From the transcript
1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.
బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.
ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.
అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.
మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.
మనలో చాలామందిమి ఎన్నో సమాధి కార్యక్రమములను చూసియుంటాము. మనం కనీసం ఒకటి రెండు చూసినాగాని అవి ఎక్కువే అని నేనంటాను. క్రైస్తవ సమాధి కార్యక్రమములలో, మనము నిరీక్షణను గూర్చి మాట్లాడతాము, ఎందుకంటే మనము కోల్పోయిన మిత్రులు మరియు ఆప్తులతో మరలా కలుసుకుంటామని మనకు తెలుసు. కాని మన లోకములో పాపము కలిగించిన బాధ, కష్టము, శ్రమ మరియు మరణము అంటే మనకు ఇష్టముండదు కాబట్టి, మనము ఏడుస్తాము. అసలు పాపము లేకపోతే, ఈ సమాధి కార్యక్రమములే ఉండేవి కావని మనము గుర్తిస్తాము. పాపము మన లోకములో, మన కుటుంబములలో, స్వయంగా మన జీవితములలో విధ్వంశమును సృష్టించింది. మరియు తుదకు అది మనలను చంపివేస్తుంది. ఇది ఎలా జరిగింది? మన జీవితములలో పాపమునకు అంత శక్తి ఎందుకు ఉంది మరియు అది ఉనికిలో ఎందుకు ఉంది?
మనుష్యుడు ఏపాటివాడు?, అను మన పాఠ్య క్రమములో ఇది మూడవ పాఠము, మరియు దీనికి “పాపము యొక్క శాపము” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠంలో, మానవ పాపమును గూర్చి, ప్రత్యేకముగా మానవుల మీద దాని యొక్క ప్రతికూల ప్రభావములను గూర్చి బైబిలు ఏమి బోధిస్తుందో పరీక్షిద్దాము.
పాపము అనేక రకములుగాను, అనేక శ్రేణులలోను ఉన్నది. కాని దేవుని మీద తిరుగుబాటు చేయు ఆత్మ వీటన్నిటికి కేంద్రమైయున్నది. వాస్తవముగా 1647లో ప్రచురించబడిన వెస్ట్‌మినిస్టర్ షార్టర్ కేటకిజం, దానిలోని 14వ ప్రశ్నోత్తరములో పాపమును గూర్చి ఎక్యుమినికల్ ప్రొటెస్టెంట్ అభిప్రాయమును వ్యక్తపరుస్తుంది. “పాపము అంటే ఏమిటి?” అను ప్రశ్నకు స్పందిస్తు, కేటకిజం ఇలా జవాబిస్తుంది:
పాపము అనగా దేవుని ధర్మశాస్త్రమును పాటించుటలో తప్పిపోవుట, లేక దానిని ఉల్లంఘించుట అయ్యున్నది.
ఈ పాఠంలో మనము చూడబోవుచున్నట్లు, దేవుని ధర్మశాస్త్రమును ఉపేక్షించుట లేక అలక్ష్యము చేయుట మానవాళి చేసిన మొదటి పాపములోని ముఖ్య సమస్యయైయున్నది, మరియు అది నేటికి మన శపించబడిన పరిస్థితికి కారణమైయున్నది.
పాపము యొక్క శాపము అను మన పాఠం మూడు భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా, మానవ పాపము యొక్క ఆరంభమును మనము విశదీకరిద్దాము. రెండవదిగా, పాపము యొక్క ముఖ్యమైన స్వభావమును మనము వర్ణించుదాము. మూడవదిగా, పాపము యొక్క పరిణామములను మనము పరిగణిద్దాము. మానవ పాపము యొక్క ఆరంభమును చూస్తూ ప్రారంభిద్దాము.
మానవ పాపము యొక్క ఉనికిని కాదనలేము. ప్రజలు దేవునికి విరోధముగా, ఒకరికొకరికి విరోధముగా, ఇతర సృష్టములకు విరోధముగా, లోకానికి విరోధముగా, మరియు స్వయంగా తమకు విరోధంగా కూడా అన్ని రకముల దురాగతాలను చేస్తుంటారు. అయితే పాపము ఎక్కడ నుండి వచ్చింది? మానవ పాపము యొక్క మూలము ఏమిటి? పాపము మానవాళికి ఏ విధంగా సంక్రమించింది?
మానవ పాపము యొక్క ఆరంభమును మనము మూడు దృష్టికోణముల నుండి చూద్దాము. మొదటిగా, మానవ జాతిలో పాపము యొక్క ఆరంభమును మనము సమీక్షిద్దాము. రెండవదిగా, వ్యక్తులలో పాపము ఎలా ఆరంభమైనదో చూద్దాము. మూడవదిగా, మానవ పాపము యొక్క కర్తృత్వమును లేక కారణమైన వ్యక్తిని చూద్దాము. మానవ జాతిలో పాపము యొక్క ఆరంభమును ముందుగా చూద్దాము.
మన ఉనికి యొక్క ఆదిలోనే మానవాళి పాపములో పడిపోయింది. వాస్తవానికి, మొదటి ఇద్దరు మానవులు — ఆదాము మరియు హవ్వ — మానవ జాతిలోనికి పాపమును తెచ్చారు. ఇంతకు ముందు పాఠంలో మనము చూసినట్లు ఆదాము హవ్వలు పాపము లేనివారిగా సృజించబడ్డారు. వారు పాపము చేయుటకు ముందుగా సిద్ధపడి రాలేదు, మరియు వారు పాపము చేయుటకు ఎలాంటి కారణము లేదు. దేవుడు వారికి ఎంతో దయను చూపాడు. ఆయనను నమ్ముటకు వారి దగ్గర ఎన్నో కారణములు ఉన్నాయి, వారి కొరకు ఆయన ఏర్పాటుచేసిన దైవకృతములలో సంతృప్తిపొందుటకు ఎన్నో కారణాలు ఉన్నాయి, మరియు ఆయన నిబంధన ఆశీర్వాదములలో కొనసాగుతు, నిబంధన శాపములను తప్పించుకొనుటకు కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి.
నిబంధన ఆశీర్వాదములలో కొనసాగి, నిబంధన శాపములను తప్పించుకొనుటకు, దేవుని నిబంధనలోని షరతులకు వారు విధేయత చూపవలసియుండెను. నిబంధనకు విధేయత చూపుటకు చేయవలసిన అనేక కార్యములను ఆదికాండము 1, 2 అధ్యాయములు తెలియపరుస్తాయి. దీనిలో మానవులతో భూమిని నింపమని ఆదాము హవ్వలకు ఇవ్వబడిన బాధ్యత, దేవుని సన్నిధి నిలిచియుండుటకు యోగ్యముగా ఉండుటకు దానిని సాగుచేయు బాధ్యత కూడా ఉన్నది. దేవుడు సృజించిన ఇతర జీవులను కూడా వారు యేలవలసియుండినది. మరియు ఏదెను తోటను సాగుచేసి, దానిని భద్రపరచు బాధ్యత వారికి ఇవ్వబడినది. దీనితో పాటు, వారికి ఒక స్పష్టమైన నిషేధాజ్ఞ ఇవ్వబడింది: మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినుట నుండి వారు నిషేధించబడ్డారు.
ఈ నిబంధన షరతులు దేవునికి ఇష్టమైన విషయములను మరియు దేవునికి అయిష్టమైన విషయములను సూచించాయి. దేవునికి ఇష్టమైన కార్యములు చేయుట వలన దేవుని నిబంధన ఆశీర్వాదములు అను ప్రతిఫలములు లభించేవి. మరియు దేవునికి అయిష్టమైన కార్యములను చేయుట ద్వారా దేవుని నిబంధన శాపములతో శపించబడేవారు.
విచారకరముగా, ఆది. 3:1-7లో, నిషేధించబడిన ఫలమును తినమని సర్పము హవ్వను శోధించినప్పుడు, ఆమె భుజించింది. తరువాత ఆమె ఆ పండును ఆదాముకు కూడా ఇవ్వగా, అతడు కూడా భుజించాడు. వెంటనే, వారు దిగంబరులుగా ఉన్నారని గుర్తించి సిగ్గుపడ్డారు. మానవులను పాపులను చేయు శక్తి ఆ చెట్టులో ఉన్నదని ఆదికాండము చెప్పలేదు. బదులుగా, ఆదాము హవ్వల అవిధేయత వారిలో అపరాధ భావనను, అవమానమును కలిగించాయి.
తరువాత, ఆది. 3:8-24లో, దేవుడు ఆదాము హవ్వలను నిలదీసి, వారు చూపిన అవిధేయత కారణంగా వారిని శపించాడు. వేదాంతవేత్తలు ఈ సన్నివేశముల సంగ్రహమును — సర్పము శోధించుట మొదలుకొని దేవుని తీర్పు వరకు — “పతనము” అని పిలుస్తారు. మానవాళి దేవుని దయను మరియు ఆశీర్వాదములను కోల్పోవుటకు ఆదాము హవ్వలు చేసిన పాపము కారణమైనది అను ఆలోచనను “పతనము” అను పేరు ప్రతిబింబిస్తుంది. ఉదాహరణకు, ఆది. 3:16లో, దేవుడు హవ్వతో ఇలా అన్నాడు:
ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను; వేదనతో పిల్లలను కందువు. నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలునని చెప్పెను (ఆది. 3:16).
దేవుని శాపములు భూమి మీద దేవుని స్వరూపములను వృద్ధి చేయుటకు హవ్వకు ఇవ్వబడిన బాధ్యతను ముగించలేదు. అయితే ఈ బాధ్యతను నెరవేర్చుట ఆమెకు ఎంతో బాధను కలిగించేదిగా ఉంటుంది అను విషయము మాత్రము నిర్థారించబడింది. ఇది ఆదాముతో ఆమె యొక్క వైవాహిక సంబంధములో కూడా కలహమును పుట్టించింది. ఆది. 3:17-19లో, దేవుడు ఆదామును కూడా ఇదే విధంగా శపించాడు.
నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు; అది ముండ్ల తుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును; పొలములోని పంట తిందువు; నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను (ఆది. 3:17-19).
భూమిని లోపరచుకొని, సాగుచేయమని ఆదాముకు ఇవ్వబడిన బాధ్యతను దేవుడు ముగించలేదు. ఆయన దానిని బాధాకరముగాను, కఠినముగాను చేశాడంతే. దీని కంటే ఎక్కువగా, ఆదాము హవ్వలు చేసిన పాపము కారణంగా వారు మరణమును కూడా అనుభవించవలసియుండెను.
పతనము కారణంగా, దేవుడు స్త్రీ, పురుషులకు మరియు వాస్తవానికి సృష్టి యావత్తుకు తీర్పు తీర్చాడు. కాబట్టి, ఉదాహరణకు, ఆదాము హవ్వలు పతనమునకు ముందు చేసిన పని, ఇప్పుడు శ్రమ అయ్యింది, కాబట్టి మానవులకు పనితో ప్రేమ-ద్వేషము అనుబంధం ఉంది. స్త్రీ పురుషుల మధ్య అనుబంధము కూడా భ్రష్టమైపోయింది మరియు నీచమైపోయింది. ప్రసవము — ఇది కూడా దేవుని యొక్క స్వరూపములను పునరుత్పత్తి చేయుటకు దేవుడిచ్చిన మరొక బహుమానము — మరింత వేదనాభరితమైపోయింది, మరియు విషయం ఏమిటంటే, ఆదాము హవ్వలకు దేవుడిచ్చిన మంచి వస్తువులను వారు ఆస్వాదించుట కొనసాగించారు, కాని ఒక విధంగా అవి వక్రీకరించబడ్డాయి మరియు భ్రష్టమైపోయాయి, మరియు వారు వాటిని పూర్తిగా ఆస్వాదించలేకపోయారు.
— డా. సైమన్ వైబర్ట్
ఆదాము హవ్వలు పాపము చేయకుండా ఉంటే ఏమి జరిగియుండేదో మనకు తెలియదు. మానవులు పాపము చేయనంత వరకు తోటలో నిరంతరము నివసించేవారని కొందరు నమ్ముతారు. ఆదాము హవ్వలు పరిక్షా కాలములో ఉండిరి అని ఇతరులు నమ్మారు; మరియు వారు ఆ పరీక్షను అధిగమించియుంటే, వారు నిరంతరము నివసించియుండేవారు. కాని వారు పాపము చేశారు, మరియు వారు చేసిన పాపము మానవ జాతిలో పాపము యొక్క ఆరంభమునకు కారణమైనది అనునది వాస్తవము.
మానవ జాతిలో పాపము యొక్క ఆరంభమును చూశాము కాబట్టి, ఇప్పుడు వ్యక్తులలోనికి అది ఎలా సంక్రమించిందో చూద్దాము.
ఆదాము హవ్వల పాపము మిగిలినవారిని ఎవ్వరిని ప్రభావితము చేయకుండా ఉంటే, ప్రతి వ్యక్తిగత మానవుడు కూడా ఆదాము హవ్వలు ఎదుర్కొనిన ఎంపికలనే ఎదుర్కొనేవారు. పాప రహితముగా ఉండాలా లేక పాపములో పడాలా అని ప్రతి వ్యక్తి అతని కొరకు లేక ఆమె కొరకు వ్యక్తిగతముగా నిర్ణయించుకోవలసియుండేది. అయితే ఆదాము హవ్వల శాపము వారి ప్రాకృతిక వారసులందరికీ — అనగా యేసు మినహా — వర్తిస్తుంది అని లేఖనము బోధిస్తుంది. రోమా. 5:12-19లో ఆదాము పాపమును గూర్చి పౌలు వ్రాసిన విధానమును వినండి:
ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను... ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను... ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు (రోమా. 5:12-19).
ఆదాము మానవ జాతికి నిబంధనా అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఆదాము చేసిన ఒక అవిధేయ కార్యము మానవాళి అంతటి మీదికి శిక్షావిధిని కొని తెచ్చింది. అతడు తనకు మాత్రమే ప్రాతినిధ్యం వహించలేదుగాని, తన భార్యకు, మరియు ప్రాకృతిక మానవ పునరుత్పత్తి ద్వారా వారిలో నుండి జన్మించు మానవులందరికీ ప్రాతినిధ్యం వహించాడు. అతని పాపము మన పాపముగా ఎంచబడింది. మరియు అతని అపరాధము మన అపరాధమైయ్యింది. మరియు మనము ఆ అపరాధములో పాలివారమైయున్నాము కాబట్టి, ఆ అపరాధమునకు దేవుడిచ్చిన శాపమును కూడా మనము పంచుకుంటాము, మరణముతో సహా. ఇందుమూలముగానే ఆదాము పాపము మానవ మరణమునకు కారణమైయ్యింది అని, మరియు అది మానవులందరినీ పాపులను చేసిందని పౌలు చెప్పగలిగాడు. ఆదాము ద్వారా, పాపము మనందరినీ భ్రష్టులను చేసింది, కాబట్టి ఆదాము చేసిన పాపమునకు అపరాధులుగా, పాపమునకు బానిసలై, మరణ శిక్షను పొందినవారై ఈ లోకములోనికి జన్మించాము. లేక 1 కొరింథీ. 15:22లో పౌలు సెలవిచ్చినట్లు:
ఆదామునందు అందరు మృతిపొందుచున్నారు (1 కొరింథీ. 15:22).
