<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
క్యాటలాగ్‌కు తిరిగి వెళ్ళుREVప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం ·Videoఆంగ్లం నుండి అనువాదం చేయబడింది

REV-03 రాజు మరియు ఆయన రాజ్యం

పూర్తి వచనం చదవండి

ఈ వీడియో అదే శ్రేణిలోని పాఠం 3కి తోడుగా ఉంటుంది. ఇది ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిస్తుంది: దేవునికి సర్వ సృష్టిపై రాజుగా పరిపాలించే హక్కు ఏమిటి? యేసు సుజరైన్ రాజు కంటే వాసల్ రాజుగా ఎలా ఉన్నాడు? ప్రకటన గ్రంథం రోమన్ సీజర్ అధికారాన్ని బలహీనపరిచిందా? క్రైస్తవులు ప్రభుత్వం పట్ల ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి? సాతానుకు ప్రస్తుతం మన ప్రపంచాన్ని ప్రభావితం చేసేంత స్వేచ్ఛ, శక్తి ఎంత ఉంది? పాత నిబంధనలో, దేవదూతలు, దెయ్యాలు జాతీయ పరస్పర చర్యలు, యుద్ధాలను ప్రభావితం చేశారా? ప్రకటన గ్రంథం ఆధ్యాత్మిక యుద్ధాన్ని ఎలా చిత్రీకరిస్తుంది? పరిశుద్ధాత్మ మనకు ఆధ్యాత్మిక యుద్ధం కోసం ఎలా అనుగ్రహిస్తుంది? క్రైస్తవులు నేడు విగ్రహారాధనకు ఎలా ప్రలోభపడతారు? ప్రజలు పట్టుదలతో ఉంటే మాత్రమే ఆశీర్వాదాలు వస్తే, మనం విఫలమైనప్పుడు మనకు ఏమి జరుగుతుంది? ప్రకటన గ్రంథం విశ్వాసులను ఎలా ప్రోత్సహిస్తుంది? మన భూసంస్థారాధన స్వర్గీయ ఆరాధనను ఎలా ప్రతిబింబిస్తుంది? ప్రకటన గ్రంథం ప్రకారం, మానవ చరిత్ర యొక్క లక్ష్యం ఏమిటి? కొత్త ఆకాశం, కొత్త భూమి ప్రస్తుత ఆకాశం, భూమి కంటే ఎలా సుపరిచితంగా, భిన్నంగా ఉంటాయి? క్రీస్తు శత్రువులందరూ చివరి తీర్పులో ఖండించబడతారని ఇచ్చినట్లయితే, అవిశ్వాసుల పట్ల మనం ఎలాంటి వైఖరిని కలిగి ఉండాలి? విచారణలు, బాధలను ఎదుర్కొనేందుకు మనం ఏ పాటి చర్యలు తీసుకోవచ్చు? యేసు పట్ల నమ్మకంగా ఉండటం ఎంత ముఖ్యం?


From the transcript

యేసు బంధింపబడిన తరువాత, ఆయన పొంతి పిలాతు నొద్దకు తేబడెను, మరియు యూదుల రాజువు నీవేనా అని పిలాతు ఆయనను అడిగెను. యేసు నేరుగా దానికి సమాధానమియ్యలేదు. దానికి బదులుగా, “నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు... నా రాజ్యము ఇహసంబంధమైనది కాదని” ఆయన చెప్పెను. పిలాతు కైసరును ఎరిగినవాడు మరియు ఆయన అంతఃపురమును చూచినవాడు. ఒక రాజు ఏ విధముగా ఉంటాడో, ఒక ఖచ్చితమైన అవగాహనను ఆయన కలిగియున్నాడు. మరియు తన ముందు నిలిచియున్న ఈ మనుష్యుడు ఒక రాజువలె కనిపించుటలేదు. యేసు చెప్పిన మాటలు ఆయనకు ఎంత నమ్మశక్యముగా లేవో ఊహించండి.

యేసు నిజముగా రాజు అవునా, కాదా అని ఈ దినమున విశ్వాసులు కూడా ప్రశ్నించడానికి శోధించబడుతున్నారేమో. తుదకు, ఒక్కసారి మన చుట్టూ చూస్తే, లోకమందంతటా దేవుని పరిపాలనకు వ్యతిరేకత కనబడుతుంది. కానీ పిలాతు ప్రశ్నకు యేసు ఇచ్చిన జవాబు ప్రకటన గ్రంథములోని ప్రాముఖ్యమైన అంశములలో ఒకటి. యేసు రాజుగా పరిపాలన చేయుచున్నాడు, కానీ ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరియు ఆయన రాజ్యము వచ్చుచున్నదనే నిరీక్షణను ప్రకటన గ్రంథము ఇచ్చుచున్నది. దానిని మనము ఇప్పుడు పాక్షికముగా అనుభవించుచున్నాము, కానీ క్రీస్తు తిరిగి వచ్చునప్పుడు పూర్తిగా అనుభవించుదము. ఏలయనగా, ఈ లోకములో అంతిమ విజయము క్రీస్తుదే, ఆయన తిరిగివచ్చు పర్యంతము వరకు ఆయనను ప్రేమించాలని మరియు విధేయులముగా ఉండాలని యోహాను మనలను పిలచుచున్నాడు.

ప్రకటన గ్రంథముపై శీర్షికలో ఇది మన మూడవ పాఠము, మరియు దీనికి మనము “రాజు మరియు ఆయన రాజ్యము” అని పేరుపెట్టియున్నాము. “దేవుని రాజ్యము” అనే ముఖ్య అంశము ప్రకటన గ్రంథమంతటిలో యెట్లు కొనసాగించబడినదో మరియు దానికి సంబంధించిన అనేకమైన బోధలను ఏ విధముగా కలుపుతూ ఉందో ఈ పాఠము పరిశోధిస్తుంది.

దేవుడు తన రాజ్యమును పరిపాలించుట, ప్రాచీన కాలములో రాజ్యపు ఒప్పందములకు ఛాయగా ఉన్నట్లు మునుపటి పాఠ్యభాగములో చెప్పుకున్నాము, ఇది ప్రాముఖ్యముగా గొప్ప చక్రవర్తులు మరియు వారికి సేవచేయుచున్న రాజ్యములపై అధికారము కలిగిన సామంత రాజులకు మధ్యన కుదుర్చబడేది. దేవుడు తన ప్రజలతో కలిగియున్న సంబంధములు మూడింటిని ఈ ఒప్పందములలో లేదా నిబంధనలలో మనము ఎత్తి చూపియున్నాము, అదేమనగా: చక్రవర్తులు సామంతులపట్ల దయచూపుట, దేవుడు తన ప్రజల యెడల దయచూపుటకు సాదృశ్యముగా ఉన్నది. చక్రవర్తి తన సామంతుల యొద్ద నుండి కోరుచున్న విధేయత, దేవుడు తన ప్రజల యొద్ద నుండి కోరుచున్న విధేయతకు సాదృశ్యముగా ఉన్నది. మరియు సామంతుల విధేయత లేదా అవిధేయత వలన కలుగు ఫలితము, ఆయనకు నమ్మకముగా ఉండువారికి ఆశీర్వాదమును మరియు నమ్మకత్వములేని వారికి శాపమును దేవుడు అనుగ్రహించుటకు సాదృశ్యముగా ఉన్నది. నిబంధన యొక్క ఈ మూడు ప్రత్యేకతలు ప్రకటన గ్రంథమంతటిలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.

“రాజు మరియు ఆయన రాజ్యము” అను మన పాఠము, ప్రాచీన నిబంధనల ప్రాథమిక ఆకృతిని కలిగియున్న నాలుగు భాగములుగా విభజించబడినది. మొదటిగా, దేవుడు, దైవికమైన ప్రభువుగా లేదా చక్రవర్తిగా కలిగియున్న రాజ్యాధికారమును, అదే ప్రకారముగా దేవుని సామంతరాజుగా యేసు కలిగియున్న రాజ్యాధికారమును మనము పరిగణించుదము. రెండవదిగా, తన నిబంధన ప్రజలపట్ల దేవుడు చూపించు దయను ప్రకటన గ్రంథము ఏ విధముగా ఎత్తి చూపుచున్నదో పరిశోధించెదము. మూడవదిగా, దేవుడు తన ప్రజల యొద్ద నుండి కోరుచున్న విధేయతను చూచెదము. నాల్గవదిగా, దేవునికి విధేయత లేదా అవిధేయత చూపించుట వలన కలుగు పర్యవసానముల వైపు తిరుగుదము. దైవికమైన ప్రభువుగా దేవుని రాజ్యమును మరియు ఆయన సామంతరాజుగా యేసుతో మనము ప్రారంభించుదము.

దేవుడు మరియు యేసు యొక్క రాజత్వమును గూర్చిన మన సంభాషణ రెండు అంశములపైన దృష్టి సారించుచున్నది. మొదటిగా, సృష్టియంతటిపైన ప్రభువుగా దేవుని యొక్క రాజత్వమును మనము పరిశీలించెదము. మరియు రెండవదిగా, దేవుని సామంతరాజుగా లేదా రాజు సేవకునిగా క్రీస్తు యొక్క రాజత్వమును మనము వివరించెదము. దేవుని యొక్క రాజత్వముతో ప్రారంభించుకుందాము.

కీర్తనలు 103:19 వంటి అనేక లేఖన భాగములు, దేవునిని సార్వభౌమునిగాను, మరియు సృష్టియంతటిపైన అధిపతిగాను వర్ణించుచున్నవి. తాను సృష్టించిన దానంతటిపైన సంపూర్ణ అధికారము మరియు శక్తి ఆయన కలిగియున్నాడు. మరియు ఈ విశ్వమును దాని జీవరాశులను పరిపాలించుట ద్వారా ఆ అధికారమును మరియు శక్తిని ఆయన కార్యసాధకము చేయుచున్నాడు.

ఆయనే సృష్టికర్త గనుక ఈ సృష్టియంతటిని పరిపాలించే అధికారము దేవుడు కలిగియున్నాడు. ఆయన దీనంతటిని చేసియున్నాడు. ఇది ఆయనకు చెందినది, మరియు దీనిపై పరిపాలన హక్కును ఆయన కలిగియున్నాడు. మరియు కీర్తనల గ్రంథములో ఒక లేఖన భాగము ఉన్నది — కీర్తనలు 24:12 — అది ఈ సత్యమును స్పష్టము చేయుచున్నది: “భూమియు దాని సంపూర్ణతను లోకమును దాని నివాసులును యెహోవావే” — ఏలయనగా — “ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాని స్థిరపరచెను.” కావున ఆయన దానిని సొత్తుగా కలిగియున్నాడు. ఆయన దానిని చేసెను గనుక దానిని పాలించుచున్నాడు. అది ఆయనకు చెందినది.

— డా. రాబర్ట్ బి. చిష్లోం, జూ.

తనకు వేరైన దానినుండి దేవుడు అధికారమును పొందజాలడు. ఆయనే తన అధికారమైయున్నాడు. అయన గుణలక్షణములు, అన్నియు, అధికారపూరితమైనవి. అయితే మానవులు కలిగియున్న అధికారము వంటిది కాదు అది, మానవాధికారము క్రూరమైనది, లేదా చపలమైనది లేదా నిరంకుశమైనది. ఆయన అధికారము మంచిది ఏలయనగా దేవుడు మంచివాడు. మనము ఆయన అధికారమును నమ్మెదము ఏలయనగా ఆయన అద్భుతమైన కార్యములను చేసియున్నాడు. ఆయన అధికారమునకు గొప్ప రుజువు ఏదనగా, మన పాపముల కొరకు మరణించుటకు తన కుమారుని పంపించుట మరియు మనలను నీతిమంతులను చేయుటకు ఆయనను లేపుట. ఏ తత్వజ్ఞానము లేదా, ఏ దేవుడు ఇటువంటి అధికారముతో ప్రత్యుత్తరమియ్యలేదు. కావున దేవుని అధికారము ఆయనయందే ఉన్నది, అయితే అది మరలా మరలా యేసు క్రీస్తు నందు రుజువు చేయబడుచున్నది.

— డా. విలియమ్ ఎడ్గర్

సృష్టియంతటిపైన దేవుడు గొప్ప రాజుగా ఉన్నట్లు ప్రకటన గ్రంథము తరచూ మాట్లాడుచున్నది, మరియు విశ్వమంతటిపైన క్రియాశీలతగల ఆయన పరిపాలనను గూర్చి నొక్కి చెప్పుచున్నది. ఈ విషయాన్ని ప్రకటన 1:4-6లో యోహాను తన పాఠకులకు వందనములు చెప్పుటలో మనము చూడవచ్చు. ప్రకటన 4–5 అధ్యాయములలో పరలోకపు సింహాసనపు ఆవరణను గూర్చిన వివరణలో మనము దీనిని చూడవచ్చు. ప్రకటన 7:9-10లో, ప్రతీ జనములో నుండి ప్రజలు సింహాసనము యెదుట నిలువబడి ఆయనను స్తుతించుటలో మనము దీనిని చూడవచ్చు. 11 మరియు 12 వచనములలో దేవదూతలు కూడా అదే ప్రకారము చేయుటలో కూడా మనము దీనిని చూడవచ్చును. మరియు ఈ పుస్తకములో మిగిలిన భాగములలో దేవుడు తన సింహాసనముపైన ఆసీనుడై యుండుటను గూర్చి తరచూ చెప్పుచున్న వాటిలో కూడా దీనిని మనము చూడవచ్చు.

ఒక ఉదాహరణగా, ప్రకటన 1:4-6లో చిన్న ఆసియాలో ఉన్న సంఘములకు యోహాను ఏ విధముగా వందనములు చెప్పుచున్నాడో వినండి:

యోహాను ఆసియలో ఉన్న యేడు సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది: వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉన్నవానినుండియు, ఆయన సింహాసనము ఎదుటనున్న యేడు ఆత్మలనుండియు, నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు, కృపాసమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి, మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక — ఆమేన్‌! ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను (ప్రకటన 1:4-6).

ఈ కొన్ని వచనాలలో దేవుని రాజ్యమును గూర్చిన విషయాలు ఎన్ని ఉన్నాయో గమనించండి. దేవుడు తన సింహాసనముపైన ఆసీనుడైయున్నాడు; భూరాజుల పైన యేసు ఆధిపత్యము కలిగియున్నాడు; మరియు సంఘము దేవుని సేవించే రాజ్యమైయున్నది.

దేవుని రాజ్యము అనే అంశము లేఖనములో అధికమైన ప్రాముఖ్యతగల అంశము, మరియు అది యేసు బోధకు కేంద్రమైయున్నదని అనేకమంది ఒప్పుకుంటారు. కావున దేవుని రాజ్యమంటే అర్థమేమిటి? తుదకు అర్థమేమనగా దేవుడే రాజు, దేవుడే సార్వభౌముడు, దేవుడే ప్రభువు, ఆయన ఈ విశ్వమంతటికి ప్రభువైయున్నాడు. లేఖనములలో చెప్పబడిన ప్రకారము లేదా వ్రాయబడిన ప్రకారము, లేఖనముపై అది రెండు ప్రధానమైన పార్శములను కలిగియున్నది. మొదటిది, ఆది నుండి అంతము వరకు దేవుడు సార్వభౌముడుగా నుండుట — చరిత్రలో, ప్రతీ కాలములో, ప్రతీ స్థలములో దేవుడు రాజుగానుండుట. వేరొకటి మానవుల పైన మరియు మానవ చరిత్ర పైన ఆయన ప్రభువుగా రాజత్వమును కనబరచుట.

— డా. మార్క్ ఎల్. స్ట్రాస్

దేవుని రాజ్యము సక్రమమైనది, దేవుని యొక్క న్యాయపూర్వకమైన అధికారమును గుర్తించి, వారి యొక్క జీవితములలో అంగీకరించిన ప్రజల యందు దేవుని పరిపాలన నిజముగా ఉన్నది, వారు ప్రేమతో, నమ్మకముతో, సంపూర్ణముగా మరియు ఉద్దేశపూర్వకముగా దేవుని యొక్క సార్వభౌమత్వమునకు అప్పగించుకొనిన వారు. ఇప్పుడు, దానర్థమేమనగా సంఘము ఒక విధముగా దేవుని రాజ్యమునకు ప్రత్యక్ష సాదృశ్యము. సృష్టిలో, చరిత్రలో, మరియు ఇప్పుడు కూడా దేవుని రాజ్యము కనబడునట్లు సంఘము రూపించబడినది. అయితే మనము ఇప్పుడు విధేయత చూపుట కేవలము రానున్న దానికి ముంగుర్తుగా ఉన్నది. తుదకు, దేవుడు అన్నిటిని నూతన పరుస్తాడు. ప్రతీ శత్రువును దేవుడు నాశనము చేస్తాడు. మనము ఆయనను సంపూర్ణముగా తెలుసుకొనుటకు మరియు ఆయనకు సంపూర్ణముగా విధేయత చూపుటకు ఆయన ప్రతీ ఆటంకమును తొలగిస్తాడు. ఆయన ఆ ఆటంకములను తొలగిస్తాడు. అది దేవుని అంతిమ వాగ్దానము. కానీ ఇపుడైతే, యేసుక్రీస్తు దేవుని యొక్క రక్షణయైయున్నాడని మరియు మన జీవితముల పైన దేవుడు అధికారమును కలిగియున్నాడని మనము గుర్తించి, హృదయపూర్వకముగా, ప్రేమగా, స్వేచ్ఛగా కనిపెడుతూ ఆ ప్రకారముగా, మనము పాల్గొనవలసియున్నది. మరియు దాని ద్వారా, రాకడలో వాగ్దానము చేయబడిన దేవుని రాజ్యము కొరకు సంఘము సాక్ష్యమియ్యవలసియున్నది.

— డా. స్టీవ్ బ్లేక్ మోర్

పశ్చిమ ఆసియ సామ్రాజ్య చక్రవర్తుల వలె, తన ఆజ్ఞలను నెరవేర్చుటకు దేవుడు సేవకులను నియమించియున్నాడు — వారు తన తరపున పరిపాలించు మరియు తన రాజ్యమును స్థిరపరచు సామంతులు. సాధారణ మాటలలో, నిబంధనను స్థాపించే వాని యొక్క అధికారమునకు ఒప్పుకొనిన మానవ జాతికి, దేవుడు ఈ బాధ్యతను అప్పగించియున్నాడు.

ముందు పాఠములో చూచినట్లు, దేవుడు తన ప్రజలతో చేసిన ఆరు ప్రధాన నిబంధనలలో నిబంధన స్థాపన వృద్ధిచెందినది అవేవనగా: ఆదాము, నోవహు, అబ్రాహాము, మోషే, దావీదు మరియు క్రీస్తుతో చేయబడిన నిబంధనలు. మొదటి రెండు నిబంధనలు — ఆదాము మరియు నోవహుతో చేసినవి — భూమియందంతటిపైన దేవుడు రారాజుగా ఉన్నట్లు, మరియు మానవ జాతి ఈ భూమి మీద ఆయన చిత్తమును జరిగించు సామంత రాజ్యముగా సూచిస్తుంది. ఈ నిబంధనల యొక్క షరతుల ప్రకారము, దేవుని యొక్క సార్వభౌమత్వము ఈ భూమి మీద ఇతర రాజ్యములకు వ్యాపించుచున్నది; ప్రతీ ఒక్కరూ ఆయనకు లెక్క అప్పగించవలసియున్నది.

ఆదాము మరియు నోవహుతో తాను నిబంధనలు చేసిన తరువాత, దేవుడు అబ్రాహాము, మోషే మరియు దావీదులతో నిబంధనలు చేసి, ప్రాచీన ఇశ్రాయేలు రాజ్యముతో ఒక ప్రత్యేకమైన విధానములో తన రాజత్వమును దేవుడు స్థాపించియున్నాడు.

ఒక ఉదాహరణగా, నిర్గమకాండము 19:4-6లో దేవుడు ప్రాచీన ఇశ్రాయేలు రాజ్యముతో చెప్పిన మాటలను వినండి:

నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల, మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు (నిర్గమకాండము 19:4-6).

ఈ లేఖన భాగములో, ఐగుప్తు బానిసత్వములో నుండి వారిని విమోచించినప్పుడు వారిపట్ల ఎటువంటి కనికరమును చూపించియున్నాడో దేవుడు ఇశ్రాయేలు వారికి జ్ఞాపకము చేయుచున్నాడు. తాను వారితో చేసిన నిబంధనకు లోబడుట ద్వారా విధేయతను చూపించాలని ఇశ్రాయేలు వారికి చెప్పుచున్నాడు. వారు నిబంధనకు విధేయత చూపించుటవలన పొందు ఆశీర్వాదములను ఆయన వారికి సూచించుచున్నాడు.

ప్రత్యేకముగా దావీదుతో చేసిన నిబంధనలో, తన ప్రజలకు ఆశీర్వాదపు ప్రవాహము మరియు తీర్పునకు సాదృశ్యముగా దావీదు వంశావళిని దేవుడు స్థిరపరచుచున్నాడు. ఈ నిబంధన 2 సమూయేలు 7:1-17, కీర్తనలు 89 మరియు కీర్తనలు 132 వంటి లేఖన భాగాలలో చెప్పబడినది. దావీదు యొక్క కుమారులు దేవుని సామంతులని అవి చెప్పుచున్నాయి. వారు దేవుని యెదుట ఇశ్రాయేలు వారి రాజ్యమంతటికి ప్రాతినిధ్యము వహించుచున్నారు. మిగిలిన అన్ని నిబంధనలలో ఉన్న ప్రకారము, దేవుడు దయను చూపించియున్నాడు, విధేయత కోరుకున్నాడు మరియు తన ఆశీర్వాదమునకు లేదా శాపమునకు దావీదు కుటుంబీకులే కారణమని జ్ఞాపకము చేసియున్నాడు.

తరువాత ఇశ్రాయేలు చరిత్రలో, దావీదు సంతానము ఘోరముగా విఫలమైనందున ఇశ్రాయేలు రాజ్యము శపించబడి, దేవుని చేత చెరకు అప్పగించబడ్డారు. అయితే చెరలో కూడా, కడవరి దినములలో నీతిమంతుడైన దావీదు కుమారుని ద్వారా దేవుడు తన నిబంధనను నూతన పరుస్తాడని ఇశ్రాయేలు ప్రవక్తల ద్వారా తెలియజేసియున్నాడు. యిర్మీయా 31:31లో, ప్రవక్తయైన యిర్మీయా ఈ నూతన పునరుద్ధరణను క్రొత్త నిబంధనగా పేర్కొన్నాడు. ఈ క్రొత్త నిబంధన దేవుని గొప్పదైన కనికరమునకు సాదృశ్యముగానున్నది. ఆయన తన ప్రజల హృదయములను మార్పుచేయుట వలన వారు ఆయనకు లోబడుదురు. అంతములేని తన నిబంధన ఆశీర్వాదములను వారు అనుభవింతురు, మరియు ఇంకెన్నటికీ శాపము నొందరు. అదే సమయములో, ఆయనను వ్యతిరేకించిన వారందరికి, తన సామంత రాజులకు, మరియు తన రాజ్య ప్రజలకు, ఆయన తీర్పుతీర్చును.

దావీదు మరియు ప్రాచీన ఇశ్రాయేలుతో దేవుని యొక్క నిబంధనలు, దావీదు మరియు ఇశ్రాయేలు వారికి మించి ఆశీర్వాదములు విస్తరించబడుటకు ఉద్దేశించబడినవి. దావీదు ఇంటివారిపైన దేవుని పరిపాలన ఇశ్రాయేలు వారందరి మేలు కొరకై ఉద్దేశించబడినది, మరియు ఇశ్రాయేలు వారి ఆశీర్వాదములు లోకమంతటికి మేలు కలుగుటకై ఉద్దేశించబడినవి. ఈ విషయాన్ని మనము క్రీర్తనలు 2, 67; యెషయా 2:2-4; మరియు ఆమోసు 9:11-15లో చూడవచ్చును. దావీదు ఇంటిలోనుండి దేవుడు ఒక విమోచకుని పంపిస్తాడు, మరియు ఆ విమోచకుడు ఇశ్రాయేలును రక్షిస్తాడు. మరియు ఇశ్రాయేలు ద్వారా, ఆయన సమస్త సృష్టిని రక్షిస్తాడు.

ఇప్పుడు, క్రీస్తు ద్వారా దేవుడు సంఘమును విమోచిస్తున్నాడు, మరియు మనలను తన పరిశుద్ధ, నిబంధన జనులుగా సమకూర్చుతున్నాడు. మరియు దాని ఫలితముగా, పాత నిబంధనలోని ఇశ్రాయేలుతో సంఘము ఇప్పుడు ఒకే రాజ్యముగా ఉన్నది.

