అదే శ్రేణి 5వ పాఠానికి సంబంధించిన ఒక అనుబంధ వీడియో, ఈ క్రింది ప్రశ్నలను అడుగుతుంది: ఫిలిప్పీయులు అన్ని రకాల బాధలను, లేదా సువార్త కోసం మాత్రమే బాధలను పరిష్కరిస్తారా? పౌలు యొక్క ఆనందం అతని బాధకు, లేదా ఫిలిప్పీయులతో అతని సంబంధానికి సంబంధించినదా? చనిపోవాలని కోరుకోవడం పౌలుకు పాపమా? పౌలు వివరించిన ఆనందం క్రీస్తు యొక్క గుర్తింపు కంటే ఎక్కువ భావోద్వేగ అనుభవమా? పౌలు ఏక కాలంలో క్రీస్తు మరియు దిగులు చెందిన వాడు ఎలా ఉండగలడు? క్రైస్తవ లేదా లౌకిక ధర్మాలు పౌలును ఫిలిప్పీయులు పట్టించుకోవడానికి ప్రేరేపించాయా? ఫిలిప్పీయుల కోసం పౌలు ఎందుకు అంత బలమైన ఆప్యాయతను అనుభవించాడు? ఒకే స్థానిక సంఘంలో చాలా వైవిధ్యమైన సమూహాలు పాల్గొనడం సాధారణమా? ఫిలిప్పీయులను పౌలు మరియు తిమోతి సంయుక్త రచయితలుగా మనం దృష్టి పెట్టాలా? యుఒడియా మరియు సింటిచేను పౌలు ఎలా ఉద్బోధించాడు అనే దాని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? యేసు తనను తాను ఏమి చేసాడు అని పౌలు చెప్పినప్పుడు? పట్టుదల మరియు సంరక్షణ మధ్య తేడా ఏమిటి? మన మంచి పనులు మన రక్షణకు దోహదపడతాయా? దేవుడు ఎప్పుడైనా నమ్మని వారిని విశ్వాసం వైపు తీసుకురావడానికి బయటకు మంచి పనులను ఉపయోగిస్తాడా? దుష్ట ఉద్దేశ్యాలతో సువార్తను ప్రకటించడం ద్వారా మంచి విషయాలు ఎలా రావచ్చు? దుష్ట ఉద్దేశ్యాలతో సువార్తను ప్రకటించే వారికి మనం ఎలా స్పందించాలి? "నిజమైన సున్నతి" ఎవరు? సువార్త యొక్క కేంద్ర భావనలు ఏమిటి? తప్పు బోధకులను మనం ఎలా గుర్తించి వ్యవహరించాలి?
From the transcript
1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.
బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.
ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.
అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.
మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.
సైనికులు యుద్ధములో ఊహించని పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడు, వారి మనస్సులు మరణపు ఆలోచనల వైపు త్రిప్పబడతాయి. వారు తమ్మునుతాము ఆదరించుకొనుటకు మరియు కుటుంబములో ఉన్న తమ ప్రియులను ఆదరించుటకు అనేకమైన మార్గములను వెదకుతూ ఉంటారు. చాలాసార్లు, వారు కృతజ్ఞతలు చెల్లించు మరియు సలహాలతో కూడిన చివరి మాటలను పలుకు పత్రికలను వ్రాస్తూ, వారి ప్రియులు జీవితములో ముందుకు కొనసాగాలని ప్రోత్సహిస్తుంటారు. అనేక విధాలుగా, పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక త్వరలోనే మరణమును అనుభవించబోవుచున్న ఒక సైనికుడు వ్రాసిన పత్రికను పోలియున్నది. తాను చెరసాలలో శ్రమను అనుభవించుచున్నప్పుడు, ఎంతో అలసి, త్వరలోనే క్రీస్తు నిమిత్తము తన జీవితమును కోల్పోతానేమో అని ఆలోచనచేస్తూ పౌలు ఫిలిప్పీయులకు వ్రాశాడు. మరియు అతడు ప్రేమించిన ప్రజలకు వ్రాశాడు. కాబట్టి, ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులతో అతడు మాట్లాడిన మాటలు చాలా కఠినముగా ఉన్ననూ శ్రద్ధ చూపించునవిగా ఉన్నాయి; విచారకరముగా ఉన్ననూ ఆదరించునవిగా ఉన్నాయి; మెచ్చుకోదగినవిగా ఉన్ననూ బాధాకరంగా ఉన్నాయి. ఈ పత్రికను మనము అధ్యయనం చేయుచుండగా, పౌలు దృష్టికోణము నుండి, తన నమ్మకమైన క్రైస్తవ స్నేహితులకు ఇవి అతడు వ్రాసిన చివరి మాటలు కావచ్చు అను విషయమును మనము ఎల్లప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలి.
పౌలు యొక్క చెరసాల పత్రికలు అను మన పాఠ్యక్రమములో ఇది ఐదవ పాఠము, మరియు దీనికి “పౌలు మరియు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక” అను పేరు పెట్టాము. ఈ పత్రికలో, పౌలు అనుభవించుచున్న బాధను బట్టి కలతచెందిన ఫిలిప్పీ పట్టణ క్రైస్తవులను ప్రోత్సహించుటకు అతడు వ్రాశాడు. అతడు త్వరలోనే మరణించబోతాడు అని గుర్తించినప్పుడు, ఫిలిప్పీలో ఉన్న సంఘమునకు నిరీక్షణను మరియు నిశ్చయతను ఇచ్చుటకు పౌలు వ్రాశాడు.
పౌలు మరియు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికను గూర్చిన మన అధ్యయనమును మూడు భాగములుగా విభాగిద్దాము. మొదటిగా, పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును అన్వేషిద్దాము. రెండవదిగా, ఫిలిప్పీ పత్రిక యొక్క ఆకృతి మరియు విషయసూచికను పరిశీలిద్దాము. మరియు మూడవదిగా, ఈ పత్రిక యొక్క ఆధునిక అనువర్తనమును పరిశీలన చేద్దాము. పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును చూస్తూ ఆరంభిద్దాము.
ఈ పాఠ్యక్రమమంతటిలో మనము చెప్పినట్లుగా, పలు సంఘములలో ఉన్న విశేషమైన అవసరతలను గూర్చి మాట్లాడుటకు పౌలు తన పత్రికలన్నిటిని వ్రాశాడు. కాబట్టి, పౌలు యొక్క పరిస్థితులు మరియు అతడు వ్రాసిన ప్రజల యొక్క పరిస్థితులను గూర్చి కొన్ని విషయములను తెలుసుకొనుట చాలా ప్రాముఖ్యమైయున్నది. ఈ వివరణలను తెలుసుకొనుట పౌలు సందేశములను మనము సరియైన రీతిలో అర్థము చేసుకొనుటకు మరియు పౌలు ఉద్దేశించిన విధంగా అతని పత్రికలను స్వీకరించుటకు సహాయపడుతుంది. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికను మనము చూచుచుండగా, “ఫిలిప్పీయులు ఎవరు?” మరియు, “వారి జీవితములలో మరియు పౌలు యొక్క జీవితములో ఏమి జరుగుచుండినది?” మరియు, “పౌలు వారికి ఎందుకు వ్రాశాడు?” అనునటు వంటి ప్రశ్నలను మనము అడగవలసియున్నది. ఈ పత్రికలో పౌలు చేసిన అధికారికమైన బోధను అర్థము చేసుకొని దానిని మన జీవితములకు అనువర్తించుకొనుటకు ఇటువంటి ప్రశ్నలు సహాయపడతాయి.
పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును మనం పరిశీలించుచుండగా, మనం మూడు విషయముల మీద దృష్టిపెడదాము: మొదటిగా, ఫిలిప్పీయులకు మరియు పౌలుకు మధ్య ఉన్న సంబంధమును మనం పరిశీలిద్దాము. రెండవదిగా, చెరసాలలో పౌలు అనుభవించిన శ్రమను గూర్చి కొన్ని వివరములను ప్రస్తావిద్దాము. మరియు మూడవదిగా, పౌలు ఈ పత్రికను వ్రాసినప్పుడు ఫిలిప్పీలో నివసించుచుండిన క్రైస్తవులు ఎదుర్కొనిన పరిస్థితులను అన్వేషించుదాము. పౌలు మరియు ఫిలిప్పీ సంఘము మధ్య ఉన్న సంబంధమును చూస్తూ ఆరంభిద్దాము.
ఫిలిప్పీ పట్టణము రోమా ప్రాంతమైన మాసిదోనియలో ముఖ్యమైనదిగా ఉంది, ఇది ప్రస్తుతము ఆధునిక గ్రీసులో ఉంది. ఇది రోమా పట్టణమును తూర్పు ప్రాంతములతో కలుపు ప్రధాన రహదారియైన వయ ఎగ్నషియ ప్రక్కన ఉంది, మరియు రోమా సామ్రాజ్యములో ఒక ప్రత్యేకమైన స్థానమును కలిగియున్నది. ఫిలిప్పీ పట్టణమునకు ఇటలీలోని ఇతర రోమా పట్టణములకు ఉన్న అవే హక్కులు ఇవ్వబడినవి, మరియు దానిలోని పౌరులకు సంపూర్ణ రోమా పౌరత్వము ఇవ్వబడినది.
పౌలు తన పత్రికను వ్రాయుటకు ముందు ఫిలిప్పీ పట్టణములో ఉన్న సంఘముతో ఎంతో సంభాషించాడు అని మనము జ్ఞాపకముంచుకొనుట చాలా ప్రాముఖ్యమైయున్నది. బహుశా క్రీ.శ. 49 లేదా 50లో పౌలు యొక్క రెండవ మిషనరీ యాత్రలో పౌలు ఫిలిప్పీ పట్టణములో సంఘము స్థాపించాడు. అతడు ఫిలిప్పీ పట్టణమునకు వెళ్లుటకు ముందు, అతడు ఆసియాలో పరిచర్య చేశాడు మరియు తూర్పు దిక్కునకు ప్రయాణించాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతడు మాసిదోనియకు సువార్త తీసుకొనిరావాలని చెప్పిన ఒక మనుష్యుని యొక్క దర్శనమును చూశాడు. ఈ దర్శనమునకు స్పందనగా, పౌలు మాసిదోనియకు ప్రయాణించాడు. అతడు నెయపొలిలో దిగి, వెంటనే నెయపొలికి పది మైళ్ల దూరమున ఉన్న ఫిలిప్పీ పట్టణమునకు ప్రయాణించాడు.
ఫిలిప్పీ పట్టణములో పౌలు చేసిన అనేకమైన కార్యములు అపొస్తలుల కార్యములు 16:12-40లో నమోదుచేయబడ్డాయి. ఉదాహరణకు, ఐరోపాలో మొదటిగా క్రైస్తవ విశ్వాసమును స్వీకరించిన వ్యక్తిని ఫిలిప్పీ పట్టణములో పౌలు కనుగొన్నాడు, ఆమె వర్తకురాలైన లూదియ. మరియు బానిసగా ఉన్న ఒక చిన్నదానిలో నుండి దయ్యమును వెళ్లగొట్టుటవలన అతడు ఫిలిప్పీలోనే చెరసాల పాలైయ్యాడు. ప్రసిద్ధిచెందిన ఫిలిప్పీ చెరసాల నాయకుడు కూడా పౌలు అతని మీద చూపిన కనికరమును బట్టి కదలించబడి క్రీస్తును అంగీకరించినది ఈ పట్టణములోనే. పౌలు ఫిలిప్పీ పట్టణములో చేసిన పరిచర్య ఎంత విజయవంతమైయ్యింది అంటే, అతడు పట్టణమును విడచివెళ్లిన తరువాత కూడా, ఫిలిప్పీ పట్టణ క్రైస్తవులు అతనికి మద్దతునిచ్చారు. పలు సందర్భములలో, అతడు ఆర్ధిక అవసరతలో ఉండినప్పుడు వారు అతనికి ఆర్ధిక బహుమతులను కూడా పంపారు. ఫిలిప్పీ. 4:15-16ను ఒకసారి వినండి, అక్కడ పౌలు వారి యొక్క ఉదారతను గూర్చి వ్రాశాడు:
మాసిదోనియలోనుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొను విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపువారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియును. ఏలయనగా థెస్సలొనీకలోకూడ మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి (ఫిలిప్పీయులకు 4:15-16).
ఫిలిప్పీ సంఘము పౌలును ప్రేమించింది, మరియు తరచుగా ఆర్ధిక బహుమతులను ఇచ్చుట ద్వారా వారు అతనికి సహాయము చేశారు. వాస్తవానికి, ఫిలిప్పీ. 4:10, 18లో, తాను వారికి పత్రికను వ్రాయుటకు కొంత సమయము ముందే ఫిలిప్పీయులు అతనికి ఒక బహుమతిని పంపారు అని పౌలు గుర్తుచేశాడు:
నన్నుగూర్చి మీరిన్నాళ్లకు మరల యోచన చేయ సాగితిరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయములో మీరు యోచనచేసియుంటిరి గాని తగిన సమయము దొరకకపోయెను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను (ఫిలిప్పీ. 4:10, 18).
ఫిలిప్పీ పట్టణ విశ్వాసులలో కొందరు ఆర్ధికముగా ఉన్నవారైనప్పటికీ, మొత్తము మీద సంఘము నిరుపేద సంఘము అయ్యుండుట సాధ్యమే. కాబట్టి, వారు పౌలుకు ఎల్లప్పుడూ ఆర్ధికముగా సహాయము చేయలేకపోయారు. అయితే వారు పౌలును ఎంతగా ప్రేమించారు అంటే, వారికి సాధ్యమైనప్పుడు అతనికి ధారాళముగా ఇచ్చారు. మరియు ఫిలిప్పీయులు పౌలును ప్రేమించినట్లుగానే, అతడు కూడా వారి యెడల బలమైన ఆప్యాయత కలిగియున్నాడు. ప్రభువు యెడల వారికున్న నిబద్ధతను బట్టి మరియు సువార్త పరిచర్యలో వారు అతని భాగస్వాములుగా ఉన్న విధానమును బట్టి అతడు వారిని ప్రేమించాడు. వారు అతని సన్నిహిత స్నేహితులుగా ఉన్నారు, అతడు వారి సహవాసమును ఆనందించాడు, వారి సాన్నిధ్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఫిలిప్పీ 1:4-8లో అతడు వారితో మాట్లాడిన విధానమును వినండి:
గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడును సంతోషముతో ప్రార్థనచేయుచు, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను … నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను ... క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి (ఫిలిప్పీయులకు 1:4-8).
వాస్తవానికి, ఫిలిప్పీయులకు 2:12 మరియు 4:1లో, పౌలు ఫిలిప్పీయులను గూర్చి అగాపెటోస్ (ἀγαπητός) అను గ్రీకు పదమును ఉపయోగిస్తూ “నా ప్రియులారా,” అని సూచించాడు. అగాపెటోస్ అను పదమును తుకికు, ఎపఫ్ర, ఫిలేమోను, ఒనేసిము మరియు లూకా వంటి తన సన్నిహిత సహోద్యోగులును మరియు ప్రియమైన స్నేహితులను గూర్చి వివరించుటకు సాధారణంగా పౌలు ఉపయోగించేవాడు. ఫిలిప్పీ సంఘము కొరకు పౌలు కలిగియుండిన ప్రేమ ఇతర సంఘముల పట్ల అతడు కలిగియుండిన ప్రేమ కంటే బలమైనదిగా కనిపిస్తుంది. మరియు ఇది అతని ఆప్యాయత మరియు సుపరిచితతత్వములో మాత్రమే వ్యక్తపరచబడలేదుగాని, కొనసాగుచున్న బలమైన స్నేహములో కూడా వ్యక్తపరచబడింది. పౌలు మరియు ఇంటి యజమానురాలైన లూదియకు మధ్య; లేదా పౌలు మరియు అతడు రక్షించిన చెరసాల నాయకునికి మధ్య; మరియు పౌలుకు మరియు అతడు దయ్యమును వెళ్లగొట్టి రక్షించిన బానిసయైన చిన్నదానికి మధ్య సన్నిహిత సంబంధం ఉంటుందని భావించుట కష్టమేమీ కాదు. ఇవి మరియు ఇతర సంబంధముల ద్వారా, పౌలు ఫిలిప్పీ పట్టణములోని విశ్వాసులను ప్రేమించుట ఆరంభించాడు, మరియు వారు కూడా అతని పట్ల ఇవే భావనలను కలిగియుండిరి.
పౌలు మొదటిసారి ఫిలిప్పీ పట్టణములో ప్రవేశించినప్పుడు కష్టమును ఎదుర్కొన్నాడు... అయితే, తాను వ్రాసిన పత్రికలో నుండి సంఘముతో అతడు కలిగియుండిన సంబంధమును గూర్చి మనము మరికొన్ని విషయములను నేర్చుకోవచ్చు. ఫిలిప్పీ. 1:7లో పౌలు వారిని కృపలో పాలివారు అని పిలుస్తున్నాడు... ఆ కృపలో పాలివారు అని అతడు వారిని పిలచుచున్నప్పుడు, పత్రిక అంతటిలో చేయుచున్న విధముగా, పౌలు తనను తాను ఆనందముగా శ్రమపడు క్రీస్తు కొరకు ఖైదీగా గుర్తించుకొనుచున్నాడు మరియు తనతో కలిసి ఆనందముగా శ్రమను అనుభవించమని, ఆ శ్రమలో తనకు మద్దతునియ్యమని ఫిలిప్పీయులను కూడా కోరుచున్నాడు... అతని సంబంధము చాలా భావార్థకముగాను, ప్రోత్సాహకరముగాను కనిపిస్తుంది. అతడు ఫిలిప్పీ సంఘమును ప్రేమించాడు మరియు వారు అతడు చెరసాలలో ఉన్నపుడు మరియు అతడు స్వతంత్రముగా సువార్త ప్రకటించుచున్నప్పుడు కూడా అతనిని ప్రేమించుచు, అతనికి మద్దతునిచ్చారు.
— డా. జోనాథన్ హ్యారిస్
పౌలు మరియు ఫిలిప్పీయుల మధ్య ఉన్న ప్రేమగల, మద్దతునిచ్చు సంబంధమును ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి, ఫిలిప్పీ పత్రిక యొక్క నేపథ్యములోని మరొక కీలకమైన అంశమును చూచుటకు మనము కొన్ని క్షణములు గడపవలసియున్నది: చెరసాలలో అపొస్తలుని శ్రమ.
తన సుదీర్ఘకాల పరిచర్య అంతటిలో, అనేక సందర్భాలలో పౌలు బహుగా శ్రమలను అనుభవించాడు. అతనిని పదే పదే కొరడాలతో, రాళ్లతో కొట్టారు మరియు హంతకులు వెంటాడారు. అనేకసార్లు అతడు చెరసాలలో బంధించబడినాడు. ఒకసారి అతనిని రాళ్లతో కొట్టి, మరణించాడు అని భావించి, విడచి వెళ్లిపోయారు కూడా. మరియు ఈ కష్టములను అతడు ఎల్లప్పుడు భరించలేదు. కొన్ని సందర్భములలో, అతడు నిరాశచెందాడు మరియు నిరాశకు గురైయ్యాడు. తన రెండవ మిషనరీ ప్రయాణ సమయములో, తన శ్రమలను గూర్చి 2 కొరింథీ. 1:8లో పౌలు ఈ మాటలను వ్రాశాడు:
సహోదరులారా, ఆసియలో మాకు తటస్థించిన శ్రమనుగూర్చి మీకు తెలియకుండుట మాకిష్టములేదు; అదేదనగా మేము బ్రదుకుదుమను నమ్మకములేక యుండునట్లుగా, మా శక్తికి మించిన అత్యధిక భారమువలన క్రుంగిపోతివిు (2 కొరింథీయులకు 1:8).
ఇక్కడ ఎంతో భారమైన బరువు తన మీద ఉండి, దానిని సహించుటకు శక్తి చాలక, బ్రదుకుతాడను నమ్మకము లేకుండా అతడు ఉన్న సందర్భమును పౌలు వర్ణించిన విధానమును గమనించండి.