సంయుక్త ఆధిపత్యము అను సిద్ధాంతము కారణంగా ఆదాము చేసిన పాపము కొరకు దేవుడు మానవులందరినీ బాధ్యులుగా ఎంచాడు. ఆదాము, మన సంయుక్త అధిపతి అయ్యున్నాడు మరియు అయ్యుంటాడు. ఇప్పుడు, ఒక దేశము లేక రాజ్యమును గూర్చి ఆలోచించుట ద్వారా దీనిని మనము అర్థము చేసుకోవచ్చు. రెండు రాజ్యములు ఉన్నాయి, మరియు రెండు రాజ్యములలోను రాజులు ఉన్నారు. మీరు రాజ్యము Aలో పౌరులైయున్నారు అనుకోండి, మరియు మీ రాజ్యము యొక్క రాజు రాజ్యము B మీద యుద్దమును ప్రకటించాడు, మరియు అతడు మీ సంయుక్త అధిపతి కాబట్టి మీరు కూడా రాజ్యము Bతో యుద్ధములో ఉన్నారు. వేదాంతశాస్త్రము కూడా ఇలానే పని చేస్తుంది. ఆదాము మన సంయుక్త అధిపతి అయ్యున్నాడు; అతడు సృజించబడినప్పుడు మనమంతా ఆదాములో ఉన్నాము. అతడు మన సంయుక్త ప్రతినిధి అయ్యున్నాడు, కాబట్టి అతడు పతనమైనప్పుడు, మనము కూడా అతనితో పాటు పతనమైయ్యాము. ఇప్పుడు, దీనితో మనకు ఏమైనా ఇబ్బంది ఉంటే, మనము సమస్యలో పడినట్లే, ఎందుకంటే రక్షణ కూడా ఇదే విధముగా పని చేస్తుంది. క్రీస్తు మన సంయుక్త అధిపతి అయ్యాడు, తద్వారా, రోమా. 5లో పౌలు చెబుతున్నట్లు ఆదాములో “అందరు పాపము చేసినట్లు” క్రీస్తులో మనమంతా సజీవులమయ్యాము. కాబట్టి, మన సంయుక్త అధిపతిగా క్రీస్తు ధర్మశాస్త్రమంతటిని నెరవేర్చాడు, మరియు మొదటి ఆదాము విఫలమైన చోట ఆయన సఫలమై మరణము మీద, నరకము మీద మరియు సమాధి మీద జయమును సాధించాడు. మనకు నీతిని ఆపాదించుటకుగాను ఆయన సంపూర్ణ నీతిని నెరవేర్చాడు, మరియు తన పరోక్ష విధేయత ద్వారా మన సంయుక్త అధిపతియైన ఆదాము వలన కలిగిన మరణమును తన మీద వేసుకున్నాడు, కాబట్టి ఆయన ప్రత్యక్ష మరియు పరోక్ష విధేయత ద్వారా మన పాపము ఆయన మీద మోపబడింది మరియు ఆయన నీతి మనకు ఆపాదించబడింది. ఇది సంయుక్త ఆధిపత్యమునకు మరొక ప్రక్క అయ్యున్నది. కాబట్టి, క్రీస్తు యొక్క సంయుక్త ఆధిపత్యమును మీరు మెచ్చుకునేంత వరకు ఆదాము యొక్క సంయుక్త ఆధిపత్యమును మెచ్చుకోలేరు.
— డా. వొడ్డి బౌచమ్, జూ.
దీనిని గూర్చి ఈ విధంగా ఆలోచించుట కొంచెం వింతగా ఉంటుంది, కాని ఆదాము ఆధారంగా దేవుడు మానవాళికి తీర్పు తీర్చుట ఆయన చూపిన కృప అనే చెప్పాలి. ఆదాముకు పాపమును తప్పించుకునే శక్తి మనకంటే ఎక్కువ ఉండినది. మరియు అతడు మన కంటే తక్కువ శోధనను అనుభవించాడు. పాపము ప్రబలియున్న లోకములో అతడు జన్మించలేదు. అతడు అనేకమంది ఇతరుల ద్వారా పాపభరితమైన ప్రభావములను ఎదుర్కొనలేదు. వాస్తవానికి, అతడు తోటలో దేవునితో నడిచాడు మరియు ఆయనతో మాట్లాడాడు. నిస్సందేహముగా, దేవుని గూర్చి అతడు మన కంటే ఎక్కువ జ్ఞానమును, అనుభవమును కలిగియుండెను. సంపూర్ణముగా పాపము లేకుండా సృజించబడుట ద్వారా అతడు మనకంటే గొప్ప వ్యక్తిగత నీతిని కలిగియున్నాడు. క్రీస్తు మినహా పాపమును ఎదురించగల వ్యక్తిగత సామర్థ్యత ఆదాము కంటే ఎక్కువ ఎవ్వరికి ఉండలేదు. ఆదాము ఎదుర్కొన్న అదే శోధనను మనము ఎదుర్కొనవలసియుంటే, మనము మరింత ఘోరముగా విఫలమవుతాము. కాబట్టి, అతడు మనకు ప్రతినిధిగా ఉండుట అంటే మనకు గొప్ప లాభము ప్రాప్తించినట్లే.
మనకు ఆదాము ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి దేవుడు పాపము యొక్క అపరాధమును మనకు సూటిగా అనువర్తించాడు. అయితే పాపము వ్యక్తులను భ్రష్టపరచు మరియు వారిలో నివసించు ప్రక్రియ విషయములో వేదాంతవేత్తలు కొంత వరకు భిన్నాభిప్రాయములను కలిగియున్నారు. ఆదాముతో మనము పంచుకొను అపరాధము నిమిత్తము ఒక సరియైన చట్టబద్ధమైన శిక్షగా దేవుని ద్వారా పాపము మనకు సూటిగా అనువర్తించబడింది అని కొందరు నమ్ముతారు. పాపమును మనము మన తల్లిదండ్రుల ద్వారా స్వాస్థ్యముగా పొందుకున్నాము అని మరికొందరు నమ్ముతారు. మన శరీరములు మన తల్లిదండ్రులను పోలిన విధముగా రూపించబడినట్లే ఇది కూడా మనలో ప్రతిబింబించబడింది అని వారు నమ్ముతారు. ఏది ఏమైనా, మనము గర్భము దాల్చబడిన సమయము మొదలు పాపము ప్రతి మానవుని కలుషితము చేస్తుంది. దుష్టులు గర్భము నుండే పాపులైయున్నారని కీర్తనలు 58:3లో మనము చదువుతాము. మరియు కీర్తనలు 51:5లో, బెత్షేబతో తాను చేసిన వ్యభిచారమును గూర్చి విలపిస్తు తల్లి గర్భమందు తాను నిర్మించబడిన సమయములోనే అతడు పాపి అని దావీదు ఒప్పుకుంటాడు. కాబట్టి, గర్భములో మరణించు శిశువులకు కూడా రక్షణ నిమిత్తము యేసు కావాలి. యోహాను 14:6లో యేసు సెలవిచ్చినట్లు:
నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు (యోహాను 14:6).
యేసు ద్వారా తప్ప ఎవ్వరును తండ్రి యొద్దకు రానేరరు అను సత్యము, ఏ భేదము లేకుండా ప్రతి ఒక్కరికీ పాప క్షమాపణ మరియు పాపముల నుండి శుద్ధిచేయబడుట అవసరమైయున్నదని సూచిస్తుంది. మన పాపము వలన, మనమంతా ఆత్మీయముగా మరణించిన స్థితిలో భూమి మీదికి వస్తాము, దీనిని గూర్చి ఎఫెసీ. 2:1-3లో పౌలు బోధించాడు. మనమంతా మనలో నివసించు పాపము మరియు భ్రష్టమైన స్వభావముతో సంఘర్షిస్తాము, దీనిని గూర్చి రోమా. 7:14-25లో వర్ణించబడింది. ఈ సమస్యలన్ని ఏదెను తోటలో ఆదాము చేసిన మొదటి పాపములో నుండి పుట్టుకొచ్చాయి. ఆ అపరాధము మానవ జాతిలో పాపము యొక్క ఆరంభమునకు మాత్రమే కారణము కాలేదుగాని, ప్రతి వ్యక్తిగత మానవునిలో పాపమునకు కూడా కారణమైయ్యింది.
మానవ జాతిలో మరియు వ్యక్తులలో పాపము యొక్క ఆరంభమును ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి, ఇప్పుడు మానవ పాపము యొక్క కర్తృత్వము మీద దృష్టిపెడదాము.
మానవ పాపము యొక్క కర్తృత్వమును గూర్చి మనము మాట్లాడునప్పుడు, దీనికి అసలు కారణమైన వ్యక్తిని గూర్చి మనము మాట్లాడుచున్నాము. ఉదాహరణ కొరకు, ఒక వ్యక్తి బిలియర్డ్స్ వంటి ఆటను ఆడినప్పుడు ఏమౌతుందో పరిగణించండి. ఒక వ్యక్తి క్యు స్టిక్ తో క్యు బంతిని కొట్టినప్పుడు, ఆ బంతి మరొక బంతికి తగిలి, దానిని నెడుతుంది. ఒక భాగము యొక్క దృష్టికోణములో నుండి అనేక భాగముల యొక్క కదలికను మనము వర్ణించవచ్చు. ఉదాహరణకు, క్యు స్టిక్ క్యు బంతిని నెట్టింది అని, ఆ క్యు బంతి రెండవ బంతిని కదిపింది అని మనము చెప్పవచ్చు. అయితే క్యు బంతిగాని, లేక క్యు స్టిక్ గాని ఈ కదలికకు మూలమైయున్నదని ఎవ్వరు చెప్పలేరు. అవును, ముందుగా క్యు స్టిక్ ను కదుపుటకు నిర్ణయించుట ద్వారా, తరువాత దానిని కదుపుట ద్వారా ఆటగాడు ఈ ప్రక్రియ అంతటిని ఆరంభించాడు.
మానవులు పాపము చేసిన విషయములో కూడా ఇలాంటిదే నిజమైయున్నది. అవును, మానవ పాపము మరింత సంక్లిష్టమైనది, ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఒక చిత్తము ఉన్నది మరియు అతడు నూతన సన్నివేశములను ఆరంభించగలడు లేక కర్తృత్వము చేయగలడు. అయితే ఏదో ఒక చోట ఈ సన్నివేశములన్నిటికి ఒక మూలము ఉన్నది.
మానవాళి పాపములోనికి పతనమగుటను దేవుడు “కర్తృత్వం” చేశాడని క్రైస్తవ్యము యొక్క విరోధులు నిందించారు కాబట్టి, కర్తృత్వ ఆలోచన చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. అనగా, మానవాళి చేసిన పాపము కొరకు వారు దేవుని నిందించుటకు ప్రయత్నించారు. సాధారణంగా వారి మనస్సులలో ఈ రెండు ఉద్దేశ్యములలో ఒకటి ఉంటుంది. ఒక వైపున, దేవుడు పాపియైతే, ఆయన దేవుడైయుండుటకు అర్హుడు కాదు, మరియు ఆయన ఆరాధించబడుటకు యోగ్యుడు కూడా కాదు అని కొందరు వాదించారు. మరొక వైపున, దేవుడు పాపమునకు మూలమైతే, మానవాళి పాపమునకు బాధ్యులు కారని, మరియు వారిని శిక్షించుట సరియైన పని కాదని కొందరు అన్నారు. అయితే లేఖనము ఏమి సెలవిస్తుంది?
ఆదాము హవ్వలు నిషేధించబడిన ఫలమును తిన్న తరువాత, దేవుడు సర్పమును, ఆదామును మరియు హవ్వను శపించిన విషయము మీకు జ్ఞాపకము ఉండేయుంటుంది. ఆ తీర్పు తీర్చు సందర్భములో, ఆదాము హవ్వలు ఇరువురు మరొకని మీద నెపమును వేయుటకు ప్రయత్నించారు. మరొకని మీద నెపము వేయుటకు మొదటిగా ఆదాము ప్రయత్నించాడు. ఆది. 3:12లో, ఆదాము ఇలా అన్నాడు:
నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను (ఆది. 3:12).
తాను పండు తిన్న విషయమును ఆదాము తిరస్కరించలేదుగాని, అతడు దానికి బాధ్యత వహించుటను నిరాకరించుటకు ప్రయత్నించాడు. మొదటిగా, అతనికి ఫలము తినమని ఇచ్చిన తన భార్య మీద నెపము వేశాడు. రెండవదిగా, దేవుడు ఆమెను సృజించాడు కాబట్టి అతడు పరోక్షంగా దేవుని మీద నెపము వేశాడు. ఆది. 3:13లో, హవ్వ సర్పము మీదికి నెపమును నెడుతూ ఇలా అనినది:
సర్పము నన్ను మోసపుచ్చి నందున తింటిననెను (ఆది. 3:13).
వారు చేసిన పాపమునకు అంతిమ నెపమును, లేక “కర్తృత్వము”ను మరొకని మీద మోపాలని ఆదాము హవ్వలు ఇరువురు వాదించుటకు ప్రయత్నించారు. మరియు వారి శిక్షను తప్పించుకొనుటకు ఇలా చేసినట్లు అనిపిస్తుంది. కాని దేవుడు వారి తర్కమును అంగీకరించలేదు. వారు ఇతరుల ద్వారా ప్రభావితము చేయబడ్డారు అను విషయమును ఆయన తిరస్కరించలేదు. అయితే ఈ బాహ్య ప్రభావితములు తమ శిక్షను తప్పించుకొనుటకు తగిన కారణములను ఇస్తున్నాయి అను విషయము మాత్రం ఆయన తిరస్కరించాడు. కాబట్టి, తరువాత వచనాలలో, స్త్రీని మోసగించినందుకు దేవుడు సర్పమును శిక్షించాడు. దేవుని మీద అపనమ్మకము కలిగియుండునట్లు మోసపోయినందుకు, ఫలమును తినినందుకు, మరియు తన భర్తను కూడా దారిమళ్లించినందుకు ఆయన హవ్వను శిక్షించాడు. మరియు హవ్వ మాటలను విని, తప్పు దారి పట్టి, ఫలమును తినినందుకు ఆయన ఆదామును శిక్షించాడు. దేవుని ఆలోచన ప్రాకారం, ఆదాము హవ్వలు ఆయన ఆజ్ఞకు అవిధేయులగుటకు నిర్ణయించుకున్నారు కాబట్టి వారు నిశ్చయముగా అపరాధులైయున్నారు.
ఈ కథనములో, పాపము యొక్క అసలు “కర్త” సర్పము అని మనము చెప్పవచ్చు, ఎందుకంటే అది పాపము చేయు ఆలోచనను ఆరంభించిన మొట్టమొదటి పాత్ర అయ్యున్నది, మరియు మానవాళిని పాపము చేయునట్లు పురికొల్పినవారిలో మొదటిదైయున్నది. అయితే ఆదాము హవ్వలు ఈ సన్నివేశములో తమ స్వతంత్ర ఎంపికలను కూడా చేశారు, మరియు ఈ భావనలో మానవ పాపమునకు కర్తలుగా ఉన్నారు.
కాని ఇప్పటికీ ఇది మనలో కొన్ని సామాన్య ప్రశ్నలను లేవనెత్తుతుంది: సర్పము పాపము ఎందుకు చేసింది? పాపము చేసిన మొట్టమొదటి ఆలోచించు సృష్టము ఎవరు? ఆ సృష్టము ఎందుకు పాపము చేసింది. మరియు, తన సృష్టములు చేయు పాపములకు దేవుడు బాధ్యుడైయున్నాడా? లేఖనము ఈ ప్రశ్నలన్నిటికి సూటిగా సమాధానము ఇవ్వదు. అయితే అత్యంత ప్రాముఖ్యమైన విషయములకు జవాబు ఇచ్చుటకు అది మనకు తగిన సమాచారమును అందిస్తుంది.
