అదే శ్రేణి 4వ పాఠానికి తోడుగా ఉండే వీడియో, ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: పౌలు తన పాఠకులను ఎంత బాగా తెలుసుకున్నాడు? కొరింథీయులకు ఎందుకు చాలా సమస్యలు వచ్చాయి? కొరింథులోని విభజనలకు, ఆధునిక తెగలకు మధ్య సారూప్యతలు ఉన్నాయా? ఆధునిక తెగలు ఒకదానితో ఒకటి పునరేకీకరణ కోసం పని చేయాలా? తెగలవాదం పాపమా? సమస్యలను పరిష్కరించడానికి సంఘాలు బయటి సలహాలను కోరాలా? క్రైస్తవులు విశ్వాసంలో బలహీనంగా ఉన్నవారికి ఎలా స్పందించాలి? యెరూషలేములోని చర్చ కోసం సేకరణ పౌలుకు ఎందుకు చాలా ముఖ్యమైనది? ఆధునిక యెరూషలేములోని చర్చలకు క్రైస్తవులు డబ్బు పంపాలా? మేధోపరమైన విషయంగా విశ్వాసం వ్యక్తిగత నమ్మకంగా విశ్వాసానికి ఎలా సంబంధం కలిగి ఉంటుంది? పౌలు ప్రకారం, క్రైస్తవులకు గొప్ప ఆశ ఏమిటి? పౌలు ఆధ్యాత్మిక బహుమతులను ప్రేమతో ఎందుకు అనుబంధిస్తాడు? ప్రేమ విశ్వాసం, ఆశల కంటే ఎందుకు గొప్పది?
From the transcript
1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.
బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.
ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.
అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.
మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.
ఈసప్ అను ప్రాచీన్ గ్రీకు పేరుకు ఆపాదించబడిన కల్పితకథలను గూర్చి మనలో చాలామందికి తెలుసు. “తాబేలు మరియు కుందేలు” అను ఒక కథలో, జంతువులన్నిటిలో తానే వేగముగా పరిగెత్తగలను అని కుందేలు ఎల్లప్పుడు అతిశయిస్తూ ఉండేది. కాబట్టి, కుందేలు యొక్క అతిశయమును గూర్చి విని విని అలసిపోయి, తాబేలు పరుగు పందెముకు సవాలు చేసింది. ఇప్పుడు, స్పష్టంగా కుందేలే గెలిసేది, కాని అది దాని యొక్క విజయము గూర్చి నిశ్చయత కలిగియుండి, దాని సామర్థ్యమును చూసుకొని గొప్పగా అతిశయించి, పందెము మధ్యలో కొంత విశ్రమించింది. కుందేలు నిద్రించుచుండగా, తాబేలు దానికంటే ముందుగా గమ్యము చేరుకుంది.
కొన్నివిధాలుగా, మొదటి శతాబ్దములో కొరింథు పట్టణములో నిససిస్తున్న అనేకమంది క్రైస్తవులు ఈసప్ కథలోని కుందేలువలె ఉన్నారు. పందెము ముగియక మునుపే కుందేలు తన్నుతాను విజేతగా లెక్కించుకొన్నట్లుగానే, కొరింథు సంఘములో అనేకమంది క్రైస్తవ జీవితము అను తమ పందెము ముగియక మునుపే తమ్మునుతాము విజేతలుగా పరిగణించుకున్నారు. వారు తమ భూసంబంధమైన శ్రేయస్సును, సమాజములో వారి స్థాయిని మరియు తమ ఆత్మీయవరములను చూచుకొని, ప్రభువు తమను ఇతరుల కంటే అధికులుగా చేశాడని నమ్మారు. తక్కువ భూసంబంధమైన సంపద మరియు తక్కువ ఆత్మీయవరములు కలిగిన ఇతర క్రైస్తవులకంటే అధికముగా వారిని దేవుడు రాజ్య వరములతో దీవించాడని భావించారు. క్రైస్తవ జీవనము అను పరుగు పందెములో వారు ఓడిపోయే అపాయములో ఉన్నారు అని అపొస్తలుడైన పౌలు వారిని హెచ్చరించాడు.
పౌలు వేదాంతశాస్త్రము యొక్క మూలాంశములు అను మన పాఠ్యక్రమములో ఇది నాల్గవ పాఠము. మరియు దీనికి “పౌలు మరియు కొరింథీయులకు వ్రాసిన పత్రిక” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో, ఇప్పుడు 1 మరియు 2 కొరింథీయులకు వ్రాసిన పత్రికలుగా సుపరిచితమైన పత్రికలలో పౌలు ఈ గర్విష్టులైన క్రైస్తవులతో మాట్లాడిన విధానమును మనము చూస్తాము. కొరింథు సంఘములో ఉన్న అనేక విశేషమైన సమస్యలను గూర్చి పౌలు మాట్లాడినప్పటికీ, వారి యొక్క అనేక సమస్యలకు ప్రధాన మూలముగా ఉన్న విషయము మీద దృష్టిపెట్టుట ద్వారా అతడు ఇలా చేశాడు: వాస్తవానికి పందెము కొనసాగుచుండగనే క్రైస్తవ జీవితములలో గమ్యమును చేరాము అని కొందరు కలిగియున్న అబద్ధ నమ్మకము.
ఈ పాఠ్యక్రమములో ఇంతకు ముందు, పౌలు వేదాంతశాస్త్రము యొక్క ములాంశము అతని యుగాంతశాస్త్రము అని మనం నేర్చుకున్నాము. యేసు ఇశ్రాయేలు యొక్క మెస్సీయ అని, ఆయన అంత్య దినములను, లేక భూమి మీద దేవుని రాజ్యము యొక్క చివరి దినములను తీసుకొనివచ్చాడని పౌలు బోధించాడు. మెస్సీయ వచ్చినప్పుడు ఆయన అంత్య దినములను సంపూర్ణముగా తెచ్చుట ద్వారా సృష్టి కొరకు దేవుడు కలిగియున్న ఉద్దేశ్యములన్నిటిని నెరవేర్చుతాడు అని పౌలు దినములలోని నమ్మకమైన యూదులు నమ్మారు. అయితే పౌలు యేసు బోధనలను అనుసరించి, ఆయన మొదటి రాకడలో, క్రీస్తు కేవలం అంత్య దినములను ఆరంభించాడు అని నమ్మాడు. క్రీస్తునందు అంత్య దినములు సంఘ చరిత్రయంతటా కొనసాగి, ఆయన రెండవ రాకడలో రాజ్య నెరవేర్పు జరిగినప్పుడు తుదకు పూర్ణతలోనికి వస్తాయి.
చాలా వరకు, క్రీస్తు రాజ్యము ఈ మూడు దశలలో బయలుపరచబడుతుంది అని ఉద్ఘాటించారుగాని, చాలా వరకు వారు సందిగ్ధతను ఎదుర్కొన్నారు. యేసు అప్పటికే ఏమేమి సాధించాడు? అంత్య దినముల కొరకు దేవుడు కలిగియున్న గొప్ప ఆశీర్వాదములలో ఎన్ని ఇంకా భవిష్యత్తులో జరగవలసియున్నాయి? అంత్య దినముల యొక్క ఆరంభములో క్రీస్తు అప్పటికే సాధించిన విషయములను గలతీయ సంఘములు తక్కువ అంచనా వేశాయని మనము చూశాము. థెసలొనీక సంఘములో ఉన్న అనేకమంది క్రీస్తు రాకడ చాలా దగ్గరగా ఉన్నదని నమ్మి వారి అనుదిన బాధ్యతలను నేరవర్చుటకు ఎలాంటి కారణము లేదని భావించిన విషయమును కూడా మనము చూశాము. ఈ పాఠములో, కొరింథీయులు మరొక విధానములో సందిగ్ధతను ఎదుర్కొన్నారు అని మనము నేర్చుకుంటాము. కొరింథు సంఘములోని కొందరు క్రైస్తవులు ఇతరుల కంటే తమకు ఎక్కువ అంత్య దినముల ఆశీర్వాదములు ఉన్నాయని ఆలోచించారు కాబట్టి సంఘము విభజనను మరియు సమస్యలను ఎదుర్కొన్నది.
పౌలు మరియు కొరింథీయులపై మన అధ్యయనం మూడు భాగాలుగా విభజించబడుతుంది: మొదటిగా, పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును చూద్దాము. రెండవదిగా, 1 మరియు 2 కొరింథీయులకు వ్రాసిన పత్రికల యొక్క నిర్మాణము మరియు విషయములను పరిశీలిద్దాము. మరియు మూడవదిగా, పౌలు పత్రికలు అతని యొక్క కేంద్ర వేదాంత దృక్పథములలో ఒకదానిని ఎలా ప్రత్యక్షపరుస్తాయో చూద్దాము: అంత్యదినములను గూర్చిన అతని సిద్ధాంతము — అతని యుగాంతశాస్త్రము. పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రికల యొక్క నేపథ్యమును మొదటిగా చూద్దాము.
ఈ పాఠ్యక్రమము అంతటా మనము ఉద్ఘాటించినట్లుగా, వివిధ సంఘములలో అగుపడుచున్న కొన్ని నిర్దిష్ట సమస్యలను గూర్చి చర్చించుటకు అపొస్తలుడైన పౌలు తన పత్రికలను వ్రాశాడు. కాబట్టి, 1 మరియు 2 కొరింథీ పత్రికలను మనం చూసినప్పుడు, మనము కొన్ని ప్రాథమిక ప్రశ్నలను అడగాలి: కొరింథు సంఘములో ఏమి జరుగుతుంది? మరియు పౌలు వారికి ఎందుకు వ్రాశాడు?
పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రికల యొక్క నేపథ్యముకు సంబంధించిన ఈ ప్రశ్నలకు మనము రెండు విధానములలో జవాబిద్దాము. మొదటిగా, కొరింథీ పత్రికలు పౌలు యొక్క మూడవ మిషనరీ యాత్రతో ఎలా సంబంధము కలిగియున్నాయో విశదీకరిద్దాము. మరియు రెండవదిగా, కొరింథు సంఘములో తలెత్తిన కొన్ని నిర్దిష్ట సమస్యలను పరిశీలిద్దాము. పౌలు యొక్క మూడవ మిషనరీ యాత్రను మొదటిగా చూద్దాము.
పౌలు యొక్క మూడవ మిషనరీ యాత్రను గూర్చి అపొస్తలుల కార్యములు 18:23-21:17లో నమోదు చేయబడింది. ఈ అధ్యాయములలో పౌలు రెండవ మిషనరీ యాత్రలో అనుసరించిన క్రమమునే చాలావరకు పునరావృతం చేశాడు అని మనము నేర్చుకుంటాము. పౌలు ఈ ప్రయాణమును సుమారుగా క్రీ.శ. 52 లేక 53లో ఆరంభించాడు. అతడు చేసిన మొదటి రెండు ప్రయాణములలో వలెనే, అతడు సిరియాలోని అంతియొకయలో ఆరంభించాడు. గలతీయ మరియు ఫ్రుగియ ప్రదేశములలోని విశ్వాసులను అతడు బలపరచాడని అపొస్తలుల కార్యములు 18:23లో మనము చదువుతాముగాని, ఈ ప్రాంతములలో అతడు సందర్శించిన పట్టణముల పేర్లు మనకు తెలియపరచబడలేదు. బహుశా, అతడు మునుపు పరిచర్య జరిగించిన పట్టణములలో కొన్నిటిని, అనగా గలతీయలో దెర్బే, లుస్త్ర మరియు ఈకొనియ, మరియు ఫ్రుగియలో అంతియొకయ వంటి పట్టణములను దర్శించియుండవచ్చు. గలతీయ మరియు ఫ్రుగియ ప్రదేశముల గుండా వెళ్లిన పౌలు, రోమీయుల ప్రాంతమైన ఆసియా లేదా చిన్న ఆసియా ప్రాంతములోని తీరప్రాంతమైన ఎఫెసు పట్టణముకు చేరుకున్నాడు.
అతడు ఎఫెసుకు వచ్చినప్పుడు, పౌలు బాప్తిస్మమిచ్చు యోహాను యొక్క పండ్రెండుగురు శిష్యులను ఎదుర్కొన్నాడు, వారు క్రీస్తు సువార్తను వెంటనే అంగీకరించారు. మొదటిగా, పౌలు సమాజమందిరములో సువార్త ప్రకటించాడు, అయితే మూడు నెలలలో, యూదులు అతని సందేశమునుబట్టి కఠినపరచబడ్డారు. కాబట్టి తరువాత రెండు సంవత్సరములలో పట్టణములో మరొకచోట అతడు సువార్త ప్రకటించి అద్భుతకార్యములు చేశాడు. అయితే, తుదకు, పౌలు మరియు అతని సహచరులకు మరియు ఎఫెసు మహాదేవియైన అర్తెమిదేవి గుళ్లను కట్టించు పనివారికిని మధ్య వివాదము కలిదినది. స్పష్టంగా చెప్పాలంటే, పౌలు అనేకమంది అన్యులను క్రీస్తు కొరకు సంపాదించాడు గనుక అన్యమత గుళ్లు గణనీయంగా తగ్గిపోయాయి. తత్ఫలితంగా, పనివారు అల్లర్లురేపి, పౌలు సహచరులలో కొందరి యొక్క భద్రతకు ఆటంకం కలిగించారు. ఎఫెసులో జరిగిన ఈ సంఘటనల తరువాత, పౌలు మరియు అతని ప్రయాణ సహచరులు అనేక నెలలు మాసిదోనియ మరియు అకయలో గడిపారు, ఇవి ఆధునిక గ్రీసులో ఉన్నవి. పౌలు ప్రయాణములోని ఈ భాగమును గూర్చిన లూకా నివేదిక క్లుప్తంగా ఉంది. అయినప్పటికీ, వారు ఫిలిప్పీ పట్టణము నుండి ఆసియాకు తిరిగివచ్చిన విషయమును అతడు నమోదుచేశాడు. పౌలు మరియు అతని సహచరులు త్రోయలో దిగారు.
అక్కడ ఒక దినము గడుపుటకు పౌలు నిర్ణయించుకున్నాడు కాబట్టి, అతడు విశ్వాసులను కూడబెట్టి వారితో అర్థరాత్రివరకు మాట్లాడాడు. పౌలు మాట్లాడుచుండగా ఐతుకు అను ఒక యౌవ్వనస్థుడు కిటికీలో కూర్చొని గాఢ నిద్రపోయి, క్రిందపడి చనిపోయాడు. అయితే, పౌలు అద్భుతముగా అతనిని బ్రతికించాడు. పౌలు మరియు అతని సహచరులు త్రోయను విడచి, అస్సు అను సమీప పట్టణముకు వెళ్లారు, అక్కడనుండి వారు మరల సముద్ర ప్రయాణము కొనసాగించారు. వారు మితులేనేకు, కీయొసు మరియు సమొసులో ఆగి, తుదకు మిలేతుకు చేరారు, అక్కడ వారు కొంతకాలము ఉన్నారు. మిలేతులో ఉండగా, పౌలు ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించాడు. వారికి కొన్ని తుది సూచనలు ఇచ్చి వారిని ఆశీర్వదించుటకు అతడు వారిని పిలిపించాడు.
దీని తరువాత, వారు తమ ప్రయాణమును కొనసాగించారు. కోసు, రొదుకు, పతరకు మరియు కుప్ర ప్రదేశముల మీదుగా ప్రయాణించి తూరులో దిగారు, అక్కడ వారు ఒక వారము పరిచర్య చేశారు. అక్కడ నుండి వారు తొలెమాయికి, తదుపరి కైసరయకు వెళ్లారు, అక్కడ యూదయ నుండి వచ్చిన అగబు అను ఒక ప్రవక్త నీవు యెరూషలేములో బంధించబడతావు అని పౌలును హెచ్చరించాడు, మరియు పౌలు అప్పటికే ఎరిగియున్నదానిని అతడు నిశ్చయపరచాడు. అయినను, అగబు ప్రవచనము లేదా అతని స్నేహితుల విన్నపమును బట్టి భయపడక, పౌలు యెరూషలేము వైపుకు తన ప్రయాణమును కొనసాగించి సుమారుగా క్రీ.శ. 57లో అక్కడ తన మూడవ మిషనరీ యాత్రను ముగించాడు.
ఈ మూడవ మిషనరీ ప్రయాణములో పౌలు తన రెండు ప్రామాణిక పత్రికలను కొరింథీయులకు వ్రాశాడు, అలాగే క్రొత్త నిబంధనలో భద్రపరచబడని రెండు అదనపు పత్రికలను కూడా అతడు వ్రాశాడు. 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక సుమారు క్రీ.శ. 55లో ఎఫెసు నుండి వ్రాయబడింది. ఈ పత్రిక పంపిన కొంతకాలమునకే, పౌలు కొరింథును దర్శించాడు, ఆ సమయములో అక్కడి సంఘ సభ్యుడు ఒకడు అతనిని తీవ్రంగా దుఃఖపెట్టాడు. ఈ సందర్శన తరువాత, అతడు ఒక పత్రిక వ్రాశాడు అది ఇప్పుడు మనవద్ద లేదు, కొన్నిసార్లు దీనిని “దుఃఖకరమైన పత్రిక” అని పిలుస్తారు. తరువాత, అతని దుఃఖకరమైన పత్రిక అనుకూలముగా అంగీకరించబడిన విధానమును గూర్చిన నివేదికను తిమోతి నుండి పొందుకొనిన తరువాత, పౌలు 2 కొరింథీ పత్రికను, బహుశా మాసిదోనియ నుండి, మరియు 1 కొరింథీ పత్రిక వ్రాసిన ఒక సంవత్సరములోపే వ్రాశాడు.
పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రికల యొక్క నేపథ్యము అతని మూడవ మిషనరీ యాత్ర యొక్క నేపథ్యములో ఎలా సరిపోతుందో మనము చూశాము గనుక, ఇప్పుడు కొరింథులోని సంఘములో ఉన్న కొన్ని నిర్దిష్ట సమస్యలను చూద్దాము. పౌలు వారికి అనేకసార్లు వ్రాయుటకు కారణమగునంత గొప్ప ఉపద్రవమును కలిగించిన ఆ సమస్యలు ఏవి?
అపొస్తలుల కార్యములు 18లో మనము చదువునట్లుగా, మునుపు మిషనరీ యాత్రలో పౌలు కొరింథు సంఘమును స్థాపించాడు, మరియు ఆ సమయములో కనీసం ఒక సంవత్సరము ఆరు నెలలపాటు కొరింథులో ఉన్నాడు. అయితే అతడు వెళ్లిపోయిన తరువాత కొరింథీ క్రైస్తవులు పౌలు చేసిన బోధలలో కొన్నింటిని మరచిపోయారు మరియు మరికొన్నిటిని తప్పుగా అనువర్తించుకొన్నారు. తత్ఫలితంగా, అనేక ముఖ్యమైన వివాదములు మరియు సమస్యలు సంఘములో తలెత్తాయి.