అవును, ప్రతి నమ్మకమైన, పరిపక్వ క్రైస్తవుని వలె, జీవితము ఎన్నడును పరిపూర్ణముగా నిరీక్షణలేనిదిగా ఉండదు అని పౌలుకు తెలుసు. దేవుడు ఎల్లప్పుడూ మన పరిస్థితుల నియంత్రణలో ఉన్నాడు, మరియు నిజమైన విశ్వాసులందరికి క్రీస్తునందు నిత్య జీవము వాగ్దానము చేయబడింది. అయితే పౌలు మన వలెనె బలహీనతలు గల మానవుడైయున్నాడు. మరియు వాస్తవము ఏమిటంటే, కొన్నిసార్లు దేవుని సార్వభౌమత్వమును తెలుసుకొనుట మరియు నమ్ముట, కఠినమైన పరిస్థితులతో సంఘర్షించకుండా మనలను ఆపలేవు. పౌలు సంఘర్షించాడు, మరియు కొన్నిసార్లు ఓటమిని అంగీకరించాలని కోరాడు కూడా. పౌలును గూర్చి ఈ విషయమును గ్రహించుట చాలా ప్రాముఖ్యమైయున్నది, ఎందుకంటే, మనము చూడబోవుతున్నట్లు, ఫిలిప్పీయులకు వ్రాసిన సమయములో పౌలు ఇలాంటి ఆలోచనలతోనే సతమతమయ్యాడు. అతని విశ్వాసము అతనిని సత్యములో నాటింది మరియు దేవుడు సమస్తమును మేలు కలిగించుట కొరకు జరిగించుచున్నాడు అని అతనిని ప్రోత్సహించింది. అయితే పౌలు యొక్క హృదయము ఇంకను భారంగానే ఉంది మరియు అతని దుఃఖము తీవ్రమైనదిగా ఉంది.
అతడు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో, పౌలు తన మనసులో ఉన్న సమస్యలన్నిటిని వెల్లడించలేదు. అయితే అతడు వాటిలో కొన్నింటిని గూర్చి మాట్లాడాడు, మరియు తన మానసిక స్థితి మీద తన కష్టాలన్ని చూపుతున్న సమిష్టి ప్రభావమును అతడు వెల్లడించాడు. ఉదాహరణకు, అతడు మరణమును గూర్చి బాధ నుండి విశ్రాంతిని కలిగించునది అని చెబుతూ మాట్లాడాడు. ఉదాహరణకు, ఫిలిప్పీయులకు 3:10లో, అతడు ఈ మాటలు వ్రాశాడు:
ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును (ఫిలిప్పీయులకు 3:10).
ఈ వచనములో, అతని ప్రస్తుత శ్రమలు ఎంత గొప్పవిగా ఉన్నాయి అంటే, అతడు క్రీస్తు శ్రమలు మరియు మరణములో పాలుపంచుకోవాలను ఆలోచనను పూర్తిగా హత్తుకున్నాడు అని పౌలు బయలుపరచాడు. మరియు ఫిలిప్పీయులకు 1:20లో, పౌలు తన దృక్కోణమును ఈ విధంగా వివరించాడు:
నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మనాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును (ఫిలిప్పీయులకు 1:20).
ఇక్కడ, తాను శ్రమపొందిన కొలది ధైర్యమును పొందుతాను అను తన నిరీక్షణను పౌలు వ్యక్తపరచాడు. అతడు జీవించినా లేక మరణించినా, ఎలాంటి అవమానము లేకుండా క్రీస్తును గౌరవించుట తాను కలిగియుండిన ఉద్దేశ్యము అయ్యున్నది. దీని తరువాత వెంటనే, 21-23 వచనాలలో, ఈ మాటల ద్వారా పౌలు రాబోవుచున్న మరణమును గూర్చి వ్యక్తపరచాడు:
నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతోకూడ నుండవలెనని నాకు ఆశయున్నది, అదినాకు మరి మేలు (ఫిలిప్పీయులకు 1:21-23).
ఈ వాక్యభాగములో మనము చూచుచున్నట్లు, పౌలు రెండు ఆకాంక్షల మధ్య నలిగిపోతున్నాడు. క్రీస్తును మరియు ఆయన రాజ్యమును సేవించుటకు అతడు ఈ లోకములో జీవించాలని ఆశించుచున్నాడు. అయితే అదే సమయములో మరణము తరువాత పరలోకములో క్రీస్తుతో మహిమకరమైన జీవితమును అనుభవించుటకు మరణించాలనే ఆశ కూడా కలిగియున్నాడు.
పౌలు ఫిలిప్పీయులకు వ్రాయుచున్నప్పుడు, అతని జీవితము చాలా త్వరగా ముగుస్తుంది, మరియు అతడు తన విశ్వాసము కొరకు హతము చేయబడు అవకాశము ఉన్నది అనే సాధ్యత క్రింద జీవించుచున్నాడు. మరియు అతడు వారికి ఇచ్చిన స్పందన నా ఆలోచన ప్రకారం, లేఖనములో మనము కనుగొను అత్యంత ప్రేరేపితమైన వాక్యభాగమైయున్నది. అతడు వాస్తవానికి రెండు విషయముల మధ్య నలిగిపోతున్నాడు అని అతడు వారికి తెలియజేశాడు. మరణించి యేసుతో ఉండుట మంచిదో లేక జీవించుట కొనసాగించి ఫిలిప్పీయులను సేవించుట మంచిదో తెలియని పరిస్థితిలో అతడు ఉన్నాడు. పౌలు వాస్తవానికి మరణించి, క్రీస్తుతో కూడా ఉండుటకు ఎక్కువ ఆశ చూపుతున్నాడు అని నేననుకుంటాను, ఎందుకంటే అది ఎంత మహిమకరముగా ఉంటుంది? అయినప్పటికీ, అతడు జీవించుటను కొనసాగించి, సువార్త సందేశమును ఇతరులకు పంచుకోవలసియుంటే, దానిని కూడా చేయుటకు అతడు పరిపూర్ణముగా సుముఖత కలిగియున్నాడు. కాబట్టి, పౌలు వైఖరి ప్రకారం, అతడు జీవించినా లేక మరణించినా, అది అతనికి మేలే అవుతుంది. అయితే అతడు జీవించుటను కొనసాగిస్తే, అది ఫిలిప్పీయులకు మేలు అవుతుంది.
— డా. డాన్ లఖీఖ్
ఇప్పుడు, సాధారణ పరిస్థితులలో, క్రైస్తవులు మరణించాలనే ఆశతో నిండుకొని ఉండకూడదు అని మనమంతా గ్రహించాలి. అవును, మన సమాధికి అవతల వైపున ఉన్నదాని కొరకు మనము ఎదురుచూడాలి. అది మహిమకరమైనది. అయినప్పటికీ, దీర్ఘాయువు దేవుడిచ్చు ఆశీర్వాదము అని లేఖనములు బోధిస్తాయి. పరలోకమందున్నట్లు భూమి మీదికి దేవుని రాజ్యమును తీసుకొని వచ్చుటలో మన వంతు తోడ్పాటునిచ్చుటకు మనము సృజింపబడియున్నాము. మరియు ఈ భావనలో, బైబిలుయందంతటా, మరణము ఒక శాపమైయున్నది. 1 కొరింథీయులకు 15:26లో పౌలు మరణమును విరోధి అని పిలచాడు. అయితే తన జీవితములోని ఈ సమయములో పౌలు వలె, ఈ లోకములో దేవుని సేవించు మన కాలము ముగింపుకు దగ్గరపడిందా అని మనము ఆశ్చర్యపోతుంటాము. మరియు అట్టి సమయములను మనము ఎదుర్కొనినప్పుడు, పరలోకమందు క్రీస్తుతో కూడా ఉండుట అను అద్భుతమైన ఆశీర్వాదమును అనుభవించాలనే ఆశతో మన హృదయములు నింపబడియుండాలి. అవును, మరణమును గూర్చి ఒక ఉపశమనము వలె మాట్లాడుట ద్వారా జీవితములోని ఆ సమయములో అతడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడో పౌలు బయలుపరచలేదు. అతడు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలోని అనేక ఇతర భాగములలో పౌలు యొక్క సతమతమవుతున్న మనస్సు యొక్క స్థితిని మీరు చూడవచ్చు. ఉదాహరణకు, ఫిలిప్పీయులకు 2:27-28లో, అతడు ఎపఫ్రొదితు అనారోగ్యము నుండి కోలుకొనుటను గూర్చి ఇలా మాట్లాడాడు:
నిజముగా అతడు [ఎపఫ్రొదితు] రోగియై చావునకు సిద్ధమైయుండెను గాని దేవుడతనిని కనికరించెను; అతనిమాత్రమే గాక నాకు దుఃఖముమీద దుఃఖము కలుగకుండుటకై నన్నును కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరల సంతోషించు నిమిత్తమును నా కున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరి శీఘ్రముగా పంపితిని (ఫిలిప్పీయులకు 2:27-28).
ఎపఫ్రొదితు యొక్క మరణము పౌలు అప్పటికే అనుభవించిన దుఃఖముకు మరింత దుఃఖమును చేకూర్చేది. దేవుడు ఎపఫ్రొదితుకు చూపిన కనుకరమును బట్టి పౌలు కృతజ్ఞత చూపాడు, కాని పౌలు యొక్క శోధనలు చాలా ఎక్కువగా ఉండినవి కాబట్టి, ఈ ఆశీర్వాదము కూడా కేవలం అతని బాధను తగ్గించింది అంతే. దానిని పూర్తిగా తీసివేయలేదు.
ఈ జీవితములో క్రీస్తు కొరకు జీవించుట పట్ల పౌలు కలిగియుండిన సమర్పణ, మరణము తరువాత తనకు కలుగబోవుదానిని బట్టి అతని ఆనందము, అతని జీవితము ఒక తీవ్రమైన అస్తవ్యస్తతలో ఉన్నదను వాస్తవములో నుండి పుట్టినది. మునుపటి పాఠములో మనము చూసినట్లుగా, అతడు ఈ పత్రికను రోమాలో నుండి లేదా కైసరియ మరిటిమలోని చెరసాల నుండి వ్రాసియుంటాడు. అతడు రోమాలో నుండి వ్రాసినట్లయితే, కైసరు తనను ఖండిస్తాడని అతడు భావించాడు. మరియు అతడు కైసరియ మరిటిమ నుండి వ్రాసినట్లయితే, తనను చంపివేయాలన్న యూదుల ప్రణాళికను గూర్చి అతడు ఆందోళన చెందియుంటాడు. అయితే రాబోవు ముప్పు ఏమైనప్పటికీ కూడా, అతడు క్రీస్తు కొరకు జీవించాలని ఆశించినప్పటికీ, తాను త్వరలోనే చనిపోయే అవకాశం ఉందని పౌలు అలోచించినట్లు తెలుస్తుంది. ఉదాహరణకు, ఫిలిప్పీయులకు 1:19లో అతడు నిరీక్షణతో ఇలా వ్రాశాడు, “బ్రదుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడును.” మరియు 1:22లో “శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకుతోచలేదు.” 2:17లో అతడు “పానార్పణముగా పోయబడే” అవకాశమును గూర్చి మాట్లాడాడు. మరియు 3:10లో, క్రీస్తు శ్రమలలో పౌలు యొక్క పాలిభాగము అతనిని “మరణ విషయములో క్రీస్తుతో సమానుభవముగలవానిగా” ఉండుటకు దారితీస్తుందని అతడు సూచించాడు. అయితే చనిపోతానని పౌలుకు ఖచ్చితంగా నమ్మకం లేదు. ఈ పత్రికలో మరోచోట, బ్రతుకుతాననే నిరీక్షణను అతడు వ్యక్తపరచాడు. ఉదాహరణకు, ఫిలిప్పీయులకు 1:26లో, “నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును” అని వ్రాసినప్పుడు ఫిలిప్పీయులకు పరిచర్య చేయుట కొనసాగించుటకు అతడు జీవించాలని కలిగియుండిన భావనను ఇది సూచిస్తుంది,
తనకు ఏమి జరుగుతుందో పౌలుకు ఖచ్చితంగా తెలియదు. ఒక వైపున, అతనికి కలుగబోవు మరణము నిజముగా సాధ్యమే అని అతనికి తెలుసు. కాబట్టి ఫిలిప్పీలో ఉన్న తన స్నేహితులను అట్టి పరిస్థితి కొరకు సిద్ధపరచుటకు అతడు ప్రయత్నించాడు. మరొక వైపున, అతడు కొంతకాలము పాటు జీవించుటను కొనసాగిస్తాడు అను ఒక విధమైన నిరీక్షణను అతడు కలిగియుండినాడు. కాబట్టి, ఉత్తమమైన దాని కొరకు ఆశించుడి అని అతడు ఫిలిప్పీయులను కూడా ప్రోత్సహించాడు. అయితే భవిష్యత్తు తన కొరకు ఏమి దాచిపెట్టియుండినను, ఈ పత్రికను వ్రాసినప్పుడు, ఈ లోకములో క్రీస్తు కొరకు జీవించుటకు లేక ఆయన కొరకు మరణించి పరలోకమందు ఆయన సన్నిధికి చేరుకొను మహిమను పొందుకొనుటకు అతడు సంపూర్ణ నిశ్చయతను కలిగియుండినాడు.
పౌలుతో ఫిలిప్పీయులకు ఉన్న సంబంధమును మరియు చెరసాలలో అతని యొక్క శ్రమను ఇప్పటివరకు మనం చూశాము గనుక, పౌలు వారికి పత్రిక వ్రాసినప్పుడు ఫిలిప్పీలో ఉన్న పరిస్థితులను ఇప్పుడు పరిశీలించుదాము. ఫిలిప్పీ క్రైస్తవులు ఎదుర్కొనిన ఏ పరిస్థితుల మీద పౌలు దృష్టిపెట్టవలసి వచ్చింది?
ఫిలిప్పీ సంఘములోని అనేక పరిస్థితులను గూర్చి పౌలు మాట్లాడాడు, అయితే మనము కేవలం రెండు విషయములను మాత్రమే చూద్దాము: పౌలు యెడల ఫిలిప్పీయులకు ఉన్న ఆందోళన, మరియు ఫిలిప్పీ సంఘములో ఉన్న అంతర్గత సమస్యలు మరియు బాహ్య సమస్యలు. పౌలు కొరకు ఫిలిప్పీయులకున్న ఆందోళనను చూస్తూ ఆరంభిద్దాము.
మొత్తంగా చూస్తే, ఫిలిప్పీ సంఘముకు అపొస్తలుడైన పౌలుతో ఒక బలమైన, ప్రేమపూర్వకమైన సంబంధము ఉంది. మరియు చెరసాలలో అతని శ్రమలను గూర్చి వారు ఆలోచన చేసినప్పుడు, వారు నిరుత్సాహపడ్డారు మరియు ఇబ్బందిపడ్డారు. కాబట్టి, వీలైనంత త్వరగా, పౌలు యొక్క భూలోక అవసరతలను తీర్చుటకు ఒక బహుమతిని పంపించి వారు తమ ఆందోళనను వ్యక్తపరచారు. బహుమతిని ఇచ్చుటకు మరియు చెరసాలలో అతనికి పరిచర్య చేయుటకు వారు ఎపఫ్రొదితును పంపారు. ఫిలిప్పీయులకు 4:18లో, ఈ కృతజ్ఞత మాటలను వ్రాస్తూ ఈ బహుమతిని గూర్చి పౌలు ప్రస్తావించాడు:
నాకు సమస్తమును సమృద్ధిగా కలిగియున్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితువలన పుచ్చుకొని యేమియు తక్కువలేక యున్నాను; అవి మనోహరమైన సువాసనయు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై యున్నవి (ఫిలిప్పీయులకు 4:18).
మనము చెప్పినట్లుగానే, ఫిలిప్పీయులు ధనవంతులుకారు గనుక ఈ బహుమానము వారు చేసిన ఒక ప్రాముఖ్యమైన త్యాగముగా ఉన్నది. అయితే వారు పౌలు శ్రేయస్సును గూర్చి ఆలోచించారు గనుక దానిని శీఘ్రముగా పంపించారు. మరియు ఫిలిప్పీయులకు 2:25లో మనము చదివినట్లుగా, చెరసాలలో పౌలుకు పరిచర్య చేయు నిమిత్తము ఫిలిప్పీ సంఘము ఎపఫ్రొదితును కూడా పంపించింది. అక్కడ పౌలు వ్రాసిన మాటలు వినండి:
మరియు నా సహోదరుడును, జతపనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని (ఫిలిప్పీయులకు 2:25).
స్పష్టముగా, ఎపఫ్రొదితు ఫిలిప్పీయులు ఇచ్చిన నివేదికను కూడా పౌలుకు అందించాడు. పౌలు క్రీస్తును అనుసరించుచున్నాము అని చెప్పుచున్నవారి ద్వారా కూడా హింసించబడుతున్నాడు, మరియు మరణ అపాయము అతని మీద అలుముకున్నది అని తెలుసుకొని వారు ఆందోళన వ్యక్తపరచారు. మరియు అతడు వారికి వ్రాసిన పత్రికలో, ఫిలిప్పీయులు సరిగానే తన పరిస్థితులను అర్థం చేసుకున్నారని పౌలు ధృవీకరించాడు, వారి ఆందోళనను బట్టి ప్రశంసలు వ్యక్తపరచాడు. ఉదాహరణకు, ఫిలిప్పీయులకు 1:15-17లో, సువార్తను ప్రకటించు కొందరు బోధకులు తనను అభ్యంతరపెడుతున్నారని అతడు చెప్పాడు. అతడు తన పరిస్థితిని ఈ మాటలలో వివరించాడు:
కొందరు అసూయచేతను కలహబుద్ధిచేతను ... నా బంధకములతో కూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు (ఫిలిప్పీయులకు 1:15-17).
వాస్తవానికి, పౌలు దుఃఖముతో ఉండుటకు ఒక కారణం ఏమిటంటే క్రైస్తవ నాయకులతో సహా, తన చుట్టూనున్న విశ్వాసులలో కూడా చాలా తక్కువ మంది, సువార్త పరిచర్య కొరకు పూర్తిగా తమ హృదయములను అర్పించుకున్నారు. ఫిలిప్పీయులకు 2:21లో దీన్ని గూర్చి అతడు మాట్లాడిన మాటలు వినండి:
అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని, యేసుక్రీస్తు కార్యములను చూడరు (ఫిలిప్పీయులకు 2:21).
సంక్షిప్తంగా, ఈ సమయంలో ఫిలిప్పీయులు పౌలు యెడల కలిగియున్న ఆందోళన సరియైనదే. పౌలు శ్రమలు ఎక్కువగా ఉన్నాయి, మరియు అతని మద్దతు మాత్రం కొంచెముగా ఉంది. అయితే పౌలు శ్రమననుభవించుచున్నాడనే వాస్తవముపట్ల ఫిలిప్పీయులు కేవలం ఆందోళన మాత్రమే చూపలేదు. అతడు హత్య చేయబడుట ద్వారా లేదా బహిరంగ ఉరిశిక్ష ద్వారా చనిపోతాడేమో అని వారు భయపడ్డారు. మరియు ఈ భయములు నిర్ధిష్టపరచబడ్డాయి. మునుపటి పాఠములలో మనము చూసినట్లుగా, యూదులు పౌలును ఒకటి కంటే ఎక్కువసార్లు చంపజూశారు, మరియు అతడు ఆరోపణలు ఎదుర్కొనుచున్న నేరముకు మరణశిక్ష విధించబడుతుంది. కాబట్టి, అపొస్తలుని మీద ఉన్న లోతైన శ్రద్ధనుబట్టి, పౌలు పక్షమున ఫిలిప్పీయులు ప్రార్థనకు తమ్మునుతాము అంకితం చేసుకున్నారు. ఫిలిప్పీయులకు 1:19-20లో ఈ ప్రోత్సాహకరమైన మాటల ద్వారా వారు చేసిన ప్రార్థనలను బట్టి పౌలు వారికి కృతజ్ఞతలు తెలిపాడు:
నా బ్రదుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణ మించునని నేనెరుగుదును (ఫిలిప్పీయులకు 1:19-20).
ఫిలిప్పీయులు చేసిన ప్రార్థనలను బట్టి పౌలు కృతజ్ఞతలు తెలిపాడు మరియు అతడు జీవించినా లేక మరణించిన అన్నిటి కంటే ఎక్కువగా క్రీస్తు ఘనపరచబడతాడు అని అతడు వారికి నిశ్చయతనిచ్చాడు.
పౌలు శ్రేయస్సు కొరకు ఫిలిప్పీయులు చూపిన ఆందోళనను పరిశీలించాము గనుక సంఘము ఎదుర్కొనుచుండిన, వేర్వేరు మూలములనుండి కలిగిన కొన్ని సమస్యలను ఇప్పుడు చూద్దాము.
పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో నుండి, ఫిలిప్పీలో ఉన్న సంఘము కనీసం మూడు రకముల సమస్యలను ఎదుర్కొన్నది అని మనము నేర్చుకుంటాము. మొదటిగా, వారు సంఘము వెలుపల నుండి హింసను ఎదుర్కొన్నారు. రెండవదిగా, ఇతర సంఘములను కలుషితం చేసినటువంటి అబద్ధ బోధన నుండి వారు అపాయమును ఎదుర్కొన్నారు. మరియు మూడవదిగా, సంఘములో ఒకరికొకరికి మధ్య వివాదములతో వారు సతమతమయ్యారు. మొదటిగా వారు ఎదుర్కొనిన హింసను చూద్దాము.
హింస. 1:27-30లో ఫిలిప్పీయులు ఎదుర్కొనిన హింసను గూర్చి ప్రస్తావిస్తూ, పౌలు ఈ మాటలను వ్రాశాడు:
మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని... ఏలయనగా మీరు నాయందు చూచినట్టియు, నాయందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి యున్నందున క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను (ఫిలిప్పీయులకు 1:27-30).
“క్రీస్తునందు విశ్వాసముంచుటమాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడెను” అని ఫిలిప్పీయులకు 1వ అధ్యాయములో పౌలు చెబుతున్నాడు. సరేనా? ఆశ్చర్యపోవద్దు; భయపడవద్దు.” పౌలు రోమా. 5లో మరొక అడుగు ముందుకు వెళ్తూ, మన శ్రమల యందు మనము ఆనందించాలి మరియు మహిమను అనుభవించాలి అని చెబుతున్నాడు. సరే, ఎందుకని? ఎందుకంటే, మనలను క్రీస్తు-పోలిన విధముగా మార్చుటకు శ్రమలు క్రైస్తవుల కొరకు దేవుని రూపకల్పన అయ్యున్నది... మనము సువార్త నుండి నిశ్చయతను పొందాలి అని లేఖనము సెలవిస్తుంది — రోమా 8, సువార్త మనకు దేవుని ఎడబాయని ప్రేమను గూర్చిన నిశ్చయతను ఇయ్యనియ్యుడి, మరియు “క్రీస్తు యేసునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎవడు యెడబాపగలడు? బాధలా లేక శ్రమలా లేక హింసయా?” కాబట్టి, తుదకు, మనము హింస లేక శ్రమలను ఎదుర్కొనునప్పుడు, మనము సువార్తను హత్తుకొనియుండి, మన యెడల దేవుడు కలిగియున్న ప్రేమ అను నిశ్చయతను కనుగొనాలి.
— రెవ. సి. ఎస్ టాంగ్
కొన్నిసంవత్సరముల క్రితం, ఫిలిప్పీలో అతడు సంఘమును స్థాపించిన తరువాత, థెస్సలొనీకలోని మాసిదోనియ పట్టణములో యూదుల నుండి గొప్ప ప్రతిఘటనను పౌలు ఎదుర్కొన్నాడు. మరియు అపొస్తలుల కార్యములు 17:5-13లో మనము చదువుచుండగా, పౌలు మరియు ఇతర విశ్వాసులు రోమా చట్టమును ఉల్లంఘించారని కోపోద్రేకులైన ఈ యూదులు ఆరోపించారు. తత్ఫలితంగా, యూదుల ద్వారా కలిగే మరింత హింస నుండి తప్పించుకొనుటకును అదే విధంగా పౌర ప్రభుత్వం అరెస్టు చేయకుండ ఉండుటకు పౌలు పట్టణము నుండి రాత్రికి రాత్రే పారిపోవలసి వచ్చింది. ఈ థెస్సలొనీక యూదులు రోషముగలవారు గనుక బెరయ పట్టణము వరకు కూడా వారు పౌలును వెంటాడారు. కాబట్టి, ఈ యూదులు లేదా ఈలాటి ఇతర యూదులు ఫిలిప్పీ సంఘమును కూడా ఆటంకపరచి, సంఘముకు వ్యతిరేకముగా స్థానిక ప్రభుత్వమును పురికొల్పారు అని చెప్పుట సమంజసంగానే ఉంటుంది. అయితే ఫిలిప్పీలో హింస యొక్క ప్రత్యేక స్వభావం ఏమైనప్పటికీ, అవిశ్వాసుల చేతిలో సంఘము నిజంగా బాధపడుతుందని స్పష్టంగా తెలుస్తుంది.
సంఘము వెలుపల నుండి హింసతో పాటుగా, అబద్ధ బోధకులు అను సమస్య ఫిలిప్పీ విశ్వాసులు ఎదుర్కొనిన రెండవ సమస్య అయ్యున్నది.
అబద్ధ బోధకులు. ఇప్పుడు, పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక నుండి, ఫిలిప్పీ సంఘమును అబద్ధ బోధలు ఇంకా లోతుగా ప్రభావితము చేయలేదు అని కనిపిస్తుంది, ఎందుకంటే పౌలు దానిని గూర్చి సూటిగా మాట్లాడలేదు. అయితే వారి పట్టణములోకి చొరబడే ప్రతి అబద్ధ బోధనను తిరస్కరించమని అతడు ఫిలిప్పీయులను హెచ్చరించాడు. ఫిలిప్పీయులకు 3:1-3లో సున్నతిని ఉద్దేశించి పౌలు మాట్లాడిన మాటలను గమనించండి:
అదేసంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరము. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా ... మనమే సున్నతి ఆచరించువారము (ఫిలిప్పీయులకు 3:1-3).
సున్నతిని ఆచరించు — “ఈ చేదన నాచారించువారు” అని అతడు వారిని పిలుస్తున్నాడు — అబద్ధ బోధకులు ఫిలిప్పీ సంఘమును ఇబ్బంది పెడతారేమో అని పౌలు చింతించాడు. ఫిలిప్పీ. 3:18-19లో అతడు ఇతర రకముల అబద్ధ బోధలను కూడా ఖండించాడు:
అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు (ఫిలిప్పీయులకు 3:18-19).
ఇక్కడ పౌలు యొక్క భాష ఆహార విషయములో నిష్ఠ మరియు పాత నిబంధన గ్రంథము యొక్క ఆహార నియమములను సరిగా ఉపయోగించకపోవుటతో పాటుగా, అనేకమైన అబద్ధ బోధనలను గూర్చి వివరిస్తుంది. ఇప్పుడు ఇటువంటి అబద్ధ బోధనలు రెండు మూలముల నుండి వచ్చియుండవచ్చును. ఒక వైపున, కొలస్సీ మరియు లైకస్ లోయలోని ఇతర పట్టణములలో ఉన్నసంఘములు ఎదుర్కొనిన అవే రకమైన అబద్ధ బోధలు పౌలు మనస్సులో ఉండియుండవచ్చు. మునుపటి పాఠములలో మనం ప్రస్తావించినట్లుగా, లైకస్ లోయలోని ఈ అబద్ధ బోధకులు క్రైస్తవ బోధను గ్రీకు తత్వశాస్త్రము, సన్యాస్యము మరియు యూదుల ధర్మశాస్త్రము యొక్క అవినీతితో మిళితము చేశారు. ఉదాహరణకు, పౌలు ఈ అబద్ధ బోధను కొలస్సీ. 2:11, 12లో సున్నతిని దుర్విన్యోగం చేయుటతో ప్రత్యేకముగా అనుసంధానము చేశాడు. అతడు దీనిని కొలస్సీ. 2:20-23లో ఇవ్వబడిన ఆహారము నివారణతో అనుసంధానము చేశాడు.
మరొక వైపున, యెరూషలేము నుండి వచ్చిన “క్రైస్తవులైన యూదుల” విషయములో కూడా పౌలు ఆందోళన కలిగియున్నాడు. ఈ అబద్ధ బోధకులను గూర్చి అనేక సంవత్సరముల క్రితం గలతీ. 2:11-21, మరియు తరువాత రోమా. 4:9-17లో అతడు వ్రాశాడు. అతడు మునుపు యెరూషలేముకు చేసిన ప్రయాణములలో ఈ అబద్ధ బోధకులతో మునుపటి వివాదములు ప్రస్తుత చెరసాల పరిస్థితికి కారణము కాకపోవచ్చు. లైకస్ లోయలోని అబద్ధ బోధకుల వలెనె, క్రైస్తవ విశ్వాసమునకు విరుద్ధముగా ఉన్న యూదుల ఆచారములకు కట్టుబడియుండాలని అన్యులైన విశ్వాసులను బలవంతము చేయుటకు యూదులైన క్రైస్తవులు ప్రయత్నించారు.
చివరిగా, హింస మరియు అబద్ధ బోధకులు అను సమస్యలతో పాటుగా, సంఘములోని విశ్వాసుల మధ్య వివాదములతో ఫిలిప్పీయులు పోరాడారు.
వివాదములు. ఫిలిప్పీయులకు 2:1-3లో పౌలు ఈ హెచ్చరికతో ఈ వివాదములను సాధారణ మాటలలో ప్రస్తావించాడు:
కావున క్రీస్తునందు ఏ హెచ్చరికయైనను, ప్రేమ వలన ఆదరణయైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్నయెడల... మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుకొనుడి (ఫిలిప్పీయులకు 2:1-3).
మరియు ఫిలిప్పీయులకు 4:2లో తమ భిన్నత్వములను పరిష్కరించుకొనలేనట్లు కనిపిస్తున్న ఇద్దరు స్త్రీలను గూర్చి ఈ మాటలలో అతడు ఉపదేశించాడు:
ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను. (ఫిలిప్పీయులకు 4:2)
ఇప్పుడు, ఫిలిప్పీ సంఘములోని అంతర్గత వివాదములను పౌలు కఠినముగా ఖండించలేదు లేక క్రమశిక్షణలో పెట్టలేదు. ఇంకను, అవి భంగపరచేవిగా, నిష్ప్రయోజనమైనవిగా, మరియు పాపభరితమైనవిగా ఉన్నాయి. స్వీయ-కేంద్రీకృతమైనవి, ప్రేమలేని విభేదములు సంఘములో ఆమోదయోగ్యమైనవి కాదు. కాబట్టి, అతడు తన ఇతర పత్రికలలో వ్రాసినట్లుగా, క్రీస్తు పనిని ముందుకు కొనసాగించుటకు సంఘములో ఐక్యత మరియు ప్రేమ యొక్క ప్రాముఖ్యతను ఉద్ఘాటించుటకు పౌలు చాలా సమయమును కేటాయించాడు.
ఫిలిప్పీ పత్రిక యొక్క నేపథ్యమును అర్థము చేసుకొనుట సహాయకరముగా ఉంటుంది. అధ్యాయము 4, 2వ వచనములో ఉన్న యువొదియ మరియు సుంటుకే అను ఇద్దరు స్త్రీలతో వ్యవహరించుట ద్వారా మనకు గొప్ప ఆధారము లభిస్తుంది అని నా అభిప్రాయము. ఇప్పుడు, అతడు అసలు ఈ పత్రికను ఎందుకు వ్రాశాడు అనుదాని గురించి మనకు ఒక ఆధారము లభిస్తుంది అనునది ఆసక్తికరమైన విషయము. “ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను” — ఇక్కడ ఉద్ఘాటనను గమనించండి — “సుంటుకేను బతిమాలుకొనుచున్నాను” అని అతడు అనుచున్నాడు. ఈ ఇరువురు స్త్రీలు ప్రభువునందు ఏకమనస్సు లేకుండా ఉన్నారు అనిపిస్తుంది, మరియు వారు ఎక్కువగా వాదించుకొనుచున్నారు అని అర్థమవుతుంది. ఇప్పుడు, ఈ సంఘ జీవితములో ఏమి జరుగుతుంది అనుదాని గురించి ఈ చిన్న ఆధారమును మనస్సులో ఉంచుకొని, ఈ పత్రికను మరలా చదువుట ద్వారా మరొక ఆధారము లభిస్తుంది, మరియు పౌలు ఈ విధముగా 2వ అధ్యాయములో చెప్పుటకు ఇది కారణము అయ్యుండవచ్చు అనిపిస్తుంది, “నాయందు ఉన్న అదే మనస్సు మీలో ఉండనీయుడి ... యేసు ... ఆయన ... దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు ... దాసుని స్వరూపమును ధరించుకున్నాడు.” “ఈ మనస్సును మీరును కలిగియుండుడి” అని పౌలు చెప్పునప్పుడు, ఇబ్బందులను ఎదుర్కొనుచున్న ఈ స్త్రీలందరితో అతడు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుందిగాని, కేవలం ఈ ఇద్దరు స్త్రీలతో మాత్రమే కాదు. మరియు మనలను మనము అప్పగించుకొనుచు క్రీస్తు వంటి మనస్సును కలిగియుండుచుండగా నిజముగా మనకు చేయబడిన తప్పిదములను ఎత్తి చూపు అవకాశము మనకు లభిస్తుంది. మరియు తన స్థానమును విడిచిపెట్టలేనంత భాగ్యమని ఎంచక యేసు ఖచ్చితముగా ఇదే పనిని చేశాడు. బదులుగా ఆయన దాసుని స్వరూపమును, ఒక బానిస స్వరూపమును ధరించుకున్నాడు.
— డా. ఆండీ మిల్లర్ III
ఇప్పటివరకు మనము ఫిలిప్పీ పత్రిక యొక్క నేపథ్యమును చూశాము గనుక, మనము మన యొక్క రెండవ ముఖ్య అంశమును పరిశీలించుటకు సిద్ధముగా ఉన్నాము: ఫిలిప్పీ సంఘముకు పౌలు వ్రాసిన పత్రిక యొక్క ఆకృతి మరియు విషయసూచిక.
పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక యొక్క ఆకృతి మరియు విషయసూచికను మనము పరిశీలించుచుండగా, పత్రికను ఆరు ప్రధాన భాగములుగా విభావించుదము:
1:1-2లో అభివందనం;
1:3-8లో కృతజ్ఞతను గూర్చిమ భాగము;
1:9-11లో ఫిలిప్పీయులను గూర్చిన పౌలు ప్రార్థన;
1:12-4:20లో పత్రిక యొక్క ప్రధాన విభాగము;
మరియు 4:21-23లో పౌలు యొక్క చివరి శుభవచనములు.
1:1-2లో అభివందనం పౌలును పత్రిక యొక్క రచయితగా గుర్తిస్తుంది మరియు పత్రిక తిమోతి నుండి కూడా వ్రాయబడింది అని గుర్తిస్తుంది. అయినప్పటికీ, ఫిలిప్పీయుల పట్ల పౌలు కలిగియుండిన ఆప్యాయత దృష్ట్యా, అతడు తరచుగా తనను తాను వ్యక్తిగతముగా ఇతర పత్రికలలో వలె “మేము” “మనము” వంటి బహువచనములతో గుర్తించుకొనుటకు బదులుగా “నేను” మరియు “నా” వంటి ఏక వచనములను ఉపయోగించాడు. మరియు ఫిలిప్పీయులకు 2:19, 22లో తిమోతిని ప్రథమ పురుషములో అతడు సూచించాడు.
ఫిలిప్పీ పత్రికలోని అభివందనం పౌలు వ్రాసిన ఇతర పత్రికలలోని అభివందనముకు భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇది పౌలు గ్రంథకర్తృత్వమును గూర్చి ప్రస్తావించుటలేదు. 1 మరియు 2 థెస్సలొనీక మరియు ఫిలేమోను పత్రికలు మాత్రమే ఈ ప్రత్యేకతను కలిగియున్నవి — అయితే ఈ పత్రికలు అన్నీ పౌలు యొక్క అపొస్తలత్వ అధికారమును గూర్చి అభివందనముకు వెలుపల ప్రస్తావిస్తాయి. ఫిలిప్పీ పత్రికలో మాత్రమే పత్రికయంతటా ఎక్కడా కూడా పౌలు తన అపొస్తులత్వ అధికారము మీద స్పష్టమైన దృష్టిని పెట్టకపోవుటను మనం చూస్తాము. ఇప్పుడు, పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక అపొస్తులత్వ అధికారమును కోల్పోయింది అని దీని అర్థం కాదు. బదులుగా, ఫిలిప్పీయులతో అతనికున్న సంబంధముకు, పౌలు పట్ల వారికున్న గౌరవముకు మరియు ప్రభువును సంతోషపరచాలను వారి ఆత్రుతకు ఇది సాక్ష్యముగా ఉంది. ఒక్కసారి కూడా తన స్థానము మరియు అధికారమును గూర్చి పౌలు మాట్లాడవలసిన అవసరము రాలేదు.
అభివందనం తరువాత, 1:3-8లో ఉన్న కృతజ్ఞతను గూర్చిన భాగమును పౌలు ప్రస్తావించాడు. అభివందనం తరువాత కృతజ్ఞత తెలుపుట పౌలు గలతీయులకు మరియు తీతుకు వ్రాసిన పత్రికల మినహా, అతని ఇతర ప్రామాణిక గ్రంథ పత్రికలో పౌలు అనుసరించిన విధానమునే ఇక్కడ అనుసరించాడు. వచనములు 3-6లో ఉన్న పౌలు ఇచ్చిన కృతజ్ఞత యొక్క మొదటి భాగము ఒక స్థిరమైన కృతజ్ఞత వ్యాఖ్యను తెలియజేస్తుంది. ఫిలిప్పీయులు అతనికి కలిగించిన ఆనందమును గూర్చి మరియు వారి అంతిమ రక్షణను గూర్చి అతడు కలిగియున్న ఆకాంక్షలను గూర్చి పౌలు మాట్లాడాడు. అయితే 7, 8 వచనములు పౌలు యొక్క సాధారణ కృతజ్ఞతలకు భిన్నముగా ఉన్నవి, ఎందుకంటే ఫిలిప్పీయుల పట్ల అతడు కలిగియున్న ప్రేమను అతడు ఉద్ఘాటించాడు. అక్కడ అతని మాటలను వినండి:
... నేను మిమ్మును నా హృదయములో ఉంచుకొని యున్నాను. ఇందుచేత మిమ్మునందరినిగూర్చి యీలాగు భావించుట నాకు ధర్మమే. క్రీస్తుయేసుయొక్క దయారసమునుబట్టి, మీ అందరిమీద నేనెంత అపేక్ష కలిగియున్నానో దేవుడే నాకు సాక్షి (ఫిలిప్పీయులకు 1:7-8).
ఫిలిప్పీయులతో పౌలుకున్న సంబంధం వ్యక్తిగతమైనది మరియు హృదయపూర్వకమైనదని ఈ వచనములు సూచిస్తాయి.
అతని అభివందనము మరియు కృతజ్ఞతలు తరువాత, 1:9-11లో పౌలు ఫిలిప్పీయుల విషయమై ప్రార్థనలు అర్పించాడు. ఈ ప్రార్థన చాలా క్లుప్తంగా ఉన్నది, కాని ఈ పత్రిక అంతటిలో కనిపించు ఉద్ఘాటనలతో ఇది నిండియున్నది. మొత్తం మీద, ఫిలిప్పీయులు దేవునిని గౌరవించే మార్గములలో జీవించుట ద్వారా తమ క్రైస్తవ ప్రేమను వ్యక్తపరచాలని పౌలు ప్రార్థించాడు. మొదటిగా, సరైన నిర్ణయములను తీసుకొనుటలో వారికి వివేచన అవసరమని అతడు ప్రార్థించాడు. రెండవదిగా, ఈ వివేచన వారిని సత్క్రియలు చేయుటకు నడిపించాలని మరియు తీర్పులో క్రీస్తు రాకడవరకు విశ్వాసము మరియు అభ్యాసములో పట్టుదలతో ఉంచాలని అతడు ప్రార్థించాడు. చివరిగా, ఫిలిప్పీయులు తమ సత్క్రియలు మరియు పట్టుదల ద్వారా దేవునికి మహిమ మరియు ప్రశంసలు తెస్తారని అతడు ప్రార్థించాడు.
అతని ప్రార్థన తరువాత, పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన తన పత్రికలోని ప్రధాన భాగము వైపు తిరిగాడు, ఇది 1:12-4:20లో మనకు కనిపిస్తుంది. ఈ విభాగమును వివిధ పండితులు వివిధ మార్గములలో వివరించారు. అయితే ఈ పాఠంలో, మన సంక్షిప్తప్రతి ప్రధానంగా ఫిలిప్పీ సంఘముకు పౌలు ఇచ్చిన ప్రోత్సాహకములు మరియు హెచ్చరికల యొక్క తార్కిక లయను అనుసరిస్తుంది.