అన్నిటికంటే ముఖ్యముగా మరియు మొదటిగా, దేవుడు పాపమునకు లేక ఏ ఒక్కరిని పాపము చేయునట్లు పురికొల్పుటకు బాధ్యుడు కాదని లేఖనము ఖచ్చితముగా తెలియజేస్తుంది. వాస్తవానికి, దేవుడు తానే స్వయంగా మంచితనమునకు పరిమాణమైయున్నాడు. కాబట్టి, నిర్వచనము ప్రకారం, ఆయన ఏ విషయములో కూడా అపరాధి కాడు. 1 యోహాను 1:5లో యోహాను వ్రాసిన మాటలను వినండి:
దేవుడు వెలుగై యున్నాడు; ఆయనయందు చీకటి ఎంతమాత్రమును లేదు (1 యోహాను 1:5).
ఈ పత్రికలో, నైతిక పరిశుద్ధతను సూచించుటకు యోహాను తరచుగా “వెలుగు” అను పదమును ఉపయోగించాడు; చీకటిని మరియు దాని పరిణామములను సూచించుటకు “చీకటి” అను పదమును ఉపయోగించాడు. ఇక్కడ విషయము చాలా స్పష్టముగా ఉంది: దేవుడు సంపూర్ణముగా పాపరహితుడైయున్నాడు.
దేవుడు తానే స్వయంగా మంచి మరియు చెడుకు ఉన్నతమైన పరిమాణముగా ఉన్నాడు. ఆయనకు వెలుపల తీర్పు తీర్చగల ఏ ఉన్నతమైన నైతిక పరిమాణము లేదు. అంతేగాక, దేవుడు పాపమును ద్వేషిస్తాడని ద్వితీ. 25:16, కీర్తనలు 5:4, మరియు జెకర్యా 8:17 వంటి చోట్ల లేఖనము బోధిస్తుంది. మరియు ఆయన పాపము ద్వారా శోధింపబడలేడని యాకోబు 1:13 సెలవిస్తుంది.
అయితే దేవుడు పాపములేనివాడు, మరియు దేవుడు పాపమును ద్వేషిస్తాడు, మరియు పాపమును నిరోధించగల శక్తి ఆయనలో ఉన్నది అయినప్పటికీ, అసలు పాపము ఎందుకు సంభవించింది? పాపములేని సర్వశక్తిగల సృష్టికర్త పాపములోనికి నడిపించు సృష్టిని ఎలా చేయగలడు? అనేకమంది వేదాంతవేత్తలు దేవుని సృష్టముల చిత్తము యొక్క స్వాతంత్ర్యము, లేక స్వేచ్ఛ దృష్ట్యా దీనికి జవాబిచ్చుటకు ప్రయత్నించారు.
ఎవరైనా వేదాంతశాస్త్రమును గూర్చి, బైబిలును గూర్చి, క్రైస్తవ విశ్వాసమును గూర్చి కొంత సేపు ఆలోచన చేస్తే, “దేవుడు పాపమునకు కర్త ఎందుకు కాదు?” అను ప్రశ్న ఏదో ఒక సమయములో వారి మనస్సులలో తలెత్తుతుంది. మరియు జరుగుతున్న ప్రతి విషయము ఒక దివ్యమైన ప్రణాళికలో భాగమైయున్నది అను సత్యమును ఉద్ఘాటించాలని నేననుకుంటాను. కాబట్టి, దేవుడు నిత్యత్వము నుండి ఉన్నవాడు మరియు మనము చూచుచున్న ప్రతిదానికి ఆయన ప్రణాళికను రూపొందించాడు, మరియు వాటి కొరకు ఒక దివ్యమైన ఉద్దేశ్యమును కూడా కలిగియున్నాడు. కాబట్టి, నిత్యత్యము నుండి, నిత్యత్వ భవిష్యత్తు కొరకు నియమించబడిన ప్రణాళిక ఒక మహిమకరమైన ఉద్దేశ్యమును నెరవేర్చుతుంది... అయితే దేవుడు పాపమునకు కర్త అని మాత్రం మనము చెప్పము ఎందుకంటే దేవుడు పాపము చేయగల సామర్థ్యము గల కారకుడు కాదు, అనగా ఆయన “పాపకార్యమును చేయలేడు.” దేవుడు నైతికముగా బాధ్యులైన వారిని సృజించాడు మరియు మంచి చెడ్డలను ఎన్నుకొను సామర్థ్యమును వారికి ఇచ్చాడు కాబట్టి అనుమతి అను అంశమును మనము తీవ్రంగా ఉద్ఘాటిస్తాము. మరియు మేలు జరిగినప్పుడు, అది దేవుని కృప ద్వారా కలిగింది అని, దేవుడు మంచిని నియమించాడని వెంటనే చెబుతాము. చెడు జరిగినప్పుడు మాత్రం, అది దేవుని చిత్తమునకు ఆధీనములో జరిగింది, మరియు దేవుడు దానిని అనుమతించాడు అని చెబుతాము. ఇది ఆ తోట దినములు మొదలుకొని సాతాను యేసు పాదములపై పడి ఆయన ప్రభువని ప్రకటించు దినము వరకు జరుగుతూనే ఉంటుంది.
— డా. కెన్ కీత్లే
అనేక వేదాంతశాస్త్ర పరంపరలు నిర్ణయ స్వేచ్ఛను అనేక విధాలుగా అర్థము చేసుకుంటాయి. అయితే ఇవాంజెలికల్ క్రైస్తవులు మాత్రం ఈ క్రింద ఇవ్వబడిన సన్నివేశముల మరియు కారణముల క్రమమును అనుసరిస్తారు. మొదటిగా, దేవుడు దేవదూతలను సృజించి వారికి పాపము చేయుట మరియు పాపమును తప్పించుకొనుట మధ్య నిర్ణయించుకొను స్వతంత్ర స్వేచ్ఛను అనుగ్రహించాడు. దేవదూతలు పాపము చేయుటకు నిర్ణయించుకున్నప్పుడు, వారు దేవుని అనుగ్రహమును కోల్పోయి దయ్యములుగా మారిపోయారు. యూదా 6 దీనిని గూర్చి ఈ విధంగా మాట్లాడుతుంది:
మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక, తమ నివాసస్థలమును విడిచిన దేవదూతలను, మహాదినమున జరుగు తీర్పువరకు కటికచీకటిలో నిత్యపాశములతో [దేవుడు] బంధించి భద్రము చేసెను (యూదా 6).
పతనమైన ఈ దేవదూతలను వర్ణించుటకు రెండవ పేతురు 2:4 కూడా ఇదే భాషను ఉపయోగిస్తుంది.
దేవదూతలు పతనమైన తరువాత, దేవుడు మానవాళిని సృజించి వారిని ఏదెను తోటలో ఉంచాడు. దేవదూతల వలెనె మానవులు కూడా పాపము చేయుటకు మరియు పాపమును తప్పించుకొనుటకు తగిన స్వతంత్ర స్వేచ్ఛతో సృజించబడ్డారు.
క్రీ.శ. 354 నుండి 430 కాలములో జీవించిన హిప్పో పట్టణ బిషప్ అయిన అగస్టిన్ దీనిని పొస్సే నాన్ పెక్కారే స్థితి అని వర్ణించాడు. ఈ ల్యాటిన్ మాటను “పాపము చేయు సామర్థ్యమును కలిగియుండుట” అని అనువదించవచ్చు. అయితే, వేదాంతశాస్త్ర ఉపయోగములో ఈ పదమును “పాపమును తప్పించుకొను సామర్థ్యము” అని అనువదిస్తారు. అగస్టిన్ మాటల ప్రకారం, ఆదాము హవ్వలు పాపమును పూర్తిగా తప్పించుకోగల శక్తితో సృజించబడ్డారు. అయితే పాపము చేయు సామర్థ్యము కూడా వారిలో ఉండెను.
మానవాళిని ఏదెను తోటలో ఉంచిన తరువాత, పతనమైన దేవదూతలలో ప్రముఖుడైన సాతాను, సర్పము రూపమును దాల్చాడు. ఈ రూపములో, అతడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము యొక్క నిషేధించబడిన ఫలమును తినునట్లు హవ్వను మోసగించాడు. ఆదికాండము ఈ సర్పమును సాతానుగా గుర్తించనప్పటికీ, ప్రకటన 12:9 మరియు 20:2 సాతానును “ఆదిసర్పము” అని పిలుస్తాయి. మరియు మత్తయి 4:6లో, హవ్వను మోసగించుటకు తోటలోని సర్పము ఉపయోగించిన యుక్తులనే సాతాను యేసుకు విరోధముగా ఉపయోగించుటకు ప్రయత్నించాడు. ఈ రెండు సందర్భాలలో, దేవుని మాటలను ఉద్ధరణముగా చెప్పి వాటిని తప్పుగా అనువర్తించు ప్రణాళిక ఉపయోగించబడింది. ఈ కారణముల చేత, అనేక మంది ఇవాంజెలికల్ వేదాంతవేత్తలు ఏదెను తోటలోని సర్పమును సాతానుతో పోల్చారు.
ఏది ఏమైనా, హవ్వ మరియు తరువాత ఆదాము ఇరువురు నిషేధించబడిన ఫలమును తిన్నారు అని ఆది. 3:6 నివేదిస్తుంది. వారికి దేవుని ఆజ్ఞ తెలిసియుండి కూడా ఆయనకు అవిధేయత చూపుటకు నిర్ణయించుకున్నారు. అంతరంగ లేక బాహ్య శక్తి నుండి వారి మీద ఏ విధమైన ఒత్తిడి ఉంచబడలేదు. వారి మనస్సులు మరియు నిర్ణయాలు వారివే. ఈ విధంగా, తమ పాపములకు మానవులే బాధ్యులైయున్నారుగాని, దేవుడు కాదు. ఇప్పుడు, మానవులు పాపము చేయుటకు దేవుడు ఎందుకు అనుమతిని ఇచ్చాడని మనము అడగవచ్చు. దాని వలన ప్రయోజనము ఏమి కలిగింది?
ఆదాము హవ్వలు పాపము చేయుటకు దేవుడు ఎందుకు అనుమతించాడు? అను ప్రశ్నను క్రైస్తవులు నిత్యము సమంజసముగానే అడుగుతుంటారు. సర్వశక్తిగల దేవుడు ఈ భయంకరమైన పరిణామాలను, శతాబ్దముల పాటు, సహస్రాబ్దుల పాటు కలుగు మరణమును, శ్రమను మరియు మానవ బాధను ముందుగానే ఎరిగియుండి కూడా గ్రహించలేకపోయాడు అను విషయమును మనము జీర్ణించుకోలేము. దేవుడు దీనిని ఎందుకు అనుమతించాడు? మనకు తెలియదు, అంతే. మరియు మనము మన న్యాయాధిపతికి తీర్పుతీర్చుటకు నిలువబడి ఆయన స్వభావమును గూర్చి కఠినమైన నైతిక ప్రశ్నలను అడుగుట వింతగా ఉంటుంది, కాని చివరికి దేవుడు తన అపరిమితమైన జ్ఞానము మరియు మంచితనములో నాటబడియున్న గణాంకాలను ఉపయోగించి కార్యములు చేశాడని విశ్వాసము బోధిస్తుంది అని నా ఆలోచన. ఆయన ఇట్టి మానవ స్వాతంత్ర్యమును మరియు గౌరవమును ఉద్దేశించనప్పటికీ ఆయన దీనిని చూసే ఉంటాడు, మరియు ఈ అద్భుతమైన మానవ పరిశోధనను ఆరంభములో తీసివేయుట కంటే దీని వలన గొప్ప మేలు జరిగియుండేది. మరియు నా ఆలోచన ప్రకారం, చివరికి, ప్రజలు బాధాకరమైన తిరుగుబాటును చూపినప్పటికీ ఈ మానవ పరిశోధనతో దుష్టత్వము మీద మహిమకరమైన విజయమును, మరియు అంత్య దినమందు దేవుడు చేయు అద్భుతమైన మేలును కృతజ్ఞతతోను, ఆశ్చర్యముతోను చూసేంత వరకు ఈ ప్రశ్నకు జవాబును మనము చూడలేము. దేవుని అద్భుతమైన విజయము ఎంత గొప్పగా ఉంటుందో మనకు స్పష్టమైన అవగాహన కూడా లేదు.
— డా. గ్లెన్ జి. స్కోర్గి
దేవుని ఉద్దేశ్యములు మనకు ఎల్లప్పుడు స్పష్టముగా కనిపించవు. మరియు లోకములోనికి పాపమును అనుమతించుటకు ఆయన కలిగియుండిన కారణములు కొంత వరకు మర్మాత్మకమైనవిగా ఉన్నాయి. దేవుడు మనలను పాపము నుండి దూరముగా ఉంచినట్లయితే చరిత్ర వేరొక విధముగా ఉండేది అను మాట నిజమే. అయితే దేవుడు మన కొరకు ఈ మార్గమును నిర్ణయించాడు అను విషయము మాత్రం స్పష్టముగా ఉన్నది. ఎఫెసీ. 1:11లో పౌలు వ్రాసినట్లు:
దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తాను సారముగా చేసిన నిర్ణయముచొప్పున సమస్తకార్యములను జరిగించుచున్నాడు (ఎఫెసీ. 1:11).
జరుగుచున్నది ఏది కూడా దేవుని ప్రణాళికకు లేక నియంత్రణకు వెలుపల లేదు. కాబట్టి, మానవ పాపమును ఆయన అనుమతించుటలో కూడా ఏదో ఒక కారణము ఉంది. కనీసం, మనము పాపము చేయకుండా ఉంటే మరుగుచేయబడియుండు ఆయన అనేక గుణములను వ్యక్తపరచుటకు మన పాపము అవకాశమును ఇచ్చింది అని మనము ఉద్ఘాటించవచ్చు. ఉదాహరణకు, మానవ పాపమునకు స్పందనగా ఆయన కొన్నిసార్లు కరుణను మరియు దీర్ఘశాంతమును కనుపరుస్తాడు, మరికొన్నిసార్లు ఉగ్రతను వ్యక్తపరుస్తాడు. ఈ గుణముల వ్యక్తీకరణ ద్వారా దేవుని మనము తెలుసుకోవచ్చు మరియు ఆయన మహిమను పొందుతాడు. కాబట్టి, మన పాపముతో వ్యవహరించుట ద్వారా ఆయన మహిమను పొందుతాడు అను భావన కూడా ఉన్నది. తుదకు, పాపము విశ్వాసుల ప్రయోజనము కొరకు పని చేస్తుంది అని, మరియు మనలను దీవించాలని ఆయన కలిగియున్న ప్రణాళికలో ఒక ఉపయోగకరమైన భాగము అవుతుంది అని కూడా మనము ఉద్ఘాటించవచ్చు. రోమా. 8:28లో మనము చదువునట్లు:
దేవుని ప్రేమించువారికి, అనగా ఆయన సంకల్పముచొప్పున పిలువబడినవారికి, మేలుకలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని యెరుగుదుము (రోమా. 8:28).
దేవుడు చేయు ప్రతిది సరియైనది మరియు మంచిది. ఆయనలో ఏ విధమైన పాపము లేదు. కాబట్టి, మానవ పాపము ఏదొక విధముగా ఆయన పరిశుద్ధతను దారి మళ్ళిస్తుంది అని మనము ఎన్నడు ఊహించకూడదు. భిన్నముగా, దేవుడు తన మహిమను బయలుపరచుటకు, క్షమాపణ ద్వారా ఆయన కరుణను మరియు దయను వ్యక్తపరచుటకు, మరియు తీర్పు ద్వారా ఆయన న్యాయమును మరియు ఉగ్రతను వ్యక్తపరచుటకు మానవ పాపము ఒక అవకాశమును ఇస్తుంది. మరియు ఈ విషయములన్నీ ఆయన నిశ్చితమైన పవిత్రతను మరియు మంచితనమును కనుపరుస్తాయి. కాబట్టి, మానవ జాతిలో మరియు వ్యక్తిగతముగా మానవులలో పాపము యొక్క ఆరంభమును గూర్చి మనము ఆలోచించినప్పుడు, దీనికి నెపము అనునది పూర్తిగా మానవుల భుజముల మీద మోపబడియుంటుంది అని మనము ఎల్లప్పుడు గుర్తుంచుకోవాలి.
