<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
క్యాటలాగ్‌కు తిరిగి వెళ్ళుJESమేము యేసుపై విశ్వసిస్తాము
మేము యేసుపై విశ్వసిస్తాము ·Videoఆంగ్లం నుండి అనువాదం చేయబడింది

JES-04 యాజకుడు

పూర్తి వచనం చదవండి

అదే శ్రేణిలోని 4వ పాఠానికి సమాధానమునిచ్చే ఒక అనుబంధ వీడియో: యేసు యాజకుని పదవిని ఎలా నెరవేర్చాడు? అవతారము ద్వారా దేవుని కుమారుడు మరింత ప్రభావవంతమైన ప్రధాన యాజకుడుగా ఎలా మారాడు? యేసు దేవాలయం యొక్క పనితీరును, ప్రాముఖ్యతను ఎలా నెరవేర్చాడు? పాత నిబంధన యాజకుల వేడుకలు ఎందుకు ముఖ్యమైనవి? పాత నిబంధన బలుల వ్యవస్థ దేవుని కరుణను ఎలా ప్రదర్శించింది? యేసు శిలువపై మరణం పాత నిబంధన బలులకు ఎలా సంబంధం కలిగి ఉంది? మనకు దేవునితో శాంతి ఉన్నట్లయితే, అతడు మనకు ఇంకా ఎందుకు శిక్షిస్తాడు? నిజమైన విశ్వాసులు తమ రక్షణపై నమ్మకం లేకపోవచ్చు, సందేహించవచ్చు? యేసు యొక్క ప్రధాన యాజకుని ప్రార్థన యొక్క ప్రధాన అంశం ఏమిటి? ఆధునిక క్రైస్తవులు ఒక యాజకుల రాజ్యంగా ఎలా పనిచేస్తారు? యేసు మన ప్రధాన యాజకుడు అయితే, చర్చి ఒక యాజకుల రాజ్యం అయితే, పాస్టర్ల పాత్ర ఏమిటి? క్రైస్తవులు స్వర్గీయ దేవాలయంలో దేవునికి ఎలా సేవిస్తారు?


From the transcript

1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.

బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.

ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.

అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.

మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.

అత్యంత బలమైన మరియు ప్రఖ్యాతిగాంచిన ఒక వ్యక్తిని కలవడానికి ఆహ్వానము ఇవ్వబడుటను గూర్చి మనము చాలా అరుదుగా ఊహించుకుంటాము. కాని అదే జరిగితే మనము ఎలా స్పందిస్తామో మనకు తెలుసు. “నన్ను ఎవరైనా పరిచయం చేస్తారా? నేను ఏమి వేసుకోవాలి? నేను ఏమి చెయ్యాలి? నేను ఏమి చెప్పాలి? అక్కడ నేను ఎలా ప్రవర్తించాలో నాకు ఎవరు చెబుతారు?” అని మనము ఆలోచన చేస్తాము.

మహిమకరమైన దేవుని సింహాసనము యొద్దకు మీరు ఆహ్వానించబడ్డారని ఊహించండి. ఆయన సమస్తమును సృష్టించినవాడు. అక్కడ కూడా మీరు ఇదే విధంగా, లేక ఇంతకంటే బలముగా స్పందిస్తారు. “నన్ను దేవునికి పరిచయం చేయుటకు ఎవరైనా ఉన్నారా? నేను ఏమి చెయ్యాలి? నేను ఏమి మాట్లాడాలి? దేవుని సన్నిధిలో ఎలా ప్రవర్తించాలో నాకు ఎవరు చెబుతారు?”

సంతోషకరముగా, మనలను దేవుని కలవడానికి సిద్ధపరచువాడు, మనలను ఆయనకు పరిచయం చేయువాడు, మరియు ఆయన తీర్పుకు మనము భయపడకుండా ఉండుటకు దేవుడు మనలను దయతో చూచునట్లు చేయగలవాడు ఉన్నాడు. అవును, ఆయనే యేసు క్రీస్తు, మరియు ఆయన మన గొప్ప ప్రధాన యాజకుడైయున్నాడు.

యేసును నమ్ముచున్నాము అను మన పాఠ్య క్రమములో ఇది నాల్గవ పాఠం, మరియు దీనికి “యాజకుడు” అని పేరు పెట్టాము. ఈ పాఠంలో, దేవుడు మరియు ఆయన ప్రజల మధ్య నిబంధనా మధ్యవర్తిగా ఉంటూ యేసు బైబిలు స్థానమైన యాజకుని పాత్రను ఏ విధంగా నెరవేర్చుతాడో మనము చూద్దాము.

మునుపటి పాఠంలో మనం ప్రస్తావించినట్లు, దేవుడు పాత నిబంధనలో మూడు స్థానములను స్థాపించి, వాటి ద్వారా తన రాజ్యమును పాలించాడు: ప్రవక్త, యాజకుడు మరియు రాజు స్థానములు. మరియు దేవుని రాజ్యము యొక్క చివరి స్థాయిలో, దీనిని మనము సాధారణంగా క్రొత్త నిబంధన యుగము అని పిలుస్తాము, ఈ మూడు స్థానములు వాటి అంతిమ నెరవేర్పును క్రీస్తులో పొందుకుంటాయి.

ఈ కారణము చేత, చరిత్రయంతటిలో ఈ స్థానముల యొక్క ప్రాముఖ్యతను మరియు కార్యకలాపాలను అధ్యయనము చేయుట యేసు క్రీస్తు ప్రస్తుతము దేవుని రాజ్యమును పాలించుటను గూర్చి, మరియు ఆయనకు నమ్మకమైన అనుచరుల యొక్క బాధ్యతలు మరియు ఆశీర్వాదములను గూర్చి అర్థము చేసుకొనుటలో సహాయపడుతుంది. ఈ పాఠంలో, యేసు యొక్క యాజక స్థానము మీద దృష్టిపెడదాము. యాజకుని మనము ఈ విధంగా నిర్వచిద్దాము:

ఆయన ఆశీర్వాదములను వారికి అనుగ్రహించుటకు తన విశేషమైన పరిశుద్ధ స్థానములోనికి దేవుడు వారిని ఆహ్వానించునట్లు దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య మధ్యవర్తిగా ఉండు వ్యక్తి.

దేవుడు అన్నివేళల అన్ని చోట్ల అదృశ్య రూపములో ఉన్నాడు అని మనందరికీ తెలుసు. కాని కొన్ని స్థలములలో మరియు సమయాలలో, ఆయన విశేషమైన దృశ్యమైన రీతులలో కూడా తనను తాను బయలుపరచుకుంటాడు. ఉదాహరణకు, ఆయన దీనిని తన పరలోక సింహాసనపు గది యొక్క ప్రకాశమానమైన వైభవములో కనుపరచుకుంటాడు. మరియు ఆయన కొన్నిసార్లు దీనిని భూమి మీద కూడా చేస్తాడు. మరియు ఇట్టి దేవుని ప్రత్యక్షతలను జీవులు సమీపించిన ప్రతిసారి, దేవుని ఆమోదమును మరియు ఆశీర్వాదములను పొందుకొనుటకు సరిగా సిద్ధపడి, ప్రాతినిధ్యం వహించి నాయకత్వం వహించాలి. బైబిలులో, ఈ విధమైన సిద్ధపాటు, ప్రాతినిధ్యం మరియు నాయకత్వం యాజకులకు ఇవ్వబడింది.

యేసు యొక్క ప్రవక్త స్థానమును ప్రస్తావించిన మన పాఠం వలెనె, యేసు యొక్క యాజక స్థానమును గూర్చిన ఈ పాఠంలో కూడా మూడు ముఖ్య బిందువులు ఉన్నాయి. మొదటిగా, ఆయన యాజక స్థానమునకు పాత నిబంధన నేపథ్యమును పరీక్షిద్దాము. రెండవదిగా, యేసు యొక్క వ్యక్తిత్వము మరియు కార్యములో ఈ స్థానము యొక్క నెరవేర్పును చూద్దాము. మరియు మూడవదిగా, యేసు యొక్క యాజక కార్యమునకు ఆధునిక అనువర్తనను చూద్దాము. మొదటిగా యేసు యొక్క యాజక స్థానమునకు పాత నిబంధన నేపథ్యమును చూద్దాము.

పాత నిబంధనలోని యాజకత్వమును గూర్చి ఆలోచన చేసిన ప్రతిసారి, చాలా మంది క్రైస్తవుల దృష్టి మనము లేవీ. 8-9లో చదువునట్లు మోషే కాలములో యాజకులుగా అభిషేకించబడిన అహరోను మరియు అతని వారసుల మీదికి వెళ్తుంది.

అయితే మోషే దినములకు ముందు కూడా, దేవుని సేవించిన యాజకులు ఉండిరి అని మనము గుర్తించుట చాలా అవసరము. విశాల దృక్పథములో, పాపములోనికి పడుటకు ముందే దేవుడు మానవ జాతి యొక్క పితామహుడైన ఆదామును యాజకునిగా నియమించాడు. మరియు ఆదాము తరువాత, సాధారణ భావనలో మానవాళి అంతా వాస్తవానికి దేవుని యాజకులుగా ఉండుటకు పిలువబడ్డారు.

సాంకేతిక భావనలో, ఆదికాండము 14లో ప్రస్తావించబడిన, అబ్రాహాము కాలములోని మెల్కీసెదెకును మనము చూస్తాము. ఆయన షాలేము దేశమునకు రాజు మరియు యాజకుడు కూడా. యోబు స్వయంగా తన కుటుంబమునకు యాజకునిగా వ్యవహరించేవాడని యోబు 1 సూచిస్తుంది. మరియు నిర్గమ. 3 ప్రకారం, మోషే మామయైన యిత్రో మిద్యాను దేశములో దేవుని యాజకుడైయుండెను.

చివరికి, దేవుడు అధికారికమైన ప్రత్యేకమైన యాజకత్వ స్థానమును స్థాపించాడు మరియు దానిలో అహరోను అతని వారసులు ఇతర విధముల యాజకత్వములన్నిటిని ప్రత్యామ్నాయపరచారు. అయితే వీరందరు కూడా దేవుని యొక్క నిజమైన యాజకులైయుండిరి. మరియు ప్రతి ఒక్కరు యేసు యొక్క యాజకత్వమునకు పాత నిబంధన నేపథ్యముగా ఉన్నారు.

యాజకత్వ స్థానము యొక్క పాత నిబంధన నేపథ్యమును మనము మూడు మార్గములలో చూద్దాము. మొదటిగా, యాజకుల యొక్క అర్హతలను చూద్దాము. రెండవదిగా, వారి కార్యములను మనము పరిగణిద్దాము. మరియు మూడవదిగా, యాజకత్వ పరిచర్య యొక్క భవిష్యత్తు కొరకు పాత నిబంధన సృష్టించిన ఆకాంక్షలను మనము అన్వేషిద్దాము. పాత నిబంధనలో యాజకులకు ఉండవలసిన అర్హతలను మొదటిగా చూద్దాము.

పురాతన యాజకులు అనేక అర్హతలను కలిగియుండవలసియుండేది, కాని లేఖనము ఉద్ఘాటించు రెండింటిని మాత్రమే మనము ప్రస్తావిద్దాము. మొదటిగా, యాజకులు దేవుని ద్వారా నియమించబడ్డారు అని చూద్దాము. రెండవదిగా, దేవునికి స్వామిభక్తి చూపవలసిన బాధ్యత వారి మీద ఉండెనను విషయమును ఉద్ఘాటిద్దాము. తమ స్థానములో దేవుని సేవించుటకు యాజకులు దేవుని ద్వారా నియమించబడ్డారను సత్యమును చూస్తూ ఆరంభిద్దాము.

పాత నిబంధనలో, యాజకుని నియమించే అధికారం దేవునికి మాత్రమే ఉండేది. యాజకులు ఎన్నడు కూడా స్వయం-నియుక్తులు కారు. వారి స్థానమునకు ఎన్నికలు జరిగేవి కావు. రాజులు లేక ఇతర నాయకులకు వారిని నియమించే అధికారం ఉండేది కాదు. మరియు తమ స్థానములలో సేవించుటకు స్వయంగా యాజకులు కూడా ఇతరులను ఎన్నుకునే అవకాశం ఉండేదికాదు. నిర్గమ. 28:1 వినండి, అక్కడ దేవుడు మోషేకు ఈ ఆజ్ఞను ఇస్తున్నాడు:

మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను... నీ యొద్దకు పిలిపింపుము (నిర్గమ 28:1).

దేవుని యొక్క నియామకము ప్రధాన యాజకునిగా అహరోను అభిషేకించబడుటలో ఒక అతి ప్రాముఖ్యమైన భాగమని నిర్గమ. 28లో తరువాత ఇవ్వబడిన విస్తారమైన వివరణ సూచిస్తుంది. ఇతర గోత్రమునకు చెందిన ఇశ్రాయేలీయుడు యాజక స్థానమును తీసుకుంటే, అతడు చంపబడాలని సంఖ్యా. 18:22-23 తెలియజేస్తుంది. హెబ్రీ. 5:1, 4 ఈ మాటలతో ఈ ఆలోచనను నిర్థారిస్తుంది:

ప్రతి ప్రధానయాజకుడును మనుష్యులలోనుండి యేర్పరచబడినవాడై, ... దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యులనిమిత్తము నియమింపబడును. మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును (హెబ్రీ. 5:1, 4).

ఇదే నియమము ప్రధాన యాజకునికి మాత్రమేగాక, పాత నిబంధనలోని యాజకులందరికీ వర్తించింది.

దేవుని ద్వారా నియమింపబడుటతో పాటుగా, యాజక స్థానమునకు అర్హులగుటకు యాజకులు దేవునికి స్వామిభక్తి కూడా కనుపరచవలసియుండినది.

యాజకులు మందిరము మరియు దేవాలయములో దేవుని యొక్క ప్రత్యేకించబడిన సన్నిధిలో సేవించేవారు కాబట్టి, ఆయనను మాత్రమే సేవిస్తూ మరియు ఆయనను మాత్రమే ఆరాధిస్తూ వారు దేవుని పట్ల ఒక విశేషమైన స్వామిభక్తిని కనుపరచవలసియుండినది, మరియు తమ బాధ్యతలను శ్రద్ధగా నెరవేర్చవలసియుండినది. ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి ప్రవేశించునట్లు దేవుని ప్రజలు దేవునికి స్వామిభక్తి కలిగియుండునట్లు చూచుకొనుటకు కూడా వారు దీనిని చేయవలసియుండినది.

వారు పాటించవలసిన కొన్ని నియమములు ఉండేవని, బలి కొరకు అగ్నిని కూడా వారు ఒక విశేషమైన రీతిలో అర్పించవలసియుండేదని, బలి కొరకు తేబడిన జంతువులు నిష్కళంకమైనవని నిర్థారించుటకు వాటిని ఒక విశేషమైన రీతిలో పరీక్షించవలసియుండేదని పాత నిబంధన యాజకుల నుండి మనము నేర్చుకుంటాము. దేవుడు వారి నుండి దీనిని ఆశించాడు. అలాగే యాజకుడు ధరించుకొనుటకు ప్రత్యేకమైన వస్త్రములు ఉండేవి, అతడు ఒక విశేషమైన శుద్ధీకరణ ప్రక్రియను అనుసరించవలసియుండేది, మందిరము మరియు మందిరములోని వస్తువులతో సహా సమస్తము “పరలోక మందిరము”ను — అనగా స్వయంగా దేవుని సన్నిధిని — పోలియున్నాయి కాబట్టి అవి ఇవ్వబడినవని హెబ్రీ పత్రిక ఉద్ఘాటిస్తుంది. కాబట్టి, యాజకులు ప్రభువైన యేసు క్రీస్తుకు ప్రతినిధులుగా ఉన్నారు. క్షమించబడుటకు దేవునికి అర్పించవలసిన పరిశుద్ధతా మరియు సంతృప్తికి యాజకులు ప్రాతినిధ్యం వహించారు. కాబట్టి, యాజక అమరికలలో, యాజక నియమాలలో ఇవ్వబడిన ప్రతిది క్రీస్తు యొక్క పూర్ణతను చూపుటకు మరియు ఆయన నిజముగా ప్రజల యొక్క పాపమును మోస్తాడని తెలియజేయుటకు ఇవ్వబడినవి. వారు ధరించిన వస్త్రములు మరియు గోత్రముల పేర్లు ఆ వస్త్రముల మీద వ్రాయబడియుండుట మరియు బలుల యొక్క పూర్ణత, ఇవన్నీ కూడా దేవుడు దీనిని ఎంత తీవ్రముగా పరిగణించుచున్నాడో, ఆయన ఎంత పరిశుద్ధుడో చూపుటకు ఇవ్వబడినవి, మరియు ముగింపులో రక్షణ కొరకు ఏకైక మార్గము మాత్రమే ఉండబోతుంది. ఒకవేళ ఆ ఏకైక మార్గమును అనుసరించుటలో మనము రాజీపడితే, మనము తప్పిపోతాము మరియు సంతృప్తి కలుగదు. కాబట్టి, మన మనస్సులలో దేవుని పరిశుద్ధత మరియు నీతి, మరియు క్రీస్తు అర్పణలోని ఐక్యత యొక్క తీవ్రతను స్థాపించుకొనుటకు యాజక నియమములు ఎంతో అవసరమైయున్నవి.

— డా. థామస్ నెట్టెల్స్

యాజకులు పరిశుద్ధలైయుండవలసిన అవసరతకు ఉత్తమమైన ఉదాహరణ లేవీ. 10:1-2లో ఉంది. అక్కడ, తాము అర్పించిన అపవిత్రమైన అర్పణ వలన దేవుడు నాదాబు అబీహులను చంపాడు. మరియు 1 సమూ. 4లో, హోఫ్నీ ఫీనెహాసులు దేవునికి భయపడనందున హతమార్చబడ్డారు,

ఈ ఉదాహరణలతో పాటుగా, ఆయన ఆశీర్వాదములను పొందుకొను నిమిత్తము ఆయన విశేషమైన సన్నిధిలోనికి ఆయన ప్రజలను నడిపించుటకు మరియు సిద్ధపడుటకు ఆశగల యాజకులు స్వయంగా దేవునికి నమ్మకస్తులైయుండాలని కీర్తనలు 132:9 మరియు విలాప. 4:11, 13 వంటి లేఖన భాగములు స్పష్టము చేస్తాయి. లేకపోతే, దేవునికి దగ్గరగా వెళ్లుట ద్వారా తీవ్రమైన తీర్పును ఎదుర్కొనవలసి వస్తుంది.

పాత నిబంధనలో యాజకుల యొక్క అర్హతలను చూశాము కాబట్టి, వారి కార్యములను ఇప్పుడు చూద్దాము.

యాజకుల యొక్క కార్యములలో మూడు అంశములను మనము చూద్దాము. మొదటిగా, వారు అందించిన నాయకత్వమును మనము చూద్దాము. రెండవదిగా, వారు నిర్వహించిన ఆచారములను మనము చూద్దాము. మరియు మూడవదిగా, ఇతరుల కొరకు వారు చేసిన విజ్ఞాపనను చూద్దాము. యాజకులు అందించిన నాయకత్వముతో ఆరంభించుదాము.

పాత నిబంధన యాజకులు దేవుని ప్రజలకు అనేక విధాలుగా నాయకత్వం వహించారు. కాని మన ఉద్దేశముల కొరకు వీటిని మనము మూడు ముఖ్య బిందువులలో క్రోడీకరిద్దాము. మొదటిగా, యాజకులు అత్యంత ప్రాముఖ్యముగా ఆరాధనలో నాయకత్వము అందించారు.

దేవుని ప్రజలను ఆయన పరిశుద్ధమైన సన్నిధిలోనికి నడిపించుటలో మరియు సిద్ధపరచుటలో ఆరాధన ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఇశ్రాయేలులో, ఇశ్రాయేలు యొక్క వార్షిక పండుగల వంటి జాతీయ ఆరాధనా సన్నివేశములలో యాజకులు మరియు లేవీయులు నాయకత్వం వహించారు. వారు అనుదినము మందిరములోను మరియు దేవాలయములోను ఆరాధనా కార్యక్రమాలను నడిపించారు, మరియు వారం వారం విశ్రాంతి దినమున ప్రత్యేకమైన కూడికలను నిర్వహించేవారు. మరియు వారు ప్రజలను స్తుతి ఆరాధనలో నడిపించేవారు. 1 దిన. 15; 2 దిన. 7, 8, 29 మరియు 30; మరియు నెహెమ్యా 12 వంటి చోట్ల ఈ వివరాలను మనము చూస్తాము.

రెండవదిగా, పౌర మరియు ఆచార తీర్పుల రూపములో యాజకులు విశేషమైన మార్గదర్శకత్వమును అందించారు. వారు ఎదుర్కొన్న పరిస్థితులకు దేవుని ధర్మశాస్త్రమును అన్వయిస్తూ వారు దీనిని చేశారు. నిర్గమ. 28:29-30, సంఖ్యా. 21:27, ద్వితీ. 21:5 మరియు యెహే. 44:24 వంటి అనేక చోట్ల ఈ సత్యము ప్రస్తావించబడింది.

ఉదాహరణకు, ద్వితీ. 17:8-9లో యాజకులు ఇవ్వగల పౌర తీర్పులను గూర్చి మోషే వివరించిన విధానమును వినండి:

హత్యకు హత్యకు వ్యాజ్యెమునకు వ్యాజ్యెమునకు దెబ్బకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యముకాని యెడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్లి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు (ద్వితీ. 17:8-9).

ఈ లేఖనభాగము సూచించుచున్నట్లు, చట్టపరమైన విషయములు స్థానిక న్యాయస్థానాలలో కుదర్చబడేవి. అయితే కఠినమైన కేసులలో, తీర్పును పొందుటకు ప్రజలు యాజకుల యొద్దకు లేక ప్రత్యేకమైన న్యాయాధిపతుల యొద్దకు వెళ్లుటకు అవకాశం ఉండేది. వాస్తవానికి, ఇశ్రాయేలులో న్యాయాలయములను మరియు న్యాయాధిపతులను ఎలా స్థాపించాలో మిద్యానీయ యాజకుడైన యిత్రో మోషేకు స్వయంగా తెలిపాడు. యిత్రో యొక్క యాజకత్వము అట్టి విషయములకు ఆయనను అధికారిగా చేసింది.

యాజక నిర్ణయాలు మరియు మార్గదర్శకములో ఆరోగ్యము మరియు పరిశుద్ధతకు సంబంధించిన విషయముల యొక్క విచారణ, వ్యాఖ్య మరియు తీర్పు కూడా ఇమిడియున్నాయి. యాజకులు దేవుని ధర్మశాస్త్ర ఆధారంగా ఇండ్లకు పట్టిన బూజును విచారించారు, రోగములను కనుగొన్నారు, వ్యక్తులను లేక వస్తువులను పవిత్రమైనవిగాను లేక అపవిత్రమైనవిగాను నిర్థారించారు. లేవీ. 11-15 వంటి లేఖన భాగములలో ఇట్టి యాజక బాధ్యతలు ప్రస్తావించబడినవి.

ఇవి యాజక సంబంధమైన విషయములైయున్నవి ఎందుకంటే ఆదాము చేసిన పాపమునకు దేవుని శాపముగా లోకములోనికి వ్యక్తిగత మరియు బహిరంగ ఆరోగ్య సమస్యలు ప్రవేశించాయి, ఇందుమూలమునే ఏదెను తోటలో ప్రత్యేకమైన దేవుని సన్నిధి నుండి ఆదాము దూరము చేయబడ్డాడు. మరణమను సార్వత్రిక శాపము ఆది. 3:19లో స్థాపించబడింది. మరియు ఈ సామాన్య తీర్పుతో పాటు ఆరోగ్యమునకు సంబంధించిన ఇతర తీర్పులు కూడా చేర్చబడ్డాయి, దీనిని మనము లేవీ. 26:16 మరియు ద్వితీ. 28:21-28 వంటి వాక్య భాగములలో చూస్తాము. ఈ కారణం చేత, ఆశీర్వాదముల కొరకు దేవుని యొద్దకు ప్రవేశించుటకు ముందు సిద్ధపాటులో ఆరోగ్య విషయములు ప్రాముఖ్యమైన పాత్రను పోషించాయి.

ప్రజలకు దేవుని వాక్యమును బోధించుట ద్వారా యాజకులు మూడవ విధముగా నాయకత్వమును కనుపరచారు, దీనిని మనము 2 దిన. 35:3, నెహెమ్యా 8 మరియు మలాకీ 2 వంటి చోట్ల చదువుతాము.

ఒక ఉదాహరణగా, మలాకీ 2:7లో ప్రభువు యొక్క మాటలను వినండి:

యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారినోట ధర్మశాస్త్రవిధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమునుబట్టి బోధింపవలెను (మలాకీ 2:7).

అబద్ధ బోధలు లోకములో పాపమునకు పరిణామముగా ఉన్నాయి, మరియు దేవుని వాక్యమును ఉల్లంఘించుట ప్రజలను ఆయన విశేషమైన సన్నిధికి వెళ్లుటకు అనర్హులను చేసింది. కాబట్టి, ఆశీర్వాదమును తెచ్చు విధముగా దేవుని ప్రజలను ఆయన విశేషమైన సన్నిధిలోనికి నడిపించుటకు మరియు సిద్ధపరచుటకు దేవుని వాక్యమును బోధించు బాధ్యత యాజకులకు ఇవ్వబడింది.

