<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
క్యాటలాగ్‌కు తిరిగి వెళ్ళుPPEపౌలుని చెరపుపు ఎపిస్టిళ్ళు
పౌలుని చెరపుపు ఎపిస్టిళ్ళు ·Videoఆంగ్లం నుండి అనువాదం చేయబడింది

PPE-01 పౌలు బందిఖానాలో

పూర్తి వచనం చదవండి

అదే శ్రేణిలోని 1వ పాఠానికి తోడుగా ఉండే వీడియో. ఈ వీడియో ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: అపొస్తలుల కార్యములు పౌలు జీవితం యొక్క వాస్తవిక వృత్తాంతాన్ని కలిగి ఉందా? పౌలు యెరూషలేములో యూదుల ఆచారాలలో పాల్గొన్నాడు ఎందుకు? ధర్మశాస్త్రం అవసరం లేని సంప్రదాయాలను మనం ఎలా చూడాలి? అడ్వెంట్, లెంట్ వంటి చర్చి కాలాలను మనం పాటించాలా? పౌలు రోమన్ పౌరుడిగా తన హక్కులను ఎందుకు నొక్కిచెప్పడానికి నిరీక్షించాడు? రోమ్ పౌలు క్రీస్తు గురించి బోధించడానికి ఎందుకు అనుమతించింది? అన్ని విషయాలను అన్ని వ్యక్తులకు అనుగుణంగా మారడం అంటే ఏమిటి? మనం విదేశీ సంస్కృతులతో నిమగ్నమవ్వాలా లేదా మనకు తెలిసిన సంస్కృతులతోనే పని చేయాలా? చర్చి తన స్వంత సంస్కృతికి అనుగుణంగా క్రైస్తవులను ఏకీభవించమని ఎప్పుడు కోరాలి? క్రైస్తవులు ఎందుకు బాధపడాలి? పౌలు ఆధ్యాత్మిక యుద్ధంలో విజయంతో బాధలను ఎందుకు అనుబంధించాడు? అతనికి ఆపాదించబడిన జైలు ఉత్తరాలన్నీ పౌలు వ్రాసాడా? పౌలు ఫిలేమోనుకు రాసిన వ్యక్తిగత లేఖ బైబిల్లో ఎందుకు ఉంది? పౌలు ఖైదు అతని గౌరవప్రదత్వాన్ని దెబ్బతీసిందా? పౌలు బోధనలోని ఏ మూలస్తంభం ఆధునిక చర్చిలో అత్యంత లోపించింది? క్రీస్తుతో సమ్మిళితం అంటే ఏమిటి, అది ఎందుకు ముఖ్యం? మన మేలు పనుల నుండి ఎవరు ప్రయోజనం పొందాలి?


From the transcript

1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.

బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.

ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.

అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.

మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.

1675వ సంవత్సరములో, ఇంగ్లాండ్ లోని బెడ్ఫోర్డ్లో, జాన్ బన్యన్ అను సుప్రసిద్ధ ప్యురిటన్ ప్రసంగికుడు మరియు రచయిత లైసెన్సు లేకుండా బహిరంగంగా ప్రసంగించినందున అతనిని అరెస్టు చేసి ఆరు నెలలు పాటు చెరసాలలో ఉంచారు. గతంలో, ఆయన పండ్రెండు సంవత్సరాల పాటు చెరసాలలో గడిపాడు, ఆ సమయములో అనేక పుస్తకాలను మరియు కర పత్రికలను ఆయన వ్రాశాడు. కాబట్టి, క్రొత్తగా అరెస్టు చేయబడిన ఈ సమయమును ఒక విషాదకరమైన సంఘటనగా కాకుండ ఆశాజనకమైన సంఘటనగా చూశాడు. “నేను చాలాకాలంగా నా రచనలకు దూరంగా ఉన్నాను” బహుశా ఇది నేను క్రీస్తు సందేశంతో ప్రపంచాన్ని చేరుకోగల కార్యాలయమే గాని చెరసాల కాదు” అని అతడు చెప్పినట్లుగా సమాచారం కూడా ఉంది.

ఇవి బన్యన్ మాట్లాడిన ఖచ్చితమైన మాటలైనా కాకపోయినా, ఈ కొద్దికాల చెరసాల సమయంలో అతడు చేసిన పరిచర్య మాత్రం త్రోసిపుచ్చలేనిది. ఈ నెలలలోనే బన్యన్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచి నేడు కూడా ప్రజలను క్రీస్తు కొరకు ఆకర్షించు ఒక క్రైస్తవ జీవిత కల్పిత రచన అయిన యాత్రికుని ప్రయాణమును వ్రాశాడు. ఇప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు క్రీస్తు కొరకు ఎన్నో సాధించిన ఒక వ్యక్తిని మనందరం ప్రశంసించాలి. అయితే, జాన్ బన్యన్ రచన ఎంత ముఖ్యమైనదిగా నిరూపించబడిందో, అపొస్తలుడైన పౌలు రచన అంతకంటే గొప్పదిగా పరిగణించబడింది. కైసరయ మరియు రోమాలో తన నాలుగు సంవత్సరాల నిర్బంధంలో, బన్యన్ యొక్క రచన కంటే ముఖ్యమైన పత్రికలను అతడు వ్రాశాడు.

పౌలు యొక్క చెరసాల పత్రికలు అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము. ఈ పాఠ్యక్రమములో “చెరసాల పత్రికలు”గా పిలువబడే పౌలు పత్రికలను మనం అధ్యయనం చేస్తాము. పౌలు క్రీస్తు సేవను బట్టి చెరసాలలో ఉన్నప్పుడు వివిధ సంఘాలకు మరియు ప్రజలకు అతడు వ్రాసిన పత్రికలు ఇవి. ఈ పాఠమునకు “పౌలు నిర్బంధం” అను పేరు పెట్టాము. ఈ పాఠంలో పౌలు కొలస్సయులకు, ఫిలేమోనుకు, ఎఫెసీయులకు మరియు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలకు కారణమైన పరిస్థితులను పరిశీలిస్తాము.

పౌలు నిర్బంధమును గూర్చిన మన అధ్యయనం మూడు ప్రధాన అంశాలను చర్చిస్తుంది: మొదటిగా, మొదట కైసరయలో అటుతరువాత రోమాలో పౌలు నిర్బంధము యొక్క నేపథాన్ని పరిశీలిస్తాము. రెండవదిగా, నిర్బంధ సమయంలో పౌలు చేసిన పరిచర్యను పరిశీలిస్తాము, నిర్బంధంలో ఉండి కూడా క్రీస్తు అపొస్తలుడుగా పరిచర్యను ఏ విధంగా కొనసాగించాడో చూద్దాము. మరియు చివరిగా, చెరసాల పత్రికలన్నీ పంచుకొనే కొన్ని ప్రధానమైన అంశాలను ఉద్ఘాటిస్తూ వాటి యొక్క వేదాంతశాస్త్ర ఐక్యతను పరీక్షిస్తాము. పౌలు నిర్బంధము యొక్క నేపథ్యముతో ఆరంభిద్దాము.

పౌలు యొక్క చెరసాల పత్రికలను మనము చూచుచుండగా, పౌలు కొలస్సీ, ఫిలేమోను, ఎఫెసీ, మరియు ఫిలిప్పీ పత్రికలను వ్రాసిన సమయములో ఎక్కడ చెరసాలలో బంధించబడియున్నాడు అను విషయమును గూర్చి పండితుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అర్థము చేసుకొనుట ప్రాముఖ్యమైయున్నది. అతడు కైసరయ నుండి వ్రాశాడని కొందరు, అతడు రోమాలో నుండి వ్రాశాడని మరికొందరు భావించారు. ఈ వివరాలు మన వ్యాఖ్యనములలో దేనికీ అంత ప్రాముఖ్యముకానప్పటికీ, పౌలు బహుశా రోమా నుండి వ్రాశాడని ఈ పాఠంలో మనం అభిప్రాయపడతాము. ఏదేమైనా, ఘనమైన పండితులు ఈ విషయాలపై విభేదిస్తున్నారు గనుక, ఈ రెండు పట్టణాల్లో ఆయన గడిపిన సమయాన్ని మనం చర్చించాలి.

పౌలు నిర్బంధము యొక్క నేపథ్యమును గూర్చిన మన పరిశోధన అతని అరెస్టుకు ముందు జరిగిన సంఘటనలను అవలోకనము చేయుటతో ఆరంభమౌతుంది. తరువాత, యెరూషలేములో అతడు అరెస్టుకు సంబంధించిన సంఘటనలను, మరియు అటుతరువాత కైసరయలో ఆయన యొక్క తొలి నిర్బంధమును అన్వేషిస్తాము. చివరిగా, రోమాలో అతని యొక్క తదుపరి నిర్బంధమును మనం చూస్తాము. ఆయన అరెస్టుకు ముందు సంభవించిన సంఘటలను మొదటిగా చూద్దాము.

పౌలు యొక్క మూడవ మిషనరీ యాత్ర ముగింపులో, బహుశా క్రీ.శ. 56 లేదా 57లో, పౌలు మరియు అతని యొక్క యాత్రా సహచరులు చిన్న ఆసియా నుండి యెరూషలేముకు, ప్రధానంగా ఓడలో ప్రయాణం చేశారు. యెరూషలేములో కరవును భరిస్తున్న పేద క్రైస్తవులకు నిధులు అందించడమే వారి ఉద్దేశమై ఉండినది. వారు ప్రయాణిస్తుండగా మిలేతులో ఆగిపోయారు, అక్కడ పౌలు ఎఫెసు సమీపములో ఉన్న సంఘపు పెద్దలను కలిశాడు. ఈ సమావేశములో పౌలు తాను యెరూషలేములో ప్రవేశించినప్పుడు నిర్బంధించబడతాడని పరిశుద్ధాత్మ తనను హెచ్చరించినట్లుగా వెల్లడిచేశాడు. అపొస్తలుల కార్యములు 20:22-24లో అతని యొక్క ప్రవచన వాక్కులను మనం ఈ విధంగా చదువుతాము:

ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడనై యెరూషలేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదుగాని, బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు (అపొస్తలుల కార్యములు 20:22-24)

పౌలు దర్శించిన అనేక పట్టాణాల్లోని విశ్వాసులు పౌలు నిర్బంధించబడతాడని ప్రవచించారు. అయితే పరిశుద్ధాత్ముడు ఈ నిర్బంధం వైపు పౌలును బలవంతం చేశాడు. కాబట్టి, ఈ ప్రవచనాలు తనను తన మార్గం నుండి నిరోధించడానికి ఉద్దేశించినవి కాదుగాని రాబోవు శ్రమలకు ఆయనను సిద్ధపరచేవిగా ఉన్నాయని పౌలుకు తెలుసు. యెరూషలేములో పౌలుకు అనేకమంది శతృవులున్నారు గనుక తాను ప్రవేశించగానే తనను నిర్బంధిస్తారని అతనికి తెలుసు. అయితే ఈ శ్రమలు దేవుడు తన యెడల కలిగియున్న ప్రణాళికలో భాగమని కూడా అతడు గ్రహించాడు.

మిలేతు నుండి పౌలు మరియు అతని యొక్క సహచరులు కోసుకు, తరువాత రొదుకు, అటుతరువాత పతరకు వెళ్లారు. పతరలో ఓడ ఎక్కి తురుకు వెళ్ళకముందు కుప్రకు వెళ్లారు. యెరూషలేములో రాబోవు శ్రమలను గూర్చి పౌలును హెచ్చరించడానికి పరిశుద్ధాత్ముడు తూరులో అనేకమంది విశ్వాసులను ప్రేరేపించాడు. కాని పౌలు మాత్రం తన లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్ణయించుకున్నాడు.

ఆ బృందం తూరు నుండి తొలెమాయికి, అటుతరువాత సమరయ తీరంలో ఉన్న కైసరయకు వెళ్లారు. ప్రాచీన ప్రపంచంలో కైసరయ అను పేరుగల పట్టణాలు చాలా ఉన్నవి గనుక, ఈ పట్టణమును ఇతర పట్టణముల నుండి ప్రత్యేకించుటకు కొన్నిసార్లు “కైసరయ మరిటిమ” అని పిలిచేవారు అనగా “సముద్రము సమీపమున” అని అర్థం.

కైసరయ మరిటిమలో ఆయన నివాసం చేసినప్పుడు, యెరూషలేము వెళ్లవద్దని మరోసారి పౌలు హెచ్చరించబడ్డాడు. ఒక ప్రసిద్ధ నాటకీయ దృష్టాంతములో, అగబు అను ఒక ప్రవక్త ప్రవచానాత్మక చిహ్నంగా తన యొక్క చేతులను మరియు కాళ్ళను కట్టుకొని, నీవు యెరూషలేమునకు వెళ్తే అరెస్టు చేసి మరియు బంధిస్తారని పౌలుకు హెచ్చరించాడు. పౌలు బంధించబడడం అతని స్నేహితులకు ఎందుకు ఇష్టం లేదో అర్థం చేసుకోడవం సులభమే. వారు బహుశా పౌలు భద్రత కొరకు భయపడ్డారు, మరియు అతనికి హాని కలగాలని వారు ఏ మాత్రము ఆశించలేదు. అయితే సువార్త వ్యాప్తి కొరకు దేవుడు తన బంధకమును మరియు నిర్బంధమును ఉపయోగించుకొనుట దేవుని ప్రణాళిక అని పౌలు గ్రహించాడు. అపొస్తలుల కార్యములు 21:13లో మనము ఈ విధంగా చదువుతాము:

పౌలు ఇలా జవాబిచ్చాడు ... “నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను” (అపొస్తలుల కార్యములు 21:13).

అతనికి కలుగబోవు నిర్బంధము “ప్రభువైన యేసు నామము కొరకు” అని పౌలు అర్థం చేసుకున్నాడు. అంటే, సువార్త వ్యాప్తి కొరకు మరియు సంఘ పరిచర్య కొరకు రాబోవు పౌలు యొక్క శ్రమలను పరిశుద్ధాత్ముడు వాడుకోబోవుచున్నాడు.

ఎప్పుడు హింసను ఎదుర్కోవాలి మరియు ఎప్పుడు పారిపోవాలి అను విషయమును పౌలు ఎలా నిర్ణయించాడా అని కొందరు ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. మరియు ఇది చాలాసార్లు నిర్ణయము తీసుకొను సమయము మీద ఆధారపడుతుంది అని నా ఆలోచన. పరిశుద్ధాత్మ నిజముగా ఆ నడిపింపును ఇవ్వాలి, కాని దీనిలో అనేక విషయములు భాగమైయున్నాయి. మరియు పౌలు విషయానికొస్తే, దీనిలో రాజ్య విలువలు భాగమైయున్నాయి. రాజ్యము కొరకు ఉత్తమమైనది ఏది? అతడు దానిలో తన స్వప్రయోజనము కొరకు లేడు. అతడు శ్రమపడుటకు మరియు మరణించుటకు కూడా సిద్ధపడినాడు.

— డా. క్లే క్వార్టర్మాన్

పౌలు ఈ ప్రమాదాలను ఎదుర్కొనుచుండగా పరిశుద్ధాత్ముని నమ్మడానికి ఒక మంచి కారణం ఉంది. మునుపు అతని యొక్క రెండవ మిషనరీ యాత్రలో, పరిశుద్ధాత్ముడు తన యెడల చూపిన శ్రద్ధను పౌలు చూశాడు. అపొస్తలుల కార్యములు 16:6-10 ప్రకారం, ఆసియ మరియు బితూనియలో సువార్త ప్రకటించాలని పౌలు ఆశించాడు, కాని పరిశుద్ధాత్ముడు అతనిని ఆటంకపరచాడు. పౌలు దృష్టికి ఇది వింతగా అనిపించిననూ, అతడు పరిశుద్ధాత్ముడికి విధేయత చూపించి త్రోయకు వెళ్లాడు.

త్రోయలో, దేవుని ప్రణాళికను వెల్లడిపరచిన దర్శనమును పౌలు పొందుకున్నాడు. పౌలు మాసిదోనియకు సువార్తను తీసుకువెళ్లవలసిన వాడిగా ఉన్నాడు. మాసిదోనియలో పౌలు పరిచర్య చాలా ఫలభరితమైనదిగా ఉంది. అయితే పౌలు పరిశుద్ధాత్మునికి అవిధేయుడై ఆసియ మరియు బితూనియలో సువార్త ప్రకటించినట్లైతే, మాసిదోనియలో సువార్త ప్రకటించేవాడు కాదు. ఇది మరియు అనేక ఇతర అనుభవాల ద్వారా, యెరూషలేములో ఏమి సంభవించినా ఆత్మ నడిపింపును అనుసరించి అక్కడికి వెళ్లాలి అని పౌలు నిర్థారించుకున్నాడు. తాను ఏమి చేయాలని దేవుడు ఆశించుచున్నాడో తెలుసుకోవడం మరియు అద్భుతమైన ఊహించని విధంగా ఏదొకటి సాధించడానికి దేవుడు ఈ శ్రమలను ఉపయోగిస్తాడని నమ్మితే చాలని పౌలు భావించాడు.

సువార్తను పంచుటకు దేవుడు తనను పిలచాడు అను నిశ్చయతతో మరియు దేవుని ఆత్మ మీద పూర్తి నమ్మకముతో, పౌలు చెరసాలను ఎదుర్కొనుటకు కూడా సిద్ధపడ్డాడు. బహుశా క్రీ.శ. 57లో, యెరూషలేముకు ప్రయాణిస్తూ పౌలు తన మూడవ మిషనరీ యాత్రను ముగించాడు. అపొస్తలుల కార్యములు 20:16 ప్రకారం, అతడు వేసవి కాలము ఆరంభంలో పెంతెకొస్తు సమయానికి చేరుకొని యుండవచ్చు.

పౌలు అరెస్టుకు ముందు జరిగిన సంఘటనలు మనము చూశాము గనుక, యెరూషలేములో అతని అరెస్టుకు సంబంధించిన పరిస్థితులను పరిశోధించుటకు ఇప్పుడు మనం సిద్ధముగా ఉన్నాము. పౌలు యెరూషలేములోని అధికారులతో ఎలా విభేదించాడు? అతడు ఎందుకు నిర్బంధించబడ్డాడు?

పౌలు యెరూషలేముకు వచ్చినప్పుడు, అతడు మ్నాసోను అను విశ్వాసి యొద్ద ఉన్నాడు మరియు సంఘము అతనిని సంతోషంగా ఆహ్వానించింది. మరుసటి దినమున పౌలు యేసు సహోదరుడును మరియు క్రొత్త నిబంధనలోని యాకోబు పత్రిక రచయితయైన యాకోబును కలిశాడు. యెరూషలేము సంఘములోని పెద్దలు కూడా పౌలును కలవడానికి కూడుకొన్నారు. బహుశా, ఈ సమయములోనే పౌలు మొదటి మిషనరీ యాత్రలో సేకరించిన కరవు ఉపశమన నిధులను సంఘానికి అందజేశాడు. పౌలు యొక్క మునుపటి పత్రికలైన రోమీయులకు, 1 మరియు 2 కొరింథీయులకు అను పత్రికల ద్వారా, ఈ నిధులు యెరూషలేములోని పేద క్రైస్తవులకు సహాయం చేయుటలో మాత్రమే కాకుండ, యూదులు మరియు అన్య విశ్వాసులను సమన్వయపరచుటలో కూడా సహాయపడతాయని పౌలు భావించినట్లుగా మనకు తెలుసు.

ఈ నిధులను యూదా క్రైస్తవులు అన్యజనుల యొద్ద నుండి పొందుకున్నప్పుడు, వారి యొక్క కృతజ్ఞతా భావం అన్యజనులను కూడా క్రీస్తులో సంపూర్ణ సోదరులుగా స్వీకరించునట్లు వారిలో మరింత ఆసక్తిని కలిగిస్తుందని పౌలు ఆశించాడు. కాని అపొస్తలుల కార్యముల్లోని కథనము కరవు ఉపశమన నిధుల పంపిణీని గూర్చి ప్రస్తావించలేదు. దీనికి బదులుగా, పౌలు పరిచర్యకు సంబంధించిన కొన్ని విషయాలను మాత్రమే అది ఉద్ఘాటిస్తుంది. బహుశా, యెరూషలేము సంఘము కరవు ఉపశమన నిధులను పౌలు ఆశించినట్లుగా అభినందించలేదని ఇది సూచిస్తుంది.

