<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
క్యాటలాగ్‌కు తిరిగి వెళ్ళుPPEపౌలుని చెరపుపు ఎపిస్టిళ్ళు
పౌలుని చెరపుపు ఎపిస్టిళ్ళు ·Videoఆంగ్లం నుండి అనువాదం చేయబడింది

PPE-03 పౌలు మరియు ఎఫెస్సుకులు

పూర్తి వచనం చదవండి

ఈ పాఠం 3వ పాఠంతో సమానమైన వీడియో సహచరుడు, ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: కొంతమంది పౌలు ఎఫెస్సుకు రచయితగా ఎందుకు సందేహిస్తారు? ఎఫెస్సు పౌలు యొక్క ఇతర రచనలతో ఎలా సమానంగా ఉంది? ఎఫెస్సు రచయిత ఎందుకు ముఖ్యం? పౌలు పేరుతో ఎవరైనా లేఖను నకిలీ ఎందుకు చేస్తారు? పౌలు నిజంగా ఈ లేఖను ఎఫెస్సుకులు రాశాడా? లేకపోతే, అది ఏ తేడా చేస్తుంది? ఈ లేఖ స్థానిక ఎఫెస్సు సమస్యలను లేదా విస్తృత సమాజంలో మాత్రమే పరిష్కరిస్తుందా? ఒక అన్యజాతి వ్యక్తి యూదు మెస్సీహ్ గురించి ఎందుకు ఉత్తేజితుడవుతాడు? పాత నిబంధన ఇజ్రాయెల్‌కు దేవుని వాగ్దానాలు చర్చికి వర్తిస్తాయా? యూదులు మరియు అన్యజాతుల మధ్య గణనీయమైన తేడాలు తొలగించబడ్డాయా? ఆధునిక చర్చి ఒక శరీరం ఎలా ఉంది? దేవుడు వైవిధ్యాన్ని ప్రేమిస్తాడా? పౌలు ఎఫెస్సులో అన్యజాతి పాఠకుల కోసం దేవుని రాజ్యం యొక్క ఆలోచనను తక్కువగా చూపించాడా? దేవుని రాజ్యం యొక్క ఆలోచన కేవలం ఒక రూపకమా? అది మనలను నేడు ఎలా ప్రభావితం చేస్తుంది? ఎఫెస్సు 4లో ఆధ్యాత్మిక బహుమతులు మరియు చర్చి కార్యాలయాల మధ్య సంబంధం ఏమిటి? ఎఫెస్సు 4లో పేర్కొన్న అన్ని చర్చి కార్యాలయాలు ఇప్పటికీ ఉన్నాయా? భార్యలు తమ భర్తలకు విధేయత చూపాలనే పౌలు సూచన ప్రతి సంస్కృతికి వర్తిస్తుందా? దేవుని కవచం పూర్తిగా రక్షణాత్మకమైనదా, లేదా దానికి దాడి చేసే గుణం కూడా ఉందా? ఆధ్యాత్మిక యుద్ధంలో మనం ఎలా నిమగ్నమవుతాము? స్తుతి మరియు ఆరాధన ప్రధానంగా సంగీతపరమైనవిగా భావించబడతాయా? సమూహ చర్చిలో ఆరాధన ఇతర రకాల ఆరాధనల నుండి ఎలా భిన్నంగా ఉంటుంది? సువార్త యొక్క వ్యక్తిగత మరియు సామూహిక అంశాలను మనం ఎలా సమన్వయం చేస్తాము? సువార్త మరియు దేవుని రాజ్యం మధ్య సంబంధం ఏమిటి? దేవుని రాజ్యాన్ని నిర్మించడానికి కొన్ని ఆచరణాత్మక మార్గాలు ఏమిటి?


From the transcript

1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.

బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.

ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.

అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.

మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.

ఒకటికంటే ఎక్కువ దేశములలో నివసించిన ప్రజలు క్రొత్త సంస్కృతులను అలవాటు చేసుకొనుటలో ఎంత కష్టమౌతుందో నాకు చాలాసార్లు చెప్పారు. ప్రతి దేశానికి సొంత పద్ధతులు, చట్టములు మరియు విలువలు ఉంటాయి. మరియు ఒక దేశములో సరైనది మరొక దేశములో సరియైనదిగా ఉండనవసరము లేదు. వ్యాపారవేత్తలు, పర్యాటకులు మరియు మిషనరీలు కూడా వారు సందర్శించుచున్న నూతన దేశము యొక్క పద్ధతులను నేర్చుకొనుటకు చాలా సమయం కేటాయించవలసియుంటుంది. క్రైస్తవ జీవితము విషయంలో కూడా అనేక విధాలుగా ఇదే వాస్తవమై ఉంది. మనందరమూ క్రీస్తుకు వెలుపల, ఆయన రాజ్యముకు వేరుగా జన్మించాము. మనలో చాలామంది అంధకార రాజ్యము యొక్క పద్ధతులను నేర్చుకొని, వాటిని అనుసరిస్తూ అనేక సంవత్సరాలు గడిపాము. మరియు మనము నూతన దేశము, మన నూతన రాజ్యము — అనగా క్రీస్తులో వెలుగు రాజ్యము — యొక్క మార్గముల ప్రకారము నడచుటకు ప్రయత్నించుచుండగా ఇది అనేక సవాళ్లకు దారితీస్తుంది.

ఈ సవాలు క్రొత్తదేమీ కాదు. ఎఫెసు పట్టణములో కూడా, క్రీస్తు రాజ్యమునకు తగిన విధముగా ఎలా జీవించాలో మొదటి తరము క్రైస్తవులకు నేర్పించవలసి వచ్చింది. అనేకమంది క్రైస్తవులు అన్యమతముల నుండి రక్షింపబడ్డారు. వారు క్రీస్తును విశ్వసించక మునుపు సాతాను యొక్క మార్గములను అనుసరించుటలో ఎక్కువ సమయం గడిపారు, మరియు వారు అలోచించు, భావించు మరియు ప్రవర్తించు విధానములను మార్చుకోవడం వారికి కష్టమైనది. కాబట్టి, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు తన పత్రికను వ్రాసినప్పుడు, అతడు క్రీస్తునందు దేవుని రాజ్యములో జీవితము యొక్క ఒక గొప్ప విశ్వ చిత్రమును చిత్రీకరిస్తూ ఈ సవాలును సూటిగా చర్చించాడు.

పౌలు యొక్క చెరసాల పత్రికలు అను మన పాఠ్యక్రమములో ఇది మూడవ పాఠము, మరియు దీనికి “పౌలు మరియు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక” అను పేరు పెట్టాము. ఈ పాఠములో, పౌలు ఎఫెసులోని సంఘముకు వ్రాసిన పత్రికను మనం పరిశీలిస్తాము, ముఖ్యముగా దేవుని రాజ్యమును ఎలా నిర్మించాలి, ఎలా నిర్వహించాలి మరియు అందులో ఎలా వర్థిల్లాలి అను విషయములను క్రైస్తవులకు బోధించుటకు తన పత్రికను అతడు రూపుదిద్దిన మార్గముల మీద మనము దృష్టిపెడతాము. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక మీద మన చర్చ మూడు భాగములుగా విభాగించబడుతుంది. మొదటిగా, ఈ పత్రిక యొక్క నేపథ్యమును పరిశీలనచేద్దాము. రెండవదిగా, దాని ఆకృతి మరియు విషయసూచికను అన్వేషించుదము. మరియు మూడవదిగా, దాని ఆధునిక అనువర్తనమును పరిశీలన చేద్దాము. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును మొదటిగా చూద్దాము.

సంఘమునకు అధికారికమైన బోధనను మరియు నాయకత్వమును అందించుటకు క్రీస్తు పౌలును అపొస్తలునిగా పిలచాడు. మరియు చెరసాలలో నుండి పత్రికలను వ్రాయుట ద్వారా కొంత వరకు పౌలు ఈ పనిని చేశాడు. అయితే పౌలు కేవలము మంచి సిద్ధాంతమును వ్యాపించాలని లేదా పారంపర్యాచారము కొరకు వీటిని నమోదుచేయాలని మాత్రమే కోరలేదు. అన్నిటి కంటే ముఖ్యముగా, కొన్ని సంఘములు ఎదుర్కొనుచున్న సవాళ్లకు అతడు తన బోధనలను అనువర్తించాడు. అతని పత్రికలు కాపరి సంబంధమైనవిగాను, శ్రద్ధ వహించేవిగాను ఉన్నవి, మరియు మొదటి శతాబ్దములో సంఘము ఎదుర్కొనుచున్న సమస్యలను గూర్చి అవి నేరుగా మాట్లాడేవిగా ఉన్నాయి. అనగా పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికను మనము అధ్యయనము చేయునప్పుడు, ఇటువంటి ప్రశ్నలను అడుగుతూ ఆరంభించుట సహాయకరముగా ఉంటుంది, “ఈ పత్రిక ఎవరికి వ్రాయబడింది?” మరియు “జీవితములో వారు ఎటువంటి ముఖ్యమైన సమస్యలను ఎదుర్కొనుచున్నారు?” ఇటువంటి ప్రశ్నలకు సమాధానము తెలుసుకొనుట పౌలు బోధనలను మరి ఎక్కువగా అర్థం చేసుకొనుటలో మనకు సహాయపడతుంది.

పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును పరిశీలించుచుండగా, మనము మూడు విషయముల మీద దృష్టిపెడదాము: మొదటిగా, పత్రిక యొక్క పౌలు గ్రంథకర్తృత్వమును చూద్దాము. రెండవదిగా, వాస్తవిక శ్రోతలను గుర్తించుదాము. మరియు మూడవదిగా, పౌలు వారికి వ్రాయుటకుగల ఉద్దేశ్యమును చూద్దాము. ఎఫెసీ పత్రిక యొక్క పౌలు గ్రంథకర్తృత్వమును చూస్తూ ఆరంభిద్దాము.

వాస్తవానికి పౌలు ఈ పత్రికను వ్రాయలేదు అని అనేకమంది ఆధునిక పండితులు చెబుతారు. బదులుగా, పౌలు యొక్క వారసత్వమును కొనసాగించుటకు మరియు అతని బోధలను క్రొత్త మార్గములలో అనువర్తించుటకు పౌలు శిష్యులలో ఒకడు ఎఫెసీ పత్రికను వ్రాశాడు అని వారు వాదించారు. ఈ కారణము చేత, ఎఫెసీ పత్రికను “డ్యూటెరో-పొలైన్” అని కూడా పిలుస్తారు. అయితే ఈ అభిప్రాయమును తిరస్కరించుటకు అనేక కారణాలు ఉన్నాయి. అన్నిటి కంటే ముఖ్యముగా, దీనిని పౌలు వ్రాశాడు అని స్వయంగా పత్రిక సెలవిస్తుంది.

ఎఫెసీయులకు 1:1లోని మాటలను వినండి:

దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులుకు...శుభమని చెప్పి వ్రాయునది (ఎఫెసీయులకు 1:1).

ఇప్పుడు, తమ పత్రికల కొరకు మాన్యతను సంపాదించుటకు ఆదిమ సంఘములో ఇతర పేర్లతో కొందరు అబద్ధ బోధకులు నకిలీ పత్రికలను వ్రాసిన మాట నిజమే. అయితే, ఒక పత్రిక నకిలీది అని సంఘము గ్రహించినట్లయితే, వారు దానిని తిరస్కరించేవారు. 2 థెస్సలొనీకయులకు 2:1-4లో ఈ విషయమును గూర్చి పౌలు ఏమి బోధించాడో వినండి:

సహోదరులారా, ... ఆత్మ వలననైనను, మాటవలననైనను, మా యొద్దనుండి వచ్చినదని చెప్పిన పత్రికవలననైనను, ఎవడైనను చెప్పినయెడల మీరు త్వరపడి చంచలమనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు... ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి (2 థెస్సలొనీకయులకు 2:1-4).

పౌలు స్వయంగా మారుపేరును ఉపయోగించుటను తిరస్కరించుట వెలుగులో, ఎఫెసీ పత్రిక మీద తన పేరును వ్రాసుకొని పౌలు శ్రేయోభిలాషులలో లేక విద్యార్థులలో ఒకరు పౌలు బోధలనే వ్యతిరేకించుట సాధ్యము కాదు. అంతేగాక, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక సిద్ధాంతము మరియు భాష రెంటిలోను పౌలు యొక్క ఇతర పత్రికలను పోలి ఉంది. ప్రత్యేకముగా కొలస్సీయులకు వ్రాసిన పత్రిక విషయములో సంబంధాలు చాలా బలముగా ఉన్నాయి. బహుశా పౌలు ఈ రెంటిని ఇంచుమించు ఒకే సమయంలో వ్రాశాడు గనుక ఇది మనలను ఆశ్చర్యపరచకూడదు. ఈ సంబంధాలు చాలా బలమైనవి గనుక పత్రికలో పౌలు తన పేరును ప్రస్తావించకపోయినప్పటికీ, సంఘము దీనిని వేరెవరికైనా ఆపాదించిందని ఊహించుట చాలా కష్టంగా ఉంటుంది.

చివరిగా, అపొస్తలుల కార్యములు 19-21 ప్రకారం, పౌలు ఎఫెసులో సంఘమును స్థాపించాడు, మరియు రెండు సంవత్సరములపాటు అతడు అక్కడ నివసించాడు. ఆ తరువాత కూడా, సంఘములోని పెద్దలతో సన్నిహిత సంబంధమును కొనసాగించాడు. ఈ కారణముల వలన, ఎఫెసీయులు పౌలు పేరు ఉన్న ఒక నకిలీ పత్రికను గుర్తించకపోవుట ఊహించలేని విషయముగా ఉంది. అదేవిధంగా, ఆరంభ సంఘము అటువంటి ప్రముఖమైన అపొస్తలుని నుండి అటువంటి ప్రముఖమైన సంఘముకు పంపిన నకిలీ పత్రికను నకిలీదిగా పరిగణించకపోవుట కూడా ఊహించరానిదిగా ఉంది. ఇవి మరియు ఇతర కారణముల వలన, ఎఫెసీ పత్రికను పౌలు వ్రాయలేదు అను ప్రతిపాదనను కూడా మనము తిరస్కరించాలి.

కొన్ని అంశములలో వారు కొంత భిన్నత్వమును చూస్తారు కాబట్టి అనేకమంది ఎఫెసీ పత్రిక యొక్క గ్రంథకర్తృత్వమును వివాదిస్తారు. రోమా పత్రిక మరియు గలతీయులకు వ్రాసిన పత్రికను పౌలు వ్రాశాడు అని అందరు నమ్ముతారు. ఆ పత్రికలు విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట మరియు దానివంటి ఇతర విషయములను గూర్చి మాట్లాడతాయి. దీనిని మనము ఎఫెసీ పత్రికలో చూడము. రోమా పత్రికలో అది ప్రాముఖ్యమైయుండిన విధముగానే ప్రాముఖ్యమైనదిగా ఉంటే, పౌలు దానిని ఎఫెసీ పత్రికలో కూడా చేర్చియుండేవాడే... ఈ పత్రికలలో మరొక కారణము కూడా ఉన్నది, మరియు అది నిజముగా సహాయకరముగా ఉంటుంది అని నేను భావించుచున్నాను, ఈ పత్రికలలో చాలా వరకు స్వయంగా చేతులతో వ్రాయబడినవి లేక చెప్పి వ్రాయించబడినవి మరియు ఒక సహాయకుని ద్వారా వ్రాయబడినవి... నేను ఎఫెసీ పత్రిక కొరకు ఒక సహాయకుని ఉపయోగించి, రెండు థెస్సలొనీక పత్రికలను స్వయంగా నా చేతులతో వ్రాసి, రోమా పత్రిక కొరకు మరొక సహాయకుని ఉపయోగించిన యెడల, వ్యాకరణము, పదజాలము, మొదలగు విషయములలో కొంత భిన్నత్వము ఉంటుంది. ఈ పత్రికలలో ఒకదానికి ఒకటి విరోధముగా ఉన్న ఒక్క విషయము కూడా లేదు.

— డా. జోసెఫ్ డి. ఫ్యాంటిన్

పౌలు యొక్క గ్రంథకర్తృత్వమును చూశాము గనుక, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక యొక్క వాస్తవిక శ్రోతలను ఇప్పుడు మనం చూద్దాము.

పౌలు యొక్క శ్రోతలను రెండు భాగములుగా పరిశీలిద్దాము, మొదటిగా ప్రాధమిక శ్రోతలను, అనగా ఎఫెసులోని సంఘమును, తరువాత, ద్వితీయ శోత్రలను, ముఖ్యముగా లైకస్ లోయలోని సంఘములను చూద్దాము. పౌలు యొక్క ప్రాధమిక శ్రోతలుగా ఎఫెసీ సంఘమును మొదటిగా చూద్దాము.

ఎఫెసీయులకు 1:1లోని మాటలను మరోసారి చూద్దాము:

దేవుని చిత్తమువలన క్రీస్తుయేసు అపొస్తలుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులుకు...శుభమని చెప్పి వ్రాయునది (ఎఫెసీయులకు 1:1).

ఈ పత్రికలోని పరిచయములో, పౌలు ఎఫెస్సులో ఉన్న సంఘమును తన శోత్రలుగా గుర్తించాడు. ఎఫెసు ఆసియాలోని రోమా ప్రాంతమునకు రాజధానిగా ఉంది, ఇది దాదాపు చిన్న ఆసియా అని పిలువబడే ఆధునిక ప్రాంతముగా ఉంది. మొదటి శతాబ్దములో, ఇది రోమా సామ్రాజ్యములో అత్యంత జనాభా కలిగియుండి, ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా ఉంటూ, తూర్పు మరియు పశ్చిమ ప్రపంచముల మధ్య ప్రవేశద్వారంగా పనిచేసింది. భౌగోళపరంగా చూస్తే, ఇది మియాండర్ నదికి ఉత్తరాన ఉన్న ఎజియన్ సముద్ర తీరంలో ఉంది.

ఇప్పుడు, ఈ పత్రిక వాస్తవంగా ఎఫెసీయులకు పంపబడినది కాదు అని కొందరు పండితులు నమ్ముతున్నారని మనం ప్రస్తావించాలి. ఈ అభిప్రాయమునకు అత్యంత బలమైన ఆధారము ఏమనగా, ఐదు ప్రాముఖ్యమైన గ్రీకు ప్రతులలో ఆరంభ వచనములో “ఎఫెసులో” అను మాట లేదు. బదులుగా, ఈ ప్రతులలో ఇలా వ్రాయబడియున్నది, “క్రీస్తుయేసునందు నమ్మకమైన పరిశుద్ధులకు.” ఇది వాస్తవముగా ఉండగా, అనేక ప్రతులలో “ఎఫెసులో” అను మాట ఉంది, మరియు తెలిసిన ఏ ప్రతులోను వేరే శ్రోతలను గూర్చి పేర్కొనబడలేదు. కాబట్టి, ఈ కారణముల చేత, ఎఫెసులోని సంఘమువారు ప్రధానమైన శ్రోతలుగా ఉన్నారు అని ఎక్కువమంది వ్యాఖ్యాతలు సమ్మతిస్తారు.

పౌలు ఈ పత్రికను ఎఫెసులో ఉన్న క్రైస్తవుల కొరకు వ్రాశాడు అను దృక్కోణమునకు మద్దతునిచ్చుటకు అనేక అంతర్గత మరియు బాహ్య ఉదాహరణలు ఉన్నాయి. ఒకవైపున, పత్రిక యొక్క అంతర్గత అంశములలోని అనేక విషయాలు ఎఫెసులో ఉన్న సంఘము ఎదుర్కొనుచున్న సవాళ్లను చక్కగా ఉద్దేశించి మాట్లాడతాయి. మొదటిగా, పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు, అతడు అర్తెమీ దేవి అరాధికులతోను మరియు ఇతర క్షుద్ర ఆచారములను పాటించువారితోను వివాదించాడు అని అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము మనకు తెలియజేస్తుంది. అలాగే, ఎఫెసీ. 5:11లో క్రైస్తవులు “నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలుపంచుకొనకూడదు” అని పౌలు వ్రాశాడు — ఇది అన్య విగ్రహారాధన ఆచారములను సూచిస్తుంది. మరియు ఎఫెసీ. 6:12లో, క్రైస్తవులు “ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నారు” అని అతడు బోధించాడు.

రెండవదిగా, ఎఫెసు పట్టణము అర్తెమీ దేవి యొక్క “పోషకదారి”గా పరిగణించబడింది, మరియు అర్తెమీ దేవి ఎఫెసు పట్టణమును ఆసియా ప్రాంతములోనే “మహిమకరమైన” పట్టణముగా చేసింది అని పురావస్తు పరిశోధనల ద్వారా మనకు తెలుసు. ఇందువలనే, ఎఫెసీ. 5:27-29లో, ఎక్ట్రెఫో (ἐκτρέφω), అనగా “పోషించుట” లేక “పెంచుట” అని అర్థము, మరియు ఎన్డాక్సోస్ (ἔνδοξος), అనగా “ఘనపరచుట” లేక “మహిమపరచుట” అని అర్థము, అను గ్రీకు పదములను ఉపయోగించి పౌలు క్రీస్తు మరియు ఆయన సంఘమునకు మధ్య ఉన్న సంబంధమును వర్ణిస్తాడు. ఇవి మరియు ఇతర వివరములు ఎఫెసులోని సంఘము యొక్క పరిస్థితిని చక్కగా వర్ణిస్తాయి.

మరొక వైపున, పౌలు ఈ పత్రికను ఎఫెసీయులకు పంపాడు అను బాహ్య ఆధారమును అనేకమంది ఆదిమ సంఘ పితరులు ఇచ్చారు. ఉదాహరణకు, అలెగ్జెండ్రియవాడైన క్లెమెంతు, రెండవ శతాబ్దము చివర్లో వ్రాస్తూ, తన రచనయైన ది ఇన్స్ట్రక్టర్, 5వ అధ్యాయములో ఈ మాటలు వ్రాశాడు:

ఎఫెసీయులకు వ్రాస్తూ, [పౌలు] ప్రశ్నార్థకముగా ఉన్న అంశమును స్పష్టంగా వివరిస్తూ, ఈ క్రింది విధముగా మాట్లాడాడు:

ఎఫెసీయులకు 4:13-15లోని వాక్యభాగము అంతటి తరువాత ఈ ముందుమాటను క్లెమెంతు వ్రాశాడు. అదేవిధంగా, మూడవ శతాబ్దము ఆరంభములో వ్రాసిన తెర్తుల్లు, తన రచనయైన ఎగెనెస్ట్ మార్సియన్, 5వ పుస్తకము, 17వ అధ్యాయములో ఇలా వ్రాశాడు:

సంఘము యొక్క నిజమైన సాంప్రదాయములో ఇది మనకు ఉంది, అదేమనగా ఈ పత్రిక ఎఫెసీయులకు పంపబడింది కాని లవొదికయకు కాదు.