యాజకులు అందించిన నాయకత్వమును చూశాము కాబట్టి, తమ ప్రజల కొరకు వారు నిర్వహించిన ఆచారములను ఇప్పుడు చూద్దాము.

పాత నిబంధన విశ్వాసుల జీవితాలలో, అనేక పండుగలు, విశ్రాంతి దినములను ఆచరించుట, వారు అర్పించిన బల్యర్పణలు ప్రాముఖ్యమైన పాత్రను పోషించాయి. మొదటిగా, దేవుని ప్రజలుగా వారి జీవితము వారికి దేవుడిచ్చిన బహుమానమని వారు ఇశ్రాయేలుకు జ్ఞాపకము చెయ్యాలి. ఉదాహరణకు, పస్కా పండుగ వారికి తాము ఒకప్పుడు ఐగుప్తులో బానిసలుగా ఉండిరని, మరియు దేవుడు మాత్రమే వారిని విడిపించాడని జ్ఞాపకము చేస్తుంది. అయితే వారు విమోచించబడ్డారు అని జ్ఞాపకము చేయుట మాత్రమే కాదు, కాని సీనాయి యొద్దకు తీసుకొని వెళ్లి దేవునితో ఒక నిబంధనను స్థాపించుటకు వారు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు. కాబట్టి దేవుడే దేవుడు మాత్రమే తన ప్రజలుగా ఉండుటకు వారిని పిలచాడని జ్ఞాపకము చేసుకొనుటకు, వారిని రక్షించుటకు దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుటకు ఇశ్రాయేలు యొక్క పండుగల జీవితము స్థాపించబడింది. విశ్రాంతి దినములు రెండు విషయములను జ్ఞాపకము చేయుటకు స్థాపించబడినవి, లోకము యెహోవాది మరియు వారు తమను తాము సృష్టించుకొనలేదు, మరియు వారు తమను తాము బానిసత్వము నుండి విమోచించుకొనలేదు. నిర్గమకాండములో, “విశ్రాంతి దినమును పాటించండి, ఎందుకంటే దేవుడు విశ్రాంతి దినమున విశ్రాంతిని తీసుకున్నాడు” అని మోషే చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండములో, దేవుడు విశ్రాంతి దినమున విశ్రాంతిని ఆచరించాడు అని మాత్రమేగాక, ఒకప్పుడు మీరు ఐగుప్తులో బానిసలైయుండిరి అను విషయమును జ్ఞాపకము చేసుకొనుటకు కూడా విశ్రాంతి దినమును ఆచరించమని మోషే చెబుతున్నాడు. కాబట్టి, ఈ పండుగలన్నీ వారిని విమోచించుటకు దేవుడు ఏమి చేశాడో జ్ఞాపకము చేయుటకు, మరియు వారి పట్ల దేవుడు చూపిన కృపగల మంచితనము ద్వారా వారు మాత్రమే దేవుని ప్రజలని జ్ఞాపకము చేయుటకు నియమించబడినవి, మరియు ఆ ఆచారములలో నుండి వారి జీవితములు రూపుదిద్దబడినవి, తద్వారా వారు విధేయత, నమ్మకము, ప్రేమ మరియు సేవ కలిగిన జీవితాలతో దేవునికి నమ్మకముగా స్పందించుట ఆరంభిస్తారు.

— డా. స్టీవ్ బ్లేక్ మోర్

మోషే దినములలో, తరువాత దావీదు దినములలో, దేవుని విశేషమైన సన్నిధిలోనికి ప్రవేశించుటకు దేవుని ప్రజలను సిద్ధపరచుటకు యాజకులు అనేక రకముల ఆచారములను నిర్వహించేవారు. ఈ ఆచారములలో పవిత్రమైన దినములు, సన్నివేశములు మరియు వస్తువులు ఇమిడియుండేవి, వీటిని మనము లేవీ. 1–7 మరియు 23; సంఖ్యా. 18–19; 1 దిన. 23; మరియు 2 దిన. 8 వంటి చోట్ల చూస్తాము.

చాలాసార్లు, ఈ ఆచారములు పవిత్రమైన స్థలముల — దేవుని విశేష సన్నిధి కనిపించు మరియు ఆయన ప్రజలు ఆయనను ఆరాధించు స్థలములు — మధ్య కేంద్రీకృతమైయుండేవి. ఉదాహరణకు, మందిరము మరియు దేవాలయము ఉన్న స్థలములు వీలైనంత అందముగాను పరిపూర్ణముగాను ఉండునట్లు చూచుట యాజకుల బాధ్యతయైయుండేది, తద్వారా విశేషమైన దృశ్య మహిమలో దేవుడు అక్కడ నివసించుటకు అనువుగా ఉండేది. లేవీ. 24:1-9; సంఖ్యా. 3–4; మరియు 1 దిన. 24:25-32 వంటి లేఖన భాగములలో దీనిని గూర్చి మనము చదువుతాము.

అయితే యాజకుల సేవలో సుప్రసిద్ధమైన ఆచారము అర్పణలను అర్పించుట. ఈ అర్పణలలో కృతజ్ఞత వ్యక్తీకరణలు, సహవాస వ్యక్తీకరణలు, పాప ప్రాయశ్చిత్త అర్పణలు ఉండేవి. వీటిలో కొన్ని తరచుగా క్రమ కాలములలో అర్పించబడేవి, అనుదిన ఉదయకాల మరియు సాయంకాల అర్పణలు, మరియు వార్షిక ప్రాయశ్చిత్త దినము వంటివి. ఇంకా కొన్ని కొన్ని విశేషమైన సందర్భాలలో అర్పించబడేవి, పాపము రుజువు చేయబడినప్పుడు వంటివి. మరికొన్ని అర్పణలు ఆరాధికుని ఇష్టమునకు అనుగుణంగా అర్పించబడేవి, స్వేచ్చార్పణలు వంటివి. లేవీయకాండము 1-7 మరియు 16 వంటి చోట్ల అనేక రకముల సూచిత అర్పణలు సంగ్రహించబడినవి.

యాజకులు నిర్వహించు ఆచార కార్యములన్నిటిలో, అర్పణలు అర్పించుట — ముఖ్యముగా ప్రాయశ్చిత్త అర్పణలు — యేసు యొక్క సొంత పరిచర్యలో కూడా అత్యంత ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. కాబట్టి మన దృష్టిని ముఖ్యముగా వాటి మీద కేంద్రీకరిద్దాము.

నేడు మనము, ఒక మరింత విలువైన దానిని పొందుకొనుటకు విలువైన దానిని వదిలిపెట్టుటను అర్పణ అని పిలుస్తాము. ఒక బహుమానమునకు అత్యంత విలువైన వెలను చెల్లించవలసివచ్చినప్పుడు ఒక బహుమానము అర్పణ అవుతుంది. పాత నిబంధనలో, దేవునికి అవసరము కాబట్టి ప్రజలు ఆయనకు అర్పణలు అర్పించలేదు. అత్యంత విలువైన దానిని — పాపముల క్షమాపణ వంటివి — పొందుకొనుట కొరకు దేవుని ప్రజలు తమకు విలువైనదానిని ఇచ్చుటకు అర్పణలు అనుమతించాయి.

విశ్వాసులు దేవుని ఆరాధించుటకు, ఆయనకు విధేయతను చూపుటకు, మరియు ఆయన ఇచ్చిన బహుమానముల కొరకు కృతజ్ఞతలను తెలుపుటకు కూడా అర్పణలు అనుమతించాయి. అవును, అర్పణలు ఎల్లప్పుడూ విశ్వాసము యొక్క వ్యక్తీకరణముగా ఉండినవి, కాని వాటిని సరైన ఉద్దేశములతో అర్పించవలసియుండెను. యథార్థ హృదయముతో అర్పించని అర్పణలను దేవుడు తిరస్కరించాడు కూడా. అర్పణల యొక్క దక్షత ఎల్లప్పుడూ దేవునికి అర్పణను అర్పించినవాని యొక్క యథార్థత మీద ఆధారపడియుండినది.

మోషే ద్వారా విస్తారమైన ఆచరణ నియమాలు ఇవ్వబడక ముందు కూడా ప్రాయశ్చిత్త అర్పణలు యాజక పరిచర్యలో ప్రాముఖ్యమైన భాగముగా ఉండేవి. ఉదాహరణకు, యోబు 1లో, వారు కలిసి చేయుచున్న వేడుకలలో తన పిల్లలు నిర్లక్ష్యముగా పాపము చేశారేమోనని తన పిల్లల కొరకు యోబు జంతువులను అర్పించాడు. వాస్తవానికి, మానవాళి పాపములో పడినది మొదలుకొని ప్రాయశ్చిత్త అర్పణలు అర్పించబడుచున్నవి. ఆదాము హవ్వలు మొదట పాపము చేసినప్పుడు, పాపములను క్షమించి ప్రజలను తనతో సమాధానపరచుకొనుటకు దేవుడు ప్రాయశ్చిత్త అర్పణలను నియమించాడు. లేవీ. 4-6, మరియు సంఖ్యా. 15:25-28 వంటి చోట్ల ఇలాంటి అర్పణ వర్ణించబడింది.

ఈ ప్రాయశ్చిత్తము వెనుక ఉన్న సామాన్య ఆలోచన చాలా సూటిగా ఉన్నది: మన పాపముల నిమిత్తము, మానవాళి అంతా శిక్షింపదగినదిగా ఉన్నది. కాబట్టి, ఈ న్యాయపూరితమైన శిక్షను నిరోధించుటకు, తమ తరుపున దేవుడిచ్చు శిక్షను స్వీకరించుటకు ఆరాధికులు అర్పణలు అర్పించేవారు. వేదాంతవేత్తలు దీనిని తరచుగా “ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తము” అని పిలుస్తారు ఎందుకంటే ఈ అర్పణ ప్రాయశ్చిత్త ఆచారములో పాలుపంచుకొను ఆరాధికునికి ప్రత్యామ్నాయముగా ఉన్నది.

పాత నిబంధనలోని సందర్భములన్నిటిలో, ప్రాయశ్చిత్త అర్పణలు చిహ్నాత్మకముగా ఉండేవి. ప్రాయశ్చిత్త బలుల ద్వారా దేవుడు క్షమాపణను తన ప్రజలకు అనువర్తించాడు, కాని అర్పణ యొక్క విలువ లేక గొప్పదనము ఆధారముగా కాదు. బదులుగా, పాత నిబంధన అర్పణలు క్రొత్త నిబంధనలో యేసు అర్పించిన బలి యొక్క విలువను మరియు గొప్పదనమును ప్రస్తావించాయి కాబట్టే అవి ప్రభావవంతముగా ఉన్నవి.

పాత నిబంధన అర్పణల ఆధారంగా ప్రజలు ఎన్నడు కూడా తమ పాపముల నుండి శాశ్వత క్షమాపణను పొందలేదు అని క్రొత్త నిబంధన వివరిస్తుంది. పాపపరిహారార్థ బలులు దేవుని తీర్పును ఆలస్యం చేశాయి అంతే, మరియు వాటిని మరలా మరలా నూతనపరచవలసివచ్చేది. పాపముల కొరకు సంపూర్ణమైన, శాశ్వతమైన వెలగా సిలువ మీద క్రీస్తు మరణము మాత్రమే ఏకైక అర్పణగా ఉన్నది. క్రీస్తు మరణములోని లాభములను పాత నిబంధన విశ్వాసులకు అనువర్తించుట కొరకు పాత నిబంధన బలుల వ్యవస్థను దేవుడు ఒక సాధనముగా అందించాడు.

నమ్మకమైన విశ్వాసుల కొరకు ప్రాయశ్చిత్త అర్పణలను అర్పించినప్పుడు, అవి కనీసం రెండు ప్రాముఖ్యమైన ఫలితాలను ఇచ్చాయి, మరియు రెండు భవిష్యత్తులో క్రీస్తు అర్పించు అర్పణ యొక్క ప్రభావము మీద ఆధారపడినవి. మనము ప్రస్తావించబోవు మొదటి ఫలితము ప్రాయశ్చిత్తము.

ప్రాయశ్చిత్తము ఆరాధికుని మీద అర్పణ యొక్క ప్రభావమును సూచిస్తుంది. ఇది ఆరాధికుల మీద నుండి పాప అపరాధమును తీసివేయుటకు సంబంధించినది. దేవుడు వారి మీద మోపవలసిన ఉగ్రత నుండి ఇది వారిని కాపాడుతుంది. ప్రాయశ్చిత్తము ద్వారా, ఆరాధికుని పాపము యొక్క శిక్ష ప్రత్యామ్నాయము మీద ఉంచబడుతుంది, తద్వారా వారు దేవుని యొక్క తీర్పు నుండి భద్రపరచబడతారు.

పాపము “కప్పబడెను” లేక “మరుగుచేయబడెను” అని ప్రస్తావించబడిన చోట్ల ప్రాయశ్చిత్తము ప్రస్తావించబడింది, దీనిని మనము యోబు 14:17, మరియు కీర్తనలు 32:1, 5 వంటి చోట్ల చూస్తాము. పాపము లేక అపరాధము “తొలగించబడింది” అని చెప్పబడిన లేవీ. 10:17, కీర్తనలు 25:18 వంటి వాక్యభాగములలో కూడా ఇది కనిపిస్తుంది, మరియు పాపము ప్రత్యామ్నాయము మీదికి “బదిలీ చేయబడింది” అని చెప్పబడిన యెషయా 53:6 వంటి చోట్ల కూడా ఇది కనిపిస్తుంది.

ప్రాయశ్చిత్త అర్పణలు విశ్వాసులకు ఇచ్చిన రెండవ ఫలితము శాంతికరము. శాంతికరము దేవుని మీద అర్పణ యొక్క ప్రభావమును సూచిస్తుంది. శాంతికరము అనగా పాపమునకు విరోధముగా దేవుని తీర్పు మరియు ఉగ్రత సంతృప్తి పొందుట అయ్యున్నది. దేవుని ఉగ్రత వ్యక్తపరచబడుటకు స్థలము దొరికింది అని మరియు ఆయన సంతృప్తి పొందాడని శాంతికరము సూచిస్తుంది. దీని మూలముగా, ఆయన న్యాయమును ప్రక్కనపెట్టకుండా దేవుడు ఆరాధికునికి దయను మరియు ప్రేమను వ్యక్తపరచగలిగాడు.

దేవుని కోపము సంతృప్తిపొందిది లేక చల్లారింది అని ప్రస్తావించు సంఖ్యా. 25:11-13 మరియు ద్వితీ. 13:16-17 వంటి వాక్యభాగములలో శాంతికరము సూచించబడింది.

పాత నిబంధన బలుల వ్యవస్థ దేవుని గూర్చిన అనేక సత్యములకు, ముఖ్యముగా కరుణకు, గొప్ప వ్యక్తీకరణగా ఉన్నది. దీనిని గూర్చి మనము చాలా సార్లు ప్రజల మీద దేవుని యొక్క అసంతృప్తిని, ఆయన ఇచ్చు శిక్షను మరియు ఆయన ఉగ్రతను జంతువుల మీద ప్రత్యామ్నాయపరచు దైవకృతము దృష్ట్యా ఆలోచన చేస్తాము. అయితే దీని వెనుక ఉన్న పురికొల్పు అంతా ఆయన ప్రేమ, ఆయన కరుణ — కరుణ అనగా ఆయన మనపైన చూపు జాలి — మరియు మనము యోగ్యులము కానిదానిని ఇచ్చు ఆయన కృపతో కూడా ముడిపడియున్నదని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకము చేసుకోవాలి. లేవీ. 17:11 ఇక్కడ చాలా ప్రాముఖ్యమైయున్నది, ఇక్కడ దేవుని తమ వైపున ఉంచుకొనుటకు ఇశ్రాయేలీయులు బలుల వ్యవస్థను స్థాపించారు అను విధంగా ఈ వ్యవస్థను మనము చూడకూడదు. కాదు, ఇక్కడ దేవుడు కార్యమును తన ప్రేమలో ఆరంభిస్తున్నాడు, తద్వారా ఆయన దేశములో నివసించుటకు ఒక మాధ్యమము ఏర్పడుతుంది. వారు ఆయన సన్నిధిలో నివసించగలుగుతారు. వారు ఆయన ప్రజలైయుంటారు; ఆయన వారి దేవుడైయుంటాడు. ఇదంతా ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన కృపకు ప్రదర్శనగా ఉంటుంది. మరియు ఇదంతా తుదకు దీనంతటికి నెరవేర్పుగా ఉన్న యేసు క్రీస్తు అను దైవకృతము వైపునకు చూపుతుంది. తద్వారా రూపకములుగా ఇవ్వబడిన ఈ అర్పణలు ఆయనలో నెరవేరాయి కాబట్టి ఇప్పుడు మనము దేవుని ఒక నూతన నిబంధనా భావనలో తెలుసుకున్నాము. ఇప్పుడు మన గొప్ప అర్పణయైన మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఆయన యొద్దకు మనము సూటిగా సమీపించు అవకాశం దొరికింది.

— డా. స్టీఫెన్ వెల్లమ్

సరే, పాత నిబంధన బలుల వ్యవస్థ దీనిని అనేక విధాలుగా సూచించింది, అది దేవుని కరుణను కనుపరచింది, కాని ఒక విశేషమైన విధానములో ప్రాయశ్చిత్త దినమున చేసింది, అక్కడ మందిరము లేక దేవాలయము ఉంది, దానిలోని లోపలి భాగము అతి పరిశుద్ధ స్థలము, మరియు దానిలో నిబంధనా మందసము ఉంది, దానిలో పది ఆజ్ఞలు ఉన్నవి, మరియు ఆ డబ్బా యొక్క పైభాగమును కరుణా పీఠము అనేవారు. మరియు ప్రాయశ్చిత్త దినమున, ప్రధాన యాజకుడు గొర్రెపిల్లను దేవాలయము లేక మందిరము యొక్క వెలుపల ఉన్న బలిపీఠము మీద అర్పించి గొర్రెపిల్ల రక్తమును తీసుకొని, అతి పరిశుద్ధమైన స్థలములోనికి తెరలో నుండి వచ్చి ఆ రక్తమును ఆ డబ్బా మీద చిలకరించేవాడు. ఉల్లంఘించబడిన నియమమును గొర్రెపిల్ల రక్తముతో కప్పినప్పుడు దేవుడు కరుణను చూపుతాడు అనేది ఇక్కడ ఆలోచన. అవును, అది మన ధర్మశాస్త్ర ఉల్లంఘనను కప్పు నిజమైన గొర్రెపిల్లయైన యేసు క్రీస్తు అను సత్యము వైపుకు చూపుతుంది. కాని, గమనించండి, మన ధర్మశాస్త్ర ఉల్లంఘనను కప్పిన ఆ రక్తము మీద దేవుని కరుణ కనబడుతుంది.

— డా. ఫ్రాంక్ బార్కర్

యాజక నాయకత్వము మరియు అర్పణలను గూర్చిన ఈ అవగాహనను మనస్సులో ఉంచుకొని, వారు ప్రాతినిధ్యం వహించిన ప్రజల కొరకు వారు చేసిన విజ్ఞాపన కార్యమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.

విజ్ఞాపనను మనము మధ్యవర్తిత్వం అని నిర్వచించవచ్చు; లేక మరొకరి కొరకు అర్జీ చేయుట అని చెప్పవచ్చు. ఒక విజ్ఞాపకుడు మీరు సమస్యలో ఉనప్పుడు మీ వైపున ఉండి మీ తరుపున వాదిస్తాడు, లేక మీకు మరొకరికి మధ్య ఉన్న విభేదములను సమాధానపరచుటకు ప్రయత్నిస్తాడు.

పాత నిబంధన ప్రవక్తలు తమ నాయకత్వము మరియు మార్గదర్శకత్వము ద్వారా, మరియు దేవుడు వారికి పురమాయించిన ఆచారముల ద్వారా మధ్యవర్తిత్వం చేసేవారు. ఉదాహరణకు, చట్టపరమైన విభేదములలో వారు సదరు వ్యక్తుల మధ్య, మరియు ప్రాయశ్చిత్త అర్పణలు అర్పించినప్పుడు ప్రజలకు దేవునికి మధ్య మధ్యవర్తిత్వం చేసేవారు. అయితే యాజకులు ఇతర రకముల విజ్ఞాపన కూడా చేసేవారు.

సహాయం కొరకు అర్జీ ఒక సాధారణమైన విజ్ఞాపనా రకము. తన ప్రజలను స్వస్థపరచమని, విమోచించమని లేక వారికి సహాయము చేయమని యాజకులు తరచుగా ప్రార్థించేవారు. దీనికి ఉదాహరణలను మనము 1 సమూ. 1:17 మరియు 1 దిన. 16:4లో చూస్తాము. ఒక ఉదాహరణగా, తన ప్రజల కొరకు యోబు చేసిన విజ్ఞాపనను యోబు 1:5లో చూడండి:

వారి వారి విందుదినములు పూర్తికాగా యోబు, తన కుమారులు పాపముచేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి, అరుణోదయమున లేచి వారిలో ఒక్కొకని నిమిత్తమై దహనబలి నర్పించుచు వచ్చెను (యోబు 1:5).

తన కుటుంబమునకు యాజకునిగా, వారి పాపములకు కలుగు పరిణామముల నుండి వారిని రక్షించుటకు యోబు వారి కొరకు విజ్ఞాపన చేశాడు.

ఆశీర్వాదమును పలుకుట మరొక సాధారణ విజ్ఞాపనా రకమైయున్నది. యాజకులు ప్రజలను దీవించినప్పుడు ప్రజలకు కనికరమును చూపమని దేవుని వారు కోరేవారు. ఆది. 14:19-20లో మెల్కీసెదకు అబ్రాహామును దీవించిన సందర్భములో, సంఖ్యా. 6:22-27లో ప్రజల మీద పలకమని యాజకులకు ఇవ్వబడిన ఆశీర్వాదములో దీనిని మనము చూడవచ్చు. ఉదాహరణకు, 2 దిన. 30:27లో ఉన్న ఈ కథనమును వినండి:

అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారిమాటలు వినబడెను; వారి ప్రార్థన ఆకాశముననున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను (2 దిన. 30:27).

దేవుడు వారి మనవి విన్నాడని లేఖనము చెబుతునప్పుడు, వారు దీవించిన ప్రజల పట్ల దయ చూపుట ద్వారా ఆయన యాజక విజ్ఞాపనను గౌరవించాడు అని అర్థము. యాజక పరిచర్యలోని ఈ భాగము నేటి దినమున ఆరాధనల ముగింపులో సేవకులు అర్పించు ఆశీర్వాదములో ప్రతిబింబించబడుతుంది. అనేక సంఘములు సంఖ్యా. 6లో అహరోనుకు మొదట ఇవ్వబడిన ఆశీర్వాదమునే పునరావృతం చేస్తారు.

మనము చూసినట్లుగా, యాజకుల యొక్క కార్యములు విభిన్నమైనవిగా ఉన్నాయి. వారు నాయకత్వమును అందించారు, ఆచారములను నిర్వహించారు, మరియు విజ్ఞాపనలను చేశారు. ఈ కార్యములు ఎంత భిన్నముగా కనిపించినా, వారు తమ నిత్య ఉద్దేశము ద్వారా ఐక్యపరచబడ్డారు. నిబంధనా ఆశీర్వాదములన్నిటిని వారు పొందుకొనుటకుగాను దేవుని ప్రజలను దేవుని సన్నిధిలో నివసించుటకు యోగ్యులుగా చేయుటకు వారంతా రూపించబడ్డారు.

ఇప్పటి వరకు మనము ప్రవక్త స్థానము యొక్క అర్హతలు మరియు కార్యములను చూశాము కాబట్టి, భవిష్యత్ ప్రవచన పరిచర్యల కొరకు పాత నిబంధన సృష్టించిన ఆకాంక్షల వైపుకు మన దృష్టిని మళ్లించుదాము.

పాత నిబంధన దినములలో, యాజక స్థానము క్రియాశీలకముగాను మారుచున్నదిగాను ఉండేది. దానికి ఆపాదించబడిన బాధ్యతలు మరియు పనులు కాలక్రమములో మారుతుండేవి. మెల్కీసెదకు యొక్క యాజకత్వము ఖచ్చితముగా యోబును పోలినదిగా లేదు. యోబు యాజకత్వము యిత్రో కంటే భిన్నముగా ఉంది. యిత్రో యాజకత్వము అహరోను మరియు అతని వారసుల కంటే భిన్నముగా ఉంది. మరియు భవిష్యత్తులో సంభవించు మరిన్ని మార్పులను గూర్చి పాత నిబంధన ప్రస్తావించింది.

భవిష్యత్తు కొరకు పాత నిబంధన యాజకత్వములు సృష్టించిన ఆకాంక్షలను అర్థము చేసుకొనుటకు, మనము రెండు దిశలలో చూద్దాము. మొదటిగా, పాత నిబంధన అంతటా ఈ స్థానము యొక్క చారిత్రిక అభివృద్ధిని పరీక్షిద్దాము. మరియు రెండవదిగా, యాజక స్థానమును గూర్చి ఇవ్వబడిన కొన్ని విశేషమైన ప్రవచనముల మీద దృష్టి పెడదాము. యాజక స్థానము యొక్క చారిత్రిక అభివృద్ధితో ఆరంభించుదాము.