ఈ పాఠములో మనము చూడబోవుచున్నట్లుగా, కొరింథులో తలెత్తిన అనేక సమస్యలు క్రైస్తవ యుగాంతశాస్త్రమును గూర్చి — ముఖ్యముగా క్రీస్తు రాబోవు యుగము, రక్షణ యుగము మరియు నిత్య జీవములోని అనేక ఆశీర్వాదములను అప్పటికే ఏ విధముగా ఆరంభించాడు అను విషయమును గూర్చి — అపార్థం చేసుకొనుటవలన కలిగినవి. అయితే పౌలు వారి మధ్య లేనప్పుడు, కొరింథులోని అనేకులు పౌలు యొక్క నిజమైన బోధలను తీవ్రతలలోనికి తీసుకొనివెళ్లారు. వారు రాబోవు యుగము యొక్క ఆశీర్వాదములను ఇతరుల కంటే ఎక్కువగా పొందుకున్నారు కాబట్టి వారిలో కొందరు అద్భుతమైన క్రైస్తవులమని, ఇతరుల కంటే ఉన్నతమైనవారమని నమ్మారు. మరియు ఈ అబద్ధపు నమ్మకము కొరింథు సంఘములో అన్ని రకముల తీవ్రమైన సమస్యలకు కారణమైయ్యింది.
మన ఉద్దేశ్యముల కొరకు, పౌలు యుగాంతశాస్త్రమును ఈ విధముగా అపార్థము చేసుకొనుట నాలుగు స్పష్టమైన సమస్యల్లోకి ఎలా నడిపించినదో మనం చూద్దాము: మొదటిగా, సంఘములో సంబంధములు దెబ్బతిన్నాయి; రెండవదిగా, లైంగిక దుష్ప్రవర్తన; మూడవదిగా, ఆరాధనను దురుపయోగం చేయుట; మరియు నాల్గవదిగా, పౌలు యొక్క అపొస్తులత్వ అధికారము యొక్క తిరస్కరణ. దెబ్బతిన్న సంబంధములు అను సమస్యను మొదటిగా చూద్దాము.
సంఘములో శతృత్వ సమూహాలు, విశ్వాసుల మధ్య వ్యాజ్యములు, కొరింథులో ఉన్న బీదలను పట్టించుకోకపోవుట, యెరూషలేములోని బీదలకు పరిచర్య చేయుటలో విఫలమగుట వంటి వివిధ రకములైన దెబ్బతిన్న సంబంధములను గూర్చి కొరింథీయులకు వ్రాసిన పత్రికలో పౌలు చర్చించాడు. శతృత్వ సమూహాల సమస్యను మొదటిగా చూద్దాము.
శతృత్వ సమూహాలు. 1 కొరింథీ పతిక్ర వ్రాసే ముందు, కొరింథీ విశ్వాసులు తమనుతాము పలువురు బోధకులతో గుర్తించుకొనుట ద్వారా ఒకరి మీద మరొకరు తిరుగుబాటు చేసుకుంటున్నారు అను నివేదిక పౌలు దృష్టికి వచ్చింది. 1 కొరింథీయులకు 1:12లో వారి వైఖరిని గూర్చి పౌలు ఎలా వివరించాడో వినండి:
మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లోవాడను, మరియొకడు నేను కేఫావాడను, ఇంకొకడు నేను క్రీస్తువాడనని చెప్పుకొనుచున్నారు (1 కొరింథీయులకు 1:12).
కొరింథు సంఘములో ఈ విభజనలకు కారణమైన స్వల్పబుద్ధిని బట్టి పౌలు ఆశ్చర్యపోయాడు. పౌలు, అపొల్లో, పేతురు మరియు యేసు అందరూ ఒకే విషయమును బోధించారు, అదేదనగా యేసు ఉన్నతమైనవాడు, అపొస్తలులు మరియు పేతురు, పౌలు, అపొల్లో వంటి బోధకులు ఆయన సేవకులు. వారు భిన్నమైన తత్వ ఆలోచనలను నిర్మించుటకు ప్రయత్నించలేదుగాని, యేసుక్రీస్తు యొక్క సంఘమును నిర్మించుటకు ప్రయత్నించారు. 1 కొరింథీయులకు 3:5, 11లో పౌలు వ్రాసినట్లుగా:
అపొల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే గదా. ఒక్కొక్కరికి ప్రభువనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి...వేయబడినది తప్ప, మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసు క్రీస్తే (1 కొరింథీయులకు 3:5, 11).
ఇక్కడ పౌలు చెబుతున్నట్లు, పేతురు, పౌలు, అపొల్లో మరియు ఇతర మానవ నాయకులు యేసుకు సేవకులైయున్నారు. ఒక బోధకునికి విరోధముగా మరొక బోధకుని ఉంచి సంఘమును విభాగించుటను ఈ దైవికమైన నాయకులు ఏనాడు ఆశించలేదు.
వ్యాజ్యము. విచారకరంగా, సంఘములోని విభజనలు ఈ శతృత్వ సమూహములను కూడా మించిపోయాయి. కొరింథులోని క్రైస్తవులు ఒకరినొకరు కోర్టులకు తీసుకెళ్తున్న విధానములో కూడా ఇవి కనిపిస్తాయి. క్రీస్తునందు సహోదరీ సహోదరులు ఒకరినొకరు కోర్టులో అవిశ్వాసుల ఎదుటకు ఈడ్చుచుండిరి. 1 కొరింథీయులకు 6:7-8లో పౌలు పరిస్థితిని గూర్చి వివరించిన విధానమును వినండి:
వ్యాజ్యెములలో వారు ఒకరికి వ్యతిరేకముగా మరొకరు వేరైపోయారు. అంతకంటె అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటె మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే యీలాగు చేయుచున్నారు (1 కొరింథీయులకు 6:7-8)
బీదలు. శతృత్వ సమూహములు మరియు వ్యాజ్యములతో పాటుగా, పౌలు మరొక విధముగా నాశనమైన సంబంధములను గూర్చి కూడా మాట్లాడాడు — కొరింథులోని సంఘములో బీదలతో వ్యవహరించిన విధానము. ప్రభుభోజనములో బీదలతో ప్రవర్తించిన విధానమును సంబోధిస్తూ అతడు ఈ విధముగా ప్రత్యేకముగా మాట్లాడాడు. 1 కొరింథీయులకు 11:21-22లో పౌలు వారిని ఖండించిన విధానమును వినండి:
ఏలయనగా మీరు ఆ భోజనము చేయునప్పుడు ఒకనికంటె ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనము చేయుచున్నాడు; ఇందువలన ఒకడు ఆకలిగొనును మరియొకడు మత్తుడవును... దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? (1 కొరింథీయులకు 11:21-22).
మొదటి కొరింథీ పత్రికలో మనము ప్రభువు బల్లను గూర్చి మరియు సంఘములో దాని స్థానమును గూర్చి అనేక విషయములను నేర్చుకుంటాము... మనము తండ్రి బల్ల యొద్ద కూర్చొనియున్నాము, మరియు దేవుని కుటుంబముగా ఆయన కృపైశ్వర్యములో పాలుపంచుకొనుచున్నాము. మరియు దానిని యోగ్యమైన రీతిలో చేయుటకు, కృతజ్ఞతగల హృదయములతో, వినయముగల హృదయములతో, ఒకరినొకరు స్వీకరించుకొనుచు మరియు ఒకరినొకరు హత్తుకొనుచు అలా చేస్తాము, కాని కొరింథీ సంఘములో ఇదే వాస్తవిక సమస్య అయ్యున్నది. 1 కొరింథీ. 11లో ప్రభువు బల్లను గూర్చి అతడు చేసిన బోధనల ద్వారా పౌలు వారిని హెచ్చరించుచున్నాడు, క్రీస్తు కనికరమును అంగీకరిస్తూ వినయముతో ఆ బల్ల యొద్దకు వారు రావాలని కోరుచున్నాడు, వారు చూపు వైఖరిలో మరియు ఇతరుల పట్ల వ్యవహరించు విధానములో దానిని వ్యక్తపరచుచు, మన పక్షమున క్రీస్తు మరణమును ప్రచురపరచుచు, ఆయన చేసిన కార్యముల వైపుకు చూస్తూ, ఆయన చేయబోవు కార్యముల వైపుకు చూస్తూ, భోజన సమయమందు మనతో ఆయన సన్నిధిని వేడుకగా జరుపుకొనమని పౌలు సెలవిచ్చుచున్నాడు. ప్రభువు బల్లలో మనము ఎంత అద్భుతమైన బహుమానమును కలిగియున్నాము!
— రెవ. డెన్ హెండ్లె
యెరూషలేములో పేదరికము. అంతేగాక, కొరింథులో ఉన్న సంఘములోని కఠిన-హృదయము మరియు స్వార్థము సంఘములో శతృత్వ సమూహాలు, వ్యాజ్యములు, సంఘములోని బీదలను పట్టించుకోకపోవుటకు మాత్రమేగాక, యెరూషలేములోని తమ తోటి విశ్వాసుల మధ్య ఉన్న పేదరికము పట్ల ఆసక్తిని చూపు విషయములో కొరింథీయులు విఫలమగుటకు కూడా దారితీసింది. యెరూషలేములోని పేద క్రైస్తవుల కొరకు చందాలు పోగుచేస్తామని కొరింథీయులు ఆ సమయములో వాగ్దానము చేశారు. 1 కొరింథీ పత్రిక వ్రాయుటకు ముందే ఈ సేకరణను చేపట్టమని పౌలు వారిని కోరాడు. వారు కొంత దాతృత్వమును చూపారు, కాని 2 కొరింథీ పత్రికను వారికి పంపే సమయానికి, వారు ఇంకా ఆ పనిని పూర్తిచేయలేదు. 2 కొరింథీయులకు 8:10-11లో ఈ విషయమును గూర్చి పౌలు వారికి ఇచ్చిన హెచ్చరికలను వినండి:
సంవత్స రము క్రిందటనే యీ కార్యము చేయుట యందే గాక చేయ తలపెట్టుటయందు కూడ మొదటి వారై యుండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనస్సు మీలో ఏలాగు కలిగెనో, ఆలాగే మీ కలిమికొలది సంపూర్తియగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి (2 కొరింథీయులకు 8:10-11).
యెరూషలేములోని పరిశుద్ధుల అవసరమును తీర్చాలనే తమ కోరికను వ్యక్తపరచినందుకు పౌలు వారిని మెచ్చుకున్నాడు, కాని వారు తమ వాగ్దానమును నెరవేర్చునట్లు చేయుటకు 2 కొరింథీయులకు 8-9 అంతటా అతడు ఆ విషయమును ఉద్ఘాటించవలసి వచ్చింది.
సంఘములో ఇట్టి దెబ్బతిన్న సంబంధములతో పాటుగా, కొరింథులోని క్రైస్తవ సమాజములో లోపల లైంగిక దుష్ప్రవర్తన కూడా వెలుగులోనికి వచ్చింది.
సాధారణంగా, మానవ లైంగికతను గూర్చి కొరింథీయుల యొక్క అభిప్రాయములు మొదటి శతాబ్దపు గ్రీకో-రోమన్ మనస్సు మరియు శరీర ద్వంద్వాదము — అనగా శరీరము మరియు మనస్సు యొక్క విభజన — ద్వారా ప్రభావితము చేయబడినవని అనిపిస్తుంది. ఈ పాఠములో ముందుగా మనము చూచినట్లుగానే, ఇది కనీసము రెండు వ్యతిరేక భావనలను సూచిస్తుంది.
మొదటిగా, మనస్సు మరియు శరీరము యొక్క ద్వంద్వాదము గ్రీకో-రోమన్ సంస్కృతిలో ఉన్న అనేకమంది తమ శరీరములతో తమకు ఇష్టమొచ్చిన పనులు చేయుటకు అనుమతి ఉన్నదని నమ్మునట్లు పురికొల్పింది. తమ హృదయములు మరియు మనస్సులలో వారు తమ భాగస్వాముల పట్ల నమ్మకముగా ఉన్నంత వరకు, వారు అన్ని రకముల హేయమైన లైంగిక సంబంధములలో పాలుపంచుకొనవచ్చని వారి అభిప్రాయం. పౌలు వ్రాసిన పత్రికల ప్రకారం, కొరింథు సంఘములోని కొందరు ఇట్టి రకమైన లైంగిక అనైతికతలో పడిపోయారు అని అనిపిస్తుంది. దీనివలన అనేక సమస్యలు తలెత్తాయి, బహుశా స్వలింగసంపర్కము మరియు వ్యభిచారము అను సమస్యలు కూడా తలెత్తాయి. అయితే గ్రీకో-రోమన్ సంస్కృతిలో కూడా ఎంతో తీవ్రముగా పరిగణించబడు ఒక సమస్యను గూర్చి పౌలు స్పష్టముగా మాట్లాడాడు: ఒక వ్యక్తి తన సవతి తల్లితో కలసి సహజీవనము చేసేవాడు. ఈ విషయమును 1 కొరింథీయులకు 5:1-2లో పౌలు ఎలా ఖండించాడో వినండి:
మీలో జారత్వమున్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొన్నాడట. అట్టి జారత్వము అన్యజనులలోనైనను జరుగదు (1 కొరింథీ. 5:1-2).
ఈ సందర్భములో, గ్రీకు పదమైన ఎకో (ἔχω), ఇక్కడ “ఉంది” అని అనువదించబడింది, మరియు “లైంగికంగా సహజీవనము చేయుట” అని అనువదించబడింది. కొరింథీయులు ఆత్మీయతను గూర్చి వారు కలిగియుండిన తప్పు ఆలోచనలను గూర్చి ఎంత సందిగ్ధతలో ఉండిరి అంటే, ఈ మనిషి తన సవతి తల్లితో లైంగిక సంబంధమును సహించుటలో గర్వపడ్డారు.
రెండవదిగా, గ్రీకు సంస్కృతిలో కొందరు దీనికి వ్యతిరేక మార్గములో వెళ్లారు. ఆత్మ లేక మనస్సు మీద దృష్టిపెట్టుటకుగాను భౌతిక శరీరము యొక్క ఆశలను తిరస్కరించాలని వారు నమ్మారు. ఇట్టి దృష్టికోణము నిజమైన ఆత్మీయ ప్రజలు అన్ని రకముల లైంగిక సంబంధముల నుండి దూరముగా ఉంటారు అనుదానితో సహా పలు రకముల సన్యాస్యము లేక స్వయం-తిరస్కరణకు దారితీసింది. కొరింథులోని కొందరు విశ్వాసులు సన్యాసమును మరియు వివాహములో కూడా లైంగిక సంయమనమును పాటించారు. పౌలు ఈ దృక్పథమును కూడా గద్దించాడు, ఎందుకంటే ఇది వివాహ నిబంధనను ఉల్లంఘిస్తుంది మరియు భార్యాభర్తలు ఇద్దరు గొప్ప లైంగిక ప్రలోభాలకు గురౌతారు. 1 కొరింథీయులకు 7:2-5లో అతడు వ్రాసినట్లుగా:
ప్రతివానికి సొంతభార్య యుండవలెను, ప్రతి స్త్రీకి సొంతభర్త యుండవలెను. భర్త భార్యకును ఆలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను... కొంతకాలమువరకు ఉభయుల సమ్మతి చొప్పుననే తప్ప, ఒకరినొకరు ఎడబాయకుడి ; మీరు మనస్సు నిలుపలేకపోయినప్పుడు సాతాను మిమ్మును శోధింపకుండునట్లు తిరిగి కలిసికొనుడి (1 కొరింథీయులకు 7:2-5).
గ్రీకు పదమైన ఎకో (ἔχω) ఈ వాక్యభాగములో కూడా కనిపిస్తుంది, ఇక్కడ వాక్యములో “కలిగి” లేదా “సొంతభార్యను కలిగి ఉండుట” అని అనువదించబడింది. మనము ఇప్పటికే గుర్తించినట్లుగా, ఇటువంటి సందర్భములలో ఇకో అనగా “లైంగికంగా జీవించుట” అను అర్థమిస్తుంది. భార్యాభర్తలు తమ వైవాహిక నిబంధనను నేరవేర్చుటకు మరియు ఆ దినములలో కొరింథు చుట్టూ అలుముకొనిన లైంగిక ప్రలోభముల నుండి తమ్ముతాను కాపాడుకొనుటకు సరైన లైంగిక సంబంధములను కొనసాగించాలి అని పౌలు ఉపదేశించాడు.
మన శరీరములు, మన భౌతిక శరీరములు ప్రాముఖ్యమైనవైన యెడల మరియు నిత్యము ఉండునవైన యెడల, ఇప్పుడు మన శరీరములతో మనము ఏమి చేయుచున్నాము అను విషయములో మనము జాగ్రత్తను వహించవలసియున్నది. మరియు దేవుని మహిమపరచు మార్గములలో తమ శరీరములను ఉపయోగించుకొనని కొరింథీయులకు పౌలు ఈ మాటను ఎంతో స్పష్టముగా చెబుతున్నాడు. కాబట్టి, పౌలు చేయగోరుచున్న ఒక పని ఏమనగా ... మన పునరుత్థాన శరీరములు, మన శరీరముల యొక్క నిత్య స్వభావము, అనగా నేడు మన శరీరములలో ఎలా జీవించుచున్నాము అను విషయమును గూర్చి మనము జాగ్రత్త కలిగియుండాలని అర్థమని అతడు వర్ణించాడు. విశేషముగా మన శరీరములను లైంగికముగా ఉపయోగించు విషయములో జాగ్రత్తగా ఉండుట. కొరింథీయులకు ఈ విషయములో సమస్య ఉన్నది, మరియు దేవుని వాక్య అనుగుణంగా లైంగికముగా వారి శరీరములను బాధ్యతాయుతముగా ఉపయోగించమని పౌలు వారిని హెచ్చరించాడు.
— డా. ఫ్రాంక్ థెయిల్మన్
కొరింథీ సంఘములోని సమస్యలు దెబ్బతిన్న సంబంధములు మరియు లైంగిక సమస్యలలో మాత్రమే కనిపించలేదు. కొరింథు సంఘములోని మూడవ ప్రధాన సమస్య ఏమనగా ఆరాధనను దురుపయోగము చేయుట అయ్యున్నది.
