<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
క్యాటలాగ్‌కు తిరిగి వెళ్ళుREVప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం ·Videoఆంగ్లం నుండి అనువాదం చేయబడింది

REV-02 అపోకలిప్సు నిర్మాణం మరియు కంటెంట్

పూర్తి వచనం చదవండి

ఈ వీడియో అదే శ్రేణిలోని 2వ పాఠానికి తోడుగా ఉంటుంది. ఇది ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిస్తుంది: ప్రకటన గ్రంథం స్పష్టమైన భాషను ఎందుకు ఉపయోగించదు? న్యూ టెస్టమెంట్‌లోని ఇతర భాగాలను "అపోకలిప్టిక్"గా పరిగణించవచ్చా? ప్రకటన గ్రంథం కాకుండా బైబిల్‌లోని ఇతర పుస్తకాలలో పునరావృత్తి ఉందా? యోహాను "ఆత్మలో" ఉన్నట్లు చెప్పినప్పుడు అతను ఏమి చెప్పాడు? ప్రకటన 5లో యోహాను యేసును సింహం మరియు గొర్రెగా ఎందుకు వర్ణించాడు? సాతాను నిజమైన జీవి అనా? చరిత్ర అంతటా క్రైస్తవులు కలిగి ఉన్న కొన్ని మిలేనియల్ అభిప్రాయాలు ఏమిటి? ప్రీమిలేనియలిజం, పోస్ట్‌మిలేనియలిజం మరియు అమిలేనియలిజం యొక్క అన్ని సువిశేష రూపాల ద్వారా పంచుకున్న కొన్ని కేంద్రీయ వేదాంతపరమైన ఆలోచనలు ఏమిటి? ప్రేమగల దేవుడు తన శత్రువులను కూడా శాశ్వతమైన ఖండనలోకి ఎందుకు పంపగలడు? మొదటి శతాబ్దపు రోమన్ సామ్రాజ్యం మరియు ఆధునిక ప్రపంచం మధ్య ప్రకటనను ఆధునిక జీవితానికి వర్తింపజేయడంలో మాకు సహాయపడే సారూప్యతలు ఉన్నాయా? మొదటి శతాబ్దంలో యూదమతం మరియు క్రైస్తవ మతం మధ్య సంబంధం ఎలా ఉండేది? ఆధునిక ప్రపంచంలో నమ్మని యూదుల పట్ల మనం ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి? మనం భరించే బాధ మరియు హింసకు చర్చి ఎలా స్పందించాలి? ప్రకటన 2 మరియు 3 అధ్యాయాలలోని చర్చలకు అనుగుణంగా, యేసు చర్చకు ప్రదర్శించాలని కోరుకునే లక్షణాలు ఏమిటి? క్రీస్తు పట్ల మన ప్రేమ మరియు ఉత్సాహం బలమైన సిద్ధాంతంతో కలిపి ఉండటం ఎందుకు ముఖ్యం?


From the transcript

నా స్నేహితుడు ఒకడు, ఐగుప్తు దేశములోని కైరో పట్టణానికి వెలుపల నున్న అల్లిక చేసిన సామాన్లు అమ్మే ఒక అంగడిని గూర్చి ఒకసారి నాతో చెప్పాడు. అందరూ కలసి తివాచీలు నేయు అనేకమంది గదులలో ఉన్నారు. సన్నని పోగులు వేలకొలది ఒకే రకమైన పోగులతో కలిపి వేర్వేరు రంగులలో తివాచీలను అల్లిక చేయుట చూచి నా స్నేహితుడు ఆకర్షించబడ్డాడు. ఆ తీగలన్నీ ఒక తివాచీగా కూర్చబడినప్పుడు ఆ పోగుల యొక్క అందము జీవాన్ని పోసుకుంటున్నాయి. అదే ప్రకారము, ప్రకటన గ్రంథము ఒక నేయబడిన తివాచీ వంటిది. అది అనేకమైన ప్రవచనములను కలిగియున్నదని, వాటి యొక్క అర్థము అనేకమైన ఇతర ప్రవచనాలపై ఆధారపడి ఉంది. మరియు ఈ గ్రంథంమంతటినీ సమూలముగా చదివినప్పుడు దాని సందేశము స్పష్టముగా కనబడుతుంది, మరియు అది చూపించుచున్న పెద్ద దృశ్యము మనకు అగుపడుతుంది.

ప్రకటన గ్రంథము శీర్షికలో ఇది రెండవ పాఠము, మరియు దీనిని మనము “ఆకృతి మరియు పుస్తక విషయ సూచక” అని పిలుస్తాము. సాహిత్య కూర్పును మరియు అనేకమైన భాగాలు ఒకదానితో ఒకటి ఏ విధముగా పొందిక చేయబడినాయో పరిగణించుట ద్వారా యోహాను వ్రాసిన ఈ గ్రంథమును ఈ పాఠములో మనము అన్వేషించెదము.

ఈ గ్రంథమును వ్రాయుటలో యోహాను యొక్క ఉద్దేశమును క్లుప్తముగా పరిశీలించుట ద్వారా ప్రకటన గ్రంథపు ఆకృతి మరియు పాఠం యొక్క అంశమును మనము అన్వేషించుదము. అటు తరువాత, ప్రకటన గ్రంథము యొక్క వివరములను మనము అన్వేషించుదము. మరియు ఆధునికముగా వాటిని అన్వయించుకొనగల కొన్ని సాధారణ పద్ధతులను చివరగా మనము అవలోకించెదము. యోహాను ఉద్దేశముతో ప్రారంభించుదము.

ప్రకటన గ్రంథము వ్రాయుటలో యోహాను యొక్క ఉద్దేశము ఆ గ్రంథమువలె చాలా మిశ్రితమైనది, అందువలన ఆ వివరణంతా ఈ పాఠములో మనము అన్వేషించలేము. కానీ తన యొక్క ముఖ్య ఉద్దేశములను ఈ విధముగా సంగ్రహించవచ్చును: శ్రమ పడుచున్న క్రైస్తవులు యేసు తిరిగి వచ్చే వరకు నమ్మకముగా ఉండునట్లు ప్రోత్సహించుటకు యోహాను ప్రకటన గ్రంథమును వ్రాసెను.

ఈ పాఠ్యక్రమము యొక్క మొదటి పాఠములో మనము సూచించినట్లు, హింసించబడుచున్న యోహాను యొక్క శ్రోతలు విశ్వాస విషయమై రాజీపడుటకు అనేక విధములుగా శోధించబడుచున్నారు. అందువలన, క్రీస్తు వారి శ్రమలను యెరిగియున్నాడనియు మరియు వాటిని ఆయన చూస్తున్నాడని ఎఫెసీ, స్ముర్న, పెర్గమము, తుయతైర, సార్ధీస్, ఫిలదెల్ఫియ, లవొదికయ మరియు మిగిలిన సంఘములన్నిటిని నిశ్చయపరచడానికి యోహాను వ్రాయుచున్నాడు. మహిమకరమైన వారి భవిష్యత్తు యేసు ఆధీనములో ఉందని మరియు నమ్మకముగా వెంబడించువారికి ఆయన బహుమానమిచ్చునని ప్రకటన గ్రంథము భరోసానిచ్చుచున్నది.

ఒక దేవుని ప్రవక్తగా, చిన్న ఆసియాలోని సంఘములకు ఆదరణగా యేసు ఇచ్చిన రెండు సందేశములో యోహాను యొక్క ఉద్దేశము వ్యక్తపరచబడినది. మొదటిగా, యేసునకు లోబడువారందరికీ కలుగు ఆశీర్వాదములను యోహాను చెప్పుచున్నాడు. మరియు రెండవదిగా, అవిధేయతగా ఉన్నవారికి కలుగు శాపములను గూర్చి హెచ్చరించుచున్నాడు. ఈ రెండు విధములైన సందేశములను మనము అన్వేషించుదము, ఆశీర్వాదపు వాగ్దానముతో ప్రారంభించెదము.

ప్రకటన 2:9-10లో స్ముర్నలో ఉన్న సంఘమునకు యోహాను ఆపాదించుచున్న ప్రోత్సాహమును వినండి:

నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును, అయినను నీవు ధనవంతుడవే; . . . నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడునట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు; పది దినములు శ్రమ కలుగును; మరణమువరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవకిరీట మిచ్చెదను (ప్రకటన 2:9-10).

శ్రమలలో భద్రతను గూర్చి వాగ్ధానము చేయుటకు బదులుగా, “నీవు పొందబోవు శ్రమలు” అని స్ముర్నలో ఉన్న సంఘమునకు యోహాను చెప్పుచున్నాడు. అదే సమయములో, వారు క్రీస్తునకు నమ్మకముగా ఉన్నట్లయితే, యేసు వారికి “జీవకిరీటమిచ్చునని” నిశ్చయపరచుచున్నాడు. వారి శ్రమ మరియు సాధారణ మరణము తాత్కాలికము మాత్రమే కానీ వారి ఆశీర్వాదము మాత్రము శాశ్వతముగా ఉండును.

ఈ ప్రోత్సాహకరమైన మాటలు చాలా ప్రాముఖ్యమైన ఏలయనగా, తరువాత వచ్చే దర్శనములను అప్పుడుండే తన పాఠకులు గ్రహించునట్లు ఇది చేయుచున్నది. తాను తిరిగివచ్చునప్పుడు ఆయనను నమ్మకముగా వెంబడించు వారికి యేసు ఇవ్వబోయే ఆశీర్వాదములను దృష్టిలో పెట్టుకొని ఈ దర్శనములను చదువమని ఇది వారికి బోధించుచున్నది. ఉదాహరణకు, క్రీస్తుతో కలసి పరిపాలించుటను గూర్చి ప్రకటన 20:4 మాట్లాడుచున్నది.

అంత్యముగా విశ్వాసులు పొందబోవు ఆశీర్వాదమును గూర్చి ప్రకటన 21:3-4లో వివరించబడిన వాటిని గూర్చి వినండి:

అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని (ప్రకటన 21:3-4).

భవిష్యత్తును గూర్చిన ఈ దర్శనము యోహాను పాఠకులును దేవునికి నమ్మకముగా ఉండునట్లు ప్రోత్సాహపరచినది, అందువలన వారు ఈ అద్భుతమైన ఆశీర్వాదములను పొందారు.

ప్రకటన గ్రంథములో దేవుని ప్రజలకు ఆశీర్వాదములు ఇవ్వబడినవి, అవి చాలా ప్రాముఖ్యమైన సందర్భములుగా మీకు ఉన్నాయి. ఉదాహరణకు ప్రకటన గ్రంథము 2 మరియు 3 అధ్యాయములలో జయించు వానికి ఇవ్వబడిన వాగ్దానమును గూర్చి ఆలోచించండి. అదే సంగతి ఈ గ్రంథము చివరిలో కూడా జయించు వారికి తిరిగి చెప్పబడినది. కావున ఆశీర్వాదపు వాగ్దానములు, దేవుని ప్రజలకు చేయు కార్యములను మనకు జ్ఞాపకము చేయుచున్నవి అదేదనగా శ్రమలు మరియు శోధనలు సమయములో మనము కాపాడబడుదుమని ప్రోత్సహించుట, కాపాడబడుట అనగా యేసును హత్తుకొని, మనలను ఆయన ఉద్దేశములకు అప్పగించుకొనుట, అంతమాత్రమే గాక ప్రభువు నామమును బట్టి యెరుగబడిన వారు జీవిత విధానములో చాలా జాగ్రత కలిగి మెలగుట ద్వారా మనము ప్రభువునకు పరిశుద్ధ జనముగా ఉండుటయైయున్నది.

— డా. డేవిడ్ డబ్ల్యూ. చాప్మన్

ప్రకటన గ్రంథములో మనము తరచూ ఎదుర్కొంటున్న ఆశీర్వాదపు సూచనల ఉద్దేశము ఏమనగా, అవి చాలామట్టుకు అంత్యకాల ప్రవచన స్వభావము కలిగిన గ్రంథములో భాగముగా ఉన్నాయి ఏలయనగా వారి యొక్క వాస్తవ పరిస్థితిని ఇవి వారికి చూపిస్తున్నాయి, వారు శపించబడిన వారుగా దృష్టించబడుచున్నారు, వారు శ్రమపడుచున్నారు, గుర్తింపు లేని వారుగా ఉన్నారు, రోమ దృష్టిలో, వ్యత్యాసము చేయబడిన వారు, మరియు సాంస్కృతికముగా వెలివేయబడినట్టు కనబడుచున్నారు. ప్రతిదీ వారికి వ్యతిరేకముగా కనిపించుచున్నది. అయితే యదార్థమైన సంగతి ఏమనగా, మాటలాడునట్లు ఆ ముసుగును మనము తీసివేయ గలిగితే వారు దేవుని వాక్యమును మరియు యేసును గూర్చిన సాక్ష్యమును కలిగియుండి, దేవుని ఆశీర్వాదమును అనుభవింతురు.

— డా. జేమ్స్, ఎమ్. హామిల్టన్

యేసును వెంబడించు నమ్మకస్తులైన వారికి ఆశీర్వాదములతో పాటు, యేసునకు అవిధేయత చూపించు వారికి సంభవించు శాపములను గూర్చి కూడా యోహాను హెచ్చరిస్తున్నాడు.

ఒక చిన్న ఉదాహరణగా, లవొదికయలో ఉన్న సంఘమును ప్రకటన 3:16లో యేసు హెచ్చరిస్తున్న సంగతి వినండి:

నీవు వెచ్చగా నైనను చల్లగా నైనను ఉండక, నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నానోట నుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను (ప్రకటన 3:16)

యోహాను పాఠకులు వారి యొక్క పాపములు నిమిత్తము పశ్చాత్తాపపడి, ఆసక్తితో యేసునకు లోబడియుండునట్లు ఈ మాటలు వారని కఠినముగా హెచ్చరించుచున్నవి. క్రీస్తు యొక్క నోటి నుండి ఉమ్మివేయబడుట అనునది యేసునకు వ్యతిరేకముగా వారి యొక్క ఘోరమైన అవిధేయత వలన కలుగు దైవిక శాపములను గూర్చి హెచ్చరిస్తుంది.

ఈ విధమైన ముప్పులు చేర్చబడుటకు కారణమేదనగా యోహాను యొక్క అసలైన శ్రోతలు దేవుని శాపముల యొక్క అవగాహనతో దర్శనములను చదువుతారు. రచయితగా, నిజమైన మరియు అబద్ధమైన విశ్వాసులు తమ పాపముల నుండి మారుమనస్సు పొందవలెనని హెచ్చరిస్తూ ఈ శాపములను గూర్చి యోహాను అనేక మారులు నొక్కి చెప్పెను.

ఉదాహరణకు, క్రూరమృగమును ఆరాధించు వారికి కలుగు శిక్షను గూర్చి యోహాను యొక్క దర్శనములలో అనేకసార్లు వివరించబడినది. ప్రకటన 14లో ఈ విగ్రహారాధికులు దేవుని ద్రాక్షాగానుగలో నలుగగొట్టబడతారు. 16వ అధ్యాయములో వారు అనేకమైన తెగుళ్లు చేత బాధించబడతారు. 19-21 అధ్యాయములలో వారు అగ్నిగుండములో కాల్చబడతారు. చిన్న ఆసియాలో ఉన్న అబద్ధపు విశ్వాసులకు ఈ దర్శనములు నిజమైన హెచ్చరికలుగా ఉన్నాయి. కాని వారి యొక్క ప్రవర్తన మరియు ఆలోచనా విధానమును బట్టి దేవుని తీర్పులోనికి రాకుండా పరిశుద్ధముగా ఉండునట్లు అవి వారిని ప్రోత్సహించుచున్నవి.

ప్రకటన గ్రంథములోని తీర్పును గూర్చిన హెచ్చరికలు నిజముగా రెండు ఉద్దేశములను కలిగి ఉన్నవి. ఒక వైపున, దృఢముగా నిలబడు విశ్వాసులకు, శ్రమలను సహించగలిగిన వారికి, అవి జ్ఞాపకము చేయుచున్నదేమనగా, న్యాయము ఆలస్యమగుట న్యాయము ఉపేక్షించుట కాదు, క్రైస్తవుల జీవితములను బాధించిన వారును లేదా క్రైస్తవులను సంహరించిన వారును తీర్పులోనికి తీసుకురాబడుదురు. మరియొక వైపున, పరిసర సంస్కృతి నివేదనల వలన శోధించబడిన సంఘములు ఈ రోజున ఉన్నట్లు మొదటి శతాబ్దములో కూడా ఉన్నవి. ప్రకటన 17లో యోహానుకు ఇవ్వబడిన దర్శనములో ఉన్న వేశ్య అందముగా అలంకరించుకొని యున్నది; ఒక విధముగా ఆమె చాలా ఆకర్షణీయంగా ఉన్నది. ఇప్పుడు ఆమె తన చేతిలో పరిశుద్ధుల రక్తమున్న ఒక పాత్రను కలిగియున్నది, క్రూరత్వముమీద స్థాపించబడిన సౌఖ్యమునకు ప్రతినిధిగా ఆమె ఎంత క్రూరమైనదో మనము గ్రహించుచున్నాము, కాని మనము శోధించబడే ప్రమాదమున్నది. మరియు యోహాను ఈ గ్రంథమును మొదటిగా అందుబాటులోనికి తెచ్చిన కొన్ని సంఘములు 2 మరియు 3 అధ్యాయములలో తెలుపబడినవి, అవి సంస్కృతి యొక్క ఆకర్షణ ద్వారా శోధించబడినాయి. అందువలన, విశ్వాసులు అన్య సంస్కృతులు మరియు సుఖభోగాలకు లోనుకాకూడదని నెమ్మదిగా హెచ్చరించబడుచున్నారు.

— డా. డెన్నిస్ ఇ. జాన్సన్

ప్రకటన గ్రంథము యొక్క నిజ సందేశమేమనగా, ఒక గొప్ప ఆత్మసంబంధమైన యుద్ధము జరుగుటకు ఈ లోకము వేదికగా ఉన్నది, మరియు ఆ యుద్ధములో మన పాత్ర చాలా ప్రాముఖ్యముగా ఉన్నది, మరియు ఈ లోకమును గూర్చి దేవుడు ఒక ఉద్దేశమును మరియు ప్రణాళిక కలిగియున్నాడు, మరియు ఆయన ఉద్దేశము మరియు ప్రణాళికకు అనుగుణముగా మన జీవితాలు ఉండాలి. కావున దేవుని ఉద్దేశమును వ్యతిరేకించువారు తగిన మూల్యము చెల్లించుదురు; వారు ఆయన నుండి తీర్పు పొందుదురు. విశ్వాసులముగా నమ్మకముగా ఉండవలసిన బాధ్యత మనకు ఉన్నది, కావున ప్రకటన గ్రంథములో పదే పదే వచ్చుచున్న సందేశమేమనగా: పట్టుకొనుట, పట్టుదల, అంతము వరకు పట్టుదల, ఏలయనగా దేవుడు జయించబోవుచున్నాడు, ఒకవేళ మార్గములో సంగతులు క్రమము తప్పుతున్నట్లు కనిపించినప్పటికీ దేవుడు సార్వభౌముడు. మరియు దేవుడు దుష్టత్వమునకు తీర్పుతీర్చి మంచి వారికి ప్రతిఫలము ఇచ్చుననే సత్యము, ఆయన ఉద్దేశము, ఆయన ప్రణాళికలకు నమ్మకముగా ఉంటూ, ఆయన సందేశమునకు నమ్మకముగా స్పందించాలని మనలను పిలచుచున్నది.

— డా. మార్క్. ఎల్. స్ట్రాస్

ప్రకటన గ్రంథములో ఉన్న అనేక విషయములు అర్థము చేసుకొనుట చాలా కష్టము, ఇందులో సందేహము లేదు. అయితే దాని ప్రాముఖ్యమైన విషయాలు ఇంకనూ స్పష్టముగానే ఉన్నవి. వారు శ్రమపడుచున్ననూ క్రీస్తుకు నమ్మకస్తులుగా ఉండాలనేది తన పాఠకుల పట్ల యోహాను యొక్క ఉద్దేశమై యున్నది. ఆశీర్వాదపు సూచనలు, వారు దేవునికి విధేయత చూపించి, మంచి కార్యములు చేయు విధముగా వారిని ప్రోత్సహించాలి. మరియు వారిని పశ్చాత్తాపములోనికి నడిపించడానికి వారికి దేవుని శాపములను గూర్చి తాను హెచ్చరించాడు. వీటిలో ఒకటి లేదా రెండు విధములుగా ప్రతి ఆకారము, గుర్తులు మరియు దృశ్యాలు ప్రకటన గ్రంథములో నమ్మకత్వమును ప్రోత్సహించుచున్నవి. మరియు ఈ ఉద్దేశమును మనము మనస్సులో పెట్టుకొంటే, ఆది క్రైస్తవులపట్ల మరియు ఆధునిక పాఠకుల విషయమై ప్రకటన గ్రంథము యొక్క తాత్పర్యమును గ్రహించుటకు అది ఉపకరిస్తుంది.

ఇంతవరకు ప్రకటన గ్రంథము యొక్క ఉద్దేశమును గూర్చి అన్వేషించి యున్నాము, ఇప్పుడు దాని వివరముల వైపు మన దృష్టిని పెట్టుదము.

ప్రకటన గ్రంథము 1:1-8లో ఉన్న క్లుప్తమైన ఉపోద్ఘాతముతో ప్రారంభమౌతున్నది. దీని వెంబడి, ప్రకటన గ్రంథము యొక్క అధ్యాయములన్నీ నాలుగు ప్రాముఖ్యమైన దర్శనములు కలిగియున్నాయి:

క్రీస్తును గూర్చిన దర్శనము 1:9-3:22

రాబోవు సంగతులను గూర్చిన దర్శనము 4:1-16:21

మహావేశ్యకు తీర్పు తీర్చబోవు దర్శనము 17:1-21:8

ప్రకటన గ్రంథములోని గొర్రెపిల్ల భార్య, వధువును గూర్చిన దర్శనము 21:9-22:5

ఈ నాలుగు ప్రాముఖ్యమైన దర్శనముల తరువాత ఈ గ్రంథము 22:6-21 తో ముగించబడుతుంది.

ప్రకటన గ్రంథములోని ఈ నలుగు దర్శనములు యోహాను “ఆత్మవశుడై” యుండగా అనే మాటతో ప్రారంభించబడినాయి. తన గ్రంథములోని ప్రధాన విభాగంలో నూతన విభాగముల ప్రారంభమును గుర్తించడానికి యోహాను ఈ భాషను నిరంతరం ఉపయోగించుచున్నాడు.

ప్రకటన గ్రంథములో యోహాను నాలుగు సార్లు ఉపయోగించిన “వెంటనే నేను ఆత్మవశుడనైతిని” అనే మాటను మనము వివరించునప్పుడు—ఇటువంటి వేరొకటి—ఉంది, అది నాలుగుసార్లు జరిగినదని మనము గమనించవచ్చు, ప్రతీసారి ఆ విధముగా జరిగినప్పుడు, అది ఒక మలుపు తిరుగుతున్నట్లు ప్రకటన గ్రంథములో చూడవచ్చు. అందువలన ప్రకటన గ్రంథమంతటిని ఈ నాలుగు భాగములుగా విభజించుటకు ఇది ఆస్కారము కలుగజేయుచున్నదని నేను భావిస్తున్నాను, విస్తృతముగా చెప్పాలంటే, ప్రారంభములో యేసు మరియు పత్రికలను గూర్చిన భాగము మనకు ఉంది, అటుతరువాత సింహాసనము మరియు తీర్పులు గూర్చినది మధ్యలో ఉంది, అటుతరువాత వేశ్యను గూర్చినది ఉంది, తదుపరి రాజు మరియు వధువును గూర్చినది ముగింపు భాగములో ఉంది. మరియు ప్రకటన గ్రంథము యొక్క పూర్తి సంగ్రహము ఆ విధముగానే ఉన్నది.

— డా. జేమ్స్, ఎమ్. హామిల్టన్

ప్రకటన గ్రంథము 1:10లో యోహాను ఈ విధముగా వ్రాసియున్నాడు.

ప్రభువు దినమందు ఆత్మ వశుడనై యుండగా బూరధ్వనివంటి గొప్పస్వరము. . . చెప్పుట నావెనుక వింటిని (ప్రకటన 1:10).

ప్రకటన 4:2లో తాను తెలుపుతున్నాడు:

వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి యుండెను. సింహాసనమునందు ఒకడు ఆసీసుడై యుండెను (ప్రకటన 4:2).

ప్రకటన 17:3లో ఈ విధముగా చెప్పుచున్నాడు:

అప్పుడతడు ఆత్మవశుడనైన నన్ను అరణ్యమునకు కొనిపోగా (ప్రకటన 17:3).

మరియు ప్రకటన 21:10లో ఈ విధముగా వ్రాసియున్నాడు:

ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను (ప్రకటన 21:10).

ఆత్మవశుడనై యుండగా అనే సందర్భము ఒక ప్రవక్తగా యోహానుకు ఇవ్వబడిన ఒక విధమైన అనుభవము అది అనేకమైన గురుతులుగల దర్శనములను పొందునట్లు తనను ఒక దర్శనపు స్థితిలోనికి తెచ్చినది. దీనికి సంబంధించిన నేపథ్యము పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథములో ఉంది, రెండు సందర్భాలలో ఆత్మలో కొనిపోబడుటను గూర్చి యెహెజ్కేలు ప్రస్తావించాడు, ఆ విధముగా కొనిపోబడకపోతే వాటిని చూడలేకపోయే వాడేమో. అది మనము పూర్తిగా అర్థము చేసుకోలేని ఒక అనుభవమని నేను అనుకొనుచున్నాను. ప్రవక్త కూడా దానిని అర్థము చేసుకోలేకపోవుచున్నాడు. మూడవ ఆకాశమునకు ఎక్కిపోవుటను గూర్చి 2 కొరింథీ 12లో పౌలు మాటలాడుచు, తను శరీరముతో కొనిపోబడ్డాడో లేదా శరీరము లేకుండా కొనిపోబడ్డాడో ఖచ్చితముగా చెప్పలేకపోయాడు. వారు దానిని సరిగ్గా అర్థము చేసుకున్నారని నేను ఖచ్చితముగా చెప్పలేను, కానీ దేవుడు వారిని ఒక స్థానము, ఒక స్థితిలో, ఉంచుతున్నాడనేది స్పష్టముగా ఉంది; ఇక్కడ వారు అసాధరణమైన దర్శనములను పొందుతున్నారు మరియు దానిని సూచించుట ద్వార లేఖనములను మనకు తెలుపుచున్నారు, ఆత్మ వారికి ఈ దర్శనములు మరియు అనుభవములు గూర్చి వివరించడానికి అవకాశము ఇచ్చిన కొలది ఇది బైబిల్ గ్రంథములో పొందుపరచబడినది.

— డా. డెన్నిస్ ఇ. జాన్సన్

ప్రకటన గ్రంథము యొక్క ప్రాముఖ్యమైన భాగములలో ఒకొక్క దానిని అన్వేషించుదము, ప్రకటన 1:1-8లో ఉన్న ఉపోద్ఘాతముతో ప్రారంభించుదము.

ఉపోద్ఘాతము ప్రకటన 1:1-3లో ఉన్న నాంది ప్రస్తావనతో ప్రారంభమౌతుంది, అది ఈ గ్రంథము యొక్క దైవిక అధికారమును నొక్కిచెప్పుచున్నది. అది తండ్రియైన దేవుని యొద్ద నుండి ప్రారంభించబడి, యేసుక్రీస్తునకు ఇవ్వబడినది మరియు ఒక దేవదూత ద్వారా తెలియజేయబడుచున్నది. మరియు క్రీస్తు యొక్క ప్రవక్తగా, యేసు యొక్క సందేశమును సంఘములకు తీసుకొనిపోవుటకు యోహాను ఒక అధికారము కలిగిన రాయబారి.

