<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
క్యాటలాగ్‌కు తిరిగి వెళ్ళుHPTపౌలు సిద్ధాంతం యొక్క హృదయం
పౌలు సిద్ధాంతం యొక్క హృదయం ·Videoఆంగ్లం నుండి అనువాదం చేయబడింది

HPT-03 పౌలు మరియు థెస్సలొనీకయులు

పూర్తి వచనం చదవండి

అదే శ్రేణి 3వ పాఠానికి తోడుగా ఉండే వీడియో ఇది. ఈ వీడియో క్రింది ప్రశ్నలను అడుగుతుంది: పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణంలో యోహాను మార్కును తీసుకోడానికి నిరాకరించడం ద్వారా పాపం చేశాడా? పౌలు ఆసియాలో పరిచర్య చేయకుండా పరిశుద్ధ ఆత్మ ఎందుకు అడ్డుకున్నాడు? 1 & 2 థెస్సలొనీకయులు క్రీస్తు రాక సమయం గురించి ఏమి బోధిస్తారు? క్రీస్తు రాక కోసం ఆశించడం ద్వారా మనం అనుచితమైన అంచనాలను ఏర్పరచకుండా ఎలా ఉండాలి? లోకిక వృత్తులలో శ్రమించడం మన క్రైస్తవ సాక్ష్యానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? "అధికార లోపం గల వ్యక్తి" ఎవరు? నేడు మనం తప్పు ప్రవక్తలను మరియు తప్పు బోధకులను ఎలా గుర్తించగలం? సమృద్ధిని అతిగా నొక్కిచెప్పకుండా కష్టపడే పనిని మనం ఎలా నిర్ధారించుకోవాలి? సోమరితనం ఎల్లప్పుడూ పాపమా? పాత, ధనిక క్రైస్తవుల ఉదాహరణ నుండి యువ, పేద క్రైస్తవులు ఏమి నేర్చుకోవచ్చు? తప్పు బోధనలను ప్రచారం చేసే చర్చిలు మరియు చర్చి నాయకులతో మనం ఎలా వ్యవహరించాలి? ఒక చర్చిని వదిలివేయడం ఎప్పుడు సముచితం? పౌలు థెస్సలొనీకయులకు రాసిన ఉత్తరాలు మన దేవశాస్త్రానికి ఏవిధమైన ప్రత్యేక కృషిని అందిస్తాయి? పౌలు మరణించిన విశ్వాసులు "నిద్రపోతున్నారు" అని ఎందుకు చెప్పాడు? క్రీస్తు యొక్క సమీప రాక మన రాజ్య నిర్మాణ దృష్టిని ఎలా ప్రభావితం చేయాలి? పరిశుద్ధ ఆత్మ మనలను లోకం నుండి తీసివేయకుండా ఎలా వేరు చేస్తాడు? బైబిలు వ్రాయబడుతున్నప్పుడు నకిలీలు ఎంత సాధారణం?


From the transcript

1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.

బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.

ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.

అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.

మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.

ఇటీవల, తన కుమారుని యొక్క గ్రాడ్యుయేషన్ కు వెళ్లిన ఒక తండ్రిని గూర్చి నేను విన్నాను. ఆ వేడుక తరువాత, అతడు గర్వంగా తన కుమారుని యొద్దకు వెళ్లి ఇలా అడిగాడు, “బాబు, మిగిలియున్న నీ జీవితముతో నీవు ఏమి చేయగోరుచున్నావు?” అతడు నవ్వి ఇలా జవాబిచ్చాడు, “సరే, నాన్న, నేను నా భవిష్యత్తను గూర్చి చాలా ఆలోచించాను, మరియు సూటిగా పదవి విరమణ చేయుటను గూర్చి ఆలోచిస్తున్నాను.” ఇప్పుడు, మనలో చాలామంది ఆ యౌవ్వన గ్రాడ్యుయేట్ కు సానుభూతి చూపవచ్చు. అయితే పదవి విరమణకు ముందు ఇంచుమించు మనమంతా అనేక బాధ్యతలను నెరవేర్చాలని మనమంతా గ్రహిస్తాము.

ఇప్పుడు, ఆ యువకుడి వైఖరి మొదటి శతాబ్దంలో థెస్సలొనీక పట్టణములో నివసించిన కొంతమంది క్రైస్తవుల యొక్క వైఖరికి దగ్గరగా ఉందని వినడానికి వింతగా అనిపించవచ్చు. క్రీస్తు యొక్క మహిమకరమైన రెండవ రాకడను అనుభవించుటను గూర్చి వారు ఎంతగా ఆలోచించారు అంటే, ఆ మహిమగల రోజుకు ముందు వారు నెరవేర్చాలని దేవుడు వారిని పిలచిన అనేక బాధ్యతలను గ్రహించుటలో విఫలమయ్యారు.

“పౌలు వేదాంతశాస్త్రము యొక్క ములాంశములు” అను పాఠ్యక్రమములో ఇది మూడవ పాఠము మరియు దీనికి “పౌలు మరియు థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక” అను పేరు పెట్టాము. ఈ పాఠములో, థెస్సలొనీక సంఘములో క్రీస్తు రాకడ అతి సమీపముగా ఉంది అని నమ్ముట వలన కొందరు మొదటి శతాబ్దపు కైస్తవులు ఎదుర్కొనిన తీవ్రమైన సమస్యలను మనం చూడబోవుచున్నాము. ఈ తప్పుదారి పట్టించిన నమ్మకముకు పౌలు ఎలా స్పందించాడో కూడా మనము చూడబోవుచున్నాము.

మన మునుపటి పాఠములలో మనము నేర్చుకొనినట్లు, మెస్సీయ వచ్చినప్పుడు, సృష్టి కొరకు దేవుడు కలిగియున్న ఉద్దేశ్యములన్నిటిని ఆయన నెరవేర్చుతాడు అని పౌలు దినములలోని నమ్మకమైన విశ్వాసులందరు నమ్మారు. ఇప్పుడు, క్రీస్తు యొక్క బోధన ఆధారంగా, ఆయన మొదటి రాకడలో క్రీస్తు అంత్య దినములను ఆరంభించాడు అని పౌలు బోధించాడు. సంఘ చరిత్రయంతట క్రీస్తునందు అంత్య దినములు కొనసాగుతాయి అని కూడా అతడు బోధించాడు. మరియు క్రీస్తు యొక్క రెండవ రాకడలో నెరవేర్పు సమయమున ఆయన సృష్టి యొక్క పరివర్తనను పూర్తి చేస్తాడని వివరించాడు. చాలా వరకు, ఆదిమ క్రైస్తవులు క్రీస్తు రాజ్యము ఈ విధముగా వివృతమవుతుంది అని నమ్మారుగాని, అనేకమంది సందిగ్ధతను ఎదుర్కొన్నారు. క్రీస్తు అప్పటికే ఎంత వరకు నెరవేర్చాడు? ఆయన ఎంత త్వరగా తిరిగివస్తాడు?

క్రీస్తు లోకమును అప్పటికే ఎంతవరకు మార్చివేశాడు అను విషయమును వారు తక్కువ అంచనా వేయుట వలన గలతీయలోని సంఘములు అన్య క్రైస్తవులను సున్నతిపొందునట్లు బలవంతపెట్టునట్లు శోధింపబడ్డారు అని మునుపటి పాఠములో మనము చూశాము. అయితే ఈ పాఠములో, మనము ఒక భిన్నమైన సమస్యను చూస్తాము. క్రీస్తు రాకడ అతి సమీపముగా ఉంది అని థెస్సలొనీక సంఘములో అనేకమంది విశ్వాసులు నమ్మారు. వారు ఈ నమ్మకములో ఎంతగా మునిగిపోయారు అంటే, క్రీస్తు అనుచరులుగా ఇతర బాధ్యతలను నెరవేర్చవలసిన అవసరతను వారు చూడలేకపోయారు. కాబట్టి, నమ్మకమైన క్రైస్తవ జీవనములోనికి వారికి తిరిగి పిలచుటకు పౌలు థెస్సలొనీకలో ఉన్న క్రైస్తవులకు పత్రికలను వ్రాశాడు.

పౌలు మరియు థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక పై మన అధ్యయనం మూడు భాగాలుగా విభజించబడుతుంది. మొదటిగా, పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును మనము పరిశీలిద్దాము. రెండవదిగా, 1 మరియు 2 థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రికల యొక్క నిర్మాణము మరియు విషయములను పరిశీలిద్దాము. మరియు మూడవదిగా, పౌలు వ్రాసిన ఈ పత్రికలు క్రైస్తవ యుగాంతశాస్త్రము పై అతని కేంద్ర వేదాంతశాస్త్ర దృక్పధములను థెస్సలొనీకలో ఉన్న సంఘమునకు ఏ విధముగా అనువర్తించాయో చూద్దాము. పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును మొదటిగా చూద్దాము.

ఈ పాఠ్యక్రమము అంతటా మనము ఉద్ఘాటించినట్లుగా, వివిధ సంఘములలో తలెత్తిన కొన్ని నిర్దిష్ట సమస్యలను గూర్చి చర్చించుటకు అపొస్తలుడైన పౌలు తన పత్రికలను వ్రాశాడు. కాబట్టి, 1 మరియు 2 థెస్సలొనీక పత్రికలను మనం చూసినప్పుడు, మనము కొన్ని ప్రాథమిక ప్రశ్నలను అడగాలి: థెస్సలొనీక సంఘములో ఏమి జరుగుతుంది? పౌలు వారికి ఎందుకు వ్రాశాడు?

పౌలు రెండవ మిషనరీ యాత్ర యొక్క నేపథ్యమును చూస్తూ మొదటిగా ఈ ప్రశ్నలను చర్చిద్దాము. తరువాత థెస్సలొనీక సంఘములో తలెత్తిన కొన్ని విశేషమైన సమస్యలను చూద్దాము. పౌలు యొక్క రెండవ మిషనరీ యాత్రను మొదటిగా చూద్దాము.

పౌలు యొక్క రెండవ మిషనరీ యాత్రను గూర్చి అపొస్తలుల కార్యములు 15:36-18:22లో మనం చూస్తాము. పౌలు నేటి గ్రీసు దేశములోని అనేక ప్రాంతములకు వెళ్లుటకు ముందు ప్రధానంగా చిన్న ఆసియాలో ప్రయాణించాడు అని లూకా అక్కడ పేర్కొన్నాడు. పౌలు యొక్క మొదటి మిషనరీ యాత్ర వలెనే, ఈ యాత్ర కూడా సిరియాలోని అంతియొకయలోనే సుమారు క్రీ.శ. 48 లేక 49లో ఆరంభమైనది. పౌలు మరియు బర్నబా కలిసి సేవచేయాలని ప్రణాళిక కలిగియున్నారు, కాని యోహాను అను పేరుగల మార్కు తమతో పాటు రావాలని బర్నబా కోరినందున వారివురి మధ్య వివాదము జరిగింది. వారి యొక్క మొదటి మిషనరీ యాత్రలో మార్కు వారిని విడిచిపెట్టినందున పౌలు అభ్యంతరపరచాడు. ఫలితంగా, పౌలు సీలను తన ప్రయాణ సహచరుడుగా ఎన్నుకున్నాడు, బర్నబా మరియు మార్కు కుప్రకు వెళ్లారు.

పౌలు మరియు సీల మొదట సిరియా ప్రాంతములో ప్రయాణము చేసి తదుపరి కిలికియకు వెళ్లారు. వారు దర్శించిన పట్టణములు మనకు తెలియనప్పటికీ, ఈ ప్రాంతములలో అనేక సంఘాలను వారు బలపరచారని అపొస్తలుల కార్యములు తెలియజేస్తుంది. వారు కిలికియ నుండి గలతీయకు వెళ్లారు, అక్కడ పౌలు తన మొదటి మిషనరీ యాత్రలో స్థాపించిన సంఘములను సందర్శించారు. వారు మొదట దెర్బేకు, తరువాత లుస్త్రకు వెళ్లారు, అక్కడ తిమోతి వారితో కలిశాడు. వారు లుస్త్ర నుండి గలతీయ మరియు ఫ్రుగియ ప్రదేశములకు వెళ్లారు.

ఈ సమయంలో, పౌలు ఆసియా ప్రాంతములో, చిన్న ఆసియా యొక్క పశ్చిమ భాగమున మరియు ఉత్తర బితూనియ ప్రాంతములలో సువార్త ప్రకటించాలని ఆశించాడు. కాని పరిశుద్ధాత్ముడు అతనిని అనుమతించలేదు. కాబట్టి, వారు ఫ్రుగియ నుండి 300 మైళ్ల దూరములో ఉన్న తీరప్రాంతమైన త్రోయకు వెళ్లారు, అక్కడ వారు పశ్చిమ దిశకు ప్రయాణించి వెళ్లుటకు కారణం స్పష్టం అవుతుంది. స్వప్నమందు, మాసిదోనియకు అనగా ఇప్పుడు గ్రీసు దేశము యొక్క ఉత్తర ప్రాంతములలో ఉన్న ప్రదేశములకు రమ్మని వేడుకొనుచున్న ఒక మనుష్యుని పౌలు చూశాడు. ఈ కలకు ప్రతిస్పందనగా, పౌలు మరియు అతని సహచరులు వెంటనే మాసిదోనియకు ప్రయాణమై వెళ్లారు. వారు నెయపొలి మార్గమున ప్రయాణించి ఫిలిప్పీ పట్టణమునకు చేరుకొన్నారు, అక్కడ వారు కొంతకాలము ఉండి, అనేకమంది క్రీస్తును అంగీకరించుటను చూశారు.

అయితే, తుదకు, దురాత్మ చేత పీడించబడుతున్న చిన్నదాని నుండి ఆ దురాత్మను వెళ్ళగొట్టుట వలన పౌలును ఫిలిప్పీ పట్టణస్తులు నిర్బంధించారు. అయితే చెరసాలలో కూడా సువార్త వ్యాపించబడింది. మధ్యరాత్రి వేళ మహా భూకంపము కలిగినందువలన ఖైదీల యొక్క సంకెళ్లు మరియు చెరసాల యొక్క తలుపులు బద్దలైపోయాయి. ఖైదీలకు తప్పించుకొనే అవకాశం దొరికినప్పటికీ, చెరసాల నాయకుడు శిక్షపొందకుండా ఉండు నిమిత్తము వారు చెరసాలలోనే ఉండిపోయారు. తన యెడల వారు చేసిన ఈ దాతృత్వ కార్యమును బట్టి చెరసాల నాయకుడు ఆకర్షితుడైయ్యాడు గనుక అతడు మరియు అతని కుటుంబీకులందరూ రక్షించబడ్డారు.

ఫిలిప్పీ నుండి, సేవకులు అంఫిపొలి మరియు అపొల్లో పట్టణముల మీదుగా వెళ్లి థెస్సలొనీకకు చేరుకున్నారు, అక్కడ పౌలు మూడు వారములు సమాజమందిరములో సువార్త ప్రకటించాడు. ఈ సువార్త పరిచర్య ద్వారా, అనేకమంది యూదులు మరియు అనేకమంది అన్యులు సువార్తను అంగీకరించారు. ఈ సమయములో పౌలు తన పోషణ కొరకు తానే పని చేసుకున్నాడు, మరియు తన అవసరతలు తీర్చబడుటకు ఫిలిప్పీ క్రైస్తవుల నుండి బహుమతులను పొందుకున్నాడు. ఈ సత్యములు, పౌలు థెస్సలొనీకలో కొన్ని నెలలు ఉన్నాడు అని సూచిస్తున్నాయి. ఏది ఏమైనా, పౌలు థెస్సలొనీక క్రైస్తవులను ప్రేమించి వారి సహోదర ప్రేమను బట్టి ప్రోత్సహించబడ్డాడు. అయితే, తుదకు, అవిశ్వాసులైన కొందరు యూదులు సువార్త వ్యాప్తిని బట్టి అసూయపడ్డారు మరియు పౌలు, సీలకు వ్యతిరేకముగా ఒక గుంపును రేపి, బెరయకు పారిపోవునట్లు వారిని తరిమారు. మొదటిగా, బెరయ పట్టణస్తులు పౌలు యొక్క సువార్త సందేశమును ఆసక్తిగా స్వీకరించారు. కాని వెంటనే, అవిశ్వాసులైన థెస్సలొనీక యూదులు ఈ విషయమును తెలుసుకొని అక్కడ కూడా అతనికి వ్యతిరేకముగా జనసమూహమును రేపి కలవరపరచారు.

పౌలు మరోసారి పారిపోయాడు, ఇప్పుడు అతడు ఏథెన్సు పట్టణముకు వెళ్లాడు, అక్కడ తన వాడుకచొప్పున అతడు సమాజమందిరములోని యూదులకు సువార్త ప్రకటించాడు, అంతేగాక మార్స్ హిల్ లో ఉన్న ఎపికూరీయులకు స్తోయికులకు కూడా సువార్తను ప్రకటించాడు. ఏథెన్సు నుండి బయలుదేరి పౌలు కొరింథుకు వెళ్లాడు, అక్కడ అతడు కనీసం సంవత్సరము ఆరు నెలలు, బహుశా ఇంకా ఎక్కువ కాలము ఉండి, సంఘమును స్థాపించి అభివృద్ది చేశాడు. తరువాత, అతడు తూర్పు దిశగా వెళ్లి, కెంక్రేయలో ఆగి, చిన్న ఆసియాలోని ఎఫెసుకు బయలుదేరాడు. అక్కడ నుండి కైసరయకు, తరువాత సిరియాలోని అంతియొకయకు వెళ్లాడు, మరియు మార్గములో యెరూషలేములో కొంత కాలముపాటు ఆగియుండవచ్చు. అతని యాత్ర బహుశా క్రీ.శ. 51 లేక 52లో ముగిసింది.

