అదే శ్రేణిలోని 11వ పాఠానికి సమాధానమిచ్చే ఒక అనుబంధ వీడియో, ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిస్తుంది: బైబిల్ యొక్క దేవుణ్ణి, పొరుగువారిని ప్రేమించాలనే ఆజ్ఞలు పరస్పరం అనుసంధానించబడి ఉన్నాయా? బైబిల్లో మనం పాటించకూడని కొన్ని చట్టాలు లేదా ఆజ్ఞలు ఉన్నాయా? నేడు విశ్వాసులు ప్రధానంగా స్క్రిప్చర్ యొక్క ప్రవర్తనా అనువర్తనాలపై దృష్టి పెడతారా? మన క్రైస్తవ జీవితాల యొక్క కార్పొరేట్ అంశాలు వ్యక్తిగత అంశాల వలె సమానంగా ముఖ్యమైనవా? పదాన్ని "చేసేవారు" గా ఉండటం ఎంత ముఖ్యం, "వినేవారు" మాత్రమే కాకుండా? పవిత్ర ఆత్మ మనకు స్క్రిప్చర్ను మన జీవితాలకు అనువర్తింపజేయడంలో ఎలా సహాయపడుతుంది? స్క్రిప్చర్ యొక్క భావోద్వేగ అంశాలను నొక్కిచెప్పినప్పుడు మనం భావోద్వేగాన్ని ఎలా నివారించవచ్చు? బైబిల్లో వివరించిన వ్యక్తుల ఉదాహరణలను మనం ఎప్పుడు అనుసరించాలి? బాధ్యతాయుతంగా బైబిల్ను వ్యాఖ్యానించడానికి అవసరమైన నైపుణ్యాలను మనం ఎలా పెంపొందించుకోవచ్చు? పాస్టర్లు తమ చర్చిల్లోని వివిధ వ్యక్తులకు స్క్రిప్చర్లను ఎలా అనువర్తింపజేయవచ్చు?
From the transcript
తన సంఘ భవనము యొక్క ద్వారము యొద్ద నిలువబడి బయటకు వెళ్లు విశ్వాసులకు అభివాదము చేయు ఒక యౌవ్వన సేవకుని గూర్చి ఒక కథ చెప్పబడింది. ఇప్పుడు, అతని సంఘ సభ్యులలో చాలామంది ఒక చిరునవ్వు నవ్వి బయటకు వెళ్లిపోయేవారు. అయితే ఆ వరుసలో చివర ఎల్లప్పుడూ తన మనస్సులో ఉన్నదానిని ఉన్నది ఉన్నట్లు మాట్లాడు ఒక వృద్ధుడు ఉన్నాడు.
అతడు ఈ విధంగా ఫిర్యాదు చేశాడు, “యౌవ్వనుడా, ఈ రోజు నీవు చెప్పిన వాక్యములో ఒక తీవ్రమైన సమస్యను నేను కనుగొన్నాను.”
“ఏంటి అది?” అని సేవకుడు అడిగాడు.
“నా జీవితమును గూర్చి దేవుని వాక్యము ఏమి చెబుతుందో నేను తెలుసుకోవాలని అనుకొనుచున్నాను, కాని నీవు ఏనాడు నా జీవితమునకు అనువర్తించబడు ఏ విషయమును మాట్లాడవు.”
సరే, ఏదో ఒక సమయములో, మనము ఎదుర్కొనుచున్న వ్యక్తిగత అవసరతలను ఉద్దేశించి మాట్లాడుటలో విఫలమైయ్యే ప్రసంగములను మనలో చాలామందిమి వినే ఉంటాము. మరియు బైబిలు అందించుచున్న ప్రోత్సాహము, ఆచరణాత్మక నడిపింపు మరియు దిద్దుబాటు మనందరికీ అవసరమైయున్నది. కాబట్టి, మనము సామాన్య లేక సైద్ధాంతిక విషయములకు ఎంతగా కట్టుబడియుండాలని ప్రయత్నించినా, లేఖనములను ఆచరణాత్మక రీతులలో మన జీవితములకు మరియు ఇతరుల జీవితములకు అనువర్తించుటను మనము నేర్చుకోవాలి.
ఆయన మనకు లేఖనమును అనుగ్రహించాడు: వ్యాఖ్యానమునకు పునాదులు అను మన పాఠ్యక్రమములో ఇది పదకొండవ పాఠము మరియు దీనికి “వ్యక్తుల కొరకు ఆధునిక అనువర్తనము” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో, ఇతరులకు మరియు వ్యక్తిగత ప్రజలుగా మనకు లేఖనమును అనువర్తించుకొను విధానమును మనము చూద్దాము.
మనము ఇతర పాఠములలో చూసినట్లు, నేటి దినము కొరకు మనము బైబిలును అనువర్తించిన ప్రతిసారి లేఖనము యొక్క వాస్తవిక శ్రోతలకు మరియు ఆధునిక శ్రోతలకు మధ్య ఉన్న మూడు రకముల దూరములను మనము పరిగణలోనికి తీసుకోవాలి: యుగముల సంబంధమైన, సాంస్కృతిక, మరియు వ్యక్తిగత దూరములు.
విస్తృత ధోరణిలో, బైబిలు చరిత్ర ఒక గొప్ప యుగము నుండి మరియొక గొప్ప యుగములోనికి కొనసాగుచుండగా జరిగిన వేదాంతశాస్త్ర పురోగమనములను మనము విశదీకరించాలి. సంకుచిత ధోరణిలో, బైబిలు కాలములలో సంస్కృతుల కొరకు దేవుని రూపరచన మరియు ఆధునిక సంస్కృతుల కొరకు దేవుని రూపరచన మధ్య ఉన్న పోలికలు మరియు వ్యత్యాసములను మనము పరిగణలోనికి తీసుకోవాలి. మరియు ఈ ఆకారములలో, లేఖనము యొక్క వాస్తవిక శ్రోతలు మరియు ఆధునిక శ్రోతల మధ్య ఉన్న వ్యక్తిగత పోలికలు మరియు వ్యత్యాసములను కూడా మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఈ పాఠములో, నేటి ప్రజల యొక్క భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములను లేఖనములు ప్రభావితము చేయవలసిన విధానమును పరిగణించుచుండగా మనము ఆధునిక అనువర్తనము యొక్క చివరి కోణమును ప్రధానముగా చూద్దాము.
మనము చలనచిత్రములను చూచుట మొదలుకొని, మనము పాటలు వినుట, మరియు అనుబంధములను ఏర్పరచుకొనుట వరకు మన జీవితములో ప్రతి విషయమును ఆయన వాక్యము ప్రభావితము చేయాలని దేవుడు ఉద్దేశించుచున్నాడు. మనము సూర్యాస్తమయమును మరియు పాపమును చూచు విధానము కూడా దేవుడు తనను తాను మనకు బయలుపరచుకున్న విధానము ద్వారా ప్రభావితము చేయబడుతుంది. మరియు అది మన మనస్సులు, మన హృదయములు, మరియు మన క్రియల మీద ప్రభావము చూపవలసియున్నది. అనుదినము అనుక్షణము మనము దేవుని ఆలోచనలను ఆలోచించు విధముగా బైబిలు వివేకమును మనకు అనుగ్రహించుటకు బైబిలు మన జీవితములలో మిళితమైపోవాలి. అది తుదకు మన జీవితములో స్వాభావికముగా జరుగునదిగా ఉండాలి, కాని బైబిలు మన జీవితముల మీద పూర్ణమైన రీతిలో ప్రభావము చూపుట కొరకు ఉద్దేశించబడినది.
— డా. కే. ఎరిక్ ధోయెన్స్
వ్యక్తుల కొరకు ఆధునిక అనువర్తనమును చూచుటకు అనేక మార్గములు ఉన్నాయి, కాని ఈ పాఠములో, మనము రెండు ప్రధానమైన విషయములను చూద్దాము. మొదటిగా, మన వ్యక్తిగత లేఖనముల అనువర్తనములో దేవుడు విభిన్నతను నిర్ణయించాడు అని మనము చూద్దాము. మరియు రెండవదిగా, మన కొరకు మరియు ఇతరుల కొరకు మన బైబిలు అనువర్తనములో జ్ఞానమును సంపాదించు విధానములను దేవుడు మనకు అనుగ్రహించాడు అని మనము విశదీకరిద్దాము. వ్యక్తిగత అనువర్తనములో విభిన్నతతో ఆరంభించి ఈ అంశములను చూద్దాము.
ఏదో ఒక సమయములో, ఒక రకమైన యాంత్రిక లేక విద్యుత్ పరికరమును ఉపయోగించుటకు మనలో చాలామందిమి సూచనల చేతిపుస్తకమును చదివే ఉంటాము. ఇప్పుడు, ప్రతి వ్యక్తి ఒకే పనిని చేయులాగున సూచనల చేతిపుస్తకము సాధారణంగా సులువైన ప్రక్రియలను గూర్చి ప్రతి చిన్న వివరణను ఇస్తుంది: “ఇలా చెయ్యండి. ఇలా చెయ్యండి. ఇలా చెయ్యండి,” మరియు ప్రతి ఒక్కటి పనిచేయవలసిన రీతిలో పని చేస్తుంది. అయితే వ్యవసాయము చేయుట, కుటుంబమును కట్టుట లేక వ్యాపారమును నడుపుటను గూర్చి ఒకరు వివరణాత్మక చేతిపుస్తకమును వ్రాయుటను గూర్చి మీరు ఊహించగలరా? ఖచ్చితముగా ఊహించలేరు. ఈ పనులు ఒక్కొక్క మెట్టులో వర్ణించబడుటకు చాలా సంక్లిష్టమైనవిగా ఉన్నాయి. మరియు తాము ఎదుర్కొను పరిస్థితులకు అనుగుణంగా పలువురు పలు విధాలుగా ఈ పనులను చేయవలసి ఉంటుంది.
బైబిలు కూడా ప్రతి వ్యక్తి అనుసరించవలసిన విశేషమైన మెట్లను తెలియజేయు ఒక సూచనల లేక బోధనల చేతిపుస్తకముగా ఉంటే బాగుంటుంది అని కొన్నిసార్లు మనము అనుకుంటాము. ఇది దేవుని వాక్యము యొక్క వ్యక్తిగత అనువర్తనమును నిశ్చయముగా సులభతరము చేస్తుంది. అయితే బైబిలు ఇలా చేయదు అని బైబిలుతో సుపరిచితులైన వారందరికీ తెలుసు. బదులుగా, బైబిలు ఊహించుటకు ఎంతో సంక్లిష్టమైన — ఒకొక్క మెట్టుగా నిర్దేశనములను ఇచ్చుటకు చాలా సంక్లిష్టమైన — విషయములతో వ్యవహరిస్తుంది. ఇంతేగాక, అనేకమంది ప్రజలు అనేక పరిస్థితులలో ఉపయోగించుట కొరకు బైబిలు రూపొందించబడింది. ఈ కారణముల చేత, వ్యక్తిగత ప్రజల కొరకు విభిన్నమైన రీతులలో అనువర్తించబడుటకు లేఖనములు వ్రాయబడినవి.
వ్యక్తిగత అనువర్తనములలో విభిన్నతను అర్థముచేసుకొనుటకు, బైబిలు ఇచ్చు బోధనలలో ఉన్న విభిన్నతలను మొదటిగా చూద్దాము. మరియు రెండవదిగా, ఈ భిన్నమైన బోధనలు పలువురు ప్రజలకు మరియు పలు పరిస్థితులకు భిన్నమైన రీతులలో ఎందుకు అనువర్తించబడాలో మనము చూద్దాము. ముందుగా బైబిలులోని బోధనల యొక్క విభిన్నతను చూద్దాము.
ఇంతకు ముందు మనము తెలిపినట్లు, ఒకొక్క మెట్టు వివరణలు గల చేతిపుస్తకములకు భిన్నముగా, వ్యవసాయము, కుటుంబము, వ్యాపారము, మొదలగువాటి మీద వ్రాయబడు పుస్తకములు విస్తృతమైన విషయముల నుండి సంకుచితమైన విషయముల వరకు పలు స్థాయిలలో విభిన్నమైన బోధనలను తమ పాఠకులకు అందిస్తాయి. సాధారణంగా, ఇట్టి పుస్తకములు అన్ని పరిస్థితులలో ప్రజలందరు పాటించవలసిన కొన్ని సార్వత్రిక నియమములను గుర్తిస్తాయి. ఎక్కువ పరిస్థితులకు అనువర్తించబడు కొన్ని సామాన్య మార్గదర్శకములను కూడా అవి అందిస్తాయి. దీనిని మించి, అప్పుడప్పుడు ఎదురయ్యే కొన్ని విశేషమైన పరిస్థితులను గూర్చి అనేక రకముల బోధనలను సాధారణంగా అందిస్తాయి. చివరిగా, ఇట్టి పుస్తకములలో సాధారణంగా విజయములు మరియూ వైఫల్యముల యొక్క ఉదాహరణలు కలిగియున్న సందర్భ పరిశీలనలు ఉంటాయి.