మానవ పాపము యొక్క ఆరంభము దృష్ట్యా పాపము యొక్క శాపమును ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి, ఇప్పుడు పాపము యొక్క ప్రధానమైన స్వభావమును చూద్దాము.
దేవుడు నిషేధించు, ఖండించు లేక శపించు విషయముల యొక్క ఉదాహరణలను చూచుట ద్వారా లేఖనములో పాపమును మనము సుళువుగాను, ఖచ్చితముగాను గుర్తించవచ్చు. ఇలా చేసినప్పుడు, పాపము కొరకు బైబిలు విభిన్నమైన పదజాలమును ఉపయోగించుచున్నట్లు మనము చూడవచ్చు. అది తరచుగా పాపమును అన్యాయము, నేరము, చేయవలసిన కార్యమును చేయకుండుట, దారి తప్పిపోవుట, భ్రష్టత్వము, వ్యర్థత, మోసము, గాయపరచుట, తిరుగుబాటు, అపవిత్రత, ద్రోహము, స్వామిద్రోహం, ఆతురత, కామాతురము, లోభము — ఈ పట్టిక చాలా సుదీర్ఘమైనదిగా ఉంది, మరియు ప్రతి పదమును గూర్చిన మన చర్చ కూడా సుదీర్ఘమైనదిగా ఉన్నది — వంటి పదముల ద్వారా వర్ణిస్తుంది. కాబట్టి, పాపమును గుర్తించుటకు లేఖనము ఉపయోగించు ప్రతి పదము యొక్క అర్థమును విశదీకరించుటకు బదులుగా, పాపము యొక్క సామాన్య గుణముల మీద మనము దృష్టిపెడదాము.
పాపము యొక్క స్వభావమును మనము రెండు భాగములలో వివరిద్దాము. మొదటిగా, పాపము ప్రధానముగా దుర్నీతి అయ్యున్నదని మనము చూద్దాము. రెండవదిగా, పాపము ప్రేమలేకపోవుట అని చూద్దాము. పాపము దుర్నీతి అయ్యున్నదని ముందుగా చూద్దాము.
దేవుని ధర్మశాస్త్రము మనకు అనవసరమైనది అని లేక మనకు హానికరమైనదని నేడు క్రైస్తవులు ఆలోచించుట చాలా సామాన్యమైన విషయమైయున్నది. సాధారణంగా, రక్షణలో ధర్మశాస్త్రము యొక్క పాత్రను గూర్చి పౌలు చేసిన బోధను వారు అపార్థం చేసుకుంటారు కాబట్టి ఇలా జరుగుతుంది. అవును, ధర్మశాస్త్రము మనలను రక్షించలేదు అన్న మాట వాస్తవమే. అది మనలను కేవలం శిక్షించగలదు. ఇందుమూలముగానే గలతీ. 5:4లో, పౌలు ఇలా వ్రాశాడు:
మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయియున్నారు (గలతీ. 5:4).
ఖచ్చితముగా ఈ కారణము చేతనే పాపమును గుర్తించుటకు మరియు వర్ణించుటకు ధర్మశాస్త్రము మనకు సహాయపడుతుంది. మన దుర్నీతిని గుర్తించుటకు ధర్మశాస్త్రము కలిగియున్న శక్తి అది మనలను ఖండించునట్లు చేస్తుంది. రోమా. 5:20లో పౌలు వ్రాసినట్లు:
అపరాధము విస్తరించునట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను... పాపమెక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను (రోమా. 5:20, 21).
ధర్మశాస్త్రము విభిన్నమైన మార్గములలో పాపమును పెంచుతుంది. ఉదాహరణకు, ధర్మశాస్త్రము ఇవ్వబడక ముందు వర్తించని షరతులను అది మన మీద మోపుతుంది. మరియు అది నిషేధించు వాటి మీదికి దృష్టిని ఆకర్షించుట ద్వారా అది మనలోని పాపపు వాంఛలను రేపుతుంది. అయినను, ధర్మశాస్త్రము మంచిదైయున్నది. ఇది అప్పటికీ దేవుని స్వభావము యొక్క నిజమైన ప్రతిబింబముగాను, పాపమునకు కొలతగాను ఉన్నది. రోమా. 7:12లో పౌలు వ్రాసినట్లు:
కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధ మైనది, ఆజ్ఞ కూడ పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై యున్నది (రోమా. 7:12).
దేవుని ధర్మశాస్త్ర విధులన్నీ మానవ జీవితమునకు అంతరాయము కలిగించుటకు ఇవ్వబడినవని ప్రజలు చాలాసార్లు తప్పుగా ఆలోచిస్తారు. వాస్తవానికి, ఇది నిజం కాదు. మానవాళి సరిగా జీవించుటను నేర్చుకొనుటకుగాను మానవాళికి దేవుని ధర్మశాస్త్రము ఇవ్వబడినది. కాని పాపము కారణంగా మానవులు ఈ విధంగా జీవించుట సాధ్యపడదు కాబట్టి, పాపులైన మానవులు [దర్మశాస్త్రమును] అపార్థము చేసుకుంటారు. అయితే ఒక వ్యక్తి దేవుని తెలుసుకొనిన తరువాత, దేవునిలో ఒక మంచి మరియు పరిపూర్ణమైన జీవితమును పొందుకొనుటకుగాను ఆ వ్యక్తికి దేవుని ధర్మశాస్త్రము ఇవ్వబడింది అని అతడు స్పష్టముగా తెలుసుకుంటాడు. దీని ద్వారా, సత్యములో, ఒక విశ్వాసి దేవుని ధర్మశాస్త్రమునకు అనుకూలముగాను, కృతజ్ఞతతోను స్పందించాలి, ఎందుకంటే, దేవుని ధర్మశాస్త్రములు అతనిని భద్రపరుస్తాయి, కాపడతాయి మరియు నడిపిస్తాయి. దేవుని వాక్యము ప్రకారం దేవుని ధర్మశాస్త్రము స్వయంగా పరిపూర్ణమైయున్నది.
— రెవ. అగస్ జి. సత్యపుత్ర, అనువాదము
మానవాళి యొక్క దుర్నీతిగల స్వభావము ఏదెను తోటలో వారు పడిపోయిన సందర్భములో మరలా మరలా కనిపిస్తుంది. ఆదాము హవ్వలకు దేవుడు ఒకే స్పష్టమైన నిషేధాజ్ఞను ఇచ్చాడు. మరియు ఆ నియమమును సూటిగా ఉల్లంఘించుట ద్వారా వారు పాపము చేశారు. ఆ దినము మొదలుకొని ప్రతి పాపము దుర్నీతిని ప్రతిబింబించింది.
మానవాళితో దేవుని నిబంధన అనుబంధము దృష్ట్యా పాపము యొక్క దుర్నీతిని గూర్చి ఆలోచించండి. దేవుని నిబంధన మన పట్ల ఆయన దయను కనుపరుస్తుంది అని, మన నుండి స్వామిభక్తిని కోరుతుంది అని, మన స్వామిభక్తికి మరియు స్వామిద్రోహమునకు తగిన పరిణామములను ఇస్తుంది అని మనము ప్రస్తావించాము. ఇప్పుడు, దేవుడు మన యొద్ద నుండి ఆశించు స్వామిభక్తిని వర్ణించునదే ధర్మశాస్త్రము. ఆయన ఆమోదించు మరియు ఆశీర్వదించు ప్రతిది — అది లేఖనములో స్పష్టముగా ఇవ్వబడినా లేక ఇవ్వబడకపోయినా — నిబంధన ధర్మశాస్త్రములో ఒక అవసరతగా ఉన్నది. మరియు ఆయన ఖండించు మరియు శపించు ప్రతిది — అది లేఖనములో స్పష్టముగా ఖండించబడినప్పటికీ లేక ఖండించబడకపోయినప్పటికీ — నిబంధన ధర్మశాస్త్రములో నిషేధాజ్ఞ అయ్యున్నది. కాబట్టి, మనము చేయు ప్రతిది దేవుని నిబంధనకు విధేయత చూపుట ద్వారా చేయునది అవుతుంది లేక ఆయన ధర్మశాస్త్రము యొక్క ఉల్లంఘన అయ్యుంటుంది. మన హృదయములలో ఉన్న ప్రతి ఆలోచన అయితే దేవుని మహిమను మరియు ఆయన సంతోషమును కోరుతుంది, లేక మన సొంత సంతృప్తిని వెదకుతుంది. మనము ఆలోచించు ప్రతి ఆలోచన, మనము చేయు ప్రతి కార్యం, మనము అనుభవించు ప్రతి భావన అయితే, దేవుని నిబంధన రాజ్యమును నిర్మించుటకు ఒక అడుగు అవుతుంది లేక దాని రాజుకు విరోధముగా చూపు తిరుగుబాటు అవుతుంది. ఇందు మూలముగానే 1 యోహాను 3:2-4లో అపొస్తలుడైన యోహాను ఈ విధంగా వ్రాస్తున్నాడు:
ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము (1 యోహాను 3:2-4).
ఈ వాక్యభాగములో, యోహాను ధర్మశాస్త్ర ఉల్లంఘనను యేసు వలె జీవించు సంపూర్ణ పవిత్రతతో వ్యతిరేకముగా చూపాడు. అతడు ఆ రెండు ఎంపికలను మాత్రమే చూశాడు. అయితే మనము పాపములేనివారిగా ఉండాలి లేక దుర్నీతిపరులైయుండాలి.
లేఖనములో ఇవ్వబడిన లెక్కింపదగిన “చేయవలసిన” మరియు “చేయకూడని” వాటితో ధర్మశాస్త్రము పరిమితము కాలేదని యోహాను నమ్మాడు. బదులుగా, అది దేవుని యొక్క పూర్ణమైన స్వభావమును క్రోడీకరిస్తుంది. ఆ స్వభావము స్వయంగా ధర్మశాస్త్రము యొక్క ఉన్నతమైన నెరవేర్పుగా ఉన్నది, మరియు లేఖనములో వ్రాయబడిన ధర్మశాస్త్రము దానిని వర్ణిస్తుంది అంతే. కాబట్టి, దేవుని పరిశుద్ధ స్వభావమునకు వ్యతిరేకముగా ఉన్న ప్రతిది ఆయన ధర్మశాస్త్రమును ఉల్లంఘిస్తుంది. యాకోబు 2:10-11లో యాకోబు దీనిని గూర్చి మాట్లాడిన విధానమును వినండి:
ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞవిషయములో తప్పి పోయినయెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును; వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్యచేయ వద్దనియు చెప్పెను (యాకోబు 2:10-11).
యాకోబు ఆలోచనలు యోహాను ఆలోచనలను పోలినవిగా ఉన్నాయి: లేఖనములోని ప్రతి ఆజ్ఞ ఒకే దేవుని నుండి బయలువస్తుంది మరియు దేవుని సంపూర్ణముగా సంతోషపరచుటకు మనము దానిని పాటించవలసియుంటుంది.
మన స్వభావమునకు దేవుడు స్వయంగా ఉన్నతమైన పరిమాణమైయున్నాడు, మరియు ధర్మశాస్త్రము ఆ పరిమాణమును మనకు బయలుపరుస్తుంది. దేవుని పూర్తిగా బయలుపరచుట కొరకు ధర్మశాస్త్రము ఇవ్వబడలేదు. ఎందుకంటే, దేవుడు అపరిమితమైనవాడు, మరియు ఊహకు అందనివాడు — ఏ మాటలు కూడా ఆయనను ఎన్నడును పూర్తిగా వర్ణించలేవు. బదులుగా, ధర్మశాస్త్రము ఆయన స్వభావమును క్రోడీకరిస్తుంది అంతే. అదే విధంగా, ధర్మశాస్త్రము స్పష్టముగా చెప్పు వాటిని మాత్రమే చేయుటకు మనము బాధ్యులము కాదు. ఆ ధర్మశాస్త్రము వర్ణించు దేవుని పూర్ణమైన స్వభావమును మనము అనుసరించువారిగా ఉండాలి. మరియు మనము పడిపోయిన ప్రతిసారి, మన పాపము దుర్నీతి అని సరిగానే వర్ణించబడుతుంది.
దుర్నీతి పాపము యొక్క స్వభావము అని చూశాము కాబట్టి, అది ప్రేమలేకపోవుట అను ఆలోచనను కూడా చూద్దాము.
ఆదాము హవ్వలు దేవునికి విరోధముగా మొదట పాపము చేసినప్పుడు, దేవుని పట్ల మరియు ఒకరికొకరి పట్ల ఘోరమైన ప్రేమలేని తనమును కనుపరచారు. మనము పాపము చేసినప్పుడు కూడా ఇలానే చేస్తున్నాము. మన పాపము దేవుని పట్ల మరియు ఇతర మానవుల పట్ల ప్రేమ లేనిదైయున్నది.
ఇప్పుడు, ప్రేమలేకపోవుట అంటే ఏమిటో అర్థము చేసుకొనుటకు, ప్రేమకలిగియుండుట అంటే ఏమిటో వివరిస్తూ ఆరంభిద్దాము. ప్రేమను గూర్చి అనేక రకముల ఆలోచనలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య ప్రేమను గూర్చి, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమను గూర్చి, స్నేహితుల మధ్య ప్రేమను గూర్చి, న్యాయము మరియు ఆదర్శముల పట్ల ప్రేమను గూర్చి, ఆహారము పట్ల ప్రేమను గూర్చి లేఖనము మాట్లాడుతుంది. అయితే దేవుని మరియు మానవాళిని ప్రేమించుటను గూర్చి అది మాట్లాడునప్పుడు, అది మనస్సులో మరొక ఆలోచనను కలిగియుంటుంది. ఇది మన నిబంధన బాధ్యతల పట్ల స్వామిభక్తిని చూపు ప్రేమయైయున్నది, మరియు నిబంధన నిమిత్తము ఇతరుల పట్ల చూపు దయగల ప్రేమయైయున్నది. యోహాను 14:15లో యేసు శిష్యులతో పలికిన మాటలను గూర్చి ఆలోచించండి:
మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు (యోహాను 14:15).
మనము ప్రేమించువానికి మన మీద అధికారము ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రేమ విధేయత రూపములో సరిగా వ్యక్తపరచబడుతుంది. “నీవు నన్ను ప్రేమిస్తే, నా మాట వింటావు” అని ఒక బిడ్డ తమ తల్లిదండ్రులుకు చెప్పుటను మీరు ఊహించగలరా? లేక ఇదే విషయమును మీ స్నేహితులలో ఒకరికి చెప్పుటను గూర్చి ఊహించగలరా? మనము అలా చెప్పలేము. స్నేహితులు తమకు విధేయులు కమ్మని తమ స్నేహితులను ఆజ్ఞాపించలేరు. అలాగే, ఒక బిడ్డకు తమ తల్లిదండ్రుల మీద అధికారము లేదు. అయితే తనను ఒక బిడ్డ వలె లేక ఒక స్నేహితుని వలె ప్రేమించమని యేసు తన శిష్యులను కోరుటలేదు. వారి నిబంధన రాజుగా ఆయనను ప్రేమించమని ఆయన వారిని సవాల్ చేస్తున్నాడు. 1 యోహాను 5:3లో యోహాను ఇదే ఆలోచనను వ్యక్తపరుస్తు ఇలా వ్రాశాడు:
మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవుని ప్రేమించుట (1 యోహాను 5:3).