ప్రభువు బల్ల సమయములో బీదలను పట్టించుకొనకపోవుట ఈ దూరపయోగములలో ఒకటి అని మనము ఇంతకు ముందే ప్రస్తావించాము. కాని పౌలు దీనిని గూర్చి మాత్రమే మాట్లాడలేదు. మరో మూడు దురుపయోగములు కూడా కొరింథు సంఘములో తలెత్తాయి: స్త్రీ పురుష బాధ్యతలు, ఆత్మీయవరముల ఉపయోగము, మరియు విగ్రహాలకు అర్పించబడిన మాంసము. మొదటిగా, బహిరంగ ఆరాధనలలో స్త్రీ పురుషులు ప్రవర్తించు విధానము మీద పౌలు దృష్టిపెట్టాడు.
స్త్రీ పురుష బాధ్యతలు. కొరింథు సంఘములోని, బహిరంగ ఆరాధనలలో స్త్రీ పురుషులు ఒకరికొకరికి మరియు క్రీస్తునకు అపకీర్తి తెచ్చు విధముగా ప్రవర్తించుట మీద పౌలు దృష్టిపెట్టాడు. అతడు ఇచ్చిన ఒక దిద్దుబాటు, ప్రార్థన సమయములో ముసుగు వేసుకొనుటకు సంబంధించినదై ఉంది. 1 కొరింథీయులకు 11:4-5లో అతడు ఇలా వ్రాశాడు:
ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును (1 కొరింథీయులకు 11:4-5).
పౌలు, ప్రార్థనలో వేసుకొనే షాలువాలు లేదా ముసుగులను గూర్చి మాట్లాడుతున్నాడా లేదా కేశాలంకరణను గూర్చి మాట్లాడుచున్నాడా అను విషయము మీద పండితులు విభేదిస్తున్నారు. అవమానపరచబడుట “తల” యొక్క గుర్తింపు విషయంలో ఏకాభిప్రాయం అనేది లేదు. కొందరు ”తల” అను పదమును శరీరములోని ఒక భాగముగా సూచిస్తారు, మరికొందరు పురుషునికి శిరస్సు అయిన క్రీస్తును మరియు స్త్రీకి శిరస్సు అయిన పురుషుని పౌలు సూచించుచున్నాడు అని నమ్ముతారు. ఈ వివరములు ఎలా ఉన్నా, సమస్య మాత్రం స్పష్టముగా ఉన్నది: స్త్రీ పురుషులు ఆరాధనలో అగౌరవముగా వ్యవహరిస్తున్నారు, మరియు స్త్రీ పురుష భిన్నత్వములపై ముసుగు వేయుట ద్వారా ఇలా చేస్తున్నారు.
ఆత్మీయ వరములు. రెండవదిగా, ఆరాధనలో ఆత్మీయవరములను ఉపయోగించు విధానమును గూర్చి కూడా పౌలు చర్చించాడు. స్పష్టంగా, అనేకమంది కొరింథు విశ్వాసులు భాషలతో మాట్లాడుట మరియు ప్రవచనములు చెప్పుట వంటి అద్భుతమైన వరములను కలిగియున్నారు. మరియు వారు వాటిని తరచు ఆరాధనలో అల్లరి సంభవించు విధముగా ఉపయోగించేవారు. 1 కొరింథీయులకు 14:26-33లో, పౌలు ఈ విషయమును గూర్చి ఇలా మాట్లాడాడు:
ఒకడు ఒక కీర్తన పాడవలెనని యున్నాడు; మరియొకడు బోధింపవలెనని యున్నాడు; మరియొకడు తనకు బయలు పరచబడినది ప్రకటనచేయవలెనని యున్నాడు ... భాషతో ఎవడైనను మాటలాడితే, ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండ, వంతులచొప్పున మాటలాడవలెను, ఒకడు అర్థము చెప్పవలెను... ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాటలాడవచ్చును; తక్కినవారు వివేచింపవలెను. అయితే కూర్చున్న మరి యొకనికి ఏదైనను బయలు పరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలెను... దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు (1 కొరింథీయులకు 14:26-33).
ఇక్కడ పౌలు మాట్లాడిన మాటల నుండి, కొరింథులోని సంఘ ఆరాధనలో ఆందోళన మరియు అల్లరి ఉన్నట్లుగా, ఒకేసారి అనేకమంది మాట్లాడుచున్నట్లు కనిపిస్తుంది. విశ్వాసులు ఒకరి మాటలు ఒకరు వింటే తప్ప, ఆత్మ ఇచ్చిన మాటల నుండి ప్రయోజనం పొందరని పౌలు నొక్కి చెప్పాడు.
విగ్రహములకు అర్పించబడిన ఆహారము. మూడవదిగా, విగ్రహాలకు అర్పించబడిన ఆహారమును గూర్చిన సమస్యను మనం ప్రస్తావించాలి. ప్రాచీన ప్రపంచములో, బజారులో అమ్మబడే మాంసము ముందు విగ్రహములకు అర్పించబడినది లేదా విగ్రహముకు అంకితము చేయబడినదిగా ఉండేది. చాలాసార్లు ఆహారమును అన్య గుళ్లలో నుండి నేరుగా తెచ్చేవారు. ఇప్పుడు, అన్యమత ఆరాధన పద్ధతులు మాంసమును కళంకము చేయలేదు అని, మరియు క్రైస్తవులు అన్యమత ఆరాధన చేయనంతకాలము ఈ ఆహారమును తినవచ్చని పౌలు ఉద్ఘాటించాడు. అయితే విగ్రహములకు అర్పించబడిన ఆహారముతో వ్యవహరించు విషయములో వారు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అతడు హెచ్చరించాడు. 1 కొరింథీయులకు 8:7లో అతడు ఈ విషయమును గూర్చి చర్చించాడు:
కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి యియ్యబడినవని యెంచి భుజించుదురు; ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచున్నది (1 కొరింథీయులకు 8:7).
సులభంగా చెప్పాలంటే, విగ్రహములకు అర్పించిన మాంసము తినుట ద్వారా, బలహీనమైన అవగాహనగల కొందరు అపరిపక్వమైన క్రైస్తవులు క్రీస్తు ఆరాధనను విగ్రహముల ఆరాధనతో మిళితం చేస్తున్నారు. పరిపక్వ క్రైస్తవులు తినుచున్నప్పుడు బలహీనమైన మనస్సాక్షి కలిగిన అతని సహోదరుడు చూచినయెడల వారు పాపము చేయువారగుచున్నారు అని కూడా పౌలు సూచించాడు. 1 కొరింథీయులకు 8:10-12లో అతడు వ్రాసినట్లుగా:
ఏలయనగా ... నీవు విగ్రహాలయమందు భోజనపంక్తిని కూర్చుండగా ఒకడు చూచినయెడల,... విగ్రహములకు బలి యియ్యబడిన పదార్థములను తినుటకు ధైర్యము తెచ్చుకొనును గదా?... ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు (1 కొరింథీయులకు 8:10-12).
ఈ విధంగా తమ సహోదరుని పరిగణించుటలో విఫలమైతే, బలహీనమైన మనస్సాక్షి కలిగిన తమ సహోదరులు ఆరాధనా శుద్ధతను భంగముచేయు పాపముకు వారు కొంతవరకు బాధ్యత వహిస్తారు.
నాశనమైన సంబంధములు, లైంగిక దుర్వ్యవహారము, మరియు ఆరాధనలో దురుపయోగము మాత్రమే కొరింథు సంఘములో సమస్యలను కలిగించలేదుగాని, అపొస్తలునిగా పౌలు యొక్క అధికారము యొక్క తిరస్కరణను గూర్చి కూడా పౌలు బలవంతముగా మాట్లాడాడు.
1 కొరింథీయులకు 1:12లో ఇప్పటికే మనం చదివినట్లుగా, కొరింథు పట్టణములో చాలామంది తమకు నచ్చిన ప్రముఖులను ఎన్నుకొనుట ద్వారా పౌలు అధికారమును చులకన చేశారు. మనం ఇంకా చూడవలసిన విషయం ఏమిటంటే, అతనిని పూర్తిగా అపఖ్యాతి పాలు చేయడానికి ప్రయత్నించిన వారికి వ్యతిరేకంగా పౌలు రెండు పత్రికలలోనూ తన అపొస్తలత్వ అధికారమును సమర్థించుకోవలసి వచ్చింది. ఉదాహరణకు, 1 కొరింథీయులకు 9:31లో, పౌలు ఇలా వ్రాశాడు:
ప్రభువునందు నా అపొస్తలత్వమునకు ముద్రగా ఉన్నవారు మీరే కారా? నన్ను విమర్శించువారికి నేను చెప్పు సమాధానమిదే ( 1 కొరింథీయులకు 9:1-3).
మరియు 2 కొరింథీయులకు 12:11-12లో, అతడు ఇలా ఉద్ఘాటించాడు:
నేను మీచేత మెప్పు పొందవలసినవాడను, ఏలయనగా నేను ఏమాత్రపువాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన యీ అపొస్తలులకంటె నేను ఏ విషయములోను తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుటవలన, అపొస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనుపరచబడెను (2 కొరింథీయులకు 12:11-12).
కొందరు కొరింథీయులు తమ్ముతాము బహు హెచ్చుగా పరిగణించుకున్నారు గనుక వారిని క్రీస్తు సువార్తలోకి నడిపించిన అపొస్తలుని యొక్క అధికారమును వారు తిరస్కరించారు. మరియు ఈ వాక్యభాగములో “శ్రేష్ఠులైన అపొస్తలులు” అని పిలువబడువారు నిజానికి అపొస్తలులే కాదు. ఈ నకిలీ అపొస్తలులు పౌలు మరియు ఇతర చట్టబద్ధమైన అపొస్తలులు కలిగియున్న అధికారమును కలిగియున్నామని చెప్పుకొంటున్నారు. మరియు అనేకమంది కొరింథీయులను పాపపు ఆలోచనా విధానములలోనికి మరియు జీవన విధానములలోనికి నడిపిస్తున్న అబద్ధ సువార్తను వారు బోధిస్తున్నారు. మరియు 2 కొరింథీయులకు 11:12-15లో, కఠినమైన పదములతో వీరిని పౌలు ఖండించాడు:
అతిశయకారణము వెదకువారు ఏవిషయములో అతిశయించుచున్నారో, ఆ విషయములో వారును మావలెనే యున్నారని కనబడునిమిత్తము వారికి కారణము దొరకకుండ కొట్టివేయుటకు, నేను చేయుచున్న ప్రకారమే యిక ముందుకును చేతును. ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు. ఇది ఆశ్చర్యము కాదు; సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులును నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతికాదు ( 2 కొరింథీయులకు 11:12-15).
వారి అబద్ధములు ఘోరమైన పరిణామాలను కలిగిస్తాయని అతనికి తెలుసు గనుక ఈ వంచకులను చాలా కఠినమైన మాటలతో పౌలు తిరస్కరించాడు. కొరింథీయులు అబద్ధ అపొస్తలులను నమ్మి, పౌలు బోధను తిరస్కరించినట్లయితే, వారు క్రీస్తును మరియు నిజమైన సువార్తను రెంటిని తిరస్కరించినవారవుతారు.
పౌలు కొరింథీ సంఘములో ఉన్న అనేక సమస్యలతో చాలా సూటిగా వ్యవహరించాడు, మరియు అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి, కాని అవన్నిటికి మూలము వారి గర్వము లేక అహంకారము అయ్యున్నది అని నా ఆలోచన. గర్వము మరియు అహంకారము అనేక విధాలుగా వ్యక్తపరచబడతాయి. ఒకటి, గుంపుల-ఆత్మ ద్వారా — ప్రజలు కొందరు క్రైస్తవ బోధకులతో జట్టుకట్టుట ద్వారా ఇతరులను అనుసరించువారిని ద్వేషిస్తారు. తరువాత అది నైతిక స్వభావమును గూర్చి బైబిలు ప్రమాణములను విచ్చలవిడిగా ఉల్లంఘిస్తున్నవారితో మరియు వారి మధ్య దానిని గుర్తించుటకు ఇష్టత చూపనివారితో సరియైన రీతిలో వ్యవహరించుటకు ఇష్టత చూపనివారితో వ్యవహరించు విధానముగా మారింది అని నా ఆలోచన. తరువాత, 1 కొరింథీ యొక్క చివరి భాగములో అనేక అధ్యాయములు వారి ఆత్మీయ వరముల దృష్ట్యా వారు కలిగియుండిన గర్వము మరియు అహంకారముతో వ్యవహరించుచున్నాయి మరియు వేరొక సహోదరునిలో ఉన్న విభిన్నమైన వరముల కంటే నా వ్యక్తిగత ఆత్మీయ వరములను హెచ్చుంచుకొనుటను గూర్చి మాట్లాడుతున్నాయి.
— రెవ. డెన్ హెండ్లె
కాబట్టి, కొరింథీయులకు వ్రాయుచున్నప్పుడు పౌలు అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు అని మనము చూడవచ్చు. 1 మరియు 2 కొరింథీ పత్రికలందంతట ఈ సమస్యలతో వ్యవహరించుట జరిగింది.
పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రికకు నేపథ్యమును అందించు కొన్ని ముఖ్యమైన విషయాలను మనము చూశాము కాబట్టి, ఇప్పుడు ఈ పత్రికల యొక్క నిర్మాణము మరియు విషయములను చూచుటకు మనం సిద్ధంగా ఉన్నాము. కొరింథు సంఘములో ఉన్న సమస్యలతో పౌలు ఎలా వ్యవహరించాడు?
కొరింథీయులకు వ్రాసిన పత్రికల యొక్క నిర్మాణము మరియు విషయములను మనం పరిశీలించుచుండగా, పౌలు మరియు కొరింథీయుల మధ్య నాలుగు పత్రికలు వ్రాయబడియుండుటను గూర్చిన ఆధారములు ఉన్నాయని గుర్తుంచుకొనుట చాలా అవసరము. 1 కొరింథీయులకు 5:9లో, పౌలు “నా పత్రికలో మీకు వ్రాసియుంటిని” అని వ్రాశాడు. కాబట్టి, మనము 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక అని పిలచుదానికి ముందు కనీసం ఒక పత్రిక ఉన్నదని నిశ్చయతతో మనకు తెలుసు. కొరింథీయులు పౌలుకు ఒక పత్రికను కూడా పంపించారు, ఇది 1 కొరింథీయులకు 7:1లో ప్రస్తావించబడింది, అక్కడ పౌలు “మీరు వ్రాసినమాట విషయము” అని సూచించుచున్నాడు. క్రొత్త నిబంధనలో ఉన్న కొరింథీ పత్రికల యొక్క నిర్మాణము మరియు విషయములను అర్థము చేసుకొనుటలో ఈ వాస్తవములు సహాయపడతాయి.
మనము ప్రతి ప్రామాణిక పత్రికను — మనము 1 మరియు 2 కొరింథీ పత్రికలను పిలచువాటిని — జాగ్రత్తగా చూసి 1 కొరింథీ పత్రికతో ఆరంభించి ప్రతి పత్రికలోని ప్రధానమైన భాగములను క్రోడీకరిద్దాము. మొదటి కొరింథీ పత్రిక నాలుగు ప్రధాన భాగములుగా విభజించబడింది మరియు పౌలు యొక్క ఇతర పత్రికల యొక్క మౌలిక నిర్మాణమును ప్రతిబింబిస్తుంది: 1:10-16:12లో ప్రధాన భాగములో వ్రాయబడిన పత్రికలకు మరియు నివేదనలకు స్పందనలు ఉన్నాయి; మరియు 16:13-24లో ముగింపు.
మొదటిగా, 1:1-3లో అభివందనం.
రెండవదిగా, 1:4-9లో కృతజ్ఞత మాట;
మూడవదిగా, 1:10-16:12లోని పత్రిక యొక్క ప్రధాన భాగములో పౌలు అందుకొనిన పత్రికలకు మరియు నివేదికలకు స్పందనలు ఉన్నాయి.
మరియు నాల్గవదిగా, 16:13-24లో ముగింపు.
పత్రిక యొక్క ఆరంభము మరియు ముగింపులో ఉన్న చిన్న విభాగములను క్లుప్తంగా పరిశీలిద్దాము, తరువాత ఈ పత్రిక యొక్క ప్రధాన భాగమును గూర్చి వివరణను ఇద్దాము. మొదటిగా పౌలు యొక్క అభివందనమును పరిగణిద్దాము.
1:1-3లోని అభివందనము పౌలు సాధారణంగా ఉపయోగించిన విధానమైయున్నది. అభివందనం చాలా క్లుప్తంగా ఉంది, మరియు పత్రిక పౌలు మరియు “మన సహోదరుడు” అని పౌలు పిలచిన సొస్తెనేసు నుండి వచ్చింది అని తెలియజేస్తుంది. ఇతడు అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయములో ప్రస్తావించబడిన సొస్తెనేసొ కాదో మనకు నిశ్చయతలేదుగాని, పత్రిక కొరింథులో ఉన్న సంఘమునకు వ్రాయబడినది అని పౌలు స్పష్టముగా తెలిపాడు. అభివందనంలో పౌలు అభివాదమును బలపరచు ఒక క్లుప్త ఆశీర్వాద వాక్యం కూడా ఉంది.
1:4-9లో ఉన్న కృతజ్ఞత కూడా క్లుప్తంగా ఉంది, మరియు పౌలు కొరింథీయుల యొక్క విశ్వాసము మరియు ఆత్మీయవరములను బట్టి మరియు రక్షణను గూర్చిన వారి నిశ్చయతను బట్టి కృతజ్ఞతలు వ్యక్తపరచాడు.
ఇప్పుడు, పత్రిక యొక్క ముగింపుకు వెళ్తే, 16:13-24లో ఉన్న ముగింపులో అనేక సాధారణ శుభవచనములు ఉన్నాయి. స్తెఫను మరియు అతని కుటుంబము యొక్క ఆమోదము, తుది అభివాదము, ఆశీర్వాదము, పత్రిక యొక్క ప్రామాణికతను ధృవీకరించు పౌలు చేవ్రాత పత్రికను కూడా మనము చదువుతాము.
1 కొరింథీ పత్రికలోని ప్రామాణిక, చిన్న భాగములను దృష్టిలో ఉంచుకొని, 1:10-16:12లో ఉన్న పత్రిక యొక్క ప్రధాన భాగమును దగ్గరగా చూద్దాము. 1 కొరింథీ పత్రిక యొక్క ప్రధాన భాగము రెండు పెద్ద ఉపభాగములుగా విభాగించబడుతుంది: మొదటిగా, 1:10-6:20లో క్లోయె కుటుంబము నుండి పొందుకొనిన నివేదికలకు పౌలు ఇచ్చిన జవాబులు ఉన్నాయి. మరియు రెండవదిగా, 7:1-16:12లో కొరింథీ సంఘము నుండి పౌలు పొందుకొనిన ప్రత్యుత్తరములను గూర్చిన నివేదికలు ఉన్నాయి. క్లోయె కుటుంబము నుండి పొందుకొనిన నివేదికలకు పౌలు ఇచ్చిన జవాబులను మొదటిగా చూద్దాము.