అన్యక్రైస్తవుల యొక్క దాతృత్వమును బట్టి ఆనందించి,పౌలు పరిచర్యను ధృవీకరించుటకు బదులుగా, పౌలు యొక్క బోధనా మరియు ఆచరణ కార్యాలను బట్టి కొన్ని పుకార్లు యెరూషలేము సంఘముకు చేరాయని పెద్దలు మరియు యాకోబు పౌలుకు తెలియజేశారు. ప్రత్యేకంగా చెప్పాలంటే, సున్నతి వంటి యూదుల యొక్క సాంప్రదాయ ఆచారాలను విస్మరించుమని పౌలు అన్యజనుల మధ్య నివసించుచున్న యూదా క్రైస్తవులకు బోధించాడను పుకారు వచ్చింది. ఇప్పుడు, యూదా క్రైస్తవులందరు సాంప్రదాయ యూదుల ఆచారాలను పాటించాలని యెరూషలేములోని యూదా క్రైస్తవులు బలంగా నమ్మారు. మరియు ఇటువంటి పుకారుల వలన స్థానిక యూదా క్రైస్తవులు పౌలును వ్యతిరేకించారని యాకోబు మరియు పెద్దలు ఆందోళన చెందారు.

పౌలును గూర్చిన ఈ అపోహలు తప్పిదములు అని మనము తెలియజేయాలి. పాత నిబంధనలో కనిపించే దేవుని నైతిక ధర్మశాస్త్రం యొక్క ప్రామాణికతను తన పత్రికలన్నిటిలోనూ పౌలు ధృవీకరించాడు. అంతేకాక, యూదుల సమాజాలు మోషే ధర్మశాస్త్రములో చేర్చిన సాంప్రదాయలను విస్మరించుమని కూడా వారిని ప్రోత్సహించలేదు. విరుద్ధంగా చెప్పాలంటే, ఆయన యూదుల సమాజాల్లో ఉన్నప్పుడు స్వయంగా తానే యూదా సాంప్రదాయాలను పాటించాడు. ఏదేమైనా, క్రీస్తు మరణము మరియు పునరుత్థానముతో క్రొత్త యుగం ప్రారంభమైందని ఆయన బోధించాడు. మరియు అతడు తన పత్రికల్లో వివరించినట్లుగా, ఈ సాంప్రదాయాలను కొనసాగించడానికి అన్యజనులు లేదా యూదులు అవసరము లేదు. అవిశ్వాసులైన యూదులకు సువార్త ప్రకటించడానికి మాత్రమే క్రైస్తవులందరు సాధారణంగా యూదుల సాంప్రదాయాలను ఉన్నతంగా పరిగణించాలి అని పౌలు నమ్మాడు.

ఈ విషయాల మీద అతని ఆలోచనను 1 కొరింథీయులకు 9:20-21లో అతడు వివరించిన విధానంలో వినండి:

యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు (నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను), ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని. (దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను). అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని (1 కొరింథీయులకు 9:20-21).

సువార్త నిమిత్తము యూదుల సాంప్రదాయాలను అనుసరించుటకు పౌలు సంతోషించాడు. అయితే, పాత నిబంధన ధర్మశాస్త్రము యొక్క ఈ సాంప్రదాయ యూదా అనువర్తనములను పౌలు అనుసరించాలని దేవుడు కోరలేదు. మరియు పౌలు అన్యజనుల మధ్యలో ఉన్నప్పుడు అన్యజనులవలె ప్రవర్తించుటకు సందేహించలేదు. పౌలు ఇక్కడ చెప్పినట్లుగా, ఈ సాంప్రదాయ ఆచారాలను విడిచిపెట్టుటకు తాను స్వతంత్రుడు. కాని క్రీస్తులోని నైతిక ఆంక్షల నుండి మాత్రం స్వతంత్రుడు కాలేదు. క్లుప్తంగా చెప్పాలంటే, దేవుని ధర్మశాస్త్రము యొక్క అనువర్తనములు క్రీస్తు వచ్చాడు గనుక ఇప్పుడు మారాయని పౌలు నమ్మాడు, కాని సువార్త నిమిత్తము యూదుల సాంప్రదాయాలను అనుసరించుట అప్పటికీ ఆమోదించబడినదిగా ఉండినది.

ఇంత జాగ్రత్తగా సూక్ష్మంగా చెప్పబడిన సిద్ధాంతం ఎలా తప్పుగా అర్థం చేసుకొనబడిందో, లేదా యూదులు తమ సాంప్రదాయాలను విస్మరించమని చెప్పినట్లు పౌలు మీద పుకారు ఎందుకు వచ్చిందో ఊహించడం అంత కష్టం కాదు. ఏ సంఘటలోనైనా, యాకోబు మరియు పెద్దలు ఒక పరిష్కారమును ఇస్తారు మరియు ఆ పరిష్కారము యెరూషలేములోని యూదా క్రైస్తవులను సంతృప్తిపరుస్తుందని వారు నమ్మారు.

ప్రత్యేకంగా చెప్పాలంటే, యెరూషలేము దేవాలయ ఆచారాల్లో పాల్గొనడం ద్వారా పౌలు మోషే ధర్మశాస్త్రము యెడల తన నిబద్ధతను ప్రదర్శించాలని వారు సూచించారు. ప్రత్యేకంగా, నజరేయ ప్రతిజ్ఞలు చేసిన నలుగురు మనుష్యులతో కూడా శుద్ధిచేసుకోవాలని వారాయనను కోరారు. ధర్మశాస్త్రము యెడల మరియు యూదుల సాంప్రదాయము యెడల పౌలు యొక్క విధేయతను ఇది చూపిస్తుంది. ఈ నలుగురు నజరేయులకు సంబంధించిన ఖర్చులను చెల్లించుమని కూడా వారు పౌలును కోరారు, ఇది పౌలు భక్తి యొక్క లోతును ప్రదర్శిస్తుంది.

పౌలు యెరూషలేమునకు తన అంతిమ ప్రయాణమును చేసినప్పుడు, మ్రొక్కుబడి చేసుకొనిన నలుగురు యేసు నందు విశ్వసించు, యూదా విశ్వాసుల పక్షమున అతడు ప్రాముఖ్యమైన యూదుల ఆచారమైన శుద్ధీకరణ ఆచారములో పాలుపంచుకున్నాడు. ఆ మ్రొక్కుబడి ఏమిటో మనకు తెలియదుగాని, దానిలోని ప్రక్రియ ఏమిటో మనకు తెలియజేయబడింది. మరియు వారు తుదకు దేవాలయమునకు వెళ్లి, అర్పణను అర్పించి, వారి మ్రొక్కుబడి పూర్తిచేయబడు సమయమును ఎంచుకొనుట ఈ ప్రక్రియలో భాగమైయున్నది... అతడు వారితో కలిసి దేవాలయమునకు వెళ్లాడు. అతడు వారి మ్రొక్కుబడికి అవసరమైన అర్పణను చెల్లించాడు — అది చాలా సొమ్ము అయ్యుండవచ్చు — మరియు వారితో కలిసి తనను తాను శుద్ధిచేసుకున్నాడు. మరియు అతడు ఇలా చేయుటకు ముఖ్య కారణము, రక్షణ పొందు నిమిత్తము ఆ నియమమును అనుసరించుటకు ప్రయత్నించుట కాదు; వాస్తవానికి సువార్త నిమిత్తము ద్వారమును తెరచుట కొరకు అతడు అలా చేశాడు... పౌలు సువార్త ప్రకటించాలని ఆశించు ప్రజలతో పాలుపంచుకొనుటకు వంతెనలు నిర్మించు నిమిత్తము విభిన్నమైన ఆచారములను, విలువలను, మరియు సంస్కృతులను పరిగణించాడు అని నా అభిప్రాయం. మరియు యూదుల శుద్ధీకరణ ఆచారములో పాలుపంచుకొను విషయములో కూడా అతడు ఇదే చేస్తున్నాడు.

— డా. డెన్ లఖీఖ్

అన్యజనులకు అపొస్తలుడుగా, అతని క్రియలు యూదా క్రైస్తవులు తనను గ్రహించిన విధానాన్ని మాత్రమే కాకుండా, అన్య క్రైస్తవులను గ్రహించిన విధానము మీద కూడా ప్రభావము చూపుతుంది అని పౌలుకు తెలుసు. బహుశా, నజరేయులకు మద్దతు ఇచ్చి తన్నుతాను శుద్ధి చేసుకోవడం ద్వార అన్యజనుల ఆర్ధిక బహుమతి సాధించని దానిని, అంటే యూదా క్రైస్తవులు అన్యక్రైస్తవులను ఆహ్వానించినదానిని సాధిస్తానని అతడు ఆశించాడు. కాబట్టి, యూదుల మధ్యలో క్రీస్తు నిమిత్తము, ప్రత్యేకించి సంఘములో యూదులు మరియు అన్యులకు మధ్య సమాధానం నిమిత్తము, ఈ విషయంలో యెరూషలేము సంఘపు తీర్పుకు లోబడి తన శుద్ధిదినములను ఆరంభించాడు.

పౌలు యొక్క శుద్ధిదినములు సమాప్తమయ్యే సమయంలో, మందిరపు లోపలి ఆవరణములో తన సమయాన్ని గడిపాడు. దేవాలయములో లోపలి ఆవరణము మరియు బయటి ఆవరణము ఉంటాయి. బయటి ఆవరణము లోపలి ఆవరణము నుండి ఒక తలుపు ద్వారా వేరుచేయబడింది. అన్ని రాజ్యల్లోని ప్రజలకు అందులో ప్రవేశించే అవకాశం ఉన్నందున బయటి ఆవరణమును అన్యజనుల ఆవరణముగా పిలిచేవారు. కాని లోపలి ఆవరణము, ఇశ్రాయేలు ఆవరణము, కేవలం యూదులకు మాత్రమే కేటాయించబడింది. గనుక ఇశ్రాయేలు ఆవరణములో ప్రవేశించిన అన్యులు మరణ శిక్షకు పాత్రులు.

పౌలు ఇశ్రాయేలు ఆవరణములో ఉన్నప్పుడు, చిన్న ఆసియా యూదులు కొందరు ఆయనను గుర్తించారు. వీరు క్రీస్తు అనుచరులుగాక బహుశా విశ్వసించని యూదులు అయ్యుండవచ్చు. మునుపు, ఈ యూదులే పౌలుతో పాటు యెరూషలేముకు వెళ్లిన త్రోఫిమను వ్యక్తితో పౌలును చూశారు. త్రోఫిము కూడా చిన్న ఆసియా కు చెందినవాడే, మరియు అతడు అన్యుడు అను విషయం ఆసియ యూదులకు తెలుసు. కాబట్టి, వారు పౌలును ఇశ్రాయేలు ఆవరణములో చూసినప్పుడు, త్రోఫిము కూడా ఆ ఆవరణములో ప్రవేశించాడని తప్పుగా ఊహించి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫలితంగా ఈ యూదులు పౌలుకు వ్యతిరేకంగా పట్టణములో గలిబిలి సృష్టించి, అతనిని చంపాలన్న ఉద్దేశంతో ఇశ్రాయేలు ఆవరణములో నుండి అతనిని బయటకు ఈడ్చారు. కాని పట్టణము గలిబిలిగా ఉందని యెరూషలేములోని రోమీయుల పటాలపు పైఅధికారి విన్నప్పుడు, ఆ అవాంతరాలను అరికట్టడానికి పరుగెత్తివచ్చి, సంకెళ్లతో పౌలును బంధించి, అదుపులోకి తీసుకున్నాడు. క్లౌదియ లూసియ అను పైఅధికారి, జనసమూహము యొక్క కోపాగ్నిని గూర్చి వివరించుమని బలవంతం చేయుటకు పౌలును శిక్షిద్దామనుకున్నాడు, కాని పౌలు రోమా పౌరత్వం కలిగినవాడని తెలుసుకున్నప్పుడు నిష్క్రమించాడు. రోమా పౌరుడుగా, విచారణ లేకుండా బంధించకూడదు లేదా శిక్షించకూడదు అనే హక్కుతో సహా ప్రత్యేక చట్టపరమైన భద్రతా హక్కులను పొందే అర్హత పౌలు కలిగియున్నాడు.

మరుసటి దినమున తనకు వ్యతిరేకముగా వచ్చిన ఆరోపణలను కనుగొనుటకు లూసియ పౌలును మహా సభ యెదుట, అనగా యూదుల ప్రభుత్వము యెదుట హాజరుపరచాడు. స్పష్టంగా చెప్పాలంటే, త్రోఫియ ఇశ్రాయేలు ఆవరణములో ప్రవేశించాడు అని సాక్ష్యమిచ్చుటకు ఒక్క సాక్షి కూడా ముందుకు రాలేదు, కాబట్టి అనేకమంది యూదులు తన బోధనకు వ్యతిరేకంగా ఎందుకు ఉన్నారో వివరించుట ద్వారా తన్నుతాను నిరూపించుకోవడానికి పౌలు స్వతంత్రం పొందాడు. అపొస్తలుల కార్యములు 23:11లో మనము చదువునట్లుగా:

వారిలో ఒక భాగము సద్దూకయ్యులును మరియొక భాగము పరిసయ్యులునై యున్నట్టు పౌలు గ్రహించి, “సహోదరులారా, నేను పరిసయ్యుడను పరిసయ్యుల సంతతివాడను; మనకున్న నిరీక్షణను గూర్చియు, మృతుల పునరుత్థానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను.” అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయెను. (సద్దూకయ్యులు పునరుత్థానము లేదనియు, దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని యొప్పుకొందురు) (అపొస్తలుల కార్యములు 23:6-8).

తాను పరిసయ్యుడైనందున మరియు తాను ప్రకటించిన సువార్త అనేక విషయాల్లో పరిసయ్యుల బోధనలతో ఏకీభవించినందున సద్దూకయ్యులు తనను వ్యతిరేకించారని పౌలు పేర్కొన్నాడు. వాస్తవంగా చెప్పాలంటే, పునరుత్థానం విషయంలో ఇది వాస్తవమైయుంది. సద్దూకయ్యులు మరణించిన వారి యొక్క శారీరక పునరుత్థానమును నమ్మరు, తత్ఫలితంగా, క్రీస్తు పునరుత్థానమును గూర్చిన పౌలు యొక్క క్రైస్తవ బోధనను వారు సహించలేదు.

మునుపటి దినమున, యేసు మృతులలో నుండి తిరిగి లేచాడని, తనకు దర్శనములో కనిపించాడని, మరియు తనకు సువార్తను వివరించాడని పౌలు ఆగ్రహంతో ఉన్న సమూహముకు ప్రకటించాడు. కాబట్టి, పునరుత్థానుడైన క్రీస్తును గూర్చిన తన దర్శనమును ఆధారము చేసుకొని సువార్త ప్రకటించానని మహా సభ యెదుట పౌలు చెప్పినప్పుడు, అతడు పరిసయ్యుల నుండి కొంత సానుభూతి పొందాడు.

పౌలు తన్నుతాను పరిసయ్యునిగా భావించి, అనేక విషయాల్లో వారి నమ్మకాలతో అంగీకరించాడని పరిసయ్యులు గమనించినప్పుడు, మహాసభలో వారు పౌలు పక్షమున మాట్లాడారు. కాని సద్దూకయ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు, గనుక ఆ సభ మరింత హింసాత్మకంగా మారింది. కాబట్టి, మరొకసారి, రోమా అధికారి అయిన క్లౌదియ లూసియ పౌలును అదుపులోనికి తీసుకున్నాడు.

మరునాడు, తనకు వ్యతిరేకంగా ఉన్న నేరములను పూర్తిగా విచారించుటకు లూసియ పౌలును మరోసారి మహాసభ యెదుట నిలబెట్టుటకు ఉద్దేశించాడు. కాని మహా సభను చేరుకోక మనుపే పౌలును చంపడానికి నలువదిమంది యూదులు పొంచియున్నారని పౌలు యొక్క మేనల్లుడు లూసియను హెచ్చరించాడు. ఇప్పుడు, పౌలు రోమా పౌరుడు గనుక అతనిని రక్షించుటకు లూసియ పూనుకొన్నాడు. కాబట్టి, అతనిని మహా సభకు పంపకుండా, యెరూషలేము సమీప పట్టణమైన కైసరయ మరిటిమాకు పంపించి మరియు రోమా ప్రాంతమైన యూదయకు గవర్నరుగా ఉన్న మార్కస్ యాంటోనియస్ ఫేలిక్సు అదుపులోకి పంపాడు.

ఇప్పటివరకు యెరూషలేములో పౌలు అరెస్టుకు ముందు జరిగిన సన్నివేశములు మరియు అరెస్టు సమయములో పరిస్థితులను పరిశీలించాము గనుక, ఇప్పడు ఫేలిక్సు అదుపులో, కైసరయలో అతని నిర్బంధమును మనం పరిశీలిద్దాము.

పౌలు యొక్క నిర్బంధ కాలములో, రోమా ప్రాంతమైన యూదయ, దక్షిణాన యూదయ, మధ్యలో సమరయ మరియు ఉత్తరమున గలిలయ అని పిలువబడే ప్రాంతాలను కలిగి ఉండినది. కైసరయ మరిటిమ సమరయ తీరంలో ఉందని మీరు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇది రోమా ప్రాంతమైన యూదయకు రాజధానిగా కూడా ఉంది.

బహుశా క్రీ.శ. 57లో పౌలు కైసరయకు మొదటిగా వచ్చినప్పుడు, అతని మీద ఆరోపణలు మోపినవారు యెరూషలేము నుండి వచ్చు వరకు ఐదు దినముల పాటు అతడు రోమా గవర్నర్ అయిన ఫేలిక్సు అదుపులో ఉన్నాడు. అతని మీద నేరముమోపిన వారిలో ప్రధాన యాజకుడైన అననీయ, కొందరు యూదుల పెద్దలు, మరియు తెర్తుల్లు అను ఒక న్యాయవాదియు ఉన్నారు.

ఆరోపణలు చేసిన యూదులు వచ్చినప్పుడు, ఫేలిక్సు ఫిర్యాదును విన్నాడు. ఈ ఫిర్యాదులో, పౌలు శాంతికి భంగం కలిగించి అల్లర్లను ప్రేరేపించాడని తెర్తుల్లు వాదించాడు. యూదయలో శాంతిని కాపాడుట ఫేలిక్సు యొక్క బాధ్యతయైయున్నందున గవర్నరు దృష్టిలో ఇదొక తీవ్రమైన ఆరోపణగా ఉంది. అయితే మరి ముఖ్యంగా, యూదుల దృష్టికోణం ప్రకారం, దేవాలయమును అపవిత్రపరచుటకు కూడా పౌలు ప్రయత్నించాడు అని వారు ఆరోపించారు. అక్కడ హాజరైన యూదుల పెద్దలలో ఒక్కరు కూడా అధికారికముగా సాక్ష్యమిచ్చుటకు ముందుకు రాకపోయినను, ఈ నేరమును వారు ధృవీకరించారు.

స్పష్టంగా చెప్పాలంటే, పౌలును గూర్చిన అబద్ధ పుకార్లను యూదులు హృదయపూర్వకంగా విశ్వసించారు. పౌలు యూదా మతము యొక్క పతనానికి ప్రయత్నించాడని మరియు దేవాలయమును అపవిత్రపరచుటకు ప్రయత్నించినట్లు తాను ఒప్పుకుంటాడని వారు విశ్వసించారు. కాబట్టి, నేరముమోపిన యూదులు పలికిన ఏకైక సాక్షి పేరు పౌలు! అపొస్తలుల కార్యములు 24:8లో ఫేలిక్సుతో తెర్తుల్లు మాట్లాడిన ముగింపు మాటలు మనం చదువుతాము:

తమరు [పౌలును] విమర్శించిన యెడల మేము ఇతనిమీద మోపుచున్న నేరములన్నియు తమకే తెలియవచ్చునని చెప్పెను (అపొస్తలుల కార్యములు 24:8).