4 మరియు 5 వచనములు శుభాకంక్షలు తెలుపుచున్నవి, అందులో యోహాను తన్నుతాను తన శ్రోతలకు తెలియజేసుకుంటున్నాడు. ప్రత్యేకముగా, చిన్న ఆసియాలో ఉన్న రోమా సామ్రాజ్యానికి చెందిన ఏడు సంఘములకు ఆయన వ్రాసియున్నాడు. యోహాను శుభాకాంక్షలును కూడా చేర్చుతున్నాడు:వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవాడైన తండ్రియైన దేవుని నుండి; ఆయన సింహాసనము యెదుట పరిశుద్ధాత్మ సంపూర్ణత లేదా పరిపూర్ణతకు సాదృశ్యముగా నున్న ఏడు ఆత్మలు నుండియు; మరియు నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆదిసంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతియని యేసుక్రీస్తును యోహాను పిలచుచున్నాడు.

5-8 వచనములలో యోహాను దేవుని స్తుతించుచున్నాడు, మరియు తన శ్రోతలపట్ల తాను కలిగియున్న అభిమానమును ఈ స్తుతి బయలుపరచుచున్నది. దేవుని యొక్క సార్వభౌమత్వమును గూర్చి, తన మహిమకరమైన ఉద్దేశముల కొరకు చరిత్రయంతటిలో దేవుడు పనిచేయుచున్నాడని యోహాను స్తుతించుచున్నాడు. యేసుక్రీస్తు ద్వారా కలుగు విమోచన కొరకు తాను దేవుని స్తుతించాడు ఏలయనగా, యేసు యొక్క జీవితము, మరణము, పునరుత్థానము మరియు ఆరోహణము ప్రతివిధమైన నిరీక్షణకు ఆధారమని యోహాను ఈ గ్రంథములో వివరిస్తున్నాడు. మరియు చివరిగా, క్రీస్తు మరలా రానున్నందున మరియు దేవుడు ఉద్దేశించినది, వాగ్దానము చేసినది నెరవేర్చబడబోవు గొప్ప భవిష్యకార్యమును బట్టి తాను దేవునిని స్తుతించాడు.

రాబోవు సంపూర్ణ విడుదలను గూర్చిన నిరీక్షణ ఉత్సాహమునకు క్రైస్తవులు స్పందించవలసియున్నది. భవిష్యత్తులో జరుగబోవు దానికొరకు కృతనిశ్చయతతో ఎదురు చూచుటయే నిరీక్షణ. నిరీక్షణ యొక్క విశేషము మరియు అభ్యాసకరమైన సంగతేమనగా అది మనలను ఉల్లాసపరుస్తుంది, అది మనకు భద్రతను కలిగిస్తుంది, అది మనకు హుషారును కలిగిస్తుంది, మరియు వాగ్దానము చేయబడినది నిజము కాబోవుచున్నదను నిశ్చయత యెడల ప్రస్తుతం ఒక విధమైన ఆనందమును కలుగజేస్తుంది. ఆశతో ఎదురుచూస్తూ ప్రస్తుతమందు సంతోషించే శక్తిని అది మనకు ఇస్తుంది. మనము దేని కొరకైతే శ్రమపడుచున్నామో దాని ఫలితము తప్పనిసరిగా మనము అనుభావిస్తామనే ఉల్లాసముతో ముందుకు నడుపుతుంది, సహజముగా మన సంకుచితమైన దృష్టివలన అధైర్యము లేదా అనిశ్చయత కలుగుతుంది.

— డా. గ్లెన్ స్కోర్గి

యేసుక్రీస్తు ద్వారా మనము పొందబోవు చివరి విమోచన నమ్మశక్యముకాని విధముగా సుందరమైనది మరియు మహిమ కలిగినది, యేసుక్రీస్తు నందు దేవుడు వాగ్దానము చేసినది మరియు నెరవేర్చిన సంగతుల విషయములో మనము సంపూర్ణముగా స్పందించవలసియున్నది. 1 యోహాను 3లో “ఇప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము మనమిక ఏమవుదుమో ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యేక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము. ఆయనయందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడును ఆయన పవిత్రుడై యున్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసికొనును”, అని యోహాను చెప్పినప్పుడు నేను అర్థము చేసుకున్నది అదే. మనలను క్రీస్తు స్వరూపములోనికి మార్చుటయే దేవుని యొక్క విమోచనా ప్రణాళికయైతే, ఒకవేళ ఆయనలో సంపూర్ణ ఐక్యము చేయబడుటయే దేవుని యొక్క ప్రణాళికయైతే, పరలోకము నిత్యము మనలో నివసించు విధముగా ఆయన మనలను తన ప్రేమ మరియు ఆత్మచేత నింపి పరలోక ఆనందమును కలుగజేయుటయే దేవుని యొక్క విమోచనా ప్రణాళికయైతే మన యొక్క ప్రతిస్పందన కేవలము ఈ విధముగానే ఉంటుంది: దేవా ఒక మనుష్యుడు సాధ్యమైన రీతిలో ఉండునట్లు ఈ లోకములో యేసును పోలియుండునట్లు నన్ను చేయుము. అది ఏ విధముగా ఉంటుందో నేను ఎరుగను; అది ఏ విధముగా పని చేస్తుందో నేను ఎరుగను, కానీ ప్రభువా, నాలోనుండి నీవు చేయగలిగనదంతయూ చేయుము. నా సమస్తము నీకిచ్చుచున్నాను; నా జీవితమును నీకిచ్చుచున్నాను. నా సమస్తమును నీకర్పించుచున్నాను. నా జీవితములో పనిచేయుచున్న నీ సంపూర్ణ మరియు పూర్తి విమోచనా కార్యమునకు తక్కువైనదేదైనా దాని కొరకు నేను జీవించడం లేదు.

— డా. స్టీవ్ బ్లేక్ మోర్

ఉపోద్ఘాతము అయిన తరువాత, క్రీస్తు యొక్క దర్శనములు మరియు సంఘములకు వాటి అన్వయింపులు ప్రకటన 1:9-3:22లో మనము కనుగొనవచ్చును.

క్రీస్తును గూర్చిన వర్ణనతో క్రీస్తు దర్శనములు ప్రారంభమై, చిన్న ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు వ్రాయబడిన క్రీస్తు పత్రికతో ముగించబడతాయి. ఈ రెండు భాగాలను మనము వేరువేరుగా చూడబోతున్నాము, ప్రకటన 1:19-20లో ఉన్న క్రీస్తును గూర్చి యోహాను ఇచ్చిన వర్ణనతో ప్రారంభించెదము.

యేసును వర్ణించుటకు ముందు క్రీస్తునుబట్టి వారికి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాళీవాడనని యోహాను తన్నుతాను తన పాఠకులతో పోల్చుకొనుచున్నాడు.

శ్రమలు అనునవి ఎల్లప్పుడు విశ్వాసులకు నిజమైనవిగా ఉన్నవి. అయితే క్రొత్త నిబంధన కాలములో మన శ్రమలు ఒక ప్రత్యేకతను కలిగియున్నాయని యోహాను చెప్పుచున్నాడు. తాను పాపమునకు ఎదురు నిలిచినందున క్రీస్తు శ్రమనొందెను. విశ్వాసులు యేసుతో ఐక్యపరచబడినందున మనము కూడా శ్రమ పొందుచున్నాము. అయినప్పటికీ మనము శ్రమనొందినప్పుడు దేవుడు మనతో ఉన్నాడనే ఆదరణ పొందుచున్నాము, మరియు ఆయన మన పరిస్థితిని తన అధికారము చొప్పున తన అధీనములో ఉంచుకుంటాడు. ప్రతీ పరిస్థితిలో—హతసాక్ష్యులైనప్పుడు—కూడా క్రీస్తు యొక్క శక్తి ద్వారా దుష్టత్వము మరియు మరణము మీద విజయము పొందుచున్నాము.

“ఆత్మవశుడైయుండగా” తాను దర్శనము పొందియున్నానని యోహాను సూచించుచున్నాడు. తాను శారీరకముగా మరొక ప్రదేశమునకు కొనిపోబడనప్పటికీ, యోహాను ఒక విధమైన పరవశము చెందిన స్థితిలో ఉన్నట్లు ఇది సూచిస్తుంది. ఇది పాత నిబంధన కాలములో ప్రవక్తలకు దేవుడు తన్నుతాను ప్రత్యక్షపరచుకొనే ఒక పద్ధతి కూడా, దానిని మనము యెహెజ్కేలు 3:12 వంటి లేఖన భాగాలలో చూడవచ్చు.

చివరిగా, ఎఫెసీ, స్ముర్న, పెర్గమము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ మరియు లవొదికయ సంఘములకు ఈ దర్శన భావమును వ్రాయవలసినదిగా పరలోకమునుండి ఒక శబ్దము తనకు ఆజ్ఞాపించినట్లు యోహాను తన పరిచయ వాక్కులను ముగిస్తున్నాడు.

యేసును గూర్చి యోహాను వర్ణన ప్రకటన 1:12 నుండి ప్రారంభమౌతుంది. ఏడు దీపస్తంభముల మధ్య సంచారము చేయు “మనుష్య కుమారునిగా” యేసు ప్రత్యక్షమగుచున్నాడు. అంధకార లోకమునకు క్రీస్తు ద్వారా దేవుని వెలుగును ప్రకాశింపజేయు సంఘములను ఇవి సూచిస్తున్నాయి. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారము మరియు దేవాలయములో ఉన్న ఉపకరణములను మరియు పరలోకమందు దేవుని సింహాసనము యెదుట ఇప్పుడు క్రీస్తు ఉన్నాడను సత్యమును ఆ దీపస్తంభములు జ్ఞాపకము చేయుచున్నాయి. పరలోకమందు దేవుని సింహాసనము ఎదుట యేసు ఇప్పుడు ఉండుట వాస్తవము దేవుడు ఎదుటనున్న ఏడు దీపస్తంభములకును మరియు చిన్న ఆసియాలో ఉన్న ఏడు సంఘములకును మధ్యనున్న సంబంధమును గూర్చి 1:4లో యోహాను ముందుగానే చెప్పియున్నాడు. ప్రత్యక్ష గుడారములోను తరువాత దేవాలయములోను దేవుడు తన మహిమా సన్నిధిని తన ప్రజల మధ్య కనబరచుచున్నాడు. ఒకప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివాసముండునట్లు క్రీస్తు ఇప్పుడు తన సంఘము మధ్యన నివాసము చేయుచున్నాడు.

యేసు పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము మరియు దట్టి, యూదుల దేవాలయములోని ప్రధాన యాజకుని సూచించుచున్నది. ఆయన నేత్రములు అగ్నిజ్వాలవలె ఉండెను మరియు ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై యుండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వనివలె ఉండెను, మరియు ఆయన నోటినుండి రెండంచులుగల వాడియైన ఖడ్గము ఒకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యునివలె ఉండెను. యేసు మహోన్నతుడు, మహిమగలవాడు మరియు శక్తిమంతుడని ఈ ప్రత్యక్షత తెలుపుచున్నది.

ప్రకటన గ్రంథము 1వ అధ్యాయమును చదువుచున్నప్పుడు ప్రాముఖ్యముగా ఆలోచనలోకి వచ్చే ఒక విషయమేమనగా యేసుక్రీస్తును గూర్చిన దర్శనము. మొట్టమొదటి సంగతి, యేసు ఏమైయున్నారో చూపించే దృశ్యముగా ఇది ఉన్నట్లు మనము స్పష్టముగా చెప్పవచ్చును. ఇది అక్షరార్థము తీసుకొనేది లేదా అన్వయించే దృశ్యము కాదు. అయితే ఒక పత్రికగా, ఒక ప్రవచనముగా, మరియు అంత్యకాల ప్రత్యక్షతా సాహిత్యముగా యోహాను ఈ పుస్తకమును వ్రాసినట్లు మనము జ్ఞాపకము చేసుకోవాలి, వారి జీవితములను యేసు క్రీస్తు కొరకు మరియు సువార్త కొరకు అంకితము చేసిన, శ్రమపొందుచున్న విశ్వాసుల కొరకు ఈ పుస్తకమును ఆయన వ్రాసియున్నాడు. మరియు సువార్త నిమిత్తము ప్రాణమును పోగొట్టుకొనే ప్రమాదములో వారున్నారు. 1వ అధ్యాయములో, యేసు క్రీస్తు మహిమపరచబడిన మనుష్యకుమారుని దృశ్యము మనకు ఉంది, మరియు యేసును గూర్చిన అనేక విధములైన వర్ణనలు అచ్చట ఉన్నవి. ఆయన యాజక వస్త్రమును ధరించియున్నాడు. దేవుని సన్నిధికి వెళ్లుటకు ఆయన మార్గమైయున్నాడు. ఆయన హిమమంత తెల్లని జుట్టును కలిగియున్నాడని యోహాను వర్ణించుచున్నాడు, ఇది చాలా ఆసక్తికరమైనది ఏలయనగా దానియేలు 7వ అధ్యాయములోని సంగతులను తాను చూపించుచున్నాడు, మరియు దానియేలు 7వ అధ్యాయములోని తెల్లని జుట్టుగల వ్యక్తి యెహోవాయైయున్నాడు. అయినప్పటికి దానిని యోహాను యేసునకు ఆపాదించుచున్నాడు, యేసు యెహోవాతో సమానుడు అని మరియు పరిపూర్ణ దైవత్వము కలిగినవాడని చూపుతున్నాడు. ఈ దృశ్యములో యేసు తన నోటిలో వాడియైన రెండంచులు గల ఖడ్గము కలిగియునట్లు వర్ణించబడియున్నాడు, అది అక్షరార్థము కాదు, గానీ అది తన శత్రువులను ఖండించి, నాశనము చేయు తన మాట యొక్క శక్తిని నొక్కి చెప్పుచున్నది అందువలన సంఘము క్రీస్తునందు ఆదరించబడుచున్నది. ఆయన ముఖము మహిమతో ప్రకాశించుచున్నదని మనకు చెప్పబడినది, అనగా ఆయన మహిమగల ప్రభువు. “మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి” అని యేసు యోహానుతో చెప్పుచున్నాడు. దీనినే సంఘము ఎదుర్కొనుచున్నది. వారు మరణమును చవి చూస్తున్నారు, గనుక వారు సహజముగా వారి భవిష్యత్తును గూర్చి కలతచెందుతున్నారు. మరియు యేసు సర్వశక్తిమంతుడని, ఆయన పునరుత్థానుడని, ఆయన జీవముగలవాడని, ఆయనే మొదటివాడును, కడపటివాడని, ఆయన మరణమును గెలిచియున్నాడని, వారు భయపడనవసరము లేదని యోహాను నొక్కి చెప్పుచున్నాడు. నీరో లేదా డొమేషియన్ గాని ఆ సమయములో ఏ రోమా చక్రవర్తి ఉండినప్పటికీ— ఈ విషయమై వాదన ఉంది — అప్పటి రోమా చక్రవర్తి ఎవరైనప్పటికీ ఆ చక్రవర్తి ఆధిపత్యము చేస్తున్నట్లు కనిపించుట లేదా? లేక రాజకీయ అధికారులు ఆధిపత్యములో ఉన్నట్లు కనిపించుట లేదా? వారు ఆధిపత్యము కలిగిలేరు. యేసే పరిపాలించుచున్నాడు, యేసే ఆధిపత్యము కలిగియున్నాడు. అందరూ ఆయన మీద ఆధారపడవలసియున్నది. కావున ప్రకటన గ్రంథము ప్రాథమికముగా శ్రమపడుచున్న సంఘమును భద్రపరచుటకు యేసే సర్వాధికారియని చెప్పుటకు, ఆయన మహిమగల ప్రభువు అని చెప్పి ఆదరణ కలిగించు పుస్తకము. ఆయన దీపస్తంభముల మధ్య సంచారము చేయుచున్నాడు. వారు ఆదరించబడి, బలపరచబడి నిరీక్షణలో ఆయన యందు నమ్మకముంచుతూ ముందుకు కొనసాగాలి.

— డా. థామస్ ఆర్. శ్రైనర్

క్రీస్తును గూర్చిన యోహాను యొక్క వర్ణనను మనము పరిశీలించియున్నాము, కాబట్టి ఇప్పుడు ప్రకటన గ్రంథము 2, 3 అధ్యాయములలో ఏడు సంఘములకు వ్రాయబడిన యేసు యొక్క పత్రికలను మనము చూచెదము.

చిన్న ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు క్రీస్తు పత్రికలను పంపుమని చెప్పుచున్నాడు, అది ఇప్పుడు టర్కీ దేశములోని పశ్చిమ ప్రాంతములో ఉన్నది. ఆ పత్రికలను ఇచ్చె వ్యక్తి ఒక క్రమ పద్ధతిలో ప్రయాణించి వెళ్లునట్లు ఆ పత్రికలు వరుసగా వ్రాయబడి ఉన్నాయి. మొట్టమొదట సముద్రతీరములో ఉన్న ఎఫెసీ పట్టణమునకు పత్రిక వ్రాసాడు, తరువాత ఉత్తర ప్రాంతమునున్న స్ముర్న, ఉత్తరమున దూరముగానున్న పెర్గెమమునకు పత్రిక వ్రాసాడు. అటుతరువాత, ఆగ్నేయముననున్న తుయతైర, సార్దీస్, తరువాత ఫిలదెల్ఫియ, తరువాత లవొదికయలో ఉన్న సంఘములపై దృష్టిసారించాడు. తన పరలోకపు పరిశుద్ధ స్థలములో యేసు చెప్పిన మాటలు ఈ పత్రికలలో పొందుపరచబడినాయి మరియు రానున్న దర్శనములను సంఘములు అర్థము చేసుకొని, స్పందించుటకు సహకరించు విధముగా ఈ పత్రికలు రూపించబడినాయి.

సాధారణ మాటల్లో, ఈ పత్రికలన్నీ ఒకే నమూనాలో పొందుపరచబడినాయి, కొద్దిగా వైరుధ్యము కనబడుతుంది. పాత నిబంధన ప్రవచనము కలిగియున్న అనేకమైన అంశాలను ఈ నమూనా కలిగియున్నది మరియు ఈ సంఘములకు యేసు యొక్క ప్రవక్తగా యోహాను పరిచర్య చేయుచున్నాడనే సంగతి మనకు జ్ఞాపకము చేయబడుచున్నది.

మొదటిగా, ప్రతీ పత్రిక ఆ సంఘములో ఉన్న దూతకు చెప్పబడునట్లు వ్రాయబడినది. సంఘములో నున్న మనుష్యులైన వారిని ఇది సూచించుచున్నట్లు కొంతమంది వ్యాఖ్యానకర్తలు చెప్పుచున్నారు. అయితే పరలోక దర్శనమున్న ఈ సందర్భములో, వారు స్థానిక సంఘముల నిమిత్తము క్రీస్తు ద్వారా నియమించబడిన నిజమైన దేవదూతలుగా కనిపించుచున్నారు. రెండవది, క్రీస్తును గూర్చిన వర్ణన ప్రకటన 1వ అధ్యాయములో ఉన్న ప్రత్యక్షతలో నుండి వ్రాయబడిన మరియు ఆ పత్రికకు సంబంధించి యేసు గుణలక్షణమును నొక్కి చెప్పుచున్నది. మూడవది, ఎరుగుటను గూర్చిన సంగతి కూడా ఉన్నది, ఈ సంఘాలను మరియు వారి జీవితాలను గూర్చి క్రీస్తు ఎరిగియున్నాడని అది సూచించుచున్నది. నాల్గవదిగా, సంఘమును పరిశోధించుట ఉంది, అందులో మెచ్చుకోలు, తరచు గద్దింపులు ఉన్నాయి. ఐదవదిగా, సంఘమును క్రీస్తు పరిశోధించిన పిమ్మట తదనుగుణంగా ఆశీర్వాదపు మాటలు లేదా శాపపు హెచ్చరికలు ఉన్నాయి. ఆరవదిగా, జయించు వారందరు నిత్యత్వపు ఆశీర్వాదములు పొందుదురని వాగ్దానము చేయబడినది. ఏడవదిగా, ప్రతీ పత్రిక క్రీస్తునకు విధేయత చూపించవలెనని హెచ్చరించుచున్నది.

ప్రకటన 2, 3 అధ్యాయాలలో ఉన్న పత్రికలలోని సారుప్యతలు ఈ భాగములో ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశాలను గుర్తుచేస్తున్నాయి. ఈ సంఘములకు క్రీస్తు సరియైన రాజుగా వర్ణించబడినాడు వారి యొక్క ప్రస్తుత పరిస్థితిని ఆయన ఎరుగును గనుక వారిని విమర్శించే అధికారమును ఆయన కలిగియన్నాడు. ఆయన ఆశీర్వాదములను వారికి వాగ్దనము చేశాడు మరియు వారి యొక్క నమ్మకత్వమును ప్రోత్సాహపరచడానికి శాపపు హెచ్చరికలను ఇచ్చియున్నాడు. మరియు శ్రమలు, శోధనలు జయించిన వారికే నిత్యత్వపు రక్షణ ఉంటుందని వారికి జ్ఞాపకము చేసియున్నాడు. ఈ ప్రకటన గ్రంథములోని ప్రధాన భాగమంతటిలో ఈ అంశాలు కూడా కీలకమైన పాత్ర పోషించుచున్నాయని చెప్పుట అతిశయోక్తి కాదు.

ఏడు సంఘాలకు వ్రాయబడిన ఏడు పత్రికలలో, క్రైస్తవులందరూ, ఎటువంటి వ్యతిరేకతలు కలుగుచున్నను తనకు నమ్మకముగా, విధేయతగా ఉండాలని యేసు కోరుతున్నాడు— అచ్చట ఎంతో వ్యతిరేకత ఉన్నను —వారు నమ్మకముగా ఉన్నారు. ఇప్పుడు గమనించండి అచ్చట ఏడు సంఘములు ఉన్నాయి. నిజముగా, వాటిలో రెండు నమ్మకముగా ఉన్నాయి, నేను స్ముర్నలో ఉన్న సంఘము మరియు ఫిలదెల్ఫియలో ఉన్న సంఘమును గూర్చి ఆరోపిస్తున్నాను, యేసు వారిని గూర్చి ఏమియు చెప్పుటలేదు గాని ఈ రెండింటిని మెచ్చుకున్నాడు. ఇప్పుడు మిగిలిన సంఘాలు చూస్తే, ఎఫెసీ, పెర్గమము, తుయతైర మరియు సార్దీస్ మెచ్చుకొనబడ్డాయి, గానీ గద్దించబడ్డాయి. అటుతరువాత మరియొకటి ఉంది ఏడవది, అది లవొదికయ సంఘము, మరియు లవొదికయలో ఉన్న సంఘమునకు మెచ్చుకోలు లేదు ఏలయనగా అది స్వయం - సమృద్ధి గల సంఘము.

— డా. సైమన్ జె. కిస్ట్ మేకర్

ఈ పత్రికలలో ప్రతి దానిని క్లుప్తముగా చూచెదము, ప్రకటన 1:1-7లో ఉన్న ఎఫెసీ సంఘముతో మొదలు పెడదాము.

ఎఫెసీ: ఈ పత్రికలో, తన కుడిచేత ఏడు నక్షత్రములు పట్టుకొనిన వానిగా మరియు సువర్ణ దీపస్తంభముల మధ్య సంచారము చేయుచున్నవానిగా యేసును యోహాను పరిచయము చేసియున్నాడు. మరియు ఈ వర్ణన క్రీస్తు యొక్క మహిమ ప్రకాశమును మరియు శక్తిని గూర్చి నొక్కి చెప్పుచున్నది.

వారి రాజుగా, ఎఫెసీ సంఘమును గూర్చి మిశ్రితమైన వ్యాఖ్యాలను యేసు ఇచ్చుచున్నాడు. వారు సరియైన బోధ పట్ల హర్షించదగిన ఆసక్తిని కలిగియున్నారు, మరియు దుష్ట ప్రవర్తనను సహింపలేదు. వారు నికోలాయితుల క్రియలను ద్వేషించుచున్నారని ప్రత్యేకముగా చెప్పబడినది, ఈ నికోలాయితులు క్రైస్తవ విశ్వాసమును విగ్రహారాధికుల కాముకత్వముతో మిశ్రమము చేసినవారు కావచ్చును.

అయితే ఎఫెసీ సంఘము కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొనినది. ప్రకటన 2:4లో వారు తమ మొదటి ప్రేమను కోల్పోయి ఉన్నారని యేసు చెప్పియున్నాడు; క్రీస్తు కొరకు మరియు ఆయన రాజ్యము కొరకు ఉన్న ఆసక్తిని వారు కోల్పోయారు. కావున వారు మారుమనస్సు పొంది మొదట ఉన్న ఆసక్తిని కలిగియుండకపోయినట్లైతే, ఆయన వారి దీపస్తంభమును— పరలోకములో వారి గొప్పతనమునకు గురుతుగా ఉన్నదానిని తొలగిస్తానని యేసు హెచ్చరిస్తున్నాడు. మరొక మాటలో వారు క్రమశిక్షణలో పెట్టబడాలి లేకపోతే తొలగించబడతారు.

స్ముర్న: ప్రకటన 2:8-11లో స్ముర్నలో ఉన్న సంఘమునకు వ్రాయబడిన పత్రిక కనబడుచున్నది. “మొదటివాడును కడపటివాడునైయుండి, మృతుడై మరలా బ్రదికినవాడు” అని యేసును వర్ణించుటతో ఇది ప్రారంభించబడుచున్నది. యేసు సమస్తమును సృష్టించిన వానిగా మరియు ఈ సృష్టి యొక్క అంత్య లక్ష్యమునకు ఆయనే మూలమైనట్లు ఈ వర్ణన యేసును గుర్తించుచున్నది.

పొరపాటును బట్టి గద్దించబడని రెండు పత్రికలలో ఇది ఒకటైయున్నది. స్ముర్నలో ఉన్న సంఘముపై సానుభూతి చూపి, అర్థము చేసుకొనుట యందు ఇది పూర్తిగా దృష్టిసారించినది, ఏలయనగా బహుశా అవిశ్వాసులైన యూదుల నుండి ఇది కఠినమైన శ్రమలను ఎదుర్కొనుచున్నది.

ఉదాహరణకు అపొస్తలుల కార్యములు మరియు ఇతర క్రొత్త నిబంధన పుస్తకాలలో యేసును మెస్సీయగా ప్రకటించుట వలన సమాజ మందిరములలో విభేదములు ప్రారంభమగుట మనము చూడవచ్చును. మరియు పౌలు సమాజ మందిరము నుండి వెలివేయబడుట ఒక గొప్ప ఉదాహరణ. మచ్చుకు, ఎఫెసులో ఆయన ఒక పాఠశాల భవనములో బోధించుటకు వెళ్లుట లేదా క్రైస్తవులైనవారు సమాజ మందిరమునకు బదులుగా గృహములలో కూడుకొనుట మనము చూడవచ్చును. యేసు మెస్సీయగా ప్రకటించబడుట వారి సంబంధములో ఒక గొప్ప ఒత్తిడిని కలుగజేయుట ఒక సంగతి, కానీ అన్యులు కూడా ప్రవేశించుట ఒక కారణము. క్రైస్తవత్వమును ప్రకటించువారు యేసుక్రీస్తును దేశములన్నింటి పైన ప్రభువుగా ప్రకటించుట మనము చూడవచ్చు. మరియు అన్యులు కూడా దానికి స్పందించుట చూడవచ్చును. కావున భోజన నియమాలు మరియు సున్నతిని గూర్చి అనేకమైన సున్నితమైన విషయాలు ఎక్కువ ఒత్తిడి చేయబడట మనము చూడవచ్చును. ఇటువంటి వివాదములు, ఈ అన్యులు ధర్మశాస్త్రమును పాటించవలసి యున్నదా, లేదా అనే విషయములను గూర్చి గలతీ వంటి సంఘములలో వచ్చుట మనము చూడవచ్చును. ఈ సంబంధమునకు ఎక్కువ ఒత్తిడిని కలుగజేయు వేరొక విషయము ఏమనగా ఇరువర్గములు రోమునకు మరియు రోమా అధికారమునకు సంబంధించిన వారే. ఉదాహరణకు, మనకు తెలుసుకదా, దేవాలయము క్రీ.శ.70లో నాశనము చేయబడినది. మరియు దానికి ముందు అనగా కైసరుకు వ్యతిరేకముగా యూదులు తిరుగుబాటు చేసినప్పుడు, ఈ మేలుకొలుపుతో యూదులు తిరిగి తమ గుర్తింపును స్థాపించుటకు యత్నించిరి. మరియు అది ఏ విధముగా ఉండబోతుందో అనేదానిని గూర్చి చర్చించుట ప్రారంభించారు. అది యూదులు మరియు క్రైస్తవుల మధ్య మరింత తారతమ్యము కలుగజేసినది.