అనేక విధాలుగా, లేఖనములు ఇదే విధమైన బోధనల భిన్నత్వమును కలిగియుంటాయి. అన్ని సమయములలో ప్రతి ఒక్కరు అనుసరించవలసిన కొన్ని సార్వత్రిక నియమములను, అనేక పరిస్థితులలో అనేకమంది అనుసరించవలసిన సామాన్య మార్గదర్శకములను, కొందరు ప్రజలు మరియు పరిస్థితుల కొరకు ప్రత్యేకమైన బోధనలను, మరియు లేఖనములోని బోధనలను అనుసరించుటలో సఫలమైన లేక విఫలమైన ప్రజల యొక్క ఉదాహరణలను అవి అందిస్తాయి.
ఈ బైబిలు బోధనలను రెండు మార్గములలో చూచుట సహాయకరముగా ఉంటుంది. మొదటిగా, పాత నిబంధనలో ఇట్టి రకముల బోధనలు కనిపించు విధానమును చూద్దాము, తరువాత ఇట్టి రకముల బోధనలను క్రొత్త నిబంధనలో ప్రత్యక్షమయ్యే విధానమును కూడా పరిగణిద్దాము. పాత నిబంధనతో మొదలుపెడదాము.
ఇది ఎంత అసంభవమైనదిగా అనిపించినప్పటికీ, ఆదికాండము మొదలుకొని మలాకీ వరకు బైబిలులో ఉన్న నియమములను మరియు బోధనలన్నిటిని ప్రతి ఇశ్రాయేలీయుడు కంటస్థం చేసి, ఆయన కోరినప్పుడు వెంటనే ఈ బోధనలను వారు అవలంబించుటకు సిద్ధముగా ఉండాలని దేవుడు ఆశించాడు అని ఆధునిక పాఠకులు చాలామంది అనుకుంటారు. పాటించుట ప్రక్కన పెట్టండి, పాత నిబంధనలో ఇవ్వబడిన నియమముల యొక్క పట్టికను జ్ఞాపకముంచుకొనుట కూడా చాలా కష్టమవుతుంది. మరియు ఈ సవాలుతో వ్యవహరించుటకు, ఇశ్రాయేలులోని రబ్బాయిలు పాత నిబంధన బోధనలలోని ప్రాధాన్యతలను వివేచించుటకు ప్రయత్నించారు. ప్రతి పరిస్థితిలో ప్రతిఒక్కరు ఏ ఆజ్ఞలను జ్ఞాపకముంచుకోవాలి? ఏ బోధనలు జీవితములోని అన్ని విభాగములలోగాక అనేక విభాగములలో అవలంబించబడాలి? ఏ ఆజ్ఞలు కేవలం అప్పుడప్పుడు జ్ఞాపకము ఉంచుకొనుటకు మాత్రమే ఉద్దేశించబడినవి? కొందరు రబ్బాయిలు ఈ విధంగా వాదిస్తే, ఇతరులు ఆ విధంగా వాదించారు. అయితే ప్రాధాన్యతలను స్థాపించుట చాలా అవసరమైయున్నది అని వారంతా యెరిగియున్నారు. మత్తయి 22:36లో, పాత నిబంధనలోని బోధనలకు ప్రాధాన్యతనిచ్చుటకు చేయబడిన ప్రయత్నములు ధర్మశాస్త్ర నిపుణుడు ఒకడు యేసును ఈ విధంగా ప్రశ్నించునట్లు పురికొల్పాయి:
బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను (మత్తయి 22:36).
37-40 వచనములలో యేసు ఇలా జవాబిచ్చాడు:
అందుకాయన నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వలెననునదియే. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను (మత్తయి 22:37-40).
ఈ సుపరిచితమైన సన్నివేశములో, బైబిలులో ఉన్న ఆజ్ఞలన్నిటి విషయములో యేసు తన అనుచరులకు అధికారిక దృక్కోణమును అందించాడు. ఆయన ద్వితీ. 6:5లో ఉన్న “నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను” అను ఆజ్ఞను ఉన్నతమైన ఆజ్ఞగా గుర్తించాడు. మరియు ఆయనను అడగకుండానే, రెండవ గొప్ప ఆజ్ఞను ఆయన జోడించాడు: లేవీ. 19:18లో నుండి “నిన్నువలె నీ పొరుగువని ప్రేమింపవలెను” అను ఆజ్ఞ. ఆయన దృష్టికోణము ప్రకారం, ఈ రెండు ఆజ్ఞలు ఇతర బైబిలు బోధనలన్నిటి కంటే ప్రధానమైనవిగా ఉన్నాయి.
అవును, స్వయంగా దేవుడు మరియు దేవుని స్వరూపముగా మానవాళి బైబిలులో చాలా ప్రాముఖ్యమైనవారిగా ఉన్నారు. అయితే ఈ రెండు ఆజ్ఞలు ఒకే గురిని కలిగియున్నవి కాబట్టి యేసు వీటిని కలిపి ఉపయోగించాడు అని జ్ఞాపకముంచుకొనుట సహాయపడుతుంది. ఈ రెండు ప్రేమను గూర్చి మాట్లాడతాయి. అన్నిటి కంటే ఎక్కువగా, మనము దేవుని ప్రేమించాలి మరియు మన పొరుగువానిని ప్రేమించాలి. కాబట్టి, యేసు ఈ ఆజ్ఞలకు ఇతర ఆజ్ఞలన్నిటి కంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన విషయము మనకు ఆశ్చర్యమును కలిగించకూడదు. అవి హృదయములోని లోతైన విషయములతో వ్యవహరిస్తాయి — ఆయన ప్రజల నుండి దేవుడు ఆశించు వైఖరులు, సమర్పణలు, పురికొల్పులు మరియు లక్ష్యములు. ఫలితంగా, యేసు యొక్క దృష్టికోణములో నుండి, దేవుని పట్ల ప్రేమ మరియు పొరుగువాని పట్ల ప్రేమ పాత నిబంధనలో సార్వత్రిక, అనగా ఏది ఏమైనా ప్రజలందరు పాటించవలసిన నియమములైయున్నవి.
ఒక న్యాయవాది యేసును ఇలా ప్రశ్నించాడు, “బైబిలులో ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” మరియు అతడు ఇలా జవాబిచ్చాడు “మొదటి మరియు ముఖ్యమైన ఆజ్ఞ ఇది: నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను.” తరువాత ఆయన ఇలా సెలవిచ్చాడు, “మరియు రెండవ ఆజ్ఞ ఏమనగా: నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవి.” కాబట్టి, స్పష్టముగా ఇవి రెండు కీలకమైన ఆజ్ఞలు. ఆయన వీటిని సమానముగా చేయలేదు. అన్నిటి కంటే ముఖ్యముగా, మనము దేవుని ప్రేమించాలి. మన మొదటి స్వామిభక్తి దేవునికి చెందుతుంది. ఆయన మన సృష్టికర్త, మన విమోచకుడు. ఆయన మన డాలు మరియు ఆయన మన గొప్ప ప్రతిఫలమైయున్నాడు. సమస్తము దేవుని మీద గురి నిలుపుతాయి. కాబట్టి, మనము దేవుని పూర్ణ హృదయముతో ప్రేమించాలి, మరియు అనుదినము మన ప్రాధాన్యతలలో ఇది ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. అయితే యేసు అక్కడితో ఆగలేదు. “ముఖ్యమైన రెండు ఆజ్ఞలు ఏవి?” అని అతడు అడగలేదు. “ముఖ్యమైన ఆజ్ఞ ఏది?” అని మాత్రమే న్యాయవాది అడిగాడు. అయితే యేసు నిశ్చయముగా రెండవ ఆజ్ఞను కూడా ఇచ్చాడు, మరియు అది నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అను ఆజ్ఞ. కాబట్టి ఈ రెండు అనుబంధము కలిగినవిగా ఉన్నాయి. దేవుని స్వరూపమందు సృజించబడిన ప్రజలను, ముఖ్యముగా విమోచించబడి, దేవుని కుటుంబములోనికి దత్తతు తీసుకొనబడిన ప్రజలను ప్రేమించకుండా మనము దేవుని ప్రేమించలేము.
— డా. ఆండ్రూ డేవిస్
ఈ రెండు ఆజ్ఞలు యేసుకు ఎంత ప్రాముఖ్యమైనవి అంటే, “ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును” — పాత నిబంధన అంతటిని సంబోధించు ఒక విధానము — “ఆధారమైయున్నవని” ఆయన జోడించాడు. ఇప్పుడు, దేవుని మరియు పొరుగువానిని ప్రేమించుట మినహా పాత నిబంధనలో ఉన్న బోధనలన్నిటిని యేసు అనుచరులు పట్టించుకోకూడదు అన్నట్లు అనేకమంది వ్యాఖ్యానకర్తలు దీనిని అర్థము చేసుకున్నారు కాబట్టి మనము కొంచెం జాగ్రత్తవహించాలి. అయితే దీనికి వ్యతిరేకమైన విషయము వాస్తవమైయున్నది.
మత్తయి 22లో యేసు రెండు ముఖ్యమైన ఆజ్ఞలను గుర్తించుట మాత్రమే కాదుగాని, మత్తయి 5:19లో, ఆజ్ఞలలో మిగుల అల్పమైన దానిని కూడా పాటించమని యేసు తన అనుచరులకు బోధించాడు. ఆయన చెప్పిన మాటలను వినండి:
కాబట్టి యీ యాజ్ఞలలో మిగుల అల్పమైన యొకదానినైనను మీరి, మనుష్యులకు ఆలాగున చేయ బోధించువాడెవడో వాడు పరలోకరాజ్యములో మిగుల అల్పుడనబడును (మత్తయి 5:19).
యేసు అనుచరులు ముఖ్యమైన ఆజ్ఞల నుండి అల్పమైన ఆజ్ఞల వరకు అన్నిటిని పాటించాలని ఈ వచనము మరియు ఇతర వాక్యభాగములు స్పష్టము చేస్తాయి.
దీనికి తోడు, మత్తయి 23:23లో, యేసు పరిసయ్యులను గద్దించినప్పుడు ముఖ్యమైన మరియు అల్పమైన వాటి మధ్య ఉన్న విభిన్నమైన బోధనలను గుర్తించాడు:
అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకఱ్ఱలోను పదియవ వంతు చెల్లించి, ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను, అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి; వాటిని మానక వీటిని చేయవలసి యుండెను (మత్తయి 23:23).
యేసు “న్యాయమును కనికరమును విశ్వాసమును” “ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు”గా సూచించి, వాటిని “దినుసులలో పదియవ వంతు” ఇచ్చుట అను అల్పమైన విషయముతో వ్యత్యాసముగా చూపిన విధమును గమనించండి. మరొకసారి, తన అనుచరులు పాత నిబంధనలోని ఆజ్ఞలన్నిటిని అనుసరించాలి అని, కాని మనస్సులో సరియైన ప్రాధాన్యతలను కలిగియుండాలని ఆయన సూచించాడు.
పాత నిబంధనలో దేవుని బోధనలపై యేసు యొక్క దృష్టికోణములను ఒక మొబైల్ తో పోల్చుట సహాయకరముగా ఉంటుంది. మొబైల్ యొక్క పైభాగములో సార్వత్రిక నియమములైన, రెండు ముఖ్యమైన ఆజ్ఞలు ఉన్నాయి: “మీ ప్రభువైన యెహోవాను ప్రేమించుము” మరియు “మీ పొరుగువానిని ప్రేమించుము.” “ఈ రెండు ఆజ్ఞలు ధర్మ శాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమైయున్నవని” మనకు తెలుపబడింది.
వీటి క్రింద ముఖ్యమైన ఆజ్ఞలను ఎలా పాటించాలో సూచించు అదనపు నియమములు ఉన్నాయి. వీటిలో పాతనిబంధనలో కనిపించు పది ఆజ్ఞలు మరియు న్యాయము, కనికరము మరియు విశ్వాసము వంటి నియమములను పోలిన సామన్య మార్గదర్శకములు ఉన్నాయి.
ఈ విస్తృత నియమముల క్రింద “ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైనవి” ఉన్నాయి. ఇవి కొన్ని పరిస్థితులలో ఉన్న పలువురు ప్రజలు పైనున్న ఆజ్ఞలను ఎలా పాటించాలో సూచించు పాత నిబంధనలోని విశేషమైన బోధనలైయున్నవి. ఉదాహరణకు, లేవీయకాండములో ఆరాధన కొరకు బోధనలు, కీర్తనలు ఇచ్చు నిర్దేశములు, యోబు మరియు సామెతలు వంటి జ్ఞాన సాహిత్య గ్రంథములలో మరియు యెషయా మరియు యెహెజ్కేలు వంటి ప్రవచన గ్రంథములలో కనిపించు అనేక బోధనలు.
మొబైల్ యొక్క క్రింది భాగములో, పాత నిబంధన కథనములలో, కీర్తనలలో మరియు జ్ఞాన సాహిత్య గ్రంథములలో కూడా చాలా ఎక్కువగా కనిపించు అనేక చారిత్రిక ఉదాహరణలు ఉన్నాయి. కొందరు స్త్రీ పురుషులు తమ విశేషమైన పరిస్థితులలో దేవుని ఆజ్ఞలకు విధేయులగు లేక అవిధేయులగు విధానముల మీద ఈ వాక్యభాగములు దృష్టిపెడతాయి.