ఇప్పుడు, పౌలు న్యాయవాది కాదు, కాని తన మీద నేరముమోపిన వారికి అతడు ఇచ్చిన సమాధానం ఆసక్తికరమైనది. అతని సమాధానంలో నాలుగు ప్రధాన బిందువులు ఉన్నాయి. మొదటిగా, మోపబడిన నేరమును ధృవీకరించుటకు ఏ సాక్షి కూడా లేడని ఆయన చెప్పాడు. అంటే వారి ఆరోపణలకు ఎటువంటి ఆధారం కూడా లేదు. ఇది ఒక ముఖ్యమైన విషయం ఎందుకంటే రద్దీగా ఉన్న ప్రదేశంలో పగటిపూటే పౌలు తన నేరాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. అతడు నేరస్థుడైతే, ఖచ్చితంగా ఎవరొకరు దానిని చూసేవారు. రెండవదిగా, తాను కాదు, ఇతరులు శాంతికి భంగం కలిగించారని అర్హడు సరిగానే వాదించాడు. ఆ అల్లరి ఆసియ నుండి వచ్చిన యూదుల వలన మొదలైంది. పౌలు రోమీయుల శాంతికి భంగం కలిగించలేదు; చిన్న ఆసియా నుండి వచ్చిన యూదులు శాంతికి భంగం కలిగించారు. పౌలును హతమార్చడానికి యూదులు ప్రణాళికలు వేస్తున్నారని ఆరోపించిన లూసియ లేఖ ద్వారా ఈ వాస్తవం ధృవీకరించబడింది. మూడవదిగా, బహుశా తన మీద నేరముమోపిన వారిని ఆశ్చర్యపరచే విధంగా, దేవాలయమును అపవిత్రపరచే ఉద్దేశము తనకు లేదని పౌలు నొక్కి చెప్పాడు. విరుద్ధంగా చెప్పాలంటే, లేఖనములో వ్రాయబడిన ప్రతిదానిని అతడు నమ్మాడు, మరియు ఆరాధించుటకు ఆయన దేవాలయంలోకి వచ్చాడు. నాల్గవదిగా, మహా సభ అతనిని నేరస్థునిగా ఎంచలేదు అని పౌలు గవర్నర్ ఫేలిక్సుకు జ్ఞాపకం చేశాడు. ఈ వాదన విచారణకు అంతరాయం కలిగించింది. యూదుల ప్రభుత్వం, మహాసభ, అతని మీద మోపబడిన నేరాలకు అతనిని దోషిగా నిరూపించలేదు. అయితే మరణ శిక్ష విధించడానికి వారెందుకు ప్రయత్నించారు?

అపొస్తలుల కార్యముల గ్రంథమును చదువునప్పుడు మనము చదువు ఒక విషయము ఏమిటంటే, చట్టపరముగానైనా లేక చట్టమునకు విరుద్ధముగానైనా లేక అక్రమముగానైనా పౌలును హతముచేయుటకు, ఉరితీయుటకు అతని ప్రత్యర్థులు చూపిన అమితమైన ఆశ మరియు ఆసక్తి. మరియు ఇది ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది, పౌలు తన ప్రత్యర్థులలో ఎందుకు అంత చంపాలన్న కోపము పుట్టించాడు? ... సరే, ఈ ప్రశ్నకు అనేక విధాలుగా సమాధానమియ్యవచ్చు అని నా ఆలోచన, కాని లూకా వ్రాసిన అపొస్తలుల కార్యముల కథనములన్నిటిలో, క్రైస్తవులు, ఆదిమ క్రైస్తవులు, అవిశ్వాసులైన యూదా అధికారుల ఎదుట నిలువబడియున్నప్పుడు పరిస్థితిని వర్ణించుటకు ఒక పదము ఉపయోగించబడింది, అది “అసూయ.” ప్రజలు సమాజ మందిరమును విడిచి వెళ్లుచున్నారు అని, వారు యేసు క్రీస్తు యొద్దకు చేరుతున్నారు అని, మరియు ఇతర క్రైస్తవులతో సహవాసము కలిగి అపొస్తలుల బోధన మరియు సిద్ధాంతము క్రింద జీవించుచున్నారు అని వారు అసూయపడ్డారు.

— డా. గై వాటర్స్

ఇప్పుడు, అంతరంగములో, ఫేలిక్సు నిజాయితీ లేని పాలకుడుగా ఉన్నాడు. పౌలుకు వ్యతిరేకంగా ఉన్న సరిపోని ఆరోపణల ఆధారంగా, ఫేలిక్సు అతనిని విడుదల చేయవచ్చు. కాని అతడు అలా చేయలేదు. బదులుగా, వ్యక్తిగత లాభం కొరకు ఒక అవకాశాన్ని చూశాడు, గనుక ఈ కేసు మీద విమర్శ నిలిపివేసి, పౌలు తనకు ద్రవ్యము ఇచ్చేవరకు వేచి ఉండడానికి ఇష్టపడ్డాడు. అపొస్తలుల కార్యములు 24:26లో, లూకా ఇలా వివరించాడు,

[ఫేలిక్సు] తరువాత పౌలు వలన తనకు ద్రవ్యము దొరుకునని ఆశించి, మాటిమాటికి అతనిని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను (అపొస్తలుల కార్యములు 24:26).

మొదట్లో, రోమా సహస్రాధిపతియైన లూసియ కైసరయకు వచ్చినప్పుడు, పౌలు కేసును తాను విచారిస్తానని ఫేలిక్సు చెప్పాడు. కాని ఫేలిక్సు పౌలు కేసుపై రెండేళ్ళ పాటు విచారణ నిలిపివేశాడు. అయితే, ఈ రెండేళ్ళ ముగింపులో, ఫేలిక్సు స్థానములో పోర్కియు ఫేస్తు గవర్నరుగా వచ్చాడు. క్రీ.శ. 59లో ఫేస్తు గవర్నరుగా అధికారములోకి వచ్చినప్పుడు, యెరూషలేములోని పౌలు యొక్క యూదా వ్యతిరేకస్తులు పౌలును చంపుటకు మరొక అవకాశం చూశారు. వారు మరొక ఆకస్మిక దాడి చేయడానికి ప్రణాళిక వేశారు మరియు అతని కేసును తిరిగి ఆరంభించి స్థానికంగా నిర్వహించాలని కోరుకుంటున్నాము అనే నెపంతో పౌలును యెరూషలేముకు పిలిపించుమని వారు ఫేస్తును వేడుకున్నారు. కాబట్టి, ఫేస్తు ఒక విచారణను పిలచి, కైసరయలో కాకుండా యెరూషలేములో తన కేసును విచారణ చేయడానికి ఇష్టమేనా అని పౌలును అడిగాడు.

ఈ సమయంలో, యెరూషలేములో తన కేసు విచారణ చేయబడుటను ఒప్పుకొనుటకంటే, రోమా పౌరునిగా తనకు ఉన్న హక్కును బట్టి నీరో కైసరే నా కేసును విచారించాలి అని పౌలు నివేదించాడు. ఫేస్తుకు వేరే మార్గములేక అతని విన్నపమును అంగీకరించాడు. ఈ నివేదనను గూర్చిన పౌలు యొక్క ప్రత్యేకమైన ఉద్దేశమును లేఖనము నమోదుచేయలేదు, కాని ఈ ఉద్దేశమును వివరించుటకు మనకు కొంత సమాచారం ఉంది. మొదటిగా, యెరూషలేములో విచారణ తరువాత విడుదల పొందుతానని నమ్ముటకు పౌలుకు ఏ కారణము లేదు. ఫేలిక్సు తన కేసును సరిగా విచారణ చేయనందున ఆయన అప్పటికే చెరసాలలో రెండేళ్ళు గడిపాడు. ఫేస్తు తన కేసును మరింత న్యాయంగా తీర్పుతీర్చుతాడని నమ్ముటకు ఆయనకు ఎటువంటి కారణం లేదు. రెండవదిగా, యూదులు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని బహుశా పౌలుకు తెలుసు. అపొస్తలుల కార్యముల రచయితయైన, లూకా, పౌలు యొక్క స్నేహితుడు, మరియు కైసరయ నుండి యెరూషలేముకు పౌలు బదిలీచేయబడినప్పుడు పౌలును చంపడానికి ప్రణాళిక వేశారని అతనికి తెలుసు. కాబట్టి, పౌలుకు కూడా ఈ ప్రణాళిక గురించి తెలుసు అని మనం ఊహంచవచ్చు. మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది, పౌలును లూసియ అరెస్టు చేసినప్పుడు, ప్రభువే పౌలుకు దర్శనములో కనబడి, నీవు రోమాలో సువార్త ప్రకటించడానికి జీవిస్తావని నిశ్చయత ఇచ్చాడు. అపొస్తలుల కార్యములు 23:11లో మనము చదువునట్లుగా:

ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి, “ధైర్యముగా ఉండుము! యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్ష్యమియ్యవలసియున్నదని చెప్పెను” (అపొస్తలుల కార్యములు 23:11).

అరెస్టు సమయంలో పౌలు ఈ దర్శనము పొందాడు, రోమాలో క్రీస్తును గూర్చి ప్రకటించుటకు తన నిర్బంధము అవకాశం కలిగిస్తుందని ఆలోచించుటకు ఈ దర్శనము సహాయపడింది. ఇంతకుముందు మనము చూచినట్లుగా, తన నిర్బంధము సువార్త వ్యాప్తిని కలుగజేస్తుందని నమ్మునట్లు పరిశుద్ధాత్ముడు పౌలును నడిపించాడు. ఆ సమయంలో, తన నిర్బంధము రోమాలోకి వెళ్లుటకు మార్గము సరాళము చేస్తుందని అతడు తెలుసుకున్నాడు.

ఏది ఏమైనప్పటికీ, పౌలు తన కేసును కైసరు యొద్ద నివేదించుకోడానికి తగిన ప్రేరణను కలిగిస్తుంది. కాని తన ప్రేరణ ఏదైనా, ఒకటి మాత్రం స్పష్టంగా ఉంది: ఎట్టకేలకు పౌలు రోమాలో సువార్త ప్రకటించగలడు, అది చెరసాల నుండైనా సరే. ఇప్పుడు, పౌలు రోమాకు పంపబడకముందు, తన కేసును యువరాజైన హేరోదు అగ్రిప్ప II యెదుట వివరించుకొనే అవకాశం ఉంది. మరియు పౌలు యొక్క వాదనలు వినిన పిమ్మట, అతడు కైసరు యెదుట చెప్పుకుంటానని అనకపోతే ఇతనిని విడుదల చేయవచ్చునని అగ్రిప్ప ఫేస్తుతో చెప్పాడు. కాని పౌలు యెడల ప్రభువుకు చాలా భిన్నమైన ప్రణాళిక ఉంది.

ఇప్పుడు, ఆ సమయములో, నమ్మకమైన యూదుల దృష్టిలో రోమీయుల అధికారము లోకము మీద సాతాను మరియు దయ్యపు శక్తుల యొక్క అధికారమునకు అత్యంత సామర్థ్యవంతమైన వ్యక్తీకరణగా ఉన్నది అని మనము గుర్తుంచుకోవాలి. తరువాత, ప్రకటన గ్రంథములో, అపొస్తలుడైన యోహాను రోమా సామ్రాజ్యమును క్రీస్తు అనుచరులను హింసించిన గొప్ప సాతాను బలముగా వర్ణిస్తాడు. రోమా పట్టణములో బోధించుట దేవుని రాజ్య ఉద్దేశ్యముల యొక్క అద్భుతమైన ప్రదర్శన అవుతుంది. అపొస్తలుల కార్యముల గ్రంథము యొక్క చివరి వచనాలలో లూకా ఆనందించినట్లు, లోకమునకు నిజమైన రాజుయైన యేసు యొక్క వాక్యమును, లోకములో దుష్ట సామ్రాజ్యము యొక్క కేంద్ర బిందువులోనికి తీసుకొనివెళ్లునట్లు దేవుడు పౌలుకు మార్గమును తెరచాడు.

పౌలు అరెస్టు కాకముందు జరిగిన సన్నివేశములను, యెరూషలేములో పౌలు యొక్క అరెస్టును, మరియు కైసరియాలో పౌలు యొక్క రెండేళ్ల చెరసాల కాలమును మనము చూశాము కాబట్టి, ఇప్పుడు అతడు తరువాత రోమాలో నిర్బంధించబడిన సమయమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము. కైసరయ నుండి రోమాకు మధ్యగల సుదీర్ఘ ప్రయాణమును గూర్చి చరిస్తూ ఆరంభిందుదము.

పౌలు రోమా ఖైదుగా ఉన్నందున, రోమా భద్రతలో అతడు ప్రయాణము చేయవలసి వచ్చింది. కాబట్టి, అతడు రోమా శతాధిపతియైన యూలి అధికారములో ఉన్నాడు మరియు చిన్న ఆసియా వైపు వెళ్లే ఓడలో వారు ప్రయాణమయ్యారు. పౌలు యొక్క ప్రయాణ సహచరులైన లూకా మరియు అరిస్తార్కు కూడా అతనితో వెళ్లడానికి అనుమతి పొందారు.

బహుశా క్రీ.శ. 59 చివరి భాగంలో ఈ ఓడ కైసరయ నుండి బయలుదేరింది. వారు మొదట సీదోనులో దిగారు, అక్కడ పౌలు కొందరి స్నేహితులను పరామర్శించుటకు అనుమతిపొందాడు. సీదోను నుండి బయలుదేరి కుప్ర దాటి, కిలికియ మరియు పంఫూలియ తీరం వెంబడి లుకియలో ఉన్న మూరకు చేరారు. మూరలో ఇటలీకి వెళ్లనైయున్న ఓడ ఎక్కారు. ఈ సమయం నుండి కూడా, వారు కఠినమైన ప్రయాణం సాగించారు. వారు క్నీదుకు ప్రయాణం సాగించి, అక్కడ నుండి దక్షిణ దిశగా వెళ్లుటకు బలవంతం చేయబడి, క్రేతు ద్వీపం వైపు ప్రయాణించి చివరకు మంచిరేవులు అను ఒక స్థలముకు చేరారు.

ఇది శీతాకాలమైనందున, ప్రయాణించడానికి వాతావరణం చాలా భయంకరంగా ఉంది. ఈ అపాయమును దృష్టిలో పెట్టుకొని ఇటలీకి వెళ్లుట ప్రమాదం అని పౌలు శతాధిపతియైన యూలికి సలహా ఇచ్చాడు. అనుభవజ్ఞులైన నావికులకు పౌలు సలహా చెప్పడం విచిత్రంగా అనిపించినప్పటికీ, అతనికి ప్రవచనాత్మక అంతర్దృష్టి ఉందని జ్ఞాపకం చేసుకోడం మాత్రమే కాకుండా, 2 కొరింథీయులకు 11:25 ప్రకారం, దీనికి ముందు పౌలు మూడు ప్రమాదాలను తప్పించుకున్నాడు అని జ్ఞాపకం చేసుకోవడం కూడా ముఖ్యమైన విషయం. రోమాలో సువార్త ప్రకటించాలని పౌలు ఆశించాడు. రోమాలో తనకు ఎదురైయ్యే తీర్పును తప్పించుకోవాలని ఆశించి అతడు నావికులకు సలహా ఇవ్వలేదు. బదులుగా, రోమాకు భద్రముగా చేరుకొని, దేవుడు తనకు ఇచ్చిన పనిని ముగించాలని అతడు ఆశ కలిగియుండినాడు గనుక అతడు హెచ్చరించాడు.

ఏది ఏమైనా, ఓడ నావికుడు మరియు యజమానుడు, తమ ప్రయాణం విజయవంతమౌతుంది అని యూలిని ఒప్పించి, మరలా ప్రయాణం కొనసాగించారు. అయితే, కొంచెం సేపైన తరువాత, వారు భయంకరమైన పెనుగాలిలో చిక్కుకున్నారు, మరియు అది వారిని మధ్యదరా సముద్రములో చాలా దూరమున ఉన్న కౌద ప్రదేశముకు తీసుకొనివెళ్లింది. ఆ పెనుగాలి రెండు వారముల పాటు కొనసాగింది, ఆ సమయములో పౌలు ఓడలో ఉన్నవారి మధ్య సువార్త ప్రకటించాడు. దేవుడు అతనికి బయలుపరచిన విషయమును — అనగా వారు బ్రతికి బయటపడతారు అను విషయమును — తెలుపుతూ అతడు వారిని ప్రోత్సహించాడు కూడా. చివరకు, మెలితే అను ద్వీప సమీపమున ఒక దిబ్బమీద ఓడ చిక్కుకుపోయినందున అమరము బద్దలైపోయింది. ఓడ బద్ధలైపోయినందున, నావికులు, సైనికులు, ఖైదీలు మరియు ఓడలోని ప్రతిఒక్కరు ఎటూ వెళ్లలేక మెలితేలో ఉండిపోయారు. మూడు నెలలపాటు పౌలు, అతని యొక్క సహచరులు మరియు సైనికులు మెలితేలో ఉండిపోయారు మరియు ఆ ద్వీపవాసులు వారికి ఉపచారము చేశారు.

పౌలు మెలితేలో ఉన్నప్పుడు, కొన్ని గొప్ప సంఘటనలు జరిగాయి. ఒకసారి, పౌలును విషసర్పము కాటువేసింది. ఆ ద్వీపవాసులు దానిని చూచి ఇతడు నరహంతకుడు కాబట్టి మరణిస్తాడు అని ఆశించారు. కాని పౌలు మాత్రం పాముకాటు ప్రభావానికి గురికాలేదు. తత్ఫలితంగా, ఆ ద్వీపవాసులు తమ అభిప్రాయం మార్చుకొని ఇతడొక దేవత అని చెప్పసాగారు.

ఇప్పుడు, పౌలు తనను దేవతగా పరిగణించువారి అభిప్రాయమును కొనసాగించనియ్యలేదని ఇతర సందర్భాల నుండి మనకు తెలుసు. ఉదాహరణకు, లుస్త్రలో పౌలుకు హెర్మే అని పేరుపట్టినప్పుడు, తాను కూడా సామాన్య నరుడనే అని చెప్పి, ఆ అవకాశమును సువార్త ప్రకటించుటకు ఉపయోగించుకున్నాడు. మెలితేలో కూడా అతడు ఇదే చేశాడని మనం ఊహించవచ్చును. పౌలు మెలితేలో కూడా అనేకమైన సూచకక్రియలు జరిగించాడు. మెలితే యొక్క ముఖ్య అధికారియైన పొప్లి యొక్క తండ్రిని స్వస్థపరచుట ద్వారా అతడు తన స్వస్థత పరిచర్యను ఆరంభించాడు. మరియు అతడు పొప్లి యొక్క తండ్రిని స్వస్థపరచాడన్న సమాచారం వ్యాపించినప్పుడు, మెలితేలో అనారోగ్యంతో ఉన్న ప్రతియొక్కరు పౌలు చెంతకు వచ్చి స్వస్థపడ్డారు.

మూడునెలలైన తరువాత, క్రీ.శ. 60 ముందు భాగంలో, శీతాకాలమంతయు గడిపిన పిమ్మట, పౌలు, అతని సహచరులు మరియు సైనికులు ఇటలీకి ప్రయాణం కొనసాగించారు. మెలితే నుండి బయలుదేరి సిసిలీ ద్వీపము వైపు ఉత్తరమున ప్రయాణించి సురకూసైకి వెళ్లారు. సురకూసై నుండి ఇటలీ ప్రధాన భూభాగం యొక్క దక్షిణ దిశలోని రేగియుకు వెళ్లారు. వారు రేగియును దాటినప్పుడు, దక్షిణపు గాలివల్ల వారు పొతియొలికి వెళ్లారు, పౌలును దర్శించుటకు చుట్టుప్రక్కల విశ్వాసులు అక్కడికి వచ్చారు. ఒక వారం తరువాత, పౌలు తుదకు రోమాకు వెళ్లాడు. క్రీ.శ. 60లో పౌలు రోమాలో ప్రవేశించాడు మరియు అక్కడ గృహ నిర్బంధంలో ఉంచబడ్డాడు.