— డా. గ్రెగ్ పెర్రీ

స్ముర్నలో సంఘమునకు వ్యతిరేకముగా యూదులు సమస్యలు సృష్టించినప్పటికీ, తన అనుచరులు నమ్మకముగా ఉండాలని యేసు హెచ్చరించాడు మరియు తాను మరణమును జయించాను గనుక తనయందు నమ్మకముంచుమని వారిని ప్రోత్సహించాడు.

పెర్గమము: తరువాత పెర్గమములో ఉన్న సంఘమును గూర్చి ప్రకటన 2:12-17లో యోహాను వ్యాఖ్యానించారు. ఈ పత్రికలో “వాడియైన రెండంచులు గల ఖడ్గము గలవాడు” అని క్రీస్తును యోహాను పరిచయము చేయుచున్నాడు. యేసు మాటలు మంగలికత్తి యంత వాడిగా ఉన్నాయి, అవి మంచి చెడుల మధ్య తీర్పుతీర్చుచున్నవి. ఇది నేరుగా వర్తిస్తుంది, ఏలయనగా ఆయన సంఘము పట్ల చేసిన విమర్శ అనుకూలము మరియు ప్రతికులముగాను ఉన్నాయి.

ప్రకటన 2:13-14లో యేసు చెప్పినది వినండి:

సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేనెరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో, నాయందు విశ్వాసియైయుండి నన్నుగూర్చి సాక్షియైన అంతిపయనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమ గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేనెరుగుదును. అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది (ప్రకటన 2:13-14).

యేసు మెచ్చుకోలుతో పాటు గద్దింపును ఇచ్చుచున్నాడు: నికోలాయితులను తృణీకరించుటలోను మరియు బిలాము యొక్క బోధకు అనుసంధానముగా నున్న విషయములను విజర్జించుటలో సంఘము విఫలమైనది. ఈ అబద్ధ బోధకులు అనేకమందిని విగ్రహారాధన మరియు జారత్వము వైపు నడిపించారు. మరియు వారు పశ్చాత్తాపమునొందక పోతే సంఘమును క్రమశిక్షణలో పెడతానని క్రీస్తు హెచ్చరించాడు.

తుయతైర: ప్రకటన 2:18-29లో తుయతైర సంఘమునకు వ్రాసిన పత్రిక కనబడుతుంది. ఇచ్చట, యేసును దహించు అగ్నియని, ఆయన అగ్నిజ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు గలవాడని యోహాను వర్ణించుచున్నాడు. ఈ వర్ణన ఆ పత్రికలో ఉన్న అంశాలకు సంబంధించినదైయున్నది, ఏలయనగా తుయతైరలో ఉన్న సంఘము శుద్ధిచేయబడాలి, మరియు పవిత్రపరచబడాలి.

ప్రకటన 2:19-20లో, యేసు ఈ విధముగా చెప్పవలసి వచ్చినది:

నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును. అయినను నీమీద తప్పు ఒకటి నేను మోపవలసి యున్నది; ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీ వుండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది (ప్రకటన 2:19-20).

ఎఫెసులో ఉన్న సంఘమువలె, తుయతైరలో ఉన్న సంఘము క్రీస్తు కొరకు తమ మొదటి ప్రేమను పోగొట్టుకొనలేదు. దానికి బదులుగా వారి ప్రేమ నిజానికి అధికమయ్యింది. అయితే వారు ఒక విభిన్నమైన స్త్రీ యొక్క అబద్ధ బోధను కొనసాగిస్తునన్నారు, యేసు ఆమెను తిరస్కారముగా “యెజెబెలు” అని పిలుస్తున్నాడు.

1 మరియు 2వ రాజులు గ్రంథములో అగుపడుచున్న దుష్టురాలైన యెజెబెలు రాణివలె, ఆ స్త్రీ ప్రజలను జారత్వము మరియు విగ్రహారాధనతో మోసపరచుచున్నది — ఈ రెండు సంగతులు ఆసియాలో ఉన్న అన్యుల సాంప్రదాయలకు చాలా దగ్గర సంబంధము కలిగియున్నవి. ఈ అబద్ధ బోధను తృణీకరించి, తనపట్ల నమ్మకముగా ఉండాలని యేసు ఈ సంఘమును హెచ్చరించుచున్నాడు.

క్రీస్తు మాదిరిలో ఉండాలంటే, శాశ్వతముగా కొనసాగాలంటే ప్రేమ మరియు ఆసక్తి ఆవశ్యకముగా, తప్పనిసరిగా, బలమైన వాక్యముతో జతపరచబడాలని నేను అనుకొనుచున్నాను. కొంతమంది ప్రేమ మరియు ఆసక్తి యెడల ఉద్రేకపూరితమైన వరమును కలిగియున్నారు, కానీ ఆ ఉద్రేకపురితమైన వరము ఈ అరువది-ఆరు ప్రామాణిక గ్రంథములలో దేవుడు చెప్పుచున్న దానిని బలముగా అర్థము చేసకొనలేకపోతే సుళువుగా లక్ష్యములో నుండి తప్పిపోవచ్చని నేను భావిస్తున్నాను. మరియొక వైపున, కొంతమంది చదువు విషయములలో ఉద్రేకపు వరమును కలిగియున్నారని భావిస్తున్నాను, అయితే వారు అవగాహన చేసుకోవాలనుకుంటారు, వాక్యము చెప్పుచున్న దానిని తెలుసుకోవాలని కోరుకుంటారు తప్పనిసరిగా వారిలో ప్రేమ కొదువగా ఉంది. నిజానికి వారు జాగ్రత్త వహించకపోతే పరిసయ్యులుగా అయిపోతారు. వారు సరియైన విషయాలను తెలుసుకొనియుండవచ్చు, అయితే దేవునిపట్ల మరియు మనుష్యుల పట్ల ప్రేమ, కనికరము, ఆసక్తి లేకుండా వారు తప్పనిసరిగా దారి తప్పి పోతారు.

— డా. మ్యాట్ ఫ్రీడెమాన్

యేసుక్రీస్తు పట్ల మనకున్న ప్రేమ మరియు ఆసక్తి, మనము చెప్పుకొనుచున్నట్లు, సరియైనది, బైబిలానుసారముగా నున్న వాక్యముతో ఎందుకు అనుసంధానము చేయాలి అనే ప్రశ్నకు జవాబు అలోచుంచుట చాలా ప్రాముఖ్యము. నిజానికి ఇది ఆవశ్యకమైన, మరియు చురుకైనా అనుసంధానము, అచ్చట హృదయపు ఆసక్తి, శిరస్సులోని స్పష్టమైన సత్యముతో అనుసంధానము చేయబడుచున్నది. వెంటనే, క్రీస్తును తృణీకరించిన కొంతమంది యూదులపట్ల అపొస్తలుడైన పౌలు యొక్క సద్విమర్శ నా మనస్సులోని వచ్చింది, వారు యూదా మత విశ్వాసపు లక్ష్యాలను వెంబడించుటలో ఆసక్తి కలిగియున్నారు, మరియు అపొస్తలుడు ఈ విధముగా చెప్పుచున్నాడు, వారికి ఆసక్తి ఉందని నేను ఒప్పుకొనుచున్నాను, కానీ అది జ్ఞానయుక్తమైనది కాదు. మరియొక మాటలో, ఆసక్తి మెచ్చుకొనదగినది, కానీ అది తప్పుడు మార్గదర్శి అయినది ఏలయనగా, అది స్పష్టమైన సత్యము చేత తెలియజేయబడలేదు, మరియు పగ్గము వేయబడలేదు మరియు ప్రేరేపించబడలేదు. మన ఆసక్తి కారు ట్యాంక్ లో ఉన్న ఇంధనము వంటిది మరియు వాక్యము అనునది దానిని నడిపించే చక్రము వంటిది. నీవు సరియైన మార్గములో వెళ్లకపోతే, వేగము అధికము చేయుటకు పాదముతో త్రొక్కు పరికరము ప్రమాదకరముగా మారవచ్చు. కావున ఆసక్తి వాక్యపు సత్యమును బట్టి క్రమపరచబడినట్లయితే, అది మేలు చేయుటలో చాలా శక్తివంతమైన బలముగా అవుతుంది.

— డా. గ్లెన్ స్కోర్గి

సార్దీస్: అటుతరువాత ప్రకటన 3:1-6లో సార్దీస్ లో ఉన్న సంఘమునకు వ్రాసిన పత్రిక వస్తుంది. ఇచ్చట, ఆత్మ యొక్క ఏడు విధములైన ప్రత్యక్షతలు మరియు ఏడు ఆత్మలను కలిగియున్న వానిగా యేసును యోహాను వర్ణించుచున్నాడు, సార్దీస్ సంఘముపైన యేసు సర్వాధికారము కలిగియున్నాడని అది సూచిస్తుంది. యేసు అధికారమును గూర్చి యోహాను శ్రద్ధచూపుచున్నాడు ఏలయనగా ఈ సంఘమును గూర్చిన ఆయన విమర్శ కఠినముగా ఉన్నది.

ప్రకటన 3:1-3లో మనము ఈ విధముగా చదువుదము:

జీవించుచున్నావన్న పేరుమాత్రమున్నది గాని నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని యెదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, చావనైయున్న మిగిలినవాటిని బలపరచుము. . . . నీవు జాగరూకుడవై యుండనియెడల నేను దొంగవలె వచ్చెదను (ప్రకటన 3:1-3).

సార్దీస్ పట్టణము బలమైన దుర్గముగా మంచి పేరును కలిగియున్నది, కానీ ఆశ్చర్యకరముగా రెండు సందర్భాలలో అది పట్టబడినది. సార్దీస్ సంఘము మారుమనస్సు పొందే విషయములో విఫలమైతే అటువంటి కార్యమును చేస్తానని యేసు హెచ్చరిస్తున్నాడు. ఆయన దొంగవలె వస్తాడు, విస్మయమొందునట్లు వారిపై దాడి చేస్తాడు. అయితే ఆయనకు నమ్మకముగా ఉండువారికి, పరిశుద్ధత, నిర్దోషత్వము మరియు బహుమానమును క్రీస్తు వాగ్దానము చేస్తున్నాడు.

ఫిలదెల్ఫియ: ప్రకటన 3:7-13లో ఫిలదెల్ఫియలో ఉన్న సంఘమునకు యేసు వ్రాసిన పత్రిక కనబడుతుంది. ఈ పత్రికలో దావీదు తాళపు చెవిని కలిగియున్నవానిగా యేసును యోహాను పరిచయము చేయుచున్నాడు, దాని అర్థము తాను అభినందించువారిని దావీదు రాజ్యములో అనుమతించుటకు ద్వారము తెరచుటకును, మరియు మిగిలిన వారిని వెలుపల ఉంచి ద్వారము మూయుటకును యేసు అధికారము కలిగియున్నాడు. యేసు ఈ సంఘమునకు చెప్పిన మాటలు ఘనముగా ఉన్నాయి. అయితే ఈ మాటలలో గుప్తమైన హెచ్చరిక ఉంది.

ప్రకటన 3:8లో ఆయన వారికి ఈ నిశ్చయత నిస్తున్నాడు:

నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు (ప్రకటన 3:8).

ఈ సంఘమునకు ముందు తెరువబడిన ద్వారమును యేసు ఉంచియున్నాడు, ఆత్మీయతలో ఎదుగుతూ, వృద్ధి చెందడానికి ఈ సంఘమునకు ఆటంకములేని అవకాశము ఇవ్వబడినది. ఈ తెరువబడిన ద్వారమును వారు సద్వినియోగము చేసుకొంటే, వారి శత్రువులు వారి పాదముల యొద్దకు వచ్చి నమస్కారము చేయునట్లు క్రీస్తు జరిగించును మరియు ఫిలదెల్ఫియ వారు నూతన యెరూషలేమును స్వాధీనపరచుకొందురు. మరియు దేవుని పేరు వారి మీద వ్రాయబడుతుంది, అనగా వారిక ఎన్నటికి ఆయనవారే. ఈ ఆధిక్యతను వారు తీసుకొనకపోయినట్లయితే, వారికి ఈ ఆశీర్వాదము ఉండదు.

లవొదికయ: తరువాత, ప్రకటన 3:14-22లో యేసు లవొదికయ సంఘమునకు వ్రాసిన పత్రికను కనుగొనవచ్చు. ఈ పత్రికలో, యేసు తుదకు ఆమెన్ అనువానిగా వర్ణించబడినాడు, అనగా యేసు అంత్యపు అధికారము కలిగిన నమ్మదగినవాడు. యేసు నమ్మకమైనవాడు, సత్యసాక్షి మరియు దేవుని సృష్టిని పరిపాలించువానిగా కూడా యోహాను చేత వర్ణించబడుచున్నాడు. లవొదికయలో ఉన్న సంఘపు విశ్వాసులు దృష్టించు విధముగా ఈ వర్ణన రూపించబడినది ఏలయనగా వారికి ఇవ్వబడిన విమర్శ చాలా వ్యతిరేకమైనది.

ప్రకటన 3:15-16లో యేసు ఏమి చెప్పాడో వినండి:

నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక — నులివెచ్చనగా ఉన్నావు గనుక — నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను (ప్రకటన 3:15-16).

లవొదికయ సంపన్నమైన పట్టణము, ఇది కొలస్సీ మరియు హిరపోలిస్ పట్టణముల మధ్యలో ఉన్నది. కొలస్సీ మరియు హిరాపోలిస్ పట్టణములు ప్రత్యేక నీటి సరఫరాకు ప్రసిద్ధినొందినవి. కొండమీద నున్న నీటి ఊటల నుండి కొలస్సీ పట్టణానికి చల్లని నీరు ప్రవహిస్తుంది; హిరాపోలిస్ పట్టణములోనికి వెచ్చటి నీటి ఊటలు ప్రవహిస్తాయి. ఈ రెండు నీటి ఊటలు స్వస్థపరచు గుణమును కలిగియున్నాయని చెబుతారు. కానీ, లవొదికయలో ఉన్న నీటి ఊటలు నులివెచ్చగా ఉండి, ఎటువంటి స్వస్థత గుణమును కలిగియుండవు. ఈ భౌతికమైన వాస్తవముల నుండి ఒక ఆత్మీయ సత్యమును యేసు ఎత్తి చూపుతున్నాడు: లవొదికయ సంఘము సంపన్నమైనది, కానీ వారి సంపద వారి ఆత్మీయ బలమును నిర్వీర్యము చేయుచున్నది. ఈ సంఘము పశ్చాత్తాపము చెందవలసియున్నది, లేనియెడల యేసు వారిని తృణీకరించును.

ప్రకటన గ్రంథములోని 2 మరియు 3 అధ్యాయములు ప్రకటన గ్రంథమునకు నిశ్చయముగా తాళపుచెవి వంటివి, ఏలయనగా సంఘము కనబరచాలని కోరబడుచున్నది అనేకమైన గుణలక్షణములు అన్వయించుకొనుటకు అవి మనకు ఇవ్వబడినవి. సంఘములకు ఇవ్వబడిన ప్రతీ సందేశము ముగింపులో జయించుటను గూర్చి ఒక ప్రత్యేకమైన మాట ఉన్నది— అది “జయించు సంఘము.” మనము పట్టుదల కలిగి ఉండాలి అది మనకు జ్ఞాపకము చేయుచున్నది. అయితే అచ్చట ప్రాముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి, కావున నీవు ఆ రెండు అధ్యాయములను చదువుచుండగా అనేకమార్లు నీవు కనుగొను ఒకమాట, మారుమానస్సు, ఏలయనగా ప్రభువు ఏమి కోరుచున్నాడో దానికి తగినట్లు ఆ సంఘములు ఉండుటలేదు గనుక మారుమనస్సు పొందాలి. వారు మొదటి ప్రేమను కోల్పోయిన, లేదా సంఘములోనే ఒక అబద్ధ బోధకుల యొక్క బోధను, నిజముగా ఒక తప్పుడు సిద్ధాంతమును కలిగినవారిని వెంబడించినా, వారు వాటి నుండి కూడా మారుమనస్సు పొందాలని పిలువబడుచున్నారు. ప్రభువు ఆ సమయములో వారిని ఆయన యొద్దకు పిలచుచున్నాడు. అయితే తనను ప్రేమించువారు దానిలో కొనసాగాలని, మరియు పట్టుదలతో ఉన్నవారు దానియందు కొనసాగాలని మరియు యదార్థముగా విశ్వాసములో నిలిచియుండాలని అనగా నిజముగా ప్రభువును ఆరాధించాలని ఆయన పిలచుచున్నాడు.

— డా. డేవిడ్ డబ్ల్యూ. చాప్మన్

క్రీస్తు ఇచ్చిన దర్శనమును గూర్చి ఇంతవరకు నేర్చుకున్నాము, కాబట్టి ప్రకటన 4:1-10:21లో యోహాను వ్రాసిన రాబోవు సంగతులను ఇప్పుడు దృష్టించెదము.

ప్రకటన 4:1-2 ప్రకారముగా, ఈ దర్శనము పరలోకపు సింహాసనము యెదుట జరుగుతున్నట్లు గ్రహించవచ్చును మరియు యోహాను దినములలో ఇంకను భవిష్యత్తులో రాబోవు సంగతులను ప్రత్యక్షపరచునదై ఉన్నది. ఇది సంఘములన్నిటికి కలిపి చెప్పుచున్న సంగతులు, మరియు రాబోవు కాలములో దుష్టులు మరియు మంచివారైన సమూహములకు మధ్య కలుగు గొప్ప యుద్ధమును గూర్చి ప్రాథమికముగా తెలుపుచున్నది. పాపము మరియు సాతాను కలిగించు పోరాటములన్నిటిలో యోహాను యొక్క అసలు శ్రోతలు నమ్మకముగా నుండునట్లు ఈ దర్శనములు పొందుపరచబడినాయి ఏలయనగా దేవుని యొక్క భవిష్యత్ విజయము నిశ్చయము.

రాబోవు సంగతులను గూర్చిన యోహాను దర్శనములో మనము గమనించదగిన మొదటి సంగతి ఏమనగా అది నాలుగు చిన్న దర్శనములను ధారావాహికముగా కలిగియుండుట, అవి: ఏడు ముద్రలు, ఏడు బూరలు, ఏడు చరిత్రలు మరియు ఏడు పాత్రలు. ఇవి హేతుబద్ధమైన చారిత్రక కాలములను వివరించుచున్నట్లుగా వాటిని ఒక వరుస క్రమములో చదవాలని కొంతమంది వ్యాఖ్యాతలు నమ్ముతున్నారు. అయితే ఈ విధముగా చేయాలని మాత్రము యోహాను ఎన్నడు సూచించలేదు.

ఒక సంగతేమనగా, వ్యాకరణానికి సంబంధించిన గురుతులు ఈ సంఘటనలను ఒకదానికొకటి కలిపి ఉంచుతున్నాయి— “అటుతరువాత” వంటి పదములు — తాను పొందుకొనిన దర్శనముల క్రమమును చూపించుచున్నాయి, కానీ ఈ దర్శనములో ప్రత్యక్షపరచబడిన సంఘటనల క్రమమును కాదు.

మరొక విషయము, ఈ దర్శనములలో అనేకమైన చెప్పుకొనదగిన చారిత్రక సంఘటనలు ఒకటికంటే ఎక్కువ ధారావాహికలుగా అగుపడుచున్నాయి. ఈ కారణము వలన, “ఉపసంహారము” అని పిలువబడుచున్న ఒక వ్యాఖ్యాన పద్ధతి మన పాఠములో చేర్చబడుచున్నది.

సాధారణముగా చెప్పాలంటే, తరువాత వచ్చే ఒక లేఖన భాగము ముందున్న లేఖన భాగమును క్రోడీకరించినప్పుడు లేదా తిరిగి చెప్పినప్పుడు ఉపసంహారము జరుగుతుంది. అది ప్రకటన గ్రంథమునకు వర్తించుచున్నందున, ధారావాహికముగా వచ్చుచున్న ప్రతీ దర్శనము క్రీస్తు యొక్క మొదటి రాకడ మరియు రెండవ రాకడకు మధ్య ఉన్న కాలమును సూచించుచున్నదనే ఆలోచనను ఈ పదము విశేషముగా ఆరోపించుచున్నది, అయితే దాని యొక్క వైరుధ్యపు వివరణ మరియు నొక్కి చెప్పుట అచ్చట ఉన్నది.

నిజానికి ఉపసంహారము అనునది బైబిలానుసారమైన ప్రవచనములో సర్వసాధారణము. పాత నిబంధన ప్రవక్తలు తరచుగా ఈ రచనా పద్ధతిని, అనగా ఒకే ధారావాహిక సంఘటనలను వేర్వేరు లేఖన భాగాలలో వివరించుట అవలంభించారు. కొన్నిసార్లు ఈ ఉపసంహారములో అదే సారుప్యత కలిగిన దృశ్యములను ఉపయోగించేవారు, యిర్మీయా 30, 31 అధ్యాయములు, ఇచ్చట ఇశ్రాయేలు పూర్వస్థితికి వచ్చుటను గూర్చి యిర్మీయా ప్రచించాడు. వేరే సమయాల్లో, ఒకే సంఘటనలను తెలియజేయటానికి ఉపసంహారము పద్ధతి వేర్వేరు దృశ్యాలను ఉపయోగించేది, యెషయా 9 మరియు 11లో, మెస్సీయ యొక్క రాకడను గూర్చి యెషయా మాట్లాడుచున్నాడు.

హొషేయ 9-14 అధ్యాయములలో ఇశ్రాయేలునకు వ్యతిరేకముగా దేవుడు చేయు వ్యాజ్యములలో ఇటువంటి సంగతిని మనము చూడవచ్చును. మరియు అచ్చట చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. కావున, యోహాను ప్రకటన గ్రంథములో ఈ పద్ధతిని ఉపయోగించినప్పుడు, తాను తన సందేశము చెప్పడానికి ప్రసిద్ధమైన, సాంప్రదాయకమైన, బైబిలానుసారమైన పద్ధతిని ఉపయోగించినాడు.

ఒకే రకమైన సంఘటనలను వేర్వేరు దృక్పధములతో యోహాను వివరించుచున్నాడని ఈ దర్శనములలో అనేకమైన మర్మములే బలముగా చెప్పుచున్నాయి. ఉదాహరణకు, మనము “అంత్యతీర్పు” అని పిలచుచున్నదానిని మూడు వేర్వేరు సందర్భాలలో యోహాను దర్శనములు సూచించుచున్నాయి.

ఏడు ముద్రలు దర్శనములో భాగమైన ప్రకటన 6:12-17లో, సూర్యుడు నలుపగునట్లు, చంద్రుడు రక్తవర్ణమగునట్లు, నక్షత్రములు భూమిమీద పడినట్లు, మరియు భూమిమీద ప్రతి ఒక్కరూ దేవుని ఉగ్రతనుండి దాగుకొనుచున్నట్లు చెప్పబడినది. ఏడు బూరల దర్శనములో భాగమైన ప్రకటన 11:15లో, గొప్ప స్వరము ఈ విధముగా చెప్పుచున్నది, “ఈలోక రాజ్యము మన ప్రభువు రాజ్యము ఆయన క్రేస్తూ రాజ్యమునాయెను; ఆయన యుగయుగముల వరకు యేలుననెను”. ఏడు పాత్రల దర్శనములో భాగమైన ప్రకటన 5:1లో, ఈ ఏడు పాత్రలు పోయబడిన తరువాత దేవుని ఉగ్రత సమాప్తమాయెనని మనకు చెప్పబడుచున్నది.

ఈ లేఖన భాగములలో ప్రతిదీ క్రీస్తు యొక్క రెండవ రాకడ మరియు దేవుని యొక్క అంత్యతీర్పునకు సంబంధించిన అంశాలతో ముడిపడియున్న వాటినే వివరిస్తున్నది. అయితే ఈ ధారావాహిక దర్శనము అంత్యతీర్పునకు ముందు వచ్చు సంగతులను గూర్చిన వివరములను కూడా కలుపుకొనుచున్నది. ఈ కారణమువలన, క్రీస్తు రెండవ రాకడకు ముందుగా దేవుని రాజ్యము యొక్క సంపూర్ణ చరిత్రను వివరించు వేర్వేరు వరుస దర్శనములను చదువుట మంచిది.

ఇవాంజిలికల్స్ మధ్యలో ఉపసంహారము అనునది ప్రాచుర్యములో ఉన్నప్పటికీ, కొంతమంది ఈ విధానములో ప్రకటన గ్రంథమును వ్యాఖ్యానించరు అనే సంగతిని గుర్తించుట చాలా ప్రాముఖ్యము. కావున ఈ పాఠములో ఉపసంహారము అనే దృక్పధమునకు దగ్గరగా ఉన్న వ్యాఖ్యాన పద్ధతులను మనము అనుసరించుట లేదు. అయినప్పటికీ, ఈ సాహిత్య విధానపు అమరిక రాబోవు సంగతులను గూర్చిన యోహాను దర్శనము, ఆ దర్శనముల యొక్క ముఖ్య అంశములు శ్రేష్ఠమైన సాహిత్యపు అమరికను కలిగియున్నాయని అనేకమంది క్రైస్తవ బోధకులు నమ్ముటను మనము తప్పక గమనించాలి.

మనము చూచినట్లుగా, రాబోవు సంగతులను గూర్చిన యోహాను దర్శనములు నాలుగు ప్రాముఖ్యమైన భాగములుగా విభజించబడినవి: ఏడు ముద్రలు, ఏడు బూరలు, ఏడు సారుప్యత గలిగిన చరిత్రలు మరియు ఏడు పాత్రలను గూర్చిన దర్శనములు. మనము వరుసగానున్న ఈ దర్శనములను అన్వేషించెదము, ప్రకటన 4:1-8:1 వరకు ఉన్న ఏడు ముద్రలతో ప్రారంభించెదము.

ఏడు ముద్రలను గూర్చిన దర్శనములు మరలా రెండు భాగాలుగా విభజింపబడినాయి, ఇది ప్రకటన 4 మరియు 5వ అధ్యాయములలో వర్ణించబడిన దేవుని పరలోక సింహాసనపు ఆవరణము నుండి ప్రారంభమగుచున్నది. ఏడు ముద్రలు కలిగియున్న ఒక ప్రాముఖ్యమైన చుట్టను ఈ భాగము మనకు తెలియజేయుచున్నది మరియు 6-8 అధ్యాయాలలో ఆ ముద్రలు తెరువబడుటకు వేదికను ఏర్పాటు చేయుచున్నది.

ప్రకటన 4:1-11లో పరలోకపు సింహాసన ఆవరణ దృశ్యమును వివరించుచున్నది, ఇది యెహెజ్కేలు 1, యెషయా 6 మరియు ఇతర పాత నిబంధన లేఖన భాగాలకు సారుప్యత కలిగియున్నది. దేవుడు తన సింహాసనమందు ఆసీనుడై, పరలోక దూతల సమూహము చేత కొనయాడబడుచున్నాడు— యోహాను సవివరముగా వర్ణించిన ఆ నాలుగు జీవులు కూడా ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటీ కన్నులతో నిండియుండి, ఆరేసి రెక్కలు కలిగి ఉన్నాయి. అయితే అవి ఒక ప్రత్యేక రూపములను కలిగియున్నాయి: ఒకటి సింహమును, మరొకటి ఎద్దును, మరొకటి ఒక మనుష్యుని మరియు వేరొకటి పక్షిరాజును పోలియున్నది. అవి భూమిమీద నున్న సమస్త జీవరాశులు దేవుని స్తుతించుటకు ప్రాతినిద్యము వహించుచున్నాయి.