పాత నిబంధనలో కనిపించు పలు విధముల బోధనలతో ఆయన శిష్యులు ఏ విధంగా వ్యవహరించాలని యేసు కోరాడో అర్థము చేసుకొనుటకు ఈ క్రమానుసార అమరిక సహాయపడుతుంది.
ఈ పాత నిబంధన నేపథ్యమును మనస్సులో ఉంచుకొని, క్రొత్త నిబంధనలో ఉన్న విభిన్నమైన బైబిలు బోధనలను పరిగణిద్దాము.
క్రొత్త నిబంధన పాత నిబంధన కంటే చిన్నదిగా ఉన్న విషయమును చూచుట సులభమేగాని, దేవుని ప్రజల కొరకు ఇవ్వబడిన బోధనల సంఖ్యను క్రొత్త నిబంధన రచయితలు కుదించారు అని దీని అర్థము కాదు. వాస్తవానికి, ప్రాచీన ఇశ్రాయేలు కొరకు ఇవ్వడిన పట్టిక కంటే ఆదిమ సంఘమునకు ఇవ్వబడిన బోధనల పట్టిక సుదీర్ఘమైనదిగా ఉన్నది. క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధనను భర్తీ చేయలేదు. బదులుగా, వారు పాత నిబంధనకు జోడించారు. ఇప్పుడు, క్రొత్త నిబంధనలో మరిన్ని బోధనలను చేర్చుట ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధన బోధనలకు తమ సొంత బోధనలను అదనముగా ఎందుకు జోడించారు?
మునుపటి పాఠములలోని ఒకదానిలో మనము చూసినట్లు, పాత నిబంధనలోని బోధనలలో దేనిని కూడా క్రీస్తు అనుచరులు మరచిపోకూడదు అని క్రొత్త నిబంధన రచయితలు కోరారు, కాని వారు పాత నిబంధన కాలములలో నివసించుచున్నట్లు నివసించకూడదు అని కూడా వారు కోరారు. కాబట్టి, మునుపటి విధానములలోనికి జారిపోకుండా తమ శ్రోతలను నిలువరించుటకు, క్రొత్త నిబంధన యుగములో పాత నిబంధన హెచ్చరికలను అనువర్తించు విధానమును వారు ఆదిమ సంఘమునకు బోధించారు.
క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధన బోధనలు గుర్తించారు, కాని యేసు మొదటిగా వచ్చినప్పుడు, తనతో కూడా దేవుని మెస్సీయ రాజ్యము యొక్క ఆరంభమును తీసుకొని వచ్చాడు అను అవగాహనతో గుర్తించారు. పరిశుద్ధాత్ముడు క్రొత్త నిబంధన యుగము యొక్క కొనసాగింపులో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తన కార్యములను చేయు విధానముల ఆధారంగా పాత నిబంధన బోధనలను చూడాలని వారు గ్రహించారు. మరియు మెస్సీయ రాజ్యము యొక్క అంతిమ నెరవేర్పులో ఆయన తన మహిమలో తిరిగివచ్చినప్పుడు క్రీస్తు చేయబోవు కార్యముల వెలుగులో వారు పాత నిబంధనను చూశారు.
దీనంతటిలో, యేసు స్థిరపరచిన ప్రాధాన్యతలను క్రీస్తు అనుచరులు పాటించాలి అని క్రొత్త నిబంధన రచయితలు ఉద్ఘాటించారు.
మొదటి స్థానములో, దేవుని కొరకు మరియు పొరుగువాని కొరకు ప్రేమ అను సార్వత్రిక నియమములు ముఖ్యమైన ఆజ్ఞలుగా కొనసాగాయి, మరియు దీనిని మనము లూకా 10:27, 1 కొరింథీ. 13:13 మరియు 1 యోహాను 4:21 వంటి వాక్యభాగములలో చూస్తాము. ఏమి జరిగినప్పటికీ, క్రొత్త నిబంధన విశ్వాసులు దేవుని ప్రేమించుటకు మరియు తమ పొరుగువారిని ప్రేమించుటకు తమ హృదయములను సమర్పించుకోవాలి.
రెండవదిగా, మత్తయి 19:18 మరియు రోమా. 13:8-10 వంటి వాక్యభాగములలో క్రొత్త నిబంధన రచయితలు పది ఆజ్ఞలు మరియు పాత నిబంధనలోని ఇతర సాధారణ మార్గదర్శకముల వైపుకు కూడా దృష్టిని ఆకర్షించారు.
మూడవదిగా, 1 కొరింథీ. 14 మరియు 2 తిమోతి 4:1-5 వంటి వాక్యభాగములలో మనము చదువునట్లు క్రొత్త నిబంధన రచయితలు ప్రత్యేకమైన ప్రజలు మరియు పరిస్థితుల కొరకు ప్రత్యేకమైన సూచనలను ఇచ్చారు.
మరియు నాలుగవ స్థానములో, సువార్తలలో మరియు అపొస్తలుల కార్యములలో మరియు అనేక ఇతర వాక్యభాగములలో ప్రజలు దేవుని ఆజ్ఞలకు విధేయులైన మరియు అవిధేయులైన అనేక స్థిరమైన చారిత్రిక ఉదాహరణలను మనము చూస్తాము.
మనము ఇంతకు ముందే చూసినట్లు, లేఖనములలోని విషయములు చాలా సంక్లిష్టమైనవి, మరియు బైబిలులో దేవుని ప్రజల కొరకు అనేక విభిన్నమైన బోధనలు ఇవ్వబడినవి, కాబట్టి ప్రతి బోధనను మన మనస్సులలో ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోలేము. అయితే ఈ అనేక ఆజ్ఞలను మనము ఏ విధంగా ఉపయోగించాలో గ్రహించుటలో క్రొత్త నిబంధన మనకు సహాయపడుతుంది.
ఒక వైపున, యేసు తన శిష్యులను ఆచరించమని చెప్పిన ప్రాధాన్యతలను మనము అనుసరించాలి. మనము అనుసరించని యెడల, మనము యేసు దినములలోని పరిసయ్యుల వలె లేఖనములోని వివరములలో దారితప్పిపోతాము. మనము కొన్ని విషయములతో వ్యవహరించుచుండగా విశేషమైన బోధనలు అవసరమేగాని, మన దృష్టి ముఖ్యమైన విషయముల మీద ఎక్కువ ఉండాలి — అన్నిటి కంటే ఎక్కువగా దేవుని మరియు పొరుగువానిని ప్రేమించుట మీద. అనుదినము అనుక్షణము మనము ఈ రెండు గొప్ప ఆజ్ఞల ద్వారా పురికొల్పబడాలి మరియు నడిపించబడాలి.
రెండవదిగా, ఈ ప్రాధ్యానతలు ఉన్నప్పటికీ, ఏదో ఒక విధముగా, క్రీస్తు అనుచరులలో ప్రతి ఒక్కరికి బైబిలులోని ప్రతి బోధన వర్తిస్తుంది అని మనము జ్ఞాపకముంచుకోవాలి. మనము విభిన్నమైన ఎంపికలను ఎదుర్కొనుచుండగా, మనము లేఖనము యొక్క సార్వత్రిక నియమముల నుండి మాత్రమే వెలికితీయుట గాక, దేవుని నమ్మకముగా సేవించుచుండగా బైబిలులో కనిపించు సామాన్య నిర్దేశనములు, విశేషమైన వివరములతో కూడిన బోధనలు మరియు స్పష్టమైన ఉదాహరణలను కూడా మనము ఉపయోగించాలి.
నిబంధనలో, దేవుడు తన ప్రజలకు తన స్వభావమును మరియు లక్షణములను బోధించుచున్నప్పుడు, ఆయన వారికి మూడు రకముల నియమములను ఇచ్చాడు. ఖచ్చితమైన విషయములుగా చెప్పబడిన నైతిక నియమములు ఉన్నాయి, మరియు ఇవి అన్ని కాలములకు వర్తిస్తాయి. పౌర నియమములు ఉన్నాయి, మరియు వీటిలో నిత్య నియమములు కాలక్రమానుసార సందర్భాలలో అమర్చబడ్డాయి. ఇతరులను గాయపరచు ఎద్దును గూర్చిన నియమమును నేను ఎల్లప్పుడూ ఉపయోగించాలనుకుంటాను, ఎందుకంటే నాకు ఎడ్లు లేవు. అనువర్తించబడని నియమములంటే నాకు ఇష్టం. ఇక్కడ నియమము ఏమిటంటే, మీ ఎద్దు జనముల మీద పడుతుంది అని మీకు తెలిసికూడా దానిని మీరు కట్టకుండా ఉండి, అది మీ పొరుగువానిని చంపితే, మీరు నరహంతకులవుతారు. మరొక వైపున, ఎద్దు ఇంతకు ముందు ఎప్పుడూ జనము మీద పడుట మీరు చూడలేదు కాబట్టి, దానిని మీరు కట్టివేయకుండా ఉండి, ఒకదినమున అది విరుచుకుపడి మీ పొరుగువానిని హతముచేస్తే, దానికి మీరు బాధ్యులు కారు. నాకు ఎడ్లు లేవు; కాని నాకు కారు ఉంది. నా కారు బ్రేకులు సరిగా లేవు అని నాకు తెలిసి కూడా నేను దానిని బాగుచేయకుండా, ఒకనిని చంపితే, బైబిలు ఆలోచన ప్రకారం నేను హంతకుడను. కాబట్టి ఇక్కడ నియమము ఏమిటి? ఇక్కడ నియమము ఏమిటంటే జ్ఞానము బాధ్యత అయ్యున్నది. కాబట్టి, పౌర నియమాలలో, నేను ఒక నియమమును వెలికితీసి దానిని నా సొంత జీవితమునకు అనువర్తించుకోవాలి. మూడవ రకమైన నియమము ఆచారపరమైనది, మరియు ఇది సామాన్యముగా ఆరాధనలోని రకములకు అనువర్తించబడుతుంది, మరియు నిత్య సత్యమును బోధించుటకు దేవుడు వీటిని సూచక పాఠములుగా ఉపయోగించుకుంటాడు. కాబట్టి, ఉదాహరణకు, పందిని తినవద్దు, అది మిమ్మును అపవిత్రము చేస్తుంది అని ఆయన సెలవిచ్చాడు. సరే, పంది మనలను అపవిత్రులుగా చేయదు. యేసు దీనిని చాలా స్పష్టము చేశాడు. మీ నోటిలోనికి వెళ్లునది మిమ్మును అపవిత్రులనుగా చేయదు. మీ అపవిత్రమైన హృదయములో నుండి బయటకు వచ్చునది మిమ్మును అపవిత్రము చేస్తుంది. కాబట్టి, “మీరు పంది మాంసమును తింటారా లేదా?” అనునది ప్రశ్న కాదు. మీ అపవిత్రమైన హృదయములో పనిచేయునట్లి పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తుకు మీరు అనుమతి ఇచ్చారా? అనునది ప్రశ్న అయ్యున్నది. కాబట్టి, లేదు, నేను ఆచార సంబంధమైన నియమములకు విధేయుడను కాను. అవి సూచక పాఠమలైయున్నవి. ఒకసారి పాఠము నేర్చుకున్న తరువాత, ఆ వస్తువులతో మీకు ఇక ఎలాంటి నిమిత్తము లేదు.
— డా. జాన్ ఒస్వల్ట్
లేఖనములో కనిపించు ఆజ్ఞలను మీరు చూసినప్పుడు, అనేక కారణముల కొరకు ఇవ్వబడిన లెక్కలేనన్ని ఆజ్ఞలు ఉన్నాయని గ్రహించుట మీరు ఆరంభిస్తారు... అపొ. 15వ అధ్యాయములో కనిపించు యెరూషలేము సభను మీరు చూసినప్పుడు, “మోషే నిబంధనలోని ఆజ్ఞల విషయములో అన్యులు ఏమి చెయ్యాలి?” అను ప్రశ్న తలెత్తినప్పుడు ఇశ్రాయేలు దేశములోని సంఘ నాయకులు ఎంతో స్పష్టతను కనుపరచారు. “మేము స్వయంగా కూడా పాటించుటకు ఇబ్బందిపడు ఈ భారమును మేము వారి మీద మోపము, కాని వీటి నుండి దూరముగా ఉండండి...” అని చెబుతూ వారు కొన్ని వస్తువుల పట్టికను ఇచ్చారు — విగ్రహారాధన, జారత్వము, లేక విగ్రహములకు అర్పించిన మాంసమును తినుట, లేక రక్తమును త్రాగుట. ఇవన్నీ నైతికముగా దేవుడు మన యొద్ద నుండి ఆశించు విషయములను గూర్చి మనము కలిగియుండవలసిన నిశ్చయతకు సంబంధించినవి. కాబట్టి, లేఖనములో కూడా దేవుని ఆజ్ఞలు విభిన్నమైన రీతిలో ఉపయోగించబడుట మనము చూస్తాము, ఎందుకంటే ఇశ్రాయేలుతో నిబంధనలో ఒక రకమైన ఆజ్ఞను మీరు చూస్తారు, కాని నిబంధనలో ఉన్న ఆ ఆజ్ఞలన్నీ దేవుడు మన నుండి మరియు మన జీవితముల నుండి ఆశించుచున్న కేంద్ర నైతిక ఆకాంక్షకు చేరుకోలేరు. మరియు చివరిగా, రెండు ముఖ్యమైన ఆజ్ఞలు ఏవి అని యేసు స్వయంగా ప్రశ్నలను ఎదుర్కొన్నప్పుడు, యేసు కూడా ఇలా సెలవిచ్చాడు, మీరు సమస్తమును క్రోడీకరించాలనుకుంటే, అది “నీ పూర్ణ హృదయముతోను, మనస్సుతోను మరియు బలముతోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను, మరియు రెండవదిగా, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము” అనునవి.