పౌలు రెండేళ్ళ పాటు, క్రీ.శ. 60 నుండి 62 వరకు రోమాలో గృహ నిర్బంధంలో ఉన్నాడు. ఈ కాలంలో, కావలిగా ఉన్న సైనికులతో అతడు ఉన్నాడు, కాని అతిథులను స్వీకరించడానికి మరియు స్వేచ్ఛగా బోధించడానికి అనుమతి పొందాడు. యూదయలోని యూదుల నాయకులు రోమా యూదులకు పౌలు విషయం చెప్పలేదు గనుక, రోమా యూదులు తమకుతామే పౌలును గూర్చి విచారణ చేయసాగారు. అతని బోధన ద్వారా, వారిలో కొందరు క్రైస్తవ్యంలోకి వచ్చారు. అయితే మరికొందరు యేసును గూర్చిన అతని ప్రకటనలను మరియు పాత నిబంధన వాదనలను తిరస్కరించారు. అపొస్తలుల కార్యములు 28:30-31లో రోమాలో పౌలు యొక్క నివాసమును లూకా సంగ్రహించి ఇలా చెప్పాడు:

పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి, తన యొద్దకు వచ్చువారినందరిని సన్మానించి ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసు క్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను (అపొస్తలుల కార్యములు 28:30-31).

యెరూషలేములో పౌలు యొక్క అరెస్టు అన్యాయం, బాధాకరం మరియు ప్రాణాంతకమైనదిగా ఉంది. మరియు కైసరయలో అతని యొక్క నిర్బంధములో న్యాయానికి అన్యాయం జరిగింది. రోమాకు అతడు చేసిన ప్రయాణంలో అనేక ప్రమాదాలు ఎదురయ్యాయి. అయితే చివరకి, పౌలు యొక్క ఆశలు నెరవేర్చబడ్డాయి మరియు దేవుని యొక్క మాట నెరవేరింది. పౌలు రోమాకు చేరుకున్నాడు. మరియు రెండు సంవత్సరముల పాటు అతడు దేవుని రాజ్యమును గూర్చి — అనగా రోమా సామ్రాజ్యము యొక్క అధికారమునకు అతిపెద్ద ముప్పును గూర్చి — బోధించగలిగాడు. రోమాలో, అతడు రాజైన “ప్రభువైన యేసు క్రీస్తును” గూర్చి బోధించగలిగాడు. అతడు తన దినములలో అత్యంత శక్తివంతమైన దుష్ట సామ్రాజ్యము యొక్క రాజధాని పట్టణములో గృహనిర్భంధములో ఉన్నప్పటికీ, దీనిని “సంపూర్ణ ధైర్యముతో నిరాటంకముగా” చేయగలిగాడు.

పౌలు రోమా పట్టణమునకు చేసిన ప్రయాణము ఎంతో హృదయమునకు హత్తుకునేదిగా ఉన్నది, ఎందుకంటే అతని ఊహకు మించిన విధముగా ఒక గొప్ప ఉద్దేశ్యమును నెరవేర్చుట కొరకు దేవుడు ఒక వ్యక్తి యొక్క ప్రయాణమును నియమించాడు అను విషయములో అది ప్రత్యేకమైనదిగా ఉన్నది. ఒకసారి ఊహించండి, పౌలు సమాజ మందిరములలో, వీధులలో ప్రసంగించాడు మరియు ఒక శ్రేణి పజలతో మాత్రమే మాట్లాడగలిగాడు, కాని అనుకోకుండా ఉన్నట్లుండి దేవుడు నియమించిన ప్రయాణము ద్వారా, అతని జీవితములో జరిగిన దేవుని కార్యము ద్వారా, అతడు “నిర్బంధములోనికి” వెళ్లిపోయాడు. అయితే ఇప్పుడు ఆ నిర్బంధము అతడు సైనికులతో, ప్రత్యేకముగా రోమా సైనికులతో మాట్లాడు అవకాశమును కల్పించింది. అతడు మరొకచోటకు పంపబడవలసియుండిన ఒక రాత్రి, రెండు వందల మంది రోమా సైనికులు, రెండువందల మంది బంట్రోతులు, మరియు డెబ్బై గుర్రపుస్వారీ చేయు సైనికులు అతనిని రాత్రివేళ నడిపించవలసి వచ్చింది. వారు ఏ విషయమును గూర్చి మాట్లాడుకొనియుంటారో ఊహించండి? పౌలు. సువార్త. మరియు ఇప్పుడు అతడు శాతాధిపతుల ఎదుట, మరియు ఎన్నడును సమాజమందిరములకు వెళ్ళని, వీధులలో కనబడని అధికారులైనవారితో మాట్లాడుతున్నాడు. రోమా పట్టణమునకు అతడు చేసిన ప్రయాణము సువార్తను ప్రతి ఒక్కరి యొద్దకు చేర్చుటకు దేవుని ప్రణాళికలో గొప్ప ఉద్దేశ్యమును నెరవేర్చింది.

— పాస్టర్ జాన్సన్ ఒని

పౌలు నిర్బంధము యొక్క నేపథ్యమును ఇప్పటివరకు అవలోకనము చేశాము, గనుక తన నిర్బంధ కాలములో కొనసాగుచున్న పరిచర్యను పరిశీలించుటకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. మనము చూడబోవుచున్నట్లుగా, చెరసాలలో ఉన్నప్పుడు పౌలు పనిపాట లేకుండా లేడు. బదులుగా, యేసుక్రీస్తు సువార్త పరిచారకునిగా చురుకుగా పనిచేయుట కొనసాగించాడు.

పౌలు ఒక అపొస్తలుడు. యేసు వ్యక్తిగతంగా పౌలును పిలచి, అతనికి శిక్షణ ఇచ్చి తన రాయబారిగా, తన నిబంధన దూతగా పనిచేయుమని అతనిని నియమించాడు. నేడు ఇది మనకు వింతగా అనిపించవచ్చు, నిర్బంధములో ఉన్నప్పుడు పౌలు తనకు అప్పగించబడిన బాధ్యతలను మరచిపోలేదు. విరుద్ధంగా చెప్పాలంటే, తన జీవితకాలములోని ఈ సమయంలో పౌలు చెరసాలలో ఉండాలని దేవుడు ఉద్దేశించియున్నాడు. రోమాలో పౌలు యొక్క నిర్బంధము వలన క్రీస్తు సువార్తను ప్రకటించడానికి అవకాశం కలిగించునట్లు దేవుడే ఈ సంఘటనలను నిర్వహించాడు.

నిర్బంధ కాలములో కొనసాగుచున్న పౌలు పరిచర్యను గూర్చిన రెండు ప్రధాన సమాచార ఆధారాలు మనకు ఉన్నాయి. ఒకవైపు, ఆ సమయంలో పౌలు పరిచర్యను గూర్చి అపొస్తలుల కార్యములు అనేక విషయాలు తెలియజేస్తుంది. మరియు మరోవైపు, పౌలు వివిధ సంఘాలకు వ్రాసిన పత్రికలు కూడా చెరసాల పరిచర్యను గూర్చి అనేక విషయాలు తెలియజేస్తాయి. పౌలు పరిచర్యను గూర్చి అపొస్తలుల కార్యములు యేమని చెబుతుందో మొదటిగా చూద్దాము.

అపొస్తలుల కార్యములు రచయితయైన లూకాకు పౌలు యొక్క నిర్బంధము చాలా ముఖ్యమైనదిగా ఉంది. పౌలు జీవితములోని ఈ ఘట్టమును గూర్చి వ్రాయుటకు తొమ్మిది అధ్యాయాలు కేటాయించాడు. అపొస్తలుల కార్యములు 19:21లో పౌలు యెరూషలేముకు తరువాత రోమాకు వెళ్లాలని తీసుకున్న నిర్ణయము నుండి అపొస్తలుల కార్యములు 28:31లో గ్రంథము చివరి వరకు, పౌలు అరెస్టు చేయబడుటను గూర్చి తరువాత నిర్బంధములోకి వెళ్లుటను గూర్చి లూకా వివరించాడు.

ఈ అధ్యాయాల్లో అనేక వివరాలు ఉన్నాయి, కాని కనీసం మూడు ప్రధాన అంశాలు అనేక సందర్భాల్లో కనిపిస్తాయి: రానున్న శ్రమలను గూర్చి పౌలుకున్న అవగాహన, రాబోవు తన శ్రమల యెడల దేవుని ఉద్దేశమును గూర్చిన అవగాహన, మరియు తన శ్రమల ద్వారా కుమ్మరింపబడబోవు దేవుని ఆశీర్వాదముల యెడల అతడు కలిగియున్న అవగాహన. మొదటిగా, అతడు చేస్తున్న క్రీస్తు పరిచర్యను బట్టి తన జీవితంలో అనేక శ్రమలు బాధలు వస్తాయని పౌలుకు తెలుసు.

అపొస్తలుల కార్యములు 19-28లో, రాబోవు శ్రమలను గూర్చి తెలిసినవాడిగా లూకా పౌలును గూర్చి వివరించాడు. తాను నిర్బంధించబడతాడని మరియు చంపివేయబడతాడని కూడా పౌలుకు తెలుసు. ఉదాహరణకు, అపొస్తలుల కార్యములు 20:22-25లో ఎఫెసీ పెద్దలతో అతడు మాట్లాడిన మాటలను వినండి:

ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడినవాడనై యెరూషలేమునకు వెళ్లుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదుగాని, బంధకములును శ్రమలును నాకొరకు కాచుకొనియున్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియును. నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు ... మీలో ఎవరును ఇకమీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియును (అపొస్తలుల కార్యములు 20:22-25).

మరియు తరువాత అపొస్తలుల కార్యములు 21:13లో కైసరయలో అతడు విశ్వాసులతో ఇలా చెప్పాడు:

నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను (అపొస్తలుల కార్యములు 21:13).

క్రీస్తుకు, ఆయన సువార్తకు తాను చేసిన సేవలో ఎదురవ్వబోయే శ్రమలను గూర్చి పౌలుకు బాగా తెలుసు, మరియు మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు.

యెరూషలేముకు వెళ్లిన తరువాత ఏమి జరుగుతుందో తెలిసి కూడా — అతడు చెరసాలలో వేయబడతాడు — అక్కడికి వెళ్లి సువార్త ప్రకటించు ధైర్యము పౌలులో ఉండినది, ఎందుకంటే సువార్త ప్రకటన పట్ల అతడు సమర్పణ కలిగియుండినాడు... మరియు అక్కడికి వెళ్లి సువార్త ప్రకటించాలని ఆత్మ అతనిని ప్రేరేపించాడు. మరియు దేవుడు అతనికి ఇచ్చిన పరిచర్యను నెరవేర్చు ప్రక్రియలో ఏ విధమైన ఆటంకములు లేక అపాయములు అతనిని తప్పుదారిపట్టించుటకు అతడు అనుమతించలేదు.

— రెవ. రాబర్ట్ అలెగ్జేండర్

రెండవదిగా, తాను ఎదుర్కొను శ్రమలను గూర్చి మాత్రమే పౌలుకు అవగాహన లేదుగాని, అతని శ్రమ యొక్క ఉద్దేశ్యమును గూర్చి కూడా అతడు అవగాహన కలిగియుండినాడు అని అపొస్తలుల కార్యములు గ్రంథము తెలియజేస్తుంది.

తాను శ్రమలను అనుభవించాలని దేవుడు ఆశించినట్లైతే, సువార్త వ్యాప్తి కొరకు ఈ శ్రమలను దేవుడు ఉపయోగించుకుంటాడని కూడా పౌలుకు తెలుసు. క్రైస్తవ సువార్త వ్యాపింపజేయడానికి దేవుడు తన శ్రమలను ఉపయోగించుకుంటాడని పౌలు సంపూర్ణముగా నమ్మాడు. తాను చేయబోవు ఏ త్యాగమైనా సరే అది అర్హమైనదే అని అతడు గ్రహించాడు ఎందుకంటే క్రీస్తులో రక్షణను గూర్చిన సువార్తను వ్యాపింపజేయడానికి అది దేవుడు ఉపయోగించే మార్గంగా ఉంది. అపొస్తలుల కార్యములు 20:24లో ఎఫెసీ పెద్దలతో అతడు ఏమి చెప్పాడో మరోసారి వినండి:

అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు (అపొస్తలుల కార్యములు 20:24).

చెరసాలలో తాను చేయుచున్న పరిచర్యలో సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట, మరియు ఈ శ్రమలను అనుభవించుట ఒక అపొస్తలుడుగా తన బాధ్యతలో భాగమని అతడు భావించాడు. ఈ నిర్బంధము, పౌలు అపొస్తులత్వ పరిచర్యకు ఆటంకం కలిగించక, తన పరిచర్యను నెరవేర్చుటకు మాధ్యమంగా ఉంది.

వాస్తవంగా చెప్పాలంటే, అపొస్తలుల కార్యముల్లో మరోచోట మనము చదువునట్లు, ఖచ్చితంగా ఇదే జరిగింది. అపొస్తలుల కార్యములు 22:1-21లో, పౌలు యెరూషలేములో నిర్బంధించబడినప్పుడు, తన మరణము కొరకు వేచిచూస్తున్న సమూహముకు తన క్రైస్తవ సాక్ష్యమును అందించాడు. అపొస్తలుల కార్యములు 23:1-10లో, మహాసభ, పాలించు ప్రభుత్వము యెదుట సువార్తను గూర్చి మరియు క్రీస్తు పునరుత్థానము గూర్చి పౌలు సాక్ష్యమిచ్చాడని లూకా వివరించాడు. అటుతరువాత అపొస్తలుల కార్యములు 24:14-26లో, పౌలు తన విచారణలో కైసరయ కోర్టులో బహిరంగంగాను మరియు గవర్నర్ ఫేలిక్సు నకు అదే విధంగా యూదురాలైన తన భార్య ద్రుసిల్లకు వ్యక్తిగతంగాను సువార్తను ప్రకటించాడు. రెండు సంవత్సరాల పాటు ఫేలిక్సు పౌలుతో తరచుగా మాట్లాడాడని కూడా మనకు చెప్పబడింది.

దీని తరువాత, అపొస్తలుల కార్యములు 25:18-26:29లో, క్రొత్త గవర్నరైన ఫేస్తుకును, అదే విధంగా యూదా రాజైన అగ్రిప్పకు మరియు అతని భార్య బెర్నిసుకు పౌలు సువార్త ప్రకటించాడని లూకా మనకు చెబుతున్నాడు. మరియు అపొస్తలుల కార్యములు 28:23-31లో, పౌలు తరచుగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు అని మరియు రోమా పట్టణములో అతనిని దర్శించుటకు వచ్చినవారందరికి ఇశ్రాయేలు యొక్క రాజరిక మెస్సీయగా యేసును గూర్చి బోధించాడు అని లూకా వివరించాడు. అపొస్తలుల కార్యములు 23:11లో, పౌలుతో క్రీస్తు మాట్లాడిన మాటలు తన శ్రమలన్నిటి యొక్క ఉద్దేశ్యమును గూర్చి సంగ్రహించాయి:

ఆ రాత్రి ప్రభువు అతనియొద్ద నిలుచుండి, “ధైర్యముగా ఉండుము! యెరూషలేములో నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడ సాక్ష్యమియ్యవలసియున్నదని చెప్పెను” (అపొస్తలుల కార్యములు 23:11).

క్రీస్తును గూర్చిన సువార్తను యెరూషలేము మొదలుకొని రోమా వరకు వ్యాపింపజేయుటకు పౌలు శ్రమపడ్డాడు.

శ్రమల పట్ల పౌలు కలిగియుండిన వైఖరి నిజముగా అమోఘమైనది. చూడండి, మనలో చాలామందిమి శ్రమను తప్పించుకొనుటకు చేయగలిగినదంతా చేస్తాము. అయితే పౌలు ఇలా చేయలేదు... అతడు శ్రమల యందు ఆనందిస్తాను అని చెబుతున్నాడు; అతడు శ్రమలు, శోధనలు మరియు బాధలలో ఆనందిస్తాడు, ఎందుకంటే అతడు బలహీనుడుగా ఉన్నప్పుడు, క్రీస్తు బలవంతుడవుతాడు. కాబట్టి, దీనంతటిలో పౌలు తనను తాను మహిమపరచుకొనుట లేదు లేక తన జీవితములో ఆదరణను కోరుటలేదుగాని క్రీస్తును మహిమపరచుచున్నాడు, మరియు దేవుడు తనను పిలచిన ప్రతి పనిని చేయుచున్నాడు, దేవుని రాజ్య నిర్మాణమును మరియు సువార్త ప్రకటనను నమ్మకముగా చేయుచున్నాడు అని మనము చూస్తాము.

— డా. జెఫ్ బ్రన్నోన్

మూడవదిగా, అతని శ్రమలు మరియు వాటి ఉద్దేశ్యమును గూర్చి పౌలు కలిగియుండిన అవగాహనతో పాటుగా, ఈ కాలములో తన పరిచర్య మీద దేవుని ఆశీర్వాదములను గూర్చి కూడా పౌలు అవగాహనను కలిగియుండినాడు అని అపొస్తలుల కార్యముల గ్రంథము మనకు బోధిస్తుంది.

అపొస్తలుల కార్యములు 19-28లోని లూకా కథనము పౌలు సువార్త సాక్ష్యము దేవుని ఆత్మ యొక్క నాటకీయ ఆశీర్వాదములతో వ్యాపిస్తుంది అని స్పష్టం చేస్తుంది. పౌలు పరిచర్యలో సువార్తను ప్రకటించు అతని సామర్థ్యతకు మరియు వ్యక్తుల జీవితాలకు వాటిని అనువర్తించడానికి సహాయపడే ఇతర విషయాలు కూడా ఉన్నాయని లూకా మనకు చెబుతాడు. ఉదాహరణకు, అతడు దిబ్బమీద కుప్పకూలిన ఓడలో ఉన్నవారి ప్రాణాలను రక్షించడానికి దర్శనములను పొందుకున్నాడు మరియు వాటిని వివరించాడు. మెలితేలో అతడు రోగులను స్వస్థపరచాడు. మరియు అతనిని చూచుటకు వచ్చిన వారియొక్క వ్యక్తిగత అవసరతలను కూడా చూశాడు.

తాను చెరసాలలో ఉన్నప్పుడు పౌలు కొనసాగించిన పరిచర్యను గూర్చి అపొస్తలుల కార్యములు గ్రంథము మనకు అనేక విషయములను బోధిస్తుంది, కాని అతడు కొలస్సీ, ఎఫెసీ మరియు ఫిలిప్పీ పట్టణములలో ఉన్న సంఘములకు, మరియు కొలస్సీ పట్టణమునకు చెందినవాడైన ఫిలేమోనుకు వ్రాసిన క్రొత్త నిబంధన పత్రికల నుండి కూడా మనము అనేక విషయములను నేర్చుకోవచ్చు.

సంఘములకు పౌలు వ్రాసిన పత్రికలలో నుండి మనము నేర్చుకొను విషయములను సంగ్రహించుటకు అనేక విధానములు కలవు, కాని నాలుగు విషయములు మాత్రం వెలుగులోనికి వస్తాయి. అతడు శారీరకంగా పరిమితం అయినప్పటికీ, పౌలు వివిధ ప్రముఖులకు మరియు తన సందర్శకులకు సువార్త ప్రకటించుట ద్వారా, ప్రపంచంలో ఉన్న విశ్వాసుల పక్షమున మరియు సంఘముల పక్షమున ప్రార్థన చేయుట ద్వారా, సంఘాభివృద్ధి కొరకు అనేక శ్రమలను అనుభవిస్తూ, ప్రపంచంలో ఉన్న వివిధ సంఘాలకు మరియు వ్యక్తులకు పత్రికలు వ్రాస్తూ పరిచర్యను కొనసాగించాడు. మొదటిగా, పౌలు ఈ సమయంలో సువార్త ప్రకటించాడు.