తెర్తుల్లు ప్రకారం, ఆ కాలానికి ముందున్న సంఘము యొక్క పూర్తి సాంప్రదాయము ఈ పత్రిక ఎఫెసీయులకు పంపబడినదని ధృవీకరించింది. ఈ విషయములో ఆదిమ సంఘము యొక్క ఏ సాక్ష్యము కూడా తెర్తుల్లుకు విరుద్ధంగా లేదు. ఈ పత్రిక పౌలు లవొదికయకు వ్రాసిన పత్రిక కూడా కాదు అని తెర్తుల్లు స్పష్టము చేశాడు — ఇది కొలస్సీ. 4:16లో ప్రస్తావించబడిన పత్రిక. ఈ రెండు పత్రికలు ఒకటే పత్రికలైయుండుట సాధ్యమైన్నప్పటికీ, ఇది నిజము కాకపోవచ్చు. ఏది ఏమైనా, ఈ పత్రికను ఎఫెసులో ఉన్న సంఘమువారు చదువుటకు పౌలు ఉద్దేశించియున్నాడు అని నమ్ముటకు ఆదిమ సంఘ పితరుల యొక్క ఈ మాటలు బలమైన బాహ్య ఆధారమును అందిస్తాయి.

ఎఫెసులో ఉన్న సంఘమువారు పౌలు యొక్క ప్రాధమిక శ్రోతలు అయ్యున్నారు అని మనము చూశాము, కాని అతనికి ద్వితీయ శ్రోతలు కూడా ఉన్నారు అని గుర్తించుట చాలా ప్రాముఖ్యమైయున్నది. ఈ శ్రోతలలో లైకస్ లోయలో ఉండిన అనేక సంఘములు భాగమైయున్నవి.

మనము ఇంతకు ముందే ప్రస్తావించినట్లు, అనేక ఆదిమ ప్రతులలో ఆరంభ వచనములో “ఎఫెసులో” అను మాటలు కనిపించవు. అయితే పౌలు ఈ పత్రికను ఎఫెసులో ఉన్న సంఘమునకు వ్రాసియుండలేదు అని చెప్పుటకు బదులుగా, పౌలు ఎఫెసీయులకు వ్రాసినప్పుడు అతడు విస్తృతమైన శ్రోతలను ఉద్దేశించియున్నాడు అని ఈ ప్రతులు సూచించుచుండవచ్చు. ఈ విస్తృత శ్రోతలలో లైకస్ లోయలోని అనేక సంఘములు భాగమైయున్నవి అని అనేకమంది పండితులు సమ్మతిస్తారు.

మొదటి శతాబ్దములో లైకస్ లోయ అని పిలువబడినదానిలో అనేక సంఘాలు అభివృద్ధి చెందాయి. ఉదాహరణకు, కొలస్సీ మరియు లవొదికయ పట్టణములలో సంఘాలు ఉన్నాయని మనకు తెలుసు మరియు హియెరాపొలి లో కూడా సంఘము ఉన్నదనుటకు మంచి కారణం ఉంది. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఈ సంఘములను గూర్చి ప్రస్తావించకపోయినప్పటికీ, పౌలు వ్రాస్తుండగా వారిని గూర్చి కూడా ఆలోచించాడు అనుటకు మంచి కారణం ఉంది.

ద్వితీయ శ్రోతలుగా పౌలు లైకస్ లోయలో ఉన్న అనేక సంఘములను తన మనస్సులో కలిగియుండినాడు అనుటకు కనీసం రెండు ప్రధానమైన కారణాలు ఉన్నాయి: మొదటిగా, పౌలు పరిచయములేని శ్రోతలకు వ్రాశాడను ఆధారము, మరియు రెండవదిగా, లైకలైకస్ లోయలో ఉన్న సంఘములకు ఈ పత్రిక యొక్క ఔచిత్యము. పౌలు శ్రోతలు అతనికి తెలియదు అని సూచించు కొన్ని వివరాలను మొదటిగా చూద్దాము.

పరిచయములేని శ్రోతలు. ఎఫెసీయులకు 1:15, 16లోని పౌలు మాటలను వినండి:

ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమునుగూర్చియు, పరిశుద్ధులందరియెడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు, నేను వినినప్పటినుండి... (ఎఫెసీయులకు 1:15).

స్పష్టంగా, అతని శ్రోతలలోని అనేకుల యొక్క విశ్వాసమును అతడు ప్రత్యక్షంగా చూడలేదుగాని, కేవలం “విన్నాడు” అంతే. ఎఫెసీయులకు 3:2-3లోని అతని మాటలు ఇదే విషయమును సూచిస్తాయి.

మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచబడినదను సంగతినిగూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని (ఎఫెసీయులకు 3:2-3).

ఇంతకు ముందు మనము ప్రస్తావించినట్లు, పౌలు ఎఫెసులో ఉన్న విశ్వాసులకు స్వయంగా బోధించాడు. అతడు వారికి బోధించుటవల్ల కాదుగాని, ఈ పత్రికలోని ఆరంభ అధ్యాయములలో అతడు దానిని గూర్చి వ్రాశాడు కాబట్టి తన శ్రోతలకు తన సువార్తను గూర్చి తెలుసు అని పౌలు వ్యాఖ్యానించాడు. అతడు వ్రాయుచుండగా పౌలు ఎఫెసీయులను మాత్రమేగాక ఇతరులను గూర్చి కూడా ఆలోచించాడు అని ఈ పదములు బలముగా సూచిస్తాయి.

పౌలు అనేకమైన అపరిచితులకు వ్రాశాడు అని చెప్పుటకు మరొక సూచన ఏమనగా అతని పత్రికలో ఎటువంటి వ్యక్తిగత ప్రస్తావన లేదు. అతని యొక్క ఇతర ప్రామాణిక పత్రికలన్నిటిలో, ఇటువంటి విషయాలను ప్రస్తావించుట ద్వారా అతని శ్రోతలు అతనికి వ్యక్తిగతముగా తెలుసు అన్నట్లు సూచించాడు: తన శ్రోతలలో తనకు తెలిసిన వ్యక్తుల యొక్క పేర్లు; కొందరు నిర్దిష్ట వ్యక్తులకు శుభములు చెప్పుట; తన శ్రోతలతో తాను గడిపిన సమయమును ప్రస్తావించుట; “సహోదరులు,” వంటి సుపరిచిత పదములను ఉపయోగిస్తూ, శ్రోతలను సూచించుట; అతని శ్రోతలపట్ల అతనికున్న ప్రేమ వ్యక్తీకరణలు; మరియు అతని శ్రోతలకు తననుతాను “ఆత్మీయ తండ్రి”గా వ్యక్తపరచుకొనుట. వాస్తవానికి, పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక మాత్రమే అతని వ్యక్తిగత సూచనలు లేని ఏకైక ప్రామాణిక గ్రంథములోని పత్రికగా ఉంది. మరియు ఎఫెసులోని సంఘముతో అతనికి చాలా సన్నిహిత సంబంధము ఉన్నప్పటికీ కూడా అతడు వ్యక్తిగత ప్రస్తావనలు చేయలేదు. పౌలు తన పత్రికను ఎఫెసులోని సంఘముతో ఆరంభించి, తనకు పరిచయము లేని వివిధ సంఘాలకు పంపించుట కొనసాగించాలని కోరాడని ఈ లక్షణము బలముగా సూచిస్తుంది.

పౌలు శ్రోతలలో తనకు పరిచయములేని సంఘములు కూడా ఉన్నాయని చూశాము గనుక, అతడు కొలస్సీ, లవొదికయ మరియు హియెరాపొలితో సహా లైకస్ లోయలోని సంఘములకు కూడా వ్రాశాడని సూచించు ఆధారమును పరిశోధించుటకు ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము.

ఔచిత్యము. లైకస్ లోయకు సంబంధించిన ఒక సూచన పౌలు స్నేహితుడైన తుకికులో కనిపిస్తుంది. ఎఫెసీయులకు 6:21, 22 కొలస్సయులకు 4:7, 8 ప్రకారం, తుకికు పౌలు కొరకు కనీసం రెండు పత్రికలను చేరవేశాడు — ఒకటి ఎఫెసులో ఉన్న సంఘముకు మరియ ఇంకొకటి కొలస్సీలో ఉన్న సంఘముకు. మరియు బహుశా వీటిని ఒకే ప్రయాణములో అతడు చేరవేసియుంటాడు. అంతేగాక, మనము ఇంతకు ముందు ప్రస్తావించినట్లు, పౌలు లవొదికయ సంఘముకు కూడా ఒక పత్రికను వ్రాశాడు. లవొదికయకు వ్రాసిన పత్రిక దొరకలేదు, కాని కొలస్సీ. 4:16లో పౌలు దానిని గూర్చి ప్రస్తావించాడు:

ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి (కొలస్సీ. 4:16).

ఈ వచనము నుండి, పౌలు కొలస్సీయులకు వ్రాసిన పత్రికతో పాటు, లవొదికయకు వ్రాసిన పత్రికను కూడా తుకికు చేరవేశాడు అని మనము తార్కికముగా ఊహించవచ్చు. రెండు సంఘములు రెండు పత్రికలను చదివేలా చూచుటకు ఇది ఉత్తమమైన పద్ధతిగా ఉంది. కాబట్టి, ఈ ఇతర సంఘములు చదువుట కొరకు కూడా తుకికు ఎఫెసీ పత్రిక యొక్క కాపీలను తీసుకువెళ్లాడని కూడా మనము తార్కికముగా ఊహించవచ్చు.

లైకస్ లోయలోని సంఘములు ఎఫెసీ పత్రికను చదవాలని పౌలు ఆశించడానికి మరొక కారణం ఏమిటంటే, పౌలు చెరసాలలో ఉన్న కాలములో ఈ సంఘములను గూర్చి ఎక్కువగా ఆలోచించేవాడు. కొలస్సయులకు 2:1లో అతడు చెప్పిన మాటలు వినండి:

మీ కొరకును, లవొదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడనివారందరికొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసికొనగోరుచున్నాను (కొలస్సయులకు 2:1).

కొలస్సీ పట్టణములో ఉన్న అబద్ధ బోధకుల విషయములో పౌలు కలవరపడ్డాడు, మరియు ఇటువంటి సమస్యలే స్పష్టంగా లవొదికయలోను, మరియు బహుశా ఆ ప్రాంతములో ఉన్న ఇతర సంఘములలో కూడా ఉన్నవని అతడు తలంచాడు. ఉదాహరణకు, కొలస్సయులకు 4:12-13లో హియెరాపొలిలోని సంఘమును గూర్చి ప్రస్తావిస్తూ, పౌలు ఇలా వ్రాశాడు:

ఎపఫ్రా … ఇతడు మీకొరకును, లవొదికయవారి కొరకును, హియెరాపొలి వారికొరకును బహు ప్రయాసపడుచున్నా[డు]... (కొలస్సీ. 4:12-13).

హియెరాపొలి మరియు లవొదికియను గూర్చి పౌలు ప్రస్తావించుట, ఎపఫ్రా పౌలుతో నివసించుటకు అయ్యే ఖర్చులను లైకస్ లోయలో ఉన్న అనేక సంఘములు భరించుచుండవచ్చు అని సూచిస్తుంది. దీని వలన ఎఫఫ్రాను చూసినప్పుడెల్లా తాను ప్రాతినిధ్యము వహించిన సంఘములను అతడు తరచుగా జ్ఞాపకము చేసేవాడు. లైకస్ లోయలోని సంఘములపట్ల పౌలు చూపిన శ్రద్ధ, ఎఫెసీ సంఘమునకు తాను వ్రాసిన పత్రిక ద్వారా వారికి పరిచర్య చేసే అవకాశమును అతడు తృణీకరించలేదని, ప్రత్యేకముగా తుకికుతో పాటు పత్రిక యొక్క మరొక కాపీని ఇచ్చి పంపించవలసినప్పటికీ కూడా అతడు అవకాశమును విడిచిపెట్టలేదు అని సూచిస్తుంది.

ఎఫెసీ పత్రిక లైకస్ లోయలోని సంఘముల కొరకు ఉద్దేశించబడింది అని ఆలోచించునట్లు మనలను ప్రేరేపించవలసిన మూడవ విషయం ఏమిటంటే, పౌలు ఎఫెసీయులకు మరియు కొలస్సయులకు వ్రాసిన పత్రిక ఇలాంటి సమస్యలనే చర్చిస్తుంది. కాబట్టి, ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక లైకస్ లోయలోని సంఘములకు ఔచిత్యముగలది మరియు తగినది అని చెప్పడం సరైన విషయం. ఉదాహరణ కొరకు మనం ఒకదానిని మాత్రం ప్రస్తావిద్దాము. మునుపటి పాఠంలో మనము చూచినట్లుగా, కొలస్సయులు దూతలను మరియు దయ్యములను ఆరాధించి పూజించే అబద్ధ ప్రవక్తలతో పోరాడారు. విశ్వమంతటిమీద మరియు ముఖ్యంగా దయ్యముల మీద యేసుక్రీస్తు యొక్క గొప్పతనమును ఉద్ఘాటించుట ద్వారా పౌలు వారి యొక్క తప్పుడు బోధలను ఎదురించాడు. ఉదాహరణకు, కొలస్సయులకు 1:16లో పౌలు యేసును గూర్చి ఈ మాటలలో వివరించాడు:

ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్నవియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టియు సృజింపబడెను (కొలస్సయులకు 1:16).

ఇప్పుడు, ఎఫెసీ. 1:20-22లో పౌలు క్రీస్తును వర్ణించిన విధానముతో దీనిని పోల్చండి:

క్రీస్తును...సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను శక్తికంటెను ప్రభుత్వముకంటెను...ప్రతి నామముకంటెను హెచ్చుగా [కూర్చుండబెట్టుకొనియున్నాడు] మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను (ఎఫెసీయులకు 1:20-22).

ఈ వాక్యభాగములో, మనం ఇంతకుముందే చదివిన కొలస్సీ పత్రికలోని మొదటి అధ్యాయములో ఉన్న వాక్యభాగమువలెనే, పౌలు గ్రీకు పదములైన ఆర్కే (ἀρχή) మరియు ఎక్సుసియ ను (ἐξουσία) ఉపయోగించాడు, అవి ఇక్కడ “ఆధిపత్యము” మరియు “అధికారము” అని అనువదించబడినవి. ఈ రెండు పదాలు ప్రధానముగా ఆత్మీయ జీవులను సూచిస్తాయి. మానవ నాయకులను లేదా దేవదూతలు మరియు దయ్యములవంటి ఆత్మీయ జీవులను సూచించు కురియోటేస్ (κυριότης) అను గ్రీకు పదమును కూడా అతడు ఇక్కడ పునరావృతం చేశాడు, అనగా “ప్రభుత్వము” అని అర్థము.

కొలస్సీ పత్రికలో ప్రస్తావించకపోయినప్పటికీ, ఇక్కడ పౌలు గ్రీకు పదమైన దునామిస్ ను (δύναμις) కూడా ఉపయోగించాడు, అది ఇక్కడ “శక్తి” అని అనువదించబడినది. దునామిస్ అను పదము చాలాసార్లు “బలము” లేదా “సామర్థ్యము”ను సూచించుటకు ఉపయోగించబడుచున్నప్పటికీ, మొదటి శతాబ్దపు యూదా మతము ఈ పదమును దేవునికి వ్యతిరేకముగా పోరాడు సాతాను పక్షమున ఉన్న దయ్యములకు ఉపయోగించింది. మనము ఇక్కడ చూచుచున్నట్లు, రెండు పత్రికలలోను, ఆత్మీయ జీవులతో సహా, సమస్తము మీద యేసు యొక్క ఔన్నత్యమును ఉద్ఘటించుట ద్వారా పౌలు సంఘములోని సమస్యలను ఉద్దేశించి మాట్లాడాడు. పౌలు దూతగా తుకికు యొక్క పాత్ర, లైకస్ లోయలోనున్న సంఘములపట్ల పౌలుకున్న ప్రత్యేకమైన శ్రద్ధ, మరియు ఎఫెసీయులకు, కొలస్సయులకు మధ్యనున్న సారూప్య అంశాలు, పౌలు ఎఫెసీయులకు వ్రాస్తున్నప్పుడు అతని మనసులో లైకస్ లోయలోని సంఘములు కూడా ఉన్నాయని సూచిస్తున్నాయి.

ఎఫెసీ పత్రిక యొక్క పౌలు గ్రంథకర్తృత్వమును మరియు పౌలు యొక్క వాస్తవిక శ్రోతలలో ఎఫెసు సంఘము మరియు లైకస్ లోయలోని సంఘములు రెండూ ఉన్నాయని మనము చూశాము గనుక, అతడు ఈ పత్రికను వ్రాయుటకుగల ఉద్దేశ్యమును చూచుటకు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాము. పౌలు ఈ పత్రికను ఎందుకు పంపాలని ఆశించాడు?

సాధారణంగా, పౌలు ప్రత్యక్షంగా లేదా వ్యక్తిగతంగా యెరిగిన స్థానిక ప్రజల యొక్క నిర్దిష్ట సమస్యలను పరిష్కరించడానికి పత్రికలను వ్రాసేవాడు. అయితే ఎఫెసులో అతడు కొంత భిన్నమైన పని చేశాడు. వివిధ ప్రాంతాల్లో ఉన్న వివిధ సంఘముల యొక్క సమస్యలకు ప్రతిస్పందనగా అతడు వ్రాశాడు, వీరిలో చాలామందిని అతడు ఎప్పుడు కలవలేదు. కాబట్టి, ఈ సంఘములలోని సమస్యలతో వ్యవహరించుట పౌలు ఈ పత్రిక వ్రాయుటకుగల ముఖ్య ఉద్దేశ్యముగా ఉంది.

పౌలు ఉద్దేశ్యమును గూర్చిన మన చర్చ రెండు భాగములుగా విభాగించబడింది: మొదటిగా, పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో దేవుని రాజ్యము అను అంశమును చూద్దాము. రెండవదిగా, దేవుని రాజ్యమును గూర్చి సంఘము ఎదుర్కొనుచున్న అనేకమైన సవాళ్లను పౌలు ఎలా చర్చించాడో చూద్దాము. దేవుని రాజ్యము అను అంశమును గూర్చి మొదటిగా చూద్దాము.

అనేకమంది క్రైస్తవులు దేవుని రాజ్యము అను వ్యక్తీకరణను సమాంతర సువార్తలతో అనుసంధానం చేశారు: మత్తయి, మార్కు మరియు లూకా. అయితే దేవుని రాజ్యము అను అంశము పాత నిబంధనలో మరియు యేసు యొక్క బోధనలలో చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది కాబట్టి, అది పౌలుకు కూడా అంతే ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. అతడు తన పత్రికలలో దేవుని రాజ్యమును గూర్చి పదహారుమారులు సూచించాడు, మరియు రాజ్య సంబంధమైన ఇతర పదాలను తరచు ఉపయోగించాడు. అతని యుగాంతశాస్త్రము — అంత్యదినములను గూర్చిన బోధ — అతని వేదాంతశాస్త్రమునకు కేంద్రముగా ఉన్నది అని పౌలు వ్రాసిన అనేక పత్రికల నుండి మనము తెలుసుకొనవచ్చు. క్రీస్తు చరిత్రను గొప్ప ముగింపుకు తెస్తున్నాడని పౌలు అర్థం చేసుకున్నాడు, ఇది ఆయన యొక్క భూలోక పరిచర్యతో ఆరంభమై, సంఘ యుగములో కొనసాగించబడి, చివరికి క్రీస్తు యొక్క జయోత్సవ రాకడలో నెరవేర్పులోనికి వస్తుంది.

అతని తోటి యూదుల వలె, చరిత్రలో క్రీస్తు యొక్క అత్యున్నతమైన భూమికను గూర్చి “రాబోవు యుగము,” అనగా క్రీస్తునందు దేవుడు చివరి ఆశీర్వాదములను మరియు శాపములను కుమ్మరించు సమయము దృష్ట్యా పౌలు మాట్లాడాడు. అయితే రాబోవు యుగమును గూర్చి యేసు మరియు సువార్త రచయితలు మట్లాడినప్పుడు, వారు దానిని దేవుని రాజ్యమును గూర్చిన పదాలలో వివరించారు. దేవుని రాజ్యము పరలోకంలో ఉన్న విధముగానే భూమిమీద కూడా ప్రత్యక్షపరచబడు సమయముగా వారు దీనిని గూర్చి మాట్లాడారు. అవును, పౌలు కూడా దీనిని నమ్మాడు. ఈ దృక్కోణములో, పౌలు ఆలోచనలలో దేవుని రాజ్యము యొక్క ప్రాముఖ్యతను అతిగా వర్ణించడం కష్టంగా ఉంటుంది. వాస్తవానికి, పౌలు స్నేహితుడు మరియు అతని ప్రయాణ సహచరుడైన లూకా ప్రకారం, పౌలు అపొస్తులత్వ పరిచర్యలో దేవుని రాజ్యమును గూర్చిన బోధన ప్రధానమైనదిగా ఉంది. అపొస్తలుల కార్యములు 28:30-31లో లూకా మాట్లాడిన మాటలు వినండి:

పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి...దేవుని రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యేసు క్రీస్తునుగూర్చిన సంగతులు బోధించుచు ఉండెను (అపొస్తలుల కార్యములు 28:30-31).

పౌలు చెరసాలలో ఉన్నప్పుడు చేసినదానిని ఈ వాక్యభాగము వర్ణిస్తుంది — బహుశా ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక కూడా అదే సమయంలో అదే స్థలములో వ్రాయబడింది. మరియు అక్కడ లూకా పౌలు పరిచర్యను గూర్చి ఎలా వివరించాడో గమనించండి. పౌలు “సువార్త” ప్రకటించాడు అని చెప్పకుండా పౌలు “దేవుని రాజ్యమును” గూర్చి ప్రకటించాడు అని లూకా చెప్పాడు.