ప్రకటన 1:5-6లో ఈ నిబంధన సంబంధము ఏ విధముగా వ్యక్తీకరించబడినదో వినండి:

భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు ... మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించి, మరియు ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను (ప్రకటన 1:5-6).

మన పాపములనుండి మనలను విమోచించుటకు యేసు మరణించినందున, మనము ఇప్పుడు దేవుని ప్రత్యేకమైన సంపాద్యముగాను మరియు రాజ్యముగాను ఉన్నామని ఈ వచనములు సూచిస్తున్నాయి. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు వారికి ఇచ్చిన పేరును: “రాజ్యము మరియు యాజకులు” అనేది మనము కూడా కలిగియున్నాము.

నిర్గమకాండము 19:6లో దేవుడు ఈ పేరును ప్రాచీన ఇశ్రాయేలు వారికి ఇచ్చియున్నాడు, అది ఇశ్రాయేలు వారికి ఒక నిబంధన ఆశీర్వాదమైయున్నది, వారు “యాజక రూపమైన రాజ్యముగాను, పరిశుద్ధ జనముగా” ఉందురని తెలుపబడినది.

అనేక శతాబ్దాలనుండి అనేకమంది దేవుని రాజ్యపు స్వభావమును గూర్చి వాదించుచున్నారు. దానిని మనము బైబిలు గ్రంథములో స్పష్టముగా కనుగొంటాము, అయినప్పటికీ దాని అర్థమును గూర్చి అనేకమైన వివాదములు ఉన్నవి. అయితే ఈ విధముగా మనము చెప్పవచ్చని నేను భావిస్తున్నాను చివరకు దాని సారాంశమేమనగా, ఈ లోకములో, సంఘములో మరియు వ్యక్తుల హృదయములలో దేవుని పరిపాలనయే దేవుని రాజ్యముగా వివరించబడినది, అనగా నీవు మరియు నేను లేఖనానుసారముగా దైవికమైన జీవితమును జీవిస్తే, మనము దేవుని రాజ్యములో పాలిభాగస్తులము అయ్యామని మనము చెప్పవచ్చును.

— డా. జాన్ ఆస్వాల్ట్

దేవుని రాజ్యమనగా ఏమిటి? మంచిది, మనము నిశ్చయముగా దానిని అనేక విధములుగా వివరించవచ్చును, కానీ దేవుని రాజ్యము ఎచ్చట స్థాపించబడుచున్నది అని చెప్పుకొనుట మనకు చాలా ప్రయోజనకరముగా ఉంటుందని నేను భావిస్తున్నాను — అది దేవుని రాజ్యము రాజు ద్వారా స్థాపించబడే ప్రాంతమైయున్నది, అచ్చట దేవుని స్తుతించుట, దేవుని మహిమపరచుట మరియు భూమి మీద జీవించిన విధానమునకు తీర్పుతీర్చబడుట ఉంటుంది. అందువలన యేసు బోధలో దేవుని రాజ్యమును గూర్చి చాలా ప్రాముఖ్యత ఉండుట మనము చూడవచ్చు. మరియు క్రొత్త నిబంధనలో మనము కనుగొనునదేమనగా, యేసు రాజుగా నుండుట మరియు దేవుని రాజ్యమును బలముతో ఈ లోకములోనికి తెచ్చుట. సాంకేతిక భాషలో పగిలి పైకివచ్చుట. అచ్చట బ్రద్ధలగుట ఉన్నది; తన మెస్సీయ రాజు ద్వారా దేవుడు ఈ లోకములోనికి ప్రవేశించుట కలదు. రాజ్యము ఎచ్చట నుండి వచ్చినదో ఒక గొప్ప విధముగా చెప్పుట గీర్ హార్ డస్ నుండి వచ్చింది, మరియు సువార్త వ్యాపించిన చోట, హృదయాలు మార్పునొందినప్పుడు, పాపము, అపరాధముములు అధిగమించబడినప్పుడు, నీతిమత్వము సాధన చేయబడినప్పుడు మరియు దేవునితో ఒక సజీవమైన సహవాసము ఏర్పడినప్పుడు దేవుని రాజ్యము వస్తుంది అని ఆయన చెప్పాడు.

— డా. బ్రాండన్ క్రో

పరలోక రాజ్యమును భూమిమీద స్థాపించి, నమ్మకస్తులైన ప్రజలతో ఈ భూమిని నిండించుటయే దేవుని యొక్క లక్ష్యమైయున్నది. పరలోకమందు, దేవుని చిత్తము సంపూర్ణముగా నెరవేర్చబడుతుంది. కాని భూమి మీద, ఆయన సృష్టి ఆయన చిత్తము చేయుటకు తరచూ నిరాకరిస్తుంది. వారు దేవునిని రాజుగా అంగీకరించుటకు నిరాకరిస్తున్నారు, మరియు ఈ లోక రాజ్యములు దేవుని పరిపాలనను వ్యతిరేకిస్తున్నాయి. కావున, యేసు పరలోక ప్రార్థనను బోధించినప్పుడు, ఒకరోజున వ్యతిరేకించే ఈ రాజ్యాలన్నీ ఓడించబడి, కేవలము దేవుని రాజ్యము మాత్రమే నిలిచి ఉండాలని ఆయన ప్రార్థించాడు.

రానున్న దినములను గూర్చి ప్రకటన 11:15 ఏ విధముగా మాట్లాడుతుందో వినండి:

ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు యేలుననెను (ప్రకటన 11:15).

ఈ లోకమంతటిని జయించి, నిండించే వరకూ దేవుని ప్రత్యేక రాజ్యము కొనసాగుతూనే ఉంటుంది. బైబిలు ప్రవచనము యొక్క అంతిమ గమ్యము ఇదే. యేసు తన మహిమతో తిరిగివచ్చినప్పుడు, దేవుని ప్రత్యేకమైన పరిపాలన ఈ భూమి మీద నున్న ప్రతి రాజ్యమును చుట్టుకొంటుంది. యిర్మీయా 31:31-34, జెకర్యా 14:9 మరియు లేఖనాలలోని అనేక భాగములలో ఇదే నిరీక్షణ బోధించబడినది.

పశ్చిమ ఆసియాలో ఉన్న రాజ్యపు సాదృశ్యములు కంటే దేవుని రాజరికము చాలా అధికముగా ఉంటుంది. ప్రాచీన ప్రపంచములో, మానవ చక్రవర్తులు తమ నిబంధనల ద్వారా చేసిన వాగ్దానపు ఆశీర్వాదములను పూర్తిగా నెరవేర్చలేకపోయేవారు. వారు తమ దాసుల యొక్క విధేయతను ఎన్నడూ సంపూర్ణముగా పరిశీలించేవారు కాదు, మరియు వారు ఎన్నడూ నిబంధనా పర్యవసానములను జరిగించే వారు కాదు. కానీ దేవుని నిబంధనలో మన ప్రభువు నిబంధన ఆశీర్వాదములకు తగినట్లు జరిగిస్తాడు. ఆయన పరిపూర్ణముగా మన విధేయతను పరిగణిస్తాడు. మరియు నిబంధనా పర్యవసానముగా కలుగు ఆశీర్వాదమును లేదా శాపమును సంపూర్ణ క్రమశిక్షణతో ఆయన తీర్పుతీర్చుతాడు. మరియు మనము చూడబోతున్నట్లుగా, మన తరపున యేసుక్రీస్తును తన యొక్క రాకుమారుని ఆయన పంపించియున్నాడు మరియు ఆయన సంపూర్ణముగా దేవునికి విధేయత చూపించి, మన అవిధేయతకు కలుగు ఫలితమును తానే భరించినందున మనము ఆయనలో రక్షణ కలిగియున్నాము.

దేవుని యొక్క సార్వత్రిక రాజరికమును గూర్చిన అవగాహనను మనస్సులో పెట్టుకొని, దేవుని సేవకునిగా లేదా సామంత రాజుగా క్రీస్తు యొక్క రాజత్వమును తెలుసుకొనుటకు సిద్ధపడుదము.

ప్రాచీన దావీదు రాజత్వము వెలుగులో క్రీస్తు యొక్క రాజత్వమును అవగాహన చేసుకొనవలసియున్నది ఏలయనగా దావీదు యేసునకు ఛాయగా ఉన్నాడు. ఆయనే మెస్సీయగా ఉన్నాడు. పాత నిబంధనలో, దావీదు యొక్క రాజత్వము అప్పటి తూర్పు దేశాల రాజ్యములను పోలి ఉండేది, అది చక్రవర్తి – సామంతరాజు సంబంధముగా ఉండేది, అందులో చక్రవర్తియైన రాజు, సాధారణముగా ఒక ఒప్పందముతో ప్రజలను పాలించేవాడు. మరియు లోకమును పరిపాలించుటకు దావీదు దేవునిచేత ఎన్నుకొనబడినవాడు. కావున, తన తరపున పరిపాలన చేయుటకు దేవుడు దావీదును నియమించినట్లు అగుపడుతుంది. మరియు దానిని తుదకు సంపూర్ణముగా నెరవేర్చునది మాత్రము యేసే.

— డా. రాబర్ట్ బి. చిష్లోం, జూ.

ఈ విశ్వమునకు ప్రభువుగా కాకుండా ఒక సామంతునిగా లేక ఒక చిన్నపాటి రాజుగా యేసును తలంచుట క్రొత్తగా అనిపిస్తుంది. అంతా చూస్తే, యేసు దేవుడు, ఉనికిలో ఉన్న ప్రతిదానిని సృష్టించి, పరిపాలించేవాడు దేవుడు. యేసు సంపూర్ణముగా దేవుడని మేము నిశ్చయముగా చెప్పుచున్నాము, కానీ యేసు కేవలము దేవుడు మాత్రమే కాదు అని గ్రహించుట చాలా ప్రాముఖ్యము. ఆయన సంపూర్ణముగా మానవుడు కూడా. మరియు మానవునిగా, తన తండ్రియైన దావీదు సింహాసనము పైన ఆయన ఆసీనుడైయున్నాడు, ఆ ప్రకారముగా దేవుని సామంత రాజ్యమైన ప్రాచీన ఇశ్రాయేలుపైన రాజుగా తన కర్తవ్యమును నెరవేర్చియున్నాడు. ఈ విధముగా చూస్తే, యేసు యొక్క రాజత్వము మానవ సంబంధమైన కార్యముగా నున్నది. కావున, పాత నిబంధనలో దావీదువలె, యేసు దేవుని సామంతునిగా ఉన్నాడు.

బైబిలు గ్రంథములో ఉన్న నిబంధన క్రమము పశ్చిమ ఆసియా దేశాల రాజుల మధ్య జరిగిన ఒడంబడికల ఆధారముగా ఉన్నాయి. మరియు అనేకసార్లు చక్రవర్తి ఒక గొప్ప రాజుగాను, వారి మధ్య నిబంధనలో ఒక సామంత రాజు గొప్ప రాజుతో సంబంధము కలిగియుంటాడు. యూదా గోత్రపు సింహముగా, రాజుగా — దావీదు వంశపు రాజుగా యేసును ప్రకటన గ్రంథము వర్ణించుచున్నది. అటువంటి భాష కొన్ని విషయాలను బయలుపరచుచున్నది. వాటిలో ఒకటి ఏమనగా యేసు దేవునిని ప్రత్యక్షపరచుట మాత్రమే కాదుగానీ, తన నిజమైన మానవత్వమును బయలుపరచి, ఒక మనుష్యుని స్వభావము ఏమిటో సంపూర్ణముగా తెలియజేయుచున్నాడు. కావున క్రొత్త నిబంధనలో దావీదు కుమారునిగా, దేవుని కుమారుని భాష వాస్తవముగా, చాలా సార్లు, దావీదు వంశపు రాజుగా, మెస్సీయగా ఆయన పాత్రను సూచిస్తుంది. ఆ విధముగా, ఆయన చారిత్రక జనాంగమునకు ప్రాతినిధ్యము వహించుచున్నాడు. ప్రకటన గ్రంథము సందర్భములో, దేవుని ప్రజలు అనేక రాజ్యములలోనికి విస్తరించియున్నారు, ఆయనే మన రాజు, తండ్రి యెదుట మన ప్రతినిధి లేక మన చక్రవర్తియైయున్నాడు. కావున చరిత్రలో, కాలములో, ఆయనే మన రాజైయున్నాడు, తండ్రి యెదుట తన ప్రజలకు ప్రాతినిధ్యము వహించు సంపూర్ణ మానవుడైయున్నాడు. ఆయన దేవునికి కూడా ప్రాతినిధ్యము వహించుచున్నాడు, కానీ అది ఆయన సంపూర్ణ మానవుడు మరియు మన తరపున దేవుని యెదుట ప్రాతినిధ్యము వహించుచున్నాడనే సత్యమును త్రోసిపుచ్చదు.

—డా. గ్రెగ్ పెర్రీ

క్రీస్తు అనే పేరు, దావీదు వంశపు రాజుగా ఆయన చేయుచున్న కార్యమును సూచించుచున్నది. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థము. ఇది పాత నిబంధనలోని మాట, తరచూ దావీదు వంశపు రాజులకు వర్తిస్తుంది ఏలయనగా ఆ కార్యము చేయ మొదలు పెట్టుటకు వారు అభిషేకించబడినారు. దీనిని మనము 2 దినవృత్తాంతములు 6:42; కీర్తనలు 2:2, 6; కీర్తనలు 18:50; కీర్తనలు 20:6, 9; మరియు కీర్తనలు 45:1-2 వంటి లేఖన భాగాలలో చూడవచ్చును. అందువలననే యేసు దేవుని క్రీస్తు అని కూడా ప్రకటన 11:15 మరియు 12:10 వంటి లేఖన భాగాలలో చెప్పబడినది. ఆయన దేవుడు అభిషేకించిన రాజు — ఆయన యొక్క సామంత రాజు.

దావీదు గొప్ప కుమారునిగా, పాత నిబంధనలో ఎదురుచూచిన నూతన నిబంధన అంశాలను యేసు నెరవేర్చెను. ఆయనలో, దేవుని శ్రేష్ఠమైన దయ కనపరచబడినది. మన పక్షముగా సమస్త విధములైన ఆవశ్యకమైన విధేయతను క్రీస్తు, తనంతటతానే చూపించియున్నాడు. మన స్థానములో ఆయన మరణించినప్పుడు, నిబంధన ఫలితముగా సంభవించు శాపములన్నిటిని భరించాడు. మరియు ఆయన మరణము నుండి పునరుత్థానుడై, పరలోకమునకు ఆరోహణమైనప్పుడు నిబంధనా ఆశీర్వాదములను ఆయన పొందియున్నాడు.

సిలువలో మరణించి, మరణము నుండి తిరిగి లేచినందున దేవుని సామంతరాజుగా యేసు తన స్థానమును భద్రపరచుకున్నాడు. దేవుని ప్రజలను శిక్షించి, నాశనము చేయు ఎటువంటి పాపమునైనా ఆయన మరణము తొలగిస్తుంది.

ప్రకటన 12:10-11లో మనము ఈ విధముగా చదువుతాము:

రాత్రింబగళ్లు మన దేవునియెదుట మన సహోదరులమీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి యున్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను; ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొఱ్ఱపిల్ల రక్తమును బట్టి వానిని జయించియున్నారు (ప్రకటన 12:10-11).

క్రీస్తు సిలువయందు అర్పించబడినందున, సాతాను ఓడించబడ్డాడు. మరియు ఇప్పుడు క్రీస్తు దేవుని రాజ్యమందు అధికారమును కలిగియున్నాడు గనుక ఆయన రక్షణ తన ప్రజలకు వచ్చియున్నది.

యేసు యొక్క విధేయత మరణములోనుండి పునరుత్థాన ప్రతిఫలమును సంపాదించినది మరియు సృష్టించబడిన ఏ అధికారము కంటే కూడా అనగా మనుష్యులు, దేవాదూతలు లేదా దురాత్మలకంటే ఉన్నతమైన స్థానము ఆయనకు ఇవ్వబడినది.

తన పునరుత్థానము తరువాత మత్తయి 28:18-19లో ఆయన చెప్పినట్లుగా,

పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి (మత్తయి 28:18-19).

ఆయన యొక్క దైవిక స్వభావములో, యేసు ఎన్నడూ అధికారము పొందుకొనలేదు. ఆయనెప్పుడూ దానిని కలిగియున్నాడు. కానీ ఆయన మరణము నుండి తిరిగి లేచిన తరువాత, తండ్రియైన దేవుడు రాజ్యములన్నిటిపైన తనకు రాజరికపు అధికారమును ఇచ్చియున్నాడని యేసు చెప్పెను, దానర్థము ఆయన పరలోకము, భూమి మీద తన తండ్రి యొక్క మానవ సామంత రాజుగా అగుట.

తన పునరుత్థానము తరువాత, యేసు పరలోకమునకు ఆరోహణమైనప్పుడు, ఆయన రాజుగా సింహాసనాసీనుడైనాడు. హెబ్రీయులకు 1:3, 10:12, మరియు 12:2 వంటి లేఖన భాగాలలో క్రొత్త నిబంధన ఈ విషయాన్ని స్పష్టము చేయుచున్నది, అచ్చట యేసు తండ్రియైన దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడైయున్నాడని చెప్పబడుచున్నది. ఈ దృశ్యము తండ్రి మహా గొప్పరాజు లేదా ప్రభువుగాను, మరియు ఆయన కుమారుడైన యేసు ఆయనను సేవించి, ఆయనకు ప్రాతినిధ్యము వహించే మానవ సామంతునిగాను సూచించుచున్నది. దావీదు వంశావళిలో మరియు భూమి మీద అన్ని రాజ్యముల పైన యేసు చిట్ట చివరి రాజైయున్నాడు. ఆయన ద్వారా లోకమంతా నూతనపరచబడుతుంది. ఆయన సింహాసనాసీనుడైయున్నందున, యేసు సంఘమును ఒక రాజుగా పాలించుచున్నాడు. మరియు భూదిగంతముల వరకు రక్షణ కలుగజేయుటవలన ఆయన తన రాజ్యమును విస్తరింపజేయుచున్నాడు.

మానవ రాజులకు చాలా విరుద్ధముగా, మన విమోచనను సిలువయందు క్రమపరచుటకు దేవుడు తన కుమారుని సంపూర్ణమైన సామంత రాజుగా పంపించాడు. భూమిమీద తన జీవితములో విధేయతను కనబరచాడు మరియు మన అవిధేయత వలన కలుగు శ్రమను ఆయన సిలువయందు భరించాడు. మన క్షమాపణ మరియు విధేయతను కొనుటకు తన జీవితమును సిలువయందు అర్పించాడు మరియు మనలను కాపాడుతూ, సంరక్షించుచున్నాడు. కావున మనలను కనికరించే మన దేవునికి మరియు రాజుకు ప్రేమగల భక్తితో లోబడుతూ ఆయన కృపగల పరిపాలనకు మనము తప్పక అప్పగించుకొనవలసి యున్నది.

ఇంతవరకూ మనము తండ్రియైన దేవుని యొక్క సార్వభౌమ రాజత్వమును మరియు సామంత రాజుగా యేసు యొక్క రాజత్వమును పరిశీలించియున్నాము, ఇప్పుడు దేవుని రాజ్యము సందర్భములో ప్రకటన గ్రంథము దేవుని దయాళుత్వమును వర్ణించు విధానమును పరిగణించుదము.

నిబంధనలో ప్రభువుగా దేవుని యొక్క దయాళుత్వము ప్రకటన గ్రంథమంతటిలో అనేక విధముగా చూడవచ్చును. సందేహము లేదు, మన పాపముల కొరకు మరణించుటకు తన కుమారుని పంపించుటయే గొప్పదైన తన దయాళుత్వము. ఈ అంశము ప్రకటన 1:5; 5:9-10; 7:14; మరియు 14:3-4 వంటి లేఖనాలలో తెలుపబడినది.

కానీ, ప్రకటన 1:6; 11:15; మరియు 17:14లో ఉన్నట్లు, మనలను ఆయన నొద్దకు పిలచి, ఆయన రాజ్యములో మనలను పాలిభాగస్తులను చేయుటయందు దేవుని రాజరిక దయాళుత్వమును మనము చూడవచ్చు.

ప్రకటన 7:3-4 మరియు 9:4లో ఉన్నట్లు, అవిశ్వాసులైన వారికి ఈ గ్రంథములో చెప్పబడిన అనేకమైన తీర్పులు ఆయన ప్రజలమైన మనపైకి రాకుండా ఆయన తన కనికరమును విస్తరింప జేయుచున్నాడు.

ప్రకటన గ్రంథములో సంఘములకు ఇవ్వబడిన ప్రవచన హెచ్చరికలు మనము పశ్చాత్తాపము నొందడానికి ఇవ్వబడిన దయాళుత్వపు అవకాశములైయున్నవి. దేవుడు తన తీర్పులను నిలిపివేయుచున్నందున ప్రజలు శిక్షావిధి నుండి తప్పించుకొనుటకు అవకాశము కలుగుచున్నది. ఇటువంటి దయాళుత్వమును గూర్చి యోహాను ప్రకటన గ్రంథము 2:5, 16, 21 మరియు 3:3, 19లో వ్రాయుచున్నాడు.

ఆత్మీయ పోరాటములో తన ప్రజలను కాపాడుట ద్వారా దేవుని కృప, మరియు కనికరము కనబరచబడుట ప్రకటన గ్రంథములో తరచూ చూడవచ్చును. కావున, ఈ పాఠములో, ఆయా పోరాటములలో తన ప్రజలు నశించిపోకుండా ఆయన కాపాడు విధానములోని దేవుని రాజరికపు దయాళుత్వమును చర్చించుటయందు దృష్టిపెట్టుదము.

మంచిది, నా అంచనా ప్రకారము ఏ క్రైస్తవునికైనా ఆత్మీయ పోరాటము నిజమైనదిగాయున్నది. అచ్చట ఆత్మసంబంధమైన లోకము ఉన్నదని, అచ్చట సాతానుడు, మరియు ఆ ఆత్మలు ఉన్నారనియు — ఆ సాతానుడు — మనలను ఇష్టపడడని అవగాహన అవుతుంది. సాతాను యేసునే ముట్టడిస్తే, ఈ దినమున ఒక విశ్వాసి యొక్క జీవితమును సాతానుడు ఏ విధముగా ముట్టడి చేస్తాడో ఊహించండి, కావున దానికి మనము సిద్ధపడియుండాలి. యేసు దెకపొలి ప్రాంతానికి వెళ్లినప్పుడు తనకు కలిగిన మొదటి అనుభవము దురాత్మ-శక్తులతో నింపబడిన వ్యక్తి, ఒక దయ్యము పట్టిన వ్యక్తిని కనుగొనుట ఊహించండి ఈ రోజున అటువంటి దయ్యములు పట్టిన వారు ఉన్నారు, కావున ఆ విషయాన్ని మనము తీవ్రముగా ఆలోచించవలసియున్నది, మరియు ఈ విషయాలను తీవ్రముగా పరిగణించడానికి ఆయన పరిశుద్ధుడైయున్న ప్రకారము మనము పరిశుద్ధులమై యున్నామని మనము నిశ్చయపరచుకోవాలి.

—డా. మ్యాట్ ఫ్రీడెమాన్

క్రొత్త నిబంధనలో, ఆత్మీయ పోరాటము ప్రాథమికముగా మన వ్యక్తిగత పాపములకు వ్యతిరేకముగా జరిగించునది కాదు, కానీ ఈ లోకములో దేవునికి మరియు దురాత్మ సమూహాలకు మధ్య పోరాటము కొనసాగుతూ ఉంది. దురాత్మ శక్తులకు వ్యతిరేకముగా తన రాజ్యమును స్థిరపరచుటద్వారా దేవుడు ఇందులో ఒక విధముగా పనిచేయుచున్నాడు. ముందు పాఠములో తెలుపబడినట్లుగా, దేవుని యొక్క సహజాతీతమైన లోకములో చేయు కార్యములను మరియు అతీంద్రియశక్తులు దేవదూతలు, దయ్యములను గూర్చి మరియు మనము నివశిస్తున్న ఈ లోకములో వాటి ప్రభావములను గూర్చి ప్రకటన గ్రంథము తరచూ తెలుపుతూ ఉంది. క్రైస్తవ జీవితములో ఆత్మీయ పోరాటము యొక్క మూలాంశము అతీంద్రియ శక్తులు ఒకదానితో ఒకటి యుద్ధముచేయుటలోను, వారు మన లోకమును ప్రభావితము చేసి దేవునికి అవిధేయులుగా మనకు హానిచేయుట మరియు దయ్యపు ప్రభావము నుండి, కార్యక్రమాలనుండి దేవదూతలను పంపి మనలను కాపాడుటలోను ఉన్నది.