మనము ఇంతకు ముందు చూసినట్లు, సువార్త ప్రకటించుటకు నూతనమైన అవకాశములను సంపాదించుటకు పౌలు చెరసాలను సహించాడు, మరియు అతని పత్రికలు ఈ ఆలోచనను పునరుద్ఘాటిస్తాయి. దీనిని మనము క్రీస్తు రాయబారిగా తన్నుతాను సంకెళ్లతో గుర్తించుకొనుటలో మాత్రమే కాకుండా, పత్రికలు వ్రాసిన సంఘముల నుండి కోరిన ప్రార్థనలో కూడా చూస్తాము. ఉదాహరణకు, ఎఫెసీయులకు 6:19-20లో అతడి విన్నపమును వినండి:

మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంకెళ్లలో ఉన్నానో, ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాటలాడ నోరుతెరచునప్పుడు దానినిగూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్చక్తి నాకు అనుగ్రహింపబడునట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి (ఎఫెసీయులకు 6:19-20).

చెరసాలలో కూడా, క్రీస్తును గూర్చి మరియు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుట అతని ప్రధానమైన బాధ్యత అని పౌలుకు తెలుసు. కాబట్టి, తన యొక్క అపొస్తలత్వ పరిచర్యను నెరవేర్చడానికి తగిన శక్తికొరకు ప్రార్థించుమని అతడు ఎఫెసీయులను కోరాడు. అదే విధంగా, కొలస్సయులకు 4:3-4లో అతడు ఇలా వ్రాశాడు:

మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మాకొరకు ప్రార్థించుడి (కొలస్సయులకు 4:3-4).

సువార్త ప్రకటించు అవకాశము నిమిత్తము, అతని యెదుట ఉంచబడిన అవకాశములను సద్వినియోగపరచుకొను నిమిత్తము ప్రార్థన చేయమని పౌలు కోరాడు.

రెండవదిగా, పౌలు పత్రికల ప్రకారం, చెరసాలలో నుండి అతని ప్రాధమిక పరిచర్య అవిశ్వాసులకు సువార్తను ప్రకటించుటను మించినదిగా ఉన్నది. ప్రపంచములోని వివిధ సంఘాలు మరియు విశ్వాసుల కొరకు చేసే నిరంతర ప్రార్థనలు కూడా ఈ పరిచర్యలో ఒక భాగముగా ఉన్నాయి.

ఆచరణాత్మకంగా చెప్పాలంటే, పౌలు నిర్బంధం వాస్తవానికి అతడు ప్రార్థనలో గడిపే సమయమును పెంచింది. అతని యొక్క మిషనరీ యాత్రల్లో, అతడు సాధారణంగా ప్రయాణము చేయుటలో మునిగిపోయాడు లేదా తన జీవనోపాధి కొరకు పని చేస్తూ ఉన్నాడు. అయితే నిర్బంధంలో చేయడానికి ఏ పనియు కూడా అతనికి లేదు, ప్రయాణించే పనిలేదు మరియు పరధ్యానాలు కూడా ఏమి లేవు. ఇది అతడు ప్రార్థన చేసే సమయాన్ని పెంచింది. మరియు అతడు పత్రికలు అందించు సాక్ష్యము నుండి, ఆ సమయమును ఎక్కువగా ఇతరుల కొరకు ప్రార్థించుట తన బాధ్యతగా మరియు గౌరవంగా భావించాడని తెలుస్తుంది. ఎఫెసీయులకు 1:16-19లో ఇతర విశ్వాసుల కొరకు పౌలు చేసిన ప్రార్థనలకు సంబంధించిన సాక్ష్యమును వినండి:

మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను... మీ మనో నేత్రములు వెలిగింపబడినందున,... మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు, నేను నా ప్రార్థనలయందు మిమ్మునుగూర్చి విజ్ఞాపన చేయుచున్నాను (ఎఫెసీయులకు 1:16-19).

పౌలు ఎల్లప్పుడు మరియు నిరంతరం ఎఫెసీయుల కొరకు ప్రార్థించాడు. ప్రార్థన శక్తివంతమైనదని అతడు నమ్మాడు, మరియు ఎఫెసీయులను ఆశీర్వదించుట ద్వారా దేవుడు తన ప్రార్థనలను ఆలకిస్తాడని అతడు నిరీక్షించాడు. ప్రార్థనలో పౌలు చేసిన ప్రయత్నాలు దూరముగా ఉన్నవారికి ఒక శక్తివంతమైన మరియు విలువైన పరిచర్యను ఏర్పాటు చేశాయి.

పౌలు ఎఫెసీయులకు వ్రాయుచుండగా వారి కొరకు అతడు చేసిన ప్రార్థనలను గూర్చి తరచుగా మాట్లాడిన విధానము ఆసక్తిని కలిగిస్తుంది. క్రీస్తు తన సంఘమునకు ఇచ్చిన గొప్ప సువార్తికులలో పౌలు నిశ్చయముగా ఒకడని మనము అనుకుంటాము. అయితే, దీని కంటే ఉన్నతముగా, పౌలు ఒక కాపరి అని మనము అనుకుంటాము. అతనికి ఒక కాపరి హృదయము ఉన్నది. మరియు ఒక కాపరి హృదయముతో పాటు తన ప్రజల కొరకు గొప్ప ప్రేమ భావన కూడా కలుగుతుంది. మరియు ఎఫెసులో ఉన్న సంఘమును అతడు ప్రేమించాడు. అక్కడ అతడు రెండు సంవత్సరములను గడిపాడు. ఆ ప్రజలు అతనికి తెలుసు. ఆ ప్రజలను అతడు ప్రేమించాడు. మరియు క్రీస్తు చిత్తానుసారముగా సంఘము పరిపక్వత చెందుతున్న సమయములో వారు క్రీస్తునందు అర్థవంతమైన రీతిలో ఎదగాలని వారి కొరకు అతడు ఆశ కలిగియున్నాడు.

— డా. జయ్ హాలె

అదే విధంగా, ఫిలిప్పీయులకు 1:3-9లో ఫిలిప్పీ సంఘము కొరకు తాను నిరంతరం ప్రార్థిస్తానని అతడు వివరించాడు.

... మీలో ఈ సత్‌క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను (ఫిలిప్పీయులకు 1:3-9).

మరియు కొలస్సీయులకు 1:9లో, కొలస్సీ సంఘము పట్ల అతనికున్న నిబద్ధతను గూర్చి మనం ఇలా చదువుతాము:

మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకముగనులవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించవలెనని, దేవుని బతిమాలుచున్నాము (కొలస్సయులకు 1:9).

అతడు కొందరు వ్యక్తుల కొరకు కూడా ప్రార్థించాడు. ఉదాహరణకు, ఫిలేమోను 6లో, కొలస్సీ సంఘ విశ్వాసులైన ఫిలేమోను, అప్ఫియ మరియు అర్ఖిప్పును గూర్చి అతడు ఇలా వ్రాశాడు:

క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేష్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను (ఫిలేమోను 6).

పౌలు తన తోటి విశ్వాసుల కొరకు ప్రార్థించుటలో, వారి పక్షమున ఆశీర్వాదములను వెదకుటలో నిబద్ధత గలవాడని ఈ వాక్యభాగములన్నిటిలో మనం చూస్తాము.

మూడవదిగా, ప్రకటించుట మరియు ప్రార్థించుటతో పాటుగా, ఇతరుల కొరకు శ్రమను అనుభవించుట కూడా చెరసాలలో అతడు చేసిన పరిచర్యలో భాగముగా ఉన్నదని పౌలు సంఘమునకు వ్రాసిన పత్రికలు సూచిస్తాయి.

ఇప్పుడు, శ్రమ అనగా కష్టము, పరిచర్య కాదు. అయితే శ్రమ యొక్క లక్ష్యము మరియు ఫలము సువార్త ప్రకటన ద్వారా దేవుని రాజ్య వ్యాప్తి అయినప్పుడు, శ్రమ అనేది క్రైస్తవ పరిచర్య యొక్క ఒక రూపంగా భావించబడుతుంది.

క్రైస్తవులు ఎల్లప్పుడు శ్రమలపాలైనారు, మరియు యేసు తిరిగి వచ్చునంత వరకు శ్రమలపాలౌతుంటారు. బైబిలు దీనిని గూర్చి మనకు ధృవీకరిస్తుంది. ఇప్పుడు, దీని అర్థం క్రైస్తవులంతా సమానంగా శ్రమపడతారు లేదా పౌలు వలె శ్రమపడతారు అని కాదు. కాని యేసు తన పనిని ముగించడానికి తిరిగి వచ్చేవరకు, భూమిమీద తన రాజ్యమును పూర్తి చేసేవరకు, ఆయన శత్రువులు ఆయనతో పోరాడుతారని దేవుడు నిర్దేశించాడు. అంటే యేసు యొక్క ప్రజలు శ్రమపడుతూ ఉంటారని దీని అర్థం. అయితే పౌలు జీవితం ఒక విషయమును రుజువుచేస్తుంది: మన శ్రమలు వ్యర్థము కాదు. విరుద్ధంగా చెప్పాలంటే, మన శ్రమ సంఘమును ఆశీర్వదిస్తుంది. మన శ్రమ సువార్తకు సాక్ష్యమిస్తుంది. మన శ్రమ సంఘము స్వాస్థ్యముగా పొందు మహిమను పెంచుతుంది.

సువార్త కొరకు అనుభవించే శ్రమలు శక్తివంతమైన మరియు ఉద్దేశ్యపూర్వకమైన పరిచర్యను సూచిస్తాయి. ముఖ్యముగా, ఇది సువార్త సత్యానికి తిరుగులేని సాక్ష్యమై ఉంది. ఇందును బట్టియే సాధారణంగా విశ్వాసం కొరకు చనిపోయే క్రైస్తవులను “అమరవీరులు” లేదా “హతసాక్షులు” అని మనం పిలుస్తాము. పౌలు శ్రమలు సువార్త ప్రకటించడానికి అవకాశములను కలిగించిన అనేక మార్గాలను ఇప్పటికే మనం చూశాము. అయితే సువార్త ప్రకటించుటకు ఇవి ఇతరులను కూడా ప్రోత్సహించాయి. ఫిలిప్పీయులకు 1:14లో పౌలు మాట్లాడిన మాటలు వినండి:

మరియు సహోదరులైన వారిలో ఎక్కువమంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై, నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి (ఫిలిప్పీయులకు 1:14).

పౌలు చెరసాలలో వేయబడుట సువార్త ప్రకటించుటకు ఫిలిప్పీయులకు ధైర్యమును కలిగించింది, ఎందుకంటే అతడు ఫిలిప్పీ పట్టణములో మొట్టమొదటిసారి చెరసాలలో పెట్టబడ్డాడు. మరియు అతడు చెరసాలలో ఉన్నప్పుడు, వారు ప్రార్థించుట మరియు పాటలు పాడుట ఆరంభించారు. దీనిని గూర్చి మీరు ఒక క్షణం ఊహించాలి. చెరసాల ఒక చీకటి స్థలము చెరసాల చాలా చీకటిగా ఉంటుంది, దానిలో ఎలాంటి దీపము ఉండదు కాని వారు పాడుచున్నారు మరియు దేవుని స్తుతించుచున్నారు, మరియు అక్కడ ఉన్న ప్రజలు వినుచున్నారు. దేవుడు అద్భుతమైన రీతిలో వారి మధ్య కార్యము చేసిన తరువాత, వారు పారిపోకుండా అక్కడే ఉన్నారు కాబట్టి చెరసాల నాయకుడు రక్షణ పొందుతాడు. మరియు చెరసాలలో ఉన్న ప్రజలు మరియు చుట్టుప్రక్కల ప్రాంతములో ఉన్న ప్రజలందరు రక్షణపొందారు. ఇప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు కూడా పౌలు సువార్త ప్రకటించుటను ఆపలేదు, మరియు చెరసాల బయటకు వచ్చిన తరువాత కూడా ఆపలేదు అని తెలుసుకొనుట, మరియు చెరసాల ఒక వ్యక్తి సువార్తను ప్రకటించుటకు ఆటంకమును కలిగించలేదు అని తెలుసుకొనుట ఫిలిప్పీయులకు ఎంతో ప్రోత్సాహమును కలిగించింది. కాబట్టి, అదే ధైర్యం. అది ఒక సాక్ష్యము... శ్రమపొందుటకు, బంధింపబడుటకు ఇష్టపడిన వ్యక్తిని, అయినప్పటికీ సువార్త పట్ల నమ్మకముగా ఉండుటకు నిర్ణయించుకొనిన వ్యక్తిని ఎవరైనా ఒక గురువుగా అనుకరించుటకు ఇష్టపడతారు. వారి చెరసాల వలన వారు నిజముగా ప్రోత్సహించబడి, సువార్త నుండి ఏవిధముగాను దారితప్పిపోలేదు.

— పాస్టర్ జాన్సన్ ఒని

రెండవదిగా, శ్రమలు ఇతరులకు ప్రయోజనమును చేకూర్చుతాయి గనుక మనము శ్రమను ఒక పరిచర్యగా పరిగణించవచ్చు. ఎందుకంటే, యేసు పాపుల కొరకు శ్రమపడెను, మరియు మనలను రక్షించడానికి ఆయన మరణించాడు. ఇతరుల నిమిత్తము శ్రమనొందుట ద్వారా కీస్తు మాదిరిని అనుసరించాలని లేఖనము బోధిస్తుంది. విశ్వాసులముగా, ఇతరుల ప్రయోజనము కొరకు మనము కష్టములను మరియు మరణమును కూడా ఎదుర్కొనుటకు వెనుకాడకూడదు. మరియు ఈ కారణము కొరకు శ్రమలను అనుభవించువారి పట్ల మనము కృతజ్ఞత కలిగియుండాలి. 1 యోహాను 3:16లో అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు:

ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుకదీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనము కూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై యున్నాము (1 యోహాను 3:16).

పౌలు దీనిని నమ్మాడు. ఇంతకుముందు మనం చూచినట్లుగా, అలా చేయుట వలన సువార్త వ్యాప్తిచెందితే, అతడు చెరసాలకు వెళ్లుటకు ఇష్టపడ్డాడు మరియు మరణించుటకు కూడా ఇష్టపడ్డాడు. ఇతరుల నిమిత్తము శ్రమనొందుటను తాను అంగీకరించిన విధమును గూర్చి ఎఫెసీయులకు 3:13లో మనం చదువుతాము:

కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను, ఇవి మీకు మహిమకరములైయున్నవి (ఎఫెసీయులకు 3:13).

ఇక్కడ పౌలు చెప్పే విషయం ఏమిటంటే, ఆయన యొక్క నిర్బంధము క్రొత్త ప్రదేశాల్లో మరియు క్రొత్త ప్రజలకు సువార్తను ప్రకటించడానికి అనుమతించింది, తద్వారా అనేకులను క్రీస్తుయందు విశ్వాసములోకి నడిపిస్తుంది. సువార్త విస్తరించబడినప్పుడు మరియు సంఘము అభివృద్ధి చెందినప్పుడు, విశ్వాసులందరు పొందుకొనే మహిమను ఇది పెంచుతుంది.

మూడవదిగా, అతని శ్రమలు స్వయంగా క్రీస్తు శ్రమలకు కొనసాగింపులు అని పౌలు పత్రికలు వెల్లడిచేస్తున్నాయి. కొలస్సయులకు 1:24లో, తన శ్రమను గూర్చి అన్నిటికంటే గొప్ప ప్రకటన పౌలు చేశాడు:

ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను (కొలస్సయులకు 1:24).

కొలస్సయులకు 1లో, క్రీస్తు యొక్క సంపూర్ణ సమృద్ధిని పౌలు బలముగా ఉద్ఘాటించాడు. కాబట్టి, క్రీస్తు పడిన పాట్లలో “కొదువైనవి” అని అతడు చెప్పినప్పుడు, దీని అర్థం క్రీస్తు మరణము మనలను రక్షించుటకు సరిపోలేదు అని కాదు, లేదా విశ్వాసులు క్రీస్తు మరణముకు తమ సొంత యోగ్యతను జోడించుకుంటారని కూడా పౌలు ఉద్దేశం కాదు. దీనికి బదులుగా, యేసు యొక్క కార్యము ముగించబడలేదనేది పౌలు ఉద్దేశమైయున్నది.

క్రీస్తు శ్రమలలో కొరతగా ఉన్న విషయములను నింపుటను గూర్చి అపొస్తలుడైన పౌలు మాట్లాడాడు, అనగా శిష్యరికము యొక్క వెలను మనము వినయముగాను, ఆనందముగాను భరించాలి. ఆదిమ సంఘమును గూర్చి చాలాసార్లు ఇలా ప్రకటించబడింది, వారి సాక్ష్యము యొక్క బలము ఎంత అంటే వారు చక్కగా మరణించారు, వారి అంతిమ కట్టుబాటు ఈ లోకము యెడల కాదుగాని దేవుని యెడల అని చూపు విధముగా వారు శ్రమను అనుభవించారు, మరియు దీని వలన, వారు భూమి మీద గొప్ప ప్రయోజనమును చేకూర్చారు... కాబట్టి, ఫిలిప్పీ. 2లో పౌలు సెలవిచ్చుచున్నట్లు క్రీస్తు యేసునకు కలిగిన అదే మనస్సు మనము కూడా కలిగియున్నాము, కాబట్టి మనము ఆయన శ్రమలలో పాలుపంచుకుంటే, ఆయన పునరుత్థానము మరియు ఆయన మహిమలో కూడా పాలుపంచుకుంటాము.

— రెవ. మైఖేల్ గ్లోడో

యేసు మరణించి పరలోకముకు అరోణమైమప్పుడు, చెడు మీద గట్టి దెబ్బకొట్టాడు, మరియు దయ్యపు శతృవులపై చేసిన యుద్ధములో సమర్థవంతంగా గెలిచాడు. అయితే సాతాను శక్తులు క్రీస్తు మరియు ఆయన రాజ్యముకు వ్యతిరేకంగా నెమ్మదిగా యుద్ధమును కొనసాగించుచున్నవి అని పౌలు గ్రహించాడు. యేసు మహిమలో తిరిగివచ్చు వరకు తన విరోధులను సంపూర్ణముగాను, సమూలముగాను నాశనము చేయలేదు, కాబట్టి ఆ సమయము వరకు సంఘము ప్రపంచములో దేవుని రాజ్యమును వ్యాపింపజేయుచుండగా శ్రమలను అనుభవించాలి. మరియు యేసు మనలను ప్రియముగా ప్రేమించుచున్నాడు గనుక, మరియు ఆయన విశ్వాసులందరితో ఐక్యంగా ఉన్నాడు గనుక, మనం శ్రమనొందినప్పుడు ఆయన కూడా శ్రమనొందుతాడు. వాస్తవిక అర్థంలో చెప్పాలంటే, సంఘము యొక్క బాధ క్రీస్తు బాధయైయున్నది.

పౌలు దమస్కు మార్గంలో మారుమనస్సు పొందినప్పుడు స్వయంగా యేసు పౌలుకు చెప్పిన విషయం ఇదే. అప్పుడు సౌలుగా పిలువబడుతున్న పౌలు క్రైస్తవులను హింసించి వారిని చెరసాలలో పడవేసి మరియు వారి మరణం కొరకు ఎదురుచూస్తున్నాడు. అయితే దమస్కులో ఉన్న క్రైస్తవులను అరెస్టు చేయుటకు దమస్కు మార్గంలో వెళ్లుచుండగా, యేసు ఆ మార్గమందు అతనిని ఎదుర్కొని, నేలను పడవేసి, సత్యమును అతనికి బయలుపరచాడు. యేసు మరియు పౌలుకు మధ్య జరిగిన సంభాషణలో కొంత భాగం అపొస్తలుల కార్యములు 9:5లో నమోదుచేయబడింది:

ప్రభువా, నీవెవడవని [సౌలు] అతడడుగగా ఆయన “నేను నీవు హింసించుచున్న యేసును” అని చెప్పెను (అపొస్తలుల కార్యములు 9:5).

