From the transcript
జ్ఞానముతో కూడిన ఆలోచనను పట్టించుకొనని వ్యక్తి ఎవరైనా మీకు తెలుసా? వారు ఇతరులు చెప్పు మాటలను మూర్ఖత్వముతో తిరస్కరిస్తారు, ఫలితంగా, వారు మరలా మరలా పడిపోతుంటారు. అనేక విధాలుగా, ప్రవక్తయైన హోషేయ కాలములో కూడా ఇలానే జరిగింది. హోషేయ అనేక దశాబ్దముల పాటు దేవుని ప్రజలకు దేవుని వాక్యమును అందించాడు. అతని ప్రవచనములు తరచుగా నిజమైనప్పటికీ, దేవుని ప్రజలు అతని మాటలను వినుటకు నిరాకరించారు కాబట్టి మరలా మరలా శ్రమలను అనుభవించారు. అయినను, హోషేయ అలసిపోలేదు. తన జీవితము యొక్క చివరి దశలో, అతడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి తన ప్రవచనముల సంపుటిని సృష్టించాడు, దానిని మనము నేడు హోషేయ గ్రంథము అని పిలుస్తాము. తమ దినములలో సవాళ్లను ఎదుర్కొన్న దేవుని ప్రజలకు జ్ఞానమును ఇచ్చుటకు అతడు తన గ్రంథమును రూపొందించాడు. మరియు దేవుని ద్వారా ప్రేరేపించబడిన గ్రంథముగా, హోషేయ గ్రంథము మన యుగముతో సహా అన్ని యుగములలోని దేవుని ప్రజలకు జ్ఞానమును నేర్పుతుంది.
హోషేయ యొక్క ప్రవచన జ్ఞానము అను మన పాఠ్యక్రమములో ఇది మొదటి పాఠము, మరియు దీనికి “హోషేయ గ్రంథము యొక్క పరిచయం” అను శీర్షికనిచ్చాము. ఈ పాఠంలో, హోషేయ యొక్క పరిచర్యకు మరియు ఇప్పుడు అతని పేరును కలిగియున్న గ్రంథమునకు సంబంధించిన కొన్ని పరిచయ విషయములను మనము విశదీకరిద్దాము.
మనమిచ్చు హోషేయ గ్రంథ పరిచయము రెండు ప్రధానమైన భాగములుగా విభాగించబడుతుంది. ముందుగా మనము ప్రవక్తయైన హోషేయ మరియు అతని పుస్తకము యొక్క నేపథ్యమును చూద్దాము. తరువాత ఈ గ్రంథములోని విషయములు మరియు నిర్మాణము యొక్క అవలోకనమును పరిచయం చేద్దాము. హోషేయ యొక్క నేపథ్యములోని అనేక కోణములను విశదీకరిస్తూ ఆరంభిద్దాము.
హోషేయ యొక్క ప్రవచనములు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడినవి, కాబట్టి చరిత్రయందంతటా దేవుని ప్రజల మీద అవి నిస్సందేహమైన అధికారమును కలిగియున్నాయి. అయితే అతని ప్రవచనములు మొదటిగా పురాతన ఇశ్రాయేలీయులు మరియు వారు ఎదుర్కొనిన పరిస్థితులను ఉద్దేశించాయి. ఈ పాఠంలో మనము చూడబోతున్నట్లు, హోషేయ యొక్క పరిచర్య అనేక దశాబ్దముల పాటు కొనసాగింది. కాబట్టి, హోషేయ యొక్క అభివృద్ధి చెందుతుండిన పరిస్థితులను మనము ఎంత ఎక్కువగా అర్థము చేసుకుంటే, అంత ఎక్కువగా అతని ప్రవచనములను మనము గ్రహించగలుగుతాము మరియు అనువర్తించుకోగలుగుతాము.
మనము విషయములను చూచుటకు ముందు, రెండు అనుబంధముగల చారిత్రిక సందర్భములను, అనగా రెండు “లోకములను” మనము వ్యత్యాసపరచి చూడవలసియున్నది. మొదటి సందర్భమును, “ఆ లోకము” అని పిలుస్తాము, ఇది హోషేయ తన ప్రవచన పరిచర్యలో దేవుని నుండి ప్రత్యక్షతలను పొందుకొని, తెలియపరచిన శతాబ్దములకు సంబంధించినదైయున్నది. అయితే మనము “వారి లోకము” అని పిలచు రెండవ చారిత్రిక సందర్భము హోషేయ జీవితములో తరువాత జరుగుతుంది. రెండవ సందర్భములో, ఈ గ్రంథమును మొదటిగా పొందుకున్నవారి యొక్క జీవితములను ప్రభావితము చేయుటకు హోషేయ తన ప్రవచనములలో కొన్నింటిని ఎంపిక చేసుకొని, వాటిని వ్రాశాడు.
Continue reading the full transcript