాని దేవుని చిత్తమును వ్యతిరేకించు ఉద్దేశముతో మరియు దుష్టుని తమ ఆత్మీయ తండ్రిగా చేసుకొనుట ద్వారా ఇలా చేశారు.
అయితే ఆదికాండము 5లో మనము షేతు వారసులను చూస్తాము, వారు స్త్రీ సంతతి యొక్క సంస్కృతిని అభివృద్ధి చేశారు. వారు కుటుంబములను, గోత్రములను రూపొందించారు. వారు మతపరమైన ఆచారములను మరియు భాషను అభివృద్ధి చేశారు. వారు పూర్ణులు కారు, కాని దేవుని సేవించు మరియు మహిమపరచు సాంస్కృతిక పద్ధతులను స్థాపించుటకు వారు ఉత్తమమైన కృషిని చేశారు. ఈ సమయము మొదలుకొని, లేఖనములు ఈ రెండు వ్యతిరేకమైన సాంస్కృతిక ఆదర్శముల మధ్య వ్యత్యాసమును చూపుట కొనసాగించాయి.
ఇక్కడ, మనము కొంత జాగ్రత్తగా ఉండాలి. లేఖనమును వ్యాఖ్యానించుటకు మరియు అనువర్తించుటకు, మానవ సంస్కృతిలోని ఈ రెండు మార్గముల మధ్య అనేక పోలికలు ఉన్నాయని కూడా మనము చూడాలి. కయీను మరియు హేబెలు ఇరువురు భూమిని లోపరచుకొనుటకు ప్రయత్నించారు అని ఆదికాండము 4 మరియు 5 అధ్యాయములు సూచిస్తాయి. వారిరువురు సామాజిక మరియు మతపరమైన ఆచారములను అభివృద్ధి చేశారు. మరియు, షేతు మరియు కయీను వంశావళులు కనుపరచుచున్నట్లు, రెండు క్రమములవారు వివాహము చేసుకొని పిల్లలను కన్నారు.
అట్టి విభిన్నమైన సాంస్కృతిక ఆదర్శములను అనుసరించు ప్రజలు ఒకే విధమైన సాంస్కృతిక వ్యక్తీకరణములను కలిగియుండుట ఎలా సాధ్యమైయ్యింది? ఈ పోలికలు రెండు కారణముల వలన జరిగాయని లేఖనములోని మిగిలిన భాగమంతటి నుండి మనము నేర్చుకుంటాము.
ఒక వైపున, దేవుని సామాన్య కృప, మానవాళిపట్ల ఆయన చూపిన రక్షింపని కనికరము, సాతానును మరియు వానిని అనుసరించు పాపభరితమైన ప్రజలను నిలువరిస్తుంది. ఫలితంగా, లోకములో అత్యంత పైశాచిక సంస్కృతులు కూడా ఎంతో కొంత వరకు దేవుని చిత్తమునకు కట్టుబడియుండుటను మనము చూస్తాము. మరొక వైపున, దేవుని మార్గములను అనుసరించువారిని పాపము భ్రష్టము చేయుట కొనసాగించింది. కాబట్టి, లోకములోని అత్యంత పరిశుద్ధమైన సంస్కృతులు కూడా దేవుని చిత్తమునకు పూర్తిగా కట్టుబడియుండుటలో విఫలమయ్యాయి.
కయీను మరియు హేబెలు కాలము నుండి నేటి వరకు, దేవుని నమ్మకమైన సేవకులు మరియు ఆయన మీద తిరుగుబాటు చేసినవారి యొక్క సాంస్కృతిక ప్రయత్నముల మధ్య భిన్నత్వములు మరియు పోలికలు ఎల్లప్పుడూ కనిపించాయి. మరియు నేడు లేఖనములోని ఏ వాక్యభాగమునైనా మనము అనువర్తించుటకు ప్రయత్నించినప్పుడు, ఈ సాంస్కృతిక భిన్నత్వములను మనస్సులో ఉంచుకొనుట చాలా ప్రాముఖ్యమైయున్నది.
సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను గూర్చిన బైబిలు పునాదులను, మరియు రెండు వ్యతిరేకమైన సాంస్కృతిక ఆదర్శముల యొక్క స్థాపనను ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి, ఇప్పుడు మూడవ విషయమును చూద్దాము. లేఖనము యొక్క ఆరంభ అధ్యాయములలోని సాంస్కృతిక భిన్నత్వమును దేవుడు ఆమోదించుట.
ఆదికాండములోని మొదటి అధ్యాయములు ప్రధానముగా కొంతమంది వ్యక్తులతో వ్యవహరిస్తాయి. కాబట్టి, బైబిలులోని ఈ భాగములో సమాజములు సాంస్కృతిక భిన్నత్వమును కనుపరచుటకు ఉదాహరణలు లేవు. అయినను, ఆదిమ మానవ చరిత్రలో వ్యక్తిగత ప్రజలకు తన చిత్తమును బయలుపరచిన విధానముల ద్వారా దేవుడు ఆదికాండములోని మొదటి అధ్యాయములలో సాంస్కృతిక భిన్నత్వము కొరకు రంగమును సిద్ధము చేశాడు.
సాంస్కృతిక భిన్నత్వము యొక్క పునాదులను వర్ణించుటకు అనేక మార్గములు ఉన్నాయి, కాని సమయమును దృష్టిలో ఉంచుకొని, “విశేషమైన ప్రత్యక్షత” ద్వారా సాంస్కృతిక భిన్నత్వము అభివృద్ధి చెందిన విధానమును మనము పరిగణిద్దాము మరియు దీనిని మనము “సామాన్య ప్రత్యక్షత” అని కూడా పిలుస్తాము.
దేవుడు తనను తాను మరియు తన చిత్తమును కలల ద్వారా, దర్శనముల ద్వారా, ప్రవక్తల ద్వారా, లేఖనముల ద్వారా, మరియు ఇతర మార్గముల ద్వారా బయలుపరచుకొనిన విధానములను సూచించుటకు “విశేషమైన ప్రత్యక్షత” అను పదమును సాంప్రదాయిక వేదాంతవేత్తలు ఉపయోగిస్తారు. ఉదాహరణకు, ఆదికాండము యొక్క ఆరంభ అధ్యాయములలో, దేవుడు మౌఖికముగా ఆదాము హవ్వలకు, కయీను హేబెలుకు, మరియు నోవహుకు తననుతను బయలుపరచుకున్నాడు.
మరొక వైపున, “సామాన్య ప్రత్యక్షత” దేవుడు సృష్టియందు తనను తాను మరియు తన చిత్తమును ప్రజలకు — మానవ వ్యక్తిత్వములకు, భౌతిక మరియు ఆత్మీయ సామర్థ్యములకు, మరియు ఇతరులకు — మరియు పరిస్థితులకు — బాహ్య, దృశ్యమైన లోకమునకు — అనుగుణంగా బయలుపరచుకొనుటను సూచిస్తుంది. కీర్తనలు 19 మరియు రోమా. 1:18-20 వంటి వాక్యభాగములలో దీనిని మనము చూస్తాము.
దేవుడు విశేషమైన మరియు సామాన్య ప్రత్యక్షతను ఉపయోగించుట తన ప్రజల మధ్య దేవుడు సాంస్కృతిక భిన్నత్వమును స్థిరపరచిన విధానమును అర్థము చేసుకొనుటలో మనకు సహాయపడుతుంది.
దేవుని నమ్మకమైన ప్రజలు ఇదే విశేషమైన ప్రత్యక్షతకు, ఒకే సమయములో, విభిన్నమైన రీతులలో విధేయత చూపిన విధానములలో దీనిని మనము చూస్తాము, ఎందుకంటే వారు విభిన్నమైన పరిస్థితులను ఎదుర్కొనుచున్న విభిన్నమైన ప్రజలైయున్నారు. ఉదాహరణకు, ఆదాము హవ్వలు ఆదికాండము 1:28లో సాంస్కృతిక ఆజ్ఞ అను విశేషమైన ప్రత్యక్షతను పొందారు. అయితే ఆదాము హవ్వలకు విభిన్నమైన తలాంతులు, వ్యక్తిత్వములు, భౌతిక సామర్థ్యములు, మొదలగునవి ఉన్నాయి. వారు విభిన్నమైన వ్యక్తిగత పరిస్థితులతో కూడా వ్యవహరించారు. వారి మధ్య ఈ భిన్నత్వములు ఎంత వరకు ప్రత్యక్షమైనప్పటికీ, ఆదాము హవ్వలు సాంస్కృతిక ఆజ్ఞ అను విశేషమైన ప్రత్యక్షతను ఒకే సమయములో విభిన్నమైన రీతులలో తమ జీవితములకు అనువర్తించుకోవలసియుండెను.
దీనితో పాటు, ప్రజలు మరియు పరిస్థితులలో కొనసాగుచున్న మార్పుల కారణంగా మానవాళి అదే విశేషమైన ప్రత్యక్షతను కాలక్రమములో విభిన్నమైన రీతులలో అనువర్తించింది. ఒక ఉదాహరణగా, దేవుడు మొట్టమొదటిగా సాంస్కృతిక ఆజ్ఞను ఇచ్చినప్పుడు, పాపము లోకములోనికి ప్రవేశించలేదు. అయితే ఆదాము హవ్వలు దేవుని మీద తిరుగుబాటు చేసిన తరువాత, వారి పరిస్థితులు మారిపోయాయి, ఫలితంగా, వారు సాంస్కృతిక ఆజ్ఞను పాటించిన విధానము కూడా మారిపోయింది. వాస్తవానికి, కాలము మరియు మానవాళి ముందుకు కొనసాగుచుండగా బాధ మరియు వ్యర్థత సాంస్కృతిక ఆజ్ఞ యొక్క నెరవేర్పును సంక్లిష్టము చేయు విధానమును ఆదికాండము 3లోని విశేషమైన ప్రత్యక్షత బయలుపరచింది.