— డా. స్టీవ్ బ్లేక్ మోర్
లేఖనము యొక్క వ్యక్తిగత అనువర్తనములో విభిన్నత బైబిలు బోధనలలోని భిన్నత్వమునకు ఎలా అనుబంధము కలిగియున్నదో చూశాము గనుక, అనువర్తనములో విభిన్నతలోనికి నడిపించు రెండవ విషయమును ఇప్పుడు చూద్దాము: పాలివారైయున్న పలువురు ప్రజలు మరియు పరిస్థితులు. మునుపటి పాఠములో మనము చూసిన విషయములను సమీక్షిస్తూ ఆరంభిద్దాము.
మీరు జ్ఞాపకము చేసుకొనునట్లు, లేఖనము ద్వారా మరియు సామాన్య ప్రత్యక్షత — అనగా ప్రజలు మరియు పరిస్థితులలో ఆయన తనను తాను మరియు తన చిత్తమును బయలుపరచుకొనుట — ద్వారా తన చిత్తమును బయలుపరచుట ద్వారా దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలను సాంస్కృతిక భిన్నత్వము వైపుకు నడిపించాడు. ఈ విధంగా, దేవుడు తన ప్రజల కొరకు కొంత సాంస్కృతిక భిన్నత్వమును నిర్ణయించాడు.
అనేక విధాలుగా, మన వ్యక్తిగత జీవితముల విషయములో కూడా ఇదే వాస్తవమైయున్నది. లేఖనములో ఉన్న అనేక విభిన్నమైన బోధనల ద్వారా దేవుడు తన చిత్తమును బయలుపరచుకుంటాడు, కాని ఈ బోధనలను మనకు మరియు ఇతరులకు అనువర్తించుటకు, విభిన్నమైన ప్రజలు మరియు పరిస్థితులలో దేవుని యొక్క సామాన్య ప్రత్యక్షతను మనము పరిగణలోనికి తీసుకోవాలి.
యేసు యొక్క బోధనల క్రమములోనికి తిరిగివెళ్లుట ద్వారా ప్రజలు మరియు పరిస్థితులలో భిన్నత్వములు వ్యక్తిగత అనువర్తనమును ప్రభావితము చేయు విధానమును మనము చూడవచ్చు. సులభతరముగా ఉండుటకు, మన నాలుగు రకముల బోధలను మనము “పైన ఉన్న” లేక మరింత సామాన్యమైన బైబిలు బోధనలుగాను, మరియు “క్రింద ఉన్న” లేక మరింత విశేషమైన బైబిలు బోధనలుగా విభాగిద్దాము. పైన ఉన్న బైబిలు బోధనలతో ఆరంభిద్దాము.
బైబిలులోని పైన ఉన్న బోధనలలో సార్వత్రిక నియమములు మరియు సామాన్య మార్గదర్శకములు భాగమైయున్నవి. ఇంతకు ముందు మనము చూసినట్లు, ఇట్టి బోధనలు మిగిలిన వాటి కంటే ప్రధానమైనవిగా ఉంటాయి ఎందుకంటే ఇవి విశాలమైన ధోరణిలో అనువర్తించబడతాయి. అయినను, దేవుని యొక్క సామాన్య ప్రత్యక్షత వెలుగులో వీటిని విభిన్నమైన రీతులలో మనము అనువర్తించాలి.
ఒక వైపున, పైన ఉన్న బైబిలు నియమములను అనువర్తించుటకు, దానిలో భాగమైన వ్యక్తి యొక్క గుణములను మనము విశ్లేషించాలి. వ్యక్తి యొక్క ఆత్మీయ స్థితి, సామాజిక స్థితి, సామర్థ్యత, వయస్సు మరియు లింగము వంటి వాటిని మనము పరిగణలోనికి తీసుకోవాలి. ఇవి మరియు ఇతర గుణములను తెలుసుకొనుట లేఖనములోని పైన ఉన్న నియమములు సదరు వ్యక్తి యొక్క భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములను ప్రభావితము చేయవలసిన విధానములను వివేచించుటలో మనకు సహాయపడతాయి.
నేను ఒక గదిలోనికి ప్రవేశించి అక్కడ కూర్చొనియున్న ఒక స్నేహితుల గుంపుతో ఈ ప్రశ్నలను అడిగానని ఊహించండి. మొదటిగా, “మనమంతా సరియైన పనిని చేయాలని మీరు నమ్ముచున్నారా?” సరే, వాళ్లంతా స్వభావికముగానే “అవును” అని జవాబిస్తారు. అయితే తరువాత నేను మరొక ప్రశ్నను అడుగుతాను, “సరే అయితే, ఈ గదిని విడచివెళ్లిన తరువాత మీలో ప్రతి ఒక్కడు ఏమి చేయబోవుచున్నాడు?” ఇప్పుడు, ప్రతి వ్యక్తి సరియైన పనినే చేస్తాడుగాని, విభిన్నమైన రీతులలో చేస్తాడు అని కనుగొనుట ద్వారా మనము ఆశ్చర్యపోతాము. “నేను ఇంటికి వెళ్లి నా పిల్లలను చూసుకుంటాను” అని ఒక వ్యక్తి చెప్పవచ్చు. లేక, “నేను కొంత ఆహారమును కొనుటకు బజారుకు వెళ్తాను” అని మరియొకరు చెబుతారు. వాస్తవానికి, వారంతా సరియైన పనిని ఒకే రేతిలో చేయుటకు ప్రణాళిక వేస్తే మనము అవాక్కవ్వవలసియుంటుంది. మరియు ఇది ఎందుకో అర్థము చేసుకొనుట అంత కష్టమైన పని ఏమి కాదు. “సరియైన పనిని చెయ్యండి” వంటి సామాన్య సూచనలు పలువురు ప్రజలకు మరియు పరిస్థితులకు విభిన్నమైన రీతులలో అనువర్తించబడతాయి.
లేవీయకాండము 19:18లో “నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను” అను సార్వత్రిక నియమము ప్రతి పరిస్థితిలో ప్రతి వ్యక్తికి అనువర్తించబడు హెచ్చరిక అయ్యున్నది అని మనము ఇంతకుముందే గుర్తించాము. అయితే తన ప్రజలందరు ఖచ్చితముగా ఒకే విధముగా ఈ ఆజ్ఞను పాటించాలని దేవుడు ఆశించలేదు అని మనకు తెలుసు. ఒక ఎదిగిన వ్యక్తి ప్రేమను ఒక విధముగా చూపితే, ఒక యౌవ్వన బిడ్డ తన ప్రేమను మరొక విధముగా చూపుతాడు. ఒక ధనవంతుడు మరియు పేద వ్యక్తి ఇతరుల పట్ల ప్రేమను విభిన్నమైన రీతులలో వ్యక్తపరచవచ్చు. ప్రతి వ్యక్తి యొక్క సామర్థ్యతలు, బలహీనతలు, అనుభవాలు, ఆత్మీయ స్థితి మొదలగు విషయములు పొరుగువాని పట్ల ప్రేమ అను సార్వత్రిక నియమము అనువర్తించబడవలసిన విధానము మీద ప్రభావముచూపుతాయి.
మరొక వైపున, “నీ పొరుగువానిని ప్రేమించుము” అను నియమము విభిన్నమైన పరిస్థితులలో విభిన్నమైన రీతులలో అనువర్తించబడుతుంది. ఒకే వ్యక్తి అతని లేక ఆమె పొరుగువానిని పలు సమయములలో పలు విధములుగా ప్రేమించవచ్చు. ప్రతి వ్యక్తి విభిన్నమైన ఆటంకములను, సవాళ్లను మరియు అవకాశములను ఎదుర్కొంటాడు. మరియు ఇతర పరిస్థితులలో ప్రజలకు అనుగుణంగా లేని విధముగా బైబిలు నియమములను అనువర్తించు విధముగా ఈ పరిస్థితులు మనలను పురికొల్పవచ్చు. ఉదాహరణకు, పొరుగువాని కొరకు ప్రేమ యుద్ధము మరియు సమాధాన కాలములలో, కలిమి మరియు లేమి కాలములలో, రోగము మరియు ఆరోగ్యము కాలములలో భిన్నమైన రీతులలో ఉండవచ్చు. మన పరిస్థితులకు అనుగుణంగా లేఖనములోని పైన ఉన్న నియమములు అనేక విధములుగా అనువర్తించబడాలి.
ప్రజలు మరియు పరిస్థితులలో భిన్నత్వములు పైన ఉన్న బైబిలు బోధనలను విభిన్నమైన రీతులలో అనువర్తించునట్లు మనలను కోరు విధానములను చూశాము కాబట్టి, ఇప్పుడు లేఖనములో యేసు ఇచ్చిన బోధనల క్రమములో క్రింద ఉన్న విషయములను మనము చూద్దాము.
మన ఉద్దేశ్యముల కొరకు, “క్రింద ఉన్న” బోధనలలో మనకు మరియు ఇతరులకు లేఖనమును అనువర్తించుటకు ఉపయోగపడు బైబిలులో విశేషమైన, వివరణలతో కూడిన బోధనలు మరియు స్పష్టమైన చారిత్రిక ఉదాహరణలు ఉన్నాయి. పైన ఉన్న బోధనల వలెనే, క్రింద ఉన్న బోధనలు ప్రజలు మరియు పరిస్థితుల యొక్క భిన్నత్వము ఆధారంగా విభిన్నమైన రీతులలో అనువర్తించబడతాయి.
ఉదాహరణకు, “మీ కుటుంబము కొరకు ఒక సురక్షితమైన ఇల్లును కట్టుము” అను ఒక సామాన్య సూచనను గూర్చి ఆలోచించండి. చలి వాతావరణములో నివసించు వ్యక్తి వేడి వాతారణములో నివసించు వ్యక్తి కంటే భిన్నమైన ఇంటిని నిర్మిస్తాడు. తుఫానులు తరచుగా వచ్చు ప్రాంతములోని ఇంటికి భూకంపములు ఎక్కువగా కలుగు ప్రాంతములలోని ఇంటికి మధ్య నిర్మాణాత్మక భిన్నత్వములు ఉంటాయి. ఇక్కడ పైన ఉన్న నియమము ఏమిటంటే ఒక వ్యక్తి తన కుటుంబమును సురక్షితముగా ఉంచుట. ఈ పైన ఉన్న నియమమును నెరవేర్చునట్లు ఇంటిని కట్టుట విశేషమైన సూచన అయ్యున్నది. మరియు ఇంటిని కట్టు ప్రతి వ్యక్తి పోలికగల పరిస్థితులలో పోలికగల ఇండ్ల ఉదాహరణ నుండి సహాయమును పొందుతాడు. అయితే ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒక విశేషమైన సూచనను ఖచ్చితముగా ఒకే విధముగా పాటించరు.
ఒక విశేషమైన బైబిలు బోధనను నేడు ఒక వ్యక్తి యొక్క జీవితమునకు మనము అనువర్తించిన ప్రతిసారి ఇలాంటిదే జరుగుతుంది. మొదటిగా, మనము పైన ఉన్న బోధనలను, మరియు పరిగణలో ఉన్న బోధన వైపుకు మనలను నిర్దేశించు దగ్గర సంబంధము గల విశేషమైన సూచనలను పరిగణలోనికి తీసుకుంటాము. రెండవదిగా, ఒక విశేషమైన సూచన ద్వార వాస్తవముగా ప్రభావితమైన ప్రజలను మరియు పరిస్థితులను మనము గుర్తిస్తాము. మరియు మూడవదిగా, దానిని మన జీవితములకు ఏ విధముగా అనువర్తించుకోవాలో వివేచించుటకు మనము మన వ్యక్తిగత జీవితములను ఒక విశేషమైన బోధన యొక్క వాస్తవిక శ్రోతలతో పోల్చుతాము.
బైబిలు యొక్క విశేషమైన గుణములలో ఒకటి ఏమిటంటే, అది విశేషమైన కాలములలో విశేషమైన స్థలములలో నివసించిన విశేషమైన ప్రజల కొరకు వ్రాయబడినది. ఇలా వ్రాయబడిన ఏకైక పవిత్ర గ్రంథము ఇదే. లోకములోని ఇతర పవిత్ర గ్రంథములు అన్ని ప్రజలు ఏమి చేయాలి లేక ఏమి చేయకూడదు అను విషయములను గూర్చి కొన్ని సలహాలు, కథనములను మాత్రమే ఇస్తాయి. అయితే దేవుడు తన మంచితనములో మనకు నేపథ్యమును అనుగ్రహించాడు. జీవితములో ఇట్టి విషయములు ఏవిధంగా జరుగుతాయో అర్థము చేసుకొనుటకు ఆయన ఒక మార్గమును మనకు అందించాడు. అనగా మనము ఎల్లప్పుడూ ఇలా చెప్పాలని దీని అర్థము, “ఈ నేపథ్య పరిస్థితిలో ఏ నియమము బోధించబడుతుంది? మరియు నా క్రొత్త నేపథ్య పరిస్థితిలో ఆ నియమము ఏవిధముగా అనువర్తించబడుతుంది?”