నివేదికలకు స్పందనలు (1:10-6:20). పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు, క్లోయె అను పేరు గల క్రైస్తవ స్త్రీ యొక్క స్నేహితులు లేక కుటుంబము నుండి నివేదికలను పొందాడు. ఈ స్త్రీ క్రొత్త నిబంధనలో ఇక్కడ మాత్రమే ప్రస్తావించబడింది, కాని పౌలు ఆమె ఇచ్చిన నివేదికలను తీవ్రముగా పరిగణించి, జాగ్రత్తగా వాటికి జవాబిచ్చాడు. 1:11లో అతడు ఇలా వ్రాశాడు, “మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి క్లోయె ఇంటివారి వలన నాకు తెలియవచ్చెను.” 5:1లో, “మీలో జారత్వమున్నదని వదంతి కలదు” అని అతడు పేర్కొన్నాడు. నేటి సంఘములలో వలెనే, విభజనలు, గొడవలు మరియు లైంగిక సమస్యలు కొరింథులో ఉన్న సంఘమును చీల్చివేశాయి. ఇవి ఎంత కీలకమైయున్నవో పౌలుకు తెలుసు గనుక అతడు వీటిని గూర్చి మాట్లాడాడు. క్లోయె కుటుంబము నుండి పొందుకొనిన నివేదికలకు పౌలు ఇచ్చిన జవాబులలో, అతడు సంఘములో విభజనలతో ఆరంభించి మూడు ముఖ్యమైన అంశముల మీద దృష్టిపెట్టాడు.
మనము ఈ పాఠములో ఇంతకు ముందే ప్రస్తావించినట్లు, కొరింథు సంఘములో అనేక సమస్యలు ఉన్నాయి, తత్ఫలితంగా విభజనలు కలిగాయి. సదరు సంఘ నాయకుల పట్ల అభిమానము కలిగియుండుట ద్వారా ఈ విభజనలు జరిగాయి. వ్యాజ్యెములలో వారు ఒకరికి వ్యతిరేకముగా మరొకరు లేచారు. మరియు వారు తమ మధ్యనున్న బీదల యెడల, యెరూషలేములోని బీదలపట్ల అహంకార భావనతో ప్రవర్తించారు. పౌలు ఈ సమస్యను వివిధ మార్గములలో పరిష్కరించాడు.
ఉదాహరణకు, వారు యేసును తమ ప్రధాన నాయకునిగాను, మరియు అపొస్తలులను, బోధకులను క్రీస్తు సేవకులుగాను దృష్టించినట్లయితే, కొందరు అపొస్తలులు మరియు బోధకుల పట్ల అభిమానము వలన కొరింథీయులు ఘర్షణపడేవారు కాదు అని అతడు వాదించాడు. సంఘ అపొస్తలులను మరియు బోధకులను ఎంతో ఉన్నతముగా గౌరవించుట మరియు ఇతరులను చిన్న చూపు చూచుట ద్వారా, వారందరిని మించిన యేసును కొరింథీయులు దృష్టించలేకపోయారు. సంఘములో ప్రాపంచిక జ్ఞానము యొక్క ప్రామాణికతలను అనువర్తించుట ద్వారా కలుగు అపాయకరమైన పరిణామాలను పౌలు బట్టబయలుచేశాడు. స్పష్టంగా, కొరింథు సంఘములో కొరింథు సమాజము బహుగా గౌరవించిన ఐశ్వర్యవంతులును, విద్యావంతులునైన, పరపతిపొందిన స్త్రీ పురుషులు కొంతమంది ఉన్నారు. ఈ లోకసంబంధమైన విలువలను హత్తుకొనుట ద్వారా క్రీస్తునందు సహోదరి సహోదరులైన వీరితో దురుసుగా ప్రవర్తించుట జరిగింది. ఇందుమమూలముగానే 1:19-20లో పౌలు ఈ మాటలు వ్రాశాడు:
ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును. వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడియున్నది. జ్ఞాని యేమయ్యెను? శాస్త్రి యేమయ్యెను? ఈ లోకపు తర్కవాది యేమయ్యెను? ఈలోక జ్ఞానమును దేవుడు వెఱ్ఱితనముగా చేసియున్నాడు గదా? (1 కొరింథీయులకు 1:19-20)
లోకము ఆలోచించినట్లు ఆలోచించుచున్నందున మీరు వెఱ్ఱివారిగా ఉన్నారు అని కొరింథీయులకు చెప్పుటతో పాటుగా, మీరు ఆత్మీయ అపరిపక్వత కలిగియున్నారని కూడా అతడు తెలియజేశాడు. 3:1-2 అతడు ఇలా వ్రాశాడు:
సహోదరులారా, ఆత్మసంబంధులైన మనుష్యులతో మాటలాడినట్లు నేను మీతో మాటలాడలేక పోతిని. శరీర సంబంధులైన మనుష్యులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, మీతో మాటలాడవలసివచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మును పెంచితినిగాని అన్నముతో మిమ్మును పెంచలేదు. మీరింకను శరీసంరబంధులై యుండుటవలన ఇప్పుడును మీరు బలహీనులైయున్నారు కారా? (1 కొరింథీయులకు 3:1-2).
మరోమాటల్లో, కొందరు కొరింథీయులు తమ లోక జ్ఞానము మరియు సాంస్కృతిక సంక్లిష్టతను బట్టి తమను తాము ఉన్నతమైనవారుగా పరిగణించుకున్నను, వాస్తవానికి వారికి క్రైస్తవ విశ్వాసమును గూర్చి ఏమియు తెలియదు. వారి ప్రాపంచిక విలువలు ఆత్మీయ సత్యము చూడకుండా చేశాయి.
పౌలు తన పత్రికను వ్రాసినప్పుడు, కొరింథు సంఘములో పౌలు మరియు అపొల్లో, ఇంకా ఇతరుల పేరున సంఘములో విభజనలు ఉండేవి. విశేషముగా, అపొల్లో ఒక అద్భుతమైన వక్త. అతడు ఎంతో అభివృద్ధి పొందిన వాక్చాతుర్యం గలవాడు, కాని పౌలుకు అది లేదు. వాస్తవానికి, 2 కొరింథీయులకు వ్రాసిన పత్రికలో, తనకు మాట్లాడు వరము లేదు అని పౌలు స్వయంగా ఒప్పుకొనుచున్నాడు, కాని అతడు అపొస్తలుడు గనుక ప్రజలు అతనితో తమనుతాము గుర్తించుకొనుచుండిరి; సంఘమును స్థాపించినది ఆయనే. మనము ఆ మానవ గుణముల తట్టు చూడకూడదు అని పౌలు చెబుతున్నాడు. పౌలు తనను తాను ముందు ఉంచుకొనుటలేదు. పౌలు యేసుకు ప్రధమ స్థానమును ఇచ్చుచున్నాడు. ఇదే కీలకమైన విషయం. దీనితో పాటుగా, సంఘములో మనుగడలో యన్న దృష్టికోణమును, సంఘము అపొల్లో యొక్క వాక్చాతుర్యం మరియు ఇతరుల సామర్థ్యములను హత్తుకొనుచుండగా వాటిని పౌలు తారుమారు చేయుచున్నాడు. కొరింథీయులు మానవ వరముల తట్టు చూచుచున్నారు. వారు కంటికి ఆకర్షణీయముగా కనబడువాటిని చూచుచున్నారు. అయితే సిలువ దీనికి పూర్తిగా భిన్నమైనదిగా ఉన్నది. మరియు సిలువ మానవ శక్తికి ప్రాముఖ్యత లేదుగాని, ఆయన కృప మాత్రమే ప్రాముఖ్యమైనది అని చూపు విధముగా రక్షణను తెచ్చు దేవుని మార్గమైయున్నది.
— డా. డొనాల్డ్ కోబ్బ్
సంఘములోని దుర్నీతిని గూర్చి క్లోయె కుటుంబీకులు ఇచ్చిన నివేదికలకు కూడా పౌలు స్పందించాడు. తన సవతి తల్లితో సహజీవనము చేస్తున్న వ్యక్తిని గూర్చిన సంఘటనను ఇంతకు ముందే మనం ప్రస్తావించాము. 5:1-13లో పౌలు ఈ విషయమును గూర్చి చర్చించాడు. అయితే 6:12-20లో, ఈ అంశమును గూర్చి అతడు మరింత సాధారణమైన రీతిలో వ్రాశాడు. ఈ వచనములలో, కొరింథీయులు ఈ క్రింది నినాదమును దుర్వినియోగపరచుకొనుచు ఒకరి మీద ఒకరు వాదించారు అను విషయం స్పష్టమవుతుంది: “అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు.” ఈ నివాదము కొరింథు సంఘములో ఏ విధముగా పరిచయం చేయబడినదో మనకు తెలియదుగాని, వారు లైంగిక సంబంధమైన విషయములను గూర్చి వాదిస్తూ దీనిని తప్పుగా అనువర్తించారు. 12-13 వచనములలో ఈ నినాదమునకు మాన్యతనిస్తూ పౌలు ఈ తప్పుకు సూటిగా స్పందించాడు:
అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేనిచేతను లోపరచు కొనబడనొల్లను... దేహము జారత్వము నిమిత్తము కాదు గాని, ప్రభువు నిమిత్తమే; ప్రభువు దేహము నిమిత్తమే (1 కొరింథీయులకు 6:12-13).
స్పష్టముగా, ఏవిధమైన లైంగిక సంబంధమునకైనా క్రైస్తవులకు అనుమతి కలదు అని కొందరు కొరింథీయులు భావించారు, కాని ఇది వాస్తవము కాదు అని పౌలు ఉద్ఘాటించాడు.
కొరింథు సంఘములో ప్రచిలితమైన ఒక సుపరిచితమైన సూత్రమును పౌలు వ్యాఖ్యానించుచున్నాడు అని నాకనిపిస్తుంది. వారి స్వాతంత్ర్యపు ఆలోచనల నడుమ కొందరు అబద్ధ బోధకులు లేచి ఇలా వాపోయారు, “వినండి, మనము క్షమించబడ్డాము కదా; కాబట్టి, ఏమైనా చేయవచ్చు.” పౌలు ఇలా స్పందించగోరాడు, “ఏది అంగీకరమైనది అను విషయము కాదుగాని, ఏది లాభదాయకమైనది అను విషయము ప్రాముఖ్యమైయున్నది.” ఏది లాభదాయకమైనది? మీ విశ్వాసము కొరకు, క్రీస్తుతో మీ అనుబంధము కొరకు, క్రీస్తు ద్వారా దేవునితో అనుబంధము కొరకు, మీ వ్యక్తిగత రక్షణ కొరకు లాభదాయకమైనది. మనము నిజముగా క్షమించబడితే, మన జీవితములు మనము కేవలం క్షమించబడుట మాత్రమేగాక, దేవునితో సరియైన సంబంధములోనికి చేర్చబడితిమి అను వాస్తవమును కూడా ప్రతిబింబిస్తాయి... కాబట్టి, దేవునికి అయిష్టమైన కార్యములని మనకు తెలిసిన విషయములకు దూరముగా ఉండి, ఆయన చిత్తమని మనము గ్రహించు విషయములను అన్వేషించుటకు ప్రయత్నిస్తాము.
— డా. స్టీవ్ బ్లేక్ మోర్
ఇప్పుడు, 6వ అధ్యాయములో మరోచోట, కొరింథీయులు క్రీస్తు యొద్దకు రాకమునుపు జరిగించిన జారత్వము, వ్యభిచారము, ఆడంగితనము, పురుష సంయోగము వంటి అనేకమైన లైంగిక పాపములను గూర్చి పౌలు ప్రస్తావించాడు. అనైతికతను గూర్చిన అతని ప్రకటనలు, ఖచ్చితంగా కాకపోయినా, బహుశా, ఈ కార్యకలాపాలలో ఇంకనూ పాలుపొందుతున్న కొరింథీ సంఘములోని సభ్యులకు వర్తించబడతాయి అని చెప్పవచ్చును. ఏది ఏమైనా, తన సవతి తల్లితో సహజీవనము చేస్తున్న వ్యక్తిని సంఘము సహించుట లైంగిక పాపముల విషయములో వారి సున్నితత్వమును స్పష్టముగా చూపిస్తుంది.
చివరిగా, మరొక వివాదాత్మక అంశమును గూర్చి సంఘమును ఇంతకు ముందు అతడిచ్చిన ఉపదేశములను పౌలు స్పష్టంచేశాడు: క్రీస్తు అనుచరులు కానివారితో క్రైస్తవుల యొక్క సంబంధములు. స్పష్టముగా, అవిశ్వాసులకు సువార్తను ప్రకటించుటకుగాను కొరింథులో ఉన్న క్రైస్తవులు వారితో సంబంధములు కలిగియుండాలని పౌలు కోరాడు. తాము విశ్వాసులమని చెప్పుకొనుచున్న విచ్చలవిడిగా పాపము చేయునట్టి, తన సవతి తల్లితో సహజీవనము చేయు వ్యక్తి వంటివారికి దూరముగా ఉండాలని అతడు నొక్కి చెప్పాడు. ఇలాటి సందర్భములలో, కొరింథు సంఘము సరైన సంఘ క్రమశిక్షణను ఆచరించాలి, అవసరమైతే నేరస్థులను బహిష్కరించాలి. 5:9-11లో అతడు ఈ విషయాలను సంగ్రహించిన విధానమును వినండి:
జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసియుంటిని. అయితే ఈలోకపువారితో ... ఏమాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు; ఆలాగైతే మీరు లోకములోనుండి వెళ్లిపోవలసివచ్చును గదా? ఇప్పుడైతే, సహోదరుడనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను (1 కొరింథీయులకు 5:9-11).
1 కొరింథీ పత్రికలోని మొదటి భాగము యొక్క ప్రధాన భాగములో క్లోయె కుటుంబము పంపిన నివేదికలకు పౌలు ఇచ్చిన స్పందనలను మనము చూశాము. 7:1-16:12లో ఉన్న రెండవ భాగములో, కొరింథు సంఘములోని పేరు ప్రస్తావించబడని వారు పంపిన పత్రిక లేక పత్రికలకు పౌలు ఇచ్చిన స్పందనలను మనము చదువుతాము.
పత్రికలకు జవాబులు (7:1–16:12). స్పష్టముగా, కొరింథులో ఉన్న క్రైస్తవ సమాజము ఎంతగా వివాదములలో చిక్కుకొనిపోయినది అంటే, కొన్ని సమస్యలను పరిష్కరించమని కోరుతూ పౌలుకు కనీసం ఒక పత్రిక అయినా వ్రాయబడింది. ఇందు మూలముగానే తన పత్రిక యొక్క ఈ భాగమును, 7:1లో, “మీరు వ్రాసినమాట విషయము” వ్రాయుచున్నాను అని చెబుతూ ఆరంభిస్తాడు. ఇప్పుడు, అతని జవాబులలో కొన్నింటిని మరింత సాధారణమైనవిగా పరిగణించవచ్చు, కాని అతడు ఇలా వ్రాస్తూ వారి మధ్య తలెత్తిన ప్రశ్నలను గూర్చి ప్రత్యేకముగా మాట్లాడాడు, 7:25లో “కన్యకల విషయమై”; 8:1లో “విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము”; 12:1లో “ఆత్మసంబంధమైన వరములనుగూర్చి”; 16:1లో “పరిశుద్ధులకొరకైన కానుకవిషయమైతే”; మరియు 16:12లో “సహోదరుడైన అపొల్లోను గూర్చిన సంగతి ఏమనగా,” అని వ్రాసినప్పుడు. కొరింథు సంఘ ప్రశ్నలకు పౌలు ఇచ్చిన జవాబులను మనము ఆరు ప్రధానమైన భాగములుగా విభాగించవచ్చు.
మొదటిగా, 7:1-40లో, వివాహము, పునర్వివాహము మరియు ఒంటరితనమును సంబంధించిన సమస్యలకు పౌలు స్పందించాడు. మనము ఇంతకు ముందు ప్రస్తావించినట్లు, కొరింథులోని కొందరు విశ్వాసులు సన్యాసమును మరియు వైవాహిక జీవితములో లైంగిక సంయమనమును పాటించారు. సన్యాసము యెడల ఈ విశ్వాసులు కలిగియున్న ధోరణి, వివాహములో లైంగికతను గూర్చి మరియు వివాహము యొక్క విలువను గూర్చి అనేకమైన ప్రశ్నలను లేవనెత్తినట్లుగా కనిపిస్తుంది. దీనికి స్పందనగా, వివాహము మరియు ఒంటరితనమును పౌలు ధృవీకరించాడు మరియు వివాహములో భార్య భర్తల మధ్య లైంగిక సంబంధము కూడా ఉండాలి అని ఉద్ఘాటించాడు. అయితే ఒంటరిగా ఉండుట ద్వారా విశ్వాసులు “ప్రభువు కార్యముల” మీద — అనగా ఒకని కుటుంబ అవసరతలకు బదులుగా క్రీస్తు రాజ్యము మీద — దృష్టిపెట్టు అవకాశం ఉంటుంది అని కూడా అతడు బోధించాడు. సమస్యలు ఉన్న పరిస్థితులలో మాత్రమే పౌలు వివాహము కంటే ఒంటరితనము మంచిది అని సూచించాడని కొందరు వ్యాఖ్యాతలు భావిస్తారు, కాని మరికొందరు ఈ ఉపదేశములను అన్ని తరములలోని విశ్వాసులందరికీ అనువర్తిస్తారు.
8:1-11:1లో, విగ్రహములకు అర్పించబడిన మాంసము గూర్చి పౌలు చర్చించాడు. గుళ్లలో విగ్రహములకు అర్పించబడు ఆహారమును గూర్చి మనము ఇప్పటికే మాట్లాడాము, ఇది 8వ అధ్యాయములో ప్రధాన అంశముగా ఉంది. అయితే సాధారణంగా, అన్య దేవాలయములలో బలియిచ్చిన మాంసము అంతటిని దేవాలయములోని వారు తినకపోవుట లేక వడ్డించకపోవుట ఆనవాయితీ. వారు చాలాసార్లు మిగిలిన మాంసమును బయట భుజించుట కొరకు అమ్మివేసేవారు అని 8వ అధ్యాయము యొక్క చివరిలో, అతడు ఇతర క్రైస్తవులను ఆటంకపరచిన యెడల ఈ మాంసమును తినడు అని పౌలు వివరించాడు. తరువాత 9వ అధ్యాయములో, అతడు క్రీస్తునందు స్వతంత్రుడైయున్నను, ఇతరులు మరియు క్రీస్తు యొక్క సేవ నిమిత్తము ఆ క్రైస్తవ స్వాతంత్ర్యమును వదిలిపెట్టుటకు సిద్ధముగా ఉన్నానని వివరించాడు. మరియు 10వ అధ్యాయములో, బజారులో అమ్మబడు విగ్రహములకు అర్పించబడిన మాంసమును తినుట మరియు వడ్డించుటను గూర్చి పౌలు సూటిగా మాట్లాడాడు. అన్య ఆరాధనలో భాగంగా కాకుండా లేదా మనస్సాక్షిని ఉల్లంఘించు విధముగా కాకుండా ఈ మాంసమును తినిన విశ్వాసులను అతడు సమర్థించాడు. అయితే అట్టి ఆహారమును భుజించుట విగ్రహారాధనను సమర్థించుట అని అపార్థము చేసుకొనునప్పుడు కూడా అట్టి ఆహారమును తినునంత అహంకారులుగా కూడా ఉండవద్దని అతడు బోధించాడు.