కాలక్రమములో దేవుడు ఒకదాని తరువాత మరొక ప్రత్యక్షతను జోడించుచుండగా ఇదే విధమైన భిన్నత్వము ప్రత్యక్షమగుటను మనము చూడవచ్చు. ఎంతో కొంత వరకు, ప్రతి క్రొత్త విశేషమైన ప్రత్యక్షత మునుపటి విశేషమైన ప్రత్యక్షతలలోని అవసరతలలో మార్పు చేసింది. కాబట్టి, దేవుడు క్రొత్త విశేషమైన ప్రత్యక్షతలను ఇచ్చిన ప్రతిసారి, ఆయనకు నమ్మకముగా ఉన్న ప్రజలు అదే సమయములో మరియు కాలక్రమములో ఆయనను సేవించిన విధానములో మార్పును తెచ్చుట ద్వారా స్పందించవలసియుండెను.
ఆరంభము నుండే, విశేషమైన మరియు సామాన్య ప్రత్యక్షతలు ఆదిమ మానవులు దేవుని సేవించిన విధానములలో అనేక రకముల భిన్నత్వములలోనికి నడిపించాయి. మరియు ఈ పాఠములో మనము తరువాత చూడబోవుచున్నట్లు, ఈ ఆరంభ భిన్నత్వము బైబిలు చరిత్ర మరియు నేడు కూడా దేవుని నమ్మకమైన ప్రజల సమాజములు సాంస్కృతిక భిన్నత్వమును అనుసరించుటకు పునాదులను స్థాపించింది.
ఆదికాండములో ఇవ్వబడిన సాంస్కృతిక ఆజ్ఞ మనము ఫలించి వృద్ధిపొంది, భూమిని నిండించి, దానిని లోపరచుకోవాలను కోరుతుంది. అది సాంస్కృతిక భిన్నత్వములోనికి నడిపిస్తుంది. అయితే ఇది నిజముగా దేవుని రూపకల్పనలో భాగమైయున్నదా? అను ప్రశ్న తలెత్తుతుంది. విభిన్నమైన సంస్కృతుల మధ్య భిన్నత్వము ఉండాలని దేవుడు ఉద్దేశించాడా? మరియు లేఖన బోధన ప్రకారం దీని జవాబు, ఖచ్చితముగా, అని నేనంటాను. ఇది దేవుడు మనలను చేయుటకు పిలచిన కార్యము అయ్యున్నది... భిన్నత్వము కొరకు ఆయన కలిగియున్న ఆశలో నుండి పుట్టిన వాతావరణములో ఆయన మనలను సృజించాడు. ఆరిన నేల మాత్రమే లేదు, సముద్రము కూడా ఉన్నది. సూర్యుడు మాత్రమే లేడు, ఇతర రకముల నక్షత్రములు కూడా ఉన్నాయి. పక్షులు మాత్రమే లేవు, ఇతర రకముల జంతువులు కూడా ఉన్నాయి. ఒకే రకమైన మానవుడు లేడు, స్త్రీ పురుషులు ఉన్నారు. తన సృష్టి అంతటిని ఈ విధముగా సృజించిన దేవుని స్వరూపమును మనము వ్యాపింపజేయుచుండగా, నిశ్చయముగా విభిన్నమైన సాంస్కృతిక ఆచారములలో మరియు విషయములలో కనిపించు భిన్నత్వమును మనము ప్రతిబింబించాలి. చూడండి, సర్వభూమిని తన మహిమతో నింపుటకు దేవుడు మనలను పిలచుచున్నాడు, మరియు మనము అలా చేయుచుండగా, మనము విభిన్నమైన వాతావరణమును, విభిన్నమైన భూప్రాంతములను ఎదుర్కొంటాము అని నా ఆలోచన. మీరు భూమధ్యరేకకు దగ్గరగా ఒక ఇగ్లును నిర్మించలేరు, మరియు అలాస్కాలో గడ్డి పాకలను వేయలేరు. కాబట్టి, మీరు సర్వభూమిని నింపుచుండగా మరియు సర్వభూమి మీద ఆధిపత్యమును పొందుచుండగా, ప్రకటన గ్రంథము చెబుతున్నట్లు విమోచించబడిన ప్రజలలో ప్రతి గోత్రము, భాష, ఉపభాష మరియు దేశమునకు చెందిన ప్రజలు ఉంటారు అన్నట్లు స్వాభావికముగా ఇట్టి భిన్నత్వము ప్రతిబింబించబడుటను మనము చూస్తాము. ఇది ఆరంభము నుండి దేవుడు కలిగియున్న ఉద్దేశము నుండి దూరమగుట ఏమాత్రము కాదు. ఇది వాస్తవానికి ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు ఆజ్ఞాపించిన విషయముల యొక్క నెరవేర్పు అయ్యున్నది.
— డా. జిమ్మీ అగన్
లోకములో దేవుని కార్యము యొక్క అందములోని ఒక భాగము, ఆయన ఒకే సంస్కృతిలో మాత్రమే కార్యము చేయక అనేక సంస్కృతుల ద్వారా కార్యము చేయుట అయ్యున్నది అని నా ఆలోచన. మరియు బైబిలులో దీనికి ఎంతో ఉద్ఘాటన ఉన్నదని నేననుకుంటాను. సువార్త ప్రకటించుట అనునది దేశములన్నిటి కొరకు, అనగా జాతులన్నిటి కొరకు, మరియు లోకములో ఉన్న ప్రజల సమూహములన్నిటి కొరకు అయ్యున్నది. మరియు మీరు ప్రకటన గ్రంథము యొక్క ముగింపునకు వచ్చినప్పుడు, భూమిలోని రాజులు వారి మహిమను దేవుని రాజ్యములోనికి తెచ్చుటను గూర్చి బైబిలు మాట్లాడుతుంది; పలు సంస్కృతులలోని ఈ నిధులన్నీ మరియు విశేషమైన బలములు మరియు వరములు లోకములోని విభిన్నమైన సంస్కృతులలో పని చేస్తాయి, ఇవన్నీ మానవాళి కొరకు దేవుడు కలిగియున్న ప్రణాళికలో భాగమైయుండి విమోచన మార్గములో దేవుడు ఉపయోగించుకొను విషయములైయున్నవి, మరియు క్రీస్తు శరీరములో విభిన్నమైన సంస్కృతుల మధ్య అనుబంధములను కలిగియుండుటకు ఇది ప్రాముఖ్యమైన కారణము అని నా ఆలోచన, తద్వారా లోకములోని విభిన్నమైన సంస్కృతుల మధ్య దేవుడు చేయు కార్యముల యొక్క పూర్ణ ఐశ్వర్యము యొక్క లాభమును మనము పొందుకోవచ్చు.
— డా. ఫిలిప్ రైకెన్
బైబిలు సంస్కృతిని మరియు ఆధునిక అనువర్తనముతో దాని అనుబంధమును విశదీకరించుటకు, మనము సంస్కృతి యొక్క బైబిలు పునాదులను మాత్రమే మనస్సులో ఉంచుకోకూడదుగాని, పాత మరియు క్రొత్త నిబంధనలలో సంస్కృతి యొక్క బైబిలు పురోగమనములను కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
బైబిలులో సంస్కృతి యొక్క బైబిలు పురోగమనములను క్రోడీకరించుటకు అనేక మార్గములు ఉన్నాయి, కాని మన ఉద్దేశ్యముల కొరకు, సంస్కృతి యొక్క పునాదులను పరీక్షించుటకు మనము ఉపయోగించిన అదే అద్దమును ఉపయోగించి ఈ సాంస్కృతిక పురోగమనములను చూద్దాము. ముందుగా బైబిలు చరిత్ర అభివృద్ధి చెందుచుండగా సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను చూద్దాము. తరువాత, బైబిలులో రెండు వ్యతిరేక సాంస్కృతిక ఆదర్శములు అభివృద్ధి చెందిన విధానమును చూద్దాము. చివరిగా, లేఖనములలో సాంస్కృతిక భిన్నత్వము అభివృద్ధి చెందిన విధానమును పరీక్షిద్దాము. సంస్కృతి యొక్క ప్రాముఖ్యతతో ఆరంభిద్దాము.
పాత మరియు క్రొత్త నిబంధనలలో సంస్కృతి చాలా ప్రాముఖ్యమైయున్నది, కాని పాత నిబంధనలో సంస్కృతి యొక్క ప్రాముఖ్యత ఆరంభ లేఖనములు దేశముగా ఇశ్రాయేలు మీద పెట్టిన విశేషమైన దృష్టిలో అత్యంత స్పష్టముగా కనిపిస్తుంది.
ఆదికాండము గ్రంథము ఇశ్రాయేలు దేశముగా కాకముందు జరిగిన సాంస్కృతిక పురోగమనములను వర్ణిస్తుంది, అయితే పంచగ్రంథము అంతా — అనగా బైబిలులోని మొదటి ఐదు గ్రంథములు — ఇశ్రాయేలు ఐగుప్తును విడచి సీనాయి పర్వతము యొద్ద సమకూడినప్పుడు మోషే ధర్మశాస్త్ర నిబంధనా యుగములో వ్రాయబడినవి. ఈ కారణము చేత, ఈ గ్రంథములు దేవుని ఆజ్ఞల మీద మరియు ఇశ్రాయేలు యొక్క జాతీయ జీవితము కొరకు ఇవ్వబడిన హెచ్చరికల మీద విశేషమైన దృష్టిని పెడతాయి.