ఆధునిక సంఘములో, ప్రజలు ఎల్లప్పుడూ “సువార్త” లేదా “సువర్తమానము”ను ఒక వ్యక్తి యొక్క పాప క్షమాపణ మరియు నిత్యజీవ వాగ్దానము వంటి వాటితో అనుసంధానిస్తారు. మరియు ఇవి మన నిరీక్షణకు అద్భుతమైన కోణాలుగా ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధనలో, సువార్త యేసు వ్యక్తిగతముగా కొందరి కొరకు చేయు కార్యముల కంటే చాలా గొప్పదైయున్నది. దాని పరిమాణము సార్వత్రికమైయున్నది. అది దేవుని రాజ్యము యొక్క రాకడను గూర్చిన శుభవార్త అయ్యున్నది. మన రాజైన యేసు తన విరోధులందరినీ ఓడించుటకు, పాపమును మరియు మరణమును జయించుటకు తన శక్తిని మరియు అధికారమును ఉపయోగించుచున్నాడు అని పౌలు ప్రకటించాడు. ఆయన సమస్తమును నూతనముగా చేస్తూ, ఆయనయందు నమ్మికయుంచువారిని ఆయన తిరిగివచ్చినప్పుడు నూతన సృష్టికి వారసులనుగా చేయుచున్నాడు. అందువలనే, యేసు మరియు సువార్త రచయితలు ఎల్లప్పుడు “దేవుని రాజ్య” సువార్తను లేక శుభవార్తను గూర్చి మాట్లాడేవారు. దేవుని రాజ్యమును గూర్చి ఎఫెసీయులకు పౌలు ఉపదేశించినప్పుడు, ఆయన వారికి సువార్తను గూర్చిన ఈ విస్తృతమైన, మహిమకరమైన చిత్రమును అందించుచున్నాడు.

కొందరు ప్రజలు పౌలు రచనలను చూసినప్పుడు, దేవుని రాజ్యమును వాస్తవమైనదిగా పౌలు సూటిగా మాట్లాడలేదు కాబట్టి, వేదాంత సిద్ధాంతము పౌలుకు అంత ప్రాముఖ్యమైనది కాదు అని నిర్థారించారు. అయితే యేసు పునరుత్థానము వెలుగులో పౌలు దేవుని రాజ్యము యొక్క భాషను తీసుకొని, దేవుని రాజ్యము అను వాస్తవికతను మరియు ఆలోచనను పూర్తిగా నూతనమైన విధానముగా అనువర్తించుచున్నాడు మరియు ప్రకటించుచున్నాడు అనే ఒక తీవ్రమైన అపార్థము ఉన్నది, కాని అతడు యేసు ఉద్దేశించిన విధముగానే దేవుని రాజ్యమును గూర్చి చాలా స్థిరముగా మాట్లాడతాడు... యేసుక్రీస్తునందు, ప్రత్యేకముగా పునరుత్థానములో, యెహోవా తాను వాగ్దానము చేసినదానిని నెరవేర్చియున్నాడు మరియు ఆయన తన ప్రజల యొద్దకు వచ్చియున్నాడు, రక్షణను తెచ్చియున్నాడు, మరియు ఇప్పుడు యేసు క్రీస్తునందు సమస్తమునకు ప్రభువుగా ప్రకటించబడినవాడు ఉన్నాడు... కాబట్టి సువార్తలలో మనకు కనిపించు దేవుని రాజ్య భాషకు భిన్నమైన విధములుగా అతడు దానిని గూర్చి మాట్లాడుచున్నను, దేవుని రాజ్యము అనునది పౌలు వేదాంతశాస్త్రములో చాలా ప్రాముఖ్యమైన ఆలోచనగా ఉన్నది.

— డా. స్టీవ్ బ్లేక్ మోర్

పౌలు ఎఫెసీ పత్రికలో ప్రత్యేకంగా కొన్నిసార్లు మాత్రమే దేవుని రాజ్యమును గూర్చి చెప్పినప్పటికీ, అతడు దానిని తరచుగా ప్రస్తావించాడు. చాలాసార్లు, పాత నిబంధన ఇశ్రాయేలు రాజ్యమును మరియు సమకాలీన రోమా సామ్రాజ్యమును జ్ఞాపకం చేయు అంశములను స్పష్టముగా ప్రస్తావించాడు. క్రైస్తవ సువార్త రాజ్యము యొక్క విజయమును గూర్చినది, ప్రత్యేకముగా, క్రీస్తునందు దేవుని రాజ్యము యొక్క విజయమునకు సంబంధించినది అని తన పాఠకులకు జ్ఞాపకము చేయుటకు అతడు ఇలా చేశాడు.

ఎఫెసీ పత్రికలో దేవుని రాజ్యము వైపుకు పౌలు దృష్టిని ఆకర్షించిన ఆరు విధానములను మనము పరిగణిద్దాము. మొదటిగా, ఎఫెసీ. 2:12, 19లో వారి రాజ్య పౌరత్వమును పరిగణించుటకు పౌలు తన శ్రోతలకు పిలుపునిచ్చాడు.

పౌరత్వము. పాత నిబంధన గ్రంథములో దేవుని ప్రజలు ఒక రాజ్యముగా, ప్రత్యేకంగా ఇశ్రాయేలు రాజ్యముగా యేర్పరచబడ్డారు. దేవుడు వారి రాజుగా ఉన్నాడు మరియు ప్రతి ఇశ్రాయేలీయుడు ఆ రాజ్యములో పౌరునిగా ఉన్నాడు. అదే విధముగా, పౌలు దినములలో, రోమా సామ్రాజ్యములో పౌరత్వము చాలా ఉన్నతముగా పరిగణించబడేది. ఈ కారణముల చేత, పౌలు క్రైస్తవులను గూర్చి “పౌరులు” అని ప్రస్తావించినప్పుడు, రాజ్యము లేక సామ్రాజ్యములో, అనగా క్రీస్తునందు దేవుని రాజ్యములో వారి పౌరత్వమును గూర్చి అతడు మాట్లాడుతున్నాడు అని అతని శ్రోతలు అర్థము చేసుకున్నారు.

స్వాస్థ్యం. ఎఫెసీయులకు 1:14, 18, అదేవిధంగా 5:5లో పౌలు ప్రస్తావించిన స్వాస్థ్యం అను అంశము విషయములో కూడా ఇదే వాస్తవమై ఉంది. పాత నిబంధనలో, ఇశ్రాయేలు రాజ్యములోని పౌరులకు మాత్రమే వాగ్దాన భూమిలో స్వాస్థ్యం ఇవ్వబడేది. మరియు రోమా సామ్రాజ్యంలో, పౌరులకు మాత్రమే స్వాస్థ్యం ఇవ్వబడేది. రెండు సందర్భములలోను, వారసత్వ హక్కులు కేవలం రాజ్య పౌరులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ కారణము చేత, క్రీస్తు అనుచరులుగా మన స్వాస్థ్యమును పౌలు స్పష్టముగా క్రీస్తునందు దేవుని రాజ్యముతో అనుసంధానం చేశాడు.

సైన్యములో సేవచేయుట. మరియు ఎఫెసీయులకు 6:10-18లో పౌలు ప్రస్తావించిన సైన్యములో చేయు సేవను గమనించండి. ప్రాచీన లోకములో, యుద్ధము రాజ్యములు అను అంశముతో దగ్గర సంబంధము కలిగియుండేది అని చెప్పనవసరములేదు. పాత నిబంధనలో, రాజ్యానికి చెందిన పురుష పౌరులు అందరు ఇశ్రాయేలు సైన్యంలో పనిచేయవలసి ఉండెను. మరియు రోమా సామ్రాజ్యంలో, పౌరులు సైన్యములో సేవ చేయవలసి ఉండేది. కాబట్టి, క్రైస్తవులు ఆత్మీయ పోరాటములో పాలుపంచుకోవాలి అని పౌలు ఉద్ఘాటించినప్పుడు, క్రీస్తునందు దేవుని రాజ్యములో పౌరులుగా వారు అలా చేశారు అని అతడు సూచించాడు.

సృష్టిని యేలుట. అంతేగాక, ఎఫెసీ. 1:20-2:6 వంటిచోట్ల ప్రస్తావించబడిన సృష్టి మీద దేవుని ప్రజల యొక్క పరిపాలన కూడా క్రీస్తునందు దేవుని రాజ్యముతో దగ్గరగా ముడిపడియున్నది. పాత నిబంధనలో, భూమి మీద వారి ఆధిపత్యమును విస్తరింపజేయుట ఇశ్రాయేలు కలిగియుండిన ముఖ్య లక్ష్యములలో ఒకటైయుండినది. రోమా సామ్రాజ్యంలో కూడా ఇదే వాస్తవమై ఉంది. కాబట్టి, సృష్టియంతటి మీద ఆధిపత్యము చేయు స్థానములో విశ్వాసులు క్రీస్తుతో కూడా కూర్చొనియున్నారు అని పౌలు బోధించినప్పుడు, క్రీస్తు రాజు అనియు, విశ్వాసులు ఆయన రాజ్యములో పౌరులు, అధికారులనియు అతడు సూచించాడు.

పేరులకు మూలము. ఎఫెసీ. 3:15లో, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము యొక్క పేర్లకు దేవుడు మూలము అయ్యున్నాడు అని పౌలు వ్రాసినప్పుడు కూడా, క్రీస్తు యొక్క విజయవంతమైన రాజ్యము అను అంశము అతని మనస్సులో ఉండినది. పాత నిబంధనలో దేవుని ప్రజలు ఆయన పేరుతో పిలువబడ్డారు ఎందుకంటే వారు ఆయన రాజ్యములో భాగస్తులుగా ఉన్నారు. ఉదాహరణకు, ఆమోసు 9:11-12లోని మాటలు వినండి:

పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి...ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరి గించు యెహోవా వాక్కు ఇదే (ఆమోసు 9:11-12).

పడిపోయిన దావీదు “గుడారము”ను లేవనెత్తుదును అని ప్రభువు చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటంటే, మానవ చరిత్ర యొక్క ముగింపులో భాగముగా దావీదు సంతానము యొక్క రాజత్వములో ఇశ్రాయేలు రాజ్యమును ఆయన పునర్నిమిస్తాడు. కాబట్టి, పాత నిబంధన ప్రకారం, దేవుని పునరుద్ధరించబడిన రాజ్యము ద్వారా జయించబడు ప్రతి దేశము దేవుని పేరును కలిగియుంటుంది. ఎఫెసీ పత్రిక యొక్క నేపథ్యములో, పేరు పెట్టు ఆచారమునకు కూడా రోమా సామ్రాజ్యముతో రాజ్య సంబంధము ఉన్నది. ప్రత్యేకముగా, రోమా సామ్రాజ్యము జయించిన అనేకమందికి సామ్రాజ్యములో పౌరత్వము సహజముగా ఇవ్వబడేది. మరియు పౌరత్వము కొరకు వారికి సహాయము చేసిన పేరును లేక వారికి పౌరత్వమును ఇచ్చిన చక్రవర్తి పేరును వారు పెట్టుకునేవారు. కాబట్టి, పౌలు దేవుని పేరును పొందుకొనుటను గూర్చి వ్రాస్తున్నాడు, ఎఫెసీయులు దీనిని క్రీస్తునందు దేవుని రాజ్యములో భాగమగుటతో అనుసంధానము చేసుకొనియుండేవారు.

రాయబారి. చివరిగా, ఎఫెసీయులకు 6:20లో, పౌలు తననుగూర్చి తాను దేవుని రాయబారిగా చెప్పుకున్నాడు. పాత నిబంధన మరియు రోమా సందర్భము రెంటిలోను, రాయబారి రాజుకు లేదా చక్రవర్తికి ఒక అధికారికమైన ప్రతినిధిగా ఉన్నాడు. కాబట్టి, ఇక్కడ కూడా క్రీస్తునందు దేవుని రాజ్యము పౌలు మనస్సులో ఉండినది. ఇవి మరియు అనేక ఇతర మార్గములలో, ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో పౌలు ప్రస్తావించిన అనేక సమస్యలు దేవుని రాజ్యమును గూర్చి తాను కలిగియున్న నమ్మకముతో సూటిగా ముడిపడి ఉన్నాయని పౌలు బయలుపరచాడు.

ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో, పౌలు దేవుని రాజ్యము మీద దృష్టిపెట్టుటను మనము చూస్తాము. ఉదాహరణకు, దేవుని మంచి ఉద్దేశ్యముల ప్రకారం వారు నిత్యత్వములో క్రీస్తు యొద్దకు పిలువబడ్డారు అని ఎఫెసీయులకు చెబుతూ అతడు పత్రికను ఆరంభిస్తాడు, మరియు ఆ పిలుపులో, వాస్తవిక భావనలో, వారు క్రీస్తు రాజ్యములోనికి పిలువబడ్డారు. క్రీస్తు మరణించి, తిరిగిలేచిన తరువాత ఈ వాస్తవమును గూర్చి మాట్లాడుతూ, ఎఫెసీ 1లో పౌలు దీనిని అభివృద్ధి చేయుట ఆరంభించాడు ... ఆయన తండ్రి కుడిపార్శ్వమునకు ఎత్తబడినాడు, మరియు అది చిత్రాత్మకమైన రీతిలో మనకు ప్రాముఖ్యమైనదిగా ఉన్నది, కాని వాస్తవిక భావనలో, ఈ రాజ్యమునకు రాజుగా సర్వశక్తి, సర్వాధికారము ఆయనకు ఇవ్వబడినది... తరువాత ఎఫెసీ. 5లో దేవుని రాజ్యము, క్రీస్తు రాజ్యము నీతి రాజ్యము అను వాస్తవమును గూర్చి కూడా పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి, క్రీస్తుకు వెలుపల ఉన్నవారు, అవినీతిపరులు, క్రీస్తు ఎదుట మొకాళ్ళూనుటకు మరియు ఆయన రాజ్యమునకు, చిత్తమునకు అప్పగించుకొనుటకు నిరాకరించువారు, ఆయన రాజ్యములో భాగమైయుండరు, ఎందుకంటే ఆయన రాజ్యము నీతి రాజ్యము అయ్యున్నది.

— డా. జయ్ హాలె

ఎఫెసీయులకు వ్రాయుట వెనుక పౌలు కలిగియున్న ఉద్దేశ్యములో దేవుని రాజ్యము మీద ఉద్ఘాటన భాగమైయున్నది అని ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి, ఈ పత్రికలో పౌలు మాట్లాడిన దేవుని రాజ్యమునకు ఉన్న కొన్ని విశేషమైన సవాళ్లను చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.

ఎఫెసీ మరియు లైకస్ లోయలోని సంఘములు ఎదుర్కొన్న అనేక సవాళ్లను పౌలు ప్రస్తావించాడు, అయితే సమయమును దృష్టిలో ఉంచుకొని మూడింటిని మాత్రమే మనం చూద్దాము: “ప్రాచీన పురుషుడు” లేక ప్రతి విశ్వాసిలో ఉండు పాపపు స్వభావము; యూదా క్రైస్తవులు మరియు అన్య క్రైస్తవుల మధ్య ఉన్న జాతి లేక తెగల కలహములు; క్రీస్తును మరియు సంఘమును వ్యతిరేకించు సాతాను, దయ్యపు శక్తులు.

పాపపు స్వభావము. మొదటిగా, పౌలు మన పాప స్వభావము మరియు పాప అలవాట్లను గూర్చి వ్రాసినప్పుడు, అతడు రాజ్య భాషను నివేదించాడు, మరియు దేవుని రాజ్యము యొక్క పౌరులకు పాపము గురుతుగా ఉండకూడదు అని బోధించాడు. ఎఫెసీయులకు 5:5లో, పౌలు ఈ మాటలు వ్రాస్తున్నాడు:

వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్నలోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు (ఎఫెసీయులకు 5:5).

దేవుని రాజ్యములోని పౌరులు క్రీస్తుకు విధేయత చూపుతారు లేదా అవిధేయత చూపుతారు. వారు తమ రాజుకు నమ్మకమైన సేవ చేస్తూ విధేయత చూపిన యెడల, నూతన సృష్టిలో వారు వారి స్వాస్థ్యములోని ఆశీర్వాదములను స్వతంత్రించుకుంటారు. కాని పౌరుడు క్రీస్తును తిరస్కరిస్తే, రాజు మీద తిరుగుబాటు చేసి ఆయన అనుగ్రహించు రక్షణను ధిక్కరిస్తే, క్రీస్తు రాజ్యములో ఆ వ్యక్తికి స్వాస్థ్యం ఉండదు.

జాతిపరమైన ఉద్రిక్తతలు. రెండవదిగా, మన పాపపు స్వభావములోని సవాళ్లను గూర్చి మాట్లాడుటతో పాటుగా, మొదటి శతాబ్దపు సంఘములో యూదులు మరియు అన్యుల మధ్య ఉన్న జాతిపరమైన లేక తెగల ఉద్రిక్తతలను గూర్చి మాట్లాడుటకు పౌలు దేవుని రాజ్యము యొక్క రూపకమును ఉపయోగించాడు. ఎఫెసీ 2:11-13లో అతని మాటలను వినండి:

కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు... ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును క్రీస్తుకు దూరస్థులై యున్నారు... ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు (ఎఫెసీయులకు 2:11-13).

ఇక్కడ, పౌలు సున్నతిలేని అన్యజనులు క్రీస్తులోకి రాక ముందు పరిస్థితిని మరియు క్రీస్తును స్వీకరించిన తరువాత పరిస్థితితో పోల్చాడు. మునుపు, వారు దేవుని రాజ్యములో పౌరులుగాక “పరజనులు”గా ఉన్నారు. అయితే ఒకసారి ఈ అన్యులు క్రీస్తునందు విశ్వాసముంచిన తరువాత, వారు ఆయన రాజ్యములో సంపూర్ణ పౌరులు అయ్యారు. అన్యజనులు “వాగ్దాన నిబంధనలులేని పరజనులుగా” ఉన్నారు అని కూడా పౌలు చెప్పాడు.

పాత నిబంధనలోని నిబంధనలు దేవుడు తన రాజ్యమును నిర్వహించుటకు చట్టపరమైన ఏర్పాట్లుగా ఉన్నాయి. ఒకసారి అన్యులు క్రీస్తు యేసునందు “సమీపస్థులైనప్పుడు,” క్రీస్తునందు నూతన నిబంధనలో వారు ఇశ్రాయేలు యొక్క జాతీయ నిబంధనల అధికారము క్రిందికి వచ్చియున్నారు. ఫలితంగా, క్రీస్తునందు దేవుని రాజ్యములోని నిబంధన ఆశీర్వాదములకు వారు హక్కుదారులు అయ్యారు. పౌరత్వము మరియు నిబంధనల విషయములో సంఘము మీద పౌలు దృష్టిపెట్టుట, పౌలు సంఘమును గూర్చి దేవుని రాజ్యముగా మాట్లాడుచున్నాడు అని సూచిస్తుంది. క్లుప్తంగా, వారిప్పుడు అదే రాజ్యములో పౌరులుగా ఉన్నారు కాబట్టి, యూదులు మరియు అన్యులు కొంతవరకు ఒకరితోనొకరు సమాధానపరచబడ్డారు అని పౌలు సూచించాడు.

పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో, అనేక సంస్కృతులు, ఎఫెసీ సంఘములో ఉన్న అనేకమంది ప్రజల కారణంగా దేవుని రాజ్యము మీద పౌలు ఎంతో వ్యూహాత్మకముగా దృష్టిపెట్టాడు. ఇప్పుడు, ఎఫెసీ 2లో అతడు బోధించుచున్నప్పుడు, మనమిక అపరిచితులము కాము అని అతడు ప్రకటించాడు. మరొక మాటలో, సంఘము ఇప్పుడు విభిన్నమైన సంస్కృతులు, జాతులు, మరియు నేపథ్యములు కలుసుకొను స్థలం అయ్యింది. నేను నైజీరియావాడిని, నేను అమెరికావాడిని, నేను రోమీయుడను, నేను యూదుడను అను మనస్సుతో మనమిక మనలను మనము గుర్తించుకోవలసిన లేక ఆలోచించవలసిన పనిలేదు. మనమంతా దేవుని రాజ్యములో ఒకటవుతాము. మరియు ఇది క్రీస్తు శరీరమును ఐక్యపరుస్తుంది... పౌలు సారాంశముగా ప్రకటించిన ప్రకారం, దేవుని రాజ్యములో పౌరునిగా ఉండుట అంటే శరీర క్రియలను విడచి, క్రీస్తు జీవమును పొందుకొనుట అయ్యున్నది. మనలను మనము ఇప్పటి వరకు నిర్వచించుకొనిన విషయములను విడచి, ప్రాకృతిక లోకములో మనము ఇప్పటి వరకు విషయములను చూసిన దృష్టికోణమును విడచి, క్రీస్తు దృష్టికోణమును పొందుకొనుట అయ్యున్నది. మొదటిగా, నేను పరలోకమునకు చెందినవాడను అను గుర్తింపులో నాటబడి, పరలోకమునకు చెందినవానిగా, ఏది ఏమైనప్పటికీ, ఆ దృష్టికోణములో నుండే నేను సమస్తమును చూడవలసియున్నది. నేను ప్రప్రధమముగా దేవుని బిడ్డనైయున్నాను, మరియు సమస్తము తరువాత స్థానములో ఉన్నది. ఈ పునాది లేకుండా, మనము నిజముగా తిరిగి జన్మించాము మరియు క్రీస్తును మన ప్రభువు మరియు రక్షకునిగా అంగీకరించాము అను వాస్తవమును కోల్పోతాము.

— పాస్టర్ జాన్సన్ ఒని

దయ్యపు శక్తులు. చివరిగా, విశ్వాసుల యొక్క పాపపు స్వభావము మరియు ఆదిమ సంఘములో జాతి మరియు తెగల ఉద్రిక్తతలకు సంబంధించి పౌలు కేవలం రాజ్య భాషను మాత్రమే ఉపయోగించలేదుగాని, ఎఫెసులో ఉన్న సంఘమును సవాలు చేసిన సాతాను, దయ్యపు శక్తుల విషయమునకు క్రీస్తునందు దేవుని రాజ్యము అను అంశమును కూడా పౌలు అనువర్తించాడు. మునుపటి పాఠములో మనము చూచినట్లుగా, లైకస్ లోయలో ఉన్న సంఘములను అబద్ధ బోధకులు కలవరపరచారు. పలు ఆత్మీయ శక్తులను క్రైస్తవులు ఆరాధించునట్లు వారిని పురికొల్పుటకు అబద్ధ బోధకులు గ్రీకు మతము నుండి, యూదా ధర్మశాస్త్రములోని కొన్ని సరికాని ఆలోచనల నుండి కొన్ని విషయములను ఉపయోగించారు. దీనిలో సాతాను మరియు దయ్యములు, అలాగే విశ్వములో ఉన్న కొన్ని మౌలిక విషయములు భాగమైయున్నాయి: భూమి, గాలి, నీరు మరియు నిప్పు. పౌలు దేవుని రాజ్యమును గూర్చిన అతని వేదాంతశాస్త్రముకు అనుసంధానంగా ఈ దయ్యములు మరియు మౌలిక విషయములను గూర్చి వర్ణించాడు. దీనిని గూర్చి అతడిచ్చు స్పష్టమైన ప్రకటన ఎఫెసీయులకు 2:1-2లో కనిపిస్తుంది.

అపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. మీరు వాటిని చేయుచు, వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి, యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి (ఎఫెసీయులకు 2:!-2).