మరియు ద్వితీ. 6:5-6లో, ప్రేమను మరియు నిబంధన విధేయతను దేవుడు ఈ విధంగా అనుసంధానపరచాడు:
నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను (ద్వితీ. 6:5-6).
ఈ రెండు వాక్యభాగములలో, ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుటను దేవుడు ప్రేమ యొక్క ప్రాధమిక వ్యక్తీకరణగా ఎంచాడని మనము నేర్చుకుంటాము.
నా ఆలోచన ప్రకారం, దేవుని ప్రేమించుట దేవునికి విధేయులగునట్లు పురికొల్పుతుంది, ఎందుకంటే ఒకవేళ ఆయన నన్ను ప్రేమించి నేను ఆయనను తిరిగి ప్రేమిస్తే, నా కొరకు ఆయన చెల్లించిన వెలను నేను అర్థము చేసుకుంటాను, మరియు ఆయన కొరకు ఏమైనా చేయుటకు సిద్ధపడతాను. కొందరు మానవులతో నాకు ఇలాంటి అనుబంధము ఉంది. దేవుని వలె కాదుగాని, నా భార్యతో నాకు ఇలాంటి సంబంధం ఉంది. ఆమె నన్ను ప్రేమిస్తుందని నాకు తెలుసు కాబట్టి ఆమె నా యొద్ద నుండి ఆశించు ప్రతిదానిని నేను ఆమె కొరకు చేస్తాను. బదులుగా నేను ఆమెను ప్రేమిస్తాను, అయితే నన్ను సంతోషపరచుటకు, నన్ను పవిత్రపరచుటకు, మరియు దేవుడు కోరిన పురుషుని వలె నన్ను సిద్ధపరచుటకు మా వివాహములో ఆమె చెల్లించిన వెలను నేను అర్థము చేసుకుంటాను. కాబట్టి, దీనిని గుర్తించినప్పుడు, ఆమె కొరకు నేను ఏ విధమైన పురుషునిగా ఉండాలో అలా అగుటకు నాకు ఒక గొప్ప ప్రోత్సాహము కలుగుతుంది. మరియు సత్యము ఏమిటంటే, దేవుడు-మానవుడు అనుబంధములో కూడా ఖచ్చితముగా ఇలానే జరుగుతుంది అని నా ఆలోచన. ఆ ప్రేమను గూర్చి మరియు ఆ వెలను గూర్చి మనము తెలుసుకున్న తరువాత మనము ఏమైనా చేయుటకు సిద్ధపడతాము.
— డా. మ్యాట్ ఫ్రిడేమాన్
ప్రజలు ఆయన అంటే భయపడతారు కాబట్టి లేక వారికి ప్రతిఫలము ఇవ్వాలి కాబట్టి ప్రజలు తనకు విధేయులు కావాలని దేవుడు కోరలేదు. బదులుగా, వారు ఆయనను గౌరవిస్తారు కాబట్టి, వారు ఆయన చూపు దయకు కృతజ్ఞులు కాబట్టి, వారు ఆయన నిబంధనకు విధేయులవుతారు కాబట్టి, మరియు వారు తమ హృదయములలో ఆయన ధర్మశాస్త్రమును దాచుకొనియుంచుతారు కాబట్టి వారు ఆయనకు విధేయులు కావాలని ఆయన కోరతాడు. ఇందుమూలముగానే లేఖనము దేవుని నిబంధనను గూర్చి ప్రేమ అను పదమును ఉపయోగించి మాట్లాడుతుంది. ఉదాహరణకు, ద్వితీ. 7:9-13లోని ఈ మాటలను వినండి:
కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడనియు, తన్ను ప్రేమించి తన ఆజ్ఞల ననుసరించి నడుచుకొనువారికి తన నిబంధనను స్థిరపరచువాడును వేయితరములవరకు కృపచూపువాడును నమ్మతగిన దేవుడు ననియు... తెలిసికొనవలెను... మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచు కొనినయెడల... ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధిచేసి, నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశములో... దీవించును (ద్వితీ. 7:9-13).
ఈ వాక్యభాగములో, దేవుని ప్రజల పట్ల ఆయన ప్రేమ, మరియు ఆయన పట్ల ప్రజల ప్రేమ, నిబంధన నమ్మకత్వము దృష్ట్యా వర్ణించబడింది.
మత్తయి 22:34-40, మరియు మార్కు 12:28-31లో ధర్మశాస్త్రములోని గొప్ప ఆజ్ఞను గూర్చి మాట్లాడినప్పుడు యేసు మనస్సులో ఇదే ఉన్నది. ఆ వాక్యభాగములలో, ధర్మశాస్త్ర నిపుణుడైన ఒక పరిసయ్యునితో యేసు సంభాషించుచున్నాడు. ధర్మశాస్త్రములోని నియమములు ఒకదానితో ఒకటి పొంతన ఎలా కలిగియున్నాయి అనుటను గూర్చి యేసు యొక్క అవగాహనను పరీక్షించుటకు రూపొందించబడిన ఒక ప్రశ్నను పరిసయ్యుడు అడిగాడు. విశేషముగా, ధర్మశాస్త్రములోని అత్యంత ముఖ్యమైన నియమము ఏమిటి అని అతడు యేసును అడిగాడు. ద్వితీ. 6:5, 6 మరియు లేవీ. 19:18లోని మాటలను ఉపయోగిస్తు యేసు స్పందించాడు. మత్తయి 22:37-40లో యేసు పలికిన మాటలను వినండి:
అందుకాయన నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ ప్రేమింప వలెననునదియే. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను (మత్తయి 22:37-40).
మొదటిగా, ఈ నియమములు దేవుని ధర్మశాస్త్రము యొక్క సంపూర్ణ స్వభావమును ప్రతిబింబించుటకు ఉద్దేశించబడిన విస్తృతమైన సారాంశములు అను విషయమును యేసు జ్ఞాపకము చేశాడు. రెండవదిగా, ఈ రెండు నియమములు ప్రేమ అను పదములో వ్యక్తపరచబడిన విషయమును గమనించండి: దేవుని ప్రేమించుట, మరియు పొరుగువానిని ప్రేమించుట.
రోమా. 13:9 మరియు గలతీ. 5:14లో పౌలు ఇలాంటి ప్రకటనలనే చేస్తూ, ధర్మశాస్త్రమంతా పొరుగువాని పట్ల ప్రేమ అను విషయము ద్వారా క్రోడీకరించబడవచ్చని చెప్పాడు. మరొక మాటలో, దేవుని ప్రేమించుట మరియు పొరుగువానిని ప్రేమించుట ధర్మశాస్త్రములోని రెండు భాగములు మాత్రమే కాదు. వాస్తవానికి, ఈ ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటిని క్రోడీకరిస్తాయి. దేవుని ప్రేమించుట ధర్మశాస్త్రమంతటికి ఒక సారంశమైయున్నది, మరియు పొరుగువానిని ప్రేమించుట ధర్మశాస్త్రమంతటికి మరొక సారంశమైయున్నది.
కాబట్టి, పాపము అనునది దేవుని పట్ల మరియు పొరుగువాని పట్ల ప్రేమలేకపోవుట అని చెప్పవచ్చు. కనీసం, ప్రతి పాపము దేవుని ప్రేమించకపోవుట అయ్యున్నది అని చెప్పవచ్చు, ఎందుకంటే ఆయన మన హృదయములలో అత్యున్నత స్థానమును కలిగిలేడని అది తెలియజేస్తుంది. ప్రతి పాపము ఆయన స్వభావమును తిరస్కరించుట, ఆయన అధికారము మీద తిరుగుబాటు చేయుట, మరియు ఆయన నిబంధనను ఉల్లంఘించుట అయ్యున్నది. మరియు ప్రతి పాపము మన పొరుగువారిని కూడా ప్రేమించకపోవుట అయ్యున్నది. అది దేవుని స్వరూపమైన మన పొరుగువానిలో దేవుని స్వభావము మరియు అధికారము యొక్క ప్రతిబింబమును తృణీకరిస్తుంది. దేవుని నిబంధన ఆశీర్వాదముల ద్వారా మన పొరుగువాని మేలును వెదకుటలో అది విఫలమవుతుంది.
“వేదాంతశాస్త్రము 101”లో పాస్ అవ్వకుండా వారు ఉతీర్ణులు కాలేరని నేను నా విద్యార్థులకు చెబుతుంటాను, మరియు ఆ వేదాంతశాస్త్రము 101 ఒక చిన్న కథనము మాత్రమే అని తరువాత వారికి చెబుతాను: దేవుడు దేవుడైయున్నాడు మరియు మీరు కాదు. పాపము, “నేనే దేవుడను” అని చెబుతుంది. పాపము దేవుని, దేవుని మహిమను, దేవుని ఘనతను, దేవుని చిత్తమును, దేవుని రాజ్యమును ప్రక్కనబెట్టి, మన సొంత మహిమను, మన ఘనతను, మన చిత్తమును, మన రాజ్యమును కేంద్రముగా చేస్తుంది. కాబట్టి, వేదాంతశాస్త్రము 101 తరువాత, వేదాంతశాస్త్రము 102 వస్తుంది: దేవుడు దేవుడైయున్నాడు కాబట్టి, మీ దేవుడైన యెహోవాను మీరు పూర్ణ మనస్సుతో, ఆత్మతో, మనస్సుతో మరియు బలముతో ప్రేమించవలెను, మరియు మీరు దేవుడు కాదు కాబట్టి, లోకము మీ చుట్టు తిరుగుట లేదు. మీరు మిమ్మును వలె మీ పొరుగువారిని ప్రేమించవలెను. కాబట్టి, అవును, పాపము ప్రధానముగా ఇతరులను ప్రేమించకపోవుటయే. అది మిమ్మును మీరు ప్రేమించుట; అది మిమ్మును మీరు కేంద్రముగా చేసుకొనుట. కాబట్టి, దేవునికి పూర్ణ విధేయత చూపుట — పాపమును చేయకుండుట — ఆయనను ప్రేమించుటయే. అది దేవుని ప్రేమించుట మరియు అది ఇతరులను ప్రేమించుట అయ్యున్నది.
— డా. అలెన్ హల్ట్బెర్గ్
పాపము యొక్క ప్రేమలేని గుణమును గూర్చి మానవాళి పాపములో పడిన సందర్భము దృష్ట్యా ఆలోచన చేద్దాము. నిషేధించబడిన ఫలమును గూర్చి దేవుడు అబద్ధమాడాడని చెప్పి సర్పము హవ్వను శోధించాడు. ఆమె ఫలమును తింటే, ఆమె మరణించదుగాని, ఆమె దేవుని వలె మారిపోతుంది అని అతడు చెప్పాడు. ఆమె ఆ ఫలమును తినిన తరువాత, ఆదాము కూడా అదే అబద్ధమును నమ్మి, అతడు కూడా కొంత భుజించాడు.
ఇప్పుడు, ఆదాము హవ్వలు దేవుని పట్ల మరియు పొరుగువాని పట్ల ప్రేమలేని గుణమును ఎలా చూపారు? దేవుని నిబంధన ధర్మశాస్త్రమునకు విరోధముగా తిరుగుబాటు చేయుట ద్వారా, మరియు దేవుని సత్యమునకు బదులుగా సర్పము యొక్క అబద్ధములను నమ్ముట ద్వారా వారు దేవుని పట్ల ప్రేమలేని గుణమును చూపారు. ఆదామును పాపము చేయునట్లు శోధించుట ద్వారా, ఆయనలోని దేవుని స్వరూపమును బట్టి అసంతృప్తిని వ్యక్తపరచుట ద్వారా, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయత చూపు అతని మేలును కోరుటలో విఫలమగుట ద్వారా హవ్వ ఆదాము పట్ల ప్రేమలేని గుణమును చూపింది. అదే విధంగా, హవ్వ మోసపోయినప్పుడు ఆమెను సరిదిద్దుటలో విఫలమగుట ద్వారా, ఆమెలో మరియు అతనిలో ఉన్న దేవుని స్వరూపము పట్ల అసంతృప్తిని వ్యక్తపరచుట ద్వారా, మరియు ఆమె మీద ప్రతికూల ప్రభావములను చూపిన పాపమును చేయుట ద్వారా ఆదాము హవ్వ పట్ల ప్రేమలేని గుణమును చూపాడు.
మరియు మానవులందరి విషయములో ఇదే వాస్తవమైయున్నది. ఆదాము హవ్వల మొదటి పాపమును పోలిన విధముగానే, సత్యమును తిరస్కరించుట ద్వారా, ఆయన దయ పట్ల అపనమ్మకమును చూపుట ద్వారా, మరియు ఆయన అధికారముపై తిరుగుబాటు చేయుట ద్వారా ప్రతి మానవ పాపము దేవుని గూర్చి ఇదే అభిప్రాయమును కలిగియుంటుంది. క్లుప్తంగా, ప్రతి మానవ పాపము దేవుని పట్ల సరియైన నిబంధన ప్రేమను కనుపరచుటలో విఫలమవుతుంది. మరియు ప్రతి మానవ పాపము మన పొరుగువారికి సరియైన నిబంధన ప్రేమను చూపుటలో విఫలమవుతుంది. వారికి విరోధముగా మనము ప్రత్యక్షంగా పాపము చేసినా లేక పరోక్షంగా పాపము చేసినా, మన క్రియల ద్వారా పాపము చేసినా లేక క్రియలు లేకుండా పాపము చేసినా, మన పాపము ఎల్లప్పుడు ఇతర ప్రజలకు హాని కలిగిస్తుంది. అది వారిలోని దేవుని స్వరూపమును అగౌరవపరుస్తుంది. అది వారి మేలును కోరుటలో విఫలమవుతుంది. పాపము యొక్క భ్రష్టత్వము మరియు ఫలితముల ద్వారా అది వారి జీవితములను నాశనము చేస్తుంది.
వారు ప్రేమ ద్వారా పురికొల్పబడినంత వరకు, దేవుని నియమములను ఉల్లంఘించుటకు వారికి అనుమతి ఉన్నదని నమ్ము క్రైస్తవులను మీరు ఎప్పుడైనా కలిసారా? లేక వారు దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తే, ఇతరులను ప్రేమించనవసరము లేదని నమ్మిన ప్రజలను చూశారా? ఈ రెండు రకముల ప్రజలు పొరపాటు పడుతున్నారు. దేవుని నిబంధన కోరు విధముగా వారిని మనము గౌరవించినప్పుడు మాత్రమే మనము దేవుని మరియు మన పొరుగువారుని ప్రేమిస్తాము. మరియు అవి నిబంధన ప్రేమ ద్వారా పురికొల్పబడినప్పుడు మాత్రమే మన క్రియలు దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తాయి. ఇందుమూలముగానే పాపము చేయుట చాలా సులభంగా ఉంటుంది. మనము దేనిని నిర్లక్ష్యము చేస్తున్నామో పాపము పట్టించుకోదు. మనము దుర్నీతిపరులుగా ఉన్నా లేక ప్రేమలేనివారిగా ఉన్నా, పాపము గెలుస్తుంది. అందువలనే విశ్వాసులు పాపము యొక్క స్వభావమును అర్థము చేసుకొనుట చాలా అవసరమైయున్నది. ఎందుకంటే మనము దానిని అర్థము చేసుకున్నప్పుడు, దానిని తప్పించుకొనుటకు మనము సరియైన విధముగా సిద్ధపడతాము, మరియు దాని ద్వారా మనకు కలుగు రక్షణను మనము మరి ఎక్కువగా మెచ్చుకుంటాము.