ఆత్మీయ పోరాటము అనే అంశము క్రైస్తవులకు చాలా సంక్లిష్టమైనది ఏలయనగా, ప్రతీవ్యక్తికి అది వేరేవేరేగా జరుగుతుంది. దాని ఫలితము జరుగు ఒక సంగతేమనగా, క్రైస్తవులు దానిని గూర్చి చర్చించుకున్నప్పుడు, వారు తరచూ చాలా విపరీతము లోనికి వెళ్లిపోతారు. ఒక విపరీతమైన సంగతి ఏమనగా, వారు ప్రతీదానిని ప్రకృతి లేదా శాస్త్రము ఆధారముగా వివరించడానికి ప్రయత్నిస్తారు, ఆత్మీయ పోరాటపు వాస్తవికతను మరచిపోతారు. అయితే, జరుగుతున్న వాటన్నిటిని శాస్త్రము ద్వారా వివరించుట సాధ్యము కాదు. మరొక విపరీతమైన సంగతి ఏమనగా, ప్రజలు ప్రతీదాని వెనుక దయ్యము ఉందని మరియు ప్రతీవిషయములో ఆత్మీయ పోరాటమును చూస్తారు. ఈ రెండింటికి మధ్యలో ఏదో ఒక చోట సత్యము ఉన్నదని నేను అనుకొనుచున్నాను. మనము ఆరాధన చేయుటకు సిద్ధపడునప్పుడు, లేక ఆత్మసంబంధమైన విషయములలో, సువార్త కార్యక్రమాలలో, చురుకుగా పాల్గొనుచున్నప్పుడు, లేదా ఇతరులకు ఆత్మీయముగా సహాయపడునప్పుడు, మనము తరచూ ఆత్మీయ వ్యతిరేకతను ఎదుర్కొంటాము. అది ఒక అనారోగ్యముగా రావచ్చు, లేదా నీకు సహాయము చేయుటకు ఇష్టపడని అధికారి ద్వారా కనబడవచ్చు. అది ఎక్కడనుండో వచ్చిన అడ్డంకులుగా కనబడవచ్చు, దానిని నీవు సాధారణరీతిలో వివరించలేవు. వాస్తవానికి, ఈ భౌతిక లోకములో చాలామట్టుకు ఆత్మీయ లోకము వ్యాపించియున్నది. అందువలననే మన జీవితములలో జరుగుచున్న అనేక భౌతిక ప్రక్రియలు ఆత్మీయ లోకములో జరుగు సంఘటనలను ప్రతిబింబిస్తున్నాయి. అయితే ఈ సంఘటనలకు హేతువు ప్రాముఖ్యమైన విషయము కాదు. వాటికి ఆత్మీయ కారణములు కావచ్చు లేదా మన పాపము వలన వచ్చు ప్రతిఫలము కావచ్చు. కానీ మనము ఎక్కడ ఉన్నప్పటికీ మరియు మనకు ఏది జరిగినప్పటికీ, మన ప్రభువు మనలను కాపాడుతాడని మనము అర్థము చేసుకోవాలి. మనము ఆయన శక్తిపైన — ఆయన బలముపైన ఆధారపడవచ్చును. మనము ఆయన యొద్దనుండి సహాయము పొందవచ్చును. మరియు మనము ఎటువంటి ఆత్మసంబంధమైన పోరాటము ఎదుర్కొనినప్పటికీ అది మనకు నమ్మకమును ఇస్తుంది. వాస్తవమేమనగా, మనము మన ప్రభువునకు చెందినవారము, మన శరీరము మరియు ఆత్మకూడా. మన పరలోకపు తండ్రి చిత్తము లేకుండా, మన తల నుండి ఒక వెంట్రుక కూడా రాలిపోదు. అందువలన ఎటువంటి ఆత్మీయ పోరాటములోనైనా, నిశ్చయముగా విజయము ప్రభువుది — ఆయనతో కలిసి — మనది కూడా అని మనము నిమ్మళముగా ఉండాలి.

— రెవ. ఇవాన్ బెస్ పలోవ్, తర్జుమాచేయబడినది.

ఆత్మీయ పోరాటములో క్రైస్తవులకు విజయము నిశ్చయము. మన రక్షణను నాశనము చేయుటకు లేదా దేవుని రాజ్యములో మన స్వాస్థ్యమును కదిలించుటకు దయ్యములకు శక్తి ఏమియూ లేదు. ఆత్మీయ పోరాటము అధైర్యపరుస్తుంది, శ్రమ పెడుతుంది లేదా ఇంకా భయపెడుతుంది. కాని దేవుని యొక్క దయాళుత్వము వలన, దీర్ఘకాలపు పరుగులో అది మన పైన జయమును పొందనేరదు.

దేవుని నిబంధన దయాళుత్వము అనే ఈ అంశమును మూడు భాగములుగా విభజించుదము. మొదటగా, పాత నిబంధనలో దేవుడు తన రాజ్యమును కాపాడిన విధమును చూచెదము. రెండవదిగా, ప్రకటన గ్రంథము మినహాయించి క్రొత్త నిబంధనలో తన రాజ్యమును ఆయన ఏ విధముగా కాపాడెనో చూచెదము. మరియు మూడవదిగా, ప్రకటన గ్రంథములోనే ఆయన దయాళుత్వపు కాపుదలపైన దృష్టియుంచుదము. ఇప్పుడు పాత నిబంధనలో దేవుని దయాళుత్వముతో ప్రారంభించుకుందాము.

పాత నిబంధన యుద్ధ చరిత్రలతో నిండియున్నది. ఇశ్రాయేలు వారు పొరుగు రాజ్యాలతో తరచూ యుద్ధము చేస్తూ ఉండేవారు. అనేక పర్యాయములు ఇశ్రాయేలీయులు తమతో తామే యుద్ధము చేసినట్లు కనబడుతుంది. పాత నిబంధనలో అనేకమైన యుద్ధాలు భౌతికముగా మనుష్యుల ఆయుధములతో పోరాడుట ఎత్తి చూపించబడినప్పటికీ, అదృశ్యమైన రీతిలో ఆత్మసంబంధమైన యుద్ధాలు కూడా అందులో చోటు చేసుకున్నట్లు అప్పుడప్పుడు లేఖనాలు తెరను లాగి ప్రత్యక్షపరుస్తున్నాయి. వాస్తవానికి, అదృశ్యమైన ఈ యుద్ధాలు మానవ సైన్యముల యొక్క జయము లేదా అపజయమును ప్రభావితము చేసేవి.

ఈ అదృశ్యమైన యుద్ధములు ఎల్లప్పుడూ, దేవుడు మరియు ఆయన దూతలు ఒక పక్షమున, సాతానుడు మరియు వాడి అనుచరులు మరొకవైపున ఉండగా వారి మధ్యలో జరిగేవి. ఇశ్రాయేలు వారికి వ్యతిరేకముగా వచ్చు అనేకమైన ఇతర సైన్యములు, ఇతర దేవతలను అనుసరించిన వారే అయినప్పటికీ, ద్వితీయోపదేశకాండము 32:17 వంటి వచనములు ఆ రాజ్యములకు చెందిన అబద్ద దేవతలు నిజముగా దయ్యములని స్పష్టము చేయుచున్నాయి.

పాత నిబంధనలో, దేవదూతలు మరియు దురాత్మలు భౌగోళిక వివాదములలో పాలు పొందునట్లు లేక వాటి వెనుక ఉన్నట్లు వర్ణించబడినవి. ఆయా సంఘటనలు లేదా వివాదములు ఏ విధముగా జరుగుచున్నవో దాని వెనుక దేవాదూతల లేక దురాత్మల హస్తము ఉన్నట్లు కనబడుతుంది. ఉదాహరణకు దానియేలు 10లో ఒక సందర్భమును మనము చూడవచ్చు, అచ్చట గాబ్రియేలను ఒక దూత దానియేలు యొద్దకు వచ్చి ఈ విధముగా చెప్పినది, “నీవు చేసిన ప్రార్థనలను నేను వినియున్నాను. నిన్ను కనుగొనుటకు నేను ముందుగానే వచ్చితిని, కాని పారసీకుల రాజ్యాధిపతి నన్ను ఎదురించెను, మిఖాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను.” కొంతవరకూ, ఈ లేఖన భాగములు మర్మము కలిగియున్నవి, దాని అర్థమేమిటో, ఆయా సంఘటనలు ఏ విధముగా జరిగియో, మరియు ఈ విధమైన యుద్ధ ప్రక్రియ ఏమిటో ఖచ్చితముగా తెలుసుకొనుట మనకు కష్టమే. కాని దేవదూతలు మరియు దురాత్మలు వెనుక నిలిచియున్నట్లు లేదా భౌగోళిక యుద్ధములను ప్రభావితము చేయుచున్నట్లు మనం చూడవచ్చు. పాత నిబంధనలోని శ్రోతలకు, ఈ రాజ్యముల మధ్య యుద్ధములు కేవలము మనుష్యులు లేదా సహజముగా జరిగే సంఘటనలు కాదుగానీ, వాటన్నిటికీ అసాధారణమైన నేపథ్యము ఉన్నది. దేవదూతలు దురాత్మలతో యుద్ధము చేయుచున్నారు. భూమిమీద ఉన్న సైన్యములు యుద్ధములు చేయుచున్నట్లే మానవాతీతమైన సైన్యములు కూడా యుద్ధములు చేయుచున్నాయి. వారి చుట్టూ జరుగుచున్న వాటి వెనుక ఉన్నవాటిని వారు అర్థము చేసుకొనేవారు, కావున, పారసీకపు రాజ్యాధిపతుల కారణముగా తన యొద్దకు వచ్చుటకు గాబ్రియేలు నిలువరించబడ్డాడు అని చెప్పినప్పుడు, దానియేలు ఆశ్చర్యపడియుండడు.

—డా. స్కాట్ రెడ్డ్

దేవదూతలు మరియు దురాత్మల సమూహములకు మధ్య జరిగిన యుద్ధములకు మరియొక ఉదాహరణ నిర్గమకాండము 7 – 15 అధ్యాయములలో కనుగొనవచ్చును. మోషే కాలములో, దేవుని ప్రజలు ఐగుప్తు బానిసత్వములో ఉండేవారు. అయితే తన ప్రజలను వారి క్రూరత్వము నుండి విడిపించుటకు, ఐగుప్తీయులు మరియు వారి దేవతలకు వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు దేవుడు తన దూతల సైన్యమును నడిపించియున్నాడు. ఐగుప్తీయుల మీదికి పది తెగుళ్లను పంపించుట ప్రారంభించాడు, మరియు ప్రతీ ఐగుప్తీయుల ఇంటిలో ప్రథమ సంతానము చంపబడునట్లు తన మరణ దూతను కూడా పంపించాడు. అటుతరువాత, చివరిలో తన శక్తిని కనబరుస్తూ, ఐగుప్తు సైన్యములను ఎర్ర సముద్రములో ముంచివేయుట ద్వారా తన ప్రజలను విమోచించాడు.

బైబిలు గ్రంథమంతటిలో, పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలలో, దేవుడు ప్రత్యక్షపరచబడిన ఒక విధానము ఏదనగా, ఆయన ఒక యుద్ధశూరునిగా ప్రత్యక్షపరచుట. చాలా ప్రాముఖ్యమైన లేఖన భాగాలలో నిర్గమకాండము 15:3 ఒకటి, అచ్చట ఐగుప్తీయులను ఓడించిన తరువాత మోషే పాట పాడుతూ ఈ విధముగా చెప్పుచున్నాడు, “యెహోవా యుద్ధ శూరుడు, యెహోవా అని ఆయనకు పేరు.” దేవుని సంపూర్ణముగా వ్యక్తపరచడానికి యెహోవా అనునది సంక్షిప్తనామము, యెహోవా సబాఓత్ అనగా సైన్యములకు అధిపతియగు యెహోవా అని అర్థము. అచ్చట కూడా, నిర్గమకాండము 15:3లో మోషే చెప్పుచున్నట్లు, ప్రాముఖ్యముగా దేవుని యొక్క సారము మరియు ఉనికి యుద్ధశూరుడనే ఈ ఆలోచన అయ్యున్నది. దేవుడు యుద్ధశూరుడైయున్నాడు.

—డా. రిచార్డ్ ఎల్. ప్రాట్, జూ.

తరువాత నిర్గమకాండము 15:11లో మోషే ఈ విధముగా పాడుచున్నాడు.

వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు? (నిర్గమకాండము 15:11).

మోషే మరియు తన పాఠకులు ఈ ప్రశ్నకు సమాధానమును ఎరుగుదురు. యెహోవా వంటి దేవుడు లేడు. దీనంతటిలో, ఐగుప్తు సైన్యమును నాశనము చేసిన నిజమైన దేవుని ఆపుటకు ఐగుప్తు దేవతలు పూర్తిగా అసమర్థులైనారు.

పాత నిబంధన అంతయు ఇటువంటి ఉదాహరణలతో నిండియున్నది. ఇశ్రాయేలు వారిని యుద్ధములోనికి నడిపించే శూరుడైన రాజుగా దేవుడు తరచు తనను బయలుపరచుకున్నాడు. అయితే ఈ యుద్ధములు కేవలము మానవ శత్రుసైన్యముతో చేసినవి కావు; అవి ఎల్లప్పుడు ఆయా రాజ్యముల దేవతలతో దేవుడు యుద్ధము చేయుటకలదు.

ఉదాహరణకు, 2 రాజులు 19వ అధ్యాయములో, అష్షూరు రాజైన సన్హెరీబు, యూదారాజైన హిజ్కియాను దూషించెను, ఏలయనగా ఇశ్రాయేలు దేవుని కంటే అష్షూరు దేవతలు బలవంతులని తాను విశ్వసించెను.

కావున 2 రాజులు 19:17-19లో హిజ్కియా ఈ విధముగా దేవునికి ప్రార్థించెను:

యెహోవా, అష్షూరురాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా; లోక మందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడ వైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము (2 రాజులు 19:17-19).

అష్షూరు వారితో చేయుచున్న యుద్ధము కేవలము సన్హెరీబు మరియు అతని సైన్యములకు వ్యతిరేకముగా మాత్రమే కాదని హిజ్కియా అర్థము చేసుకున్నాడు. అది యెహోవా, అష్షూరు దేవతలతో చేయుచున్న ఆత్మీయసంబంధమైన యుద్ధమైయున్నది. అందుకే, ఆయన యుద్ధములో విజయమును మాత్రమే కోరుటలేదు గాని, వారి దేవతలపైన యెహోవా మహిమపరచబడాలని కోరుచున్నాడు.

మరియు దేవుడు ఆయన ప్రార్థన విన్నాడు. ఆ రాత్రి అష్షూరు సైన్యములో 185, 000 మందిని ఒక దూత సంహరించింది మరియు సన్హెరీబు ఓడించబడినవాడై ఇంటికి వచ్చాడు. హిజ్కియా సైన్యము యుద్ధములో అష్షూరీయులను అసలు ఎదుర్కొనవలసిన అవసరతే లేదు. దేవుని ఆత్మసంబంధమైన శక్తి సమూలనముగా మానవ సైన్యమును నాశనము చేసినది.

పాత నిబంధనలో యెహోవాను గూర్చిన ప్రాముఖ్యమైన వర్ణనలలో ఒకటి రాజుగా దేవుని పాత్ర, మరియు ఒక రాజుగా, పశ్చిమ ఆసియా దేశ రాజువలె ఆయనకు అనేకమైన బాధ్యతలు ఉన్నాయి, రాజుగా ఆయన పనిని కనబరచే అనేక కార్యములు, బాధ్యతలు ఉన్నాయి. ఆ కార్యములలో ఒకటి యుద్ధశూరునిగా చేయవలసిన కార్యము. పశ్చిమ ఆసియాలో రాజు దండునాయకునిగా, తన రాజ్యపు సైన్యములకు నాయకునిగా, మరియు గొప్ప శూరునిగా కూడా పరిగణించబడేవాడు. అందువలన, దేవుడు లేక యెహోవా పాత నిబంధన అంతటిలో యుద్ధశూరునిగా ఉండుట వలన దేవునిని యుద్ధశూరుడైన రాజుగా వర్ణిస్తుంది. తాను బయటకు వెళ్లి పోరాడుతాడు, యుద్ధము చేస్తాడు, విడిపిస్తాడు మరియు తన సొంత ప్రజలను కాపాడుతాడు. యుద్ధశూరుడైన రాజుగా దేవుని పాత్ర ఆదరణ మరియు ఓదార్పునకు కారణమైతే, ఇది నమ్మకమునకు కూడా కారణమగుచున్నది. మనచుట్టూ ఉన్న ప్రపంచములోనికి మనము వెళ్లునప్పుడు, తమ దేవుడు యుద్ధశూరుడనియు, ఆయన వెలుపలికివెళ్లి వారికొరకు యుద్ధము చేస్తాడనియు , వారిని కాపాడి, వారి కొరకు పోరాడి, విజయము పొందుతాడని దేవుని ప్రజలు నిశ్చయము కలిగి యుండవచ్చు.

—డా. స్కాట్ రీడ్

పాత నిబంధనలో యుద్ధమును గూర్చిన వృత్తాంతములు, ఇశ్రాయేలు నిజ దేవునికి మరియు ఇతర రాజ్యముల అబద్ధ దేవతలకు మధ్య ఆత్మ సంబంధమైన పోరాటములను గూర్చి ఎల్లప్పుడూ విస్తృతముగా చెప్పవు. ఆ విధముగా ఉండినప్పటికీ, భౌతికమైన యుద్ధములు ఆత్మ సంబంధమైన యుద్ధములచే బహుగా ప్రభావితము చేయబడుతున్నాయని పాత నిబంధన ఎల్లప్పుడూ ప్రత్యక్షపరుస్తుంది.

తన రాజ్యమును కాపాడుట ద్వారా పాత నిబంధనలోని దేవుడు ఏ విధముగా తన దయాళుత్వమును ప్రత్యక్షపరచాడో ఇంతవరకూ మనము చూచియున్నాము, ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైన పోరాటములలో ఆయన దయాళుత్వము వైపు మన దృష్టిని త్రిప్పుదము.

క్రొత్త నిబంధనలో, ఆత్మీయ పోరాటము భూసంబంధమైన సైన్య సమూహాలతో సంబంధము కలిగి యుండదు. కావున, ఆత్మ సంబంధమైన పోరాటములలో దేవుని దయాళుత్వము అనునది అతీంద్రియలోకములో అదృశ్యమైన పోరాటములుగా వర్ణించబడుచున్నది, మరియు ఈ ఆత్మసంబంధమైన పోరాటములు, సహజ లోకమును ఏ విధముగా ప్రభావితము చేస్తున్నాయో తెలుపుతుంది. ఇప్పుడ, పాత నిబంధనవలె, దేవుడు, దేవదూతలు మరియు దురాత్మలు మానవ యుద్ధములలోను మరియు అంతర్జాతీయ రాజకీయాలలోను సంబంధము కలిగియున్నారు. అయితే, క్రొత్త నిబంధనలో తనకు నమ్మకముగా ఉండువారిని దురాత్మ శక్తులనుండి ఏ విధముగా కాపాడుతాడో దానినిబట్టి దేవుని దయాళుత్వము దృష్టించబడుతుంది.

పాతనిబంధనవలె, క్రొత్త నిబంధన కూడా, దేవుడు తన ప్రజలను దయతో కాపాడుటను గూర్చి అనేక విధములుగా ప్రస్తావిస్తుంది. కావున, సమయమును బట్టి, మన యొక్క సంభాషణను రెండింటితో సరిపెట్టుదము. మొదటగా, ఆత్మసంబంధమైన పోరాటములో దేవుని దయాళుత్వము క్రీస్తు యొక్క విజయములో వ్యక్తీకరించబడినది.

యేసు జీవితము, మరణము, పునరుత్థానము మరియు ఆరోహణమును పాపముపైన మరియు దాని ఫలితముగా వచ్చు వాటన్నింటినిపైన విజయముగా క్రొత్త నిబంధన తెలుపుచున్నది.

యేసు జీవితము దురాత్మలను అనేక రీతులుగా జయించెను, ప్రత్యేకముగా దురాత్మలను వెళ్లగొట్టుటలో ప్రత్యక్షపరచబడినది. దీనిని మనము మత్తయి 12:25-28 వంటి లేఖన భాగాలలో చూడవచ్చు, అచ్చట, దేవుని రాజ్యము వచ్చియున్నది గనుక గొప్ప అధికారము మరియు శక్తితో దయ్యములను వెళ్లగొట్టుచున్నానని యేసు బోధించెను.

క్రీస్తు మరణమును గూర్చి కొలస్సీ 2:15లో పౌలు ఏ విధముగా వ్రాయుచున్నాడో వినండి:

ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగాచేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను (కొలస్సీ 2:15).

ఈ లేఖన భాగములో, ప్రధానులు మరియు అధికారులు దురాత్మశక్తులై యున్నారు. క్రీస్తు సిలువలో చేసిన కార్యమునుబట్టి వారు నిరాయుధులుగా చేయబడి ఓడించబడ్డారు. ఇదే తలంపును మనము హెబ్రీ పత్రిక 2:14లో చూడవచ్చును.

క్రీస్తు యొక్క పునరుత్థానము మరియు పరలోకములోనికి ఆరోహణము కూడా తన ప్రజలకు దేవుని దయాళుత్వపు కాపుదలను సూచించుచున్నది. ఉదాహరణకు, ఆ విధముగా చేయుటవలన ఆత్మసంబంధమైన ప్రతీ దుష్టశక్తి పైన యేసు అధికారమును పొందియున్నాడు, గనుక సంఘమును కాపాడి ఆశీర్వదించును. ఈ తలంపు మత్తయి 28:18-20, ఎఫెసీ 1:19-23, మరియు 1 పేతురు 3:22లో స్పష్టముగా బోధించబడినది.

ఆత్మసంబంధమైన పోరాటములో దేవుని దయాళుత్వమును గూర్చి క్రొత్త నిబంధన తెలుపుచున్న రెండవ విధానము ఏమనగా, దురాత్మను మరియు వాని తంత్రములను ఎదురించుటకు సామర్థ్యము కలుగజేయు పరిశుధ్దాత్మ శక్తిని వివరించుట.

దేవునికి విధేయత చూపి, సిలువలో మరణించి, మరణము నుండి లేచి మరియు పరలోకమునకు ఆరోహణమగుట ద్వారా యేసు తన యొక్క మన యొక్క ఆత్మసంబంధమైన శత్రువులందరిపైన అధికారమును పొందియున్నాడు. అయితే ప్రస్తుత సమయమందు, మన శత్రువులను సమూలనముగా నాశనము చేయుటకు ఆయన ఈ అధికారమును ఉపయోగించుట లేదు. నిజానికి, దురాత్మలు అనేక విధములుగా ఈ లోకమును ప్రభావితము చేయుటకు ఇంకనూ దేవుడు అనుమతిస్తున్నాడు. అయితే, వాటిని ఎదురించుటకు ఆయన మనలను తన పరిశుద్ధాత్మ చేత బలపరుస్తున్నాడు. దీనిని మనము గలతీ 3:2-3, ఎఫెసీ 3:16, కొలస్సీ 1:9-11 మరియు అనేకమైన ఇతర భాగాలలో కూడా చూడవచ్చును.

ఒక ఉదాహరణగా, యాకోబు 4:5-7లో వ్రాయబడిన మాటలు ఆలకించండి:

ఆయన మనయందు నివసింపజేసిన ఆత్మ ... ఆయన ఎక్కువ కృప నిచ్చును ... కాబట్టి దేవునికి లోబడియుండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్దనుండి పారిపోవును (యాకోబు 4:5-7).

ఇచ్చట, పరిశుద్ధాత్మవలన మనము పొందిన కృప ఆత్మసంబంధమైన పోరాటము చేయుటకు మనలను బలపరుస్తుందని యాకోబు చెప్పుచున్నాడు, ఈ సందర్భములో దేవునికి లోబడుతూ, దురాత్మల శోధన మరియు ప్రేరేపణలను ఎదురించుట కలదు.