ఇరువది - నలుగురు పెద్దలు దేవుని సింహాసనము చుట్టూ ఉండుటను యోహాను దర్శనము చూపుచున్నది, బహుశా పాత నిబంధనలోని పండ్రెండు గోత్రములు మరియు నూతన నిబంధనలోని పండ్రెండు అపొస్తలులను ఆ సంఖ్యా సూచించవచ్చు. చరిత్రయంతటిలో దేవుని ప్రజలకు గురుతుగా ఈ పెద్దలు ఉన్నారు. ఈ నాలుగు జీవరాశులు దేవుని స్తుతించునప్పుడు, ఆ పెద్దలు సాగిలపడి, ఆయన ప్రభావమును, ఆధిపత్యమును ఒప్పుకొనుచూ, వారి సమర్పణను, విధేయతను మరియు గౌరవమును ఆయనకు వాగ్దానము చేయుచున్నారు. ఆ పెద్దలకు ఆవల, అనేకములైన దూతగణములు ఉపరితలమున దేవుని మరియు దేవుని గొర్రెపిల్లను స్తుతిస్తున్నారు.

ఈ దృశ్యము పాత నిబంధనలోని గుడారము మరియు దేవాలయము యొక్క వివరణలోని అనేక ప్రతిబింబములను కలిగియున్నది: సింహాసనము యెదుట దీపములు ప్రకాశమానముగా వెలుగుచున్నవి; ధూపము దేవుని ప్రజల యొక్క ప్రార్థనలను సూచించుచున్నది; అచ్చట స్పటిక సముద్రము ఉన్నది, అది పాత నిబంధనలోని ఇత్తడి గంగాళము కంటే ఎక్కువ సంపూర్ణమైనది; మరియు లేవీయులు పాడుచున్నట్లు స్తుతి గీతములు అచ్చట ఉన్నవి. ఈ దృశ్యములు దేవుని పరలోకపు సింహాసనపు ఆవరణను గూర్చిన దృష్టిని యోహాను వివరిస్తున్నాడని ఇది సూచించుచున్నది, ఆయన ఆ సింహాసముమీద నుండి ఈ విశ్వమునంతటిని పరిపాలన చేస్తున్నాడని మరియు తన తీర్పులను తీర్చుచున్నాడని సుచిస్తున్నది. గొప్ప ప్రాముఖ్యత కలిగిన సంగతులను ఈ దర్శనము సంధించుచున్నదని యోహాను యొక్క పాఠకులకు ఇది తెలియజేయుచున్నది.

ప్రకటన 5:1-14లో పరలోక దర్శనము కొనసాగుతూ ఉంది. దేవుడు తన కుడిచేతిలో ఒక గ్రంథమును పట్టుకొని యున్నాడు, అది ఈ లోకము కొరకు దేవుడు ఉద్దేశించిన ప్రణాళికకు సూచకముగా ఉన్నది. అయితే ఆయన ఆవరణములో ఉన్న సభ్యులెవరు దానిని తెరువలేకపోయారు. మరో మాటల్లో, ఆయన ప్రణాళికను ఎవరూ నెరవేర్చలేకపోయారు. అప్పుడు యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలు విప్పి, గ్రంథపు చుట్టను చదువగలదని ఆ పెద్దలలో ఒకరు యోహానుకు చెప్పిరి.

యూదా గోత్రపు సింహము అనే సందర్భము ఆది.కా. 49:9-10 నుండి తీసుకొనబడినది, దానిని ఈ విధముగా చదివెదము:

యూదా కొదమ సింహము . . . యూదా యొద్దనుండి దండము తొలగదు. అతని కాళ్ల మధ్యనుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై యుందురు (ఆది.కా. 49:9-10).

యూదా ఇశ్రాయేలు గోత్రముల వారినందరిని ఏలునని ఈ ప్రవచనము సూచిస్తుంది, మరియు లోకమంతటిని పరిపాలించు రాజును కూడా తుదకు సిద్ధపరుస్తుంది.

కానీ యోహాను చూచినప్పడు, నిజముగా గొర్రెపిల్లయే యూదా గోత్రపు సింహమై యుండుట కనుగొని తాను విస్మయమొందాడు, అది వధించబడినదిగా చూస్తూ ఉన్నాడు. వాస్తవానికి, ఆ గొర్రెపిల్ల క్రీస్తునకు సాదృశ్యమైయున్నది. ఆయన, ఇశ్రాయేలు రాజైన యూదా వారసుడు. మరియు యోహాను 1:29లో చదువుచున్నట్లు, పస్కా గొర్రెపిల్లగా పాపపరిహారము కొరకు తన్నుతాను అర్పించుకున్నాడు. యేసు గ్రంథపు చుట్టను తెరచే యోగ్యత కలిగియుండుట, ఈ లోకము కొరకు తాను ఉద్దేశించిన ప్రణాళికలను దేవుడు ఆయన ద్వారా మాత్రమే నెరవేర్చునని సూచించుచున్నది.

నీవు ప్రకటన 5వ అధ్యయము చదువుచున్నప్పుడు, యేసే సింహముగా గొర్రెపిల్లగా చెప్పబడిన గొప్ప సాదృశ్యము అచ్చట ఉన్నది. ఇప్పుడు ఆ దృశ్యరూపము ఎక్కడనుండి వచ్చుచున్నది? మంచిది, మనము గమనించవలసిన మొదట సంగతి ఏమనగా ఆ దృశ్యము యొక్క ప్రవచన నేపథ్యము, అది యేసును గూర్చి యోహాను ఇచ్చుచున్న ప్రవచానాత్మకమైన దృశ్యము. మరియు పాత నిబంధన నేపథ్యమును చూస్తే, అవి చాలా ఉన్నతమైన మూలాంశాలుగా మనము చూడవచ్చును. ఉదాహరణకు, ఆదికాండము 49 అధ్యాయము నుండి చూస్తే సింహము యూదా గోత్రమునకు సంబంధించినదై యున్నది, అచ్చట యూదా కొదమ సింహముగాను మరియు యూదా నుండి దండము తొలగదని, తాను తన సహోదరులందరిని ఏలునని ప్రవచించబడినది. సింహమును గూర్చిన చిహ్నము విజయ సూచకము మరియు మహాబలమైన సూచకము. ఈ గొర్రెపిల్ల ఎచ్చట నుండి వస్తుంది? మంచిది, ప్రజలకొరకు మరియు పాపక్షమాపణ కొరకు వధించబడిన ఆ పస్కా గొర్రెపిల్లను పాత నిబంధనలో చూపెదము. మరియు దానిని మనము యెషయా 53వ అధ్యాయములో పొడవబడిన, వధకు తేబడు గొర్రెపిల్లగా ఉన్న శ్రమపడిన సేవకునితో పోల్చవచ్చు. యేసు ఏమైయున్నాడో తెలుపు బహుళ దృక్పధములు కలిగిన ఈ రెండు దృశ్యములను యోహాను ఎన్నుకున్నాడు. ఆయన సింహము మరియు గొర్రెపిల్ల. ఆయన వధించబడిన గొర్రెపిల్ల, అవును, కానీ ఆ వధించబడిన గొర్రెపిల్ల జయించునది, విజయవంతమైనది. ప్రకటన 5లో ఏడు తలలు కలిగన ఆయనను మనము చూడగలము. కావున గొర్రెపిల్ల దృశ్యము బలహీనమైన, నాశనము చేయబడి, తిరిగిలేవలేని గొర్రెపిల్లకు చిహ్నము కాదు, కానీ అది విజయము పొందిన సింహము, యూదా గోత్రపు సింహము, యూదా మతములో మెస్సీయకు సంబంధించిన అనేకమైన తలంపులలో ఈ ఆలోచనలు ఉన్నాయి. మరియు ఈ చిహ్నముల యొక్క వాస్తవికత ఏ విధముగా యేసులో నెరవేర్చబడినదో యోహాను మనకు చూపిస్తున్నాడు.

— డా. బ్రాండన్ క్రో

ఆదికాండము 49వ అధ్యాయము యూదా గోత్రపు సింహమును గూర్చి మాట్లాడుతుంది, మరియు ఈ విధమైన భావన యూదుల నిరీక్షణలో అభివృద్ధి చెందినది, నాల్గవ ఎజ్రా మరియు అనేకచోట్ల విజయము, సింహమువలె పోరాడుట అనే భావనలను సూచిస్తుంది. కావున, యూదా గోత్రము నుండి వచ్చు జయించునదైన సింహమును గూర్చి యోహాను వినియున్నాడు. అయితే ఆయన వెనుదిరిగి, అలంకార ప్రాయముగా ఒక బలమైన, జయించు సింహమును చూచుచున్నాడు. ఆయన ఒక గొర్రెపిల్లను చూస్తున్నాడు, జీవరాశియంతటిలో ఒక బలహీనమైన గొర్రెపిల్లను కాదుగానీ, ఒక వధించబడిన గొర్రెపిల్లను ఆయన చూస్తున్నాడు. ఇది మనలను నూతన నిబంధన అంతటికి ప్రాముఖ్యమైన సువార్తవైపు తీసుకువెళ్తుంది, అదేమనగా యేసు జయించుట, విశేషముగా బలమును ప్రదర్శించుట ద్వార కాదుగానీ యేసు సిలువలో మరణించుట ద్వారా జయించుట. బలహీనతలో దేవుని బలము సంపూర్ణము చేయబడుతుంది. దేవుని మహిమ ప్రత్యక్షపరచబడుతుంది. యేసు యొక్క శ్రమలలో ఆయన విజయము ప్రత్యక్షపరచబడుతుంది.

— డా. క్రెగ్ ఎస్. కీనర్

ప్రకటన 6:1-8:1లో ఉన్న ముద్రలను గూర్చిన దర్శనము యొక్క రెండవ భాగము ముద్రలను విప్పుటయైయున్నది. అది ఆరు ముద్రలు విప్పబడుటను తెలియజేస్తుంది, దాని తరువాత కొంత సమయము నిశబ్దము అటుతరువాత ఏడవ ముద్ర విప్పబడుతుంది.

మొదటి నాలుగు ముద్రలు అంత్యకాల ప్రత్యక్షతకు సంబంధించిన ప్రసిద్ధమైన గుఱ్ఱపు రౌతులను విడుదల చేస్తుంది, వారు లోకము మీదకు ఉపద్రవములు తెచ్చుచున్నారు. ఈ నలుగురు గుఱ్ఱపు రౌతుల దృశ్యము జెకర్యా 6వ అధ్యాయము నుండి తీయబడినది, అచ్చట ఒకే రంగులో ఉన్న గుఱ్ఱములు పరలోకములో ఉన్న నాలుగు ఆత్మలకు సాదృశ్యముగా ఉన్నాయి. మొదటి ముద్ర విప్పబడినప్పుడు, తెల్లని గుఱ్ఱము మీదనున్న వ్యక్తి దేశములపైన జయమును తెచ్చెను. రెండవ ముద్ర మండుచున్న అగ్నివంటి ఎఱ్ఱని గుఱ్ఱమును తెచ్చుచున్నది, అది వధకు సాదృశ్యముగా ఉన్నది.

వధించుటకు యుద్ధము ఒక ప్రాముఖ్యమైన విధానమైతే వేరొక పద్ధతిలో కూడా మనుష్యులు చంపబడుటను గూర్చి ఈ దృశ్యము చాలామట్టుకు విస్తృతపరుస్తుంది. మూడవ ముద్ర నల్లని గుఱ్ఱమును స్వారీ చేయుచున్న వ్యక్తిని విడుదల చేస్తుంది, తాను కరవునకు సాదృశ్యముగా ఉన్నాడు. మరియు నాల్గవ ముద్ర మరణమని పేరు కలిగిన రౌతును విడుదల చేయుచున్నది, తాను పాండుర వర్ణముగల గుఱ్ఱమును స్వారీ చేయుచున్నాడు, తాను ఖడ్గము ద్వారా మరణమునకు, కరవునకు, తెగుళ్లకు మరియు క్రూరమృగములకు సాదృశ్యముగా ఉన్నాడు. ఈ ఉపద్రవములు అంత భయంకరముగా ఉన్నందున, భూమి యొక్క నాల్గవ భాగము బాధించబడెను. దేవుని తీర్పులో ఈ భాగమును చాలామంది తప్పించుకొందురు.

ఐదవ ముద్ర విప్పబడినప్పుడు, పరలోకములో క్రైస్తవ హతసాక్షులను గూర్చిన దర్శనమును యోహాను చూచెను. దేవునికి ఆయన వాక్యమునకు వారు నమ్మకముగా ఉన్నందున ఈ పరిశుద్ధులు వధించబడినారు. వారిని చంపిన వారిని శిక్షించుమని వారు దేవునిని వేడుకొనుచున్నారు, కానీ నీతిమంతులను కాపాడుటకు తన పూర్తి న్యాయతీర్పు దేవుడు తెచ్చుటలేదని వారికి తెలియజేయబడినది. హత సాక్షులుగా చేయబడిన వారి సంఖ్య సంపూర్ణమయ్యేవరకు వారు ఓపికతో వేచియుండవలసి యున్నది.

ఆరవ ముద్ర విప్పబడినప్పుడు, భూమి అంతయూ దేవుని తీర్పును అనుభవించారు. అచ్చట భూకంపము వచ్చినది; సూర్యుడు నలుపాయెను, చంద్రుడు రక్త వర్ణమాయెను; నక్షత్రములు భూమిమీద రాలెను; ఆకాశము చుట్టబడి తొలగిపోయెను; మరియు ప్రతీ పర్వతము ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. ఈ వర్ణనలు పాత నిబంధన ప్రవచనములలో రాజ్యములపైకి వచ్చు ప్రవచనములను మనకు జ్ఞాపకము చేయుచున్నవి, అటువంటివి యెషయా 34:1-4 మరియు యోవేలు 2:10-11 వంటి లేఖన భాగాలలో కనుగొనవచ్చు. దేవుడు చివరి తీర్పును తీర్చును, దుష్ట ప్రపంచము నాశనము చేయబడుతుంది అని చెప్పబడింది.

ఒక రోజున మనుష్యులు దేవునికి లెక్క అప్పగించవలసి యున్నది మరియు దేవుని యెదుట సాకులు చెప్పుటకు వీలుపడదు. కానీ దేవునికి భయపడువారిని ఆయన మరి ఎక్కువగా ఘనపరచును. అయితే ఈ సంగతులన్నిటిని చులకనగా తీసుకొను వారందరు రానున్న తీర్పును ఎదుర్కొందురు. వారికి ప్రార్థన చేయుటకున్న అవకాశము కూడా ఇవ్వబడదు. రానున్న ఉగ్రతనుండి తప్పించుకొనుటకు కొండలు, గుట్టలు వారిపైన పడుటయే వారికున్న నిరీక్షణ. ఈ తీర్పును గూర్చిన హెచ్చరిక యెన్నిక చేయబడిన ప్రజలకు ప్రత్యేకముగా దేవుడు ఉద్దేశించినది, కావున దేవుని భయము చేత భక్తి కలిగిన జీవితమును వారు జీవించెదరు మరియు పరిశుద్ధ జీవితము జీవించుచూ ఆయనను సంతోషపెట్టు మార్గమున వెళ్లుటకు కావలసిన శక్తికొరకు ప్రార్థన చేయుదురు.

—రెవ. డా. స్టీవెన్ టాంగ్, భాషాంతరము చేయబడినది.

ఆరవ ముద్ర మరియు ఏడవ ముద్ర విప్పుటకు మధ్యలో, ప్రకటన 7వ అధ్యాయములో ఒక అంతరము ఉన్నది. దేవుడు తన ప్రజలను కాపాడు విధానమును గూర్చి సంఘము ఎత్తి చూపుట ఈ అంతరము వివరించుచున్నది. మొదటిగా, ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములలో ఒకొక్క గోత్రము నుండి 12,000 మందిని—మొత్తముగా 144,000— మందిని దేవుడు తన ప్రత్యేకమైన ప్రజలుగా ముద్రించినట్లు ఒక స్వరము యోహాను విన్నాడు. 144,000 మందిని వేర్వేరుగా అర్థము చేసుకొనుచున్నప్పటికీ, 144,000 మందిని గూర్చిన ప్రకటనను యోహాను విన్నాడని ప్రకటన గ్రంథములో ఉన్న లేఖన భాగాలు చెబుతున్నాయి, అయితే ఆయన వెనుదిరిగి చూచుచునప్పుడు, కొంచెము వేరైనది తాను చూచియున్నాడు.

ప్రకటన 7:9లో యోహాను వారిని గూర్చి యెట్లు వివరిస్తున్నాడో వినండి:

అటుతరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతివంశములో నుండియు ప్రజలోనుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు. . . సింహాసనము యెదుటను గొర్రెపిల్ల యెదుటను నిలువబడిరి (ప్రకటన 7:9).

ప్రకటన 5వ అధ్యాయములో కూడా ఇటువంటిదే జరుగుట నీవు జ్ఞాపకము చేసుకొనుము. యోహాను ఒక సింహమును గూర్చి ప్రకటించబడుట విన్నాడు, అటు తరువాత తాను ఒక గొర్రెపిల్లను చూసాడు. మంచిది, ఇచ్చట కూడా దానికి సారూప్యమైనదే జరిగినది. తాను 144,000 మంది యూదులను గూర్చి విన్నాడు, అటు తరువాత తాను చూచినప్పుడు యూదులు మరియు అన్యులు కలిగియున్న విస్తారమైన జనసమూహమును చూచియున్నారు. ఈ రెండు సందర్భాలలో, యోహాను వినిన మాటలు పాత నిబంధనలో ఉన్న సాదృశ్యములు— అవి సింహము మరియు ఇశ్రాయేలు గోత్రములు. అయితే తాను చూచుటకు తిరిగినప్పుడు, ప్రకటించబడిన దానికంటే మిక్కిలి గొప్ప సంఖ్యలో అగుపడినది. సింహము అనే సాదృశ్యము క్రీస్తులో నెరవేర్చబడినది, గోత్రములకు సంబంధించిన సాదృశ్యము ప్రతీ దేశములో ఉన్న గొప్ప జనాంగములుగా నెరవేర్చబడుచున్నది.

నిశబ్దము తరువాత, ఏడవ ముద్ర విప్పబడుట ప్రకటన 8:1లో వ్రాయబడినది. కానీ ఒక గొప్ప, ఉన్నతమైన ముగింపునకు బదులు అచ్చట కేవలము నిశబ్దము ఉన్నది. ఈ సృష్టియంతా భయముతో నిలువబడినది. యోహాను యొక్క దర్శనములను మొదటి చదివినవారికి ఈ నిశబ్దము గొప్ప ఉత్కంఠను కలుగజేసినది. ఈ మర్మయుక్తమైన చరిత్రయొక్క చివరిదశ ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానము ఆ తరువాత వచ్చిన దర్శనములో చూడవచ్చును.

ఇప్పుడు మనము ఏడు ముద్రలను పరిశీలించియున్నాము, కాబట్టి రాబోవు సంగతులను తెలుపు రెండవ శీర్షిక దర్శనములవైపు మన దృష్టిని కేంద్రీకరించుదము అది: ప్రకటన 8:2-11:19లో ఉన్న ఏడు బూరలు.

ఏడు బూరలు దర్శనములో వరుసగా దేవాదూతలు బూరలు ఊదుట ఉన్నది. బూర ఊదిన ప్రతిసారి, భూమి మీద మరియొక తీర్పు వచ్చుచున్నది. ఏడు బూరల దర్శనము, ఏడు ముద్రలు దర్శనముల మాదిరిగానే ఉందని గమనించుట చాలా ప్రాముఖ్యము. ఈ దర్శనము ఆరు బూరలు ఊదుటను చూపుతుంది, దాని వెంబడి ఒక అంతరము అటుతరువాత ఏడవ బూర. ఈ బూరలు పాత నిబంధనలో హోషేయ 5:8 యోవేలు 2:1, ఆమోసు 2:2 మరియు జెకర్యా 9:14 వంటి ప్రవచానాత్మక లేఖనాలలో ఉన్న బూరలను జ్ఞాపకము చేస్తున్నాయి. దేవుడు తన దేవదూత సైన్యముతో వచ్చునప్పుడు ఆ బూరలు ఊదబడతాయి, దేవుని శత్రువులకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు పరలోక సైన్యసమూహమును అవి పిలుస్తాయి.

ప్రకటన 8:2-13లో మొదటి నాలుగు బూరలు ఊదుటను గూర్చి చెప్పబడింది, అవి ఈ సృష్టియొక్క నాలుగు ప్రాముఖ్యమైన భాగాలలో దేవదూతల సైన్యము తీర్పు తీర్చుటను సూచిస్తుంది. మొట్టమొదటి బూర ఊదబడినప్పుడు, రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు పుట్టి భూమిపై పడవేయబడెను. రెండవ బూర ఊదబడినప్పుడు ఒక పెద్ద కొండవంటిది సముద్రములో పడద్రోయబడెను. మూడవ బూర ఊదబడినప్పుడు, ఒక పెద్ద నక్షత్రము మంచినీటి వనరులపై పడి నీళ్లను తాగలేనంత చేదుగా మార్చును. మరియు నాల్గవ బూరతో, ఆకాశము నాశనము చేయబడినది; పగటిలో మూడవ భాగమున మరియు రాత్రిలో మూడవ భాగమున చీకటి కమ్మెను. అయితే, ఆ తీర్పులు చాలా చెడ్డవైనందున ప్రతీ భాగములో మూడవ వంతు మాత్రమే నాశనము చేయబడెను. ఈ భాగము ముగింపులో, ఇంకా మిక్కిలి చెడ్డదైన తీర్పు రానుందని దేవదూత హెచ్చరించుచున్నది.

ఐదవ బూర ఊదబడుటను గూర్చి ప్రకటన 9:1-12లో వ్రాయబడినది. అది ఒక అసాధారణమైన మిడుతల దండును పంపించుచున్నది. ఈ మిడుతలు యుద్ధానికి సిద్ధపడుచున్న గుఱ్ఱములను పోలియున్నాయని, బంగారపు కిరీటములను ధరించి, మనుష్యుల వంటి ముఖము, స్త్రీల తలవెండ్రుకులు, సింహము కోరలు, మరియు తేళ్ల తోకలవంటివి వాటికి ఉండెను. కాని వాటి శక్తి పరిమితము చేయబడినది. అది కేవలము ఐదు నెలలు మాత్రమే బాధించుటకు భూమిమీద అధికారము ఇవ్వబడినది మరియు దుష్టులైన వారిని బాధించుటకు మాత్రమే అనుమతించబడినది.

ఆరవ బూర ఊదుట ప్రకటన 9:13-21లో వ్రాయబడినది. అప్పుడు యూఫ్రటీసు నది యొద్ద బంధింపబడిన నలుగురు దూతలు విడిపించబడెను, వారు మనుష్యులలో మూడవ వంతును హతమార్చుటకు బయలుదేరిరి.

ఆరవ బూర ఊదబడిన తరువాత ప్రకటన 10:1-11:14లో రెండు భాగములుగా అంతరము వచ్చుచున్నది. యెహెజ్కేలు 2:9-3:9లో దేవుని తీర్పును గూర్చి యెహెజ్కేలునకు ప్రత్యక్షపరచబడిన మాదిరిగా, ప్రవచన సందేశము కలిగిన ఒక చిన్న గ్రంథపు చుట్టను యోహాను పొందుకున్నాడు మరియు దానిని తినుటకు ఆజ్ఞాపించబడినది. ఆ గ్రంథపు చుట్ట తేనెయంత మధురముగాను, బహుశా అది ఆలస్యము లేకుండా నెరవేర్చబడబోవు దేవుని ప్రణాళికలను గూర్చిన శుభవర్తమానము సూచించుచున్నది. అయితే కడుపునకు అది చేదుగా ఉన్నది, బహుశా దేవుని ప్రణాళికలు నెరవేర్చుటలో శ్రమలు కలుగుతాయని సూచించవచ్చును.

ఈ అంతరము యొక్క రెండవ భాగములో యోహాను దర్శనములోని సువార్త నిమిత్తము మరణించిన ఇద్దరు సాక్షులను గూర్చి వ్రాయబడినది. వారు అద్భుతములను చేసారు, మారుమనస్సు పొందుమని ప్రజలకు ప్రకటించారు మరియు రానున్న తీర్పు విషయమై హెచ్చరించారు. అయితే వారు దేవుని శత్రువుల వలన వధించబడ్డారు.

ఇద్దరు సాక్షులను గూర్చిన యోహాను దర్శనము చరిత్రలో చాలా ప్రాథమికమైన వివాదమును లేపుచున్నది: అది యేసుక్రీస్తునకు మరియు తన శత్రువులకు మధ్యనున్న వివాదము. ఈ ఇద్దరు సాక్షులు అతిశ్రేష్ఠమైన బలము కలిగినవారు, అయితే వారి శత్రువులు చాలా కఠినమైన వారు మరియు ఆ సాక్షులను వారు హతమార్చారు. ఈ ధృడమైన వివాదము తెలుపుచున్న వాస్తవమేమనగా, యేసునకు మరియు ఆయన శత్రువులకు మధ్యస్థ స్థానము లేదు. ప్రతీ మనుష్యుడు యేసుకొరకైనా ఉండాలి లేదా యేసునకు వ్యతిరేకముగానైనా ఉండాలి.

ఈ అంతరము అయిన తరువాత, ఏడవ బూరను ఊదినట్లు ప్రకటన 11:15-19లో వ్రాయబడినది, ఈ దర్శనపు శీర్షిక ముగించబడుచున్నది.

ఏడవ బూర ఊదబడినప్పుడు పరలోకములో ఈ ప్రకటన చేయబడినట్లు ప్రకటన 11:15లో వ్రాయబడినది.

ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు యేలుననెను (ప్రకటన 11:15).

ఈలోక రాజ్యములన్నిటిపైన విజయము నొందినప్పుడు మరియు సమస్త సృష్టిపైన అంత్య తీర్పును ఆయన తీర్చునప్పుడు దేవుని సింహాసనపు ఆవరణములో ఆరాధించుటను ఏడవ బూర పరిచయము చేయుచున్నది. భూమిని నూతనపరచడానికి క్రీస్తు రానైయున్నాడు; ఆయన మహిమ పూర్తిగా కనబరచబడుతుంది; మరియు సృష్టియందంతటా దేవుని పరిపాలన స్థాపించబడుతుంది.

రాబోవు సంగతులను గూర్చిన మూడవ దర్శనముల శీర్షిక ప్రతీకాత్మకమైన చరిత్రను గూర్చి ప్రకటన 12:1-14:20లో వివరించుచున్నది.

నిర్మాణరీత్యా, ప్రతీకాత్మకమైన ఏడు చరిత్రలను గూర్చిన దర్శనములు, ఏడు ముద్రలు మరియు బూరలు దర్శనములను ప్రతిబింబించుచున్నవి; చరిత్రలను గూర్చిన మొదటి ఆరు దర్శనములు ఒక సముదాయముగా ఉన్నాయి, తరువాత ఒక అంతరము వచ్చుచున్నది, అటుతరువాత ప్రతీకాత్మకమైన ఏడవ చరిత్ర దర్శనము వచ్చుచున్నది. అయితే ముద్రలు మరియు బూరలను గూర్చిన దర్శనములు దైవికమైన తీర్పులపైన కేంద్రీకరించబడియుండగా, సాతాను మరియు దేవుని ప్రజలకు మధ్యనున్న పోరాటమును ఏడు చరిత్రలు వర్ణించుచున్నవి. ఈ శీర్షికలో ఉన్న చరిత్రలు ప్రాముఖ్యమైన ప్రతీకాత్మక పాత్రధారుల చుట్టూ తిరుగుచున్నవి, అవి: స్త్రీ, ఘటసర్పము, సముద్రములో నుండి వచ్చు క్రూరమృగము, భూలోక క్రూరమృగము, 144,000 మంది విశ్వాసులు, దేవాదూతలు మరియు మనుష్య కుమారుడు.