వారు విశ్వాసులగుటకు ముందు, ఎఫెసీయులు “వాయు మండల సంబంధమైన అధిపతి” పాలించుచున్న “ప్రపంచ ధర్మము చొప్పున” నడుచుకొనిరి అని పౌలు తెలిపాడు. మిగిలిన లేఖనము అంతటిలో మనము చూచుచున్నట్లు, ఆ గొప్ప అధిపతి స్వయంగా దురాత్మ అయిన సాతానే. నిరాశ్చర్యముగా, సాతాను మరియు దయ్యపు శక్తులు సంఘమును వ్యతిరేకిస్తూ, క్రీస్తునందు దేవుని రాజ్యముతో పోరాడతాయి అని పౌలు తరువాత తెలియపరచాడు. ఎఫెసీ 6:12లో అతని మాటలను వినండి:

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము (ఎఫెసీయులకు 6:12).

దేవుని రాజ్యముగా సంఘము అంధకార సంబంధమగు రాజ్యముతో సార్వత్రిక యుద్ధము చేస్తుంది. అది ప్రజలు లేక “రక్తమాంసముల”తో యుద్ధము చేయుటలేదుగాని, సాతాను మరియు వాని దయ్యపు శక్తులతో యుద్ధము చేస్తుంది. ఎఫెసీయులు మరియు లైకస్ లోయలో ఉన్న సంఘములతో సహా పౌలు యొక్క వాస్తవిక శ్రోతలు వ్యక్తిగత పాపము, జాతి ఉద్రిక్తతలు, దయ్యపు శక్తులు వంటి పలు రకముల సమస్యలను ఎదుర్కొన్నారు. మరియు ఈ సమస్యలన్నిటిని ఒక సామాన్య అంశముతో అనుసంధానం చేయుట ద్వారా పౌలు ఈ సమస్యలను పరిష్కరించుటకు ప్రయత్నించాడు. క్రీస్తునందు దేవుని రాజ్యము అను సంపూర్ణమైన, సార్వత్రిక వాస్తవికత వెలుగులో వాటిని గూర్చి అతడు మాట్లాడాడు. అలా చేయుట ద్వారా, క్రీస్తునందు దేవుడు సాధ్యపరచుచున్న ఉన్నతమైన చిత్రమును అతడు తన పాఠకులకు ఇచ్చాడు.

ఎఫెసు మరియు లైకస్ లోయలో దేవుడు నూతనమైన ప్రజలను సృష్టించాడు. వారు ఇక తమ పాపపు స్వభావములకు బానిసలుగా ఉండకుండుటకుగాను ఆయన రాజ్యములో ఆయన వారికి పౌరత్వమును ఇచ్చాడు. ఆయన రాజ్యములో తోటి పౌరులుగా ఒకరితో ఒకరు సామరస్యముగా ఉండుటకుగాను ఆయన వారిని పిలచాడు మరియు బలపరచాడు. వారి దయ్యపు విరోధులపై విజయము కొరకు ఆయన రాజ్యములోని ప్రజలుగా ఆయన వారిని బలపరచాడు. ఈ విధములుగా దేవుని రాజ్యము అను అంశమును గూర్చి మాట్లాడుట ద్వారా, తాను ప్రకటించిన సువార్త వైపుకు — అనగా క్రీస్తునందు దేవుని రాజ్యము యొక్క విజయమును గూర్చిన శుభవార్త వైపుకు — తిరిగిరమ్మని పౌలు లైకస్ లోయలో ఉన్న సంఘములకు పిలుపునిచ్చాడు.

పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును ఇప్పటివరకు మనం చూశాము గనుక, పత్రిక యొక్క ఆకృతి మరియు విషయసూచికను చూచుటకు మనం ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము. ఎఫెసీ మరియు లైకస్ లోయలో ఉన్న సంఘములు ఎదుర్కొనుచున్న సవాళ్లను గూర్చి మాట్లాడుతూ పౌలు తన ఆలోచనలను ఏ విధముగా తెలియపరచాడు?

పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక ఐదు ప్రధాన భాగములుగా విభాగించబడుతుంది. అవి ఏవనగా:

1:1, 2లో అభివందనం;

1:3-14లో దేవుని స్తుతించుట;

1:15-23లో ఎఫెసీయుల కొరకు పౌలు తరచు చేసిన ప్రార్థనను గూర్చిన వివరణ;

2:1-6:20లో వెలుగు రాజ్యము మరియు చీకటి రాజ్యము మధ్య భిన్నత్వమును చూపించు ప్రధాన భాగము;

మరియు 6:21-24లో అంతిమ అభివాదములు.

మొదటిగా, పౌలు వ్రాసిన అనేక పత్రికల వలెనే, ఈ పత్రికను అపొస్తలుడైన పౌలు వ్రాశాడు అని 1:1, 2లో ఉన్న అభివందనం తెలియజేస్తుంది. “దేవుని చిత్తమువలన” అతడు తన అపొస్తులత్వమును పొందుకున్నాడు అని కూడా అది నివేదిస్తుంది. దేవుని చిత్తమును గూర్చి ఈ సూచన పౌలును దేవుని యొక్క అధికారికమైన ప్రతినిధిగా గుర్తిస్తుంది తద్వారా పౌలు మాటలు దైవ అధికారముగలవిగా ఉన్నవి. ఈ అభివందనం ఒక ఆశీర్వాద రూపములో ప్రామాణిక శుభముతో ముగుస్తుంది.

దేవుని స్తుతించు భాగము 1:3-14లో కనిపిస్తుంది. పౌలు పత్రికలలో కేవలము ఈ ప్రామాణిక గ్రంథ పత్రికలో మాత్రమే అభివందనం తరువాత దేవుని స్తుతించుటను గూర్చిన భాగము ఉంది. సాధారణంగా పౌలు తన అభివందనము తరువాత వ్యక్తిగత సూచన లేదా శుభవచనము తెలుపుతాడు. అయితే మనం ఇప్పటికే చూచినట్లుగా, ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఏ విధమైన వ్యక్తిగత సూచనలు లేవు.

పౌలు వ్యక్తిగత సూచనలను ఎందుకు ఇవ్వలేదో కూడా మనకు ఖచ్చితంగా తెలియదు. బహుశా, వివిధ సంఘములకు పంపబడే పత్రికలో స్తుతిని గూర్చిన భాగము మంచిగా ఉంటుంది అని అతడు భావించియుంటాడు. లేదా తరువాత భాగములో కొనసాగే సిద్ధాంతపరమైన విషయాలకు ఇది పునాదిగా ఉండాలని కూడా అతడు భావించియుంటాడు. కొందరు ఈ భాగమును మొదటి మూడు అధ్యాయములలో విస్తరించియున్న ప్రార్థనకు ఆరంభముగా చూశారు. మరికొందరు ప్రాచీన ప్రపంచంలో అధికారికమైన రచనలలో రాజుకు స్తుతులు చెల్లించుట సర్వసాధారణమైన విషయము అని తెలియపరచారు. చాలా వరకు, ఇక్కడ మనము ప్రస్తావించిన కనీసం కొన్ని కారణములతో సహా, పౌలు ఈ పత్రికను ఈ విధముగా వ్రాయటానికి వెనుక ఉన్న కారణాలు సంక్లిష్టమైనవిగా ఉన్నాయి.

పౌలు ఈ స్తుతి భాగమును ఎందుకు వ్రాశాడో కనుగొనడం కష్టమైనప్పటికీ, దానిలోని విషయాలను గమనించడం మాత్రం సులభముగా ఉన్నది. ఉదాహరణకు, ఈ వచనములు తండ్రి, కుమారుడు, మరియు పరిశుద్ధాత్మ యొక్క కార్యమును స్పష్టముగా ఘనపరచుచున్నవి కాబట్టి దీనిలో బలమైన త్రిత్వ సిద్ధాంతము కనబడుతుంది. 7వ వచనములో యేసుక్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా రక్షణ; 9వ వచనములో సువార్త మర్మమును గూర్చిన ప్రత్యక్షత; లేదా 11-14 వచనములలో పరిశుద్ధాత్ముని వరముల ద్వారా నిర్థారించబడిన భవిష్యత్ మహిమ యొక్క వాగ్దానమును కూడా పౌలు ఉద్ఘాటించాడు. ఈ ఆలోచనలన్ని ఉద్ఘాటించదగినవిగా ఉన్నవి, అయితే దీని కంటే ఉన్నతమైన, సంగ్రహమైన మరొక గురి ఉన్నది. ఈ గురి కేవలం ఈ విషయములన్నిటిని ఐక్యపరచుట మాత్రమేగాక, మహిమపరచుటలోని అనేక ఇతర వివరములను కూడా వివరిస్తుంది. నిరాశ్చర్యముగా, ఈ గొప్ప గురి దేవుని రాజ్యము అయ్యున్నది. 1:4, 5 వంటి చోట్ల పౌలు చేసిన స్తుతిలో ఈ రాజ్య గురిని మనము చూస్తాము. ఉదాహరణకు, 4 మరియు 5వ వచనములో, దేవుని యొక్క సార్వభౌమ అధికారమును బట్టి పౌలు దేవునిని మహిమపరచుచు, కొందరు వ్యక్తులు తన ప్రజలుగా ఉండుటకు దేవుడు ఏర్పాటు చేసుకొనిన విధానమును బట్టి ఆయనను స్తుతించాడు. 9, 10 వచనములలో, సమస్తమును క్రీస్తు ఆధీనములోకి తెచ్చు సృష్టియంతటిమీద దేవుని యొక్క సార్వభౌమత్వమును బట్టి కూడా పౌలు దేవునిని స్తుతించాడు. అంతేకాక, 5-7 వచనములలో, దేవుడు తన ప్రజల యెడల కలిగియున్న దయను బట్టి పౌలు ఆయనను స్తుతించాడు.

పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన కాలములలో మానవ రాజులు, వారి ప్రజలకు వారు అనేక విధములుగా చూపిన దయను బట్టి ప్రశంసలను పొందారు. మరియు పాత నిబంధన అంతటిలో, ఆయన చేసిన గొప్ప దయాకృతములను బట్టి ఇశ్రాయేలునకు రాజుగా దేవుడు స్తుతించబడ్డాడు. కాబట్టి, తన ప్రజల పట్ల దేవుడు చూపిన అనేక రాజరిక దైవకృతములను బట్టి పౌలు దేవుని యొక్క రాజరిక సార్వభౌమత్వమును స్తుతించుట ఆశ్చర్యము కలిగించదు. ప్రత్యేకముగా, తన ప్రజలను దత్తతుతీసుకొనుట ద్వారా, విమోచించుట ద్వారా, క్షమించుట ద్వారా దేవుడు తన కనికరమును కనుపరచిన విధానమును పౌలు ఉద్ఘాటించాడు. మరియు 14వ వచనములో క్రీస్తులో మనకున్న స్వాస్థ్యమును బట్టి పౌలు దేవునిని స్తుతించాడు. ఈ పాఠములో ఇంతకుముందు మనము చూసినట్లు, 5:5లో పౌలు మన స్వాస్థ్యమును “క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కు”గా గుర్తించాడు కాబట్టి స్వాస్థ్యం అను అంశము దేవుని రాజ్యమునకు సంబంధించినదిగా ఉన్నది. ఈ విధములుగా, దేవుని రాజ్యము యొక్క మహత్వము మరియు ఎఫెసీయులు ఎదుర్కొనిన సవాళ్ల పట్ల అది కలిగియుండిన ఔచిత్యము ద్వారా పౌలు ఎంతగా ఆకర్షితుడు అయ్యాడు అంటే, రాజైన దేవుని స్తుతించుట ద్వారా ఒక విస్తరించబడిన మహిమను చెల్లించుచు అతడు తన పత్రిక అంతటిని ఆరంభించాడు.

పరిచయ అభివందనం మరియు స్తుతి తరువాత, ఎఫెసీ. 1:15-23లో ఉన్న తదుపరి భాగం, పౌలు వారిని గూర్చి తరచుగా ప్రార్థించుచున్నాడు అని అతడు తన పాఠకులకు ఇచ్చిన నిశ్చయతను గూర్చినది అయ్యున్నది.

పౌలు పత్రికలను చదువునప్పుడు మీరు గమనించగల ఒక విషయం ఏమిటంటే, తన పాఠకుల కొరకు, తాను వ్రాయుచున్న ప్రజల కొరకు ప్రార్థించుచున్నాడు అని అతడు ప్రస్తావించుటను మనము చూస్తాము. మరియు పౌలు పరిచర్యలో ప్రార్థన ఒక ప్రాముఖ్యమైన భాగముగా ఉన్నది కాబట్టి మీరు దీనిని చూస్తారు... పౌలు దీనిని గుర్తిస్తాడు, మరియు జీవితమంతటికి, పరిచర్య అంతటికి ఈ ఆత్మీయ కోణము ఉన్నది అని గ్రహిస్తాడు. మన పోరాటము రక్త మాంసములతో కాదుగాని, ఆకాశమండలములలో ఉన్న దురాత్మ శక్తులతో అయ్యున్నది... వాక్యమును ప్రకటించుట, సువార్తను ప్రకటించుట, మరియు ప్రార్థన, వీటిని ఎదుగుదలను తెచ్చుటకు మరియు భూదిగంతముల వరకు సువార్తను వ్యాపింపజేయుటకు, మరియు క్రీస్తునందు విశ్వాసముంచు ప్రజలను ఉపయోగించుకొనుటకు దేవుడు ఈ మాధ్యమాలను ఉపయోగిస్తాడు. కాబట్టి, ఉదాహరణకు, ఎఫెసీ. 1:15-19 వంటి చోట్ల, పౌలు తన పాఠకుల కొరకు ప్రార్థించుచున్నాడు మరియు క్రీస్తునందు కలుగు గొప్ప ఆశీర్వాదములను వారు తెలుసుకొనుట కొరకు అతడు నిజముగా ప్రార్థించుచున్నాడు.

— డా. జెఫ్ బ్రన్నన్

పౌలు ఎఫెసీయుల కొరకు చేసిన ప్రార్థనలో మూడు భాగములు ఉన్నాయి అని అతడు నిర్థారణ ఇచ్చాడు: అతడు వ్రాసిన విశ్వాసులకు అతడు తెలిపిన కృతజ్ఞత; పరిశుద్ధాత్ముడు వారిని వెలిగింపజేస్తాడు అని చెప్పు రెండింతల విజ్ఞాపన; మరియు ఆ వెలిగింపు యొక్క విస్తృతమైన వర్ణన. మునుపటి మహిమలో అతడు ఉద్ఘాటించిన అవే అంశములను ఈ భాగమంతటిలో పౌలు పునరావృతం చేస్తాడు. ప్రత్యేకముగా 17వ వచనములో తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్ముని యొక్క కార్యమును గౌరవించుట ద్వారా అతడు బలమైన త్రిత్వ వేదాంతశాస్త్రమును అందిస్తాడు. 19 మరియు 20 వచనములలో రక్షణ యేసు క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తము ద్వారా కలుగుతుంది అని అతడు ఉద్ఘాటించాడు. 17-19 వచనములలో, అతని ముఖ్య విన్నపములో, అతడు సువార్తను గూర్చి అదనపు ప్రత్యక్షతను గూర్చి, వారు పొందిన ఆశీర్వాదములను ఎఫెసీయులు అర్థము చేసుకొనుటకు సహాయము చేయు జ్ఞానమును వారికి అనుగ్రహించమని అతడు ప్రార్థిస్తాడు. మరియు 18వ వచనములో, మన భవిష్యత్ మహిమ నిరీక్షణను గూర్చి అతడు మాట్లాడాడు. మరియు, మునుపటి స్తుతిలో వలెనె, అతడు ఈ ఆలోచనలన్నిటిని ఉన్నతమైన, ఐక్యపరచు అంశమైన దేవుని రాజ్యముతో జతపరచాడు.

పౌలు చెల్లించిన స్తుతిలో దేవుని రాజ్యము అను అంశము మూడు వివరముల మీద దృష్టిపెట్టిన విధానమును ఇంతకు ముందే మనము చూశాము: దేవుని యొక్క సార్వభౌమ అధికారము, దీనిలో ఆయన శక్తి మరియు అధికారము కూడా ఉన్నది; దేవుని దయ, దీనిలో రాజుగా ఆయన తన ప్రజలకు ఉచితముగా ఇచ్చు మంచి ఈవులు ఉంటాయి; దేవుని రాజ్యములో మనకు అనుగ్రహించబడిన క్రీస్తునందు మన స్వాస్థ్యము మరియు నిరాశ్చర్యంగా, ఈ మూడు రాజ్య మూలకములు అతని ప్రార్థనలో కూడా కనిపిస్తాయి. 19వ వచనములో ఆయన “శక్తియొక్క అపరిమితమైన మహత్మ్యము” మరియు ఆయన “బలాతిశయము”ను గూర్చి మాట్లాడునప్పుడు, మరియు 21వ వచనములో అధిపతులందరికంటే క్రీస్తు ఉన్నతమైన సింహాసనమందు ఆసీనుడైయున్నాడు అని మాట్లాడినప్పుడు పౌలు దేవుని సార్వభౌమ పరిపాలనను ప్రస్తావించాడు. 19వ వచనములో, దేవుని బలాతిశయమును బట్టి “విశ్వసించు మనయందు” అని పౌలు ప్రస్తావించినప్పుడు అదే విధంగా 22 మరియు 23 వచనములలో సంఘ ప్రయోజనము కొరకు క్రీస్తు రాజుగా పాలించుచున్నాడు అని చెప్పినపుడు కూడా దేవుని యొక్క దయను గూర్చి అతడు మాట్లాడాడు. మరియు 18వ వచనములో “పరిశుద్ధులలో ఆయన [క్రీస్తు] స్వాస్థ్యముయొక్క మహిమైశ్వర్యము”ను గూర్చి పౌలు నేరుగా మాట్లాడాడు, ఈ నిరీక్షణ కొరకై విశ్వాసులు పిలువబడ్డారు.

క్రీస్తు యొక్క స్వాస్థ్యము మన నిరీక్షణ అని పౌలు చెప్పగలిగాడు, ఎందుకంటే — అతడు పత్రికలోని ప్రధాన భాగములో బోధించుచున్నట్లు — క్రీస్తు ఆయన స్వాస్థ్యమును మనతో పంచుకుంటాడు తద్వారా ఆయన స్వాస్థ్యం మన స్వాస్థ్యంగా కూడా అవుతుంది. రాజ్య స్వాస్థ్యం మీద ఈ దృష్టి పాత నిబంధనలోని ఒక సామాన్యమైన ఆలోచనలో నుండి వెలికితీయబడినది. ద్వితీయోపదేశకాండము 9:26-29 వంటి వాక్యభాగములలో, ఇశ్రాయేలు రాజ్యము దేవుని స్వాస్థ్యము అని పిలువబడినది, మరియు వారికి ఆయన తన రాజ్యములో స్వాస్థ్యమును అనుగ్రహించుచుండగా ఆయన రాజ్యములోని ప్రజలు బహుగా ఆశీర్వదించబడ్డారు.

పౌలు యొక్క స్తుతి భాగములో మరియు విజ్ఞాపనలో రాజ్యము యొక్క ప్రాముఖ్యతను మనం చూశాము గనుక, ఈ పత్రికలోని ప్రధాన భాగమును ఇప్పుడు చూద్దాము, అది 2:1-6:20లో కనిపిస్తుంది. ఎఫెసీ పత్రికలోని ఈ భాగము ఒకవైపు దేవుని నీతి రాజ్యము, మరోవైపు దయ్యముల యొక్క పాప రాజ్యము మరియు పతనమైన మానవుల మధ్య వ్యత్యాసము మీద దృష్టిపెడుతుంది.

పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలోని ప్రధాన భాగము యొక్క ఆకృతిని తెలుపుటకు అనేక మార్గములు ఉన్నాయి. అయితే ఈ పాఠములో మనము పెడుతున్న దృష్టిని అనుసరించి, ప్రధాన భాగము దేవుని రాజ్యము అను అంశమును ఎలా ఎత్తి చూపుతుందో మన ఆకృతి ఉద్ఘాటిస్తుంది. దీని వెలుగులో, ప్రధాన భాగమును మూడు ప్రాథమిక భాగములుగా విభాగించుదాము: మొదటిగా, 2:1-22లో రాజ్యములో పౌరత్వమును గూర్చిన పౌలు బోధన; రెండవదిగా, 3:1-21లో రాజ్యము యొక్క పాలనను గూర్చి అతని వివరణ; మరియు మూడవదిగా, 4:1-6:20లో రాజ్యములో జీవించుటకు పౌలు ఇచ్చిన సూత్రములు. దేవుని రాజ్యములో పౌరత్వముతో ఆరంభించి ఈ భాగములను ఒకొక్కటిగా చూద్దాము.

దేవుని రాజ్యములో పౌరునిగా ఉండుట అంటే అర్థము ఏమిటి? ఉదాహరణకు, మనము పౌరత్వమును గూర్చి మాట్లాడునప్పుడు, ఈ లోకములో మరియు ఒక దేశములో జన్మించుటను గూర్చి మనము ఆలోచన చేస్తాము, మరియు జననము నుండి మనము ఆ దేశములో పౌరులముగా ఉంటాము, మరియు పౌరులుగా మనకు కొన్ని హక్కులు మరియు ధన్యతలు ఇవ్వబడతాయి. దేవుని రాజ్యములో పౌరులుగా ఉండుట అంటే కూడా అర్థము ఇదే. క్రీస్తునందు, మనకు రాజ్యములోని హక్కులు మరియు ధన్యతలు అన్నీ ఉన్నాయి. ఉదాహరణకు, పౌలు మాటల ప్రకారం ఇది రాజ్యములోని కొందరు సభ్యులకు మాత్రమే వర్తించదుగాని, దేవుని రాజ్యములోని సభ్యులందరికి వర్తిస్తుంది. కాబట్టి, మరొక మాటలో, అబ్రాహాము మరియు మోషే, ఇస్సాకు, యాకోబు మరియు దావీదు వలెనే, క్రీస్తునందు ఉన్న మనమంతా ఆయన సమాజములో, క్రీస్తు సమాజము మరియు ఆయన రాజ్యములో భాగముగా అవే హక్కులను మరియు ధన్యతలను ఆస్వాదిస్తాము.

— డా. జయ్ హాలె

దేవుని వెలుగు రాజ్యములో పౌరత్వమును గూర్చిన పౌలు బోధన మూడు విభాగములుగా విభజించబడింది: మొదటిగా, ఎఫెసీయులకు 2:1-3 పతనమైన మానవులు అంధకార రాజ్యములో జన్మించారు మరియు స్వభావికముగా దేవునికి శత్రువులుగా ఉన్నారు అను సత్యమును ఉద్ఘాటిస్తుంది. తరువాత, దేవుడు మనలను అంధకార రాజ్యములో నుండి వెలుగు రాజ్యములోకి నడిపించుట ద్వారా ఆయన రాజ్యంలో పౌరత్వమును మనకు అనుగ్రహించిన విధానమును గూర్చి ఎఫెసీయులకు 2:4-10లో పౌలు వివరించాడు. చివరిగా, వెలుగు రాజ్యంలో మన పౌరత్వము యొక్క స్వభావమును గూర్చి ఎఫెసీయులకు 2:11-22 చర్చిస్తుంది. మొదటిగా చీకటి రాజ్యమును గూర్చి పౌలు మాట్లాడిన విధానమును గూర్చి మాట్లాడదాము.