— డా. జాన్ ఒస్వల్ట్
మన మనస్సులో ఉన్న విషయమును ఉదాహరించుటకు, నిర్గమ. 21:23-25ను నేటి వ్యక్తులకు అనువర్తించవలసిన విధానమును మనము పరిగణిద్దాము. ఇశ్రాయేలులోని న్యాయాధిపతులు తమ తీర్పులను ఈ విధముగా ఇవ్వవలసియుండెను అని ఈ వచనములలో మనము చదువుతాము:
హాని కలిగినయెడల నీవు ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను (నిర్గమ. 21:23-25).
ఇప్పుడు మత్తయి 5:38-39ని వినండి, అక్కడ యేసు కొండ మీద ప్రసంగములో ఈ నియమమును తమ వ్యక్తిగత జీవితములకు అనువర్తించుకొనమని తన అనుచరులకు బోధించాడు.
కంటికి కన్ను, పంటికి పల్లు అని చెప్పబడిన మాట మీరు విన్నారు గదా. నేను మీతో చెప్పునదేమనగా దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంపమీద కొట్టువాని వైపునకు ఎడమచెంపకూడ త్రిప్పుము (మత్తయి 5:38-39).
న్యాయాధిపతుల కొరకు మరియు న్యాయ వ్యవస్థల కొరకు పాత నిబంధన బోధనకు యేసు అసమ్మతి తెలుపలేదు అను విషయమును గ్రహించుట చాలా అవసరమైయున్నది. మనందరి వలె, దేవుని కొరకు మరియు పొరుగువాని కొరకు ప్రేమ అనునది న్యాయాలయములో న్యాయమైన తీర్పునకు కారణమవ్వాలని యేసుకు తెలుసు. అయితే పరిసయ్యులు న్యాయాధిపతుల కొరకు ఇవ్వబడిన ఈ నియమమును వ్యక్తిగత సంభాషణలలో ప్రతీకారము తీర్చుకొనుటకు సమర్థనగా ఉపయోగించుట యేసు ఎదుర్కొనిన ప్రశ్న అయ్యున్నది. అయితే ఈ నియమమును లేఖనములోని పైన ఉన్న నియమములతో మరియు “క్రింద ఉన్న” ఇతర బోధనలతో మనము పోల్చినప్పుడు, యేసు ఇక్కడ తన శిష్యులకు ఏమి బోధించాడో మనము అర్థము చేసుకోగలము. ప్రభావవంతముగా, తన అనుచరులు తమను తాము నిర్గమ. 21 యొక్క వాస్తవిక శ్రోతలతో పోల్చుకోవాలని యేసు పిలుపునిచ్చాడు. ప్రతి వ్యక్తి న్యాయ వ్యవస్థలలో న్యాయము మరియు సరియైన తీర్పును సమర్థించాలి. మరియు ఒక న్యాయాధిపతిని ప్రతిబింబించు బాధ్యతలను మనమంతా కలిగియున్నప్పుడు, నిర్గమ. 21ని ఒక న్యాయాలయములోని న్యాయాధిపతి వలె మనము అనువర్తించాలి. అయితే మన వ్యక్తిగత అనుబంధములలో మనము ఏనాడు న్యాయాధిపతుల వలె వ్యవహరించకూడదు. మన సాధారణ, వ్యక్తిగత పాలుపంపులు న్యాయము ద్వార మాత్రమే శాసించబడకూడదుగాని, వీలైనంత వరకు కరుణ మరియు కనికరముతో ఉండాలి.
మరొక ఉదాహరణగా, మత్తయి 19:21లో ధనికుడైన యౌవ్వన అధికారికి యేసు ఈ హెచ్చరికను ఇచ్చాడు:
పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును (మత్తయి 19:21).
ధనికుడైన యౌవ్వన అధికారి తన ధనమును ప్రేమించి పైన ఉన్న నియమములైన దేవుని మరియు పొరుగువానిని ప్రేమించుటను ఉల్లంఘించాడు కాబట్టి యేసు ఈ క్రింద ఉన్న హెచ్చరికను ఇచ్చాడు అని ఈ వచనము యొక్క నేపథ్యము స్పష్టము చేస్తుంది. మరియు ధనాశను అతడు తన ఉన్నతమైన ప్రాధాన్యత చేసుకున్నాడు.
ఆధునిక లోకములో ఉన్న ప్రతి ధనికుడు తన ఆస్తులను అమ్మి బీదలకు ఇవ్వాలని ఈ వాక్యభాగము చెబుతుందా అని చాలాసార్లు ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. అయితే వ్యక్తిగత ఆస్తి మరియు ఐశ్వర్యము విషయములో మనము లేఖనములోని పైన ఉన్న నియమములను పరిగణలోనికి తీసుకోవాలి. మరియు ఈ క్రింద ఉన్న, మరింత విశేషమైన బోధనను మనము ఆస్తులను గూర్చి యేసు మరియు క్రొత్త నిబంధన రచయితలు బోధించిన ఇతర బోధనలతో పోల్చాలి. కాబట్టి, ధనికులు తమ డబ్బుతో ఏమి చెయ్యాలి అను విషయమును మనము ఎలా నిర్ణయిస్తాము? వ్యక్తులను మరియు వారి నేటి పరిస్థితులను ధనికుడైన యౌవ్వన అధికారితో పోల్చుట ద్వారా దీని జవాబును మనము పొందుతాము. మనము అతనిని ఎంత ఎక్కువగా పోలియుంటే, అంత ఎక్కువగా మన ఆధునిక అనువర్తన తన దినమున అతడు చేయవలసియుండిన పనిని పోలియుంటుంది.
వ్యక్తుల కొరకు ఆధునిక అనువర్తనమును గూర్చిన ఈ పాఠములో ఇప్పటి వరకు, ఎంతో కొంత వరకు, వ్యక్తిగత అనువర్తనలో విభిన్నత ఉండుట వలన ఆధునిక ప్రజలు లేఖనములను విభిన్నమైన రీతులలో అనువర్తించవలసిన విధానమును మనము చూశాము. ఇది మనలను మన రెండవ అంశములోనికి నడిపిస్తుంది: అనువర్తనములో జ్ఞానము యొక్క అవసరత.
లోకములో చాలా చోట్ల, క్రైస్తవులు తమకు నచ్చినప్పుడు బైబిలును తీసుకొని చదవవచ్చు. ఇది ఎంత అద్భుతమైన విషయమైనను, మనలో చాలామందిమి లేఖనములను మన వ్యక్తిగత జీవితములకు ఎంతో ఎంపిక చేసుకొనుచు అనువర్తించుకొను విధముగా ఇది మనలను పురికొల్పాయి. లేఖనమంతా దేవుని ద్వారా ప్రేరేపించబడింది అని సైద్ధాంతికముగా మనము ఉద్ఘాటిస్తాము. అయితే పలు సందర్భములలో పలువురు ప్రజల కొరకు బైబిలులోని అనేక బోధనలతో వ్యవహరించుటకు బదులుగా, మనము వ్యక్తిగతముగా లేఖనములను చదువుతూ మన జీవితములకు సులువుగా అనువర్తించబడు విధానముల కొరకు వెదకుచుంటాము. ఈ ప్రచిలితమైన ఆచారము అర్థము చేసుకొనదగినదే ఎందుకంటే చాలాసార్లు బైబిలు చాలా సంక్లిష్టమైనదిగా ఉన్నది. అయితే వాస్తవానికి, ఈ విధంగా ఉపయోగించుట కొరకు బైబిలు వ్రాయబడలేదు. బదులుగా, తన ప్రజలు ఒకరితో ఒకరు పాలుపంచుకొనుచుండగా లేఖనములు చదవబడాలని దేవుడు ఉద్దేశించాడు. ఇతరుల సహాయముతో, బైబిలులోని కఠినమైన భాగములను కూడా మన జీవితములకు అనువర్తించుకొనవలసిన విధానములను గూర్చి మనము జ్ఞానమును సంపాదించుకొనవచ్చు.
మనము చూడబోవుచున్నట్లు, లేఖనము యొక్క అనువర్తనములోనికి పరిశుద్ధాత్మ మనకు అసాధారణమైన మెళకువలను అందించుచున్నప్పటికీ, సాధారణముగా ఇతరులతో పాలుపంచుకొనుట ద్వారా మనము జ్ఞానమును సంపాదించుకోవాలని దేవుడు స్పష్టముగా నిర్ణయించాడు.
ప్రాచీన ఇశ్రాయేలీయులకు మరియు ఆదిమ సంఘమునకు ముద్రణా యంత్రములు లేవు, ప్రచురణకర్తలు లేరు, నేటి వలె లేఖనమును విరివిగా పంచిపెట్టుటకు సాధనములు లేవు. మరియు లేఖనములు ఎక్కువమంది ప్రజల చెంతకు చేరియుండినప్పటికీ, వారు వాటిని చదివియుండేవారు కాదు. కాబట్టి, సమాజములో ఒకరితో ఒకరు సంభాషించుట ద్వారా ప్రజలు లేఖనములను అనువర్తించు విధానములను నేర్చుకోవాలని దేవుడు ఆశించాడు.
ఇతరులతో సంభాషించుట ద్వారా వ్యక్తిగత అనువర్తనములోని జ్ఞానము అభివృద్ధి చెందు రెండు విధానములను మనము విశదీకరిద్దాము. మొదటిగా, లేఖనము యొక్క ప్రాధమిక శ్రోతలుగా దేవుడు నియమించిన నాయకుల యొక్క కీలకమైన పాత్రను మనము చూద్దాము. రెండవదిగా, దేవుని ప్రజల మధ్య లేఖనమును వ్యాపింపజేయుటలో సమాజము యొక్క అవసరతను విశదీకరిద్దాము. వ్యక్తిగత అనువర్తనములో నాయకుల యొక్క కీలకమైన పాత్రను ముందుగా చూద్దాము.
బైబిలు వ్యక్తిగత విశ్వాసుల కొరకు రూపొందించబడిన ఒక గ్రంథము అని ఇవాంజెలికల్ క్రైస్తవులు అనుకొనునప్పటికీ, బైబిలు రచయితలు ఒక విభిన్నమైన దృష్టికోణముతో వ్రాశారు అని అనేక సూచకములు తెలియజేయుచున్నాయి. ఇశ్రాయేలులో ఉన్న మరియు ఆదిమ సంఘములో ఉన్న ప్రజలందరికీ సూటిగా వ్రాయుటకు బదులుగా, లేఖన రచయితలు ముందుగా లేఖన బోధనలను వివరించి, విడమరచి చెప్పుటకు నియమించబడిన దేవుని ప్రజల నాయకులకు వ్రాశారు.
బైబిలు ప్రధానముగా పాత నిబంధనలోని నాయకులకు వ్రాయబడిన విధానమును ముందు చూద్దాము మరియు తరువాత క్రొత్త నిబంధనలో ఇది జరిగిన విధానమును చూద్దాము. పాత నిబంధనతో మొదలుపెడదాము.
పాత నిబంధనలో, యాజకులు, లేవీయులు, ప్రవక్తలు, సాధువులు, న్యాయాధిపతులు, రాజులు, మరియు ఇతర అధికారులు మాత్రమే ప్రధానముగా లేఖనములను చదవగలిగేవారు మరియు అధ్యయనం చేయగలిగేవారు. ఇందు వలన, పాత నిబంధన రచయితలు ప్రాధమికముగా ఇశ్రాయేలు యొక్క నాయకులను ఉద్దేశించి వ్రాశారు. దీనికి రుజువును మనము కనీసం మూడు మార్గములలో చూడవచ్చు.
మొదటిగా, ఇశ్రాయేలు నాయకులు పాత నిబంధనలోని గ్రంథముల యోకాక్ ప్రాధమిక గ్రహీతలు అని చూపుటకు అనేక స్పష్టమైన సూచనలు ఉన్నాయి.
కొన్ని ఉదాహరణలుగా, మోషే ధర్మశాస్త్రము లేవీయ యాజకుల ఆధీనములో అమలుచేయబడేది అని ద్వితీ. 31:9 మరియు 2 రాజులు 22:8-10 వంటి వాక్యభాగములు సూచిస్తాయి. మరియు నిర్గమ. 21:1-23:9లోని నిబంధనా గ్రంథములో ఉన్న అనేక బోధనలు “తీర్పులు” హెబ్రీ భాషలో — మిష్పటిం — అని పిలువబడేవి, ఎందుకంటే న్యాయాధిపతులు తమ న్యాయస్థానములలో ఉపయోగించుటకు సందర్భ నియమములుగా అవి వ్రాయబడినవి. మరియు సామెతలు 1:1 మరియు 25:1 వంటి వాక్యభాగములలో, సామెతలు యూదా రాజ న్యాయస్థానములలో ఉన్నతమైన జ్ఞానులు మరియు రాజ కుటుంబీకులు ఉపయోగించుటకు ఇవ్వబడినవి అని పరిచయ పలుకులుగా ఇవ్వబడిన మాటలు తెలియజేస్తాయి. పాత నిబంధన గ్రంథములు మొదటిగా ఇశ్రాయేలు యొక్క నాయకులను దృష్టిలో ఉంచుకొని వ్రాయబడినవి అని ఇవి మరియు అనేక ఇతర సందర్భములు సూచిస్తాయి.