ఆత్మసంబంధమైన పోరాటము కొరకు పరిశుద్ధాత్మ మనలను బలపరుచుటలో మొదటి సంగతి, ఆత్మసంబంధమైన లోకమును గూర్చి మనకు తెలియపరచుట అని నేను భావిస్తున్నాను. మనము చూచిన దానిని మరియు అనుభవించిన దానివైపు మనము సాధారణముగా ఆకర్షితులమౌతాము. అయితే ఒక ఆత్మసంబంధమైన లోకము ఉందని అందులోనే పనిచేయాలని మరియు పోరాటము చేయాలని ఎరుగుట చాలా ప్రాముఖ్యము. కావున ప్రధమ స్థానములో ఆయన ఆత్మసంబంధమైన లోకమును గూర్చి మనకు తెలియజేస్తాడు. పాపమును గూర్చి ఆయన పశ్చాత్తాపమును కలుగజేస్తాడు. మన జీవితములో పాపము జయించుటలో, మొదట మన పాపమును ఎరుగుట ఆవశ్యకము, అటుతరువాత పాపమును జయించుటకు ఆయన బలమునిస్తాడు. మరియు ప్రార్థనలో కొనసాగించుట మరియు పోరాటములో ముందుంచుటకు మన జీవితములో ఆయన పాత్ర చాలా ప్రాముఖ్యము.

—డా. కే. ఎరిక్ ధోయెన్స్

ఎఫెసీ 6వ అధ్యాయములో, ఆత్మసంబంధమైన పోరాటములో దేవుని కాపుదలను వివరించుటకు సైనికుని యొక్క సర్వాంగ కవచమును మరియు ఆయుధములను ఉపమానముగా పౌలు చెప్పుచున్నాడు. ప్రత్యేకముగా, క్రైస్తవులు దేవుని సర్వాంగ కవచమును ధరించుకొనుటను గూర్చి మాట్లాడుచున్నాడు.

ఎఫెసీ 6:12-13లో ఆయన మాటలను వినండి:

ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, గాని ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకారసంబంధులగు లోక నాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహ ములతోను పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువ బడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి (ఎఫెసీ 6:12-13).

ఆ తరువాత 17 మరియు 18 వచనములలో, ఈ సర్వాంగ కవచమును రూపొందించుటలోను, ప్రేరణ కలుగజేయుటలోను మరియు పోరాటములో శక్తి కలిగియుండుటలో పరిశుద్ధాత్మ చాలా సంక్లిష్టమైన పాత్రను పోషించుచున్నాడని పౌలు చెప్పుచున్నాడు. ఆయన బోధించినదేమనగా:

... దేవుని వాక్యమను ఆత్మఖడ్గము ధరించుకొనుడి. ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ... (ఎఫెసీ 6:17-18).

తాను ప్రారంభించునది ముగించుటకు యేసు తిరిగివచ్చునంతవరకు, ఈ లోకములో ఇంకనూ పనిచేయుచున్న అతీంద్రియ శక్తులకు వ్యతిరేకముగా మనము ఆత్మసంబంధమైన పోరాటము చేయాలని క్రొత్త నిబంధన మనలను పిలచుచున్నది. మరియు దానికి కావలసిన యుద్ధోపకరణములను మరియు దాని చేయుటకు బలమును పరిశుద్ధాత్మ ఇచ్చునని అది వాగ్దానము చేయుచున్నది.

2 కొరింథీ 10:4లో పౌలు చెప్పుచున్నట్లు:

మా యుద్ధోపకరణములు శరీరసంబంధమైనవి కావుగాని, దేవుని యెదుట దుర్గములను పడద్రోయజాలినంత బలముకలవై యున్నవి (2 కొరింథీ 10:4).

మా యుద్ధోపకరణములకు దైవశక్తి ఉన్నది ఏలయనగా అవి పరిశుద్ధాత్మ నుండి వచ్చునవి. ప్రతి విధమైన ఆత్మీయ ప్రమాదమునకు వ్యతిరేకముగా అవి ప్రభావవంతముగా ఉన్నాయి, తప్పుడు బోధలు మొదలుకొని దయ్యపు శక్తుల వరకు.

దానిని మనము ఎదుర్కొందము రండి, దుష్టుడు ఈ భూమి మీద మనలను బాధించును. అది జరిగినప్పుడు, ప్రశ్న ఏమంటే, మనకు నిరీక్షణ కలదా? నాకు నేనే ఉన్నానా? దీనిని గూర్చి దేవుడు ఎరిగియున్నడా, ఏదైనా చేస్తున్నాడా? ప్రతిధ్వనించే సమాధానమేమనగా, అవును ఆయన చూస్తున్నాడు, దుష్టుని యొక్క ఎటువంటి దాడినైనా అధిగమించడానికి సమృద్ధియైన శక్తిని ఆయన ఇచ్చుచున్నాడు. వీటితో పాటు నాకు ఇష్టమైన ఒక లేఖన భాగమును మీ కొరకు నేను చదవాలని ఆశిస్తున్నాను. 1 యోహాను 4:3-4లో యోహాను ఈ విధముగా చెప్పుచున్నాడు, “యే ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ... క్రీస్తువిరోధి ఆత్మ వచ్చునని మీరు వినినసంగతి ఇదే; యిదివరకే అది లోకములో ఉన్నది. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు; మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటె గొప్పవాడు గనుక మీరు వారిని జయించియున్నారు.” మనకు గొప్ప శక్తి ఉందని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. మరియు అది అధికారము కొరకైన పోరాటము. దుష్టుడు అధికమైన బలమును కలిగియున్నాడు, మనము దేవుని కలిగియున్నామనే మినహా, మనకంటే కూడా ఎక్కువ బలమును కలిగియున్నాడు.

— మిష్టర్. స్టీవ్ డగ్లస్

ఇంతవరకూ, ఆత్మ సంబంధమైన పోరాటములో, దేవుడు తన దయాళుత్వమును ప్రత్యక్షపరచుటను పాత నిబంధన మరియు క్రొత్తనిబంధనలో మనము చూసాము, ఇప్పుడు తన ప్రజలను కాపాడి, వారి శత్రువులకు వ్యతిరేకముగా ఆయన ఏ విధముగా యుద్ధము చేస్తాడో ప్రకటన గ్రంథములో నుండి చూచుటకు మన దృష్టిని త్రిప్పుదము.

ప్రకటన గ్రంథము, ప్రత్యేకముగా 12వ అధ్యాయము వంటి దానిలో, భూమి మీద ఏదైతే సంభవిస్తుందో దానికి అనుబంధముగా పరలోకపు స్థానములో జరుగుతుందని ప్రకటన గ్రంథము బోధిస్తుందని నేను భావిస్తున్నాను మరియు నిజముగా చరిత్రలో జరుగుచున్నది ఆత్మసంబంధమైన పోరాటముతో సంబంధము కలిగియున్నది, మన జీవితములలో జరుగుచున్నవి, చరిత్రలో పనిచేయుచున్న దుష్టశక్తులు మరియు మహా ఘటసర్పమైన సాతానుడు, క్రూరమృగము ఇవన్నియు ఒకదానితో ఒకటి సంబంధము కలిగి ఉన్నాయి, లవొదికయ మరియు ఎఫెసీ సంఘములలో ఉన్నవారికి వాస్తవముగా కాపుదల అవసరమైయున్నది, అయితే అది వారి యొక్క రక్షణ గొర్రెపిల్ల, పునరుత్థానపు గొర్రెపిల్లలో ఉన్నది. కావున పరలోక స్థానములలో సాతానుకు మరియు యేసుకు మధ్యనున్న పోరాటములు చరిత్రలో ప్రత్యక్షపరచబడినాయి, కేవలము మొదటి చరిత్రలోనే కాదు గాని ఇప్పుడు కూడా దాని ప్రభావము ఉన్నది. వారి విశ్వాసమును బట్టి శ్రమపడుచున్న క్రైస్తవుల విషయములో ఈ సంగతులు జరుగుట మనము చూడవచ్చును. కేవలము రాజకీయ శక్తులు మాత్రమే పనిచేయుట కాదు. దురాత్మశక్తులు పని చేయుచున్నాయి.

—డా. గ్రెగ్ పెర్రీ

ప్రకటన గ్రంథమంతటిలో, మానవజాతి పాపములో పడి పతనమైనప్పటి నుండి కొనసాగుతున్న ఆత్మసంబంధమైన పోరాటమును గూర్చి యోహాను హెచ్చరిక చేస్తున్నాడు, మరియు ఆ పోరాటము క్రీస్తు తిరిగివచ్చునంతవరకూ కొనసాగుతుంది. క్రూరమృగము మరియు ప్రకటన 12వ అధ్యాయములోని స్త్రీకి మధ్య జరుగు యుద్ధమును మరియు 13వ అధ్యాయములో సముద్రములో నుండి వచ్చు క్రూర మృగముతోను, భూమిమీద నుండి వచ్చు క్రూర మృగముతో చేయు యుద్ధమును ఆత్మ సంబంధమైన పోరాటపు దృశ్యరూపకముగా యోహాను వివరించుచున్నాడు. క్రీస్తు మరియు తన శత్రువు మధ్యనున్న ఆత్మసంబంధమైన యుద్ధము కారణముగా వారు నేరుగా శ్రమలను, హింసను మరియు శోధనను అనుభవించుచున్న విషయము తన పాఠకులు గ్రహించాలని యోహాను కోరుతున్నాడు.

పాత నిబంధనవలె, దేవదూతలు మరియు దురాత్మల సమూహముల మధ్య సంభవించు ఆత్మ సంబంధమైన పోరాటములు మానవ రాజకీయాలను ప్రభావితము చేస్తాయని యోహాను సూచిస్తున్నాడు. ఉదాహరణకు, ప్రకటన 16:14-16లో దీనిని మనము చూడవచ్చు, అక్కడ దేవునికి వ్యతిరేకముగా యుద్ధము చేయుటకు భూలోక రాజులందరూ పోగుచేయబడుట. మరియొక స్పష్టమైన ఉదాహరణ ఏమనగా ప్రకటన 17వ అధ్యాయములో వివరించబడిన క్రూర మృగము యొక్క తలలు, మరియు కొమ్ములు భూలోక రాజులను సూచించుచున్నవి. కొన్ని దురాత్మ శక్తులు భూసంబంధమైన ప్రభుత్వములను ప్రేరేపించుట వలన యోహాను యొక్క వాస్తవ పాఠకులే శ్రమపొందుచున్నారు.

అయితే క్రొత్త నిబంధనవలె, తన వాస్తవమైన పాఠకులు ప్రాథమికముగా సహజాతీతమైన లోకములో ఆత్మ సంబంధమైన పోరాటములు చేయుచున్నారని యోహాను వివరించుచున్నాడు. క్రీస్తుకు విధేయత చూపించునట్లు, పాపమును ఎదురించునట్లు మరియు సువార్త ద్వారా దేవుని రాజ్యమును విస్తరింపజేయునట్లు వారు చేయవలసిన వ్యక్తిగత పోరాటములు; ఇతరులతో పోరాడుటకు ఆయుధములు పట్టుకొనుట కాదు.

అయితే ప్రతీ సందర్భములోను —విశ్వములో జరుగు యుద్ధములు లేదా మానవ రాజకీయాలు లేదా వ్యక్తిగత పోరాటములు ఏవైనా సరే — దేవుడే వారిని దయతో కాపాడునని యోహాను తన పాఠకులకు నిశ్చయపరుస్తున్నాడు. అపరిమితమైన దాడుల నుండి ఆయన వారిని కాపాడుతాడు, నమ్మకముగా ఉండుటకు వారిని బలపరుస్తాడు, మరియు చివరిగా వారికి సమాధానము అనుగ్రహిస్తాడు.

ప్రకటన గ్రంథము ఎక్కువగా ఆత్మ సంబంధమైన పోరాటము పైన దృష్టి సారించుచున్నది. అది ఒకవైపున దేవుడు, క్రీస్తు మరియు ఆయన సేవకుల నుండి, మరోవైపు సాతాను, వాని అనుచరుల నుండి వేరు చేసే దృశ్యమును చూపెడుతుంది. అది మనమెంత భక్తి కలిగియున్నామో తెలుసుకొనుటకు సహాయపడుతుంది — నీవు దేవుని వెంబడిస్తున్నావా లేక స్వయమును వెంబడించి సాతాను రాజ్యానికి చెందిన వానిగా ఉన్నావా? అటువంటి వైరుధ్యము చూచుట మనకు చాలా ప్రాముఖ్యము. నేను అడుగుటకు ఆసక్తి చూపెడుతున్న రెండవ విషయమేమనగా మనమెంతవరకూ అప్పగించుకుంటున్నాము. మన ఆలోచనలు ఎక్కడకు వెళుతున్నాయి, మన హృదయాలు ఎక్కడకు వెళుతున్నాయి అని అడగడం, అంతేకాని, కేవలము మన బాహ్యప్రవర్తన మాత్రమే కాదు. ఇందులో నేను భావిస్తున్న మూడవ సంగతి ఏమనగా సాతానుడు ఒక నకిలీవాడు, మనుష్యులను పీల్చివేసే విధముగా వాస్తవమైన దానికి చేరువగా ఉండేలా తన కార్యాలు చేస్తాడు, కాని అవి నకిలీవి, అయితే ఈ రోజున మనలను ఆకర్షించు ఆ నకిలీ గుణములను కనుగొనుట మన ముంచు ఉన్న సవాలు.

—డా. వెర్న్ యస్. పొత్రెస్

ఆత్మ సంబంధమైన పోరాటము ద్వారా వచ్చు ఒత్తిడులు మరియు సమస్యలకు ప్రత్యుత్తరముగా, దేవుని యొక్క దయాళుత్వపు కాపుదలను తెలియజేయు మూడు పద్ధతులను పాఠకులకు ప్రకటన గ్రంథము ఇచ్చుచున్నది. మొదటిగా, తనకు నమ్మకస్తులైన వారందరికి క్రీస్తు విజయమును సంపాదించియున్నాడని నొక్కి చెబుతుంది.

క్రీస్తు యొక్క జీవితము, మరణము, భూస్థాపితము, పునరుత్థానము మరియు ఆరోహణము ద్వారా ఆత్మ సంబంధమైన పోరాటములో మన అంతిమ విజయమును ప్రకటన గ్రంథము నొక్కి చెప్పుచున్నది. దేవుని శత్రువులకు తీర్పుతీర్చు గ్రంథపు చుట్టను తెరచుటకు యోగ్యతగల వధించబడిన గొర్రెపిల్లగా ప్రకటన గ్రంథము 4 మరియు 5 అధ్యాయములో వర్ణించబడుటలో ఈ విజయము స్పష్టమగుచున్నది. తన శత్రువులపై క్రీస్తు పొందిన విజయము యుద్ధానికి ముగింపు కాదు. అయితే ఆయన శత్రువులు సమూలనముగా నాశనము చేయబడతారని మరియు తనకు నమ్మకస్తులైన వారు సంపూర్ణముగా ఆశీర్వదించబడతారని అది నిశ్చయము చేస్తుంది. ఈ విధముగా, దేవుని దయాళుత్వము మరియు కాపుదల విజయముతో ముద్ర వేయబడుతుంది. మనము అపజయము పొందు అవకాశమే లేదు ఏలయనగా ఇప్పటికే విజయము క్రీస్తునకు చెందియున్నది. ఆయన దానిని తెచ్చేవరకు మనము పట్టుదలతో ఉండాలి.

రెండవదిగా, ఆత్మ సంబంధమైన పోరాటములో విశ్వాసుల జీవితములలో క్రీస్తు యొక్క విజయమును పరిశుద్ధాత్ముడు ప్రస్తుతము అన్వయింపజేయుటను జ్ఞాపకము చేయుట ద్వారా దేవుని యొక్క దయాళుత్వపు కాపుదలను గూర్చి ప్రకటన గ్రంథము తెలుపుచున్నది.

ఆత్మ సంబంధమైన పోరాటములో క్రీస్తు విజయము సంపాదించినప్పుడు, తనకు నమ్మకస్తులైన వారికి ఆ విజయము యొక్క ఆశీర్వాదములను పంచి ఇచ్చుటకు ఆయన అధికారమును పొందియున్నాడు. మరియు తన దయాళుత్వము చొప్పున, ఆశీర్వాదములు మన జీవితములలో అన్వయించబడునట్లు ఆ ఆశీర్వాదములను మనకు పంచునట్లు ఆయన పరిశుద్ధాత్మను ఏర్పాటు చేసియున్నాడు.

ఈ దయాళుత్వపు ఆశీర్వాదములలో అనేకము ప్రకటన గ్రంథమునకు సంబంధించినవే. ఉదాహరణకు, రోమా సామ్రాజ్యము పతనమైపోయింది. నిజానికి, సంఘమును ఆర్పివేయాలని ప్రయత్నించిన శక్తులన్నీ విఫలమైనట్లు చరిత్రలో చూడవచ్చు. ఓటమి లేకుండా, ప్రతీ రాజ్యము, తెగ, జనాంగము మరియు ఆయా భాషలు మాట్లాడు ప్రజల మధ్య దేవుని రాజ్యము స్థాపించబడుతూ కొనసాగుతుంది. మరియు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ప్రకారము, అది లక్ష్యమును నేరవేర్చుతుంది.

మూడవదిగా, క్రీస్తు తిరిగి వచ్చునప్పుడు మన ఆత్మ సంబంధమైన శత్రువులను సమూలనముగా నాశనము చేయుట ద్వారా విజయముతో యుద్ధమును సమాప్తి చేస్తాడని జ్ఞాపకము చేయుట ద్వారా దేవుని యొక్క దయాళుత్వపు కాపుదలను ప్రకటన గ్రంథము తెలుపుచున్నది.

క్రీస్తు తిరిగి వచ్చునప్పుడు, సాతాను మరియు వాడి అనుచరులు అంత్యముగా నాశనము చేయబడతారని ప్రకటన గ్రంథము మనకు ధైర్యము నిచ్చుచున్నది. మనలను శోధించడానికి మరియు ఇబ్బంది పెట్టడానికి వారు పూర్తిగా శక్తిహీనులుగా చేయబడతారు. వారింక ఏ మాత్రము యుద్ధము చేయలేని స్థితిలో వారిపై వచ్చు శిక్ష వారిని పరిమితము చేస్తుంది.

మహావేశ్యయైన, బబులోను పట్టణమునకు కలుగు శిక్ష మరియు భూమి మీద ఆమెను వెంబడించిన రాజులకు, భూనివాసులకు కలుగు శిక్షను గూర్చి ప్రకటన గ్రంథము 17 మరియు 18 అధ్యాయములు తెలుపుచున్నాయి. క్రూరమృగము మరియు వాని సైన్యము యొక్క ఓటమిని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము లెక్కించుచున్నది. మరియు నూతన ఆకాశము మరియు నూతన భూమి సంపూర్ణముగా దుష్టత్వము నుండి తప్పించబడినట్లు ప్రకటన గ్రంథము 21 మరియు 22 అధ్యాయములు బోధించుచున్నాయి.

దేవుని శత్రువులు శక్తిహీనులుగా చేయబడినప్పుడు, ఆత్మ సంబంధమైన గొప్ప పోరాటము ముగించబడుతుంది మరియు దేవుని నమ్మకస్తులైన ప్రజలు అంతరాయములేని సమాధానము కలిగియుంటారు. దేవుని దయాళుత్వము మరియు కాపుదల అంత్యముగా ఈ విధముగా వ్యక్తపరచబడుతుంది; మనము సదాకాలము క్షేమముగా ఉందుము.

తన ప్రజలకు అనుగ్రహించుట మరియు కాపాడుట ద్వారా దేవుని యొక్క దయాళుత్వమును ప్రకటన గ్రంథమంతటిలో చూడవచ్చును. దేవుని ప్రజల కొరకు యేసు సిలువలో విజయమును కొనియున్నాడు మరియు పునరుత్థానమగుట ద్వారా ఆయన విజయము దేవుని నమ్మకస్తులైన ప్రజలకు వర్తించుచున్నది. ప్రస్తుత కాలమందు, ఈ విజయమును కొంతమట్టుకు సంఘము అనుభవించుచున్నది. క్రీస్తు తిరిగి వచ్చునప్పుడు, మనము సంపూర్ణముగా ఆ విజయమును అనుభవించుతామని దేవుని యొక్క నిశ్చయమైన వాగ్దానము మనకు ఉన్నది. క్రీస్తు యొక్క శత్రువులందరూ తీర్పుతీర్చబడుదురు, మరియు నూతన ఆకాశము మరియు నూతన భూమిలో మనము మహిమకరమైన స్వాస్థ్యమును పొందుతాము.

మన పాఠములో ఇంతవరకూ, దేవుని యొక్క నిబంధనా రాజత్వమును మరియు క్రీస్తు సామంతరాజుగా, ప్రభువుగా ఉండుట పరిశీలించాము మరియు దేవుని దయాళుత్వము ఆయన నిబంధన ప్రజలతో ప్రకటన గ్రంథములో ఏ విధముగా ఉన్నదో పరిశోధించాము. కావున, ఈ సమయములో, మూడవ ప్రాముఖ్యమైన అంశము వైపు తిరుగుదాము అదేదనగా: దేవుని రాజ్యపౌరులుగా ఆయన కోరుతున్న విధేయత.

మనము చూచినట్లు, ప్రాచీన కాలములో ప్రభవులకు – సామంతులకు మధ్య జరుగు ఒప్పందములు లేదా నిబంధనలు, దేవునితో మనకున్న సంబంధపు లక్షణములకు కనీసము మూడు సమాంతరములు ఉన్నాయి, అవి: తన ప్రజలుగా దేవుడు మనపై చూపెట్టు దయాళుత్వము; తన సామంత రాజ్యముగా దేవుని యెడల మనము చూపించవలసిన విధేయత లేదా లోబడుటను దేవుడు కోరుకొనుట; మరియు విధేయతకు ప్రత్యుత్తరముగా ఆశీర్వాదము, అవిధేయతకు ప్రత్యుత్తరముగా శాపము. ఈ సందర్భములో, తన కృపచేత రక్షించుకొనిన ప్రజల యొద్ద నుండి దేవుడు కోరుతున్న విధేయతపై దృష్టిపెట్టుదము.

ప్రకటన గ్రంథమును తాను వ్రాయుచున్నప్పుడు, సంఘము దేవునితో కలిగియున్న నిబంధనా సంబంధమును గూర్చి అపొస్తలుడైన యోహాను బాగుగా ఎరిగియున్నాడు. వారు ఎదుర్కొనుచున్న శ్రమలలో దేవునికి లోబడి యుండాలని దేవుడు చిన్న ఆసియాలో ఉన్న సంఘములను ప్రోత్సహించుటయే ఈ గ్రంథము వ్రాయుటకు ఒక కారణము. దేవుడు చూపుచున్న కనికరమును, ఆ విధముగానే దేవుడు అనుగ్రహించుచున్న ఆశీర్వాదములను వారు జ్ఞాపకము చేసుకొని, ఆ ప్రకారముగా వారు ప్రభువునకు నమ్మకముగా విధేయులై యుండాలని ఆయన కోరుతున్నాడు.

దేవుని కొరకైన వారి విధేయతలో సంఘములు రాజీపడే శోధనను జయించుటకు హెచ్చరించబడుట ప్రకటన గ్రంథములో ఉందని ముందటి పాఠములో నుండి మీరు జ్ఞాపకము చేసికొనవచ్చును. దేవునికి అవిధేయత చూపు విషయములో యోహాను యొక్క అసలైన పాఠకులు కనీసము నాలుగు రకములైన శోధనలను ఎదుర్కొన్నారు.

మొదటిగా, అప్పుడున్న వర్తక సంఘములు వారి పితరుల దేవతలను కలిగియుండే వారు, కావున ఈ సంఘసభ్యులు ఈ అబద్ధ దేవతలను పూజించుమని బలవంతము పెట్టేవారు. అటువంటి వర్తకము చేయాలని మరియు పనిచేయుటకు అవకాశమును ఆశించే విశ్వాసులు విగ్రహారాధన చేయుటకు శోధించబడేవారు.

రెండవదిగా, రోమా సామ్రాజ్యములోని దేవతలను, చక్రవర్తిని పూజించాలని ఒత్తిడి చేశారు. ప్రభుత్వము నుండి కలిగే శిక్షలను తప్పించుకొనుటకు క్రైస్తవులు అన్యదేవతలను పూజించుటకు శోధించబడ్డారు.

మూడవదిగా, క్రీస్తును తిరస్కరించులాగున యూదా మతము క్రైస్తవులను ఒత్తిడి చేసియున్నది. యూదా మతమునకు అన్యదేవతా ఆరాధన నుండి ప్రత్యేకమైన మినహాయింపు ఇవ్వబడినది మరియు వాస్తవముగా క్రైస్తవత్వము ఈ మినహాయింపులో దాచబడినది. అయితే యూదా మతము క్రైస్తవత్వము నుండి వేరుచేయబడినందున ఈ మినహాయింపు సంఘమునకు వర్తించలేదు. రోమా ప్రభుత్వ హింసలను తప్పించుకొనుటకు, అనేకమంది క్రైస్తవులు క్రీస్తును తృణీకరించి యూదా మత సాంప్రదాయములోనికి తిరిగి వచ్చేసారు.