చీకటి రాజ్యము (2:1-3). మొదటిగా, మానవులందరు పాపులుగాను, పతనమైనవారిగాను జన్మించారు అని పౌలు తన శ్రోతలకు జ్ఞాపకము చేశాడు. మనం ఆత్మీయంగా చనిపోయాము, మనకు దుష్ట స్వభావము ఉంది, మనము దేవుని శత్రువులమైయున్నాము, తత్ఫలితంగా తీర్పు దినమున దేవుని ఉగ్రతకు మనము పాత్రులుగా ఉన్నాము. ఎఫెసీ. 2:1-3లో, క్రీస్తుకు వేరుగా ఎఫెసీయులు మరియు ప్రజలందరి యొక్క పరిస్థితిని పౌలు వర్ణించిన విధానమును వినండి:

మీఅపరాధములచేతను పాపములచేతను మీరు చచ్చినవారై యుండగా... వాయు మండల సంబంధమైన అధిపతిని... యీ ప్రపంచ ధర్మముచొప్పున మునుపు నడుచుకొంటిరి... వారితో కలిసి మనమందరమును శరీరముయొక్కయు మనస్సుయొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారివలెనే స్వభావసిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై యుంటిమి (ఎఫెసీయులకు 2:1-3).

మనము క్రీస్తు చెంతకు వచ్చుటకు ముందు, మనమంతా దేవుని శత్రువులమైయుంటిమి. దేవుడు మనలను రక్షించకమునుపు, మనము మన యిష్టప్రకారముగా పాప స్వభావములో జీవించేవారము, “వాయు మండల సంబంధమైన అధిపతియైన” సాతానును సేవించేవారముగా ఉన్నాము. ఇక్కడ మరియు అనేక ఇతర చోట్ల, పౌలు సాతాను పాలనను ఆత్మీయ చీకటితో అనుసంధానము చేశాడు.

వెలుగు రాజ్యము (2:4-10). రెండవదిగా, క్రీస్తును నమ్మువారందరిని చీకటి రాజ్యము నుండి వెలుగు రాజ్యములోనికి నడిపించుటకు దేవుడు ఒక రాజరిక ఆధిక్యతను ఉపయోగించుచున్నాడు అని పౌలు ఉద్ఘాటించాడు. ఈ ప్రక్రియలో భాగముగా, దేవుడు మన ఆత్మలను నూతనపరుస్తాడు, తద్వారా మనము ఆత్మీయముగా సజీవులముగా ఉంటాము, మరియు ఆయన మనలో క్రీస్తును పునఃసృష్టిస్తాడు, తద్వారా మనము దేవుని ప్రేమించు నూతన స్వభావములను కలిగియుంటాము. దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలను చేయుట ద్వారా ఆయనను మనము సేవిస్తాము. తత్ఫలితంగా, రాబోవు యుగములో దేవుని ఉగ్రత మరియు తీర్పుకు బదులుగా మహిమైశ్వర్యము కొరకు మనము ఎదురుచూస్తాము.

పౌరత్వము యొక్క స్వభావము (2:11-22). మూడవదిగా, చీకటి రాజ్యములో నుండి వెలుగు రాజ్యములోనికి మన భర్తీని ఉద్ఘాటించిన తరువాత, ఎఫెసీ. 2:11-22లో దేవుని రాజ్యములో మన పౌరత్వము యొక్క స్వభావమును పౌలు చర్చించాడు. ఈ భాగములో, యూదుల నుండి అన్యులకు తన ఆశీర్వాదములను విస్తరింపజేయు పాత నిబంధన ఆలోచనను దేవుడు ఇప్పుడు నెరవేర్చిన విధానమును గూర్చి పౌలు మాట్లాడాడు. ఆయన తన సార్వభౌమ రాజ్యము క్రింద తన ప్రజలను ఒకే సార్వత్రిక రాజ్యములోనికి నడిపించియున్నాడు. పాత నిబంధన అంతటా ఈ ఆలోచన కనిపిస్తుంది. ఉదాహరణకు, కీర్తనలు 22:27-28లో రాజ్యము యొక్క భవిష్యత్తును గూర్చిన ఈ దర్శనము మీద దావీదు దృష్టిసారించాడు:

భూదిగంతముల నివాసులందరు జ్ఞాపకము చేసికొని యెహోవాతట్టు తిరిగెదరు అన్యజనుల వంశస్థులందరు నీ సన్నిధిని నమస్కారము చేసెదరు రాజ్యము యెహోవాదే అన్యజనులలో ఏలువాడు ఆయనే (కీర్తనలు 22:27-28).

పౌలు దినములలో, అన్యజనులైన క్రైస్తవుల యొక్క స్థితి అత్యంత వివాదాస్పదమైన విషయంగా మారిపోయింది. యూదా క్రైస్తవులు అన్యులు మారుమనస్సు పొందుటకు అభ్యంతరమును తెలుపలేదుగాని, అన్యులు ద్వితీయ శ్రేణి క్రైస్తవులు అని కొందరు భావించారు. క్రీస్తు రాక మునుపు, యూదులు దేవుని రాజ్యములో ప్రత్యేకమైన హోదాను పొందుకున్నారు. దేవుని నిబంధన ప్రజలలో ప్రాధమికముగా ఇశ్రాయేలు రాజ్యము ఉంది, మరియు పరిపూర్ణమైన నిబంధన ఆశీర్వాదములు యూదా గోత్రపు పురుషులకు మాత్రమే చెందాయి. పాత నిబంధన విశ్వాసములోని ఈ సత్యమును గూర్చి పౌలుకు తెలుసు, అయితే ఇశ్రాయేలులో నమ్మకమైనవారు తాము అనుభవించిన రక్షణను అన్యులకు కూడా వ్యాపింపజేయవలసియుండెను అని కూడా అతనికి తెలిసియుండెను. విశ్వాసులందరూ—యూదుడైన లేదా అన్యుడైన, పురుషుడైన లేదా స్త్రీయైనా, దాసుడైన లేదా స్వతంత్రుడైన—క్రీస్తులో ఐక్యపరచబడుట ద్వారా మాత్రమే నిత్య నిబంధన ఆశీర్వాదములను పొందుకున్నారు అని క్రొత్త నిబంధన గ్రంథము బయలుపరుస్తుంది. క్రీస్తులో, ప్రతి విశ్వాసి దేవుని న్యాయస్థానమందు పరిపూర్ణంగా నీతిమంతునిగా తీర్చబడతాడు స్వయంగా యేసు యొక్క నీతిని పొందుకుంటాడు, మరియు వారు దేవుని నిత్య ఆశీర్వాదములను పొందుకుంటారు.

ఇంతకు ముందు ప్రస్తావించినట్లు, యూదుల అబద్ధ బోధలు ఎఫెసులోని అన్య విశ్వాసులను ప్రభావితము చేస్తున్నట్లు కనిపిస్తుంది. కాబట్టి, దేవుని రాజ్యములో యూదులు మరియు అన్యులకు మధ్య ఉన్న పాత భిన్నత్వములు ఇప్పుడు నిరర్థకమైపోయాయి అని ఉద్ఘాటించుట ద్వారా పౌలు ఈ అబద్ధ బోధలను తిరస్కరించగోరాడు. ప్రతి ఒక్కరు ఒకే విధముగా రక్షణను పొందారు గనుక, క్రొత్త ప్రామాణికతలో జాతితో నిమిత్తము లేకుండా ప్రతి ఒక్కరికి సమాన స్థితి మరియు సమాన హోదా ఇవ్వబడింది. దీని వలన, వెలుగు రాజ్యములోని పౌరులు అందరు సమాన హక్కులు కలిగిన పరిపూర్ణ పౌరులుగా ఉన్నారు మరియు దేవుని సన్నిధికి చేరు సంపూర్ణ హక్కును కలిగియున్నారు. ఎఫెసీయులకు 2:13-19లో పౌలు ఈ విధంగా వ్రాశాడు:

అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తుయేసునందు క్రీస్తు రక్తమువలన సమీపస్థులై యున్నారు... ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రిసన్నిధికి చేరగలిగియున్నాము. కాబట్టి మీరికమీదట పరజనులును పరదేశులునై యుండక, పరిశుద్ధులతో ఏక పట్టణస్థులును దేవుని యింటివారునై యున్నారు (ఎఫెసీయులకు 2:13-19).

క్రీస్తులో యూదుడు మరియు అన్యుడు అను భేదము లేదు అని పౌలు అంటున్నాడు. మనమంతా స్వీకరించబడితిమి. మునుపు దూరముగా ఉన్న మీరు ఇప్పుడు క్రీస్తు ద్వారా దగ్గరకు చేర్చబడితిరి అని అతడు అంటాడు. ఆయన భూమిని సమతుల్యము చేయువాడు, ఎందుకంటే మీరు ఎక్కడ నుండి వచ్చినను, మీరు యూదులైనా లేక అన్యులైనా, దేవుని యొద్దకు చేరుటకు ఒకే ఒక్క మార్గము ఉన్నది మరియు అది క్రీస్తునందు విశ్వాసము ద్వారా మాత్రమే. కాబట్టి మొదటి శతాబ్దపు సంఘములోని అన్య విశ్వాసులు క్రీస్తును నమ్మిన యూదా విశ్వాసుల వలెనే అబ్రాహాము కుమారులు అయ్యారు. అబ్రాహాము కలిగియుండిన అదే విశ్వాసము ద్వారా దేవుని యొద్దకు వచ్చి ప్రతి ఒక్కరు అబ్రాహాము కుమారులు అవుతారు అని క్రొత్త నిబంధనలో కొన్ని చోట్ల అతడు చెబుతాడు. కాబట్టి, వారు సమానులు, విశ్వాస కుటుంబములో సమానులైయున్నారు. వారిరువురు — యూదులు మరియు అన్యులు — దేవుని కుటుంబములో సభ్యులైయున్నారు మరియు ఆయన దృష్టికి శ్రేష్టులైయున్నారు.

— డా. క్రిస్ లోహర్స్టోర్ఫర్

ఇప్పుడు దేవుని వెలుగు రాజ్యములో పౌరత్వమును గూర్చిన అంశమును చూశాము గనుక, ఇప్పుడు పౌలు పత్రిక యొక్క ప్రధాన భాగములోని తరువాత భాగమును మనము చూడవలసియున్నది. ఎఫెసీ. 3:1-21లో, రాజ్యము యొక్క పరిపాలనను గూర్చి పౌలు బోధించాడు.

ప్రతి రాజ్యములో ఒక విధమైన పరిపాలన పద్ధతి అవసరము అనునది స్పష్టమైన విషయము. రాజ్యములకు తగినంత వ్యవస్థ లేని యెడల అవి ఊరకనే పతనమైపోతాయి. రాజు తన రాజ్యమును పాలించుటకు ఇతర ప్రభుత్వ కార్యాలయములు కూడా ఉండాలి. సాధారణ మానవుల ప్రభుత్వాలలో, చట్టములను ఏర్పాటు చేసేవారు, అమలు చేసేవారు, మరియు చట్టములను ఉల్లంఘించినప్పుడు తీర్పు విధించేవారు వంటి వివిధ స్థాయిలు మరియు వివిధ నాయకత్వములు ఉంటాయి. దేవుని రాజ్యములో, ముఖ్యముగా సంఘములో దేవుడు స్థాపించిన అధికారిక నిర్మాణములలో కూడా ఇదే వాస్తవమైయున్నది.

పౌలు దినములలో అబద్ధ బోధకులు సంఘము యొక్క అధికారిక నిర్మాణమును సవాలు చేశారు. వాస్తవానికి, అతడు యెరూషలేములో పట్టబడక మునుపు, అబద్ధ బోధకులు తమ సొంత జనులలో నుండి ఉత్పన్నమౌతారు అని పౌలు ఎఫెసీ పెద్దలను హెచ్చరించాడు. అపొస్తలుల కార్యములు 20:28-30లో, పౌలు ఎఫెసు పెద్దలతో మాట్లాడిన ఈ మాటలను లూకా నివేదించాడు:

దేవుడు...తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి... నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు (అపొ. 20:28-30).

అబద్ధ బోధకులు లేచి సంఘమును కలవరపెడతారని పౌలుకు తెలుసు. కాబట్టి, ఈ అబద్ధ బోధకుల విషయములో జాగ్రత్తగా ఉండమని అతడు పెద్దలను హెచ్చరించాడు. అయితే పెద్దలకు ఈ బాధ్యతను అప్పగించి, అబద్ధ బోధకులను ఖండించమని చెప్పు హక్కును పౌలు ఎలా పొందుకున్నాడు? సరే, తన రాజ్యమును పరిపాలించుటకు దేవుడు మరొక సంఘ స్థానమును నియుక్తి చేశాడు. అది అపొస్తలుల స్థానము అయ్యున్నది. పౌలు దినములలో, అపొస్తలుల స్థానము ఒక ప్రధానమైన స్థానముగా ఉనికిలో ఉండేది, కాని నేడు అది ఉనికిలో లేదు. దేవుడే స్వయంగా ఏర్పాటు చేసుకొని శిక్షణ ఇచ్చిన వారు- పునరుత్థానుడైన యేసుక్రీస్తును చూసినవారు — అనగా పౌలువంటివారు — ఈ బాధ్యతను చేపట్టారు. అపొస్తలులు దేవుని అధికారమును కలిగియున్నారు మరియు పెద్దలతో సహా సంఘమంతటిని పాలించారు. ఎఫెసీయులకు 3:2-7లో, పౌలు తన అపొస్తులత్వ అధికారమును దేవుని రాజ్య పాలనతో అనుసంధానంగా ఈ మాటల ద్వారా వివరించాడు:

మీకొరకు నాకనుగ్రహింపబడిన దేవుని కృపవిషయమైన యేర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనమువలన నాకు తెలియపరచబడినది... ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడలేదు... దేవుడు కార్యకారియగు తన శక్తినిబట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని (ఎఫెసీయులకు 3:2-7).

ఎఫెసీయులను తప్పుదారి పట్టించినవారిని నిలదీయుటకు, అపొస్తలులు దేవుని నుండి ఒక ప్రత్యేకమైన కృపను పొందుకున్నారు అని, అది వారికి పరిచర్య చేయు అధికారమును ఇచ్చింది అని, మరియు దేవుని నుండి కలిగిన ప్రత్యేకమైన ప్రత్యక్షత వారికి పొరపడని సత్యమును నేర్పింది అని పౌలు నొక్కి చెప్పాడు. మరియు ఈ ప్రత్యక్షతను సంఘముకు బోధించమని దేవుడు అపొస్తలులకు బాధ్యత అప్పగించాడు. కాబట్టి, ఒక అపొస్తలునిగా, రాజ్యము యొక్క నియమములను దానిలోని పౌరులకు బోధించుట ద్వారా, మరియు ఆయనకు విరోధముగా నిలబడినవారిని ఖండించుట ద్వారా క్రీస్తునందు దేవుని రాజ్యమును నిర్వహించు బాధ్యతను మరియు హక్కును పౌలు పొందుకున్నాడు.

పౌలుతో సహా, అపొస్తలులు, క్రీస్తు రాజ్యమును నిర్వహించు లేక పరిపాలించు హక్కును ఎందుకు పొందుకున్నారు? అయితే, వారి అనుభవములు మరియు సాక్ష్యము ద్వారా మాత్రమే శిష్యులు — అనగా క్రీస్తుతో జీవించి, క్రీస్తు బోధలను పొంది, క్రీస్తును ప్రత్యక్షముగా చూసిన యూదా మినహా ఇతర పదకొండు మంది శిష్యులు — ఎట్టి అధికారమును కలిగియుండిరో మనము చూడవచ్చు. అయితే వెళ్లి క్రీస్తుకు సాక్షులుగా ఉండుటకు సువార్తల యొక్క ముగింపులో వారికి ప్రత్యేకముగా ఆజ్ఞ ఇవ్వబడినది. అయితే, పౌలు విషయం ఏమిటి? అతడు యేసును కలిశాడా? అతడు యేసు బోధను విన్నాడా? అవును, విన్నాడు. దమస్కు మార్గమున అతడు పునరుత్థానుడైన క్రీస్తును ఎదుర్కొని, మారుమనస్సు పొందాడు. అంతేగాక, గలతీ 1లో అతడు మాట్లాడుచున్నట్లు, క్రీస్తు ఉపదేశములను మరియు ఆజ్ఞలను పొందుకొనుచు క్రీస్తు సన్నిధిలో అరేబియా అరణ్యములో అతడు కొంత సమయమును గడిపాడు, కాబట్టి పౌలు అన్యులకు అపొస్తలునిగా ప్రత్యేకముగా పంపబడ్డాడు. మరియు ఎఫెసులో అతడు దీనిని గురించే మాట్లాడుతున్నాడు, మరియు దేవుని రాజ్య సువార్తను అన్యుల యొద్దకు తీసుకొనివెళ్లుట అతనికి ఇవ్వబడిన ప్రత్యేకమైన ఆజ్ఞ అని చెబుతున్నాడు.

— రెవ. మైఖేల్ గ్లోడో

భూమిమీద దేవుని యొక్క అధికారికమైన ప్రతినిధిగా, ఆయన అపొస్తలునిగా ఉండుటకు ఆయన పౌలును నియమించాడు. మరియు ఈ అపొస్తులత్వము పౌలు మాటలను అధికారికముగా, స్వయంగా దేవుడే మాట్లాడినట్లుగా చేశాయి. అయితే ఈ సమయంలో పౌలు అధికారం పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో ఎందుకు అంత ప్రాముఖ్యమైనదిగా ఉంది? సరళమైన మాటలలో చెబితే, ఎఫెసులోని కొందరు పౌలు యొక్క బోధలను తిరస్కరించుండిరి, మరియు ఎవరిని నమ్మాలో సంఘమునకు తెలియవలసియుండెను. నేడు కూడా, మనము దేవుని సంతోషపరచగోరితే, దేవుడు మన నుండి ఏమి ఆశించుచున్నాడో మనము తెలుసుకోవాలి. పౌలు దినములలో, అనేకమైన అబద్ధ బోధనలు ప్రచిలితమైనవి కాబట్టి దేవుడు ఆశించునవి ఏమిటో తెలుసుకోవడం కష్టంగా ఉండినది. అబద్ధ బోధకులు ఒక విషయం చెబితే, సంఘములో నియమించబడిన నాయకులు మరొకటి చెప్పారు. పౌలు తన యొక్క అపొస్తులత్వ అధికారమును ఉపయోగించుట ద్వారా ఈ సమస్యను పరిష్కరించాడు. అతడు అపొస్తలుడైనందున, అతని అధికారం మరియు అంతర్దృష్టి ఇతరులకన్నా గొప్పవి అని అతడు తన శ్రోతలకు జ్ఞాపకం చేశాడు. ఏ అబద్ధ ప్రవక్త కూడా తాను అపొస్తలుడు అని సరియైన రీతిలో దావా చేయలేడు. కాబట్టి, ఏ అబద్ధ ప్రవక్తకు పౌలుకు ఉన్న మెళకువలు ఉండవు, లేక దైవికమైన అధికారముతో వారు మాట్లాడగలిగేవారు కాదు. ఒక అపొస్తలునిగా, సత్యములోనికి నడిపించుటకు పౌలు దేవుని ప్రజలకు దేవుని మాటలను బోధించాడు.

తెలివిగా, రాజ్య పరిపాలనను గూర్చిన పౌలు బోధన తన అధికారమును నొక్కి చెప్పుటతో ముగియదు. బదులుగా, ఎఫెసీ. 3:14-21లో కనిపించే ప్రార్థనతో ముగుస్తుంది. పౌలు మిషనరీగాను, కాపరిగాను, అపొస్తలునిగాను సేవించాడు కాబట్టి, ప్రజలు ఒక సత్యమును వినినంత మాత్రమున దానిని గుర్తించరు లేదా అంగీకరించరు అని తెలుసుకున్నాడు. అతని యొద్ద జీవపు మాటలు ఉన్నాయని అతనికి తెలుసు, కాని తన సొంత శక్తితో అతడు ఎఫెసీయులను నమ్మించలేడు అని కూడా అతడు గ్రహించాడు. కాబట్టి, పరిశుద్ధాత్ముడు వారి మనస్సులను ప్రకాశింపజేయాలని, తద్వారా వారు అతని అధికారమును మరియు బోధనను అంగీకరించాలని అతడు ప్రార్థించాడు. తత్ఫలితంగా, వారు దేవుని రాజ్యమును నిర్మించు, దాని పౌరులను ఆశీర్వదించు మార్గములలో జీవించాలని అతడు ప్రార్థించాడు.

ఈ పత్రిక యొక్క ప్రధాన భాగము దేవుని రాజ్యముతో అనుబంధములో పౌరత్వము మరియు పరిపాలనను గూర్చి మాట్లాడు విధానమును మనము ఇప్పటి వరకు చూశాము కాబట్టి, ఇప్పుడు ఎఫెసీ. 4:1-6:20లో నమోదు చేయబడిన జీవించుటకు సూత్రములను చూడవలసియున్నది.

రాజ్యములో జీవించుట కొరకైన ఈ సూత్రములలో క్రైస్తవ ప్రవర్తనలను మరియు స్వభావములను గూర్చిన అనేక విభిన్నమైన ఉపదేశములు ఉన్నాయి, కాని వాటిని నాలుగు బిందువులలో సంగ్రహించవచ్చు: మొదటిగా, ఎఫెసీ. 4:1-16లో రాజ్యములో సంఘ క్రమము; రెండవదిగా, 4:17-5:20లో రాజ్యమును పవిత్రపరచుట; మూడవదిగా, 5:21-6:9లో రాజ్యములో కుటుంబ క్రమము; మరియు చివరిగా, 6:10-20లో రాజ్యము యొక్క పోరాటము. రాజ్యములో సంఘ క్రమమును పరిగణించుచు ఆరంభిద్దాము.