మొట్టమొదటి పాత్రదారి, సూర్యుని ధరించుకొనిన గర్భిణియైన స్త్రీ. ఆమె చరిత్ర ప్రకటన 12:1-17లో కనుగొనబడుచున్నది, మరియు అది యేసు పుట్టుకను మరియు ఆయనను చంపటకు హేరోదు చేసిన ప్రయత్నమును సూచించుచున్నది. ఇశ్రాయేలులో నమ్మకమైన వారిని సూచించు స్త్రీ, మెస్సీయయైన యేసుక్రీస్తుకు జన్మనిచ్చినది. ఆమె కుమారుడు పరలోకమునకు కొనిపోబడెను, అది క్రీస్తు యొక్క పునరుత్థానము మరియు పరలోక ఆరోహణమును సూచించుచున్నది. అయితే భూమిమీద నిలిచిపోయిన ఆ స్త్రీ మహా ఘటసర్పము చేత హింసించబడుచుండెను. దేవుడు ఆమెను కాపాడెను గనుక ఆ ఘటసర్పము ఆమెను జయించలేకపోయినది కానీ ఈ పోరాటము వలన ఆమె శ్రమపడుచూ వచ్చెను. దేవుని నమ్మకమైన ప్రజలలో నుండి యేసు వచ్చుచున్నాడని మరియు సాతానుడు వాని రాజ్యము వలన నిజమైన విశ్వాసులు శ్రమపొందుతూ ఉంటారని ఈ ప్రతీకాత్మకమైన చరిత్ర సూచించుచున్నది. యోహాను యొక్క అసలైన శ్రోతలు, ఈ సమస్యలన్నీ ఈ పోరాటము వలననే కలుగుచున్నవని అర్థము చేసుకొనియున్నారు, మరియు ఆ స్త్రీని దేవుడు కాపాడిన విధమును చూచి వారు ధైర్యము తెచ్చుకోవాలి. అదే సమయములో, ఆ పోరాటము అంత త్వరగా ముగించబడదు గనుక వారు కాపాడబడే అవసరతను కూడా వారు గ్రహించవలసియున్నది.

ఆ తరువాత ప్రతీకాత్మకమైన చరిత్ర ఎఱ్ఱని మహా ఘటసర్పము చుట్టూ తిరుగుతుంది మరియు ప్రకటన 12:13-17లో అగుపడుతుంది. ఈ చరిత్ర ఆ స్త్రీ యొక్క చరిత్రతో పాటే తెలియజేయబడినది కానీ ఇది వేరొక సూచనగా 12:3లో గుర్తించబడినది. ఈ ఎఱ్ఱని ఘటసర్పము ఏడు తలలు, పదికొమ్ములు కలిగి మరియు ఏడు తలలపైన ఏడు కిరీటములను కలిగియున్న అతి దుష్టమైనదిగా వర్ణించబడినది. మరియు 9వ వచనములో వాడే సాతానుగా గుర్తించబడినాడు. యోహాను దర్శనములో ఈ ఘట సర్పము యొక్క తోక ఆకాశములో మూడవ వంతు నక్షత్రములను నేలను పడవేసెను. దేవదూతలు పడిపోయి దయ్యములుగా మారుటను ఈ కార్యము తెలుపుచున్నది లేక యెషయా 34:3 మరియు మార్కు 13:25లో తెలుపబడినట్లు ఆకాశమండలి శక్తులు కదలింపబడుటయైనా కావచ్చు. ఈ ఘట సర్పము ఆ స్త్రీని మరియు తన కుమారుని ఎదురించుచున్నది, అది దేవుని ప్రజలు మరియు సాతాను మధ్య ఉద్దేశపూర్వకమైన పోరాటమును ఎత్తి చూపుతున్నది.

ఈ ఘటసర్పము చరిత్రలో, పరలోకములో యుద్ధము చేయుటగలదు, మికాయేలు మరియు దేవదూతలు ఘటసర్పముతో పోరాడతారు. సాతాను మరియు వారి దూతలను మికాయేలు భూమిమీద పడద్రోయును. ఒకసారి భూమిమీద పడద్రోయబడిన తరువాత, సాతానుడు ఆ స్త్రీని బాధించుటకు వెంటపడతాడు. అయితే దేవుడు ఆమెను కాపాడుతాడు, కావున తన సంతానమును—అనగా విధేయత చూపించి, క్రీస్తు సాక్ష్యము కలిగిన విశ్వాసులను బాధించుటకు సాతానుడు వారివైపు తిరుగుతాడు. దేవునిపై సాతాను తిరుగుబాటు చేస్తున్నందున మరియు ఆత్మ సంబంధమైన పోరాటము చేయుచున్నందున వారు హింసించాబడుచున్నారని యోహాను యొక్క పాఠకులు అవగాహన చేసుకొనుటకు ఈ ప్రతీకాత్మకామైన చరిత్ర సహాయము చేయుచున్నది. అయినప్పటికీ, సాతనుడు అప్పటికే ఓడించబడినాడు, ఘట సర్పము యొక్క పరిమిత సమయము భూమిమీద కొనసాగినంతవరకు మాత్రమే సంఘము శ్రమపడుతుంది.

మూడవ ప్రతీకాత్మకామైన చరిత్ర సముద్రములో నుండి పైకి వచ్చు క్రూరమృగము చుట్టూ తిరుగుతుంది, మరియు ప్రకటన 13:1-10లో దీనిని కనుగొనవచ్చు. ఈ క్రూరమృగము సింహము, ఎలుగుబంటి మరియు చిరుతపులి స్వభావము కలిగియుండి దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో విగ్రహారాధ రాజ్యములకు సాదృశ్యముగా నున్న క్రూరమృగములను పోలియున్నది. సముద్రములో నుండి పైకి వచ్చు క్రూరమృగము యేసుక్రీస్తు రాజ్యమునకు వ్యతిరేకించు రాజకీయ శక్తులకు సూచనగా ఉందని ఇది తెలుపుచున్నది. ఆ క్రూరమృగమునకు భయంకరమైన చావుదెబ్బ తగిలిన గాయపు మచ్చ ఉన్నట్లు కూడా యోహాను వ్రాయుచున్నాడు.

ఈ ఘటసర్పము భూమిమీద నున్న సమస్త రాజ్యములపైన శక్తి మరియు అధికారమును ఆ క్రూరమృగమునకు ఇచ్చియున్నది మరియు భూనివాసులందరు ఆ క్రూరమృగమునకు నమస్కారము చేసిరి. పరిశుద్ధులపైన కూడా యుద్ధము చేసి వారిని అధిగమించుటకు వానికి అధికారము ఇయ్యబడినది. ఈ క్రూరమృగమును రోమా చక్రవర్తికి లేదా సామ్రాజ్యమునకు అదే విధముగా చక్రవర్తి ఆరాధనకు సంబంధించి యుండవచ్చని యోహాను పాఠకులు బహుశా అర్థము చేసుకొని యుండవచ్చును. క్రూరమృగమును తిరస్కరించి క్రీస్తుకు నమ్మకస్తులుగా ఉండే అవసరతను వారు చూచారు.

ప్రతీకాత్మకమైన నాల్గవ చరిత్ర రెండవ క్రూరమృగముపైన కేంద్రీకరించబడుచున్నది—అది భూమిమీద నుండి పైకి వచ్చునది. ఈ వృత్తాంతము ప్రకటన 13:11-18లో ఉన్నది. భూమిమీద నుండి వచ్చు క్రూరమృగమునకు గొర్రెపిల్ల వంటి రెండు కొమ్ములు ఉన్నాయ, అయితే అది ఘటసర్పమువలె మాట్లాడుచున్నది. అది సముద్రము నుండి వచ్చిన క్రూరమృగమును సేవించుచూ, ఆ క్రూరమృగమునకు ప్రపంచము నమస్కారము చేయులాగున అద్భుత సూచకక్రియలను చేయుచున్నది. క్రూరమృగము యొక్క ముద్రను కుడిచేతి మీద లేదా నుదుటిపైన పొందునట్లు ప్రజలను బలవంతము చేయుచున్నది. రెండు క్రూరమృగములు కలిసి లోకమంతటిని జయించడానికి ప్రయత్నిస్తున్నాయి.

ఈ రెండవ క్రూరమృగము చక్రవర్తి ఆరాధనను బలవంతము చేయు రోమా పురజన మతముగా యోహాను పాఠకులు భావించియుండవచ్చు, మరియు చక్రవర్తిని ఆరాధించని వారు చంపబడతారని భయపెట్టియుండవచ్చు. సముద్రము నుండి పైకి వచ్చిన క్రూరమృగపు చరిత్రవలె, విగ్రహారధనను తృణీకరించి యేసునకు నమ్మకముగా ఉండుమని ఇది హెచ్చరించుచున్నది.

ఐదవ ప్రతీకాత్మకమైన చరిత్ర దేవునికి చెందిన 144,000 మంది విశ్వాసులను గూర్చి తెలుపుతుంది అది ప్రకటన 14:1-5లో ఉన్నది. వారి యొక్క నుదుటులపైన దేవుని పేరు ముద్రించబడినదనే సత్యము ఆధారముగా, వారు బహుశా ప్రకటన 7:1-8లో తెలుపబడిన జనసమూహముగా కనబడుచున్నారు. వారి నుదుటులమీద ఉన్న దేవుని యొక్క పేరు, భూమిమీద క్రూరమృగముకు నమస్కారము చేయు వారి నుదుటిపైన క్రూరమృగపు గుర్తునకు వ్యత్యాసముగా ఉన్నది. యోహాను దర్శనములో, 144,000 మంది సియ్యోను కొండపైన గొర్రెపిల్లతో నిలబడి దేవుని స్తుతించుచున్నారు.

ఈ ప్రతీకాత్మకమైన చరిత్ర యోహాను పాఠకులకు ఇచ్చుచున్న నిశ్చయత ఏమనగా, నిజమైన విశ్వాసులు తుదకు ఘటసర్పము మరియు క్రూరమృగమును తప్పించుకొని దేవుని ఆశీర్వాదములను పొందుదురు. తీవ్రమైన శోధనలు ఉండినప్పటికీ, నమ్మకమైన విశ్వాసులు స్వచ్ఛముగా మరియు నిందారహితముగా కనుగొనబడుదురు.

ఆరవ ప్రతీకాత్మకమైన చరిత్ర ముగ్గురు దేవదూతల సందేశమైయున్నది, ప్రకటన 14:6-11లో అది కనుగొనవచ్చు. యోహాను దర్శనములో, మొదటి దూత ప్రజలందరూ దేవునికి భయపడి, ఆయనను ఆరాధించాలని, నిత్యసువార్తను ప్రకటించినది. రెండవ దూత యేసు క్రీస్తు రాజ్యమును వ్యతిరేకించువారికి కేంద్రపట్టణమైన, మహాబబులోను కూలిపోవుటను ప్రకటించెను. మరియు మూడవ దూత, క్రూరమృగమును వెంబడించి, నమస్కారము చేయు ప్రతీ ఒక్కరికి కలుగు అంత్యతీర్పును గూర్చి ప్రకటించెను. క్రీస్తు యొక్క సువార్త ఆటంకము చేయు ప్రతీ రాజ్యమును జయించును మరియు యేసు తిరిగి వచ్చునప్పుడు ఆయన శత్రువులు శాశ్వతముగా దండించబడుదురని ఈ దూతలు ప్రకటించిరి.

ఈ దూతల సందేశములను గూర్చిన యోహాను వివరణ తన పాఠకులను ప్రోత్సాహపరచినది, కొన్నిసార్లు సంఘము ఓడిపోయినట్లు కనిపించినప్పటికీ, క్రీస్తు రాజ్యము తన శత్రువులను తుదకు జయించును. ఒకవేళ యోహాను పాఠకులలో ఎవరైనా హింసలను తప్పించుకొనాలను దృష్టితో చక్రవర్తిని ఆరాధించుటకు నిర్ణయించుకుంటే, ఈ చరిత్ర అటువంటి శోధనలో పడకుండా వారిని హెచ్చరించుచున్నది.

ఈ దేవదూతల చరిత్ర తరువాత ప్రకటన 14:12-13లో యోహాను ఒక చిన్న అంతరమును చేర్చుతున్నాడు. ఈ అంతరములో, దేవుని ప్రజలు తమ చుట్టూనున్న విగ్రహారాధన విధానమును తిరస్కరించి సహనం కలిగియుండాలని యోహాను హెచ్చరిక చేయుచున్నాడు. మరియు నమ్మకముగా ఉన్నవారు తుదకు దేవుని ఆశీర్వాదమును, విశ్రాంతిని పొందుతారని పరలోకము నుండి ఒక స్వరము ప్రకటించినది.

చివరి ప్రతీకాత్మకమైన చరిత్ర “మనుష్యకుమారుని పోలిన” వానిని అనగా తెల్లని మేఘము మీద ఆసీనుడైయుండి, కోతకోయుటకు వచ్చువానిని వర్ణించుచున్నది. ఆయన చరిత్ర ప్రకటన 14:14-20లో కనుగొనవచ్చును. “మనుష్యకుమారుని పోలిన” అనే మాట ప్రకటన 1:13లో కూడా వ్రాయబడినది, అది ప్రత్యేకముగా యేసును సూచించుచున్నది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో ఉన్న కార్యములు మరియు సందర్భమును బట్టి ఈ మనుష్యకుమారుడు కూడా క్రీస్తే అని స్పష్టమౌతుంది. ఈ చరిత్రలోని అలంకారప్రాయమైన దృశ్యము దానియేలు 7:13లో “మనుష్యకుమారుని పోలిన ఒకడు” అనే మాటకు సారూప్యముగా ఉన్నది, ఆయన దేవుని పరలోకపు ఆవరణములోనికి ప్రవేశించుటకు మేఘములపైన వచ్చుచున్నాడు.

ఈ చరిత్రల శీర్షికలలోని మొదటిదానిలో అనగా, స్త్రీ చరిత్రలో, యేసు పరలోకమునకు కొనిపోబడిన మగశిశువుగా చిత్రీకరించబడెను. అయితే ఈ చరిత్రలు ఒక ఉన్నత స్థానమునకు వచ్చుచున్నప్పుడు, ఒకడు పంటను కోయునట్లు నమ్మకస్తులైన అనుచరుల పంటను కోయు మనుష్యకుమారునిగా యేసు వర్ణించబడుచున్నాడు. అటుతరువాత మరియొక కోతకోయువాడు—ఈయన దేవదూత—లోకములోని మిగిలిన నివాసులను కోతకోసి, దేవుని ఉగ్రత అనే ద్రాక్షాతొట్టిలో వారిని నలుగగొట్టి రక్తము చిందించును. యేసు యొక్క అంత్య విజయమును ఈ దర్శనము ప్రకటించుచున్నది. చరిత్ర ఒక గొప్ప ముగింపునకు వచ్చియున్నదని అది చూపుతున్నది, అనగా యేసునకు నమ్మకముగా ఉండువారు నిర్దోషులుగా చేయబడుదురు మరియు ఆ విధముగా లేనివారు నాశనము చేయబడుదురు.

యోహాను యొక్క అసలైన పాఠకులు దీనిని ప్రోత్సాహకరముగా తీసుకొనియుండవచ్చు. తమ శత్రువుల మీద దేవుడు కుమ్మరించు ఉగ్రతతో వారి శ్రమలు పోల్చదగినవి కావని వారు గ్రహింఛారు. వారు తుదకునిర్దోషులుగా యెంచబడి, ఆశీర్వదించబడతారనే సత్యము నుండి వారు నిరీక్షణ మరియు నిశ్చయతను పొందుచున్నారు.

ప్రేమగల దేవుడు ప్రజలను మరియు శత్రువులను కూడా యెట్లు నరకములోనికి పంపిస్తాడనే వివాదమును గూర్చి మనము చెప్పుకొనుచున్నప్పుడు మనము తరచు ఒత్తిడిని అనుభవిస్తుంటాము. కొన్నిసార్లు అటువంటి వివాదముతో పోరాడటానికి కారణము మనము దేవుని ప్రేమ గుణమును — నిజమైన గుణమును మనము చులకనగా అర్థము చేసుకోనుచున్నామని నేను భావిస్తున్నాను— ఆయన స్వభావములో నుండి దానిని అమితముగా అనురాగముతో మిళితము చేస్తున్నాము. దేవుని స్వభావపు సంపూర్ణ నిజత్వమును మనము వివాదము చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రేమను గూర్చిన మన అవగాహనను తన పరిశుద్ధత గూర్చిన మన అవగాహనతో మిశ్రితము చేసినట్లయితే నరకము సరియైనదని మరియు అంత్య తీర్పు సరియైనదని గ్రహిస్తాము, పశ్చాత్తాపము నొందనివారికి తీర్పుతీర్చుటలో దేవుడు ఖచ్చితముగా సరియైనవాడు, ఒకవేళ ఆయన ఆ విధముగా చేయకపోతే ఆయన మంచివాడని మనము చెప్పలేము. ఒక నిర్దిష్టమైన లేఖనములలో చెప్పబడుచున్న నిజమైన దేవుని ఆరాధించే విధానమును దేవుడు ఘనపరచకపోతే, పాపమును చూచిచూడనట్లు విడిచిపెట్టి, అసలు అది అంత పెద్ద సమస్య కాదన్నట్లు గుణిస్తే ఆయన మంచివాడు కాదు అని మనము చెప్పవచ్చును. కావున దేవుని ప్రేమ అర్థము చేసుకొనుటకు చాలా క్లిష్టమైన గుణము. లేఖనములలో దేవుని స్వభావమును గూర్చి చెప్పబడుచున్న ఇతర గుణములలో నుండి దీనిని వేరుచేసి మనము చెప్పకూడదు.

— డా. రాబర్ట్ జి. లిస్టర్

ప్రతీకాత్మకమైన చరిత్రలను గూర్చిన దర్శనముల శీర్షిక నుండి, సిలువలో క్రీస్తు సాతనును ఓడించాడని యోహాను యొక్క అసలైన పాఠకులకు జ్ఞాపకము చేయబడియుండవచ్చు. తన మొదటి రాకడలోనే క్రీస్తును ఓడించుటలో సాతనుడు విఫలమైయ్యాడు, ఈసారి కూడా సాతాను తప్పక ఓడిపోతాడని విశ్వాసులు స్థిరమైన నమ్మకము కలిగియున్నారు. అంతిమంగా, క్రీస్తు తిరిగి వచ్చి సాతానుని మరియు తన క్రూరమృగములను నాశనము చేస్తాడు. మరియు మధ్య కాలములో, ఓడిపోతున్న వారి శత్రువు యొక్క మరణపు శ్వాసనుండి కలుగు హింసలు మాత్రమే విశ్వాసులు పొందుదురు.

ఏడు ముద్రలు, ఏడు బూరలు మరియు ఏడు ప్రతీకాత్మకమైన దర్శనములను గూర్చి మనము పరిశీలించియున్నాము. ఇప్పుడు రాబోవు సంగతులను గూర్చిన నాల్గవ దర్శనముల శీర్షిక వైపు మనము దృష్టిని మళ్లించుదము: అది ప్రకటన 15 మరియు 16వ అధ్యాయములలో ఉన్న దేవుని ఉగ్రతగల ఏడు పాత్రలు.

ఏడు పాత్రల దర్శనములు దుష్టులైన వారిపైన దేవుని ఉగ్రతను కుమ్మరించు ఏడు బంగారు పాత్రలను చేత పట్టిన ఏడుగురు దేవదూతలను ప్రత్యక్షపరచుచున్నవి. ఈ దర్శనములు కూడా, ముద్రలు, బూరలు మరియు చరిత్రల దర్శనముల వంటి ఆకృతిని కలిగియున్నాయి: అది ఆరు పాత్రలు తరువాత ఒక అంతరము, ఆ తరువాత ఏడవ పాత్ర పోయబడుట గలదు.

మరియు అంతగా ప్రాముఖ్యము కాని అనేకమైన ఇతర పోలికలు అచ్చట ఉన్నాయి. ఉదాహరణకు, మొదటి నాలుగు బూరల వలె మొదటి నాలుగు పాత్రలు లోకము యొక్క నాలుగు ప్రాముఖ్యమైన భాగాలను నాశనము చేయుచున్నాయి: అవి ఆరిన నేల, సముద్రము, మంచినీటి నదులు మరియు ఆకాశము. బూరల వలన కలిగిన తీర్పు భూమిమీద మూడవవంతును నాశనము చేయగా, ఈ పాత్రలు లోకమంతటిని నాశనము చేయుచున్నాయి.

మొదటి పాత్ర కమ్మరించబడినప్పుడు, క్రూరమృగము యొక్క ముద్రగల వారికిని, దానికి నమస్కారము చేయువారికిని బాధాకరమైన చెడ్డ పుండ్లు పుట్టెను. రెండవ పాత్ర సముద్రమును రక్తముగా మార్చినది. మూడవ పాత్ర మంచి నీటి నదులను, జలధారలను రక్తముగా మార్చెను. మరియు నాల్గవ పాత్ర సూర్యుని నుండి కాల్చివేయునంత వేడిని పుట్టించెను. ఈ నాశనకరమైన తెగుళ్లు కలిగినా కూడా, ప్రజలు దేవుని దూషించి పశ్చాత్తాపము నొందుటకు నిరాకరిస్తారు.

ఐదవ పాత్ర, క్రూరమృగము యొక్క సింహాసనముపై కుమ్మరించబడినది. ఈ క్రూరమృగము సముద్రము నుండి వచ్చు క్రూరమృగముగా ప్రకటన 13వ అధ్యాయము నుండి స్పష్టమౌచున్నది, వాని పరిపాలన భూమిమీద నుండి వచ్చు క్రూరమృగము చేత బలపరచబడుచున్నది. క్రూరమృగము యొక్క రాజ్యమును ఈ పాత్ర చీకటితో కప్పుచున్నది, కాని దాని అనుచరులు ఇంకను దేవుని ధూషిస్తూ, పశ్చాతాపము నొందుటకు నిరాకరించుదురు. ఆరవ పాత్ర కుమ్మరించబడినప్పుడు, అది యూఫ్రటీసు నదిని ఎండిపొజేసెను, దేవుని వాగ్దాన భూమిలోనికి తూర్పు రాజులు చొరబడునట్లు అది మార్గము సరాళము చేయుచున్నది.

ప్రకటన 16:16 ప్రకారము, తూర్పు రాజులు మరియు దేవుని ప్రజలకు మధ్య అర్ మెగిద్దోను లేదా మెగిద్దోను అను పర్వతము దగ్గర నిశ్చయమైన యుద్ధము జరుగవలసియున్నది. పురాతన ఇశ్రాయేలు దేశములో, మెసపొతమియ మరియు ఐగుప్తు రాజ్యముల మధ్య వ్యాపారమునకు మెగిద్దో ఒక ప్రాముఖ్యమైన పట్టణముగా ఉండేది. విస్తార సైన్యములు యెజ్రెయేలు లోయ ప్రాంతములో మోహరించి ఉండేవి, ఆ ప్రాంతము కొన్నిసార్లు ఇస్ డ్రాన్లో మైదానముగా కూడా పిలువబడేది. మరియు దేవుని ప్రజలు మెగిద్దోలో పూర్వము యుద్ధములో విజయమును పొందియున్నారు. కావున, దేవుని సేవకులు మరియు ఆయన శత్రువుల మధ్య జరుగబోవు చివరి యుద్ధమును వర్ణించుటకు ఈ దృశ్యము సరిపోవుచున్నది.

తరువాత, అంతరము కొరకు ప్రకటన 16:15లో కొద్దిసేపు నిలిపివేయబడినది, ఆ సమయములో ఈ క్రింది ప్రకటనను మనము చదువుతాము:

ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను; తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిసమొలను చూతురేమో అని మెలకువగాను, నమ్మకముగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు (ప్రకటన 16:15).

సార్దీస్ లో ఉన్న సంఘమునకు ప్రకటన 3వ అధ్యాయములో వ్రాసిన తన పత్రికను జ్ఞాపకము చేయుచూ, ప్రతీ సమయములోను మెలకువగాను, నమ్మకముగాను ఉండునట్లు క్రీస్తు తన అనుచరులను హెచ్చరిస్తున్నాడు.

అంతరము అయిపోయిన తరువాత, ఏడవ పాత్ర దుష్టుల యొక్క అంతిమ నాశనమును ప్రారంభించినది, అప్పుడు మెరుపులును, ధ్వనులును పుట్టెను. ఆయా దేశముల పట్టణములను ఒక గొప్ప భూకంపము ధ్వంసము చేసినది. ద్వీపములు మునిగిపోయినవి. పర్వతములు అదృశ్యమాయెను. మరియు మిక్కిలి పెద్దవైన వడగండ్లు మనుష్యులను నలుగగొట్టేను. ఈ యుగము యొక్క ముగింపు ఇదే — ప్రస్తుతమున్న ఈ లోకము యొక్క నాశనము క్రీస్తు తిరిగి వచ్చునప్పుడు జరుగును.

రాబోవు సంఘతులను గూర్చిన యోహాను దర్శనములను, ఏడు పాత్రలు శీర్షిక ఒక ముగింపునకు తెచ్చుచున్నది. ముద్రలు, బూరలు, చరిత్రలు మరియు పాత్రలు, ఇవన్నీ తన ప్రజల యొక్క క్షేమము మరియు ఆశీర్వాదమును నిశ్చయపరచుటకు చరిత్రలోకి దేవుడు ప్రవేశించుటకు తీసుకున్న నిర్ణయమును ప్రత్యక్షపరచుచున్నవి. యోహాను దినములలో, చిన్న ఆసియాలో ఉన్న సంఘముల విషయములో రోమా సామ్రాజ్యము కఠినముగా ఉన్నట్లు కనబడుతుంది. మరియు సంఘమునకున్న ఆధునిక శత్రువులు కూడా అంతే బలముగా ఉన్నారు. అయితే దేవుడు తన శత్రువులను మరియు మన శత్రువులను నాశనము చేయుటకు నిర్ణయించుకున్నాడు. అనేకమైన వ్యతిరేకతలు మరియు అణచివేతలు కలిగినను ప్రతీయుగములో ప్రతీ క్రైస్తవుడు క్రీస్తునకు నమ్మకముగా ఉండాలని ఇది ప్రోత్సాహపరుస్తుంది.

ఇంతవరకూ, యోహాను యొక్క మొదటి, మరియు రెండవ దర్శనములను పరిశీలించియున్నాము, కాబట్టి ఇప్పుడు ప్రకటన 17:1-21:8లోనున్న మహావేశ్యకు కలుగు శిక్షను గూర్చిన దర్శనమువైపు తిరుగుదాము.

ఈ దర్శనము అరణ్యములో జరిగినది, ప్రకటన 17:1 ప్రకారము ఈ దర్శనమంతా మహావేశ్యను శిక్షించుటయందు దృష్టి కేంద్రీకరించుచున్నది, క్రీస్తు యొక్క రాకడ ద్వారా, దృష్టశక్తులన్నీ చివరి యుద్ధము ద్వారా సంపూర్ణముగా జయించబడుట మరియు క్రీస్తుకు విధేయులైన వారి పరిపాలన, భూమి ఆకాశములు నూతనపరచబడుట ఇందులో ఉన్నాయి. క్రీస్తుకు నమ్మకముగా ఉండువారికి కలుగు కడవరి ఆశీర్వాదములు, ఆ విధముగా లేని వారికి కలుగు శాపములును గూర్చి తన శ్రోతల యొక్క దృష్టిని మరల్చునట్లు యోహాను ఈ భాగమును సిద్ధపరచియున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదములు వెదుకుతూ ఆయన తీర్పును తప్పించుకొనుటకు ఈ రెండింతలు ప్రాధాన్యత యోహాను పాఠకులను పురిగొల్పుచున్నది.