1 కొరింథీ. 8లో ... కొరింథులో ఏమి జరుగుతుంది? విగ్రహాలకు అర్పించబడిన మాంసమును తినవచ్చా తినకూడదా అని సంఘము ప్రశ్నించుచున్నది. వాస్తవమేమిటంటే, ఆ దినములలో అందుబాటులో ఉండిన అత్యంత చౌక మాంసము విగ్రహములకు అర్పించిన మాంసము అయ్యున్నది. అది చాలా ఉండేది, మరియు అది ఎంత ఎక్కువగా ఉండేది అంటే, దానిని ప్రజలు బజారులో మిగుల తక్కువ ధరకు కొనగలిగేవారు. మరియు సంఘము ఎంతో బీద స్థితిలో ఉండినది. సంఘము అధిక ధర చెల్లించి మాంసమును కొనే స్థితిలో లేదు. కాబట్టి, వారు బజారుకు వెళ్లి తక్కువ ధరకు విగ్రహాలకు అర్పించిన మాంసమును కొని, భుజించేవారు. అయితే కొందరు క్రైస్తవులకు ఇది నచ్చలేదు, మరియు మనము ఆటంకములుగా ఉండకూడదు అని పౌలు వివరించాడు. మీ మనస్సాక్షికి ఎలాంటి ఇబ్బంది లేకపోతే, దానిని మీరు తినవచ్చు... కాని మీరు మీ సహోదరునికి ఆటంకము కాకూడదు.
— డా. మిగుయేల్ నునెజ్, అనువాదము
11:2-34లో, ఆరాధనకు సంబంధించిన రెండు విషయాలను పౌలు చర్చించాడు: స్త్రీ పురుష భూమికలు, వీటిని గూర్చి 2-16 వచనములలో అతడు మాట్లాడాడు, మరియు ప్రభువు భోజన సమయములో పేదలతో దుర్వ్యవహారం చేయుట, దీనిని గూర్చి 17-34 వచనములలో అతడు చర్చించాడు. అదే అహంకారము మరియు ఆత్మీయ ఔన్నత్య ధోరణి వలన సంఘములో విభజనలు, వ్యాజ్యములు, మరియు విగ్రహములకు అర్పించబడిన ఆహారమునకు సంబంధించిన వివాదములు, మరియు ఆరాధనలో విశ్వాసులు ఒకరినొకరు అగౌరవపరచుకొనుటకు దారితీసింది. నిరాశ్చర్యంగా, పౌలు ఇచ్చు పరిష్కారం ఆటంకపరచు ప్రవర్తనలను ఆపివేయడం మాత్రమే కాదుగాని ప్రతి ఒక్కరి హృదయ వైఖరిని కూడా మార్చుట అయ్యింది.
12:1-14:40లో, ఆత్మీయ వరముల యొక్క ఉపయోగమును గూర్చిన సమస్యలను గూర్చి పౌలు చర్చించాడు. 12వ అధ్యాయములో, వరము పొందిన వారి యొక్క స్థితిని పెంచడానికో లేదా నీతిమంతులకు బహుమతిగానో పరిశుద్ధాత్ముడు ఇవ్వబడలేదు అని అతడు వివరించాడు. బదులుగా, సంఘములోని ఇతరులను బలపరచుటకు ఆయన ప్రజలకు వరములను ఇచ్చాడు. 13వ అధ్యాయములో — “ప్రేమ అధ్యాయము”గా పిలువబడు అధ్యాయములో — ఆత్మీయ వరములన్నియు ప్రేమతో ఉపయోగించాలని పౌలు వివరించాడు. ఒకవేళ ఆత్మ వరములను ప్రేమకలిగి ఉపయోగించనట్లయితే, అవి పనికిరానివి అని కూడా అతడు స్పష్టము చేశాడు. తరువాత, 14వ అధ్యాయములో, క్రమములేని ఆరాధన కూడికల విషయములో పౌలు కొరింథీయులను గద్దించాడు. సంఘమును దర్శించు అవిశ్వాసులతో సహా ఇతరుల శ్రేయస్సు కొరకు బహిరంగ ఆరాధనలో తమ వరముల యొక్క ఉపయోగమును వారు ఏవిధముగా పరిమితము చేయాలో కూడా అతడు ఉపదేశించాడు.
15:1-58 విశ్వాసులందరి యొక్క పునరుత్థానమును గూర్చిన అంశమును పరిచయం చేస్తుంది. చాలాసార్లు, ఈ వాక్యభాగములో పౌలు క్రీస్తు యొక్క మరణ పునరుత్థానమును సమర్థించుచున్నాడు అని వ్యాఖ్యాతలు భావిస్తారు. కాని విస్తృత నేపథ్యము యొక్క వెలుగులో, క్రీస్తు పునరుత్థానము మరియు ఆరోహణము మీద పౌలు పెట్టిన దృష్టి సంఘములో విభజనలకు కారణమైన ఒక కీలకమైన అపార్థమును గూర్చి మాట్లాడింది. వివాహమును, విగ్రహములకు అర్పించిన ఆహారము, ఆరాధన మరియు ఆత్మీయ వరములను గూర్చిన వాదనలకు కొరింథీయుల యొక్క అహంకారము మూలమైయున్నది. “క్రీస్తు మరణమును వారి అహంకారములో, కొందరు తమ అనుదిన జీవితములలో క్రీస్తు పునరుత్థానము యొక్క ప్రాముఖ్యతను చూడలేకపోయారు. క్రీస్తు పునరుత్థానమునకు వారు కూడా పునరుత్థానము పొంది మహిమపరచబడతారు అని అర్థము అను విషయమును చూచుటలో కూడా వారు విఫలమయ్యారు. కొరింథీయులు బహుగా అతిశయించిన వరములు మరియు ఆశీర్వాదములు వారి అంతిమ మహిమ కాదు కాబట్టి, వారు వినయము కలిగి ఉండాలి. క్రీస్తు మరణములో నుండి తిరిగిలేచినప్పుడు మహిమపరచబడిన విధముగానే మరియు నెరవేర్పును తండ్రి పరిపూర్ణముగా ఘనపరచు సమయము కొరకు వేచిచూచుచున్న విధముగానే, అంత్య దినమున విశ్వాసులు లేచినప్పుడు మాత్రమే తమ సంపూర్ణమైన మహిమను పొందుకొనగలరు.
యెరూషలేము సంఘముకు చందాలను ప్రోగుచేయుటను గూర్చి కొన్ని సూచనలను ఇచ్చుట ద్వారా, అపొల్లోను గూర్చి కొన్ని వ్యాఖ్యలను చేయుట ద్వారా కొరింథీయుల యొక్క ప్రశ్నలకు పౌలు తన సమాధానములను 16:1-12లో పూర్తిచేశాడు.
ఇంతకు ముందు మనము చూసినట్లు, 1 కొరింథీ పత్రికలో క్లోయె కుటుంబము లేక స్నేహితులు ఇచ్చిన నివేదికలు మరియు కొరింథీయులు పంపిన పత్రికల ద్వారా తన దృష్టికి వచ్చిన కొన్ని విషయములతో పౌలు వ్యవహరించాడు. అయితే ఈ సమస్యలు కొరింథు సంఘములో ఏ విధముగా ఉన్నాయో, అదే విధముగా ప్రతి తరములోని ప్రతి సంఘము కూడా ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నది అని చూచుట అంత కష్టమైన పనేమీ కాదు. మన సంఘములలో తరచుగా వివాదములకు కారణమేమిటి? సంఘములో విభజనలు ఎందుకు ఉన్నాయి? మరలా మరలా, కొరింథీయుల వలె మనము సామాజిక స్థితి, కఠినమైన మత ఆచారములు, ఆత్మ వరములు, ఉన్నతమైన జ్ఞానము, ఇలాంటి ఇతర విషయములు మనలను ఇతరుల కంటే గొప్పవారిగా చేస్తాయని తలంచుతాము కాబట్టి విభజనలు కలుగుతాయి. మరియు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగియుండుట అత్యున్నతమైన సద్గుణము అను విషయమును మనము మరచిపోతాము. ఇది కొరింథు సంఘములో సమస్యకు మూలమైయున్నది, మరియు నేడు క్రీస్తు సంఘమును ఇదే అలుముకొనియున్నది.
1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక యొక్క నిర్మాణము మరియు విషయములను మనం చూశాము గనుక ఇప్పుడు కొరింథీయులకు వ్రాసిన రెండవ పత్రిక యొక్క విషయములను పరిశీలిద్దాము. పౌలు కొరింథీయులకు వ్రాసిన రెండవ ప్రామాణిక పత్రికకు పలు విధానములలో ఆకారమును ఇవ్వచ్చు, ఎందుకంటే ఇది 1 కొరింథీ అంత బలమైన నిర్మాణమును కలిగియుండదు. మన ఉద్దేశ్యముల కొరకు, ఈ విషయములను మనం నాలుగు ప్రధానమైన అంశములుగా చూద్దాము:
1:1, 2లోని అభివందనం;
1:3-11లోని ఉపోద్ఘాతము;
1:12-13:10లో ఉన్న పత్రిక యొక్క ప్రధాన భాగము; మరియు
13:11-14లోని ముగింపు.
ఇంతకు ముందు వలెనే, 2 కొరింథీ పత్రిక యొక్క ఆరంభ మరియు చివరి భాగములను చూసి, పత్రిక యొక్క ప్రధాన భాగమును మరింత వివరముగా పరిగణిద్దాము. ముందుగా పౌలు యొక్క అభివందనమును చూద్దాము.
1:1, 2లో ఉన్న అభివందనం ఈ పత్రికను పౌలు మరియు తిమోతిల నుండి వెలువడుతుంది అని తెలియజేస్తుంది. కొరింథులోని సంఘమును అదే విధంగా అకయ ప్రాంతములోని పరిశుద్ధులు శ్రోతలైయున్నారని గుర్తిస్తుంది. శుభవచనముగా ఉన్న ఒక చిన్న ఆశీర్వాదము కూడా దానిలో ఉన్నది.
1:3-11లో ఉన్న పరిచయం పౌలు పత్రికల్లో సాధారణంగా కనిపించు శైలి కాదు. పౌలు తన పరిచర్య కొరకు అనుభవించిన తీవ్రమైన శ్రమలను, అదేవిధంగా దేవుని నుండి అతడు పొందుకున్న ఉపశమనమును ఈ పరిచయము వివరిస్తుంది. పౌలు వాదనల మీద కొరింథీయులకు సానుభూతి కలిగించేదిగా ఇది పనిచేస్తున్నప్పటికీ, సువార్త కొరకు శ్రమలనుభవిస్తున్న విశ్వాసులందరికి ఇది గొప్ప ఓదార్పు ఇస్తుంది, మరియు ప్రభువును “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” అని కూడా సంబోధిస్తుంది.
2 కొరింథీ పత్రికను గూర్చి ఆలోచన చేయుట ఆసక్తికరముగా ఉంటుంది, ఎందుకంటే ఇది పౌలు వ్రాసిన అత్యంత వ్యక్తిగతమైన పత్రికలలో ఒకటైయున్నది, మరియు అబద్ధ ప్రవక్తలకు, కొరింథు పట్టణములో ఉన్న అబద్ధ అపొస్తలులకు విరోధముగా అతడు తన అపొస్తలత్వమును సమర్థించుకొనుచున్నాడు, మరియు ఇలా చేయుట ద్వారా, తాను వ్రాసిన ఇతర పుస్తకములన్నిటి కంటే ఎక్కువగా అతడు తనను గూర్చి తాను మాట్లాడుకొనుచున్నాడు. మరియు అతడు మాట్లాడు ఒక విషయము తాను ఎదుర్కొనిన శ్రమలు అయ్యున్నది, మరియు మన శ్రమల మధ్య దేవుడు మనకు ఆదరణ కలిగిస్తాడు, దేవుడు మనకిచ్చు ఆదరణ ద్వారా, మనము ఇతరులకు ఆదరణను కలిగించవచ్చు, మరియు మనము ఎంతగా శ్రమను అనుభవిస్తే అంతగా దేవుడు మనలను ఆదరిస్తాడు అని మాట్లాడుతూ అతడు 2 కొరింథీ పత్రికను ఆరంభిస్తాడు. కాబట్టి, బహుగా శ్రమపడిన విశ్వాసులు, బహుగా ఎదుగుటకు కారణం వారి జీవితములలో దేవుడు లోతైన రీతిలో కార్యము చేయుట అయ్యున్నది అని ఇది వివరిస్తుంది.
— డా. జెఫ్ లోమాన్
ఈ పత్రిక యొక్క ముగింపులో, 13:11-14లో ఉన్న ముగింపు చాలా క్లుప్తముగా ఉన్నది. ఇందులో కొన్ని సాధారణ ఉపదేశములు మరియు తుది శుభవచనములు ఉన్నాయి.
2 కొరింథీ పత్రికలోని చివరి భాగములను దృష్టిలో ఉంచుకొని, 1:12-13:10లో ఉన్న పత్రిక యొక్క ప్రధాన భాగమును చూద్దాము. ఈ వచనములు పత్రికలో ఎక్కువ భాగము అయ్యున్నది మరియు దీనిని ఐదు ప్రధాన భాగములుగా విభాగించవచ్చు. 1:12-2:11లో ఉన్న పౌలు ప్రవర్తన యొక్క సమర్థనతో ప్రధాన భాగము ఆరంభమవుతుంది. దీని తరువాత 2:12-7:1లో పౌలు పరిచర్య యొక్క సమర్థన ఉన్నది. తరువాత 7:2-9:15లో యెరూషలేము కొరకు కానుకలను సేకరించుటను గూర్చి పౌలు ఉపదేశములను ఇచ్చుచున్నాడు. అటు తరువాత 10:1-12:13లో పత్రిక మరొకసారి పౌలు పరిచర్యను సమర్థిస్తుంది. తరువాత త్వరలోనే పౌలు చేయుటకు ఆశించిన సందర్శనను చర్చిస్తూ 12:14-13:10లో పత్రిక ముగుస్తుంది. 1:12-2:11లో తన ప్రవర్తనను పౌలు సమర్థించుకొనిన విధానమును మొదటిగా చూద్దాము.
పౌలు ప్రవర్తన (1:12-2:11). అనేక అబద్ధ ఆరోపణలు మరియు అపార్థముల నడుమ తనను తాను సమర్థించుకొనవలసిన అవసరతను పౌలు గుర్తించాడు అని ఈ వచనములు స్పష్టము చేస్తాయి. మొదటిగా, మునుపు ప్రణాళిక వేసుకున్న ప్రకారముగా తాను కొరింథు సంఘమును ఎందుకు సందర్శించలేకపోయాడో అతడు వివరించాడు. మరియు రెండవదిగా, కొరింథులో ఒకడు తనకు చేసిన తప్పును అతడు ప్రస్తావించాడు. స్పష్టంగా, కొరింథు పట్టణమును దర్శించవలెనను అతని ప్రణాళికను తెలియపరచిన తరువాత, అతనికి మరియు కొరింథు సంఘములో ఉన్న కొందరికి మధ్య వివాదము ఏర్పడింది. తత్ఫలితంగా, అతడు వారిని దర్శిస్తే, అతడు వారిని నిలదీయవలసి వస్తుంది అని పౌలుకు తెలుసు. కాబట్టి, పౌలు యొక్క సహన కార్యముగా, అతడు తన ప్రయాణ ప్రణాళికను మార్చుకున్నాడు. కొరింథులోని అనేకమంది క్రైస్తవులు ఇది కనికర చర్య అని గ్రహించడంలో విఫలమయ్యారు మరియు అతడు రాలేదని బాధపడ్డారు. కొందరు అతని విశ్వసనీయతను కుడా ప్రశ్నించారు.
సంబంధిత విషయముగా, అతనిని తప్పుపట్టి తరువాత సంఘము ద్వారా క్రమశిక్షణ పొందిన ఒక నిర్దిష్ట విశ్వాసి యొక్క పరిస్థితిని గూర్చి కూడా పౌలు చర్చించాడు. అతడు ఆ వ్యక్తిని క్షమించానని మరియు అతనికి ఇవ్వబడిన క్రమశిక్షణ సరిపోతుంది అని పౌలు సంఘముకు ధృవీకరించాడు. మరియు సంఘము ఆ వ్యక్తిని ప్రేమించి, తమ సహవాసములో చేర్చుకోవాలని కూడా పౌలు సంఘమును హెచ్చరించాడు.
పౌలు పరిచర్య (2:12-7:1). 2:12-7:1లో, పౌలు మరింత తీవ్రమైన సమస్యను చర్చించాడు: పౌలు అపొస్తులత్వ పరిచర్య యొక్క విశ్వసనీయత. పౌలు అపొస్తులత్వమును కొందరు కొరింథు విశ్వాసులు అనుమానించారు అని స్పష్టమవుతుంది. మనము ఇప్పటికే చూసినట్లుగా, పౌలు ఈ విషయమును గూర్చి 1 కొరింథీ పత్రికలో చర్చించాడు. అయితే 2 కొరింథీ పత్రికలోని అతని మాటలలో, కొరింథులోని అనేకమంది క్రైస్తవులు ఈ తప్పును సరిదిద్దుకోలేదని స్పష్టం అవుతుంది. కాబట్టి, పౌలు తన పరిచర్య పద్ధతిని విస్తృతముగా సమర్థించాడు, అతని పిలుపు మరియు పరిచర్య అధికారము దేవుని నుండి వచ్చినవి అని ప్రకటించాడు. వాస్తవానికి, పౌలు తన పరిచర్యను ఎంతగా సమర్థించాడు అంటే, అతని అపొస్తలత్వమును తిరస్కరించుట వలన తీవ్ర పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుంది అని స్పష్టము చేశాడు. 2 కొరింథీయులకు 5:18-20లో తన అపొస్తులత్వమును అనుమానించువారు ఇంకను దేవునితో సమాధానపడలేదు అని కూడా అతడు చెప్పాడు.