దేవుని యొక్క విశేషమైన, పరిశుద్ధమైన సన్నిధికి వెళ్లవలసిన అవసరత మానవులకు ఎల్లప్పుడూ ఉండినది కాబట్టి, యాజకుల కార్యముల యొక్క అవసరత ఎల్లప్పుడూ ఉండినది. వాస్తవానికి, మానవాళి మరియు సృష్టి కొరకు దేవుడు కలిగియుండిన దీర్ఘ-కాల ప్రణాళికను గూర్చి యాజకులు ఎల్లప్పుడూ విమర్శనాత్మకముగానే స్పందించారు. కాని చారిత్రికముగా, దేవుని ప్రజల యొక్క మారుతున్న పరిస్థితులకు స్పందిస్తూ యాజకుల యొక్క పాత్ర కొన్నిసార్లు మార్పుచెందినది.

చరిత్రలోని నాలుగు విభిన్న కాలములలో యాజకుల యొక్క మారుతున్న పాత్రలను మనము పరిగణిద్దాము, సృష్టి జరిగిన కాలముతో ఆరంభిద్దాము.

సృష్టి. ఇది దేవుడు ఆదాముతో నిబంధన చేసిన కాలమునకు సంబంధించినది. మానవులు ఉంచబడిన ఏదెను తోట దేవుడు నడచిన మరియు తన ప్రజలతో మాట్లాడిన ఒక పవిత్రమైన స్థలమైయుండేది. ఈ నేపథ్యములో, మందిరము మరియు దేవాలయములో అహరోను వంశపు యాజకులు సేవించిన మాదిరిగానే ఆదాము హవ్వలు దేవుని సేవించారు. ఈ కారణము చేత, యాజకత్వ స్థానము మానవాళి అంత పురాతనమైయున్నదని మనము చెప్పవచ్చు. నిర్గమ 2:15లో మోషే గ్రంథస్థం చేసిన వివరాలను వినండి:

మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను (ఆది. 2:15).

ఈ వాక్యభాగములో, తోటలో ఆదాము హవ్వల యొక్క పనిని మోషే “పని” అని అనువదించబడిన ”అవద్” మరియు “సంరక్షించు” అని అనువదించబడిన “షమార్” అను హెబ్రీ పదములను ఉపయోగిస్తూ వర్ణించాడు. సంఖ్యా 3:7-8లో, మందిరములో లేవీయుల యొక్క పనిని వర్ణించుటకు కూడా మోషే ఇదే పద సమూహమును ఉపయోగించాడు. మరియు ఆది. 3:8 మరియు 2 సమూ. 7:6 వంటి చోట్ల కూడా మనము ఇదే విధమైన మౌఖిక పోలికలను చూస్తాము.

ఏదెను వనములో మానవుల కార్యములను మరియు మందిరములో యాజకుల కార్యములను వర్ణించుటకు ఒకే భాషను ఉపయోగించుట ద్వారా, ఆదాము హవ్వలు వాస్తవిక యాజకులని, మందిరము మరియు దేవాలయము వంటి స్థలములు ఏదెను వనములో జరిగిన కార్యకలాపాలను నెరవేర్చుట కొరకు చేయబడినవని మోషే సూచించుచున్నాడు. వాస్తవానికి, మందిరము మరియు దేవాలయము యొక్క అలంకరణలు మరియు సామాన్లు ఏదెను వనమును జ్ఞాపకము చేసుకొను విధముగా రూపించబడినాయని అనేకమంది పండితులు సూచిస్తారు.

ఏది ఏమైనా, ఏదెనులో మానవుల యొక్క యాజత్వములో ఆయన వన పవిత్ర స్థలములో దేవునికి సేవ చేయుట, ఆయన పరిశుద్ధమైన వస్తువులను సంరక్షించుట, మరియు ఆయనకు నివాసయోగ్యముగా ఉండునట్లు ఆ స్థలమును చూచుకొనుట భాగముగా ఉన్నాయి. అంతేగాక, తమ పనిని లోకమంతా వ్యాపింపజేయుట ద్వారా యాజక రాజ్యము కమ్మని దేవుడు ఆదాము హవ్వలకు మరియు వారి సంతతికి ఆజ్ఞ ఇచ్చాడు.

ఆది. 1:28లో మానవాళితో దేవుడు పలికిన మాటలను వినండి:

మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి (ఆది. 1:28).

భూమిని నింపి లోపరచుకొనమని దేవుడు ఇచ్చిన ఆజ్ఞను చాలాసార్లు “సాంస్కృతిక ఆజ్ఞ” అంటారు, ఎందుకంటే లోకమంతటిని ఏదెను వనమును పోలిన విధముగా చేయుటకు దానిని సాగుచేసి అభివృద్ధి చేయు బాధ్యత మానవాళికి ఇవ్వబడింది. యాజక దృష్టికోణములో, లోకమంతటిని దేవుని పరిశుద్ధ స్థలముగా మార్చి నిత్యము దానిలో పరిచర్య చేయుట మానవాళి యొక్క బాధ్యతయైయుండెను.

దేవుడు మానవాళిని తన స్వరూపములో చేసినప్పుడు, ఏ కారణము లేకుండా ఆయన అలా చేయలేదు. ఆయన మనకు “సృష్టి యొక్క సాంస్కృతిక ఆజ్ఞ” అని చాలా సార్లు పిలువబడు దానిని ఇచ్చాడు. భూమిని లోపరచుకొనుటకు మనము కేవలం పరిపాలనతో, రాజ పాత్రతో అనుసంధానపరచు విధంగా మాత్రమే చూడక, యాజకులుగా కూడా అనుసంధానపరచుకొనుట సహాయకరముగా ఉంటుంది. పాపము లోకములోనికి ప్రవేశించకపోయినప్పటికీ, ఆది. 2లో ఏదెను ఒక దేవాలయము, వన పవిత్ర స్థలమును పోలియున్నదని చూపు చిత్రములు ఉన్నాయి, కాబట్టి సృష్టిలో ఏదెను యొక్క సరిహద్దులను భూమి యొక్క ఇతర భాగములలోనికి వ్యాపింపజేయు పాత్ర మనకు ఇవ్వబడింది. తుదకు, క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో ఇది క్రీస్తు ద్వారా కలుగుతుంది. ఈ యాజక కార్యము యొక్క కేంద్ర భాగముగా ఆరాధన కూడా ఉంది, కాబట్టి మనము చేయు ప్రతిది దేవుని మహిమ కొరకు చేయుచున్నాము, సృష్టి యొక్క ఉద్దేశమును పూర్తిచేయుచున్నాము. సేవ — మరియు ఇతర రెండు పాత్రలు యాజక కార్యములకు మరియు రాజు యొక్క కార్యములకు అనుబంధము కలిగినవిగా ఉన్నాయి. కాబట్టి, సృష్టిలో మనకు ఇవ్వబడిన సాంస్కృతిక ఆజ్ఞ సేవకులుగా ఉండుట, దేవునితో అనుబంధములో ఆయన సృష్టములుగా ఉండుట, ఆ వన పవిత్ర స్థలము యొక్క సరిహద్దులను వ్యాపింపజేయుట, ఆరాధన, భక్తి, విధేయత ద్వారా, ఆయన సృష్టిలోని నిధులన్ని అన్వేషించుట అయ్యున్నది, మరియు, అవును, దీనిని మరలా క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో కూడా మనము చేస్తాము.

— డా. స్టీఫెన్ వెల్లమ్

ఆదికాండములో సాంస్కృతిక ఆజ్ఞను గూర్చి మనము నేర్చుకుంటాము. ఇది మానవ కార్యకలాపాలలో అతి ప్రాముఖ్యమైన భాగమైయున్నది, జీవిత వరమును మనము జీవించుచుండగా మనము దేవుని దృష్టిలో ఏమైయుండాలో ఇది తెలియజేస్తుంది. అవును, మనకు ఇవ్వబడిన సాంస్కృతిక ఆజ్ఞ ఏ విధముగా కూడా సువార్త ప్రకటించు ఆజ్ఞను నిర్లక్ష్యం చేయు విధంగా నడిపిస్తుంది అని మనము ఆలోచించకూడదు. రెండు దేవుని యొద్ద నుండి వచ్చాయి, రెండు అధికారికమైనవే, రెండు ప్రాముఖ్యమైనవే. ముఖ్యముగా, సాంస్కృతిక ఆజ్ఞ ఒక గొప్ప బహుమానముగాను ధన్యతగాను ఉన్నది. దైవకృతమును అనుగ్రహించు దేవుడు ఆయన పోలికలో చేయబడిన ఆయన ప్రజలను, బాధ్యులుగా ఉండుటకు, సంరక్షించుటకు, సేవకులుగా ఉండుటకు, సృష్టి క్రమములో గొప్ప సామర్థ్యమును అభివృద్ధి చేయుటకు, దయగల దేవుని నమ్మకమైన రాయబారులుగా లేక నిర్థారించబడిన ప్రతినిధులుగా ఉండుటకు పిలచుచున్నాడు. ఈ విధంగా, సృష్టికర్త యొక్క పోలికలో సృజనాత్మక ప్రజలుగా ఉండుట మాత్రమేగాక, మనము కృపకలిగి, దాతృత్వము కలిగి సృష్టి ఆజ్ఞను నెరవేర్చుటకు ప్రజలను బాధ్యతాయుతముగా సమకూర్చు వారిగా ఉండాలి.

— డా. గ్లెన్ స్కోర్గి

యాజక స్థానములోని మొదటి మార్పులు మానవాళి పాపములో పడినప్పుడు, అనగా ఆదికాండము 3లో నిషేధించబడిన మంచి చెడ్డల జ్ఞానమునిచ్చు వృక్ష ఫలమును తినినప్పుడు కలిగాయి.

పతనము. ఈ సమయానికి, ఆదాము హవ్వలు ఏదెను తోటలో నుండి బహిష్కరించబడ్డారు మరియు తమ పాపముల ప్రాయశ్చిత్తము కొరకు అర్పణలు అర్పించుట ఆరంభించారు. దీనికి ఉదాహరణలను మనము ఆది. 3:21లోనే చూస్తాము, అక్కడ దేవుడు ఆదాము హవ్వలను జంతువుల యొక్క తోళ్ళతో కప్పాడు. దీనికి మరింత స్పష్టమైన ఉదాహరణను మనము ఆది. 4:4లో చూస్తాము, అక్కడ హేబెలు దేవునికి జంతువును బలిగా అర్పించాడు.

ఈ కాలములో మరికొన్ని ఉదాహరణలను మనము చూడవచ్చు, అవి: ఆది. 8:20లో జలప్రళయము తరువాత నోవహు అర్పించిన బలులు; ఆది. 22:13లో అబ్రాహాము పొట్టేలును బలిగా అర్పించుట; ఆది. 31:54లో యాకోబు అర్పించిన బలులు. ఈ కాలంలో, కుటుంబ యజమానులు తమ వారసులకు యాజకులుగా వ్యవహరించేవారు, మరియు ఇంత కంటే ఎక్కువగా పరిచర్య చేయుటకు కొంత మంది యాజకులు మాత్రమే పిలువబడేవారు.

ఈ కాలములో యాజక పరిచర్య యొక్క స్థలము విషయములో మార్పు జరిగింది. పతనమునకు ముందు, ఇది దేవుని యొక్క వన పవిత్ర స్థలములో మాత్రమే విశేషముగా జరిగేది. అయితే ఆదికాండము 3లో మానవాళి ఏదెను వనములో నుండి త్రోసివేయబడినప్పుడు, తనను ఆరాధించుటకు ప్రత్యేకమైన స్థలములను ఏర్పాటు చేయమని, మరియు ఆయన వారితో కలసిన స్థలములను గుర్తించుటకు జ్ఞాపక రాళ్ళను పాతమని దేవుడు యాజకులను సూచించాడు. సృష్టి కాలమునకు భిన్నముగా, చరిత్రలోని ఈ కాలములో భూమి మీద ఏ స్థలమును కూడా దేవుడు నివాసముండు స్థలమని వర్ణించలేము.

తరువాత ప్రథానమైన మార్పులు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమన దినములలో జరిగింది.

నిర్గమము. ఇశ్రాయేలు దేశము 400 సంవత్సరాల కంటే ఎక్కువ కాలము ఐగుప్తు ఫరో యొక్క బానిసత్వములో ఉండిన తరువాత, వారు దేవుని ప్రార్థించగా ఆయన బలమైన అద్భుతములను చేసి వారిని విడిపించాడు. ఈ సన్నివేశము నిర్గమకాండము అని పిలువబడు బైబిలు యొక్క రెండవ పుస్తకములో వర్ణించబడింది.

ఈ కాలములో, దేవుడు తన యాజక పిలుపును సర్వమానవాళి నుండి ఇశ్రాయేలు దేశమునకు కుదించాడు. నిర్గమ. 19:6లో ఆయన చెప్పినట్లు, ఇశ్రాయేలు ప్రజలు ఆయనకు యాజక రాజ్యముగా ఉండవలసియుండెను. ఆయన కొరకు ప్రత్యేకించబడిన జనాంగముగా ఆయన లేవీయ గోత్రమును ప్రత్యేకపరచాడు. ఈ గోత్రమువారు చాలా వరకు దేశములో యాజకులుగా పని చేసిన కొంతమంది లేవీయులకు సహాయక పాత్రలను పోషించారు. లేవీయులలో, అహరోను మరియు అతని సంతతివారు మాత్రమే యాజకులుగా నియమించబడ్డారు, మరియు ఒక సమయమందు ఒకే వ్యక్తి ప్రధాన యాజకునిగా ఉండేవాడు. అహరోను యాజకత్వము యొక్క క్రొత్త బాధ్యతలను గూర్చి లేవీయకాండమంతా, మరియు సంఖ్యాకాండములోని కొన్ని భాగములలో దేవుడు సూచనలను ఇచ్చాడు.

ఇదే కాలములో మందిరము యొక్క నిర్మాణమును గూర్చి కూడా దేవుడు సూచనలను ఇచ్చాడు. మందిరము అలంకరించబడిన ఒక పెద్ద గుడారమైయుండేది, మరియు అది ఇశ్రాయేలీయులు తమ ప్రయాణాలలో తీసుకొనివెళ్లుటకు వీలుగా ఉండేది. ఇది ముఖ్యముగా సృష్టి సమయములో ఏదెను వనము పని చేసిన విధముగా పని చేసేది; ఇది భూమి మీద దేవుని యొక్క పవిత్రమైన స్థలము, ఇది ఆయన నడచిన మరియు తన ప్రజలతో సంభాషించిన స్థలము. పతనము తరువాత, అప్పుడప్పుడు దేవుడు పలు చోట్ల ప్రజలను కలిశాడు. అయితే మందిరము సృష్టించబడిన తరువాత, దేవుడు తన ఆరాధనను మరొకసారి ఒకే స్థలములో కేంద్రీకృతము చేశాడు. మరియు దేవునిచే ఎన్నుకొనబడిన సేవకులైన యాజకులు ఈ ఆరాధనా స్థలమును భద్రపరచి, పరిచర్య చేయవలసియుండేది. మందిరము కొరకు ఇవ్వబడిన సూచనలు, మరియు దాని యొక్క నిర్మాణమును గూర్చిన సూచనలను నిర్గమ. 25-40లో చూడవచ్చు.

మానవాళి కొరకు ఆయన కలిగియుండిన వాస్తవిక ప్రణాళికను నెరవేర్చుటకు మెట్లుగా నిర్గమన కాలములోని యాజకత్వములో మార్పులు తేవాలని దేవుడు కోరాడు. మొదటిగా ఇశ్రాయేలును యాజక రాజ్యముగా మార్చుటకు, తరువాత ఈ ప్రత్యేకించబడిన దేశములో నమ్మకముగా సేవ చేయుటకు, మరియు ఆయన రాజ్యమును భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు ఆయన అహరోను కుటుంబమునకు చెందిన యాజకులను ఉపయోగించగోరాడు.

పాత నిబంధనలోని యాజక స్థానమునకు చివరి మార్పులు ఇశ్రాయేలులో రాజుల పాలన కాలములో జరిగాయి, ఆ సమయములో ఇశ్రాయేలు దేశము వాగ్దాన దేశములో స్థిరపడి రాజు యొక్క పరిపాలనలో నివసించింది.

రాజుల పరిపాలన. రాజుల కాలము ఇశ్రాయేలు యొక్క మొదటి రాజైన సౌలుతో దురారంభం అయ్యింది. అయితే సౌలు తరువాత వచ్చిన దావీదు మరియు అతని సంతతి ద్వారా అది శుభారంభము అయ్యింది.

ఇశ్రాయేలు రాజులు పాలించినప్పుడు, వారు యాజక స్థానముతో దగ్గరగా పని చేసేవారు. ఉదాహరణకు, దావీదు మందిర నిర్మాణము కొరకు ప్రణాళికను సిద్ధపరచాడు. యాజక సేవలు జరుగునట్లు అతడు జాగ్రత్తపడ్డాడు. అతడు యాజక కుటుంబములను క్రమపరచి వారికి బాధ్యతలను పురమాయించాడు. ఈ విషయములను మనము 1 దిన. 15 మరియు 16 మరియు 23-28 వంటి లేఖనభాగములలో చూడవచ్చు.

దావీదు ఇతర లేవీయ కుటుంబములకు కూడా బాధ్యతలను, ముఖ్యముగా ద్వారపాలక మరియు సంగీతకారుల బాధ్యతలను, అప్పగించాడు. 2 సమూ. 6:17-18లో కనిపించునట్లు, తరచుగా యాజకులతో కలసి అతడు బలులను అర్పించాడు మరియు ప్రజల మీద ఆశీర్వాదములను ఉచ్చరించాడు. ఒక సమయములో, అతడు రాజ వస్త్రమును తీసి లేవీయుల అంగీని ధరించాడు కూడా, ఇది 1 దిన. 15:27లో నమోదు చేయబడింది. ఎజ్రా 8:20లో కనిపించునట్లు, దావీదు దినముల తరువాత కూడా ఈ పురోగమనములు కొనసాగాయి.

దావీదు కాలములో, ప్రధాన యాజకులుగా పని చేయుటకు రెండు కుటుంబాలకు మాత్రమే అనుమతి ఇవ్వబడేది: అహరోను సంతతివారైన సాదోకు మరియు అబ్యాతారు. దీనిని గూర్చి 1 దిన. 18:16లో నమోదు చేయబడింది.

దావీదు తరువాత, తన కుమారుడైన సొలొమోను దేవుని రాజ్యమునకు రాజుగా పాలించాడు, మరియు అతడు దావీదు కంటే ఎక్కువగా యాజక సేవలలో పాలుపంచుకున్నాడు. సొలొమోను మందిర నిర్మాణమును పర్యవేక్షించాడు. లెక్కలేనన్ని బలులను అతడు పర్యవేక్షించాడు. తన తండ్రి వలె అతడు దేవాలయములో ప్రజలను ప్రార్థనలో నడిపించి వారి మీద దీవెనలను పలికాడు. ఈ వివరములు 1 దిన. 21:28; 2 దిన. 3-6, మరియు 1 రాజులు 8-9లో ప్రస్తావించబడినవి. వీటిని మనము దావీదు వ్రాసిన అనేక కీర్తనలలో కూడా చూడవచ్చు, ఉదాహరణకు కీర్తనలు 5, 11, 18, 27, 65, 66 మరియు 68.

సొలొమోను ప్రధాన యాజక వరుసను మరొకసారి కుదించాడు. అబ్యాతారు రాజద్రోహము చేశాడు కాబట్టి, సొలొమోను అతనిని అతని కుటుంబమును యాజక సేవల నుండి తొలగించాడు, దీనిని మనము 1 రాజులు 2:26, 27, 35లో చూస్తాము. ఇది న్యాయాధిపతుల కాలములో అపనమ్మకమైన యాజకుడైన ఏలీ కుటుంబమునకు ఇవ్వబడిన తీర్పును నెరవేర్చుతుంది మరియు 1 సమూ. 27-36లో నమోదు చేయబడింది.

దేవాలయములో కొన్ని పరిచర్యలు యాజకుల కొరకు మాత్రమే ప్రత్యేకించబడియుండగా, యూదా దేశపు రాజులు యాజక సేవలలో పాలుపంచుకొనుచు దావీదు మరియు సొలొమోనులను అనుసరించారు. తద్వారా, వారు సొలొమోను దేవాలయములో రాజులైన యాజకులైయ్యారు.

క్రీ.పూ. 587 లేక 586లో బబులోనీయులు యెరూషలేమును మరియు సొలొమోను దేవాలయమును నాశనం చేసి ప్రజలను చెరగొనిపోవుటతో రాజుల పరిపాలన ముగిసింది. అయితే సుమారుగా క్రీ.పూ. 515లో, చెర తరువాత పునరుద్ధరణ ప్రక్రియలో, తిరిగివచ్చిన ఇశ్రాయేలీయులు రెండవ దేవాలయమును నిర్మించారు. ఈ కాలములో, సాదోకు సంతతివాడైన యెహోషువను దేవుడు ప్రధాన యాజకునిగా నియమించాడని ప్రవక్తలైన యెహెజ్కేలు మరియు జెకర్యా ప్రకటించారు. యెహోషువ పునరుద్ధరణకు నాయకత్వం వహించు దావీదు సంతతివాడైన జెరుబ్బాబెలుతో కలసి సేవిస్తాడని కూడా వారు ప్రకటించారు. దు:ఖకరముగా, జరుబ్బాబెలు మరియు యెహోషువ యొక్క ప్రయత్నాలు ఎక్కువ కాలం కొనసాగలేదు. కాలక్రమములో, చాలామంది యాజకులు మరియు లేవీయులు దేవునికి దూరమయ్యారు, మరియు దేశములో చాలా వరకు ఆయనకు దూరమైయ్యింది. ఇశ్రాయేలీయుల ఆరాధన భ్రష్టమైపోయింది, మరియు దేవుని తీర్పు దేశము మీద కొన్ని వందల సంవత్సరాల పాటు కొనసాగింది.

అయినను, ఈ దినములలోని ఇశ్రాయేలు ప్రజలు దావీదు మరియు సొలొమోను కాలములను జ్ఞాపకము చేసుకొనుట కొనసాగించారు. రాజులు మరియు యాజకులు సరైన విధముగా దేవుని సేవించినప్పుడు ఎలా ఉంటుందో నమ్మకమైన ప్రజలు జ్ఞాపకము చేసుకున్నారు. మరియు మునుపటి కంటే వైభవవంతముగా రాజ మరియు యాజక బాధ్యతలు నెరవేర్చబడు నూతన దినము కొరకు మరియు దేవుడు పశ్చాత్తాపపడిన ప్రజలను తన విశేషమైన సన్నిధిలోనికి ఆహ్వానించు దినము కొరకు వారు నిరీక్షించారు.

యాజక స్థానము యొక్క చారిత్రిక అభివృద్ధి ద్వారా సృష్టించబడిన ఆకాంక్షలను మనము చూశాము కాబట్టి, కొన్ని విశేషమైన పాత నిబంధన ప్రవచనములు భవిష్యత్ యాజకులను గూర్చి సృష్టించిన ఆకాంక్షలను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.

ఈ భాగంలో, యాజక స్థానమును గూర్చి మూడు విశేషమైన పాత నిబంధన ప్రవచనముల మీద దృష్టిపెడదాము. మనము పరిగణించు మొదటి ఆకాంక్ష ఏమనగా తుదకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు వస్తాడు మరియు ఆయన పరిచర్య ఎన్నటికీ ముగియదు.

అనేక విధాలుగా, ఒక రోజున యాజకత్వము నిత్యము సేవించు ఒక ప్రధాన యాజకునితో ముగుస్తుంది అని పాత నిబంధన సూచిస్తుంది. మోషే కాలములో దేవుడు ఆహరోనును ప్రధాన యాజకునిగా నియమించాడు, కాని అతని యాజకత్వము కూడా ముగించబడు ఒక కాలము కొరకు పాత నిబంధన కూడా ఆశతో ఎదురుచూసింది. కాబట్టి అహరోను యాజకత్వము తాత్కాలికమైనదిగా గొప్ప ప్రధాన యాజకుని యొక్క రాక వరకు మాత్రమే కొనసాగవలసియుండినది. వాస్తవానికి, గొప్ప ప్రధాన యాజకుడు మరియు మెస్సీయ రాజు ఆధ్వర్యంలో రెండు స్థానములు ఒకే స్థానముగా ఐక్యపరచబడతాయి అనునది పాత నిబంధన యొక్క నిరీక్షణయైయుండినది.

ఈ ఆలోచనకు స్పష్టమైన కథనము కీర్తనలు 110:4లో ఇవ్వబడినది, అక్కడ మనము ఈ మాటలను చదువుతాము:

మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు (కీర్తనలు 110:4)

ఈ కీర్తన నేపథ్యములో, యాజకునిగా మెస్సీయ యొక్క పరిచర్య ఎన్నడును ఆగిపోదు అని దేవుడు వాగ్దానము చేశాడు. అది నిత్యముంటుంది.

