<link rel="stylesheet" href="https://cdn.plyr.io/3.7.8/plyr.css" />
BETA You're previewing the new Nexus — a work in progress.
దానం చేయి
క్యాటలాగ్‌కు తిరిగి వెళ్ళుHOSహోషేయ యొక్క ప్రవచనాత్మక జ్ఞానం
హోషేయ యొక్క ప్రవచనాత్మక జ్ఞానం ·Manuscriptఆంగ్లం నుండి అనువాదం చేయబడింది

HOS-01 హోషేయుని గ్రంథానికి ఒక పరిచయం

పూర్తి వచనం చదవండి

మాన్యుస్క్రిప్ట్ తెరుగుతోంది…

హోషేయ గ్రంథము యొక్క పరిచయము

హోషేయ యొక్క ప్రవచన జ్ఞానము

Manuscript

మొదటి పాఠము

© 2021 థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్

సర్వహక్కులు ప్రచురణకర్తలవే. ఈ ప్రచురణలోని ఏ భాగమైనను ఏ రూపములోనైనను లేదా ఏ సాధనము ద్వారానైనను ప్రచురణకర్తలైన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్, ఐఎన్సి, 316 లైవ్ ఓక్స్ బిఎల్విడి, కాసిల్ బెర్రీ, ఫ్లోరిడా 32707, నుండి వ్రాతపూర్వకమైన అనుమతి పొందకుండా పునఃసమీలలో క్లుప్తంగా ఉల్లేఖింపబడుట, వ్యాఖ్యానించుట, లేదా పాండిత్యము సంపాదించు ఉద్దేశం కొరకు మినహా పునఃర్ముద్రింపకూడదు.

మరొక విధంగా సుచింపబడితే తప్ప ఇందులోని లేఖన ఉల్లేఖనములన్నియు తెలుగు OV వెర్షన్ నుండి తీసికొనబడినవి. కాపిరైట్ © ది బైబిల్ సొసైటీ అఫ్ ఇండియా.

థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్

1997లో స్థాపించబడిన థర్డ్ మిలీనియం మినిస్ట్రీస్ ఒక లాభాపేక్షలేని ఇవాంజెలికల్ క్రైస్తవ పరిచర్యగా లోకమునకు ఉచితముగా బైబిలు సంబంధమైన విద్యను అందించుటకు ప్రతిష్టింపబడింది.

బైబిలు విద్య. లోకము కొరకు. ఉచితముగా.

ప్రపంచవ్యాప్తముగా పరిచర్య కొరకు తగిన తర్ఫీదులేని కొన్ని వందల వేల మంది క్రైస్తవ నాయకులకు ఉచిత క్రైస్తవ విద్యను అందించుట మా లక్ష్యమైయున్నది. ఆంగ్లము, అరబిక్, మాండరిన్, రష్యన్, మరియు స్పానిష్ భాషలలో సాటిలేని మల్టీమీడియా సెమినారిని సిద్ధపరచి, విశ్వవ్యాప్తముగా పంచిపెట్టుట ద్వారా మేము ఈ లక్ష్యమును చేధించుచున్నాము. మా పరిచర్య భాగస్వాముల ద్వారా మా పాఠ్యాంశములు ఒక డజను కంటే ఎక్కువ భాషలలో ప్రస్తుతము అనువదించబడుచున్నాయి. ఈ పాఠ్యాంశములలో చిత్రములతో కూడిన వీడియోలు, ముద్రించబడిన ఉపదేశములు, మరియు ఇంటర్నెట్ వనరులు ఉన్నాయి. పాటశాలలు, సమూహములు, మరియు వ్యక్తులు ఆన్లైన్ లో మరియు అధ్యయనము చేయు సమాజములలో ఉపయోగించుటకు అనుగుణంగా ఇవి రూపొందించబడినవి.

అనేక సంవత్సరాలుగా, అవార్డులు సంపాదించిన అత్యుత్తమమైన విషయములు మరియు నాణ్యతగల మల్టీమీడియా పాఠములను ఉత్పత్తి చేయుటకు తగుమాత్రపు ఖర్చుతో కూడిన పద్ధతిని మేము అభివృద్ధి చేశాము. మా రచయితలు మరియు సంపాదకులు వేదాంతవిద్యలో తర్ఫీదు పొందిన విద్యావేత్తలు, మా అనువాదకులు వేదాంత ప్రావీణ్యతకలిగి తాము అనువదించు భాషలలో మాతృభాషా నైపుణ్యత కలిగియున్నవారు, మరియు మా పాఠములు లోకవ్యాప్తముగా అనేక సెమినారీలలో బోధించు వందలమంది గౌరవనీయులైన అధ్యాపకులు మరియు కాపరుల యొక్క మెళకువలను కలిగియున్నాయి. ఇంతేగాక, మా గ్రాఫిక్ డిజైనర్లు, ఉదాహరణలను ఇచ్చువారు, మరియు ప్రొడ్యుసర్లు అద్భుతమైన పరికరములను మరియు టెక్నిక్లను ఉపయోగించి ఉన్నతమైన ప్రమాణములతో పనిచేస్తారు.

మా డిస్ట్రిబ్యూషన్ లక్ష్యములను చేధించుటకు, సంఘములతో, సెమినారీలతో, బైబిల్ కళాశాలలతో, మిషనరీలతో, క్రైస్తవ బ్రాడ్కాస్టర్లతో, శాటిలైట్ టెలివిజన్ వారితో, మరియు ఇతర సంస్థలతో థర్డ్ మిలీనియం వ్యూహాత్మక భాగస్వామ్యములను కలిగియున్నది. ఈ భాగస్వామ్యములు ఇప్పటికే లెక్కలేనన్ని వీడియో పాఠములను స్థానిక నయాకులు, కాపరులు, మరియు సెమినరీ విద్యార్థులకు పంచుటకు కారణమైయ్యాయి. మా వెబ్సైటులు కూడా డిస్ట్రిబ్యూషన్ కు మాధ్యమాలుగా ఉండి, మా పాఠములతో పాటుగా సహాయకరముగా ఉండుటకు అదనపు వనరులను కూడా అందించుచున్నవి. ఉదాహరణకు, మీ సొంత అధ్యయన సమాజమును ఆరంభించుటను గూర్చిన వనరులు.

థర్డ్ మిలీనియం IRS 501(c)(3) కార్పోరేషన్ గా గుర్తింపుపొందినది. మేము సంఘములు, సంస్థలు, వ్యాపారములు, మరియు ప్రజలు వ్యక్తిగతంగా ఇచ్చు టాక్స్-మినహాయింపైన కానుకల మీద ఆధారపడి పనిచేస్తాము. మా పరిచర్యలను గూర్చి అదనపు సమాచారము కొరకు మరియు మీరు మాతో కలసి పరిచర్య చేయు మార్గములను తెలుసుకొనుటకు, ఈ వెబ్సైటును దర్శించండి http://thirdmill.org.

విషయ సూచిక

ఉపోద్ఘాతం 1

నేపథ్యము 1

ప్రవక్త 2

కాలము 3

ప్రాంతము 4

పరిస్థితులు 5

ఉద్దేశ్యము 10

గ్రంథము 11

కాలము 12

ప్రాంతము 14

పరిస్థితులు 14

ఉద్దేశ్యము 17

విషయములు & నిర్మాణము 18

తీర్పు మరియు నిరీక్షణ (1:2-3:5) 20

మునుపటి కుటుంబ అనుభవాలు (1:2-2:1) 22

దేవుని వ్యాజ్యము (2:2-23) 22

తదుపరి కుటుంబ అనుభవాలు (3:1-5) 24

వివృతమగుతున్న తీర్పు 25

దేవుని వ్యాజ్యములు (4:1-5:7) 25

అపాయమును గూర్చి దేవుడిచ్చిన పిలుపులు (5:8-9:9) 28

వివృతమగుతున్న నిరీక్షణ (9:10-14:8) 31

పండు (9:10-12) 32

నాటబడిన ఖర్జూరపు మొక్క (9:13-17) 33

విస్తారమైన ద్రాక్షచెట్టు (10:1-10) 34

అభ్యాసము పొందిన పెయ్య (10:11-15) 35

ప్రియమైన బిడ్డ (11:1-14:8) 35

ముగింపు 37

ఉపోద్ఘాతం

జ్ఞానముతో కూడిన ఆలోచనను పట్టించుకొనని వ్యక్తి ఎవరైనా మీకు తెలుసా? వారు ఇతరులు చెప్పు మాటలను మూర్ఖత్వముతో తిరస్కరిస్తారు, ఫలితంగా, వారు మరలా మరలా పడిపోతుంటారు. అనేక విధాలుగా, ప్రవక్తయైన హోషేయ కాలములో కూడా ఇలానే జరిగింది. హోషేయ అనేక దశాబ్దముల పాటు దేవుని ప్రజలకు దేవుని వాక్యమును అందించాడు. అతని ప్రవచనములు తరచుగా నిజమైనప్పటికీ, దేవుని ప్రజలు అతని మాటలను వినుటకు నిరాకరించారు కాబట్టి మరలా మరలా శ్రమలను అనుభవించారు. అయినను, హోషేయ అలసిపోలేదు. తన జీవితము యొక్క చివరి దశలో, అతడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి తన ప్రవచనముల సంపుటిని సృష్టించాడు, దానిని మనము నేడు హోషేయ గ్రంథము అని పిలుస్తాము. తమ దినములలో సవాళ్లను ఎదుర్కొన్న దేవుని ప్రజలకు జ్ఞానమును ఇచ్చుటకు అతడు తన గ్రంథమును రూపొందించాడు. మరియు దేవుని ద్వారా ప్రేరేపించబడిన గ్రంథముగా, హోషేయ గ్రంథము మన యుగముతో సహా అన్ని యుగములలోని దేవుని ప్రజలకు జ్ఞానమును నేర్పుతుంది.

హోషేయ యొక్క ప్రవచన జ్ఞానము అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము, మరియు దీనికి “హోషేయ గ్రంథము యొక్క పరిచయం” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠంలో, హోషేయ యొక్క పరిచర్యకు మరియు ఇప్పుడు అతని పేరును కలిగియున్న గ్రంథమునకు సంబంధించిన కొన్ని పరిచయ విషయములను మనము విశదీకరిద్దాము.

మనమిచ్చు హోషేయ గ్రంథ పరిచయము రెండు ప్రధానమైన భాగములుగా విభాగించబడుతుంది. ముందుగా మనము ప్రవక్తయైన హోషేయ మరియు అతని పుస్తకము యొక్క నేపథ్యమును చూద్దాము. తరువాత ఈ గ్రంథములోని విషయములు మరియు నిర్మాణము యొక్క అవలోకనమును పరిచయం చేద్దాము. హోషేయ యొక్క నేపథ్యములోని అనేక కోణములను విశదీకరిస్తూ ఆరంభిద్దాము.

నేపథ్యము

హోషేయ యొక్క ప్రవచనములు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినవి, కాబట్టి చరిత్రయందంతటా దేవుని ప్రజల మీద అవి నిస్సందేహమైన అధికారమును కలిగియున్నాయి. అయితే అతని ప్రవచనములు మొదటిగా పురాతన ఇశ్రాయేలీయులు మరియు వారు ఎదుర్కొనిన పరిస్థితులను ఉద్దేశించాయి. ఈ పాఠంలో మనము చూడబోతున్నట్లు, హోషేయ యొక్క పరిచర్య అనేక దశాబ్దముల పాటు కొనసాగింది. కాబట్టి, హోషేయ యొక్క అభివృద్ధి చెందుతుండిన పరిస్థితులను మనము ఎంత ఎక్కువగా అర్థము చేసుకుంటే, అంత ఎక్కువగా అతని ప్రవచనములను మనము గ్రహించగలుగుతాము మరియు అనువర్తించుకోగలుగుతాము.

మనము విషయములను చూచుటకు ముందు, రెండు అనుబంధముగల చారిత్రిక సందర్భములను, అనగా రెండు “లోకములను” మనము వ్యత్యాసపరచి చూడవలసియున్నది. మొదటి సందర్భమును, “ఆ లోకము” అని పిలుస్తాము, ఇది హోషేయ తన ప్రవచన పరిచర్యలో దేవుని నుండి ప్రత్యక్షతలను పొందుకొని, తెలియపరచిన శతాబ్దములకు సంబంధించినదైయున్నది. అయితే మనము “వారి లోకము” అని పిలచు రెండవ చారిత్రిక సందర్భము హోషేయ జీవితములో తరువాత జరుగుతుంది. రెండవ సందర్భములో, ఈ గ్రంథమును మొదటిగా పొందుకున్నవారి యొక్క జీవితములను ప్రభావితము చేయుటకు హోషేయ తన ప్రవచనములలో కొన్నింటిని ఎంపిక చేసుకొని, వాటిని వ్రాశాడు.

ఈ రెండింతల నేపథ్యమును మనము రెండు దశలలో చూద్దాము. మొదటిగా, “ఆ లోకమును” లేక ప్రవక్తయైన హోషేయ పరిచర్య యొక్క సంపూర్ణ శ్రేణిని చూద్దాము. మరియు రెండవదిగా, “వారి లోకమును” లేక హోషేయ గ్రంథము వ్రాయబడిన సందర్భమును మనము పరీక్షిద్దాము. హోషేయ ప్రవక్త యొక్క పరిచర్యతో ఆరంభిద్దాము.

ప్రవక్త

హోషేయ యొక్క ప్రవచన పరిచర్య కాలములో, దేవుని ప్రజల చరిత్రలో అనేక దేశములు ప్రాముఖ్యమైన పాత్రలను పోషించాయి. క్రీ.పూ. 930లో, దావీదు సొలొమోనుల ఐక్య రాజ్యము రెండు రాజ్యములుగా చీలిపోయింది: ఉత్తర దిక్కున ఇశ్రాయేలు రాజ్యము మరియు దక్షణమున యూదా రాజ్యము. ఈ రెండు రాజ్యములు హోషేయ యొక్క ప్రవచన పరిచర్యలో ప్రాముఖ్యముగా కనిపిస్తాయి. ఆ కాలములో, దేవుని ప్రజలు సిరియా మరియు ఐగుప్తు వంటి దేశములతో కూడా సంబంధములు కలిగియుండేవారు. అయితే అన్నిటి కంటే ఎక్కువగా, హోషేయ తన పరిచర్యలో అష్షూరు సామ్రాజ్యము చుట్టూ జరిగిన సన్నివేశముల మీద దృష్టిపెట్టాడు. హోషేయ దినములలో, అష్షూరు బలమైన సామ్రాజ్యమై దాని ప్రభావమును ఇశ్రాయేలు, యూదా దేశములతో సహా ప్రతి దిశలోను వ్యాపింపజేసింది. మనము చూడబోతున్నట్లు, ఇశ్రాయేలు యూదా నుండి చీలిపోయిన రెండు వందల సంవత్సరాలకు హోషేయ యొక్క పరిచర్య ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ఆరంభమైయ్యింది.

దేవునికి నమ్మకముగా ఉండుటకు కోరిన ఎవరికైనా చరిత్రలోని ఈ కాలములో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో జీవించుట కష్టముగా ఉండేది. మరియు తన ప్రవక్తగా ఉండుటకు దేవుడు పిలచిన మనుష్యుడైన హోషేయ విషయములో ఇది మరింత వాస్తవమైయుండినది. ఇశ్రాయేలు నాయకులు తమ రాజ్యమును దేవుని నుండి దూరముగా నడిపించి, ఇతర దేశములతో మరియు తమ అబద్ధ దేవతలతో పెట్టుకున్న పొత్తును ఎక్కువగా నమ్మిన విషయమును హోషేయ ప్రత్యక్షంగా చూశాడు. ఇశ్రాయేలులోని యాజకులు దేవుని ఆరాధనను విగ్రహారాధనతో ముడిపడియున్న త్రాగుబోతుతనము, ఆడంబరముతో కూడిన సారమునకు సంబంధించిన ఆచారములతో మిళితము చేశారు. ధనికులు మరింత ధనము కూడబెట్టుకున్నారు, కాని పేదలు ఎంత బీదరికమును అనుభవించారంటే చాలాసార్లు భోజనము కూడబెట్టుకొనుట కొరకు తమ భార్యలను మరియు కుమార్తెలను వారు దేవదాసీలుగా చేసేవారు. మరియు ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో హోషేయ హృదయమును కలచివేయు పరిస్థితులను ఎదుర్కొనినప్పుడు, దేవుడు అతనిని ప్రవచించుటకు — అనగా చాలా తక్కువమంది వినుటకు ఇష్టపడిన ఇశ్రాయేలు దైవిక రాజు యొక్క సందేశమును అందించుటకు — పిలచాడు. అష్షూరు సామ్రాజ్యము ద్వారా దేవుడు ఇశ్రాయేలు రాజ్యము మీద శాపములను కుమ్మరించగోరాడు.

హోషేయ ప్రవక్త యొక్క పరిచర్యను మనము పరిగణించుచుండగా, మనము నాలుగు పరస్పర సంబంధముగల సమస్యలను చూద్దాము: అతని పరిచర్య కాలము, పరిచర్య చేసిన ప్రాంతము, హోషేయ యొక్క మారుచుండిన పరిస్థితులు, మరియు అతని ప్రవచన పరిచర్య యొక్క ఉద్దేశ్యము లేక లక్ష్యము. హోషేయ దేవుని ప్రవక్తగా పని చేసిన కాలము మీద దృష్టిపెడుతూ ఆరంభిద్దాము.

కాలము

అనేక ఇతర పాత నిబంధన ప్రవచన పుస్తకములను పోలిన విధముగా, 1:1లో హోషేయ యొక్క ఆరంభ వచనము హోషేయ పరిచర్య చేసిన కాలమును మనకు పరిచయం చేస్తుంది. ఈ పుస్తకము ఎలా ఆరంభమవుతుందో వినండి:

ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా అను యూదారాజుల దినములలోను, యెహోయాషు కుమారుడైన యరొబాము అను ఇశ్రాయేలురాజు దినములలోను బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు (హోషేయ 1:1).

ఇక్కడ ఇవ్వబడిన రాజుల పట్టిక హోషేయ పరిచర్య యొక్క ఆరంభము మరియు ముగింపును గూర్చి మనకు ఒక అవగాహనను ఇస్తుంది. మరొక వైపు, హోషేయ యొక్క పరిచర్య యూదా దేశమునకు చెందిన ఉజ్జియా మరియు ఇశ్రాయేలుకు చెందిన యరొబాము కాలములో ఆరంభమైనది అని ఇది మనకు చెబుతుంది. ఈ యరొబామును సాధారణంగా యరొబాము II అని పిలుస్తారు, మరియు ఇది ఇతనిని ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు యొక్క మొదటి రాజైన యరొబాము I నుండి భిన్నముగా చూపుతుంది.

ఉజ్జియా — లేక అజర్యా అని కూడా ఇతని పేరు — క్రీ.పూ 792 నుండి 740 మధ్య కాలములో యూదా దేశమును పాలించాడు. మరియు యరొబాము II సుమారుగా క్రీ.పూ 793 నుండి 753 వరకు పాలించాడు. హోషేయ యొక్క ఆరంభ ప్రవచనములలో ప్రస్తావించబడిన పరిస్థితులు ఇశ్రాయేలులో యరొబాము II పాలించిన చివరి దశాబ్దములో జరిగిన సన్నివేశములను ప్రతిబింబిస్తాయని అనేకమంది వ్యాఖ్యానకర్తలు సరిగానే సూచిస్తారు. కాబట్టి, హోషేయ పరిచర్య సుమారుగా క్రీ.పూ. 760లో ఆరంభమైనది అని చెప్పుట సమంజసముగానే ఉంటుంది. అనగా, తాను చేసిన పరిచర్యకు బైబిలు పుస్తకము ఒకటి అంకితం చేయబడిన ఆదిమ ప్రవక్తలలో హోషేయ ఒకడైయున్నాడని, లేక ఆదిమ ప్రవక్త అయ్యున్నాడని ఇది తెలియజేస్తుంది.

ఒక వైపున, 1:1లో ఉన్న రాజుల పట్టిక హోషేయ ప్రవచన పరిచర్య యొక్క ముగింపును గూర్చి కూడా మనకు ఒక అవగాహనను కలిగిస్తుంది. యూదా రాజులైన ఉజ్జియా, యోతాము మరియు ఆహాజు రాజులు పాలించిన కాలములో హోషేయ పరిచర్య చేశాడు, మరియు హిజ్కియా రాజు కాలములో తన పరిచర్యను ముగించాడు.

తన తండ్రితో కలసి కొంతకాలము పాలించిన తరువాత, క్రీ.పూ. 715 నుండి క్రీ.పూ. 686 మధ్య కాలములో హిజ్కియా యూదా దేశమును ఒంటరిగా పాలించాడు. ఇప్పుడు, హిజ్కియా పరిపాలనలో హోషేయ ఎంతకాలం జీవించాడు అను విషయమును గూర్చి మనకు స్పష్టత లేదుగాని, ఒకవేళ అతడు ఇరవై సంవత్సరాల వయస్సులో క్రీ.పూ 760లో తన పరిచర్యను ఆరంభించియుంటే, క్రీ.పూ. 686 నాటికి అతడు తొంబై నాలుగు సంవత్సరముల వయస్సువాడైయుండేవాడు. కాబట్టి, క్రీ.పూ. 686కు కొంతకాలము ముందే హోషేయ యొక్క పరిచర్య ముగించబడియుంటుంది.