రాజ్యములో సంఘ క్రమము (4:1-16). రాజ్యములో సంఘ క్రమమును గూర్చిన భాగము ఎఫెసీయులకు 4:1-16లో కనిపిస్తుంది, ప్రధానంగా సంఘములో నాయకత్వము, ప్రభావము మరియు అధికారము యొక్క స్థానముల మీద దృష్టిపెడుతుంది. మరియు ఈ భూమికలు — వీటిని చాలాసార్లు మనము “స్థానము”లు అని పిలుస్తాము — అందరి ప్రయోజనము కొరకు ఏ విధముగా పని చేస్తాయో పౌలు యొక్క బోధనలు ఉద్ఘాటిస్తాయి. పౌరులు ఒకరిపై ఒకరు అసూయపడేలా ఉండకూడదు గాని, తమ సహోదరి సహోదరులు చేసే ప్రయత్నములను మెచ్చుకోవాలి. ప్రతి యొక్కరు తమ తమ బాధ్యతలను నిర్వర్తించినప్పుడు, అవి దేవుని రాజ్యమంతటికి ప్రయోజనమును చేకూర్చుతాయి. ఎఫెసీ. 4:8లో పౌలు వ్రాసిన మాటల వెలుగులో ఈ ఆలోచనను పరిగణించండి:

అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చెరను చెరగా పట్టుకొనిపోయి మనష్యులకు ఈవులను అనుగ్రహించెనని చెప్పబడియున్నది (ఎఫెసీయులకు 4:8).

ఈ వాక్యభాగములో పౌలు కీర్తనలు 68:18ని నివేదించాడు, అది ప్రభువును యుద్ధము నుండి తిరిగి వచ్చిన విజయవంతమైన రాజుగా చిత్రీకరిస్తుంది. కీర్తనలు 68లో, ప్రభువు తాను జయించిన శత్రువుల నుండి కొల్లసొమ్మును పొందాడు. అయితే, ఈ బహుమానములతో ప్రభువు ఏమి చేశాడు అను విషయము మీద పౌలు దృష్టిపెట్టాడు. జ్ఞానులైన ప్రాచీన రాజుల వలెనె, ఆయన తన విజయము ద్వారా సాధించిన కొల్లసొమ్మును తన సైన్యముతో పంచుకున్నాడు. కాబట్టి, వాస్తవిక భావనలో, ఈ బహుమానములు ఆయన రాజ్యములోని ప్రజలకు ప్రయోజనకరమై ఉన్నవి. మరియు, ఎఫెసీ. 4:7-12లో, పౌలు కొన్ని చాలా ప్రత్యేకమైన వరములను వర్ణించాడు:

అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణముచొప్పున కృప యియ్యబడెను... క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను ఉపదేశకులనుగాను నియమించెను (ఎఫెసీయులకు 4:7-12).

క్రీస్తు తన అనుచరులందరి మీద వరములను కుమ్మరించాడుగాని, ఇక్కడ పౌలు సంఘములోని నాయకులకు ఇవ్వబడిన చాలా ప్రత్యేకమైన వరముల వైపుకు ప్రత్యేకమైన దృష్టిని ఆకర్షించాడు: “అపొస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు.” ఆయన రాజ్యములోని పౌరులు ఒకరినొకరు సేవించుకొనుటకు, క్రీస్తు శరీరమును, లేక రాజ్యమును కట్టుటకు ఈ నాయకులు వారిని బలపరుస్తారు.

కాబట్టి, ఎఫెసీ. 4:11, 12వ వచనములోని ఉద్దేశ్యము కొరకు ఈ ప్రజలకు క్రీస్తు స్వయంగా వరములను ఇచ్చియున్నాడు అని పౌలు స్పష్టము చేస్తాడు, అది పరిచర్య పని కొరకు పరిశుద్ధులను సిద్ధపరచుట అయ్యున్నది. ఇప్పుడు, 1 కొరింథీ మరియు ఇతర స్థలములలో పౌలు తెలిపిన ఆత్మీయ వరములను గూర్చిన ఇతర జాబితాలను నిర్లక్ష్యము చేయుటకు నేను దీని మీద ఎక్కువ దృష్టిని పెట్టుటలేదు, దానిని నిర్లక్ష్యము చేయాలనునది నా ఉద్దేశ్యము కాదు, కాని మనము చాలాసార్లు పరిచర్య చేయుట అను వరములను గూర్చి, సంఘమును సేవించుటకు దేవుని ఆత్మ ద్వారా లేక స్వయంగా క్రీస్తు ద్వారా వరములను పొందుకొనుటను గూర్చి మాట్లాడతాము, చాలాసార్లు వారిని ఒక కోవలో ఉంచి, మన ఆత్మీయ వరములను వారి కంటే తక్కువవైనవాటిగా పరిగణిస్తుంటాము, లేక క్రీస్తు శరీరములో అవి తక్కువ ప్రాముఖ్యమైనవి అనుకుంటాము. ఈ విషయములో నేను క్రీస్తు ద్వారా ఒక ప్రత్యేకమైన రీతిలో వరమును పొందినవారి యొక్క ప్రాముఖ్యతను ఉద్ఘాటించగోరుచున్నాను. మరియు, నేడు మనము దీనిని ఏవిధముగా అర్థము చేసుకొనినను, ఈ ప్రజలు క్రీస్తు శరీరములో ఇతరుల కంటే ఉన్నతమైన పరిచర్యగలవారు కాబట్టి ఈ వరములను పొందలేదుగాని, పరిచర్యలో ఉన్న ఇతర ప్రజలకు వారి పరిచర్య కేంద్రముగా ఉన్నది కాబట్టి ఈ వరములను పొందుకున్నారు.

— డా. బెంజమిన్ క్విన్

రాజ్యమును పవిత్రపరచుట (4:17–5:20). తరువాత, రాజ్యములో సంఘ క్రమము మీద తాను పెట్టిన దృష్టి తరువాత, 4:17-5:20లో పౌలు రాజ్యమును శుద్ధిచేయుట మీద దృష్టిపెట్టాడు. మనము సాతాను యొక్క అంధకార రాజ్యములో పౌరులుగా ఉండగా ఈ అవినీతి, లేదా పాపము మనలో పుట్టి, పోషించబడింది. ఫలితంగా, వెలుగు రాజ్యములోనికి ప్రవేశించువారు పాపమును అధిగమించుటకు ఆధారపడగల నూతన స్వభావములను కలిగియున్నారు. అయినప్పటికీ, సామాన్య అనుభవము ద్వారా మనందరికీ తెలిసిన విధముగా, మన ప్రాచీన, పాపపు స్వభావములు వెలుగు రాజ్య పౌరుల మధ్య కూడా సంపూర్ణముగా అంతరించిపోలేదు. కాబట్టి, ఎఫెసీయులకు 4:22-24లో పౌలు ఎఫెసీయులను ఈ విధంగా ఉపదేశించాడు:

కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే, మోసకరమైన దురాశవలన చెడిపోవు మీ ప్రాచీనస్వభావమును వదలుకొని మీ చిత్తవృత్తియందు నూతనపరచబడినవారై, నీతియు యథార్థమైన భక్తియుగలవారై, దేవుని పోలికగా సృష్టింపబడిన నవీనస్వభావమును ధరించుకొనవలెను (ఎఫెసీయులకు 4:22-24).

దేవుని రాజ్యము సాధ్యమైనంత నైతిక పవిత్రతను కలిగియుండాలి. అది దాని రాజు యొక్క స్వభావమును ప్రతిబింబించాలి. ఇది రాజ్యమంతటి యొక్క ప్రయోజనము కొరకై ఉండాలి. దేవుడు నైతిక స్వచ్ఛతను ఆశీర్వదిస్తాడు మరియు ప్రతిఫలమిస్తాడు. కాబట్టి, పాపమును విడిచిపెట్టుట ద్వారా, మరియు సత్క్రియలు చేయుట ద్వారా, పౌరులు దేవుని రాజ్యము యొక్క ఆశీర్వాదమును అభివృద్ధి చేస్తారు మరియు దానిలో వారి యొక్క స్వాస్థ్యమును నిర్థారిస్తారు.

రాజ్యములో కుటుంబ క్రమము (5:21–6:9). రాజ్యములో సంఘ క్రమమును గూర్చి, రాజ్యమును పవిత్రపరచుటను గూర్చి తాను ఉపదేశములను ఇచ్చిన తరువాత, ఎఫెసీ. 5:21-6:9లో రాజ్యములో కుటుంబ క్రమము వైపుకు పౌలు తిరుగుతున్నాడు. ఈ భాగములో, కుటుంబములలో ఉనికిలో ఉండు సరియైన అధికార క్రమములను నిర్వహించుటను గూర్చి పౌలు మాట్లాడాడు. అధికారిక సంబంధములలో ఉన్న ప్రతి వ్యక్తి ఒకరితో ఒకరు కలిగియుండవలసిన అనుబంధమును కూడా అతడు చర్చించాడు. ఈ విభాగము చాలా వరకు సంఘ క్రమమును గూర్చిన పౌలు బోధను ప్రతిబింబిస్తుంది. ఈ భాగములో, సంఘములో నాయకత్వము, ప్రభావముచూపు మరియు అధికారిము కలిగియుండు స్థానములు గలవారిని ప్రతి ఒక్కరు గౌరవించాలి మరియు మర్యాద చూపాలని పౌలు బోధించాడు. మరియు అందరి ప్రయోజనము కొరకు కార్యమును చేయమని నాయకత్వ స్థానములలో ఉన్నవారికి అతడు బోధించాడు.

ఇక్కడ, భార్యభర్తలు, తల్లిదండ్రులు మరియు పిల్లలు, యజమానులు మరియు బానిసలు మధ్య ఉన్న అధికారిక క్రమములను ఉద్ఘాటిస్తూ ఎఫెసీలో ఉన్న కుటుంబ వివాదములను గూర్చి పౌలు మాట్లాడాడు. మరియు ఈ సంబంధాలు కలిగియున్న ప్రతియొక్కరు అందరి యొక్క ప్రయోజనము కొరకు పనిచేయాలని మరియు అందరిని గౌరవించాలని అతడు బోధించాడు. మరొకసారి, దీనికి కారణం ఏమిటంటే ఈ నిర్మాణములు దేవుని రాజ్యములో జీవితమును మెరుగుపరుస్తాయి.

చాలాసార్లు పౌలు మనము ఒకరితో ఒకరము కలిగియున్న సంబంధములను గూర్చి మాట్లాడతాడు, ప్రత్యేకముగా, ఎఫెసీ. 5ను చూసినప్పుడు, అనుదిన జీవితములో చాలా సామాన్యమైన సంబంధములను గూర్చి అతడు మాట్లాడుచున్నాడు. మరియు ఆ సంబంధములలో అధికారము యొక్క స్వభావమును గూర్చి అతడు మాట్లాడుచున్నాడు, కాని ఈ సంబంధములలో జరగవలసిన పరస్పర లోబడుటను గూర్చి కూడా అతడు మాట్లాడుతున్నాడు. 21వవచనములో “క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి” అని పౌలు చెబుతున్న విషయమును గమనించుట చాలా ఆసక్తిని కలిగిస్తుంది. కాబట్టి మనమంతా ఒకరికి ఒకరము లోబడి ఉండాలి అనుటకు ఇది ఒక వ్యాఖ్యగా ఉన్నది. తరువాత అతడు ఈ మూడు జతల సంబంధముల ఉదాహరణలను ఇచ్చుచున్నాడు: భార్యభర్తలు, తల్లిదండ్రులు మరియు పిల్లలు, బానిసలు మరియు యజమానులు. మరియు వీటన్నిటిలో, పాలించుటకు ఒకరికి ఎక్కువ బాధ్యత ఉన్నది అని అతడు గుర్తించుచున్నాడు — వారు భర్తలు, తల్లిదండ్రులు, యజమాని. అయినను, అదే సమయములో, వారిలో ప్రతి ఒక్కరు — అనగా భర్తలు, తల్లిదండ్రులు, యజమానులు — ఏదో ఒక విధముగా వారు సేవచేయుచున్నవారికి లోబడి ఉండాలి అని కూడా అతడు స్పష్టము చేయుచున్నాడు... కాబట్టి, ఆ సంబంధములో ఒక భాగము విషయములో పౌలు నిజముగా బైబిలానుసారమైన సేవక నాయకత్వమును గూర్చి ఆలోచనచేయుచున్నాడు, అనగా వారు తమ అధికారమును కలిగియుంటూనే, ఒక సేవకునిగా దానిని చేయుచు, అదే సమయములో ఇతరులు వారిని గౌరవించునట్లు చూచుకొనుట అయ్యున్నది. కాబట్టి, ఇది మీ పర్యవేక్షణలో ఒకరి కొరకు మిమ్మును మీరు పరస్పరముగా సమర్పించుకొనుటను గూర్చినది అయ్యున్నది.

— డా. డెన్ లఖీఖ్

రాజ్యము యొక్క పోరాటము (6:10-20). చివరిగా, రాజ్యములో సంఘ క్రమము, రాజ్యమును పవిత్రపరచుట, రాజ్యములో కుటుంబ క్రమమును గూర్చి మాట్లాడిన తరువాత, పౌలు వెలుగు రాజ్యము మరియు చీకటి రాజ్యము మధ్య జరుగు పోరాటమును గూర్చి మాట్లాడాడు. ఇక్కడ, వెలుగు రాజ్యములోని ప్రతియొక్కరు దేవుని సైన్యములో సేవ చేయుటకు, అంధకార రాజ్యము మీద ఆత్మీయ యుద్ధము చేయుటకు పిలువబడ్డారు అను వాస్తవమును గూర్చి పౌలు మాట్లాడాడు. ఎఫెసీయులకు 6:11-12లో ఈ చివరి బిందువును పౌలు సంగ్రహించాడు, అక్కడ అతడు ఇలా వ్రాశాడు:

మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము (ఎఫెసీయులకు 6:11-12).

అపవాది మరియు దాని రాజ్యము సంఘము మరియు వెలుగు రాజ్యముతో యుద్ధము చేస్తుంది, మరియు ఈ యుద్ధములో దైవిక రాజు మన నమ్మకత్వమును కోరుతున్నాడు. మన మీద దాడి చేయు దురాత్మలకు విరోధముగా మనము స్థిరముగా నిలబడునట్లు చూచుకొనుటకు, క్రీస్తు మనకు “దేవుని సర్వాంగ కవచమును” అనుగ్రహిస్తాడు. మరియు ఇప్పుడు అందరికీ ఇవ్వబడుచున్న సమాధాన సువార్తను చేత పట్టుకొని మనము లోకములోనికి వెళ్లుచుండగా ఆయన మనలను తన వాక్యముతో నింపుతాడు.

క్రీస్తు శరీరము యొక్క సర్వాంగకవచము మనము గుర్తించవలసిన అత్యంత ప్రాముఖ్యమైన విషయము అయ్యున్నది. దేవుని రాజ్యమును గూర్చి పౌలు చేసిన బోధలో అతడు దీనిని స్పష్టము చేశాడు. ఇప్పుడు, మీరు ఒకవేళ దేవుని రాజ్యములో సభ్యులైయుంటే మరియు దేవుని సర్వాంగకవచము మీ యొద్ద లేకుంటే, మీరు అప్పుడు శత్రువు కంటపడతారు. ఏదెను తోటలో మానవుని పతనమునకు కారణమైన అదే అపవాది, యేసు క్రీస్తును శోధించిన అదే అపవాది, నేడు కూడా పనిచేయుచున్నాడు అని అర్థము చేసుకోండి. విరోధి విసురు ప్రతి అగ్ని బాణమును ఆర్పుటకు సర్వాంగ కవచము కలిగియుండుట ఒక విషయమైతే, దేవుని బిడ్డగా దేవుని రాజ్యమును వ్యాపించుటకు మనకు ఇవ్వబడిన పని కొరకు సర్వాంగ కవచమును ధరించుకొనుట మరొక విషయమైయున్నది. దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనుట విరోధిని ఎదురించుటకు సహాయపడుట మాత్రమేగాక, మన పనిని, ఆత్మలను రక్షించుటను, దేవుని రాజ్యమును వ్యాపింపజేయుటను ప్రభావవంతముగా పూర్తి చేయుటలో కూడా సహాయపడుతుంది.

— పాస్టర్ జాన్సన్ ఒని

ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక యొక్క ప్రధాన భాగము తరువాత, పౌలు తన పత్రిక యొక్క చివరి భాగము వైపుకు దృష్టిని మళ్లించాడు, అది ఎఫెసీ. 6:21-24లో ఉన్న చివరి శుభావచనాల భాగము అయ్యున్నది. ఈ చిన్న వాక్యభాగములో, పౌలు చివరి శుభవచనములను అందించాడు మరియు తుకికు ఈ పత్రికను అందజేస్తాడు అని కూడా సూచించాడు. పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక, వారిని దేవుని రాజ్యము వైపుకు చూపుట ద్వారా విశ్వాసులు ఎదుర్కొను అనేక సవాళ్లను గూర్చి మాట్లాడుతుంది. అతడు వారి కొరకు ప్రార్థించాడు మరియు చీకటి రాజ్యములోగాక, దేవుని వెలుగు రాజ్యములో, క్రీస్తు పరిపాలనలో పౌరులుగా ఎలా జీవించాలో ఉపదేశించుచున్నాడు.

పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును చూసి, దాని ఆకృతి మరియు విషయ సూచికను విశదీకరించాము కాబట్టి, పౌలు ఎఫెసీయులకు చేసిన బోధ యొక్క ఆధునిక అనువర్తనమును గూర్చి మాట్లాడుటకు మనము సిద్ధముగా ఉన్నాము.

ఈ పత్రికను మన జీవితములకు అనువర్తించుటకు లెక్కలేనన్ని మార్గములు ఉన్నాయి, కాని మనము మూడు విషయముల మీద దృష్టిపెడదాము, మరియు క్రీస్తునందు దేవుని రాజ్యములో మన జీవితములోని సంకుచిత కోణములతో ఆరంభించి విశాలమైన కోణములను చూద్దాము. మొదటిగా, రాజును గౌరవించుటను గూర్చి మట్లాడుదాము. రెండవదిగా, రాజ్య నిర్మాణమును గూర్చి మాట్లాడుదాము. మూడవదిగా, విశ్వమును జయించు అంశమును గూర్చి మాట్లాడుదాము. రాజును గౌరవించు అంశముతో ఆరంభిద్దాము.

మనము చూచినట్లుగా, పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక దేవుడు సృష్టియంతటి మీద దైవిక రాజుగా ఉన్నాడు, ప్రత్యేకముగా తన ప్రజల రాజ్యము మీద రాజుగా ఉన్నాడు అను ఆలోచనను నివేదిస్తుంది. మరియు మన దైవిక రాజు మన కొరకు అనేక అద్భుతకరమైన విషయాలు చేశాడు తద్వారా మనము ఆయనను గౌరవిస్తూ, ప్రత్యేకముగా కృతజ్ఞత చెల్లిస్తూ, విధేయత మరియు నమ్మకత్వము చూపిస్తూ ఆయనకు స్పందించాలి. రాజులను గూర్చి మరియు వారి ప్రజలను గూర్చి యేసు మరియు పాత నిబంధన, మరియు ఇతర ప్రాచీన సమాజములు మాట్లాడిన విధానములకు అనుగుణంగా, దేవుడు తన రాజరిక దయను మనకు ఇచ్చుటను ఆయన ప్రేమకు వ్యక్తీకరణములుగా పౌలు వర్ణించాడు. మరియు ఆయన యెడల మనకు ఉన్న బాధ్యతలను కూడా అదే విధంగా వివరించాడు.

ఉదాహరణకు, ఎఫెసీయులకు 2:4-7లో పౌలు మాటలు వినండి:

దేవుడు కరుణాసంపన్నుడై యుండి, మనము మన అపరాధములచేత చచ్చినవారమై యుండినప్పుడు సయితము మనయెడల చూపిన తన మహా ప్రేమచేత మనలను క్రీస్తుతోకూడ బ్రదికించెను... క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనుపరచునిమిత్తము, క్రీస్తుయేసునందు మనలను ఆయనతోకూడ లేపి, పరలోకమందు ఆయనతోకూడ కూర్చుండబెట్టెను (ఎఫెసీయులకు 2:4-7).

ఆయన రాజ్యములో దేవుడు మనలను పౌరులుగా ఎలా చేస్తాడు అనుదానిని గూర్చి పౌలు ఇచ్చు వివరణ ఈ వాక్యభాగము యొక్క విశాలమైన నేపథ్యము అయ్యున్నది. ఈ వచనములలో, మనలను పునరుజ్జీవపరచినప్పుడు దేవుడు తన గొప్ప ప్రేమను కనుపరచిన విధానమును, ఆయన రాజ్యములోనికి మనలను భర్తీ చేయుటను, అధికారము మరియు గౌరవప్రదమైన స్థానములో మనలను ఉంచుటను, మరియు మన స్వాస్థ్యమును మనకు ఇచ్చుటను అతడు ఉద్ఘాటిస్తాడు. ప్రాచీన ప్రపంచంలో, రాజులు తమ ప్రజల యెడల ప్రేమను కనుపరచేవారు, మరియు తమ ప్రజలు కూడా తమ్మును ప్రేమించాలని ఆశించేవారు. ఈ నేపథ్యములలో, “ప్రేమ” అను పదము నమ్మకత్వమును మరియు భక్తిని సూచిస్తుంది, ఇది నేడు మనము మన దేశములను ప్రేమించుటను గూర్చి మాట్లాడుటను పోలియున్నది. దయ మరియు భద్రత ద్వారా రాజులు తమ ప్రేమను చూపేవారు, మరియు వారి రాజ్యములలో పౌరులు విధేయత మరియు స్వామిభక్తి ద్వారా ప్రేమను వ్యక్తపరచేవారు.

దేవుని ప్రజల పట్ల తన ప్రేమను గూర్చి పౌలు ఇచ్చిన వివరణలో దీనినే స్పష్టంగా మనం చూస్తాము. సువార్త యొక్క చారిత్రాత్మక సత్యములు, దేవుడు తన రాజ్య ప్రజలను ప్రేమించుచున్నాడు మరియు మనలను ఉన్నతమైనవారిగా చూచుచున్నాడు అని రుజువు చేస్తాయి. మన యెడల ఆయన యొక్క నమ్మకత్వము, మనలను ముందుగా నిర్ణయించుట, మన కొరకు క్రీస్తు మరణించుట, మన ఆత్మల యొక్క పునరుజ్జీవం, దేవుని రాజ్యములో మన పౌరత్వం, పరలోక రాజైన క్రీస్తుతో మన ఐక్యత మరియు భవిష్యత్తులో మనం పొందబోవు మహిమ వంటి విషయాల్లో వ్యక్తీకరించబడిన ఆయన కనికరము మరియు భద్రత ద్వారా వెల్లడిపరచబడింది. మరియు దేవుడు ఈ అద్భుతమైన వాటన్నిటిని మన కొరకు చేశాడు గనుక మనము ఆయనను ప్రేమించుటకు మరియు గౌరవించుటకు పిలువబడితిమి. ఎఫెసీయులకు 3:17-4:1లో ఈ మాటలను వ్రాసినప్పుడు పౌలు మనస్సులో ఇదే ఉన్నది:

ప్రేమయందు వేరు పారి స్థిరపడి, సమస్త పరిశుద్ధులతో కూడ దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలిసికొనుటకును తగిన శక్తిగలవారు కావలెననియు ప్రార్థించుచున్నాను...క్రీస్తుయేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా...నడుచుకొనవలెనని, ప్రభువునుబట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను (ఎఫెసీయులకు 3:17-4:1).