మనము ఇంతకు ముందే ప్రస్తావించినట్లు, పౌలు ఫిలిప్పీయులకు వ్రాసినప్పుడు, అతడు చెరసాలలో బహుగా శ్రమలను అనుభవించుచున్నాడు, మరియు అతని జీవితము గొప్ప ఆపాయములో ఉండినది. మరియు ఈ మనస్తత్వంతోనే అతడు ఫిలిప్పీ విశ్వాసులకు వ్రాశాడు. ఇవి అతడు వారికి వ్రాయుచున్న చివరి మాటలు అని పౌలుకు తెలుసు. కాబట్టి, అతడు వారిపట్ల తన లోతైన భావనలను వ్యక్తపరచాడు, అతడు వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో మరియు వారి స్నేహము, పరిచర్యకు అతడు ఎంత కృతజ్ఞతతో ఉన్నాడో వారికి తెలియపరచాడు. మరియు అతడు చివరి జ్ఞానవచనములను ఇచ్చాడు, మరియు దేవునిని గౌరవించే మార్గములలో కష్టాలను ఎలా ఎదుర్కోవాలో వారికి నేర్పించాడు.
ఫిలిప్పీయులను గూర్చిన ఈ విస్తృతమైన దృక్పథము దృష్టిలో ఉంచుకొని, ఈ పత్రికలోని ప్రధాన భాగములో మూడు ప్రాధమిక భాగములను మనం కనుగొనవచ్చు: మొదటిగా, 1:12-26లో, చెరసాలలో పౌలు చూపిన ఓర్పును గూర్చిన వివరణ; రెండవదిగా, 1:27-4:9లో ఓర్పుతో ఉండమని పౌలు ఫిలిప్పీయులకు ప్రోత్సాహము ఇచ్చుట; మరియు మూడవదిగా, 4:10-20లో ఫిలిప్పీయుల యొక్క ఓర్పును పౌలు ధృవీకరించుట. మనము ఈ భాగములన్నిటిని ఒకొక్కటిగా చూద్దాము, చెరసాలలో పౌలు చూపిన ఓర్పుతో ఆరంభిద్దాము.
తన శ్రమలను తిసర్కరించుట ద్వారా పౌలు చెరసాలలో ఓర్పును చూపలేదుగాని, శ్రమల మధ్యలో ఆనందించుటకు కారణములను కనుగొనుట ద్వారా ఓర్పును చూపాడు. మరియు తన యెడల ఫిలిప్పీయులకున్న చింతను ఆపివేయునట్లు వారిని ప్రోత్సహించుటకును మరియు తన ఆనందమును కాపాడుకొనుటకు మరియు వివరించుటకును అతడు సమయం తీసుకున్నాడు. అతని పట్ల వారు కలిగియుండిన ఆందోళనను అతడు మెచ్చుకున్నాడు, కాని అతని పరిస్థితులను గూర్చి వారు అతిగా చింతించకూడదు అని అతడు కోరాడు.
పౌలు చూపిన ఓర్పును గూర్చిన ఈ భాగములో, శ్రమల మధ్య అతడు కనుగొనిన ఆనందమునకు మూడు మూలముల మీద అతడు దృష్టిపెట్టాడు: 1:12-18వ వచనము యొక్క మొదటి భాగములో తన ప్రస్తుత పరిచర్య యొక్క విజయము; 18వ వచనము రెండవ భాగము నుండి 21 వచనములలో భవిష్యత్ విమోచనను గూర్చిన తన నిరీక్షణ; మరియు 22-26 వచనములలో భవిష్యత్ పరిచర్యను గూర్చి తన ఆకాంక్ష. ఈ మంచి విషయముల మీద దృష్టిపెట్టుట ద్వారా, అతడు తన కష్టములను భరించగలిగానని పౌలు వివరించాడు.
ప్రస్తుత పరిచర్య (1:12-18a). ఉదాహరణకు, అతడు చెరసాలలో శ్రమననుభవించుచున్ననూ, తన ప్రస్తుత పరిచర్య వృద్ధి చెందుతుండుట ఆనందమును కలిగించుచున్నది అని అతడు ఫిలిప్పీ క్రైస్తవులకు వివరించాడు. ఫిలిప్పీయులకు 1:16-18లో అతని కథనమును వినండి:
[కొందరు] నా బంధకములతో కూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు... అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. (ఫిలిప్పీయులకు 1:16-18).
కొంత వరకు, స్వార్థపరులైన, అత్యాశగల సువార్తికులు అతనికి ఇబ్బందిని కలిగించారు. అయితే అతడు ఈ విధముగా శ్రమను అనుభవించినప్పటికీ, వారు నిజమైన సువార్తను ప్రకటించిన విషయము పౌలుకు ఆనందమును కలిగించింది.
సరికాని హేతువులతో మాట్లాడు ప్రజల పట్ల పౌలు వైఖరి ఒకే మౌలిక ఆలోచన మీద ఆధారితమైయున్నది: వారు క్రీస్తును ప్రకటించుచున్నారా? వారు స్పష్టముగా క్రీస్తును ప్రకటించుచుంటే, వారి హేతువులను దేవుడు సరిచేయును గాక. దీని ద్వారా సంఘము ఐక్యముగా ముందుకు కొనసాగవచ్చు, మరియు హృదయములను పరిశీలించు దేవుడు వారి హృదయములను పరిశీలిస్తాడు మరియు వారి ఆందోళనలకు జవాబు ఇస్తాడు. ఎందుకంటే తుదకు, సరికాని హేతువుగల వ్యక్తి కూడా మార్పుచెంది, సమర్పణగలవాడు అయ్యే అవకాశము ఉంది.
— పాస్టర్ జాన్సన్ ఒని
భవిష్యత్ విమోచన (1:18b-21). తన ప్రస్తుత పరిచర్య అభివృద్ధి చెందుతుంది అను వాస్తవములో మాత్రమే పౌలు ఆనందించలేదుగాని, 18వ వచనము యొక్క రెండవ భాగము నుండి 21వ వచనము వరకు ఉన్న మాటలలో, భవిష్యత్ విమోచనను గూర్చిన నిరీక్షణను బట్టి కూడా పౌలు ఆనందించాడు. అతడు తుదకు చెరసాల నుండి విడిపించబడతాడు అని పౌలు నిరీక్షించాడు. అయితే, మనము ఇంతకు ముందు చెప్పినట్లు, ఈ సమయములో, పౌలు యొక్క శ్రమలు ఎంత తీవ్రముగా ఉండినవి అంటే, అతడు త్వరగా మరణించుట కూడా సాధ్యమే అని అతడు గ్రహించాడు. కాబట్టి, తాను విడిపించబడుట ద్వారా లేదా మరణము ద్వారా, దేవుని దైవకృతములో తన శ్రమల నుండి ఉపశమనము కలుగుతుంది అను వాస్తవము ద్వారా అతడు ప్రోత్సహించబడ్డాడు. ఫిలిప్పీ. 1:18-21లో అతడు ఈ దృష్టికోణమును వ్యక్తపరచాడు:
ఇక ముందును సంతోషింతును ... నా బ్రదుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే... ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేనెరుగుదును. నామట్టుకైతే బ్రదుకుట క్రీస్తే, చావైతే లాభము (ఫిలిప్పీయులకు 1:18-21).
ఒక భావనలో, మరణాపాయము పౌలును బహుగా ఇబ్బందిపెట్టింది, ఎందుకంటే అది భూమి మీద క్రీస్తు మరియు ఆయన రాజ్యము కొరకు అతని పరిచర్యను ముగింపునకు తెస్తుంది. అయితే మరో విధంగా, తన మరణము తరువాత పరలోకములో క్రీస్తు సాన్నిధ్యంలోని ఆనందమును అతడు చూడగలిగాడు. జీవము మరియు మరణము రెండు దేవుని ఆశీర్వాదములను తీసుకొనివస్తాయి అను వాస్తవము మీద ఆధారపడుట ద్వారా, తన సమస్యలన్నిటి మధ్య పౌలు ఆనందమును అనుభవించగలిగాడు.
భవిష్యత్ పరిచర్య (1:22-26). పౌలు ఆనందము తన ప్రస్తుత పరిచర్య యొక్క సాఫల్యత మరియు భవిష్యత్ పరిచర్యను గూర్చి తాను కలిగియున్న నిరీక్షణ ద్వారా ప్రేరేపించబడింది. మరియు ఇదే భావనలో, 1:22-26లో, ఫిలిప్పీయులకు భవిష్యత్తులో సాధ్యమైతే చేయబోవు భవిష్యత్ పరిచర్య యొక్క ఆనందమును అతడు కనుగొన్నాడు. ఫిలిప్పీయులకు 1:25-26లో అతని ప్రోత్సహపు మాటలను వినండి:
మరియు ఇట్టి నమ్మకము కలిగి, నేను మరల మీతో కలిసి యుండుటచేత నన్నుగూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము, నేను జీవించి మీ అందరితో కూడ కలిసియుందునని నాకు తెలియును (ఫిలిప్పీ. 1:25-26).
ఫిలిప్పీయులు పౌలును ప్రేమించారు, గనుక అతను ఇంకా జీవించాలని ఆశిస్తున్నాడని విన్నప్పుడు వారు ఉపశమనం పొందారు. వారు కూడా అతనిని ప్రేమించారు, మరియు దేవుడు మరలా వారిని చూచుటకు అతనికి అనుమతి ఇవ్వగలడు అను ఆలోచన ద్వారా వారు ఆదరణను మరియు సంతృప్తిని పొందారు.
చెరసాలలో అతని ఓర్పును గూర్చి ఫిలిప్పీయులకు నిశ్చయతను కలుగజేసిన పిమ్మట, ఫిలిప్పీ. 1:27-4:9లో ఫిలిప్పీయులను కూడా ఓర్పు కలిగియుండమని తెలుపుతూ ఒక సుదీర్ఘమైన ఉపదేశముల భాగమును వ్రాశాడు.
ఇక్కడ క్రీస్తుకు నమ్మకముగా ఉండాలని మరియు దుర్భరమైన పరిస్థితుల మధ్య కూడా ఆదర్శప్రాయమైన జీవితములను గడపాలని పౌలు వారిని ఆదేశించాడు. పౌలు యొక్క ఉపదేశములను గూర్చిన మన అధ్యయనం ఈ క్రింది నాలుగు ప్రధాన విషయములను చర్చిస్తుంది: 1:27-2:18లో ఓర్పు యొక్క ప్రాముఖ్యత; 2:19-30లో పరిచారకులు ఓర్పుకు అందించు సహాయము; 3:1-16లో ఓర్పును గూర్చి పౌలు యొక్క వ్యక్తిగత ఉదాహరణ; మరియు చివరిగా, 3:17-4:9లో ఓర్పు ఎదుర్కొను సవాళ్లను గూర్చి అతడిచ్చిన సూచనలు.
ఓర్పు యొక్క ప్రాముఖ్యత (1:27–2:18). మొదటిగా, క్రైస్తవ విశ్వాసము మరియు ఆచరణలో ఓర్పు యొక్క ప్రాముఖ్యతను గూర్చి పౌలు ఏమి చెప్పాడో చూద్దాము. ఫిలిప్పీయులకు 1:27-30లో, పౌలు ఫిలిప్పీయుల యొక్క కష్టములను గుర్తించి, ఈ మాటలతో వారిని ప్రోత్సహించాడు:
మీరు ఏ విషయములోను ఎదిరించువారికి బెదరక, అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు, ఏక మనస్సుగలవారై నిలిచియున్నారని... ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను (ఫిలిప్పీయులకు 1:27-30).
నిరాశ మరియు బాధను కలిగించు వ్యతిరేకతను ఫిలిప్పీయులు ఎదుర్కొన్నారు. అయితే దీనిలో ఏదియు దేవుని నియంత్రణకు వెలుపల లేదు. దీనికి భిన్నముగా, వారిని దీవించుటకు మాధ్యమముగా క్రీస్తు కొరకు వారి శ్రమలను దేవుడే స్వయంగా నిర్థారించాడు. ఈ కారణము చేత, ఈ కష్ట సమయముల మధ్య వారు ఐక్యత మరియు ధైర్యముతో ఓర్పు కలిగియుండుట ప్రాముఖ్యమైయుండినది.
పౌలు ఫిలిప్పీయులకు వ్రాస్తూ, మీరు క్రీస్తు యేసును నమ్ముట మాత్రమే కాదుగాని, ఆయన కొరకు శ్రమలను కూడా అనుభవించాలి అని చెబుతున్నాడు. కాబట్టి శ్రమ అనునది, అనుదినము మన సిలువను ఎత్తుకొని క్రీస్తును అనుసరించుటలో భాగమైయున్నది. మన జీవితములో వచ్చు శ్రమలు మరియు కష్టములతో ఎలా వ్యవహరించాలి అను దానిని గూర్చి అనేక ఆచరణాత్మక సలహాలను క్రొత్త నిబంధన రచయితలు మనకు ఇచ్చారు. వీటిని మనము ... అధిగమించుటకు ప్రోత్సాహము, క్రీస్తుతో మన సంబంధమును తిరస్కరించుటకు ఎదుర్కొను గొప్ప ఒత్తిడి మధ్య నమ్మకముగా ఉండుట, లేక రాజీపడుటలో మనము చూస్తాము.
— డా. గ్రెగరీ ఆర్. పెర్రీ
ఇతర పాఠములలో మనము చూసినట్లు, సిలువ మీద క్రీస్తు మరణము దేవుని ఉగ్రత నుండి మనలను విమోచించుటకు పూర్తిగా సరిపోయినది అయినప్పటికీ, ఆయన తిరిగి వచ్చు వరకు క్రీస్తు యొక్క శ్రమ ముగించబడదు అని పౌలు బోధించాడు. ఈలోపు, ఆయన కొరకు నియమించబడిన శ్రమ క్రీస్తు శరీరమైన సంఘము ద్వారా ఆయన పూర్తి చేస్తాడు. విశ్వాసులు క్రీస్తుతో ఏకమైయున్నారు గనుక, మనం శ్రమపడినప్పుడు, యేసు శ్రమపడతాడు. మరియు పౌలు దృష్టికోణము ప్రకారం, క్రీస్తు కొరకు నియమించబడిన శ్రమలను పూర్తి చేయుట ప్రతి క్రైస్తవునికి ఒక గొప్ప ఘనత అయ్యున్నది. ఫిలిప్పీయులకు 1:27-30లో ఇంతకుముందే మనము చదివినట్లుగా, దేవుడు ఫిలిప్పీయులకు శ్రమను కేవలం అనుమతించలేదు – క్రీస్తు కొరకు శ్రమను అనుభవించు ఘనతను ఆయన వారికి “అనుగ్రహించాడు.” ఈ ఆలోచనను గూర్చి ఫిలిప్పీయులకు 2:5-11లో వివరిస్తూ పౌలు ఈ మాటలు వ్రాశాడు:
క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి ... మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను. అందుచేత దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను (ఫిలిప్పీయులకు 2:5-11).
దేవుని రాజ్యము కొరకు యేసు ఇష్టపూర్వకముగా శ్రమలను మరియు దూషణను అనుభవించాడు, మరియు ఆయన చేసిన త్యాగమునకు ఆయన పొందిన ప్రతిఫలము ఎంతో గొప్పదిగా ఉన్నది. అదే విధముగా, లోకమంతటా రాజ్య సువార్తను వ్యాపింపజేయుటకు విశ్వాసులు వినయముతో శ్రమలను మరియు దూషణను సహించాలి. మనం అలా చేసినప్పుడు, మన బహుమానం చాలా గొప్పదిగా ఉంటుంది. ఇందుమూలముగానే ఫిలిప్పీయులకు 2:17-18లో పౌలు ఈ మాటలు వ్రాయగలిగాడు:
మరియు మీ విశ్వాసయాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పణముగా పోయబడినను, నేనానందించి మీ యందరితోకూడ సంతోషింతును. ఇటువలెనే మీరును ఆనందించి నాతోకూడ సంతోషించుడి (ఫిలిప్పీయులకు 2:17-18).
ఫిలిప్పీయులు తమకు నియమించబడిన శ్రమలను భరించాలని మాత్రమే పౌలు ఆశించలేదుగాని, తత్ఫలితంగా వచ్చే ఆశీర్వాదములను బట్టి శ్రమల మధ్యలో కూడా సంతోషించాలని ఆశించాడు. అంతేకాక, వారి శ్రమల ద్వారా కలిగే ఆశీర్వాదములను బట్టి అతడు ఎలా ఆనందించాడో, అలాగే తన వ్యక్తగత శ్రమల ఫలితంగా వచ్చు ఆశీర్వాదములను బట్టి కూడా వారు ఆనందించాలని అతడు ఆశించాడు.
చాలాసార్లు శ్రమను ప్రతికూలమైనదిగా చూస్తారు. అయితే, క్రైస్తవ దృష్టికోణములో నుండి, శ్రమను ఒక క్రమశిక్షణగా, మరియు దేవుని స్వభావములోనికి విశ్వాసులను మరి ఎక్కువగా మార్చుటకు మరియు రూపించుటకు ప్రభువు ఉపయోగించు క్రమశిక్షణగా చూడాలి... క్రీస్తును మరియు ఆయన పునరుత్థాన శక్తిని తాను తెలుసుకోవాలనుకొనుచున్నాను అని వివరించినప్పుడు ఫిలిప్పీ. 3లో పౌలు దీనిని గూర్చి మాట్లాడాడు, కాని అతడు అక్కడ ఆగుటలేదు. ఆయన శ్రమలలో పాలుపంచుకొను సహవాసమును గూర్చి అతడు మాట్లాడుతున్నాడు. కాబట్టి, ఆయన శ్రమలలో విశ్వాసులు క్రీస్తుతో సహవాసము కలిగియుండవచ్చు, మరియు రోమా 8:28లో పౌలు పలికిన ఈ మాటలను దృష్టిలో ఉంచుకొని జీవితములో శ్రమలను అనుభవించుచుండగా మనము కూడా ఒకరితో ఒకరము సహావాసము కలిగియుండవచ్చు, “దేవుడు మేలు కలిగించుటకై సమస్తమును సమకూడి జరిగించుచున్నాడు,” కాబట్టి, శ్రమలు మరియు క్రైస్తవుని జీవితము మీద దాని యొక్క ప్రభావము విషయములో మనము ఒక భిన్నమైన దృష్టికోణమును కలిగియుండవచ్చు.
— రెవ. ల్యారీ కాక్రెల్
ఈ జీవితములో శ్రమలను ఎదుర్కొనుచున్న ఫిలిప్పీ విశ్వాసులను, వారి శ్రమలకు కలుగు దేవుని ప్రతిఫలముల మీద దృష్టిపెట్టమని పౌలు ప్రోత్సహించాడు. ఈ విధముగా, గొప్ప ఒత్తిడి మధ్య కూడా, విశ్వాసము మరియు పరిశుద్ధ జీవనములో ఓర్పు కలిగియుండుటకు శక్తిని మరియు ధైర్యమును వారు పొందుకుంటారు.
ఓర్పు కొరకు సహాయము (2:19-30). వారు పొందబోవు ఆశీర్వాదములను గూర్చి ఫిలిప్పీయులకు జ్ఞాపకము చేస్తూ, ఓర్పు యొక్క ప్రాముఖ్యతను పౌలు ఉద్ఘాటించాడు. తరువాత, ఫిలిప్పీ. 2:19-30లో, వారి పట్ల శ్రద్ధ వహించుటకు సేవకులను పంపుట ద్వారా అతడు ఓర్పును కలిగియుండుటకు ఆచరణాత్మక సహాయమును అందించాడు.
శ్రమల మధ్య ఓర్పును కలిగియుండునప్పుడు మనకు కలుగబోవు ప్రతిఫలముల మీద దృష్టిపెట్టుట చాలా ప్రాముఖ్యమైయున్నది. అయితే ఇతర ప్రజలు సహాయము చేయుచున్నప్పుడు శ్రమలను అనుభవించుట సులభమవుతుంది అని కూడా పౌలు అర్థము చేసుకున్నాడు. మనలను బలపరచుటకు మరియు ప్రోత్సహించుటకు మనందరికీ ఇతరులు కావాలి. కాబట్టి, వారి అవసరత సమయములో వారికి సహాయము చేయుటకు తన స్నేహితులను పంపుచున్నాను అని పౌలు ఫిలిప్పీయులకు నిశ్చయతనిచ్చాడు. మరియు అతడు వారిని త్వరలో చూడబోవుచున్నాను అను నిశ్చయతను కూడా వారికి ప్రకటించాడు.