ప్రవక్తయైన హోషేయ పరిచర్యకు సంబంధించిన ఈ కాల వ్యవధిని మనస్సులో ఉంచుకొని, అతడు దేవుని ప్రవక్తగా పని చేసిన ప్రాంతమును ఇప్పుడు మనము చూద్దాము.

ప్రాంతము

హోషేయ యరొబాము II కాలములో సేవించాడు అని గుర్తిస్తూ హోషేయ గ్రంథము యొక్క ఆరంభ వచనము ప్రవక్త పరిచర్య చేసిన ప్రాంతమును గూర్చి ఒక ప్రాముఖ్యమైన ఆధారమును మనకు ఇస్తుంది. యరొబాము II యొక్క ప్రస్తావన హోషేయ యొక్క ప్రాంతమును గూర్చి రెండు విషయములను బయలుపరుస్తుంది. ఒక వైపున, హోషేయ యొక్క పరిచర్య యూదాలోగాక ఇశ్రాయేలు రాజ్యములో ఆరంభమైనది అని సూచిస్తుంది.

ప్రవక్తయైన హోషేయ ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో పరిచర్య చేశాడు అని గ్రంథములో ఉన్న పలు విధానములు మరియు వాక్యభాగముల ద్వారా మనము చెప్పగలము. ఉదాహరణకు, 1:1లో ఉన్న పుస్తకము యొక్క పరిచయ పలుకులలో, హోషేయకు సమకాలీనులైన రాజుల యొక్క పట్టికను మనము చదువుతాము మరియు వారి పరిపాలన కాలములలో దేవుని వాక్యము అతనికి ప్రత్యక్షమైయ్యింది. వీరిలో ఒకడు యోవాషు కుమారుడైన యరొబాము రాజు, లేక యరొబాము II అయ్యున్నాడు, ఇతడు ఇశ్రాయేలు రాజులలో ఒకడైయున్నాడు. హోషేయ యొక్క పరిచర్య ఇశ్రాయేలు రాజ్యముతో ముడిపడియున్నదని ఇది చూపుతుంది. అంతేగాక, ఈ పుస్తకమంతటిలో దేవుడు ఇశ్రాయేలుతో సూటిగా మాట్లాడుటను మనము చూస్తాము. అతడు ఇశ్రాయేలు మీదికి రాబోవు ఉగ్రతను గూర్చి మాట్లాడతాడు, మరియు వారు చేసిన పాపముల వలన ఇశ్రాయేలు ప్రజల యొక్క క్రియలను బట్టబయలు చేస్తాడు. ఉదాహరణకు, 1:4లో, తాను ఇశ్రాయేలు రాజ్యమును తుడిచివేస్తానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి, ఇశ్రాయేలు రాజైన యరొబామును గూర్చి ప్రస్తావించుటతో పాటుగా ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన స్పష్టమైన సందేశము, హోషేయ యొక్క పరిచర్య ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలుతో అనుబంధము కలిగియున్నది అని సూచిస్తుంది.

— రెవ. షెరిఫ్ గెండి, అనువాదము

ఉత్తర రాజ్యము వైపుకు దృష్టి హోషేయ గ్రంథములో అనేక మార్గములలో ప్రత్యక్షమవుతుంది, అయితే మనము రెండు ప్రాముఖ్యమైన విషయములను ప్రస్తావించవలసియున్నది. మొదటిగా, హోషేయ ఉత్తర రాజ్యమునకు చెందినవాడని ఈ గ్రంథము యొక్క హెబ్రీ యాస బలముగా సూచిస్తుంది. అనేక ఆధునిక అధ్యయనములు హోషేయలోని హెబ్రీ వ్యాకరణమునకు మరియు ఫెనికియ భాషలోని — ముఖ్యముగా ఉత్తర కోస్తా ప్రాంతములలో మాట్లాడిన పశ్చిమ-సెమిటిక్ యాస — వ్యాకరణమునకు మధ్య పోలికలు ఉన్నాయని గుర్తించింది.

రెండవదిగా, హోషేయ గ్రంథములో ఉన్న ఎక్కువశాతం ప్రవచనాలు యూదా కంటే ఎక్కువగా ఇశ్రాయేలు మీద దృష్టిపెడతాయి కాబట్టి ఇది మరింత స్పష్టముగా ఉన్నది. ఈ పుస్తకము “ఇశ్రాయేలు,” “ఇశ్రాయేలీయులు,” అక్షరార్థంగా “ఇశ్రాయేలు కుమారులు” మరియు ఇశ్రాయేలును సంబోధించుటకు హోషేయ ఉపయోగించిన పేరు అయిన “ఎఫ్రాయిము,” అను పదములను ఉపయోగిస్తూ ఎనభై ఒకటిసార్లు ఉత్తర రాజ్యమును విశేషముగా ప్రస్తావిస్తుంది. భిన్నముగా, ఈ పుస్తకము యూదా పేరును కేవలం పదిహేను సార్లు మాత్రమే ప్రస్తావిస్తుంది. ఉత్తర రాజ్యములో సంభవించిన సన్నివేశములను గూర్చి హోషేయ ఎక్కువగా చింతించాడు.

మరొక వైపు, 1:1 యరొబాము IIను గూర్చి మాత్రమే ప్రస్తావిస్తూ, హోషేయ జీవితకాలములో పాలించిన ఆరుగురు ఇతర ఉత్తర ఇశ్రాయేలు రాజులను తొలగిస్తుంది అను విషయమును మనం గుర్తించినప్పుడు హోషేయ పరిచర్య ప్రాంతమును గూర్చి మరొక విషయమును మనము నేర్చుకోవచ్చు.

యరొబాము II తరువాత, ఇశ్రాయేలు రాజధానియైన షోమ్రోను క్రీ.పూ. 722లో అష్షూరీయుల చేతిలో పడుటకు ముందు జెకర్యా, షల్లూము, మనహేము, పెకహ్యా, పెకహు, మరియు హోషేయ రాజులు ఒకరి తరువాత ఒకరు వెంటవెంటనే పాలించారు. యరొబాము II యొక్క పరిపాలనకు ముగింపులో క్రీ.పూ. 753లో హోషేయ యూదాకు వలస వెళ్లాడు కాబట్టి ఈ రాజులను గూర్చి మన గ్రంథము యొక్క ఆరంభ వచనములో ప్రస్తావించియుండకపోవచ్చు. అవును, హోషేయ తన ప్రవచనములలో కొన్నిటిని ఇచ్చుటకు మధ్యమధ్యలో ఉత్తర రాజ్యమునకు కూడా ప్రయాణించియుండవచ్చు. తన పక్షమున ఉత్తర రాజ్యములో హోషేయ యొక్క శిష్యులు లేక స్నేహితులు తన ప్రవచనములను అందించియుంటారు అను విషయము కూడా సాధ్యమే. ఏది ఏమైనా, 1:1లో ఇశ్రాయేలు యొక్క ఇతర రాజులను గుర్తించకపోవుట, హోషేయ స్వయంగా యరొబాము II యొక్క పాలన ముగింపబడు వరకు మాత్రమే ఉత్తర ఇశ్రాయేలులో నివసించియుంటాడు అను అభిప్రాయమునకు మద్దతునిస్తుంది. తరువాత, అయితే రాజకీయ సంక్షోభముల వలన లేక తన ప్రవచనములకు ఎదురైన ప్రతిఘటనల వలన, అతడు దక్షిణ రాజ్యమైన యూదాలో క్రొత్త స్థావరమును నిర్మించుకున్నాడు.

ప్రవక్తయైన హోషేయ పరిచర్య యొక్క కాలమును మరియు ప్రాంతమును ఇప్పటి వరకు మనము చూశాము కాబట్టి, దేవుని ప్రవక్తగా అతడు సేవించిన దశాబ్దములలో అతడు ఎదుర్కొనిన కొన్ని పరిస్థితులను ఇప్పుడు మనము చూడాలి.

పరిస్థితులు

హోషేయ పరిచర్యతో ముడిపడియున్న బైబిలు చరిత్రా కాలమును గూర్చి అనేకమంది లేఖన విద్యార్థులకు అవగాహన ఉండదు. అవును, రాజులు మరియు దినవృత్తాంతములు వంటి చారిత్రిక పుస్తకములు, మీకా మరియు యెషయా వంటి ప్రవచన పుస్తకములు, మరియు పురావస్తుశాస్త్ర ఆవిష్కరణలు ఈ కాలమును గూర్చి అనేక విషయములు మనకు తెలియజేస్తాయి. కాబట్టి, ఇక్కడ ఈ సన్నివేశములన్నిటిని చెప్పుటకు మనకు సమయము సహకరించదు. అయితే హోషేయ పరిచర్య చేసిన దశాబ్దములలో ఇశ్రాయేలు మరియు యూదా దేశములలో జరిగిన ప్రాముఖ్యమైన సన్నివేశములలో కొన్నిటిని గూర్చి కనీస అవగాహన లేకుండా మనము ముందుకు కొనసాగలేము.

యరొబాము II కాలములో ఉత్తర రాజ్యములో పరిచర్యను ప్రారంభించిన హోషేయ మీరే అని ఒకసారి ఊహించుకోండి. మీరు దేవుని నమ్ముచున్నారు, కాని మీరు చూసిన ప్రతిచోట, రాజు, యాజకుడు మరియు ఇశ్రాయేలులో ఉన్న ధనికులు అందరు మీ దేశమును ఒక పీడకల వలె తయారు చేశారు. వారు ఇతర దేశముల యొక్క అబద్ధ దేవతలను ఆరాధిస్తున్నారు. వారు దేశమును హింసతో నింపివేస్తున్నారు. సరియైన దిశలేని సైన్య కలాపాలలో సేవించమని పేదల కుమారులను బలవంతం చేస్తున్నారు. మరియు తాము సారము కొరకు ఆరాధన చేయు అషేరా ప్రతిమ ఎదుట వ్యభిచారము చేయునట్లు వారి భార్యలను మరియు కుమార్తెలను ఒత్తిడి చేసేవారు. ఇన్ని జరుగుతున్నా, నాయకులు దేవునికి నమ్మకముగా ఉంటున్నామనే చెప్పేవారు, మరియు వారు చేయుచున్న పనులకు దేవుని ఆమోదము ఉన్నదని తెలుపుటకు వారు సాధించుచుండిన ఐశ్వర్యమును మరియు అధికారమును చూపేవారు.

ఇప్పుడు, దేవుడు ఇట్టి తిరిగుబాటును ఎన్నటికి సహింపడు అని మోషే చాలా కాలం క్రితం హెచ్చరించిన విషయం హోషేయకు తెలుసు. ఆయన తన ప్రజలను నమ్రపరచుటకు శ్రమలను పంపుతాడు. వారిని క్రమశిక్షణలో పెట్టుటకు దేవుడు ఒక క్రూరమైన దుష్టమైన అన్య రాజ్యమును పంపుతాడని కూడా మోషే హెచ్చరించాడు. మరియు ఇశ్రాయేలుకు ఖచ్చితముగా ఇలానే చేయబోవుచున్నానని దేవుడు హోషేయకు బయలుపరచాడు.

తన మాతృభూమిని గూర్చి ఈ విషయములను తెలుసుకొనుట హోషేయకు ఎంత కష్టమైయుండినప్పటికీ, తరువాత అతడు యూదాలో కూడా ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నాడు. దశాబ్దములు జరుగుచుండగా, తను వలసవెళ్లి నివసించిన దక్షిణ రాజ్యము తమ ఇరుగున ఉన్న ఉత్తర రాజ్యము వలెనే తిరుగుబాటు చేయుట ఆరంభించింది. వారు ఇతర దేశములతో పొత్తును పెట్టుకున్నారు, ఇతరులతో అన్యాయముగా వ్యవహరించారు, మూర్ఖమైన యుద్ధములను చేయునట్లు తమ యౌవ్వనులను బలవంతం చేశారు, మరియు యెరూషలేములో కూడా విగ్రహారాధనను ప్రోత్సహించారు. మరియు హోషేయ ఈ విషయములను చూసినప్పుడు, యూదా ప్రజలు కూడా అణగద్రొక్కబడతారని దేవుడు అతనికి బయలుపరచాడు.

విశాలమైన భావనలో మాట్లాడితే, హోషేయ ప్రవచించిన సమస్యల కాలమును “అష్షూరీయుల ద్వారా తీర్పు” అని చెప్పవచ్చు. ఈ కాలములో, దేవుడు అష్షూరు సామ్రాజ్యమును క్రమశిక్షణలో పెట్టుటకు ప్రధానమైన సాధనముగా ఉపయోగించుకున్నాడు. మహా చక్రవర్తియైన తిగ్లత్-పిలేసరు III (పూలు) సింహాసనమును అధిరోహించినప్పుడు బైబిలు చరిత్రలో అష్షూరు ఈ పాత్రను పోషించుట ఆరంభించింది. మరియు, ఏదో ఒక విధముగా, క్రీ.పూ. 612లో నీనెవె — అష్షూరు యొక్క రాజధాని పట్టణము — బబులోనీయుల చేతిలో పతనమైనంత వరకు అష్షూరీయులు బైబిలు చరిత్రలో ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషించారు.

ఇంచుమించు చివరి భాగములో లేక యరొబాము II యొక్క పాలన తరువాత ... తిగ్లత్-పిలేసరు III అష్షూరు దేశమునకు రాజు అయ్యాడు. ఇప్పుడు, ఆ రోజులలో అష్షూరు దేశము మహా శక్తిగా ఉండేది మరియు యూదా, ఇశ్రాయేలు మరియు ఇశ్రాయేలుకు ఉత్తర దిక్కున ఇరుగున ఉన్న సిరియా దేశముల యొక్క ఉనికికి పెను ముప్పుగా మారింది. కాబట్టి ఇశ్రాయేలు చూపిన అవిధేయత కారణంగా హోషేయ ప్రవచించిన శాపములు మరియు బానిసత్వమునకు తిగ్లత్-పిలేసరు III కర్తగా మారాడు. అంతేగాక తిగ్లేత్-పిలేసరు III తరువాత, షల్మనేసెరు రాజు అయ్యాడు, మరియు ఈ ఇద్దరు, తిగ్లేత్-పిలేసరు III మరియు షల్మనేసెరు, దేవుని న్యాయమునకు దండముగా పని చేశారు, మరియు దీని ద్వారా ఆయన హోషేయకు వాగ్దానము చేసిన విధముగా ఇశ్రాయేలును శిక్షించాడు.

— డా. ల్యారీ ట్రోటర్

ఈ పాఠంలో మనము చూడబోవుచున్నట్లు, హోషేయ గ్రంథములోని విషయములు అష్షూరు ద్వారా వచ్చిన తీర్పు కాలములో జరిగిన మూడు ప్రధానమైన సన్నివేశముల వైపు అతని ప్రవచన పరిచర్య యొక్క దృష్టిని సారిస్తాయి. హోషేయ గ్రంథములోని ఆరంభ ప్రవచనములు మొదటి సన్నివేశమును గూర్చినవైయున్నవి: క్రీ.పూ. 744లో తిగ్లత్ పిలేసరు III చక్రవర్తి అయినప్పుడు అష్షూరు దేశము ఖ్యాతిని గడించుట. క్రీ.పూ 732లో అష్షూరీయులు ఇశ్రాయేలు మీద దండయాత్రను చేసిన విషయమును గూర్చిన ప్రవచనములను కూడా హోషేయ నమోదు చేశాడు. అంతేగాక, పది సంవత్సరముల తరువాత క్రీ.పూ. 722లో అష్షూరీయులు ఇశ్రాయేలు మీద దండయాత్ర చేసి ఇశ్రాయేలు రాజ్యమును సమూలముగా నాశనము చేసిన విషయములను కూడా హోషేయ తన ప్రవచనాలలో తెలియపరచాడు. ఈ మూడు సన్నివేశములను గూర్చి ప్రవచించినప్పుడు హోషేయ ఎదుర్కొనిన పరిస్థితులను ఒక్కొక్కటిగా చూద్దాము. క్రీ.పూ. 744లో అష్షూరీయులు ఖ్యాతిని గడించిన సమయములో ప్రవచనములను పొందిన హోషేయ పరిచర్య యొక్క మొదటి దశతో ఆరంభిద్దాము.

మనము ఇంతకు ముందే చెప్పినట్లు, క్రీ.పూ. 744లో తిగ్లత్-పిలేసరు III అష్షూరుకు రాజై ఇశ్రాయేలు మరియు యూదా మీద తన అధికారమును మోపాడు. ఈ కాలమునకు ముందు హోషేయ ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో నివసించేవాడు, మరియు యరొబాము II ఇశ్రాయేలుకు గొప్ప ఐశ్వర్యమును సమకూర్చుటను ప్రత్యక్షంగా చూశాడు. అయితే రాజు, యాజకులు మరియు ఇతర నాయకులు విగ్రహారాధన మరియు అన్యాయమును జరిగించుట ద్వారా దేవునికి అవిధేయత చూపిన విషయమును కూడా అతడు చూశాడు. ఫలితంగా, అష్షూరు రాజ్యము ద్వారా దేవుడు పంపబోవు శాపములను గూర్చి హోషేయ హెచ్చరించాడు.

రాజులు మరియు దినవృత్తాంతములు గ్రంథముల ప్రకారం, ఇదే కాలములో, యూదా రాజ్యము కూడా తిగ్లత్-పిలేసరు III యొక్క పరిపాలనలోనికి వచ్చింది. అయితే, ఇశ్రాయేలు నాయకులకు భిన్నముగా, యూదా రాజైన ఉజ్జియా చాలా ప్రాముఖ్యమైన విధానములో ఒక నీతిగల రాజుగా పాలించాడు. యూదా దేశములోని అనేకమంది విగ్రహారాధనను ఆచరించినప్పటికీ, ఉజ్జియా కేవలం యెహోవాను మాత్రమే ఆరాధించాడు మరియు యెరూషలేములోని దేవాలయములో కేవలం యెహోవా యొక్క ఆరాధనను మాత్రమే జరిగించుటకు అనుమతి ఇచ్చాడు. కాబట్టి, మనకు తెలిసినంత వరకు, ఈ కాలములో యూదాను గూర్చి దేవుడు హోషేయకు ఎలాంటి ఆరోపణలను బయలుపరచలేదు మరియు యూదాకు విరోధముగా ఎలాంటి శాపములను గూర్చిన హెచ్చరికలను ఇవ్వలేదు.

హోషేయ పరిచర్యలోని తరువాత భాగము క్రీ.పూ. 732లో అష్షూరీయులు ఇశ్రాయేలుపై దండయాత్ర చేయుట మీద దృష్టిపెడుతుంది. ఈ దండయాత్రను గూర్చి హోషేయ ఇంతకుముందు ప్రవచించినప్పుడు, తిగ్లత్-పిలేసరు III ఇశ్రాయేలు రాజ్యము మీద తన రాజకీయ ఆధిపత్యమును కొనసాగిస్తూనే ఉన్నాడు. మనహేము మరియు పెకహ్యా రాజులు విగ్రహారాధనకు మరియు అన్యాయమునకు మద్దతునిచ్చి భద్రత కొరకు అష్షూరుతో తమ పొత్తు మీద ఆధారపడ్డారు. ఇప్పుడు, పురాతన కాలములోని అనేక రాజకీయ పొత్తుల వలెనె, ఈ అనుబంధము కూడా తమ అష్షూరు ప్రభువుల యొక్క దేవతలను ఒప్పుకొనుట ఆరంభించింది. దేవునికి చూపిన ఈ అవిధేయతల కారణంగా, క్రీ.పూ. 732లో రాబోవుచున్న అష్షూరు దాడి ద్వారా దేవుడు ఇశ్రాయేలు మీద తన శాపములను కుమ్మరించబోతున్నాడని హోషేయ హెచ్చరించాడు.

ఈ కాలములో యూదాను పాలించిన ఉజ్జియా మరియు యోతాము నీతిగల రాజులైయుండిరి అని రాజుల గ్రంథము మనకు తెలియజేస్తుంది. అనేకమంది ఉన్నత స్థలములలో ఇతర దేవతలను ఆరాధించుట కొనసాగించారుగాని, ఉజ్జియా మరియు యోతాములు ఇట్టి విగ్రహారాధనను ఆచరించలేదు మరియు మద్దతు కూడా ఇవ్వలేదు. కాబట్టి, ఈ కాలములో కూడా, హోషేయ యూదాకు విరోధముగా ఎలాంటి హెచ్చరికలను ఇవ్వలేదు.

ఇప్పుడు, క్రీ.పూ. 732లో అష్షూరు దండయాత్రను గూర్చి హోషేయ తదుపరి ప్రవచనములను పొందుకొనినప్పుడు, ఇశ్రాయేలులో పరిస్థితులు మరింత క్షీణించిపోయాయి. పెకహు రాజు విగ్రహారాధన మరియు అన్యాయము చేయుటలో కొనసాగాడు. అతడు అష్షూరు ఆధిపత్యమునకు తలొగ్గాడు, కాని తిగ్లత్-పిలేసరు III ఇతర చోట్ల కలిగిన సమస్యలలో నిమగ్నమైనప్పుడు, పెకహు అష్షూరుకు చెల్లించవలసియుండిన భారమైన కప్పమును చెల్లించకుండా తప్పించుకొనుటకు ప్రయత్నించాడు. అతడు సిరియాతోను సిరియా దేవతలతోను పొత్తును కుదుర్చుకున్నాడు — ఈ పొత్తును చాలాసార్లు “సిరియా-ఇశ్రాయేలు కూటమి” అని పిలుస్తారు. అష్షూరుకు విరోధముగా వారు చేయుచున్న తిరుగుబాటులో పాలుపంచుకొనునట్లు యూదాను బలవంతము చేయుటకు పెకహు మరియు సిరియా రాజు కలసి యూదా మీదికి దండెత్తారు. మీరు ఊహించండి, ఇశ్రాయేలు చేసిన ఈ దుస్సాహసమునకు దేవుడు వారి మీదికి శాపములను తీసుకొని వస్తాడని హోషేయ ప్రవహించాడు. కొంత కాలము తరువాత, క్రీ.పూ. 732లో, తిగ్లత్-పిలేసరు III సిరియా రాజ్యమును ద్వంసం చేసి, ఇశ్రాయేలు రాజ్యమును స్వాధీనం చేసుకున్నాడు.