యెహోషువ మొదలుకొని మలాకీ గ్రంథము వరకు ఉన్న మిగిలిన పాత నిబంధన అంతా, ఇశ్రాయేలు పూర్తిగా వృద్ధి చెందిన దేశమైన తరువాత దావీదు రాజరిక నిబంధన యుగములో వ్రాయబడినవి. ఈ గ్రంథములు ఇశ్రాయేలు రాజరిక వైభవములోనికి ఎదిగినప్పుడు, విభజించబడిన రాజ్యము యొక్క ఒడుదిడుకులలో, చెరలో, మరియు పాత నిబంధన చివరిలోని క్లుప్త పునరుద్ధరణ కాలములో ఇశ్రాయేలు సంస్కృతిని నిర్దేశించిన దేవుని ప్రత్యక్షతల వర్ణమాలను గూర్చి మాట్లాడతాయి.
ఇశ్రాయేలులో జరిగిన అనేక సాంస్కృతిక పురోగమనములను పాత నిబంధన వర్ణించుచున్నప్పటికీ, లేఖనములోని అత్యంత ఉన్నతమైన సాంస్కృతిక పురోగమనము పాత నిబంధనలో నుండి క్రీస్తునందు క్రొత్త నిబంధన యుగములోనికి జరిగిన మార్పు కాలములో సంభవించింది. ఇశ్రాయేలు యొక్క జాతీయ సంస్కృతి మీద దృష్టిపెట్టుటకు బదులుగా, క్రొత్త నిబంధన క్రైస్తవ సంఘములో సాంస్కృతిక పద్ధతుల యొక్క పురోగమనముల వైపుకు దృష్టిని ఆకర్షిస్తుంది.
ఈ నాటకీయమైన మార్పు ఎలా సంభవించినదో చూచుటకు, మొదటి శతాబ్దపు పాలస్తీనాలోని అనేకమంది యూదులు క్రొత్త నిబంధన యుగము యొక్క రాక కొరకు ఎదురుచూశారు అని మనము గుర్తుంచుకోవాలి. మునుపటి పాఠములో మనము నేర్చుకున్నట్లు, నిబంధనల మధ్య కాలములో యూదుల రబ్బాయిలు మెస్సీయ రాకకు ముందు చరిత్ర అంతటిని “ఆ యుగము” అని పిలిచేవారు. మరియు మెస్సీయ ప్రత్యక్షమైనప్పుడు, ఆయన “రాబోవు యుగము”ను తీసుకొని వస్తాడని వారు బోధించారు. రాబోవు యుగములో, మెస్సీయ ప్రత్యక్షమవుతాడు, లోకములోని దుష్ట దేశముల మీద యుద్ధము చేయుటలో తన ప్రజలకు నాయకత్వం వహిస్తాడు, మరియు తన ప్రజలను తన మహిమకరమైన సార్వత్రిక రాజ్యములో వేగిరముగా స్థాపించి, ఇశ్రాయేలు సంస్కృతిని విశేషముగా మార్చివేస్తాడు అని వారు నమ్మారు.
అయితే ఆయన పరిపాలన మూడు దశలలో వివృతమవుతుంది అని యేసు మరియు ఆయన అపొస్తలులు స్పష్టము చేశారు: ఆయన మొదటి రాకడలో ఆయన రాజ్యము యొక్క ఆరంభము, సంఘ చరిత్ర అంతటిలో ఆయన రాజ్యము యొక్క కొనసాగింపు, మరియు ఆయన రెండవ రాకడలో ఆయన రాజ్యము యొక్క నెరవేర్పు. ఈ మూడు-దశల దృక్పథము క్రొత్త నిబంధన యుగములో దేవుడు తన ప్రజల యొక్క సంస్కృతిని అభివృద్ధి చేయాలని కోరిన విధానములను గూర్చి నూతనమైన అవగాహనలోనికి నడిపించింది.
ప్రకటన 11:15 వంటి వాక్యభాగములలో వర్ణించబడినట్లు క్రీస్తు రాజ్యము యొక్క అంతిమ లక్ష్యమును మనస్సులో ఉంచుకుంటే తప్ప క్రొత్త నిబంధనలో సంస్కృతి యొక్క ప్రాముఖ్యత మీద దృష్టిని కోల్పోవుట చాలా సులభమవుతుంది:
ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను (ప్రకటన 11:15).
ఈ వాక్యభాగములో, క్రీస్తు ఒక దినమున “ఈ లోక రాజ్యమును” దానిలోని తిరుగుబాటు చేయు సంస్కృతులన్నిటిని నాశనము చేస్తాడని మనము చూస్తాము. అయితే ఆయన ఈ దుష్ట సంస్కృతులను ఊరకనే నాశనము చేయడు. ఆయన లోకమును లోకవ్యాప్త సంస్కృతిగా మార్చుతాడు మరియు దానిని “మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము” అని పిలువవచ్చు, అక్కడ “ఆయన యుగయుగముల వరకు ఏలును.”
కాబట్టి, క్రొత్త నిబంధనలో ఒక చిన్న భాగముగా ఉండుటగాక, సంస్కృతి ఎంత ప్రాముఖ్యమైనదిగా ఉన్నది అంటే లేఖనములోని ఈ విభాగములోని ప్రతి భాగము ఏదో ఒక విధముగా మానవ సంస్కృతి కొరకు దేవుని ఉద్దేశ్యముల యొక్క నెరవేర్పును క్రీస్తు తీసుకొనివచ్చు విధానముతో వ్యవహరిస్తుంది.
యేసు తన జీవితము, మరణము, పునరుత్థానము, ఆరోహణము మరియు ఆత్మ కుమ్మరింపు ద్వారా సాంస్కృతిక ఆజ్ఞలోని అంతిమ దశను ముందుకు నడుపు విధానముల మీద కొన్ని వాక్యభాగములు దృష్టిపెడతాయి. క్రొత్త నిబంధనలోని ఇతర వాక్యభాగములు క్రీస్తు రాజ్యము యొక్క కొనసాగింపులో సువార్త ద్వారా లోకమును మార్చుటలో సహాయపడుచుండగా సంఘమును నడిపించుట మీద దృష్టిపెడతాయి. ఇంకొన్ని వాక్యభాగములు మానవాళి కొరకు దేవుని ఉద్దేశ్యములను నెరవేర్చి, పరలోకమందు నెరవేర్చబడునట్లు భూమియందు కూడా దేవుని చిత్తము నెరవేర్చబడుటకు క్రీస్తు తిరిగివచ్చు కాలమైన నెరవేర్పు కాలము మీద దృష్టిపెడతాయి.
బైబిలు చరిత్ర యొక్క పురోగమనములో సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను చూచుట ద్వారా సంస్కృతిలో బైబిలు పురోగమనములను ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి, ఇప్పుడు బైబిలు అంతటిలో కనిపించు రెండు వ్యతిరేకమైన సాంస్కృతిక ఆదర్శముల యొక్క పురోగమనమును మనము చూడవచ్చు.
ఆదికాండము 3వ అధ్యాయములో రెండు సాంస్కృతిక ఆదర్శముల యొక్క స్థాపన అన్య దేశములను సర్ప సంతతితో మరియు ఇశ్రాయేలును హవ్వ సంతతితో పోల్చునట్లు పాత నిబంధన రచయితలను పురికొల్పింది.
అబద్ధ దేవతలకు తమ పరిచర్యగా అన్య దేశములు తమ సంస్కృతులను అభివృద్ధి చేసి, ఇశ్రాయేలు దేవుని వ్యతిరేకించాయి. వారు తమ అబద్ధ దేవతల కొరకు దుర్గములను మరియు దేవాలయములను నిర్మించి, తమ సొంత పిల్లలను బలి అర్పించారు. ఆయన ప్రజలు ఇట్టి ఆచారములలో ఏమాత్రము పాలుపంచుకొనకూడదు అని దేవుడు స్పష్టము చేశాడు.
మరొక వైపున ఇశ్రాయేలు, మోషే ద్వారా దేవుడిచ్చిన నీతిగల ధర్మశాస్త్రమును హత్తుకొని, ఏక సత్య దేవుని మహిమపరచు విధానములలో జీవించుటకు ప్రయత్నించారు. వారు విశ్రాంతి దినమును అనుసరించారు, విగ్రహారాధనను విసర్జించారు, మానవ జ్ఞానము మరియు బలము మీద ఆధారపడుటకు బదులుగా దేవుని నడిపింపు మరియు భద్రత మీద ఆధారపడ్డారు.
అవును, దేవునికి స్వామిభక్తి చూపుట ద్వారా అన్యులు ఇశ్రాయేలు దేశములో భాగము కావచ్చని, లేక దేవుని విరోధులు అగునంతగా ఇశ్రాయేలీయులు భ్రష్టులు కాలేరని దీని అర్థము కాదు. అయితే ప్రతి ఒక్కరు తమ ఆదర్శములను అనుసరించినంత వరకు, ఇశ్రాయేలు దాని సంస్కృతిని దేవుని పరిచర్యలో అభివృద్ధి చేసింది, మరియు అన్య దేశములు తమ సంస్కృతులను అబద్ధ దేవతల ఆరాధనలో అభివృద్ధి చేశారు.