విశ్వాసులను హింసించుట స్వయంగా క్రీస్తును హింసించుటయే అని యేసు పౌలుకు స్పష్టము చేశాడు. కాబట్టి, ఒక విశ్వాసి శ్రమను అనుభవించినప్పుడు, యేసు కూడా శ్రమపడతాడు. క్రీస్తు ఉన్నతముగా హెచ్చింపబడినప్పటికీ, తన శరీరమైన సంఘముతో ఆయన తిరిగివచ్చు వరకు శ్రమను అనుభవిస్తాడు. అయితే ఆయన శ్రమలను అనుభవించుట ముగిసినప్పుడు, తన శతృవులను సమూలనంగా నిర్మూలను చేసి, సంఘమును మహిమపరుస్తాడు. నియమించబడిన ఆ శ్రమను నెరవేర్చు విషయములో క్రీస్తును సేవించుట పౌలు ధన్యతగా భావించాడు.

పౌలు ప్రకటించాడని, ప్రార్థించాడని, మరియు అపొస్తలుడుగా శ్రమలను అనుభవించాడని సూచించుటతో పాటుగా, చెరసాలలో ఉన్నప్పుడు శక్తివంతమైన రచనా పరిచర్యలో నిమగ్నమయ్యాడని కూడా పౌలు పత్రికలు స్పష్టం చేస్తున్నాయి.

పౌలు నిర్బంధములో ఉన్నప్పుడు అతని యొక్క రచనా పరిచర్య క్రొత్త నిబంధనలోని కొలస్సయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు మరియు ఫిలేమోనుకు వ్రాసిన పత్రికల ద్వారా నిరూపించబడింది. పౌలు ఈ పత్రికల ద్వారా సంఘాలకు మరియు వ్యక్తులకు తగిన పరిచర్యను అందించగలిగాడు. మరియు ఈ పత్రికలు మన కొరకు క్రొత్త నిబంధనలో భద్రపరచబడినవి గనుక, గత రెండువేల సంవత్సరాలుగా పౌలు పరిచర్య ప్రపంచమంతటా అభివృద్ధి చెందుతుంది.

తన యొక్క బాంధవ్యమును కొనసాగించుచున్న సంఘాలకు మరియు వ్యక్తులకు చేసిన గొప్ప పరిచర్యను పౌలు పత్రికలు వెల్లడిపరుస్తాయి. వారి పరిస్థితులను గూర్చి మరియు వ్యక్తిగతంగా వారిని గూర్చి చాలా విషయాలు అతనికి తెలుసు. మరియు తత్ఫలితంగా, వ్యక్తిగత మరియు వేదాంతపరమైన తన ప్రేక్షకులకు సంబంధించిన అనేక నిర్దిష్ట సమస్యలను పౌలు పరిష్కరించగలిగాడు. ఆయన కొంతమందిని వ్యక్తిగతంగా పేర్లతో హెచ్చరించాడు. అతడు ప్రయాణించలేనప్పటికీ, పౌలు పరిచర్య తాను పత్రికలు వ్రాసిన సంఘాలు మరియు వ్యక్తుల యొక్క నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా రూపొందించబడినవి.

ఉదాహరణకు, గమనించండి, ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో యువొదియ, సుంటుకే అను ఇద్దరు స్త్రీలకు ఒకరికొకరు ఏకమనస్సుగలవారై ఉండుడని ఉపదేశించుట ద్వారా పౌలు కాపరి పరిచర్యలో నిమగ్నమయ్యాడు. ఈ స్త్రీలు పౌలుకు తెలిసినవారు, అతనితో కూడా కలసి పనిచేసినవారు, కాని ఒకరికొకరు విభేదించిన వారిగా ఉన్నారు. వారి యెడల పౌలుకు ఉన్న శ్రద్ధ వ్యక్తిగతమైనది మరియు ప్రియమైనది, మరియు వారి సమస్యకు అతడు ఇచ్చిన పరిష్కారం మృదువైనది. ఈ స్త్రీలను గూర్చి అతని మాటలను మనము ఫిలిప్పీ 4:2-3లో చదువుతాము:

ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను... [వారు] సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను (ఫిలిప్పీ. 4:2-3).

ఇదే విధంగా, విశ్వాసుల మధ్య సమాధానం ఉండాలని ఫిలేమోను పత్రికలో కూడా పౌలు బతిమాలుకున్నాడు. అక్కడ తన కొలస్సీ యజమానుడైన ఫిలేమోను యొద్ద నుండి పారిపోయిన ఒనేసిము అను పేరుగల దాసుని పక్షమున అతడు వేడుకున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే, ఫిలేమోను పత్రిక మొత్తం ఒనేసిము యెడల దయ చూపించుమని ఫిలేమోనుకు విజ్ఞాపన చేయుటకే అంకితం చేయబడింది.

తన యజమానుని యొద్ద నుండి పారిపోయిన తరువాత, ఫిలేమోను స్నేహితుడైన, పౌలును ఒనేసిము వెదకాడు. మరియు పౌలు పరిచర్యలో, ఒనేసిము క్రైస్తవునిగా మారాడు. అంతేకాక, ఒనేసిము పౌలు చెంతనే ఉండి నిర్బంధములో అతనికు పరిచర్య చేశాడు. కాబట్టి, ఒనేసిము మరియు ఫిలేమోనుకు పౌలు చేసిన పరిచర్య అత్యంత వ్యక్తిగతమైనదిగా ఉన్నది. మరియు వారి కాపరిగా, వారి స్నేహితునిగా, వారిని సమాధానపరచుటకు అతడు ప్రయత్నము చేశాడు.

ఫిలేమోను పత్రిక చాలా ఆసక్తికరమైనదిగా ఉన్నది. తన బానిసను విడిచిపెట్టమని పౌలు ఫిలేమోనును చక్కగా అడుగుతున్నట్లు అనిపిస్తుంది. వాస్తవానికి, అపొస్తలునిగా తన అధికారమును ఉపయోగించుటకు కూడా అతడు ప్రయత్నించుటలేదు... మరియు దీనంతటిలో ఫిలేమోను తన మర్యాదను కాపాడుకొని, మంచివానిగా కనిపించునట్లు అతడు అనుమతి ఇస్తున్నాడు. అయితే మీరు ఫిలేమోనును దగ్గరగా చదివితే, కనీసం నేను చదివినప్పుడు, ఒక వ్యక్తి ఫిలేమోనుతో మాట్లాడుతూ, ఫిలేమోను జీవితములో స్వయంగా పౌలు చేసిన కృషిని గూర్చి చెబుతున్నట్లు నేను చూస్తాను. అతడు ఒక ఆత్మీయ తండ్రి వంటివాడు. తరువాత అతడు అంటాడు కదా, “ఇలా చేయమని నేను నిన్ను ఆజ్ఞాపించదలచుట లేదు, కాని ఒక జతపనివానిగా, లేక ఒక స్నేహితునిగా నాకు సహాయము చేయుటకు ఇలా చేయమని చెబుతున్నాను,” మరియు ఒనేసిములో కలిగిన ఒక ప్రాముఖ్యమైన మార్పును, మరియు అతడు ఇప్పుడు ఒక సహోదరుడైన విధానమును అతడు చూపుచున్నాడు; అతడు ఒక బానిస కంటే ప్రాముఖ్యమైనవాడు, మరియు పౌలుకు ఎంతో ప్రయోజనకారి. తరువాత చివరికి అతడు ఇలా అంటాడు, “నా కొరకు స్థలము సిద్ధము చేయుము. నేను అక్కడికి వస్తున్నాను.”

— డా. జోసెఫ్ డి. ఫన్టిన్

సంఘమంతటిలో ఉన్నటువంటి వేదాంతపరమైన సమస్యలను గూర్చి కూడా పౌలు తన పత్రికల్లో సూచించాడు, కాపరివలె మృదువుగా అధికారికమైన అపొస్తలత్వ ఉపదేశమును అందించాడు. క్రీస్తు యొక్క అధికారిక ప్రతినిధిగా అతడు బోధనా పరిచర్య చెరసాలలో క్షీణించిపోలేదు. బదులుగా, ఈ సమయంలో కూడా సత్యము యొక్క అమోఘమైన ప్రత్యక్షతలను అతడు వెల్లడిచేశాడు మరియు ఈ పత్రికల ద్వారా ఆ సత్యమును సంఘముకు అనువర్తించాడు.

మనము ఇంతకుముందు చూసినట్లుగా, నిర్బంధ సమయంలో కూడా పౌలు చురుకుగా పరిచర్య చేసినట్లు అపొస్తలుల కార్యములు మరియు పౌలు పత్రికలు రెండూ సూచిస్తున్నాయి. సువార్త ప్రకటించడానికి మరియు పరిశుద్ధులకు మాదిరిగా ఉండడానికి దేవుడు చెరసాలను ఒక అవకాశంగా ఇచ్చాడని అతనికి తెలుసు. మరియు ఈ జ్ఞానము చేత ప్రేరేపించబడి, ప్రకటన, ప్రార్థన, శ్రమలు మరియు రచన అనే బలమైన పరిచర్యను అతడు నిర్వహించాడు, మరియు దీని ద్వారా యేసుక్రీస్తు అపొస్తలునిగా తన విధులనన్నిటిని నమ్మకంగా నిర్వర్తించాడు.

పౌలు నిర్బంధము యొక్క నేపథ్యమును మరియు నిర్బంధములో అతని పరిచర్యను ఇప్పటివరకు మనము వివరించాము గనుక, ఇప్పుడు నిర్బంధములో అతడు వ్రాసిన పత్రికల యొక్క వేదాంతపరమైన ఐక్యతను చూచుటకు సిద్ధంగా ఉన్నాము. ఈ భాగములో, చెరసాల పత్రికలు పంచుకొనే సిద్ధాంతపరమైన అంశాలను విశదీకరించి, పౌలు యొక్క విస్తృత వేదాంతశాస్త్రములో అవి ఏవిదంగా సరిపోతాయో చూద్దాము.

పౌలు చెరసాల నుండి వ్రాసిన పత్రికలు కొన్ని ప్రాముఖ్యమైన సిద్ధాంతిక పునాదులను కలిగియున్నవని చెప్పనవసరము లేదు. అతి ప్రాథమికంగా, ఇవన్నీ ఒకే సువార్తను ధృవీకరిస్తాయి. అయితే మనకు తెలిసిన విధముగానే, క్రైస్తవ సువార్త అనేక కోణములు కలిగినది. కాబట్టి, పౌలు చెరసాల నుండి వ్రాసిన పత్రికలు పౌలు చెరసాలలో ఉన్న కాలములో వ్యక్తిగతముగా అతనికి ప్రాముఖ్యమైన మరియు ఆ చెరసాల పత్రికలను మొట్టమొదటిసారి పొందుకొనిన వారికి ప్రాముఖ్యమైన సువార్తలోని అనేక విషయముల ద్వారా పౌలు చెరసాల పత్రికలు ఐక్యపరచబడినవి అని గ్రహించుట ప్రాముఖ్యమైయున్నది.

చెరసాల పత్రికల యొక్క వేదాంత ఐక్యతను గూర్చిన మన సంభాషణ, ఈ పత్రికలలో పౌలు మరలా మరలా ప్రస్తావించిన దగ్గర సంబంధముగల బోధల మీద దృష్టిపెడుతుంది. మొదటిగా, యేసు క్రీస్తు సృష్టికి రాజు అను సిద్ధాంతమును చూద్దాము. రెండవదిగా, యేసు రాజరికములో ఒక ప్రాముఖ్యమైన అంశమును, అనగా ఆయన రాజరికములో క్రీస్తుతో విశ్వాసుల యొక్క ఐక్యత మీద దృష్టిపెడదాము. మరియు మూడవదిగా, ఈ రెండు సిద్ధాంతములు నైతిక జీవనము యొక్క అవసరతల మీద దృష్టిపెడతాయి అని చూద్దాము. యేసు క్రీస్తు సృష్టికి రాజు అని పౌలు చేసిన బోధను మొదటిగా చూద్దాము.

సృష్టిపై క్రీస్తు రాజత్వమును గూర్చిన పౌలు ఉద్ఘాటన పౌలు వ్రాసిన ఇతర రచనల్లో కంటే కూడా చెరసాల పత్రికల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పత్రికలలో తరచుగా కనిపించు క్రీస్తు రాజరికములోని మూడు కోణములను మనము పరిగణిద్దాము. ఆయన బలము మరియు అధికారముతో సహా, క్రీస్తు సార్వభౌమత్వము; ఆయన మహిమ మరియు గౌరవము, మర్యాద, మరియు ఆరాధనను పొందు యోగ్యతతో పాటుగా, ఆయన గౌరవము; మరియు భూమి మీద తన రాజ్యమును నెరవేర్చుట కొరకు తిరిగి రావాలని ఆయన కలిగియున్న సంకల్పము. క్రీస్తు రాజ సార్వభౌమత్వమును చూచుట ద్వారా ఆరంభించుదాము.

క్రీస్తు సార్వభౌముడు అని మనం చెప్పినప్పుడు, ఆయన చిత్తమును నెరవేర్చడానికి అధికారం గలవాడు మరియు సమర్థుడు, మరియు ఆయనకు చట్టబద్ధమైన అధికారం మరియు ఆ విధంగా చేసే హక్కు ఉందని అర్థం. ప్రాచీన ప్రపంచంలో, రాజులు మరియు చక్రవర్తులు తమ దేశాలలోని సైనికదళాలను అజ్ఞాపించేవారు, వారు కోరినది నెరవేర్చే శక్తి వారికి ఇచ్చేవారు. వారి దేశాల చట్టాలు తమ యొక్క పాలనను మరియు పాలనా హక్కును కూడా అంగీకరించాయి, అంటే వారు కోరినది నెరవేర్చగల అధికారం కూడా వారికి ఉంది.

పౌలు మాటల ప్రకారం, యేసు పరలోకముకు ఆరోహణమైనప్పుడు, తండ్రియైన దేవుడు సృష్టియంతటిపై ఈ విధమైన సార్వభౌమాధికారమును ఆయనకు ఇచ్చాడు. యేసు చాలా శక్తివంతుడు మరియు అధికారం గలవాడు గనుక, వారు భూమిమీద ఉన్నా లేదా ఆత్మీయ రాజ్యంలో ఉన్నా, ఆయన సార్వభౌమాధికారం ఇతర రాజులందరికి మరియు చక్రవర్తులందరికి కూడా వ్యాపించింది. ఎఫెసీయులకు 1:20-22లో తండ్రి క్రీస్తుకు అనుగ్రహించిన సార్వభౌమాధికారమును పౌలు ఈ విధంగా వివరించాడు:

[తండ్రి] ఆ బలాతిశయముచేత క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను, ఈ యుగమునందుమాత్రమే గాక రాబోవు యుగమునందును పేరుపొందిన ప్రతి నామముకంటెను, ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున [తండ్రి] కూర్చుండబెట్టుకొనియున్నాడు (ఎఫెసీయులకు 1:20-22).

ఇప్పుడు, యేసు క్రీస్తు సార్వభౌమాధికారముతో సృష్టియంతటిని పాలించుచున్నాడు. మరియు ఆయన సార్వభౌమత్వము కేవలం పరలోక స్థలములకు మాత్రమే పరిమితము కాలేదు. ఆయన భూమిని కూడా పాలించుచున్నాడు. మత్తయి 28:18లో యేసు ఈ విధంగా ప్రకటించాడు:

పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది (మత్తయి 28:18).

చెరసాలలో ఉన్నప్పుడు క్రీస్తు యొక్క సార్వభౌమత్వము పౌలునకు ప్రాముఖ్యమైనదిగా ఉండినది అను విషయము ఆశ్చర్యమును కలిగిస్తుందా? క్రీస్తు యేసు సృష్టియావత్తును పాలించుచున్నాడు. ఆయన భూసంబంధమైన ప్రభుత్వాలు మరియు దేశాలను పాలించుచున్నాడు, మరియు ప్రతి దేవదూతను మరియు దయ్యమును కూడా పాలించుచున్నాడు. స్పష్టంగా చెప్పాలంటే, సృష్టిలోని ప్రతిదీ ఆయనకు విధేయత చూపించవలసిన రీతిలో చూపించుటలేదు. మరియు ఆయనకు నచ్చిన విధముగా ఆయన చిత్తమునకు లోబడుటకు విధేయతను ఆజ్ఞాపించు మరియు శక్తిని ఉపయోగించు హక్కును తండ్రి యేసుకు అనుగ్రహించాడు. తాను ప్రేమించువారిని దీవించు, మరియు తన విరోధులను నాశనము చేయు సంపూర్ణ హక్కు మరియు అధికారము యేసుకు ఇవ్వబడినవి. సువార్తలోని ఈ కోణము పౌలు శ్రమపడుచుండగా అతని బలమునకు మూలముగా ఉండినది, మరియు తాను వ్రాసిన చెరసాల పత్రికలలో అతడు దీనిని ధైర్యముగా ప్రకటించాడు.

సృష్టికి రాజుగా క్రీస్తు యొక్క సార్వభౌమత్వమును ఉద్ఘాటించుటతో పాటుగా, పౌలు క్రీస్తు యొక్క గౌరవమును గూర్చి, అనగా మర్యాదను, అనుకరణను, ఆరాధనను కోరు ఆయన మహిమ మరియు విలువను గూర్చి కూడా మాట్లాడాడు.

క్రీస్తు పరిపూర్ణుడు, పరిశుద్ధుడు మరియు నీతిమంతుడు గనుక గౌరవించబడుటకు యోగ్యుడు అని పౌలు చెరసాలలో ఉండగా మరలా మరలా ఉద్ఘాటించాడు. ఆయన ఉన్నతాధికారము గలవాడు, మరియు ఆ అధికారమును న్యాయముగా మరియు నీతిగా అమలుచేస్తాడు గనుక గౌరవించబడుతున్నాడు. మరియు ఆయన సృష్టికర్త మరియు విశ్వమును కొనసాగించువాడు గనుక గౌరవించబడుతున్నాడు. యేసు ఘనతకు అర్హుడు అని చెప్పడానికి వందలాది కారణములను మనం సులభంగా చెప్పవచ్చు. అయితే యేసు గౌరవముకు మరియు స్తుతికి పాత్రుడు అని చెప్పడానికి పౌలు యొక్క చెరసాల పత్రికలలో ఇవ్వబడిన ఒక గొప్ప కారణము ఏమిటంటే ఆయన దైవత్వముగలవాడు. యేసు దేవుడు, మరియు ఎనలేని అత్యున్నత గౌరవానికి దేవుడు అర్హుడు.

సంఘములో కొంతమంది అబద్ధ బోధకులు యేసు ఎంత ప్రత్యేకమైనవాడో గుర్తించలేదు కాబట్టి, ఈ పత్రికలలో యేసు గౌరవమును పౌలు బహుగా ఉద్ఘాటించవలసివచ్చింది. స్పష్టంగా చెప్పాలంటే, అబద్ధ బోధకులు దేవదూతలు మరియు ఆత్మల ఆరాధనను సంఘంలో ప్రవేశపెట్టారు. క్రీస్తు యొక్క ప్రత్యేకతను మరియు బహు గొప్పదనమును నొక్కి చెప్పుట ద్వారా పౌలు ఈ అబద్ధ బోధనలను తిరస్కరించాడు. కొలస్సయులకు 1:16-17లో క్రీస్తును ఇతర ఆత్మీయ జీవులతో విభేదించిన విధానమును వినండి:

ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు (కొలస్సయులకు 1:16-17).