విచారకరముగా, ఈ దండయాత్ర దగ్గరపడుతున్న కాలములో, యూదాలో ఒక ప్రాముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది. సిరియా-ఇశ్రాయేలు కూటమి యూదా మీద దాడి చేయుటకు కొంతకాలము ముందే, ఆహాజు సింహాసనమును అధిరోహించాడు. అతని తాత మరియు తండ్రికి భిన్నముగా, ఆహాజు దేవుని తిరస్కరించి, విగ్రహారాధనను మరియు అన్యాయమును బలపరచాడు. యూదా సిరియా-ఇశ్రాయేలు కూటమి చేసిన దాడులను మరియు ఎదోమీయుల నుండియు, ఫిలిష్తీయుల నుండియు ఎదురైన దాడులను అనుభవించింది. అయితే సహాయము కొరకు దేవుని వైపుకు తిరుగుటకు బదులుగా, ఆహాజు అష్షూరీయులు మరియు వారి దేవతలతో పొత్తును పునరుద్ఘాటిస్తూ భద్రత కొరకు వారిని ఆశ్రయించాడు. మరియు ఆహాజు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేశాడు కాబట్టి, దేవుని శాపములు యూదాకు కూడా రాబోవుచున్నాయని హోషేయ ప్రవచించాడు.

ఇది మనలను క్రీ.పూ. 722లో అష్షూరీయుల దండయాత్రను గూర్చి ప్రవచించిన హోషేయ పరిచర్య కాలములోనికి నడిపిస్తుంది — ఈ దండయాత్ర ఇశ్రాయేలు రాజధానియైన షోమ్రోను యొక్క పతనమునకు మరియు ఇశ్రాయేలు జనాభాలో ఎక్కువ శాతం చెరగొనిపోబడుటకు దారితీసింది. క్రీ.పూ. 722ను గూర్చి హోషేయ ఇచ్చిన మునుపటి ప్రవచనములు అష్షూరు ఇశ్రాయేలు సింహాసనము మీద నియమించిన హోషేయ రాజు యొక్క పరిపాలనలోని ఆరంభ దినములలో ఇశ్రాయేలులో జరిగిన సన్నివేశముల మీద దృష్టిపెడతాయి. హోషేయ ఇశ్రాయేలులో విగ్రహారాధనను మరియు అన్యాయమును స్థిరపరచి, అష్షూరీయులతో మరియు ఆ కాలములోని వారి దేవతలతో కలిగియుండిన పొత్తుకు నమ్మకముగా ఉన్నాడు. ఫలితంగా, రెండవ ప్రధానమైన అష్షూరు దండయాత్ర — క్రీ.పూ. 722లో జరిగిన దండయాత్ర ద్వారా — క్రొత్త శాపములు రాబోవుచున్నవని హోషేయ హెచ్చరించాడు.

అదే సమయములో యూదాలో, ఆహాజు విగ్రహారాధనను మరియు అన్యాయమును బలపరచుట ద్వారా దేవుని నిబంధనను ఉల్లంఘించాడు. అతడు అప్పటికీ దేవుని మీద ఆధారపడుటను నిరాకరించాడు, మరియు అష్షూరు మరియు అష్షూరీయుల దేవతలతో పొత్తు మీద నమ్మకము పెట్టుకొని తమ విరోధుల నుండి భద్రతను కోరాడు. ఫలితంగా, దేవుని యొక్క మహా శాపములు యూదా మీదికి కూడా రాబోవుచున్నాయని హోషేయ హెచ్చరించాడు.

క్రీ.పూ. 722లో అష్షూరు యొక్క దండయాత్రను గూర్చి హోషేయ ఇచ్చిన తదుపరి ప్రవచనములు ఇశ్రాయేలులో హోషేయ రాజు విగ్రహారాధనను, అన్యాయమును బలపరచుటను కొనసాగించుట మీద దృష్టిపెట్టాయి. ఇప్పుడు, తిగ్లత్-పిలేసరు III మరణించునప్పుడు, అష్షూరుకు కప్పము చెల్లించకుండా తప్పించుకునే అవకాశమును హోషేయ చూశాడు. అయితే భద్రత కొరకు దేవుని వైపుకు తిరుగుటకు బదులుగా, అతడు ఐగుప్తుతోను ఐగుప్తు దేవతలతోను పొత్తు పెట్టుకున్నాడు. ఈ పాపములు అతి త్వరలో దేవుని శాపములను తీసుకువస్తాయని హోషేయ ప్రవచించాడు. మరియు, ఈ ప్రవచనముల యొక్క నెరవేర్పుగా, తిగ్లత్-పిలేసరు యొక్క కుమారుడైన షల్మనేసెరు V, షోమ్రోనును స్వాధీనము చేసుకొని, పెద్ద మొత్తములో కప్పము చెల్లించవలసినదిగా హోషేయను బలవంతం చేశాడు. కొన్ని సంవత్సరముల తరువాత, క్రీ.పూ. 722లో, అష్షూరు రాజైన, సర్గోను II, షోమ్రోనును పూర్తిగా ధ్వంసం చేసి, ఇశ్రాయేలు జనాభాలో ఎక్కువ శాతం ప్రజలను చెరగొనిపోయాడు.

ఈ సంవత్సరములలో, యూదా రాజులైన ఆహాజు మరియు హిజ్కియా కలసి పాలించేవారు. ఆరంభములో, హిజ్కియా అష్షూరుతోను మరియు దాని దేవతలతోను తన తండ్రి పెట్టుకున్న పొత్తును కొనసాగించాడు. అయితే కొంత కాలానికి అతడు అష్షూరుతో విడిపోయాడు. దురదృష్టవశాత్తు, అష్షూరు నుండి భద్రత కొరకు దేవుని నమ్ముటకు బదులుగా హిజ్కియా తన సైన్యము యొక్క బలము మీద, తన ప్రాకరములుగల పట్టణములు మరియు ఐగుప్తుతో పొత్తు మీద ఆధారపడ్డాడు. ఫలితంగా, యూదా మీదికి దేవుడు శాపములను తేబోతున్నాడు అని హోషేయ హెచ్చరించాడు, అవి చాలా కాలం తరువాత అష్షూరీయులు చేసిన దాడి ద్వారా వచ్చాయి.

బైబిలు చరిత్రలోని ఈ కాలమును అధ్యయనము చేయుటకు మీరు చాలా సమయమును గడిపితే తప్ప, ఈ పేర్లు మరియు తారీఖులు మిమ్మును తికమకపెట్టే అవకాశం ఉంది. అయితే ఈ సన్నివేశములు హోషేయ పరిచర్య కాలములో జరిగాయని తెలుసుకొనుట హోషేయ గ్రంథమును అర్థము చేసుకొనుటకు కీలకముగా ఉన్నది. కాబట్టి, ఇది ఎంత కష్టమనిపించినప్పటికీ, క్రీ.పూ. 744లో అష్షూరు యొక్క ఎదుగుదలను గూర్చి హోషేయ చేసిన ప్రవచనములను, క్రీ.పూ. 732లో అష్షూరు దండయాత్రను గూర్చిన ప్రవచనములు, మరియు క్రీ.పూ. 722లో అష్షూరు దండయాత్రను గూర్చిన ప్రవచనములతో వ్యత్యాసము చేసి చూపుట చాలా ప్రాముఖ్యమైయున్నది. ఈ వ్యత్యాసములను మనము చూపుచుండగా, ఈ కాలములలో దేవుని ప్రజలు ఎదుర్కొనిన సవాళ్లను సంబోధిస్తూ హోషేయ చేసిన దశాబ్దముల పరిచర్యను మనము చూడగలుగుతాము.

ప్రవక్తయైన హోషేయ యొక్క పరిచర్యకు సంబంధించిన కాలము, ప్రాంతము మరియు మారుచున్న పరిస్థితులను మనము చూశాము కాబట్టి, ఇప్పుడు హోషేయ యొక్క ఉద్దేశ్యమును మనము పరిగణించవలసియున్నది. ప్రవక్తగా, దేవుని ప్రవచనములను ప్రకటిస్తూ అతడు ఏమి సాధించుటకు ప్రయత్నించాడు?

ఉద్దేశ్యము

ఈ ప్రశ్నకు జవాబును ఇతర పాఠ్యక్రమములలో మరింత వివరంగా మనము చూశాము, కాని సాధారణ మాటలలో, దేవుని రాజ్యమును భూదిగంతముల వరకు వ్యాపింపజేయుటలో తన పాత్రను పోషించుటకుగాను — దేవుడు ప్రతి యుగములో తన ప్రజలను పిలిచిన విధముగానే — హోషేయను పిలిచాడు. మరియు హోషేయ యెరిగియుండిన విధముగానే, దేవుడు తన నిబంధనలలో స్థాపించిన పద్ధతుల ఆధారంగా తన రాజ్య వ్యాప్తిని జరిగించాడు. ఆదాము మరియు నోవహులతో చేసిన నిబంధనలలో సమస్త దేశములతో ఆరంభించి, తరువాత అబ్రాహాము, మోషే మరియు దావీదుతో చేసిన విశేషమైన నిబంధనలతో దేవుడు అప్పటికే ఐదు ప్రధానమైన నిబంధనల ద్వారా రాజ్య పధకమును స్థిరపరచాడని హోషేయకు బాగా తెలుసు. ఈ నిబంధనలలో ప్రతి దానికి ఒక ప్రత్యేకమైన ఉద్ఘాటన ఉన్నది, అయితే ప్రతి నిబంధన కూడా అంతకు ముందు ఉన్న నిబంధనలలోని పధకములను కలిగియుండి, వాటి మీద నిర్మించబడేది. ఇతర ప్రవక్తల వలె, దేవుడు ఈ నిబంధనా పధకములను ఏ విధంగా అమలు చేయబోతున్నాడు అని ప్రకటించు దేవుని దూతగా లేక రాయబారిగా విశేషమైన పాత్ర హోషేయకు ఇవ్వబడింది.

దేవుని నిబంధనలన్నీ దేవుడు ప్రజలతో పాలుపంచుకున్న మూడు మౌలికమైన క్రియాశీలకములను స్థాపించాయి మరియు అవి హోషేయ పరిచర్య యొక్క రూపురేఖలను కూడా తీర్చిదిద్దాయి. ఇక్కడ మన ఉద్దేశ్యముల కొరకు మనము ఒక క్లుప్త అవలోకనమును మాత్రమే ఇద్దాము. మొదటిగా, దేవుని నిబంధనలన్నీ ఏదో ఒక విధముగా దేవుని దయ లేక దేవుని మంచితనము మరియు కనికరము యొక్క ప్రదర్శనల ద్వారా ఆరంభించబడ్డాయి మరియు కొనసాగించబడ్డాయి. రెండవదిగా, ఆయన చూపిన దయకు కృతజ్ఞతా స్పందనగా దేవుడు తన ప్రజల నుండి ఆశించిన మానవ స్వామిభక్తిని అన్ని నిబంధనలు స్పష్టము చేశాయి. మరియు మూడవదిగా, అన్ని దైవిక నిబంధనలలో ఆయన ప్రజలు ఆశించవలసిన రెండు రకముల పరిణామాలు ఇవ్వబడినవి: విధేయతకు ఆశీర్వాదములు మరియు అవిధేయతకు శాపములు.

కాబట్టి, దేవునితో నిబంధనలో ఇశ్రాయేలీయులు నమ్మకముగా ఉండాలని ఆయన కోరాడు. మరియు వారు దేవునితో నిబంధనలో నమ్మకముగా ఉంటే, వారికి మేలు జరుగుతుంది అని ఆయన వాగ్దానం చేశాడు. కాని వారు నిబంధనను ఉల్లంఘించినట్లయితే, వారికి కీడు జరుగుతుంది. మన జీవితములలో కూడా ఇది నిజమైయున్నది. మనము దేవుని నిబంధనకు నమ్మకముగా ఉంటే, దేవుడు మనతో ఉంటాడు, మనలను నడిపిస్తాడు, మరియు మన ద్వారా కార్యములను చేయుట కొనసాగిస్తాడు.

— పాస్టర్ మీకా గుస్సా

దేవుని నిబంధనలకు ప్రవచన దూతగా, ఈ నిబంధన క్రియాశీలకములను ఏ విధంగా నిర్దేశించాలని దేవుడు కోరాడో నిర్థారించుటకు హోషేయ ప్రత్యక్షతలను పొందుకున్నాడు. తరువాత అతడు ఈ ప్రత్యక్షతలను దేవుని ప్రజలకు అందించాడు. అతని పరిచర్య జరిగిన సంవత్సరముల దృష్ట్యా హోషేయను మనము పరిగణించినట్లయితే, అతని ప్రవచన ఉద్దేశ్యమును మనము ఈ విధంగా నిర్వచించవచ్చు: క్రీ.పూ. 744లో అష్షూరు యొక్క ఎదుగుదల, క్రీ.పూ. 732లో అష్షూరు దండయాత్ర, మరియు క్రీ.పూ. 722లో అష్షూరు యొక్క దండయాత్రకు అనుబంధములో నిబంధన క్రియాశీలకములైన దేవుని దయ, మానవ స్వామిభక్తి మరియు ఆశీర్వాదములు మరియు శాపములు అను పరిణామాలను దేవుడు ఉద్దేశించిన రీతిగా ప్రకటించుట హోషేయ యొక్క ఉద్దేశ్యమైయున్నది.

ఇప్పటి వరకు ప్రవక్తయైన హోషేయ యొక్క నేపథ్యమును మనము చూశాము కాబట్టి, ఇప్పుడు హోషేయ గ్రంథము యొక్క నేపథ్యమును చూచుటకు మనము సిద్ధముగా ఉన్నాము.

గ్రంథము

హోషేయ మరియు అతని శిష్యులు అతడు చేసిన దశాబ్దముల పరిచర్యలోని అనేక ప్రవచనములను వ్రాసియుండవచ్చు. అయితే తన జీవితము యొక్క చివరి దశలో, హిజ్కియా పరిపాలనలో, హోషేయ చివరికి తన ప్రవచనములను సేకరించి ఇప్పుడు మనము హోషేయ అని పిలచు గ్రంథముగా అమర్చాడు. దీనిని మనము దృష్టిలో ఉంచుకుంటే, మనము పుస్తకములోనికి అనేక మెళకువలను పొందుకుంటాము.

ఇప్పటివరకు మనము “ఆ లోకము” అని పిలచుదాని మీద దృష్టిపెట్టాము — అనగా అష్షూరు ద్వారా వచ్చిన తీర్పు కాలములలో ఇశ్రాయేలు మరియు యూదా దేశముల కొరకు హోషేయ దేవుని నుండి పొందుకున్న ప్రత్యక్షతలు. ఇప్పుడు మనము “వారి లోకమును” చూద్దాము — కలుగబోవు విషయములను గూర్చి యూదా నాయకులకు జ్ఞానమును అనుగ్రహించుటకు హోషేయ తన ప్రవచనములను హోషేయ గ్రంథముగా అమర్చుటకు ఎన్నుకొనిన సమయము.

ఆ లోకము మరియు వారి లోకము మధ్య ఈ వ్యత్యాసము హోషేయ గ్రంథమును అర్థము చేసుకొనుటకు కీలకమైయున్నది, ఎందుకంటే క్రీ.పూ. 722లో ఇశ్రాయేలు రాజ్యము ధ్వంసమైన తరువాత హోషేయ ఈ గ్రంథమును సంగ్రహము చేశాడు. కాబట్టి, ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో మిగిలియుండిన ప్రజల కొరకు హోషేయ గ్రంథము ముఖ్యమైన భావములు కలిగియుండినను, అతడు దీనిని ముఖ్యముగా యూదా నాయకుల కొరకు వ్రాశాడు. మనము చూడబోతున్నట్లు, క్రీ.పూ. 701లో అష్షూరు దండయాత్ర తమ వాకిట నిలిచియుండినప్పుడు హిజ్కియా మరియు ఇతర యూదా రాజులు అనుసరించవలసిన జ్ఞాన మార్గమును ఇచ్చుటకు హోషేయ తన పరిచర్య కాలమంతటికి సంబంధించిన ప్రవచనములను వ్రాశాడు.

ఇది ఎలా వాస్తవమైయున్నదో చూచుటకు, మనము మన మునుపటి సంభాషణను అనుసరిస్తూ, హోషేయ గ్రంథము యొక్క నాలుగు నేపథ్య లక్షణములను చూద్దాము: దాని కూర్పు కాలము, అది వ్రాయబడిన ప్రాంతము, అది సమకూర్చబడిన పరిస్థితులు, మరియు గ్రంథము యొక్క ఉద్దేశ్యము. మన గ్రంథము వ్రాయబడిన కాలముతో ఆరంభిద్దాము.

కాలము

హోషేయ గ్రంథము అనేక ప్రధానమైన సంస్కరణలను ఎదుర్కొన్నది అని అవి చాలా కాలము తరువాత — అనగా బబులోను చెర కాలము చివరిలో లేక బబులోను చెర తరువాత ముగింపుకు వచ్చాయని — విమర్శనాత్మక పండితులు సాధారణంగా నమ్ముతారని మనము ఆరంభములోనే ప్రస్తావించవలసియున్నది. ఫలితంగా, గ్రంథములోని కొన్ని భాగములు మాత్రమే హోషేయ కాలము నుండి వచ్చినవైయున్నాయని ఎక్కువమంది విమర్శనాత్మక పండితులు నమ్ముతారు. బదులుగా, సంస్కరణకర్తలు లేక సంపాదకీయులు హోషేయ మరణించిన తరువాత తమ సొంత రచనలను గ్రంథములో జోడించారని వారు వాదిస్తారు. అయితే భవిష్యత్తును గూర్చి హోషేయ దేవుని నుండి ఆశ్చర్యకరమైన ప్రత్యక్షతలను పొందుకున్నాడు అను విషయమును వారు తిరస్కరిస్తారు కాబట్టి, చాలా వరకు విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు ఇలా ఆలోచిస్తారు అను విషయమును మనము జ్ఞాపకముంచుకోవాలి.

దీనికి భిన్నముగా, ఇవాంజెలికల్ క్రైస్తవులు హోషేయ ప్రవచనము యొక్క అసాధారణమైన ప్రేరణను నమ్ముతారు. కాబట్టి, హోషేయ గ్రంథమంతా హోషేయ దేవుని యొద్ద నుండి పొందుకున్న విషయములను కలిగియున్నది అని మనము ఉద్ఘాటిస్తాము. ఇందువలన, ఇవాంజెలికల్ క్రైస్తవులు ఈ గ్రంథము యొక్క కూర్పు ఇంకా ముందే జరిగింది అని నమ్ముతారు.

ఇవాంజెలికల్ దృష్టికోణములో నుండి, 1:1 యూదా రాజైన హిజ్కియాను గూర్చి ప్రస్తావిస్తూ ఈ గ్రంథము కూర్పు చేయబడిన ఆరంభ తేదిని స్థాపిస్తుంది. ఈ పుస్తకము వ్రాయబడిన సమయానికి ఒకవేళ హిజ్కియా రాజు అయ్యుండని పక్షమున అతడు దీనిలో ఉన్న రాజుల పట్టికలో చేర్చబడియుండేవాడు కాదు. కాబట్టి, హోషేయ గ్రంథము కూర్పు చేయబడిన ఆరంభ తేదీ క్రీ.పూ. 715లో ఆరంభమై క్రీ.పూ 686 వరకు కొనసాగిన హిజ్కియా యొక్క ఏక పాలన కాలములో అయ్యుండవచ్చని మనము చెప్పవచ్చు.

హోషేయ చివరికి తన గ్రంథమును ఎప్పుడు సంగ్రహపరచాడో లేక నేడు బైబిలులో ఉన్న స్థితికి అది ఎప్పుడు తేబడినదో మనము ఖచ్చితముగా చెప్పలేము. అయితే హోషేయ జీవితములో, వాస్తవానికి అతని జీవితము యొక్క ముగింపు కాలములో, అతడు పరిచర్య చేసిన చివరి రాజు పరిపాలన కాలములో ఒక సన్నివేశము జరిగింది, మరియు ఆ రాజు పేరు హిజ్కియా... ఇప్పుడు, హిజ్కియా అనేక విషయముల కొరకు ప్రసిద్ధి చెందాడు, అయితే బైబిలు చరిత్రలో, అతడు అనుభవించిన అత్యంత ప్రాముఖ్యమైన లేక గుర్తింపబడిన విషయము, అష్షూరీయుడైన సన్హెరీబు చేసిన దండయాత్ర అయ్యున్నది. సన్హెరీబు అక్షరాల యూదాను నాశనం చేశాడు. ప్రజలు తమ జీవితములను కాపాడుకొనుట కొరకు పరిగెత్తేవారు, మరియు అతడు యూదా దేశములో కలిగించిన నాశనమును గూర్చి మీరు మీకా 1లో చదవవచ్చు. అయితే అతడు ఇంకొక అడుగు ముందుకు వెళ్లాడు. అతడు యెరూషలేమును చుట్టుముట్టి, దానిని ముట్టడివేశాడు... సన్హెరీబు యూదా మీద దండయాత్ర చేసి యెరూషలేమును చుట్టుముట్టి, దావీదు పట్టణమును, దేవుని పట్టణమును, లోక రాజధానిని ముట్టడివేసిన విషయము, ఎంత ప్రాముఖ్యమైయుండినదంటే, ఆ సమయములో అది యూదా చరిత్రలో సమస్తమును ముగింపులోనికి తీసుకొనివస్తుంది. సమస్తము పణంగా పెట్టబడింది. యెరూషలేము పతనము కాబోతుందా? సరే, యెషయా ఆ కాలములో ప్రవచించాడు, మరియు హోషేయ తన గ్రంథమును కూడా అదే కాలములో వ్రాసియుండవచ్చు, ఎందుకంటే హోషేయ గ్రంథములో మొదటి వచనములోనే — 1:1 — ప్రస్తావించబడిన చివరి రాజు హిజ్కియా అయ్యున్నాడు.