పాపము యొక్క శాపము అను మన పాఠంలో ఇప్పటి వరకు మనము మానవ పాపము యొక్క ఆరంభమును విశదీకరించాము మరియు పాపము యొక్క ప్రధానమైన స్వభావమును వర్ణించాము. ఇప్పుడు మన మూడవ ప్రధానమైన అంశమును చూచుటకు సిద్ధముగా ఉన్నాము: పాపము యొక్క పరిణామములు.
సాంప్రదాయిక క్రమబద్ధ వేదాంతశాస్త్రములో, “వాస్తవిక పాపము” అను పదము మానవాళి చేసిన మొదటి పాపము యొక్క పరిణామములను సూచిస్తుంది. వాస్తవిక పాపము యొక్క వివరములను పలువురు వేదాంతవేత్తలు పలు విధాలుగా వివరించారు. కాని ప్రతి సందర్భములోను, దృష్టి ఈ క్రింది విషయముల మీద కేంద్రీకరించబడింది:
ఆదాము పాపములో పడిపోవుట కారణంగా ఆదాము యొక్క ప్రాకృతిక వారసులు జన్మించిన స్థితి.
ఆదాము చూపిన అవిధేయత అతనిలో నుండి స్వాభావికముగా జన్మించిన ప్రతి మానవమాత్రుని మీద ప్రతికూలంగా ప్రభావం చూపింది. కేవలం యేసు మాత్రమే వాస్తవిక పాపమును తప్పించుకున్నాడు.
క్లుప్తమైన పదములలో, వాస్తవిక పాపము అనగా, ఒక వ్యక్తి జన్మించిన నాటి నుండి కలిగియున్న పాపము. మరియు ఒక వ్యక్తి ఈ పాపమును తప్పించుకొనలేడు. జన్మించిన ప్రతి వ్యక్తి ఈ విషయమును అంగీకరించాలి, ఎందుకంటే ప్రజలు పాపభరితమైన వంశ క్రమములో జన్మిస్తారు. నేను ఒక ఉదాహరణ ఇస్తాను: ఒక సింహము గొర్రెపిల్లకు జన్మనివ్వలేదు, మరియు ఒక పాపియైన మనుష్యుడు, అనగా ఆదాము వారసుడు, దేవుని ఎదుట నీతిమంతునిగా ఉండు ఒక పవిత్రమైన వ్యక్తికి జన్మనివ్వలేడు. మరియు ఇది ఇప్పటికే ఉనికిలో ఉన్న పాపమైయున్నది. దానిని మనము మన ఆలోచనల ద్వారా చేయకపోవచ్చు, మాటల ద్వారా చేయకపోవచ్చు, మన క్రియల ద్వారా చేయకపోవచ్చు, కాని అది ఉనికిలో ఉంటుంది. మరియు మన మధ్యలో దానిని తప్పించుకోగలవారు ఎవ్వరు లేరు. దీనినే “వాస్తవిక పాపము” అని పిలుస్తారు. 51వ కీర్తనలో దావీదు చెప్పినట్లు, “నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను.”
— యోహనాస్ ప్రాప్టోవర్సో, Ph.D., అనువాదము
ఈ పాఠములో మన ఉద్దేశముల కొరకు, మానవాళి పాపములో పడిపోవుట వలన కలిగిన మూడు పరిణామములను మనము చూద్దాము: భ్రష్టత్వము, ఎడబాటు మరియు మరణము. భ్రష్టత్వముతో ఆరంభిద్దాము.
ఆదాము హవ్వలు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినినప్పుడు, అది వారికి చేసిన హానిని మీరు జ్ఞాపకము చేసుకొనవచ్చు. హిప్పో పట్టణ బిషప్ అయిన అగస్టిన్ పాపములేని స్థితిని పొస్సే నాన్ పెక్కరే, అనగా మానవాళికి పాపమును తప్పించుకొను సామర్థ్యము ఉన్నది, అని వర్ణించాడని మనము ఇంతకు ముందు ప్రస్తావించాము. ఆదాము హవ్వలు పాపము చేసిన తరువాత, తమ సామర్థ్యతను కోల్పోయి, పాపము చేయు సామర్థ్యమును మాత్రమే పొందుకున్నారు. వారి నూతన స్థితిని అగస్టిన్ నాన్ పొస్సే నాన్ పెక్కరే — పాపమును తప్పించుకొనుటకు అసమర్థత — అని వర్ణించాడు. ఆదాము హవ్వలు అనుభవించిన భ్రష్టత్వము దేవుని సంతోషపరచి, ఆయన ఆశీర్వాదములను పొందుకొనుటకు వారు కలిగియుండిన సామర్థ్యతను తొలగించింది, మరియు పాపము చేయు సామర్థ్యమును మరియు దేవుని శాపములను పొందుకొను యోగ్యతను మాత్రమే వారిలో మిగిల్చింది.
ఇప్పుడు, ఆది. 3:12, 13లో మనము చూస్తున్నట్లు, అసంపూర్ణముగానైనా ఆదాము హవ్వలు తమ పాపములను ఒప్పుకున్నారు. మరియు తరువాత వచనములలో, దేవుడు వారి పట్ల కొంత సౌమ్యతను చూపాడు. వారు చేసిన పాపము కొరకు ఆయన వారిని వెంటనే చంపియుండేవాడే. కాని ఆయన అలా చేయలేదు. బదులుగా, ఆయన వారికి కరుణను చూపాడు. మరియు ఆది. 3:15లో, వారిని తమ పాపము మరియు దాని యొక్క ప్రభావముల నుండి విమోచించుటకు ఒక విమోచనకర్తను పంపుతానని కూడా ఆయన వాగ్దానం చేశాడు. ఆదాము హవ్వలు వ్యక్తపరచిన విశ్వాసము మరియు పశ్చాత్తాపము ద్వారా, దేవుడు వారి ఆత్మలను నూతనపరచి, వారిలోని పాపమును తప్పించుకొను సామర్థ్యతను పునరుద్ధరించాడు.
దురదృష్టవశాత్తు, వారి వ్యక్తిగత పునరుద్ధరణ వారి యొక్క ప్రాకృతిక వారసులకు ఇవ్వబడలేదు. మిగిలిన మానవాళి అంతా పాపమును తప్పించుకొనుటకు అసమర్థతలోనే జన్మించుటకు విడిచిపెట్టబడింది. యోహాను 8:31-44, మరియు రోమా. 6:6-20 వంటి చోట్ల యేసు మరియు పౌలు ఈ నైతిక భ్రష్టత్వ స్థితిని పాపమునకు బానిసలగుటతో పోల్చారు. మరియు ఆదాము హవ్వలను రక్షించినట్లు, దేవుడు మనలను రక్షించు వరకు మనము ఈ భ్రష్టస్థితిలోనే ఉంటాము.
లూకా 6:43-45లో, యేసు మన భ్రష్ట స్థితిని చెడ్డ ఫలములను మాత్రమే ఇచ్చు చెడ్డ చెట్టుతో పోల్చాడు. రక్షణలేని పతనమైన మానవాళి బాహ్యముగా ఏ మేలును చేయనేలేదని ఆయన ఉద్దేశము కాదు. వారు ఇప్పటికీ తమ పిల్లలను జాగ్రత్తగా చూచుకుంటారు, పౌర నియమములను మొదలగువాటిని పాటిస్తారు కూడా. అయితే పాపము యొక్క భ్రష్టత్వము దేవుని ధర్మశాస్త్రమును గౌరవించి కార్యములను చేయకుండా, లేక దేవుని పట్ల మరియు పొరుగువాని పట్ల నిబంధన ప్రేమతో కార్యములను చేయకుండా వారిని ఆటంకపరుస్తుంది. కాబట్టి, వారు చేయు ప్రతి పని పాపము అను మచ్చను కలిగి ఉంటుంది. రోమా. 8:6-8లో పౌలు సెలవిచ్చినట్లు:
ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు (రోమా. 8:6-8).
విచారకరముగా, పతనమైన మానవాళి విషయములో, మన భ్రష్టత్వము పాపము చేయకుండా తప్పించుకొనుటలో మనము కలిగియున్న అసమర్థతకు మాత్రమే పరిమితము కాదు. అది మానవ స్వభావములోని ప్రతి కోణమునకు వ్యాపిస్తుంది. ఈ భ్రష్టత్వము యొక్క వ్యాప్తిని పలు వేదాంతశాస్త్ర సంప్రదాయములు పలు విధములుగా అర్థము చేసుకుంటాయి. అయితే మన మానవ స్వభావములోని ప్రతి కోణము, మన శరీరములు మరియు ప్రాణములతో సహా, ప్రభావితము చేయబడింది అని మనమంతా ఒప్పుకోవచ్చు. ఉదాహరణకు, ఆది. 3:16-19లో దేవుడు సెలవిచ్చినట్లు, మన శరీరములు శ్రమను అనుభవించి మరణిస్తాయి. రోమా. 3:11లో పౌలు సూచించినట్లు, మన మనస్సులు అవగాహన లేనివిగా ఉన్నాయి. 1 యోహాను 2:16లో యోహాను సూచించినట్లు, మన హృదయములు పాపమను లోభముతో నిండియుంటాయి.
పాపము మన జీవితములలో వంచించునదిగా ఉన్నది. అది మన పతనమైన అస్తిత్వములోని ప్రతి భాగమును — మన శరీరములు, మన ఆత్మలు, మన మనస్సులు, మన కోరికలు, మన ఆలోచనలు, మరియు మిగిలినవన్నిటిని — భ్రష్టము చేస్తుంది. ఫలితంగా, మనలో నుండి ప్రవహించు ప్రతిదానిని — మనము ఆలోచించు, చేయు మరియు భావించు ప్రతిదానిని — అది భ్రష్టము చేస్తుంది. మనము క్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు, అన్ని కోణములలోను ఆయనను సంతోషపరచు సామర్థ్యమును దేవుడు మనలో నూతనపరుస్తాడు. కాని ఇప్పటి వరకు రక్షణ పొందనివారి విషయములో, వారు చేయు ప్రతిదానిలోను పాపము వ్యక్తపరచబడుతుంది.
మనము విశ్వసించక ముందు భ్రష్టత్వము మనలో ఉత్పత్తి చేయు వాటిని గూర్చి లేఖనము మాట్లాడు మూడు విధానములను చూద్దాము, మరియు మనము హత్తుకొను పాపభరితమైన భావనలతో ఆరంభిద్దాము.
దేవుని ఉద్దేశములు మరియు నిషేధించబడిన ఫలము యొక్క ప్రభావములను గూర్చి సర్పము చెప్పిన అబద్ధములను నమ్మినప్పుడు హవ్వ యొక్క భావనలు భ్రష్టమైపోయాయి. మరియు ఆ ఫలము తినుటకు యోగ్యమైనది అని నిర్ధారించినప్పుడు ఆదాము యొక్క భావనలు కూడా భ్రష్టమైపోయాయి. అయితే దేవుని శాపము ద్వారా మానవులందరికీ అవి అందించబడుట ఆ భ్రష్టత్వముల యొక్క అత్యంత ఘోరమైన పర్యవసానమైయున్నది.
ఇంతకు ముందు పాఠంలో మనము చూసినట్లు, భావనాత్మకముగా ఆలోచించు మానవ సామర్థ్యమును పాపము నాశనము చేసింది, మరియు అబద్ధ ఆలోచనలు నిజమని నమ్మునట్లు మనలను పురికొల్పింది. పాపము కొన్ని విధాలుగా మనలను మతిస్థిమితములేనివారిగా చేస్తుంది అని ప్రసంగి 9:3 మరియు యిర్మీయా 17:9 బోధిస్తాయి. దేవుడు ఘనపరచుదానిని మనము ఘనపరచము, మరియు మనలను మనము చెడుతనమునకు సమర్పించుకుంటాము. పాపముతో నిండిన మనస్సులు దేవుని ఆశ్చర్య కార్యముల యొక్క ప్రాముఖ్యతను అర్థము చేసుకొనలేవని ద్వితీ. 29:2-4 సెలవిస్తుంది. పాపము మనలను అబద్ధములను హత్తుకొనునట్లు చేస్తుంది అని, సత్యమును అంగీకరించకుండా నిరోధిస్తుంది అని యోహాను 8:43-47 బోధిస్తుంది. ఎఫెసీ. 4:17-18లో, పాపము యొక్క ప్రభావమును పౌలు ఈ విధంగా వర్ణించాడు:
వారైతే అంధకారమైన మనస్సుగలవారై, తమ హృదయ కాఠిన్యమువలన తమలోనున్న అజ్ఞానముచేత దేవునివలన కలుగు జీవములోనుండి వేరుపరచబడినవారై, తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు (ఎఫెసీ. 4:18).
పాపము మన భావనలను భ్రష్టము చేస్తుంది కాబట్టి, మనము సత్యమును నమ్ముటలో విఫలమవుతాము. ఇంకా ఘోరమైన విషయము ఏమిటంటే, మనము కలిగియుండు అబద్ధ భావనలు స్వయంగా పాపభరితమైయున్నవి. మనము అర్థము చేసుకొనుటకు కష్టమైన భావనలను అపార్థము చేసుకొనుట, లేక నేర్చుకొనుటకు మనకు అవకాశము దొరకనివాటిని గూర్చి అజ్ఞానులుగా ఉండుట పాపము కాదు. అయితే అబద్ధ సిద్ధాంతమును మరియు బైబిలుకు వ్యతిరేకమైన ఆలోచనలను ఉద్ఘాటించుట పాపమైయున్నది. ఇందుమూలముగానే 1 తిమోతి 6:3-5లో, అబద్ధ బోధకుల యొక్క ఉద్దేశపూర్వక అజ్ఞానత మరియు భ్రష్టమైన మనస్సుల కారణంగా పౌలు వారిని పాపులు అని పిలుస్తున్నాడు. అబద్ధ సిద్ధాంతములు మరియు తప్పుడు ఆలోచనలు దేవుని సత్యమును మరుగుచేయు అబద్ధములైయున్నాయి, మరియు అవి మనలను మరింత పాపములోనికి నడిపిస్తాయి.
దేవుడు దేవుడైయున్నాడు మరియు ప్రతి విషయమును ఖచ్చితముగాను, సరిగాను ఎరిగియుండుటకు ఆయన యోగ్యుడు. సత్యుడైన వానిని తెలుసుకొని, సరియైన సిద్ధాంతములను కలిగియుండుటకు మనము బద్ధులమైయున్నాము, ఎందుకంటే సరియైన సిద్ధాంతము దేవునిని మరియు ఆయనతో మన అనుబంధమును వర్ణిస్తుంది. కాబట్టి, మొట్టమొదటిగా, మన ఉత్తమమైన ఆలోచనకు మరియు ఆయనను గూర్చి వీలైనంత సరిగా ఆలోచన చేయుటకు ఆయన యోగ్యుడైయున్నాడు. కాబట్టి, సరియైన సిద్ధాంతము దేవుని ఘనపరుస్తుంది కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనది. అది ఆయనకు గౌరవమును ఇస్తుంది. ఆయన నిజముగా ఏమైయున్నాడో మనము తెలుసుకొనగోరుచున్నాము. ఆయన తనను గూర్చి మనకు బయలుపరచిన సత్యమును మనము తెలుసుకొనగోరుచున్నాము. అవును, లేఖనము యొక్క ఉద్దేశ్యము అదే అయ్యున్నది, మరియు మనము దానిని తెలుసుకోగలము. రెండవదిగా, అబద్ధ సిద్ధాంతము అబద్ధ జీవన శైలిలోనికి నడిపిస్తుంది కాబట్టి క్రొత్త నిబంధన దానిని గూర్చి కఠినముగా మాట్లాడుతుంది. అది పాపములోనికి నడిపిస్తుంది, దేవుని నుండి దూరముగా నడిపిస్తుంది. మనము దేవుని సరిగా అర్థము చేసుకోలేనప్పుడు, దేవుని గూర్చి మనకు ఒక అబద్ధ అభిప్రాయము ఉన్నప్పుడు, మనము ఒక వక్రమైన జీవితమును జీవిస్తాము. ఆయన ఆశించిన విధముగా మనము ఆయనను సేవించలేము. ఇందువలనే, క్రొత్త నిబంధన అబద్ధ సిద్ధాంతమును గూర్చి చాలా కఠినముగా మాట్లాడుతుంది.