మహావేశ్యకు కలుగుశిక్షను గూర్చిన దర్శనములో రెండు చిన్నవైన శీర్షికలు ఉన్నాయి. మొదటిది బబులోనుపై దేవుని తీర్పును గూర్చి తెలుపగా, రెండవది పరిశుద్ధుల రాజ్యము పై దృష్టిసారించుచున్నది. ఈ రెండు శీర్షికలను మనము చూచెదము, ప్రకటన 17:1-19:21లో కలుగు తీర్పునుండి ప్రారంభించుదము.

యోహాను యొక్క ముద్రలు, బూరలు, చరిత్రలు మరియు పాత్రలు దర్శనములవలె బబులోనుకు కలుగు తీర్పును గూర్చిన దర్శనములు కూడా సంఘ చరిత్రను సమగ్రహించుచున్నవి.

ప్రకటన 17:1-6లో బబులోను పట్టణము ఒక వేశ్యగా కనబరచబడినది. ఆమె మోహింపజేయు వస్త్రములను ధరించినది మరియు ఆమె బంగారము, రత్నములు, ముత్యములతో మెరయుచున్నది. ఆమె రూపము మరియు వ్యభిచారము, దేవుని ప్రజలను యదార్థమైన ఆధారము మరియు నమ్మకమైన జీవితము నుండి తొలగించు అక్రమమైన సుఖభోగములకు సాదృశ్యముగానున్నది. అయితే విశేషముగా, ఆమె అరణ్యములో కనబడుచున్నది, ఆమె ఇచ్చుచున్న సుఖభోగములు మరియు సంతోషములు ఆమెను కాపాడ లేకపోవుటను ఇది సూచించుచున్నది. మరియు ఈ సత్యమును నిర్ధారించుటకు, ఆమె తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన కార్యములతోను నిండిన పాత్రను పట్టుకొనియుండెను.

ఈ వేశ్య ఏడు తలలును పది కుమ్ములును గల ఎఱ్ఱని మృగము మీద కూర్చుండెను. ఇది ప్రకటన గ్రంథము 13వ అధ్యాయములో నున్న సముద్రము నుండి పైకి వచ్చు కుర్రమృగమైయున్నది. అది దేవాదూషణ నామములతో నిండుకొనియున్నది, దాని దుష్టత్వము మరియు దానిని వెంబడించుచున్న వారు చేయు వ్యభిచారమునకు అది సాదృశ్యముగా ఉన్నది.

ఈ వేశ్య దృశ్యరూపము మరియు క్రూరమృగమును గూర్చిన విశేషము తరువాత వచ్చు దర్శనముల శీర్షికలో ప్రత్యక్షపరచబడుచున్నది. మునుపటి ముద్రలు, బూరలు, చరిత్రలు మరియు పాత్రల యొక్క దర్శనముల మునుపటి శీర్షికవలె, ఈ శీర్షిక యొక్క వరుస కూడా తీర్పు మరియు ప్రలాపమును గూర్చిన ఆరు వర్తమానములను తెలియజేయుచున్నవి, తరువాత ఒక అంతరము వచ్చుచున్నది. అయితే ఏడవ వర్తమానము క్రీస్తు మరియు తన విరోధులకు మధ్యనున్న యుద్ధమును వివరించుటకు బదులు, ఆ దర్శనముల వరుస యుద్ధమును గూర్చిన దర్శనముతో ముగుస్తుంది.

మొదటి వర్తమనము, ప్రకటన 17:7-18లో కనబడుతుంది, వేశ్య మరియు క్రూరమృగమును గూర్చిన దర్శనములను వివరించుచున్నది. ఆయనను వ్యతిరేకించు ప్రతీవారిని మరియు ప్రతీదానిని దేవుడు నాశనము చేయుట ఆ వర్తమానము యొక్క సారాంశముగా మనము చెప్పవచ్చును.

రెండవ వర్తమానము ప్రకటన 18:1-3లో ఉన్నది, బబులోను మరియు ఇతర రాజ్యముల రాజులు మరియు ఆమెతో సుఖభోగాలు అనుభవించిన వర్తకులకు సంభవించు గొప్ప ఓటమిని ప్రకటించెను.

మూడవ వర్తమనము ప్రకటన 18:4-8లో వ్రాయబడినది, బబులోనును తృణీకరించి, దాని పాపములో పాలివారు కాకూడదని ప్రజలకు పిలునిచ్చుచున్నది.

మరియు నాల్గవ వర్తమానము ప్రకటన 18:9-20లో వ్రాయబడినది, క్రూరమృగమునకు నమస్కారము చేయుచు బబులోను యొక్క సుఖభోగములను అనుభవించిన రాజులు, వర్తకులు మరియు ఓడ నావికుల యొక్క మూడు ప్రలాపములను కలిగియున్నది. విచారకరముగా, వారి యొక్క ప్రలాపములు పశ్చాతాపమును మరియు క్రీస్తునందు విశ్వాసమును పురిగొల్పలేదు. దానికి బదులుగా, బబులోను యొక్క మునుపటి ఐశ్వర్యము కొరకు రాజులు, వర్తకులు మరియు నావికులు ఎదురుచూశారు.

ఈ వర్తమానములన్నిటిలో, క్రీస్తు పరిపాలనను వ్యతిరేకించు ప్రతీ రాజ్యము, మరియు వ్యవస్థాపకమును బబులోను సూచించుచున్నది. ప్రభువు తన శత్రువుల నందరిని నాశనము చేయును మరియు వారి పాపభోగములు పోయినందున దుష్టులు దుఖిస్తారని ప్రకటించుట ద్వార ఈ వర్తమానములు క్రీస్తు అనుచరులను ప్రోత్సాహపరచుచున్నవి. అయితే, ఇవే పాపములు చేయకూడదని, ఆ ప్రకారము అదే తీర్పులోనికి రాకూడదని ఈ వర్తమానములు సంఘమును హెచ్చరించుచున్నవి.

విగ్రహారాధన మరియు అపవిత్రత అవిశ్వాసులైన వారికి చాలా ప్రీతీకరమని నేననుకొనుచున్నాను కానీ అది విశ్వాసులకు కూడా చాలా ఆకర్షణీయముగా ఉన్నది. అది చాలా సులభము. అది నిషేధించబడిన ఫలము. అదే నాకు కావాలి. నేను తీసుకొనకూడనిది అందులో బహుశా ఏదో ఉండవచ్చు, కానీ దానిని పొందుకోవాలని మన అంతరంగములో ఒక విధమైన కోరిక నిర్మించబడుతుంది. అయితే, ఈ విషయము మంచిదిగా భావించబడుతుందని అనుకొనుచున్నాను, అపవిత్రత మంచిది అనిపిస్తుంది. ఆ క్షణములో ఏదొకటి అణచివేస్తుంది, కానీ ఇదే అసలు విషయము. ఆ క్షణములో అణచివేయునది స్థిరమైనది, ఉన్నతమైనది, పరిశుద్ధమైనది కాకపోవచ్చును, దానిని మనము కలిగియుండకపోవచ్చు, కావున మనము విశ్వాసములో నడుస్తూ ఈ విధముగా చెప్పాలి, “దేనిని బైబిలు గ్రంథము విగ్రహారాధనని పిలుస్తుందో, దేనిని అపవిత్రతయని పిలుస్తుందో, వాటికి వేరుగా వెళ్లి ఆ నిర్వచనముల ప్రకారము జీవిస్తాను. ఆ క్షణములో అది మంచిదిగా అనిపించకపోయినా, అది నిత్యమైన విలువను కలిగియున్నదని నేనెరుగుదును”. మరలా అది దేవుడు మనలను జీవించుమని కోరిన మార్గమును చూపెడుతుంది.

— డా. మ్యాట్ ఫ్రీడెమాన్

బబులోను తీర్పును గూర్చిన ఐదవ వర్తమానము ప్రకటన 18:21-24లో కనబడుచున్నది మరియు బబులోను యొక్క సంపూర్ణ, శాశ్వత నాశనమును అది ప్రకటించుచున్నది.

ఈ శీర్షికలో ఆరవ వర్తమానము ప్రకటన 19:1-8లో వ్రాయబడినది మరియు పరలోకములో దేవుని ప్రజల యొక్క విస్తారమైన స్తుతులను వివరిస్తుంది. బబులోనుకు తీర్చబడిన తీర్పునకు బదులుగా, దేవుని నమ్మకస్తులైన ప్రజలు ఆయనను స్తుతించుట. బబులోనుకు తీర్పుతీర్చుట ద్వార గొర్రెపిల్లయైన క్రీస్తుకు మరియు అయన పెండ్లి కుమార్తె సంఘమునకు మధ్య వివాహమునకు మార్గము స్పష్టమైనదని గ్రహించి వారి స్తుతులు కొనసాగించబడినవి.

తరువాత, ఒక అంతరము ఈ వర్తమానములకు అంతరాయమును కలిగించుట ప్రకటన 19:9-10లో ఉన్నది. ఈ అంతరములో, గొర్రెపిల్ల పెండ్లి విందులో పాల్గొను వారందరికి కలుగు ఆశీర్వాదమును వ్రాయుమని యోహానుకు ఆజ్ఞాపించబడినది.

చివరిగా, ఈ దర్శనముల శీర్షిక, దేవునికి మరియు తన శత్రువులకు మధ్య జరుగు యుద్ధముతో ముగించుట ప్రకటన 19:11-21లో ఉన్నది. క్రీస్తు దైవికమైన యుద్ధశూరునిగా మరియు దేవుని శత్రువులకు వ్యతిరేకముగా యుద్ధము చేయువానిగా ప్రత్యక్షమగుచున్నాడు. ఈ శత్రువులు క్రూరమృగము మరియు అబద్ధ ప్రవక్త ద్వారా నడిపించబడినవారు, వీరెవరనగా వరుసగా ప్రకటన 13వ అధ్యాయములో నున్న సముద్రములో నుండి వచ్చు క్రూరమృగము మరియు భూమిమీద నుండి వచ్చు క్రూరమృగము. మరియు అచ్చట పోటీలేదు; క్రూరమృగము మరియు అబద్ధ ప్రవక్త శాశ్వతముగా ఓడించబడ్డారు. వారి యొక్క నాశనము గూర్చి ప్రకటన 19:20 చెప్పుచున్నది వినండి:

అప్పుడా మృగమును, దాని యెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, వారిద్దరు గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి (ప్రకటన 19:20).

తన ప్రజల పక్షమున దేవుడు బదులు తీర్చుకొను యుద్ధములన్నిటిలో ఆఖరి యుద్ధము ఒక ముగింపునకు తెచ్చుచున్నది మరియు సిలువపైన యేసు పొందిన విజయమును సంపూర్ణము చేయుచున్నది.

ఇంతవరకు మనము బబులోనుకు కలుగు తీర్పును అన్వేషించియున్నాము, కాబట్టి ఇప్పుడు ప్రకటన 20:1-21:8లో ఉన్న పరిశుద్ధుల పరిపాలనను గూర్చి తెలుపు సంగతులను పరిశీలించెదము.

పరిశుద్ధుల పరిపాలనను గూర్చిన ఈ శీర్షిక మూడు భాగాలు కలిగియున్నది, పరిశుద్ధుల వెయ్యి సంవత్సరములు పరిపాలనతో ప్రారంభించుకుందాము, సాధారణముగా ఇది వెయ్యేండ్ల పరిపాలన అని పిలువబడుతుంది, ప్రకటన 20:1-10లో దీనిని చూడవచ్చును.

వెయ్యేండ్ల పరిపాలన: ఈ భాగములో, ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చి, సాతాను అయిన మహా ఘటసర్పమును బంధించుట గలదు. నమ్మకస్తులైన క్రైస్తవ హతసాక్షులు సజీవులై, క్రీస్తుతో పాటు పరిపాలన చేయుచుండగా, వెయ్యి సంవత్సరములు సాతాను బంధించబడుట యోహాను చూచియున్నాడు. వెయ్యి సంవత్సరముల తరువాత సాతాను విడిపించబడతాడు, ప్రకటన 19వ అధ్యాయములో చెప్పబడినట్లు దేవునికి వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు అనేక రాజ్యములను వాడు సమకూర్చుతున్నట్లు కూడా యోహాను చూచియున్నాడు. ఈ యుద్ధము ముగింపులో, దేవుని యొక్క శత్రువులందరు శాశ్వతముగ నాశనము చేయబడుదురు. దహించు అగ్నిగుండములో సాతానుడు కూడా పదద్రోయబడతాడు.

అనేకమంది వ్యాఖ్యానకర్తలు గుర్తించినదేమనగా, యోహాను యొక్క మిగతా అంత్యకాలపు ప్రవచనముల వలె ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము కూడా మిక్కిలిగా దృశ్యరూపకమైనది. మరియు ఈ దృశ్యములను అనేకమైన వేర్వేరు పద్ధతులలో విశ్వాసులు అన్వయించుకుంటున్నారు. నిజానికి, ప్రకటన గ్రంథమంతటిలో, ఈ వాక్యభాగము కంటే ఎక్కువ వివాదములతో కూడుకొనినది వెదకడం కష్టం.

విస్తృతముగా చెప్పాలంటే, ఈ వాక్యభాగమును అన్వయింపు చేయుటకు ప్రాముఖ్యముగా నాలుగు విశ్వాస శాఖలు ఉన్నాయి. ఈ భాగములో తెలుపబడిన వెయ్యేండ్ల పాలన లేక మిల్లీనియంను అవగాహన చేసుకొనిన ప్రకారముగా ఈ పేరుతో పిలువబడుతున్నాయి. ఈ లేఖన భాగమును అన్వయించుచున్న నాలుగు విశ్వాస శాఖలు ఏవనగా: హిస్టారిక్ ప్రిమిల్లీనియలిజం, డిస్పెన్శేషనల్ ప్రిమిల్లీనియలిజం, పోస్ట్ మిల్లీయనిజం మరియు అమిల్లీయనిజం.

చారిత్రక పూర్వ-వెయ్యేండ్ల పాలన (హిస్టారిక్ ప్రిమిల్లీనియలిజం) మరియు దైవ విధితమైన పూర్వ-వెయ్యేండ్ల పాలన (డిస్పెన్శేషనల్ ప్రిమిల్లీనియలిజం) రెండును పూర్వ-వెయ్యేండ్ల పాలనకు సంబంధించినవే, అనగా వెయ్యేండ్ల పాలన ప్రారంభమవక ముందే యేసు వస్తాడని విశ్వసించుట. దానికి విరుద్ధముగా, ఉత్తర వెయ్యేండ్ల పాలన (పోస్ట్ మిల్లీయనిజం) మరియు అసాధ్య వెయ్యేండ్ల పాలన (అమిల్లీయనిజం) రెండూ ఉత్తర-వెయ్యేండ్ల పాలనకు సంబంధించినవి అనగా, వెయ్యండ్ల పాలన ముగింపులో యేసు వస్తాడని విశ్వసిస్తాయి. ఈ రకములైన భావ విధానములను గూర్చి కొంచెము వివరముగా చూచెదము.

చారిత్రక పూర్వ-వెయ్యేండ్ల పాలన “చారిత్రకమైనదిగా” పిలువబడుచున్నది, ఏలయనగా సంఘ చరిత్రయంతటిలో అనేకమంది వేదాంత పండితులు మరియు వేర్వేరు శాఖలకు చెందినవారు ఈ పరిశీలన కలిగియున్నారు. యేసు రెండవ రాకడ తరువాత, సాతాను బంధించబడతాడు మరియు యేసు వెయ్యేండ్ల పాలనను-భూమిమీద వెయ్యేండ్లు సుఖ, శాంతులను స్థాపించుటను ఇది బోధిస్తుంది. వెయ్యేండ్ల పాలన ప్రారంభించబడినప్పుడు విశ్వాసులు పునరుత్థాన శరీరములను కలిగియుంటారు. అవిశ్వాసులైనవారు పునరుత్థాన శరీరములను కలిగియుండరు. వారు ఇప్పుడు జీవించుచున్న దానికంటే ఎక్కువ కాలము వారు జీవించెదరు, అయినప్పటికీ చివరకు మరణించెదరు. వెయ్యేండ్ల పాలన ముగించబడినప్పుడు, సాతాను తిరుగుబాటు చేస్తాడు దాని వెంబడి అంత్యతీర్పు వస్తుంది. మరియు అప్పుడు నూతన ఆకాశము మరియు నూతన భూమినందు దేవుని నిత్య పరిపాలన ప్రారంభమౌతుంది. ఈ క్రమముగా ప్రకటన 19వ అధ్యాయము తరువాత వచ్చు 20వ అధ్యాయమును విశదపరుస్తుంది.

దైవవిధితమైన పూర్వ- వెయ్యేండ్ల పాలన 1830 దశకములో బోధించబడినది. ఈ పరిశీలనలో వైరుధ్యములు ఉన్నాయి, ప్రాముఖ్యముగా వెయ్యేండ్ల పాలన రాకముందు అంత్యమున జరుగబోవు కార్యముల సమయమును గూర్చి వైరుధ్యము ఉన్నది. అయితే, సాధారణముగా చెప్పాలంటే, యేసు రెండవరాకడలో ఇశ్రాయేలు దేశమును తిరిగి సమకూర్చి, యెరూషలేములో తన సింహాసనము నుండి దేశములపై ప్రత్యక్షముగా రాజ్య పరిపాలన చేయునని ఈ దైవ విధితమైన పూర్వ-వెయ్యేండ్ల పాలన బోధిస్తుంది. వెయ్యేండ్ల పాలన ముగింపులో, సాతానుడు తిరుగుబాటును ప్రేరేపించును గానీ దేవుడు సాతానును, వాని సైన్యములను పూర్తిగా ఓడించును. అటుతరువాత, దేవుని అంత్యతీర్పు జరుగుతుంది మరియు నూతన ఆకాశము మరియు నూతన భూమిపైన దేవుని యొక్క నిత్య పరిపాలన ప్రారంభమౌతుంది. చారిత్రక పూర్వ వెయ్యేండ్ల పాలనవలె, ఈ పరిశీలన కూడా క్రమముగా ప్రకటన 19వ అధ్యాయము వెంబడి 20వ అధ్యాయములో వస్తుంది.

చారిత్రక పూర్వ-వెయ్యేండ్ల పాలన మరియు దైవ విధితమైన పూర్వ-వెయ్యేండ్ల పాలనకు విరుద్ధముగా, వెయ్యేండ్ల పాలన తరువాత యేసు రెండవ రాకడ ఉంటుందని ఉత్తర-వెయ్యేండ్ల పాలన బోధిస్తుంది. ఈ వెయ్యేండ్లు క్రీస్తు యొక్క మొదటి మరియు రెండవ రాకడ మధ్యకాలముగా గానీ లేదా ఆయన రాకడకు ముందున్న వెయ్యేండ్లుగా గానీ భావించబడుతుంది. ఈ రెండు సందర్భాలలో కూడా, భూమిమీద నున్న తన సంఘము ద్వారా పరలోకము నుండి యేసు పరిపాలన చేయును. మరియు ఆయన రాజ్యము భూమియందంతటా వ్యాపించు విధముగా అభివృద్ధి చెందుతుంది.

అసాధ్య-వెయ్యేండ్ల పాలన అనగా “వెయ్యేండ్ల పాలన లేదు” అని అర్థము. వెయ్యేండ్ల పాలన అక్షరార్థముగా నెరవేరుతుందనే విషయమును ఇది ఉపేక్షించుట ద్వారా ఈ పేరు ప్రాచుర్యములోనికి వచ్చినది. వెయ్యేండ్ల పాలన, పరలోకములోనున్న తన సింహాసనము నుండి సంఘము ద్వార భూమిమీద యేసు చేయు పరిపాలనను; మరియు వెయ్యేండ్ల ముగింపులో యేసు తిరిగివస్తాడను విషయమును అది బోధిస్తుంది.

అనేక విధములుగా అసాధ్య-వెయ్యేండ్ల పాలన, ఉత్తర-వెయ్యేండ్ల పాలన ఉద్దేశమునకు వేరైనది. ఒక విషయమేమనగా, అన్ని విధములుగా అసాధ్య వెయ్యేండ్ల పాలన క్రీస్తు యొక్క మొదటి మరియు రెండవ రాకడ మధ్య పూర్తి కాలమును బలపరచుచున్నది. మరొక సంగతేమనగా, యేసు మరియు పరిశుద్ధుల యొక్క పరిపాలన దేవుని రాజ్యమును మరియు లోకమును వృద్ధి చేస్తాయని అసాధ్య-వెయ్యేండ్ల పాలన నొక్కి చెప్పుటలేదు. అసాధ్య-వెయ్యేండ్ల దృక్పధములో, దేవుని రాజ్యము యొక్క ఆశీర్వాదమును మరియు క్రీస్తు రాకడలో అంతిమ విజయము సాధించే వరకు భూమిమీద మహాశ్రమలను క్రైస్తవులు అనుభవింతురు.

అచ్చట సాధారణత, సర్వజనితమైన—అనగా సార్వత్రికత ఉన్నాయి—కొన్నికొన్ని విషయాలలో క్రైస్తవుల ఉద్దేశములు అంత్యకాలమున జరుగబోవుచున్నాయి. మరియు ఆ ప్రధాన సిద్ధాంతములను, దాని ముఖ్య అంశాలను అపొస్తలుల విశ్వాస తీర్మానములో మనము కనుగొనవచ్చును. ఉదాహరణకు, యేసు పరలోకమునకు ఆరోహణయ్యాడని మరియు జీవముగలవారిని, మృతులైన వారిని లేక సజీవులను,మరణించిన వారిని ఆయన తీర్పుతీర్చుటకు పరలోకము నుండి తిరిగివస్తాడని అపొస్తలుల విశ్వాస తీర్మానము చెబుతుంది. కావున అంత్య తీర్పు అచ్చట ఉందని మనమందరము నమ్ముచున్నాము, మరియు యేసు తిరిగి రాబోవుచున్నాడు మరియు సజీవులైన వారికి మరియు మృతులైన వారికి, ఇరువర్గములకు ఈ కార్యము చేయనున్నాడు. అయితే, అది ఏ విధముగా జరుగబోతుందనే విషయముమై మనకు అనేకమైన వైరుధ్యములు ఉన్నాయి, కానీ ఇది ఆ విధముగా జరుగుతుందని మాత్రము మనము ఒప్పుకుంటాము. మరియు ఆ తరువాత అపొస్తలుల తీర్మానములో “పాపక్షమాపణ, శరీరము పునరుత్థానమగుటను” మనము నమ్ముచున్నామని చెప్పబడుచున్నది. ఇప్పుడు ఇది సార్వత్రిక సాంప్రదాయ క్రైస్తవ్యముకు సంబంధించినది, అచ్చట సాధారణమైన శరీరము, భౌతిక పునరుత్థానము ఉండబోవుచున్నదని మనము నమ్ముచున్న విషయమును అనేకమంది క్రైస్తవులు అర్థము చేసుకొనలేకపోవుచున్నారు. నేను చెప్పుచున్నదేమనగా, ప్రజలు నిరంతరము ఆత్మలుగా ఉండిపోరు; వారు వారియొక్క శరీరములను తిరిగి పొందబోవుచున్నారు. వాస్తవానికి, యేసు తన పునరుత్థానములో పొందినట్లే క్రైస్తవులు మహిమ శరీరములను పొందుదురు. ఆయా విషయాలలో మనము పరస్పర వైరుధ్యములను కలిగియున్నప్పటికీ క్రైస్తవులందరు అంగీకరించవలసిన మరొక బోధనా ఇది. కావున మనము “శరీరము పునరుత్థానమగుటను మరియు నిత్య జీవమును నమ్ముచున్నాము. ఆమెన్.” మరియు ఆ ప్రకారముగా చెప్పుచున్నదేమనగా, అచ్చట ఈ తీర్పుతీర్చబడుట ఉన్నది, శరీరము పునరుత్థానమగుట ఉన్నది, గనుక అచ్చట నూతన లోకము, ఒక నూతన దినము, నిత్యజీవము కొనసాగుతూ ఉందని కూడా మనము నమ్ముతాము, మరియు మనము ఆకాశములో మేఘముల మధ్య ఎగురుతూ ఎగురుతున్నాము అని అర్థము, దీనిని బైబిలు గ్రంథము “క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి” అని పిలచుచున్నది. కావున యేసు తిరిగివచ్చునప్పుడు, ఆయన భూమిని పరిపాలించును గనుక మనము ఆయనతో పరిపాలించుదము. ఆయా శాఖలకు చెందిన క్రైస్తవులు అంత్యకాలము లేదా రాకడ శాస్త్రమునకు చెందిన ఈ విషయములను ఈ ప్రకారముగా రూఢిగా చెప్పుచున్నారు.

— డా. రిచార్డ్ ఎల్. ప్రాట్, జూ.

ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిపాలన మరియు రాజ్యము రాబోతుందని సువార్త ద్వార ఏదో ఒక విధముగా మనము ఏకీభవించుచున్నాము, ఆయన వ్యక్తిగతముగా అక్కడ ఉన్నాడో లేక తరువాత వస్తాడో మనకు స్పష్టత లేదుగాని, ఆయన పరపాలించబోవుచున్నాడని ఆయన రాజ్యము చేయబోవుచున్నాడు మరియు సువార్త శక్తిలో అది ప్రత్యక్షపరచబడుచున్నదని మనమెరుగుదము. ఆయన తీర్పుతీర్చునని మరియు గొర్రెలకు, మేకలకు కూడా ఆయన తీర్పుతీర్చునని మనము ఎరుగుదుము, మరియు కొంతమందికి ఈయన ద్వారా పాప క్షమాపణ జరుగలేదు గనుక వారు నిత్యశిక్షలోనికి పడవేయబడతారని, మరియు భూమికి పునాది వేయబడక మునుపే వారి కొరకు సిద్ధము చేయబడిన నిత్య మహిమలోనికి కొంతమంది పిలువబడతారని మనమెరుగుదుము. ఈ విషయాలు నిజమైనవని మనమెరుగుదుము. ఆ విషయాలన్నిటిలో మనము ఏకీభవించుచున్నాము. పరలోకములో నీతి నివాసము చేయునని మరియు క్రీస్తు తానే పరిపాలన చేయునని, ఆయనలో మనము మహిమనొందుతామని, మనము ఎరుగుదము మరియు అచ్చట యేసుక్రీస్తు యొక్క అధికారము మరియు అద్భుతమును గూర్చి అనుమానము ఉండదు. మనమందరము ఆ విషయములో ఏకీభవించుచున్నాము. మరియు అంత్యమున జరుగబోవు ఈ కార్యములను గూర్చన అనేక సత్యములను మనము ఎక్కువగా నేర్చుకొనవచ్చు, మనము రాకడ శాస్త్రము అని పిలచే ఎస్కటాలజీ అనే మాట ఎస్కాటాస్ అను పదమునుండి వచ్చినది. అనేకమైన విషయాలలో మనము ఏకీభవించుచున్నాము ఏలయనగా, ప్రకటన గ్రంథములోని స్పష్టత మనలను కొంత ఆశ్చర్యపరచుచున్నది. మరియు మనము ఏకీభవించలేని విషయాలను గూర్చి ఎక్కువ దృష్టిసారించకూడదని నేను భావించుచున్నాను, మనము వివాదములు కలిగియుండినప్పటికీ, బైబిలు గ్రంథము అస్పష్టమైనది మరియు ఆయా విషయాలను అర్థము చేసుకొనలేము అనే ఆలోచనను మనము ఇవ్వకూడదు ఏలయనగా అచ్చట చాలా ప్రాముఖ్యమైన అద్భుతమైన సత్యములు పెద్ద మొత్తములో ఉన్నాయి, వాటిని మనము ఏకీభవించి, ఆయా సంగతులను చర్చించవలసి ఉన్నది.