— డా. రిచర్డ్ ఎల్. ప్రాట్ట్, జూ.

హోషేయ గ్రంథము కూర్పు చేయబడిన చివరి తేదీని కూడా మనము నిర్థారించవచ్చు, అది హోషేయ మరణమునకు ముందు, బహుశా హిజ్కియా పరిపాలనలో జరిగియుండవచ్చు. ఇప్పుడు, తన గ్రంథమును సంకలనము చేయుటకు హోషేయ తన శిష్యుల యొక్క సహాయమును తీసుకొనియుంటాడు అని విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు సరిగానే సూచిస్తారు. యిర్మీయా 36:4లో యిర్మీయా శిష్యుడైన బారూకు మీద ఆధారపడినట్లే, హోషేయ కూడా తన శిష్యుల మీద ఆధారపడ్డాడని అక్కడక్కడ కొన్ని రుజువులను మనము చూడవచ్చు.

ఉదాహరణకు హోషేయ 1:2-9ని ఒక జీవిత చరిత్ర్రగా పరిగణించండి. ఇది హోషేయ యొక్క కార్యములను మూడవ వ్యక్తి వ్యక్తీకరణములలో వర్ణిస్తుంది: “హోషేయ ఇలా సెలవిచ్చాడు.” “అతడు అలా చేశాడు.” అయితే 3:1-3 స్వీయ చరిత్ర అయ్యున్నది. హోషేయ యొక్క కార్యములు మొదటి వ్యక్తి వ్యక్తీకరణములలో వర్ణించబడ్డాయి: “నేను ఇలా చేశాను.” “యెహోవా నాతో ఇలా సెలవిచ్చాడు.” జీవిత చరిత్ర నుండి స్వీయ చరిత్రలోనికి ఈ మార్పు హోషేయ యొక్క శిష్యులు ఈ గ్రంథము యొక్క కూర్పులో పాలుపంచుకున్నారను సత్యమును ప్రతిబింబిస్తుంది.

అయితే విమర్శనాత్మక వ్యాఖ్యానకర్తలు ఊహించినదానికి భిన్నముగా, శిష్యులు హోషేయ మరణము తరువాత కొన్ని క్రొత్త విషయములను చేర్చారు అనిగాని లేక అతని మాటలను మార్చారు అనిగాని ఎలాంటి అనుకూలమైన ఆధారము లేదు. హోషేయ శిష్యులు అతని మరణము తరువాత హోషేయ గ్రంథమును నిజముగానే ముగించినప్పటికీ, హోషేయకు దేవుడిచ్చిన ప్రత్యక్షతలలో నుండి వారు తప్పిపోలేదు. గ్రంథమంతటిలో “హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు”లు ఉన్నాయని గ్రంథము యొక్క శీర్షిక, 1:1 సూటిగా తెలియజేస్తుంది.

ఈ కారణముల చేత, ఈ గ్రంథము హిజ్కియా పరిపాలన కాలములో సంకలనము చేయబడినది అని మనము చెప్పవచ్చు. అనగా క్రీ.పూ. 686కు ముందే, లేక హోషేయ మరణించుటకు ముందే హోషేయ గ్రంథము వ్రాయబడినదని దీని అర్థమైయున్నది.

హోషేయ గ్రంథము యొక్క సంపూర్ణ సంకలనమునకు ఈ కాలవ్యవధిని మనము స్థాపించాము కాబట్టి, ఇప్పుడు అది ఎక్కడ వ్రాయబడినది అను విషయమును కూడా మనము తెలియపరచాలి.

ప్రాంతము

మనము ఇంతకు ముందే ప్రస్తావించినట్లు, యరొబాము II పరిపాలనకు చివరి కాలములో హోషేయ యూదాకు వలస వెళ్లియుండవచ్చు. మరియు క్రీ.పూ. 722లో ఇశ్రాయేలు రాజ్యము పతనమైన తరువాత హిజ్కియా పరిపాలనలో కూడా అతడు జీవించాడని మనకు తెలుసు కాబట్టి, హోషేయ తన గ్రంథమును యూదాలో సంకలనం చేశాడు అను నిశ్చయతను మనము కలిగియుండవచ్చు.

హోషేయ గ్రంథము స్వయముగా 1:1లో దీనిని గుర్తిస్తుంది. ఈ వచనములోని పట్టిక ఇశ్రాయేలు రాజైన యరొబామును ప్రస్తావించుటకు ముందు యూదా రాజులైన ఉజ్జియా, యోతాము, ఆహాజు, మరియు హిజ్కియాలను ప్రస్తావిస్తుంది. యూదా రాజులను గూర్చి మొదట ప్రస్తావించుట ద్వారా, అతడు తన పుస్తకమును యూదాలో దావీదు సామ్రాజ్యము యొక్క అధికారము క్రింద వ్రాసినట్లు హోషేయ గుర్తిస్తాడు. కాబట్టి, హోషేయ ప్రవచనములు ప్రధానముగా ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు మీద దృష్టిపెడుతున్నప్పటికీ, హోషేయ తన గ్రంథమును దక్షిణ రాజ్యమైన యూదాలో వ్రాశాడు.

హోషేయ గ్రంథ సంకలనము యొక్క కాలమును మరియు ప్రాంతమును మనము చూశాము కాబట్టి, హోషేయ మరియు ఈ పుస్తకమును మొదటిగా పొందుకున్న యూదా ప్రజల యొక్క పరిస్థితులను చూద్దాము.

పరిస్థితులు

మనము ఇంతకు ముందు ప్రస్తావించినట్లు, హోషేయ తన గ్రంథమును సంకలనం చేసినప్పుడు, అతడు వలసవెళ్లిన మాతృభూమి అయిన యూదా రాజ్యము కూడా అష్షూరు నుండి ముప్పును ఎదుర్కొనుచుండినది. క్రీ.పూ. 701లో, హిజ్కియా పరిపాలనలో, అష్షూరు రాజైన సన్హెరీబు యూదా మీద దాడి చేశాడు. అయితే, హోషేయ ప్రవచనములన్నీ ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు మీద అష్షూరు ద్వారా వచ్చిన తీర్పునకు సంబంధించినవి అయినప్పటికీ, యూదా మీదికి అష్షూరు తీర్పు వచ్చుచుండగా వారిని నడిపించుటకు హోషేయ తన గ్రంథమును వ్రాశాడు. ఈ కారణము చేత, సన్హెరీబు చేసిన దాడి చుట్టూ జరిగిన సన్నివేశములను గూర్చి మనము తెలుసుకొనవలసియున్నది.

రాజులు మరియు దినవృత్తాంతములలోని చారిత్రిక నివేదికలు, మరియు మీకా, యెషయాల ప్రవచనములు హిజ్కియా పరిపాలనను గూర్చి ఒక సంక్లిష్టమైన చిత్రమును అందిస్తాయి. ఇంతకు ముందు హిజ్కియా యూదాలో సంస్కరణలను చేశాడు మరియు యూదా ప్రాకారములను బలపరచాడు కాబట్టి అష్షూరీయుల యొక్క క్రొత్త రాజైన సన్హెరీబు సింహాసనమును అధిరోహించినప్పుడు, హిజ్కియా కప్పము చెల్లించుటకు నిరాకరించాడు. అయితే అష్షూరు ముప్పు ముంచుకొస్తుండగా, హిజ్కియా దేవుని మీద ఆధారపడుటలో విఫలమయ్యాడు. బదులుగా, అతడు ఐగుప్తుతోను, ఐగుప్తు దేవతలతోను పొత్తును పెట్టుకొనుట ద్వారా భద్రత కొరకు వెతికాడు. అయితే అతని ప్రయత్నములు విఫలమైయ్యాయి. సన్హెరీబు యూదా మీద దాడి చేసి, అనేక పట్టణములను, నగరములను మరియు గ్రామములను ధ్వంసం చేసి, యెరూషలేమును కూడా ముట్టడివేశాడు. అయితే యెరూషలేము పతనమవుతుంది అని అనుకున్న సమయములోనే హిజ్కియా యెహోవాకు ప్రార్థన చేశాడు, మరియు దేవుడు విమోచిస్తాడు అని యెషయా ప్రవక్త నిశ్చయతను ఇచ్చాడు. 2 రాజులు 19:33-34లో మనము చదువునట్లు:

ఈ పట్టణములోపలికి రాక [సన్హెరీబు] తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును (2 రాజులు 19:33-34).

కనికరము చూపుతూ, యెషయా యొక్క ప్రవచనము నెరవేరింది. దేవుడు యెరూషలేమును సన్హెరీబు చేతులలో నుండి ఆశ్చర్యకరముగా విమోచించాడు.

ఇశ్రాయేలు చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన చారిత్రిక సన్నివేశములలో ఒకటి అష్షూరు రాజైన సన్హెరీబు యూదా రాజైన హిజ్కియాను ఓడించుటకు వచ్చినప్పుడు జరిగింది... అతడు యూదాపై దండెత్తి, ఇంచుమించు యూదా పట్టణములన్నిటిని స్వాధీనము చేసుకున్నాడు. ఒకే ఒక్క పట్టణము మిగిలిపోయింది, మరియు అది యెరూషలేము. మరియు అతడు ఏమంటున్నాడు అంటే, “మీ దేవుడు కూడా ఇతర దేవతల వంటి వాడే. నేను ఇతర దేవతలను బయటకు ఈడ్చినట్లే, ఇశ్రాయేలు దేవుని కూడా బయటకు ఈడ్చుతాను.” అతడు పరలోక దేవుడైన యెహోవాకు విరోధముగా అహంకారముతో మాట్లాడాడు, మరియు దేవుడు ఇలా జవాబిచ్చాడు, “నేను సన్హెరీబుకు నా బాహుబలమును చూపుతాను.” కాబట్టి, ఆయన ఏమి చేశాడంటే ఇశ్రాయేలును ఆశ్చర్యకరముగా విడిపించాడు, మరియు అష్షూరీయుల సైన్యమును కొట్టాడు కాబట్టి అష్షూరీయుల సైన్యములో లక్షా ఎనభై ఐదు వేలమంది చచ్చారు. తరువాత అతడు అష్షూరులో జరుగుచున్న తిరుగుబాటును గూర్చి వింటాడు, కాబట్టి తిరిగి అష్షూరుకు వెళ్లవలసివచ్చింది. మరియు వారు ఒక పక్షిని పంజరములో పెట్టునట్లు హిజ్కియాను బంధించాలని కోరారు గాని, వారు అతనిని ఓడించారని చెప్పినట్లు అష్షూరీయుల రాజుల గ్రంథములలో కూడా మనము చూడము. ఇప్పుడు, గుర్తుంచుకోండి, అష్షూరీయుల సాహిత్యము ప్రగల్భాలతో నిండియుంది. వారు ఎన్నడును ఓటమిని అంగీకరించరు, కాబట్టి అతనిని పక్షి వలె బంధించుటను గూర్చి మాట్లాడునప్పుడు, వారు అతనిని ఓడించలేదని ఒప్పుకొనుచున్నారు. కాబట్టి, అష్షూరీయుల నివేదికలు కూడా దీనిని ఒప్పుకుంటాయి.

— డా. రసూల్ టి. ఫుల్లర్

యెరూషలేము యొక్క విమోచన యూదా రాజ్యము పట్ల దేవుని యొక్క కనికరమును ఎంతగా కనుపరచిందో వివరించుట మనకు కష్టమవుతుంది. అయితే ఇది ఎంత అద్భుతముగా అనిపించినప్పటికీ, హిజ్కియా యొక్క సమస్యలు ఇంకా తీరిపోలేదు. సన్హెరీబు ఇంటికి తిరిగివెళ్లాడు, కాని అష్షూరీయులు మరలా దాడి చేస్తారని హిజ్కియా భయపడ్డాడు. విచారకరముగా, దేవుని మీద ఆధారపడుటకు బదులుగా, హిజ్కియా తన పురాతన మార్గములను ఎంచుకొని ఐగుప్తుతో గాక ఎదుగుచున్న బబులోను సామ్రాజ్యముతో పొత్తును కోరాడు. యెరూషలేము యొక్క గొప్ప విమోచన తరువాత దేవుని నమ్ముటకు హిజ్కియా తిరస్కరించుట దేవునికి ఒక లోతైన స్వామిద్రోహమును కనుపరచినట్లైయ్యింది. మరియు యూదాకు చెందిన రాజ నిధులు బబులోనుకు కొనిపోబడతాయని యెషయా వెంటనే హెచ్చరించాడు. 2 రాజులు 20:17-18లో యెషయా పలికిన మాటలను వినండి:

వచ్చు దినములలో ఏమియు మిగులకుండ నీ నగరునందున్న సమస్తమును, నేటివరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టిన దంతయును బబులోను పట్టణమునకు ఎత్తికొనిపోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్రసంతును బబులోనురాజు నగరునందు నపుంసకులగా చేయుటకై వారు తీసికొని పోవుదురు (2 రాజులు 20:17-18).

దురదృష్టవశాత్తు, యెషయా చెప్పిన ఈ మాటలను వినిన తరువాత, హిజ్కియా దేవునికి చూపిన స్వామిద్రోహమును బట్టి పశ్చాత్తాపపడలేదు. బదులుగా, యూదాకు విరోధముగా కలుగు ఈ తీర్పు తన జీవిత కాలములో జరుగదు కాబట్టి ఉపశమనము పొందాడు.

క్రీ.పూ. 701లో యెరూషలేము విమోచనకు ముందు మరియు తరువాత దేవునికి నమ్మకముగా ఉండుటలో హిజ్కియా విఫలమగుట ఎంత ప్రాముఖ్యమైన సన్నివేశమైయ్యింది అంటే, ఇది తన గ్రంథమును సంకలనము చేయునట్లు హోషేయను పురికొల్పియుండవచ్చు. ఒక వైపున, హోషేయ ఈ గ్రంథమును సన్హెరీబు చేతిలో నుండి యెరూషలేము యొక్క విమోచనకు కొంత కాలము ముందు వ్రాసియుండవచ్చు. సన్హెరీబు యొక్క దాడులు మరియు యెరూషలేమును ముట్టడిచేయుట ధారాళమైన ప్రవచన కార్యమునకు దారితీశాయి. సన్హెరీబు ముందుకు సాగుతూ యెరూషలేమును ముట్టడి వేయుచుండగా హిజ్కియా యొక్క వైఫల్యములను ఎత్తి చూపుటకు ఈ కాలములో తన గ్రంథమును వ్రాయమని దేవుడు హోషేయకు పిలుపునిచ్చియుండుట కూడా సాధ్యమే.

మరొక వైపు, యెరూషలేము విమోచన పొందిన వెంటనే కూడా హోషేయ ఈ గ్రంథమును సంకలనం చేసియుండవచ్చు. మనము ఇంతకు ముందు ప్రస్తావించినట్లు, దేవుడు యెరూషలేమును విమోచించినప్పటికీ, హిజ్కియా దేవునికి నమ్మకముగా ఉండుటలో విఫలమై, బబులోనుతో పొత్తు పెట్టుకొనుటకు ప్రయత్నించాడు. మరియు దేవుని పట్ల హిజ్కియా చూపిన స్వామిద్రోహము యూదా యొక్క భవిష్యత్తును అపాయములోనికి నెట్టింది. కాబట్టి, సన్హెరీబు నుండి యెరూషలేము యొక్క విమోచనకు ముందు ఎదురైన సమస్యలు లేక తరువాత ఎదురైన సమస్యలను ఉద్దేశించుటకు హోషేయ తన గ్రంథమును వ్రాసియుంటాడు.

హోషేయ గ్రంథము యొక్క అంతిమ సంకలనము యొక్క కాలము, ప్రాంతము మరియు పరిస్థితులను మనస్సులో ఉంచుకొనిన యెడల, ఈ పుస్తకము యొక్క ముఖ్య ఉద్దేశ్యమును అర్థము చేసుకొనుట కష్టమనిపించదు. సంతోషకరముగా, మనము ఊహించుకొననవసరం లేదు ఎందుకంటే తన మనస్సులో ఉన్న లక్ష్యమును హోషేయ స్వయంగా స్పష్టముగా బయలుపరచాడు.

ఉద్దేశ్యము

పుస్తకము యొక్క చివరి వచనమైన హోషేయ 14:9లో, హోషేయ తన ఉద్దేశ్యమును ఈ విధంగా క్రోడీకరించాడు:

జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు; ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాని ననుసరించి నడచుకొందురు గాని తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు (హోషేయ 14:9).

ఈ వచనము దీనికి ముందు వచనముల కంటే భిన్నముగా ఉన్నది, మరియు ముందుగా ఈ గ్రంథమును పొందుకున్నవారికి అంతిమ ఉపదేశములను ఇస్తూ గ్రంథమంతటిని ముగిస్తుంది. “యెహోవా మార్గములు చక్కనివి” అని నమ్మి “జ్ఞానులు”గాను “బుద్ధిమంతులు”గాను ఉండమని యూదాలో ఉన్న తన వాస్తవిక శ్రోతలకు హోషేయ పిలుపునిచ్చాడు. మరొక మాటలో, తన ప్రవచనముల సంకలనము ద్వారా యూదా జ్ఞానమును పొందుకుంటుంది అని హోషేయ నిరీక్షించాడు. “నీతిమంతులు” — అనగా దేవుని ఆశీర్వాదములు పొందుకొనువారు — యెహోవా మార్గములను అనుసరించి నడుస్తారు అను సత్యము వెలుగులో వారు తమ పరిస్థితులను చూడాలని అతడు కోరాడు. “తిరుగుబాటు చేయువారు” — అనగా దేవుని తీర్పును ఎదుర్కొనువారు — మూర్ఖత్వముతో “తొట్రిల్లుదురు.”

ఇశ్రాయేలు జ్ఞాన పరంపరలలోని విషయములు ఇతర ప్రవచన పుస్తకాలలో కనిపించునప్పటికీ, జ్ఞానము కొరకు పిలుపునిచ్చుటలో హోషేయ చూపిన ధైర్యము అసాధారణమైనది. అయితే జ్ఞానము మీద హోషేయ పెట్టిన దృష్టి హిజ్కియా కాలమునకు చక్కగా సరిపోతుంది. ఇశ్రాయేలు యొక్క జ్ఞాన పరంపరలను గూర్చి అవగాహన కలిగిన ప్రజలతో హిజ్కియా అనుబంధము కలిగియుండేవాడని లేఖనములో మనము చూస్తాము. వాస్తవానికి, సామెతలు గ్రంథములోని 25-29 అధ్యాయములను పరిచయం చేస్తూ సామెతలు 25:1 ఇలా సెలవిస్తుంది, “ఇవియును సొలొమోను సామెతలే. యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి.” స్పష్టముగా, ఈ “హిజ్కియా” సేవకులు హిజ్కియా ఆస్థానములో నివసించిన గౌరవనీయులైన జ్ఞానుల బృందమైయున్నారు. మరియు జ్ఞానము కొరకు హోషేయ ఇచ్చిన ఆఖరు పిలుపు సూటిగా హిజ్కియాకు మరియు ఆస్థానములోని జ్ఞానులకు ఇవ్వబడియుండవచ్చు. దీని వెలుగులో, హోషేయ గ్రంథము యొక్క ఉద్దేశ్యమును ఈ విధంగా మనము క్రోడీకరించవచ్చు.

సన్హెరీబు చేసిన దండయాత్ర ద్వారా ఎదురైన సవాళ్లను ఎదుర్కొనుచుండగా హోషేయ పరిచర్యలో దేవుడు బయలుపరచిన జ్ఞానమును పొందుకోమని హోషేయ గ్రంథము యూదా నాయకులకు పిలుపునిచ్చింది.

ఈ సారంశము సూచించుచున్నట్లు, భవిష్యత్ సన్నివేశములను గూర్చి కొన్ని విశేషమైన ప్రవచనములను ఇచ్చుటకు మన పుస్తకము రూపొందించబడలేదు. బదులుగా, హిజ్కియా దినములలోని నాయకులు జ్ఞాన మార్గమును అనుసరించునట్లు వారికి పిలుపునిచ్చుటకు హోషేయ ఈ గ్రంథమును సంకలనం చేశాడు. హిజ్కియా మరియు అతని ఆస్థానము హోషేయ పరిచర్య ద్వారా దేవుడు బయలుపరచిన విషయములలో నుండి నేర్చుకొని, సన్హెరీబు దండయాత్ర ద్వారా ఎదురైనా సవాళ్లలో నుండి యూదాను నడిపించవలసియుండెను. సన్హెరీబు నుండి యెరూషలేము యొక్క విమోచనకు ముందు మరియు తరువాత, యూదా నాయకులకు జ్ఞాన ఉపదేశము చాలా అవసరమైయుండినది, మరియు హోషేయ గ్రంథము దానిని వారికి అందించింది.