హెబ్రీ. 7 ఈ ఆలోచనను ఉపయోగించి దేవుని ప్రజల మీద ప్రధాన యాజకుని స్థానములో యేసు ఉన్నాడు అను విషయముతో సూటిగా అనుసంధానపరుస్తుంది. క్రీస్తు యొక్క శాశ్వత యాజకత్వము నూతన నిబంధనకు అనుసంధానముగా ఉన్నది అను సత్యము ద్వారా నిర్థారించబడింది అని ఇదే అధ్యాయము సూచిస్తుంది, దీనిని గూర్చి యిర్మీయా 31:31లో యిర్మీయా ప్రవచించాడు. ఆ వాక్య భాగములో, నూతన నిబంధనలోని జీవితము పరిపూర్ణముగాను అద్భుతముగాను ఉంటుంది అని యిర్మీయా సూచించాడు. మరియు దీనికి అనుసంధానముగా, ఈ ఉత్తమమైన నిబంధన కొరకు ఉత్తమమైన యాజకత్వము — నిత్యముండు యాజకత్వము — అవసరమని హెబ్రీ పత్రిక రచయిత వాదించాడు.

కీర్తనలు 110:4ను ఉద్ధరణముగా చెబుతూ, హెబ్రీ పత్రిక రచయిత హెబ్రీ. 7:20-21లో దీనిని ఈ విధముగా చెబుతున్నాడు.

మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను (హెబ్రీ. 7:20-21).

తుదకు, నూతన నిబంధనలో దేవుడు ఒక గొప్ప ప్రధాన యాజకుని నియమించాడు అని మరియు ఆయన పరిచర్య ఎన్నడును ముగియదని పాత నిబంధన ప్రత్యేకముగా ప్రవచిస్తుంది.

యాజక స్థానమును గూర్చి పాత నిబంధనలో విశేషముగా ప్రవచించబడిన రెండవ ఆకాంక్ష ఏమనగా, గొప్ప ప్రధాన యాజకుడు రాజుగా పాలిస్తాడు.

ఇంతకు ముందు మనము చూసినట్లు, ఏదెను తోటలో మానవులు యాజకులుగాను రాజులుగాను సేవించారు. మరియు మెల్కీసెదకు కూడా రెండు స్థాయిలలో సేవించాడు. ఈ స్థానములు చరిత్రలో తరువాత వేరుచేయబడినప్పటికీ, తుదకు అవి మెస్సీయ యొక్క వ్యక్తిత్వములో ఐక్యపరచబడతాయని పాత నిబంధన ప్రవచించింది.

మరొకసారి కీర్తనలు 110ను చూద్దాము, ఈ సారి 2-4 వచనములను చూద్దాము, అక్కడ రానున్న మెస్సీయను గూర్చి దేవుడు ఈ వాగ్దానమును చేశాడు:

యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు (కీర్తనలు 110:4)

మెస్సీయ దావీదు వంశమునకు చెందినవాడని మరియు ఆయన రాజుగాను యాజకునిగాను సేవిస్తాడని దేవుడు వాగ్దానము చేశాడు.

ఇదే ఆలోచన జెకర్యా 6:13లో కూడా ఉంది, అక్కడ రానున్న మెస్సీయను గూర్చి మనము ఈ ప్రవచనమును చూస్తాము:

సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ... (జెకర్యా 6:13).

పాత నిబంధన ప్రకారం, మెస్సీయ యాజక స్థానమును రాజ స్థానముతో తిరిగి ఐక్యపరుస్తాడు అనునది యాజక స్థానము కొరకు కలిగియుండిన ఆకాంక్షలలో ఒకటైయున్నది.

స్వయంగా దేవుని ప్రజలు యాజకుల రాజ్యమవుతారు అనునది యాజక స్థానము కొరకు విశేషముగా ప్రవచించబడిన మూడవ ఆకాంక్ష అయ్యున్నది.

ఆది. 2:15లో మనము చూచునట్లు, యాజక స్థానములో పరిచర్య చేయుట ద్వారా మానవాళి ఏదెను వనములో ఆరంభమయ్యింది. కాబట్టి, పాపములో పడిన తరువాత మనము పొందుచున్న పునరుద్ధరణలో, విమోచించబడిన మానవాళి మరొకసారి దేవుని యాజకులుగా సేవిస్తారు అను విషయము మనకు ఆశ్చర్యం కలిగించనవసరం లేదు. మరియు వాస్తవానికి, నిర్గమ 19:6 మరియు యెషయా 61:6 వంటి స్థానములలో ఇది విశేషముగా ప్రవచించబడింది.

మెస్సీయ రాజుగా పాలించునప్పుడు దేవుని ప్రజలు అందరు నమ్మకమైన యాజకులుగా సేవిస్తారని, మరియు ఒకే దేశముగా లేక యాజకుల రాజ్యముగా ఐక్యపరచబడతారని ఈ లేఖనభాగములు రెండు సూచించుచున్నాయి. వేదాంతవేత్తలు చాలాసార్లు దీనిని విశ్వాసులందరి యొక్క యాజకత్వము అని సంబోధిస్తారు. మరియు ఇది తన దినములలోనే జరుగుతుంది అని అపొస్తలుడైన పేతురు సూచించాడు. 1 పేతురు 2:5లో ఆయన వ్రాసిన మాటలు వినండి:

యేసుక్రీస్తుద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మసంబంధమైన బలులనర్పించుటకు పరిశుద్ధయాజకులుగా ఉండునట్లు, మీరును సజీవమైన రాళ్లవలెనుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు (1 పేతురు 2:5).

నిబంధనా సమాధానకర్తలుగా, పాత నిబంధనలోని యాజకులు దేవునితో వారి నిబంధనా అనుబంధము యొక్క ప్రాముఖ్యతను తరచుగా తమ ప్రజలకు జ్ఞాపకము చేసేవారు. మరియు సృష్టిలోనికి పాపము తీసుకొనివచ్చిన నాశనమును దృష్టిలో ఉంచుకొని, దేవుని రాజ్యము యొక్క కొనసాగు ప్రగతి కొరకు మరియు ఆయన ఉద్దేశముల యొక్క నెరవేర్పు కొరకు యాజక స్థానము ఎంతో ప్రాముఖ్యమైనది మరియు అవసరమైయున్నది. కాని చారిత్రయంతటిలో అత్యంత ప్రాముఖ్యమైయున్న యాజక పాత్ర — పాత నిబంధన అంతా ఎదురుచూసిన మెస్సీయ — లేకుండా ఈ ఉద్దేశములు నెరవేర్చబడలేవు.

యాజక స్థానమునకు పాత నిబంధన నేపథ్యమును చూశాము కాబట్టి, మన రెండవ ముఖ్యాంశమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము: యేసులో యాజక స్థానము యొక్క నెరవేర్పు.

యాజక స్థానము యొక్క పాత నిబంధన ఆకాంక్షలను యేసు నెరవేర్చాడు అని సువార్తలు మరియు క్రొత్త నిబంధన పత్రికలు విశేషముగా తెలియజేయుచున్నాయని సూచిస్తూ మనము ఆరంభించాలి. ఉదాహరణకు, హెబ్రీ 3:1లో, యేసు యొక్క యాజక పరిచర్యను గూర్చి ఈ స్పష్టమైన ఉద్ఘాటనను మనము చదువుతాము:

మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడునైన యేసుమీద లక్ష్యముంచుడి (హెబ్రీ. 3:1).

మరియు హెబ్రీ. 4:14 దీనిని ఈ విధంగా చెబుతుంది:

దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు (హెబ్రీ. 4:14).

మన గొప్ప ప్రధాన యాజకునిగా, యేసు మనకు మరియు దేవునికి మధ్య మధ్యవర్తిగా ఉన్నాడు, తద్వారా మనము దేవుని యొక్క విశేషమైన పరిశుద్ధమైన సన్నిధిలోనికి అంగీకరించబడతాము. మనము పరిశుద్ధులమై దేవుని కొరకు పవిత్రపరచబడునట్లు ఆయన చూచుకుంటాడు, తద్వారా మనము దేవుని సన్నిధిలో నివసించి ఆయన నిబంధనా ఆశీర్వాదములను పొందుకుంటాము.

యాజక స్థానము యొక్క పాత నిబంధన నేపథ్యమును చర్చించుటకు మనము ఉపయోగించిన అవే విభాగములను ఉపయోగించి యాజక స్థానము యొక్క నెరవేర్పును మనము విశదీకరిద్దాము. మొదటిగా, యేసు ఈ స్థానము యొక్క అర్హతలను ఎలా నెరవేర్చాడో మనము చూద్దాము. రెండవదిగా, దాని యొక్క కార్యములను యేసు ఏ విధంగా నిర్వహించాడో చూద్దాము. మరియు మూడవదిగా, యాజక స్థానము యొక్క ఆకాంక్షలను యేసు ఎలా అందుకోగలిగాడో చూద్దాము. యాజక స్థానము యొక్క అర్హతలను యేసు ఏ విధంగా నెరవేర్చాడో మొదట చూద్దాము.

యేసు ఎన్నడు దేవాలయములో సేవించలేదు లేక సంఘ సాహిత్యములను చదివి వినిపించలేదు, మరియు ఆయన అహరోను సంతతివాడు కూడా కాదు అని చాలామంది ఎత్తిచూపుతారు. కాబట్టి, యేసు యాజకత్వ కార్యములను మరియు పరిచర్యలను చేశాడని క్రొత్త నిబంధన రచయితలు ఎందుకు చెబుతారు? మరియు యాజక స్థానమును కలిగియుండుటకు ఆయన అసలు అర్హతను ఎలా పొందాడు? సులువుగా చెప్పాలంటే, యేసు పాత నిబంధన నిరీక్షణ అయిన యాజక పరిచర్యలన్నిటి మీద దేవుడు స్వయంగా నియమించు రాజరిక యాజకుని యొక్క నెరవేర్పుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఈ స్థానమునకు అర్హునిగా ఉన్నాడు.

యాజక స్థానము యొక్క పాత నిబంధన నేపథ్యములో మనము సూచించిన అవే అర్హతలను యాజకునిగా యేసు యొక్క అర్హతల కొరకు కూడా ఉపయోగించుదాము. మొదటిగా, యాజకత్వ కార్యము కొరకు యేసు దేవుని ద్వారా నియమించబడ్డాడని చూద్దాము. మరియు రెండవదిగా, ఆయన దేవునికి స్వామిభక్తిని కూడా చూపాడని మనము చూద్దాము. యేసు దేవుని ద్వారా నియమించబడెను అను వాస్తవమును మొదట చూద్దాము.

దేవుడు యేసును ప్రధాన యాజకునిగా నియమించాడని హెబ్రీ. 5:4-10 స్పష్టముగా తెలియపరుస్తుంది. అక్కడ వ్రాయబడిన మాటలను వినండి:

మరియు ఎవడును ఈ ఘనత తనకుతానే వహించుకొనడు గాని, అహరోను పిలువబడినట్టుగా దేవునిచేత పిలువబడినవాడై యీ ఘనతపొందును అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని ... ప్రధానయాజకుడని దేవునిచేత పిలువబ[డెను] (హెబ్రీ. 5:4-10).

దేవుడు ఆయనను నియమించాడు కాబట్టి, యేసు నిశ్చయముగా ఈ అర్హతను నెరవేర్చాడు. అదే సమయములో, ఈ నియామకము కొంతవరకు అసాధారణమైనదిగా ఉన్నది, ఎందుకంటే యేసు లేవీయ యాజక వంశావళికి చెందినవాడు కాదు. పాత నిబంధన యొక్క ఆరంభములో, యాజకులుగా ఉండుటకు దేవుడు అనేకమందికి అనుమతి ఇచ్చాడు. అయితే పాత నిబంధన యొక్క ముగింపు సమయమునకు, ఆయన సాదోకు వారసులకు మాత్రమే యాజకత్వమును అప్పగించాడు. ఇదే విధముగా, యేసు యొక్క నియామకము కూడా ముందు కనిపించినంత అసాధారణమైనది ఏమి కాదు.

ఏదెను వనములో, దేవుని యొక్క సామంత రాజుగా భూమిని పాలించుటకు ఆదాము నియమించబడ్డాడు. అయితే అతని పరిపాలన యాజక పరిపాలన కూడా అయ్యుండి, లోకమంతటిని దేవుని యొక్క మహిమకరమైన సన్నిధికి అనువుగా ఉండునట్లు మార్చు విధముగా రూపొందించబడింది. రాజుల పరిపాలన కాలములోని రాజుల మధ్య కూడా యాజకుడు మరియు రాజు స్థానములు దగ్గర అనుబంధం కలిగియుండేవి.

ఇంచుమించు ఇదే విధముగా, క్రీస్తు ఒక రాజరిక యాజకుడైయున్నాడు. ఆయన దేవుని యొక్క పరిపూర్ణమైన సామంత రాజుగా పాలిస్తాడు. కాని ఆయన పరిపాలన యాజక పరిచర్య కూడా అయ్యున్నది మరియు అది మనలను మరియు భూమిని దేవుని యొక్క మహిమకరమైన ప్రత్యేక సన్నిధి కొరకు సిద్ధపరుస్తుంది. ఈ విధముగా, ఆదాము మరియు అతని ఇతర వారసులు చేయుటలో విఫలమైన కార్యములను క్రీస్తు నెరవేర్చుతాడు.

కీర్తనలు 110:1-4లో గొప్ప మెస్సీయను గూర్చి దావీదు మాట్లాడిన విధానమును మరొకసారి వినండి:

ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము... మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు (కీర్తనలు 110:1-4).

ఈ లేఖన భాగములో, మెస్సీయ — దావీదు ఆయనను “నా ప్రభువు” అని పిలుస్తున్నాడు — పరిపాలనదండము మరియు పరిపాలన అను రాజరిక రూపకములతోను, మరియు యాజకునిగాను వర్ణించబడ్డాడు.

తన వారసులలో ఒకరు ఉన్నతమైన రాజరిక స్థాయిని అధిరోహించి రాజరిక పరిచర్యను మాత్రమే గాక, మెల్కీసెదకు వలె యాజక పరిచర్యను కూడా నెరవేర్చు దినము కొరకు దావీదు యొక్క ప్రవచనము ఎదురుచూసింది. ఇందును బట్టియే యేసు యూదా రాజరిక గోత్రమునకు చెందినవాడుగాని, యాజక గోత్రమైన లేవీయ గోత్రమునకు చెందినవాడు కాదని హెబ్రీ. 7:14 ఉద్ఘాటిస్తుంది. యేసు యూదా గోత్రపు రాజు మరియు గొప్ప ప్రధాన యాజకుడైయున్నాడు అను సత్యము ఆయన ఎంతో కాలముగా ఎదురుచూచుచున్న దావీదు కుమారుడైన మెస్సీయ అనుటకు రుజువుగా ఉన్నది.

ఇది చాలా వరకు ఆదికాండము 14 మరియు మెల్కీసెదకు కాలములో ఆరంభమైయ్యుండవచ్చు, అతడు రాజు మరియు యాజకునిగా వర్ణించబడ్డాడు ఎందుకంటే అబ్రాహాము బలులు అర్పించాడు మరియు మెల్కీసెదకు ఒక యాజకునిగా వాటిని స్వీకరించాడు. కాని అదే సమయములో, అతడు షాలేము దేశమునకు రాజుగా కూడా ఉన్నాడు. ఇది ఇక్కడ ఆరంభమై మిగిలిన బైబిలు కథనములలో కొన్నిసార్లు ఒక్కరే రాజులుగాను యాజకులుగాను వ్యవహరించిన సందర్భములకు దారితీసింది. 110వ కీర్తనలో రాజు “నీతిగల పైవిచారకుని”గా సంబోధించబడినాడు. సరే, దీనితో నిశ్చయముగా ప్రభుత్వ విషయములు ముడిపడియున్నాయి, కాని నీవు నీతికి పైవిచారకునిగా ఉంటే, నీవు యాజక పాత్రను కూడా పంచుకొనుచున్నావు, ఎందుకంటే దేవుని నీతి లోకమంతా నీతిగా ఉండుటకు దేవుని చిత్తమైయున్నది. కాబట్టి రాజు దానిలో పాలుపంచుకుంటాడు, నియమిత యాజకులు ఉన్నప్పటికీ, రాజు యాజక మార్గములో కార్యము చేయుచున్నాడు. తరువాత, యేసు విషయానికొస్తే, ఆయనలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆయనను మనము ప్రవక్త, యాజకుడు మరియు రాజు అని పిలుస్తాము. అవును, ఆయన హెబ్రీ పత్రికలో తెలుపబడినట్లు నూతన మెల్కీసెదకు. పాత నిబంధనలో దేవుడు పోషించిన పాత్రకు ఆయన నూతన నిబంధనలో శరీరధారియైయున్నాడు.

— డా. స్టీవ్ హార్పర్

యేసు దేవుని ద్వారా నియమించబడ్డాడు అని చూశాము గనుక, దేవునిపట్ల స్వామిభక్తి కలిగియుండు అవసరతను కూడా ఆయన నెరవేర్చాడు అని చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.

ఇంతకు ముందు మనము ప్రస్తావించినట్లు, ఆయనను మాత్రమే ఆరాధించుట ద్వారా మరియు సేవించుట ద్వారా, దేవుడు వారికి పురమాయించిన బాధ్యతలను జాగ్రత్తగా నెరవేర్చుట ద్వారా యాజకులు దేవుని పట్ల ఒక విశేషమైన స్వామిభక్తిని ప్రదర్శించవలసియుండినది. దేవుని ప్రజలు నైతికముగా మరియు ఆచారపరముగా దేవునికి స్వామిభక్తి కనుపరచి నిర్భయంగా దేవుని ప్రత్యేకమైన సన్నిధిలోనికి ప్రవేశించునట్లు చూచుట వారి బాధ్యతలకు ప్రాథమిక కారణములలో ఒకటిగా ఉన్నది. యాజకులు అందించిన ప్రథానమైన సేవలలో ఇది ఒకటి.

యేసు ఈ అర్హతలను నిరాటంకమైన పూర్ణతతో కలిగియుండెను. ఆయన ఎల్లప్పుడూ దేవుని మరియు దేవుని మాత్రమే ఆరాధించేవాడు మరియు సేవించేవాడు. మరియు ఎల్లప్పుడు ఆయన దేవుని ఆజ్ఞలకు విధేయుడైయ్యాడు. మరియు ఈ యాజక పరిచర్య ద్వారా, దేవుని యొక్క విశేషమైన పరిశుద్ధ సన్నిధిలోనికి ప్రవేశించుటకు యేసు మనలను సిద్ధపరచగలిగాడు.

సాధారణ భావనలో, దేవుని పట్ల యేసు యొక్క స్వామిభక్తికి రుజువుగా మనము నాలుగు సువార్తలలోని విషయములన్నిటిని చూడవచ్చు. తండ్రి ఆయనకిచ్చిన ఆజ్ఞను ఆయన అనుసరించాడు; తండ్రి తనకు ఇచ్చిన మాటలనే ఆయన పలికాడు; మరియు తండ్రి చేసిన కార్యములను మాత్రమే చేశాడు. కాని ఈ ఆలోచనలను స్పష్టముగా క్రోడీకరించిన క్రొత్త నిబంధన లేఖనభాగములు కూడా చాలా ఉన్నాయి, మత్తయి 26:42; యోహాను 5:19, 14:31, మరియు 17:4; మరియు హెబ్రీ. 7:5-7 వంటివి.

దేవుని పట్ల యేసు చూపిన పూర్ణమైన స్వామిభక్తి మన గొప్ప ప్రధాన యాజకునిగా ఆయన పొందిన సఫలతలో ముఖ్య భాగమైయున్నది. దేవునికి సంపూర్ణమైన స్వామిభక్తి చూపుట ద్వారా మాత్రమే, ఆయన తన అనుచరులను పరిపూర్ణ పరిశుద్ధులుగా చేయగలడు, మరియు దేవుని విశేషమైన పరిశుద్ధ సన్నిధిలో నిత్యముండునట్లు మనలను బలపరచగలడు. మరియు దీనికి అనేక ఉదాహరణలను మనము లేఖనములలో చూడవచ్చు.

ఉదాహరణకు, యోహాను 17:19లో ఆయన చేసిన ప్రధాన యాజక ప్రార్థనలో ఆయన విశేషముగా మన పరిశుద్ధత కొరకు ప్రార్థించాడు. మరియు రోమా 15:16 మరియు 1 కొరింథీ. 6:11 వంటి లేఖన భాగముల ప్రకారం, ఆయన దృష్టిలో మనలను పరిశుద్ధులుగా చేయుట ద్వారా దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇచ్చేశాడు.

యాజకత్వమునకు కావలసిన అర్హతలను యేసు నెరవేర్చాడు అని చూశాము కాబట్టి, యాజకుని యొక్క కార్యములను ఆయన నెరవేర్చిన విధానమును ఇప్పుడు మనము చూద్దాము.

పాత నిబంధనలో మనము గుర్తించిన యాజకత్వ పాత్రలను చూస్తూ యాజకునిగా యేసు యొక్క కార్యమును మనము విశదీకరిద్దాము: మొదటిగా, దేవుని ప్రజలపై యాజకత్వ నాయకత్వము; రెండవదిగా, యాజకత్వ ఆచారములు; మరియు మూడవదిగా, యాజకత్వ విజ్ఞాపన. యాజకత్వ నాయకత్వ కార్యమును యేసు నెరవేర్చిన విధానమును మొదట చూద్దాము.

యేసు నాయకత్వములోని అనేక కోణములను మనము ఎత్తి చూపవచ్చుగాని, యేసు యొక్క యాజకత్వ స్థానమునకు పాత నిబంధన నేపథ్యము యొక్క సర్వేలో మనము కనుగొన్న మూడింటి మీదనే దృష్టిపెడదాము, మరియు ఆరాధనలో ఆయన అందించిన నాయకత్వముతో ఆరంభించుదాము.

గొప్ప ప్రధాన యాజకునిగా మహిమపరచబడువానిగా, ఇశ్రాయేలు దేశములోను, ఆయన అనుచరుల మధ్యను నిజమైన ఆత్మీయ ఆరాధనను ప్రోత్సహించుటకు యేసు అనేక కార్యములను చేశాడు. ఉదాహరణకు, మత్తయి 21:12-13లో, ఆయన వర్తకులను మరియు డబ్బు మార్చువారిని దేవాలయము నుండి వెళ్లగొట్టాడు, ఎందుకంటే వారు దేవుని ప్రార్థనా గృహమును దొంగల గుహగా మార్చివేశారు.

అయితే అన్నిటికంటే ముఖ్యంగా, పరలోక దేవాలయములో పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని యొద్దకు వెళ్లుటకు తన ప్రజల కొరకు మార్గమును తెరచాడు. పాత నిబంధనలో, మొదటిగా మందిరము తరువాత దేవాలయము ఆకాశము మరియు భూమి కలుసుకున్న స్థలములైయుండేవి. అరాధికులు ఒకేసారి భూమి మీద మరియు దేవుని పరలోక ప్రాంగణములలో ఉపస్థితులైయుండిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాని క్రొత్త నిబంధనలో, యేసు స్వయంగా ఈ బాధ్యతను తీసుకున్నాడు. కాబట్టి, దేవుని యొక్క పరలోక ప్రాంగణములోనికి ప్రవేశించుటకు ఒక ప్రత్యేకమైన భవనములోనికి ప్రవేశించుటకు బదులుగా, యేసు స్వయంగా మనలను అక్కడకి తీసుకువెళ్తాడు. ఆయన ద్వారా, దేవుని యొక్క విశేషమైన పరిశుద్ధ సన్నిధిలోనికి మనము ఆహ్వానించబడ్డాము, అక్కడ మనము సహవాస ఆశీర్వాదమును పొందుకుంటాము.

దీనిని గూర్చి హెబ్రీ 10:19-22 మాట్లాడుతున్న విధానమును వినండి:

సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను, దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను... విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము (హెబ్రీ. 10:19-22).

పౌర మరియు ఆచార తీర్పులలో కూడా విశేషమైన మార్గదర్శకత్వమును అందిస్తూ యేసు యాజకత్వ నాయకత్వమును కనుపరచాడు.

ఉదాహరణకు, మత్తయి 12:1-8లో, విశ్రాంతి దినమును ఉల్లంఘించినందుకు తన శిష్యులు శపించబడినప్పుడు యేసు యాజకత్వ తీర్పును ఇచ్చాడు. మార్కు 7:19లో ఆహారము యొక్క ఆచార శుద్ధతను గూర్చి తీర్పులను ఆయన ప్రకటించాడు. మత్తయి 8లో కుష్టువ్యాధిగలవాని బాగుచేయుట ద్వారా, ఆ మనిషి ఆచారరిత్యా శుద్ధి చేయబడ్డాడు అని ప్రకటించి యాజకత్వ ప్రకటనను చేశాడు, మరియు తగిన బలిని దేవాలయమునకు తీసుకొని వెళ్లమని చెప్పాడు. తనను తాను యాజకులకు కనుపరచుకొనమని యేసు ఆజ్ఞాపించిన్నప్పటికీ, అతని పరిస్థితిని పరీక్షించమనే ఉద్దేశముతో ఆయన అతనిని పంపలేదు. బదులుగా, మత్తయి 8:4 ప్రకారం, అది యేసు యొక్క శక్తి మరియు అధికారమునకు సాక్ష్యమైయుండవలసియుండెను.

మనము ప్రస్తావించిన మూడవ రకమైన నాయకత్వము బోధన. మరియు యేసు ఈ బాధ్యతను చాలా సక్రమముగా నెరవేర్చాడు.