ఈ వాక్యభాగములో, పౌలు దేవుని ప్రేమ నుండి రెండు అనువర్తనములను తీశాడు. మొదటిగా, దేవునికి మహిమ చెల్లించుట ద్వారా అతడు ఆయనను స్తుతించాడు. రెండవదిగా, దేవుని నుండి వారు పొందుకొనిన “పిలుపుకు తగినట్లు” జీవించుట ద్వారా దేవుని గౌరవించమని కూడా పౌలు తన పాఠకులకు ఉపదేశించాడు.

రాజైన దేవుని మనము గౌరవించవలసిన ఈ రెండు విధానములను గూర్చి ఎఫెసీ పత్రిక మాట్లాడు విధానమును తెలుసుకొనుట సహాయకరముగా ఉంటుంది. మనము ఆయనకు ఆపాదించవలసిన స్తుతి ఆరాధనతో ఆరంభించి, మనము ఆయన పట్ల కలిగియుండవలసిన విధేయతగల జీవితములను చూద్దాము. మొదటిగా స్తుతి ఆరాధనను చూద్దాము.

ఎఫెసీయులకు 5:19-20లో, స్తుతి ఆరాధన ద్వారా దేవునిని గౌరవించాలని పౌలు తన శ్రోతలకు స్పష్టంగా తెలియజేస్తూ ఈ మాటలు వ్రాశాడు:

ఒకనినొకడు కీర్తనల తోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువునుగూర్చి పాడుచు కీర్తించుచు, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుము (ఎఫెసీయులకు 5:19-20).

దేవుని “ఆశీర్వాదములన్నిటిని” బట్టి క్రైస్తవులు ఎల్లప్పుడు ఆయనకు కృతజ్ఞులై ఉండాలి. మరియు కీర్తనలతోను, సంగీతములతోను, ఆత్మసంబంధమైన పాటలతోను హృదయపూర్వకముగా కృతజ్ఞతలు చెల్లించాలి. ఇవన్నీ మనం బాహ్యంగా ఇతరులకు వ్యక్తపరచిన లేదా అంతరంగములో ప్రభువుకు మాత్రమే చెల్లించిన స్తుతి ఆరాధన రూపములుగా ఉన్నాయి.

మనము ఆరాధన కొరకు సృజింపబడితిమి. మనము దేవుని ప్రేమ ద్వారా, దేవుని అపారమైన, అమోఘమైన ప్రేమ ద్వారా సృజింపబడితిమి, కాబట్టి, మనము మన జీవితములను ఆయన వైపుకు త్రిప్పవలసియున్నది, ప్రేమగల విధేయతతో మరియు స్తుతి ఆరాధనతో మన జీవితములను ఆయన వైపుకు త్రిప్పవలసియున్నది. కాబట్టి, మనము చేయు సమస్తము వాస్తవానికి ఆరాధనలో నిలిచియుంటుంది.

— డా. జేమ్స్ ఆర్. హార్ట్

పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో మనము అనుసరించుటకు అనేక స్తుతుల మాదిరులు ఉన్నాయి. ఎఫెసీయులకు 1:13-14లో అతడి పరిచయ స్తుతి మరియు ఎఫెసీయులకు 3:14-21లో అతడు చేసిన దైవస్తోత్ర ప్రార్థనలో దీనికి ఉదాహరణలను మనము చూస్తాము. ఇటువంటి స్తుతి మరియు దైవస్తోత్రము ద్వారా దేవున్ని ఎలా గౌరవించాలి అను విషయమును ఈ రెండు వాక్యభాగాలు మనకు చూపిస్తాయి. మనము చూచినట్లుగా, ఈ రెండు భాగములలో త్రిత్వములోని ప్రతి పురుషమూర్తి యొక్క కార్యము మీద, యేసు ప్రాయశ్చిత్తము, మన కొరకైన దేవుని ప్రత్యక్షత, మరియు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన భవిష్యత్తు మహిమ మీద పౌలు దృష్టిపెట్టాడు. దేవుడు మన మీద చేయు రాజ్యపరిపాలనను బట్టి మనము ఆయనను గౌరవించాలనే నేపథ్యములో అతడు ఈ విషయాలను ప్రస్తావించాడు. దేవుని యొక్క సార్వభౌమ అధికారము, మన యెడల ఆయన దయ, మరియు క్రీస్తులో మన స్వాస్థ్యమును గూర్చి అతడు మాట్లాడాడు.

స్తుతి ఆరాధనతో పాటుగా, ఆయనకు విధేయత చూపుట ద్వారా మన దైవికమైన రాజుగా దేవుని మహిమపరచమని కూడా పౌలు మనకు బోధించాడు.

దేవునికి మనము విధేయత చూపించదగు ఒక మార్గం ఏమనగా, ధైర్యంగా ఆయనకు నిరంతరం విధేయత చూపుట, ఆయనను సంతోషపరచుటకు ప్రయత్నించుట మరియు సమస్త ప్రధానులను, అధికారములను విడిచిపెట్టుట అయ్యున్నది. ఎఫెసీయులకు 5:8-10లో పౌలు ఈ విధంగా వ్రాశాడు:

మీరు పూర్వమందు చీకటియై యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగైయున్నారు... గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు, వెలుగు సంబంధులవలె నడుచుకొనుడి (ఎఫెసీయులకు 5:8-10).

మనము పూర్వము సాతానుడి యొక్క అంధకార సంబంధమైన రాజ్యములో పౌరులుగా ఉన్నాము. అయితే ఇప్పుడు మన విధేయత మారిపోయింది. దేవుడు మనలను తన రాజ్యములోనికి తెచ్చాడు గనుక, మనం ఆయనకు విధేయత చూపించవలసియున్నది; అంధకారసంబంధమైన రాజ్యము యొక్క పాప మార్గములను విడిచిపెట్టి మన నూతన ప్రభువు మరియు రాజును మెప్పించు మార్గములలో జీవించుటకు మనము ఆయనకు విధేయత చూపించవలసినవారముగా ఉన్నాము. ఈ విధేయతను గూర్చి పౌలు ఎఫెసీయులకు 6:24లో మరలా వ్రాశాడు, అక్కడ అతడు షరతులతో కూడిన ఈ ఆశీర్వాదమును ప్రకటించాడు:

మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికందరికిని కృప కలుగును గాక (ఎఫెసీయులకు 6:24).

దేవుని యెడల మన ప్రేమ “మారనిదిగా,” శాశ్వతమైనదిగా, నిరంతరాయంగా, భయభక్తులు కలిగినదిగా, స్థిరంగా ఉండాలి.

దేవుడు మన యొక్క పరిపూర్ణ భక్తి మరియు అంకితభావమును కోరుతున్నాడు అని ఎఫెసీ పత్రిక స్పష్టము చేస్తుంది. మనము ఆరాధించే అన్యదేవతలలో ఆయనను చేర్చడం వల్ల ప్రయోజనం లేదు; ఆయన మన నుండి నమ్మకత్వ భక్తిని కోరుతున్నాడు. ఆయన రాజ్యములోని ఆశీర్వాదములలో ఉపశమనము పొందు విధముగా మాత్రమే, నిష్క్రియాత్మక నమ్మకత్వమును ఆయన కోరుటలేదు. లేదు, ఆయన ఆజ్ఞలన్నిటిని పాటించాలని ఆయన కోరుతున్నాడు, కేవలం ఇతర దేవతలను విడిచిపెట్టుట మాత్రమే కాదుగాని ఆయన మన కొరకు ఏర్పాటుచేసిన అనేక సత్క్రియలను చురుకుగా చేయాలని ఆయన కోరుతున్నాడు.

ఎఫెసీయులకు 2:8-10లోని పౌలు మాటలు ఈ విషయమును గూర్చి కొంత అంతర్దృష్టిని ఇస్తాయి:

మీరు విశ్వాసముద్వారా కృపచేతనే రక్షింపబడియున్నారు; ఇది మీవలన కలిగినది కాదు, దేవుని వరమే ... మరియు వాటియందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్‌క్రియలు చేయుటకై, మనము క్రీస్తుయేసునందు సృష్ఠింపబడినవారమై ఆయన చేసిన పనియైయున్నాము (ఎఫెసీయులకు 2:8-10).

ఈ వాక్యభాగము సూచించుచున్నట్లు, దేవుడు మనలను రక్షించింది కేవలం నశించిపోకుండా ఉండుటకు, లేదా ఆయన రాజ్యములో సుఖమైన జీవితమును అనుభవించుటకు మాత్రమే కాదు. బదులుగా, ఆయన రాజ్యములో మనం ఫలవంతమైన పౌరులుగా ఉండి, ఆయన మనకు అప్పగించిన సత్క్రియలు చేయుటకు క్రీస్తులో దేవుడు మనలను నూతనముగా చేసియున్నాడు.

దేవుని రాజ్యములో, సత్క్రియలు మంచి పాత్రను పోషిస్తాయి: దేవుడు ఆయన రాజ్యమును విస్తృతపరచి పవిత్రపరచుటకు, మహిమ పొందుటకు, మరియు ఆయన ప్రజలకు పరిచర్య చేయుటకు ఇవి పరికరాలుగా ఉన్నాయి. మరియు పౌలు మాటల ప్రకారం, మనము సత్క్రియలు చేయాలని దేవుడు మనలను రక్షించుచున్నాడు. కాబట్టి, ఆయన సేవకులు మరియు పరిచారకులుగా మన నియామకమును అంగీకరించుటయే దేవుని కృపకు సరైన ప్రతిస్పందన అయ్యున్నది. అనగా ఆయన లక్ష్యమును మన లక్ష్యముగా, ఆయన ఉద్దేశ్యమును మన ఉద్దేశ్యముగా అంగీకరించుట అయ్యున్నది. ఇందుమూలముగానే పౌలు తన శ్రోతలను “అర్హమైన” పద్ధతిలో, క్రీస్తునందు దేవుని రాజ్య ప్రజలుగా మనము కలిగియున్న మహిమగల పిలుపును ప్రతిబింబించు విధముగా జీవించుమని ఎల్లప్పుడు పురికొల్పాడు.

మన అనుదిన జీవితములలో రాజును ఘనపరచవలసిన విషయము మీద పౌలు పెట్టిన దృష్టిని ఇప్పటి వరకు మనము పరిగణించాము కాబట్టి, రాజ్యమును నిర్మించు విషయములో పౌలు కలిగియున్న దృక్కోణముల యొక్క ఆధునిక అనువర్తనమును మనము చూచుటకు సిద్ధముగా ఉన్నాము. దేవుడు ప్రీతికరమైన మన స్తుతి మరియు విధేయతను కోరినట్లుగానే, ఆయన భూలోక రాజ్యము విస్తరించి అభివృద్ధి చెందుటలో మనము ఆయనకు సహాయము చేయాలని కోరుతున్నాడు.

క్రీస్తునందు దేవుని రాజ్యమును మనము ఎలా నిర్మించాలో అర్థము చేసుకొనుటలో మనకు సహాయము చేయుటకు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో పౌలు అనేక రూపకములను ఉపయోగించాడు. దేవుని రాజ్యములోని ప్రతి పౌరుడు ఒకరికొకరు మరియు క్రీస్తుతో ఎలా అనుసంధానం కలిగియుంటారు, అదే విధంగా అభివృద్ధి చెందుతున్న దేవుని రాజ్యములో మనం ఎలా సహకరించాలి అను విషయముల మీద ప్రతి రూపకము అంతర్దృష్టిని కలిగిస్తుంది. అలాంటి రెండు రూపకములను మనము చూద్దాము, పౌలు రాజ్యమును దేవుని దేవాలయముతో పోల్చిన విధానమును మొదటిగా చూద్దాము. తరువాత, క్రీస్తు శరీరము మీద అతడు పెట్టిన దృష్టిని మనము పరిగణిద్దాము. మొదటిగా పౌలు ఉపయోగించిన దేవాలయము అను రూపకమును చూద్దాము..

ఎఫెసీయులకు 2:19-22లో పౌలు అన్యజనులైన క్రైస్తవులతో మాట్లాడిన మాటలను వినండి:

మీరు ... క్రీస్తుయేసే ముఖ్యమైన మూలరాయియై యుండగా అపొస్తలులును ప్రవక్తలును వేసిన పునాదిమీద మీరు కట్టబడియున్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి, ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధిపొందుచున్నది. ఆయనలో మీరు కూడ ఆత్మమూలముగా దేవునికి నివాసస్థలమై యుండుటకు కట్టబడుచున్నారు (ఎఫెసీయులకు 2:19-22).

అన్యజనులైన క్రైస్తవులు దేవుని రాజ్యములో పరిపూర్ణమైన పౌరులు, యూదులైన క్రైస్తవులతో పాటుగా సమాన స్థాయిగలవారు అని పౌలు బోధించాడు. మరియు ఈ సత్యమును ఉద్ఘాటించుటకు, అతడు దేవుని రాజ్యమును ఒక భవనముతో పోల్చాడు, ప్రతి క్రైస్తవుని ఆ భవనములో ఒక రాయిగా వర్ణించాడు.

యేసును మూలరాయిగా మరియు అపొస్తలుల బోధకు పునాదిగా వర్ణిస్తూ, ఎఫెసీ. 2లో పౌలు సంఘమును దేవుని మందిరముతో పోల్చుతాడు, తరువాత సంఘము ఆ పునాది మీద కట్టబడుతుంది... కాబట్టి, మూలరాయి ఒక భవనములో అత్యంత ప్రాముఖ్యమైన రాయి అయ్యున్నది, మరియు ఆ మూలరాయిని దృష్టిలో ఉంచుకొని సమస్తమును నిర్మించవలసియుంటుంది. కాబట్టి, మూలరాయి నిజమైనది కాని యెడల, లేక మూలరాయి విఫలమైతే, భవనము అంతా పడిపోతుంది. మరియు అపొస్తలులు భవనము యొక్క పునాదిని పోలియున్నారు. వారి బోధన, వారు సాక్ష్యమిచ్చుట, యేసును గూర్చి మరియు ఆయన చేసిన క్రియలను గూర్చి వారిచ్చు సాక్ష్యము సమస్తమునకు ఆధారముగా ఉన్నది. కాబట్టి, దేవుని ప్రజలు లేక 1 పేతురు 2లో పేతురు రూపకమును ఉపయోగించినట్లయితే దేవుని ప్రజలు ఆ పునాది మీద నిర్మించబడు సజీవమైన రాళ్లు అయ్యున్నారు. కాబట్టి, సంఘము దేవుడు నివసించు స్థలము అయ్యుండాలి అను మన ఉద్దేశ్యమును మరియు క్రీస్తు ద్వారా, క్రీస్తు బోధన మరియు అధికారము మనము చేయు, చెప్పు మరియు బోధించు సమస్తమునకు ఆధారము అయ్యున్నది అని అది బయలుపరుస్తుంది.

— రెవ. మైఖేల్ గ్లోడో

ఈ రూపకములో, క్రీస్తు ముందుగా ఉన్నాడు, పునాదికి మూలరాయిగా ఉన్నాడు, మిగిలిన రాళ్లన్నిఆయన మీద ఆధారపడియున్నవి. మొదటి శతాబ్దపు అపొస్తలులు మరియు ప్రవక్తలు ఉన్నతమైన అధికారం కలిగియున్నారు, ఎందుకంటే క్రీస్తు వారిని తన పునాది ప్రతినిధులుగా స్థిరపరచాడు. మరియు ఇతర క్రైస్తవులందరూ ఎటువంటి భిన్నత్వములు లేకుండా ఆ నిర్మాణములో రాళ్లుగా ఉన్నారు. ఇప్పుడు, ఈ కట్టడము యొక్క లక్ష్యము దేవుని నివాసముగా ఉండుట అయ్యున్నది, తద్వారా దేవుడు ఆయన ప్రజల మధ్య నివసిస్తాడు. సొలొమోను 2 దినవృత్తాంతములు 6లో ప్రకటించినట్లుగా ఇశ్రాయేలు రాజ్యము పాత నిబంధనలో, ముఖ్యంగా యెరూషలేములోని మందిరము మరియు దేవాలయము ద్వారా ఇటువంటి ఆశీర్వాదమునే అనుభవించింది. అయితే అన్యజనులు దేవుని సన్నిధిలో నివసిస్తారు అని కూడా పాత నిబంధన బోధించింది. ఉదాహరణకు, యెషయా 66:19-20లో దేవుని మాటలను వినండి:

వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. సర్వజనములలోనుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసికొనివచ్చెదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు (యెషయా 66:19-20)

ఈ వాక్యభాగములో దేవుడు ఇశ్రాయేలు రాజ్యమును పునరుద్ధరించినప్పుడు — యేసు ద్వారా క్రొత్త నిబంధనలో ఆయన దీనిని చేయుటను ఆరంభించాడు — ఇశ్రాయేలీయులు దేవునిని ఆరాధించుటకు యెరూషలేములోని దేవాలయముకు తిరిగి వస్తారని దేవుడు బోధించాడు. మరియు అద్భుతముగా, అన్యజనులు వారితో కూడా వస్తారు, వాస్తవానికి ఇశ్రాయేలీయుల శేషమును దేవునికి నైవేద్యముగా తీసుకొనివస్తారు. కాబట్టి, యూదులు మరియు అన్యజనులు ఇద్దరు ఆయన ఆలయముగా దేవుని సన్నిధిలో నివసిస్తారని పౌలు బోధించినప్పుడు, దేవుని రాజ్యము దాని అంతిమ లక్ష్యమువైపు కదులుతుంది అని అతని అర్థమై ఉంది. అనగా దేవుని రాజ్య ఆశీర్వాదములు ఇప్పుడు అన్ని జాతులకు విస్తరించబడినవి. అయితే పౌలు ఈ నిర్దిష్ట రూపకమును ఎందుకు ఉపయోగించాడు? సరియైన రీతిలోనే, సంఘములో యూదులు మరియు అన్యజనుల మధ్య సమాధానము కలుగజేయుటకు అతడు దీనిని ఉపయోగించాడు.

పౌలు దినములలో, యూదులు ఎన్నుకొనబడిన దేవుని ప్రజలు గనుక అన్యజనుల కంటే గొప్పవారనే ఆలోచనను కొందరు యూదులైన క్రైస్తవులు కలిగియుండేవారు. వారు చాలాకాలం దేవుని నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదములు పొందారు గనుక వారు అర్హులని భావించుట ఆరంభించారు. అయితే వాస్తవం ఏమిటంటే మానవులందరూ, యూదులు మరియు అన్యులు ఒకే విధముగా, క్రీస్తు లేకుండా నశించిపోతారు. మనలో ఏ ఒక్కరము ఆయన ఆశీర్వాదమునకు అర్హులము కాము. కేవలము క్రీస్తు మాత్రమే ఆశీర్వాదముకు అర్హుడుగా ఉన్నాడు. కృతజ్ఞతాపూర్వకంగా, ఆయనయందు విశ్వాసము ద్వారా మనము క్రీస్తుతో ఐక్యపరచబడ్డాము గనుక, దేవుడు మనలను ఆశీర్వాదములకు అర్హులుగా చేస్తాడు. కాబట్టి, నేడు దేవుని రాజ్యమును మనం నిర్మించుచుండగా, దేవునిని గౌరవించి ఆయన సన్నిధిలో జీవించాలనే గొప్ప విషయము మీద మనం దృష్టిపెట్టాలి, మరియు మన మహిమ కాకుండా దేవుని మహిమను పెంచుటకు ఆశపడాలి. మరియు ఒకరిపట్ల ఒకరు నమ్రతను చూపాలి, ఏ విశ్వాసి మరొక విశ్వాసి కంటే ఎక్కువ ఆశీర్వాదములకు అర్హుడు కాదు అని మనం గ్రహించాలి.

మనము ఒకరి నుండి ఒకరము సరికాని రీతిలో వేరగు విధానమును గూర్చి లేక ఇతరులకు హాని కలిగించు విధముగా మనలను మనము సరికాని రీతిలో హెచ్చించుకొను ప్రతి మార్గమును గూర్చి మనము మారుమనస్సు పొందాలని దేవుని దేవాలయముగా సంఘము అని పౌలు ఉపయోగించిన రూపకము తెలియజేస్తుంది. జాతి, దేశము, మరియు తెగలు వంటివి దేవుని దేవాలయమును ఎన్నడును విభాగించకూడదు. సంఘ నాయకులు తమను తాము విశ్వాసుల కంటే ఎక్కువగా ఎన్నడును పరిగణించుకొనకూడదు. ధనికులైన క్రైస్తవులు పేదలైన క్రైస్తవుల కంటే గొప్ప ఘనతను ఎన్నడును పొందకూడదు. దేవుని రాజ్యమును నిర్మించు ప్రక్రియలో మనము మన స్థానిక సంఘమును లేదా మన డినామినేషన్ను అధికంగా భావించి ఇతర సంఘస్తులను చిన్నచూపు చూసి స్వతంత్రంగా పనిచేయు ప్రయత్నాలు మనము ఎన్నడును చేయకూడదు. అట్టి సందర్భాలన్నిటిలో, మన వ్యర్థతను మరియు అహంకారమును ప్రక్కనబెట్టి దేవుని రాజ్యములో మనతో సమానులుగా విశ్వాసులందరిని హత్తుకోవాలి అని పౌలు బోధించుచున్నాడు.

ఇప్పుడు, దేవాలయము అను పౌలు యొక్క రూపకము ఎంత అద్భుతమైనది అయినప్పటికీ, రాజ్యమును మనము ఏ విధముగా నిర్మించాలో వివరించుటకు ఎఫెసీ పత్రికలో పౌలు ఎక్కువగా ఉపయోగించిన రూపకము శరీరము — ముఖ్యముగా క్రీస్తు శరీరము — అయ్యున్నది.

క్రీస్తు శిరస్సు అయ్యున్నాడు మరియు విశ్వాసులందరు కలిసి క్రీస్తు శరీరముగా ఉన్నారు అని పౌలు బోధించాడు. పౌలు అనువర్తనము కొరకు అనేక సూచనలను బయలుపరచుటకు ఈ రూపకమును 1, 3, 4 మరియు 5 అధ్యాయములలో ఉపయోగించాడు. ఎఫెసీయులకు 1:20-23లో ఈ మాటలతో అతడు ఈ రూపకమును ఉపయోగించాడు:

[దేవుడు] క్రీస్తును మృతులలోనుండి లేపి, సమస్తమైన ఆధిపత్యముకంటెను అధికారముకంటెను ... ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వ మున కూర్చుండబెట్టుకొనియున్నాడు. మరియు సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము (ఎఫెసీయులకు 1:20-23).