రెండవదిగా, పాత నిబంధన గ్రంథములు ప్రాధమికముగా ఇశ్రాయేలు నాయకుల కొరకు వ్రాయబడినవని వాటిలోని విషయములు తెలియజేస్తాయి.
అనేక పాత నిబంధన గ్రంథములు ఎక్కువమంది ఇశ్రాయేలీయుల అనుదిన జీవితముల కొరకు సూటైన ఔచిత్యములేని అంశముల మీద ఎక్కువ సమయమును గడుపుతాయి. ఉదాహరణకు, 1 రాజులు 6లో దేవాలయ నిర్మాణమును గూర్చి ఇవ్వబడిన సుదీర్ఘమైన సూచనలు ఒక సాధారణ ఇశ్రాయేలు కాపరి, రైతు లేక కళాకారుని జీవితమునకు పరోక్షముగానే వర్తించబడతాయి. అదే విధముగా, ధనమును, ఆహ్లాదమును, ఖ్యాతిని మొదలగువాటిని అన్వేషించుటలోని వ్యర్థతను గూర్చి ప్రసంగి గ్రంథములో ఉన్న విషయములు అనేకమంది ఇశ్రాయేలీయ స్త్రీ పురుషులు ఎదుర్కొను సవాళ్లకు అంతగా వర్తించునవిగా లేవు. ఇశ్రాయేలులోని ప్రతి వ్యక్తి ఎదుర్కొనుచున్న అవసరతలు మరియు సవాళ్లతో సూటిగా మాట్లాడు సూచనలను ఇచ్చుటకు బదులుగా, పాత నిబంధన గ్రంథములలోని అనేక విషయములు ఇశ్రాయేలు నాయకులు ఎదుర్కొనుచుండిన అవసరతలు మరియు సవాళ్లను గూర్చి మరింత సూటిగా మాట్లాడతాయి.
మూడవదిగా, పాత నిబంధన గ్రంథములు ప్రధానముగా వరములను పొంది, అనుభవముగల జ్ఞానులైన నాయకుల కొరకు రూపొందించబడినవి అని వాటిలోని సంక్లిష్టతలు బయలుపరుస్తాయి.
స్పష్టముగా, పాత నిబంధనలోని అనేక భాగములు పిల్లలు అర్థము చేసుకొనుటకు కూడా సులభమైనవిగా ఉన్నవి. అయితే అనేక పాత నిబంధన గ్రంథములలోని సంక్లిష్టతలు అత్యంత నైపుణ్యత గల పాఠకులను కూడా సవాలు చేస్తాయని పాత నిబంధనతో సుపరిచితులైనవారు యెరిగియున్నారు. ఒక ఉదాహరణగా, యెషయా మరియు యిర్మీయా వంటి ప్రవచన గ్ర్రంథములు ఎంత అల్లికతో నిర్మించబడినవి అంటే ఒక సగటు ఇశ్రాయేలీయునికి అవి అయోమయమును కలిగించియుంటాయి. మొత్తము మీద, ఇశ్రాయేలులో ఉన్న ప్రతి వ్యక్తికి ప్రత్యక్షముగా బోధించుటకు పాత నిబంధన గ్రంథములు వ్రాయబడలేదుగాని, దేశములోని నాయకులను హెచ్చరించుటకు ప్రధానముగా వ్రాయబడినవి అని స్పష్టమవుతుంది.
అనేక విధములుగా, ఇశ్రాయేలులోని నాయకులు పాత నిబంధన రచయితల యొక్క మొదటి శ్రోతలు అయ్యున్న విధముగానే, క్రొత్త నిబంధన రచయితలు కూడా తమ గ్రంథములను అపొస్తలులు, ప్రవక్తలు, సువర్తికులు, కాపరులు, బోధకులు, పెద్దలు, పరిచారకులు మరియు ఇతర ప్రాముఖ్యమైన వ్యక్తుల వంటి సంఘ నాయకుల కొరకు రూపొందించారు.
మొదటిగా, సంఘ నాయకులు తమ ప్రాధమిక గ్రహీతలు అని క్రొత్త నిబంధన గ్రంథములు కొన్ని స్పష్టముగా తెలియజేస్తాయి.
ఉదాహరణకు, 1 మరియు 2 తిమోతి పత్రికలు పౌలు యొక్క “విశ్వాస కుమారుడైన” తిమోతికి వ్రాయబడినవి. మరియు తీతు పత్రిక పౌలు క్రింద తర్ఫీదు పొందిన తీతుకు వ్రాయబడినది. వీరిరువురు ఆదిమ సంఘములో ప్రఖ్యాతిగాంచిన నాయకులైయ్యారు.
పౌలు వ్రాసిన పత్రికలలో మూడు పత్రికలను కాపరి పత్రికలు అని పిలుస్తారు, ఎందుకంటే అవి మొదటి శతాబ్దములో కాపరులైన తిమోతికి మరియు తీతుకు వ్రాయబడినవి. కాబట్టి, 1 తిమోతి, 2 తిమోతి, మరియు తరువాత తీతు పత్రిక... ఒకవేళ పౌలు ఎఫెసు నుండి దూరముగా ఉంటే, ఎఫేసులోని సంఘమును చూచుకొనుటకు నియమించబడిన వ్యక్తిని గూర్చి అతడు చాలా చింతించాడు. అతడు ఎవరు? యౌవ్వనుడైన తిమోతి. కాబట్టి అతనిని ప్రోత్సహించుటకు, ఈ ముఖ్యమైన పని చేయునట్లు అతనిని బలపరచుటకు అతడు 1 తిమోతి వ్రాయుచున్నాడు. మరియు అతడు తీతుకు కూడా వ్రాస్తున్నాడు, అతడు కూడా పౌలుకు “రెండవ స్థానములోని శిష్యుడు” మరియు కొన్ని విధాలుగా అతడు తిమోతి కంటే కూడా ఆధారయోగ్యమైన స్వభావము కలిగియున్నాడు, కొంచెం బలవంతునిగా ఉన్నాడు, కాని తన పని కొరకు అతనికి కూడా ప్రోత్సాహము అవసరమైయున్నది, మరియు క్రేతు ద్వీపమందు ఉన్న క్రైస్తవ విశ్వాసుల సమస్యలను పరిష్కరించుట ఆ సమయమందు అతనికి ఇయ్యబడియుండిన పని అయ్యున్నది. కాబట్టి, అతడు తీతుకు వ్రాస్తున్నాడు. కాబట్టి ఈ రెండు పత్రికలను పౌలు తన ప్రయాణములలో తనకు ఇద్దరు కీలకమైన మద్దతుదారులైన తిమోతి మరియు తీతుకు, తాను ఇల్లూరికులో నుండి గ్రీసునకు ప్రయాణించుచుండగా వ్రాస్తున్నాడు.
— డా. పీటర్ వాకర్
రెండవదిగా, క్రొత్త నిబంధన గ్రంథములలోని విషయములు కూడా సంఘ నాయకులను మొదటి శ్రోతలుగా సూచించుచున్నాయి.
క్రొత్త నిబంధన గ్రంథములను మనము వాటి యొక్క చారిత్రిక నేపథ్యములలో పరిగణించినప్పుడు, అవి మొదటి శతాబ్దపు విశ్వాసులకు సుపరిచితముకాని విషయముల మీద దృష్టిపెట్టుచున్నవి అని చూచుట అంత కష్టమనిపించదు. ఒక ఉదాహరణగా, అనేక క్రొత్త నిబంధన గ్రంథములు ప్రధానముగా అన్య సంఘములకు, పాత నిబంధనను గూర్చి చాలా తక్కువ జ్ఞానము ఉన్న ప్రజలకు వ్రాయబడినవి. అయినను, క్రొత్త నిబంధన రచయితలు పాత నిబంధన వాక్యభాగములను కొన్ని వందలసార్లు తగిన వివరణలేకుండా ఉపయోగించారు. అనేక మంది ఆదిమ క్రైస్తవులకు తెలియని ఇవి మరియు ఇతర బోధనలను జ్ఞానముగల నాయకులు అర్థము చేసుకోగలరని క్రొత్త నిబంధన రచయితలు ఆలోచించియుండవచ్చు.
మూడవదిగా, క్రొత్త నిబంధన బోధనలలో సంక్లిష్టతలు వాటి యొక్క ప్రాధమిక శ్రోతలు విద్యావంతులైన జ్ఞానముగల నాయకులు అని సూచిస్తాయి.
క్రొత్త నిబంధనలోని ఎక్కువ భాగమును సులువుగా అర్థము చేసుకొనవచ్చుగాని, అనేక భాగములు ఆదిమ క్రైస్తవులు అర్థము చేసుకొనుటకు చాలా కష్టమైనవిగా ఉన్నాయి. అపొస్తలుడైన పేతురు కూడా 2 పేతురు 3:16లో ఈ సుపరిచితమైన మాటలను వ్రాశాడు, “అయితే [పౌలు పత్రికలలో] కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి.” మరలా మరలా, క్రొత్త నిబంధన రచయితలు ఎంత వేదాంతపరమైన సంక్లిష్టతతో వ్రాశారు అంటే, వారి పత్రికలు అత్యంత సాధారణమైన విశ్వాసులకు అర్థము కాకుండా ఉండేవి. ఈ కారణం చేత, తామంతట తాము ఈ లేఖనములను చదివి అర్థము చేసుకోలేనివారికి వాటిని బోధించుటకు మరియు వివరించుటకు సంఘములో వరములు పొందిన నాయకులకు బాధ్యత అప్పగించబడింది.
దేవుని ప్రజల నాయకులు బైబిలు గ్రంథముల యొక్క ప్రాధమిక గ్రహీతలైయున్నారు అని తెలుసుకొనుట ఆధునిక క్రైస్తవుల కొరకు అనేక అంతర్భావములను ఇస్తుంది. వ్యక్తిగత విశ్వాసులు తమ నాయకుల మీద బహుగా ఆధారపడినప్పుడు లేఖనములు దుర్వినియోగం చేయబడుటను గూర్చి సంఘ చరిత్ర తెలియజేస్తుంది. అయితే మనము మరొక తీవ్రతకు వెళ్లి మనకు క్రైస్తవ నాయకులు అవసరము లేదు అని అనుకోకూడదు.
బైబిలు దినములలో లేఖనములలోని తెలియని విషయములను మరియు సంక్లిష్టతలను తెలియపరచుటకు దేవుడు నాయకులను నియమించిన విధముగానే, ఆధునిక క్రీస్తు అనుచరులకు కూడా అనుభవముగల, పరిశుద్ధాత్మ ద్వారా జ్ఞానము మరియు వివేకమును పొందిన నాయకులు అనేక కారణముల వలన అవసరమైయున్నారు.
వాస్తవానికి, మన చేతులలో ఉన్న బైబిలు — మనలో కొంతమందిమి చదివిన హెబ్రీ, అరమాయిక్ మరియు గ్రీకు వాక్యభాగాములతో సహా — కూడా గొప్ప పండితుల ద్వారా, ప్రాచీన వాక్యభాగముల యొక్క సాహిత్య విమర్శ, సేకరణ, సంకలనం మరియు ప్రచురణ చేయుటలో నైపుణ్యత పొందిన నాయకుల ద్వారా మనకు అందాయి. దీని కంటే ఎక్కువగా, నేడు అనేకమంది క్రైస్తవులు ఉపయోగించు లేఖనము యొక్క ఆధునిక అనువాదములు ప్రాచీన హెబ్రీ, అరమాయిక్ మరియు గ్రీకు భాషలలో మరియు అనువాద కళలో నిపుణులైనవారు చేసిన కృషి వలన అందాయి.
లేఖనము యొక్క వ్యక్తిగత అధ్యయనము అనేక మార్గములలో విలువైనది అయినప్పటికీ, నేటి మన జీవితములకు లేఖనములను అనువర్తించుకొనుటకు ప్రయత్నించుచుండగా నమ్మకమైన నాయకులను మరియు పరిశుద్ధాత్మ వారికి అనుగ్రహించిన వరములను కనుగొనుటకు ప్రత్యామ్నాయం మరొకటి లేదు.
నాయకులు సమస్త విషయములలో మాదిరిని చూపాలి: ప్రేమయందు, నీతియందు, ప్రార్థనయందు, మరియు అవును బోధన మరియు సిద్ధాంతముయందు. అతడు ఎదుగుదలలో మాదిరిగా ఉండాలి... ఈ కారణం చేత, అపొస్తలుడైన పౌలు తిమోతి మీద దృష్టిపెట్టి అతడు యౌవ్వనుడు కాబట్టి ఎవరు అతనిని ఆసరాగా తీసుకొనకుండా జాగ్రత్తపడమని అతనికి సలహా ఇచ్చాడు. అవును ఇతరులకు మాదిరిగా ఉండమని అతడు అతనికి చెప్పాడు. ఒక నాయకుని జీవితములో ఇది చాలా ప్రాముఖ్యమైనది.