నాల్గవదిగా, రోమా సామ్రాజ్యమంతటిలో అవిధేయులైన క్రైస్తవులు విశ్వాసములో రాజీపడి విగ్రహారాధన మరియు వ్యభిచారము చేయుచుండిరి. వారి యొక్క పాపములో పాలుపొందుమని ఇతర క్రైస్తవులను ప్రోత్సహించేవారు.

చిన్న ఆసియాలో ఉన్న సంఘముల విధేయత విషయములో ఈ శోధనలు విశేషమైన సవాళ్లను కనబరుస్తున్నాయి. ఇటువంటి సందర్భములో, వారు తమ విరోధులకు లోబడకుండా, దేవునికి లోబడుటయందు బలపరచుటయే ఈ గ్రంథమును యోహాను వ్రాయుటకు ప్రాముఖ్య కారణము.

విధేయత అను మన ముఖ్య అంశము ప్రకటన గ్రంథమంతటిలో రెండు ప్రాముఖ్యమైన రీతులలో తెలియజేయబడుట యందు మన పరిశీలనను కేంద్రీకరించుదము: పట్టుదల మరియు ఆరాధన. మొదట, పట్టుదలగా ఉండుటకు ప్రకటన గ్రంథము పిలుపునిచ్చుటను గూర్చి పరిశీలించుదాము.

పట్టుదలను ఈ విధముగా నిర్వచించవచ్చు:

శోధన, వ్యతిరేకత లేక నిరుత్సాహము కలిగినప్పటికీ, విశ్వాసము మరియు క్రియలలో దేవునియందు నమ్మకత్వముతో నిలచియుండుట.

పట్టుదల కలిగియుండుట అనగా దేవునియందు మన విశ్వాసమును తృణీకరింపజేయు ఏ శక్తినైనా జయించుట లేదా అన్ని విధములుగా ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేయుట.

చిన్న ఆసియాలో ఉన్న విశ్వాసులు అనేకమైన శోధనలు పొందినందుకు ప్రత్యుత్తరముగా, పట్టుదల కలిగియుండాలని లేదా జయించాలని తన పాఠకులను యోహాను మరలా మరలా పిలచుచున్నాడు. ప్రకటన గ్రంథము 2 మరియు 3 అధ్యాయములలో వ్రాయబడిన పత్రికలలోను మరియు ఇదే గ్రంథములోని ఇతర భాగాలలో కూడా ఈ హెచ్చరికలను కనుగొనవచ్చును.

పత్రికలలో, ప్రకటన 2:7,11, 17, 26; మరియు 3:5, 12, 21 భాగాలలో మనము వాటిని చూడవచ్చు. అదే విధముగా ప్రకటన 14:12; 16:15; 18:4; 20:4; 21:7; మరియు 22:7, 11, 14 వంటి భాగాలలో కూడా మనము వాటిని చూడవచ్చును. ప్రకటన గ్రంథమంతటిలో పట్టుదల అనునది చాలా ప్రాముఖ్యమైన అంశమని చెప్పుట అతిశయోక్తి కాదు.

ఏడు సంఘములకు వ్రాయబడిన పత్రికలలో మనము చూచినట్టుగానే ప్రకటన గ్రంథము యొక్క కేంద్ర భాగములో కూడా జయించుట అనే పదజాలమును ఎక్కువగా చూస్తాము. 11:7 మరియు 13:7లో, క్రూరమృగము, లేదా దుష్టుడు, పరిశుద్ధులను జయించుట, లేదా దేవుని ప్రతినిధులను జయించుట, లేక దేవుని సాక్షులను చంపుట మనము చూస్తాము. అయినప్పటికీ, 12:11లో దేవుని వివాదముపైన పరలోకపు దృక్పథము మనకు కనబడుతుంది, మరియు అదేదనగా వారు వానిని జయించుట — ఈ సందర్భములో, వారు అపవాదిని జయించుట అని అర్థము — వారు గొర్రెపిల్ల రక్తమునుబట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించియున్నారు గాని, మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. వధించబడిన గొర్రెపిల్లవలె వారు క్రూర మృగమును జయించియున్నారు గనుక దేవుని సింహాసము యెదుట వారు ఏ విధముగా నిలువబడియున్నారో ప్రకటన గ్రంథము చెబుతూనే ఉంది. ఆయన జయించు సింహమైయున్నాడు, కానీ ఆయన గొర్రెపిల్లవలె ప్రదర్శించబడ్డాడు. సింహమువలె గొర్రెపిల్ల హత సాక్షిగా మరణించుట ద్వారా జయించియున్నాడు, ఈ దేవుని ప్రజలు లోకముతో యుద్ధము చేసి జయించలేదు గాని, దేవునియందు విశ్వాసము ద్వారా మరియు వారియొక్క సాక్ష్యము ద్వారా జయించియున్నారు, ఏలయనగా లోకము మనకు గొప్ప కీడు చేసినా, మనము దేవునికి చెందినవరము గనుక మనము జయించుదము. చిన్న ఆసియాలో ఉన్న యేడు సంఘములు ప్రతీఒక్కటి వేర్వేరు శోధనలు కలిగియున్నాయి మరియు ప్రతీ ఒక్కటి జయించుటకు పిలువబడ్డాయి. మనలో ప్రతీ ఒక్కరికి వేర్వేరు శోధనలు ఉన్నాయి. వేరొకరి శోధన మనకు చులకనగా ఉండవచ్చు లేదా మరొకరి శోధన భీతికరముగా నుండవచ్చు, కానీ మనకు మన సొంతవే ఉన్నాయి, మరియు వాటిని జయించుటకు మనము పిలువబడ్డాము. శోధన ఏదైనప్పటికీ, వాగ్దానమనునది ప్రకటన గ్రంథము చివర 21వ అధ్యాయములో జయించు వారిని గూర్చి దేవుడు చెప్పుచున్నాడు, “నేనతనికి దేవుడనై యుందును అతడు నాకు కుమారుడై యుండును.”

—డా. క్రెగ్ ఎస్. కీనర్

యోహాను ప్రకటన గ్రంథములో ఎత్తి చూపుతున్న ఐదు రకాలైన పట్టుదలలను మనము ప్రస్తావించుకుందము, విశ్వాసములో పట్టుదలతో ప్రారంభించెదము.

హెబ్రీ 11:1లో, విశ్వాసమును లేఖన భాగాలూ ఈ విధముగా నిర్వచిస్తున్నాయి:

విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై యున్నది (హెబ్రీ 11:1).

లేఖనాలలో చదువుకొనుచున్న కాపుదల, పోషణ మరియు ఆశీర్వాదములు మన జీవితములలో ప్రత్యక్షపరచబడని పరిస్థితులలో దేవునియందు నమ్మకముంచుట చాలా కష్టము. ఆయా విషయాలు మన జీవితాలలో చెడుగా ఉన్నప్పుడు, మనము తప్పు చేశామనిపిస్తుంది, మోసపుచ్చబడ్డామనిపిస్తుంది, బైబిలు గ్రంథములోని దేవుడు నిజము కాదనిపిస్తుంది, మరియు ఆయనకు లోబడనవసరము లేదనిపిస్తుంది. ఈ సంగతి మొదటి శతాబ్దములో ఎంత వాస్తవమో ఇప్పుడూ అంతే. కావున, ప్రకటన గ్రంథమును వ్రాయుచున్నప్పుడు యోహాను యొక్క ఒక ఉద్దేశమేమనగా, పరిస్థితులు పైకి కనబడుతున్న దానికంటే వేరుగా ఉన్నట్లు పాఠకులు గ్రహించాలి. ఇప్పుడు కనిపిస్తున్నదానికంటే ఈ లోకము ఎంతో చెడ్డది; మరియు వారు ఊహించుకొను దానికంటే దేవుని రాజ్యము చాలా శ్రేష్ఠమైనదిగా ఉంటుంది.

అన్యదేవతలు మరియు రోమా చక్రవర్తి ఆశీర్వాదమునకు కారకులుగా ఉన్నారనే అంశమును యోహాను యొక్క అసలైన శ్రోతలు గొప్ప శోధనగా ఎదుర్కొన్నారు. బాహ్యముగా, ఇవి భద్రత, ఆహ్లాదము మరియు ఐశ్వర్యమును ఇచ్చు బలమైన శక్తులుగా కనబడుతున్నాయి. మరియు దీనికి విరుద్ధముగా, క్రైస్తవ జీవితము చాలా కష్టమైనది. వర్తకము విశ్వాసులకు కష్టముగా ఉన్నది. వారు ప్రభుత్వము చేత హింసించబడుచున్నారు. అన్యుల యొద్దనుండి వారు పొందుకొనే లోకానుసారమైన సంతోషము వంటిది సంఘము ఇచ్చుట లేదు. దేవునిలో విశ్వాసమును తృణీకరించునట్లు మరియు విశ్వాసమునకు బదులుగా లోకమును యెంచుకొనేటట్లు చిన్న ఆసియాలో ఉన్న సంఘములను ఇటువంటి శోధనలు ప్రేరేపించేవి.

ఈ పరిస్థితులకు ప్రత్యుత్తరముగా, తన పాఠకులు విశ్వాసములో బలము పొందాలని యోహాను పట్టుబట్టి చెప్పుచున్నాడు. లోకము యొక్క పద్ధతులు అవి కనిపించినంత మంచివి కావనే వారి నమ్మకములో దృఢముగా ఉండాలని, మరియు క్రైస్తవ జీవితము ఎంత కష్టముగా ఉండినప్పటికీ, భద్రత, సంతోషము మరియు ఐశ్వర్యమునకు అదొక్కటే సరియైన మార్గమని వారు తెలుసుకోవాలని తాను కోరుచున్నాడు.

అందువలనే, లోకము, పాపభరితమైన శక్తులు మరియు కోరికలను ప్రకటన గ్రంథము వికృతముగా, వికారముగా, మోసపూరితమైనవి మరియు చెడ్డవిగా పదేపదే వర్ణించుచున్నది. అవును, సాతాను రాజ్యము మరియు వాని అనుచరులు అందమైన ముసుగులను ధరించియున్నారు. అయితే వాస్తవమైన దానిని మనము చూడగలిగితే, దాని హేయతను నిరాకరించుదము. మరియు అదే సంగతి ఇప్పటికీ వాస్తవమైయున్నది.

పాపము ఎంత ఆకర్షణీయముగా ఉండినప్పటికీ, మరియు క్రీస్తును వెంబడించువారముగా జీవితములో ఎంత కష్టము, ఎంత నిరుత్సాహము కలిగినా, దేవుడు ఏమైయున్నాడో, తాను చెప్పునది తప్పక చేసే మరియు మనము ఆయనకు లోబడితే ఆశీర్వదిస్తాడు అనే విశ్వాసములో కొనసాగుట చాలా ప్రాముఖ్యము.

విశ్వాసములో పట్టుదల కలిగియుండుట, పట్టుదలలోని ఇతర రకములకంటే చాలా ప్రాముఖ్యమైనదైనా, ఇతర రకములైన పట్టుదలలో కూడా, యదార్థమైన విశ్వాసము కనబరచబడుతుందని ప్రకటన గ్రంథము నొక్కి చెబుతుంది. ఉదాహరణకు, ప్రకటన గ్రంథములో చెప్పబడిన రెండవ రకమైన పట్టుదల ఏమనగా దేవునిపట్ల స్థిరమైన ప్రేమ కలిగియుండుట.

దేవునిపట్ల వారి ప్రేమ సజీవముగా, బలముగా ఉండాలని ప్రకటన గ్రంథము విశ్వాసులందరిని పిలచుచున్నది. ఉదాహరణకు, ప్రకటన 2:19లో, తుయతైరలో ఉన్న సంఘము ప్రేమ మరియు విశ్వాసము విషయములో పట్టుదల కనబరుచుటలో కొనియాడబడినది. దీనికి విరుద్ధముగా, ప్రకటన 2:4లో, ఎఫెసీలో ఉన్న సంఘము మొదటి ప్రేమను కోల్పోయినందుకు గద్దించబడినది. ఈ విఫలత చాలా గొప్పది గనుక దాని దీప స్తంభమును తొలగిస్తానని, అనగా, సంఘమును తొలగిస్తానని ప్రభువు హెచ్చరించియున్నాడు.

ప్రకటన గ్రంథములో మూడవ రకమైన పట్టుదల, క్రైస్తవునిగా ఇతరులకు మనము సాక్ష్యమిచ్చుటకు సంబంధించినది.

యోహాను దినములలో క్రీస్తునకు నమ్మకముగా ఉన్న సంఘములు వాటిచుట్టూ ఉన్న సాంస్కృతికి లోబడక అనివార్యముగా ఎదురు నిలిచాయి. కావున, ప్రకటన గ్రంథము 2 మరియు 3 అధ్యాయములలోని ఏడు సంఘములను లోకపు చీకటిలో వెలుగుచున్న దీప స్తంభములని యోహాను వర్ణించుచున్నాడు. ఎఫెసీ సంఘమునకు వ్రాయబడిన పత్రిక మనకు బోధిస్తున్నట్లు, క్రైస్తవులు లోకముతో రాజీపడినట్లయితే, శ్రేష్ఠమైన వారి సాక్ష్యమును కోల్పోవుదురు, మరియు లోకమునకు సాక్షులుగా ఉండుటలో చల్లారిపోవుదురు.

ఇటువంటిది ప్రకటన 7:10లో చూడవచ్చు, అచ్చట, లోకమునకు సాక్ష్యము చెప్పుచున్న తెల్లని వస్త్రములు ధరించిన గొప్ప సమూహము సింహాసనము చుట్టూ చేరి దేవుని స్తుతిస్తూ పదే పదే ఇలా చెప్పుచున్నాది: “రక్షణ మన దేవునికే చెందును.” కైసరుయందు లేక మరొకచోట రక్షణ దొరకదు కానీ, కేవలము దేవుని గొర్రెపిల్లయైన, యేసుక్రీస్తు చేసిన కార్యము ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఈ ఒక్క సత్యము విశ్వాసుల యొక్క సాక్ష్యమును మరింత ప్రాముఖ్యము చేయుచున్నది. వారి యొక్క సొంత పూజలు అబద్ధమైనవి మరియు తప్పుత్రోవ పట్టిస్తాయని మరియు సంఘము మాత్రమే జీవము మరియు నిరీక్షణ సందేశములను కలిగియున్నదని అవిశ్వాసులైనవారు గ్రహించవలసియున్నది.

ప్రకటన గ్రంథము పట్టుదలను గూర్చి చెప్పుచున్న నాల్గవ విధానము, నైతిక పరిశుద్ధత.

నైతిక పరిశుద్ధతను గూర్చిన హెచ్చరికలు ఏడు సంఘములకు వ్రాసిన పత్రికలలో తరచూ కనుగొనవచ్చును. ఉదాహరణకు, ప్రకటన 2:12-17లో, జారత్వము అంగీకరించుట మాత్రమే గాక, ఇతరులను కూడా వారి క్రియలలో పాలుపొందునట్లు ప్రోత్సహించుచున్న పెర్గమము సంఘములో ఉన్న వారిని యేసు గద్దించుచున్నాడు. మరియు ప్రకటన 3:14-22లో, లవొదికయలో ఉన్న సంఘమును యేసు గద్దించెను ఏలయనగా, క్రీస్తునకు విధేయత చూపించుట కంటే సంపద, సుఖమునకు వారు విలువనిచ్చారు.

మనము ప్రస్తావించబోవు ఐదవ రకమైన పట్టుదల ఏదనగా, సరియైన బోధలో నిలచుట.

దేవుని ప్రేమించుచున్నామని విశ్వాసముంచే ప్రజలు అన్ని చోట్లా అనేకమంది ఉన్నారు. అయితే, దేవునిని గూర్చిన వారి అవగాహన సంపూర్ణముగా తప్పు అయినట్లయితే, సత్యదేవునిని గ్రహించకపోతే, వారు ఎంతగా దేవునిని “సేవిస్తారో” అంతగా దేవుని యొద్దనుండి పడిపోతారు. ఒక చెట్టు యొక్క వేరులు భూమి క్రిందన ఉండి, కనిపించకుండా ఎలా ఉంటాయో, ఆ విధముగానే సేవకు సరియైన బోధ ఆధారము. అనేకమంది దాని కొమ్మలను, ఫలములను చూస్తారు గానీ, ఆ వేరులు ఆ ఫలమును ఏ విధముగా ప్రభావితము చేస్తాయో చాలామంది చూడరు. అనేకమంది లోతులేని క్రైస్తవులు సరియైన బోధకు సంబంధించిన విషయాలను పట్టించుకొనుట లేదు, అయితే శ్రద్ధ కలిగిన క్రైస్తవులు సరియైన బోధ అనునది అన్నింటికి ఆధారమని ఎరుగుదురు — అది చాలా ప్రాముఖ్యము.

—రెవ. డా. స్టీవెన్ టాంగ్, భాషాంతరము చేయబడినది.

సరియైన బోధను వెంబడించుమని మరియు లోకానుసారమైన ఆలోచనలతో రాజీపడవద్దని ప్రకటన గ్రంథము విశ్వాసులను యెడతెగక పిలచుచున్నది. ఉదాహరణకు, ప్రకటన 2:1-7లో, సరియైన క్రైస్తవ బోధలో కొనసాగుతున్నందుకు, నిజమైన మరియు అబద్ధపు అపొస్తలుల మధ్య వ్యత్యాసమును గూర్చి గ్రహింపు కలిగియున్నందుకు యేసు ఎఫెసీ సంఘమును మెచ్చుకుంటున్నాడు. మరియు ప్రకటన 2:20-23లో, తుయతైర సంఘము బోధ విషయములో రాజీపడినందున, ప్రత్యేకముగా అబద్ధ ప్రవక్తయైన యెజెబెలును ఉండనిచ్చుచున్నందున గద్దించబడినది.

సంఘము అనేక విధములుగా పట్టుదల కలిగియుండాలని ప్రకటన గ్రంథము పిలచుచున్నది. అయితే ఈ విషయాలలో సవాలును పొందుచున్న విశ్వాసులు, వారు ఎదుర్కొనుచున్న శ్రమలు శోధనలు మరియు కష్టములను జయించుటకు ఏమిచేయాలో వారికి అన్నివేళల్లో తెలియటము లేదు.

కృతజ్ఞత పూర్వకంగా, మనము కేవలము పట్టుదల కలిగియుండాలని మాత్రమే ప్రకటన గ్రంథము బోధించుటలేదు. కాని యెట్లు పట్టుదల కలిగియుండగలమో అభ్యాసపూర్వకమైన సూచనలు కూడా ఇచ్చుచున్నది.

నా ఆలోచన ప్రకారం, శ్రమలు ఎదుర్కొనుచున్నప్పుడు పట్టుదల కలిగియుండుటకు తీసుకోవలసిన అభ్యాసపూర్వకమైన అడుగులు, ప్రకటన గ్రంథములోని గలిబిలియైన చారిత్రక లేక ఇతర పరిస్థితుల మధ్య కూడా, లేఖనమంతటిలో ఉన్నటువంటి అడుగులే అనునది ఆసక్తికరమైన విషయము. దేవుని ప్రజలు నమ్మకముగా ఉండుటకు పిలవబడుచున్నారు, వారు ఎరిగియున్నదానికి, వారికి ప్రత్యక్షపరచబడిన దానికి విధేయత కలిగియుండుటకు, పిలువబడుచున్నారని, నేను భావిస్తున్నాను. వారు కలిసియుండుటకు, కలసి విశ్వసించుటకు, కలసి ఆరాధించునట్లు ఒక సమూహములోనికి వారు పిలువబడ్డారు. కలసి సాక్ష్యమిచ్చుటకు పిలువబడ్డారు. ఏ సందర్భమైనా, ఎటువంటి శ్రమయైనా, అన్ని వేళలలో మనము ఏ విధముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడో అటువైపు మన పట్టుదల కేంద్రీకరించబడాలి, పరిస్థితులు బాగున్నా లేదా చెడ్డవిగా ఉండినా, పరిశుద్ధమైన జీవితము జీవించాలి. అందువలన, ప్రకటన గ్రంథము మరియు అటువంటి ఇతర పుస్తకములు చాలా ప్రోత్సాహకరముగా ఉన్నట్లు కనుగొన్నాను; అది పరిశుద్ధమైన జీవితము జీవించుటకు సవాలు చేయుచున్నది, కానీ ఆ విధముగా జీవించుట అసాధ్యము కాదు అని కూడా ప్రోత్సహించుచున్నది. చాలా క్లిష్టతరమైన పరిస్థితులలో కూడా, దేవుని ప్రజలు కృపా మార్గమును వెంబడించవలసియున్నది మరియు క్రీస్తు యొక్క నామమును ప్రకటించవలసియున్నది, మరియు క్రీస్తు లేని వారు ప్రతిస్పందించుదానికి విరుద్ధముగా స్పందిస్తూ జీవించవలసి యున్నది.

—డా. విలియం ఊరే

దేవునిని వ్యతిరేకించుచున్న పాపభరితమైన మానవ ప్రభుత్వాలు చేసిన మోసపు తెరను ప్రకటన గ్రంథము తొలగించుతుంది. దేవుని రాజ్యము మరియు క్రీస్తు అధికారమును గూర్చిన సౌందర్యము మరియు అద్భుతములను బయలుపరుస్తుంది. దేవుడు తన ప్రజలను దీవిస్తాడని మరియు ఆయన మహిమ కలిగిన రాజ్యములో వారిని దీవిస్తాడని బయలుపరుస్తుంది. మరియు మనము అంతము వరకు నమ్మకముగా పట్టుదల కలిగియున్నట్లయితే, నూతన ఆకాశము మరియు నూతన భూమిలో కలుగు ఆశీర్వాదములను నిశ్చయపరుస్తుంది. సంక్షిప్తముగా, మన జీవితాంతము నమ్మకత్వముతో పట్టుదల కలిగియుండుటకు, మరియు చరిత్రలో, యేసు సమస్తమును నూతనముగా చేయుటకు తిరిగివచ్చు వరకు దేవునికి నమ్మకముగా ఉండుటకు హేతువును ఇది ఇస్తుంది.

తాను సిలువ వేయబడిన తరువాత మరణము యేసును నిలువరించలేదు, మూడవ దినమున ఆయన మరణము నుండి లేచియున్నాడు. ప్రస్తుతమున్న లోక పరిస్థితుల విషయములో ఇది సత్యము. అనేకమైన భూసంబంధమైన శక్తులు మరియు సమూహాలు దేవుని వ్యతిరేకించవచ్చు, మరియు దేవుని ప్రజలు శ్రమపడవచ్చు. అవి జీవితమును చాలా నిరుత్సాహపరచవచ్చు. అయితే మనము జ్ఞాపకము చేసుకొనవలసినదేమనగా, జీవితము చాలా నిరుత్సాహముగా కనిపించినప్పటికీ, దేవుడు స్వాధీనము కలిగియున్నాడు, మరియు శ్రేష్ఠమైన మన ఇష్టమును ఆయన హృదయమందు కలిగియున్నాడు. ఏది ఏమైనప్పటికీ, తన వాగ్దానముల విషయమై తాను మేలు చేస్తాడు. యేసు తిరిగివచ్చునప్పుడు మనకు కలుగు మహిమతో ప్రస్తుతమందున్న శ్రమలు పోల్చుటకు సరిపోవు. మనము విశ్వాసములో, మరియు సమర్పణలో స్థిరముగా ఉండునట్లు, ప్రేమలో నిలకడగా ఉండునట్లు, మన సాక్ష్యములో కొనసాగునట్లు, సరియైన బోధలో పట్టుదల కలిగి జీవితములో కొనసాగునట్లు, ఇది మనలను పురిగొల్పాలి. చీకటి వంటి యేసు మరణమును వెలుగు అనే పునరుత్థానము వెంబడించినట్లు, చీకటి లాంటి మన ప్రస్తుత కష్టములు వెంబడి ఆయన తన సంపూర్ణ రాజ్యముతో తిరిగివచ్చుట అనే వెలుగు వచ్చును.

దేవునికి విధేయత చూపుటలో పట్టుదల కలిగియుండుటను గూర్చి ప్రకటన గ్రంథము ఏ విధముగా ప్రోత్సహించుచున్నదో మనము ఇంతవరకూ చూచియున్నాము, కాబట్టి ఆరాధన ద్వారా మన విధేయతను వ్యక్తపరచుటను అది ఏ విధముగా ప్రోత్సహిస్తుందో ఇప్పుడు చూచెదము.