ఇప్పుడు, ఇశ్రాయేలులో అనేక రకముల బోధకులు ఉండిరి అను మాట నిజమే. ప్రవక్తలు దేవుని నిబంధనను మరియు చిత్తమును ప్రకటించిన బోధకులు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించారు. రబ్బీలు మరియు పెద్దలు తమ సమాజములకు బోధించారు. అయితే, యాజకులు ప్రత్యేకముగా మారుమనస్సు మరియు నమ్మకత్వమును గూర్చి బోధించారు తద్వారా దేవుని ప్రజలు ఆయన ప్రత్యేకమైన సన్నిధిలోనికి ఆహ్వానించబడాలని కోరారు. దీనికి ఒక ఉదాహరణను మనము నెహెమ్యా 8లో చూస్తాము. మరియు యేసు యొక్క బోధ ఈ యాజకత్వ బాధ్యతను కూడా నెరవేర్చింది.

ఉదాహరణకు, మత్తయి 5-7లో ఉన్న కొండ మీద ప్రసంగములో, తన మాటలను వినినవారిని నిబంధనా నమ్మకత్వములోనికి నడిపించుటకు దేవుని ధర్మశాస్త్రము యొక్క నిజమైన ఉద్దేశమును మరియు అనువర్తనను యేసు వివరించాడు. మారుమనస్సు మరియు నమ్మకత్వమును గూర్చి ఆయన తన బోధలలో తరచుగా మాట్లాడాడు, దీనిని మనము మత్తయి 4:17, లూకా 5:32, మరియు యోహాను 14:15-24 వంటి వాక్యభాగములలో చూస్తాము.

యేసు నాయకత్వము యొక్క యాజకత్వ బాధ్యతను నెరవేర్చాడు అని చూశాము కాబట్టి, ఆచారముల విషయములో ఆయన యాజకత్వ బాధ్యతలను నెరవేర్చు విధానమును ఇప్పుడు చూద్దాము.

నిస్సందేహముగా, యేసు యొక్క సిలువ మరణము ఆయన యాజకత్వ పరిచర్యలో గొప్ప ఆచార విషయమైయున్నది.

యేసు స్వయంగా ఇశ్రాయేలు యొక్క ఆచారములలో పాలుపంచుకున్నాడు. వాస్తవానికి, వాటిలో కొన్ని యోహాను సువార్తలో ప్రస్తావించబడినవి. అయితే యేసు యొక్క సిలువ బలిదానము దేవుని ప్రజల కొరకు సాధించిన విమోచనను వీటిలో ఏ ఆచారము కూడా సాధించలేకపోయింది. నిస్సందేహముగా, యేసు యొక్క సిలువ మరణము ఆయన యాజక పరిచర్యలో అతి గొప్ప ఆచార అంశముగా ఉన్నది. మోషే ధర్మశాస్త్రము ఇశ్రాయేలు యొక్క నమ్మకత్వమును కోరింది, కాని ఇశ్రాయేలు తమ అవిధేయతను కొనసాగిస్తుంది అని దేవునికి తెలుసు కాబట్టి, ఆ పాపములకు ప్రాయశ్చిత్తం చెల్లించుటకు బలులను అర్పించమని దేవుడు ఇశ్రాయేలును ఆజ్ఞాపించాడు. కాని ఈ బలులు ఎంత ప్రాముఖ్యమైనవిగా ఉన్నను, వాటిని ప్రతి సంవత్సరము తరచుగా అర్పించవలసియుండినది — వాటిలో ఏది కూడా ఇశ్రాయేలు యొక్క పాపమును శాశ్వతముగా తీసివేయలేదు. కాబట్టి యేసు వచ్చి పాపము కొరకు తనను తాను పరిపూర్ణమైన బలిగా అర్పించుకున్నాడు. ఇశ్రాయేలులోని బలులు ఎన్నడు కూడా సాధించలేని విమోచనను ఆయన ప్రాయశ్చిత్త బలి సాధించింది. ఈ విధముగా పాపము కొరకు ఆయన అందరికి ఒకేసారి అర్పించిన ఏకైక బలి ఇశ్రాయేలు యొక్క యాజకత్వ ఆకాంక్షలను నెరవేర్చింది.

సరే, పాపమును ఇక ఉండకుండా ఒకేసారి తీసివేయు బలి కొరకు పాత నిబంధన బలులు ఎదురుచూశాయి. మరియు సిలువపై యేసు యొక్క పాత్రను పాపమునకు బలిగాను, మరియు ఆ బలికి ఆయనే యాజకుడు అని కూడా బైబిలు వర్ణిస్తుంది. ఒకవిధంగా ఆయన ఈ రెండు బాధ్యతలను నెరవేర్చుచున్నాడు. ఆయన లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్లను అందిస్తున్నాడు. కాని ఇతర బలులన్ననిటిని ముగించు బలిని ఇచ్చుటకు యాజకునిగా యేసు తనను తాను అర్పించుకొనుచున్నాడు.

— డా. సైమన్ వైబర్ట్

యేసు మరణము మరియు పాత నిబంధన బలులకు మధ్య ఉన్న అనుబంధమును అనేక విధాలుగా అభివృద్ధి చేయవచ్చు. ముఖ్యముగా, పాత నిబంధన బలులను దేవుడు ఇశ్రాయేలు దేశమునకు ఇచ్చిన పాత నిబంధనలో ఉంచి చూడాలి. బలుల వ్యవస్థ ద్వారా ప్రజల పాపములు తీసివేయబడ్డాయి; దేవుని ఉగ్రత చల్లారింది; దేవుడు మరియు ఆయన ప్రజల మధ్య ఒక అనుబంధం ఏర్పడింది. ఈ బలులను మనము ప్రతీకలు అని పిలువవచ్చు; అవి మాదిరులు; అవి మరింత గొప్పదైన ఒకదాని వైపు చూపుతాయి. ఒక జంతువును అర్పించుట మాత్రమే పాపమును తీసివేయలేదు అని తెలుపు అనేక సూచనలు పాత నిబంధనలో ఉన్నాయి. అది ఏనాడు కూడా పాపమును శాశ్వతముగా తీసివేయునదిగా పరిగణించబడలేదు. అవి మరింత గొప్పదానికి ఛాయలుగా ఉన్నాయి. కాని అవి క్రీస్తు యొక్క బలి వైపుకు చూపుచున్నాయి, ఆయన ఆ బలుల వలెనె మన ప్రత్యామ్నాయముగా ఉన్నాడు. ఆయన మన స్థానమును తీసుకుంటాడు. ఆయన మానవుడు గనుక దీనిని మరింత గొప్ప స్థాయిలో ఆయన చేస్తాడు. ఆయన మన మానవత్వమును ధరించుకుంటాడు. అయితే ఆ జంతు బలులు అలా చేయలేదు. అయినను, ఆయన కుమారుడైన దేవునిగా ఉన్నాడు, నరవతారియైన కుమారుడైన దేవునిగా ఉన్నాడు, తద్వారా మన పాపమును ప్రక్కనబెట్టి, మన ప్రతినిధిగా, మన ప్రత్యామ్నాయముగా, మన యాజకునిగా నిలువబడి ఆయన తన సొంత నీతిగల అర్హతలను నెరవేర్చుచున్నాడు. మరియు ఆ బలులు ఎదురుచూసినవన్నిటిని ఆయన నెరవేర్చుచున్నాడు, మనలను దేవునితో అనుబంధములోనికి పునరుద్ధరించుచున్నాడు, మరియు దేవుడు మనలను ఆరంభములో చేసిన స్థాయికి — ఆయన ప్రజలు ఆయన కొరకు జీవిస్తూ, ఆయనను సేవిస్తూ, లోకములో ఆయన స్వరూపములుగా మన పాత్రను మరియు బాధ్యతను నెరవేర్చుట — తీసుకొనివస్తున్నాడు.

— డా. స్టీఫెన్ వెల్లమ్

మనము ఇంతకు ముందు చూసినట్లు, పాత నిబంధన యాజకులు పాపపరిహారార్థ బలులు, కృతజ్ఞత అర్పణలు మరియు సహవాస అర్పణలతో సహా అనేక రకముల అర్పణలకు బాధ్యులైయుండేవారు. మరియు సిలువపై ఆయన పొందిన మరణము ద్వారా, చరిత్రలో అప్పటి వరకు అర్పించబడిన ప్రతి బలికి ఒక యోగ్యమైన ఆధారమును రూపొందించిన ఏకైక బలిని యేసు అర్పించాడు. ప్రాయశ్చిత్తము కొరకు ఇంతకు ముందు అర్పించబడిన ప్రతి అర్పణ సిలువలో మరణించినప్పుడు యేసు అర్పించిన అర్పణకు కేవలం పూర్వగామి అయ్యింది. ఈ సత్యము రోమా 3:25 మరియు 8:3, మరియు 1 యోహాను 2:2 మరియు 4:10 వంటి లేఖనభాగములలో ప్రకటించబడింది.

ఒక ఉదాహరణగా, హెబ్రీ. 10:1-4లోని మాటలు గమనించండి:

ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజస్వరూపము గలదికాదు గనుక ఆ యాజకులు ఏటేట ఎడతెగకుండ అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడును సంపూర్ణసిద్ధి కలుగజేయనేరవు... అయితే ఆ బలులు అర్పించుటచేత ఏటేట పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి ఏలయనగా ఎడ్లయొక్కయు మేకలయొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము (హెబ్రీ. 10:1-4).

పాత నిబంధన బలులు అర్పించబడిన బలుల ఆధారంగా ఆరాధికులకు ప్రయోజనము చేకూర్చలేదుగాని, సిలువ మీద తుదకు క్రీస్తు అర్పించబోవు విశేషమైన బలి కొరకు ఎదురుచూచుట ద్వారా ప్రయోజనమును చేకూర్చాయి. అంతేగాక, మిగిలినవన్నీ ఎదురుచూసిన యేసు అర్పించిన ఆ ఏకైక బలి లేకుండా అవి అందించిన ప్రయోజనము ఎన్నటికీ సంపూర్ణతను పొందియుండలేదు. ఇందుమూలముగానే పాత నిబంధన బలులు పాపమును శాశ్వతముగా తీసివేయలేకపోయాయి. దేవుడు తన ఉగ్రతను జాగుచేయుటకు మరియు సిలువ మీద యేసు మరణించునంత వరకు సహనమును చూపుటకు మాత్రమే అవి మార్గములైయుండినవి.

ఈ విషయములో, యేసు మునుపటి ప్రాయశ్చిత్త అర్పణలు చూపిన ఒక విషయము మాత్రమే అయ్యుండలేదు. ఆయన అంతిమ ప్రాయశ్చిత్తమైయున్నాడు. ప్రాయశ్చిత్త అర్పణల యొక్క పూర్ణత యేసులో నెరవేర్చబడింది కాబట్టి, ఛాయలను అర్పించవలసిన అవసరము ఇక లేకపోయింది. అందుకనే పాత నిబంధనలో వర్ణించబడిన ప్రాయశ్చిత్త అర్పణలను క్రైస్తవులు అర్పించరు. ప్రాయశ్చిత్త అర్పణలు అనవసరమైనవి అని మనము నమ్ముతాము కాబట్టి కాదు. బదులుగా, ప్రాయశ్చిత్తము అనునది ఖచ్చితముగా అవసరమని మనకు తెలుసు. ప్రాయశ్చిత్తమునకు మనము అర్పణలను ఇవ్వకపోవుటకు గల కారణము ఏమిటంటే, అన్ని కాలములలోని దేవుని నమ్మకమైన ప్రజలందరి ప్రాయశ్చిత్తము యొక్క అవసరతను యేసు యొక్క ఏకైక బలి పూర్తిగా నెరవేర్చింది అని మనము నమ్ముతాము. మరియు ఈ ఒక్క కార్యము ద్వారా, ఆయన మన పరిశుద్ధతను సంపాదించాడు, మరియు దేవుని యొక్క విశేషమైన పరిశుద్ధమైన సన్నిధిలో నివసించుటకు మనలను సమర్థులుగా చేశాడు.

హెబ్రీ. 10:10లో ఇలా చదువుతాము:

యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడియున్నాము (హెబ్రీ. 10:10).

యేసు యొక్క బలి దేవుని రాజ్యము యొక్క నూతన యుగములోనికి ప్రవేశం కల్పించింది; దేవుని ప్రజల యొక్క చెర మరియు తీర్పు యొక్క ముగింపునకు అది ఆరంభమైయ్యింది. ఈ ఒక్క బలి దేవుని క్షమాపణను భూమి మీద ప్రతి దేశము సూటిగా పొందుకొనునట్లు చేసింది. అంతేగాక అది దేవుని దీర్ఘశాంతము యొక్క ముగింపును మరియు అనేకమంది అవిశ్వాసుల పట్ల ఆయన చూపిన ఓరిమి యొక్క ముగింపుకు కూడా నాంది పలికింది.

అపొ. 17:30లో మనము చదువునట్లు, క్రీస్తు అర్పించిన బలికి ముందు సత్యమును ఎరుగనివారి మీదికి తీర్పును తెచ్చుటలో దేవుడు ఆలస్యమును చూపాడు. అయితే క్రీస్తు యొక్క బలి సత్యమును ఏ విధంగా ప్రకటించింది అంటే అజ్ఞానత అను సాకును ప్రక్కనబెట్టు విధంగా చేసింది. ఫలితంగా, సువార్తను ప్రకటించినప్పుడు ప్రజలు మారుమనస్సు పొందుటలో విఫలమైనప్పుడు పాపుల మీదికి తీర్పును దేవుడు మరింత కఠినముగాను త్వరితముగాను తెచ్చుట ఆరంభించాడు.

కొంతమంది సందిగ్ధవాదులు యేసు యొక్క మరణమును ఒక దిశలేని జీవితమునకు కలిగిన దుఃఖకరమైన ముగింపుగా పరిగణిస్తారు. కాని విశ్వాసుల విషయంలో, క్రీస్తు యొక్క మరణము ఉద్దేశపూర్వకమైనది, ప్రాముఖ్యమైనది, మరియు విమోచనను కలిగించింది. అది పాత నిబంధన బలి యొక్క ప్రతీక, లేక పుర్వాలోచనకు నెరవేర్పుగా ఉన్నది అన్నట్లు మనము సిలువ యొక్క నిగూఢమైన క్రియాశీలకములను అర్థము చేసుకుంటాము. అంతేగాక నేడు రక్తము యొక్క అవసరతను గూర్చి చాలా అసౌకర్యముగా భావించు ప్రజలు చాలామంది ఉన్నారు. ఇది ఎక్కువ జ్ఞానోదము కలిగిన మరియు నాగరికత పొందుకున్న ప్రజలకు అనాంగీకారముగాను, పురాతనమైనదిగాను అనిపిస్తుంది. దేవుడు తన అవసరతలను తీర్చుకొనుటకు రక్తమును కోరు ఒక లోక సంబంధమైన పిశాచి కాదని గ్రహించుట చాలా అవసరమని నా ఆలోచన. పాత నిబంధన బలి, పాత నిబంధన బలుల వ్యవస్థ గంభీరముగాను, ఘోరముగాను, భీకరముగాను ఉండేది, కాని ఇదంతా పాపము యొక్క తీవ్రతను తెలుపుటకు చేయబడినది. దేవుని విశ్వము యొక్క నైతిక వ్యవస్థను పునరుద్ధరించుటకు పాపమునకు పరిష్కారము అవసరమని పురాతన ప్రజలకు జ్ఞాపకము చేయుటకు పాత నిబంధన బలుల వ్యవస్థ ఇవ్వబడినది. మరియు యేసు క్రీస్తు ఆ అవసరత యొక్క నెరవేర్పుగా ఏ విధంగా ఉన్నాడంటే, దేవుని న్యాయము మరియు లోక నైతిక వ్యవస్థ యొక్క అవసరతలను తీర్చుటకు ఆయన ప్రేమతో స్వయం పరిత్యాగ కార్యమును చేశాడు. పాత నిబంధన పురాతన బలుల వ్యవస్థ యొక్క వివరాలను క్రీస్తులో నెరవేర్చబడునంత వరకు చూపుతుంది.

— డా. గ్లెన్ స్కోర్గి

నాయకత్వము మరియు ఆచారముల ద్వారా యేసు యాజకత్వ పాత్రను నెరవేర్చిన విధానమును చూశాము కాబట్టి, ఇప్పుడు ఆయన యాజక బాధ్యతయైన విజ్ఞాపనను ఏ విధముగా నెరవేర్చాడో చూడవలసియున్నది.

ఈ పాఠంలో ఇంతకు ముందు, విజ్ఞాపన అనగా మరొకరి కొరకు మధ్యవర్తిత్వం చేయుట లేక అర్జీ చేయుట అని చెప్పాము. ఇది యేసు యొక్క భూలోక పరిచర్యలో, మరియు ఇప్పటి పరలోక పరిచర్యలో కూడా ముఖ్య భాగముగా ఉన్నది.

ఒక స్నేహితుడు నన్ను ఇలా అడిగాడు, “ఒకవేళ యేసు మనలను దేవుని యొద్దకు తీసుకొనివెళ్తే, తరువాత కూడా మనకు యేసు యొక్క అవసరత ఏంటి? ఇప్పుడు ఆయన మనలను దేవుని దగ్గరకు తీసుకొని వెళ్లాడు కాబట్టి, ఆయనను ప్రక్కనబెట్టి, తండ్రికే ప్రార్థన చేస్తే పోలా? మనకు ఇక యేసుతో పని లేదు.” అంటే, ఇది యేసు యొక్క కొనసాగు పాత్రను మరచిపోతున్నట్లే. ఎందుకంటే యేసు దేవునికి మానవునికి మధ్య ఉన్న ఏకైక మధ్యవర్తి అని క్రొత్త నిబంధన చెబుతుంది, ఇది వర్తమాన కాలములో ఉంది, నరుడైన యేసు మన కొరకు విజ్ఞాపన చేయుటకు నిత్యము నివసిస్తాడు. అంటే దీని అర్థము సిలువ మీద యేసు చేసిన ప్రాయశ్చిత్త కార్యము అసంపూర్ణమైనది అని ఏ విధంగా కూడా కాదు. స్పష్టముగా ఉండుటకు, యేసు ప్రాయశ్చిత్త కార్యము ఒకేసారి అందరి కొరకు చేయబడినది, అది పరిపూర్ణమైనది; దానికి ఇంకా ఏది కూడా జోడించవలసిన పని లేదు. మన న్యాయవాదిగా, మన మధ్యవర్తిగా, మన ప్రతినిధిగా యేసు ఒక కొనసాగుచున్న, వ్యక్తిగతమైన, అనుబంధ పాత్రను మన జీవితములలో పోషించుచునే ఉన్నాడు. గొప్ప న్యాయాధిపతి ఎదుటకు అనుదినము తరచుగా వెళ్లి మన పక్షమున వ్యాజ్యమాడు మన న్యాయవాధి ఆయన. ఆయన ప్రాయశ్చిత్త కార్యము వలన ఆయన ఎన్నడును వ్యాజ్యమును ఓడిపోడు అనునది గొప్ప శుభవార్త. మన గొప్ప ప్రధాన యాజకునిగా విజ్ఞాపకుని పాత్రలో మన పక్షమున తన పూర్ణమైన, పూర్తి చేయబడిన కార్యమును ఆయన ఎల్లప్పుడు ప్రస్తావిస్తున్నాడు, మరియు అది ఎల్లప్పుడు సఫలమవుతుంది, ఎల్లప్పుడు ప్రభావవంతమైనది. కాని అది కొనసాగునది, అనుబంధముగలది, మరియు క్రియాశీలమైనది. కాబట్టి యేసు, ఆయన చేసిన పరిపూర్ణమైన ప్రాయశ్చిత్త కార్యము ఆధారంగా మన మధ్యవర్తిగా, మన కొరకు విజ్ఞాపన చేయువానిగా, మన గొప్ప ప్రధాన యాజకునిగా కొనసాగుచున్నాడు.

— డా. కే. ఎరిక్ ధోయెన్స్

తాను అప్పగించబడిన రాత్రి తన శిష్యుల కొరకు యేసు చేసిన ప్రార్థన బైబిలులో యేసు చేసిన విజ్ఞాపన కార్యమునకు అత్యంత స్పష్టమైన ఉదాహరణగా ఉన్నది, ఇది యోహాను 17లో నమోదు చేయబడింది. వాస్తవానికి, దీనిని సాధారణంగా ఆయన చేసిన “ప్రధాన యాజక ప్రార్థన” అని పిలుస్తారు. ఈ ప్రార్థనలో, అపొస్తలుల కొరకు యేసు అనేక విజ్ఞాపనలను చేశాడు. మరియు యోహాను 17:20-21లో, వారు చేయు సువార్త పని ద్వారా శిష్యులు కాబోవు వారి కొరకు కూడా యేసు ప్రార్థించాడు.

యేసు సిలువ మీద తాను పొందిన మరణములో కూడా విజ్ఞాపన కార్యమును కొనసాగించాడు, అక్కడ ఆయన దేవునికి మానవునికి మధ్య అత్యంత ప్రభావవంతమైన మార్గములో మధ్యవర్తిత్వం చేశాడు. మరియు ఇప్పుడు ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు కాబట్టి, తన సొంత రక్తమును బలిపీఠము మీద ప్రోక్షించుచు మన కొరకు తండ్రి ఎదుట వేడుకొనుచు ఆయన మన కొరకు విజ్ఞాపన చేయుటను కొనసాగించుచున్నాడు. హెబ్రీ. 7:24-25లో ఇలా వ్రాయబడియున్నది:

ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు (హెబ్రీ 7:24-25).

మన రక్షణ శాశ్వతముగా భద్రపరచబడింది, ఎందుకంటే మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసు మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేయుచున్నాడు, మరియు మనము చేయు ప్రతి పాపమునకు వెలగా కుమారుని మరణమును స్వీకరించమని తండ్రిని అడుగుచున్నాడు.

యేసు పాత నిబంధన యాజకత్వము యొక్క కార్యములను పరిపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన నాయకత్వమును అందించాడు, ఆచారములను నిర్వహించాడు — చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన ఆచారమైన ఆయన సిలువ మరణముతో సహా — మరియు తన ప్రజల కొరకు విజ్ఞాపన చేశాడు. వాస్తవానికి, ఈ కార్యములను ఆయన నేడు కూడా, తన సంఘము ద్వారా మరియు పరలోక ప్రాంగణములలో తన ప్రధాన యాజక బాధ్యతల ద్వారా నెరవేర్చుచున్నాడు. కాబట్టి, ఆయన అనుచరులుగా, తండ్రి యొద్దకు వెళ్లుటకు ఏకైక మార్గముగా యేసును గుర్తించి ఆయన మీద ఆధారపడుట, మరియు దేవుని యొక్క విశేషమైన పరిశుద్ధ సన్నిధిలోనికి తీసుకొని వెళ్లుటకు మనలను సిద్ధపరచుచుండగా ఆయన పరిచర్యకు సమర్పించుకొనుట మన బాధ్యతయైయున్నది.

యేసు యొక్క అర్హతలు మరియు యాజకునిగా ఆయన కార్యములను మనస్సులో ఉంచుకొని, యాజక స్థానము కొరకు పాత నిబంధన ఆకాంక్షలను ఆయన ఏ విధంగా నెరవేర్చాడో చూద్దాము.

ఈ పాఠంలో ఇంతకు ముందు మనము చూసినట్లు, యాజక స్థానము యొక్క చారిత్రిక అభివృద్ధి, ప్రజలు దేవుని యొక్క విశేషమైన పరిశుద్ధ సన్నిధిలోనికి అంగీకరింపబడుటకుగాను దేవునికి మరియు ఆయన ప్రజలకు మధ్య మధ్యవర్తిత్వమును కొనసాగించుటకు యాజక స్థానము భవిష్యత్తులో కొనసాగుతుంది అనే ఆకాంక్షను సృష్టించింది. యాజక స్థానము యొక్క కార్యములను చేయుట ద్వారా యేసు ఈ ఆకాంక్షలను నెరవేర్చాడని ఇంతకు ముందే మనము చూశాము. కాబట్టి, ఈ భాగములో, యాజక స్థానము యొక్క భవిష్యత్తును గూర్చి కొన్ని పాత నిబంధన ప్రవచనములను యేసు నెరవేర్చిన కొన్ని మార్గముల మీద మన దృష్టిని కేంద్రీకరిద్దాము.

మన చర్చ మూడు భాగములుగా విభజించబడింది. మొదటిగా, గొప్ప ప్రధాన యాజకుని గూర్చి ఇవ్వబడిన ప్రవచనమును మనము చూద్దాము. రెండవదిగా, ఈ గొప్ప యాజకుడు రాజుగా సేవించుటను గూర్చి ఇవ్వబడిన ప్రవచనమును మనము చూద్దాము. మరియు మూడవదిగా, దేవుని ప్రజలు యాజకుల రాజ్యము అవుతారని ఇవ్వబడిన ప్రవచనమును చూద్దాము. గొప్ప ప్రధాన యాజకుని గూర్చి ఇవ్వబడిన ప్రవచనమును యేసు ఎలా నెరవేర్చాడో చూస్తూ ఆరంభిద్దాము.