— రెవ. యుస్సఫ్ ఔరహ్మానె, అనువాదం
హెబ్రీ. 13:17లో ఉన్న ఉపదేశమును మనము హృదయపూర్వకముగా స్వీకరించాలి:
మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి (హెబ్రీ. 13:17).
అనువర్తనములో జ్ఞానమును అభివృద్ధి చేసుకొనుటలో దేవుడు నియమించిన నాయకులతో పాలుపంచుకొనుట భాగమైయున్నది అని చూశాము కాబట్టి, ఇప్పుడు మన రెండవ విషయమును చూద్దాము: బైబిలు బోధన యొక్క వ్యాప్తి మరియు అనువర్తనములో సమాజము యొక్క అవసరత.
ఇశ్రాయేలులో మరియు ఆదిమ సంఘములో సాధారణ వ్యక్తులకు లేఖనములు అందుబాటులో ఉండేవి కాదు. కాబట్టి, వారు తమ జీవితములకు లేఖనములను ఏవిధంగా అనువర్తించుకోగలిగారు? క్లుప్తంగా, నాయకులు లేఖనములను వ్యాప్తిచేస్తారు, తద్వారా దేవుని ప్రజలు కలసి వాటిని సమాజములో అనువర్తించగలరు అను ఆశతో బైబిలు రచయితలు వ్రాశారు.
పాత నిబంధనలో దేవుని ప్రజల సమాజము మధ్య లేఖనములు పంచబడిన విధానమును చూచుట ద్వారా లేఖనము యొక్క వ్యక్తిగత అనువర్తనములో సమాజము యొక్క ప్రాముఖ్యతను మనము చూద్దాము. తరువాత అవి క్రొత్త నిబంధనలో ఎలా వ్యాప్తి చెందాయో మనము చూద్దాము. పాత నిబంధనతో మొదలుపెడదాము.
పాత నిబంధన విషయానికొస్తే, అనేక కథనములు, నియమములు, సామెతలు, కీర్తనలు, ప్రవచన ఊపన్యాసములు మొదలగునవి బైబిలు గ్రంథములుగా సంకలనం చేయబడుటకు ముందు మౌఖికముగా వ్యాపించాయి అని మనకు తెలుసు. అయితే ఈ పాఠములో, వాటిని ముందుగా చదివిన నాయకులను మించి ఈ బోధనల యొక్క వ్రాతపూర్వక నివేదికలు ఎలా వ్యాప్తిచెందాయి అను విషయము మీద మనము ఎక్కువ ఆసక్తిని చూపుచున్నాము.
పాత నిబంధన గ్రంథములు ఇశ్రాయేలులోని విస్తృతమైన సమాజములో ఎలా వ్యాప్తిచెందాయో అర్థము చేసుకొనుటకు సహాయపడు అనేక ఆధారములు ఉన్నాయి. ఉదాహరణకు, ద్వితీ. 31:9-29లో, మోషే దేవుని ధర్మశాస్త్రమును ముందుగా లేవీయ యాజకులకు ఇచ్చాడు. తరువాత స్త్రీ, పురుషులు మరియు పిల్లలు ధర్మశాస్త్రమును విని దానిని నేర్చుకొనునట్లు గుడారముల పండుగ సమయములో ధర్మశాస్త్రమును చదివి వినిపించమని మోషే లేవీయ యాజకులను హెచ్చరించాడు. దీనితో పాటు, తమ కొరకు దేవుని చిత్తముగా నిత్యమైన సాక్ష్యముగా ఉండునట్లు ప్రజలు పాడుకొనుటకు ధర్మశాస్త్రములోని ఆశీర్వాదములను మరియు శాపములను ఒక పాట రూపములో వ్రాయమని కూడా దేవుడు మోషేకు ఆజ్ఞాపించాడు.
అంతేగాక, ఇశ్రాయేలు న్యాయస్థానములలో ఉన్న లేవీయులు మరియు న్యాయాధిపతులు దేవుని ధర్మశాస్త్రమును ప్రజలకు అనువర్తించి ధర్మశాస్త్రము యొక్క పరిణామాలను గూర్చి సాధారణ ప్రజలకు తెలియజేశారు అని ద్వితీ. 17:8-13 సూచిస్తుంది. మరియు 1 రాజులు 3:16-18 రాజుల ఆస్థానములలో ఇలానే జరిగేది అని సూచిస్తుంది. నిబంధనను నూతనపరచు సమయములో రాజు ప్రజల ఎదుట లేఖనమును బిగ్గరగా చదివి ధర్మశాస్త్రమును అమలుచేయాలని నిర్దేశించేవాడని 2 రాజులు 23:1-3 సూచిస్తుంది. గోత్ర నాయకులు తాము సేవించిన ప్రజల జీవితములకు దేవుని వాక్యమును అనువర్తించారు అని ఎజ్రా 10:16 చూపుతుంది. పస్కాపండుగ యొక్క ఆచారములను తమ పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలని ఆజ్ఞాపించబడినట్లు నిర్గమ. 12:27 తెలియజేస్తుంది. వాస్తవానికి, అవకాశం వచ్చినప్పుడెల్లా ధర్మశాస్త్రమును పిల్లలకు బోధించాలని ద్వితీ. 6:6-9లో ఉన్న మోషే యొక్క హెచ్చరికలు చూపుచున్నాయి.
మరియు అవును, లేఖనములోని బోధనలు ఇశ్రాయేలులోని సాధారణ ప్రజలను చేరినప్పుడు, లేఖన బోధనలను గూర్చి తాము తెలుసుకొనిన విషయములను అనుసరించునట్లు సమాజములోని సభ్యులు ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు.
ప్రజలు దేవుని వాక్యమును తమ హృదయములలో భద్రపరచుకోవాలి అని కూడా పాత నిబంధన ఉద్ఘాటిస్తుంది. ఈ కారణం చేత, పాత నిబంధనలోని అనేక భాగములు కంటస్థం చేయుట కొరకు రూపొందించబడినవి. చిన్న కథనములు, పది ఆజ్ఞలు, కీర్తనలు మరియు సామెతలు, అనేక ప్రవచన ఉపన్యాసములు, పాటలు మరియు ఉపమానములను ఇశ్రాయేలు సమాజమువారు కంటస్థం చేశారు. ఇదే విధముగా, దేవుని వాక్యమును ధ్యానించుట మరియు దానియందు ఆనందించుట ద్వారా నమ్మకమైన వ్యక్తులు దేవుని ఆజ్ఞలను తమ హృదయములలో ఉంచుకున్నారు. ఒక ఉదాహరణగా, కీర్తనలు 119:11-16లోని మాటలు గమనించండి:
నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను. యెహోవా, నీవే స్తోత్రము నొందదగినవాడవు. నీ కట్టడలను నాకు బోధించుము... నీ శాసనముల మార్గమునుబట్టి నేను సంతోషించు చున్నాను... నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను. నీ కట్టడలనుబట్టి నేను హర్షించెదను. నీ వాక్యమును నేను మరువకయుందును (కీర్తనలు 119:11-16).
ఈ వాక్యభాగములో, తన హృదయములో దేవుని వాక్యమును దాచుకొనుట అంటే ఏమిటో కీర్తనకారుడు వివరించాడు. “[దేవుని] శాసనముల మార్గములను బట్టి [అతడు] సంతోషించాడు.” వాటిని తన వ్యక్తిగత జీవితములో అనువర్తించుకొనుటకు ప్రయత్నించుచుండగా అతడు “[దేవుని] ఆజ్ఞలను ధ్యానించెను” మరియు “[దేవుని] త్రోవలను మన్నించెను.”
మానవ వ్యక్తిత్వము యొక్క పూర్ణత పాపము ద్వారా ప్రభావితము చేయబడింది. ఇందుమూలముగానే, 119వ కీర్తనలో, లేఖనమును సమీపించుట కొరకు ఒక మాదిరి మనకు ఉన్నది, మరియు అక్కడ కీర్తనకారుడు మరలా మరలా ఇలా ప్రార్థించుచున్నాడు, “నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము... వ్యర్థమైనవాటిని చూడకుండ నా కన్నులు త్రిప్పివేయుము.” మన హృదయములను మరియు మనస్సులను పాపపు విషయముల నుండి దూరము చేయునట్లు దేవుని వెదకు మాదిరిని లేఖనము మనకు అందిస్తుంది, అయితే లేఖనము మన ప్రవర్తనను సమర్థించు విధముగా మనకు నచ్చినది చెప్పునట్లు లేఖనమును తారుమారుచేయు అవకాశం మనకు ఉన్నదని గుర్తుంచుకోండి... కాబట్టి మన పాపము ప్రభువుతో మన అనుబంధమును ప్రభావితము చేస్తుంది, మరియు దేవుడు ఇతరులను క్షమించటకు, ఆయన మనకు అనుగ్రహించు కృపతో ఇతరులతో వ్యవహరించుటకు మనలను పిలచుచున్నాడు.
— డా. రాబర్ట్ ఎల్. ప్లమ్మర్
పాత నిబంధనలో లేఖనములను వ్యాపింపజేయుటకు దేవుని ప్రజల యొక్క సమాజము ఎంత కీలకమైయున్నదో మనము పరిగణించాము కాబట్టి, క్రొత్త నిబంధన సంఘములో అనుసరించబడిన ఇవే రకములైన ఆచారములను ఇప్పుడు మనము చూద్దాము.
చాలా వరకు, ఆదిమ సంఘ సమాజము లేఖనములను స్వీకరించిన విధానమును మొదటి శతాబ్దపు సమాజ మందిరముల ఆచారములకు అనుగుణంగా రూపొందించుకున్నది. సమాజములో దేవుని వాక్యము వ్యాపించుటకుగాను లేఖనములను చదివి వివరించు బాధ్యత సంఘ నాయకులకు ఇవ్వబడినది. లూకా 4:14-19లో నజరేతులోని సమాజమందిరములో యేసును గూర్చిన సుపరిచితమైన వృత్తాంతములో మనము ఇదే పద్ధతిని చూడవచ్చు. ఈ వచనములలో, యేసు సమాజమందిరములో ఒక సహవాసములో పాలుపంచుకున్నాడు అని లూకా నివేదించాడు. సమాజమందిరపు నాయకులు ఆయనకు ఒక పత్రమును అందించారు, మరియు యేసు బాధ్యతాయుతముగా లేచినిలువబడి ఆయనకు ఇవ్వబడిన యెషయా గ్రంథములోని ఒక భాగమును చదివాడు. తరువాత, ఆ పత్రమును తిరిగి అప్పగించి, యేసు కూర్చొని తాను చదివిన మాటలు సమాజమునకు ఎలా వర్తిస్తాయో వివరించాడు.
ఆదిమ క్రైస్తవ సంఘములు ఈ సమాజమందిర బోధనా పధ్ధతిని అనుసరించాయి అని అనేక క్రొత్త నిబంధన వాక్యభాగములు సూచిస్తాయి. ఒక ఉదాహరణగా, కొలస్సీ. 4:16లో పౌలు ఇచ్చిన హెచ్చరికను వినండి:
ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి (కొలస్సీ. 4:16).
తాను వ్రాసిన పత్రిక కొలస్సీలోని సంఘములో చదవబడాలని తరువాత “లవొదికయ వారి సంఘములోను చదివించుడి” అని పౌలు ఆశించినట్లు మనము చూస్తాము. ఈ వాక్యభాగము తెలియజేయుచున్నట్లు, సంఘ నాయకులు తమ గ్రంథములను సంఘ సహవాసములలో చదివి వివరిస్తారనే ఆకాంక్షతో క్రొత్త నిబంధన రచయితలు వ్రాశారు.
ప్రతి వ్యక్తికి ఒక బైబిలును ఇచ్చి ఇంటికి వెళ్లి వ్యక్తిగతముగా అధ్యయనము చేయమని చెప్పుటకు బదులుగా, ఆదిమ క్రైస్తవులు లేఖనమును నేర్చుకొని, తమ నాయకుల యొక్క పర్యవేక్షణలో బహిరంగ పఠనముల ద్వారా మరియు లేఖన వివరణల ద్వారా లేఖనమును ప్రధానముగా సమాజమునకు అనువర్తించారు. మరియు ఆ బోధనలు దేవుని ప్రజల మధ్య వ్యాపించుచుండగా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పొరుగువారు వాటిని అనువర్తించుకొనుటలో ఒకరికొకరు తోడ్పడ్డారు.
పాత నిబంధనలో వలెనే, ఈ సామాజిక పాలుపంపులు వ్యక్తిగత ధ్యానమును ఆచరించుటకు ఆదిమ సంఘములోని విశ్వాసులను బలపరిచాయి. ఆరంభ క్రైస్తవులు క్రొత్త నిబంధన బోధనలను కంటస్థం చేసి తమ వ్యక్తిగత జీవితముల కొరకు వాటి యొక్క ప్రాముఖ్యతను ధ్యానించారు. క్రొత్త నిబంధనలో యేసు ఉపమానములు మరియు మత్తయి 5లోని ధన్యవచనములు మరియు మత్తయి 6లోని ప్రభువు ప్రార్థన వంటి ఇతర సులువుగా కంటస్థం చేయబడు బోధనలు ఉండుటకు ఇది ఒక కారణమైయున్నది. ఫిలిప్పీ. 2:6-11 మరియు కొలస్సీ. 1:15-20 వలె అనేక వాక్యభాగములు ఆదిమ క్రైస్తవ పాటలుగా ఎందుకు ఉన్నాయో అర్థము చేసుకొనుట సహాయకరముగా ఉంటుంది. 2 తిమోతి 2:11-13లో ఉన్న పౌలు మాటలు సంఘములో సుపరిచితమైనవిగా ఉండుటకు కారణమును కూడా ఇది వివరిస్తుంది.