ఇప్పుడు, అదే సమయములో, ఇశ్రాయేలీయుల మరియు అన్యుల సంస్కృతులు అనేక విధాలుగా పోలికలను కలిగియున్నవి అని పాత నిబంధన మరియు పురావస్తుశాస్త్రజ్ఞులు సూచించారు. ఇశ్రాయేలీయులు తమ పొరుగు దేశముల యొక్క పాపభరితమైన ఆచారములను అనుసరించుట ద్వారా ఈ పోలికలలో కొన్ని కలిగాయి. అయితే ఇతర పోలికలు పాపభరితమైన అన్యులకు దేవుడు తన సామాన్య కృపను చూపుటకు ఫలితంగా కలిగాయి, తద్వారా వారి సంస్కృతులలో ఆ కోణములు కనీసం పైకి అయినా దేవుని చిత్తమునకు అనుగుణంగా ఉన్నాయి. ఈ సాంస్కృతిక విభజనలు పాత నిబంధన అంతటా కొనసాగాయి.
మనము క్రొత్త నిబంధన వైపుకు తిరిగినప్పుడు, రెండు వ్యతిరేక సాంస్కృతిక ఆదర్శములు మరొకసారి కనిపిస్తాయి, కాని విభిన్నమైన అనుబంధములతో కనిపిస్తాయి.
పాత నిబంధనలో ఆరంభమైన ఇశ్రాయేలు యొక్క సుదీర్ఘమైన అపనమ్మకత్వము, క్రీస్తు నరావతారిగా వచ్చు సమయమునకు నమ్మకమైన యూదుల యొక్క శేషమును మాత్రమే మిగల్చగలిగింది. మరియు క్రొత్త నిబంధనలో, ఈ శేషముతో పాటుగా దేవుని ప్రజలుగా అన్యులు కూడా పూర్తి దత్తతును పొందుకున్నారు. కాబట్టి, యూదులు మరియు అన్య దేశముల మధ్య విభజన చేయుటకు బదులుగా, క్రొత్త నిబంధన రచయితలు క్రీస్తు అనుచరులను స్త్రీ సంతతితో మరియు అవిశ్వాసులను, వారు యూదులైనా అన్యులైనా, సర్ప సంతతితో పోల్చారు.
ఇందుమూలముగానే యోహాను 8:44లో యేసు సాతానును పరిసయ్యులకు తండ్రి అని చెప్పాడు. రోమా 16:20లో, దేవుడు సాతానును వారి పాదముల క్రింద శీఘ్రముగా అణగద్రొక్కును అని రోమా పట్టణములోని క్రైస్తవులకు నిశ్చయతనిచ్చుచున్నప్పుడు ఇందుమూలముగానే పౌలు ఆదికాండము 3:15ను ఉపయోగించాడు.
ఇశ్రాయేలు మరియు అన్య దేశముల మధ్య అనుబంధము ఒక ఆసక్తికరమైన ప్రశ్న అయ్యున్నది... మరియు మీరు ఆదికాండము 18 మరియు ఇతర చోట్ల చూసినట్లయితే, దేవుడు అబ్రాహామును మరియు అతని సంతతిని దీవిస్తానని అబ్రాహాముతో వాగ్దానము చేశాడు. మరియు మనము లేఖనమును గూర్చి పలు సీనులు గల నాటికగా ఆలోచించినట్లయితే, అబ్రాహాముతో దేవుడు వాగ్దానము చేసినప్పుడు మొదటి సీనును మీరు చూస్తారు, మరియు ఆయన ఇశ్రాయేలు దేశమును చుట్టూ ఉన్న దేశముల యొక్క భ్రష్టమైన ప్రభావముల నుండి దూరముగా ఉంచుట ద్వారా వారిని భద్రపరుస్తాడు; వారు విఫలమవుతారు, కాని ఆయన వారిని క్రమశిక్షణలో పెడతాడు. మెస్సీయ వచ్చు వరకు ఆయన దేశమును భద్రపరుస్తాడు. మెస్సీయ వచ్చి ఇశ్రాయేలునకు రక్షణను ప్రకటిస్తాడు. మత్తయి సువార్తను మీరు చూసినట్లయితే, మత్తయి 15లో యేసు “నేను ఇశ్రాయేలులో నశించిన గొర్రెల కొరకు వచ్చితిని” అని చెబుతున్నాడు. కనానీయురాలైన ఆమె తన కుమార్తె నిమిత్తము ఆయనను ప్రాధేయపడుతుంది. మరియు కొన్నిసార్లు అది అసౌకర్యముగా ఉంటుంది. “సరే, ఆయన ఆమె కుమార్తెను వెంటనే ఎందుకు స్వస్థపరచలేదు?” అని ప్రజలు అంటారు. అయితే యేసు ఒక విధముగా అంటాడు, “ఇది రెండవ సీను.” కదా? “ఇశ్రాయేలులో నశించిపోయిన గొర్రెలకు రక్షణను ప్రకటించుటకు నేను వచ్చాను.” తరువాత మీరు సువార్త యొక్క ముగింపులోనికి వచ్చినప్పుడు, మత్తయి 28లో, మూడవ సీను ఆరంభమవుతుంది, దానిలో ఇప్పుడు మనము ఉన్నాము, అక్కడ సువార్త సర్వలోకమునకు వెళ్లి యూదులకు మరియు అన్యులకు సమానముగా ప్రకటించబడుతుంది. ఇప్పుడు, రోమా. 1లో మూడవ సీనులో కూడా పౌలు ఈ వ్యత్యాసమును కొనసాగించుట ఆసక్తికరమైన విషయమైయున్నది. అతడు “ముందు యూదునికి, తరువాత అన్యునికి” అని అంటాడు. అతడు తన దేశవాసుల పట్ల, అబ్రాహాము వాగ్దానములను కలిగియున్న వారి పట్ల బాధ్యత కలిగియునట్లు భావించాడు: వారికి ముందు ప్రకటించు బాధ్యత నాకు ఉన్నది. కాబట్టి అతడు సమాజమందిరములోనికి వెళ్లి, మన పూర్వీకులకు ఇవ్వబడిన వాగ్దానములు సత్యములు అని ప్రకటించాడు. అయితే అతడు సమాజమందిరములో నుండి బయటకు త్రోలివేయబడినప్పుడు లేక వారు అతని మాటలను వినుట మానినప్పుడు, అతడు వెంటనే అన్యుల మధ్యకు వెళ్లాడు. కాబట్టి, అతడు ఎఫెసీ. 2లో వర్ణించుచున్నట్లు, సిలువ మీద క్రీస్తు మరణము ద్వారా, యూదులు మరియు అన్యులకు మధ్య ఉన్న గోడ పడద్రోయబడింది... ఇప్పుడు దేవుని కుమారులు మరియు కుమార్తెలుగా యూదులు మరియు అన్యులమైన మనకు అద్భుతమైన ఐక్యత ఉన్నది.
— డా. రాబర్ట్ ఎల్. ప్లమ్మర్
సంఘము మరియు లోకము వ్యతిరేకమైన ఆదర్శములను అనుసరిస్తాయి కాబట్టి లోకమునకు అనుగుణంగా నడుచుకోవద్దని క్రొత్త నిబంధన విశ్వాసులను హెచ్చరిస్తుంది. అయితే అదే సమయములో, సంఘము మరియు లోకమునకు మధ్య ఉన్న గీత ఖచ్చితమైనది కాదు అని క్రొత్త నిబంధన రచయితలు గుర్తించారు. బైబిలులో సంస్కృతి అభివృద్ధి చెందుచుండగా, ఆదిమ క్రైస్తవులు అవిశ్వాసులు అనుసరించిన ఆచారములకు మరియు తత్వ దృక్కోణములకు చాలాసార్లు మద్దతునిచ్చారు. మరియు మనము ఇంతకు ముందు నేర్చుకున్నట్లు, ఈ పోలికలలో కొన్ని క్రీస్తు అనుచరుల మీద పాపము యొక్క ప్రభావమునకు ఫలితముగా కలిగాయి, మరియు ఇతర పోలికలు లోకము మీద సామాన్య కృప యొక్క భావార్థక ప్రభావముల వలన కలిగాయి.
బైబిలు సాంస్కృతిక పురోగమనముల మీద మనము పెట్టిన దృష్టిలో పాత మరియు క్రొత్త నిబంధనలలో సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను, మరియు బైబిలు చరిత్ర అంతటిలో వ్యతిరేకమైన సాంస్కృతిక ఆదర్శములు అభివృద్ధి చెందిన విధానమును మనము చూశాము. ఇప్పుడు మన మూడవ అంశమును చూద్దాము: లేఖనములలో సాంస్కృతిక విభిన్నత్వము యొక్క పురోగమనము.
మనము పాత నిబంధనను విశదీకరించినప్పుడు, దానిలో ఇశ్రాయేలు యొక్క జాతీయ సంస్కృతిని బలపరచుటకు అనేక నియమములు మరియు హెచ్చరికలు దానిలో ఉన్నాయను మాట స్పష్టముగా కనిపిస్తుంది. అనగా ఇశ్రాయేలు సంస్కృతులన్నీ ఒకే విధముగా ఉండాలని దేవుడు కోరాడు అని దీని అర్థము కాదు. వాస్తవానికి, దేవుని విశేషమైన మరియు సామాన్య ప్రత్యక్షతలను ఇశ్రాయేలులోని పలు సమాజములు నమ్మకముగా అనువర్తించుచుండగా, విభిన్నమైన సాంస్కృతిక పద్ధతులు వెలుగులోనికి వచ్చాయి.
ఈ విభిన్నతలలో చాలా వరకు ఒకేసారి సంభవించాయి. లేవీయ యాజకులు తమ సమాజములలో దేవుని నియమములను కొన్ని విధానములలో అనువర్తించారు, అయితే అదే సమయములో రాజులు మరియు ఇతర రాజకీయ నాయకులు దేవుని నియమములను భిన్నమైన రీతులలో అనువర్తించారు. ఒక కుటుంబము దాని సభ్యులకు అనుగుణంగా ఉండు విధముగా దేవుని నియమములను అనువర్తించగా, ఇతర కుటుంబములు దేవుని నియమములను వారి సభ్యులకు అనుగుణంగా ఉండునట్లు అనువర్తించారు.