యోహాను యొక్క అసలైన శ్రోతలు గొప్ప శ్రమలు అనుభవించుట వాస్తవమైనప్పటికీ, ప్రకటన గ్రంథము ఆరాధన గూర్చి విశేషముగా నొక్కి చెప్పుచున్నది. పరలోక స్థానములో సింహాసనము ఆవరణములో అద్భుతమైన ఆరాధన దృశ్యము ప్రకటన గ్రంథము 4 మరియు 5 అధ్యాయములలో వర్ణించబడినది, దేవుని సింహాసనము చుట్టూ ఇరువది – నలుగురు పెద్దలు ఆసీనులై యుండుట, మరియు నాలుగు జీవులు ఎగురుతూ దేవుని స్తుతించుట కలదు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము అర్థభాగములో అటువంటి ఆరాధనా దృశ్యమే కనబడుతుంది.

మొదటగా ఈ సంగతి మనకు ఆశ్చర్యముగా అనిపించినప్పటికీ, శ్రమలు మరియు ఆరాధన మధ్య సంబంధమును ప్రకటన గ్రంథము స్పష్టము చేయుచున్నది. మనలను బలవంతము చేయుచున్న పరిస్థితులున్నప్పటికీ, బహుగా వ్యాకులము చెందిన సందర్భములలో కూడా, దేవుడు ఇంకనూ సంపూర్ణుడు, పరిశుద్ధుడు మరియు మంచివాడు. ఆయన ఈ సంగతులన్నిటిని మన మేలుకొరకై చేయుచున్నాడు, కావున రానున్న యుగములో క్రీస్తులోనున్న సంపూర్ణ స్వాస్థ్యముతో ఆయన మనలను ఆశీర్వదిస్తాడు.

దేవుని ఆరాధించుటను గూర్చి ప్రకటన గ్రంథము అనేకమైన కారణాలు చూపించుచుండగా, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో తెలుపునట్లు ఇరువది - నలుగురు పెద్దలు దేవుని స్తుతించుటను గూర్చిన మూడు తలంపులను ఈ పాఠములో మనము దృష్టించుదము.

ప్రకటన 5:9-10లో పెద్దలు ప్రకటించిన దానిని వినండి:

నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి, ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడువారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవునికొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు (ప్రకటన 5:9-10).

దేవుని స్తుతించుటకు కనీసము మూడు కారణములను పెద్దలు ప్రస్తావించుచున్నారు. మొదటిది, ప్రతి వంశములోనుండి, ఆయా భాషలు మాటలాడువారిలో నుండి, ప్రతి ప్రజలోనుండి మరియు ప్రతి జనములోనుండి వారిని క్రీస్తు కొనియున్నాడు లేదా విమోచించియున్నాడు. రెండవదిగా, ఈ విమోచించబడిన ప్రజలను ఒక రాజ్యముగాను, యాజకులనుగాను క్రీస్తు నియమించియున్నాడు. మరియు మూడవదిగా, భవిష్యత్తులో వారు భూమి మీద పరిపాలన చేస్తారని ఆయన నిశ్చయపరుస్తున్నాడు.

ఆరాధన ద్వారా దేవునికి విధేయత వ్యక్తము చేయబడుతుంది అనే అంశము ప్రకటన 5:9-10లో ఉన్న ఈ మూడు తలంపులలో సరిసమానముగా ఉన్నది.

మొదటిది, గతములో క్రీస్తు నెరవేర్చిన విమోచనా కార్యము దేవుని ఆరాధించుటకు కారణముగా మనము చూచెదము.

రెండవది, ఆయన రాజ్యములో యాజకులనుగా నియమించుట ద్వారా ప్రస్తుతము మనకు ఘనత కలుగజేయుచున్నందున దేవుని ఆరాధించుట యందు మనము దృష్టిసారించుదము.

మరియు మూడవదిగా, మనము నూతన ఆకాశము మరియు నూతన భూమిలో పరిపాలించునప్పుడు భవిష్యత్తులో మనము పొందబోవు ఆశీర్వాదమును బట్టి ఆరాధించవలసియున్నది మనము చూచుదము. మొదటిగా గతములో క్రీస్తు నెరవేర్చిన కార్యమును పరిశీలించెదము.

తన సృష్టియంతటి నుండి ఆరాధించబడుటకు దేవుడు యోగ్యుడైయున్నాడని ప్రకటన గ్రంథము ప్రత్యక్షపరుస్తుంది. పరలోకములో ఉన్న తన పరిశుద్ధులందరూ ఆయనను ఆరాధిస్తున్న విధమును గూర్చి ఇది సుందరమైన దృశ్యానిస్తుంది. దేవునిని ఆరాధించవలసియున్నదని ప్రకటన గ్రంథము మనము చూపుచున్న ఒక కారణమే క్రీస్తు మనకొరకు చేసిన రక్షణ కార్యము.

క్రీస్తునుండి మనము ఇప్పటికే పొందియున్న విమోచనను గూర్చిన సుందర దృశ్యము ప్రకటన 14:1-4 ఇవ్వబడియున్నది. గొర్రెపిల్ల యొక్క నామము మరియు తండ్రియొక్క నామము విశ్వాసుల యొక్క నొసళ్లయందు లిఖించబడియుండుటను గూర్చి 1వ వచనములో యోహాను వర్ణించుచున్నాడు. విశ్వాసులు మనుష్యులలో నుండి కొనబడియున్నారని, మరియు వీరు దేవునికిని మరియు గొర్రెపిల్లకు సమర్పించబడ్డారని 4వ వచనములో యోహాను వ్రాయుచున్నాడు. ఈ గొప్ప రక్షణకు ప్రత్యుత్తరముగా, నూతన గీతముతో తమ కృతజ్ఞతలు వ్యక్తపరచుటకు విశ్వాసులు దేవుని స్తుతించి, ఆరాధిస్తున్నారు.

మనము పొందుకొనిన ఈ రక్షణకు ప్రత్యుత్తరముగా ప్రతీ విశ్వాసి ఇటువంటి అనుభవమును తప్పక కలిగియుండాలి. మనమందరమూ క్రీస్తు చేత కొనబడియున్నాము, మరియు మనమందరము దేవునికి, గొర్రెపిల్లకు అర్పణగా సమర్పించబడియున్నాము. కృతజ్ఞతతో మరియు స్తుతులతో మనమందరము ప్రతిస్పందించవలసియున్నది, దేవునిని మరియు ఆయన క్రీస్తును సంతోషముతో పాడుతూ ఆరాధించాలి.

మనము కష్టములను ఎదుర్కొనుచున్నప్పుడు, దేవుని మంచితనమును సందేహించుట మరియు రక్షణలో మనకు ఇవ్వబడిన మంచివరములను మరచిపోవుట మనకు సుళువే — ఆ వరములేవనగా, క్షమాపణ, మన సృష్టికర్తయైన ప్రభువుతో సమకూర్చబడుట మరియు నిత్యజీవము వంటివి.

క్రీస్తు మనకొరకు నెరవేర్చి, వర్తింపజేసిన విమోచన కార్యమును మనము తరచూ జ్ఞాపకము చేసుకొనిన, ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, అది ఆయనను ఆరాధింపజేస్తుంది. దేవుడు మనలను ప్రేమించి పాపభరితమైన లోకములోకి వచ్చాడు, కఠినమైన శ్రమలను, హింసలను సహించాడు మరియు మనకొరకు సిలువలో మరణించాడు. క్రీస్తు మనకొరకు సహించిన శ్రమలతో ఈ లోకములోని ఏ శ్రమలు లేదా కష్టము పోల్చదగినవి కావు. అదే సమస్త ఆరాధనలకు, స్తుతులకు మరియు కృతజ్ఞతలకు ఆయనను యోగ్యునిగా చేయుచున్నది.

ఇంతవరకూ క్రీస్తు గతములో నెరవేర్చిన విమోచన కార్యము విధేయతతో ఆరాధించునట్లు ఏ విధముగా ప్రేరేపించుచున్నదో మనము చూశాము, కాబట్టి ఇప్పుడు మనలను ఆయన రాజ్యములో యాజకులను చేయుట ద్వారా ప్రస్తుతమందు మనలను ఏ విధముగా దేవుడు ఘనపరచుచున్నాడో చూద్దాము.

ప్రస్తుత కాలములో, పరలోక దేవాలయములో తన సింహాసముపై దేవుడు పరిపాలన చేయుచున్నాడు. భూమి మీదనున్న తన ప్రజలను ఆయన రాజ్యపు యాజకులుగా పిలచుచున్నాడు.

పాత నిబంధనలో, రాజులు మరియు యాజకులు ఎక్కువగా ఘనపరచబడేవారు ఏలయనగా, తన నిబంధన ప్రజలకు ప్రతినిధులుగా వీరు దేవుని చేత ఎన్నుకొనబడిన వారు. అయితే దేవుడు వారి యొక్క ప్రభువైయున్న ప్రకారము వారు లోబడుచున్నంత కాలము ఈ పరిచర్యలో వారు ఘనపరచబడుతూ వృద్ధి చెందుదురు. పాత నిబంధనలోని రాజులకు సంబంధించి, 1 రాజులు 3:13-14, యిర్మీయా 34:4-5, మరియు దానియేలు 4:34-37 వంటి లేఖన భాగాలలో దీనిని మనము చూడవచ్చు. యాజకత్వపు విధేయత మరియు ఘనతకు మధ్య సంబంధమును 2 దినవృత్తాంతములు 26:18, మరియు విలాపవాక్యములు 4:12-16 వంటి లేఖన భాగాలలో మనము చూడవచ్చును.

అయితే, పాత నిబంధనలో కొద్దిమంది మాత్రమే రాజులుగాను, యాజకులుగాను ఎన్నిక చేయబడినప్పటికీ, దేవుని యొక్క నమ్మకస్తులైన ప్రజలు ఈ భూమి మీద రాజులుగాను, యాజకులుగాను ఉండే దినము కొరకు పాత నిబంధన ఎదురుచూచినది.

నిర్గమకాండము 19:5-6లో దేవుడు ఇశ్రాయేలీయులకు చెప్పినట్లు:

కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనము గాను ఉందురు (నిర్గమ. కా.19:5-6).

ప్రకటన గ్రంథము ప్రకారము, పాత నిబంధన ఎదురుచూచుచున్న దినము ఇక్కడే ఉన్నది. సంఘము యాజక రూపమైన రాజ్యముగా ఈ భూమి మీద పరిపాలన చేయుచున్నది. ఈ సంగతిని ప్రకటన 5:9-10, మరియు 20:6లో మనము విస్తృతముగా చూడవచ్చు, మరియు అనేకమైన ఇతర భాగములలో ఇది వ్యక్తపరచబడుచున్నది.

మీకు తెలుసా, దేవుడు వారిని రాజులైన యాజక సమూహముగా యెన్నిక చేసియున్నానని నిర్గమకాండము 19లో దేవుడు ఇశ్రాయేలుతో చెప్పియున్నాడు, అది ఒక రాజ్య సంబంధమైన యాజకత్వమైయున్నది. నిర్గమకాండము 19లో ఉపయోగించిన పదజాలమే క్రొత్త నిబంధనలో సంఘమును గూర్చి పేతురు ఎత్తి చూపియున్నాడు. అందువలన ఈ దృక్పథమును బట్టి మనము కేవలము ప్రాచీన ఇశ్రాయేలువారికి సాదృశ్యముగా నుండుట మాత్రమే కాదుగానీ, క్రైస్తవులముగా మనము యాజక రూపమైన రాజ్యముగాను, ఒక ఎన్నిక చేయబడిన జనులముగాను, ఒక రాజ్య సంబంధమైన యాజకులుగా ఉన్నాము. ఈ విషయము అనేక విధములుగా క్రొత్తగా వినబడుతుందని నేనెరుగుదును, ఏలయనగా యాజకులను గూర్చి మనము సాధారణముగా ఏ విధముగా అలోచిస్తామంటే, యాజకులు చాలా పరిమితమైన పనులు మాత్రమే చేస్తారు; వారు బలులను అర్పిస్తారు, వారు ప్రార్థన చేస్తారు, ఆయా సందర్భాలలో పాటలు పాడుతారు, బహుశా బూరలు ఊదుతారు మరియు గాన బృందాలతో ఉంటారు, ఇటువంటి పనులే చేస్తారని మన ఆలోచన. కాని నిజానికి, బైబిలు గ్రంథము చెప్పుచున్నదేమనగా, శాస్త్ర సమ్మతమైన ప్రతీ కార్యము, దేవుడు – ప్రతిష్ఠించినది ప్రారంభము నుండి ముగింపు వరకూ ఈ భూమి మీద దేవుని సేవించుచున్న రాజులైన యజకత్వ సమూహము యొక్క కార్యములే. దేవుని సేవించుటకు కొన్ని పనులను మాత్రమే చేస్తు — ఆయనను ఆరాధించే కార్యక్రమములు — అటుతరువాత మిగిలిన పనులు ఏ కారణము లేకుండా మన కొరకు మనము చేసుకొనే పనులు కాదు. బదులుగా, క్రైస్తవులముగా మనము చేయు ప్రతీ కార్యము ప్రభువునకు చేసినట్లుగా హృదయపూర్వకముగా చేయాలి ఏలయనగా మనము ప్రభువుకే చేస్తున్నాము, అది నీవు చేసిన ఆరు రోజుల పని కావచ్చు, అది నిద్రపోవడమే కావచ్చు, అది పిల్లల పెంపకము కావచ్చు. ఏదైనప్పటికీ, అది రాజులైన యాజకుని కార్యము ఏలయనగా లోకములో దేవుని పరిశుద్ధతను చలింపజేయుటయే మన పని, మనము స్వచ్ఛమైన, పరిశుద్ధమైన, పవిత్రపరచబడిన భూమిపైన, సదాకాలము తన యొక్క రాజులైన యాజక సమూహముగా దేవునిని సేవించు నూతన ప్రపంచము కొరకు ఎదురుచూచుచున్నాము.

—డా. రిచార్డ్ యల్. ప్రాట్, జూ

అయితే, ఈ సత్యమును గూర్చి అనేక అన్వయింపులు ఉన్నాయి. ఉదాహరణకు, ఈ భూమి మీద క్రైస్తవులు దేవుని యొక్క రాయబారులు. మనము ఆయనకు మరియు ఇతరులకు సేవ చేయుటకు పిలువబడ్డాము. మనము ఈ భూమిని బాధ్యతాయుతముగా పాలించవలసియున్నది, ఇటువంటివి అనేకము ఉన్నాయి. అయితే ఈ పాఠములో మనము దృష్టించుచున్న అన్వయింపులు అనగా ఈ ఘనత ఆయనను ఆరాధించు విధముగా మనలను పురిగొల్పాలి.

ఉదాహరణకు, ప్రకటన 5:8-14లో, పరలోకపు ఆవరణములో ఆరాధన చేయుచున్న అద్భుతమైన దృశ్యము ఉన్నది. ఈ దృశ్యములో భాగముగా, నాలుగు జీవులు మరియు ఇరువది - నలుగురు పెద్దలు సితారాలతోను, పాటలతోను మరియు ధూపముతోను గొర్రెపిల్ల యేసును స్తుతించి, ఆరాధిస్తున్నారు.

దేవుని నమ్మకస్తులైన ప్రజలను గూర్చి వారేమి పాడుచున్నారో ప్రకటన 5:10లో నుండి వినండి:

దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు (ప్రకటన 5:10).

యేసు ఆరాధనకు యోగ్యుడని చెప్పుటకు ఒక ప్రాముఖ్యమైన కారణమేమనగా, ప్రస్తుతమందు మనము ఆయన యాజకులముగా సేవించి, భూమి మీద పరిపాలించు రాజులుగా మనలను నియమించి తన ప్రజలను ఆయన ఘనపరచుచున్నాడు.

దీనికి సారూప్యమైనదే ప్రకటన 4:10-11లో చూడవచ్చు. పరలోకములో పెద్దలు వారికివ్వబడిన ఘనత మరియు రాజరికపు అధికారమునకు ప్రత్యుత్తరముగా వారు యేసు యెదుట సాష్టాంగపడి, వారి కిరీటములను ఆయన పాదముల చెంత పెట్టి, ఆయనను స్తుతించుట, ఈ లేఖన భాగములో చూడవచ్చు.

మరియొక ఉదాహరణ 7వ అధ్యాయములో కనుగొనవచ్చును, అచ్చట అసంఖ్యాకమైన జనము దేవుని సేవకులుగా ముద్రించబడ్డారు. వారికివ్వబడిన కృప, ఘనతలకు ప్రత్యుత్తరముగా, ప్రభువు యొక్క దయాళుత్వము, కనికరము మరియు అధికారము కొరకై వారు ఆయనను స్తుతిస్తున్నారు.

ప్రకటన 1:5-6లో, అపొస్తలుడైన యోహాను ఇటువంటి మాదిరిని మనకు చూపిస్తున్నాడు. అక్కడ ఆయన చెప్పినది వినండి:

... మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్‌ — ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను! (ప్రకటన 1:5-6).

ఈ వచనములలో, మనలను యాజకరూపమైన రాజ్యముగా ఆశీర్వదించుచున్న ప్రభువును ఆరాధించుట ద్వారా కలుగు ఘనతకు అన్ని యుగములలో ఉన్న సంఘము ప్రతిస్పందించాలని యోహాను ప్రత్యక్షపరుస్తున్నాడు.

ఆయన స్వతంత్రుడు, అవసరత లేనివాడు; ఆయన సంపూర్ణముగా స్వయం – సమృద్ధి గలవాడు అని మనము గ్రహించినప్పుడు, దేవునికి పరిచర్య చేయుట మరియు దేవునిని స్తుతించుటను గూర్చి మాట్లాడుట కొంచెము క్రొత్తగానే ఉంటుంది. అయితే, ఆయనతో మనకున్న సంబంధములో, ఆయనకు విధేయత చూపుటలో లేదా ఆరాధించుట ద్వారా లేక నమ్మకముగా జీవించుట ద్వారా మనము ఆయనను సంతోషపరచవచ్చు. అందువలన, అనుదినము నమ్మకత్వము, అనుదినము విధేయత మరియు దేవుని ఆరాధించుట నిజానికి దేవునికి స్తుతి చెల్లుతుంది మరియు ఆయన హృదయానికి ఆనందము నిస్తుంది. నిజముగా క్రైస్తవునిగా ఉండుటలో ముఖ్య ఉద్దేశము అదే. అలాగని మనకు చెడ్డ కార్యాలు జరగవని లేక దేవుడు మనపట్ల కోపగించుకుంటాడని కాదు గానీ, మనము నివసించు జీవితము ద్వారా మన సృష్టికర్త హృదయమునకు ఆనందము తెచ్చువారివలె ఉండాలి.

—డా. కె. ఎరిక్. థియోన్నెస్

దేవుని యాజకులుగా, విశ్వాసులే నిజముగా పరలోకములో దేవునికి సేవచేయుదురనే విషయమును కొన్నిసార్లు మర్చిపోతున్నాము. అనగా, పరలోకపు దేవాలయమును కొనసాగించుటలో ప్రభువు సంతోషించు విధముగా మనము సేవచేయుదము. ఉదాహరణకు, దేవుని పరలోకపు దేవాలయములో పరిశుద్ధుల ప్రార్థనలు నిండిన సువర్ణ పాత్రలోని ధూపమువలె ఉన్నాయని ప్రకటన 5:8 నిశ్చయపరుస్తుంది. మరియు ప్రకటన 8:3-5లో, ఈ ప్రార్థనలు దేవుని సన్నిధిని చేరుతున్నాయి, మరియు భూమి మీదకి తీర్పును పంపించుట ద్వారా ఆయన ప్రత్యుత్తరమిస్తున్నాడు.

ఆయన రాజ్యపు యాజకులుగా దేవుని ప్రజలు నేడు ఘనతను కలిగియున్నారు. దేవుడు మనలను తన రాజ్యములోనికి తీసుకొని వచ్చియున్నాడు, మరియు ఆయన రాజ్యమును లోకమంతటా వ్యాపించాలని మనలను నియమించియున్నాడు. ఆయన యాజకులముగా, పరలోకపు దేవాలయములో ఆయన పరిచర్య చేయు ఘనత మనకు ఉన్నది. దీనిని గూర్చి ఆలోచించండి — ఈ విశ్వమంతటికి సృష్టికర్త మరియు పరిపాలకుడైన వానికి మనము నేరుగా పనిచేయనున్నాము. తన సృష్టిపైన ఆయన మనకు అధికారమును ఇచ్చియున్నాడు, మన సేవ మరియు ప్రార్థన ఆయనకు అప్పగించునప్పుడు ఆయన మన మాటలు శ్రద్ధగా వింటాడు. ఆయన మన ప్రార్థనలు కూడా వింటాడు, మరియు నమ్మకమైన వారిని ఆశీర్వదించుటకు మరియు ఆయన పరిపాలనను వ్యతిరేకించువారిని తీర్పుతీర్చుటకు ఆ ప్రార్థనలను సాధనముగా ఉపయోగిస్తాడు. ఇటువంటి గొప్ప ఘనతకు మనము ఏ విధముగా స్పందించాలి? కృతజ్ఞతపూర్వకమైన విధేయత మరియు స్వచ్ఛమైన ఆరాధనను ఇచ్చుట ద్వారా చేయగలము.

గతములో క్రీస్తు నెరవేర్చిన కార్యమును మరియు ప్రస్తుతమందు మనకున్న ఘనతను చూచిన తరువాత, ఆయన భవిష్యత్తులో మనకు ఇవ్వబోవు ఆశీర్వాదమును బట్టి మన విధేయతతో కూడిన ఆరాధనకు దేవుడు యోగ్యుడైయున్నాడని చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.

సంఘము దేవుని ఆరాధించాలని ప్రకటన గ్రంథము పిలుపునిచ్చుచున్నది, ఏలయనగా తీర్పుతీర్చునప్పుడు ఆయన గొప్ప ఆశీర్వాదము మనకు అనుగ్రహించుచున్నాడు, అది నూతన ఆకాశము, నూతన భూమిలో క్రీస్తుతో కలసి శాశ్వతకాలము పరిపాలించునప్పుడు జరుగుతుంది. మనము వెంబడించుటకు కొన్ని ఉదాహరణలు ఇచ్చుట ద్వారా దేవునిని ఆరాధించునట్లు ఈ గ్రంథము తరచూ ప్రోత్సహిస్తుంది.

ప్రకటన గ్రంథము 11:16-18లో పెద్దలు ఇచ్చుచున్న ఉదాహరణ పరిగణించండి:

అంతట దేవునియెదుట సింహాసనాసీనులగు ఆ ఇరువది - నలుగురు పెద్దలు, సాష్టాంగపడి దేవునికి సమస్కారము చేసి: “వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి యేలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచుచున్నాము ... మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును, పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును ... సమయము వచ్చియున్నదని చెప్పిరి (ప్రకటన 11:16-18).

ఈ దర్శనములో, భవిష్యత్తు తీర్పుదినమును యోహాను చూచియున్నాడు. ఆ దినమున, దేవుని నమ్మకస్తులైన వారందరూ శాశ్వతమైన ప్రతిఫలము పొందుదురు, మరియు దేవుని శత్రువులనందరిని శాశ్వతమైన నాశనమునకు పంపించును. ఈ దృశ్యములో భాగముగా, పెద్దలు దేవుని ఆరాధించుటను యోహాను గమనించుచున్నాడు, ఏలయనగా ఆయన వారికి ప్రతిఫలమిచ్చుచున్నాడు మరియు వారి శత్రువులను తొలగించుచున్నాడు. ఈ ఉదాహరణ ద్వారా, ఇప్పుడు, ప్రస్తుత కాలములో కూడా దేవుడు మన ఆరాధనకు యోగ్యుడని యోహాను దినములలో ఉన్న సంఘములు అర్థము చేసుకున్నాయి ఏలయనగా, అవే భవిష్యత్తు ఆశీర్వాదములు మనకు కూడా వాగ్దానము చేయబడ్డాయి.

మరియొక ఉదాహరణ 7:9-10లో కనుగొనవచ్చు, అచ్చట ఈ విధముగా చదువుతాము:

... ఇదిగో, ప్రతి జనములోనుండియు ప్రతివంశములో నుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడు వారిలో నుండియు వచ్చి, యెవడును లెక్కింపజాలని యొక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించు కొన్నవారై, ఖర్జూరపుమట్టలు చేత పట్టుకొని “సింహాసనాసీనుడైన మా దేవునికిని గొఱ్ఱపిల్లకును మా రక్షణకై స్తోత్రమని” మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి (ప్రకటన 7:9-10).

ఈ లేఖన భాగములో, యోహాను వివరించుచున్న జనసమూహము తెల్లని వస్త్రములు ధరించి, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకొనియున్నారు. ప్రకటన 7:14-17 ప్రకారము, తెల్లని వస్త్రములు వారు పొందుకొనిన ఆశీర్వాదమునకు సాదృశ్యముగా ఉన్నవి. వారు శ్రమల గుండా తీసుకురాబడిన వారు మరియు వారి పాపములు క్రీస్తు రక్తములో క్షమించబడియున్నవి.