దేవాలయము అను రూపకము వలెనే, ఇది కూడా దేవుని రాజ్యమును సూచిస్తుంది: క్రీస్తు పరలోకములో అసీనుడైయున్నాడు, మరియు సంఘమైన, తన ప్రజల ప్రయోజనము కొరకు పాలిస్తున్నాడు. ఎఫెసీయులకు 3:6లో పౌలు ఈ మాటలకు కొన్ని అదనపు విషయములను జోడిస్తూ ఈ రూపకమును కొనసాగించాడు:

ఈ మర్మమేదనగా అన్యజనులు, సువార్తవలన క్రీస్తుయేసునందు, యూదులతోపాటు సమానవారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారనునదియే (ఎఫెసీయులకు 3:6).

యూదులు మరియు అన్యుల మధ్య సమాధానము మీద పౌలు పెట్టిన ఉద్ఘాటన ఈ వాక్యభాగములో మరొకసారి కనబడుతుంది. ఒకే క్రీస్తు శరీరములోని సభ్యులుగా, యూదా క్రైస్తవులు మరియు అన్య క్రైస్తవులు క్రీస్తుతోను, క్రీస్తునందు ఒకరితో ఒకరు ఐక్యపరచబడియున్నారు అని అతడు చూపించాడు. మరియు ఇరువురు క్రీస్తునందు ఉన్న వాగ్దానములలో పాలుపంచుకుంటారు కాబట్టే ఆశీర్వాదములను పొందుకుంటారు అని కూడా అతడు ఉద్ఘాటించాడు.

అయితే, క్రీస్తు శరీరము అను రూపకమును 4:1-16లో పౌలు పరిపూర్ణంగా ఉపయోగించాడు, అక్కడ రాజ్యములో సంఘ క్రమము మీద అతడు దృష్టిపెట్టాడు. సంఘములో నాయకత్వ, ప్రభావ మరియు అధికార క్రమమును గూర్చి అక్కడ అతడు ఉద్ఘాటించాడు, దీని ద్వారా మిగిలిన సంఘము పరిచర్య చేయుటకు బలపరచబడుతుంది. దేవుడు మన కొరకు సిద్ధపరచిన సత్క్రియలు ఒకరికొకరు సేవ చేయుటకు, సంఘమును నిర్మించుటకు అయ్యున్నవి అని అతడు వాదించాడు, తద్వారా విశ్వము యొక్క ప్రభువు పాలించుటకు తగిన రాజ్యముగా అది మారుతుంది. ఎఫెసీయులకు 4:11-13లోని పౌలు మాటలను వినండి:

మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములోను ఏకత్వముపొంది, సంపూర్ణ పురుషులమగువరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగువరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును, పరిచర్య ధర్మము జరుగుటకును, ఆయన [దేవుడు] కొందరిని అపొస్తలులనుగాను, కొందరిని ప్రవక్తలనుగాను, కొందరిని సువార్తికులనుగాను, కొందరిని కాపరులనుగాను, ఉపదేశకులనుగాను నియమించెను (ఎఫెసీయులకు 4:11-13).

దేవుడు సంఘములో నాయకులను నియమించాడు, గనుక ఒకరికి ఒకరు సేవ చేయుటకు వారు ఇతరులను సిద్ధపరచాలి. మరియు ఈ నాయకులు సంఘమును రెండు లక్ష్యముల వైపు నడిపించాలి. వాటిలో ఒకటి “విశ్వాస విషయములో ఏకత్వము” పొందుట. ఇక్కడ సంఘము సిద్ధాంతపరముగా ఏకత్వము కలిగి, పరిపక్వత కలిగి ఖచ్చితమైన అవగాహన కలిగియుండాలి, మరియు సువార్త యొక్క ప్రాథమిక అవగాహనతో మాత్రమే సంతృప్తి చెందకూడదు అని పౌలు భావించాడు. ఇది, క్రీస్తునందు దేవుని రాజ్య ఆశీర్వాదములను అర్థం చేసుకొనుటకు తన పాఠకులకు దేవుడు శక్తినిస్తాడు అని పౌలు చేసిన మునుపటి ప్రార్థనలకు అనుగుణంగా ఉంది.

నాయకులను ఎన్నుకొనుట సంఘములో ఐక్యతను కలిగించిన ప్రాముఖ్యమైన విషయములలో ఒకటైయున్నది: అపొస్తలులు, సంఘములో అధ్యక్షులు, పరిచారకులు, పెద్దలు. తుదకు, అపొ. 6 మొదలు, విశ్వాసుల సంఖ్య పెరిగినప్పుడు, సమస్యలు ఎదురైయ్యాయి, మరియు నిర్ణయాలు తీసుకొనుటకు నాయకులు అవసరమైయ్యారు, క్రమపరచుటకు నాయకులు అవసరమైయ్యారు. కాబట్టి, ఆదిమ సంఘములో సంఘము యొక్క నాయకత్వము ఐక్యపరచు కారకముగా ప్రాముఖ్యమైయ్యింది.

— డా. లాస్ న్యూమాన్

“క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుట” రెండవ లక్ష్యము అయ్యున్నది. ఈ లక్ష్యము సార్వత్రికమైనది; పౌలు ఎఫెసీయులకు 1:10లో చెప్పినట్లగా సృష్టి అంతటిని క్రీస్తు పాలనలోకి అది తీసుకొనిరావలసియున్నది. ఇది ఎంత అద్భుతముగా వినిపించినప్పటికీ, సరియైన సంఘ నాయకత్వము మరియు క్రైస్తవుల మధ్య సమర్పణగల పరిచర్య ద్వారా, సర్వ సృష్టికి ప్రభువుగా క్రీస్తును మహిమపరచుటకు సంఘము మార్గమును సిద్ధపరుస్తుంది. ఎఫెసీయులకు 4:15-16లో పౌలు ఈ రూపకమును కొనసాగించాడు, అక్కడ సంఘ నాయకులు ప్రజలకు నేర్పించవలసిన కొన్ని నిర్దిష్ట విషయాలను వివరించాడు:

ప్రేమగలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలె ఉండుటకు, మనమన్ని విషయములలో ఎదుగుదము. ఆయన శిరస్సయియున్నాడు, ఆయననుండి సర్వశరీరము చక్కగా అమర్చబడి, తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలువలన గలిగిన బలముచేత అతుకబడి, ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసికొనుచున్నది (ఎఫెసీయులకు 4:15-16).

ప్రతి సంఘ నాయకుడు సంఘముతో ప్రేమతో సత్యమును మాట్లాడినప్పుడు, శరీరము ఆ సత్యమును నేర్చుకొంటుంది. తత్ఫలితంగా, ప్రతి క్రైస్తవుడు ఇతరులకు అర్థవంతంగా సేవ చేయగలడు, సేవ మరియు ప్రోత్సాహపరచు పనులను చేయగలడు. అయితే మరొక విషయమును కూడా గమనించండి: ప్రతి సభ్యుడు కార్యము చేయుచుండగా, సంఘము ఎదుగుతూ ”ప్రేమయందు” దానిని అది కట్టుకొనవలసియున్నది. ప్రేమ నాయకుని బోధన మరియు సంఘము యొక్క సేవా కార్యక్రమాలు రెండింటినీ కలిగియుండాలి.

దేవుడు మనపట్ల చూపు ప్రేమ మరియు దేవుని పట్ల మనము చూపు ప్రేమ ప్రధానంగా రాజ్యములో విధేయత మరియు అంకితభావము దృష్ట్యా నిర్వహించించబడినట్లే, ఇతర క్రైస్తవుల పట్ల మనము చూపు ప్రేమ కూడా ఇదే విధముగా నిర్వచించబడాలి. మన పొరుగువారి పట్ల మనము కలిగియుండు ప్రేమ ఒక వ్యక్తిగత సంబంధమును మించినదిగా ఉన్నది. బదులుగా, ఇది వారు మనకు వ్యక్తిగతముగా పరిచయం లేనప్పటికీ, క్రీస్తునందు ఇతరుల ప్రయోజనమును అన్వేషించుటకు స్వామిభక్తితో కూడిన సమర్పణ మరియు అంకితభావము అయ్యున్నది. అయితే ఈ ప్రేమ కేవలం సహకారం లేదా పరస్పర సహాయం మాత్రమే కాదు. బదులుగా, మన తోటి విశ్వాసులు క్రీస్తు స్వాస్థ్యములో భాగస్తులు అని క్రైస్తవ ప్రేమ అర్థం చేసుకుంటుంది. క్రీస్తు వారిని తనవారిగా చేసుకొనుటకు మరణించుటకు ఇష్టపడ్డాడు మరియు వారు ఆయనకు చెందినవారు గనుక ఆయన మహిమ మరియు గౌరవమును పొందుతాడు. ఇది వారిని మరింత విలువైనవారిగా పరిగణించుటకు మరియు వారికి పరిచర్య చేయుటకు ప్రయత్నాలు చేయుటకు మనలను పురికొల్పాలి.

విశ్వాసుల యొక్క ఐక్యతను మనము చూడగోరితే, అపొస్తలుల కార్యములను పరిశీలించి, మరొకసారి, 2వ అధ్యాయములో ఉన్న పెంతెకొస్తు దినమును చూడవలసియున్నది, మరియు పెంతెకొస్తు తరువాత వారు అపొస్తలుల సిద్ధాంతమును హత్తుకొని, వాక్యమును బోధించారు అని మీరు చూస్తారు; వారు రొట్టె విరచుటకు కూడుకున్నారు, దీనిలో ప్రభువు బల్ల భాగమైయున్నది అని, బాప్తిస్మము మరియు సహవాసము కూడా భాగమైయున్నవి అని నాఅభిప్రాయము. వారు ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కూడా వహించారు, ఒకరికి ఒకరు సేవ చేశారు, మరియు దేవుడు వారికి ఇచ్చిన వరములను వారు ఉపయోగించారు. అవును, నేను ఎఫెసీ. 4ను కూడా ఉపయోగించుచున్నాను. కాబట్టి, వాక్యము, సువార్త, సంస్కారములు, పరస్పర ప్రేమ మరియు మరొకరి పట్ల శ్రద్ధ శరీరమును ఒక కుటుంబముగా ఐక్యపరచింది. అవును, ఒక కుటుంబమును ఏమి ఐక్యపరుస్తుందో మీరు తెలుసుకోవాలనుకుంటే, దానిని చూడండి. మరియు మనము ఒక పెద్ద కుటుంబము అయ్యున్నాము కాబట్టి, క్రీస్తు శరీరమును కూడా ఇదే ఐక్యపరుస్తుంది.

— డా. డాని ఎకిన్

రాజును మహిమపరచుట మరియు రాజ్యమును కట్టుటను ఇప్పటి వరకు మనము విశదీకరించాము కాబట్టి, మన ఆధునిక లోకమునకు ఎఫెసీ పత్రికను అనువర్తించగల మూడవ మార్గమును మనము చూడవలసియున్నది: విశ్వమును జయించుట. క్రీస్తు ఇప్పుడు సంఘముకు రాజుగా ఉన్నాడు, కాని ఒక దినము వస్తుంది అప్పుడు ఆయన తన శత్రువులందరిని జయించి విశ్వమంతటిని పాలిస్తాడు.

ఇంతకు ముందు మనము చూచినట్లు, క్రీస్తునందు దేవుని రాజ్యము యొక్క ఆరంభము మరియు కొనసాగింపులో, దేవుని రాజ్యము పస్తుత పాపపు మరియు మరణపు యుగముతో అతివ్యాప్తి కలిగి ఉనికిలో ఉంటుంది. కాబట్టి, నేడు, క్రీస్తు రాజ్యమునకు వ్యతిరేకత కొనసాగుతుంది. మరియు దేవుని శక్తులు — సంఘముతో సహా — దయ్యములతో పోరాడుతూ, పాపపు బానిసత్వము నుండి మానవులను విడిపించుటకు ప్రయత్నిస్తాయి. అయితే రాజ్యము యొక్క నెరవేర్పులో, యేసు తిరిగి వస్తాడు. మరియు ఆయన తిరిగి వచ్చినప్పుడు, ఆయన విరోధుల మీద ఆయన తన అంతిమ తీర్పును ప్రకటిస్తాడు. చీకటి శక్తుల మీద ఈ భవిష్యత్ విజయము నిశ్చయమైనది, కాని ఆ దినము వరకు, క్రీస్తు మరియు ఆయన రాజ్యమును సేవించుటలో వారితో పోరాడుటకు మనము బాధ్యతను కలిగియున్నాము.

అయితే, క్రీస్తు రాకడ కొరకు మనము ఎదురుచూచుచుండగా, దయ్యపు శక్తులతో పోరాటములో మనము పైచేయి కలిగియున్నాము. మన రాజు వారికంటే పైన అధికారము కలిగి ఇప్పటికే ఆసీనుడైయున్నాడు, మరియు మనము ఆయనతో ఆసీనులమైయున్నాము. వాటి దుష్ట ఆధిపత్యము నుండి దేవుడు మనలను ఇప్పటికే విమోచించియున్నాడు, మరి ఎక్కువ మందిని ఆయన విమోచించుటను కొనసాగించుచున్నాడు. మరియు దేవుని గొప్ప ఆశీర్వాదముల వలన, మనపై మన శత్రులు చేయగల అత్యంత ఘాతుకమైన దాడిని కూడా ఎదురించుటకు పరిశుద్ధాత్మ మనకు శక్తిని అనుగ్రహిస్తాడు. ఎఫెసీయులకు 6:13, 16లోని పౌలు మాటలను వినండి:

అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ... ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు (ఎఫెసీయులకు 6:13, 16).

ఆయన కృప మరియు ఆత్మ ద్వారా, దయ్యపు సమూహములకు వ్యతిరేకముగా నిలువబడుటకు దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. సంఘము ఇప్పుడు పొందుచున్న అనేక ఆశీర్వాదముల వలన, వాటి ఓటమి నిశ్చయమని దయ్యములకు తెలిసేయున్నది. వాస్తవానికి, సంఘము దేశములన్నిటి మధ్య వ్యాపించుచున్నది అను అదే వాస్తవము దేవుని శత్రువులందరి యొక్క నాశనముకు సాక్ష్యముగా ఉన్నది అని కూడా పౌలు చెబుతున్నాడు. ఎఫెసీ. 3:8-11లో పౌలు ఏమి వర్ణిస్తున్నాడో గమనించండి:

దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున, పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి, శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలమునుండి మరుగైయున్న ఆ మర్మమునుగూర్చిన యేర్పాటు ఎట్టిదో అందరికిని తేటపరచుటకును...ఈ కృప అనుగ్రహించెను (ఎఫెసీయులకు 3:8-11).

ఈ వాక్యభాగము ప్రకారం, దేవుని “నిత్యసంకల్పము” ఇప్పుడు “క్రీస్తుయేసునందు తేటపరచబడెను.” దేవుడు “పూర్వకాలమునుండి ఈ మర్మమును మరుగుచేసెను.” అయితే ఇప్పుడు క్రీస్తు వచ్చాడు కాబట్టి, “పరలోకములో ప్రధానులకును అధికారులకును” తన “నానావిధమైన జ్ఞానము” లేక తన “పలు ముఖములుగల జ్ఞానమును” కనుపరచుటకు సకలజనుల మధ్య సంఘ వ్యాప్తిని దేవుడు ఉపయోగించుకొనుచున్నాడు.

మానవులను సృష్టించక మునుపే, దయ్యపు శత్రువులకు తన మహిమను వెల్లడిచేయు నిమిత్తము దేవుడు సంఘమును ఉపయోగించుకొనుటకు నిర్ణయించుకున్నాడు. మరియు ఇప్పుడు క్రీస్తు వచ్చియున్నాడు కాబట్టి, సంఘమును ఎదిగింపజేయుట మరియు వ్యాపింపజేయుట దయ్యము యొక్క అతిపెద్ద ప్రణాళికలను కూడా జయించు దేవుని శక్తిని కనుపరుస్తుంది. క్రీస్తు సంఘము సమస్తమును తన వైపునకు సమాధానపరచుకొను దేవుని శక్తికి రుజువుగా ఉన్నది. ఎందుకంటే, ఆయన పాపము అను భ్రష్టత్వము నుండి మరి ఎక్కువమంది మానవులను విమోచించగలిగితే, మరియు మన వంటి వారిని కూడా ఒకరితో ఒకరిని, మరియు ఆయనతో సమాధానపరచగలిగితే, క్రీస్తునందు ఆయన సాధించలేనిది ఏదియు లేదు.

అయితే సంఘము దేవుని నిత్య శక్తి మరియు జ్ఞానము యొక్క మహిమకరమైన ప్రత్యక్షత మాత్రమే కాదు. సంఘము క్రీస్తు యొక్క బహుమానము కూడా అయ్యున్నది. మనము ఆయన తన శత్రువుల రాజ్యములో నుండి యుద్ధము చేసి గెలుచుకున్న సంపదగా ఉన్నాము. మనము దేవుడు రక్షించు ప్రజలమైయున్నాము, భద్రపరచుటకు మరియు వివాహము చేసుకొనుటకు క్రీస్తు తన జీవితమును అర్పించిన ఆయన ప్రియమైన వధువుగా ఉన్నాము. ఎఫెసీయులకు 5:23-27లో క్రీస్తు మరియు సంఘమును గూర్చిన పౌలు వివరణను వినండి:

క్రీస్తు సంఘమునకు శిరస్సై యున్న లాగున పురుషుడు భార్యకు శిరస్సై యున్నాడు ... క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను, నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దానిని నిలువబెట్టుకొనవలెనని ... దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను (ఎఫెసీయులకు 5:23-27).

క్రీస్తు సంఘమును తన వధువుగా ప్రేమించుచున్నాడు మరియు విలువనిచ్చుచున్నాడు. మరియు తనతో సమస్తమును సమాధానపరచుకొను ప్రక్రియలో మరియు విశ్వమును పునరుద్ధరించి పవిత్రపరచే ప్రక్రియలో, ఆయన మనతో ఆరంభించుచున్నాడు. గనుక, సంఘము యొక్క ఉనికి, సంఘము యొక్క క్షమాపణ, మరియు సంఘము యొక్క పవిత్రీకరణ దేవుని రాజ్యము ఆరంభమైనది అని రుజువు చేస్తుంది. మరియు దేవుని రాజ్యము ప్రస్తుతము వ్యాపించబడుతుంది కాబట్టి, అది నిశ్చయముగా నెరవేర్చబడుతుంది. మరియు అది నెరవేర్చబడినప్పుడు, దయ్యములు పూర్తిగా నాశనం చేయబడతాయి మరియు క్రీస్తు పాలన సంపూర్ణమవుతుంది. ఎఫెసీయులకు 1:22-23లో క్రీస్తును గూర్చి పౌలు ఇలా వ్రాశాడు:

మరియు [దేవుడు] సమస్తమును ఆయన పాదములక్రింద ఉంచి, సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము; సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై యున్నది. (ఎఫెసీయులకు 1:22-23).

ఇక్కడ పౌలు మాటలు ఆశ్చర్యకరముగా ఉన్నాయి. సంఘము ఆశీర్వాదించబడునట్లుగా క్రీస్తు విశ్వముకు రాజుగా హెచ్చించబడ్డాడు. మనము ఆయన సంపూర్ణతయై, ఆయన శరీరమై ఉన్నాము. తన సొంత స్థాయి మరియు యోగ్యత కారణముగా క్రీస్తు పాలించుటకు అర్హుడు, కాని ఆయన సంఘమును ఎంతగా ప్రేమించుచున్నాడు అంటే, మనలను ఆశీర్వదించుటకు కూడా ఆయన పాలించుచున్నాడు. సంఘములో, యూదులు మరియు అన్యులు, భార్యభర్తలు, తల్లిదండ్రులు, యజమానులు, మరియు బానిసలు ఒకరితో ఒకరు మరియు దేవునితో సమాధానపరచబడియున్నారు. దేవుడు బలవంతుడు, మంచివాడు మరియు జ్ఞానముగలవాడు అనుటకు, మరియు క్రీస్తునందు సర్వ సృష్టిని ఆయన నూతనపరచుటను ఆరంభించియున్నాడు అనుటకు ఈ అద్భుతమైన ఆశీర్వాదము ఒక అనుకూలమైన ఆధారముగా ఉన్నది.

ఈ పాఠములో పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికను మనం విశదీకరించాము. పౌలు ఈ పత్రికను ఎందుకు వ్రాశాడో అర్థము చేసుకొనుటకు, మనము దాని నేపథ్యమును చూశాము. వారి దినములలో దేవుని ప్రజలు అనేక సవాళ్లను ఎదుర్కొనుచుండగా వారిని పౌలు ప్రోత్సహించిన విధానమును చూచుటకు పత్రిక యొక్క నిర్మాణము మరియు ఆకృతి మరియు విషయ సూచికను కూడా మనము చూశాము. చివరిగా, నేడు మన జీవితములకు ఔచిత్యముగా ఈ పత్రిక యొక్క ఆధునిక అనువర్తనమును కూడా మనము పరిగణించాము.

పౌలు ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో అనేక ప్రాముఖ్యమైన పాఠములు ఉన్నాయి, అవి కేవలం ఎఫెసు మరియు లైకస్ లోయలో ఉండిన మొదటి శతాబ్దములోని సంఘములకు మాత్రమే కాదుగాని, ప్రతి తరములోని క్రీస్తు అనుచరులందరికి వర్తిస్తాయి. మన విశ్వాసము ప్రజలు తమ పాపముల నుండి రక్షణను పొందుటను గూర్చినది మాత్రమే కాదు అని అది మనకు బోధిస్తుంది. బదులుగా, క్రైస్తవ విశ్వాసము సాతాను రాజ్యమును సమూలముగా నాశనము చేయుటను గూర్చినది, మరియు క్రీస్తునందు దేవుని రాజ్యమును కట్టుట మరియు వ్యాపింపజేయుటను గూర్చినది అయ్యున్నది. క్రీస్తునందు దేవుని రాజ్యము యొక్క అద్భుతమును గూర్చి మనము కలిగియున్న అవగాహనలో మనము ఎదుగుచుండగా, మనకు విరోధముగా నిలువబడు శక్తులన్నిటిని ఎదురించుటకు మనము మరి ఉత్తమమైన రీతిలో సిద్ధపడి ఉంటాము. దేవుని సంతోషపరచు విధములుగా జీవించుటకు మనము సిద్ధపరచబడతాము. మరియు మనము, లోకములో ప్రతిచోట ఉన్న మన తోటి విశ్వాసులు క్రీస్తు రాజ్యము యొక్క ఆశీర్వాదములను పొందుకుంటాము.

Continue reading the full transcript