ఈ వాక్యభాగము సూచించుచునట్లు, ఉనికిలో ఉన్న సమస్తమునకు — అనగా అబద్ధ బోధకులు గౌరవించిన దేవదూతలు మరియు ఆత్మలకు కూడా — యేసు సృష్టికర్త గనుక ఆయనకు అత్యున్నతమైన గౌరవమును ఇవ్వవలసియున్నది. ఆత్మీయ లోకంలో మరియు భూమి మీద ఇతర పాలకులు కలిగిన స్థానములను కూడా ఆయనే స్థాపించాడు. మరియు భూమిమీద పాలించువారిని మరియు ఆత్మీయ లోకంలో అధికారం కలిగిన దూతలు మరియు దయ్యములతో సహా ఇతర పాలకులను సృష్టించిన వాడు కూడా ఆయనే.

కొలస్సీ. 1:15 మరియు తరువాత వచనములలో, పండితులు కొలస్సీ పత్రికలోని “క్రీస్తు కీర్తన” అని పిలచుదానిలోని ఒక భాగమును మనము చూస్తాము. మరియు సర్వసృష్టి మీద క్రీస్తు యొక్క ఆధిపత్యమును గూర్చిన అసాధారణమైన చిత్రమును, అనగా ఆయన అన్నిటికి పైన ఉన్నాడు అని సమస్తము ఆయన అధికారము క్రింద ఉన్నది అని మరియు ఆయన అన్నిటికి కేంద్రమైయున్నాడని, మరియు అంతేగాక, దేవుడు సమస్తమును ఆయన ద్వారా సృజించాడు అని మరియు యేసు సమస్తమును నడిపిస్తాడు అని మనము చూస్తాము. కాబట్టి, ఇక్కడ మరియు ఉదాహరణకు ఎఫెసీ. 1 వంటి ఇతర చోట్ల ఇవ్వబడిన చిత్రము, సార్వత్రిక క్రీస్తును గూర్చి మనకు ఒక చిత్రమును ఇస్తుంది, లోకము కొరకు ఆయన ప్రాముఖ్యత ఎంతో విలువైన ఆయన జననము, మరణము, మరియు పునరుత్థానమును మించినదిగా ఉన్నది, మరియు ఆయన సృష్టియందు దేవుని ప్రతినిధిగా ఉన్నాడు, సృష్టిని కొనసాగించువానిగా ఉన్నాడు, మరియు సర్వసృష్టికి ఆయన ప్రభువుగా ఉన్నాడు, కాబట్టి సమస్తము వాటి ముగింపును, వాటి లక్ష్యమును, వాటి నెరవేర్పును ఆయనలో కలిగియున్నవి.

— డా. కాన్ష్టెంట్టైన్ కాంప్బెల్

క్రీస్తు సార్వభౌమత్వము మరియు గౌరవము దృష్ట్యా రాజుగా క్రీస్తును గూర్చి మాట్లాడుటతో పాటు, తన రాజ్యమును సంపూర్తి చేయడానికి భూలోకముకు తిరిగిరావాలనే క్రీస్తు సంకల్పాన్ని కూడా పౌలు నొక్కి చెప్పాడు.

క్రీస్తు రాకడను గూర్చిన పౌలు దృక్పథమును అర్థం చేసుకోవాలంటే, అంత్యదినములను గూర్చిన అతని బోధన — యుగాంతశాస్త్రము — సాంప్రదాయ యూదుల అంత్యదినముల అభిప్రాయము నుండి వచ్చిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు కాలములోని సాంప్రదాయ యూదుల వేదాంతశాస్త్రంలో, లేఖనము మానవాళి యొక్క రెండు ప్రధాన యుగాలను తెలియజేస్తుంది అని భావించారు. క్రీస్తు రాకకు ముందు, లోకము “ప్రస్తుత యుగము”లో ఉంది — ఇది పాపము, మరణము మరియు అవినీతి అను పదాలతో వర్ణించబడింది. ఈ ప్రస్తుత యుగము తరువాత, “రాబోవు యుగము” వస్తుంది, బైబిలు దీనిని “దేవుని రాజ్యము” మరియు “పరలోక రాజ్యము” అని సంబోధిస్తుంది.

విరివిగా ఉనికిలో ఉండిన యూదుల నమ్మకముల ప్రకారం, రాబోవు యుగము మెస్సీయ లేక క్రీస్తు వచ్చినప్పుడు ఒకేసారి వస్తుంది. అయితే పౌలు మరియు ఇతర క్రొత్త నిబంధన రచయితల ప్రకారం, ఈ సాంప్రదాయ యూదుల అభిప్రాయం పూర్తిగా ఖచ్చితమైనది కాదు అని యేసు వెల్లడించాడు. రాబోవు యుగము ప్రస్తుత యుగము యొక్క స్థానమును తీసుకుంటుంది, కాని ఒకేసారి కాదు. బదులుగా, కొంతకాలం పాటు ఒకే సమయంలో ఈ రెండు యుగాలు అతివ్యాప్తి కలిగిఉంటాయి, ఇది క్రీస్తు యొక్క భూలోక పరిచర్య నుండి మొదలౌతుంది — దీనిని మనం దేవుని రాజ్య “ఆరంభము” అని పిలుస్తాము — మరియు ఇది క్రీస్తు రాకడ లేదా రెండవ రాకడ వరకు వ్యాపిస్తుంది — దీనిని మనం దేవుని రాజ్యము యొక్క “నెరవేర్పు” అని పిలుస్తాము. ఆవిష్కృతము మరియు సంపూర్ణతకు మధ్యగల కాలమును దేవుని రాజ్య కొనసాగింపు కాలము అని మనం పిలుస్తాము. ఈ మధ్యకాల యుగమే పౌలు కాలములో సంఘము ఉనికిలో ఉన్న యుగము, మరియు నేడు కూడా ఇదే కొనసాగుతుంది.

యుగాంతశాస్త్రము లేక అంత్యదినములను గూర్చి అతడు కలిగియున్న దృక్కోణమును పౌలు తరచుగా గుర్తుచేశాడు, ఎందుకంటే ఒక ఖైదీగా అతడు ఎదుర్కొనిన సమస్యలను అది వివరించింది, మరియు అతడు చెరసాల నుండి వ్రాసిన అనేక సంఘములలోని సమస్యలను గూర్చి కూడా అది మాట్లాడింది. పాపము, మరణము మరియు అవినీతితో నిండియున్న ఈ ప్రస్తుత యుగము పూర్తిగా నిర్మూలించబడలేదు. అందుచేతనే విశ్వాసులు ఇప్పటికీ శ్రమలను అనుభవిస్తున్నారు ఏదిఏమైనా, భవిష్యత్తులో ఒక దినమున అవిశ్వాసులకు అంతిమ తీర్పునిచ్చుటకు మరియు విశ్వాసులందరికీ ఆశీర్వాదాములను ఇచ్చుటకు యేసు తిరిగివస్తాడు. అప్పటి వరకు, యేసు ఖచ్చితంగా తిరిగివస్తాడని విశ్వాసులు నిరీక్షణ కలిగియుండాలి.

ఇప్పుడు, యేసు పరలోకము నుండి రాజుగా పాలించుచున్నాడు. అయితే ఆయన దీనితో సంతృప్తిగా లేడు. ఆయన ఇప్పుడు పరలోకంలో పాలించుచున్నట్లే సృష్టిలోని ప్రతిదానిని కూడా పూర్తిగా మరియు మహిమాన్వితంగా పాలించాలని ఆయన కోరుచున్నాడు. ఆయన శతృవులందరిని శిక్షించి పూర్తిగా నాశనం చేసి, నూతన సృష్టిలో విశ్వాసులందరిని ఆశీర్వదించే వరకు సంతృప్తి చెందడు. మరియు ఆయన రాజ్యమును భూలోకమంతటికీ వ్యాపించుట ద్వారా దీనిని చేయాలని ఆశించుచున్నాడు. సృష్టియంతటినీ పాలించుట క్రీస్తు ప్రణాళిక అని పౌలుకు తెలుసు గనుక, తన రాజ్యమును సంపూర్ణపరచుటకు క్రీస్తు నిశ్చయించుకున్నాడని పౌలు నొక్కి చెప్పాడు. ఇందువలనే అతడు విశ్వాసులకు భవిష్యత్ స్వాస్థ్యము ఉంటుంది మరియు క్రీస్తు తిరిగివచ్చినప్పుడు వారు గొప్ప ప్రతిఫలమును పొందుతారు అని వ్రాశాడు. ఉదాహరణకు, ఎఫెసీయులకు 1:13-14లో ఆయన వ్రాసిన మాటలు గమనించండి:

వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు (ఎఫెసీయులకు 1:13-14).

మన భవిష్యత్ స్వాస్థ్యముకు హామీ ఉందని పౌలు నొక్కి చెప్పాడు – దేవుడు వాగ్దానం చేశాడు మరియు ఆయన మనసును మార్చుకొనడు. తత్ఫలితంగా, రాజ్యము ముగింపులో మన స్వాస్థ్యమును ఇచ్చుటకు యేసు ఖచ్చితంగా తిరిగివస్తాడు. మరియు ఫిలిప్పీయులకు 3:20-21లో క్రీస్తు రాకడను గూర్చి ఈ పదాల్లో పౌలు వ్రాశాడు:

మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము ... ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపముగలదానిగా మార్చును (ఫిలిప్పీయులకు 3:20-21)

క్రీస్తు తన భూలోక రాజ్యమును సంపూర్ణపరచుటకు వచ్చినప్పుడు, క్రొత్త, మహిమశరీరములు మన స్వాస్థ్యములో భాగంగా ఉంటాయి. తాను అనుభవించిన శ్రమల కాలములో పౌలు స్వయంగా ఈ నిరీక్షణను పట్టుకొనియున్నాడు. పౌలు ఈ స్వాస్థ్యమును గూర్చి గొప్ప నిశ్చయతతో చెబుతున్నాడు ఎందుకంటే యేసు తిరిగివస్తానని వాగ్దానం చేశాడని, మరియు ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి యేసు నిశ్చయించుకున్నాడని అతనికి తెలుసు. తాను వ్రాసిన చెరసాల పత్రికలన్నిటిలో, సృష్టికి రాజుగా పౌలు క్రీస్తు వైపుకు దృష్టిని ఆకర్షించాడు, మరియు అతడు క్రీస్తు యొక్క రాజరిక సార్వభౌమత్వము, గౌరవము మరియు సంకల్పము మీద తన బోధలకు మూలరాళ్లుగా ఆధారపడ్డాడు. ఈ అంశాలు ఈ పత్రికల్లో పదే పదే కనిపిస్తాయి, మరియు కొలస్సయులకు, ఎఫెసీయులకు మరియు ఫిలిప్పీయులకు పౌలు వ్రాసిన అనేక ఉపదేశాలకు ఇవి ఆధారంగా ఉన్నాయి.

యేసు క్రీస్తు సృష్టికి రాజు అను సిద్ధాంతమును ఇప్పటి వరకు మనము చూశాము గనుక, చెరసాల పత్రికల యొక్క వేదాంతశాస్త్ర ఐక్యతను, అనగా రాజరికములో క్రీస్తుతో విశ్వాసుల యొక్క ఐక్యత మీద దృష్టిపెట్టు రెండవ బోధనను ఇప్పుడు మనము చూడవలసియున్నది. యేసుతో మన ఐక్యత మనతో ఆయన ఆశీర్వాదములను పంచుకొనుటకు కారణమవుతుంది.

క్రీస్తుతో ఐక్యత కీలకమైన క్రొత్త నిబంధన సత్యము అయ్యున్నది, ముఖ్యముగా యోహాను సువార్త మరియు పౌలు వ్రాసిన పత్రికలలో ఉద్ఘాటించబడినది. కాబట్టి, యోహాను 14:6లో, “నేనే జీవమును” అని యేసు సెలవిచ్చాడు. మరియు యోహాను 3:16లో, “వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవముపొందు[ను]” అని మనము చదువుతాము. మరియు యోహాను 3:16లో, యేసు కేవలం విశ్వాసమునకు కర్త మాత్రమే కాదుగాని, ఆయన విశ్వాసము దొరుకు స్థలము అయ్యున్నాడు, మనము ఆయనను నమ్ముతాము, ద్రాక్షవల్లిలో తీగెల వలె మనము ఆయనయందు నాటబడియున్నాము. కాబట్టి, ఆయన జీవము అయ్యున్నట్లయితే, నాకు జీవము అవసరమైయుంటే, నేను ఆయనతో ఐక్యపరచబడియుండాలి.

— డా. నాక్స్ ఛేంబ్లిన్

పౌలు ఆలోచన ప్రకారం, యేసును మనం నమ్మినప్పుడు, మనం దేవుని దృష్టిలో ఆయనతో ఒక రహస్యమైన, ఆత్మీయ మార్గంలో ఐక్యపరచబడతాము. మరియు మనము యేసుతో ఐక్యత కలిగియున్నాము కాబట్టి, ఆయన వలెనే మనము కూడా పరలోకములో నిర్దోషులుగా పరిగణించబడతాము. అంతేగాక, మనము క్రీస్తుతో ఐక్యపరచబడియున్నాము కాబట్టి, ఆయన పునరుత్థాన మహిమలో కూడా మనము పాలుపంచుకుంటాము. క్రీస్తు రాజత్వములో వారు కూడా పాలుపంచుకుంటారని పౌలు తన పాఠకులను చెరసాల పత్రికల ద్వారా ప్రోత్సహించుచుండగా ఈ అంశమును పదే పదే ప్రస్తుతించాడు. క్రీస్తు రాజ్యంలో విశ్వాసులు పాలుపంచుకుంటారు గనుక, క్రీస్తు రాజ్యం యొక్క ప్రస్తుత కొనసాగింపులో ఆశీర్వాదములు పొందుతారు మరియు రాజ్యము ముగింపులో ఇంకా గొప్ప ఆశీర్వాదములు పొందుటకు ఆసక్తి కలిగియున్నారు అని అతడు చాలాసార్లు సూచించాడు. ఉదాహరణకు, కొలస్సయులకు 3:1-4లో, పౌలు ఈ విధంగా వ్రాశాడు:

మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు ... ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. మనకు జీవమైయున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు (కొలస్సయులకు 3:1-4).

క్రీస్తుతో మన ఐక్యత ద్వారా, మనం క్రీస్తు మరణముతో ఐక్యపరచబడితిమి కాబట్టి మనము ఆయనతో కూడా మరణించాము. క్రీస్తు యొక్క పునరుత్థానము మరియు జీవములో మనం ఐక్యముగా ఉన్నాము గనుక ఆయనతో కూడా మనం లేపబడ్డాము. క్రీస్తు యొక్క ఆరోహణము మరియు రాజత్వములో కూడా మనం ఐక్యముగా ఉన్నాము గనుక ఆయన మహిమలో వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం పాలిస్తాము. ఎఫెసీయులకు 2:6-7లో పౌలు ఇలా వ్రాశాడు:

క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము, క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను (ఎఫెసీయులకు 2:6-7).

పౌలు మాటల ప్రకారం, ఇప్పుడు కూడా మనం “పరలోక స్థలములలో” క్రీస్తుతో కూర్చున్నాము, సృష్టియంతటిపై ఆయన ప్రస్తుతము చేస్తున్న రాజత్వములో ఆయనతో ఐక్యంగా ఉన్నాము. ఫలితంగా, ప్రస్తుతము మన ప్రస్తుత భూలోక పరిస్థితులను మనము అనుభవించుచున్నప్పటికీ, ఆయన ఘనత మరియు ఆయన ఆశీర్వాదములలో మనము పాలుపంచుకొనుచున్నాము. మరియు యేసు తిరిగివచ్చినప్పుడు, రాబోవు లోకములో మన ఆశీర్వాదములు పరిమాణమునకు మించిన విధముగా వృద్ధి చెందుతాయి. శ్రమలు వంటి విషయములకు తగిన దృష్టికోణమును ఇచ్చుటకు క్రీస్తుతో మన ఐక్యతను గూర్చి కూడా పౌలు మాట్లాడాడు. క్రీస్తు అనుచరులు ఒంటరిగా లేక వ్యర్థముగా శ్రమను అనుభవించరు అని స్పష్టము చేయుటకు అతడు క్రీస్తుతో ఐక్యతను గూర్చి మాట్లడాడు. ఇది పౌలుకు మాత్రమేగాక, అతని పాఠకులకు కూడా వర్తిస్తుంది. కొలస్సయులకు 1:24లో అతని మాటలు వినండి:

ఇప్పుడు మీకొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడినపాట్లలో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను (కొలస్సయులకు 1:24).

క్రైస్తవ జీవితము కష్టముతో కూడినది, మరియు గొప్ప శ్రమలను కలిగియుంటుంది. మన రాజు పరలోకంలో పాలించుచున్ననూ, ఆయన తన శతృవులందరిని నిర్మూలించలేదు, మరియు ఆ శతృవులు తరచూ తమ బలగాలను మనకు విరోధముగా ఉపయోగిస్తున్నారు. అయితే మనం క్రీస్తు కొరకు శ్రమలను అనుభవిస్తునప్పుడు, క్రీస్తుతో మన ఐక్యత క్రీస్తు మనతో శ్రమనొందుచున్నాడు మరియు సానుభూతి చూపిస్తున్నాడు అని నిర్ధారించు సత్యములో పౌలు ఓదార్పునొందాడు. రాజైన క్రీస్తుతో మన ఐక్యత ద్వారా మన శ్రమలు సంఘముకు ప్రయోజనకరముగా ఉంటాయి అని తెలుసుకొనుటలో కూడా పౌలు ఓదార్పునొందాడు. చివరిగా, మన శ్రమలు క్రీస్తు నియమించిన శ్రమలను పూర్తిచేస్తాయి, మరియు మన రాజు యొక్క విజయవంతమైన రాకడకు వేదికగా నిలుస్తాయి అని అతడు బోధించాడు. ఇటువంటి కారణాలవల్ల, పౌలు యొక్క చెరసాల పత్రికలు సాధారణంగా క్రీస్తుతో మన ఐక్యత అనే అంశముపై దృష్టిపెట్టాయి. పౌలు మాటల ప్రకారం, సృష్టికి రాజైన క్రీస్తుతో మన ఐక్యత మన రక్షణలో గొప్ప విశ్వాసముకు, కష్టాల్లో గొప్ప ప్రోత్సాహముకు మరియు భవిష్యత్తు కొరకు గొప్ప నిరీక్షణకు ఆధారంగా ఉంది.

సృష్టికి రాజుగా క్రీస్తు మీద దృష్టిపెట్టుట ద్వారా, ఆయన రాజత్వములో క్రీస్తుతో విశ్వాసుల యొక్క ఐక్యత మీద దృష్టిపెట్టుట ద్వారా పౌలు చెరసాల పత్రికకు వేదాంతపరముగా ఐక్యత కలిగియున్న విధానమును మనము పరిశీలించాము కాబట్టి, ఈ పత్రికలను ఐక్యపరచు మూడవ లక్షణమును చూచుటకు ఇప్పుడు మనము సిద్ధముగా ఉన్నాము: క్రీస్తు రాజత్వము మరియు ఆయనతో మన ఐక్యతలో నాటబడియున్న నైతిక జీవనము యొక్క అవసరత.

పౌలు పత్రికల యెడల అవగాహన ఉన్నవారికి అపొస్తలుడైన పౌలు సిద్ధాంతపరమైన విషయాలు ప్రస్తావించినట్లుగానే నైతిక జీవనమును గూర్చిన విషయాలను బోధించుటకు కూడా ఎక్కువ సమయం కేటాయించాడని తెలుస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే, సిద్ధాంతపరమైన అంశమును పరిచయం చేసిన ప్రతిసారి, విశ్వాసులు ఆ సిద్ధాంతమును తమ జీవతాలకు ఎలా అనువర్తించుకోవాలో వివరించాడు. అతడు సరియైన ఆలోచన లేక సిద్ధాంతములను గూర్చి మాత్రమే బోధించలేదు; అతడు సరియైన ప్రవర్తన మరియు భావనలను ఉద్ఘాటించాడు. మన భావోద్వేగాలను మరియు ప్రవర్తనను మార్చే మార్గాల్లో సిద్ధాంతము మన జీవితాలకు అనువర్తించబడకపోతే ఉపయోగంలేదు అని చెప్పడానికి కూడా పౌలు సందేహించలేదు. 1 కొరింథీయులకు 13:2లో దీనిని ఉద్దేశించి పౌలు మాట్లాడిన మాటలు వినండి:

ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నియు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసముగలవాడనైనను, ప్రేమలేనివాడనైతే నేను వ్యర్థుడను (1 కొరింథీయులకు 13:2).