— డా. థామస్. జె. నెట్టల్స్

క్రీస్తును వెంబడించే వారు ప్రాముఖ్యముగా గ్రహించవలసినదేమనగా, ఇవాంజిలికల్ శాఖ విశ్వాసులు అన్ని విషయాలలో ఏకీభవించరు మరియు వెయ్యేండ్ల పాలనను గూర్చిన అంశము చారిత్రకముగా ఒక గొప్ప వివాదమును కలిగియున్నది. అయితే వెయ్యేండ్ల పరిపాలనకు సంబంధించి ఏ పరిశీలనను మనము పరిగణలోనికి తీసుకున్నా, క్రీస్తు తిరిగివచ్చి, దుష్టునిపై అంతిమ విజయము నొంది, తుదకు సాతానుడు ఓడించబడి, క్రీస్తు పరిపాలన క్రింద నూతన సృష్టిలో దేవుని ప్రజలు సదాకాలము జీవిస్తారని ప్రతీ ఇవాంజిలికల్ శాఖకు చెందిన వారంతా ఏకీభవిస్తారు. ఇదే ఒప్పుకోలును మనమందరము పంచుకొంటాము. మరియు దాని ఫలితముగా, వెయ్యేండ్ల పాలనను గూర్చి బైబిలు బోధిస్తున్న అంశము ద్వారా మనమందరము గొప్ప ఆదరణ, ప్రోత్సాహము పొందుదము.

పరిశుద్ధుల పరిపాలనకు సంబంధించిన శీర్షికలో రెండవ భాగము, దేవుని శత్రువుల అంత్య తీర్పును గూర్చి, ప్రకటన 20:11-15లో తెలియజేయబడుతుంది.

దేవుని శత్రువుల అంత్య తీర్పు: ఆయన దర్శనములోని ఈ భాగములో, మనుష్యులందరిపైన వారి వారి క్రియలను బట్టి ఆయన అమలు చేయుచున్న అంత్య తీర్పును గూర్చి యోహాను సాక్ష్యమిచ్చుచున్నాడు. మునుపు నివసించిన వారందరు ఈ తీర్పులోనికి వస్తారు. యెవరి పేర్లయితే జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయో ఆ విశ్వాసులు భయంకరమైన ఉగ్రత నుండి తప్పించబడతారు. అయితే మనుష్యులలో మిగిలిన వారు వారి పాపములను బట్టి శిక్షించబడతారు. ఈ అంత్య తీర్పు లోకములో పాపము యొక్క ప్రభావమును సంపూర్ణముగా తొలగించి, నూతన ఆకాశము, నూతన భూమికి మార్గము సరాళము చేస్తుంది.

చివరిగా, పరిశుద్ధుల పరిపాలనకు సంబంధించిన శీర్షికలో మూడవ భాగము, దేవుని ప్రజలమీదికి రాబోవు అంత్యతీర్పుపై దృష్టిసారించుట, ప్రకటన 21:1-8లో ఉన్నది.

దేవుని ప్రజల అంత్యతీర్పు: దేవుని ప్రజల యొక్క అంత్యతీర్పును ఒక ఆశీర్వాదముగా యోహాను చూస్తున్నాడు. భూమ్యాకాశములు తిరిగి సృష్టించబడుచున్నాయి, మరియు నూతన యెరూషలేము భూమిమీద కేంద్ర పట్టణముగా ఉండునట్లు పరలోకము నుండి దిగుచున్నది. ఈ నూతన భూమి, నూతన ఆకాశములో దేవుడు తన ప్రజలతో నివాసముంటాడని ఈ పోలిక మనకు తెలియజేస్తుంది. దీనిని దేవుడు ఏదెను వనములోను, ప్రత్యక్ష గుడారములోను, మరియు దేవాలయములోని గతములో చేసాడు. ఇప్పుడు ఆయన క్రీస్తులోమనతో నివాసముంటున్నాడు. అయితే, నూతన ఆకాశము మరియు నూతన భూమిలో దేవునితో మన సహవాసము చాలా గొప్పదిగా ఉంటుంది, ఏలయనగా ఆయన తన మహిమను మన మధ్యలో ప్రత్యక్షపరచుతాడు మరియు ఆయన భౌతిక సన్నిధిలో మనము సదాకాలము జీవిస్తాము.

ఇచ్చట నేను నొక్కి చెప్పడానికి ఇష్టపడుచున్న సత్యమేమనగా మనకు నూతన ఆకాశము మరియు నూతన భూమి ఉన్నది, ప్రభువు తిరిగి వచ్చునప్పుడు సమస్తమును సమీపముగా తీసుకువస్తాడు, మనము నూతన భూమిని కలిగియుండుట మాత్రమే కాదుగానీ, ఆకాశము కూడా నూతనత్వము నొందును.

— డా. విలియం ఊరే

మహావేశ్యకు కలుగు శిక్షను గూర్చి యోహాను యొక్క దర్శనమును పరిశీలించిన మీదట, గొర్రెపిల్ల యొక్క భార్యను గూర్చిన ఆయన దర్శనము వైపు మనము కదులుదము. ఈ దర్శనము ప్రకటన 21:9-22:5లో వ్రాయబడినది.

తన నాల్గవ దర్శనములో, యోహాను ఒక పెద్ద పర్వతము పైకి కొనిపోబడెను. ప్రకటన 21:9 ప్రకారము ఆ దర్శనము పెండ్లి కుమార్తె, గొర్రెపిల్ల యొక్క భార్యను గూర్చినది, అది నూతన యెరూషలేముగా నున్నది. దేవుని శత్రువుల వలన నాశనము చేయబడిన లోకము పరిశుద్ధపరచబడి, ఎన్నడు వాడబారని సౌందర్యము, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము మరియు ఆనందమును పొందుతాయని ఈ దర్శనము వివరించుచున్నది. మరియు యోహాను యొక్క అసలైన శ్రోతలు దీనిని చదువునప్పుడు, వాటిలోనున్న ఆదర్శము అనుసారముగా జీవించుట ద్వారా ఆశీర్వాదమును పొందుకొనుటకు దేవుని వెంబడించునట్లు వారు ప్రోత్సహించబడ్డారు మరియు క్రీస్తు తిరిగి వచ్చునప్పుడు వారికి కలుగు రక్షణ సంపూర్ణత కొరకు ఎదురు చూసారు.

ప్రకటన గ్రంథము ముగింపులో మనము దృష్టించగల ఒక దృశ్యమేమనగా, నూతన పట్టణమైన నూతన యెరూషలేము దిగివచ్చుట, అది ఈ భూమిమీదికి వచ్చుచున్నది. కావున అది ఈ భూగోళము మీదికే వచ్చుచున్నది. ఈ నూతన వాస్తవికములో జీవ వృక్షము ప్రాముఖ్యమైన సాదృశ్యముగా ఉండుట కూడా మనము గమనించవచ్చు, అది స్పష్టముగా ఆదికాండము 1వ అధ్యాయములో ఉన్న ఏదెను వనమును సూచించుచున్నది కావున ఒక విధముగా సృష్టి వనములో ప్రారంభమైనది కాని, మరియొక విధముగా అది ఒక పట్టణములో ముగుస్తుంది; అయితే ఇది ఒక ప్రాముఖ్యమైన సంబంధము కలిగియున్నట్లు కనబడుతుంది. నేను తెలుపబోవుచున్న దృశ్యము ప్రకటన గ్రంథములో దుష్టత్వములేని లోకముతో సరితూగుతుంది, ఈ నిర్ధారణను పరిగణలోకి తీసుకుంటే, అది చాలా మంచి సరిపడే ప్రత్యామ్నాయముగా ఉంటుందని నేననుకొనుచున్నాను, అదేదనగా ఏడ్పులేని, మరణములేని, బాధలేని, కష్టములేని, సృష్టికర్తయైన దేవునికి మరియు మనకు ఎడబాటులేని లోకమైయున్నది.

—బ్రాడ్లీ టి. జాన్సన్

నూతన యెరూషలేమును గూర్చిన వివరణ ప్రకటన 21:9-27 ఉంది. అది పరలోకములో సిద్ధము చేయబడి ఈ నూతన భూమిపైకి తీసుకురాబడినది. ఈ పట్టణము ఖచ్చితమైన ఘనము ఆకారములో చేయబడినది. పాత నిబంధనలో, ప్రత్యక్ష గుడారములోని మరియు దేవాలయములోని అతి పరిశుద్ధ స్థలము కూడా ఘనము ఆకారములో ఉన్నది. అతి పరిశుద్ధ స్థలములో దేవుడు తన సన్నిధిని ప్రత్యక్షపరచునట్లు, ఆయన తన మహిమను నూతన యెరూషలేములోని తన ప్రజలపై ప్రత్యక్షపరచిటను ఇది తెలుపుతుంది.

నూతన యెరూషలేము యొక్క దిక్కులు మరియు వివరణము తరచు పన్నెండు అనే సంఖ్యతో తెలియజేయబడినాయి. పాత నిబంధనలో ఈ సంఖ్య ఇశ్రాయేలు వారి పండ్రెండు గోత్రములను, ఆ యుగములో ఉన్న దేవుని ప్రజలను సూచించుచున్నది. మరియు నూతన నిబంధనలో పండ్రెండు అనే సంఖ్య పండ్రెండు మంది అపొస్తలులను పోలియున్నది, అది ప్రస్తుతమున్న దేవుని ప్రజలను సూచించుచున్నది. నూతన యెరూషలేములో, దేవుని ప్రజలు వైరుధ్యము కలిగిన వేర్వేరు సంస్కృతుల నుండి సమకూర్చబడతారని ఇది సూచించుచున్నది.

నూతన యెరూషలేములోనే, దేవుని సింహాసనము నుండి పట్టణము మధ్య వరకు జీవనది ప్రవహించుచున్నది. ఆ నది జీవ వృక్షమును పోషించుచున్నది, మరియు దాని ఆకులు సమస్త జనములకు స్వస్థత తెచ్చుచున్నవి. నూతన భూమిలో పాపము యొక్క శాపము సృష్టిలోనుండి పూర్తిగా తుడిచిపెట్టుటకు అది సాదృశ్యముగా ఉన్నది. మన చరిత్ర అంతటిలో పతనమైన మానవాళికి పాపము వలన ప్రాప్తించిన సమస్త వివాదములను స్వస్థపరచి, లోకమంతా సంపూర్ణముగా నూతనపరచబడుతుంది.

చివరిగా, నూతన యెరూషలేము దేవుని మహిమతో ప్రకాశించుట యోహాను చూచియున్నాడు. ఆ పట్టణము యొక్క ఆభరణములు, మరియు వెలగల రాళ్లు ఆయన ఐశ్వర్యమును, సౌందర్యమును మరియు మహిమను తెలుపుచున్నవి. మరియు దీనికి అతీతముగా, దేవుని మహిమ పట్టణమును ఆవరించియున్నది, అందువలన దానికి వేరొక వెలుగు అవసరము లేదు — సూర్యుడు లేదా చంద్రుడు కూడా అవసరము లేదు.

ప్రశ్న ఏమనగా, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయములో వాగ్దానము చేసిన ప్రకారము నూతన ఆకాశము, నూతన భూమిని నిర్మించుటకు ప్రస్తుతమందున్న ఆకాశము, మరియు భూమి నాశనము చేయబడతాయా? కొంతమంది ఆ విధముగానే జరుగుతుందని అనుకొంటున్నారు. నేను దానిని ఒక సమూల పరివర్తనగా వివరించుచున్నాను—సమూలనమైన మార్పు అతి ప్రాముఖ్యమైనది. ఒక విధముగా అది నాశనము చేయబడునట్లు కనబడుతుంది, కాని నమూనా మాత్రము క్రీస్తు యొక్క సొంత పునరుత్థాన శరీరము వంటిది. ఆయన మరణించక ముందుండిన శరీరముతో పోల్చితే ఆయన పునరుత్థాన శరీరము రూపాంతరము చెందినది, అయినప్పటికీ తన చేతులలో మేకులు కొట్టిన గాయములను ఇంకా కలిగియున్నాడు. మన పునరుత్థానము యొక్క నమూనా కుడా ఆ విధముగానే ఉంటుంది, మరియు రోమా పత్రిక 8వ అధ్యాయము 18వ వచనము నుండి చదివితే ఇదే నమూనా విశ్వమంతటికీ వర్తిస్తున్నట్లు చూడవచ్చు.

— డా. వెర్న్ యస్. పొత్రెస్

నిశ్చయముగా ప్రస్తుతము మనము నివసించుచున్న ఈ ఆకాశము, భూమి తొలగించబడతాయి మరియు వీటికి పూర్తి భిన్నముగా నూతన ఆకాశము మరియు నూతన భూమి ఉండబోవు, మానవ పతనము యొక్క ప్రభావము ఇందులో ఎన్నటికీ ఉండదు, కానీ అనేకమంది క్రైస్తవులు నూతన ఆకాశమును గూర్చి మితిమీరిన ఆత్మీయ దృష్టిని కలిగియున్నారు, దేవుడు శిధిలమైన దానినుండి ప్రారంభించడు, కానీ తాను నిర్మించిన దానినే నూతనముగా చేయబోవుచున్నాడు. మానవుని పతనము వలన విచారకరముగా కోల్పోయిన దానిని ఆయన పూర్వ స్థితికి తీసుకువస్తాడు. అందువలన నూతన ఆకాశము, నూతన భూమి అద్భుతమైన రీతిలో నూతన పరచబడినప్పటికీ మనము ఇప్పుడు కలిగియున్న దానికి మరియు రాబోవుచున్న దానికి చాలా కొనసాగింపు అచ్చట ఉంటుంది.

— డా. కే. ఎరిక్ ధోయెన్స్

ఇంతవరకు మనము ప్రకటన గ్రంథమునకు యోహాను యొక్క ఉపోద్ఘాతమును మరియు ఆయన పరలోక దర్శనముల శీర్షికను పరీక్షించియున్నాము, కాబట్టి ఇప్పుడు ప్రకటన 22:6-21లో ఉన్న ఈ పుస్తకము యొక్క ముగింపు వైపునకు తిరుగుదము.

యోహాను ప్రకటన గ్రంథమును తన దర్శనముల ద్వారా నొక్కి చెప్పబడిన ప్రాథమిక సందేశములతో ముగించుచున్నాడు. తాను పొందిన ఈ దర్శనములు నమ్మదగినవని ఆయన నొక్కి చెబుతున్నాడు, ఏలయనగా అవి ప్రభువు దూత ద్వారా వారికి తెలియజేయబడినవి. నూతన ఆకాశము మరియు నూతన భూమిలో గొప్ప ఆశీర్వాదములు తన పాఠకులు పొందాలని ఆయన హెచ్చరించుచున్నాడు. మరియు దేవుని రాజ్యము సంపూర్ణముగా వచ్చుట మరియు అంత్య తీర్పు ఇంకా భవిష్యత్తులో రాబోవుచున్నాయని యోహాను తన పాఠకులకు జ్ఞాపకము చేయుచున్నాడు. కావున ఇప్పటికి, క్రైస్తవులు నమ్మకముగా సహనము కలిగియుండాలి మరియు పాపులు పశ్చాత్తాపము చెందవలసియున్నది.

ప్రకటన గ్రంథము దేవుని నుండి తన ప్రజలకు ఇవ్వబడిన కాలానికి ఆవలనున్న సందేశము. కాలానికి సంబంధించి మరియు యోహాను దర్శనముల నెరవేర్పుకు సంబంధించి మన దృక్పధము ఏ విధముగా ఉన్నప్పటికీ, యోహాను ఈ గ్రంథమును వ్రాసినప్పుడు ఏ విధముగా ఉన్నదో ఇప్పుడు కూడా అదే ప్రకారముగా వర్తించుచున్నదని క్రైస్తవులందరు ఒప్పుకొనవలసి ఉన్నది. మన పరిస్థితి వేరుగా ఉండవచ్చు గానీ మన దేవుడు మారలేదు. మరియు యోహాను బోధించిన విలువలు మరియు దృక్పధములు ఈ రోజున కూడా మనకు వర్తిస్తాయి. భూత, వర్తమాన, మరియు భవిష్యత్ కాలములలో దేవుని యొక్క మంచితనమును బట్టి మనము ప్రోత్సహించబడుదుము. ఆయన మన యెడల కలిగియున్న ప్రేమ మరియు చరిత్రను ఆయన స్వాధీనపరచుకొనుటయందు మనము నమ్మకముగా ఉండాలి. ఇప్పుడును, మరియు మిగిలిన మన జీవితమంతటిలో ఆయన పట్ల నమ్మకము కలిగియుండునట్లు విశ్వాసముతో మనము ఆయనకు స్పందించవచ్చును.

ప్రకటన గ్రంథము యొక్క ఉద్దేశము మరియు వివరణలు గూర్చి చర్చించిన మీదట, మూడవ ప్రధాన అంశమును చర్చించుకొనుటకు మనము సిద్ధముగా ఉన్నాము: అదేదనగా ప్రకటన గ్రంథమును అన్వయించుకొను ప్రణాళిక.

ప్రకటన గ్రంథమును ఆధునిక కాలానికి అన్వయించుకొనుటను గూర్చిన వాదము రెండు భాగములుగా విభజించబడినది: మొదటిగా, ప్రకటన గ్రంథమును అన్వయించుకొనుటకు నాలుగు సాధారణమైన ప్రణాళికలను వివరించుచూ, సద్విమర్శ చేయుదము. మరియు రెండవదిగా, ఈ నాలుగు ప్రణాళికల నుండి తయారు చేయబడిన సమగ్రమైన ఒక ప్రణాళికను సూచించెదము. ప్రకటన గ్రంథమును అన్వయించుకొనుటకు గల నాలుగు సాధారణమైన ప్రణాళికలను మొదట మనము చూచెదము.

మొట్టమొదటిగా చెప్పదలచుకున్న విషయమేమనగా ఈ నాలుగు ప్రణాళికలలో ప్రతిదీ కూడా చాలా ప్రయోజనకరమైనది, అయితే ఏ ఒక్కటీ కుడా దానంతట అదే సరిపోయినది కాదు. ఈ పరిస్థితి పాతదైన ఒక గుడ్డివాడు, ఏనుగు కథను జ్ఞాపకము చేయుచున్నది, అదేమనగా ప్రతీ గ్రుడ్డివాడు ఏనుగు శరీర భాగమును వివరించారు గానీ, ఏ ఒక్కరూ ఏనుగు యొక్క సంపూర్ణ రూపమును చెప్పలేకపోయారు. ఈ కథ వేర్వేరు సంస్కృతులలో వేర్వేరు విధములుగా ఉన్నది. ఒక వ్యక్తి ఏనుగు యొక్క కాలును తడిమి, ఏనుగు ఒక స్తంభము వలె ఉంటుందని నమ్ముతాడు. మరియొకడు దాని చెవిని తడిమి ఏనుగు విసెనకర్ర వలె ఉంటుందని చెప్పాడు. మరియొకడు దాని తోకను తడిమి ఏనుగు ఒక తాడువలె ఉంటుందని ఆలోచిస్తాడు. మరియొకడు దాని తొండము తడిమి ఎనుడు నీటిగొట్టము వలె ఉంటుందని ముగించాడు. ఆ విధముగా కథ సాగుతుంది. వారి వారి అంచనాల ప్రకారము అందరూ చెప్పినది సరియైనదే అయితే పూర్తిగా ఏనుగును ఎవరు చూడలేకపోయారు.

అదే ప్రకారముగా, అనేకమైన ప్రఖ్యాతిగాంచిన ప్రణాళికలు ఉన్నవి గానీ, ప్రకటన గ్రంథమును వ్యాఖ్యానించి అన్వయించుటకు అవి సరిపోవు. ప్రకటన గ్రంథములో ఉన్న దృశ్యములను ప్రతీ ప్రణాళిక యొక్క దృక్పథము చొప్పున వివరించుతాము. ఈ దృక్పథములు చాలా పరిమితముగా ఉన్నందువలన ప్రతీ పరిశీలన ప్రకటన గ్రంథము ఇచ్చుచున్న దర్శనములో ఉన్న పూర్ణ అర్థమును మరియు పూర్తి దృచూడలేకపోతారు.

ఈ పాఠములో మనము చూడబోతున్న అన్వయింపును గూర్చిన నాలుగు ప్రణాళికలు ఏమనగా: ప్రీటరిజం, ఫ్యూచరిజం, హిస్టారిసిజం మరియు ఐడియలిజం అని చెప్పబడుతున్నాయి. ప్రకటన గ్రంథము యొక్క కాల వ్యవధి, మరియు ఆ దర్శనములు నెరవేర్చబడు విధానమును గూర్చి ప్రతీది వేర్వేరు అన్వయింపులను కలిగి ఉన్నది. ఈ నాలుగు పరిశీలనలను ఒకొక్కటిగా మనము పరిశీలించెదము, ప్రీటరిజంతో ప్రారంభించెదము.

ప్రీటరైట్ అనే మాట గతములో జరిగిన కార్యములను సూచించుచున్నది. ఆ ప్రకారముగా, ప్రకటన గ్రంథములోని ప్రవచనములు చాలామట్టుకు గతములో నెరవేర్చబడ్డాయని ప్రీటరిజం తెలుపుతుంది.

ప్రకటన గ్రంథము క్రీ.శ. 70లో యెరూషలేము పతనము అయిన తరువాత వ్రాయబడినదని మరియు ఆ సమయానికే చాలామట్టుకు ప్రవచనములు నెరవేర్చబడ్డాయని ప్రీటరిజంలో ఒక శాఖ చెప్తుంది. క్రీ.శ ఐదవ శాతబ్దములో రోమా సామ్రాజ్యము పతనము అయినప్పుడు ఈ దర్శనములు నెరవేర్చబడ్డాయని మరియొక శాఖ తెలుపుతుంది.

యోహాను యొక్క అసలైన శ్రోతలపై దృష్టి సారించడానికి ప్రీటరిజం సహాయపడుతుంది. ప్రకటన 2, 3 అధ్యాయములలో ఉన్న ఏడు సంఘములను గూర్చి సవివరమైన జ్ఞానము యొక్క ప్రాముఖ్యతను అది చూస్తుంది. ఈ సంఘములు వాస్తవముగా అనుభవించిన శ్రమలను అది మనకు జ్ఞాపకము చేస్తుంది. మరియు ఇది 2 మరియు 3 అధ్యాయములకు మరియు గ్రంథములోని మిగిలిన అధ్యాయములకును మధ్యన అంశాత్మకమైన సంబంధమును నిర్మిస్తుంది. యోహాను కేవలము భవిష్యత్తు తరముల వారికే ఇది వ్రాయలేదని, యోహాను యొక్క అసలైన శ్రోతల పట్ల క్రీస్తు చూపిన ప్రత్యేకమైన అభిమానము మరియు ప్రోత్సాహమును ఈ గ్రంథము ఆధునిక అన్వయింపును తెలియజేయుచున్నదని ప్రీటరిజం సమయోచితముగా చెప్పుచున్నది. మరియు ప్రకటన గ్రంథము యొక్క చివరి అధ్యాయములు క్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి మాట్లాడుచున్నాయని ప్రీటరిజం యొక్క అన్ని శాఖలు సరియైన విధముగా అవగాహన చేసుకొనుచున్నాయి.

ప్రకటన గ్రంథమును ఈ విధముగా చూచుట ద్వారా ప్రయోజనకరమైన అన్వయింపులను మనము వెలికి తీయవచ్చును. ఉదాహరణకు, అది మనకు దేవుని స్వభావమును గూర్చి మరియు నీతుమంతులకు ఆయన ప్రతిఫలమిచ్చి, దుష్టులను శిక్షించునని బోధించుచున్నది. మన లోకములో కలుగు సమస్యలకు ఏ విధముగా స్పందించాలో అర్థము చేసుకొను విధముగా సహాయపడుతుంది మరియు భవిష్యత్తులో క్రీస్తు యొక్క రాకడను గూర్చి మనకు నిరీక్షణ కూడా ఇస్తుంది.

అయితే ఇంత విలువైన అంతర దృష్టి ఉన్నప్పటికీ, ప్రకటన గ్రంథముపై ప్రీటరిజం సంపూర్ణమైన దృక్పథమును ఇవ్వలేదు. ఒక విషయమేమనగా, అంత్యకాల ప్రత్యక్షతా సాహిత్యము అప్పుడు ఉండే సమయానికి మాత్రమే వ్రాయబడినదిగాని, రానున్న భవిష్యత్తునకు అంతగా కాదు అని ఇది తరచూ తప్పుడు అభిప్రాయమును ఇచ్చుచున్నది. అయితే సత్యమేమనగా లేఖనాలలో అనేక అంత్యకాల ప్రత్యక్షతా భాగములు, దానియేలు 7-12, మత్తయి 24 మరియు 2 థెస్సలొనీక 1 మరియు 2 అధ్యాయములు భవిష్యత్ సంఘటనలను తెలియజేయుచున్నవి.

అదే ప్రకారము, ప్రకటన గ్రంథము 1:1-3 మరలా ప్రకటన గ్రంథము చివర 22:10లో ఉన్న “కాలము సమీపమైయున్నది” అని చెప్పబడిన కాలానికి సంబంధించిన వాక్యములను వ్యాఖ్యానించుటలో ప్రీటరిజం చాలా సంకుచితముగా ఉన్నది. ఇటువంటి వాక్యములు క్రీస్తు యొక్క మొదటి రాకడ మరియు రెండవ రాకడ మధ్యనున్న కాలమునకు సంబంధించినవి కావని— ఆ సమయము అంత్య తీర్పునకు “ముందు” వచ్చుచున్నదైనా, అది కాలానికి సంబంధించినదైనా కాదని వాదిస్తారు. మరి ఎక్కువగా, ఈ కాలానికి సంబంధించినది చరిత్రలో జరుగదగినదిగా సహజముగా ప్రీటరిజం అంగీకరించదు. దాని ఫలితముగా భవిష్యత్తులో నెరవేర్చబడబోవు సంగతులను ఇది మరుగు చేయుచున్నది మరియు అసలైన శ్రోతల సందర్భములో నెరవేర్చబోవు సంగతిని మాత్రమే దృష్టించుతుంది.

ప్రకటన గ్రంథమును అది అన్వయించు నియమమును బట్టి, మొదటి శతాబ్దము నుండి విస్తరించుచున్న దేవుని రాజ్యమును గూర్చి ప్రీటరిజం తక్కువగానే చెప్పుచున్నది. ప్రకటన గ్రంథములోని చాలామట్టుకు ప్రవచనములు వారియొక్క జీవిత కాలములో నెరవేరుచున్నట్లు చరిత్రయంతటిలో ఇది క్రైస్తవులను సిద్ధపరచలేదు. హతసాక్షులు కొనసాగుతారని మరియు వ్యతిరేకతలు కొనసాగుతాయని ఇది తెలుపుట లేదు. ఈ విధముగాను, మరియు అనేక విధములుగాను, ప్రీటరిజం ప్రకటన గ్రంథము యొక్క పూర్తి అన్వయింపును ఇవ్వలేకపోయెను.

ప్రకటన గ్రంథమును గూర్చి ప్రీటరిజం ఇచ్చుచున్న ఈ అవగాహనను మనస్సులో పెట్టుకొని, ఫ్యూచరిజం వైపు తిరుగుదము.

క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు కాలమునకు సంబంధించిన శ్రమలు వచ్చునంత వరకు ప్రకటన గ్రంథములోని దర్శనములు నెరవేర్చబడుట ప్రారంభము కాదని ఫ్యూచరిజం అభిప్ర్రాయపడుతుంది.

ప్రీటరిజంవలె, ఫ్యూచరిజం కూడా కొన్ని మెళకువలను కలిగియున్నది. ప్రకటన గ్రంథము ముందుకు చూచుచున్నదని సరిగా చెప్పుచున్నది, అన్నిటికంటే పైగా, గొప్పకార్యమైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడను గూర్చి చెబుతుంది. ప్రకటన 22:20 వంటి లేఖన భాగాలలో ఉన్న ఈ కేంద్ర ఉద్దేశమును మనము చూడవచ్చు.

భవిష్యత్తు దినమున జరుగబోవు అంత్య తీర్పును గూర్చి మరియు రోమా 8:19-25 వంటి లేఖన భాగాలలో నిర్ధారించబడిన సృష్టియావత్తును తిరిగి పూర్వస్థితికి తెచ్చుటను గూర్చి కూడా ఫ్యూచరిజం సరిగా ఎదురు చూచుచున్నది.