అంతేగాక, కాలక్రమములో దేవుడు మరిన్ని విశేషమైన ప్రత్యక్షతలను ఇశ్రాయేలుకు ఇచ్చుచుండగా మరిన్ని విభిన్నతలు సంభవించాయి. దేవుని ప్రజలు అరణ్యములో సంచరించుచుండగా కొన్ని సాంస్కృతిక పద్ధతులను మరియు కనానును స్వాధీనము చేసుకొనుచుండగా భిన్నమైన పద్ధతులను దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలులో రాజరికమును స్థాపించుచుండగా మరియు యెరూషలేములో సొలొమోను దేవాలయమును నిర్మించమని ఆజ్ఞాపించినప్పుడు దేవుడు మార్పులను నిర్దేశించాడు. చెర కాలములో మరియు చెర తరువాత కాలములో ఇశ్రాయేలు సంస్కృతిలో ఇతర భిన్నత్వములు చోటు చేసుకున్నాయి.
ఇశ్రాయేలు యొక్క సాంస్కృతిక జీవితములోని కొన్ని కోణములు వారి చరిత్ర అంతటిలో పెద్దగా మార్పు చెందలేదు. వారు ఆరంభము నుండి అంతము వరకు పురుష ఆధిపత్య సంస్కృతిగా కొనసాగాయి. కుటుంబములో భర్త ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉండేవాడు. అయితే ఏ విధముగా కూడా ఏకైక వ్యక్తి మాత్రము కాదు. నీ తండ్రిని నీవు గౌరవించాలి మరియు నీ తల్లిని శపించకూడదు అని చెప్పు సామెత నాకు జ్ఞాపకమోస్తుంది. అయితే ఏది ఏమైనా, ఆరంభము నుండి అంతము వరకు ఎక్కువ శాతం పురష ఆధిపత్య సంస్కృతిగా ఉండినది. మరొక వైపున, వారి రాజకీయ స్థితి విడిగా ఉన్న గోత్రముల నుండి క్రమముగల గోత్రముల నిర్మాణమునకు, చివరికి దేశముగా నాటకీయముగా మార్పు చెందినది, మరియు తరువాత దేశము నాశనమైయ్యింది, తరువాత వారు ఒక పెద్ద సార్వత్రిక సామ్రాజ్యము యొక్క సంస్కృతిలో భాగముగా మాత్రమే ఉండి, దేవుని ప్రజలుగా మనము ఎవరము? అను విషయమును అర్థము చేసుకొనుటకు ప్రయత్నించారు. కాబట్టి, ఆ కాలములో వారి రాజకీయ పరిస్థితి నాటకీయముగా మార్పు చెందింది.
— డా. జాన్ ఒస్వల్ట్
మనము క్రొత్త నిబంధనను చూసినప్పుడు, మరొకసారి విభిన్నతను మనము కనుగొంటాము. పాత నిబంధన సాంస్కృతిక పద్ధతులు అప్పటికీ వర్తించాయి, కాని దేవుని ప్రజలు ఇక ఒకే దేశముగా లేరు అను వాస్తవము యొక్క వెలుగులో వాటిని చూడవలసివచ్చింది. దేవుని ప్రజలు ఇప్పుడు సంఘమైయున్నారు, విభిన్నమైన జాతీయ సంస్కృతుల మధ్య నివసించుటకు పిలువబడిన సమాజముగా ఉన్నారు. కాబట్టి, మీరు ఊహించు విధముగానే, క్రొత్త నిబంధన యుగములో మరిగొప్ప సాంస్కృతిక విభిన్నతను అభివృద్ధి చేయు విధముగా దేవుడు తన నమ్మకమైన ప్రజలను నడిపించాడు.
ప్రజలు మరియు పరిస్థితుల మధ్య వ్యత్యాసములు క్రైస్తవ సమాజములు బైబిలు బోధనలను భిన్నమైన రీతులలో అనువర్తించునట్లు పురికొల్పాయి. ఉదాహరణకు, వారి సొంత పరిస్థితులకు అనుగుణంగా యూదా మరియు అన్య విశ్వాసులు విభిన్నమైన సాంస్కృతిక ఆచారములను పాటించారు. మరియు పలు ప్రాంతములలో నివసించుచున్న క్రైస్తవ సంఘములు బైబిలును అనువర్తించుచుండగా తమ సొంత ప్రజలను మరియు పరిస్థితులను పరిగణలోనికి తీసుకున్నారు. మరియు అనేక కుటుంబ గుంపులు దేవుని మాటలను విభిన్నమైన రీతులలో నమ్మకముగా అనుసరించారు.
అయితే క్రొత్త నిబంధనలోని విశేషమైన ప్రత్యక్షత ఒకేసారి జరుగలేదు అని గుర్తుంచుకొనుట చాలా ప్రాముఖ్యమైయున్నది. ఇంచుమించు ఒక శతాబ్దము పాటు, క్రీస్తు ద్వారా మరియు క్రీస్తు అపొస్తలులు మరియు ప్రవక్తల ద్వారా దేవుడు తన సంఘము కొరకు తన చిత్తమును బయలుపరచాడు. కాబట్టి, క్రొత్త నిబంధనలో సంఘము యొక్క సంస్కృతి కూడా కాలక్రమములో మార్పు చెందింది. ఉదాహరణకు, అపొ. 15లో అపొస్తలులు మరియు పెద్దలు యెరూషలేములో కలుసుకొనినప్పుడు సున్నతి ఆచారము ఒక్కసారిగా మారిపోయింది. మరియు క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయబడిన మరియు పొందుకొనబడిన ప్రతిసారి, పలు క్రైస్తవ సంఘములు మార్పు చెందాయి. ఇవి మరియు అనేక ఇతర కారణముల వలన, క్రొత్త నిబంధన కాలములో కైస్తవ సమాజముల మధ్య గొప్ప సాంస్కృతిక భిన్నత్వము కనిపించింది.
ఇప్పటి వరకు సంస్కృతికి బైబిలు పునాదులను పరిశోధించుట ద్వారా మరియు బైబిలు పురోగమనములు బైబిలులో సంస్కృతిని ప్రభావితము చేసిన విధానములను చూచుట ద్వారా బైబిలు సంస్కృతిని మరియు ఆధునిక అనువర్తనమును మనము చూశాము కాబట్టి, ఇప్పుడు మన మూడవ ప్రధానాంశమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. మన ఆధునిక లేఖన అనువర్తనమును గూర్చి ఈ పరిగణలన్నీ ఏమి చెబుతాయి?
మన దినములలో, చాలామంది ఇవాంజెలికల్ క్రైస్తవులు విశ్వాసము ప్రధానముగా వ్యక్తిగతమైనది అని అనుకుంటారు. ఇప్పుడు స్పష్టముగా, దేవునితో మన వ్యక్తిగత నడవడికను గూర్చి లేఖనములు అనేక విషయములను తెలియజేస్తాయి. అయితే మనలో చాలామందిమి బైబిలులోని ఈ భాగమును ఎంతగా ఉద్ఘాటిస్తాము అంటే, ఆధునిక సంస్కృతి కొరకు లేఖనము యొక్క అంతర్భావముల మీద చాలా తక్కువ ఆసక్తిని చూపుతాము. అయితే మనము చూడబోవుచున్నట్లు, మన విశ్వాసములోని సాంస్కృతిక కోణములను లేఖనములు ఎంతగా ఉద్ఘాటిస్తాయి అంటే, మనము నేటి మన సంస్కృతికి లేఖనములను అనువర్తించుకోవలసిన అవసరత ఖచ్చితముగా ఉంటుంది.
సంస్కృతిని గూర్చి బైబిలు బోధించుచున్న విషయముల యొక్క ఆధునిక అనువర్తనమును లేఖనములో సంస్కృతి యొక్క పునాదులు మరియు పురోగమనములను చూసిన విధముగానే చూద్దాము. మొదటిగా, లేఖనమును అనువర్తించునప్పుడు సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను మనము విశదీకరిద్దాము. రెండవదిగా, రెండు వ్యతిరేకమైన సాంస్కృతిక ఆదర్శములు నేడు లేఖనము యొక్క అనువర్తనమును ప్రభావితము చేయవలసిన విధానములను మనము చూద్దాము. మరియు చివరిగా, ఆధునిక అనువర్తనము మన దినముల కొరకు దేవుడు నియమించిన సాంస్కృతిక భిన్నత్వమును పరిగణలోనికి తీసుకోవలసిన విధానమును మనము చూద్దాము. ఆధునిక అనువర్తనములో సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను చూస్తూ ఆరంభిద్దాము.
బైబిలును ఆధునిక సంస్కృతులకు అనువర్తించుట యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకొనుటలో అనేక లేఖన భాగములు మనకు సహాయము చేస్తాయి. అయితే ఆయన ఆజ్ఞాపించిన విషయములన్నిటిని బోధించుట ద్వారా లోకములో ఉన్న ప్రతి సంస్కృతిని ప్రభావితము చేయమని క్రీస్తు తన అనుచరులను పిలచిన విధానమును పరిగణించుట ద్వారా ఒక సులువైన మార్గములో దీనిని మనము చూడవచ్చు.
క్రైస్తవులు చాలా సార్లు మహా ఆజ్ఞ లేక “సువార్త ఆజ్ఞ” అని పిలచు ఒక సుపరిచిత వాక్యభాగమైన మత్తయి 28:19-20లో యేసు ఈ విషయములను తెలిపిన విధమును వినండి. ఈ వాక్యభాగములో, యేసు తన శిష్యులతో ఇలా సెలవిచ్చాడు:
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి (మత్తయి 28:19-20).