పౌలు యొక్క రెండవ మిషనరీ యాత్ర యొక్క చివరి దశలలో అతడు 1 మరియు 2 థెస్సలొనీక పత్రికలను వ్రాశాడు. 1 థెస్సలొనీకయులకు 3:1, 2 ప్రకారం, పౌలు ఏథెన్సులో ఉండగా థెస్సలొనీకకు వెళ్లి అక్కడి విశ్వాసులను బలపరచమని తిమోతిని పంపించాడు. ఇది సుమారు క్రీ.శ. 49 లేక 50లో, పౌలు మరియు అతని సహచరులు థెస్సలొనీక పట్టణమును విడచిన వెంటనే అయ్యుండవచ్చు. సుమారు క్రీ.శ. 50 లేక 51లో, తిమోతి తిరిగివచ్చినప్పుడు, పౌలు కొరింథులో ఉండియుండవచ్చు. స్పష్టంగా, తిమోతి థెస్సలొనీక సంఘమును గూర్చి పౌలుకు అనేక ప్రోత్సాహకరమైన విషయములను తెలియజేశాడుగాని, అదే సమయములో ఆ సంఘములో తలెత్తిన అనేక తీవ్రమైన అపార్థములను మరియు ఆచరణాత్మక సమస్యలను గూర్చి కూడా అతడు తెలియపరచాడు. ఈ సమస్యలను పరిష్కరించు నిమిత్తము తిమోతి వచ్చిన వెంటనే పౌలు కొరింథు నుండి 1 థెస్సలొనీక పత్రికను వ్రాసి ఉండవచ్చు. 2 థెస్సలొనీక పత్రిక కూడా కొన్ని నెలలు తరువాత కొరింథు నుండే వ్రాసియుండవచ్చు.

పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రికలో మనము రెండు విషయములను చూడవచ్చు. మొదటిగా, అక్కడ సంఘ జీవితములో జరుగుచుండిన కొన్ని విషయములను గూర్చి అతడు ఆందోళన చెందాడు. అక్కడ పరిస్థితులు అనుకున్న విధముగా లేవుగాని, పౌలు వారి పట్ల ఎంతో ఆప్యాయతను కలిగియున్నాడు. అతడు వారి కొరకు నిరంతరం ప్రార్థించుటను గూర్చి, వారి యెడల అతడు కలిగియుండిన ప్రేమను గూర్చి, మరియు వీలైనంత వరకు ప్రతి మార్గములోను అతని విశ్వాసమును అనుకరించుటకు వారు చేయుచున్న ప్రయత్నమును బట్టి అతడు అనుభవించుచున్న గౌరవమును గూర్చి అతడు మాట్లాడాడు. మరియు నా ఆలోచన ప్రకారం ముఖ్య విషయం ఏమిటంటే, వీరిలో చాలా మందిని పౌలు క్రీస్తునందు విశ్వాసములోనికి నడిపించాడు, వారికి బోధించాడు, వారికి మార్గదర్శకునిగా ఉన్నాడు, మరియు వారి మధ్య ఉన్న అనుబంధము వలన ఇది అతడు వారితో కలిగియున్న బంధము అయ్యున్నది, మరియు క్రీస్తునందు వారి విశ్వాసము మరియు ఆయనను అనుసరించుటకు వారు కలిగియుండిన ఆశ వలన అతడు వారిని ప్రేమించాడు. అయితే ప్రతి సంఘములో వలెనే — దీనిని మనము పౌలు వ్రాసిన ప్రతి పత్రికలో కూడా చూస్తాము — సమస్యలు ఖచ్చితముగా ఉంటాయి, ఇబ్బందులు మరియు కష్టములు ఎల్లప్పుడు ఉంటాయి. మరియు తాను బోధించిన ప్రతి మాటను నూరు శాతం ఉన్నది ఉన్నట్లు పాటించకపోవుట వలన పౌలు ఎవరిని కూడా విడిచిపెట్టువాడు కాదు. క్రీస్తునందు వారు కలిగియుండిన బంధము వలన మరియు అనేక విధాలుగా అతడు వారి కాపరి అయ్యున్నందు వలన అతని ప్రేమ ఈ సమస్యలన్నిటికీ మించినదిగా ఉన్నది.

— డా. డాన్ లఖీఖ్

ఇప్పటి వరకు, పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును అతని రెండవ మిషనరీ యాత్ర అను విస్తృత సందర్భములో చూశాము గనుక, ఇప్పుడు థెస్సలొనీక సంఘములో తలెత్తిన సమస్యలను చూద్దాము. పౌలును కలవరపరచిన సమస్యలు ఏమిటి? థెస్సలొనీక సంఘముకు ఒకసారి కాదు రెండుమారులు ఎందుకు వ్రాయవలసి వచ్చింది?

పౌలు యొక్క ఇతర పత్రికలలో కూడా కనిపించు అనేక అంశములను గూర్చి 1 మరియు 2 థెస్సలొనీక పత్రికలలో అతడు మాట్లాడాడు. నిర్దిష్ట సంఘములు, మరియు ఆ సంఘములలోని సమూహములు మరియు వ్యక్తులు ఎదుర్కొనిన బలమైన కాపరి అవసరతలను చర్చించుటకు పౌలు తన పత్రికలను వ్రాశాడు అను విషయమును మనము ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి. తన రెండవ మిషనరీ యాత్రలో థెస్సలొనీకలోని క్రైస్తవులతో పౌలు గడిపిన సమయమును బట్టి అతడు వారిని ఎంతగానో ప్రేమించాడు. అయితే పౌలు థెస్సలొనీకను విడిచి వెళ్లిన తరువాత, అతని శిష్యుడైన తిమోతి థెస్సలొనీక విశ్వాసుల మధ్య తలెత్తిన అనేక తీవ్రమైన సమస్యలను గూర్చి అతనికి సమాచారమిచ్చాడు.

ప్రతి సందర్భములో జరుగునట్లే, థెస్సలొనీకలో అనేక పరస్పరాధారితమైన సమస్యలు ఉండినవి. అయితే పౌలు ఈ సంఘములకు వ్రాసిన పత్రికలను చదువుచుండగా, మూడు ప్రధానమైన సమస్యలు వెలుగులోకి వస్తాయి: మొదటిగా, హింసతో పోరాటం; రెండవదిగా, సంఘములోపల అబద్ధ ప్రవక్తలు లేచుట; మరియు మూడవదిగా, ఈ అబద్ధ ప్రవక్తలు చేసిన కొన్ని సరికాని బోధనల ఫలితంగా కలిగిన ఆచరణాత్మక క్రైస్తవ జీవితముకు సంబంధించిన కొన్ని సమస్యలు. మొదటిగా, హింస అను సమస్యను పరిశీలిద్దాము.

పౌలు మొదటిగా థెస్సలొనీకకు సువార్తను తెచ్చినప్పుడు, అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, వారి విశ్వాసము నిమిత్తము హింసించబడ్డారు. వారిలో అనేకమంది తీవ్రమైన, ప్రాణాంతకమైన హింసను ఎదుర్కొన్నారు. అపొస్తలుల కార్యములు 17:5లో నివేదించబడిన థెస్సలొనీకలో జరిగిన సంఘటనలను గూర్చి లూకా ఇచ్చిన వర్ణనను వినండి:

అయితే యూదులు మత్సరపడి, పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపుకూర్చి పట్టణమెల్ల అల్లరిచేయుచు, యాసోను ఇంటిమీదపడి [పౌలు సీలలను] జనుల సభయెదుటికి తీసికొని వచ్చుటకు యత్నముచేసిరి (అపొస్తలుల కార్యములు 17:5).

వాస్తవానికి, థెస్సలొనీకలోని అవిశ్వాసులైన యూదులు క్రూరమైన వారు గనుక పౌలు మరియు సీలను తమ పట్టణము నుండి తరిమివేయుటతో తృప్తిచెందలేదు. బదులుగా, శ్రమపెట్టుట కొనసాగించుటకు వారు బెరయకు కూడా వారిని అనుసరించారు. లూకా దీనిని అపొస్తలుల కార్యములు 17:13లో నివేదించాడు:

అయితే బెరయలోకూడ పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలొనీకలో ఉండు యూదులు తెలిసికొని అక్కడికిని వచ్చి జనసమూహములను రేపి కలవరపరచిరి (అపొస్తలుల కార్యములు 17:13).

సువార్తను వ్యతిరేకించిన యూదులు ముష్కరులు గనుక వారు క్రైస్తవులను పట్టణము వెంబడి పట్టణముకు వెంబడించి తరుముచు, క్రైస్తవ విశ్వాసమును వ్యతిరేకించుటకు అన్యులను కూడా ప్రేరేపించారు. అతడు థెస్సలొనీక నుండి వెళ్లిపోయిన తరువాత కూడా ఈ సమస్య కొనసాగుతూనే ఉంది అని పౌలు థెస్సలొనీకకు వ్రాసిన పత్రికలు సూచిస్తాయి. 1 థెస్సలొనీక 2:14-16లో, పౌలు వారి సమస్యలను ఈ విధంగా వివరించాడు:

వారుయూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశస్తులవలన అనుభవించితిరి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి, అన్యజనులు రక్షణపొందుటకై వారితో మేము మాటలాడకుండ మమ్మును ఆటంకపరచుచు, దేవునికి ఇష్టులు కానివారును మనుష్యులకందరికి విరోధులునై యున్నారు (1 థెస్సలొనీకయులకు 2:14-16).

పౌలు థెస్సలొనీకలో మొదట సువార్త ప్రకటించినది మొదలుకొని అతడు ఈ పత్రిక వారికి వ్రాసేంతవరకు, థెస్సలొనీకలో క్రీస్తు కొరకు జీవించువారి జీవితములో హింస ఒక ముఖ్యమైన భాగమైపోయింది. పౌలు ఆ పట్టణములోని విశ్వాసులకు వ్రాయుచుండగా, అతడు ఈ హింస మరియు వారిమీద ఇది చూపు ప్రభావము విషయములో ఎంతో ఆందోళన చెందాడు.

సంఘము యొక్క హింసను గూర్చి మనము ఆలోచుంచునప్పుడు, సంఘము అపొస్తలుడైన పౌలు దినములలో మాత్రమే బహుగా హింసింపబడలేదుగాని... పెంతెకొస్తు దినమున, దేవుని శక్తిని పొంది ముందుకు కొనసాగమని సంఘము ఆజ్ఞను పొందిన నాటి నుండి హింసను అనుభవించింది... కాబట్టి, ప్రతి మలుపులోని సంఘము వెలివేయబడిన, విమర్శించబడిన, దూషించబడిన విధానమును గూర్చి మనము ఆలోచన చేసిన యెడల, యేసు రంగములోనికి దింపిన అదే సంఘము నేడు కూడా పని చేస్తుంది అని మనము అర్థము చేసుకుంటాము. అన్ని శ్రమలు అనుభవించిన తరువాత కూడా అది ఏ విధముగా కొనసాగినదో, నేటికీ ఉనికిలో ఉన్నదో మనము చూస్తాము. మరొక మాట నేను చెప్పగోరుచున్నాను. శరీరధారిగా వచ్చిన వాక్యమైయున్న యేసు క్రీస్తు సువార్తను — ఆనాడు వారు అంతమొందించలేకపోయారు, నేడు అంతమొందించలేరు. కాబట్టి మనము ఆయన సంఘములో ఉన్న సంఘము అయ్యున్నాము, దానిలో భాగమైయున్నాము, మరియు ఈ పనిని ముగించుటకు దేనికీ, పాతాళ లోకపు ద్వారములకు కూడా ఆయన అనుమతినియ్యడు.

— డా. విల్లి వెల్ల్స్

హింసను అనుభవించుటతో పాటుగా, థెస్సలొనీక సంఘము అబద్ధ ప్రవక్తల యొక్క ప్రభావమును కూడా ఎదుర్కొన్నది.

కొన్నివిధాలుగా, సంఘములో అబద్ధ బోధకులు ప్రత్యక్షమగుట ఆశ్చర్యమును కలిగించదు. చరిత్రయంతటిలో, క్రైస్తవులు సుదీర్ఘకాలం హింసను ఎదుర్కొన్నప్పుడు, శ్రమల నుండి విడిపించుటకై యేసు తిరిగిరావాలని వారు ఎల్లప్పుడు నిరీక్షించారు. హింసించబడుచున్న క్రైస్తవులు తమ జీవితమంతటినీ క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు నిరీక్షిస్తూ గడుపుతుంటారు. ఈ జీవితము నిరాశ మరియు బాధను మాత్రమే కలిగించినప్పుడు, యేసు మనలను విడిపించే రోజువైపు మన దృష్టిని త్రిప్పుట సహజమే. అంతేగాక, క్రైస్తవులు క్రీస్తు రాకడ కొరకు ఎక్కువగా కనిపెట్టినప్పుడు, రెండవ రాకడను గూర్చి సందిగ్ధకరమైన దృక్పథములను కలిగిన అబద్ధ ప్రవక్తలు లేక అబద్ధ బోధకుల యొక్క వలలో పడిపోతారు. మరియు థెస్సలొనీక సంఘములో కూడా ఖచ్చితముగా ఇదే జరిగింది.

థెస్సలోనీకలోని అబద్ధ బోధకులు ఎంత ఇబ్బంది కలిగించారో పరిగణించుటకు రెండు విషయాలను చూడవలసి ఉంది: పౌలు మరియు అబద్ధ బోధకుల మధ్య ఏర్పడిన వివాదము, మరియు అబద్ధ బోధకులు బోధించు విషయాలు. మొదటిగా పౌలుతో వివాదమును చూద్దాము.

వివాదము. అబద్ధ బోధకులు పౌలు బోధనను తీవ్రముగా వ్యతిరేకించారు అని 1 మరియు 2 థెస్సలొనీకలోని అనేక భాగములలో స్పష్టమౌతుంది. ఉదాహరణకు, థెస్సలొనీక సంఘము యొక్క పరిస్థితిని గూర్చి తిమోతి ఇచ్చిన నివేదికలను అతడు అందుకొన్నప్పుడు, అబద్ధ బోధకులు విశ్వాసుల సహవాసములో చొచ్చి అతని బోధనలకు వ్యతిరేకముగా మాట్లాడినట్లు పౌలు తెలుసుకున్నాడు. వారు వినిన ప్రతి ప్రవచనమును పరీక్షించుమని థెస్సలొనీకయులకు జ్ఞాపకం చేయుట ఈ సమస్యకు పౌలు ఇచ్చు ఒక సమాధానం అయ్యున్నది. 1 థెస్సలొనీకయులకు 5:20-21లో అతడు మాట్లాడిన మాటలను వినండి:

ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి (1 థెస్సలొనీకయులకు 5:20-21)

“సమస్తమును పరీక్షించి మేలైనదానిని చేపట్టుడి” అని పౌలు థెస్సలొనీకయులను హెచ్చరించాడు, ఎందుకంటే వారు పొందుకొనిన ఉపదేశములోని ప్రతి విషయము వారు పరిశోధించాలని అతడు ఆశించాడు. లేఖనములు మరియు పౌలు బోధనల నుండి వాస్తవమని తమకు తెలిసిన వాటితో సంబంధములేని ప్రతి విషయమును విస్మరిస్తూ వారు మంచిని మాత్రమే స్వీకరించాలి. కాని అబద్ధ బోధకులు అంత సులభంగా విడిచిపెట్టలేదు. బదులుగా, వారు తమ అబద్ధ సిద్ధాంతములను బోధించుట మరియు ప్రకటించుట కొనసాగించారు. వాస్తవానికి, పౌలు రెండవ థెస్సలొనీక పత్రిక వ్రాయునాటికి, థెస్సలొనీకయులను తమ అభిప్రాయములలోనికి ఆకర్షించే ప్రయత్నంలో వారు పౌలు పేరుతో నకిలీ పత్రికలను కూడా వ్రాసినట్లు తెలుస్తుంది. 2 థెస్సలొనీకయులకు 2:1-2లో పౌలు దీనిని గూర్చి ఆందోళనను వ్యక్తపరచాడు:.

సహోదరులారా, … ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు … మిమ్మును వేడుకొనుచున్నాము (2 థెస్సలొనీకయులకు 2:1-2).

2 థెస్సలొనీకయులకు 3:17లో అతడు వ్రాసిన మాటలలో కూడా నకిలీ పత్రికల యొక్క సమస్య కనిపిస్తుంది:

పౌలను నేను నా చేవ్రాతతో వందనమని వ్రాయుచున్నాను. ప్రతి పత్రికయందును అదే గురుతు, నేను వ్రాయుట ఈలాగే (2 థెస్సలొనీకయులకు 3:17).

తన పత్రికలను నకిలీ పత్రికల నుండి భిన్నముగా చూపుట కొరకు 2వ థెస్సలొనీక పత్రిక వ్రాస్తూ పౌలు నేను నా చేవ్రాతతో వ్రాయుచున్నాను అను మాటలను ఒక సంతకము రూపములో ఉపయోగించాడు. థెస్సలొనీకయులు నిజముగా అతడు వ్రాసిన పత్రికలను కనుగొనుటలో సహాయము చేయుటకు అతడు ఇలా చేశాడు.

ఒక వ్యక్తి మరొకని పేరు ఉపయోగించి పత్రికను వ్రాయుట వెనుక ఉన్న అత్యంత స్పష్టమైన ఒక కారణము ఆ వ్యక్తి యొక్క అధికారమును సంపాదించుట అయ్యున్నది, కాబట్టి, ఒక పౌలు విద్యార్థి, లేక విశ్వాసములో విరోధి, తాను తన సొంత శక్తితో చేయలేని కొన్ని పనులను సంఘములో చేయగోరియుండి, దాని కొరకు పౌలు యొక్క పేరును ఉపయోగించుకొనియుండవచ్చు. మరొకరి పేరును ఉపయోగించి వ్రాయుట ప్రాచీన సాహిత్యములో ఒక సుపరిచితమైన లక్షణమైయున్నది అని కొందరు వాదిస్తారు ... ఒకవేళ అలానే జరిగియుంటే, ఇది అందరికి తెలిసిన విషయము మరియు ఇలా వ్రాయుట సహజమే అని రుజువు చేస్తే తప్ప, ఇట్టి కార్యములను అనుకూలమైన ఉద్దేశ్యములను వివరించుట కష్టమవుతుంది. అయితే ఇలా జరుగలేదు అని చాలామంది భావిస్తారని — లేక ఎక్కువమంది ఇవాంజెలికల్ పండితులు భావిస్తారని — నా ఆలోచన. ఒకవేళ నిజముగా నకిలీ పత్రికలు వ్రాయబడియుంటే, అది మంచి కారణముల కొరకైనా లేక చెడ్డ కారణముల కొరకైనా ఒకరు పౌలు యొక్క అధికారమును ఉపయోగించుటకు ప్రయత్నించుచున్నారు అని అర్థము.