— డా. గ్యారెత్ కాక్రెల్
మన భ్రష్టత్వము యొక్క రెండవ పరిణామము మనము కలిగియుండే పాపభరితమైన ప్రవర్తనలు అయ్యున్నది.
ఆదాము హవ్వల నడత వారి పాపములో అత్యంత స్పష్టమైన విషయమైయున్నది: నిషేధించబడిన ఫలమును భుజించుట. ఆ కాలము మొదలుకొని మానవాళిని పట్టి పీడిస్తున్న ప్రవర్తనా పాపములన్నిటికీ ఈ పాపము ఒక మాదిరిగా పని చేసింది. ఆ సమయము తరువాత, ఆది. 6:5లో మనము చదువునట్లు, మానవాళి యొక్క పాపభరితమైన ప్రవర్తనతో దేవునికి ఎంత కోపము వచ్చింది అంటే, ఆయన మానవ జాతి అంతటిని జలప్రళయం ద్వారా నాశనం చేశాడు, మరియు లోకమును మరలా నింపుటకు నోవహును మరియు అతని కుటుంబమును మాత్రమే రక్షించాడు.
విచారకరముగా, మానవాళి ఈ సారి కూడా సరిగా ప్రవర్తించలేదు. ఇప్పటికీ మనము అన్ని రకముల ప్రవర్తనా పాపములను చేస్తాము. వాస్తవానికి, రోమా. 1లో, దేవుడు మనలను మన పాపభరితమైన వాంఛలకు అప్పగించేశాడు కాబట్టి, మనము ఇంతగా పాపము చేస్తామని పౌలు వాదించాడు. ఇదే అధ్యాయములో, మన రక్షణలేని, పతనమైన స్థితిలో మనము కలిగియుండే ప్రవర్తనలను పౌలు భయానకముగా వర్ణించాడు. రోమా. 1:29-32లో పౌలు వ్రాసిన మాటలను వినండి:
అట్టివారు సమస్తమైన దుర్నీతిచేతను, దుష్టత్వముచేతను, లోభముచేతను, ఈర్ష్యచేతను నిండుకొని, మత్సరము నరహత్య కలహము కపటము వైరమనువాటితో నిండినవారై కొండెగాండ్రును అపవాదకులును, దేవద్వేషులును, హింసకులును, అహంకారులును, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తలిదండ్రులకవిధేయులును, అవివేకులును మాట తప్పువారును అనురాగ రహితులును, నిర్దయులునైరి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగ ఎరిగియుండియు, వాటిని చేయు చున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు (రోమా. 1:29-32).
ఇరవైయ్యవ శతాబ్దము ఆరంభమైనప్పుడు, లోకములో, ముఖ్యముగా పాశ్చాత్య లోకంలో ఎంతో ఆశావాదం ఉండేది, ఇది విజ్ఞానములో పురోగతి కారణంగా, విద్య విరివిగా అందుబాటులో ఉండుట కారణంగా, అన్ని ఆవిష్కరణల కారణంగా, సాంకేతిక పరిజ్ఞాన పురోగతి కారణంగా, మొదలగువాటి కారణంగా ఇది జరిగింది, మరియు ఇరవైయ్యవ శతాబ్దము యుద్ధము అనేదిలేని ఒక సమాధాన శతాబ్దముగా ఉంటుంది అనే గొప్ప ఆశావాదము తత్త్వవేత్తలలో, సామాజిక వైజ్ఞానికులలో మరియు కొంతమంది ఉదారవాద వేదాంతవేత్తలలో కూడా ఉండేది. ఇరవైయ్యవ శతాబ్దమును మానవ తర్కము పాలిస్తుంది, మరియు తార్కికమైన జీవులు ఒకరినొకరు చంపుకొనకుండా ఉంటారు. కాబట్టి, సమాధానముతో నిండియుండు ఒక శతాబ్దములోనికి మనము ప్రవేశించుచున్నాము అను ఈ గొప్ప నిరీక్షణలోనే ఒక సమస్య కనిపిస్తుంది... మార్క్స్ వాదములో కూడా ఇదే సమస్య ఉంది. దానిలో ఒక ఆశావాద మానవశాస్త్రము ఉన్నది, కాని దానిలో పాప సిద్ధాంతము లేదు కాబట్టి అది సామాజిక విపత్తులకు దారితీసింది. అయితే ఏమి జరిగింది? మొదటి ప్రపంచయుద్ధము జరిగింది. బోల్షెవిక్ విప్లవం జరిగింది. హోలోకాస్ట్, రెండవ ప్రపంచ యుద్ధము, హిట్లర్, నాజీవాదము, ఇంకా ఇలా లెక్కపెడుతూ పోవచ్చు. కాబట్టి, ఫలితంగా, ఇరవైయ్యవ శతాబ్దములో సుమారుగా పదకొండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మంది ప్రజలు యుద్ధముల వలన మరణించారు. నేను కేవలం యుద్ధములను గూర్చి మాత్రమే మాట్లాడుతున్నాను — పౌరులు మరియు సైనికులు, మరియు ఇవి కేవలం అధికారికంగా నమోదు చేయబడిన గణాంకాలు మాత్రమే. ఇది అంతకు ముందు నాలుగు శతాబ్దములలో జరిగిన మరణముల కంటే నాలుగు రెట్లు ఎక్కువ. ఇది మనకు ఏమి తెలియజేస్తుంది? సామాజిక పరిస్థితులు మాత్రమేగాక, ఏదో సరిగాలేదు. జ్ఞానమంతా కూడబెట్టి, విజ్ఞానము యొక్క పురోగతి మరియు నాగరికత యొక్క ప్రగతి తరువాత కూడా, మానవ స్వభావములో ఏదో ఒక ప్రాధమిక సమస్య ఉంది. మరియు దీనినే క్రైస్తవులమైన మనము “పాపము” అని పిలుస్తాము. ఇప్పుడు మీడియావారి మధ్యలో, అధ్యయన రంగములో మొదలగువాటిలో ఇది ఉపయోగించబడు పదము కాదు, అయినను రెయిన్హోల్డ్ నైబర్ చెప్పునట్లు, పాపము అను క్రైస్తవ సిద్ధాంతము సిద్ధాంతములన్నిటిలో తక్కువ ఖ్యాతిని పొందినదైయున్నది, అయినను దీనికి మన యొద్ద ఎంతో అనుభవాత్మక ఆధారము ఉన్నది.
— డా. పీటర్ కుజ్మిక్
మన భ్రష్టత్వము వలన కలుగు మూడవ పరిణామము పాపాత్మక భావోద్వేగాలు.
మనము ఇంతకు ముందు చూసినట్లు, దేవుని ధర్మశాస్త్రములోని మొదటి రెండు గొప్ప ఆజ్ఞలు ప్రేమను గూర్చిన ఆజ్ఞలైయున్నవి: మొదటిది, దేవుని ప్రేమించుట; మరియు రెండవది, మన పొరుగువారిని ప్రేమించుట. అవును, ప్రేమ ఒక భావము అయ్యున్నది, కనీసం కొంత వరకైనా. మన జీవితములోని ప్రతి భాగములో మనము విధేయులగునట్లు అది మనలను పురికొల్పుతుంది. కాబట్టి, పాపభరితమైన భ్రష్టత్వము మన భావోద్వేగాల మీద ప్రభావము చూపుతుంది అను విషయం మనకు ఆశ్చర్యమును కలిగించకూడదు, మరియు అది దేవుని మరియు మన పొరుగువారిని ప్రేమించకుండా మనకు ఆటంకం కలిగిస్తుంది, మరియు ఈ ప్రేమలో నుండి వెలువడు నీతిగల భావోద్వేగాలను వ్యక్తపరచకుండా మనకు ఆటంకం కలిగిస్తుంది.
ఆదాము హవ్వల భావోద్వేగాల భ్రష్టత్వము వారు చేసిన పాపములోను, దాని యొక్క తక్షణ పర్యవసానాలలోను, మరియు దాని యొక్క నిలిచియుండు శాపములోను కనిపిస్తుంది. ఉదాహరణకు, ఆది. 3:6లో, నిషేధించబడిన ఫలము ఇచ్చు జ్ఞానమును హవ్వ ఆశించింది. 7-10 వచనాలలో, తమ దిగంబరత్వమును బట్టి ఆదాము హవ్వలు సిగ్గునొందారు. మరియు 16వ వచనములో, వారి భావోద్వేగములు మరియు కోరికలు వారి యొక్క వైవాహిక అనుబంధము మీద ప్రభావము చూపు విధానమును దేవుడు శపించాడు.
మరియు ప్రతి మానవుని యొక్క భావోద్వేగాలను కూడా పాపము ఇదే విధముగా భ్రష్టము చేస్తుంది. మనమంతా దురాశ, లోభము, అహంకారము, ద్వేషము, అవినీతితో కూడిన కోపము, మరియు అన్ని రకముల పాపపు భావోద్వేగాలతో సతమతమవుతాము. మార్కు 7:21-22లో యేసు సెలవిచ్చినట్లు:
లోపలినుండి, అనగా మనుష్యుల హృదయములోనుండి దురాలోచనలును జారత్వములును దొంగతనములును నరహత్యలును వ్యభిచారములును లోభములును చెడుతనములును కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవదూషణయు అహంభావమును అవివేకమును వచ్చును (మార్కు 7:21-22).
మనము ఒక పనిని చేయుటకు ముందే, మన పాపపు భావోద్వేగాలు మరియు కోరికలు పాపభరితమైన ఆలోచనలు మరియు ప్రవర్తన వైపుకు మనలను ఆకర్షిస్తాయి. యాకోబు 1:14-15లో యాకోబు దీనిని గూర్చి ఇలా సెలవిచ్చుచున్నాడు:
ప్రతివాడును తన స్వకీయమైన దురాశచేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును (యాకోబు 1:14-15).
మన పాపపు స్వభావములో, దేవుని ధర్మశాస్త్రమునకు బాహ్య విధేయత చూపుట కూడా అసాధ్యమవుతుంది. కాని మన భావాత్మక భ్రష్టత్వమును, మరియు మనము ప్రేమించవలసిన విధముగా దేవునిని మరియు మన పొరుగువానిని ప్రేమించుటలో మన అసమర్థతను గూర్చి మనము ఆలోచన చేయునప్పుడు, ఆయన రక్షించు కృప లేకుండా దేవుని సంతోషపరచు శక్తి మనకు లేదని స్పష్టమవుతుంది.
భ్రష్టత్వము మానవాళి పాపములోనికి పడిపోవుట యొక్క ఘోరమైన పరిణామములలో ఒకటి అని మనము చూశాము కాబట్టి, దేవుని నుండి మరియు ఇతర మానవుల నుండి మన ఎడబాటును ఇప్పుడు చూద్దాము.
పాపము యొక్క ప్రభావమును అతిగా ఉద్ఘాటించుట సాధ్యముకాదు. మొదటిగా, పాపము యొక్క జీతము మరణమైయున్నది. పాపము వలన మానవులు మరణమును అనుభవిస్తారు. మనమంతా పాపము వలన మరణిస్తాము. రెండవదిగా, పాపము వలన మనము దేవునికి దూరమయ్యాము. మన అనుబంధము తెగిపోయింది మరియు మన పాపము కారణంగా ఆయనతో మనము మరలా అనుబంధము కలిగియుండు హక్కు మనకు లేదు. మూడవదిగా, మనలో ఒకరికొకరి మధ్య ఉన్న అనుబంధములు పాపము కారణంగా తెగిపోయాయి, విరిగిపోయాయి, నాశనమైపోయాయి. మనము మన అవసరతలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తాము కాబట్టి మరియు ఇతరుల కంటే మనకు మనం ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాము కాబట్టి, గర్వము, స్వార్థము మరియు మోసముతో నిండియున్నాము కాబట్టి, మనమంతా పూర్ణ అన్యోన్యతను కనుపరచుటలో విఫలమవుతాము. కాబట్టి, ఇదంతా కేవలం పాపము వలనే జరిగింది.
— డా. కాన్స్టంటైన్ కాంప్‌బెల్
మానవులు దేవునితో సహవాసము కలిగి లోకమును పాలించుట కొరకు దేవుని స్వరూపములుగా సృజించబడ్డారు. ఏదెను తోటను భూమియందంతటా వ్యాపింపజేయు బాధ్యత మనకు ఇవ్వబడినది, తద్వారా సృష్టియావత్తు దేవుని యొక్క భూలోక రాజ్యము అవుతుంది. మరియు ఆ రాజ్యములో, దేవుడు నివసిస్తాడు మరియు తన సన్నిధిని మన మధ్యన ఉంచుతాడు. మరియు దేవుని ఉప-ప్రతినిధులుగా లేక సామంత రాజులుగా సృష్టిని ప్రేమతో మరియు సహకారముతో పాలిస్తు మనము ఒక ఐక్యత గల జాతిగా కూడా నివసించవలసియుండెను.
అయితే పాపము దేవునితో మన సహవాసమునకు భంగము కలిగించి, ఒకరితో ఒకరము కలిగియుండవలసిన అనుబంధములను నాశనం చేసింది. దీని వలన దేవుడు ఆదాము హవ్వలను ఏదెను తోటలో నుండి బయటకు వెళ్లగొట్టాడు. వారు తిరిగి లోనికి ప్రవేశించకుండా ఆపుటకు దాని ద్వారము యొద్ద ఆయన దేవదూతలను కూడా ఉంచాడు అని ఆది. 3:24 సెలవిస్తుంది. ఫలితంగా, మానవాళి దేవుని సన్నిధికి మరియు భద్రతకు దూరంగా అరణ్యములో నివసించునట్లు తోలివేయబడింది. మరియు ఆది. 4-6 అధ్యాయములలో మనము నేర్చుకొనునట్లు, అరణ్యములో మానవులు ఒకరికి విరోధముగా మరొకరు లేచుట ఆరంభించారు. కయీను తన సహోదరుడైన హేబెలును హతమార్చాడు, మరియు ఇతరులతో దుర్వ్యవహారం చేసిన కొన్ని తరములకు తండ్రి అయ్యాడు. చివరికి, మానవులు ఒకరినొకరు ఎంతగా వేధించారంటే నోవహు దినములలో దేవుడు లోకమంతటినీ జలప్రళయంతో నాశనం చేశాడు.
ఆ దినము మొదలుకొని దేవుని నుండి మరియు ఇతర మానవుల నుండి మానవాళి యొక్క ఎడబాటు భయానకమైన రీతిలో కొనసాగింది. ఆదాము హవ్వల వలె మనము దేవుని దృశ్య సన్నిధిలో ఇక నడవలేము; బదులుగా, మనము ఆయనను ద్వేషించి ఆయనతో యుద్ధము చేస్తాము. మరియు అబద్ధములు, మోసము, ద్వేషము, కలహము మరియు అనేక ఇతర అనుబంధ సమాస్యలు ఇతర ప్రజలతో సమాధానముగాను, సహకారముతోను జీవించకుండా మనకు ఆటంకం కలిగిస్తాయి.