ఈ వ్యాఖ్యానములు అనేక ప్రయోజనకరమైన పద్ధతులలో అన్వయించబడతాయి. అవి క్రీస్తు రెండవ రాకడ, తీర్పు మరియు సృష్టి నూతన పరచబడును గూర్చి నిరీక్షణను కలుగజేస్తాయి. ఆ సమయము కొరకు ఎదురుచూచునట్లు చరిత్రలో అన్ని కాలములలో ఉన్న క్రైస్తవులను ప్రోత్సహపరచుతాయి.

ఈ విలువైన ఆలోచనలు కలిగియున్నప్పటికీ, అసలైన శ్రోతలతో ప్రకటన గ్రంథము ఏ విధముగా మాట్లాడినదో ఫ్యూచరిజం దాటవేసినది. నిజానికి, క్రీస్తు రాకడకు ముందున్న తరము మినహా మిగతా అన్ని తరముల వారికీ అన్వయింపుని ఇది తక్కువచేసినది— యోహాను ప్రాచీన కాలములో ఉన్న ఏడు సంఘముల పేర్లు, ప్రత్యేకముగ ప్రతీ సంఘమునకు సందేశము ఇచ్చినప్పటికీ ఇవి వాటి ప్రాధాన్యతను పరిగణించలేదు. 2 మరియు 3 అధ్యాయములలో చెప్పబడిన ఏడు సంఘములను, మనస్సులో పెట్టుకొనకుండా వ్రాయబడ్డాయని భావించుట చాలా కష్టము. ఈ విధముగా, ఫ్యూచరిజం చరిత్రలో చాలామంది శ్రోతలకు ప్రకటన గ్రంథమును వర్తింపజేయలేకపోయినట్లు అగపడుచున్నది.

ఇంతవరకు మనము ప్రీటరిజం మరియు ఫ్యూచరిజంను పరిశీలించియున్నాము, కాబట్టి ఇప్పుడు సాధారణ అన్వయింపులలో మూడవ దానివైపు తిరుగుదము, దానిని మనము హిస్టారిసిజం అని పిలచుచున్నాము.

ప్రకటన గ్రంథములోని దర్శనములు కాల క్రమానుసారముగా మొదటి శతాబ్దము నుండి, రెండవ రాకడ వరకు ఉండే కాలము యొక్క నమూనాను సూచిస్తుందని హిస్టారిసిజం తలంచుచున్నది.

హిస్టారిసిజం మాదిరికరముగా చెప్పుచున్నదేమనగా: ప్రకటన 2–12 అధ్యాయములలోని సంఘటనలు కొన్ని మొదటి శాతాబ్దాలకు సంబంధించినవి; 13–17 అధ్యాయములలోని సంఘటనలు ప్రొటెస్టెంట్ సంఘ సంస్కరణకు సంబంధించినవి, మరియు 18–22వ అధ్యాయములు రెండవ రాకడకు సంబంధించిన సంఘటనలను కలిగియున్నవి.

హిస్టారిసిజం అనేకమైన విలువైన ఆలోచనలను ఇచ్చుచున్నది. ప్రకటన గ్రంథము ఏడు సంఘముల పరిస్థితితో ప్రారంభమౌచున్నదని ఇది సరిగా చెప్పుచున్నది. మరియు ప్రకటన గ్రంథము యొక్క ముగింపు దృశ్యాలను రెండవ రాకడకు సరిగా ఇది ఆపాదించుచున్నది. మరియు ప్రకటన గ్రంథము ఒక ముగింపు వైపునకు కదులుతూ ఉందని ఇది సరిగా గుర్తించుచున్నది – ఈ గ్రంథమంతా చదువుతూ ఉండగా ఈ వృత్తాంతము కొనసాగుతుంది.

అన్ని యుగములలో ఉన్న సంఘములకు ప్రకటన గ్రంథము వర్తించుచున్నదని హిస్టారిసిజం గుర్తించుచున్నది. యేసు తిరిగివచ్చు పర్యంతము మనము కాపాడబడుతామని ప్రోత్సహపరచుచున్నది మరియు ఆ సమయములలో భూమ్యాకాశములను ఆయన నూతన పరుస్తాడని ఇది నిశ్చయపరచుచున్నది. మరియు చరిత్రపై దేవుని ఆధిపత్యము ఉన్నది మరియు ఆయన ప్రణాళిక ముగింపునకు వచ్చు విషయములో విఫలమయ్యేది లేదనే విషయమును అది మనకు జ్ఞాపకము చేయుచున్నది.

కానీ మరియొక విధముగా హిస్టారిసిజం సమస్యాత్మకమైనది. ఒక సంగతి ఏమనగా, ప్రకటన గ్రంథములో ఉన్న ప్రవచనములన్నీ ఖచ్చితముగా కాలనిర్ణయము చొప్పున ఉన్నవని ఇది నిశ్చయపరచుచున్నది. అది ఆది సంఘము, సంఘ సంస్కరణ మరియు క్రీస్తు యొక్క రెండవ రాకడ మధ్య నున్న విరామమును కాలమనే తీగను మొదటి శాతాబ్దము నుండి ఆఖరి శతాబ్దము వరకు సాగదీయుట ద్వారా పూడ్చుచున్నది, మరియు ఈ దర్శనములను ప్రపంచ చారిత్రక సంఘటనలతో ముడిపెడుతుంది.

అయితే, ఈ పాఠములో మనము ముందుగా చూచినట్లుగా, ప్రకటన గ్రంథము యొక్క నిర్మాణ ఆకృతి ఖచ్చితముగా కాలనిర్ణయ ప్రకారముగా లేదు. వారు విమోచనా చరిత్రలో ఎక్కడ ఉన్నారో తెలియని ఒక తప్పుడు దృక్పథమును ఇది క్రైస్తవులకు ఇయ్యవచ్చు, కొన్నిసార్లు వారిని యుక్తము కాని నిరాశావాదము లోనికి వారిని నెట్టివేయవచ్చు, మరియు మరి కొన్నిసార్లు వారిని యుక్తముగాని ఆశావాదములోనికి నెట్టివేయవచ్చు. ఇంకనూ ప్రకటన గ్రంథములో తెలుపబడుచున్న కాలక్రమమును మనము ఏ విధముగానూ తప్పిపోకూడదనే భావనను ఇది కలుగజేస్తుంది, దేవుడు దయచూపించునట్లు లేదా కోపపడునట్లు చేయుటకు మన సొంత కార్యములు అసమర్థమైనవి మరియు స్పష్టముగానున్న చరిత్రను మార్చుటకు వీలుపడదని ఇది తెలుపుచున్నది.

హిస్టారిసిజంలో ఉన్న రెండవ సమస్య ఏమనగా, క్రీస్తు యొక్క సార్వత్రిక సంఘ చరిత్రలో ప్రొటెస్టంట్ సంఘ సంస్కరణ చాలా కీలకమైనదిగా దానిపై ఇది ఆధారపడుట. సార్వత్రిక సంఘ దృక్పథమును హిస్టారిసజం మరుగు చేయుచున్నట్లు కనబడుచున్నది, తరచు యోహాను యొక్క ప్రవచనములు పాశ్చాత్య క్రైస్తవత్వమునకు పరిమితము చేయుచున్నది — మరియు కొన్నిసార్లు సంకుచితముగా యూరోప్ దేశాల క్రైస్తవత్వములో జరిగిన సంఘటనలకే పరిమితము చేయుచున్నది. ఇటువంటి అభిప్రాయము ఇతర దేశములలో ఉన్న సంఘము పాత్రను తక్కువ చేయుచున్నది. మరియు ఇది చాలా నిరుత్సాహకరమైనది. వారి యొక్క కార్యములు అంతగా గుర్తించదగినవి కావని విశ్వాసులు ఆలోచించునట్లు చేస్తుంది మరియు ప్రపంచమంతటా దేవుని రాజ్యము అభివృద్ధి కొనసాగు ప్రాముఖ్యమైన ఉద్దేశమును గూర్చిన ఆసక్తిని ఇది తొలగిస్తుంది.

ప్రీటరిజం, ఫ్యూచరిజం మరియు హిస్టారిసిజం చూచిన తరువాత, ఇప్పుడు సాధారణ అన్వయింపులలో నాల్గవదానివైపు మనము తిరుగుదము, అదేదనగా: ఐడియలిజం

ప్రకటన గ్రంథములోని సంఘటనలు ఒక నిర్ణీత కాలపరిమితిని లేదా వేరొకదానిని తెలుపుతున్నాయని చెప్పుటకంటే, ప్రకటన గ్రంథములో ఉన్న దృశ్యములు ఆత్మీయ పోరాటములోని సాధారణ పద్ధతులను తెలుపుతున్నాయనేగాని, ఒక ప్రత్యేకమైన సంఘటనలను లేదా కాలక్రమానికి చెందినవాటిని తెలుపుటలేదని ఐడియలిజం వాదించుచున్నది.

మిగిలిన సాధారణ అన్వయింపుల వలె, ఐడియలిజం కొన్ని విలువైన ఆలోచనలను ఇచ్చుచున్నది. ప్రకటన గ్రంథములో ఉన్న కొన్ని ప్రవచనాల మూల అంశమునకు అనుగుణముగా అమర్చబడుటను ఇది గుర్తించుచున్నది. ప్రాథమికంగా సాతాను యొక్క పద్ధతులు చరిత్రలో ఒకే విధముగా ఉన్నాయనే సత్యమును ఇది ఎత్తిచూపుచున్నది, మరియు వాటిని ముందుగానే తెలుపుచున్నది.

ఈ శీర్షిక పాఠములలో ముందుగా మనము వివరించిన ప్రకారము క్రొత్త నిబంధనకు సంబంధించిన, ఆరంభ రాకడ శాస్త్రపు పద్ధతిని ఐడియలిజం గుర్తించుచున్నది. మరియు ఈ ఆధునిక యుగ సందర్భమునకు, మొదటి శతాబ్దపు మరియు అంత్యకాలపు ఆపదలో జరుగువాటిని సార్వత్రికము చేస్తూ అన్వయించుకొనుటను ఇది నొక్కి చెప్తుంది. యోహాను ఉద్దేశించిన ప్రకారముగా ప్రకటన గ్రంథమును చదివి, ఉపయోగించుటకు ఈ ఆలోచనలు మన సామర్థ్యమును పెంచుతాయి. దేవుని స్వభావమునందు దృష్టి పెట్టునట్లు మరియు లోకముతో ఆయన వ్యవహరించు రీతిని అవగాహన చేయుటకు సహాయపడతాయి. చరిత్ర యొక్క అన్నికాల పరిమితులలో నివశించుటకు మరియు రానున్న క్రీస్తు రాకడను గూర్చిన నిరీక్షణ కలిగియుండునట్లు, అవి మనలను సిద్ధపరుస్తాయి.

అయితే ఐడియలిజంలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. చాలా స్పష్టముగా కనబడుచున్నదేమనగా, ప్రకటన గ్రంథములోని ఏ ఒక్క దృశ్య రూపమును చారిత్రక సంఘటనలతో ఇది పోల్చి చెప్పుటలేదు. కనీసము, యోహాను యొక్క అసలైన శ్రోతలు వారి కాలములో జరుగుచున్న సంఘటనలను గూర్చి తెలుసుకొనుటకైనా ఆయన అంత్యకాల ప్రత్యక్షతలు సహాయము చేయవలసిన అవసరత ఉన్నది. మరియు ఇటువంటి ఆలోచనా దృష్టిని ఇచ్చుటకే ప్రకటన గ్రంథము ఉద్దేశించబడినది, “త్వరలో సంభవింపబోవు” సంగతులను అవగాహన చేసుకొనుటకే దేవుడు వాటిని యోహానుకు బయలుపరచెనని అనేకమారులు చెప్పబడినది. ఈ సంగతిని ప్రకటన గ్రంథము ప్రారంభములో, ప్రకటన 1:1, అదే విధముగా ముగింపుగా 22:6లో చూడవచ్చును. ప్రకటన 22:6లో ఈ విధముగా చదువుతాము.

ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు, త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను (ప్రకటన 22:6).

వాస్తవిక ప్రపంచములో జరుగు వాస్తవిక సంఘటనలను గూర్చి ప్రకటన గ్రంథము శ్రద్ధవహించుచున్నదని ఇటువంటి లేఖనములు మనకు తెలియజేయుచున్నవి. లేఖనములలో ఇటువంటి శాస్త్ర సమ్మతమైన అన్వయింపులను వెలికి తీయుటలో ఐడియలిజం మనలను నిరుత్సాహపరచుచున్నది.

ఆధునిక జీవితానికి ప్రకటన గ్రంథమును వ్యాఖ్యానించి, అన్వయించు నాలుగు సాధారణ పద్ధతులను గూర్చి మనము ఇంతవరకు చూశాము, కాబట్టి ఒక సమగ్రమైన పద్ధతిని తెలుపుటకు మనము సిద్దముగా ఉన్నాము.

మన సమగ్ర అన్వయింపు పద్ధతి ప్రీటరిజం, ఫ్యూచరిజం, హిస్టారిసిజం, మరియు ఐడియలిజంను గుర్తిస్తూ ఇవి ప్రకటన గ్రంథము ఆధునిక అవగాహనకు యెట్లు దోహదపడుతున్నాయో పరిశీలించుట ద్వారా ఇది ప్రారంభమగుచున్నది. కావున, ఈ సాధారణ పద్ధతులను పూర్తిగా తృణీకరించుటకు బదులు, ఈ పద్ధతులలో ఉన్న విలువైన దృక్పథములను మన సమగ్ర అన్వయింపు పద్ధతి మిళితము చేస్తుంది, మరియు అదే సమయములో వాటిలో ఉండే లోపాలను తొలగిస్తుంది.

ప్రకటన గ్రంథములోని ప్రవచనములు ఆ గ్రంథమును మొదట పొందుకొనిన చిన్న ఆసియాలో ఉన్న ఏడు సంఘములకు వర్తించునని చెప్పుచున్న ప్రీటరిజంలో మనము ఏకీభవించుచున్నాము. అయితే ప్రకటన గ్రంథములోని కొన్ని ప్రవచనములు క్రీస్తు యొక్క రెండవ రాకడ మరియు అంత్యతీర్పు చేత చుట్టబడి ఉన్నాయని చెప్పుచున్న ఫ్యూచరిజంతో కూడా మనము ఏకీభవించుచున్నాము. దేవుడు చరిత్రనంతటిని స్వాధీనములో ఉంచుచున్నాడని మరియు ఇవన్నీ సమకూడి క్రీస్తు యొక్క రెండవ రాకడ వైపుగా జరుగుచున్నాయని చెప్పుచున్న హిస్టారిసిజంతో కూడా మనము ఏకీభవించుచున్నాము. ప్రకటన గ్రంథములో సాతానీయమైన దుష్టశక్తులు ఇంకా మన విశ్వాసమును రాజీపడేటట్లు శోదిస్తాయి అని చెప్పుచున్న ఐడియలిజంతో కూడా మనము ఏకీభవించుచున్నాము.

సమగ్ర అన్వయింపు పద్ధతి రెండు భాగాలు లేదా సోపానాలు కలిగియున్నట్లు మనము సంగ్రహించవచ్చును. మొదటిగా, ప్రకటన గ్రంథములో ఉన్న నియమాలు మరియు సత్యాలు వివేచించుటకు అందుబాటులో ఉన్న ప్రతీ మార్గాన్ని మనము ఉపయోగించెదము. అవి దేవుని స్వభావమును గూర్చిన సత్యములు కావచ్చు, ఈ లోకముతో ఆయన వ్యవహరించుటను గూర్చిన సత్యము, ఆయన యెదుట మన బాధ్యతలను గూర్చిన సత్యము, చారిత్రక కాలవ్యవధిని గూర్చిన సత్యము లేక ప్రకటన గ్రంథములో యోహాను బోధించిన ఏ సత్యమైన కావచ్చును. మరియు రెండవదిగా, యోహాను శ్రోతల యొక్క పరిస్థితులకు మరియు మన జీవిత పరిస్థితులకు మధ్య సారుప్యతలను మనము చూడాలి. మరియు ఆ సమాంతరములు మన అన్వయింపుకు మార్గ దర్శకమౌతాయి.

ప్రకటన గ్రంథుములోని నియమాలు మరియు సత్యాలను అవగాహన చేసుకొను మొదటి సోపానము చాలా సంక్లిష్టమైనది, ఏలయనగా ఈ గ్రంథము అనేకమైన తలంపులను బోధించుచున్నది. కావున, యోహాను నొక్కి చెప్పుచున్న కొన్ని ప్రాముఖ్యమైన అంశములను చెప్పుకొనుట చాలా సహాయకరముగా ఉంటుంది. ఈ అంశములు ఆధునిక జీవితమునకు అనేక విధములుగా వర్తింపజేయుట సులభము.

ఉదాహరణకు, క్రీస్తు యొక్క జీవితము, మరణము, పునరుత్థానము మరియు పరలోకపు పరిపాలనను గూర్చిన సత్యము ఆయనను ఆరాధించునట్లు చేయుట మనము చూడవచ్చును.

దుష్టత్వముపైన క్రీస్తు యొక్క సంపూర్ణ విజయమును గూర్చిన తలంపుపైన కూడా మన దృష్టిసారించవచ్చును మరియు ఆయన రాజ్యము ఎప్పటికీ అంతము కాదు. వాటిని ఆరాధించు విధముగా మనలను ప్రలోభ పెట్టుచున్న లోకములోని సాతాను కార్యములకు వ్యతిరేకముగా మనము నిలువబడాలి, ఏలయనగా వారిని వెంబడించువారిని అది దీవించుటకు బదులు శపిస్తుందని మనము ఎరుగుదము. మరియు ఈ జీవితములో క్రీస్తుకు నమ్మకముగా ఉన్నవారు, రాబోవుచున్న జీవితములో మహిమాన్విత ప్రతిఫలము పొందుదురని మనము జ్ఞాపకము చేసుకోవాలి.

కష్టములో కొనసాగుటకు మనము పురికొల్పబడాలి, ఏలయనగా తన శత్రువులపైకి వచ్చు దేవుని ఉగ్రత యెదుట మనము పొందుచున్న శ్రమలు పోల్చతగినవి కాదు. భయంకరమైన ఆయన తీర్పునుండి దేవుని యొక్క నమ్మకస్తులైన ప్రజలు రక్షించబడుదురనే సత్యమునందు మనము ఆదరణ పొందుదము. ఈ లోకము నుండి పాపము యొక్క శాపము ఒక దినమున పూర్తిగా తొలగించబడుతుందనే పరిజ్ఞానము నుండి నిరీక్షణను వెలికితీయుదము, మరియు దేవుడు ఆయన ప్రజల మధ్య పరిపూర్ణ సమాధానము మరియు నీతితో నివాసముంటాడు. మరియు ఈ మధ్య సమయములో సంఘము ఇచ్చుచున్న సాక్ష్యమును దేవుడు ఆశీర్వదించుచున్నాడనే నిశ్చయతతో మనము ఉండగలము, మరియు ఆయన దానిని ఉపయోగించి అనేకమందిని విశ్వాసములోనికి తెచ్చును.

యోహాను యొక్క అసలైన శ్రోతలు మరియు ఈ దినమునున్న శ్రోతలకు మధ్య సారుప్యత కనుగొనే రెండవ సోపానము కూడా క్లిష్టమైనది, ఏలయనగా అచ్చట పరిగణించుటకు అనేకమైన వివరములు ఉన్నాయి. కావున, ఈ విధములైన అనుసంధానములు చేయడానికి బాధ్యతా యుక్తమైన అన్వయింపు పద్ధతులను కలిగియుండుట సహాయకరము.

రోమా సామ్రాజ్యమునకు మరియు ఆధునిక యుగమునకు చాలా ఆసక్తికరమైన సారుప్యతలు ఉన్నాయి, అవి ప్రకటన గ్రంథమును ఆధునిక జీవితమునకు అన్వయించుకొను విధముగా అవి అనుమతించుచున్నాయి. నేను అనుకొనుచున్న అతి ప్రాముఖ్యమైన సంగతి ఏమనగా, మొదటి శతాబ్దములో ప్రతికూలమైన ప్రభుత్వ బలగాలు ఉన్నాయి, అవి సంఘమునకు వ్యతిరేకముగా ఉన్నాయి. సంఘమనునది ప్రభుత్వముచేత తరచు అణగద్రొక్కబడుతు సమాజమునుండి వేరుచేయబడిన ఒక సమూహముగా ఉన్నది. నేను అనుకొనుచున్నదేమనగా, ప్రపంచములో అనేకమంది క్రైస్తవులకున్న సాధారణ అనుభవము ఇదే మరియు రానున్న శాతాబ్దాములలో పాశ్చాత్య దేశాలలో కూడా ఇది మరియెక్కువగా సర్వసాధారణమౌతుంది. కావున ప్రకటన గ్రంథములోని పాఠము ఏమనగా, సంఘము విజయవంతమౌతుంది, సంఘము చరిత్రకు మార్గమైయున్నదను మత్తయి 16:18లోని వాగ్దానము— ప్రకటన గ్రంథములో ఉన్న పాఠములు సమాజము వెలుపలికి తోయబడి, వేరుచేయబడిన సంఘమునకు విస్తృతముగా వర్తించుచున్నవి.

— డా. కార్ల్ ఆర్. ట్రూమాన్

ప్రకటన గ్రంథము యొక్క ప్రపంచము నుండి మరియు దాని ఆదిమ రచనల నుండి రెండువేల సంవత్సరములు దూరముగా ఉన్నప్పటికీ, అప్పుడున్న రోమా ప్రభుత్వానికి మరియు ప్రస్తుతపు కాలానికి కొన్ని సారుప్యతలు ఉన్నాయని నేను అనుకొనుచున్నాను, వాటిలో ఒక సత్యమేమనగా ఈ రెండు సందర్భాలలో కూడా చాలా, చాలా తారతమ్యములు గల ప్రజలు ఉండుట, చాలా ధనవంతులు మరియు చాలా పేదవారి మధ్య అంతర్గత ఒత్తిడులు మరియు ఆశ్చర్యకరమైన భిన్నాభిప్రాయములు కూడా ఉండుట. అచ్చట అద్భుతమైన ఉద్యమాలు జరిగాయి— కాని కొన్ని స్థిరమైన కారకాలు కూడా ఉన్నాయి— మొదటి శతాబ్దములో అద్భుత ఉద్యమాలు ఉన్నాయి, ప్రజలు ఉద్యమిస్తున్నారు, ప్రయాణీకులు, వ్యాపారస్తులు, ప్రజలు స్వచ్చందముగా అవసరతను బట్టి వారి జన్మస్థలాల నుండి వేర్వేరు చోట్ల ఒక్కటిగా కట్టబడుచున్నారు, కావున మనతో చెప్పుటకు అనేక భాషాపరమైన దృక్పథములు మరియు సాంఘిక దృక్పథములు అచ్చట ఎన్నో ఉన్నాయని నేను భావిస్తున్నారు.

— డా. జేమ్స్ డి. స్మిత్ III

అనేకమైన చిన్న చిన్న సారుప్యతలతో పాటు, యోహాను అసలైన శ్రోతలకు మరియు మనకు మధ్యన అచ్చట కనీసము మూడు ప్రాముఖ్యమైన సారుప్యతలు ఉన్నాయి, అవి మన అన్వయింపునకు మార్గదర్శకముగా సహాయము చేస్తాయి.

మొదటిది, మొదటి శతాబ్దములో సృష్టిని పరిపాలించిన దేవుడే ఈ రోజున ఈ ప్రపంచమును పరిపాలించుచున్నాడు. ఆయన ఇంకనూ చరిత్రను నియంత్రిస్తున్నాడు. ఆయన ఇంకా తన ప్రజలను కాపాడుచున్నాడు. ఆయన ఇంకను ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. ఆయన ఇంకను మన విధేయతను, కృతజ్ఞతను మరియు స్తుతిని కోరుచున్నాడు.

రెండవది, చిన్న ఆసియాలో ఉన్న సంఘమును వేధించిన పాపభరితమైన, పతనమైన అదే లోకము ఈ దీనమున క్రైస్తవ్యమును వేధించుచున్నది. మనము ఇంకనూ ఆత్మీయ దుష్టశక్తులను ఎదుర్కొనుచున్నాము. ప్రకృతిలో జరుగుతున్న సంఘటనల వలన మనమింకనూ కష్టమును అనుభవిస్తున్నాము. మనము రోగము మరియు ఆకలికి వ్యతిరేకముగా పోరాడుచున్నాము.

మరియు మూడవది, మనుష్యులు ఇంకనూ అదే విధముగా ఉన్నారు. మనము ఇంకనూ రక్షణ, స్వస్థత, మరియు దేవునితో సమాధానపర్చబడిన సంబంధాలు కలిగియుండే అవసరతను కలిగియున్నాము. ఇటువంటి సారుప్యతలు, మొదటి శతాబ్దములో ప్రకటన గ్రంథము ఏ విధముగా వర్తిస్తుందో, నేడు కూడా అదే విధముగా వర్తించుచున్నది అని చెప్పుచున్నవి.

అనేక విధములుగా, ప్రకటన గ్రంథము అన్ని కాలములలో ఉన్న క్రైస్తవులకు నిరీక్షణను ఇచ్చుచున్నది. దాని సందేశములు కాలాతీతమైనవి, ఎల్లప్పుడు వర్తించునవి మరియు చిన్న ఆసియాలో ఉన్న సంఘములకు మాదిరిగానే నేడు మనకు కూడా ఎంతో శక్తివంతమైనవి. ప్రతీ పరిస్థితిలో క్రీస్తునకు నమ్మకముగా ఉండాలని ప్రకటన గ్రంథము మనలను పోత్సాహపరచుచున్నది. మరియు భవిష్యత్తును గూర్చి మనకు నిరీక్షణ ఇచ్చుచున్నది. కొన్నిసార్లు చూచుకున్నప్పుడు మన జీవితాలు ఎంత కష్టముగా ఉన్నప్పటికీ, మనము నిజముగా విజయ పథములోనే ఉన్నాము. మరియు ఈ నిరీక్షణ మనలను కొనసాగింపజేయుచున్నది, ఏలయనగా పరిపూర్ణ, శాశ్వత సృష్టిలో పరిపాలకులుగా మరియు వారసులుగా మనలను ఆశీర్వదించుటకు ఒకానొక దినమున క్రీస్తు రానైయున్నాడు.

ఈ పాఠములో, ప్రకటన గ్రంథము చెప్పుచున్న ఆశీర్వాదములు, మరియు శాపపు హెచ్చరికల దృక్పథములో ఈ గ్రంథము యొక్క ఉద్దేశమును మనము పరిశీలించియున్నాము; దాని మూలాంశములోని వివరములను అవలోకనము చేసియున్నాము; మరియు కొన్ని సాధారణ అన్వయింపు పద్ధతులను దృష్టిలో పెట్టుకొని ఆధునిక అన్వయింపును పరిగణించాము మరియు సమగ్ర అన్వయింపు పద్ధతిని చూచియున్నాము.

ఈ పాఠమంతటిలో, దేవుని యొక్క అంత్య విజయమును ప్రకటన గ్రంథము నిశ్చయపరుస్తుంది, మన కొనసాగింపును ప్రోత్సహిస్తుంది మరియు క్రీస్తు రాకడ కొరకు మన ఎదురుచూపును బలపరుస్తుంది. మన భవిష్యత్ ఆశీర్వాదము నిశ్చయము. శోధించబడినప్పుడు లేదా ఇంకా హింసించబడినప్పుడు అది మనకు ఆదరణ, మరియు కృత నిశ్చయత నిచ్చుచున్నది. మనము వేదాంత శాస్త్ర సంబంధమైన విభేదాలు కలిగియుండాలని దేవుడు ఈ పుస్తకమును ఇవ్వలేదు. ప్రతీ కాలములోనున్న ప్రతీ విశ్వాసి ఆయనకు నమ్మకముగా ఉండాలని మరియు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ రాకడ యందు నిరీక్షణ కలిగియుండునట్లు ప్రోత్సహించుటకు ఆయన ఉద్దేశించియున్నాడు.

Continue reading the full transcript