— డా. జోసెఫ్ డి. ఫన్టిన్

పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రికను మనము చదువుచుండగా అబద్ధ ప్రవక్తలతో ఈ వివాదము మరొక సమస్యకు దారితీస్తుంది. ఈ అబద్ధ ప్రవక్తలు ఏమి బోధించారు?

బోధ. అబద్ధ బోధకులు బోధించిన విషయములన్నీ మనకు ఖచ్చితంగా తెలియవుగాని, థెస్సలొనీకలో జరుగుచున్న హింసను మనం జ్ఞాపకం చేసుకున్నట్లైతే మరియు థెస్సలొనీకయులకు పౌలు వ్రాసిన పత్రికలోని విషయాలను మనం పరిశీలించినట్లైతే, క్రీస్తు రెండవ రాకడను గూర్చి అబద్ధ ప్రవక్తలు అనేక రకములైన అపోహలను కలిగియుండిరి మనం భావించవచ్చు. అన్నిటి కంటే ఎక్కువగా, యేసు వెంటనే తిరిగి వస్తాడు అని వారు బోధించారు. వాస్తవానికి, ఇది మనకు ఎంత ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ, కొందరు అబద్ధ ప్రవక్తలు క్రీస్తు అప్పటికే వచ్చేశాడు అని ప్రకటించారు.

2 థెస్సలొనీకయులకు 2:1-3ను వినండి:

సహోదరులారా, ప్రభువుదినమిప్పుడే వచ్చి యున్నట్టుగా ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడనుబట్టియు, మనము ఆయనయొద్ద కూడుకొనుటను బట్టియు, మిమ్మును వేడుకొనుచున్నాము.... ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి (2 థెస్సలొనీకయులకు 2:1-3).

స్పష్టంగా, థెస్సలోనీకలోని సంఘము క్రీస్తు రాకడను చూచుటలో విఫలమైయ్యారు అని కనీసం కొందరు అబద్ధ బోధకులు బోధించారు. అబద్ధ బోధకులు ఈ ఆలోచనలను కాబిరస్ ను ఆరాధించిన థెస్సలొనీక పౌరుల యొక్క అబద్ధ మతము నుండి తీసుకున్నారు అని చెప్పవచ్చు, కాబిరస్ క్రమానుగతంగా లోకముకు తిరిగి వస్తానని చెప్పిన హత్యచేయబడిన స్థానిక యోధుడు. క్రీస్తు అప్పటికే తిరిగివచ్చాడు అని థెస్సలొనీకయులకు చెప్పుట ద్వారా అబద్ధ బోధకులు ఈ విధమైన దృక్పథమును క్రైస్తవ విశ్వాసముకు అనువర్తించారు. ఈ తప్పులకు మూలము ఏదైనప్పటికీ, పౌలు అబద్ధ బోధకులను ఖండించాడు మరియు క్రీస్తు రాకడను గూర్చి అతడు వారికి చెప్పిన విషయములను పట్టుకొనియుండమని థెస్సలొనీకయులను హెచ్చరించాడు.

యేసు తిరిగివచ్చు సమయము ఎవరికీ తెలియదు, కాబట్టి మనము తేదీలను నిర్ణయించము, మరియు ప్రజలను భయపెట్టుటకు, లేక ఇతర హేతువులు మరియు ఉద్దేశ్యముల ద్వారా డబ్బు సంపాదించుటకు తేదీలను నిర్ణయించు అబద్ధ బోధకుల మాటలలో పడిపోయి మోసపోకుండా మనము మన స్నేహితులకు సహాయము చేయవచ్చు. కాబట్టి, యేసు రెండవ రాకడ యొక్క సమయమును నిర్ణయించుట కఠినమైన పని. ఆయన రాకడ కొరకు ఎదురుచూస్తూ మనము జీవించాలి. ఆయన వచ్చుటకు ముందు కొన్ని కార్యములు జరగాలని ప్రభువు చెబుతున్నాడు. అయితే అన్నిటి కంటే ముఖ్యముగా, ఆ సమయము మనకు తెలియదు, కాబట్టి మనము దానిని దేవుని చేతికి వదిలిపెడతాము, మరియు ఆయన ప్రేమించు మరియు ఆయన కొరకు జీవించు పనిలో మనము నిమగ్నమైపోతాము.

— డా. రాబర్ట్ ఏ. పీటర్సన్

హింస మరియు అబద్ధ ప్రవక్తల సమస్యలు థెస్సలోనిక సంఘములోకి ఎలా ప్రవెశించాయో మనము చూశాము కాబట్టి, క్రైస్తవ జీవనమును గూర్చిన కొన్ని ఆచరణాత్మక సమస్యలను మరియు ఈ సమస్యలు సంఘమును ప్రభావితం చేసిన కొన్ని మార్గములను ఇప్పుడు చూద్దాము.

పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రికలలో కొన్ని ప్రధానమైన సమస్యలు కనిపిస్తాయి, కాని మనము రెంటిని మాత్రమే చూద్దాము: నిరుత్సాహము మరియు బాధ్యతారహితము. మొదటిగా థెస్సలొనీకయుల యొక్క నిరుత్సాహమును పరిశీలిద్దాము.

నిరుత్సాహము. సాధారణంగా, యేసు రాకడ సమీపముగా ఉన్నది అని క్రైస్తవులు నమ్మినప్పుడు మొదట వారు ఎంతో ఉత్సాహమును ఎదుర్కొంటారు. అయితే, క్రీస్తు యొక్క తక్షణ రాకడను గూర్చిన ప్రవచనములు విఫలమైనప్పుడు, వారు నిరుత్సాహపడతారు మరియు నిరాశకు గురవుతారు. థెస్సలొనీకలో, అనేకమంది విశ్వాసులు క్రీస్తునందు విశ్వాసము వలన హింసను ఎదుర్కొన్నారు. మరియు అబద్ధ ప్రవక్తల యొక్క ప్రభావము వలన, క్రీస్తు యొక్క తక్షణ రాకడ యొక్క నిరీక్షణ చుట్టూ తమ జీవితములను కేంద్రీకృతము చేశారు. అయితే, నెలలు గడచిపోయిన తరువాత కూడా, పరిస్థితి మారలేదు. తమ తోటి విశ్వాసులలో అనేకమంది మరణించినప్పుడు, సజీవులుగా ఉన్నవారు మరణించిన విశ్వాసుల యొక్క నిత్య గమ్యమును గూర్చి కలతచెందారు. ఈ ఆందోళన వారిని అనుమానములలోకి నడిపించింది మరియు అనుమానములు నిరుత్సాహమును కలిగించాయి.

1 థెస్సలోనీకయులకు 4:13-14లో పౌలు వారిని మృదువుగా సరిచేసిన విధానమును వినండి:

సహోదరులారా, నిరీక్షణలేని యితరులవలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము, నిద్రించుచున్నవారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును (1 థెస్సలొనీకయులకు 4:13-14).

మరణించిన పరిశుద్ధులు భౌతికంగా చనిపోయినప్పటికీ, వారు క్రీస్తులో సజీవముగా ఉన్నారు, మరియు ఆయన తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనతో కూడా వస్తారు అను నిశ్చయతను పౌలు థెస్సలొనీకయులకు ఇచ్చాడు.

ఆశించని విధముగా దేవుని రాజ్యము ఆలస్యము చేయబడుట, అసలైన శ్రోతల యొక్క దృక్పధములను ఏ విధముగా ప్రభావితము చేసింది అని మనము ఆలోచించాలి... క్రీస్తు ఆరోహణమైయ్యాడు, దీనిని గూర్చి సువార్తలు సాక్ష్యమిస్తాయి. అపొస్తలులు దీనికి సాక్ష్యమిచ్చారు, మరియు సువార్తలలోను, అపొస్తలుడైన పౌలు రచనలలో కూడా క్రీస్తు త్వరగా వస్తున్నాడని అర్థము చేసుకొనబడుచున్న సాక్ష్యములు ఉన్నాయి, కాబట్టి, మొదటి శతాబ్దపు క్రైస్తవులు క్రీస్తే ప్రభువని బహిరంగముగా ఒప్పుకొనుచు, హింసలు, శ్రమలు, సాధారణ కష్టములు, లేక ఆర్థిక అవకతవకలు, ప్రాంతములు మారుటను అనుభవించుచుండగా, యేసు తిరిగి వస్తానని చెప్పిన వాగ్దానము విఫలమైనదా? అని వారు ఆశ్చర్యపోయియుంటారు ... వారికి కొంత నిరీక్షణ యొక్క అవసరత ఉండినది; వారు ఆశించిన విధముగా పనులు జరుగకపోయినప్పటికీ, దేవుని వాగ్దానములు విఫలము కాలేదు అని, వారు స్థిరముగా నిలబడాలనే — మరియు వారు ఈ పరిస్థితికి ఈ విధముగానే స్పందించాలనే — నిశ్చయత వారికి అవసరమైయుండినది మరియు క్రీస్తు అధిగమించాడు అని తెలుసుకొని విశ్వాసములో స్థిరముగా నిలబడవలసియుండెను.

— రెవ. మైఖేల్ గ్లోడో

నిరుత్సాహముతో పాటుగా, అబద్ధ బోధకుల యొక్క సందేశము బాధ్యాతారహితముగా జీవించుటకు కారణమైయ్యింది.

బాధ్యాతారహితము. థెస్సలొనీకయలో ఏమి జరిగిందో అర్థం చేసుకొనుట అంత కష్టమేమీ కాదు. మిమ్మును మీరు వారి పరిస్థితిలో ఊహించుకొనండి. ప్రపంచము తరువాత నెలలో అంతమైపోతుంది అని మీరు నమ్మినప్పుడు, మీరు పనులకు వెళ్తారా మీ ఇంటిని బాగుచేయించుకుంటారా? మీ పిల్లల కొరకు విద్యాలయాలు నిర్మిస్తారా? యేసు కేవలం కొద్ది దినములలోనే తిరిగి వస్తాడు అని మీరు నిశ్చయత కలిగియుండినప్పుడు, సాధారణ కార్యములు అంత ప్రాముఖ్యమైనవి అనిపించవు. థెస్సలొనీకలో ఇదే జరిగింది. తమను తాము పోషించుకొనుటకు పని చేయవలసిన అవసరతలేదని మరియు సాధారణ దైవికమైన జీవితములో నిమగ్నమవ్వాలని అబద్ధ ప్రవక్తలు కొందరు క్రైస్తవులను నమ్మించారు. “యేసు వెంటనే తిరిగి వస్తున్నప్పుడు పని చేయవలసిన అవసరం ఏమిటి?” అన్నట్టుగా ఉంది వారి వైఖరి. అందుకే 1 థెస్సలొనీకయులకు 4:11-12లో పౌలు ఇలా వ్రాశాడు:

సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక, మీ సొంతకార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశకలిగి యుండవలెననియు, మిమ్మును హెచ్చరించుచున్నాము (1 థెస్సలొనీకయులకు 4:11-12).

విచారకరముగా, దినచర్యల మీద దృష్టిపెట్టాలని పౌలు హెచ్చరించిన పిమ్మట కూడా, థెస్సలొనీకలోని కొందరు విశ్వాసులు తమ బాధ్యతలను చేపట్టలేదు. కాబట్టి, 2 థెస్సలొనీయులకు వ్రాసిన పత్రికలో పౌలు మరలా ఈ అంశమును గూర్చి మాట్లాడాడు, కాని ఈ సారి మరింత కఠినముగా మాట్లాడాడు. 3:6-12లో అతడు ఇలా వ్రాశాడు:

సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకా రముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము... మేము మీ యొద్ద ఉన్నప్పుడు- ఎవడైనను దప్పిగొనిన యెడల నాయొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. మీలోకొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము (1 థెస్సలొనీకయులకు 3:6-12).

క్రీస్తు యొక్క తక్షణ రాకడను గూర్చిన అబద్ధ ప్రవచనములు థెస్సలొనీకయులు సోమరులుగాను, పనిలేనివారిగాను ఉండుటకు కారణమయ్యాయి. మరియు, కాసేపట్లో మనము చూడబోవుచున్నట్లు, సోమరితనము ఇతర సమస్యలకు దారితీసింది. కాబట్టి, థెస్సలొనీకలోని క్రైస్తవుల మధ్య పరస్పర సంబంధము గల అనేక సమస్యలు తలెత్తాయని పౌలు గుర్తించాడు. హింస, క్రీస్తు యొక్క తక్షణ రాకడను గూర్చి అబద్ధ ఆకాంక్షలు కలిగించుటకు అబద్ధ ప్రవక్తలకు మార్గములను సరాళము చేశాయి. మరియు ఆ అబద్ధ ఆకాంక్షలు నిరుత్సాహము మరియు బాధ్యతారహితమువంటి అనేక ఆచరణాత్మక సమస్యలకు దారితీసాయి. ఈ కఠినమైన సమస్యలతో వ్యవహరించుటలో థెస్సలొనీకయులకు సహాయము చేయుటకు పౌలు 1 మరియు 2 థెస్సలొనీయ పత్రికలను వ్రాశాడు.

పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రికకు నేపథ్యముగా ఉన్న కొన్ని సందర్భములను మనము చూశాము గనుక ఇప్పుడు ఈ పత్రికల యొక్క నిర్మాణము మరియు విషయములను చూచుటకు సిద్ధంగా ఉన్నాము. పౌలు థెస్సలొనీకయులకు ఏమి వ్రాశాడు? వారి సమస్యలకు అతడు ఎలా స్పందించాడు?

పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన రెండు పత్రికల మధ్య అనేక పోలికలు ఉన్నాయి. అతడు వారికి బోధించిన విషయములకు నమ్మకముగా ఉండి, అబద్ధ ప్రవక్తలను తిరస్కరించి, తమ అనుదిన జీవితములలో బాధ్యతాయుతముగా జీవించమని తన రెండు పత్రికలలో అతడు థెస్సలొనీకలో ఉన్న విశ్వాసులకు పిలుపునిచ్చాడు. అలాంటప్పుడు, పౌలు వారికి రెండవ పత్రికను ఎందుకు వ్రాశాడు? ఇంతకు ముందు మనము ప్రస్తావించినట్లు, 2 థెస్సలొనీక పత్రికలో కనిపించు ఒక విషయం ఏమిటంటే, నకిలీ పత్రికలను గూర్చి పౌలు ఇచ్చిన హెచ్చరిక. తమ అభిప్రాయములకు మద్దతునిచ్చుటకు పౌలు వ్రాశాడని చెప్పుకొనుచు పత్రికలను వ్రాయుట ద్వారా థెస్సలొనీకలో ఉన్న అబద్ధ ప్రవక్తలు సంఘము మీద తమ ప్రభావమును కొనసాగించుటకు ప్రయత్నించియుండవచ్చు. స్పష్టముగా, ఈ ప్రయత్నము కొంత వరకు సఫలమైనది కాబట్టే, అపొస్తలుడు థెస్సలొనీకయులకు రెండవ సారి వ్రాయవలసివచ్చింది.

ప్రతి పత్రిక యొక్క ప్రధాన భాగములలోని విషయములను సంగ్రహిస్తూ ఈ రెండు థెస్సలొనీక పత్రికలను మనం క్లుప్తంగా పరిశీలిద్దాము. థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రికతో ఆరంభిద్దాము.

పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన మొదటి పత్రిక ఐదు ప్రధానమైన భాగములుగా విభాగించబడుతుంది:

మొదటిగా, 1:1లోని శుభవచనము;

రెండవదిగా, 1:2-2:16లో కృతజ్ఞత నివేదిక;

మూడవదిగా, 2:17-3:13లో పౌలు గైర్హాజరీని గూర్చిన చర్చ;

నాల్గవదిగా, 4:1-5:22లో సంఘము కొరకు పౌలు ఇచ్చిన సూచనలు;

మరియు ఐదవదిగా, 5:23-38లో కొన్ని ముగింపు వ్యాఖ్యలు.

పౌలు ఇచ్చిన శుభవచనము మరియు ముగింపు వ్యాఖ్యలతో ఆరంభిద్దాము.

పౌలు వ్రాసిన అనేక ఇతర పత్రికలలో వలెనే, 1 థెస్సలొనీక పత్రికలోని మొదటి మరియు చివరి భాగములు క్లుప్తంగాను మరియు స్పష్టంగాను ఉన్నవి. ఈ పతిక్ర థెస్సలొనీకయులకు సంబోధించబడింది అని మరియు దీనిని పౌలు వ్రాశాడు అని 1:1లో ఉన్న శుభవచనము పేర్కొంటుంది. ఆసక్తికరంగా, సీల మరియు తిమోతి సహ-రచయితలుగా ఉన్నారు అని కూడా ఇది తెలియజేస్తుంది. ఇందువలనే అనేక సందర్భాల్లో, తిమోతి మరియు సీలతో పాటుగా పౌలు అని అర్థము నిచ్చుటకు 1 థెస్సలొనీక పత్రిక “మేము” మరియు “మా” అను పదములను ఉపయోగిస్తుంది. అవును, సీల మరియు తిమోతి పౌలు యొక్క అపొస్తులత్వ అధికారమును పంచుకొనలేదు, కాబట్టి కేవలము పౌలు అధికారములోనే ఈ పత్రిక బైబిలులో చేర్చబడింది. 5:23-28లో ఉన్న ముగింపు వ్యాఖ్యలు కూడా చాలా సరళముగా ఉన్నాయి. ఈ భాగములో ఆశీర్వచనము, ప్రార్థించమని విన్నపము, మరియు చివరి అభివాదము ఉన్నాయి.