అనేక విధాలుగా, కొన్నిసార్లు స్పష్టముగా, మెస్సీయ రాజ్యములోనికి నడిపించు ఒక గొప్ప ప్రధాన యాజకుడు రాబోవుచున్నాడని, మరియు ఆయన స్వయంగా మెస్సీయ అని పాత నిబంధన ప్రవచించింది. కీర్తనలు 110 ప్రకారం, ఈ గొప్ప ప్రధాన యాజకుడు “మెల్కీసెదకు క్రమమునకు” చెందినవాడు అవుతాడు, అనగా ఆయన అహరోను వారసుడు అయ్యుండడు. ఆయన తన స్థానములో నిత్యము సేవిస్తాడు, అనగా తన బాధ్యతను నెరవేర్చుట నుండి మరణము ఆయనను ఆపుచేయలేదు. మరియు హెబ్రీ పత్రిక యొక్క రచయిత ప్రకారం, ఈ ప్రవచనములన్నీ యేసులో నెరవేరాయి.

హెబ్రీ. 7:21-22 కీర్తనలు 110:4ను ఉద్ధరణముగా చెబుతూ, ఈ విధంగా వ్యాఖ్యానిస్తుంది:

మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, నీవు నిరంతరము యాజకుడవై యున్నావని ప్రభువు ప్రమాణము చేసెను (హెబ్రీ. 7:20-21).

మెస్సీయ శాశ్వత యాజకునిగా ఉంటాడని దేవుడు ప్రమాణం చేసినప్పుడు, రానున్న గొప్ప ప్రధాన యాజకుడు మెస్సీయ అని ఆయన నూతన నిబంధనను తెస్తాడని దేవుడు తెలియపరచినట్లు హెబ్రీ పత్రిక రచయిత సెలవిచ్చాడు. మరియు హెబ్రీ పత్రికలోని ఇదే వాక్యభాగం ప్రకారం, యేసు గొప్ప ప్రధాన యాజకుడైయున్నాడు.

వాస్తవానికి, ప్రవచించబడిన గొప్ప ప్రధాన యాజకునిగా యేసు యొక్క పాత్రను హెబ్రీ పత్రిక కనీసం పదిసార్లు ప్రస్తావిస్తుంది. అంతేగాక యేసును “క్రీస్తు”గా లేక “మెస్సీయ”గా అది తరచుగా సంభోదిస్తుంది మరియు నూతన నిబంధనను తెచ్చువాడు ఆయనేనని 8, 9 మరియు 12 అధ్యాయములలో అది స్పష్టముగా తెలియజేస్తుంది. క్రొత్త నిబంధనలో ఏ ఇతర పుస్తకము కంటే ఎక్కువగా, యేసు గొప్ప ప్రధాన యాజకుని గూర్చిన పాత నిబంధన ఆకాంక్షను నెరవేర్చుచున్నాడని హెబ్రీ పత్రిక నిస్సందేహముగా రుజువు చేస్తుంది.

గొప్ప ప్రధాన యాజకుడు రాజుగా కూడా పాలిస్తాడు అనునది యేసును గూర్చి పాత నిబంధన కలిగియుండిన రెండవ ఆకాంక్ష.

ఆదాము కాలము మొదలుకొని అబ్రాహాము కాలము వరకు యాజకడు మరియు రాజు స్థానములు ఒకే వ్యక్తిలో ఐక్యపరచబడిన విషయమును మనము చూడవచ్చు. ఇశ్రాయేలును రాజులు పాలించిన కాలములో అవి వేరుపరచబడినప్పటికీ, తుదకు మెస్సీయ యొక్క వ్యక్తిత్వములో అవి మరలా ఐక్యపరచబడతాయని పాత నిబంధన ప్రవచించింది. ఈ విషయము కీర్తనలు 110:2-4, మరియు జెకర్యా 6:13లో ప్రస్తావించబడింది.

మనము ఈ పాఠంలోను మరియు మునుపటి పాఠములలోను చూసినట్లు, యేసు మెస్సీయగా వచ్చినప్పుడు, ఆయన రాజు స్థానమును మరియు యాజకత్వ స్థానమును రెండిటిని తీసుకున్నాడు. ఇది మార్కు 8:29; లూకా 23:3; మరియు హెబ్రీ. 8–9 వంటి వాక్యభాగములలో ప్రస్తావించబడింది.

యేసు రాక మునుపు, అహరోను యాజకత్వము వెయ్యి సంవత్సరములకు పైగా దేవుని ప్రజలను సేవించింది. కాని వారి పరిచర్య వారిని మించిన రానున్న మెస్సీయ వైపుకు చూపింది మరియు ఆయన యాజకునిగాను రాజుగాను రానైయుండెను. వాస్తవానికి, అపొ. 6:7 ప్రకారం, యెరూషలేము మరియు ఇశ్రాయేలులో ఉన్న అనేకమంది యాజకులు యేసును మెస్సీయగా గుర్తించి ఆయన అనుచరులయ్యారు.

యేసు ఎన్నడును స్వతంత్ర యాజకత్వమును స్థాపించలేదు కాబట్టి, దేవాలయము మరియు అహరోను యాజకత్వము యొక్క కొనసాగు పరిచర్యను నిర్థారించలేదు కాబట్టి, ఇశ్రాయేలు యాజకుల నుండి ఆయన పొందిన మద్దతు ఆ యాజకులు మెస్సీయ వచ్చినప్పుడు ఆయన తన వ్యక్తిత్వములో ప్రధాన యాజకుడు మరియు రాజు యొక్క స్థానములను ఐక్యపరుస్తాడను పాత నిబంధన బోధను అర్థము చేసుకున్నారు అని సూచిస్తుంది. మరియు మనము ఇంతకు ముందు చూసినట్లు, యేసు చేసినది ఖచ్చితముగా ఇదే.

యేసు యొక్క యాజకత్వము నెరవేర్చిన విశేషముగా ప్రవచించబడిన మూడవ ఆకాంక్ష ఏమనగా, గొప్ప ప్రధాన యాజకుడు దేవుని ప్రజలను యాజకుల రాజ్యము అగునట్లు నడిపిస్తాడు.

దేవుని ప్రజలు యాజకుల దేశముగా లేక రాజ్యముగా అయ్యే కాలమును గూర్చి నిర్గమ. 19:6 మరియు యెషయా 61:6 ప్రవచించాయని మనము ఇంతకు ముందే చూశాము. ఆయన ఇచ్చిన పనిని చేయుట ద్వారా, స్తుతి మరియు విధేయతా బలులను అర్పించుట ద్వారా, మరియు తమకు ఇవ్వబడిన ఇతర యాజక కార్యములను చేయుట ద్వారా వారంతా దేవుని పరిశుద్ధ సన్నిధిలో సేవ చేస్తారు. మరియు ప్రాముఖ్యముగా, లూకా 4లో నమోదు చేయబడిన యేసు యొక్క ప్రసంగములో, ప్రభువు యెషయా 61ని ఉద్ధరణముగా చెబుతూ దానిని నెరవేర్చానని తెలియపరచాడు. ఈ విధంగా, తాను స్వయంగా దేవుని ప్రజలను యాజకుల రాజ్యముగా మార్చుతానని యేసు సూచించాడు. మరియు క్రొత్త నిబంధనలోని ఇతర భాగముల వలెనె, ఆయన ఇదే చేశాడు.

ఉదాహరణకు, 1 పేతురు 2:5లో, పేతురు సంఘమును “పరిశుద్ధ యాజకులు” అని పిలచాడు. మరియు 9వ వచనములో “రాజులైన యాజకులు” అని పిలచాడు. ఇదే ఆలోచనను మనము ప్రకటన 1:6, 5:10, మరియు 20:6లో చూడవచ్చు.

ఒక ఉదాహరణగా, ప్రకటన 1:6లో యేసును గూర్చిన ఈ మాటలను వినండి:

ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను (ప్రకటన 1:6).

మెస్సీయగా, యేసు గొప్ప ప్రధాన యాజకునిగా పాలించు రాజైయున్నాడు, మరియు ఆయన తన అనుచరులందరిని తన రాజ్యములో యాజకులుగా సేవించుటకు నియమిస్తాడు.

పాత నిబంధనలో నుండి మనము నేర్చుకొను ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దానిలోని ముఖ్యమైన మత నాయకులు అందరూ యాజకులైయున్నారు. కాని క్రొత్త నిబంధనలో క్రైస్తవులలో కొందరు మాత్రమేగాక, విశ్వాసులందరు యాజకులేనని మనము కనుగొంటాము. ఈ సత్యము చాలాసార్లు సుపరిచితమైన ఈ మాట ద్వారా తెలియజేయబడుతుంది, “విశ్వాసులందరి యొక్క యాజకత్వము.” క్రైస్తవులందరు పరిచర్య చేయుటకు, క్రీస్తు శరీరములో యేసు యొక్క చేతులుగాను, హృదయముగాను, కళ్లుగాను ఉండుటకు పిలువబడ్డారు అను విషయమును మనము ఉద్ఘాటించాలి. ఇప్పుడు, ఇది ఎంతో బలమైన ఒక సత్యము. ఈ అద్భుతమైన సత్యమును అర్థము చేసుకొనుట వలన కలుగు ఒక చారిత్రిక నాటకీయమైన పరిణామము ఏమిటంటే, ఇక ఏ ఒక్కరు కూడా తమకు మరియు దేవునికి మధ్య ఒక మధ్యవర్తిగా, లేక వంతెనగా ఉండుటకు మరొక మానవుని పరిగణించవలసిన అవసరత లేదు. మీకు దేవునికి మధ్య ఒక మధ్యవర్తులను పెట్టు ఏ వ్యవస్థ అయినా మిమ్మును దుర్వినియోగం చేయుటకు, సామాజికముగా నియంత్రించుటకు, బంధించుటకు ప్రయత్నిస్తుంది అంతే. కాబట్టి ఇది ఎంతో బలపరచు గౌరవమునిచ్చు మరియు విమోచించు సత్యమైయున్నది, అయినను, ఈ సత్యము దేవుడు తన శరీరమునకు వివిధ వరములను ఇచ్చాడను సత్యమును, మరియు ఆ వరములలో, నాకు నచ్చిన మరియు నన్ను సేవించినవారిలో నేను మెచ్చిన కాపరి వరమును త్రోసిపుచ్చదు. కాపరి వరమునకు ఒక ప్రత్యేకమైన హృదయము కావాలి. దానిలో కాయుటకు, నడిపించుటకు, ప్రోత్సహించుటకు, మరియు ఆదరించుటకు హృదయము మరియు నైపుణ్యము అవసరము. ఇది ఇతరులకు మరియు వారి దేవునికి మధ్య నిలబడుట కాదు. ఇది వారు తమ మంచి పనిని చేయుచు తమను తాము ఆ పని కొరకు క్రమశిక్షణలో పెట్టుచుండగా దేవుడు వారి మనస్సులకు జ్ఞానము కలిగించుచుండగా లేఖనములను అనువదించుటకు వారికి ఇవ్వబడిన హక్కును చిన్నచూపు చూచుట కాదు. కాని ఇది మనకు ఇవ్వబడిన కృప అయ్యున్నది, ఇది ప్రతి ఒక్కరు యాజకునిగా ఉన్న ప్రయాణములో మనకు సహాయపడుతుంది, మరియు ఈ యాజకులందరు కాపరి శ్రద్ధను గౌరవిస్తారు మరియు హత్తుకుంటారు.

— డా. గ్లెన్ స్కోర్గి

యేసు యాజక స్థానమును నెరవేర్చుట మనకు ఎంతో ముఖ్యమైన ఒక విషయమును జ్ఞాపకము చేస్తుంది. సృష్టిలో దేవుని యొక్క వాస్తవిక ఉద్దేశములు పాపము ద్వారా క్లిష్టపరచబడినవి, కాని పాపము వాటిని అధిగమించలేదు. యేసు స్వయంగా వచ్చుట మరియు యాజక అర్హతలను నెరవేర్చుట దేవుని ప్రణాళికల యొక్క మంచితనము పట్ల తన నమ్మకత్వమును చూపాయి. ఆయన ఆ స్థానమును బలపరచుట మరియు దాని యొక్క ఉన్నతమైన అర్థము దేవుని ప్రణాళికను కొనసాగించుటలో ఆయన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మరియు రాజుగా పరిపాలించి గొప్ప ప్రధాన యాజకునిగా యేసు యాజక పరిచర్య యొక్క వాస్తవిక మరియు ఊహించదగిన విషయములను నెరవేర్చుతాడు. కాబట్టి, ఆయన ప్రజలుగా, యేసును గౌరవించుటకు, ఆరాధించుటకు, నమ్ముటకు, మరియు ఆయన యాజకుల రాజ్యముగా నమ్మకముగా ఆయనను సేవించుటకు ఒక గొప్ప కారణముంది.

ఇప్పటి వరకు, యాజక స్థానమునకు పాత నిబంధన నేపథ్యమును, మరియు యేసులో దాని యొక్క నెరవేర్పును మనము చూశాము. కాబట్టి, ఈ సమయములో, యేసు యాజకత్వము యొక్క ఆధునిక అనువర్తనను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. గొప్ప ప్రధాన యాజకునిగా యేసు యొక్క పాత్ర నేటి మన జీవితముల మీద ఎలాంటి ప్రభావమును చూపుతుంది?

క్రీస్తు యాజక కార్యము యొక్క ఆధునిక అనువర్తనను పరీక్షించుటకు ఒక సులువైన మార్గమును వెస్ట్మినిస్టర్ షార్టర్ కేటకిజం, 25వ జవాబులో మనము చూడవచ్చు, అక్కడ ఇలా వ్రాయబడియున్నది:

దేవుని యొక్క న్యాయమును తీర్చుటకు తనను తాను ఒకేసారి బలిగా అర్పించుకొనుట ద్వారా, మరియు దేవునితో మనలను సమాధానపరచుట ద్వారా, మరియు మన కొరకు నిరంతరము విజ్ఞాపన చేయుట ద్వారా క్రీస్తు యాజక స్థానమును నెరవేర్చుచున్నాడు.

ఈ జవాబులో, ఆయన విశ్వాసులకు చేసిన పరిచర్య దృష్ట్యా క్రీస్తు యొక్క యాజక కార్యమును కేటకిజం క్రోడీకరిస్తుంది. మరియు ఇది ఆయన చేసిన కార్యములో కనీసం మూడు విషయములను తెలియజేస్తుంది. మొదటిగా, క్రీస్తు యొక్క స్వయం-బలి పరిచర్యను గూర్చి ఇది మాట్లాడుతుంది. రెండవదిగా, అందరి కొరకు ఒకేసారి చేయబడిన ఆయన సమర్పణ పరిచర్య విశ్వాసులు మరియు దేవుని మధ్య సమాధానమునకు కారణమైనది అని చెబుతుంది. మరియు మూడవదిగా, విశ్వాసులు మరియు దేవుని మధ్య ఆయన చేయుచున్న కొనసాగు విజ్ఞాపనను గూర్చి మాట్లాడుతుంది.

యేసు యాజక స్థానము యొక్క ఆధునిక అనువర్తనను గూర్చిన మన చర్చ వెస్ట్మినిస్టర్ షార్టర్ కేటకిజం అందించిన ఉద్ఘాటనలను అనుసరిస్తుంది. మొదటిగా, క్రీస్తు యొక్క బలిని మనము చూద్దాము. రెండవది, ఆయన చేసిన సమాధాన కార్యము మీద దృష్టిపెడదాము. మరియు మూడవదిగా, క్రీస్తు చేసిన విజ్ఞాపన యొక్క అనువర్తనను మనము పరిగణించుదాము. మొదటిగా బలిని చూద్దాము.

క్రీస్తు అర్పించిన బలి యొక్క అనువర్తనను మనము ఇవ్వవలసిన మూడు ప్రతిస్పందనల దృష్య్టా చూద్దాము: రక్షణ కొరకు ఆయనను నమ్మాలి; ఆయనను మరియు ఆయన ప్రేమించువారిని నమ్మకముగా సేవించాలి; మరియు ఆరాధన. నమ్మకము అను విషయమును చూస్తూ మొదలుపెడదాము.

దేవుడిచ్చు రక్షణ బహుమానము సిలువ మీద యేసు అర్పించిన బలి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని లేఖనము బోధిస్తుంది. పాపులను రక్షించుట కొరకు క్రీస్తు సిలువ మీద మరణించాడు. ఈ పాఠంలో ఇంతకు ముందు మనము నేర్చుకున్న మాటలను ఉపయోగించుటకు, ఆయనయందు విశ్వాసముంచువారి అపరాధమును తీసివేయుటకు ఆయన దేవుని శాంతింపజేశాడు, మరియు దేవుని న్యాయమును ఉగ్రతను సంతృప్తిపరచాడు.

మరియు అట్టి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తు అనుగ్రహించు పాప క్షమాపణను పొందుటకు, ఆయనను మనము నమ్మాలి, ఆయనను మాత్రమే నమ్మాలి. ఆయన మన పాపముల కొరకు మరణించిన దేవుని కుమారుడని మరియు ఆయన మన కొరకు అర్పించిన అర్పణ వలననే మనము క్షమించబడ్డామని మనము నమ్మాలి. యోహాను 20:31, రోమా. 10:9-10, మరియు 1 యోహాను 4:14-16 వంటి చోట్ల ఈ నమ్మికను గూర్చి లేఖనము మాట్లాడుతుంది.

మన రక్షణ యేసు అర్పించిన బలి మీద ఆధారపడియున్నదని, మరియు అది ఆయన చేసిన కార్యము ద్వారానే ప్రభావితమైయ్యిందని క్రీస్తు అనుచరులు నమ్మాలి. ఇంకా ఎవ్వరు మనలను రక్షించలేరు.

అపొ. 4:12లో పేతురు ప్రకటించినట్లు:

మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను (అపొ 4:12).

మనము రక్షణను సంపాదించలేము. ఏ సంఘము లేక పరిశుద్ధుడు మనకు దానిని ఇవ్వలేడు. మనలను రక్షించుటకు క్రీస్తు యొక్క గుణములు మరియు ఆయన అర్పించిన బలిని మాత్రమే మనము నమ్మాలి.

యేసు మీద మాత్రమే మనము నమ్మిక ఉంచినప్పుడు, దేవుని ఎదుట మనము నిశ్చయతను ఆనందమును కలిగియుండవచ్చు. తండ్రి ఆజ్ఞాపించిన ప్రతిదానిని యేసు నమ్మకముగా చేశాడు. మరియు ఆయన మనకు వాగ్దానము చేసిన ప్రతిదానిని కూడా నమ్మకముగా చేస్తాడనే నిశ్చయతను కూడా మనము కలిగియుండవచ్చు.

హెబ్రీ. 10:20-22లో ఇలా వ్రాయబడియున్నది:

ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను, దేవుని యింటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను ... విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము (హెబ్రీ. 10:20-22).

ఇక్కడ ప్రస్తావించబడిన ధైర్యమును నమ్మకము అని కూడా పిలవవచ్చు. మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయుటకు యేసు అర్పించిన బలి సరిపోతుందని మరియు అది మనలను రక్షించుట నుండి ఏ విధముగా కూడా విఫలము కాదనే స్థిరమైన నమ్మకము ఇది.

రక్షణను అనుభవించుట రక్షణకు ఒక చిహ్నముగా ఉన్నది. దేవుని కుటుంబములో సభ్యులమై ఉన్న భావన మనకుంది. మనము దేవుని పిల్లలమని పరిశుద్ధాత్మ మన ఆత్మకు సాక్ష్యమిస్తాడని బైబిలు చెబుతుంది. కాబట్టి, నిజమైన దేవుని పిల్లలకు ఆ దత్తతు అనుభవం ఉంటుంది. అంటే రక్షణను గూర్చి మనము కలిగిగియున్న నిశ్చయత యొక్క స్థాయిలో భేదములు ఉండవని దీని అర్థము కాదు. ఆ నిశ్చయతలో మనము ఎదగాలని ఆశపడతాము గాని, అది నిశ్చయముగా కాలక్రమములో వస్తూ పోతూ ఉంటుంది. యేసు మన స్థానమును తీసుకునప్పుడు మన కొరకు ఏమి చేశాడో అర్థము చేసుకొని ఒకరికొకరము సహాయం చేసుకొనుటకు సువార్తను అర్థము చేసుకొని అనుదినము దానిని మనకు మనము ప్రసంగించుకొనుటకు ప్రయత్నించాలి. సహవాసములో మనము ఇదే చేస్తాము, మన దత్తతును గూర్చి, మన రక్షణను గూర్చి, మనము పొందిన క్షమాపణను గూర్చి ఎక్కువ నిశ్చయత కలిగియుండుటలో ఒకరికొకరము సహాయపడతాము, మరియు మనము వాక్యమును ధ్యానించుటకు కూర్చునప్పుడు పరిశుద్ధాత్ముడు దీనిని మన హృదయములలో నాటుతాడు మరియు క్రీస్తును గూర్చి ఆయన చేసిన కార్యములను గూర్చి మనము మరిఎక్కువ నిశ్చయతను పొందుకుంటాము. కాబట్టి, ప్రతి విశ్వాసి కలిగియున్న రక్షణ నిశ్చయత దినదినము వస్తూ పోతూ ఉంటుంది, కాని సాధారణముగా కాలక్రమములో కొనసాగు ఎదుగుదల ఉంటుంది.

— డా. కే. ఎరిక్ ధోయెన్స్

నిజమైన విశ్వాసులు తమ రక్షణను గూర్చి సందేహించగలరా? నిరపేక్షంగా. దీనికి ఒక ఉదాహరణను లేఖనములో చూడవచ్చు. వీటిని మనము ఏలీయా సొరచెట్టు క్రింద కూర్చొని ఉన్న సందర్భములో చూడవచ్చు; దేవునితో తాను కలిగియున్న అనుబంధమును గూర్చి ప్రశ్నలు అడుగుతూ దావీదు రచించిన కొన్ని విలాప కీర్తనలలో దీనిని చూడవచ్చు. దీనిని మనము పేతురు యొక్క ఆత్మకథలో, యేసును తిరస్కరించిన వెంటనే, బయటకు వెళ్లి విలపించిన సందర్భములో చూడవచ్చు. ఖచ్చితముగా. నిజమైన విశ్వాసులు తమ రక్షణను సందేహించవచ్చు. మీకు తెలుసుకదా, మన రక్షణ “నాకు ఉన్న నిశ్చయత స్థాయి ద్వారా రక్షించబడ్డాను,” అని కాదు. కొన్నిసార్లు ఇవాంజెలికల్ క్రైస్తవులమైన మనము ఆ దిశలో వెళ్తున్నట్లు అనిపిస్తుంది. ప్రజలను సాక్ష్యమివ్వమని అడుగుతాము — నాకు ఒక సాక్ష్యముంది; నేను పౌలు వంటి మారుమనస్సు అనుభవము కలిగియున్నాను. అది అనుకోకుండా నాటకీయముగా జరిగింది. మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు ఒక గంట ఒక నిమిషం ఇవ్వగలను. ఒకప్పుడు యేసు ఉన్నాడని నేను నమ్మేవాడను కాదు, అసలు పట్టించుకునేవాడినే కాదు, కాని 24 గంటలలోనే, ఆయన దేవుని కుమారుడని మరియు నా రక్షకుడని నేను నమ్మాను. కాని క్రీస్తు యొక్క ముగించబడిన మరియు సాధించిన కార్యము వలననే విశ్వాసము ద్వారా కృప మూలముగా నేను రక్షింపబడ్డాను గాని నేను కలిగియుండిన నిశ్చయత స్థాయి ఆధారంగా కాదు. మీరు కలిగియున్న నిశ్చయతను అనేక విషయాలు దొంగిలించగలవు. అనుకోకుండా జరుగు విషాదములు, అనగా లోకములో మీరు బహుగా ప్రేమించు స్త్రీని లేక పురుషుని ప్రభువు పిలచిన పరిస్థితులు మిమ్మును కంగుతినిపించగలవు. కొన్నిసార్లు భౌతిక, మానసిక కారణములు ఉంటాయి. కొంతమంది వారిలో ఉన్న వెలితిని మాత్రమే చూడడానికి ప్రయత్నిస్తారు. వారు ఎప్పుడు చూసినా ప్రశ్నిస్తూనే ఉంటారు. ఈ లోకములోని “ఇయోరీలు” మనందరికీ తెలుసు, మరియు నేను వారిలో ఒకడిని అని, ప్రకృతిని గూర్చి ఎల్లప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటానని నా ఆలోచన. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, దైవిక కారణాలు, ఉదాహరణకు దేవుడు కొన్నిసార్లు ఆయన సన్నిధి యొక్క వెలుగును మన నుండి దూరము చేస్తాడు అని, మనము ఆయనను మరి ఎక్కువగా ఆశించునట్లు తనను తాను మన నుండి దూరము చేసుకుంటాడని, మరియు ఆయన సన్నిధి కొరకు తాపత్రయపడుట మనలను ఎదిగింపజేసి మన విశ్వాసమును ఉద్ఘాటిస్తుంది అని 17వ శతాబ్దము నాటి వెస్ట్మినిస్టర్ షార్టర్ కేటకిజం సూచిస్తుంది. ఇది సులువైన అనుభవము కాదు. కాని తల్లిదండ్రులు కొన్నిసార్లు ఇలా చేస్తారు. అప్పుడప్పుడే నడచుట నేర్చుకున్న తమ బిడ్డ చేతులను వారు విడచిపెడతారు. వారు ఒకవేళ పడిపోతుంటే పట్టుకొనుటకు వారు ప్రక్కనే ఉంటారు, కాని ఒక క్షణం పాటు వారు ఎలాంటి సహాయం లేకుండా ఉంటారు. ఇంచుమించు ఇలాంటిదే, దేవుడు మనతో చేస్తాడు, మనము ఆయన కొరకు తాపత్రయపడునట్లు చేస్తాడు, ఫలితముగా మనము ఎదుగుతాము.