మొదటిగా, పౌలుకు పరిచర్య చేయుటకు వారు పంపిన ఫిలిప్పీయుల సొంత పరిచారకుడైన ఎపఫ్రొదితును పౌలు పంపుచున్నాడు. వాస్తవానికి పౌలు పత్రికను ఫిలిప్పీయులకు అందజేసినది ఎపఫ్రొదితే కావచ్చు. ఫిలిప్పీ. 2:25-30లో మనము నేర్చుకొనుచున్నట్లు, అతడు అనారోగ్యం పాలైయ్యాడు గనుక ఫిలిప్పీలో ఉన్న సంఘము ఎపఫ్రొదితును గూర్చి చింతించింది. మరియు వారు ఎంతో చింతించుచున్నారు కాబట్టి ఎపఫ్రొదితు వారిని గూర్చి చింతించాడు. కాబట్టి, పౌలు వారి మనసులను తేలికపరచడానికి మరియు వారికి పరిచర్య చేయుటకు ఎపఫ్రొదితును వారి యొద్దకు పంపించాడు. తరువాత, తిమోతిని ఫిలిప్పీకి పంపించాలని పౌలు ఆశించాడు. ప్రస్తుతానికి, అతడు చెరసాలలో పౌలు యొద్దనే ఉండి, బాధ సమయంలో అపొస్తలునికి పరిచర్య చేస్తున్నాడు. అయితే ఫిలిప్పీయులకు 2:19లో మనము చదివినట్లుగా, సమీప భవిష్యత్తులో ఫిలిప్పీయులకు సహాయము చేయుటకు అతనిని పంపించాలని పౌలు భావించాడు. చివరిగా, తాను చెరసాల నుండి విడిపించబడి ఫిలిప్పీయులకు పరిచర్య చేయుటకు వస్తానని అతడు నిరీక్షించాడు. ఫిలిప్పీయులకు 2:24లో అతడు ఈ భావనను వ్యక్తపరచాడు, అక్కడ అతడు ఈ మాటలు వ్రాశాడు:
నేనును శీఘ్రముగా వచ్చెదనని ప్రభువునుబట్టి నమ్ముచున్నాను (ఫిలిప్పీయులకు 2:24).
పెపొయ్త (πέποιθα) అను గ్రీకు పదము ఇక్కడ, “నమ్ముట” అని అనువదించబడింది, బహుశా దీనికి ఉత్తమమైన అనువాదము “నేను ఒప్పించబడితిని.” పౌలు తన విడుదలను గూర్చి నిరీక్షణ కలిగియున్నాడు, కాని ఫిలిప్పీ పత్రికలోని ఇతర భాగములు సూచించుచునట్లు, దానిని గూర్చి అతడు సంపూర్ణ నిశ్చయతను కలిగిలేడు. ఏది ఏమైనప్పటికీ, ఫిలిప్పీ సంఘము కష్టములతో పోరాడుతుండగా నమ్మకమైన విశ్వాసుల యొక్క పరిచర్య దానికి ఎంతో విలువైనది అని పౌలుకు తెలుసు. కాబట్టి, నైపుణ్యత గల ప్రేమించు పరిచారకులను వారి యొద్దకు పంపుటను గూర్చి అతడు ప్రణాళికలు కలిగియున్నాడు అని ఉద్ఘాటించాడు.
ఓర్పును గూర్చిన ఉదాహరణ (3:1-16). ఫిలిప్పీయులకు 3:1-16లో కనిపించే ఉపదేశములను గూర్చిన తదుపరి భాగములో, పౌలు తన మనస్తత్వం మరియు ప్రవర్తనకు సంబంధించి, శ్రమలలో ఓర్పు కలిగియుండు విషయములో తననుతాను ఒక ఉదాహరణగా చెప్పుకున్నాడు. ప్రత్యేకముగా, అతడు క్రీస్తును అంగీకరించినప్పుడు, దేవుని అనుగ్రహము మరియు ఆశీర్వాదము పొందుటకు భూసంబంధమైన విషయముల మీద ఆధారపడుట మానివేసి, క్రీస్తుమీద మాత్రమే ఆధారపడుట ఆరంభించానని పౌలు వివరించాడు. అయితే యూదా సమాజము యొక్క భూసంబంధమైన పరిమాణములను అతడు చేరుకోలేకపోయాడు అనునది దీనికి కారణము కాదు. భిన్నముగా, భూసంబంధమైన ప్రామాణికతల ప్రకారం పౌలు దేవుని అత్యంత అనుగ్రహం పొందినవారిలో ఒకనిగా ఉండాలి. ఫిలిప్పీయులకు 3:4-6లో తన అర్హతలకు పౌలు ఇచ్చిన వివరణను వినండి:
కావలయునంటే నేను శరీరమును ఆస్పదము చేసికొనవచ్చును; మరి ఎవడైనను శరీరమును ఆస్పదము చేసికొనదలచినయెడల నేను మరి యెక్కువగా చేసికొనవచ్చును. ఎనిమిదవదినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశపువాడనై, బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై, ధర్మశాస్త్రవిషయము పరిసయ్యుడనై, ఆసక్తివిషయము సంఘమును హింసించువాడనై, ధర్మశాస్త్రమువలని నీతివిషయము అనింద్యుడనై యుంటిని (ఫిలిప్పీయులకు 3:4-6).
ఏ మానవుడైన ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా దేవుని ఆశీర్వాదములను పొందగలిగాడు అంటే అది పౌలే. అయితే ఈ విషయంలో వాస్తవమేమిటంటే రక్షణ మరియు నిత్యజీవము అను దేవుని ఆశీర్వాదములను పొందుటకు పతనమైన ఏ మానవుడు కూడా అర్హుడు కాదు. కాబట్టి, పౌలు తన భూసంబంధమైన యోగ్యత మీద ఆధారపడుటకు తిరస్కరించి, క్రీస్తు యోగ్యత మీద ఆధారపడ్డాడు, మరియు దీనిని దేవుడు అతనికి విశ్వాసం ద్వారా అనుగ్రహించాడు. అదేసమయంలో, మన రక్షణకు ధృవీకరణగా కేవలం విశ్వాసమును ఒప్పుకొంటే సరిపోదు అని అతడు స్పష్టం చేశాడు. భిన్నముగా, క్రీస్తునందు విశ్వాసము ఉన్నదని చెప్పుకొనువారందరు నిత్య జీవము పొందుటకు విశ్వాసములో కూడా ఓర్పు కలిగియుండాలి. మనము విశ్వాసమును కాపాడుకోవాలి, మరియు పరిశుద్ధమైన జీవితము జీవించాలి, లేకపోతే మన విశ్వాసము అబద్ధమని నిరూపిస్తాము. ఇందుమూలముగానే ఫిలిప్పీయులకు 3:12-16లో క్రీస్తులో రక్షణను గూర్చి వ్రాస్తూ, ఓర్పు మీద అతడు ఎక్కువ దృష్టిపెట్టాడు:
ఇదివరకే నేను గెలిచితి ననియైనను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితిననియైనను నేను అనుకొనుటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసుచేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను ... నేనిదివరకే పట్టుకొని యున్నానని తలంచుకొనను ... ముందున్న వాటికొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని, గురి యొద్దకే పరుగెత్తుచున్నాను (ఫిలిప్పీయులకు 3:12-16).
ఇక్కడ మనము చూస్తున్నట్లు, జీవితములో ఏదో ఒక సమయములో క్రీస్తు నందు విశ్వాసమును వ్యక్తపరచుట మాత్రమే చాలదు. నమ్మకముగా ఉండుట ద్వారా మనము మన విశ్వాసమును రుజువు కూడా చేయాలి. మరియు మనము అంతము వరకు ఒర్పుతో ఉండకపోతే, మన రక్షణ కొరకు క్రీస్తులో విశ్వాసమును కాపాడుకొనకపోతే, మరియు పరిశుద్ధమైన జీవితము ద్వారా నమ్మకముగా ఉండకపోతే, మన విశ్వాసము అబద్ధమని మనం నిరూపిస్తాము.
ఫిలిప్పీ. 3:12ను అనేకమంది కంఠస్థం చేస్తారు. మరియు చాలాసార్లు మనము పరిపూర్ణులము కాము అని చూపుటకు ఈ వచనము ఎక్కువగా ఉపయోగించబడుతుంది. అవును కదా? ఉదాహరణకు, “ఇదివరకే నేను గెలిచితి ననియైనను. . . అనుకొనుటలేదు” — లేక నేను నా లక్ష్యమును ఇప్పటికే చేరుకున్నాను అను విషయమును చూడండి. తరువాత అది “పరిగెత్తుచున్నాను” అని చెబుతుంది, మరియు దీనిని గూర్చి ఆలోచన చేయునప్పుడు అన్ని రకముల చిత్రములు మనస్సుకు వస్తాయి. అయితే విచారకరముగా, ఆ వచనమును మనము కంఠస్థం చేసినప్పుడు లేక ఉపయోగించినప్పుడు, చాలాసార్లు దాని యొక్క అర్థమును మనం తప్పిపోతాము. నేను దాని అర్థమును చాలాసార్లు తప్పిపోయాను అని చెబుతాను. ఎందుకంటే “ఇదివరకే [దానిని] నేను గెలిచితి ననియైనను. . . అనుకొనుటలేదు” అని చెబుతుంది. ఇక్కడ “దానిని” అను పదము దేనిని సూచిస్తుంది? ఇక్కడ దానిని అంటే ఏమిటి? ఇది ఏ దానిని అయ్యున్నది? కాబట్టి మీరు ఒక వచనము వెనుకకు వెళ్తే, “దానిని” అంటే ఏమిటో అర్థమవుతుంది: “ఏ విధముచేతనైనను మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనగుట యెట్టిదో యెరుగు నిమిత్తమును” ... క్రైస్తవులు ఎందుకు ఓర్పు కలిగియుండాలి? వారు ఎందుకు ముందుకు సాగిపోవాలి? ఎందుకంటే జీవితములో ఏమి జరుగుచున్నను, ఏమి జరుగుచున్నను, పునరుత్థానము కలుగబోతుంది, మరియు అప్పుడే సరికాని ప్రతి విషయమును దేవుడు సరిగా చేస్తాడు.
— డా. ఆండీ మిల్లర్ III
ఓర్పుకు సవాళ్లు (3:17–4:9). పౌలు యొక్క చివరి ఉపదేశములు ఓర్పుగా ఉండుటలో ఎదురయ్యే సవాళ్లకు సంబంధించినవిగా ఉన్నాయి, దీనిని గూర్చి ఫిలిప్పీయులకు 3:17-4:9లో అతడు మాట్లాడాడు. ఈ ఉపదేశములు ప్రధానముగా ఓర్పును గూర్చిన ఉదాహరణల యొక్క అనువర్తననములు అయ్యున్నవి. అబద్ధ బోధకులు, లేక సంఘములోని వివాదములు, లేక వ్యక్తిగత కష్టములు దేవుని పట్ల వారు కలిగియున్న నమ్మకత్వము విషయములో పడిపోవునట్లు చేయుటకు అవకాశము ఇవ్వవద్దు అని పౌలు ఫిలిప్పీయులను ప్రోత్సహించాడు. ఫిలిప్పీలో ఉన్న సంఘము మీద అబద్ధ బోధ దాడి చేయు విధానముల మీద అతడు దృష్టిపెట్టుట ఆరంభించాడు. ఫిలిప్పీయులకు 3:18-19లో పౌలు వ్రాసిన కఠినమైన ఖండనను వినండి:
అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు; వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు, భూసంబంధమైనవాటి యందే మనస్సు నుంచుచున్నారు (ఫిలిప్పీయులకు 3:18-19).
“క్రీస్తు సిలువకు శత్రువులుగా” ఉన్న వీరు విశ్వాసులు కారు. అయినప్పటికీ, వారు సంఘమునకు హాని కలిగించు స్థితిలో ఉన్నారు. వాస్తవానికి ఓర్పును కలిగియుండవలసిన అవసరతను గూర్చి వారు ఒప్పించునట్లు మాట్లాడారు. లేక, వారు ఏదో ఒక విధముగా పరపతిగలవారిగా ఉండవచ్చు. ఏ సందర్భములోనైనా, క్రీస్తు శత్రువుల యొక్క అబద్ధ బోధనలను విశ్వాసులు తిరస్కరిస్తూ, పవిత్రమైన క్రైస్తవ విశ్వాసము మరియు ఆచరణలో ఓర్పుతో ఉండాలని పౌలు ఉద్ఘాటించాడు. ఇబ్బందులు మరియు శ్రమల నుండి తప్పించుకోవాలి అను ఆశ సువార్త నుండి దూరమగుటకు ఎన్నడును కారణము కాకూడదు. అయితే సంఘములోని నిజమైన విశ్వాసులు ఇతర విశ్వాసుల ఓర్పుకు సవాళ్లను కలిగించవచ్చు అని కూడా పౌలు హెచ్చరించాడు. ఒక ఉదాహరణగా, యువొదియ మరియు సుంటుకే మధ్య ఉన్న సమస్యను అతడు ప్రస్తావించాడు. ఫిలిప్పీ. 4:1-3లో, పౌలు ఈ మాటలు వ్రాస్తున్నాడు:
... ప్రియులారా, యిట్లు ప్రభువునందు స్థిరులై యుండుడి. ప్రభువునందు ఏకమనస్సుగలవారై యుండుడని యువొదియను, సుంటుకేను బతిమాలుకొనుచున్నాను... [వారు] సువార్తపనిలో నాతోకూడ ప్రయాసపడినవారు గనుక వారికి సహాయము చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను (ఫిలిప్పీ. 4:1-3).
ఒకరితో ఒకరు వివాదములు పెట్టుకొనుట ద్వారా, యువొదియ మరియు సుంటుకే పరిశుద్ధమైన జీవనములో స్థిరముగా నిలబడు విషయములో విఫలమైయ్యారు. మరియు ఈ స్త్రీలు పౌలుతో కలిసి పని చేసినవారు కాబట్టి, వారి మధ్య ఉన్న వివాదము ఫిలిప్పీ పట్టణములో ఉన్న ఇతర విశ్వాసుల యొక్క ఓర్పుకు కూడా హానిని కలిగించునదిగా ఉండినది. దీనికి తోడు, వ్యక్తిగతముగా వారు ఎదుర్కొనిన కష్టములు వారి ఓర్పుకు ఆటంకము కలిగించకుండా చూచుకోమని కూడా పౌలు ఫిలిప్పీయులకు ఉపదేశించాడు. సంతోషకరమైన దృక్పథమును పాటించమని మరియు నిరుత్సాహముకు గురిచేసే చింతను అనుమతించవద్దని అతడు వారిని ప్రోత్సహించాడు. ఫిలిప్పీ. 4:4-7లో అతని ఆలోచనలు చక్కగా తెలియజేయబడినవి:
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. దేనినిగూర్చియు చింతపడకుడి...మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు...దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును (ఫిలిప్పీయులకు 4:4-7).
చింత మరియు వ్యాకులతలోనికి దిగజారిపోవుటకు బదులుగా, వారి అవసరతలను తీర్చమని దేవుని అడగమని పౌలు ఫిలిప్పీయులను ప్రోత్సహించాడు. కొన్ని సందర్భములలో, ఇబ్బందికరమైన పరిస్థితులను తొలగించుట ద్వారా దేవుడు స్పందిస్తాడు అని పౌలుకు తెలుసు. అయితే దేవుడు అలా చేయుటను నిర్ణయించుకొననప్పుడు కూడా, దేవుని సమాధానము “క్రీస్తు యేసు నందు వారి హృదయములను మరియు మనస్సులను కాయును” అని కూడా పౌలుకు తెలుసు. వారి వైఖరులు మరియు దృక్కోణములను మార్చుకొనుట ద్వారా, దేవుని పట్ల నమ్మకత్వము విషయములో వారు ఓర్పు కలిగియుండవచ్చు.
పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక యొక్క ముఖ్య భాగములో, అతడు తన వ్యక్తిగత ఓర్పును వర్ణించాడు, మరియు ఫిలిప్పీయులు కూడా ఓర్పు కలిగియుండాలని ఉపదేశించాడు. తరువాత, 4:10-20లో, ముఖ్యముగా వారు అతనికి చేసిన కొనసాగు పరిచర్య ద్వారా నమ్మకమైన క్రైస్తవ జీవనములో ఫిలిప్పీయుల యొక్క ఓర్పును గూర్చిన ఉద్ఘాటనతో తన పత్రిక యొక్క ముఖ్య భాగమును అతడు ముగించుచున్నాడు.
ఈ భాగములో, చెరసాలలో తన శ్రమకు కొంత ఉపశమనము కలుగుటకు ఫిలిప్పీయులు పంపిన ధనమును బట్టి పౌలు కృతజ్ఞతలు తెలిపాడు. పౌలు యొక్క కృతజ్ఞత పలుకులు అతడు ధనము అందుకున్నాడనియు మరియు తన పరిస్థితులు మెరుగుపడుటలో అది సహాయపడినదనియు అతడు వారికి ధృవీకరించాడు. అయితే ఆ ధనము యొక్క గొప్ప విలువనుబట్టి పౌలు భావోద్వేగముకు గురైనట్లు కనిపిస్తుంది. ఫిలిప్పీయులకు 4:12-14లో అతడు చెప్పిన మాటలు వినండి:
దీనస్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును; ప్రతివిషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండియుండుటకును ఆకలిగొనియుండుటకును, సమృద్ధికలిగియుండుటకును లేమిలో ఉండుటకును నేర్చు కొనియున్నాను... అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని (ఫిలిప్పీయులకు 4:12-14).
ఈ ధనము యొక్క గొప్ప విలువ అది పౌలు హృదయమును తాకిన విధానములో ఉన్నది. అతని పక్షమున వారు చేసిన త్యాగము ద్వారా, బీదలైన ఈ క్రైస్తవులు తాము పౌలును ఎంతగా ప్రేమిస్తున్నారో తెలియజేశారు.
ఫిలిప్పీయులు పౌలు యెడల వారి ప్రేమను వ్యక్తపరచుటకు ఇది ఉత్తమమైన సమయం. ఈ సమయంలో, పౌలు యొక్క జైలు శిక్ష అతని మీద భారముగా ఉంది. అతడు బహుగా శ్రమను అనుభవించుచున్నాడు మరియు ఇంచుమించు నిరాశలోనికి చేరుకున్నాడు. అతనిని చాలామంది ప్రేమిస్తున్నారని మరియు అతని శ్రమలలో పాలుపంచుకోనాలని ఆశిస్తున్నారని జ్ఞాపకం చేసుకొనుట అతనికి ఎంత ఓదార్పు నిచ్చిందో ఊహించండి. వాస్తవానికి ఫిలిప్పీయులు చూపిన శ్రద్ధ అతని నిరీక్షణను పునరుద్ధరించింది అని కూడా మనము ఊహించవచ్చు. అతని భయంకరమైన పరిస్థితుల మధ్య ఆనందించాలనే తన నిర్ణయమును ప్రేరేపించింది వారి ప్రేమేనా? పౌలు విడిచిపెట్టబడలేదనియు మరియు ఒంటిరిగా లేడనియు జ్ఞాపకం చేసింది వారి స్నేహమేనా? ఒకటి మాత్రం వాస్తవం: పౌలు ఫిలిప్పీయులను హృదయపూర్వకముగా ప్రేమించాడు. కాబట్టి, వారి బహుమానము అతనిని ప్రోత్సహించుట తప్ప మరేమియు చేయలేదు.