1 థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రికలోని రెండవ భాగముకు — అనగా 1:2-2:16లో ఉన్న కృతజ్ఞత నివేదికకు — కొనసాగినప్పుడు పత్రికలోని సంక్లిష్టమైన భాగముకు మనం చేరుకుంటాము. ఈ భాగమంతయు పౌలు దేవునికి కృతజ్ఞతలు తెలుపుటను గూర్చి మాట్లాడుతుంది మరియు మూడు ప్రధాన భాగములుగా విభాగించబడుతుంది.

ఉపద్రవమందు సహనము. మొదటిగా, 1:2-10లో, ఉపద్రవమందు థెస్సలొనీకయుల చూపిన సహనమును బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలిపానని పౌలు వివరించాడు. మనము చూచినట్లుగా, అవిశ్వాసులైన యూదులు మరియు అన్యజనులు థెస్సలొనీకలోని విశ్వాసులను హింసించారు, కాని ఈ విశ్వాసులు క్రీస్తు యెడల సమర్పణ విషయములో తొలగిపోలేదు. బదులుగా, ఆయనయందు వారికున్న నిరీక్షణ మరింత బలపడింది. 1 థెస్సలొనీకయులకు 1:6-7లో పౌలు వారిని మెచ్చుకున్న విధానమును వినండి:

పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికిని మాదిరియైతిరి; ఎందుకనగా మీయొద్దనుండి ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను (1 థెస్సలొనీకయులకు 1:6-7).

థెస్సలొనీకయులు హింసకు ఆనందముతో స్పందించారు, మరియు కఠిన సమయములలో వారి నమ్మకత్వము ఇతరులకు మాదిరికరముగా ఉండినందున పౌలు దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.

ప్రత్యక్ష జ్ఞానము (2:1-12). రెండవదిగా, 2:1-12లో, ఆయనను గూర్చి థెస్సలొనీకయులు కలిగియున్న ప్రత్యక్ష జ్ఞానమును బట్టి పౌలు వారికి కృతజ్ఞతలు తెలిపాడు. అబద్ధ బోధకులు తరువాత పౌలు యొక్క ఉద్దేశ్యములను సవాలు చేశారు కాబట్టి పౌలును గూర్చి వారు వ్యక్తిగత జ్ఞానమును కలిగియుండుట చాలా ప్రాముఖ్యమైయున్నది. 1 థెస్సలొనీకయులకు 2:9-10లో అతడు ఈ మాటలు వ్రాశాడు:

అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి (1 థెస్సలొనీకయులకు 2:9-10).

పౌలు థెస్సలొనీకయుల నుండి ప్రయోజనం పొందుకుంటున్నాడని మరియు అతడు వారిని తప్పుదారి పట్టించి వారి మీద అతనికున్న అధికారమును దుర్వినియోగపస్తున్నాడని చెప్పి అబద్ధ బోధకులు పౌలును కించపరచడానికి ప్రయత్నించారు. స్పష్టంగా, సంఘములో కనీసం కొందరు ఈ అబద్ధ ఆరోపణలను నమ్మడం కూడా ఆరంభించారు. ఈ కారణము చేత, అతడు మరియు అతని సహచరులు వారి ఎదుట “భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను” జీవించిన విధానమును వారు తమ సొంత కన్నులతో చూసినందుకు అతడు ఎంత సంతోషించాడో పౌలు వారికి తెలిపాడు. ప్రతి అబద్ధ ఆరోపణను తిరస్కరించునంతగా అతడు వారికి సుపరిచితుడు.

అధికారము యొక్క గుర్తింపు (2:13-16). ఇంచుమించు ఇదే విధముగా, 2:13-16లో కనిపించు పౌలు యొక్క కృతజ్ఞతను గూర్చి మూడవ విభాగములో, థెస్సలొనీకయులు తన అధికారమును గుర్తించిరి కాబట్టి పౌలు కృతజ్ఞతలు తెలిపాడు. 1 థెస్సలొనీకయులకు 2:13లో దీనిని గూర్చి అతడు ఏమి చెప్పాడో వినండి:

ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్యమని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది. (1 థెస్సలొనీకయులకు 2:13).

థెస్సలొనీకయులు పౌలు బోధనను దేవుని వాక్యముగా అంగీకరించారు. మరియు వారిలో ఉన్న నిజమైన విశ్వాసులు అతని బోధనకు నమ్మకముగా ఉండి, అబద్ధ ప్రవచనములను తిరస్కరిస్తారని ఇది అతనికి నిశ్చయత కలుగజేసింది.

పౌలు ప్రజలకు స్పందించిన విధానము వారు అతనిని వ్యక్తిగతముగా ఎలా స్వీకరించియుండేవారు అనేదాని కంటే అతడు మాట్లాడిన వాక్యమును వారు ఏ విధముగా స్వీకరించారు అను విషయమును గూర్చినదైయున్నది. చూడండి, ప్రజలు అతనిని హత్తుకొనకపోయినప్పటికీ, క్రీస్తు వాక్యము వ్యాపిస్తే తాను ఆనందిస్తాను అని ఫిలిప్పీ పత్రికలో అతడు చెబుతున్నాడు. థెస్సలొనీకయుల విషయములో, వారు పౌలును వ్యక్తిగతముగా స్వీకరించారు, అలాగే అతడు తెచ్చిన వాక్యమును కూడా వారు గొప్ప ఆనందముతో స్వీకరించారు... వారి యొద్దకు అతని రాయబారి ద్వారా పంపబడిన దేవుని వాక్యమును, అతడు వారికి బోధించిన వాక్యమును వారు స్వీకరించిన విధానమును బట్టి పౌలు ఎంతగానో ఆనందించాడు, మరియు వారు పురోగతిని పొందుచున్న ప్రజలైయున్నారు; ఇది “మనము ఎక్కడ ఉన్నాము” అను విషయము కాదుగాని “ఎక్కడికి వెళ్లుచున్నాము” అనునది అయ్యున్నది. మరియు ఈ థెస్సలొనీకయులు సత్యమును హత్తుకొనిరి మరియు సత్యములో జీవించుటకు కొనసాగుచుండిరి కాబట్టి, ప్రతి ఒక్క నమ్మకమైన కాపరి వలెనే ఇది అపొస్తలుడైన పౌలు యొక్క ప్రాణమును ఆనందింపజేసింది.

— రెవ. డెన్ హెండ్లె

అతడు వారిపట్ల ఎంత కృతజ్ఞుడుగా ఉన్నాడో తెలియజేయుట ద్వారా థెస్సలొనీకయులను ప్రోత్సహించిన తరువాత, పత్రికలోని మూడవ ప్రధాన భాగమును పౌలు ఆరంభించాడు. ఇక్కడ, 2:17-3:13లో థెస్సలొనీకలో అతడు లేకపోవుటను గూర్చి పౌలు మాట్లాడాడు. స్పష్టముగా, పౌలు థెస్సలొనీక విశ్వాసులను విడిచి, ఇతర ప్రాంతములకు ప్రయాణించి వెళ్లిన విధానమును బట్టి అనేక ప్రశ్నలు తలెత్తాయి.

చింతించవలసిన విషయము (2:17–3:5). పౌలు ఈ విషయమును గూర్చి మూడు ప్రధానమైన మార్గములలో మాట్లాడాడు: మొదటిగా, 2:17-3:5లో, పౌలు థెస్సలొనీకయుల పట్ల కలిగియున్న హృదయపూర్వక చింతను ధృవీకరించాడు. మరియు తిమోతిని వారి యొద్దకు పంపుట ద్వారా అతడు దీనిని ప్రత్యక్షపరచాడు. 1 థెస్సలొనీకయులకు 3:1-2లోని పౌలు మాటలను వినండి:

కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి, యీ శ్రమలవలన ఎవడును కదిలింపబడకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకును, మీ విశ్వాసవిషయమై మిమ్మును హెచ్చరించుటకును, మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడునైన తిమోతిని పంపితిమి (1 థెస్సలొనీకయులకు 3:1-2).

ఆనందము (3:6-10). హృదయపూర్వకమైన కాపరి చింతతో పాటుగా, 3:6-10లో, తిమోతి థెస్సలొనీకయుల నుండి తెచ్చిన సమాచారమును — అనగా విశ్వాసులు తమ విశ్వాసమునందు స్థిరముగా ఉన్నారు, పౌలు వారిని గూర్చి చింతించుచున్న విధముగానే వారు కూడా పౌలును గూర్చి చింతించుచున్నారు అను సమాచారమును — విని పౌలు సంతోషించాడు. ఈ సమాచారము పౌలుకు ఎంత సంతోషము కలిగించింది అంటే, 1 థెస్సలొనీకయులకు 3:8-9లో అతడు ఇలా వ్రాశాడు:

ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే... మన దేవునియెదుట మిమ్మునుబట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఏలాగు చెల్లింపగలము? (1 థెస్సలొనీకయులకు 3:8-9).

తిమోతి అందించిన మంచి సమాచారము వినిన తరువాత పౌలు యొక్క దుఃఖము ఆనందముగాను, నిశ్చయతగాను మారిపోయింది.

ప్రార్థన (3:11-13). మూడవదిగా, 3:11-13లో, పౌలు థెస్సలొనీకయులను గూర్చి వేడుకుంటూ, “నిరాటంకముగా” వారిని తిరిగి దర్శించుటకు మార్గము సరాళము చేయమని తండ్రిని ప్రార్థించాడు.

1 థెస్సలొనీక పత్రిక 3వ అధ్యాయము యొక్క చివరిలో, వారు క్రీస్తునందు పరిశుద్ధతలో ఎదగాలని, క్రీస్తునందు నిందారహితమైన జీవితమును జీవించాలని పౌలు కలిగియుండిన ఆశను వ్యక్తపరుస్తూ థెస్సలొనీక పత్రిక యొక్క ముగింపు ఆశీర్వచనములను పలుకుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే వారు సఫలీకృతులు కావాలని అతడు కోరుచున్నాడు. క్రీస్తు కొరకు వారు గొప్ప సాక్షులుగా జీవించాలని అతడు కోరుచున్నాడు. మరియు క్రీస్తు అనుచరులకు లభించు ఆశీర్వాదములన్నిటిని వారు ఆస్వాదించాలని అతడు కోరాడు. కాబట్టి, ఆ మాటలలో పౌలు వారి కొరకు కలిగియుండిన నిజమైన ప్రేమ కుమ్మరింపబడింది అని నా ఆలోచన, ఎందుకంటే, వారు తుదకు ఏమి కావాలని అతడు కోరుచున్నాడు మరియు వారు ఏ విధముగా సఫలీకృతులు కావాలని అతడు కోరుచున్నాడో అది చూపుతుంది. మరియు ఆ క్షణమందు వారు ఎదుర్కొనుచుండిన సమస్యలన్నీ, అతని ప్రేమను ఏ విధముగా కూడా తగ్గించలేవు. వాస్తవానికి, అవి అతని ప్రేమను మరింత బలపరుస్తాయి కాబట్టి వారు పరిశుద్ధతలోనికి మరియు క్రీస్తు యొక్క పోలికలోనికి వారి శ్రేయస్సు కొరకు మరియు వారి సొంత ఆనందము కొరకు మార్చబడాలని అతడు ఎదురుచూశాడు.

— డా. డాన్ లఖీఖ్

థెస్సలొనీక పత్రికలోని నాలుగవ ప్రధాన భాగము 4:1-5:22లో కనిపిస్తుంది, మరియు థెస్సలొనీక సంఘమునకు పౌలు ఇచ్చిన సూచనలను తెలియజేస్తుంది. మనము ఇంతకు ముందే ప్రస్తావించినట్లు, క్రీస్తు యొక్క తక్షణ రాకడను గూర్చిన ఆలోచనలతో థెస్సలొనీక విశ్వాసులలో చాలామంది ఎంతగా మైమరచిపోయారు అంటే, ప్రస్తుత లోకములో క్రీస్తు మరియు ఆయన అపొస్తలుల బోధనలను అనుసరించు విషయంలో ఆసక్తిని కోల్పోయారు. కాబట్టి, అనేక విశేషమైన సూచనలను పౌలు వారికి ఇచ్చాడు. యేసు రాకడను గూర్చిన నిరీక్షణను థెస్సలొనీకయులు విడిచిపెట్టకూడదని అతడు ఆశించాడు, కాని క్రీస్తు తక్షణమే తిరిగిరాడు అను విషయమును వారు గుర్తించాలని అతడు కోరాడు. అప్పటి వరకు, ప్రభువు ఆజ్ఞాపించినట్లు వారు జీవించాలని అతడు కోరాడు.

ఈ భాగము పౌలు థెస్సలొనీకయులకు ఇచ్చిన సూచనలను సుదీర్ఘమైన రీతిలో తెలియజేస్తుంది, మరియు దీనిని మూడు ప్రధానమైన భాగములుగా విభాగించవచ్చు. 4:1-12లో ఉన్న మొదటి భాగము నైతిక జీవనమును గూర్చి మాట్లాడుతుంది. 4:13-5:11లో ఉన్న రెండవ భాగము, క్రీస్తు రాకడను గూర్చి మాట్లాడుతుంది. మరియు 5:12-22లో ఉన్న మూడవ భాగము, చివరి సూచనలను ఇస్తుంది. నైతిక జీవనమును గూర్చి పౌలు ఇచ్చిన సూచనలతో ఆరంభించి, ఒకొక్క భాగమును చూద్దాము.

నైతిక జీవనము (4:1-12). నైతిక జీవనమును గూర్చి పౌలు ఇచ్చిన సూచనలను నాలుగు భాగములలో పరిగణిద్దాము, 4:1, 2లో ఉన్న క్లుప్త పరిచయముతో ఆరంభిద్దాము. పరిచయములో, పౌలు తన మునుపటి ఆజ్ఞలను పాటించినందుకు థెస్సలొనీక విశ్వాసులందరిని ప్రశంసించాడు. అవును, అతని సూచనలను నిర్లక్ష్యము చేయునట్లు వారు బహుగా శోధింపబడ్డారని అతనికి తెలుసు, ఎందుకంటే అతని ప్రత్యర్థులు నిశ్చయముగా — బహుశా స్పష్టంగా — భూసంబంధమైన బాధ్యతలు మరియు బాధ్యతల నుండి స్వేచ్ఛను వాగ్దానం చేశారు. కాబట్టి, తన బోధన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారమును కలిగి ఉందని పౌలు థెస్సలొనీకయులకు జ్ఞాపకం చేశాడు. థెస్సలొనీకయులు అతని మాటలను నిర్లక్ష్యము చేస్తే దేవుడే వారిని సరిచేస్తాడు.

పరిచయము తరువాత, 4:3-8లో లైంగికముగా పవిత్రులైయుండమని ఆజ్ఞాపిస్తూ నైతిక జీవనము కొరకు అతడిచ్చిన పిలుపును పౌలు కొనసాగించాడు. థెస్సలొనీక విశ్వాసులు పాపముకు దూరముగా ఉండాలని మరియు క్రీస్తు పట్ల తమ విధేయతలో వృద్ధిపొందాలని పౌలు తరచుగా ఆశించాడు. మరియు, ఇంతము ముందే మనము ప్రస్తావించినట్లు, థెస్సలొనీక సంఘములో అబద్ధ బోధకులు బహుశా ప్రకటించిన పాపముల మీద అతడు ప్రత్యేక దృష్టిపెట్టాడు. ఈ కారణము చేత, సంఘములో లైంగిక పవిత్రతను గూర్చి అతడు సూటిగా మాట్లాడుతున్నాడు.

మనలో చాలామందికి ఇది ఎంత వింతగా అనిపించినప్పటికీ, చరిత్రయందంతటా, లోకము యొక్క అంతము సమీపములో ఉన్నదని నమ్మిన అనేక మత గుంపులు లైంగిక అనైతికతలో మునిగిపోయారు. మరియు థెస్సలొనీకయులు సంతానోత్పత్తి మతము యొక్క అలవాట్లలో లైంగిక అనైతికత భాగమైయుండిన సంస్కృతిలో జీవించారని మనము తెలియజేయాలి. బహుశా అత్యంత సందర్భోచితమైన ఉదాహరణను థెస్సలొనీకయుల యొక్క పౌర ఆరాధనలో మనం చూస్తాము. ఈ అబద్ధ మతము లైంగిక అనైతిక ప్రవర్తనతో కూడిన ఆరాధన చేస్తూ కాబిరాస్ దేవత యొక్క రాకను వేడుకగా జరుపుకొంటారు. ఈ నేపథ్యములో, క్రీస్తు అనుచరులు కూడా లైంగిక అనైతికతలో పడిపోవునట్లు శోధింపబడ్డారు. ఇది ఎంత పెద్ద సమస్య అంటే, తన మాటల వెనుక ఉన్న దైవిక అధికారమునకు మరొక ఉద్ఘాటనను ఇస్తూ పౌలు ఈ భాగమును ముగించుచున్నాడు.

అతని పరిచయం మరియు లైంగిక పవిత్రత కొరకు ఇవ్వబడిన పిలుపు తరువాత, 4:9-10లో, పౌలు థెస్సలొనీకయుల యొక్క సహోదర ప్రేమను బట్టి వారిని మెచ్చుకొనుట వైపుకు నైతిక జీవనమును గూర్చిన తన సంభాషణను మరల్చాడు. పౌలు థెస్సలొనీకయుల యొక్క సహోదర ప్రేమను బట్టి వారిని మెచ్చుకుని, ప్రేమలో మరింత బలపడాలని వారిని ప్రోత్సహించాడు. ఇతరులకు భారముగా ఉండక స్వయంగా కష్టపడుట ద్వారా ఒక విధముగా థెస్సలొనీకయులు ప్రేమను వ్యక్తపరచాలని ఈ అధ్యాయము యొక్క విస్తృత నేపథ్యము సూచిస్తుంది.