హోషేయ గ్రంథ పరిచయంలో ఇప్పటివరకు మనము, ప్రవక్త మరియు అతని గ్రంథము యొక్క నేపథ్యమును చూశాము. ఇప్పుడు, హోషేయ గ్రంథము యొక్క విషయములు మరియు నిర్మాణమును అవలోకనము చేద్దాము.

విషయములు & నిర్మాణము

దురదృష్టవశాత్తు, హోషేయ ముందుగా తన ప్రవచనములను పొందుకున్న చారిత్రిక సందర్భమును అనేకమంది ఇవాంజెలికల్ క్రైస్తవులు నిర్లక్ష్యం చేస్తారు. అంతేగాక, ఈ పుస్తకములోని భాగములకు ఒకదానికొకటి పొంతన లేదు అన్నట్లు వారు గ్రంథములోని చిన్న భాగముల మీద దృష్టిపెడతారు. ఖచ్చితముగా, ఈ చరిత్రను పరిగణలోనికి తీసుకొని చిన్నచిన్న భాగములను చూచు పద్ధతులు హోషేయ గ్రంథమును గూర్చి అనేక మెళకువలను అనుగ్రహించాయి. అయితే ఈ మెళకువలతో పాటుగా, మనము మరొక ప్రణాళికను చూద్దాము. హోషేయ యొక్క ప్రవచనములను అర్థము చేసుకొనుటకు అతని పరిచర్య యొక్క చారిత్రిక నేపథ్యము చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నదని మనము చూద్దాము. ఒకదానికి ఒకటి పొంతనలేని విధముగా చిన్న భాగముల మీద దృష్టిపెట్టుటకు బదులుగా, హోషేయ గ్రంథములోని పెద్ద భాగములకు మధ్య ఉన్న తార్కికమైన అనుబంధములను మనము విశదీకరిద్దాము. ఈ గ్రంథమును మొదటిగా పొందుకున్న యూదా ప్రజలకు జ్ఞానమునిచ్చుటకు హోషేయ ఈ గ్రంథమును ఏ విధంగా రూపించాడో స్పష్టముగా చూచుటకు ఈ ప్రణాళిక మనకు సహాయం చేస్తుంది. మరియు నేడు హోషేయ గ్రంథములోని జ్ఞానమును మనము ఎలా నేర్చుకోవాలో తెలుసుకొనుటలో కూడా ఇది మనకు సహాయపడుతుంది.

మరొకసారి మిమ్మును మీరు హోషేయ స్థానములో ఊహించుకోండి. క్లుప్త పరిచర్య కాలము కలిగియున్న ఇతర ప్రవక్తలకు భిన్నముగా, హోషేయ దేవుని నుండి అరవై సంవత్సరముల — యరొబాము II పాలనలోని చివరి దశాబ్దము నుండి హిజ్కియా పరిపాలన వరకు — కంటే ఎక్కువ కాలము పాటు ప్రత్యక్షతలను పొందుకున్నాడు. ఈ దశాబ్దములలో, దేవుడు అతనికి అనేక విషయములను, అనగా ఈ గ్రంథములోని పద్నాలుగు అధ్యాయములలో కనిపించు విషయముల కంటే ఎక్కువ విషయములను బయలుపరచాడు.

హోషేయ తన గ్రంథమును నిర్మించిన విధానమును అర్థము చేసుకొనుటకు, హోషేయ యొక్క ప్రవచనములన్నిటిని దేవుడు ఒకేసారి బయలుపరచలేదు అను విషయమును మనము జ్ఞాపకముంచుకోవాలి. మనము ఇంతకు ముందే వివరించినట్లు, ఇశ్రాయేలు దేశము క్రీ.పూ. 744లో అష్షూరు యొక్క ఎదుగుదల, క్రీ.పూ. 732లో అష్షూరు యొక్క దండయాత్ర మరియు క్రీ.పూ. 722లో అష్షూరు యొక్క దండయాత్రను ఎదుర్కొనుచుండగా దేవుడు హోషేయకు ప్రత్యక్షతలను ఇచ్చాడు. ఈ విభిన్నమైన చారిత్రిక సందర్భములను జ్ఞాపకముంచుకొనుటలో మనము విఫలమైతే, హోషేయ పలు సందర్భాలలో, ముఖ్యముగా యూదాను గూర్చిన ప్రవచనముల విషయములో, తనకు విరోధముగా తానే మాట్లాడుకున్నట్లు అనిపిస్తుంది. కాని వాస్తవానికి, అతడు మారుచున్న పరిస్థితులను సంబోధిస్తూ మాట్లాడాడు కాబట్టి హోషేయ యొక్క ప్రవచన దృక్పధాలు కాలక్రమములో మారాయని మనము చూడబోతున్నాము.

ఇప్పుడు, హోషేయ గ్రంథము యొక్క కాలక్రమమును గుర్తించుట ఎంత ప్రాముఖ్యమైయున్నప్పటికీ, హోషేయ తన ప్రవచనములను అంశముల వారీగా అమర్చాడు అను విషయమును కూడా మనము గమనించాలి. 1:1 మన గ్రంథము యొక్క శీర్షికగా ఉన్నదని మరియు హోషేయ పరిచర్య కాలము యొక్క సంపూర్ణ కాలక్రమమును పరిచయం చేయుటకు రూపొందించబడినదని మనము ఈ పాఠంలో ఇంతకు ముందే చూశాము. మరియు ఈ గ్రంథములో నుండి జ్ఞానమును పొందుకోమని దేవుని ప్రజలకు పిలుపునిచ్చు హోషేయ యొక్క ఉద్దేశ్యమును క్రోడీకరిస్తూ 14:9లో ఈ గ్రంథము ముగుస్తుంది. క్రీ.పూ. 701లో సన్హెరీబు దాడి చేసిన కాలములో హోషేయ ఈ గ్రంథమును సంకలనము చేయుచుండగా ఈ గ్రంథములోని విషయములు వ్రాయబడినవని ఈ ఆరంభ మరియు ముగింపు మాటలు సూచిస్తున్నాయి. అయితే ఈ పుస్తకము యొక్క ఆరంభము మరియు ముగింపుకు మధ్య, హోషేయ గ్రంథము యొక్క ముఖ్య భాగము మూడు పెద్ద భాగములుగా విభాగించబడుతుంది మరియు వీటికి అంశ ప్రాముఖ్యత ఉన్నది.

1:1-3:5 మధ్య ఉన్న మొదటి భాగము దేవుని తీర్పు మరియు నిరీక్షణను ఉద్ఘాటిస్తుంది. ఈ ఆరంభ అధ్యాయములు యరొబాము II — క్రీ.పూ. 744లో అష్షూరు ఎదుగుదలను ఉద్దేశించి మాట్లాడిన ప్రవచనములు — పాలించిన కాలములో హోషేయ పొందుకున్న ఆదిమ ప్రవచనములను తెలియజేస్తాయి. తన ప్రజల మీద దేవుడు కుమ్మరించాలని నిర్ణయించుకున్న శాపములు మరియు భవిష్యత్తులో వారు పొందుకోబోవు ఆశీర్వాదములకు సంబంధించి సమతుల్యముతో కూడిన దృక్పధాలను ఇచ్చుటకు ఈ ఆరంభ ప్రవచనములను హోషేయ జాగ్రత్తగా నిర్ణయించాడు మరియు అమర్చాడు.

4:1-9:9లో ఉన్న రెండవ భాగము, దేవుని యొద్ద నుండి వచ్చుచున్న తీర్పును ఉద్ఘాటిస్తుంది. మొదటి విభాగమునకు భిన్నముగా, ఈ ప్రవచనములు, క్రీ.పూ. 732లో జరిగిన అష్షూరు దండయాత్ర మరియు క్రీ.పూ. 722లో జరిగిన అష్షూరు దండయాత్ర కాలములో హోషేయ ప్రత్యక్షతలను పొందుకొనినప్పుడు, అనగా హోషేయ పరిచర్యలోని తరువాత దశలలో నుండి వెలువడతాయి. ఈ అధ్యాయములు విశేషముగా దేవుని తీర్పుకు సంబంధించిన అంశముల మీద దృష్టిపెడతాయి. మరియు హోషేయ పరిచర్య కాలములోని పలు దశలలో ఈ దైవిక తీర్పులు ఏ విధంగా కఠినమయ్యాయో ఇవి ఎత్తి చూపుతాయి.

9:10-14:8లో ఉన్న మూడవ విభాగము దేవుని యొద్ద నుండి కలిగిన నిరీక్షణ మీద దృష్టిపెడుతుంది. క్రీ.పూ. 732లో జరిగిన అష్షూరు దండయాత్ర మరియు క్రీ.పూ. 722లో జరిగిన అష్షూరు దండయాత్రను ఊహించుచు హోషేయ పొందిన ప్రత్యక్షతలు కూడా ఈ చివరి ప్రధానమైన భాగములో ఉన్నాయి. అయితే ఈ విభాగము నిరీక్షణ, అనగా హోషేయ పరిచర్యలోని ఈ దశలలో ఆయన ప్రజల యొక్క భవిష్యత్తును గూర్చి దేవుడు బయలుపరచిన నిరీక్షణను గూర్చిన అంశము మీద ఎక్కువ దృష్టిపెడుతుంది,

హోషేయ గ్రంథము యొక్క వ్యాఖ్యానము కొరకు ఈ చారిత్రిక మరియు అంశాత్మక అమరికల యొక్క ప్రాముఖ్యతను ఎంత ఎక్కువగా ఉద్ఘాటించినా తక్కువే అవుతుంది. అనేక విధాలుగా, హిజ్కియా పరిపాలన కాలములో ఈ గ్రంథమును మొదటిగా పొందుకున్న ప్రజలలో హోషేయ నింపాలనుకున్న జ్ఞానమును విప్పుటకు ఇవి తాళపు చెవులుగా ఉన్నాయి.

మన తరువాత పాఠంలో హోషేయ యొక్క జ్ఞానమును గూర్చి మరింత దగ్గరగా మనము చూద్దాము, అయితే ప్రస్తుతానికి మన గ్రంథములోని ప్రతి ప్రధానమైన విభాగములోని విషయములను మరియు నిర్మాణమును పరిచయం చేయుట సహాయకరంగా ఉంటుంది. 1:2-3:5లోని మొదటి విభాగములో ఉన్న దేవుని తీర్పు మరియు నిరీక్షణతో ఆరంభిద్దాము. మన గ్రంథములోని ఆరంభ అధ్యాయములు దేవుని ప్రజలకు కలుగు శాపములు మరియు తరువాత దేవుని నుండి కలుగు ఆశీర్వాదముల మీద సమతుల్యముతో దృష్టిని కేంద్రీకరిస్తాయి.

తీర్పు మరియు నిరీక్షణ (1:2-3:5)

మనము ఇంతకు ముందే ప్రస్తావించినట్లు, ఈ ఆరంభ అధ్యాయములు క్రీ.పూ. 744లో అష్షూరు ఘనతకు ఎదుగుతుంది అని హోషేయ ప్రవచనములను పొందుకున్న యరొబాము II దినములలో హోషేయ యొక్క పరిచర్యకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అయితే ఈ కాలములోనే హోషేయ ప్రత్యక్షతలను పొందుకున్నాడు అని మనము ఎలా చెప్పగలము? సరే, ఈ అధ్యాయములు “మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట” సెలవిచ్చిన కాలమును సూచిస్తున్నాయని 1:2 తెలియజేస్తుంది.

ఈ ఆదిమ చారిత్రిక సందర్భమును ఈ విభాగములోని ఇతర భాగములు కూడా నిర్థారిస్తాయి. మొదటి స్థానములో, ఇశ్రాయేలు మహా సమృద్ధిని అనుభవించుచుండగా, వారు విగ్రహారాధన మరియు అన్యాయములోనికి దిగజారిపోయారు అను సత్యము వైపుకు హోషేయ దృష్టిని ఆకర్షించాడు. ఇశ్రాయేలు మీద అష్షూరు యొక్క ఆధిపత్యము ద్వారా దేవుడు శాపములను తీసుకొనివచ్చుటకు నిశ్చయించుకున్నాడని కూడా అతడు సూచించాడు. ఈ సత్యములు హోషేయ పరిచర్యలోని ఆదిమ విభాగములతో పొంతనకలిగియున్నాయి.

రెండవదిగా, ఈ విభాగములో హోషేయ యూదా మీద దృష్టిని కేంద్రీకరించుట అతడు ఈ ప్రవచనములను తన పరిచర్య యొక్క మొదటి దశలో పొందుకున్నాడు అని నిర్థారిస్తుంది. ఈ కాలములో, ఉజ్జియా యూదా దేశములో నీతిగల రాజుగా పాలించిన విషయమును మీరు గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి, ఊహించిన విధముగానే, ఈ అధ్యాయములు దక్షిణ రాజ్యము మీద ఎలాంటి శాపములను పలుకవు. భిన్నముగా, ఈ మొదటి విభాగము అనేకసార్లు యూదాను గూర్చి అనుకూలముగా మాట్లాడుతుంది. ఉదాహరణకు, దేవుడు ఇశ్రాయేలు మరియు యూదాకు మధ్య ఒక స్పష్టమైన వ్యత్యాసమును చూపిన హోషేయ 1:6-7ను వినండి. అక్కడ దేవుడు ఇలా సెలవిచ్చాడు:

ఇకమీదట నేను ఇశ్రాయేలువారిని క్షమించను, వారియెడల జాలిపడను. అయితే యూదావారియెడల జాలిపడి, విల్లు ఖడ్గము యుద్ధము గుఱ్ఱములు రౌతులు అను వాటిచేత కాక తమ దేవుడైన యెహోవాచేతనే వారిని రక్షింతును (హోషేయ 1:6-7).

ఉత్తర రాజ్యము అష్షూరు చేతులలో శ్రమను అనుభవించవలసియుండినను, ఈ సమయములో దేవుడు కనికరము చూపి యూదాను రక్షించబోతున్నాడని ఈ వాక్యభాగము స్పష్టము చేస్తుంది. 1:11లో కూడా యూదాను గూర్చి అనుకూలంగా మాట్లాడుతు హోషేయ ఇలా అన్నాడు:

యూదావారును ఇశ్రాయేలువారును ఏకముగా కూడుకొని, తమపైన నొకనినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములోనుండి బయలుదేరుదురు (హోషేయ 1:11).

ఇశ్రాయేలు అష్షూరు తీర్పును ఎదుర్కొనుచుండగా, దేవుని ఆశీర్వాదములను గూర్చి వారు కలిగియుండిన నిరీక్షణ ఒకే రాజు క్రింద యూదాతో ఐక్యపరచబడుట ద్వారా నెరవేరుతుందని హోషేయ ఇక్కడ సూచించాడు. ఇదే విధముగా, 3:5లో, హోషేయ ఇలా సెలవిచ్చాడు:

తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయుదురు. ఈ దినముల అంతమందు వారు భయభక్తులుకలిగి యెహోవా అనుగ్రహము నొందుటకై ఆయన యొద్దకు వత్తురు (హోషేయ 3:5).

“తమ రాజైన దావీదు” అని ఇక్కడ సూటిగా సంబోధించుట యూదాను గూర్చి అనుకూలముగా మాట్లాడినట్లు ప్రతిబింబిస్తుంది, ఎందుకంటే యూదా దావీదు యొక్క రాజ గృహము ద్వారా పాలించబడుచున్నది. గ్రంథము యొక్క మొదటి విభాగములో యూదాను గూర్చి హోషేయ సంపూర్ణముగా అనుకూలమైన దృక్పధములు కలిగియుండుట ఈ ప్రవచనములను అతడు తన పరిచర్య యొక్క ఆరంభ కాలములో, దేవుని మార్గములను అనుసరించి ఉజ్జియా యూదాను పాలించిన కాలములో పొందుకున్నాడని నిర్థారిస్తుంది.

హోషేయ గ్రంథము యొక్క మొదటి విభాగమును గూర్చిన ఈ దృక్పధమును మనస్సులో ఉంచుకొని, ఈ అధ్యాయములు దేవుని తీర్పు మరియు నిరీక్షణ అను అంశమును ఏ విధంగా ఉద్ఘాటిస్తాయో క్లుప్తంగా చూద్దాము. హోషేయ ఈ అధ్యాయములను మూడు ప్రధానమైన భాగములుగా అమర్చాడు. 1:2-2:1లో ఉన్న మొదటి భాగము అతని మునుపటి కుటుంబ అనుభవాలను వర్ణిస్తుంది.

మునుపటి కుటుంబ అనుభవాలు (1:2-2:1)

ఈ విభాగము రెండు ప్రధానమైన భాగములుగా విభజించబడుతుంది. 1:2-9లోని మొదటి భాగము కుటుంబ కథనమును అనుబంధపరుస్తుంది. దేవదాసిగా నివసించుచుండిన గోమెరు అను స్త్రీని వివాహము చేసుకోమని దేవుడు హోషేయకు ఇచ్చిన ఆజ్ఞతో ఇది ఆరంభమవుతుంది. వారికి బిడ్డలు జన్మించినప్పుడు, దేవుడు ఇశ్రాయేలు మీద కురిపించబోవుచుండిన తీర్పులకు చిహ్నముగా ఉండునట్లు వారికి పేర్లు పెట్టమని హోషేయకు తెలియజేయబడింది. ఈ కథనము అష్షూరు ద్వారా ఇశ్రాయేలుకు కలుగబోవు శ్రమల వైపుకు దృష్టిని ఆకర్షిస్తుంది.

అయితే సమతుల్యముగా దేవుని తీర్పు మీద ఈ విధంగా దృష్టిపెట్టుట ద్వారా, 1:10-2:1లో నిరీక్షణతో కూడిన తన ప్రవచన పలుకులు గల రెండవ విభాగమును హోషేయ జోడించుచున్నాడు. ఒక ఉదాహారణను చూద్దాము, 1:10లో, హోషేయ దీనిని బయలుపరచాడు:

ఇశ్రాయేలీయుల జనసంఖ్య అమితమై లెక్కలేని సముద్రపు ఇసుకంత విస్తారమగును; ఏ స్థలమందు–మీరు నా జనులు కారన్నమాట జనులు వారితో చెప్పుదురో ఆ స్థలముననే–మీరు జీవముగల దేవుని కుమారులైయున్నారని వారితో చెప్పుదురు (హోషేయ 1:10).

ఇశ్రాయేలుకు విరోధముగా దేవుడు తీర్పు కాలమును ఆరంభించుటకు సిద్ధపడినప్పటికీ, ఇశ్రాయేలు గోత్రముల వారసులకు భవిష్యత్తులో ఆశీర్వాదములు కలుగుతాయని కూడా హోషేయ తెలియజేశాడు.

2:2-23లోని దేవుని తీర్పు మరియు నిరీక్షణలోని రెండవ భాగము హోషేయ గ్రంథములో ఉన్న దేవుని యొక్క మొదటి వ్యాజ్యము మీద దృష్టిపెడుతుంది.

దేవుని వ్యాజ్యము (2:2-23)

ఈ వచనములు భూమి మీద హోషేయ యొక్క కుటుంబ అనుభవముల నుండి పరలోక ఆస్థానములలో జరుగుతున్న న్యాయ వ్యాజ్యమును గూర్చిన ఒక ప్రేరేపిత కథనము వైపుకు దృష్టిని మళ్ళించాయి. ఇప్పుడు, పాత నిబంధనలో, తన పరలోక న్యాయస్థానములో చోటు చేసుకొను న్యాయ విమర్శలను గూర్చి ప్రవక్తలకు జ్ఞానమును అనుగ్రహించుట ద్వారా దేవుడు తరచుగా భవిష్యత్తును గూర్చిన తన ప్రణాళికలను బయలుపరచేవాడు. వీటిలో కొన్ని ప్రత్యక్షతలను మనము “వ్యాజ్యములు” అని పిలుస్తాము, ఎందుకంటే అవి దేవుని న్యాయస్థానములో జరుగు న్యాయవిమర్శలను గూర్చి సంపూర్ణ వివరణను ఇస్తాయి. అవి చాలా సార్లు దేవుడు తన సింహాసనము మీద కూర్చొనియుండుటను చిత్రీకరిస్తాయి, మరియు కోర్టుకు హాజరు కావాలని ఆయన ప్రజలకు ఇచ్చిన సమన్లను వర్ణిస్తాయి, దోషుల మీద ఆరోపణలను మరియు వారితో జరుగు సంభాషణలను నివేదిస్తాయి, మరియు తీర్పులను ప్రకటిస్తాయి.

అనేక ప్రవచన తీర్పు ఉపన్యాసములు నిబంధన వ్యాజ్యము యొక్క రూపమును తీసుకుంటాయని చెప్పవచ్చు. నిబంధన వ్యాజ్యము అను ఆలోచన అంతర్జాతీయ మంత్రాంగము మీద ఆధారపడియున్నది, మరియు దీనికి ఉత్తమమైన ఉదాహరణలను మనకు అందుబాటులో ఉన్న హిత్తీయుల మంత్రాంగ లేఖలలో చూస్తాము, అక్కడ ఒక హిత్తీయ రాయబారి సామంత దేశమునకు వెళ్లి సామంత రాజు వ్రాసియిచ్చిన, కాని ఇప్పుడు ఉల్లంఘించబడిన ఒప్పందములోని షరతులను అమలు చేస్తాడు. ఇక్కడ ప్రవక్త అట్టి పాత్రను పోషించుచున్నాడు. మరియు ఈ మూలకములను పూర్తిగా ఉదహరించు అనేక కీలకమైన వాక్య భాగములు ఉన్నాయి. దాని సంపూర్ణతలో, ఈ మూలకములలో ప్రతివాదులకు మరియు సాక్ష్యులకు ఇవ్వబడిన సమన్లు ఉన్నాయి... తరువాత గొప్ప రాజైన ప్రభువు, మరియు సామంత రాజు మధ్య నెలకొనిన నిబంధన అనుబంధము యొక్క చరిత్రకు సంబంధించిన ఒక మూలకము ఉంటుంది, దాని తరువాత ఒప్పందమును ఉల్లంఘించినందుకు సామంతను ముద్దాయిగా ఎంచుట ఉంటుంది, దాని తరువాత ఒప్పందమును ఉల్లంఘించినందుకు హెచ్చరిక లేక శిక్ష ఇవ్వబడుతుంది.