ఈ వాక్యభాగము క్రీస్తు మహిమలో తిరిగివచ్చునంత వరకు ఆయన అనుచరులకు ఇవ్వబడిన పనిని క్రోడీకరిస్తుంది. మన ఆధునిక సాంస్కృతిక ప్రయత్నములకు ఇది ఏ విధంగా అనుబంధపరచబడుతుందో చూచుటకు, ఆదికాండము యొక్క ఆరంభములో మానవజాతికి ఇవ్వబడిన సాంస్కృతిక ఆజ్ఞను ఈ సువార్త ఆజ్ఞ ఏవిధంగా ప్రతిధ్వనిస్తుందో చూచుట సహాయకరముగా ఉంటుంది. ఆదికాండము 1:28లో ఉన్న సాంస్కృతిక ఆజ్ఞలో, “ఫలించి సంఖ్యాపరముగా అభివృద్ధి చెందమని” దేవుడు మానవాళికి సెలవిచ్చాడు.
అదే విధముగా మత్తయి 28:19లో, క్రీస్తు ఇలా ఆజ్ఞాపిస్తు సంఖ్యాపరముగా ఎదగమని తన అనుచరులకు పిలుపునిచ్చాడు, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమి[య్యుడి].” ఆదాము హవ్వలు లోకమును దేవుని స్వరూపములతో నింపవలసియుండిన విధముగానే, క్రైస్తవులు కూడా విమోచించబడిన దేవుని స్వరూపములను వృద్ధి చేయవలసియుండెను. మరియు ప్రజలను క్రీస్తునందు రక్షింపబడు విశ్వాసములోనికి నడిపించుట ద్వారా ఒక విధముగా మనము ఇలా చేయగలము.
అయితే దేవుని యొక్క నమ్మకమైన సేవకులను సంఖ్యాపరముగా పెంచుటతో మాత్రమే సువార్త ఆజ్ఞ ఆగిపోలేదు. మత్తయి 28:20 ప్రకారం, “నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి” అను బాధ్యత మనకు ఇవ్వబడినది. భూమిని నింపి దానిని లోపరచుకొనుట ద్వారా దేవునికి విధేయత చూపుటకు ఆదాము హవ్వలు పిలువబడిన విధముగానే, దేవుని ఆజ్ఞలను పాటించు విధముగా సమస్త దేశములకు క్రైస్తవులు బోధించవలసియుండెను, మరియు దీనిలో సంస్కృతిలోని ప్రతి కోణము భాగమైయున్నది.
దీనిని మనము ఈ విధముగా చూడవచ్చు: ఆదాము హవ్వలు దేవునికి విధేయులై భూమిని లోపరచుకొనుట ద్వారా సంస్కృతిని నిర్మించవలసియుండెను, మరియు మనము దేవునికి విధేయులమై దేశములను శిష్యులుగా చేయుట ద్వారా సంస్కృతిని నిర్మించవలసియున్నది.
విశ్వాసులకు బాప్తిస్మమిచ్చుట ద్వారా మరియు సమస్త దేశములకు ఆయన ఆజ్ఞలను బోధించుట ద్వారా ఆయన అనుచరులు ప్రతి సంస్కృతి మీద ప్రభావము చూపాలని యేసు ఆశించినట్లు మత్తయి 28లో నుండి స్పష్టమవుతుంది. వారి బోధనలు పేదరికం, ఆర్థిక వనరులు, ఆరోగ్యం, వివాహం, న్యాయము, జాతి, రాజకీయం మరియు పన్నులను చెల్లించుట వంటి బహిరంగ సాంస్కృతిక విషయములను గూర్చి ఉద్దేశించునవిగా ఉండాలి. ఇందుమూలముగానే క్రొత్త నిబంధన గ్రంథములు అనేక సాంస్కృతిక విషయములను గూర్చి మాట్లాడుటను మనము చూస్తాము.
ఇదే క్రమమును అనుసరించి, మత్తయి 5:13-14లో, క్రీస్తు తన శిష్యులను ధైర్యముగా ఇలా వర్ణించాడు:
లోకమునకు ఉప్పు ... [మరియు] లోకమునకు వెలుగు (మత్తయి 5:13-14).
చరిత్ర మరలా మరలా చూపినట్లు, క్రీస్తు సమస్త దేశములకు ఆజ్ఞాపించిన బోధలన్నిటిని నమ్మకముగా అనుసరించుటకు యేసు అనుచరులు కట్టుబడియుండినప్పుడు, లోకమంతటిలోని ప్రతి సంస్కృతిలోని ప్రతి కోణమును భావార్థకముగా ప్రభావితము చేయు శక్తిని మనము కలిగియుంటాము. ఈ కారణం చేత, మనము చేయు బైబిలు యొక్క ఆధునిక అనువర్తన మానవ సంస్కృతిలోని అనేక విషయములను ఉద్దేశించి మాట్లాడాలి.
మత్తయి 5లో, వారు లోకమునకు ఉప్పు మరియు లోకమునకు వెలుగైయుండాలని యేసు తన శిష్యులకు సెలవిచ్చాడు. మరియు ఒక ఆధునిక శ్రోతకు, ఇది ఒక మర్మాత్మకమైన కథనము అయ్యున్నది... ప్రాచీన శ్రోతలకు, ముఖ్యముగా లెఖనమూలో నాటబడియున్న సంస్కృతికి ఈ భాష ఏమి తెలియజేస్తుంది అని మీరనుకొనుచున్నారు? మరియు ఉప్పు వస్తువులు కుళ్ళిపోకుండా భద్రపరిచేది, కాబట్టి ఉప్పు మాంసము లేక చేప కుళ్ళిపోకుండా, భద్రపరచబడుటకు ఉపయోగించబడేది, మరియు అది రుచిని కూడా ఇచ్చేది. మరియు మీరు క్రైస్తవులను గూర్చి ఆలోచనచ చెయ్యండి. దేవుని చేతి క్రింద అనేక విధములుగా నీతికలిగి లోకమును ప్రభావితముచేస్తూ, దేవుని సత్యముతో సంస్కృతిని భద్రపరచుట లేక సంస్కృతికి రుచిని కలిగించుట వారి పని అయ్యున్నది. మరియు వెలుగు కూడా దీనిని చిత్రీకరిస్తుంది. లేఖనమంతటా వెలుగు ప్రత్యక్షతకు చిత్రముగా, ప్రత్యక్షపరచునదిగా గుర్తించబడినది. మరియు క్రైస్తవులు దేవుడు ఎవరో బయలుపరుస్తూ, చీకటి లోకమును దేవునిని గూర్చిన సత్యము మరియు నీతితో వెలిగిస్తూ లోకములో జీవించాలి.
— డా. రాబర్ట్ ఎల్. ప్లమ్మర్
ఆధునిక అనువర్తనము మరియు బైబిలు సంస్కృతిని గూర్చిన మన అధ్యయనములో, నేటి క్రీస్తు అనుచరుల కొరకు సంస్కృతి యొక్క ప్రాముఖ్యతను మనము చూశాము. ఇప్పుడు మన రెండవ అంశమును మనము చూద్దాము. రెండు వ్యతిరేకమైన సాంస్కృతిక ఆదర్శముల యొక్క ఉనికి బైబిలు యొక్క ఆధునిక అనువర్తనమును ఏవిధంగా ప్రభావితము చేయాలి?
క్రీస్తు ఈ లోకమునకు వచ్చినప్పుడు, సాతాను మీద ఆయన సాధించిన గొప్ప విజయము యొక్క అంతిమ దశను ఆయన ఆరంభించాడు. అయితే ఈ విజయం క్రీస్తు సమస్త విషయముల యొక్క నెరవేర్పునందు మహిమలో తిరిగివచ్చినప్పుడు మాత్రమే సంపూర్ణమవుతుంది. అప్పటి వరకు, రాజ్యము యొక్క కొనసాగింపు కాలములో, మానవ జాతి సర్ప సంతతి, అనగా దేవునికి విరోధముగా తిరుగుబాటు చేయు సాంస్కృతిక ఆదర్శమును కలిగియున్న అవిశ్వాస లోకము, మరియు హవ్వ సంతతి, అనగా దేవునికి పరిచర్య చేయు సాంస్కృతిక ఆదర్శమును అనుసరించు క్రీస్తు అనుచరులుగా విభజించబడుట కొనసాగుతుంది.
అయితే, బైబిలు కాలములలో వలె, దేవుని ప్రజలు మరియు లోకము మధ్య ఉన్న గీత ఖచ్చితమైనది కాదు. క్రీస్తు తిరిగివచ్చునంత వరకు, భూమి మీద ఉన్న ఆయన ప్రజలు మిగిలియున్న పాపము యొక్క ప్రభావముతో సంఘర్షిస్తుంటారు. మనము పాపము యొక్క బానిసత్వము నుండి స్వతంత్రులమయ్యాముగాని, పాపము యొక్క ప్రభావము నుండి ఇంకా స్వతంత్రులము కాలేదు. అదే సమయములో, అవిశ్వాసులు కూడా దేవుని చిత్తమునకు అనుగుణంగా కొంత వరకు జీవించునట్లు దేవుని సామాన్య కృప లోకమును అదుపు చేస్తుంది. మరియు సువార్త బహుగా ప్రభావము చూపిన దేశములలో ఇది విశేషముగా వాస్తవమైయున్నది.