2 తిమోతి 2:7లో, అపొస్తలుడైన పౌలు ధ్యాయము చేయు అభ్యాసమును మరియు దేవుని నుండి లేఖన మెళకువలను పొందుకొనుటను సూటిగా సంబోధించాడు. అతడు వ్రాసిన మాటలను వినండి:
నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము; అన్ని విషయములయందు ప్రభువు నీకు వివేకమనుగ్రహించును (2 తిమోతి 2:7).
తాను వ్రాసిన విషయములను గూర్చి “ఆలోచించుకొనుము” అని పౌలు తిమోతికి పిలుపునిచ్చాడు. “అన్ని విషయములయందు ప్రభువు [తిమోతికి] వివేకమనుగ్రహించును” అని పౌలు ఆకాంక్షించాడు. ధ్యానము ద్వారా, పౌలు యొక్క ప్రేరేపిత మాటల యొక్క ప్రాముఖ్యతను గూర్చి ప్రభువు తిమోతికి నేర్పుతాడు, తద్వారా తిమోతి వాటిని తన వ్యక్తిగత జీవితమునకు అనువర్తించుకోవచ్చు.
మనము ఇంతకు ముందు చూసినట్లు, ప్రాచీన ఇశ్రాయేలీయులు కరియు ఆదిమ క్రైస్తవులు లేఖనములను తమ వ్యక్తిగత జీవితములకు అనువర్తించుకొనిన విధానము మన దినములలోని సాధారణ ఆచారముల కంటే భిన్నముగా ఉన్నది. ఇశ్రాయేలులోని మరియు ఆదిమ సంఘములోని నాయకులు ముందు లేఖనములను పొందుకున్నారు మరియు తరువాత దేవుని ప్రజల యొక్క విశాలమైన సమాజములలో వాటిలోని కొన్ని భాగములను వ్యాపింపజేశారు. మరియు ఇతరులతో పాలుపంచుకొను నేపథ్యములో, తమ వ్యక్తిగత జీవితములకు అనువర్తించు విధానములో దేవుడు వారిని నడిపించును అనే ఆశతో ప్రజలు వారు ఎరిగియుండిన లేఖనములను గూర్చి ఆలోచన చేసి వాటిని ధ్యానించవలసియుండెను. కాబట్టి, ఈ ఆచారములు మన కొరకు ఎలాంటి అంతర్భావములను కలిగియున్నవి? మన వ్యక్తిగత జీవితములకు లేఖనములను అనువర్తించుకొనుటకు గూర్చి అవి మనకు ఏమి చెబుతున్నాయి?
లేఖనమును తమ వ్యక్తిగత జీవితములకు అనువర్తించుకొనుటకు అవసరమైన జ్ఞానమును పొందుకోవాలని ఆశించువారి కొరకు కనీసం మూడు అంతర్భావములు ఉన్నాయి.
మొదటిగా, లేఖన బోధలను మన యొద్దకు తెచ్చుట కొరకు ఆత్మ వరములు పొందిన నాయకులు మనకు ఎంత అవసరమైయున్నారో క్రీస్తు యొక్క ఆధునిక అనుచరులు నేర్చుకోవాలి. క్రొత్తవైన మరియు సంక్లిష్టమైన బోధనలను అర్థము చేసుకొనుటలో వారికి సహాయము చేయుట కొరకు బైబిలు యొక్క వాస్తవిక శ్రోతలకు తమ నాయకుల యొక్క సహాయము అవసరమైనది అని మనము చూశాము. బైబిలు దినములలో నివసించుచుండిన ప్రజల విషయములో ఇది వాస్తవమైతే, నేడు మనకు కూడా ఇది వర్తిస్తుంది. మనము బైబిలును మన చేతిలో పట్టుకోవచ్చు, కాని లేఖనములను మన జీవితములకు అనువర్తించుకొనుటకు మనము ప్రయత్నించుచుండగా మనకు సహాయము చేయుటకు మనకు ఇప్పటికీ జ్ఞానులైన అనుభవము కలిగిన నాయకులు కావాలి.
రెండవదిగా, మనము లేఖనములను అనువర్తించుకొనుటకు ప్రయత్నించుచుండగా విశాలమైన క్రైస్తవ సమాజము, అనగా క్రీస్తు శరీరముతో పాలుపంచుకొనుట యొక్క ప్రాముఖ్యతను ఆధునిక క్రీస్తు అనుచరులు పునరుద్ఘాటించవలసిన అవసరత ఉన్నది. ఈ భావనలో, పాత నానుడి నేటికీ వర్తిస్తుంది. “ఒకని కన్నుల కంటే ఇద్దరి కన్నులు మేలు.” వాస్తవానికి, మూడు, నాలుగు, ఐదు ... వెయ్యిమంది కన్నులు ఒకని కన్నుల కంటే శ్రేష్టమైనవి. సులువైన సత్యము ఇది: ఏదో ఒక సమయములో, క్రీస్తు అనుచరులలో ప్రతి ఒక్కడు ఒక అనువర్తనము ఖచ్చితముగా తగినది అని గ్రహించియుంటాడు, కాని తరువాత ఇతరులతో సంభాషించుట వలన వాస్తవానికి అది అంత అవసరమైనది కాదు అని కనుగొనియుంటాడు. క్రీస్తు శరీరము ఆయన ఆత్మకు దేవాలయముగా ఉన్నదని మనము జ్ఞాపకముంచుకొనినప్పుడు, లేఖనములను తమ వ్యక్తిగత జీవితములకు అనువర్తించుకొనుచుండగా ఇతర నమ్మకమైన క్రైస్తవులతో పాలుపంచుకొనుట ఆధునిక క్రైస్తవులు చేయగల ఒక ఉత్తమమైన పని అని మనము గ్రహిస్తాము.
2 పేతురు 3:16లో, అపొస్తలుడైన పేతురు పౌలు వ్రాసిన పత్రికలను గూర్చి మాట్లాడుతున్నాడు. అతడు పౌలును గూర్చి ఇలా చెబుతున్నాడు:
వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు (2 పేతురు 3:16).
ఈ వచనములో నాకు నచ్చిన ఒక విషయము ఏమిటంటే, లేఖనములోని కొన్ని విషయములు అర్థము చేసుకొనుటకు కష్టము అని ఇది మనకు గుర్తుచేస్తుంది. వాటిని అర్థము చేసుకొనుట అసాధ్యము అని అర్థము కాదుగాని, కొన్ని కష్టమైనవి అని, మరియు లేఖన అర్థమును తారుమారు చేయుట, ప్రేరేపించబడిన అర్థమునకు నమ్మకముగా లేని విధముగా దానిని ఉపయోగించుట సాధ్యమని అర్థము. మరియు క్రీస్తు శరీరముగా మనకు అవసరమైన ఒక మంచి జ్ఞాపకము ఇది, ఎందుకంటే క్రొత్త నిబంధన అంతటా, ఇతర విశ్వాసులతో కలసి మనము ప్రత్యక్షమైన మరియు పరోక్షమైన ఆకాంక్షలను మనము పొందుకుంటాము. దేవుడు తన శరీరమునకు ఇచ్చు విభిన్నమైన ఆత్మీయ వరములను గూర్చి అనేక వాక్యభాగములు మాట్లాడతాయి — 1 కొరింథీ. 12-14లో, రోమా. 14లో, ఎఫెసీ. 4లో. ఎఫెసీ. 4 ప్రకారం దేవుడు క్రీస్తు శరీరమునకు అనుగ్రహించు వరములలో కొందరు కాపరులు మరియు బోధకులు. అనగా క్రైస్తవులందరు పరిశుద్ధాత్మను కలిగియుండి, లేఖనములను చదువుటకు మరియు అర్థము చేసుకొనుటకు పిలువబడ్డారు అను విషయమును తిరస్కరించుట కాదుగాని, లేఖనములను వివరించుటలో మరియు దానిలోని విషయములను చూచుటకు మనకు సహాయము చేయుటలో కొందరు ప్రజలు విశేషముగా వరములను పొందియున్నారు.
— డా. రాబర్ట్ ఎల్. ప్లమ్మర్
మూడవదిగా, లేఖనము యొక్క వ్యక్తిగత, ప్రార్థనాపూర్వక ధ్యానము చేయు అలవాటును నూతనపరచుకొనుట ద్వారా కూడా ఆధునిక క్రీస్తు అనుచరులు అనువర్తనము కొరకు జ్ఞానమును పొందవలసిన అవసరత ఉన్నది. నాయకులు మరియు విశాలమైన క్రీస్తు శరీరముతో పాలుపంచుకొనుట ప్రాముఖ్యమైన విషయమైనప్పటికీ, ప్రతి క్రైస్తవుడు అతడు లేక ఆమె చేసిన దానిని బట్టి లెక్క అప్పగించవలసియున్నది. కాబట్టి, తుదకు, తిమోతికి పౌలు వ్రాసినట్లు, వ్యక్తిగత అనువర్తన “మనము మెళకువ” దయచేయమని ప్రభువును కోరుటకు వేరుగా ఉండకూడదు. ప్రార్థనాపూర్వక ధ్యానము ద్వారా, దేవుని ఆత్మ ఆయనకు నచ్చిన విధముగా లేఖనములను అనువర్తించుటకు మనకు మెళకువను మరియు హృదయపూర్వక నిశ్చయతను అనుగ్రహిస్తాడు.
చదువుట అనగా లేఖనమును తెలుసుకొనుట, మరియు అది మంచి ఆరంభ బిందువు అయ్యున్నది; మీరు ఇలా చేయాలి. అయితే ధ్యానము అనగా లేఖనమును నెమరువేయుట. దేవుని వాక్యముతో మనము అనుదినము గడుపు సమయము ద్వారా మన జీవితములో మార్పు కలగాలని మనము కలిగియుండు నిరీక్షణ లేఖనమును నెమరువేయుట ద్వారా కలుగుతుంది. మరియు దేవుని అనుభవించుటలో మనకు సహాయపడుతుంది. ధ్యానము ద్వారా ప్రభువు మంచివాడు అని మనము రుచిచూచి తెలుసుకుంటాము. పేజీ మీద ఉన్న సమాచారము ప్రభువుతో భక్తిగల అనుభవముగా మారిపోయి జీవితములో మార్పును కలిగిస్తుంది. మరియు నా అనుభవము ఏమిటంటే, చాలామంది క్రైస్తవులు, అత్యంత అంకితభావంగల బైబిలు పాఠకులు కూడా, ధ్యానం చేయరు... బైబిలు కేవలం చదువవద్దు; లేఖనమును ధ్యానించండి.
— డా. డోనాల్డ్ ఎస్. విట్నే
వ్యక్తుల కొరకు ఆధునిక అనువర్తనము అను ఈ పాఠములో, లేఖనములను వ్యక్తులుగా మనకు మరియు ఇతరులకు అనువర్తించుకొనుటలోని రెండు కోణములను మనము చూశాము. లేఖనము యొక్క వ్యక్తిగత అనువర్తనములో విభిన్నత బైబిలు బోధనలలోని విభిన్నతను మరియు ప్రజలు మరియు పరిస్థితులలోని విభిన్నతను పరిగణలోనికి తీసుకోవాలని మనము గుర్తించాము. బైబిలు అనువర్తనములోని జ్ఞానము దేవుడు నియమించిన నాయకులతో మరియు దేవుని ప్రజల సమాజముతో పాలుపంచుకొనుట మీద ఆధారపడియుండు విధానమును, మరియు దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా లేఖనమును ధ్యానించుచుండగా మనకు సహాయపడు విధానమును కూడా మనము విశదీకరించాము.
బైబిలు దేవుని యొద్ద నుండి కలిగిన అద్భుతమైన బహుమానమైయున్నది, మఱియు మన ఏకైక నిస్సందేహమైన విశ్వాస మరియు జీవిత నియమమైయున్నది. దేవుని సేవలో మన వ్యక్తిగత భావనలు, ప్రవర్తనలు మరియు భావోద్వేగములను తగిన విధముగా నిర్దేశించు ప్రామాణికత మరి దేనికి లేదు. జీవితములోని విభిన్నతలతో మనము వ్యవహరించుచుండగా మనకు అవసరమైన విభిన్నమైన సూచనలతో లేఖనములు నిండియున్నాయి. సమాజములో ఒకరితో ఒకరము కలిసి లేఖనములను నేర్చుకొనుటకు మరియు అనువర్తించుటకు మనకు పిలుపునిచ్చుట ద్వారా లేఖనములోని ఈ విభిన్నతతో వ్యవహరించవలసిన జ్ఞాన మార్గమును కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దృక్కోణములను మనము మనస్సులో ఉంచుకోగలిగితే, మన జీవితములలో అనుదినము దేవునికి మనము చేయు వ్యక్తిగత పరిచర్యలో లేఖనములను అనువర్తించుటకు మనము ఉత్తమమైన రీతిలో సిద్ధపడియుండగలము.
Continue reading the full transcript