మనము ఇంతకు ముందు చూసినట్లు, నిషేధించబడిన పండును తిని ఆదాము హవ్వలు దేవుని మీద చేసిన తిరిగుబాటు ఈ ఎడబాటుకు మొదటి కారణమైయున్నది. వారి పాపములో, మన మొదటి తల్లిదండ్రులు దేవుని అధికారము కంటే ఎక్కువగా తమ అధికారమును వక్కాణించుటకు ప్రయత్నించారు. అది మానవాళి అంతటిని దేవునికి విరోధులుగా చేసిన దేవుని నిబంధనకు విరోధముగా చేయబడిన ద్రోహమైయున్నది.
తాను ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో, మానవాళి పాపములో పడిపోవుట పతనమైన మానవులందరు సాతాను రాజ్యములో చేరుటకు కారణమైనదని పౌలు బయలుపరచాడు. మనము దేవునికి సన్నిహితులముగా ఉండుట మాని ఆత్మీయ యుద్ధములో ఆయనకు బద్ధ శత్రువులమయ్యాము. ఫలితంగా, మనలో ప్రతి ఒక్కరు దేవుని కృప మరియు దయకు దూరముగా ఉంటూ జీవితమును ఆరంభిస్తారు. మన స్వాభావిక శత్రువుగా మాత్రమే మనము ఆయనను ఎరిగియున్నాము. ఎఫెసీ. 2:1-3లో, రక్షణకు ముందు తన పాఠకుల యొక్క పరిస్థితిని పౌలు ఈ విధంగా వర్ణించాడు:
మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైయుంటిమి (ఎఫెసీ. 2:1-3).
“మనమందరము” ఈ విధముగా జీవించాము అని చెప్పినప్పుడు పౌలు ఈ వర్ణనను ప్రతి రక్షింపబడని, పతనమైన మానవునికి అనువర్తించాడు. రోమా. 5:10లో ఇలాంటి విషయమునే తెలియజేస్తూ, పౌలు ఇలా వ్రాశాడు:
ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన యెడల సమాధానపరచబడిన వారమై[తిమి] (రోమా. 5:10).
మన అనుబంధములో ఆటంకము కలిగినది కాబట్టి లేక ఆయన ప్రసన్నతలో మనము ఉండలేము కాబట్టి మాత్రమే మనము ఆయన నుండి దూరమైపోలేదు. అది దీని కంటే ఎంతో ఘోరమైనది. మానవాళి పాపములోనికి పడిపోవుట మనలను దేవునికి విరోధులనుగా చేసింది.
మరియు మిగిలిన మానవులందరితో మన అనుబంధములకు ఇది ఒకే విధముగా హాని కలిగించలేదుగాని, పతనము అప్పటిక అనేక విధాలుగా మనలను ఒకరి నుండి మరొకరిని దూరము చేసింది. అవును, మన పాపము మానవుల మధ్య అనేక విరోధులను సృష్టించింది మరియు యుద్ధములకు కారణమైయ్యింది. కాని మరింత సామాన్యమైన అనుబంధ సమస్యలకు కూడా అదే కారణమైయున్నది. ఆదాము హవ్వల మధ్య అవమానమును మరియు వైవాహిక కలహమును సృష్టించిన విధముగానే, అది ప్రతి వివాహములోను సమస్యలను కలిగిస్తుంది. వారి బిడ్డల మధ్య హింసకు కారణమైన విధముగానే, అది ప్రతి సమాజములో కూడా హింసకు కారణమవుతుంది. మనము ఒకరితో ఒకరము అబద్ధములు చెప్పుకొను విధముగా, ఒకరినొకరము ద్వేషించుకొను విధముగా, ఒకరినొకరము గాయపరచుకొను విధముగా, హింసను అనుభవించు మరియు హింసించు విధముగా అది మనలను ప్రభావితం చేసింది. అది మనలో ఈర్ష్య, అసూయ, క్షమాపణలేని గుణమును కలిగిస్తుంది. విశ్వాసుల మధ్య కూడా, నిరీక్షణలేని పాపపు బానిసత్వము నుండి దేవుడు మనలను విమోచించిన తరువాత కూడా, మనము ఒకరితో ఒకరము ప్రేమతో మరియు దయతో ఉండుటకు సంఘర్షిస్తాము. యాకోబు 4:1-2లో యాకోబు విశ్వాసులకు వ్రాసినట్లు:
మీలో యుద్ధములును పోరాటములును దేనినుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛలనుండియే గదా? మీరాశించుచున్నారు గాని మీకు దొరకుటలేదు; నరహత్యచేయుదురు మత్సర పడుదురు గాని సంపాదించుకొనలేరు; పోట్లాడుదురు యుద్ధము చేయుదురు గాని దేవుని అడుగనందున మీ కేమియు దొరకదు (యాకోబు 4:1-2).
మానవాళి పాపములో పడిపోవుట మనలను దేవుని నుండి మరియు ఒకరి నుండి మరొకరిని దూరము చేసింది. దేవునితోను, ఇతర ప్రజలతోను సమాధానకరమైన, ప్రేమగల అనుబంధముల మధ్య నివసించుటకు మనము సృజించబడితిమి. మనము సేవించు దేవుని మన జీవితములకు కేంద్రముగా చేసుకొని, కలిసి జీవించుటకు మరియు పని చేయుటకు మనము సృజించబడితిమి. అయితే పతనము మనలను స్వార్థపరులుగాను, అహంకారులుగాను, ద్వేషించువారిగాను చేసింది. కాబట్టి, దేవుని ప్రేమించుటకు బదులుగా మనము ఆయనను వ్యతిరేకిస్తాము. ఇతరులతో నిస్వార్థంగా బ్రదుకుటకు బదులుగా, వారు కలిగియున్నదానిని ఆశించి, వాటిని మన స్వప్రయోజనముల కొరకు ఉపయోగిస్తాము. లేదు, మనము ఉండగలిగినంత దుష్టులముగా ఇంకా కాలేదు. పతనమైన మానవ అనుబంధములలో కూడా మనము మంచి యొక్క అవశేషాలను చూస్తాము. కాని అవి ఉండవలసిన విధముగా లేవు. పాపము దేవునితో మన అనుబంధమును నాశనం చేసి, ఇతరులతో మన అనుబంధములను ఘోరముగా పాడు చేసింది. దేవుని కృపలేకుండా, ఈ సమస్యలకు పరిష్కారం లేదు.
ఇప్పటి వరకు, భ్రష్టత్వము మరియు ఎడబాటు దృష్ట్యా పాపములోనికి మానవాళి పతనము యొక్క పరిణామాలను మనము చూశాము. ఇప్పుడు మరణము అను అంశమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.
ఆది. 2:17లో, అతడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినిన యెడల నిశ్చయముగా మరణిస్తాడని దేవుడు ఆదాముకు సెలవిచ్చాడు. తరువాత, ఆదాము ఆ పండును తినిన తరువాత, దేవుడు ఆదాముకు భౌతిక మరణమునిచ్చి శపించాడని ఆది. 3:19 నివేదిస్తుంది. అయితే, మనము ఇంతకు ముందు ప్రస్తావించినట్లు, ఆదాము పాపము మరియు దాని వలన కలిగిన శాపము కేవలం ఆదాము మీద మాత్రమే ప్రభావం చూపలేదు. ఏదిఏమైనా, అతడు మానవ జాతి అంతటికి నిబంధన శిరస్సుగా ఉన్నాడు కదా. అతడు మన రాజైయున్నాడు. కాబట్టి, అతడు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసినప్పుడు, మన మానవ జాతి అంతా అతని అపరాధమును, ఫలితంగా, మరణమను శాపమును అనుభవించింది. రోమా. 5:12-17లో పౌలు సెలవిచ్చినట్లు:
ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను... ఏలయనగా తీర్పు ఒక్క అపరాధమూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను...మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యే[లెను] (రోమా. 5:12-17).
దేవుడు ఆదాము పాపమును ఆదాముకు మాత్రమే ఆపాదించక, మిగిలిన మానవ జాతి అంతటికి ఆపాదించాడు కాబట్టి అందరును పాపము చేశారని పౌలు చెప్పాడు. మరియు ఈ అపరాధము మన మరణమునకు కారణమవుతుంది. వాస్తవిక పాపము యొక్క చట్టపరమైన దృష్టికోణములో నుండి, ప్రతి మానవుడు కూడా ఆదాముతో సమానముగా అపరాధియైయున్నాడు. కాబట్టి ఆదాము మరణపాత్రుడైతే — అవును అతడు మరణపాత్రుడే — మనము కూడా మారణపాత్రులమే. అందుకనే అతడు మరణించాడు. మనము క్రీస్తునందు విశ్వాసముంచిన తరువాత కూడా, పాపము యొక్క శాపము మన శరీరములకు వ్రేలాడుతుంటుంది. ఫలితంగా, ఆదాము వలె మనమంతా కూడా మరణించి మట్టిలోనికి చేర్చబడతాము.
ఇప్పుడు, దేవుడు శపించిన వెంటనే ఆదాము మరణించలేదు — కనీసం భౌతికముగానైనా. మనందరి విషయములో కూడా ఇదే నిజమైయున్నది. దేవుడు మనందరికీ భూమి మీద ఒక భౌతిక ఆయుష్షును అనుమతిస్తాడు. అయితే ఆదాము శపించబడినప్పుడు ఆత్మీయముగా మరణించాడు అని, మరియు అతని ప్రాకృతిక వారసులు కూడా విశ్వసించక ముందు ఆత్మీయముగా మరణించారని లేఖనము తెలియజేస్తుంది.
ఆత్మీయ మరణమును గూర్చిన ప్రశ్నకు ఎఫెసీ. 2 చాలా చక్కగా జవాబిస్తుంది. వాస్తవానికి, మనము మన పాపములలోను, అపరాధములలోను మరణించియున్నామని పౌలు చెబుతున్నాడు. మరియు మనము మరణించియున్నాము కాబట్టి, ఒక మృతుడు దేవుని సంతోషపరచుటకు ఏమి చేయలేడు. మరివిశేషముగా, పౌలు మన క్రియలను గూర్చి మరియు మన క్రియలలో దేవుడు చూచు విషయములను గూర్చి మాట్లాడుతున్నాడని నా ఆలోచన. మనము ఈ లోకాధిపతిని అనుసరిస్తున్నామని 2వ అధ్యాయములోని ఆ వచనము తరువాత చెబుతుంది... మనము స్వాభావికముగా అతడు కోరు పనులను చేస్తున్నాము. మనము మన పాపములలో మరణించినప్పుడు, మరణమునకు నాయకుడైన సాతానును అనుసరిస్తున్నాము. మనము క్రీస్తులో సజీవులమైనప్పుడు... మనకు నూతన జీవము ఇవ్వబడుతుంది. అది ఒక నూతన జీవము. అది మనలను కార్యములు చేయుటకు, దేవునికి ఇష్టమైన కార్యములను చేయుటకు అనుమతించు జీవితము, మరియు అది కేవలం యేసు క్రీస్తు యొక్క జీవితము, మరణము మరియు పునరుత్థానము మరియు ఆయనయందు మనము కలిగియుండు విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
— రెవ. తిమోతి మౌంట్‌ఫోర్ట్
పౌలు ఎఫెసీ 2:1-5లో ఇలా మాట్లాడుతూ ఆత్మీయ మరణమును వర్ణించాడు:
మీ అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి. అయినను దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రదికించెను (ఎఫెసీ. 2:1-5).
పౌలు వర్ణించిన ప్రజలు భౌతికముగా సజీవులైయున్నారు. వారు పాపములో పాలుపంచుకొని, ఆత్మీయ యుద్ధములో దేవునితో పోరాడారు. అయితే వారు దేవుని శిక్షావిధికి ఆధీనములో ఉన్నారు కాబట్టి, మరియు దేవుని సంతోషపరచుటకు కావలసిన ఆత్మీయ సజీవత్తము వారిలో లేదు కాబట్టి పౌలు వారిని “చచ్చినవారు” అనే పిలుస్తున్నాడు, విశ్వాసులు కూడా ఇదే విధముగా “చచ్చినవారివలె” ఉండేవారని పౌలు చెప్పాడు. క్రీస్తులో ఆత్మీయ జీవమును పొందునంత వరకు పతనమైన మానవులందరు ఈ ఆత్మీయ మరణ స్థితిని అనుభవిస్తారు. రోమా. 8:10లో పౌలు వ్రాసినట్లు:
క్రీస్తు మీలోనున్నయెడల మీ శరీరము పాపవిషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది (రోమా. 8:10).
క్రీస్తు మనలో ఉంటే మనకు ఆత్మీయ జీవితము ఉంటుంది అని ఇక్కడ పౌలు చెబుతున్నాడు. అనగా, క్రీస్తు మనలో లేకుంటే, మనము ఆత్మీయముగా చచ్చినవారమైయున్నాము.
ఆదాము పాపములో పడిపోవుట కారణంగా, మానవులు సృజించబడిన సమయములో ఆత్మీయ మరణమును అనుభవించారు, తరువాత భౌతిక మరణమును అనుభవించారు. దీని కంటే ఘోరముగా, మనము ఒకవేళ ఎన్నడును క్రీస్తును విశ్వసించకయుంటే, దేవుని కృప ద్వారా ఎన్నడును పాపము యొక్క శాపము నుండి విమోచించబడకయుంటే, నరకములో ఆత్మీయ మరియు భౌతిక మరణమును మనము అనుభవిస్తూనే ఉంటాము. ప్రస్తుత లోకములో ఆత్మీయ మరణము వలెనే, ఆ అనుభవమును కూడా మనము వివేచించగలుగుతాము. విమోచించబడనివారు నిత్యము ఉనికిలో ఉంటూ, శరీరములోను మరియు ప్రాణములోను నిలిచియుండు పాపము యొక్క శాపమును అనుభవిస్తారు. పాపము యొక్క శాపము వాస్తవమైనది. అయితే దేవుని కృప ద్వారా, ఇప్పుడు పాపము యొక్క ప్రభావముతో మనము పోరాడవచ్చు, మరియు భవిష్యత్తులో దానిని పూర్తిగా తప్పించుకోవచ్చు.
పాపము యొక్క శాపము అను ఈ పాఠంలో, మానవ జాతిలో మరియు మానవ వ్యక్తులలో పాపము యొక్క ఆరంభమును విశదీకరించి, పాపము యొక్క కర్తృత్వమును మనము చర్చించాము. దుర్నీతి మరియు ప్రేమలేకపోవుట పాపము యొక్క ముఖ్య స్వభావమైయున్నదని కూడా వర్ణించాము. పాపము యొక్క పరిణామములైన భ్రష్టత్వము, ఎడబాటు మరియు మరణమును కూడా మనము పరిగణించాము.
క్రీస్తులో మనకు నిరీక్షణ లేకపోతే మానవ పాపము యొక్క బరువు మనకు నిస్సహాయతను కలిగిస్తుంది. మరియు ఈ పాఠంలో మనము చూసినట్లుగా, అది చిన్న విషయము కాదు. అది ఈ జీవితములో మనలను భ్రష్టత్వముతో బంధించి, నిత్య మరణములోనికి మనలను ఈడ్చుకు వెళ్లు ఒక ఘోరమైన బరువు అయ్యున్నది. జాన్ బన్యన్ వ్రాసిన ప్రఖ్యాతిగాంచిన పుస్తకమైన, ది పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ లో, అతడు పాపమును మన వీపుల మీద కట్టబడిన బరువు అని వర్ణిస్తూ, దానిని క్రీస్తు సిలువ మాత్రమే తొలగించగలదు అని చెప్పాడు. మన తరువాత పాఠంలో, మన రక్షకుడు మనలను పాపము యొక్క శాపము నుండి విమోచించినప్పుడు ఇది ఎలా జరుగుతుందో మనము చూద్దాము.
Continue reading the full transcript