చివరిగా, ఫిలిప్పీయులకు 4:21-23లో పౌలు యొక్క తుది శుభవచనముతో పత్రిక ముగుస్తుంది. ఈ భాగము చాలా వరకు సామాన్య క్రమములోనే ఉన్నది, కాని ఈ చివరి శుభవచనములలోని ఒక విషయము ఎంత అద్భుతమైనది అంటే, దానిని గూర్చి ప్రత్యేకముగా మాట్లాడవలసియున్నది. ముఖ్యముగా, ఫిలిప్పీయులకు 4:22లో, కైసరు ఇంటికి చెందిన పరిశుద్ధుల నుండి పౌలు ఫిలిప్పీ సంఘమునకు శుభాకాంక్షలు పంపాడు. మరొక మాటలో, రోమా సామ్రాజ్యము అంతటి యొక్క చక్రవర్తి ఇంటి నుండి అతడు శుభములు పంపాడు. ఇప్పుడు, “కైసరు ఇంటివారు” అను మాట, వారు అతనితో రాజనివాసములో నివసించుచున్నా నివసించుచుండకపోయినా కైసరు కుటుంబ సభ్యులను మరియు సేవకులను సూచిస్తుంది అని తెలుసుకొనుట ప్రాముఖ్యమైయున్నది. మరియు అతని సేవకులు కేవలం నౌకరులు మాత్రమే కాదు. వారిలో వ్యక్తిగత అంగరక్షకులు, మరియు అనేకమంది పౌర సేవకులు కూడా భాగమైయున్నారు.
అవును, కైసరు ఇంటివారిని గూర్చిన ప్రస్తావన పౌలు మునుపు కైసరియ మరిటిమలో చెరసాలలో ఉన్న సమయములోగాక, రోమా చెరసాల నుండి ఫిలిప్పీయులకు వ్రాయుచున్నాడు అని అనేకమంది వ్యాఖ్యానకర్తలు నిర్ధారించుటకు దారితీసింది. అయితే, కైసరు రోమాలో నివసించి, ఒక వాస్తవిక కుటుంబమును కలిగియుండిన మాట వాస్తవమైనప్పటికీ, ఈ నిర్థారణకు మనము తొందరపాటులో రాకూడదు. వాస్తవమేమిటంటే, కైసరియ మరిటిమలో ఉన్నవారితో సహా సామ్రాజ్యమంతటా ఉన్న కైసరు యొక్క పౌర సేవకులు మరియు కాపులవారందరిని “కైసరు ఇంటివారు” అని పిలచేవారు. ఏది ఏమైనప్పటికీ, కైసరు ఇంటివారిలో ఉన్న విశ్వాసులు లేక పరిశుద్ధులను గూర్చి ప్రస్తావించుట, ఈ పత్రికను ముగించటకు పౌలు ఉపయోగించిన ఒక భావార్థకమైన మరియు ప్రోత్సాహకరమైన మార్గము అయ్యున్నది. పౌలు యొక్క చెర అతనిపై ప్రభావమును చూపినప్పటికీ, అది సువార్త యొక్క వ్యాప్తికి ఆటంకము కలిగించలేదు. భిన్నముగా, అన్యులను సేవించుటకు దేవుడు పౌలును పిలచాడు, మరియు వారి మధ్య అతని పరిచర్య ఎంతో ఫలవంతముగా కొనసాగింది. అతడు చెరసాలలో శ్రమలను అనుభవించుచుండిన సమయములో కూడా, పౌలు అధికారులకు, చెరసాల నాయకులకు, మరియు కైసరు యొక్క సొంత ఇంటివారికి ప్రాతినిధ్యము వహించినవారికి నమ్మకముగా సువార్తను ప్రకటించాడు. మరియు వారందరి మధ్య అతడు క్రీస్తు శిష్యులను చేశాడు.
పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికను మనము అధ్యయనము చేయుచుండగా, వారి పట్ల అతడు కలిగియుండిన ప్రేమను మనము తిరస్కరించలేము. దీనిని మనము అతని వ్యక్తిగత శుభవచనములో, అతని కృతజ్ఞతలో, మరియు వారి కొరకు అతడు చేసిన ప్రార్థనలో చూడవచ్చు. అంతేగాక, అతడు తన చెరసాల సమయములో ఎంతో సంఘర్షణను ఎదుర్కొనినప్పటికీ, దేవునికి మహిమను మరియు స్తుతిని తెచ్చు విధముగా నిలకడ కలిగియుండమని అతడు ఫిలిప్పీయులను ప్రోత్సహించాడు.
పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక యొక్క నేపథ్యమును, దాని యొక్క ఆకృతి మరియు విషయసూచికను పరిశీలించాము గనుక ఈ పత్రికలోని పౌలు బోధనల యొక్క ఆధునిక అనువర్తనమును పరిశీలించే స్థితిలో ఉన్నాము.
ఎన్నో ఘనమైన విషయములను కలిగియున్న ఫిలిప్పీ పత్రిక వంటి ఒక పత్రికను మన ఆధునిక జీవితములకు మనము అనేక విధములుగా అనువర్తించుకోవచ్చు. అయితే ఈ పాఠములో, భూమి మీద బహుశా అతని చివరి దినములుగా పరిగణించబడినవాటిలో పౌలు ఫిలిప్పీ విశ్వాసులను ప్రోత్సహించిన విధానము మీద మనము దృష్టిపెట్టాము. ఈ దృక్పథములో నుండి, ఒక అంశము వెలుగులోకి వస్తుంది. ఈ పత్రిక అంతటిలో, కష్ట సమయములలో దేవుని ఎదుట నమ్మకముగా నడచుటను కొనసాగించి, ఓర్పు కలిగియుండమని పౌలు ఫిలిప్పీయులను ప్రోత్సహించాడు. నేడు మన కొరకు ఫిలిప్పీ పత్రిక యొక్క అర్థము ఏమిటో పరిశీలించుచుండగా, పౌలు పత్రికలోని ఈ అంశము మీద మనము దృష్టిపెడతాము.
క్రైస్తవ జీవితం కొరకు ఆధునిక అనువర్తనమునకు పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక యొక్క అంతర్భావములను గూర్చి మనం ఆలోచించుచుండగా, క్రైస్తవ దృక్కోణము యొక్క మూడు విషయములను మనం పరిశీలిద్దాము: మొదటిగా, ఓర్పు యొక్క స్వభావమును చూద్దాము. రెండవదిగా, ఓర్పు యొక్క మనస్తత్వమును చూద్దాము. మరియు మూడవదిగా, ఓర్పును గూర్చిన సంఘ పరిచర్యను చూద్దాము. ఓర్పు యొక్క స్వభావమును చూస్తూ ఆరంభిద్దాము.
ఫిలిప్పీ పత్రికలో, ఓర్పును గూర్చిన పౌలు బోధనలు మూడు ప్రధాన విషయముల దృష్ట్యా చాలా సులభంగా అర్థం అవుతాయి: క్రైస్తవ ఓర్పు యొక్క నిర్వచనము; ఓర్పు యొక్క అవసరత; మరియు ఓర్పు యొక్క ధృవీకరణ. ఓర్పును గూర్చి పౌలు ఇచ్చిన నిర్వచనమును చూస్తూ ఆరంభిద్దాము.
పౌలు నిజమైన విశ్వాసము మరియు నీతిగల జీవితం అను రెండు ఆలోచనల దృష్ట్యా ఓర్పును గూర్చి ఆలోచించాడు. మరోవైపు, ఓర్పు అనగా క్రీస్తు సువార్తలో మన విశ్వాసమును కాపాడుకొనుట మరియు దేవుని యెదుట మనము నీతిగా నిలబడుటకు కేవలం ఆయన అర్హత మీద ఆధారపడుట అయ్యున్నది. ఫిలిప్పీ 1:27లో పౌలు ఈ ఆలోచనను ఉద్ఘాటిస్తూ, ఈ మాటల ద్వారా ఫిలిప్పీయులను ప్రోత్సహించాడు:
అందరును ఒక్క భావముతో సువార్త విశ్వాసపక్షమున పోరాడుచు (ఫిలిప్పీయులకు 1:27).
ఒక విశ్వాసిగా, సువార్తపట్ల మనకున్న నిబద్ధతలో మనం స్థిరంగా ఉండాలి, మరియు మన రక్షణను విజయుడైన క్రీస్తు సాధించాడు అను మన నమ్మకమును విడిచిపెట్టకూడదు. క్రైస్తవ విశ్వాసములో ఓర్పు కలిగియుండుట వెనుక ఇది ఒక కీలకమైన కోణము అయ్యున్నది. క్రీస్తు సువార్తలో నిజమైన విశ్వాసమును అనేక విధములుగా వివరించవచ్చు, కాని పౌలు ఫిలిప్పీయులకు 3:8-9లో క్రైస్తవ విశ్వాసమును గూర్చి ఒక ముఖ్యమైన విషయమును ఈ విధముగా వివరించాడు:
నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తునుగూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును (ఫిలిప్పీయులకు 3:8-9).
ఈ వాక్యభాగములో, నిజమైన నీతి మరియు రక్షణను పొందు నిమిత్తము అతని యొక్క మానవ స్థితి మరియు సత్క్రియలన్ని నిష్ప్రయోజనమైనవిగా ఉన్నాయి అని పౌలు సూచించాడు. అతనికి రక్షణ అనుగ్రహించు ఒకేఒక్క విషయం క్రీస్తు నీతి, ఇది విశ్వాసము ద్వారా పౌలుకు ఆపాదించబడింది.
మన నీతి కొరకు మనము క్రీస్తు యోగ్యత మీద ఆధారపడినంతవరకు, మనము ఓర్పుతో విశ్వాసములో స్థిరులుగా ఉంటాము. ఇప్పుడు, మనము ఎన్నడును పడిపోము లేక కాలుజారము అని దీని అర్థము కాదు. బదులుగా, ఓర్పుతో కూడిన విశ్వాసము సువార్త సత్యమును ఎన్నడును పూర్తిగా తృణీకరించదు. మన వేదాంతశాస్త్రములలో మనందరికి తప్పిదములు ఉన్నాయి మరియు పాపము మరియు మరణము మీద క్రీస్తు సాధించిన విజయము మీద మనఃపూర్వకముగా ఆధారపడు విషయములో మనమందరము విఫలమవుతాము. అయితే క్రీస్తు మరియు క్రీస్తు మాత్రమే మనలను రక్షించాడు అను కీలకమైన క్రైస్తవ బోధనను మనము నమ్ముట మానినప్పుడు మాత్రమే, మనము ఓర్పు కలిగియుండు విషయములో విఫలమవుతాము.
నిజమైన విశ్వాసము దృష్ట్యా ఓర్పును నిర్వచించుటతో పాటుగా, ఓర్పు అంటే నీతిగా జీవించుట, సత్క్రియలు చేయుటలో కొనసాగుట, మరియు ప్రశంసనీయమైన కార్యములు చేయుట అని కూడా పౌలు తెలిపాడు. ఉదాహరణకు, ఫిలిప్పీ. 2:12-13లో, పౌలు ఇలా వ్రాశాడు:
భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే (ఫిలిప్పీయులకు 2:12-13)
మనమంతా సత్క్రియలు చేయు విషయములో కొనసాగుట యొక్క ప్రాముఖ్యతను, దేవుని కరుణ ద్వారా మనము పొందుకొనిన రక్షణకు అనుగుణ్యమైన విధానములలో కార్యములను చేయుటలో కొనసాగుట యొక్క ప్రాముఖ్యతను పౌలు సూచించాడు. ఇప్పుడు, సత్క్రియలు చేయుటలో ఓర్పు అనగా మనం పరిపూర్ణులముగా జీవిస్తున్నాము అని కాదు. ఈ జీవితములో ఎన్నడును మనం పరిపూర్ణతకు చేరుకోలేము, మరియు కొన్నిసార్లు మనము తీవ్రముగా విఫలమవుతుంటాము. బదులుగా, క్రీస్తుకు నమ్మకముగా ఉండాలని మనం ఆశించినప్పుడు సత్క్రియలు చేయుటలో ఓర్పు కలిగి ఉంటాము.
క్రైస్తవులు వారి రక్షణను భయముతోను, వణకుతోను కొనసాగించుకొనుడి అని ఫిలిప్పీ. 2లో పౌలు చెబుతున్నప్పుడు, దానిని మనము సంపాదించుకున్నాము అను భావన కలుగవచ్చు. ఒక్క నిమిషం ఆగండి. నీతిమంతులుగా తీర్చబడుట అనునది విశ్వాసము ద్వారా మాత్రమే మరియు క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము అని నేననుకున్నాను, కాని దానిని మనము సంపాదించుకొనినట్లు కొనసాగించుకోవాలని పౌలు చెబుతున్నాడు. సరే, 1వ అధ్యాయమును గుర్తుంచుకోండి, మనలో తన మంచి చిత్తమును జరిగించుట కొరకు దేవుడు మనలో కార్యసిద్ధి కలుగజేస్తాడు అని పౌలు చెబుతున్నాడు. ఈ రెండు వాక్యభాగములను మీరు కలిపి చెప్పాలి. తుదకు దేవుడే ప్రతి విశ్వాసిలో ఈ కార్యములను చేయువాడైయున్నాడు. నేడు మన కొరకు దీని అర్థము ఏమిటంటే ... మనము క్రీస్తునందు మరియు ఆయన చేసిన కార్యమునందు విశ్వాసమును మరియు నమ్మకమును ఉంచుతాము. అలా చేసినప్పుడు, మనము వాస్తవికత యొక్క వెలుగులో జీవిస్తాము. ఎల్లప్పుడూ జీవిస్తాము. క్రియలు విశ్వాస మూలముగా జరుగుతాయి... క్రియలు చేయుట ఎల్లప్పుడూ మంచి పనే, కాని అవి క్రీస్తునందు మనము కలిగియున్న గుర్తింపులో ఆరంభమై, జీవన అలవాట్లు మరియు విధానములు మరియు నీతిగల జీవనము ద్వారా జరిగించబడతాయి. కాబట్టి మనము ఎల్లప్పుడూ క్రీస్తు అను మన్నుతో సంబంధము కలిగియుంటాము.
— డా. బెంజమిన్ గ్లాడ్డ్
ఓర్పు యొక్క స్వభావమును మనము పరిగణించాము కాబట్టి, కేవలం ఓర్పు యొక్క నిర్వచనమును మాత్రమే ఫిలిప్పీయులు అర్థము చేసుకోవాలని పౌలు కోరలేదు. రక్షణ పొందుట కొరకు, విశ్వాసములో మరియు జీవితములో ఓర్పు యొక్క అవసరతను కూడా అర్థము చేసుకోవాలని అతడు కోరాడు.
ఫిలిప్పీయులకు 3:8-11లోని పౌలు మాటలను వినండి:
క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయనయందు అగపడు నిమిత్తమును... మరణవిషయములో సమానానుభవముగలవాడనై, ఆయనను ఆయన పునరుత్థానబలమును ఎరుగు నిమిత్తమును, సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను (ఫిలిప్పీయులకు 3:8-11).
స్పష్టంగా చెప్పాలంటే, మనం నిజమైన విశ్వాసమును కాపాడుకొనుటలో విఫలమైతే, మనము క్రీస్తులో కనుగొనబడము, తద్వారా నిత్యమహిమలో జీవించుటకు మనము తిరిగి లేపబడము. మరోమాటల్లో, విశ్వాసములో ఓర్పు అనునది అంతిమ రక్షణకు అవసరమై ఉంది. అదేవిధంగా, ఫిలిప్పీయులకు 2:14-16లో, నిత్యజీవితమును గూర్చిన ఈ ఉపదేశమును అతడు అందించాడు:
మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య, నిరపరాధులును నిష్కళంకులును అనింద్యులునైన దేవుని కుమారులగునట్లు, సణుగులును సంశయములును మాని, సమస్త కార్యములను చేయుడి ... అందువలన నేను వ్యర్థముగా పరుగెత్త లేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయకారణము కలుగును (ఫిలిప్పీయులకు 2:14-16).
సణుగులను సంశయములను నివారించుట ద్వారా — అనగా నీతిగా జీవించుట ద్వారా — ఫిలిప్పీయులు నిరపరాధులును, నిష్కళంకులును అయ్యుండి, తన పరిచర్యను గూర్చి అతిశయపడుటకు పౌలుకు ఒక కారణమును ఇస్తారు. వారు ఓర్పుగా ఉండుటలో విఫలమైతే వారు దేవుని పిల్లలు కారనియు — మరియు క్రీస్తుయందు నిజమైన నమ్మకం లేదనియు — మరియు అంత్యదినమందు వారు రక్షింపబడరనియు నిరూపిస్తారు. మన విషయంలో కూడా అది వాస్తవమైయున్నది. నీతిగల జీవితంలో మనం ఓర్పుతో ఉండని యెడల మనము అవిశ్వాసులమని నిరూపించుకుంటాము, మనము రక్షింపబడము.
చాలా కాలము క్రితం మీరు బాప్తిస్మము పొందారు కాబట్టి లేక విశ్వాసమును ఒప్పుకున్నారు కాబట్టి, లేక ఇంకా ఏదో చేశారు కాబట్టి, లేక సంఘమునకు వెళ్లేవారు కాబట్టి, లేక భాషలు మాట్లాడేవారు కాబట్టి, మీకు పరలోకములో స్థలం నిశ్చయించబడింది అను ఊహాగానములకు తావులేదు... మనము నివసించుచున్న లోకములో, అంతము వరకు ఓర్పుతో నిలిచియుండమని మాత్రమే పిలుపు ఇవ్వబడినది — “అంతము వరకు నిలిచియుండువాడు నిత్యజీవము పొందును.” ఇవి యేసు పలికిన మాటలు... యుగాంతపు ఆశీర్వాదములను పొందుకొనుటకు క్రీస్తును గూర్చి మీరు నమ్మకముగా సాక్ష్యమివ్వాలి.
— డా. సీన్ మెక్ డోనో
మనలో చాలామందికి, ఓర్పు యొక్క నిర్వచనము మరియు అవసరతను గూర్చిన పౌలు బోధనలు కష్టముగాను లేదా కఠినముగాను ఉంటాయి. అయితే పౌలు యొక్క సిద్ధాంతముకు ప్రోత్సాహకరమైన మూడవ కోణము కూడా ఉంది, అదేమనగ ఓర్పు యొక్క ధృవీకరణ. మరియు ధృవీకరణ వెలుగులో, ఓర్పును గూర్చిన పౌలు బోధనలు విశ్వాసులను బెదిరించేవిగా లేవుగాని ఆదరించేవిగా ఉన్నాయి.
నిజమైన ప్రతి విశ్వాసి విశ్వాసము మరియు నీతిగా జీవించుట రెంటిలోను ఓర్పుతో ఉంటారని పౌలు ఫిలిప్పీయులకు ధృవీకరించాడు, తద్వారా మన రక్షణ నిశ్చయించబడింది. చాలామంది తప్పుగా విశ్వాసాన్ని ప్రకటించారు మరియు ఓర్పులో విఫలమయ్యారనేది ఇప్పటికి వాస్తవమై ఉంది. అయితే వీరు ఆరంభములోనే రక్షించు విశ్వాసమును కలిగినవారిగా లేరు. మరోవైపు, నిజమైన విశ్వాసముగలవారు పరిశుద్ధాత్మను కలిగియున్నారు, ఆయన వారికి ఓర్పును ధృవీకరించునట్లు వారిలో పనిచేస్తున్నాడు. ఫిలిప్పీయులకు 1:4లోని పౌలు మాటలను వినండి:
మీలో ఈ సత్క్రియ నారంభించినవాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను (ఫిలిప్పీయులకు 1:4).
దేవుడు ఫిలిప్పీయులను రక్షించడం ప్రారంభించి ఉంటే, ఫిలిప్పీయులను రక్షించడం పూర్తి చేస్తాడని పౌలు నిశ్చయించుకున్నాడు. ఆయన వారిలో ఎవరిని నశించిపోనీయడు, కాని నిజమైన విశ్వాసులందరూ క్రీస్తు యేసు దినమువరకు ఓర్పుతో ఉండునట్లు చేస్తాడు. మరియు పౌలు యొక్క నిశ్చయత మన నిశ్చయతగా కూడా ఉండాలి. మనము నిజముగా నమ్మితే, విశ్వాసము లేదా కృప నుండి తప్పిపోయే అవకాశమే లేదు. పౌలు ఈ ఆలోచనను ఫిలిప్పీయులకు 2:13లో ధృవీకరించాడు, అక్కడ అతడు ఈ ప్రోత్సాహము ఇచ్చాడు:
భయముతోను వణకుతోను మీ సొంతరక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగజేసికొనుటకును, తన దయాసంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే (ఫిలిప్పీయులకు 2:12-13)
మనము తుదకు కృపను కోల్పోతాము అనే భయము మనకు ఉండవలసిన భయము కాదు. మనము ఆయన కోరునది ఆలోచించునట్లు మరియు చేయునట్లు సర్వశక్తిగల దేవుడు మనలో ప్రతి ఒక్కరిలో కార్యము చేయుటను గూర్చిన అవగాహన మనలో గొప్ప ఆశ్చర్యమును కలిగించాలి. మన ఓర్పును కలిగియున్న తన సదుద్దేశము కొరకు ఆయన మన హృదయములను మరియు మనస్సులను నియంత్రిస్తాడు, ఇందులో తద్వారా చివరివరకు మనం పడిపోకుండా స్థిరముగా ఉంటాము.
పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక యొక్క ఆధునిక అనువర్తనమును మనము ఇప్పటి వరకు విశదీకరించుచుండగా, మన జీవితములలో ఓర్పు యొక్క స్వభావమును పత్రిక ఎలా బయలుపరుస్తుందో మనము చూశాము. ఇప్పుడు, ప్రతి యుగములో జీవించు విశ్వాసులందరు అలవరచుకొనవలసిన ఓర్పు యొక్క మనస్తత్వమును చర్చించు స్థితిలో మనము ఉన్నాము.
ఈ పత్రికలో పౌలు ఉద్ఘాటించిన మనస్తత్వములోని మూడు విషయముల మీద మనము దృష్టిపెడదాము: వినయము, ఆశావాదం, మరియు ఆనందం. వినయమును గూర్చి పౌలు మాట్లాడిన విషయములను మొదటిగా చూద్దాము.
ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారికమైన అపొస్తలునిగా, అహంకారిగా ఉండుటకు పౌలుకు ప్రతి అవకాశం ఉంది. నాయకత్వం కొరకు క్రీస్తు పౌలును అసాధారణమైన రీతిలో తర్ఫీదు చేశాడు. సువార్తను అన్యుల యొద్దకు తీసుకొని వెళ్లుటకు ఆయన పౌలును అందరి కంటే ఉన్నతముగా ఎన్నుకున్నాడు, మరియు అతని ద్వారా ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యములను చేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘములన్నిటిలో పౌలు ఒక ఘనునిగా గౌరవించబడ్డాడు. కాబట్టి, అతడు చెరసాలలో శ్రమపడుతున్నప్పుడు, “ప్రజలందరిలో నాకు మాత్రమే దేవుడు ఎందుకు ఇలా జరగనిస్తున్నాడు? నేను ఆయనకు ఎంతో నమ్మకంగా ఉన్నాను, అయినను ఆయన నన్ను ఆశీర్వదించుటకు నిరాకరించాడు. నేను మరింత ఉత్తమమైనదానికి అర్హుడను!” అని ఆలోచించే శోధనను ఎదుర్కొనియుండవచ్చు.
అయితే ఈ విధముగా దేవుని జ్ఞానమును మరియు మంచితనమును సవాలు చేయుట మూర్ఖత్వము మరియు తప్పు అయ్యున్నది. అయితే, అన్ని విషయాల్లో దేవుని యెదుట వినయంగా ఉండుటకు ఎన్నో కారణాలు ఉన్నాయని పౌలుకు తెలుసు. మరియు ఈ సత్యమును అంగీకరించుట ద్వారా, దేవుని చేత కట్టబడుటకు మరియు తాను ఎదుర్కొనుచున్న శ్రమలలో ఓర్పుతో ఉండుటకు తన్నుతాను సిద్ధపరచుకున్నాడు. ఈ విషయంలో, పౌలు తన మనస్తత్వమును యేసు మనస్తత్వమునకు అనుగుణంగా రూపొందించుకున్నాడు, మరియు యేసు తన కొరకు మరియు మన కొరకు దేవుని ఆశీర్వాదములను పొందునట్లు తన్నుతాను తగ్గించుకున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే, విధేయతతో ఉండాలని చెప్పిన తన ఉపదేశములకు మద్దతుగా పౌలు ప్రసిద్ధమైన “క్రీస్తు పాట”ను చేర్చాడు, ఇది ఫిలిప్పీయులకు 2:6-11లో కనిపిస్తుంది. పౌలు ఫిలిప్పీయులకు పత్రికను వ్రాయకముందే ఈ వచనములు సంఘములో తెలిసిన పాటగా ఉండేవి అని కొందరు పండితులు సూచించారు. పౌలు ఈ వచనమును ఒక ప్రత్యేకమైన సందర్భం కొరకు వ్రాశాడని ఇంకొందరు భావించారు. అయితే వారి మూలము ఏదైనప్పటికీ, ఈ వచనముల యొక్క అర్థం స్పష్టంగా ఉంది: యేసు విధేయుడుగా ఉన్నాడు, మరియు మనము ఆయనను అనుసరించాలి.
యేసు వినయమునకు ఎంతో స్పష్టమైన ఒక మాదిరిని మనముందు ఉంచుతున్నాడు. యేసు వచ్చినప్పుడు ... ఆయన వినయముతో సేవ చేశాడు అని ఫిలిప్పీ. 2లో పౌలు స్పష్టముగా మనకు చెబుతున్నాడు. కాబట్టి ఆయన దేవుడైయున్నప్పటికీ, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టలేనంత భాగ్యమని ఆయన ఎంచలేదు. దీనినే వినయము అంటారు. యేసు తన శిష్యులకు సేవ చేయు విధముగా వచ్చాడు. ఆయన వారి పాదములను కడిగాడు. ఇవి ఒక నాయకుని నుండి ఆశించదగిన కార్యములు కావు. కాబట్టి క్రీస్తు మనకు ఈ మాదిరిని అందించుచుండగా, మనము నాయకత్వ స్థానములో ఉన్నప్పటికీ — మనము బైబిలు అధ్యయనమును నడిపించుచున్నప్పటికీ, మనము ఒక సంఘమునకు కాపరిగా ఉన్నప్పటికీ — మనము ప్రశ్నలను అడుగుతున్నప్పుడు, వినయము కలిగి ప్రశ్నలను అడగవలసియున్నది.
— రెవ. తిమోతి మోంట్ఫోర్ట్
పౌలు యొక్క “క్రీస్తు పాట” చరిత్రలోని మూడు దశల్లో క్రీస్తును వివరిస్తుంది: ఆయన యొక్క పూర్వావతారణ స్థితి, ఆయన అవమానము మరియు ఆయన హెచ్చింపు.
పూర్వావతారణ స్థితి. మొదటిగా, నరావతారమునకు ముందు క్రీస్తు యొక్క స్థితిని గూర్చి పౌలు మాట్లాడాడు. ఆ సమయంలో, క్రీస్తు కుమారుడైన దేవుడుగా ఉన్నాడు, తండ్రి మరియు పరిశుద్ధాత్మునితో పరిపూర్ణ ఐక్యతతో జీవించాడు, శక్తి మరియు మహిమలో వారితో సమానంగా ఉన్నాడు. క్రీస్తు యొక్క పుర్వావతారణ స్థితిని ఫిలిప్పీ. 2:6లో పౌలు వర్ణించిన విధానమును వినండి:
ఆయన [క్రీస్తు] దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు (ఫిలిప్పీయులకు 2:6).
ఈ వచనము క్రీస్తును గూర్చి కనీసం రెండు విషయములను మనకు తెలియజేస్తుంది: మొదటిగా, ఆయన నరుడగుటకు ముందు క్రీస్తు మహిమకరముగా ఉండేవాడు, లేక పౌలు మాటలలో, క్రీస్తు దేవుని స్వరూపమును కలిగియుండేవాడు. “స్వరూపము” అను పదమునకు పౌలు ఉపయోగించిన గ్రీకు పదము మోర్ఫె (μορφή) అయ్యున్నది, ఇది సాధారణంగా ఒకని బాహ్య ఆకారమును సూచిస్తుంది. అయితే క్రీస్తు దేవుని వలె కనిపించాడు అని మాత్రమే పౌలు చెప్పలేదు. బదులుగా, నిజానికి క్రీస్తు దేవుడైయున్నాడు అని చెప్పే అంతర్లీన వాస్తవికతకు ఆయన యొక్క బాహ్య ఆకారము సాక్ష్యమిస్తుంది.
అంతేగాక, క్రీస్తు విధేయుడుగా ఉన్నాడని పౌలు సూచించాడు. ఆయన శరీరధారిగా రాక మునుపే, పూర్వావతారుడైన కుమారుడు అదనపు పోలిక లేదా స్వరూపమును — మన మనుషుల స్వరూపమును — ఇష్టపూర్వకముగా అంగీకరించుట చేత వినయమును కనుపరచాడు. ముఖ్యంగా, క్రీస్తు “దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు” అని పౌలు వ్రాశాడు. దేవునితో క్రీస్తు యొక్క “సమానత్వమును” లేదా “ఏకత్వమును” సూచించుటకు ఇసోస్ (ἴσος) అను పదమును పౌలు ఉపయోగించాడు. క్రీస్తు “స్వరూపము” లేక బాహ్య మహిమ తండ్రియైన దేవుడు కనుపరచిన అదే మహిమ అయ్యున్నది అని అతని అర్థమైయున్నది. అయితే తండ్రిని సంతోషపరచుటకు మరియు మన రక్షణను కొనుగోలు చేయుటకు అర్హమైన తన పరలోక స్థితి వలన కలిగిన మహిమను విడిచిపెట్టుటకు క్రీస్తు ఇష్టపడ్డాడు.
అవమానము. ఆయన నరావతారమునకు ముందు క్రీస్తును వర్ణించిన తరువాత, వేదాంతవేత్తలు క్రీస్తు “అవమానము” అని పిలచుదానిని గూర్చి పౌలు మాట్లాడాడు. ఇది మరియ గర్భం ధరించుటతో ఆరంభమై సిలువలో ఆయన మరణము వరకు వ్యాపించియున్న భూలోకములో క్రీస్తు జీవించిన కాలము అయ్యున్నది. ఫిలిప్పీయులకు 2:7-8లో క్రీస్తు యొక్క అవమానమును గూర్చి పౌలు వ్రాసిన మాటలు వినండి:
[క్రీస్తు] మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను. ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను (ఫిలిప్పీయులకు 2:7-8).
క్రీస్తు యొక్క పూర్వావతారము గూర్చి పౌలు చెప్పిన మాటలకు అనుగుణంగా, క్రీస్తు అవమానపరచబడిన స్థితిని గూర్చి ఈ వచనములు రెండు విషయములను తెలియజేస్తాయి. మొదటిగా, క్రీస్తు యొక్క అవమానము అప్రసిద్ధమైనది. అనగా, దేవుని కుమారుడు మనుష్యుల పోలిక లేదా స్వరూపము ధరించుటకు దైవిక మహిమను విడిచిపెట్టాడు. మరొకసారి, ఆయన తన దైవికమైన మహిమను ఇక కనుపరచకుండా క్రీస్తు తన బాహ్య రూపమును విడిచిపెట్టాడు అని సూచించుటకు పౌలు గ్రీకు పదమైన మొర్ఫేను (μορφή) ఉపయోగించాడు. బదులుగా, ఆయన స్పష్టముగా మానవుని యొక్క బాహ్య రూపమును కనుపరచాడు.
క్రీస్తు తనను తాను శూన్యముగా చేసుకున్నాడు అని పౌలు చెప్పాడు. మరొక మాటలో ఆయన “తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు.” మరియు, కొందరు దీనిని తప్పుగా అర్థము చేసుకొని, యేసు తన దైవత్వము అంతటిని విడిచిపెట్టాడు మరియు ఒక సామాన్య మానవుడైయ్యాడు, ఆయన తనలోని దైవత్వము అంతటిని తొలగించుకొని, తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు అని ఇది చెబుతున్నట్లు చూశారు అని నా ఆలోచన. అయితే ఈ ఆలోచన లేఖనములో మనము చదువుదానికి పూర్తిగా విరుద్ధముగా ఉన్నది, లేఖనముల ప్రకారం యేసు పరిపూర్ణముగా నరుడు మరియు పరిపూర్ణముగా దేవుడు అయ్యున్నాడు. కాబట్టి, యేసు తనను తాను శూన్యముగా లేక రిక్తునిగా చేసుకున్నాడు అని ఆయనను గూర్చి పౌలు మాట్లాడునప్పుడు, తాను మరణమునొందునంతగా బానిస పాత్రను ఆయన స్వీకరించాడు అని అతడు మాట్లాడుచున్నాడు... పౌలు బానిస అగుటను గూర్చిన ఈ ఆలోచనను సూటిగా రిక్తునిగా చేసుకొనుటతో జతకలిపి, మన కొరకు సిలువ మీద మరణమునొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు అని చెబుతున్నాడు. కాబట్టి, తన దైవత్వమును విడిచిపెట్టుట, లోకములోనికి తన పూర్ణ మహిమతో రాక లోకములోనికి వినయముగా వచ్చుట, అయినప్పటికీ పరిపూర్ణ దైవత్వమును కలిగియుండుట నిజముగా యేసు యొక్క వినయమునకు ప్రతీకగా ఉన్నది, మరియు ఆయన తన మహిమను దాచుకొని సిలువ మీద ఒక దాసుని భూమికను పోషించాడు.
— డా. డాన్ లఖీఖ్
క్రీస్తు యొక్క దైవత్వం ఆయన నిజముగా మరియు పరిపూర్ణంగా దేవుడు అని సూచించినట్లే, ఆయన యొక్క మానవ రూపము ఆయన నిజముగా మరియు పరిపూర్ణంగా మానవుడు అని సూచిస్తుంది. అయితే మానవునిగా మారడంలో, క్రీస్తు ఏ దైవిక లక్షణమును విడిచిపెట్టలేదని గ్రహించడం చాలా ముఖ్యమైన విషయం. బదులుగా, ఆయన తన యొక్క పరిపూర్ణ దైవత్వముకు పరిపూర్ణ మానవత్వమును జతపరచాడు, తద్వారా ఆయన పరిపూర్ణ మానవుడును మరియు పరిపూర్ణ దేవునిగా వర్ణించబడ్డాడు.
రెండవదిగా, ఫిలిప్పీ. 2:7-8లో తన భూలోక పరిచర్య కాలములో క్రీస్తును గూర్చి పౌలు చెప్పిన మాటలు క్రీస్తు వినయముగలవాడు అని నిర్థారిస్తాయి. ఆయన శరీర రూపమును దాల్చుటకు ముందు మహిమకరమైన రూపమును ధరించుకొనిన విధముగానే, భూమి మీద ఆయన చూపిన వినయము ఎంత గొప్పది అంటే “ఆయన మరణమునొందునంతగా తనను తాను తగ్గించుకున్నాడు.” మరొక మాటలో, ఆయన తన కొరకు తీసుకొనిన అదే రూపమునకు చెందిన జీవులు ఆయనను హతమార్చుటకు ఆయన అనుమతి ఇచ్చాడు.
హెచ్చింపు. తన నరావతారమునకు ముందు క్రీస్తు యొక్క స్థితిని మరియు తన భూలోక పరిచర్య కాలములో ఆయన ఎదుర్కొనిన అవమానమును గూర్చి మాట్లాడిన తరువాత, మృతులలో నుండి ఆయన తిరిగిలేచుటతో మరియు పరలోక ఆరోహణముతో ఆరంభమై, ఆయన ప్రస్తుత సృష్టియావత్తుపై పరిపాలనలో కొనసాగుచున్న క్రీస్తు యొక్క హెచ్చింపు స్థితిని పౌలు వర్ణించాడు. ఫిలిప్పీయులకు 2:9-11లో క్రీస్తు యొక్క హెచ్చించబడిన స్థితిని గూర్చి పౌలు ఈ మాటలలో వ్రాశాడు:
అందుచేతను పరలోకమందున్నవారిలో గాని, భూమిమీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను (ఫిలిప్పీయులకు 2:9-11).
మరలా, క్రీస్తు యొక్క ఈ స్థితిని గూర్చి పౌలు రెండు ముఖ్యమైన విషయాలను చెప్పాడు. మొదటిగా, క్రీస్తు మహిమకరమైన తన స్వరూపమును మరలా పొందుకున్నాడు, ప్రతి జీవి వంగి నమస్కరించునట్లుగా విశ్వమంతటి మీద అధికారిగా హెచ్చించబడ్డాడు. రెండవదిగా, సార్వత్రిక సార్వభౌమాధికారం కలిగిన ఈ గొప్ప మహిమకరమైన స్థితిలో కూడా ఆయన తన విధేయతను కొనసాగించాడు. ఇక్కడ పౌలు చెప్పుచున్నట్లు, సృష్టి మీద ఆయన పరిపాలన కూడా తన్నుతాను మహిమపరచుకొనుటకు కాదుగాని తండ్రిని మహిమపరచుటకు అయ్యున్నది.
విశ్వాసులు క్రీస్తు యొక్క మాదిరిని అనుసరించాలని అతడు కోరాడు కాబట్టి, ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో పౌలు క్రీస్తును గూర్చిన ఈ మూడు దృష్టికోణములను తెలియపరచాడు. దేవుని కుమారుడే అటువంటి అవమానకరమైన పరిస్థితికి అప్పగించుకున్నాడు, గనుక ఖచ్చితంగా ఆయన సేవకులు కూడా విధేయత చూపించాలి. క్రీస్తు యొక్క విధేయత ఆయన యొక్క శ్రమలలోను, మరణంలోను ఓర్పుతో ఉండుటకు సహాయపడినప్పుడు, విధేయత ఓర్పుతో ఉండుటకు మనకు కూడా సహాయపడుతుంది. మరియు ఫిలిప్పీయులకు 2:2-4లో ఈ విషయాన్నే పౌలు చెప్పాడు, అక్కడ అతడు ఈ సూచనలను ఇచ్చాడు:
మీరు ఏకమనస్కులగునట్లుగా ఏకప్రేమకలిగి, యేక భావముగలవారుగా ఉండి, ఒక్కదానియందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను (ఫిలిప్పీయులకు2:2-4).
దేవుని ఎదుట వినయము కలిగియుండుట నీతిగల జీవితమును మరియు విశ్వాసమును కాపాడుకొనుటకు ఆధారమైయున్నది. మరోవైపు, ఏకమనస్కులుగా, ఏకభావముగలవారై ఒకరినొకరు ప్రేమించుకొనుటకు, గౌరవించుకొనుటకు మరియు వారి అవసరతలను తీర్చుకొనుటకు ఇది మనకు సహాయపడుతుంది. మరోవైపు, మన పరిస్థితులు కఠినముగా ఉన్నప్పుడు, మనం హింసించబడినప్పుడు, మనము హతమార్చబడినప్పుడు కూడా తండ్రి మన నమ్మకమును మరియు నిజాయితీని కోరుకుంటాడని మనం జ్ఞాపకం చేసుకొనుటకు ఇది మనకు సహాయపడుతుంది.
వినయముగల మనస్సు కలిగియుండమని విశ్వాసులను ప్రోత్సహించుటతో పాటుగా, పౌలు ఆశావాదమును, అనగా జీవితమును గూర్చి ఒక భావార్థకమైన మరియు నిరీక్షణకరమైన దృక్కోణమును కలిగియుండుటను గూర్చి ఉద్ఘాటించాడు.
ఆధునిక లోకములో, ప్రజలు ఆశావాదము మూర్ఖత్వము అని మాట్లాడుట మనము సామాన్యముగా వింటుంటాము. ఆశావాదులు వాస్తవిక లోకమును చూడరుగాని, పరిస్థితులు ఉన్న విధము కంటే మెరుగ్గా ఉన్నాయన్నట్లు నటిస్తారు అని వారనుకుంటారు. అయితే పౌలు యొక్క ఆశావాదం అలాటిది కాదు. అతని యొక్క ఆశావదము వాస్తవికమైనది. అతడు జీవిత సమస్యలను నిర్లక్ష్యము చేయలేదు. వాస్తవానికి, అతడు వాటిని లోతుగా అనుభవించాడు. ముఖ్యముగా, పౌలు ఆశావాదం అంటే వాస్తవంగా చెడ్డ విషయముల మీద కాకుండా వాస్తవంగా మంచి విషయముల మీద దృష్టిపెట్టాలను ఒక నిర్ణయం తీసుకొనుట. ఇది ప్రస్తుత లోకములో దేవుని యొక్క ఆశీర్వాదములు మరియు దైవకృతములో అతనికున్న విశ్వాసములో నుండి మరియు భవిష్యత్తులో దేవుడు మనకు అనుగ్రహించు విమోచన మరియు బహుమానము మీద అతనికున్న నిరీక్షణ నుండి పుట్టుకొచ్చింది.