4:11-12లో, సహోదర ప్రేమ మీద దృష్టి పెట్టిన తరువాత, సొంతకార్యములను జరుపుకొనుట మరియు చేతులతో కష్టపడుటలో నిమగ్నమవ్వాలి అని పౌలు థెస్సలొనీకయులను ఆజ్ఞాపించాడు. కొందరు థెస్సలొనీక విశ్వాసులు యేసు తక్షణమే తిరిగి వస్తాడను ఆలోచనకు ఆకర్షితులై తమ అనుదిన బాధ్యతలను నిర్వర్తించుటను ఆపివేశారు. ఈ ప్రజలు వ్యక్తిగతముగా సంపన్నులు కాదు కాబట్టి థెస్సలొనీక సంఘములో ఉన్న ఇతరులకు భారము అయ్యారు. అంతేకాకుండ, సంఘములోని కొందరు చూపిన సోమరితనము అవిశ్వాసుల దృష్టిలో సంఘము యొక్క విశ్వసనీయతను బలహీనపరచింది.

నైతిక జీవనము కొరకు సూచనలను అందించిన తరువాత, 4:13-5:11లో పౌలు క్రీస్తు రాకడను గూర్చి మాట్లాడాడు.

క్రీస్తు యొక్క రాకడ (4:13–5:11). క్రీస్తు రాకడను గూర్చి పౌలు థెస్సలొనీకయులను రెండు విధాలుగా హెచ్చరించాడు. మొదటిగా, 4:13-18లో క్రీస్తునందు మృతులను గూర్చి అతడు మాట్లాడాడు. ప్రభువునందు మృతులైన తమ ప్రియులను భవిష్యత్తులో కలుసుకొంటాము అనే నిరీక్షణతో ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలని చెబుతూ అపొస్తలుడు థెస్సలొనీకయులను ప్రోత్సహించాడు. స్పష్టంగా, క్రీస్తు తిరిగివచ్చినప్పుడు సజీవులుగా ఉన్నవారు మాత్రమే నిత్య రక్షణను పొందుకుంటారు అని థెస్సలొనీకలో ఉన్న అబద్ధ బోధకులు బోధించారు. అప్పటికే మరణించిన తమ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు క్రీస్తు రాకడ మహిమలను చూడలేరు అను భయమును ఈ అబద్ధ బోధ వారిలో కలిగించింది. కాబట్టి, పౌలు ఈ అబద్ధ అభిప్రాయమును సరిచేశాడు.

పౌలు ఆలోచన ప్రకారం, పునరుత్థానము ఒక అపోహ కాదు, అది ఒక అస్పష్టమైన ఆత్మీయ నిరీక్షణ కాదు, కాని ఒక దినమున మన భౌతిక శరీరములు చరిత్రలో, కాలములో, మరియు ఒక స్థలములో తిరిగిలేస్తాయి అనే నిశ్చయత అయ్యున్నది. పునరుత్థానము, విశ్వాసుల యొక్క భవిష్యత్ పునరుత్థానము కూడా ప్రస్తుతము గొప్ప బలమునిచ్చు మూలము అయ్యున్నది అని పౌలు నమ్మాడు, కాబట్టి తమ ప్రియలను కోల్పోయి రోధించుచున్నవారిని ఓదార్చుటకు ఒక మార్గముగా పౌలు భవిష్యత్ పునరుత్థానమును చూసియుండవచ్చు. మొదటి థెస్సలొనీక పత్రిక 4వ అధ్యాయము దీనికి గొప్ప ఉదాహరణ అయ్యున్నది, అక్కడ తమ ప్రియులు మరణించుట వలన రోధించుచున్నవారు, యేసు తిరిగివచ్చి మృతులను లేపుతాడని అర్థము చేసుకోవాలని పౌలు చెబుతున్నాడు. ఇది కేవలం భవిష్యత్ ఆశీర్వాదము మాత్రమే కాదుగాని, ప్రస్తుతము దుఖమును మరియు రోదనను సహించుటకు అది మనకు శక్తిని కూడా ఇస్తుంది.

— డా. జిమ్మీ ఆగన్

క్రీస్తునందు మృతులను గూర్చి తన వాస్తవిక శ్రోతలను ప్రోత్సహించిన తరువాత పౌలు వారికి 5:1-11లో ప్రభువు దినమును జ్ఞాపకము చేశాడు. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు అవిధేయులను ఖండించి నమ్మకముగా ఉన్నవారిని ఆశీర్వదిస్తాడు అనివారికి జ్ఞాపకము చేయుట ద్వారా తన బోధనలకు నమ్మకముగా ఉండమని పౌలు థెస్సలొనీకయులకు పిలుపునిచ్చాడు. సోమరితనము మరియు అనైతికకు కారణము కాక, క్రీస్తు రాకడ విశ్వాసులందరిని పరిశుద్ధమైన జీవితములను గడుపుటకు ప్రేరేపించాలని పౌలు స్పష్టం చేయగోరాడు.

చివరి సూచనలు (5:12-22). పౌలు నైతిక జీవనము మరియు క్రీస్తు యొక్క రాకడను మాత్రమే చర్చించలేదుగాని, 5:12-22లో అతడు కొన్ని చివరి సూచనలను కూడా ఇచ్చాడు. పౌలు యొక్క చివరి సూచనలు 5:12 మరియు 13లో థెస్సలొనీకయ సంఘము యొక్క సంఘ అధికారమును ఉద్ఘాటిస్తూ ఆరంభమవుతాయి.

అబద్ధ బోధకుల నుండి వారిని భద్రపరచుటకు, థెస్సలొనీకలో తాను నియమించిన నమ్మకమైన సంఘ నాయకుల యొక్క అధికారమును పౌలు పునరుద్ఘాటించాడు. సరైన సిద్ధాంతములను కలిగియుండిన పురుషులను పౌలు వారి మధ్య నియమించాడు మరియు వారు అబద్ధ బోధకులను వ్యతిరేకించారు. తత్ఫలితంగా, థెస్సలొనీక సంఘము ఒకవైపు సత్యవంతులైన తమ నాయకుల నుండి మరొకవైపు ప్రత్యర్థుల నుండి మిశ్రమ సందేశములను పొందుతుంది. అతడు అభిషేకించిన నాయకుల యొక్క బోధనను అంగీకరించి అబద్ధ ప్రవక్తల యొక్క బోధనను తిరస్కరించుమని పౌలు స్పష్టం చేశాడు.

చివరిగా, సంఘము యొక్క సంఘ అధికారమును ఉద్ఘాటించి, 5:14-22లో తన మునుపటి బోధనల యొక్క క్లుప్త సారాంశమును పౌలు ఇచ్చాడు. 5:14లో, సంఘము సోమరులుగా ఉన్నవారితో మృదువుగా వ్యవహరించక వారిని హెచ్చరించాలి అని పౌలు సూచించాడు. అయితే తమ్మునుతాము పోషించుకొనలేని ప్రతివారిని వెలివేయాలని అతడు కోరలేదు, కాబట్టి నిజముగా అవసరతలో ఉన్నవారికి పరిచర్య చేయమని వారికి జ్ఞాపకం చేశాడు. 5:15లో, హాని కలుగజేసినవారికి దయను పంచమని చెప్పుట ద్వారా అబద్ధ బోధకుల ప్రభావముకు గురైన విశ్వాసుల యెడల కనికరముతో వ్యవహరించమని అందరికీ సూచించాడు. 5:16-18లో, సంఘము ఎదుర్కొనుచున్న కష్టముల మధ్యలో ఆనందముతో ఉండమని పౌలు ప్రోత్సహించాడు, మరియు మరోసారి అతని బోధన వెనుకనున్న దైవిక అధికారమును ధృవీకరించాడు. 5:19-22లో, అబద్ధ బోధకుల యెడల అతని వ్యతిరేకత క్రొత్త ప్రవచనములు మరియు బోధలన్నిటి యొక్క తిరస్కరణ కాదు అని అతడు స్పష్టం చేశాడు. బదులుగా, అటువంటి ప్రకటనలన్నిటిని పరీక్షించాలి, మరియు అబద్ధములను విస్మరించాలి.

పౌలు ఇచ్చిన విస్తృతమైన సూచనలు అనేకమైన ఆచరణాత్మక విషయాలను గూర్చి మాట్లాడతాయి. ప్రతి విషయములో, పౌలు యొక్క వైఖరి అనుకూలముగా ఉంది. థెస్సలొనీకయులు మంచిగా ఉన్నారు గనుక పౌలు వారిని మెచ్చుకున్నాడు. విశ్వాసము మరియు క్రీస్తు పరిచర్య విషయములో అభివృద్ధిచెందాలని కూడా అతడు వారిని కోరాడు.

కాబట్టి, క్రొత్త నిబంధనలో, దేవుని సంతోషపరచుటకు మీరు ప్రయాసపడతారు, మరియు అది ఆయనను మీరు ప్రేమించుచున్నారు అనుటకు ఒక చిహ్నమైయున్నది అని పౌలు అనేక చోట్ల చెప్పాడు. మరియు 1 థెస్సలొనీకలో అప్పటికే దేవుని సంతోషపరచుచున్నవారు ఆ పనిలో కొనసాగాలని అతడు చెబుతున్నాడు, ఎందుకంటే ప్రేమలో కొనసాగుటకు అది ఒక మార్గమైయున్నది. అనగా దైవత్వములో, అనగా తండ్రి మరియు కుమారులతో సహవాసములో కొనసాగుట అయ్యున్నది, మరియు తుదకు ఇది అక్షరాల మన నిత్య జీవితము అవుతుంది. అది ఇక్కడ ఆరంభమవుతుంది; మహిమలో నిత్యము వరకు కొనసాగుతుంది.

— డా. జే. ఐ. పెక్కర్

1 థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక యొక్క అవలోకనమును ఇప్పటివరకు మనము చూశాము గనుక ఇప్పుడు 2 థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక యొక్క విషయములు మరియు నిర్మాణమును చూద్దాము.

మనము చూడబోవుచున్నట్లు, పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రిక కూడా మొదటి పత్రికవలె ఆరంభమౌతుంది. ఈ పత్రిక కూడా ఐదు ప్రధానమైన భాగములుగా విభాగించబడుతుంది:

1:1, 2లో శుభవచనము;

1:3-10లో కృతజ్ఞత మరియు ప్రోత్సాహమును గూర్చిన మరొక నివేదిక;

1:11, 12లో థెస్సలొనీకయుల కొరకు పౌలు చేసిన ప్రార్థన;

2:1-3:15లో పౌలు ఇచ్చిన సూచనలు;

మరియు 3:16-18లో ముగింపు వ్యాఖ్యలు.

శుభవచనము మరియు ముగింపు వ్యాఖ్యలతో ఆరంభిద్దాము.

పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన రెండవ పత్రిక కూడా మొదటి పత్రికవలె ఆరంభమౌతుంది. 1:1, 2లో ఉన్న శుభవచనము సూటిగాను, క్లుప్తంగాను ఉన్నది. ఈ పత్రిక థెస్సలొనీకలో ఉన్న సంఘము కొరకు వ్రాయబడింది అని ఇది సూచిస్తుంది, మరియు 1 థెస్సలొనీకయుల వలెనే, ఈ పత్రిక పౌలు నుండి మాత్రమే కాదుగాని సీలా మరియు తిమోతి నుండి కూడా వెలువడింది అని శుభవచనం వివరిస్తుంది. పౌలు గ్రంథకర్తృత్వము పత్రికలో ఉన్న ప్రతియొక్క మాట నిజమైనదని ధృవీకరిస్తుంది మరియు పత్రిక బోధించబడిన ప్రతి విషయమునకు విధేయత చూపించి మరియు నమ్మాలి అని అతని అధికారం కోరుతుంది. వాస్తవానికి, 3:16-18లో ఉన్న పత్రిక యొక్క క్లుప్త ముగింపును మనం చూసినట్లయితే, పౌలు ప్రధానమైన రచయితగా ఉన్నాడని ఈ వచనములు స్పష్టము చేస్తాయి. నకిలీ పత్రికలు వ్రాసేవారికి వ్యతిరేకంగా పౌలు, కేవలం పౌలు మాత్రమే ఈ పత్రికను ప్రామాణీకరించడానికి వ్యక్తిగతముగా సంతకం చేశాడు.

1:3-10లోని రెండవ భాగములో, హింసను అనుభవించుచున్న సమయములో కూడా థెస్సలొనీకయుల యొక్క కొనసాగుచున్న విశ్వాసము మరియు ప్రేమను బట్టి పౌలు మరోసారి కృతజ్ఞతలు తెలిపాడు. మొదటి పత్రికలో ఎదుర్కొన్న అవే సమస్యలను రెండవమారు చర్చించుటకు వ్రాయవలసి ఉండినప్పటికీ, థెస్సలొనీకయుల విషయంలో పౌలు చాలా ఆకర్షితుడైయ్యాడు. వారి విశ్వాసము ఎంత మాదిరికరమైనదో వారికి మరలా తెలియజేస్తూ మరియు వారి సహనమును గూర్చి ఇతర సంఘములకు తెలియజేసిన విధానమును వారికి చెబుతూ కూడా అతడు వారిని ప్రోత్సహించాడు. 2 థెస్సలొనీకయులకు 1:4లో అతని మాటలను వినండి:

అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయపడుచున్నాము (2 థెస్సలొనీకయులకు 1:4).

1:11-12లోని మూడవ భాగములో, తాను థెస్సలొనీకయుల కొరకు ఎల్లప్పుడు ప్రార్థిస్తూ ఉన్నానని మరియు వారు వారి యొక్క శ్రమలలో ఒంటరివారు కారు అని అతడు వివరించాడు. వారు క్రీస్తు యెడల తమ పరిచర్య విషయములో నమ్మకముగా ఉండి, ఫలించునట్లు దేవుడు వారిలో బలముగా పనిచేయాలని అతడు, తిమోతి మరియు సీలా నిరంతరం ప్రార్థన చేశారు.

నాలుగవ భాగము సూచనలతో నిండియుంది, ఇది 2:1-3:15లో కనిపిస్తుంది. ఈ సుదీర్ఘమైన భాగము పత్రికలోని అధిక భాగముగా ఉంది. పౌలు సూచనలు మూడు భాగములుగా విభజించబడినవి.

క్రీస్తు రాకడ (2:1-17). మొదటిగా, 2:1-17లో, క్రీస్తు రాకడను గూర్చి పౌలు థెస్సలొనీకయులను మరొకసారి హెచ్చరించాడు. ఈ పాఠములో తరువాత ఈ వచనములను మరింత జాగ్రత్తగా పరిశీలిద్దాము, కాబట్టి ఇప్పుడు క్రీస్తు అప్పటికే తిరిగి వచ్చాడు అను ఆలోచనను పౌలు కఠినముగా తిరస్కరించాడు అను విషయమును చూద్దాము. 2:3లో అతడు ఇలా వ్రాసినట్లు:

మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు (2 థెస్సలొనీకయులకు 2:3).

భద్రత మరియు సాఫల్యత (3:1-5). రెండవదిగా, 3:1-5లో, పరిచర్యలో భద్రత మరియు సాఫల్యత పొందునట్లు అతని కొరకు మరియు అతని సహచరుల కొరకు ప్రార్థించమని పౌలు కోరాడు.

బాధ్యతారహితము (3:6-15). మూడవదిగా, 3:6-15లో, బాధ్యతారహితమునకు వ్యతిరేకంగా పౌలు ఒక హెచ్చరిక జారీచేసి, తమ పనులను తిరిగి ఆరంభించాలని మరియు తమ బ్రతుకుతెరువు కొరకు కష్టపడాలని థెస్సలొనీకయులకు చెప్పాడు. 3:10లో అతడు ఇలా వ్రాశాడు:

మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు-- ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితివిు గదా (2 థెస్సలొనీకయులకు 3:10).

కాబట్టి, 2 థెస్సలొనీక 3:10లో ... ఏ విధమైన సమాజములైనా కార్యములు చేయుటకు మరియు సఫలమగుటకు ప్రాముఖ్యమైన మరియు అవసరమైన ఒక ఆలోచనను లేక అభిప్రాయమును పౌలు తెలియజేయుచున్నాడు. సంఘము ప్రజల సమాజమైయున్నది, మరియు వారి మధ్య ఉన్న పేదలను మరియు అవసరతలో ఉన్నవారిని పోషించుటకు వారికి ఆజ్ఞ ఇవ్వబడినది. అయితే అతడు మానవుల యొక్క విరోధ స్వభావమును గుర్తించాడు అని, మరియు పని చేయు శక్తిగల ఒక వ్యక్తి కాళీగా కూర్చొనినప్పుడు మనము ఆ వ్యక్తి కొరకు సమకూర్చిన యెడల, మనము వారి శరీరములను పోషించుచున్నామేగాని, వారి ఆత్మలకు హాని కలిగించుచున్నామని అతడు గుర్తించాడు అని నా అభిప్రాయం... “సహోదరుడా, సహోదరీ, మీము మీతో పంచుకొనుటకు, మా ఆహారమును మరియు మా దగ్గర ఉన్నవాటిని మీతో పంచుకొనుటకు సంతోషించుచున్నాము, కాని మీకు కూడా బాధ్యత ఉన్నది. కాబట్టి, కొంచెం ఎదగండి, మీ బాధ్యతల మీద దృష్టిపెట్టండి, మరియు ధన్యతలతో మాత్రమేగాక, బాధ్యతలతో కూడా దేవుని కుటుంబములో చేరండి” అని చెప్పుట కఠినమైన ప్రేమ యొక్క గొప్ప వ్యక్తీకరణ అయ్యుంటుంది.