క్రీస్తు అనుచరులముగా, దేవుని చిత్తమును అనుసరించు సాంస్కృతిక మార్గములను అనుసరించి, ఆ విధముగాలేని వాటిని విసర్జించుట మన బాధ్యత అయ్యున్నది. కొన్నిసార్లు మనము అనుసరించు మార్గములు లోకములోని మార్గముల కంటే భిన్నముగా ఉండాలి. బైబిలు రచయితలు తరచుగా విగ్రహారాధన, లైంగిక అనైతికత, స్వార్థం, గర్వం, అన్యాయము మరియు ఇతర సాంస్కృతిక దుష్టత్వములలోనికి దిగజారకుండా జాగ్రత్తపడునట్లు తమ వాస్తవిక శ్రోతలను హెచ్చరించారు. మన దినమున ఇట్టి దుష్టత్వములను మనము చూసిన ప్రతిసారి, మనము వాటి నుండి దూరము కావాలి.
అయితే ఇతర సమయాలలో, సామాజిక అనుబంధములు, విజ్ఞానము, కళ, సంగీతము, నిర్మాణశాస్త్రము, చట్టము మరియు రాజకీయములోని అనేక విషయముల మీద సామాన్య కృప యొక్క ప్రభావమును గుర్తించునట్లు బైబిలు రచయితలు తమ వాస్తవిక శ్రోతలను ప్రోత్సహించారు. అవిశ్వాసులు నివసించు విధానమును లేఖనములు సమర్థించిన విధానమును మనము చుసిన ప్రతిసారి, నేటి లోకములోని సంస్కృతుల మీద దేవుని సామాన్య కృప యొక్క అట్టి ప్రభావములను వెదకుట కొరకు మనము ప్రయత్నించాలి. మనము లేఖనము యొక్క బోధనలకు కట్టుబడియున్నంత వరకు, విజ్ఞానము, కళ, రాజకీయము, మరియు జీవితములోని ఇతర విభాగములలో సామాన్య కృప యొక్క ఆశీర్వాదములను మనము స్వతంత్రముగా సమర్థించాలి.
లేఖనములోని సాంస్కృతిక పద్ధతులు నేటి మన జీవితములకు అనువర్తించబడు విధానమును వివేచించుట కొన్నిసార్లు కష్టతరము కావచ్చు. అయితే సామాన్యమైన పదములలో, బైబిలు అంతా దేవుడు సంస్కృతిలోని పలు కోణములను నిర్దేశించిన విధానములను మనము పరిగణలోనికి తీసుకోవాలి. సంస్కృతిలోని పలు కోణములలో ఉన్న విషయములను గూర్చి లేఖనములు బయలుపరచు విషయములన్నిటిని మనము పోల్చినప్పుడు, దేవుడు సాంస్కృతిక పద్ధతులను నిర్దేశించిన కనీసం నాలుగు మార్గములను మనము కనుగొంటాము. వివాహము మరియు పని వంటి కొన్ని పద్ధతులను ఆయన శాశ్వతముగా ఆమోదించాడు. ఐగుప్తు నుండి కనానుకు కదులుచుండగా ఇశ్రాయేలు గోత్రములుగా అమర్చబడుట వంటి కొన్నింటిని ఆయన తాత్కాలికముగా మాత్రమే ఆమోదించాడు. కొన్నిసార్లు, పాపుల పట్ల ఆయన చూపిన సహనములో, దేవుడు తన ప్రజల యొక్క కొన్ని సాంస్కృతిక కార్యములను ఆమోదించనప్పటికీ తాత్కాలికముగా సహించాడు, ఇవి బహుభార్యాత్వము మరియు బానిసత్వము వంటివి. మరియు అవును, లేఖనమంతటా, దేవుని యొక్క శాశ్వత తిరస్కరణను ఎదుర్కొన్న కొన్ని సాంస్కృతిక పద్ధతులను మనము చూడవచ్చు, ఇవి అన్యాయము మరియు విగ్రహారాధన వంటివి.
మరొక మాటలో, బైబిలులో మనము కనుగొను సాంస్కృతిక పద్ధతిని నేటి మన జీవితములకు అనువర్తించుటకు, స్వయంగా వాక్యభాగములో దేవుని యొక్క విశ్లేషణను మనము చూడాలి. తరువాత, ఇతర బైబిలు భాగములలో నుండి తగిన నైతిక ప్రామాణికతలను మనము వెదకి, మనము చూచు బైబిలు సాంస్కృతిక మూలకములలోని ప్రేరణలను మరియు లక్ష్యములను మనము నిర్దేశించాలి. ఈ విధములుగా, బైబిలు భాగములలోని సాంస్కృతిక పద్ధతులు దేవునికి సేవ లేక ఆయన మీద తిరుగుబాటు అను రెండు వ్యతిరేక సాంస్కృతిక ఆదర్శములకు ప్రాతినిథ్యం వహించు విధానమును మనము వివేచింపవచ్చు. మరియు మనము ఇలా చేయుచుండగా, బైబిలులో ఉన్న తగిన సాంస్కృతిక పద్ధతులను మన ఆధునిక లోకమునకు అనువర్తించుటకు మనము శక్తిని పొందుతాము.
సంస్కృతి యొక్క ప్రాముఖ్యత మరియు నేటి లోకములోని వ్యతిరేక సాంస్కృతిక ఆదర్శముల దృష్ట్యా ఆధునిక అనువర్తనమును మనము చూశాము కాబట్టి, ఇప్పుడు మనము మూడవ విషయమును పరిగణించుటకు సిద్ధముగా ఉన్నాము. నేడు మనము లేఖనమును అనువర్తించుచుండగా సాంస్కృతిక భిన్నత్వముతో మనము ఎలా వ్యవహరించాలి?
ప్రపంచము యొక్క పలు భాగములలో ఉన్న అనేకమంది విశ్వాసులను మనము దర్శించినప్పుడు, మన భాషలు, మన వస్త్రధారణ, మన భోజన అలవాట్లు, సంగీతం, మరియు అనేక ఇతర సాంస్కృతిక పద్ధతులు చాలా భిన్నముగా ఉండుటను మనము స్పష్టముగా గమనిస్తాము. ఇలా ఎందుకు జరుగుతుంది? మనమంతా లేఖన ప్రామాణికతలను పాటించుటకు ప్రయత్నించుచున్నప్పుడు, మన సంస్కృతుల యొక్క పద్ధతులు ఇన్ని విభిన్నమైన దిశలలో ఎందుకు ప్రయాణించాయి? సరే, మన భిన్నత్వములలో కొన్ని మనము లేఖనమునకు అనుగుణంగా జీవించుటకు విఫలమగుట వలన కలుగుతాయి అని చెప్పనవసరము లేదు. అయితే మన వైఫల్యములతో పాటుగా, లోకములో ఉన్న దేవుని ప్రజలందరి మధ్య సాంస్కృతిక భిన్నతను ఆశించుటకు అనేక ఇతర మాన్యమైన కారణములు ఉన్నాయి.
మనము ఇంతకు ముందు చూసినట్లు, క్రొత్త నిబంధన యుగము యొక్క ఆరంభముతో, దేవుని ప్రజలు ఇక ఒకే దేశముగా లేరు. మరియు గత రెండు వేల సంవత్సరములుగా, సువార్త ప్రపంచవ్యాప్తంగా వ్యాపించగా, దేవుని నమ్మకమైన ప్రజలు విభిన్నమైన సంస్కృతులలో క్రీస్తు కొరకు జీవించు సవాలును ఎదుర్కొన్నారు. ఈ సవాలు ఒక కీలకమైన ప్రశ్నకు దారితీసింది. ఎంత సాంస్కృతిక భిన్నత్వమును మనము అనుమతించగలము? మనము ఏ పరిమితులను నియమించగలము?
లేఖనములో అనేక చోట్ల ఈ ప్రశ్నకు జవాబు కనబడుతుంది, అయితే 1 కొరింథీ. 9:19-23 ఈ సమస్యను పరిష్కరించుటకు ఒక ఉత్తమమైన స్థలమైయున్నది. ఈ వాక్యభాగములో, పౌలు కొరింథీ సంఘమునకు ఇలా వ్రాయుచున్నాడు:
నేను అందరి విషయము స్వతంత్రుడనై యున్నను ఎక్కువమందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసికొంటిని. యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని. బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను (1 కొరింథీ. 9:19-23).
ఈ వాక్యభాగములో, సువార్త ఆజ్ఞను నెరవేర్చుట కొరకు తాను కలిగియున్న సమర్పణ విభిన్నమైన సాంస్కృతిక భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములను హత్తుకొనునట్లు అతనిని పురికొల్పిన విధానమును పౌలు వర్ణించాడు. 22వ వచనములో అతడు క్రోడీకరించినట్లు, “ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను.”
అనేక చోట్లకు ప్రయాణించిన వ్యక్తిగా, పౌలు ఎంతో అసాధారణమైన సాంస్కృతిక వశ్యతను ఉపయోగించవలసి వచ్చింది. 20వ వచనములో, యూదుల సమాజములలో ఉన్నప్పుడు అతడు “ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని” అని చెబుతున్నాడు. మరియు 21వ వచనములో, అతడు అన్యుల సమాజములలో ఉన్నప్పుడు, “ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని” అని చెబుతున్నాడు.
అయితే తాను హత్తుకొనుటకు ఇష్టపడుచున్న సాంస్కృతిక భిన్నత్వమునకు పౌలు పరిమితులను నియమించిన విధానమును గమనించండి. 20వ వచనములో అతడు చెప్పినట్లు, “నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.” మరొక మాటలో, పౌలు యూదుల సమాజములోని సాంస్కృతిక పద్ధతులను అనుసరించాడు, కాని ఆ దినములలోని మత నాయకులు అర్థము చేసుకొనిన విధముగా అతడు ధర్మశాస్త్రమునకు కట్టుబడియుండలేదు. పౌలు దినములలోని అనేకమంది పరిసయ్యులు మరియు మత నాయకులు తమ స్వనీతిని చూపుకొనుటకు మాత్రమే ధర్మశాస్త్రమును ఉపయోగించేవారు. అయితే, మత్తయి 23లో యేసు సూచించినట్లు, ఇట్టి ప్రవర్తన శిక్షావిధికి మరియు మరణమునకు దారితీసింది. ఇక్కడ, తుదకు తనను దేవుని తీర్పులోనికి తీసుకొని వచ్చు సాంస్కృతిక ప్రామాణికతలను హత్తుకొనకుండా తాను సంస్కృతిని హత్తుకున్నాడని పౌలు వివరించాడు.