ఉదాహరణకు, చెరసాలలో అతడు శ్రమపొందుతున్న దినములలో, నిజాయితీలేని కొందరు బోధకులు పౌలును గాయపరచు విధముగా సువార్తను ప్రకటించుటను ఆరంభించారు. అయితే కోపము మరియు ద్వేషముతో నిండిపోవుటకు బదులుగా, ఇట్టి బోధకులు దుష్ట హేతువులను కలిగియుండినప్పటికీ, క్రీస్తును గూర్చి ప్రకటించబడుతుంది అనే ఆశీర్వాదము మీద పౌలు దృష్టిపెట్టగోరాడు. ఫిలిప్పీయులకు 1:17-18లో అతని కథనమును వినండి:
వారైతే నా బంధకములతో కూడ నాకు శ్రమ తోడుచేయవలెనని తలంచుకొని, శుద్ధమనస్సుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు; అయిననేమి? మిషచేతనేగాని సత్యముచేతనే గాని, యేవిధముచేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను. (ఫిలిప్పీయులకు 1:16-18).
పౌలు యొక్క భావోద్వేగ స్థితి సంక్లిష్టంగా ఉంది. ఒక వైపున, అతడు శ్రమను అనుభవించుచున్నాను అని తెలియజేశాడు. కాని మరొక వైపున, వాస్తవమైన మంచి విషయముల మీద కూడా అతడు దృష్టిపెట్టగోరాడు. మరియు ఈ నిర్ణయము అతడు చెరసాలలో శ్రమపడుటకు అదేవిధంగా ఈ బోధకుల విషయంలో బాధపడుటకు సహాయం చేసింది. మరియు ఫిలిప్పీయులకు 4:6-8లో పౌలు సంఘమునకు ఇచ్చిన సలహా అతని వైఖరికి అనుగుణంగా ఉంది. అక్కడ అతడు మాట్లాడిన మాటలు వినండి:
దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. మెట్టుకు సహోదరులారా, యే యోగ్యతయైనను మెప్పైనను ఉండినయెడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్య మైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, వాటిమీద ధ్యాన ముంచుకొనుడి (ఫిలిప్పీయులకు 4:6-8).
సత్యమైన, మాన్యమైన, న్యాయమైన, పవిత్రమైన, రమ్యమైన, ఖ్యాతిగల విషయముల మీద ఆశావాదముతో దృష్టిపెట్టుట, మన మనస్సులను మరియు హృదయములను కాయుమని దేవునిని పిలచుటకు ఒక మాధ్యమం అయ్యున్నది. కాబట్టి, ఇది ఓర్పుకు మార్గంగా కూడా ఉంది.
చివరిగా, వినయము మరియు ఆశావాదంతో పాటుగా, క్రైస్తవ ఓర్పులో ఆనందకరమైన మనస్సు గొప్ప సహాయకరంగా ఉంటుందని పౌలు బోధించాడు.
ఒక విషయానికొస్తే, పౌలు కష్టపరిస్థితులలో ఓర్పుతో ఉండుటకు ఆనందము మీద దృష్టిపెట్టాడు. మరియు అతని మాదిరిని అనుసరించి, ఆ విధంగానే చేయుమని ఫిలిప్పీ విశ్వాసులను ప్రోత్సహించాడు. ఉదాహరణకు, ఫిలిప్పీయులకు 1:18-20లో, పౌలు తన ఆనందమును గూర్చి ఈ విధంగా మాట్లాడాడు:
ఇక ముందును సంతోషింతును ... నా బ్రదుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థనవలనను, యేసుక్రీస్తుయొక్క ఆత్మనాకు సమృద్ధిగా కలుగుటవలనను, ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణ మించునని నేనెరుగుదును (ఫిలిప్పీయులకు 1:18-20).
అతడు హతము చేయబడు అవకాశము ఉందని పౌలుకు తెలుసు. అయినను, మరణమును గూర్చిన ప్రతికూల విషయముల మీద దృష్టిపెట్టక మరణము తీసుకువచ్చు సానుకూల ప్రతిఫలం మీద అతడు దృష్టిపెట్టాడు. ఫలితంగా, అతడు ఆనందించగలిగాడు. ఈ సందర్భములో, పౌలు యొక్క ఆనందము బాధను మరియు శ్రమలను గూర్చి ఎలాంటి ఆలోచన లేకుండా వాటిని తిరస్కరించుట కాదని గమనించండి. దీనికి భిన్నముగా, అతని భావనలలో ఎంతో దుఖము మరియు బాధ ఉన్నవి అని చూడండి. అయితే అతడు కష్టములు అనుభవించుచున్నప్పటికీ, పౌలు తన జీవితములోని మంచి విషయములను చూసి, వాటిని బట్టి ఆనందించాడు. అతడు ధైర్యముగా మరణమును ఎదుర్కొనుట ద్వారా క్రీస్తును గౌరవించుటను గూర్చి ఆలోచించగలిగాడు మరియు క్రీస్తు యొక్క ఘనతను గూర్చి తృప్తిచెందాడు – సంతోషించగలిగాడు. మరియు ఆ సంతృప్తి మరియు సంతోషము ఆనందమును కలిగించాయి. పౌలు కేవలము ఆనందమును మాత్రమే అనుభవించలేదుగాని నిజమైన ఆనందమును అనుభవించాడు. మరియు ఈ ఆనందము ముందున్న వాటికొరకు పరిగెత్తుటకు కోరికను ఇచ్చింది మరియు అతని శ్రమలకు ఒక ఉద్దేశ్యమును అందించింది. ఇటువంటి వైఖరినే కలిగియుండమని, ఫలితంగా అది వారి ఆనందము ఓర్పుగా ఉండుటకు సహాయపడుతుందని ఫిలిప్పీలోని తన స్నేహితులను పురికొల్పాడు. ఫిలిప్పీయులకు 4:4-6లో అతడు వారికిచ్చిన సలహాను వినండి:
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి ...ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనినిగూర్చియు చింతపడకుడి (ఫిలిప్పీయులకు 4:4-6).
అవసరత సమయంలో సహాయముగా లేదా భూమియంతటిమీద సమాధానాధిపతిగా పాలించుటకు తిరిగివచ్చువానిగా, ప్రభువు సమీపముగా ఉన్నాడు గనుక ఆనందించుడి అని పౌలు ఫిలిప్పీయులను ప్రోత్సహించాడు. ఏది ఏమైనప్పటికీ, ఫిలిప్పీయుల యొక్క చింతను తొలగించునట్లు ఆనందము ప్రేరేపిస్తుంది మరియు సామర్థ్యము ఇస్తుంది. కాబట్టి, ప్రభువు వచ్చువరకు ఓర్పుగా ఉండుటకు ఇది వారిని సిద్ధపరుస్తుంది.
విధేయత, ఆశావదము మరియు ఆనందము మీద దృష్టిపెట్టి పౌలువలె మనము మన మనసులను రూపొందించుకొనుట ద్వారా, చింత మరియు నిరాశకు వ్యతిరేకంగా బలం పొందుకుంటాము. కష్టములు రావడం మరియు మనం బాధపడుట — కొన్నిసార్లు ఎక్కువగా బాధపడుట — అనేది అనివార్యం. కాబట్టి, మనం కష్టములను ఎదుర్కొనునప్పుడు పౌలు యొక్క మాదిరిని మరియు సలహాను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము మన యొక్క శ్రమను విధేయతతో నిగ్రహించుకోవాలి, మరియు ఈ జీవితములో మరియు రాబోవు జీవితములో మనకున్న అనేక మంచి విషయాలను గూర్చి ఆలోచిస్తూ నిరీక్షణతో ఉండాలి. మరియు మనము మన జీవితములో ఆనందించదగిన విషయములను బట్టి ఆనందించాలను నిర్ణయము తీసుకొనుట ద్వారా మన పరిస్థితి యొక్క సమస్యలను అధిగమించాలి. ఈ విధములుగా, ఓర్పు కలిగియుండుటకు మనము దేవుని ద్వారా బలమును పొందగలము.
ఓర్పు యొక్క స్వభావము మరియు మనస్తత్వమును గూర్చి పౌలు వ్రాసిన విషయములకు ఆధునిక అనువర్తనమును ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి, మన మూడవ విషయమును చూచుటకు ఇప్పుడు సిద్ధముగా ఉన్నాము: సంఘము యొక్క ఓర్పు పరిచర్య. మనము చేయు క్రియలు మనము క్రీస్తునందు ఓర్పుతో కొనసాగుటలో ఎలా సహాయపడతాయి?
ఫిలిప్పీయులు అతనికి చేసిన పరిచర్య, అతని యొక్క ప్రస్తుత చెరసాలతో సహా తన పరిచర్యలోని అనేక దశలలో ఓర్పుగా ఉండుటకు సహాయపడిందని పౌలు గుర్తించాడు. అనేక సమయములలో వారు అతనికి ఆర్థికంగా మరియు మానసికంగా మద్దతు ఇచ్చారు. మరియు చెరసాలలో అతనికి పరిచర్య చేయుటకు వారు ఎపఫ్రొదితును కూడా పంపారు. వారు పౌలుకు చేసిన పరిచర్యను భౌతిక మద్దతు, ప్రోత్సాహము మరియు శారీరిక ఉపస్థితి దృష్ట్యా సంగ్రహించవచ్చు. ఈ మార్గములన్నిటిలోను, ఫిలిప్పీయులు పౌలును బలపరచారు మరియు మరింత ఓర్పుతో ఉండుటకు అతనిని బలపరచారు. ఉదాహరణకు, ఫిలిప్పీయులకు 4:13-14లో పౌలు యొక్క హృదయపూర్వకమైన మాటలను వినండి:
నన్ను బలపరచువానియందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలుపుచ్చుకొనినది మంచిపని (ఫిలిప్పీయులకు 4:13-14).
కొన్నివిధాలుగా, ఫిలిప్పీయులు పౌలుకు చేసిన పరిచర్య యొక్క కేంద్రమును మరియు వారిని గూర్చి అతనికున్న భావమును ఈ సరళమైన వచనములు సూచిస్తాయి. ఫిలిప్పీయుల యొక్క బహుమానమును తీసుకొని ఎపఫ్రొదితు రాకమునుపు, అపొస్తలుడు ఓర్పుగా ఉండుటకు ప్రభువు నుండి బలము పొందుకున్నాడు, కాని అతనికి ఇతరుల నుండి నైతిక మద్దతు దొరకలేదు. ఫలితంగా, అతని ఆశావాదము మరియు అతని ఆనందము సమసిపోయాయి. అతడు ఓర్పుతో ఉన్నాడు కాని అది కష్టమైన పనిగా ఉంది. అయితే ఫిలిప్పీయుల యొక్క బహుమానము భౌతిక మద్దతు ఇచ్చింది, అది అతని యొక్క బాధను కొంతవరకు తగ్గించింది తద్వారా ఓర్పు కలిగియుండుట కొంచెం సులభతరం అయ్యింది. మరియు బహుమానము ద్వారా, ఎపఫ్రొదితును పంపుట ద్వారా, ప్రోత్సాహపరచుట ద్వారా వ్యక్తపరచబడిన అతని యెడల వారికున్న శ్రద్ధ అతని యొక్క ఆశావదమును మరియు ఆనందమును తిరిగి పొందుటలో సహాయపడింది. వాస్తవానికి, ఎపఫ్రొదితు యొక్క భౌతిక ఉనికి పౌలు యొక్క భూసంబంధమైన అవసరాలను తీర్చడమే కాక, మరింత ఓర్పుతో ఉండుటకు సాంగత్యమును మరియు స్నేహమును అందించింది. అందువలన, “నా కష్టములలో పాలుపంచుకొనుట మీకు మంచిదని” పౌలు ఫిలిప్పీయులకు చెప్పుట హృదయపూర్వకమైన కృతజ్ఞతగా ఉంది. పౌలు వారి పరిచర్యను ఎంతగానో మెచ్చుకున్నాడు, మరియు వారిని అతని స్నేహితులుగా పరిగణించుట అతనికి గొప్ప ఆదరణను మరియు ఆనందమును కలిగించాయి. ఫిలిప్పీయుల యొక్క ప్రోత్సాహము మరియు సహాయము ద్వారా, విశ్వాసములో బలముగా ఉండుట ద్వారా మరియు క్రీస్తును ఘనపరచు విధముగా జీవించుట ద్వారా పౌలు ఓర్పుతో కొనసాగగలిగాడు.
మరియు ఫిలిప్పీయులు తమ పరీక్షలలో ఓర్పుగా ఉండుటకు పౌలు తన పరిచర్యను ఉద్దేశించాడు. ఫిలిప్పీయులకు 1:3-4లో మనం చదవునట్లుగా, అతడు వారి కొరకు ప్రార్థించాడు. ఎలా ఓర్పుతో ఉండాలో బోధించుటకు అతడు తన పత్రిక వ్రాశాడు. మరియు అంతకంటే ఎక్కువ, బహుశా సంఘ నాయకునిగా, వారికి పరిచర్య చేయు నిమిత్తము అతడు ఎపఫ్రొదితును పంపాడు.
సంఘములోనే మనము ఓర్పు కలిగియుండునట్లు ఒకరినొకరము ప్రోత్సహించుకుంటాము. సంఘము అంటే అనుబంధము అని నా అభిప్రాయం. సంఘముగా ఉండుట ద్వారా, మనము ఒకరితో ఒకరు ఎలాంటి సంబంధము కలిగియుండాలని దేవుడు కోరుచున్నాడో మరియు దేవుడు కోరు ప్రజలముగా ఆయనతో సామూహికముగా మనము ఎలాంటి సంబంధము కలిగియుండాలని కోరుకుంటున్నాడో కనుగొంటాము. దేవుడే ఎల్లప్పుడూ ప్రజలను తన చుట్టూ సేకరించియున్నాడు. కాబట్టి తుదకు, సంఘము దేవుని మహిమ కొరకు ఉన్నది... ఆయన మహిమ కొరకు మరియు మన శ్రేయస్సు కొరకు ఇది దేవుడు మన కొరకు కలిగియున్న ప్రణాళిక అయ్యున్నది.
— రెవ. సి. ఎస్. టాంగ్
ఆధునిక సంఘంలో, భౌతిక మద్దతు ఇచ్చుట ద్వారా ఫిలిప్పీయులు పౌలుకు పరిచర్య చేసిన విధానము నుండి మనం నేర్చుకొనవచ్చు. గొప్ప భౌతిక అవసరతలు కలిగియున్న క్రైస్తవుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఉంది. కొందరు చాలా బీదలుగా ఉన్నారు గనుక ఆహారము మరియు దుస్తుల కొరకు వెతకుట వారికి నిరంతర సవాలుగా ఉంది. ఇతరులు ప్రపంచంలోని దుష్ట వ్యక్తులచే హింసించబడుతున్నారు. కొందరు బానిసలుగా అమ్మివేయబడ్డారు మరియు తీవ్రంగా దుర్వినియోగపరచబడుతున్నారు. మరియు వాస్తవానికి, ప్రపంచంలోని ప్రతి భాగంలో క్రైస్తవులు అనుభవించిన అనేక ఇతర వాస్తవమైన కాని తక్కువ నాటకీయమైన భౌతిక అవసరతలు ఉన్నాయి. ఈ విశ్వాసులకు మనం పరిచర్య చేసే ఒక మార్గం, వారికి ఆశ ఇచ్చి ఓర్పుగా ఉండుమని చెప్పుటకు ఒక మార్గం ఏమిటంటే, వారి భౌతిక అవసరతలను తీర్చటం.
ఫిలిప్పీయులు తమ ప్రేమ మరియు ప్రోత్సాహము ద్వారా పౌలుకు పరిచర్య చేసిన విధానము నుండి మనం చాలా నేర్చుకొనవచ్చు. వారు పౌలుకు కేవలం ధనమును మాత్రమే పంపలేదు; వారు తమ ప్రేమను కూడా పంపారు. ఎపఫ్రొదితు ద్వారా, వారు అతనిని గూర్చి ఆలోచిస్తున్నారని మరియు వారు అతని మనసులో ఉన్నట్లుగానే వారి మనసులో అతడు ఉన్నాడని పౌలుతో మాట్లాడారు. ఆధునిక క్రైస్తవులు ఓర్పుగా ఉండుటకు కూడా ప్రోత్సాహం అవసరం. మనము సంఘములో, లేదా టెలిఫోన్ లో, లేదా పత్రికలో లేదా అనేక ఇతర మార్గములలో ప్రోత్సాహపు మాటలను అందించవచ్చు. అయితే విషయం ఏమిటంటే, వారిని ప్రేమిస్తున్నామని మరియు మరచిపోలేదని ప్రజలకు తెలియజేయుటకు మనం మన స్థలము నుండి బయటకురావాలి.
అంతేగాక, పౌలుకు పరిచర్య చేయుటకు ఫిలిప్పీయులు ఎపఫ్రొదితును పంపిన విధముగానే, మనము కూడా వ్యక్తిగతముగా ప్రజలతో సమయమును గడపవచ్చు. మనము కేవలం వారి ప్రక్కన కూర్చొని, వారితో సమయము గడుపుతూ, వారి భౌతిక అవసరతలను తీర్చవచ్చు. సంఘములో కూడా, చాలామంది ఒంటరిగా, ఒక స్నేహితుని యొక్క అవసరతలో ఉంటారు. మరియు షాపింగ్, శుభ్రపరచుట, లేదా వారి మరియు వారి యొక్క కుటుంబముల మీద శ్రద్ధ చూపుట వంటి చిన్న చిన్న విషయములలో సహాయము అవసరమైన వారిగా ఉన్నారు. విశ్వాసులతో భౌతికముగా ఉండుట ఓర్పుగా ఉండుటలో వారికి సహాయము చేయుటకు మరొక మంచి మార్గముగా ఉంది.
పౌలు ఫిలిప్పీయులకు చేసిన పరిచర్య విధానము నుండి మనము అనేక విషయములు నేర్చుకొనవచ్చు. మనము ఎవరిమైనా, లేదా ఎక్కడ ఉన్నా, ఎల్లప్పుడు మనం ప్రార్థించవచ్చు తద్వారా మన విన్నపములకు జవాబుగా, ఓర్పుగా ఉండే బలమును దేవుడు తానే స్వయంగా విశ్వాసులకు అనుగ్రహిస్తాడు. మంచి సిద్ధాంతము మరియు ఆచరణాత్మక సలహా ద్వారా కూడా ఓర్పు కలిగియుండునట్లు మనము తోటి క్రైస్తవులకు బోధించవచ్చు. మరియు, సంఘములో అధికార స్థానములలో మనము ఉన్నట్లయితే, మాట మరియు క్రియల ద్వారా ప్రోత్సాహకరమైన రీతులలో మనము సంఘమును నడిపించవచ్చు.
ఈ పాఠంలో, పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన ప్రామాణిక గ్రంథ పత్రికను మనం చూశాము, ఇందులో పత్రికకు చారిత్రిక మరియు సామాజిక సందర్భమును ఏర్పాటు చేసే నేపథ్యమును, పత్రిక యొక్క ఆకృతి మరియు విషయ సూచికను, మరియు చివరిగా క్రైస్తవ సంఘ జీవితములో ఈ పత్రిక యొక్క ఆధునిక అనువర్తనమును పరిశీలించాము.
పౌలు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రికలో అనేకమైన మరియు అద్భుతమైన సత్యాలు ఉన్నాయి, శ్రమలలో మరియు కష్ట సమయములలో క్రైస్తవ విశ్వాసములో నిలకడగా ఉండుటను గూర్చి ఇవి మనకు బోధిస్తాయి. మనలను మనము పౌలు యొక్క బోధనలకు సమర్పించుకొనుచుండగా, ఓర్పు ఎంత ప్రాముఖ్యమైయున్నదో మనము గ్రహిస్తాము. ఈ అద్భుతమైన పని కొరకు మనలను మనము సమర్పించుకొనుట ద్వారా కూడా మనము ఎంతో ప్రోత్సాహమును పొందవచ్చు. మరి ముఖ్యంగా, పౌలు సలహాలను పాటించుట ద్వారా మనం మన ఓర్పులో విజయం సాధించినప్పుడు, మరియు ఇతరులు కూడా ఓర్పుతో ఉండాలని వారిని ప్రోత్సహించినప్పుడు, ఉన్నతుడైన ప్రభువువైన యేసు క్రీస్తుకు మహిమ మరియు ఘనతను తెస్తాము.
Continue reading the full transcript