దేవుడు...సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను...దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు...మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని...బతిమాలుకొనుచున్నాము (2 కొరింథీయులకు 5:18-20).
దేవునితో సమాధానపడనివారు తమ పాప అపరాధములను తమమీద మోసికొనుచున్నారు. వారు క్షమించబడలేదు. అవును, తన రాయబారిని తిరస్కరించువారు తనను తిరస్కరించినట్లే అని యేసు తానే స్వయంగా బోధించాడు. లూకా 10:16లో ప్రభువు ఆయన శిష్యులకు సెలవిచ్చినట్లుగా:
మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును (లూకా 10:16).
ఈ అంశము చాలా ముఖ్యమైనది గనుక పౌలు ఈ పత్రికలో దీనిని గూర్చి ఎక్కువగా చర్చించాడు. కొరింథీయుల విషయములో అతడు కలిగియున్న చివరి ఆశ , తాను ఎంతో ప్రేమించినన తన సువార్తను ధిక్కరించిన కొరింథీయులు నశించిపోవుట అయ్యున్నది. మరియు ఇది నేడు క్రైస్తవులమను పిలచుకొను అనేకమందికి కూడా కఠినమైన హెచ్చరిక అయ్యున్నది.
కానుక (7:2-9:15). 2 కొరింథీ పత్రికలోని ప్రధాన భాగము యొక్క మూడవ ఉపభాగము 7:2-9:15లో యెరూషలేములోని పేదల కొరకు కానుకను సేకరించాలని ఇవ్వబడిన సూచనలను కలిగియున్నది. యూదయలో కరవు వచ్చిన కారణమును బట్టి యెరూషలేములోని క్రైస్తవులు అత్యవసర పరిస్థితిలో ఉన్నారు. ఈ సంక్షోభముకు ప్రతిస్పందనగా, ఇతర సంఘములతో పాటుగా కొరింథు సంఘము, వారికి సహాయముగా కానుకలను సేకరించుటకు ఒప్పుకున్నారు. అయితే కొరింథీయులు కానుకలను సేకరించుటలో విఫలమయ్యారు. కాబట్టి, ఇతరుల కొరకు త్యాగం చేయుట యొక్క విలువను గూర్చిన సుదీర్ఘ చర్చలో పౌలు నిమగ్నమైయ్యాడు. మాసిదోనియ సంఘములు ఇవ్వగలిగిన దానికంటే కూడా ఎక్కువగా ఇచ్చి ఈ విధముగా పరిచర్య చేయుటను బట్టి సంతోషించుచున్నారు అని ఆ సంఘమును గూర్చి ఆదర్శప్రాయంగా అతడు మాట్లాడాడు. కొరింథీయులు సమృద్ధిని ఆనందించు నిమిత్తము తన ప్రాణమునే అర్పించిన క్రీస్తు మాదిరిని కూడా ఆదర్శప్రాయంగా వారికి చూపించాడు. అంతేగాక, వారు మునుపటి ఉద్దేశ్యముల ప్రకారం నడచుకుంటే దేవుడు వారి మీద గొప్ప ఆశీర్వాదములను కుమ్మరిస్తాడు అని వారిని ప్రోత్సహించాడు.
పౌలు పరిచర్య (10:1-12:13). 10:1-12:13లో, పౌలు క్రీస్తు అపొస్తులునిగా తన పరిచర్యను సమర్థించుకొను విషయమును మరల చర్చించాడు. ఇంతకు ముందు మనము ప్రస్తావించినట్లు, కొరింథీ క్రైస్తవులు లోకములో బాగా గౌరవించబడిన లక్షణములకు ఎంతో విలువనిచ్చారు. అయితే పౌలు ఈ లక్షణములను కనుపరచలేదు. కాబట్టి, సంఘములో కనీసం కొందరైనా అతని బోధను మరియు అధికారమును నిరాకరించారు. ఉదాహరణకు, కొరింథీయులు స్పష్టంగా శిక్షణపొందిన బోధకులకు విలువనిచ్చారు మరియు వారు చేయు పనిని బట్టి జీతమునకు పాత్రులు అని భావించారు. పౌలు ప్రసంగించినప్పుడు సంక్లిష్టమైన పదజాలములను ఉపయోగించలేదు. కొరింథులో ఉన్నప్పుడు సంఘముకు భారముగా ఉండకుండా తనను తాను పోషించుకొనుటకు అతడు పని కూడా చేశాడు. ఇవి మరియు ఇతర కారణముల వలన, పౌలును చిన్నచూపు చూడడం జరిగింది.
ఈ వైఖరికి ప్రతిస్పందనగా, తన పరిచర్య యొక్క మాన్యతను ఉద్ఘాటించుట ద్వారా మరియు ఇట్టి సరికాని విలువలను కలిగియున్నందుకు కొరింథీయులను గద్దించుట ద్వారా పౌలు తన అర్హతలను పేర్కొన్నాడు. ఇతర విషయాలతో పాటుగా, సువార్త నిమిత్తమై అతడు చేసిన అద్భుతమైన త్యాగములను గూర్చి మరియు పరలోకమును అతడు అనుభవించిన విధానమును గూర్చి అతడు ప్రస్తావించాడు. అంతేకాకుండ, కొరింథీయులు గౌరవించే భూసంబంధమైన అర్హతలను కలిగి, కొరింథులో అబద్ధములను వ్యాప్తిచేసే అబద్ధ అపొస్తలులను పౌలు ఖడించాడు మరియు వారి మీద దాడిచేశాడు. ఈ మనుష్యులను గూర్చి, 2 కొరింథీయులకు 11:13లో పౌలు ఇలా వ్రాశాడు:
ఏలయనగా అట్టి వారు క్రీస్తుయొక్క అపొస్తలుల వేషము ధరించుకొనువారై యుండి, దొంగ అపొస్తలులును మోసగాండ్రగు పనివారునై యున్నారు (2 కొరింథీయులకు 11:13).
ఈ అబద్ధ అపొస్తలుల మాటలు ఆలకించువారు వారి నాశనమునకే చేయుచున్నారు అని పౌలు స్పష్టము చేశాడు.
భవిష్యత్ సందర్శన (12:14–13:10). చివరిగా, 2 కొరింథీ పత్రికలోని ప్రధాన భాగము 12:14-13:12లో ముగుస్తుంది, అక్కడ పౌలు భవిష్యత్ సందర్శనను గూర్చి చర్చించాడు. సంఘముకు తీర్పుగా ఉన్నా లేకపోయినా అతడు కొరింథుకు వచ్చుటకు ప్రణాళిక కలిగియున్నాడు. విచారకరంగా, భయంకరమైన పాపములను గూర్చి హెచ్చరించబడిన తరువాత కూడా పశ్చాత్తాపము నొందుటకు తిరస్కరించిన అనేకమంది విశ్వాసులను ఎదుర్కొంటానెమో అని అతడు భయపడ్డాడు. వారు విశ్వాసములో ఉన్నారా లేదా అని కనుగొనునట్లు తమ్మునుతాము పరీక్షించుకోవాలని అతడు తన పాఠకులను హెచ్చరించాడు. 13:5లో అతని మాటలను వినండి:
మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచు కొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి; మీరు భ్రష్టులు కానియెడల యేసుక్రీస్తు మీలో నున్నాడని మిమ్మును గూర్చి మీరే యెరుగరా? (2 కొరింథీయులకు 13:5)
విశ్వాసము ఉంది అని చెప్పుకొనేవారు వాస్తవానికి రక్షణ కొరకు క్రీస్తును విశ్వసించుటలేదు అని పౌలుకు తెలుసు. కాబట్టి, అతని ప్రత్యర్థులు యేసుక్రీస్తు యొక్క నిజమైన అనుచరులు అవుతారనే ఆశతో కొరింథు సంఘముకు పౌలు పశ్చాత్తాప, విశ్వాస మరియు రక్షణ సువార్తను గుర్తుచేశాడు.
పౌలు కొరింథీయులకు వ్రాసిన పత్రికల రెంటిలోను, కొరింథు సంఘములోనికి చొరబడిన అనేక అబద్ధ బోధనలను పౌలు సరిచేశాడు. పౌలు కొరింథులోని విశ్వాసుల పట్ల లోతైన శ్రద్ధను కలిగియున్నాడు అని స్పష్టమవుతుంది, కాబట్టి ఈ అబద్ధ బోధకులను తిరస్కరించి వారు మొదట పొందుకొనిన సువార్తను హత్తుకొని ఉండాలని హెచ్చరించుటకు అతడు వారికి వ్రాశాడు.
పౌలు కొరింథీయులకు వ్రాసిన ప్రామాణిక పత్రికల యొక్క నేపథ్యమును, విషయములను మరియు నిర్మాణమును చూశాము గనుక, మనము ఈ పాఠములోని మూడవ అంశమును పరిశీలించుటకు సిద్ధముగా ఉన్నాము: 1 మరియు 2 కొరింథీ పత్రికలలో పౌలు వ్రాసిన సమస్త విషయములకు వెనుక పౌలు యొక్క వేదాంతశాస్త్ర దృక్పథములు ఏ విధముగా ఉన్నాయి.
ఇప్పటివరకు ఈ పాఠములో, 1 మరియు 2 కొరింథీ పత్రికలలో పౌలు చర్చించిన అనేక నిర్దిష్టమైన సమస్యలను మనం చూశాము. మరియు ఈ సమస్యలలో చాలా వరకు యుగాంతశాస్త్రమును గూర్చి కొరింథీయులకు కలిగియున్న తీవ్రమైన అవగాహనలలో నాటుకొనియున్నాయని మనం సూచించాము. దీనిలోని పౌలు యొక్క నిర్దిష్ట బోధనలు తన వేదాంతశాస్త్రము యొక్క మూలాంశములలో నుండి తలెత్తాయని జాగ్రత్తగా చూచు స్థితిలో మనము ఉన్నాము. క్రీస్తునందు దేవుని రాజ్యము యొక్క అంత్య దినములు వివృతమగుటను గూర్చి తాను నిజమని యెరిగిన విషయములను ఉపయోగిస్తూ కొరింథులో ఉన్న సమస్యలను పౌలు మరలా మరలా పరిష్కరించాడు.
ఈ పాఠములన్నిటిలో మనం చెప్పినట్లుగా, పౌలు యొక్క యుగాంతశాస్త్రము చరిత్ర యొక్క లక్ష్యము కొరకు దేవుని రూపకల్పన మీద సాధారణ యూదులు కలిగియున్న దృక్పథములో నాటబడియున్నది. మొదటి శతాబ్దములో, ఎక్కువశాతం యూదుల అవగాహన పాతనిబంధన చరిత్రను రెండు యుగాలుగా విభజించింది: “ఈ యుగము” మరియు “రాబోవు యుగము.” “ఈ యుగము” అనగా పాపము, తీర్పు మరియు మరణ యుగము, మరియు “రాబోవు యుగము” అనగా దేవుని ప్రజలకు నీతి, క్షమాపణ మరియు నిత్య జీవితము కలుగు భవిష్యత్ యుగము. ఈ రెండు యుగముల మధ్య పరివర్తనను కలిగించు సంఘటన “మెస్సీయ” లేదా “క్రీస్తు” ఆగమనము అయ్యున్నది. మెస్సీయ వచ్చినప్పుడు, ఆయన ఈ యుగమును సమాప్తి చేసి రాబోవు యుగమును ఆరంభిస్తాడు అని చాలామంది నమ్మకము.
వాస్తవానికి, పౌలు మరియు ఇతర అపొస్తలులవంటి క్రీస్తు అనుచరులు, యూదుల వేదాంతవేత్తలు ఆశించిన విధముగా చరిత్ర స్పష్టంగా బయలుపరచబడలేదు అని గుర్తించారు. అన్ని సందేహములకు మించి, యేసు మెస్సీయ అయ్యున్నాడు మరియు రాబోవు యుగమును ఆయన ఆరంభించాడు. అయితే రాబోవు యుగము సంఘ చరిత్ర అంతటిలో కొనసాగుతుంది అని, క్రీస్తు తిరిగివచ్చినప్పుడు నెరవేర్పు సమయములో మాత్రమే పూర్ణతకు చేరుతుంది అని పౌలు మరియు ఇతర అపొస్తలులు అర్థము చేసుకున్నారు. క్లుప్తంగా, రాబోవు నిత్యరక్షణ యుగము యొక్క ఆగమనము కొన్నివిధాలుగా “మన మధ్యన ఉన్నది” కాని ఇంకొన్ని విధాలు “ఇంకా రాలేదు” అను కాలములో మనం ఉన్నాము. మనది ప్రస్తుత యుగము మరియు రాబోవుయుగము ఉనికిలో ఉన్న కాలము. యుగముల యొక్క ఈ అతివ్యాప్తి కాలములో, రాబోవు యుగము యొక్క అనేక ఆశీర్వాదములను మనము అనుభవిస్తున్నప్పటికీ, పాపము మరియు మరణము అను యుగములో కొనసాగుచున్న కలహాలు మరియు కష్టాలను మనం గ్రహించాలి.
నేను “ఆరంభమైన యుగాంతశాస్త్రము” అని పిలువబడుదానిని ప్రతిపాదిస్తాను. ఇది ఒక రకముగా నెరవేర్చబడిన యుగాంతశాస్త్రము రాజ్యము దాని పూర్ణతలో మన మధ్యన ఉన్నది అను ఆలోచన మరియు భవిష్యత్ యుగాంతశాస్త్రము, అనగా రాజ్యములో ఏమియు ఇక్కడ లేదు, మరియు భవిష్యత్తులో దాని నెరవేర్పు కొరకు మనము ఎదురుచూచుచున్నాము అను వాటి మధ్య ఇది ఒక “మధ్య మార్గముగా” ఉన్నది. నా ఆలోచన ప్రకారం, ఆరంభమైన యుగాంతశాస్త్రము క్రొత్త నిబంధన పట్ల సమర్పణ కలిగియున్నది, ఎందుకంటే రాజు యొక్క రాకడ ద్వారా, రాజ్యము ఆరంభమైనది, రాజ్యము ఆవిష్కృతమైనది అని అది బోధిస్తుంది. ఒక చిన్న ఆవగింజ విత్తబడినది. కాని, రాజైన యేసు యొక్క మహిమ సార్వత్రికముగాను, ప్రపంచవ్యాప్తముగాను కనబడు రాజ్యము యొక్క సంపూర్ణత కొరకు మనము ఇప్పటికీ ఎదురుచూచుచున్నాము. కాబట్టి, రాజ్యము మనమధ్యన ఉన్నదా? అవును ఉన్నది. అది మన మధ్యన పూర్ణతలో ఉన్నదా? లేదు, అది కేవలం ఆరంభమైనది అంతే. అది ఆరంభమైనది, కాని దాని పూర్ణత యేసు తిరిగివచ్చినప్పుడు మాత్రమే జరుగుతుంది.
— డా. డెని ఎకిన్
పౌలు తన మిషనరీ యాత్రలలో ప్రయాణించుచున్నప్పుడు, యుగాంతశాస్తమును గూర్చి క్రైస్తవులు కలిగియుండిన ఈ అవగాహన ఆదిమ సంఘమునకు అనేక కష్టములను సృష్టించింది అని అతడు నేర్చుకున్నాడు. మునుపటి పాఠములలో, ఈ విషయము మీద అనేకమంది విశ్వాసులు తీవ్రమైన ఆలోచనల్లోకి వెళ్లిపోయారు అని మనము చూశాము. గలతీయులు క్రీస్తునందు రాబోవు యుగము లోకమును ఎంత వరకు మార్చింది అను విషయమును తక్కువ అంచనా వేశారు. వారి తప్పిదమును మనము “తక్కువగా ఉనికిలోనికి వచ్చిన యుగాంతశాస్త్రము” అని పిలచాము. అన్య క్రైస్తవులు ధర్మశాస్త్రమును నెరవేర్చుటకుగాను సున్నతిని పొందాలి అని ఈ నమ్మకములో నుండి వారు నిర్థారించారు. “ఉద్రేక యుగాంతశాస్త్రము” అని మనం పిలచుదానిని థెస్సలొనీకయులు అభివృద్ధి చేశారు. సమీప భవిష్యత్తులో యేసు ప్రస్తుత యుగమును ముగించి రాబోవు యుగమును పూర్ణతలోనికి తెస్తాడు అని వారు నమ్మారు. తత్ఫలితంగా, ఈ యుగములో జీవితము అనేది అంత ప్రాముఖ్యము కాదని వారు భావించారు.
కొరింథులోని సమస్యలను మరియు పౌలు వారికి ఇచ్చిన జవాబులను మనం దగ్గరగా చూసినప్పుడు, కొరింథీయులు కూడా ఇవే సమస్యలను కలిగియుండిరి అని మనం కనుగొంటాము. రాబోవు యుగములో ఎంత భాగము ఇప్పటికే మన మధ్యన ఉన్నది అను విషయమును వారు ఎక్కువ అంచనా వేశారు. ఈ తప్పిదము “అతిగా-నెరవేర్చబడిన యుగాంతశాస్త్రము” అయ్యున్నది. మరియు ఈ విధముగా ఎక్కువ అంచనా వేయుట ద్వారా, వారి దగ్గర ఉన్నవాటి కంటే ఎక్కువ ఆశీర్వాదములు వారికి ఉన్నాయని కొందరు భావించి, అహంకారులయ్యారు. కాబట్టి, కొరింథు సంఘములోని కొన్ని విషయములను గూర్చి పౌలు మాట్లాడుతూ, వారి ఆత్మీయ స్థితిని గూర్చి మరింత సమతుల్యమైన సమీక్షను ఎలా చేసుకోవాలో మరలా మరలా వారికి తెలియజేశాడు.
పౌలు కొరింథీ సంఘమునకు తన వేదాంతశాస్త్ర దృక్పధములను అనేక మార్గములలో పునరుద్ఘాటించినప్పటికీ, మన ఉద్దేశ్యముల కొరకు అతడు కొరింథీ పత్రికలలో మరలా మరలా పునరావృతం చేసిన ఆయన యుగాంతశాస్త్రములోని మూడు విషయముల మీద మనము దృష్టిపెడదాము: విశ్వాసము, ప్రత్యేకముగా క్రీస్తు యొక్క శ్రేష్ఠత్వముకు సంబంధించి; ప్రస్తుతమునకు బదులుగా భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ; మరియు క్రైస్తవ జీవనముకు కీలకమైన మూలకముగా ప్రేమ. కొరింథీయుల విశ్వాసములో ఉన్న అసమానతలను సరిచేయుటకు క్రీస్తు శ్రేష్ఠత్వమును గూర్చి పౌలు ఉద్ఘాటించిన విధానమును మొదటిగా చూద్దాము.