— రెవ. డెన్ హెండ్లె

మనము చూస్తున్నట్లుగా, పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన రెండు క్లుప్త పత్రికలు అనేక విధములైన పోలికలను కలిగియున్నవి. థెస్సలొనీక సంఘము పట్ల అతడు కలిగియున్న నిశ్చయతను మరియు ఆనందమును, అదే విధముగా అతడు అందుబాటులో లేనప్పుడు కూడా వారు చూపిన నమ్మకత్వముబట్టి అతని కృతజ్ఞతను రెండు పత్రికలు ప్రస్తుతిస్తాయి. అయినను, అతడు వ్రాసిన మొదటి పత్రిక థెస్సలొనీక సంఘములో ఉన్న సమస్యలను పరిష్కరించలేదు అని పౌలుకు తెలుసు. కాబట్టి, అతడు రెండవ పత్రికను వ్రాశాడు. వారు క్రీస్తుకు మరియు అతని బోధకు నమ్మకముగా ఉండాలి, అనుదిన జీవితములలో బాధ్యతాయుతముగా జీవించాలి, మరియు ప్రభువు రాకడను గూర్చి సరైన అవగాహన కలిగియుండాలి అనువాటి మీద అతడు ముఖ్యముగా దృష్టిపెట్టాడు.

ఇప్పటివరకు పౌలు థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును మరియు ఈ పత్రికల యొక్క ప్రాథమిక నిర్మాణము మరియు విషయములను మనం విశదీకరించాము. ఇప్పుడు మూడవ అంశమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము. ఈ పత్రికలు “అంత్యదినములు” — అనగా అతని యుగాంతశాస్త్రము — పైన పౌలు యొక్క కేంద్ర వేదాంతశాస్త్ర దృక్పధములను ఎలా ప్రతిబింబిస్తాయి?

థెస్సలొనీకయులకు అతడు వ్రాసిన పత్రికలో, అనేక విషయాలను పౌలు చర్చించాడు. అబద్ధ బోధకులు, నమ్మకమైన మరియు బాధ్యతాయుతమైన క్రైస్తవ జీవనమును గూర్చి అతడు వ్రాశాడు. క్రీస్తు రాకడను గూర్చి వారి అభిప్రాయములను అతడు సరిదిద్దాడు. అయితే మునుపటి పాఠములలో మనము చూసినట్లుగా, అతడు బోధించు ప్రతిదానివెనుక ఉన్న ప్రాథమిక వేదాంతశాస్త్ర దృక్పధముల దృష్టి నుండి పౌలు వ్రాసిన పత్రికలలోని ప్రత్యేకమైన బోధనలను వ్యత్యాసపరచుట సహాయకరముగా ఉంటుంది. అతని ఇతర పత్రికలలో వలెనే, పౌలు థెస్సలొనీకయులకు ఇచ్చిన విశేషమైన సూచనలు అతని వేదాంతశాస్త్రము యొక్క మూలములకు మరియు క్రీస్తునందు అంత్య దినములపై అతని దృక్పథముల యొక్క వివరణలుగాను మరియు అనువర్తనములుగాను ఉన్నాయి.

పౌలు యొక్క యుగాంతశస్త్రము అంత్యదినములలో ఆయన ఉద్దేశ్యముల యొక్క నెరవేర్పు వైపుకు చరిత్రను దేవుడు నడిపించుచున్నాడు అను పాత నిబంధన బోధనలో నుండి ఉద్భవించిందని మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. మునుపటి పాఠములలో మనము చూసినట్లు, చరిత్రను రెండు యుగములుగా విభజించుట ద్వారా మొదటి శతాబ్దములోని అనేకమంది యూదులు ఈ దైవిక ప్రణాళికను సంబోధించారు: “ఈ యుగము” మరియు “రాబోవు యుగము.” “ఈ యుగము” అను పదము పాపము, తీర్పు మరియు మరణముతో నిండియున్న ప్రస్తుత యుగమును సూచించుటకు ఉపయోగించబడిన సాంకేతిక పదముగా ఉంది. అయితే “రాబోవు యుగము” అను పదము దేవుని శత్రువుల మీదికి వచ్చు అంతిమ తీర్పు మరియు దేవుని ప్రజల మీదికి వచ్చు తుది ఆశీర్వాదములను సూచిస్తుంది. ఈ యూదుల దృష్టికోణములో, మెస్సీయ లేదా క్రీస్తు యొక్క రాకడ ఈ రెండు యుగములకు మధ్య మలుపుగా ఉంది. మెస్సీయ వచ్చినప్పుడు, ఆయన ఈ యుగముకు ముగింపు తెచ్చి రాబోవు యుగము యొక్క అద్భుతములను పరిచయం చేస్తాడు.

ఇప్పుడు, పౌలు యేసు బోధనలను అనుసరించాడు కాబట్టి, అతడు మరియు ఇతర అపొస్తలులు చరిత్ర యొక్క సూటైన రెండు-యుగముల పద్ధతిని సవరించారు. యేసు మెస్సీయ అని, మరియు ఆ యేసే రాబోవు యుగమును ఆరంభించాడని వారికి తెలుసు. అయితే, రాబోవు యుగము ఇంకా సంపూర్ణతకు రాలేదని మరియు ఈ యుగము ఉనికిలోనే ఉందని కూడా వారు గ్రహించారు. కాబట్టి, క్రీస్తు అనుచరులు “ఇప్పటికే వచ్చింది మరియు ఇంకా రాలేదు” అని వర్ణించబడే కాలంలో, అనగా కొన్ని విధాలుగా నిత్య రక్షణ “ఇప్పటికే వచ్చింది” కాని దాని సంపూర్ణత “ఇంకా రాలేదు” అని చెప్పబడే కాలములో నివసిస్తున్నారని వారు వివరించారు. పౌలు యొక్క దృష్టికోణము ప్రకారం, ఆయన మొదటి రాకడలో క్రీస్తు అంత్య దినములను ఆరంభించాడు; అంత్య దినములు సంఘ చరిత్ర అంతటిలో కొనసాగుతాయి; మరియు క్రీస్తు తన మహిమగల రెండవ రాకడలో తిరిగివచ్చినప్పుడు అవి సంపూర్ణతకు చేరతాయి.

ఆదిమ క్రైస్తవులు క్రీస్తునందు జీవితమును కనుగొనుట ఆరంభించినప్పుడు, క్రైస్తవ యుగాంతశాస్త్రము యొక్క అభ్యాసిక అంతర్భావములను గూర్చిన అపార్థములను యేసు అపొస్తలులు చాలాసార్లు సరిచేయవలసి వచ్చేది. “పౌలు మరియు గలతీయులకు వ్రాసిన పత్రిక” అను పాఠములో మనం చూసినట్లుగా, క్రీస్తు ఆయన మొదటి రాకడలో లోకమును ఎంతగా మార్చాడో గ్రహించుటలో కొందరు క్రైస్తవులు విఫలమయ్యారు. ఈ అసమతుల్య దృక్పధమును “గ్రహింపబడని యుగాంతశాస్త్రము” అని పిలిచాము.

దీనికి భిన్నముగా, థెస్సలొనీకలో ఉన్న అబద్ధ ప్రవక్తలు క్రైస్తవులను మరొక తీవ్రతలోనికి నడిపించారు. “ఉద్రేక” లేక “అధిక యుగాంతశాస్త్రము” అని మనం పిలచుదానిని థెస్సలొనీకయులు అభివృద్ధి చేశారు. అబద్ధ ప్రవక్తల యొక్క ప్రభావమువలన, రాబోవు యుగము యొక్క సంపూర్ణత ఇప్పటికే జరిగింది లేదా చుట్టూ ఉంది అని చాలామంది నమ్మారు. కొందరు క్రీస్తు ఇప్పటికే వచ్చేశాడు అని ఊహించారు. ఈ ఉద్రేక యుగాంతశాస్త్రము వలన, థెస్సలొనీకయులు ఈ యుగములో నమ్మకముగా జీవించు బాధ్యతలను పరిణామరహితములుగా భావించారు. ఈ “ఉద్రేక యుగాంతశాస్త్రము” థెస్సలొనీకయులను తీవ్రమైన సమస్యల్లోకి నడిపించింది అని పౌలు గ్రహించాడు. కాబట్టి, మరింత సమతుల్యమైన దృక్పథమును వారికి ఇచ్చుటకు అతడు వారికి వ్రాశాడు.

మన ఉద్దేశ్యముల కొరకు, పౌలు యొక్క వేదాంతశాస్త్ర దృక్పధములు థెస్సలొనీకయుల యొక్క ఉద్రేక యుగాంతశాస్త్రమును సమతుల్యము చేసిన మూడు మార్గములను మాత్రం మనము చూద్దాము. మొదటిగా, క్రీస్తు యొక్క రెండవ రాకడపై వారు చూపిన అతి ఉద్ఘాటనను ప్రతిఘటించు విధముగా అతడు రక్షణ సిద్ధాంతమును వివరించాడు. రెండవదిగా, క్రైస్తవ నైతికత లేక నైతిక ప్రవర్తన క్రీస్తునందు అంత్య దినములతో ఎలా అనుబంధము కలిగియున్నదో పౌలు కనుపరచాడు. మరియు మూడవదిగా, ఆదిమ సంఘము యొక్క చారిత్రిక స్థానమును, మరియు క్రీస్తు రాకకు వారు ఎంత దగ్గరగా ఉన్నారు అను విషయమును అతడు వివరించాడు. యుగాంతశాస్త్రమును గూర్చి థెస్సలొనీకయులు కలిగియుండిన ఆలోచనను సమతుల్యము చేయుటకు, పౌలు యొక్క రక్షణ సిద్ధాంతమును చర్చించిన విధానమును మొదట చూద్దాము.

అబద్ధ బోధకుల యొక్క ప్రభావము క్రింద, అనేకమంది థెస్సలొనీకయులు రక్షణ అను అంశమును, క్రీస్తు రాకడతో వచ్చు ఆశీర్వాదముతో గుర్తించారు. ఇంకా దీనికి విలువలేదు. అంత్య దినముల యొక్క నెరవేర్పు మీద ఈ అతి ఉద్ఘాటనను ప్రతిఘటించుటకు, వారు క్రీస్తు రాక కొరకు ఎదురుచూచుచున్నను రక్షణ థెస్సలొనీకయుల జీవితములో ప్రస్తుత వాస్తవికతగా ఉన్న విధానమును పౌలు నొక్కి చెప్పాడు. పౌలు థెస్సలొనీకయులు కలిగియుండాలని ఆశించిన దృక్పథముల కొరకు అతడిచ్చిన ఒక సహాయకరమైన వ్యాఖ్యను 2 థెస్సలొనీకయులకు 2:13-14లో వినండి. పౌలు ఇలా వ్రాశాడు:

ప్రభువువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మునుబట్టి యెల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్ధులమైయున్నాము. మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను (2 థెస్సలొనీకయులకు 2:13-14).

ఈ వచనములను గూర్చి అనేక విషయములు చెప్పవచ్చు కాని, ఇక్కడ తెలుపబడిన రక్షణ సిద్ధాంతము యొక్క మూడు కోణములను మాత్రం మనం చూద్దాము. గతములో రక్షణ వైపుకు పౌలు దృష్టిని ఎలా ఆకర్షించాడో మనం మొదట చూద్దాము, తరువాత భవిష్యత్ రక్షణ వైపుకు మన దృష్టిని మళ్లిద్దాము, మరియు చివరిగా ఈ వాక్యభాగము రక్షణ యొక్క ఇప్పటి లేదా ప్రస్తుత కోణములను గూర్చి మాట్లాడు విధానమును మనం పరిశీలిద్దాము. గతములోని రక్షణను గూర్చి పౌలు వివరించిన విధానమును మొదటిగా చూద్దాము.

గత రక్షణ యొక్క కోణములకు సంబంధించి, పౌలు రెండు విషయముల మీద దృష్టిపెట్టాడు. మొదటిగా, అతడు దేవుని ఎంపిక లేక థెస్సలొనీకయుల యొక్క “ఏర్పాటు”ను గూర్చి మాట్లాడాడు.

ఏర్పాటు. పౌలు సువార్త ప్రకటించుట వలన వారు విశ్వసించుటకు చాలా కాలం క్రితమే దేవుడు థెస్సలొనీకలోని విశ్వాసులను ఎన్నుకున్నాడు అని పౌలు చెప్పాడు. దేవుడు అప్పటికే థెస్సలొనీకయులను ప్రేమించాడు మరియు వారిని రక్షింపగోరాడు. దేవుడు సృష్టిని సృష్టించక మునుపే ఈ ఏర్పాటు జరిగింది. ఎఫెసీ 1:4లో దేవుడు ప్రజలను రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్న విధానమును గూర్చి పౌలు మాట్లాడిన విధానమును వినండి:

మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను (ఎఫెసీయులకు 1:6).

2 థెస్సలొనీకయులకు 2:13లో పౌలు ఇలా వ్రాసినప్పుడు కూడా ఈ ఆలోచన మనకు కనిపిస్తుంది:

ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను (2 థెస్సలొనీకయులకు 2:13).

పౌలు చెప్పాలనుకున్నది స్పష్టముగా ఉంది: వారు దేవుని ఎన్నుకొనుటకు చాలా కాలం క్రితమే దేవుడు రక్షణ కొరకు వారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి థెస్సలొనీకయులు రక్షించబడ్డారు.

రక్షణ అను అంశము బైబిలులో ఒక కీలకమైన విషయమైయున్నది, ఎందుకంటే మానవ పాపము మరియు దేవుని విమోచన బైబిలులో అత్యంత ప్రాముఖ్యమైన అంశములైయున్నవి, మరియు ఇవి క్రీస్తునందు మాత్రమే సాధించబడగలవు... రక్షణ సృష్టికి ముందే దేవుడు చేసిన కార్యము అని కెల్విన్ లేఖనములో నుండి స్పష్టముగా కనుపరుస్తాడు. మనుష్యుడు నిబంధనను ఆచరించాడు కాబట్టి, లేక బాప్తిస్మము పొందుట ద్వారా తిరిగి జన్మించాడు కాబట్టి రక్షణను పొందలేదు. అది వ్యక్తులను దేవుడు ఏర్పాటు చేసుకొనుట ద్వారా, క్రీస్తు యొక్క విమోచన ద్వారా, మరియు మనకు దేవుని రక్షణను కలిగించు పరిశుద్ధాత్మ యొక్క కృప ద్వారా సాధ్యమైయ్యింది.

—రెవ. డా. స్టీవెన్ టాంగ్, భాషాంతరము చేయబడినది.

ఇప్పుడు, పౌలు ఆలోచన ప్రకారం ఏర్పాటు అనేది సంబంధములేని, నిలకడలేని, ఆవ్యక్తిగతమైన కార్యము కాదు అని గ్రహించడం ప్రాముఖ్యం. ఎఫెసీయులకు 1:4లో ఇంతకు ముందే మనము చదివినట్లుగా, దేవుని ఏర్పాటు “క్రీస్తునందు” చేయబడింది. ఇతర పాఠములలో మనం చూచినట్లుగా, “క్రీస్తునందు” ఉండుట అంటే యేసుతో ఐక్యత కలిగియుండుట. కాబట్టి, మరణము మరియు పునరుత్థానము ద్వారా ఆయన ఈ యుగములో నుండి మరొక యుగములోకి దాటిపోయినట్లే, మనము కూడా — ఆయనతో ఐక్యపరచబడ్డాము గనుక — ఈ యుగములో నుండి రాబోవు యుగములోకి దాటిపోతాము. వారి ఏర్పాటును గూర్చి పౌలు థెస్సలొనీకయులకు జ్ఞాపకం చేసినప్పుడు, యేసుతో కూడా ఐక్యపరచబడి, ఆయనతో పాటుగా ఈ యుగములో నుండి రాబోవు యుగములోకి దాటిపోవునట్లు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు అను ఆలోచన అతని మనస్సులో ఉండినది.

మారుమనస్సు. ఏర్పాటు అను ఆలోచన వలన గతములో జరిగిన థెస్సలొనీకయుల రక్షణ యొక్క మరొక కోణమును గూర్చి కూడా పౌలు వ్రాశాడు: క్రైస్తవ విశ్వాసములోనికి వారి మారుమనస్సు. 2 థెస్సలొనీకయులకు 2:14లో పౌలు ఈ మాటలు వ్రాశాడు:

“[దేవుడు] మా సువార్త వలన మిమ్మును పిలిచెను” (2 థెస్సలొనీకయులకు 2:14).

పౌలు వారికి ప్రకటించిన సువార్త ద్వారా దేవుడు థెస్సలొనీకయులను రక్షణలోనికి పిలచాడు. ఇక్కడ తన రెండవ మిషనరీ యాత్రలో థెస్సలొనీకయులకు క్రీస్తు సువార్తను ప్రకటించిన గత సమయమును పౌలు ప్రస్తావించాడు. వారు క్రీస్తును గూర్చిన సువార్తను విన్నారు మరియు నమ్మారు, మరియు సువార్త యెడల ఈ ఆరంభ స్పందన వారికి రక్షణను తెచ్చింది. 1 థెస్సలొనీకయులకు 1:4లో, పౌలు గత రక్షణను గూర్చి దేవుని శాశ్వతమైన ఎంపికలోను మరియు థెస్సలొనీకయులు మొదట విశ్వసించినప్పుడు కూడా జరిగిన కార్యముగా మాట్లాడాడు. అతడు ఇలా అన్నాడు:

మీరు ఏర్పరచబడిన సంగతి, అనగా మా సువార్త, మాటతో మాత్రముగాక శక్తితోను, పరిశుద్ధాత్మతోను, సంపూర్ణ నిశ్చయతతోను మీయొద్దకు వచ్చియున్న సంగతి మాకు తెలియును (థెస్సలొనీకయులకు 1:4).