— డా. డెరెక్ డబ్ల్యు. హెచ్. థామస్

క్రీస్తు చేసిన బలికి నమ్మకము స్పందనగా ఉండాలని మనము చూశాము కాబట్టి, ఆయన అర్పించిన బలి ద్వారా పురికొల్పబడి మనము అందించవలసిన సేవను చూద్దాము.

మన కొరకు యేసు అర్పించిన బలి మనము ఆయనను నమ్మకముగా సేవించునట్లు పురికొల్పాలని బైబిలు బోధిస్తుంది. రోమా. 6వ అధ్యాయం అంతటా, యేసు మనలను రక్షించుటకు మరణించాడు కాబట్టి, మనము ఆయనను ప్రేమించి ఆయనకు విధేయులవ్వబద్దులమైయున్నామని పౌలు స్పష్టము చేశాడు. మనకు నూతన జీవమునిచ్చుటకు — పాపము యొక్క ప్రభుత్వము నుండి మనలను స్వతంత్రులను చేయు జీవితము — ఆయన మరణించాడు. ఈ రక్షణ కొరకు మనము కృతజ్ఞతలు తెలుపవలసిన ఒక మార్గము ఏమనగా మన జీవితములలోని పాపముతో పోరాడుట, మరియు దానికి మరియొకసారి విధేయులగుటకు నిరాకరించుట.

రోమా 6:2-4లో పౌలు ఇలా వ్రాస్తున్నాడు:

... పాపము విషయమై చనిపోయిన మనము ఇకమీదట ఏలాగు దానిలో జీవించుదుము? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడ పాతిపెట్టబడితివిు.

పాపము యొక్క ప్రభుత్వము నుండి మనలను స్వతంత్రులను చేయుటకు యేసు మరణించాడు. ఆయనకు ఇష్టానుసారమైన మార్గములలో నడచుట ఆ బలికి మనము ఇవ్వదగిన సరియైన స్పందన.

ఆయన బలికి అనుగుణంగా మనము క్రీస్తును ఇంకా అనేక విధాలుగా సేవించవచ్చు అని లేఖనము తెలియజేస్తుంది. నిశ్చయముగా, ఆయన ఉద్దేశముల కొరకు శ్రమపొందుటకు మరియు మరణించుటకు కూడా సిద్ధపడుట ద్వారా క్రీస్తు యొక్క మాదిరిని మనము అనుసరించవచ్చు. వాస్తవానికి, క్రీస్తు కొరకు మనము శ్రమను అనుభవించుట గొప్ప సౌభాగ్యము మరియు ఆశీర్వాదము అని అపొ. 5:41 మరియు ఫిలిప్పీ. 1:29 వంటి లేఖనభాగములు సూచిస్తున్నాయి.

యేసు రక్షించుటకు మరణించిన ప్రజల కొరకే మనలను మనము సమర్పించుకొనుట ద్వారా క్రీస్తును సేవించమని కూడా బైబిలు మనలను ప్రోత్సహిస్తుంది. ఒకరితో ఒకరము ఓరిమి కలిగి దయతో వ్యవహరించమని ఎఫెసీ. 4:32-5:2 బోధిస్తుంది. విశ్వాసములో బలహీనులైనవారి కొరకు మనకు ఇవ్వబడిన స్వతంత్రతలను కూడా విడిచిపెట్టమని రోమా 14 మరియు 1 కొరింథీ. 8 బోధిస్తాయి. అంతేగాక, క్రీస్తు వలె ఇతర విశ్వాసుల కొరకు మన ప్రాణములను కూడా ధారపోయమని అది మనకు ఆజ్ఞాపిస్తుంది. 1 యోహాను 3:16లో యోహాను వ్రాసినట్లు:

ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరులనిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైయున్నాము (1 యోహాను 3:16).

యేసు సిలువ మీద అందరి కొరకు ఒకేసారి అర్పించిన బలి దాని యొక్క ఉద్దేశము కొరకు, అనగా, పాపముల కొరకు దేవుడిచ్చు న్యాయమైన శిక్షను తనపై తీసుకొనుటకు పూర్తిగా సరిపోతుంది. ఇతర మానవులను ప్రక్కన పెట్టండి, మనము ఎన్నడు మన కొరకు మనము కూడా ప్రాయశ్చిత్తము చేసుకొనలేము. కాని ఇతరుల కొరకు మన జీవితములను సమర్పించుకొనుట ద్వారా మనము యేసు యొక్క మాదిరిని అనుసరించవచ్చు.

మరియు వారి కొరకు మరణించుటకు మనము సిద్ధముగా ఉంటే, మన సమయము, మన డబ్బు, మన సౌకర్యము, మరియు మన ఆస్తులను వారిని సేవించుట కొరకు విడచి తక్కువ అర్పణలను కూడా మనము చేయవచ్చు.

ఇతరులను ప్రేమించుట యొక్క ప్రాముఖ్యతను గూర్చి మాట్లాడుట చాలా సులభమే. కాని ఈ ఆలోచనలను అనుసరించుట కొన్నిసార్లు మనకు కష్టమవుతుంది. ప్రజలను సరిగా ప్రేమించుటకు, మనము అతిగా ప్రేమించువాటిని — మన సమయము, మన ఆస్తులు, మరియు మన సౌకర్యము — మనము విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉండాలి. ఇతరులను ప్రేమించుట కొరకు కొన్ని సమర్పణలు మాత్రమే అవసరమైయున్నవి. దేవుని రాజ్యము మరియు దాని నీతికి, మన సొంత సౌకర్యముల కంటే ఎక్కువ విలువనిచ్చుట మనకు కష్టమవుతుంది. కాని అలా మనము చేయలేనప్పుడు, ఒక ప్రాముఖ్యమైన సత్యమును మనము కోల్పోతాము: ఈ అర్పణల కంటే ఎక్కువగా ఈ అర్పణలను అర్పించినప్పుడు మనము పొందుకుంటాము. ఇతరుల కొరకు మన జీవితములను అర్పించుట ద్వారా దేవుని ఆరాధించు మరియు ఈ లోకములో ఆయన రాజ్య వ్యాప్తిని వీక్షించు అవకాశమును మనము పొందుకుంటాము.

క్రీస్తు యొక్క బలికి రెండు ఆధునిక అనువర్తనములైన నమ్మకము మరియు సేవను మనము చూశాము కాబట్టి, ఆరాధన వైపుకు మన దృష్టిని మళ్లించుదాము.

క్రైస్తవులముగా, యేసు మన కొరకు సిలువ మీద చేసిన కార్యమును జ్ఞాపకము చేసుకునప్పుడు ఆయనను ఆరాధించుటకు పురికొల్పబడతాము. ఆయన చేసిన నిస్వార్థమైన బలి ఆయన మన పట్ల చూపిన ప్రేమను బట్టి ఆయనను స్తుతించుటకు మన హృదయములను పురికొల్పుతుంది. మరియు ఆయన మన కొరకు వెలబెట్టి కొనిన అద్భుతమైన రక్షణ ఆశీర్వాదములను బట్టి ఆయనకు మరలా మరలా కృతజ్ఞతలు తెలుపుటకు మనలను ప్రేరేపిస్తుంది.

మరియు యేసు అర్పించిన బలి తండ్రి మరియు ఆత్మను కూడా ఆరాధించునట్లు మనలను ప్రేరేపించాలి. ఎందుకంటే, యోహాను 14:31 వంటి లేఖనముల ప్రకారం, యేసు అర్పించిన బలి తండ్రి యొక్క ప్రణాళిక అయ్యున్నది. మరియు యేసు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తనను తాను అర్పించుకున్నాడని హెబ్రీ. 9:14 బోధిస్తుంది. కాబట్టి, తండ్రి మరియు ఆత్మ కూడా మనము యేసుకు చేయు స్తుతి ఆరాధనలకు అర్హులైయున్నారు.

యేసు యొక్క బలి మనలను ఆరాధించుటకు ప్రోత్సహించుట మాత్రమేగాక, ఆరాధన కొరకు ఒక మాదిరిగా కూడా పని చేస్తుంది. రోమా 12:1లో పౌలు ఏమని వ్రాస్తున్నాడో ఒకసారి చూడండి:

కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది (రోమా 12:1).

ఈ లేఖనభాగము స్వాభావికముగా రెండు ప్రశ్నలను లేవనెత్తుతుంది. మొదటిగా, సిలువపై యేసు యొక్క మరణము ఒక ఆరాధనా కార్యము ఎలా అవుతుంది? రెండవదిగా, దానికి అనుగుణంగా మన సొంత ఆరాధనను మనము ఎలా నిర్మించగలము?

మొదటి ప్రశ్నకు జవాబుగా, సిలువపై యేసు యొక్క మరణము ఆరాధనా కార్యమైయున్నది, ఎందుకంటే పాత నిబంధనలోని బలులు స్థాపించిన పాత నిబంధన ప్రతీకలను మరియు మాదిరిలను అది నెరవేర్చింది. పాత నిబంధనలో, దేవుని ఆరాధన బలుల వ్యవస్థ చుట్టూ కేంద్రీకృతమైయుండినది. మరియు ఈ పాత నిబంధన బలులు అన్ని యేసు యొక్క బలి వైపుకు చూపాయని హెబ్రీ. 9 బోధిస్తుంది. మరియు యేసు మన కొరకు పరోక్షంగా బలి అర్పించబడలేదు అని కూడా అది సెలవిస్తుంది. బదులుగా, ఆయన ప్రత్యక్షముగా మన కొరకు బలి అయ్యాడు. ఆయన పాత నిబంధన ఆరాధనా నియమాలను అనుసరించి, బల్యార్పణగా తనను తాను దేవునికి అప్పగించుకున్న ప్రధాన యాజకుడు. మరియు ఈ కారణము చేత, మన అర్పణలలో కూడా ఆరాధన ఇమిడియున్నది.

అయితే మనము మన ఆరాధనను యేసు యొక్క బలికి అనుగుణంగా ఎలా నిర్మించగలము? మనము ఎటువంటి అర్పణలు చేయవలసియున్నది? సరే, దేవుడు అర్పణగా పరిగణించు అనేక విషయములను లేఖనము మన కొరకు సూచిస్తుంది. మనము ఇంతకు ముందే చూసినట్లు, మన శరీరములను సజీవయాగముగా దేవునికి సమర్పించుట ద్వారా మనము క్రీస్తును అనుకరించవచ్చు అని రోమా. 12:1 తెలియజేస్తుంది. అయితే 2వ వచనము దీని అర్థమును వివరిస్తూ కొనసాగుతుంది: మనము లోకానుసారముగా జీవించకూడదు; బదులుగా, క్రీస్తులో నూతనపరచబడిన మనస్సులు మనలను నూతన అలవాట్లలోనికి నడిపించునట్లు అవకాశం ఇవ్వాలి. మన శరీరములను పాపభరితమైన ఉపయోగముల నుండి దూరముగా ఉంచి, దేవునికి మహిమను కలిగించు నూతనమైన మార్గములలో మనము ప్రవర్తించాలి.

ప్రేమగల జీవితమును జీవించుట క్రీస్తు యొక్క బలిని మనము అనుకరించగల రెండవ మార్గమని ఎఫెసీ. 5:1-2 బోధిస్తుంది. సిలువపై యేసు యొక్క మరణము ప్రేమకు ఉన్నతమైన ప్రతిరూపము. కాబట్టి మనము ఒకరిపట్ల ఒకరము దయ మరియు కనికరమును చూపినప్పుడు, మన జీవితములను క్రీస్తు యొక్క ప్రేమగల బలికి అనుగుణంగా మార్చుకొనుచున్నాము.

ఫిలిప్పీ. 4:18 సూచించుచునట్లు, మూడవ విధముగా అర్పణల ద్వారా మనము దేవుని ఆరాధించవచ్చు: ఇతర విశ్వాసులకు సహాయం చేయుటకు మన డబ్బు, నిధులు మరియు సమయమును ఇచ్చుట ద్వారా. ఫిలిప్పీయులు తనకు ఇచ్చిన బహుమానములు దేవునికి ఇవ్వబడిన అర్పణలు మరియు బలులైయున్నవని పౌలు చెప్పాడు, ఎందుకంటే అవి ఫిలిప్పీయుల కొరకు చాలా విలువైనవేగాని అవి దేవుని ప్రేమించువారి కొరకు ప్రయోజకకరమయ్యాయి.

ఇప్పుడు, అవును, ఈ సూచనలు అర్పణల ద్వారా దేవుని ఆరాధించు సాధ్యతల పట్టికను పరిమితము చేయవు. కాని ప్రేమగల అర్పణ ద్వారా దేవుని ఆరాధిస్తూ క్రీస్తు అడుగుజాడలలో మనము నడచుచుండగా ఇవి మంచి ఆరంభ బిందువులుగా ఉన్నాయి.

యేసు అర్పించిన బలిలో నుండి కొన్ని అభ్యాసిక అనువర్తనలను పొందుకొను మార్గములను మనము చూశాము కాబట్టి, ఇప్పుడు ఆయన యాజకత్వ సమాధాన కార్యము మన పరిచర్యను ఏ విధముగా ప్రభావితము చేస్తుందో చూద్దాము.

యేసు చేసిన యాజక సమాధాన కార్యము యొక్క ఆధునిక అనువర్తనను మూడు మార్గములలో చూద్దాము: మొదటిగా అది మనలను దేవునితో సమాధానపరుస్తుంది అని చూద్దాము. రెండవదిగా, అది పెంపొందించు ఐక్యతను చూద్దాము. మరియు మూడవదిగా, అది మనకు అప్పగించు పనిని చూద్దాము. మొదటిగా దేవునితో మనము పొందిన సమాధానమును చూద్దాము.

యేసు మనలను దేవునితో సమాధానపరచినప్పుడు, ఆయన దేవునికి మనకు మధ్య సమాధానమును కలిగించుచున్నాడు. ఈ సమాధాన కార్యమునకు మునుపు, దేవునిపై మనము చేసిన తిరుగుబాటు మనలను ఆయన విరోధులుగా చేసింది, దీనిని మనము రోమా. 5:10 మరియు ఎఫెసీ. 2:2 వంటి చోట్ల చదువుతాము. ఆ సమయములో, మనము దేవుని న్యాయము మరియు ఉగ్రతకు పాత్రులమయ్యాము. కాని మనలను దేవునితో సమాధానపరచుట ద్వారా, ఈ వైరమునకు దేవుడు ముగింపు పలికాడు. ఆయన దేవుని ఉగ్రతను చల్లార్చాడు, మరియు మన మధ్య సమాధానమును కలిగించాడు.

ఇప్పుడు, దేవునికి విరోధులుగా ఉండుటకు బదులుగా, మనము ఆయన ప్రేమించు పిల్లలుగాను, ఆయన రాజ్యములో నమ్మకమైన పౌరులుగాను ఉన్నాము. అనగా మన విరోధులంటే మనము భయపడు విధముగా దేవుడంటే భయపడవలసిన అవసరము లేదు. ఆయన మనలను నాశనము చేయగోరుచున్నాడు అని మనము ఎన్నడు ఆలోచించవలసిన పని లేదు. మన జీవితములు క్రీస్తులో దాచబడియున్నాయి, మరియు తండ్రియైన దేవునికి మరియు కుమారుడైన దేవునికి మధ్య ఉన్న సమాధానమే దేవునికి మనకు మధ్య కూడా ఏర్పడింది. మరియు ఇట్టి సమాధానము మన హృదయములను స్తుతించునట్లు, మన చేతులను కార్యములు చేయునట్లు, మరియు మనస్సులను గొప్ప దేవుని గూర్చి మరి ఎక్కువగా తెలుసుకొనునట్లు చేయాలి.

దీనిని గూర్చి కొలస్సీ. 1:19-22లో పౌలు చెప్పుచున్న మాటలు ఆలకించండి:

ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయనద్వారా సమస్తమును, ... తనతో సమాధానపరచుకొన వలెననియు తండ్రి అభీష్టమాయెను. మరియు గతకాల మందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియలవలన మీ మనస్సులో విరోధభావముగలవారునై యుండిన మిమ్మును కూడ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను (కొలస్సీ. 1:19-22).

“దేవునితో మనము సమాధానం కలిగియున్నాము” అను విషయం ఇక్కడ చాలా చాలా స్పష్టముగా ఉంది. అయితే ఆయన పిల్లలను, విశ్వాసులను క్రమశిక్షణలో పెట్టవలసిన పని ఏమిటి? నా ఆలోచన ప్రకారం, దీనికి సులువైన జవాబు ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవునితో సమాధానము కలిగియుండుట అనగా మనము ఆయనతో అనుబంధములోనికి మరలా చేర్చబడితిమి. దేవుని తెలుసుకొనుటకు, ఆయనను సేవించుటకు, ఆయనను ప్రేమించుటకు, ఆయనకు విధేయులగుటకు, ఆయనను సన్నిహితముగా తెలుసుకొనుటకు మనము సృష్టించబడితిమి. మరియు మన పాపము మనలను వీటి నుండి దూరము చేస్తుంది. రక్షణ మనకు — సమాధానము, శాంతి, మరియు రక్షణను తెలియపరచు ఇతర చిత్రములను — తిరిగి తెస్తుంది, తద్వారా ఇప్పుడు మనము ఆయనతో అనుబంధములో ఉన్నాము. మనము పాపము చేసినప్పుడు, ఆయన మనలను ప్రేమించుచున్నాడు కాబట్టి మనకు నచ్చిన మార్గములో ఆయన మనలను వెళ్లనియ్యడు. ఆయన మనలను వెనుకకు లాగుతాడు. ఆయన మనలను క్రమశిక్షణలో పెడతాడు. అనగా, లేఖనములో ఉపయోగించబడిన రూపకమైన ఒక తండ్రి బిడ్డను క్రమశిక్షణలో పెట్టినట్లు. కాబట్టి నా పిల్లలకు హాని కలిగించు పనులను చేస్తునప్పుడు, నేను వారికి ఆజ్ఞాపించిన పనులను చేయనప్పుడు వారికి నేను అనుమతి ఇస్తే, నేను వారిని ప్రేమించుటలేదు మరియు వారి పట్ల శ్రద్ధ వహించుటలేదు అని అర్థము. మన పరలోక తండ్రి, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా, మనము క్రీస్తు పోలికలోనికి మార్చబడునట్లు మనలను క్రమశిక్షణలో పెడుతున్నాడు. ఇది మన మేలు కొరకే. కాబట్టి ఒకవేళ మనము దేవుని క్రమశిక్షణను అనుభవించకపోతే, అది మన జీవితములో ఒక సమస్యే. క్రమశిక్షణ చెడ్డ పని కాదు; అది మంచి పని, మరియు అది దేవుని పిల్లల పట్ల ఆయన కలిగియున్న ప్రేమను కనుపరుస్తుంది.

— డా. స్టీఫెన్ వెల్లమ్

దేవునితో మనము కలిగియున్న సమాధానము మన కొరకు ఆయన చూపిన గొప్ప కనికరమును ప్రచురపరుస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ దేవుని స్తుతించునట్లు మన హృదయములను పురికొల్పాలి. దేవుని గూర్చి మరియు ఆయన గుణములను గూర్చి దేవునితో ప్రార్థనలో మాట్లాడుటకు అది మనలను ప్రోత్సహించాలి. మన జీవితములలో ఆయన చేసిన అద్భుత కార్యములను గూర్చి ధ్యానించుటకు, మరియు ఆయనను ప్రేమించుటకు అనుసరించుటకు నూతనమైన మార్గములను పరిగణించుటకు అది మనలను పురికొల్పాలి. దేవునితో విశ్వాసులు కలిగియున్న సమాధానమును గూర్చి జ్ఞాపకము చేస్తూ, మరియు ఆయనతో సమాధానపడిన యెడల అవిశ్వాసులు కూడా దానిని కలిగియుండవచ్చని జ్ఞాపకము చేస్తూ మన చుట్టు ఉన్నవారిని ప్రోత్సహించు ఆశను అది మనకు ఇవ్వాలి.

దేవునితో మనము కలిగియున్న సమాధానము మన చేతులను కార్యములు చేయుటకు కదిలించాలి కూడా. ఇతర మానవులతో కూడా మనము సమాధానపడాలి. నైతిక మరియు సామాజిక న్యాయము ద్వారా, మరియు అవసరతలో ఉన్నవారికి సహాయపడుట ద్వారా దేవుని సమాధానకరమైన రాజ్యము యొక్క ఆశీర్వాదములను మనము కనుపరచాలి. తమ జీవితములలో సమాధానము మరియు ఆశీర్వాదము లేక హృదయములు గాయపడిన వారికి మనము ఆదరణను సలహాలను ఇవ్వాలి.

దేవునితో మనము కలిగియున్న సమాధానము మన గొప్ప దేవుడు మరియు రక్షకుని గూర్చి కూడా మరిఎక్కువగా తెలుసుకొనుటకు మరియు అర్థము చేసుకొనుటకు మనలను ప్రోత్సహించాలి. ఆయనను గూర్చిన ఆలోచనలను ఆలోచిస్తూ మన మనస్సులను దేవుని ఆలోచనా ప్రక్రియకు అనుగుణంగా మలచుకోవాలని ఆయన వాక్యము మనకు సెలవిస్తుంది. మరియు ఆయన సమృద్ధిలో సమాధానకరముగా విశ్రాంతి తీసుకొనుచు, లోకములో దేవుడు మనలను విడిచిపెడతాడు అనే చింత లేకుండా, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు మరియు మన పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు అనే సంపూర్ణ నిశ్చయతతో మనము ఉండవచ్చు.

యేసు యొక్క యాజక పరిచర్య అయిన సమాధానపరచుట అనునది మనకు అన్వయింపబడు రెండవ మార్గము ఏమనగా, దేవుని ప్రజల మధ్య ఐక్యత యొక్క వ్యక్తీకరణలు.

దేవుని ప్రేమించువారు దేవుడు ప్రేమించు ప్రజలను కూడా ప్రేమిస్తారు అనునది క్రొత్త నిబంధనలో తరచుగా కనిపించు అంశములలో ఒకటి. 1 యోహాను 4:21లో మనము చదువునట్లు:

దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడ ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయనవలన పొందియున్నాము (1 యోహాను 4:21).

దేవుడు ఒక వ్యక్తితో సమాధానపడినప్పుడు, ఆ వ్యక్తితో మనము కూడా సమాధానపడాలి.

ఇందు మూలముగానే దేవుని యొద్ద నుండి వారు పొందుకున్న సమాధానపరచబడుట అను గొప్ప బహుమానమును గుర్తించి ఇతర విశ్వాసులతో ఐక్యత కలిగి దానిని వ్యక్తపరచమని అపొస్తలుడైన పౌలు తన పాఠకులకు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఆదిమ సంఘములో, సంఘములోని యూదులు మరియు అన్యజనులకు మధ్య ఉన్న ఉద్రిక్తకరమైన అనుబంధమునకు అతడు ఈ ఆలోచనను తరచుగా అన్వయించాడు.

ఎఫెసీ. 2:13-16లో ఆయన చెప్పిన మాటలను వినండి:

అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు... ఇట్లు సంధిచేయుచు, ఈ యిద్దరిని తనయందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి, తన సిలువవలన ఆ ద్వేషమును సంహరించి, దాని ద్వారా వీరిద్దరిని ఏకశరీరముగా చేసి, దేవునితో సమాధానపరచవలెనని యీలాగు చేసెను గనుక ఆయనయే మనకు సమాధానకారకుడైయున్నాడు (ఎఫెసీ. 2:13-16).

ఐక్యత మీద ఇలాంటి ఉద్ఘాటననే మనము యోహాను 17:23, రోమా. 15:5, మరియు ఎఫెసీ. 4:3-13 వంటి వాక్యభాగములలో కూడా చూడవచ్చు.

యూదులు మరియు అన్యజనుల మధ్య సరైన అనుబంధములు అను విశేషమైన సమస్యను ఆధునిక సంఘము ఎక్కువగా ఎదుర్కొనదు. అయితే దీనిని పోలిన అనేక సమస్యలు మన మధ్యన ఉన్నాయి. విశ్వాసుల మధ్య జాతి, కులం, ప్రాంతం వంటి భిన్నత్వములతో మనము ఇబ్బందిపడుతుంటాం. మరియు యేసు చేసిన సమాధానపరిచర్య ఈ విషయములలో ఐక్యతను పొందుట కొరకు సహాయపడుతుంది. క్రీస్తుతో మనము పొందిన ఐక్యత ద్వారా మనము దేవునితోను ఒకరితో ఒకరము సమాధానపడితిమి. మరియు సంఘములో మనము కలిగియుండు అనుబంధముల ద్వారా ఈ ఐక్యత వ్యక్తపరచబడాలి. కొన్నిసార్లు మనలను ఇతరులతో వేరుపరచు కొన్ని విషయములను విడిచిపెట్టవలసివచ్చినప్పటికీ, ఐక్య సంఘము కొరకు దేవుడు కలిగియున్న లక్ష్యమును బట్టి సంతోషించుటకు మరియు దాని సాధనలో కృషి చేయుటకు ఇది మనలను పురికొల్పాలి.