ఈ పాఠములో కొరింథీ సంఘములో అనేక సమస్యలకు కారణమైన గర్వము మరియు అహంకారముతో వ్యవహరించుటకు పౌలు విశ్వాసము మీద మరలా మరలా దృష్టిపెట్టాడు. చాలావరకు, ఈ అహంకారం పెరగడానికి కారణము ఏమిటంటే క్రీస్తు అందరికి ప్రభువు మరియు రక్షకుడు అని గుర్తించుటలో కొందరు కొరింథీయులు విఫలమయ్యారు. దీనికి తోడు, క్రీస్తు అందరికీ రక్షకుడు అని చూచుటలో అనేకమంది విఫలమయ్యారు.
ప్రభువుగా క్రీస్తు విషయములో, ఆయన రాజ్యము యొక్క నెరవేర్పులో ఆయన ప్రభుత్వము యొక్క ప్రత్యక్షతను కొరింథీయులు ఉద్ఘాటించారు. వినుటకు వింతగా ఉన్నా, కొందరు కొరింథీయులు క్రీస్తు దేవుని రాజ్యమును దాదాపు పూర్తిగా వారి జీవితములోనికి తీసుకువచ్చాడు అన్నట్లుగా వ్యవహరించారు. విశ్వాసుల కొరకు దేవుడు మనస్సులో కలిగియున్న అనేక లేక ఇంచుమించు అన్ని నిత్య ఆశీర్వాదములను అనుభవిస్తున్నారు అని భావించారు. యేసు క్రొత్తగా స్థాపించబడిన భూమి మీద వారిని పాలకులుగా నియమించినట్లు వారు వ్యవహరించారు. ఈ ఆలోచన ప్రత్యేకముగా, సంఘములో అధికారమును చలాయించిన వారియొక్క అభిప్రాయమువలె కనిపిస్తుంది. వారు ఇతరుల కంటే జ్ఞానులు మరియు “ఆత్మీయులు” గనుక క్రీస్తు వారికి ఈ అధికారమును ఇచ్చాడని వారు భావించారు. మరియు అటువంటి బహుమానములను పొందుకొననివారిని వారు చిన్నచూపు చూశారు.
ఈ విధమైన ఆలోచన కలిగియున్నందున 1 కొరింథీయులకు 4:7-10లో పౌలు వారిని ఎలా మందలించాడో వినండి:
నీకు ఆధిక్యము కలుగ జేయువాడెవడు? నీకు కలిగిన వాటిలో పరునివలన నీవు పొందనిది ఏది? పొందియుండియు పొందనట్టు నీవు అతిశ యింపనేల? ఇదివరకే మీరేమియు కొదువలేక తృప్తులైతిరి, ఇదివరకే ఐశ్వర్యవంతులైతిరి, మమ్మును విడిచిపెట్టి మీరు రాజులైతిరి; అవును, మేమును మీతోకూడ రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే గదా? ... మేముక్రీస్తు నిమిత్తము వెఱ్ఱివారము, మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము బలహీనులము, మీరు బలవంతులు; మీరు ఘనులు, మేము ఘనహీనులము (1 కొరింథీయులకు 4:7-10).
ఈ వాక్యభాగములో, కొరింథీయుల యొక్క అహంకార ఆలోచనలను పౌలు అపహాస్యం చేశాడు. పౌలు శ్రమలను అనుభవించాడు మరియు వారు అనుభవించలేదు గనుక వారు పౌలు కంటెను ఉన్నతమైనవారని నమ్మారు. హోదాను మరియు గౌరవమును తాము పొందుకున్నామని వారు భావించారుగాని వాస్తవానికి వారికి అనుగ్రహించింది క్రీస్తే. క్రీస్తు రాజుగా ఇంకను తిరిగి రాకుండానే వారు భూమి మీద క్రీస్తుతో కలిసి పాలించుచున్నారని వారు వెఱ్ఱిగా ఆలోచించారు. మరియు క్రీస్తుకు మాత్రమే చెందిన బలము, జ్ఞానము మరియు మహిమను తమకు ఆపాదించుకున్నారు. మరియు అటువంటి బహుమానములను పొందుకొనని ఇతర క్రైస్తవులను వారు చిన్నచూపు చూశారు.
కొన్ని విధాలుగా, ఈ తప్పులను అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు మహిమలో తిరిగి వచ్చిన తరువాత విశ్వాసులు గొప్ప ఘనతను పొంది, క్రొత్త భూమిని పాలిస్తారు అని కొరింథీయులు సరిగానే అంచనా వేశారు. అయితే ఈ జీవితములో వారరు కలిగియుండిన లాభములను గూర్చి మూర్ఖముగా ఆలోచన చేసి, అప్పటికే వారు దేవుని నుండి ఈ ఘనతను అనుభవించుచున్నారు అని నిర్థారించారు. వారు తమను తాము అధికులుగా, ఘనులుగా, ఇతరుల కంటే ఎక్కువ మహిమను పొందినవారిగా ఎంచుకున్నారు.
అయితే వారి తప్పులు అర్థం చేసుకోబడిన లేక చేసుకోబడకపోయినా, అవి అంగీకర యోగ్యమైనవి కావు. వాస్తవానికి, వారు సంఘములో విధ్వంశము సృష్టిస్తూ, పరపతిగల స్థితిలో లేని విశ్వాసులను అగౌరవించుట ద్వారా వారు సంఘములో నాశనమును కలిగిస్తున్నారు. కాబట్టి, ఈ సమస్యను సరిచేయుటకు, రాబోవు యుగము సంపూర్ణముగా ఉనికిలోకి రాలేదను సత్యమును పౌలు ఉద్ఘాటించాడు. క్రీస్తు గాక మరి ఏ ఒక్కరు కూడా ఆ పరిపాలనను ఆరంభించలేరు. ఆ ఘనతను పొందుట కొరకు ప్రతి ఒక్కరు క్రీస్తు రాకడను ఎదురుచూశారు.
క్రైస్తవ పరిచర్య యొక్క మూలమును గూర్చి మాట్లాడుతూ పౌలు 2 కొరింథీ. 4:5 వంటి అద్భుతమైన వచనమును ఇచ్చాడు:
మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదుగాని, క్రీస్తుయేసును గూర్చి, ఆయన ప్రభువనియు, మమ్మునుగూర్చి, యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము (2 కొరింథీయులకు 4:5).
అతడు కొరింథీయుల కొరకు కలిగియుండిన సందేశము యేసు క్రీస్తు యొక్క ప్రభుత్వమును గూర్చినది అను వాస్తవమును గూర్చి అతడు మాట్లాడాడు. యేసే సర్వమునైయున్నాడు. ఆయన ప్రభుత్వమును గూర్చి మనము ప్రకటించగోరుచున్నారు. మనలో ప్రతి ఒక్కరము లోకములో కేంద్రముగా ఉండాలనుకొను మన శోధనను ఆయన గుర్తించాడు. ఇది ఒక స్వాభావిక ఆలోచన. మరియు ఇది చాలా సులువైనది, వాస్తవానికి, పరిచర్య అంతా వారిని గూర్చినదిగా మారిపోవుట కొరింథీయుల మధ్య ఒక సమస్య అయ్యున్నది. ఈ లోకములో వారు ఏమి సాధించగలరు, దేవుని లోకములో వారు కేంద్రముగా ఎలా ఉండగలరు అను విషయముల మీద దృష్టిపెట్టబడింది, కాని వాస్తవానికి, మన ప్రసంగము యొక్క ముఖ్య లక్ష్యము యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని బోధించుట మరియు ఆయన ప్రభుత్వము క్రింద జీవించుట యొక్క అంతర్భావములను అర్థము చేసుకొనుట అయ్యున్నది.
— రెవ. డా. సైమన్ వైబర్ట్
కొరింథీయులు ప్రభువుగా క్రీస్తును చూచుటలో విఫలమగుట మాత్రమేగాక, క్రీస్తును రక్షకునిగా ఘనపరచు విషయములో కూడా విఫలమయ్యారు కాబట్టి, పౌలు విశ్వాసమును ఉద్ఘాటించాడు. ప్రత్యేకముగా, క్రీస్తుతో ఐక్యపరచబడుట ద్వారానే విశ్వాసులు ఆత్మీయ వరములు మరియు ఘనతతో సహా రాబోవు యుగము యొక్క ఆశీర్వాదములను పొందుతారను సత్యమును వారు ఉపేక్షించారు.
మనము ఇంతకు ముందు చూసినట్లు, క్రీస్తుతో ఐక్యపరచబడుట ద్వారా మాత్రమే, విశ్వాసులు క్రీస్తు యొక్క గుర్తింపును మరియు దేవుని దృష్టిలో అర్హతను పొందుతారు. మరియు ఈ ఐక్యత కారణముగానే, వారే క్రీస్తు అన్నట్లుగానే దేవుడు వారిని చూచి, సంఘములో వారు ఆనందించు స్థాయి, గౌరవము మరియు వరములను అనుగ్రహిస్తాడు. అయితే అనేకమంది కొరింథీయుల హృదయములలో, వరములు మరియు ఘనత విశ్వాసులు వ్యక్తిగతముగా పొందుకున్నారు అను ఆలోచన ఉండేది. క్రైస్తవునికి ప్రభావము మరియు స్థాయి ఉన్నట్లయితే, వాటిని పొందుకొనుటకు ఆ వ్యక్తి అర్హుడు గనుక వాటిని పొందుకున్నాడు అని వారు ఆలోచించారు. మరియు ఒక విశ్వాసి అలాటి భూసంబంధమైన ప్రాముఖ్యతను పొందుకొనకపోతే, అతడు లేదా ఆమె సంపూర్ణ క్రైస్తవుడు కాదు అని భావించారు. కాబట్టి, ఈ తప్పును సరిచేయుటకు పౌలు యుగాంతశాస్త్రములోని మరొక కోణమును ఉద్ఘాటించాడు, మరియు ఇది క్రీస్తు యొక్క ప్రాముఖ్యతను అనగా క్రీస్తు మరియు విశ్వాసులకు మధ్యగల ఐక్యత అను సిద్ధాంతమును ఉద్ఘాటిస్తుంది. 2 కొరింథీయులకు 5:15-17లో పౌలు దీనిని గూర్చి మాట్లాడిన విధానమును వినండి:
జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు [క్రీస్తు] అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము. కావున ఇకమీదట మేము శరీరరీతిగా ఎవనినైనను ఎరుగము... కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను (2 కొరింథీయులకు 5:15-17).
విశ్వాసులు తమ్మునుతాము లేదా ఇతరులను శారీరపరముగా లేదా ప్రాపంచిక ప్రమాణాల ప్రకారం విశ్లేషించుకొనకూడదు అని పౌలు నొక్కి చెప్పాడు. బదులుగా, విశ్వాసులందరిని క్రీస్తులో ఐక్యపరచబడినవారిగా పరిగణించి, ప్రభువును ప్రేమించినట్లుగానే ఒకరినొకరు ప్రేమించుకోవాలని అతడు వారిని కోరాడు. ఈ కారణము చేత, ప్రభువును ఘనపరచునట్లు మరియు ప్రేమించినట్లుగానే వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలని అతడు వారిని కోరాడు. వాస్తవానికి, కొరింథీయులకు వ్రాసిన పత్రికలలో పౌలు ఈ మాటలను పదే పదే ప్రస్తావించాడు. 1 కొరింథీయులకు 8:11-12లో ఈ విషయమును గూర్చి అతడిచ్చిన సలహాను వినండి:
ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును. ఈలాగు సహోదరులకు విరోధముగా పాపము చేయుట వలనను, వారి బలహీనమైన మనస్సాక్షిని నొప్పించుట వలనను, మీరు క్రీస్తునకు విరోధముగా పాపము చేయు వారగుచున్నారు (1 కొరింథీయులకు 8:11-12).
విశ్వాసులు క్రీస్తులో ఐక్యపరచబడ్డారు గనుక విశ్వాసికి వ్యతిరేకముగా పాపము చేయుట అంటే క్రీస్తుకు వ్యతిరేకముగా పాపము చేయుటయే అవుతుంది అని పౌలు బోధించాడు. మరియు ప్రభు భోజన సమయములో బీదలను సిగ్గుపరచవద్దు అని ఆధిక్యతగలవారిని హెచ్చరించినప్పుడు కూడా 1 కొరింథీ. 11:24-27లో అతడు ఇదే విధమైన వాదనను ఉపయోగించాడు. పౌలు ఇలా వ్రాశాడు:
యేసు “ఇది మీకొరకైన నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను... పాత్ర నా రక్తమువలననైన క్రొత్తనిబంధన; ... నన్ను జ్ఞాపకము చేసికొనుటకై దీనిని చేయుడని చెప్పెను... కాబట్టి యెవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభువుయొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును (1 కొరింథీయులకు 11:24-27).
ఈ వాక్య భాగములో, యేసు కేవలము సంపన్నులు లేదా శక్తివంతులకు మాత్రమేగాక వారందరికొరకు తన్నుతాను అప్పగించుకున్నాడు అని పౌలు కొరింథీయులకు జ్ఞాపకం చేశాడు. మరియు కేవలము క్రీస్తు ద్వారానే విశ్వాసులందరూ ఐక్యత కలిగియున్నారని తద్వారా రాబోవు యుగము యొక్క ఆశీర్వాదములను పొందుకున్నారని అతడు వారికి జ్ఞాపకం చేశాడు. ఈ కారణము చేత, ప్రభు భోజనములో అయోగ్యముగా పాలుపొందుట, అనగా భోజన సమయములో బీదలను లేదా ఇతరు విశ్వాసులను కించపరచుట యేసుకు విరోధముగా పాపము చేయుట అని అతడు స్పష్టంచేశాడు.
అతడు కొరింథీయులకు వ్రాసిన పత్రికలందంతట, ఇతర విశ్వాసులను గౌరవించుట, వారికి విలువనిచ్చుట మరియు వారికి పరిచర్య చేయుట క్రీస్తుతో ఐక్యతకు మూలముగా ఉన్నాయని పౌలు తరచుగా సూచించాడు. 1 కొరింథీయులకు 12:12లో మానవుని శరీరములో అవయవములవలెనే విశ్వాసులు ఒకరిమీద ఒకరు ఆధారపడాలని అతడు వ్రాసినప్పుడు అతడు ఇలానే చేశాడు. 2 కొరింథీయులకు 1:5లో క్రీస్తు ఆదరణలో పాలుపంచుకోవాలని విశ్వాసులను అతడు ప్రోత్సహించినప్పుడు కూడా అతడు మరలా ఇలానే చేశాడు. కొరింథులోని సంఘముకు పౌలు తన పత్రికలలో వ్రాసిన ఈ ఆలోచనలను వివరించుటకు తగిన సమయము మన యొద్ద లేదు కాబట్టి, అతని ఆలోచనను ఈ విధముగా సంగ్రహించుట ద్వారా మనం సంతృప్తిపొందాలి: కేవలము క్రీస్తుతో ఐక్యత ద్వారా మాత్రమే రాబోవు యుగము యొక్క ఆశీర్వాదములలో విశ్వాసులు పాలుపొందుతారు. మనము ఈ సత్యమును గ్రహించినప్పుడు, క్రీస్తును సరిగా మహిమపరచి, ఇతరుల పట్ల అహంకారమును చూపుటను నిరోధించగలుగుతాము.
పౌలు యొక్క వేదాంతశాస్త్ర దృక్పధములు కేవలం విశ్వాసమును మాత్రమే ఉద్ఘాటించలేదుగాని, వారి నిరీక్షణ దేవుని రాజ్యము యొక్క భవిష్యత్ నెరవేర్పు మీద ఆధారపడియున్నదిగాని, వారి ప్రస్తుత ఆశీర్వాదముల మీద కాదు అని జ్ఞాపకము చేయుట ద్వారా కొరింథీయుల యొక్క సరికాని అభిప్రాయములను పౌలు సరిచేశాడు.
రాబోవు యుగము యొక్క ఆశీర్వాదములలో కొన్నింటిని కొరింథీయులు అప్పటికే ఆనందించుచున్నప్పటికీ, పాపము మరియు మరణము అను ప్రస్తుత యుగము ఇంకను ముగింపుకు రాలేదు. 1 కొరింథీ 7:31లో పౌలు వ్రాసినట్లు, “ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది.” మరొక మాటలో, రాబోవు యుగము ఆరంభమైనదిగాని, ఈ యుగము ఇంకను “గంతించిపోతూనే” ఉన్నది. 1 కొరింథీయులకు 2:6లో ఇలా వ్రాసినప్పుడు అతడు ఇటువంటి ప్రకటననే చేశాడు, “నిరర్థకులై పోవుచున్న యీ లోకాధికారుల జ్ఞానము.” అవి ఇంకా ముగింపునకు రాలేదు.
1 కొరింథీయులకు 15:50లో, పౌలు ఈ మాటలను చేర్చాడు, “రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు.” వాస్తవానికి, వారు రక్తమాంసములుగలవారని కొరింథీయులకు తెలుసు, కాబట్టి వారి ప్రస్తుత ఉనికిలో సంపూర్ణ నిత్య ఆశీర్వాదములను వారు పొందలేరు అని ఈ ప్రకటన సూచిస్తుంది. మరియు క్రీస్తు రాకడ సమయమున కలుగువాటి కొరకు వారు నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగవలసియున్నది. అదేవిధంగా, 1 కొరింథీయులకు 4:8లో కొరింథీయులు క్రీస్తుతో పాలించుట ఇంకను ఆరంభించలేదు అని పౌలు వాదించిన విషయము మీరు జ్ఞాపకము చేసుకోవచ్చు. రాబోవు యుగము యొక్క సంపూర్ణతలో క్రీస్తుతో కలిసి పాలించుట జీవితంలోని మరొక కోణం అవుతుంది.
నిరీక్షణ సిద్ధాంతముకు నేరుగా అనువర్తించబడు పౌలు చేసిన సుదీర్ఘమైన వాదనను 1 కొరింథీయులకు 15లో చూస్తాము. అక్కడ, విశ్వాసులందరి యొక్క భవిష్యత్ శారీరిక పునరుత్థానమును తిరస్కరించువారిని పౌలు ఖండించాడు. రాబోవు యుగము యొక్క ఆశీర్వాదములన్నిటిని కాకపోయిన కొన్నిటినైనా అప్పటికే అనుభవించుచున్నామని కొరింథు సంఘములోని కనీసం కొందరు నమ్మారు. ఫలితముగా, విశ్వాసుల యొక్క భవిష్యత్ పునరుత్థానము ద్వారా కలుగు మహిమ యొక్క ప్రాముఖ్యతను వారు చూడలేకపోయారు. అయితే 1 కొరింథీయులకు 15లో, రాబోవు యుగము యొక్క సంపూర్ణ ఆశీర్వాదములను పొందుకొనుటకు ముందు కొన్ని పెద్ద సంఘటనలు జరగాలి మరియు ముఖ్యమైన మార్పులు జరగాలి అని పౌలు స్పష్టం చేశాడు.