ఇదే విధముగా, 21వ వచనములో అతడు ఇలా పలికాడు, “దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ... ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని.” పౌలు అన్య సమాజముల యొక్క భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములలో పాలుపంచుకున్నాడు గాని, క్రొత్త నిబంధన ప్రజల కొరకు క్రీస్తు తెలియపరచిన విధముగా దేవుని ధర్మశాస్త్రమును ఉల్లంఘించనంత వరకు మాత్రమే అతడు దానిలో పాలుపంచుకున్నాడు.
ఇదే విధముగా, నేడు సువార్త ఆజ్ఞను నెరవేర్చుట కొరకు, క్రీస్తు యొక్క నమ్మకమైన అనుచరులు ఇతర సాంస్కృతిక నేపథ్యములకు చెందిన ప్రజలను మరియు పరిస్థితులను అనుసరించువారిని ఎదుర్కొను ప్రతిసారి లేఖనములను విభిన్నమైన రీతులలో అనువర్తించుటకు సిద్ధముగా ఉండాలి. స్థానిక సంఘములు, క్రైస్తవ వ్యాపారములు, విద్యాలయములు, వైద్యశాలలు, మరియు స్నేహాలు కూడా ఒకదానికొకటి భిన్నముగా ఉంటాయి. మరియు అవును, సమయము గడచిన కొలది, దానిలోని ప్రజలు మరియు పరిస్థితులు మారుచుండగా ఈ సమాజములు కూడా మార్పు చెందుతాయి.
అయితే మనకు నచ్చిన విధముగా మన సమాజములలోని సంస్కృతులకు రూపుదిద్దుటకు మనము స్వతంత్రులమైయున్నాము అని దీని అర్థము కాదు. భిన్నముగా, అపొస్తలుడైన పౌలు వలె, క్రీస్తు అనుచరులు నేడు లేఖనము యొక్క పరిమితులలో ఉండుటకు బలమైన సమర్పణ కలిగినవారైయుండాలి. మన సమాజములను లేఖనములకు విభిన్నమైన రీతులలో అనువర్తించుచుండగా వాటికి కట్టుబడియుండుటకు మనము సమర్పణ కలిగియుండుట ఆధునిక అనువర్తనములో అత్యంత సంక్లిష్టమైన భాగములలో ఒకటైయున్నది.
దేవుడు తనను తాను మనకు బయలుపరచుకొనుచుండగా, ఆయన స్థలములో మరియు కాలములో దానిని చేస్తాడు. ఆయన ప్రత్యక్షత యొక్క మహిమలో మరియు విమోచన కొరకు ఆయన ప్రణాళికలో ఇది భాగమైయున్నది. పాత నిబంధన యుగము నుండి క్రొత్త నిబంధన యుగమునకు మనము పనిచేయుచుండగా, మనము పలు సంస్కృతులతో మరియు పలు కాలములలోని ప్రజలతో వ్యవహరిస్తుంటాము. చరిత్రలో కొన్ని స్థలములకు, సంస్కృతులు మరియు నేపథ్యముల దృష్ట్యా కొన్ని స్థలములకు కట్టుబడియున్న అనేక రకముల సాంస్కృతిక భిన్నత్వములను మనము చూస్తాము. వీటిలో ఏది మనకు అనువర్తించబడుతుందో మనకు ఎలా తెలుసు, మరియు దానిని మనము ఎలా జీవించాలి? సరే, కొన్ని నైతిక అవసరతల ప్రామాణికతల దృష్ట్యా మనము ముందుగా భిన్నత్వములను విశ్లేషించాలి అని నా ఆలోచన. కొన్ని సాంస్కృతిక భిన్నత్వములను మనము తిరస్కరించాలి, ఎందుకంటే అవి ప్రతిబింబించుచున్నప్పటికీ, దేవుడు మనలను సృజించిన విధానమునకు — అనగా ఆయన నైతిక ప్రామాణికతలు మరియు ఆ అలవాట్లకు — అవి వ్యతిరేకముగా ఉంటాయి ... సాంస్కృతిక భిన్నత్వము విగ్రహారాధనను, దేవునిని మరియు ఆయన ప్రామాణికతలను తిరస్కరించుటను ప్రతిబింబించవచ్చు.
— డా. స్టీఫెన్ జే. వెల్లుమ్
బైబిలు చరిత్ర అంతటిలో, దేవుని నమ్మకమైన ప్రజల యొక్క ప్రతి సమాజము కొన్ని సాంస్కృతిక పద్ధతులను అనుసరించింది. అయితే ఇతర సాంస్కృతిక పద్ధతులు కాలక్రమములో మార్పుచెందాయి. బైబిలులో మనము చూసే ఒక సాంస్కృతిక పద్ధతిని ఎంత వరకు మనము అనుకరించవచ్చు అని నిర్ధారించుటకు ఒక మార్గము, ఆ సాంస్కృతిక పద్ధతి లేఖనమందంతటా ఒకే విధముగా నిలిచియున్నదా లేక పలు యుగములు, ప్రజలు లేక పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందినదా అని జాగ్రత్తగా చూచుట అయ్యున్నది.
సాంస్కృతిక పద్ధతులు లేఖనములో మార్పుచెందినట్లయితే, మన కాలములో కూడా అవి మార్పుచెందుతాయి అని మనము ఆశించవచ్చు. అయితే బైబిలు చరిత్ర అంతటిలో సాంస్కృతిక విషయములు స్థిరముగా ఉంటే, వాటిని మనము నేటి కొరకు కూడా ప్రామాణికతలుగా పరిగణించవచ్చు.
ఉదాహరణకు, కుటుంబ నిర్మాణములు మరియు జీవన పరిస్థితులు గత రెండు వేల సంవత్సరములలో మార్పు చెందాయి, కాని పిల్లలు తల్లిదండ్రులకు విధేయులైయుండాలని లేఖనము తరచుగా హెచ్చరిస్తుంది. ఇది నేడు మనకు కూడా వర్తిస్తుంది. మరియు చట్ట వ్యవస్థలు ప్రతి సంస్కృతిలో మరియు పలు యుగములలో భిన్నముగా ఉండినప్పటికీ, సాక్ష్యమియ్యవలసి వచ్చినప్పుడు దేవుని ప్రజలు నిజాయితీగా సాక్ష్యము ఇయ్యవలెను అను సత్యమును మాత్రం లేఖనము ఏనాడు మార్చలేదు. రాజకీయ వ్యవస్థలు, వస్త్రధారణ, సంగీతం, భోజన అలవాట్లు, మరియు సంస్కృతిలోని అనేక ఇతర కోణములు బైబిలు చరిత్ర యందంతటా మార్పుచెందినప్పటికీ, మన కుటుంబములలో, పనిచేయు స్థలములలో, మరియు సమాజములలో దేవుని ఘనపరచుట మరియు సేవించుట కొరకు ఇవ్వబడిన నిర్దేశనము స్థిరముగా నిలిచియున్నది.
క్రీస్తు అనుచరులముగా, లేఖనములోని సాంస్కృతిక పద్ధతిని మన దినములకు అనువర్తించుటకు మనము ప్రయత్నించిన ప్రతిసారి, ఈ కొనసాగింపులు మరియు విచ్చేధముల మధ్య వ్యత్యాసము చూపునట్లు మనము జాగ్రత్తవహించాలి.
ఈ పాఠములో, బైబిలు సంస్కృతి మరియు ఆధునిక అనువర్తనములోని అనేక ప్రాముఖ్యమైన కోణములను మనము విశదీకరించాము. బైబిలు యొక్క ఆరంభ అధ్యాయములలో మనము సంస్కృతి యొక్క బైబిలు పునాదులను చూశాము. పాత మరియు క్రొత్త నిబంధనలలోని సంస్కృతిలో సంభవించిన బైబిలు పురోగమనములను మనము చూశాము. మరియు బైబిలులోని సంస్కృతిలో ఉన్న కోణములు మన లేఖనము యొక్క ఆధునిక అనువర్తనమును ప్రభావితము చేయవలసిన విధానములను మనము విశదీకరించాము.
క్రీస్తు యొక్క నమ్మకమైన అనుచరులు లేఖనములోని బోధనలను కేవలం వ్యక్తిగతముగా తమకు మాత్రమే అనువర్తించుకొనక, వారి జీవితములలోని సాంస్కృతిక కోణములకు కూడా అనువర్తించుకోవాలని స్వయంగా బైబిలు స్పష్టము చేస్తుంది. క్రొత్త నిబంధన యుగములో కూడా, మనము దేవుని స్వరూపములైయున్నాము మరియు దేవునికి ఇష్టానుసారమైన రీతిలో మానవ సంస్కృతిని నిర్మించుటకు మనము పిలువబడ్డాము. ఈ ఆజ్ఞ క్రీస్తు రాకడ వరకు కొనసాగుతుంది. కాబట్టి, ఆధునిక సంస్కృతిలోని ప్రతి కోణమునకు లేఖనములు అనువర్తించబడు విధానమును మనము నిశ్చయముగా నేర్చుకోవాలి.
Continue reading the full transcript