మరియెక్కువగా, వారు శాశ్వతమైన దేవుని రాజ్యములోనికి అనుమతించబడ్డారు, మరియు వారియొక్క శాశ్వత ప్రతి ఫలమును పొందియున్నారు. అయితే వారు దేవునికి ఏ విధముగా ప్రతిస్పందించారు? ఆయనను ఆరాధించుట ద్వారా. మరియు వారి యొక్క మాదిరి యోహాను యొక్క అసలైన శ్రోతలును ఆ విధముగా చేయుటకు ప్రేరేపించియుండేది, ఏలయనగా, అవే ఆశీర్వాదములు వారికి కూడా ఇవ్వబడినవి. మరియు అదే విషయము అన్ని కాలములలో ఉన్న విశ్వాసులకు వర్తిస్తుంది.

ఆ జన సమూహము చేతపట్టుకొనిన ఖర్జూరమట్టల విషయము కూడా ఆ విధముగానే ఉన్నది. లేవీయకాండము 23:40 ప్రకారము, ప్రభువు నెరవేర్చు రక్షణ కార్యమునకు సూచనగా పర్ణశాలల పండుగలో ఖర్జూరపు మట్టలు ఎల్లప్పుడూ ఉపయోగించేవారు. యోహాను 12వ అధ్యాయములో యేసు యెరూషలేము లోనికి విజయోత్సవముతో ప్రవేశించునప్పుడు, మనకు తెలుపబడిన ఒక విషయమేమనగా ఆ జనసమూహములు ఆయనను ఖర్జూర మట్టలతో ఆహ్వానించారు, దేవుని మెస్సీయ రాజ్యమును ఆయన తీసుకువస్తాడని వారు విశ్వసించుచున్న దానికి అది సూచనగా ఉన్నది. కావున, యోహాను దర్శనములో ఖర్జూరపు మట్టలు చేతపట్టిన సమూహములు దేవుని రాజ్యపు భవిష్యత్తు ఆశీర్వాదములను పొందియుండుటను సూచించుచున్నది. వారిని ఆశీర్వదించిన వానిని ఆరాధించుచూ తమ కృతజ్ఞతా స్తుతులను చెల్లించారు.

దేవుని శత్రువులపైన యేసు ఇప్పటికే విజయమును పొందియున్నాడు. మరియు భవిష్యత్తులో పొందబోవు గొప్ప ఆశీర్వాదము కొరకు ప్రతీ విశ్వాసి ఎదురు చూడవచ్చును, మనము మరణించునప్పుడు పరలోకములోను, మరియు యేసు తిరిగి వచ్చునప్పుడు నూతన ఆకాశము మరియు నూతన భూమి యందు కూడా పొందుదము. జయశీలుడైన మన దేవుని స్తుతించి, ఆరాధించుటకు మనందరికి అది ఒక కారణము నిచ్చుచున్నది.

దేవుని ఆరాధించుట అనగా ఏమిటో అని ఆలోచన చేయునప్పుడు, తరచుగా మనము సృష్టి క్రమమును చూచుదము, క్రీస్తు యొక్క సిలువ మరియు మన పాపక్షమాపణ నిమిత్తము మనము కలిగియున్న అవగాహనను చూచెదము మరియు మనము అయన పిల్లలముగా దత్తత చేయబడ్డాము. ఇవన్నీ ప్రస్తుతమున్న సంపదగా మనము చూస్తున్నాము. దావీదు 19వ కీర్తనలో చెప్పుచున్నట్లు మనము కూడా ఈ విధముగా చెప్పవచ్చును, “ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.” మన చుట్టూ ఉన్న సౌందర్యమును మనము చూచుచున్నాము; మనము వీటన్నిటికొరకు కృతజ్ఞతలు చెల్లించువారమై యుండాలి. క్రీస్తు నెరవేర్చిన కార్యమును గూర్చి మరియు మనము దేవుని పిల్లలముగా, క్షమాపణ పొందిన ప్రజలముగా మనకున్న ధన్యతను గూర్చి లేఖన పరిభాషలో మనము చూస్తూ ఉన్నాము మరియు దానికొరకు దేవునిని స్తుతిస్తున్నాము. అయితే, లేఖనాలలో మనము కలిగియున్న ఒక సంగతేమనగా, భవిష్యత్తులో ఉన్న ఆశీర్వాదమును భద్రపరచుకోవాలి మరియు నిశ్చయత కలిగియుండాలి. నిజానికి, మనకు భవిష్యత్తు ఆశీర్వాదములు మన మిప్పుడు కలిగియున్న వాటికంటే ఎంతో విస్తారమైనవి మరియు మహిమాన్వితమైనవిగా లేఖనాలు సూచిస్తున్నాయని నేను తలంచుచున్నాను

—డా. థామస్. జె. నెట్టల్స్

మన జీవితములలో ఇప్పటికింకా నెరవేర్చబడని విషయాలలో కూడా దేవుడు ఆరాధనకు యోగ్యుడైయున్నాడు ఏలయనగా అవి నిశ్చయముగా జరుగుతాయని మనకు తెలుసు. క్రైస్తవ విశ్వాసమేమనగా, దేవుని సార్వభౌమత్వపు దయాళుత్వము, అధికారము నందు నిరీక్షణ యుంచుట, కావున ఏదైనా చేస్తానని దేవుడు వాగ్దానము చేస్తే, అది తప్పక జరుగుతుందని మనము ఆయనను స్తుతించి, ఆరాధించాలి. ఆయన చేసిన దాని కొరకు, చేస్తున్నదాని కొరకు మరియు చేయబోవుచున్న దాని కొరకు మనము దేవునిని ఆరాధించాలి.

—డా. కె. ఎరిక్. ధోయేన్స్

దేవునికి విధేయత అనే అంశము ప్రకటన గ్రంథములో అనేక విధములుగా వ్యక్తపరచబడినది. అయితే ముందు మనము చూచినట్లు, ప్రస్తుత లోకములో దేవుని యెడల మన విధేయతను ఆరాధన మరియు పట్టుదల ద్వారా వ్యక్తపరచవచ్చని ప్రకటన గ్రంథము ఎత్తి చూపుతుంది అయితే, ఇది అన్ని సమయాలలో సుళువు కాదు. నిజానికి, మనము ఎక్కువ శ్రమ పొందుచున్న కొలది, పట్టుదల కలిగియుండుట కష్టమౌతుంది, మరియు ఆరాధించాలనే ప్రేరణ తక్కువగా ఉన్నట్లు కనుగొంటాము. కానీ మిక్కిలి కష్టతరమైన పరిస్థితులలో కూడా ఆయనకు నమ్మకస్తులై యుండునట్లు దేవుడు తన ప్రజలకు బలము నిచ్చుచున్నాడని యోహాను స్పష్టము చేయుచున్నాడు. ప్రస్తుతమందున్న మన పరిస్థితులు ఏ విధముగా ఉండినప్పటికీ, దేవుని ఆరాధించడానికి అపరిమితమైన కారణాలు ఉన్నాయని యోహాను సూచించుచున్నాడు అవేవనగా గతములో మనము పొందియున్న రక్షణ, ప్రస్తుతమందు ఉన్న ఘనత మరియు భవిష్యత్తులో మనము పొందుకోబోవుచున్న ఆశీర్వాదము.

మనము దేవుని యొక్క రాజత్వమును, దయాళుత్వమును మరియు మన యొద్దనుండి కోరుచున్న విధేయతను ఇంతవరకూ విశ్లేషించియున్నాము, ఇప్పుడు దేవుని యెడల విధేయత మరియు అవిధేయత చూపించుట వలన కలుగు పర్యవసానములను గూర్చి ప్రకటన గ్రంథము ఏమి చెబుతుందో చూచుటకు సిద్ధముగా ఉన్నాము.

ఈ భాగములో, క్రీస్తు రాకడలో దేవుని రాజ్యమును దాని సంపూర్ణతతో తీసుకువచ్చుచున్నప్పుడు మానవజాతి పొందుకొనే పర్యవసానములు యందు దృష్టిపెట్టుదము. విధేయతకు కలుగు అనేక ఆశీర్వాదములను మరియు అవిధేయతకు కలుగు అనేకమైన శిక్షలు, శాపములను ప్రకటన గ్రంథము తెలుపుతుంది. వీటిలో అనేకమైన వాటిని ఈ యుగములో కూడా అనుభవించవచ్చు. మన పాఠములో ఈ సందర్భములో క్రీస్తు తిరిగివచ్చునప్పుడు వచ్చే పర్యవసానములను మనము దృష్టించబోవుచున్నాము.

నీతిమంతులకు మరియు అనీతిమంతులకు క్రీస్తు రెండవ రాకడలో అంత్య తీర్పుతీర్చుతాడని ఇవాంజిలికల్ క్రైస్తవులందరూ ఎదురుచూస్తున్నారు. మునుపటి పాఠములో, యోహాను పొందిన నాలుగు దర్శనములలో వరుసగా వచ్చు తీర్పులలో నుండి ఈ అంత్యతీర్పు వర్ణించబడినట్లు మనము అభిప్రాయపడ్డాము. ఈ అభిప్రాయముతో అందరూ ఏకీభవించక పోయినప్పటికీ, యోహాను వివరించిన తీర్పును గూర్చిన సాధారణ విధమును చాలామట్టుకు క్రైస్తవులు అంగీకరించుదురు.

సామంత రాజుగా క్రీస్తుతో చేసిన దేవుని నిబంధనకు పర్యవసానముగా అంత్యతీర్పు ఆవశ్యకమైయున్నది. రాజుగా క్రీస్తు పరిపాలనలో భూమి, ఆకాశము నూతన పరచబడుచున్నాయి, ఆ ప్రకారముగా సృష్టి సంపూర్ణముగా దేవుని మహిమను కనబరచును. ఆ విధముగా జరుగుటకు, మంచితనము ఘనపరచబడాలి మరియు ఆశీర్వదించబడాలి, మరియు దుష్టత్వము, దేవుని రాజ్యానికి వ్యతిరేకత శిక్షించబడి, తొలగించబడాలి.

దేవునికి విధేయత మరియు అవిధేయత చూపించుటవలన కలుగు పర్యవసానములను రెండు భాగములుగా మనము విశ్లేషించెదము. మొదటగా, దేవునికి అవిధేయులైన వారికి కలుగు కడవరి శాపములను చూచెదము. రెండవదిగా, విధేయులైన వారికి నూతన ఆకాశము, నూతన భూమిలో ఇవ్వబడిన కడవరి ఆశీర్వాదములను మనము పరిగణించెదము. దేవుని శత్రువులపై వచ్చు కడవరి శాపములను మొదట చూచెదము.

దేవుని శత్రువులకు కలుగు కడవరి శాపములను కనీసము మూడింటిని ప్రకటన గ్రంథము వర్గీకరించుచున్నది. ఘటసర్పము, క్రూరమృగము మరియు అబద్ధ ప్రవక్త యొక్క నాశనము గూర్చి మొదటగా ప్రస్తావించుదము.

మానవ చరిత్రయంతటిలో ఘటసర్పము మరియు వాని అనుచరులు దేవునిని వ్యతిరేకించారు. సాతనుడు ఏదెను వనములో ఉన్నాడు, మంచి చెడుల తెలివినిచ్చు వృక్షఫలము తినునట్లుగా హవ్వను శోధించాడు. అప్పటి నుండి వాని శక్తులు దేవునిని, ఆయన రాజ్యమును ఓడించుటకు ప్రయత్నించుచున్నాయి. కానీ, యేసు తిరిగివచ్చునప్పుడు, సాతానుడు పూర్తిగా తుదకు ఓడించబడతాడు. క్రూరమృగము మరియు అబద్ధ ప్రవక్త పట్టబడి, అగ్ని గుండములో త్రోయబడతారని ప్రకటన 19:19-21 బోధించుచున్నవి. మరియు ఘటసర్పము కూడా ఓడించబడి అగ్నిగుండములో పడవేయబడతాడని 20:9-10లో చూస్తాము, అప్పటి నుండి నమ్మకస్తులైన దేవుని ప్రజలకు వాడెంతమాత్రము హాని చేయడు వానితో పాటు పోరాడుచున్న దురాత్మశక్తులన్నియు శాశ్వతముగా నాశనము చేయబడతాయి.

రెండవ కడవరి శాపము ఏదనగా, శత్రు రాజులను మరియు దేశములను ఓడించుట.

అనేకచోట్ల, దేవుని శత్రువులైన రాజులు మరియు రాజ్యముల నాశనమును గూర్చి ప్రకటన గ్రంథము వివరించుచున్నది. ఉదాహరణకు, భూరాజులును, సహస్రాధిపతులును, ధనికులును మరియు బలిష్ఠులును గొర్రెపిల్ల ఉగ్రతనుండి తమను మరుగుచేయమని పర్వతములను కోరుచున్నట్లు ప్రకటన 6:16-17లో వివరించబడినది. తన పరిపాలనను వ్యతిరేకించు మానవ శక్తులకు క్రీస్తు తీర్పుతీర్చుటకు ఇది సాదృశ్యముగా కనబడుతుంది.

ప్రకటన 19:15-21లో, యేసు తెల్లని గుఱ్ఱముపై ప్రత్యక్షమగుతాడు, పరలోక సేనలను నడిపిస్తూ, వారి స్థానములో తాను పరిపాలించు విధముగా భురాజులను అణగద్రొక్కుతాడు.

మరియు దేవుడు బబులోనుకు త్రాగించుటను గూర్చి ప్రకటన 16:19లో ఉంది:

తన తీక్షణమైన ఉగ్రతయను మద్యముగల పాత్రను మహా బబులోనునకు ఇయ్యవలెనని ... (ప్రకటన 16:19).

ముందు పాఠములో చూచినట్లుగా, క్రీస్తు రాజ్యమును వ్యతిరేకించు మానవ, ప్రభుత్వ శక్తులకు బబులోను సాదృశ్యముగా ఉన్నది. వారి యొక్క అవిధేయతను బట్టి ఈ రాజ్యములు మరియు వారి పాలకులు దేవుని ఉగ్రతను పూర్తిగా అనుభవించుటకు శాసించునట్లు ఈ లేఖన భాగము వర్ణించుచున్నది.

మూడవ కడవరి శాపమేదనగా అవిశ్వాసులను శిక్షించుట:

క్రీస్తు యొక్క రాకడలో శత్రు రాజులు మరియు రాజ్యములు నాశనము చేయబడుట మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకముగా వారు తిరుగుబాటు చేసినదానికి ప్రతిఫలముగా ఈ రాజ్యములలో అవిశ్వాసులైన భూనివాసులందరూ తీర్పు తీర్చబడతారు. ఉదాహరణకు, ప్రకటన 14:17-20లో, ఇద్దరు దేవదూతలు భూమి మీదనున్న అవిశ్వాసులను ప్రోగుచేసి ద్రాక్ష గెలలవలె వారిని “దేవుని కోపమను ద్రాక్షల పెద్దతొట్టిలో వేసెను.” మరియు ప్రకటన 20వ అధ్యాయములో, జీవగ్రంథమందు పేర్లు వ్రాయబడని వారిని అగ్నిగుండములో పడవేయుటను గూర్చి వ్రాయబడినది.

ప్రకటన 20:12-15లో యోహాను ఇచ్చుచున్న వివరణ వినండి:

మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని, అప్పుడు గ్రంథములు విప్పబడెను. మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి ... ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను (ప్రకటన 20:12-15).

ఇచ్చట అవిశ్వాసులైన వారందరికి భవిష్యత్తులో కలుగు శిక్షను గూర్చి యోహాను వివరించుచున్నాడు. వారు ఆయనకు వ్యతిరేకముగా పాపము చేసినందున ఎన్నటికిని అంతము కాని దేవుని ఉగ్రతను అనుభవించుటకు వారిలో ప్రతి ఒక్కరూ అగ్నిగుండములోనికి త్రోయబడుదురు.

మన చుట్టూ ఉన్న లోకమును మరియు అవిశ్వాసులను ప్రజలను గూర్చి తలంచునప్పుడు, వారిని గూర్చి మనము ఏమి ఆలోచించాలి? వారి యెడల మన వైఖరి ఏ విధముగా ఉండాలి? మనము వారికంటే ఆధిక్యము కలిగినవారమని ఆలోచించుటకు ప్రేరేపించబడతాము మరియు ప్రాముఖ్యముగా మనపట్ల కఠినముగా ప్రవర్తించినప్పుడు లేక మనలను గేలిచేసినప్పుడు, అటువంటివి ఏవైనా చేసినప్పుడు ఇలా ఆలోచిస్తాము. అయితే వారికి సేవ చేసే ఆకాంక్ష, వారిపట్ల కనికరము కలిగి, తప్పిపోయిన వారిగా చూడాలని యేసు కోరుతున్నాడని నేను భావిస్తున్నాను ఏలయనగా ఎవరు మార్పుచెందుతారో మనమెరుగము, కావున వారికి సువార్త ప్రకటించాలి వారు ప్రతిస్పందిస్తారనే నిరీక్షించాలి. తీర్పు యొక్క వేరొక కోణమును గూర్చి మనము ఆలోచన చేసినప్పుడు, వారి పట్ల మన వైఖరి ఏమిటి? కనికర స్వభావము మరియు వారి యెడల విచారము కనుపరచాలని నేను భావిస్తున్నాను. ఆ దినమున వారు వ్రేలు చూపించి, “నీకు తెలుసు కదా, ఈ క్రీస్తును గూర్చి నీ వెందుకు చెప్పలేదు?” అని వారు చెప్పకముందే, వారికి సువార్త అందించు అవకాశము ఉన్నప్పుడే వారిని ప్రేమించే స్పష్టమైన మనస్సాక్షిని మనము కలిగియుండాలి. వారిని ముందుగానే నిందించకుండా, భవిష్యత్తు దృక్పథము కలిగి వారితో మనము కలిసి జీవించాలి, అయితే వారికి సేవచేయుటలో మరియు సహాయము చేయుటలో క్రీస్తు విమోచన కనబడుతుంది.

—డా. జాన్. ఇ. మెక్కిన్లె

దేవుని యొక్క శత్రువులందరూ అంత్యతీర్పులో శిక్షించబడి, నాశనము చేయబడతారని ప్రకటన గ్రంథము చాలా స్పష్టముగా చూపుచున్నందున, నేడు అవిశ్వాసులైన వాటిపట్ల మన ఆలోచనా విధానము ధైర్యముగా నుండునట్లు కనికరముతో సాక్ష్యమిచ్చునట్లు మరియు తగ్గింపు కలిగియుండాలి. ధైర్యముగా నుండుట ఎందుకంటే, అంత్యముగా విజయము క్రీస్తునకే చెందునని మనకు తెలియును. మన విశ్వాసమును, మన ప్రభువును అసహ్యించుకొనిన అవిశ్వాసులైన వారు మనకు వ్యతిరేకముగా చేయుచున్న బెదిరింపులకు మనము నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. అదే సమయములో, మనము కనికరము కూడా కలిగియుండాలి. మనము గ్రహించుచున్నట్లు, ఈ ఆలస్యము, అనగా క్రీస్తు రెండవ రాకడ ఆలస్యము, ప్రకటన గ్రంథము మనకు చూపుతున్నట్లు, దేవుని యొక్క ప్రజలందరిని సమకూర్చుటకే అని మనము గ్రహించాలి. దేవుని యొక్క తీర్పుతో ముడిపడియున్న ఏడు బూరల సూచనలు, హెచ్చరిక స్వరములు, ప్రజలను పశ్చాత్తాపము చెందుటకు పిలచుచున్నాయి. అయితే వారు సువార్త ద్వారా పశ్చాత్తాపపడుదురు గనుక మనము సాక్ష్యమియ్యవలసి యున్నది. మనము తగ్గింపును కలిగియుండాలి, ఏలయనగా దేవునికి తిరుగుబాటు చేయుటవలన సంభవించు తీర్పు అంత్యమున మనకు జ్ఞాపకము చేయబడును, మనము దేనికి పాత్రులమో అది మరియొకసారి మనకు గుర్తుచేస్తుంది. ఈ రోజు అవిశ్వాసులైన వారికంటే మనము అధికులము కాము. మనము ఒకప్పుడు శత్రువులము అయితే విశ్వాసము ద్వారా క్రీస్తుతో ఐక్యమగుటకు దేవుడు కృప నిచ్చియున్నాడు.

—డా. డెన్నిస్ ఇ. జాన్సన్

కడవరి తీర్పులో సంభవించు శాపములు భయపెడుతూ ఉన్నప్పటికీ, ఆ శాపములు న్యాయమైనవే అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. వారి యొక్క అవిధేయతను బట్టి శిక్షించబడుటకు అవిశ్వాసులు తీర్పునొందదగిన వారు. దేవుడు తన సృష్టిపైన రాజైయున్నాడు, ఆయనకు అవిధేయత చూపుట పాపమును మరియు తిరుగుబాటునై యున్నది. ఈ సంగతి గ్రహించుటకు బాధాకరమైనప్పటికీ, పాపము మరియు తిరుగుబాటు శిక్షించబడాలని దేవుని నీతి కోరుచున్నది. ఈ ప్రకారముగా, దేవుని నీతియుక్తమైన రాజరికములో దుష్టులను శిక్షించుట ప్రాముఖ్యమైన అంశము.

కడవరి శాపములలో పాపము మరియు అవిధేయత వలన కలుగు పర్యవసానములను ఇంతవరకూ మనము చూచియున్నాము, ఇప్పుడు నూతన ఆకాశము మరియు నూతన భూమిలో దేవుని నమ్మకస్తులైన ప్రజలకు పర్యవసానముగా కలుగు ఆశీర్వాదములను చూచెదము.

పాపమునకు వ్యతిరేకముగా దేవుని తీర్పులో, ఆయన పరిపాలనను వ్యతిరేకించిన ఆత్మీయ మరియు ప్రభుత్వ బలగాలు ఈ లోకములో నుండి తుడిచి వేయబడతాయి, మరియు వారితో పాటు అవిశ్వాసులైన వారు తీర్పుతీర్చబడతారు. దేవుని శత్రువుల నుండి సృష్టి శుద్ధిచేయబడిన తరువాత, ఈ విశ్వమంతా నూతనపరచబడుతుంది, ఫలితముగా దేవుని నమ్మకస్తులైన ప్రజలు నూతన ఆకాశము మరియు నూతన భూమిని సదాకాలము అనుభవింతురు.

ప్రకటన 21:1-5 నూతన సృష్టిని ఈ విధముగా వర్ణిస్తుంది:

అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను ... “మొదటి సంగతులు గతించి పోయెనని “సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైయున్నవాడు, “ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను” (ప్రకటన 21:1-5).

యోహాను చెప్పినట్లు దేవునికి విధేయులైన వారికి కలుగు మూడు ఆశీర్వాదములను మనము ప్రస్తావించుదము. మొదటగా, సృష్టియంతయు సంపూర్ణముగా నూతనపరచుబడుతుంది లేదా సరిక్రొత్తదిగా చేయబడుతుంది.

మొదటి ఆకాశము మరియు మొదటి భూమి గతించిపోవుటను గూర్చి ప్రకటన 21:1, 4 మాట్లాడుచున్నాయి, ఇవి ఒక విధముగా అవి ఉనికిలో ఉండవని సూచిస్తున్నాయి. ఇటువంటి తలంపులను మనము 2 పేతురు 3:10-11లో చూస్తాము, క్రొత్తది వచ్చుటకు ప్రస్తుతమందున్న లోకము నాశనము చేయబడుచున్నట్లు అవి మాట్లాడుచున్నాయి.

అయితే, నూతనపరచబడుట ద్వారా క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కలుగుటను ప్రకటన 21:5 వర్ణించుచున్నది, అది పూర్తిగా తుడిచిపెట్టుటకు బదులుగా, పాత సృష్టి నూతనము చేయబడుట లేదా క్రొత్తదిగా చేయబడుటను సూచిస్తుంది. ఇదే తలంపు రోమా 8:19-22 వంటి భాగాలలో కనబడుతుంది. రెండు సృష్టుల మధ్య వాస్తవమైన కొనసాగింపు ఉంటుందని, ఒకదానికొకటి పోలియుండదని ఈ లేఖన భాగాలు బోధించుచున్నాయి. జనముల మహిమ, ఘనత నూతన యెరూషలేములోనికి తీసుకురాబడుతుందని ప్రకటన 21:24-26 తెలుపుచున్నది, అనగా మన ప్రస్తుత జీవితముల విమోచనా అంశము క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమితో ముడిపడియున్నదని సూచిస్తుంది.