— డా. డగ్లస్ గ్రోప్ప్

హోషేయ గ్రంథములోని మొదటి పరలోక వ్యాజ్యము 2:2లో దేవుడు ఈ మాటలను ఉపయోగిస్తూ ఇశ్రాయేలును తన న్యాయస్థానములోనికి పిలచుటతో ఆరంభమవుతుంది:

మీ తల్లి...తో వాదించుడి (హోషేయ 2:3).

ఆధునిక శ్రోతలకు, ఈ పిలుపు వింతగా అనిపించవచ్చు. ఇక్కడ “గద్దింపు” లేక “వాదించుట” అను పదము హెబ్రీ పదమైన “రిబ్”ను (רִיב) అనువదిస్తుంది. ఈ పదము ప్రవక్తల పుస్తకాలలో చాలాసార్లు పరలోక న్యాయస్థానములోని “న్యాయపరమైన వాదము” లేక “వ్యాజ్యమును” వర్ణించుటకు ఉపయోగించబడింది. ఇక్కడ “తల్లి” ఇశ్రాయేలు నాయకులు నివసించిన ఇశ్రాయేలు రాజధానియైన షోమ్రోను అయ్యున్నది. కాబట్టి, వాస్తవానికి, షోమ్రోనులో నివసించుచున్న తమ నాయకులకు విరోధముగా పరలోక వ్యాజ్యములోనికి — ఇది దేవుడు స్వయంగా వినునటువంటి వ్యాజ్యమైయున్నది — ప్రవేశించమని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు పిలుపునిచ్చాడు.

ఈ వ్యాజ్యము ద్వారా, దేవుడు హోషేయ భార్యయైన గోమెరు వలె ఇశ్రాయేలు ప్రవర్తించిన విధానములను తెలియపరచాడు. గోమెరు హోషేయకు అపనమ్మకస్తురాలిగా ఉండి ఆమె పిల్లలకు శ్రమలను కొనితెచ్చింది. మరియు ఇశ్రాయేలు నాయకులు దేవునికి అపనమ్మకస్తులైయుండి ఇశ్రాయేలు రాజ్యమునకు శ్రమలను కొనితెచ్చారు. అయితే ఈ వ్యాజ్యములో, తన నిబంధనా శాపములను అనుభవించునట్లు దేవుడు ఇశ్రాయేలు రాజ్యమును శిక్షించాడు అని మాత్రమే హోషేయ నివేదించుటలేదు. దేవుడు ఒక దినమున ఇశ్రాయేలును మరలా తన యొద్దకు చేర్చుకుంటాడు అని కూడా అతడు నివేదించాడు. తీర్పు కాలము తరువాత, దేవుడు ఇశ్రాయేలును తన యొద్దకు పునరుద్ధరించుకుంటాడు మరియు ఉత్తర గోత్రముల మీద కనికరమును చూపుతాడు.

పరలోక న్యాయస్థానమును గూర్చిన ఈ కథనము తరువాత, హోషేయ దేవుని తీర్పు మరియు నిరీక్షణ మీద తన దృష్టిని 3:1-5లో ఉన్న తన తదుపరి కుటుంబ అనుభవాలను గూర్చిన వర్ణనతో ముగించాడు.

తదుపరి కుటుంబ అనుభవాలు (3:1-5)

తన మునుపటి కుటుంబ అనుభవములను గూర్చిన కథనమును పోలిన విధముగా, 3:1-3లో హోషేయ స్వీయచరిత్రా కుటుంబ కథనముతో ఆరంభించాడు. దేవదాసిగా తన పురాతన జీవన శైలిలోనికి అతని భార్య తిరిగివెళ్లిపోయింది, కాని ఆమెకు మరొకసారి ప్రేమను చూపమని దేవుడు హోషేయకు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి, హోషేయ గోమెరును కొనుగోలు చేసి, ఆమె కొరకు ఒక గృహమును కొన్నాడు.

ఈ క్లుప్త కథనము తరువాత 3:4, 5లో హోషేయ యొక్క రెండవ నిరీక్షణకరమైన ప్రవచన పలుకులను మనము చూస్తాము. ఈ వచనములలో, కొంత కాలము పాటు ఇశ్రాయేలు రాజ్యము దేవుని నుండి సమస్యలను ఎదుర్కొంటుంది అని హోషేయ వివరించాడు. అయితే దేవునితో ఇశ్రాయేలు కలిగియున్న అనుబంధము వలన ఇశ్రాయేలుకు గొప్ప దీవెనలు కలుగు దినము భవిష్యత్తులో రాబోతుంది.

ఈ సాదృశ్యములో, తన ప్రజల మధ్య ఘనతను పొందిన ప్రవక్తయైన హోషేయ దేవుని సూచిస్తున్నాడు. అవును, దేవుడు హోషేయ కంటే చాలా గొప్పవాడు, కాని ఇది ఒక అలంకారమైయున్నది. మరొక వైపున, వ్యభిచారియైన స్త్రీ ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తుంది... యెహోవాను విడచి ఇతర దేవతలను ఆరాధించుట ద్వారా వారు వ్యభిచరించారు. కాబట్టి తన వృత్తాంతమును ప్రతిబింబించమని దేవుడు హోషేయను కోరాడు “ఐగుప్తులో నివసించుచుండగా ఇశ్రాయేలు ప్రజలు ఇతర దేవతలను ఆరాధిస్తూ, నాకు దూరముగా ఉండినను, వారు దూరముగా ఉండగనే మరియు వ్యభిచారములో నివసిస్తున్నప్పుడే నేను వారి యొద్దకు వెళ్లి వారిని వివాహము చేసుకున్నాను. వారు దూరముగా ఉన్నప్పుడు నేను వారిని రక్షించాను. వారు మంచివారు గనుక నేను వారిని రక్షింపలేదు, కాని నా కృప మూలముగా నేను వారిని రక్షించాను.”

అయితే ఇక్కడ వింతైన విషయము ఏమిటంటే, ఈ స్త్రీని వివాహము చేసుకొనిన తరువాత, ఆమె తిరిగి వ్యభిచారములోనికి వెళ్లిపోతుంది అని దేవుడు హోషేయకు చెప్పాడు. అయితే వెళ్లి ఆమెను మరలా తన యొద్దకు తీసుకొని రమ్మని ఆయన హోషేయతో అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో మన ప్రభువు ఇలానే చేశాడు. ఐగుప్తులో వారు వ్యభిచారములో నివసించుచుండినప్పటికీ, మన ప్రభువు ఇశ్రాయేలు ప్రజలను రక్షించి వారిని పైకి మాత్రమే లేపలేదుగాని, ప్రజలు రక్షించబడి దేవునితో నిబంధనా అనుబంధమును చేసుకొనిన తరువాత కూడా, ఇతర దేవతలతో వ్యభిచారము చేయుటకు వారు తిరిగివెళ్లారు. మరియు దేవుడు ప్రజలను శిక్షించి వారిని క్రమశిక్షణలో పెట్టినప్పటికీ, హోషేయ వ్యభిచారియైన తన స్త్రీని చేర్చుకున్నట్లే ఆయన కృప ద్వారా, దేవుడు తన “భార్య” — అనగా వివాహము తరువాత కూడా వ్యభిచారము చేసిన ప్రజలు — యొద్దకు వెళ్లి వారిని తన కొరకు పునరుద్ధరించుకున్నాడు.

— శ్రీ. షెరిఫ్ అతేఫ్ ఫహిం, అనువాదం

కాబట్టి మొత్తము మీద, తన పరిచర్యలోని ఆరంభ కాలములో పొందుకొనిన కొన్ని ప్రత్యక్షతలను సమకూర్చి సంకలనం చేయుట ద్వారా, హిజ్కియా దినములలో నివసించిన యూదా నాయకులకు హోషేయ చాలా జాగ్రత్తగా ఒక సమతుల్యమైన సందేశమును అందించాడు.

మన గ్రంథము వ్రాయబడిన కాలములో, ఉత్తర రాజ్యము యొక్క పతనము ద్వారా దేవుడు ఇచ్చిన తీర్పు అప్పటికే నెరవేరింది. అయితే దేవుని ప్రజలు నిరీక్షణను కోల్పోకూడదు. తీర్పు కాలము భవిష్యత్తులో ఇశ్రాయేలు దేవుని నుండి గొప్ప ఆశీర్వాదములు పొందుకొను కాలములోనికి నడిపిస్తుంది.

దేవుని తీర్పు మరియు నిరీక్షణను గూర్చిన ఒక సమతుల్యమైన ఆలోచనను మొదటి విభాగము అందించిన తరువాత, 4:1-9:9లో ఉన్న రెండవ విభాగము దేవుని యొద్ద నుండి వివృతమగుతున్న తీర్పు మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది.

వివృతమగుతున్న తీర్పు

హోషేయ గ్రంథములోని ఈ భాగమునకు “వివృతమగుచున్న” అను శీర్షికనిచ్చాము, ఎందుకంటే దీనిలో హోషేయ సుదీర్ఘకాలము పాటు పొందుకొనిన ప్రత్యక్షతలు ఉన్నాయి. మరియు దీనిని మనము “తీర్పు” అని ఎందుకు పిలుస్తామంటే, ఇది హోషేయ పరిచర్య చేసిన కాలములో దేవుడు ఇశ్రాయేలు మరియు యూదాకు విరోధముగా ఇచ్చిన నిబంధన శాపముల మీద విశేషముగా దృష్టిపెడుతుంది.

విశాలముగా మాట్లాడితే, వివృతమగుచున్న తీర్పును గూర్చిన ఈ అధ్యాయములు రెండు ప్రధానమైన భాగములుగా విభాగించబడతాయి: 4:1 నుండి 5:7లో మరిన్ని దేవుని వ్యాజ్యములు, తరువాత 5:8-9:9లో అపాయమును గూర్చి దేవుడిచ్చిన పిలుపు. ముందుగా దేవుని వ్యాజ్యములను చూద్దాము.

దేవుని వ్యాజ్యములు (4:1-5:7)

ఈ విభాగములో దేవుని యొక్క ఆరంభ వ్యాజ్యములు 4:1-19లో కనిపిస్తాయి. మరొకసారి, పరలోక న్యాయస్థానములో జరుగు న్యాయ సంబంధమైన చర్చలను గూర్చిన జ్ఞానమును హోషేయకు అనుగ్రహిస్తూ దేవుడు తన ప్రణాళికలను బయలుపరచాడు. 4:1లో ఇవ్వబడిన ఆజ్ఞను వినండి:

ఇశ్రాయేలువారలారా, యెహోవా మాట ఆలకించుడి... యెహోవా దేశనివాసులతో వ్యాజ్యెమాడుచున్నాడు (హోషేయ 4:1).

ఈ ఆరంభ వచనము సూచించుచున్నట్లు, ఇశ్రాయేలుకు విరోధముగా దేవుని యొద్ద ఒక “వ్యాజ్యము” ఉన్నది కాబట్టి ఆయన ఇశ్రాయేలును తన న్యాయస్థానములోనికి పిలిచాడు. ఇక్కడ “వ్యాజ్యము” అను పదము మనము ఇంతకు ముందు చూసిన హెబ్రీ పదమైన “రిబ్”నే (רִיב,) అనువదిస్తుంది, దీని పారిభాషిక అర్థము ఒక న్యాయసంబంధమైన కేసు.

మొదటి విభాగము తరువాత వెంటనే ఈ వ్యాజ్యమును మరియు దానిలోని విషయములను వ్రాయుట, ఇది క్రీ.పూ. 732లో అష్షూరు దండయాత్రను గూర్చి హోషేయ ఇచ్చిన మునుపటి ప్రవచనములలో ఒకటైయున్నది అని బలముగా సూచిస్తుంది. ఈ కాలములో ఇశ్రాయేలులో మనహేము, పెకహ్యా విగ్రహారాధనకు మరియు అన్యాయమునకు మద్దతునిచ్చుట కొనసాగించారు అని మీకు జ్ఞాపకముండేయుంటుంది. మరియు మనహేము అష్షూరు దాడిని క్లుప్తంగా అనుభవించినప్పుడు, దేవునిలో భద్రతను వెదకుటకు బదులుగా, అతడు మరియు తరువాత పెకహ్యా అష్షూరు మరియు అష్షూరీయుల దేవతలతో తమ పొత్తును పునరుద్ఘాటించారు.

ఈ వ్యాజ్యము అంతటిలో, ఇలాంటి పాపములను గూర్చే దేవుడు ఇశ్రాయేలును నిందించాడు. మరియు నిరాశ్చర్యముగా, కఠినమైన అష్షూరు దాడి రూపములో — బహుశ క్రీ.పూ. 732లో జరిగిన దండయాత్రను సంబోధిస్తూ — ఇశ్రాయేలు మీదికి శాపములను తీసుకొనివస్తానని దేవుడు ప్రకటించాడు. ఈ చారిత్రిక సందర్భమునకు బలమైన ఆధారములలో ఒకటి ఇంతకుమందు వ్యాజ్యములో హోషేయ యూదాను గూర్చి చెప్పిన ఒక విషయమైయున్నది. 4:15లో హోషేయ వ్రాసిన మాటలను వినండి:

ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైతివి; అయినను యూదా ఆ పాపములో పాలుపొందక పోవునుగాక (హోషేయ 4:15).

ఇక్కడ మనము చూస్తునట్లు, ఈ కాలములో, ఇశ్రాయేలులోని పరిస్థితులు మరియు యూదాలోని పరిస్థితుల మధ్య దేవుడు ఒక విశాలమైన వ్యత్యాసమును చూపుచున్నాడు. ఇశ్రాయేలు దేవునికి చూపిన అపనమ్మకమును బట్టి దోషియై యుండినది. అయితే ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలును అనుసరించవద్దని దేవుడు యూదాకు ఒక హెచ్చరికను మాత్రమే ఇచ్చాడు. ఇశ్రాయేలు మరియు యూదాల మధ్య ఈ వ్యత్యాసము ఉజ్జియా మరియు యోతాము నీతిగల రాజులుగా పాలించినప్పుడు యూదాలోని పరిస్థితులను మనకు జ్ఞాపకము చేస్తుంది. కాబట్టి, క్రీ.పూ. 732లోని దండయాత్రకు ముందు, యూదా మీద దేవుడు ఎలాంటి శాపములను పలుకలేదు.

ఇది మనలను 5:1-7లో దేవుడు తరువాత ప్రకటించిన వ్యాజ్యములోనికి నడిపిస్తుంది. ఇక్కడ మనము మరొక పరలోక న్యాయస్థాన దృశ్యమును చూస్తాము. 5:1లో నిందితులను న్యాయస్థానమునకు సమకూర్చుచున్న విధానమును వినండి:

యాజకులారా, నామాట ఆలకించుడి; ఇశ్రాయేలువారలారా, చెవిని బెట్టి ఆలోచించుడి; రాజసంతతివారలారా, చెవియొగ్గి ఆలకించుడి, ... మిమ్మునుబట్టి ఈ తీర్పు జరుగును (హోషేయ 5:1).

ఈ వాక్యభాగము పారిభాషిక పదమైన “రిబ్”ను (רִיב,) ఉపయోగించనప్పటికీ, దేవుడు దోషులను — అనగా “యాజకులు,” “ఇశ్రాయేలీయులు,” మరియు “రాజ గృహమునకు చెందినవారు” — న్యాయస్థానములోనికి పిలిచాడు మరియు వారిని పిలచుటకు ఉద్దేశ్యము “తీర్పు” — లేక హెబ్రీ భాషలో మిష్పత్ (מִשְׁפָּט) — అయ్యున్నదని ప్రకటించాడు. రిబ్ (מִשְׁפָּט) అను పదము వలెనే, ఈ పదము పరలోక న్యాయస్థానములో న్యాయసంబంధమైన సంభాషణలను సూచిస్తుంది.

క్రీ.పూ. 732లో అష్షూరు దండయాత్ర దగ్గరపడుతుండగా హోషేయ తదుపరి ప్రవచనములను పొందుకొని, ప్రకటించిప్పుడు ఇది ఆరంభమైనది అని ఈ తదుపరి వ్యాజ్యములోని విషయములు సూచిస్తున్నాయి. ఇశ్రాయేలు రాజసంతతివారు మిస్పా మరియు తాబోరులో ప్రజలను హింసించారు అని ప్రస్తావిస్తూ హోషేయ 5:1 ఈ చారిత్రిక ధోరణిని ఎత్తి చూపుతుంది. క్రీ.పూ. 732లో తిగ్లత్-పిలేసరు III ఇశ్రాయేలు మీద దాడిచేసి వారిని సామంతలుగా చేసిన సమయము వరకు ఈ స్థలములు ఇశ్రాయేలు యొక్క స్వాధీనములో ఉండేవి అని పురావస్తుశాస్త్ర రుజువులు స్పష్టము చేయుచున్నాయి కాబట్టి ఇది ప్రాముఖ్యమైయున్నది. ఇశ్రాయేలు నిష్ఫలముగా తిగ్లత్-పిలేసరు III, లేక ఈ వచనములో పిలువబడినట్లు “గొప్ప రాజు” యొక్క సహాయము కొరకు కోరెనని దేవుడు ఇశ్రాయేలును నిందించినప్పుడు 5:13లో ఇది స్పష్టమవుతుంది.

ఇశ్రాయేలులో ఈ కాలమందు, పెకహు రాజు విగ్రహారాధన మరియు అన్యాయములో కొనసాగాడు. అష్షూరుకు కప్పము చెల్లించకుండా ఉండుటకు అతడు సిరియాతో పొత్తు — సిరియా-ఇశ్రాయేలు కూటమి — కూడా పెట్టుకున్నాడు. కాబట్టి, ఇశ్రాయేలు యొక్క శాపములు ఘోరమైన అష్షూరీయుల దాడి రూపములో వచ్చుచున్నవి అని దేవుని యొక్క తదుపరి వ్యాజ్యము హెచ్చరించింది.

మరొకసారి, హోషేయ యూదా మీద పెట్టిన దృష్టి ఈ చారిత్రిక సందర్భమునకు మరొక ప్రాముఖ్యమైన రుజువుగా ఉన్నది. ఈ పాఠంలో ఇంతకు ముందు మనము ప్రస్తావించినట్లు, సిరియా-ఇశ్రాయేలు యొక్క కూటమి ఏర్పడుటకు కొంచెము ముందే ఆహాజు యూదా రాజైయ్యాడు. అయితే తన తండ్రి మరియు తాతకు భిన్నముగా, ఆహాజు యూదాలో విగ్రహారాధనను మరియు అన్యాయమును ప్రోత్సహించాడు. తన శత్రువుల నుండి భద్రత కొరకు అతడు అష్షూరీయులతో, వారి దేవతలతో పొత్తు కూడా పెట్టుకున్నాడు. ఫలితంగా, ఈ తదుపరి వ్యాజ్యములో, మొట్టమొదటి సారిగా దేవుడు శాపములను గూర్చి యూదాను హెచ్చరించాడు. 5:5 యూదాను ఉద్దేశించి మాట్లాడిన విధానమును వినండి:

ఇశ్రాయేలువారును... తమ దోషములో చిక్కుపడి తొట్రిల్లు చున్నారు; వారితోకూడ యూదావారును తొట్రిల్లుచున్నారు (హోషేయ 5:5).

దేవుని యొక్క మునుపటి వ్యాజ్యముకు మరియు దీనికి మధ్య ఉన్న వ్యత్యాసమును గమనించండి. 4:15లో, ఇశ్రాయేలు వలె పాపత్మకముగా మారవద్దని దేవుడు యూదాను హెచ్చరించాడు. అయితే ఈ వచనము సూచించుచున్నట్లు, ఈ తదుపరి వ్యాజము ఇవ్వబడిన కాలానికి, ఆహాజు వారిని తప్పు దారిలోనికి నడిపించాడు కాబట్టి యూదా కూడా ఇశ్రాయేలుతో పాటు దేవుని ఎదుట దోషిగా ఎంచబడింది.