దేవుడు వారిని రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నాడని థెస్సలొనీకయుల మారుమనస్సు రుజువుచేసింది. థెస్సలొనీకయుల యొక్క జీవితములో అప్పటికే గ్రహించబడిన రక్షణను గూర్చిన ఈ గత కోణములను ప్రస్తావించుట ద్వారా, వారికి అప్పటికే ప్రకటించబడిన సువార్తను పౌలు మరలా ధృవీకరించాడు. మరియు రక్షణ యొక్క కొన్ని నిర్దిష్టకోణములను యిప్పటికే అనుభవించారు అను వాస్తవమును బట్టి ఆనందించమని వారికి పిలుపునిచ్చాడు.

అతడు థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రికలో పౌలు రక్షణ సిద్ధాంతము వైపుకు దృష్టి ఆకర్షించిన మరొక విధానము ఏమనగా వారి రక్షణ యొక్క భవిష్యత్ కోణముల మీద దృష్టిపెట్టుట. ఉదాహరణకు, 1 థెస్సలొనీకయులకు 1:10లో విశ్వాసులు ఇలా ఉండాలని పౌలు వ్రాశాడు:

దేవుడు మృతులలోనుండి లేపిన యేసు, అనగా రాబోవు ఉగ్రతనుండి మనలను తప్పించుచున్న [దేవుని] కుమారుడైన యేసు, పరలోకమునుండి వచ్చునని యెదురు చూ[డుము] (1 థెస్సలొనీకయులకు 1:10).

ఇంచుమించు ఇదే విధముగా, 2 థెస్సలొనీకయులకు 2:14లో, దైవిక విమోచన యొక్క అంతిమ ముగింపు ఏమనగా:

మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందుట (2 థెస్సలొనీకయులకు 1:14).

థెస్సలొనీకయులు క్రీస్తు రాకడను గూర్చి తీవ్రమైన ఆలోచన కలిగియున్నప్పటికీ, క్రీస్తు రాకడ రక్షణను సంపూర్ణతకు తీసుకువస్తుంది అని పౌలు గుర్తించాడు. థెస్సలొనీకయులకు అన్ని బాగుగా తెలుసు గనుక, రక్షణ యొక్క అంతిమ లక్ష్యము దైవ ఉగ్రత నుండి అంతిమ విమోచన మరియు క్రీస్తు అనుచరులు మహిమను పొందుట అయ్యున్నది. మనము క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో క్రీస్తుతో పాటు పాలించుచుండగా ఊహించని గౌరవము మరియు మహిమ స్థితిలోని విప్లవాత్మక మరియు సంపూర్ణ పరివర్తనను అనుభవిస్తాము అని చెప్పుటకు పౌలు భయపడలేదు.

భవిష్యత్తులో మనము మహిమపరచబడినప్పుడు, అనగా, క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి మీద మన జీవితము ఎలా ఉంటుంది అని మనము చాలాసార్లు ఆశ్చర్యపోతుంటాము. మరియు నేను చెప్పగోరు మొదటి విషయం ఇదే. దేవునితో నిత్య జీవితమును గూర్చి మేఘాలలో ఎగురుట వలె మనము ఊహించనవసరము లేదు అని నా అభిప్రాయం. అయితే మనము క్రొత్త, పునరుత్థాన శరీరములను, పాపము, రోగము మరియు మరణములేని శరీరములను కలిగియుంటాము. మనము అమర్త్యముగా ఉండి, ఎన్నడును మరణించము, మరియు క్రొత్త భూమి మీద నిత్యము నివసిస్తాము. ఇప్పుడు, దీని వివరములు మనకు చిక్కకుండా ఉంటాయి. దానిలో ఏమి ఉంటుంది? వివరములన్నీ మనకు తెలియదు, కాని మనము కొంత బాధ్యతను కలిగియుంటామని మనకు తెలుసు. మనము క్రీస్తుతో పరిపాలిస్తాము.

— డా. థామస్ ఆర్. శ్రైనర్

మూడవదిగా, రక్షణ యొక్క గత మరియు భవిష్యత్ కోణములను ప్రస్తావించుటతో పాటుగా, రక్షణ కొనసాగుచున్న ప్రస్తుత వాస్తవికతగా ఉంది అని కూడా పౌలు మాట్లాడాడు. 2 థెస్సలొనీకయులకు 2:13లో అతడు రక్షణ యొక్క ఈ కోణమును గూర్చి రెండు విధములుగా మాట్లాడాడు:

ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలనను, మీరు సత్యమును నమ్ముటవలనను, రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను (2 థెస్సలొనీకయులకు 2:13).

ఒకవైపు, “ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుటవలన” రక్షణ థెస్సలొనీకయుల యొద్దకు వచ్చినది అని పౌలు సూచించాడు. ఇతర పాఠములలో మనము చూసినట్లుగా, దేవుని ప్రజల మీద పరిశుద్ధాత్ముని యొక్క గొప్ప కుమ్మరింపు క్రీస్తు ఆరోహణమైనప్పుడు జరిగింది. మరియు ఈ ఆత్మ కుమ్మరింపు రాబోవు యుగము యొక్క ఆశీర్వాదము అని, మరియు అది ప్రస్తుతము థెస్సలొనీకలోని విశ్వాసుల యొక్క జీవితములో వాస్తవికత అయ్యున్నది అని పౌలు బోధించాడు. వాస్తవానికి, ఎఫెసీయులకు 1:14లో, అతడు పరిశుద్ధాత్మను రాబోవు గొప్ప యుగములో మన భవిష్యత్తు స్వాస్థ్యమునకు “సంచకరువు,” లేక జమ, లేక నిశ్చయత అని పిలచాడు. కాబట్టి, థెస్సలొనీకయులలో ఆత్మ కార్యము చేయుచున్నాడు అని అతడు మాట్లాడినప్పుడు, వారు ఎంతో ఆసక్తిగా వేచిచూస్తున్న స్వాస్థ్యములో కొంత భాగమును వారు అప్పటికే అనుభవించుచున్నారను సత్యము వైపుకు పౌలు వారి దృష్టిని ఆకర్షించాడు.

ఈ యుగము మరియు రాబోవు యుగము యొక్క అతివ్యాప్తి సమయములో ఆత్మ యొక్క పరిచర్య చాలా ముఖ్యమైనదిగా ఉన్నది. పాపము మరియు మరణముతో నిండిన ఈ యుగము యొక్క అవినీతి విశ్వాసులను నాశనము చేయుటకు తరచు వెదకుతుంది. కాని రాబోవు యుగమునకు ముందు రుచిగా, ఆత్మ నిరంతరం మనలను శుద్ధి చేస్తాడు మరియు ప్రపంచములోని అవినీతి నుండి మనలను వేరుపరుస్తాడు.

మరోవైపు, 2 థెస్సలొనీకయులకు 2:13లో “సత్యమును నమ్ముటవలన” మనము రక్షించబడితిమి అని చెప్పుట ద్వారా రక్షణ యొక్క ప్రస్తుత కోణములను కూడా పౌలు సూచించాడు. దేవుని పట్ల మరియు క్రైస్తవ విశ్వాసము పట్ల విశ్వాసులందరికి ఉన్న నిబద్ధతను నిలబెట్టుకొనే బాధ్యతను గూర్చి పౌలు మాట్లాడాడు. మరియు అబద్ధ ప్రవచనము నుండి వెనుదిరిగి, అతడు వారికి ప్రకటించిన సత్యమును ప్రేమించాలని థెస్సలొనీకయులను పురికోల్పాడు. సత్యమును ఎల్లప్పుడు నమ్ముట వారి జీవితములలో క్రీస్తు యొక్క ప్రస్తుత రక్షణ కార్యము యొక్క ముఖ్యమైన కోణముగా ఉంది.

సంఘ చరిత్రయందంతటా, థెస్సలొనీకయులవలెనే, అనేక క్రైస్తవ సమూహములు క్రీస్తు యొక్క రెండవ రాకడ మీద దృష్టిపెట్టి, రక్షణ యొక్క గత మరియు ప్రస్తుత కోణముల ఫలితముగా వచ్చు బాధ్యతలు మరియు ప్రయోజనములను గ్రహించుటలో విఫలమైయ్యాయి. క్రీస్తు మహిమలో తిరిగి వచ్చు అద్భుతమైన దృశ్యము మీద నుండి మనము ఏనాడు దృష్టిని తీసివేయగోరకపోయినప్పటికీ, దేవుడు మన కొరకు ఇప్పటికే ఎన్ని కార్యాలు చేశాడో మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మరియు ఆయన మన కొరకు కార్యములు చేయుటను కొనసాగించుచున్నాడని మనం గ్రహించాలి.

పౌలు రక్షణ యొక్క గత మరియు ప్రస్తుత కోణములు ఉద్ఘాటించుట ద్వారా మాత్రమే థెస్సలొనీకయలోని ఉద్రేక యుగాంతశాస్త్రమును ప్రతిఘటించలేదుగాని, క్రైస్తవుని యొక్క నైతిక జీవనమును గూర్చి నొక్కి చెప్పుట ద్వారా కూడా ప్రతిఘటించాడు. నైతికత మీద పౌలు చేసిన బోధన అతని యొక్క యుగాంతశాస్తమును ఎలా ప్రతిబింబించినదో చూచుటకు, మనము రెండు అంశములను చూద్దాము: రక్షణ ప్రక్రియ, మరియు క్రైస్తవ జీవితము యొక్క నైతిక అంతర్భావములు. రక్షణ యొక్క గత మరియు ప్రస్తుత కోణముల నుండి భవిష్యత్ ఆశీర్వాదములలోనికి పురోగతిని పౌలు యొక్క యుగాంతశాస్త్రము ఎలా ప్రత్యక్షపరుస్తుందో మొదటిగా చూద్దాము.

2 థెస్సలొనీకయులకు 2:14లో రక్షణ ప్రక్రియను గూర్చిన సంపూర్ణ చిత్రమును పౌలు ప్రత్యక్షపరచాడు:

మీరీలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క మహిమను పొందవలెనని, ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను (2 థెస్సలొనీకయులకు 2:14).

“ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందు నిమిత్తము” థెస్సలొనీకయులు పరిశుద్ధపరచబడి, సత్యమును నమ్మారు అని పౌలు వ్రాశాడు. 1 థెస్సలొనీకయులకు 3:13లో ఇలా ప్రార్థిస్తూ, పౌలు ఇదే విధమైన ఆలోచనను వ్యక్తపరచాడు:

మేము మీయెడల ఏలాగు ప్రేమలో అభివృద్ధిపొంది వర్ధిల్లుచున్నామో, ఆలాగే మీరును ఒకని యెడల ఒకడును మనుష్యులందరి యెడలను, ప్రేమలో అభి వృద్ధిపొంది వర్ధిల్లునట్లు [ప్రభువు] దయచేయును గాక (1 థెస్సలొనీకయులకు 3:13).

క్రీస్తు “తన పరిశుద్ధులందరితో” తిరిగి రావాలని థెస్సలొనీకయులు కోరారు మరియు పౌలు ఈ కోరికను ధృవీకరించాడు. అయితే, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు, ఆయన దృష్టికి వారు ఆమోదయోగ్యముగా కనబడు నిమిత్తము క్రీస్తు యెడల వారు కలిగియున్న నిబద్ధతలో బలపడాలని కూడా అతడు వారి కొరకు ప్రార్థించాడు. నిత్యమహిమలో భవిష్యత్ రక్షణ అనునది ప్రక్రియ యొక్క ముగింపు లేదా లక్ష్యముగా ఉంది. రక్షణ యొక్క గత మరియు ప్రస్తుత అనుభవములను రక్షణ యొక్క భవిష్యత్తు దశకు దారితీసేలా దేవుడు రూపొందించాడు. మరియు గత మరియు ప్రస్తుత దశలు లేకుండా, భవిష్యత్ రక్షణను మనం చేరుకోలేము.

ఈ యుగము మరియు రాబోవు యుగముకు మధ్య అతివ్యాప్తిలో క్రైస్తవులు ఎదుర్కొను ఉద్రిక్తతల దృష్ట్యా, ఆ ఉద్రిక్తతలను మరియు మనము వాటితో వ్యవహరించు విధానమును, లేక మన మనస్సులో ఆ ఉద్రిక్తతను నియంత్రించు విధానమును, రక్షణ యొక్క మూడు కాలములను గ్రహించుట ఉత్తమమైన రీతిలో క్రోడీకరిస్తుంది. భూత కాలము: నేను పాపము యొక్క శిక్ష నుండి రక్షింపబడితిని; దీనిని నీతిమంతులుగా తీర్చబడుట అంటారు. ప్రస్తుత/వర్తమాన కాలము: నేను పాపపు శక్తి నుండి రక్షింపబడితిని; దీనిని పవిత్రపరచబడుట అంటారు. భవిష్యత్ కాలము: నేను పాపము యొక్క ఉనికి నుండి రక్షింపబడతాను... మరియు నేను ఈ మూడింటిని — భూత, వర్తమాన, భవిష్యత్ — పట్టుకొనుచుండగా, మరియు వాటి అర్థమును చూచుచుండగా, అది నన్ను జ్ఞానవంతముగా జీవించునట్లు పురికొల్పుతుంది. పాపము నుండి విముక్తిని పొందుట కొరకు నేను ఆశతో ఎదురుచూచుచున్నాను. నా పాపమునకు వెల చెల్లించబడినది, నా శిక్షకు ప్రాయశ్చిత్తము జరిగినది కాబట్టి నేను కృతజ్ఞుడను. ఇప్పుడు, ప్రభువా, ప్రస్తుతము పాపముతో చేయు యుద్ధములో నాకు సహాయము చేయుము. నేను ఎల్లప్పుడు విజయము సాధించను. ఇది కొనసాగు మారుమనస్సు అయ్యున్నది, అయితే అదే సమయములో, మార్పు కలుగుతుంది అని ఆశించుచున్నాము. నేను క్రీస్తు పోలికలో ఎదుగుచు, భవిష్యత్తు కొరకు ఎదురుచూచుచున్నాను.

— రెవ. రికో టైస్

ఈ నైతిక బోధన అతని యొక్క రాకడశాస్త్రమును ఎలా ప్రతిబింబించినదో చూచుటకు, మనము రెండు అంశములను చూద్దాము: రక్షణ ప్రక్రియ, మరియు నైతికముగా జీవించుటకు సూచనలు.

రక్షణ యొక్క గత, ప్రస్తుత మరియు భవిష్యత్తు కోణములను వివరిస్తూ, ఆ ప్రక్రియలో ఒక అవసరమైన మెట్టు అనుదిన నైతిక జీవితము జీవించుట అని పౌలు సూచించాడు. సంక్షిప్తంగా, విశ్వాసులమని చెప్పుకుంటూ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీతిగా జీవించనివారు ఈ ప్రక్రియను పూర్తి చేయలేరు ఎందుకంటే వారు దానిని అసలు ఆరంభించనే లేదు. ఈ విషయమును నొక్కి చెప్పుట ద్వారా, క్రీస్తు రాకడ యొక్క ఆశీర్వాదములను గూర్చిన నిరీక్షణను కలిగి ఉండుట సరైనదైనప్పటికీ, భవిష్యత్తు ఆశీర్వాదములను పొందుకొనుటకు ఆశించినట్లయితే వారు తమ జీవితముల యొక్క ప్రస్తుత పరిస్థితుల మీద దృష్టిపెట్టాలని పౌలు థెస్సలొనీకయులకు జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు, క్రీస్తులో ఉన్న నిజమైన విశ్వాసులు తమ రక్షణను కోల్పోయే అవకాశం లేదని పౌలు నమ్మాడని ఇతర భాగముల నుండి మనం ఖచ్చితంగా చెప్పగలము. ఉదాహరణకు, ఫిలిప్పీయులకు 1:6లో పౌలు ఫిలిప్పీయులకు ఈ విధముగా నిశ్చయత ఇచ్చాడు:

నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను (ఫిలిప్పీయులకు 1:6).

అయినను, 1 థెస్సలొనీకయులకు 5:5-9లో పౌలు వారిని ఏ విధముగా హెచ్చరించాడో వినండి:

మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారము కాము. కావున ఇతరులవలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులముకాక యుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై యున్నాము గనుక మత్తులమై యుండక, విశ్వాస ప్రేమలను కవచము, రక్షణనిరీక్షణయను శిరస్త్రాణ మును ధరించుకొందము. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా రక్షణపొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రతపాలగుటకు నియమింపలేదు (1 థెస్సలొనీకయులకు 5:5-9).

రక్షణను గూర్చిన పౌలు యొక్క ప్రాథమిక మూడింతల దృక్కోణము మరల ఈ వాక్యభాగములో కనిపిస్తుంది. గతములో, థెస్సలొనీకయులు “వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు.” దేవుని దృష్టిలో ఈ ప్రత్యేకమైన స్థితిని వారు అప్పటికే పొందుకున్నారు, మరియు నమ్మకముగా, ప్రేమగా ఉన్నారు మరియు రక్షణను గూర్చి నిరీక్షణతో ఉన్నారు. వారు గతములో రక్షణను అనుభవించారు గనుక, ప్రస్తుతములో రక్షణలో కొనసాగే బాధ్యత వారికి ఉందని పౌలు ఉద్ఘాటించాడు: “మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.” అంతేకాకుండ, క్రైస్తవులు మెలకువగా ఉండి మత్తులు కాకుండా, విశ్వాసము, నిరీక్షణ మరియు ప్రేమలో నిలకడగా ఉండుటకు కారణం మన భవిష్యత్ రక్షణ వీటి మీద ఆధారపడి ఉండుట అని పౌలు చెప్పాడు. దేవుడు తన “ఉగ్రతను భరించుటకు” మనలను నియమించలేదుగాని “రక్షణను పొందుటకు” నియమించాడు. అయితే మన ప్రస్తుత విశ్వాసమును మన భవిష్యత్తు రక్షణను పొందే మార్గముగా కూడా ఆయన నియమించాడు.