ఫలితముగా, ప్రస్తుతమున్న సృష్టి పూర్తిగా తీసివేయబడదు మరియు దాని స్థానములో వేరొకటిరాదని అనేకమంది వేదాంతపండితులు ముగింపు చెప్పుచున్నారు. దానికి బదులుగా, అది సమూలనముగా రూపాంతరము చెందును.

మంచిది, నూతన యెరూషలేములో ఛాయగా కనిపించే విషయాలు అనేకము ప్రకటన గ్రంథములో ఉన్నట్లు చూడవచ్చు మరియు నిజానికి, ఆదికాండము 2, 3 అధ్యాయములలో సృష్టి ఆరంభములో ఉన్న దృశ్యాలకు, జీవవృక్ష ఫలముల చెట్టు వంటి వాటికి పోలిక కలిగియున్నాయి. కావున అవి ఎందుకు ప్రాతినిధ్యము వహిస్తున్నాయని మనలను మనము ప్రశ్నించుకోవాలి? మంచిది, దానిని అన్వయించుటకు అనేక విధానాలు అచ్చట ఉన్నాయి కానీ, నూతన యెరూషలేముతో ముడిపడియున్న అనేక అంశాలు, వాస్తవముగా సృష్టి యొక్క ఉద్దేశము మరియు నడిపించబడు రీతిలో ఈ అంశాలు ఏకీభవించుచున్నాయని మామూలుగా చదివినా అర్థమౌతాయని నేను భావిస్తున్నాను. కాబట్టి ఒక విధముగా, నూతన యుగముతో సమముగానున్న మార్పు అచ్చట ఉంటుంది, కానీ అది సమూలనముగా మార్చబడుట కాదు. దేవుడు చేసిన ఆ సృష్టి యొక్క గురుతులు అచ్చట ఎక్కువ పాత్రను కలిగి సరైన స్థానములో ఉంటాయి. కావున, వాస్తవానికి ఒకదానికి బదులుగా మరొకటి మార్చబడుట అచ్చట చూడలేము కానీ, ప్రస్తుతమందున్న వాస్తవము రూపాంతరము పొందుట బహుశా మనము చూడవచ్చు — అనగా ఒక నూతన విధానము — వాస్తవములోనికి తీసుకురాబడుతుంది. మరియు జీవవృక్షము వంటి దృశ్యములు మరియు గురుతులు, రెండు వాస్తవాల మధ్యనుండే కొనసాగింపును అర్థము చేసుకోవడానికి సహకరిస్తున్నాయి.

—బ్రాడ్లీ టి. జాన్సన్

ఈ రూపాంతరము చాలా శ్రద్ధగా నూతనపరచబడుతుంది, అది మొదటి సృష్టించబడిన దానికంటే లోకము శ్రేష్ఠమైనదిగా చేయబడుతుంది. సృష్టియంతా దేవుడు నివాసముండు విధముగా పరిశుద్ధముగాను మరియు స్వచ్ఛముగాను ఉంటుంది.

ప్రకటన 21:3-4లో దేవదూత ఈ విధముగా ప్రకటిస్తుంది:

ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, మరియు ఆయన వారితో కాపురముండును. వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని (ప్రకటన 21:3-4).

సృష్టి నూతనపరచబడుటలో మరియొక ప్రాముఖ్యమైన అంశము ప్రకటన 22:3లో ప్రస్తావించబడినది, అచ్చట మనకు ఈ విధముగా చెప్పబడుతుంది:

ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు (ప్రకటన 22:3)

క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో, ఏదెను వనములో దేవుడు ఆదాము, హవ్వలపై మోపిన శాపము చివరగా తొలగించబడుతుంది. ప్రస్తుతముందున్న ఆకాశము మరియు భూమి మనుష్యుని యొక్క పతనము మరియు పాపము వలన తీవ్రముగా శపించబడ్డాయని ఆదికాండము 3:17-19, 5:29, మరియు 8:21 వంటి లేఖన భాగాలు స్పష్టము చేయుచున్నాయి. ఆహారము పెంచుటకు మన ప్రయత్నమును భూమి అడ్డుకొంటుంది. అడవి మృగములు మనకు వ్యతిరేకముగా క్రూరముగా ప్రవర్తిస్తున్నాయి. వరదలు, భూకంపములు మరియు తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు ప్రపంచమంతటిలో ప్రజలను శ్రమలపాలు చేస్తున్నాయి. మరియు సూక్ష్మ – జీవులు వ్యాధులను, ఇంకా మరణమును కలుగజేస్తున్నాయి.

అయితే క్రీస్తు తిరిగి వచ్చునప్పుడు, ఈ శాపము యొక్క ప్రతి అంశము నుండి లోకమును ఆయన విమోచిస్తాడు. నూతనపరచబడిన సృష్టియొక్క ఆశీర్వాదములను యోహాను అనేక విధములుగా వివరించుచున్నాడు, అందులో పరిశుద్ధ పట్టణము, ఆయన నూతన యెరూషలేము, యేసు యొక్క వధువుగా అలంకరించుకొని, దేవుని మహిమతో వెలుగొందుట కూడా అందులో ఉన్నది. మరియు, నూతన యెరూషలేము నుండి ప్రవహించుచున్న జీవనది, జీవవృక్షమును తడుపుచున్న అద్భుతమైన దృశ్యమును యోహాను ఈ సందర్భములో ఉపయోగించుచున్నాడు.

ప్రకటన 22:1-2లో తాను వ్రాసినది వినండి:

మరియు స్ఫటికమువలె మెరయునట్టి జీవజలముల నది దేవునియొక్కయు గొఱ్ఱపిల్ల యొక్కయు సింహాసనము నొద్దనుండి, ఆ పట్టణపు రాజవీధిమధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నదియొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను ... ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును (ప్రకటన 22:1-2).

దేవుని సింహాసనము నుండి ఒక నది ప్రవహించి జీవవృక్షమును తడుపుచున్నదని అందువలన అది జనములకు స్వస్థతనిచ్చుచున్నదని ఈ అద్భుతమైన లేఖనాలు చెప్పుచున్నాయి. ఈ అంశాలు వెనుకకు ఆదికాండములోనికి వెళుతున్నాయి. ఏదెనులో నుండి ఒక నది ప్రవహించి, ఏదెను వనమును మరియు జీవవృక్షమును తడుపుచున్నట్లు ఆదికాండము 2:10 చెబుతుంది. ఈ నది ఆనంద ప్రవాహముగా కీర్తనలు 36:8లో జ్ఞాపకము చేయబడినది, మరియు ఈ నది ప్రవాహములు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవని కీర్తనలు 46:4లో ఉంది.

ఈ నదిని గూర్చి విస్తృతమైన సంభాషణ యెహేజ్కేలు 47:1-12లో కనుగొనవచ్చును. యెహేజ్కేలు దర్శనములో, దేవుని మందిరములో నుండి ఒక జలధార ప్రవహించి, దాటలేనంత మహానదిగా వృద్ధిపొందినది యున్నది. ఆ నీరు ప్రవహించు చోటెల్ల జీవమును తెచ్చినది, మరియు ఉప్పుదైన మృత సముద్రమును కూడా స్వచ్ఛమైన నీరుగా మార్చుతుంది.

ఈ నదిని గూర్చి యోవేలు 3:17-18లో దేవుడు ఏమి చెప్పాడో చూడండి:

అన్యులికమీదట దానిలో సంచరింపకుండ యెరూషలేము పరి శుద్ధపట్టణముగా ఉండును; మీ దేవుడనైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలిసికొందురు ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిర ములోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును (యోవేలు 3:17-18).

ప్రకటన 22లో, ఈ జీవ నది మునుపటికంటే గొప్పదిగా అగుట ఉంది. అది దేవుని సింహాసనము మరియు గొర్రెపిల్ల యొద్దనుండి నేరుగా యెరూషలేము పట్టణము మధ్యలోనికి ప్రవహించుచూ, సమస్త జీవము మరియు స్వస్థతకు దేవుడే తుదకు మూలమైయున్నాడని సూచించుచున్నది.

యోహాను దర్శనములో, ఈ సమృద్ధియైన జీవపు ఊట అనునది ఇరువైపులా ఉన్న జీవవృక్షమును తడుపుచున్నది. ఆ వృక్షము సమృద్ధియైన ఫలములను ఇచ్చుచున్నది, దాని ఆకులు కూడా జనములకు స్వస్థతను తెచ్చుచున్నది.

ప్రకటన గ్రంథము చివరిలో నూతన యెరూషలేమును గూర్చి చదువుచుండగా, ఆదికాండములో ఏదెను వనము గూర్చి వ్రాయబడిన అనేక విషయాలు జ్ఞాపకము చేయుట మనము చూస్తాము, అది ఉద్దేశించబడిన విధముగా నూతన యెరూషలేము సృష్టిని తిరిగి నూతన పరచుటయైయున్నది. ఆ ప్రకారముగా దేవుడు మనుష్యులను తయారుచేసి వారిని సరియైన స్థానములో నుంచుట మనము చూడవచ్చు. ఏదెను వనములో వారు పరిపక్వత చెందాలని ఉద్దేశించబడినది, బహుశా ఉన్నతమైన మహిమను వారు చేరుకోవలసియుండగా, ఆయన నుండి వెనుదిరిగి, దేవుని ఉద్దేశములను తృణీకరించుట ద్వారా ప్రక్కకు తొలగిపోయిరి. అయితే నిజముగా, దేవుడు ఉద్దేశించిన దానిని ఏదెనులో మనము చూడవచ్చు, మనుష్యుల నుండి ఏమి కోరుచున్నాడో చూడవచ్చు, కావున, మనుష్యులకు మరియు దేవునికి మధ్యనున్న పరిపూర్ణ సంబంధము, మనము కలిగియుండవలసినది, నూతన యెరూషలేములో తిరిగి సమకూర్చబడుటను మనము ఆశించవచ్చు.

—డా. మార్క్ ఎల్. స్ట్రాస్

ప్రకటన గ్రంథములోనికి చూచినప్పుడు, నూతన యెరూషలేమును గూర్చిన వర్ణనలను చూడగలము. అది ఏదెను వనములో ఉండే అంశాలను అనగా జీవవృక్షము వంటివి, కలిగియున్నట్లు కనుగొంటాము. బైబిలు గ్రంథములోని మొదటి పుస్తకము నుండి బైబిలు గ్రంథములోని చివరి పుస్తకము వరకు ఎందుకు ఈ విధముగా ఉంది? అది పాక్షికముగా మనకు చూపించుచున్నదేమనగా పాపము ద్వారా అచ్చట సంపూర్ణముగా విరుద్ధమైనది సంభవించినది మరియు దేవుడు సమస్తమును సరియైనదిగా చేసాడని నేను భావిస్తున్నాను. ఆయన ఉద్దేశించిన దానిని పాపము శిథిలము చేయలేదు, మరియు అది ప్రారంభములో ఎచ్చట ఉన్నదో అచ్చటికే దానిని ఆయన తీసుకువస్తున్నాడు, అయితే దానిని ఆయన సంపూర్ణతలోనికి తెచ్చుచున్నాడు. అది మరలా పతనము కాని సృష్టి మాత్రమే కాదుగానీ, అది నిరంతరము నిలిచియుండు సృష్టియైయున్నది.

—డా. జాన్. ఇ. మెక్కిన్లె

ఏదెను వనములో ఆదాము, హవ్వలు పాపము చేసినప్పుడు, దేవుడు వారిని శపించి తోటలో నుండి బహిష్కరించాడు, ప్రత్యేకముగా వారు జీవవృక్ష ఫలములను తిని నిరంతరము ఆ విధముగా జీవించకుండునట్లు చేసాడు. అయితే క్రీస్తు తిరిగివచ్చునప్పుడు, జీవజల నది జీవవృక్షమును మరల తడుపుతుంది, మరియు సమస్త జనములు ఆ ఫలమును పొందుదురు. విమోచించబడిన మానవులంతా స్వస్థత పొందుతారు. అచ్చట పాపము, అనారోగ్యము లేదా వ్యాధులు ఎంతమాత్రము ఉండవు. ప్రకృతి వైపరీత్యాలు మరలా జరగవు. సమస్త దేశములు తమ్మనుతాము నీతితో మరియు సమాధానముతో పరిపాలించుకుంటారు. మరియు సమస్త దేవుని సృష్టి సంపూర్ణముగా ఆయన మహిమను ప్రచురపరచును.

క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో దేవుని నమ్మకస్తులైన ప్రజలు పొందుకొనే రెండవ ఆశీర్వాదమేమనగా, లోకమంతయూ దేవుని సన్నిధి కలిగిన సార్వత్రిక దేవాలయము అవుతుంది.

పాత నిబంధన అంతటిలో, తన సన్నిధిని ఒక ప్రత్యేకమైన విధముగా ప్రత్యక్ష పరచుటకు దేవుడు కొన్ని పరిశుద్ధ స్థలములను ప్రత్యేకపరచుకున్నాడు. ఏదెను వనములో ఆయన ఆదాము, హవ్వలతో నడచినట్లుగా ఆదికాండము 3:8 సూచిస్తుంది. ఆ తోట దేవుని పరిశుద్ధ స్థలము లేదా దేవాలయమని ఇతర లేఖన భాగాలలో సూచించబడినది.

ఉదాహరణకు, తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దేవుడు ఆదామును అందులో ఉంచాడని ఆదికాండము 2:15లో సూచిస్తుంది. ఇచ్చట “సేద్యపరచుట” అనే పదమునకు అవద్ అనే హెబ్రీ పదము వ్రాయబడినది. మరియు “కాచుటకు” అనే పదానికి షమార్ అనే పదము వ్రాయబడినది. ఇది గుర్తించదగినది ఏలయనగా సంఖ్యాకాండము 3:8లో దేవాలయములో యాజకులు చేయవలసిన పరిచర్య ఉద్యోగమును గూర్చి వివరించునప్పుడు మోషే ఈ పదాలనే ఉపయోగించాడు. మరొక మాటలో, ఆదాము హవ్వలు తోటలో యాజకత్వపు పని చేసారనమాట మరియు ఆ తోట భూమి మీద దేవుని పరిశుద్ధ స్థలమునకు సాదృశ్యముగా ఉన్నది.

దీనికి ఆవల, యెహేజ్కేలు 47:7లో ఉన్నట్లు రాబోవు దేవాలయములో నది మరియు వృక్షములు, ఏదెను తోటలో ఉన్న నదికి, అదే విధముగా జీవవృక్షమునకు బలమైన సాదృశ్యముగా ఉన్నాయి’, ఇది ఆదికాండము 2:9-10లో వివరించబడింది.

మరియు యెహేజ్కేలు 28:13-14 ఏదెను తోటను “దేవుని పర్వతమని” సూచించునప్పుడు, ప్రాచీన కాలములో పర్వతముల పైన దేవాలయములు కట్టునప్పుడు ఉపయోగించే పదజాలమే ఉపయోగించబడినది.

ఏదెను తోట ఆయన భూసంబంధమైన పరిశుద్ధ స్థలములుగా ఉపయోగించబడిన తరువాత, తన ప్రత్యేకమైన సన్నిధిని దేవుడు ప్రత్యక్ష గుడారములో కనబరచాడు. దీనిని గూర్చి మనము నిర్గమకాండము 40:34-38లో చదువుతాము.

ప్రత్యేక్ష గుడారము తరువాత, తన ప్రత్యేకమైన సన్నిధిని దేవాలయములో ప్రత్యక్షపరచాడు, దీనిని మనము 1 రాజులు 8:10-11, మరియు 2 దినవృత్తాంతములు 7:1-3లో చదువుతాము.

ఈ భూసంబంధమైన పరిశుద్ధ స్థలములు నిజానికి తన ప్రత్యేకమైన సన్నిధిని స్పష్టముగా ప్రత్యక్షపరచుచున్న దేవుని సింహాసనపు ఆవరణమునకు ఛాయగా ఉద్దేశించబడినవని హెబ్రీ 8:5 వివరించుచున్నది. అయితే క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో దేవుని సన్నిధి ఒక తోటకు లేదా భావనానికి పరిమితము చేయబడదు. దానికి బదులుగా, లోకమందంతటా దేవుడు తన ప్రత్యేక సన్నిధిని ప్రత్యక్ష పరచుచున్నాడు.

నూతన యెరూషలేమును గూర్చి ప్రకటన 21:22-23లో యోహాను యెట్లు వర్ణిస్తున్నాడో వినండి:

దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱెపిల్లయు దానికి దేవాలయమై యున్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు; దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొఱ్ఱెపిల్లయే దానికి దీపము (ప్రకటన 21:22-23).

నూతన యెరూషలేములో దేవాలయము అక్కరలేని ఒక సమయము కొరకు ప్రకటన గ్రంథము ఎదురు చూస్తుంది. దానికి బదులుగా, ప్రతీ చోట దేవుడే తన ప్రత్యేక సన్నిధిని ప్రత్యక్షపరుస్తాడు. తన ప్రజల మధ్యలో నివాసముండుట ద్వారా ఆయన తన ప్రజలను ఆశీర్వదిస్తాడు మరియు జనములు ఆయన వెలుగులో నడిచెదరు. ఆ సమయము వచ్చినప్పుడు, పగటికి సూర్యుడు ఏ విధముగా వెలుగునిస్తున్నాడో ఆ ప్రకారమే లోకమంతయు దేవుని మహిమచేత సంపూర్ణముగా నిండియుంటుంది.

ప్రకటన 21:6లో మనము ఈ విధముగా చదువుతాము:

అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడైయుండును (ప్రకటన 21:3).

క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో, లోకమందంతటా దేవుని యొక్క సన్నిధి తన ప్రజలందరితో ఉంటుంది.

యేసు క్రీస్తు యొక్క కార్యము ద్వారా లోకము నూతనపరచబడుట ఈ విధమైన సార్వత్రిక దేవాలయమును సృష్టిస్తుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో, పరలోకపు స్థానములో ఏడు దీప స్తంభములు మధ్యన యేసు సంచరించెను, అది తన సంఘములలో దేవుని సన్నిధికి సాదృశ్యముగా ఉన్నది. అయితే, క్రీస్తు తిరిగి వచ్చునప్పుడు, సృష్టియంతటిపైన తన ప్రత్యేకమైన పరిపాలనను ఆయన స్థాపిస్తాడు, ఆ విధముగా లోకమంతా దేవుని మందిరముగా ఉంటుంది, మరియు ఆయన ప్రత్యేక సన్నిధి ప్రతీ చోటా ప్రత్యక్షపరచబడుతుంది.

యోహాను ప్రస్తావించిన మూడవ ఆశీర్వాదమేమనగా, యేసు రాజుగా అంతము లేని యేసు క్రీస్తు పరిపాలనను భూమి మీద దేవుడు స్థాపించుట.

క్రొత్త భూమిలో దాని రాజధానియైన నూతన యెరూషలేము పట్టణమే కేంద్రమైయున్నదని ప్రకటన 21, 22 అధ్యాయాలు సూచిస్తున్నాయి. మరియు ఆ పట్టణపు కేంద్రము దేవుని సింహాసనము. దేవుని సింహాసనము రాజుగా ఆయన పరిపాలనకు సాదృశ్యమైయున్నది. యేసు తిరిగివచ్చునప్పుడు, ఆయన నూతన యెరూషలేములో సింహాసనాసీనుడై, తన తండ్రి తరపున లోకమునంతటిని పరిపాలించును.

దావీదు వంశపు రాజులందరూ యెరూషలేము దేవుని సింహాసనముపై ఆసీనులయ్యే ఘనతలో పాలుపొందుకొనుట 1 దినవృత్తాంతములు 29:23లో సూచించబడినది. అయితే, దావీదు వంశపు చివరి రాజైన యేసుక్రీస్తు మాత్రమే నూతన యెరూషలేములో సింహాసనాసీనుడగును మరియు ఆయన పరిపాలన మాత్రమే అంతము లేనిదై యుండును. విమోచించబడిన వారందరూ ఆయనతో పాటు నూతన సృష్టిలో ఉంటారు, ఆయన అధికారమును, శక్తిని గుర్తించుదురు, ఆయన సింహాసనమునకు నమస్కారము చేయుదురు, మరియు ప్రకటన 22:5లో చదువుచున్నట్లు ఆయనను మహిమపరచి, ఘనపరచుదురు, ఇంకా అంతములేని పరిపాలనలో పాలుపొందుదురు.

కొంతమంది 70, ఇతరులు 80 మరికొంత మంది 90 లేక 100 సంవత్సరములు జీవిస్తారు, ఆ తరువాత ముగింపు. ఈ నూతన భూమిలో ఆ విధముగా ఉండదు. ఈ భూమిలో మనము సదాకాలము జీవిస్తాము. ఎందుకని? ఏలయనగా ప్రభువైన యేసుక్రీస్తు మనతో ఎల్లప్పుడు ఉంటారు. ఆయన పరలోకములో ఉంటాడు కదా, అని మీరంటారేమో. కాదు. ఆయన పరలోకమునకును భూమికిని రాజైయున్నాడు. భూమిమీద ఆయన నిరంతరము మనుష్య కుమారునిగా ఉంటాడు. అయితే ఇంకా నీకు కావలసినదేమిటి? యేసుతో నిరంతరము జీవిస్తావా లేక ఆయన లేకుండా ఉంటావా? అందువలన, నూతన పరచబడిన భూమిమీద నిరంతరమూ ప్రభువైన యేసు క్రీస్తుతో నుండుటకు నేను ఎదురుచూస్తున్నాను.

—డా. సైమన్ జె. కిస్ట్ మేకర్

క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమిలో క్రీస్తు యొక్క పరిపాలన ఖచ్చితముగా సంపూర్ణముగా ఉంటుంది. తన ప్రజలకు కావలసిన దానంతటిని ఆయన సమకూర్చును. అచ్చట ఎటువంటి పాపము, ఎటువంటి దుర్నీతి, ఎటువంటి రోగము లేక ఎటువంటి మరణము ఉండదు. మన సంతోషము నుండి మనలను ఏదీ వేరుచేయుటలేదు. దేవుని నిబంధనలో ఉన్న ప్రతి ఆశీర్వాదము ఎల్లప్పుడు మనదగును.

విశ్వాసులముగా, నూతన ఆకాశము, నూతన భూమిలో మనపైన దేవుడు పరిపాలన చేయాలని మనము ఎదురుచూడాలి. మరియు ఇప్పుడే నమ్మకస్తులైన విధేయత చూపించాలి మనము శోధించబడి, హింసించబడినప్పుడు కూడా — మనము నమ్మకత్వములో పట్టుదల కలిగియున్నప్పుడు, తన సృష్టి కొరకు దేవుడు ఉద్దేశించిన శ్రేష్ఠమైన ఆశీర్వాదములో మనము పాలుపొందుదము.

ఈ పాఠములో, రాజు మరియు ఆయన రాజ్యము అనే అంశములను దృష్టించి ప్రకటన గ్రంథమును పునఃపరిశీలన చేసియున్నాము. రాజత్వము అనే భావనను పరిశీలించాము, దేవుని రాజరికపు దయాళుత్వమును విశ్లేషించాము, రాజునకు మానవ విధేయత యొక్క ప్రాముఖ్యతను పరిగణించాము మరియు విధేయత వలన కలుగు ఆశీర్వాదములను, అవిధేయత వలన కలుగు శాపములను వివరించాము.

క్రైస్తవులందరికీ ఉన్న నిరీక్షణ ఏమనగా, ఒక రోజున యేసు తిరిగి వస్తాడు. మనము జీవితములో అనుభవిస్తున్న ప్రతీ శ్రమను జయించుటకును, పట్టుదల కలిగి ఉండుటకును ఈ నిరీక్షణ మనలను ప్రేరేపిస్తుంది. మన విశ్వాసమును బట్టి ఎటువంటి కష్టమును మనము ఎదుర్కొనుచున్నప్పటికీ, మనము దేవునికి మరియు ఆయన క్రీస్తునకు విధేయత చూపించవలసియున్నది ఏలయనగా ఆయన వాక్యము సత్యమని మనము ఎరుగుదము. మనలను పరిపాలించుటకు మరియు ప్రతిఫలమిచ్చుటకు యేసు తిరిగి వచ్చును. అది జరగనంతవరకూ, ప్రకటన గ్రంథము చివరిలో ఆయన ఇచ్చిన వాగ్దానమును నమ్ముదము, అదేదనగా; “అవును, త్వరగా వచ్చుచున్నాను.” మరియు మన ప్రత్యుత్తరము యోహాను ఇచ్చిన విధముగానే ఉండాలి: “ఆమెన్. ప్రభువైన యేసూ, రమ్ము!”

Continue reading the full transcript