1 కొరింథీయులకు 15:22-24లో ఈ మార్పలను పౌలు సంగ్రహించాడు:
క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును (1 కొరింథీయులకు 15:22-24).
క్రీస్తు లేచినట్లుగానే విశ్వాసులు కూడా మరణము నుండి తిరిగిలేవాలి కాని, క్రీస్తు తిరిగి వచ్చే వరకు వారి పునరుత్థానము జరుగదు. అప్పుడు, క్రీస్తు తన పునరుత్థానమందు మహిమ శరీరమును పొందుకొనిన విధముగానే వారు తమ మహిమగల శరీరములను పొందుకుంటారు.
క్రైస్తవులమైన మనము ఎదురుచూడవలసిన ఒక అతి గొప్ప విషయము శరీర పునరుత్థానమైయున్నది. ఇది బైబిలు నిరీక్షణ అయ్యున్నది... మరియు మన అంతిమ పునరుత్థానము క్రీస్తు పునరుత్థానములో నాటబడియున్నది మరియు దాని ద్వారానే నిశ్చయించబడినది. 1 కొరింథీయులకు 15:15-17లో పౌలు దీనిని గూర్చి మాట్లాడిన విధానమును వినండి: మొదటిదిగా, మనము క్రీస్తు యొక్క మృతుల పునరుత్థానమును చర్చిస్తాము. ఇక్కడ రూపకము క్రీస్తు పునరుత్థానము వరుసలో మొదటిదిగా ఉండుట మాత్రమే కాదుగాని, రాబోవు మిగిలిన విషయములన్నిటిని గూర్చి నిశ్చయతను ఇచ్చుట అయ్యున్నది, ఎందుకంటే ఆయన తిరిగిలేచియున్నాడు, మనము ఆయనయందు మరియు ఆయనతో నిశ్చయముగా తిరిగిలేస్తాము, మరియు ఇది భవిష్యత్తును గూర్చి మనకు నిశ్చయమైన అద్భుతమైన నిరీక్షణను అనుగ్రహిస్తుంది.
— డా. డగ్లస్ మూ
క్రీస్తు రాకడ మరియు విశ్వాసుల పునరుత్థానము, ప్రస్తుత యుగము, దాని పరిపాలన, అధికారము మరియు శక్తి యొక్క ముగింపును సూచిస్తుంది. క్రీస్తు ఇంకా తిరిగి రాలేదు కాబట్టి, పునరుత్థానము ఇంకా జరుగలేదు కాబట్టి, కొరింథీయులు — ఏమనుకున్నను — మహిమలో జీవించుటలేదు. 1 కొరింథీయులకు 15:19లో పౌలు వ్రాసినట్లుగా:
ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము (1 కొరింథీయులకు 15:19).
ప్రస్తుత ప్రపంచము యొక్క తాత్కాలిక స్వభావమును గూర్చి స్పష్టంగా మాట్లాడుట ద్వారా, ఆ సమయమందు కొరింథీయుల యొక్క జీవితములను గూర్చిన వాస్తవిక దృక్పథములను ఇచ్చుటకు పౌలు ఆశించాడు. మరియు ఈ వాస్తవిక దృక్పథము వారు తమ అహంకారము మరియు పాపమును గూర్చి పశ్చాత్తాపపడేలా చేస్తుంది అని అతడు నిరీక్షించాడు.
విశ్వాసము మరియు నిరీక్షణను మనము చూశాము కాబట్టి, మనము ప్రస్తావించబోవు యుగాంతశాస్త్రము మీద పౌలు కలిగియున్న వేదాంతశాస్త్ర దృక్పధము ప్రేమ యొక్క ప్రాముఖ్యత అయ్యున్నది.
సాధారణంగా, ప్రేమ దేవుని ధర్మశాస్త్రమంతటికీ సారాంశముగా ఉందని మనం ఆలోచిస్తాముగాని, యుగాంతశాస్త్రములో భాగమైయున్నదని గుర్తించము. ఏదేమైనా, ప్రేమ అనేది రాబోవు యుగములో ఎంత ప్రాముఖ్యముగా ఉందో ప్రస్తుత యుగములో కూడా అంతే ప్రాముఖ్యముగా ఉండుట వాస్తవమే అయినను, పౌలు ఆలోచన ప్రకారం ప్రేమ అనేది “యుగాంతశాస్త్ర” సుగుణమై యున్నది. అనగా, అంత్యదినములను గూర్చిన అతని వేదాంతశాస్త్రములో ఇది ముఖ్య విషయముగా ఉంది.
ఉదాహరణకు, అతని సుప్రసిద్ధ “ప్రేమ అధ్యాయము” అయిన 1 కొరింథీయులకు 13లో కనుగొనబడు ప్రేమ యొక్క నిలిచియుండు విలువను గూర్చిన పౌలు వాదనను వినండి. 8-13 వచనములలో అతడు ఈ మాటలు వ్రాశాడు:
ప్రేమ శాశ్వతకాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును; భాషలైనను నిలిచి పోవును; జ్ఞానమైనను నిరర్థకమగును; మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంతమట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముకానిది నిరర్థకమగును... కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ యీ మూడును నిలుచును; వీటిలో శ్రేష్ఠమైనది ప్రేమయే (1 కొరింథీయులకు 13:8-13).
ఈ వాక్యభాగము సూచించుచున్నట్లు, ప్రస్తుత యుగము యొక్క జీవితములోని అనేక కోణములు రాబోవు యుగము సంపూర్ణముగా వచ్చినప్పుడు కొనసాగవు. ఇక్కడ మాట్లాడే విషయాలు మన యెదుట ఉన్నప్పుడు ప్రవచనమైనను జ్ఞాన వరములైనను నిరుపయోగముగా ఉంటాయి. అదేవిధంగా, విశ్వాసము మరియ నిరీక్షణ అను ఉన్నతమైన క్రైస్తవ గుణములకు కూడా రాబోవు యుగము యొక్క సంపూర్ణతలో స్థానము ఉండదు.
ప్రస్తుత యుగములో, మనము చూడనివాటి యందు విశ్వాసముంచుట ప్రతి విశ్వాసికి కీలకమైయున్నది. అయితే క్రీస్తు మనతో భౌతికముగా నివసించుటకు తిరిగివచ్చినప్పుడు, ఆయన ఒకసారి మనలను మరణములో నుండి తిరిగిలేపి, ఆయన రాజ్యము యొక్క నెరవేర్పును మన మధ్యకు తెచ్చినప్పుడు, మనము ఇక విశ్వాసమును కొనసాగించవలసిన అవసరము ఉండదు. వాస్తవికత మన చుట్టూ ఉంటుంది. ఇంచుమించు ఇదే విధముగా, క్రైస్తవ జీవితమునకు కూడా నిరీక్షణ కీలకమైయున్నది. మనము ప్రస్తుతము నిరుత్సాహముతో సతమతమగుచున్నను, రాబోవు యుగములో కలుగు అద్భుతమైన ఆశీర్వాదముల కొరకు మనము నిరీక్షించాలి. అయితే క్రీస్తు తిరిగివచ్చినప్పుడు మనము ఆయన ఆశీర్వాదములను పొందుకొనిన తరువాత, మనము ఇక వాటి కొరకు నిరీక్షించవలసిన అవసరము ఉండదు. బదులుగా, మనము వాటిని నిత్యము వరకు ఆస్వాదిస్తాము.
ఈ అధ్యాయములో పౌలు ప్రస్తావించిన ఆత్మీయ వరములు మరియు క్రైస్తవ గుణములన్నిటిలో, ప్రేమ మాత్రమే రాబోవు యుగము యొక్క సంపూర్ణతలో వ్యక్తమౌతుంది మరియు నిధిగా కొనసాగుతుంది. మనము ఇప్పుడు ప్రేమిస్తాము, అప్పుడు కూడా ప్రేమిస్తాము. మనము ఇప్పుడు ప్రేమను పొందుకొనుచున్నాము, అప్పుడు కూడా ప్రేమను పొందుకుంటాము. నేటి క్రైస్తవ ప్రేమయే రాబోవు యుగము యొక్క ఆశీర్వాదములలో అతి గొప్ప పాలుపంపులు అయ్యున్నది. వాస్తవానికి, ఇది ఆ ఆశీర్వాదముల యొక్క ముఖ్య వ్యక్తీకరణగా ఉంది. అయితే రాకడశాస్త్ర గుణమైన ప్రేమను కొరింథులోని సమస్యలకు పౌలు ఎలా అనువర్తించాడు? అతడు దీనిని చేసిన అనేక మార్గములను ఇప్పటికే మనం చూశాము. ఉదాహరణకు, విగ్రహముల దేవాలయములలో మాంసము తినవద్దని జ్ఞానవంతులైన విశ్వాసులను అతడు ప్రోత్సహించాడు. ఈ విధముగా, బలహీనమైన మనస్సాక్షి కలిగి ఈ ప్రవర్తన ద్వారా విగ్రహారాధనలో పాలుపొందుటకు ప్రోత్సహించబడు వారి పట్ల వారు ప్రేమను చూపుతారు. 1 కొరింథీ 8:1లో పౌలు వ్రాసిన మాటలను వినండి:
విగ్రహములకు బలిగా అర్పించినవాటి విషయము: మనమందరము జ్ఞానముగలవారమని యెరుగుదుము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును (1 కొరింథీయులకు 8:1).
ఈ వాక్యభాగములో మనము చూసినట్లు, విగ్రహములకు అర్పించబడిన మాంసమును తినకూడదు అని పౌలు ఇచ్చిన హెచ్చరికలు క్రైస్తవ ప్రేమ అను సుగుణములో నాటబడియున్నవి. పౌలు తన అపొస్తులత్వమును సమర్థించుకొనిన సందర్భములో కూడా ప్రేమను గూర్చి ధృడముగా మాట్లాడాడు. ఉదాహరణకు, అతడు పరిచర్య చేసిన విధానమును వివరిస్తూ, 2 కొరింథీయులకు 5:14-15లో ఇలా వ్రాశాడు:
క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది; ఏలాగనగా అందరికొరకు ఒకడు మృతిపొందెను గనుక అందరును మృతిపొందిరనియు జీవించువారికమీదట తమకొరకు కాక, తమ నిమిత్తము మృతిపొంది తిరిగి లేచినవానికొరకే జీవించుటకు ఆయన అందరికొరకు మృతిపొందెననియు నిశ్చయించు కొనుచున్నాము (2 కొరింథీయులకు 5:14-15).
మరొక మాటలో, తర్ఫీదు పొందిన ప్రసంగీకులు మరియు మాన్యతగల ప్రవక్తలను పోలిన విధముగా పరిచర్య చేయకుండునట్లు ప్రేమ పౌలును బలవంతము చేసింది. విశ్వాసులందరు క్రీస్తును ప్రేమించిన విధముగానే ఒకరినొకరు ప్రేమించుకోవాలని అతడు ఆశించాడు.
పౌలు ప్రేమ అను సుగుణమును కొరింథులోని పరిస్థితికి అనువర్తించిన అత్యంత స్పష్టమైన మార్గము, ఆత్మీయ వరములకు సంబంధించి అతడు ఇచ్చిన సూచనలలో కనిపిస్తుంది. పరిశుద్ధాత్ముడు కొరింథీయులకు అద్భుతమైన రీతులలో వరములను ఇచ్చినప్పటికీ, భాషలు, ప్రవచనము, జ్ఞానము మరియు ఆశ్చర్య-కార్యములు వంటి ఎక్కువ విశేషమైన వరములు కలిగినవారి యొక్క అహంకారము తక్కువ నాటకీయమైనవరములు కలిగినవారిని చిన్నచూపు చూచుటకు దారితీసింది. వరములన్నియు, ముఖ్యమైనవి మరియు ఇతరవి, ప్రేమతో ఉపయోగించబడని యెడల నిరుపయోగమైనవి మరియు బాధించేవిగా ఉంటాయి అని చెప్పుట ద్వారా ఒక విధముగా పౌలు ఈ పరిస్థితిని పరిష్కరించాలని నిరీక్షించాడు.
పాత నిబంధన కాలములు మరియు క్రొత్త నిబంధన కాలముల మధ్య పరిశుద్ధాత్మ వరముల మధ్య వ్యత్యాసము చూపుట పరిశుద్ధాత్మ సిద్ధాంతములో అత్యంత కష్టమైన ప్రశ్నలలో ఒకటైయున్నది. పరిశుద్ధాత్మ వరములు వ్యక్తిగత ప్రయోజనము కొరకు గాక, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఇవ్వబడినవి అని క్రొత్త నిబంధనలోని అనేక భాగములలో మనము చూడవచ్చు... వారు ఆత్మీయ వరములను ఇతర విశ్వాసుల కంటే ఉన్నతమైనవారిగా భావించుకొనుటకు ఏనాడు ఉపయోగించకూడదు. 1 కొరింథీయులకు 12లో, కొరింథీయుల మధ్య నివేదించబడిన పరిస్థితిని అపొస్తలుడైన పౌలు సవరించాడు. ఆత్మ యొక్క మరి ఎక్కువ అద్భుతమైన వరములను పొందుకొనుటకు వారంతా ప్రయత్నించారు. అయితే, మరి ఉత్తమమైన మార్గము ఉన్నదని, మరియు అది ప్రేమ మార్గము అయ్యున్నది అని అతడు వారికి తెలిపాడు. మరొక మాటలో, సంఘము పరిశుద్ధాత్మ ఏ ఉద్దేశ్యము కొరకు వరములను అనుగ్రహించాడో ఆ ఉద్దేశ్యముల కొరకు వాటిని ఉపయోగిస్తూ పరిపక్వతలో ఎదుగునట్లు సంఘమును సేవించు నిమిత్తము ప్రేమతో వాటిని ఉపయోగించని పక్షమున విశేషమైన వరముల వలన ప్రయోజనము లేదు.
— డా. డేవిడ్ కొర్రే, అనువాదము
1 కొరింథీయులకు 13:1-2లో అతడు వ్రాసినట్లుగా:
మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను (1 కొరింథీయులకు 13:1-2).
ప్రవచనము, భాషలు, అతీంద్రియ జ్ఞానము, మరియు అద్భుత-కార్యములు చేయు విశ్వాసము ప్రాపంచిన కోణము నుండి పరిశీలిస్తే ప్రభావవంతముగా ఉంటాయి. అయితే వాస్తవానికి, విశ్వాసుల యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు అవి ఇవ్వబడినవి గాని భూసంబంధమైన విలువ లేదా అనుభావిక ఆనందం కొరకు కాదు. వాటిని ప్రేమతో ఉపయోగించకపోతే, ఆత్మీయ వారములు ఆత్మీయ ఆశీర్వాదములను అనుగ్రహించవు. ఇక్కడ, మరొకసారి, ప్రేమపై పౌలు యొక్క ఉద్ఘాటన అతని యుగాంతశాస్త్రము యొక్క అభ్యాసిక అనువర్తనముగా ఎలా ఉన్నదో మనము చూస్తాము. సంఘములోని అనేక ఆత్మీయ వరములు రాబోవు యుగము ఆరంభమైనది అని కనుపరచాయి. అయితే ఈ వరములను ప్రేమతో ఉపయోగించినప్పుడు మాత్రమే అవి ప్రస్తుత యుగము యొక్క బాధలు మరియు మరణము నుండి ఉపశాంతి కలుగజేసి, రాబోవు యుగములోని ఆశీర్వాదములలో సంఘము పాలుపొందునట్లు చేస్తాయి.
ఈ పాఠములో, కోరింథు సంఘములో తలెత్తిన సమస్యలకు పౌలు స్పందించిన విధానమును మనం చూశాము. కొరింథులో ఉన్న క్రైస్తవులతో అతని అనుబంధము యొక్క నేపథ్యమును, మరియు అతడు వారికి వ్రాసిన ప్రామాణిక పత్రికల యొక్క నిర్మాణము మరియు విషయములను మనము సమీక్షించాము. చివరిగా, వారు అతిగా-నెరవేర్చబడిన యుగాంతశాస్త్రమును సరిచేసుకొని, తమ పాపములను ఒప్పుకోవాలని, ఒకరి పట్ల ఒకరు విధేయత చూపాలని, మరియు రాబోవు యుగము యొక్క నెరవేర్పు కొరకు నిరీక్షిస్తూ వేచిచూడాలని విశ్వాసులకు పిలుపునిచ్చుట ద్వారా పౌలు తన వేదాంతశాస్త్రము యొక్క మూలాంశములను వారి సమస్యలకు ఎలా అనువర్తించాడో మనం చూశాము.
పౌలు కొరింథు సంఘములో తలెత్తిన సమస్యలను పరిష్కరించిన విధానమును మనము పరిగణించుచుండగా, నేడు అతని బోధనలు మనకు ఎలా బోధిస్తాయో మనము గ్రహించగలుగుతాము. అనేక క్రైస్తవులు నేడు తమ్మును గూర్చి తాము ఆలోచించుకొనవలసిన దానికంటే ఎక్కువగా ఆలోచించుకొనుచున్నారు. వారు తమను తాము లోక ప్రామాణికతలకు అనుగుణంగా పరిగణించుకొనుచు గర్వముతో నిండియున్నారు. లోకమంతా ఉన్న నేటి సంఘములు విభజనలతో, వేర్వేరు వ్యతిరేక గుంపులతో సతమతమవుతున్నాయి. కొందరు పౌలు వంటి అపొస్తలులు మరియు క్రీస్తు ప్రవక్తలను కూడా పట్టించుకోరు లేక ధిక్కరిస్తున్నాయి. అయితే ప్రస్తుత యుగములో మనము కలిగియున్నవాటిని గూర్చి అతిశయపడుట కొరకు క్రీస్తు సిలువవేయబడలేదు మరియు సజీవునిగా తిరిగిలేవలేదు. పౌలు తన వేదాంతశాస్త్రము యొక్క మూలాంశములను అనువర్తించిన విధానమును మనము వినుచుండగా, ఒకరినొకరు ప్రేమించుకొని, యుగముల అంతమందు ఆయన తిరిగివచ్చినప్పుడు క్రీస్తు తెచ్చువాటి మీద హృదయములను కేంద్రీకరించి నేడు జీవించాలని కొరింథీయులకు బోధించిన విధముగానే అతడు మనకు కూడా బోధించుచున్నాడు.
Continue reading the full transcript