పౌలు బోధించినట్లు, మనము మర్మములన్నిటిని అర్థము చేసుకొనినను, దేవుని గూర్చి సమస్త జ్ఞానమును లేక పరిపూర్ణ అవగాహనను కలిగియున్నా, అది చాలదు. మంచి సిద్ధాంతమును — లేక పరిపూర్ణ సిద్ధాంతమును — కలిగియున్నా ఆ సిద్ధాంతము మన జీవితములను మార్చకపోతే ఎందుకు పనికిరాదు. దానిలో ప్రేమ లేనియెడల, క్రీస్తుకు విధేయత చూపు విధముగా నైతిక జీవితమును అది కలిగించకపోతే, దానికి ఎలాంటి విలువ ఉండదు.

పౌలు చెరసాల పత్రికలు చాలావరకు నైతిక జీవనానికి ప్రాధాన్యత ఇవ్వడం మనకు ఆశ్చర్యం కలిగించదు. మరొక వైపు, క్రీస్తు రాజు కాబట్టి మనము క్రీస్తుకు విధేయత చూపబద్ధులైయున్నాము. మరొక వైపున, మనము క్రీస్తుతో ఐక్యపరచబడియున్నాము కాబట్టి మనము క్రీస్తుకు విధేయత చూపబద్ధులమైయున్నాము. క్రీస్తు యొక్క రాజత్వము నుండి వచ్చే నైతిక జీవన బాధ్యతను మొదటిగా చూద్దాము.

మనము ఇంతకు ముందు ప్రస్తావించినట్లు, క్రీస్తు రాజైయున్నాడు కాబట్టి ఆయన సార్వభౌముడైయున్నాడు. అనగా మన నుండి విధేయతను కోరే చట్టబద్ధమైన అధికారం ఆయనకు ఉంది. అంటే ఆయనకు విధేయత చూపించే చట్టబద్ధమైన బాధ్యత మనకు ఉందని అర్థం. మరియు మునుపు మనం చెప్పినట్లుగా, క్రీస్తు సంపూర్ణ నీతిమంతుడు మరియు న్యాయమైన రాజు. దీని అర్థం, ఆయన తీర్పులు మరియు ఆజ్ఞలు సంపూర్ణంగా నైతికమైనవి, కాబట్టి ఆయనకు విధేయత చూపించవలసిన నైతిక బాధ్యతను మనం కలిగియున్నాము. క్రీస్తు సార్వభౌముడు మరియు న్యాయవంతుడైన రాజు గనుక, ఆయన ఆజ్ఞాపించు సమస్తమును పాటించుటకు మనము బద్ధులమైయున్నాము. ఫిలిప్పీ. 2:9-12లో ఈ మాటలను వ్రాస్తూ, పౌలు ఈ దృష్టికోణమును అందించాడు:

పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును... కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడును విధేయులైయున్న ప్రకారము...భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి (ఫిలిప్పీయులకు 2:9-12).

పరలోకముమందు, భూమిమీద మరియు భూమి క్రింద ఉన్నవాటన్నిటికీ యేసు పాలకుడు మరియు ప్రభువైయున్నాడు. ఆయన సృష్టికి రాజు. మరియు క్రీస్తు యొక్క రాజత్వమును ఆధారము చేసుకొని, క్రీస్తుకు విధేయులు కమ్మని పౌలు ఫిలిప్పీయులను హెచ్చరించాడు. మనము ఇంతకు ముందు చూసినట్లు, క్రీస్తు రాజరికము ఆయనకు చెందవలసిన గౌరవమును వెలుగులోనికి తెస్తుంది. ఇదే విధముగా, క్రైస్తవులు తమ రాజు యొక్క గౌరవార్థముగా పరిశుద్ధ జీవితాలు గడపాలని పౌలు హెచ్చరించాడు. క్రీస్తు పరిశుద్ధుడు, నీతిమంతుడు మరియు గౌరవింపదగినవాడు. మరియు క్రీస్తుకు అర్హమైన గౌరవమునకు అనుగుణమైన విధానములలో జీవించుటకు క్రీస్తు అనుచరులు బద్ధులైయున్నారు. ఫిలిప్పీయులకు 1:27లో దీనిని గూర్చి పౌలు ఇలా వ్రాశాడు:

మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి (ఫిలిప్పీయులకు 1:27).

మరియు కొలస్సయులకు 1:10లో ఆయన తన పాఠకులను ఈ మాటలతో ప్రోత్సహించాడు:

ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుచున్నాము (కొలస్సయులకు 1:10).

తాను మరియు తన తోటి క్రైస్తవులు క్రీస్తుకు యోగ్యమైన, ఆయనను గౌరవించు మరియు ఆయనను సంతోషపరచు జీవితములను జీవించాలని పౌలు ఎంతగానో కోరాడు. విశ్వాసులు సత్క్రియలు చేయుట ద్వారా, అనగా, ప్రభువు ఆజ్ఞలకు విధేయత చూపుట ద్వారా మాత్రమే దీనిని సాధించగలరు. తాను వ్రాసిన చెరసాల పత్రికలన్నిటిలో, క్రీస్తుకు విధేయత చూపమని మరియు దేవుని ఆజ్ఞలకు అనుగుణంగా ఆలోచించమని, ప్రవర్తించమని మరియు భావనలు కలిగియుండమని పౌలు తన శ్రోతలను ఉపదేశించాడు. క్రీస్తు రాజరికమును గుర్తించుటకు మరియు సృష్టికి రాజుగా ఆయనకు ఘనతను తెచ్చుటకు ఇలా మనము చేయాలని అతడు మరలా మరలా ఉద్ఘాటించాడు.,

క్రీస్తు రాజు గనుక క్రైస్తవులు నైతికంగా జీవించాలని బోధించుటతో పాటుగా, మనం క్రీస్తుతో ఐక్యంగా ఉన్నాము గనుక ఆయన లక్షణాలు మరియు ఆజ్ఞలకు తగినట్లుగా జీవించే బాధ్యత మనకు ఉందని పౌలు వివరించాడు.

పరిశుద్ధాత్మ ఏమైయున్నాడో మరియు మన కొరకు ఏమి చేస్తుయున్నాడో వాటి ద్వార మనలను క్రీస్తుతో ఐక్యపరచియున్నాడు ... మరియు మనము దేవుని నిత్య కుమారునితో ఐక్యత కలిగియున్నాము గనుక, ఇప్పుడు మనము సజీవుడైన దేవుని యొక్క దత్తతుతీసుకొనబడిన కుమారులము మరియు కుమార్తెలమైయున్నాము మరియు ఆయన నిత్య కుమారుడైన యేసుకు సహోదరీ సహోదరులముగా ఉన్నాము. ఇది సరిపోతుంది, కాని ఇంకా చాలా ఉన్నది. యేసు మన కొరకు చేసిన దానిని మనకు అనువర్తించుట ద్వారా క్రీస్తుతో మన ఐక్యత కార్యమును కూడా పరిస్థితికనుగుణంగా మనకు అనువర్తిస్తాడు. మనము పాపము కొరకు మరణించుట మరియు నీతి కొరకు తిరిగిలేచుటను గూర్చి మాట్లాడుతూ, దీనిని గూర్చి పౌలు రోమా. 6లో మాట్లాడతాడు. ఈ కోణము ఒక నూతన జీవన మార్గమునకు దారితీస్తుంది అని, మరియు మన జీవితాలలో బానిసత్వము మరియు పాపపు ఆధిపత్యము నుండి నూతన స్వాతంత్ర్యమును కలిగిస్తుంది అని పౌలు చెబుతున్నాడు. మనము ఇక పాపము చేయము అని కాదుగాని, పాపమే మనము ప్రభువు అన్నట్లు అది ఇక మన మీద ఆధిపత్యమును చెలాయించదు. అది మన ప్రభువు కాదు, మనము మరణించియున్నాము. మనము క్రీస్తుతో కూడా లేపబడితిమి, కాబట్టి ఆత్మ మనలో ఆయన జీవితకాల, నిశ్శబ్దమైన, యెడతెగని కార్యమును కొనసాగిస్తూ, మనలను క్రీస్తు స్వరూపములోనికి మరి ఎక్కువగా మార్చుతాడు.

— డా. డెన్నిస్ ఇ. జాన్సన్

తాను వ్రాసిన చెరసాల పత్రికలలో, క్రీస్తుతో మన ఐక్యత కనీసం మూడు కారణముల చేత మనలను నైతిక క్రైస్తవ జీవనములోనికి నడిపిస్తుంది అని పౌలు వివరించాడు. మొదటిగా, పౌలు చెరసాలలో నుండి వ్రాయుచుండగా, క్రీస్తుతో విశ్వాసుల యొక్క ఐక్యత అనగా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనలో కార్యము చేస్తాడు అని అర్థము అయ్యున్నది. ఈ సమస్యాత్మక లోకములో మనము ఒంటరివారము కాము, మరియు మనలను మనము కాపాడుకొనుటకు లేక మన సొంత శక్తితో పనులను చేయుటకు మనము విడిచిపెట్టబడలేదు. బదులుగా, మన రాజు ఎదుట మనము కలిగియున్న నైతిక బాధ్యతలకు సమర్పించుకొనునట్లు మనలను బలపరచుటకు మరియు నడిపించుటకు దేవుడు మనయందు కార్యములు చేస్తాడు. ఫిలిప్పీయులకు 2:12-13లో ఈ విషయాలను గూర్చి పౌలు మాట్లాడిన మాటలు వినండి:

భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే (ఫిలిప్పీయులకు 2:12-13)

ఈ వచనములు సూచించుచునట్లు, దేవుని పరిచర్యలో మన నైతిక జీవనమును కొనసాగించునట్లు “పనులను చేయుటకు” మనము బాధ్యత కలిగియున్నాము. అయితే మనము క్రీస్తుతో ఐక్యపరచబడియున్నాము గనుక, దేవుడు మనలో కార్యములు చేస్తాడు. మరియు పరిశుద్ధాత్ముడు మన చిత్తమును కదలించి దేవుని యెడల విధేయత కనుపరచునట్లు చేస్తాడు, తద్వారా మనం సరియైన రీతిలో, నైతికంగా జీవిస్తాము. కొలస్సయులకు 3:5-10లో ఇటువంటి విషయం గురించి పౌలు మాట్లాడుతున్నాడు:

కావున భూమిమీదనున్న మీ అవయవములను...చంపి వేయుడి ... ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొనియున్నారు (కొలస్సయులకు 3:5-10).

మనము క్రీస్తుతో ఐక్యపరచబడియున్నాము కాబట్టి, మన భూసంబంధమైన స్వభావమును విడచి, క్రీస్తునందు నూతన స్వభావమును ధరించుకొనుటకు మనము పిలువబడియున్నాము. దేవుని స్వరూపములముగా మనము జీవించు విధానములో జీవించుటకు “నవీన పురుషుడు” నూతనపరచబడియున్నాడు.

యేసు క్రీస్తుతో మన ఐక్యత ద్వారా ఇప్పుడు మనము ఏమి కలిగియున్నాము అంటే, క్రీస్తుకు అవును అని చెప్పు, దేవుడు మన యెడల కలిగియున్న ఆకాంక్షలకు అవును అని చెప్పు శక్తిని కలిగియున్నాము. ఇక ధర్మశాస్త్రము మనలను ఖండించదుగాని, జీవమునిచ్చు ఆత్మయైన పునరుత్థానుడైన క్రీస్తులో నెరవేర్పులోనికి వచ్చిన ఆత్మ కుమ్మరింపు మరియు నూతన నిబంధన యొక్క నెరవేర్పు ద్వారా, మరియు క్రీస్తునందు దేవునికి విధేయత చూపుటకు మనము బలమును పొందాము, మనము శక్తిని పొందాము, పురికొల్పబడ్డాము. కాబట్టి, క్రీస్తుతో మన ఐక్యత వాస్తవానికి మనము ఆనందకరమైన విధేయతలో నడుచు విధానమును తెలియజేస్తుంది, మరియు మనము పాపము చేసినప్పుడు, తండ్రి ఎదుట మన పక్షమున నిలబడి మన కొరకు విజ్ఞాపన చేయు న్యాయవాది మన కొరకు ఉన్నాడు అని తెలుసుకొనియున్నాము. అయితే వాస్తవానికి, ఆ పశ్చాత్తాపములో, మనము క్షమాపణను అనుభవించుచుండగా, యేసు క్రీస్తు తిరిగిలేచాడు కాబట్టి, మనము ఆయనతో తిరిగిలేచియున్నాము కాబట్టి, మరొకసారి క్రియాత్మక పునరుత్థాన శక్తితో జీవించుటకు మనము బలపరచబడుతున్నాము.

— డా. డేవిడ్ బి. గార్నర్

రెండవదిగా, తన కుమారునితో ఐక్యముగా ఉన్నవారందరూ పరిశుద్ధముగా జీవించాలని దేవుడు ఆజ్ఞాపించాడు అని పౌలు ఉద్ఘాటించాడు. అయితే, దేవుడు కేవలం దీనిని ఆజ్ఞాపించలేదు. మనము చేయవలసిన సత్క్రియలను ఆయన ముందుగానే నిర్ణయించాడు. ఎఫెసీయులకు 2:10లో పౌలు దీనిని గూర్చి వ్రాశాడు, అక్కడ అతడు ఇలా బోధించాడు:

వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము (ఎఫెసీయులకు 2:10).

మనము “క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై” ఉన్నాము, అంటే యేసుక్రీస్తుతో ఐక్యత ద్వారా దేవుడు మనలను రక్షించాడు. మరియు ఆయన ఈ విధముగా చేయుటకు ఒక కారణం ఏమిటంటే మనము చేయవలసిన సత్క్రియలను ఆయన ముందుగానే నిర్ణయించాడు.

మూడవదిగా, క్రీస్తుతో విశ్వాసుల ఐక్యత అంటే, క్రీస్తు ద్వారా మనము ఒకరితో ఒకరము ఐక్యత కలిగియున్నాము అని అర్థమని కూడా పౌలు ఉద్ఘాటించాడు. కాబట్టి క్రీస్తుతో వ్యవహరించినట్లే, మన యెడల ఒకరు ఎలా వ్యవహరించాలని ఆశిస్తామో అదే విధంగా ఇతరులతో వ్యవహరించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఎఫెసీయులకు 4:25లో పౌలు ఈ విధంగా వ్రాశాడు:

మనము ఒకరికొకరము అవయవములై యున్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను (ఎఫెసీయులకు 4:25).

క్రీస్తునందు మనము ఒకరితో ఒకరము ఐక్యత కలిగియున్నాము, మరియు ఈ ఐక్యత ఒకరితో ఒకరు మర్యాదగా ప్రవర్తించునట్లు మనలను బద్ధులనుగా చేస్తుంది. మనము ఒకరికి విరోధముగా ఒకరము పాపము చేయకూడదుగాని, అందరి ప్రయోజనము కొరకు పని చేయవలసియున్నది. ఫిలిప్పీయులకు 2:1-3లో అతడు ఈ విధంగా వ్రాశాడు:

కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను ... ఉన్నయెడల... వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుము (ఫిలిప్పీయులకు 2:1-3).

క్రీస్తుతో మన ఐక్యత మనము నైతికముగా జీవించుటకు మనలను బద్ధులనుగా చేస్తుంది మరియు మనలను బలపరుస్తుంది. మరియు మనమంతా ఎదుర్కొను సంఘర్షణల మధ్య కూడా, రాజైన క్రీస్తు మన ముందుంచిన ప్రామాణికతకు అనుగుణంగా మనము జీవించగలుగుతాము. క్రీస్తుతో విశ్వాసుల ఐక్యత మరియు నైతికంగా జీవించాల్సిన మన బాధ్యతతో సహా సృష్టియంతటిపై క్రీస్తు యొక్క రాజత్వమును గూర్చి ఎన్నో అంశాలున్న ఒక సిద్ధాంతము ద్వార పౌలు చెరసాల పత్రికలు వేదాంతపరంగా ఐక్యముగా ఉన్నాయని మనం చూస్తాము. రానున్న పాఠముల్లో మనం చూడబోతున్నట్లుగా, పౌలు యొక్క చెరసాల పత్రికలు ఇతర అనేక అంశాలను కూడా పంచుకుంటాయి. అయితే యేసుక్రీస్తు సృష్టికి రాజు అనే సిద్ధాంతము ఈ అంశాలను ఐక్యపరచే ఒక అత్యంత సామాన్యమైన విషయం అయ్యున్నది.

పౌలు వ్రాసిన చెరసాల పత్రికలకు పరిచయముగా ఉన్న ఈ పాఠములో, కైసరియ మరియు రోమాలో పౌలు చెరసాల నిర్భంధము యొక్క నేపథ్యమును మరియు ఈ పత్రికలకు దారితీసిన పరిస్థితులను మనము పరిశీలించాము. చెరసాలలో, ఇతరులతో ముఖాముఖిగాను మరియు తన పత్రికల ద్వారాను పౌలు కొనసాగించిన పరిచర్యను మనము విశదీకరించాము. మరియు చివరిగా, చెరసాలలో నుండి పౌలు వ్రాసిన పత్రికలన్నిటి యొక్క వేదాంతశాస్త్ర ఐక్యతను, ముఖ్యముగా యేసు క్రీస్తు సృష్టికి రాజు అను పౌలు యొక్క ధృడ నిశ్చయతలో నుండి అవి వెలువడిన విధానమును మనము పరిచయం చేశాము.

భవిష్యత్ పాఠములలో, పౌలు వ్రాసిన చెరసాల పత్రికలన్నిటిని మరింత దగ్గరగా పరిశీలన చేద్దాము. మరియు అలా చేయునప్పుడు, ఈ పాఠంలో చదివిన నేపథ్యమును మనస్సులో ఉంచుకుందాము. పౌలు అనుభవించిన శ్రమలను మరియు చెరసాలలో అతడు చేసిన పరిచర్యను తెలుసుకొనుట, కొలస్సయులకు, ఎఫెసీయులకు, మరియు ఫిలిప్పీ సంఘాలకు పత్రికలు వ్రాయుటలో పౌలు ఉద్దేశాలు మరియు లక్ష్యాలు ఏమిటో అర్థం చేసుకొనుటకు సహాయపడుతుంది. మరియు ఈ పత్రికలను ఐక్యపరచే వేదాంతపరమైన అంశాలను అర్థం చేసుకొనుట, ఈ సంఘాలకు పౌలు ఇచ్చిన ప్రత్యేక ఉపదేశాలను అర్థం చేసుకొనుటకు సహాయపడతాయి. క్రీస్తుకు ఖైదీగా పౌలు అనుభవించిన శ్రమల అనుభవాలు, తను మొదటి శతాబ్దములో వ్రాసిన సంఘములకు ఉపదేశమును అందించుట కొరకు మాత్రమే వ్రాయబడలేదు. పౌలు యొక్క పరిస్థితులు, ఇతరులకు పరిచర్య చేయుటకు అతడు చేసిన ప్రయత్నములు మరియు అతని హృదయమును రేపిన ముఖ్యమైన అంశముల వెలుగులో మనము క్రొత్త నిబంధనలోని ఈ భాగములను చదివినప్పుడు, అవి ఆధునిక లోకములో మన వ్యక్తిగత జీవితాలకు మరియు సంఘములకు కూడా అనువర్తించబడతాయి అని కూడా మనము చూస్తాము.

Continue reading the full transcript