దీని వెలుగులో, 1 మరియు 2 థెస్సలొనీకయులకు వ్రాసిన పత్రికలలో పౌలు అనేకమైన నైతిక సూత్రములను ఇచ్చాడు. ఉదాహరణకు, 1 థెస్సలొనీకయులకు 4:3-5:22లో మనము ఇప్పటికే చూచినట్లుగా, అతడు వారిని చేతులతో పనుచేయుడి, జారత్వమును దూరముగా ఉండుడి, ఒకని నొకడు ప్రేమించుకొనుడి, కీడునకు ప్రతికీడు చేయకుండా మేలైనదానిని చేయండి, పరిశుద్ధముగా జీవించుడి అని హెచ్చరించాడు. థెస్సలొనీకయులకు ఇయ్యబడిన ఇవి మరియు ఇతర హెచ్చరికలు రక్షణ అప్పటికే ప్రస్తుత వాస్తవికతగా ఉన్న సమయంలో క్రైస్తవులు జీవిస్తున్నారనే పౌలు యొక్క నమ్మకం నుండి వెలువడినవి. పౌలు యొక్క యుగాంతశాస్త్రము రక్షణ యొక్క గత మరియు ప్రస్తుత కోణముల నుండి భవిష్యత్ ఆశీర్వాదములకు పురోగతిని కనుపరచింది.

రక్షణ సిద్ధాంతము మరియు క్రైస్తవ నైతికతను గూర్చి పౌలు ఇచ్చిన వేదాంతశాస్త్ర దృక్పధములతో పాటుగా, థెస్సలొనీకయుల యొక్క ఉద్రేక యుగాంతశాస్త్రమును సరిచేయుటకు అతడు మూడవ మార్గమును ప్రతిపాదించాడు. క్రీస్తు తిరిగివచ్చుటకు ముందు జరుగు సంఘటనలకు దృష్ట్యా పౌలు వారి యొక్క చారిత్రిక స్థితిని వివరించాడు.

ప్రభువు రాకడలో జరుగు చారిత్రిక సంఘటనలను గూర్చి థెస్సలోనీకయలోని అనేక విశ్వాసులు సందిగ్ధతలో ఉన్న విషయము మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. క్రీస్తు అప్పటికే తిరిగి వచ్చాడు అని, మరియు వారు ఆయన రాకడను కోల్పోయారని కూడా వారిలో కొందరు ఆలోచించారు. క్రీస్తు తిరిగి రానప్పటికీ, ఆయన తక్షణ భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తాడు అని ఇతరులు నమ్మారు. పౌలు ఈ తప్పు ఆలోచనకు స్పందిస్తూ, క్రీస్తు రాకడకు ముందు అనేకమైన సంఘటనలు జరగాలి అని థెస్సలొనీకయులకు జ్ఞాపకం చేశాడు — మరియు ఈ సంఘటనలు ఇంకా చోటుచేసుకోలేదు. 2 థెస్సలొనీకయులకు 2:1-8లో అతడు వ్రాసిన మాటలను వినండి:

ప్రభువుదినమిప్పుడే వచ్చి యున్నట్టుగా ... మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగుపాపపురుషుడు బయలుపడితేనేగాని ఆ దినము రాదు ... ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసివేయబడు వరకే అడ్డగించును. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. ప్రభువైన యేసు తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును (2 థెస్సలొనీకయులకు 2:1-8).

ఈ వాక్యభాగము సంఘము యొక్క ఆది నుండే వ్యాఖ్యతలను ఆకర్షించింది మరియు దీని అర్థము మీద అనేక భిన్నమైన అభిప్రాయములు కూడా ఉన్నాయి. సాధారణ పదములలో, థెస్సలొనీకయుల యొక్క ఉద్రేక యుగాంతశాస్త్రము తప్పుదారిలో ఉన్నదని పౌలు బోధించినట్లుగా మనం నిశ్చయముగా చెప్పవచ్చు ఎందుకంటే క్రీస్తు మహిమలో తిరిగివచ్చుటకు ముందు కొన్ని సంఘటనలు జరగవలసి ఉంది.

థెస్సలొనీకయుల యొక్క చారిత్రిక స్థితి ప్రకారం, క్రీస్తు రాకడకు ముందు కనీసం నాలుగు సంఘటనలు జరగాలి: మొదటిగా, ధర్మవిరోధ సంబంధమైన మర్మము క్రియ చేయాలి మరియు అడ్డగించబడాలి; రెండవదిగా, భ్రష్టత్వము లేదా తిరుగుబాటు సంభవించాలి; మూడవదిగా, అడ్డగించుచున్నవాడు తీసివేయబడాలి; మరియు నాల్గవదిగా, ధర్మవిరోధి బయలుపరచబడాలి. ఇప్పుడు ఆరంభించుటకు ముందు, ఒక విషయమును మాత్రం మనము స్పష్టము చేయాలి. వ్యాఖ్యాతలు ఈ నాలుగు విషయాలను అనేక విధాలుగా అర్థం చేసుకున్నారు, మరియు ప్రతియొక్కరి సంతృప్తి కొరకు ప్రతి విషయమును ఇక్కడ మనం పరిష్కరించలేము. కాబట్టి, ఈ సమయంలో మనలను బాగా ఒప్పించగల ఎక్కువగా పరపతి సాధించిన కొన్ని అభిప్రాయములను చూద్దాము, “ధర్మవిరోధ సంబంధమైన మర్మము”తో ఆరంభిద్దాము.

మొదటిగా, “ధర్మవిరోధ సంబంధమైన మర్మము” ఇప్పటికే క్రియ జరిగించుచున్నది, మరియు అది అడ్డగించబడుతుంది అని పౌలు వ్యాఖ్యానించాడు, కాని అతడు ఈ మర్మమును లేక అడ్డగించువాడిని గుర్తించలేదు. ఏదేమైనా, 2 థెస్సలొనీకయులకు 2:7-9లో, పౌలు ఈ మర్మమును సంఘము యొక్క ప్రధాన శత్రువైన సాతానుతో స్పష్టంగా అనుబంధపరచాడు. ఇది స్వాభావికంగా సాతాను లేక దయ్యము అయ్యుండవచ్చని ఇది మనకు సూచిస్తుంది. సంఘము ప్రధానంగా భూసంబంధమైన అధికారులతో కాదుగాని దురాత్మ సమూహములతో పోరాడుచున్నట్లుగా పౌలు వివరించిన విషయమును గమనించండి. ఎఫెసీయులకు 6:12లో అతడు వ్రాసినట్లు:

మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహ ములతోను పోరాడుచున్నాము (ఎఫెసీయులకు 6:12).

దురాత్మ సమూహములకు భూసంబంధమైన ప్రతిరూపములు, అనగా దుష్ట మానవ ప్రభుత్వాలు మరియు క్రీస్తుకు వేరుగా ఉన్న వ్యక్తులు వంటి ప్రతిరూపాలు ఉంటాయను విషయమును పౌలు తిరస్కరించలేదు. అయితే దయ్యముల కార్యముల విషయమును గూర్చి మొదటిగా ఆలోచించాలని మరియు ప్రతి భూసంబంధమైన పోరాటమును దురాత్మల యుద్ధముకు విస్తరణగా భావించాలని అతడు విశ్వాసులను ప్రోత్సహించాడు. అంతేకాకుండా, పౌలు అతని పత్రికలన్నిటిలో మర్మము మరియు అడ్డగించువానికి సమాంతరముగా ఆత్మీయ యుద్ధమును గూర్చిన వివరాలను పేర్కొన్నాడు.

ఉదాహరణకు, కొలస్సయులకు 2:15-20లో మరియు గలతీయులకు 4:3-9లో, విశ్వాసులు విశ్వాసములోకి రాక మునుపు వారి మీద అధికారమును కలిగియున్న దయ్యములను క్రీస్తు సిలువ “నిరాయుధులనుగా” చేసింది అని అతడు బోధించాడు. మరియు పరిశుద్ధాత్ముని పరిచర్య బలహీనమైన ఈ అబద్ధ దేవతల నుండి విశ్వాసులను విడిపించింది అని అతడు బోధించాడు. ముఖ్యముగా, ఈ దురాత్మ శక్తులు ఇంకా క్రియ జరిగించుచున్నవి కాని, దేవుని శక్తి ద్వారా అవి అడ్డగించబడుచున్నవి. ఈ కారణములను బట్టి, “ధర్మవిరోధ సంబంధమైన మర్మము”ను ఆకాశమండలములో పరిపాలించుచున్న దురాత్మ శక్తులుగా, దేవునిని వ్యతిరేకించువారిగా, అబద్ధ బోధకులను బలపరచేవారిగా, మరియు అబద్ధ మతమును ప్రోత్సహించేవారిగా పరిగణించుట ఉత్తమము అనిపిస్తుంది. తదనుగుణంగా, “అడ్డగించుచున్నవాడు,” లేదా బహుశా “అడ్డగింపు” కూడా ప్రధానంగా ఆత్మీయ ప్రపంచములో క్రియ జరిగించుచున్నది, ఇది బహుశా దూత లేదా దూతల సమూహము లేదా పరిశుద్ధాత్మ అయ్యిండవచ్చు.

ధర్మవిరోధ సంబంధమైన మర్మము అడ్డగింపబడుటను గూర్చి అతడు చేసిన సంభాషణ తరువాత, తిరుగుబాటు లేక భ్రష్టత్వము జరుగకుండ క్రీస్తు రాకడ జరుగదు అని పౌలు థెస్సలొనీకయులకు ధృవీకరించాడు. పౌలు వ్రాసినప్పుడు అడ్డగించువాడు క్రియ జరిగించుచున్నాడు గనుక, ఈ తిరుగుబాటు జరుగలేదు మరియు క్రీస్తు ఇంకా తిరిగి రాలేదు.

ఈ తిరుగుబాటు లేక భ్రష్టత్వమును ప్రకటన గ్రంథమంతటా యోహాను పిలచినట్లుగా “యుద్ధము”కు సమాంతరంగా అర్థం చేసుకోవడం మంచిది. ప్రకటన 16:14లో, ఇది “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధము” అయ్యున్నది. ప్రకటన 19:19లో, ఇది “గుఱ్ఱముమీద కూర్చున్నవానితో యుద్ధము” అయ్యున్నది. ప్రకటన 20:8, 9లో, ఇది “పరిశుద్ధుల శిబిరముకు మరియు ప్రియమైన పట్టణముకు” యుద్ధము అయ్యున్నది. ఈ తిరుగుబాటులో ప్రభువు యొక్క అంతిమ దినమున దేవునికి వ్యతిరేకముగా యుద్ధము చేయు దురాత్మ సమూహములు ఉన్నాయి. ఇది యుగ సమాప్తి అయ్యే వరకు సంభవించదు. మరియు ఆ సమయములో, ఆయనకు వ్యతిరేకముగా ఉన్నవారిని క్రీస్తు సమూల నాశనము చేస్తాడు.

అంతేగాక, “అడ్డగించువాడు” లేదా అడ్డగింపు తొలగింపబడి, ధర్మవిరోధ సంబంధమైన మర్మమును అడ్డగించుట ఆపివేయనంతవరకు తిరుగుబాటు లేక భ్రష్టత్వము జరుగదు అని పౌలు సూచించాడు. థెస్సలొనీకయులు అడ్డగించువాని యొక్క కొనసాగు క్రియాశీల కార్యమును గూర్చి అవగాహన కలిగియున్నారు గనుక క్రీస్తు రాకడను కోల్పోయామని వారు భయపడనవసరము లేదు.

చివరిగా, ధర్మవిరోధి బయలుపరచబడువరకు క్రీస్తు రాకడ జరుగదు అని పౌలు చెప్పాడు. 2 థెస్సలొనీకయులకు 2:4-9లోని పౌలు వివరణలో, ధర్మవిరోధి యేసు క్రీస్తు అవతారము యొక్క వ్యంగ్యానుకరణగా కనిపిస్తాడు. ఉదాహరణకు, 8వ వచనము ప్రకారం, యేసు వలె వాడు “బయలుపరచబడతాడు.” వాడు “సొంతకాలమందు” వస్తాడు అని 6వ వచనము సూచిస్తుంది. 9వ వచనము ప్రకారం, వాని “రాక” “బలముతోను, సూచకక్రియలతోను మరియు మహత్కార్యములతోను” జరుగుతుంది. మరియు వాడు తన్నుతాను దేవుడుగా ప్రకటించుకుంటాడు అని 4వ వచనము చెబుతుంది.

ధర్మవిరోధి యొక్క గుర్తింపుకు సంబంధించి అనేకమైన సూచనలు ఇవ్వబడినవి. వాడు మొదటి శతాబ్దములో రోమా చక్రవర్తులైన నీరో, క్లౌదియ కైసరు వంటి రాజకీయ సంబంధమైన వ్యక్తి వంటివాడు అని కొంతమంది భావించారు. ప్రతి యుగములోను పునరావృతమయ్యే ఒక రకమైన రాజకీయ వ్యక్తి అని ఇంకొందరు భావించారు. ఉదాహరణకు, నీరో సంఘమును అతిగా హింసించినవారిలో మొదటివాడైనప్పటికీ, అతని తరువాత మార్కుస్ ఔరెలియస్ వంటి వారు కూడా సంఘముకు వ్యతిరేకముగా ఉండిరి. బహుశా ఉత్తమమైన వివరణ ఏమనగా ధర్మవిరోధి ఏక మానవ చిత్రముగా ఉన్నాడు, ఇంకా బయలుపరచబడవలసియుండి, క్రీస్తు రాకడకు ముందు చివరి తరములో చాలా ప్రభావవంతముగా ఉంటాడు, యోహాను వానిని 1 యోహాను 2:18లో “అంత్యక్రీస్తు” అని పిలచాడు.

ఇప్పుడు, మనము ప్రస్తావించిన ప్రతి విషయము యొక్క స్పష్టమైన అర్థమును గూర్చి పండితులు విభేదించినప్పటికీ, పౌలు యొక్క విస్తృతమైన ప్రకటనను గూర్చి మనం కనీసం ఖచ్చితంగా చెప్పగలము: క్రీస్తు రాకడకు ముందు అనేకమైన విషయాలు జరుగవలసి ఉంది అని పౌలు పునరావృతం చేశాడు, అనగా క్రీస్తు రాకడ థెస్సలొనీకయులు ఆలోచించినదాని కంటే దూరముగా ఉన్నది అని అర్థము. మరియు వారి ప్రస్తుత జీవితముల యొక్క ప్రాముఖ్యత వైపుకు దృష్టిని ఆకర్షించుటకు అతడు ప్రధానముగా ఇలా చేశాడు. ఇదే విధముగా, ప్రస్తుతము మనము దేవునికి చేయవలసిన సేవను నిర్లక్ష్యము చేయునట్లు శోధింపబడునంతగా క్రీస్తు యొక్క తక్షణ రాకను గూర్చి క్రైస్తవులు అత్యుత్సాహము చూపకూడదు. క్రీస్తు రాకడకు ముందు, ప్రస్తుతము మనము కలిగియున్న క్రైస్తవ బాధ్యతలలో పాలుపంచుకొనుట ఎంత ప్రాముఖ్యమైయున్నదో మనము జ్ఞాపకముంచుకోవాలి.

ఈ పాఠములో థెస్సలొనీక సంఘములో తలెత్తిన సమస్యలకు పౌలు స్పందించిన విధానమును మనం చూశాము. థెస్సలొనీకయులతో అతని సంబంధము యొక్క నేపథ్యమును మనం విశదీకరించాము. మరియు థెస్సలొనీకయులకు అతడు వ్రాసిన పత్రిక యొక్క నిర్మాణము మరియు విషయములను మనం చూశాము. చివరిగా, తమ యొక్క ఉద్రేక యుగాంతశాస్త్రమును శాంతపరచాలని మరియు ఇప్పుడు మరియు ఇక్కడ జీవితముపై సరైన ఆసక్తి చూపించాలని థెస్సలొనీకలోని క్రైస్తవులకు పిలుపునిచ్చుట ద్వారా థెస్సలొనీకయులకు పౌలు వ్రాసిన పత్రికలు అతని కేంద్ర వేదాంతశాస్త్ర దృక్పధములను — అనగా క్రీస్తునందు అంత్య దినములను గూర్చిన అతని బోధలను — ప్రతిబింబించిన విధానమును మనము చూశాము.

థెస్సలొనీకయులకు పౌలు వ్రాసిన పత్రికలను మనం విశ్లేషించుచుండగా, అతని యుగాంతశాస్త్రము మొదటి శతాబ్దములోని క్రైస్తవుల యొక్క ఆచరణాత్మకమైన సమస్యలను గూర్చి ఎలా మాట్లాడినదో మరియు నేడు అది మనలను ఎలా నడిపించగలదో మనం చూశాము. చాలా వరకు థెస్సలొనీకయుల వలెనే, నేడు అనేకమంది క్రైస్తవులు క్రీస్తు రాకడ మీద ఎంతగా దృష్టిపెట్టునట్లు తప్పుదారి పట్టించబడ్డారు అంటే, ప్రస్తుతము ఆత్మయందు జీవించుట యొక్క ప్రాముఖ్యతను వారు నిర్లక్ష్యము చేస్తారు. అయితే క్రీస్తు తన రాజ్యములో మన ప్రస్తుత బాధ్యతలను అల్పమైనవిగా పరిగణించుటకు మనలను పిలువలేదు. బదులుగా, ఆయనకు నమ్మకముగా ఉండుటకు, పరిశుద్ధతలో ఎదుగుటకు, మరియు ప్రపంచములో ఆయనకు సాక్షులుగా ఉండుటకు మన జీవితములో ఈ సమయమును ఆయన నియమించాడు. ఈ విధముగా, పౌలు వేదాంతశాస్త్రము అలనాడు థెస్సలొనీకయులతో మాట్లాడినట్లుగా నేడు మనతో మాట్లాడుతుంది. ప్రభువు రాకడ కొరకు మరియు రాబోవు యుగము యొక్క సంపూర్ణత కొరకు వేచిచూస్తుండగా నమ్మకముగా ఉండాలని అది మనలను ప్రోత్సహిస్తుంది.

Continue reading the full transcript