సిరియా మరియు ఇశ్రాయేలు కూటమి వాస్తవానికి ఆహాజు దినములలో యూదా మీద దాడి చేసి, అష్షూరును ఎదుర్కొనుటకు యేర్పరచబడిన కూటమిలో వారు కూడా చేరాలని యూదాను బలవంతము చేయుటకు ప్రయత్నించింది. ఇప్పుడు, దీనికి ఫలితము ఊహించదగినదిగానే ఉన్నది. అష్షూరీయులకు ఇది నచ్చలేదు, ఫలితంగా కొన్ని సంవత్సరముల తరువాత అష్షూరీయులు తిరిగివచ్చి, సిరియాను పూర్తిగా ధ్వంసం చేసి ఇశ్రాయేలును బోర్లపడవేసి, వారిని సామంతలుగా చేసి, అష్షూరు రాజ్యమునకు పెద్ద మొత్తములో కప్పము చెల్లించునట్లు చేసింది. వాస్తవానికి, దక్షిణ రాజ్యము ఈ కూటమి ద్వారా మాత్రమే దాడిని ఎదుర్కోలేదుగాని, భద్రత కొరకు అష్షూరు రాజ్యమునకు స్వయంగా సమర్పించుకున్నది కాబట్టి దక్షిణ రాజ్యము కూడా ఇక్కడ శ్రమను అనుభవించింది. “అలా చేయవద్దు. నీవు యొద్ద నుండి సహాయమును కోరినట్లయితే ఆయన ఈ మహా కూటమి యొక్క దాడి నుండి నిన్ను భద్రపరుస్తాడు” అని యెషయా ఆహాజుకు తెలియజేశాడు. కాని ఆహాజు నిరాకరించాడు. అతడు “వద్దు, నాకు కనులకు కనబడే సహాయము కావాలి, అది అష్షూరు రాజ్యమైయున్నది” అని జవాబిచ్చాడు. కాబట్టి, ఆ సమయమందు యూదా స్వయంగా అష్షూరు సామ్రాజ్యమునకు సామంత దేశమైపోయింది.

— డా. రిచర్డ్ ఎల్. ప్రాట్ట్, జూ.

దేవుని వ్యాజ్యములను అనుసరించి, వివృతమగుతున్న తీర్పును గూర్చిన హోషేయ ప్రవచనములు 5:8-9:9లో అపాయమును గూర్చి దేవుడిచ్చిన పిలుపుల వైపుకు తిరుగుతాయి.

అపాయమును గూర్చి దేవుడిచ్చిన పిలుపులు (5:8-9:9)

పురాతన ఇశ్రాయేలులో, ఒక గొర్రె కొమ్మును — హెబ్రీ భాషలో షోఫర్ (שׁוֹפָר) — ఊదుట ద్వారా లేక వెండి బూరను — హెబ్రీ భాషలో చట్సొట్స్రహ్ (חֲצֹצְרָה) — ఊదుట ద్వారా సైన్యములను యుద్ధము కొరకు పిలచేవారు మరియు అనేక సందర్భాలలో, ఈ ఆచారమును సూచించుట ద్వారా దేవుడు స్వయంగా యుద్ధములను ప్రకటించాడు లేక జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ భాగములో, మనము అలాంటి రెండు పిలుపులను చూస్తాము.

అపాయమును గూర్చిన మొదటి పిలుపు (5:8:7-16). అపాయమును గూర్చిన మొదటి పిలుపు 5:8-7:16లో కనిపిస్తుంది. 5:8లో అది ఈ మాటలతో ఆరంభమవుతుంది: “గిబియాలో బాకానాదము చేయుడి” — షోఫర్ (שׁוֹפָר) — “రామాలో బూర ఊదుడి” — చట్సొట్స్రహ్ (חֲצֹצְרָה) అపాయమును గూర్చి ఇవ్వబడిన ఈ మొదటి పిలుపులోని విషయములను మనము పరీక్షించినప్పుడు, ఇది క్రీ.పూ. 722లో అష్షూరు దండయాత్ర జరిగినప్పుడు హోషేయ ఇచ్చిన ఆదిమ ప్రవచనములలో నుండి వెలువడినట్లు అనిపిస్తుంది. దీనికి ఆధారముగా, రెండు వాక్యభాగములు మునుపు క్రీ.పూ. 732లో జరిగిన దండయాత్రను గూర్చి మాట్లాడతాయి. అష్షూరీయులు అప్పటికే ఇశ్రాయేలును ఏ విధంగా “హింసించారో” మరియు “బాధించారో” హోషేయ 5:11 ప్రస్తావిస్తుంది. ఇశ్రాయేలు “చీల్చబడినది” మరియు “కొట్టబడినది” అని హోషేయ 6:1 నివేదిస్తుంది. దీనికి తోడు, 7:11లో ఇశ్రాయేలు “ఐగుప్తును పిలుచుకొనుచున్నది అని, అష్షూరీయుల యొద్దకు పోవుచున్నదని” దేవుడు వారిని నిందించాడు — ఇది ఆ కాలములో ఇశ్రాయేలు యొక్క అంతర్జాతీయ పొత్తులలో కలుగుచుండిన మార్పులకు సూచనగా ఉన్నది.

మనకు తెలిసినట్లే, క్రీ.పూ. 732లో ఇశ్రాయేలును ఓడించిన తరువాత అష్షూరీయులు హోషేయను ఇశ్రాయేలుకు రాజుగా నియమించారు. హోషేయ కూడా విగ్రహారాధన మరియు అన్యాయము చేయుటలో కొనసాగి, కొంత కాలము పాటు ఉత్సాహముగా అష్షూరీయులతో పొత్తును కొనసాగించాడు. అయితే తరువాత భద్రత కొరకు ఐగుప్తును ఆశ్రయించుట ద్వారా అతడు అష్షూరు ఆధిపత్యము నుండి స్వాతంత్ర్యమును కోరాడు. దేవుని యొద్ద నుండి రాబోవుచున్న మరిన్ని శాపములను గూర్చి హెచ్చరిస్తూ ఈ పాపములకు కలుగు తీవ్ర పరిణామాలను హోషేయ బట్టబయలు చేశాడు — ఈ శాపములు క్రీ.పూ. 722లో అష్షూరు యొక్క విధ్వంసకరమైన దండయాత్ర రూపములో వచ్చాయి.

యూదా రాజ్యము మీద ఈ అధ్యాయములు పెట్టు విశేషమైన ఆసక్తి కూడా ఈ చారిత్రిక సందర్భమునకు మద్దతునిస్తుంది. ఈ కాలములో, ఆహాజు యూదాను పాలించాడు మరియు యూదాను విగ్రహారాధనలోనికి మరియు అన్యాయములోనికి నడిపించాడు. దేవుని నమ్ముటకు బదులుగా, ఆహాజు అష్షూరుతోను, వారి దేవతలతోను పొత్తును పెట్టుకొనుట ద్వారా తన విరోధుల నుండి భద్రతను ఆశించాడు. ఫలితంగా, ఈ అధ్యాయములు యూదాకు విరోధముగా దేవుని శాపములమీద ఎక్కువ దృష్టిని పెడతాయి. హోషేయ 5:10-14లో హోషేయ పలికిన ఈ మాటలను వినండి:

యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయువారివలెనున్నారు; నీళ్లు ప్రవహించినట్లు నేను వారిమీద నా ఉగ్రతను కుమ్మరింతును... యూదావారికి వత్సపురుగువలెను నేనుందును... తనకు పుండు కలుగుట యూదా చూచెను... యూదావారికి కొదమసింహమువంటివాడనుగాను నేనుందును. నేనే వారిని పట్టుకొని చీల్చెదను, నేనే వారిని కొనిపోవుదును, విడిపించువాడొకడును లేక పోవును (హోషేయ 5:10-14).

మరియు 6:4లో, ఇలా మాట్లాడుతూ దేవుడు ఆహాజుకు మరియు ఇశ్రాయేలుకు తన కోపమును వెళ్లబుచ్చాడు:

యూదా, నిన్ను నేనేమిచేతును? (హోషేయ 6:4).

మరియు 11వ వచనములో, దేవుడు ఇలా పలికాడు:

ఓ యూదా, అతడు నీకు కోత కాలము నిర్ణయించును (హోషేయ 6:11).

ఇశ్రాయేలు రాజ్యముతో పాటు యూదా కొరకు కూడా కోత కాలము నిర్ణయించబడింది అని దేవుడు ఇక్కడ ప్రకటించాడు. ఇప్పుడు, ఈ వచనములోని రెండవ భాగము దేవుని ప్రజల యొక్క పునరుద్ధరణను గూర్చి మాట్లాడుతుంది అని మనము గుర్తించాలి. అయితే అనేకమంది వ్యాఖ్యానకర్తలు, మరియు కొందరు ఆధునిక అనువాదకులు సూచించునట్లు, 11వ వచనము యొక్క రెండవ భాగము వాస్తవానికి 7:1 తరువాత ఉన్న ప్రవచనములో భాగమైయున్నది. కాబట్టి, ఈ అభిప్రాయము ప్రకారం నిర్ణయించబడిన “కోత కాలము,” అష్షూరీయుల చేతులలో యూదా యొక్క నాశనము అయ్యున్నది.

అపాయమును గూర్చిన రెండవ పిలుపు (8:1-9:9). అపాయమును గూర్చి దేవుడిచ్చిన రెండవ పిలుపు 8:1-9:9లో కనిపిస్తుంది. 8:1లో “బాకా — లేక షోఫర్ (שׁוֹפָר) — నీ నోటను ఉంచి ఊదుము” అని ఇవ్వబడిన ఆజ్ఞతో ఇది ఆరంభమవుతుంది. ఇది క్రీ.పూ. 722లో అష్షూరీయుల దండయాత్ర దగ్గరపడుచుండగా హోషేయ ఇచ్చిన తరువాత ప్రవచనములకు చెందినదైయున్నదని అపాయమును గూర్చిన ఈ రెండవ పిలుపులోని విషయములు తెలియజేస్తాయి. ఈ కాలములో, ఇశ్రాయేలు దేశమునకు చెందిన హోషేయ రాజు విగ్రహారాధనను మరియు అన్యాయమును పురికొల్పుట కొనసాగించాడు. అలాగే ఐగుప్తుతో తాను పెట్టుకొనిన పొత్తు మీద ఆధారపడుట కొనసాగించాడు. ఫలితంగా, దేవుని యొద్ద నుండి రాబోవుచున్న శాపములను గూర్చి హోషేయ హెచ్చరించాడు. “అష్షూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు” అని 9:3లో అతడు ప్రకటించాడు. తరువాత వెంటనే, షల్మనేసెరు V షోమ్రోనును స్వాధీనము చేసుకున్నాడు. మరియు క్రీ.పూ. 722లో అష్షూరు రాజైన సర్గోను II షోమ్రోనున ధ్వంసం చేసి ఇశ్రాయేలు రాజ్యమునకు అంతము తీసుకొనివచ్చాడు.

అనేకమందికి ఆందోళన కలిగించు ఒక ప్రశ్న ఏమిటంటే, “దేవుడు తన సొంత ప్రజలను అన్యులైన అష్షూరీయుల చేతిలోనికి పడునట్లు ఎందుకు అనుమతించాడు? సరే, న్యాయమైన తీర్పులు అర్హమైనవి అని చూపుతూ హోషేయ ఈ ప్రశ్నకు స్పందించుటకు ప్రయత్నించాడు. దేవుడు తన ప్రజలను మరలా మరలా హెచ్చరించాడు. దేవుడు తన ప్రవక్తలను పంపాడు. వారి అవిధేయతకు మరియు వారు చూపిన అపనమ్మకత్వమునకు పరిణామాలు ఉంటాయని దేవుడు వారికి చెప్పాడు. అయినను, హోషేయ తన గ్రంథములో చిత్రాత్మకముగా చూపినట్లు నిబంధన పట్ల వారి అపనమ్మకత్వమును గూర్చి వారు పశ్చాత్తాపపడాలనుకోలేదు. కాబట్టి హోషేయ వారికి ఇలా వ్రాస్తున్నాడు, “మీరందరు శ్రమపడుచున్నారు కదా, ఇది తగినదే. దేవుడు మిమ్మును హెచ్చరించాడు, కాని మీరు పశ్చాత్తాపపడుటకు ఇష్టపడలేదు.” కాబట్టి దేవుడు ఇంతకు ముందే హెచ్చరించిన తీర్పును ఇచ్చుట తప్ప వేరొక మార్గము మిగిలియుండలేదు.

— డా. డేవిడ్ కొర్రేయ, అనువాదము

యూదాను గూర్చి ఈ వాక్యభాగము చెబుతున్న విషయముల ఆధారంగా చారిత్రిక సందర్భము కూడా నిర్థారించబడింది. ఇశ్రాయేలు యొక్క ఉనికిలోని ఈ చివరి సంవత్సరములలో, ఆహాజు మరియు హిజ్కియా యూదాలో కలసి పాలించారు. ఆహాజు చేసిన విగ్రహారాధన మరియు అన్యాయము నుండి యూదాను దారి మళ్లించు కార్యమును హిజ్కియా ఆరంభించాడు. మరియు ఈ విషయములో, అతడు నిజమైన సంస్కర్తగా ఉన్నాడు. అయితే అష్షూరు దాడిని ఎదుర్కొనుటకు యూదా యొక్క ప్రాకారములను బలపరచుట ద్వారా హిజ్కియా తన సొంత శక్తిని కూడా నమ్ముకున్నాడు. మరియు అతడు దేవుని వైపుకు తిరుగుటకు బదులుగా ఐగుప్తుతోను మరియు ఐగుప్తు దేవతలతోను పొత్తును పెట్టుకున్నాడు. ఈ కార్యముల వలన అష్షూరు ద్వారా యూదా మరిన్ని శాపములను ఎదుర్కొనబోతుంది అని దేవుడు ప్రకటించాడు. 8:14లో దేవుడు సెలవిచ్చినట్లు:

యూదావారు ప్రాకారములుగల పట్టణములను చాల కట్టియున్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చివేయును (హోషేయ 8:14).

ఖచ్చితముగా రెండు దశాబ్దముల తరువాత క్రీ.పూ. 701లో సన్హెరీబు యూదా మీద దండయాత్ర చేసి, దానిలోని పట్టణములన్నిటిని ఇంచుమించుగా నాశనము చేసి, యెరూషలేమును ముట్టడివేసినప్పుడు ఈ ప్రవచనము నెరవేరింది.

మీరు ఊహించగలుగునట్లే, ఈ తీర్పు ప్రవచనములను హోషేయ మొట్టమొదటిగా పొందుకొనినప్పుడు, ఇవి ఇశ్రాయేలు మరియు యూదాకు అనేక భావములను అందించాయి. ప్రతి అడుగులోను, అవి రానున్న తీర్పును గూర్చి హెచ్చరించి పశ్చాత్తాపపడమని పిలుపునిచ్చాయి. అయితే తరువాత, హోషేయ ఈ ప్రవచనములను పుస్తకము యొక్క రెండవ విభాగములో ఉంచినప్పుడు, తీర్పును గూర్చిన ఈ హెచ్చరికలు అప్పటికే నెరవేరాయి. క్రీ.పూ. 722లో ఇశ్రాయేలు అష్షూరు చేతిలో పతనమైయ్యింది, మరియు హిజ్కియా పరిపాలన కాలములో అష్షూరు యూదా దేశము మీద దాడిచేసి చాలావరకు ధ్వంసం చేసింది. అయినను, హిజ్కియా దినములలోని యూదా నాయకులకు ఈ ప్రవచనములు ధారాళమైన జ్ఞానమును బోధించాయి. దేవుడు ఇశ్రాయేలు రాజ్యమును ఎందుకు నాశనం చేశాడో వివరించుట మాత్రమేగాక, దేవుడు యూదా మీదికి అష్షూరును అంత నాశనకరమైన శక్తితో ఎందుకు పంపాడో కూడా అవి వివరించాయి.

హోషేయ గ్రంథములోని మొదటి విభాగము యొక్క నిర్మాణము మరియు విషయములు దేవుని తీర్పు మరియు నిరీక్షణ మీద దృష్టిపెట్టుటను మరియు రెండవ విభాగము దేవుని యొక్క వివృతమగుతున్న తీర్పును గూర్చి వివరించుటను మనము చూశాము కాబట్టి, ఇప్పుడు ఈ పుస్తకము యొక్క మూడవ ప్రధానమైన విభాగమును మనము చూడవలసియున్నది: 9:10-14:8లో దేవుని యొద్ద నుండి వివృతమగుతున్న నిరీక్షణను గూర్చి హోషేయ యొక్క ప్రవచనములు.

వివృతమగుతున్న నిరీక్షణ (9:10-14:8)

ఈ విభాగమును గూర్చి మనము “వివృతమగుతున్న” అని ఎందుకు మాట్లాడతాము అంటే, మరొకసారి, హోషేయ అనేక సంవత్సరముల పాటు పొందుకొనిన ప్రవచనములలో నుండి వీటిని వెలికి తీస్తున్నాడు. మరియు మనము “నిరీక్షణ”ను గూర్చి ఎందుకు మాట్లాడతాము అంటే, దేవుని ప్రజలు ఆయన తీర్పును చాలా కఠినముగా ఎదుర్కున్న తరువాత కూడా దేవుని ఆశీర్వాదములను గూర్చి వారు నిరీక్షణ కలిగియుండవచ్చని ఇది ఉద్ఘాటిస్తుంది.

ఈ పుస్తకములోని రెండవ విభాగములో, ఇశ్రాయేలు మరియు యూదా దేశముల మీద దేవుని తీర్పును గూర్చి హోషేయ విశేషముగా మాట్లాడాడు. ఒకవేళ హోషేయ తన గ్రంథమును అక్కడే ముగించియుంటే, అనేక కీలకమైన ప్రశ్నలకు జవాబులు దొరికేవికావు. భవిష్యత్తులో దేవుడు తన ప్రజలను ఇక ఆశీర్వదించడు అని ఇశ్రాయేలు మరియు యూదా ఎదుర్కొనిన సమస్యలు తెలియజేయుచున్నాయా? దేవుని ప్రజలు నిత్యము వరకు నశించిపోవలసియున్నది? ఇలాంటి ప్రశ్నలకు జవాబిచ్చుటకు హోషేయ తన గ్రంథములోని మూడవ విభాగమును వ్రాశాడు. ఇక్కడ, వారు భవిష్యత్తులో దేవుని ఆశీర్వాదములను ఎందుకు నిరీక్షించవలసియున్నదో అతడు హిజ్కియా దినములలోని యూదా నాయకులకు బయలుపరచాడు.

హోషేయ గ్రంథము యొక్క మూడవ విభాగము మన పుస్తకములో అత్యంత సంక్లిష్టమైన భాగమైయున్నది, ఎందుకంటే హోషేయ అనేక ప్రవచనములను, మరియు ప్రవచన సారాంశములను దీనిలో కలిపి చేర్చాడు. అయితే చాలా వరకు, ఇది ఐదు ప్రధానమైన భాగములుగా విభజించబడుతుంది అని, ప్రతి భాగము ఇశ్రాయేలుతో దేవుడు చేసిన పోలిక ద్వారా పరిచయం చేయబడుతుంది అని మనము నిశ్చయతతో చెప్పవచ్చు.

9:10-12లో దేవుడు ఇశ్రాయేలును ఒక పండుతో పోల్చాడు; 9:13-17లో నాటబడిన ఒక ఖర్జూరపు మొక్కతో పోల్చాడు; 10:1-10లో ఒక విస్తారమైన ద్రాక్ష చెట్టుతో పోల్చాడు; 10:11-15లో అభ్యాసము పొందిన ఒక పెయ్యతో పోల్చాడు; మరియు చివరిగా 11:1-14:8లో ఒక ప్రియమైన బిడ్డతో లేక కుమారునితో పోల్చాడు. ఈ భాగములు ఈ పోలికలను అనేక విధాలుగా వివరిస్తాయి, మరియు ఈ వివరణలను గూర్చి మన తరువాత పాఠంలో మరింత స్పష్టముగా చూద్దాము. అయితే ఈ పరిచయ పాఠంలో, ప్రతి భాగము యొక్క ఆరంభములో కనిపించు సులువైన నిరీక్షణ పద్ధతిని చూచుటకు మాత్రమే మనకు సమయం అనుకూలిస్తుంది.

హోషేయ గ్రంథము యొక్క ఈ విభాగములోనికి మనము ప్రవేశించుచుండగా, వీలైనంత వరకు, ఈ భాగములలోని ప్రతి ప్రత్యక్షతను హోషేయ మొదటిగా ఎప్పుడు పొందుకున్నాడో గుర్తించుట ప్రాముఖ్యమైయున్నది. వీటిలో కొన్ని చారిత్రిక నేపథ్యములు ఇతర వాటి కంటే సులువుగా గుర్తించబడతాయి. అయితే మొత్తం మీద, తన గ్రంథము యొక్క రెండవ భాగములో అతడు ఉపయోగించిన అవే చారిత్రిక కాలములను మరలా ఉపయోగించాడు. మనము ఇంతకు ముందు చూసినట్లు, క్రీ.పూ. 732లో అష్షూరు దండయాత్ర మరియు క్రీ.పూ. 722లో అష్షూరు దండయాత్ర కాలములలో దేవుడిచ్చిన తీర్పుల మీద రెండవ విభాగములో హోషేయ దృష్టిపెట్టాడు. అయితే మన గ్రంథము యొక్క మూడవ విభాగములో, తీర్పు మీద దృష్టిపెట్టుటకు బదులుగా, ఇదే కాలవ్యవధిలో దేవుడిచ్చిన నిరీక్షణ మాటల మీద ఈ భాగము దృష్టిపెడుతుంది.

9:10-12లో దేవుడు ఇశ్రాయేలును పండుతో పోల్చిన విధానమును చూస్తూ ఆరంభిద్దాము.