సమాధానము మరియు ఐక్యతతో పాటుగా, క్రీస్తు యొక్క యాజకత్వ పరిచర్యయైన సమాధానపరచుట నుండి మనము పొందగల మూడవ అనువర్తన ఏమనగా, లోకములో మన సొంత సమాధాన పరిచర్యను నెరవేర్చుటకు మనకు ఇవ్వబడిన పని.

యేసు యొక్క యాజకత్వ పరిచర్యయైన సమాధానపరచుట ఇంకా ముగింపబడలేదు. ఆయన బలియాగము సమాధానమును వెలపెట్టి కొన్నది మరియు నిర్థారణ కలిగించింది. కాని ఆ సమాధానము లోకమంతటికి ఇంకా అన్వయింపబడలేదు. కాబట్టి, చరిత్రలోని ఈ సమయములో, ఆయన సమాధాన పరిచర్యను కొనసాగించుటకు యేసు సంఘమును నియమించాడు. మనము ఆయన సమాధాన పరిచర్యకు రాయబారులముగా ఉన్నాము. మరియు పాపులను దేవునితో సమాధానపరచు పరిచర్యను ప్రకటించుట మన బాధ్యతయైయున్నది. మనకు అప్పగించబడిన పనిని 2 కొరింథీ. 5:18-20లో పౌలు ఎలా వర్ణించాడో వినండి:

ఆయన మనలను క్రీస్తుద్వారా తనతో సమాధానపరచుకొని, ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు, ఆ సమాధానవాక్యమును మాకు అప్పగించెను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము (2 కొరింథీ. 5:18-20)

దేవునితో సమాధానపరచు కార్యము నేటికి కూడా సంఘము యొక్క ప్రాముఖ్యమైన పరిచర్యలలో ఒకటైయున్నది. క్రీస్తు ద్వారా దేవుడు మనలను తనతో సమాధానపరచుకున్నాడని, మరియు లోకమంతటిని తనతో సమాధానపరచు కార్యమును ఆయన కొనసాగించుచున్నాడని పౌలు కొరింథీ సంఘమునకు వ్రాస్తున్నాడు. క్రీస్తు అనుచరులుగా ఈ సందేశమును ఇతరులకు ప్రకటించుట మన బాధ్యతయైయున్నది, తద్వారా ఆయన ద్వారా వారు కూడా దేవునితో సమాధానపడగలుగుతారు. క్రీస్తు మరణము, పునరుత్థానము మరియు ఆరోహణము ద్వారా పాపులు దేవునితో సమాధానపడగలరు అను శుభవార్తను ప్రకటిస్తూ మనము దీనిని ప్రాథమికముగా చేయగలము.

యేసు యొక్క యాజకత్వ పరిచర్యను బలి మరియు సమాధానపరచబడుట దృష్ట్యా చూశాము కాబట్టి, యేసు యొక్క యాజకత్వ విజ్ఞాపనకు ఆధునిక అనువర్తనను ఇప్పుడు పరిశీలించాలి.

యేసు యొక్క యాజకత్వ విజ్ఞాపనకు ఆధునిక అనువర్తనను రెండు అంశములలో పరీక్షిద్దాము. మొదటిగా, అది దేవుని ఎదుట మన కొరకు మనము మొరపెట్టుటకు సహాయయము చేస్తుంది అని చూద్దాము. మరియు రెండవదిగా, క్రీస్తు యొక్క విజ్ఞాపన ఇతర ప్రజల కొరకు వాదించు బద్దులను చేస్తుంది అని చూద్దాము. అది మనలను మన సొంత అవసరతల కొరకు దేవుని ఎదుట మొర పెట్టునట్లు ఎలా బలపరుస్తుందో మొదట చూద్దాము.

మనము ఇంతకు ముందు చూసినట్లుగా, మన కొరకు ఆయన చేసిన బలియాగమును తండ్రియైన దేవునికి జ్ఞాపకము చేస్తూ, మరియు ఆయన బలి ఆధారముగా మనలను క్షమించి ఆశీర్వదించమని తండ్రిని అడుగుతూ యేసు మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కాబట్టి మరియు ఆయన బలియాగమునకు విలువనిస్తున్నాడు కాబట్టి, మన కొరకు కుమారుడు చేయుచున్న విజ్ఞాపనకు ఆయన అనుకూలంగా స్పందిస్తాడు. క్షమాపణ, పరిశుద్ధత, జీవితము మరియు రక్షణ యొక్క ఇతర ఆశీర్వాదములు మనకు తరచుగా అన్వయించబడుటకు క్రీస్తు యొక్క యాజకత్వ విజ్ఞాపనలను ఆయన వింటాడు మరియు జవాబు ఇస్తాడు.

దీనికి ఒక ఫలితం ఏమనగా, మన గొప్ప ప్రధాన యాజకుడు మన కొరకు ప్రార్థించుచున్నాడు గనుక ఆయన ప్రార్థనలను ఆలకించుచున్నాడని గుర్తెరిగి అనుదినము మన సొంత అవసరతలతో మనము తండ్రిని ఆశ్రయించవచ్చు, దీనిని ఎఫెసీ. 3:12, హెబ్రీ. 10:19లో మరియు అనేక ఇతర చోట్ల మనము చూస్తాము.

ఉదాహరణకు, హెబ్రీ. 4:14-15ను గమనించండి:

ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము (హెబ్రీ 4:14-16).

హెబ్రీ పత్రిక రచయిత ఎత్తి చూపినట్లు, యేసు “ఆకాశమండలము గుండ వెళ్లాడు.” అనగా, మన కొరకు విజ్ఞాపన చేయుటకు ఆయన తన సొంత రక్తముతో పరలోక స్థానములోనికి వెళ్లాడు. మరియు ఆయన చేయు విజ్ఞాపన కారణంగా, దేవుడు మనపై దయ చూపుతాడు అనే నిశ్చయతను కలిగియుండవచ్చు, మరియు మనము ప్రార్థించినప్పుడు మనకు కరుణను కృపను ఇచ్చుటకు బద్దుడైయున్నాడు.

మన అవసరతలన్నిటి కొరకు సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఎదుట మనము మొరపెట్టవచ్చు, అవి క్షమాపణ మరియు రక్షణ వంటి లోతైన అవసరతలు కావచ్చు, లేక అనుదిన ఆహారము కొరకు, వస్త్రములు మరియు ఆశ్రయము కొరకు చేయు సామాన్య ప్రార్థనలు కావచ్చు. ఏ అవసరత కూడా మన కొరకు క్రీస్తు చేయు విజ్ఞాపన అవసరము లేనంత చిన్నది కాదు. మరియు ఆయన బలియాగము యొక్క విలువ తీర్చలేని గొప్ప అవసరత కూడా ఏది లేదు. మరియు ఈ కారణము చేత, మన అవసరతలన్నిటి కొరకు మరియు నీతిగల ఆశలన్నిటి కొరకు మన ప్రేమగల పరలోక తండ్రికి మొరపెడుతూ మనము చేయు ప్రార్థనలలో నిశ్చయత కలిగి ధైర్యముగా ఉండవచ్చు,

క్రీస్తు యొక్క విజ్ఞాపన మన కొరకు మనము దేవుని ఎదుట మొరపెట్టుకొనుటకు ఇచ్చు హక్కు మరియు నిశ్చయతను గూర్చిన ఈ అవగాహనను దృష్టిలో ఉంచుకొని, ఇతరుల కొరకు వాదించుటకు ఇది మనలను ఎలా ప్రోత్సహిస్తుందో చూద్దాము.

యేసు విజ్ఞాపన చేస్తున్నాడు కదా, మనము ఇతరుల కొరకు ఎందుకు ప్రార్థన చెయ్యాలి? దీనికి ముఖ్యమైన కారణం రెండు పదములు అని నా ఆలోచన — “నన్ను వెంబడించుము.” యేసు విజ్ఞాపన చేయుచునప్పుడు, మీరు నన్ను వెంబడించాలి మరియు మీరు విజ్ఞాపన కూడా చెయ్యాలని ఆయన చెబుతున్నాడు. మన ప్రార్థనలో కూడా శక్తి ఉన్నదని నా నమ్మకము. దానిలో శక్తి ఉండుట మాత్రమేకాదుగాని కొన్ని సందర్భాలలో మీరు ప్రార్థన చేయకపోతే మీరు ప్రార్థన చేయలేదు కాబట్టి కొన్ని పనులు జరగవని నేను నమ్ముతాను, మరియు లేఖనము కూడా ఇదే బోధిస్తుంది అని నా ఆలోచన. కాబట్టి, మనము ప్రార్థనను నమ్ముచున్నామా? నమ్ముచున్నాము. కాని ఎందుకు? ఎందుకంటే “నన్ను వెంబడించుము” అని యేసు సెలవిచ్చుచున్నాడు మరియు ఆయన ప్రార్థించాడు.

— డా. మ్యాట్ ఫ్రీడెమాన్

క్రీస్తు యొక్క పరలోక విజ్ఞాపనలోని ప్రాముఖ్యమైన పాఠములలో ఒకటి ఏమనగా, ప్రార్థనలో ఇతరుల కొరకు వాదించుట ద్వారా మనము ఆయన మాదిరిని అనుసరించాలి. ఇతరుల కొరకు మనము కలిగియుండు ప్రేమ మరియు ఆసక్తి వారి తరుపున దేవునితో మాట్లాడుటకు, వారు ఎదుర్కొనుచున్న పరిస్థితులన్నిటిలో వారికి తన ప్రేమను కరుణను చూపమని కోరుటకు మనలను పురికొల్పాలి.

ఎఫెసీ. 6:18లో పౌలు ఏమి వ్రాశాడో వినండి:

ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి (ఎఫెసీ. 6:18).

ఇక్కడ, ఇతరుల పక్షమున దేవుని ఆశ్రయించమని పౌలు విశ్వాసులందరికీ హెచ్చరించాడు. మరియు అవును, మనము అలా చేసిన ప్రతిసారి, యేసు మన కొరకు చేయు వాదన వలెనె, మనము చేయు వాదన క్రీస్తు మన కొరకు చేసిన బలియాగము మీద ఆధారపడియుంటుంది.

కాబట్టి యేసు ఎందుకు ప్రార్థించాడు అని నన్ను నేను ప్రశ్నించివచ్చు, ఆయనకు నా అవసరతలు తెలుసు, ఆయన నా అవసరతలను అర్థము చేసుకుంటాడు, అలాంటప్పుడు, ఆయన నా కొరకు ఎందుకు విజ్ఞాపన చెయ్యాలి? దేవుని హృదయమునకు ఉదాహరణయైన ఏదో ఒకటి విజ్ఞాపనకు ఆధారముగా ఉండాలి, మరియు దానినే ఆయన కలిగియున్నాడు మరియు మోయుచున్నాడు. ప్రభువు యొక్క నరవతార జీవితములో, ఆయన త్రిత్వ జీవితములో, మానవాళి యొక్క అవసరతలను స్వీకరించు ఒక ప్రేమ, ఒక భారము ఉంది. అది సిలువకు పునాదిగా ఉంది, యేసుతో నా నడకకు పునాదిగా ఉంది. కాబట్టి ప్రభువు నాతో ఒక ఆజ్ఞ రూపములో మాట్లాడుచున్నాడు ఎందుకంటే నేను వాస్తవమును తెలుసుకోవాలని ఆయన కోరుచున్నాడు, అంతేగాక నా హృదయములో మరొకరిని మోయు అవకాశమును కూడా ఆయన నాకు ఇచ్చుచున్నాడు. నేను దీనిని ఈ విధముగా చెప్పగలిగితే, ప్రతి వ్యక్తి కలిగియున్న అవసరతకు జవాబు మరొకరి యొద్ద ఉన్నది. ఇప్పుడు, మనందరి అవసరతలకు జవాబు యేసు యొక్క హృదయములో ఉన్నది. కాని ఆయన, తన పోలికలో మనలను చేయుట ద్వారా మరియు ఆయన శిష్యులుగా ఉండుటకు పిలచుట ద్వారా, మీరు కూడా మోయాలని సెలవిచ్చుచున్నాడు. ఇశ్రాయేలు యాజకుల వలె మీరు కూడా యాజకులుగా ఉండాలి. అహరోను వలె మీరు కూడా హృదయములో భారం కలిగియుండాలి. నా వలె మీ హృదయములో లోకము యొక్క అవసరతలను మోయాలి. కాబట్టి విజ్ఞాపన స్వయంగా దేవుని హృదయము యొక్క వ్యక్తీకరణ అయ్యున్నది.

— డా. బిల్ ఉరి

వాదించు విజ్ఞాపన ప్రార్థనలను జీవితములోని ఏ విషయమునకైనా అన్వయించవచ్చు. ఉదాహరణకు, క్రైస్తవ పరిచర్యల యొక్క వృద్ధి కొరకు ప్రార్థించమని రోమా. 15:30; ఎఫెసీ. 6:20; కొలస్సీ. 4:4; 1 థెస్స. 5:25; మరియు హెబ్రీ. 13:19 వంటి చోట్ల మనము పురికొల్పబడ్డాము.

1 యోహాను 5:16లో మనము చూచునట్లు, ఆత్మీయ అపాయము లేక పాపములో ఉన్నవారి కొరకు ప్రార్థించమని మనకు నేర్పబడింది. మత్తయి 6:13లో యేసు యొక్క బోధను, మరియు లూకా 22:32లో ఆయన మాదిరిని అనుసరిస్తూ శోధన నుండి తప్పించబడునట్లు ఇతరుల కొరకు మనము ప్రార్థన చెయ్యాలి. వారి ఆరోగ్యము కొరకు మనము ప్రార్థించాలి, వారి శారీరక మరియు మానసిక గాయములను కట్టమని దేవుని కోరాలి. యాకోబు 5:14-16లో యాకోబు ఇచ్చిన హెచ్చరికలను వినండి:

మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతనికొరకు ప్రార్థనచేయవలెను. విశ్వాససహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణ నొందును మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముగలదై యుండును (యాకోబు 5:14-16).

ప్రభువు పేరట మనము ఇతరుల కొరకు వాదించినప్పుడు, అనగా వారు క్రీస్తునకు చెందినవారని ప్రభువుకు జ్ఞాపకము చేస్తూ వారి కొరకు మనము విజ్ఞాపన చేసినప్పుడు, ప్రభువు మన వాదనను అంగీకరిస్తాడని, మన మనవులను అనుగ్రహిస్తాడని యాకోబు బోధిస్తున్నాడు. మరియు ఈ కారణము చేత, ఈ ధన్యతను పూర్తిగా ఉపయోగించుకుంటూ, అవసరతలో ఉన్నవారి కొరకు తరచుగా మనము ప్రార్థించాలి.

దేవుని యొక్క సార్వభౌమత్వము మీద నాకు కదల్చబడని నమ్మకము ఉంది. యేసు క్రీస్తు ఈ క్షణమందే నా కొరకు మరియు విశ్వాసులందరి కొరకు తండ్రి సింహాసనము ఎదుట విజ్ఞాపన చేయుచున్నాడు అనే పూర్ణ నిశ్చయత నాకు ఉంది. నాకు అవసరమైన ప్రతిది క్రీస్తులో కలదు అనే సంపూర్ణ నిశ్చయత నాకు ఉంది. అయితే, అవసరతలో ఉన్నారని నాకు తెలిసినవారి కొరకు నేను విజ్ఞాపన ప్రార్థనలు చేయని యెడల అది హాని కలిగిస్తుందా? ఒక మాట వినండి, ఒకరు అవసరతలో ఉనప్పుడు ఈ ప్రశ్న అడగనే అడగరు. నేను గొప్ప అవసరత ఉండిన సందర్భాలను ఎదుర్కొన్నాను. వైద్యపరముగా నా జీవితము అంచులలోకి వెళ్లిపోయిన సందర్భాలు ఉన్నాయి. నమ్మకమైనవారి యొక్క ప్రార్థనలు చాలా ప్రాముఖ్యమైనవని నాకు తెలుసు. నా కొరకు ప్రార్థించుచున్న సహోదరీ సహోదరులు నా జీవితమునకు ఎంతో ప్రాముఖ్యమైన కార్యమును చేస్తున్నారని నాకు తెలుసు. నా అంతిమ విశ్వాసము మరియు నమ్మకము సార్వభౌమ దేవుని మీద మరియు మహిమగల క్రీస్తు మీద ఉన్నాయి, కాని క్రీస్తు పట్ల మనము చూపు నమ్మకత్వము క్రీస్తు ఆజ్ఞాపించినదానిని చేయునట్లు మనలను కోరుతుంది, అనగా నమ్మకమైనవారి కొరకు ప్రార్థించుట అని దీని అర్థము. ఇది ప్రాముఖ్యమనుటకు నాకొక కారణము తెలుసు. అవసరతలో ఉన్నారని నాకు తెలిసినవారి కొరకు ప్రార్థించుట ద్వారా నేను మరి ఎక్కువ నమ్మకమైన క్రైస్తవుడనవుతాను.

— డా. ఆర్. ఆల్బర్ట్ మొహ్లర్, జూ.

అవును, అనుదిన జీవిత విషయములలో మనము ఇతరుల కొరకు కూడా మనవులను చేయాలి. ఉదాహరణకు, మన కొరకు మనము రొట్టెను అడుగుచునప్పుడు, ఇతరుల కొరకు కూడా అడుగుచు, వారి అనుదిన అవసరతలను కూడా తీర్చమని దేవుని కోరాలి. ఆయన ప్రజలకు ఆరోగ్యము, మంచి పని, అనుబంధములలో జయముతో సహా అన్ని రకముల దీవెనలను ఇవ్వమని మనము ఆయనను అడగాలి. మన జీవిత పరిస్థితులు మన హృదయములో భారము కలిగించినప్పుడు, మనకు సహాయం చేయమని దేవునికి మొరపెట్టాలి. అదే విధముగా, ఇతరుల అవసరతల కొరకు కూడా, అవి పెద్దవైనా లేక చిన్నవైనా సరే, ప్రార్థించుటకు మనము పురికొల్పబడాలి.

ప్రజలు చాలా సార్లు ప్రార్థన అను మర్మమును బట్టి ఆశ్చర్యపడుతుంటారు. మనము ఎందుకు ప్రార్థన చెయ్యాలి? దేవునికి అన్ని విషయములు తెలిసియుంటే, మరియు యేసు ఇప్పటికే విజ్ఞాపన చేస్తుంటే, మనము ఎందుకు ప్రార్థన చెయ్యాలి? లోకము కొరకు మరియు ఇతరుల కొరకు మనము ప్రార్థించకపోతే లేక విజ్ఞాపన చేయకపోతే ఏమైనా అయిపోతుందా, లేక హాని ఏమైనా జరుగుతుందా? సరే, ఈ ప్రశ్నకు జవాబు అవును అని నా ఆలోచన, అవును హాని జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది. మొదటిగా, మనము విజ్ఞాపన చేయకపోతే, మనము దేవునికి అవిధేయులమవుతాము, ఎందుకంటే ఆయన ప్రార్థించమని ఆజ్ఞాపించాడు. ఒక స్థాయిలో, ఇంత మట్టుకే మనము తెలుసుకొనవలసినది. అది ఎలా జరుగుతుంది అనే మర్మమును మనము తెలుసుకోవలసిన పని లేదు. ప్రార్థించమని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. మరియు మనము ఆయనను నమ్మితే మరియు ప్రేమిస్తే, మనము ప్రార్థిస్తాము. కాని రెండవదిగా, మనలను ప్రార్థించమని మాత్రమే దేవుడు ఆజ్ఞాపించలేదుగాని, ఈ మర్మమంతటిలో, యేసు యొక్క విజ్ఞాపనలోనే ఆయన పరిశుద్ధుల యొక్క విజ్ఞాపనను కూడా జతపరచాడు. ప్రకటన గ్రంథములో ఇవ్వబడిన, దేవుని యొద్దకు ఎగయుచున్న ఈ మండుచున్న ధూపము యొక్క రూపకము నన్ను ఆశ్చర్యపరుస్తుంది, అది పరిశుద్ధుల యొక్క ప్రార్థన అని వర్ణించబడింది. అలాగే మనము ప్రార్థించని యెడల మనము దేవునితో మన అనుబంధమునకు కూడా హాని కలిగించుచున్నాము, ఎందుకంటే ఆయన లోకములో చేయుచున్న ప్రతిదానిలో మనము కూడా పాలివారము కావాలని ఆయన కోరుచున్నాడు. పౌలు తనను తాను మరియు ఇతరులను గూర్చి వివరించునట్లుగా, మన విజ్ఞాపన ద్వారా విమోచన కార్యములో దేవుని తోటి-పనివారిగా ఉండునట్లు, మనలను ఆయన యొక్క తోటి-పనివారిగా చూచుట ద్వారా ఆయనతో లోతైన పరిపూర్ణమైన అనుబంధములోనికి ఆయన మనలను పిలచుచున్నాడు. కాబట్టి దేవునితో మన అనుబంధమునకు హాని కలుగుతుంది. అయితే మూడవదిగా, అన్నిటి కంటే గొప్ప మర్మమిది. బయట నుండి కార్యములు చేయుట ద్వారా గాక, తన కృప యొక్క సామర్థ్యమును లోపలనే సృష్టించుట ద్వారా దేవుడు లోకమును విమోచించాలని నిర్ణయించుకున్నాడు. కాబట్టి మనము యేసుతో కలసి విజ్ఞాపన చేయునప్పుడు, దేవుడు చేయుటకు ఇష్టపడని దానిని చేయమని ఆయనను ఒప్పించువారిగా, లేక యేసు ప్రార్థనలకు కొంత జోడించువారిగా మనలను మనము పరిగణించుకోకూడదు. లోకము కొరకు లేక ఇతరుల కొరకు మనము చేయు విజ్ఞాపనను గూర్చి మనము ఈ విధముగా ఆలోచన చెయ్యాలి. మనము లోకమును లేక ఇతరులను తీసుకొని దేవుని దీవెనలు మరియు కృప వారి మీద కుమ్మరింపబడునట్లు వారు ఉండాలని దేవుడు కోరుచున్న స్థలమునకు మన ప్రార్థనల ద్వారా లాగుటకు ప్రయత్నించుచున్నాము. ఈ విధంగా, దేవుని మర్మాత్మక రూప రచనలో, మనము ప్రార్థించకపోతే ఏదో వెలితి కలుగుతుంది, ఎందుకంటే ఆయన సృష్టిలో నుండి, విమోచించబడిన ఆయన పిల్లలు కేవలం తమ అంతిమ రక్షణ కొరకు ఎదురు చూచుట మాత్రమేగాక, దేవుడు వారిని రక్షించు స్థలమునకు తమ ప్రార్థన ద్వారా లోకమును మరియు ఇతరులను లాగువారిగా ఉండాలని ఆయన వారిని విడిచిపెట్టాడు.

— డా. స్టీవ్ బ్లేక్ మోర్

యాజకుడైన యేసు అను ఈ పాఠంలో, యేసు స్థానమునకు పాత నిబంధన నేపథ్యమును చూశాము, మరియు దేవుని ఆశీర్వాదము పొందుకొనునట్లు దేవుని ప్రజలను ఆయన యొక్క విశేషమైన పరిశుద్ధ సన్నిధిలోనికి నడిపించుటకు మరియు సిద్ధపరచుటకు దేవుడు యాజకులను అభిషేకించాడు అని చూశాము. మన గొప్ప ప్రధాన యాజకుడగుట ద్వారా క్రొత్త నిబంధనలో యేసు ఈ స్థానమును ఎలా నెరవేర్చాడో కూడా చూశాము. ఆధునిక లోకములో యేసు యాజకత్వ పరిచర్య యొక్క నియమాలను మన జీవితములకు అన్వయించుకోగల మార్గములను కొన్నింటిని చూశాము.

బైబిలు స్థానమైన యాజకత్వమునకు యేసు అంతిమ నెరవేర్పుగా ఉన్నాడు. మన గొప్ప ప్రధాన యాజకునిగా, దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఉండుటకు, మరియు దేవుని ద్వారా అద్భుతమైన విధములుగా దీవించబడుటకు ఆయన మనలను సిద్ధపరచుచున్నాడు. మరియు ఆ ఆశీర్వాదములు కేవలం భవిష్యత్తు కొరకు మాత్రమే దాచియుంచబడలేదు. యేసు యొక్క బలి మరియు విజ్ఞాపన ద్వారా, మన నిత్యజీవము యొక్క ముందు రుచిని ప్రస్తుత లోకములోనే తండ్రి మనకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఈ కారణము చేత, క్రీస్తు అనుచరులు యేసు యొక్క యాజకత్వ పరిచర్యను బట్టి ఆనందించాలి మరియు క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో స్వయంగా యేసు ద్వారా దేవుని యొక్క విశేషమైన సన్నిధిలోనికి మనము ఆహ్వానించబడు దినము కొరకు ఎదురుచూడాలి. మన గొప్ప ప్రధాన యాజకునిగా క్రీస్తు యొక్క ప్రస్తుత పరిచర్య మీద ఆధారపడి దాని లాభములను పొందుకోవాలి, మరియు ఆయన ఇప్పుడు కూడా పరలోకములో మన కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు.

Continue reading the full transcript