పండు (9:10-12)

క్రీ.పూ. 732లో అష్షూరు దండయాత్రను గూర్చి ఇవ్వబడిన మునుపటి ప్రవచనములతో పాటుగా ఈ మొదటి భాగము హోషేయకు బయలుపరచబడియుండవచ్చు. ఈ చారిత్రిక సందర్భమునకు ఉత్తమమైన రుజువు 9:11లో కనిపిస్తుంది. ఇశ్రాయేలు రాజులు దేవునికి దూరమయ్యారు కాబట్టి, “ఎఫ్రాయిము యొక్క కీర్తి” — అక్షరార్థముగా “వారి మహిమ,” లేక హెబ్రీ భాషలో కెవోదిమ్ (כְּבוֹדָם) — “పక్షివలె ఎగిరిపోవును” అని మనము చదువుతాము. దేవుడు ఇశ్రాయేలు యొక్క మహిమను తీసివేయబోతున్నాడు. హోషేయ గ్రంథములో దేవుడు దీనిని గూర్చి తెలియపరచిన మరొక సమయము 4:1-19లో దేవుని యొక్క మునుపటి వ్యాజ్యము అయ్యున్నది — క్రీ.పూ. 732లో దండయాత్రను గూర్చి హోషేయ ఇంతకు ముందు ఇచ్చిన ప్రవచనములతో అనుబంధము గల భాగము. “వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును” అని 4:7లో దేవుడు సెలవిచ్చాడు. క్రీ.పూ. 732లో అష్షూరు యొక్క దండయాత్రను గూర్చి అతడు ఇచ్చిన మునుపటి ప్రవచనములలో ఒకదానితో హోషేయ తన రెండవ భాగమును ఆరంభించిన విధముగానే మూడవ భాగమును కూడా ఆరంభించాడు అని ఈ విషయము బలముగా సూచిస్తుంది.

ఈ వచనములు యూదాను గూర్చి మాట్లాడుటలేదు అను సత్యము ఈ సందర్భమును నిర్థారిస్తుంది. మీకు జ్ఞాపకమున్నట్లయితే, ఉజ్జియా మరియు యోతాములు నీతిగల రాజులుగా పాలించారు మరియు ఈ కాలములో దేవుడు యూదా మీద ఎలాంటి శాపములను పలుకలేదు. ఈ చారిత్రిక ధోరణిని మనస్సులో ఉంచుకొని, 9:10లో దేవుడు సెలవిచ్చిన మాటలను వినండి:

అరణ్యములో ద్రాక్షపండ్లు దొరికినట్లు ఇశ్రాయేలువారు నాకు దొరికిరి; చిగురుపెట్టు కాలమందు అంజూరపు చెట్టుమీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. అయితే వారు బయల్పెయోరు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమ్మును తాము అప్పగించుకొనిరి; తాము మోహించినదానివలెనే వారు హేయులైరి (హోషేయ 9:10).

స్పష్టముగా, ఈ వచనములో దేవుడు ఇశ్రాయేలు యొక్క పాపములను గూర్చి మాట్లాడాడు. అయితే ద్రాక్షపండ్లు మరియు అంజూరముతో ఇశ్రాయేలును అనుకూలముగా పోల్చుట ద్వారా దేవుడు ఆరంభించిన విషయమును గమనించడం చాలా ప్రాముఖ్యమైయున్నది. కాబట్టి, క్రీ.పూ. 732లో ఇశ్రాయేలుకు విరోధముగా తీర్పును తెచ్చుటకు దేవుడు నిర్థారించుచుండగా కూడా, ఆయన ఇశ్రాయేలును ఒకడు తియ్యని పండ్లను జ్ఞాపకము చేసుకొను విధముగా జ్ఞాపకము చేసుకున్నాడు. మరియు దేవుని యొక్క అనుకూలమైన జ్ఞాపకము భవిష్యత్తులో వారు ఆయన ఆశీర్వాదముల కొరకు తిరిగివచ్చుటకు నిరీక్షణ ఉన్నదని దేవుని ప్రజలకు పునఃనిశ్చయపరచింది.

9:13-17లో ఉన్న రెండవ భాగము, నాటబడిన ఖర్జూరపు మొక్కగా ఇశ్రాయేలు మీద దృష్టిపెట్టి ఇదే విధమైన పద్ధతిని అనుసరిస్తుంది.

నాటబడిన ఖర్జూరపు మొక్క (9:13-17)

ఈ ప్రత్యక్షతను హోషేయ ముందుగా ఎప్పుడు పొందుకున్నాడో మనము ఖచ్చితముగా చెప్పలేము. అయితే మొత్తము మీద, క్రీ.పూ. 732లో అష్షూరు దండయాత్రను గూర్చి హోషేయ ఇచ్చిన ప్రవచనముల కాలములో ఇశ్రాయేలు యొక్క పరిస్థితులకు ఇశ్రాయేలును గూర్చి హోషేయ ఇచ్చిన వర్ణన చక్కగా సరిపోతుంది. ఈ వాక్యభాగము యూదాను ప్రస్తావించదు అను సత్యము ద్వారా ఈ చారిత్రిక దృక్పధమును సమర్థిస్తుంది. కాబట్టి, ఆహాజు యూదాను దేవునికి వ్యతిరేకముగా మరల్చుటకు ముందే ఇది హోషేయకు అందియుండవచ్చు. 9:13లో ఈ భాగము యొక్క ఆరంభమును వినండి:

లోయలో స్థాపింపబడిన తూరువంటి (ఆంగ్లములో ఖర్జూరపు మొక్క అని ఉన్నది) స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకొంటిని; అయితే నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటికి తెచ్చును (హోషేయ 9:13).

అష్షూరు సైన్యములకు విరోధముగా యుద్ధము చేయుటకు వెళ్లినప్పుడు ఇశ్రాయేలు యొక్క పిల్లలు హతము చేయబడతారని దేవుడు ఇక్కడ ఇశ్రాయేలును హెచ్చరించాడు. అయితే ఈ తీర్పు ఎంత భయంకరమైనదిగా ఉన్నను, ఈ వచనము యొక్క మొదటి భాగములో “లోయలో స్థాపించబడిన ఖర్జూరపు మొక్క” వలె దేవుడు ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనిన విషయమును తెలియజేస్తుంది. దేవుడు వారిని గూర్చి మధురమైన రీతిలో జ్ఞాపకము చేసుకొనుట, ఇశ్రాయేలు భవిష్యత్తులో దేవుని ఆశీర్వాదముల కొరకు నిరీక్షించవచ్చని బయలుపరచింది.

నాటబడిన ఖర్జూరపు మొక్కగా ఇశ్రాయేలు మీద దృష్టిపెట్టిన తరువాత, 10:1-10లో హోషేయ ఇశ్రాయేలు రాజ్యమును ఒక విస్తారమైన ద్రాక్ష చెట్టుతో పోల్చాడు.

విస్తారమైన ద్రాక్షచెట్టు (10:1-10)

క్రీ.పూ. 732లో అష్షూరు దండయాత్రను గూర్చి హోషేయ ప్రవచనములను పొందుకున్నప్పుడు ఈ భాగము వెలువడియుండవచ్చు. ఇశ్రాయేలు ఆరాధనా స్థలములోని ఐశ్వర్యము “గొప్ప రాజునకు కానుకగా ఇయ్యబడును” — 5:13లో ప్రస్తావించబడిన అదే రాజు — అని హోషేయ 10:6 హెచ్చరిస్తుంది. ఈ “గొప్ప రాజు” క్రీ.పూ. 732లో విధ్వంసకరమైన దాడిని చేసిన తిగ్లత్-పిలేసరు III రాజు అయ్యున్నాడు. అయితే ఈ భాగములో యూదాను గూర్చిన ప్రస్తావన లేదు అని గుర్తించుట ప్రాముఖ్యమైయున్నది. కాబట్టి, ఆహాజు అప్పటికి ఇంకా యూదాను భ్రష్టత్వములోనికి నడిపించియుండలేదు అని ఇది సూచిస్తుంది. దీని వెలుగులో, 10:1లో దేవుడు సెలవిచ్చిన మాటలను వినండి:

ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష ... ఫలము ఫలించినకొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి (హోషేయ 10:1).

వారు ఫలించిన కొలది “వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచువచ్చిరి” కాబట్టి హోషేయ యొక్క ప్రవచనము ఇశ్రాయేలుకు విరోధముగా వచ్చిన తీర్పు మీద దృష్టిపెట్టిన విషయమును ఇక్కడ గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు తమ గోత్రములు నివసించిన ప్రాంతములలో ఇతర దేవతలకు బలిపీఠములను కట్టారు, మరియు ఈ తిరుగుబాటు కారణంగా వారు దేవుని తీర్పును అనుభవించవలసియుండెను. అయితే, ఇంతకు ముందు వలె, దేవుడు ఇశ్రాయేలును ఒక మనోహరమైన విస్తరించిన ద్రాక్ష చెట్టు వలె జ్ఞాపకము చేసుకొనుచున్నాడు అను సత్యమును తెలుపుతూ ఈ తీర్పును గూర్చిన ముప్పును హోషేయ పరిచయం చేశాడు. ఈ పోలిక భవిష్యత్తులో ఇశ్రాయేలు మీద దేవుని ఆశీర్వాదములను గూర్చి నిరీక్షణను అందించింది.

ఇశ్రాయేలును విస్తరించబడిన ద్రాక్ష చెట్టుతో పోల్చుటతో పాటు, 10:11-15లో, దేవుడు ఇశ్రాయేలు రాజ్యమును అభ్యాసము పొందిన పెయ్యతో పోల్చిన విధానమును గూర్చి కూడా హోషేయ వ్రాసాడు.

అభ్యాసము పొందిన పెయ్య (10:11-15)

క్రీ.పూ. 722లో అష్షూరు దండయాత్రను గూర్చి హోషేయ మునుపటి ప్రవచనములను పొందుకొనిన కాలములో ఈ భాగము వెలువడియుండవచ్చు. మనము ఇంతకు ముందు చూసినట్లు, ఈ కాలములో, హోషేయ రాజు ఇశ్రాయేలును విగ్రహారాధన మరియు అన్యాయములోనికి నడిపించాడు. మరియు ఇంతకు ముందు, భద్రత కొరకు దేవుని మీద ఆధారపడుటకు బదులుగా అష్షూరుతోను దాని దేవతలతోను పొత్తు మీద అతడు ఆధారపడ్డాడు. ఈ కారణము చేత, ఇశ్రాయేలు మీదికి శాపము రాబోవుచున్నదని దేవుడు హెచ్చరించాడు.

ఇక్కడ యూదా పాపములను గూర్చి ప్రస్తావించబడకపోవుట ఈ భాగము యొక్క చారిత్రిక సందర్భమును గూర్చి అత్యంత గమనీయమైన రుజువైయున్నది. మనకు తెలిసినట్లే, యూదా రాజైన ఆహాజు, యూదా దేశమందంతట విగ్రహారాధనను మరియు అన్యాయమును ప్రోత్సహించాడు. దేవుని యొద్ద నుండి సహాయమును కోరుటకు బదులుగా ఇతడు కూడా అష్షూరుతో పొత్తు నుండి సహాయమును పొందుటకు ప్రయత్నించాడు. కాబట్టి, 10:11, 12లో, దేవుడు క్లుప్తంగా యూదాకు కూడా శాపములు రాబోవుచున్నాయని హెచ్చరించి, ఇలా ప్రకటించాడు “యూదా భూమిని దున్నును.... నీతి ఫలించునట్లు.” 10:11లోని ఈ మాటలతో ఈ భాగము అంతా ఆరంభమవుతుంది:

ఎఫ్రాయిము నూర్పునందు అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్యవలె ఉన్నది; అయితే దాని నున్నని మెడకు నేను కాడి కట్టుదును; ఎఫ్రాయిముచేత దున్నించుటకు నేనొకని నియమింతును (హోషేయ 10:11).

ఎఫ్రాయిము మెడకు కాడి కట్టుదును అని దేవుడు హెచ్చరించాడు, ఇది అష్షూరు ద్వారా కలుగు క్రూరమైన తీర్పుకు రూపకముగా ఉన్నది. అయితే తీర్పు వచ్చుచుండినను, దేవుడు ఇశ్రాయేలును “అభ్యాసముగలదై కంకులను త్రొక్కగోరు పెయ్య” వలె వాత్సల్యముతో జ్ఞాపకము చేసుకున్నాడు. మరియు దేవుడు ఇశ్రాయేలును గూర్చి అనుకూలమైన రీతిలో జ్ఞాపకము చేసుకొనుట భవిష్యత్తు కొరకు నిరీక్షణకు ఆధారముగా పని చేసింది.

ఇది దేవుని యొద్ద నుండి కలుగు వివృతమగుతున్న నిరీక్షణను గూర్చిన ఈ విభాగములోని చివరి పోలిక, మరియు ఇప్పటి వరకు మూడవ విభాగములో అతి పెద్ద భాగములోనికి మనలను నడిపిస్తుంది. 11:1-14:8లో, దేవుడు తన ప్రజలను అభ్యాసము పొందిన పెయ్య కంటే అమూల్యమైన రీతిలో పోల్చాడు — ప్రియమైన బిడ్డ లేక కుమారుడు.

ప్రియమైన బిడ్డ (11:1-14:8)

ఈ సుదీర్ఘమైన భాగము క్రీ.పూ. 722లో అష్షూరు దండయాత్ర జరిగినప్పుడు హోషేయ ఇచ్చిన ప్రవచనములను సూచిస్తుంది. ఈ కాలమందు, హోషేయ రాజు ఇశ్రాయేలును విగ్రహారాధన మరియు అన్యాయములోనికి నడిపించుట కొనసాగించాడు. అయితే తరువాత, మూర్ఖత్వముతో అష్షూరు నుండి స్వతంత్రుడై ఐగుప్తుతో పొత్తును పెట్టుకొనుటకు ప్రయత్నించాడు. 11:5లో ఇశ్రాయేలువారు “ఐగుప్తు దేశమునకు... మరల దిగిపోరుగాని... అష్షూరు రాజు వీరి మీద ప్రభుత్వము చేయును” అని తెలియజేస్తూ దేవుడు ప్రత్యేకముగా ఈ పొత్తును ఉద్దేశించి మాట్లాడాడు.

11:12 మరియు 12:2-6లో హోషేయ యూదాకు విరోధముగా కూడా ప్రవచించాడు అను సత్యము ఈ చారిత్రిక నేపథ్యమును నిర్థారిస్తుంది. 12:2లో మనము చదువునట్లు, “యూదావారిమీద యెహోవాకు వ్యాజ్యెము పుట్టెను.” హిజ్కియా సంస్కరణలను చేసిన తరువాత కూడా, అతడు యెహోవా వైపుకు తిరుగక తన సొంత శక్తి మీద ఆధారపడి ఐగుప్తుతో పొత్తు పెట్టుకున్నాడు. కాబట్టి, క్రీ.పూ. 701లో సన్హెరీబు దండయాత్ర ద్వారా యూదా దేవుని తీర్పును ఎదుర్కొన్నది. ఇప్పుడు, 11:1-2లో ఈ భాగము యొక్క ఆరంభమును వినండి:

ఇశ్రాయేలు బాలుడైయుండగా నేను అతనియెడల ప్రేమగలిగి నా కుమారుని ఐగుప్తుదేశములోనుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులనర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి (హోషేయ 11:1-2).

ఈ ఆరంభ వచనములు మరొకసారి హోషేయ ఉపయోగించిన పద్ధతిని తెలియజేస్తాయి. ఇశ్రాయేలు దేవునికి విరోధముగా పాపము చేసింది. మరలా మరలా, దేవుడు వారికి పిలుపునిచ్చాడుగాని, “వారు ఆయనకు దూరమై” బయలు దేవతలను మరియు ఇతర విగ్రహములను ఆరాధించారు. ఫలితంగా, తీర్పు రాబోవుచుండినది. అయితే దేవుడు తీర్పును ప్రకటించుచు కూడా, ఇశ్రాయేలు ఒక ప్రియమైన కుమారుడైయున్నాడని భావించినట్లు మొదటి వచనము సూచిస్తుంది. మరియు తన బిడ్డయైన ఇశ్రాయేలు కొరకు ఆయన కలిగియుండిన ప్రేమ ఇశ్రాయేలు యొక్క భవిష్యత్ ఆశీర్వాదముల కొరకు నిరీక్షణ ఆధారముగా మారింది.

దేవుడు ఇశ్రాయేలును ఐగుప్తు నుండి బయటకు పిలిచిన విధానమును గూర్చి హోషేయ 11:1 మాట్లాడుతుంది. దేవుడు క్రిందికి వంగి వారికి ప్రేమతో తినిపించి తన ప్రజల కొరకు సమకూర్చాడని ఈ వచనములు సెలవిస్తాయి. అయినను, తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఆయన తన ప్రజలను ఎంత ఎక్కువగా పిలిస్తే, వారు ఆయనకు అంత దూరమైయ్యారు. కాబట్టి, ఆయన వారిని మరలా దూరముగా పంపుతానని, కాని ఈ సారి ఐగుప్తుగాక, అష్షూరు వారికి రాజుగా ఉంటుంది అని దేవుడు ప్రకటించాడు. అయితే ఈ అధ్యాయము ముందుకు కొనసాగుచు దేవుని స్వరము తన ప్రజలను ప్రేమతో పిలచుటతో, మరియు దేవుడు ఈ విధంగా ప్రకటించుటతో కొనసాగుతుంది, “నేను నా రోషముగల తీర్పును ఇశ్రాయేలు మీద చూపను. నేను పిలుస్తాను, మరియు నా కుమారులు వణకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తుదేశములో నుండి, పావురముల వలె అష్షూరు దేశము నుండి వచ్చెదరు. నేను వారిని తమ నివాసములలోనికి సమకూర్చుతాను, మరలా వారికి నేను దేవుడనైయుందును మరియు వారు నాకు ప్రజలైయుందురు.”

— డా. క్రైగ్ ఎస్. కీనర్

ఇప్పుడు, మన క్లుప్త పరిచయం బయలుపరచుచున్న దాని కంటే హోషేయ యొక్క మూడవ విభాగములో ఇంకా అనేక విషయములు ఉన్నాయి. మరియు మన గ్రంథములోని ఈ భాగమును గూర్చి తరువాత పాఠంలో మరింత దగ్గరగా చూద్దాము. అయినను, ఇక్కడ అసలు విషయమును అర్థము చేసుకొనుటకు కావలసినన్ని విషయములను మనము చూశాము. ఇశ్రాయేలు అష్షూరు ఎదుట పతనమైన తరువాత మరియు దానిలోని పౌరులు చాలా వరకు చెరగొనిపోబడిన తరువాత, యూదా నాయకులకు జ్ఞానమును ఇచ్చుటకు హోషేయ ఈ గ్రంథములోని చివరి భాగమును సంకలనం చేశాడు. మరియు తన గ్రంథములోని ఈ చివరి అధ్యాయములలో, దేవుడు వాగ్దానము చేసిన విషయములను గూర్చి యూదా యొక్క నిరీక్షణలను బలపరచుటకు హోషేయ తన పరిచర్య కాలమంతటిలో ఇచ్చిన ప్రవచనములను వెలికితీశాడు. తీర్పు ఇశ్రాయేలు యొక్క కథకు ముగింపు కాదు, ఎందుకంటే దేవుడు వారి పట్ల చూపిన వాత్సల్యమును మరచిపోలేదు. యూదా నాయకులు జ్ఞానమును సంపాదించుకొని రానున్న ఆశీర్వాదములను గూర్చిన నిరీక్షణను బలముగా పట్టుకొని యుండవచ్చు.

ముగింపు

హోషేయ గ్రంథమును గూర్చిన ఈ పరిచయంలో, ప్రవచన పరిచర్య మరియు అతని గ్రంథము యొక్క కాలము, ప్రాంతము, పరిస్థితులు మరియు ఉద్దేశ్యము మధ్య వ్యత్యాసములను చూపుతూ హోషేయ గ్రంథము యొక్క నేపథ్యమును మనము విశదీకరించాము. హోషేయ గ్రంథము యొక్క నిర్మాణము మరియు విషయములను సమీక్షిస్తూ, తీర్పు మరియు నిరీక్షణ, వివృతమగుతున్న తీర్పు, మరియు దేవుని యొద్ద నుండి వివృతమగుతున్న నిరీక్షణల మీద దృష్టిపెడుతూ తన గ్రంథమును ముందుగా పొందుకున్న వారికి ప్రవక్త ఏ విధంగా జ్ఞానమును ఇచ్చాడో మనము చూశాము.

ఇశ్రాయేలు మరియు యూదాలు తమ చరిత్రలోనే అత్యంత కఠినమైన సమయమును — అనగా అష్షూరీయుల ద్వారా తీర్పు అను సమస్యను — ఎదుర్కొనుచుండిన కాలములో వారికి జ్ఞానమును బోధించుటకు హోషేయ గ్రంథము వ్రాయబడినది. మరియు ప్రతి యుగములోను, మరియు భవిష్యత్తులోనికి ఎదురుచూచుచుండగా మన యుగములోను దేవుని ప్రజలకు అవసరమైన మెళకువలను ఈ గ్రంథము అందిస్తుంది. హోషేయ దినములలో ఇశ్రాయేలు మరియు యూదావలె, ఈ లోకములోని శ్రమలను మనము ఎదుర్కొనుచుండగా జ్ఞానమును అన్వేషించమని హోషేయ ఇచ్చిన పిలుపును క్రీస్తు అనుచరులు ఖచ్చితముగా వినాలి. మనము ఎలాంటి సమస్యలను ఎదుర్కొనుచున్నను, సమస్తము కోల్పోయినట్లు అనిపించినప్పుడు కూడా, క్రీస్తులో భవిష్యత్తును గూర్చి మనకు ఉన్న నిరీక్షణను మనము బలముగా పట్టుకొనియుండవచ్చని ఈ పుస్తకములో మనము నేర్చుకుంటాము. మరియు క్రీస్తు మహిమలో తిరిగివచ్చునప్పుడు దేవుడు తన ప్రజల మీద లెక్కింపలేనన్ని దీవెనలను కురిపిస్తాడు అనే నిశ్చయతను మనము కలిగియుండవచ్చు.